ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ పుష్కర ప్రధానిగా, ప్రధమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను మించి పదవిలో కొనసాగుతున్న నేతగా భక్తులు, అభిమానుల నుంచి నీరాజనాలు, ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా ప్రభుత్వ పథకాల గురించి విజయగానాలు చేస్తుంటే వాటి తీరు గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అన్నింటి గురించి వివరించేందుకు అవకాశం లేదు.కనుక మోడీ మానవత్వం గురించి వెల్లడించే సామాజిక పెన్షన్ల గురించి చూద్దాం.మోడీ పదవిని అధిష్టించేనాటికి అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి జాతీయ సామాజిక సహాయక పథకం(ఎన్‌ఎస్‌ఏపి) అమల్లో ఉంది.దీనిలో ఆరుపదులు దాటిన వృద్దులు, వితంతువులు,వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్రాలు అమలు జరపాలి.కేంద్ర ఇచ్చే నగదుకు అదనపు మొత్తాలను జత చేయాలనే షరతేమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు అదనంగా ఇస్తున్నాయి. అందువల్లనే వివిధ రాష్ట్రాలలో చెల్లించే మొత్తాల్లో ఎంతో తేడా ఉంది. 2023లో కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం సగటున రు.1,100 అందుకుంటున్నట్లు తేలింది. ఉదాహరణకు రెండింజన్ల పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెబుతున్న మధ్య ప్రదేశ్‌లో 60 ఏండ్ల వారికి రు.600, ఎనభై దాటిన వారికి రు.1,000 ఇస్తున్నారు. చత్తీస్‌ఘర్‌లో రు.350, ఇక దేశానికే ఆదర్శం అని చెబుతున్న గుజరాత్‌లో వరుసగా రు.750, రు.1,250 చెల్లిస్తున్నారు. మోడీ తరువాత ఆదర్శవంతమైన పాలన అందించారని కీర్తిస్తున్న నితీష్ కుమార్‌పాలనలో బీహార్‌లో ఇస్తున్నది రు.1,100, ఆంధ్రప్రదేశ్‌లో రు.4,000 చెల్లిస్తున్నారు.దేశంలో ఇదే గరిష్టం. ఏ రాష్ట్రం ఎంత చెల్లించినా దీనిలో కేంద్ర ఇస్తున్న మొత్తాలు 60 ఏండ్లు దాటిన వారికి రు.200, ఎనిమిది పదులు దాటితే రు.500 మాత్రమే. అంతకు మించి ఇచ్చేదంతా రాష్ట్రాల బడ్జెట్ల నుంచే కేటాయిస్తున్నారు. అభాగ్యులను ఆదుకొనేందుకు ముందుకు రాకుండా వారి ఉసురుపోసుకుంటున్న పాలనలో రెండింజన్లు ఉంటేనేం ఇరవై ఉన్నా ప్రయోజనం ఏముంది ! ప్రతిపక్షంలో ఉండగా ఇంత స్వల్పమొత్తాలా అంటూ ఇదే బిజెపి విమర్శించింది. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఆ పార్టీ వ్యవహరిస్తున్నది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అధికారమిస్తే అచ్చేదిన్ అంటే మంచి రోజులను తెస్తానని 2014లో వాగ్దానం చేసిన నరేంద్రమోడీ ఇప్పుడవయస్సు ఇప్పుడు 75 దాటింది. ఇది కూడా వివాదమే, ఒక సర్టిఫికెట్ ప్రకారం 75దాటితే ఆయన చెప్పుకుంటున్నదాని ప్రకారం త్వరంలో అధిగమిస్తారు. అరవై దాటిన వారెవరికైనా వృద్దుల బాధలేమిటో తెలిసి ఉండాలి. అయినా ఏమీ తెలియనట్లు, పెన్షన్ మొత్తాలను పెంచుతూ సవరించేందుకు మొరాయిస్తున్నారు, ససేమిరా కుదరదని మాట్లాడకపోయినా ఆచరణలో చూపుతున్నారు.పెన్షన్ల సవరణకు ఏమైనా కాలవ్యవధి ఉందా అని లోక్‌సభలో వచ్చిన ఒక ప్రశ్నకు మంత్రి కమలేష్ పాశ్వాన్ 2025 ఫిబ్రవరి 11న ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. ” పథకపు మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రత్యేకించి సవరణకు నిర్ణీత వ్యవధి అంటూ లేదు.అయినప్పటికీ అంతకు ముందు ఉన్న రు.75ను 2007లో రు.200కు పెంచారు. ఎనభై అంతకు మించిన వయస్సున్నవారికి 2011లో రు.500కు పెంచారు. ఇదిగాక వితంతు, వికలాంగులకు ఇచ్చే మొత్తాన్ని 2012లో రు.200 నుంచి రు.300కు పెంచారు.” అప్పటి నుంచి ఇంతవరకు కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వటం లేదు. మోడీ సర్కార్ మానవత్వం లేదా మానవ ముఖానికి ఇది అద్దం పడుతున్నది. ఈ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటు సభ్యులకు నెలవారీ వేతనాలు, ఇతర అలవెన్సులు రు.లలో ఎలా పెంచారో చూద్దాం.
