డాక్టర్ కొల్లా రాజమోహన్,
‘ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం’గా పేరుపొందిన కృష్ణా డెల్టా నేడు తీవ్రమైన సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో (El Niño) ప్రభావం మరియు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో “ఈ సీజన్‌లో వరి పంట వేయవద్దు” అని ప్రభుత్వం జారీ చేసే సూచనలు డెల్టా రైతాంగాన్ని తీవ్రమైన దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి.2003 సంవత్సరంలో కృష్ణా డెల్టా లో రైతులు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొన్నారు.సాగు నీటి కోసం ఉద్యమం సాగించారు.ప్రకాశం బ్యారేజి పైన అతి పెద్ద ధర్నా నిర్వహంచారు.అతి తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధించారు. అప్పటికి పులిచింతల నిర్మించలేదు. పులిచింతల నిర్మించిన తరువాత కూడా కృష్ణా డెల్టా లో వరి పంట సాగుచేయవద్దనటం విచిత్రం గా వుంది.
1. కృష్ణా డెల్టా ప్రత్యేక పరిస్ధితులు – వరి వైపే రైతుల మొగ్గు ఎందుకు?
డెల్టా ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం కాగితం మీద సులువుగానే కనిపించినా, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి:
డెల్టా నేలలు ఎక్కువగా నల్లరేగడి నేలలు మరియు బంకమన్నునేలలు. ఈ ప్రత్యేక స్వభావం వలన భూమి నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటుంది. వరిపొలాలలో నీరు నిల్వ వుండటంకోసం, పొలాలను గట్టులతో మడిగా ఏర్పాటు చేస్తారు., మడి లోనుండి మురుగు నీరు బయటకు మురుగు కాలువ లోనికి పంపటానికి వీలుగా ఏర్పాటు జరుగుతుంది.
డ్రెయినేజ్ (మురుగు నీటి పారుదల) వ్యవస్ధ నిర్వహణ లోపం కారణంగా, కాలక్రమేణా కాలువలు, డ్రెయిన్లు పూడిపోవడం వల్ల సరైన నీటి పారుదల వ్యవస్థ లేదు. చిన్న వర్షం పడినా లేదా చిన్నపాటి తుఫాను వచ్చినా మాగాణి పొలాల్లో నీరు నిలిచిపోతుంది.
ప్రభుత్వం సూచించినట్లుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయటంవలన నష్టం అపారంగా వుంటుంది. మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము వంటి ఆరుతడి పంటలు వేసినప్పుడు పొలంలో నీరు నిలిస్తే, వేరు కుళ్ళు తెగులు వచ్చి పంట క్షణాల్లో నాశనమవుతుంది. అందుకే రైతులు నీటిని తట్టుకునే వరి పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.
2. ప్రభుత్వాల వద్ద ఉన్న అవకాశాలు & నీటి మేనేజ్మెంట్
ఎల్ నీనో ప్రభావం వలన తీవ్రమయిన వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల అసలు వర్షాలు పడవు. మరి కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. క్రిష్ణానది పరీవాహక ప్రాంతం చాలా పెద్దది. పరీవాహక ప్రాంతంలో కురుసిన వర్షపు నీటిని సద్వినియోగ పరచటంలోనే నిపుణుల యొక్క నైపుణ్యం, పరిపాలకుల సామర్ధ్యం ఇమిడి వుంటుది.
ఎగువన వర్షాలు లేకపోయినా, డెల్టాను ఆదుకోవడానికి అందుబాటులో ఉన్న ఇతర వనరులను సమర్థవంతంగా నిర్వహించాలనేది రైతుల ప్రధాన డిమాండ్:
పులిచింతల ప్రాజెక్టులో లో 45 టీ యమ్ సీ ల నీటిని నిల్వచేయవచ్చని ప్రభుత్వం చెప్తున్నది. పులిచింతల నిర్మాణం చేసేది, కృష్ణా డెల్టాలోని పంటల రక్షణ కోసమన్నారు. అదే ఉద్దేశ్యంతో కృష్ణా డెల్టాలోని ప్రజలు, రైతు నాయకులు పులిచింతల కోసం పోరాడి సాధించుకున్నారు. ప్రతికూల పరిస్ధితులలో, పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకుయోగిస్తామని పులిచింతల నిర్మాణం సమయంలో ప్రభుత్వాధినేతలు శెలవిచ్చారు. ఇపుడు మాటమార్చి, తాగునీటికోసం పులిచింతల అంటున్నారు. గతంలో లాగానే, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువులు నింపాలి. మొట్టమొదట కట్టిన ప్రాజెక్టులకు వున్న (RIPARIAN RIGHTS ని ఉపయోగించుకోవాలి. ఫైనుండి ప్రవహించినపుడు, నదీ తీర వాసులకు నీటిని వాడుకోవటానికి వున్న హక్కును ఉపయోగించుకోవాలి. పూర్తి నీటి సామర్ధ్యం వరకు పులిచింతలలో నీటిని నింపి, అవసరమయినపుడు క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు ఉపయోగించుకోవాలి.అవసరమైతే వారబందీ పధతి ద్వారా లేక రేషన్ పధతి ద్వారా నీటిని అందించవచ్చు.
