డోనాల్డ్‌ ట్రంప్‌ నోట మరో పచ్చి అబద్దం !

Tags

, , , , ,

Image result for donald trump , us world police

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే ! అమెరికా పాలకవర్గమూ అలాంటిదే ! వారికి యుద్ధమూ లాభమే, పోరు నిలిపివేతా లబ్ది చేకూర్చేదే అయితే దేనికైనా సిద్ధపడతారు ! అది ఆసియా ఖండమా, ఐరోపానా అన్నదానితో నిమిత్తం లేదు ! అందుకు డెమోక్రాట్లు- రిపబ్లికన్లూ అన్న తేడా లేదు ! అవసరమైతే పార్లమెంటులో రెండు పార్టీలు కలసి ఎవరు అధ్యక్షుడిగా వున్నా అడ్డుకుంటాయి లేదా మద్దతు ఇస్తాయి ! ఆ రెండు పార్టీల మధ్య తగాదా అధికారం దగ్గర తప్ప కార్పొరేట్ల ప్రయోజనాల గురించి కాదు. తమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు, అనుసరించాల్సిన మార్గాల మీద తప్ప లక్ష్యం మార్పు రద్దు గురించి కాదు. అమెరికా రాజకీయాలు, విధానాలను నిర్ణయించేది అక్కడి గుత్త సంస్ధలు తప్ప సామాన్యులు కాదు. రాజకీయ నేతలు వాటి తోలుబమ్మలే. అందుకే వారు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. అమెరికా ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అన్నింటా అగ్రస్ధానం తమదే అనే దాని ఆటలు సాగటం లేదు. అదిరింపు, బెదిరింపు, బుజ్జగింపు, లాలింపు, తప్పదనుకుంటే రాజీ ఇదీ ఇప్పటి దాని స్ధితి. ఇలా చెప్పటం అంటే అమెరికా పని అయిపోయిందని కాదు. అగ్రరాజ్యానికి కూడా అనువుగాని పరిస్ధితులు ఎదురైనపుడు సింహం కూడా ఒకడుగు వెనక్కు వేయకత తప్పదు. ఏమిటా పరిస్ధితి, ఎందుకీ పరిణామాలు !

సిరియా నుంచి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సగం మంది సైనికులను వుపసంహరించనున్నట్లు ట్రంప్‌ సంచలన ప్రకటన, దానికి నిరసనగా దేశ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ రాజీనామా, ఆ తరువాత మెక్సికో సరిహద్దులో గోడకు నిధుల కేటాయింపుపై పార్లమెంట్‌లో వ్యతిరేకత, అది ప్రభుత్వ స్ధంభనకు దారితీత, ఇది కొనసాగుతుండగానే ఆకస్మికంగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో తిష్టవేసిన అమెరికన్‌ దళాల వద్దకు వెళ్లి ఇంకేమాత్రం అమెరికా ప్రపంచ పోలీసుగా వుండబోదని ఒక ప్రకటన. ఇవన్నీ పక్షం రోజుల్లో వరుసగా జరిగిన పరిణామాలు. అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సంక్షోభం, సమస్యల తీవ్రతకు ప్రతిబింబాలు. ఒక వారంలో ఒకదాన్ని సంచలనాంశంగా మారిస్తే మరో వారంలో మరో అంశాన్ని ముందుకు తెస్తున్న ట్రంప్‌ తీరుతెన్నులు ప్రపంచానికి పజిల్‌గా వుంటున్నాయి. ఒక ప్రకటన చేయటం దాని మీద స్పందనలు ఎలా వుంటాయో చూడటం, దానికి అనుగుణ్యంగా తదుపరి చర్యలు. వీటిలో ప్రపంచ పోలీసుగా అమెరికా పాత్ర గురించి వివరంగా పరిశీలించుదాం. చరిత్రలో తొలి ప్రపంచ పోలీసుగా బ్రిటన్‌ వ్యవహరిస్తే తదుపరి ఆ పాత్రను అమెరికా పోషిస్తోంది. కర్రవున్నవాడిదే గొర్రె అన్నట్లుగా ప్రపంచంపై పెత్తనం కోసం తమకు తాముగా కర్రపెత్తనం చలాయించటం తప్ప ఈ దేశాలకు ఎవరూ ఆ బాధ్యతను అప్పగించలేదు. ఆ పాత్రలో తామింక వుండలేమని ట్రంప్‌ చెప్పటం వెనుక పరమార్ధం ఏమిటి?

రేపటి నుంచి మిమ్మల్ని తినబోనని పులి చెబితే మేకలు నమ్ముతాయా, ట్రంప్‌ మారుమనస్సు పుచ్చుకున్నాడా ? ఎందుకింత పెద్ద అబద్దం చెప్పాడు. అమెరికా సమాజానికి ఇది ఒక ప్రజాకర్షక అంశంగా తయారైంది. అందుకే ఇటీవలి కాలంలో ఎవరు అధికారంలో వున్నా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సివస్తోంది. ప్రపంచ పోలీసు పాత్రలో వుండాలనుకోవటం లేదు అన్న మాటలు కాదు, కొనసాగింపు అంశం ముఖ్యం. ‘ భారం మొత్తం మేమే భరించటం సముచితం కాదు. మమ్మల్ని, నిస్సందేహమైన మా మిలిటరీని తమ రక్షణకు వుపయోగించుకోవాలని ఇతర దేశాలు చూడటాన్ని ఇంకేమాత్రం మేము కోరుకోవటం లేదు.’ అన్నాడు.ప్రస్తుత స్ధాయిలో అమెరికా మిలిటరీ ఖర్చు వెర్రి తప్ప మరొకటి కాదు, అదుపులేని ఆయుధపోటీగా మారినందున అర్ధవంతమైన ముగింపు పలకాలి, ఒక రోజు తాను, చైనా, రష్యా నాయకులు దీని గురించి చర్చ ప్రారంభించకతప్పదు అని గతంలో ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.జనాభాలో సగం, జిడిపిలో పదోవంతు కలిగిన పొరుగుదేశం వుత్తర కారియానుంచి రక్షణ కోసం దక్షిణ కొరియాను అమెరికా ఎందుకు కాపాడాలి. అమెరికా కంటే రష్యాకు మరింతదగ్గరగా వుంది జర్మనీ, తూర్పు నుంచి (రష్యా) నుంచి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది జిడిపిలో ఒక శాతం కూడా ఖర్చు చేయటం లేదు వాటికోసం అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి అని కూడా ప్రశ్నించాడు. గత కొద్ది సంవత్సరాలుగా తమ మిలిటరీ రక్షణ పొందాలని చూసే దేశాలు అందుకయ్యే ఖర్చులో అధికభాగం భరించాలని అమెరికా సందర్భం వచ్చినపుడల్లా చెబుతోంది, వత్తిడి తెస్తోంది. దక్షిణ కొరియాలో ఏటా మూడున్నర బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి తమ సైన్యాన్ని అక్కడ ఎందుకు కొనసాగించాలని ట్రంప్‌ గతేడాది ప్రశ్నించాడు. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా వుండాలంటే కొనసాగించక తప్పదని సిరియానుంచి సైనిక దళాల వుపసంహరణను వ్యతిరేకిస్తూ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మాటిస్‌ స్పష్టం చేశాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదులను అణచే పేరుతో సిరియాలో ఏటా 15, ఆఫ్ఘనిస్తాన్‌లో 45 బిలియన్‌ డాలర్లను ఏటా అమెరికా ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి సాధించేదేమిటి? అనే ప్రశ్నకు పాలకులు సూటిగా సమాధానం చెప్పే స్ధితిలో లేరు.

పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల విశ్లేషణ, అవగాహన ప్రకారం ఒక దేశ రక్షణ ఖర్చు కంటే అప్పుల చెల్లింపు ఎక్కువైన దేశాలు కుప్పకూలిపోతాయి. గతంలో కమ్యూనిజాన్ని, తరువాత ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అణచే పేరుతో లేదా వాటి నుంచి దేశాలను రక్షించే సాకుతో ప్రపంచ వ్యాపితంగా అమెరికా తన సేనలను మోహరించింది. ప్రత్యక్షంగా ఆయా దేశాల గడ్డమీద లేదా ఏ క్షణంలో అయినా జోక్యం చేసుకొనేందుకు వీలుగా సమీప ప్రాంతాలలో వేసిన తిష్టవలన గానీ 150 దేశాల్లో అమెరికా సైన్యాలు వున్నట్లు లెక్క. ప్రస్తుతం అమెరికా జాతీయ రుణ భారం 21లక్షల కోట్ల డాలర్లు.2012లో ఫెడరల్‌ లోటు బడ్జెట్‌ లక్ష కోట్లు దాటగా 2018లో 779 బిలియన్‌ డాలర్లుంది.2020 నాటికి ఐదుశాతం రక్షణతో సహా ప్రతి శాఖ కోత విధించాలని ట్రంప్‌ కోరాడు. రుణ చెల్లింపులు రక్షణ ఖర్చుకంటే ఎక్కువైన కారణంగానే రోమన్‌ సామ్రాజ్యం, సోవియట్‌ యూనియన్‌ దివాలా తీశాయని, అమెరికా ఇప్పుడు దానికి దగ్గరగా వస్తోందని హార్వర్లు ప్రొఫెసర్‌ నియాల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించాడు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా సైనిక కేంద్రాలు వివిధ ప్రాంతాలు, సముద్రాలలో ఐరోపాలో 330, ఆసియాలో 210, మధ్య ప్రాచ్యంలో 73, లాటిన్‌ అమెరికాలో 71, పసిఫిక్‌లో 66, ఆఫ్రికాలో 24,కెనడా లేదా గ్రీన్‌లాండ్‌లో నాలుగు, అట్లాంటిక్‌లో రెండు చొప్పున మొత్తం 750 వున్నాయి.

ఇటీవల పార్లమెంట్‌ బడ్జెట్‌ కార్యాలయం(సిబిఓ) తెలిపిన సమాచారం ప్రకారం 2018లో జాతీయ అప్పు మీద చెల్లించిన వడ్డీ 371బిలియన్‌ డాలర్లు, ఇది రక్షణ బడ్జెట్‌లో సగం. ప్రస్తుత బడ్జెట్‌ పోకడలను బట్టి ఐదు సంవత్సరాలలో రక్షణ కంటే వడ్డీ చెల్లింపులకు కేటాయించాల్సిన మొత్తం పెరగనుంది. పది సంవత్సరాలలో వడ్డీ,సామాజిక భద్రత వంటి పధకాలకు పన్ను వసూళ్లలో 85శాతం ఖర్చు అవుతుందని, జిడిపిలో 2018లో 3.1శాతంగా వున్న రక్షణ బడ్జెట్‌ 2028నాటికి 2.6శాతానికి తగ్గనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఐరోపాలోని ధనిక దేశాల రక్షణ ఖర్చు గణనీయంగా పెరగనుంది. వడ్డీ రేట్ల పెరుగుదల అంచనా కంటే వేగంగా వుంటే ఇంకా ముందే ఏడాదికి వడ్డీ చెల్లింపులు 900బిలియన్‌ డాలర్లకు చేరి రక్షణ ఖర్చును మించి పోవచ్చు. చైనా, ఐరోపా యూనియన్‌ దేశాల రక్షణ ఖర్చు జిడిపిలో రెండుశాతానికి చేరితే త్వరలోనే అమెరికాతో సమం కావచ్చు. ఇప్పుడున్న తీరు తెన్నులను బట్టి 2035నాటికి చైనా, ఐరోపా యూనియన్‌లు అమెరికాను అధిగమించనున్నాయి.

