Tags
BJP, Narendra Modi Failures, BJP illogical propaganda, Abhijeet Dipke, Cockroach Janta Party’, # Cockroach Janta Party’
ఎం కోటేశ్వరరావు
ఇప్పటి వరకు బొద్దింకలను చూసి కొంత మంది ఎలా భయపడతారో చూశాం గానీ ఇప్పుడు ఆ పేరును చూసి కళవళపడుతున్న రాజకీయ పార్టీలను చూస్తున్నాం. ఇలాంటి రోజు వస్తుందని ఎవరైనా ఊహించారా ! ఫాసిజం మరోమారు తలెత్తుతున్నదంటే హిట్లర్, ముస్సోలినీ, టోజో వంటి దుర్మార్గులే తిరిగి జన్మించారని కాదు. వారి వారసులు ప్రజాస్వామ్య వేషాలతో మనమధ్య తిరిగేవారే ఆపని చేస్తున్నారు.లేకపోతే బొద్దింకల జనతా పార్టీ (సిజెపి) ఎక్స్ ఖాతా నిలిపివేయటం ఏమిటి ! దాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఖరాబు చేశారు, చివరికి వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఆ పేజీని కూడా కనపడకుండా చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో దీన్ని కూడా అంతే. ఇలాంటి చేష్టలతో యువతను మరింతగా రెచ్చగొట్టటం, సిజెపికి మద్దతుదార్లను పెంచటం తప్ప మరొకటి కాదు. ఇది నిరంకుశ చర్య అని ఉద్యమాన్ని ప్రారంభించిన అభిజిత్ డిప్కే వ్యాఖ్యానించాడు. సామాజిక ఉద్యమనినాదం రూపంలో ఉన్న ఆ పార్టీ ముందుకు తెచ్చిన ఐదు అంశాలు దేశంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయట, ఆ విషయాన్ని కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబి) ప్రభుత్వానికి నివేదించిందట,దేశ రక్షణ కోసం సదరు సిజెపి సామాజిక మాధ్యమ ఎక్స్ ఖాతాను మోడీ సర్కార్ నిలిపివేయించిందట. నేపాల్లో అధికారంలో ఉన్న పార్టీ సామాజిక మాధ్యమాలపై విధించిన ఆంక్షలే తమకు నష్టం అని భావించిన పాలకపార్టీ ఆంక్షలు పెట్టింది, దానిపై యువత ఎలా స్పందించిందో చివరికి అధికార మార్పిడికి దారితీయటాన్ని ప్రపంచం చూసింది. చరిత్రలో మోడీ మరొక పేజీకి నాంది పలికారా ? భారత్‌లో నిషేధాలు, ఇతర చర్యలతో సిజెపి పేజీలను అడ్డుకోవచ్చు, కానీ విదేశాల్లో చేరే అనుచరులను మోడీ అడ్డుకోగలరా ? ప్రపంచవ్యాపితంగా మోడీ పలుకుబడి గురించి బిజెపి గొప్పలు చెప్పుకుంటుంది. అలాంటి మోడీ పాలనలో యువత గురించి దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు, దేశంలో ఉన్న స్థితిగతుల గురించి విదేశాల్లో ఉన్నవారికి ఆసక్తి కలిగినట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఇదీ ఒకందుకు మంచిదే. మోడీ ప్రజాస్వామ్య బండారం ప్రపంచానికి తెలుస్తుంది. విమర్శకుల సంగతి సరే, మోడీని అభిమానించే వారందరూ మతోన్మాదులు లేదా మరొకరో అనుకోనవసరం లేదు. ప్రజాస్వామిక ప్రియులకు ఈ వార్త వీనుల విందుగా ఉందా ? ఈ పరిణామాలను జీర్ణించుకోగలుగుతున్నారా !!
ఇంతకూ సిజెపి తన అజెండాలో ప్రకటించిన అంశాలేమిటి ? పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను రాజ్యసభకు పంపకూడదు, తొలగించిన ఓట్లకు గాను ఉపా చట్టం కింద కేంద్ర ఎన్నికల కమిషన్‌పై విచారణ, మహిళలకు 55శాతం రిజర్వేషన్లు, ఓట్ల తొలగింపును ఎన్నికల కమిషన్ నిర్ణీత వ్యవధిలో జరపాలి, భారతీయ యువతకు రాజకీయ విద్యగరపాలి.పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని దీర్ఘకాలం ఎన్నికల్లో పాల్గ్గొననివ్వకూడదు. ఆసక్తి కలిగిన వారు ఆ పార్టీ వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తే లేదా వేరే రూపంలో తిరిగి ప్రారంభమైతే ఈ అంశాల మీద వారి వివరణను చదువుకోవచ్చు.ఈ అజెండాను ఎవరైనా అందరూ ఆమోదించాలనేమీ లేమీ లేదు, అది వారికి ఉన్న హక్కు. అలాగే సమర్ధించటానికీ హక్కు ఉంది. దానిలో రెచ్చగొట్టే అంశాలేమున్నాయి, వాటితో దేశ భద్రతకు వచ్చిన ముప్పేమిటి ? వెంపలి చెట్లకు నిచ్చెనవేసుకు ఎక్కేవారు పుడతారన్నట్లుగా పోతులూరి వీరబ్రహ్మం చెప్పారని ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో తెలియదు గానీ కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఏ నివేదిక కావాలంటే దాన్ని క్షణాల్లో తెప్పించుకోవచ్చు, ఇడి, ఐటి, సిబిఐతో పాటు దేశ భక్తిని గుత్తకు తీసుకున్నామని చెప్పేవారి దాడులు కూడా ఎవరిమీదైనా ఎప్పుడైనా జరగవచ్చు.
