ఎం కోటేశ్వరరావు
అదానీ, అంబానీ,గూగుల్, అమెజాన్‌లకు ప్రజల సొమ్మును రాయితీల రూపంలో ఇస్తే అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్లు ఏడవకండి. ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు జనాన్ని ఏమార్చే ఊసరవెల్లులు రంగులనే కాదు, సిద్దాంతాలను కూడా మార్చివేస్తున్నారు. వాస్తవాలను తలకిందులుగా చూపితే కొందరు తమ మెదళ్లను అలాగే ఉంచుకొని నిజమే అంటారు. సంపద సృష్టికర్తలు జనం.కానీ కొందరు ముందు చెప్పుకున్న కంపెనీల వంటివే సృష్టికర్తలని చెబుతూ వాటికి సర్వం సమర్పించుకుంటున్నారు. దాన్ని సమర్ధించుకొనేందుకు ఊట సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు.ఈ సిద్దాంతం ఎప్పుడు వచ్చింది. దోపిడీ పెరిగిపోయి భరించలేని స్థితిలో కార్మికవర్గం, రైతాంగం తిరగబడి రష్యా,చైనా, మరికొన్ని దేశాలలో సోషలిస్టు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.జనం వాటికి ఆకర్షితులు కావటాన్ని గమనించి 1960దశకంలో ఊట సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. సూక్ష్మంలో మోక్షంలా ఒక్క ముక్కలో చెప్పాలంటే సంపదలను పెరగనిస్తే వాటి ఫలాలు క్రమంగా ఊటనీరులా సమాజంలోకి దిగుతాయి.అందరికీ ఉపయోగం. దీన్ని ఎవరైతేనేం మహానుభావులు నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు,రాహుల్ గాంధీ, రేవంతరెడ్డి, కెసిఆర్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, మాయావతి అండ్‌కో గట్టిగా బలపరుస్తారు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా జరుగుతున్నది తద్విరుద్దంగా ఉంది.
తాజాగా ” భారత సంపదల గుర్తింపు నివేదిక 2026 ” (వెల్త్ ట్రాకర్ ఇండియా రిపోర్టు 2026) ప్రకారం మనదేశంలో సంపన్నుల్లో అగ్రభాగాన ఉన్న 1,688 మంది సంపద దేశ జిడిపిలో సగానికి సమానం. ఇంత అసమానత, కేంద్రీకరణ బ్రిటీష్ వారి కాలంలోనూ, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనూ లేదు.1980దశకం వరకు కూడా నేడున్నంత తీవ్రంగా లేవు. ఊట సిద్దాంతం చెప్పటం ప్రారంభించిన తరువాత కిందికి బదులు సంపద పైకి చేరుతున్నది.ఈ 1,688 మంది కలవారి మీద రెండు నుంచి ఆరుశాతం సంపద పన్ను విధిస్తే ఏటా పదిలక్షల కోట్ల రూపాయల వరకు రాబడి వస్తుందని, ఆ మొత్తాన్ని సంక్షేమానికి వినియోగించవచ్చని సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ ఎకౌంటబులిటీ -సిఎఫ్‌ఏ (ఆర్థిక జవాబుదారీతన కేంద్రం) రూపొందించిన సదరు నివేదిక పేర్కొన్నది.ఎప్పటికైనా వామపక్షాలు అధికారానికి వచ్చి పిల్లిమెడలో గంట కట్టాల్సిందే తప్ప మిగిలినవారెవరూ అలాంటి ఆలోచన కూడా చేయరు. మరోవైపు నిధుల కొరత గురించి శ్రీరంగ నీతులు చెబుతారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు సవరించేందుకు ముందుకు రారు. గూగుల్ వంటి ధనిక సంస్థలకు వేల కోట్ల రూపాయలు రాయితీలుగా ఇచ్చేందుకు తాంబూలాలు ఇచ్చేశారు.రేవంత రెడ్డి బాట కూడా అదే. పన్నెండేండ్ల క్రితం నరేంద్రమోడీ చెప్పిన కబుర్లలో అచ్చేదిన్(మంచి రోజులు ) ఒకటి.దేశంలో మోడీని చూసి ఓట్లు వేసిన ఎవరికైనా ఐదు సంవత్సరాల్లో రాబడి 400 శాతం పెరిగిందా ? మోడీ మద్దతు ఉన్న అంబానీ, అదానీ, జిందాల్,శివనాడార్, సునీల్ మిట్టల్ వంటి వారికి 2019-25 సంవత్సరాలలో సంపదలు దాదాపు 400శాతం పెరిగాయి.వాటిలోంచి కొంత తీసి ఎన్నికల బాండ్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలను బిజెపికి కట్టబెట్టారు.అనధికారికంగా సమర్పించుకున్న మొత్తాలకు లెక్కలేదు.ఎంత డబ్బు లేకపోతే కేరళలోని పాలక్కాడ్‌లో బిజెపి మద్దతుదారులు ఓటుకు ఐదువేల రూపాయలు ఎలా పంచగలిగారు ?