సామ్రాజ్యం అంటే వలసలు లేదా అధీన రాజ్యాలు కలిగి వుండటం అన్నది సాంప్రదాయ అర్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ పరిస్ధితి అంతరించింది కనుక ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ఎన్ని సైనిక కేంద్రాలు, ఎందరు సైనికులున్నారన్నది సామ్రాజ్యవాదానికి తాత్పర్యంగా చెప్పవచ్చు.దీనికి ముందే చెప్పుకున్న సైనిక కేంద్రాలే నిదర్శనం. చమురు రవాణా సక్రమంగా జరిగేందుకు నావల ప్రయాణించే మార్గాలు, పైపులైన్ల రక్షణ మొదలు అనేక వ్యూహాత్మక అవసరాలకు అమెరికా ఈ కేంద్రాలను, సైన్యాన్ని వినియోగిస్తున్నది. వీటికి ఏటా 156 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతున్నది. సాంప్రదాయక సామ్రాజ్యవాదం అది బ్రిటన్‌ లేదా ఫ్రెంచి, డచ్‌, పోర్చుగీసు, స్పెయిన్‌ ఏదైనా కావచ్చు, వందల సంవత్సరాలు వలస దేశాలలో తిష్టవేసి ప్రధానంగా వాటిని తమ పరిశ్రమలకు ముడివస్తువులను సరఫరా చేసే దేశాలుగానూ, పారిశ్రామిక వస్తువులకు మార్కెట్లగానూ వినియోగించుకున్నాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాదం వీటితో పాటు అంతకు ముందు లేని కమ్యూనిజం వ్యాప్తి నిరోధం, కమ్యూనిస్టు దేశాల అణచివేతను కూడా జోడించి వివిధ ప్రాంతాలలో కుట్రలకు తెరలేపింది, నియంతలను బలపరిచింది, యుద్ధాలను, వాటికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్ధికంగా లబ్దిపొందుతున్నది. ఈ కారణంగానే మిలిటరీ పారిశ్రామిక కార్పొరేట్‌లు అవతరించాయి.వుదాహరణకు మనకందరకు తెలిసిన బోయింగ్‌ కంపెనీ ప్రయాణీకుల విమానాలతో పాటు యుద్ధ జెట్‌ విమానాలతో పాటు అనేక మారణాయుధాలను కూడా తయారు చేస్తున్నది. అవి నిత్యం పని చేస్తూ వుండాలంటే ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల ఒక దేశం మరొక దేశంతో కొట్లాడుకోవాలి లేకపోతే అమెరికాయే ప్రత్యక్షంగా ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ వుండాలి. రక్షణ ఒప్పందాలు, ముప్పు పేరుతో అనేక దేశాలను తన గుప్పెటలోకి తెచ్చుకొని నిరంత ఆయుధ విక్రయాలతో దోపిడీ సాగిస్తున్నది. అలాంటి దేశం తెల్లవారేసరి తాను ప్రపంచ పోలీసు పాత్రనుంచి తప్పుకోవాలను కుంటుందా ? తన ఆయుధ పరిశ్రమలను మూసివేసుకుంటుందా ? లాభాలను వదులుకుంటుందా ?

Image result for donald trump on us world police cartoons

విదేశాలలోని సైనిక స్ధావరాలలో అమెరికా లక్షన్నర మంది సైనికులను మోహరించింది. నిజానికి పాతికేండ్ల క్రితం ప్రచ్చన్న యుద్ధంలో విజయం సాధించామని, కమ్యూనిజం అంతరించిందని చెప్పిన అమెరికా విదేశాల్లోని సగం సైనిక కేంద్రాలనైనా తక్షణమే మూసి వుండాల్సింది. కానీ కేంద్రాల సంఖ్యతో పాటు సైనికులను మోహరించిన దేశాల సంఖ్య కూడా 40 నుంచి 80కి పెరిగింది.సహజంగానే ఖర్చు కూడా తడిచి మోపెడు అవుతుంది. ఈ ఖర్చు ఎంతో నిజానికి బయటి ప్రపంచానికి తెలియదు. విదేశీ స్ధావరాల వార్షిక ఖర్చు ఎంత అని పార్లమెంట్‌ కోరితే 21 లేదా 22 బిలియన్‌ డాలర్లని పేర్కొన్నారు. అయితే దీన్నెవరూ నమ్మటం లేదు, ఏడాదికి కనీసం 250 బిలియన్‌ డాలర్లని కొందరి అంచనా. పైకి చెప్పకపోయినప్పటికీ జపాన్‌లో 113, దక్షిణ కొరియాలోని 83 సైనిక కేంద్రాలు నిజానికి ఏక్షణంలో అయినా చైనా లేదా రష్యాతో యుద్ధానికి తలపడే సన్నద్దతతో గత ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. దీని వలన సామాన్యజనానికి భారం తప్ప వారికి ఒరుగుతున్నదేమీ లేదు. ఆయుధ పరిశ్రమలకు నిరంతరం లాభాలు వస్తున్నాయి.నిరంతరం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా 33 అప్రజాస్వామిక దేశాలలో సైనిక కేంద్రాలను నడుపుతున్నదని ఒక మాజీ అధికారి పేర్కొన్నాడు. ఇవే కాదు సైనిక స్ధావరం వున్న ప్రతి దేశం అమెరికా ఆయుధాలు, వస్తువులకు అవి మార్కెట్లుగా వున్నాయని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే ట్రంప్‌ మరో పచ్చి అబద్దం ఆడాడని చెప్పాల్సి వస్తోంది.

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 3 : చైనా లక్షణాలతో సోషలిజం అంటే ఏమిటి !

Tags

, , ,

Image result for forty years china reforms

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కమ్యూనిస్టు వుద్యమ సైద్ధాంతిక చర్చలో రష్యా మార్గం, చైనా మార్గం అనే మాటలు వినిపించేవి. సారాన్ని సులభంగా అర్ధం చేసుకొనేందుకు ఆ పదజాలాన్ని వాడినప్పటికీ దేశంలో సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనేదే ఆ చర్చ. కొందరు మాది చైనా మార్గం మావోయే మా చైర్మన్‌ అనేంత వరకు వెళ్లగా మరికొందరు తమది రష్యా మార్గమన్నారు. వామపక్ష వుద్యమంలో ప్రధాన భాగంగా వున్న సిపిఐ(ఎ) తమది చైనా కాదు రష్యా కాదు భారత మార్గం అని స్పష్టం చేసింది. అంటే ఏ దేశంలో వున్న పరిస్ధితులను బట్టి దానికి అనుగుణ్యంగా విప్లవశక్తుల కార్యాచరణ వుండాలి తప్ప ఏదో ఒక దేశాన్ని అనుసరించటం కాదని చెప్పటమే. అయితే ఆ మార్గం మంచి చెడ్డలు, అనుసరిస్తున్న ఎత్తుగడలు, విధానాల గురించి ఎవరైనా విమర్శించవచ్చు, విబేధించవచ్చు, చర్చించి పరిపుష్టం చేయవచ్చు అది వారికి వున్న స్వేచ్చ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తరచూ చేసే వ్యాఖ్యానాలలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద నిర్మాణం, సమాజం వంటి అంశాలుంటాయి.

నిజానికి ఇది సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినది. ఆచరణకు రానంత వరకు ఏ కొత్త భావజాలమైనా ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆదర్శంగా వుంటుంది. దూరం నుంచి చూస్తే కొండలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లి ఎక్కాల్సివచ్చినపుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. శక్తి రూపాలను మార్చుకున్నట్లుగానే దోపిడీ రూపాలు మారవచ్చు గానీ అనుమతించే వ్యవస్ధలున్న చోట దోపిడీ అంతం కాదు.మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం-ఆచరణకు సంబంధించి శాస్త్రీయమైనది. ఈ సిద్ధాంతాన్ని ఆయా దేశ, కాల పరిస్ధితులకు అన్వయించుకోవాల్సి వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం ద్వారా అధికారాన్ని పొంది నూతన వ్యవస్ధ నిర్మాణానికి పూనుకుంది. సుదీర్ఘంగా సాగిన విప్లవకాలంలోనూ తరువాత మూడు దశాబ్దాల వరకు మావోఆలోచనా విధానం పేరుతో చైనా పరిస్దితులకు అన్వయించిన అంశాలను అమలు జరిపారు. మావో బతికి వుండగానే వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ హయాంలో సంస్కరణల విధానాన్ని అనుసరించారు. అప్పటి నుంచి చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అంటున్నారు. నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన చైనా సంస్కరణలు ఇప్పుడు 1980దశకం మాదిరే వుండవు. ఇప్పటి అవసరాలకు తగిన మార్పులు చేర్పులు వుండాలి. జనాభా అవసరాలకు అనుగుణంగా వుపాధి, కనీస అవసరాలు తీరాలంటే ఆర్ధిక వ్యవస్ధ వేగంగా అభివృద్ధి చెందాలి. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అధికారం కింద సోషలిజానికి కట్టుబడి వుంటూనే మార్కెట్‌ సంస్కరణలను అమలు జరిపేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాజీలు పడ్డారు.

Image result for forty years china reforms

గతంలో ఏ సోషలిస్టు దేశంలోనూ ఇలాంటి ప్రయోగం జరపలేదు. మార్కెట్‌ విధానాలు పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్ధ పద్దతుల్లో లేవు, ప్రణాళికలు పూర్తిగా సోషలిస్టు పద్దతిలోనూ లేవు. చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుంది, భౌతిక సంపద స్ధాయి తక్కువగా వుంది, సోషలిస్టు సమ సమాజం తరువాత కమ్యూనిస్టు సమాజానికి దారి తీయాలంటే ముందు ఆర్ధిక పురోగతి సాధించాలి, దానికి గాను మార్కెట్‌ ఆర్ధిక విధానాలు సాధనమని అధికారానికి వచ్చిన రెండున్నర దశాబ్దాల తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహనకు వచ్చింది. నిజానికి చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుందని 1950దశకం చివరిలోనే కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. పరివర్తన దశలో వుత్పాదక శక్తులు బలహీనంగా వున్నాయని ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్దలలోనే సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న మార్క్సిస్టు తత్వవేత్తల అంచనా తప్పింది.పురోగామి వుత్పాదక సంబంధాలు వుత్పత్తిని పెంచుతాయన్న మావో ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. సోవియట్‌ తరహా ప్రణాళికాబద్ద విధానాలు కూడా జయప్రదం కాలేదు. పెట్టుబడిదారీ విధానంలో లాభాలు వచ్చే వాటికే ప్రాధాన్యత వుంటుంది. సోషలిస్టు వ్యవస్దలో ప్రజల అవసరాలకు వుపయోగపడే వస్తూత్పతికి ప్రాధాన్యత వుంటుంది. ఈ రెండింటినీ మేళవించి అమలు జరిపిన విధానం కారణంగా చైనా శరవేగంతో అభివృద్ది చెందుతోంది.

చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ 1984చేసిన ఒక వుపన్యాసంలోచెప్పిన అంశాలను మననం చేసుకోవటం అవసరం. వాటి సారాంశం ఇలా వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసే నాటికి పాత చైనాను నాశమైన ఆర్ధికవ్యవస్ధను వారసత్వంగా తెచ్చుకున్నాము. పరిశ్రమలు దాదాపు లేవు. సోషలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుగుతారు. పెట్టుబడిదారీ విధానం చైనాలోని గందరగోళాన్ని లేదా దారిద్య్రం వెనుకబాటు తనాన్ని తొలగించదు. అందుకే మార్క్సిజానికి, సోషలిస్టు బాటకు కట్టుబడి వున్నామని పదే పదే చెబుతున్నాము. అయితే మార్క్సిజం అంటే మన అర్ధం చైనా పరిస్ధితులకు దానిని అసుసంధానించటం, సోషలిజం అంటే చైనా పరిస్ధితులకు అనుగుణ్యంగా ప్రత్యేకించి చైనా లక్షణాలతో రూపొందించుకోవటం. సోషలిజం, మార్క్సిజం అంటే ఏమిటి ? గతంలో దీని గురించి అంత స్పష్టత లేదు. వుత్పాదకశక్తుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతతో మార్క్సిజం ముడిపడి వుంది. కమ్యూనిజానికి ప్రాధమిక దశ సోషలిజం అని చెప్పాము. ఆ వున్నత దశలో ప్రతి ఒక్కరూ శక్తి కొద్ది పని చేయటం, అవసరం కొద్దీ వినియోగం వుంటుంది. దీనికి వున్నతంగా అభివృద్ధి చెందిన వుత్పాదకశక్తులు,సరిపడా సరకుల తయారీ అవసరం వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసిన తరువాత వుత్పాద శక్తుల అభివృద్ధికి తగిన శ్రద్ధ పెట్టకపోవటం ఒక లోపం. సోషలిజం అంటే దారిద్య్రాన్ని తొలగించటం, బికారితనం సోషలిజం కాదు. పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినపుడు చైనా తన తలుపులు మూసుకున్న విధానం అనుసరించింది. విప్లవం తరువాత ఇతర దేశాలు చైనాను దిగ్బంధనం కావించాయి. ఈ స్ధితి ఇబ్బందులను కలిగించింది. చైనా జనాభా 80శాతం గ్రామాలలోనే వుంది. వాటి నిలకడమీదనే చైనా స్ధిరత్వం ఆధారపడి వుంది. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పద్దతులకు స్వాగతం పలికాము. అవి సోషలిజాన్ని పూర్వపక్షం చేస్తాయా, అవకాశం లేదు, ఎందుకంటే చైనా ఆర్ధిక వ్యవస్ధలో సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన భాగం.సహజంగానే విదేశీ పెట్టుబడులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. సానుకూల అంశాలతో పోలిస్తే ప్రతికూల ప్రభావాలు అంత ముఖ్యమైనవి కాదు. మరొక సందర్భంలో మాట్లాడుతూ సోషలిజం-పెట్టుబడిదారీ వ్యవస్ధల మధ్య ప్రణాళికా బద్ద మరియు మార్కెట్‌ శక్తులనేవి అనివార్యమైన విభేదం కాదని చెప్పారు. సోషలిజం అంటే ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధ అనే నిర్వచనమేమీ లేదని పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాదిరి ప్రణాళికాబద్ద మరియు మార్కెట్‌ శక్తుల ఆర్దిక వ్యవస్ధ సోషలిజంలో కూడా వుంటుందని రెండు శక్తులు ఆర్దిక వ్యవస్ధలను అదుపు చేస్తాయన్నారు.

ప్రపంచంలో సమసమాజం ఎలా స్ధాపించాలనే విషయంలో తలెత్తిన సైద్ధాంతిక సమస్యలు దోపిడీని ఎలా కొనసాగించాలనే అంశం మీద వ్యక్తం కాలేదు. ఈ కారణంగానే చైనాలో సాధించిన అభివృద్ధిని స్వాగతించేవారు కూడా ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, బిలియనీర్లు, ధనికుల సంఖ్యలను చూసి వారెక్కడ విప్లవాన్ని వమ్ము చేస్తారో అని భయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల్లో చైనా నాయకత్వం గురించి భయ సందేహాలు ఎలా పెరుగుతున్నాయో చూడటం అవసరం. 2018 అక్టోబరు మూడవ తేదీన అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ‘ఆధునిక చైనాను నిర్మించిన ప్రయివేటు వాణిజ్యాలు, ఇపుడు వెనక్కు నెడుతున్న ప్రభుత్వం ‘ అనే శీర్షికతో ఒక విశ్లేషణ ప్రచురించింది. ప్రయివేటు వాణిజ్యాలను అనుమతించే బీజింగ్‌ అనుజ్ఞార్ధకం గతకొద్ది సంవత్సరాలుగా అల్లుకుపోతూ ముందుకు సాగింది. నియంతృత్వం(పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు చైనా కమ్యూనిస్టు పాలనను అలాగే వర్ణిస్తారు) మరియు స్వేచ్చా మార్కెట్‌ మధ్య దీర్ఘకాలంగా వున్న వుద్రిక్తలు ఇప్పుడు సందిగ్దబిందువు వద్దకు చేరుకున్నాయని చైనాలో కొందరు చెప్పారని వక్కాణించారు. ఆ విశ్లేషణ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

వ్యాఖ్యలు మెళకువతో కూడిన భాష వెనుక నక్కాయి, కానీ చైనా దిశ గురించిన హెచ్చరిక స్పష్టంగా వుంది. సంపదలతో పెరిగేందుకు తనలో భాగం మార్కెట్‌ శక్తులను ఆలింగనం చేసుకొన్నది. పొసగని గళాలతో ఇప్పుడు ప్రయివేటు సంస్ధలను ఖండిస్తున్నది. ఈ దృగ్విషయాన్ని గమనించాల్సివుంది అని మార్కెట్‌ అనుకూల ఆర్ధికవేత్త 88 ఏండ్ల వు జింగాలియన్‌ వ్యక్తం చేసిన అసాధారణ అధికారిక స్వరం చైనా వ్యాపార, ఆర్దికవేత్తలు, చివరికి కొంత మంది ప్రభుత్వ అధికారులలో కూడా పెరుగుతున్న ఆందోళనకు ప్రతిధ్వని. ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ స్ధానంలోకి తీసుకుపోయిన స్వేచ్చా మార్కెట్‌, వాణిజ్య అనుకూల విధానాల నుంచి చైనా వెనక్కు తగ్గవచ్చు, గత నాలుగు దశాబ్దాలుగా నియంతృత్వ కమ్యూనిస్టు అదుపు మరియు స్వేచ్చగా తిరిగే పెట్టుబడిదారీ విధానం మధ్య చైనా వూగుతోంది. అక్కడ ఏమైనా జరగవచ్చు, లోలకం తిరిగి ప్రభుత్వంవైపే వూగవచ్చని కొందరికి కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రయివేటు వాణిజ్య సంస్దలు ముందుపీఠీన వున్న చోట పారిశ్రామిక వుత్పత్తి,మరియు లాభాలవృద్ధిలో రోజురోజుకూ ప్రభుత్వ అదుపులోని కంపెనీల వాటా పెరుగుతోంది. ఇంటర్నెట్‌ వ్యాపారం, రియలెస్టేట్‌, వీడియోగేమ్స్‌ను నియంత్రించేందుకు చైనా రంగంలోకి దిగింది. కంపెనీలు పన్నుల పెంపుదల, వుద్యోగులు పొందే లబ్ది ఖర్చును ఎక్కువగా భరించాల్సి రావచ్చు. కొందరు మేథావులు ప్రయివేటు సంస్ధలను పూర్తిగా రద్దు చేయాలని పిలుపులనిస్తున్నారు. అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రయివేటు సంస్ధలకు తమ ప్రభుత్వ మద్దతు వుంటుందని హామీ ఇస్తూ ప్రభుత్వరంగంలోని పెద్ద కంపెనీలకు పూర్తి స్ధాయి మద్దతు ప్రకటించటాన్ని ప్రయివేటు వాణిజ్యాలకు ఇంకచోటు లేదని చెప్పటమే అని అనేక మంది ఆర్ధికవేత్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధ చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కేంద్రం ఒకదాని సందర్శన సందర్భంగా గ్జీ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ రంగ సంస్ధలు వుండకూడదు, మనకు చిన్న ప్రభుత్వ సంస్ధలే వుండాలి’ అనే ప్రకటనలు తప్పు, ఏకపక్షమైనవి అన్నారు. చైనా అధ్యక్షుడు మిలిటరీ, మీడియా, పౌర సమాజం మీద పూర్తిగా పార్టీ అదుపు వుండాలని కోరతారు. ఇప్పుడు వాణిజ్యం మీద దృష్టి సారిస్తున్నారు. పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో నేరుగా వాటాలు తీసుకోవటం గురించి పరిశీలిస్తోంది. విదేశీ కంపెనీలతో సహా అన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ కమిటీలకు పెద్ద పాత్ర కల్పించేందుకు నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వామపక్ష పండితులు, బ్లాగర్స్‌(వివిధ అంశాల మీద విశ్లేషణలు, అభిప్రాయలు రాసేవారు) ప్రభుత్వ అధికారులు సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన మద్దతు తెలియచేస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యాలను తొలగించాలని జనవరిలో(2018) బీజింగ్‌లోని రెనిమిన్‌ విశ్వవిద్యాలయ మార్క్సిజం ప్రొఫెసర్‌ జౌ గ్జిన్‌చెంగ్‌ కోరారు. అభివృద్ధి లక్ష్యాన్ని ప్రయివేటు రంగం పూర్తి చేసిందని ఇప్పుడు దానికి స్వస్తి పలకాలంటూ వు గ్జీయపింగ్‌ అనే అంతగా తెలియని బ్లాగర్‌ రాసిన అంశం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. మానవ వనరులు, సాంఘిక భద్రత వుప మంత్రి క్వి గ్జియపింగ్‌ ప్రయివేటు సంస్ధలలో ప్రజాస్వామిక యాజమాన్య పద్దతులు వుండాలని, యజమానులు-కార్మికులు సంయుక్తంగా వాటిని నడపాలని కోరారు. ప్రభుత్వ చర్యల వలన రుణాలపై ఆధారపడి నడిచే ప్రయివేటు కంపెనీలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది, ఇదే సమయంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు కొత్త రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒకప్పుడు అసలు వూహల్లోకి కూడా రాని వాటిని ఇప్పుడు కొన్ని ప్రయివేటు సంస్దలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు 46 ప్రయివేటు కంపెనీలు సగానికిపైగా వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.చైనా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే సంఖ్య చాలా చిన్నది అయినప్పటికీ ప్రయివేటు కంపెనీలకు వాటాలను విక్రయించే ప్రభుత్వ కంపెనీల రెండు దశాబ్దాల ధోరణికి ఇది వ్యతిరేకం.

Image result for forty years china reforms

కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి ప్రత్యక్ష పాత్ర కల్పించిన తరువాత కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు స్ధంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ, వీడియో గేమ్‌ల్లో పేరు ప్రఖ్యాతులున్న టెన్‌సెంట్‌ కంపెనీమార్కెట్‌ విలువ దాదాపు మూడోవంతు పడిపోయింది. కొత్తగా తెచ్చిన చట్ట ప్రకారం ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, పన్నులు చెల్లించాలి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో ఒకటైన అలీబాబా గ్రూప్‌ను దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీలకు ఇది మంచి సంవత్సరం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏడాది తొలి ఏడునెలల్లో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడి మూడురెట్లు లాభాలు సాధించాయి. అధిక సామర్ద్యం, కాలుష్యనివారణ చర్యలు ఎక్కువగా ప్రయివేటు కంపెనీల మీద మోపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా దీనికి కారణం.

చైనా మ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే సంస్కరణలు నడుస్తున్నాయా? లేదూ న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషకుడు చెబుతున్నట్లు ప్రభుత్వ రంగ అదుపులోకి తిరిగి చైనా అర్ధిక వ్యవస్ధ వెళ్ల నుందా? ఎంతకాలం పడుతుంది? వీటిన్నింటి గురించి చైనా వెలుపల కూడా చర్చించవచ్చు. అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు గానీ న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు నాయకత్వానికి దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారి విధాన మంచి చెడ్డలను సమీక్షించవచ్చు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మాదిరి చైనాలో కూడా తప్పిదాలకు పాల్పడితే అనే పెద్ద సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. ఇప్పటికైతే అది వూహాజనిత సమస్య. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు సోషలిజం అనే భావజాలానికి కాలం చెల్లిందని అమెరికా ప్రకటించింది. అదే చోట ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం పనికిరాదు, అది కాలం చెల్లిన సిద్ధాంతం అని నమ్ముతున్నవారు, సోషలిజాన్ని అభిమానిస్తున్నవారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు. సమాజ మార్పుకోరే పురోగామి శక్తులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు గాని చరిత్ర ముందుకే పోతుంది, అంతిమ విజయం వారిదే.

