Tags
Bangladesh Per capita GDP, BJP, Fuel prices freezing, IMF on GDP, India GDP, Modinomics a farce, Narendra Modi Failures, RSS, Saffron gang
ఎం కోటేశ్వరరావు
వికసిత్ భారత్ పేరుతో దేశ జిడిపిని 2047 మూడో, రెండో స్థానానికో తీసుకుపోతారని జనమంతా ఎందురు చూస్తున్నారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జిడిపిలో భారత్ ఆరోస్థానానికి పడిపోయింది.తలసరి జిడిపి మనది 2.81వేల డాలర్లు కాగా బంగ్లాదేశ్ 2.91వేలతో ఎగువన ఉంది. చైనా 14.87వేలతో ఇంకా ముందుంది.బంగ్లాదేశ్‌తో పోలుస్తారా అంటూ కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేస్తే కుదరదు.చేదు నిజాలను అంగీకరించకతప్పదు మరి.ఇది ఐఎంఎఫ్ చెప్పిన సమాచారం. 1980 నుంచి 2000 వరకు రెండు దేశాల మధ్య స్వల్పతేడా ఉంది.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో మనకంటే బంగ్లాదేశ్ వెనుకబడి ఉంది.పన్నెండేళ్ల మోడీనోమిక్స్ అభివృద్ధి పథంలో దేశం నడిచిందని చెప్పిన తరువాత ఇప్పుడు మనం వెనుకబడిపోయాం.ఎంత చెట్టుకు అంతగాలి అంటారు గానీ, బంగ్లాదేశ్ చిన్న చెట్టు నుంచి ఎక్కువగా వస్తోంది.మొత్తం జిడిపిని జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి, ఇది వేదగణితంలో కూడా మారదు మరి. దీన్ని చూస్తుంటే ఒక సినిమాలో ఏమిరా బాలరాజూ నీవలన దేశానికి ఉపయోగం ఏమిటి అన్న మాట గుర్తుకు వస్తున్నది. ఇరాన్‌మీద జరుగుతున్న యుద్దంతో మనకేం సంబంధం లేదు, మన మీద ఎలాంటి ప్రభావం పడదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న తరుణంలో ఐఎంఎఫ్ నివేదిక వెలువడింది. ఒక్కసారిగా నాలుగో స్థానం నుంచి ఆరుకు దిగజారిందంటే మన వృద్ధి ఎంత బలహీనంగా ఉందో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆర్థిక స్థితి గురించి ఐఎంఎఫ్ ఏప్రిల్ నెలలో వేసిన అంచనాలు పరిస్థితిని వెల్లడించాయి. అయితే నాలుగు లేదా ఆరులో ఉన్నప్పటికీ సమీప దేశాలతో పోలిస్తే తేడాలు పెద్దగా లేవు. ఉదాహరణకు వంద నాలుగో స్థానం అనుకుంటే 101ఐదో స్థానం మాదిరిగా చెప్పుకోవచ్చు.తాజా ఐఎంఎఫ్ అంచనా ప్రకారం అమెరికా 32.38,చైనా 20.85,జర్మనీ 5.5, జపాన్ 4.38, బ్రిటన్ 4.26, భారత్ 4.15, ఫ్రాన్సు 3.27లక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగి ఉన్నాయి. అందువలన నాలుగు నుంచి ఆరు స్థానాల వరకు ఉన్న దేశాల్లో ఏ చిన్న మార్పు వచ్చినా వరుస మారుతున్నది.మన స్థానం ఎందుకు తగ్గుతున్నట్లు ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఎన్ని స్టెరాయిడ్లు ఇచ్చినా ఫలితం ఎందుకు రావటం లేదు !
