బ్రెక్సిట్‌ : మీడియా వైఖరి ఏ పక్షం ?

Tags

, , , ,

Image result for brexit media bias

ఎం కోటేశ్వరరావు

   ఇటీవలి కాలంలో మీడియా పాత్ర గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి చోటా ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతోంది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ ఘటన, అదే మనిషి కుక్కను కరిస్తే సంచలన వార్త. అదే మాదిరి సాధారణ అర్ధంలో మీడియాకు చెప్పిన నిర్వచనం ప్రకారం వ్యవహరిస్తే అది సాధారణం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అది చర్చ నీయాంశం అవుతుంది. వర్తమానంలో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవాలనే అంశంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ, అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో అక్కడి ప్రధాన రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీల తరఫున ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే అంశంలో ఆ రెండు పార్టీలలో పోటీ బడిన వారు పార్టీ సభ్యుల మధ్య జరిపిన ఓటింగ్‌ సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు, లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలో వున్న చోట ఆ ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా మీడియా వ్యవహరించటం తీవ్ర చర్చ నీయాంశం అయింది. ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ పరిణామాల గురించి చూద్దాం.

   న్యూ (కొత్తది) అనే ఏక వచన ఆంగ్ల పదానికి బహువచన రూపమే న్యూస్‌(కొత్తవి). సులభంగా చెప్పాలంటే తాజా కూరల గంప. దానిలో రకరకాల కాయలు, ఆకు కూరలు, మసాలాకు వుపయోగించే కరిపేపాకు, కొత్తి మీర వంటి వన్నీ గంప లేక బండిలో ఒకే దగ్గర వుంచి విక్రయించినట్లుగానూ న్యూస్‌ పేపర్లు, పుస్తకాలు, అవే ఎలక్ట్రానిక్‌ రూపంలో రేడియో,టీవీలు మొదలైనవి. కొంత మంది న్యూస్‌లో నాలుగు ఆంగ్ల అక్షరాలు నాలుగు దిక్కులను సూచించే పదాలలోని మొదటి అక్షరాలని అంటే నలుదిక్కులకు సంబంధించి సమాచారమని కూడా కొందరు వ్యాఖ్యానాలు చెప్పి వుండవచ్చు. అలా తీసుకున్నా దాని అర్ధంలో పెద్ద మార్పు వుండదు.

  సమస్య ఎక్కడ వస్తుందంటే నాలుగు దిక్కులకు చెందిన నూతన సమాచారాన్ని ఎలా అందించాలన్న దగ్గర వస్తోంది. మన దేశంలో స్వాతంత్య్రానికి ముందు పత్రికలు ప్రభుత్వానికి చెందిన నిర్ణయాలు, అభిప్రాయాలను, వైఖరులను మాత్రమే అందచేసేవి. అంటే ఆంగ్లేయుల పాలన కొనసాగింపు, ఆంగ్లేయుల కంపెనీల ప్రయోజనాలు, ప్రపంచ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వ, పాలకుల వైఖరిని సమర్ధిస్తూ వార్తలు ఇచ్చేవి. అందుకే రాణిగారి పక్షం అని పిలిచేవారు. ఏకపక్షంగా వార్తలు ఇస్తూ, పాలనలోని లోపాలను, హాని కర విధానాలను విస్మరించటం పాఠకులలో విమర్శలకు కారణం కావటంలో కొన్ని పత్రికలు సున్నితంగా విమర్శలు చేసేవి. రాణిగారి విధానాలు మంచివే గానీ వాటి అమలులో అధికారుల లోపాల కారణంగా సమస్యలు అనే పద్దతిలో వార్తలు ఇస్తే అటు రాణీగారికి ఇబ్బంది లేదు ఇటు పాఠకులను కొంత మేరకు సంతృప్తి పరచవచ్చు. అలా ఇచ్చిన పత్రికలను రాణీగారి ప్రతిపక్షం అని పిలిచారు. ఈ రెండు రకాల పత్రికల ధోరణులకు భిన్నంగా అసలు ఆంగ్ల పాలన, జాతీయ, అంతర్జాతీయంగా బ్రిటన్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేక వైఖరితో స్వాతంత్ర పోరాటానికి అనుకూలంగా వార్తలు ఇచ్చిన పత్రికలు కూడా మన దేశంలో వునికిలోకి వచ్చాయి. ఇవి ఒక తరగతి, స్వాతంత్ర పోరాటంతో పాటు వచ్చే స్వాతంత్య్రం దేశంలోని 99 శాతం మంది ప్రయోజనాలకు అనుగుణంగా వుండాలనే వైఖరితో వార్తలు, వ్యాఖ్యానాలతో వెలువడే పత్రికలు కూడా వచ్చాయి. అందువలన మీడియా అనే సాధనాన్ని ఎవరికి అనుకూలంగా వుపయోగిస్తున్నారనే దానిని బట్టి స్థూలంగా చెప్పాలంటే రెండు రకాలు ప్రతి సందర్భంలోనూ వున్నట్లు మనం గమనించవచ్చు.ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ ప్రజాభిప్రాయం సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు తెన్నులను పరిశీలిద్దాం.

   ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. ఆ మేరకు జూన్‌ చివరి వారంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్‌లో 52శాతం బయటకు వెళ్లిపోవాలని, మిగిలిన వారు వుండిపోవాలని ఓటు చేశారు.ఈ ప్రక్రియను ఆంగ్లంలో పొట్టిగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. ఓటర్లు మొత్తం పాల్గొని వుండి వుంటే, మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే ఫలితం ఎలా వుండేదో చెప్పలేము. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి ఆలోచనల చేయకుండా మీడియా వార్తలను చూసి వ్యతిరేకంగా ఓటేశాము అని చెప్పిన వారు వున్నారు. తూచ్‌ మేము ఇలా అనుకోలేదు, తిరిగి ప్రజాభిప్రాయసేకరణ జరపండి అప్పుడు మేము సరైన నిర్ణయం తీసుకుంటామంటూ వ్యతిరేకంగా, అనుకూలంగా ఓటు చేసిన వారు, అసలు ఓటింగ్‌లో పాల్గొనని వారూ లక్షల మంది పార్లమెంట్‌కు నివేదించారు. బ్రిటన్‌ నిర్ణయం ప్రపంచాన్ని కుదిపివేసింది అంటే అతిశయోక్తి కాదు. అంతర్గతంగానే కాదు అంతర్జాతీయంగా కూడా లాభ నష్టాల పర్యవసానాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక పెద్ద వుపద్రవం సంభవించినపుడు ఎవరికీ ఏమీ నిర్దిష్టంగా తెలియదు, ప్రతి ఒక్కరూ తోటి వారిని వూరడించేందుకో లేక తెలుసుకొనేందుకో, తనకు తెలిసినదానిని చెప్పేందుకో పడే మూక ఆతురత కనిపిస్తోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎవరైనా యువతీ యువకులు వెంటనే వివాహం చేసుకోవాలనుకుంటే ఏటిఎం ఏదైతేనేం తీసుకోవటానికి మిషన్‌లో డబ్బుందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు పక్కనే వున్న ఆంజనేయ స్వామి గుడి అయినా సరే అర్ధగంటలో ఆ తంతు పూర్తిచేస్తారు, అదే విడాకులు తీసుకోవాలంటే నిర్ణీత వ్యవధి అవసరం అలాగే నిబంధనావళిని పూర్తిగా పాటిస్తే ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది, ఇంకా సాగదీయాలనుకుంటే ఆ తరువాత ఎంత కాలం పడుతుందో తెలియదు. లేదూ ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి ఐరోపా యూనియన్‌లోనే కొనసాగాలని అనుకుంటే అదీ సంభవమే.

     బ్రిటన్‌లో ఎంత అవివేకులైన ఆధునికులు వున్నారో బ్రెక్సిట్‌ వెల్లడించిందని సత్యజిత్‌ దాస్‌ అనే ప్రవాస సంతతికి చెందిన బ్రిటీష్‌ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. మీడియా తమను తప్పుదారి పట్టించింది అని కొందరు మండి పడుతుంటే జనంలో వున్న వెధవాయత్వం గురించి కొందరు అదే మీడియాలో తప్పుడుతున్నారు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని చెప్పినట్లుగా మీడియా ఎలా అయినా సొమ్ము చేసుకుంటుందా ? ఒక వివాదం లేదా ఒక విధానం గురించి చర్చ, ఓటింగ్‌, నిర్ణయం జరిగే సందర్బాలలో మీడియా ఎలా వ్యవహరించాలి అన్నది మీడియా ప్రారంభం నుంచి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే వుంది.నిష్పక్షపాతంగా, మంచి చెడ్డలను తక్కెట్లో పెట్టి సమంగా తూచినట్లుగా వుండాలని ఎవరైనా కోరుకుంటారు. అలా జరుగుతోందా ?

    సాధారణంగా ఎన్నికలలో ఓడినవారు విచారపడితే గెలిచిన పక్షం విజయం జరుపుకుంటుంది. ఈ బ్రెక్సిట్‌లో అక్కడి టోరీ, లేబర్‌ పార్టీ రెండూ ఓడాయి, రెండూ గెలిచాయి. ఎందుకంటే ఓటింగ్‌ ఫలితం రెండు పార్టీల నాయకత్వాలలో అభిమానులలో చీలిక తెచ్చింది.ఐరోపా యూనియన్‌ శ్రామికుల, మధ్యతరగతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తోందన్న భావన నానాటికీ పెరుగుతోంది కనుక దానికి వ్యతిరేకంగా కొందరు, దీర్ఘకాలంగా దానిలో బ్రిటన్‌ సభ్యురాలిగా వుంది కనుక తమ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసిందని మరికొందరు, మిగతా దేశాలతో మనకు అనవసరం మన దేశం, మన పూర్వవైభం, మన పలుకుబడి, పెత్తనం అనే పెత్తందారీ జాతీయవాదం తలకెక్కించుకున్నవారు ఇలా వివిధ కారణాలతో ఓటు చేశారని చెబుతున్నారు. కొంతమంది చెప్పినట్లు ప్రపంచీకరణ, అక్కడి పాలకవర్గం అనుసరిస్తున్న పొదుపు చర్యలపై రెండు పార్టీల వెనుక వున్న సామాన్యుల ఆగ్రహం అందామా ? ఒక వేళ అదే సరైనది అనుకుంటే బ్రెక్సిట్‌ను మొత్తం మీద మీడియా అంతా బలపరిచింది అంటున్నారు కనుక మీడియా కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మారిందా ? మీడియాను అదుపు చేస్తున్న కార్పొరేట్‌ శక్తులు మారుమనసు పుచ్చుకున్నాయా ? అన్న ప్రశ్నలకు సమాధానం కష్టం. ప్రపంచాధిపత్యంలో పోయిన బ్రిటన్‌ ప్రాభవాన్ని లేదా పెత్తనాన్ని పూర్తిగా పునరుద్దరించలేకపోయినా కనీసం తమ ప్రయోజనాలనైనా రక్షించుకోవాలనే బ్రిటన్‌ కార్పొరేట్‌ (ఆర్ధిక) జాతీయ వాదం వైపు మొగ్గేట్లు జనాన్ని మీడియా ఒకవైపుకు నెట్టిందా ? ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే వర్గ, ఆర్ధిక,విద్య, వయస్సు, నివాసం, జాతి మొదలైన అంశాలన్నీ పని చేసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ లక్షణాలన్నీ దానిలో వున్నాయి. ఏది ఎక్కువ పని చేసింది ? ఇంకా లోతుగా అధ్యయనాలు వెలువడితే తప్ప నిర్ధారణకు రాలేము. సాంకేతికంగా ఈ ఓటింగ్‌కు ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగటానికి సంబంధం లేదు. ఓటు చేశారు కనుక వెంటనే వెళ్లి పోండి అని మిగతా సభ్య దేశాలు కోరాయి గనుక బ్రిటన్‌ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మేం విడిపోవాలనుకున్నాం అని చెప్పినంత మాత్రాన విడాకులు రావు, కోర్టులో తమ వినతిని దాఖలు చేయాలి. అలాగే ఐరోపా యూనియన్‌ నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 ప్రకారం తాము విడిపోయేందుకు క్రమాన్ని ప్రారంభించాలని బ్రిటన్‌ కోరినపుడే ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రధానిగా వున్న కామెరాన్‌ రాజీనామా ప్రకటించారు, కొత్త ప్రధాని ఎన్నికైన తరువాత ఆ క్రమాన్ని ప్రారంభంపై నిర్ణయంతీసుకుంటారని చెప్పారు. బ్రెక్సిట్‌లో మీడియా పాత్ర గురించి చూద్దాం.

