ట్రంప్‌తో మరిన్ని కౌగిలింతల కోసం మోడీ తహతహలాడుతున్నారా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?

కరోనా వైరస్‌ కట్టడికి చైనా కమ్యూనిస్టులు చేసిందేమిటి !

Tags

, ,



ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించిందనో, దాని ప్రయోగాల్లో పొరపాటున బయటకు వచ్చిందనో రకరకాలుగా ఏదో విధంగా బాధ్యతను అంట కట్టి దోషిగా నిలిపేందుకు ఇప్పటికీ అమెరికా వంటి దేశాలూ, వాటి కనుసన్నలలో నడిచే మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. మన దేశంతో సహా అనేక చోట్ల కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తమ ప్రభుత్వం కరోనా నిరోధానికి కఠినంగా వ్యవహరించినట్లు కొందరు తొలి రోజుల్లో భావించినా అమెరికా, ఐరోపా దేశాలు, బ్రెజిల్‌ తదితర దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలను చూసి తమ ప్రభుత్వం చేసింది సరైనదే అని పార్టీ, ప్రభుత్వం పట్ల మరింతగా చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివారించిన చైనా అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోతే నష్టం ఆయా దేశాల జనాలకే. మహమ్మారులు ప్రబలిన సమయంలో సుభాషితాలు చెప్పటం, చప్పట్లు కొట్టించటం, దీపాలు ఆర్పటం-హారతులు వెలిగించట కాదని, తమ సభ్యులను కదన రంగంలోకి దింపటం ముఖ్యమని చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కరోనాను ఎలా కట్టడి చేసిందీ వివరిస్తూ చైనా సమాచారశాఖ ఈనెల ఏడవ తేదీన ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. అరవై అయిదు పేజీలు ఆ పత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(పూర్తి పాఠం చదవాలని ఆసక్తి కనపరిచే వారి సౌకర్యం కోసం దాని లింక్‌ను చివరిలో చూడవచ్చు)
1949లో చైనా ప్రజారిపబ్లిక్‌ను స్ధాపించిన తరువాత కోవిడ్‌19 ఒక పెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్దితిగా ముందుకు వచ్చింది. మరొకటేదీ ఇంత వేగంగా వ్యాపించలేదు, నిరోధించటం ఎంతో కష్టం అని రుజువు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం దీనికి అగ్రశ్రేణి ప్రాధాన్యత ఇచ్చాయి.అది చైనీయుల విశ్వాసాన్ని పదిలపరచింది.బాధాకరమైన ప్రయత్నాలు, ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చినా చైనా తన పౌరులను రక్షించుకుంది. ఏ తేదీన ఏమి జరిగిందీ అని చైనా చెబుతున్నప్పటికీ అనేక మంది ఆ సమాచారాన్ని అనుమానంతో చూస్తున్నారు. మరి కొందరు చూస్తూనే ఉంటారు. గతంలో తాము సాధించిన అభివృద్ది గురించి చైనా ప్రకటిస్తే అదంతా అంకెల గారడీ అని చెప్పిన వారున్నారు. ఇప్పటికీ నమ్మని వారి సంగతి సరే సరి. తీరా నమ్మక తప్పని పరిస్ధితి వచ్చినపుడు ఆ అక్కడ కమ్యూనిస్టు నియంతృత్వం కనుక సాధ్యమైంది, మనది ప్రజాస్వామ్యం అని వైఫల్యాన్ని సమర్దించుకుంటున్నారు. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. వైరస్‌ కట్టడికి అక్కడి కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ఏ చర్యలను ఎలా అమలు జరిపిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోని కారణంగా అనేక దేశాల పాలకులు తమ పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఇప్పటికీ నేర్చుకొనేందుకు ముందుకు రావటం లేదు. అభివృద్ధి వైఫల్యాన్ని ప్రజాస్వామ్య ముసుగులో దాచి పెడుతున్న మేథావులమని చెప్పుకొనే వారు ప్రాణాలను బలి పెట్టకుండా మీరు చెప్పే నియంతృత్వ చైనాలో ఎలా కట్టడి చేశారో కనీసం తెలుసుకొనేందుకు పూనుకుంటారా ? మేథావులు అనేక మంది ప్రతిసారీ బస్సు మిస్సవుతున్నారు కనుక వారిని వదలి వేద్దాం. సామాన్యుల కోసం చైనా ప్రభుత్వం వెల్లడించిన శ్వేతపత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(స్ధలాభావం రీత్యా ఏ రోజు ఏమి జరిగిందీ అనే సమాచారాన్ని ఇవ్వటం లేదు. ఎలా అరికట్టారనే భాగానికే ఇది పరిమితం)
వైరస్‌ తొలుత బయటపడిన ఊహాన్‌ నగరంలోని 4.21 మిలియన్ల కుటుంబాలలో ఏ ఒక్కదానిని, కుటుంబంలో ఏ ఒక్కరినీ వదల కుండా వైరస్‌ పరీక్షలు చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష వ్యవధిని రెండు రోజుల నుంచి 4-6 గంటలకు తగ్గించారు. తొలి రోజుల్లో రోజుకు 300 పరీక్షలు చేస్తే ఏప్రిల్‌ మధ్యనాటికి 50వేలకు చేరింది. నివాసులందరూ ప్రతి రోజూ ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందో అధికారులకు తెలియచేయాలని కోరారు. మరోవైపున సామాజిక కార్యకర్తలు ఆ సమాచారాన్ని నిర్ధారించుకొనేందుకు ఇంటింటికీ తిరిగారు. జ్వరాల ఆసుపత్రులలో పరీక్షలు చేసిన సమాచారాన్ని రెండు గంటల్లోగా ఉన్నతాధికారులకు చేరవేయాలని కోరారు. పరీక్షా ఫలితాలను పన్నెండు గంటలలో వెల్లడించారు. ఇరవైనాలుగు గంటలలో నిర్ధారిత పరీక్షలను పూర్తి చేసి రోగులను గుర్తించి ఆసుపత్రులకు తరలించారు.
ఉహాన్‌ నుంచి వచ్చిపోయే అన్ని రకాల దారులను పూర్తిగా మూసివేశారు.హువెరు రాష్ట్రం, వెలుపల ఉన్న ప్రాంతాలలో కేసుల తీవ్రతను బట్టి ఆంక్షలను అమలు జరిపారు. వైద్యపరమైన అత్యవసరాలకు మినహా గృహస్తులు ఇతర అవసరాలకు బయటకు రాకుండా కట్టడి చేశారు. సామాజిక కార్యకర్తలు వారికి అవసరమైన రోజు వారీ అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేశారు. పరిమిత రాకపోకలను అనుమతించిన ఇతర ప్రాంతాలలో రాక-పోక సమయాల్లో శరీర ఉష్ణ్రోగ్రతలను విధిగా నమోదు చేశారు. దేశవ్యాపితంగా నిరోధ చర్యల్లో భాగంగా వీటితో పాటు ఇతర చర్యలను అమలు జరిపారు, అందుకు అవసరమైన వైద్య, ఇతర సదుపాయాలను అత్యవసర ప్రాతిపదికన మెరుగుపరిచారు.
దేశవ్యాపితంగా పదివేల ఆసుపత్రులను కోవిడ్‌-19 చికిత్సకు ప్రత్యేకించి అవసరమైన వసతులు కల్పించారు.ఆన్‌లైన్‌ ద్వారా అవసరమైన సాంకేతిక మద్దతు అందించారు. ప్రధాన కేంద్రమైన ఉహాన్‌లో 80శాతం కేసులు తీవ్రమైనవి కాదు. అయినా ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తగా పద్నాలుగువేల పడకలతో స్టేడియాలు, ప్రదర్శన కేంద్రాలలో 16 తాత్కాలిక చికిత్స ఏర్పాట్లు చేశారు. నివారణలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఆరోగ్యవ్యవస్ధ మీద వత్తిడిని తగ్గించటంలో ఇవి కీలక పాత్ర పోషించినట్లు బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌ పేర్కొన్నది. రోగ నిర్ధారణ, చికిత్సలో సంప్రదాయ చైనా వైద్య పద్దతులు, ఔషధాలను, ఆధునిక వైద్య పద్దతులు, ఔషధాలను రెండింటినీ వినియోగించారు. కొన్ని సంప్రదాయ చైనా వైద్య ఆసుపత్రులలో పూర్తిగా రోగులకు చికిత్స చేశారు, దానితో పాటు ప్రతి ఆసుపత్రిలోనూ ఆ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. తీవ్రత తక్కువ ఉన్న కేసులను ఈ ఆసుపత్రులలో చికిత్స చేసి తీవ్రమైన వారిని ఆధునిక వైద్య ఆసుపత్రులకు పంపారు. ఇందుకోసం ఈ రంగ వైద్య నిపుణులతో ఒక జాతీయ సమన్వయ సంస్ధను ఏర్పాటు చేశారు. తొంభై రెండుశాతం నిర్ధారిత కరోనా కేసులలో చైనా మూలికా ఔషధాలను వినియోగించారు. హుబెరు రాష్ట్రంలో చికిత్స పొందిన 90శాతం కేసులలో అవి సమర్దవంతంగా పని చేసినట్లు తేలింది.
కేంద్ర, రాష్ట్ర, స్ధానిక ప్రభుత్వాలన్నీ కలసి మే31 నాటికి 162.4 బిలియన్‌ యువాన్లు మహమ్మారి నివారణ, చికిత్సకు కేటాయించారు. బీమా కంపెనీలు పరిష్కరించిన యాభై ఎనిమిది వేల మంది ఆసుపత్రి చికిత్స బిల్లులను విశ్లేషించినపుడు సగటున ఒక్కొక్కరికి 23వేల యువాన్లు కాగా, తీవ్ర పరిస్ధితికి చేరిన వారికి లక్షా 50వేలు దాటింది. ఒక యువాను మన కరెన్సీలో పది రూపాయలకు పైగా విలువ కలిగి ఉంది. కొన్ని సంక్లిష్ట కేసులలో పది లక్షల యువాన్ల వరకు ఖర్చయింది. వ్యక్తులకు అయిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించింది.
మే 31వ తేదీనాటికి చైనా కేంద్ర సమాచార మండలి 161 పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసింది. పద్నాలుగు వందల ప్రశ్నలకు 50శాఖల అధికారులు సమాధానాలు చెప్పారు. ఇవిగాక హుబెరు రాష్ట్రంలో 103 పత్రికా గోష్టులు ఏర్పాటు చేయగా ఇతర చోట్ల మరో 1050 నిర్వహించారు.మరోవైపు వాక్సిన్‌తో సహా కరోనా వైరస్‌కు సంబంధించి వివిధ అంశాలపై పరిశోధన మరియు అభివృద్దికి గాను కొత్తగా 83 కార్యక్రమాలను ప్రారంభించారు.
పౌరుల ప్రాణాలు, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆర్ధికంగా ఖర్చు గురించి ఆలోచించకుండా అనేక కఠిన చర్యలు తీసుకున్నది.” భారీ సామాజిక, ఆర్ధిక నష్టంతో చైనా విజయం వచ్చింది.ఆరోగ్యం మరియు ఆర్ధిక రక్షణ మధ్య ఉండాల్సిన సమతూకాన్ని సాధించేందుకు చైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది” అని లాన్‌సెట్‌ సంపాదకీయం పేర్కొన్నది. ఒకటిన్నర రోజు పసి గుడ్డు నుంచి వంద సంవత్సరాల పండు ముదుసలి వరకు ఖర్చు ఎంతైనా సరే ప్రాణాలను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.చికిత్సకు, మరణాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు దేశంలోని నిపుణులైన వైద్యులు, సిబ్బందిని తరలించింది. ఊహాన్‌లో తీవ్ర స్ధితిలో ఉన్న 9,600 రోగులకు చికిత్స అందించారు.
బతికేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుకు వెనుకాడకుండా వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. మే 31 నాటికి ఏడుగురు శతాధిక వృద్దులతో సహా 80 ఏండ్లు దాటిన మూడువేల మంది ప్రాణాలను రక్షించారు. వారిలో డెబ్బయి ఏండ్ల రోగి ఒకరికి పది మంది సిబ్బంది అనేక వారాల పాటు చికిత్సలో పాల్గొన్నారు. అందుకు పదిహేను లక్షల యువాన్లు ఖర్చు కాగా మొత్తం ప్రభుత్వమే భరించింది. వివిధ దేశాలలోని ప్రవాస చైనా విద్యార్ధులకు పదిలక్షల ఆరోగ్య కిట్లను చైనా పంపింది.
జనవరి 24 నుంచి మార్చి 8వ తేదీ వరకు హుబెరు రాష్ట్రంలోని ఊహాన్‌, మరో 16 పట్టణాలకు ఇతర ప్రాంతాలకు దేశమంతటి నుంచీ అన్ని రకాల వైద్య వనరులను సమీకరించారు, 346 జాతీయ వైద్య బృందాలలో 42,600 సిబ్బంది ఉన్నారు. వీరుగాక 900 మంది ప్రజారోగ్య నిపుణులు ఉన్నారు. చైనా ప్రజావిముక్త సైన్యం(పిఎల్‌ఏ) నుంచి నాలుగువేల మంది వైద్య సిబ్బందిని సమీకరించారు. ఆదేశాలిచ్చిన రెండు గంటల్లోనే బృందాలను ఏర్పాటు చేయటం, 24గంటల్లోగా నిర్దేశిత కేంద్రాలకు చేరటం ఏడు రోజులకు సరిపడా రక్షణ సామాగ్రితో వచ్చిన వెంటనే చికిత్స అందించటం ఆ బృందాల ప్రత్యేకత.
నలభైవేల మంది నిర్మాణ కార్మికులను రప్పించి వేయిపడకల ఆసుపత్రిని అన్ని రకాల పరికరాలతో పది రోజుల్లో, మరో 1600 పడకల ఆసుపత్రిని పన్నెండు రోజుల్లో నిర్మించారు.మరో 14వేల పడకల తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు.పది రాష్ట్రాల నుంచి 45వేల ఎర్ర రక్తకణ యూనిట్లు, 1762 ప్లేట్‌లెట్స్‌ డోస్‌లు, 1370 లీటర్ల గడ్డకట్టించిన ప్లాస్మాను సిద్ధం చేశారు. ఏ రకమైన వైద్య పరికరాలు, ముఖతొడుగులు,ఔషధాలకు కొరత రాకుండా ఉత్పత్తికి ఏర్పాటు చేశారు. చికిత్సా సమయంలో 17రకాల, వాక్సిన్లు, ఔషధాలను(క్లినికల్‌ ట్రయల్స్‌, వినియోగం) వినియోగించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దేశవ్యాపితంగా నిరాటంకంగా ఎక్కడకు అవసరమైతే అక్కడకు తరలించే సమన్వయ వ్యవస్ధలను ఏర్పాటు చేశారు.
ఉహాన్‌ నగరంలో కోటి మంది, ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లో ఉన్న జనాలకు అవసరమైన ధాన్యం, కూరగాయలు, నూనెలు, పాలు, గుడ్లు, మాంసం తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 500 సంస్దలతో సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
చైనా ప్రధాన భూభాగంలోనూ, తైవాన్‌, హాంకాంగ్‌, మకావు ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్న చైనీయులు పెద్ద ఎత్తున స్పందించి 38.93 బిలియన్‌ యువాన్లు, 990 మిలియన్ల వస్తువులను విరాళంగా అందచేశారు. లాక్‌డౌన్‌తో పాటే చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తల మీద భారాలు తగ్గించటం, ప్రభుత్వ సబ్సిడీల పెంపు, ఉపాధి స్ధిరీకరణ, ప్రభుత్వ సేవల మెరుగుదల వంటి అనేక చర్యలను తీసుకుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత తమ పని స్ధలాలకు చేరేందుకు వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లు, విమానాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఏడాదికి రెండు కోట్ల యువాన్ల ఆదాయం వచ్చే కంపెనీలలో 99శాతం పనిలోకి వచ్చాయి. తీవ్రంగా ప్రభావితమైను హుబెరు రాష్ట్రంలో కూడా 98.2శాతం సంస్ధలు తిరిగి పని చేస్తుండగా 92.1శాతం కార్మికులు విధుల్లో చేరారు. ప్రజా రవాణా పూర్తిగా పునరుద్దరణ అయింది. యావత్‌ ప్రజాజీవనం సాధారణ స్ధాయికి చేరుకుంది.
హుబెరు రాష్ట్రంలోని 5,40,000 ఆరోగ్య కార్యకర్తలు, బయటి నుంచి వచ్చిన నలభైవేల మంది పౌర, మిలిటరీ వైద్య సిబ్బంది, మిలియన్ల కొలది ఆరోగ్య సిబ్బంది కరోనాను అడ్డుకొనేందుకు మరో గ్రేట్‌ వాల్‌ నిర్మించారు. పుట్టుకతో ఎవరూ వీరులు కాదు. ఈ పోరులో రెండువేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది, అనేక మంది మరణించారు. కరోనా పోరులో సామాన్య జనాన్ని సిద్దం చేసేందుకు, వారిని ఆదుకొనేందుకు 6,50,000 పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు, రోగులను గుర్తించేందుకు, పౌరుల రోజువారీ సమస్యల పరిష్కారానికి 40లక్షల మంది సామాజిక కార్యకర్తలు పని చేశారు. పద్దెనిమిది లక్షల మంది పారిశుధ్యకార్మికులు బహిరంగ స్ధలాలు, ముఖ్యమైన ప్రాంతాలను శుభ్రం చేయటంలోనూ, వైద్య, ఇతర చెత్తను సేకరించటంలోనూ పాలొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో 130 మంది మరణించారు. వలంటీర్లుగా నమోదు చేసుకున్న 88లక్షల మంది 4,60,00 కార్యక్రమాల్లో 29కోట్ల గంటల పాటు సేవలు అందించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీలో 46లక్షలకు పైగా ప్రాధమిక శాఖలు ఉన్నాయి.మహమ్మారిని ఎదుర్కోవటం,జనాన్ని సమీకరించటం, వారికి సేవ చేయటంలోనూ అవి గట్టిగా పని చేశాయి. మూడు కోట్ల 90లక్షల మంది పార్టీ సభ్యులు అగ్రగామి దళంగా ఉన్నారు. కోటీ 30లక్షల మంది వలంటీర్లుగా సేవలందించారు. సేవారంగంలో ముందున్న వారిని ఉన్నత స్ధానాల్లోకి ప్రమోట్‌ చేశారు,బాధ్యతా రహితంగా ఉన్నవారిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఉత్పాతాల నుంచి కాపాడటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అత్యంత విశ్వసనీయంగా ఉంటుందని లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత సాధారణ జనం ఎంతగానో గ్రహించారు, రాజకీయ వ్య వస్ధ మీద తమ విశ్వాసాన్ని ప్రకటించారు. 170దేశాల నేతలు, 50 ప్రపంచ, ప్రాంతీయ సంస్దల అధిపతులు, 300 విదేశీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చైనాకు బాసటగా నిలిచాయి. డెబ్బరు ఏడు దేశాలు, పన్నెండు అంతర్జాతీయ సంస్ధలు అత్యవసర విరాళాలు అందచేశాయి.84దేశాల నుంచి వివిధ సంస్ధలు సాయాన్ని పంపాయి. బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు, ఏఐఐబి ఏడు,2.48బిలియన్‌ యువాన్ల చొప్పున అత్యవసర రుణాలు అందచేశాయి. నూటపది దేశాలకు చెందిన 240 పార్టీలతో కలసి చైనా కమ్యూనిస్టు పార్టీ సంయుక్త విజ్ఞాపనలు చేసింది. యాభై మంది నేతలు, అంతర్జాతీయ సంస్ధల అధిపతులతో దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ స్వయంగా మాట్లాడి చైనా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
శ్వేత పత్రంలోని ముఖ్యాంశాలను పైన చూశాము. గత నెలలో అమెరికా వ్యాపింప చేసిన 24 అబద్దాలను తిప్పి కొడుతూ చైనా ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు కరోనాను ఎదుర్కొన్న తీరు తెన్నులను వివరిస్తూ శ్వేత పత్రాన్ని ప్రకటించింది. ఇంతవరకు ఏ దేశమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. తాము తీసుకున్న చర్యలను అధికారికంగా విడుదల చేసి జనం ముందుంచటం కనీస బాధ్యత. వాటి మంచి చెడ్డలను జనం స్వయంగా తెలుసుకుంటారు. ప్రపంచంలో గతంలో అనేక మహమ్మారులు వచ్చాయి. అవి ముందుగా బయటపడిన దేశాలను అందుకు బాధ్యులుగా చేసి రచ్చ చేసిన ఉదంతం ఇదొక్కటే అని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ దెబ్బలను ఎదుర్కొన్న ఒక బాధిత దేశంగా ఉన్న చైనా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తానేమిటో, తన రాజకీయ వ్యవస్ధ ఔన్నత్యం ఏమిటో నిరూపించుకుంది. సాధారణ కార్యకలాపాలతో తిరిగి ముందుకు పోతున్నది.చైనా తీసుకున్న చర్యలను కూడా ఎవరైనా సహేతుకంగా విమర్శించవచ్చు, లోపాలను ఎత్తిచూపవచ్చు. ఇదే సమయంలో ఏ దేశం, ఏ పాలకులు బాధ్యతా రహితంగా వ్యవహరించి తమ పౌరుల ప్రాణాల మీదకు తెచ్చారో తెలుసుకోవటం పౌరుల హక్కులలో ఒకటి. అందుకే మిగిలిన దేశాలు కూడా తామేమి చేసిందీ ప్రపంచ జన కోర్టుకు చెప్పాలి. చైనాతో పోటీ పడుతున్నామని చెప్పుకుంటున్న, చైనా తరువాత జనాభా రీత్యా రెండవ స్ధానంలో ఉన్న మన పాలకుల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉందంటే ఏకీభవిస్తారా !
https://news.cgtn.com/news/2020-06-07/Full-Text-Fighting-COVID-19-China-in-Action-R7xr2aKsyA/index.html