రూపాయి పతనం గురించి మోడీ, ఇతర బిజెపి నేతలు మన్మోహన్ హయాంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకుంటే ఆడపిల్లలకంటే ఎక్కువగా సిగ్గుపడిపోతారు గనుక ఇప్పుడు మాట్లాడటం లేదు, కిందపడినా గెలుపు మాదే అన్నట్లుగా ఉన్నారు. గతంలో రూపాయి పతనమైతే మన్మోహన్ సింగ్ చేతగాని తనం, అవినీతి అన్నారు.ఇప్పుడు మరోవిధంగా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుకల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.వ్యవస్థా సంబంధిత సమస్యల కంటే రూపాయి మార్పులే జిడిపి స్థానం పడిపోవటానికి కారణమని, రానున్న సంవత్సరాలో భారత్ పుంజుకుంటుందని ఐఎంఎఫ్ చెప్పింది.జోతిష్కాలన్నీ అలాగే ఉంటాయి. ప్రపంచ జిడిపి లెక్కలన్నీ అమెరికా డాలర్లలోనే ఉంటాయి.అందువలన డాలర్‌తో ప్రతిదేశ కరెన్సీ విలువను బట్టి పరిస్థితి మారుతూ ఉంటుంది.మనదేశంలో ఉత్పత్తి ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే విలువ పడిపోతుంది. గడిచిన ఏడాది కాలంలో రు.80లలో ఉన్న మారకం రు.90లోకి పతనమైంది.అందుకే డాలర్ల లెక్కలో మన జిడిపి తగ్గింది.ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మన రూపాయి పాపాయి మీద వత్తిడిని మరింతగా పెంచాయి. ముడిచమురు ఉత్పత్తిలో మోడీ అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో 37.4మిలియన్ టన్నుల నుంచి ప్రస్తుతం 25మి.టన్నులకు పడిపోయింది, సహజవాయు ఉత్పత్తి కూడా తగ్గింది.ఈ మేరకు విదేశీ దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తున్నది.దీనికి గాను డాలర్లు కావాలి, వాటిని కొనుగోలు చేయాలంటే మన రూపాయి విలువ పతనం అవుతున్నది. ఇటీవలి కాలంలో మన స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు పెద్ద మొత్తంలో లాభాలు దండుకొని వెనక్కు తీసుకోవటం కూడా డాలర్లు తరలిపోవటానికి ఒక కారణం. తన డాలరు పెత్తనాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్ వంటి దేశాలనే తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు చూస్తున్న అమెరికా తన కరెన్సీ విలువ పతనం కాకుండా చూస్తున్నది. భారత ఆర్థిక సంవత్సరం 2025-26లో మన వృద్ధి రేటు 6.5శాతం ఉన్నప్పటికీ కరెన్సీ విలువ పదకొండుశాతం పతనం కాగా జపాన్ ఎన్ 10, బ్రిటన్ పౌండ్ రెండు శాతాల చొప్పున పెరిగాయి. అందుకే స్వల్పంగానే అయినప్పటికీ అవి రెండు మనలను వెనక్కు నెట్టి పైకి వెళ్లాయి. మన జిడిపి లెక్కింపు ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చిన కారణంగా తగ్గిపోయినట్లు కొందరు చెబుతున్నారు, అదే వాస్తవం అయితే అంతకు ముందు పాత ప్రాతిపదిక సంవత్సరాన్ని తీసుకొని ఎక్కువగా చూపి జనాన్ని మభ్యపెట్టారని అనుకోవాల్సి ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం వలన మనకెలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నారు. అలా జరగాలనే జనం కోరుకుంటున్నారు.అది నిజమా !ఇల్లు కట్టేటపుడు, పెళ్లి కుదిరిన తరువాత వాటిని పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కడబడితే అక్కడ అప్పు తెచ్చి ముగించటం తెలిసిందే. తరువాతే అసలు కథ మొదలౌతుంది.యుద్ధ ప్రభావం కూడా అంతే.మనకు అవసరమైన ముడి చమురు దిగుమతులను తగ్గించటంలో మోడీ సర్కార్ విఫలమైంది.అవసరాలు పెరుగుతున్నపుడు దిగుమతులు కూడా పెరగాలి కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆత్మనిర్భరత నినాద కాలంలో మన స్వదేశీ ఉత్పత్తి 2014 38మిలియన్ టన్నులు ఉండగా ఇప్పుడు 25మి.టన్నులకు పడిపోయింది.అందువలన 88శాతం మేరకు దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది.రోజుకు సగటున 50లక్షల పీపాలను కొనుగోలు చేస్తున్నాం.ఈ మొత్తంలో 40శాతం హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతుంది.వంటగ్యాస్‌ను 91శాతం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.ఇప్పుడు దీనికీ ఆటంకం ఏర్పడింది.విదేశాల్లో ఉన్న భారతీయులు వందమంది అనుకుంటే 50మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. వారు ప్రతిఏటా 50బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు.ఇప్పుడు ఎంత తగ్గిందో లెక్కలు తేలిన తరువాత మాత్రమే తెలుస్తుంది.యుద్దానికి ముందు మనం సగటున 67డాలర్లకు ఒక పీపా దిగుమతి చేసుకుంటే అది 110 డాలర్లకు పెరిగింది. 2022 నుంచి దిగుమతి ధర తగ్గినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి తగ్గుదల లేకుండా గోళ్లూడగొట్టి అధికమొత్తాలను వసూలు చేశారు.అందుకే తేలుకుట్టిన దొంగల మాదిరి ఏమీ మాట్లాడటంలేదు, అయితే తాత్కాలికమే.