గోదావరి నీటి సమర్థవంతంగా వినియోగించాలి. పట్టిసీమ ద్వారా గోదావరి నదిలో వరద నీరు ఉధృతంగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు నీటిని మళ్ళించి ప్రకాశం బ్యారేజీ ఆయకట్టును స్థిరీకరించవచ్చు.
ఎగువ ప్రవాహాల సమన్వయం (Inflow Forecasting): మహారాష్ట్ర, కర్ణాటక (ఆల్మట్టి, నారాయణపూర్) ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీటిని అంచనా వేసి, సాగర్ నుండి నీటి పంపిణీని ముందే ప్రణాళికాబద్ధంగా (Water Budgeting) నిర్వహించాలి.
మౌలిక వసతుల పునరుద్ధరణ: ఇప్పటికిప్పుడు డ్రెయినేజ్ వ్యవస్థ మొత్తాన్ని ఆధునీకరించడం కష్టమే అయినా, ప్రధాన కాలువల్లో పూడికతీత, అడ్డంకుల తొలగింపు తక్షణమే చేపట్టడం ద్వారా మురుగు నీటి ముప్పును తగ్గించవచ్చు.
3). క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక మార్గాలు (మధ్యంతర పరిష్కారాలు)
ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోవడానికి మరియు రైతులు పూర్తిగా నష్టపోకుండా ఉండటానికి సాంకేతిక, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలు:
1. వరి నేరుగా విత్తుట (Direct Seeded Rice – DSR):
నారు పోసి, నీరు నిలబెట్టే సాంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పి, డ్రమ్ సీడర్ లేదా గొర్రుతో నేరుగా విత్తుకోవడం.
దీనివల్ల 30% వరకు నీరు, పెట్టుబడి వ్యయం ఆదా అవుతాయి.
2. స్వల్పకాలిక రకాల ఎంపిక:
110-120 రోజుల్లో చేతికి వచ్చే తక్కువ నీటితో పండే వరి రకాలను సాగు చేయడం.
3. ఆరుతడి పంటలకు ఎత్తైన మడులు (Raised Bed Cultivation):
మురుగు నీటి సౌకర్యం సరిగా లేని మాగాణుల్లో ఆరుతడి పంటలు వేయాల్సి వస్తే, బోదెలు (Raised Beds) చేసి పంటలు వేయడం ద్వారా నీరు నిలవకుండా కాపాడుకోవచ్చు.
4. సబ్సిడీ విత్తనాలు:& భీమా (Crop Insurance) అంశం
రిస్క్ అనే ఆలోచన ఉన్నప్పటికీ, నీటి లభ్యత పై అనిశ్చితి స్ధితి కొనసాగుతున్నా వరి నారును సిధం చేస్తున్న రైతులను అభినందించాలి. ప్రోత్సహించాలి.అవసరమయిన అన్ని సహాయాలూ ప్రభుత్వం అందించాలి. . భారీ రిస్క్ తీసుకుని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రీమియం కట్టి భీమా సౌకర్యాన్ని కలిగించాలి.. రైతులకు ఆర్థికంగా ఆ మాత్రం సహాయాన్ని ప్రభుత్వం చేయాలి. రైతు సేవా కేంద్రాల (RSK) ద్వారా డెల్టా భూములకు తగిన ఉచిత/సబ్సిడీ ప్రత్యామ్నాయ విత్తనాలను, సాంకేతిక సలహాలను ఉచితంగా అందించాలి.
5. దీర్ఘకాల ప్రణాలిక గా, వరద నీటిని నిల్వ చేసుకునే ప్రయత్నాలను ముమ్మరంచేయాలి.అవనిగడ్డ ప్రాంతంలో రెండు చెక్ డామ్ లు కట్టటం ద్వారా 6.75 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయటానికి అనుమతులు , ప్రణాళికలు సిధంగావున్నా ఆచణకు నోచుకోలేదు. పాలేరు, మున్నేరు పై రిజర్వాయర్ ల ద్వారా 5 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయవచ్చని నిపుణులు సూచించినా ఆచరించలేదు.
ముగింపు
పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు వినియోగించాలి. మురుగు నీటి పారుదల వ్యవస్థ లోపాలు ఉన్నాయని తెలిసి పంట వద్దనడం కంటే,తక్షణ కాలువల పూడికతీత, మరియు తక్కువ నీటితో పండే నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించడమే సరైన పరిష్కారం. గోదావరి–కృష్ణా జలాలను సరైన వాటర్ మేనేజ్ మెంట్ చేసి,సమన్వయంచేసి నీటిని రైతులకు అందించాలి. కృష్ణా డెల్టా రైతుకు సాగునీరు అనేది కేవలం వరి పంట వేయాలా వద్దా అనే ప్రశ్న మాత్రమే కాదు, అది వారి జీవనాధారం. ఆంధ్ర ప్రజల ఆర్ధిక ప్రగతికి మూలాధారం. ప్రభుత్వం, రైతాంగం, రైతుసంఘాలు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే డెల్టాలో ఈ నీటి సంక్షోభాన్ని అధిగమించవచ్చు.
