చిలీ ఎన్నికలు వామపక్షాలకు మరో హెచ్చరిక !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

డిసెంబరు 17న లాటిన్‌ అమెరికాలోని చిలీ అధ్యక్ష తుది ఎన్నికలు జరిగాయి. మితవాద అభ్యర్ధి సెబాస్టియన్‌ పినెరా గెలిచాడు అనటం కంటే వామపక్ష అభ్యర్ధి అలెజాండ్రో గలియర్‌ ఓటమి పాలయ్యాడని చెప్పాలి. ఆశ్చర్యంగా వుంది కదూ ! సగానికిపైగా ఓటర్లు అసలు ఎన్నికల్లో పాల్గనలేదు, మొదటి దఫా పోలైన ఓట్లలో 64శాతం ఓట్లు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులుగా వున్న అభ్యర్ధులకే వచ్చాయి. తుదివిడత పోటీలో వారి మధ్య ఐక్యత లోపించిన కారణంగా వామపక్ష అభ్యర్ధి ఓటమి పాలయ్యారు. జనాభాలో 45శాతంగా వున్న ఆదివాసులు ఎక్కువ మంది మితవాద పినేరా వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు కేవలం 46.72 శాతం మాత్రమే ఓటర్లు పాల్గన్నారు. తుది విడతలో 49శాతం వరకు పెరిగినప్పటికీ ఎన్నికలకు దూరంగా వున్న ఓటర్లను సమీకరించటంలో వామపక్ష కూటమి పెద్దగా చేసిందేమీ లేనట్లు స్పష్టమైంది. ఓటింగ్‌ శాతం తగ్గిన అత్యధిక సందర్భాలలో మితవాద, ప్రజావ్యతిరేక శక్తులే చురుకుగా వుంటాయన్నది ప్రపంచ అనుభవం.

ఎన్నికల గడువు దగ్గర పడిన తరువాత నూతన వామపక్ష కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌లోని పార్టీలు, తొలిదశలో పోటీ పడిన ఇతర అభ్యర్ధులు గులియర్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది. వారికి వచ్చిన ఓట్లన్నీ గులియర్‌కు పడి వుంటే ఎంతో సులభంగా విజయం లభించి వుండేది. అలా జరగలేదు. సోషలిస్టుపార్టీ నేత బాచ్‌లెట్‌ ప్రభుత్వం పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య ఒప్పందం వైపు మొగ్గు చూపటం, వెనెజులాపై ఆరోపణల దాడి జరపటం వంటి అంశాలు కొత్తగా ముందుకు వచ్చిన వామపక్ష కూటమివైపు వామపక్ష అభిమానులు గణనీయంగా మొగ్గు చూపేందుకు దోహదం చేశాయి. బ్రాడ్‌ ఫ్రంట్‌ నేతలు కూడా ప్రచారంలో మితవాద పినేరా కంటే గులియర్‌పై దాడిని ఎక్కుపెట్టటం కూడా దాని మద్దతుదారులు రెండో విడత ఎన్నికలలో ఓటింగ్‌కు దూరం కావటమో లేక నామమాత్రంగా గులియర్‌కు వేసి వుండటమో జరిగింది.

లాటిన్‌ అమెరికాలో ఒక మార్క్సిస్టుగా ఎన్నికలలో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుడిగా సాల్వెడార్‌ అలెండీ చరిత్రకు ఎక్కారు. ప్రజాస్వామ్యబద్దంగా 1970లో చిలీ అధ్యక్షుడిగా ఎన్నికైన అలెండీని కొనసాగనిస్తే లాటిన్‌ అమెరికా అంతటా అదే పరిణామం పునరావృతం అవుతుందని భయపడిన అమెరికా కుట్ర చేసి మిలిటరీ జనరల్‌ పినోచెట్‌ నాయకత్వంలో తిరుగుబాటుకు తెరదీసింది. దానిని ఎదుర్కొనేందుకు స్వయంగా తుపాకి పట్టి కుట్రదారుల చేతుల్లో బలైన నేత అలెండీ.

      నవంబరు 19న జరిగిన పోలింగ్‌లో ఎనిమిది మంది పోటీ పడగా వారిలో పినెరాకు 36.64, గలియర్‌కు 22.7, మరో వామపక్ష అభ్యర్ధి బియాట్రిజ్‌ సాంఛెజ్‌కు 20.27శాతం ఓట్లు వచ్చాయి. ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాని కారణంగా తొలి రెండు స్ధానాలలో వున్నవారి మధ్య తుది పోటీ జరిగింది. గలియర్‌ న్యూ మెజారిటీ పేరుతో వున్న అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి అభ్యర్ధి. ఈ కూటమిలో చిలీ అనగానే గుర్తుకు వచ్చే సాల్వెడార్‌ అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీ నాయకురాలు కాగా కమ్యూనిస్టుపార్టీ, సోషలిజం- పెట్టుబడిదారీ విధానాలలోని మంచిని అమలు జరపాలని చెప్పే విరుద్ద విధానాల క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఇతర చిన్న పార్టీలు వున్నాయి.. మొదటి ఇద్దరి మధ్య తుదివిడత పోటీలో పినేరా 54.58 శాతం ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలకు దూరంగా మెజారిటీ ఓటర్లు 51.5శాతం వున్నారు. అధికారంలో వున్న న్యూ మెజారిటీ కూటమి అనుసరించిన విధానాలతో ఓటర్లు ఎంతగా విసిగిపోయారో ఈ అంకె వెల్లడించింది. ఈ కారణంగానే చిలీలో ఇద్దరు ప్రజాభిమానం లేని అభ్యర్ధుల మధ్య పోటీ అనే శీర్షికతో ఒక మీడియా వార్తనిచ్చింది. అధికార కూటమి అభ్యర్ధి ఓటమిని అనేక మంది ముందే సూచించారు. ఎన్నికలకు నెల రోజుల ముందే క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధికార కూటమి నుంచి వైదొలగి తన అభ్యర్ధిని పోటీకి పెట్టింది. ఆరు సంవత్సరాల క్రితం వువ్వెత్తున ఎగిసిన విద్యార్ధి వుద్యమానికి నాయకత్వం వహించిన వారితో పాటు కొన్ని చిన్న వామపక్ష పార్టీలతో ఈ ఏడాది ప్రారంభంలో బ్రాడ్‌ ఫ్రంట్‌ పేరుతో ఏర్పడిన కూటమి అభ్యర్ధే రెండవ స్ధానంలో వుంటారా అన్న వాతావరణం నవంబరు ఎన్నికల సమయంలో ఏర్పడింది. సోషలిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు జరిపిన విధానాలపై విబేధాల కారణంగా అన్ని వామపక్ష పార్టీలు,శక్తుల మధ్య ఐక్యత కుదిరేది కాదని ముందే తేలిపోయింది.

ఈ పూర్వరంగంలో జరిగిన తుది విడత ఎన్నికలలో మితవాది పినేరా విజయం సాధించాడు. పార్లమెంట్‌ దిగువ సభలోని 155 స్ధానాలకు గాను పినేరా నాయకత్వంలోని కూటమి72 సాధించగా న్యూ మెజారిటీ కూటమి 43, బ్రాడ్‌ ఫ్రంట్‌ 20, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌పార్టీ కూటమి 14 స్ధానాలు సాధించాయి. ఇతర పార్టీలకు 6 వచ్చాయి. న్యూ మెజారీటీ కూటమిగతం కంటే ఒక సీటును కోల్పోగా దాని భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆరు నుంచి ఎనిమిది సీట్లకు పెంచుకుంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన, మరోసారి గెలిచిన పినేరా చిలీ నియంత పినోచెట్‌ అనుచరుడు. అతనికి దేశంలోని 15 రాష్ట్రాలలో 13చోట్ల ఆధిక్యత లభించింది. తుది విడత పోటీ పడిన ఇద్దరు అభ్యర్ధుల పట్ల ఓటర్లు అనాసక్తి కనపరచటానికి కారణం వివిధ తరగతుల జీవితాలు చిన్నా భిన్నం కావటానికి కారణమైన స్వేచ్చామార్కెట్‌ లేదా నయా వుదారవాద విధానాలపై ఇద్దరూ వ్యతిరేకంగా మాట్లాడకపోవటమే. తాను గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తానని గలియర్‌ ప్రకటించగా, తాను కార్పొరేట్‌లాభాలపై పన్నులు తగ్గిస్తానని పినేరా వాగ్దానం చేశాడు. వామపక్ష ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో వున్నప్పటికీ నియంత పినోచెట్‌ హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని మార్చటానికి పెద్దగా ప్రయత్నించలేదు. తనను ఎన్నుకుంటే ఆ పని చేస్తానని వామపక్ష కూటమి అభ్యర్ధి గలియర్‌ ప్రకటించినప్పటికీ జనంలో విశ్వాసం కలగలేదని ఓటర్ల అనాసక్తి వెల్లడించింది. గతంలో తాము కోల్పోయిన భూములను తిరిగి పొందేందుకు పోరాడుతున్న ఆదివాసులపై బాచ్‌లెట్‌ ప్రభుత్వం నియంత పాలనలో చేసిన వుగ్రవాద చట్టాన్ని ప్రయోగించి మిగతాపార్టీలకూ వామపక్షాలకు తేడా లేదన్న విమర్శలను మూటగట్టుకుంది. విద్యారంగంలో కూడా జనం కోరిన విధంగా విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రయత్నం చేయలేదు.మిగతా లాటిన్‌ అమెరికా దేశాల మాదిరే ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయని కారణంగా పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభ ప్రభావం చిలీపై కూడా ఎన్నికలకు ముందు బాచ్‌లెట్‌ ప్రభుత్వానికి జనాదరణ అత్యంత తక్కుగా వున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

ప్రపంచ సాంప్రదాయ పెట్టుబడిదారీ, ఇటీవలి కాలపు ద్రవ్య పెట్టుబడిదారీ విధానాలు, వాటికి వున్నత రూపమైన సామ్రాజ్యవాద ప్రయోగశాలగా లాటిన్‌ అమెరికాను మార్చారు. పోరాట సాంప్రదాయం కలిగిన లాటిన్‌ అమెరికాలో తమ దోపిడీకి అడ్డులేకుండా చేసుకొనేందుకు, వామపక్ష, ప్రజావుద్యమాలను వుక్కుపాదంతో అణచివేసేందుకు ప్రజాస్వామిక వ్యవస్ధలను ప్రహసన ప్రాయంగా మార్చి ప్రతి దేశంలోనూ మిలిటరీ నియంతలను రంగంలోకి తెచ్చిన చరిత్ర తెలిసిందే. ‘చికాగో పిల్లలు’గా పిలిపించుకున్న అమెరికన్‌ సలహాదారులు అందచేసిన దివాలాకోరు నయా వుదారవాద విధానాల అమలు ఫలితంగా ఆర్ధికంగా దివాలా, అప్పులపాలైన ఆ ప్రాంత దేశాలలో మిలిటెంట్‌ వుద్యమాలు, తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. తీవ్రమైన అమెరికా వ్యతిరేకత పెల్లుబికింది. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అమెరికా ప్రతిష్టించిన పాలకులను సమర్ధించటానికి జంకే పరిస్ధితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి ప్రచ్చన్న యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించుకుంది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి. అంత పెద్ద విజయం సాధించిన తరువాత తమ పెరటితోటలో నియంతల స్ధానంలో నయా వుదారవాద విధానాలను అమలు జరిపే సరికొత్త శక్తులను రంగంలోకి తెచ్చేందుకు అమెరికా అనుమతించింది. ఆక్రమంలో ఆ పాలకుల వైఫల్యం, ఆ కారణంగా ఏర్పడే ఖాళీలో వామపక్ష శక్తులు విజయం సాధిస్తాయన్నది సామ్రాజ్యవాద శక్తులు వూహించని పరిణామం. ఆ క్రమాన్ని అడ్డుకోవటం అంటే తిరిగి సైనిక, మితవాద నియంతలను ప్రతిష్టించటం లేదా మరోసారి ప్రజాస్వామ్య పీకనులిమినట్లు ప్రపంచానికి తెలియచెప్పటమే. అందువలన తనను వ్యతిరేకించే శక్తులను అనుమతించటం తప్ప వారికి మరొక తక్షణ మార్గం లేకపోయింది.

దశాబ్దాల తరబడి లేని ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించటం, తక్షణం వుపశమనం కలిగించే చర్యలు, కొన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపిన కారణంగా వెనెజులా, బ్రెజిల్‌, అర్జెంటీనా, బలీవియా వంటి చోట్ల వరుసగా వామపక్ష శక్తులు విజయాలు సాధించటం అది ఇతర దేశాలకు వ్యాపించిన చరిత్ర తెలిసిందే. అయితే నయావుదారవాదం, ద్రవ్యపెట్టుబడిదారీ విధానాల ప్రాతిపదికన ఏర్పడిన దోపిడీ వ్యవస్ధ మూలాలను దెబ్బతీయకుండా వాటి పెరుగుదలను అనుమతిస్తూనే మరోవైపు సంక్షేమ చర్యలను అమలు జరపటం ఎంతో కాలం సాధ్యం కాదని గుర్తించటంలో లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యం కనిపిస్తోంది. నయా వుదారవాద విధానాల చట్రం నుంచి బయటపడని కారణంగా ఆ ప్రభుత్వాలు కూడా ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు వామపక్షాలుగా వున్న కొన్ని పార్టీల నేతల అవినీతి అక్రమాలు, విధానపరమైన వైఫల్యాల కారణంగా మితవాద, కార్పొరేట్‌ శక్తులు జనాన్ని రెచ్చగొట్టటంలో కొంత మేర జయప్రదం అయ్యాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌లో మితవాదులు అధికారానికి రాగా వెనెజులా పార్లమెంట్‌లో ఆధిక్యతను సాధించారు. చిలీలోని వామపక్ష శక్తులు కూడా నయావుదారవాద పునాదుల మీదే పాలన సాగించటం, అధ్యక్షురాలు బాచ్‌లెట్‌ కుటుంబ సభ్యులపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలపై విచారణ వంటివి అక్కడ ఓటమికి కారణం. మితవాది పినేరా విజయం సాధించటానికి దారితీసిన పూర్వరంగాన్ని నెమరువేసుకోవటం అవసరం. చిలీ రాజ్యాంగం ప్రకారం ఒక దఫా అధ్యక్షపదవికి ఎన్నికైన వారు తదుపరి ఎన్నికలలో పాల్గనటానికి అవకాశం లేదు. తాజా ఎన్నికలలో విజయం సాధించిన సెబాస్టియన్‌ పినేరా 2010-14 మధ్య అధ్యక్షుడిగా పని చేశాడు. తరువాత అధ్యక్షురాలిగా ఎన్నికైన మిచెల్లీ బాచ్‌లెట్‌ అంతకు ముందు ఒకసారి అధ్యక్షరాలిగా పని చేశారు. అంటే గత పదమూడు సంవత్సరాలలో బాచ్‌లెట్‌-పినేరా పాలనా తీరుతెన్నులను చూసిన చిలీ ఓటర్లు పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయినా ఒకటే అనే నిర్వేదానికి లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. నియంత పినోచెట్‌ పాలన 1990లో అంతరించినా వాడి హయాంలో రూపొందించిన కార్పొరేట్‌ అనుకూల, ప్రజావ్యతిరేక రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు లేకుండా గత 27 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకటే అని ఓటర్లు భావిస్తున్నందున ఇటీవలి ఎన్నికలలో మెజారిటీ ఓటర్లు పోలింగ్‌ బూత్‌లవైపు చూడటం లేదు. తాజా ఎన్నికలకు ముందు జరిగిన ఒక సర్వేలో కేవలం 29శాతం మంది మాత్రమే రాజకీయ పార్టీల పట్లవిశ్వాసం వెలిబుచ్చగా సగం మంది తమకు రాజకీయాలంటే ఆసక్తిలేదని పేర్కొన్నారు. పినోచెట్‌ నియంతృత్వానికి గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మిచెల్లీ బాచ్‌లెట్‌పై వున్న గౌరవం, అధ్యక్షుడిగా పినేరా అవినీతి అక్రమాలతో విసిగిపోయిన జనం గత ఎన్నికలలో బాచ్‌లెట్‌వైపు మొగ్గారు. ఈసారి ఆమె పోటీకి అనర్హురాలు కావటంతో జర్నలిస్టు అయిన గులియర్‌ను అభ్యర్ధిగా నిలిపారు. అయితే అతనిని బయటి వ్యక్తిగా చూశారని విశ్లేషకులు చెబుతున్నారు. తాను ప్రజలందరి అధ్యక్షుడిని అని ప్రచారం చేసుకోవటం కూడా దెబ్బతీసి వుండవచ్చు.

ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా అర్జెంటీనా, బ్రెజిల్‌లో ఇటీవల పెద్ద ఎత్తున అక్కడి మితవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జనం తిరిగి వీధులలోకి వస్తున్నారు. అందువలన ఇప్పటికీ అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులుగానీ, అధికారం కోల్పోయిన దేశాల్లోని శక్తులుగానీ నయావుదారవాద మూలాలను దెబ్బతీసి దోపిడీ నుంచి కార్మికవర్గాన్ని కాపాడే ప్రత్యామ్నాయ అర్ధిక విధానాలకు రూపకల్పన చేసి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనటం తప్ప మరొక దగ్గర మార్గం కనిపించటం లేదు. గత రెండు దశాబ్దాలలో సాధించిన విజయాలు,తాజాగా ఎదురవుతున్న అపజయాలను సమీక్షించుకొని ముందుకు ఎలా పోవాలా అన్న మధనం ఇప్పటికే అక్కడి వామపక్ష శక్తులలో ప్రారంభమైంది. నయా వుదారవాద పునాదులపై నిర్మించిన వ్యవస్ధలను కూల్చకుండా ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేయలేమని తేలిపోయింది. ప్రపంచ సోషలిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన సమయంలోనే లాటిన్‌ అమెరికాలో అరుణపతాక రెపరెపలు ప్రారంభమయ్యాయి. సోషలిస్టు శిబిరానికి తగిలిన ఎదురుదెబ్బల కంటే ప్రస్తుతం లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న ఓటములు పెద్దవేమీ కాదు. ఇప్పటికే వెనెజులాలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా దేశాలలో కూడా ఆ క్రమం అనివార్యం. కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ వూహించినట్లుగా తమకాలంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవం సంభవించలేదు. అనూహ్యంగా ఇతర చోట్ల వచ్చింది. లాటిన్‌ అమెరికాలో తదుపరి దశ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు, కార్పొరేట్‌, మితవాద శక్తుల పునాదులను కూల్చివేయటమే కనుక వాటి నుంచి ప్రతిఘటన గతం కంటే తీవ్రంగా వుంటుంది. ఆ పరిణామాలు ఎలా వుంటాయన్నది జోశ్యం చెప్పే అంశం కాదు.చుంచెలుక భూమిలో నిరంతరం తవ్వుతూ అప్పుడప్పుడు బయటికి కనిపించినట్లుగా విప్లవ క్రమం అంతర్గతంగా నిరంతరం జరుగుతూనే వుంటుంది. అది ఎప్పుడు, ఎలా,ఎక్కడ బయటకు వస్తుందో చెప్పలేము.

లోక్‌సభ ముందస్తు ఎన్నికలను ముందుకు తెచ్చే గుజరాత్‌ విజయం ?

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎలాగైతేనేం అక్కడ మా మోడీ విజయం సాధించాడా లేదా అని బుర్రలో గాక మరెక్కడో మెదళ్లున్నవారు చేసే వాదనలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అలాంటి అలగా తరగతి ఎప్పుడూ అన్ని పాలకవర్గ పార్టీల వెనుకా వుంటుంది. ఇలాంటి వారు నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే శక్తులకు వుత్తేజమిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి బ్యాంకు ఖాతాల్లో తలా పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో జనాన్ని నమ్మించారు. ఇదేమిటయ్యా అమిత్‌ షా అని ఎన్నికల తరువాత అడిగితే ఎన్నికల జుమ్లా , ఓట్ల కోసం అనేకం చెబుతుంటాం అని చిరునవ్వు నవ్వేశాడు. గుజరాత్‌లో ఈసారి తమకు 150 సీట్లు వస్తాయని ఆ పెద్దమనిషే ప్రచారం చేశాడు. అవెక్కడ అంటే జుమ్లా అని మరోసారి నవ్వేస్తారు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని గంటల పాటు బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

సంఘపరివార్‌ ప్రయోగశాల గుజరాత్‌. గత రెండు దశాబ్దాలుగా మైనారిటీల వ్యతిరేక, మెజారిటీ అనుకూల మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును తయారు చేసేందుకు అది చేయని అవాంచనీయ చర్యలు లేవు.అలాంటి చోట కూడా బిజెపి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా స్వల్పమెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. సమగ్ర విశ్లేషణలకు సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి వుంది. పూర్తిగా పట్టణ లేదా లేదా అత్యధిక భాగం పట్టణ ఓటర్లున్న 53 నియోజకవర్గాలలో బిజెపి 45చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 129 గ్రామీణ నియోజకవర్గాలలో 72 చోట్ల గెలిచింది. మతోన్మాదం పట్టణాలలో ఎక్కినంతగా గ్రామీణంలో ఎక్కదని, ఎక్కినా వ్యవసాయ సంక్షోభంలో తమకు మతం వండి వార్చేదేమీ వుండదని గ్రామీణులు గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక మంచి సంకేతం. పట్టణ ప్రాంతాలలో కూడా బిజెపి సీట్లు తెచ్చుకున్నప్పటికీ దాని ఓట్లు 2014తో పోల్చితే పదకొండు శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం కూడా బిజెపి ఆందోళన కలిగించేదే. మొత్తం మీద చూసినపుడు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే బిజెపి ఓట్లు 10.2 నుంచి 10.9 మధ్య తగ్గగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓట్లు 6.2 నుంచి 10.8శాతం వరకు పెరిగాయి. అంటే బిజెపికి తగ్గిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కు పడలేదు.

ఒక నమూనా రాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకున్న చోటే నరేంద్రమోడీ ఆ విషయం మినహా మిగతా విషయాలన్నీ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నేత నీచ్‌ కిసామ్‌కా ఆద్మీ( నీచపు పనులు చేసే వ్యక్తి) అని చేసిన వ్యాఖ్యకు కాళిదాసు కవిత్వానికి తన పైత్యాన్ని జోడించినట్లుగా గుజరాత్‌లో అత్యధికంగా చదివే గుజరాత్‌ సమాచార్‌ పత్రిక ‘మోడీ నీచ్‌ జాతినో మానాస్‌ ఛే (ఒక తక్కువ కులంలో పుట్టిన మోడీ) అన్నట్లుగా కులాన్ని, మోడీ పేరును జతచేసి మొదటి పేజీలో సంచలనాత్మకంగా ప్రకటించి చివరి క్షణంలో బిజెపికి మేలు చేసింది. కీలక సమయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించగలదో ఈ ఎన్నికలు నిరూపించాయి. బిజెపి, మోడీ మీద కోపంతో ఓటర్లు మరొక ప్రత్యామ్నాయం లేదు కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు తప్ప నిజానికి కాంగ్రెస్‌ మీద అభిమానం కలగటానికి ఒక ప్రతిపక్షంగా గత రెండు దశాబ్దాలలో అక్కడ అది చేసిందేమీ లేదు. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది చర్చనీయాంశంగా ముందుకు వస్తోంది.

బిజెపికి పోటీగా మరో పార్టీలేని చోట్ల తమవైపు తిరిగి ఓటర్లు మొగ్గుతారని కాంగ్రెస్‌లో ఆశలు రేగుతాయి. అనేక పార్టీలున్న చోట్ల ఎవరికి వారే తామే ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న చోట్ల ఆప్‌, బిఎస్‌పి వంటి పార్టీలు దెబ్బతింటాయి. ఓటర్లు తమకు ఇష్టం వున్నా లేకపోయినా బిజెపిపై తలెత్తిన అసంతృప్తితో నిఖరంగా ఆ పార్టీని ఓడించగల శక్తివైపే మొగ్గు చూపవచ్చు.ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట్ల కాంగ్రెస్‌ పరిస్ధితి ఇప్పుడున్న మాదిరే వుండవచ్చు లేదా దిగజారవచ్చు. అటు కాంగ్రెస్‌ లేదా బిజెపి బలంగా లేని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల ఇప్పటి వరకు బిజెపితో అంటకాగిన లేదా బిజెపి పంచన చేరాలని చూస్తున్న పార్టీలలో పునరాలోచన మరింత తీవ్రంగా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీలను మింగి తాను ఎదగాలని బిజెపి చూస్తున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల గుజరాత్‌ ఫలితాలు బిజెపిని ఇరుకున పెడతాయి.శివసేన, తెలుగుదేశం వంటి పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగుతాయి, సమయం వచ్చినపుడు, వాటంగా వుంటే బిజెపిని వదలిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తాను బలపడేందుకు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏది వాటంగా వుంటే దానితో వుండేందుకు గల అవకాశాలను చూస్తున్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నిరాకరించిన బిజెపి దాని కంటే మెరుగైన ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బిజెపి ఎవరి నాటకాన్ని వారు బాగారక్తి కట్టిస్తున్నారు. ఒక వేళ బిజెపి తో తెగతెంపులు చేసుకొంటే రాష్ట్రానికి బిజెపి చేసిన ఈ ద్రోహాలను జనం ముందు పెట్టి తెలుగుదేశం ఒంటి కంటితో( ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రకారం మరో కన్ను తెలంగాణా కనుక ఆయనకు మిగిలింది మరొకటి మాత్రమే అనే అవగాహనతో) ఏకధారగా నీరు గార్చి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే గుజరాత్‌ ఫలితాలు జగన్‌లో ముఖ్యమంత్రి పీఠంపై మరింతగా ఆశలు పెంచవచ్చు. ఒక ప్రతిపక్షంగా విఫలమైనప్పటికీ గుజరాత్‌ ఓటర్లు బిజెపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రధాన ప్రతిపక్షం తామే గనుక తమ మీద ఇష్టం వున్నా లేకపోయినా చంద్రబాబు మీద వ్యతిరేకతతో జనం ఓట్లు వేస్తారనే ఆశలు కలగవచ్చు.

ఇక బిజెపి విషయానికి వస్తే అన్ని పార్టీల కంటే గుజరాత్‌లో గెలిచిన సంతోషం కంటే దాని పర్యవసానాల గురించి ఆందోళన పెరగటం ఖాయం. పార్టీలో నరేంద్రమోడీ ఏకపక్ష వైఖరితో ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శక్తులు మరింతగా దాడిని పెంచుతాయా లేక మొదటికే మోసం వస్తే ఎలా అని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది ఒక అంశం. అధికారమే పరమావధిగా వుండే పాలకపార్టీలలో అత్యధిక సందర్భాలలో బాధితులు రాజీపడిన సందర్భాలు తక్కువ. గ్రామీణుల ఆదాయాలను రెట్టింపు చేసి అదనంగా అన్న వస్త్రాలను అంద చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ విధానాలు వున్న వస్త్రాలను కూడా లాగివేస్తున్నాయి. లోకసభ ఎన్నికల నిర్దిష్ట గడువు వరకు పరిస్ధితి ఇలాగే వుంటే పట్టణ ప్రాంతాలతో పాటు అంతకంటే ఎక్కువగా గ్రామీణంలో బిజెపి వ్యతిరేకత పెరగటం అనివార్యం.

బిజెపి లేదా కాంగ్రెస్‌ గానీ ప్రజావ్యతిరేక, ద్రవ్యపెట్టుబడిదారీ అనుకూల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యసంస్ధ ఆదేశిత విధానాల అమలులో తక్షణమే వెనక్కు తిరిగి రాలేనంతగా కూరుకుపోయాయి. వాటిని మరింత వేగంగా, ఎక్కువగా అమలు జరపాలనే వత్తిడి పెరుగుతోంది. అదే జరిగితే గ్రామీణ వ్యవస్ధ మరింత తీవ్ర సంక్షోభానికి గురి కావటం అనివార్యం. నరేంద్రమోడీ విషయానికి వస్తే తాను ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే పైన చెప్పుకున్న శక్తుల విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా రూపొందించే సులభతర వాణిజ్య ర్యాంకులో మోడీ సర్కార్‌ ఏకంగా 130 నుంచి వందవ స్ధానానికి ఎగబాకింది. ప్రపంచ ధనిక దేశాలలో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సంక్షోభం 2018లో పదవ సంవత్సరంలో ప్రవేశించనుం ది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో, కనీసం సంక్షోభ పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు వస్తుందో తెలియని స్ధితి. దాని పర్యవసానాలు మన ఆర్ధిక వ్యవస్ధపై బలంగా పడే సమయంలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. గత మూడున్నర సంవత్సరాలలో వుత్పాదక, ఎగుమతి రంగాలలో దిగజారుడు ఆ సంక్షోభపర్యవసానాలే. అయితే చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో దిగుమతుల బిల్లు తగ్గిపోయి జనానికి పెద్దగా నొప్పి కలగలేదు. గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. ఇప్పటికే లీటరుకు పది రూపాయలకు పైగా ధరలు పెరిగాయి, కిరోసిన్‌, గ్యాస్‌ సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి మాదిరే వున్నప్పటికీ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి, దానిని సర్దుబాటు చేసేందుకు వ్యవసాయ రంగానికి, ఇతర సంక్షేమ చర్యలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోత పెట్టటం, లేదా పన్ను భారాలను పెంచటం మినహా మరొక దగ్గరదారి లేదు. వీటన్నింటినీ చూసినపుడు ఏం చేసినా అది మోడీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. అందువలన గడువుకు ముందే ముందస్తున్న ఎన్నికలకు పోతారని గత కొంతకాలంగా వినవస్తున్నది. గుజరాత్‌లో భారీ మెజారిటీతో గెలిస్తే దాన్ని చూపి దేశమంతటా ప్రచారం చేసేందుకు ముందుస్తున్న ఎన్నికలకు పోతారని ముందుగానే పండితులు అంచనాలు వేశారు. ఇప్పుడు గెలిచినా దాన్ని పెద్దగా చెప్పుకొని సంబర పడే స్దితి లేదు.వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘర్‌ బిజెపి పాలితం కాగా కర్ణాటక కాంగ్రెస్‌, త్రిపుర సిపిఎం ఏలుబడిలో వున్నాయి. వాటి ఫలితాలు కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే అది రాజకీయంగా బిజెపికి నష్టం. ఇది కూడా ముందస్తు ఎన్నికలను ముందుకు తెస్తుందనే చెప్పవచ్చు.