పవర్ పెట్రోలు, పారిశ్రామిక అవసరాలకు వాడే డీజిల్ ధరలను మాత్రమే పెంచారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మొత్తం చమురు, గ్యాస్ ధరలను పెంచుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న.ఎందుకంటే నరేంద్రమోడీ జిగినీదోస్తు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడప్పుడే సంక్షోభాన్ని ముగించేట్లు లేడు. యుద్దానికి ముందు రోజుకు 33.5కోట్ల డాలర్లను దిగుమతులకు ఖర్చు చేస్తుంటే ఆ మొత్తం ఇప్పుడు 55 కోట్ల డాలర్లకు పెరిగింది.నలభై ఐదు రోజుల యుద్ద కాలంలో పెరిగిన అదనపు చమురు బిల్లు 970 కోట్ల డాలర్లు.ఇది మన కరెన్సీ 92వేలకోట్లకు సమానం.ముడి చమురు ధర ఒక పీపాకు పదిడాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు జిడిపిలో 0.4 నుంచి 0.5శాతం పెరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతి చేసే టాంకర్ల బీమా ధరలు 400శాతం పెరిగాయి, రూపాయి విలువ నష్టం గురించి ముందే చెప్పుకున్నాం.చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 40శాతం పెరిగాయి, మన రూపాయి విలువ 11శాతం తగ్గింది. దీంతో ప్రతి పీపాకు మనం చెల్లించాల్సిన మొత్తం 55శాతం పెరిగిందని అంచనా. మరింత సులభంగా చెప్పాలంటే యుద్దానికి ముందు ఒక పీపాను మన రూపాయల్లో రు.5,695కు తెచ్చుకుంటే ఇప్పుడు రు.9,500 చెల్లించాల్సి వస్తోంది.ఈ మొత్తం జనాలు లేదా ప్రభుత్వం భరించాల్సిందే. మోడీ జనం మీద దయచూపుతారా ? పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కారణాలతో మన విదేశీమారక ద్రవ్యం100 బిలియన్ డాలర్లు తగ్గింది. యుద్దం కారణంగా వంటగ్యాస్ దిగుమతులు వెంటనే 30శాతం తగ్గాయి. దాంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం చమురుశుద్ది కేంద్రాలలో ఉప ఉత్పత్తులైన ప్రొపేన్ మరియు బుటేన్‌లను వంటగ్యాస్ తయారీకి మళ్లించాలని ఆదేశించింది, దాంతో 25శాతం మాత్రమే అదనంగా అందుబాటులోకి వచ్చింది. ఈ కారణంగా ఇప్పటికీ గ్యాస్ సరఫరా ఆలశ్యం అవుతున్నది. గ్యాస్ ధర రు.60 పెంచారు, సబ్సిడీ రు.40 రద్దు చేశారు, అంటే వంద రూపాయలు వడ్డించారు.మన భూగర్భ నిల్వల సామర్ద్యం 1.4లక్షల టన్నులే,రోజుకు 80వేల టన్నులు కావాలి గనుక రెండు రోజులకూ సరిపోదు. అందుకే వెంటనే కొరత ఏర్పడింది.