   రెండు తెలుగు రాష్ట్రాలలోని పత్రికలు అసాధారణరీతిలో ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని పాఠకులకు అందించాయి.సామాన్య జనం కంటే మధ్యతరగతి, ధనికులు, కార్పొరేట్‌ శక్తులకు ఆసక్తికలిగించే అంశం నుక అంత ప్రాధాన్యత ఇచ్చాయని వేరే చెప్పనవసరం లేదు. బ్రిటన్‌ జాతీయ పత్రికలన్నీ దాదాపుగా బ్రెక్సిట్‌కు మద్దతు ఇచ్చాయి. అయితే కొన్ని పత్రికలు పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొలది తామూహించినట్లు జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోవటాన్ని గమనించిగానీ లేదా తాము ప్రచారం చేసిన దానికి భిన్నంగా ఫలితం వస్తే తమ విస్వసనీయత దెబ్బతింటుందని భయపడి గానీ చివరి క్షణంలో వైఖరి మార్చుకున్నాయి. బ్రెక్సిట్‌కు అనుకూలంగా వ్యవహరించినవి కొన్ని అనుకూల రాగాలాపన చేశాయి. డేవిడ్‌ కామెరాన్‌, ఐరోపా అనుకూల శిబిరానికి దెబ్బ అంటూ తొలిపేజీలో ఒక పెద్ద వార్తను దాదాపు రెండు నెలల ముందుగానే ‘అబ్జర్వర్‌ ‘ ప్రచురించింది.నలభైమూడు శాతం విడిపోవటానికి, 39శాతం వుండిపోవటానికి అనుకూలంగా వున్నారని 18శాతం మంది నిర్ణయించుకోలేదని అది పేర్కొన్నది. నల్లడబ్బు అక్రమంగా దాచుకున్నవారి గురించి పనామా పత్రాలు వెల్లడి అయిన రోజు కూడా బ్రిటన్‌ పత్రికలు విడాకుల వార్తలకే ప్రాధాన్యత ఇచ్చాయి. జూన్‌ 23వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచీ ఐరోపాకు వస్తున్న వలస జనాభాకు, ఐరోపా యూనియన్‌కు లంకె పెట్టి వ్యాఖ్యాతలు, సంపాదకులు తమ రచనలను నింపివేశారు.త్వరలో వెల్లడి కానున్న బ్రిటన్‌కు వలస వచ్చిన వారి వివరాల సమాచారమంటూ నెల రోజుల ముందే డెయిలీ మెయిల్‌ తొలి పేజీలో డెయిలీ మెయిల్‌, సన్‌ పత్రికలు రెండవ పేజీలో వార్తలను ప్రచురించాయి. విడిపోవాలన్న వైఖరి తమకు ఒక పెద్ద విజయమని డెయిలీ మెయిల్‌ ముందే ప్రకటించుకుంది. బ్రెక్సిట్‌ తరువాత బ్రిటన్‌ వృద్ధి చెందుతుందని పేర్కొనటమే గాక, వేర్పాటుకు ఓటు వేయాలని కోరుతూ ఇంధనశాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్‌ రాసిన వ్యాసాన్ని కూడా అది ప్రచురించింది.అపరిమితంగా వస్తున్న వలసజనంతో ఇప్పటికే స్కూళ్లు, ఆసుపత్రులు, వుద్యోగాలు, ఇండ్లపై ఎంతో వత్తిడి పెరిగిందని ఆమె పేర్కొటాన్ని ఆ పత్రిక ప్రశంసించింది. పదమూడు లక్షల బ్రెక్సిట్‌ బాంబు పేలబోతున్నదని సన్‌ శీర్షిక పెట్టింది. తాను ప్రధానిగా వున్నానని, మనల్ని పరిపాలించాలనే విషయాన్ని కూడా మరచిపోయి డేవిడ్‌ కామెరాన్‌ మనల్ని ఐరోపా యూనియన్‌లో వుంచేందుకు పూర్తిగా నిమగ్నమయ్యారని సన్‌ సంపాదకీయం ఎత్తిపొడిచింది.

     అబ్జర్వర్‌ పత్రిక సర్వే ప్రకారం వేర్పాటు కోరుకొనేవారు నాలుగుశాతం మెజారిటీగా వున్నారని, పెద్ద వారి కంటే వారి కుటుంబాలలోని యువతరం ఐరోపా యూనియన్లో కొనసాగేందుకు ఎక్కువగా కట్టుబడి వుందని, వ్యతిరేకంగా ఎందుకు ఓటెయ్యాలో వారికి చెప్పండని డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ తన సంపాదకీయంలో పెద్దలకు సలహా ఇచ్చింది. ఈ వేసవిలో గ్రీసు నుంచి టర్కీకి వలస జనాన్ని తరలించే పధకం కనుక విఫలమైతే సంక్షోభం మరింత తీవ్ర అవుతుందని డెయిలీ టెలిగ్రాఫ్‌ పేర్కొన్నది. ఐరోపా యూనియన్‌ వ్యతిరేకి బోరిస్‌ జాన్సన్‌ రాసిన వ్యాసాలకు ఆ పత్రిక పెద్ద పీట వేసింది.’ ప్రతి సందర్భంలోనూ మనకు ఐరోపా యూనియన్‌ సమస్యగా మారుతోంది.మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ప్రభుత్వం చేసే సాయాలన్నింటికీ యూనియన్‌ అభ్యంతరం చెబుతోంది,చివరికి మన ఇంట్లో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవటాన్ని కూడా అది ప్రశ్నిస్తోంది, అర్ధమయ్యేట్లు చెప్పాలంటే మిగతా దేశాలతో సమంగా మన ఇంధన ఖర్చును తగ్గించుకోవటానికి కూడా అదే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వేలాది వుద్యోగాలకు ముప్పు వచ్చినప్పటికీ మనమేమీ చేయలేం, ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారం ప్రారంభమైనపుడు కీలక సమస్య మన సార్వభౌమత్వం అని నేను చెప్పాను, జనం నా వైపు జాలి చూపులు చూడటం నాకు గుర్తు వస్తోంది, సార్వభౌమత్వం గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని వారు చెప్పారు.అని బోరిస్‌ జాన్సన్‌ రెచ్చగొట్టాడు. మీడియా మొఘల్‌గా పేరు తెచ్చుకున్న రూపర్ట్‌ మర్డోచ్‌ పత్రికలైన సన్‌, టైమ్స్‌ రెండు వైపుల నుంచి వెలువడిన వాదనలను ప్రముఖంగా ఇచ్చాయి, మొగ్గు మాత్రం విడిపోయేవైపే వుంది. గార్డియన్‌ పత్రిక మాత్రం బ్రెక్సిట్‌ను వ్యతిరేకించింది. పోలింగ్‌ దగ్గర పడుతున్న సమయంలో మెయిల్‌ పత్రిక ఆశ్చర్యకరంగా కొనసాగాలనే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది. బ్రిటన్‌ శాంతి, సంపదలను ఫణంగా పెట్టే సమయం కాదిది అని పేర్కొన్నది. ఏ లెక్కన చూసుకున్నప్పటికీ బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతే అధిక పన్నులు, ద్రవ్య మార్కెట్లలో గందరగోళం, అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఐరోపా యూనియన్‌ వెలుపల బ్రిటన్‌ సిరిసంపదలను పొందుతుందని చెప్పేవారు ప్రమాదకరమైన భ్ర మను కలిగించేందుకు పూనుకున్నారని రెండు పేజీల పెద్ద సంపాదకీయం రాసింది. సండే టెలిగ్రాఫ్‌, సండే టైమ్స్‌ మాత్రం వ్యతిరేకంగా ముందుకు వచ్చాయి. తొలుత బ్రెక్సిట్‌కు అనుకూలంగా వున్న అబ్జర్వర్‌ పత్రిక కూడా చివరికి ‘ఎన్ని లోపాలు వున్నప్పటికీ ఐరోపా యూనియన్‌ మంచికే శక్తి నిస్తుందన్నదానిని ప్రశ్నించలేము’ అని పేర్కొన్నది. మొత్తం మీద మీడియా వ్యవహరించిన తీరు తొలి రోజుల్లో తటస్థంగా వున్నవారిని బ్రెక్సిట్‌ వైపు మొగ్గేట్లు చేసిన కారణంగానే ఫలితాలు అలా వెలువడ్డాయని చెప్పవచ్చు. ఒకసారి ఓటరు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత చివరి క్షణంలో మీడియా వైఖరిలో వచ్చిన మార్పు పెద్దగా ప్రభావితం చేయదని చెప్పవచ్చు.

    ప్రయివేటు మీడియా తీరుతెన్నులు ఒక ఎత్తయితే ప్రభుత్వ నిధులతో స్వతంత్రంగా నడుస్తుందని చెప్పబడే బిబిసి ఏ విధంగా వ్యవహరించిందనేది కూడా ఆసక్తి కలిగించే అంశమే. బ్రెక్సిట్‌ ప్రచారం, ఎన్నికల సందర్భంగా బిబిసి ‘పిరికిగా’ వ్యవహరించిందనే శీర్షికతో ఒక పత్రిక వ్యాఖ్యానించింది. మీడియా శైలిలో అతి పెద్ద సవాలును అది ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. రెండు వైపుల నుంచీ వినిపించే వాదనలకు సమ ప్రాధాన్యత ఇవ్వలేదని, మొత్తం మీద మొగ్గు ఐరోపాయూనియన్‌లోనే వుండి పోవాలనే వైఖరి వైపు వున్నదని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. బ్రిటన్‌ కార్పొరేట్‌ శక్తులలో వ్యతిరేక, అనుకూల వైఖరి వెల్లడైంది. విడిపోయి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తే ఎక్కువ లాభం అని భావించే వారు మెజారిటీగా వున్నప్పటికీ యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూసే వారు కూడా గణనీయంగా వున్నారు.ఈ శిబిరాలు చేసిన వాదనలతో జనం ఒక విధంగా గందరగోళపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఐరోపా యూనియన్‌ ఏర్పాటు అన్నది అమెరికా, జపాన్‌ పోటీని ఐక్యంగా ఎదుర్కొనేందుకే అని చెప్పినప్పటికీ ఆక్రమంలో కార్పొరేట్ల లాభాలను కాపాడేందుకు పొదుపు చర్యల పేరుతో కార్మిక వ్యతిరేక వైఖరిని ఐరోపా యూనియన్‌ తీసుకున్నది. పర్యవసానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టటం, ఎత్తివేయటమో చేస్తున్నారు. దీంతో సహజంగానే ఆ విధానాలకు కార్మికవర్గంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ అసంతృప్తిని సొమ్ము చేసుకొని వారి పేరుతో తమ ప్రయోజనాలను సాధించుకొనేందుకు కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించాయి. మీడియా వాటికి వంత పాడటం తప్ప కార్మికవర్గ ప్రయోజన కోణం నుంచి గతంలో ఆలోచించలేదు, బ్రెక్సిట్‌ సందర్భంగానూ అదే వైఖరిని అనుసరించింది.

