చైనాపై విచారణ సరే ముందు అమెరికా, జర్మనీ నేరాల మాటేమిటి !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ తొలుత బయట పడిన ఊహాన్‌ నగరంలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తమ తనిఖీదార్లను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. ఈ డిమాండ్‌ను చైనా తోసి పుచ్చింది. కరోనా గురించి సకాలంలో హెచ్చరించని కారణంగా తమ దేశానికి జరిగిన నష్టం 20లక్షల కోట్ల డాలర్లు చైనా చెల్లించాల్సిందే అని అమెరికన్లు కొందరు తమ దేశంలో దావా దాఖలు చేశారు. చైనా మీద కేసులు అమెరికా కోర్టుల్లో దాఖలు చేయటం ఏమిటో, అవి విచారణ జరిపే ప్రహసనం ఏమిటో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇదే విధంగా తమకు 149 బిలియన్‌ యూరోల నష్టపరిహారం చెల్లించాలని జర్మన్‌ పత్రిక బిల్డ్‌ పేర్కొన్నది. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్‌లు రావచ్చు. అవెంత ఉంటాయో తెలియదు. ఈ డిమాండ్లు న్యాయసమ్మతమేనా ? ఆచరణ సాధ్యమేనా ?
నావరకు అయితే కొన్ని చిన్న చిన్న షరతులతో న్యాయసమ్మతమే, ఆచరణ సాధ్యమే ! అదెలాగో తరువాత చూద్దాం.ఈ వార్తలను చూసి చాలా మంది చైనా తిక్క కుదిరింది అనుకుంటున్నారు. దాఖలు చేయని కేసులను కూడా వేసినట్లే సంబర పడుతున్నారు. ముందు తమ దేశాల్లో కరోనా నివారణ చేయకుండా ఇదేమిటి అనుకొనేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి నష్ట పరిహారం కోరేవారు నిజంగా సాధించేందుకు అవకాశాలున్నాయని నమ్ముతున్నారా ? లేక ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ట్రంప్‌ ఇలాంటి కేసులను వేయిస్తున్నాడా అన్నది అనుమానమే. అసలు ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్ధలో అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన మార్గదర్శక సూత్రాల మేరకు అంతర్జాతీయ నేరాలుగా పరిగణించిన వాటిని విచారించేందుకు అంతర్జాతీయ న్యాయ స్ధానం ఉంది. చైనాలో వెలువడిన కరోనా వైరస్‌ అలాంటి నేరంగా ఎవరూ ఎక్కడా నిర్ధారించలేదు. చరిత్రలో ఎప్పుడైనా నిజంగా తప్పు చేసిన ఏ దేశమైనా ఎవరికైనా పరిహారం చెల్లించిందా ?


అమెరికా ఏమిటి ఏ దేశమైనా దేని గురించి అయినా స్వంత విచారణలు జరుపుకోవచ్చు. కోరుకున్న తీర్పులు రాసుకోవచ్చు. రద్దు కింద అమ్ముకోవటానికి తప్ప అవి దేనికి పనికి వస్తాయి ? ఆ దేశాలన్నీ ముందు చైనాలో వైరస్‌ను ఎలా అరికట్టారో తమ దేశాలలో ఎలా జనం ప్రాణాలు తీస్తున్నారో తెలుసుకోవాలి. ఇతర దేశాల్లోకి స్వంత దర్యాప్తు బృందాలను పంపటానికి ఏ దేశానికీ హక్కు లేదు, అవకాశం అంతకంటే లేదు. అదే నిజంగా ఉంటే పాకిస్ధాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను ఈ పాటికే మన కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసి ఉండేది, అదే విధంగా పాక్‌ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మన మీద చేసిన ఆరోపణలను విచారించే వారు. అమెరికాలో అత్యధిక కేసులు ఐరోపా నుంచి దిగుమతి అయ్యాయి. అందువలన ఆ దేశాల మీద ముందు అమెరికా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే ప్రపంచ పోలీసుగా తనకు తాను బాధ్యత తీసుకున్న అమెరికా దాదాపు అన్ని చోట్లా చావు దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రపంచ న్యాయమూర్తిగా మారదలచుకున్నట్లు కనిపిస్తోంది. అత్యాశగాకపోతే అది సాధ్యమేనా ?
చైనాలోని ఉహాన్‌ వైరాలజీ సంస్ధ అధిపతి, చైనా మిలిటరీ మేజర్‌ జనరల్‌ తమ దేశంలో కరోనా వ్యాప్తి, మరణాలకు కారకులని, నష్టపరిహారంగా 20లక్షల కోట్ల డాలర్లు చెల్లించాలని అమెరికాలోని ఒక లాయర్‌, మరో ఫొటోల కంపెనీ, మరో ఇద్దరు కేసులు దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పిచ్చి కేసుకు ప్రపంచ వ్యాపితంగా ప్రచారం తప్ప మరొక లాభం ఉండదు. అది కోరిన మొత్తం చైనా జిడిపికంటే ఎక్కువ. అంటే చైనా మొత్తాన్ని అమ్మినా అంత సొమ్ము రాదు, అసలు కొనే వారెవరు అన్నది వేరే విషయం. ఆస్ట్రేలియా ఎలాంటి నష్ట పరిహారం కోరలేదుగానీ అమెరికా ఏది మాట్లాడితే దానికి వత్తాసుగా పలుకుతోంది. ఇక జర్మనీలో అత్యధిక ఆదరణ కలిగిన పత్రిక ” బిల్డ్‌ ” సంపాదకులు తమ దేశానికి చైనా కారణంగా వివిధ రంగాలకు 149 బిలియన్‌ యూరోల మేరకు నష్టం జరిగిందని ఆ మొత్తం చెల్లించాలని రాశారు. అయితే ఇందుకోసం ఎలాంటి కేసులు గట్రా దాఖలు చేయలేదు.
ఇక చైనా మీద విచారణ అంశాన్ని దానికి గాను నేను ముందే చెప్పిన షరతుల సంగతి చూద్దాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం సంభవించిన వైరస్‌ల మూలాలు ఏదేశంలోనివో ఇప్పుడు నిర్ధారించటం కష్టం. ఎందుకంటే నాడున్న దేశాలు లేదా సామ్రాజ్యాలు నేడు లేవు గనుక నిందితులు ఫలానా అని నిర్దారించలేము. నిజానికి ఏ దేశం తప్పుచేసినా విచారణ జరిపేందుకు ప్రపంచ రాజ్యాలు ఏక క్రీవంగా అంగీరించి ముందు ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ఆమోదించాలన్న చిన్న షరతును ముందు నెరవేర్చాలి. ఆ మేరకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కనుక మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకుందాం, లేదూ ఎవరైనా అంతకు ముందు నుంచే విచారణ ప్రారంభించాలి అంటే అభ్యంతరమూ లేదు.చైనాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కరోనా వైరస్‌ను చైనా తయారు చేసిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. మానవాళి చరిత్రలో అతి పెద్ద మహమ్మారి ప్లేగు వ్యాధి అని తెలిసినా కొన్ని వందల సంవత్సరాలు గడచి నందున దానికి సంబంధించిన అంశాలు పూర్తిగా నిర్దారించలేము. మనకు బాగా తెలిసిన స్పానిష్‌ ఫ్లూ(ప్రపంచానికి తెలిసిన తొలి హెచ్‌1ఎన్‌1 వైరస్‌). మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ప్రబలింది. ఇది ఐరోపాలోనా, అమెరికాలోనా ఎక్కడ ప్రారంభమైంది అన్న అంశం మీద వివాదం ఉంది. భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువ పరిశీలనలు అమెరికా వైపే వేలు చూపుతున్నాయి. నిజానికి ట్రంప్‌కు, జర్మన్‌ పత్రిక బిల్డ్‌ సంపాదకులకు, వారిని సమర్ధించే వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ వైరస్‌ ఎక్కడ ప్రారంభమైందో ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం నిర్ధారించాలి. చైనాలో విచారణకు తమ నిపుణులను అంగీకరించాలని ట్రంప్‌ కోరాడు. అలా ఒక దేశం కాకుండా భద్రతా మండలిలో ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా సభ్యరాజ్యాలుగా ఉన్నాయి కనుక వాటి ప్రతినిధులను ఎంపిక చేసి విచారణ జరిపించాలి. ఆ నివేదిక ప్రాతిపాదికన నష్టాలను నిర్ధారించి ఆ మొత్తాలను బాధిత దేశాలకు పంచాలి. ఇదేమీ పెద్ద షరతు కాదు, అసాధ్యమైంది అంతకంటే కాదు.


1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా నాడు ప్రపంచంలో ఉన్న మూడో వంతు జనాభా 50 కోట్ల మందికి సోకింది. కోటీ 70లక్షల నుంచి ఐదు కోట్ల మందికి, మరికొందరి అంచనాల ప్రకారం పది కోట్ల మంది దుర్మరణం చెందారు. ఇది మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న దేశాలు గావించిన నష్టానికి అదనం, ప్రపంచ ఆధిపత్యం కోసం యుద్దాన్ని తెచ్చిన దేశాలు, స్పానిష్‌ ఫ్లూ నష్టాలను కలిపి లేదా విడిగా తేల్చి దానిలో ఎవరి వాటా ఎంతో ఎలా చెల్లిస్తారో అమెరికా, ఐరోపా దేశాలు ముందు తేల్చుకోవాలి. ఆ యుద్ధంలో స్పెయిన్‌ తటస్ధంగా ఉంది. అయితే ఆ సమయంలోనే తలెత్తిన ఫ్లూ సోకి రాజు 13వ ఆల్‌ఫోన్సో మరణించటంతో నేటి మాదిరే నాటి పత్రికలు కూడా వెనుకా ముందూ చూడకుండా స్పెయిన్‌లోనే పుట్టిందని దానికి స్పానిష్‌ ఫ్లూ అని రాశాయి. తరువాత స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా ఆ పేరు వాడుకలో ఉండిపోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ద కరోనాకు కోవిడ్‌-19 అని పేరు పెట్టినా చైనా వైరస్‌ అని నిందిస్తున్న మాదిరి అన్నమాట. ఈ ఫ్లూ కొనసాగింపుగా 2009లో స్వైన్‌ ఫ్లూ వచ్చింది కనుక దీన్ని కూడా చేర్చి విచారణ జరపాలి. ఇది పుట్టింది అమెరికాలోనా, మెక్సికోలోనా మరొక చోటా అన్నది ఆ దేశాలు తేల్చాలి. పనిలో పనిగా ఎయిడ్స్‌ను ఎక్కడ తయారు చేసి ప్రపంచం మీద వదిలారో కూడా తేల్చి పరిహారం చెల్లించాలి.
మన కళ్ల ముందే ఇరాక్‌లో మారణాయుధాలు, జీవ రసాయన ఆయుధాల గుట్టలు ఉన్నట్లు ప్రచారం చేసిన అమెరికన్ల గురించి తెలుసు. ఆ పేరుతో ఇరాక్‌ మీద దాడి చేసి పదిలక్షల మంది ప్రాణాలు తీశారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. తీరా తమ తనిఖీలో ఎలాంటి జీవ, రసాయన ఆయుధాలు లేవని స్వయంగా అమెరికన్లే ప్రకటించారు. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించి అపార ప్రాణ నష్టానికి కారకులయ్యారు. ఇస్లామిక్‌ తాలిబాన్‌(ఉగ్రవాదులు)లను సృష్టించారు. ఈ రోజు వారు ప్రపంచ వ్యాపితంగా చేస్తున్న దుర్మార్గాలకు గాను ఎవరు పరిహారం చెల్లిస్తారు, ట్రంప్‌ మెడపట్టి బాధిత దేశాలన్నీ నష్టపరిహారం కోరాలి. విచారణకు డిమాండ్‌ చేయాలి. పాక్‌ ఉగ్రవాదులు తాలిబాన్ల శిక్షణలోనే తయారయ్యారు కనుక మన మోడీ గారు కూడా స్నేహితుడనే విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయంలో అమెరికా, ట్రంప్‌ను పరిహారం కోరాలి.

American Crime Case #23: The Afghanistan and Iraq War Logs and the ...
రెండవ ప్రపంచ యుద్ధంలో మిగతా వన్నీ పక్కన పెడితే కొన్ని దేశాలు ప్రత్యేకంగా చేసిన నేరాలు ఉన్నాయి. వాటిని విచారణ జరిపి శిక్షలు కూడా వేశారు. ఆ యుద్దం ముగింపు దశలో అమెరికన్లు జపాన్‌లోని నాగసాకి,హిరోషిమా పట్టణాల మీద వేసిన రెండు అణుబాంబులు ఎంత మందిని బలితీసుకున్నాయో తెలుసు. తొలిసారి అవసరం లేకపోయినా చేసిన ఈ దాడికి అమెరికన్లు జపాన్‌కు ఎంత నష్టపరిహారం ఇస్తారో ముందు తేల్చాలి. అమెరికా మిత్ర దేశంగా జపాన్‌ ఉంది కనుక ఆ పరిహారాన్ని తీసుకోవాలా లేదా అన్నది వేరే విషయం. జపాన్‌ మిలిటరీ చైనా పట్టణాలపై ప్లేగు బాంబులు వేసి ప్లేగు వ్యాధిని వ్యాపింప చేసి దొరికి పోయి విచారణ ఎదుర్కొన్న విషయం దాస్తే దాగేది కాదు. అందువలన దానికి చైనాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో జపాన్‌ కూడా తేల్చాలి. వియత్నాం ఇతర ఇండో చైనా దేశాలేమీ ఎవరి మీదా దాడులు చేయలేదు, దురాక్రమణకు పాల్పడలేదు. అయినా జపాన్‌, ఫ్రెంచి, అమెరికా సామ్రాజ్యవాదులు దశాబ్దాలతరబడి దాడులు చేసి కలిగించిన అపార నష్టానికి ఆ మూడు దేశాలు నష్టపరిహారం చెల్లించాలి, ఎవరి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి.
ఇక జర్మనీ సంగతి. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా 60లక్షల మంది యూదులు, కోటీ పదిలక్షల మంది ఇతరులను బలిగొన్న నాజీ సైన్యాలను నడిపింది జర్మనీ. గ్యాస్‌ ఛాంబర్లలో ఏ రసాయనాన్ని పంపి హత్యలు చేశారో వెల్లడించాలి. దానికి ఎంతో నష్టపరిహారం చెల్లించాలో ముందు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బిల్డ్‌ సంపాదకుడు తగుదునమ్మా అంటూ ఆధారాలు లేని చైనాను నష్టపరిహారం అడుగుతున్నాడు.
మన దేశాన్ని బ్రిటన్‌ ఆక్రమించి మనక ఎంత నష్టం కలిగించిందో తెలిసిందే. అందువలన దాని మీద కూడా విచారణ జరిపి నష్టపరిహారాన్ని రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు లేదా దేశాల మీద ఆపాదించినంత మాత్రాన నేరంచేసినట్లు కాదు. చైనా మీద కూడా ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు.పైన చెప్పుకున్న దేశాల నేరాలు ఇప్పటికే రుజువయ్యాయి. అందువలన నిందితులను, నష్టపరిహారాన్ని తేల్చి తరువాత చైనా సంగతి మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన చరిత్ర ఇప్పటి వరకు సామ్రాజ్యవాదులదే, ఏ సోషలిస్టు దేశానికి అలాంటి చరిత్ర లేదు. ఒక వేళ ఎవరైనా నిరూపిస్తే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

ఆహారం కోసం ఆరు గంటలపాటు క్యూలో కార్లున్న అమెరికా ”పేదలు” !

Tags

,

Food Banks Are Overrun, as Coronavirus Surges Demand - The New ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాతలు చేసే అన్నదానం ఇతర సాయం కోసం మన దేశంలోని పేదలు ఎలా ఎదురు చూస్తున్నారో నిత్యం చూస్తున్నాం. అత్యంత ధనిక దేశమైన అమెరికా పేదలు అదేపని చేస్తున్నారు. మనకు వారికీ తేడా ఏమిటంటే మన పేదలకు కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. అమెరికా పేదలకు విలాసవంతమైన కార్లుంటాయి. అక్కడా ఇక్కడా పేదలు చేయి చాచటం ఒకేవిధంగా ఉంటుంది. మన పిల్లలు అనేక మంది ఇప్పుడు అమెరికాలో చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. వారికి కనీసం దాతలు లేదా ప్రభుత్వం అందచేసే ఆహారం ఏమేరకు అందుతోందో లేదో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. ఆహార కూపన్లకు అర్హులో కాదో కూడా చెప్పలేము. మన దేశంలోని వలస కూలీలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో అర్ధం చేసుకుంటే అమెరికా స్ధాయిలో అక్కడ ఉపాధి కోసం వెళ్లిన వారు కూడా ఇలాగే ఉండి ఉంటారు.
మన రైతాంగం పండించిన పంటలను విధిలేక అయినకాడికి అమ్ముకోవటం లేదా కూలీ ఖర్చులు కూడా రాకపోతే పొలాల్లోనే దున్నివేయటం కొత్త కాదు. ఇప్పుడు అమెరికాలో రైతులు అనేక చోట్ల ఇప్పుడు అదే చేస్తున్నారు. చికాగో సన్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15న రాసిన సంపాదకీయం ప్రకారం పితికిన పాలను కొనే వారు లేక రైతులు గోతుల్లో పోస్తున్నారు. కూరగాయల పొలాలను దున్ని పంటను మట్టిలో కలిపివేస్తున్నారు. అమెరికా ఎదుర్కొంటున్న ఈ నూతన సవాలును కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అది కోరింది. ఇది రాస్తున్న సమయానికి ప్రపంచంలో కరోనా మరణాలు లక్షా 65వేలు కాగా ఒక్క అమెరికాలోనే 40వేల మంది చనిపోయారు. ప్రపంచంలో 24లక్షల మంది వైరస్‌బారిన పడితే అమెరికాలో ఏడులక్షల 65వేల మంది ఉన్నారు. తన ఏలుబడిలో ఇంత దారుణం ఎలా జరిగిందో దర్యాప్తు జరిపించాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం తమ నిపుణులను చైనా పంపి కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో దర్యాప్తు చేయిస్తానని కబుర్లు చెబుతున్నాడు. అమెరికాలో ఇంతగా పరిస్దితి ఎందుకు దిగజారిందో ఏదో ఒక దేశం కాదు కనీసం ఐక్యరాజ్యసమితి బృందాన్ని అయినా అధ్యక్షుడు అనుమతిస్తాడా !
పరిస్ధితులు బాగున్నాయి అనుకున్నపుడే అమెరికాలో ఆహార భద్రత లేని కుటుంబాలు 1.43కోట్లు ఉన్నట్లు 2018 వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొన్నది. గత నాలుగువారాల్లో నిరుద్యోగులుగా మారామని, భృతి ఇవ్వాలని కోరుతూ 2.2కోట్ల మంది లేదా అమెరికా కార్మికవర్గంలో 13శాతం దరఖాస్తు చేశారు.వీరిలో దాదాపు సగం మంది యజమానులు ఆరోగ్యబీమా కల్పించిన వారే. ఇప్పుడు నిరుద్యోగులు కావటంతో ఆ రక్షణ ఉద్యోగం నుంచి తొలగించిన మూడు నెలలవరకు మాత్రమే ఉంటుంది. తరువాత కొనసాగాలంటే కార్మికులు తమ జేబుల నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలి లేదా బీమా లేకుండా జీవించాలి. భృతి దరఖాస్తుదారుల్లో 59 మంది మహిళలు ఉన్నారంటే నిరుద్యోగం వారి మీద ఎలాంటి ప్రభావం చూపనుందో అర్ధం చేసుకోవచ్చు.రోడె ఐలాండ్‌లోని పదిలక్షల మంది జనాభాలో 1.66లక్షల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు నాలుగు వందల దరఖాస్తులు వస్తున్నాయి.
ఆహార భద్రత లేని వారు అమెరికాలో 2019లో 3.7కోట్ల మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. వీరిలో కోటీ పదిలక్షల మంది పిల్లలు,54లక్షల మంది వృద్దులు ఉన్నారు. కరోనా కేసుల మాదిరి ఈ సంఖ్యలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. పేదలకు ఆహారం అందచేసే ఫీడింగ్‌ అమెరికా అనే ధార్మిక సంస్థ ఇప్పుడు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అంతే కాదు అవసరమైన ఆహారాన్ని నిల్వచేసేందుకు అది నిర్వహించే ఆహార బ్యాంకులు, ఇతర సామూహిక వంటశాలలకు తగిన విస్తీర్ణం కలిగిన గోడవున్లు కూడా లేవని వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఆహారం కోసం లైన్లలో నిలుస్తున్నవారికి అధిక ధరల్లో ఆహారం కొనాల్సి వస్తోంది. సూపర్‌ మార్కెట్ల నుంచి వచ్చే విరాళాలు నాటకీయంగా పడిపోయాయి. గార్డియన్‌ పత్రిక విలేకర్లు సేకరించిన సమాచారం ప్రకారం పెన్సిల్వేనియా ఆహార బ్యాంకులు వారానికి పదిలక్షల డాలర్లు అదనంగా ఖర్చు చేస్తున్నా వచ్చిన వారందరికీ ఆహారం అందచేయలేకపోతున్నాయి. అనేక కేంద్రాల బడ్జెట్లు తారుమారవుతున్నాయి. బియ్యం ధరలు మూడు రెట్లు పెరిగాయి, అవి బంగారంలా మారాయి, డబ్బాల్లో నిల్వఉండే పండ్లు, కూరగాయలు దొరకటం లేదు.గత సంవత్సరం నాలుగు కోట్ల మంది అమెరికన్లు 200 ఆహార బ్యాంకులు, 60వేల వంటశాలల వండిన ఆహారం లేదా వంట వస్తువులను పొందారు.

