మహిళా చట్టాన్ని నీరు గార్చినపుడే మేలుకొని వుంటే దళితుల వరకు వచ్చేదా ?

Tags

, , , ,

చట్టాలను నీరు గార్చేందుకే దుర్వినియోగ ఆరోపణ

ఎం కోటేశ్వరరావు

చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించి దేశంలో ఇప్పుడు సమాజంలోని కులీన, అట్టడుగు తరగతుల్లో ఒకే అంశంపై చర్చ మొదలైంది. చిత్రం ఏమిటంటే యావత్‌ దేశానికి చట్టాలు చేసే పార్లమెంట్‌ వుభయ సభలను గత ఇరవై ఐదు రోజులుగా దుర్వినియోగం చేయటాన్ని స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా యావత్‌ జాతి గమనించింది. పార్లమెంట్‌ సరిగా నడవని అన్ని రోజులకు ఎన్‌డిఏ ఎంపీలు తమ వేతనాలు, అలవెన్సులను వదులుకుంటారని బుధవారం రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల కేేంద్ర మంత్రి అనంతకుమార్‌ ప్రకటించారు. సభను నడిపించాల్సిన అధికారపక్షం అవిశ్వాస తీర్మానాల ప్రహసనంలో అంటించుకున్న గబ్బును కాస్తయినా తగ్గించుకొనేందుకు తాము పెద్ద జవాబుదారీ అంశకు చెందిన వారమని ఫోజు పెట్టేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు వేసిన అతి తెలివి ఎత్తుగడ ఇది. సభను నడపాల్సిన వారు సరిగా నడపకపోతే నేనెందుకు వదులుకోవాలి అని బిజెపి సభ్యుడు సుబ్రమణ్యస్వామి గడ్డిపెట్టారనకోండి.

సమాజంలో ఏమాత్రం రక్షణ లేని దళితులు, గిరిజనులు తమ రక్షణ చట్టాన్ని దుర్వినియోగం చేశారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు నివేదించింది, దాని ఆదారంగానే అది ఆ చట్టంలో మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది.తాము అలవెన్సులు, వేతనా వదులుకుంటామని చెప్పటం అంటే పార్లమెంట్‌ను దుర్వినియోగం చేసినట్లు అంగీకరించటమే. దానికి పరిహారంగా ఆర్ధిక ప్రయోజనాన్ని వదులుకుంటామంటే సరిపోతుందా ? అదంత స్వల్ప దుర్వినియోగమా ? ఈ విషయాన్ని ప్రజాకోర్టు తప్ప మరే కోర్టూ విచారించే అవకాశం లేదు. అటువంటి అవకాశాలే వుంటే అవిశ్వాస తీర్మానంపై నాటకం ఇంత రంజుగా నడిచేది కాదు. అందువలన అన్ని రకాల దుర్వినియోగాలు, వాటికి బాధ్యుల గురించి దేశం తీవ్రంగా చర్చించాల్సిందే.

మహిళలకు రక్షణ కల్పించే శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌, ఎస్‌సి, ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టం రెండింటినీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నప్పటికీ రెండవ అంశం ప్రస్తుతం అనూహ్యంగా ముందుకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్ధితులు అరుదుగా వస్తుంటాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఒక చట్టాన్ని వినియోగించకుండా నీరుగారుస్తున్నారని జనాభాలో ఒక పెద్ద సమూహం, దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆ సమూహంపై తరతరాలుగా దాడులు చేసేవారు లేదా చేయటాన్ని పరోక్షంగా అయినా సమర్ధించేవారు పరిమితంగానే అయినా వీధుల్లోకి సైతం వచ్చిన వుదంతం ఏప్రిల్‌ రెండవ తేదీన జరిగింది. అనేక అంశాలపై సమ్మెలు, బందులు జరగటం సర్వసాధారణం. తమ రక్షణకు తెచ్చిన చట్టాన్ని నీరు గార్చటానికి లేదా ఎత్తివేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రక్షణ కోసం దళితులు, గిరిజనులు దేశ వ్యాపిత బంద్‌కు పిలుపు ఇచ్చిన వుదంతం ఎన్నడూ జరగలేదు. అది జయప్రదమైందా, విఫలమా, పాక్షికమా అన్న విషయాన్ని పక్కనపెడదాం. మూడు రాష్ట్రాలలో హింసాత్మకంగా మారి పదకొండు మంది వరకు మరణించటాన్ని బట్టి దాని తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ బంద్‌ ఒక చైతన్యానికి, పోరాటపటిమకు నిదర్శనం.

Image result for SC/ST Atrocities Act, band

ఎప్పుడూ అనేక అంశాలపై చర్చ జరుగుతూనే వుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. దళితుల, గిరిజనుల రక్షణ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశంలో వివిధ చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించిన చర్చ ముందు పీఠీకి వచ్చింది. తిరోగమన వాదులకు సంకటమైన ఈ చర్చను పురోగమనవాదులు మరింతగా ముందుకు తీసుకుపోవాల్సిన తరుణమిది. ఒక కుక్కను చంపాలనుకుంటే పిచ్చిదని ప్రచారం చేయాలన్నది పాత సామెత. ఒక అవాస్తవాన్ని నిజం చేయాలంటే వందసార్లు చెప్పాలని ఫాసిస్టు గోబెల్స్‌ పాలకవర్గాలకు సరికొత్త ఆయుధాన్ని అందించాడు. తమకు కంటగింపుగా వున్న చట్టాలను నీరుగార్చి, పసలేని వాటిగా చేయాలన్నా, తొలగించాలన్నా అవాస్తవాలతో పాటు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలన్నది నేటి పాలకవర్గాల నీతి. కేంద్రంలో అధికారంలో వున్న పాలకపక్షం బహుశా మొదటిసారిగా తాను అమలు జరుపుతున్న ఒక చట్టాన్ని అందునా సమాజంలో సమాజంలో అట్టడుగున వున్నవారు దుర్వినియోగం చేస్తున్నారని దేశ అత్యున్నత న్యాయ స్ధానానికి నివేదించటం, దానిని ప్రాతిపదికగా తీసుకొని అవును నిజమే అని తీర్పు చెప్పటం నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి సాధించిన ‘ఒక ఘనత’.

భూస్వామ్య శక్తులతో రాజీపడి ఆ వ్యవస్ధను కొనసాగిస్తూనే తమ ప్రయోజనాలకు పెద్ద పీటవేసుకొనే బడా పెట్టుబడిదారుల నాయకత్వంలో నడుస్తున్నది మన దేశం. కాంగ్రెస్‌, ఇతర పార్టీలలో కూడా ఈశక్తులకు ప్రాతినిధ్యం వహించేవారు వున్నప్పటికీ అత్యధికంగా మాజీ రాజులు,రాణులు, జమిందార్లు,దేశముఖులు, భూస్వాములు అదే సమయంలో బడాపెట్టుబడిదారులను కుడి ఎడమల ఢాల్‌ కత్తుల మాదిరి కలిగి వున్న ఏకైక పెద్ద పార్టీ బిజెపి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోని చట్టాలపై ద్విముఖ దాడి జరుగుతున్నది. అదిప్పుడు మరింతగా పెరిగింది. ఆ ఖ్యాతి తమదే అని బిజెపి ప్రపంచం ముందుకు వస్తోంది. పారిశ్రామిక సంబంధాలు, చట్టాల సంస్కరణల పేరుతో కార్మికులకు రక్షణ కల్పించే, సంక్షేమ చర్యలను చేపట్టాల్సిన అనేక చట్టాలను నీరుగారుస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. మరోవైపు మొత్తంగా మహిళలపై సాగించే వరకట్న తదితర వేధింపుల నిరోధక అంశాలు, సామాజికంగా బలహీన వర్గాలుగా వున్న ఎస్‌సి,ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టంపై బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, దాని వాదనలకు అనుగుణ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, దాని పర్యవసానాలు వాటిని నీరుగార్చేందుకు దారితీసేవిగా వున్నాయి.

ఈ తీర్పుపై అనూహ్యరీతిలో దళితులు, గిరిజనుల్లో వెల్లడైన ఆగ్రహాన్ని వూహించని బిజెపి సర్కార్‌ కోర్టులో తీర్పు సమీక్ష పిటీషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు దళితులు, గిరిజనుల మీద బిజెపికి వున్న శ్రద్ధ ఎలాంటిదో, అంతరంగంలో వున్నదేమిటో కళ్లు తెరిపించేవిగా వున్నాయి. దళితులు, గిరిజనులపై దాడుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదని గణాంకాలు కూడా సమర్పించింది మీ ప్రభుత్వమే కదా అని జస్టిస్‌ ఏకె గోయల్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టుకు సాయపడేందుకు గాను అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన అమరేంద్ర షరాన్‌ ‘ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సమాచారం అందించి దుర్వినియోగం గురించి విన్నపాలు చేసింది, ఇప్పుడు అదే ప్రభుత్వ తీర్పును సవాలు చేస్తోంది’ అని అభ్యంతరం తెలిపారు.కోర్టుకు అందచేసిన సమాచారం, దాని మీద దుర్వినియోగ వ్యాఖ్యానాలతో వాదనలు చేయటం ఫ్యూడల్‌ వ్యవస్ధకు ప్రతినిధులైన భూస్వాములు, మాజీ జమిందార్లు, రాజాలు, ఆ భావజాలం వున్న ఇతరులను సంతృప్తి పరచేందుకు, ఆ చట్టాన్ని తొలగించేందుకు అన్నది స్పష్టం. దాని మీద ఈ తరగతుల్లో వ్యక్తమైన హర్షాతిరేకాల కంటే బాధితులుగా వుంటున్న దళితులు, గిరిజనుల్లో వెల్లడైన వ్యతిరేకతను చూసి బిజెపి ఎక్కువగా భయపడింది. దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో ఓట్ల గురించి తలెత్తిన బెంగ, దాని పర్యవసానమే కోర్టులో సమీక్ష పిటీషన్‌.

బ్రిటీష్‌ వారి విభజించు పాలించు అనే సూత్రాన్ని మన పాలకవర్గం మరింతగా నవీకరించి అమలు జరుపుతోంది. ఏ తరగతికి ఆ తరగతి వారు తమ దాకా వచ్చినపుడు చూసుకుందాంలే అనే వుపేక్షాభావంతో వున్నారు. దళితులు చూపిన చొరవను గతంలో వివిధ చట్టాల సందర్భంగా అందరూ చూపి వుంటే ఇప్పుడీ పరిస్ధితి తలెత్తి వుండేది కాదు. వుదాహరణకు మహిళా రక్షణ చట్టాల విషయమే చూద్దాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మహిళ చట్టాన్ని వుపయోగించుకుంటే దాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తారు, అదే మన దేశంలో అయితే దుర్వినియోగంతో పాటు సదరు మహిళ చెడునడత కలదని ముద్రవేయటం సర్వసాధారణం. ఏడాది క్రితం కట్న వేధింపుల వుదంతాలలో శిక్షాస్మృతి 498ఏ కింద ఫిర్యాదులు నమోదైనపుడు వాటిని నిర్ధారించుకోకుండా అరెస్టులు చేయరాదని సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి జిల్లాలో కట్నవేధింపుల కేసుల ఫిర్యాదులను పరిశీలించేందుకు కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్ధలో కొంత నీరుకారుతుంటే మరొక దొంతర తోడు చేయటమే ఇది. సమాజంలో కట్నకానుకల దురాచారం లేదా దోపిడీ గురించి తెలియని వారు లేరు. వాటికోసం మహిళలను వేధించటం జగమెరిగిన సత్యం. ఎవరైనా తెగించి ఫిర్యాదు చేస్తే చట్టాన్ని దుర్వినియోగం చేశారనే నిందతో సమాజం, పోలీసులు,కోర్టులలో లాయర్ల ప్రశ్నలతో మరో వేధింపు పర్వం ప్రారంభం అవుతుంది. అంతదాకా నిలబడిన మహిళపై చివరకు చెడునడత నింద. సహించలేక ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే వేధింపులు ఆగేందుకు ప్రయత్నం కాకుండా కుటుంబపరువు పోతుందనే పేరుతో అసలు కేసునే వెనక్కు తీసుకొనే ప్రయత్నం అటు పోలీసుల నుంచి ఇటు ఇతరుల నుంచీ జరుగుతుంది. అందుకే వరకట్న వేధింపులు, దళితులు, గిరిజనులపై అత్యాచారాలు, దాడుల కేసులు అత్యధికం విచారణ వరకు రావు, వచ్చినా శిక్షలు పడేది చాలా తక్కువగా వుంటున్నాయి. కారణం విధిలేక రాజీపడేవి కొన్నయితే బలవంతపు రాజీ,ప్రలోభాలతో నీరుగారేవి ఎన్నో. ఈ గణాంకాలను చూపే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం దుర్వినియోగమవుతున్నదని వాదించగా ప్రభుత్వమే సాధికారికంగా దుర్వినియోగం గురించి చెబుతున్నపుడు కోర్టులు అందుకు అనుగుణ్యంగా తీర్పు చెప్పకుండా ఎలా వుంటాయి? కట్నవివాదాలలో అత్తమామలను చేర్చి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక సందర్భాలలో కోర్టులే వ్యాఖ్యానించిన వుదంతాలు వున్నాయి. తమ కుమారుడు కోడల్ని వేధిస్తున్నాడని అత్తమామలు ఫిర్యాదు చేసిన వుదంతం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటానికి కారణం ఏమిటి? మనది పితృస్వామిక వ్యవస్ధ ఇలాంటి వాటిలో ఏం చేసినా ఆడది అణగిమణగి వుండాలన్నది తరతరాలుగా వస్తున్న ఆధిపత్య భావజాలమే. దీని అర్ధం చట్టాలు దుర్వినియోగం అవటం లేదని కాదు. తప్పుదారి పట్టేవారు సమాజంలోని ప్రతి తరగతిలో వుంటారు. అలాంటి అనేక వుదంతాలలో గ్రామ కక్షలలో, పట్టణాలలో వివాదాలలో పావులుగా మార్చుకొని ప్రత్యర్ధులపై తప్పుడు ఫిర్యాదులు చేయించేది పెత్తందారులు, అవాంఛనీయ శక్తులే. అలాంటి వారిపై తగు చర్య తీసుకొనేందుకు అవకాశం వున్నప్పటికీ మన వ్యవస్ధలు తమ అధికారం, బాధ్యతలను దుర్వినియోగపరుస్తున్నాయి. మహిళా చట్టాన్ని నీరుగార్చినపుడే తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత వ్యక్తమై వుంటే దళితులు తమ రక్షణకోసం చేసిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిపైనే బిజెపి సర్కార్‌ నెపం మోపే సాహసం చేసి వుండేదా ?

పశ్చిమ దేశాల పధకంలో భాగమే ముస్లిం వుగ్రవాదుల తయారీ !

Tags

, ,

ఎం కోటేశ్వరరావు

తమ విలువైన సంపదలు పశ్చిమ దేశాల కార్పొరేట్‌ సంస్ధల పాలవుతున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ముస్లిం దేశాల పౌరులున్నారు. మరోవైపు అదే సంస్ధల ఆధీనంలో వున్న మీడియా పని గట్టుకొని చేస్తున్న ప్రచారం, జరుగుతున్న కొన్ని వుదంతాల వలన మానసికంగా గాయపడిన, అవమానభారాలకు, గందరగోళానికి, ఆత్మన్యూనతకు గురి అవుతున్నారు. అలాంటి వారు వూరట పొందేందుకు, వాస్తవాలను అర్ధం చేసుకొనేందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పిన అంశాలు నిస్సందేహంగా తోడ్పడతాయి. అత్యధిక ముస్లిం దేశాలలో పశ్చిమ దేశాలు, వారి ప్రయోజనాలతో ముడిపడి వున్న శక్తులతో సంబంధాలున్న నిరంకుశశక్తులు అధికారంలో వున్నాయి. వారు మిలిటరీ లేదా అవినీతి అక్రమాలకు నిలయంగా వున్నారు. అందువలన తమకు అవసరమైనది తప్ప ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ ఆయా దేశాల జనానికి తెలియకుండా నియంత్రిస్తున్నారు. వారికి అందుబాటులో వున్నదంతా పశ్చిమ దేశాల కృత్రిమ తయారీ సమాచారమే. ఒక అంచనా ప్రకారం గత అర్ధశాతాబ్దంలో దాదాపు కోటి మంది సామాన్య ముస్లింలు పశ్చిమ దేశాల కుట్రలకు బలై ప్రాణాలర్పించారని అంచనా. ఇందుకు కారకులైన దుర్మార్గాలను మరుగుపరచి ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోయినా వుగ్రవాదులందరూ ముస్లింలే అనే పేరుతో అందరినీ అవమానాలకు గురి చేస్తున్నారు. ఇదంతా పశ్చిమ దేశాలు, వాటితో చేతులు కలిపిన తమ దేశాల పాలకవర్గాల పుణ్యమే అని గ్రహించలేని వారెందరో. అలాంటి వారిలో కొందరికైనా సౌదీ పాలకుడు అధికారికంగా అంగీకరించిన అంశం వుపకరిస్తుంది.

