చమురు మంత్రి ప్రధాన్‌ తీరు తెన్నులు : డాంబికాలు పోవద్దురో డింగరీ డంగై పోతావు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చాలా మందికి అశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలకు దిగుమతుల మీద ఆధారపడటం, గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లే అని మరోసారి చెప్పారు. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేశామని చెప్పుకున్న పార్టీకి చెందిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటి అని ఎవరికైనా తట్టిందా ? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటం కదా !


ఇంతకీ గత ఏడు సంవత్సరాలలో ” దేశభక్తులు ” భారతీయ చమురు ఉత్పిత్తిని ఎంత పెంచారో చెప్పగలరా ? 2022 నాటికి దేశం చమురు దిగుమతులను పదిశాతం తగ్గించాలని 2015లో ప్రధాని నరేంద్రమోడీ లక్ష్య నిర్ధేశం చేశారు.2014-15లో మన దేశం వినియోగించే చమురులో 78.6శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది.యుపిఏ పాలన చివరి ఏడాది 2013-14లో మన దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37,788 మిలియన్‌ టన్నులు.అది 2019-20 నాటికి 32.173 మి. టన్నులకు పడిపోయింది. ఇది పద్దెనిమిది సంవత్సరాలలో కనిష్ట రికార్డు, 2020-21లో మోడీ సర్కార్‌ తన రికార్డును తానే తుత్తునియలు గావించి 30,5 మిలియన్‌ టన్నులకు తగ్గించేసింది. 2019-20 ఏప్రిల్‌-ఫివ్రబరి మాసాల వరకు ఉన్న సమాచారం ప్రకారం విదేశీ దిగుమతుల మీద ఆధారపడింది 86.7శాతం.( కరోనా కారణంగా వినియోగం పడిపోయింది కనుక దిగుమతులు కూడా తగ్గి ఇప్పుడు 85శాతానికి పైగా ఉంది.) దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమా, బండబడ చెవుల్లో పూలు పెట్టుకొని వినేవాళ్లుండాలే గానీ ఎన్ని పిట్ట కథలైనా వినిపించేట్టున్నారుగా !

ఇదే ధర్మేంద్ర ప్రధాన్‌ గారి తీరుతెన్నులను చూస్తే లేస్తే మనిషిని గాను అని బెదిరించే కాళ్లు లేని మల్లయ్య కథను గుర్తుకు తెస్తున్నారు. చలి కాలంలో చమురు డిమాండ్‌ ఎక్కువ ఉంటుంది, వేసవి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయని కూడా మంత్రి సెలవిచ్చారు. తగ్గకపోగా రోజూ పెరుగుతున్నాయి. ఇన్నేండ్లుగా ఉన్న కేంద్ర మంత్రికి మార్కెట్‌ తీరుతెన్నులు ఆ మాత్రం తెలియదా లేక తెలిసి కూడా జనాన్ని జోకొట్టేందుకు అలా చెబుతున్నారా ? ఆదివారం ఉదయం (జూన్‌ 27) బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 76.18 డాలర్లు ఉంది, అమెరికా రకం 74.05, మనం కొనుగోలు చేసేది 74.24 డాలర్లు ఉంది. ఇరాన్‌తో ముదురుతున్న అణువివాద నేపధ్యంలో ఎప్పుడైనా 80 డాలర్లు దాట వచ్చన్నది వార్త.


చమురు ఉత్పత్తి దేశాలు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ధరలను తగ్గించని పక్షంలో ” చమురు ఆయుధాన్ని ” వినియోగిస్తామని 2015 నుంచీ మంత్రి ప్రధాన్‌ బెదిరిస్తూనే ఉన్నారు. తాజాగా ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ మధ్యప్రాచ్య దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చమురుశుద్ధి సంస్ధలను కోరారు. ” చమురు అమ్ముకొనే వారికి భారత్‌ పెద్ద మార్కెట్‌, వారు మా గిరాకీని, అదే విధంగా దీర్ఘకాలిక సంబంధాలను గమనంలో ఉంచుకోవాలని ” బెదిరించారు. సౌదీ తదితర దేశాలను దారికి తెచ్చే పేరుతో ఇప్పటికే అమెరికా చమురు కంపెనీల ప్రలోభాలకు లొంగిపోయి అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయటం ప్రారంభించారు. నాలుగు సంవత్సరాల క్రితం ట్రంప్‌ అధికారంలోకి రాక ముందు మన చమురు దిగుమతుల్లో అమెరికా వాటా కేవలం 1.2శాతం మాత్రమే ఉండేది. అలాంటిది ట్రంప్‌తో నరేంద్రమోడీ కౌగిలింతల స్నేహం కుదిరాక ట్రంప్‌ దిగిపోయే సమయానికి 4.5శాతానికి పెరిగింది. మన డాలర్ల సమర్పయామీ, ఆయాసం మిగిలింది తప్ప మనకు ఒరిగిందేమీ లేదనుకోండి. అందుకే మన ప్రధాన్‌ గారు ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ పెద్ద మనిషి మాటలకు అంత సీన్‌లేదులే, అయినా మా మీద అలిగితే ఎండేది ఎవరికో మాకు తెలుసు అన్నట్లుగా సౌదీ అరేబియా మంత్రిగానీ, అధికారులు గానీ ఖాతరు చేయలేదు. మిగతా దేశాలూ అంతే.

తాజాగా జూన్‌ 24న ఈ పెద్దమనిషే చమురు ధరలతో తట్టుకోలేకపోతున్నాం, మా ఆర్ధిక పరిస్ధితి కోలుకోవటం కష్టంగా ఉంది కనికరించండి అన్నట్లుగా చమురు ఉత్పత్తి-ఎగుమతి(ఒపెక్‌) దేశాల సంస్ధకు వేడుకోళ్లు పంపారు. ధరలు సరసంగా ఉంటే మీకూ మాకూ ఉపయోగం ఉంటుంది అని అర్ధం చేసుకోండీ అన్నారు. లీటరు రెండు వందలైనా సరే చెల్లిస్తాం-దేశభక్తిని నిరూపించుకుంటాం అంటున్న మోడీ వీరాభిమానుల మనోభావాలను దెబ్బతీయటం తప్ప ఏమిటంటారు.( వీరి కోసం కాషాయ పెట్రోలు బంకులను తెరిచి ఆ ధరలకు విక్రయించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి లేదా ప్రతి చోటా కొన్ని ప్రత్యేక బంకులను బిజెపి కార్యకర్తలకే కేటాయించాలి) బెదిరింపులనే ఖాతరు చేయని వారు సుభాషితాలను పట్టించుకుంటారా ? నరేంద్రమోడీ గారూ మీరైనా నోరు విప్పండి లేకపోతే ప్రధాన్‌ నోరైనా మూయించండి ! బడాయి మాటలతో చమురు మంత్రి దేశం పరువు గంగలో కలుపుతున్నారు, జనంలో నవ్వులాటలు ప్రారంభమయ్యాయి. వంద రూపాయలు దాటినా నిరసనగా వీధుల్లోకి వచ్చేందుకు సిగ్గుపడుతున్నారు గానీ అంతిమంగా నష్టపోయేది మీరే, ఆపైన మీ ఇష్టం !

సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు(ట్రోల్స్‌) తిప్పుతున్న ఒక పోస్టర్‌లో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ జారీ చేసిన 1.3లక్షల కోట్ల చమురు బాండ్ల అప్పుడు మోడీ సర్కార్‌ను అప్పుల ఊబిలో దింపిందని గుండెలు బాదుకున్నారు. దానిలో చెప్పిందేమిటి ?2005 నుంచి 2010వరకు పెట్రోలు ధరలను తక్కువగా ఉంచేందుకు నాటి ప్రభుత్వం చమురుబాండ్లు జారీ చేసింది. ఆ బాండ్లతో చమురు కంపెనీలు రుణాలు తీసుకొనే వీలు కలిగినందున చమురు ధరలను తక్కువగా ఉంచాయి. యుపిఏ కాలం నాటి 20వేల కోట్ల రూపాయల చమురు బాండ్లను ఇప్పుడు మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. రానున్న ఐదు సంవత్సరాలలో యుపిఏ ప్రభుత్వ బాండ్లకు గాను 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. నిరర్దక ఆస్తులు, యుపిఏ అవకతవకలకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం, పన్ను చెల్లింపుదార్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ వాదన ఎంతో వీనుల విందుగా ఉంది కదూ !


ఇందులో చెప్పని, మూసిపెట్టిన అంశం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డియే ప్రభుత్వం కూడా చమురు బాండ్లను జారీ చేసింది. చమురు వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని చమురు కంపెనీలకు చెల్లించాలి. గతంలో అలాంటి సబ్సిడీల సొమ్మునే చెల్లించలేక సమర్ధ వాజ్‌పాయి, అసమర్ద మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌లు బాండ్ల రూపంలో(జనం ఎవరికైనా అప్పుపడితే ప్రామిసరీ నోట్లు రాసిస్తారు కదా ) ఇచ్చారు. వారందరినీ తలదన్ని 56 అంగుళాల ఛాతీ గలిగిన నరేంద్రమోడీ ఎవడొస్తాడో రండి అంటూ పూర్తిగా సబ్సిడీ ఎత్తివేశారు. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. లీటరు మీద ఒక రూపాయి పన్ను లేదా ధర పెంచినా కేంద్రానికి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం. సరే బిజెపి వారు చెబుతున్నట్లుగా గతంలో ఇచ్చిన సబ్సిడీలను జనం నుంచి వసూలు చేసేందుకే పన్ను విధించారని అంగీకరిద్దాం. రాబోయే ఐదు సంవత్సరాలలో వడ్డీతో సహా 1.3లక్షల కోట్ల మేరకు అదనపు భారం పడింది కనుక, నరేంద్రమోడీ అంతమొత్తాన్ని సర్దుబాటు చేయలేని అసమర్ధతతో ఉన్నారు కనుక మనం తీసుకున్నదాన్ని మనమే చెల్లిద్దాం.


కానీ మన నుంచి వసూలు చేస్తున్నది ఎంత ? జేబులను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిద్దామా ? మన తేల్‌ మంత్రి మహౌదరు ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన సమాచారం ప్రకారం 2013లో పెట్రోలు, డీజిలు మీద యుపిఏ సర్కార్‌ వసూలు చేసిన పన్ను మొత్తం రు.52,537 కోట్లు, అది 2019-20 నాటికి 2.13లక్షల కోట్లకు చేరింది. ఆ మొత్తం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో పదకొండు నెలలకు రు.2.94లక్షల కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రాబోయే 1.3లక్షల కోట్ల మన్మోహన్‌ సింగ్‌ అప్పు చెల్లించటానికిగాను మన నరేంద్రమోడీ గారు ఇప్పటికి వసూలు చేసిన కొన్ని లక్షల కోట్లను పక్కన పెడితే, పన్నులేమీ తగ్గించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు కనుక ఏటా మూడు లక్షల కోట్ల వంతున వచ్చే ఐదేండ్లలో పదిహేను లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ” దేశద్రోహులు ” ప్రశ్నిస్తే లడఖ్‌ సరిహద్దుల్లో మిలిటరీ ఖర్చుకు, చైనాతో యుద్ద సన్నాహాలకు మనం చెల్లించకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ మరుగుజ్జులు వెంటనే కొత్త పల్లవి అందుకుంటారు. పోనీ ఆపేరుతోనే పన్ను వేయమనండి ! బిజెపి వారి ఆదర్శం ఔరంగజేబు విధించాడని చెబుతున్నట్లు జట్టు పెంచితే పన్ను తీస్తే పన్ను అన్నట్లుగా ఏదో ఒక పేరుతో వేయమనండి. మధ్యలో మన్మోహనెందుకు, కాంగ్రెస్‌ ఎందుకు ? చిత్తశుద్ది, నిజాయితీలేని బతుకులు ! జనం పట్టించుకోకపోతే ఇవే కబుర్లు పునరావృతం అవుతాయి మరి !

కరోనా మరణాలను దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.

చైనాతో ట్రంప్‌ చెలగాటం – బైడెన్‌కు ప్రాణ సంకటం !

Tags

, , , , ,


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 4

ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో నిత్యం అనేక కుట్ర సిద్దాంతాలు, వాటికి అనుగుణ్యంగా కట్టుకథలు-పిట్టకథలూ వెలువడుతుంటాయి. ఇది ప్రచార దాడిలో భాగం అని చాలా మందికి తెలియదు. నిజమే అని విశ్వసిస్తారు. వాస్తవం కాదని తెలిసేసరికి ఆ సమస్య ఉనికిలో ఉండదు కనుక పట్టించుకోరు. ఉదాహరణకు ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినందున తాము దాడి చేశామని అమెరికా ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాంను అంతం చేసిన తరువాత అదే అమెరికా తరువాత కొన్ని సంవత్సరాల తరువాత అబ్బే అలాంటి గుట్టలేమీ దొరకలేదు అని చెప్పింది. ఎంత మంది దానిని పట్టించుకున్నారు.

గతంలో అమెరికన్లు రష్యన్లను విలన్లుగా చిత్రిస్తే ఇప్పుడు వారి బదులు చైనీయులను చేర్చారు. వారి పొడ మనకు గిట్టదు అని చెబుతుంటారు. కానీ అమెరికాలోని కాటో ఇనిస్టిట్యూట్‌ అనే ఒక మేథో సంస్ధకు చెందిన ఇద్దరు మేథావులు ఈ మధ్యే ఒక వ్యాసం రాశారు. చైనా నుంచి వలస వచ్చే వారిని అమెరికా ప్రోత్సహించాలి అని దానిలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వారిని అమెరికా గడ్డమీద అడుగు పెట్టనివ్వొద్దు అన్నట్లుగా చెలరేగి పోయాడు.వారు గూఢచర్యాలకు పాల్పడుతున్నారని, విద్యా సంస్ధలలో కమ్యూనిస్టు సిద్దాంతాలను వ్యాపింపచేస్తున్నారని, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరిస్తున్నారని మొత్తం మీద అమెరికా భద్రతకే ముప్పు తెస్తున్నారన్నట్లుగా ప్రచారం చేయించాడు. చైనా మిలిటరీ-పౌర సంస్దలు సమ్మిళితంగా అనుసరించే వ్యూహాలతో సంబంధం ఉన్న ఎఫ్‌-1 విద్యార్ధులు, జె-1పర్యాటకులను అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశాడు.చైనా సంస్ధల నుంచి నిధులు పొందే అమెరికన్‌ విశ్వవిద్యాలయాల మీద కూడా చర్యలు తీసుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక సంస్ధలలో ప్రవేశం కోరే చైనీయుల వీసాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నాడు.దాంతో ప్రతి వీసా నెలల తరబడి విచారణల్లోనే ఉండేది. కాటో సంస్ధ మేథావులు వీటన్నింటితో ఏకీ భావం కలిగిన వారే.


అయితే వారి దూరా లేదా దురాలోచనను దాచుకోలేదు.గతంలో సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్దం సాగించినపుడు దాని పౌరులను ఆకర్షించటాన్ని ఒక విధానంగా అమెరికా అనుసరించింది. ఇప్పుడు దాన్ని చైనాకు ఎందుకు వర్తింప చేయకూడదన్నది వారి తర్కం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం అనేక తూర్పు ఐరోపా దేశాలను హిట్లర్‌ ఆక్రమణ, దుర్మార్గాల నుంచి విముక్తి చేసింది. స్ధానిక కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాలను నెలకొల్పటం ఒకపరిణామం. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులను అమెరికాకు ఆహ్వానించి కమ్యూనిస్టు నియంతృత్వం నుంచి బయటపడిన స్వేచ్చా జీవులుగా ముద్రవేసి వారితో కట్టుకథలు చెప్పించి అమెరికన్లను, ప్రపంచాన్ని నమ్మించారు. నాటి అధ్యక్షుడు ట్రూమన్‌ అలా 80వేల మందికి ఆశ్రయం కల్పించాడు.1990లో సోవియట్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో కూడా అదే ఎత్తుగడను అనుసరించి వలసలను సరళతరం గావించారు.