Electric car drivers face queues and quarrels
లాస్‌ వేగాస్‌లో విలాసవంతమైన కార్లు వేసుకొని తెల్లవారు ఝామున నాలుగు గంటలకు వచ్చి ఆరుగంటల పాటు వరుసలో ఉండి ఆహారాన్ని తీసుకుపోతున్నవారు ఉన్నారు. గత వారం శాన్‌ ఆంటోనియోలో అసాధారణ రీతిలో పదివేల మంది కార్లలో ఆహారం కోసం వచ్చారు. అదే సాధారణ సమయాల్లో నాలుగు వందల మంది వచ్చే వారు. కంపెనీల్లో లేఆఫ్‌లు పెరగటమే దీనికి కారణం. అనేక చోట్ల ఆహార బ్యాంకుల వద్ద భద్రతా సిబ్బందిని నియమించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇండ్లకే ఆహారం సరఫరా చేస్తున్నారు. సియాటిల్‌ నగరంలోని ఒక ఆహారబ్యాంకు బడ్జెట్‌ ఇప్పటి తీరును బట్టి ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్‌ వాణిజ్య యుద్దం కారణంగా ఆహార బ్యాంకులకు 2019లో 0.54 మిలియన్‌ డాలర్లకు వచ్చిన సరకులను కొనుగోలు చేయటానికి 2018లో 1.1మిలియన్‌ డాలర్లు కాగా ఈఏడాది అదే సరకుల విలువ 1.71 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. కరోనాకు ముందు లూసియానాలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఆకలితో ఉంటే ఇప్పుడు ముగ్గురిలో ఒకరు ఉన్నారు.
అమెరికన్లకు పొదుపు అలవాటు లేదు, ఉద్యోగాలు లేదా అప్పులు చేసి అవసరమైనవి కొనుగోలు చేసి బతికే విధంగా తయారయ్యారు. గత ఏడాది వివరాల ప్రకారం అమెరికన్లు 14లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పులు కలిగి ఉన్నారు. వాటిలో కార్ల రుణాలు 1.3లక్షల కోట్ల డాలర్లు, క్రెడిట్‌ కార్డు బకాయిలు లక్ష కోట్ల డాలర్లు, విద్యా రుణాలు 1.48 లక్షల కోట్లు, 9.4లక్షల కోట్ల తనఖా రుణాలు ఉన్నాయి.కొరత పోషకాహార సహాయ పధకానికి ఆహార కూపన్ల కోసం దరఖాస్తు చేసే వారికి గత డిసెంబరులో ట్రంప్‌ సర్కార్‌ సవరించిన నిబంధనల కారణంగా కనీసం ఏడు లక్షల మంది అనర్హులయ్యారని అంచనా. విధించిన షరతులను బాధితులు రుజువు చేయటం కష్టంగా మారింది. పద్దెనిమిది-49 సంవత్సరాల మధ్య వయస్సు వారు తమ మీద ఎవరూ ఆధారపడిలేరని, తాము వారానికి 20గంటలు పనిచేశామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవి చేసినా వారు మినహాయింపులు పొందిన ప్రాంతాలు, రాష్ట్రాలలో ఉన్నవారై ఉండాలి. దారిద్య్రరేఖ కింద ఉన్న వారి సంఖ్యను తక్కువ చేసి చూపేందుకు,నిరుద్యోగ భృతి చెల్లింపును ఎగవేసేందుకు ఈ పని చేశారు.

Rice is like gold': US food banks face shortfalls of millions of ...
అమెరికాలో రోజు రోజుకూ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికి అదుపులోకి వస్తాయో చెప్పలేని స్ధితి. మరోవైపు నవంబరులో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి కూరుకుపోతున్నట్లు ఆందోళన పెరుగుతోంది. కరోనాకు ముందు, వ్యాధి తొలి రోజుల్లో ఎన్నికల్లో ట్రంప్‌ విజయం ఖాయం అని భావించిన వారు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్‌ వైఫల్యం, మూర్ఖత్వం పౌరుల ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున జోబిడెన్‌ అభ్యర్ధిత్వం ఖరారైంది. ప్రస్తుతం దేశమంతా కరోనా కల్లోలంలో మునిగి ఉంది. ముఫ్పైకోట్ల మంది గృహబందీలో ఉన్నారు. ఎప్పుడు తొలగించేది తెలియని స్ధితి. ఒక వైపు ఆకలి మరోవైపు నిరుద్యోగం, ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న స్ధితిలో వాటి మీద కేంద్రీకరించకుండా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ట్రంప్‌ చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద ప్రారంభించిన ప్రచార యుద్దం అతగాడికే ఎదురుతిరిగే అవకాశాలున్నాయన్నది ఒక అంచనా !

పెద్దన్న ట్రంప్‌ పిచ్చిపనులపై నిజమైన దేశభక్తుల మౌనం తగదు మోడీ గారూ !

Tags

, , , ,

Donald Trump 'imitates Indian Prime Minister Narendra Modi's ...

ఎం కోటేశ్వరరావు
అమెరికా పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నాడు, యావత్‌ ప్రపంచాన్ని అలవికాని ఆర్ధిక బాధల్లోకి నెడుతున్నాడు. ఈ వైఫల్యాన్ని, నేరాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థను, చైనాను దెబ్బతీసేందుకు పూనుకున్నాడు. ఈ వ్యాఖ్యతో ప్రారంభించిన ఈ రాతలో ఇంకేమి ఉంటుందిలే అని చప్పరించే వారు తమ సమయాన్ని వృధా చేసుకోనవసరం లేదని మనవి. ప్రాణ, విత్త, మానభంగములందు అసత్యాలు చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. ట్రంప్‌ దానికి ఎన్నికలను కూడా జోడించాడు. నవంబరులో జరగాల్సిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు ట్రంప్‌ ఎంతకైనా తెగించేందుకు సిద్దపడుతున్నాడని వేరే చెప్పనవసరం లేదు.
ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్ధలు ఏ ఒక్కరి సొత్తో కాదు. వాటిని ప్రారంభించే రోజు సంస్ధాపక సభ్య దేశాలలో కొన్నింటికి దురాలోచనలు మరికొన్నింటికీ దూరాలోచనలు ఉన్నాయి. ఎన్ని లోపాలున్నా అంతకంటే మెరుగైన ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనే వరకు ఉన్నవాటిని రక్షించుకోవటం తప్ప మరొక మార్గం లేదు. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాకు అనుకూలంగా పని చేస్తోందని లేదా చైనా ఆ సంస్ధ మీద పెత్తనం చేస్తోందని నిజంగా నమ్మేవారు 1945 నుంచి 1971 వరకు చైనాను ఐక్యరాజ్యసమితి, దాని సంస్ధల గడప తొక్కనివ్వలేదని, చైనా పేరుతో తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా పరిగణిస్తూ అమెరికా మోకాలడ్డిందని, ఐరాసలో అనుమతించినా 2000 సంవత్సరం వరకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు భాగస్వామ్యం కల్పించలేదని కూడా తెలుసుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే పెత్తనం చేసింది. ఈ రోజు చైనా పెత్తనం చేస్తోందంటూ బుడిబుడి రాగాలు తీస్తోంది. ఇంతకాలం అమెరికా తప్పుడు పనులు చేసింది కనుకనే ఐరాసలో దానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, అదేపని చైనా లేదా మరొక దేశం చేస్తే వాటికీ అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు చైనా అలాంటి తప్పులు చేస్తోందా? ఉదాహరణలు ఉంటే ఎవరైనా చెప్పాలి మరి !
ఐక్యరాజ్యసమితికి రూపకల్పన చేసిన సమయానికి అమెరికా అగ్రరాజ్యం. నిబంధనల కూర్పులో దానిదే పైచేయి. ఇప్పుడు వాటినే అది ప్రశ్నిస్తోంది. ఐరాస, దాని సంస్దలు సమర్ధవంతంగా లేదా ప్రజాస్వామ్య బద్దంగా పని చేయాలంటే సంస్కరణలు తేవాలి. దానికి బదులు అమెరికా వంటి దేశాలు అర్ధంతరంగా నిధులు నిలిపివేస్తే నష్టపోయేది మన వంటి లేదా ఇంకా దరిద్రంలో ఉన్న దేశాలే. ఇలాంటి చర్యలకు బ్లాక్‌మెయిల్‌ లేదా బెదరింపు అని తప్ప మరొక భావం, అర్ధం లేదు. పెద్దన్న బెదరింపులను నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించటం లేదో తెలియదు. మన ప్రయోజనాలను రక్షించుకోవటమే దేశభక్తి అని అంగీకరిస్తే ఆచరణలో అది కనిపించాలి కదా ! అమెరికా మెడలు వంచి గత ఆరు సంవత్సరాలలో మనం సాధించిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరి కోసం పని చేస్తున్నట్లు ?
అమెరికా తన ఆయుధాలను అమ్ముకొనేందుకు అనేక చోట్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు, అంతర్యుద్ధాలను రెచ్చగొడుతోంది. గతంలో మన మీద పాకిస్ధాన్‌ను ఎగదోసింది, ఇప్పుడు మనలను దాని మీదకు ఎగదోస్తోంది. రెండు దేశాలకూ అవసరమైన ఆయుధాలను అందిస్తోంది, డాలర్లను జేబులో వేసుకుంటోంది. మనం ప్రాణాలను కాపాడే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు ఇస్తే దానికి బదులు ప్రాణాలు తీసే ఆయుధాలను మనకు అమెరికా అందచేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన వెంటిలేటర్ల బదులు ఇతర దేశాల్లో ప్రాణాలు తీసే ఆయుధ తయారీకే ట్రంప్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లో నాటి సోవియట్‌ యూనియన్‌ పలుకుబడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్ల పేరుతో మత ఉ గ్రవాదులను తయారు చేసింది. సోవియట్‌ ఉపసంహరణ తరువాత వారు ఏకుమేకై అమెరికాకే తలనొప్పిగా తయారయ్యారు. అక్కడ తన సైన్యాన్ని నిర్వహించటం పెద్ద భారంగా మారింది, చివరకు ఉపసంహరణకు ఆ తాలిబాన్లతోనే చర్చలు జరపాల్సిన దుర్గతి ట్రంప్‌కు పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌, ప్రపంచ సంపదలు, మిలిటరీ రీత్యా వ్యూహాత్మక ప్రాంతాల మీద పట్టు సాధించటం అమెరికా కార్పొరేట్ల అసలు లక్ష్యం. అక్కడి అధ్యక్షులందరూ వాటి కాపలాదారులు, సేవకులే.
బడ్జెట్‌ను సర్దుబాటు చేయలేక సతమతం అవుతున్న ట్రంప్‌ అధికారంలోకి రాగానే పొదుపు చర్యల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి పరిరక్షక కార్యకలాపాలకు అంద చేస్తున్న నిధుల కోత పెట్టాలని ప్రతిపాదించాడు. తరువాత అన్ని ఐరాస కార్యక్రమాలకు సగం కోత కోయాలని పార్లమెంట్‌ను కోరాడు.శాంతి పరిరక్షక కార్యకలాపాలకు కేటాయించే నిధుల మీద ఉన్న ఆంక్షలను 2001లో తొలగించారు. ట్రంప్‌ ప్రతిపాదనలను చర్చించిన పార్లమెంట్‌ శాంతిపరిరక్షక కార్యకలాపాల మొత్తాలకు తిరిగి పరిమితి విధించింది. దాంతో వాటికి అమెరికా అందచేస్తున్న మొత్తం 28 నుంచి 25శాతానికి తగ్గిపోయింది. ఆమొత్తం 2019లో 20 కోట్ల డాలర్లు. ఇదే సమయంలో రానున్న పది సంవత్సరాల కాలంలో శాంతి పరిరక్షక కార్యకలాపాలకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని చైనా నిర్ణయించింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేస్తున్న దేశాలకు చేస్తున్న సాయానికి కూడా కోత పెట్టాలని ట్రంప్‌ కార్యాలయం ప్రతిపాదించింది.
ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరి 19నాటికి 1095 రోజుల్లో ఆడిన అబద్దాల సంఖ్య 16,241 అని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణలో వెల్లడించింది. నోరు తెరిస్తే రోజూ ఏదో ఒక అబద్దం ఆడిన అధ్యక్షుడు అమెరికా చరిత్రలో మరొకరు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు నిలిపివేసేందుకు ఆడిన అబద్దాలు ఎన్నో ! చైనా చెప్పినట్లు చేస్తోంది, చైనా దాచిన సమాచారాన్ని సమర్ధించింది. ఊహాన్‌లో కరోనా వ్యాప్తి పెద్ద సమస్య కాదని చెప్పిందట, అమెరికా సరిహద్దులను చైనాకు తెరిచి ఉంచాలని తొలుత సలహా ఇచ్చిందట. ఆరోగ్య సంస్ధ ఒక వేళ చెప్పిందే అనుకుందాం, మాకంటే మొనగాండ్లు లేరని విర్రవీగే సిఐఏ, ఎఫ్‌బిఐ తెలివి తేటలు ఏమయ్యాయి. చైనా సమాచారాన్ని దాచిందే అనుకుందాం, నష్టపోయేది వారే కదా ! ఎదుటి వాడు తొడకోసుకుంటే తెలిసి ఎవరైనా మెడకోసుకుంటారా ? అమెరికా, ఐరోపా దేశాలు చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ద చెప్పిన వాటిని పెడచెవిన పెట్టి తమ పౌరుల ప్రాణాల మీదకు తేవటాన్ని ఏమనాలి ?
అసలేమి జరిగిందో చూద్దాం. కరోనా వైరస్‌ నిర్ధారణ గాక ముందు డిసెంబరు 31న చైనా ఒక ప్రకటన చేస్తూ ఊహాన్‌ నగరంలో న్యుమోనియా కేసులు అసాధారణంగా నమోదైనట్లు వెల్లడించింది. జనవరి ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నూతన కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చినట్లు నిర్ధారించింది. పన్నెండవ తేదీనాటికి దాని పూర్తి జన్యువును నిర్ధారించింది. తొమ్మిది రోజుల తరువాత తన తొలి శాస్త్రవేత్తల బృందాన్ని ఊహాన్‌ నగరానికి పంపింది. జనవరి 30న ఏక కాలంలో అనేక మందికి సోకే అంటువ్యాధిగా ప్రజారోగ్యానికి ప్రమాదం వచ్చిందని, అంతర్జాతీయ సమాజం అత్యవసరమైన అంశంగా పరిగణించాలని ప్రకటించింది. అయితే ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించుతుందని స్పష్టమైన ఆధారాలు లేవని చైనా చేసిన ప్రకటనను జనవరి 14న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ట్వీట్‌ చేసింది. తరువాత వచ్చిన సమాచారం మేరకు ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది.కానీ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికాను లేదా ప్రపంచాన్ని గానీ తప్పుదారి పట్టించలేదు. నిజానికి ఐరోపా ధనిక దేశాలు, ట్రంప్‌, యావత్‌ అమెరికా యంత్రాంగం ఆ హెచ్చరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ద ప్రకటనలను పట్టించుకోనవసరం లేదని జనవరి 22న ట్రంప్‌ చెప్పాడు. ఫిబ్రవరి పదవ తేదీన న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఏప్రిల్‌ నాటికి వాతావరణం వేడెక్కుతుంది, కరోనా వైరస్‌ ఎలా వచ్చిందో అలాగే ఆశ్చర్యకరంగా అదృశ్యం అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి 26న విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఫ్లూ, ఫ్లూ వంటిది, అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది ఫ్లూతో మరణిస్తుంటారని తెలియదా అన్నాడు. మార్చి తొమ్మిదవ తేదీన కరోనాను తాము సమర్దవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటించాడు. అత్యధిక కేసులు, మరణాలో అమెరికాలో మరణ మృదంగం మోగుతుంటే ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధను తప్పుపడుతున్నాడు. తన తప్పిదం లేదని జనాన్ని నమ్మించేందుకు అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నాడు. కట్టుకథలను మీడియాకు అందిస్తున్నాడు.