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

Tags

, ,

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 1 : దారిద్య్ర నిర్మూలనలో అసాధారణ ప్రగతి !

Tags

, ,

Image result for four decades of china reforms

ఎం కోటేశ్వరరావు

ఏమి చెయ్యాలో చెయ్య కూడదో చైనాను నిర్దేశించే స్ధితిలో ఎవరూ లేరు, మా బాటలో మేము ప్రయాణిస్తాం ! ఇదీ తమ సంస్కరణల నలభయ్యవ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌ డిసెంబరు 18న ప్రపంచానికి స్పష్టం చేసిన అంశం. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు పధానికి మరియు సోషలిజానికి, దాని అభివృద్ధికి కట్టుబడి వుంటూ ముందుకు పోతామని ప్రపంచానికి తెలిపారు. సంస్కరణల పట్ల ప్రజల విశ్వాసాన్ని, సంస్కరణలను పెంచుతామని కూడా చెప్పారు. చైనీయులు మాట్లాడేది తక్కువ ఆచరించేది ఎక్కువ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. సంస్కరణల విషయాన్ని గతంలో కూడా పదే పదే స్పష్టం చేశారు గనుక పునశ్చరణ అవసరం లేదు. మావో మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన డెంగ్‌ సియావో పింగ్‌ నాయకత్వంలోని పార్టీ ఎన్నో తర్జన భర్జనలు పడిన తరువాత ఎంతో ముందు చూపుతో, ఆత్మ విశ్వాసంతో ప్రారంభించిన సంస్కరణలు చైనాలో అద్భుతాలను ఆవిష్కరించాయంటే అతిశయోక్తి కాదు.

సోషలిస్టు వ్యవస్ధలను ఫలానా విధంగా నిర్మించాలనే ఒక నమూనా లేదు. అన్ని దేశాలలో ఒకే విధంగా నిర్మించటమూ సాధ్యం కాదన్నది స్పష్టం. తమ దేశ లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నామని చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది.చైనాలో నిర్మాణం చేస్తున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని, ప్రభుత్వ రంగంలోని పెట్టుబడిదారీ వ్యవస్ధ్ద అని మరొకటని కొందరు వర్ణించవచ్చు.వారికా స్వేచ్చ వుంది. చిత్రం ఏమిటంటే ఒకవైపు కమ్యూనిస్టులుగా చెప్పుకొనే వారు అక్కడ వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని తిరస్కరిస్తుంటే, మరోవైపు అసలు సిసలు పెట్టుబడిదారీ విధానం కాదంటూ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాలు చైనాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా తరహా సోషలిస్టు విధానంలో కనిపించిన తప్పులు ఒప్పులతో చర్చించటం, మెరుగుపడేందుకు తోడ్పడటం ఒక ఎత్తు. అలాగాక ఏ పేరుతో వ్యతిరేకించినా అది సామ్రాజ్యవాదులు, సోషలిస్టు వ్యతిరేకులకే ప్రయోజనం. ఈ పూర్వరంగంలో గత నాలుగు దశాబ్దాలలో చైనా సాధించిన అభివృద్ధిని, అది ఎలా సాధ్యమైందో ఒకసారి సింహావలోకనం చేసుకోవటం అవసరం.

చైనా సమాజ మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దేశ ఆర్ధిక వ్యవస్ధను మరింతగా విదేశాలకు తెరవాలని అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు ఒకవైపుకు లాగుతున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్ధ, సమాజంలోని అన్ని అంశాల మీద మ్యూనిస్టు పార్టీ అదుపులో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేయాలని గ్జీ జింగ్‌పింగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ మరోవైపు ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్ధితిలో చైనా ఎటు ప్రయాణిస్తుంది అన్నది సహజంగానే కమ్యూనిస్టుల్లో, వ్యతిరేకుల్లో కూడా ఆసక్తి కలిగించే అంశమే. డెంగ్‌సియావో పింగ్‌ చెప్పినట్లుగా పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పట్టగలిగినంత వరకు అది ఏ రంగుదైనా ఫర్లేదు. చైనాతో పాటు భారత్‌తో సహా అనేక దేశాలు సంస్కరణల పేరుతో తమ మార్కెట్లను విదేశీకార్పొరేట్లకు తెరిచాయి. వాటిలో ప్రజాస్వామ్యం, నియంతల పాలనలో వున్నవీ వున్నాయి కానీ సోషలిస్టు చైనా మాదిరి అభివృద్ధి చెందలేదు. పెత్తందారీ అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలను సవాలు చేసే స్ధితిలో లేవు. ప్రపంచంలో అత్యధిక జనాభాతో, అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనాలో ప్రస్తుతం వున్నది సోషలిజమా-పెట్టుబడిదారీ విధానమా అనే మీమాంసలో కూరుకుపోతే ప్రధాన అంశాన్ని మరచిపోయినట్లే. అసలు సమస్య చైనా జనానికి తిండిపెట్టటం, దానికి ఏది పని చేస్తుంది అన్నది ముఖ్యం. ఈ పూర్వరంగంలో చైనాలో వున్న ప్రత్యేక పరిస్ధితులను గమనంలో వుంచుకొని అక్కడి పార్టీ నాయకత్వం తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ఇంకా సమస్యలున్నప్పటికీ ఆకలి దారిద్య్రాల నుంచి జనాన్ని బయటపడవేసింది. తానేమిటో ప్రపంచానికి చాటింది. చైనా వ్యవస్ధ కూలిపోతుందని అనేక మంది పశ్చిమ దేశాల పండితులు ఇప్పటికి ఎన్నో జోశ్యాలు చెప్పారు. తమ వ్యవస్ధలు ఎదుర్కొన్న సంక్షోభాలను వారు పసిగట్ట లేకపోయారు, లేదా తెలిసినా మూసిపెట్టారు. సంక్షోభాలను నివారించలేకపోయారు. ప్రపంచీకరణలో భాగంగా లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్దలుగా మారిపోయి అప్పులపాలై దివాలా తీసి, తీవ్ర సామాజిక, ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనటం మన కళ్ల ముందే చూశాము. ఇతర దేశాల మీద ఆధారపడిన ఎగుమతి ఆర్ధిక విధానాన్ని చైనా ప్రధానంగా అనుసరించినప్పటికీ గత నలభై సంవత్సరాలలో లాటిన్‌ అమెరికా లేదా ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి సమస్యలను ఎదుర్కోలేదు. అనేక ముందు జాగ్రత్తలను తీసుకొని వ్యవహరించిన కారణంగా కొన్ని సంవత్సరాలలో అభివృద్ధి రేటు తగ్గినా మొత్తం మీద రెండంకెల ప్రగతిని సాధించింది. మరే దేశంలోనూ ఈ తీరు కనిపించదు. చైనా అనుసరిస్తున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని వర్ణించే వారు సైతం ప్రభుత్వేతర పెట్టుబడిదారీ విధానం కంటే ఇదే మెరుగైనదని, మిగతా విధానాలు వైఫల్యం చెందాయని అంగీకరించకతప్పదు. ఒక దేశం అనుసరిస్తున్నది పెట్టుబడిదారీ విధానమా దానికి భిన్నమైనదా అనేందుకు కొలబద్ద పౌరుల జీవన పరిస్ధితుల మెరుగుదల మాత్రమే.

Image result for four decades of china reforms

చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌

దారిద్య్రనిర్మూలన పెట్టుబడిదారీ విధానానికి ఒక నినాదం మాత్రమే. దానికి భిన్నమైన విధానాలకు ఒక బృహత్తర కార్యక్రమం, సవాలు. దానికి చక్కటి వుదాహరణలు భారత్‌, చైనాలే. 1971లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇందిరా గాంధీ గరీబీ హఠావో పేరుతో పేదరిక నిర్మూలన నినాదమిచ్చి ఘనవిజయం సాధించారు. చైనా విషయానికి వస్తే అలాంటి నినాదాలేమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు గానీ 1978లో విదేశీ కార్పొరేట్లకు తన మార్కెట్‌ను తెరుస్తూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వాటిలో దారిద్య్ర నిర్మూలన లక్ష్యం కూడా ఒకటి. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలన్నీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు దశాబ్దాలలో 70 నుంచి 80 కోట్ల మందికి( జనాభాలో 90శాతం నుంచి రెండుశాతానికి) దారిద్య్రం నుంచి విముక్తి కలిగించింది. 2030నాటికి ప్రపంచ వ్యాపితంగా దారిద్య్రనిర్మూలన సాధించాలన్న ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది లక్ష్యాలకు అనుగుణ్యంగా పని చేయటాన్ని చూస్తే పది సంవత్సరాల ముందే నూటికి నూరుశాతం మందిని దారిద్య్రరేఖకు ఎగువకు చేర్చాలని ప్రయత్నిస్తున్నది. చైనా జాతీయ గణాంక సంస్ధ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం 1978-2017 మధ్య 74కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చింది. సరాసరి ఏటా కోటీ 90లక్షల మందికి విముక్తి కలిగించింది.తాజాగా విడుదల చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆహారం, దుస్తులు, విధిగా పిల్లలకు తొమ్మిది సంవత్సరాల విద్య, మౌలిక వైద్య, గృహవసతి కల్పించాల్సి వుంది. దీనికి అనుగుణంగా 2020 నాటికి మిగిలిన వారికి ఆ వసతులు కల్పించేందుకు వచ్చే ఏడాది 13బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఒక వ్యక్తికి వార్షికాదాయం 2,300 యువాన్లు లేదా 337 డాలర్ల కంటే తక్కువ లభిస్తే దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ప్రపంచబ్యాంకు తాజాగా ప్రకటించినదాని ప్రకారం రోజుకు 1.9డాలర్ల కంటే తక్కువ వచ్చే వారు దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ(యుఎన్‌డిపి) సంస్ధ బహుఅంశాల దారిద్య్ర సూచిక (ఎంపిఐ-మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌) 2018 ప్రకారం 2015-16 సర్వే ప్రకారం భారత్‌ సూచిక 0.121, జనాభాలో 27.51శాతం మంది దారిద్య్రంలో వున్నారు. అదే చైనాలో 2014 సర్వే ప్రకారం సూచిక 0.017గానూ, 4.11శాతం మంది దారిద్య్రంలో వున్నారు. ఈ లెక్కన త్వరలో నూటికి నూరుశాతం మంది చైనాలో దారిద్య్రం నుంచి బయటపడనుండగా మన దేశం 2030లక్ష్యాన్ని చేరుకోగలదా అన్నది సమస్య. అందువలన ఏ విధంగా చూసినా చైనా మనకంటే ఎంతో ముందుంది. చైనా సమాజంలో ఆర్ధిక అసమానతలు వున్నాయని ప్రభుత్వమే స్వయంగా చెబుతోంది. మొత్తంగా అసమానతలతో పాటు గ్రామీణ- పట్టణ అసమానలు ఒక సమస్య. పట్టణ పేదరిక సమస్య దాదాపు పూర్తిగా నిర్మూలన అయింది. గ్రామాలు, బాగా వెనుకబడిన ప్రాంతాలలో మిగిలి వున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రీకరణ చేపట్టింది.