అలా వచ్చిన లక్షలాది మంది రాజకీయ, నైతిక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఎంతగానో తోడ్పడ్డారు. కమ్యూనిజం కంటే పెట్టుబడిదారీ విధానం ఎంత గొప్పదో వారి చేత చిలుకపలుకులు పలికించి ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేకులకు వీనుల విందు చేశారు. అదే సమయంలో అమెరికాకు ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు చైనీయులు సాంకేతిక రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సవాలు విసురుతున్నారు. అందువలన అత్యంత ప్రతిభావంతులు, విద్యావంతులైన చైనీయులను అమెరికాకు రప్పించటం ఎంతో లాభదాయకం అన్నది కాటో తర్కం. అలావచ్చిన వారు గూఢచర్యానికి పాల్పడి, రహస్యాలను చైనాకు చేరవేస్తేనో అన్న ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పారు.అలాంటి చర్యలవలన జరిగే నష్టం చాలా తక్కువ అని అంతకంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చే వారు చేసే పరిశోధన, అభివృద్ధి ఎక్కువ లాభం అని బల్లలు చరిచి మరీ చెపుతున్నారు. కరోనా వైరస్‌ను ఊహాన్‌ పరిశోధనాకేంద్రంలోనే తయారు చేశారనే కథనాలు చైనా నుంచి ఫిరాయించిన ఒకరిద్దరు చెబుతున్నవే. వాటన్నింటితో ప్రపంచ మీడియా చైనా వ్యతిరేక పండగ చేసుకొంటోంది.


అయితే ఈ మేథావులు, వారిని సమర్ధించేవారు గానీ ఒక విషయాన్ని మరచి పోతున్నారు. మూడు దశాబ్దాల నాడు కూల్చి వేసిన సోవియట్‌ నాడు అమెరికాతో పోలిస్తే ఒక మిలిటరీ శక్తి తప్ప ఆర్ధిక శక్తి కాదు.ఇప్పుడు చైనా అమెరికా ఆర్ధికశక్తిని సవాలు చేసి రెండవ స్ధానం నుంచి మొదటి స్దానానికి పరుగులు తీస్తున్నది. మిలిటరీ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. సోవియట్‌ నాయకత్వం సామ్రాజ్యావాదం, పెట్టుబడిదారీ విధానాల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా జనానికి వాటి ముప్పు గురించి చైతన్యం కలిగించటంలో నిర్లక్ష్యం చేసింది. చైనా అలాంటి భ్రమల్లో లేదు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చివేసే సమయంలో సంభవించిన తియన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన వెనుక ఉన్న అంశాలను పసిగట్టి మొగ్గలోనే తుంచి వేసింది. జనాన్ని హెచ్చరించింది.ఇదే సమయంలో ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికాలో నేడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని నమ్ముతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. సోషలిస్టు చైనా విజయాలు ఎలా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన కలుగుతోంది.

అమెరికా ఇప్పటికీ బలమైన, ప్రమాదకర దేశమే అయినప్పటికీ దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మీద పట్టుకోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో చతుష్టయం (క్వాడ్‌) పేరుతో జట్టుకడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య కోసం సమగ్ర మరియు పురోగామి ఒప్పందం (సిపిటిపిపి) ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా సిద్దం కావటం లేదు. అది లేకుండా మిగతా దేశాలు చేసేదేమీ లేదు. అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల కారణంగా స్వంతగడ్డమీద పెట్టుబడులను ప్రోత్సహించాలని బైడెన్‌ సర్కార్‌ భావిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనాతో వాణిజ్యలోటు తగ్గింపులక్ష్యంతో దేశ భద్రత పేరుతో చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాల పెంపు అమెరికన్ల మీదనే భారం మోపాయి. పనిలో పనిగా జపాన్‌, ఐరోపా మిత్ర దేశాల మీద కూడా అదేపని చేశాడు. ఈ పన్నులను ఎత్తివేయాలని చైనా కంటే అమెరికా వాణిజ్యవేత్తలే ఇప్పుడు బైడెన్‌ మీద ఎక్కువ వత్తిడి తెస్తున్నారు.


చైనాతో పోరు సంగతి తరువాత, అమెరికా వెలుపలి నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్నుల విధింపు కారణంగా తాము మార్కెట్లో పోటీ పడలేకున్నామని అందువలన వాటిని ఎత్తివేయాలని మూడువందల సంస్దలు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆరులక్షల కోట్ల డాలర్లతో అనేక పధకాలను అమలు జరిపేందుకు ఆమోదం తెలపాలని బైడెన్‌ పార్లమెంట్‌ను కోరారు. దీని వలన తమ మీద పడే ప్రభావం, పర్యవసానాలు ఏమిటని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమెరికన్లు ఎంత హడావుడి చేసినా ఇతర దేశాల సహకారం లేకుండా చైనాను వారేమీ చేయలేరు. అదే సమయంలో చైనీయులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటున్నారు. పరిశోధన-అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వంత గడ్డమీద జనం కొనుగోలు శక్తి పెంచేందుకు, ఇతర దేశాల్లో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభించారు.దానిలో భాగమే బెల్ట్‌ మరియు రోడ్‌ (బిఆర్‌ఐ) పధకాలు. రాజకీయంగా తమకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఆస్ట్రేలియాకు చైనా చుక్కలు చూపిస్తోంది.గతంలో ఏటా 50 కోట్ల డాలర్ల విలువగల పీతలు ఆస్ట్రేలియా ఎగుమతి చేసేది. అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అనగానే ఆ పీతల దిగుమతులను చైనా నిషేధించింది. ఇలాంటి అనేక చర్యలు తీసుకోవటంతో ఆస్ట్రేలియన్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా అండచూసుకొని చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొండంత రాగం తీసి హడావుడి చేసిన మన పాలకులు తిరిగి చైనా వస్తువుల దిగుమతులను పెంచారు.


మన దేశంలో చైనా అంటే అభిమానం లేని వారు కూడా దానితో వైరం తెచ్చుకొని సాధించేదేమిటి అన్న ప్రశ్నను ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. మనతో సహా అమెరికా నాయకత్వంలోని దేశాలు చైనాను ఒంటరి పాటు చేయాలని చూస్తున్నాయి. చైనాను దెబ్బతీయటం అంటే తమను తాము నాశనం చేసుకోవటం అనే అంశాన్ని అవి మరచిపోతున్నాయి. నూటనలభై కోట్ల మంది జనాభా ఉన్న చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండటమే కాదు, వినియోగ మార్కెట్‌ అని మరచి పోరాదు. ఎవరి సంగతి వారు చూసుకుంటున్న ఈ తరుణంలో చైనాతో ఆసియన్‌ దేశాల కూటమి వాణిజ్యం 732 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు చైనాతో జరుపుతున్న ఎగుమతి దిగుమతుల విలువ 1,600 బిలియన్‌ డాలర్లు. చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ పధకానికి చైనా ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లను సమకూర్చగలదని వార్తలు వచ్చాయి. తానే స్వయంగా వాగ్దానం చేసినట్లుగా జనానికి వాక్సిన్లు వేయించకుండా భారాన్ని రాష్ట్రాల మీద నెట్టేందుకు ప్రయత్నించిన మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంత మొత్తంలో విదేశాల్లో పెట్టుబడులను పెడుతుందని ఎవరైనా ఆశించగలరా ? దానితో పోటీగా మనమూ తయారైతే తప్ప కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అవి మనతో కలసి వస్తాయా ? మనలను నమ్ముకొని మిగతా దేశాలు చైనాకు వ్యతిరేకంగా జట్టుకడతాయా ?

పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సన్యాసులు రాత్రికి మఠానికి చేరి గంజాయి దమ్ము కొట్టి తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలని ప్రగల్భాలు పలికి తెల్లవారేసరికి మత్తు దిగి ఎవరి కర్రా బుర్రా వారు తీసుకొని ఎవరిదారిన వారు పోయినట్లు ఇప్పటికి 47 సార్లు జి7 దేశాల సమావేశాల కబుర్లున్నాయి తప్ప ఎవరికైనా విశ్వాసం కలిగించాయా ? గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిందేమిటి ? చైనీయులు మన సరిహద్దుల్లోకి చొరబడిందీ లేదు, మన పోస్టులను తమతో తీసుకుపోయిందీ లేదు అన్నారు. అలాంటపుడు చైనాతో ఏ సమస్య మీద పోరాడుతారు ? చతుష్టయం పేరుతో శతృత్వం పెంచుకోవటం తప్ప సాధించేదేమిటి ? మనకంటే ఎంతో బలమైన చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించగలిగిన ఆర్ధిక వనరులను కలిగి ఉంది. మన పరిస్ధితి ఏమిటి ? కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఎందుకు ? దాన్ని సంతుష్టీకరించేందుకు చైనాతో వైరం ఎందుకు, సైన్య మోహరింపు ఎవరికోసం, ఆ ఖర్చును జనం మీద మోపటం ఎందుకు ? గతంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలతో పోరాడి అక్కడి వ్యవస్ధలను కూల్చివేసిన అమెరికా కొన్ని దేశాల మార్కెట్లను ఆక్రమించుకుంది. అయినా దాని ఆర్ధిక సమస్యలు తీరలేదు. 2008లో దానితో సహా తూర్పు ఐరోపాను పంచుకున్న ధనికదేశాలన్నీ ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. ఇప్పుడు చతుష్టయం పేరుతో చైనాను ఢకొీని దాని మార్కెట్‌ను ఆక్రమించుకోవటం సాధ్యమయ్యేనా. ఒకవేళ జరిగినా ఆమెరికా మిగతాదేశాలకు వాటా ఇస్తుందా ? ఎవరిపని వారు చేసుకోకుండా మనకెందుకీ ఆయాసం !

తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు: ”తిరగరాసిన” చరిత్ర

Tags

, ,


యం. జయలక్ష్మి


జూన్‌ 24, 1989, చైనాపార్టీ వందేళ్ళ చరిత్రలో ఒక ముఖ్యఘట్టం. సోషలిస్టు చైనా నిలదొక్కుకోటానికి పునరంకితమైన రోజది. తూర్పుయూరపులో, సోవియట్‌ యూనియన్‌లో మాదిరే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతనమవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలను వమ్ముచేస్తూ చర్యలు తీసుకొన్న రోజు. 24వతేదీన ముగిసిన రెండురోజుల విస్త త ప్లీనరీ సమావేశంలో నాటివిద్యార్థి ఆందోళనపై ప్రధాని, పోలిట్‌ బ్యూరో సభ్యుడు లీపెంగ్‌ నివేదికను చర్చించి ఆమోదించారు. కేంద్రనాయకులు 557మంది పాల్గొని, ముఖ్యనిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రధానకార్యదర్శి జావోజియాంగుని అన్ని పదవులనుంచీ తొలగించారు. సంస్కరణలక్రమంలో ”బూర్జువా లిబరలైజేషన్‌”ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన నాలుగు మౌలిక సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను పాటించని వారు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను నిర్వహించారని, ప్రజా చైనా, పార్టీ భవితవ్యాన్ని దెబ్బతీయటానికి, సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్రస్వభావాన్ని అర్థంచేసుకోకుండా, దాన్ని బలపరిచి, ఆయనతోపాటు మరి కొద్దిమంది తీవ్రమైన తప్పుని చేశారని వివరించారు.


1989జూన్‌4 నాడు ”తియనన్మెన్‌ స్క్వేర్‌ లో పదివేలమంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని” ఒక విషప్రచారంతో అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తమ కుట్రను కప్పిపెట్టుకో చూశారు. ఆ ఆందోళనను చైనా మరిచిపోయినా, అమెరికా, పశ్చిమదేశాలు, భారతీయమీడియా ఏటా జూన్‌ నెలలో గుర్తుచేస్తుంటాయి. కాగా చైనాపార్టీ నాడు చెప్పినదే మౌలికంగా సరైనదని చెప్పకనే చెప్పిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. దానిక్లుప్త పరిచయమే ఈ వ్యాసలక్ష్యం.
చైనావ్యతిరేక దుమారాన్ని తిరిగి ప్రోత్సహిస్తున్ననేటి బైడెన్‌ యుగంలో నాటిచరిత్రని ”తిరగరాసిన” పుస్తకం ” తియన్మెన్‌ స్క్వేర్‌ : ద మేకింగ్‌ ఆఫ్‌ ఏ ప్రొటెస్ట్‌ – ఏ డిప్లొమాట్‌ లుక్స్‌ బాక్‌ ” సాదాసీదా రచయిత కథనం కాదది: ఆనాడు చైనాలో ఇండియా దౌత్యవేత్తగా వుండిన చైనా నిపుణుడు, ప్రత్యక్షసాక్షి విజరు గోఖలే రాశారు. ఈ ఏడాది మేనెలలో విడుదలైన 181పేజీల (399రూ. హార్పర్‌ కాలిన్స్‌) పుస్తకం దౌత్యప్రపంచంలో సంచలనం. ఆతర్వాత భారత విదేశాంగశాఖ కార్యదర్శి అయిన గోఖలే కథనం విలువైనది, మరుగునపడిన అనేక వాస్తవాలను వెలికి తెచ్చినది అని గతంలో చైనాలో పనిచేసి, తర్వాత అదే పదవిని అలంకరించిన శ్యాంశరణ్‌, శివశంకరమీనన్‌ వంటివారు ప్రశంసించారు. ‘ఎంతోకాలంగా బైటపెట్టాలనుకున్న విషయాలివి. కానీ ”నేనున్న పరిస్థితులలో” కుదరలేదు’ ుఅని రాశారు గోఖలే. గతఏడాదే విదేశాంగ కార్యదర్శిగా రిటైరయ్యారు. .


ఆ ఘటనల గురించిన పాశ్చాత్య కథనాన్ని మీ పుస్తకంలో సవాలు చేశారు. అది ఎందుకు అవసరమయ్యింది? అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (మే23) విదేశీవ్యవహారాల నిపుణులు ప్రశ్నించారు. ఇరుపక్షాల మీడియా కూడా భావజాలపర పక్షపాతాలతో కూడివుంది. ఆ 50రోజుల ఘటనలను స్వంత అనుభవంతో చూశాను. నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కొందరు కూడా అందులో భాగమయ్యారు. వారు చెప్పినవి పూర్తి వాస్తవాలు కావు. ప్రశ్నించదగినవి, నాకు స్వయంగా తెల్సిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవన్నీ నా కళ్ళు తెరిపించాయి. ఈమొత్తాన్ని పాశ్చాత్య మీడియా తమదైన రీతితో వక్రీకరించింది. అందుకే వీటిని బైటపెట్టాల్సిన అవసరముంది అని భావించాను అని గోఖలే జవాబిచ్చారు.


కరోనా గురించి చైనావ్యతిరేక పాశ్చాత్య దుమారం (భారత మీడియా దానికి యుద్ధోన్మాద భేరీలను జోడించి ప్రచారం చేస్తుంటుంది: స్వంత విలేకరుల కథనాలు దాదాపు లేవని ఈ వ్యవహారాలు ఏకాస్త తెల్సినవారయినా ఇట్టే గ్రహించగలుగుతారు) ఈ నేపధ్యంలో గోఖలే రచన ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అమెరికా అంటే ప్రపంచవ్యాప్త దోపిడీదారనీ, పసిపిల్లలతో సహా లక్షలాది మంది పౌరులను బలిగొన్న యుద్ధోన్మాదరాజ్యం అనీ, ప్రత్యేకించి నల్లవారిని అణగదొక్కిన జాత్యహంకార పోలీసువ్యవస్థ కలిగినదనీ తెల్సినదే. వియత్నాంలో ఘోరమైనఓటమి (1975) తర్వాత అమెరికా మిలటరీ వెనక్కితగ్గిన కాలమిది.


చైనా విప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరంవారి ఆందోళన తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు. పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువాప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. 1970తర్వాత అమెరికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలోహలో అని పలకరించుకుంటున్న వాతావరణం. ఆతర్వాత పుట్టిపెరిగిన విద్యార్థితరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత త్వంల గురించిన పైపైఅవగాహనే వుంది. ”సంపూర్ణ పాశ్చాత్యీకరణ”ను, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ విగ్రహ నమూనాని కూడా తలకెత్తుకున్నారు కొందరు చైనావిద్యార్థులు.


ఆ నేపథ్యంలో నాటి చైనా నాయకత్వంలో ఒక ఆందోళన మొదలైంది. ””ఎర్ర జన్యువు”ని తర్వాతితరాలకి అందించాలి అని నేటి అధ్యక్షుడు జిన్పింగ్‌ అన్నారు. నాడూనేడూ కూడా ఈ ‘రెడ్‌ జీన్‌’ కీలక సంకేతం ు అన్నారు గోఖలే (టైమ్సులో). అభివ ద్ధి, సంపదలు, సౌకర్యాలు, టెక్నాలజీలన్నీ కలిసి ‘రెడ్‌ జీన్‌’ని పలుచనచేసేస్తాయేమో అన్నది ఒక అభిప్రాయం. డెంగ్‌ ఆర్థిక సంస్కరణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడిదారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ”చైనా తరహా సోషలిజం” పేరిట అనుసరించిన వ్యూహం-ఎత్తుగడల పట్ల అవగాహనలో గందరగోళం నెలకొనివుంది, ముఖ్యంగా యువతరంలోని పార్టీకేడర్లో, నాయకత్వంలో కూడా వున్నది. ఆనాటికే కొన్ని భ్రమలూ, అలజడులూ తలెత్తాయి. ఆ ప్రమాదాన్ని పసిగట్టే ”బూర్జువా లిబరలైజేషన్‌’కి వ్యతిరేకంగా చైనాపార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్నిసంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడిమాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశికసూత్రాలను ప్రకటించారు(పార్టీ 13వ మహాసభలో, 1987అక్టోబరు). సంస్కరణలక్రమంలో పెచ్చరిల్లిన ”బూర్జువా లిబరలైజేషన్‌ ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన ఆ సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం.