సిజెపి సృష్టికర్త అభిజిత్ దిప్కే గురించి టీవీ చర్చల్లో, సామాజిక మాధ్యమాల్లో బిజెపివారు ధ్వజమెత్తుతున్నారు. మూడు పదుల వయస్సున్న ఆ యువకుడి వెనుక బిజెపిని వ్యతిరేకించే అన్ని పార్టీలు, శక్తులు ఉన్నాయని, కుట్ర చేశాయని బిజెపి నేతలు దేశభక్తి గీతాలాపన ప్రారంభించారు. పండుగాడి దెబ్బ తగిలి మైండ్ బ్లాంక్ అయినవారు తప్ప మరొకరు ఇలా మాట్లాడరు.సిజెపి ఎక్స్ ఖాతాను అనుసరించేవారు కోట్లలో ఉండటంతో బిజెపి తట్టుకోలేకపోయింది.భారత్‌ను వ్యతిరేకించే దేశాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అనుసరించుతున్నారని, వారంతా భారతీయులు కాదని ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతోందని బిజెపి ప్రతినిధులు టీవీ చర్చల్లో చెబుతున్నారు.బోడి గుండుకు మోకాలికి ముడిపెట్ట గల సమర్ధులకు మాత్రమే ఇలా మాట్లాడటం సాధ్యం. తమ నేత, పార్టీకి విదేశాల్లో కూడా అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారని కాషాయ నేతలు గొప్పలు చెప్పుకోవటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సామాజిక మాధ్యమ ఖాతా అంటే ఒక బ్యాంకు ఖాతా వంటిది కాదు. ప్రపంచంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారెవరైనా ఎక్కడి నుంచైనా చేరవచ్చు. ఉచితం ఉన్నాయి, డబ్బు వసూలు చేసేవీ ఉన్నాయి.కుట్ర అంటే చేతివేళ్ల మీద లెక్కించదగిన వారు చేసేది తప్ప కోట్లాది మంది భాగస్వాములు అవుతారా ? మోడీ, బిజెపి, కాంగ్రెస్ సామాజిక మాధ్యమ ఖాతాను అనుసరించేవారిలో ఎక్కువ మంది నకిలీలే అనే అభిప్రాయం ఉంది, గొప్పలు చెప్పుకొనేందుకు పార్టీలు, వ్యక్తులు అలాంటి చర్యలకు పాల్పడతారు.లోకోభిన్న రుచి అన్నట్లుగా సినిమాతారలు, ఇతర ప్రముఖులను అనుసరించేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉండే సంగతి తెలిసిందే.