నూతన ఆర్థిక విధానాలకు ఆద్యులం మేమే అని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటుంది. వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఖ్యాతి మాదే అని బిజెపి ఢంకా బజాయించి మరీ బాకాలూదుతున్నది.వందకోట్ల డాలర్ల సంపద కలిగిన శ్రీమంతుడు 1991దేశంలో ఒక్కరే, అలాంటిది ఇప్పుడు 358 మంది ఉన్నారు.నివేదికలో పేర్కొన్న 1,688 మంది సంపద విలువ 166లక్షల కోట్లు, ఇది మన జిడిపిలో దాదాపు సగం. దేశంలోని ఎగువ ఒక శాతం మంది సంపద 2019లో 36.5శాతం ఉండగా 2022 నాటికి 40.1శాతానికి పెరగ్గా ఇదే కాలంలో దిగువ 50శాతం మంది వాటా 6.8 నుంచి 6.4శాతానికి దిగజారింది. అచ్చే దిన్ ఎవరికి ? ఇక వెయ్యి కోట్లకు మించి ఆస్తులున్న వ్యక్తుల సంఖ్య 2019-25 మధ్య 77శాతం పెరగ్గా, వారి సంపద (31లక్షల కోట్ల నుంచి 88లక్షల కోట్లకు) 227శాతం పెరిగింది.వీరిలో అదానీ ఆస్తి 625, ముకేష్ అంబానీ సంపద 153శాతం పెరిగింది.కేంద్ర ప్రభుత్వం వారిపట్ల ఎలాంటి సానుకూలత, అభిమానం చూపకుండానే స్వంతంగా చెమటోడ్చి పెంచుకున్నారని చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి.ఈ అపర కుబేరుల మీద పన్ను వేస్తే వచ్చే అదనపు రాబడితో విద్య, వైద్యం వంటి సేవలకు జిడిపిలో అదనంగా ప్రతి రంగానికి ఒక్కో శాతం ఖర్చు పెంచవచ్చు, వృద్దు లందరికీ నెల నెలా పన్నెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వవచ్చు.మానవత్వం ఉట్టి పడే నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఎంతో తెలుసా ? 80 ఏండ్ల లోపు వారికి నెలకు రు.200, ఆపైబడిన వారికి రు.500, వితంతువులకు రు.500, వికలాంగులకు రు.300-500 మాత్రమే. మోడీ ఏలుబడిలో ఒక్క పైసా కూడా పెంచలేదు. అంతకు ముందు యుపిఏ ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాలనే ఇస్తున్నారు. అంతకు మించి ఇస్తున్నారంటే అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉదారత్వమే.ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న నాలుగువేలు, తెలంగాణాలో ఉన్న రెండువేలల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం రెండు, ఐదు వందలు మాత్రమే. అందుకే ఎప్పుడూ ఈ పెన్షన్లలో మా మోడీ గురించి చెప్పరేం అని ఏ ఒక్క బిజెపి నేతా డిమాండ్ చేయరు.