కేరళ ఏనుగు మృతిపై బిజెపి పీనుగు రాజకీయాలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీ. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్రనుంచి యువతరం ఆదర్శంగా తీసుకోవాల్సిందేముందన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు పెద్ద అబద్దాల కోరుగా తయారయ్యారు. కేరళలో మరణించిన ఒక ఏనుగు ఉదంతంలో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తాను ఇంకా రాజకీయంగా జీవించే ఉన్నా అన్నట్లుగా మీడియాలో మరోసారి వెలుగులోకి వచ్చారు.ఆమె చేసిన వ్యాఖ్యల గురించి బిజెపి స్పందించలేదు గనుక వాటిని ఆమోదించినట్లే భావించాలి. దేశంలో అనేకం జరుగుతున్నా మిన్నువిరిగి మీద పడ్డా చలించని అనేక మంది ప్రముఖులు ఏనుగు విషయంలో అపూర్వ స్పందన కనపరిచారు. వారిని ఆ మేరకు అభినందించాల్సిందే. అసలు స్పందించని వారికంటే వీరు మేలు, మనుషుల విషయంలో మాకేం పట్టదన్నట్లు మౌనంగా ఉన్నా బోలెడంత జంతు ప్రేమ ఉందని లోకానికి తెలిపారు. అలాంటి వారి చర్మాలు ఎప్పుడైనా పలుచనై మనుషుల మీద కూడా జాలి చూపే అవకాశం ఉంటుందని ఆశిద్దాం.
ఏనుగు దారుణంగా మరణించిందనే దాని కంటే అది కడుపుతో ఉందన్న వార్తకు జనంలో స్పందన ఎక్కువగా వచ్చినట్లు అనిపించింది. మీడియా కూడా దాన్నే ఎక్కువగా చూపింది. దేనికి రేటింగ్‌ ఎక్కువగా ఉంటే అదే ముఖ్యం కదా మరి ! ఈ వార్త, స్పందన చూడగానే వెంటనే గుజరాత్‌ బాబు బజరంగీ గుర్తుకు వచ్చాడు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకొనేందుకు అటవీ సమీప ప్రాంత రైతులు తీసుకొనే అనేక చర్యల గురించి మనకు తెలిసిందే. వాటికోసం, పొలాల చుట్టూ విద్యుత్‌ తీగలను అమర్చటం, పేలుడు పదార్ధాలను వినియోగించటం సర్వసాధారణం. కేరళలో కూడా అలా అమర్చిన ఒక పైనాపిల్‌ను అడవి పందులకు బదులు తిన్న ఏనుగు వాటిలో అమర్చిన టపాసులు పేలి గాయపడి మరణించి ఉండవచ్చన్నది ఒక కథనం. జంతు ప్రేమికులు పందుల మీద ఒక ప్రేమ ఏనుగుల మీద మరొక ప్రేమ ప్రదర్శిస్తారని ఇప్పుడు అర్ధమైంది. ఇక బాబు బజరంగీ అనే మానవ రూపంలో ఉన్న ఒక కాషాయ జీవి గుజరాత్‌ మారణకాండ సమయంలో ఇతర కాషాయ తాలిబాన్లతో కలసి దాడుల్లో పాల్గొన్నాడు. సామూహిక హత్యలు, దహనకాండకు పాల్పడిన నర రూప రాక్షసుల్లో ఒకడు. కౌసర్‌ బాను అనే ఒక గర్భిణీ అతగాడి కంటపడింది. ఇంకేముంది చేతిలోని బాకుతో ఆమె పొట్టను చీల్చి కడుపులోని పిండాన్ని దానితో పైకి లేపి వికటాట్టహాసం చేసి ఉంటాడు. కేరళ ఏనుగు ఎంతబాధ పడి మరణించిందో ఊహించుకొని స్పందించిన వారి మాదిరే బజరంగీ కూడా చేసి ఉండాలి, లేకపోతే అలాంటి వారికి కిక్కు ఉండదు. తరువాత తామెలా చంపిందీ హవభావాలతో ఒక మీడియా సంస్ధకు వివరించాడు కూడా !
పంటలను కాపాడుకొనేందుకు పేలుడు పదార్ధాలను పెడితే ఆ పేలుడు శబ్దాలకు లేదా పేలుడుతో గాయపడి జంతువులు పంటల జోలికి రాకుండా పారిపోతాయని రైతులు భావిస్తారు. మరి బజరంగీ ఎవరిని రక్షించటానికి ఒక గర్భిణీపై అంతదుర్మార్గంగా వ్యవహరించాడు ? కేరళ ఏనుగు మరణానికి పరోక్ష కారకులుగా భావిస్తున్నవారందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని మేనకా గాంధీ డిమాండ్‌ చేశారు. ఒక ఉదంతం జరిగినపుడు ఎవరైనా, దేన్నయినా డిమాండ్‌ చేసే హక్కు కలిగి ఉంటారు, మేనకా గాంధీ అందుకు మినహాయింపు కాదు. ఒక స్త్రీగా, తల్లిగా గర్భ సమయంలో ఎలా ఉంటుందో ఆమెకు చెప్పనవసరం లేదు. మరి కౌసర్‌బీని అత్యంత అమానుషంగా హత్య చేసిన ఉదంతంపై ఆమె స్పందన ఏమిటి ? దాన్ని ఖండించినట్లు, ఏవైనా డిమాండ్లు చేసినట్లు ఆధారాలుంటే ఏవరైనా తెలియచేయాలని మనవి. ఎందరినో అన్యాయంగా పొట్టన పెట్టుకున్న దారుణాలకు నైతిక బాధ్యత వహించి ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్రమోడీతో సహా ఎవరూ రాజీనామా కాదు కాదు కనీసం అయ్యోపాపం అని కూడా అనలేదు. గట్టిగా చెప్పే ధైర్యం లేక లేదా చిత్తశుద్ధి లేక గానీ నాడు ప్రధానిగా ఉన్న వాజ్‌పారు కేవలం రాజధర్మాన్ని పాటించమని మాత్రమే నరేంద్రమోడీకి చెప్పారు. ఈ రోజు గర్భంతో ఉన్న ఏనుగు మృతికి స్పందించిన వారు అప్పుడు తామెలా స్పందించిందీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా ?
కౌసర్‌బాను కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి జ్యోత్సా యాగ్నిక్‌ తన తీర్పులో గర్భిణి మీద బజరంగీదాడి చేశాడు గానీ ఆమె కడుపులోని పిండాన్ని కత్తితో బయటకు తీసి ఉండడు, ముస్లింల మీద ద్వేషంతో దాడి చేశాడు తప్ప పుట్టబోయే బిడ్డను అడ్డుకొనేందుకు కాదు అని చెప్పారు. తన సోదరి కడుపును బజరంగీ చీల్చాడని 14ఏండ్ల ఆమె సోదరుడు చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అలాంటి పని శిక్షణ పొందిన వైద్యులు లేదా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరని బజరంగీ అలా చేశాడని తాను నమ్మటం లేదని, కత్తితో పొడిచినపుడు బయటకు వచ్చిన రక్త మాంసాలను చూసి పిండం బయటకు వచ్చిందని అనుకొని ఉండవచ్చని, బజరంగీకి ఆ ఉద్దేశం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కౌసర్‌బీ మీద దాడి తరువాత ఆమెను అక్కడే సజీవదహనం చేశారు కనుక పోస్టు మార్టం చేసే అవకాశం లేకుండా పోయింది. తెహల్కా రహస్య శోధనలో ఆ ఉదంతం గురించి బజరంగీ పూసగుచ్చినట్లు చెప్పాడు. ఈ దారుణం గురించి మేనకా గాంధీ లేదా ఏనుగు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసినట్లు నాకు ఎక్కడా సమాచారం దొరకలేదు.
ఇక కేరళ ఏనుగు ఉదంతం జరిగింది పాలక్కాడ్‌ జిల్లాలో అని తెలిసిన తరువాత కూడా మలప్పురం జిల్లా, అక్కడి పౌరుల గురించి చేసిన దుర్మార్గ పూరితమైన వ్యాఖ్యల పట్ల కనీసం విచారం కూడా మేనకా గాంధీ నుంచి ఇంతవరకు వెలువడలేదు. ఆమె మీద ఒక కేసు దాఖలైనట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె తన వ్యాఖ్యలను ఎలా సమర్దించుకుంటారో చూద్దాం. ఈ ఉదంతంలో బిజెపి మత రాజకీయాలకు ఎలా పాల్పడిందో విజ్ఞులైన వారు గ్రహిస్తారని అనుకుంటున్నాను. మలప్పురం దేశంలో అత్యంత హింసాత్మక,హీనమైన జిల్లా అని ఎఎన్‌ఐ అనే వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేనకా గాంధీ వర్ణించారు. అక్కడ మెజారిటీ పౌరులు ముస్లింలు కావటం, ఆమెలో వారి పట్ల ఉన్న విపరీత ద్వేషం తప్ప అంతటి సీనియర్‌ నేత వాస్తవాల ప్రాతిపదికన అలాంటి బాధ్యతా రహిత వ్యాఖ్య చేయలేదు.అత్యంత కల్లోల జిల్లాలో అదొకటని రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, అక్కడ జరిగేవాటి మీద చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం భయపడుతుందని, అత్యంత బలహీనమైన అధికారులను అక్కడ నియమిస్తుందని ఇంకా అలాంటి అనేకం ఆమె నోటి నుంచి జాలువారాయి.(హైదరాబాదు పాతబస్తీలో మజ్లిస్‌ గురించి బిజెపి నేతలు నిత్యం చేసే విమర్శలు అచ్చం ఇలాగే ఉంటాయి) హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు,అత్యాచారాల వంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్రం గుర్తించి మూడు వందల అగ్రశ్రేణి జిల్లాల్లో మలప్పురం లేదని మేనకా గాంధీకి, ఆమె తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వారికి ఎవరు చెబుతారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన పిలిభిత్‌, ప్రస్తుతం ఎన్నికైన సుల్తాన్‌పూర్‌ జిల్లాల్లో నేరాల సంగతి అయినా ఆమెకు తెలిసి ఉంటే ఇలా మాట్లాడి ఉండేవారు కాదు.
కేరళలో ప్రతి ఏటా ఆరువందల ఏనుగులను చంపివేస్తున్నారని కూడా మేనక ఆరోపించారు.అది కూడా పచ్చి అబద్దమే. దేశం మొత్తంలో కూడా అన్నింటిని చంపలేదు. పార్లమెంట్‌లో తమ ప్రభుత్వం స్వయంగా వెల్లడించిన సమాచారం కూడా ఆమెకు తెలియదు.2016-17 నుంచి 2018-19 వరకు దేశంలో 314 అటవీ ఏనుగులను చంపివేసినట్లు ఈ ఏడాది మార్చి 20న పార్లమెంట్‌కు తెలిపారు. వాటిలో కేరళలో మూడు సంవత్సరాలలో కేవలం 21 మాత్రమే కాగా బిజెపి ఏలుబడిలోని అసోంలో అత్యధికంగా 90 ఏనుగులను చంపివేశారని ఆ పార్టీ వారికి ఎవరు చెబుతారు.
అంతే కాదు తరువాత ఆమె ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ మలప్పురంలో ఎక్కడో రెండు మూడు చోట్ల కొందరు బాంబులు తయారు చేస్తున్నారు.ఈ రోజు ఏనుగుకు బాంబు పెట్టిన వారు రేపు మనుషులకు పెడతారు అన్నారు. మేనకా గాంధీ అంటే ఉద్యోగం లేక నిరాశతో, వయసు పైబడి , మతి తప్పి కేరళలో ఏ జిల్లా ఏమిటో తెలియని స్ధితిలో ఉన్నారనుకుందాం,కేంద్ర అటవీ, వన్య ప్రాణిశాఖ మంత్రి ప్రకాష జవదేకర్‌ సైతం ఉదంతం ఏ అడవిలో జరిగిందో తెలుసుకోకుండా మలప్పురం అని నోరు పారవేసుకున్నారు.
2017లో జరిగిన ఏనుగుల సర్వే ప్రకారం దేశం మొత్తం మీద 29,964 ఉన్నాయి.వాటిలో కేరళలో 5,706 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌ ప్రకారం దేశంలో 2,454 మచ్చిక చేసుకున్న ఏనుగులు ఉన్నాయి. వాటిలో 1,809 ప్రయివేటు వ్యక్తులు, దేవాలయాలు, సర్కస్‌ కంపెనీలలో ఉండగా మిగిలినవి జంతు ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. ఈ ఏనుగుల్లో రాష్ట్రాల వారీ అసోంలో 905, కేరళలో 518, కర్ణాటకలో 184, తమిళనాడులో 138 ఉన్నాయి. తరువాత కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన సమాచారం ప్రకారం ప్రయివేటు వ్యక్తులు మచ్చిక చేసుకున్న ఏనుగులు 1,774 అని పేర్కొన్నారు. మరి కేరళలో ఏటా ఆరువందల ఏనుగులను చంపుతున్నట్లు పోసుకోలు సమాచారం తప్ప మేనకా గాంధీ ఏ ఆధారంతో చెప్పినట్లు ?
దేవాలయాల్లో ఉన్న ఏనుగులను కాళ్లను ఇరగ్గొట్టి, కొట్టి, ఆకలితో మాడ్చి, ఇతరంగా చంపుతున్నట్లు కూడా మేనకా గాంధీ పేర్కొన్నారు. అలాంటి ఉదంతాలు జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. జంతు ప్రేమికురాలిగా మేనకా గాంధీ అలాంటి దారుణాలకు పాల్పడిన దేవాలయ సిబ్బంది లేదా ప్రయివేటు వ్యక్తుల మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదు. దేవాలయాల జోలికి పోవటానికి ఆమెకు భయమెందుకు ? ఒక్క ఉదంతంలో అయినా ఆమె మంత్రిగా ఉండగా, లేనపుడు ఒక వ్యక్తిగా తీసుకున్న చర్య ఏమిటో చెప్పగలరా ? ఇప్పుడెందుకు ఏనుగు మీద అంత ప్రేమ పుట్టుకు వచ్చింది, పీనుగు రాజకీయాల ద్వారా ఆమె ఏమి ఆశిస్తున్నట్లు ?

చైనా వస్తు బహిష్కరణ: వేయి వాట్సాప్‌లు – పదివేల పగటి కలలు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు
కేంద్రపాలిత లడఖ్‌ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీరు, విద్యా సంస్కరణవాదిగా వర్ణితమైన సోనమ్‌ వాంగ్‌చుక్‌ చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటూ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది.జూన్‌ రెండవ తేదీ నాటికి 20లక్షల మంది చూశారట. భారత-చైనా సరిహద్దులో ఒకటైన లడక్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో పెట్టిన ఈ పోస్టుకు మీడియాలో కూడా పెద్ద ప్రచారమే వచ్చింది. మరోసారి చైనా వస్తువులను బహిష్కరించండి అనే వార్తలు దర్శనమిస్తున్నాయి.
బ్రిటీష్‌ వారు బెంగాల్‌ను విభజిస్తూ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా 1905లో నాటి జాతీయోద్యమ నేతలు స్వదేశీ పిలుపునిచ్చి బ్రిటీష్‌ వారి వస్తువుల కొనుగోలును బహిష్కరించాలని కోరారు.ఆ చర్యతో ఆ నిర్ణయాన్ని వెనక్కు గొట్టవచ్చని భావించారు. నాడు పిలుపు ఇచ్చిన వారు తాము కాంగ్రెస్‌ వాదులం అని రొమ్మువిరుచుకొని వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దని పిలుపు ఇస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ముసుగులు వేసుకొని తమ గుర్తింపు బయటపడకుండా ఆ పని చేస్తున్నారు. నాడు కాంగ్రెస్‌ వాదులు బ్రిటీష్‌ వారితో చేతులు కలపలేదు. నేడు కొందరు ముసుగులు వేసుకొని ఒక వైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు పాలకులు చైనా నేతలకు ఎర్రతివాచీ పరచి మర్యాదలు చేస్తున్నారు. ఆ ముసుగు వీరులు ఎక్కడా ఈ ఎర్రతివాచీలను పల్లెత్తు మాట అనరు. అంటే వారికీ వీరికీ చీకటి సంబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఇద్దరూ కలసి జనాన్ని వెర్రివాళ్లను చేస్తున్నారా? చెవుల్లో కమలం పువ్వులు పెడుతున్నారా ?
ముసుగు లేదా మరుగుజ్జు వీరులు వాట్సాప్‌ద్వారా చేస్తున్న ప్రచారాన్ని అనేక మంది నిజమే అనుకుంటున్నారు. తామంతా చైనా వస్తువులను బహిష్కరించినట్లు, చైనా కమ్యూనిస్టులు తలుపుతట్టి తమ కాళ్ల మీద పడి తప్పయి పోయింది, మా వస్తువులను కొనటం మాని మా నోటి కాడ కూడును కొట్టకండి మహాప్రభో అని వేడుకుంటున్నట్లు చాలా మంది కలలు కంటున్నారు. వయసులో ఉన్న వారికి వచ్చే కొన్ని కలలు వారిని మంచాల మీద నుంచి పడవేస్తుంటాయి. కొందరికి చైనా కలలు కూడా అలాంటి కిక్కు ఇస్తూ ఉండవచ్చు.
కోట్లాది మంది చైనా యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి తొలగిస్తే మన సరిహద్దులలోకి ప్రవేశిస్తున్న చైనా ప్రభుత్వానికి అదొక హెచ్చరికగా ఉంటుందని సోనమ్‌ వాంగ్‌చుక్‌ చెప్పాడు. మన సైన్యం ఆయుధాలను తీసి సమాధానం చెబుతుంటే జనం పర్సులను మూసి చెప్పాలన్నాడు. చైనా వస్తువులను బహిష్కరించితే దాని మూల్యం ఎంతో చైనాకు తెలిసి వస్తుందన్నాడు. చైనా వస్తువుల కొనుగోలుకు పెట్టిన ఆర్డర్లను వ్యాపారులు రద్దు చేసుకుంటే వ్యాపారంతోనే బతుకుతున్న తమ జనం తిరగబడతారని చైనా ప్రభుత్వం భయపడుతుంది. వ్యాపారం నిలిచిపోయి వారి ఆదాయం దెబ్బతింటే తిరుగుబాటే వచ్చే అవకాశం ఉంది. అందువల చైనా వస్తువులను బహిష్కరించాల్సి ఉంది అని కూడా చెప్పాడు. ఇలాంటి కలలు కనే వారు నిజంగానే తట్టుకోలేక మంచాల మీద నుంచి దభీమని పడతారు.మన సరిహద్దుల్లోకి చైనీయులు చొరబడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియోలు ప్రామాణికమైనవి కాదు, దుష్ట ఆలోచనతో రూపొందించినవి అని మరోవైపు మన సైన్యం ప్రకటించింది.
రెండుదేశాల మధ్య గత ఏడాది 93 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. రెండుచోట్లా ఆర్ధిక పరిస్ధితులు బాగోలేక అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మూడు బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి. మన దిగుమతులు ఎక్కువ కావటంతో చైనా మిగులు 56.77 బిలియన్‌ డాలర్లు ఉంది. కలలు అవి పగలు, రాత్రి అయినా కనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లావాదేవీల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవటం అవసరం. బోగస్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ మేథావుల సమాచారాన్ని నమ్మవద్దు. మన దేశం నుంచి 2019లో జరిగిన ఎగుమతులలో అమెరికాకు 15.91శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు 9.13, చైనాకు 5.08,హాంకాంగ్‌కు 3.93శాతం, సింగపూర్‌కు 3.51, మిగతా అన్ని దేశాలకు కలిపి 62.44శాతం ఉన్నాయి. ఇదే ఏడాది చైనా ఎగుమతులలో మన దేశ వాటా కేవలం మూడు శాతంతో ఏడవ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉండి 16.8 శాతం దిగుమతి చేసుకుంటున్న అమెరికాయే రెండు సంవత్సరాల నుంచి వాణిజ్య యుద్దం చేస్తూ చైనాను వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయిందన్నది తెలుసుకుంటే సోనమ్‌ వాంగ్‌చుక్‌ లాంటి వారు కలలు కనటానికి అసలు నిదరే పట్టదు మరి.
చైనా నుంచి మనం మూడుశాతం దిగుమతులు నిలిపివేస్తే, మన ఎగుమతులు ఐదుశాతం నిలిచిపోతాయి. చైనా నుంచి మనం వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని వాస్తవాల మీద ఆధారపడి పిలుపులు ఇస్తున్నారా లేక ఊహల్లో ఉండి చేస్తున్నారో తెలియదు. ఇవాళ అనేక వస్తువులు ఏవీ ఒక దేశంలో తయారు కావటం లేదు. ఒక్కో దేశంలో కొన్ని భాగాలు తయారైతే వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సంపూర్ణ వస్తువును రూపొందిస్తున్నారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులన్నీ అలాంటివే. ఈ నేపధ్యంలో మన ప్రధాని నరేంద్రమోడీ స్ధానిక వస్తువులనే అడగండి అన్న పిలుపు మేరకు ఎవరైనా దుకాణాలకు వెళ్లి పక్కా స్ధానిక వస్తువులను ఎన్నింటిని కొనగలమో ఆలోచించండి.
ఒక దేశ వస్తువుల మీద మరొక దేశం లేదా కొన్ని దేశాలు దిగుమతి పన్నులు విధించినట్లయితే వాటిని తప్పించుకొనేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. అదే పని చైనా కూడా చేస్తున్నది. కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా ఎగుమతి చేయిస్తున్నది, మరికొన్నింటిని మరికొన్ని దేశాల ద్వారా సరఫరా చేస్తున్నది. అనేక వస్తువుల మీద ఏ దేశంలో తయారైంది అన్న సమాచారమే ఉండదు. అలాంటపుడు ఫలానా వస్తువు చైనాది అని ఎవరు చెప్పగలరు ? చైనా నుంచి మన ఔషధ కంపెనీలకు, ఇతర పరిశ్రమలకు అవసరమైన బల్క్‌డ్రగ్స్‌, ముడిసరకులను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. వినిమయ వస్తువులనే కాకుండా చైనా అంశ ఉన్న ప్రాణావసర ఔషధాలను కూడా కూడా బహిష్కరించాలా ?
మన ప్రధాని మేకిన్‌ ఇండియా అని పిలుపు ఇచ్చిన తరువాత కొన్ని చైనా కంపెనీలు మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి సెల్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీలను కూడా మూయిస్తారా, ఆ ఫోన్లను కూడా బహిష్కరిస్తారా ? చైనాగాక ఇతర దేశాలు తయారు చేస్తున్న అనేక వస్తువులను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. వాటిలో ప్రతిదానిలో ఏదో ఒక భాగం చైనాలో తయారైనదిగా ఉంటుంది. మరి వాటి పట్ల వైఖరి ఏమిటి ? అమెరికా, జపాన్‌, మన దేశ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అక్కడ సంస్ధలను స్ధాపించి వస్తువులను ఉత్పత్తి చేయించి ఎగుమతులు చేస్తున్నారు. వాటిని చైనా ఉత్పత్తులుగా పరిగణించాలా మరొక దేశానివిగా భావించాలా ?
చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో బాబా రామ్‌దేవ్‌ కూడా తక్కువ తినలేదు. చైనా వస్తువులను బహిష్కరించటం దేశానికి సేవ చేయటమేనని చెప్పారు. ఫోన్‌ నుంచి టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌,విడ్‌మేట్‌ వంటి యాప్స్‌ను తొలగిస్తున్న ఒకవీడియోను ట్వీట్‌ చేశారు. చైనా వ్యతిరేకతలో భాగంగా జైపూర్‌కు చెందిన ఒక సంస్ధ ‘రిమూవ్‌ చైనా యాప్‌(చైనా యాప్‌లను తొలగించండి) అనే ఒక యాప్‌ను తయారు చేసి వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచింది. దాన్ని తమఫోన్‌లో పెట్టుకున్నవారికి ఏవి చైనా యాప్‌లో అది తెలియ చేస్తుంది. కావాలనుకున్నవారు వాటిని తొలగించుకోవచ్చు.
ఈ యాప్‌ను తన దుకాణంలో అందుబాటులో ఉంచిన గూగుల్‌ ప్రస్తుతం దాన్ని తొలగించింది. అలాంటి యాప్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచటం దుకాణ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అందుబాటుల్లో ఉంచే ముందు దానికి తెలియదా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఇదే కాదు టిక్‌టాక్‌కు ప్రత్నామ్నాయ తయారీ అంటూ మిత్రోం పేరుతో విడుదల చేసిన యాప్‌ను కూడా గూగుల్‌ నిలిపివేసింది. కాపీ యాప్‌ల తయారీ, విక్రయం తమ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అయితే చైనా వత్తిడి కారణంగానే గూగుల్‌ ఈ చర్యకు పాల్పడిందని కొందరు నెటిజన్లు సంస్ధ సిఇఓ సుందర్‌ పిచరు మీద విరుచుకు పడ్డారు. ఆయన దేశద్రోహా, దేశభక్తుడా ?
చైనా వస్తువులను బహిష్కరించాలి అని ప్రబోధిస్తున్న వారు, దానిని సమర్ధిస్తున్నవారు కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని ఆలోచించాలి. సరిహద్దుతో మనకు సమస్యలున్నాయి గనుక ఆ దేశ వస్తువులను వద్దంటున్నారా ? లేక స్వదేశీ వస్తువులనే అడగండి అని మోడీ పిలుపు ఇచ్చారు కనుక వద్దంటున్నారా ? మొదటి అంశం అయితే ఏదో ఉద్రేకం అని సరిపెట్టుకోవచ్చు. రెండవది అయితే ఒక్క మూడుశాతం చైనాయేం ఖర్మ, యావత్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 97శాతం వస్తువులు నిలిపివేస్తే మన వస్తువులు మనం కొనుక్కున్నట్లు అవుతుంది. అవి తయారు చేసేందుకు అవసరమైన పరిశ్రమలు, వాణిజ్యాన్ని పెంచుకున్నట్లు ఉంటుంది. దాని ద్వారా మన యువతకు ఉపాధి లభిస్తుంది. రాజకీయంగా ఆ దేశాలన్నీ కూడా మన కాళ్ల బేరానికి వస్తాయి కదా ! మరి ఆ పిలుపు ఎందుకు ఇవ్వటం లేదు ? దీన్లో కూడా రాజకీయాలు ఉన్నాయా ?
చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేవారు వాటిని మన దేశంలోకి అనుమతిస్తున్న పాలకుల సంగతి ముందు తేల్చాలి. వారు దేశభక్తులో, ద్రోహులో నిలదీయాలి.ఒక వేళ అక్రమంగా సరిహద్దులు, సముద్రాలు దాటి వస్తుంటే మన భద్రతా దళాలు, నిఘా సంస్ధలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాలి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఒకవైపు అనుమతించటం ఎందుకు, మరో వైపు బహిష్కరించమనటం ఏమిటి ? వాణిజ్యవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ జనానికి దేశభక్తి, స్వదేశీ, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అని సొల్లు కబుర్లు చెబుతారా ? చైనా లేదా మొత్తం విదేశీ వస్తువులను కొన వద్దు అని ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు పిలుపు ఇవ్వరు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉప్పొంగటం లేదా ? ఒక్క వస్తువులనేనా లేక చైనా పెట్టుబడులను కూడా వద్దంటున్నారా ?
గేట్‌వే హౌస్‌ అనే ఒక సంస్ధ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. మన దేశంలోని టెక్‌ అంకుర సంస్ధలలో నాలుగు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఒక బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 30 పెద్ద అంకుర సంస్ధలలో 18లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఫిబ్రవరిలో వెల్లడైన ఆ నివేదిక ప్రకారం మొత్తం 92 సంస్ధలలో చైనా నిధులు ఉన్నాయి. నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన తరువాత ఆ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలన్నింటికీ యజమానులు చైనీయులు లేదా అక్కడి మాతృసంస్ధలు కావు. అనేక మంది భారతీయులు, చైనీయులు కాని వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. అంతే కాదు, మన దేశానికి చెందిన వారు తమ సంస్ధలలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిన తరువాతనే విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. వాటిలో చైనీయులు, కాని వారు అందరూ ఉన్నారు. పేటిమ్‌కు 2019లో రూ.3,690 కోట్లు, ఫ్లిప్‌కార్ట్‌కు రూ.3,837 కోట్ల నష్టం వచ్చింది. వాటిలో చైనీయులు పెట్టుబడి పెట్టారు. ఉన్న ఫళాన సోనమ్‌ వాంగ్‌చుక్‌ వంటి వారు వారిని తట్టాబుట్టా సర్దుకుపొమ్మంటారా ? లేదా స్వదేశీ రామ్‌దేవ్‌ బాబా చైనా పెట్టుబడులను తిరిగి ఇచ్చి ఆ వాటాలను తన పతంజలి సంస్ధద్వారా కొనుగోలు చేయాలి.
2019 నివేదిక ప్రకారం మన దేశంలో ఫోన్‌ వినియోగదారులు డౌన్లోడ్‌ చేసుకున్న అగ్రశ్రేణి 50శాతం యాప్‌లలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. మరి వాటిని కూడా ఫోన్ల నుంచి తొలగిస్తారా ? 2019తొలి మూడునెలల్లో మన దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో చైనా బ్రాండ్స్‌ 66శాతం ఆక్రమించాయి. వాటిని కొనుగోలు చేసిన వారెందరు తమ ఫోన్లను చెత్తబుట్టలో పడవేసి తమ దేశభక్తిని నిరూపించుకున్నారో ఎవరికి వారు పక్కవారిని పరిశీలించాలి. మార్కెట్లో ఏ దేశంలో తయారైందో ,బ్రాండ్‌లు తెలియని అనేక చైనా వస్తువులను ఇబ్బడి ముబ్బడిగా విక్రయిస్తున్నారు, జనం కొనుగోలు చేస్తున్నారు. మేడిన్‌ ఇండియా అనే ముద్రలేని వస్తువులన్నింటినీ మన ఇండ్ల నుంచి బయటపడవేద్దామా ? స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ నినాదం మేరకు అనేక మంది బ్రిటన్‌ గ్లాస్కో పంచెలు, చొక్కాలను ,కోట్లు సూట్లు తీసి వేసి జీవితాంతం ఖద్దరు ధరించారు. మహాత్మా గాంధీయే అందుకు నిదర్శనం. ఆయనకంటే గొప్ప దేశభక్తులం మేము అని చెప్పుకుంటున్నవారు ఆపని చేయలేరా ? మనకా పట్టుదల లేదా ? ఓకల్‌ ఫర్‌ లోకల్‌ నినాద మిచ్చిన నరేంద్రమోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు ముందు ఆపని చేశారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా ?
ప్రపంచీకరణ యుగంలో ఒక దేశం మరొక దేశంలో కంపెనీలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి మూడో దేశంలో పెట్టుబడులు పెడుతోంది. వాటిని ఏ దేశానికి చెందినవిగా పరిగణించాలి. ఉదాహరణకు సింగపూర్‌, హాంకాంగ్‌, మలేషియా, మారిషస్‌ వంటి దేశాల్లో ఉన్న రాయితీలు, ఇతర సౌలభ్యాల కారణంగా అనేక సంస్ధలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. పెట్టుబడులు కూడా అక్కడి నుంచే పెడుతున్నట్లు చూపుతున్నాయి.ఉదాహరణకు పేటిమ్‌లో చైనాకు చెందిన ఆలీబాబా సింగపూర్‌ హౌల్డింగ్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టారు. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని సింగపూర్‌ పెట్టుబడులుగా కాగితాల మీద చూపింది తప్ప చైనావిగా కాదు. మరి ఇలాంటి వాటి గురించి ఏమంటారు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే ఒక పిలుపు ఇచ్చేటపుడు, దాన్ని బలపరచే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి.ప్రతిపోసుకోలు కబురును భుజానవేసుకోకూడదు. భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా రామ్‌దేవ్‌ బాబా తన వస్తువులను మరింతగా అమ్ముకొనేందుకు ఇలాంటి పిలుపులను సమర్ధిస్తారు తప్ప మరొకటి కాదని గుర్తించాలి. ఈ రోజు ఉన్నఫళంగా చైనా వస్తువులను ఆపివేస్తే వాటి స్ధానంలో ఎవరి వస్తువులను కొనాలి. చైనా తప్ప మనకు అన్ని దేశాలూ మిత్రపక్షాలే అని చెబుతున్నవారు ముందు ఆ సంగతి తేల్చాలి. వారు చైనా ధరలకే మనకు అందచేస్తారా ? సోనమ్‌ వాంగ్‌ చుక్‌ చెప్పినట్లు చైనా కోసం పర్సుమూస్తే అధిక ధరలుండా మిగతాదేశాల వస్తువుల కోసం ఉన్న పర్సును ఖాళీ చేసుకొని అప్పులు చేయాలి. చిప్పపట్టుకు తిరగాలి. అందుకు సిద్దపడదామా ?
విదేశీ వస్తువులు అవి చైనావి అయినా మరొక దేశానికి చెందినవి అయినా వినియోగదారులు ఎందుకు కొంటున్నారు. కొన్నవారందరూ దేశద్రోహులు, విదేశీ సమర్ధకులు, తుకడే తుకడే గ్యాంగులు కాదు. దిగుమతి చేసుకొనే వస్తువుల మాదిరి చౌక ధరలు, నాణ్యతను మన దేశంలో తయారీదారులు అందిస్తే ఎవరూ విదేశీ బ్రాండ్లకు ఎగబడరు. చౌకగా వస్తువులు విక్రయించటానికి చైనా,జపాన్‌, దక్షిణ కొరియాకు సాధ్యమౌతోంది. అదే అమెరికా,బ్రిటన్‌లకు ఎందుకు కావటం లేదు? తమ అవసరాలకు మించి మిగతా దేశాలకు సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున సరకులు తయారు చేస్తున్న కారణంగా చైనా వంటి దేశాలకు ఉత్పాదక ఖర్చు తగ్గుతోంది. తమ జనాభా మొత్తానికి పని కల్పించాలి కనుక వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చి విదేశీ మార్కెట్‌ను పెంచుకొంటోంది. అన్నింటికీ మించి చౌకగా వస్తువులను ఎలా తయారు చేయాలి, ఉత్పాదకతను ఎలా పెంచాలి అనేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ది ఖర్చు చైనా, జపాన్‌, కొరియాల్లో ఎక్కువగా ఉంటోంది. గతంలో ఎవరి చేతుల్లో చూసినా కొరియా శాంసంగ్‌, ఫిన్లాండ్‌ నోకియా కనిపించేది. చైనా ఫోన్లు చౌకరకం, సరిగా పనిచేయవని అనే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ఫోన్లే, పని చేయవు అనే ఫిర్యాదు లేదు. వాటి దెబ్బకు జపాన్‌ సోనీ, పానాసోనిక్‌, మన దేశానికి చెందిన మైక్రోమాక్స్‌ కనుమరుగయ్యాయి.ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న అనేక ఫోన్లలో వాడుతున్నది చైనా విడిభాగాలే, వాటిని తయారు చేస్తున్నదీ మన దేశంలో ఏర్పాటు చేసిన చైనా కంపెనీలే మరి. వాటన్నింటినీ మూసివేస్తే మన ఆర్ధిక వ్యవస్ధకు, ఉపాధికి సైతం నష్టమే. పడవ నుంచి దూకాలనుకొనే ముందు పర్యవసానాలను ఆలోచించుకోపోతే ఏమౌతుందో తెలుసా ?

