అమెరికా కుట్రలకు చెంపదెబ్బ – బొలీవియా వామపక్ష జయకేతనం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 18, ఆదివారం నాడు జరిగిన బొలీవియా అధ్యక్ష, పార్లమెంట్‌ ఎన్నికల్లో వామపక్ష ” మాస్‌ ” పార్టీ విజయం సాధించింది. పోలింగ్‌ అనంతర సర్వేలో 53శాతం ఓట్లతో వామపక్ష అభ్యర్ధి లూయిస్‌ ఆర్‌సి విజయం సాధించనున్నట్లు వెల్లడైంది. ఇది రాస్తున్న సమయానికి 40శాతం ఓట్ల లెక్కింపు జరిగినట్లు ఆర్‌సి 45శాతంతో ముందుండగా 35శాతం సాధించిన ప్రత్యర్ధి మాజీ అధ్యక్షుడు కార్లోస్‌ మెసా తన ఓటమిని అంగీకరించినట్లు వాయిస్‌ అమెరికా తెలిపింది. ఎన్నికలలో విజేతను గుర్తిస్తానని, విజయాన్ని గుర్తించటమే ప్రజాస్వామ్యానికి తగినదన్నారు. ఎన్నికలలో లూయీస్‌ ఆర్‌సి విజయాన్ని ఇరాన్‌ అభినందించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఈ మేరకు ఒక ప్రకటన చేశాడు. బొలీవియాలో సంబంధాలను పునరుద్దరించి పటిష్ట పరుచుకొనేందుకు సిద్దమని చెప్పాడు.


పట్టణ ప్రాంతాల ఓట్లు తొలుత లెక్కించగా ఇద్దరూ పోటా పోటీగా ఉన్నారని, ఇవో మొరేల్స్‌ నాయకత్వంలోని ‘మాస్‌’ (మువ్‌మెంట్‌ ఫర్‌ సోషలిజం-సోషలిజం కోసం ఉద్యమం) పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని పట్టు ఉన్నందున మెజారిటీ పెరగనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం తొలి దఫాలోనే యాభైశాతంపైగా తెచ్చుకున్నా లేదా నలభైశాతంపైగా తెచ్చుకొని ప్రత్యర్ధికంటే పదిశాతం కంటే మెజారిటీలో ఉన్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే తొలి రెండు స్ధానాల్లో ఉన్న అభ్యర్ధుల మధ్య రెండవ దఫా ముఖాముఖీ పోటీ నిర్వహిస్తారు.
అనేక కుట్రలు, కరోనా కారణంగా మూడు సార్లు వాయిదా పడి చివరకు ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 25నాటికి పూర్తై ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఏడాది క్రితం పోలీసులు, మిలిటరీ, మితవాద రాజకీయశక్తులు కలసి పన్నిన కుట్ర కారణంగా ఎన్నికల్లో విజయం సాధించిన మాస్‌ నేత ఇవోమొరేల్స్‌ పదవికి రాజీనామా చేసి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఎన్నికలు జరిగే రోజు వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నందున అధికారికంగా ప్రకటించే వరకు ఓట్ల లెక్కింపులో అక్రమాలు, ఇతరంగా కుట్రలు జరిపి ఫలితాలను తారు మారు చేసే అవకాశాలను ఇప్పటికీ తోసి పుచ్చలేము. ఎగ్జిట్‌ పోల్స్‌ కార్యరూపం దాల్చితే గతేడాది ఇవో మొరేల్స్‌ కంటే ఎక్కువ ఓట్లతో మాస్‌ పార్టీ విజయం సాధించనుంది.


ఆదివారం నాడు ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వే ఫలితాలను వెల్లడించేందుకు పౌర సమాజం, కాథలిక్‌ చర్చి ఏర్పాటు చేసిన స్వతంత్ర సర్వే సంస్ధలు, మీడియాకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వకపోవటం, తొలి లెక్కింపు వివరాలను వెల్లడించకపోవటం అనేక అనుమానాలకు దారితీసింది. అక్రమ పద్దతుల్లో గద్దెనెక్కిన అమెరికా అనుకూల తాత్కాలిక అధ్యక్షురాలు జీనీ అనెజ్‌ బలపరచినట్లు ప్రచారం జరిగిన అభ్యర్ధికి కేవలం 14శాతమే వస్తాయని తేలటంతో ఆమె ఓటమిని అంగీకరించటం, ఇతర ప్రతికూల పరిణామాలేవీ లేకపోవటంతో మాస్‌ తిరిగి అధికారాన్ని చేపట్టటం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ అమెరికా అనుకూల శక్తుల కుట్రలను ఊహించలేము.


కొన్ని చోట్ల తగిలిన ఎదురు దెబ్బల తరువాత ఈ ఎన్నికల ఫలితాలు మొత్తం లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులకు వచ్చిన అతిపెద్ద విజయం, మితవాద శక్తులకు, దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికాకూ పెద్ద ఎదురుదెబ్బ. అంతే కాదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల వామపక్ష శక్తులకు ఎంతో ఉత్తేజమిచ్చే పరిణామం. ఈ ఫలితాలు అమెరికా పెత్తందారీ పోకడలకు చెంపదెబ్బ. నవంబరు మూడవ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడిని మరింతగా దెబ్బతీస్తాయి. ఎగ్జిట్‌, ఓట్ల లెక్కింపు తొలి ఫలితాలు వెలువడగానే రాజధాని లాపాజ్‌లో మాస్‌ పార్టీ మద్దతుదారులు సంబరాలను ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని గమనంలో ఉంచుకొని జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాస్‌ అభ్యర్ధి ఆర్‌సి ప్రకటించారు. పార్టీ మద్దతదారులు, ఇతరులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.


కోటీ పదహారు లక్షల మంది జనాభా ఉన్న బొలీవియాలో స్ధానిక గిరిజన తెగల జనాభా మెజారిటీ ఉన్నప్పటికీ, స్పెయిన్‌ వలస, స్వతంత్ర పాలన ఐదువందల సంవత్సరాలలో 2006లో ఇవోమొరేల్స్‌ విజయం సాధించే వరకు మెజారిటీ సామాజిక తరగతికి చెందిన వారు పాలనా పగ్గాలు చేపట్టలేకపోయారు. మొరేల్స్‌ గత ఏడాది జరిగిన ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలో కుట్ర చేసి ఎన్నికల ఫలితాలను గుర్తించేందుకు నిరాకరించటంతో పాటు పార్లమెంట్‌ ద్వారా తాత్కాలిక అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. తాను తిరిగి ఎన్నికలను నిర్వహిస్తానని, కొత్త ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని మొరేల్స్‌ చెప్పినా అంగీకరించలేదు. రాజీనామా చేయాలని, తదుపరి అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనేందుకు వీల్లేదని మిలిటరీ అధికారులు ఆదేశించారు. చివరకు అరెస్టు చేసి జైలు పాలు చేసే కుట్రను గ్రహించి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందారు. మొరేల్స్‌ అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు, పార్లమెంట్‌ అభ్యర్ధిగా కూడా పోటీ చేయకూడదని కుట్రదారుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలలో ఆయన ప్రభుత్వంలో పదేండ్లకు పైగా ఆర్ధిక మంత్రిగా పని చేసిన లూయీస్‌ ఆర్‌సి అభ్యర్ధిగా ఎంపికయ్యాడు. ఎన్నికల ఫలితాల సరళి వెలువడగానే తాను స్వదేశానికి రానున్నట్లు మొరేల్స్‌ ప్రకటించాడు. మొరేల్స్‌ మీద చేసిన ఆరోపణలను జనం విశ్వసించలేదని ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేశాయి.


వామపక్షాల స్ధానంలో అధికారానికి వచ్చిన మితవాద శక్తులు అంతకు ముందు అమలు జరిపిన సంక్షేమ చర్యలకు ఎలా గండికొడుతున్నారో చూసిన తరువాత బొలీవియన్లు మితవాదుల ప్రచారాన్ని పట్టించుకోలేదన్నది స్పష్టం అవుతోంది. అయితే నయావుదారవాద పునాదులను బద్దలు చేయకుండా వాటి మీద ఆధారపడి తీసుకొనే సంక్షేమ చర్యలకు పరిమితులు ఏర్పడి జనంలో అసంతృప్తి తలెత్తుతున్నట్లు అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. బొలీవియాలో ఏర్పడనున్న నూతన మాస్‌ ప్రభుత్వం ప్రతిపక్షం, అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రల మధ్య ఆ సవాళ్లను ఎలా స్వీకరించనున్నది చూడాల్సి ఉంది.
ఇవో మొరేల్స్‌ను ఆధికారం నుంచి తొలగించటం లాటిన్‌ అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మూలమలుపు అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించిన విషయం తెలిసిందే. కానీ అదే ట్రంప్‌ హయాంలో మాస్‌ ప్రతినిధి తిరిగి అధికారాన్ని చేపట్టబోతున్నాడు. అధికారంలో ఉండి ఓడిపోయిన అధ్యక్షుడిగా అదే ట్రంప్‌ చరిత్ర చెత్తబుట్టకు ఎక్కనున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ఎలాంటి పరిహాస ప్రాయమైన వాదనలతో కుట్రదారులు వ్యవహరిస్తారో బొలివీయా పరిణామం స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో లెక్కింపు ప్రారంభంలో ప్రత్యర్ధికంటే ఇవోమొరేల్స్‌ మెజారిటీ 7.87శాతమే ఉందని, తరువాత 10.15శాతంగా ప్రకటించారని, తరువాత దాన్ని 10.52కు పెంచి మొరేల్స్‌ గెలిచినట్లు ప్రకటించారని ఆక్రమాలకారణంగానే ఇలా జరిగిందని అమెరికా కనుసన్నలలో నడిచే అమెరికా దేశాల సంస్ధ (ఓఏఎస్‌) ఆరోపించింది. ఎన్నికలకు ముందే ఈ సంస్ధతో పాటు ఐరోపా దేశాల ప్రతినిధులు అక్రమాల గురించి ప్రచారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగులేని మెజారిటీకారణంగానే గత ఎన్నికలలో చివరిలో మోరెల్స్‌ అవసరమైన మెజారిటీ సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా అదే ధోరణి వ్యక్తమైనట్లు వచ్చిన వార్తలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది మాస్‌కు మెజారిటీ వస్తున్న సమయంలో వివరాలను వెల్లడించకుండా నిలిపివేసి తరువాత ప్రకటించటంతో పెద్ద తేడా రావటాన్ని కూడా ఎన్నికల అక్రమంగానే కుట్రదారులు ఆరోపించారు. అయితే తరువాత వాటికి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయారు.


తాజా ఎన్నికలో మాస్‌ పార్టీ విజయం సాధించనుందని తొలి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. మితవాద శక్తుల మధ్య ఉన్న వివాదాలను సర్దుబాటు ఒకే అభ్యర్ధిని పోటీకి నిలపాలని ప్రయత్నించారు. అయితే రెండవ అభ్యర్ధి రంగంలోకి దిగాడు. తొలి విడత ఎవరికీ మెజారిటీ వచ్చే అవకాశం లేదనే అంచనాతో దిగిన మితవాద శక్తులకు మలివిడత ఎన్నికలతో పని లేకుండానే బొలీవియన్లు నిర్ణయాత్మక తీర్పునిచ్చారు. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేల ప్రకారం ఆర్‌సికి 42.3, మెసాకు 33.1, మూడవ అభ్యర్ధికి 16.7శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. మెసాకు మద్దతుగా అనెజ్‌ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గత ఏడాది మొరేల్స్‌కు 47శాతం వచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం లూయీస్‌ ఆర్‌సికి 52.4శాతం, కార్లోస్‌ మెసాకు 31.5, మూడవ పార్టీకి 14.1శాతం వస్తాయని వార్తలు వెలువడ్డాయి.
గతంలో తాము నడచిన బాటనే ముందుకు పోవాలని దేశ ప్రజలు ఈ తీర్పు నిచ్చారని ఆర్‌సి వర్ణించారు. ఇవో మొరేల్స్‌ మాదిరి ప్రజా ఉద్యమాల నుంచి నేతగా ఆవిర్భవించనప్పటికీ ఒక మేథావిగా మాస్‌ ఎత్తుగడలు, విధానాలను నిర్ణయించటంలో ఆర్‌సి కీలకపాత్ర వహించారు. అనేక సంస్కరణలకు కీలకవ్యక్తిగా మారటమే కాదు మొరేల్స్‌ తరువాత ప్రజల అభిమానం పొందారు. గత ఏడాది కాలంలో కుట్రదారుల ప్రభుత్వం అనుసరించిన అక్రమాలు, అవినీతి కారణంగా బొలివీయన్లు రెండు ప్రభుత్వాల మధ్య తేడాను గమనించారు. 2002 నుంచి జరిగిన బొలీవియా ఎన్నికలు, అనంతర పరిణామాలను చూసినపుడు రెండు శిబిరాలుగా రాజకీయ సమీకరణలు జరిగాయి. తాము వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చినపుడు వారికి సమస్యలు సృష్టించేందుకు మితవాదులు చేయని ప్రయత్నం లేదు. గత ఏడాది ఇవో మొరేల్స్‌ను అడ్డుకోవటం పరాకాష్ట. ఈ కారణంగానే ఈ సారి కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని, ఏదో ఒకసాకుతో మిలిటరీ రంగంలోకి దిగవచ్చని జోశ్యం చెప్పిన వారు కూడా ఉన్నారు.


మాస్‌ పార్టీ నేతగా ఇవో మొరేల్స్‌ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన కొచబాంబా ప్రాంతం ఉన్న చపారే రాష్ట్రంలో, ఇతర చోట్ల పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గత ఏడాది కాలంలో తాత్కాలిక ప్రభుత్వం పాల్పడని తప్పుడు పని లేదు. సంఘవ్యతిరేక శక్తులను ప్రోత్సహించి మాస్‌ కార్యకర్తల మీద, సామాన్య జనం మీద దాడులు చేయించారు. చమురు ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం కలిగించారు. మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో పోలీసులతో గ్రామాల మీద దాడులు చేయించారు. మిలిటరీని ప్రయోగించి భయపెట్టారు. మొరేల్స్‌ వ్యతిరేకులకు పెద్ద ఎత్తున నిధులు అందచేసి తప్పుడు ప్రచారం చేయించారు. ఈ ఎన్నికల్లో అనేక మంది మాస్‌ అభ్యర్దులను పోటీకి అనర్హులుగా ప్రకటించారు. పోటీలో ఉన్నవారి మీద పోలీసు దాడులు చేయించారు. అంతెందుకు అధ్యక్ష పదవికి పోటీపడిన ఆర్‌సిని అనేక సార్లు అనర్హునిగా ప్రకటిస్తామని బెదరించారు. మితవాద శక్తులు ఎన్నికల సంఘం మీద వత్తిడి తెస్తూ నిరసన ప్రదర్శనలకు దిగాయి. మీడియా సంగతి చెప్పనవసరం లేదు. మాస్‌ పార్టీకి వ్యతిరేకంగా మితవాదశక్తులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఉన్నది ఉన్నట్లు రాస్తారు, చూపుతారు అని అనుమానం వచ్చిన స్దానిక, విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు విధించారు. టెలిసుర్‌, ఆర్‌ టీవీ ఛానల్స్‌ ప్రసారాల అనుమతులను రద్దు చేశారు.పదిహేను సామాజిక రేడియోలను మూయించారు. కొందరు జర్నలిస్టుల మీద కుట్ర అనుకూల మూకలను ఉసిగొల్పారు.
అన్నీ సక్రమంగా జరిగితే కొత్తగా తిరిగి ఏర్పడే మాస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం పెద్ద ఎత్తున జరిపే అవకాశాలున్నాయి. క్యూబా,వెనెజులా, నిగరాగువా మరికొన్ని దేశాల ఆధినేతలు అతిధులుగా అర్జెంటీనా ప్రవాసం నుంచి తిరిగి వచ్చే ఇవోమోరేల్స్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చునని చెబుతున్నారు. అయితే అమెరికా సామ్రాజ్యవాదులు ఈ పరిణమాన్ని సహిస్తారా ? మాస్‌ విజయాన్ని వమ్ము చేయకుండా ఉంటారా ?

చైనా సంగతి తరువాత, ముందు బంగ్లాదేశ్‌ను అధిగమించండి !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఆగండి ఆగండి శీర్షికను చూసి ఉద్రేకపడకండని కొందరికి సవినయ మనవి. ఇది కమ్యూనిస్టులు ఇచ్చిన సలహా కాదు మహాశయులారా ! మోడినోమిక్స్‌ అంటే తెలుసు కదా ! నరేంద్రమోడీ ప్రావీణ్యత సంపాదించిన ప్రత్యేక ఆర్ధశాస్త్రం. అసలు ఆయనే చదువుకున్నారో మనకు తెలియదు. చదువులతో పనేముంది అంటూ ఆయన ప్రకటించిన విధానాలను చూసి అర్ధశాస్త్ర పండితుడని, ఆ పాండిత్యం అనితర సాధ్యం కనుక ఆయన పేరుతోనే మన మీడియా కితాబిచ్చింది. ఇప్పుడు అదే మీడియాలో ఒక విశ్లేషణ వెలువడింది. చైనా సంగతి తరువాత ముందు బంగ్లాదేశ్‌ను అధిగమించండి అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తీరు తెన్నుల గురించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వెల్లడించిన తాజా అంచనా-జోశ్యంలో చెప్పిన అంశాలు మోడినోమిక్స్‌ గాలితీస్తున్నాయి. ఆండీ ముఖర్జీ అనే జర్నలిస్టు మోడీకి అలాంటి సలహా ఇచ్చేందుకు చేసిన సాహసాన్ని ముందుగా అభినందించాలి. పైన పేర్కొన్న శీర్షికతో ఆండీ రాసిన దాన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.