గమనిక :ఈ వ్యాసం వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి జూలై నెల సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

నరేంద్రమోడీ తీరే వేరు – గరిష్ట మంత్రులు, కనిష్ట పాలన

Tags

, , ,

ఎంకెఆర్‌

    ప్రధాని నరేంద్రమోడీ మరో వాగ్దానానికి తిలోదకాలిచ్చారు. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అనే వాగ్దానానికి తూనా బొడ్డు అని చెప్పారు. గరిష్ట మంత్రులు-కనిష్ట పాలనకు తెరతీశారు. మంగళవారం నాడు ఐదుగురు మంత్రుల వుద్యోగాలు పీకివేసి 19మందికి కొత్తగా ఇచ్చారు. సంతుష్టీకరణ పనులు చేయబోమని గొప్పలు చెప్పుకొనే బిజెపి అదే బాటలో నడిచి జంబో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో 78 మంది వుంటే మందగా ఎద్దేవా చేసి చూడండి మేము 45 మందితో ఏర్పాటు చేస్తున్నామని గొప్పగా చెప్పారు. మంత్రివర్గ ఏర్పాటులో అసాధారణం, సానుకూల మార్పు అని స్వయంగా నరేంద్రమోడీ తన అభిమానులకు ట్వీట్లు పంచారు. దానినే పెద్ద సంస్కరణగా వూరూ వాడా టాంటాం వేసుకున్నారు, వంది మాగధుల పొగడ్తలు అందుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌, అదే మన్మోహన్‌ సింగ్‌ బూట్లలో కాళ్లు దూర్చారు.పని చేయని మంత్రులుగా పేరు తెచ్చుకున్న వారిని కొనసాగించారు. నిబంధనావళి ప్రకారం 82 మంది వరకు మంత్రులు వుండవచ్చు. అంటే మరో నలుగురికి చోటు కల్పించేందుకు అవకాశం వుంది.

     డెబ్బయి అయిదు సంవత్సరాలు దాటిన ముసలి వారిని మంత్రులుగా తీసుకోకూడదన్నది విధాన నిర్ణయంగా నరేంద్రమోడీ ప్రకటించినపుడు అద్వానీ అండ్‌ కోను వదలించుకొనేందుకే అని కొందరు గొణిగినప్పటికీ వహ్వా వహ్వా అంటూ ఎందరో అభినందనలు చెప్పారు. ముసలివారిని తొలగిస్తారని వూహాగానాలు చేసిన, రాసిన వారందరూ నజ్మా హెప్తుల్లా, కల్‌రాజ్‌ మిశ్రాల కొనసాగింపును చూసి అవాక్కయ్యారు. ఎన్‌పిఏ(పని చేయని) మంత్రిగా పేరు తెచ్చుకున్న సదానంద గౌడతో సహా మరికొందరిని పని చేసేందుకు కొనసాగనిచ్చారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరిని కొనసాగించటం ద్వారా ‘మై హూనా ‘ అంటూ భరోసా ఇచ్చినట్లయింది.

    ఇప్పటికే 13 మంది మంత్రులున్న వుత్తర ప్రదేశ్‌కు మరి కొంత మందిని తోడు చేయటం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే అంటే కోపగించుకోకూడదు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో అబ్బే అలాంటిదేమీ లేదని రుజువు చేసుకుంటున్నది. మోడీ మంత్రి వర్గ విస్తరణ పాలనతో సంబంధం లేదు ఎన్నికలు అధికారంపై తన మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ పట్టు నిలుపుకొనే రాజకీయ చర్య అని ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని తరచూ మన్‌కీ బాత్‌ అంటూ మాట్లాడతారు తప్ప కామ్‌కీ బాత్‌ను పట్టించుకోరని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

ప్రధాని నరేంద్రమోడీ – ఇప్తార్‌ విందు రాజకీయాలు

Tags

, , , , , , ,

సత్య

    మంత్రసానితనానికి ఒప్పుకున్నతరువాత ఏదొచ్చినా పట్టాలి అన్నట్లుగా ప్రజాజీవితంలో వుండాలి అనుకున్న తరువాత ప్రశంసలను ‘ఆస్వాదించటమే ‘ కాదు విమర్శలను కూడా ‘సహించాలి’.గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ పైకి అభివృద్ధి మంత్రం జపిస్తున్నప్పటికీ ఆచరణలో హిందుత్వను పెంచి పోషించటంపైనే కేంద్రీకరిస్తున్నారన్నది కమ్యూనిస్టులు, కాని వారు కూడా చేసిన విమర్శలలో ఒకటి.http://economictimes.indiatimes.com/news/politics-and-nation/pm-narendra-modi-in-control-turns-focus-from-hindutva-to-development/articleshow/53021691.cms

   ‘పరిస్థితిని అదుపులోకి తెచ్చుకొని హిందూత్వ నుంచి అభివృద్ధి వైపు మరలిన ప్రధాని నరేంద్రమోడీ’ అనే శీర్షికతో జూలై రెండున ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. దానిని ఐఎఎన్‌ఎస్‌ అనే ఒక వార్తా సంస్ధ ప్రతినిధి రాశారు. ప్రచురించిన పత్రిక, రాసిన జర్నలిస్టు, రాయించిన వార్తా సంస్ధగానీ కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో ‘నీకిది నాకది’ సంబంధాలు కలిగినవి కాదు.ఎట్టకేలకు రెండు సంవత్సరాల తరువాత హిందుత్వ నుంచి అభివృద్ధి వైపు మరలినట్లు రాసిన ఆ కధనం ‘బి పాజిటివ్‌ ‘ ధోరణిలో సాగిందే అని గమనించాలి. హిందుత్వ బలపడటానికి నరేంద్రమోడీ ‘పాటు పడుతున్నారని’ చేసిన విమర్శలు వాస్తవమే అన్నది ఆ కధనం కూడా బలపరిచింది.

      ఈ వ్యాఖ్యానం వెలువడిన రోజే రాష్ట్రపతి ప్రతి ఏటా రంజాన్‌ సందర్భంగా సాంప్రదాయంగా ఇచ్చే ఇప్తార్‌ విందుకు వరుసగా మూడవ సంవత్సరం ప్రధాని నరేంద్రమోడీ డుమ్మా అనే వార్తలు కూడా వచ్చాయి. దేనికి హాజరు కావాలో కాకూడదో ప్రధాని ఇష్టం, ఆయనకు ఆ స్వేచ్ఛ లేదా అనే మండిపడే ప్రజాస్వామిక వాదులతో ఎలాంటి పేచీ లేదు.అత్యంత గౌరవనీయ పదవిలో దేశాధిపతి అధికారికంగా ఇచ్చే విందుకు సందర్భం ఏదైనా ఆహ్వానం రావటమే ఒక గౌరవంగా భావిస్తారు. దాన్ని మన్నించటం ఒక వ్యవస్ధకు ఇచ్చే మర్యాద. సోనియా గాంధీ, సీతారాం ఏచూరి వంటి వారు రావటం అన్నది ఇక్కడ ప్రధానం కాదు. ప్రధాని న్యూఢిల్లీలో వుండి రాకపోవటం అన్నది నలుగురి నోళ్లలో నానే అంశమే. ఈ విషయం నరేంద్రమోడీ, ఆయన సలహాదారులు, మార్గదర్శకులకు తెలియదు అనుకొనే అమాయకులు లేరు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్నవి మినహా మన దేశంలో మతాన్ని రాజకీయ మయం చేసినంతగా మరే దేశంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు.వాటిలో ఇప్తార్‌ విందు ఒకటి.

      రాష్ట్రపతి ఇచ్చిన విందుకు రాకపోవటం గురించి కనీసం ట్విటర్‌ ద్వారా అయినా నరేంద్రమోడీ తెలిపారా లేదా అన్నది గానీ, బిజెపి నాయకత్వం ఇబ్బంది పడుతున్న కారణంగా తన ట్వీట్ల సంఖ్యను తగ్గించుకుంటానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవటంలో భాగంగా గానీ ట్వీట్లు, వాటిని అనుసరించే అభిమానుల విషయంలో నరేంద్రమోడీతో పోటీ పడే సుబ్రమణ్యస్వామి దీని మీద ట్వీట్‌ చేసిందీ లేనిదీ తెలియదు. స్వాతి చతుర్వేది అనే ఒక సీనియర్‌ జర్నలిస్టు ‘రాష్ట్రపతి భవన్‌ ఇప్తార్‌ విందుకు భారత ప్రధాని మరోసారి రాలేదు, విదేశాలలో ఆయన చేసిన వుపన్యాసాలను మరచిపోయినట్లుగా కనిపిస్తున్నది ‘ అని ట్వీట్‌ చేశారు.’ ఇదీ భారతీయ స్ఫూర్తి,ఇది మా జాతి బలం, మా పౌరులందరూ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్దులు, చాలా పరిమితంగా వున్న పార్సీలు, దైవంపై నమ్మకం వున్న వారు , లేని వారు అందరూ భారత్‌లో అంతర్బాగం. ఒకసారి భారత్‌కు వచ్చినట్లుగానే ఈ రోజు భారత్‌ నుంచి సూఫీయిజం ప్రపంచానికి విస్తరిస్తోంది. భారత్‌లో రూపుదిద్దుకున్న ఈ సంప్రదాయం మొత్తం దక్షిణాసియా అంతటికి చెందుతుంది. అందుకే మన వారసత్వాన్ని ఈ ప్రాంతంలోని ఇతరులందరూ పాటించాలని, పునరుద్ధరించాలని కోరుతున్నాను.’ ఈ మాటలను ఢిల్లీలో జరిగిన ప్రపంచ సూఫీ మహాసభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వుపన్యాసంలో చెప్పారు. విదేశాలకు వెళ్లినపుడు భిన్నత్వాన్ని తానెంతగా గౌరవించేది తన వుపన్యాసాలలో చెప్పే నరేంద్రమోడీ ఆచరణ ముస్లింల పట్ల వ్యతిరేక భావంతో వుంటారన్న అభిప్రాయాలకు అనుగుణంగా వుందని, తిరిగి వెనుకటి రోజులకు మరలారని కనిపిస్తోందని ఇండియా డాట్‌కామ్‌ వార్తలో వ్యాఖ్యానించారు.http://www.india.com/news/india/prime-minister-narendra-modi-skips-presidents-iftar-party-third-year-in-a-row-1304643/