Image result for four decades of china reforms

డెంగ్‌సియావో పింగ్‌

అభివృద్ధిలో పోటీపడి ఏ దేశమైనా తన పౌరుల జీవన పరిస్ధితులను మెరుగుపరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. గత కొద్ది సంవత్సరాలుగా త్వరలో చైనాను అధిగమించి భారత్‌ పురోగమించనుందని అనేక మంది చెబుతున్నారు. రెండు దేశాలను పోల్చి కొన్ని అంకెలను కూడా చెబుతున్నారు. విమర్శనాత్మకంగా పరిశీలించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని జాతివ్యతిరేకులుగా వర్ణించే ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయి. 2018 మార్చినాటికి భారత జిడిపి 2.6లక్షల కోట్లుగానూ, 2023 మార్చినాటికి నాలుగు లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని నీతిఅయోగ్‌ తాజా అంచనాలో తెలిపింది. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి పదిశాతం మధ్య వుంటుందనే అంచనాతో ఈ జోస్యం చెప్పారు. ప్రస్తుతం 14లక్షల కోట్ల డాలర్లుగా వున్న చైనా జిడిపి 2023నాటికి 21.5లక్షల కోట్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఒక వేళ చైనా అభివృద్ది పూర్తిగా ఆగిపోతుందని అనుకుంటే ఇప్పుడున్న చైనా స్ధాయికి చేరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. 2.6లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షలకోట్లకు ఐదు సంవత్సరాలు పడితే ఊఏటా పదిశాతం అభివృద్ది రేటు వుంటే గింటే 2034 నాటికి గాని మనం చైనా స్ధాయికి చేరుకోలేమన్నది అంచనా. అందువలన ప్రస్తుత విధానాలతో త్వరలోనే మనం చైనాను అధిగమించుతామని చెప్పటం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటమే. మన ఆర్ధికవేత్తలు, ఇతరులు చెబుతున్నట్లు మన దేశం ఏటా 7.5శాతం అభివృద్ధి సాధిస్తే మన ఆర్ధిక వ్యవస్ధ 0.195లక్షల డాలర్ల మేర పెరుగుతుంది. అదే చైనా 6.9శాతం వున్నా 0.86లక్షల కోట్లు పెరుగుతుంది. 2018 ప్రపంచ ఆర్ధిక వేదిక సంఘటిత అభివృద్ధి సూచిక ప్రకారం మన దేశంలో ప్రతి పదిమందిలో ఆరుగురు రోజుకు 3.20 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో వున్నారు. చైనాలో అది ప్రతి పది మందికి 1.2 మంది మాత్రమే అలా వున్నారు. సంఘటిత అభివృద్ధి పధంలో వున్నాయని ఆ సంస్ధ ఎంపిక చేసిన 74 దేశాలలో చైనా 26వదిగా వుండగా మన దేశం 62వ స్ధానంలో వుంది. చైనా సాధించిన విజయాల గురించి కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులు పెదవి విరుస్తుంటారు. చెబుతున్న అభివృద్ధికి రుజువుల్లేవంటారు, మేం నమ్మం అంటారు. ఎయిడ్స్‌ వైరస్‌కు చికిత్సలేదు. మాకు నమ్మకం లేదు అనేది కూడా అలాంటి చికిత్సలేని వ్యాధే. అలాంటి వారిని ఒప్పిందచేందుకు పూనుకోవటం వృధా ప్రయాసే. ఎయిడ్స్‌ రోగుల మాదిరి సానుభూతి చూపాల్సిందే.

చైనాపై అమెరికా టెక్‌ వార్‌లో భారత్‌ ఎటువైపు !

Tags

, , ,

Image result for  us china tech war

ఎం కోటేశ్వరరావు

మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్‌ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్‌ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్‌ సర్కార్‌ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్‌ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్‌ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్‌ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్‌ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.

డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్‌ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్‌ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్‌ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్‌ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్‌ అనే హాంకాంగ్‌ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్‌ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.

ఇటీవలి కాలంలో హైటెక్‌ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్‌ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్‌ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్‌ ఐస్‌’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌, బ్రిటన్‌ ఎం16 అధిపతి మైఖేల్‌ యంగర్‌ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్‌ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.

Image result for us china tech war cartoons

ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.

రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్‌ మోరెల్‌ వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.

ఐదవతరం ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఐఫోన్‌ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్‌ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్‌ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?

Image result for  us china tech war

గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్‌ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్‌ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్‌ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్‌ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్‌ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్‌ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్‌ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్‌ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.

‘ మెంగ్‌ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.

తప్పుడు లెక్కలతో పత్తి, చెరకు రైతులకు హాని తలపెట్టిన అమెరికా, ఆస్ట్రేలియా !

Tags

, , ,

Image result for usa, australia stand against india farmers at wto

ఎం కోటేశ్వరరావు

అమెరికా, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు దౌత్యపరంగా మనకు మిత్ర దేశాలే. మన యువతీ యువకులు తెల్లారి లేస్తే ఏదో ఒక చోటికి వెళ్లాలని తహతహలాడుతుంటారు. మన పాలకులు అక్కడికి వెళ్లినపుడు, వారు ఇక్కడికి వచ్చినపుడు భారత దేశమా చుట్టుపక్కల 66 దేశాలకు పోతుగడ్డ అన్నట్లుగా మాట్లాడతారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లు, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా తమ దేశాల కార్పొరేట్ల ప్రయోజనాల విషయంలో మనకు ముఖ్యంగా రైతాంగానికి అవి శత్రుదేశాలే. ప్రపంచీకరణ పేరుతో మన పెట్టుబడిదారులు ఇతర దేశాలకు విస్తరించేందుకు, ఇప్పటికే విస్తరించిన బహుళజాతి కంపెనీలతో జత కట్టేందుకు మన పాలకవర్గం ప్రపంచీకరణ పేరుతో వాటికి ప్రాతినిధ్యం వహించే సంస్ధల సలహాలు, ఆదేశాలతో నడుస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే మన పాలకులు ఒక్కొక్క వలువ తీసివేసి చివరకు గోచి మీద నిలబెట్టినట్లు నామ మాత్ర రాయితీలు మిగిల్చాయి. ఇప్పుడు రైతాంగానికి మిగిలిన ఆ గోచిని కూడా తీసేయాల్సిందేనని ధనిక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు ఆ పంచాయతీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో నడుస్తోంది.

అమెరికాాచైనా మధ్య జూలైలో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ యుద్దంలో దెబ్బతినే తన రైతాంగానికి ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీలకు తోడు అదనంగా పత్తి, సోయా వంటి అనేక ఎగుమతి పంటలకు 12బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది అమెరికా. అలాంటి దేశం గతంలో వరి, గోధుమలపై ఇప్పుడు మన మీద పత్తి రాయితీలు పరిమితికి మించి ఇస్తున్నారంటూ కనీస మద్దతు ధరకు ఎసరు పెట్టింది. తప్పుడు లెక్కలతో ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)కు ఫిర్యాదు చేసింది. చెరకు రైతులకు, పంచదార ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలు తమ రైతాంగాన్ని, మొత్తంగా ప్రపంచ పంచదార మార్కెట్‌ను దెబ్బతీశాయంటూ ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది. ఆ వాదన లేదా మనపై దాడికి ప్రాతిపదిక ఏమిటి? మన దేశంలో వున్న విభిన్న వాతావరణ పరిస్ధితుల కారణంగా అటు వుష్ణ మండల పంటలతో పాటు ఇటు శీతల మండల, సమశీతల మండల ప్రాంతాలలో సాగు చేసే పంటలలో కొన్ని మినహాదాదాపు అన్నింటినీ పండించే అవకాశం వుంది. అందుకే మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకు సరఫరా చేసే ప్రాంతంగా పారిశ్రామిక విప్లవం తరువాత ఐరోపా ధనిక దేశాలు గుర్తించాయి. అందుకే ఆక్రమణ పోటీలో బ్రిటన్‌ది పైచేయి అయింది.మారిన పరిస్ధితుల్లో తమ అన్ని రకాల వ్యాపారాలు, వస్తుమార్కెట్లకు మన దేశం అనువుగా వుంది కనుక, భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశం లేదు గనుక మన మార్కెట్‌ను ఆక్రమించుకొనేందుకు, తమకు అనుకూలంగా మన విధానాలను రూపుదిద్దేందుకు పూనుకున్నాయి. అందుకోసం ప్రపంచీకరణ, సరళీకరణ, సంస్కరణలు అంటూ ముద్దుపేర్లను ముందుకు తెచ్చాయి. ప్రస్తుతాంశం వ్యవసాయ సబ్సిడీలు కనుక వాటి గురించి చూద్దాం.

గత రెండు దశాబ్దాలలో మన వ్యవసాయ పెట్టుబడులు కనీసంగా నాలుగింతలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలో వచ్చి జనవరి ఒకటిన 24వ సంవత్సరంలో అడుగిడబోతోంది. ముఫ్పై సంవత్సరాల నాటి లెక్కల ఆధారంగా వర్ధమాన దేశాలకు నిర్ణయించిన పదిశాతం సబ్సిడీ పరిమితిని, వ్యవసాయ వుత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు భారత్‌లో సబ్సిడీలు పరిమితికి మించి ఇస్తున్నారని అమెరికా, ఆస్ట్రేలియాలు ఫిర్యాదు చేశాయి. కనీస మద్దతు ధర ఆ నిబంధనను వుల్లంఘించేదిగా వుందని, తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సరే అసలు ఎత్తివేయాలని కూడా మరోవైపు వత్తిడి తెస్తున్నాయనుకోండి. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే మన దేశంలో వుత్పత్తి అయ్యే మొత్తం పత్తి విలువ వెయ్యికోట్ల రూపాయలు అనుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపాయూనియన్‌ వంటి ధనిక దేశాల వాదన ప్రకారం పత్తి మీద సబ్సిడీ మొత్తం విలువలో పదిశాతం అంటే వంద కోట్ల రూపాయలకు మించి ఇవ్వకూడదు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల వందకోట్ల రూపాయలకు మించకూడదు.(ప్రత్యక్షంగా ఇచ్చే సబ్సిడీ మొత్తాలకు, కనీస మద్దతు ధరల సబ్సిడీ అవగాహనకు వున్న తేడా తెలిసిందే) మిగతా పంటలకూ ఇదే సూత్రం. ప్రపంచ వాణిజ్య సంస్ధ వునికిలోకి రాక ముందు దాని విధి విధానాలను రూపొందించే కసరత్తులో భాగంగా 1986-88 సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్లో వున్న సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకొని ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయించారు.

అంకెలతో ఎన్నో గారడీలు చేయవచ్చు. స్వామినాధన్‌ కమిటి సిఫార్సుల ప్రకారం వుత్పాదక ఖర్చుకు అదనంగా సగం కలిపి అంటే 150 గా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుత్పాదక ఖర్చులో కొన్నింటిని కలపలేదని మనం విమర్శిస్తున్నాం. అంతకంటే ముందే మన మద్దతు ధరలను వ్యతిరేకిస్తున్న అమెరికా ఏమి చెబుతోందో చూద్దాం. మన గోధుమలు, వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర పదిశాతం పరిమితికి మించి 60,70 శాతం వుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేశాడు. గాజు కొంపలో కూర్చొని ఎదుటివారి మీద రాళ్లు వేస్తున్నది అమెరికా. మన దేశం వరికి 60శాతం అదనంగా ఇస్తున్నట్లు యాగీ చేస్తున్న ఆ దేశం తన రైతాంగానికి 82శాతం, ఐరోపా యూనియన్‌ 66శాతం ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాల ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతం పరిమితికి సబ్సిడీలు మించకూడదు. అయితే దీన్ని వక్రీకరించి కొన్ని పంటలకు కొన్ని సంవత్సరాలలో విపరీతమైన సబ్సిడీలను ఇచ్చి మొత్తం పంటల విలువకు దాన్ని వర్తింప చేసి ధనిక దేశాలు తప్పించుకుంటున్నాయి. అందుబాటులో వున్న సమాచారం మేరకు కొన్ని సంవత్సరాలలో అమెరికాకు అర్హత వున్న సబ్సిడీ మొత్తం వంద రూపాయలు అనుకుంటే 90రూపాయలను పాలు, పంచదార రైతులకే ఇచ్చింది, అలాగే ఐరోపా యూనియన్‌ 64రూపాయలను గోధుమ, వెన్నకే ఇచ్చింది.