ఆ పరంపరలో వచ్చినవే తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు.హఠాత్తుగా వచ్చినవి కాదు.
ఆర్థిక సంస్కరణలతో సోషలిస్టు చైనా ‘ ఉదారవాద (పెట్టుబడిదారీ) చైనా’గా మారిపోతుందని పాశ్చాత్యదేశాలు భావించాయి. అది తప్పుదారి పట్టిన పాశ్చాత్య ఊహ మాత్రమే అంటారు గోఖలే. 1989నుంచీ భారత విదేశాంగశాఖ, రాజకీయ నాయకత్వంకూడా దాన్ని విశ్వసించటంలేదు. ఆమాట పాశ్చాత్యులకు చెప్పాం కూడా. అయినా చైనా మార్కెటు, అక్కడ వస్తున్న లాభాలతో వారు మిన్నకుండిపోయారు అన్నారు గోఖలే(టైమ్స్‌).
”పాశ్చాత్యీకరించబడిన” ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. దీన్ని భారతీయులు కూడా బాగా అర్థంచేసుకోవాలి. మనతో సరిహద్దు తగాదా చైనా కమ్యూనిస్టులు స ష్టించినది కాదు. అంతకుముందటి ”జాతీయ” చైనా, అమెరికా అనుకూల చియాంగ్‌ కై షేక్‌ కాలపు చైనా వైఖరీ ఇదే. వారెవ్వరూ మెక్‌ మహన్‌ లైనుని, సిక్కింని (దలైలామా కూడా 2008దాకా) గుర్తించలేదు అని ఎత్తిచూపారు గోఖలే.


ఆనాటి ఘటనల గురించి ఎన్నో కథనాలున్నాయి. భారత ద క్కోణం గల ”విశిష్టమైన కాంట్రిబ్యూషన్‌ ఈ పుస్తకం” అని ప్రశంసించారు సి.ఉదయభాస్కర్‌. ఆయన చైనా వ్యూహవ్యవహారాల నిపుణుడు, వ్యాఖ్యాత. ఇప్పటిదాకా చెప్పని కథనాన్ని ఎంతో నచ్చచెప్పేరీతిలో, ఆచితూచి రాసిన పుస్తకం అన్నారాయన. నేను కళ్ళారాచూసిన వాస్తవాలకు అన్వయంజోడించి, 30ఏళ్ళతర్వాత వెనక్కిచూసుకుంటే అర్థమయ్యేద ష్టితో రాసిన 10అధ్యాయాల పుస్తకం అని చెప్పుకున్నారు గోఖలే. ఆనాడు 500బిలియన్‌ డాలర్లున్న చైనా జీడీపీ నేడు 14000బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నవంతులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్‌ చూపెట్టిన, ఆతర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంతో వారు ఈ స్థాయికి చేరారు. 1989తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనామార్గం స్థానంలో ”ప్రజాస్వామ్యం పేరిట మరోవ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీప్రజల్లో కన్పించటంలేదు” అని నిర్ధారించారు గోఖలే అని ఉదయభాస్కర్‌ చెప్పారు. పాశ్చాత్యదేశాలకు తమ తప్పులను గుర్తించటానికి 30ఏళ్ళు పట్టింది అంటారు గోఖలే.


ఆనాటి కొందరు విద్యార్థినేతలు ఎలాంటి వారంటే చాటుగా భోజనాలుచేస్తూ నిరాహారదీక్షలు చేసినవారు, పాశ్చాత్యదేశాల, మీడియాల ఆకర్షణ గలవారు అని గోఖలే రాశారు. నిజానికి నిరాహారదీక్షలు చేయరాదని విద్యార్థుల ఫెడరేషన్‌ తీర్మానించింది కూడా. అయినా ఒక నాయకుడు మీడియాముందు ఈ ”డ్రామాను” మొదలుపెట్టాడు. విద్యార్థులలోబాగా చీలిక వుండేదనీ, తమనితాము నాయకులుగా చెప్పుకునేవారు రహస్య ఎజెండాలతో ఎలాపనిచేశారో బయటపెట్టారు గోఖలే. సంస్కరణలగురించి పార్టీనాయకత్వంలో విభేదాలు, చర్చలు కొనసాగుతున్నకాలం. అలాంటి ఒక పొలిట్‌ బ్యూరో సమావేశంలో హుయావో బాంగ్‌ గుండెపోటుతో 15-4-1989న మరణించారు. డెంగ్‌ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్‌ వైపు మొగ్గిన నేత. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధానకార్యదర్శిగా (16-1-1987) రాజీనామాచేసి, పొలిట్‌ బ్యూరోలో వుండగా మరణించారు. నాటి వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యంపోశాయి విదేశాలు, విదేశీమీడీయా. అలా ఏప్రిల్‌18-22న సంతాపంపేరిట వేలాదిమంది తరలివచ్చారు.అదే ముదిరి 50రోజులు కొనసాగింది. ప్రధానే మైదానంలోకివచ్చి తమతో చర్చలు జరపాలని మొండి డిమాండు పెట్టారు కొందరు. ప్రధాని లీపెంగ్‌ జనంమధ్యకి వచ్చి, నేలపైకూర్చొని మే18న జరిపిన సుదీర్ఘచర్చలను, ఫోటోలను ఆనాటి చైనా టీవీ, పత్రికలు ప్రచురించాయి.


300మందికిపైగా కీలకపార్టీ, ప్రభుత్వ నాయకులంతా వుండే కేంద్రస్థానం అది. వారి నివాసాలు, ఆఫీసులు, ప్రభుత్వ సెక్రటేరియట్‌ కూడా అందులోనే. అలాంటిస్థానాన్ని లక్షమంది విద్యార్థులు చుట్టుముట్టిన నెలతర్వాత, మే18న పొలిట్‌ బ్యూరో నిర్ణయంతో, మే20నగానీ మార్షల్‌ లా ప్రకటించలేదు. ఆతర్వాతే సైన్యప్రవేశం, కానీ నగరం వెలుపలే ఉంచారు. మే15-16న రష్యానేత గోర్బచేవ్‌ పర్యటన సందర్భంగా స్క్వేర్‌ లో కార్యక్రమాలకోసం మైదానాన్ని ఖాళీ చేయాలా అని చర్చించారు. కానీ చేయలేదు. జూన్‌ 3 రాత్రిదాకా ఒక్క బుల్లెట్‌ కూడా పేలలేదు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇలాంటి తిరుగుబాటుని అన్నిరోజులు అనుమతించిన రాజ్యం మరొకటిలేదు. ఏదైనావుంటే ఎవరైనా ఉదహరించవచ్చు. చర్చలద్వారా 90-95 శాతంమందిని నచ్చచెప్పి ఇళ్ళకు పంపేశారు. వారు పోగా ఇంకా 5నుంచి10వేలమంది దాకావుంటారు.
”మొత్తం” ఎంతమంది చనిపోయారు? చైనాలెక్క 300 (సైనికులతోసహా). జూన్‌3రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్నపుకార్లు: పదివేలమంది. అమెరికాగూఢచారి సంస్థ ఎన్‌ఎస్‌ఏ 500 మందిదాకా, యామ్నెస్టీ 1000దాకా, న్యూయార్క్‌టైమ్స్‌(జూన్‌21)400-800దాకా. స్క్వేర్‌ లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. నిజమే ‘ అక్కడ అలాంటి ఆధారాలేవీ లేవ’ని వాషింగ్టన్‌ పోస్టు, సిబిఎస్‌ విలేకరులు, ”అక్కడ ఎలాటి ఊచకోతనీ చూడలేద”ని సంఘీభావంగా జనంమధ్యేవున్న తైవాన్‌ విలేకరి, ”అక్కడ” రక్తపాతం జరుగలేదని 2011లో అమెరికా రాయబార కార్యాలయం పంపిన రహస్య కేబుల్స్‌ చెప్పాయి. పాశ్చాత్యకపటాన్ని చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. దానితో కొన్ని ఏజెన్సీలు (వాయిస్‌ ఆఫ్‌ అమెరికా) తమతప్పులను కొంత అంగీకరించాయి. మరయితే జూన్‌ 3 రాత్రి ఏంజరిగింది? పూర్తివివరాలు ఈ పుస్తకంలోనూ లేవు. జర్నలిస్టిక్‌ నియమాలను తుంగలోతొక్కి ఊహాగానాలతో, రూమర్లతో, కట్టుకథలతో పాశ్చాత్యమీడియా పచ్చికపటంతో ఎలా వ్యవహరించిందో అద్భుతంగా వెల్లడించారు గోఖలే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఈ ”తిరగరాసిన చరిత్ర”ని తరచి చూడాల్సిన అవసరం వుంది.

వ్యాస రచయిత్రి ఆంధ్రప్రదేశ్‌ కోపరేటివ్‌ బ్యాంకు మాజీ అధికారిణి

బిజెపి వ్యతిరేక కూటమి : వివిధ పార్టీల ముందున్న సవాళ్లు – అవకాశాలు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు

జూన్‌ 22వ తేదీన న్యూ ఢిల్లీలో ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ నివాసంలో బిజెపిని వ్యతిరేకించే కొన్ని పార్టీలు, కొందరు మేథావుల ఇష్టాగోష్టి సమావేశం జరిగింది. దీనికి బిజెపి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా నిర్వహిస్తున్న రాష్ట్ర మంచ్‌ ఫోరమ్‌ పేరుతో ఆహ్వానాలు పంపారు. దీనిలో శరద్‌ పవార్‌, యశ్వంత సిన్హా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) ఘనశ్యామ్‌ తివారీ (సమాజవాది), జయంత్‌ చౌదరి(ఆర్‌ఎల్‌డి), సుశీల్‌ గుప్తా (ఆప్‌), నీలోత్పల్‌ బసు( సిపిఎం) , వినరు విశ్వం( సిపిఐ), పవన్‌ వర్మ (జనతాదళ్‌-యునైటెడ్‌), మాజీ న్యాయమూర్తి ఎపి షా, ఆర్ధికవేత్త అరుణ్‌ కుమార్‌, మాజీ దౌత్యవేత్త కెసి సింగ్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొందరికి ఆహ్వానాలు పంపినప్పటికీ ఎవరూ రాలేదు. బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కాన్ని పార్టీలకు ఆహ్వానాలు అందిందీ లేనిదీ కూడా స్పష్టత లేదు. ఇది బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ సమావేశం కాదని, కరోనా, నిరుద్యోగం, దేశంలోని వ్యవస్ధలపై జరుగుతున్నదాడుల వంటి అంశాల మీద ఆలోచనలను పంచుకొనేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల సమావేశం అని సిపిఎం నేత నీలోత్పల్‌ బసు చెప్పారు. మిగతావారు కూడా ఇదే పద్దతుల్లో మాట్లాడారు. అయితే ఇది రాజకీయ అంశమే అని జనం భావిస్తున్నారు. బిజెపి గురించి చెప్పాల్సిన పనిలేదు.


ఇప్పటి వరకు దేశంలో జరిగిన పరిణామాలను, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయ ప్రక్రియను చూసినపుడు నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి వన్నీ ఎన్నికలు, అధికారం చుట్టూనే తిరిగాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం మీద నయా ఉదారవాద విధానాలను అమలు జరపటం తప్ప వాటి పర్యవసానాలకు ప్రత్నామ్నాయ విధానాలు లేవు. సంకీర్ణ ధర్మం కారణంగా తమ అసలు సిసలు విధానాలను అమలు జరపలేమని ఏ పార్టీ కూడా ఇప్పుడు చెప్పటానికి లేదు. ఎవరితో నిమిత్తం లేకుండానే బిజెపికి గత రెండు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో కూడా అవసరమైన మెజారిటీ చేకూర్చేందుకు ఇతర పార్టీలు సిద్దంగా ఉన్నట్లు స్పష్టమైంది. అయినప్పటికీ గతంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన సంస్కరణలను మరింత వేగంగా, అమానవీయంగా అమలు జరపటం తప్ప కొత్త విధానాలేమీ లేవు. అందువలన ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేని ఫ్రంట్‌ మరొకటి ఉనికిలోకి వచ్చినా ప్రయోజనం ఏమిటి అన్నది ప్రశ్న.


గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించటం వెనుక దాని అవినీతి అక్రమాలే కాదు, జనానికి ప్రయోజనం లేని విధానాల పర్యవసానం కూడా ఇమిడి ఉంది. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం గానీ గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో కూడా అలాంటిదే. ఇందిరా గాంధీ పార్టీలో తన ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు దాన్ని ముందుకు తెస్తే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే పేరుతో నరేంద్రమోడీ కొత్త నినాదాలిచ్చారు. తన ప్రయోజనాల కోసం అధ్యక్ష తరహా పద్దతుల్లో ప్రధాని అభ్యర్ధి అంటూ గతంలో వాజ్‌పారు, తాజాగా నరేంద్రమోడీని బిజెపి రంగంలోకి తెచ్చింది. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ ఏర్పడవచ్చేమోగానీ ప్రధాని అభ్యర్ధిని అంగీకరించే అవకాశాలు లేవు.అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.


శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు కొత్తవి కాదు. గతంలో కూడా ఉన్నాయి, అయినప్పటికీ గత ఏడు సంవత్సరాలలో ఇలాంటి సమావేశాలు ఎందుకు జరగలేదు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సమావేశంలో పాల్గొన్నవారు లోపల ఏమి చర్చించారు, బయటికి ఏమి చెప్పారన్నదానిని పక్కన పెడితే ఇది బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పడాలన్న వాంఛ నేపధ్యంలోనే జరిగిన ప్రయత్నమన్నది స్పష్టం. అయితే అది రూపుదిద్దుకుంటుందా ? తీరుతెన్నులు ఎలా ఉంటాయి ? ఆటంకంగా ఉన్న అంశాలేమిటి ?ఎదురయ్యే సవాళ్లేమిటన్న వాటి గురించి రాబోయే రోజుల్లో చర్చ ప్రారంభం అవుతుంది. మరి ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా ? ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని చెప్పలేము. గతంలో ఏర్పడిన ఫ్రంటులు, సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ఫలితాలు, వైఫల్యాలూ అన్నీ పార్టీలు, మేథావుల అన్నింటికీ మించి జనం ముందు ఉన్నాయి. వాటిని విస్మరించి ఏ ప్రయత్నమూ సఫలం కాదు.


దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాలకు తొలిసారిగా కాంగ్రెస్‌ వ్యతిరేకత అంశం ముందుకు వచ్చింది. 1967లో తొలిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో ఐక్యంగా పోటీ చేశాయి. తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తొలిసారిగా ఓడిపోయింది. వాటిని కూల్చివేయటంతో కాంగ్రెస్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.


బిజెపి పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన 2014 ఎన్నికలు మూడు ఫ్రంట్ల మధ్య పోటీగా జరిగాయి. ఒకటి బిజెపి నాయకత్వాన ఉన్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌, కాంగ్రెస్‌ నాయకత్వాన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఏ), కాంగ్రెస్‌ను తిరస్కరించండి, బిజెపిని ఓడించండి అనే పిలుపుతో వామపక్షాలు ఒక ఫ్రంట్‌గా విడిగా పోటీ చేశాయి. అందువలన కాంగ్రెస్‌కు భిన్నంగా బిజెపి వ్యతిరేక కూటములు ప్రారంభం నుంచీ ఉన్నాయి. ఇంకా పదేండ్లు ముందుకు పోతే కాంగ్రెస్‌కు అవసరమైన మెజారిటీ లేని కారణంగా బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు వామపక్షాలు యుపిఏ కూటమికి మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందువలన బిజెపి వ్యతిరేకత అన్నది అది తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే అంకురించింది. సరికొత్త ఆలోచన అయితే కాదు.


కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది ఆ పార్టీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, అన్నింటికీ మించి రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పట్ల అనుసరించిన కక్ష పూరిత వైఖరి, రాష్ట్రాల పట్ల అనుసరించిన విధానాల వంటి వాటి ప్రాతిపదికన ప్రారంభమైంది. 1975లో అత్యవసర పరిస్ధితిని విధించి మొత్తం ప్రజాస్వామిక హక్కులకే ముప్పుగా తయారైన నేపధ్యంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది మరింత స్పష్టంగా ముందుకు వచ్చింది. ఆ సమయంలో రాజకీయంగా తనను వ్యతిరేకించిన పార్టీలు, వ్యక్తులు, శక్తులను అది జైలు పాలు చేసింది. అందువల్లనే అనంతరం జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జనతా పార్టీలో సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) పూర్వ రాజకీయ విభాగమైన మతశక్తి జనసంఘం, స్వతంత్ర పార్టీ వంటి మితవాద శక్తులు ఉన్నప్పటికీ సిపిఎం దాన్ని బలపరిచేందుకు వెనుకాడలేదు.


గత ఏడు సంవత్సరాల కాలంలో బిజెపి ఒక్క అత్యవసర పరిస్ధితి విధింపు మినహా మిగతా అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల కూల్చివేతలకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర దర్యాప్తు సంస్దల దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం వంటి అంశాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు మతోన్మాద మహమ్మారిని ముందుకు తెచ్చింది. వివిధ ఉద్యమాల్లో తన విధానాలను వ్యతిరేకించిన వారి మీద ఉగ్రవాద, దేశద్రోహ నేరాలను మోపుతూ తమను వ్యతిరేకిస్తే అందరికీ ఇదే గతి అని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేసింది. కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి పాలనకు వ్యతిరేకత పెరిగే కొద్దీ అది రాజకీయ పార్టీలకు విస్తరించే రోజు ఎంతో దూరంలో లేదు. అందువలన వీటిని వ్యతిరేకించే శక్తులన్నీ సహజంగానే ఐక్యం కావాలని కోరుకుంటాయి. అలాంటి వాంఛకు నిదర్శనమే శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశం. కరోనా రెండవ దశను నిర్లక్ష్యం చేయటం, వచ్చిన తరువాత అయినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడకపోవటం అన్నింటినీ మించి ఆక్సిజన్‌, వాక్సిన్ల విషయంలో సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బల గురించి తెలిసిందే. ఈ సమయంలోనే ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి బలహీనత, దాన్ని వ్యతిరేకించే శక్తుల బలం వెల్లడైంది. బిజెపి వ్యతిరేక శ క్తుల సమావేశానికి పురికొల్పిన అంశాలు ఇవే. వచ్చే ఏడాది జరిగి ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ ప్రయత్నాలు ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పవచ్చు.


గత అనుభవాలను చూసినపుడు కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిలోకి వచ్చేందుకు బిజెపి ఎన్నడూ తటపటాయించలేదు. అధికారం కోసం ఎవరితో అయినా చేతులు కలిపేందుకు అది అర్రులు చాచింది. రాజకీయంగా ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తపించి పోయింది. తన అజెండాను దాచుకోకపోయినా ముందుకు తేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు దాన్నే ముందుకు తెచ్చి అమలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాల వివాదంలో తాము సంఘపరివార్‌ను వదులుకొనేది లేదని బహిరంగంగా ప్రకటించి జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘం విడిపోయి బిజెపి పేరుతో కొత్త దుకాణం తెరిచింది. ఈ కారణంగానే తరువాత కాలంలో దానికి ఉన్న మతోన్మాద లక్షణం కారణంగా వామపక్షాలు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. (పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమన్వయం చేసుకోవటం వేరు ) మిగతా పార్టీలు మతకోణాన్ని పక్కన పెట్టి అవకాశవాదంతో దానితో చేతులు కలిపాయి. ఇప్పుడు అవి తమ వైఖరిని తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.


బిజెపి వ్యతిరేక కూటమి విషయానికి వస్తే గతంలో బిజెపి లేదా దాని పూర్వ రూపం జనసంఘం మాదిరి ఎవరితో అయినా కలవటానికి ముందుకు వచ్చినట్లుగా కాంగ్రెస్‌ రావటం లేదు. రాజకీయంగా బలహీనపడినప్పటికీ తన షరతుల మీద నడవాలని అది కోరుకుంటోంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని వ్యతిరేకించే శక్తులతో రాజీపడేందుకు సిద్దం కావటం లేదు. వాస్తవ పరిస్ధితిని గుర్తించేందుకు సిద్దంగా లేదు. ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా తానే ఏక పార్టీగా చక్రం తిప్పగలననే భ్రమలతో ఉంది.బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలను ఖాతరు చేయటం లేదు. తొక్కివేసేందుకు వెనుకాడటం లేదు. అయితే ఎంత బలహీనపడినప్పటికీ బిజెపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ లేకుండా లక్ష్యం నెరవేరదు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే రెండు రకాలు. గతంలో కాంగ్రెస్‌ బాధిత పక్షాలు,సహజంగానే కాంగ్రెస్‌ వ్యతిరేకతకు ముందుకు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేసిన కారణంగానే తరువాత ఎన్‌టి రామారావు దానికి కేంద్రంగా మారారు. అయితే కాంగ్రెస్‌ బలహీనపడిన తరువాత అవే పార్టీలు బిజెపితో అవకాశవాదంతో జట్టు కట్టాయి. అలాంటి వాటిలో తెలుగుదేశం పార్టీ ఒకటి. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీ కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపింది. గత ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకించింది. ఇప్పుడు తిరిగి ఆ పార్టీతో సంబంధాలకు తహతహలాడుతోంది.


మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి కూడా కూడా అవకాశవాదానికి మారుపేరుగా ఉంది. సమాజవాది పార్టీతో మిత్రపక్షంగా ప్రారంభమై శత్రుపక్షంగా మారింది. గతలోక్‌సభ ఎన్నికల్లో తిరిగి జట్టుకట్టింది. ఇప్పుడు దానితో కలిసే పరిస్ధితి లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవికోసం బిజెపితో చేతులు కలిపింది. రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. అదే పార్టీతో వైరమూ పెట్టుకుంది. యుపిఏ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఉపసంహరించుకుంది.
శివసేన విషయానికి వస్తే అది బిజెపి బాధిత పార్టీ. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గతంలో బిజెపితో చేతులు కలిపింది, కేంద్ర మంత్రి పదవులను కూడా దక్కించుకుంది.తరువాత అధికారం దగ్గర పంచాయతీ వచ్చి బిజెపితో పోరాడాల్సి వచ్చింది. బిజెపి బాధిత పార్టీగా మారింది. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు దాసోహం అంటున్నాయి. ఒడిషాలో బిజెడి ఎటూ తేల్చుకోలేని స్ధితిలో ఉంది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌-బిజెపిలను రెండింటినీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటుంది. కానీ కేంద్రంలో బిజెపి తీసుకొనే అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇస్తుంది. వైసిపి విషయానికి వస్తే కాంగ్రెస్‌తో దానికి పేచీ లేదు. ఆ పార్టీని అంతం చేసి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత బిజెపితో సమస్యలున్నప్పటికీ దానికి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ముందుకు వస్తుందా అంటే అనుమానమే. బిజెపిని సమర్ధించే విషయంలో బిజెపితో పోటీ పడుతోంది.


పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలు లేవు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ ్వంత సిన్హా ఆహ్వానం మేరకు ఇతర పార్టీలతో పాటు సమావేశానికి హాజరైనప్పటికీ ఆ పార్టీ ఉండే కూటమిలో చేరటం అనుమానమే. కర్ణాటకలో జెడిఎస్‌ పార్టీ కూడా అవకాశ వాదంతో వ్యవహరించింది. అధికారం కోసం బిజెపి-కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపేందుకు అది సిద్దం. కనుక ఇప్పటికిప్పుడు బిజెపి వ్యతిరేక కూటమి రూపుదిద్దుకోవటం అనేక సమస్యలతో కూడి ఉంది.

కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టి బిజెపిని రాజకీయంగా కొంత మేరకు రక్షించింది. అయితే దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితి రాబోయే రోజుల్లో అసలైన పరీక్ష పెట్టనుంది. బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు అది కూడా దోహదం చేస్తుంది. గతంలో ఇందిరా గాంధీ తన అధికారానికి ఎసరు వచ్చినపుడు రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సంఘపరివార్‌ తన అజెండాను అమలు జరిపేందుకు అధికారంలో కొనసాగాలని కోరుకుంటోంది. అందువలన ఒక వేళ ఎన్నికల్లో ఓటమి తధ్యమని తేలితే ఎంతకైనా తెగించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో అదే జరిగింది. అందువలన ప్రస్తుతానికి ఊహాజనితమైన ప్రశ్నే అయినప్పటికీ అధికారం కోసం ఏమైనా చేయవచ్చు. అదే జరిగితే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల ప్రాతిపదికన ఏకీకరణ జరుగుతోంది. మన దేశంలో కూడా అలాంటి మధనం జరగాలి. దానికి శరద్‌ పవార్‌ నివాసంలో నిర్వహించిన సమావేశం నాంది పలికితే దాని ప్రాధమిక ప్రయోజనం నెరవేరినట్లే !

కరోనాను మించి భయపెడుతున్న చమురు – అచ్చేదిన్‌ కాదు జనం చచ్చే రోజులు !

Tags

, ,



ఎం కోటేశ్వరరావు
కొంత అతిశయోక్తిగానే ఉండవచ్చు గానీ అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న ధరల తీరు తెన్నులను చూస్తే మన జనాలను కరోనా కంటే చమురు ధరలే ఎక్కువగా భయపెట్టేట్లు ఉన్నాయి. బుధవారం నాడు ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం చమురు ధర 75.30 డాలర్లుగా ఉంది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికాతో కరాఖండిగా వ్యవహరించే ఇబ్రహీం రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గనుక అని ఒక కారణం చెప్పారు. అమెరికా ఇతర దేశాలు ఇరాన్‌తో జరుపుతున్న అణు చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడవచ్చని చెబుతున్నారు. అమెరికాలో చమురు నిల్వలు తగ్గిపోవటం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచుతాయో లేదో తెలియని పరిస్ధితి కూడా ఇతర కారణాల్లో ఉన్నాయి. కరోనా తగ్గిపోయి క్రమంగా సాధారణ పరిస్ధితి ఏర్పడితే ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ముడిచమురు పీపా ధర వంద డాలర్ల వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో అమెరికాలో షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరిగితే డిమాండ్‌ తగ్గి ధరలు అదుపులో ఉండటం లేదా కొంత మేరకు తగ్గవచ్చని జోశ్యాలు చెప్పిన వారు పునరాలోచనలో పడ్డారు. దీనితో పాటు ఇరాన్‌కు కొత్త అధ్యక్షుడు వస్తే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఆంక్షలు ఎత్తివేస్తే సరఫరా పెరుగుతుందని ఆశించిన వారంతా అలాంటి అవకాశాలు లేవని భావించటంతో ధరలు భగ్గుమన్నాయి.
అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌(ఏపిఐ) మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్‌ 18వ తేదీతో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7.199 మిలియన్‌ పీపాలకు తగ్గాయి. అంతకు ముందు వారంలో 8.537 మిలియన్‌ పీపాలు ఉన్నాయి. గతేడాది జనవరితో పోల్చితే ఎక్కువే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరితో పోల్చితే తగ్గాయి.ఇది కూడా ధరల పెరుగుదల మీద ప్రభావం చూపింది. ఊహించినదానికంటే ముందుగానే వంద డాలర్లకు పెరుగుతుందా ? వచ్చే నెలలో ఒపెక్‌+దేశాల అదనపు ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చినా ధరలు తగ్గకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం.
ద్రవ్యోల్బణం, చమురు గిరాకీ పెరుగుదల, చమురు కంపెనీల వాటాదార్ల వత్తిడి, పర్యావరణం వంటి కారణాలతో రానున్న మూడు సంవత్సరాలలో ధరల పెరుగుదలతో పాటు చమురు సంక్షోభం తలెత్తవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో విద్యుత్‌ వాహనాల తయారీ మీద కేంద్రీకరణ, అమెరికా వంటి దేశాలలో పునరుత్పాదక ఇంథనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరగవచ్చన్నది విశ్లేషణల సారాంశం. ఈ పరిణామాలు, పర్యవసానాలకు సిద్దం గాని మనవంటి దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు. అది పాలకుల మీద వత్తిడికి దారి తీసి రాజకీయ పర్యవసానాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రానున్న ఆరునెలల్లో ముడి చమురు ధర వంద డాలర్లకు పెరగవచ్చన్నది ఒక అంచనా అయితే రానున్న సంవత్సరాలలో 130 డాలర్లకు పెరగవచ్చని చెబుతున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత పరిణామాలు ఎలా ఉండేది చెప్పలేని స్ధితి. చమురు మార్కెట్‌ను కృత్రిమంగా అదుపు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గతంలో పడిపోయిన 35 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరగవచ్చు లేదా తిరిగి 35 డాలర్లకు దిగిరావచ్చన్నది కొందరి తర్కం. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పెరగాలి, అది జరగాలంటే ఆ రంగంలో పెట్టుబడులు కావాలి. కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వలన ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. ఇది చమురు కొరతకు దారి తీయవచ్చు. పర్యావరణ సమస్యల కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించాలని డచ్‌ కోర్టు షెల్‌ కంపెనీని ఆదేశించింది. మరోవైపున అంతర్జాతీయ ఇంథన సంస్ధ కొత్తగా నిక్షేపాల అన్వేషణలను నిలిపివేయాలని కోరింది.
అమెరికాలో షేల్‌ చమురు ఉత్పత్తి పరిమితంగా ఉన్నందున, తిరిగి పెరిగినా మార్కెట్‌ పడిపోయే అవకాశం లేదని ఒపెక్‌ దేశాలు భావిస్తున్నాయి.ఈ ఏడాది అమెరికా చమురు ఉత్పత్తి రోజుకు కేవలం రెండు లక్షల పీపాలు మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పెరగవచ్చు. షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఒపెక్‌ దేశాలు గమనంలోకి తీసుకున్నాయి. గతేడాది రికార్డు స్ధాయిలో చమురు ధరలు పడిపోయినందున షేల్‌ ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఆ కంపెనీలు లాభాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సంవత్సరం అమెరికా ఉత్పత్తి రోజుకు 11.2 మిలియన్‌ పీపాలు ఉంటుందని, అది గతేడాది కంటే లక్షా 20వేల పీపాలు తక్కువని తాజా జోశ్యాలు ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్‌ టక్సాస్‌ ఇంటర్‌మీడియెట్‌(డబ్ల్యుటిఐ) రకం చమురు ధర పీపాకు 60 డాలర్లకు మించితేనే అక్కడి కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి. అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువే ఉంది. మార్కెట్‌ స్ధిరపడింది అనుకున్న తరువాత వచ్చే ఏడాది ఉత్పత్తి పెంచవచ్చని భావిస్తున్నారు. తమ లాభాలు పెరుగుతాయనుకుంటేనే పెట్టుబడిదారులు మరింత ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను బట్టి ఆగస్టులో ముడి చమురు ఉత్పత్తి పెంచాలా వద్దా అని చమురు ఉత్పత్తి దేశాల సంస్ధ (ఒపెక్‌) చర్చలు జరుపుతోంది.వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్‌లో ఉన్న లోటును పూడ్చేందుకు ఉత్పత్తి పెంచాలా అన్న అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత లండన్‌ మార్కెట్‌లో ముడిచమురు బ్రెంట్‌ ధర 75 డాలర్లు దాటింది. మే నుంచి జూలై మధ్య రోజుకు 20లక్షల పీపాల ఉత్పత్తి పెంచాలన్న అంశాన్ని ఒపెక్‌ దేశాలు సమీక్షిస్తున్నాయి, అయితే ఊహించినదాని కంటే ధరలు పెరగటంతో అంతకంటే ఎక్కువే పెంచాలనే వత్తిడి వస్తోంది. గిరాకీ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే నిలిపివేసిన ఉత్పత్తిని పునరుద్దరించటం గురించి పరిశీలిస్తామని ఒపెక్‌ దేశాల నేతగా ఉన్న సౌదీ అరేబియా చమురు మంత్రి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 30లక్షల పీపాల కొరత ఉన్నట్లు గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా వేసింది. ఒపెక్‌+దేశాలు రోజుకు 58లక్షల పీపాలు ఉత్పత్తి చేస్తున్నాయి. సౌదీతో రోజువారీ ఫోన్లో మాట్లాడుతున్న రష్యా తక్షణమే ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాల్సిన పరిస్ధితి లేదని భావిస్తోంది.
అమెరికాలో చమురు నిల్వల గురించి వస్తున్న వార్తల కారణంగా ముందస్తు చమురు మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో సరఫరా చేయాల్సిన డబ్య్లుటిఐ చమురు ధర పీపాకు 1.2 డాలర్లు పెరిగింది. గత పద మూడు సంవత్సరాలలో రెండు నెలల మధ్య ఒక డాలరుకు మించిన వ్యత్యాసం కేవలం రెండు సార్లు (2008, 2014)మాత్రమే జరిగింది. ఏడాది క్రితం కొనుగోలు చేసిన చమురును ఎక్కడ నిల్వచేసుకోవాలో తెలియక ఒప్పందం ప్రకారం చమురు సరఫరాను స్వీకరించలేని కంపెనీలు ఎగుమతిదార్లకు ఎదురు డాలర్లు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నాయి.ఇప్పుడు చమురుశుద్ది కర్మాగారాలు అమెరికాలో పూర్తి స్దాయిలో పని చేస్తుండటంతో ఆ నిల్వలన్నీ ఖాళీ అవుతున్న కారణంగా చమురు నిల్వ టాంకులు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జూన్‌ తరువాత ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచనట్లయితే చమురు కొరత ఏర్పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ హెచ్చరించింది.
ప్రపంచ చమురు నిల్వల్లో 2012 అంచనా ప్రకారం ఐదో వంతు (296.5 బిలియన్‌ పీపాలు) నిర్దారిత చమురు కలిగి ఉంది వెనెజులా. మార్కెట్లో ధరలు పెరిగిన కారణంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తిని పెంచనున్నది. గతేడాది చమురు ధరలు భారీగా పతనమైనందున రోజుకు నాలుగు లక్షల పీపాలకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏడులక్షలు జరుగుతోందని చమురుశాఖ మంత్రి ఎల్‌ ఇసామీ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి పదిహేను లక్షల పీపాలకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నందున ఉత్పత్తి చేసినప్పటికీ కొనుగోలుదార్లు ముందుకు రాకపోతే ప్రయోజనం లేదు. అందువలన ఆంక్షల గురించి జో బైడెన్‌ సర్కార్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తేనే చర్చలు, ఆంక్షల తొలగింపు అని అమెరికా అంటోంది. మన దేశంలోని రిలయన్స్‌ చమురు కంపెనీ కోసం గతంలో సెనెటర్‌గా బైడెన్‌ ఉన్నపుడు సహాయకుడిగా పని చేసిన భారతీయ లాబీయిస్టు అంకిత్‌ దేశారు ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ చమురు శుద్ది కర్మాగారానికి పని కావాలంటే ముడి చమురు కావాలి. వెనెజులా వద్ద చమురు ఉన్నప్పటికీ డీజిల్‌ తయారీకి అవసరమైన శుద్ది కర్మాగారాలు లేవు. వెనెజులా నుంచి చమురు దిగుమతి చేసుకొని డీజిల్‌ను తయారు చేసి తిరిగి ఎగుమతి చేసే అవకాశం ఉన్నందున ఏదో ఒక రూపంలో ఆంక్షలను సడలించి రిలయన్స్‌ కంపెనీకి తోడ్పడాలని అంకిత్‌ దేశారు రాయబారాలు జరుపుతున్నారు. అంబానీలతో నరేంద్రమోడీకి విడదీయరాని సంబంధాలు ఉన్నందున ఆయన కూడా జోక్యం చేసుకోవచ్చు. అయితే తమ కంపెనీ అమెజాన్‌కు మోడీ మొండి చేయి చూపుతున్నందున బైడెన్‌ యంత్రాంగం ఏమేరకు దిగి వస్తుందో తెలియదు. అమెజాన్‌-రిలయన్స్‌ రాజీపడితే…..ఏమో ఏదైనా జరగవచ్చు !

