Tags
Agricultural research and Development, BJP, china agriculture, FAO, Farmers matters, Narendra Modi Failures, pseudoscience, R & D in India, RSS discipline hypocrisy exposed, Saffron gang hypocrisy
ఎం కోటేశ్వరరావు
పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలా లేదా అన్న అంశంపై నాలుగేండ్ల నాడు వేసిన కమిషన్ ఏం చేస్తోందో తెలియదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధరలతో పాటు దిగుబడి పెంపుదల, సాగు ఖర్చుల తగ్గింపు గురించి అనేక మంది చెప్పటం తెలిసిందే. పోనీ దానికైనా గడచిన పన్నెండేళ్లలో మోడీ సర్కార్ ఏమైనా చేసిందా ? వ్యవసాయ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి తీరుతెన్నులు, ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు గురించి రోమ్ నగరంలో ఉన్న ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) ఏప్రిల్ 30వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. సభ్యదేశాల ప్రభుత్వాలు అందచేసే సమాచారం మేరకు 2023వరకు ఉన్న వివరాల ప్రకారం రూపొందించిన నివేదిక. గడచిన రెండు దశాబ్దాలలో ఏటా 1.8శాతం చొప్పున పరిశోధనకు ఖర్చు పెరుగుతూ 50.4 బిలియన్ డాలర్లకు చేరింది.వర్తమాన సహస్రాబ్ది తొలి పదేండ్లలో విస్తరణ మందకొడిగా ఉందని, 2009తరువాత పెరిగిందని గమనించారు.రైతే రాజు, దేశానికి వెన్నెముక, రైతులేనిదే రాజ్యం లేదు వంటి మాటలు ఎన్నో విన్నాం. ఏం జరిగింది, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ అగ్రికల్చర్ రిసర్చ్(ఐజెఓఇఏఆర్) 2026 మార్చినెల సంచిక, పేజీ 126లో దిగువ వివరాలు ఉన్నాయి. పంట ఉత్పత్తి అంకెలను మిలియన్ మెట్రిక్ టన్నులుగా, దిగుబడి హెక్టారుకు టన్నులుగా గమనించాలి.చైనాలో మనకంటే సాగుభూమి తక్కువ, అయినా మొత్తం 69.కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంటే మనం 35.4కోట్ల టన్నులు చేసి చైనా కంటే మన జనాభా అదనంగా ఉన్నప్పటికీ అవసరానికి మించి పండిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాం.
పంటపేరు×× భారత ఉత్పత్తి××చైనా ఉత్పత్తి×××భారత దిగుబడి××చైనా దిగుబడి
వరి ×××××× 147-150 ×× 145 ××× 4.3 ×× 7.1
గోధుమ ×× 113-117 ×× 140 ××× 3.5 ×× 5.5
మొక్కజన్న × 35 ×× 280-290 ××× 3.2 ×× 6.1
సోయాబీన్×× 12-13 ×× 20 ××× 1.2 ×× 1.9
బం.దుంప×× 60 ×× 95 ××× 24 ×× 33
పిండికొద్దీ రొట్టె అన్న పెద్దలే కుండలో కూడు కుండలోనే ఉండాలి పిల్లాడు దుడ్డులా పెరగాలంటే కుదరదని కూడా చెప్పారు. జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచటంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే దిగుబడులను కూడా అధికంగా సాధించాలి. అందుకు పెట్టుబడి, శాస్త్రవేత్తలు కావాలి. ప్రపంచంలో 2004లో 2,04,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటే 2023నాటికి 3,16,000కు పెరిగారు. మనదేశంలో పరిస్థితి ఏమిటి ? పూర్తికాలం పని చేసే పరిశోధకుల సంఖ్య రెండువేల సంవత్సరంలో 11,154 మంది ఉంటే 2018లో 11,372 మంది ఉన్నారు. అదే చైనాలో ప్రస్తుతం 43వేల మంది పని చేస్తున్నారు.శాస్త్రవేత్తల సంఖ్యను బట్టే వారి మీద పరిశోధన ఖర్చుకూడా ఉంటుంది. అది అధిక దిగుబడి వంగడాలు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పండించటం మీద కూడా ప్రభావం చూపుతుంది.పారిశ్రామిక, ఐటి రంగాలకు అవసరమైన చౌక (కార్మికులు) ఇంజనీర్ల సృష్టి మీద చూపిన శ్రద్ధ అధికారంలో ఎవరున్నా వ్యవసాయం మీద పెట్టలేదు. ఎందుకంటే కోట్లాది మంది రైతుల కంటే లక్షల మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద ఎక్కువ. అందుకే వ్యవసాయ రంగం ఇలా దిగజారిపోతున్నది, వ్యవసాయం గిట్టుబాటుగాక, అప్పులపాలైన రైతాంగ ఆత్మహత్యల గురించి వింటున్నాం.ఇతర రంగాల్లో అలాంటి పరిస్థితి లేనందుకు సంతోషమే గానీ ఇంకా ఎంతమంది రైతాంగాన్ని బలిపెట్టాలన్నదే ప్రశ్న.