గత ఇరవై ఏండ్లలో ఏడు సంవత్సరాల సమాచారాన్ని చూసినపుడు అమెరికాలో కొన్ని వుత్పత్తులకు వూలు 215, మేక బచ్చుతో చేసే శాలువలకు 141, వరి 82, పత్తి 74, పంచదార 66, కనోలా 61, ఎండు బఠాణీలకు 57శాతం, ఐరోపా యూనియన్‌లో పట్టుపురుగులకు 167, పొగాకు 155, పంచదార 120, కీరా 86, పియర్స్‌ పండ్లకు 82, ఆలివ్‌ ఆయిల్‌ 76, వెన్న 71,ఆపిల్స్‌ 68,పాలపొడి 67,టమాటా 61శాతాల చొప్పున ఇచ్చారు. ఇలా ప్రత్యేకించి ఒక వుత్పత్తికి ఇచ్చిన రాయితీలు సబ్సిడీల పరిధిలో చూపటం లేదు.

మన దేశం 53ా81శాతం మధ్య పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేసిన కొనుగోళ్లను మాత్రమే సబ్సిడీలుగా భారత్‌ చూపుతున్నది.2015ా16లో 120 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్ధకు భారత్‌ తెలిపిందని అయితే 50,400 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అమెరికా ఆరోపించింది. అంటే మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్లు చిత్రించింది. పంచదారను ప్రభుత్వం సేకరించే విధానం లేనప్పటికీ మద్దతు ధర నిర్ణయించటమే సబ్సిడీ చెల్లించటంగా ఆస్ట్రేలియా ఆరోపించింది. తాము నిర్ణయిస్తున్న మద్దతు ధరలను డబ్ల్యుటిఓ ఏర్పాటుకు ముందు 1986ా88 నాటి ధరలతో పోల్చి ఎక్కువగా వుంటున్నట్లు అమెరికా తప్పుడు లెక్కలు వేస్తోందని మన దేశం గతంలోనే సమాధానమిచ్చినా ఖాతరు చేయకుండా ఫిర్యాదు చేశారు. భారత్‌ డాలర్లలో లెక్కలు వేస్తుంటే అమెరికన్లు భారతీయ కరెన్సీలో గుణిస్తున్నారని అందువలన ఇరు దేశాలు చెప్పేదానికి పొంతన వుండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990లో ఒక డాలరుకు 18 రూపాయలుండగా ఇప్పుడు 72 తాకింది. అందువలన రూపాయల్లో లెక్కవేసినపుడు నాలుగు రెట్లు ఎక్కువగా కనిపించటం సహజం. భారత, చైనా వంటి దేశాల వ్యవసాయ సబ్సిడీల గురించి అభ్యంతర పెడుతున్న ధనిక దేశాలు తాము ఇస్తున్నవాటి గురించి దాస్తున్నాయి. పలు ఖాతాల ద్వారా అందచేస్తూ వాటిని సబ్సిడీలుగా పరిగణించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ 2018 నవంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్న అంశాలను గమనించటం అవసరం. కనీస మద్దతు ధరలు, ప్రత్యక్ష వుత్పాదక సబ్సిడీ, బీమా, తదితర రాయితీలన్నింటినీ కలిపి మొత్తంగా పత్తి సబ్సిడీలని పిలుస్తున్నారు.ప్రపంచ వ్యాపితంగా ఇవి 2016-17లో 4.4బిలియన్‌ డాలర్లుండగా 2017-18నాటికి 5.9బిలియన్లకు( ఒక బిలియన్‌ వంద కోట్ల డాలర్లు) 33శాతం పెరిగాయి. ఒక పౌను(453) దూదికి ఇచ్చిన సబ్సిడీ 17 నుంచి 18 సెంట్లకు(నవంబరు 27 విలువ ప్రకారం రు.12.03 నుంచి రు.12.74కు పెరిగాయి) 1997-98 నుంచి ఇప్పటి వరకు వున్న ధోరణుల ప్రకారం పత్తి ధరలు ఎక్కువగా వున్నపుడు సబ్సిడీలు తగ్గటం, తగ్గినపుడు పెరుగుదల వుంది.

పత్తి ధరల విషయానికి వస్తే 2013-14లో సగటున పౌనుకు 91సెంట్లు లభిస్తే 2014-16లో 70కి తగ్గి 2016-17లో 83కు, 2017-18లో 88 సెంట్లకు పెరిగింది.బ్రెజిల్‌,భారత్‌,పాకిస్ధాన్‌ వంటి అనేక దేశాలలో 2017-18లో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్లో ఎక్కువ ధరలు వున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఎరువులు, రవాణా, గ్రేడింగ్‌, నిల్వ, ఇతర మార్కెటింగ్‌ ఖర్చులను సబ్సిడీగా ఇచ్చాయి.కొన్ని చోట్ల పంటల బీమా సబ్సిడీ పెరిగింది.1998-2008 మధ్య ప్రత్యక్ష, ఇతర సబ్సిడీల మొత్తం సగటున 55శాతం పెరిగింది, మరుసటి ఏడాది 83శాతానికి చేరింది, 2010-14 మధ్య 48శాతానికి తగ్గింది, తదుపరి రెండు సంవత్సరాలలో సగటున 75శాతానికి పెరిగి తదుపరి రెండు సంవత్సరాలలో 47శాతానికి తగ్గాయి. ఈ పూర్వరంగంలో చూసినపుడు మన దేశం గురించి అమెరికా చేసిన ఫిర్యాదు దురుద్దేశపూరితం, కనీస మద్దతు ధర వంటి కనీస రక్షణ కూడా ఎత్తివేయాలని వత్తిడి చేయటం తప్ప మరొకటి కాదు. చైనా, అమెరికాలలో మాదిరి వివిధ పధకాల కింద ఇస్తున్న రాయితీలు మన పత్తి రైతాంగానికి లేవు. ఎరువులు, పురుగు మందుల ధరల మీద నియంత్రణ ఎత్తివేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచకపోవటం వంటి చర్యల కారణంగా పత్తి రైతాంగానికి ఏటే వుత్పాదక ఖర్చు పెరిగిపోతోంది. కనీస మద్దతు ధరకంటే పడిపోయినపుడు రంగంలోకి వస్తున్న సిసిఐ పరిమితంగానే కొనుగోళ్లు చేస్తూ ప్రయివేటు వ్యాపారులకు ఎక్కువగా తోడ్పడుతోంది. అనేక సందర్భాలలో రైతుల పేరుతో వ్యాపారుల నుంచే కొనుగోలు చేసిన కుంభకోణాల గురించి పత్తి రైతాంగానికి తెలిసిందే.

అమెరికా అభ్యంతర పెడుతున్న కనీస మద్దతు ధరల ప్రహసనం ఏమిటో మనకు తెలియంది కాదు. అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ నివేదిక రహస్యమేమీ కాదు. దానిలో మన దేశం గురించి పేర్కొన్న అంశాలు ఇలా వున్నాయి.’ భారత్‌లో కనీస మద్దతు ధర పద్దతి వుంది. 2014-15 మరియు 2015-16 సంవత్సరాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్‌ ధరలు తక్కువగా వున్నందున కొద్ది కాలమైనా ప్రభుత్వం నేరుగా పత్తి కొనుగోలు చేసింది.2016-17,2017-18లో మార్కెట్‌ ధరలు ఎక్కువగా వున్నందున మద్దతు ధరల వ్యవస్ధ కొనుగోలు అవసరం లేకపోయింది. మధ్యరకం పింజ రకమైన జె34 రకానికి 2017-18లో మద్దతు ధరగా క్వింటాలుకు రు.4,020 నిర్ణయించారు. అది పౌను దూది ధర 83సెంట్లకు సమానం. భారత్‌లో పత్తి రైతులు ప్రభుత్వ రుణ మాఫీ మరియు ఎరువుల సబ్సిడీ వలన లబ్ది పొందారు. పంటల బీమా ద్వారా కూడా కొంత మేర మద్దతు ఇచ్చారు. అయితే దీని విలువ ఎంతో తెలియదు. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాల వుత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. టెక్నాలజీ మిషన్‌ ద్వారా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ యూనిట్ల నవీకరణకు, పత్తి మార్కెటింగ్‌కు ఇటీవల తోడ్పడింది. వీటి గురించి బహిరంగంగా తెలిపే సమాచారం లేదు. ఇవి గాకుండా జౌళి రంగానికి ప్రత్యక్ష మద్దతు, చౌక రుణాల ద్వారా కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.’ రుణాల రద్దును, నూలు, వస్త్ర మిల్లులకు ఇస్తున్న రాయితీలను కూడ పత్తి రైతులకు ఇస్తున్న రాయితీగా చిత్రించారు.

చైనా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీల గురించి చూద్దాం. 2017-18లో అంతకు ముందు ఏడాది ఇచ్చిన 3.3బిలియన్‌ డాలర్ల సబ్సిడీని 4.3బిలియన్‌ డాలర్లకు పెంచారు(పౌనుకు 30సెంట్లు). ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకోవాల్సిన నిర్దేశిత వంతుకు మించి అదనంగా దిగుమతి చేసుకొనే పత్తి మీద 40శాతం పన్నుతో సహా రైతాంగానికి పలు రక్షణలు కల్పిస్తున్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ ధరకంటే రైతాంగానికి ఎక్కువ గిట్టుబాటు అవుతున్నది. దిగుమతి చేసుకున్న పత్తి ధర, చైనా మిల్లులకు చేరిన ధరకు మధ్య వున్న వ్యత్యాసం రైతులకు నష్టదాయకంగా వుండకుండా చూసేందుకు చెల్లించిన లబ్ది మొత్తం 201-17లో ఒక బిలియన్‌ డాలర్లు వుండగా మరుసటి ఏడాది అది 1.5బిలియన్లకు పెరిగింది. ఇంతేగాకుండా మన దగ్గర కనీస మద్దతు ధర మాదిరిగా ప్రతి ఏటా రైతాంగానికి ఒక లక్షిత ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ఏడాది మార్కెట్‌లో వచ్చిన సగటు ధరతో దానిని పోల్చి తక్కువ వస్తే ఆ మేరకు రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. ఆ మేరకు 2015,16,17 సంవత్సరాలలో చెల్లింపులు చేసింది. 2018 సంవత్సరానికి ఒక టన్నుకు 18,600 యువాన్లుగా నిర్ణయించింది. ఇది పౌనుకు 130 సెంట్లకు సమానం. దాని ప్రకారం అంతకు ముందు సంవత్సరం చెల్లించిన 1.6బిలియన్ల నుంచి 2.1బిలియన్లకు మొత్తాన్ని పెంచింది. అంతే కాదు ప్రతి ఏటా 15క్లో డాలర్ల మేర నాణ్యమైన విత్తన సబ్సిడీ, మరో 15కోట్ల డాలర్లను దూర ప్రాంత రవాణా ఖర్చుల కింద రైతాంగానికి చెల్లించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం కోసం చైనా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక ఏడాదికి 8,94,000 టన్నుల పత్తి దిగుమతి చేసుకుంటే దాని మీద పన్ను ఒక శాతమే విధించాలి. అంతకు మించి దిగుమతులు వుంటే పరిమాణాన్ని బట్టి ఒక శాతం నుంచి 40శాతం వరకు పన్ను విధించవచ్చు. గత మూడు సంవత్సరాలుగా నిర్దేశిత మొత్తం మేరకే దిగుమతులు చేసుకుంటున్నది.