డోనాల్డ్‌ ట్రంప్‌ అసహనం, బెదిరింపుల వెనుక అసలు కథేంటి !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ : చైనా చేతిలో కీలుబమ్మగా మారింది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ: దీన్ని రద్దు చేయాలి, మాకు ఉపయోగపడటం లేదు. చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌: తన స్వార్ధం తాను చూసుకొంటోంది, దొంగ ఏడ్పులు ఏడుస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు : దీన్ని మేము గుర్తించం, మా మీద విచారణ జరిపే అధికారం దానికి లేదు.
ఏడుదేశాల బృందం(జి7) : దీనికి కాలదోషం పట్టింది. ఈ బృందంలో భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చాలి.
ఇలాంటి సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది.దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎందుకు ? కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది. చైనీయులను బూచిగా చూపుతోంది. ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది వాటన్నింటికీ కారణం ఏమిటి , కారకులు ఎవరు ?
ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది. స్వేచ్చకు ప్రతి రూపంగా లిబర్టీ విగ్రహాన్ని పెట్టుకున్న వారు ఒక వైపు యాత్రీకుల నుంచి ఆదాయం పిండుకొనే వనరుగా మార్చుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల పౌరుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించిన మిలిటరీ, ఇతర నియంతలను ఆ విగ్రం ముందు నిలబెట్టి అసలైన రక్షకులుగా ప్రపంచానికి చూపారు.
2018లో ప్రపంచ మానవహక్కుల సంస్ధ నుంచి అమెరికా వైదొలగింది. పాలస్తీనియన్ల సమస్య మీద ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ సంస్ధ పని చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి పాలస్తీనియన్ల మాతృదేశాన్ని లేకుండా చేసి వారి ప్రాంతాలను ఆక్రమించి, బందీలుగా మార్చి, నిత్యం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం అమెరికా. తాను చేసిన ఆరోపణలకు ఆమోద ముద్రవేయకపోవటం, తాను నందంటే నంది, పందంటే పంది అని వంతపాడేందుకు ఆ సంస్ధ నిరాకరించటమే అసలు కారణం. ఆ సంస్ధ నుంచి వైదొలిగిన అమెరికా సాధించిందేమీ లేదు, అమెరికా లేనంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగిపోలేదు. సిరియా, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల అమెరికన్లు దాడులు,తిరుగుబాట్లను ప్రోత్సహించి, రెచ్చ గొట్టి, తామే స్వయంగా దాడులకు పాల్పడి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సత్యం దాస్తే దాగేది కాదు. ఆ నేరాలు ఏడాది కేడాది పెరుగుతున్నాయి గనుక తమను ఎక్కడ బోనులో నిలబెడతారో అనే భయంతో ఐక్యరాజ్యసమితి చొరవతో ఏర్పడిన అంతర్జాతీయ నేర కోర్టును గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంప్రదింపుల అనంతరం రోమ్‌ సమావేశంలో తీర్మానించారు.1998 జూలై 17న దాన్ని 120దేశాలు ఆమోదించగా, 21 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేకించిన ఏడు దేశాలలో అమెరికా, చైనా, లిబియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఎమెన్‌, కతార్‌ ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఇలాంటి ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేస్తేనే చాలదు, వాటిని ఆయా దేశాల పార్లమెంట్‌లు ఆమోదించాలి. క్లింటన్‌ పార్లమెంట్‌కు నివేదించలేదు. రెండు సంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాస్తూ రోమ్‌ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ స్పష్టం చేశారు. ఒకసారి అంగీకరిస్తే ఆయా దేశాల మీద వచ్చే ఆరోపణలు, విమర్శల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. అమెరికా గనుక చేరి ఉంటే ఏదో ఒకసాకుతో అనేక దేశాలలో జోక్యం చేసుకుంటున్నదాని దుర్మార్గాలపై ఈ పాటికి ఎన్నో విచారణలు జరిగి ఉండేవి, దాని దుర్మార్గం మరింతగా లోకానికి బట్టబయలు అయి ఉండేది. అందుకే చేరేందుకు నిరాకరిస్తోంది. ఒక వైపు తాము సహకరిస్తామని చెబుతూనే నేరాలకు పాల్పడిన తమ సైనిక, గూఢచార ఇతర పౌరులను రక్షించుకొనేందుకు, కోర్టు కార్యకలాపాలను అడ్డుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. మరికొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా ఏకపక్షంగా వైదొలగింది. వాటిలో ఇరాన్‌తో కుదిరి అణు ఒప్పందం అన్నది తెలిసిందే. దాన్నుంచి వైదొలగిన తరువాత అమెరికా దాడులు, దానికి ఇరాన్‌ ప్రతిదాడుల సంగతి తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది.కొన్ని సంవత్సరాల తరువాత భారత్‌, చైనాలు ఇంకేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని, ఆ పేరుతో వాటికి రాయితీలు కల్పించటం అక్రమం అని, తమకు సంస్ధలో ఉన్నందున ప్రయోజనాలేమీ లేవని, తమకు సైతం అదే హౌదా ఇవ్వాలని లేకుంటే తాము సంస్ధ నుంచి విడిపోతామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. వర్ధమాన దేశాలు పన్నులను తగ్గించేందుకు ఇచ్చిన వ్యవధి మేరకే భారత్‌, చైనాలు అవకాశాలను వినియోగించుకుంటున్నాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. నిజానికి నిబంధనలను ఉల్లంఘించి లబ్ది పొందుతోంది అమెరికాయే. అనేక దేశాలపై కేసులు దాఖలు చేసి బెదిరింపులకు దిగింది. మన దేశం పత్తికి మద్దతు ధర ప్రకటించటాన్ని రాయితీ ఇవ్వటంగా చిత్రించి ప్రపంచ వాణిజ్య సంస్దలో మనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. బోయింగ్‌ విమాన కంపెనీకి పెద్ద ఎత్తున దొడ్డిదారిన రాయితీలు ఇస్తోంది. ఆ విమానాలను కొనాలని ఇతర దేశాలపై తన పలుకుబడిని వినియోగిస్తోంది. బోయింగ్‌కు పోటీగా ఐరోపా ధనిక దేశాలు ఎయిర్‌బస్‌కు మద్దతు ఇస్తున్నాయి. రెండూ పరస్పరం ఆరోపణ చేసుకొని దాఖలు చేసిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదహారేండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదంలో ఐరోపా యూనియన్‌ను బెదిరించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే విమానాలు, విడిభాగాలపై విధిస్తున్న పన్ను 10 నుంచి 15శాతానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పెంచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి. దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు. ఈ సంస్ధకు ఇచ్చే నిధులను ప్రపంచంలో ప్రజారోగ్యానికి చేసే ఖర్చుకు అంద చేస్తామని గొప్పలు చెప్పాడు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది. అయితే రాజకీయ కోణంతో జరిపే దర్యాప్తులకు బదులు వాస్తవం తెలుసుకొనేందుకు కరోనా సమస్య సమసిపోయిన తరువాత స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించింది. భారత్‌తో సహా 122 దేశాలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి ఓటింగ్‌ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించటం అమెరికాకు మింగుడు పడలేదు. చైనా వ్యతిరేకిస్తుందని, దాన్ని సాకుగా తీసుకొని దాడి చేయాలని చూసిన ఆమెరికా దీంతో హతాశురాలైంది. ఇక లాభం లేదనుకొని తాము సంస్ధ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. సంస్కరణలు తేవటంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే అమెరికా కోరుతున్న సంస్కరణలు ఏమిటో స్పష్టత లేదని, బయట చర్చకు పెట్టలేదని, ఒక నెల వేచి చూస్తామని చెప్పిన ట్రంప్‌ వారం రోజులకే బెదిరింపులకు ఎందుకు దిగారో తెలియటం లేదని సంస్ధ ప్రధాన కార్యదర్శి టెడ్రోస్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయం ముందు చూపులేమి, అమెరికన్ల ప్రాణాలకు ముప్పు తేవటమే అని విమర్శలు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీ ఆమోదించిన ఒక చారిత్రాత్మక ప్రతిపాదన కూడా అమెరికా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయి. వాటిలో అమెరికా అనుయాయి దేశాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. అదే జరిగితే ఏం జరుగుతుందో ఎయిడ్స్‌ ఔషధాల విషయంలో చూశాము.
తాము కూడా కరోనా వాక్సిన్‌ తయారీలో ఉన్నామని, అవి జయప్రదమైన తరువాత ప్రజల వస్తువుగా అందుబాటులో ఉంచుతామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రకటించారు. అంతే కాదు ప్రజల వస్తువుగా ఉంచే వాక్సిన్‌ తయారీ యత్నాలకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు బిలియన్‌ డాలర్లు అందచేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంస్ధలు వాక్సిన్‌ ఒకటి, రెండవ దశ పరీక్షలలో ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలో, రెండు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో ఒక్కొక్కటీ ఉన్నాయి.
ఎయిడ్స్‌ ఔషధ పేటెంట్‌ పొందిన కంపెనీ ఏడాదికి ఒక్కో రోగి నుంచి పది నుంచి పదిహేనువేల డాలర్లు వసూలు చేసి విక్రయించింది. పదేండ్ల పాటు అంత ఖర్చు భరించలేని రోగులందరూ దుర్మరణం పాలయ్యారు.2004లో మన దేశ కంపెనీలు ఏడాదికి కేవలం 350 డాలర్లకే మందులను అందుబాటులో తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచానికి కావలసిన ఎయిడ్స్‌ ఔషధాలలో 80శాతం మన దగ్గర నుంచే సరఫరా అవుతున్నాయి. కాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నెక్సావార్‌ ఔషధంపై బేయర్‌ కంపెనీ పేటెంట్‌ హక్కు కలిగి ఉంది. నూట ఇరవై బిళ్లలను రెండు లక్షల ఎనభైవేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలాంటిది మన దేశంలోని నాట్కో కంపెనీ జనరిక్‌ ఔషధాన్ని కేవలం రూ.8,800లకే అందుబాటులోకి తెచ్చింది. తాము ఈ ఔషధాన్ని భారత మార్కెట్‌కోసం తయారు చేయలేదని పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయగల పశ్చిమదేశాల వారికి ఉద్దేశించింది అని నాట్కో కంపెనీపై కేసు దాఖలు చేసిన సందర్భంగా బేయర్‌ కంపెనీ సిఇఓ చెప్పాడు. అయితే ఆ కేసులో బేయర్‌ ఓడిపోయింది.
ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన. అనేక వ్యాధులు పశ్చిమ దేశాలలో అంతగా రావు, అయినా పశ్చిమ దేశాల కంపెనీలు ఆ వ్యాధులకు ఔషధాలను ఎందుకు రూపొందిస్తున్నాయంటే రోగులను పీల్చి పిప్పి చేసేందుకే అన్నది స్పష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తే అమెరికన్లు సభ్య సమాజం నుంచి మరింతగా వేరుపడతారు. ఇతర జబ్బులకు ఒకసారి పెట్టుబడి పెట్టి అభివృద్ది చేస్తే తరువాత రోజుల్లో పెద్ద మార్పుల అవసరం ఉండదు. కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన ఔషధం శాశ్వతంగా పనికి రాదు. వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎయిడ్స్‌ కోరి తెచ్చుకొనే జబ్బు, కరోనా కోరకుండానే దాడి చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దపడతారు.మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి. ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి. వాటి ఆకాంక్షలను ట్రంప్‌ వెల్లడిస్తున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నుంచి అమెరికా వైదొలగాలన్న అంశం గత పదిహేను సంవత్సరాలుగా నలుగుతున్నదే. అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇటీవల ఈ సంస్ధను రద్దు చేయాలంటూ ఊగిపోయారు. అలాంటి అధికారం గనుక అమెరికాకు ఉంటే ఈ పాటికి ట్రంప్‌ ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా తక్కువ తినలేదు.ఆ సంస్ధ నుంచి తప్పుకోవాలంటూ పార్లమెంట్‌లో ఆ పార్టీ సభ్యుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వేళ ట్రంప్‌ అలాంటి పిచ్చిపని చేస్తే ముందు నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు. అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరితో పాటు కూర్చునేందుకు తమకు స్ధలం ఉండదు అని అమెరికా వాణిజ్య మాజీ ప్రతినిధి వెండీ కట్లర్‌ చేసిన వ్యాఖ్య తీవ్రతకు నిదర్శనం.
గాట్‌లో, తరువాత దాని స్ధానంలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో స్ధాపక సభ్యురాలిగా చైనాకు స్ధానం కల్పించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు అనుమతించలేదు.ఏ వర్ధమాన దేశానికీ విధంచని షరతులను చైనాకు పెట్టి చివరకు చేర్చుకున్నారు.అప్పటి నుంచీ చైనా తమ దేశం నుంచి ఫ్యాక్టరీలు, సంస్ధలను తరలించుకుపోతున్నది, ఉద్యోగాలకు ఎసరు పెట్టింది, వాణిజ్యాన్ని దెబ్బతీసింది అంటూ అమెరికా సణగని రోజు లేదు.
అమెరికా ఒక్క ఐక్యరాజ్యసమితి సంస్ధల నుంచే కాదు. ఇతర వ్యవస్ధలను కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. బలహీనులనే కాదు బలవంతులను కూడా తన పాదాల చెంతకు తెచ్చుకొనేందుకు పూనుకుంది. చరిత్రలో జరిగిన అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు సామ్రాజ్యవాదుల ఇలాంటి వైఖరే కారణమైంది.
జి7 దేశాల బృందానికి కాలదోషం పట్టిందని ప్రకటించటానికి ట్రంప్‌ ఎవరు ? దానిలో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు రష్యాను ఎనిమిదవ దేశంగా చేర్చుకొనేందుకు నిర్ణయించి క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకొందనే సాకుతో పక్కన పెట్టారు.ఈ ఏడాది జరిగే సమావేశానికి తిరిగి అధికారికంగా పిలవాలని నిర్ణయించారు. గత ఏడాది మనదేశంతో సహా తొమ్మిది దేశాలను అతిధులుగా ఆహ్వానించారు. ఆరు దేశాల బృందంగా ఏర్పడిన ఈ ఆర్ధిక కూటమిలో తరువాత ఏడవద దేశంగా కెనడాను చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఐరోపా యూనియన్‌ శాశ్వత ఆహ్వానిత సంస్ధగా పిలుస్తున్నారు. నిజానికి ఇది ధనిక రాజ్యాలు తమ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసుకున్నది తప్ప ఐక్యరాజ్యసమితితో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ ఏడాది జూన్‌ 10-12 తేదీలలో అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రంలోని కాంప్‌డేవిడ్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా సమావేశాన్ని ఆన్‌లైన్‌ జరపనున్నట్లు మార్చి నెలలో తెలిపారు. ఇప్పుడు దాన్ని కూడా ఏకంగా సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అప్పటికి అమెరికా ఎన్నికలు దగ్గరపడతాయి కనుక తన లాభనష్టాలను బేరీజు వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
ఒకే గూటి పక్షులైన ఈ బృంద దేశాలతో కూడా అమెరికా సక్రమంగా వ్యవహరించటం లేదు. మిగతా దేశాలన్నీ తనకు అణగి మణగి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో 2018లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో జరిగిన సమావేశం రసాభాస అయింది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మిగిలిన ఆరుగురు నేతలు పడిన ఇబ్బందులను గమనించిన జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ” జి6ప్లస్‌ ఒన్‌ ” అని అపహాస్యం చేశారు. ఆ సమావేశం ఎలాంటి ప్రకటనను ఆమోదించకుండా ముగియటానికి అమెరికా, ట్రంపే కారణం అంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడాదే చైనా, కెనడా , ఐరోపా యూనియన్‌ ఇతర అనేక దేశాలపై బస్తీమే సవాల్‌ అంటూ ట్రంప్‌ వాణిజ్య యుద్దం ప్రకటించటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆతిధ్యం ఇస్తూ ఈ బృందం పనికిమాలినది అని వ్యాఖ్యానించటాన్ని బట్టి ట్రంప్‌ సంస్కారం ఏమిటో బయటపడింది. అదే నోటితో మన దేశంతో సహా మిగిలిన దేశాలతో దాన్ని విస్తృత పరచాలంటూ ఆదేశాల తరఫున మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టాడు. నిజానికి ఆ బృందంలో ఉన్నంత మాత్రాన ఏ దేశానికైనా పెద్దగా ఒరిగేదేమీ లేదు. దానితో నిమిత్తం లేకుండానే చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంతగా ఎదిగిందో, ఆ బృందంలోని అమెరికా మినహా మిగిలిన దేశాలను దాటి ఎలా ముందుకు పోతోందో ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టటంలో సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఒక్క జపాన్‌ మినహా మిగిలిన అన్ని జి7దేశాలూ కరోనాతో సతమతం అవుతున్నాయి. అమెరికా గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇది రాస్తున్న సమయానికి నమోదైన 62లక్షల కేసుల్లో పద్దెనిమిది లక్షల కేసులను దాటి పోయింది. 2008లలో ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి జి7లోని ఏ ఒక్కదేశమూ బయటపడకపోగా మరో సంక్షోభంలోకి కూరుకుపోతుండటాన్ని చూస్తున్నాము.
అమెరికా పాలకవర్గం, దాని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకుంటున్నది ఒకటి-జరుగుతున్నది మరొకటి కావటంతో తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక పిచ్చిపనో, ప్రకటనో, బెదిరింపులో చేస్తున్నాడు. వాటిలో ఒకటి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అమెరికా తప్పుకుంటుందన్న అంశం. గతంలో ప్రపంచాన్ని బెదిరించేందుకు జపాన్‌పై అణుబాంబులు వేశారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రపంచ సంస్ధల నుంచి తప్పుకుంటామనే రూపంలో అవి ముందుకు వస్తున్నాయి.అందుకుగాను ప్రతిదానికీ ఏదో ఒక సాకు చూపుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత తలెత్తిన పరిస్ధితుల్లో అమెరికా ఒక పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను నెత్తికి ఎత్తుకొని ప్రపంచలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులన్నింటినీ కూడగట్టింది. ఆ ముసుగులో తన కార్పొరేట్‌ సంస్ధలకు ఆయా దేశాలను మార్కెట్‌గా చేసుకొనేందుకు, సహజవనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది. తన మిలిటరీ,రాజకీయ వ్యూహాలను అమలు జరిపేందుకు కేంద్రాలుగా చేసుకున్నది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ఎత్తుగడలు దానికి ఎదురుతన్నాయి.ఈ కారణంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ సంస్ధలలో అమెరికా కొనసాగటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం దండగ, తమ లక్ష్యాలకు ఉపయోగపడటం లేదని భావించటం, తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాయే కాదు ఏదేశంలో అయినా పాలకవర్గాలకు తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. తాము నిర్దేశించిన అజెండాను అమలు జరపకపోతే ఒక బొమ్మ బదులు మరొక బొమ్మను గద్దెపై కూర్చోబెడతాయి. ఈ నేపధ్యంలోనే నవంబరు ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోయి మరొకరు వచ్చినా భాష, హావభావాలు, పిచ్చిమాటలు మారవచ్చు తప్ప ఇదే వైఖరి కొనసాగుతుంది.
ఇలాంటి వైఖరి అమెరికాకు ఉపయోగపడుతుందా ? ప్రపంచ సంస్ధలతో నిమిత్తం లేకుండా తనకున్న ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచాన్ని శాసించి తన అదుపులోకి తెచ్చుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అది సాధ్యం కాదని దానికి అవగతం అవుతోంది. 2008లో పెట్టుబడిదారీ దేశాలలో వచ్చిన మాంద్యం తరువాత అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్ధను పక్కన పెట్టి విడిగా ఒప్పందాలు చేసుకోవటం పెరుగుతోంది. గత ఏడాది నవంబరు వరకు వచ్చిన వార్తల ప్రకారం రక్షణాత్మక చర్యల్లో అమెరికా 790తో అగ్రస్ధానంలో ఉంది. మన దేశం ప్రపంచ వాణిజ్యంలో చాలా తక్కువశాతమే కలిగి ఉన్నప్పటికీ దాన్నయినా కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యల్లో 566తో అమెరికా తరువాత రెండో స్ధానంలో ఉన్నాం. దేశాల వారీ జర్మనీ 390, బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌262, చైనా 256, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు తీసుకున్నాయి.2018 చివరిలో ప్రపంచ వాణిజ్యం మాంద్యంలోకి జారిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం ఎలాంటి పర్యవసానాలను చూడాల్సి వస్తుందో అప్పుడే చెప్పలేము.
ఐక్యరాజ్యసమితికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనేంతవరకు దాన్ని కొనసాగించటం తప్ప మరొక మార్గం లేదు. ఉన్నదాన్నే కొనసాగించటానికి అంగీకరించని అమెరికన్లు దాన్ని బోనులో నిలబెట్టే అంతకంటే శక్తివంతమైన ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటుకు అంగీకరిస్తారని ఆశపెట్టుకోనవసరం లేదు. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొనేందుకు, రక్షణాత్మక చర్యలు అమలు జరిపిన కారణంగానే ప్రపంచ యుద్దాలు వచ్చాయి. ట్రంప్‌ చేస్తున్న పిచ్చిపనులు నవంబరులో జరిగే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది ఒకటైతే రెండవది అమెరికా వైఖరిలో రోజు రోజుకూ పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ట్రంప్‌ ఓడిపోతారా, డెమోక్రాట్‌ జోబిడెన్‌ గెలుస్తారా అన్నది పక్కన పెడితే అగ్రస్దానం అమెరికాదే అన్న వైఖరిని మరింత ముందుకు తీసుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియదు గానీ, తీవ్రంగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