దేశంలో జరిగిన అనర్దాలన్నింటికీ గాంధీ, నెహ్రూలే కారణం అని కాషాయ దళాలు నిరంతరం దుమ్మెత్తి పోస్తుంటాయి.వారి పూర్వీకులు బ్రిటీష్ వారి సేవకు బదులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొని నాయకత్వ స్థానాలకు వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా, ఎందుకు ఆ పని చేయలేదో చెప్పగలరా ? పోనీ వాజ్‌పాయి, ఇప్పుడు నరేంద్రమోడీ ఏలుబడిలో పరిశోధన అభివృద్ది రంగాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు, ఇతర దేశాలతో ఎందుకు పోటీపడటం లేదో అయినా చెప్పాలి.ఎవరు అడ్డుకున్నారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయిష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకొనేవారి ఒళ్లో కూర్చుని రెండువేల సంవత్సరాల నాడే భారత్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేశారని, వినాయకుడికి ఏనుగు తల అమర్చటం దానికి నిదర్శనమని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అదే బాటలో గోమూత్రం తాగితే కాన్సర్ నయమౌతుందని బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్ సెలవిచ్చినదాన్నీ దేశం చూసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్న నాగేశ్వరరావు ఇంకా ముందుకు పోయి మహాభారత కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ పరిజ్ఞానంతో 100 మంది కౌరవులు ఒకేతల్లికి జన్మించారని కూడా చెప్పారు. అదే నిజమైతే పాండవులు వేర్వేరు తండ్రులకు ఎలా పుట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులని చిత్రిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నవారు శాస్త్రపరిశోధనలను ప్రోత్సహిస్తారా ? అమెరికాలోని లోవా విశ్వవిద్యాలయం చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.ఓయిసిడి సమాచారం(2022) ప్రకారం 2000-2002 మధ్య వ్యవసాయ పరిశోధనలకు అమెరికా, భారత్,బ్రెజిల్ దేశాలలో ఒక బిలియన్ డాలర్లకు అటూ ఇటూగా ప్రభుత్వాలు ఖర్చు చేశాయి.అదే 2019-21నాటికి చైనా ఖర్చు ఏడాదికి 1.3 నుంచి 6.6బిలియన్లకు పెరిగింది. అమెరికా,భారత్,బ్రెజిల్ చేసిన మొత్తం ఖర్చు కంటే చైనాలో ఎక్కువగా ఉంది.
దశాబ్దాల పాటు కొనసాగిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి తన అజెండాకు అనుగుణంగా వ్యవహరించేందుకు నీతి అయోగ్‌ను నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే గాంధీ, నెహ్రూలు అడ్డుకొని ధర్నాలకు దిగిన ఉదంతాలేమీ లేవు.నీతి అయోగ్ 2025లో విడుదల చేసిన పదకొండవ పత్రంలో ఏం చెప్పిందో తెలుసా ! 1995-96లో కేంద్ర ప్రభుత్వం జిడిపిలో అన్ని రకాల పరిశోధనలకు కేటాయించిన మొత్తం 0.61 శాతం కాగా 2005-06లో అది 0.81కి పెరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015-16లో 0.69శాతం, 2020-21లో 0.64శాతానికి పతనమైంది.వ్యవసాయ పరిశోధనలకూ ఇదే గతి అని వేరే చెప్పనవసరం లేదు.జిడిపిలో కనీసం రెండు శాతం కేటాయించాలని గతంలో ప్రణాళికా సంఘం సిఫార్సు చేసింది.దీని గురించి మోడీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఎందుకు మాట్లాడటం లేదు ? ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2020లో తలసరి పరిశోధన పెట్టుబడి ఇజ్రాయెల్ 2,438 డాలర్లతో ప్రపంచంలో అగ్రగామిగా ఉండగా, తరువాత 2,192 డాలర్లతో అమెరికా,తొమ్మిదవ స్థానంలో ఉన్న చైనా 250, పద్నాలుగవ స్థానంలో 13 డాలర్లతో మనం ఉన్నాం. వీటినే అదే ప్రపంచ బ్యాంకు మరోవిధంగా చెప్పింది. జిడిపిలో ఇజ్రాయెల్ 5.4, అమెరికా 3.5శాతం కేటాయించగా చైనా 2.4, మనదేశం 0.7శాతం కేటాయించింది.