పార్లమెంట్‌, రాష్ట్రాలలో నేపాల్‌ కమ్యూనిస్టు ఐక్యకూటమి ఘనవిజయం !

Tags

, , , ,

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో నేపాల్‌ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.ఒక నాడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ప్రకటించిన నేపాల్‌లో అన్ని మతాలకు సమాన గుర్తింపు నిచ్చే లౌకిక, ప్రజాస్వామ్య నూతన రాజ్యాంగం రచనలో కమ్యూనిస్టులు భాగస్వాములు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన స్ధానాలలో మూడింట రెండు వంతులపైగా మెజారిటీ ఇప్పటికే సాధించారు. దామాషా స్ధానాలను కలిపినపుడు కూడా అదే మెజారిటీ పొందే అవకాశాలున్నాయి. కమ్యూనిస్టులే సంపూర్ణ మెజారిటీతో ఏర్పాటు చేసే ప్రభుత్వం నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాతే ఇదే ప్రధమం. నవంబరు 26, డిసెంబరు ఏడవ తేదీన రెండు విడతలుగా 275 సీట్లకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుల విజయం హిమాలయ దేశంపై ఆసక్తి చూపుతున్న అన్ని దేశాలలో ముఖ్యంగా కమ్యూనిస్టులు అధికారానికి రావద్దని కోరుకుంటున్న వారిలో వేడిపుట్టించిందంటే అతిశయోక్తికాదు.

పార్లమెంట్‌లోని 275 స్ధానాలు ఏడు రాష్ట్రా( ప్రాంతాలు)లలో విస్తరించి వున్నాయి. వాటిలో 165 నియోజకవర్గాలకు మనదేశంలో మాదిరి ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి దామాషా పద్దతిలో ఎన్నికలు జరిగాయి.  165కు గాను 116 చోట్ల కమ్యూనిస్టులు విజయం సాధించారు. మొత్తం ఓట్లు లెక్కింపు పూర్తి అయిన తరువాత పదిహేనవ తేదీన దామాషా ప్రాతిపదికన వచ్చిన సీట్లను పార్టీలకు కేటాయిస్తారు. బుధవారం నాటికి జరిగిన లెక్కింపు వివరాల మేరకు దామాషా ఓట్లలో నేపాలీ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ 35.35శాతం ఓట్లతో ముందుండగా నేపాలీ కాంగ్రెస్‌ 33.62శాతంతో రెండవ స్ధానంలో, 13.63 శాతంతొ మావోయిస్టు సెంటర్‌ మూడవ స్ధానంలో కొనసాగుతోంది. మరో మూడు పార్టీలు సాధించాల్సిన కనీస మూడుశాతం కంటే ఎక్కువ తెచ్చుకొని దామాషా సీట్లలో ప్రాతినిధ్యం పొందనున్నాయి. మొత్తం స్ధానాలలో 33శాతం మహిళలకు కేటాయించారు. ఏడు ప్రాంతాల శాసనసభకు జరిగిన ఎన్నికలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ అభ్యర్ధులు ఆరు చోట్ల మెజారిటీలో వున్నారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. రాష్ట్రాల శాసన సభలలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల స్ధానాలలో యుఎంఎల్‌ 166,మావోయిస్టు సెంటర్‌ 73, నేపాలీ కాంగ్రెస్‌ 45, ఇతర పార్టీలు 45 తెచ్చుకున్నాయి. దామాషా సీట్లకు గాను నమోదైన పార్టీలు కనీసంగా ప్రతి రాష్ట్రంలో 1.5శాతం ఓట్లు తెచ్చుకుంటే ప్రాతినిధ్యం పొందుతాయి.

మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండ

తమ కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందనే విశ్వాసాన్ని ఎన్నికల ముందు వ్యక్తపరచిన యుఎంఎల్‌ నాయకుడు కెపి శర్మ ఓలీ మాటలను అతిశయోక్తిగా వర్ణిస్తూ మహా అయితే స్వల్ప మెజారిటీ సాధించవచ్చునేమో అని అనేక మంది కొట్టిపారేశారు. మావోయిస్టులు అధికారంలో కొనసాగుతూనే ప్రతిపక్షంలో వున్న యుఎంఎల్‌ పార్టీతో అవగాహనకు రావటంపై సహజంగానే వుభయ పార్టీలలో కొంత అసంతృప్తి రేపింది. సీట్లు కోల్పోయిన వారు, రాని వారు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తారేమోనని సందేహించారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహనను దెబ్బతీసేందుకు మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండకు చివరి క్షణంలో నేపాలీ కాంగ్రెస్‌నేతలు ప్రధాని పదవిని ఎరవేసినా ఆశ్చర్యం లేదని కొందరు వూహించారు. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కమ్యూనిస్టులు విజయకేతనం ఎగుర వేశారు. మూడింట రెండువంతుల కంటే ఎక్కువగా సీట్లను పొందారు.

అక్టోబరు రెండవ తేదీన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌) నేపాలీ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60:40 దామాషా పద్దతిలో రెండు పార్టీలు పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీల ఐక్యతా క్రమాన్ని ప్రారంభిస్తారు. యుఎంఎల్‌ పార్టీ 80, మావోయిస్టు సెంటర్‌ 36 సీట్లు గెలుచుకుంది. రద్దయిన పార్లమెంటులో పెద్ద పార్టీగా వున్న నేపాలి కాంగ్రెస్‌కు 23, ఇతర పార్టీలకు 26 సీట్లు వచ్చాయి. మావోయిస్టు సెంటర్‌ నుంచి విడిపోయి నయాశక్తి పార్టీ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ని తమ గుర్తుపై పోటీ చేసేందుకు మావోయిస్టు సెంటర్‌ నిరాకరించింది. దాంతో ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చి పార్లమెంటుసీటులో విజయం గెలిచారు. వచ్చిన వార్తలను బట్టి యుఎంఎల్‌ పార్టీ అధ్యక్షుడు కెపి శర్మ ఓలి ప్రధానిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేపాల్‌ నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 30 రోజుల లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. ఎన్నికల తరువాత రెండు పార్టీల విలీనం జ రుగుతుందని గతంలో ప్రకటించారు.

. రాచరిక వ్యవస్ధ అంతరించిన తరువాత నేపాల్‌ రాజకీయ అవనికపై నేపాలీ కాంగ్రెస్‌, యుఎంఎల్‌, మావోయిస్టు సెంటర్లే ప్రధాన పాత్ర పోషించాయి. వాటి మధ్యే సంకీర్ణ కూటమి అవగాహనలు కుదిరాయి, ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి, విడిపోయాయి. అందువలన వైఫల్యాలకు మూడు పార్టీలను బాధ్యులను చేయాల్సి వుంటుంది. అసలే పేద దేశం దానికి తోడు దశాబ్దాల పాటు ఫూడల్‌ రాచరిక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం, ఎలాంటి అభివృద్ధి లేని దేశంలో రాచరికానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం సాగిన అంతర్యుద్ధం, అది ముందుకు తెచ్చిన అంశాలు, వేర్పాటు వాదం వంటి సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి.చైనాతో సన్నిహిత సంబంధాలతో పాటు ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్న కారణంగానే జలవిద్యుత్‌ ప్రాజక్టుల వంటివి ఆలశ్యమయ్యాయని విమర్శకులు ఆరోపించారు. అదే సమయంలో నేపాలీ కాంగ్రెస్‌కు గతంలో భారత్‌తో వున్న సంబంధాల కారణంగా భారత్‌తో స్నేహంగా వుండాలనే వైపు మొగ్గు చూపారని కూడా విశ్లేషకులు పేర్కొన్నారు.

రాచరిక వ్యవస్ధ కూలిపోయిన తరువాత ఏర్పడిన అనేక సంకీర్ణ ప్రభుత్వాలు, భాగస్వామ్య పక్షాల మధ్య తలెత్తిన సమస్యలు, నూతన రాజ్యాంగంపై ఏర్పడిన ప్రతిష్ఠంభన, కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత వ్యక్తం కావటం, ఇరుగు పొరుగు దేశాలజోక్యం, ప్రభావం,పేదరికం, దారిద్య్రం, ప్రజల ఆకాంక్షల వంటి అనేక సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి. ఈ పూర్వరంగంలో నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగటమే ఒక ముఖ్యాంశంగా చెప్పాల్సి వుంటుంది. రిపబ్లికన్‌, ఫెడరల్‌ లక్షణాలతో కూడిన నూతన రాజ్యాంగాన్ని 2015 సెప్టెంబరులో ఆమోదించారు. 2018జనవరిలోగా కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్నది ఆదేశం. రద్దయిన పార్లమెంట్‌లో అధికార కూటమిలో వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) ప్రధాన ప్రతిపక్షంగా వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌)తో అవగాహనకు రావటం దేశ రాజకీయాలలో నూతన వుత్తేజాన్ని నింపటంతో పాటు ప్రజామోదం పొందినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.

ఎన్నికలకు ముందు నేపాల్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు సంభవించాయి. నేపాలీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో మావోయిస్టు సెంటర్‌ భాగస్వామి. దాని మంత్రులు రాజీనామా చేయకుండానే ప్రతిపక్ష యుఎంఎల్‌ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. దీంతో నేపాలీ కాంగ్రెస్‌ దేశంలోని కమ్యూనిస్టేతర పార్టీలన్నింటినీ ప్రభుత్వంలోకి ఆహ్వానించటమే గాక కొత్త మంత్రులను కొందరిని చేర్చుకొని వారికి మావోయిస్టు మంత్రుల శాఖలను కేటాయించారు. రాచరిక వ్యవస్ధను సమర్ధించే రాష్ట్రీయ ప్రజాతంత్రపార్టీ, మధేశీపార్టీల వంటి వాటిని చేరదీశారు. అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా వాటి మధ్య ఐక్యత కానరాలేదు. మధేశీ పార్టీలలో ఒకటైన ఎన్‌డిఎఫ్‌ మాత్రమే నేపాలీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఎన్నికల ప్రచార తీరు తెన్నులను చూస్తే కమ్యూనిజమా లేక ప్రజాస్వామ్యమా అన్న పద్దతిలో మార్చివేసిన కమ్యూనిస్టేతర పార్టీలు దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టచూశాయి. ఇదే సమయంలో ఎన్నికలను విచ్చిన్నం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అసంతృప్తి చెందిన మావోయిస్టులు, ఇతరులు కొందరు కొన్ని చోట్ల బాంబుల దాడులు కూడా జరిపారు. కొన్ని చోట్ల సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. మొత్తం మీద ఎన్నికలు జరగటం ఒక విశేషంగానే పరిశీలకులకు కనిపించింది.

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ప్రజలు మా కార్యక్రమాన్ని ఆమోదించారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అభివృద్ధికోసం ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోతాం, దేశాభివృద్ధికి ఏకాభిప్రాయం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇతర శక్తులను విమర్శించే లేదా నిందించే రోజులు పోయాయి, ఇప్పుడు దేశం స్ధిరత్వాన్ని చూడనుంది, మేం అభివృద్ధి గురించి తప్ప రాజకీయాలు మాట్లాడబోం అన్నారు.పార్లమెంటరీ మెజారిటీ సాధించటంతోనే స్ధిరత్వం రాదని అభివృద్ధి, సంపదల సృష్టికి నేతలు సుముఖత చూపితేనే సాధ్యమని చెప్పారు.

ఎన్నికల తరువాత దేశం రాజకీయ స్ధిరత్వం మరియు అభివృద్ధి బాటలో ప్రవేశించిందని మావోయిస్టు సెంటర్‌ అధ్యక్షుడు పుష్ప కమాల్‌ దహాల్‌( ప్రచండ) వ్యాఖ్యానించారు.చిటవాన్‌ మూడవ నంబరు పార్లమెంటరీ స్ధానం నుంచి విజయం సాధించిన సందర్భంగా ఎన్నికల సంఘ అధికారి ధృవీకరణ పత్రం అందచేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రచండ పాల్గన్నారు. దేశం ఇంకేమాత్రం గందరగోళ పరిస్ధితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వామపక్ష కూటమికి ప్రజలిచ్చిన బాధ్యతను వమ్ముకానివ్వబోమని చెప్పారు. ఈ విజయం ప్రపంచవ్యాపితంగా వివిధ కారణాలతో నీరసపడి వున్న పురోగామివాదులు, కమ్యూనిస్టులలో ఎంతో వుత్సాహాన్ని నింపుతుందని వేరే చెప్పనవసరం లేదు.

అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా-హొండురాస్‌లో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటాన్ని అంగీకరించబోమన్న హొండురాన్లపై పాలకులు వుక్కుపాదాన్ని మోపేందుకు పూనుకున్నారు. దేశమంతటా పది రోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించి రక్తాన్ని కండ్ల చూస్తున్నారు. తెలియందేముంది, మేమున్నాం అంటూ సకల అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇచ్చే అమెరికన్లు తాజా దుండగానికీ మద్దతు ఇస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటి వరకు 11మంది మరణించినట్లు మానవహక్కుల సంఘం ప్రకటించింది. మరోవైపు పోలీసు బలగాలు తాము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదని తిరుగుబాటును ప్రకటించాయి. కర్ఫ్యూను వుల్లంఘించి ప్రదర్శనలు జరుపుతున్న వారిపై బల ప్రయోగానికి నిరాకరించాయి. ప్రదర్శనల్లో పాల్గొన్నవారిని సురక్షితంగా ఇండ్లకు చేర్చేందుకు ముందుకు వస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు కూడా ప్రదర్శకులతో కలసి అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దక్షిణ అమెరికా ఖండంలోని మధ్య అమెరికాగా పిలిచే కరీబియన్‌ దేశాలలో ఒకటైన హొండురాస్‌కు ఈశాన్యంలో నికరాగువా, నైరుతిలో ఎల్‌ సాల్వెడార్‌, పశ్చిమాన గౌతమాలా, దక్షిణాన పసిఫిక్‌, వుత్తరాన కరీబియన్‌ సముద్రాల మధ్యలో తొంభైలక్షల మంది జనాభా వున్న దేశమది.నవంబరు 26న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు మితవాది జువాన్‌ ఆర్లొండో హెర్నాండెజ్‌ తిరిగి ఎన్నికౌతాడని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా విజయం సాధించే దిశగా వున్నట్లు ఓట్ల లెక్కింపు సరళి వెల్లడించింది. పోలైన ఓట్లలో 58శాతం లెక్కించిన సమయానికి ఐదుశాతం మెజారిటీతో నసరల్లా ముందున్నారు. అయితే సాంకేతిక కారణాలు చూపి ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. రెండు రోజుల తరువాత ప్రారంభించగా నాటకీయంగా నసరల్లా మెజారిటీ తగ్గిపోయి హెర్నాండెజ్‌ స్వల్పమెజారిటీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయగానే ఓటర్ల తీర్పును వమ్ము చేయనున్నారని గ్రహించిన నసరల్లా ఎన్నికలలో తాను గెలిచానని, తీర్పును వమ్ముచేసేందుకు పూనుకున్నందున నిరసన తెలపాలని తన మద్దతదార్లకు పిలుపునిచ్చారు.

టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా

ఇదే సమయంలోే ఎన్నికల పరిశీలకురాలిగా వున్న అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) హొండూరాస్‌ ప్రతినిధి బృందం నాయకుడు జార్జ్‌ క్విరోగా ఒక ప్రకటన చేస్తూ ఓట్ల లెక్కింపులో అక్రమాలు, తప్పిదాలు, వ్యవస్ధా పరమైన సమస్యలున్నందున ఫలితాన్ని గురించి చెప్పలేమని, తిరిగి లెక్కింపు జరపాలని ప్రకటించారు. ఈ పూర్వరంగంలో అనుమానాలున్న వెయ్యి పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి లెక్కించిన తరువాత మొత్తం 99.98శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని, హెర్నాండెజ్‌ 42.98, నసరల్లా 41.39 శాతం చొప్పున పొందినట్లు సోమవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అయితే విజేత ప్రకటన చేయలేదు. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రకటించి ఈ ఓట్ల లెక్కింపు తతంగం జరిపారు. తాజా ఓటింగ్‌ ఫలితాన్ని ప్రకటించకముందే వాటిని తాము అంగీకరించేది లేదని అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి పార్టీల ప్రతినిధుల, పరిశీలకుల సమక్షంలో జరపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాపితంగా జనం ప్రదర్శనలకు దిగారు. భద్రతా దళాలు వారిపై భాష్పవాయు, నీటి ఫిరంగులను ప్రయోగించాయి.కొన్ని చోట్ల కాల్పులు జరిపాయి. దేశంలోని మొత్తం 5,179 పోలింగ్‌ బూత్‌ల ఓట్లను తిరిగి లెక్కించాలని, లేనట్లయితే నిరసన తెలుపుతామని నసరల్లా నాయకత్వంలోని అలయన్స్‌ పార్టీ ప్రకటించింది.

రాజధాని టెగు(టెగుసియాగల్పా)తో సహా ఎక్కడా పోలీసులు ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన కర్ఫ్యూ ఆజ్ఞలను అమలు జరపరని, రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాము యూనిట్లకే పరిమితం అవుతామని పోలీసు ప్రతినిధి ప్రకటించారు.’ మాకు రాజకీయ సిద్ధాంతాలు లేవు, మేము శాంతిని కోరుకుంటున్నాము, మేము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదు, ఈ విషయంలో మేము అలసిపోయాము.మేము జనంతో ఘర్షణ కొనసాగించలేము, అణచివేతను కోరుకోవటం లేదు, దేశ ప్రజల మానవహక్కులను వుల్లంఘించజాలం’ అని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ప్రతినిధి ప్ర కటించాడు. అంతకు ముందు కొట్లాటల నిరోధ కోబ్రా దళ సభ్యుడు మాట్లాడుతూ ‘ఇదేమీ సమ్మె కాదు, వేతనాలు లేదా డబ్బు గురించి కాదు, మా విధి దేశ ప్రజలకు శాంతి, భద్రత కల్పించటం, వారిని అణచివేయటం కాదు, దేశ ప్రజలందరూ సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ ప్రకటనల పరంపర కొనసాగుతుండగానే మరో పోలీసు ప్రతినిధి ఒక టీవీలో మాట్లాడుతూ కొంత మంది పోలీసులు నిరాహారదీక్షకు పూనుకుంటారని ప్రకటించారు. ‘మేము మానవహక్కుల వుల్లంఘనలో భాగస్వాముల కాబోం, మేమా పని చేస్తే త్వరలోనో తరువాతో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది. వాస్తవానికి గతంలో మా వున్నతాధికారుల హక్కుల వుల్లంఘన కారణంగా మేము ఇప్పటికే పరిహారం చెల్లిస్తున్నాము.యూనిఫాంలో వున్న సిబ్బంది మెరుగైన పని పరిస్ధితులు వుండాలని కోరుతున్నారు, వాటిని మా డిప్యూటీ డైరెక్టర్‌ తిరస్కరించారు. మాకు కావాల్సింది యజమానులు కాదు, నాయకులు, మా కమిషనర్‌ నాయకుల కోవకు చెందుతారు. వీధులలో గస్తీ తిరిగే సిబ్బందికి నిరాకరించి అనుబంధంగా వుండే వారికి మాత్రమే వేతనాలు ఎందుకు పెంచారు.ఇది సరైనది కాదు. అని చెబుతూ తమ డిమాండ్లు ఇవి అని టీవీలో ఒక ప్రకటన చదివారు. మరోవైపు భద్రతా దళాలు అనేక మంది విదేశీ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని స్వదేశాకు పంపివేయటం ప్రారంభించాయి.

ఇదిలా వుండగా హొండురాస్‌లో ఎన్నికల కమిషన్‌ క్రమపద్దతిలో ఓట్ల లెక్కింపు జరిపిందని అమెరికా వున్నతాధికారి ఒకరు కితాబునిచ్చారు.హెర్నాండెజ్‌ అమెరికాకు అత్యంత సన్నిహితుడు. ఈక్రమంలోనే అతగాడిని రక్షించేందుకు పూనుకుంది.హొండురాస్‌ సర్కార్‌ అవినీతి వ్యతిరేకత పోరాటం, మానవ హక్కుల పరిరక్షణకు మద్దతు ఇస్తోందంటూ అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రక ప్రకటనలో పేర్కొన్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఇలాంటి శక్తులకు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం. లాటిన్‌ అమెరికాలో నియంతలకు వ్యతిరేకంగా అనేక దేశాలలో పోరాడిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటాన్ని అమెరికా తొలి రోజుల్లో అడ్డుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో చట్టబద్దమైన కుట్రలకు తెరతీసి అనేక దేశాలలో మితవాదులకు పెద్దపీట వేసి తన మద్దతుదార్లుగా మారుస్తున్నది. హొండురాస్‌లో కూడా అదే పునరావృతం అవుతోంది.

అటు వుత్తర అమెరికా ఖండానికి ఇటు దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో కీలకమైన ప్రాంతంలో వున్న హొండూరాస్‌లో ప్రజాస్వామ్యం ఒక మేడి పండు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగంలోని ప్రతి వ్యవస్ధ ఆమోద ముద్రవేయాల్సిందే. అది నందంటే నంది పందంటే పంది. రాజ్యాంగాన్ని సవరించటం అన్నది అప్రజాస్వామికమని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు.2009లో నాటి అధ్యక్షుడు మాన్యువల్‌ జెలయా రాజ్యాంగసవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపటం రాజ్యాంగ బద్దమేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసింది తప్ప రాజ్యాంగ సవరణ రాజ్యాంగ బద్దమా కాదా అన్న విషయం చెప్పలేదు. ఈ లోగా పార్లమెంట్‌, అటార్నీ జనరల్‌, ఎన్నికల సంఘం జెలయా నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాయి.వాటిని ఖాతరు చేయని జెలయా బ్యాలట్‌ పత్రాలు, బాక్సులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలని జారీ చేసిన ఆదేశాన్ని మిలిటరీ అధిపతి తిరస్కరించాడు. ఈ సమయంలో తమ ఆదేశాన్ని పాటించలేదనే పేరుతో జెలయాను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మిలిటరీ ఆయనను నిదుర మంచం మీద నుంచి తీసుకు పోయి పక్కనే వున్న కోస్టారికా దేశంలో విడిచి వచ్చింది. ఒక దేశ పౌరుడిని మరొక దేశంలో అక్రమంగా వదలి రావటం ఏ చట్టం ప్రకారం సమర్ధనీయమో, మిలిటరీ చేసిన పని తప్పోకాదో కూడా సుప్రీం కోర్టు విచారించలేదంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో చూడవచ్చు. జెలయా, కుటుంబ సభ్యులు కోస్టారికా నుంచి బయలు దేరి రహస్యంగా కాలినడకన తిరిగి హొండూరాస్‌ చేరుకొని బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. తరువాత ఆయన మీద కేసులు ఎత్తివేసి దేశంలో కొనసాగనిచ్చారు.

రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి పదవీ బాధ్యతలలో వున్న తరువాత రెండసారి అధ్యక్షపదవికి పోటీ చేయటానికి అర్హత లేదు. ఆ రీత్యా చూసినపుడు తాజా ఎన్నికలలో అధికారంలో వున్న అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పోటీ చేయటానికి లేదు.అయినా కేంద్ర ఎన్నికల సంఘం మూడింట రెండు ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలపటంతో పోటీ చేసినా సుప్రీం కోర్టు, ఇతర రాజ్యాంగ సంస్ధలు నోరు మెదపలేదు. అనుకున్నదొకటీ అయింది ఒకటి అన్నట్లుగా సులభంగా విజయం సాధిస్తాడని అనుకున్న హెర్నాండెజ్‌ వెనుకబడటంతో ఆయన నియమించిన ఎన్నికల సంఘం సాంకేతిక సమస్యలు తలెత్తాయనే సాకు చూపి ఓట్ల లెక్కింపును రెండు రోజుల పాటు నిలిపివేసి మెజారిటీతో వున్న ప్రతిపక్ష అభ్యర్ధికంటే హెర్నాండెజ్‌కు స్వల్ప మెజార్టీ వచ్చిందని ప్రకటించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది. ప్రస్తుతం మెజారిటీ ఓట్లు సాధించి విజయం సాధించిన ప్రతిపక్ష అభ్యర్ధి జర్నలిస్టు అయిన సాల్వెడార్‌ నసరల్లా ఓ ప్రజాస్వామికవాది, గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజామద్దతు పొందిన వ్యక్తి. ఆయనను మాజీ అధ్యక్షుడు, వామపక్షాలతో సహా పురోగామి పార్టీలు, శక్తులు బలపరిచాయి. నసరుల్లాకు వున్న అనర్హత ఏమంటే అమెరికాకు బంటుగా పనిచేస్తాడనే హమీ లేకపోవటమే. అందుకే ఓట్ల లెక్కింపు మధ్యలోనే ఫలితాన్ని తారుమారు చేశారు. అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా ?ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినందున మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలి లేదా ఎన్నికను రద్దు చేసి తిరిగి జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధి సాల్వెడార్‌ నసరల్లా డిమాండ్‌ చేశారు. గురు, శుక్రవారాలలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎన్నికను తొత్తడం గావించి, మరింతగా అణచివేతకు పూనుకుంటే పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.

జర్మనీలో అనిశ్చితిపై ఐరోపాలో ఆందోళన !

Tags

, , ,

Image result for germany political uncertainty

ఎం కోటేశ్వరరావు

జర్మనీ, ఐరోపాయూనియన్‌ అనే ఒక రైలు బండికి ఇంజను వంటిది. గత రెండు నెలలుగా అది ఆగిపోయి ముందుకు కదలటం లేదు. దాన్ని తిరిగి ఎలా నడుపుతారో ప్రస్తుతానికైతే తోచటం లేదు. బండి ప్రయాణించకపోతే జర్మన్లకే కాదు, మొత్తం ఐరోపా ప్రయాణీకులందరికీ ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కొందరు విశ్లేషకులు పేర్కొన్నట్లు జర్మనీ రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎరుగనంత రాజకీయ అనిశ్చితి, సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా పచ్చిమితవాదులు పన్నెండుశాతంపైగా ఓట్లతో మూడవ పెద్ద పార్టీగా పార్లమెంటులో ప్రవేశించారు. క్రిస్మస్‌ నాటికి ఒక కొలిక్కి రానట్లయితే మహాసంఘటన చర్చలు విఫలమైనట్లుగా భావించాలని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ తరువాతే మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుంది. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక తన రాజకీయ సంక్షోభాన్ని జర్మనీ ఎలా పరిష్కరించుకుంటుందనేదే ఆసక్తికరం. మొత్తం ఐరోపా పధకాలే గందరగోళంలో పడతాయని బ్రస్సెల్స్‌(ఐరోపా యూనియను ప్రధాన కేంద్రం) భయంకరమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.ఐరోపా యూనియను సముద్రంలో వుంది, దాన్ని ఆదుకొనే పెద్ద స్నేహితుడు మధ్య ఐరోపాలో మనకు లేడు అంటూ ఐరోపా ప్రపంచం అనే పత్రిక ప్రచురణకర్త చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. అమెరికా ట్రంప్‌ తప్పుడు అంతర్జాతీయ విధానాల ఫలితంగా భద్రత మరియు విదేశీ వ్యవహారాలలో ఐరోపా యూనియను కలసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం వుంది, అందుకు గాను ఇంజను వంటి బలమైన జర్మనీ అవసరం అని భావిస్తున్నారు. అలాంటి జర్మనీలో ప్రభుత్వం ఏర్పడుతుందో లేదో తిరిగి ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని స్ధితి ఏర్పడింది. మరోవైపు యూనియన్‌ నుంచి విడిపోయేందుకు 50బిలియన్‌ పౌండ్లు చెల్లించేందుకు సిద్ధపడి బ్రిటన్‌ తనదారి తాను చూసుకుంటున్నది.ఐరోపా అంతటా పచ్చి మితవాద, నయా ఫాసిస్టు, నాజీ శక్తులు తలెత్తటం ఐరోపా యూనియన్‌ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. సహజంగానే ఈ పరిస్ధితి అమెరికన్లకు సంతోషం కలిగిస్తుంది.