కోవాగ్జిన్‌ కుంభకోణంలో బ్రెజిల్‌ బోల్సనారో – కరోనా వైఫల్యంపై రాజీనామాకు జనం డిమాండ్‌ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
వాక్సిన్లు, ఆహారం అందించలేని బోల్సనారో గద్దె దిగు అంటూ గత శనివారం నాడు బ్రెజిల్‌లోని నాలుగు వందల పట్టణాలలో ఏడున్నరలక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. అనేక ప్రాంతాలలో భారీ వర్షాలకారణంగా ప్రదర్శనలు నిర్వహించలేదు. అంతకు ఇరవై రోజుల ముందు జరిగిన నిరసనలో కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు.పదిహేడు దేశాలలో ఉన్న బ్రెజిల్‌ పౌరులు, ఇతరులు కూడా నిరసన తెలిపారు. కరోనా మరణాలు ఐదులక్షలకు చేరిన సందర్భంగా జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరసనతో గుక్కతిప్పుకోలేకపోతున్న అధ్యక్షుడు బోల్సనారో సోమవారం నాడు తన ఆగ్రహాన్ని ఒక టీవీ జర్నలిస్టు మీద చూపాడు.అతగాడి దురుసు ప్రవర్తనను ఖండిస్తూ పదవికి రాజీనామా చేయాలని జర్నలిస్టు యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపున మన దేశానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి కోవాగ్జిన్‌ వాక్సిన్ల కొనుగోలుకు ప్రభుత్వ పెద్దల నుంచి పెద్ద ఎత్తున వత్తిడి చేసినట్లు వెలువడిన వార్తలు బోల్సనారోను మరింత ఇరకాటంలోకి నెట్టాయని చెప్పవచ్చు.
గత ఎన్నికల్లో వామపక్ష వర్కర్స్‌ పార్టీకి వ్యతిరేకంగా బోల్సనారోకు ఓటు వేసిన వారు కూడా రెండేళ్లలో దేశానికి చేసిన నష్టం చాలు గద్దె దిగు అంటూ శనివారం నాటి ప్రదర్శనల్లో నినదించారంటే వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో కోటీ 78లక్షల మందికి వైరస్‌ సోకింది, వారిలో ఐదు లక్షల మంది మరణించారు. ఐసియు పడకలు, ఆక్సిజన్‌ సరఫరాలేక అనేక మంది దుర్మరణం పాలయ్యారు. అయినప్పటికీ బోల్సనారో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు ఒక మిలిటరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినపుడు కూడా ముఖానికి తొడుగు లేకుండా ఉన్నారు. దాంతో గతంలో మీరు ముఖతొడుగు ధరించనందుకు అనేక సార్లు జరిమానా చెల్లించారు కదా అని బ్రెజిల్‌ అతిపెద్ద మీడియా సంస్ద వాన్‌గార్డ్‌ విలేకరి గుర్తు చేయటంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నా ప్రాణం, నా ఇష్టం, తొడుగులేకుండా వస్తాను, నువ్వు నోరు మూసుకో, మిమ్మల్ని చూస్తే అసహ్యం, మీది చెత్త జర్నలిజం, మీదొక పెంట మీడియా, మీరు బ్రెజిల్‌ కుటుంబాలను, మతాన్ని నాశనం చేశారు అంటూ వీరంగం వేశాడు. ఇదిగో ముఖతొడుగు దీన్ని నేను ధరించటం లేదు, ఇప్పుడు మీకు సంతోషమేగా రాత్రి జాతీయ వార్తా కార్యక్రమంలో చూపండి అన్నాడు.మీడియా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సోమవారం నాడు బోల్సనారో విలేకర్ల సమావేశంలో ఆరోపించాడు. సిఎన్‌ఎన్‌ టీవీ శనివారం నాడు ప్రదర్శనలు జరిపిన వారిని ప్రశంసించిందన్నారు. ఆ సందర్భంగానే వాన్‌ గార్డ్‌ టీవి విలేకరి శాంటోస్‌పై విరుచుకుపడ్డారు.
తానుగా ముఖతొడుగును ధరించకపోవటమే గాక కరోనా నిరోధ చర్యలను తీసుకోవటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. ముఖతొడుగులు, వాక్సిన్ల వలన ఉపయోగం లేదని పదే పదే చెప్పాడు. తాను అధికారంలో ఉన్నంత వరకు కరోనా మీద పోరాడతా, ముఖతొడుగులు ధరించాల్సిన అవసరం లేదని ప్రతి గురువారం దేశ ప్రజల నుద్దేశించి చేసే ఉపన్యాసంలో కూడా చెప్పాడు. ఫార్మాకార్పొరేట్ల ప్రయోజనం కోసం కరోనాను నిరోధించలేని ఔషధాలను వినియోగించాలని ప్రబోధించాడు. ప్రయోజనం లేదని తేలినప్పటికీ దిగుమతి చేసుకున్న కంపెనీలకు అనుకూలంగా మలేరియా నిరోధానికి వినియోగించే క్లోరోక్విన్‌తో చికిత్స చేయాలని వివిధ సందర్భాలలో 84 సార్లు చెప్పాడు. ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం కారణంగా జనంలో తీవ్ర అభద్రతా భావం ఏర్పడింది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల మీద కూడా తాజా నిరసనల ప్రభావం పడటం అనివార్యం. పదవికి రాజనామా చేయాలని కోరుతూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడవ తరంగం కరోనా రానుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం మీద మరింత వత్తిడి తెచ్చేందుకు మే, జూన్‌లో జరిగిన ప్రదర్శనల కొనసాగింపుగా తదుపరి కార్యాచరణకు ప్రజా ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్దలూ త్వరలో సమావేశం కానున్నాయి.ఇంతకాలం బోల్సనారోకు మద్దతు ఇచ్చిన మీడియా కూడా ప్రజల్లో వెల్లడౌతున్న నిరసన కారణంగా గుడ్డిగా సమర్ధిస్తే పూర్తిగా విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తుందనే భయం లేదా ఎంత బలపరిచినా తదుపరి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్న అంచనాకు రావటం వల్లగానీ వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా మహమ్మారి సమస్య మీద రాజకీయంగా విబేధించే శక్తులు కూడా ఈ ప్రదర్శనల్లో భాగస్వాములయ్యాయి. బహుశా ఈ కారణంగానే చీటికి మాటికి నియంత బోల్సనారో మీడియా మీద విరుచుకుపడుతున్నాడు. అయితే ధనిక తరగతులు మాత్రం బోల్సనారోకు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బోల్సనారోపై ప్రతిపక్షం 122 అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టింది. వాటి మీద పార్లమెంట్‌ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఏ అధ్యక్షుడూ ఇలాంటి నిరసనను ఎదుర్కోలేదు.
కరోనా పట్ల నిర్లక్ష్యానికి నిరసనలు ఒక్క బ్రెజిల్‌కే పరిమితం కాలేదు, కొలంబియా, పరాగ్వే,పెరూల్లో కూడా జరిగాయి.బ్రెజిల్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఇరుగు పొరుగు దేశాలకు కూడా అక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక కొత్త రకాల వైరస్‌లు బయటపడ్డాయి. జనంలో వ్యతిరేకత పెరుగుతుండటాన్ని గమనించిన బోల్సనారో మే ఒకటవ తేదీన తన మద్దుతుదార్లతో ప్రదర్శనలు చేయించాడు. ఇప్పుడు మిలిటరీ జోక్యం చేసుకోవాలి, నేను అంగీకరిస్తున్నాను అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. కరోనా నిబంధనలను జనాలు పాటించటం లేదు కనుక మిలిటరీ జోక్యం చేసుకొని అయినా నియంత్రణలను అమలు జరపాలని జనం కోరుతున్నారనే పేరుతో ఆ ప్రదర్శనలు చేయించారు. మే 29వ తేదీన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు జరిపిన ప్రదర్శనల్లో వాటికి ప్రతిగా నేను అంగీకరించటం లేదు, మిలిటరీ వద్దు అంటూ ప్రదర్శకులు బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. తనకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన వారు సామాన్య జనం అని వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన వారు కిరాయి, అల్లర్లు చేసే వారు, ఉగ్రవాదులు అని బోల్సనారో వర్ణించాడు.
అధికారానికి వచ్చినప్పటి నుంచి బోల్సనారో వివాదాస్పద అధ్యక్షుడిగా తయారయ్యాడు. గతేడాది ఆగస్టులో అతగాడి పాలన బాగుందని చెప్పిన వారు 37శాతం మంది కాగా జనవరిలో 31శాతానికి పడిపోయింది. కరోనా సాయం నిలిపివేసిన తరువాత అదే నెలలో జరిగిన సర్వేలో 24శాతానికి దిగజారింది. దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారింది.కోటీ44లక్షల మంది నిరుద్యోగులున్నారు.వారిలో కేవలం 16శాతం మంది మాత్రమే బోల్సనారోను సమర్ధిస్తున్నారు. బెల్జియన్‌ రియల్స్‌ 2,200(మన కరెన్సీలో 32వేలు) లోపు ఆదాయం వచ్చే వారిలో 55శాతం మంది బోల్సనారోకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారని సర్వే తెలిపింది. ఏడాదిన్నర తరువాత జరిగే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే నిర్ధారణలకు రావటం తొందరపాటు కావచ్చుగానీ అప్పటికి పరిస్ధితి మెరుగుపడే సూచనల్లేవు.
భారత బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ వాక్సిన్లను కొనుగోలుకు హామీ ఇవ్వాలని బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య నిఘా సంస్ధ మీద తీవ్ర వత్తిడి వచ్చినట్లు పోహా అనే పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుగుతోంది. మారినో అనే ఒక సైనికాధిరిని ఆర్యోగ వస్తు,ఔషధాల సరఫరా నిమిత్తం గతేడాది ఆరోగ్యశాఖ మంత్రి నియమించాడు. సదరు సైనికాధికారి జాతీయ ఆరోగ్య సంస్ద మీద వత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది. వాక్సిన్ల సరఫరా గురించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న బ్రెజిల్‌ సంస్ధ ఒప్పంద షరతులను ఉల్లంఘించినట్లు తేలింది. ఇతర కంపెనీలు తక్కువ ధరలకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చినప్పటికీ భారత బయోటెక్‌ నుంచి ఒక మోతాదు 15 డాలర్ల చొప్పున రెండు కోట్ల మోతాల కొనుగోలుకు అవగాహన కుదిరింది.ఒప్పందం ప్రకారం ఈపాటికే వాక్సిన్‌ బ్రెజిల్‌ చేరి ఉండాలి.ఈ ఒప్పందం చేసుకున్న సంస్ద బోల్సనారోకు సన్నిహితమైంది కావటంతో అధ్యక్ష కార్యాలయం నుంచే వత్తిడి జరిగిందన్నది స్పష్టం.వాక్సిన్‌ గురించి ప్రదాని నరేంద్రమోడీకి బోల్సనారో ఫోన్‌ చేసిన తరువాతే ఒప్పందం ఖరారైనట్లు చెబుతున్నారు. గత సంవత్సరం హైడ్రోక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయాలని రెండు ప్రయివేటు సంస్దల తరఫున బోల్సనారో మన ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసినట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. అందువలన క్లోరోక్విన్‌, వాక్సిన్‌ తయారీ కంపెనీలతో నరేంద్రమోడీకి ఆసక్తి ఎందుకు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
బ్రెజిల్‌లో ప్రస్తుతం చైనా వాక్సిన్‌ సినోవాక్‌, అమెరికా ఫైజర్‌, మరో కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్లను మూడవ దశ ప్రయోగాల తరువాత సాధారణ లేదా అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చని అనుమతి ఇచ్చారు. వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన మార్పి ఒప్పందాలన్నీ మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా నేరుగా ప్రభుత్వ సంస్దలే చేసుకున్నాయి. దానికి భిన్నంగా కోవాగ్జిన్‌కు ఆ నిబంధనలను సడలించారు. ఒప్పందం జరిగిన సమయానికి బ్రెజిల్‌లో కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు జరగలేదు, భారత్‌లో జరిగిన ప్రయోగాల సమాచారాన్ని కూడా అందచేయలేదు. ఇతర వాక్సిన్లకంటే ముందే చెప్పుకున్నట్లు మధ్యవర్తి కంపెనీ అధికధరలకు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 25న ఒప్పందం చేసుకున్న తరువాత నెల రోజుల్లోపల 80లక్షల మోతాదులను సరఫరా చేయాలి.అయితే ఆ గడువు సెప్టెంబరుకు పెరగవచ్చంటున్నారు. మన దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ప్రభుత్వం మీద తీవ్రవత్తిడి రావటంతో ఎగుమతులపై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒప్పందానికి తొమ్మిది రోజుల ముందు బ్రెజిల్‌ మంత్రి కోవాగ్జిన్‌ గురించి బ్రెజిల్‌ రాష్ట్రాల గవర్నర్లకు వివరించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 80లక్షల మోతాదుల చొప్పున మే నెలలో నలభై లక్షల మోతాదులు సరఫరా అవుతాయని చెప్పాడు. వాక్సిన్‌కు సంబంధించి వివరాలు లేకపోవటం, తయారీలో ప్రమాణాలు పాటిస్తున్నట్లు తమకు విశ్వాసం లేనందున వాక్సిన్ను తిరస్కరిస్తున్నట్లు మార్చి 31న బ్రెజిల్‌ ప్రభుత్వ సంస్ద ప్రకటించింది. భారత వాక్సిన్లను రానివ్వకుండా బ్రెజిల్‌ నియంత్రణ సంస్ద జాతీయవాదంతో వ్యవహరించిందని భారత బయోటెక్‌ అధిపతి ఎల్లా కృష్ణ ఆరోపించారు. మొత్తం మీద బ్రెజిల్‌ విచారణ ఎవరి పాత్రను ఎలా బయట పెడుతుందో చూడాల్సి ఉంది.