ఐఎంఎఫ్‌ నివేదిక అందరికీ అందుబాటులో ఉంది. అదేమీ రహస్య పత్రం కాదు.మరికొందరు విశ్లేషకులు కూడా దాని మీద వ్యాఖ్యలు, వార్తలు రాశారు. ఆండీ ముఖర్జీ శీర్షిక ఎంతో సూటిగా వాస్తవానికి దగ్గరగా ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన తలసరి జిడిపి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌ కంటే తగ్గనుందని ఐఎంఎఫ్‌ చెప్పింది. ” ఏ వర్ధమాన ఆర్ధిక వ్యవస్ద అయినా బాగా పని చేస్తున్నదనటం శుభవార్త. అయితే ఐదు సంవత్సరాల క్రితం 25శాతం ఆధిక్యతలో ఉన్న భారత్‌ ఇప్పుడు వెనుకపడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది ” అని ప్రముఖ ఆర్ధికవేత్త కౌశిక్‌ బసు ఐఎంఎఫ్‌ నివేదిక వెలువడిన వెంటనే ట్వీట్‌ చేశారు. మన కేంద్ర పాలకుల స్పందన చూస్తే చీమకుట్టినట్లు కూడా లేదు.


చైనాను అధిగమిస్తామని చెప్పిన వారు చివరకు అత్యంత పేద దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌కంటే వెనుకబడిపోవటం విజయనాదాలు తప్ప మరొకటి తెలియని నరేంద్రమోడీ గణానికి జీర్ణించుకోలేని అంశమే. ఒక పెద్ద దేశంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెద్దదిగా ఉండవచ్చుగానీ తలసరి విషయంలో ఎంత వెనుకబడి ఉందో ఈ పరిణామం స్పష్టం చేసింది. దీనికి కారణం కరోనా అని ఠకీమని చెప్పవచ్చు. చివరకు దానిలో కూడా మన ప్రధాని అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సిందే. బంగ్లాదేశ్‌ జనాభా కంటే మనం ఎనిమిది రెట్లు ఎక్కువ. అక్టోబరు 18 నాటికి ప్రపంచంలో కరోనా సోకిన వారు నాలుగు కోట్లు దాటారు.మన దేశంలో 75లక్షల మందికి కరోనా సోకితే, 1,114,064 మంది మరణించారు. అదే బంగ్లాదేశ్‌లో 3,87,295 మందికి వైరస్‌ సోకగా 5,646 మంది మరణించారు. అంటే మన దేశంలో 20 రెట్లు మరణాలు ఎక్కువ.


మన జిడిపి 10.3శాతం తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేయగా బంగ్లాదేశ్‌లో 3.8శాతం పురోగమనంలో ఉంటుందని పేర్కొన్నది.అందుకే కరోనా లేకపోయినా తలసరి జిడిపిలో బంగ్లాదేశ్‌ మనలను మించి పోయి ఉండేదని ఆర్దికవేత్తలు పేర్కొన్నారు. నైపుణ్యం తక్కువగా ఉన్న వారు చేయగలిగిన వస్తు తయారీకి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అనుసరించటమే దీనికి కారణం.తొలి సంవత్సరాల్లో చైనా అనుసరించిన విధానమదే. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పించింది. బంగ్లాదేశ్‌లో పని చేయగలిగిన వయస్సులోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు కార్మికులుగా ఉన్నారు. మన దేశం కంటే ఎక్కువ. ప్రస్తుతం చైనా నైపుణ్యం తక్కువ అవసరమైన ఉత్పత్తులకు బదులు అధిక నైపుణ్యం కలిగిన వస్తు తయారీ, సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నందున బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలు చైనా వదలిన ఖాళీని పూర్తి చేసి ఎగుమతుల బాటలో పయనిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా కొత్తగా 80లక్షల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులయ్యారు. ఈ నేపధ్యంలోనే చైనాతో పోల్చుకోవటం పక్కన పెట్టి బంగ్లాదేశ్‌ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని ఆండీ ముఖర్జీ సూచించారు.


ఐదేండ్ల క్రితం మన తలసరి జిడిపి బంగ్లాదేశ్‌ కంటే 24శాతం ఎక్కువగా ఉంది. కానీ 2020లో మన తలసరి జిడిపి 1,876.53 డాలర్లుగా అంచనా వేస్తే బంగ్లాదేశ్‌లో 1,887.97 డాలర్లుగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ అంచనాలు దిగువ విధంగా ఉన్నాయి. 2021లో మన తలసరి జిడిపి 2,030.62 డాలర్లు ఉంటే బంగ్లాదేశ్‌లో 1,989.85గా ఉంటుంది. అయితే 2024లో రెండు దేశాల్లో దాదాపు సమంగా ఉన్నప్పటికీ 2025నాటికి మన దేశంలో 2,729.24 డాలర్లు, బంగ్లాదేశ్‌లో 2,756.10డాలర్లు ఉంటుంది. ఇక చైనా విషయానికి వస్తే 2020లో తలసరి జిడిపి 10,839.43 డాలర్లు. మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 1,115, శ్రీలంకలో 3,697 డాలర్లుగా పేర్కొన్నది. అందువలన మన చైనాతో పోటీ పడటానికి బదులు బంగ్లాదేశ్‌, శ్రీలంకలను అధిగమించేందుకు పూనుకోవటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
బంగ్లాదేశ్‌ కంటే మనం వెనుకబడిపోతున్నామనటాన్ని మన అధికార యంత్రాంగం అంగీకరించటం లేదు. కొనుగోలుశక్తి ప్రాతిపదికన లెక్కించే పిపిపి ప్రకారం 2020 మన తలసరి జిడిపి 6,284 డాలర్లుంటుందని అదే బంగ్లాదేశ్‌లో 5,139 డాలర్లని పేర్కొన్నట్లు పిటిఐ తెలిపింది. ఐఎంఎఫ్‌ అంచనాలతో ఇప్పుడు అనేక మంది చైనాను పక్కన పెట్టి బంగ్లాదేశ్‌తో మన దేశాన్ని పోలుస్తున్నారు. ఇది ఎన్‌డిఏకు ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీకి ఒక పెద్ద సవాలు విసరటం తప్ప వేరు కాదు. 2004-16 మధ్య మన దేశ జిడిపి పెరుగుదల రేటు బంగ్లాదేశ్‌ కంటే వేగంగా ఉంది. అయితే 2017 నుంచి బంగ్లా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. గత 15 సంవత్సరాలలో మన జనాభా పెరుగుదల 21శాతం పెరగ్గా బంగ్లాదేశ్‌లో 18శాతం మాత్రమే ఉంది. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరని, పిల్లల్ని ఎక్కువగా కని ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్‌ సమాజంగా మారుస్తారని ప్రచారం చేసే వారికి ఇది చెంపపెట్టు.


ప్రపంచ ఆకలి నివేదిక 2019, ప్రపంచ బ్యాంకు సమాచారం మేరకు కొన్ని అంశాలలో రెండు దేశాల మధ్య కొన్ని సూచికల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం బంగ్లాదేశ్‌ ×××××××× భారత్‌
ద్రవ్యోల్బణ శాతం 5.8 ××××××××× 3,8
కరంట్‌ ఖాతాలోటు శాతం జిడిపి -2.4 ××××××××× 0.7
జిడిపిలో నిఖర ఎఫ్‌డిఐశాతం 0.4 ×××××××××× 1.1
జిడిపిలో ద్రవ్యలోటు శాతం -8.8 ×××××××××× -12.4
జిడిపిలో రుణశాతం 49 ×××××××××× 90
మానవాభివృద్ధి సూచిక 135 ×××××××××× 129
ఆయు ప్రమాణం సం. 72.3 ×××××××××× 69.4
మహిళా కార్మికుల భాగస్వామ్యశాతం 36 ×××××××××× 20.335
సులభతర వాణిజ్య సూచిక 168 ×××××××××× 63
ఆర్ధిక స్వేచ్చ సూచిక 122 ×××××××××× 105
బ్యాంకుఖాతాలున్న పెద్దలశాతం 50 ×××××××××× 80
మరుగుదొడ్లు ఉన్నవారి శాతం 48.23 ××××××××× 59.43
అపరిశుభ్రత కారణంగా మరణాలు 11.9 ××××××××× 18.6
సమానత్వ సూచిక 50 ××××××××× 112
ఆకలి సూచిక 75 ××××××××× 94


బంగ్లాదేశ్‌లో జనాభా ఎక్కువగా పరిశ్రమలు, సేవారంగం మీద ఆధారపడుతుండగా మన దేశంలో వ్యవసాయరంగం ప్రధానంగా ఉంది. అనేక రంగాలలో పురోగతి ఉన్నప్పటికీ మన దేశంతో పోల్చితే బంగ్లాదేశ్‌లో దారిద్య్రం ఎక్కువగా ఉంది. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2019-20లో బంగ్లాదేశ్‌లో 21.9శాతం మంది దారిద్య్రంలో ఉండగా మన దేశంలో 8.3శాతం ఉన్నారు. 2021-22 నాటికి బంగ్లాలో 21.4శాతానికి తగ్గుతారని మన దేశంలో పదిశాతానికి పెరుగుతారని అంచనా. చైనా అయినా బంగ్లాదేశ్‌ అయినా ఎదగటానికి దశాబ్దాలు పట్టింది. కానీ మన పాలకులు ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా అరచేతిలో స్వర్గాన్ని చూపుతున్నారు. గుజరాత్‌ నమూనాను దేశమంతటా అమలు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయని ఊరించారు. వస్తే వచ్చాయి, వస్తాయో రావో తెలియని వాటి గురించి ఊహల్లో లెక్కలు వేసుకుంటూ మంచాలు నేసే సోమరిపోతులను గుర్తుకు తెస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి తగు చర్యలు తీసుకుంటారా ? మరో కొత్త ఊరింపులతో జనాన్ని మభ్యపెడతారా ?

తనిష్క ”ఏకత్వం”పై హిందూత్వ రంధ్రాన్వేషకుల దాడి !

Tags

,


ఎం కోటేశ్వరరావు


హిందూ – ముస్లిం ఐక్యత ఇతివృత్తంతో టాటా గ్రూపు ఆభరణాల కంపెనీ తనిష్క రూపొందించిన ఒక వాణిజ్య ప్రకటనను వివాదాస్పదం కావించారు. దాంతో కంపెనీ దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తొలుత తమ ప్రకటనపై వ్యతిరేక, అనుకూలతలను వ్యక్తం చేసే వ్యాఖ్యలకు అవకాశం లేకుండా చేసింది. తరువాత ఏకంగా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే భారత ప్రకటనల ప్రమాణాల మండలి(ఎఎస్‌సిఐ) వెంటనే ఒక ప్రకటన చేస్తూ తనిష్క ప్రకటన ఏ ప్రమాణాలనూ ఉల్లంఘించనందున దాని మీద చేస్తున్న ఫిర్యాదులు నిలిచేవి కాదని, కావాలనుకుంటే ప్రకటనదారులు ప్రసారం చేసుకోవచ్చని పేర్కొన్నది. తనిష్క ప్రకటనలో ఎలాంటి అసభ్యత లేదా అసహ్యకరమైనదేమీ లేదని పేర్కొన్నది. ప్రకటనలు, మీడియా రంగంలో ఉన్న అనేక సంస్దలు ఇదే విధమైన మద్దతును ప్రకటించాయి. అయినా హిందూత్వశక్తులు దాడులకు దిగుతాయనే భయంతో ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
కొందరి మనోభావాలు దెబ్బతినటాన్ని గమనంలో ఉంచుకొని తమ ఉద్యోగులు, దుకాణ సిబ్బంది, భాగస్వాముల సంక్షేమం దృష్ట్యా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు తనిష్క తెలిపింది. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా గాంధీ ధామం పట్టణంలోని తనిష్క దుకాణంలో ఈ మేరకు ఒక ప్రకటనను కంపెనీ అంటించింది. దుకాణంపై కొందరు దాడికి దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొంత మంది దుకాణం వద్దకు వెళ్లి ప్రశ్నించారు తప్ప దాడి లేదా దుకాణ ధ్వంసం గానీ జరగలేదని, ఫోన్లద్వారా అనేక మంది నిరసన తెలిపారని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిని పలువురు నెటిజన్లు, ఖండించారు. ఈ ప్రకటనపై వెల్లడైన ధోరణి ఆందోళన కలిగిస్తున్నదని, ప్రకటనను రూపొందించిన వారికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ ప్రకటించింది.


ఇటీవలి కాలంలో రంధ్రాన్వేషణ చేసే శక్తులు ప్రతి దానిలో హిందూత్వకు హాని జరుగుతోందంటూ మనోభావాలను రెచ్చగొట్టేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. గర్భిణీతో ఉన్న హిందువు అయిన కోడలికి ఒక ముస్లిం కుటుంబం హిందూ సాంప్రదాయ ప్రకారం సీమంతం జరపటం, ఆ సందర్భంగా కోడలికి తనిష్క ఆభరణాన్ని బహుకరించే 44 సెకండ్ల ప్రకటనను తనిష్క కంపెనీ తయారు చేయించి విడుదల చేసింది. ముస్లిం యువకులు కుట్రతో హిందూ యువతులను ప్రలోభ పెట్టి వివాహాలు చేసుకొనటాన్ని -లవ్‌జీహాద్‌- ప్రోత్సహించేదిగా, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేదిగా ప్రకటన ఉందంటూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమంలో దాడికి దిగితే గాంధీ ధామం, ముంబై తనిష్క దుకాణాల వద్ద మతశక్తులు గుమికూడి నిరసన తెలిపినట్లు వార్తలు వచ్చాయి.


అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు హిందువులను వివాహాలు చేసుకున్నారు. పోనీ వారేమీ చదువు సంధ్యలు లేని లేదా మంచీ చెడ్డలు తెలియని వారు కాదు. అదే విధంగా కొందరు బిజెపి పెద్దలు ముస్లిం మతానికి చెందిన యువతులను తమ కుమారులకు ఇచ్చి వివాహాలు చేసినవారు కూడా ఉన్నారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు చేసుకోవటం తప్ప హిందూ అబ్బాయిలు ఎంత మంది ముస్లిం అమ్మాయిలను చేసుకున్నారో చెప్పండి అని కొంత మంది అడ్డు సవాళ్లు విసురుతారు. దీనిలో ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా ? వివాహం వ్యక్తిగతం, దానికి మతాన్ని ముడి పెట్టే దుష్ట యత్నంలో భాగమే లవ్‌ జీహాద్‌ ప్రచారం.
మతం ఒకటే అయినా హిందువులలో వేర్వేరు కులాల మధ్య జరుగుతున్న వివాహాలను కులపెద్దలు అంగీకరించకుండా పంచాయతీలతో విడదీయటం, దాడులు, హత్యలకు పాల్పడటాన్ని చూస్తున్నాము. మిర్యాలగూడెంలో అమృత-ప్రణరు, హైదరాబాదులో అవంతిక-హేమంత్‌ ఉదంతాలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. రెండు ఉదంతాల్లో హిందూ యువకులను చంపించింది హిందూ మత మామలే కదా ! ముస్లిం కుటుంబం హిందూ యువతికి సీమంతం జరపటానికి బదులు హిందూ కుటుంబం ముస్లిం యువతికి సీమంతం జరిపే విధంగా ఏకత్వ ప్రకటనను ఎందుకు రూపొందించలేదంటూ రంధ్రాన్వేషకులు తనిష్క ప్రకటన మీద అర్దం లేని, వితండ వాదనకు దిగారు. నిజానికి వారికి మతద్వేషం లేకపోతే ఆ ప్రకటనను సమర్ధించి రెండో విధంగా కూడా ప్రకటనలు రూపొందించి రెండు మతాల మధ్య సమదూరం పాటించాలని కంపెనీకి సలహా ఇవ్వవచ్చు, దానికి బదులు ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, తనిష్క ఆభరణాల కొనుగోలును బహిష్కరించాలని పిలుపు ఇవ్వటాన్ని ఏమనుకోవాలి ?


గతంలో కూడా కొన్ని ప్రకటనలను ఆధారం చేసుకొని హిందూమతోన్మాదాన్ని, ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. హిందూస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తి సర్ఫ్‌ఎక్సెల్‌ పౌడర్‌ గురించిన ప్రకటనలో స్నేహితులైన హిందూ బాలిక ముస్లిం బాలుడితో హౌలీ సందర్భాన్ని చిత్రించారు. దానిలో నువ్వు నమాజుకు వెళ్లిరా తరువాత రంగు పడుతుంది అని బాలిక అంటుంది. దాన్ని వక్రీకరించి హౌలీ పండుగ కంటే నమాజుకు ప్రాధాన్యత ఇచ్చారంటూ రంధ్రాన్వేషకులు దాడి చేశారు. ఇదే కంపెనీ తన రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్‌ ప్రకటనకు కుంభమేళాను ఇతివృత్తంగా ఎంచుకుంది. వృద్దుడైన తన తండ్రితో మేళాకు వెళ్లిన కొడుకు నుంచి జనం రద్దీలో తండ్రి విడిపోతాడు. కొద్ది సేపటి తరువాత కొడుకు దాన్ని గ్రహించి తండ్రిని వెతుక్కుంటూ వెళ్లి ఒక టీ స్టాల్‌ దగ్గర తండ్రిని కలుసుకుంటాడు. ఇద్దరూ టీ తాగుతూ ముసలి వారిని వదిలించుకొనే చోట నాకోసం తిరిగి వచ్చావంటూ కొడుకును తండ్రి అభినందిస్తాడు.