తమ విధానాలకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగిన పెట్టుబడిదారీ కావలి బంట్లలో ఏంజెలా మెర్కెల్‌ ఒకరు. వరుసగా మూడు సార్లు ఛాన్సలర్‌గా ప్రభుత్వాలను నడిపిన ఆమెకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆమె ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు భాగస్వామిగా చేరిన సోషలిస్టులం అనిచెప్పుకొనే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి వెన్నుదన్నుగా వుండే కార్మికులు ఈ ఎన్నికలలో దూరం, కావటం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతి తక్కువ ఓట్లు తెచ్చుకోవటం శరాఘాతం వంటిది. మెర్కెల్‌తో జతకడితే రానున్న రోజుల్లో వున్న ఓట్లుకూడా పోతాయోమోననే భయం ఆ పార్టీని వెన్నాడుతున్నది. అయితే తాజా వార్తలను బట్టి వారు సంకీర్ణ సంప్రదింపులకు తలుపులను పూర్తిగా మూసివేయలేదు. అదే సమయంలో 20శాతం బలంతో వందశాతం డిమాండ్లు పెడితే అంగీకరించేది లేని మెర్కెల్‌ శిబిరం హెచ్చరికలు జారీ చేసింది. ఈ పూర్వరంగంలో ఎవరు ఎంత మేరకు రాజీపడినప్పటికీ కార్మికవర్గానికి జరిగే మేలు ఏమిటన్నది అసలు సమస్య.

ఆల్‌ ఈజ్‌ వెల్‌(అంతా మంచిగా వుంది) అనుకుంటున్న జర్మనీలో ఎన్నికలు అధికార కూటమిని అనూహ్యకుదుపునకు గురిచేశాయి.నిజానికి జర్మనీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక్క వామపక్షపార్టీ తప్ప మిగిలినవన్నీ అవి తెచ్చుకొనే సీట్లను బట్టి, అక్కడి పాలకవర్గ వాంఛలను బట్టి అధికార-ప్రతిపక్ష పాత్రలను పోషిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో 2013లో రెండు పెద్ద పార్టీలైన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(సిడియు), దానితో కలసి వుండే క్రిస్టియన్‌ సోషలిస్టు యూనియన్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా ఎన్నికలలో రెండు పార్టీలకు దిమ్మదిరిగే విధంగా గతంలో ఎన్నడూరానన్ని తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లోని 709 స్థానాలకు గాను మెజారిటీ 355కాగా ఈ మూడు పార్టీలకు 399 వచ్చినప్పటికీ తాము ప్రతిపక్షంలో వుంటామని 143 సీట్లు తెచ్చుకున్న ఎస్‌డిపి ప్రకటించటం జర్మనీలో రాజకీయ అనిశ్చితికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పార్లమెంట్‌కు 18సార్లు ఎన్నికలు జరిగాయి.ఇరవై అయిదు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటిలో అత్యధికం సిడియు, దాని మిత్రపక్ష ప్రభుత్వాలు. ఎస్‌పిడి దాని మిత్రపక్షాలతో కలసి అధికారానికి వచ్చింది. ఈ రెండు పార్టీలు కలసి ఐదుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర వుంది.

ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీతో కలసి మరోసారి అధికారాన్ని పంచుకొనేందుకు తొలి స్పందనగా ససేమిరా అని పేర్కొన్నది. ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం పదవ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. దాని దెబ్బకు ఐరోపాలోని మితవాద పార్టీలతో పాటు సోషలిస్టులుగా వున్నవారు కూడా ఎన్నికలలో చావు దెబ్బలు తింటున్నారు. ఒకసారి అధికారానికి వచ్చిన వారు మరోసారి మట్టికరుస్తున్నారు.జర్మనీలో మితవాద సిడియు, వామపక్షంగా చెప్పుకొనే ఎస్‌డియు రెండూ గత నాలుగు సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా రెండుపార్టీల ఓట్లు, సీట్లు పడిపోయాయి.1998లో గరిష్టంగా 40.9శాతం ఓట్లు తెచ్చుకున్న ఎస్‌పిడి తరువాత అధికారానికి వచ్చి ఇప్పుడు 20.5శాతానికి పడిపోయింది. అందువలన మరోసారి సిడియుతో జతకట్టవద్దని ఆ పార్టీలో పైనుంచి కింది వరకు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఐరోపాలోని మిగతా ధనిక దేశాలతో పోల్చితే జర్మనీ ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగ్గా వున్నప్పటికీ సాంఘిక సంక్షేమ పధకాలకు కోతపెట్టటంలో రెండుపార్టీలు ఏకాభిప్రాయంతో వ్యవహరించాయి. ఈ అసంతృప్తి కార్మికవర్గంలో వుంది. అందుకే వెంటనే తాము ప్రతిపక్షంలో వుంటామని చెప్పింది. అయితే అది కూడా ఒక బూర్జువాపార్టీయే గనుక కార్పొరేట్‌ శక్తుల వత్తిళ్లకు లంగి సంకీర్ణం గురించి చర్చించేందుకు సిద్ధం అంటున్నది.తొలిసారిగా ముస్లిం, వలసకార్మికుల వ్యతిరేక నినాదాలతో ఎన్నికలలో పోటీచేసి మూడవ పెద్ద పార్టీగా ఆవిర్భవించిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని బూచిగా చూపి మరోసారి మెర్కెల్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోలేదు.

పార్లమెంట్‌లోని 709 స్ధానాలకు గాను 299 సీట్లకు ప్రత్యక్ష పద్దతిలో 410 సీట్లకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలు దిగువ విధంగా సీట్లు సంపాదించాయి.(బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికలలో సాధించిన సీట్లు) క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(సిడియు),క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సిఎస్‌యు) 246(311), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) 153(193), జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎడి) 94(కొత్త పార్టీ), ఫ్రీ డెమోక్రటిక్‌ పార్టీ 80(0), వామపక్ష పార్టీ 69(64), గ్రీన్‌ పార్టీ 67(63). మిగతా ఐరోపా దేశాలలో మాదిరే జర్మనీలో కూడా ఈ ఎన్నికలలో తొలిసారిగా పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నా పార్టీ మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష,గ్రీన్‌ పార్టీలు గతం కంటే కొద్దిగా సీట్లు పెంచుకున్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవటంలో విఫలమయ్యాయి.

మెర్కెల్‌ నాయకత్వంలోని సిడియుతో జతకట్టేందుకు ఎస్‌డిపి తిరస్కరించటంతో ఒక సంక్లిష్ట పరిస్ధితి ఏర్పడింది. ఎస్‌పిడి,వామపక్ష,గ్రీన్‌ పార్టీలతో కూటమి ఏర్పడినా మెజారిటీ సాధించే అవకాశం లేదు. సిడియు పరిస్ధితి కూడా అంతే పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని, ఫ్రీడెమోక్రటిక్‌ పార్టీని కలుపుకుంటే తప్ప మెజారిటీ సాధించే పరిస్ధితి లేదు.ఆ మూడు కలిసే అవకాశం లేదు. అయితే జర్మనీ పాలకవర్గం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీల మీద వత్తిడి చేస్తోంది. మరోసారి ఎన్నికలు జరిపినా పరిస్ధితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేకపోగా సిడియు పరిస్ధితి మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్ధితుల్లో ఏకైక పెద్ద పార్టీగా సిడియు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మినహా మరొక మార్గం లేదు. అందుకు సిద్దపడటం కంటే తిరిగి ప్రజాతీర్పు కోరటం మేలనే వైఖరితో మెర్కెల్‌ వున్నారు. అయితే అందుకు ఆ పార్టీనాయకత్వం అంగీకరిస్తుందా, లేక ఆమెను పక్కకు నెట్టి కొత్తనేతతో సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది వచ్చే ఏడాది జనవరిలో గానీ స్పష్టం అయ్యే అవకాశం లేదు.ఎస్‌డిపితో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుమఖత తెలియచేస్తూ సిడియు తీర్మానించింది. మరోవైపు ఎస్‌డిపి యువజన విభాగం కూడా ఒక తీర్మానం చేసి మహా సంఘటన ఏర్పాటుకు ప్రయత్నించటం కంటే ప్రతిపక్షంలోని పార్టీలతో సంకీర్ణానికి ప్రయత్నించాలని తీర్మానించి పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చింది.

దేశ జనాభాలో గణనీయ భాగం 2000 సంవత్సరంలో సంపాదించిన ఆదాయ మొత్తంలో సగం కూడా ఇప్పుడు పొందటం లేదని విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఇటువంటి స్ధితిలో వామపక్షాలు ప్రత్యామ్నాయంగా లేకపోతే జనం పచ్చిమితవాద, నయా ఫాసిస్టు శక్తులవైపు మొగ్గుతారని జర్మనీతో సహా అన్ని ఐరోపా దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. ఇవి వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలకు కూడా మేలుకొలుపు వంటివే. పెట్టుబడిదారీ వ్యవస్ధ జరుపుతున్నదాడులు, నయావుదారవాద విధానాలను నిఖరంగ ఎదిరించే మొనగాళ్లుగా వామపక్షాలు జనానికి కనిపించకపోతే మితవాదులే మెరుగని జనం భావిస్తారు. తాజా ఎన్నికలలో పూర్వపు పశ్చిమ జర్మనీ ప్రాంతంలో వామపక్ష పార్టీ కొంత మేరకు ఓట్లు పెంచుకుందిగానీ, తూర్పు జర్మనీలో ఆరుశాతం కోల్పోయింది, ఆ ఓట్లు ఎడి పార్టీకి పడ్డాయి. స్వల్పంగా ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ మిగతాపార్టీలకంటే తాము భిన్నం అనే గుర్తింపును జనంలో తెచ్చుకోలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో సమతూక బడ్జెట్‌ పేరుతో కోతలకు, రోడ్ల ప్రయివేటీకరణకు అంగీకరించటం వంటి చర్యలు అందుకు నిదర్శనం.

ముగాబే అనంతర జింబాబ్వే పయనమెటు ?

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర జింబాబ్వేలో 37 సంవత్సరాల పాటు తిరుగులేని నేతగా వెలిగిపోయిన రాబర్టు ముగాబే(93) రాజీనామాతో అక్కడ మరో అధ్యాయం మొదలైంది. వుపాధ్యక్షుడిగా వుద్వాసనకు గురైన మాజీ గెరిల్లా నేత ఎమర్సన్‌ మంగాగ్వా(75) నవరబరు 24న దేశాధ్యక్షపదవిని చేపట్టారు. ముగాబే అనంతరం జింబాబ్వే పరిణామాలు ఎలా వుంటాయోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిగిలిపోయిన వలసలు, శ్వేతజాతి మైనారిటీ పాలకుల చేతిలో మగ్గిపోయిన దేశాలలో జింబాబ్వే ఒకటి. జాతీయవాదులుగా, తరువాత మార్క్సిస్టులుగా మారి దేశ విముక్తి కోసం ఆయుధాలు పట్టిన సంస్ధలకు నాయకత్వం వహించిన ముగాబే, మంగాగ్వా వంటి వారు అధికారంలోకి వచ్చిన తరువాత చీలికలు పేలికలై అధికార కుమ్ములాటలలో నిమగ్నం కావటం ఏమిటనే ప్రశ్నలు కొంత మందిలో తలెత్తుతున్నాయి. సుదీర్ఘరాజకీయ, అధికారిక బాధ్యతల్లో వున్న ముగాబే ఏ జనం చేత జేజేలు కొట్టించుకున్నారో వారి చేతే అధికారపు చివరి రోజుల్లో ఛీ ఛీ అనిపించుకోవటం నిజంగా ఒక విషాదమే. ఒక జాతీయవాది, ఒక మార్క్సిస్టు ఇలా దిగజారిపోతే మిగతా నేతలకు వీరికి తేడా ఏమిటి, ఎవరిని చూసి స్ఫూర్తి పొందాలి అనే నిర్వేదం కొంత మందిలో కలగటం సహజం.1924 ఫిబ్రవరి 21న ఒక కార్పెంటర్‌ కుటుంబంలో జన్మించిన ముగాబే విద్యాభాస అనంతరం ఒక టీచర్‌గా 1945లో జీవితం ప్రారంభించారు. టీచర్‌గా వుండగానే దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ హరే విశ్వవిద్యాలయంలో బిఏ చదివేందుకు స్కాలర్‌షిప్పు రావటంతో 1949 నుంచి 52వరకు అక్కడ వున్నారు. ఆ క్రమంలోనే ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుపార్టీలతో సంబంధాలు ఏర్పడ్డాయి. తిరిగి స్వదేశం చేరుకొని టీచర్‌ వృత్తిలో చేరారు.1960దశకం ప్రారంభంలో జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు.1980లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రధానిగా, తరువాత అధ్యక్షుడిగా 37 సంవత్సరాలు పదవిలో వున్నారు.

ఆఫ్రికా ఖండంలో వలసపాలకులకు వ్యతిరేకంగా సాగిన వుద్యమాలలో జాతీయవాదులు,కమ్యూనిస్టులు కలసి పోరాడటం ఒక ప్రత్యేక పరిణామంగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుపార్టీ, కొసాటు(కార్మిక సంఘాల సమాఖ్య) శ్వేతజాతి దురహంకార పాలనకు వ్యతిరేకంగా జరిపిన సమిష్టి పోరాటం ఆ ప్రాంత దేశాల జాతీయోద్యమాలను ఎంతగానో ప్రభావితం చేసింది. 1990దశకం ముందు వరకు( సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేయనంత వరకు) ఒక మార్క్సిస్టు-లెనినిస్టుగా వర్ణించుకున్న ముగాబే తరువాత ఒక సోషలిస్టును అని, తాను అనుసరించే విధానాలను ముగాబేయిజంగా చెప్పుకున్నాడు.పదవి నుంచి దిగిపోయే నాటికి ఒక ప్రజావ్యతిరేకిగా తేలాడు.

ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో అనేక మంది నేతలు ఇలా మారిపోవటం, చరిత్ర చెత్తబుట్టలోకి జారిపోవటం కనిపిస్తుంది. ఈ పరిణామాలను జీర్ణించుకోవటం కాస్త కష్టమే, ఆయా దేశాలలో పురోగామి శక్తులకు నష్టం జరిగినప్పటికీ ఎత్తిన జండా దించని అభ్యుదయగాములు ఎందరో వున్నారు. పరిస్ధితులకు అనుగుణ్యంగా వుద్యమాలు నివురు కప్పిన నిప్పులా వున్నాయి. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో తలెత్తిన మితవాద, అతివాద ధోరణులతో పాటు జాతీయవాద నాయకత్వాలపై నయా వుదారవాద ధోరణుల ప్రభావం వంటి అనేక అంశాలు ముగాబే వంటి వారు దిగజారిపోవటానికి కారణమయ్యాయి. ఏ కారణం, ఎక్కడ ఎంత ప్రభావం చూపిందనేది ఆయా దేశాల నిర్ధిష్ట పరిస్ధితులు, ధోరణులను కూలంకషంగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేము. వుదాహరణకు దక్షిణాఫ్రికా అధికార కూటమిలోని ఎఎన్‌సి, కమ్యూనిస్టుపార్టీ, కార్మిక సంఘాల సమాఖ్యలకు చెందిన వారు ఎఎన్‌సి అభ్యర్ధులుగానే పార్లమెంట్‌కు ఎన్నికవుతున్నారు. జాతీయోద్యమంలో కలసి పని చేసిన శక్తులు స్వాతంత్య్రం రాగానే ఎవరిదుకాణాన్ని వారు ఏర్పాటు చేసుకోవటం చూశాము. కానీ దక్షిణాఫ్రికాలో గత 23 సంవత్సరాలలో జరిగిన ఐదు ఎన్నికలలో కూటమి ఐక్యంగా వుండటం ఒక విశేషం. అయితే అదే దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన సంస్ధలకు కమ్యూనిస్టులు, కాని వారు కూడా నాయకత్వం వహించారు. కమ్యూనిస్టులుగా ముద్రపడిన వారు అనేక మంది అక్కడ కమ్యూనిస్టులతో విబేధించటం చూస్తున్నాము.నెల్సన్‌ మండేలా తరువాత అధ్యక్షుడిగా ఎన్నికైన తాబో ఎంబెకీ, తరువాత ప్రస్తుత అధ్యక్షుడు జాకబ్‌ జుమా కూడా కమ్యూనిస్టులుగా వున్నవారే. కానీ వారిద్దరూ కమ్యూనిస్టు పాలకుల మాదిరి వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం జాకబ్‌ జుమా-కమ్యూనిస్టుపార్టీ మధ్య తీవ్ర విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీ మంత్రి ఒకరిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. జుమాను తొలగించాలని కమ్యూనిస్టుపార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఇదే సమయంలో ఎవరు అధ్యక్షులుగా వున్నప్పటికీ దక్షిణాఫ్రికా పాలక కూటమి మొత్తంగా నయా వుదారవాద విధానాల ప్రభావంలోకి పోయిందనే విమర్శలు కూడా లేకపోలేదు. దక్షిణాఫ్రికా ఎఎన్‌సి నుంచి స్ఫూర్తి పొంది రంగంలోకి వచ్చిన జింబాబ్వే నాయకత్వంలో అలాంటి ఐక్యత కానరాదు, ముగాబేతో విబేధించిన వారిని రాజకీయంగా, ఇతరంగా కూడా అణచివేశారనే విమర్శలు లేకపోలేదు. వీటికితోడు నయావుదారవాద విధానాలతో పూర్తిగా దేశాన్ని సర్వనాశనం చేశారనే విమర్శలు వచ్చాయి.

జింబాబ్వే తాజా పరిణామాలలో చైనా పాత్ర గురించి కొంత మంది కమ్యూనిస్టులుగా చెప్పుకొనే వారు(నక్సల్స్‌) తప్పుడు ప్రచారానికి దిగారు. గతంలో అలాంటి బాపతే సోవియట్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదిగా వర్ణించిన విషయాన్ని మరచిపోరాదు. జింబాబ్వే విముక్తి పోరాటంలో పాల్గన్న శక్తులు, సంస్ధలకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా కూడా ఆయుధాలతో సహా అన్ని రకాల సాయం అందించాయి. 1960దశకంలో ముగాబే నాయకత్వంలోని శక్తులు చైనా సాయం తీసుకున్నాయి, అక్కడ శిక్షణ కూడా పొందాయి. అలాంటి వారిలో ప్రస్తుత అధ్యక్షుడు మంగాగ్వా ఒకరు.రొడీషియాగా పిలిచిన జింబాబ్వేలో శ్వేత జాతి దురహంకారపాలనను శాశ్వతం కావించేందుకు, అక్కడున్న తమ పెట్టుబడులను కాపాడుకొనేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం 1965లో ఏకపక్షంగా స్వాతంత్య్రం ప్రకటించింది. అప్పటి వరకు అక్కడ పోరాడుతున్న శక్తులకు సోవియట్‌ సాయం అందించింది. స్వాతంత్య్రప్రకటన అనంతరం పోరాట సంస్ధలలో తలెత్తిన నూతన ఆలోచనల్లో భాగంగా గెరిల్లా పోరాటం జరిపేందుకు చైనా సాయం కోరాలని కొందరు నిర్ణయించుకొని ఆమేరకు మద్దతుతీసుకున్నారు. అందువలన ఇటీవలి కాలంలో చైనా కంపెనీలు పెట్టిన పెట్టుబడులను రక్షించుకొనేందుకు ముగాబేకు వ్యతిరేకంగా సమీకృతమైన శక్తులకు చైనా మద్దతు ఇచ్చిందని, సైనిక జనరల్‌ చైనా పర్యటన జరిపిన తరువాత సైన్యం జోక్యం చేసుకున్నదని ప్రచారం చేస్తున్నారు. సైనికజనరల్‌ నవంబరు 8,9 తేదీలలో చైనా పర్యటించారు. ఏడవ తేదీన మంగాగ్వాను ముగాబే పదవీచ్యుతుని కావించారు. అంటే జనరల్‌ చైనా ప్రయాణంలో వుండగా అది జరిగింది. అందకు కొద్ది నెలల ముందే మంగాగ్వాకు మద్దతు ఇచ్చే వారిగా అనుమానిస్తున్న జనరల్‌ చివెంగాతో సహా అనేక మంది సైన్యాధికారులకు వుద్వాసన పలికేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనంతటికీ కారణం ముగాబే భార్య గ్రేస్‌ను వుపాధ్యక్షరాలుగా నియమించేందుకు పూనుకోవటం, ఆచర్యను వ్యతిరేకించే రాజకీయ, మిలిటరీ అధికారులకు వుద్వాసన పలకటం అనే ప్రమాదకర ఆలోచనలోకి ముగాబే వెళ్లినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తన స్ధానంలో తన భార్యను గద్దెనెక్కించేందుకు పూనుకోవటం, విబేధించిన వారిపై చర్యలకు పూనుకోవటమే తాజా పరిణామాలకు మూలంగా కనిపిస్తోంది.Image result for mnangagwa swearing

సైన్యాధికారులకు చైనా కంపెనీలలో వాటాలు వున్నట్లు వూహాగానాలు తప్ప నిర్ధారణగా ఎలాంటి ఆధారాలు ఇంతవరకు బయటకురాలేదు. విదేశీ కంపెనీలలో స్వదేశీ సంస్ధలకు వాటాల గురించి ముగాబే సర్కార్‌ తీసుకున్న విధానానికి అనుగుణంగా ఎవరైనా బినామీలుగా కంపెనీలలో వాటాలు కలిగి వుండటాన్ని కాదనలేము. కానీ ముగాబే వుద్వాసనకు అదే అసలైన కారణాలని చెప్పలేము. ఎందుకంటే చైనా పెట్టుబడులకు ముగాబే వ్యతిరేకమేమీ కాదు. ఆ మాటకు వస్తే తన మార్కెట్‌ను, రాజకీయ సంబంధాలను పెంచుకొనే క్రమంలో ఇటీవలి సంవత్సరాలలో చైనా ఆఫ్రికాపై దృష్టి సారించింది. అమెరికా, ఐరోపాలతో తన వాణిజ్య మిగులను అక్కడ పెట్టుబడులుగా అందచేస్తోంది. అదేమీ రహస్యం కాదు. చైనాను రాజకీయంగా వంటరిపాటు చేసేందుకు అమెరికా తన మిలిటరీ, రాజకీయ, ఆర్ధిక శక్తులను వుపయోగించి ప్రపంచ దేశాలను ప్రభావితం చేయటం నిరంతరం కొనసాగిస్తుండగా దానికి వ్యతిరేకంగా, తనను తాను కాపాడుకొనేందుకు తన వ్యూహాన్ని చైనా అమలు జరుపుతున్నది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అనే విధానం కింద హాంకాంగ్‌, మకావో దీవులలో వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను, కంపెనీలను 2050 వరకు కదలించేది లేదని వాటి విలీనం సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ హామీ ఇచ్చింది. అందువలన జింబాబ్వేలో లేదా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టే చైనా కంపెనీలన్నీ చైనా ప్రధాన భూభాగానికి చెందినవే కానవసరం లేదు.

దేశియం పేరుతో ముగాబే సర్కార్‌ ఆమోదించిన విధానాల ప్రకారం విదేశీ కంపెనీలు తమ వాటాను 49శాతానికి పరిమితం చేసి 51శాతం జింబాబ్వియన్లకు కేటాయించాలి.ఈ విధానాన్ని స్వదేశీ బూర్జువాశక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని దేశాన్ని గుల్లచేశారు. తాను సామ్రాజ్యవాదానికి,పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం అని ముగాబే చెప్పుకున్నప్పటికీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరించారు.1991 నుంచి నయావుదారవాద విధానాలను అమలులోకి తెచ్చారు. నూతన అధ్యక్షుడు మంగాగ్వా రాజీనామా చేసిన ముగాబేతో విధానాలపరంగా విబేధించినట్లు కనపడదు. తమ, తమ మద్దతుదార్ల గురించి తలెత్తిన సమస్యలతో వచ్చిన కుమ్ములాటలుగానే వున్నాయి. ఇంతవరకు మంగాగ్వా తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దానికంటే దేశాన్ని దివాలా తీయించిన విధానాల మార్పు గురించి ఇంతవరకు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు.

రేటింగ్స్‌ మోజులో మోడీ ఆశాభంగం ?

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఒక్కొక్కటీ ఎదురుతన్నుతుండటంతో గతంలో మాదిరి రొమ్ము విరుచుకొనే పరిస్థితులు లేవు. ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్నట్లుగా రేటింగ్స్‌ మోజు నరేంద్రమోడీ పైకి చెప్పుకోలేని చోట మరో దెబ్బతగిలేట్లు చేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. పద్నాలుగు సంవత్సరాలుగా రేటింగ్‌తో నిమిత్తం లేకుండా తెచ్చుకుంటున్న అప్పులు, వస్తున్నాయని చెబుతున్న పెట్టుబడులతో ముందుకు పోకుండా అత్యాశకు పోనేల, ఇలా ఇబ్బందులను కొని తెచ్చుకోవటం ఎందుకు అని మోడీ మంత్రాంగం, యంత్రాంగం ఇప్పుడు తలలు పట్టుకోవటం గురించి చెప్పనవసరం లేదు. మూడు వన్‌డే మాచ్‌ల సీరీస్‌లో ఒకటి అటు ఇటు అయితే మూడవది ఇరు జట్లపై ఎంతో వత్తిడి, అభిమానులలో వుత్కంఠను పెంచినట్లుగా ఇప్పుడు అగ్రశ్రేణి రేటింగ్‌ కంపెనీలో మూడవదైన ‘ఫిచ్‌’ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కారణాలు పైకి ఏం చెప్పినా మూడీస్‌ మన సార్వభౌమ రేటింగ్‌ను చెత్తకు దగ్గరగా వున్న స్ధానాన్ని ఒక మెట్టు పైకి పెంచింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌(ఎస్‌ అండ్‌ పి) మాత్రం గతంలో ఏ స్ధానంలో వుంచిందో దానిని మార్చాల్సినంత సీనేమీ లేదని శుక్రవారం నాడు స్పష్టం చేసింది.ఈ రెండు కంపెనీలు అమెరికావి, మూడవది బ్రిటన్‌ది.

సులభతర వాణిజ్య ర్యాంకును 130 నుంచి 100కు ప్రపంచబ్యాంకు పెంచింది. అలాగే అమెరికాకు చెందిన పూ పరిశోధనా సంస్ధ ఫిబ్రవరిలో చేసిన సర్వే ఫలితాలను నవంబరులో విడుదల చేసి నరేంద్రమోడీకి ఆదరణేమీ తగ్గలేదని, తిరుగులేని నేతని చెప్పింది.విశ్వసనీయ ప్రభుత్వంగా ప్రపంచంలో మోడీ సర్కార్‌ మూడో దేశంగా వుందని 2016లో చేసిన సర్వేలో ఓయిసిడి మరో రాంకు ఇచ్చింది. మూడీస్‌ సంస్ధ చెత్త పక్కన వున్న రాంకును కాస్త ఎగువకు జరిపింది. వాటిని మోడీ భజంత్రీలు ఆయన ఖాతాలో వేసి వీరుడు, శూరుడు అని పొగుడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలను కలిగి వున్న దేశాలు తీవ్ర సంక్షోభం, వాటి పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశానికి ఆ సంక్షోభ సెగ తగలటం ప్రారంభమయ్యే సమయంలో నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి మాజిక్‌ చేస్తానని జనాన్ని నమ్మించి సీట్ల రీత్యా తిరుగులేని మెజారిటీ సాధించారు. అలాంటి స్ధితిలో ఎస్‌ అండ్‌ పి వున్న ర్యాంకును కొనసాగించటం తప్ప పెంచే అవకాశం లేదని చెప్పి గాలితీసిందంటే అది దేశద్రోహం అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు.