అంశం ×××××××××××××× 2014 ×××× 2026
మూలవేతనం ××××××××× 50,000 ×××× 1,24,000
నియోజకవర్గ అలవెన్సు ×× 45,000 ×××× 90,000
ఆఫీసు ఖర్చులు ×××××××× 45,000 ×××× 75,000
సమావేశాల హాజరు భత్యం× 2,000 ×××× 2,500
కనీస పెన్షన్: నెలకు ××××× 20,000 ×××× 31,000
పెన్షన్ ప్రతి ఏటికి అదననం× 1,500 ×××× 2,500
2014లో ఉన్న ఇతర సౌకర్యాల్లో ఇంటి వసతి, వైద్యం, మూడు టెలిఫోన్లు ఉచితం, ఏడాదికి 50వేల యూనిట్లు విద్యుత్,నీరు ఉచితం, ఎంపీతో పాటు కుటుంబ సభ్యులు లేదా తోటి ప్రయాణం చేసేవారికి ఏటా 34 విమాన ప్రయాణాలు, అపరిమితంగా రైలు, బస్సు ప్రయాణాలు ఉచితం.2026 నాటికి పైన పేర్కొన్న సౌకర్యాలతో పాటు ఏడాదికి లక్షన్నర రూపాయలు ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యాలకోసం ఇస్తున్నారు. పన్నెండు సంవత్సరాల్లో ఇంతగా ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంచిన ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ మొత్తాలను పెంచేందుకు ఎలాంటి మార్గదర్శక సూత్రాలు లేవని చెబుతోంది. ఆర్టికల్ 370, ఇతర అనేక చట్టాలను సవరించిన మానవతావాదులు దీనికి అవసరమైన సవరణలు చేపట్టేందుకు ఎవరు అడ్డుపడ్డారు. ధరల పెరుగుదలకు అనుగుణ్యంగా ఎంపీలు, ఉద్యోగుల వేతనాలు పెంచుతున్న కేంద్రం అభాగ్యులకు అది వర్తించదా ?2013 నుంచి 2026 నాటికి రూపాయి విలువ పతనమై పెన్షన్ నిజమొత్తం విలువ రు.99 మాత్రమే,(ఈ మొత్తానికి గ్రామాల్లో అరకిలో వేరుశనగ నూనె మాత్రమే వస్తుంది, మిగతా అవసరాల సంగతేమిటి ) అందుకే కొందరు దీన్ని క్రూర పరిహాసం అని వర్ణిస్తున్నారు, ఇతర వస్తువుల ధరలు, ఇతర అవసరాల పెరుగుదల సంగతేమిటి ? పెన్షన్ మొత్తాలు చాలటం లేదని 95శాతం మంది చెప్పినట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేలింది, వారంతా బిజెపి పాలిత రాష్ట్రాలే వారే అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు అవసరమైన తిండిగింజల కొనుగోలుకు తగిన ఉపాధి లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ప్రతినెలా ఐదేసి కిలోల వంతున అందిస్తున్నది. దేశంలో వృద్దుల సంఖ్య పెరుగుతున్నదని అందరూ అంగీకరిస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, లేదా బతుకుతెరువు కోసం వలసలు పోతున్న స్థితిలో ఇండ్లకే పరిమితం అవుతున్న వృద్ధులను ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దేశంలో వృద్దుల సంఖ్య ప్రస్తుతం 17 కోట్లని, 2030 నాటికి 20కోట్లకు పెరుగుతుందని అంచనా, కానీ పెన్షన్ మొత్తాలు అందుకుంటున్నవారి సంఖ్య మోడీ పుష్కరకాలంలో 2.2కోట్లుగా ఉంది తప్ప పెరగలేదు.కేంద్ర తన పథకంలో భాగంగా పెన్షన్లు ఎందుకు పెంచటం లేదని బిజెపి నేతలను ప్రశ్నిస్తే రాష్ట్రాలకు ఆ బాధ్యత లేదా అని ఎదురుదాడికి దిగుతారు. ఆంధ్రప్రదేశ్ మాదిరి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వటం లేదంటే మెమ్మెమ్మె బెబ్బెబ్బె అంటారు. రాష్ట్రాలకూ బాధ్యత ఉంది గనుకనే అవి పెంచుతున్నాయి, కేంద్రం ఎందుకు పెంచటం లేదన్నదే ప్రశ్న. పెన్షన్ల మొత్తాన్ని పెంచేందుకు రాష్ట్రాలకు స్వేచ్చ ఉందని అతితెలివి సమాధానం కేంద్ర మంత్రి నోటి నుంచి వెలువడింది.