దీని మీద హిందువులు పవిత్రంగా భావించే కుంభమేళాను కించపరుస్తారా బహిష్కరించండి హిందుస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తులను అంటూ సామాజిక మాధ్యమంలో దాడికి దిగారు. దాని మీద ఆ కంపెనీ తన ప్రకటనను సమర్ధించుకుంది. ముసలి వారిని వదిలించుకొనేవాటిలో సకుంభమేళా స్ధలం ఒకటి. మన పెద్దవారి సంరక్షణ పట్టించుకోకపోవట విచారకరం కాదా ? అలాంటి చోట్ల చేతులు పట్టుకొని పెద్దవారిని తీసుకు పోవాలని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఆప్రకటనను రూపొందించామని, ఆ ప్రకటన చూడండి ఒక నగసత్యం గురించి కళ్లు తెరిపిస్తుంది అని పేర్కొన్నది. దానికి విపరీత అర్ధం చెబుతూ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.


మామూలుగానే వృద్దులను వదిలించుకొనే బాధ్యతా రహితులైన వారు నిత్యం మనకు దర్శనమిస్తుంటారు. ఉత్తరాదిలో కుంభమేళా సందర్భంగా కొందరు కావాలనే ముసలివారిని వదలి వేసి తమదారి తాము చూసుకుంటారన్నది నమ్మలేని నిజం. మేళా ముగిసిన తరువాత అలాంటి వారందరినీ వృద్దాశ్రమాలకు తరలిస్తారు. ఆ దుర్మార్గాన్ని ఖండించి, నిరసించాల్సింది పోయి ఒక సందేశాత్మక అంశంతో రూపొందించిన ప్రకటనకు మతానికి ముడిపెట్టటం దేశంలో మతోన్మాద భావనలను ఎంతగా మెదళ్లకు ఎక్కించారో స్పష్టం చేస్తున్నది.


కుంభమేళాలో ఇలాంటి దురాచారం, కొందరు బిడ్డల బాధ్యతా రాహిత్యం గురించి 2013 ఫిబ్రవరిలో నేషనల్‌ జాగ్రఫిక్‌ న్యూస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. తమ కుటుంబాల్లోని ముసలి వారిని వదిలించుకొనేందుకు కుంభమేళా కోసం ఎదురు చూసే వారు కూడా ఉంటారని అనుష్‌ మాలవీయ అనే ఒక సామాజిక కార్యకర్త చెప్పిన అంశాన్ని దానిలో పేర్కొన్నారు. వదలివేసినట్లు ఎవరూ అంగీకరించరు గానీ అది వాస్తవం అని అనుష్‌ చెప్పారు. అలా విస్మరణకు గురైన వారిలో తాము ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలియని వారు ఉంటారని, కొందరు వృద్దాశ్రమాల్లో చేరితే మిగిలిన వారు వీధులపాలై యాచకులుగా మారతారని చెప్పారు. వారణాసి, బృందావన్‌ ప్రాంతాల్లో వితంతు మహిళలను వదలివేసే దురాచారం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ పురాణం లేదా వేదాలు కూడా అనాధలైన వారిని ఇలా విస్మరించమని చెప్పలేదు.


తనిష్క ఏకత్వ ప్రకటనను వెనక్కు తీసుకోవటం గురించి సానుకూల విమర్శలు కూడా వెలువడ్డాయి. ఇలాంటి చర్యలు సామాజిక మాధ్యమంలోని మతోన్మాదులకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని ట్రస్ట్‌ రిసర్చ్‌ ఎడ్వజరీ సంస్ధ సిఇఓ ఎన్‌ చంద్రమౌళి చెప్పారు.భవిష్యత్‌లో మిగిలిన ప్రకటనదారులకు ఇదొక సంప్రదాయంగా మారుతుందన్నారు. ప్రకటన వెనక్కు తీసుకోవటం విచారకరమని, తనిష్క మీద ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రకటనను వెనక్కు తీసుకోవటం వలన మంచి కంటే మరింత నష్టం జరుగుతుందని మరో మీడియా అధిపతి సందీప్‌ గోయల్‌ అన్నారు. ఒక బ్రాండ్‌గా నమ్మిన దానికి నూటికి నూరుశాతం కట్టుబడి ఉండాలి, లేనట్లయితే అది తెచ్చిపెట్టుకున్నదని, వెన్నుముక లేదని అనుకోవాల్సి ఉంటుందన్నారు. తనిష్క తన ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిందని ఎక్కువ మంది ప్రకటనల రంగంలోని వారు అభిప్రాయపడ్డారు.


హిందువులను కించపరిచే ప్రకటనల పేరుతో ఆయా కంపెనీల వస్తువులను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న పిలుపులను వినియోగదారులు పట్టించుకుంటారా ? దానికి ఎలాంటి ఆధారాలు లేవు. పట్టించుకొనేట్లయితే చైనా వస్తువులను బహిష్కరించాలని కాషాయ తాలిబాన్లు నిత్యం పారాయణం చేస్తుంటారు. ఎందరు పట్టించుకున్నారు ? నరేంద్రమోడీ హయాంలో వాటి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. అలాంటి పిలుపు ఇచ్చే వారు వాడే సెల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్లలో చైనావే ఎక్కువగా ఉంటున్నాయి లేదా చైనా విడిభాగాలు లేని పరికరాలు దాదాపుగా లేవు. అయితే అలాంటి ప్రచారం మెదడు ఉపయోగించని లేదా సరిగా ఎదగని వారి బుర్రలను ఖరాబు చేసేందుకు పనికి వస్తాయి.

కుష్‌బూతో బిజెపి సినిమా హిట్టా ఫట్టా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


సినిమా గోలగా చెప్పాలంటే ఒక హీరో లేదా హీరో తమ తదుపరి చిత్రంలో చేసేందుకు అంగీకరించటమే సగం విజయమన్నట్లుగా కొందరు నిర్మాతలు తమ ఖుషీని ప్రకటిస్తారు. ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్‌గా నీరాజనాలందుకున్న ఖుషఉ్బ గతంలో డిఎంకె, కాంగ్రెస్‌ చిత్రాల్లో నటించి ఇప్పుడు బిజెపి సినిమాలో పని చేసేందుకు అంగీకరించారు. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా ఎంతో గొప్ప తారాగణంతో తీసిన సినిమాలను జనం ఇంటికి పంపిన చరిత్ర కూడా సినిమా రంగంలో నమోదైంది.


ఒక వ్యక్తిగా ఏ పార్టీలో చేరేందుకైనా ఉన్న హక్కును ఎవరికీ కాదనలేము. అయితే జనాలకు సుద్దులు చెబితేనే మండుతుంది.పార్టీలు ఫిరాయించేవారు చెప్పే ఇలాంటి కబుర్లు విని విని జనానికి బోరు కొట్టింది. నేను ఎన్ని పార్టీలైనా మారవచ్చు, మార్పు సహజం, మారాలి అని సెలవిచ్చిన ఆమె తన సిద్దాంతాలు మాత్రం మారలేదని చెప్పారు. హీరోయిన్‌గా ఎన్ని సంవత్సరాలైనా ఫిట్‌నెస్‌ మారలేదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాను అంటే నిర్మాతలు అంగీకరించవచ్చు, అలా చేస్తే ప్రేక్షకులు ఆదరించవచ్చు. కానీ రాజకీయాలు సినిమాలు కావు. కుష్‌బూ ఏ పార్టీలో చేరితో ఆమె చెప్పిన సిద్దాంతంతో ఆయా పార్టీలు మారిపోతాయా ? ఇంతకీ ఆమె సిద్దాంతం ఏమిటి ?
తన సిద్దాంతాలు లేదా భావజాలం మారలేదు అని చెబుతున్న కుష్‌బూ పెళ్లికి ముందు కన్యలు పవిత్రంగా ఉండాలనే చాదస్తాల నుంచి సమాజం బయటపడాలని, కోరుకున్న పురుషుడితో జీవించే స్త్రీ వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కూడా కనవచ్చంటూ గతంలో వెలిబుచ్చిన భావజాలానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆమె బిజెపి వేదికల మీద ప్రకటించగలరా ? గతంలో బిజెపి మీద చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటారా ? డిఎంకెతో రాజకీయాలను ప్రారంభించి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు బిజెపి కండువా కప్పుకున్నారు. రేపు మరొక పార్టీలోకి వెళ్లరనే గ్యారంటీ ఏముంది ? డొల్లు పుచ్చకాయలు, పార్టీలు మారేవారు ఒకే చోట ఉంటారా ? పార్టీ మారటానికి కొద్ది వారాల ముందు నరేంద్రమోడీది జుమ్లా సర్కార్‌ (అవసరానికి అనుగుణంగా మాట్లాడటం) అని చెప్పిన ఆమె ఇప్పుడు మాట మార్చితే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని తలూపేందుకు జనం గొర్రెలా ?


తమిళనాడులో నాలుగు సీట్లు సంపాదించుకోవటం ఎలా అనే యావలో బిజెపి ఉందన్నది బహిరంగ రహస్యం. దానిలో భాగంగానే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తలుపు తట్టింది. లేస్తే మనిషిని కాదు అని దారినపోయే వారిని బెదిరించే కుంటి మల్లయ్య సామెత మాదిరి ఇప్పటి వరకు రజనీ వైఖరి ఉంది. ఇంతవరకు లేచింది లేదు, ఇప్పుడు లేస్తారో లేదో తెలియదు. 1996 నుంచి ఏదో ఒక రూపంలో రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పటమో సూచనలు ఇవ్వటమో చేస్తున్నారు. 2021 ఎన్నికలలో తన సత్తా చూపేందుకు సిద్దం అవుతున్నారని కొన్ని కథనాలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. తానే ఒక పార్టీని పెడతానని కూడా 69 ఏండ్ల రజనీ కాంత్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత ప్రకటిస్తారని చెబుతున్నారు.
సినిమా తారలు బిజెపిలో చేరటం కొత్తేమీ కాదు. గతంలో గౌతమి, నమిత, రాధారవి ఆ పార్టీలో చేరినా ఒరిగిందేమీ లేదు. కుష్‌బూ తమిళనాడులో పరిచయం అవసరం లేని స్టార్‌, మాట్లాడగల చాతుర్యం ఉంది. అందువలన వస్తారో రారో తెలియని రజనీ కోసం వేచి చూడటం కంటే ఆమెతో ప్రచారం చేయించుకోవచ్చని బిజెపి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.కుష్‌బూ డియంకె నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీకి పోయింది లేదు, కాంగ్రెస్‌లో చేరినపుడు కొత్తగా ఆ పార్టీకి పెరిగిందేమీ లేదు. ఇప్పుడు బిజెపికి కూడా ప్రచారానికి తప్ప ఓట్ల ప్రయోజనం కలగకపోవచ్చు. నేను ఇప్పుడే పార్టీలో చేరాను, ఆరునెలల తరువాత చూడండి అని విలేకర్లతో చేసిన వ్యాఖ్య బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కావచ్చు.

గతంలో కొన్ని అంశాల మీద ఆమె చేసిన వ్యాఖ్యల మీద బిజెపి లేదా హిందూమత శక్తులు సామాజిక మాధ్యమంలో ఎలా విరుచుకుపడ్డాయో, ఎన్ని కేసులు నమోదు చేశాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె బిజెపిలో చేరి సిద్దాంతాల గురించి చెప్పటాన్ని ఆశక్తులు ఎలా జీర్ణించుకుంటాయో చూడాల్సిందే. పచ్చిమితవాదులు ఆమెను అంగీకరిస్తారా ఆమె తన వైఖరిని మార్చుకుంటారా ? గతంలో ఆమె చేసిన బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారకుండా ఉంటాయా ? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడిన ఆమె ఈ ఏడాది మార్చినెల నుంచి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కుష్‌బూ పేరు నఖత్‌ ఖాన్‌ అంటూ ఆమె మతం గురించి బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) దాడి చేసినపుడు అవును నేను ముస్లింగానే పుట్టాను, దాని గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరినపుడు ఆ పార్టీ తన భావజాలానికి సరిపడిందని చెప్పారు. మరి బిజెపి గురించి ఏమి చెబుతారు అంటే ఎవరైనా కులం, మతం, జాతి గురించి మాట్లాడితే నా రక్తం సలసల కాగుతుంది. నేను దేశభక్తురాలిని, లౌకికవాదిని కాషాయ, హిందూత్వవాదాలకు వ్యతిరేకం అని చెప్పారు. అలాంటి హిందూత్వవాదులతోనే ఆమె చేతులు కలిపారు.


ద్రవిడ కజగం పార్టీ స్దాపకుడు, హేతువాది, జీవితాంతం బ్రాహ్మణిజానికి, బ్రాహ్మలకు వ్యతిరేకంగా ఉన్న ఇవి రామస్వామి నాయకర్‌ మనవడైన సతీష్‌ కృష్ణన్‌ ఆగస్టు నెలలో అన్నాడిఎంకె నుంచి బిజెపిలో చేరారు. ఇలా కాంగ్రెస్‌, డిఎంకె, అన్నాడిఎంకె మూడు పార్టీలలో అసంతృప్తికి గురైన వారందరనీ చేర్చుకొనేందుకు బిజెపి తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యను పార్టీ యువజన విభాగ ఉపాధ్యక్షురాలిగా చేసి ఆ పార్టీలోకి చేర్చుకుంది. నా తండ్రిని చూసి కాదు, నేను ఏమిటన్నది చూడాలని ఆమె చెప్పుకుంది. నా తండ్రి మంచివాడని, జనాలకు సాయం చేసేవాడని నాకు చెప్పారని, తండ్రితో స్ఫూర్తి పొందానని విలేకర్లతో చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా ఎంఎల్‌ఏగా ఎన్నికైతే వారికి పార్టీ తరఫున ఒక ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ పార్టీ సమావేశంలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కనీసం 25 మంది ఎంఎల్‌ఏలను పార్టీ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని చెప్పారు. పార్టీ గెలుపుకోసం బాగా పనిచేసినట్లు గుర్తించిన వారికి తమిళనాడులో పార్టీలు బంగారు ఉంగరాలు, గొలుసులు బహుమతిగా ఇవ్వటం సాధారణ విషయం. బిజెపి మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా ఇన్నోవా కార్లనే ఎరగా చూపింది.


ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ముఠాలు పార్టీలో ఆధిపత్యం మాదంటే మాదని కొట్టుకున్నాయి. అది ముదిరితే ఏదో ఒక వర్గం తమతో వస్తుందన్న ఆశలు ఒక దశలో బిజెపిలో కలిగాయి. అయితే తామిద్దరూ ఒకటేనని పళని స్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పని చేసేందుకు నిర్ణయించినట్లు అన్నాడిఎంకె ప్రకటించింది. అయితే ఆ సయోధ్య ఎన్నికల వరకు నిలుస్తుందా ఏమి జరుగుతుంది అనేది అప్పుడే చెప్పలేము.

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 స్ధానాలకు పోటీ చేసిన బిజెపి 2.86శాతం ఓట్లు తెచ్చుకుంది. అన్నాడిఎంకెకు 40.88శాతం, డిఎంకె కూటమికి 39.1శాతం వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి 55శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది, 39కి గాను 38 సీట్లు గెలుచుకుంది. ఇంతే కాదు 216 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సంపాదించింది. అన్నా డిఎంకె కూటమి 16 చోట్ల మెజారిటీ తెచ్చుకోగా అన్నాడిఎంకె 12, పట్టలి మక్కలి కచ్చి 3, బిజెపి ఒక చోట ఆధిక్యత ప్రదర్శించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె కూటమిలో సీట్ల పంపకం పెద్ద సమస్యగాక పోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో తామే నాయకత్వం వహిస్తామని బిజెపి చెప్పుకోవటంపై అన్నాడిఎంకె గుర్రుగా ఉంది. ఎన్నికల నాటికి ఆ పార్టీ నేత శశికళ జైలు నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు. ఆమె ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-అన్నాడిఎంకె విడివిడిగా పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేసిన పట్టలి మక్కల్‌ కచ్చి 5.36 శాతం ఓట్లు తెచ్చుకుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి పిఎంకె, బిజెపి, తమిళమానిల కాంగ్రెస్‌ అన్నా డిఎంకె కూటమిలో చేరాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియదు. అన్నాడిఎంకె బలహీనపడిన కారణంగా గత పార్లమెంట్‌ ఎన్నికలలో 20 స్ధానాలకే పరిమితమై పిఎంకెకు 7, బిజెపికి ఐదు, డిఎండికెకు నాలుగు, మరో మూడు పార్టీలకు మూడు సీట్లు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరుగుతుందా ? అన్నాడిఎంకె తన సీట్లను సగానికి తగ్గించుకుంటుందా ?


మరోవైపు డిఎంకె కూటమిలో 2019 లోక్‌ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ డిఎంకె 138, కాంగ్రెస్‌ 49, సిపిఎం, సిపిఐ పన్నెండు చొప్పున, ముస్లింలీగ్‌ ఐదు చోట్ల ఆధిక్యత ప్రదర్శించింది. ఇంతటి భారీ విజయం సాధించిన కారణంగా డిఎంకెలో సీట్ల కోసం పోటీ పడేవారు సహజంగానే ఉంటారు. అసంతృప్తి చెందిన వారిని పిలిచి పార్టీ కండువాలు కప్పేందుకు అన్నాడిఎంకె, బిజెపి సిద్దంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలాల్లో పెను మార్పులు జరిగే పరిణామాలేవీ జరగలేదు. ఈ నేపధ్యంలో ఫలితాలు కూడా లోక్‌సభ మాదిరే ఉంటాయని భావిస్తున్నారు.

జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన్‌ ఫిర్యాదు-పర్యవసానాలేమిటి ?

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయటం కొత్త కాదు. అయితే చేసిన ఫిర్యాదును ఒక ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేయటం దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ద్వితీయ స్ధానంలో ఉండి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్ష తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.


న్యాయమూర్తుల మీద గతంలో కూడా అధికారంలో ఉన్న వారు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ విధంగా వాటిని బహిరంగపరచలేదు. పదోన్నతి వరుసలో ఉన్న న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయటం ఒక ధోరణిగా మారిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే కొద్ది వారాల క్రితం ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాని తరువాత ఇప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రవర్తన మీద, అధికార దుర్వినియోగం గురించి ఫిర్యాదులు కోర్టు విచారణల వరకు వెళ్లాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ జిల్లా న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళా జడ్జి చేసిన ఫిర్యాదు విచారణ సమయంలో జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ కూడా ప్రమోషన్‌ వరుసలో ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదు కోర్టులో లేదా పోలీస్‌ సేష్టన్‌లో దాఖలు కాలేదు. గతంలో న్యాయమూర్తులకు రాసిన లేఖలను, పత్రికా వార్తల మీద స్పందించి విచారణకు ఆదేశించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా పరిగణిస్తారు అన్నది పెద్ద ప్రశ్న.


మధ్య ప్రదేశ్‌ జిల్లా జడ్జిపై వచ్చిన ఆరోపణల కేసులో ఎవరైనా పదోన్నతి పొందుతారు అనగానే మన వ్యవస్దలో అన్ని రకాల అంశాలు ప్రారంభం అవుతాయి. ఫిర్యాదులు చేస్తారు, పత్రికల్లో వార్తలు కనిపిస్తాయి, అరే ఇతను అంత చెడ్డవాడా అని ఆకస్మికంగా జనాలు గుర్తు చేసుకుంటారు అని జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. ఆ జిల్లా జడ్జి ఈ ఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్‌ అవకాశాలున్నాయని అనుకుంటున్న సమయంలో అతని మీద 2018లో పని స్ధలంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఫిర్యాదు చేసింది కూడా మరొక జడ్జి కావటం గమనార్హం. జిల్లా ప్రధాన జడ్జిని మరొక జిల్లాకు బదిలీ చేశారు. అతని మీద వచ్చిన ఫిర్యాదులను విచారించిన అంతర్గత ఫిర్యాదుల విచారణ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. తన మీద చర్యను నిలిపివేయించాలని కోరుతూ సదరు న్యాయమూర్తిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీం కోర్టు సలహాయిచ్చింది. అయితే హైకోర్టులో ఎలాంటి ఊరట లభించకపోవటంతో తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయకూడనే నిబంధనలేవీ లేవు. ఎవరి మీద అయినా ఫిర్యాదులు చేయవచ్చు. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి వాటి మీద విచారణ జరిపే పరిస్ధితి వస్తే కొన్ని రక్షణలు ఉన్నాయి. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ మీద సిబిఐ కేసు దాఖలు చేసింది. అయితే 2014లో రాజస్ధాన్‌ గవర్నర్‌గా నియమించటంతో విచారణ నిలిపివేశారు. పదవీ కాలం ముగిసిన తరువాత విచారణకు పిలవ వచ్చని సుప్రీం కోర్టు చెప్పింది.


ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేఖ ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసింది ఫిర్యాదు మాత్రమే. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంశమే. ప్రతి కేసులో ఒకరు ఓడిపోతారు, రెండవ వారు గెలుస్తారు. ఓడిన వారు న్యాయమూర్తి వల్లనే తనకు అన్యాయం జరిగిందని విమర్శ లేదా ఆరోపణ చేయవచ్చు. అది ఇతర న్యాయమూర్తుల మీద ప్రభావం చూపుతుంది. చివరకు న్యాయవ్యవస్ధ మీదనే విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ నేపధ్యంలోనే న్యాయమూర్తులకు రక్షణ కల్పిస్తూ బ్రిటీష్‌ వారి హయాంలోనే చట్టాలు చేశారు.
న్యాయమూర్తిగా వ్యవహరించే వారు ఇచ్చిన తీర్పులను పై కోర్టులో సవాలు చేయవచ్చు తప్ప వారి మీద చర్యలు తీసుకొనేందుకు వీలు లేకుండా రక్షణ కల్పించారు. అయితే కొన్ని ఉదంతాలలో న్యాయమూర్తులు తప్పు చేసినట్లు ఫిర్యాదులు దాఖలయ్యాయి. అవి వాస్తవమే అని తేలిన సందర్భాలలో వారికి రక్షణ వర్తించదు అన్న తీర్పులు వచ్చాయి. ఒక సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఒక వ్యక్తి అరెస్టు మరియు నిర్బంధానికి ఇచ్చిన ఉత్తరువు నిర్లక్ష్యపూరితంగా ఉందని భావించిన సుప్రీం కోర్టు బాధితుడికి నష్టపరిహారంగా ఐదువేల రూపాయలు ఇవ్వాలన్న తీర్పును సమర్ధించింది. మరో కేసులో ఒక మెజిస్ట్రేట్‌ తన బుర్రను ఉపయోగించకుండా ఒక వారంట్‌ మీద సంతకం చేయటం అక్రమం అని బాధితుడు సెషన్స్‌ కోర్టులో వేసిన కేసులో న్యాయమూర్తి తప్పు చేశారని బాధితుడికి ఐదు వందల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. మరో కేసులో ఆరోపణలు చేసిన న్యాయవాది ఒక రౌడీ గూండా, జూదగాడని ఒక మెజిస్ట్రేట్‌ స్వయంగా కోర్టులో చెప్పటం విధి నిర్వహణలో భాగం కాదని అందువలన అతని మీద చర్య తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. మరో కేసులో ఒక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ విధి నిర్వహణలో ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాస్తూ కాపీ చేస్తూ దొరికి పోయాడు. తాను న్యాయాధికారిని కనుక తనమీద చర్య తీసుకోరాదని వాదించటాన్ని కోర్టు అంగీకరించలేదు.


ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు వ్యవహరించాలి. ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి పాటించాలి. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆరోపణలతో లేఖద్వారా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదంతాలు గతంలో లేవు లేదా రహస్యంగా చేసిన ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్న ఉదంతాలు లేవు. ఫిర్యాదుల స్వభావాన్ని బట్టి ప్రధాన న్యాయమూర్తి తోటి న్యాయమూర్తి మీద విచారణకు ఆదేశిస్తారా లేక ఫిర్యాదుల్లో పసలేదని, బహిరంగంగా ప్రకటించి ఒక న్యాయమూర్తి ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదుదారు మీద చర్య తీసుకుంటారా ?


ఒక వేళ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద తొలగింపు వంటి చర్యలు తీసుకోవాల్సి రాష్ట్రపతి ఉత్తరువు జారీ చేయాలి. దానికి ముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో మెజారిటీ సభ్యులు చర్యలకు ఆమోదం తెలపాలి. ఓటింగ్‌ సమయంలో మూడింట రెండువంతుల మంది సభ్యులు హాజరు ఉండాలి. న్యాయమూర్తుల తీరుతెన్నులపై చర్చ జరపకూడదు. గతంలో జస్టిస్‌ రామస్వామి మీద చర్యకు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో మెజారిటీ లేక ప్రతిపాదన వీగిపోయింది. ఒక ప్రధాన న్యాయమూర్తి మీద చర్యను ప్రతిపాదన దశలోనే రాజ్యసభలో తిరస్కరించి అసలు ఓటింగ్‌ వరకే రానివ్వలేదు.


సమాజ సరళి ప్రతి వారి మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ముందుకు వచ్చిన ఈ సమస్య మన వ్యవస్దలో ఇప్పటి వరకు అంతర్గతంగా జరుగుతున్నట్లు భావిస్తున్న, చెవులు కొరుకుతున్న కుమ్ములాటలను బహిర్గతం చేసింది. దీని పర్యవసానాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు అయినా చేయవచ్చు. జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం మరింత సడలటానికే దోహదం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి కేసును కుల, ప్రభావాల ప్రాతిపదికన జనం చూసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిణామాన్నే పాలకులు కోరుకుంటున్నారా ?

కోర్టుల తీరుతెన్నుల మీద సీనియర్‌ న్యాయవాది నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పుల తీరుతెన్నులపై చేసిన విమర్శలు వ్యక్తిగతం కానప్పటికీ సుప్రీం కోర్టు నేరంగా పరిగణించింది. ఇప్పుడు ప్రత్యేకించి ఒక న్యాయమూర్తి మీద జగన్‌ ఫిర్యాదు చేశారు. రాసిన లేఖకు ప్రధాన న్యాయమూర్తి నుంచి సమాధానం వచ్చేవరకు ఆగి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావానికి లోనై తీర్పులు ఇస్తున్నారని ఆరోపించటం ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను బ్లాక్‌మెయిల్‌ చేయటమే అంటున్నవారు లేకపోలేదు. తీర్పులను విమర్శించ వచ్చు తప్ప న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించిన వారు దాన్ని నిరూపించుకోవాలి లేకపోతే వారి మీదనే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించటం ఒకటైతే, వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావితం చేశారని ఆరోపించటం మరొకటి. ఈ రెండింటికీ తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. జస్టిస్‌ రమణ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను కూడా ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తికి పంపటమే కాదు, బహిరంగపరిచారు. ఆస్తులు ఉండటం తప్పు కాదు, వాటిని ఎలా సంపాదించారనేది సమస్య. ఆదాయానికి మించి సంపాదిస్తే ఆదాయ వనరులను తెలియచేయాల్సి ఉంటుంది. వీగిపోయిన లేదా గెలిచిన ప్రతి కేసు వెనుక ఎవరో ఒకరు న్యాయమూర్తులను ప్రభావితం చేశారని ఆరోపించితే రాబోయే రోజుల్లో కేసులు నమోదైతే వాటి మీద ప్రభావం పడకుండా ఉంటుందా ? సుప్రీం కోర్టులో కూడా కేసులు వీగిపోతే అక్కడి న్యాయమూర్తుల మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తారా ? వీటికి అంతమెక్కడ ? ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుంది ? అన్నీ శేష ప్రశ్నలే.


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నడుస్తున్న కేసుల మీద, న్యాయమూర్తుల మీద సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారం ఒకటైతే. పార్టీలు, మీడియా వ్యాఖ్యాతలు చేస్తున్న అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు కోర్టులను ప్రభావితం చేస్తున్నారని గతంలో విమర్శించిన వైసిపి నేతలు ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ స్వయంగా జోక్యం చేసుకొని ప్రభావితం చేస్తున్నారని రోడ్డెక్కారు. గతంలో 16నెలల పాటు జైల్లో ఉన్న జగన్‌ బెయిలు పొందేందుకు నాటి యుపిఏ ప్రభుత్వ సహకారాన్ని పొందారంటూ ఒక వ్యాఖ్యాత పలికారు. ఇప్పుడు కేసులు తుది విచారణకు వస్తున్నందున తిరిగి కేంద్ర సాయం కావాల్సి వచ్చిందని, మోడీ-షా ద్వయం సహకరిస్తారనే నమ్మకం లేకపోయినా సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా రాశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు న్యాయమూర్తులను ప్రభావితం చేసి బెయిల్‌ ఇప్పించారని సూటిగానే చెప్పారు. అధికారంలో ఉన్న వారికి అలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందన్నపుడు వైసిపి ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు సైతం అలా ప్రభావితం చేస్తారనేందుకు ఆస్కారం లేదా ? జస్టిస్‌ రమణ పూర్వాశ్రమంలో న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీలో పని చేయలేదా కేసులను చూడలేదా ? ఆ పరిచయంతో చంద్రబాబు ప్రభావితం చేసి ఉండవచ్చని జనం అనుకొనేందుకు ఆస్కారం లేదా ?

నోబెల్‌ బహుమతులు : డోనాల్డ్‌ ట్రంప్‌ -నరేంద్రమోడీ అర్హత లేమిటి ?

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


నోబెల్‌ బహుమతి కమిటీ ఎంపిక ప్రమాణాలు ఏమిటో ముఖ్యంగా శాంతి బహుమతి విషయంలో ఒక్కోసారి అంతుబట్టవు. కొన్ని బహుమతుల ప్రకటన చూస్తే తెరవెనుక ఏదో జరుగుతోంది అనిపిస్తుంది. అమెరికాలో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులుగా ఉన్నా నిత్యం ఎక్కడో ఒక చోట నిప్పురాజేస్తారు, జనాలను చంపటమో, చంపించటమో చేస్తారు. అలాంటి వారికి శాంతి బహుమతి ప్రకటన చేయటాన్ని ఏమనాలి ? బరాక్‌ ఒబామాతో సహా ఇప్పటికి నలుగురికి అలా ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ కొందరు ట్రంప్‌ పేరును ప్రతిపాదించారు. స్వయంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోబట్టి గానీ ఉంటే తన పేరును తానే ప్రతిపాదించగల సమర్ధుడు ఆ పెద్దమనిషి.


ఈ నేపధ్యంలో ట్రంప్‌కు జిగినీ దోస్తు, ప్రపంచ నేతలుగా భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్న మన ప్రధాని నరేంద్రమోడీ పేరును ప్రతిపాదించకపోవటాన్ని ఎలా చూడాలి. గతంలో కేంద్ర మంత్రిగా మోడీని దేవుడు అని వర్ణించిన నేటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాదిరి ఒక్కరు కూడా మోడీ పేరును ప్రతిపాదించే సాహసం ఎందుకు చేయలేకపోయినట్లు ? ప్రపంచ నేతగా ఎదిగిన తొలి ప్రధాని అని ఇంతకాలం ఊదరగొట్టిందంతా ఒట్టి గ్యాసేనా ? ప్రపంచ శాంతికి, ఆర్ధిక అభివృద్ధికి గాను నరేంద్రమోడీకి దక్షిణకొరియా అందచేసిన బహుమతి వెనుక మన మార్కెట్‌ మీద దృష్టి ఉందా ?


ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, ఒక కిలో పప్పులు ఉచితంగా 80 కోట్ల కార్డులున్న వారికి అందచేస్తున్నట్లు, అందుకోసం 90వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అది నిజంగా అంత గొప్ప చర్యే అయితే ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఎందుకు వచ్చినట్లు ? ప్రతి దానికీ వీరుడు శూరుడు అంటూ పొగుడుతున్న కొన్ని దేశాల వారు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు ? చౌక దుకాణాల్లో సరకులు కొనుగోలు చేసేందుకు డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు, ఉచితంగా ఇచ్చేవాటితో కనీసం ప్రాణాలు అయినా నిలుపుకుంటారు,సాయం ఎంతని కాదు, ఎన్ని కోట్ల మందికి చేశారు అన్నది ముఖ్యం కదా ! ఇంత అన్యాయమా ? ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యుఎఫ్‌పి) నోబెల్‌ బహుమతి ప్రకటిస్తారా అని భక్తులు లోలోపల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారా ? వచ్చిన ఆపద తీవ్రతతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్రమోడీ ప్రచార ఆర్భాటం చేస్తున్నారా ? ఆచరణలో ఆకలి లేదా ఆహార భద్రత, పోషకాహారం అందించే విషయలో జరుగుతున్నదేమిటి ?