Ingram Pinn's illustration of the week: 'A beautiful timeline ...
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. చైనాలో కరోనా వైరస్‌ గురించి ఒక వైద్యుడు ముందే హెచ్చరించాడన్నది ఒక అంశం. అది నిజమై ఉండవచ్చు.ఒక ప్రాంతంలో తలెత్తిన ఒక ప్రమాదకర వైరస్‌ను ఎవరో ఒకరు లేదా ఒక బృందం ముందుగా అనుమానించటం లేదా కనుగొనటం సహజమే. అయితే అది యావత్‌ సమాజాన్ని భయాందోళనకు గురిచేసేది అయితే ముందుగా ప్రభుత్వంతో సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోకుండా, ఏర్పాట్లు చేయకుండా బయటకు వెల్లడిస్తే సమాజం అల్లకల్లోలం అవుతుంది. సదరు వైద్యుడు తాను అనుమానించిన అంశాన్ని నిర్దారిస్తూ సోషల్‌ మీడియాలో తన సహచరులతో పంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్‌ ఆసుపత్రిలో తగిన రక్షణ పరికరాలు లేవని, పోలీసుల ప్రవర్తన సరిగా లేదని తప్పుపట్టటం, మంత్రులతో సహా ఎవరూ పట్టించుకోవటం లేదని బహిరంగంగా చేసిన విమర్శను సహించని ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంది. అలాంటిది ఒక వైరస్‌ భయంకరమైనదని ఒక బృందం లేదా సంస్ధ నిర్దారించకుండా ఒక వైద్యుడు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఏ సర్కార్‌ అయినా ఎలా తీసుకుంటుంది ? తప్పుపడుతూ చైనా సర్కార్‌ ఆ వైద్యుడిపై చర్య తీసుకుంది. అతను చెప్పింది నిజమైంది గనుక తరువాత తన చర్యను సరిదిద్దుకుంది. ఒక వేళ అవాస్తవం అయి ఉంటే ?
2009, 10 సంవత్సరాలలో స్వైన్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. అది 1918-19లో ప్రపంచాన్ని వణికించి లక్షల మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్‌ ప్లూ హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ తాలుకు కొత్త రకం .పక్షులు, పందులు, మనుషుల నుంచి పునర్వర్గీకరణం చెందింది. ఇది పందుల నుంచి వ్యాపించిన వైరస్‌ కావటంతో దాన్నీ స్వైన్‌(పంది)ఫ్లూ అని పిలిచారు.ఇది కనీసం 70 నుంచి 140 కోట్ల మందికి సోకిందని అంచనా వేశారు. అయితే మరణించిన వారు 1.5లక్షల నుంచి 5.75లక్షల మంది ఉంటారని అంచనా వేశారు.అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించిన మేరకు 67లక్షల 24,149 మందికి వ్యాధి సోకగా మరణించిన వారి సంఖ్య 19,654 మాత్రమే. ప్రతి ఏటా ప్రపంచంలో ఫ్లూ(జలుబు) కారణంగా మరణించే వారు రెండున్నర నుంచి ఐదు లక్షల మంది వరకు ఉంటారని, దీనితో పోల్చుకుంటే స్వైన్‌ ప్లూతో మరణించిన వారు తక్కువే అని కొందరు పోలిక చెప్పారు. కొందరు ఆరోపిస్తున్నట్లు కరోనాకు చైనాయే కారణమైతే ఏటా లక్షల మందిని బలిగొంటున్న ఫ్లూ వైరస్‌ను ఎవరు వదులుతున్నట్లు ?
స్వైన్‌ ఫ్లూ తొలుత మెక్సికోలోని పందుల ఫారాల నుంచి సోకి 2009 మార్చి తొమ్మిదవ తేదీన ఒక ఐదు సంవత్సరాల బాలుడిలో బయటపడింది. ఏప్రిల్‌ చివరిలో 50 రోజుల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే అంటువ్యాధిగా ప్రకటించింది. అంత సమయం ఎందుకు తీసుకున్నట్లని ఎవరూ ఆనాడు సంస్ధను తప్పుపట్టలేదు. నిధులు నిలిపివేయలేదు. అన్ని అంశాలను నిర్ధారించుకున్న తరువాతే ఒక బాధ్యతాయుత సంస్ధ వ్యవహరిస్తుంది. తాము అనేక నివారణ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఆ రోజుల్లో గొప్పలు చెప్పుకున్నప్పటికీ అక్టోబరు 24న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించాడు. అన్ని నెలలు ఎందుకు ఆలస్యం చేసినట్లు ? మరణాల సంఖ్య అధికార రీత్యా ప్రకటించిన మేరకు తక్కువే అయినా అగ్రస్ధానంలో అమెరికాయే ఉంది. ఇక మన దేశం విషయానికి వస్తే అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వైన్‌ ఫ్లూను మోసుకు వచ్చాడు. హైదరాబాదు విమానాశ్రయంలో మే 13వ తేదీన గుర్తించారు, ఆగస్టు నాటికి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికులు 937 మంది మరణించగా ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏలుబడిలో గుజరాత్‌ 488 మరణాలతో రెండవ స్ధానంలో నిలిచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా మీద ఆధారపడింది అనటం ఎంతవరకు వాస్తవం ? ప్రపంచ ఆరోగ్య సంస్దకు మేము ఏటా 40 నుంచి 50 కోట్ల డాలర్లు అందచేస్తున్నాము, అదే చైనా నాలుగు కోట్ల డాలర్లు, అంతకంటే తక్కువే ఇస్తోంది. ఒక ప్రధాన ప్రాయోజిత దేశంగా ఉన్న తమకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పూర్తి జవాబుదారీగా ఉండాలని కోరే హక్కు మాకుంది అని ట్రంప్‌ సెలవిచ్చాడు. అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నంత మాత్రాన అమెరికా చెప్పినట్లు ఏ సంస్ధ అయినా నడవాలా ?
అంటు వ్యాధుల నివారణ సమాచారం ఎవరి దగ్గర ఉంటే ఆ దేశాల మీద ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆధారపడటం సహజం. ప్రజారోగ్యం విషయంలో చైనా ప్రత్యేక చర్యలు, 2003లో కరోనా తరగతికి చెందిన సారస్‌ను చైనాలో సమర్దవంతంగా అరికట్టిన చరిత్ర, దానికి సంబంధించి వారి దగ్గర ఉన్న సమాచారం మరొక దేశం దగ్గర లేదు. కనుకనే కరోనా నిర్దారణ కాగానే చైనా సమాచారం మీద ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధారపడింది తప్ప నిధులు ఎక్కువ పొందో లేక మరొక ప్రలోభంతోనో కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఐరోపా యూనియన్‌ అమెరికాతో ఉంటుంది తప్ప చైనా మిత్రపక్షం కాదు. అలాంటిది నిధులు నిలిపివేయాలన్న ట్రంప్‌ చర్యను ఖండిస్తూ తీవ్ర విచారం ప్రకటించింది. నిందల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. వైరస్‌కు సరిహద్దులు లేవు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యేకించి నిధుల లేమితో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్దను బలపరచాలి, వాక్సిన్ల తయారీ పరీక్షల అభివృద్ధికి తోడ్పడాలని జర్మన్‌ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ వ్యాఖ్యానించాడు.
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ట్రంప్‌ చైనా మీద, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద నిందలు వేశాడు. ఐక్యరాజ్యసమితి సంస్ధలను తన రాజకీయాలు, దుర్మార్గ చర్యలకు ఉపయోగించుకోవటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వాటిని తన కనుసైగలతో నడిపించిన అమెరికా ఇప్పుడు ప్రాభవం కోల్పోతుండటంతో ఇతర దేశాలు అలాగే వ్యవహరిస్తున్నాయనే అనుమానపు జబ్బుకు గురైంది.
మన కళ్ల ముందే ఇరాక్‌లో ఏం జరిగిందో చూశాము. ఇరాన్‌కు వ్యతిరేకంగా పని చేసినంతకాలం ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుసేన్‌కు అన్ని రకాల ఆయుధాలను అందించి పదేండ్ల పాటు యుద్దం చేయించటంలో అమెరికా పాత్ర బహిరంగ రహస్యం. తరువాత అదే సద్దామ్‌ అమెరికా వ్యతిరేకిగా మారటంతో సద్దామ్‌ను వదిలించుకొనేందుకు ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశారని అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రచారం ప్రారంభించాయి. అమెరికా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న సద్దామ్‌ కువైట్‌పై దాడి చేసి అమెరికా సైనిక జోక్యానికి అవకాశం కల్పించాడు.
భద్రతా మండలిలో తీర్మానం చేయించి ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్ద ప్రతినిధి బృందాన్ని పంపారు.దానితో పాటు అమెరికా ప్రతినిధులు కూడా వెళ్లారు. దానిలో సిఐఏ ఏజంట్లు ఉన్నారని అప్పుడే వార్తలు వచ్చాయి.రెండు బృందాలు కలసి రెండు సంవత్సరాల పాటు ఇరాక్‌లో తిష్టవేసి వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసి 1,625 మంది 1,700 స్దలాలను వెతికి చివరికి ప్రకటించిందేమంటే ఎలాంటి ఆయుధ ఆనవాళ్లు లేదా జీవ, రసాయన ఆయుధ కార్యక్రమాలు లేవని తేల్చారు. బుష్‌ విచారం వ్యక్తం చేశాడు. అయితే తమ చర్యను సమర్దించుకొనేందుకు ఆ కార్యక్రమాలను రద్దు చేసిన ఆనవాళ్లు దొరికాయని ప్రకటించి అమెరికా, ఇతర దేశాల యుద్ద నేరాలను కప్పిపుచ్చారు. ఆ పేరుతో ఇరాక్‌ను ఆక్రమించిన అమెరికా సేనలు చివరకు సద్దామ్‌ హుసేన్‌ను ఉరితీసి తమ తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అమెరికా దాడి కారణంగా లక్షా తొమ్మిదివేల మంది మరణించినట్లు వికీలీక్స్‌ బయటపెట్టిన అమెరికా పత్రాల్లో ఉండగా మరో అంచనా ప్రకారం పదిలక్షల మంది ఇరాకీయులు అమెరికా కారణంగా మరణించారు. ఆల్‌ ఖైదాకు ఇరాక్‌ పాలకులకు ఎలాంటి సంబంధం లేదని సిఐఏ రహస్య పత్రాలు వెల్లడించాయి. అమెరికా చెప్పిన వన్నీ అబద్దాలే అని తేలిపోయింది. అలాంటి అమెరికా చైనా,ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే నమ్మటం ఎలా ?

ఊహాన్‌లో సంభవించిన కరోనా మరణాల సంఖ్యను సవరించినట్లు చైనాయే స్వయంగా ప్రకటించింది. దీన్ని చూపి చూశారా చైనా నిజాలను దాచిందని మేం ముందే చెప్పాం అంటూ అమెరికా లేదా ఎవరైనా వాదించవచ్చు. వివిధ కారణాలతో కోటి మంది జనాభా ఉన్న ఊహాన్‌లో రోజూ అనేక మంది మరణిస్తుంటారు. అధికార యంత్రాంగం కరోనా మరణాలను కొన్నింటిని సహజ మరణాలుగా నమోదు చేసి ఉండవచ్చు. తరువాత విచారణలో కాదని తేలినందున అంకెలను సవరించారు. అదేమీ నేరం కాదే. మరణాలు, శ్మశానాల్లో అస్ధికలశాల సంఖ్య గురించి పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. నిజంగా వాటిని అక్కడి ప్రభుత్వాలు, పాలకులు నమ్మితే, పెద్ద సంఖ్యలో మరణించినట్లు చెబుతున్నదానికి ఆధారాలుంటే, అలాంటి ప్రమాదకారి కరోనా కట్టడికి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పిన వారు లేరు. పాత చింతకాయ పచ్చడినే కొత్తగా వండి వడ్డిస్తున్నారు.
ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీదనే కాదు అనేక సంస్ధల మీద ట్రంప్‌ సర్కార్‌ దాడి చేసింది. అదిరించి బెదిరించి లొంగదీసుకోవాలని చూసింది. ఆప్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అమెరికన్ల మీద , ఇతర దేశాలపై అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలపై విచారణ జరుపుతున్న అంతర్జాతీయ నేర కోర్టు న్యాయమూర్తులు, సిబ్బందిని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జాన్‌ బోల్టన్‌ బెదిరించాడు. అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనల గురించి నిత్యం ఇతర దేశాలపై దుమెత్తిపోసే అమెరికా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్ధ నుంచి వైదొలిగిన తొలి దేశంగా చరిత్రలో నమోదైంది. అమెరికాలో దారిద్య్రం గురించి ఒక నివేదికను రూపొందించేందుకు ధైర్యం చేసిన ప్రొఫెసర్‌ ఫిలిప్‌ ఆల్‌స్టన్‌ను ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ విమర్శించాడు. ప్రపంచవ్యాపితంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసపోవటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అసలు అమెరికా అంటేనే వలస వచ్చిన వారితో కూడిన దేశం, అలాంటిది ప్రపంచ వలసల చర్చల నుంచి అమెరికా వైదొలిగింది. యునెస్కో నుంచి వైదొలిగి శాశ్వత పరిశీలక దేశంగా ఉంటానని ప్రకటించింది. వాతావరణ మార్పులు, యూదుల పట్ల వ్యతిరేకత, వారి మీద జరిగిన మారణకాండ వంటి అంశాల మీద యునెస్కో పని చేయటం, దానిలో అమెరికా పాత్ర బయటకు రావటం సహించలేని అమెరికా ఈ చర్యకు పాల్పడింది. పాలస్తీనియన్లు, ఇతర చోట్ల నిర్వాసితులుగా మారిన వారి సహాయ చర్యలు చేపట్టే సంస్ధకు తామింకేమాత్రం నిధులు అందచేసేది లేదని ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. ఇలాంటి చర్యలను చూసిన తరువాత అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితిని అమెరికా మిత్రునిగా చూస్తోందో శత్రువుగా భావిస్తోందా అన్నవే అవి. ఇదంతా ఇంటర్నెట్‌లో వెతికితే ఎవరికైనా దొరికే సమాచారమే !
ఇటీవలి కాలంలో ఏమి చేసినా చివరికి ప్రధాని నరేంద్రమోడీని అవమానించినా అమెరికా, ట్రంప్‌ను బలపరిచే, గుడ్డిగా వెనకేసుకు వచ్చే, చైనా మీద బురద చల్లే ఒక అనాలోచిత ధోరణి మన దేశంలో వెల్లడి అవుతోంది. అమెరికాను నమ్మితే కుక్కతోకను బట్టి గోదావరిని దాటే యత్నం లాంటిదే. నరేంద్రమోడీని లేదా మరొకరిని వ్యక్తిగా లేదా ఒక రాజకీయవేత్తగా విమర్శిస్తే దాని సంగతి వారు చూసుకుంటారు. ప్రధాని పదవిలో ఉన్నపుడు అవమానాలు పాలుకావటం అంటే దేశ వ్యవస్ధనే అవమానించటంతో సమానం. అమెరికా పౌరుడు బిల్‌ గేట్సే తమ ప్రభుత్వ చర్యను విమర్శించాడు. కానీ మన పాలకపక్షాలకు ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. ముందు కరోనా నివారణకు మన ప్రాధాన్యత అని మన ప్రభుత్వ ప్రతినిధి ఒక ముక్తాయింపు ఇచ్చారు. మిగతా దేశాలకు ఆ మాత్రం తెలియక విమర్శించినట్లా ?

Who's Ready to Die for Trump's Ego? | Common Dreams Views
ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు ఆగిపోతే నష్టపోయేది మనవంటి దేశాలే అని గుర్తించటం అవసరం. అమెరికా, ఇతర ఐరోపా దేశాలలోని బహుళజాతి ఔషధ గుత్త సంస్ధలు ప్రజారోగ్యం, మహమ్మారులకు సంబంధించిన సమాచారంపై గుత్తాధిపత్యంతో ఔషధాలు, వాక్సిన్ల తయారీకి పూనుకోవటం తెలిసిందే. మన వంటి వర్ధమాన దేశాలకు అవసరమైన సలహాలు, సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి మాత్రమే పొందగలం. నిధులు లేక దాని కార్యకలాపాలు కుంటుపడితే నష్టపోయేది మన దేశం, మన ఔషధ కంపెనీలే అని గుర్తించాలి. కామెర్ల ఔషధం మన దేశ సంస్ధలు తయారు చేయక ముందు విదేశీ రకాలకు ఎంత ధర చెల్లించామో తెలిసినదే. మన వంటి దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎంతగానో తోడ్పడుతోంది. అందువలన ట్రంప్‌ చర్యను యావత్‌ సభ్య సమాజం నిరసించాలి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఎన్నో కేసులను దాఖలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటివి ఎన్నో చూడాల్సి రావచ్చు. అందుకే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రపంచ సంస్ధలను కాపాడుకొనేందుకు పూనుకోవాలి. ట్రంప్‌ను ఏ విధంగా సమర్ధించినా అది దేశద్రోహం తప్ప దేశభక్తి కాదు !

(అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -2 ముగింపు)

అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -1

Tags

, , , ,

Donald Trump | WHO Coronavirus | US President Donald Trump Latest ...
ఎం కోటేశ్వరరావు
ప్రపంచ పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌కు అకారణంగా కోపం వచ్చింది. వయసు మీద పడిన ప్రభావం అనుకుందామా ? కొద్ది రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్దను, చైనాను పొగిడి వెంటనే తెగడటాన్ని ఏమనాలి ? ప్రపంచ ఆరోగ్య సంస్ధకు 50కోట్ల డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. తన ఆంగ్లం మీద, విడిగా మాట్లాడిన అంశాల మీద జోకులు పేల్చినా, పరువు తీసినా నోరు మెదపని చిన్నన్న నరేంద్రమోడీ ఈ పరిణామం మీద మాట్లాడతారని ఎలా అనుకుంటాం ! ప్రపంచ వ్యాపితంగా కరోనా నిరోధ చర్యలను సమన్వయపరచాలని కోరుతున్న మోడీ ఈ ఆపద సమయంలో తన జిగినీ దోస్తు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టకపోయినా మరొక్కసారి ఆలోచించన్నా అని ఎందుకు ప్రాధేయపడలేకపోయారు ? అసలు ఈ చర్యకు ట్రంప్‌ చెబుతున్న కారణం ఎంతమేరకు నిజం ?
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కర్ర ఉన్నవాడిదే గొర్రె. బలమైన దేశాలు బలహీనమైన వాటిని వలసలుగా చేసుకున్నాయి. వలసల ఆక్రమణలో ముందున్న వాటితో వెనుకబడినవి ఏదో ఒక పేరుతో గిల్లి కజ్జాలు పెట్టుకొని అనేక ప్రాంతీయ యుద్దాలకు తలపడ్డాయి.మన బొబ్బిలి యుద్దం, పక్కనే ఉన్న మైసూరు యుద్దాలు అవే. ఇలాంటివి మరింత ముదిరి బలవంతంగా ప్రపంచాన్ని పంచుకొనేందుకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాంతో సమస్య పరిష్కారం కాలేదు. సంధి ప్రయత్నంగా నానాజాతి సమితి పేరుతో మరో యుద్ధం రాకూడదని ఒక ఏర్పాటు చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పరాజిత దేశాలు తిరిగి పుంజుకొని మరోమారు వాటా కోసం తలపడ్డాయి. ఫలితమే రెండవ ప్రపంచ యుద్దం. దాని పర్యవసానం వలసల ఏర్పాటు సాధ్యం కాకుండా చేసింది. నానాజాతి సమితి స్ధానంలో ఏర్పడిందే ఐక్యరాజ్య సమితి. దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక సంస్ధలు అనుబంధంగా ఏర్పడ్డాయి. ఈ వ్యవస్ధలోనూ విజేతలదే పెత్తనం. అందునా రెండు ప్రపంచ యుద్ధాలలో ప్రత్యక్షంగా లేదా ప్రధాన యుద్ధ రంగాలలో పాల్గొనకుండా అటూ ఇటూ ఆయుధాలను అమ్మి సొమ్ముచేసుకున్న అమెరికా పరోక్షంగా ప్రపంచాన్ని, పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నించింది. సోవియట్‌ యూనియన్‌ అడ్డుకోవటంతో దాని ఆటలు పూర్తిగా సాగలేదు.1970దశకంలో చైనాకు ఐరాసలో స్ధానం కల్పించారు. సోవియట్‌-చైనా మధ్య తలెత్తిన విబేధాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన అమెరికా తీవ్ర ఆశాభంగం చెందింది. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత చైనాను దెబ్బతీయాలని ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలో చైనా బలపడింది, అమెరికా ఇతర దేశాల ఆశలు నెరవేరలేదు. ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ, ఇతర ప్రపంచ సంస్ధలతో తాము అనుకున్న లబ్ది చేకూరటం లేదు అని అర్దం చేసుకున్న అమెరికా అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఈ సంస్ధలను విమర్శించటం ప్రారంభించింది. అది ఐరాసకే పరిమితం కాలేదు. తాను ఏర్పాటు చేసిన మిలటరీ కూటమి నాటోను కూడా వదల్లేదు. ఐక్యరాజ్యసమితి సంస్ధలకు ఇస్తున్న విరాళాలను తగ్గించేందుకు పూనుకుంది. నాటో ద్వారా తాము ఐరోపాను రక్షిస్తుంటే అందుకయ్యే ఖర్చును పూర్తిగా మేమే ఎందుకు భరించాలి సభ్యదేశాలు కూడా పంచుకోవాలి అని ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు కరోనా సందర్భాన్ని వినియోగించుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాడు. దానికి అతకని సాకులు చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ , మిగతా ఐరాస సంస్ధల భవితవ్యం ఏమిటి ? ఈ అంశాలను అర్ధం చేసుకోవాలంటే నేపధ్యంలోకి పోకుండా సాధ్యం కాదు.
ప్రపంచ శాంతి, భద్రతల కోసమే ఐరాసను ఏర్పాటు చేశారు. మార్కెట్లకోసం జరుగుతున్న పోటీలో అవాంఛనీయ పోకడల నివారణకు ఏర్పాటు చేసిందే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ). ప్రపంచీకరణ పేరుతో ఈ వ్యవస్ధ ద్వారా లబ్ది పొందాలనుకున్న ధనిక దేశాలు ఆచరణలో తాము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని గ్రహించగానే ఈ సంస్ధను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయి. ధనిక దేశాలలో 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత వివిధ దేశాలు డబ్ల్యుటిఓతో నిమిత్తం లేకుండా తీసుకున్న రక్షణాత్మక చర్యలు, చేసుకున్న ద్వౌపాక్షిక ఒప్పందాల తీరు తెన్నుల గురించి అలయన్స్‌ అండ్‌ యులెర్‌ హెర్మ్‌స్‌ ఎకనమిక్‌ సంస్ధ గతేడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. అగ్రరాజ్యం అమెరికా 790, జర్మనీ 390,బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌ 262, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు, ఒప్పందాలు చేసుకున్నాయి. ధనిక దేశాల దెబ్బను తట్టుకొనేందుకు వర్ధమాన దేశాల్లో మన దేశం 566, బ్రెజిల్‌ 302, చైనా 256 చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదిక తెలిపింది. గత పన్నెండు సంవత్సరాలలో వాణిజ్య విధానం ఆయా దేశాల లక్ష్యాల సాధనకు ఒక ఆయుధంగా మారింది. జాతీయ భద్రత పేరుతో తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికో ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా 2018 మేనెలలో 25,10శాతాల చొప్పున దిగుమతి పన్ను విధించింది. తాము కూడా ప్రతీకార చర్యలకు పూనుకుంటామని హెచ్చరించటంతో ఏడాది తరువాత రద్దు చేసింది. ఐరోపా యూనియన్‌ దేశాలు కూడా మిత్రదేశాలే అయినా 7.5బిలియన్‌ డాలర్ల మేరకు అమెరికా పన్నులు విధించింది. ఇక చైనా గురించి ఏకంగా వాణిజ్య యుద్దమే ప్రారంభించింది.కరోనా కారణంగా అది తాత్కాలికంగా ఆగిపోయింది. చైనా వస్తువుల మీద తాము విధించిన పన్ను దెబ్బకు భయపడిపోయి ఆ మేరకు ధరలు చైనా సంస్ధలు ధరలు తగ్గిస్తాయని ట్రంప్‌ పేరాశలు పెట్టుకున్నాడు. అయితే చైనా కూడా ప్రతి చర్యలు తీసుకుంది. మరోవైపు చైనా వస్తువులపై విధించిన పన్ను మొత్తాలను అధిక ధరల రూపంలో అమెరికా వినియోగదారులే చెల్లించాల్సి రావటంతో ట్రంప్‌ దిక్కుతోచని స్ధితిలో ఉండగా కరోనా వచ్చింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. గత ఏడుదశాబ్దాలుగా ఐరాస, దాని అనుబంధ సంస్ధల కార్యాలయాలు చాలా మేరకు అక్కడే ఉన్నాయి. వాటికయ్యే ఖర్చులో గణనీయ మొత్తం అమెరికా భరిస్తోంది. అయితే తాను ఖర్చు చేసిన ప్రతిడాలరుకు ఎంతలాభం వస్తుందో అమెరికా లెక్కవేసుకుంటుంది. అంతర్జాతీయ సంస్ధల కార్యకలాపాల నిమిత్తం వచ్చే ప్రతినిధి వర్గాలు, దేశాధినేతలు చేసే ఖర్చు, ఐరాస సిబ్బంది చెల్లించే పన్నులు అన్నీ వివిధ ప్రయివేటు సంస్ధలు, న్యూయార్క్‌ నగర ఖజానాలో పడతాయి.వాణిజ్యం, రియలెస్టేట్‌ పెరుగుతుంది. (ఇక్కడ ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధానులు, కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి సాధిస్తామని చెప్పటం, తెలంగాణాలో కొత్త జిల్లాలు ఏర్పడినపుడు వాటి కార్యాలయాల ఏర్పాటు ప్రాంతాల ఎంపికలో రాజకీయాలను గుర్తు చేయటం సముచితంగా ఉంటుంది)