ఏడాదిగా అడుసు తొక్కుతూ కాళ్లు కడుక్కుంటున్న వైసిపి నేతలు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు
రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగించటం చెల్లదని, దానికి దోహదం చేసిన ఆర్డినెన్స్‌, ప్రభుత్వ ఉత్తరువులను కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు ఇచ్చింది. శనివారం నాడు ఏడాది పాలన ఉత్సవాలు జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్న జగన్‌ మోహనరెడ్డి, అనుయాయులకు ఇది ఊహించని ఎదురు దెబ్బ. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత తెలిసిందే. గత ఏడాది కాలంలో జరిగిన అనేక పరిణామాలను చూస్తే జగన్‌ పరివారం అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అధికారానికి వచ్చిన తొలిరోజుల్లో అనుభవం లేక లేదా ప్రతిపక్ష నేతగా తాను అనుభవించిన అవమానాల అక్కసును భరించలేక ప్రత్యర్ధి పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనుకొని ఏ పార్టీకి చెందని వారు సరిపెట్టుకున్నారు. ఏడాది కాలంలో అలాంటి వారందరినీ వైసిపి దూరం చేసుకుంది. జగన్‌ నాయకత్వం చేస్తున్న పనులు తెలియక కాదు తెలిసే చేస్తున్నారని, పర్యవసానాలను అనుభవించకతప్పదనే అభిప్రాయం పెరుగుతోంది. జగన్‌ తన మంత్రులకు సమాంతరంగా సలహాదారులను ఏర్పాటు చేసుకున్నారు. వారంతా భజనపరులుగా, మనసెరిగి మసలుకొనే అవకాశవాదుల్లా కనిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కొంప ముంచటంలో సలహాదారులు తక్కువేమీ తినలేదు. ఇప్పుడూ అదే పునరావృతం అవుతోందా అన్నది వైసిపి శ్రేణులు పరిశీలించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
తిరుమల వెంకన్న భూములు కొన్ని నిరర్ధక ఆస్తులుగా ఉన్నాయని, వాటిని అమ్మేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఆ చర్యను సమర్ధించుకుంటూ ఆ నిర్ణయం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దేవస్ధానం బోర్డే నిర్ణయం తీసుకుందని దాన్నే తాము అమలు జరుపుతున్నామని సమర్ధించుకున్న నేతల తీరు తెన్నులు యావత్‌ రాష్ట్రం చూసింది. తరువాత వచ్చిన వత్తిడి మేరకు తాము గత నిర్ణయాలను సమీక్షించామే తప్ప విక్రయ నిర్ణయం తీసుకోలేదని, ఒక వేళ అలాంటిది చేయాల్సివస్తే సంప్రదించే చేస్తామని అదే నోళ్లు ఎలాంటి వెరపు లేకుండా ప్రకటించటాన్ని చూసి విస్తుపోతున్నది. అంతే కాదు గతంలో వచ్చిన కానుకలు, భూముల విక్రయాలు తదితర అంశాలన్నింటితో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఎవరు వద్దన్నారు ? ఎవరి బండారం ఏమిటో బయటపడుతుంది. జనం కోరుకున్నదీ అదే. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఒక్క అంగుళం కూడా భూములు విక్రయించం అని కూడా ప్రకటించారు. ఇదేదో తొలిరోజే చెప్పి ఉంటే పోయేది. ప్రతిపక్షాలను అల్లరి పాలు చేయాలని యత్నించి తమ గోతిలో తామే పడినట్లుగా ఉంది వైసిపి వ్యవహారం. ఇలాంటి చర్యలతో గ్రామాలు, పట్టణాల్లో దిగువ స్ధాయిలో రొమ్ములు విరుచుకొని గుడ్డిగా సమర్ధించిన సామాన్య కార్యకర్తల పరువు ఏమౌతుందో, దాని ప్రభావం ఏమిటో ఆలోచించే వారున్నారా ?
ప్రభుత్వం చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో, సుప్రీం కోర్టులో తీర్పులు వస్తున్న తరువాత అయినా కొత్తగా వేసే కేసులు నిలుస్తాయా లేదా ఓడిపోతే పరువు సంగతి ఏమిటని ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు, తమ నేతలను ప్రశ్నిస్తున్నట్లూ కనపడదు. కోర్టుల్లో కేసులు ఓడిపోయినా జనంలో తమ పలుకుబడి తగ్గటం లేదని వైసిపి నాయకత్వం భావిస్తున్నదా ? దానికి ఆస్కారం లేకపోలేదు. ఆంగ్ల మాధ్యమంపై కోర్టులో ఓడిపోయిన తరువాత ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న వారందరూ కోర్టు తీర్పును తప్పుపట్టారు. అది సహజం. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమంలో విద్య తమ బిడ్డలను అందలాలెక్కిస్తుందని ఆశలు పెంచుకున్నవారికి సహజంగానే కోర్టు తీర్పు రుచించదు, కనుక కేసు పోయినా మా మద్దతు మీకే అని అలాంటి వారందరూ మద్దతు ప్రకటించి ఉండవచ్చు. అయితే అది శాశ్వతంగా ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆంగ్ల మాధ్యమాన్ని గతంలో చెప్పినట్లు అమలు జరపకపోతే చేతగాని వారు ఎందుకు చెప్పినట్లు అనే అసంతృప్తి మెల్లగా ప్రారంభం అవుతుంది.
పోలీసు ఉన్నతాధికారి ఎబి వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం ఓడిపోయినా అదేమీ ప్రజాసమస్య కాదుకనుక తమకు వచ్చే నష్టమేమీ లేదని వైసిపి శ్రేణులు సమర్ధించుకోవచ్చు. సామాన్య జనానికి సంబంధించిన సమస్య కాదు గనుక దానితో పలుకుబడి మీద ప్రభావం చూపదు. కానీ తిరుమల వెంకన్న భూములపై తమ మాటలను తామే మింగిన తీరు, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపుపై తలెత్తిన తీవ్ర రగడ, రాజకీయ నేపధ్యం చూస్తే అది మిగతా కేసుల కంటే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశాలు ఎక్కువ.
ముఖ్యమంత్రిగా అసలైన అధికారం నాదా ఎన్నికల కమిషనర్‌దా అని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌కు అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడింది. ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసిన లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. విచారణ తతంగం జరిపారు. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ? ఆ లేఖ గురించి నానా యాగీ చేసిన వైసిపి నేతలు అనూహ్యంగా ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావటం, దాని మేరకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిందని ప్రకటించటం, కొత్త కమిషనర్‌ నియామకం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పదవికి తగిన వారెవరూ లేనట్లు తమిళనాడులో పాస్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ జస్టిస్‌ కనకరాజ్‌ను తీసుకురావటం, ఆయన దళిత సామాజిక తరగతికి చెందిన వారని ప్రచారం చేసి దళితుల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నించటం తెలిసిందే.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కులాన్ని అంటగట్టిందీ, కొత్త కమిషనర్‌కూ అదే పని చేసిందీ వైసిపి వారే కావటం గమనించాలి. అదీ, ఇదీ రెండూ చౌకబారు రాజకీయాలే. ఒక దళితుడి నియామకాన్ని తప్పుపడతారా అని మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది సలహాదారుల బుర్రలో పుట్టిందా లేక జగన్‌మోహనరెడ్డిగారికే తట్టిందో తెలియదు. ఇప్పుడు రమేష్‌ కుమార్‌ తొలగింపు చెల్లదు అని తీర్పు వచ్చిన తరువాత దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని కొందరు, కోర్టు తీర్పును ఆమోదిస్తామని మరి కొందరు అధికార పార్టీ నేతలు చెప్పారు. ఒక వేళ అదే జరిగితే మరో సమస్యను తలకెత్తుకొనేందుకు పూనుకున్నట్లే ?
నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తిరిగి అధికారం చేపట్టిన తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోనవసరం లేదు. ఈ తీర్పుతో ప్రభుత్వ పలుకుబడి తగ్గుతుందా, రమేష్‌ కుమార్‌కు సానుభూతి పెరుగుతుందా? పర్యవసానాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. కారకులు వారా వీరా ఎవరు, ఎవరు ప్రారంభించారు, ఎవరు కొనసాగిస్తున్నారు అన్నది ఒక అంశమైతే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుమ్ములాటలు, సమీకరణలు మరింతగా ఘనీభవించాయన్నది ఒక అభిప్రాయం. ఆ ప్రాతిపదికన ఆలోచించే వారు ఏ పార్టీకి చెందినప్పటికీ లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం తమ పార్టీ ఏది చేసినా సరైనదే అనే అడ్డగోలు సమర్ధనకు పూనుకుంటున్నారు. దాన్ని సమర్ధించేందుకు ప్రత్యర్ధి పక్షం కూడా చేసింది అదేగా అని వారి తప్పులను తమకు రక్షణగా ముందుకు తెస్తున్నారు. ఈ నేపధ్యంలో చూసినపుడు నిమ్మగడ్డకు కొత్తగా వచ్చే సానుభూతి ఏమీ ఉండదు. అదే విధంగా కేవలం ఈ అంశం మీద అధికార పార్టీ పెద్దగా మద్దతు కోల్పోయే అవకాశాలు కూడా తక్కువే అని చెప్పవచ్చు.
అయితే అధికార పార్టీమీద ఎలాంటి ప్రభావం ఉండదా ? తప్పకుండా ఉంటుంది. ఏలుబడిలోకి వచ్చి ఏడాది మాత్రమే గడచింది. పెట్టుబడులు పెట్టిన వారు వాటిని రాబట్టుకోవటం ప్రారంభించిన సమయానికి కరోనా సమస్య వచ్చింది. సంక్షేమ పధకాలలో అధికార పార్టీ వారికి వచ్చే వాటాలేమీ ఉండవు. ఇసుక, మట్టిని పిండటం ప్రారంభమైంది. అవే చాలవు, ప్రభుత్వం చేపట్టే రోడ్లు, నిర్మాణాలు, ప్రాజెక్టుల వంటివి ఉంటే పంటపండుతుంది. ఉన్న సొమ్మంతా నవరత్నాలకే పోతే అలాంటివి ఎన్ని పనులు చేపడతారు, ఎలా అన్నది బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు తేలిపోనుంది.
కోర్టులలో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా వైసిపిలో స్ధానిక కార్యకర్తల మనస్ధైర్యం క్రమంగా సడలటం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రే స్వయంగా రచ్చ చేసిన నిమ్మగడ్డ వ్యవహారంలో వచ్చిన తీర్పు ఒక మలుపు, అధికారపక్షానికి ఒక షాక్‌ వంటిదే. రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ ప్రతిపక్షాలకు ప్రచార ఆస్త్రాలుగా, పాలక పార్టీకి ప్రతికూలంగా మారతాయి.

భారత్‌ – చైనా మధ్యలో దూరే అవకాశం లేదు ట్రంప్‌ గారూ !