నోబెల్‌ బహుమతుల ఎంపికలో జరుగుతున్న లోపాలను చూసిన తరువాత 1991లో కొందరు ఇగో నోబెల్‌ పేరుతో ఎగతాళి బహుమతులను ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో వైద్య రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు గాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌,రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌, టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రడార్‌, బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో, తుర్కుమెనిస్దాన్‌ అధ్యక్షుడు బద్రిమహ్మద్‌లకు కలిపి ఉమ్మడి బహుమతిని ప్రకటించారు. కరోనా మహమ్మారి జనజీవితాల మీద చూపే ప్రభావాన్ని శాస్త్రవేత్తలు, వైద్యుల కంటే ముందుగానే రాజకీయవేత్తలుగా వీరు ప్రపంచానికి బోధ చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ దేశాల్లో కరోనా కేసులు ఎలా పెరిగిపోయిందీ, జనాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందీ ప్రపంచం చూసింది. ప్రపంచ శాంతికి ఇచ్చే ఇగో నోబెల్‌ బహుమతులు భారత్‌-పాకిస్ధాన్‌ దౌత్యవేత్తలకు ప్రకటించారు. అర్ధరాత్రి అపరాత్రి అనికూడా చూడకుండా తలుపు గంటలను మోగించటం, వచ్చి తలుపు తెరిచి సమాధానం ఇచ్చే లోగానే కనపడకుండా పోతున్నందుకు ఇస్తున్నట్లు ప్రకటించారు.(సెప్టెంబరు 18, ది ప్రింట్‌)

నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో విజయాలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటోంది. అదేమిటో గానీ సరైన లెక్కలు తయారు చేయటంలో లేదా తనకు అనుకూలంగా లెక్కలు రాయించటంలో సైతం వైఫల్యం కనిపిస్తోంది. మరోవైపు అన్నీ నెహ్రూయే చేశాడు అని చెప్పుకొనే అవకాశాలు రోజు రోజుకూ నరేంద్రమోడీ దళానికి తగ్గిపోతున్నాయి. 2016-25ను పోషకాహార కార్యాచరణ దశాబ్దంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి 2016ఏప్రిల్‌లో నిర్ణయించింది. 2012లో ప్రపంచ ఆరోగ్య ప్రతినిధుల సమావేశం 2025 నాటికి ఆరుపోషకాహార లక్ష్యాలను సాధించాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దాన్ని చేరుకోవటంలో విఫలమయ్యే 88 దేశాల్లో మనది ఒకటి అని 2020 ప్రపంచ పోషకహార నివేదిక పేర్కొన్నది. గడచిన ఎనిమిది సంవత్సరాలలో మోడీ గారీ వాటా ఆరు సంవత్సరాలు ఉంది. ప్రభుత్వ పని తీరు చూసి వచ్చే ఐదేండ్లలో లక్ష్యాన్ని చేరే అవకాశం లేదని ప్రకటించేశారు. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవటాన్ని నివారించటం, పిల్లల్ని కనే వయస్సు ఉన్న మహిళల్లో రక్త హీనత నివారణ, పిల్లలో అధికబరువు నివారణ, తల్లిపాలు ఇవ్వటం పెంపు లక్ష్యాలను చేరుకొనే అవకాశాలు లేవని మన సమాచారాన్ని విశ్లేషించిన నివేదిక పేర్కొన్నది.ప్రపంచంలో అధ్వాన్నంగా ఉన్న మూడు దేశాలలో నైజీరియా, ఇండోనేషియాతో పాటు మన దేశాన్ని చేర్చారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో పరిస్ధితి దారుణంగా ఉందని నివేదిక పేర్కొన్నది. ఇలాంటి కార్యక్రమాలను అమలు జరపాల్సింది రాష్ట్రాలు కదా, వాటి వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేయటం సబబా అని కొంత మంది అతి తెలివి వాదనలు చేస్తున్నారు. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది అనే వాస్తవాన్ని వారు కావాలనే దాస్తున్నారు. పదిహేనేండ్లకు పైగా పాలనలో ఉన్న రాష్ట్రాలలో పరిస్ధితి మారిందేమీ లేదు.


పిల్లలకు తగినన్ని పండ్లు ఆహారంగా ఇస్తే తరువాతి రోజుల్లో వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దేశంలో తగినంత ఆహారమే పెట్టలేని స్ధితిలో పండ్లు తినిపించటం సాధ్యమా ? తలిదండ్రుల ఆదాయాలు అందుకు అనుగుణ్యంగా ఉన్నాయా? కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ఈ అంశం మరింతగా ముందుకు వచ్చింది. దేశంలో 80 నుంచి 90శాతం మంది పెద్ద వారికి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ డి లోపం ఉంది. కరోనా నిరోధానికి అది అవసరమని కొందరు చెప్పటంతో సూక్ష్మంలో మోక్షానికి అలవాటు పడిన మన జనాలు ఇష్టమొచ్చినట్లు డి విటమిన్‌ టాబ్లెట్‌లు తీసుకొని కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు. దీనికి అర్హతలు లేని ప్రబోధ వైద్యులు, వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులే ప్రధాన కారణం.


ప్రపంచంలో పలుచోట్ల నెలకొన్న అస్తవ్యస్ధ పరిస్ధితికి సరైన టీకా ఆహారమే అని నోబెల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెరిట్‌ రెసి అండర్సన్‌ చెప్పారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్‌ బహుమతిని ప్రకటించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచ ఆకలిని కరోనా మహమ్మారి రెట్టింపు చేయనుందనే అంచనాల నేపధ్యంలో ఈ కార్యక్రమ అవసరం ఎంతో ఉందన్నారు. తమ కుటుంబానికి దక్కిన ఈ గౌరవంగా దీన్ని భావిస్తున్నామని, తొలిసారిగా తనకు మాటలు రావటం లేదని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యనిర్వహణ అధికారి డేవిడ్‌ బియాస్‌లే వ్యాఖ్యానించారు. అనేక దశాబ్దాల పాటు ప్రపంచంలో ఆకలి తగ్గిన తరువాత 2016 నుంచి పెరుగుతోందని, పెద్ద దేశాలు కొన్ని ఆకలిని తీర్చేందుకు సహకరించటం లేదని ఆహార కార్యక్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.


మన దేశానికి సంబంధించి 117 దేశాలలో ఆకలి సూచిక 2019లో 102గా ఉంది. అయితే మన అధికారులు అది పాత సమాచారం మీద ఆధారపడి రూపొందించినది, 2017, 18 సంవత్సరాల వివరాలను తీసుకుంటే 91గా ఉంటుందని చెబుతున్నారు. ఆకలిని కొలిచేందుకు తీసుకుంటున్న ప్రమాణాల్లో మార్పులు చేసిన మాట వాస్తవం. అది ఒక్క మన దేశానికే కాదు అన్ని దేశాలకూ వర్తిస్తుంది.102కు బదులు 91 ఎంతో మెరుగైదని చెప్పుకొనేందుకు తాపత్రయ పడటం తప్ప మనం ఎంతో ఆకలితో ఉన్నామనే విషయాన్ని విస్మరిస్తున్నారు. 2019 సూచికలో ఐదు పాయింట్లు, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన దేశాలన్నింటినీ ఒకటవ స్ధానంలో ఉన్నట్లుగా పరిగణించారు, అలాంటి దేశాలు 17 ఉన్నాయి. ఐదు-ఆరు పాయింట్ల మధ్య ఐదు దేశాలు ఉన్నాయి. ఆరు -ఏడు పాయింట్ల మధ్య మరో ఐదు దేశాలుండగా వాటిలో 6.5 పాయింట్లతో చైనా 24వ స్ధానంలో ఉంది. పదిపాయిట్ల లోపు ఉన్న దేశాలన్నీ ఆకలి తక్కువగా, 10-19.9 మధ్య వచ్చినవి సాధారణమైనవిగా, 20-34.5 మధ్య తీవ్రంగా, 35-49.9 ఆందోళన కరంగా , 50పాయింట్లు దాటినవి మరింత ఆందోళన కరమైన స్దితిలో ఉన్నట్లు భావిస్తున్నారు. మన దేశం 91 అయినా 102 అయినా ఆందోళనకర స్ధాయిలో ఆకలి ఉన్న దేశాల వర్గీకరణలోనే ఉంటుందని గమనించాలి. ఆహారమే కొనలేని మన దేశవాసులకు పోషకాహారం గురించి మన ప్రధాని మన్‌కీ బాత్‌లో ఉద్బోధ చేశారు.

ఆకలి ఒక అంశమైతే దేశాల్లో ఆహార భద్రత ఏ స్ధాయిలో ఉందన్నది కూడా ముఖ్యమే.2019 సూచికలో 113 దేశాలలో 87.4 పాయింట్లతో సింగపూర్‌ తొలి స్ధానంలో ఉంది.చైనా 71 పాయింట్లతో 35వ స్ధానంలో ఉండగా మన దేశం 58.9 పాయింట్లతో 72వ స్దానంలో ఉంది. పాకిస్ధాన్‌ 78వ స్ధానంలో 56.8పాయింట్లను కలిగి ఉంది.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల ముసుగులో మన రైతాంగానికి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగించేందుకు పూనుకోవటాన్ని కొందరు పెద్దలు స్వాగతిస్తున్నారు. కొన్ని అంకెలు చెబుతూ మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో మిగులు సాధించినట్లు చిత్రిస్తున్నారు. వారు చెబుతున్న అంకెలు వాస్తవమే గానీ వాటికి చెబుతున్న భాష్యంతోనే అసలు సమస్య. పండించటం ఒక ఎత్తయితే జనం తింటున్నారా లేదా అన్నది అసలు సమస్య. 2019 సంవత్సరానికి చైనా పండ్ల ఎగుమతులు దిగుమతుల వివరాలను ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. చైనా నుంచి కొన్ని పండ్లను ఎగుమతి చేస్తుండగా కొన్ని రకాలను దిగుమతి చేసుకుంటోంది. గతేడాది 950 కోట్ల డాలర్ల విలువ గల పండ్లను దిగుమతి చేసుకుంటే 550 కోట్ల డాలర్ల విలువగల పండ్లను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే దిగుమతుల విలువ 24, ఎగుమతుల విలువ 14శాతం పెరిగింది.


వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంపుదల ద్వారా రైతులకు మేలు చేస్తామనే పేరుతో సంస్కరణలు ప్రారంభించిన నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు 14న ఉల్లిధరలు పెరగటాన్ని చూపుతూ ఎగుమతులను నిషేధించింది. తరువాత ఉల్లి ధరలు పెద్దగా తగ్గిందేమీ లేదు. విమర్శలు రావటంతో అక్టోబరు మొదటి వారంలో కృష్ణాపురం ఉల్లిరకాన్ని నిషేధం నుంచి మినహాయించింది. ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల నిషేధం అమల్లోకి తెచ్చిందో మన మీద ఆధారపడిన బంగ్లాదేశ్‌ వంటి దేశాలు చైనా నుంచి దిగుమతులకు పూనుకున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏడాది తగ్గినా, పెరిగినా ప్రస్తుతం ప్రపంచంలో 9,32,26,400 టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. చైనాలో 2,39,07,509 టన్నులు, భారత్‌ 1,94,15,425 టన్నులు ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో ఉల్లి ధరలు ప్రతి ఏడూ ఏదో ఒక సమస్యను ముందుకు తెస్తున్నాయి. గతేడాది కూడా ధరలు పెరగటంతో నిషేధం విధించారు. దాంతో మన మీద ఆధారపడిన అనేక దేశాలు చైనాతో ఒప్పందాలు చేసుకున్నాయి. 2021వరకు ఉల్లి దిగుమతి పన్ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో అసాధారణ రీతిలో రైతులకు, అదే మాదిరి వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు తెప్పించే పరిస్ధితి లేదు. అదే మన దేశంలో వ్యాపారులు ఇరువురినీ దోచుకుంటున్నా పట్టించుకొనే వారు లేరు. తాజాగా నిల్వలపై ఆంక్షలను ఎత్తివేయటం, దానికి వర్షాలు తోడు కావటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వాటిని అదుపు చేసేందుకు ఎగుమతిపై ఆంక్షలు.


చైనాలో రెండు నెలలుగా స్ధానికంగా కరోనా కేసులేవీ నమోదు కాకపోవటంతో అక్టోబరు ఒకటి నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దాదాపు 63 కోట్ల మంది వినోద, విహార యాత్రలు చేసినట్లు ప్రకటించారు. బంధువులు, స్నేహితులను కలిసిన సందర్భాలలో పండ్లను కానుకగా ఇవ్వటం చైనా సంప్రదాయాలలో ఒకటి.ఈ ఏడాది అసాధారణ డిమాండ్‌ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో దిగుమతి చేసుకున్న పండ్లకే ఎక్కువ ఆదరణ ఉంది. ద్రాక్ష ఉత్పత్తిలో, వినియోగంలో చైనా అగ్రస్ధానంలో ఉంది. ఈ కారణంగా మిగులు సమయాల్లో ఎగుమతులు, పంట అయిపోయిన తరువాత దిగుమతులు కూడా చేసుకుంటున్నది. ప్రపంచంలో 23 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా చైనాలో గత ఏడాది 10.8 మి.టన్నులు ఉత్పత్తి అయినట్లు అంచనా. మన దేశంలో మూడు మిలియన్‌ టన్నులకు అటూ ఇటూగా ఉంటోంది. చిలీ ప్రపంచ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది.

కూరగాయలు, పండ్లు తగినన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. ఆ మేరకు వినియోగించేందుకు అనువుగా ఉత్పత్తి ఉందా లేదా అన్నది కూడా చూడాలి, కొనుగోలు చేసే వారు లేనపుడు మిగులుగా కనిపించవచ్చు. అది ఆయా దేశాల బలహీనత తప్ప బలంగా చెప్పగలమా ? ప్రపంచ వ్యవసాయ సంస్ధ ప్రకటించిన తాజా సమాచారం (2016) ప్రకారం ప్రపంచ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో చైనా వాటా 39శాతం ఉంది. మన దేశం పదిశాతం, అమెరికా నాలుగుశాతం కలిగి ఉన్నాయి. చైనాలో 708 మి.టన్నుల ఉత్పత్తి జరిగింది. మన దేశంలో 2015లో పండ్లు, కూరగాయల ఉత్పత్తి 180 మి.టన్నులు. ఉత్పత్తిని బట్టి వినియోగాన్ని అంచనా వేసుకోవచ్చు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది లేదా మన పౌరుల కొనుగోలు శక్తి అలా ఉంది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. మన దేశంలో వారాల తరబడి అసలు కూరగాయల మొఖం ఎరగని కుటుంబాలున్నాయంటే అతిశయోక్తి కాదు.


ఆహార భద్రత, పోషకాహార లేమిని మన కంటే ఎంతో మెరుగ్గా చైనా అధిగమిస్తోందన్నది స్పష్టం. జనం ఆహారం తీసుకుంటున్నారా, పోషకాహారం కలిగి ఉన్నారా లేదా అనేందుకు దారిద్య్రం కొలబద్ద. 1981-2015 మధ్య చైనాలో దారిద్య్రం 0.7 శాతానికి తగ్గింది. మన దేశంలో 1987లో 48.9శాతం ఉంటే 2015 నాటికి 13.4శాతానికి తగ్గింది.1999-2005 మధ్య దారిద్య్ర నిర్మూలనలో చైనా ఆదాయ స్ధితిస్దాపకత 1.51ఉంది. అంటే ఆదాయం ఒకటి పెరిగితే దారిద్య్రం 1.51 తగ్గింది. ఇదే కాలంలో మన దేశంలో స్ధితిస్ధాపకత 0.4శాతం మాత్రమే ఉంది.దారిద్య్రం ఒకటికి 0.4 మాత్రమే తగ్గింది. దీనికి అనుగుణ్యంగానే 2002-04 నుంచి 2015-07 మధ్య ఆకలి, పోషకాహారం లేని వారు చైనాలో 15.9 నుంచి 8.8శాతానికి తగ్గితే ఇదే సమయంలో మన దేశంలో 22.2నుంచి 14.8కి తగ్గింది. ఐదేండ్ల లోపు పిల్లల పెరుగుదల ఆగిపోయిన వారు ప్రపంచ సగటు 23.2శాతం కాగా 2000-13 మధ్య చైనాలో 17.8 నుంచి 8.1శాతానికి పడిపోగా మన దేశంలో 2000-15 మధ్య 54.2 నుంచి 38.4కు తగ్గింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే చైనాలో 1980దశకంలో వ్యవసాయం బాగా అభివృద్ది చెంది జన జీవితాలను మార్చివేయగా మన దేశంలో ఆది జరగలేదు. ఇవన్నీ ఆయా దేశాలలో ఎలాంటి రాజకీయ వ్యవస్ధ ఉందని కాదు, జనం పట్ల జవాబుదారీతనంతో ఉన్నారా లేదా అన్నది ముఖ్యం.

పెట్టుబడిదారీ వ్యవస్ధ లోపాన్ని బయట పెట్టిన కరోనా : పోప్‌ ఫ్రాన్సిస్‌

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


మహిమ గల సిద్దాంతంగా చెప్పే స్వేచ్చాయుత పెట్టుబడిదారీ విధానంలో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి మరింతగా బయట పెట్టిందని పోప్‌ ఫ్రాన్సిస్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ” అందరూ సోదరీ సోదరులు ” అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బిషప్పులకు రాసిన లేఖను విడుదల చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ యుద్ధాలు రాకుండా చూసేందుకు అవసరమైన చర్చలు, సౌభ్రాత్వత్వాలను పెంపొందించే నూతన తరహా రాజకీయాలు ప్రపంచానికి అవసరమంటూ తాజాది మూడవది అయిన ఆ లేఖలో పేర్కొన్నారు. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బోధనల నుంచి తానీ ఉత్తేజాన్ని పొందానని ప్రపంచం మీద కమ్మిన చీకటి మబ్బులతో సంఘర్షించాలని అన్నారు. ఆత్మరక్షణకు న్యాయ యుద్దం చేయవచ్చు అన్న కాథలిక్‌ చర్చి సిద్దాంతాన్ని శతాబ్దాల తరబడి విస్తారంగా వినియోగించారని అదింకేమాత్రమూ పనికిరాదని అన్నారు. దాన్ని సమర్దించుకోవటం ఈ రోజుల్లో కష్టమన్నారు.


తీవ్ర హాని కలిగించిన కరోనా వైరస్‌ పీడిత జనాల న్యాయమైన అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం రాజకీయ, ఆర్దిక వ్యవస్ధలను సంస్కరించాలని పోప్‌ చెప్పారు. వివిధ దేశాలు భిన్న మార్గాల్లో కరోనా సంక్షోభం మీద స్పందించినప్పటికీ కలసి పనిచేయటంలో వాటి అశక్తత ఎంతో స్పష్టంగా కనిపించిందన్నారు. మెరుగుపరచేందుకు ఇప్పుడు మనం చేస్తున్నది లేదా ఉన్న వ్యవస్ధను మరియు నిబంధనలను మెరుగుపరచేందుకు చేస్తున్నది గానీ వాస్తవాలను గుర్తించటం లేదనే ఏకైక గుణపాఠాన్ని నేర్చుకోవాలన్నారు. వైరస్‌ కారణంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోవటాన్ని రుజువుగా తీసుకొని ప్రజాఉద్యమాలు, యూనియన్లు, ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న జన సమూహాలు చెప్పేవాటిని రాజకీయనేతలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రతి దాన్ని మార్కెట్‌ స్వేచ్చ పరిష్కరించలేదని కరోనా మహమ్మారి చూపిందన్నారు.