WHO | Publications
2017లో ఐక్యరాజ్యసమితి ఖర్చు 50బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా పదిబిలియన్‌ డాలర్లు వివిధ రూపాలలో అందచేసింది. ఇంత ఖర్చు ఎంతకాలం భరిస్తాం, అసలు మనం ఎందుకు భరించాలి అనే ప్రశ్నలను ట్రంప్‌ యంత్రాంగం ఆనాడే లేవనెత్తింది. కోత పెట్టాల్సిందే అని ట్రంప్‌ ప్రతిపాదించాడు. ఐరాసలో ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్యరాజ్యం ఎంత సొమ్ము సభ్యత్వరుసుముగా చెల్లించాలో ఒక ఫార్ములా ఉంది. ఆయా దేశాల జాతీయ ఆదాయం, జనాభా, ఇతర మరికొన్ని అంశాలను బట్టి అది నిర్ణయం అవుతుంది.హెచ్చు తగ్గులను బట్టి మారుతూ ఉంటుంది.ఈ మొత్తాలను విధిగా చెల్లించాలి, లేకుంటే ఐరాస నుంచి వెళ్లిపోవాలి. ఈ సొమ్ముతో ఐరాస రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అది గాక ఐరాస చేపట్టే కార్యక్రమాలు అది ఆరోగ్య పధకం కావచ్చు లేదా ఏదైనా దేశంలో శాంతిస్ధాపక కార్యక్రమం వంటివి కావచ్చు. వీటికి దేశాలు, సంస్ధలూ విరాళాల రూపంలో ఐరాసకు అందచేస్తున్నాయి. ఇక్కడే తిరకాసు ఉంది, ట్రంప్‌ ప్రస్తుతం ఈ మొత్తాన్నే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు.
ఒక్కసారి వెనుక్కు చూసుకుంటే ఇరాక్‌లో సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచ మానవాళికి ముప్పు తలపెట్టాడనే తప్పుడు ప్రచారంతో అమెరికా, దాని తైనాతీ దేశాలు ఇరాక్‌ మీద దాడి చేసి ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణుశక్తి సంస్ధను రంగంలోకి దించారు. ఇలాంటి కార్యక్రమాలకు దేశాలు ఇచ్చే విరాళాలను బట్టి అవి నడుస్తాయి. డబ్బు లేకపోతే ఎలాంటి కార్యకలాపాలూ ఉండవు. అందుకే అమెరికా పెద్ద మొత్తంలో విరాళం అందచేసింది. తిరిగి ఆ మొత్తాలను ఐరాస పేరుతో వేతనాలు, ఇతర రూపాల్లో తన సైనికులు, ఇతర అధికారులు, వారి అవసరాల కోసం ఖర్చు చేసింది. 2018లో ఐరాస సాధారణ బడ్జెట్‌లో 22శాతం, శాంతి స్ధాపక కార్యక్రమాల కోసం 28శాతం బడ్జెట్‌ను అమెరికా భరించింది. అయితే 2019లో శాంతికార్యక్రమాలకు 25శాతానికి మించి ఇవ్వలేమని కోత పెట్టింది. సభ్యత్వ రుసుము బకాయి, ఇతర బకాయిలను వాటిలోనే సర్దుకోవాలని చెప్పింది. అంటే శాంతి కార్యక్రమాలకు గణనీయంగా విరాళాన్ని తగ్గించింది. ఇది సంచలనాత్మక అంశం కాదు కనుక మీడియా కూడా పట్టించుకోలేదు. సాధారణ సమయాల్లో ఏవైనా సంచలనాత్మక నివేదికలు, ప్రకటనలు చేస్తే తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి కూడా జనానికి, మీడియాకు అంతగా పట్టదు. ఇప్పుడు కరోనా వ్యతిరేక పోరులో అది ముందు ఉంది కనుక, దాని పాత్రను వివాదం చేసి ఆ ముసుగులో ట్రంప్‌ విరాళాన్ని తగ్గించేందుకు అవకాశాన్ని వినియోగించుకున్నాడు కనుక పెద్ద చర్చనీయాంశమైంది.

Donald Trump: 'Disgusted' facial expressions 'help' presidential ...
ముందే చెప్పుకున్నట్లు 2017లో అమెరికా ఐరాసకు అందచేసిన పది బిలియన్‌ డాలర్లలో దాని సభ్యత్వ సొమ్ము 3.5బిలియన్లు కాగా, మిగిలిన సొమ్ము విరాళం. దీనిలో యూనిసెఫ్‌ పేరుతో పిల్లల సంక్షేమానికి, ఆహార కార్యక్రమం, శరణార్ధుల సంక్షేమం ఇతర కార్యక్రమాలకు ఇచ్చే నిధులు ఉన్నాయి. 2018లో ట్రంప్‌ విరాళాల్లో 30 కోట్ల డాలర్ల కోత విధించిన కారణంగా పాలస్తీనా నిర్వాసితుల సంక్షేమాన్ని అమలు చేసే సిబ్బందిలో 250 మందిని తొలగించారు. ఐరోపా, గల్ఫ్‌ దేశాలు అదనంగా ఇచ్చి కొంత మేరకు ఆదుకున్నప్పటికీ అమెరికా కోత ఫలితంగా లక్షా40వేల మందికి ఆహారం, 70వేల మందికి మంచినీరు అందచేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధకు విధిస్తున్న కోత దాని కార్యక్రమాలు అంటే ప్రధానంగా పేద దేశాల్లో, మనవంటి దేశాల్లో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వాక్సిన్‌ల వ్యాపారంలో పెద్ద వాటా కలిగి ఉన్న బిల్‌గేట్స్‌ తమ సంస్ధ ఇస్తున్న పది కోట్ల విరాళాన్ని 25కోట్ల డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించాడు. ఇలా ఏదో రూపంలో ప్రపంచ ఆరోగ్య సంస్ద కార్యక్రమం కొనసాగుతుందనేది వేరే విషయం, మానవత్వం, మానవతా పూర్వక సాయం గురించి నిత్యం కబుర్లు చెప్పే అమెరికా ఎందుకు ఇలాంటా అమానవీయ చర్యకు పాల్పడింది ? ఇరవైలక్షల కోట్ల డాలర్ల జిడిపి ఉన్న దేశానికి 50 కోట్లు ఒక లెక్కలోనివా ? (మిగతా అంశాలు మరో వ్యాసంలో చూద్దాం)

కనుచూపు మేరలో హెలికాప్టర్‌ మనీ కానరావటం లేదు కెసిఆర్‌ సార్‌ !

Tags

, , ,

KCR Explains About Helicopter Money | CM KCR Press Meet | 11/04 ...

ఎం కోటేశ్వరరావు
గృహబందీ 2.0(లాక్‌డౌన్‌) మే నెల మూడవ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసం దేశంలోని అన్ని తరగతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యమంత్రుల తరగతిలో తెలంగాణా వజీర్‌ ఆలా కె.చంద్రశేఖరరావు మరింత ఆశాభంగం చెంది ఉండాలి. మీడియా ముందుకు రావటానికి బిడియ పడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పైకి బయట పడకపోయినా పెద్దన్న చెప్పింది జరిగేట్లు చూడమని దేవుళ్లందరినీ గృహబందీ కారణంగా లోలోపల అయినా వేడుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్ధిక పరిస్ధితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేట్లు ఉంది మరి.
గృహబందీ పొడిగించటం అని వార్యం అని తేలిపోయి, లాంఛన ప్రకటన వెలువడటమే తరువాయి అన్న దశలో హెలికాప్టర్‌ మనీ అందచేయాలని కెసిఆర్‌ ప్రతిపాదించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే ఆ ”ఖ్యాతి”లో తన వాటా ఎక్కడ తగ్గుతుందో అన్న తొందరలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సలహా తనదే అని తన భుజాలను తానే చరుచుకున్న విషయం తెలిసిందే. సరే తరువాత ఏమైందో చెప్పుకుంటే అంత బాగోదు. మనోభావాలు దెబ్బతినవచ్చు.
మన కెసిఆర్‌ సార్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడక ముందే అమెరికా, జపాన్‌, ఇతర దేశాల పత్రికల్లో ఇతరంగా దీని గురించి చర్చ ప్రారంభమైంది. విలేకర్ల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నోరు మూయిస్తారు గనుక, ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే కెసిఆర్‌ ముందు అవమానాల పాలుకావటంతో పాటు ఆఫీసుకు వెళ్లే సరికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని స్ధితి కనుక దాని మంచి చెడ్డలు కెసిఆర్‌ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉండదు.
ప్రస్తుత సంక్షుభిత స్దితిలో దీన్ని ప్రతిపాదిస్తే తాను ఖ్యాతి పొందవచ్చన్న ఆలోచనగానీ లేదా నరేంద్రమోడీ అలాంటి పని చేయవచ్చన్న అత్యాశగానీ కారణాలు ఏమైనా కెసిఆర్‌ ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రధాని ప్రసంగం లేదా కేంద్రం నుంచి రెండవ విడత వెలువడుతుందని భావిస్తున్న ఉద్దీపన 2.0గానీ అలాంటి ఆలోచన కలలో కూడా పెట్టుకోవద్దు అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు ఉన్న ఉపాధి కోల్పోయి గోచిపాతలతో మిగిలారు. ప్రభుత్వాల సంక్షేమ పధకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో కూడా ముందస్తు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ మీద లీటరుకు కరోనా సమయంలోనే మూడేసి రూపాయల పన్ను పెంచి రాబోయే రోజుల్లో మరింతగా పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సర్కార్‌ జనానికి పన్ను పోటు తగ్గిస్తుందని లేదా ధనికుల దగ్గర మూలుగుతున్న సంపదల్లో కొద్ది మొత్తం తీసుకొని కరోనా కష్టకాలాన్ని గట్టెక్కిస్తుందని ఎవరైనా ఊహించగలరా ? మునిగిపోతున్న పడవలో ప్రయాణించే వారికి గడ్డిపోచ కనిపించినా దాన్ని పట్టుకొని బయటపడదామని చూస్తారు. రాష్ట్రాల పరిస్ధితి ఇలాగే ఉంది కనుక చంద్రశేఖరరావు అలాంటి ఆశతో హెలికాప్టర్‌ మనీ కోసం చూస్తున్నారని అనుకోవాలి.
చాలా మంది తెలంగాణా ముఖ్య మంత్రికి ఇలాంటి మహత్తర ఆలోచన ఎలా తట్టిందబ్బా అనుకుంటున్నారు. రెండు విషయాలు జరిగి ఉండవచ్చు. ఒకటి ముఖ్యమంత్రి పత్రికలు లేదా ఇంటర్నెట్లో వార్తలు చదువుతూ ఉండి ఉండాలి.రెండవది ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలు నాకు నివేదించాలి అని అధికార యంత్రాంగానికి పని చెప్పి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి ముందురోజు అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. మరో రూపంలో అంతకు ముందే మన దేశంలో కూడా కొంత మంది ఇలాంటి సూచనలే చేశారు. ఇక జరిగిందేమిటో మీరే ఊహించుకోవచ్చు.
పూర్వం వైద్యులు చేయగలిగింది చేశాం చివరి ప్రయత్నంగా మీకు అంగీకారమైతే గరళ ప్రయోగం చేద్దాం అనేవారని చదువుకున్నాం. అంటే రోగి ఆటో ఇటో అన్నమాట. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభానికి గురైనపుడు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చేతులెత్తేసే స్దితిలో జనానికి చేతి నిండా డబ్బు ఇస్తే ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటుందనే ఒక దివాలాకోరు ఆలోచన ఇది. దీనికి హెలికాప్టర్‌ మనీ అని ఎందుకు పేరు పెట్టారు ? హెలికాప్టర్లు, మోటారు వాహనాలు, రైళ్లు లేని రోజుల్లో గనుక ఇలాంటి పరిస్ధితి మీద ఆలోచన వచ్చి ఉంటే దానికి గుర్రపు బండి లేదా గుర్రపు డబ్బు అనే వారేమో. ఎందుకంటే అప్పుడు అదే వేగంగా, కొండలు, గుట్టల మీద ప్రయాణించే సాధనం కనుక.
1969లో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారింది. ఆ సమయంలో వినిమయాన్ని పెంచటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించాలన్న ఆలోచనతో ఆర్ధికవేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ హెలికాప్టర్ల ద్వారా జన సమూహాలకు డబ్బును జారవిడిచి జనానికి డబ్బు అందించి కొనుగోలుశక్తిని పెంచవచ్చని తొలిసారిగా ఆ పద్దతి, పదప్రయోగం చేశాడు. హెలికాప్టర్లతో వేగంగా డబ్బు సంచులు మోసుకుపోవచ్చు, జనానికి అత్యంత సమీపానికి వాటిని దించవచ్చు.అలాంటిది మరొక సాధనం లేదు. నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించి జనానికి అందచేయటం ఇక్కడ కీలకం, దాన్ని తిరిగి జనం నుంచి వసూలు చేయాలా లేదా అంటే అది ఆయా ప్రభుత్వాల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఉచితంగా ఇవ్వాలన్నదే హెలికాప్టర్‌ మనీ ఉద్ధేశ్యం. అనూహ్యంగా ఈ పని చేయాలని మిల్టన్‌ చెప్పాడు తప్ప చెయ్యలేదనుకోండి !

KCR Explains About Helicopter Money
ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ? ప్రపంచంలో సంక్షోభం ఏర్పడినపుడు ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి గాడిలో ఎలా పెట్టాలి అన్నది ఒక చర్చ. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అంటే ఆస్తుల కల్పన ద్వారా ఉపాధి కల్పించి జనం చేతుల్లో డబ్బు ఉండేట్లు చూడటం. దీన్ని కీన్స్‌ సిద్దాంతం అంటారు. గతంలో అమెరికాలో ఇదే చేశారు. పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు, వివిధ సేవలకు భవనాల(ఆసుపత్రులు, పాఠశాలల) వంటి మౌలిక సదుపాయాలు కలిగించటం దానిలో భాగమే. అవే తరువాత అమెరికా అభివృద్దికి ఎంతో తోడ్పడ్డాయి. మన దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం అలాంటిదే. కీన్స్‌కు విరుద్దమైనది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ సిద్దాంతం. మౌలిక సదుపాయాల కల్పన అంటే వెంటనే జరిగేది కాదు. కొంత వ్యవధి పడుతుంది. కనుక ఎటిఎం మిషన్‌లో ఇలా కార్డు పెట్టగానే అలా డబ్బు వచ్చినట్లు జనానికి డబ్బు ఇచ్చి ఖర్చు చేయించటం ద్వారా వెంటనే వస్తువులకు డిమాండ్‌ పెంచవచ్చు అనే వినిమయదారీ సిద్ధాంతం మిల్టన్‌ది. హెలికాప్టర్‌ మనీ ప్రతిపాదనలు చేసే వారు దీన్ని నమ్ముతున్నారని అర్ధం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.75వేల కోట్ల ఉద్దీపన పధకం ప్రకటించింది. ఇది ఏమూలకూ చాలదు. మన జిడిపి విలువ 2020అంచనా 203 నుంచి 245లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. దీనిలో పైన చెప్పుకున్న మొత్తం0.86 నుంచి 0.7శాతమే. ఇది ఏమూలకూ చాలదు, కనీసం ఐదుశాతం ఉద్దీపనకు కేటాయించాలి అంటే పది నుంచి 12లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అనేక మంది చెబుతున్నారు. దీని కోసం నోట్ల ముద్రణ ఒక మార్గం అయితే, పరిమాణాత్మక సడలింపు అంటే మార్కెట్‌లో డబ్బు సరఫరాను పెంచటం మరొక పద్దతి. దీనిలో కూడా నోట్ల ముద్రణ కొంత మేరకు ఉంటుంది. 2008 సంక్షోభం తరువాత అమెరికాలో ఈ పద్దతిని కొంత మేరకు అమలు జరిపారు గానీ సంక్షోభం పరిష్కారం కాలేదు, త్వరలో మరొక సంక్షోభంలో కూరుకుపోతుందని కరోనాకు ముందే వార్తలు వచ్చాయి.
ముఖ్య మంత్రి కెసిఆర్‌ ప్రతిపాదించిన హెలికాప్టర్‌ మనీ పధకాన్ని కేంద్రం అమలు జరిపితే ఏం జరుగుతుంది ? కొంత సొమ్మును రాష్ట్రాలకు కేటాయిస్తారు. దాన్ని తిరిగి కేంద్రానికి ఇవ్వనవసరం లేదు.రాష్ట్రాలు తాము ఇవ్వదలచుకున్న వారికి ఆ సొమ్మును పంపిణీ చేస్తాయి, జనం సరకులు కొనుగోలు చేస్తే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. సరకులు అమ్ముడు పోతే తయారీ డిమాండ్‌ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది, తద్వారా కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది మరింత డిమాండ్‌ను పెంచుతుంది. ఇది ఒక అంచనా, అభిప్రాయం. అయితే పరిస్ధితులు బాగోలేనపుడు, రేపేం జరుగుతుందో తెలియనపుడు మనవంటి దేశాలలో సహజంగానే జనం తమ ఖర్చులను తగ్గించుకుంటారు, డబ్బును పొదుపు చేసి తమదగ్గరే ఉంచుకుంటారు. బ్యాంకుల్లో సొమ్మును ఏం చేస్తారో అనే అపనమ్మకం కారణంగా జనం ఇటీవల బ్యాంకుల్లో సొమ్ముదాచుకోవటం లేదనే వార్తల విషయం తెలిసిందే. ఒక వేళ అదే జరిగితే హెలికాప్టర్‌ మనీ పధక లక్ష్యం నీరుకారిపోతుందన్నది ఒక అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చాయి. ఆ సొమ్మంతా తిరిగి పెట్టుబడులుగా మార్కెట్లోకి రాలేదు. తమ రిజర్వుసొమ్ము, ఇతర ఖాతాల్లో వారు దాచుకున్నారు. జనానికి తగిన ఆదాయం లేకపోవటం, వస్తుకొనుగోలుకు చేసే వ్యయానికి తగిన డబ్బు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతాలలో వస్తు వినియోగం తగ్గింది. మరోమాటలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇది పరిశ్రమల మీద పడి నిరుద్యోగం పెరిగింది, అనేక సంస్ధల మూతకు దారి తీసింది. ఈ పరిస్ధితి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది. అది మరింత నిరుద్యోగానికి కారణమైంది. స్వయం సహాయ సంస్ధల ఏర్పాటు లక్ష్యం స్వయం ఉపాధిని కల్పించటం, కానీ జరిగిందేమిటి ? వాటికి ఇచ్చే రుణాలను వేరే అవసరాలకు వినియోగించినందున అసలు లక్ష్యం వెనుకబడిపోయింది.
పశ్చిమ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో పరిస్ధితులు వేరు. ఈ రోజు ఎంత వస్తే అంత ఎలా ఖర్చు చేయాలి అనే వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే అప్పుచేసి పప్పుకూడు. నిరుద్యోగ భృతి వంటి హామీలున్నాయి గనుక అక్కడ జనం అలా తయారయ్యారు. మనకా సామాజిక రక్షణ లేదు. డబ్బు వస్తే ముందు పొదుపు ఎలా చేయాలా అని చూస్తాం. ఈ వైఖరి మన దేశాన్ని ఇప్పటి వరకు రక్షిస్తోంది. కానీ కార్పొరేట్‌ కంపెనీలు అమెరికా పద్దతికి నెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగమే ఎన్ని క్రెడిట్‌ కార్డులు కావాలంటే అన్ని కార్డులు ఇవ్వటం, వాయిదాల పద్దతిలో వస్తువుల అందచేత వంటివి.
మన నరేంద్రమోడీ గారు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత దగ్గరి స్నేహితుడో అందరికీ తెలిసిందే జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల చొప్పున మూడునెలలు ఇస్తామని ప్రకటించారు. డాలర్లలో ఏప్రిల్‌ 16 డాలరు మారకపు విలువ రూ.76.75లో 19.51 డాలర్లు. అదే ట్రంప్‌ నెలకు పెద్ద వారికి 1200 డాలర్లు, పిల్లలకు ఐదు వందల చొప్పున ప్రకటించారు, కానీ పెద్ద వారికి మూడువేలు, పిల్లలకు 1500చెల్లించాల్సిన అవసరం ఉందని గతంలో ట్రంప్‌ వద్ద కొంతకాలం సమాచార అధికారిగా పని చేసిన ఆంథోనీ కారముసి చెప్పాడు. వడ్డీ రేటు సున్నాకు దగ్గరలో ఉన్నందున, మరిన్ని అప్పులను కొనుగోలు చేస్తామని ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) చెప్పిన కారణంగా మరింత సొమ్ము చలామణిలోకి వస్తుందని, గత మూడు వారాల్లో ఒక లక్ష కోట్ల డాలర్లను చలామణిలోకి తెచ్చినట్లు(ఏప్రిల్‌ తొమ్మిది నాటికి మన రూపాయల్లో 76 లక్షల కోట్లు ) కారముసి చెప్పాడు.
హెలికాప్టర్‌ మనీ సరఫరా గురించి ఆలోచించే వారు రాగల ముప్పును కూడా గమనంలోకి తీసుకోవాలనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. జనం దగ్గరకు ఒక్కసారిగా డబ్బు చేరినపుడు డిమాండ్‌ మేరకు సరకులు లేకపోతే ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో గృహబందీ సమయంలో జరుగుతున్నది అదే. జనం దగ్గర పరిమితంగానే డబ్బులున్నాయి, అయినా సరకుల రవాణాపై ఆంక్షలున్న కారణంగా ధరలు పెరిగాయి. సరకులు ఉన్నా ఆయాచితంగా ఒక్కసారిగా డబ్బు జనం చేతుల్లోకి వస్తే ధరలు పెరుగుతాయి, దాని పర్యవసానం వేతన పెరుగుదల ఉంటుంది, ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా అడ్డుకుంటాయో కూడా చూడాలని కూడా హెచ్చరిస్తున్నారు. అసలు అమెరికా మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ కూడా ఒకసారి అమలు జరపాలి తప్ప మరోసారి పునరావృతం కాకూడదని కూడా చెప్పాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజాకర్షక రాజకీయవేత్తలు ఇదేదో బాగుందని తాము చేయాల్సిన వాటిని కూడా చేయకుండా ప్రింటింగ్‌ ప్రెస్‌లవైపు పరుగులు తీస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలా చేస్తే రిజర్వుబ్యాంకుల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని,ఆర్ధిక అరాచకం పెరుగుతుందని, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని, ఇప్పుడంత అవసరం లేదనే వారు మరికొందరు.