ఇప్పుడున్న స్ధితిలో ఎవరెన్ని ర్యాంకులు ఇచ్చినా, తెచ్చుకున్నా, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఇంకా మరికొన్నింటిని జనం ముందు ప్రదర్శించినా స్ధాయి పెంచిన మూడీస్‌గానీ, యథాతధంగా వుంచిన ఎస్‌ అండ్‌పి గానీ లేవనెత్తున్న అంశాలేమిటి? మోడీ భక్తులు దాని గురించి మాట్లాడటం లేదెందుని? దేశంలో నేడున్న పరిస్ధితులలో అనేక కారణాల రీత్యా ప్రజాకర్షణలో నరేంద్రమోడీ మిగతా పార్టీల నేతల కంటే ఎంతో ముందున్న మాట నిజం. చరిత్రలో అనేక మంది నేతలు ఇలాగే ప్రజాకర్షణలో తారాజువ్వల మాదిరి దూసుకుపోయి అంతే వేగంతో పడిపోయిన వారు కూడా లేకపోలేదు. గత మూడున్నర సంవత్సరాలుగా ఇంతగా జనం విశ్వసిస్తున్న దేశ ప్రధానిని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్ధలు ఎందుకు నమ్మటం లేదు అని మోడీ భక్తులు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంస్ధలకు చట్టబద్దత లేకపోయినా, లొసుగులున్నా, ఎవరు అవునన్నా కాదన్నా ఏ దేశానికైనా రుణం ఇవ్వాలన్నా,పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంస్ధల సిఫార్సులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందుకే కదా నరేంద్రమోడీ సర్కార్‌ తమ రేటింగ్‌ పెంచమని పైరవీలు కూడా జరిపింది. మరోవైపు అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లు ఫోజు పెడుతున్నారు.

మీ గురించి కావాలంటే ఎన్ని మెచ్చుకోలు మాటలైనా చెబుతాం గాని ఆ ఒక్కటీ అడగవద్దు అన్నట్లుగా రేటింగ్‌ సంస్ధలు మన దేశం పట్ల వ్యవహరిస్తున్నాయి. గత 14 సంవత్సరాలుగా రేటింగ్‌ను పెంచకపోయినా మేం అప్పులు తెచ్చుకోగలిగాం, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, గతం కంటే ఇప్పుడు మా రుణభార శాతం తక్కువగా వుంది. మాకంటే ఎక్కువ రుణభారం వారికి మెరుగైన రేటింగ్‌ ఇచ్చారు, అలాంటపుడు మా రేటింగ్‌ ఎందుకు పెంచరు అని నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది మూడీస్‌ సంస్ధను నిలదీసింది. దీనిలో పాక్షిక సత్యం లేకపోలేదు.1991 నుంచి 2016 వరకు మన దేశ జిడిపి-రుణ నిష్పత్తి సగటున 73.42 శాతం వుంది. అంటే మన ఆదాయం 100 అయితే 73.42 అప్పు తీసుకుంటున్నాం. గతేడాది 2016లో ఇది 69.50 శాతం, గత పాతిక సంవత్సరాలలో కనిష్టంగా 1996లో 66, గరిష్టంగా 2003లో 84.20 శాతం నమోదైంది. రెండవ ఘనత బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయికి దక్కింది. ఆయన పాలనలోనే రుణభారం విపరీతంగా పెరిగింది. అంతకు ముందున్న కనిష్ట స్ధాయికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ హయాంలో అంతకు ముందున్నదాని కంటే ఒక శాతం పెరిగింది. రేటింగ్‌ లేకపోయినా అప్పులు తెచ్చుకుంటున్నాం అంటున్నారు. అది కూడా తిరుగులేని సత్యమే. ముందు అప్పు ఇవ్వండి వడ్డీ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటున్నాం. ముందే చెప్పినట్లు మన అప్పు నూటికి నూరుశాతం స్ధాయికి పెరగలేదు.మిగతా దేశాలకు ఇస్తే వడ్డీ కంటే రెట్టింపునకు పైగా భారత్‌లో వస్తోంది. అందువలన రేటింగ్‌ను పక్కన పెట్టి ఇచ్చినా ఫరవాలేదు, కొంత వడ్డీ పోయినా ఇబ్బంది లేదు అని విదేశీ సంస్ధలు అనుకుంటున్నాయి. రోజువారీ అధిక వడ్డీలకు ఇచ్చే వారు తీసుకొనే వాడి జుట్టు చేతిలో పెట్టుకుంటున్నట్లే అలాంటి రుణాలకు మనం తప్పించుకోలేని షరతులను రుద్దుతాయి.https://tradingeconomics.com/india/government-bond-yield మన దేశం తీసుకొనే రుణాలకు చెల్లించే వడ్డీ (దాన్నే బాండ్‌ రేటు అంటున్నారు) పది సంవత్సరాల బాండ్‌కు దాదాపు 7 శాతం కాగా అదే చైనా 4.04, అమెరికా 2.33, బ్రిటన్‌ 1.25,ఫ్రాన్సు 0.68, జపాన్‌ 0.03 వుండగా మన కంటే ఎక్కువ వడ్డీలు చెల్లించి రుణాలు పొందే దేశాలు బ్రెజిల్‌ 10.09, మెక్సికో 7.26 వున్నాయి. అందువలన అప్పు తీసుకోవటం గొప్ప కాదు, దానిని ఎలా తీరుస్తామనేదే సమస్య.ష్https://thelogicalindian.com/story-feed/opinion/indias-debt-trap-25-of-the-budget-is-spent-on-paying-of-debts/ మనం తీసుకొనే అప్పులకు బడ్జెట్‌లో 25శాతం మొత్తం చెల్లిస్తున్నాము, అదే అమెరికా కేవలం ఆరుశాతమే. మన పాలకులు అప్పులు తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేది ఒట్టిమాట, పాత అప్పులు, వాటి వడ్డీలు కట్టేందుకే మనం కొత్త అప్పులు తీసుకుంటున్నాం.

రేటింగ్‌ సంస్ధలు దీని గురించే పట్టుబడుతున్నాయి. అనధికారికంగా అధిక వడ్డీలకు ఆశపడి ఎవరైనా అప్పులు ఇచ్చి రిస్కుతీసుకుంటే అది వారి సమస్య, తమ రేటింగ్‌ను బట్టి అప్పు ఇచ్చేవారిని నట్టేట ముంచేందుకు సిద్ధంగా లేమంటున్నాయి ఆ సంస్ధలు. ఎందుకంటే అన్ని దేశాల పరిస్ధితులను అధ్యయనం చేసి తగు సలహాలనిచ్చేందుకు ఆ సంస్ధలు పెద్ద మొత్తంలో మదుపుదార్లనుంచి ఫీజులు వసూలు చేస్తాయి. మన దేశ తలసరి ఆదాయం కనిష్ట స్ధాయిలో వుండటం, రుణభారం పెరుగుతుండటం మదుపుదార్లకు ఆందోళన కలిగించే అంశమే. మూడు సంవత్సరాలలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మోడీ చేసుకుంటున్నది ప్రచారం తప్ప వాస్తవం కాదని చెప్పటమే గత రేటింగ్‌ను యథాతధంగా వుంచటానికి అర్ధం. అంటే మోడీ అభివృద్ధి, సంస్కరణల గాలితీసినట్లే.

గతేడాది చేసిన నోట్ల రద్దు ద్వారా సాధించిన ఫలితాలేమిటో ఏడాది పూర్తయిన సందర్భంగా అయినా మోడీ నోరు విప్పుతారేమోనని ఆశించిన దేశభక్తులను నిరాశపరిచారు. జిఎస్‌టి గురించి ఎలాంటి కసరత్తు, పర్యవసానాల గురించి ఆలోచించకుండా బలవంతంగా అమలు జరపటంతో జరిగిందేమిటో చూస్తున్నాం. ఒక పన్ను పద్దతిని రద్దు చేసి మరొక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టటం అంటే తెల్లచొక్కా తీసి వేసి కాషాయ చొక్కా తొడుక్కున్నంత సులభం అన్నట్లుగా చెప్పిన కబుర్లు ఏమయ్యాయి. గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు, గుజరాత్‌ వ్యాపారులు తీవ్ర నిరసనల కారణంగా జిఎస్‌టిలో మార్పులు చేశారని అందరూ ఎరిగిందే. ఆ పని పూర్తయిన తరువాత తిరిగి రేట్లు పెంచరన్న హామీ ఏముంది. భారత్‌లో పన్ను ఆదాయం తక్కువగా వుందని, దాన్ని పెంచకుండా, తగినంత ఆదాయం లేకుండా అప్పులు ఎలా తీరుస్తారని గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ మన ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. అందువలన నరేంద్రమోడీ మరింతగా మూసుకోవటం తప్ప నోరు తెరిచే అవకాశం లేదు. నిజానికి మోడీకి వాస్తవాలు తెలియక కాదు, జర్నలిస్టులలో చెప్పింది రాసుకొనే స్టెనోగ్రాఫర్లే కాదు, ఏమిటి, ఎందుకు, ఎలా,ఎవరు, ఎక్కడ అని ప్రశ్నలడిగే నోరున్న వారు కూడా వున్నారు గనుక ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మోడీ ఇంతవరకు పత్రికా గోష్టి పెట్టలేదు. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం మనది, అందులోనూ ప్రధాని విధిగా పత్రికా గోష్టి పెట్టాలని ఎక్కడా రాసిలేదు మరి. ఈ విషయంలో గిన్నిస్‌బుక్‌ రికార్డులకు ఎక్కుతారనేది జనాభిప్రాయం.

యధారాజా తధా ప్రజ సామెతలో ప్రజ బదులు సలహాదారులు అని మార్పు చేసుకోవాల్సిన అగత్యం కనపడుతోంది. ఈ మధ్య కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రులు పుష్పకవిమానాలను నింపినట్లు తమ కార్యాలయాలను సలహాదారులతో నింపివేస్తున్నారు. వారు తమ ప్రావీణ్యత వున్న రంగాలలో గతంలో ఏం చేశారో తెలియదు గానీ సలహాదారులుగా మారిన తరువాత యజమాని మనసెరిగి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాదంటే వారి వుద్యోగాలుండవు మరి. మహాభారతంలో శకుని మామ గురించి తెలిసినదే. ప్రధాని నరేంద్రమోడీకి బయటి ప్రత్యర్ధులెవరో అందరికీ తెలిసిందే. సమస్య అంతర్గత శక్తులతోనే. అందుకని ఎవరే పాత్ర పోషిస్తున్నప్పటికీ అది ఆ పెద్ద మనిషి స్వయంకృతం. ‘చివరాఖరికి ‘ చెప్పొచ్చేదేమంటే నరేంద్రమోడీ అంతకంటే ఆయనను అనుసరించే గుడ్డి భక్తకోటి రోజు రోజుకూ ఇరకాటంలో కూరుకుపోతున్నారు. దానివలన ఎవరికీ నష్టం లేదు సమస్యల్లా సామాన్య జనం, దేశం అధోగతి పాలు కావటం గురించే.

పడుచు పెళ్ళాం కోసం ముప్పు తెచ్చుకున్న ముగాబే !

Tags

, , , ,

ఎం. కోటేశ్వరరావు

దేవుడు తప్ప తనను మరొకరు గద్దె దింపలేరని ఒక నాడు విర్రవీగి గత కొద్ది రోజులుగా తప్పుకొనేది లేదని బిర్రబిగిసిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే 37సంవత్సరాల తరువాత అవమానకరంగా మంగళవారం రాత్రి తనంతటతానే రాజీనామా చేసి గద్దె దిగాడు. ఆ వార్త వినగానే దేశంలో సంబరాలు మిన్నంటాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు జింబాబ్వే రాజకీయాలను అనధికారికంగా అధికారికంగా శాసించిన ముగాబే(93) శకం అంతమైంది. అంతకు ఒక రోజు ముందు వుద్వాసనకు గురై దక్షిణాఫ్రికాలో రక్షణ పొందుతున్న మాజీ వుపాధ్యక్షుడు ఎమర్సన్‌ మంగాగ్వాకు అధికారం అప్పగించేందుకు ముగాబే సిద్దపడినట్లు రక్షణ దళాల కమాండర్‌ జనరల్‌ కానస్టాంటినో చివెంగా జర్నలిస్టులతో చెప్పారు. అధికారపక్ష కేంద్రకమిటీ ఆదివారం నాడు సమావేశమై 24గంటలలోగా రాజీనామా చేయని పక్షంలో అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తామని హెచ్చరించింది. దానిని కూడా ముగాబే ధిక్కరించటంతో మిలిటరీతో బలప్రదర్శనకు దిగుతాడా అన్న సందేహాలు తలెత్తాయి. దేశంలో ఎలాంటి ప్రదర్శనలు జరపవద్దని మిలిటరీ జనరల్‌ కోరారు.శనివారం నాడు జింబాబ్వే జాతీయ విముక్తి పోరాట యోధుల సంఘం ఒక ప్రదర్శన జరిపి ముగాబే రాజీనామాను డిమాండ్‌ చేసింది. మరోమారు ప్రదర్శన జరుపుతామని హెచ్చరించింది. ముగాబే గద్దె దిగకపోతే తాము పరీక్షలను బహిష్కరిస్తామని విశ్వవిద్యాలయ విద్యార్ధులు చేశారు. మంగళవారం వుదయం విదేశాలలో ఒక గుర్తు తెలియని ప్రాంతం నుంచి చేసిన ప్రకటనలో ముగాబే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, తన ప్రాణ రక్షణకు హామీతో పాటు దేశంలోని రాజకీయ పరిస్ధితులపై చర్చకు ఆహ్వానం పంపాలని కోరినట్లు వార్తా సంస్ధలు పేర్కొన్నాయి. గృహనిర్బంధంలో వున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ముుగాబే గత శుక్రవారం నాడు జింబాబ్వే ఓపెన్‌ యూనివర్సిటీ పట్టాల ప్రదాన కార్యక్రమంలో ఛాన్సలర్‌ హోదాలో పాల్గనటం, తరువాత బయట కనిపించకపోవటం కూడా అనుమానాలకు తావిచ్చింది. తాము అధికారాన్ని స్వీకరించలేదని, నేరగాండ్లను ఏరివేయటానికి కొన్ని చర్యలు తీసుకున్నామని, ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా వుందని అంతకు ముందు మిలిటరీ ప్రకటించింది. తనపై ప్రతీకారం తీర్చుకోవటం, కక్ష్యపూరితంగా వుండటం వలన ఎలాంటి ప్రయోజనం వుండదని రాజధాని, దేశంలోని ప్రతి ఒక్కరిని తన అభిమానులు క్షమించివదలి వేయాలని ముగాబే విశ్వవిద్యాలయ ప్రసంగంలో పేర్కొనటాన్ని బట్టి గద్దె దిగేందుకు సుముఖంగా లేనని చెప్పటమే అని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో మంగళవారం నాడు పార్లమెంట్‌లో అభిశంసన ప్రక్రియ ప్రారంభమైన కొద్ది సేపటికే తాను రాజీనామా చేస్తున్నట్లు ముగాబే ప్రకటించటంతో పార్లమెంట్‌ వాయిదా పడింది.