ఇస్లామిక్‌ దేశాలలో మతోన్మాదశక్తులు పెరగటానికి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదశక్తులే కారణం అన్నది ఎప్పటి నుంచో తెలిసిన బహిరంగ రహస్యం. 1960వ దశకంలో ఇండోనేషియాలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, సోవియట్‌ సేనలపై దాడులకు ముజాహిదీన్‌ లేదా తాలిబాన్ల పేరుతో వున్న మతశక్తులకు ఆయుధాలిచ్చాయి. ఇప్పుడు సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వాటిని వుపయోగిస్తున్నారు. ముస్లిం దేశాలు సోవియట్‌ ప్రభావంలో పడకుండా వుండేందుకు గాను పశ్చిమ దేశాల సలహా మేరకు వహాబియిజాన్ని వ్యాప్తి చేసేందుకు తాము పెద్ద మొత్తంలో నిధులు అంద చేస్తున్నట్లు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వెల్లడించారు. గతనెల మూడవ వారంలో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు పత్రిక జర్నలిస్టుల ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గని అనేక విషయాలు చెప్పారు. ప్రచ్చన్న యుద్ద(కమ్యూనిజంపై సామ్రాజ్యవాదుల దాడికి పెట్టిన పేరు) సమయంలో సోవియట్‌ ప్రభావం (అంటే కమ్యూనిస్టు వుద్యమ) పెరగకుండా చూసేందుకు పశ్చిమ దేశాల సలహా సౌదీ అరేబియా వ్యవహరించిన తీరును వివరించారు. ఇష్టాగోష్టిగా చెప్పినప్పటికీ తరువాత కొన్ని విషయాలను ప్రచురించి, ప్రసారం చేయటానికి సౌదీ రాయబారకార్యాలయం వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు అనుమతిచ్చింది.ఆ విధంగా పై వివరాలు బయటకు వచ్చాయి.

ఇస్లామిక్‌ దేశాలలో సోవియట్‌ ప్రభావం విస్తరించకుండా చూసేందుకు ఆ దేశాలలో సున్నీ తెగ ముస్లింల మసీదుల నిర్మాణం, మదార్సాల ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రచ్చన్న యుద్ధ కాలంలో తమ దేశాన్ని పశ్చిమ దేశాలు కోరాయని, మధ్యలో కొన్ని సౌదీ ప్రభుత్వాలకు వాటితో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరించుకున్నామని, వాటికి నిధులు ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రధానంగా సౌదీలోని ధార్మిక సంస్ధల ద్వారా అంద చేస్తున్నట్లు యువరాజు వెల్లడించారు. తరువాత కొద్ది రోజుల తరువాత అట్లాంటిక్స్‌ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతూ వహాబియిస్టులకు నిధులు ఇస్తున్న మాట వాస్తవమేనని అయితే వహాబియిజం అంటే నిర్వచనం ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఇస్లామ్‌ను సంస్కరించే పేరుతో 1703-1791 మధ్య సౌదీ ప్రాంతంలో నివశించిన మహమ్మద్‌బిన్‌ అబ్దల్‌ వహాబ్‌ అనే ఇస్లామిక్‌ పండితుడు సున్నీ ముస్లింలు కఠోరనైతికతా వాదంతో ఎలా వుండాలో ప్రవచించిన దానినే వహాబియిజమ్‌ అని వ్యవహరిస్తున్నారు. దానికి పలు వ్యాఖ్యానాలున్నాయి. అయితే ఇప్పుడు తాలిబాన్లు, ఆల్‌ఖైదా, ఐఎస్‌, బోకో హారం పేరుతో వ్యవహరిస్తున్న మత వుగ్రవాద సంస్ధలన్నీ తాము వహాబియిజాన్నే అనుసరిస్తున్నామని, అలాంటి ముస్లిం సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ జనం మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి, అమలు జరపనివారి మీద దాడులు చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాలతో చేతులు కలపని ముస్లిందేశాల పాలకులందరిని మత ద్రోహులుగా ముద్రవేసి పవిత్రపోరాటం పేరుతో అమెరికా తదితర దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో కిరాయిదాడులకు పాల్పడుతున్నాయి.

జనంలో తంపులు పెట్టటం, తిరోగమన శక్తులను పెంచి పోషించటంలో అందెవేసిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వహాబియిజాన్ని సాధనంగా చేసుకొని తమ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. తరువాత అమెరికా పెద్దన్న పాత్ర తీసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. దీనిలో భాగంగానే బిన్‌ లాడెన్‌ వంటి దుష్టశక్తులను పెంచి పెద్ద చేశారు. ఆల్‌ఖైదా తీవ్రవాదులు 2001సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసినప్పటికీ అమెరికన్లు ఈ మత వుగ్రవాదులకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. దానికి తన ప్రయోజనాలు తప్ప తాను పెంచిన వుగ్రవాదులు తన దేశపౌరులపై దాడులు చేసినప్పటికీ దానికేమీ చీమకుట్టినట్లు లేదని తరువాత పరిణామాలు స్పష్టం చేశాయి. సౌదీలోని పాలకులకు ఈ శక్తులు వెన్నుదన్నుగా వున్నాయి. ఆఫ్రికాలోని ఎమెన్‌ ప్రాంతం మిలిటరీ వ్యూహరీత్యా ఎంతో కీలకంగా వుండటంతో అక్కడ తిష్టవేసేందుకు అమెరికా గత యాభై సంవత్సరాలుగా చేయని దుర్మార్గం లేదు. ఆ కుట్రలు ఫలించకపోవటంతో సౌదీ అరేబియాను ముందు పెట్టి దాని నాయకత్వంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎమెన్‌పై దాడులు చేయిస్తున్నారు. కొన్ని లక్షల మందిని చంపివేసినా, కరవు కాటకాలకు, కలరా వంటి వ్యాధులకు గురిచేసినా, లక్షల మందిని దేశం నుంచి తరిమివేసినా దాన్ని స్వాధీనం చేసుకోవటం సాధ్యం కావటం లేదు. అక్కడి సామ్రాజ్యవాద వ్యతిరేకశక్తులు మొక్కవోని ధైర్యంతో ప్రతిఘటిస్తున్నాయి. సౌదీ అరేబియన్‌ పౌరుల రక్షణకు మాత్రమే తాము అక్కడ జోక్యం చేసుకుంటున్నామని సల్మాన్‌ సమర్ధించుకున్నారు.

సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా మతోన్మాద, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల వలలో పడిన ముస్లిం యువతలో, యావత్‌ ఇస్లామిక్‌ దేశాలలో పురోగామి ఆలోచనలు రేకెత్తించటానికి, సామ్రాజ్యవాదుల కుట్రల పట్ల మరింత అప్రమత్తం కావటానికి సౌదీ యువరాజు వెల్లడించిన అంశాలు తోడ్పడతాయి. కమ్యూనిస్టు వుద్యమం విస్తరించకుండా చూసేందుకు సామ్రాజ్యవాదులు అనుసరించిన వ్యూహంలో ఎన్నో అంశాలున్నాయి. అరబ్‌ సోషలిజం పేరుతో సంస్కరణవాదశక్తులను ప్రోత్సహించారు. దానికి పెద్ద వుదాహరణ బాత్‌ పార్టీ సోషలిజం పేరుతో సద్ధాం హుసేన్‌ రంగంలోకి రావటానికి, సమర్ధించటంలో అమెరికా తోడ్పడింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆ సద్దాంనే ప్రయోగించి యుద్దం చేయించిన వుదంతం మన కళ్ల ముందే వున్నది. అమెరికా కుట్రలను ఎరిగిన సోవియట్‌ యూనియన్‌ అనేక అరబ్బు దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చి నిలబెట్టింది. అలాంటి వారిలో గడాఫీ ఒకరు. ఇదే సమయంలో సౌదీ అరేబియా వంటి దేశాల పాలకులతో చేతులు కలిపి తాలిబాన్లు,ఆల్‌ఖైదా వంటి ఛాందస వుగ్రవాదుల తయారీని చూశాము. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత తనను వ్యతిరేకించే అరబ్బు జాతీయశక్తులను దెబ్బతీసేందుకు అమెరికా పావులు కదిపింది. ఇరాక్‌ , లిబియాలో జరిగింది అదే. ఇరాన్‌లో విఫలయత్నం చేసింది. సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల పాలకులను మార్చేందుకు ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నది. తమ చేతికి మట్టి అంటకుండా ఇస్లామ్‌ పునీకరించేపేరుతో మతఛాందసాన్ని మెదళ్లకు ఎక్కించటం, ప్రపంచాధిపత్యంలో భాగంగా అపార చమురు, ఇతర సహజ సంపదలున్న ప్రాంతాలపై ఆధిపత్యం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతాలను తమ చేతుల్లో వుంచుకొనేందకే ఇదంతా చేస్తున్నారు.

సామ్రాజ్యవాదులు కేవలం ఇస్లామిక్‌ సమాజాలు, ఇస్లామిక్‌ దేశాల మీదే కేంద్రీకరించాయనుకుంటే పొరపాటు. అది మతం, ప్రాంతీయం, భాష, వేర్పాటు వాదం ఏదైనా కావచ్చు. వాటి వెనుక సామ్రాజ్యవాదుల హస్తం వుంటుంది. మన దేశంలో హిందూ తాలిబాన్లు,గతంలో పంజాబ్‌ తీవ్రవాదులు, ఇప్పుడు కాశ్మీరులో తీవ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ వుగ్రవాదులు, ఐరోపా దేశాలలో నయా నాజీ బృందాల వెనుక పశ్చిమ దేశాల హస్తం, డబ్బు లేకుండా ఇంతగా రెచ్చిపోవటం సాధ్యం కాదు. తాము తయారు చేసిన వుగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ కొన్ని చోట్ల తమ అదుపు తప్పటంతో లేదా తమ వ్యతిరేకులైన ఇరాన్‌ ప్రభావంలోకి పోవటం వంటి పరిణామాలతో అవే పశ్చిమ దేశాలు ఒక ఎత్తుగడగా వుగ్రవాద వ్యతిరేక ఫోజుపెడుతున్నాయి. తమతో సంబంధాలలో వున్న వారితో సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వుపయోగించుకుంటున్నాయి. నిజానికి వంద సంవత్సరాల క్రితం ముస్లిం తీవ్రవాదం గురించి ప్రపంచానికి తెలియదు, అటువంటి వుగ్రవాద చర్యలు కూడా లేవు. ముస్లిం సమాజం వుగ్రవాదానికి లోనై వుంటే పశ్చిమాసియాలో వారి మెజారిటీగా వున్న ప్రాంతాలకు ప్రపంచంలో వున్న యూదులందరినీ సమీకరించి కొన్ని ప్రాంతాల రూపురేఖలను మార్చివేస్తుంటే సహించి వుండేవారా ? తమ ప్రాంతాల నుంచి తమను వెళ్లగొట్టటం ప్రారంభమైన తరువాతే పాలస్తీనియన్లు ఆయుధాలు పట్టారు తప్ప అంతకు ముందు ఎంతో సౌమ్యంగా వున్న సమాజాలవి. నిజానికి ఇస్లాం ఒక మతమే కాదు, ఒక సంస్కృతి కూడా. ప్రతి సంస్కృతిలో కొన్ని మినహాయింపులున్నట్లే దానికి భిన్నంగా ప్రవర్తించేవారు ఆ సమాజంలో వుండట ఆశ్చర్యమేమీ కాదు.

పుతిన్‌ అధ్యక్ష ఎన్నిక ఓ ప్రహసనం!

Tags

,

ఎం.కోటేశ్వరరావు

         బద్దకంగా కలలు కనేవారికి నియంతృత్వం కూడా ఒక పాలనా విధానం మాదిరే కనిపించి మాయ చేస్తుంది. వారికి మరొక ప్రత్యామ్నాయం కనిపించదు. ఇది ఆదివారం నాడు జరిగిన రష్యన్‌ ఎన్నికల్లో మరోమారు ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌ విజయం గురించి ఒక వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి ఎంతో దగ్గరగా వుంది. అసలు ఎన్నికలే జరపని నియంతలు కొందరైతే ప్రత్యర్థులకు అవకాశాలు లేకుండా చేసి అప్రజాస్వామికంగా యంత్రాంగాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకొనే తరగతికి చెందిన వ్యక్తి పుతిన్‌. అందుకే అతగాడు తప్ప మరొకరు విజయం సాధించలేరని, ఎన్నిక లాంఛనప్రాయమే అని పరిశీలకులు ముందుగా వూహించినట్టుగానే ఫలితాలూ వచ్చాయి. ఎన్నికల్లో అవినీతి, అక్రమాల ఆరోపణల మధ్య పుతిన్‌కు 77, కమ్యూనిస్టుపార్టీ బలపరిచిన అభ్యర్థి గ్రడనిన్‌కు 12, మితవాది జిరినోవస్కీకి 5.65శాతం ఓట్లు వచ్చాయి. మరో ఆరేండ్లు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనసాగేందుకు వీలు కల్పించిన ఏకపక్ష ఎన్నికల గురించి నిజానికి ఎవరికీ పెద్ద భ్రమలు లేవు. సోవియట్‌ విచ్ఛిన్నంతో మిగిలిపోయే రష్యా గురించి సామ్రాజ్యవాదులు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత రెండు ప్రపంచ యుద్ధాల్లో ఏదో ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయి అది బలహీనపడటం చరిత్ర. ఉదాహరణ టర్కీ, బ్రిటన్‌, జపాన్‌, అయితే ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్‌ యూనియన్ను కూల్చేసిన తరువాత ప్రపంచ రాజకీయ రంగంలో తమకు పోటీదారుగా రష్యా ముందుకు రావటాన్ని సామ్రాజ్యవాదులు వూహించి వుంటే పరిణామాలు మరోవిధంగా వుండేవి. పుతిన్‌ హయాంలో రష్యా ప్రపంచ అగ్రరాజ్యంగా ముందుకు వచ్చింది. తన సత్తా నిరూపించేందుకు నాటో కూటమిని సవాలు చేస్తూ తన పక్కలో బల్లెంగా మారకుండా చూసుకొనేందుకు ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించుకుంది. సిరియాలో అసద్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి సామ్రాజ్యవాదుల వెన్నుదన్నుగా వున్న శక్తులను దెబ్బతీయటంలో రష్యా పాత్ర బహిరంగం. ఇదే సమయంలో మొత్తం మీద చూసినప్పుడు సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్థలను కూల్చేసిన సామ్రాజ్యవాద, ధనిక పెట్టుబడి దారీ దేశాలన్నీ తరతమ తేడాలతో అభివృద్ధి గిడసబారటం లేదా తగ్గటం వంటి సంక్షోభాలకు గురయ్యాయి.

కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే కార్మికులకు మరో ఆయుధమేముంది !

Tags

, , , , ,

యంగ్‌ కారల్‌ మార్క్సు దృశ్యం

ఎం కోటేశ్వరరావు

తుపాకి చేతబట్టిన ఒక చెడ్డవాడిని ఆపాలంటే మరో మంచివాడు తుపాకి పట్టటమే ఏకైక మార్గం అని గతంలో సెలవిచ్చిన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధిపతి వేనె లాపిరే తాజాగా మరో మారు రెచ్చి పోయాడు.తుపాకులను అదుపు చేయాలనే వారందరూ కమ్యూనిస్టులని, ఆచర్య స్వేచ్చను అడ్డుకోవటమే అంటూ చిందులేశాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో 17 మంది విద్యార్దులు, టీచర్లు ఒక దుండగుడి తుపాకి కాల్పులకు బలైన విషయం తెలిసిందే. ఇలాంటి వుదంతాలు పునరావృతం కాకూడదంటే టీచర్లందరికీ తుపాకులు ఇవ్వటమే మార్గం అని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తుపాకులపై ఆంక్షలు విధించాలనే వారందరూ స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించాలని చూసే కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదని వేనె లాపిరే అన్నాడు. ట్రంప్‌-లాపిరే ఇద్దరూ లాభాల కోసం తుపాకులు తయారు చేసే కార్పొరేట్లకు వంత పాడుతున్నారు తప్ప వాటితో పోయే ప్రాణాల గురించి వారికి ఎలాంటి చింత లేదని నిరూపించుకున్నారు.