     ఒకే రోజు నరేంద్రమోడీ గురించి భిన్నమైన వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.అమృతసర్‌లో నేనూ మరికొందరు జర్నలిస్టులు స్వర్ణదేవాలయ సందర్శనకు వెళ్లాము. తలమీద పాగా లేదా అది లేనట్లయితే కనీసం హాండ్‌ కర్చిఫ్‌ అయినా కప్పుకొని వెళ్లాలని చెప్పినదానిని మేము పాటించాము, అదే విధంగా తిరుపతి, తిరువనంతపురం పద్మనాభస్వామి గుడి సందర్శనకు వెళ్లినపుడు విధిగా అక్కడి ఆచారాలు పాటించాలని స్పష్టం చేశారు. ఇష్టం వున్నవారు పాటించి దేవాలయాలను సందర్శించారు లేని వారు బయటే వుండిపోయారు. నా గురించి తెలిసిన వారు నేను హిందూ మతావలంబకులను సంతుష్టి పరచటానికి అంగవస్త్రం ధరించి వారితో పాటు గుడిలోకి వెళ్లానని అనలేకపోయారు. ముస్లింలు సాంప్రదాయంగా ధరించే టోపీ (స్కల్‌ కాప్‌) ధరించటానికి నరేంద్రమోడీ తిరస్కరించారు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిదానినీ రాజకీయం చేయటంలో భాగంగా ఇతర పార్టీల వారు వాటిని ధరించినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వారు మైనారిటీల సంతుష్టీకరణలో భాగమే ఇదని వూరూ వాడా ప్రచారం చేశారు. అలాంటి వారే చివరికి వాటిని ధరిస్తే ప్రతిపక్షాలు వూరుకుంటాయా? అందుకే నరేంద్రమోడీ బహుశా తిరస్కరించి వుండవచ్చు లేదా ఇంకేదయినా మహత్తర ఆశయం వుందేమో తెలియదు. టోపీ ధరించిన వారినీ లేదా ధరించని వారిని గానీ కమ్యూనిస్టులెపుడూ విమర్శించలేదు. సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నదని విమర్శలు,ఆరోపణలకు తీవ్రంగా గురైన కాంగ్రెస్‌ పార్టీ చివరికి ఇప్తార్‌ విందులకు స్వస్తి చెప్పింది. కాంగ్రెస్‌ను దుయ్యబట్టిన సంఘపరివార్‌ తన అనుబంధ సంస్ధ ఆర్‌ఎంఎం ద్వారా కొత్తగా ఇప్తార్‌ విందులకు తెరతీసింది. గతేడాది ఈ సంస్ధ సాదాసీదాగా నిర్వహిస్తే ఈ సంవత్సరం దానిని ఒక అంతర్జాతీయ సంఘటనగా చేసేందుకు 140 దేశాల రాయబారులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించి న్యూఢిల్లీ పార్లమెంట్‌ అనెగ్జర్‌లో భారీ ఇప్తార్‌ విందు ఏర్పాటు చేసింది. దాని ఎవరైనా విమర్శిస్తే సహించాలి. ఎదురుదాడికి దిగితే లాభం లేదు.

అమరావతిపై కొండంత రాగం తీసిన చంద్రబాబు చివరికి ….

Tags

, , ,

.

ఎం కోటేశ్వరరావు

     కొండంత రాగం తీసి చివరికి కీచుగొంతుతో ఏదో గొణిగి సరిపెట్టటంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాతే ఎవరైనా అంటే ఆయన అభిమానులకు కోపం కలగవచ్చు. హైదరాబాదుకు ధీటుగా ఐదులక్షల కోట్ల రూపాయలు రాజధానికి కావాలని సీమాంధ్రప్రాంతంలో విభజనకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న సమయంలో ప్రకటించి ఆంధ్రప్రాంతంలో తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. కొండంత రాగం ఐదులక్షల కోట్లకు కనీసం ఐదు వేల కోట్లు కూడా కాదు కదా కేంద్రం విజయవాడ, గుంటూరు పట్టణాలకు ఇచ్చిన వెయ్యికోట్లతో సహా అమరావతి నూతన రాజధానికి మొత్తం మూడున్నర వేలకోట్లకు మించి ఇవ్వనంటున్నారని ఆయనే మెల్లగా ఇప్పుడు చెబుతున్నారు. ఆనాడు అసలు విభజనే వద్దంటుంటూ కొత్త రాజధానికి ఐదులక్షల కోట్లు ఆడగటం ఏమిటని ఎందరో మండి పడటంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గారు.(ఆనాడు మండి పడ్డవారు ఇప్పుడు ఇంత అన్యాయమా అని కూడా అనటం లేదన్నది వేరే విషయం) అయితే తరువాత కొంత కాలం మౌనం పాటించి, బిజెపి-కాంగ్రెస్‌ పార్టీలతో విభజన ఖరారు చేయించిన తరువాత తిరిగి అదే పల్లవి అందుకున్నారు. హిందూ పత్రిక 2013 ఆగస్టు ఒకటిన ప్రచురించిన ఆయన పత్రికా గోష్టి వివరాల ప్రకారంwww.thehindu.com/news/national/andhra…/rs-5-lakh…capital…/article4975144.ece  తన మాటలను వక్రీకరించిందని ఈ పత్రికను అనే అవకాశం లేదు.

    హైదరాబాదుతో సమంగా కొత్త రాజధాని నిర్మాణం జరగాలంటే 4-5లక్షల కోట్లు కావాలని అందుకు కేంద్రం వుదారంగా నిధులు ఇవ్వాలని చెప్పారు. అసలు హైదరాబాదుతో సమంగా అని పోల్చటమే జనాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ. మధ్యప్రదేశ్‌ను విభజించినపుడు భోపాల్‌తో సమంగా చత్తీస్‌ ఘర్‌కు, లక్నో మాదిరి వుత్తరాంచల్‌కు, పాట్నామాదిరి ఝార్కండ్‌కు రాజధానులు కావాలని ఎవరూ కోరలేదు. అది అసాధ్యం. కానీ అలాంటి కోరిక కోరకపోతే, దానిని జనంలో ప్రచారం చేసుకోకపోతే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు ? ఆ డిమాండ్‌ చేసిన సమయంలో తాను ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తన డిమాండ్లను చెబుతున్నాను తప్ప రాజకీయాలు మాట్లాడటం లేదని ఆ నాడు చెప్పారు. ఇక్కడొక విషయాన్ని గుర్తు చేస్తే తెలుగుదేశం పార్టీ వారికి ఎక్కడైనా మండవచ్చు. అంతా కాంగ్రెస్‌ వారే చేశారు, పార్లమెంట్‌ తలుపులు మూశారు, చీకట్లో చేశారు, అన్యాయం చేశారు అని విమర్శిస్తున్నారు. దానితో ఎవరూ విబేధించటం లేదు, ఆ కాంగ్రెస్‌ వారికే తరువాత తెలిసి వచ్చింది, రెండు రాష్ట్రాలలో అనుభవిస్తున్నారు అది వేరే విషయం. ఒక నిపుణుల కమిటీని వేసి హైదరాబాదుతో సమంగా మౌలిక సదుపాయాలు, నీటి పంపిణీ, ఆదాయం, విద్యుత్‌,వుద్యోగాల వంటి అన్నింటినీ విభజన బిల్లులో చేర్చాలని కూడా చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు 2008లోనే కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకొనేది లేదని కూడా చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా ,నిక్కచ్చిగా ఇచ్చిన మాటకు నిలబడిన తెలుగు దేశం పార్టీ పార్లమెంటులో బిల్లులో ఇవేవీ చేర్చలేదని తెలిసీ ఎందుకు జోక్యం చేసుకోలేదు, పోనీ నిరసన తెలిపే యావలో మరిచిపోయామంటారా? అన్యాయంగా విభజిస్తున్నారని అప్పటికే పల్లవి అందుకున్న వారు బిల్లులో జరిగే అన్యాయాన్ని ఎందుకు చూడలేకపోయారు. ఒక కన్ను పోతుంటే ఏం చేశారు? పోనీ తెలుగుదేశం వారు విభజనను అడ్డుకొనే యత్నంలో మునిగిపోయారు అనుకుందాం, అన్నీ తానే అయి వ్యవహరించిన వెంకయ్య నాయుడికి ఇవన్నీ తెలియదా ? ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నలకు ఈ జన్మలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, వెంకయ్య నాయుడు, బిజెపి నుంచి సంతృప్తికర సమాధానాలు రావు.ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కేటాయించటం కేంద్రానికి పెద్ద సమస్యకాదని మూడు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు చెప్పారు.అలాంటపుడు మూడున్నర వేలకోట్లకు మించి ఇవ్వనుంటున్నారని ఇప్పుడు చెప్పటం ఏమిటి ?

    తాను అధికారానికి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం, నాలుగైదులక్షల కోట్ల రూపాయల పాట మానుకోలేదుwww.deccanchronicle.com/140610/nation…/andhra-pradesh-new-capital-near-guntur పది-పది హేను సంవత్సరాలలో నాలుగు-అయిదు లక్షల కోట్లతో నూతన రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. జనాన్ని వెర్రివాళ్లను చేయటాన్ని కొనసాగించారు. రాజధాని అంటే రాష్ట్ర అధికార కేంద్రమైన సచివాలయం, దాని అనుబంధ కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు, రాజధాని కేంద్రంగా పనిచేసే వారికి అవసరమైన వసతి తప్ప చంద్రబాబు చెప్పే మిగిలిన వాటిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి అయితే దాని కంటే పెద్దవైన న్యూయార్క్‌ ఇతర నగరాలు పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వుంది. చైనా రాజధాని బీజింగ్‌ అయితే అక్కడి అసలైన పారిశ్రామిక కేంద్రం దానికి ఎంతో దూరంలో వున్న షాంఘై అని అందరికీ తెలిసిందే. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. గుజరాత్‌ నూతన రాజధాని గాంధీ నగరం లేదా చత్తీస్‌ఘర్‌ నయా రాయపూర్‌ వంటి వన్నీ పరిపాలనా కేంద్రాలుగా నిర్మితమయ్యాయి, అవుతున్నాయి తప్ప చంద్రబాబు చెప్పే పద్దతుల్లో కాదు.ఆ పేరుతో వేలాది ఎకరాల భూములు తీసుకున్నారు కనుక ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల ఏర్పాటు గురించి సహజంగానే జనం నుంచి డిమాండ్‌ వస్తుంది.

    తాజాగా చైనా పర్యటన జరిపిన చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. రాజధానికి ఎంతో దూరంగా వున్న దొనకొండ ప్రాంతంలో దేశంలోనే తొలిదైన అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు చైనాతో ఒప్పందం చేసుకున్నట్లు ముఖ్య మంత్రి కార్యాలయం ప్రకటించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు వున్న సాగర తీరం, పరిశ్రమల ఏర్పాటుకు వున్న అవకాశాల గురించి కూడా చైనా వారికి వివరించారు, ఇప్పటికే విశాఖ-చెన్నయ్‌ పారిశ్రామిక కారిడార్‌ గురించి వూరిస్తున్నారు. ఈ కారిడార్‌, దొనకొండ అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రం వంటి వన్నీ అమరావతి చుట్టూ ఏర్పాటు చేస్తామని చెప్పిన పారిశ్రా మిక పట్టణాలకు అదనంగా అనుకోవాలా ? ఒక అతిశయోక్తిని సమర్ధించుకోవటానికి మరొక అతిశయోకి.్త . ప్రపంచ వ్యాపితంగా వున్న పెట్టుబడిదారులు తెల్లవారిన తరువాత పెట్టుబడి పెట్టి సాయంత్రానికి వచ్చిన లాభాలతో మరోచోటికి పోయే రోజుల్లో విదేశీ కంపెనీలు, లేదా వ్యక్తులు ఫ్యాక్టరీలు, వ్యాపారాలను కొత్తగా పెట్టి ఆంధ్రప్రదేశ్‌ జనానికి వుపాధి కల్పిస్తారని నమ్మబలటానికి ఎంతో ధైర్యం కావాలి. అందుకు చంద్రబాబును అభినందించాల్సిందే.