CM KCR about Helicopter Money| KCR Press meet| 4D NEWS #helicopter ...
సార్వత్రిక కనీస ఆదాయ పధకాన్ని ముందుకు తెచ్చిన వామపక్ష భావాలున్న ఆర్ధికవేత్తలు ఇటీవల హెలికాప్టర్‌ మనీని ముందుకు తెచ్చారని దీనివలన ప్రభుత్వాలు చేసే ఖర్చు పడిపోతుందన్నది ఒక విమర్శ. ఈ పధకాన్ని అమలు జరిపితే వనరుల కేటాయింపు, కష్టపడేవారికి ప్రోత్సాహకాలు కరవు అవుతాయన్నది మరొక వాదన. అయితే గతంలో పెదవి విరిచిన వారు కూడా మరొక మార్గం ఏమీ కనిపించక ఏదో ఒకసారికి అయితే సరే అన్నట్లుగా తలూపుతున్నారు. నేరుగా నగదు పంపిణీ చేయకపోతే ఆర్ధిక వ్యవస్ధ మరింత దిగజారుతుందన్నది కొందరి హెచ్చరిక.
చివరిగా చెప్పవచ్చేదేమంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదించినట్లుగా కేంద్రం హెలికాప్టర్‌ మనీ అంద చేసే అవకాశాలు దాదాపు లేవు. కరోనా కారణంగా అనేక మంది చెబుతున్నట్లు అభివృద్ధి రేటు తిరోగమనంలోకి దిగిపోయి తిరిగి పైకి లేచే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినపుడు గరళం పోయాల్సిన పరిస్ధితి వస్తే తప్ప ఇలాంటి పరిస్ధితి రాదు. అందువలన బంగారు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు బీద అరుపులు అరిస్తే, జనాన్ని విస్మరిస్తే అన్ని తరగతుల్లో విస్వసనీయత సమస్య తలెత్తుతుంది. అదే జరిగితే రాజకీయంగా, పార్టీ పరంగా అనూహ్యపరిణామాలకు నాంది అవుతుంది. అలాంటి పరిస్ధితిని కెసిఆర్‌ కొని తెచ్చుకుంటారా ?

కరోనా మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా ?

Tags

, , , ,

సత్య
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేక విషం చిమ్మే నాగుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌ను కూడా అవకాశంగా తీసుకొని అదే పని చేసే వారి గురించి ప్రస్తావించాల్సి వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా చైనాలో బయటకు కనిపించిన కరోనాను అక్కడి కమ్యూనిస్టులే కట్టడి చేశారన్నది తలలో బుర్రవున్న ప్రతివారికీ స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంలో కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎలా అదుపు చేస్తోందో జనానికంతటికీ తెలుసు.
కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టు పార్టీలు విమర్శలకు అతీతం కాదు. తప్పు చేశారనిపించినా, విధానాలను తప్పు పడుతూ ఎవరైనా విమర్శించే హక్కు కలిగి ఉంటారు. దానికి ఏదో ఒక ప్రాతిపదిక, సందర్భం, తర్కం ఉండాలి. అవి లేనపుడు మోకాలికీ బోడి గుండుకు ముడివేసేందుకు ప్రయత్నిస్తే వృధా ప్రయాస. గత లోక్‌సభ ఎన్నికల తరువాత కొత్తగా నరేంద్రమోడీ భజన సమాజంలో చేరిన ఒక తెలుగు పత్రిక సీనియర్‌ జర్నలిస్టు అదేపని చేశారు. పోనీ చేసిన విమర్శ అందరికీ వర్తింప చేస్తే అదొక తీరు. కాదే ! గాజు కొంపలో కూర్చొని కమ్యూనిస్టుల మీద రాళ్లు వేస్తే కుదరదు.
బాబా నరేంద్రమోడీ గారు మండల దీక్షలో సప్తపది పాటించాలని సెలవిచ్చారు. చంద్రబాబా భక్తులుగా కొనసాగుతూనే మోడీ బాబా భజన బృందంలో చేరిన వారు పగలు ఒకరికి, రాత్రి ఒకరికి చెక్కభజన చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ” విచిత్రమేమంటే శ్రమజీవుల పార్టీలుగా చెప్పుకుంటున్న వృద్ధ కమ్యూనిస్టుల పార్టీల్లో కూడా వీరెవరూ సభ్యులుగా ఉన్నట్లు కనపడటం లేదు. ఉంటే వారు లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే నిర్భయంగా అజయ భవన్‌, గోపాలన్‌ భవన్‌, మఖ్దుం భవన్‌లకు వెళ్లి సేదదీరే వాళ్లు ”.అని ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల గురించి రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడ చిక్కుకుపోయిన వారిని అక్కడే పరిమితం చేశారు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు శ్రమ జీవులు కమ్యూనిస్టు పార్టీలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చేరుకొనే వీలు లేదని తెలియనంత ఆమాయక చక్రవర్తి అయితే కాదు కదా ? ఒక వేళ ఎవరైనా వచ్చి ఉంటే ఏమి చేసి ఉండే వారో మనకు తెలిసేది. అనేక సందర్భాలలో కమ్యూనిస్టుల కార్యాలయాలు ఆశ్రితులకు నిలయాలుగా మారిన చరిత్ర ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక బిజెపిని విమర్శించినట్లు ఉండాలి, మాట అనకుండా ఎంత తెలివిని ప్రదర్శించారో చూడండి.”సంస్ధాపక దినం సందర్భంగా బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని దాని సభ్యత్వం 18కోట్లకు పెరిగిందని చెప్పుకున్నారు. ఇవాళ లాక్‌డౌన్‌ మూలంగా జీవితాలు దుర్భరమైన కోట్లాది మందిలో ఒక్కరైనా బిజెపిలో సభ్యులుగా ఉన్నారా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది ” అన్నారు. కమ్యూనిస్టుల వెనుక పేదలు లేరని ఇలాంటి వారే వేరే సందర్భాలలో రాస్తారు. బిజెపి లేదా తెలుగుదేశం వంటి పార్టీలకు పేదలు ఓట్లు వేయకుండానే వారు అధికారానికి వచ్చారని చెప్పదలచుకున్నారా ? మరి ఆ పార్టీలకు కమ్యూనిస్టులకంటే పెద్దవి, ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయే, వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?
ఇక్కడ కమ్యూనిస్టుల మీద రాళ్లేస్తున్న పెద్ద మనిషికి ఒకటే కన్ను పని చేస్తున్నదా ? కష్టకాలంలో శ్రమజీవులకు ఆశ్రయం కల్పించటంలో కమ్యూనిస్టులు, కాని వారు, పార్టీలు, వ్యక్తులు, కమ్యూనిస్టు ఆఫీసులు, ఇండ్లేమిటి ఎక్కడైనా ఆశ్రయం కల్పించాల్సిందే. అనేక చోట్ల కమ్యూనిస్టులు అలాంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ రాతలు రాసిన పెద్దమనిషి తన ఇంట్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు? లేదూ తాను పని చేస్తున్న సంస్ధ పేరుతో ప్రభుత్వం నుంచి పొందిన భూములలో కట్టించిన కార్యాలయాల్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సదరు విలేకరి, మీడియా శ్రమజీవులను పట్టించుకోరా లేక పట్టదా ? కరోనా పేరుతో ఎంతోకాలంగా పని చేస్తున్న వారిని ఇండ్లకు పంపిన తమ యాజమాన్య ” ఔదార్యం ” సంగతి ముందు చూడాలి. ఉద్యోగులను ఎవరినీ తొలగించవద్దని చెప్పిన తమ బాబా మోడీ ఉపదేశాలకు ఇచ్చిన విలువ ఏమిటి ? కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తి కొద్దీ చేయాల్సిందేదో చేస్తున్నాయి, వాటికి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తప్ప పార్టీల కార్యాలయాల వైపు తొంగి చూడటమే రాజకీయం. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అన్నీ మూతబడ్డాయి. ఇలాంటి సమయాల్లో చిక్కుకు పోయిన వలస కార్మికులను అలాంటి చోట్లకు తరలించి ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులది. తమను స్వస్ధలాలకు పంపాలని ముంబైలోని బాంద్రా రైల్వేష్టేషన్‌కు అంత మంది పేదలు వస్తుంటే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు ? స్టేషన్‌కు చేరకుండానే వెనక్కు ఎందుకు పంపలేదు ? వచ్చిన వారిని నచ్చ చెప్పి పంపాల్సిన యంత్రాంగం లాఠీలకు పని చెప్పటాన్ని ఏమనాలి ?
” చింత చచ్చినా పులుపు చావనట్లు పదవుల కోసం ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు గంటల తరబడి పొలిట్‌బ్యూరో సమావేశాలు నిర్వహించే వారికి కష్టజీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది ” అని రాయి వేశారు. కమ్యూనిస్టులు కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నారు. అక్కడ వారేమి చేస్తున్నదీ యావత్‌ ప్రపంచం చూసిందీ. పొలిట్‌ బ్యూరోలో పేదల గురించి చర్చించారు కనుకనే కేరళ పార్టీకి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం కూడా చేయని విధంగా ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయటమే కాదు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారో చూసేందుకు లాక్‌డౌన్‌కు ముందే అనేక రాష్ట్రాల అధికార బృందాలను అక్కడకు రప్పించగలిగారు. లక్షలాది మంది వలస కూలీలను, రాష్ట్ర ప్రజలను ఎలా ఆదుకుంటున్నారో దాస్తే దాగేది కాదు. నిజాన్ని చూడలేని ఉష్ట్రపక్షుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కమ్యూనిస్టుల గురించి మార్చి 21వరకు నరేంద్రమోడీ, ఆయన మంత్రులు, యావత్‌ యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? నిత్యం వారి చుట్టూ తిరిగే ఆ విలేకరికి అవేమీ కనిపించవా ? పొలిట్‌బ్యూరో కాకపోతే మరో పేరుతో మిగతా పార్టీలకు కమిటీలు లేవా ? అవి సమావేశాలు కావటం లేదా ?
కరోనా సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను రప్పించి భజనలో మునిగిపోయిందెవరో జనానికి తెలుసు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి నేతలు పడిన పాట్లు దేశమంతటా చూసింది. అనేక చోట్ల నిత్యం చేస్తున్న కుట్రల గురించి ఒంటి కన్ను వారికి నిజంగా కనిపించవు. కమ్యూనిస్టులెక్కడా ఏ ప్రభుత్వాన్ని కూల్చిన లేదా కుట్ర చేసిన దాఖలా లేదు, ఎవరి కాళ్లనూ లాగలేదు. ఇప్పుడు చూడాల్సింది, జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కమ్యూనిస్టులు పొలిట్‌బ్యూరో ఏమి చర్చిస్తున్నారన్నదానికా, పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారో చూడాలా ? కమ్యూనిస్టులైనా, మరొక ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పరిమితం. కమ్యూనిస్టు పార్టీల పొలిట్‌బ్యూరో సమావేశాలు, కానీ పార్టీల ఏకవ్యక్తి నిర్ణయాలూ ఇవాళ కొత్తేమీ కాదు. అసలు ఆ విలేకరి సమస్య ఏమిటి ?
మోడీ సర్కార్‌కు ముందస్తు చూపు, శ్రద్ద ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారందరినీ ముందునుంచే క్వారంటైన్‌లో పెట్టి ఉంటే పరిస్ధితి ఇలా ఉండేది కాదు. ఒక పక్క మలేషియాలో, మరో వైపు పాకిస్ధాన్‌లో తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు వచ్చిన వారు కరోనా వైరస్‌ను అంటించారని తెలిసినా నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు విదేశాల నుంచి వచ్చే వారిని ఎలా అనుమతించారో, వైద్య పరీక్షలు చేయకుండా, క్వారంటైన్‌లోకి పెట్టకుండా మార్చినెలలో ఎలా వదలి పెట్టారో, దానికి బాధ్యులెవరో కేంద్రాన్ని, నరేంద్రమోడీని అడిగే దమ్ము సదరు జర్నలిస్టుకు లేదు.ఉన్న ఒక్క కన్నూ కమ్యూనిస్టుల మీద పెట్టారు కనుక కనుక ఇవేవీ కనిపించలేదను కోవాలి.
పదవి ఉన్న కాలంలో తమకు, తమ యాజమాన్యానికి పాకేజ్‌లు ఇచ్చిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తున్నదో ఎలా కాలక్షేపం చేస్తున్నదో సదరు జర్నలిస్టుకు తెలియదను కోవాలా ? కష్టకాలంలో రాష్ట్రం వదలి పారిపోయి హైదరాబాదులో దాక్కున్నారని వైసిపి చేసిన విమర్శలు వినిపించటం లేదా? కనిపించటం లేదా ? చంద్రబాబు నాయుడికీ పొలిట్‌ బ్యూరో ఉంది. ఆయనేమి చేస్తున్నారో తెలుసా ? ఎవరితో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా పని చేస్తున్నారా ? హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదో చెబుతారా ? ఇష్టమైన పార్టీలకు చేసుకొనే భజన మీద కేంద్రీకరించకుండా మధ్యలో కమ్యూనిస్టుల మీద ఇలాంటి అవాకులు చెవాకులు ఎవరిని సంతుష్టీకరించేందుకు చేస్తున్నట్లు ? కరోనా మీద, దాన్ని నిర్లక్ష్యం చేసిన వారి మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా !

మే 3వరకు గృహ బందీ – జనానికి నరేంద్రమోడీ వట్టిస్తరి-మంచినీళ్లు !

Tags

, ,

PM Narendra Modi Extends Lockdown Until May 3, Other Key ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ కరోనా, గృహబందీ(లాక్‌డౌన్‌) మూడవ ప్రసంగంలో సప్తపది అనే పదాన్ని వినియోగించారు. ఏడు అంశాలను పేర్కొన్నారు కనుక ప్రాసకోసం ప్రయోగించారని సరిపెట్టుకోవాలా ? నిజానికి అది హిందువుల సంప్రదాయ వివాహ శుభ సందర్భంగా నిర్వహించే ఒక క్రతువు. వివాహంలో సూత్రధారణ తరువాత నవ వధువులు అగ్ని గుండం చుట్టూ ఏడు అడుగులు నడవటాన్ని సప్తపది అంటారు. అయితే విశ్వాసులు ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ క్రతువును పాటించిన వారు కాళ్లపారాణి ఆరక ముందే భార్యలను వదలివేసే భర్తలు, భర్తలను వదలివేసే భార్యలను మనం చూస్తున్నాం. దీనికి ఇంకా ఏమైనా అర్ధాలున్నాయేమో నాకు తెలియదు. వివాహం వేరు, కరోనా లేదా మరొక మహమ్మారి మీద పోరాడటం వేరు. రెండూ పరస్పర విరుద్దమైనవి. మోడీ ప్రసంగం విని, చూసిన వారికి పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం చదివినట్లుగా సప్త పది ప్రయోగం అనిపిస్తే అది వారి తప్పుకాదు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. ఈ నేపధ్యంలో అనేక మంది గృహబందీ వ్యవధిని పొడిగించాలని సూచించారు, అనేక రాష్ట్రాలు ఏప్రిల్‌ 30వరకు పొడిగించాలని ముందే నిర్ణయించి ప్రకటించాయి. దీనికి మోడీ గారు కొత్త ట్టిస్ట్‌ ఇచ్చి మండల దీక్షగా ( అయ్యప్ప, దానికి అనుకరణగా ఇతర దీక్షలు) ధ్వనింప చేస్తూ మే మూడవ తేదీ వరకు 19రోజులు పొడిగించారు. ఇవన్నీ పక్కన పెడదాం.దేశమంతా ఎంతగానో ఎదురు చూసిన మోడీ పలుకుల్లో కొత్తదనం ఏముంది ? జనం లేదా అనేక రంగాలు కోరుతున్న అంశాలను ఎక్కడైనా ప్రస్తావించారా ? ఏమి ప్రస్తావించారు అనేది ముఖ్యం. తెలుగులో ఒక లోకోక్తి లేదా సామెతల గురించి చాలా మంది వినే ఉంటారు. వాటిలో ఒకటి వట్టి మాటలకు కడుపులు నిండుతాయా ? రెండవది వట్టిస్తరి – మంచినీళ్లు. ఇంతకు మించి మోడీగారి ప్రసంగంలో మరొకటి కనిపించలేదు.
మొదటి రెండు ఉపన్యాసాలలో చప్పట్లు, దీపాల వెలిగింపు పిలుపు ఇచ్చారు. మూడవ దానిలో ఇప్పటికే జనమందరూ పాటిస్తున్న అంశాల సప్తపది సుభాషితం తప్ప ఎలాంటి కార్యక్రమం లేదు. దీని గురించి నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. కొందరు హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నించారు. రెండో పిలుపు సందర్భంగా దీపాల వెలుగు పేరుతో దీపావళి జరుపుకున్నవారు ఇప్పుడు అలాంటి మరొక అవకాశం రాలేదే అని నిరాశపడి ఉంటారు. ఈనెల 20వరకు మరింత గట్టిగా గృహబందీ అమలు తరువాత ఏమి చేయాలనేది ఆ తరువాత నిర్ణయిస్తారు. ఆ తేదీ నాటికి కొత్త కేసులేవీ నమోదు కానట్లయి బందీ నిబంధనల సడలింపుకు సంబంధించి బుధవారం నాడు మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తామని మోడీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమంలో వెల్లడైన ధోరణి చూస్తే తరువాత ఏమిటి అని అనేక మంది ప్రశ్నించారు.హిందీ సినిమాల్లో మాదిరి ప్రసంగంలో 80శాతం ఏమీ లేదన్నది ఒక వ్యాఖ్య. మిగతా కొన్ని ఇలా ఉన్నాయి. ఆయనెందుకు అలా మాట్లాడారు మనం ఏమన్నా నాలుగేండ్ల పిల్లలమా ? మోడీ చెప్పదలచుకున్న సందేశానికి 30నిమిషాలు అవసరం లేదు. ప్రసంగం మోడీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని మోడీ చెప్పటం మా ఛానల్‌ చందాదారులుగా చేరండి అని చెప్పిట్లుగా ఉంది. మోడీ ప్రసంగాన్ని ముందుకు జరిపే బటన్‌ ఇచ్చి ఉండాల్సింది. పావు గంటసేపు అబద్దాలు, చెత్త మాట్లాడారు. పావు గంటసేపు సరకులేకుండా మాట్లాడారు. వాస్తవాలను మరుగుపరచి మాటల జడివాన కురిపిస్తూ ఎలా మాట్లాడవచ్చో నేర్చుకున్నాను. వైద్యులు, వైద్య సిబ్బందికి పిపిఇ కిట్స్‌ ఏర్పాటు, దేశమంతటా కరోనా పరీక్షల పెంపు, పేదల సంరక్షణ, ఆరోగ్యవసతుల కల్పన, ఆర్ధిక వ్యవస్ద మరియు ఉపాధి పునరుద్దరణ, ఔషధాల కొరత, వలస కార్మికుల గురించి ప్రస్తావన లేకుండా చక్కగా ప్రసంగించారు.
నరేంద్రమోడీ ప్రసంగం గురించి ఇంతకంటే ఎక్కువ రాయనవసరం లేదు. పరీక్షా సమయాల్లో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవారు వ్యవహరించే తీరు తెన్నులను బట్టి జనం స్పందిస్తారు. పొగిడిన నోళ్లతోనే నవ్వుతారు. ఇక మోడీ గారి ‘సప్తపది’ గురించి చూస్తే 1.వృద్దుల సంరక్షణ, 2. ఇంట్లోనే ఉండండి, ఇంట్లో తయారు చేసిన ముఖతొడుగులు ధరించండి, 3.వ్యాధి నిరోధక చర్యలు తీసుకోండి.4,ఆరోగ్యసేతు యాప్‌ ఉపయోగించండి, 5. పేదలను ఆదుకోండి, ఆహారం అందించండి, 6. ఉద్యోగులను ఆదుకోండి, తొలగించవద్దు, 7. ఆరోగ్య సిబ్బంది, పోలీసు తదితర యంత్రాంగ సేవలను అభినందించండి. వీటిలో కొత్త అంశాలేమి ఉన్నాయి గనుక.