‘అమెరికా కాలేజీలలోె ఎక్కువగా ఇచ్చే నియోజిత పఠనం, అధ్యయనాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, ఆర్ధికవేత్తలలో కారల్‌ మార్క్స్‌ వుంటున్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు వందకు పైగా అమెరికా యువ ప్రజాస్వామ్య సోషలిస్టు శాఖలున్నాయి. సోషలిస్టు భావజాలాన్ని పెంపొందించుతున్నందుకు విద్యార్ధులు పాండిత్య ప్రదర్శక అభినందనలు కూడా పొందుతున్నారు.మీ పిల్లల్ని పాఠశాలలకు పంపే నిర్ణయం తీసుకోబోయే ముందు దీన్ని గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. అమెరికా రాజ్యాంగాన్ని పట్టించుకోవటం లేదు, దానికి వక్రభాష్యం చెబుతున్నారు. రెండవ సవరణ ద్వారా ఈ దేశంలో ప్రసాదించిన స్వేచ్చ విస్మరించబడుతోంది. వారు గనుక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా స్వేచ్చలు పోతాయి, మన దేశం శాశ్వతంగా మారిపోతుంది.సోషలిజం రక్తాన్ని ఇష్టపడుతుంది’. ఇలా సాగింది వెనె లాపిరే వాచాలత్వం.

చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వెల్లడవుతున్న అవాంఛనీయ పోకడలను ఎలా సమర్ధించుకోవాలో తెలియని శక్తులు స్వేచ్చా, స్వాతంత్య్రాలపదజాలంతో సోషలిస్టు, పురోగామి శక్తులే కాదు, వాటితో సంబంధం లేని వారి అభిప్రాయాలపై కూడా దాడి చేస్తున్నారు. తుపాకి సంస్కృతికి గోరీ కట్టాలనేందుకు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ప్రముఖ చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌ తాజా చిత్రం ”ద యంగ్‌ కారల్‌ మార్క్స్‌ ‘ (యువ కారల్‌ మార్క్స్‌) ఫిబ్రవరి 23న అమెరికాలో విడుదల అయింది. ఆ సందర్భంగా డెమోక్రసీ నౌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వెనె లాపిరే వాచాలత్వం గురించి రావుల్‌ పీక్‌ స్పందించారు. గతంలో ఆయన ‘ అయామ్‌ నాట్‌ యువర్‌ నీగ్రో, లుముంబా, డెత్‌ ఆఫ్‌ ఏ ఫ్రాఫెట్‌, హైతీ, ద సైలెన్స్‌ ఆఫ్‌ ద డాగ్స్‌, సమ్‌ టైమ్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ ‘ వంటి చిత్రాలను నిర్మించాడు. ‘ నేను స్పందించాల్సి వుంటుందని అనుకోలేదు, ఒక విషయం చెబుతాను. అనేక మంది టీచర్లు, అనేక సంస్ధలు ఆయన చెబుతున్నట్లుగా కారల్‌ మార్క్స్‌ను బోధన ప్రణాళికలో చేర్చుతున్నట్లయితే వారు కొంతమేరకు మంచి చేస్తున్నట్లే భావించాలి. కారల్‌ మార్క్స్‌ అంటే ఎవరు, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, ఒక విధంగా చరిత్రగతినే మొత్తంగా మార్చటం గురించి, వర్గం, కార్మికవర్గం, బూర్జువాలు, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి వంటి ఆయన చుట్టూ వున్న విషయాలు చర్చించటానికి వుపయోగపడుతుంది.

ఆయన ప్రస్తావిస్తున్న పుస్తకం కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి అధ్యాయాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నదానిని ఎక్కువ తక్కువ లేకుండా వర్ణించటం కనిపిస్తుంది. లాభమే ధ్యేయం గల ఒక వ్యవస్ధగా ఆయన సంస్ద(ఎన్‌ఆర్‌ఏ) జాబితా మొదట్లో వుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైతే లాభానిది పైచేయి అయిందంటే దాని అర్ధం తరుణ వయస్కుల్ని చంపటం, దానిని ఇంకా సమర్ధించుకోవటం వంటి అనంగీకృతమైన వాటిని అంగీకరించే స్ధితిలో మీరు వున్నట్లే. ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోలో వున్నది అదే. యువతరం దానిని చదవటం ప్రారంభించి, దాని మీద చక్కటి చర్చ చేస్తే అది చాలా మంచిది.’ రావుల్‌ పీక్‌ చెప్పిన ఈ అంశం ఒక్క అమెరికా రైఫిల్‌ అసోసియేషన్‌కే కాదు, యావత్‌ ప్రపంచంలో లాభాలవేటలో వున్న ప్రతి వ్యవస్ధకూ,అన్ని జీవన రంగాలకూ ఇది వర్తిస్తుంది. యంగ్‌ కారల్‌ మార్క్సు అనే పీక్‌ సినిమాలో మార్క్స్‌ ఒక ఫౌండరీ యజమానితో చేసిన సంభాషణ దృశ్యం ఇలా సాగుతుంది.

కారల్‌ మార్క్స్‌ : ఎలా సాగుతోంది మీ పని ?

యజమాని: మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా వుంది.

నేపధ్య వ్యాఖ్యాత :జునేలాకు ఫ్యాక్టరీలున్నాయి, పిల్లలతో సహా అనేక మందిని కార్మికులుగా నియమించాడు.

మార్క్స్‌ : మీ ఫ్యాక్టరీల్లో బాలకార్మికులున్నట్లున్నారు ?

యజమాని: మాకు వేరే గత్యంతరం లేదు, బాల కార్మికులు లేకపోతే మేం మార్కెట్లో అమ్ముకోలేము.

మార్క్స్‌ : మీ వంటి వారు లేకుండా దోపిడీ లేని ఒక సమాజం ఎక్కడ వుంటుంది, మీరు కూడా పని చేస్తున్నారు, ఇది దుర్భరంగా అనిపించటం లేదా ?

వ్యాఖ్యాత : వ్యవస్ధతో మనం పోరాడాలి, త్వరలో పాత వ్యవస్ధ కూలిపోతుంది.

మార్క్స్‌: రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కష్టించి పని చేసే వారు, మరొకరు ఆ కష్టార్జిత ఫలం నుంచి లబ్ది పొందేవారు.

యజమాని : దీన్ని ఆపాల్సిందే, సహించకూడదు, మీరెంత అదృష్టవంతులో చూడండి, నేను మిమ్మల్ని తొలగించలేను.

మార్క్స్‌ : నేను పెద్ద మనుషులను ద్వేషిస్తాను, తృణీకరిస్తాను, కార్మికుల స్వేదంతో బజ్జలు పెంచే పందులు వారు.

యజమాని : మేము చెత్తబుట్టలోకి నెట్టదగిన వారమనేగా మీరు చెబుతోంది.

వ్యాఖ్యాత : ఆయన చెప్పింది విన్నారుగా దయచేయండి. వారు మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు మన బుర్రలను నిరోధించలేరు.

వ్యాఖ్యాత : కారల్‌ , ఫెడరిక్‌ ఎంగెల్స్‌ను పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి.

ఎంగెల్స్‌ : మీ రచనలను నేను చదివాను, నా వాటిని మీరు చదివారా ? మనకాలపు గొప్ప మేధావులలో మీరు ఒకరు !

వ్యాఖ్యాత : తిరుగుబాటుకు సంతోషం అవసరం !

మార్క్స్‌ : ప్రతిదీ మారుతుంది, ఏదీ శాశ్వతంగా వుండదు, పాత వ్యవస్ధను మనం తోసివేయాలి.

ఎంగెల్స్‌ : మేలుకోవాల్సిన సమయమిది !

మార్క్స్‌ : ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పారు. కానీ దాన్ని మార్చాల్సి వుంది.

వ్యాఖ్యాత : బూర్జువాలు, కార్మికులు సోదరులా ?

కార్మికులు : కాదు !

ఎంగెల్స్‌ : కాదు, వారు సోదరులు కాదు, శత్రువులు !

Image result for the young karl marx

తన సినిమా బాక్సాఫీసు వద్ద ఆర్ధికంగా విజయం సాధించటం కంటే ప్రపంచంలో నేడు పెరిగిపోతున్న మితవాద, పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా వున్న రకరకాల వామపక్ష, పురోగామిశక్తుల సమీకరణ కేంద్రంగా తన సినిమా పనిచేస్తే అది పెద్ద విజయమని పీక్‌ భావిస్తున్నారు. ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ తన చిత్రం పట్ల ఫ్రాన్స్‌లో వెల్లడైన స్పందనను వివరిస్తూ రాజకీయ విబేదాలతో ఏకీభావం లేని పార్టీల వారందరినీ తన చిత్రం ఒక దగ్గరకు చేర్చిందని, ఇతివృత్తం గురించి చర్చలకు దోహదం చేసిందన్నారు. మార్క్స్‌ పిడివాది కాదు, మీవర్తమాన, చారిత్రక పరిస్ధితులను పున:సమీక్షించుకోవాలని మార్క్స్‌ ఎల్లవేళలా చెప్పేవారని అన్నారు. ‘ నా జీవిత పాఠం, రాజకీయాల అనుభవం కారణంగా ఒక వ్యక్తి ఏ ఒక్కరినీ రక్షించలేరని నేను నమ్ముతాను. అలాంటివి ఎన్నికలలో ప్రజాకర్షణకు బాగుంటాయని మనం చూడవచ్చు, దీని నుంచి బయటపడి నూతన వుమ్మడి సమూహాలను నిర్మించాలి. మీకు ఓటు వేయాలని కొంత మందిని మీరు బలవంతం చేయలేరు. వారిని ఒప్పించాలి. అది చర్చల ద్వారా మీరు చెబుతున్నదానిని రుజువు చేసుకోవాలి. కనుక అది దీర్ఘమైన బాట, దీనిలో రహస్యమేమీ లేదు. ఈ రోజు మనకు అపురూప వ్యక్తి మన ముందు ప్రత్యక్షమైన మనలను వెలుగులోకి తీసుకుపోవాలని వూహించుకోవచ్చు, కానీ అలాంటిదెన్నడూ జరగలేదు, అదొక క్రమం. నేడు సమాజాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే వారందరికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ వారి సమయంలో అందించిన పరికరాలు – దీర్ఘకాల చరిత్ర అందించిన సూచనలు- ఇప్పటికీ లభ్య మౌతున్నాయి. సినిమా ఒక హీరో కేంద్రంగా నడిచేది కాదు. భావవిప్లవం, సామాజికమార్పు కోసం నూతన రాజకీయ సంఘటనల నిర్మాణం, సుదీర్ఘచర్చలు, ఒక యంత్రాంగ నిర్మాణం, అంతర్గత విభేదాలు, పిలుపులతో కూడిన ఒక వాస్తవం ఆధారంగా సాగింది ‘ అన్నారు.

‘ మెరిసిన జుట్టు పెరిగిన గడ్డం వుండే వృద్ధుడైన రాజకీయవేత్తగా కాదు, ఒక అసాధారణ తత్వవేత్తగా చూపించినప్పటికీ ఒక యువకుడిగా, అప్పులతో ఇబ్బందులు పడిన మార్క్స్‌ను, వుద్యమం నుంచి వుద్భవించిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఎలా వచ్చిందో ఈ చిత్రంలో చూస్తారు. కేటుంబం, ముఖ్యంగా భార్యజెన్నీ, స్నేహితుల మధ్య మార్క్స్‌ ఎలా పెరిగారో చూపటం దీనిలో నా తొలి అంశం. మేం ధనికులం, మేం మధ్యతరగతి లేదా పారిశ్రామిక కుటుంబాలకు చెందినవారం అయినప్పటికీ మా చుట్టూ జరుగుతున్నదానిని మేం అంగీకరించం అని చెప్పిన ముగ్గురు యువకుల జీవితాలను యువతరం చూడాలని కోరుకున్నాను. మానవులుగా వారికి నేనెంతో సన్నిహితం, వారు కేవలం పోరాటం మాత్రమే చేయలేదు, వాటితోనే జీవించారు. తమకు ప్రమాదకరమైన నిర్ణయాలను వారు తీసుకున్నారు, సర్వం కోల్పోయారు. వారు పేదలయ్యారు అయినప్పటికీ వారిది పెద్ద జీవితం, మేథావులుగా తయారయ్యారు.యువకులుగా స్పందించారు, ప్రతిదీ మార్చదగినదిగానే వారికి కనిపించింది. పశ్చిమ దేశాలలో మార్క్సు గురించి మరో చిత్రం లేకపోవటం ఈ చిత్ర నిర్మాణానికి ఒక కారణం.’ అన్నారు పీక్‌.

మార్క్స్‌పై చిత్ర నిర్మాణానికి పీక్‌ పది సంవత్సరాలు పని చేశారు. డబ్బు సమస్యలెదురయ్యాయి.ౖ ‘ నేను మూలాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.కమ్యూనిస్టు మానిఫెస్టో వంటి ఒక ముఖ్యమైన పుస్తకం మీరు చదివినపుడు అది సులభమార్గంలో వారి పోరాటాలు, జీవితాలను అర్ధం చేసుకొనేందుకు కార్మికుల కోసం రాసిన ఒక పుస్తకం అని అర్ధం అవుతుంది. దానిలో తొలి అధ్యాయం చదివితే గత మూడుదశాబ్దాలలో జరిగినదానిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. పెట్టుబడిదారీవిధాన విస్తరణ, వూహాకల్పన(స్పెక్యులేషన్‌) మీద సంపూర్ణ వెర్రి, మొత్తం భూగోళంపై దాని దాడి. సరిగ్గా అదే జరిగింది, కనుక మన చరిత్రను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైంది. లేనట్లయితే మీకు స్వర్గాన్ని చూపించే తదుపరి ప్రజాకర్షకకులను అనుసరించే ఒక కీలుబమ్మ అవుతావు.’ అని రావుల్‌ పీక్‌ చెప్పారు.

ఈ చిత్రం న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ నగరాలలో ఫిబ్రవరి 23న విడుదల అయింది. రెండు గంటల నిడివి వున్న ఈ చిత్రాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియంలలో చిత్రీకరించారు. కారల్‌ మార్క్స్‌గా అగస్ట్‌ డిహెల్‌, ఎంగెల్స్‌గా స్టెఫాన్‌ కోనార్సకె, జెన్నీగా వికీ క్రిప్స్‌ నటించారు. మార్క్స్‌-ఎంగెల్స్‌ తమ కాలంలో ప్రబలంగా వున్న పలు రాజకీయ, తాత్విక ఆలోచనా ధోరణుల నుంచి శాస్త్రీయ సోషలిజాన్ని ఎలా వేరు పరచారన్నదే ప్రధానాంశంగా ఈ చిత్రంలో వున్నదని కొన్ని సమీక్షలలో పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత రావుల్‌ పీక్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల అధ్యయనంలో దాస్‌ కాపిటల్‌ ఒక భాగంగా అభ్యసించారు.