అపర కుబేరుల మీద సంపద పన్ను విధిస్తే ఏం చేయవచ్చో కూడా నివేదిక పేర్కొన్నది.అంబానీ నుంచి రెండుశాతం పన్ను వసూలు చేస్తే దేశంలో ఉన్న 185 లక్షల మంది పదవ తరగతి విద్యార్ధులకు మూడేసి లాప్‌టాప్‌లు ఉచితంగా ఇవ్వవచ్చు. లేదా 2.85కోట్ల మంది తల్లులకు రెండు సంవత్సరాల పాటు ఆర్థిక సాయం చేయవచ్చు.ఏడాదికి రు.18వేలు ఇస్తే అయ్యే ఖర్చు సంవత్సరానికి రు.51,300 కోట్లు.అదానీ నుంచి రెండుశాతం పన్ను వసూలు చేస్తే దేశమంతటా రెండు సంవత్సరాల పాటు ప్రాధమిక ఆరోగ్యానికి ఖర్చు చేయవచ్చు లేదా 87 కోట్ల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వవచ్చు.లేదా ఎనిమిది కోట్ల కుటుంబాలకు చెడు గాలి నుంచి రక్షణకు శుద్ధి చేసే పరికరాలను ఉచితంగా అందించవచ్చు.సావిత్రీ జిందాల్ నుంచి వసూలు చేసే పన్నుతో దళితులు, గిరిజన విద్యార్ధులకు కొన్ని సంవత్సరాలపాటు స్కాలర్‌షిప్పులు ఇవ్వవచ్చు.లేదా పదివేల రూపాయల చొప్పున రెండున్నర కోట్ల మంది బాలికలు తమ విద్యను మెరుగుపరుచుకొనేందుకు ఇవ్వవచ్చు.కార్పొరేట్‌లు, వ్యక్తులకు పన్నుమినహాయింపులు ఇస్తున్న కారణంగా ఆ భారాన్ని సామాన్యులు భరిస్తున్నారు. గత పదకొండు సంవత్సరాల్లో కార్పొరేట్లకు రు.19.6లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. అయితే రికార్డుల్లో వాటిని పారుబాకీలుగా చూపుతారు తప్ప రద్దు చేసినట్లు ఉండదు.మన దేశం జి 20 కూటమిలో భాగస్వామి. జోసెఫ్ స్టిగ్లిజ్ అనే ఆర్థికవేత్త నాయకత్వంలో ప్రపంచ అసమానతల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేశారు.అసమానతల పెరుగుదల విధానపరంగా ఎంచుకున్న అంశమని, సంపద పెరిగే కొద్దీ పన్ను మొత్తాలను పెంచే విధంగా ఆ విధానాన్ని మార్చాలని కమిటీ నివేదిక పేర్కొన్నది.కానీ మనదేశంలో జరుగుతున్నదేమిటి ? అసమానతలను తగ్గించాలని మన రాజ్యాంగమే చెప్పింది.అధికారంలో ఎవరున్నా దాన్ని తుంగలో తొక్కారు.చివరకు మోడీ సంపదపన్నునే రద్దు చేశారని సదరు నివేదిక వ్యాఖ్యానించింది.ఎందుకయ్యా అంటే వసూలు చేసే పన్ను కంటే అందుకయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని చూపారు.చట్టంలో లోపాలు ఉన్నాయన్నారు.ఇంట్లో ఎలుకలు ఉన్నాయని వాటిని చంపటం కంటే ఇల్లుతగులబెట్టటమే లాభదాయకమని చెప్పినట్లుగా ఉంది.చట్టాల్లో ఉన్న అనేక లోపాలను సరిచేస్తున్నామని చెప్పిన వారు ఈ చట్టాన్ని ఎందుకు సరి చేయలేదు ? 1957 చట్టం ప్రకారం రు.30 లక్షల సంపద మీద ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.దాన్ని రద్దు చేసి ఒక కోటికి మించి రాబడి ఉన్నవారు చెల్లించే పన్ను మీద రెండుశాతం సర్‌ఛార్జి విధిస్తున్నారు. ఉదాహరణకు కోటి రూపాయల రాబడిలో మినహాయింపులన్నీ పోను 20లక్షలకు పన్ను చెల్లించాల్సి వస్తే దాని మీద రెండుశాతం విధిస్తారు. ధనికులకు ఎన్ని రాయితీలు కల్పిస్తున్నారో చూడండి.