భూ వనరులు సామాజిక ప్రయోజనాలకు తప్ప వ్యక్తుల ఆస్ధి కాదని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కొంత మందిని ధనికులుగా మారుస్తూ పేదలను దూరంగానే ఉంచుతున్నదనే తన విమర్శను పోప్‌ పునరుద్ఘాటించారు. ఊటసిద్దాంతాన్ని చెప్పినంత సులువుగా అమలు చేయలేమని అన్నారు. ఊట సిద్దాంతం, మహత్తు గలవని చెప్పే సిద్దాంతాల పేరు చెప్పకుండానే నయా ఉదారవాదం వాటిని పునరుత్పత్తి చేస్తోందని, అది సమాజ వ్యవస్ధకే ముప్పు తెచ్చే హింసాత్మక ధోరణులు పెరిగేందుకు దోహదం చేసే అసమానతలను పరిష్కరించలేదని అన్నారు. మంచి ఆర్ధిక విధానం ఉద్యోగాలను కల్పిస్తుంది తప్ప కోత పెట్టదని పోప్‌ పేర్కొన్నారు. గౌరవ ప్రదంగా బ్రతకటానికి అవసరమైనవి ఒక వ్యక్తికి లేకపోవటానికి కారణం మరొక వ్యక్తి వాటిని అడ్డుకోవటమే అని తొలి రోజులలో ముందుకు వచ్చిన క్రైస్తవ భావన ఇప్పటికీ చెల్లుతుందని చెప్పారు. జాత్యంహంకారం గురించి చెబుతూ అది ఒక వైరస్‌, అంతర్ధానం కావటానికి బదులు వేగంగా రూపం, స్వభావం మార్చు కుంటుంది, దాగి అవకాశం కోసం ఎదురు చూస్తుంది అన్నారు.

పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రస్తావించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ గురు పీఠమైన అమెరికాలో ” మహమ్మారి విషాదం వ్యాకులత ముగిసింది – మాంద్యం ఇప్పుడే ప్రారంభం అయిందని ” న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక తాజా పరిస్ధితి గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నది. అనిశ్చితమైన భవిష్యత్‌కు ముప్పును తెచ్చే ఆర్ధిక వ్యవస్ధ దీర్ఘకాలికమైన, మెల్లగా కోలుకొనే స్ధితిలో ప్రవేశించినట్లు, సిద్దాంతం ప్రకారం మహమ్మారులతో పెద్దగా ప్రభావితం కావని చెప్పే రంగాలు కూడా ఇప్పుడు తీవ్ర మాంద్యానికి దగ్గరగా ఉన్నాయి. సాధారణంగా మాంద్యాల్లో మాత్రమే ఉండే లేఆఫ్‌ల హెచ్చరికలను వాణిజ్య వార్తల శీర్షికలు ప్రతిబింబిస్తున్నాయి. బడా చమురు కంపెనీ షెల్‌ తొమ్మిదివేలు, డిస్నీ 28, రక్షణ రంగ కంపెనీ రేథియాన్‌ 15వేల ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. వసంత రుతువులో ఈ రంగాలలో రద్దయిన ఉద్యోగాలు వేసవి వచ్చినా పూర్తిగా తిరిగి రాలేదు. 2008 నాటి మాంద్యంలో 2.4శాతం ఉద్యోగాలు తగ్గితే ఇప్పుడు 3.9శాతం తగ్గాయి. గత మాంద్యాల కంటే దారుణంగా మహమ్మారి కారణంగా ఉద్యోగాల నష్టం జరిగింది. ఆర్ధిక వ్యవస్ధ ఆరోగ్యం బాగుపడినప్పటికీ అనేక ఉద్యోగాలు ఉండవు, కొత్త రకాల కోసం కార్మికులు వెతుక్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఒక పరిశ్రమ దెబ్బతింటే అది అనేక ఇతర పరిశ్రమలను దెబ్బతీస్తుంది.


పెట్టుబడిదారీ వ్యవస్ధ దివాలాకోరుతనం కారణంగా కరోనా ముందు స్ధాయికి ఆర్ధిక వ్యవస్ధ కోలుకున్నప్పటికీ అది నిరంతరం కొనసాగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ జనాభాలో నాలుగుశాతం కలిగిన అమెరికాలో కరోనా మరణాల్లో మాత్రం 21శాతం ఉన్నాయి. ప్రపంచ ధనిక దేశాల్లో నాలుగోవంతు మరణాలు అక్కడే సంభవించాయి. అమెరికాలో రోజుకు వెయ్యి మంది, ఐరోపా యూనియన్‌లో మూడు వందల మంది మరణిస్తుండగా ఆసియా ధనిక దేశాలలో దాదాపు మరణాలు లేవు. అమెరికా పక్కనే ఉన్న కెనడాలో వైరస్‌ కారణంగా మరణిస్తున్నవారు రోజుకు పదికి అటూ ఇటూగా మరణాలు ఉంటున్నాయి.
మరోవైపు సోషలిస్టు వ్యవస్ధలు కలిగిన చైనా కరోనా వైరస్‌ను పూర్తిగా అరికట్టటమే కాదు సాధారణ జనజీవనాన్ని తిరిగి ప్రారంభించింది. వియత్నాం, క్యూబా కూడా కరోనాను అరికట్టటంలో జయప్రదమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ మరియు సోషలిస్టు వ్యవస్ధ గొప్పతన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించినట్లు చైనా అధినేత గ్జీ జింపింగ్‌ వర్ణించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలోని ధనిక దేశాలు 2008 ద్రవ్య సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని స్ధితిలో చైనా దాని ప్రభావాలను అధిగమించి ఒక ప్రధాన శక్తిగా ఎదిగింది. ప్రధాన ఆర్ధిక వ్యవస్దలన్నీ తిరోగమనంలో ఉండగా చైనా పురోగమనంలో సాగుతోంది. ఈ వాస్తవాన్ని విస్మరించటం అంత తేలిక కాదు.
అనేక మంది ఆర్ధిక పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ 2008 గాలివానకు తట్టుకొని నిలవటమే కాదు తదుపరి దశాబ్దిలో ప్రపంచ ఆర్దిక వ్యవస్ధలో మూడోవంతు ఆర్ధిక ప్రగతిని చైనా జోడించింది. అమెరికాకు సమీపంలో ఉంది. ఈ ఆర్ధిక శక్తి ప్రపంచంలో చైనా పలుకుబడి పెరిగేందుకు దోహదం చేసింది.బెల్ట్‌ మరియు రోడ్డు చొరవ పేరుతో చైనా నుంచి ఐరోపా వరకు లక్ష కోట్ల డాలర్ల పధకాన్ని చైనా అమలు జరుపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ గురుత్వాకర్షణ కేంద్రం అట్లాంటిక్‌ నుంచి పసిఫిక్‌ సముద్రానికి మారుతోంది అని అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌ వ్యాఖ్యానించాడు.ఏదైనా ఉపద్రవం వచ్చినపుడు ఆదుకొనేందుకు ప్రతివారూ అమెరికా కోసం ఎదురు చూసేవారు. కానీ కరోనా మహమ్మారి తొలి రోజుల్లో జనానికి అవసరమైన ముఖతొడుగులు, ఇతర రక్షణ వైద్య పరికరాల కోసం ప్రపంచం చైనా వైపు చూసింది. ఒక్క జిడిపి విషయంలోనే కాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి అన్ని రంగాలలో చైనా తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపింది. ఇది అక్కడి సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత తప్ప మరొకటి కాదు. అమెరికా రాజకీయ నాయకత్వం రోజు రోజుకూ చైనా వ్యతిరేకతను పెంచుకుంటున్నప్పటికీ ఆర్ధిక సేవలు అందించే అక్కడి కంపెనీలు చైనాలో కార్యకలాపాలను పెంచుతూనే ఉన్నాయి.చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలన్నీ పొలోమంటూ స్వదేశానికి, మన దేశానికి వస్తున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.అయితే అలాంటి ఆలోచన లేదా నిర్ణయం తీసుకున్న కంపెనీలు కేవలం నాలుగుశాతమే అని తాజా సర్వేలో వెల్లడైంది.


అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.
అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది.క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. వైద్య సేవను ఆదాయానికి గాక బాధ్యతగా ప్రభుత్వం భావించటమే దీనికి కారణం.


వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు.
చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు.2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు. అనేక విజయాలు సాధించిన చైనా ఈ లక్ష్యాన్ని సాధించటంలో కూడా జయప్రదం అవుతుందనటంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదు.

విశాఖ రైల్వేజోన్‌ ఎండమావేనా ?

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నిజంగా తలచుకోవాలేగానీ ఏదైనా క్షణాల్లో అయిపోతుంది. కోరుకున్నవాటిని మాత్రమే తలచుకుంటారు, అదే అవుతుంది. జూన్‌ ఐదున వ్యవసాయ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చి సెప్టెంబరు మూడవ వారానికి పార్లమెంటులో ఆమోదం కూడా పొందారు. కరోనా అడ్డం రాలేదు. కాశ్మీరు రాష్ట్ర రద్దు అయితే ఒకే ఒక్క రోజులో పూర్తి చేశారు. అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోలేదు, ఎంత పట్టుదల, ఎంత వేగం ? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కారు మూడురాజధానులు, ఇతర కొన్ని కేసుల మీద ఉన్న ఆత్రంతో వివాదాల విచారణను వేగవంతం చేయించాలని సుప్రీం కోర్టు తలుపులు తట్టటాన్ని చూశాము. రాష్ట్రానికి అది అత్యంత ప్రాముఖ్యత అంశంగా భావించారు. విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి ? ఎవరికైనా పట్టిందా, వెంటనే ఉనికిలోకి తీసుకురావాలనే కోరిక ఉందా ?


కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌ ఉనికిలోకి రావటం గురించి అటు కేంద్రానికి పట్టలేదు, ఇటు రాష్ట్రమూ పట్టించుకోలేదు. ఎంత సమయం తీసుకుంటారు ? ఏమిటి ఆటంకాలు ? రాష్ట్ర పునర్విభజన చట్టంలో వాగ్దానం చేసినమేరకు నిర్ణయం తీసుకొనేందుకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ప్రకటించారు. పందొమ్మిది నెలలు గడుస్తోంది. ఇప్పుడు ప్రతిదానికి కరోనాను చూపుతున్నారు ? కరోనా కారణంగా ఏది ఆగింది ? రైల్వే జోన్‌ ఉనికిలోకి ఎందుకు రావటం లేదు ?


విశాఖ రైల్వే డివిజన్‌ను రద్దు చేస్తారు, ఆ భవనాల్లో జోనల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. సిబ్బందిని కొత్తగా నియమించటం లేదు, ఉన్నవారినే సర్దుబాటు చేయవచ్చు, దానికీ ఇబ్బందీ లేదు.లాక్‌డౌన్‌ దశలవారీ ఎత్తివేస్తున్నారు.నామ మాత్రంగానే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మరి ఆటంకం ఏమిటి ? కొన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు డబ్బు కొరతా ? అదేమీ వేల కోట్లు కాదే ! పోనీ అదైనా చెప్పాలి కదా ? రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపివేశారు. వస్తున్న వార్తలను బట్టి వచ్చే ఏడాది కూడా దేశ జిడిపి తిరోగమనంలో ఉంటుందని చెబుతున్నారు. పోనీ పురోగమనంలోకి వచ్చిన తరువాతే ఉనికిలోకి వస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరూ ఏమీ మాట్లాడరు ? ఏమనుకోవాలి ?
వస్తున్న వార్తలను బట్టి సంస్కరణల పేరుతో ఇప్పుడు ఉన్న 17 రైల్వే జోన్లను తగ్గిస్తారా ? అందుకే 18వ జోన్‌ విశాఖను తాత్సారం చేస్తున్నారా ? రైల్వే సంస్కరణల్లో భాగంగా అసలు జోనల్‌ వ్యవస్ధలనే ఎత్తివేసి కార్యకాలపాల ఆధారంగా కొత్త సంస్ధలను ఏర్పాటు చేస్తారా ? అనేక ప్రశ్నలు ముసురుతున్నాయి.ఏమైనా జరగవచ్చు. రైల్వేలను కూడా దశలవారీ ప్రయివేటీకరించే ఆలోచనలో పాలకులు ఉన్నారు.దానికి అవసరమైన నియంత్రణ కమిషన్‌, ధరల పెరుగుదలకో మరొక పెరుగుదలకో చార్జీల పెంపును ముడిపెట్టి ప్రభుత్వ నిర్ణయంతో పని లేకుండా అధికార యంత్రాంగమే నిర్ణయించే ఏర్పాట్లు కూడా ఆలోచనలో ఉన్నాయి.


జపాన్‌లో రైల్వే వ్యవస్ధ ప్రయివేటీకరణ తరువాత సరకు రవాణాకు దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించారు, ప్రయాణీకుల విషయానికి వస్తే ఆరు ప్రాంతీయ కంపెనీలను ఏర్పాటు చేసి ఏ మార్గంలో రైళ్లు నడపాలో లేదో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చారు. చైనాలో పునర్వ్యవస్దీకరణలో భాగంగా సరకు రవాణా, ప్రయాణీకులు, రైలు మార్గాల యాజమాన్యాలకు స్వతంత్ర సంస్దలను ఏర్పాటు చేశారు. ఆ మూడు విభాగాల్లో కూడా ఉప విభాగాలు ఉంటాయి. బ్రిటన్‌లో ప్రయివేటీకరణలో భాగంగా 25కంపెనీలను ఏర్పాటు చేసి ప్రయివేటీకరించారు. మన దేశంలో కూడా ప్రయివేటు రైళ్లను అనుమతించాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. రైల్వే బోర్డు, జోనల్‌, డివిజన్లను రద్దు చేసి కొత్త వాటిని తీసుకు రారనే హామీ లేదు.


ఈ నేపధ్యంలోనే మూడులక్షల ఉద్యోగాలను రద్దు చేయాలని 55 ఏండ్లు దాటిన వారి జాబితాలను సిద్దం చేయాలని, సిబ్బంది పని తీరును సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జోన్లకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 13-14 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.రిటైరైన ఖాళీలను భర్తీ చేయకుండా ఉంచటం, పని తీరు బాగోలేదని భావించిన వారిని నిర్బంధంగా రిటైర్‌ చేయించే ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ విషయమై జోనల్‌ అధికారులకు రాసిన లేఖలు తీవ్ర సంచలనం, ఉద్యోగుల్లో వ్యతిరేకత తలెత్తటంతో వివరణ పేరుతో శాంత పరిచేందుకు మరొక ప్రకటన చేశారు.పని తీరుబాగో లేని వారిని తొలగించటం అంటే కొత్త ఉద్యోగాలు ఉండవని కాదన్నదే దాని సారాంశం. 2014-19 మధ్య 2,83,637 పోస్టుల భర్తీ కసరత్తు జరిగిందని వాటిలో 1,41,060పోస్టులకు పరీక్షలను పూర్తిచేశామని ఆ ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని పేర్కొన్నది.


పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా రక్షణ సిబ్బందిని తప్ప కొత్తగా ఏ పోస్టును సృష్టించవద్దని ఆదేశించారు. ఉన్న సిబ్బందితో పలు రకాల పనులు చేయించాలి. కనీస సంఖ్యలో సిబ్బందితో పని చేయించేందుకు ఏర్పాటు చేయాలని, కొత్తగా నియామకాలు జరపవద్దని, గత రెండు సంవత్సరాల్లో సృష్టించిన పోస్టుల గురించి సమీక్ష జరపాలని, వాటిలో నియామకాలు జరపకపోతే నిలిపివేయాలని, సిబ్బందిని హేతుబద్దీకరించాలని, ఆర్ధికంగా లాభసాటి గాని శాఖలను మూసివేయాలని, ఇంకా అనేక పొదుపు చర్యలను ఆదేశించారు. 2014కు ముందు ప్రకటించిన గుల్బర్గ, జమ్ము, సిల్చార్‌ తప్ప కొత్త డివిజన్ల ఏర్పాటు ఆలోచన లేదని 2015లో కేంద్ర ప్రకటించింది.విశాఖను రద్దు చేస్తున్నారు కనుక రాయఘడ డివిజన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.


విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు గాను విశాఖ డివిజన్‌ను రద్దు చేసి దాని ఆధీనంలోని 30శాతం మార్గాలను విజయవాడ డివిజన్‌లో విలీనం చేసి మిగిలిన వాటితో రాయఘడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి విశాఖ జోన్‌ ఉనికిలోకి రానున్నదని సంకేతాలు ఇచ్చారు.వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను గత ఆగస్టులో సమర్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని దానిలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న రైల్వే మార్గాలన్నీ విశాఖ జోన్‌లో ఉంచాలని పలువురు కోరారు. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌ మీద ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తరువాత కార్యకలాపాల ప్రారంభానికి నాలుగు నుంచి ఆరునెలల వ్యవధి అవసరం అవుతుందని అంచనా. డిపిఆర్‌ గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోనరెడ్డి లేదా ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గానీ ఈ అంశం మీద కేంద్రాన్ని సంప్రదించినట్లు వార్తలు లేవు.