PM Modi's Covid Lockdown Address Not Up To Congress' Expectations ...
కేవలం నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇస్తూ గృహబందీని మే 25 నుంచి ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో అందరూ చెప్పలేని ఇబ్బందులు పడ్డారు. అయినా ఆరోగ్యం, ప్రాణాలే ముఖ్యం కనుక జనం సర్దుకున్నారు. ఈ 21 రోజుల్లో అనేక సామాజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జనాన్ని, అసలే ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవటం గురించి ఎదురు చూసిన వారికి ప్రధాని ప్రసంగం తీవ్ర నిరాశపరచింది. ఇబ్బందులు పడుతున్నవారికి కావాల్సింది ప్రధాని మోడీ మాదిరి కార్చిన కడవల కొద్దీ కన్నీరు, సానుభూతి, జనం ముందు తలవంచటం కాదు. ఇప్పటికే సామాన్యులు, మధ్యతరగతి వారు తమ వంతు త్యాగాలు చేశారు. ఇంకేమాత్రం చేసే స్ధితిలో లేరు.
గతంలో వాజ్‌పేయి పాలించినా, కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల ప్రధానుల ఏలుబడిలో ఉన్నా మన దేశంలో సంపద కొద్ది మంది దగ్గర పోగుపడే విధానాలే అనుసరించారు, ఇప్పుడు నరేంద్రమోడీ కూడా అదే చేస్తున్నారు.కరోనా కష్టాలను తెచ్చింది నిజం. కానీ ఇప్పుడు జనాన్ని ఆదుకొమ్మని చెబుతుంటే రాష్ట్రాల, దేశ ఆర్ధిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నవారికి ఇంతకాలం సంపదలు పోగేసుకున్న వారు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఈ కష్ట కాలంలో వారేమి చేస్తున్నారు, పాలకులు వారి నుంచి వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.2018లో ప్రతి రెండు రోజులకు ఒకరు డాలర్‌ బిలియనీర్‌గా మారారు. అంటే సంపద కోట్లు దాటటం. ప్రపంచ చరిత్రలో 2016 రెండవ త్రైమాసిక కాలం నుంచి 2018లో అదే సమయానికి ప్రపంచ సంపదల్లో 82శాతం ఒక శాతం మంది చేతిలో ఉన్నాయి. చరిత్రలో ఇంత పెరుగుదల ఎన్నడూ నమోదు కాలేదని ఆక్స్‌పామ్‌ సంస్ద తెలిపింది. 2006 నుంచి 2015వరకు జరిపిన పరిశీలన ప్రకారం సామాన్య కార్మికుల ఆదాయం ఏడాదికి సగటున రెండు శాతం పెరిగితే బిలియనీర్ల సంపద దానికి ఆరురెట్లు ఎక్కువగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే ఒకశాతం ధనికుల వద్ద 58శాతం పోగుపడింది. ఈ మధ్యకాలంలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. 2017 బడ్జెట్‌ వివరాల ప్రకారం మన దేశంలో ఒక శాతం ధనికులు 73శాతం కలిగి ఉంటే పేదలుగా ఉన్న 67కోట్ల మంది జనం సంపద కేవలం ఒకశాతమే పెరిగింది. బిలియనీర్ల పెరుగుదల ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం తప్ప అభివృద్ధి సూచిక కాదు. ఒక ప్రముఖ పరిశ్రమ సిఇఓ ఏడాదికి పొందుతున్న ఆదాయ స్దాయికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కనీసవేతనాలకు పని చేసే కార్మికుడు చేరాలంటే 941 సంవత్సరాలు పడుతుంది.
కార్పొరేట్‌ సంస్ధలకు ఏటా లక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో ప్రభుత్వం కట్టబెడుతున్నది. వాటికి తోడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కావాలని ఎగవేస్తుంటే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీలు సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) కింద మూడు సంవత్సరాల నిఖర లాభాల సగటులో రెండుశాతం మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్దితి అవసరాలకోసం పిఎం-కేర్‌ (ప్రధాని పౌరసహాయం మరియు ఉపశమన నిధి) నిధిని ఏర్పాటు చేసింది. కరోనా నివారణను అత్యవసర పరిస్ధితిగా పరిగణిస్తున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ నిధికి కంపెనీలు ఇచ్చే మొత్తాలను సిఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేసినట్లుగానే పరిగణించి ఆ మేరకు మినహాయింపులు ఇస్తారు. అదే కంపెనీలు ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇచ్చే మొత్తాలకు ఇది వర్తించదు. అయితే రాష్ట్రాలలో విపత్తు సహాయం లేదా అత్యవసర నిధికి కూడా ఈ మొత్తాలను ఇస్తే మినహాయింపు ఇస్తారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ మీడియాలో ప్రచారం పొందుతున్న బడా కంపెనీలన్నీ ఆ సొమ్మును పిఎం కేర్‌కు బదలాయిస్తున్నాయా లేక నిజంగా విరాళాలు ఇస్తున్నాయా అన్నది తరువాత గానీ బయట పడదు. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు కంపెనీలు సిఎస్‌ఆర్‌ నిధి నుంచి కార్మికులకు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే మొత్తాలను కూడా ఈ నిధిఖాతాలో రాయవచ్చు. కరోనా సమయంలో తాత్కాలిక, కాజువల్‌, రోజువారీ కార్మికులకు సాయం చేయవచ్చు. కంపెనీ నిఖర ఆస్ధుల విలువ ఐదు వందల కోట్లు లేదా వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే కంపెనీలు అంతకు ముందు సంవత్సరంలో నిఖరలాభం ఐదు కోట్లు ఉన్నవి సామాజిక బాధ్యత కింద రెండుశాతం మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది.గడచిన ఐదు ఆర్ధిక సంవత్సరాలలో ఈ మేరకు కంపెనీలు 52వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నివేదించాయి.
నరేంద్రమోడీ సర్కార్‌ ఈ కంపెనీలను విరాళంగా తీసుకున్న మొత్తాలను తన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుగా చూపుతున్నది. నిజానికి ఇలాంటి సందర్భాలలో లక్షల కోట్ల రూపాయల రిజర్వు నిధుల నిల్వలున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచి కొంత శాతం మొత్తాలను విధిగా ప్రభుత్వాలకు జమచేసేట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఆ సొమ్ము కష్టపడి పనిచేసిన కార్మికులదీ, ప్రజలది తప్ప మరొకటి కాదు. అలాంటి ప్రత్యేక పధకాలను ప్రకటిస్తారని అనేక మంది ఎదురు చూశారు. ప్రధాని తన ప్రసంగంలో కొన్ని చెప్పకూడని మాటలు చెప్పారు. కనీసం ఒక్క కరోనా కేసు కూడా మన దేశంలో నమోదు కాక ముందే నివారణకు ఏర్పాట్లు చేసినట్లు మోడీ తన ప్రసంగంలో చెప్పారు. ఇది విమర్శించటానికి తగిన సందర్భం కాదు కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని చెప్పిందే నిజమైతే విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు ? విదేశాల నుంచి నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు రాదలచుకున్న వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు, రోగులకు చికిత్స ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలకు ఎవరు జవాబులు చెప్పాలి. తొలి కేసు జనవరిలోనే నమోదైన విషయం అందరికీ తెలిసిందే మార్చి 22న జనతా కర్ఫ్యూ, 25 నుంచి గృహబందీ ప్రకటించారు.

Coronavirus India: PM Modi New Twitter Bio Pic After Address To ...
గత ఇరవై ఒక్క రోజులుగా రాష్ట్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కోట్లాది మంది వలస కార్మికులు అనేక చోట్ల చిక్కుకు పోయారు, వారు తమ ఇండ్లకు వెళ్లే అవకాశాలు ఈనెల 20వ తేదీవరకు ఉండవు. తరువాత ఉంటాయో లేదో తెలియదు. వారి అవసరాలను ఎవరు చూడాలి? వారుంటున్న ప్రాంతాలలో పారిశుధ్యం,తదితరాల పరిస్ధితి ఏమిటి? అందుకు కేంద్రం వద్ద ఉన్న పధకాలేమిటి ? రాష్ట్రాలు తమకున్న పరిమిత వనరులతో వారిని ఆదుకోగలవా ? పోనీ అప్పోసప్పో చేసి ఖర్చు చేస్తే కేంద్రం భరిస్తుందా ? అదనపు ఖర్చు భరిస్తున్న రాష్ట్రాలకు పరిస్ధితి తీవ్రతను బట్టి కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదా ? అప్పులు తీసుకొనేందుకు అడ్డువస్తున్న నిబంధనలను కూడా కేంద్రం, రిజర్వుబ్యాంకు సవరించలేదనే అంశాల గురించి పట్టించుకోవనవసరం లేదా ? వైద్య పరికరాల సరఫరాను కేంద్రం పర్యవేక్షించాల్సిన అగత్యం లేదా ? చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్రం చేసే సాయం ఏమిటి ? కార్మికులను తొలగించవద్దని సలహా చెబితే సరిపోతుందా ? ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లేదా కనీసం ప్రస్తావన అయినా ఉంటుందనుకున్న వారిని ప్రధాని తీవ్ర నిరాశకు గురిచేయలేదా ?

ఛీ.. ఛీ….చివరికి కరోనా నుంచి కూడా లాభాలు పిండుకుంటున్న అమెరికా !

Tags

, ,

Cartoon of the week - BioVoice News

ఎం కోటేశ్వరరావు
” కరోనా మహమ్మారి సమయంలో మనకు అత్యంత అవసరమైన తరుణంలో ఎన్‌95ముఖ తొడుగులు దేశం బయటకు పోతున్నాయి – తరువాత ఏం జరుగుతుంది ?” అనే శీర్షికతో అమెరికాకు చెందిన ” ఫోర్బ్స్‌ ” పత్రిక విలేకరి డేవిడ్‌ డిసాల్వో రాసిన విశ్లేషణా వ్యాఖ్య ఏప్రిల్‌ ఆరవ తేదీన ప్రచురితమైంది. సరిగ్గా అదే రోజు మన ప్రధాని నరేంద్రమోడీ కౌగిలి నేస్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లతో మమాట్లాడుతూ తాను కోరిన విధంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పంపక పోతే భారత్‌ మీద ప్రతీకార చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. స్నేహంలో ఇలాంటివి మామూలే అన్నట్లుగా మన నరేంద్రమోడీ వ్యవహరించారు.
మన దేశానికి చేసిన బెదిరింపును చూసి అనేక మంది అమెరికా తన అవసరాల కోసం అందుకు తెగిస్తోంది అనుకుంటున్నారు. అది వాస్తవమే, అయితే అదే సమయంలో అమెరికాలో తయారైన వైద్య పరికరాలను ట్రంప్‌ ఇతర దేశాలకు విక్రయించటానికి అనుమతించాడు, అంతే కాదు, ఇతర దేశాలు ఎక్కడో కొనుక్కున వాటిని దారి మధ్యలో అటకాయించి తీసుకుపోయిన దుండగానికి కూడా ట్రంప్‌ పాల్పడ్డాడు. ట్రంప్‌ బెదిరింపులు, మోడీ లొంగుబాటు గురించి మాట్లాడలేని మన మీడియా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఎగుమతుల గురించి చిలవలు పలవలుగా వర్ణిస్తూ మోడీ భజనకు, తద్వారా మెరుగైన పాకేజీలకు అంటే నీకిది నాకదిగా ఉపయోగించుకుంది అని చెప్పాల్సి వస్తోంది. భజన చేయని కొన్ని మీడియా సంస్ధలకు ఈ విమర్శ వర్తించదన్నది షరా మామూలే.
అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో పైన పేర్కొన్న విలేకరి ఒక రోజు అమెరికాలో వైద్య పరికరాల విక్రయాకొనుగోలు దార్ల , ముఖ్యంగా ఎన్‌95 ముఖతొడుగుల లావాదేవీల మీద కేంద్రీకరించి పరిశీలించాడు. మార్చి 30వ తేదీన అదే పత్రికలో ఒక కథనాన్ని కూడా రాశాడు. దాని సారాంశం ఇలా ఉంది. ” కొద్ది గంటల్లోనే 28 కోట్ల ముఖతొడుగుల లావాదేవీలు జరగ్గా అత్యధిక భాగం అవి విదేశాల కొనుగోలు దార్లకు సంబంధించినవే. అదే రోజు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం కూడా ముఖతొడుగుల కోసం ఎక్కని -దిగని గుమ్మం లేదు. ఒక్క ఒప్పందం కూడా కుదరలేదు. మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, బ్రిటన్లలో అమ్మకాలకు కోట్లాది తొడుగులు ఉన్నట్లు మధ్యవర్తులు చెప్పారు. డిమాండ్‌ను చూసి విపరీతంగా ధరలను పెంచటంతో కొనుగోలుదార్లు ముఖ్యంగా అమెరికా దేశీయ కొనుగోలు దార్లనుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.ధరలు పెరిగిపోయిన కారణంగా విక్రయాలను గుట్టుగా సాగించటంతో పాటు అప్పటికే కుంభకోణాలు కూడా చోటు చేసుకుంటుండంతో కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఇవి జరిగాయి. తొడుగులు, పరికరాలకు విపరీతమైన డిమాండ్‌ పెరగటంతో వెంటనే డబ్బు చెల్లిస్తారా లేదా అసలు కొనుగోలు దార్ల దగ్గర డబ్బు ఉందా లేదా అని నిర్ధారించుకొని మరీ విక్రయాలు జరిపారు. నిధులు తమ దగ్గర ఉన్నట్లు రుజువు చూపటంలో ఆలస్యం అయిన సందర్భాలలో గంట వ్యవధిలోనే అప్పటికే ఒకరు కుదుర్చుకున్న వస్తువులను వేరే వారు కొనుగోలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ప్రతి పత్రికా గోష్టిలో పాల్గొన్నవారు ఎన్‌95 ముఖతొడుగులను ధరించి కనిపించటంతో వాటికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. న్యూజెర్సీ రాష్ట్ర అధికారులు తాము తొడుగుల కోసం ప్రపంచవ్యాపితంగా ప్రయత్నిస్తున్నామని చెప్పిన సమయంలో అక్కడ నాలుగు కోట్ల 30లక్షల తొడుగులు అందుబాటులో ఉన్నాయి. స్ధానికులెవరూ లేకపోవటంతో వాటిని విదేశీ కొనుగోలుదార్లు ఎగరేసుకుపోయారు. ప్రభుత్వ సంస్ధలు కొనుగోలుకు ప్రయత్నించినపుడు ఎక్కువ భాగం ఖరారు కాలేదు. సంప్రదింపులు కొనసాగుతుండగా మధ్యలోనే ధరలు మారిపోయాయి, మధ్యవర్తులు సాధ్యమైన మేరకు సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు.”
అమెరికాలో కరోనా మహమ్మారి విస్తరించటానికి చైనా వారు కారణమని ఇప్పటికీ కొన్ని ఉష్ట్రపక్షులు మాట్లాడుతూనే ఉన్నాయి. లాభాల కోసం ఎంతకైనా తెగించే పెట్టుబడిదారీ వ్యవస్ధ, దాన్ని కాపాడే కావలి కుక్కల వంటి ట్రంప్‌లు తమకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల రక్షణ కోసం ఉపయోగించనంత కాలం ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. లాభాలు ఆర్జించే ఆంబోతులకు స్వేచ్చ ఇచ్చిన ట్రంప్‌ నిర్వాకం ఇది. ఫోర్బ్స్‌ పత్రికలో ఈ లావాదేవీల గురించి వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ సర్కార్‌ ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. ఇతర దేశాలకు వైద్య పరికరాల నిరాటంకంగా ఎలా వెళ్లిపోయాయో పత్రికలు రాశాయి. చైనా వ్యతిరేక కళ్లద్దాలు పెట్టుకున్న కొన్ని పత్రికలు కరోనా వైరస్‌తో పాటే వందల కోట్ల వైద్యపరికరాలను కూడా చైనా తయారు చేసి సిద్దంగా ఉంచుకుంది అని రాసినవి కూడా లేకపోలేదు. ఈ విషయాలు తెలిసినపుడు వైరస్‌ నిరోధ చర్యలను ఆయా దేశాలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న ఆ రాతలు రాసే వారికి తట్టలేదు. ప్రమాదం గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించారని విమర్శిస్తే పాలకులు ఎక్కడ కన్నెర్ల చేస్తారో అని భయం.
చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారిందని రాసిన, చెప్పిన నోళ్లతోనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. సాధారణ సమయాల్లో ఇతర దేశాలకు ఎగుమతి కోసం చైనా వైద్య పరికరాలు తయారు చేస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం. చైనా కంటే ఎన్నో రెట్లు మహమ్మారి వ్యాపించిన సమయంలో తమకు వెంటిలేటర్లు పెద్ద సంఖ్యలో కావాలని అడిగిన న్యూయార్క్‌ గవర్నర్‌ను ఎక్కువ చేస్తున్నావంటూ నోరు పారవేసుకున్న ట్రంప్‌ ఏలుబడిలో అదే సమయంలో అమెరికా నుంచి ఏఏ దేశాలకు వెంటిలేటర్ల ఎగుమతి జరిగిందో చెబుతూ ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక రాసింది. అవేవీ రహస్యంగా తరలిపోలేదు, కావాలంటే రికార్డులు తనిఖీ చేసుకోవచ్చు. తైవాన్‌ వంటి చోట్ల కరోనా వ్యాప్తి పరిమితంగా ఉన్నప్పటికీ వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించారు. అమెరికా నుంచి స్వేచ్చగా బయటకు పోనిచ్చారు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు తీరా అలవికాని పరిస్ధితి ఏర్పడగానే జనాన్ని రక్షించేందుకు ఏమైనా చేస్తా అన్నట్లుగా ట్రంప్‌ ఫోజు పెట్టాడు. తమ దేశాలకు వస్తున్న వైద్య పరికరాలు, ముఖతొడుగులను బలవంతంగా చైనా నుంచి అనుమానాస్పద స్ధితిలో పక్కదారి పట్టించినట్లు జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ ఆరోపించాయి. తమకు దానం చేసిన 20వెంటిలేటర్లను అమెరికా అధికారులు అడ్డుకున్నట్లు బార్బడోస్‌ ప్రభుత్వం పేర్కొన్నది. చైనానుంచి బెర్లిన్‌ రావాల్సిన రెండు లక్షల ఎన్‌95 ముఖతొడుగులను దారి మధ్యలో థారులాండ్‌కు అక్కడి నుంచి ఏప్రిల్‌ 3న అమెరికాకు తరలించటం ఆధునిక సముద్రదోపిడీ అని జర్మన్‌ అధికారులు వర్ణించారు. అదే రోజు ఫ్రెంచి అధికారులు ఒక ప్రకటన చేస్తూ తమ దేశానికి రావలసిన సరఫరాలు షాంఘై విమానాశ్రయంలో రన్‌వే మీద ఉండగానే మూడు రెట్ల అధిక ధరలకు అమెరికా కొనుగోలు దార్లు ఎగరేసుకుపోయారని తెలిపారు. తాము పెట్టిన ఆర్డర్ల ప్రకారం వైద్య పరికరాలు సకాలంలో అందకుండా మధ్యలో అడ్డుపడుతున్నారని బ్రెజిల్‌ ఆరోపించింది. తాము చేస్తున్నదానిలో తప్పు లేదని ట్రంప్‌ సమర్ధించుకున్నాడు. తగిన మార్గాల్లో పరికరాలను సేకరిస్తున్నామని చెప్పాడు. ఎం3 అమెరికా కంపెనీ ఉత్పత్తుల ఎగుమతులను కెనడా ఇతర దేశాలకు ఎగుమతి చేయటంపై ట్రంప్‌ సర్కార్‌ విధించిన నిషేధాన్ని కెనడా ప్రధాని విమర్శించటంతో ట్రంప్‌ నిషేధాన్ని ఎత్తివేశాడు.
వైద్య పరికరాలకు డిమాండ్‌ పెరిగిపోవటంతో అమెరికా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఒకదాని మీద మరొకటి విమర్శలకు సైతం దిగాయి. యాభై రాష్ట్రాల మధ్య ఇది ఎలక్ట్రానిక్‌ వేలంగా ఉందని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో వ్యాఖ్యానించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సాయం విషయంలో రాజకీయ ప్రాధాన్యతలను ట్రంప్‌ ముందుకు తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. కరోనా మహమ్మారి సమయంలో అమెరికా ప్రభుత్వం వైద్యపరికరాల అపహరణకు పాల్పడుతున్నదా అని అమెరికాలోని కాటో సంస్ధ నిపుణుడు క్రిస్‌ ఎడ్వర్డ్‌ ప్రశ్న వేసుకొని అలాగే కనిపిస్తున్నదని తానే సమాధానం చెప్పాడు. ప్రభుత్వం చట్టబద్దమైన ఉత్పత్తులకు ఆర్డర్‌ ఇవ్వకుండా వాటిని స్వాధీనం చేసుకోవటాన్ని మరో విధంగా అపహరించటమే అని చెప్పాల్సి ఉంటుందని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది.
తమకు వస్తున్న వాటిలో ఓడ నుంచి ఎనిమిది వెంటిలేటర్లు, 50వేల ముఖతొడుగులు, ఇతర వైద్య సరఫరాలను అమెరికా తొలగించటం తీవ్ర ఆశాభంగం కలిగించిందని బ్రిటన్‌ వలస ప్రాంతమైన కరీబియన్‌ కేమాన్‌ దీవుల ప్రధాని ఆల్డన్‌ మెక్‌లాహిన్‌ వ్యాఖ్యానించాడు. జమైకా రాయబారి జోక్యం చేసుకోవటం అమెరికా తిరిగి వాటిని ఆ దీవులకు పంపింది.