Tags

, ,

ఎం కోటేశ్వరరావు
భారత్‌ాచైనాల మధ్య వివాదాస్పర సరిహద్దు సమస్యలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రెండు దేశాలకూ తెలియచేశానని కూడా చెప్పారు. మరుసటి రోజు ఇదే అంశంపై మాట్లాడుతూ ” మోడీతో మాట్లాడాను. చైనాతో తలెత్తిన పరిస్ధితి గురించి ఆయన మంచి మానసికస్దితిలో(గుడ్‌ మూడ్‌) లేరని నేను చెప్పగలను.రెండు దేశాలూ సంతోషంగా లేవు” అని కూడా ట్రంప్‌ చెప్పారు. ఇది ఎంతో తెలివిగా చేసిన వ్యాఖ్య. నిజంగా మోడీ ఎలా ఉన్నారో తెలియదు. నీవు నీ భార్యను కొట్టటం మానుకున్నావా అని ఎవరైనా అడిగినపుడు ఏ సమాధానం చెప్పినా తంటాయే. మామూలుగానే మన ప్రధానికి మాట్లాడే అలవాటు లేదు కనుక స్పందన తెలియదు. అయితే మన విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ చైనాతో శాంతియుతంగా పరిష్కరించే పనిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా చైనా కూడా స్పందించింది. ట్రంప్‌ ప్రస్తావన లేకుండా చైనా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ చైనా-భారత్‌ సరిహద్దు విషయంలో చైనా వైఖరి స్పష్టం. శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ట్రంప్‌ జోక్యం అవసరం లేదని చైనా మీడియా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు లడఖ్‌ ప్రాంతంలో తలెత్తిన తాజా పరిణామాల గురించి చైనా వ్యాఖ్యాతలు పరిస్ధితి అదుపులోనే ఉందని చెబుతున్నారు తప్ప మన దేశంలో మీడియా మాదిరి యుద్ధానికి దారి తీస్తుందా అన్నట్లు చిత్రీకరించటం లేదు.
కరోనా వైరస్‌తో సహజీహనం చేయాలంటూ పాలకులు తమ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు పూనుకున్నారు.దరిద్రం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, అక్రమాలు, రోగాలు, రొష్టులు, అంటరానితనం, కులతత్వం, మతోన్మాదం, సామాజిక వివక్ష, అణచివేత ఇలా చెప్పుకొంటే శతకోటి అవాంఛనీయాలతో సహజీవనం చేయటానికి, దేనికీ స్పందించలేని స్ధితికి అలవాటు పడ్దాం.
కరోనా వైరస్‌ మీద కేంద్రీకరించిన మీడియాకు ఇప్పుడు భారతాచైనా సరిహద్దు వివాదం ఒక రేటింగ్‌ సాధనంగా మారింది. యుద్దం వస్తే బాగుండు అన్నట్లుగా కొందరి వ్యవహారం ఉంది. ఎంత రంజుగా రాస్తే అంత గొప్ప, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత కసి ఉన్నట్లు, ఎంతగా జాతీయ(దురహంకారం)వాదాన్ని ప్రదర్శిస్తే అంత గొప్ప దేశభక్తులని భావిస్తున్న ఈ రోజుల్లో భిన్న అభిప్రాయం సంగతి దేవుడెరుగు, భిన్న సమాచారాన్ని పాఠకులు, వీక్షకుల ముందుంచటం కూడా దేశద్రోహంగా ముద్రవేస్తున్న ఒక ప్రమాదకర స్ధితిలో ఉన్నాం.
రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే ముందు బలయ్యేది నిజం. ఇప్పుడు అదే జరుగుతోందా ? చైనా-భారత్‌ సరిహద్దు వివాదం బ్రిటీష్‌ పాలకుల పుణ్యం. కాగితాల మీద గీసిన సరిహద్దుల ప్రకారం ప్రాంతాలు లేవు. ఆయా దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల ప్రకారం సరిహద్దు గీతలు లేవు. తమ ఆధీనంలో లేని ప్రాంతాల మీద హక్కులు తమవే అని రెండు దేశాలూ చెప్పటమే వివాదాలకు కారణం. పరస్పరం సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకోవటం తప్ప మిలిటరీ చర్యల ద్వారా పరిష్కారాలు సాధ్యం కావన్నది ప్రపంచ అనుభవం. రష్యాతో, ఇతర పూర్వం సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి తరువాత స్వతంత్రులుగ మారిన మధ్య ఆసియా దేశాలతో చైనా ఈ పద్దతిలోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంది. మన దేశం కూడా ఇలాగే పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వెలిబుచ్చినందుకు కొందరు కమ్యూనిస్టులను 1962లో నాటి పాలకులు జైల్లో పెట్టారు. చైనాతో యుద్దానికి మద్దతు ఇచ్చిన మరి కొందరు కమ్యూనిస్టులను బయట తిరగనిచ్చారు.
ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప అనుభవం రాదని పెద్దలు చెబుతారు.1962 యుద్దం తరువాత పదమూడు సంవత్సరాలకు 1975లో భారత్‌-చైనా ఒక అవగాహనకు వచ్చాయి. దాని ప్రకారం సరిహద్దుల్లో ఏదైనా వివాదం తలెత్తితే ఏ వైపు నుంచి తుపాకులు పేలకూడదు, తూటాలు బయటకు రాకూడదు. దానికి రెండు దేశాలూ ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నాయి.అయితే మధ్యలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదా ? రెండు దేశాల మధ్య ఉందని చెబుతున్న వాస్తవాధీన రేఖ ఒక ఊహ, తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. దాన్ని అధికారికంగా ఎవరూ గుర్తించటం లేదు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని వారు సంరక్షించుకోవటం, దానిలో భాగంగా కాపలా ఏర్పాట్లు తప్ప నిర్దారణ లేదు. దాన్ని లేదా ఇతర మార్పులు చేర్పులతో గుర్తిస్తే అదే అధికారిక సరిహద్దు అవుతుంది.
సరిహద్దు ఉల్లంఘనలు జరిగాయి అని భావించిన ప్రతిసారీ గతంలో అటూ ఇటూ మోహరించిన సైనికులు చేతులతో తోసుకున్నారు, కాస్త ముదిరితే ముష్ఠిఘాతాలకు తలపడ్డారు, రాళ్లు విసురుకున్నారు. ఈ లోగా రెండు వైపులకూ సమాచారం చేరటం, జోక్యంతో సర్దుమణగటం మామూలైంది.2017 డోక్లాం వివాదంలో 72రోజుల పాటు రెండు వైపులా సైనికులు మోహరించటం తప్ప ఒక్క తూటా, ఫిరంగి పేలలేదు. తాజాగా జరుగుతున్న ఉదంతాలలో ఇనుపరాడ్లు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అసలెందుకు ఇది జరిగింది, జరుగుతోంది ?
సరిహద్దులలో రెండు వైపులా మౌలిక వసతులు క్రమంగా మెరుగుపడుతున్న కారణంగా పహారా పెరుగుతోంది. ఆ ప్రాంతాలకు సరిహద్దు భద్రతా దళాలు చేరేందుకు పెద్దగా వ్యవధి అవసరం లేకపోతోంది. పర్యవసానంగా ఉల్లంఘనలు జరిగాయని భావించినపుడు వివాదాలు చెలరేగేవి.సర్దుబాటు చేసుకొనే వారు. అనేక ఉదంతాలు మీడియా వరకు వచ్చేవి కాదు. వచ్చిన వాటికి వాస్తవం గోరంత అయితే కొండంత కల్పనలతో చెలరేగిపోయేవి.
భారత్‌-చైనా మధ్య లడఖ్‌ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఆక్సారు చిన్‌ ఒక వివాదాస్పద ప్రాంతం. అక్కడ యుద్దం కూడా జరిగింది.అది తొలి నుంచీ తమ ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. కాదు మనదే అని మన దేశం అంటోంది. మన ఏలుబడిలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతం కనుక తమదే అని చైనా చెబుతోంది. ఎన్నడూ టిబెట్‌లో భాగంగా లేదు, మాతోనే ఉంది అని మనం చెబుతున్నాం. ఈ వివాదాన్ని ఎవరు తేల్చాలి ? మూడో పక్షానికి అవకాశం ఇచ్చామా ? అవి అక్కడ తిష్టవేస్తాయి. రెండు దేశాల జుట్లూ చిక్కించుకుంటాయి. మరి ఎలా తేలాలి. సంప్రదింపులు, సంప్రదింపులు, సంప్రదింపులు. రెండు వైపులా చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం అసాధ్యం కాదు.
తాజా వివాదానికి కారణం ఏమిటి ? సరిహద్దు సమస్య పరిష్కారం కానప్పటికీ ఏ దేశానికి ఆదేశం తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో రోడ్లు వేసుకోవటం, మిలిటరీ ఏర్పాట్లు చేసుకోవటానికి ప్రయత్నించినపుడు అదిగో మా ప్రాంతంలో మీరు ఆక్రమణకు పాల్పడ్డారు అని ఉభయులూ వివాదపడతారు. లడక్‌ ప్రాంతంలోని గలవాన్‌ లోయ. సముద్ర మట్టానికి పదిహేనువేల అడుగున ఎత్తు ఉంటుంది. అక్కడ రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ కాశ్మీర్‌ నుంచి మయన్మార్‌ వరకు ఉంది. దాన్ని ఇద్దరూ అంగీకరించరు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో వారు తమ తమ బలగాలను పటిష్టపరచుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గలవాన్‌లోయ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముందుగా భారత్‌ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని వార్తలు. ఇది వివాదాస్పద ప్రాంతంలో జరుగుతోందంటూ అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నించింది. చైనా మిలిటరీ కదలికల తరువాతనే మన ప్రాంతంలో మిలిటరీ వ్యవస్దల నిర్మాణానికి చైనా పూనుకుందంటూ మన దేశం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రెండు వైపులా సైనికులు గుడారాలు వేసుకొని అడ్డుకొనేందుకు కాచుక్కూర్చున్నారు. చైనా వైపున 80 నుంచి వంద గుడారాలు, భారత్‌ అరవై గుడారాలు వేసినట్లు వార్తలు. అటు అన్నివేల మంది సైనికులు ఉన్నారు, ఇటు ఇన్నివేల మంది సిపాయిలున్నారనే వార్తలు అటూ ఇటూ మీడియా విభాగాలు ఒక పధకం ప్రకారం ఇచ్చే లీకులు, ఇష్టాగోష్టి వార్తలు తప్ప ఎవరూ తలలు లెక్కపెట్టింది లేదు. ఇంతకు మించి అటూ ఇటూ ఎలాంటి ఒప్పంద ఉల్లంఘనలు జరిగినట్లు విమర్శలు లేవు.
లడఖ్‌లో దౌలత్‌ బేగ్‌ ఓల్డీ విమానస్దావరాన్ని గతేడాది అక్టోబరులో మన దేశం ప్రారంభించింది.దానికి దారితీసే 66 రోడ్లను 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో మన దేశం నిర్మిస్తోంది. వాటిలో కొన్ని చైనా ఆధీనంలోని గలవాన్‌లోయకు దగ్గరగా ఉన్నాయి. ఒక ప్రధాన రోడ్డు వాస్తవాధీన రేఖకు సమాంతరంగా అనేక పాయింట్లను కలుపుతూ నిర్మితమౌతోంది. దీన్ని చైనా అభ్యంతర పెడుతోంది.ఈ ప్రాంతంలోని కొన్ని ఏరియాలు తమవని చైనా చెబుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 2017లో డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్లు నిర్మించటాన్ని మన దేశం అభ్యంతరం పెట్టింది. అది వాస్తవానికి భూటాన్‌ -చైనా మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతం. అయితే భూటాన్‌తో మనకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, భూటాన్‌ కోరిక మేరకు డోక్లాంలో చైనాను అడ్డుకున్నట్లు మన ప్రభుత్వం చెప్పింది. అయితే అసలు వాస్తవం ఏమిటంటే డోక్లాం మన సిలిగురి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నందున మన భద్రతా ప్రయోజనాలకు ముప్పు అన్నది మన వ్యూహకర్తల ఆందోళన. గత ఏడాది మన దేశం లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. మన మ్యాపులో తమ ఆధీనంలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతాన్ని కూడా లడఖ్‌ ప్రాంతంగా చూపటాన్ని అప్పుడే చైనా అభ్యంతర పెట్టింది. మ్యాపులో చూపినా వాస్తవాధీన రేఖ యథాతధ స్దితి కొనసాగుతుందని మన దేశం ప్రకటించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మించిన రోడ్లపై కూడా చైనా అభ్యంతరాలు తెలిపింది.
గత నాలుగు వారాలలో నాలుగు చోట్ల రెండు దేశాల కాపలా బృందాలు తారసపడ్డాయి. వాటిలో మూడు లడఖ్‌లో, నాలుగోది సిక్కిం దగ్గర టిబెట్‌ను కలిపే నుకాలా కనుమవద్ద అని వార్తలు వచ్చాయి.1993లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎవరైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించినపుడు మీరు అతిక్రమించారు, వెనక్కు పోండి అని చెప్పటం, అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున చైనా సైనికులు చొచ్చుకు వచ్చారని మన మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనా కూడా అదే చెబుతోంది, తమ గలవాన్‌లోయలో భారత్‌ రోడ్డు నిర్మిస్తోందని అంటున్నది. భారత దళాల సాధారణ పహారాకు ఆటంకం కలిగించే విధంగా చైనా వ్యవహరిస్తోందని భారత విదేశాంగశాఖ విమర్శించింది.
మన దేశం-నేపాల్‌ మధ్య ఉత్తరాఖండ్‌లో 62చదరపు కిలోమీటర్ల కాలపానీ ప్రాంతం మన ఆధీనంలో ఉంది. అయితే అది తమ ప్రాంతమని నేపాల్‌ 1998 నుంచి వివాదాన్ని రేపింది. అది పరిష్కారం కాలేదు. మేనెల ప్రారంభంలో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ రిమోట్‌తో ఆ ప్రాంతంలో ఒకరోడ్డు ప్రారంభోత్సవం చేశారు. ఆ చర్యను నేపాల్‌ నిరసించింది. వేరే వారి ప్రమేయంతో నేపాల్‌ ఆ చర్యకు పాల్పడిందంటూ చైనాను ఉద్దేశించి పరోక్షంగా మన సైనికాధికారి ఎంఎం నవరానే వ్యాఖ్యానించారు.1816లో నేపాల్‌, నాటి బ్రిటీష్‌ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందంలో మహాకాళీ నది నుంచి నేపాల్‌ పడమటి సరిహద్దు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అయితే ఆ నది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నదానిపై రెండు దేశాల మధ్య స్పష్టత లేకపోవటం వివాదానికి కారణం.
తాజా పరిణామాలపై రెండు దేశాల సామాజిక, సాంప్రదాయ మాధమాల్లో అనేక అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వాటిని ఇక్కడ పేర్కొంటున్నామంటే ఏకీభవించినట్లు కాదు. మన దేశంలో ట్విటర్లలో వెలువడుతున్న అభిప్రాయాల ఒక మచ్చుతునక ఇలా ఉంది.” సింధు జలాలపై మోడీ పాకిస్ధాన్‌ను బెదిరించినపుడు చైనా బ్రహ్మపుత్ర నీటితో చేస్తుంది.లిపులేఖ్‌ దగ్గర సరిహద్దును మార్చాలని మోడీ నేపాల్‌ మీద వత్తిడి తెచ్చినపుడు చైనా లడఖ్‌లోని వాస్తవాధీన రేఖను దాటుతుంది. మోడీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటమే చైనా పధకం” దీనిలో వాస్తవాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే ప్రతి దేశం తన రాజకీయాలను తాను చేస్తుందన్నది కనిపిస్తోంది.
చైనా మీడియాలో వచ్చిన వార్తలు, విశ్లేషణల సారాంశం ఇలా ఉంది.” తాజా సరిహద్దు వివాదం ఏదో యాదృచ్చికంగా జరిగింది కాదు. భారత్‌ ఒక పధకం ప్రకారమే వ్యవహరించింది. గాలవాన్‌ లోయ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉందని భారత్‌కు స్పష్టంగా తెలుసు. మే తొలి వారంలో చైనా ప్రాంతంలోకి భారత్‌ ప్రవేశించింది, సైన్యం కావాలని రెచ్చగొట్టింది. చైనా పహరా బృందాలకు ఆటంకాలు కల్పించింది. ఆ లోయలో చైనా మిలిటరీది పైచేయి అని తెలుసు కనుక భారత సైన్యం తెగేదాకా లాగుతుందని అనుకోవటం లేదు. ఒక వేళ పరిస్ధితిని దిగజార్చితే భారత మిలిటరీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో వైఫల్యం వలన భారతీయ సమాజం నుంచి వచ్చిన వత్తిడి పెరిగింది. ఇంతకు ముందే బలహీన పడిన భారత ఆర్ధిక పరిస్ధితి కరోనా కారణంగా మరింతగా దిగజారి మాంద్యలోకి పోనుందని గోల్డ్‌మన్‌శాచస్‌ పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీ పలుకుబడి ఉన్నత స్ధాయిలోనే ఉన్నప్పటికీ దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లను అధిగమించటానికి అది పని చేయదు.కనుక స్ధానిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి మరోసారి చైనాతో సరిహద్దు సమస్యను పెంచి పెద్దది చేసేందుకు నిర్ణయించింది. ఆర్ధిక, వైద్య సహాయం కోసం చైనాతో బేరమాడేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సరిహద్దు వివాదాలను రోజువారీ సాధారణ వ్యవహారంగా మార్చేందుకు భారత్‌ పూనుకుంది.ఎందుకంటే సరిహద్దులకు తరచుగా సైన్యాన్ని పంపేందుకు దానికి భౌతిక సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి.కనుక ఇదొక దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. చైనా కంటే భారత్‌కు అంతర్జాతీయ వాతావరణం అనుకూలంగా ఉందని భారత్‌లోని కొందరు పండితులు నమ్ముతున్నారు.చైనా-అమెరికా మధ్య విబేధాలు తీవ్రతరమైతే అమెరికాకు దగ్గరయ్యేందుకు భారత్‌కు అవకాశాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఒకటైతే అంతర్జాతీయ రాజకీయాల కారణంగా తీసుకుంటున్న వైఖరులు కూడా వివాదాన్ని ముదిరేట్లు చేస్తున్నాయి. టిబెట్‌, తైవాన్‌ రెండు ప్రాంతాలూ చైనాలో అంతర్భాగమే అన్నది మన ప్రభుత్వ అధికారిక వైఖరి. అయితే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల మద్దతుతో టిబెట్‌లో తిరుగుబాటు చేసిన దలైలామాను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అణచివేసింది. దాంతో దలైలామా పారిపోయి మన దేశం వచ్చాడు. ప్రాణభయంతో ఆశ్రయం కోరిన వారికి రక్షణ కల్పించటాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ జరిగిందేమిటి ? దలైలామా మన దేశంలోని హిమచల్‌ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రవాస ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించనప్పటికీ ఆ పేరుతో సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించింది. చైనా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పించింది. అనేక చోట్ల నివాసాలను ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగం అని చైనా చెబుతున్నది. అక్కడి తవాంగ్‌ పట్టణాన్ని దలైలామా సందర్శించేందుకు 2009లో యుపిఏ పాలనా కాలంలోనూ, 2017లో మోడీ ఏలుబడిలో మరోసారి సందర్శించేందుకు అనుమతించటాన్ని చైనా వ్యతిరేకించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లు పెట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, తైవాన్‌లను తమ ప్రాంతాలుగా చూపకుండా ముద్రించిన ప్రపంచ మ్యాప్‌లను 2019లో చైనా కస్టమ్స్‌ అధికారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
భారత-చైనాల మధ్య ఉన్న మరో వివాదాస్పద అంశం దక్షిణ చైనా సముద్రంలో జోక్యం. ఈ సముద్ర ప్రాంతం మన దేశానికి ఎంతో దూరంగా ఉంది, దానితో మనకు ఎలాంటి సంబంధం లేదు. మనకంటే ఇంకా ఎంతో దూరంలో ఉన్న అమెరికా ఈ ప్రాంత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రెచ్చగొడుతోంది.దానికి మన దేశం వంతపాడుతున్నట్లు చైనా భావిస్తోంది. ఆ సముద్రంలో ఉన్న కొన్ని దీవులపై హక్కు తమదే అని చైనా చెబుతోంది. మరో సోషలిస్టు దేశమైన వియత్నాంతో సహా ఫిలిఫ్పీన్స్‌, బ్రూనే,మలేషియా, ఇండోనేషియాలు చైనా హక్కు వాదనతో విబేధిస్తున్నాయి. ఆ దీవులలో చమురు, ఇతర సంపదలు ప్రధానమైన అంశం. ఈ వివాదాన్ని అంతర్జాతీయం చేయవద్దని చెబుతూనే దక్షిణ చైనా సముద్రంలో తాము స్వేచ్చగా ప్రయాణించే హక్కు కలిగి ఉండాలని మన దేశం కోరుతోంది. ఈ జలాలపై చైనా హక్కును గుర్తిస్తే ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలు వినియోగ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మనకూ ాచైనా మధ్య ఏవైనా తీవ్ర విబేధాలు తలెత్తితే మనకు ఇబ్బందులు వస్తాయి. మన దేశ వాణిజ్యంలో 55శాతం ఈ ప్రాంతంలోని మలక్కా జలసంధి ద్వారా జరుగుతోంది. ఈ ప్రాంతంలో బలహీనపడుతున్న అమెరికా తన ప్రతినిధిగా భారత్‌ ఉండాలని కోరుకుంటోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధ్యక్ష స్ధానానికి తాజాగా మన దేశం ఎన్నికైంది. ఈ సంస్ధలో స్వతంత్ర రాజ్యాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. అయితే తైవాన్‌కు సభ్యత్వం ఇవ్వాలని, అధికారయుతంగా సమావేశాలకు ఆహ్వానించాలని అమెరికా పట్టుపడుతోంది. అందుకు చైనా ససేమిరా అంటోంది. మన దేశం తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందిందే అని అధికారిక వైఖరిని కలిగి ఉన్నప్పటికీ బిజెపి దానికి కట్టుబడి ఉండటం లేదు. అమెరికా క్రీడలో పావుగా వ్యవహరిస్తోంది. చైనాకు చెందిన ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌. అక్కడ జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన పార్టీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటీవల అధ్యక్షురాలు శారు ఇంగ్‌ వెన్‌ అధికారస్వీకారోత్సవానికి బిజెపికి చెందిన మీనాక్షీ లేఖి మరొక ఎంపీని ఆహ్వానించారు. ఆ మేరకు వారు ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది తమను రెచ్చగొట్టే చర్యగా చైనా పరిగణిస్తోంది.
ఈ నేపధ్యంలో తాజా పరిణామాలను ఏ విధంగా చూడాలి అన్నది సమస్య. అంతర్జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలలో ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరొక దగ్గర లైట్‌ వెలగటం తెలిసిందే. ఏ దేశంతో అయినా ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రత్యేకించి ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉండటం ఎంతో అవసరం. దాని వలన బోలెడు మిలిటరీ ఖర్చు తగ్గిపోయి, అభివృద్ధికి వెచ్చించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీ, జపాన్‌లు ఆ యుద్దం ముగిసిన తరువాత రెగ్యులర్‌ మిలిటరీ కలిగి ఉండటానికి వీల్లేదని విజేతలు శాశించారు. అప్పటి నుంచి ఆత్మరక్షణ దళాల పేరుతో పరిమితి సాయుధ బలగాలే ఉన్నాయి. మిలిటరీకి చేసే ఖర్చును ఆ రెండు దేశాలు పరిశోధన, అభివృద్ధికి ఉపయోగించి పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో అభివృద్ది చెందాయి. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధలే ఉన్నందున దానిలోని అంతర్గత వైరుధ్యాల కారణంగా అవి కూడా సమస్యలను ఎదుర్కొంటున్నా మిగతా దేశాల కంటే మెరుగ్గానే ఉన్నాయి.
ఏ రీత్యా చూసినా ఇప్పుడు ఏ దేశమూ యుద్దం చేయగల స్ధితిలో లేదు. అటు గ్జీ జింపింగ్‌, ఇటు నరేంద్రమోడీ వెనుక 140 కోట్ల మంది చొప్పున జనం ఉన్నారన్నది మర్చిపోకూడదు. ప్రస్తుత పరిస్ధితుల్లో రెండు దేశాల సరిహద్దు భద్రతా బలగాల మధ్య తలెత్తిన వివాదం గతంలో ముందుకు వచ్చిన వాటికంటే భిన్నమైనది, తీవ్రమైనది అని చెబుతున్నవారితో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇది ఇంతకు మించి మిలిటరీ చర్యలకు దారి తీసే అవకాశాలు పరిమితం. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం పేరుతో దూరేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టి పరిస్ధితుల్లోనూ నెరవేరదు. అది తన అనుయాయులను సంతృప్తిపరచినా ఒక ప్రధానిగా నరేంద్రమోడీ అంగీకరించే అవకాశం లేదు. 1. రెండు దేశాలూ కరోనా వైరస్‌ మీద పోరాడుతున్నాయి. చైనాలో కరోనాను కట్టడి చేసినా ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మన దేశంలో కట్టడి చేశామని చెబుతున్నప్పటికీ అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. గతంలో కంటే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విదేశాల నుంచి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి నుంచి కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. మనకు ఇంకా ముప్పు తొలగలేదు. 2.కరోనా కారణంగా చైనాలో ఒక్క హుబెరు రాష్ట్రమే లాక్‌డౌన్‌లో ఉంది. మన దేశం మొత్తం ఉంది. అక్కడ ఆర్ధిక కార్యకలాపాలూ పూర్తిగా కొద్ది వారాల క్రితమే ప్రారంభం అయ్యాయి. మన దగ్గర ఇంకా అనిశ్చితంగానే ఉంది. 3.కరోనాకు ముందే మన దేశం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయింది. చైనాలో అలాంటి పరిస్ధితి లేకపోయినా వృద్ది రేటు తగ్గింది. కరోనా అనంతరం దాని వృద్ధి రేటు రెండున్నరశాతం వరకు ఉండవచ్చని అంచనాలు వెలువడుతుండగా మనది మైనస్‌ ఆరుశాతం వరకు ఉండవచ్చు అంటున్నారు. స్వల్ప యుద్దం జరిగినా రెండు దేశాలూ నష్టపోతాయి, ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు, ఎంతో మిగులులో ఉన్న చైనాతో పోలిస్తే వాణిజ్య లోటుతో ఉన్న మన నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
భారత్‌-చైనాలు రెండూ అణ్వస్త్రదేశాలే కనుక యుద్దమంటూ వస్తే పరస్పరం నాశనం తప్ప విజేతలంటూ ఉండరు. రెండూ వర్ధమాన దేశాలే కనుక యుద్దం కంటే జనజీవితాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి.భారత-పాకిస్ధాన్‌ మధ్య యుద్దం వస్తే ఆయుధాలు అమ్ముకొని లాభపడేది అమెరికా.భారత-చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా జరిగేది అదే. కనుక సంప్రదింపుల ద్వారా తాజాగా తలెత్తిన ఉద్రిక్తతలను ఉపశమింప చేసేందుకు ప్రయత్నించాలి. జాతీయవాదం, దురహంకారాన్ని రెచ్చగొట్టటం సులభం, దాన్నుంచి వెనక్కు రావటం ఎంతో కష్టం. అది సామాన్యుల్లో తలెత్తితే సమసిపోతుంది, కానీ పాలకులకే ఆ వైరస్‌ అంటుకుంటే ఏం జరుగుతుందో గతంలో చూశాము. చరిత్ర పునరావృతం కారాదని కోరుకుందాం.

అచ్చేదిన్‌ నుంచి ఆత్మనిర్భరత వరకు….ఆరేండ్ల మోడీ పాలన ?