విశాఖ జోన్‌ ఉనికిలోకి వస్తే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఒడిషాలో రాజకీయ సమస్యలకు దారి తీయవచ్చు. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాలను ఒకేసారి సంతృప్తి పరచటం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌లో ఉంది. తమ జోన్‌ పరిధి తగ్గిపోనుందనే భయంతో బిజెపి, దాని మిత్ర పక్షం బిజెడి తెచ్చిన వత్తిడి మేరకు విశాఖ డివిజన్నే రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిషాలో బిజెపి పరువును కాపాడేందుకు ఏదో ఒక సాకుతో విశాఖ జోన్‌ ఉనికిలోకి రాకుండా చూడాలని కేంద్రం చూస్తున్నదా ? రైల్వేజోన్ల తగ్గింపు అంశం కూడా పరిశీలనలో ఉన్నదని రైల్వే మంత్రి పార్లమెంట్‌లో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అదే వాస్తవమైతే ఆ పేరుతో విశాఖ రైల్వేజోన్‌ ఇచ్చినట్లుగానూ ఇవ్వనట్లుగానూ ఎటూ తేల్చకుండా ఉంచేందుకు పూనుకున్నారా ? ఏమో ! కేంద్ర పెద్దలు దేనికైనా సమర్ధులు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకపార్టీ లేదా బిజెపి లేదా దాని మిత్ర పక్షాలకు ఇదేమీ పట్టినట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఒక దగా ! వి శాఖ రైల్వే జోన్‌ మరో దగా కాదు కదా !

కరోనా కట్టడితో చైనాలో ఆనంద హేల – ముట్టడితో అమెరికాలో ఆరోపణల గోల !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


రెండు దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకచోట ఆనంద హేల ! మరో చోట ఆరోపణల గోల !! కరోనా వైరస్‌ను కట్టడి చేసిన చైనాలో అక్టోబరు ఒకటవ తేదీన ప్రతి ఏటా జరుపుకొనే అరుణపతాక ఆవిష్కరణ ఎంతో ఆర్భాటంగా జరిగింది. 1949 అక్టోబరు ఒకటవ తేదీన చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇదే సమయంలో శరత్కాల పండుగను కూడా జరుపుకుంటారు. అందువలన రెండింటికి కలిపి వారం రోజుల పాటు ఇచ్చే సెలవులు గడిపేందుకు దాదాపు 55 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు పయనమై వెళ్లారు. కరోనాను కట్టడి చేసిన తరువాత చైనాలో సాధారణ జీవనం పునరుద్దరణ అయిందనేందుకు ఇది నిదర్శనం.


మరోవైపు కరోనా నిరోధాన్ని నిర్లక్ష్యం చేసి రెండు లక్షలకు పైగా ప్రాణాలు పోయేందుకు,75లక్షల మందికి కరోనా సోకేందుకు కారకుడైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన నేరం, వైఫల్య నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు పూనుకున్నాడు. నిర్లక్ష్యంతో అధ్యక్షుడిగా యావత్‌ అమెరికా పౌరులను, చివరకు వ్యక్తిగతంగా తాను, సతీమణికి సైతం కరోనాను అంటించి క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారి జరిగిన అభ్యర్ధుల సంవాదంలో ట్రంప్‌ పచ్చి అబద్దాలు, అసత్యాలను పలికాడు. ప్రత్యర్ధి జో బిడెన్‌, మీడియా, ఇతరులు ట్రంప్‌ మీద విరుచుకు పడ్డారు. ఎన్నికలు జరిగే నాటికి కోటి మంది వరకు కరోనా బారిన పడే తీరులో వ్యాధి వ్యాపిస్తోంది. మరోవైపు చైనాలో అడపాదడపా కొన్ని కేసులు వెలుగు చూడటం -అదీ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది – తప్ప మొత్తంగా వ్యాధి అదుపులో ఉంది.


మహమ్మారులను ఎదుర్కోవటం,కట్టడి చేయటంలో సోషలిస్టు ప్రభుత్వాల ప్రత్యేకతేమిటో చరిత్రలో తొలిసారిగా ప్రపంచం చూసింది. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి చెందిపెద్ద సంఖ్యలో జనం మరణించిన సమయానికి రష్యాలో బోల్షివిక్‌ ప్రభుత్వం పూర్తిగా నిలదొక్కుకోలేదు. కరోనా కేసులు తొలుత చైనాలో బయట పడిన కారణంగా అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ జీవ ఆయుధాల తయారీలో భాగంగా బయటకు వదిలారని, ప్రమాదవశాత్తూ బయల్పడిందని ఏ కారణం చెప్పినప్పటికీ చైనా మీద ఆరోపణలు చేసేందుకు, కమ్యూనిస్టు సిద్దాంతం మీద దాడి చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కరోనా పేరుతో అన్ని విధాలుగా ఒంటరి పాటు చేసేందుకు, ఆ పేరుతో ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన దేశాలు ఏవో చూశాము. వాటన్నింటినీ తట్టుకొని తన దైన శైలిలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని కరోనా నుంచి బయటపడింది.


కరోనా కేసులు తొలుత బయట పడిన ఊహాన్‌ నగరం, హుబెయి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు జరిపిన తీరు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు, అన్నింటికీ మించి జనం ఎక్కడా చైనా, వియత్నాంలో మాదిరి సహకరించలేదు. మహమ్మారి నుంచి చైనా సమాజాన్ని బయటపడవేసేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యల మీద జనం అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి గత నాలుగు దశాబ్దాలలో సంస్కరణలు అమలు జరిపి జనజీవితాలను మెరుగుపరచిన వాస్తవాన్ని స్వయంగా గమనించటమే కారణం. పదేండ్ల క్రితం ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా తమ ఆర్ధిక వ్యవస్ధ కూడా ప్రభావితం అయినప్పటికీ జనాన్ని ఆదుకున్న తీరును, మిగిలిన దేశాల్లో జనజీవితాలు అస్తవ్యస్ధం కావటాన్ని చూశారు గనుకనే కరోనా మహమ్మారిని జయించేందుకు ప్రభుత్వంతో కలసి జనం పోరాడారు.
దాదాపు తొమ్మిది నెలల పాటు క్వారంటైన్‌, లాక్‌డౌన్‌, అనేక ఆంక్షలను అనుభవించిన జనం గత రెండు నెలలుగా కొత్తకేసులు లేకపోవటంతో పంజరాల నుంచి బయట పడిన పక్షులు స్వేచ్చగా ఎగిరే మాదిరి బయటకు వచ్చారు. పరిస్ధితులన్నీ బాగుపడ్డాయనే ధైర్యం వచ్చిన తరువాత కసిగా విహార యాత్రలకు వెళుతున్నారని విశ్లేషకులు వర్ణించారు. ఇది చైనా ఆర్ధిక వ్యవస్దకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. సెప్టెంబరు30వ తేదీన 12 కేసులు నమోదు కాగా అవి కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే. ఎనిమిది రోజుల పాటు సెలవులను ప్రకటించటం ఏ దేశంలో అయినా జరుగుతుందా ? చైనాలో మాత్రమే చూడగలం. నూటనలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కసారిగా 55 కోట్ల మంది బయటకు వస్తే బహిరంగ స్ధలాలు ఎంత రద్దీ అవుతాయో ఊహించుకోవాల్సిందే. ప్రయాణ సాధనాల్లో, హౌటళ్లలో రిజర్వేషన్లు దొరక్క, ఒక రోజు ముందే వాహనరద్దీతో ఇండ్లకే పరిమితమైన వారెందరో. వాహనాలు నత్తనడక నడిచాయి. ఐదు వందలకు పైగా విహార కేంద్రాలలో ప్రవేశానికి రాయితీలు లేదా ఉచితంగా అనుమతిస్తూ ప్రకటించారు. అక్టోబరు ఒకటవ తేదీ ఒక్కరోజే 14,941 విమానాలు ఏర్పాటు చేశారు. రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేక విమానాలు కూడా సిద్దం చేశారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు ఎనిమిది వరకు రైల్వేశాఖ 10.8 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే చైనా సమాజం మీద ఆర్ధికంగా కరోనా ప్రభావం లేదా ? ఉంది కనుకనే గత ఏడాది 80 కోట్ల మంది ప్రయాణాలు చేస్తే ఈ ఏడాది 55 కోట్ల మందే చేస్తున్నారని వెల్లడైంది. గతేడాది 9.5బిలియన్‌ డాలర్ల మేరకు జనం ఖర్చు చేశారు. ఈ ఏడాది తగ్గనుంది.ఆగస్టు నుంచి సాధారణ వస్తుకొనుగోలు పెరిగింది.


కరోనా వైరస్‌ను అదుపు చేయటంలో ఒక్క చైనాయే కాదు, వియత్నాంతో పాటు సామ్రాజ్యవాదుల ఆంక్షల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న క్యూబా,వెనెజులా కూడా ప్రపంచానికి మార్గంచూపాయి. వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. అయితే అదే పద్దతిని ఇతర దేశాల్లో ఎందుకు అనుసరించటం లేదు ? ఇబ్బందులేమిటి ? అనే చర్చ జరిగింది. చైనాతో వియత్నాంకు సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. ఊహాన్‌ నుంచి వియత్నాం వచ్చిన ఒక చైనా పౌరుడు, అతని కుమారుడిలో జనవరి 30న ఆ వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. 2003లో చైనాలో బయటపడిన సార్స్‌ సోకిన తొలి దేశం వియత్నాం కావటం, గత అనుభవాలను గమనంలో ఉంచుకొని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం వెంటనే కరోనా నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంది.వాటికి జనం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వియత్నాంలో కేంద్రీకృత అధికార వ్యవస్ధ ఉండటం, వెంటనే నిర్ణయాలు తీసుకొనేందుకు, అమలు చేసేందుకు దోహదం చేసింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం, లాక్‌డౌన్‌ నిబంధనలను గట్టిగా అమలు జరపటం ఎంతో తోడ్పడింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద నిఘావేసే చర్యలు తీసుకున్నారు.అనేక దేశాల్లో ప్రభుత్వాలకు అలాంటి అధికారం ఉన్నప్పటికీ జవాబుదారీతనం, తగినన్ని నిధులు లేని కారణంగా ఆ పని చేయలేదు.


ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. జనం కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.ఇలాంటి పరిస్ధితి మరేదేశంలోనూ కనిపించదు. సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్ధితిని ప్రభుత్వం వివరించింది. మీడియా సరేసరి. మిలిటరీని కూడా రంగంలోకి దించి జనాన్ని అప్రమత్తం గావించింది. ఈ కసరత్తు అంతా జనానికి పరిస్ధితి తీవ్రతను తెలియ చేసేందుకు కరోనా పోరులో వారిని భాగస్వాములను చేసేందుకు అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు ఎంతగానో తోడ్పడింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ఆర్ధిక రంగంపై దాని ప్రభావం పడకుండా చూసిన కారణంగా ఈ ఏడాది ఎనిమిది నెలల్లో అమెరికాతో సహా అనేక దేశాలకు వియత్నాం ఎగుమతులు గత ఏడాది కంటే పెరిగాయి. అమెరికా ఖండ దేశాల నుంచి పెట్టుబడులు కూడా పెరిగాయి. దీనికి అమెరికా-చైనా మధ్య తలెత్తిన వివాదం కూడా తోడైంది.


క్యూబా మీద అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలకు ఆరుదశాబ్దాలు నిండాయి.1991లో సోవియట్‌ రిపబ్లిక్‌లను కూల్చివేసిన తరువాత కూడా అవి కొనసాగుతున్నాయి. అక్కడి కమ్యూనిస్టు పార్టీ జనానికి కలిగించిన చైతన్యం కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలిచింది. అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.


అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 కరోనా కేసులు నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది. క్యూబా ఔషధంగా పేరుగాంచిన ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా2బి తయారీ 2003నుంచి చైనాలో జరుగుతోంది. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతోంది.జనాన్ని చంపటానికైనా సిద్ధపడుతున్నాడు గానీ దాన్ని అమెరికాలో వినియోగించటానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు అహం అడ్డువచ్చింది.


అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలన్నీ క్యూబా ప్రభుత్వం ఉచితంగానే చేసింది.వైద్యం అనేక దేశాల్లో బీమా కంపెనీల ఆదాయవనరుగా, వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. దీనికి అనుగుణ్యంగానే అమెరికాలో వైద్యులకు ఇచ్చే వేతనాలు క్యూబాలో లేవు అన్నది కూడా నిజం. వైద్యులకు వేతనాల కంటే జనానికి వైద్య ఖర్చు తగ్గించటమే సోషలిస్టు క్యూబా ప్రత్యేకత. మిగతావారితో పాటు వైద్యులు కూడా ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతను పొందుతారు.


క్యూబా వైద్య విధానాన్ని చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వెనెజులాలో 20వేల మంది క్యూబన్‌ వైద్యులు,నర్సులు ఉన్నారు. స్ధానికులతో కలసి వారంతా ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు,చికిత్స, అవసరమైన సలహాలు అందించటం నిత్యకృత్యంగా చేస్తున్నారు.దేశంలో 15వేల క్లినిక్స్‌, 572 రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలు, 586 చికిత్స కేంద్రాలు, 35 ఉన్నత సాంకేతిక వైద్య కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిలో అత్యధిభాగాన్ని కరోనా నిరోధ కేంద్రాలుగా పని చేయిస్తున్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న వెనెజులాలో అక్టోబరు రెండవ తేదీ నాటికి 76వేల కేసులు నమోదు కాగా 635 మంది మృత్యువాత పడ్డారు.పక్కనే ఉన్న కొలంబియాలో 8.35లక్షల కేసులు, 26వేల మరణాలు సంభవించాయి. వెనెజులా గురించి అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల గురించి కట్టుకధలు చెప్పేవారు ఈ వివరాల గురించి ఏమంటారు? ఆమెరికా, ఇతర అనేక దేశాలు కల్పిస్తున్న ఇబ్బందులను తట్టుకుంటూ వెనెజులా జనాన్ని కరోనా బారిన పడకుండా కాపాడుతున్నది. అంతా సజావుగా ఉందని చెబుతున్న కొలంబియా సంగతి చూశాము. అదే ప్రాంతానికి చెందిన మరో దేశం బ్రెజిల్‌లో 48.5లక్షల కేసులు నమోదు కాగా 1.44లక్షల మంది మరణించారు.


కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన దేశాల్లో చైనా కూడా ఒకటి. వైరస్‌ను అక్కడే తయారు చేసి వదిలారు అని చెబుతున్నవారు మరి దీనికేమంటారు ? జనవరి-మార్చినెలల మధ్య జిడిపి 6.8శాతం తిరోగమనంలో పడగా ఎక్కడైతే మహమ్మారి ప్రారంభమైందో ఆ హుబెరు రాష్ట్రంలో నష్టం 39.2శాతం ఉంది. అయితే ఆ విపత్తును త్వరలోనే అధిగమించి ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో మూడశాతం పురోగమనాన్ని సాధించింది. ఫిబ్రవరి నాటికి 80వేలకు పైగా కేసులుండగా అక్టోబరు రెండున 85,424 కేసులు నమోద కాగా చికిత్స పొందుతున్న వారు 189 మంది, ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది, కొత్తకేసులు పది నమోదయ్యాయి. మే మొదటి వారానికే ఊహాన్‌తో సహా దేశమంతటా 80శాతం ఉత్పాదక కార్యకలాపాలు నమోదయ్యాయి. ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తూ వైరస్‌ జాడను కనుగొన్నారు.


చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. 2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు.


కరోనా కారణంగా ఉద్దీపన పధకాలకు అమెరికా 2.3లక్షల కోట్ల డాలర్లు కేటాయించింది. చైనా 50వేల కోట్ల డాలర్లు కేటాయించింది. అమెరికా అంత మొత్తం ప్రకటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ 2020లో 8శాతం తిరోగమనంలో ఉంటుందని, 2021లో 4.5శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ జూన్‌ అంచనాలో పేర్కొన్నది. అదే చైనా విషయానికి వస్తే ఒకటి, 8.2శాతాలుగా ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే 2020లో పురోగమన వృద్ధి రేటుతో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా. కరోనా విషయంలోనే కాదు, ఆర్ధిక రంగంలో చైనా తన సోషలిస్టు వ్యవస్ధ విశిష్టతను ప్రదర్శిస్తోందన్నది స్పష్టం.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం – మన రైతాంగానికి పొంచి ఉన్న మరో ముప్పు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా మన దేశ రైతాంగానికి అనేక వైపుల నుంచి ముప్పు ముంచుకు వస్తోంది. ఏ కష్టం వచ్చినా కాచుకొనే ప్రభుత్వం ఉంటే అదొక తీరు. బాధ్యతల నుంచి తప్పుకొంటున్న పాలకులు ఒక వైపు ఉంటే రైతాంగాన్ని నిలువు దోపిడీ చేసే శక్తులు మరోవైపు కమ్ముకు వస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వ సేకరణ, కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ద్వారా ధనిక దేశాల కార్పొరేట్‌ సంస్దలు తెస్తున్న వత్తిడికి ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోయారా ? దాన్ని నీరుగార్చే చర్యల్లో భాగంగానే సంస్కరణల పేరుతో వ్యవసాయ, నిత్యావసర వస్తువుల చట్టాలలో సవరణలు చేశారా ? యావత్‌ వినియోగదారులు, రైతాంగ ప్రయోజనాలను ఫణంగా పెట్టారా ? మరోవైపు అమెరికాతో కుదరబోతోందని చెబుతున్న ఒప్పంద రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఒక వేళ కుదిరితే దాని బాటలోనే ఇంకా ఏ దేశాలు ఏ గొంతెమ్మ కోరికలు కోరతాయో తెలియదు. ఇవన్నీ చుట్టుముడుతున్న ప్రశ్నలు, సమస్యలు.