Image result for cotton picking in india

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిసిఐ) వార్షిక నివేదికలను ఆ సంస్ధ వెబ్‌ సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. వాటిలో పేర్కొన్నదాని ప్రకారం 2014-15 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర అంతకు ముందు సంవత్సరం కంటే పెంచింది రు.50, ఇది ఒక శాతానికి దగ్గరగా వుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోయిన కారణంగా ఆ ఏడాది దేశీయ మార్కెట్లో ముడిపత్తి ధరలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19 నుంచి 30శాతం వరకు, అదే విధంగా దూది ధర 25 నుంచి 30శాతం వరకు పతనమైందని సిసిఐ నివేదిక తెలిపింది. ఇలాంటి సందర్భాలలో చైనా, అమెరికాలలో రైతాంగానికి ఆయా ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో నష్టం రాకుండా చూశాయి. మన దేశంలో అలాంటి విధానం లేదు. కనీస మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ వున్నపుడు ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా సిసిఐ కొనుగోళ్లు వుంటున్నాయి. అవి కూడా మద్దతు ధరకు మించటం లేదు. పైన చెప్పుకున్నట్లు ఒక ఏడాది ధరలు భారీగా పడిపోయినా రైతాంగం అప్పులపాలు కావాల్సిందే. ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధరల కంటే తక్కువ ధరలకే అధిక మొత్తాలను కొనుగోలు చేస్తున్నట్లు వివిధ మార్కెట్ల సమాచారం వెల్లడిస్తున్నది.

1966 నాటి చెరకు నియంత్రణ విధానం ప్రకారం మన ప్రభుత్వాలు చెరకు ధరను సూచిస్తున్నాయి. ఈ విధానం, పంచదార ఎగుమతులకు ఇస్తున్న రాయితీల కారణంగా ధరలు తగ్గి తమతో పాటు ప్రపంచ రైతాంగానికి, వ్యాపారులకు నష్టం జరుగుతోందంటూ ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్ధకు మన దేశం మీద చేసిన పరోక్ష ఫిర్యాదును ఇప్పుడు విచారిస్తున్నారు.’ చెరకు వుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచేందుకు భారతీయ రైతులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారు.దీంతో పంచదార మిల్లులకు ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు వీలు కలుగుతోంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌ సబ్సిడీలను తగ్గించే జాబితాలో చెరకు లేదు ‘ అని ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. చెరకు సబ్సిడీలను తగ్గిస్తామని అంగీకరించిన దేశాలలో మన దేశం లేదు. ధనిక దేశాలు కోరుతున్న పద్దతిలో వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలనటాన్ని మనదేశం, చైనా వుమ్మడిగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో వ్యతిరేకించాయి, ఈ అంశం మీద చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. అయితే అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌, నార్వే, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలు చర్చను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2011-17 మధ్య అంగీకరించిన సబ్సిడీ మొత్తాలకు మించి చెరకు సబ్సిడీలను భారత్‌లో ఇచ్చారని ఆస్ట్రేలియా వాదించింది. భారత చెరకు, పంచదార గురించి అమెరికా తయారు చేసిన తప్పుడు లెక్కలను వుదహరించి ఆస్ట్రేలియా కేసు దాఖలు చేసింది. ఒక్క చెరకు పంట మీదే కాదు, పప్పుధాన్యాలకు కూడా భారత్‌ ఇస్తున్న సబ్సిడీ వలన కూడా ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతోందని ఆరోపిస్తోంది.ఈ వైఖరి ఒక విధంగా మన దేశ సార్వభౌమత్వాన్నే సవాలు చేయటంగా కూడా చెప్పవచ్చు.

ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా ఈ ఏడాది భారత్‌లో పంచదార వుత్పత్తి ఏకంగా 20 నుంచి 35 మిలియన్‌ టన్నులకు పెరిగిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌ 85కోట్ల డాలర్ల మేర సబ్సిడీ ఇచ్చి ఐదులక్షల టన్నుల పంచదారను ప్రపంచ మార్కెట్లో కుమ్మరిస్తున్నదని, తమ దేశంలో టన్ను పంచదార వుత్పత్తికి 440-450 డాలర్ల వరకు ఖర్చవుతుండగా మార్కెట్లో 500డాలర్లుగా వున్న ధర పడిపోయి 400కు మించి రావటం లేదని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలు రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదని పెంచాలని కోరుతున్నారు. దీన్నే సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నారు.నిజానికి రాష్ట్రం లేదా కేంద్రంగానీ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహక ధరలు లేదా రాయితీలు చెరకు-దాని వుత్పత్తుల మీద వచ్చే ఆదాయం, పన్నులతో పోల్చుకుంటే తక్కువే. ఈ మాత్రపు రక్షణ కూడా లేకుండా మార్కెట్‌ శక్తులకు వదలి వేయాలని అంతర్జాతీయ బడా పంచదార వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు.

గత పదహారు సంవత్సరాలలో తొలిసారిగా భారత్‌ పంచదార వుత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి 35.9 మిలియన్‌ టన్నులతో ప్రధమ స్ధానంలోకి వచ్చింది. అయితే ఇది తాత్కాలికమే అని చెప్పవచ్చు. బ్రెజిల్‌లో ప్రతికూల వాతావరణం నెలకొనటం ఒక కారణమైతే, చమురు ధరలు 85డాలర్లకు పెరిగినందున పంచదార బదులు ఎథనాల్‌ తయారు చేయటం లాభసాటిగా వున్నందున పంచదార వుత్పత్తిని కావాలనే తగ్గించారు. చమురు ధరలు 60డాలర్లకు పడిపోయినందున ఎథనాల్‌ బదులు పంచదారకు మరలితే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. ప్రపంచ వ్యాపితంగా 188.3మిలియన్‌ టన్నుల పంచదార వుత్పత్తి అవుతుందని అంచనా.

మన మార్కెట్‌ను బహుళజాతి గుత్త సంస్ధలకు తెరిచిన కారణంగా ఇప్పటికే పత్తి, ఇతర విత్తన రంగం,పురుగు మందుల రంగం విదేశీ, స్వదేశీ గుత్త సంస్ధల ఆధిపత్యంలోకి పోయింది.వారు నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. కార్గిల్‌ వంటి బహుళజాతి గుత్త సంస్ధలు కనీస మద్దతు ధరలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్లను నిర్దేశిస్తున్నాయని 2017 జనవరిలో వార్తలు వచ్చాయి. లోపాలతో కూడినదే అయినప్పటికీ ఆ విధానం కూడా వుండకూడదని, అప్పుడే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని అవి భావిస్తున్నాయి. దానిలో భాగంనే పారిశ్రామిక రంగానికి ఇచ్చే రాయితీలను కూడా రైతుల ఖాతాలో వేసి అమెరికా వంటి దేశాలు కనీస మద్దతు ధరల విధానం మీద దాడి చేస్తున్నాయన్నది స్పష్టం. దీని వెనుక అంతర్జాతీయ వ్యవసాయ కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ధనిక దేశాల లాబీ, వత్తిడికి లంగి వాటికి అనుకూలమైన విధానాలు అమలు జరుపుతున్న పాలకవర్గాల మీద, అదే విధంగా కార్పొరేట్‌ శక్తుల కుట్రల మీద రైతాంగం చైతన్యవంతులై ఆ విధానాలను తిప్పికొట్టకపోతే వున్న రాయితీలు కూడా వూడ్చిపెట్టుకుపోయే ప్రమాదం వుంది.

ఫ్రెంచి ‘పసుపు చొక్కాల’ ప్రతిఘటనతో ‘ఆకుపచ్చ’ పన్ను వాయిదా !

Tags

, , ,

Image result for france yellow vest protests : green tax deferred

ఎం కోటేశ్వరరావు

పరిమితికి మించి బరువులెత్తిన నావ గడ్డిపోచను కూడా ఓపలేదు. జనం కూడా అంతేనా ? కాకపోతే కుటుంబానికి నెలకు పది యూరోలు లేదా 14 డాలర్ల అదనపు భారం(మన రూపాయల్లో 850) మోపే చమురు పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ నవంబరు 17 నుంచి ఫ్రాన్స్‌లో జనం వీధులకెక్కటం, అధ్యక్షుడు మక్రాన్‌కు ముచ్చెమటలు పట్టించటాన్ని ఏమనాలి? 2013, సెప్టెంబరు 16న హిందూస్తాన్‌ పెట్రోలియం(హెచ్‌పిసిఎల్‌) ప్రకటించిన వివరాల ప్రకారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.76.10. 2018 డిసెంబరు నాలుగవ తేదీన రు.71.78లు. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 117.58 డాలర్లు నేడు 60డాలర్లకు అటూ ఇటూగా వుంది. అంతర్జాతీయ ధర సగం పడిపోయినా ఆ దామాషాలో మన దగ్గర తగ్గకపోయినా మనకు చీమకుట్టినట్లు కూడా లేదు. దీన్ని బట్టి దేన్నయినా తట్టుకోగలిగిన విధంగా మన(చర్మాలు)ం తయారైనట్లు అనుకోవాలి. మోపిన భారాన్ని మనం భుజం మార్చుకోకుండా భరిస్తుంటే, వేయబోయే బరువు ప్రకటనతో ముందే ఫ్రెంచి జనాలు ఆందోళన ప్రారంభించారు. అంటే వారికి ఇంకే మాత్రం తట్టుకొనే శక్తి లేదన్నది స్పష్టం. ఆందోళనల్లో పాల్గంటున్నవారంతా నిరుద్యోగులు కాదు, ఇప్పటికే నెలలో 20వ తేదీ దాటితే జేబులు, ఇంట్లో ఫ్రిజ్‌లు ఖాళీ అవుతున్నాయి, ఇప్పుడు ఇదొకటా అంటూ పర్యావరణ పరిరక్షణ పేరుతో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రకటించిన ‘ఆకుపచ్చ’ పన్నుకు వ్యతిరేకంగా ‘పచ్చ చొక్కా’ యూనిఫారాలతో మూడువారాలుగా నిరసన తెలుపుతున్నవారిలో గణనీయ భాగం చిరుద్యోగులు కావటం విశేషం. పార్టీలు లేవు, నాయకులు అంతకంటే లేరు, ఎవరికి వారే కార్యకర్తలుగా భావించి వీధుల్లోకి వచ్చారు.

ఇప్పటి వరకు వివిధ సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కొందరు తిరగబడ్డారు, దెబ్బలు తిన్నారు, పోలీసులకు దెబ్బ రుచి చూపారు.డీజిల్‌ ధరలు తగ్గించాలన్న డిమాండ్‌తో ప్రారంభమైన వుద్యమం కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చింది.సాధారణంగా పట్టణాలలో ప్రారంభమయ్యే ఆందోళనలు మెల్లగా పల్లెలకు పాకుతాయి. దీనికి విరుద్దంగా ఈ ఆందోళన గ్రామాలతో మొదలైంది. ఎందుకంటే పట్టణవాసులతో పోలిస్తే పల్లెటూరి వారు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. మన దేశంలో ఒకపుడు ఇంటికి విద్యుత్‌ వుంటే, తరువాత టీవీ, ఇప్పుడు మోటార్‌ సైకిల్‌ వుంటే సంక్షేమ పధకాలకు అనర్హులని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాన్స్‌లో కూడా గ్రామీణ, చిన్న పట్టణాలలో సంక్షేమ పధకాలకు అనర్హులైన వారు, వచ్చే ఆదాయాలతో అస్తుబిస్తుగా గడుపుతూ ఇంకే మాత్రం భారం భరించలేని వారు ఆందోళనకు ఆద్యులయ్యారు. ఒక నాయకుడు లేదా ఒక పార్టీ ఇచ్చిన పిలుపు కాదిది, సామాజిక మాధ్యమంలో అభిప్రాయాలు కలిసిన వారి స్పందన. మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడు అన్న సామెత మాదిరి ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే ఒక ప్రతిభాశాలిగా ఏడాదిన్నర క్రితం పరిగణించిన అధ్యక్షుడు మాక్రాన్‌ను జనం ఇప్పుడు అన్నింటికీ అతనే కారణం అంటున్నారు. సంస్కరణల పేరుతో ధనికుల మీద సంపద పన్ను తగ్గించాడు. కార్మిక చట్టాలను మరింతగా నీరుగార్చాడు, చమురు భారాలు మోపటం వంటి వాటిని జనం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