Tags

, ,


ఎం కోటేశ్వరరావు
తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోరు చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలా చూస్తే ఈనెల 30 తేదీకి నరేంద్రమోడీ2.0పాలనకు ఏడాది పూర్తి, ఖాతాలో ఆరేండ్లు జమ చేసుకోవటం తప్ప ఏం సాధించారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. సాధారణంగా చివరి సంవత్సరంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకుల వైఫల్యాల గురించి చర్చ ప్రారంభం అవుతుంది. కానీ చిత్రం ఏమిటంటే మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తొలి ఆరునెలల్లోనే దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితికి కారకులు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. దిగ్గజాలనిపించుకుంటున్న మన మంత్రులు హాస్యభరితమైన సమాధానాలు చెబుతుండగా కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ అది వెనక్కు పోయింది. కరోనా వైరస్‌ పేరుతో వైఫల్య వైరస్‌ బయటకు రాకుండా ఎంతకాలం, ఎలా కాపాడతారో దేశం చూడనుంది.
ఏడాది పాలన మంచి చెడ్డల కంటే ముందుగా కరోనా నిరోధ చర్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి వచ్చిన విమర్శలకు అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు విన్యాసాలు చేసేందుకు భయపడుతున్నారు.ఎంత ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తే అంత ఎక్కువగా జనంలో పలచనౌతారు. ఏడాది పాలన ఉత్సవాలను ఎలా చేసుకుంటారో, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, జనం ఏవిధంగా చూస్తారో చూద్దాం. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రెండవ ఇన్నింగ్స్‌లో తరచూ విఫలమయ్యాయరన్నది ఒక విశ్లేషణ. రాజకీయాల్లో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోడీకి ఇది వర్తిస్తుందా?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చేతులు కడుక్కోవటం ఒకటి.పేరుకు 20లక్షల కోట్ల రూపాయల పాకేజ్‌ అని ప్రకటించినప్పటికీ రెండున్నర లక్షల కోట్లకు మించి ఖజానా నుంచి ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులు కడిగేసుకోవటాన్ని చూశాము. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపితే అదిగో చూడండి పాకేజ్‌ను అర్ధం చేసుకోకుండా లోపాలు వెతికేందుకు పూనుకున్నారు అంటూ నిర్మలమ్మ ఎగిరి పడ్డారు.
2024 నాటికి మన ఆర్ధిక వ్యవస్ధను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి పెంచాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సర్వేజనా సుఖినో భవంతు మాదిరి ఐదు కాదు ఆయన మంత్రదండంతో పదిలక్షల కోట్లకు పెంచినా మంచిదే, దాంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా సాధిస్తారన్నదే కదా సమస్య. దానికంటే ముందు 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న వాగ్దానం గురించి మాట్లాడటం మానేశారు. ఒకసారి చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకపోవటమే కదా అనితర సాధ్యమైన నరేంద్రమోడీ ప్రత్యేకత. గతంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, చివరికి బిజెపికే చెందిన వాజ్‌పారు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు విమర్శిస్తే ఎక్కడ దేశ ద్రోహి అంటారో, తుకడే తుకడే గాంగ్‌ అని ముద్రవేస్తారో అని ప్రముఖ పారిశ్రామికవేత్తల మొదలు మేథావుల వరకు ఎవరూ ప్రభుత్వ విధానాలు,వాటి పర్యసానాల గురించి మాట్లాడేందుకు భయపడి చస్తున్నారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలు, ఢిల్లీ మతదాడులతో మలివిడత తొలి ఏడాది ప్రారంభంలో ఆర్టికల్‌ 370, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ముమ్మారు తలాక్‌ రద్దు వంటి విజయగానాలు మూగపోయాయి. ఏదో ఆరోజు అలా అనుకున్నాం అని గాక ఆర్టికల్‌ రద్దు, కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు వలన ఆ రాష్ట్ర ప్రజలకు, మొత్తంగా దేశ ప్రజలకు జరిగిన మంచి ఏమిటో మోడీ లేదా మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు జనానికి ఈ సందర్భంగా చెప్పాలి. ఏదో ఒక రోజు కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత జరుగుతుంది తప్ప గత ఏడాది ఆగస్టు 5న ప్రకటించిన కాశ్మీర్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేత కనుచూపు మేరలో కనిపించటం లేదు. దాన్ని సమర్ధించిన పార్టీలేవీ మాట్లాడటం లేదు. అది ఇంక శాశ్వతం అన్నట్లుగా జనాలు కూడా ఆలోచించటం మానుకున్నారు. దాని గురించి మాట్లాడేందుకే పాలక పార్టీ భయపడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ మరింత సంక్షోభంలోకి కూరుకుపోకుండా చూసేందుకు ఊబిలో ఉన్న జనాలను రక్షించేందుకు గాక వెలుపల ఉన్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెడితే తాము కూడా ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని వారు ముందుకు రావటం లేదు. బంగారు బాతులను కోసి గుడ్లు తీసుకున్నట్లుగా ఎల్‌ఐసి, చమురు సంస్ధల వాటాల విక్రయం, ప్రయివేటీకరణ అజెండా గురించి వేరే చెప్పనవసరం లేదు.
దేశంలో హిందువులున్న ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, వాటి సరసన ఆయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో మరో ఆలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పు అవకాశం ఇచ్చింది. రాముడి మనోభావాలకు విలువ ఇచ్చిన ఉన్నత న్యాయస్ధానం వలస కార్మికుల విషయంలో మేమేం చేస్తామంటూ కడిగేసుకుంది. తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు అవకాశం, వ్యవధి ఇవ్వకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాది మంది పడిన ఇబ్బందులు మోడీ సర్కార్‌కు తొలి ఏడాది పాలనలో మాయని మచ్చగా మారాయి. ఎన్ని మరకలు పడితే అంత మంచిది అని భావించే వారిని అవి బాధించవు. అన్నింటికీ మించి 20లక్షల కోట్ల జుమ్లా పాకేజ్‌ మోడీ సర్కార్‌ బూటకాన్ని మరోసారి బట్టబయలు గావించింది. మన ప్రజారోగ్య వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో మహమ్మారుల సమయంలో వైద్యులు, సిబ్బందికి కనీసం అవసరమైన ముఖతొడుగులు, పిపిఇ కిట్స్‌ కూడా అందించలేని దుస్ధితిని కరోనా వెల్లడించింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్లతో వైరస్‌ను అరికట్టవచ్చని ముఖ్యమంత్రులే చెప్పారు.
ఏడాది పాలన సందర్భంగా వందిమాగధులు చప్పట్లు కొట్టే పరిస్ధితి లేదు, అభిమానులు దీపాలు వెలిగించి హారతులు పట్టేంత గొప్పలేమీ లేవు. పూలు చల్లి పూజలు చేసే మహిమలేవీ మోడీ బాబా ప్రదర్శించలేదు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేని దానిని లేదా చేసిన నిర్వాకాలను మేము ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని బిజెపి నేతలు చెప్పుకున్నారు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఒక కవి చెప్పిన మాటలను ఆ పార్టీకి అన్వయించుకోవలని వారే స్వయంగా రుజువు చేసుకున్నారు. మచ్చుకు ఒకదానిని చూద్దాం. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం రూ. 46,15,250 కోట్లు కాగా 2019-20కి రూ.100,18,120 కోట్లు. సెంచురీ సాధించిన ఘనత కచ్చితంగా మోడీదే. నాటి నెహ్రూ మొదలు మధ్యలో వాజ్‌పేయితో సహా మన్మోహన్‌ సింగ్‌ వరకు చేసిన అప్పుల బకాయిల కంటే అరు సంవత్సరాలలో మోడీ గారి ప్రగతి ఆకాశానికి ఎలా ఎగిరిందో వ్యాఖ్యలు అవసరం లేదు. జనానికి ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీల రద్దు తరువాత జరిగినది ఈ పురోగతి.
వృతం చెడ్డా ఫలం దక్కలేదు. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను కరోనాకు ముందు, తరువాతగా చూసేట్లయితే మోడీ 2.0 రెండవ ఏడాది ఎదుర్కోబోయే సవాలు అర్ధం అవుతుంది.లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మార్చి 25న దేశంలో నిరుద్యోగుల శాతం 7.58శాతంగా ఉందని సిఎంఐయి విశ్లేషణ పేర్కొన్నది. అదే మేనెల 24న 24.6శాతంగా తెలిపింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఇది ఎలా మారుతుందో చూడాల్సి వుంది. ఏప్రిల్‌ నెలలో పెద్ద రాష్ట్రాలలో గరిష్టంగా తమిళనాడులో 49.8శాతం ఉంది, కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో 75.8శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 20.5, తెలంగాణాలో 6.2శాతం ఉన్నట్లు సిఎంఐయి తెలిపింది. దేశ ఆర్ధిక రంగంలో వైఫల్యాలు లేదా ఎదురువుతున్న సవాళ్ల గురించి మచ్చుకు ఇవి చాలు. ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?
గాంధీ, నెహ్రూలే అని ఆరు సంవత్సరాల ఏలుబడి తరువాత మోడీ పరివారం చెబితే నడవదు, భక్తులు కూడా మరీ అంతగా కమలం పువ్వులు ఎక్కువ కాలం పెట్టుకోలేరు. మోడీ సర్కార్‌ చెప్పుకున్నట్లు చైనా కంటే అధిక వృద్ధి రేటు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా, ఎక్కువగా ఉన్న మన దేశం ఒక్కసారిగా తిరోగమనంలోకి జారిందన్నది కాదనలేని వాస్తవం. త్వరలో మాంద్యంలోకి పోబోతున్నదని అందరూ అంగీకరిస్తున్న అంశం. అనాలోచితంగా మోడీ ప్రకటించిన 2016నాటి పెద్ద నోట్ల రద్దు,తరువాత తగినంత కసరత్తు లేకుండా ప్రవేశపెట్టిన జిఎస్‌టి, తదితర అంశాలు అంతగా అంతుబట్టని ఆర్ధిక గొలుసుకట్టు రాతను జనం అర్ధం చేసుకొనే తరుణం వచ్చింది.
యుపిఏ హయాంలో ముడుపులు తీసుకొని కాంగ్రెస్‌ మంత్రులు ఫోన్లు చేసి లక్షల కోట్ల రూపాయలను ఆశ్రిత పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రుణాలుగా ఇప్పించారని, తీసుకున్నవారంతా ఎగవేస్తున్నారని, దానికి బాధ్యత కాంగ్రెస్‌దే, ఫోన్‌ బ్యాంకింగ్‌ అంటూ ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్న బిజెపి తన ఏలుబడిలో ఆ అప్పులను రద్దు చేస్తున్నది లేదా ఎంతో కొంత వసూలు చేసి లావాదేవీలను మూసివేయమంటున్నది. నాడు అప్పులు ఇప్పించినందుకు కాంగ్రెస్‌కు ఎన్ని ముడుపులు ముట్టాయో వాటిని రద్దు చేస్తున్నందుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువే బిజెపికి ముడుతూ ఉండాలి. లేకుంటే ఉత్తి పుణ్యానికే రద్దు చేస్తారా ? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిజెపి నేత నళిన్‌ కోహ్లీతో చెప్పినట్లుగా బిజెపి సోషల్‌ మీడియా వేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం సిబిఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌.కాగ్‌(మూడు సి’లు) గురించి భయపడాల్సిన పనిలేదని, అర్హులైన వారికి ఉదారంగా రుణాలివ్వాలని, నిర్ణయం తప్పయినా, ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం నూరుశాతం హామీగా ఉంటుందని బ్యాంకు, ఆర్ధిక సంస్ధల అధికారులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఎక్కడా ఖండించినట్లు కనిపించలేదు. అంటే ఆర్ధిక సంస్ధల ఉన్నతాధికారులు, బడాబాబుల బంధం మరింత గట్టిపడి రాబోయే రోజుల్లో జనం సొమ్ము లూటీ చేసేందుకు హామీ ఇవ్వటం తప్ప ఇది వేరు కాదు. కాంగ్రెస్‌ నేతలు అనధికారికంగా సిఫార్సులు చేసినా మేం చూసుకుంటామని ఎక్కడా చెప్పలేదు, పోయినోళ్లే మంచోళ్లు అనిపిస్తున్నారు బిజెపి నేతలు.
మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యానికి ద్రవ్య వ్యవస్ధను ప్రయివేటీకరించకపోవటమే అని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ లాబీ చెబుతోంది. రుణాల వృద్ది రేటు బలహీనంగా ఉందని, మూడింట రెండు వంతుల బ్యాంకింగ్‌ ఆస్ధులను ప్రభుత్వ రంగబ్యాంకులే అదుపు చేస్తున్నాయని, గత ఆకస్మిక రుణ వృద్ధి తరువాత నిరర్ధక ఆస్తుల్లో 90శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వరంగ బ్యాంకులను తెగనమ్మకుండా వాటిని సంస్కరించటానికి పూనుకున్నట్లు నిషఉ్ఠరాలాడుతున్నారు. 2008 సంక్షోభంలో ప్రయివేటు రంగ బ్యాంకులు ఇతర దేశాల్లో ఎలా కుప్పకూలాయో చూసిన తరువాత మన దగ్గర అలాంటి సంక్షోభం తలెత్తకపోవటానికి కారణం బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటం అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులను దెబ్బతీసేందుకు, ప్రయివేటు పరం చేసేందుకు వత్తిడి తెస్తున్నారు.
ి ఏడవ వేతన సంఘ సిఫార్సుల ప్రభావం తొలి రోజుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ అది తగ్గిపోవటం ప్రారంభమైందని ఆర్ధిక వ్యవస్ధ మందగించటానికి ఇది ఒక కారణమన్నది ఒక అభిప్రాయం. ఆర్ధిక పునరుద్దరణకు వడ్డీ రేట్ల తగ్గింపు జిందాతిలిస్మాత్‌ కాదు.పరిమిత ప్రయోజనాలు మాత్రమే ప్రతికూల పర్యవసానాలు కూడా వెంట ఉంటాయి. అనేక దేశాల్లో సున్నా లేదా ఒకటి రెండు శాతమే వడ్డీ రేటు ఉన్నా అవి ఆర్ధిక సుడిగుండాల నుంచి బయటపడటం లేదు.
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చైనా కంటే అధికంగా నరేంద్రమోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని ఊదరగొట్టిన వారు, తిరోగమనం ప్రారంభం కాగానే మాట మార్చారు. మన మందగమనానికి కారణం ప్రపంచ వ్యవస్ధ లేదా అన్ని దేశాల మాదిరిగానే మనదీ సమస్యలను ఎదుర్కొంటోందంటూ విమర్శకులపై ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ మందగమనానికి మన దేశం ప్రాధమిక కారణమని, సులభలెక్కల్లో అయితే 80శాతం అని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధికవేత్త గీతా గోపీనాధ్‌ జనవరినెలలో దవోస్‌ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో చెప్పారు.భారత అభివృద్ధి మందగించిన కారణంగానే ప్రపంచ సూచికలను తగ్గించాల్సి వస్తోందన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా నామమాత్రమని అమెరికా-చైనాల మధ్య సాగుతున్న వాణిజ్యపోరు, అమెరికా-ఇరాన్‌ వైరం, అమెరికా నుంచి ఐరోపా, రష్యా వరకు ఏ ఒక్క దేశంలోనూ పురోగతి కనిపించటం లేదు, ఇవన్నీ మన దేశాన్ని దెబ్బతీస్తున్నాయి తప్ప మనం కారణం అనటం ఏమిటనిఅనేక మంది ఆర్దికవేత్తలు గీతపై రుసరుసలాడారు. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తి పర్యవసానాల గురించి అంచనాలు లేక ముందు జరిగిన చర్చ అంశాలు. కరోనాకు ముందు 2019లో మన ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు అక్టోబరు అంచనాలో 6.1శాతం కాగా తరువాత 4.8శాతానికి ఐఎంఎఫ్‌ తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 6.8శాతం నుంచి జనవరిలో ఐదు శాతానికి తగ్గించింది. వాస్తవంలో ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు 2020లో మనదీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఎంత శాతమో ఇంకా తెలియదు గానీ తిరోగమనమే అని చెప్పగా పదిహేనవ ఆర్ధిక సంఘం చైర్మన్‌ ఎన్‌కె సింగ్‌ మాత్రం మైనస్‌ ఆరు నుంచి ఒకశాతం మధ్య ఉంటుందన్నారు. చైనాకు సంబంధించి గణనీయంగా తగ్గినా పురోగమనమే తప్ప తిరోగమం కాదని అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.
క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధిక వేత్త డికె జోషి ప్రపంచ ఆర్ధిక మందగమనానికి భారత్‌ కారణం అనటాన్ని తోసిపుచ్చారు. మూలము ధనిక దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పాకుతుంది అన్నారు.భారత మందగమనానికి స్ధానిక అంశాలే మొత్తంగా కారణం అన్నారు. అంకెల రీత్యా భారత్‌ ప్రభావం చూపినట్లు కనిపించవచ్చుగానీ భౌతికంగా కాదు అన్నారు. కొనుగోలు శక్తి తుల్యత(పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ) ప్రాతిపదికన అభివృద్ధి రేటును లెక్కిస్తే ప్రపంచంలో భారత్‌ మూడవ పెద్ద దేశం.(2020 అంచనాల ప్రకారం చైనా 27.8, అమెరికా 20.29, భారత్‌ 11.32, జపాన్‌ 5.45, రష్యా 4.18 లక్షల కోట్ల డాలర్ల వంతున తొలి ఐదు స్ధానాల్లో ఉన్నాయి. కరోనా ఈ అంకెలను ఎలా మారుస్తుందో తెలియదు.) భారత మందగమనం కానసాగటానికి కారణం ద్రవ్య రంగ సమస్యలు. వస్తు ఉత్పత్తి, సేవలు, ద్రవ్య రంగం ఒకదానికి ఒకటి సాయపడాల్సి ఉంది. ఆర్ధికవ్యవస్దకు ఉత్తేజం, ఉల్లాసం కలిగించే సామర్ధ్యం దేశ ద్రవ్యవిధానాలకు పరిమితంగా ఉంది, కాబట్టి ముడి చమురు ధరలు, రుతుపవనాల మీద అదృష్టం ఆధారపడి ఉంటుందని జోషి చెప్పారు.
ప్రపంచ-భారత ఆర్ధిక సంస్ధలు పరస్పర ఆధారితమైనవి.అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పినట్లు వర్తమాన భారత మందగమనాన్ని బయటి అంశాలు తీవ్రం చేశాయి. అయితే స్ధానిక సమస్యలే దానికి మూలం అన్నది ముఖ్యమని గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్రం, గిరాకీ(డిమాండ్‌) పడిపోవటం, పెట్టుబడుల రేటు తీవ్రంగా పడిపోవటం, పెద్ద నోట్ల రద్దు, లోపాలతో కూడిన జిఎస్‌టి భారత వృద్ధి రేటు పడిపోవటానికి ప్రాధమిక కారణాలు అని ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ రంగాలలో అమెరికా, ఐరోపా యూనియన్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలే మన దేశీయ అభివృద్ధికి ప్రతికూలంగా మారాయని బిజెపి ఆర్ధిక వ్యవహారాల ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్‌ చెప్పారు. దేశ ఆర్ధిక వృద్ధి కంటే నరేంద్రమోడీ తన రాజకీయ, సామాజిక అజెండాను నెరవేర్చుకోవటం మీదే కేంద్రీకరించిన పర్యవసానమే మందగమనం అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు.
దేశ ఆర్ధిక మందగమనానికి నెహ్రూ, ఇందిరా గాంధీలే కారణం అని చెప్పవద్దని శివసేన పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది. అధికారాలన్నీ చేజిక్కించుకొని మంత్రులకు అధికారం లేకుండా చేసిన ప్రధాన మంత్రి కార్యాలయమే ఒక ప్రధాన కారణమని, ఆర్ధికం అంటే షేర్‌ మార్కెట్‌ జూదంగా భావిస్తున్న బిజెపి నాయకత్వం ఆర్ధికవేత్తలు చెప్పేది వినటం లేదని పేర్కొన్నది.
” టీవీలలో చూపే లెక్కల జోలికి మీరు పోవద్దు, దేశం ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా ఎదగాలంటే పన్నెండుశాతం వంతున ఎదగాలి. ఈరోజు ఆరుాఏడుశాతం చొప్పున పెరుగుతున్నది. మీరు ఆలెక్కల్లోకి పోవద్దు గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలు ఎప్పుడూ ఉపయోగపడలేదు ” (ఐనిస్టీన్‌ పుట్టటానికి దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే న్యూటన్‌ ఆ సిద్దాంతాన్ని కనుగొన్నాడు. ఐనిస్టీన్‌ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని కనుగొన్నాడు. అవి రెండూ లెక్కల ప్రాతిపదికగా చెప్పినవే ) అని చెప్పిన మంత్రి పియూష్‌ గోయల్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలో మాంద్యం ఎందుకు వచ్చిందంటే జనాలు ఊబర్‌,ఓలాలు వినియోగించటమే కారణం అని చెప్పిన నిర్మలాసీతారామన్‌, మూడు సినిమాలు కిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తుంటే ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడ అని ప్రశ్నించిన రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి వారు నరేంద్రమోడీ కొలువులో మంత్రులుగా ఎన్ని ఉత్సవాలు చేసుకున్నా, ఎంతకాలం పదవుల్లో ఉన్నా దేశ మందగమనానికి అసలైన కారణాలు, బాధ్యుల గురించి వారి నోట వినగలమా ?

అన్నీ శుభసూచనలే అయినా నరేంద్రమోడీకి ఎందుకీ అపశకునాలు !

Tags

, , , , , ,

Slowdown blues: State of Indian economy and its fragile-five past ...

ఎం కోటేశ్వరరావు
కరోనా విపత్తు సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇస్తున్న పిలుపులు, వాటి తీరుతెన్నులను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మోడినోమిక్స్‌ ద్వారా అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్ధికి గాను చేసిన కృషికి చరిత్రలో మన ప్రధానుల్లో ఎవరూ పొందని విధంగా రెండు సంవత్సరాల క్రితం సియోల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి, ప్రస్తుత మోడీ ఒకరేనా అన్న అనుమానం కలగకపోదు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎన్ని పిలుపులు, ఎంత హడావుడి చేశారు. గతంలో మాదిరి స్వదేశీ వస్తువులనే కొనండి అన్న పిలుపు తిరిగి ఇస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారేమో ” స్వదేశీ వస్తువులనే అడగండి ”(వోకల్‌ ఫర్‌ లోకల్‌ ) అని ఇచ్చిన పిలుపు నిజంగానే వీనుల విందుగా ఉంటుంది. నరేంద్రమోడీ, ఆయన మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద పెద్ద స్వదేశీ లేదా భారతీయ నామాలు పెట్టుకొని జనం ముందు ప్రదర్శిస్తున్నా ఆచరణలో ఎక్కువగా విదేశీ వైపు మొగ్గుచూపటం నగ సత్యం. ప్రపంచ దేశాల వారందరూ వచ్చి మన దేశంలో ఖాయిలా పడిన లేదా అమ్మకానికి పెట్టిన కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఆంక్షలు విధించని, కొన్ని రంగాలలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడుల విషయంలో తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. అది ప్రపంచ వాణిజ్య సంస్ధ, స్వేచ్చా వాణిజ్య విధానాలకు వ్యతిరేకం అని చైనా విమర్శించింది. అయితే ఇదే మోడీ సర్కార్‌ చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ఇంతకాలం ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధించలేదు అన్న ప్రశ్నకు జవాబు లేదు. పెట్టుబడులు వద్దు-దిగుమతులు ముద్దు అని చెబుతారా ? పళ్లూడ గొట్టుకొనేందుకు అమెరికా రాయి హాయి నిస్తుంది, చైనా రాయి బాధనిస్తుంది అంటారా ?
మన దేశ ఆర్ధిక సంస్కరణల చరిత్రను చూసినపుడు అవి బాధ ఉపశమనానికి పైపూత ఔషధాల మాదిరిగా పని చేశాయి తప్ప చైనా మాదిరి మన దేశం ఒక ఆర్ధిక శక్తిగా ఎదగటానికి గానీ, సామాన్యుల జీవన స్ధితిగతులు మెరుగుపడేందుకు గానీ తోడ్పడలేదు. మన దేశమే కాదు అనేక లాటిన్‌ అమెరికా దేశాలు సంస్కరణల పేరుతో అనేక చర్యలు తీసుకున్నాయి ఏ ఒక్కటీ చైనా మాదిరి లబ్ది పొందలేదు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మనది ప్రజాస్వామ్యం అక్కడి మాదిరి మనకు కుదరదు అని ఎవరైనా చెప్పవచ్చు. అలాంటపుడు చైనాతో పోల్చుకోవటం ఎందుకు? త్వరలో చైనాను అధిగమిస్తామని ప్రగల్భాలు పలకటం ఎందుకు ? కమ్యూనిస్టు చైనా మాదిరిగాక పోతే మిగతా దేశాల మాదిరి పురోగమించకుండా అడ్డుకున్నదెవరు ? అత్యంత పేద దేశం, ఫ్రెంచ్‌, జపాన్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుద్ధాలు సాగిన వియత్నాం సాధించిన మేరకు అయినా మనం ఎందుకు ఎదగలేకపోయాం.2018లో ప్రపంచ ఎగుమతుల్లో మన దేశం 323,056,409,000 డాలర్లతో 18వ స్ధానంలో ఉండగా వియత్నాం 290,395,445,000 డాలర్లతో 22వ స్ధానంలో ఉంది. తొమ్మిదిన్నర కోట్ల జనాభాగల ఆదేశం ఎక్కడ 140 కోట్లు గల మనం ఎక్కడ ?