President Donald J. Trump Archives - The iPINIONS Journal
వైద్యులు సిఫార్సు చేస్తున్న ఔషధాల ఎగుమతుల విలువ ప్రపంచవ్యాపితంగా 2018లో 371.3 బిలియన్‌ డాలర్లని వరల్డ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డాట్‌కామ్‌ తాజాగా తెలిపింది. 2014 నుంచి సగటున ఎగుమతులు అన్ని దేశాల నుంచి 5.8శాతం చొప్పున ఏటా పెరుగుతున్నాయి. ఎగుమతుల్లో 79.7శాతం ఐరోపా దేశాల నుంచే జరుగుతున్నాయి. వాటి విలువ 295.8 బిలియన్‌ డాలర్లు. రెండవ స్ధానంలో ఉన్న ఆసియా నుంచి 10.7, ఉత్తర అమెరికా ఖండం నుంచి 8.1శాతం ఉన్నాయి. ఎగుమతులు ఉన్నాయి. ప్రపంచంలో 4.3శాతంగా ఉన్న 3003 ఔషధాలలో రెండు అంతకంటే ఎక్కువ కలసి ఉన్నాయి, మరో 3004 ఔషధాలు అసలేమీ కలవనివి, ఒకటి రెండు కలిసినవి 95.7శాతం ఉన్నాయి.2018లో అగ్రస్ధానంలో ఉన్న పది దేశాల ఎగుమతులు బిలియన్‌ డాలర్లు, శాతాలలో ఇలా ఉన్నాయి.1.జర్మనీ 62.3(16.8), 2. స్విట్జర్లాండ్‌ 45.3(12.2), 3.బెల్జియం 27.8(7.5), 4.ఫ్రాన్స్‌ 25.9(7), 5. అమెరికా 22(5.9), 6.ఐర్లండ్‌21.7(5.8), 7.బ్రిటన్‌ 19.7(5.3),8.ఇటలీ 19.6(5.3), 9.నెదర్లాండ్స్‌ 16.3(4.5), 10 భారత్‌ 13.1(3.5). మొత్తం ఎగుమతులలో పదిహేను దేశాల వాటా 85శాతంగా ఉంది. 2014 తరువాత వేగంగా ఎగుమతులు అభివృద్ధి చెందుతున్న దేశాల ఎగుమతుల పెరుగుదల డెన్మార్క్‌ 293.4శాతం కాగా స్విడ్జర్లాండ్‌ 26.7, భారత్‌ 22.5, జర్మనీ 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో బ్రిటన్‌ ఎగుమతులు 18.1శాతం తగ్గగా తరువాత అమెరికా 14.3, ఇటలీ 12.4, బెల్జియం 9.6, ఆస్ట్రియా 8.3శాతం తగ్గాయి.

ఇక మన దేశం విషయానికి వస్తే హైడ్రాక్సీ క్లోరో క్విన్‌ మందు బిళ్లల గురించి నరేంద్రమోడీకి లంకె పెట్టి అదొక ఘనతగా పెద్దఎత్తునప్రచారం చేస్తున్నారు. ఔషధ రంగంలో ముందున్న అన్ని దేశాలలో దీనిని తయారు చేస్తున్నారు. చలితో వచ్చే జ్వరాన్ని తగ్గించేందుకు లాటిన్‌ అమెరికాలోని పెరూలోని గిరిజనులు(స్ధానికులు) స్ధానికంగా దొరికే సింకోనా చెట్టు బెరడు నుంచి తయారు చేసిన చూర్ణాన్ని వినియోగించే వారు. ఆ ప్రాంతానికి ఐరోపా వారు వలస వచ్చిన తరువాత ఆ చెట్టు మందును తమ దేశాలలో అదే జ్వరం, మలేరియాకు వినియోగించారు. తరువాత సింకోనా నుంచి 1820లో క్వినైన్‌ను వేరు చేసి వినియోగించటం ప్రారంభించారు. 1902లో బ్రిటీష్‌ వైద్యుడు రోనాల్డ్‌ రాస్‌ దోమల నుంచి మలేరియా వ్యాప్తి చెందుతున్నట్లు కనుగొన్నారు. 1934లో జర్మనీకి చెందిన బేయర్‌ కంపెనీ శాస్త్రవేత్త హాన్స్‌ అండెర్‌సగ్‌ నాయకత్వంలోని బృందం క్లోరోక్విన్‌ తయారు చేసింది. దానికి రిసోచిన్‌ అని పేరు పెట్టారు. అయితే అది చాలా తీవ్ర విషతుల్యంగా ఉండటంతో మానవ వినియోగానికి పనికి రాదని నిర్ణయించి పట్టించుకోలేదు. అయితే రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఆఫ్రికాలో జర్మనీ దాని మిత్ర దేశాల సైనికులకు మలేరియా సోకింది. క్లోరోక్విన్‌ నుంచి వేరు చేసిన మిథైల్‌ క్లోరోక్విన్‌ దాన్నే సంటోచిన్‌ అని పిలిచారు. మలేరియా నివారణకు దాన్ని ఉపయోగించారు. ఆ యుద్దంలో జర్మనీ ఓడిపోయినపుడు ట్యునిస్‌లో ఆ ఔషధం అమెరికన్లకు దొరికింది. వారు దాన్ని తమ దేశానికి తీసుకుపోయి మరింత అభివృద్ధి చేసి 1947 నుంచి మలేరియా నివారణకు వినియోగించటం ప్రారంభించారు.
మలేరియా భూమధ్య రేఖకు అటూ ఇటూ ఉండే ఉష్ణమండల దేశాలలో ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో ఎక్కువగా వ్యాపిస్తోంది. వాటిలో మన దేశం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ 2018 నివేదిక ప్రకారం 22.8కోట్ల మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఆఫ్రికాలోనే 21.3 కోట్లు ఉన్నాయి. ఆఫ్రికాలో కూడా ఆరు దేశాల్లో ప్రపంచంలోని 85శాతం కేసులు నమోదయ్యాయి. వాటిలో నైజీరియాలో 25, కాంగో 12, ఉగాండా 5, కోట్‌ డి ఐవరీ, మొజాంబిక్‌, నైగర్‌లో మూడుశాతం చొప్పున ప్రపంచంలోని సగం కేసులు కలిగి ఉన్నాయి.

Cartoon Movement - Profit from Tragedy
మన దేశం విషయానికి వస్తే 2001లో 2.08 మిలియన్‌ కేసులు నమోదు కాగా 2018లో నాలుగు లక్షలకు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 నాటికి మలేరియా రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నది. ఇప్పటికీ గణనీయంగా ఉన్నందున మన దేశంలో మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మందును అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. రెండువందల మిల్లీ గ్రాములుండే ఒక్కోబిళ్ల తయారీకి మూడు రూపాయలు అవుతున్నట్లు అంచనా. దాన్ని ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు. బ్రాండ్‌, డోసు ఎక్కువ, తక్కువను బట్టి రేట్లలో తేడాలు ఉంటాయి. ఇదే అమెరికాలో 200 మిగ్రా ఒక్కోబిళ్ల తయారీకి ఇరవై నుంచి 70 రూపాయలవరకు ఖర్చు అవుతుంది. బహుశా ఈ కారణంగానే ట్రంప్‌ మన దేశం నుంచి చౌక ధరలకు ఈ మందు కావాలని మన ప్రధాని నరేంద్రమోడీని బెదిరించి ఉండవచ్చన్నది ఒక కారణం. అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులను అధిక ధరలకు ఇతర దేశాలకు విక్రయించి మన దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికా వాణిజ్య కంపెనీలకు రెండు చేతులా లాభాలే లాభాలు. ఇది నగ సత్యం. కరోనా వైరస్‌ నివారణకు ఈ మందు పని చేస్తుందని ఎవరూ నిర్దారించకపోయినా ట్రంప్‌ పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించటంతో అమెరికన్లు తుపాకులతో పాటు ఈ ఔషధాన్ని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఎప్పుడైనా పనికి వస్తుందని నిలవ చేసుకుంటున్నట్లు వార్తలు. తుపాకులు ఎందుకు అంటే అమెరికాలో ఏ కారణంతో అయినా సంక్షోభ పరిస్ధితులు ఏర్పడినపుడు చేతిలో తుపాకీ ఉంటే రక్షించుకోవచ్చన్నది అమెరికన్ల నమ్మిక !

కరోనా వైరస్‌ : కట్టడిలో కమ్యూనిస్టుల విజయం- జాడలేని మతాలు, యోగులు, యోగినులు !

Tags

, , ,

Coronavirus

ఎం కోటేశ్వరరావు
బ్రహ్మాండం బద్దలు కాలేదు, సముద్రాలు ఇంకి పోలేదు, ఇటు సూర్యుడు అటు పొడవ లేదు. కరోనా కారణంగా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న గుడ్‌ఫ్రైడే క్రతువును పోప్‌ స్వయంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. తన నివాసంలోనే తంతును పూర్తి చేశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది.ఎక్కడైతే ఏసు క్రీస్తును శిలువ వేశారని భక్తులు నమ్ముతారో జరూసలెంలోని ఆ ప్రాంతంలో నిర్మించిన హౌలీ పుల్చెర్‌ చర్చ్‌లో అతి కొద్ది మంది ప్రార్ధనలు చేశారు. ఫిలిప్పైన్స్‌లో ఊరేగింపునే రద్దు చేశారు. కొందరు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించి కొన్ని చోట్ల ప్రార్ధనలు చేశారు. అందువలన మత చాదస్తులు, ఉన్మాదులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవెయ్యాలి, కళ్లారా చూసేందుకు దృశ్యాలను వారి ముందు ప్రదర్శించాలి. అయినా మారకపోతే అలాంటి వారిని కరోనా క్వారంటైన్‌ మాదిరి ఎక్కడైనా పెట్టి తాళం వెయ్యాలి. ఇది ఒక్క క్రైస్తవుల గురించే వ్యాఖ్య అనుకుంటే పొరపాటు ఏ మతం వారికైనా జరగాల్సింది ఇదే.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మతాల మూఢనమ్మకాల ఉక్కు గోడలను తుత్తునియలు చేస్తోంది. మతాలతో నిమిత్తం లేని దేవుడు, దేవతలు, దయ్యాలతో ప్రమేయం లేని కమ్యూనిస్టు చైనా కరోనాను కట్టడి చేసి సాధారణ జనజీవితాన్ని పునరుద్దరించింది. మరోవైపు దేవుడు,దేవతలు, దేవుడు, దేవుని కుమారుడు, దేవ దూతలు తమను రక్షిస్తారని కూర్చున్న మూర్ఖశిఖామణులను వారెవరూ కాపాడటం లేదు, దిక్కులేని చావు చస్తున్నారు, పూడ్చేందుకు కూడా ఎవరూ లేని వారిని అమెరికాలో గుట్టలుగా పడవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం మత పునరుద్దరణ, మతోన్మాదశక్తులకు ఊహించని ఎదురుదెబ్బ. మూఢనమ్మకాలను నల్లేరు మీద బండిలా ముందుకు తీసుకుపోవచ్చన్న అజెండాతో ముందుకు పోతున్నవారికి పెద్ద కుదుపు. ఊగిసలాటతో ఉన్న అనేక మందికి ఈ పరిణామం దేవుడు, దేవతలు, మతాలు వాటి మహిమల మీద నమ్మకాలను వమ్ము చేస్తుంది.
ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధాన ఘటన జరిగిన తరువాత జ్యోతిష్కులు అదిగో చూడండి మేము ముందే చెప్పాము అంటూ ముందుకు వస్తారు. కొంత మంది తమ మెదళ్లలో ఉన్న అశాస్త్రీయ సరుక్కు ఇదిగో నాసా(అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చెప్పింది అని ముద్ర తగిలిస్తారు. మరికొందరు మన పోతులూరి వీరబ్రహ్మం, ఫ్రెంచి జ్యోతిష్కుడు మైఖేల్‌ డే నోస్ట్రాడామస్‌ పేరు ఉపయోగించి 1551లో ఇలా రాశాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటిలో ఒకటి ఇప్పుడు కరోనా మీద తిరుగుతోంది. దానిలో ఇలా ఉంది.” ఒక జంట సంవత్సరం(2020) ఉంటుంది. దాన్నుంచి ఒక రాణి (కరోనా) తూర్పు దిక్కు(చైనా) నుంచి వస్తుంది.ఏడు కొండలు ఉన్న ఒకదేశం(ఇటలీ) మీద ఒక చీకటి రాత్రి ఒక ప్లేగ్‌(వైరస్‌)ను చల్లుతుంది.అది జీవిత చరమాంకంలో ఉన్న పురుషులలో ప్రవేశించి మట్టి(మరణం)గా మారుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అంతం చేస్తుంది”.

These photos show how coronavirus fears left religious sites empty ...
దీన్ని సృష్టించిన వారు, దాన్ని గుడ్డిగా నమ్మేవారు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారి గురించి చెప్పాలంటే ఏమాత్రం బుర్ర ఉపయోగించని వారే అన్నది స్పష్టం. నోస్ట్రోడామస్‌ ఒక జంట సంవత్సరం వస్తుంది, అది 2020 అని చెప్పటమే తెలివితక్కువ తనం. ప్రతి నూట ఒక్క సంవత్సరాలకు అలాంటి సంవత్సరాలు వస్తాయి. అవి నోస్ట్రోడామస్‌కు ముందు వచ్చాయి, తరువాత వస్తాయి. అతగాడు చెప్పింది 1551లో అంటున్నారు గనుక 1616,1717,1818,1919 వచ్చాయి. అవే కాదు మూడంకెల సంవత్సరాలు కూడా వచ్చాయి. మిగతా సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో కూడా ప్రపంచాన్ని కుదిపివేసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ ప్రచార సృష్టి కర్తలకు బాక్టీరియాకు, వైరస్‌కు తేడా తెలియదు. అది ఇటలీలో ముసలి వారిని చంపేస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని వయసుల వారినీ కబళిస్తోంది. ఇటలీతో పాటు అనేక ఐరోపా దేశాలలో విలయతాండవం చేస్తోంది. అన్నిదేశాల కంటే వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఉంది.
గణేషా స్పీక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో జ్యోతిషాన్ని చెబుతున్నవారు మార్చి 30 తరువాత వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఎంత వేగంగా విస్తరిస్తోందో, దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పటంలో ఒక మతం అని లేదు. స్వాములు, బాబాలు, గురువులు, గురవమ్మలు, గంటల, దిన, వార పంచాంగాలు,రాసి ఫలాలను ప్రచురించి సొమ్ము చేసుకొనే మీడియా గురించి ఏం చెప్పాలి? హిందూ మహాసభ గోమూత్ర పార్టీలను ఏర్పాటు చేసింది, ఇంకే ముంది కొందరు బిజెపి నేతలూ అదే పాట అందుకున్నారు.
కరోనా వైరస్‌ మతశక్తులలో విబేధాలు తెచ్చినట్లు ప్రముఖ పత్రిక ”ఎకనోమిస్ట్‌ ” తాజాగా ఒక వార్తను ప్రచురించింది. గుడ్‌ ప్రైడే సందర్భంగా రోమ్‌లో ప్రతి ఏటా పోప్‌ భక్తులతో కలసి శిలువను మోస్తూ ఏసు క్రీస్తు జీవితంలోని పద్నాలుగు ఘట్టాలకు చిహ్నంగా (మహాభారత పర్వాలు, రామాయణ కాండల మాదిరి) 14చోట్ల ఆగుతూ నడుస్తారు. ఆ దారిలో వేలాది మంది అనుచరులు శిలువను ముద్దాడుతూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. వాటన్నింటినీ పక్కన పెట్టారని, ఏ ఏదేశాల్లో ఏమి జరుగుతోంది ఆ పత్రిక ప్రకటించింది. తాను 51 సంవత్సరాలుగా బోధకుడిగా ఉన్నానని ఇప్పుడు జనాన్ని చర్చ్‌లకు రావద్దని చెప్పాల్సి రావటం తనకు ఎంత కష్టమో ఆలోచించాలని రష్యన్‌ ఆర్ధోడాక్స్‌ చర్చ్‌ ప్రధాన గురువు కిరిల్‌ ప్రకటించారు. అయితే కొందరు అమెరికన్‌ ఇవలాంజికల్స్‌ మూర్ఖంగా వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ప్రార్ధన చేసి వైరస్‌ను నిర్మూలిస్తామంటూ జనాన్ని తరలించిన ఫ్లోరిడా బోధకుడు రోడ్నీ హౌవార్డ్‌ బ్రౌన్‌ వారిలో ఒకడు. మన తిరుపతి వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో మాదిరి భక్తులు లేకుండా తప్పనిసరి అనుకున్న మత క్రతువులను నిర్వహించవచ్చని ఫ్లోరిడా గవర్నర్‌ ప్రకటించాడు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు కూడా ఈస్టర్‌ పూజలను ఇలా పూర్తిగా అడ్డుకోలేదని తూర్పు ఐరోపా దేశాల్లో సామాన్యులు భావిస్తున్నారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. యూదు మతంలో ఒక బహిరంగ మత క్రతువు నిర్వహించాలంటే కనీసం పది మంది హాజరు ఉండాలి, ఇప్పుడు సాధ్యం కాదు కానుక వాట్సాప్‌ లేదా మరొక పద్దతిలో పది మందిని చూపి దాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇరాక్‌లో వైరస్‌ను వ్యాపింప చేసే వారు హంతకులతో సమానమని షియా మత పెద్ద గ్రాండ్‌ అయాతుల్లా అలీ అల్‌ సస్తానీ చేసిన వ్యాఖ్యలను ముక్తాదా అల్‌ సదర్‌ అనే మత పెద్ద వ్యతిరేకించాడు. నజఫ్‌ లోని ఇమామ్‌ అలీ మందిరాన్ని తెరవాల్సిందే అంటూ ప్రార్ధన ధర్నా చేశాడు. తలుపులు తెరిచిన తరువాత శవాలతో జనం దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు మతఛాందుసులైన క్రైస్తవులు, స్వలింగ వివాహాలకు మద్దతు ఇస్తున్న కారణంగా కరోనా వైరస్‌ శిక్షిస్తున్నదని ముక్తాదా ముక్తాయింపులు ఇస్తున్నాడు. ఈనెల 23న రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ సందర్భంగా ఇస్లామిక్‌ దేశాలలో ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇరాన్‌లో అన్ని మత ప్రదేశాలకు భక్తులు రావటాన్ని గతనెల 16న ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోయిందని లౌకికవాదులు విమర్శిస్తే, ఇది తగని చర్య అని మతోన్మాదులు విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామనవమి ఉత్సవాలను పరిమితం చేయాలని అధికారులు ప్రయత్నిస్తే హిందూ సంస్ధల వారు అయిష్టంగానే అంగీకరించారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది.
కరోనా వైరస్‌ బతికి ఉన్నవారి మధ్య దూరం పెంచటమే కాదు, మరణించిన వారి అంత్యక్రియలకు సైతం పరిమితులు విధించింది. సంప్రదాయాలను పక్కన పెట్టమంది. క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాల్లో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు మూడు రోజులు తీసుకుంటారు. ఇప్పుడు మరణించిన రోజే ఆపని చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని చోట్ల రోజుల తరబడి శవాలను ఇచ్చే పరిస్ధితి లేదు. కరోనా వ్యాధి గ్రస్తులు మరణించిన తరువాత వైరస్‌ ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అలాంటి వారిని అనుమతించేది లేదని అనేక శ్మశానవాటికలు నిరాకరిస్తున్నాయి. హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ రెండు కిలోమీటర్ల దూరం పైగా నిలబడి శ్రద్దాంజలి ఘటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మత మూర్ఖశిఖామణులే కాదు కొన్ని ప్రభుత్వాలు కూడా జనం ముఖ్యంగా లక్షలాది మంది మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వైరస్‌ వ్యాప్తికి అబార్షన్లే కారణమని అనటమే కాదు, అబార్షన్లను నిషేధించింది. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయం లేని అనేక మంది ఇదేమి అదనపు భారంరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతకు ముందు అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చిన ఆసుపత్రులన్నీ వాటిని రద్దు చేశాయి. అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో అత్యవసరంగా గర్భవిచ్చిత్తి చేసే ఆసుపత్రుల కోసం పరుగులు తీస్తున్నారు.
కరోనా వైరస్‌ కారణంగా ఇది రాస్తున్న సమయానికి వ్యాధిగ్రస్తులైన వారు 17లక్షల 16వేలు, మరణించిన వారు లక్షా మూడువేల 848మంది. ఒక్క అమెరికాలోనే 30శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. మానవాళితో పాటు వారిని నడిపిస్తున్న మతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. దీని దెబ్బకు మతాలు బోధకుల మీదనే విశ్వాసం సన్నగిల్లే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. గత చరిత్రను చూసినపుడు ప్రళయాలు సంభవించినపుడు, వర్తమాన కాలంలో ఆర్ధిక సంక్షోభాలు వచ్చినపుడు జనం మరింతగా మతాలు, దేవుళ్లవైపు చూశారని స్పష్టమైంది. సమాజాన్ని వెనుక్కుతీసుకుపోయే మతశక్తులు మత, క్రతువుల పునరుద్దరణకు చేసే సంఘటిత ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వర్తమాన కాలంలో హిందూత్వ శక్తులు హిందూమతం కోసం ప్రయత్నిస్తుంటే తబ్లిగీ జమాత్‌ వంటి సంస్దలు ఇస్లామ్‌ పునరుద్దరణ ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాగే ప్రతి మతంలోనూ తిరోగామి శక్తులు చెలరేగుతున్నాయి. మానవ ప్రవర్తన మీద మతాల ప్రభావం ఇప్పుడు పెరుగుతోందా తరుగుతోందా అనే చర్చ ఉండనే ఉంది. ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే దేవుడ్ని పట్టించుకోరనే మాట తరచూ వినిపించటం అందరికీ తెలిసిందే.
1960 దశకంలో అమెరికాలో 40శాతం లోపే మతాన్ని నమ్మటం లేదా తమ జీవితాల మీద మత ప్రభావం ఉందని భావించగా న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడులు చేసిన తరువాత మతం మీద విశ్వాసం ఉండాలని భావించిన వారు 71శాతం ఉన్నట్లు గ్యాలప్‌ సర్వే పేర్కొన్నది.14వ శతాబ్దంలో ఐరోపాలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలినపుడు జనజీవితంలో చేస్తున్న తప్పుల కారణంగానే శిక్షగా దేవుడు ప్లేగ్‌ను పంపాడని మత పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్లేగు వ్యాధితో జనం మరణించకుండా నివారణ ప్రార్ధనలు జరిపేందుకు నాటి రాజు కులీ కుతుబ్‌ షా 1591లో నిర్మించిన కట్టడం అది. ప్రపంచంలో అనేక చోట్ల అలాంటివి వెలిశాయి. తరువాత హైదరాబాదు సంస్ధానంలో ప్లేగు వచ్చినపుడు పాలకులు భారం దానిమీదే వేసి ఊరుకోలేదు.ఐరోపాలో ప్లేగు కోట్లాది మందిని బలితీసుకుంది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్లేగు వ్యాధి పదే పదే రావటంతో జనాలకు మతం మీద నమ్మకం సన్నగిల్లింది. దేవుడు మంచి వాడే గానీ మత పెద్దలు కాదన్నట్లుగా ఆగ్రహం వారి మీదకు మళ్లింది. ఆ పరిణామం మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది.
కరోనా సందర్భంగా అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రపంచ వ్యాపితంగా అన్ని మతాల ప్రార్ధనా మందిరాలను మూసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చాదస్తం, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఆయా మతాల వారిలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మలేసియా, పాకిస్దాన్‌, భారత్‌లలో తబ్లిగీ జమాత్‌ సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా, వాటిలో పాల్గొన్నవారు వైరస్‌ను మోసుకు వచ్చిన వారిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ తప్పు ఇస్లాం మతానిది కాదు, ఆ మతాన్ని పునరుద్దరించే పేరుతో పనిచేస్తున్న సంస్ధలు, వ్యక్తులు కరోనా వ్యాప్తి గురించి తెలిసి కూడా మూర్ఖంగా సమావేశాలు నిర్వహించటం నేరపూరిత వ్యవహారం. దాని మీద ఆ మతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మతాన్ని పునరుద్దరిస్తాం అంటే సరి పెట్టుకున్నంత మాత్రాన అసలుకే ఎసరు తెస్తే ఎలా అంగీకరిస్తాం అనే ఆగ్రహం ఆ మతంలోని వారి నుంచే వ్యక్తం అవుతోంది. సరే ఈ ఉదంతాలను కూడా మతోన్మాదాన్ని, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్న వారి గురించి తెలిసిందే. వారికి సోకిన మత వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం.