ప్రపంచ గతినే మలుపు తిప్పిన కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి ప్రచురణకు 170 ఏండ్లు. ఈగ్రంధ ముద్రణ 1848 ఫిబ్రవరి చివరి వారంలో లండన్‌లోని ఒక అజ్ఞాత ప్రాంతంలో జరిగింది. వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ పేరుతో దానిని ప్రచురించారు. తొలుత దానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని పేరు పెట్టారు. 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత ఈ గ్రంధ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్‌లో వాటర్‌ స్టోన్స్‌ అనే విక్రేత 2015 ఫిబ్రవరిలో వారం రోజుల్లోనే 30వేల కాపీలు విక్రయించారు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొని వున్న ప్రస్తుత సమయంలో మార్క్సిజం పట్ల ఆసక్తి తిరిగి రేకెత్తించటానికి, పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేకించి యువకులకు అది తోడ్పడుతుందని 2012లో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొన్నది.’మనకు తెలిసిన పెట్టుబడిదారీ వ్యవస్ధ జవాబుదారీతనం లేని పెద్ద ప్రపంచవ్యాపిత బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధిపత్యంలో వుంది. అది నాలుగు రోడ్ల కూడలిలో వుంది, దాన్ని సంస్కరించి, నవీకరించాల్సి వుంది’ అని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం చితికిపోయింది, దానిని తక్షణమే సంస్కరించటం అవసరం, ఎందుకంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలను దుర్భరస్ధితిలో వదలి వేస్తున్నదని టెలిగ్రాఫ్‌ పత్రిక గతేడాది సెప్టెంబరు 5న పేర్కొన్నది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో జనం సోషలిజానికి అనుకూలంగా మాట్లాడేందుకు వీలుగా అక్కడి పరిస్ధితి వుంది. 2016లో యు గవ్‌ అనే సంస్ధ జరిపిన సర్వేలో 32శాతం బ్రిటీషర్లు సోషలిజాన్ని వ్యతిరేకించగా 36శాతం మంది అనుకూలం అని తేలింది. నూతన సహస్రాబ్దిలో పుట్టిన వారిలో 40శాతం అమెరికన్లు సోషలిజానికి అనుకూలంగా వున్నట్లు గతేడాది నవంబరులో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే 83శాతం మంది బ్రిటీషర్లు నీటి సరఫరా సంస్దల ప్రయివేటీకరణ బదులు ప్రభుత్వ ఆధీనంలోనే వుండాలని, విద్యుత్‌, గ్యాస్‌ కంపెనీలను తిరిగి జాతీయం చేయాలని 77శాతం, రైల్వేలను తిరిగి ప్రభుత్వఆధీనంలోకి తీసుకోవాలని 76శాతం కోరుతున్నారు. 170 ఏండ్ల నాటి కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి చిత్తు ప్రతితో పాటు, మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిరాత ప్రతులు అనేక నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ(ఐఐఎస్‌హెచ్‌)లో వున్నాయి.’ 1990 దశకంలో మార్క్స్‌ ఇంకేమాత్రం పనికిరాడు అని కొంత మంది చెప్పారు. అమెరికా, ఐరోపాలలో తరువాత సంభవించిన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం,స్పెక్యులేషన్‌, బుడగలు పేలిపోయిన తరువాత జనాలు ఆకస్మికంగా ఇది గతంలో ఒకసారి జరిగింది, దాన్ని పరిశోధించారు, మరోసారి మార్క్సును చదివితే ఏమౌతుంది, అది ఇప్పటికీ పనికొస్తుందా, అవును ఇది పనికొచ్చేట్లే కనిపిస్తోంది అనే ఆలోచనలో పడ్డారని’ సంస్ద అధిపతి మారియన్‌ వాన్‌డెర్‌ హెజ్డన్‌ వ్యాఖ్యానించారు.

సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎన్ని విధాలుగా కుత్సిత వ్యాఖ్యానాలు చేసినా వాస్తవాన్ని కాదనలేరు. కమ్యూనిస్టు మానిఫెస్టోను రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన మాట వాస్తవం. దోపిడీ తీవ్రత, ఆర్ధిక అసమానతల్లో ఎలాంటి మార్పు లేదు. దోపిడీ కొనసాగుతూనే వుంది. అందువలన దానిని అంతం చేయాలని కోరిన కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే మరొక మెరుగైన సిద్ధాంతం, కార్మికవర్గ అస్త్రం మరొకటి కనిపించటం లేదు. లేదు ఎవరైనా అంతకంటే త్వరగా దోపిడీని అంతం చేసే భావజాలం,అస్త్రాలను కార్మికవర్గానికి అందచేస్తే అంతకంటే కావాల్సింది లేదు. అవి లేకుండా అందుబాటులో వున్న ఆయుధాలు పనికి రావు అని చెప్పటం అంటే కార్మికవర్గాన్ని నిరాయుధం చేసే మోసపు ఎత్తుగడతప్ప మరొకటి కాదు !

నేపాల్‌ కమ్యూనిస్టు వుద్యమంలో నూతన అధ్యాయం !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమానికి వుత్తేజం కలిగించే మరో పుట చరిత్రకు తోడైంది. ఇటీవలి పార్లమెంట్‌, రాష్ట్రాల ఎన్నికలలో ఐక్యంగా పోటీచేసిన నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ(యుఎంఎల్‌), నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు సెంటర్‌)లను ఒకే పార్టీగా విలీనమైంది. ఈ మేరకు లాంఛనంగా రెండు పార్టీల నేతలు ఏడు అంశాల ఒప్పందంపై సోమవారం నాడు సంతకాలు చేశారు. దీని ప్రకారం కొత్త పార్టీకి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సిపిఎన్‌) నామకరణం చేశారు. మార్క్సిజం-లెనిజం వేగుచుక్కగా పార్టీ పని చేస్తుంది. యుఎంఎల్‌ అధ్య క్షుడు, ప్రధాని అయిన కెపి శర్మ ఓలి, ఝాలా నాధ్‌ ఖనాల్‌, మాధవ కుమార్‌ నేపాల్‌, వామ్‌దేవ్‌ గౌతమ్‌, ఈశ్వర్‌ పోఖరెల్‌, మావోయిస్టు సెంటర్‌ తరఫున పార్టీ అధ్యక్షుడు పుష్పకమల్‌ దహాల్‌( ప్రచండ) నారాయణ్‌ కాజీ శ్రేష్ట, రామ్‌ బహదూర్‌ థాపా సంతకాలు చేశారు. ఐక్యపార్టీ మహాసభ జరిగే వరకు పార్టీకి కెపి శర్మ ఓలీ, ప్రచండ ఇద్దరూ అధ్యక్షులు వుంటారు, ఇద్దరూ అధికారంలో పాలుపంచుకుంటారు. దిగువ స్ధాయిలో కూడా రెండు పార్టీల కమిటీలు విలీనం అవుతాయి. అంగీకరించిన ఏడు అంశాలు ఇలా వున్నాయి.1.పార్టీపేరు నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ.2.పార్టీ సిద్ధాంతాలను అంతిమంగా పార్టీ మహాసభ నిర్ణయిస్తుంది.3. అప్పటి వరకు మార్క్సిజం-లెనినిజం వుమ్మడి పార్టీ సిద్ధాంత అంశంగా వుంటుంది.4. వుమ్మడి పార్టీ స్టాండింగ్‌ కమిటీ, పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలు చిన్నవిగా వుంటాయి.5. ప్రధానిగా కెపిశర్మ ఓలి, ప్రపండ రెండు సమానవంతుల వారీ పని చేస్తారు.6. పార్లమెంట్‌ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌గా యుఎంఎల్‌, స్పీకర్‌, వుపాధ్యక్షులుగా మావోయిస్టు సెంటర్‌ ప్రతినిధులు వుంటారు.7.మంత్రుల సంఖ్యను తరువాత ఖరారు చేస్తారు.(15 మందితో కాబినెట్‌ వుండాలని సమన్వయ కమిటీ సిఫార్సు చేసింది). మార్చినెల అయిదవ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశ కొత్త దేశాధ్యక్షుడు, వుపాధ్యక్షుడిని ఎన్నుకొంటుంది.

పదిరోజుల క్రితం ప్రధానిగా కెపి శర్మ ఓలి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసినదే.మార్చి ఐదవ తేదీన పార్లమెంట్‌ తొలి సమావేశం జరుగుతుంది. వుభయ సభలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ సభ్యులను కలిగి వుంది. చట్టపరమైన లాంఛనాలు కూడా పూర్తి కావాల్సి వున్నందున విలీన ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో నెల రోజులు పట్టవచ్చు.ఈ లోగా రెండు పార్టీల కేంద్రకమిటీలు సమావేశమై విలీన తీర్మానాలను అమోదించాల్సి వుంది. విభిన్న నేపధ్యాలు కలిగిన ఈ రెండు పార్టీల విలీనం అనేక మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది, అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. రెండువందల నలభయి సంవత్సరాల హిందూరాజ్య పాలన సాగిన నేపాల్‌లో గత రెండు దశాబ్దాలుగా రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన శక్తులు అక్కడి రాజకీయాలలో ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. కమ్యూనిస్టులు, నేపాలీ కాంగ్రెస్‌ కలిసి రాచరిక వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కాగా మావోయిస్టు సెంటర్‌ పార్టీ సాయుధపోరు బాటను అనుసరించింది.2006లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం మావోయిస్టులు ఆయుధాలను విసర్జించారు. ఆ పార్టీ నేత ప్రచండ ప్రధాని అయ్యారు. అయితే ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గిపోయింది. తాజా ఎన్నికలలో సంఖ్యరీత్యా అది మూడో స్ధానానికి పరిమితమైంది. నేపాల్‌ మావోయిస్టు పోరాటాన్ని ‘ ద బుల్లెట్‌ అండ్‌ బాలట్‌ బాక్సు’ పేరుతో గ్రంధస్తం చేసిన ఆదిత్య అధికారి విలీనం అసాధారణమైనదని వర్ణించారు. వారు ఐక్యతకు కట్టుబడి వుంటే అది నేపాల్‌ రాజకీయ భవితవ్యాన్నే మార్చివేస్తుందని, అయితే అధికారాన్ని పంచుకోవటంలో వుమ్మడి పార్టీలో కూడా వారు రెండు పక్షాలుగా వ్యవహరించే అవకాశం వుందని అన్నారు. గత పదకొండు సంవత్సరాలలో తొమ్మిది సంకీర్ణాలను చూసి విసుగెత్తిన నేపాలీ ఓటర్లు తాజా ఎన్నికలలో కమ్యూనిస్టులకు పార్లమెంట్‌ వుభయ సభలు, రాష్ట్రాలలో తిరుగులేని మెజారిటీని కట్టబెట్టి అస్ధిరతకు తెరదించారు. అందువలన వుమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సి వుంది. తాము అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నామని, శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, పూజలకు మాత్రమే పరిమితమైతే కుదరదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

పార్లమెంట్‌ ఎగువ సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులు మెజారిటీ సీట్లు గెలుచుకున్నారు. ఎగువ సభను కలిగి వుండటం నేపాల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభ్యులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్ధానిక సంస్ధల అధ్యక్షులు, వుపాధ్యక్షులతో కూడిన ఎలక్ట్రొరల్‌ కాలేజీ 59 సభ్యులుండే ఎగువ సభలో 56 మందిని ఎన్నుకుంటుంది. ముగ్గురిని దేశాధ్యక్షుడు నియమిస్తారు. ఏడు రాష్ట్రాలు సమాన ప్రాతిపదికన ఒక్కొక్క చోట నుంచి ఎనిమిది మందిని ఎన్నుకోవాల్సి వుంది. వీరిలో ముగ్గురు మహిళలు, ఒకరు దళితులు, ఒకరు వికలాంగుల ప్రతినిధి వుండాలి. ఈ మేరకు సోమవారం నాడు అధ్యక్షుడు విద్యాదేవి భండారి ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గురిని నియమించారు. ఒకరు జాతీయ ప్రణాళికా సంఘ మాజీ వుపాధ్యక్షుడు, మరొకరు ప్రణాళికా సంఘమాజీ సభ్యుడు కాగా మరొకరు న్యాయవాది. ఎగువ సభలో అధికార పక్షానికి చెందిన యుఎంఎల్‌కు 27, మావోయిస్టు సెంటర్‌కు 12, ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌కు 13, రాష్ట్రీయ జనతా పార్టీ, ఫెడరల్‌ సోషలిస్టు పార్టీ రెండేసి స్ధానాల చొప్పున కలిగి వున్నాయి.

నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం వుభయ సభలలో 33శాతం మహిళలు సభ్యులుగా వుండాలి. దిగువ సభలోని 275 స్ధానాలకు గాను 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీ నుంచి అయినా రెండు తరగతులలో ఎన్నికైన వారు 33శాతం విధిగా వుండాలి. ప్రత్యక్ష ఎన్నికలలో కేవలం ఆరుగురు మాత్రమే ఎన్నికయ్యారు. వీరిలో ముగ్గురు మావోయిస్టు సెంటర్‌, ఇద్దరు యుఎంఎల్‌, మరొకరు మరొకపార్టీ నుంచి ఎన్నికయ్యారు. దాంతో 33శాతం వుండే విధంగా పార్టీలు దామాషా నియోజకవర్గాల జాబితాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు యుఎంఎల్‌ పార్టీకి దామాషా కోటాలో వచ్చిన 41 స్ధానాలలో మహిళలు 37, నేపాలీ కాంగ్రెస్‌కు వచ్చిన 40లో 20, మావోయిస్టు సెంటర్‌ 17లో పదహారు మంది మొత్తం 84 మంది మహిళలు ఎన్నికయ్యారు. మొత్తంగా చూసినపుడు అన్ని పార్టీల తరఫున దిగువ సభలో 90 మంది, ఎగువ సభలో 21 మంది ఎన్నికయ్యారు. దామాషా పద్దతిలో కొన్ని సీట్లు వుండటం, రెండింటిలో కలిపి 33శాతం విధిగా ఎన్నిక అవాలన్న నిబంధన కారణంగానే ఇంత మంది మహిళలకు అవకాశం వచ్చింది. ఒక వేళ దామాషా పద్దతిలో ఆశాతం పూర్తి కానట్లయితే ఆమేరకు ప్రత్యక్ష ఎన్నికలో వచ్చిన సీట్లు పార్టీ కోల్పోవాల్సి వుంటుంది. దిగువ సభ ఎన్నికలలో కనీసం మూడుశాతం ఓట్లు వచ్చిన పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. కేవలం ఐదు పార్టీలు మాత్రమే ఆ మేరకు ఓట్లు పొందాయి, 44 విఫలమయ్యాయి. చట్ట సభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల గురించి మన దేశంలో ప్రధాన పార్టీలు కబుర్లు చెప్పటం తప్ప ఆచరణలో అడుగు ముందుకు వేయటం లేదు. పక్కనే వున్న నేపాల్‌లో అది కార్యరూపం దాల్చటానికి కమ్యూనిస్టులు ప్రధాన పాత్రధారులుగా వుండటమే కారణం.

దక్షిణాఫ్రికా త్రిపక్ష కూటమిలో సయోధ్య కొనసాగేనా !

Tags

, , , ,

 

 ఎం. కోటేశ్వరరావు

కమ్యూనిస్టు చైనా – కాథలిక్‌ మతం !