దేశంలో అసమానతల గురించి సిఎఫ్‌ఏ ప్రచార విభాగ డైరెక్టర్ అనిర్భన్ భట్టాచార్య మాట్లాడుతూ ” నేడు రెండు భారత్‌లు ఉన్నాయి.ఒక భారత్‌లో ఎగువన ఉన్న వేళ్లమీద లెక్కించదగిన కొద్ది మంది సంపదలు లక్షల కోట్లుగా పెరుగుతుంటే మరో భారత్ అప్పులపాలవుతున్నది ” అన్నారు. ” నోట్ల రద్దు మొదలు కరోనా మహమ్మారి వరకు గత పదేండ్లుగా బతకాలంటే ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని జనాలకు చెప్పిన వారు ఇప్పుడు ఎల్‌పిజి-బొగ్గు గురించి కూడా అడగవద్దంటున్నారని” ధనికుల మీద పన్నువేయాలనే ప్రచార కర్త రాజశేఖర్ వ్యాఖ్యానించారు.కష్టపడే సామాన్యులు రోడ్ల మీద వరుసల్లో నిలుస్తుంటే దేశంలోని అపరకుబేరులకు దోపిడీ కొనసాగించేందుకు ఉచిత పాస్‌లు ఇస్తున్నారని కూడా అన్నారు. నివేదిక రూపకల్పనలో భాగస్వామి జాకబ్ జోషి మాట్లాడుతూ ఆందోళనకర స్థాయికి సంపద కేంద్రీకరణ పెరిగినప్పటికీ విధానపరమైన చర్చలో దాని ఊసే లేదన్నారు. అసమానతలు సాధారణం అయ్యాయని, సంపదపన్ను అద్భుతాలు చేస్తుందని కాదు గానీ పేదల మౌలిక హక్కుల అమలుకు కొంత మేర దోహదం చేస్తుందని కూడా చెప్పారు. అసమానతలు పెరిగితే ఏమౌతుంది ? మానవాభివృద్ది దిగజారిపోతుంది. ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవదిగా తీసుకురావటం తమ ఘనత అని బిజెపి గొప్పలు చెప్పుకుంటుంది.కాసేపు అంగీకరిద్దాం.తలసరి జిడిపిలో సంగతేమిటి ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంది. ఐఎంఎఫ్ 2025 సమాచారం ప్రకారం చైనా 13,806 డాలర్లతో 99వదిగా ఉంది, మనదేశం 2,818 డాలర్లతో 166వదిగా ఉంది.మానవాభివృద్ది సూచికల్లో 2012లో 136వ స్థానం నుంచి మోడీ అధికారానికి వచ్చిన 2014లో 130వదిగా కాస్త పెరిగింది.సబ్‌కాసాత్ సబ్‌కా వికాస్ పాలనలో 2025లో కూడా 130వదిగానే ఉంది.సాధించిన అభివృద్ది ఏమిటి ? ఇంక మోడీ ప్రత్యేక ఏముంది ! కాషాయదళాలు చెప్పే ఆవు పాలు అంబానీ, అదానీలకు పేడ, మూత్రం జనాలకు పంచితే ఇదే జరుగుతుంది.మానవాభివృద్ది సూచికలో చైనా 0.797 పాయింట్లు కలిగి ఉంటే మనదేశం 0.685 దగ్గర ఉంది.అసమానతలు పెరిగే కొద్దీ ఆ సంఖ్య పెరగదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మట్టికాదోరు మనుషులోరు అన్నది నిజం కావాలంటే సంపదలు కేంద్రీకృతమైతే కుదరదు. పిండికొద్దీ రొట్టె అన్నట్లుగా ఆదాయం ఉంటేనే ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవనం సాధ్యం.సర్వేజనా సుఖినోభవంతు అంటే చాలదు, అందుకు కార్యాచరణ ముఖ్యం !