గత కొద్ది వారాలుగా జరిగిన పరిణామాలను చూస్తే ముగాబే మాజీ కావటం ఖాయం అని తేలిపోయింది. మిలిటరీ అధికారులతో సన్నిహిత సంబంధాలున్న రాజకీయవేత్తగా పార్టీలో, మిలిటరీ, పోలీసుల్లో వుపాధ్యక్షుడి వర్గం ఆధిపత్యం రుజువైనా, లేక భార్య గ్రేస్‌ది పైచేయి అయినా ముగాబే ఆధిపత్యం ముగిసినట్లే. ఇప్పుడు మొదటిదే రుజువైంది. ముగాబేను మిలిటరీ గృహనిర్భంధంలో వుంచటంతో అక్కడి రాజకీయ సంక్షోభ తీవ్రత ప్రపంచానికి తెలిసింది. సైన్యాధికారులు తీసుకున్న రాజకీయ-మిలిటరీ చర్య ఒక కోణంలో ప్రమాద సూచికలను వెల్లడించినప్పటికీ మొత్తం మీద దేశవ్యాపితంగా ఆమోదం లభించటం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు సంభవించిన పరిణామాలలో అధికారాన్ని మిలిటరీ తీసుకొనే సూచనలు లేవు.

తిరుగులేని నేతగా వున్న ముగాబే 1980 నుంచి 87వరకు ప్రధానిగా, తరువాత నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన పూర్వరంగంలో తొమ్మిది పదులు దాటిన ముగాబే అధికార వారసత్వం కోసం అధికారపక్షంలో పోరు మొదలైంది.ముగాబే తన కంటే 41 సంవత్సరాలు చిన్నదైన రెండవ భార్య గ్రేస్‌(52)కు పదవిని కట్టబెట్టేందుకు పూనుకోవటంతో పార్టీలో తిరుగుబాటుకు బీజం పడింది. వైమానిక దళ పైలట్‌ భార్య అయిన గ్రేస్‌ ఒక బిడ్డ పుట్టిన తరువాత అధ్యక్షకార్యాలయంలో వుద్యోగినిగా చేరింది. భర్తతో పాటు ముగాబేతో కూడా సంసారం చేసింది. వివాహేతర బంధంతో ముగాబే ద్వారా ఇద్దర్ని వివాహం తరువాత మరొకర్ని కన్నది. గ్రేస్‌కు విడాకులు ఇవ్వాలని ముగాబే అధికారబలంతో వత్తిడి తెచ్చి, తరువాత మొదటి భర్తతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు పైలట్‌ను విదేశాంగ శాఖ వుద్యోగిగా ఎంతో దూరంలో వున్న చైనాకు పంపించాడు. గ్రేస్‌తో సంబంధం వున్న మరో ఇద్దరిని అనుమానాస్పద స్ధితిలో హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం భార్య బ్రతికి వుండగా విడాకులు తీసుకోకుండా మరో వివాహం చేసుకొనే అవకాశం లేదు. అందువలన ఏండ్ల తరబడి వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. తరువాత భార్య మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత దశాబ్దిలో కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంతో గ్రేస్‌ను వివాహం చేసుకున్నాడని విదేశీ పత్రికలు రాస్తే శతాబ్దిలో ఇలాంటి ఆడంబరాన్ని చూడలేదని జింబాబ్వే మీడియా పేర్కొన్నది. ఇలాంటి వ్యక్తిత్వం కారణంగా ముగాబేను సహించినప్పటికీ గ్రేస్‌ను ఎన్నడూ పార్టీకార్యకర్తలు, సాధారణ పౌరులు గౌరవించలేదు. ముగాబే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భార్య సారా పేరుతో ఐరోపాలో అక్రమ ఆస్థులను దాచాడు. ఆమె ఘనావియన్‌ కావటంతో 1992లో ఆమె మరణించినపుడు ఘనావియన్‌ చట్ట ప్రకారం ఆమె పేరుతో వున్న ఆస్థులు పుట్టింటి వారికి చెందుతాయి తప్ప మెట్టినింటికి దక్కవు. దాంతో భార్య మరణించగానే దాచుకున్న సంపదంతా పోయిందనే ఆక్రోశంతో తన నివాసంలోని కిటికీలన్నింటినీ ముగాబే పగలగొట్టినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. మొదటి భార్య సారాను ఆప్యాయంగా ఇప్పటికీ జింబాబ్వియన్లు తమ అమ్మగా పిలుచుకుంటారు. గ్రేస్‌కు అధికారాన్ని అప్పగించేందుకు పూనుకోవటంతో చివరకు ముగాబేను కూడా తోసిపుచ్చేందుకు పార్టీలోని వారికి అవకాశం దొరికింది. అయితే ఈ వ్యవహారం తక్షణ అంశంగా కనిపిస్తున్నప్పటికీ తిరుగుబాటు అసలు కారణంగా దేశం ఆర్ధికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవటం వాటిని పరిష్కరించటంలో ముగాబే వైఫల్యం అని చెప్పాలి.

బ్రిటీష్‌ వలసపాలనలో రోడీషియాగా పిలిచిన జింబాబ్వే స్వాతంత్య్రపోరాటంలో ముగాబే కీలకపాత్ర పోషించాడు. పక్కనే వున్న దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు, ఎఎన్‌సి వుద్యమాలతో వున్న సంబంధాలు, నాడున్న అంతర్జాతీయ పరిస్ధితులలో ఒక వామపక్షవాదిగా వున్న ముగాబే తరువాత కాలంలో బూర్జువారాజకీయవేత్తగా మారాడు. శ్వేతజాతీయుల చేతులలో వున్న భూముల పంపకం వంటి కొన్ని చర్యలతో దేశంలో తిరుగులేని నేతగా మారాడు.వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ ఆయనకు మద్దతు ఇచ్చాయి.

ముగాబే పార్టీ, అధికార పదవుల నుంచి తప్పుకోవాలని కూడా అధికారపక్ష కేంద్రకమిటీ తీర్మానించింది.ఆయన స్ధానంలో ప్రస్తుతం ప్రవాసంలో వున్న మంగాగ్వాను నాయకుడిగా, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నుకున్నట్లు ఆదివారం నాడు ప్రకటించారు. సోమవారం లోగా పదవి నుంచి తప్పుకోనట్లయితే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ద్వారా పదవీచ్యుతుని గావిస్తామని హెచ్చరించింది. గడువు ముగిసినా ముగాబే అందుకు సిద్దపడకపోగా అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధంగా పడినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో వెనక్కు తగ్గేందుకు సుముఖంగా వున్నట్లు సైనికాధికారులు చెప్పటం తెరవెనుక యత్నాలు జరిగిన విషయాన్ని నిర్ధారించింది. మంగళవారం నాడు మంగాగ్వా చేసిన ప్రకటనలో ముగాబే తన హత్యకు పధకం వేసినట్లు పేర్కొన్నారు. తనను వుపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత బందీగా తీసుకొని హతమార్చాలని పధకం వేసినట్లు గత నవంబరునెలలోనే తనకు స్నేహితులైన భద్రతా అధికారి హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. పదవి నుంచి తొలగించిన ప్రకటన వెలువడగానే మంగాగ్వా దేశం విడిచిపెట్టిన విషయం తెలిసిందే.

గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం దేశ ప్రజలలో మంగాగ్వా పట్ల కూడా అంతగా సదభిప్రాయం లేదు. ఒక నాడు తిరుగులేని నేతగా వున్న ముగాబేను వద్దని కోరుకుంటున్న జనం మరో ప్రత్యామ్నాయం లేకనే మంగాగ్వాను ఆహ్వానిస్తున్నారని చెప్పాల్సి వుంది. దేశాన్ని అస్తవ్యస్తం గావించటంలో ముగాబే పాత్ర ఎంతో ఇంతకాలం ప్రభుత్వ విధానాలను సమర్ధిస్తూ వచ్చిన మంగాగ్వాకూ దానిలో వాటా వుంది. మధ్యలో ముగాబే తన భార్యను రంగం మీదకు తేవటంతో పాలకపార్టీలో తిరుగుబాటుకు నాంది అయింది తప్ప విధానాల పరంగా ఎలాంటి తేడా లేదు. ముగాబేపై జనంలో తలెత్తిన విముఖత, మిలిటరీ మొగ్గు మంగాగ్వా వైపు వుందని పసిగట్టిన పశ్చిమ దేశాలు ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా మంగాగ్వాకు మద్దతు పలుకుతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.

మంగాగ్వాకు రాజ్యాంగబద్దంగా అధికారం అప్పగించాలంటే కొన్ని నిబంధనలు అడ్డువస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు పార్లమెంట్‌ స్పీకర్‌కు రాజీనామాను సమర్పించిన 24గంటల లోగా ప్రత్యామ్నాయంగా వుపాధ్యక్షుడికి బాధ్యతలను అప్పగించాల్సి వుంది. అయితే మంగాగ్వాను వుపాధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినకారణంగా ఆ స్ధానం ఖాళీగా వుంది. ఇప్పుడు రాజీనామా చేస్తే స్పీకరే ఆ బాధ్యతలను స్వీకరించాల్సి వుంటుంది. రాజ్యాంగ పద్దతుల ప్రకారం అధ్యక్షుడిగా ముగాబే తిరిగి మంగాగ్వాను వుపాధ్యక్షపదవిలో నియమించి తాను పదవినుంచి తప్పుకోవాలి.బహుశా ఈ కారణంగానే ముగాబే తననుఆహ్వానించాలని మంగాగ్వా మంగళవారం నాడు చేసిన ప్రకటనలో డిమాండ్‌ చేసి వుండాలి. మంగాగ్వా పునర్‌నియామకం జరగకుండానే ముగాబే రాజీనామా చేసినందున మరొక ప్రక్రియ ద్వారా కొత్త నేత ఎంపిక జరగాల్సి వుంది.

మిలిటరీచర్య దేశంలో ఏర్పడిన అల్లకల్లోలం ముఖ్యంగా అధికార పార్టీలో ఏర్పడిన అస్తవ్యస్థ పరిస్థితుల ఫలితమే అని ఇటీవలనే ఏర్పడిన జింబాబ్వే కమ్యూనిస్టు పార్టీ చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నఖబుతో మబెహెనా ఒక ప్రకటన చేస్తూ దేశ ప్రజలు దుర్భరదారిద్య్రంలో మగ్గుతుంటే అధికారపార్టీ ప్రముఖులు భోగలాలసులుగా తయారయ్యారని పేర్కొన్నారు. పరిశ్రమలు మూతబడ్డాయి, సంఘటిత రంగంలో 90శాతానికిపైగా నిరుద్యోగం వుంది. అధికార ప్రతిపక్షా వ్యక్తిగత రాజకీయాలలో మునిగిపోయాయి. గత 37 సంవత్సరాలలో ఎన్నడూ ఇలాంటి పరిస్ధితి ఏర్పడలేదు. రాజకీయ ప్రముఖుల సామూహిక దోపిడీతో కూడిన ఒక అప్రజాస్వామిక రాజకీయ వ్యవస్ధ అభివృద్ధి అయింది, ఫలితంగా అర్ధికదిగజారుడుకు దారితీసింది. సాధారణ పరిస్థితులలో మిలిటరీ చర్యను సమర్ధించకూడదు.అయితే అధికారం కొద్ధి మంది, అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావటం, ప్రజాబాహుళ్య అదుపు లేదా అసమ్మతి తెలిపేందుకు వున్న అవకాశాలన్నీ మూసుకుపోయిన స్థితిలో ఈ వుదంతంలో మిలిటరీ చర్యకు దారితీసింది, దీనిని అత్యధిక జింబాబ్వియన్లు ఒకే తీరులో కానప్పటికీ సంతోషంగా అంగీకరించారు. రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో శాంతియుత,రాజ్యాంగ పద్దతుల్లో అధికారమార్పిడి జరగాలి, అందుకు అనువైన పరిస్ధితులను ఏర్పరచాలి అని కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. సహేతుకమైన కాల వ్యవధిలో స్వేచ్చ,అక్రమాలకు తావులేని ఎన్నికలు జరిపేందుకు ఒక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు జరగాలని సూచించింది.

దేశియం పేరుతో ముగాబే సర్కార్‌ ఆమోదించిన విధానాల ప్రకారం విదేశీ కంపెనీలు తమ వాటాను 49శాతానికి పరిమితం చేసి 51శాతం జింబాబ్వియన్లకు కేటాయించాలి.ఈ విధానాన్ని స్వదేశీ బూర్జువాశక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని దేశాన్ని గుల్లచేశారు. తాను సామ్రాజ్యవాదానికి,పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం అని ముగాబే చెప్పుకున్నప్పటికీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరించారు.1991 నుంచి నయావుదారవాద విధానాలను అమలులోకి తెచ్చారు. ఈ పూర్వరంగంలో మంగాగ్వా లేదా మరొకరి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం ఈ విధానాలను మార్చుకోనట్లయితే జనంలో వ్యతిరేకత రావటానికి ఎక్కువ కాలం పట్టదు. మరొక ముగాబేను దీర్ఘకాలం అధికారంలో తిష్ట వేయటానికి అంగీకరించే అవకాశాలు తక్కువ.

రేటింగ్స్‌ కోసం మోడీ సర్కార్‌ పైరవీలు జరిపిందా ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్‌ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్‌ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్‌ బూస్ట్‌ ఈజ్‌ద సీక్రెట్‌ ఆఫ్‌ అవర్‌ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్‌ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్‌ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.

మూడీస్‌ సంస్ధ రేటింగ్‌ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్‌ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్‌ గాంధీ పాలనలో మూడీస్‌ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్‌ ఎనిమిది(1990) చంద్రశేఖర్‌ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.

పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్‌ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్‌ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A   గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.

రాయిటర్స్‌ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్‌ రేటింగ్‌ పద్దతులను భారత్‌ విమర్శించింది. రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్‌ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్‌ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్‌ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్‌ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్‌ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్‌ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్‌ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్‌ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్‌ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్‌ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు. బిఏఏ రేటింగ్‌ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్‌(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్‌ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్‌ ఇచ్చింది. రేటింగ్‌ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.

అక్టోబరు నెలలో మూడీస్‌ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్‌ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్‌ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్‌ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్‌ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్‌ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్‌ తెలిపింది.’

1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్‌ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్‌ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్‌ సంస్ధలైన్‌ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్‌ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్‌ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్‌ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్‌ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.

అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్‌ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.

ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్‌ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.

దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్‌ వున్న దేశాల మీడియన్‌ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్‌ పెంపుదల కోసం మూడీస్‌ సంస్ధతో మోడీ సర్కార్‌ లాబీయింగ్‌(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్‌ మరో అమెరికన్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి, బ్రిటన్‌ కంపెనీ ఫిచ్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్‌ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

Tags

, , , , ,

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?