Tags

, , ,

Image result for china communist party-catholic religion

ఎం కోటేశ్వరరావు

మతం జనం పాలిట మత్తు వంటిదన్నది కమ్యూనిస్టుల అవగాహన. కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అన్నది కాథలిక్‌ మతాధికారుల భాష్యం. అటువంటి రెండు పరస్పర విరుద్ధ శక్తులు కారణాలేమైతేనేం రాజీబాటలో వున్నాయంటే నమ్మబుద్ది కావటం లేదు కదూ ! ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించటానికి ఎవరి స్వేచ్చ వారికి వుంది. అనుకూల, వ్యతిరేక తీర్పుల జోలికి పోకుండా అసలేం జరుగుతోందో ముందు చూద్దాం.గత కొద్ది వారాలుగా గతంలో ఎవరి మీదా లేని విధంగా క్రైస్తవులే పోప్‌ ఫ్రాన్సిస్‌పై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. మతాన్ని మంటగలుపుతున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు. పోప్‌ కూడా చివరికి కమ్యూనిస్టు చైనాకు లో0గిపోతున్నారని, ఆ దేశం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే జరిగితే గత వెయ్యి సంవత్సరాలుగా పోప్‌ల నియామకంపై పెత్తనం చలాయియిస్తున్న వాటికన్‌ ఓడిపోయినట్లే అని కొందరు రెచ్చగొడుతున్నారు. అది జరిగితే కొందరైతే గొర్రెపిల్లలను తోడేళ్లకు అప్పగిస్తున్న వ్యక్తిగా పోప్‌ను నిందిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

ప్రతి సమాజంలో ఎవరు సుప్రీం, అంతిమ అధికారం ఎవరిది అన్న అంశంపై మతం, రాజ్యాధికారం మధ్య ఏదో ఒక రూపంలో పోరు సాగింది. దోపిడీవర్గ జోక్యంతో రాజీలు, సర్దుబాట్లు జరిగాయి. తమ దోపిడీ సజావుగా సాగటానికి అటు రాజ్యాన్ని, మతాన్ని దోపిడీవర్గం కుడిఎడమల డాల్‌, కత్తుల మాదిరి సహజీవనం చేయిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా చైనా-వాటికన్‌ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నా నిర్ధిష్టంగా ఎలాంటి పురోగతి లేదు. చైనాలో 1948లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని 1971 వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అమెరికా నాయకత్వంలోని కూటమి చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా గుర్తిస్తూ వచ్చింది. బౌద్దమతాధిపతి దలైలామా అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి టిబెట్‌ తన పాలనలోని రాజ్యమంటూ విఫల తిరుగుబాటు చేసి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌లో నిత్యం ప్రభుత్వ వ్యతిరేకులతో సంబంధాలు కలిగి వున్నాడు. గతేడాది నవంబరు 23న ఒక ప్రకటన చేస్తూ జరిగిందేదో జరిగిపోయింది, చైనాతో టిబెట్‌ కలసి వుండాలనుకొంటోంది, చైనా అంగీకరిస్తే టిబెట్‌కు తిరిగి వస్తాను అని దలైలామా ప్రకటన చేశారు. కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా నుంచి హాంకాంగ్‌ పారిపోయి తైవాన్‌, మకావుల్లో బిషప్పుగా పని చేసి రిటైరైన చైనాలోని కాధలిక్‌ మత కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌(86) మాత్రం ససేమిరా రాజీపడేది లేదు అంటున్నారు.

డిసెంబరులో వాటికన్‌ నుంచి చైనా వెళ్లిన ఒక ప్రతినిధి బృందం గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని షాంటౌలో బిషప్పుగా పనిచేస్తున్న పీటర్‌ ఝువాంగ్‌ జియాన్‌ జియాన్‌(88)ను బీజింగ్‌లో కలసింది. బాధ్యతల నుంచి వైదొలగి చైనా ప్రభుత్వం నియమించిన పార్లమెంట్‌ సభ్యుడు, బిషప్పు హువాంగ్‌ బింగ్‌ఝాంగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు వీలు కల్పించాలని కోరింది. హువాంగ్‌ను 2011లో వాటికన్‌ అధికారులు మతం నుంచి బహిష్కరించారు. మరోబిషప్పు జోసెఫ్‌ గువో గ్జీజిన్‌ను కూడా తప్పుకోవాలని వాటికన్‌ బృందం కోరింది. 1999తో బ్రిటన్‌ కౌలు గడువు ముగిసిన హాంకాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చినప్పటికీ విలీనం సందర్భంగా కుదురిన ఒప్పందం ప్రకారం 2050వరకు అక్కడ ప్రత్యేక పాలనా వ్యవస్ధ కొనసాగుతుంది. జోసెఫ్‌ జెన్‌ 2002లో అక్కడ బిషప్పు అయ్యాడు. తరువాత రిటైర్‌ అయిన ఈ మాజీ బిషప్పు చైనాలో హాంకాంగ్‌ విలీన వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ రాజకీయాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే సదరు జెన్‌ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జనవరి పదిన వాటికన్‌ నగరానికి వెళ్లి అక్కడ పోప్‌ను కలిసింది. చైనా ప్రభుత్వానికి లంగిపోయి వాటికన్‌ గుర్తించిన ఇద్దరు బిషప్పుల స్ధానంలో కమ్యూనిస్టు పార్టీ ఆమోదం వున్న బిషప్పులను నియమించవద్దని వాదించింది. ఈ కలయిక, చర్చల గురించి పశ్చిమ దేశాలు, క్రైస్తవమత కేంద్రాలు, మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల తరువాత మరోసా రి మతం, రాజ్యం మధ్య ఆధిపత్యపోరు కొత్త రూపంలో ముందుకు వచ్చిందన్నది వాటిలో ఒకటి.

చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నగరానికి చైనాకు పరస్పర గుర్తింపు, దౌత్య సంబంధాలు లేవు. అయినా వాటికన్‌ అక్కడ ఇంతకాలంగా మత పెద్దలను నియమిస్తూనే వుంది. వారిని చైనా గుర్తించటం లేదు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్నవారిగానే భావిస్తున్నది. 1957లో చైనా ప్రభుత్వం కాథలిక్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా బిషప్పు, ఇతర మతాధికారుల నియమాకాన్ని చేపట్టింది. దీన్ని తాము గుర్తించటం లేదని అలాంటి మతాధికారులను బహిష్కరిస్తున్నట్లు 1958లో పోప్‌ 14వ బెండిక్ట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతున్నది. అప్పటి నుంచి అధికార, అనధికార బిషప్పుల నియామకాలు జరుగుతూనే వున్నాయి. అనధికార ప్రార్ధనలపై చైనా సర్కార్‌ క్రమంగా ఆంక్షలను పెంచటం ప్రారంభించింది. వాటికన్‌ అధికారాన్ని గుర్తించేందుకు చైనా ససేమిరా అంటోంది. మొత్తంగా చూసినపుడు ప్రతి మతం ప్రజల పాలిట మత్తు మందే అన్నది స్పష్టం. అయినప్పటికీ కొందరు మతాన్ని సంపూర్ణంగా సంస్కరించలేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే పురోగామివాదులు కొందరైతే మొరటుగా వెనక్కు నడిపించజూసే కొందరు అన్ని మతాల్లోనూ వుంటారు. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌లలో సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో అమెరికా సామ్రాజ్యవాదులు, ఇతర ఐరోపా ధనిక దేశాలతో పాటు రెండవ పోప్‌ జాన్‌పాల్‌ కూడా పుణ్యం కట్టుకున్న రెండవ తెగకు చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌పై చేస్తున్న విమర్శలు, వస్తున్న వూహాగానాలను బట్టి ఆయన జాన్‌పాల్‌ వంటి వ్యక్తి మాత్రం కాదని చెప్పవచ్చు.

తిరుగుబాటు మాజీ బిషప్‌ జెన్‌ బృందం రోమ్‌లో పోప్‌ను కలిసి చైనా ప్రభుత్వ వత్తిడికి లంగవద్దని కోరింది. దాని మీద పోప్‌ స్పందిస్తూ గతంలో హంగరీలో మాదిరి తిరుగుబాటు చేసి జైలు పాలయ్యే పరిస్ధితి తెచ్చుకోవద్దని చైనాలో రహస్యంగా పని చేస్తున్న బిషప్పులనుద్ధేశించి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. జోసెఫ్‌ మైండ్‌జెంటీ అనే బిషప్పు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలు పాలయ్యాడు.1956లో ప్రతీఘాతవిప్లవ సమయంలో తిరుగుబాటుదార్లు జైలుపై దాడి చేసి మైండ్‌ జెంటీని అమెరికా రాయబార కార్యాలయంలోకి పంపారు. హంగరీ ప్రభుత్వ వత్తిడి కారణంగా మైంట్‌జెంటీని దేశం వదలి వెళ్లాలని ఆదేశించిన వాటికన్‌ ఆయన స్ధానంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యుడైన మరొక బిషప్పును నియమించింది. అటువంటి స్ధితిని మరోమారు తెచ్చుకోవద్దని చైనా బిషప్పులకు పోప్‌ సలహాఇచ్చారన్నది వార్తల సారాంశం. ‘ చైనా కాథలిక్‌ చర్చిని వాటికన్‌ చర్చి(కమ్యూనిస్టులకు) ధారాదత్తం చేస్తున్నదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే గత కొద్ది సంవత్సరాలుగా, నెలలుగా వారు నడిచినబాటనే కొనసాగిస్తే అదే జరుగుతుంది. వాటికన్‌-చైనా మధ్య ఒప్పందం కుదిరే క్రమంలో నేను ప్రధాన ఆటంకం వున్నానా? ఒక వేళ అది దుష్ట లావాదేవీ అనుకుంటే దానికి ఆటంకంగా వున్నందుకు నేను సంతోషపడతాను’ అని జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొట్లు వార్తలు వచ్చాయి. జెన్‌ వైఖరి చైనా సర్కార్‌తో ఘర్షణనే కోరుతున్నట్లు వెల్లడి కావటంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకొనేందుకు వుభయపక్షాలు వేగంగా కదులుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వాటికన్‌ విదేశాంగమంత్రి పిట్రో పారోలిన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్‌ పేరు ప్రస్తావించకుండా ‘ అవును, చైనా ప్రభుత్వ అధికారులతో ప్రస్తుత సంబంధాలను పోప్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎవరూ అనధికార చొరవలు తీసుకోవటం లేదు. చేస్తున్న త్యాగం చైనా ప్రభుత్వం కోసం కాదు, క్రీస్తు చర్చికోసమే, అని చెప్పారు.

కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి రెండు వందల సంవత్సరాలైతే క్రైస్తవం దాని కంటే రెండువేల సంవత్సరాల ముందు పుట్టింది. సోదరత్వాన్ని ప్రబోధించటమే తప్ప సోదరుల మధ్య అంతరాలు,దోపిడీ పెరగటాన్ని అది నిరోధించలేకపోయింది. దోపిడీకి వ్యతిరేకంగా నూతన సమాజాన్ని నిర్మించాలన్న కమ్యూనిజాన్ని దోపిడీదారులు, వారికి వత్తాసుగా వున్న మతపెద్దలు వ్యతిరేకించేందుకు నడుం కట్టారు. దోపిడీదార్లతో మత పెద్దలు చేతులు కలపాలంటే ఏదో ఒక సాకు కావాలి కనుక మతానికి కమ్యూనిజం వ్యతిరేకం అని అర్ధాలు తీశారు. దోపిడీ మతానికి వ్యతిరేకమని ఏనాడూ పెట్టుబడిదారీ వ్యవస్ధను, సిద్ధాంతాలను మతం చెప్పలేదు. సోవియట్‌, తూర్పు ఐరోపాదేశాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే సామ్రాజ్యవాదులతో పాటు వారితో చేతులు కలిపిన చర్చి అధికారుల పాత్రను చైనా కమ్యూనిస్టుపార్టీ గుర్తించి కనుకనే మతం ముసుగులో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న మతాధికారులను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం పూనుకుంది. మత స్వేచ్చను అనుమతిస్తున్నది కనుకనే దాన్ని ఇంటికి పరిమితం చేసుకోవాలని, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతోంది. ఒకసారి జనంలో మతోన్మాదాన్ని నింపితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులను చూస్తున్న ప్రపంచానికి వేరే చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అమెరికన్లు, వారితో చేతులు కలిపిన ఆ ప్రాంత కమ్యూనిస్టు వ్యతిరేకులు తాలిబాన్ల సృష్టికి తెరలేపారు. పశ్చిమాసియాలో రాజకీయంగా తమను వ్యతిరేకించే శక్తులకు వ్యతిరేకంగా తాలిబాన్లతో పాటు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా పెంచి పోషించింది అమెరికా, దాని అనుయాయి దేశాలే అన్నది స్పష్టం. ఈ పరిణామాలను చూసిన తరువాత చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధను కాపాడుకొనేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. అందువలన చైనాలో అనధికార క్రైస్తవ, ఇస్లామిక్‌ మతకార్యకలాపాలను ఈ నేపధ్యం, దృష్టితోనే చూడాల్సి వుంది.

ఇక్కడ కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులకు ఒక సందేహం రావటం సహజం.మతం మత్తు మందు అని చెప్పే కమ్యూనిస్టులు మతాన్ని నిర్మూలించకుండా అధికారికంగా అనుమతించటం ఏమిటి అన్నదే అది. కమ్యూనిస్టు పార్టీ అంగీకారంతో నియమించే బిషప్పులు కూడా అదే క్రీస్తు, అదే బైబిల్‌నే ప్రచారం చేస్తారు కదా తేడా ఏముంది అని ప్రశ్నించ వచ్చు. మన సమాజంలో మతం అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి వేళ్లూనుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా మరో అధికార కమ్యూనిస్టు పార్టీ దాని ప్రభావాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకుంటున్నదా, మతభావాలను పెంచేవిధంగా వ్యవహరిస్తున్నదా అన్నదే గీటురాయి. ఆ విధంగా చూసినపుడు చైనా ప్రభుత్వం మతంతో సహా అనేక అన్యవర్గధోరణులను అరికట్టేందుకు ఓపికతో పని చేయాలే తప్ప నిషేధాలతో కాదు. అక్కడ ఇంకా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఇంకా ప్రాధమిక దశలోనే వుంది, ఎన్నో దశ లను అధిగమించాల్సి వుంది. అటువంటపుడు అన్యవర్గ ధోరణులు అంతమయ్యే అవకాశ ం లేదు. కనుక కొంత కాలం పాటు కుట్రలూ, కూహకాలకు అవకాశం లేని మత స్వేచ్చను అనుమతించటం తప్ప మరో మార్గం లేదు.జనం తమ అనుభవం ద్వారా మత ప్రభావం నుంచి బయటపడాల్సి వుంది.

విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం చైనాలోని 140 కోట్ల జనాభాలో ఏడు కోట్ల మంది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులుంటే కోటి మంది కాథలిక్కులున్నారని అంచనా. చైనా కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, ఏడు దశాబ్దాల ప్రభుత్వ తీరుతెన్నులను గమనిస్తే మతం రాజ్యానికి లోబడి వుండాలే తప్ప రాజ్యంపై మత పెత్తనాన్ని అంగీకరించేది లేదని రుజువైంది. కమ్యూనిస్టు పార్టీ అధికారానికి రాగానే బౌద్ద మతాధిపతి దలైలామా తాను సర్వస్వతంత్రుడనని, తన ఆధీనంలోని టిబెట్‌ తన రాజ్యమని ప్రకటించుకోవటమేగాక కమ్యూనిస్టు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో తిరుగుబాటు విఫలమై మన దేశానికి పారిపోయి రావటం, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చరిత్ర తెలిసిందే. క్రైస్తవ మత చరిత్రలో బిషప్పులు, ఇతర మతాధికారులను నియమించే అధికారం రాజులదా, పోప్‌దా అనే ఆధిపత్యపోరు సాగింది.అది పదకొండవ శతాబ్దిలో తారాస్ధాయికి చేరింది. పోప్‌ ఏడవ గ్రెగరీ ఆధిపత్యాన్ని రోమన్‌ లేదా జర్మన్‌ చక్రవర్తి నాలుగవ హెన్రీ సవాలు చేయటంతో ముగ్గురు పోప్‌లు ఐదుసార్లు అతడిని మతం నుంచి బహిష్కరించారు. ఇటలీ, జర్మనీలలో అంతర్యుద్ధాలు సంభవించాయి. ఆ పోరులో బలహీనపడిన హెన్రీ 1076,77 సంవత్సరాలనాటికి చేతులెత్తేశాడు. ఈ పోరులోనే పోప్‌ ఏడవ గ్రెగరీని కిడ్నాప్‌ చేసి ఇటలీలోని కానోసా కోటలో బంధించారు. అయితే కొంత మంది ప్రభువుల అండతో తప్పించుకున్నాడు. కిడ్నాప్‌లో హెన్రీ హస్తం వుందని భావించారు. చివరకు హెన్రీ పోప్‌కు లంగిపోవాల్సి వచ్చింది. పోప్‌ నివాసానికి వెళ్లి మూడు రోజుల పాటు చెప్పుల్లేకుండా మంచులో బయట నిలబడి తన తప్పులను క్షమించాలని వేడుకున్నాడు. తరువాత పోప్‌ ఇతరులకు మద్దతు ఇచ్చి మరోసారి హెన్రీని మతం నుంచి బహిష్కరించాడు.