ఇప్తార్‌ విందు: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మవంచన

Tags

, , , , , , , , ,

సత్య

     పాపం ఆర్‌ఎస్‌ఎస్‌ ! తన కార్యక్రమాన్ని తానే బహిరంగంగా సమర్ధించుకోలేక భయపడుతోంది. ఒకనాడు తాము చేసిన విమర్శలు లేదా ఆరోపణలే మరోరోజు తమను రచ్చకీడుస్తాయని బహుశా ఆలోచించి వుండదు. పక్షం రోజుల క్రితం తన మైనారిటీ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం మంచ్‌(ఆర్‌ఎంఎం) ద్వారా జూలై రెండున మన దేశంలోని ఇస్లామిక్‌ దేశాల రాయబారులతో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులను, ఇతరప్రముఖులను ఆహ్వానించి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ప్రధాన స్రవంతి మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ స్వభావం, మైనారిటీ సంతుష్టీకరణ గురించి పెద్దగా చర్చ జరగలేదుగానీ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలే నడుములు విరిగి లేవలేని స్థితిలో వున్న కాంగ్రెస్‌ మెజారిటీ ఓటర్లను ఆకర్షించాలని అనుకున్నదో ఏమో తొలిసారిగా ఇప్తార్‌ విందు ఇవ్వకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్‌ వదలి వేసిన ఇప్తార్‌ విందులను ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి ప్రారంభించిందనే రీతిలో వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా మెజారిటీ హిందువులలో పలుచనవుతామని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, యుపి తదితర రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలలో హిందువులలో దాని ప్రభావం ఎలా వుంటుందో అన్న గుంజాటన, జూన్‌ 25న కాశ్మీర్‌లో పాక్‌ వుగ్రవాదుల దాడి వంటి వుదంతాలతో పాక్‌ రాయబారిని ఆహ్వానించి ఇప్తార్‌ విందు ఇవ్వటం నష్టదాయకమని పునరాలోచించి అబ్బే అసలు మేము అలాంటి కార్యక్రమమే తలపెట్టలేదంటూ పక్షం రోజుల తరువాత జూన్‌ 30న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. వేరే సంస్ధ పెట్టుకున్న కార్యక్రమాన్ని తాము ఎందుకు వ్యతిరేకించాలని ఎదురు ప్రశ్నించింది.

     మెజారిటీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టి తమకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకొనేందుకు మైనారిటీ వ్యతిరేకతను పురికొల్పటం దాని పధకాలలో ఒకటి. బిజెపి , దాని పూర్వ రూపమైన జనసంఘం తప్ప కాంగ్రెస్‌, వామపక్షాలు, మిగతా పార్టీలన్నీ ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగిస్తున్నాయని పదేపదే ప్రచారం చేసి కొంత మేరకు విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో జయప్రదమైంది. ఇప్తార్‌ విందులు ఇవ్వటం, పర్యటనల సందర్భంగా మతపరమైన కేంద్రాలను సందర్శించటం వంటి చర్యలను అది తప్పుపట్టింది. ఓట్ల కోసం వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తాను రాజకీయంగా బలహీనపడినట్లు పసిగట్టిన ఇందిరా గాంధీ ఇలాంటి కార్యక్రమాలకు తొలిసారిగా పెద్ద ఎత్తున తెరతీశారు. తరువాత కాలంలో ఇతర పార్టీలు కూడా ఒక్క మైనారిటీలే కాదు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలకు పోటీగా మెజారిటీ ఓట్లను పోగొట్టుకోకుండా వుండేందుకు కూడా ప్రయత్నించాయన్నదానిలో రెండవ మాట లేదు. దేవాలయాల భూములను ఇతర మతాల పేదలైన కౌలుదార్లు సాగు చేయకూడదని, ఎవరైనా వుంటే వైదొలగాలని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, హాజ్‌ యాత్రలకు ఇచ్చే రాయితీలను రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వంటి క్షేత్రాల సందర్శనకు రాయితీలు ఇస్తామని ప్రకటించటాన్ని ఏమనాలి ? కాంగ్రెస్‌ బాబరీ మసీదు తాళాలను తీయటం, షాబానో కేసులో సవరణలు, బాబరీ మసీదును కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోవటం వంటి వన్నీ వాటిలో భాగమే. అందుకే కుహనా లౌకికవాదులంటూ సైద్దాంతిక దాడి చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి అవకాశాలు దొరికాయి.

  అంతర్జాతీయంగా నరేంద్రమోడీపై వున్న మైనారిటీ వ్యతిరేక ముద్ర తొలగించుకోవాలని సంఘపరివార్‌ ఆలోచిస్తున్నది. మిగతా పార్టీలు ఓట్లకోసమే మైనారిటీ పధకాలను ప్రకటిస్తే తాము ఓట్ల దృష్టితో గాక మైనారిటీల సంక్షేమం కోసమే పధకాలను ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నామని, అందుకోసం గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశాం చూడమంటూ ప్రచారానికి దిగింది. అసోం వంటి చోట్ల మైనారిటీ వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎల్లకాలం సాగదు కనుక గణనీయ సంఖ్యలో వున్న మైనారిటీలను ‘సంతృప్తి పరచటం లేదా సంతుష్టీకరణ’ చేయటం ద్వారా వారిని పక్కా వ్యతిరేకులుగా మారకుండా చూసుకొనేందుకు పూనుకుంది. అనేక మంది ప్రముఖులు ఇప్తార్‌ విందులకు హజరు అవుతున్నారు. కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ పాల్గొన్న ఒక చిత్రం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

    మన దేశంలో ముస్లిం పాలనకు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర వుంది. వారి ప్రవేశం నుంచి రంజాన్‌ సందర్భంగా ఇప్తార్‌ విందులు ప్రారంభమయ్యాయి. మహమ్మద్‌ ప్రవక్త తన వుపవాసాన్ని మూడు ఖర్జూరాలు తిని ముగించేవారట. అయితే ప్రస్తుతం ఇప్తార్‌ విందులు ఖర్జూరాలకే పరిమితం కాలేదు, ఆయా దేశాలలో వున్న ఆహార అలవాట్లతో పాటు ఎన్నిరకాలు వడ్డిస్తే అంత గొప్పగా పరిగణించే రోజులు వచ్చాయి. సామూహికంగా జరిగే ఈ క్రతువుకు హాజరు కావటం కాకపోవటం అనేది మత విశ్వాసాలకు సంబంధం లేదు. హిందువుల పండగలను ముస్లింలు జరుపుకోవటం ఎలా జరుగుతోందో ఇప్తార్‌ విందులకు వుపవాసం పాటించని హిందువులు, ఇతర మతాల వారు కూడా హాజరుకావటం అన్నది ఒక సామాజిక మర్యాద, అంశంగా మారిపోయింది. వాటిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదాస్పదం కావించింది. ఒక పార్టీ ఇచ్చిన విందుకారణంగా ముస్లింలందరూ అదే పార్టీకి ఓటు వేస్తారనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి వుండదు. అదే అయితే వినాయకచవితి, దసరా వంటి హిందువుల పండుగల సందర్బంగా బిజెపి నేతలు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంత మాత్రాన హిందువులందరూ వారికి ఓటు వేయటం లేదు. జర్మనీలో హిట్లర్‌ యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే లాభం వుంటుందని భావించినట్లే మన దేశంలో ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చని ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి శక్తులు భావిస్తున్నాయి. అందుకే ఈ రచ్చ.

 అధికారంలో వున్నపుడు మతం, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటంలో కాంగ్రెస్‌ ఎలా వ్యవహరించిందో కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బిజెపి అంతకంటే ఎక్కువగా చేస్తోందనటంలో అతిశయోక్తి కాదు. వారణాసిలో ఒక హిందూమత కార్యక్రమానికి ప్రధాని హాజరుకావటం, దానిని ప్రత్యక్ష ప్రసారం చేయటం రాజకీయ లబ్ది పొందటంలో భాగం కాదా ? ఇరుగు పొరుగు దేశాలను సందర్శించినపుడు ప్రధాని మతపరమైన పూజలు నిర్వహించటం కూడా ప్రచారంలో ఒక భాగంగా మార్చివేశారు. సినీ హీరో షారూఖ్‌ ఖాన్‌ను పాక్‌ వుగ్రవాది హఫీజ్‌తో పోల్చిన హిందూమత పూజారి లేదా యోగి, పచ్చి ముస్లిం వ్యతిరేకి అయిన ఆదిత్యనాధ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.

    ఇలాంటివి ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. వివిధ కారణాలతో అనేక దేశాలలో జరిగాయి, జరుగుతున్నాయి. ముస్లిం దండయాత్రలకు గురైన సోమనాధ దేవాలయాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులతో తిరిగి నిర్మించారు.దేవాలయ నిర్మాణం జరపండిగాని దానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించండి తప్ప ప్రభుత్వ నిధులు వద్దని చెప్పిన మహాత్మాగాంధీ సూచనను నాటి పాలకులు పట్టించుకోలేదు. 1971లో అంతర్యుద్ధం సందర్భంగా నేటి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా పట్టణంలో పాక్‌ సైన్యం ధ్వంసం చేసిన రమణ కాళీ మందిరం స్ధానంలో జాతీయ దేవాలయం(ప్రభుత్వ) కట్టించాలని అక్కడి మైనారిటీ హిందువులు చేసిన వినతి లేదా డిమాండ్‌కు తలొగ్గిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఢాకేశ్వరీ పేరుతో ఆలయ నిర్మాణం చేయటమే గాక దానిని జాతీయ ఆలయంగా కూడా ప్రకటించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి మైనారిటీ హిందువుల కోరిక మేరకు హోలీ, దీపావళిని జాతీయ సెలవు దినాలుగా ప్రకటించింది. కెనడాలో పెద్ద సంఖ్యలో వున్న సిక్కు మైనారిటీల కారణంగా వైశాఖీ పూర్ణిమను జరుపుకోవాలని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

    ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ద ఆర్‌ఎంఎం పార్లమెంట్‌ భవనంలో జరప తలపెట్టిన ఇప్తార్‌ పార్టీకి మొత్తం 140 దేశాల ప్రతినిధులతో పాటు మోడీ మంత్రివర్గ సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు కూడా హాజరౌతారని గొప్పగా ప్రకటించారు.దీని గురించి ఆర్‌ఎంఎంకు మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ ఇంద్రేష్‌ కుమార్‌ మీడియాతో స్వయంగా మాట్లాడారు. దీనిని ఒక రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఏర్పాటు చేసినదిగా చూడవద్దని కూడా చెప్పారు. భారత్‌లో అన్ని మతాల వారు సహజీవనం చేస్తున్నారని ప్రపంచానికి తెలిపేందుకు వుద్ధేశించినట్లు తెలిపారు.ఈ సంస్థకు ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదని చెప్పటం ఎలా వుందంటే బిజెపి వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో వుండవచ్చు, దానికీ తమకూ సంబంధం లేదని బుకాయించటం వంటిదే.