Slowdown: Does the Narendra Modi govt even understand what is ...
మన దేశంలో అమలు జరిపిన ప్రతి దశ సంస్కరణల లక్ష్యం గురించి ఎన్ని తీపి కబుర్లు చెప్పినా, పర్యవసాన మన మార్కెట్‌ను విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు, ద్రవ్యపెట్టుబడికి మరింతగా తెరవటమే అన్నది చేదు నిజం. స్వాతంత్య్రానికి ముందు పరాయి బ్రిటీష్‌ పాలకులు మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తే విదేశీ కార్పొరేట్లు ఇప్పుడు మనలను పరోక్షంగా నడిపిస్తున్నారు. నాడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తే కాషాయ దళాలు వారికి సేవ చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు మాత్రమే విదేశీ పెత్తనం, కార్పొరేట్‌ దోపిడీని వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్‌, బిజెపి, ఆ ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు విదేశీ, కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నాయి. మన దేశ ఫెడరల్‌ వ్యవస్ధ మౌలిక లక్ష్యాలను దెబ్బతీసే విధంగా వివిధ రంగాలలో రెగ్యులేటరీ వ్యవస్ధల ఏర్పాటుకు ఆద్యుడు బిజెపి నేత వాజ్‌పేయి, ఆయన హయాంలోనే నాంది పలికారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు కూడా అలాంటిదే. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రంగు వేశారు, ఆర్‌టిసి బస్సులకు ఈ రంగు వేశారంటూ గుండెలు బాదుకుంటున్న, సమర్ధించుకుంటున్న తెలుగుదేశం-వైసిపిలు రాష్ట్ర అధికారాలను హరించి వేసే ఈ బిల్లు విషయంలో కేంద్రానికి భజన చేస్తున్నాయి. తెలుగుదేశం బహిరంగంగా ప్రకటిస్తే వైసిపి తన వైఖరిని ప్రకటించేందుకు భయపడుతోంది.
దేశమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అన్న గొడవలో ఉంటే ఇక నరేంద్రమోడీ హయాంలో మరో దఫా సంస్కరణలకు ఇదే సరైన తరుణం అని కార్పొరేట్‌ మీడియా చెవిలో జోరిగలా తొలుస్తోంది. సినిమాల్లో క్లబ్‌డాన్సర్లు నృత్యం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఒంటి మీది దుస్తులు ఒక్కొక్కటి తొలగిస్తూ జనాలకు మత్తు ఎక్కిస్తుంటారు. మన దేశంలో సంస్కరణల ద్వారా ఒక్కొక్క రంగాన్ని తెరుస్తూ అదే మాదిరి విదేశీ సంస్ధలకు కిక్కు ఎక్కిస్తున్నారు. ఒక మోజు తీరగానే కొంత కాలానికి మరో కొత్తదనం(సంస్కరణ) కావాలనే డిమాండు ముందుకు వస్తోంది. 1991 తరువాత ప్రతి సంస్కర్త పాలనాకాలం వైఫల్యంతోనే ముగిసింది. మరో ముఖ్య అంశం ఏమంటే 2014 ఎన్నికల్లో తప్ప అంతకు ముందు జరిగిన ప్రతి ఎన్నిక సంకీర్ణ కూటములకే తీర్పు ఇచ్చింది. ఏక పార్టీ ఆధిపత్యం లేదు. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన వారు తమ వైఫల్యాలకు దాన్నొక కారణంగా చెప్పుకున్నారు. కిచిడీ ప్రభుత్వాలంటూ రాజకీయంగా బిజెపి ఆ పరిస్ధితిని బాగా వాడుకుంది. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి అలాంటి సమస్యలు లేకుండా ఒకటికి రెండు సార్లు జనం తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. మేము సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సి ఉంది, పూర్తి మెజారిటీ లేదు, ఉంటే మా తడాఖా ఏమిటో చూపే వారం అని చెప్పుకొనే అవకాశం లేకుండా చేశారు.
నిర్ణయాత్మక ప్రజాతీర్పే కాదు, నరేంద్రమోడీ నాయకత్వానికి గత ఆరు సంవత్సరాలలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. అత్యధిక రాష్ట్రాలలో ఆ పార్టీ పాలనే సాగుతోంది. అయినా అనేక అంశాలలో గత రికార్డులను తలదన్నే వైఫల్యాలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. వాటికి తగిన చికిత్సబదులు వేరే మార్గాలను ఎంచుకొంటోంది. వాటికి మరో తరం సంస్కరణలు అని ముద్దు పేరు పెడుతోంది. 1991 సంస్కరణలతో ఎన్నో ఆశలు పెంచుకున్న నాటి యువతీ యువకులకు వరుస వైఫల్యాలకు కారణాలు తెలియటం లేదు. ఆ తరువాత పుట్టిన నేటి యువతరానికి అసలేం చేయాలో తోచటం లేదు.
బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ చెల్లింపులు చేయాల్సిన దుస్ధితిలో ఆర్ధిక వ్యవస్ధ ఉన్న సమయంలో పివి నరసింహారావు 1991లో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. ఆ సమయంలో మన విదేశీ అప్పులో కేవలం ఏడుశాతమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 68.2శాతం ఉండగా 2018లో అవి గరిష్టంగా 80.2శాతానికి పెరిగాయి, ఈ ఏడాది జనవరి 11న రిజర్వు బ్యాంకు ప్రచురించిన సమాచారం ప్రకారం 77.8శాతం ఉన్నాయి. పివి నరసింహారావు సంస్కరణలు ప్రకటించిన తరువాత అవి 23శాతానికి పెరిగాయి. అందువలన ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం కోసమైతే సంస్కరణలు అవసరం లేదు. సంస్కరణలో భాగంగా పివి తన పాలనా కాలంలో రూపాయి విలువను గణనీయంగా తగ్గించారు లేదా పతనం అయ్యేట్లు చూశారు. 1991 మార్చినెలలో డాలరుకు రు.19.64 ఉన్నది కాస్తా 1996 నాటికి రూ.34.35కు పతనమైంది. గత ఆరు సంవత్సరాల మోడీ పాలనలో రూపాయి విలువ రూ.61.14 నుంచి ప్రస్తుతం 75కు పడిపోయిన విషయం తెలిసినదే. వాజ్‌పేయి హయాం నాటి రూపాయి విలువ స్ధాయికి అయినా ఎందుకు పెంచలేదో , ఇలా ఎందుకు జరిగిందో, దాని వలన మనకు జరిగిన లాభ నష్టాలేమిటో అధికారం పక్షం చెప్పదు, ప్రతిపక్షం లేదా ఆర్ధికవేత్తలు చెప్పేదానిని అంగీకరించకపోగా ఎదురుదాడి చేసే ఒక నిరంకుశ పరిస్ధితిలో ఉన్నాం. బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ పాపాయి వంటి రూపాయిని బజారులో(మార్కెట్‌ శక్తులకు) వదలి పెట్టి మరింత బలహీనపరచకుండా చూసేందుకు ఏమి చేస్తున్నారు? ఆయనలో మూర్తీభవించినట్లు చెప్పే భారతీయత, దేశభక్తి ఏమైనట్లు ?
ఇక పివి నరసింహారావు తరువాత పదమూడు రోజుల పాలనను పక్కన పెడితే 1998 నుంచి 2004వరకు అధికారంలో ఉన్న బిజెపి నేత వాజ్‌పేయి కూడా అనేక సంస్కరణలకు తెరతీశారు. ఆయన పాలనలో ప్రత్యేకత ఏమంటే మన విదేశీ అప్పులో 36శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 103శాతానికి పెరిగింది, అంతే కాదు ఆయన పాలన చివరి రెండు సంవత్సరాలలో మన విదేశీ వాణిజ్యం జిడిపిలో 1.5శాతం మిగులులో ఉంది. స్వాతంత్య్రం తరువాత అలాంటి పరిస్ధితి ఆయన ఏలుబడికి ముందూ, తరువాత కూడా లేదు. అయితే రూపాయి విలువ వాజ్‌పేయి హయాంలో రూ.37.16 నుంచి 45.95కు దిగజారింది. ఆయన పదవి నుంచి దిగిపోయే ముందు పెట్రోలు, డీజిల్‌ మీద సబ్సిడీలను రద్దు చేశారు. మొత్తంగా తమ పాలనలో దేశం వెలిగిపోయింది అనే నినాదంతో ఎన్నికలకు పోయిన బిజెపి 2004లో ఘోరపరాజయం పాలైంది.

Decoding Slowdown: Dip in household savings, investment an ...
వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ పరాజయాన్ని చూసిన తరువాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ చమురు సబ్సిడీలను తిరిగి ప్రవేశ పెట్టింది. తొలి ఏడాది రూ.5,430 కోట్ల నుంచి పదేండ్లలో రూ.1,60,000 కోట్లకు పెంచారు. యుపిఏ పాలనా కాలంలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. సబ్సిడీ దాదాపు సున్నా నుంచి 1,38,000 కోట్ల రూపాయలకు పెరిగింది. వాజ్‌పేయి హయాంలో దిగుమతి చేసుకున్న ఎరువులు పదిశాతం ఉంటే పదేండ్లలో 60శాతానికి పెరగటం దీనికి ఒక కారణం. ఈ కాలంలో చమురు ధరలు, దానికి అనుగుణంగానే దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు, వాటికి సబ్సిడీ విపరీతంగా పెరిగింది. మోడీ హయాంలో దిగుమతి ఎరువుల శాతం 30కి అటూఇటూగా ఉంటోంది. విపరీతంగా పెరిగిన చమురు, ఎరువులు, బొగ్గు దిగుమతి ఖర్చు కారణంగా యుపిఏ పాలనా కాలంలో వాణిజ్యలోటు విపరీతంగా పెరిగింది. పదేండ్లలో జిడిపిలో 1.5శాతం మిగులు నుంచి నుంచి 5.1శాతం లోటుకు చేరింది. పర్యవసానంగా విదేశీ అప్పుకు 103శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 68శాతానికి తగ్గిపోయింది. ఈ కాలంలోనే రూపాయి విలువ రూ .45.95 నుంచి 60.09కి దిగజారింది.
యుపిఏ పాలనా కాలంలో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి నాయకత్వం 2014లో అధికారానికి వచ్చిన తరువాత ఆ పతనాన్ని కొనసాగించి ప్రస్తుతం 75కు దిగజార్చింది. మోడీ తొలి మూడు సంవత్సరాల కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా విదేశీ మారక నిల్వలు 80శాతానికి పెరిగాయి. ఈ ఏడాది మార్చి ఆరవ తేదీ నాటికి కరంట్‌ ఖాతా లోటు 0.2 ఒకశాతానికి తగ్గిపోయింది. ఇది మన విదేశీ చెల్లింపులకు ఢోకాలేని స్ధితిని తెలుపుతోంది. అయితే ఇదే పరిస్ధితి కొనసాగుతుందని చెప్పలేము. లోటు పెరిగే కొద్దీ రూపాయి విలువ మీద వత్తిడి పెంచుతుంది. ఈ ఏడాది ఆఖరుకు 1.6శాతానికి లోటు పెరగవచ్చని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా చమురు, గ్యాస్‌ ధరలు రికార్డు స్ధాయిలో పడిపోవటంతో పరిస్ధితి ఎంతో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ని సానుకూల అంశాలు నరేంద్రమోడీ సర్కార్‌కు కలసి వచ్చినా అనేక రంగాలలో వైఫల్యం చెందటానికి కారణాలు ఏమిటి, దాన్నుంచి బయట పడేందుకు సర్కార్‌ తీసుకుంటున్న లేదా రాష్ట్రాలతో అమలు చేయిస్తున్న కార్మిక చట్టాల సవరణల వంటి సంస్కరణలు ఏమేరకు తోడ్పడతాయి అన్నది ప్రశ్న. కరోనా సంక్షోభం రాక ముందే అన్ని రంగాలలో తలెత్తిన సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెట్టింది. మాంద్యం లేదు గానీ మందగమనం ఉందని సన్నాయి నొక్కులు నొక్కింది. గతంలోనే అనేక కార్మిక చట్టాలను నీరు గార్చటంలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందున్నాయి. ఇప్పుడు కేంద్రంలో కూడా వారే ఉన్నారు గనుక మరోసారి మిగిలిన వాటిని దెబ్బతీసేందుకు పూనుకున్నారు. ఓవర్‌ టైమ్‌ చేయించేందుకు వీలు కల్పించే పేరుతో పన్నెండు గంటల పని పద్దతిని అమలు చేయాలని అనేక చోట్ల ప్రతిపాదించారు. అంటే పని స్ధలాలకు దూరంగా ఉన్న కార్మికులు ఇండ్లకు వెళ్లేందుకు వీలు కలగదు, బ్రిటీష్‌ వారి కాలంలో మాదిరి పని చేసి ఇంటికి పోకుండా మరుసటి రోజు విధులకు వెళ్లేందుకు ఫ్యాక్టరీ గేట్ల ముందే విశ్రమించే రోజులు వచ్చినా ఆశ్చర్య ం లేదు.
1971లో ఇందిరా గాంధీ జనం దృష్టిలో దేవత దుర్గాదేవి. పాక్‌ సేనలను లొంగదీసుకొని బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడిన సమయంలో ఆమె తిరుగులేని నేత. బంగ్లా విముక్తికి కొద్ది నెలల ముందు గరీబీ హఠావో పేరుతో మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తిరుగులేని విజయం సాధించారు. కానీ రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే పరిస్ధితులు మారిపోయాయి. కాలేజీ ఫీజుల పెంపుదల, అధిక ధరలకు వ్యతిరేకంగా విద్యార్ధులు ప్రారంభించిన ఉద్యమాలు దేశ రాజకీయాలనే మార్చివేశాయి. బంగ్లా విముక్తి వంటి విజయం నరేంద్రమోడీ ఖాతాలో లేకపోయినా వివిధ కారణాలతో జనంలో పలుకుబడి కలిగి ఉన్నారు. సర్కార్‌ ఏలుబడిలో తీవ్ర సమస్యలున్నా అలాంటి ఉద్యమాలు లేవు.
1971లో పాక్‌ ఆర్మీతో తూర్పు పాకిస్ధాన్‌లో యుద్దం పదమూడు రోజులే జరిగినప్పటికీ అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్ధకు భారంగా మారిందంటే అతిశయోక్తి కాదు.1971-72 మన జిడిపి వృద్ధి రేటు 0.9శాతమే. తరువాత రెండు సంవత్సరాలలో అనేక చోట్ల కరవు, ఆహార ధాన్యాల కొరత, అధిక ధరలు, బంగ్లా శరణార్దుల రక్షణ వంటి అంశాలు చుట్టుముట్టాయి. విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయింది. పరిశ్రమల మూత, నిరుద్యోగం పెరుగుదల, 1973లో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం చమురు సంక్షోభానికి దారితీసి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది కొద్ది వారాల్లోనే పీపా 60 నుంచి ఇరవై డాలర్లకు పడిపోతే నాడు కొద్ది రోజుల్లోనే మూడు నుంచి పన్నెండు డాలర్లకు పెరిగింది. మోడీకి ఎన్నో డాలర్లు మిగిలితే ఇందిరా గాంధీకి ఖర్చయ్యాయి. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే జనానికి పెరిగాయి, నేడు గణనీయంగా తగ్గినా పెరిగాయి. మోడీకి యుద్ధం లేదు, చమురు బిల్లు గణనీయంగా తగ్గింది గానీ జిడిపి వృద్ధి రేటు దిగజారింది. ఇందిరా గాంధీ నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ద్రవ్యోల్బణం ఇరవైశాతం పైనే ఉంది, దానికి తగినట్లు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం లేదు. చమురు ధరలు తగ్గి ప్రభుత్వం మీద ఆర్ధిక వత్తిడి గణనీయంగా తగ్గినా చమురు పన్ను ఒక ఆదాయవనరుగా మార్చు కుంది.2014లో లీటరు పెట్రోలు మీద రూ.9.48 ఉంటే ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.32.98కి మోడీ సర్కార్‌ పెంచింది. పెట్రోలు, డీజిల్‌ మీద ఒక లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పదమూడు- పద్నాలువేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా అంటే అదనంగా సాధారణ రోజుల్లో ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మొత్తం అదనం అయితే పెట్రోలు, డీజిల్‌ సబ్సిడీ ఏటా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదా అయింది. 2004-05 నుంచి 2018-19 వరకు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం 10,99,234 కోట్ల రూపాయలు. అయితే 2014-15 నుంచి 2018-19 వరకు చూస్తే పెట్రోలియం ఉత్పత్తుల మీద వసూలు చేసిన పన్ను మొత్తం రూ. 11,90,777 కోట్లు అన్న పచ్చినిజం ఎంత మందికి తెలుసు ?
2014 మార్చి ఒకటవ తేదీన ముడిచమురు పీపా ధర 118 డాలర్లు ఉన్నపుడు వినియోగదారుడికి ఢిల్లీలో రూ.73.20 పెట్రోలు దొరికింది, ఈ ఏడాది మే 22న పీపాధర 33.25 డాలర్లకు పడిపోయినప్పటికీ పెట్రోలు ధర రూ.71.30 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి చమురు ధరల పెంపు తగ్గింపు అనే విధానాన్ని గత రెండునెలలుగా పక్కన పెట్టేశారు. ఇలాంటి పాలకులు సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతామని చెపితే నమ్మటం ఎలా ?
ఒకవైపు జనం మీద బాదుడు, మరోవైపు చమురు బిల్లు తగ్గుదల, అనేక ఆర్ధిక సూచికలు గతంతో పోల్చితే బాగున్నప్పటికీ అభివృద్ధి జాడల్లేవు. ప్రపంచంలో అభివృద్దికి పలు నమూనాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. దానితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్‌ నమూనాను అభివృద్ధి చేశారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని దేశమంతటా విస్తరించకుండా విదేశాలు, విదేశీ కార్పొరేట్ల కోసం వెంపర్లాడటం ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారు లేరు.

Economic Crisis: View: India's economic crisis can bring about ...రిజర్వుబ్యాంకు శుక్రవారం నాడు మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తీరు చూస్తుంటే వడ్డీ సంగతి తరువాత ఒక రూపాయి అప్పు తీసుకుంటే మరో రూపాయి ఉచితం అనే రోజులు వస్తాయా అని పిస్తోంది. రుణాలు తీసుకొనే వారు లేరు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎంత బలహీనమైనదో అర్ధం అవుతోంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి రేటు మైనస్‌ 2.5 నుంచి మైనస్‌ 3.6శాతానికి దిగజార నుందని రేటింగ్‌ సంస్ధ గోల్డ్‌మాన్‌ శాచస్‌ తాజా అంచనాలో పేర్కొన్నది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తరువాత ఈ అంచనా ఎలా మారుతుందో తెలియదు. 2020-21లో మన జిడిపి రేటు మైనస్‌ ఆరు, ప్లస్‌ ఒక శాతం మధ్య ఉండవచ్చని పదిహేనవ ఆర్ధిక సంఘం అధ్యక్షుడు ఎన్‌కె సింగ్‌ జోశ్యం చెప్పారు. ఇవన్నీ నిజానికి ఆందోళనకర వార్తలు. మరోవైపు చైనాలో వృద్ధి రేటు కనిష్టంగా 1.8శాతం ఉంటుందని అంచనాలు వెలువడతున్నప్పటికీ తాము ఒక లక్ష్యాన్ని నిర్దేశించే స్ధితిలో లేమని చైనా ప్రధాని శుక్రవారం నాడు ప్రకటించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో బ్యాంకుల నిరర్దక ఆస్తులు విపరీతంగా పెరిగిపోవటం, ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు వాటిని రద్దు చేయటం చూశాము. వీటిలో కావాలని ఎగవేసిన వాటితో పాటు ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు కూడా కనిపిస్తోంది. మోడీ సర్కార్‌ గత ఏడాది కాలంలో క్రమంగా వడ్డీ రేట్లను ఎంత తగ్గించినా, తీసుకొనే వారు కనిపించకపోవటం పలుమార్లు కోత పెడుతోంది. మన మీద ఏ విదేశీ ఆంక్షలు లేవు, విదేశీ కంపెనీలు తమ లాభాలను స్వేచ్చగా తరలించుకుపోయేందుకు ద్వారాలను ఎప్పుడో తెరిచి ఉంచాము. అయినా పెట్టుబడులు రావటం లేదు.
మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతే బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని తగ్గించాల్సి ఉంటుంది, అదే జరిగితే బ్యాంకుల్లో సొమ్ముదాచుకొనే వారు తగ్గిపోతారు. అది సరికొత్త సమస్యలకు దారి తీస్తుంది.దీన్ని ఆసరా చేసుకొని ద్రవ్యపెట్టుబడికి దారులు తెరిచేందుకు మోడీ సర్కార్‌ సరికొత్త వాదనలను ముందుకు తెచ్చింది. అదే విదేశాల్లో డాలర్‌ రుణాలను ప్రభుత్వమే తీసుకోవటం. ఇదొక ప్రమాదకరమైన క్రీడకు పూనుకోవటమే. రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా ఆ మేరకు బ్యాంకులు తమ ఖాతాదార్లకు బదలాయించటం లేదన్నది ఒక వాస్తవం.స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు.
ఏ దేశానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతామంటే ఎలా ? కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన పిపిఇ, మాస్కులను కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.ఒక వైపు వలస కార్మికులు మాటిక్కెట్లను మా డబ్బులతో కొంటాం మా స్వంత ఊళ్లకు పంపండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోని పాలకులు మన జనాన్ని చంద్రుడి మీదకు అంతరిక్షయానం చేయించేందుకు విదేశీ కంపెనీలతో ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు. అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు తిరస్కరించినపుడు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా సాయంతో మన ఇస్త్రో శాస్త్రవేత్తలు గణనీయమైన విజయాలు సాధించారు. ఇవాళ్లగాకపోతే రేపు ఇప్పుడు చౌకగా రాకెట్లను, ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లే అంతరిక్ష యానం కూడా చేయించగల సత్తా ఉంది. వారిని అవమానించే విధంగా ఇప్పుడు ప్రయివేటు విదేశీ కంపెనీలను రమ్మంటున్నారు. సంస్కరణల్లో భాగంగా మన అంతరిక్ష పరిశోధనా సంస్ధ సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ప్రయివేటు కంపెనీలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయించింది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సౌకర్యాలను వినియోగించుకోవటం అంటే పుట్టా గుట్టా కొట్టి పెంచిన చెట్లు కాయలు కాసే తరుణంలో వాటికి నీరు పోసి పండ్లు కోసుకుపోయేందుకు వేరే వారికి అప్పగించటం తప్ప మరొకటి కాదు.