తమ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను 32 నుంచి 42శాతానికి పెంచిందని బిజెపి నేతల గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ ముసుగులో పథకాలలో కేంద్రం తన వాటాను గణనీయంగా తగ్గించిన సంగతి మాత్రం చెప్పరు. తాజాగా గ్రామీణ ఉపాధి పథకంలో 90ని 60శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. అనేక పథకాలు ఇలానే ఉన్నాయి, అందుకే ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో లాక్కున్నట్లు విమర్శలు వచ్చాయి. పెన్షన్ల విషయంలో కూడా అదే జరుగుతోంది.వివిధ రాష్ట్రాలు ఇస్తున్న మొత్తాలతో పాటు సంఖ్య కూడా పెరిగింది, కనీసం వారికైనా కేంద్రం నిధులు మంజూరు చేయటం లేదు.అయినా ఏ బిజెపి నేతా లేదా చంద్రబాబు వంటి వారు గానీ కుక్కిన పేనుల్లా ఉంటారు తప్ప దాన్ని గురించి అడగరు. మోడీ ఏమైనా తన జేబులోంచి ఇస్తున్నారా ? కార్పొరేట్లకు ఎంతో ఉదారంగా పన్ను తగ్గించి ఖజానాకు రావాల్సిన మొత్తాన్నే రద్దు చేశారు, రాయితీలు జనం చెల్లిస్తున్న పన్నుల నుంచే ఇస్తున్నారు. మరొక దుర్మార్గం ఏమంటే తాము ఇచ్చే ముష్టి రెండువందల రూపాయలను కూడా ఏ రాష్ట్రంలో ఎంతమందికి ఇవ్వాలో కేంద్రం కోటాలను నిర్ణయిస్తుంది. ఆ మేరకు ప్రస్తుతం 3.09కోట్ల మందికి మాత్రమే ఇస్తున్నది, అదనంగా సంఖ్యను పెంచుకోవాలంటే రాష్ట్రాలే భరించాలని చెప్పింది. అలా రాష్ట్రాలు అదనంగా ఇస్తున్న సంఖ్యతో కలుపుకుంటే మొత్తం లబ్దిదారులు 5.86 కోట్ల మంది ఉన్నారు. నిజానికి ఇప్పటికే ఆరు కోట్ల మంది వృద్దులు నిరుపేద కుటుంబాల్లో ఉన్నారని అంచనా, వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వటం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు వృద్దులు ఉసురు తీస్తున్నాయని వ్యాఖ్యానించాల్సి వస్తోంది.గతంలో 58 ఏండ్లు దాటిన మహిళలు, 60 ఏండ్ల వృద్దులకు రైళ్లలో ఛార్జీల రాయితీ ఉండేది. మోడీ సర్కార్ దీన్ని కూడా రద్దు చేసింది. తన ఏలుబడిలో దేశ సంపద(జిడిపి)ని గణనీయంగా పెంచానని మోడీ సర్కార్ చెప్పుకుంటుంది.సమాజానికి ఉపయోగపడని సంపద తాడి చెట్టు మాదిరి ఎంత పెరిగితేనేం ! మోడీ అధికారానికి వచ్చినపుడు సామాజిక పెన్షన్లకు కేటాయించిన మొత్తం జిడిపిలో 0.58శాతం ఉండేది, పదేండ్ల తరువాత అది 0.2కు పడిపోయింది.ఏటా బడ్జెట్ కేటాయింపులు తొమ్మిదిన్నరవేల కోట్లకు అటూ ఇటూగానే ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం నీతి అయోగ్ నివేదిక దేశంలో 78శాతం మంది వృద్దులు పెన్షన్లు లేకుండా బతుకుతున్నారని, వారిలో 70శాతం తమ కుటుంబాల మీద ఆధారపడుతున్నట్లు పేర్కొన్నది. ఎన్నికల బాండ్ల జారీ చెల్లవు అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తరువాత కూడా పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని ముద్రించి చెత్తబుట్టలో వేసిన జవాబుదారీతనం నరేంద్రమోడీది.కేవలం పన్నెండు కార్పొరేట్ సంస్థలు దివాలా ప్రకటిస్తే వాటికి రద్దు చేసిన మొత్తం రు.2.84లక్షల కోట్లు.నేను పైసా తినను ఇతరులను తిననివ్వను అని ఎన్ని సొల్లుకబుర్లు చెబితే ఏమిటి ! సామాజిక పెన్షన్ మొత్తాలను పెంచే ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని 2025 ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అందువలన నరేంద్రమోడీ పుష్కరకాలం పదవిలో ఉంటేనేం మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