అసలు మే 15వ తేదీ ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వివాదాస్పద బొద్దింకలు, పరాన్న జీవుల వ్యాఖ్యలు చేయటం, మరుసటి రోజునే అభిజిత్ బొద్దింకల జనతా పార్టీ అంటూ వ్యంగ్యాస్త్రంతో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టటం, లక్షల నుంచి కోట్ల సంఖ్యలో అనుచరులు చేరటం అంతా మూడు నాలుగు రోజుల్లోనే జరిగిపోయింది. బిజెపి వారు చెప్పేదాన్ని బట్టి కుట్ర ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు ముందే రూపొంది ఉండాలి.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయటం కూడా కుట్రలో భాగం అయి ఉండాలి. లేకపోతే ఎలా సాధ్యం. ఒక నేత ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో పర్యటిస్తారని ముందే ప్రకటిస్తారు గనుక తెలుస్తుంది తప్ప ఏ సెలవిస్తారో ఊహించగలరా ? ఆ రోజు ఫలానే కేసు విచారణకు వస్తుందని తెలియవచ్చు ప్రధాన న్యాయమూర్తి అలాంటి వివాదాస్పద మాటలు మాట్లాడతారని కుట్రదారులకు ముందే తెలుసా ? బొద్దింకల జనతా పార్టీ పోస్టులను పెట్టగానే అనుచరులుగా మారండని కోట్లాది మందికి ముందుగానే వర్తమానాలు పంపుతారా ? ఆరోపణలు చేసే ముందు తర్కానికి అవి నిలిచేవిగా ఉండాలి. వారు చెప్పేదాని ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తి కూడా బిజెపి వ్యతిరేక కుట్రలో భాగమే అనుకోవాలి.తల మీద మెదడు ఉన్నవారెవరూ ఇలా చెప్పరు. నిజంగా కుట్ర జరిగిందని నమ్మితే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి నిజా నిజాలను నిగ్గుతేల్చాలి. ఆపని చేయలేదు. తాను అలాంటి వ్యాఖ్యలను యువతమొత్తాన్ని ఉద్దేశించి చేయలేదని ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఎవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన అంతరంగంలోంచి వచ్చిన అవాంఛనీయ వ్యాఖ్యలుగానే చూస్తున్నారు.ఎందుకంటే ఫిబ్రవరి నెలలో కార్మిక సంఘాలను కూడా ఆయన ఇదే విధంగా తూలనాడారు. ఇటీవలి కాలంలో హైకోర్టు, సుప్రీం కోర్టులలో అనేక మంది న్యాయమూర్తులు తీర్పులతో సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో సంచలనాలకు కారకులౌతున్నారు.గతంలో ఇలా ఉండేవారు కాదు. తాము నిరుద్యోగులుగా ఉన్నందున శారీరకంగా సోమరిపోతులం తప్ప మెదళ్లు పనిచేస్తూనే ఉన్నాయని కూడా సిజెపి వ్యంగ్యాస్త్రం విసిరింది. ఇది ఎంత మంది పెద్దలకు అర్ధం అవుతుందో తెలియదు.
సిజెపిని ముందుకు తెచ్చిన అభిజిత్ అమెరికాలో ఉండి ఇదంతా చేస్తున్నాడని, గతంలో ఆమ్ ఆద్మీపార్టీలో పని చేశాడని బిజెపి నేతలు ధ్వజమెత్తుతున్నారు.ఎక్కడ ఉండి చేశారు, చేస్తున్నారని కాదు, ఏం చేశారనేదే ముఖ్యం. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ అమెరికాలో విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడే 1923లో అమెరికా హిందూస్థాన్ అసోసియేషన్ సభకు అధ్యక్షత వహించాడు. తరువాత ఆరేండ్లకు భారత్ వచ్చి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొన్నారు. సంఘపరివార్ ఆరాధించే విడి సావర్కర్ లండన్‌లో చదువుకొనేందుకు వెళ్లి అక్కడ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇలా చెప్పుకుంటే ఎందరో. అభిజిత్ దిప్కే వయస్సు మూడు పదులు, 2023లో చదుకొనేందుకు అమెరికా వెళ్లాడు,అక్కడి నుంచే స్పందించాడు. తప్పేముంది, భారత్‌ను యావత్ ప్రపంచానికి విశ్వగురువుగా మారుస్తామని బిజెపి నేతలు చెబుతారు. ప్రపంచ కుగ్రామంలో అతను అమెరికా అనే పేటలో ఉండటం నేరం కాదు. అలా అనుకుంటే అనేక మంది అమెరికా, ఇతర దేశాల్లో ప్రవాస భారతీయులు హిందూ సంస్థలు, సంఘపరివార్ సంస్థలను ఏర్పాటు చేసి కోట్లాది డాలర్లను బిజెపికి అందిస్తున్నారు. వారంతా స్వదేశం వచ్చి ఆ పని చేయాలని బిజెపి వారు అడగటం లేదేం ? దళితులు, రిజర్వేషన్ల సమస్యల గురించి ఒక నెటిజన్ అభిజిత్‌ను ప్రశ్నిస్తే తానే ఒక దళితుడనని చెప్పాడు. ఇంకేముంది ప్రతిభకు పట్టం గట్టటాన్ని వ్యతిరేకిస్తారని, దళితకార్డు వాడుకుంటున్నారంటూ కొందరు ధ్వజమెత్తుతున్నారు.బరాబర్ హిందూమతం కోసం పని చేస్తాం, కరడు గట్టిన సనాతన వాదులం అంటూ వీరంగం వేస్తున్నమాదిరి అతన తన సామాజిక తరగతిని ముందుగా వెల్లడించలేదు. అన్నింటికీ మించి అతనేమీ రిజర్వేషన్ సౌకర్యంతో అమెరికా వెళ్లలేదు. తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు, బలహీనవర్గాలకు తెలివితేటలు ఉండవా ! స్వయంకృషితో ఎదిగిన అంబేద్కర్ జన్మించిన గడ్డ మీద అభిజిత్ పుట్టాడు. ఒక మేథావి, సంస్కరణవాదిగా, మనుధర్మ వ్యతిరేకిగా అనేక మందికి అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. దళితులను సామాజికంగా ఎలా వేధిస్తున్నారో నిత్యం చూస్తున్నాం, అలాంటి వారి భావజాల వారసులు ఇప్పుడు అభిజిత్‌ను కూడా అవమానించేందుకు పూనుకున్నారు. ఇది మనువాదులకు మరింత మంది వ్యతిరేకులను తయారు చేస్తుంది, తెలిసో తెలియకో వారిని అనుసరిస్తున్న దళితులు, అణచివేతకు గురైన గిరిజనులు, ఇతర బలహీనవర్గాలు కూడా తామెటు ఉండాలో నిర్ణయించుకొనేట్లు చేస్తుంది, ఇప్పటికిప్పుడు మార్పురాకపోవచ్చు, ఆలోచన మొదలైతే చాలు ఆచరణ ఎలా ఉండాలో తెలుస్తుంది. సిజెపిని వదలి బిజెపిలో చేరాలని లేకపోతే నీ తలిదండ్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసు అంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.ఇది అనూహ్యమేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించటం, ప్రశ్నించటాన్ని దేశద్రోహంగా చిత్రించి దాడులు చేయటం తెలిసిందే, అభిజిత్ భారత్‌కు తిరిగి వస్తే అదే జరుగుతుందా ? చూద్దాం !