Where Are The Jobs? There Is A Real And Growing Unemployment Crisis In India
కరోనా సహాయచర్యలకు డబ్బులేదు , కావాలంటే అప్పులు ఇప్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ సమయంలోనే ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం, సచివాలయం, ప్రధాని, ఉపరాష్ట్రపతి భవనాల నిర్మాణం పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేయనుంది. ఇప్పుడు ఉన్నవాటితో వచ్చిన ఇబ్బంది ఏమిటి ? వర్షాకాలంలో మన ఇండ్ల మాదిరి అవేమీ కారటం లేదు, వేసవి వస్తే వాటిలో ఉండేవారికి వడదెబ్బ తగలటం లేదే ? న్యూఢిల్లీలో కొత్తగా పర్యావరణానికి, వారసత్వ నిర్మాణాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అనేక మంది మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.1970 దశకంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజరు గాంధీకి ఏడాదికి యాభైవేల మారుతీ కార్ల తయారీకి ఇందిర ప్రభుత్వం లైసెన్సు ఇస్తే ఆర్దిక సంక్షోభ సమయంలో కార్లు అవసరమా అంటూ ఆ రోజు ధ్వజమెత్తిన ప్రతిపక్షాలలో నేటి బిజెపి పూర్వరూపం జనసంఫ్‌ు కూడా ఉంది. అదేమీ ప్రభుత్వ పెట్టుబడితో సంజయ గాంధీ స్వంతానికి పెట్టే కంపెనీ కాదు. అదే విమర్శ ఇప్పుడు బిజెపికి సైతం వర్తించదా ? ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం తరలింపును, తెలంగాణాలో నూతన సచివాలయ, అసెంబ్లీ భవనాల నిర్మాణాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బిజెపి న్యూఢిల్లీలో చేస్తున్నదేమిటి ? కరోనా పరీక్షలకు నిధులు కేటాయించని కేంద్రం ఆర్ధికంగా దిగజారిన స్ధితిలో ఒకవైపు జనాల మీద పన్నులు బాదుతూ అన్నివేల కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేయటం అవసరమా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి వైఖరి కనిపించటం లేదా !

కరోనా సాయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మోడీ తక్కువ ఇచ్చారా ?

Tags

, , , ,

Did India handle Covid crisis better or Pakistan? The answer lies ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల కరోనా సంక్షోభ నివారణ పాకేజ్‌ గురించి ప్రస్తుతం దేశంలో మధనం జరుగుతోంది. ప్రభుత్వం, అధికారపార్టీ, దాని మిత్రపక్షాలు ఆ పధకం నుంచి అమృతం రానుందని చెబుతున్నాయి. అంతా ఒట్టిదే ఇదంతా జుమ్లా, పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండువేయబోయి ఒకటి వేసి దాన్ని కూడా కొట్టి వేసి సున్నా చుట్టినట్లుగా ఉంటుందని, అమృతం రాదు, వచ్చేది ఏమిటో తెలియదు, అది ప్రాణాలు నిలుపుకొనేందుకు సైతం పనికి రాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం వస్తుందో, ఏం రాదో తెలియక జనాలు జుట్టుపీక్కుంటున్నారు. తమ స్వస్థలాలకు పోయేందుకు వలస కార్మికుల తెగింపు తీరు తెన్నులను చూస్తుంటే తమకు వచ్చేదేమీ లేదు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియని నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లు చెబుతున్నాయి.
పాకేజ్‌ ఎలాంటిదో ప్రతి అంశాన్ని చూడనవసరం లేదు. ఉదాహరణకు ఎంఎస్‌ఎంఇ( సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి ఐదున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లిస్తే ఆ పరిశ్రమలకు అంతకంటే వరం మరొకటి లేదు. ఆ బకాయిలను చెల్లించకుండా ఆ సంస్ధలకు మూడులక్షల కోట్ల రూపాయల హామీ లేని రుణం ఇప్పిస్తామని కేంద్ర ప్రకటించటం హాస్యాస్పదం. ఐదున్నర లక్షల కోట్ల బకాయిలే చెల్లించలేని వారు ఇరవై లక్షల కోట్ల పాకేజ్‌ అమలు జరుపుతామని చెబుతుంటే తల్లికి కూడు పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్న సామెత గుర్తుకు వస్తోంది. అందువలన పనికిరాని పాకేజ్‌ను కాసేపు పక్కన పెడదాం. ప్రపంచబ్యాంకు నిపుణులు ప్రతివారం వివిధ దేశాలలో అమలు చేస్తున్న, ప్రకటిస్తున్న కరోనా సంక్షేమ పధకాల గురించి సమాచారాన్ని సేకరించి మదింపు చేస్తున్నారు. వ్యాధి విస్తరిస్తున్నకొద్దీ ప్రతికూల ప్రభావాల తీవ్రత పెరిగే కొద్దీ పలు కొత్త పధకాలను ప్రకటించటం, అమల్లో ఉన్నవాటిని మెరుగుపరుస్తున్నారు. పాలకుల చిత్తశుద్ధి, శ్రద్ద ఎలా ఉంటుందో గ్రహించటానికి కరోనా సంక్షోభం పెద్ద అవకాశం కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ వ్యాపితంగా సంక్షేమ చర్యలన్నీ ఒకే విధంగా లేవు. నగదు బదిలీ, ఆహార పంపిణీ తక్షణ సహాయ చర్యలుగా ఉన్నాయి. విద్యుత్‌, నీటి బిల్లుల రద్దు, వాయిదా, రాయితీల మొదలు ఉద్దీపనలు, తక్షణ సాయాలు రకరకాలుగా అమలు జరుపుతున్నారు. తాజాగా మేనెల 15వరకు వచ్చిన సమాచారం మేరకు 181 దేశాల్లో 870 రకాల సంక్షేమ చర్యలను ప్రకటించి అమలు జరుపుతున్నారు. మొత్తంగా చూసినపుడు 30.3శాతం(264) నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగాయి. వీటిలో 104 దేశాల్లో148 నగదు పధకాల కొత్తవి. నాలుగో వంతు పధకాల్లో ఇస్తున్న నగదును ఒకేసారి ఇస్తున్నారు. వస్తుసహాయ పధకాలు కూడా గణనీయంగా ఉన్నాయి. కొన్ని చోట్లా సామాజిక భద్రతా పధకాలకు వినియోగదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాన్ని ప్రభుత్వాలు రద్దు చేశాయి.
నగదేతర సంక్షేమ పధకాల్లో ప్రజాపనుల వంటివి 26.5శాతం, వస్తుపధకాలతో పోల్చితే నగదు పధకాలు రెట్టింపు ఉన్నాయి. నగదు అందచేత పధకాల సగటు వ్యవధి 3.1నెలలు, ఇది క్రమంగా పెరుగుతోంది. ఒక నెల నుంచి గరిష్టంగా ఆరునెలల వరకు ప్రకటించిన దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వైరస్‌ సంక్షోభం ఎంతకాలం ఉంటే అంతకాలం అని కొన్ని దేశాలు ప్రకటించాయి. నగదు విషయానికి వస్తే మొత్తం మీద ఆయా దేశాలలోని తలసరి నెలవారీ జిడిపిలో సగటున 27శాతం ఉన్నాయి. ఉదాహరణకు మన దేశ తలసరి వార్షిక ఆదాయం 2020 అంచనాలో రు.1,76,976 ఉంది. దీన్ని నెలవారీ లెక్కిస్తే రూ.14,740 అవుతుంది. దీనిలో 27శాతం అంటే రూ.3,981. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రూ.1,500 కనుక ప్రపంచ సగటులో సగానికంటే తక్కువే ఉంది. ఈ మాత్రానికే బిజెపి నేతలు ఎంతో గొప్ప సాయం అందించినట్లు చెప్పుకుంటున్నారు. పాకిస్ధాన్‌ తలసరి జిడిపి 2019లో 1388 డాలర్లు. దీన్ని మన రూపాయల్లోకి మారిస్తే 1,05,065. దీన్ని నెలవారీ చూస్తే రూ.8,755. దీనికి గాను పాక్‌ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆరువేల రూపాయలు( పాక్‌ రూపాయల్లో పన్నెండువేలు), అంటే మనం ఎక్కడ ఉన్నాం ? పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మన ప్రధాని మోడీ తక్కువ ఇచ్చినట్లే కదా ! ఎంత చెట్టుకు అంతగాలి, ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి ఇస్తారు, ఇచ్చేది ఎంత అన్నది కూడా ముఖ్యమే కదా ! ప్రపంచ జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయామని చెప్పిన పెద్దలు సాయం విషయానికి వస్తే దరిద్రం తాండవించే దేశాల సరసన చేర్చారు. దీన్ని చూసి ఇంతకు ముందు ప్రశంసలు కురిపించిన వారు విస్తుపోతున్నారు. మనలను చూసి ప్రపంచం నేర్చుకొంటోందని చేస్తున్న ప్రచారం ఇలాంటి చర్యలతో గోవిందా ! మంగోలియాలో కరోనాకు ముందు పిల్లల నగదు సాయ ఆ దేశ కరెన్సీ ఎంవిటి పదివేలు ఉంటే కరోనా తరువాత లక్షకు పెంచారు. ఇలా అనేక దేశాలలో జరుగుతోంది. ఇలాంటి సాయం ప్రపంచం మొత్తం మీద 134శాతం పెరిగింది.మాల్డోవాలో కనిష్టంగా 43శాతం పెరిగితే గరిష్టంగా మంగోలియాలో 900శాతం ఉంది. మార్చినెల 27న నగదు బదిలీ పధకాలు 107 కాగా వస్తు సహా పధకాలు 22 ఉన్నాయి. అవి మే15నాటికి 264, 120కి పెరిగాయి.
కరోనానో నిమిత్తం లేకుండానే కొన్ని దేశాలలో నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికింద చెల్లించే మొత్తాలు 45దేశాలలో పెరిగాయి, 157దేశాలలో పధకాన్ని ఎక్కువ మందికి వర్తించేలా విస్తరించారు. కేవలం నగదు సాయాన్ని పొందుతున్న వారు ప్రపంచంలో 130 కోట్ల మంది అయితే సామాజిక పధకాల సాయం పొందుతున్నవారు 170 కోట్ల వరకు ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో పంపిణీ చేసే నగదు మొత్తం పెంచటం ఒక తక్షణ సవాలుగా ముందుకు వస్తోంది. నూట పదకొండు దేశాలలో సాధారణంగా రెండు రకాలుగా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందే తమ వద్ద ఉన్న జాబితాలకు కొత్త కుటుంబాలను జత చేయటం, ఆన్‌లైన్‌ కంప్యూటర్లు లేదా ఫోన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించటం, మూడవది ప్రభుత్వాలే అర్హులను గుర్తించటం.కొన్ని దేశాల్లో తమ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల ద్వారా లబ్దిదార్లకు తెలియ చేస్తున్నారు.
నూటపదిహేడు దేశాలలో సామాజిక పధకాలకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాలను రద్దు చేయటం లేదా రాయితీలు ఇస్తున్నారు.సిక్‌లీవులకు చెల్లింపులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రకటించిన మేరకు సామాజిక భద్రతా పధకాలకు తలసరి ఖర్చు సగటున 44 డాలర్లు ఉంది. ఒక డాలరు చొప్పున ఎనిమిది దేశాల్లో , నాలుగు డాలర్లు 12చోట్ల, 25 దేశాలలో 25 డాలర్లు, 99 డాలర్ల చొప్పున 17దేశాలలో ఖర్చుచేస్తున్నారు. సామాజిక బీమా పధకాలు మన దేశంలో ఎనిమిదిశాతం మందికి వర్తింప చేస్తుండగా పాకిస్ధాన్లో నాలుగుశాతం ఉంది.
కొన్ని ముఖ్యమైన దేశాల్లో అమలు జరుగుతున్న పధకాల వివరాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. చెల్లింపులు, ఇతర సాయం బాధితులు, అవసరమైన వారికే అని గమనంలో ఉంచుకోవాలి. అయితే పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం ఎక్కువగా ఉంటుంది కనుక బాధితులూ ఎక్కువగానే ఉంటారు. మన దేశంలో వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తున్నట్లుగానే అనేక దేశాలలో అలాంటి పధకాలతో పాటు పరిమితంగా నగదు బదిలీ కూడా కరోనాతో నిమిత్తం లేకుండానే జరుగుతోంది. అనేక ఐరోపా దేశాలలో నిరుద్యోగ భృతి, నిరుద్యోగ బీమా పరిహారం వంటి పధకాలు ఉన్నాయి. మన వంటి అనేక దేశాలలో అవి లేవు.
అల్జీరియాలో రంజాన్‌ సందర్భంగా పేదలకు 79 డాలర్ల విలువగల పదివేల అల్జీరియన్‌ దీనార్‌లు చెల్లిస్తారు. గర్భిణులకు, పిల్లలను చూసుకోవాల్సిన మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు, తాత్కాలిక ఉద్యోగులకు 50శాతం సిక్‌ లీవు చెల్లింపు.ఆస్ట్రేలియాలో ప్రభుత్వ పెన్షనర్లకు ఒకసారి చెల్లింపుగా 750 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(455 అమెరికా డాలర్లు), ఉద్యోగార్ధులకు, యువ అలవెన్సుకింద పదిహేనురోజులకు ఒకసారి 550 డాలర్లు చెల్లిస్తారు. కొత్తగా వలస వచ్చిన అర్హతగల వారికి వేచి ఉండే వ్యవధిని రద్దు చేసి అలవెన్సు ఇస్తున్నారు.తాస్‌మనానియన్‌ రాష్ట్రంలో అల్పాదాయం గల వారు స్వయంగా క్వారంటైన్‌లో ఉండేట్లయితే వ్యక్తికి 250, కుటుంబానికి1000 డాలర్లు అత్యవసర సాయంగా ఇస్తారు.
బంగ్లాదేశ్‌లో పేదలకు విక్రయించే బియ్యం రేటును కిలో 30టాకాల నుంచి ఐదుకు తగ్గించారు. బెల్జియంలో నిరుద్యోగ భృతి, అలవెన్సులను 60 నుంచి 70శాతం వరకు పెంచారు, గరిష్ట పరిమితిని నెలకు 2,754యూరోలుగా నిర్ణయించారు, మూడునెలల పాటు ఇస్తారు.కార్మికులకు నిరుద్యోగ భృతితో పాటు రోజుకు 5.63యూరోలు అదనంగా చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి కరోనా కారణంగా ఏడాది పాటు వారు తమ సామాజిక బీమాకు చెల్లించాల్సిన మొత్తాన్ని రద్దు చేశారు. వారికి ఇచ్చే సాయంలో ఎలాంటి కోత ఉండదు. బ్రెజిల్‌లో నిరుద్యోగులైన అసంఘటిత రంగ కార్మికులైన పెద్దలకు మూడు నెలల పాటు 115 డాలర్లు లేదా కనీసవేతనంలో 60శాతం వంతున చెల్లిస్తారు.అయితే కుటుంబానికి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది.వంటరి తల్లులకు 230 డాలర్లు ఇస్తారు.
కెనడాలో ఉపాధి హామీ బీమా వర్తించని వారికి నాలుగు నెలల పాటు రెండువేల డాలర్ల చొప్పున చెల్లిస్తారు.బ్రిటీష్‌ కొలంబియాలో కరోనా కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి ఒకసారిగా వెయ్యి కెనడియన్‌ డాలర్లు చెల్లిస్తారు.అద్దెలకు ఉండేవారికి ఐదు వందల డాలర్లు ఇస్తారు, విద్యార్ధుల రుణాల వసూలును ఆరునెలలు వాయిదా వేశారు. ఛాద్‌లో ఆరునెలలు నీటి పన్ను, మూడు నెలలు విద్యుత్‌ బిల్లులను రద్దు చేశారు. చిలీలో మొదటి అసంఘటిత రంగ కార్మికులకు మొదటి నెల 340 డాలర్లు తరువాత దానిలో 85శాతం, మూడవ నెలలో 65శాతం నగదు చెల్లిస్తారు.
చైనాలోని ఊహాన్‌ నగరంలో వలస వచ్చిన కార్మికులకు గుండుగుత్తగా ఐదువందల యువాన్లు(మన రూపాయల్లో నాలుగువేలకు సమానం) ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చైనాలో సామాజిక భద్రతా పధకాల కింద నమోదైన కంపెనీలన్నింటిలో హుబెరు రాష్ట్రంలో ప్రతి కంపెనీ యజమానులు చెల్లించాల్సిన వాటాను రద్దు చేశారు. మిగతా చోట్ల ఎంఎస్‌ఎంఇలకు రద్దు చేశారు. ఇదిగాక నిరుద్యోగ బీమా పధకం నుంచి వేతనాలు, సబ్సిడీలను చెల్లిస్తారు.ఈ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. ఉదాహరణకు నాన్‌జింగ్‌లో రోజుకు ఒక కార్మికుడికి వంద యువాన్లు చెల్లిస్తారు. దారిద్య్ర నిర్మూలన పధకంగా చైనాలో కనీస జీవన ప్రమాణ హామీ పధకం అమల్లో ఉంది. దీన్ని దిబావో అనిపిలుస్తారు. దీని కింద ఒక వ్యక్తికి పట్టణాల్లో ఐదు వందలు,గ్రామాల్లో మూడు వందల యువాన్లు కనీసంగా చెల్లిస్తారు. ఇది కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు, ఎక్కువ మొత్తాలను చెల్లించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. షెంజన్‌లో స్ధానిక దిబావో మొత్తాలకు రెండు నుంచి 18 రెట్లు పొందేవారు కూడా ఉన్నారు.
క్యూబాలో వృద్దులు,వ్యాధి గ్రస్తులు, కరోనా వైరస్‌ బాధితులై ఇంటి దగ్గరే ఉండిపోయిన వారికి మొదటి నెలలో వందశాతం వేతనం, రెండవ నెలలో 60శాతం చెల్లిస్తారు.డెన్మార్క్‌లో లేఆఫ్‌ ప్రకటించని పక్షంలో ప్రభుత్వం మూడు నెలలపాటు 75శాతం వేతనాలు చెల్లిస్తుంది.ఈ మొత్తం గరిష్టంగా 3,418 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.ఈజిప్టులో అసంఘటితరంగ కార్మికులకు నెలకు 500 ఈజిప్టు పౌండ్లు లేదా మన రూపాయల్లో 2400 మూడు నెలల పాటు చెల్లిస్తారు.
అమెరికాలో నాలుగు నెలల పాటు పెద్ద వారికి 1200, పిల్లలకు 500 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. పాకిస్తాన్లో ఒక విడతగా పన్నెండువేల రూపాయలు, మన కరెన్సీలో ఆరువేలు చెల్లిస్తారు. జర్మనీలో కళాకారులు, నర్సుల వంటి వారికి మూడునెలల్లో 15వేల యూరోలు చెల్లిస్తారు. ఆదాయం కోల్పోయిన వారి పిల్లలకు మార్చినెల నుంచి సెప్టెంబరు వరకు 185యూరోలు చెల్లిస్తారు.వ్యాధి సోకిన వారికి ఆరువారాల పాటు సిక్‌ లీవు కింద పూర్తి వేతనం ఇస్తారు. సామాజిక బీమా పధకాలకు యజమానులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. యజమానులు లేఆఫ్‌ చేయకుండా ఉన్న కంపెనీలలో పన్నెండు నెలల పాటు 60శాతం వేతనాలు చెల్లించవచ్చు, పిల్లలున్న కార్మికులకు 67శాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌లో అత్యవసర సాయం కింద కుటుంబానికి 150, పిల్లలకు వంద యూరోల చొప్పున చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందేవారికి 1500, విధుల్లో ఉన్న ఉద్యోగులకు వెయ్యి యూరోల బోనస్‌ చెల్లిస్తారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మొత్తం వేతనంలో 70శాతం చెల్లిస్తారు, కనీసం వేతనం, అంతకంటే తక్కువ పొందేవారికి నూటికి నూరుశాతం చెల్లిస్తారు.

UN general assembly session: Imran Khan lashes out at Prime ...

దక్షిణ కొరియాలో నిరుద్యోగ భృతి అక్కడి కరెన్సీలో నెలకు రెండు నుంచి ఐదు లక్షలకు పెంచారు. రష్యాలో గర్భవతులకు నెలకు 63 డాలర్లు, నిరుద్యోగులకు మూడు నెలల పాటు 38డాలర్లు చెల్లిస్తారు. జపాన్‌లో ప్రతి పౌరుడికి 930 డాలర్లు ఇస్తున్నారు. ఇరాన్‌లో నాలుగు విడతలుగా 400 డాలర్లు, ఇరాక్‌లో ప్రతి ఒక్కరికి 253 డాలర్లు,హాంకాంగ్‌లో ఒక విడతగా 1,280 డాలర్లు, ఒక నెల సామాజిక భద్రత పధకం అలవెన్సు అదనం. గ్రీసులో మూతబడిన సంస్ధల సిబ్బందికి 800 యూరోలు చెల్లిస్తున్నారు. పాకిస్ధాన్‌లో ఒక విడతగా పన్నెండు వేల రూపాయలను ప్రకటించారు. ఇది మన ఆరువేల రూపాయలకు సమానం. ఈ నేపధ్యంలో ప్రతి దేశంలోనూ అందించాల్సిన సాయం, కోల్పోయిన ఉపాధి పునరుద్దరణ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఏ దేశంలో అయినా అందరికీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అవకాశమూ ఉండదు. కొందరికి అయినా ఇచ్చే మొత్తం ఎంత అన్నది చూసినపుడు మనం ఇస్తున్నది చాలా తక్కువ. ఎంత ఇవ్వాలనే అంశంపై మన దేశంలో చర్చకు పాలకులు తావివ్వటం లేదు. చర్చ జరిగితే బండారం బయట పడుతుంది కనుక పాచిపోయినా సరే మూసి పెట్టటానికే సిద్దపడుతున్నారు.

కార్పొరేట్లకు కట్టబెట్టే సమయంలో ప్రదర్శించే ఉత్సాహం, ఉదారత, ఉద్దీపనలు సామాన్యుల విషయంలో కనిపించటం లేదు. ఏటా కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల మేర కార్పొరేట్లకు, ఇతర ధనికులకు రాయితీలు ఇస్తూ ఖజానాకు రావాల్సిన అంటే జనానికి ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని వదులుకుంటున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకొని కావాలని ఎగవేసిన బడా సంస్ధలకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు మన కళ్ల ముందే జరిగింది. అందువలన ఇలాంటి సమయాల్లో చప్పట్లు, దీపాలు వెలిగించటం, స్వదేశీ వంటి కబుర్లు కాదు, కార్యాచరణ కావాలని జనం కోరుకుంటున్నారు. సుభాషితాలు పెరిగే కొద్దీ చిరాకు నిరసనగా మారుతోంది.