     ఆర్‌ఎంఎం అధిపతి మహమ్మద్‌ అఫ్జల్‌ ఈ విందు గురించి చెబుతూ భారత్‌లో ముస్లింలు శాంతి లేదా సంతోషంగా లేరని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, ముస్లింలకు మోడీ ప్రభుత్వం మంచి చేస్తున్నదని చెప్పటానికే ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైన ప్రపంచ సౌహార్ద్ర నూతన అధ్యాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది, దీనిని రాజకీయమైందని చిత్రిస్తారు, సరిగ్గా ఆ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకే దీనిని నిర్వహిస్తున్నాం అని అరటి పండు వలచి చెప్పినట్లు వివరించారు.http://indiatoday.intoday.in/story/rss-tries-to-shed-pro-hindu-image-invites-140-countries-to-iftar-party/1/695911.html

   ముస్లింలను సంతృప్తిపరుస్తున్నారని కాంగ్రెస్‌, ఇతర పార్టీలను ఇప్పటి వరకు విమర్శిస్తూ, ఖండిస్తూ వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు తానే ఆ పనిచేస్తున్నదని బిజెపి మిత్రపక్షమైన శివసేన నాయకుడు మనీషా క్యాండే ధ్వజమెత్తారు.’ఒక హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ చెబుతుంటుంది,ఇప్తార్‌ విందుల వంటి వాటిని కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఏర్పాటు చేసినపుడు వాటిని ఖండిస్తుంది,అలాంటిది ఇప్పుడు అదే ఆపని చేస్తోంది. దాని అసలు భావజాలం నుంచి పూర్తిగా వైదొలిగింది, ఒకవైపు ఘర్‌ వాపసీ గురించి చెబుతారు మరోవైపు ఇప్తార్‌ విందులు ఇస్తారు, దీని ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ గందరగోళంలో వున్నదని వారే వెల్లడించుకుంటున్నారు అని క్యాండే పేర్కొన్నారు. రిజర్వేషన్లను సమీక్షించాలంటూ వ్యతిరేకంగా మాట్లాడి తరువాత దానిని కాదని చెప్పిన విషయం తెలిసిందే. చరిత్రలో దాని ఆత్మవంచన, పరవంచన ఖాతాలో ఇప్పుడు ఇప్తార్‌ విందు మరొకటి.

స్పెయిన్‌ ఎన్నికలు-వామపక్షాలు నేర్చుకోవాల్సిందేమిటి ?

Tags

, , , ,

ఎంకెఆర్‌

    గతవారంలో జరిగిన స్పెయిన్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటర్లు మరోసారి అన్ని పార్టీలను ఓడించారు. ఏడాది వ్యవధిలో జరిగిన రెండు ఎన్నికలలో ఏ పార్టీ లేదా కూటమికి సంపూర్ణ మెజారిటీ రాలేదు. గత ఎన్నికలతో పోల్చితే మితవాద, సోషలిస్టు పార్టీలు స్వల్పంగా ఓట్లను పెంచుకోగా, అక్కడి రెండు పార్టీల వ్యవస్ధను సవాలు చేస్తూ ముందుకు వచ్చిన వామపక్ష పోడెమోస్‌ పార్టీ గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి పన్నెండు లక్షల ఓట్లను కోల్పోయింది, ఆరునెలల క్రితం 52లక్షలకుపైగా ఓట్లు తెచ్చుకుంది,విడిగా పోటీ చేసి తొమ్మిదిలక్షలకుపైగా ఓట్లు , రెండు సీట్లు తెచ్చుకున్న ఐక్య వామపక్ష పార్టీ ఈ సారి పోడెమోస్‌తో కలసి పోయింది. ఈ రెండు పార్టీల కూటమికి గతంలో మాదిరి 71సీట్లు వచ్చినప్పటికీ పన్నెండులక్షలకు పైగా ఓట్లు తగ్గటం తీవ్రమైన విషయం. ఎన్నికలకు ముందు మీడియా జోశ్యాలు పోడెమోస్‌ కూటమికి పాపులర్‌ పార్టీకి దగ్గరగా ఓట్లు వస్తాయనే (28.5, 26.6) రీతిలో సాగాయి. సోషలిస్టుల కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని కూడా కొందరు ఆశించారు. అందుకు విరుద్దంగా జరగటంతో పొడెమోస్‌ అవాక్కయింది. స్పెయిన్‌ పార్లమెంట్‌లో 350 స్ధానాలు వున్నాయి. గత రెండు ఎన్నికలలో ఓట్లు, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.(ఓ. ఓట్లశాతం సీ.సీట్ల సంఖ్య)

            పార్టీ     ఓ     సీ    పార్టీ       ఓ     సీ   పార్టీ        ఓ     సీ

2015 పాపులర్‌ 28.7 123 సోషలిస్టు 22.0 90 పోడెమోస్‌ 24.38  71

2016 పాపులర్‌ 33.0 137 సోషలిస్టు 22.7 90 పోడెమోస్‌ 21.10  71

     పోడెమోస్‌ ఓట్లు గతంతో పోల్చితే తగ్గటం గురించి అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.వాటితో కొందరు ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు, వామపక్ష శక్తులు వాటి మంచి చెడ్డలను మధించాల్సిన అవసరం వుంది. ఐరోపా యూనియన్‌లో నాలుగవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వున్న స్పెయిన్‌ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. గత ఆరునెలలుగా ఆపద్ధర్మం తప్ప ప్రభుత్వం లేదు, ఇలా వున్నపుడే ఆర్ధిక పరిస్థితి మెరుగుపడిందని కొందరు చమత్కరించారు. ఎన్నికలలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానిపక్షంలో పెద్ద పార్టీగా ఎన్నికైన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. బలపరీక్షలో అది పార్లమెంట్‌లో 50శాతానికి పైగా మెజారిటీ తెచ్చుకోవాలి. ఒకసారి విఫలమైతే రెండు నెలల్లో మరోసారి నిరూపించుకోవాలి. అది కూడా విఫలమైతే పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ విధంగానే జూన్‌ 26న రెండవ సారి ఎన్నికలు జరిగాయి.ఈ సారి కూడా గత మాదిరే ఫలితాలు రావటం, చిన్న పార్టీలు కీలకంగా మారటంతో ఏ పార్టీ కూడా వాటి మీద ఆధారపడి ప్రభుత్వ ఏర్పాటుకు గతంలో ముందుకు రాలేదు. ఈ సారి పాపులర్‌ పార్టీ గతం ంటే 14 సీట్లు పెంచుకొని 137 తెచ్చుకున్నది, సంపూర్ణ మెజారిటీకి 186 మంది మద్దతు అవసరం.సోషలిస్టులు 85, పోడెమోస్‌ 71 మరో ఆరు పార్టీలు 57 స్థానాలు తెచ్చుకున్నాయి. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా సంకీర్ణం తప్ప మరొక మార్గం లేదు. తాము ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పాపులర్‌ పార్టీ ప్రకటించింది. గత యాభై సంవత్సరాల కాలంలో రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యానికి గండిపడటం, రాజకీయ అనిశ్చిత పరిస్ధితి ఏర్పడటం ఇదే మొదటిసారి.

    ప్రస్తుతం ఏ పార్టీ మీదా విశ్వాసం లేదని స్పానిష్‌ ఓటర్ల తీర్పు స్పష్టం చేస్తున్నది. 2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక సంక్షోభం తరువాత జరిగిన ఎన్నికలలో ఒక్క గ్రీస్‌లో సిరిజా తప్ప ఏ పార్టీ కూడా రెండవ సారి వరుసగా అధికారానికి రాలేదు. ఈ స్థితిలో పొదుపు చర్యల పేరుతో అమలు జరుపుతున్న ప్రజావ్యతిరేక చర్యలను వ్యతిరేకించటం, అధికారానికి వచ్చిన తరువాత అదే పని చేయటంతో జనం మరో పార్టీని ఎంచుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో స్పెయిన్‌లో 2011 నుంచి 2015 వరకు అధికారంలో వున్న పాపులర్‌ పార్టీ ప్రజావ్యతిరేక చర్యలతో జనానికి దూరమైంది. ప్రతిపక్షంగా వున్న సోషలిస్టు పార్టీ కూడా ఐరోపాలో మిగతా సోషలిస్టుల మాదిరే అధికారంలో లేనపుడు ప్రజల గురించి కన్నీరు కార్చటం, వచ్చిన తరువాత కార్పొరేట్ల సేవలో తరించటంతో ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన పొడేమోస్‌కు జనం మద్దతు ఇచ్చారు. గ్రీస్‌లో సిరిజా పార్టీతో దానిని పోల్చారు. అంతకు ముందు కమ్యూనిస్టులుగా వున్న వారు ఐక్య వామపక్ష పార్టీగా మారారు. తాజా ఎన్నికలలో వారు పోడెమోస్‌తో కలసి పోటీ చేశారు. అయినా రెండు పార్టీలకు కలిపితే గతంలో వచ్చిన వాటి కంటే పన్నెండు లక్షల ఓట్లను వారు కోల్పోయారు.పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది నెలల్లోనే స్ధానిక సంస్ధల ఎన్నికలలో అనేక ఘన విజయాలు సాధించిన ఆ పార్టీ గత డిసెంబరులో తొలిసారి పార్లమెంట్‌కు పోటీ చేసినపుడు స్ధానిక సంస్ధలలో మాదిరి విజయం సాధించి అధికారానికి వస్తుందని, తిరుగులేని పార్టీగా ఎదుగుతుందని అతిగా అంచనాలు వేసుకున్నవారు దానికి అంత సత్తా లేదని డిసెంబరు ఫలితాలు వెల్లడి చేయటంతో నిరుత్సాహపడ్డారు.

    అవినీతి అక్రమాలతో గబ్బు పట్టిన పాపులర్‌, సోషలిస్టు పార్టీలనంటే జనం నమ్మటం లేదు, వామపక్ష పొడెమోస్‌ను ఎందుకు నమ్మటం లేదు, ఆరునెలల క్రితం కంటే ఓట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందన్నది చర్చ. వెంటనే వెలువడిన అభిప్రాయాల సారాంశం ఇలా వుంది. తటస్థంగా వున్న ఓటర్లు ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు పోవాలని బ్రిటన్‌ ఓటర్ల తీర్పు తరువాత మితవాదులవైపు మొగ్గారు. ఆర్ధిక సంక్షోభం ఐరోపాలో నయా నాజీ శక్తులు పెరగటానికి దోహదం చేస్తున్నట్లు అనేక దేశాలలో ఆ శక్తులు తెచ్చుకున్న ఓటింగ్‌ స్పష్టం చేసింది. స్పెయిన్‌లో కూడా అదే ధోరణి వెల్లడి అయిందా? గ్రీస్‌లో సిరిజాతో విబేధించే కమ్యూనిస్టు పార్టీ అన్ని ఎన్నికలలో తన బలాన్ని నిలుపుకుంటున్నది తప్ప పెరగటం లేదు.కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయిన కొందరు, ఇతర వామపక్ష శక్తులతో కలసి ఏర్పడిన సిరిజా పార్టీ అధికారానికి వచ్చిన తరువాత అంతకు ముందు మితవాదులు అమలు జరిపిన ప్రజావ్యతిరేకచర్యలనే దాదాపుగా అమలు జరుపుతున్నదనే విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అక్కడి కార్మికవర్గం కూడా నిరసన తెలుపుతున్నది. తాము కూడా గ్రీస్‌ సిరిజా వంటి వారిమే అని చెప్పుకున్న పోడెమోస్‌కు మద్దతు ఇచ్చినా అదే పని చేస్తారా అని స్పెయిన్‌ ఓటర్లు భావించారా ? సంస్ధాపరంగా మిగతా పార్టీల మాదిరే అనుకున్నారా ? ఐక్య వామపక్ష పార్టీతో కలసి పనిచేయాలని చేసిన నిర్ణయం పొడెమోస్‌లో విబేధాలకు దారితీసింది.పాబ్లో ఇగ్లెసియాస్‌ తరువాత రెండవ స్ధానంలో నాయకుడిగా వున్న ఇనిగో ఎరెజాన్‌ మధ్య విబేధాలు వెల్లడయ్యాయి. పార్టీ కార్యదర్శిగా వున్న సెరిజియో పాస్కల్‌ను తొలగించారు.పాత వామపక్షవాదులు సోది చెబుతారు,నిరాశావాదంతో నిరుత్సాహాన్ని వ్యాపింపచేస్తారంటూ ఒక ఇంటర్వ్యూలో ఇగ్లెసియాస్‌ చులకనగా మాట్లాడాడు.నిరాశావాదం ఎంత మంచిది కాదో అతి అంచనా కూడా అంతే హాని చేస్తుందని గుర్తించలేకపోయారు. అన్ని రకాల ఓటర్లను ఆకర్షించాలనే వైఖరితో పొడెమోస్‌ నాయకత్వం పూర్వపు కమ్యూనిస్టులను చులకనగా మాట్లాడటం కొంత నష్టపరిచింది. పాబ్లో ఇగ్లెసియాన్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తారని ఓటర్లు భావించారా ? పొడెమోస్‌లో తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని వామపక్ష పార్టీ మద్దతుదార్లు, తమను సంప్రదించుకుండా పార్టీ ఎన్నికల ప్రణాళికలో వామపక్ష పార్టీ అంశాలను చేర్చారని ఇతర మద్దతుదార్లు అసంతృప్తి చెందిన కారణంగా పన్నెండులక్షల ఓట్లు తగ్గాయన్నది ఒక అభిప్రాయం.ఆరునెలల క్రితం పొడెమోస్‌కు గణనీయంగా సీట్లు కట్టపెట్టినప్పటికీ వారు చెప్పిన మార్పును తీసుకురావటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న అసంతృప్తి కూడా ఓటర్లలో కలిగింది.వెనెజులా నుంచి నిధులు పొందారన్న ప్రత్యర్ధుల ప్రచారాన్ని తిప్పి కొట్టటంలో పొడెమోస్‌ నాయకత్వం జయప్రదం కాలేదా ?