చమురు ధరల పెరుగుదల : బిజెపికి ముందుంది ముసళ్ల పండగ !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


నాలుగు నెలల క్రితం లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్ధ ఒక సర్వే జరిపింది. దాని ప్రకారం పెరుగుతున్న చమురు ధరల ఖర్చును సర్దుబాటు చేసుకొనేందుకు ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నామని 51శాతం మంది చెప్పారు. అత్యవసర వస్తువుల మీద ఖర్చు తగ్గించుకోవటం బాధాకరంగా ఉందని 21శాతం మంది అన్నారు. ఆ సర్వే రోజు ఢిల్లీలో పెట్రోలు ధర 90.93, డీజిలు ధర రూ.81.32 ఉంది. జూన్‌ 21న 97.22, 87.97కు పెరిగాయి. అంటే పైన పేర్కొన్న జనాలు ఇంకా పెరుగుతారని వేరే చెప్పనవసరం లేదు. అచ్చేదినాలలో ఉన్నాం కనుక దేశభక్తితో ఇతర ఖర్చులు తగ్గించుకొని దేశం కోసం త్యాగం చేస్తున్నాం. జూన్‌ 21న చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు పీపాధర 73.50కు అటూ ఇటూగా, మన దేశం కొనుగోలు చేసే రకం ధర.72.39 డాలర్లుగా ఉంది. సాధారణంగా బ్రెంట్‌ కంటే ఒక డాలరు తక్కువగా ఉంటుంది.
కొంత మంది పాలకులకు, కొన్ని పార్టీలకు చరిత్ర అంటే మహాచిరాకు. ఎందుకంటే జనాలు వాటి పేజీలను తిరగేస్తే బండారం బయట పడుతుంది. గతంలో ఏమి చెప్పారో ఇప్పుడేమి చెబుతున్నారో జనం చర్చించుకుంటారు. ప్రతిఘటనకు ఆలోచనలే నాంది కనుక, జనాన్ని ఏదో ఒక మత్తులో చేతనా రహితంగా ఉంచాలని చూస్తారు. చమురు ధరల గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమి చెప్పారో, ప్రధానిగా ఉంటూ ఆయనేమి చేస్తున్నారో, సచివులేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటం అవసరం.


మరోవైపున చమురు ధరలు పెంచటం వలన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతేడాది జూన్‌30న చెప్పారు. ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ చేసిన ఆందోళనను ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు.కుటుంబంలో సమస్య తలెత్తినపుడు భవిష్యత్‌ అవసరాలను చూసుకొని జనాలు సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడతారు. చమురు ధరల పెంపును కూడా ఇదే విధంగా చూడాలి. చమురు పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బును ఆరోగ్యం, ఉపాధి, ఆర్ధిక భద్రత చేకూరే ఇతర వాటి మీద ఖర్చు చేస్తున్నాం. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పధకం కింద పేదలు, రైతులకు అనేక పధకాల కింది 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించాం. జనాల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. ఆరునెలల పాటు ఉచితంగా రేషన్‌ మరియు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. పేదలకు సంక్షేమ పధకాలను అమలు జరుపుతుంటే సోనియా గాంధీ, కాంగ్రెస్‌ భరించలేకపోతున్నాయి.” అన్నారు. ఏడాది తరువాత కూడా ఇదే పద్దతిలో సమర్ధించుకున్నారు.


సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నాం కనుక చమురు ధరలను తగ్గించేది లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూన్‌ 13న కరాఖండిగా చెప్పేశారు. ధరలు జనానికి సమస్యగా ఉందని తెలిసినప్పటికీ చేసేదేమీ లేదన్నారు. వాక్సిన్ల కోసం 35వేల కోట్లు, ఎనిమిది నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ప్రధాని మంత్రి గరీబ్‌ కల్యాణయోజన పధకం కింద లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు.వేలాది కోట్ల రూపాయలను కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద బ్యాంకుల్లో జమచేశాము, రైతులకు కనీస మద్దతు ధరలను పెంచాము కనుక ఈ ఏడాది ఇవన్నీ ఉన్నందున చేయగలిగిందేమీ లేదన్నారు.


ఇవన్నీ ఇప్పుడు చెబుతున్న సాకులు మాత్రమే. ఆరు సంవత్సరాల క్రితం నుంచి క్రమంగా పెంచటంతో పాటు గతేడాది బడ్జెట్‌ సమయంలోనే చమురు పన్నులు భారీగా పెంచారు. గత మూడు సంవత్సరాలలో చమురు పన్ను ద్వారా వచ్చిన ఆదాయ సంఖ్యలే అందుకు సాక్షి. ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన లోక్‌సభకు మంత్రి ప్రధాన్‌ ఇచ్చిన సమాధానం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వచ్చిన ఆదాయం ఇలా ఉంది.2018-19లో 2.13లక్షల కోట్లు, 2019-20లో 1.78లక్షల కోట్లు, 2020-21లో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు (పది నెలలకు) 2.94లక్షల కోట్లు వచ్చింది. కరోనా రెండవ తరంగం వస్తుందని ముందే ఊహించి ఇంత భారీ ఎత్తునపన్నులు విధించినట్లు భావించాలా ? ఇన్ని కబుర్లు చెబుతున్నవారు వాక్సిన్ల భారాన్ని రాష్ట్రాల మీద వేసేందుకు ఎందుకు ప్రయత్నించినట్లు ? 2014-15లో అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్రం పెట్రోలు మీద రు.29,279 కోట్లు, డీజిలు మీద 42,881 కోట్లు వసూలు చేయగా ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది మార్చి 22న లోక్‌సభలో చెప్పినదాని ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి వరకు పెట్రోలు మీద రు.89,575 కోట్లు, డీజిలు మీద రు.2,04,906 కోట్లు ఎక్సయిజ్‌ పన్ను వసూలైంది. ఇంత పెంపుదల రైతులు, కరోనా కోసమే చేశారా ? కరోనా నిరోధ పరికరాలు, ఔషధాల మీద జిఎస్‌టి తగ్గించటానికి ససేమిరా అని వత్తిడి తట్టుకోలేక నామ మాత్ర రాయితీ ఇచ్చిన పెద్దలు చెబుతున్నమాటలివి. బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉండగా ఏమి చెప్పారు ? ఏమి చేశారు ?


కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి చమురు ధరల పెరుగుదల గొప్ప తార్కాణం అని 2012 మే 23న ఒక ట్వీట్‌ ద్వారా నరేంద్రమోడీ విమర్శించారు.బహుశా అప్పటికి ప్రధాని పదవి ఆలోచన లేదా లేక ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకొనే ఎత్తుగడలో భాగంగా చెప్పారా ? ధరల పెంపుదల వలన గుజరాత్‌ పౌరుల మీద వందల కోట్ల భారం పడుతుందని కూడా నాడు ముఖ్యమంత్రిగా మోడీ చెప్పి ఉంటారు. 2012లో రైలు ఛార్జీల పెంపు పేదలు, రైతులకు వ్యతిరేకం అని నిరసన తెలుపుతూ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్రానికి లేఖ రాశారు.అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేశాడన్నట్లుగా 2014లో అధికారానికి వచ్చిన తొలి నెలలోనే ప్రధాని నరేంద్రమోడీ తన వాగ్దానాల్లో ఒకటైన ధరల పెరుగుదల అరికట్టటం, అచ్చేదిన్‌ అమల్లో భాగంగా రైలు ప్రయాణీకుల ఛార్జీలు 14.2శాతం, సరకు రవాణా 6.5శాతం పెంచారు. దివంగత సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ మాటలను పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న స్కృతి ఇరానీ తీరుతెన్నులు తెలిసిందే. బిజెపి కనుక కేరళలో అధికారానికి వస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ అరవై రూపాయలకే అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనమ్‌ రాజశేఖరన్‌ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. వాటిని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ఆధరకు ఇవ్వవచ్చని చెప్పారు. చమురును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు ఎల్‌డిఎఫ్‌ అంగీకరించటం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ గారు రోజువారీ ధరల పెంపుదల వినియోగదారులకే మంచిదని, తమ ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధించదని చెప్పారు.
ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చివరికి అదే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ను బిజెపి పెద్దలు, పిన్నలు ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్రం విధించే ఎక్సయిజ్‌ పన్నులో 41శాతం తిరిగి రాష్ట్రాలకే పోతుందని, అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలని నిరంతరం చెబుతుంటారు. అదే వాస్తవం అయితే బిజెపి పాలిత రాష్ట్రాలు ముందుగా ఆ పని చేసి ఆదర్శంగా నిలిచి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల మీద ఎందుకు వత్తిడి తేవటం లేదు ? ఒక్కటంటే ఒక్క రాష్ట్రమైనా ఆపని ఎందుకు చేయలేదు?


యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో ఎలా ఉందో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం××× ధర డాలర్లలో
2010-11××× 85.09
2011-12××× 111.89
2012-13××× 107.97
2013-14××× 105.52
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.57
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.57
2020-21××× 44.82


2021-22 సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో 66.61, మే నెలలో 72.08 డాలర్లు ఉంది. ఈ సంవత్సరాలలో ధరలు తగ్గితే వినియోగదారులకు ధరలు తగ్గాలి, పెరిగితే పెరగాలి అని చెప్పారు. అదే తర్కాన్ని వర్తింప చేస్తే ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గాలి. జరిగిందేమిటి ? ఎలా పెరిగిందో ముందే చూశాము. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వినియోగదారుల జేబులు గుల్ల అయ్యాయి. చమురు ధర 72 డాలర్లు ఉంటేనే మోడీ ఏలుబడిలో పెట్రోలు ధర వంద రూపాయలు దాటింది. అదే పూర్వపు స్ధాయికి చేరితే…… మోత మోగుతుందని వేరే చెప్పాలా ?


సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో బిజెపి చేస్తున్న ప్రచారం పని చేస్తున్న కారణంగానే అనేక మంది పన్ను తగ్గించాల్సింది రాష్ట్రాలే అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పెట్రోలు మీద యూపిఏ హయాంలో లీటరుకు విధించిన రూ.9.48 నుంచి 32.98కి డీజిలు మీద రు.3.56 నుంచి 31.80కి పెంచాలని ఏ రాష్ట్రం కోరిందో చెప్పాలని బిజెపి పెద్దలను నిలదీయండి, సమాధానం ఉండదు. ఈ మొత్తాలలో రాష్ట్రాలకు వాటా లేని సెస్‌లు, డ్యూటీలే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఈ మొత్తాల నుంచి 41శాతం లెక్కవేసి దానికి, రాష్ట్రాలు విధించే వాట్‌ను కలిపి చూడండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయమే ఎక్కువ కదా, కనుక రాష్ట్రాలే తగ్గించాలని బిజెపి పెద్దలు వాదిస్తారు. అందుకే మెజారిటీ రాష్ట్రాలు మీవే కదా ఆ పని ముందు అక్కడ ఎందుకు చేయలేదు అంటే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కోసం చమురు మీద లీటరు పెట్రోల మీద రెండున్నర, డీజిలు మీద నాలుగు రూపాయల సెస్‌ విధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వినియోగదారులకు పెంచలేదు. మరి ఆ సొమ్మును ఎలా వసూలు చేస్తారు ? పైన చెప్పుకున్న ఎక్సయిజు పన్ను నుంచి ఈ మొత్తాన్ని సెస్‌ ఖాతాకు మార్చారు. ఈ మొత్తాలనుంచి రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అలాగే లీటరుకు వసూలు చేస్తున్న రు.18 రోడ్డు మరియు మౌలిక సదుపాయాల సెస్‌. వీటి నుంచే చమురు, గ్యాస్‌ పైప్‌లైన్లు, జాతీయ రహదారులు, రాష్ట్రాలకు రహదారులకు నిధులు ఇస్తున్నారు. మరోవైపు వినియోగదారుల చార్జీల పేరుతో వాటిని వినియోగించుకున్నందుకు జనాల నుంచి వసూలు చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే మన డబ్బులతో మనమే రోడ్లు వేసుకొని వాటికి టోల్‌టాక్సు మనమే కడుతున్నాం. ఇవన్నీ పోను మిగిలిన మొత్తాల నుంచే రాష్ట్రాలకు 41శాతం వాటా ఇస్తారు. అసలు మోసం ఇక్కడే ఉంది.

కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో ఏడాదికి ఒక్కో రైతుకు ఆరువేల రూపాయలు ఇస్తున్నట్లు ఎన్నికల కోసం ఒక పధకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపున ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోలు,డీజిలు మీద వ్యవసాయ సెస్‌ పేరుతో ప్రతిపాదించిన మొత్తాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా 49వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. జనమంతా చమురు కొంటారా అని వాదించే వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాహనాలు నడిపేవారందరూ వ్యవసాయం చేయరు కదా ? వారి కోసం అందరిదగ్గర నుంచి ఎందుకు వసూలు చేయాలి ? కరోనా కారణంగా చమురు వాడకం తగ్గింది గానీ, ప్రభుత్వాలకు గణనీయంగా ఆదాయం పెరగటం వెనుక మతలబు పెంచిన పన్నులే. మంచి జరిగితే తమ ఖాతాలో, చెడు జరిగితే రాష్ట్రాల ఖాతాలో వేయటం కరోనా విషయంలో చూశాము. కరోనా మీద విజయం సాధించామని చెప్పుకొన్నపుడు నరేంద్రమోడీ అండ్‌కోకు రాష్ట్రాలు గుర్తుకు రాలేదు, తీరా రెండవ తరంగంలో పరిస్ధితి చేజారటంతో ఆరోగ్యం, వైద్యం రాష్ట్రాల బాధ్యత అంటూ ప్రచారానికి దిగారు.


2014 మే నెలలో ఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు ధర రు.71.41. దీనిలో చమురు ధర 63శాతం, కేంద్ర పన్నులు 16శాతం, రాష్ట్ర పన్ను 18శాతం, డీలరు కమిషన్‌ మూడు శాతం ఉంది. అదే 2021 ఫిబ్రవరిలో లీటరు ధర రూ.86.30. దీనిలో కేంద్ర పన్ను 37శాతం, చమురు ధర 36శాతం రాష్ట్ర పన్ను 23శాతం, డీలరు కమిషన్‌ నాలుగుశాతం ఉంది. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతున్నందున ఈ శాతాల్లో మార్పులు ఉంటాయి. దీన్ని రూపాయల్లో చెప్పుకుంటే రు.86.30లో కేంద్రానికి రు.32.98, చమురు కంపెనీలకు రు.29.71, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.19.92, డీలరు కమిషన్‌ రు.3.69 వస్తాయి.


పేదలందరూ పెట్రోలు కొంటారా ? వాహనాలు లేని వారు కూడ కొని తాగుతారా అంటూ వితండవాదనలు చేసే వారిని చూస్తాము. అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ముందుకు తెచ్చిన ప్రచార అస్త్రాలు. ప్రతి వస్తువు ధర పెరుగుదల, పన్నుల పెంపు మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఆ సూచికలను నిర్ణయించేందుకు అన్ని రకాల వినియోగ వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకొని ప్రతి నెలా సూచిక తగ్గిందా లేదా అని నిర్ధారిస్తారు. ఉద్యోగులకు, కార్మికులకు, ఇతర వేతన జీవులకు ఆ ప్రాతిపదికనే కరువు భత్యాన్ని నిర్ణయిస్తారు.ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. డీజిలు ధరలు పెరిగితే ప్రజారవాణాకు వినియోగించే బస్సుల నిర్వహణ, సరకు రవాణా లారీ, వ్యవసాయదారుల ట్రాక్టర్లు, పంపుసెట్ల ఖర్చు పెరుగుతుంది. పరిశ్రమల్లో జనరేటర్లను వాడితే అక్కడ తయారయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలా పరోక్షంగా యావత్‌ జనజీవనం మీద చమురు ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.