అంతేనా ప్రభుత్వ రంగంలో మొత్తం పరిశోధనా సంస్థలు అమెరికా 727, చైనాలో 353, భారత్‌లో 18 ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక అంశాలను నీతి అయోగ్ తన పత్రంలో పేర్కొన్నది. ఇంత దరిద్రంగా ఉంటే మన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు ఎలా పెరుగుతాయి, నాణ్యతలో ప్రపంచంలో ఎలా పోటీపడతాయి ? మోడీ విధానాలతో 2047నాటికి దేశం ఎక్కడికో పోతుందని నమ్మే వారు దేశంకోసం-ధర్మం కోసం బుర్రలు పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదా ! నరేంద్రమోడీ ఇజ్రాయెల్ పర్యటన జరిపి ఏం నేర్చుకొని వచ్చారు.ఇజ్రాయెల్ పితృస్వామికం, మనది మాతృస్వామికం అని చెప్పారు.దీని మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు ఎంతగా అపహాస్య చేశారో తెలిసిందే. అక్కడి నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే పాలస్తీనా ప్రాంతాలలో ఇజ్రాయెల్ యూదులను ఎలా ప్రవేశ పెట్టి జనాభా నిష్పత్తిని ఎలా మార్చివేసిందో, కాశ్మీరులో కూడా అలాగే చేయాలని ప్రయోగాలు చేసింది.పెగాసెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు వచ్చి విమర్శనాత్మకంగా ఉండే మీడియా, రాజకీయంగా విబేధించే పార్టీల నేతల సమాచారాన్ని దొంగచెవులతో వినేందుకు చూసింది, వివిధ దేశాల్లో హంతక దళాలతో హత్యలు ఎలా చేయించవచ్చో నేర్చుకున్నది తప్ప మరొకటి కాదు.
చరిత్రలో నరేంద్రమోడీ ఏ ప్రధానీ వెళ్లనన్ని సార్లు చైనా వెళ్లారు, దాని నేతలతో భేటీ అయ్యారు.పోనీ చైనా నుంచి అయినా నేర్చుకున్నారా అదీ లేదు. ఓయిసిడి నివేదిక ప్రకారం 2019-21 సంవత్సరాలలో చైనా వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1.6లక్షల కోట్ల డాలర్లు, అమెరికాలో 0.4,భారత్ విలువ 0.2లక్షల కోట్ల డాలర్లు మాత్రమే.మనదేశంతో పోలిస్తే చైనా విస్తీర్ణం చాలా ఎక్కువ, దానిలో 10.6శాతం 1.02మిలియన్ల చదరపు కిలోమీటర్లలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. అదే మనదేశంలో 52.8శాతం భూమి 1.69మిలియన్ చదరపు కిలోమీర్లలో సాగు చేస్తున్నాం.అయినా మన ఉత్పత్తి విలువ తక్కువగా ఎందుకుందో చైనాలో ఎక్కువ ఎందుకో ఎప్పుడైనా మోడీ తెలుసుకున్నారా ! ప్రపంచం మొత్తంలో ఉన్న భూమిలో 11.6శాతం మాత్రమే సాగులో ఉంది,భారత్ అగ్రస్థానంలో ఉండగా అమెరికాలో 17.1, రష్యాలో 7.4శాతంలో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రభుత్వ రంగం చేస్తున్న ఖర్చు గురించే మాట్లాడుకున్నాం. ప్రైవేటు రంగం కూడా ఇటీవలి సంవత్సరాల్లో పరిశోధనలకు ఖర్చు చేస్తున్నది.అది గుత్త సంస్థలకు మాత్రమే లాభాలు చేకూర్చుతున్నది తప్ప అందరికీ కాదు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం వ్యవసాయ పరిశోధనల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది.అక్కడ ప్రభుత్వ ఖర్చు తగ్గుతున్నది. చైనాలో ప్రైవేటు పరిశోధనలు దాదాపు లేవు.భారత్,బ్రెజిల్, ఐరోపా యూనియన్‌లో పెరుగుతున్నాయి.. ప్రైవేటు రంగం కేంద్రీకరణ అంతా మార్కెట్లో గిరాకీ, లాభం ఉన్నవాటి మీదే ఉంటుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గటం వలన టిఎఫ్‌పి(టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ) సూచిక అమెరికాలో ఇటీవలి కాలంలో ఆరుశాతం తగ్గింది.దీని అర్ధం ఏమిటంటే పదేండ్ల కాలంలో ఉత్పాదకత అమెరికాలో లాభసాటిగా లేదు.అందుకే పెద్ద ఎత్తున ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి అక్కడి ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో గుమ్మరించేందుకు అదిరింపులు, బెదరింపులు చేస్తున్నది.