   ఐక్య వామపక్ష పార్టీతో కూటమి కట్టక ముందే పొడెమోస్‌ మద్దతు పడిపోతున్నదని గుర్తించలేకపోయారు. పటిష్టమైన పార్టీ నిర్మాణం అవసరం లేదనే భావనతో పాటు దిగువ స్ధాయి నుంచి ప్రజాస్వామ్యం పేరుతో చేసిన ప్రయోగాలు, పై నాయకత్వపు అతి అంచనాలు, అంతర్గత కుమ్ములాటలు కూడా మద్దతు తగ్గటానికి దారి తీశాయి.గత ఎన్నికల తరువాత ఈ గందరగోళం మరింత పెరిగింది. సోషలిస్టులతో సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందే తిరస్కరిస్తే ఒక పద్దతి, చర్చలు ప్రారంభించిన తరువాత అవి జయప్రదం కావాలన్న విధంగా పొడెమోస్‌ నాయకత్వం వ్యవహరించలేదు, కొందరు కావాలనే చెడగొట్టారనే భావం ఒక దశలో కలిగింది. వామపక్ష పార్టీ అనే బలమైన ముద్రతోనే అధికారానికి రావటం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన నాయకత్వం మితవాద పార్టీల వెనుక వున్న ఓటర్లను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఒక మాజీ సైనిక జనరల్‌ను ముందుకు తెచ్చారు. పొడెమోస్‌ వామపక్షం కాదు మితవాద పక్షం కాదు అని అతను ప్రచారం చేశాడు. గతంలో కమ్యూనిస్టులు దురహంకార జాతీయ వాద భావనలకు దూరంగా వున్నారు. పొడెమోస్‌ నాయకుడు ఇగ్లెసియాస్‌ మితవాదులను ఆకర్షించేందుకు నేను దేశ భక్తుడిని, నేను నా దేశం గురించి పాటు పడతాను అని చెప్పాడు. అదే సమయంలో వామపక్ష పార్టీ అనే అభిప్రాయాన్ని వ్యాపింపచేసేందుకు కూడా ప్రయత్నించారు. ఐక్యవామపక్ష పార్టీతో పాటు అనేక చిన్నా,చితకా వామపక్ష బృందాలను విలీనం చేసుకున్నారు.ఈ పరిణామం కూడా గత ఎన్నికల తరువాత సోషలిస్టులతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై విబేధాలు తలెత్తటానికి దారితీసిందని చెబుతున్నారు.

     గతేడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో అనేక ముఖ్యపట్టణాలలో పొడెమోస్‌ నాయకులు మేయర్లుగా ఎన్నికయ్యారు. వారి పద్దెనిమిదినెలల పాలనాకాలంలో ఓటర్ల విశ్వాసాన్ని కోల్పోతున్నట్లు ఓటింగ్‌ తీరుతెన్నులు వెల్లడిస్తున్నాయి.మాడ్రిడ్‌, బార్సిలోనా వంటి చోట్ల వారే మేయర్లుగా వున్నారు. రెండులక్షల ఓట్లు ఈ పట్టణాలలో తగ్గాయి. అనేక చోట్ల అదే ధోరణి వెల్లడైంది.ఈ అభిప్రాయాలన్నీ ముందే చెప్పినట్లు లోతుగా విశ్లేషణ చేసి వెల్లడించినవి కాదు. పొడెమోస్‌ అధికారికంగా ఎన్నికల ఫలితాల గురించి ఎలాంటి విశ్లేషణా ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ ప్రపంచంలోని వామపక్ష శక్తులన్నీ జనం విశ్వాసాన్ని చూరగొనే క్రమంలో ఈ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని తమ విధానాలు, ఎత్తుగడలు, ప్రవర్తనలను రూపొందించుకోవాల్సి వుంటుంది.

ఏమి సెపితిరి ! ఏమి సెపితిరి !! చిన్న మౌన ముని నరేంద్రమోడీ !!!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

      పది సంవత్సరాలు అధికారంలో వున్న మన్మోహన్‌ సింగ్‌ పెద్ద మౌన మునిగా బిజెపి తదితరులతో పిలిపించుకున్నారు. కొద్ది వారాల క్రితమే రెండు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న చిన్న మౌన ముని నరేంద్రమోడీ తొలిసారిగా ఒక ప్రయివేటు టీవీ ఛానల్‌తో సంభాషించారు. తాము పూజించే లేదా అభిమానించే బాబాలు, మునులు ఎప్పుడు నోరు తెరుస్తారా మధుర భాషణం ఎప్పుడు విందామా అని ఎదురు చూసే భక్తులు, అభిమానులు ఆ క్షణంలో ఎంత తన్మయులౌతారో మోడీ భక్తుల పరిస్థితి కూడా అలాగే వుండి వుండాలి.

    నరేంద్రమోడీ నోరు తెరవటం ప్రపంచంలోని ఏడు వింతలలో చేరితే ఆయనను ఇంటర్వ్యూ చేసిన టైమ్స్‌ నౌ సంపాదకుడు ఆర్నాబ్‌ గోస్వామి పిల్లిలా మాట్లాడటం కూడా మరొకటిగా చేరటం మరొక విశేషం. మోడీ ఇంటర్వ్యూ చూసిన లేదా పత్రికలలో చదివిన వారు విమర్శనాత్మకంగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మోడీ అభిమానులు వారిని సహించరని వేరే చెప్పనవసరం లేదు. అయితే అంతర్గతంగా ఎలాగూ మాట్లాడటం లేదనే విమర్శలు మూటగట్టుకున్నారు, ఇంతకంటే పోయేదేముంది మాట్లాడి అనవసరంగా విమర్శల పాలయ్యారని తలపట్టుకోవచ్చు. ఇంటర్య్యూలోని మచ్చుకు కొన్ని అంశాలు ఎలా వున్నాయో చూడబోయే ముందు ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చూడటం అవసరం.

     ఆర్నాబ్‌ గోస్వామి గురించి సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌ కొన్ని వ్యంగ్యోక్తులు సంధించారు. అత్యాచారానికి గురైన మహిళ స్ధితి గురించి సల్మాన్‌ ఖాన్‌ నోరు పారవేసుకోవటం, మీడియా, సామాజిక మీడియా, ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించటం, దాని మీద సలీంఖాన్‌ క్షమాపణ చెప్పటం ఇవన్నీ తెలిసిందే. అయినా రేటింగ్‌ల కోసం మీడియాలో గోస్వామి వంటి వారు సల్మాన్‌ ఖాన్‌ గురించి చేసిన హడావుడి నష్టనివారణకు దోహదం చేయలేదు. నరేంద్రమోడీ ఇంటర్వ్యూను టీవీలో చూసిన సలీమ్‌ ఖాన్‌ మోడీ మాటల కంటే ఆర్నాబ్‌ గోస్వామి ప్రశ్నించే తీరునే గమనించినట్లున్నారు. అందుకే పెద్ద ఖాన్‌ చేసిన ట్వీట్స్‌లోని అంశాలు ఇలా వున్నాయి.

       ‘ ఏమిటీ ? మీరు ఇప్పుడు టమ్స్‌ నౌ(ఛానల్‌) మాత్రమే చూడండి, అది కూడా ఆర్నాబ్‌ కోసం, సల్మాన్‌ ఖాన్‌ మీద అతని అవ్యాజ ప్రేమానురాగాలను చూడటానికి కాదు, వైద్య కారణాలతో దానిని చూడటం అంటే ఎంతో వున్నత గౌరవం వుంది. వైద్య కారణాలు ఏమిటంటారా ? అవును, ఎందుకంటే నేను రెండు చెవులూ నలభై శాతం వినికిడి లోపంతో వున్నాను. ప్రతి మాటనూ ఆ ఛానల్‌లో మాత్రమే వినగలను. కానీ గత రాత్రి ప్రధాన మంత్రిని ఆర్నాబ్‌ ఇంటర్వ్యూ చెయ్యటాన్ని చూడటానికి గరిష్ట స్థాయిలో శ్రుతిని(సౌండ్‌) పెంచినా నాకు ఒక్క మాటా వినిపించలేదు. ఆర్నాబ్‌ అంత మృదువుగా వ్యవహరించటాన్ని నేను చూడలేదు. ప్రధాని సమాధానాల కోసం ఎలా ప్రశ్నించారో వూహించుకోవచ్చు. అతను రంకెలు మాత్రమే వేస్తాడు లేదా ఎవరికీ భయపడడు అని చెప్పే నాలి ముచ్చులు ఎక్కడ ?’

      అర్నాబ్‌ గోస్వామి టీవీలో చర్చలు నిర్వహించటాన్ని తొలిసారి ఎవరైనా వీక్షిస్తే పాల్గొన్నవారి మీద వేసే రంకెలు, హావభావాలను చూసి మీదపడి కొడతారా ఏమిటి అన్నట్లుగా వుంటాయి. ప్రధానితో చేసిన ఇంటర్యూ చూసి ఆయన అభిమానులు ఆశాభంగం చెంది వుంటారు, ఇతర నేతలతో చేసిన ఇంటర్వ్యూలను పోల్చి మోడీతో ఒక పరిణితి చెందిన టీవీ జర్నలిస్టు మాదిరి గాక ఒక టీచర్‌-విద్యార్ధి సంభాషణగా వుంది అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒక ప్రధాని తొలిసారి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినపుడు ఆ సంభాషణ ద్వారా కొత్త విషయాలు రాబట్టే ప్రయత్నం, తీరు కనపడలేదని, చూసేవారికి కొత్తేదేముంది అన్నట్లుగా వుంది. ఆ కార్యక్రమం మోడీ ప్రదర్శన కాదు, మోడీని ఒక మూలకు నెట్టే మల్లయోధుడి పిడిగుద్దుల మాదిరి గాక పిల్లలు తాతయ్యలను చిరుకోపంతో ముట్టుకునే మాదిరి సాగింది, ఏ మల్లయోధుడైనా ఎదుటి వారిని ముష్టిఘాతాలతో ఆడుకోవటానికి గాక వర్తులం చుట్టూ వూరికే తిరుగుతారా అని ఎద్దేవా చేశారు.