రానున్న కొద్ది వారాల్లో పీపా చమురు 80డాలర్లకు చేరవచ్చని జోశ్యం చెబుతున్నారు. గత రెండు నెలల్లో మార్కెట్‌ తీరుతెన్నులను చూసినపుడు ముందుగానే పెరిగినా ఆశ్చర్యం లేదు. వివిధ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆర్ధిక కార్యకలాపాల పెరుగుదల దానికి ఒక కారణంగా చెబుతున్నారు. జోశ్యాలు నిజమౌతాయా లేదా అన్నది పక్కన పెడితే 70-80 డాలర్ల మధ్య చమురు ధరలు ఉన్నప్పటికీ మన వినియోగదారులకు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగానే ఉంటుంది. ఇదే జరిగితే వినియోగదారులకు, ముందే చెప్పుకున్నట్లు యావత్‌ జనానికి ధరల సెగ, అది పాలకులకు రాజకీయ సెగగా తగలటం అనివార్యం. యుపిఏ చివరి మూడు సంవత్సరాలలో జరిగింది అదే. అదే నరేంద్రమోడీ సర్కార్‌కూ పునరావృతం అవుతుందా ?

నేను గాని ఈలవేస్తే……బిజెపికి కొరకరాని కొయ్య కర్ణాటక యడియూరప్ప !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


రెండు తెలుగు రాష్ట్రాలకూ పొరుగు అయిన కర్ణాటకలో ఏమి జరుగుతోంది ? బిజెపి రాజకీయ నాటకంలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరు ? టీవీ సీరియల్‌ మాదిరి ఎంత కాలం సాగనుంది ? తాజాగా ముగిసిన భాగంలో పాత్రధారులు చెప్పిందేమిటి ? అధిష్టానం ఎప్పుడు దిగమంటే అప్పుడు దిగుతా అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడియూరప్ప. లేదు, ఆయన పూర్తి పదవీ కాలంలో ఉంటారు, మార్పులేదు అన్నారు కేంద్ర పార్టీ ప్రతినిధి అరుణ్‌ సింగ్‌. మేము వెనక్కు తగ్గేది లేదు అంటున్నాయి ఇతర పాత్రలు.మొత్తం మీద మూడు ముక్కలాట నడుస్తోంది.


బిజెపి ఎంఎల్‌ఏలు, మంత్రులు లేవనెత్తుతున్న అవినీతి ఆరోపణలు, పాలనా వ్యవహారాల్లో ఎడియూరప్ప కుమార రత్నం జోక్యం గురించి పార్టీ అధిష్టానం మాట్లాడటం లేదు. ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా సజావుగా ఉంది) అంటోంది. పాచిపోతుందని తెలిసినా ఇద్దరు ముగ్గురు ఎంఎల్‌ఏలు చేస్తున్న రచ్చ తప్ప మరింకేం లేదని మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి యడియూరప్ప బిజెపి కేంద్ర నాయకత్వానికి, ముఖ్యంగా తిరుగులేని మోడీ-అమిత్‌ షా ద్వయానికి కొరకరాని కొయ్యగా మారారా ? దేశంలోని పరిస్ధితులు వారిని బలహీన పరిచాయా ?

కర్ణాటకలో కరోనా ఎలా విజృంభించిందో ఎంత మంది మరణించారో, మరణాలను ఎలా దాచిపెట్టారో లోకానికి తెలిసిందే. అభివృద్ది పనులేమీ లేవని బిజెపి వారే చెబుతున్నారు గనుక వివాదం లేదు. డెబ్బయి అయిదు సంత్సరాలు దాటిన వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదన్నది స్వయంగా బిజెపి విధించుకున్న నిబంధన అని అమిత్‌ షా వంటి వారు చెప్పారు. దాని వెనుక ప్రధాని పదవి రేసు నుంచి ఎల్‌కె అద్వానీ తప్పించే ఎత్తుగడ ఉందంటారు. అసలీ నిబంధన నిర్ణయం ఏ సమావేశంలో జరిగిందో తనకు తెలియదని, అమిత్‌ షానే చెప్పాలని లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గతలోక్‌ సభ ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారు. ఆ నిబంధనను చూపి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ను, కేంద్ర మంత్రి నజమా హెప్తుల్లాను పదవుల నుంచి తప్పించారు. కానీ అదే బిజెపి పెద్దలు 75 ఏండ్లు దాటిన తరువాతనే యడియూరప్పను మరోమారు కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించారు ( లేకపోతే ఆయనే గద్దెనెక్కితే ఆమోద ముద్రవేశారు). కేరళలో యడియూరప్పకంటే పదేళ్ల పెద్ద అయిన 88 ఏండ్ల మెట్రో మాన్‌ శ్రీధరన్‌ పిళ్లేను ఎన్నికల్లో నిలపటమే కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించారు. నిజానికి ఈ రెండూ ఆ పార్టీ ప్రవచించిన స్వయం ప్రవర్తనా నియమావళికి విరుద్దమైనవే.మోడీ-షా ద్వయం తమకు వ్యతిరేకం లేదా ఎవరినైనా దెబ్బతీయాలనుకుంటే ఈ నిబంధనను ముందుకు తెస్తారు. 2014 ఎన్నికల్లో సీట్లు ఇచ్చినప్పటికీ అద్వానీ, మురళీ మనోహర జోషిని ఈ నిబంధన చూపే దూరంగా పదవులకు దూరంగా పెట్టారు. అన్నింటికంటే అవమానం ఏమిటంటే ఇలాంటి వయస్సు మీరిన వారందరితో ఒక మార్గదర్శక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, మార్గదర్శనం చేయాలని అడిగిన వారు లేరు.

ఎడియూరప్పకు ఇప్పుడు 78 సంవత్సరాలు, ఆ నిబంధనకు మినహాయింపు ఇస్తే కారణం ఏమిటో చెప్పాలి, ఎలాంటి ప్రకటన, వివరణ లేకుండానే ముఖ్యమంత్రిగా ఆమోదించారు, కొనసాగిస్తున్నారు. అధిష్టానం ఏమి చెప్పినప్పటికీ కర్ణాటక బిజెపి వ్యవహారాలు వీధుళాలకెక్కాయి. కుమారుడే తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందున యడియూరప్పను తప్పిస్తే తప్ప తాము వెనక్కు తగ్గేది లేని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. ఎంఎల్‌సి హెచ్‌ విశ్వనాధ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఎడియూరప్పకు వయసైపోయింది, ఆరోగ్య సమస్యలున్నాయి, కుటుంబ సభ్యులు పాలనలో జోక్యం చేసుకుంటున్నారు, ముఖ్యంగా కుమారుడు విజయేంద్ర అన్ని శాఖలల్లోనూ వేలు పెడుతున్నారని ఆరోపించారు. అయితే విశ్వనాధ్‌ ప్రకటన వ్యక్తిగతం పార్టీకి సంబంధం లేదని, యడియూరప్పే ముఖ్యమంత్రి అని కేంద్ర ప్రతినిధి అరుణ్‌ సింగ్‌ ఇప్పటికే చెప్పారని బళ్లారి మంత్రి బి శ్రీరాములు సిఎంకు మద్దతుగా ప్రకటించారు. జెడిఎస్‌ నుంచి ఫిరాయించిన వారిలో విశ్వనాధ్‌ ఒకరు. వీరశైవ సామాజిక తరగతి నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని కోరుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల వ్యవధి ఉంది. అందువలన కొత్త ముఖంతో ఎన్నికలకు పోవాలన్నది వ్యతిరేకుల ప్రతిపాదన. అదే చేస్తే అసలు ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందని కేంద్ర పెద్దల భయం.


కరోనా నిరోధంలో ముఖ్యమంత్రి పని తీరు బాగుందని, పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉండాలని, ఎవరికైనా సమస్యలుంటే నాతో మాట్లాడాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయకూడదు, ఎవరైనా అలా చేస్తే సంజాయిషీ కోరతాం అని కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ చెప్పారు. ఇద్దరు ముగ్గురు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, వారిలో ఒకరికి బిజెపి సంస్కృతి గురించి తెలియదని అన్నారు. మూడు రోజుల పాటు బెంగళూరులో మకాం వేసి మంత్రులు, ఎంఎల్‌ఏలతో చర్చలు జరిపారు. అంతకు ముందు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప ముఖ్యమంత్రి నియంత పోకడల మీద గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాశారు. పర్యాటక శాఖ మంత్రి సిపి యోగేశ్వర్‌ స్వయంగా ముఖ్యమంత్రి మీద ధ్వజమెత్తారు.ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. మంత్రులను పార్టీ గానీ, ముఖ్యమంత్రిగానీ ఇంతవరకు ఎలాంటి సంజాయిషీ కోరలేదు. ముఖ్యమంత్రి మార్పు గురించి డిమాండ్లు వస్తుండటంతో యడియూరప్పకు మద్దతుగా 65 మంది సంతకాలు చేసినట్లు సిఎం రాజకీయ కార్యదర్శి, ఎంఎల్‌ఏ రేణుకాచార్య ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు శాసనసభా పక్ష సమావేశం జరపాలని కొందరు ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేసిన నేపధ్యంలో సంతకాల కార్యక్రమం చేపట్టారు.

గతంలో యడియూరప్ప మార్పు గురించి అనేక తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో తాజాగా మే రెండవ తేదీ తరువాత ఎప్పుడైనా ఆయన ఉద్యోగం ఊడుతుందని చెప్పారు. ” సూర్యుడు-చంద్రుడు ఉన్నంత వరకు యడియూరప్ప ముఖ్యమంత్రగా ఉంటారని కొందరు చెబుతున్నారు.అదెలా సాధ్యం, 2023లో కూడా ముఖ్యమంత్రిగా ఉంటారా ? 75 సంవత్సరాల వయోపరిమితి నిబంధన వర్తించదా ? ఇప్పటికే రెండు సంవత్సరాల బోనస్‌ పొందారు. అందుకుగాను పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలి, ఏప్రిల్‌ 17 తరువాత స్వచ్చందంగా వైదొలగాలి, మే రెండవ తేదీ తరువాత మార్పు ఏ రోజైనా మార్పు జరగనుంది. ఉత్తర కర్ణాటక నుంచి ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ” అని సీనియర్‌ బిజెపి ఎంఎల్‌ఏ బసన్‌గౌడ పాటిల్‌ ఏప్రిల్లో విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఏప్రిల్‌ 17న బెలగామ్‌ లోక్‌సభ, బసవకల్యాన్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌, మే రెండవ తేదీన ఫలితాల ప్రకటన గనుక ఆ తేదీలను బసవన గౌడ ప్రకటించారు. అంతకు ముందు ఇలాంటి ప్రకటనలే చేసినందుకు సంజాయిషీ లేఖ ఇచ్చినప్పటికీ వెనక్కు తగ్గకుండా బహిరంగ దాడికి దిగారు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలు, బదిలీల మాఫియా గురించి, హైకోర్టు మందలింపుల గురించి పార్టీ అధిష్టానానికి తెలుసు అని కూడా గుర్తు చేశారు.పక్షం రోజుల క్రితం కూడా బసన్‌గౌడ తన దాడిని కొనసాగించారు.ముఖ్యమంత్రిని మార్చటం తధ్యం, ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయం, కర్ణాటకలో పార్టీ బతకాలంటే బయటకు పంపేయాల్సిందే అన్నారు.


అందరికీ తెలిసిన అంశం కుక్క తోకను ఆడిస్తుంది తప్ప తోక కుక్కను ఆడించదు. కానీ కర్ణాటకలో రెండోదే జరుగుతోంది. యడియూరప్పే పార్టీని నిర్దేశిస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌-జనతాదళ్‌ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత జరిగింది అదే. అంతకు ముందు బళ్లారి ఇనుప ఖనిజం కుంభకోణంలో యడియూరప్ప ప్రమేయం కారణంగా 2011లో ముఖ్యమంత్రి పదవి నుంచి కేంద్ర పార్టీ తొలగించింది. దాంతో బయటికి వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు, బిజెపి ఓటమే ధ్యేయంగా పని చేశారు. 2013 ఎన్నికల్లో అదే జరిగింది. తరువాత యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు, పూర్తి అధికారాలు ఇచ్చారు. 2014లో నరేంద్రమోడీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన తరువాత మిత్ర పక్ష పార్టీల పట్ల, అదే విధంగా రాష్ట్రాల్లో బిజెపి వ్యవహారాల్లోనూ మోడీ-షా ద్వయం మాటకు తిరుగులేకుండా పోయింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారానికి అవసరమైన సీట్లు తగ్గాయి. కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది. తరువాత అసలు కథ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల గురించి బిజెపి ఎన్ని నీతి కబుర్లు చెప్పినా అధికార కూటమిలోని ఎంఎల్‌ఏలకు ఎరవేయకుండా యడియూరప్పను అధిష్టానం నివారించలేకపోయింది. ఆయన చెప్పినట్లు తలాడించకతప్పలేదు. తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫిరాయింపు ఎంఎల్‌ఏలకు సీట్లు ఇవ్వటం గురించి పార్టీలో వ్యతిరేకత వెల్లడైనా యడియూరప్ప మాటే చెల్లుబాటైంది. మంత్రివర్గంలో తన అనుచరులకే పెద్ద పీటవేశారు.

ఆర్ధిక రంగం, కరోనా నిరోధంలో నరేంద్రమోడీ వైఫల్యం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపధ్యంలోనే యడియూరప్పను తొలగించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. కరోనా వైఫల్యాన్ని సాకుగా చూపి ప్రత్యర్ధులు పావులు కదిపారు. దాని మీద ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్య నరేంద్రమోడీని ఉద్దేశించే అన్నది స్పష్టం. జూన్‌ మొదటి వారంలో విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు స్పందించారు.” నేను ఎవరినీ విమర్శించను, నాకు ప్రత్యామ్నాయం లేరంటే నేను అంగీకరించను, ప్రత్యామ్నాయ వ్యక్తులు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎల్లవేళలా ఉంటారు, నాకు ఎలాంటి గందరగోళమూ లేదు, హైమాండ్‌ నాకు అవకాశం ఇచ్చింది, నాశక్తికి మించి పని చేస్తున్నాను. మిగిలిందంతా అధిష్టానమే చూసుకుంటుంది. వారి విశ్వాసం ఉన్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా.” అన్నారు.
దక్షిణ భారత్‌లో ఉన్న ఒక్క కర్ణాటకలో కూడా కాషాయ జెండా ఎగరకపోయినా ఫరవాలేదు, యడియూరప్పను తొలగించాల్సిందే అనుకుంటే తప్ప నాయకత్వమార్పిడి జరిగే అవకాశాలు లేవు. ప్రత్యర్ధుల మీద మాదిరి ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యుల లేదా ఆశ్రితుల అక్రమ సంపాదనల మీద దాడులు చేసినా, కేసులు నమోదు చేసినా పోయేది పార్టీ పరువే. ఇప్పటికీ ముఖ్యమంత్రి, కుటుంబసభ్యుల మీద కేసులు పరిష్కారం కాలేదు. సెక్స్‌ కుంభకోణంలో ఇప్పటికే ఉద్యోగం పొగొట్టుకున్న మంత్రి రమేష్‌ జర్కిహౌలికి యడియూరప్ప పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఒక భూమి డీనోటిఫికేషన్‌ వ్యవహారంలో యడియూరప్ప ప్రమేయం ఉందనే ఫిర్యాదులు రావటంతో ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశించింది. జెడిఎస్‌ ఎంఎల్‌ఏ కుమారుడిని డబ్బు, మంత్రిపదవితో ప్రలోభపెట్టారంటూ 2019లో యడియూరప్పమీద దాఖలైన కేసు ఇంకా ఉంది.ఇలాంటివి అనేక ఆరోపణలు ఉన్నా చలించటం లేదు.


యడియూరప్ప మీద తిరుగుబాటును సమర్ధిస్తే కలిగే లాభనష్టాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మదింపు వేస్తున్నట్లు వార్తలు. లింగాయత్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్ల అంశం ఎటూ తేలటం లేదు. యడియూరప్ప ఆ సామాజిక తరగతిలో ఒక కులానికి చెందిన వ్యక్తి. ఒక వేళ ముఖ్యమంత్రిపదవి నుంచి తొలగిస్తే మరొక బలమైన సామాజిక తరగతి మీద ఆధారపడాల్సి ఉంటుందన్నది ఒక ఆలోచన. అలాంటపుడు కురుబల మీద ఆధారపడాల్సి వస్తుందని, అందువల్లనే ఆ సామాజిక తరగతికి చెందిన మంత్రి ఈశ్వరప్పతో ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు జెండా ఎగురవేయించారన్నది ఒక అభిప్రాయం. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలలో ఆరితేరిన యడియూరప్ప అంత తేలికగా లొంగబోరని చెబుతున్నారు. ప్రస్తుతం 224 సభ్యులున్న అసెంబ్లీలో బిజెపికి ఉన్న బలం 119 మాత్రమే. అంటే కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి గెలిచిన వారు దూరమైనా ప్రభుత్వం నిలిచే అవకాశం లేదు. తనతో పాటు కనీసం 30-35 మందిని యడియూరప్ప తీసుకుపోగలరని భావిస్తున్నారు. ఒక వేళ జెడిఎస్‌తో మిగిలిన బిజెపి సభ్యులు చేతులు కలిపినా ప్రయోజనం ఉండదు. నరేంద్రమోడీ పేరుతో ఓట్లడిగి బీహార్‌లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా బయటపడినా అసోంలో పెద్ద మెజారిటీ రాలేదు, పశ్చిమబెంగాల్లో అనూహ్య ఓటమి నేపధ్యంలో కర్ణాటకలో మోడీ బొమ్మను చూపి ఓట్లడిగే పరిస్ధితిలో బిజెపి ఉందా అంటే అనుమానమే. తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ, షా వంటి పెద్దలు ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నింటా మిగతా చోట్ల మాదిరే ఓట్లు తగ్గాయి.