మనువాదులు, సనాతనులుగా చెప్పుకొనేందుకు గర్వపడుతున్నవారు ఇటీవలి కాలంలో వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే వాదనలను ముందుకు తెస్తున్నారు.జర్మన్ హిట్లర్‌తో సహా పలువురు విదేశీయులు వివిధ రూపాల్లో వచ్చి మన పురాణాలు, వేదాలను తమ దేశాలకు తీసుకుపోయి వాటిలో ఉన్న విజ్ఞానాన్ని తస్కరించి తమవిగా చెప్పుకొని అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పేవారి సంగతి తెలిసిందే. అదే నిజమైతే మనం ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించటానికి బదులు సమాజానికి అజ్ఞానాన్ని ఎందుకు పంచినట్లు ?ఆంగ్లేయులు ఇతర ఐరోపావారు మనదేశానికి రాకముందే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, తరువాతే వారి అదనపు ఉత్పత్తులను అమ్ముకొనేందుకు మనతో సహా ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు. పురాణాల్లో ఉన్న కొన్నింటికి ఆధునిక గణిత, శాస్త్రసిద్దాంతాలను అంటగడుతూ ఇవన్నీ గతంలోనే మనవారికి తెలుసని గతం గురించి గొప్పలు చెప్పుకుంటాయి కాషాయ దళాలు, వాటి తప్పుడు ప్రచారాన్ని తలకు ఎక్కించుకున్నవారు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఏక పార్టీ నియంతృత్వం, దాని విధానాలు మనకు పనికి రావు, చైనీయులు కాపీ కొడతారు అని సొల్లు కబుర్లు చెబుతారు.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని, సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు చెబుతున్నమాట నిజం. కానీ ఉత్పత్తులు ఎలా చేయాలో, పంటలు ఎలా పండించాలో నేర్చుకొనేందుకు ఆడలేక మద్దెల ఓటిగా ఉందని సాకుచెప్పినట్లుగా సిద్దాంతాలతో పనేముంది ?అన్నీ అందరికీ తెలియవని మన పురాణాలే చెబుతున్నాయి. కుమారిల భట్టు వేదపండితుడే అయినప్పటికీ మిగతా అంశాల గురించి తెలియదు. బౌద్దం, జైనుల తత్వశాస్త్రం గురించి అధ్యయనం చేయటానికి వారి ఆశ్రమాలకు మారువేషంలో వెళ్లి అధ్యయనం చేసి తరువాత వాదించాడని చెబుతారు.ఆదిశంకరుడు సైతం పరకాయ ప్రవేశ విద్య ద్వారా కామకళా శాస్త్రాన్ని నేర్చుకొని ఉభయ భారతీదేవితో వాదించి ఆమె భర్త మండన మిశ్రుని శృంగేరి మొదటి పీఠాధిపతిగా నియమించినట్లు చెబుతారు. ఇక్కడ సమస్య ఏమంటే మన ఘనాపాటీలు, సంస్కృత పండితులు ఇంతవరకు వాటిలో ఉందని చెబుతున్న విజ్ఞానాన్ని బయటకు తీయలేదు, నూతన ఆవిష్కరణలు చేయలేదు.ఇప్పటికైనా ఆదిశంకరుల మాదిరి పరకాయ ప్రవేశం చేసిన చైనా, ఇతర దేశాల నుంచి దేశం కోసం-ధర్మం కోసం దేశభక్తులుగా మారి ఆధునిక యుద్ద విమానాల సాంకేతిక పరిజ్ఞానాలను సేకరిస్తారా ? పారిశ్రామిక,వ్యవసాయ రంగంలో వృద్ధికి తోడ్పడతారా ? పడక కుర్చీల కాలక్షేపపు కబుర్లు చెబుతూనే ఉంటారా ?