     తనపై వచ్చిన విమర్శలకు తట్టుకోలేకపోయిన ఆర్నాబ్‌ తన కార్యక్రమాల గురించి చర్చించటం తప్ప మరొక పనిలేని గుంపు ఒకటి వుంది. వారు ఎంతో విధేయతతో వుత్సాహంతో వాటిని చూస్తున్నందుకు వారికి కృతజ్ఞుడనై వుంటాను అని వుక్రోషంతో సమాధానమిచ్చాడు. ఇంటర్వ్యూ సమయంలో అసాధారణరీతిలో మీరు మౌనంగా వున్నారు ఎందువలన అని ఒక జర్నలిస్టు ఆర్నాబ్‌ను అడిగినపుడు ఇలా చెప్పాడు.’ కొంతమంది ఇంటర్వ్యూను చూస్తున్నారనుకోండి వారికి వార్తా విశేషాలు ఎంతో ముఖ్యం.పాకిస్థాన్‌లో మిలిటరీ-పౌర విభజన ఏర్పడే అవకాశం గురించి ప్రధాని సూచన ప్రాయంగా చెప్పారు. ఎన్‌ఎస్‌జి గురించి స్పందన వార్తాంశం ముఖ్యం అని నేను ఆలోచించాను. రఘురాం రాజన్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన(మోడీ) సమాధానమిచ్చిన తీరు సూటిగా వున్న వార్తాంశమని నేను అనుకున్నాను. ఈ వార్తాంశాలతో నా విధేయులైన వీక్షక బృందాన్ని, మీడియాను కూడా నిరాశపరిచాను’

    ఇంటర్వ్యూలో వున్న ఆ గొప్ప వార్తాంశమేమిటా అని అనేక మంది జర్నలిస్టులు చూశారు.తన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరైనా అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకపోతే ఆర్నాబ్‌ ఎలా రెచ్చిపోతారో చూసినవారికే అర్ధం అవుతుంది. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రాజన్‌ గురించి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి నేరుగా ప్రధానికి లేఖ రాశారు, బహిరంగంగా ఎంత రచ్చ చేసిందీ తెలిసిందే. రాజన్‌ గురించి ఆర్నాబ్‌ అడిగిన దానికి మోడీ చెప్పిన సమాధానం ఎంత సూటిగా వుందో చూడండి.’ ఎవరైనా, మా పార్టీ వారు కావచ్చు కాకపోవచ్చు, అటువంటి పనులు తగవు. అలాంటి ప్రచారం జిమ్మిక్కులతో దేశం బాగుపడదు. అటువంటి పనులు చేసే వారు మరింత బాధ్యతాయుతంగా వుండాలి. వ్యవస్థకంటే తాము పెద్ద వారమని ఎవరైనా భావిస్తే అది తప్పు’ అని మాత్రమే అన్నారు.ఇలాంటి సమాధానాలు ఇతరులు చెప్పి వుంటే ఆర్నాబ్‌ వారిని చీల్చి చెండాడి పేరు చెప్పేంతవరకు వదలి పెట్టరు.

    ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, ప్రధాని సమాధానం చెప్పిన తీరు మీద కూడా అనేక స్పందనలు వచ్చాయి. విషయం ఏమీ చెప్పకుండానే , సూటిగా మాట్లాడ కుండా ఎలా సమాధానాలు ఇవ్వవచ్చో నేర్పే విధంగా వున్నాయన్నది వాటిలో ఒకటి. పిల్లలు ఆవు, చెట్ల వలన వుపయోగాల గురించి రాసే వ్యాసాల మాదిరి వున్నాయంటే అతిశయోక్తి కాదు. అనేక అంశాలపై నరేంద్ర మోడీ మౌనం పాటిస్తారనే విమర్శ వుంది. దీంతో అది మరింత స్పష్టమైంది. ముఖ్య అంశాలపై మాట్లాడినప్పటికీ సూటిగా సమాధానాలు లేవు. అన్నింటికీ మించి విలేకర్ల గోష్టి కాకుండా తనకు మద్దతునిచ్చే ఒక ఛానల్‌తో మాట్లాడటాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా కొందరు భావించారు. మీడియాను ఎదుర్కొనే స్ధితిలో ప్రధాని లేరనేది స్పష్టమైందన్న అభిప్రాయమూ వుంది.

     ప్రధాన మంత్రి తరచూ విదేశీ ప్రయాణాలు, ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారన్న విమర్శలు వచ్చినపుడు అనేక మంది మంత్రులు, బిజెపి నేతలు విదేశీ పెట్టుబడుల కోసం జరుపుతున్నట్లు చెప్పారు. కానీ మోడీ సమాధానం అందుకు భిన్నంగా వుంది.’ ప్రపంచానికి నా గురించి తెలియదు. ఒక దేశానికి ఎవరు సారధిగా వున్నారు అని తెలుసుకోవాలని ప్రపంచం అనుకుంటుంది. ఎవరైనా మీడియా ద్వారా మోడీ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అలాంటి వారు అసలైన మోడీ ఎవరు అని తికమక పడే అవకాశం వుంది. అది జరిగితే దేశానికి నష్టం. భారత్‌పై విశ్వాసం కలగటానికి మోడీ వ్యక్తిత్వం ఆటంకం కాకూడదు, అందువలన నేను అందరు నాయకులను కలుసుకోవాలి, ముఖాముఖీ మాట్లాడాలి, నేను నిర్మొహమాటంగా మాట్లాడకపోతే వారికి భారత సారధి గురించి తెలియదు. అందువలన ఇది నాకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. ఇంతకు ముందు ప్రపంచ నాయకులను కలుసుకొనే అవకాశం రాలేదు.’

    నల్లధనాన్ని వెనక్కు తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పారన్న ప్రశ్నకు ‘ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్య అది, వారికి మాట్లాడటానికి ఏదో ఒక సమస్య వుండాలి కదా ‘ అన్నారు. ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ ‘ గత ప్రభుత్వ హయాంలో ధరలు వేగంగా పెరగటాన్ని మీరు చూడవచ్చు, నేడు వేగం బాగా తగ్గింది. మీరు అంకెలను చూడవచ్చు.రెండవది వరుసగా రెండు సంవత్సరాలు కరవు వుంది.కూరగాయలు, ఆహారం, పప్పుల ధరలపై కరవు ప్రభావం ప్రత్యక్షంగా వుంటుంది, ఎందుకంటే అవన్నీ భూమిలో పండుతాయి. అంత పెద్ద కరవు వున్నపుడు ఎవరి చేతుల్లో ఏమీ వుండదు. ఇటువంటి పరిస్థితులలో దిగుమతులు చేసుకోవటం రెండవ అవకాశం. కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంది. మూడవది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంయుక్త బాధ్యత అది.’

     కొందరు కేంద్ర మంత్రులు మతవుద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనల చేయటం గురించి అడిగిన ప్రశ్నకు ‘ అటువంటి వ్యాఖ్యలు చేసేవారిని వాటి ద్వారా హీరోలుగా మార్చవద్దని నేను చెప్పదలచుకున్నాను.వారిని హీరోలను చేయకండి, వారే మానుకుంటారు.’ అన్నారు. ఇక వుపాధి గురించి చిరంజీవి సినిమాను గుర్తుకు తెచ్చేలా చెప్పారు. ‘ మొదటి విషయం మన దేశంలో 35 సంవత్సరాల లోపు వారు 80కోట్ల మంది వున్నారు. వుద్యోగాల కోసం పెద్ద డిమాండ్‌ వున్న విషయాన్ని మనం అంగీకరించాలి.కానీ వారెక్కడ వుపాధి పొందుతారు ? పెట్టుబడులు రావాలి. వాటిని మౌలిక సదుపాయాలు, వుత్పాదక, సేవా రంగాలలో వుపయోగించాలి. ఇప్పుడు మనం చొరవ తీసుకున్నాము, ముద్రా యోజన ప్రారంభించాము. రజకులు, క్షురకులు,పాలవారు, వార్తాపత్రికలు అమ్మేవారు, బండ్ల మీద అమ్మేవారందరూ కలసి దేశంలో మూడు కోట్ల మంది వున్నారు. వారి పనిని విస్తరించేందుకు ఎలాంటి హామీతో పనిలేకుండా దాదాపు 1.25లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చాము. ఒకరు ప్రస్తుతం ఒకరికి పని కల్పిస్తున్నారనుకుందాం, దానిని విస్తరిస్తే అతనికి ఇద్దరు కావాలి. అదే ఇద్దరు వుంటే ముగ్గురు కావాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మూడు కోట్ల మంది ఈ చిన్న వ్యాపారులకు రుణం అందుబాటులోకి వచ్చిందనుకోండి వారు తమ పనిని విస్తరించక తప్పదు. మేం మరొక చిన్న నిర్ణయాన్ని తీసుకున్నాం. దేశంలో పెద్ద దుకాణాలు 365 రోజులూ నడుస్తాయి, కానీ చిన్న దుకాణాలను సెలవు రోజుల్లో మూసివేయాలి.చిన్న దుకాణాలను కూడా పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులు తెరవ వచ్చని మేము బడ్జెట్‌లో ప్రకటించాము. పెద్ద దుకాణాలకు లేని ఆంక్షలు చిన్న దుకాణాల వారికి ఎందుకు వర్తింపచేయాలి? కాబట్టి పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులూ తెరిచేందుకు అవకాశం వుంది కనుక గతంలో ఒకరిని వుద్యోగానికి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరిని పెట్టుకోవాలి, దీని వలన వుపాధి పెరగదా ? 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు వుండాలని చెబుతున్నాము.ఈ రంగం ఎంతో మందికి వుపాధి కల్పిస్తుంది.’

    కొంత మంది మంత్రులు, నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం గురించి ప్రస్తావించి మతం పేరుతో రాజకీయాలు చేయకూడదు కదా, వారిని అదుపు చేయాల్సిన అవసరం లేదా అని ఆర్నాబ్‌ ప్రశ్నించారు.’ మొదటిది, అభివృద్ధి వైపు జాతి పురోగమించాలని గట్టిగా విశ్వాసం వున్న వాడిని, అది అవసరం కూడా, అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని హీరోలుగా చేయవద్దని నేను మీడియాను కోరుతున్నాను.’

      కానీ వారు వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు కదా ?’ వారిని హీరోలను చేయవద్దు వారే ఆగిపోతారు.’

    మేం వారిని హీరోలను చేయలేదు, విలన్లుగా చేశాము ‘ కానీ మీరు వారిని ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారు. అలాంటి ప్రకటనలు చేయటాన్ని నేను టీవీలలో చూశాను, వారి ముఖాలు కూడా నేను చూడలేదు, చివరికి వారు టీవీలో అధికార ప్రతినిధులుగా మారుతున్నారు.’

  తమకు తామే ప్రతినిధులుగా ప్రదర్శించుకుంటున్నారు ‘ అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు ‘

    మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వారి గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలివి. ఒక ప్రధాని స్ధాయిలో వున్న వ్యక్తి అనేక ముఖ్యాంశాల గురించి మాట్లాడిన తీరుతో అనేక మంది విస్తుపోతున్నారు. అభిమానులు ఎలాగూ వేరే అర్ధాలు తీస్తారన్నది తెలిసిందే.