In a test of faith, Christians mark Good Friday in isolation - The ...

మత శక్తులు వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే. ఇండోనేషియాలో మార్చి 19వ తేదీ నుంచి జరపతలపెట్టిన తబ్లిగీ జమాత్‌ ఐదు రోజుల ఆసియా వార్షిక మత సమావేశాలను రద్దు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. అల్లాకు తప్ప మరొకరెవరికీ భయపడాల్సిన పనిలేదని ప్రచారం చేశారు. సమావేశ రద్దు ప్రతిపాదన వెనుక నిషేధిత ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఉందని కూడా రెచ్చగొట్టారు. చావు పుట్టుకలన్నీ దేవుడు ముందే నిర్ణయిస్తాడని, కనుక కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. దానికి భయపడితే ఇస్లాం నుంచి వైదొలిగినట్లే అని రెచ్చగొట్టారు. మసీదు నిర్వాహకులు అల్లా కంటే సమావేశాలను వాయిదా వేయాల్సిందే అన్న రాష్ట్ర గవర్నర్‌ రిదవాన్‌ కమిల్‌కే ఎక్కువ భయపడ్డారని జనం భావించారు. అనుమతి లేకపోయినా భక్తులు ప్రారంభానికి ముందే వేలాది మంది చేరుకున్నారు. చివరికి అధికార యంత్రాంగం కరకుగా వ్యవహరించటంతో రద్దు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ జరిపి తీరాల్సిందే అని రామాలయ ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస పట్టుబట్టిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, భక్తుల మంచి చెడ్డలను రాముడే చూసుకుంటాడని వాదించారు.
ఇక మంత్రాలకు చింతకాయలను రాలుస్తాం అనే అన్ని మతాలకు చెందిన బాబాలు, యోగులు,యోగినులు దుకాణాలు మూసుకొని కరోనా దెబ్బకు ఎక్కడికి పోయారో తెలియదు. వారిని గుడ్డిగా నమ్మిన జనం కష్ట కాలంలో ఏమయ్యారు అని నిలదీయకుండా ఉంటారా ? అంత ధైర్యం చెయ్యకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా కథ ముగిసిన తరువాత వారంతా తిరిగి దుకాణాలు తెరుస్తారు, జనానికి ఎలాంటి సంజాయిషీ చెబుతారో చూద్దాం. అలాంటి వారందరి చేత తెల్లారగానే బోధలు చేయించే మీడియా పెద్దలు కూడా జనానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో అన్ని మతాల వారు ఇండ్లలో ఉండే ప్రార్ధనలు జరపండి అని చెప్పకతప్పటం లేదు. అదే పని సాధారణ సమయాల్లో సైతం ఎందుకు చేయకూడదు అని కొందరైనా ఆలోచించకుండా ఉంటారా ? దర్శనాల వేలం వెర్రి తగ్గుతుందా? అదే జరిగితే అత్యంత లాభదాయకంగా మారిన భక్తి వాణిజ్య కేంద్రాలు, వాటి నిర్వాహకుల ఆదాయాలు ఏమి అవుతాయి ? ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది. గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ మత ప్రచారంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. మత గ్రంధాల ప్రచురణ, పంపకం ద్వారా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం బాగా పెరిగి పోయిన ఈ రోజుల్లో ఫోన్‌ భక్తి వెల్లువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇష్టదైవాన్ని ఫోన్లో చూస్తూనే బస్సులు, రైళ్లు, కార్యాలయాల్లో పూజలు ప్రారంభం కావచ్చు. ఇవన్నీ మత వాణిజ్యం, మతశక్తులకు మంచి సూచనలు కావు.

Chinese President Xi Says He Was Leading COVID-19 Since Jan. 7 | Time
ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిందని ప్రతివారూ చెబుతారు. కానీ ఆ గ్రామంలోనే ప్రతి వారూ తమ కులం, మతాలకే పరిమితమైన గోడలతో గృహ సముదాయాలను నిర్మించుకోవటాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కులం, ప్రతి మతం తమ పవిత్రతను కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించే ధోరణులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకునే పిల్లుల మాదిరి ప్రతి వారూ తమ కుళ్లును మూసిపెడుతూ ఎదుటి వారి దాని మీద దాడి చేస్తున్నారు. అంతరించి పోతున్న మత, కుల మడులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో మతాల పేరుతో అధికారాన్ని నిలుపుకొనేందుకు రాజులు,రంగప్పలు చేస్తే ఇప్పుడు వారి వారసులుగా కొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. మృత భాషగా మారిపోయిన సంస్కృత శ్లోకాలను తమ పిల్లలకు నేర్పుతూ అనేక మంది ముఖ్యంగా విదేశాలలో ఉంటూ తెలియకుండానే హిందూ మత ఉద్దారకులుగా మారిపోతున్నవారిని చూస్తున్నాము. అదే పద్దతిలో ఏ మతానికి ఆ మతం వారు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భారతీయులమని చెప్పుకోవాల్సింది పోయి ఫలానా కులం, ఫలానా మతం ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తున్న ప్రవాస భారతీయలను చూసి సిగ్గుపడుతున్నాము. అయితే ఏ విత్తనాలు వేస్తే ఆ పండ్లు, కాయలే కాస్తాయి అన్నట్లుగా మన దేశంలో, రాష్ట్రాలలో కుల మతాల కంపుతో పెరిగిన మన వారు పరాయి ప్రాంతంలో కూడా దాన్నే వ్యాపింప చేయటంలో ఆశ్చర్యం ఏముంది.

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వేటు : వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా ?

Tags

, , ,

Opinion - Who's Mr Right: CM or SEC?

ఎం కోటేశ్వరరావు
జగన్‌మోహరెడ్డి ఎరక్కపోయి మరింతగా ఇరుక్కు పోతున్నారా అనే శీర్షికతో మార్చినెల 22న ఒక విశ్లేషణ చేశాను. తాజాగా జరిగిన పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌ అమలు చేశారు. గవర్నర్‌ ఆమోదం పొందిన తరువాత ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్‌గా తుడా కార్యదర్శి ఎస్‌ రామసుందరరెడ్డి నియామకం కూడా జరిగిపోయింది. కరోనా లక్షణాలు బయట పడటానికి 14 రోజులు పడుతుందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే కరోనా మాటున రహస్యంగా జరిగింది బయట పడింది.
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా ? ఏదైనా ఒకటే, వినేవారు చెవి అందిస్తే దానికి ఇంపైన మాటలతో కంపు చర్యలను కూడా ఎక్కిస్తారు. కమిషనర్‌ పదవీ కాలం తగ్గింపు, దాని కొనసాగింపుగా తొలగింపు చట్టబద్దమా, విరుద్దమా అన్న చర్చ ప్రారంభమైంది. తెలుగు ప్రాంతాల్లో ఒక లోకోక్తి ఉంది. కొడదామంటే కడుపుతో ఉంది-తిడదామా అంటే అక్క కూతురు అన్నట్లుగా సలహాదారులను ఏమీ చేయలేని స్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. ఏరి కోరి నియమించుకున్నవారాయే ఏ పేరుతో తొలగిస్తారు ? ఏది ఎలా జరిగినా అంతిమంగా ఫలితాన్ని అనుభవించేది జగన్మోహనరెడ్డి మాత్రమే. సలహాదారులకు పోయేదేమీ లేదు, వాళ్లు ఎన్ని తప్పుడు సలహాలు ఇచ్చినా తొలగించలేని నిస్సహాయ స్థితిలోకి ఇప్పటికే జారుకున్నారు. ఎవరినైనా తొలగిస్తే అది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది.
జగన్మోహనరెడ్డి పాలన మీద కేంద్రీకరించటం కంటే తనకు శాశ్వతంగా అధికారాన్ని కట్టబెడతాయని ఆశపడుతున్న నవరత్నాల అమలు, తన రాజకీయ ప్రత్యర్ధుల మీద, గత పాలనలో వారికి సహకరించిన ఉన్నతాధికారుల మీద కక్ష తీర్చుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. వాటిని ఆరోపణలుగా భావించి వైసిపికి మద్దతు ఇస్తున్న వారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం తగ్గింపు ఆర్డినెన్స్‌ ద్వారా దొడ్డి దారిన రమేష్‌ కుమార్‌ను తొలగించటంతో సిఎం కక్షపూరిత వైఖరిని నిర్ధారించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహనరెడ్డి ఏం చేసినా సమర్ధించే వీర భక్తులకు కొదవ లేదన్నది వేరే అంశం. వారు తమ దేవుళ్లను కాపాడలేరు అని ఇప్పటికే చంద్రబాబు నాయుడి విషయంలో రుజువైంది.
స్ధానిక ఎన్నికలను వాయిదా వేసిన కమిషనర్‌ నియామకంపై తమ ముఖ్య మంత్రి అనవసరంగా ప్రతిష్టకు పోయి దెబ్బతిన్నారని భావిస్తున్న వైసిపి నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తొలగింపునకు అనుసరించిన పద్దతిని ఉన్నత న్యాయస్ధానాలు అంగీకరించకపోతే తాము ఏ ముఖంతో బయటకు రావలానే ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కారణంగానే గతంలో ఎదురు దెబ్బలు తిన్న అనుభవం గమనంలో ఉంటే ఇప్పుడు ఆ కరోనా మరింత ఉధృతంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యను వైసిపి కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేరు.
ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం, నియామకం గురించి స్వతంత్ర విధానాన్ని అనుసరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధికి రమేష్‌ కుమార్‌ను నియమించింది. అది ముగిసేలోగా ఏ కారణాలతో అయినా నియమిత వ్యక్తులు రాజీనామా చేస్తే లేదా అరవై అయిదు సంవత్సరాలు నిండి వైదొలగాల్సి వస్తే ఆ స్ధానంలో కొత్త వారిని నియమించటం వేరు. లేదా కమిషనర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చినపుడు తొలగించాలంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఏ పద్దతుల్లో తొలగించాలో అదే పద్దతిని పాటించాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఆమోదం అవసరం. అందువల అది అంత తేలిక కాదు కనుక జగన్‌ సర్కార్‌ వేరే మార్గాన్ని ఎంచుకుంది. అది చట్టబద్దమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. తన తొలగింపును సవాల్‌ చేస్తూ రమేష్‌ కుమార్‌ కోర్టుకు వెళతారా లేదా అన్నది తెలియదు. ప్రజాప్రయోజనాల రీత్యా ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ ఇతరులు ఎవరైనా కోర్టుకు వెళ్ల వచ్చన్నది ఒక వాదన.
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం ముఖ్యమంత్రి అయిన తానా లేక ఎన్నికల కమిషనరా అని స్వయంగా జగన్‌మోహనరెడ్డే ప్రశ్నించటమే కాదు, సుప్రీం కోర్టుకు వెళ్లి మొట్టికాయలు తిని కమిషనర్‌ నిర్ణయమే సుప్రీం అని నిర్ధారించుకున్నారు.అయితే దాన్ని జీర్ణించుకోలేకపోయారు అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దానికి ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ భావించినా అది ఇలా, ఈ సమయంలో ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. కరోనా కారణంగా దృష్టి అంతా అటే వైపు ఉంది. దాన్ని అవకాశంగా తీసుకొని కక్ష తీర్చుకోవటానికి పూనుకుంటారని, ఈ సమయంలో కొత్త రాజకీయ వివాదాలకు తెరలేపుతారని ఎవరూ ఊహించలేదు.
అయితే వెనుకటి తేదీ నుంచి అమలు జరిగే నిర్ణయం చట్టబద్దమైతే ఏక్షణంలో అయినా తొలగించేందుకు అవకాశం ఉంది. కరోనా కష్ట కాలంలో ఆర్డినెన్స్‌ ద్వారా యావత్‌ రాజకీయ వర్గాలు విస్తుపోయేలా రాజకీయానికి పూనుకోనవసరం లేదు. గాలికిపోయేదాన్ని తలకెత్తుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఎలాగూ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉంటుంది. చర్చ లేకుండానే ఆమోదించే మద్దతు ఎలాగూ ఉన్నారు గనుక ఆ సమయంలోనే ఆర్డినెన్స్‌ ద్వారా చేసిన దాన్ని బిల్లుద్వారానే చేయవచ్చు.తొందరపడకుండా ప్రజాస్వామ్య బద్దంగానే చేశారనే విమర్శలు రాకుండా చూసుకోవచ్చు. కరోనా వ్యాప్తి తగ్గేవరకు స్దానిక సంస్ధల ఎన్నికలు ఎలాగూ జరగవు. ఈ లోగా కమిషనర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేదేమీ ఉండదు.
ఈ నేపధ్యంలో ఇలాంటి చర్యల ద్వారా జగన్మోహనరెడ్డి ఏమి సాధిస్తారు ? ఎలా లబ్ది పొందుతారన్నది ఒక అంశం. రమేష్‌ కుమార్‌ తొలగింపు విషయంలో కోర్టుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వెళ్లకపోతే అదొక పెద్ద చర్చ అవుతుంది. తాను తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన రమేష్‌ కుమార్‌ తన వేటును సవాలు చేయకపోతే బెదిరింపులకు లొంగిపోయినట్లు కనిపించే అవకాశం ఉంది. ఆర్డినెన్స్‌ ద్వారా ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని సవరించారు. అది పూర్వపు తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను 2016 ఏప్రిల్‌ ఒకటవ తేదీన నియమించారు. ఒకసారి నియమించిన తరువాత సదరు వ్యక్తి పదవీకాలం పూర్తి అయిన తరువాతే కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నది ఒక వాదన, కాదు వెనుకటి తేదీ నుంచి కూడా అమలు చేయవచ్చు అన్నది సర్కార్‌ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషర్ల విషయంలో ఇలాంటి పరిస్ధితి గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. అయితే సమాచార కమిషనర్ల నియామకం, వారి హౌదాల విషయంలో ప్రభుత్వాలు చేసిన చేసిన మార్పులు కొత్తగా నియమించబోయేవారికి తప్ప ప్రభుత్వం కొత్త విధానాన్ని ఖరారు చేసే సమయానికి పదవుల్లో ఉన్న వారికి గత విధానాలే వర్తిస్తాయని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ తీర్పు ప్రకారం అయితే జగన్‌మోహనరెడ్డికి మరో గట్టిదెబ్బ తగలనుంది. అది కార్యకర్తలు, నేతల్లో జగన్‌ పట్ల ఉన్న ఆరాధన స్ధానంలో చులకన భావం కలగటానికి నాంది అవుతుంది. ఇప్పటికే మడి కట్టుకొని ఉన్నవారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఉన్నత న్యాయ స్ధానాలు ఈ వివాదం తమ ముందుకు వస్తే ఏమి తీర్పు ఇస్తాయి అన్నది ఆసక్తికరం. ఇటీవల వెలువడిన కొన్ని తీర్పులను చూస్తే గత తీర్పులను అనుసరిస్తారనేదేమీ లేదు. చట్టానికి చేసే వ్యాఖ్యానాలు మారిపోతున్నాయి. ఒక వేళ వెనుకటి తేదీతో అమలు జరిపే ఆర్డినెన్స్‌ చెల్లదు అని తీర్పు వస్తే జగన్‌ పరువు మరింత పోతుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఎన్నికల వాయిదాను రచ్చ చేసి పార్టీ కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టారన్న భావం ఉంది. ఎన్నికల రద్దు నిర్ణయం తరువాత జరిగిన పరిణామాలను చూస్తే కమిషనర్‌ చర్యే సరైందన్నది స్పష్టం. అయితే అది ప్రభుత్వంతో సంప్రదించి చేసి ఉండాల్సింది అన్నది కూడా కమిషనర్‌ వైపు నుంచి జరిగిన లోపం అన్నది కూడా నిజమే.

Did Jagan Mohan Reddy disappoints Congress party? | AP PCC ...
ఒక వేళ ప్రభుత్వ చర్యను ఉన్నత న్యాయస్ధానాలు సమర్ధిస్తే చూశారా మా తడాఖా అని జబ్బలు చరుచుకోవటం తప్ప వైసిపికి అదనంగా వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమిటన్నది అయోమయం. అంతే కాదు అది కొత్త సమస్యలను ముందుకు తెస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టంలో జరిగిన దాడులు, బలవంతపు ఉపసంహరణలు, ఇతర అక్రమాల గురించి కొందరు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఉద్వాసనకు గురైన కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సిఫార్సు చేశారు. ఆ అంశాలతో కూడిన ఒక లేఖ కేంద్రానికి కమిషనర్‌ నుంచి అందినట్ల్లు, అవసరమైనపుడు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరతామని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా లేదా కోర్టు అనుమతిస్తే కొత్త కమిషనర్‌ గత కమిషనర్‌ చేసిన సిఫార్సులను రద్దు చేస్తారా ? వచ్చిన ఫిర్యాదుల మీద ఏ చర్య తీసుకుంటారు ? కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖను కూడా ఉపసంహరించుకుంటారా ? అదే జరిగితే కేంద్రం ఏ వైఖరి తీసుకుంటుంది అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి.
ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు జగన్‌ సర్కార్‌ కరోనా, పేదలను ఆదుకోవటం గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కక్ష తీర్చుకోవటం మీద ఉన్న శ్రద్ద కష్టకాలంలో ఉన్న జనాల మీద లేదనే తీవ్ర విమర్శ, జనాగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.