వ్యవసాయ ఉత్పత్తుల పన్నులలో మార్పులు చేర్పులు గురించి ముందుగానే తెలియచేయాలన్న కెనడా తదితర దేశాల ప్రతిపాదనను మన దేశం వ్యతిరేకించింది. అలా చేస్తే అది సట్టాబేరాలకు, ఇతర అక్రమ లావాదేవీలకు దారి తీస్తుందని, ఆహార ధాన్యాల నిల్వల మీద ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. పారదర్శకత, వర్తించే పన్నుల గురించి అంచనాలకు వచ్చేందుకు వీలుగా ముందుగానే పన్నుల వివరాలు వెల్లడించాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్య దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ తరఫున కెనడా ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధలోని వ్యవసాయ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న వ్యవసాయ మంత్రుల సమావేశ అజండాను ఖరారు చేసేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముందుగానే పన్నుల వివరాలను వెల్లడిస్తే పండ్లవంటి తాజా ఉత్పత్తులకు ఎంతో మేలు జరుగుతుందని బ్రెజిల్‌ పేర్కొన్నది. ఈ మూడు దేశాల, అదేమాదిరి అభిప్రాయాన్ని ముందుకు తెచ్చిన రష్యా ప్రతిపాదనకు అమెరికా, అర్జెంటీనా, న్యూజిలాండ్‌, ఉరుగ్వే,ఉక్రెయిన్‌ కూడా మద్దతు తెలిపాయి. మనదేశంతో పాటు దక్షిణాఫ్రికా, ఈజిప్టు వ్యతిరేకించాయి.ఈ దేశాలు వ్యక్తం చేసిన కొన్ని అంశాలతో తాము కూడా ఏకీభవిస్తున్నట్లు చైనా పేర్కొన్నది.


ఈ సమావేశంలోనే మన ప్రభుత్వం ఇస్తున్న పంచదార రాయితీలు, రవాణా, మార్కెటింగ్‌ రాయితీల గురించి, ఆహార నిల్వల ప్రభావం ఏమిటంటూ మిగతా దేశాలు ఆరాతీశాయి. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల పరిమితిని అతిక్రమించి అమెరికాలో ఇస్తున్న 34బిలియన్‌ డాలర్ల రాయితీల సంగతేమిటని మన దేశంతో సహా అనేక దేశాలు ప్రశ్నించాయి. మన ప్రభుత్వం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం రైతులకు రాయితీలు ఇవ్వటమేనని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దం కనుక ఆ విధానాన్ని ఎత్తివేయాలి లేదా ధరలను తగ్గించాలని అమెరికా, ఐరోపా యూనియన్‌ తదితర దేశాలన్నీ ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. తమ చర్యలు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆ వాదనలను ఇప్పటి వరకు మన దేశం తిరస్కరిస్తూ వస్తోంది.


వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో కనీస మద్దతు ధరల కంటే తక్కువకు ఎవరూ కొనటానికి వీలులేదు. దీని ర్ధం వ్యాపారులు పోటీ పడి ఎక్కువకు కొనుగోలు చేయవద్దని కాదు. చమార్కెట్‌ యార్డుల పరిధిలో కొనుగోలు చేసే వారి మీద పర్యవేక్షణ ఉంటుంది. తాజాగా చేసిన సవరణల ప్రకారం యార్డుల పరిధిని కుదించారు. ఆ పరిధి వెలుపల ఎవరైనా ఎలాంటి సెస్‌ చెల్లించకుడా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ధరలను పర్యవేక్షించే యంత్రాంగం ఉండదు. ఒప్పంద వ్యవసాయం చేసేందుకు కూడా అనుమతిస్తున్నందున రైతులు-వ్యాపార సంస్ధల మధ్య ఒప్పందంలో కనీస మద్దతు ధరల అంశం- ప్రస్తావనే ఉండదు. కంపెనీలు ఏదో ఒక సాకుతో ధరలు దిగ్గొస్తే అధికారులను ఆశ్రయించటం తప్ప న్యాయస్ధానాలకు వెళ్లే అవకాశం లేదు. అధికార యంత్రాంగం ఎవరివైపున ఉంటుందో తెలిసిందే.


2013లో నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ మంత్రుల సమావేశ నిర్ణయం ప్రకారం 2023వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, రవాణా, మార్కెటింగ్‌ రాయితీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తరువాత రద్దు లేదా పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీని పర్యవసానాలు రైతులకు హానికరంగా ఉంటాయి తప్ప మరో తీరులో ఉండే అవకాశం లేదు.
అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ నెల రోజుల క్రితం చెప్పారు. వచ్చిన వార్తలు, జరుగుతున్న చర్చల తీరుతెన్నులను చూస్తే ముందుగా ఒక పరిమిత ఒప్పందం తరువాత సమగ్ర ఒప్పందం జరగబోతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానిక సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఒక ఆర్డినెన్స్‌ అనేది అత్యవసర సందర్భాలలో మాత్రమే ఉపయోగించే అధికారం. వ్యవసాయ సంస్కరణలు అలాంటివి కాదు. ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి దానికి తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం. అమెరికాతో ఒప్పందం కుదరితే అది మన వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావం చూపనుందని చెబుతున్నారు. అనేక దేశాలతో అది కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ దాని కార్పొరేట్‌ ప్రయోజనాలకే అనుకూలంగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు.


ప్రపంచంలో అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో మన దేశం మిగులుతో ఉంది. దాన్ని సమం చేసేందుకు మన దేశం మీద వత్తిడి తెచ్చి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు బంద్‌ చేయించి తన చమురును మనకు విక్రయిస్తున్నది. త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికా వ్యవసాయ సరకులు మన దేశాన్ని ముంచెత్తటం ఖాయం.
చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.2018లో అమెరికా 7,15,491 టన్నుల పాలపొడి, 5,45,890 టన్నుల పన్నీరు పొడి ( పాలవిరుగుడు), 3,48,561టన్నుల జున్ను, 3,92,166 టన్నుల పాలచక్కెర(లాక్టోజ్‌)ను ఎగుమతి చేసింది. చైనాతో లడాయి కారణంగా అమెరికా పదిశాతం ఎగుమతిని కోల్పోయింది. దీంతో అమెరికాలో రికార్డు స్ధాయిలో ఆరులక్షల టన్నులకు జున్ను నిల్వలు పేరుకుపోయాయి. ఇది మన దేశంలో పన్నెండు సంవత్సరాల జున్ను వినియోగానికి సమానమని అంచనా. ఇప్పుడు మన వంటి దేశాలకు పాడి ఉత్పత్తులను ఎగుమతి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
దేశంలో పన్నీరు పొడి ధర కిలో రు.130-150 మధ్య ఉండగా 30శాతం దిగుమతి పన్ను ఉన్నప్పటికీ కిలో రు.70కంటే తక్కువ ధరకే ప్రతి నెలా వెయ్యి టన్నుల మేరకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. పన్నీరు, జున్నుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాల పొడి ధర మన దేశంలో రు.280-300 మధ్య ఉంది. కొందరు పన్నీరు పొడిని కూడా పాలపొడిగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల నుంచి గనుక పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే మన పాల రైతాంగం పరిస్ధితి ఏమిటి ? దిగుమతి పన్ను 30శాతానికి మించి పెంచినా అమెరికా లేదా న్యూజిలాండ్‌ వంటి దేశాలు ఇస్తున్న సబ్సిడీల కారణంగా మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువ ధరకే దిగుమతి చేసుకోవచ్చు. దాంతో మన పాలరైతులు పాడి పరిశ్రమకు దూరం కావాల్సిందే. ప్రపంచ వ్యాపితంగా జున్ను తయారీలో దూడల పేగుల్లోంచి తీసిన పదార్దాన్ని తోడు కింద వినియోగిస్తారు. మన దేశంలో అలా వినియోగించటం చట్టవిరుద్దం. అయితే దిగుమతి చేసుకొనే దానిలో అలాంటి తోడు వినియోగించారా లేదా అన్నది తయారీదారులు చెబితే తప్ప తెలుసుకోవటం కష్టం.అమెరికా, ఐరోపా దేశాల్లో ఆవులకు వేసే దాణాలో జంతువుల ఎముకలతో తయారు చేసిందాన్ని వినియోగిస్తారు. అలాంటి వాటితో తయారు చేసిన పదార్ధాలు మన దేశానికి ఇప్పటికే దొడ్డిదారిన వస్తున్నాయి. ఇది ఒక విధంగా కొన్ని తరగతుల వినియోగదారులను మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వాటిని కస్టమ్స్‌ సిబ్బంది గుర్తించలేరు.వ్యవసాయం తరువాత మన దేశంలో పాడి రైతులు ఎక్కువ. పాలకూ కనీస సేకరణ ధర నిర్ణయించాలని చాలా కాలం నుంచి రైతులు కోరుతున్నారు. అయితే తమకటువంటి ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో స్పష్టం చేసింది.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. 2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ?


అమెరికా నుంచి ఇప్పటికే పండ్లు, కూరగాయలను మనం దిగుమతి చేసుకుంటున్నాము, అవి పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన వ్యవసాయ చట్టాల సవరణల్లో ఒప్పంద వ్యవసాయం గురించి చెప్పింది. భారీ ఎత్తున అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో పోటీ పడి మన దేశం పండ్లు, కూరగాయలు, పూలను ఎగుమతి చేసే స్ధితిలో ఉందా ? మన రైతాంగాన్ని దెబ్బతీసే దిగుమతులు ఎందుకు, విదేశీ కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇచ్చి మన దేశం నుంచి ఎగుమతులెందుకు ?
అమెరికా లేదా మరొక దేశంతో వ్యవసాయ ఉత్పత్తుల గురించి మన దేశం కుదుర్చుకోబోయే ఒప్పందంలో ఇప్పుడున్న దిగుమతి పన్నులను తగ్గించకుండా అమెరికా అంగీకరిస్తుందా ? తగ్గిస్తే మన రైతుల సంగతేమిటి ? ఉదాహరణకు యాపిల్‌ పండ్లపై మన దేశం విధిస్తున్న పన్ను 50శాతం ఉన్నపుడు 2018 జనవరి నుంచి జూన్‌ 15 మధ్య అమెరికా నుంచి 78లక్షల బాక్సులను దిగుమతి చేసుకున్నాము. పన్ను మొత్తాన్ని 70శాతానికి పెంచటంతో మరుసటి ఏడాది అదే కాలంలో దిగుమతులు 26లక్షల బాక్సులకు పడిపోయాయి. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉంటేనే కాశ్మీర్‌, హిమచల ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోని యాపిల్‌ రైతులకు మేలు జరుగుతుంది. అదే తగ్గిస్తే ?


మనం పత్తిని ఎగుమతి చేస్తున్నాం-ఇదే సమయంలో భారీ సబ్సిడీలు ఇస్తున్న అమెరికా పత్తిని మన మిల్లు యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక వ్యవసాయ ఉత్పత్తుల పరిస్ధితి ఇదే, పన్ను తక్కువగా ఉన్నపుడు ఇబ్బడి ముబ్బడిగా మన కార్పొరేట్‌ లేదా వాణిజ్య ” దేశభక్తులు ” దిగుమతి చేసుకొని మన రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. రైతాంగం కన్నెర్ర చేయటంతో పాలకులు పన్నులు పెంచాల్సి వస్తోంది. దాంతా కాస్త ఊరట కలుగుతోంది. ఈ దోబూచులాట ఎంతకాలం ? రైతులు ఆరుగాలం పంటలు పండించాలా ? ప్రతిక్షణం పాలకుల విధానాల మీద కన్నువేసి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయాలా ?


ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే.


బర్డ్‌ ఫ్లూ సమస్య తలెత్తినపుడు 2007లో మన దేశం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. మన కోళ్ల పరిశ్రమ రక్షణ కోసం ఆ సమస్య తొలగిన తరువాత కూడా అది కానసాగింది. అయితే ఆ చర్య నిబంధనలకు విరుద్దం అంటూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసి 2014లో అమెరికా గెలిచింది. దాంతో నరేంద్రమోడీ సర్కార్‌ 2017లో నిషేధాన్ని ఎత్తివేసింది. దిగుమతులపై వందశాతం పన్ను విధించింది. అయినప్పటికీ మన మార్కెట్లో దొరికే వాటి కంటే చౌక కావటంతో కోడి కాళ్ల దిగుమతులు ప్రారంభం అయ్యాయి. ఆ పన్ను మొత్తాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. అదే జరిగితే మన బాయిలర్‌ కోళ్ల ఫారాలు, వాటికి రుణాలు ఇస్తున్న బ్యాంకులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి.


అమెరికా ఇప్పటికే మధ్య అమెరికాలోని చిలీ వంటి దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ప్రాతిపదికనే మన దేశం కూడా ఒప్పందం చేసుకోవాలని వత్తిడి వస్తోంది. అదే జరిగితే వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది. అది ఒక్క అమెరికాకే పరిమితం కాదు. మనతో వాణిజ్య సంబంధాలున్న మిగతా దేశాలు కూడా అదే విధమైన రాయితీలు కోరతాయి. విత్తన వాణిజ్యం మీద ప్రస్తుతం ఉన్న నియంత్రణలను మరింత సడలిస్తే మాన్‌శాంటో, కార్గిల్‌, సింజెంటా వంటి కంపెనీల దోపిడీకి అడ్డు ఉండదు. గుజరాత్‌లో పెప్సీ కంపెనీ తన అనుమతి లేకుండా తన పేటెంట్‌ హక్కు ఉన్న బంగాళాదుంప విత్తనాలను సాగు చేశారంటూ మన దేశానికి వర్తించని నిబంధనలతో పదకొండు మంది రైతుల మీద కేసులు వేసిన విషయం తెలిసిందే.
మన కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం కనుక ఆ విధానాన్ని రద్దు చేసేట్లు ఆదేశించాలని అమెరికా, కెనడా దాఖలు చేసిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ ధరల నిర్ణయం రాయితీగా వర్ణిస్తూ అవి అనుమతించిన దానికంటే 26 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నది వాటి వాదన. ఉత్పత్తి విలువ లెక్కింపు పద్దతిలో తేడా ఉంది. అమెరికా, కెనడా వంటి దేశాలు మన రూపాయిని యూనిట్‌గా తీసుకొని లెక్కిస్తున్నాయి. మన దేశం డాలరు ప్రాతిపదికగా లెక్కవేస్తోంది. ఉదాహరణకు మన దేశం పప్పుదినుసుల విలువ రూ.2,677 కోట్ల రూపాయలుగా చూపుతుంటే అమెరికా రూ.69,923కోట్లుగా లెక్క చెబుతోంది. మన ప్రభుత్వం సేకరించే సరకునే పరిగణనలోకి తీసుకుంటే అమెరికా మొత్తం ఉత్పత్తి విలువను లెక్క వేస్తోంది. చైనా మీద కూడా అమెరికా ఇలాంటి కేసే వేసింది. వీటిని భారత్‌, చైనా రెండూ కలసి వ్యతిరేకిస్తున్నాయి.


భారత ఆహార సంస్ధ అనవసరంగా ధాన్య నిల్వలు చేస్తున్నదనీ, కనీస మద్దతు ధరల విధానం అసమర్దతకు ప్రోత్సాహం అనే దివాలాకోరు వాదనలు చేసే వారు కూడా ఉన్నారు. ఒక ఎకరానికి పది క్వింటాళ్ల ధాన్యం పండించే రైతుకూ, 15క్వింటాళ్లు పండించే రైతుకూ కనీస మద్దతు ధర ఒకటే ఉంటుందనే రీతిలో వారి వాదనలు ఉన్నాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చు, తక్కువ నీటిని వినియోగించే వారికి ప్రోత్సాహం ఇవ్వటం లేదని చెబుతారు. ఇవన్నీ ఆ విధానాలను రద్దు చేయాలనే దుష్ట ఆలోచన ఉన్నవారు ముందుకు తెచ్చే వాదనలు. కనీస మద్దతు ధర ఎత్తివేస్తే ప్రయివేటు వ్యాపారులు అలాంటి రైతులను గుర్తించి వారికి అదనపు ధర లేదా మరో రూపంలో ప్రోత్సాహం అందిస్తారా ? ఏ దేశంలో అయినా అలా జరిగిందా ? ఉన్న వ్యవస్ధలో లోపాలను సరిదిద్దటాన్ని ఎవరూ వ్యతిరేకించటం లేదు. అంతకంటే మెరుగైన వ్యవస్ధ లేకుండా ఉన్నదాన్ని నిర్వీర్యం చేస్తే దిక్కేమిటి ? ఇదే రైతులు ముందుకు తెస్తున్న ప్రశ్న !


రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చేందుకు వీలుగా ముందు ఒక పరిమిత ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాలో మన రాయబారిగా ఉన్న తరంజిత్‌ సింగ్‌ సంధు ఆగస్టు 21న ఫిక్కి సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం మన దేశం మన అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల మీద అమెరికా విధించిన అధిక పన్నులను వెనక్కు తీసుకోవాలని, జిఎస్‌పి కింద రద్దు చేసిన రాయితీలను పునరుద్దరించాలని కోరుతోంది. తాము ఆపని చేయాలంటే తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను తెరవాలని, ఐటి ఉత్పత్తుల మీద పన్నులు తగ్గించాలని వాణిజ్యలోటును తగ్గించాలని అమెరికా అంటోంది. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అనుసరించే వైఖరి. నవంబరు ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇదే సమస్య ముందుకు రానుంది. ఆ వత్తిడిని మన పాలకులు తట్టుకుంటారా ? మన రైతులు, పరిశ్రమలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటారా ? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మన ముందు ఉంది !