ఈ సంక్షోభం కారణంగా దాదాపు పన్నెండు బిలియన్ డాలర్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు ముప్పులో పడినట్లు గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్(జిటిఆర్‌ఐ) అంచనా వేసింది.నాలుగు లక్షల టన్నుల బాస్మతి బియ్యం రేవుల్లో నిలిచిపోయింది.కాండ్లా రేవులో అరటి పండ్లు పనికిరాకుండా పోయాయి.తేయాకు ఇరవైశాతం ఎగుమతులు ఆగిపోయాయి.ఇదే విధంగా మనం దిగుమతి చేసుకొనే ఆపిల్,ఇతర ఉత్పత్తులు కూడా ఆగిపోయాయి.దిగుమతి చేసుకొనే ఎరువులు నెల రోజులు ఆలశ్యం అవుతాయని, ఇప్పటికే 20శాతం ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రతి ఏటా 50 బిలియన్ డాలర్లు మాతృదేశానికి పంపుతున్నారు.ఈ మొత్తంలో మధ్య ప్రాచ్య దేశాల నుంచి 15బిలియన్ డాలర్లు వస్తున్నాయి.తాజా సంక్షోభంతో ఈ మొత్తాల మీద ప్రతికూల ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే తెలియదు.పశ్చిమాసియా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండదని తొలిరోజుల్లో మాట్లాడిన అధికారపక్ష నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.నీతి ఆయోగ్ తాజా నివేదికలో దేశవాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం గురించి చెబుతూ కరెంట్ ఖాతా లోటు పెరగనుందని చెప్పింది.దేశ ఎగుమతులు, దిగుమతుల్లో గల్ఫ్ ప్రాంత వాటా పన్నెండుశాతం ఉంది.యుఏయికి సరకులను పంపి అక్కడి నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తారు.ఇప్పుడు వాటికీ ముప్పు ఏర్పడింది.ఈ ప్రాంతం నుంచి మన ఎరువుల అవసరాల్లో 36శాతం, విలువైన రాళ్లు,లోహాలలో 32శాతం దిగుమతి చేసుకుంటున్నాము.మూడవ త్రైమాస కాలంలో యుద్దంతో నిమిత్తం లేని సమయంలో మన వస్తు ఎగుమతులు కేవలం 1.6శాతం పెరగ్గా దిగుమతులు 7.9పెరిగాయి.
ముడి చమురు ధరలు పెరగటం, కొరతల కారణంగా వృద్ధి రేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు ఉందని ఏప్రిల్ ఎనిమిదిన ఆర్‌బిఐ గవర్నర్ సంజరు మల్హోత్రా విధాన ప్రకటనలో పేర్కొన్నారు.ద్రవ్యోల్బణ లక్ష్యం నాలుగుశాతం కాగా 4.6శాతానికి పెరగవచ్చని ఆర్‌బిఐ పేర్కొన్నది.నెల రోజుల పాటు రష్యన్ చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ” అనుమతి ” ఇచ్చింది. అయితే గతంలో ట్రంప్ బెదిరించిన కారణంగా మనం దిగుమతులు తగ్గించిన కారణం కావచ్చు,మార్కెట్‌లో డిమాండ్ ఇతర కారణాలతో గతంలో రష్యా ఇచ్చిన రాయితీలు ఇప్పుడు లేకపోగా అదనంగా చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ప్రపంచ మార్కెట్ కంటే పీపాకు పదిహేను నుంచి ఇరవై డాలర్లు తక్కువగా రాయితీ ధరలకు రష్యా ముడిచమురును అందచేస్తే దాన్నుంచి ఉత్పత్తులు తయారు చేసి అంబానీ,నయారా కంపెనీలు విదేశాలకు లాభాలకు అమ్ముకున్నాయి తప్ప మన వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గించలేదు.ఇప్పుడు గతరాయితీలు పోగొట్టుకొని ప్రామాణిక బ్రెంట్ రకం కంటే రెండు నుంచి నాలుగు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.అమెరికా పాటలకు అనుగుణ్యంగా డాన్సులు చేస్తే ఇలాగే ఉంటుంది మరి.అతి తెలివి ప్రదర్శిస్తే వ్రతమూ చెడుతుంది, ఫలితమూ దక్కదు ! మొత్తంగా పన్నెండేళ్ల పాలన తీరు తెన్నులను చూస్తే మన్మోహన్ సింగ్ హయాంలో యుపిఏ ఎదుర్కొన్న తీవ్ర పరిస్థితులు తిరిగి వస్తున్నాయా ? 2029లో మోడీ, బిజెపి పాలనకు తెరపడుతుందా ?