కుల రాజకీయాలు నడుస్తున్నంత కాలం ఎడియూరప్ప తన సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. దానికి తోడు ఐక్యంగా పనిచేసే కుటుంబం కూడా ఉంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారందరూ ఐక్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దీపాలు చక్కపెట్టుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. కుటుంబపాలన గురించి అనేక చోట్ల బిజెపి పెద్ద కబుర్లు చెబుతుంది, ఆ పేరుతో ఓట్లు దండుకుంది. కానీ కర్ణాటకలో అసలు అలాంటిదేమీ లేదన్నట్లుగా ఉంటుంది. పెద్ద కుమార్తె పద్మావతి యడియూరప్ప ఇంట్లోనే ఉంటారు, ఆయన అధికారిక పర్యటనలను కూడా ఖరారు చేస్తారు. రెండవ కుమార్తె అరుణాదేవీ అఖిల భారత వీరశైవ మహాసభ మహిళా విభాగ అధ్యక్షురాలు. మూడవ కుమార్తె ” కుటుంబ వ్యాపారాలను ” చూసుకుంటారు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర షివమొగ్గ లోక్‌సభ సభ్యుడు. కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. రెండవ కుమారుడు విజయేంద్రకు ఎలాంటి పదవులు లేకపోయినా సూపర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌-జెడిఎస్‌ల నుంచి రెండు సంవత్సరాల క్రితం ఎంఎల్‌ఏల కొనుగోలులో ప్రధాన పాత్రధారి అని చెబుతారు.తనను ముఖ్యమంత్రిగా తొలగిస్తే విజయేంద్రను వారసుడిగా అంగీకరిస్తే యడియూరప్ప ఏ క్షణంలో అయినా వైదొలుగుతారు. వచ్చే ఎన్నికల్లో విజయేంద్ర మైసూరు జిల్లా వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ముందే ప్రకటించేశారు. బిజెపిలో కుమ్ములాటలకు ఇదే మూలం.


కర్ణాటక బిజెపిలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎవరి ప్రయోజనాలు వారివి. ఆ పార్టీ వ్యవహారాలు చూసినపుడు యడియూరప్ప కొరకరాని కొయ్య. ఆయన చుట్టూ పార్టీ నడవాలి తప్ప పార్టీ చెప్పినట్లు నడిచే తత్వం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం ఉన్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. యడియూరప్ప లేకపోతే అదీ ఉండదు, వారికి కావాల్సింది అధికారం, విలువలు-వలువలతో పనిలేదు కనుక బిజెపి కేంద్ర పెద్దలు కూడా ఇప్పటికైతే చేయగలిగింది లేదు. నేను గాని ఈలవేస్తే అనే పరిస్దితి లేదు. కానీ అదే యడియూరప్ప ఈల వేస్తే బిజెపి ఖాతా నుంచి కర్ణాటక అవుట్‌ !

పెరూలో వామపక్ష విజయాన్ని వమ్ము చేసే కుట్ర !

Tags

, , , ,


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 3


ఎం కోటేశ్వరరావు


జూన్‌ ఆరవ తేదీన లాటిన్‌ అమెరికాలోని పెరూలో పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. లెక్కింపు పూర్తయినప్పటికీ ఇంకా అధ్యక్ష పదవికి ఎన్నికైన వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలోను ఎన్నికల సంఘం ఇంకా ధృవీకరించలేదు.ప్రజాతీర్పును వమ్ము చేసే కుట్ర దీనివెనుక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలు దామాషా ప్రాతిపదికన జరగ్గా అధ్యక్ష ఎన్నికలు మరోవిధంగా జరిగాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తొలి పోలింగ్‌లోనే సగానికి పైగా ఓట్లు తెచ్చుకుంటే మలి ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా గెలిచిన వారిని అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిగా ప్రకటిస్తారు. లేనపుడు పోటీ చేసిన అభ్యర్ధులలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య రెండవ సారి ఎన్నిక జరుపుతారు. ఆ విధంగా ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో ఫలితం తేలలేదు. జూన్‌ ఆరున జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో 50.127శాతం ఓట్లు తెచ్చుకోగా ప్రత్యర్ధి కెయికు ఫుజిమోరీ 49.873శాతం ఓట్లు తెచ్చుకున్నారు. కాస్టిలో మెజారిటీ 44,240 ఓట్లు. పెరూ ఎన్నికల సంఘం అంతిమంగా ప్రకటించిన వివరాల ప్రకారం 2,52,87,954 ఓట్లకు గాను 1,88,56,818 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో ఎవరికీ వేయకుండా ఖాళీ పత్రాలు 1,21,478, చెల్లని ఓట్లు 11,07,640 ఉన్నాయి. చెల్లని ఓట్లన్నీ తనకు పడినవే అని కెయికు ఫుజిమోరీ వాదించటంతో రోజుల తరబడి వాటన్నింటినీ తిరిగి పరిశీలించారు. మంగళవారం నాడు ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయినప్పటికీ అంతకు ముందు వెలువడిన ఫలితంలో మార్పులేమీ లేవు. లెక్కింపు ప్రారంభమై పన్నెండు రోజులు గడిచినా ఇది రాస్తున్న సమయానికి ఎన్నికల సంఘం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చిందీ ప్రకటించింది తప్ప అధికారికంగా ఫలితాన్ని ఖరారు చేయలేదు.

ఒకవైపు లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాల ప్రతినిధులు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదని ప్రకటించారు, అమెరికా కూడా ఫలితాలను అందరూ అమోదించాలని చెప్పింది, అయినప్పటికీ అనూహ్యంగా తాము అనుకున్నదానికి భిన్నంగా ఫలితం రావటంతో కుట్రకు తెరలేపినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి కాస్టిల్లోను అభినందిస్తూ సందేశాలు వస్తున్నాయి.గతేడాది అమెరికాలో జరిగిన ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరిగాయంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించటం, కోర్టులకు ఎక్కటం తెలిసిందే. ఇప్పుడ ట్రంప్‌ను ఆదర్శంగా తీసుకొని కెయికు ఫుజిమోరీ తన ఓటమిని అంగీకరించేందుకు సిద్దపడటం లేదు. ఫలితాలను సవాలు చేసేందుకు 30 మంది అగ్రశ్రేణి న్యాయవాదులతో ఇప్పటికే 134 కేసులు వేయించగా మరో 811 వేసేందుకు సిద్దం అవుతున్నట్లు వార్తలు. చెల్లనివిగా ప్రకటించిన వాటిలో రెండున్నరలక్షల ఓట్ల గురించి తాము సవాలు చేస్తున్నట్లు కెయికు గురువారం నాడు వెల్లడించింది. పోటీ తీవ్రంగా ఉందని పసిగట్టిన కెయికు ఎన్నికలకు ముందుగానే వీరితో మంతనాలు జరిపి చట్టపరంగా ఆటంకాలు కల్పించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. కాస్టిలో మద్దతుదారులందరూ గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని స్ధానిక జాతులు, రైతులు, పట్టణ ప్రాంతాల్లోని పేదలు కాగా ఫుజిమోరి మద్దతుదారులందరూ అత్యంత సంపన్నులు, ఐరోపా దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన శ్వేతజాతీయుల వారసులు.కెయికు ఫుజిమోరి తండ్రి, అవినీతి కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఆల్బర్ట్‌ ఫుజిమోరి నియంత, మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద రాజకీయవేత్త. జపాన్‌ నుంచి వలస వచ్చిన వారి సంతానం.


ఎన్నికలకు ముందుగా అమెరికా నూతన రాయబారిగా లిసా కెనా నియమితులయ్యారు. ఆమె గతంలో తొమ్మిది సంవత్సరాలు సిఐఏ అధికారిగా విదేశాంగశాఖ ముసుగులో ఇరాక్‌లో పనిచేశారు. ట్రంప్‌ హయాంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన మైక్‌ పాంపియోకు సలహాదారు. పెరూ ఎన్నికలకు ముందు ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ తమ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అధ్యక్ష ఎన్నిక మొత్తం లాటిన్‌ అమెరికాకే ఒక ఆదర్శ నమూనాగా ఉండాలని పేర్కొన్నారు.కైయికు ఫుజిమోరి విజయం సాధిస్తారనే ధీమాతో ఈ ప్రకటన చేసి ఉండాలి.లేనట్లయితే ప్రతి దేశంలో మాదిరి ముందుగానే పెరూలో కూడా తన కుట్రను అమలు జరిపి ఉండేది.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత తొలి దశలో కైయికు ముందంజలో ఉండగా ఎలాంటి ప్రకటనలు చేయని వారు, గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపులో కాస్టిలో దూసుకుపోవటంతో ఫలితాలు తారుమారైనట్లు గ్రహించి తనకు పడిన ఓట్లను చెల్లనివిగా పక్కన పెట్టారనే ఆరోపణను ఆమె ముందుకు తెచ్చారు. కాస్టిలో ఎన్నికైతే దేశం మరో వెనెజులాగా మారిపోతుందని ఆమె మద్దతుదారుగా ఉన్న నోబెల్‌బహుమతి గ్రహీత వర్గాస్‌ లోసా ప్రకటించి కాస్టిలో వ్యతిరేకులను రెచ్చగొట్టారు. ఎన్నికలకు ముందే అల్బర్ట్‌ ఫుజిమోరిని వ్యతిరేకించిన మితవాదులందరూ కెయికు మద్దతుదారులుగా మారారు. ఫలితాలు అనూహ్యంగా మారటంతో మరింత సంఘటితమై లెక్కింపును గుర్తించబోమంటూ ప్రదర్శనలకు దిగారు.మరోవైపు కాస్టిలో కూడా తీర్పును కాపాడుకొనేందుకు వీధుల్లోకి రావాలని తన మద్దతుదారులకు పిలుపు నిచ్చారు. ఈ నేపధ్యంలో ఓట్ల లెక్కింపు పూర్తయి వివరాలను అధికారికి వెబ్‌సైట్‌లో వెల్లడించినప్పటికీ రోజులు గడుస్తున్నా ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఎన్నికల సంఘం జాప్యం చేస్తున్నది.ఈ లోగా కైయికు కేసులు దాఖలు చేసేందుకు తగిన గడువు ఇవ్వటం ద్వారా సరికొత్త కుట్రకు తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో ఒకసాకుతో కోర్టు ద్వారా ఎన్నికలను రద్దు చేసినా ఆశ్చర్యం లేదు.

ఎన్నికల ఫలితాలపై వచ్చిన ఫిర్యాదులను ఎంతో వేగంగా పరిష్కరిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. గత ఎన్నికల్లో కూడా ఇద్దరు అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా కేవలం 41,027 మాత్రమే.అప్పుడు కూడా రెండవ స్ధానంలో కెయికు ఫుజిమోరియే ఉన్నారు. ఆ సమయంలో కూడా జూన్‌ నెలాఖరుగానీ ఫలితాన్ని ఖరారు చేయలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. అది నిజమే అయినప్పటికీ గత ఎన్నికలలో పోటీ పడిన వారిద్దరూ మితవాద పక్షాలకు చెందిన వారే. ఇప్పుడు అనూహ్యంగా వామపక్ష అభ్యర్ధి రంగంలోకి రావటం, మెజారిటీ సంపాదించిన కారణంగానే అనేక అనుమానాలు తలెత్తాయి.
పెరూలో జరిగిన పరిణామాలలో వామపక్ష అభ్యర్ది విజయం సాధించటం ఆ ఖండమంతటా వామపక్షశక్తులు తిరిగి పుంజకుంటున్నాయనేందుకు సంకేతంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో వామపక్ష తీవ్రవాదిగా రంగంలోకి వచ్చి విజయం సాధించిన మాజీ సైనిక అధికారి ఒలాంటా హమాలా అమెరికా సామ్రాజ్యవాదుల బంటుగా, నయాఉదారవాద విధానాలను అమలు జరిపే వాడిగా తయారై మొత్తంగా వామపక్ష శక్తుల మీదనే అనుమానాలు వ్యక్తం చేసే విధంగా వ్యవహరించాడు. దాన్నుంచి బయటపడి తిరిగి అక్కడి పేదలు కాస్టిలోను ఎన్నుకోవటం చిన్న విషయం కాదు. త్వరలో ఎన్నికలు జరగనున్న చిలీ, కొలంబియా, బ్రెజిల్‌లో కూడా ఇదే పునరావృతం అవుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం వెనెజులా, అర్జెంటీనా, నికరాగువా,బొలీవియా, మెక్సికోలలో వామపక్ష శక్తులు అధికారంలో ఉన్నాయి. కాస్టిలో నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్టు పార్టీ కాకున్నప్పటికీ తమది మార్క్సిస్టు భావజాలం మీద ఆధారపడి పని చేస్తుందని ప్రకటించారు. పెరూ మితవాద శక్తులను వ్యతిరేకించే ఒక విశాల వామపక్ష పార్టీగా అది ఉందని చెప్పవచ్చు.


మౌలికంగా భిన్నమైన లాటిన్‌ అమెరికా గురించి ఆలోచించాల్సి ఉంటుందని అమెరికాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు బ్రియన్‌ వింటర్‌ ఆ ఖండంలో జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానించాడు. ప్రజాభిప్రాయాన్ని చూస్తే అధికారంలో ఉన్న ప్రత్యేకించి మితవాద శక్తులు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోందని బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌ వెబ్‌సైట్‌ సంప్రదించిన పన్నెండు మంది ప్రాంతీయ విశ్లేషకులు చెప్పారు. దిగజారిపోయిన ఆర్ధిక వ్యవస్ధలు, మహమ్మారి కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలను బట్టి జనాలు మితవాదులను బయటకు గెంటేయాలన్నట్లుగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అసంతృప్తికి కరోనా ఒక్కటే కారణం కాదు, అంతకు ముందే చిలీ, కొలంబియా వంటి చోట్ల జనం వీధుల్లోకి వచ్చారు. వాస్తవానికి కరోనా జనాన్ని ఇండ్లకే పరిమితం చేసింది. మితవాద శక్తులు చేసిన వాగ్దానాలను మరచిపోవటంతో జనం ధనికులతో పాటు ఆర్ధిక విధానాలనే మార్చాలని కోరుతున్నారని పెరూ పరిణామాలు స్పష్టం చేశాయి.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలోకి రావటం వలన పరిణామాలు,పర్యవసానాలు ఆ ఖండానికే పరిమితం కావు. రాజకీయంగా వెనెజులా, బొలీవియా నాయకత్వాల మీద వత్తిడి తగ్గుతుంది.అమెరికాతో సంబంధాలు పరిమితమై చైనాతో పటిష్టమౌతాయి. అన్నింటినీ మించి అమెరికా జోక్యంతో పరిణామాలను ప్రభావితం చేయటం కష్టం అవుతుంది. వామపక్ష శక్తులే కాదు, ప్రజాస్వామిక శక్తులను కూడా అక్కడి మితవాద శక్తులు సహించటం లేదు. ఈ కారణంగానే నిరంతరం ఏదో ఒక దేశంలో కుట్రలు జరగటం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఆరుదశాబ్దాలలో పన్నెండు దేశాలలో 34 కుట్రలు జరిగాయి. వీటన్నింటి వెనుక అమెరికా సామ్రాజ్యవాదుల కుట్ర, డబ్బు, ఆయుధాలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ ఛేదించి జనం ఎప్పటికప్పుడు పురోగామి శక్తులకు పట్టం గడుతున్నారు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు పార్టీలకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో ఈ పరిణామాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి, విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు పదే పదే తలెత్తుతున్నాయంటే అదేదో గాల్లోంచి జరుగుతున్నది కాదు.అక్కడి మితవాద శక్తులు, వాటి విధానాలు, వాటికి వెన్నుదన్నుగా అమెరికా కుట్రలే అందుకు దోహదం చేస్తున్నాయి. .