ఇది పదకొండవ శతాబ్దం కాదు, చైనా పాలకులకు నాలుగవ హెన్రీకి, ఏడవ పోప్‌ గ్రెగరీకి, ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌కు పోలికేలేదు. ఆయన స్ధానంలో మరొకరుండి పెత్తనం చెలాయించాలని చూసినా చైనాను కట్టడి చేసే శక్తివంతులెవరూ నేడు ప్రపంచంలో లేరు. పోప్‌దే సర్వాధికారం అని రుజువు చెయ్యటానికి పాలకులు యుద్ధాలు చేసే పరిస్ధితీ లేదు. వాటికన్‌ మొండిగా వ్యవహరించి చైనాలో రహస్యకార్యకలాపాలు నిర్వహిస్తున్న కాథలిక్కులను ప్రోత్సహించటమంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారు చేయటం, తద్వారా వారిని ఇబ్బందుల పాలు చేయటం తప్ప మరొకటి కాదు. గతంతో పోల్చితే ఒక్క క్రైస్తవమే కాదు అన్నిరకాల మతకార్యకలాపాలను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకొనేందుకు చైనా నాయకత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రహస్య ప్రార్ధనలను ఏమాత్రం సహించేది లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు చైనా తిరుగుబాటు బిషప్‌ జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆసియా న్యూస్‌ అనే పత్రిక 2015లో ప్రచురించిన ఒక వార్తను వుటంకిస్తూ దాని సంపాదకుడు వ్యాఖ్యానించారు. జైలు పాలైన మతాధికారుల గురించి చైనా ప్రభుత్వం అసలు చర్చలకే అంగీకరించలేదు, అప్పుడూ ఇప్పుడు తాము ప్రతిపాదించిన బిషప్పును గుర్తిస్తేనే వాటికన్‌ను గుర్తిస్తామని చైనా చెబుతోంది. ఆంక్షల పెంపుదలకు ఒకటే వుద్ధేశం. అదేమంటే కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని సుస్ధిరం చేసుకొనేందుకు, ఎవరైనా దాని వునికిని సవాలు చేస్తే అణచివేసేందుకు’ అన్నాడు. పదజాలం ఎలా వున్నప్పటికీ చైనా సోషలిస్టు వ్యవస్ధకు హాని తలపెట్టే ఏ పరిణామాన్ని కూడా అక్కడి నాయకత్వం తక్కువ చేసి చూడటం లేదని, దానిని రక్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. వాటికన్‌-చైనా సంబంధాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు ఏ రీత్యాచూసినా ఆహ్వానించదగినవే అని చెప్పవచ్చు. మతానికి కమ్యూనిజానికి మధ్య కట్టిన అడ్డుగోడల కూల్చివేతకు ఏ మాత్రం తోడ్పడినా మంచిదే !

కొద్ది గంటల్లో మాజీ కానున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

దక్షిణా ఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప మరికొద్ది గంటల్లోనే పదవీచ్యుతుడు కానున్నారు. పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. గురువారం నాడు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగక ముందే గౌరవ ప్రదంగా రాజీనామా చేసే అవకాశాన్ని వినియోగించుకుంటారా ? ఓటింగ్‌ ద్వారా మెడపట్టి బయటకు గెంటించుకుంటారా అన్నదే ఇప్పుడు మిగిలి వుంది. పదవి నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలని దక్షిణాఫ్రికా పాలక కూటమి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఎఎన్‌సి) జాతీయ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా తిరస్కరించటంతో అక్కడ తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సోమవారం రాత్రి ఆయనకు రెండురోజుల గడువు ఇస్తూ ఎన్‌ఎన్‌సి చేసిన తీర్మానాన్ని స్వయంగా పార్టీనేతలు అందచేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తప్పుకోమని కోరాము తప్ప గడువు విధించలేదని ఎఎన్‌సి ప్రధాన కార్యదర్శి ఏస్‌ మగాషులే మంగళవారం నాడు చెప్పారు. తాను రాజీనామా చేసేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండని జుమా ఎఎన్‌సి నేతలకు చెప్పినట్లు తాజా వార్తలు తెలిపాయి. జుమా బింకాలు పోతున్నాడా లేక నిజంగానే రాజీనామా చేయకుండా తొలగింపువరకు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సి వుంది. ఒక వేళ రాజీనామా చేస్తే వుపాధ్యక్షుడిగా వున్న ఎఎన్‌సి అధ్యక్షుడు సిరిల్‌ రాంఫొసా వెంటనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. తరువాత ఆయనను లేదా మరొకరిని పాలకపక్షం అధ్యక్షుడిగా ఎన్నికుంటుంది. ప్రతిపక్ష ఎకనమిక్‌ ఫ్రీడమ్‌ పార్టీ జుమాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం స్పీకర్‌ పరిశీలనలో వుంది. జుమా బుధవారం నాడు రాజీనామా చేస్తారని నిర్ధారణ కాని వార్తలు పేర్కొన్నాయి. ఆ తీర్మానాన్ని తాము బలపరుస్తామని ఎఎన్‌సి ప్రకటించింది. వెంటనే స్పీకర్‌ ఒక ప్రకటన చేస్తూ ఈ నెల 22న చేపట్టాల్సిన అవిశ్వాస తీర్మానాన్ని గురువారం నాడే చర్చకు అనుమతించనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు అవిశ్వాస తీర్మానాన్ని వుపసంహరించుకోవాలని ఎఎన్‌సి చేసిన వినతిని ఫ్రీడమ్‌ పార్టీ తిరస్కరించింది. దాంతో తమ సవరణ తీర్మానం ద్వారా దాన్ని బలపరచాలని ఎఎన్‌సి నిర్ణయించింది.

బుధవారం నాడు జుమాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలైన గుప్తా సోదరుల ఇండ్లపై పోలీసుదాడులు జరిగాయి. గతంలో దాఖలైన కేసుల కొనసాగింపే అని చెప్పినప్పటికీ జుమా వుద్వాసన ఖాయం అని ఈ పరిణామాలు స్పష్టం చేశాయి. మరోవైపు జుమా టీవీలో మాట్లాడుతూ తనను రాజీనామా చేయమనటం అన్యాయమని, తానేమీ తప్పు చేయలేదన్నారు. తనను వేధించినందుకు ఎఎన్‌సి సభ్యులు విచారిస్తారని వ్యాఖ్యానించాడు. గురువారం నాడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే అదే రోజు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారని కూడా వార్తలు వచ్చాయి. జాకబ్‌ జుమా రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలని పాలక త్రిపక్ష కూటమిలోని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసిపి) గత కొద్ది నెలలుగా డిమాండ్‌ చేస్తూ వస్తోంది. మరో పక్షమైన కార్మిక సంఘాల కూటమి(కొసాటు) కూడా రాజీనామా చేయాలని కోరింది. చివరకు ఎఎన్‌సి కార్యవర్గం సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం జుమా రాజీనామా కోరుతూ తీర్మానించింది. గురువారం నాడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే శుక్రవారం నాడు సిరిల్‌ రాంఫొసా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అదే రోజు బడ్జెట్‌ సందర్భంగా దేశాన్ని వుద్ధేశించి ప్రసంగిస్తారని, 21వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెడతారని వార్తలు వచ్చాయి.

గత రెండు దశాబ్దాలలో ఎఎన్‌సి ఇద్దరు అధ్యక్షులను రాజీనామా చేయాలని కోరింది.2008లో తాబో ఎంబెకీ పార్టీ ఆదేశాన్ని శిరసావహించి రాజీనామా చేశారు. ఆయన స్ధానంలో 2009లో జాకబ్‌ జుమా అధ్యక్షుడయ్యారు. ఈ ఇద్దరూ తమ రాజకీయ జీవితాన్ని కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలుగా ప్రారంభించి ఎఎన్‌సి నేతలుగా ఎదిగారు. చివరకు పార్టీ చర్యలకు గురయ్యారు.జుమా పాలనలో అనేక అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాత వంటి ఆరోపణలతో పాటు అనేక రంగాలలో వైఫల్యం కారణంగా 2016లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఎఎన్‌సి అనేక పరాజయాలు చవి చూసింది.ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే, కార్పొరేట్‌ వ్యతిరేక చర్యలు తీసుకొనేందుకు గాను జాకబ్‌ జుమా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ముందుగా కమ్యూనిస్టుపార్టీ లేవెనెత్తింది. దానితో ఆగ్రహించిన జుమా కమ్యూనిస్టు మంత్రి ఒకరిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. జుమాపై చర్యతీసుకోని పక్షంలో తాము అధికార కూటమి నుంచి వైదొలుగుతామని, అవసరమైతే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో వంటరిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టులు హెచ్చరించారు. వత్తిడికి తట్టుకోలేని జుమా తాను రాజీనామా చేస్తానని అయితే అది మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో తనకు ఇష్టమైనపుడు మాత్రమే చేస్తానంటూ మొరాయిస్తూ వచ్చాడు. అయితే డిసెంబరులో ఎఎన్‌సి పార్టీఅధ్యక్షుడిగా జుమాను తొలగించి సిరిల్‌ రాంఫొసా ఎన్నికైన తరువాత ఎఎన్‌సి కార్యవర్గం ఏదో ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దానిలో భాగంగానే పదవి నుంచి మర్యాదపూర్వకంగా తప్పుకోవాలని కోరింది.దానికి జుమా తిరస్కరించటంతో అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది.

జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఆయుధాలు పట్టిన జాకబ్‌ జుమా అనేక మంది ఇతర నేతల మాదిరిగానే జైలు పాలయ్యారు. యువనేతగా దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన 1997లో ఎఎన్‌సి వుపాధ్యక్షుడిగా, 1999లో దేశ వుపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఐరోపా కంపెనీతో జరిగిన ఆయుధ లావాదేవీలలో చోటు చేసుకున్న అక్రమాలతో జుమాకు సంబంధం వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జుమా ఆర్ధిక సలహాదారుగా వున్న వ్యక్తి నిందితుడిగా తేలాడు.జుమా2005లో పదవీచ్యుతుడయ్యాడు. తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అధ్యక్షుడు తాబో ఎంబెకీ అక్రమాలను వ్యతిరేకించినందుకు తనను కేసులలో ఇరికించారని చేసిన వాదనలను ఏఎన్‌సి నాయకత్వం విశ్వసించింది. దాంతో ఎంబెకీని రాజీనామా చేయించి ఆ స్ధానంలో జుమాను 2009లో అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జుమాపై 18 అంశాలలో వచ్చిన అవినీతి, ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయన్స్‌ దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు గతేడాది స్పష్టం చేసింది. తాను అమాయకుడిని అన్న జుమా వాదనను కోర్టు కొట్టివేసింది. డిసెంబరు 13న ఇచ్చిన తీర్పులో జుమా, అతని అనుచరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆమేరకు జనవరిలో ఒక కమిషన్‌ ఏర్పడింది.ఒక అవినీతి నివేదికను తొక్కిపెట్టటంలో జుమా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మరో కేసులో న్యాయస్ధానం స్పష్టం చేసింది.భారతీయ సంతతికి చెందిన గుప్తా కుటుంబం జుమాతో వున్న సంబంధాలను వుపయోగించుకొని అనేక ప్రభుత్వ కాంట్రాక్టులను పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పుల తరువాత వారం రోజులకే డిసెంబరు 18న జుమాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సిరిల్‌ రాంఫొసాను ఎన్నుకున్నారు. వుద్వాసనకు గురికానట్లయితే మరొక పద్నాలుగు నెలలపాటు జుమా అధికారంలో వుండవచ్చు. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఒకరు రెండువిడతలు మాత్రమే పదవికి అర్హత కలిగివుంటారు.

1994లో స్వేతజాతి పాలన అంతమైన తరువాత ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అనుసరించినవి స్ధూలంగా నయా వుదారవాద విధానాలు తప్ప మరొకటి కాదు. పర్యవసానంగా జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఎఎన్‌సి కూటమి జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక విశాల వేదిక మాత్రమే. జాత్యంహకార పాలనను అంతం చేసి జాతీయప్రజాస్వామిక విప్లవ సాధన దిశగా ఎఎన్‌సిలో కమ్యూనిస్టులు , కాని వారు ఐక్యంగా పోరాడారు. 1994 తరువాత ఎఎన్‌సిలో కమ్యూనిస్టుపార్టీ, కొసాటు కొనసాగటమే కొత్త పరిణామం.పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించాలనే ఎఎన్‌సి నాయకత్వం కుడివైపు, మిగతా రెండు పక్షాలు ఎడమవైపు లాగినప్పటికీ అంతిమంగా మొగ్గు కుడివైపే వుంది. వివిధ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బలు, పలు తరగతులలో పెరుగుతున్న అసంతృప్తికారణంగా కమ్యూనిస్టుపార్టీ పునరాలోచనలో పడింది.ఎఎన్‌సి నుంచి విడగొట్టుకోవాలనే ఆలోచనదానిలో ప్రారంభమైంది. పార్టీలు వేర్వేరుగా వున్నప్పటికీ చట్టసభలకు ఎఎన్‌సి గుర్తుమీదనే మూడు పక్షాలూ పోటీ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల నాటికి ఈ కూటమి ఇలాగే వుంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తాము వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టుపార్టీ నాయకులు చెబుతున్నారు. కింది శాఖలలో అలాంటి చర్చను అనుమతిస్తున్నారు. రానున్న ఎన్నికలలో విడిగా ప్రచారం చేయాలని కమ్యూనిస్టుపార్టీ మహాసభ గతేడాది నిర్ణయించింది. అవసరమైతే వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేసేదిశలో ఇదొక అడుగుగా చెప్పవచ్చు.ఎఎన్‌సి పాలనలో అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గళమెత్తుతున్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం ఏ కమ్యూనిస్టుపార్టీ జాకబ్‌ జుమాను బలపరిచిందో అదే పార్టీ అతడిని తొలగించాలని ముందుగా గళమెత్తింది. అనేక అంశాలపై పార్టీ విబేధిస్తున్నది. అందువలన వచ్చే ఎన్నికల నాటికి అది దేశాన్ని నడిపించేందుకు తనదైన పంధాలో పయనిస్తుందా అన్నది ఆసక్తికలిగించే అంశం. అదే అయితే కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఒకవైపు, ఎఎన్‌సి మరోవైపు అధికారం కోసం పోటీపడినా ఆశ్చర్యం లేదు.

సూక్ష్మంలో నరేంద్రమోడీ మోక్షం: పకోడీలతో స్వయం వుపాధి !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఎట్టకేలకు నరేంద్రమోడీ నాలుగేండ్ల తరువాత తాము వుపాధి కల్పించలేకపోతున్నట్లు పరోక్షంగా అయినా అంగీకరించినందుకు అభినందించకుండా ఎలా వుంటాం ! పెట్టలేని వారు పెట్టే దారన్నా చూపాలి అన్నట్లు పకోడీలు అమ్మి స్వయం వుపాధి కల్పించుకోవాలని మంచి సలహా కూడా ఇచ్చినందుకు ఆయన మేథోశక్తికి నీరాజనాలు పలకాల్సిందే. బాబొస్తే జాబొచ్చినట్లే అన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు చేయలేని ధైర్యం, తెగువను నరేంద్రమోడీ చూపారు. పకోడీ వ్యాఖ్యానం తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో యావత్‌ దేశాన్నీ ఆకర్షించేందుకు మోడీ మరో విన్యాసం చేశారు. వుద్యోగులకు ఏడాదికి మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పదిహేనువేలు, నెలకు 16వందల ప్రయాణ అలవెన్సు వెరసి ఏడాదికి 34,200కు ఇప్పుడు పన్ను మినహాయింపు వుంది. ఈ రెండింటి బదులు గుండుగుత్తగా 40వేల రూపాయలకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించారు. దీని వలన వుద్యోగులకు ఎనిమిదివేల కోట్ల రూపాయలు మిగిలితే, ఖజానాకు అంతే మొత్తం నష్టం అని చెప్పారు. ఈ వుదారత్వానికి వుద్యోగులు ఎలా పండుగ చేసుకుంటారన్నది వారికే వదలివేద్దాం.