దేశంలో సమస్యలు, సంక్షోభం తలెత్తినపుడు యువత స్పందిస్తూనే ఉంది.కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చిన తరువాత జరిగిన 1971లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని పార్టీ 352 సీట్లతో అఖండ మెజారిటీ సాధించింది, అప్పుడు సిపిఐ(ఎం) 25 సీట్లతో పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎన్నికైంది. వాజ్‌పాయి నాయకత్వంలోని భారతీయ జనసంఘం 35 సీట్ల నుంచి 22కు పడిపోయింది. ఆ ఎన్నికల్లోనే ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే కేసు రుజువు కావటంతో 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రెండు సంవత్సరాల ముందు, గుజరాత్, బీహార్‌లో ధరల పెరుగుదల, కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమై ఇందిరాగాంధీని ఇరుకున పెట్టాయి.1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ కూడా ఎన్నికల్లో ఓడిపోయి జనతా పార్టీ అధికారానికి వచ్చింది. ఆ సమయంలో యువకులుగా రంగంలోకి వచ్చిన అనేక మంది తరువాత కాలంలో వివిధ పార్టీల నేతలుగా ఎదిగారు. బొద్దింకల జనతా పార్టీ ప్రస్తుతానికి సామాజిక మాధ్యమ ఉద్యమంలో భాగం తప్ప భౌతిక ఉనికిలో లేదు. పార్టీని నమోదు చేస్తారో లేదో తెలియదు. ఒక సంచలనం. గతంలో ఎన్‌టి రామారావు ఆంధ్ర ప్రదేశ్‌లో, తాజాగా విజరు తమిళనాడులో సృష్టించిన ప్రభంజనంలో యువత ప్రముఖ పాత్రపోషించిన సంగతి తెలిసిందే.యువత మార్పును కోరుతున్నారు. సాంప్రదాయ పార్టీలు చేసిన మోసాలు, వాగ్దాన భంగాలతో విసిగిపోయి ఉన్నారు.తీవ్రమైన రాజకీయ, సామాజిక అంశాలను వ్యంగ్యంగా ముందుకు తెచ్చినట్లు కొందరు తప్పుపడుతున్నారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి. జనం దృష్టిని ఆకర్షించటంలో నవరసాలు ఉంటాయి, వాటిలో హాస్యం, వ్యంగ్యం ఒకటి.కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యల గురించి చెబితే జనంలో ఎలాంటి స్పందన ఉండటం లేదు. అందుకని ఏ రూపాన్ని ఎంచుకున్నారన్నది కాదు, యువత, ఇతర తరగతులను కదిలించాడా లేదా అన్నదే గీటురాయిగా ఉండాలి. ఇదేదో కొంపముంచేట్లుంది చూడండయ్యా అన్నట్లుగా కేంద్ర మంత్రివర్గ సమావేశాలో నరేంద్రమోడీ చివాట్లు వేశారన్న వార్తలు వచ్చాయి, యాభైఆరు అంగుళాల ఛాతికి ఏదో జరగకుండా అది జరుగుతుందా ! కాంగ్రెస్, బిజెపి, వాటిని ఆదరించిన డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు విజరు దెబ్బను చవిచూశాయి. అందుకే ఇప్పటివరకు సినిమాలో పండుగాడి దెబ్బతో పోలిక బదులు ఇప్పుడు దేశవ్యాపితంగా రాజకీయంగా అభిషేక్ దెబ్బ గురించి చెప్పుకోవాల్సి వస్తోంది !