‘కోటీ 89లక్షల మంది వేతన జీవులు ఒక్కొక్కరు 2016ా17లో చెల్లించిన సగటు పన్ను రు.76,306 కాగా వ్యక్తిగతంగా వ్యాపారులు, వైద్యులు, లాయర్ల వంటి వృత్తిదారులు 1.88 కోట్ల మంది సగటున చెల్లించింది రు.25,753 మాత్రమే. ఇవి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి హష్‌ముఖ్‌ అధియా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వెల్లడించిన వివరాలు. నిజాయితీగా పన్ను చెల్లించే తమకు భారం తగ్గించి అక్రమ మార్గాలను వెతక్కుండా సరైనదారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. మరోవైపు తమ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న ఇతరుల పన్ను ఎగవేత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇదీ స్థూలంగా బడ్జెట్‌ సందర్భంగా వేతన జీవులలో వెల్లడవుతున్న అసంతృప్తి. దిగువనున్న ఇతరులతో పోల్చుకుంటే వుద్యోగుల పరిస్ధితి మెరుగే అయినప్పటికీ పెరుగుతున్న ధరలు, అవసరాలు, గౌరవ ప్రదమైన జీవనం గడపాలంటే ప్రస్తుత వేతనాలను ఇంకా పెంచాల్సిన అవసరం వుంది. ప్రతి బడ్జెట్‌లో భారాలు మోపటం సర్వసాధారణ రివాజుగా మారింది కనుక సామాన్యులకు పెద్దగా ఆసక్తి వుండదు. ఎన్ని రాయితీలు ఇచ్చినా మంగళగిరి పానకాల రాయుడి మాదిరి ఇంకా కావాలనే వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, న్యాయమైన రాయితీల కోసం ఎదురు చూసే వేతన జీవులలోనే బడ్జెట్‌ పట్ల ఆసక్తి వుంటుంది. వ్యాపారులు, వృత్తిదారులు పన్నుల విధింపు సమాచారం గురించి కుతూహలం చూపుతారు. ఏ భారం మోపినా చివరకు దాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి వినియోగదారులు, సేవలు పొందే జనం మీదనే మోపుతారు కనుక బడ్జెట్‌లో ఏం చేసినా వారికేమీ చింత వుండదు.

ఎక్కువ మంది వుద్యోగులు బడ్జెట్‌లో తమకేమి రాయితీలు ప్రకటించారు అనే విషయం మీదనే ప్రధానంగా కేంద్రీకరించటం సహజం. నిజానికి పౌరులుగా, చదువుకున్న వారికి అంతకంటే ఎక్కువ ఆసక్తి, విమర్శనాత్మక వైఖరితో ఈ ప్రక్రియను చూడటం అవసరం. అందుకే అసలు బడ్జెట్‌ అంటే ఏమిటి ? ప్రజారంజక, ప్రజా సంక్షేమ బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని చెప్పని పార్టీ ఏముంది? అదే నిజమైతే 2017లో దేశంలో వృద్ధి అయిన సంపదల మొత్తంలో ఒక శాతంగా వున్న ధనికులు 73శాతం దక్కించుకున్నారని ఆక్స్‌పామ్‌ అనే స్వచ్చంద సంస్ధ ఎందుకు చెప్పింది. వివిధ సంస్ధల, లెక్క విధానాలు, అంచనాలలో హెచ్చు తగ్గులుండవచ్చుగానీ సంపద కొద్ది మంది దగ్గర పోగుపడుతున్నదనేది వాస్తవమే కదా ?

ఆదాయాన్ని ఖర్చుల నిమిత్తం చేసే పంపిణీ ప్రక్రియే బడ్జెట్‌. దీనిలో సామాన్యులుగా వున్న 99శాతానికి, ఒకశాతం ధనికులకు దామాషా ప్రకారం పంపిణీ చేస్తే సమస్య లేదు. లేకపోతేనే తేడాలు వస్తాయి. కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు ప్రతిపక్షంలో వుండగా ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి అధికారం రాగానే కార్పొరేట్లకు కామధేనువులుగా మారుతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సామాన్యులకు మంచిరోజులు( అచ్చేదిన్‌) వచ్చాయని ప్రకటించారు. ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం 2017లో దేశంలోని బిలియనీర్ల ్లబ్బులో కొత్తగా పదిహేడు మంది చేరారు. మోడీ నిజంగా రాబిన్‌హుడ్‌ అవతారం అయితే బిలియనీర్ల సంపద తగ్గాలి కదా ! గత నాలుగు సంవత్సరాలుగా తాను ఎన్నో విజయాలు సాధించానని ప్రతి నెలా మన్‌కీబాత్‌ పేరుతో (మనసులోని మాట) ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ జన్‌కీ బాత్‌(జనం మాట) వేరేగా వుంది. మొత్తంగా చూసుకున్నపుడు వుత్పత్తి, ఎగుమతులు పడిపోయాయి. అనేక చోట్ల గిట్టుబాటు ధరలు రాక రైతాంగం ఆందోళనలకు దిగింది, ఆత్మహత్యలు ఆగలేదు. అయినా మరోవైపు కార్పొరేట్ల లాభాలు తగ్గలేదు, స్టాక్‌మార్కెట్‌ సూచీలు రికార్డులను తిరగరాశాయి. పర్యవసానంగా శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది, అప్పటికే ఆ జాబితాలో వున్నవారి ఆస్ధులు ఇంకా పెరిగాయని వేరే చెప్పనవసరం లేదు. అంటే మోడీ గారు చెప్పిన మంచి రోజులు ఎవరికి వచ్చినట్లు ? ఒక చాయ్‌ వాలా పాలనలో ఎంత మంది ఫ్లాస్కుల నుంచి టీ స్టాల్స్‌, హోటల్స్‌ పెట్టే స్ధాయికి ఎదిగారు ? తాజాగా మోడీతో పాటు, అమిత్‌షా గారు కూడా చెప్పినట్లు పకోడీలు అమ్మేవారు ఎంత మంది లక్షాధికార్లు అయ్యారు అని ప్రశ్నించుకోవాలి.

ఐదేండ్ల కాలానికి ఎన్నుకున్న మోడీ సర్కార్‌కు ఇది చివరి, ఎన్నికల బడ్జెట్‌ కనుక సహజంగానే జనంలో ఆసక్తి కలిగించింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌ ప్రకారం మొత్తం ఆదాయం 24లక్షల కోట్ల 42 వేల 213 కోట్లు. దీనిలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం రు.17,25,738 కోట్లు. అప్పుల ద్వారా సమకూర్చుకొనేది 6,24,276 కోట్లు మిగతాది ఇతర వనరుల ద్వారా వస్తుంది. దీనిలో వడ్డీ చెల్లింపులకు కేటాయింపు 5,75,795 కోట్లు. నరేంద్రమోడీ పాలనలో మన రూపాయి రాకపోకల తీరు తెన్నులు ఎలా మారాయో చూద్దాం. 2015-16 బడ్జెట్‌లో 21పైసలు అప్పుల ద్వారా సమకూర్చుకుంటే 2018-19కి అది 19కి తగ్గిపోయింది. కార్పొరేట్‌ పన్ను 20 నుంచి 19కి తగ్గింది, ఆదాయపన్ను 14 నుంచి 16కు పెరిగింది. తాజా బడ్జెట్‌ రూపాయి రాకలో నూరు పైసలకు గాను జిఎస్‌టి నుంచి 23, కార్పొరేట్‌ పన్ను నుంచి 19,అప్పుల ద్వారా 19, ఆదాయ పన్ను నుంచి 16, ఎక్సయిజ్‌, కస్టమ్స్‌ నుంచి 12, ఇతరంగా 11పైసల వంతున వస్తోంది. ఇక పోక విషయానికి వస్తే పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా 24, వడ్డీ చెల్లింపులు 18, రక్షణ, కేంద్ర పధకాలు, సబ్సిడీలకు 9చొప్పున, ఫైనాన్స్‌ కమిషన్‌ బదిలీలకు 8, ఇతర ఖర్చులకు 13పైసలు పోతోంది.

గతేడాది నోట్ల రద్దు వలన సాధారణ పెరుగుదల కంటే అదనంగా 18లక్షల మంది కొత్తగా పన్నులు చెల్లించేవారు పెరిగారని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. మంచిదే, రెండు కోట్ల ఎనభైలక్షల మంది పన్ను చెల్లింపుదార్లుండగా మరో 18లక్షల మంది కోసం పెద్ద నోట్లు రద్దు చేయాలా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టిన ప్రబుద్ధులను ఈ చర్య గుర్తుకు తేవటం లేదూ? ఈ పద్దెనిమిది లక్షల మంది అదనంగా చెల్లించే పన్నెంతో, నోట్ల రద్దు వలన జరిగిన నష్టం, జనం పడిన ఇబ్బందుల గురించి అధికారంలో వున్న వారు నోరు విప్పారా ? పోనీ ఆ కారణంగా ఆదాయపన్ను రాబడి రూపాయి రాకలో రెండుశాతం పెరిగిందని అనుకుందాం. కార్పొరేట్‌ పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గటానికి కారణం ఏమిటి? లోపాలను సరిచేస్తే వసూలు పెరగాలి కదా ! చెప్పే మాటలకు, చేతలకు పొత్తు కుదరటం లేదు. ఇంతకు ముందు 50 కోట్ల లావాదేవీలు వున్న కంపెనీలకు 25శాతం కార్పొరేట్‌ పన్ను వుంటే ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు అంటే 250 కోట్లకు పెంచటం వంటి వెసులుబాటు కాదా? పోనీ ఇలాంటి మినహాయింపులతో కంపెనీలు పొందిన లబ్దిని తిరిగి పెట్టుబడులుగా పెట్టిన దాఖలాలేమీ లేవు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా మహాశయులు వుద్యోగాలు లేకపోతే పకోడీలు అమ్మాలని సెలవిచ్చారు. 2015-16 వుపాధి, నిరుద్యోగ సర్వే ప్రకారం దేశంలో పని చేస్తున్న వారిలో 46.6శాతం మంది స్వయం వుపాధి అంటే మోడీ గారి భాషలో పకోడీ వుద్యోగాలు చేస్తున్నవారే. వారి వార్షిక ఆదాయం అరవైవేల రూపాయలు. వారందరూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తుంటే కొత్తగా వుద్యోగాల కోసం చూస్తున్నవారికి నాలుగేండ్ల తరువాత మోడీ ఈ సలహా ఇచ్చారు.

యుపిఏ , ఎన్‌డిఏ రెండూ సంస్కరణలు అమలు జరిపాయి. అవి ఎవరికి లబ్ది చేకూర్చాయి? గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను రాబడిలో ఏ రంగం నుంచి ఎంత వచ్చిందో బడ్జెట్‌ పత్రాలలో వివరించారు. దాని ప్రకారం 2009-10లో మొత్తం పన్ను రాబడి 6,24,528 కోట్లకు గాను కార్పొరేట్‌, ఆదాయ పన్ను వాటాలు 39,19.6 శాతం చొప్పున వున్నాయి. అదే 2018-19 బడ్జెట్‌లో 27.3,23.2 శాతాలుగా వున్నాయి. అంటే పదేండ్లలో కార్పొరేట్లకు పన్నెండుశాతం వరకు లబ్ది చేకూరితే వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదార్లపై 3.6శాతం భారం పెరిగింది. ఆదాయ అసమానతలు పెరగటానికి శతకోటీశ్వరులు వృద్ధి చెందటానికి ఇది కారణం కాదా ? వుద్యోగులకు మొత్తం ఆదాయం మీద పన్ను విధిస్తుండగా కార్పొరేట్‌లు, వ్యాపారులు, ఇతర వృత్తిదారులకు ఖర్చులు పోను నిఖర ఆదాయం మీదనే పన్ను వేస్తున్నారు. ఇదొక అన్యాయం. వుద్యోగులకు కుటుంబ ఖర్చులను లెక్కవేసే వేతనాలు నిర్ణయిస్తున్నారు తప్ప ప్రతి ఏటా వారికి ఇంత మిగులు వుండాలనే ప్రాతిపదికేమీ వుండదు. హష్‌ముఖ్‌ చెప్పినదాని ప్రకారం ఏడు లక్షల నమోదైన కంపెనీలలో సగం సమర్పించిన ఆదాయ వివరాల ప్రకారం సున్నా మిగులు లేదా నష్టాలను చూపారు. వుద్యోగులకు ఇటువంటి అవకాశం లేదు. నిజానికి వారు వినియోగదారులుగా ఇతర పన్నులతో పాటు అదనంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. ‘బ్రిటీరాజ్యం నుంచి బిలియనీర్‌ రాజ్యం వరకు ‘ అనే శీర్షికతో ప్రముఖ ఆర్ధికవేత్తలు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టి ఆదాయ పన్ను చట్టం చేసిన 1922 నుంచి 2014 వరకు మన దేశ ఆర్ధిక వ్యవస్ధలో అసమానతల గురించి ఒక అధ్యయన పత్రాన్ని తయారు చేశారు. దాని ప్రకారం 2014లో పదిశాతం ధనికులు వార్షికాదాయంలో 56శాతాన్ని పోగేసుకున్నారు.1930 దశకంలో ఒకశాతం ధనికులు మొత్తం ఆదాయంలో 21శాతం లోపు కలిగి వుండగా అది 1980దశకం ప్రారంభానికి ఆరుశాతానికి పడిపోయి 2014నాటికి 22శాతానికి పెరిగింది. గతేడాది ఆక్స్‌ఫామ్‌ సర్వే ప్రకారం ప్రపంచ ధనికులలో ఒక శాతం మంది 50శాతం సంపదను కలిగి వుండగా మన దేశంలో అది 58శాతంగా వుంది. 2017 వివరాల ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 20.9లక్షల కోట్లకు అంటే కేంద్ర బడ్జెట్‌కు సమంగా చేరుకుంది. మన దేశంలోని ఒక ప్రముఖ వస్త్రకంపెనీ సిఇఓ ఒక ఏడాది ఆదాయాన్ని పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం పొందుతున్న కార్మికుడు 941 సంవత్సరాలు పనిచేయాల్సి వుంటుంది. మరో విధంగా లెక్క వేస్తే గ్రామీణ కార్మికుడు జీవితాంతం(50 సంవత్సరాలు) పని చేస్తే సంపాదించే మొత్తాన్ని అదే సిఇఓ కేవలం 17.5 రోజుల్లో సంపాదిస్తాడట. అదే అమెరికాలో ఒక కార్మికుడు ఏడాది మొత్తంలో పొందిన వేతనాన్ని ఒక కంపెనీ సిఇవో ఒక రోజులో పొందుతాడని ఆక్స్‌ఫామ్‌ పేర్కొన్నది.

కారిపోతున్న ‘సంపద బక్కెట్‌ ‘ కన్నాలు పూడ్చాలని కార్పొరేట్లకు పన్ను రాయితీలు రద్దు చేయాలని, పన్ను నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్‌ కోరింది. గతేడాదినాటికి మన దేశంలోని బిలియనీర్ల సంపద 20.7లక్షల కోట్లకు పెరిగితే దానిలో గతేడాదే 4.89లక్షల కోట్లు చేరింది. ఈ మొత్తంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చు, ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాజక్టులకు ధారాళంగా నిధులు కేటాయించవచ్చు. బాహుబలి సినిమా వసూలు చేసిన మొత్తమంత కూడా తమకు కేటాయించలేదని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వుండదు.

ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోని మరికొన్ని విషయాలను చూద్దాం. ఆర్ధిక సర్వే, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు అంకెలన్నీ ఒకచోటనే తయారు చేసి స్వల్ప మార్పులతో ఎవరికి వారు ప్రకటించుకున్నట్లుగా వుంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి పెరుగుదల రేటు 6.75శాతం వుంటుందని అంచనా వేస్తే కేంద్ర గణాంకశాఖ 6.5శాతంగానూ, ఐఎంఎఫ్‌ 6.7గా చెప్పింది, వచ్చేఏడాది పెరుగుదల రేట్లను 7.5,7.4శాతాలుగా పేర్కొన్నాయి. పెరుగుదల రేట్లు అచ్చేదిన్‌ అంచనాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన చేతుల్లో లేని ప్రపంచ చమురు మార్కెట్‌ రేట్ల మీద ఇవి ఆధారపడి వుంటాయి. స్టాక్‌ మార్కెట్‌ ఇప్పుడు మంచి కాక మీద వుంది కనుక లాభాలు దండిగా సంపాదించుకొనేందుకు విదేశీ కంపెనీలు డాలర్లను కుమ్మరించి వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఆ మొత్తాలను మన విదేశీ మారక నిల్వలుగా చూపుతున్నాం, వాటితో చమురు కొనుగోలు చేస్తున్నాం. స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా, చమురు ధరలు పూర్వపు స్ధాయికి పెరిగినా మన పరిస్ధితి ఢమాల్‌. ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ బుడగ మరికొంత కాలం కొనసాగిందనుకుందాం. అది వుండగానే మన పారిశ్రామిక వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి. అందువలన ఈ పరిస్ధితి కొనసాగదన్న గ్యారంటీ ఏముంది? ముదిమది తప్పిన మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై కాలుదువ్వుతున్న పూర్వరంగంలో ఇప్పటికే పీపా చమురు 70 డాలర్లకు చేరింది. తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. అందుకే మనకు రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా సర్కార్‌ మన ఐటి ఎగుమతులను దెబ్బతీసే విధంగా, మన ఇంజనీర్లకు వీసాలు నిరాకరించే ధోరణిలో వ్యవహరిస్తోంది. అది కూడా మనకు నష్టం చేకూర్చే పరిస్థితే. ప్రపంచ ధనిక దేశాలలో పరిస్ధితులు చక్కబడితే తప్ప మన ఎగుమతులు పెరగవు అని తేలిపోయింది. వాటి పరిస్ధితి కూడా అంత ఆశావహంగా కనిపించటం లేదు. అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వాటి ప్రభావం మన మీద పడింది కనుకనే మన ప్రధాని దవోస్‌ సమావేశ వేదికపై వుగ్రవాదం ఎంత చెడ్డదో రక్షణ చర్యలు కూడా అంతే అని చెప్పాల్సి వచ్చింది.

ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అంతర్గత మార్కెట్‌ను పెంచుకోవటం తప్ప మరొక మార్గం లేదు. అది జరగాలంటే జనంలో కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు ఎగుమతుల కోసం లేదా కార్పొరేట్‌ సంస్ధలకు ఇస్తున్న ఇతర రాయితీల మొత్తాన్ని వేతన పెరుగుదల లేదా జనం కొనుగోలు శక్తి పెంపుదలకు మళ్లిస్తే పారిశ్రామిక వుత్పత్తి పెరగటంతో పాటు వుపాధి అవకాశాలు పెరుగుతాయి. బడ్జెట్‌ విషయానికి వస్తే 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామన్నది ఒక పెద్ద వాగ్దానం. అయితే దానికి తోడ్పడే చర్యలేమీ లేవు. రానున్న ఎన్నికలకు రైతులకు విసిరిన ఎర. ప్రత్యక్ష పన్నుల వాటా 51.6 నుంచి 50.6శాతానికి తగ్గనున్నట్లు చెప్పటమంటే కార్పొరేట్లకు రాయితీ ఇవ్వటమే. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు వీలుగా పది కోట్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా. పాత పధకాలన్నీ కలిపి కొత్తగా చెప్పిన అంకె. జన ఆరోగ్యం కంటే పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న బీమా కంపెనీలకు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టచెప్పే ఎత్తుగడ దీని వెనుక వుందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రయివేటు రంగం పెట్టుబడులు పెద్దగా రావటం లేదు. వచ్చినవి కూడా వుపాధి రహిత వృద్ధికే దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ తగ్గుతున్నాయి. అనేక పధకాలకు కేటాయింపులు తగ్గించారు. డబ్బు మొత్తాలు స్వల్పంగా పెరగవచ్చుగానీ జిడిపితో పోల్చితే శాతాలన్నీ తగ్గిపోయాయి. పోనీ పేర్కొన్నవాటిని కూడా పూర్తిగా ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిరుద్యోగ యువతను పకోడీలమ్మించే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పవచ్చు.

శీతాకాల ఒలింపిక్స్‌లో ‘కొరియా’ రాజకీయ వేడి !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి ఎనిమిదిన దక్షిణ కారియా నగరమైన పయోంగ్‌ చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్‌పోటీలు ప్రారంభంగాక ముందే కొరియా ద్వీపకల్పం, దానితో ముడివడిన దేశాల మధ్య రాజకీయ క్రీడలతో వేడి మొదలైంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా నాయకత్వంలోని కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల కూటమి క్రీడలలో కూడా రాజకీయాలను జొప్పించిన విషయం విదితమే. ఈ ఒలింపిక్స్‌కూడా దానికి మినహాయింపు కాదని అవి మరోసారి నిరూపించాయి. ఒలింపిక్‌ క్రీడల ప్రారంభానికి మన రాష్ట్రపతి వంటి స్ధాయి కలిగిన వుత్తర కొరియా పార్లమెంటు అధ్యక్షుడు కిమ్‌ యోంగ్‌ నామ్‌ నాయకత్వంలో శుక్రవారం నాడు వచ్చిన ప్రతినిధివర్గంలో వుత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా వున్నారు. 1950 దశకంలో కొరియా యుద్దం తరువాత దక్షిణ ప్రాంతాన్ని సందర్శించిన తొలి వున్నత స్ధాయి ప్రతినిధి వర్గం ఇదే.

పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ ఈ పోటీల్లో ఒకేపతాకం నీడలో ఒకే గీతం పాడుతూ కదం తొక్కుదామని, వుమ్మడిగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇద్దామని, వీలైతే కొన్ని పోటీలలో వుమ్మడి జట్లను బరిలోకి దింపుదామని వుత్తర కారియా చేసిన ప్రతిపాదనలకు దక్షిణ కొరియా కూడా ముందుకు వచ్చింది. అయితే పొమ్మనకుండానే పొగబెట్టినట్లు పాలకవర్గదన్ను వున్న దక్షిణ కొరియా మీడియా అవమానించేవిధంగా రాతలు రాసిన కారణంగా తాము వెనక్కు తగ్గుతున్నట్లు వుత్తర కారియా ప్రకటించింది. ఒలింపిక్స్‌ జరిగే సమయంలోనే అమెరికా దాడులకు దిగనుందనే వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ఈ పోటీలకు ఐదువందల మందితో కూడిన వుత్తర కొరియా ప్రతినిధి బృందం పయోంగ్‌ చాంగ్‌ చేరుకుంది. పోటీలు జరిగే ఈ నగరం వుత్తర కొరియా సరిహద్దుకు కేవలం 80కిలోమీటర్ల దూరంలోనే వుంది.

తాము శాంతి ప్రయత్నాలు చేస్తున్నా వుత్తర కొరియా అణు పరీక్షలను కొనసాగిస్తూనే వుందని ప్రపంచం ముందు కనిపించేందుకు గతేడాది మేనెలలో ఎన్నికైన అధ్యక్షుడు మూన్‌ ప్రయత్నిస్తున్నాడు. శాంతి ఒలింపిక్స్‌ అని తమ దేశంలో జరుగుతున్న పోటీలను అభివర్ణించాడు. అణు పరీక్షలు జరిపిందనే పేరుతో మూన్‌కు ముందున్న అధ్యక్షుడు పార్క్‌గున్‌ హై 2016జనవరి తరువాత వుత్తర కొరియాకు సాయాన్ని నిలిపివేశాడు. ఇప్పుడున్న స్ధితిలో సాయం వద్దని జపాన్‌ ప్రధాని షింజో అబే వ్యక్తిగతంగా కోరినప్పటికీ మూన్‌ నాలుగునెలల క్రితం ఎనిమిది మిలియన్‌డాలర్ల సాయాన్ని పునరుద్దరించాడని పరిశీలకులు వ్యాఖ్యానించారు. నిజానికి అది ప్రచార ఎత్తుగడని వేరే చెప్పనవసరం లేదు. ఈ సాయాన్ని వుత్తర కొరియా మిలిటరీకి వుపయోగిస్తున్నదని అమెరికా, జపాన్‌ ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు దేశాల ప్రయోజనాలకోసం వుత్తర కొరియాను రెచ్చగొడుతున్నారని, ఒక వేళ యుద్ధమే వస్తే నష్టపోయేది తాము తప్ప ఆ దేశాలు కాదని దక్షిణ కొరియా పౌరులు ఆందోళన చెందుతూ సోదర కొరియాతో శాంతికోసం ప్రయత్నించాలని పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్న కారణంగానే మూన్‌ శాంతి ప్రకటనలు చేస్తున్నాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు కేవలం 35కిలోమీటర్ల దూరంలో వున్న సరిహద్దులో వుత్తర కొరియా తన భారీ ఫిరంగి దళాన్ని మోహరించింది.

రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణకు గురైన కొరియాను విముక్తి చేసే క్రమంలో వుత్తర ప్రాంతంలో సోవియట్‌ సేనలు, దక్షిణ ప్రాంతంలో అమెరికా నాయకత్వంలోని సేనలు జపాన్‌ మిలిటరీని ఓడించాయి. దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టుల నాయకత్వంలో వుత్తర ప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వానికి సోవియట్‌ మద్దతు ప్రకటించగా దానికి పోటీగా అమెరికాలో వున్న కమ్యూనిస్టు వ్యతిరేకి, మాజీ కొరియా నియంత సింగమాన్‌ రీని అమెరికా నుంచి రప్పించి అమెరికన్లు దక్షిణ ప్రాంతంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాపై తమదే ఆధిపత్యం అని ప్రకటించుకున్నాయి. పరిస్ధితులు చక్కపడిన తరువాత ఐక్య కొరియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అంగీకారం కుదిరింది. తరువాత దక్షిణ కొరియాలోని నియంత ప్రభుత్వం అమెరికా దన్నుతో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు దాడి చేసింది. దానిని సోవియట్‌, చైనా మద్దతుతో వుత్తర కొరియా కమ్యూనిస్టు ప్రభుత్వం తిప్పి కొట్టింది. వుభయుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి విలీనం గురించి వుత్తర కొరియా ప్రయత్నిండగా తగిన పరిస్ధితులు ఏర్పడలేదనే పేరుతో 1953 నుంచీ దక్షిణ కొరియా అడ్డుకొంటోంది. దీనికి అమెరికా, జపాన్‌ మద్దతు ఇస్తున్నాయి. వుత్తర కొరియాకు రద్దయ్యే వరకు సోవియట్‌, తరువాత చైనా, వియత్నాం వెన్నుదన్నుగా వున్నాయి.

వుత్తర కొరియాతో సఖ్యత, ఐక్యతకు సిద్దమంటూనే మూన్‌ ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం ఒలింపిక్‌ క్రీడల సమయంలోనే అవసరమైతే వుత్తర కారియాపై దాడి చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఆంగ్లంలో బ్లడీనోస్‌ అని పిలుస్తున్నారు. (ముక్కు బద్దలు కొట్టి భయ పెట్టటం వంటిది). ఎవరు అవునన్నా కాదన్నా అణ్వస్త్ర దేశాలలో వుత్తర కొరియా ఒకటి. అమెరికా దగ్గర వెయ్యి వుంటే దాని దగ్గర ఒకటే వుండవచ్చు. వాటిని ప్రయోగిస్తే జరిగే నష్టం ఒకటైనా, వెయ్యి అయినా ఒకటే. అందువలన తక్షణమే వాటిని వుపయోగించకపోయినా మారణకాండ జరిపే ఆయుధాలు అమెరికా దగ్గర గుట్టలుగా వున్నాయి. అమెరికా గనుక యుద్దానికి పూనుకుంటే దక్షిణ కొరియాలో వున్న రెండులక్షల 30వేల మంది అమెరికన్‌ సైనికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా కొత్తగా నియమితుడైన విక్టర్‌ చా హెచ్చరించాడు.అందుకుగాను ట్రంప్‌ ఆ నియామకాన్ని రద్దు చేశాడు. గత ఏడాది కాలంలో అనేక సార్లు ట్రంప్‌ వుత్తర కొరియా నాయకత్వాన్ని తూలనాడటం, రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయటం తెలిసినదే. గతవారంలో వుత్తర కొరియా నుంచి ఫిరాయించిన వారితో సమావేశమై గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దాడులు తప్ప మరొక మార్గం లేదని నోరుపారవేసుకున్నాడు. ఒలింపిక్స్‌కు బయలుదేరి అమెరికా వుపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మధ్యలో అలాస్కాలోని క్షిపణి వ్యతిరేక కేంద్రాన్ని సందర్శించటంతో పాటు జపాన్‌తో చర్చలు జరపాలని నిర్ణయించాడు. నిజానికి ఇతగాడి పర్యటన వుత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రచార దాడి లక్ష్యం తప్ప తలెత్తిన వుద్రిక్తతలను వుపశమింపచేసేదిగా లేదు. క్రీడల తరువాత గతేడాది మాదిరే వుత్తర కొరియా సమీపంలో ఆధునిక ఆయుధాలతో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కొరియా ద్వీపకల్పంపై దాడికి వీలుగా గువామ్‌ సైనిక కేంద్రంలో అణ్వాయుధాలను తీసుకుపోవగల బి-52, బి2 రకాల విమానాలను మోహరించారు.

వుత్తర కొరియాపై దాడులు చేసేందుకు అమెరికా అవకాశం కోసం చూస్తున్నది. దానిలో భాగంగానే జనవరి 13వ తేదీన హవాయి దీవుల వైపు ఖండాంతర క్షిపణి వస్తున్నదని, ఇది డ్రిల్లు కాదు, వెంటనే రక్షణ తీసుకోండనే తప్పుడు సమాచారాన్ని జనంలో ప్రచారంలో పెట్టారు. దాంతో వీధుల్లోని జనం కార్లను వదలి పరుగులు తీసిన వుదంతం తెలిసిందే. ముఫ్నై ఎనిమిది నిమిషాలపాటు జనం కకావికలయ్యారు. అది వాస్తవం కాదని విన్యాసమని కూడా సమాచారంలో వుందని తరువాత అధికారులు చెబుతున్నప్పటికీ చివరలో డ్రిల్లు కాదని కూడా పేర్కొన్నందున జనం నిజమని భావించారు. అబద్దాలు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటంలో అమెరికా గూడచార, మీడియా సంస్ధలు పేరు మోశాయి. జపాన్‌పై అణుబాంబును ప్రయోగించేందుకు సాకుగా రెండవ ప్రపంచ యుద్ధంలో పెరల్‌ హార్బర్‌పై దాడి చేసిందనే పెద్ద అబద్దాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వియత్నాంపై దాడి చేసేందుకు 1964లో టోంకిన్‌ గల్ఫ్‌లో తమ యుద్ధ నౌకపై దాడి జరిపిందనే సాకుతో దాడులకు దిగిన విషయం దాస్తే దాగేది కాదు నిన్నగాక మొన్న ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో సద్ధాం హుస్సేన్‌పై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. వుగ్రవాదంపై పోరు పోరు పేరుతో ఇప్పుడు దాడులు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను సృష్టించిందీ అమెరికాయే అన్న విషయం తెలిసిందే.

ఒకవైపు శీతాకాల ఒలింపిక్స్‌ వుత్సవాలకు ప్రతినిధి బృందాలను పంపిన వుత్తర కొరియా నాయకత్వం మరోవైపు ఏప్రిల్‌ 25న జరగాల్సి కొరియా ప్రజాసైన్య 70వ వార్షికోత్సవాన్ని ఒలింపిక్‌ క్రీడల ప్రారంభానికి ఒక రోజు ముందే జరిపేందుకు పూనుకున్నదని, తన దగ్గర వున్న దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రదర్శన ద్వారా అమెరికాను బెదిరించేందుకు పూనుకుందని, అందువలన శాంతి కావాలనే ఎత్తుగడతో దక్షిణ కొరియా, దాని మిత్రపక్షాల మధ్య అంతరం పెంచేందుకు వుద్దేశించిన దాని ప్రచారాన్ని నమ్మవద్దని జపాన్‌, పశ్చిమ దేశాల మీడియా గగ్గోలు పెడుతోంది. తను అణుకార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవసరమైన వ్యవధి తీసుకొనేందుకు అది శాంతి గురించి మాట్లాడుతున్నదని ఆరోపణలు చేస్తున్నది.

గత ఏడు దశాబ్దాల పరిణామాలను గమనించినపుడు వుభయ కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాల కూటమి అన్నది స్పష్టం.1950 దశకంలో వుత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు అమెరికా మద్దతుతో దక్షిణకొరియా ప్రయత్నించింది తప్ప ఇంతవరకు ఏ నాడూ దక్షిణ కొరియాపై సోషలిస్టు వుత్తర కొరియా దాడిచేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ విలీనానికి ఇంకా అనుమానాలు తొలగలేదనే పాచిపాటనే పశ్చిమ దేశాలు పాడుతున్నాయి. శీతాకాల ఒలింపిక్స్‌ సందర్భంగా చేస్తున్న ప్రచారదాడి దానిలో భాగమే.