పది సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌లో మోటారు వాహన చట్టానికి తెచ్చిన సవరణ ప్రకారం బండ్లను నడిపే వారు విధిగా కాంతి పడినపుడు వెలుగు నిచ్చే పచ్చచొక్కాలను ధరించాలి.(మన దగ్గర రాత్రుళ్లు పనిచేసే మునిసిపల్‌ కార్మికులు వేసుకొనే వెలుగుపడితే మెరిసే జాకెట్ల మాదిరి) ఇప్పుడు వాటితోనే పన్ను భారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళన రాజధాని పారిస్‌లో హింసాత్మకంగా మారి మరో మలుపు తిరిగాయి. తొలుత పెంచిన పన్ను తగ్గించాలన్న డిమాండ్‌కు ఇప్పుడు పన్నులు పోగా నెలకు కనీసవేతనం 1350 డాలర్లు వుండేట్లుగా నిర్ణయించాలన్న డిమాండ్‌ తోడైంది. కొందరు పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికలు జరపాలని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని కూడా నినాదాలు వినిపించారు. పాలకపార్టీ, ప్రభుత్వ నేతల బలహీనత వెల్లడైన తరువాత ఆ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఆందోళనను పక్కదారి పట్టించేందుకు, వక్రీకరించే ఎత్తుగడల్లో భాగంగా ఆందోళనల కారణంగా జరుగుతున్న నష్టం అంటూ మీడియా బూతద్దంలో చూపుతున్నది.ఈ ఆందోళనకు 73-84శాతం మధ్య జనం మద్దతు తెలిపారు. ఆందోళనకారులు రోడ్ల దిగ్బంధన సమయంలో ముగ్గురు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటంతో సహజంగానే హింసాకాండను కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనతో దిక్కుతోచని సర్కార్‌ తొలుత చర్చలు జరిపేందుకు విముఖత చూపినా శనివారం నాడు జరిగిన హింసాత్మక ఘటనల తరువాత మాట్లాడేందుకు ముందుకు వచ్చింది. వుపశమన చర్యలను ప్రకటిస్తామని ప్రకటించింది. పద్దెనిమిది నెలల తరువాత మక్రాన్‌కు ప్రజావ్యతిరేకత అనూహ్యరూపంలో ఎదురైంది.

Image result for france yellow vest protests : green tax deferred

గత రెండు సంవత్సరాలలో డీజిల్‌ ధరలు 14 మరియు 22శాతాల చొప్పున 36శాతం పెంచారు. దీనిలో ప్రపంచ మార్కెట్లో పెరిగిన చమురు ధరల వాటాతో పాటు స్ధానికంగా పెంచిన పన్నుల మొత్తం కూడా కలిసింది.ఈ ఏడాది ఒక లీటరు డీజిల్‌ మీద 7.6సెంట్లు, పెట్రోలు మీద 3.9సెంట్లు పెంచారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పన్నులను మరో 6.5, 2.9శాతాలను జనవరి ఒకటి నుంచి పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పెంపుదలలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరల కంటే పన్ను భారమే ఎక్కువగా వుందని, దాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబరులో ఒక పౌరబృందం ఇంటర్నెట్‌లో ఒక పిటీషన్‌ తయారు చేసి సంతకాల సేకరణ వుద్యమాన్ని ప్రారంభించింది. జనాన్ని మభ్యపెట్టేందుకు అధ్యక్షుడు మక్రాన్‌ నవంబరు ప్రారంభంలో ఒక ప్రకటన చేస్తూ ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.పర్యావరణం దెబ్బతినటానికి ప్రధాన కారణం లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారుల వైఖరి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొందరు పర్యావరణ పరిరక్షణను ముందుకు తెస్తూ మక్రాన్‌ సర్కార్‌ తీసుకున్న చర్యల సమర్ధనకు దిగుతున్నారు.కాలుష్యానికి కారణమయ్యే డీజిల్‌ మోటార్‌ వాహనాల తయారీకి రాయితీలు ఇచ్చి మరీ ప్రోత్సహించిన వాటిలో ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఒకటి. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి అపరిమిత సంపదలు కూడబెట్టుకున్న కంపెనీలు, ఇతర ధనికుల మీద అధిక పన్నులు విధించి దామాషా ప్రకారం సామాన్యుల మీద కూడా విధిస్తే అదొక తీరు. పెట్టుబడిదారుల లాభాల వేటకు బలైందీ కార్మికవర్గమే, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు మూల్యం చెల్లించాల్సి వస్తున్నదీ కార్మికవర్గమే.

ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల ఆందోళన సమీప ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్‌లో ప్రతిధ్వనించింది. నవంబరు 17న ఫ్రాన్స్‌లో దాదాపు మూడులక్షల మంది వివిధ ప్రాంతాలలో రోడ్డు దిగ్బంధనంతో ప్రత్యక్ష ఆందోళన ప్రారంభమైంది. ప్రతిశనివారం పెద్ద ఎత్తున సమీకరణలు జరుగుతున్నాయి.డిసెంబరు ఒకటిన తొలిసారిగా మక్రాన్‌ రాజీనామా డిమాండ్‌ ముందుకు వచ్చింది.గతనెల 21న ఫ్రెంచి పాలనలోని రీయూనియన్‌ దీవిలో హింసాకాండ చెలరేగటంతో సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. బెల్జియంలో అనేక పెట్రోలు బంకుల వద్ద నిరసనలు చెలరేగాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నెదర్లాండ్స్‌లోని అనేక నగరాల్లో పసుపు చొక్కాలతో ప్రదర్శనలు చేశారు. అయితే ఇటలీలో ప్రభుత్వ వ్యతిరేకతకు బదులు తమ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న ఐరోపాయూనియన్‌కు వ్యతిరేకంగా పసుపు చొక్కాలతో నిరసన తెలుపుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Related image

గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం పొదుపు పేరుతో తీసుకున్న ప్రజావ్యతిరేక చర్యల కారణంగా ప్రస్తుతం మక్రాన్‌ పలుకుబడి 26శాతానికి పడిపోయింది. వచ్చే ఏడాది జరగనున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ లేదా ర్యాలీ పార్టీ పోటాపోటీగా తయారవుతుందని అంచనా. గత పది సంవత్సరాలలో ఫ్రెంచి రాజకీయాలలో ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ లేదా నేత మరోసారి గెలిచింది లేదు. రోడ్డుదాటటమే తరువాయి, నేను అధికారానికి రావటమే తరువాయి నీకు ఒక వుద్యోగం సిద్ధంగా వుంటుంది అన్నంతగా భ్రమలు కల్పించిన మక్రాన్‌ ఏడాదిన్నరలోనే యువత, మధ్యతరగతి ఆశలను ఏడాదిన్నరలోనే దెబ్బతీశాడు. తొలిసారిగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. గత నాలుగు దశాబ్దాల కాలంలో అన్ని ధనిక దేశాల మాదిరే ఫ్రాన్స్‌లో కూడా నూతన ఆర్ధిక విధానాలకు మూల్యం చెల్లించింది కార్మికవర్గమూ, మధ్యతరగతి వారే అంటే మొత్తంగా సమాజమే దెబ్బతిన్నది. విజయవంతమైందని చెప్పుకొనే ప్రపంచీకరణ నమూనా వారిని దెబ్బతీసింది. సంపదలు పెరుగుతూనే వున్నాయి. వాటితో పాటు నిరుద్యోగం, అభద్రత, దారిద్య్రమూ పెరుగుతున్నాయి. పట్టణీకరణ జరిగిన ఐరోపాలో పెద్ద నగరాల్లోనే పెట్టుబడులు దానికి అనుగుణంగా వుపాధి అవకాశాలుండగా గ్రామీణ, చిన్న పట్టణాలలో అలాంటి పరిస్ధితి లేదు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావన సర్వత్రా వెల్లడి అవుతున్నది. తదుపరి ఐరోపాలో కూడా అదే జరగనుంది. మధనం ప్రారంభమైంది. సోషల్‌డెమోక్రటిక్‌ పార్టీలు, మితవాద పార్టీలు జనాన్ని ఇంతకాలం మభ్యపెట్టాయి. కమ్యూనిస్టు పార్టీలు మితవాదానికి గురైదెబ్బతిన్నాయి. పచ్చిమితవాద శక్తులు తాత్కాలికంగా అయినా జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి. ఫ్రెంచి పచ్చచొక్కాల వుద్యమానికి కొన్ని పరిమితులు వున్నాయి.వాటిని అధిగమించి మరింత ముందుకు పోకుండా చూసేందుకు పన్ను పెంపుదలను ఆరునెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆందోళనకూ అంతేవిరామం వస్తుంది. అసంఘటితంగా వున్న వారు ఇచ్చిన పిలుపుకే ఇంత స్పందన వస్తే రానున్న రోజుల్లో ప్రతిఘటన మరింత సంఘటితంగా వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. పసుపు చొక్కాల వుద్యమం ఒక విధంగా భారాలు మోపే ప్రభుత్వానికి, దానికి తగిన ప్రతిఘటన చూపని ప్రతిపక్షాలకూ ఒక పెద్ద హెచ్చరిక. కోడి కూయనంత మాత్రాన సూర్యోదయం ఆగనట్లే, వుద్యమాలు కూడా ఆగవు.

వక్రీకరణలను తిప్పికొట్టండి-సోషలిజం గొప్పతనాన్ని చెప్పండి !

Tags

, , ,

Image result for 20th IMCWP

ఎం కోటేశ్వరరావు

కమ్యూనిస్టు , కార్మికోద్యమాలను బలపరిచే, సంరక్షించుకొనే కృషిలో భాగంగా 2019లో వచ్చే ముఖ్యమైన స్మారకోత్సవాల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలను నిర్వహించాలని, వక్రీకరణలను తిప్పి కొట్టి సోషలిజం గొప్పతనాన్ని జనానికి చెప్పాలని గ్రీసు రాజధాని ఏథెన్స్‌లో జరిగిన 20వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల సమావేశం పిలుపు నిచ్చింది. గ్రీసు కమ్యూనిస్టు పార్టీ తన వందవ వార్షికోత్సవం సందర్భంగా నవంబరు 23-25 తేదీలలో ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశానికి 73 దేశాల నుంచి 90 పార్టీల ప్రతినిధులు హాజరై తమ అనుభవాలను కలబోసుకున్నారు. ‘ వర్తమాన కార్మికవర్గం మరియు దాని మైత్రి(సమాశ్రయం). దోపిడీ మరియు సామ్రాజ్యవాదుల యుద్ధాల వ్యతిరేక పోరాటం, శాంతి, సోషలిజం కోసం, కార్మికులు మరియు పౌరుల హక్కుల పరిరక్షణ వుద్యమాల్లో ముందుండే కమ్యూనిస్టు మరియు కార్మిక పార్టీల రాజకీయ లక్ష్యాలు.’ అనే ఇతి వృత్తంతో జరిగిన ఈ సమావేశంలో పాల్గన్న ప్రతి పార్టీ అంతర్జాతీయ, ప్రాంతీయ, దేశీయ పరిస్ధితులపై తన అనుభవాలు, పాఠాలను సోదర పార్టీలతో పంచుకుంది. మన దేశం నుంచి సిపిఐ(ఎం), సిపిఐ పార్టీల ప్రతినిధి వర్గాలు పాల్గన్నాయి.

పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి లేదా సంక్షోభంలో బహుముఖాలుగా పెట్టుబడిదారీ దేశాలు వాటి కూటముల మధ్య పోటీ మరియు వైరుధ్యాలు తీవ్రమౌతున్నాయని, ఆ క్రమంలో బలాబలాల పునరేకీకరణ అంతర్జాతీయంగా ముందుకు వస్తున్నదని సమావేశం గుర్తించింది. సామ్రాజ్యవాదుల జోక్యం, దిగ్బంధాలు మరియు మధ్యవర్తిత్వాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సిరియా, ఎమెన్‌, లిబియా అదే విధంగా అజర్‌బైజాన్‌లో యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రజావ్యతిరేక కీవ్‌ పాలకుల కారణంగా వుక్రెయిన్‌లో భాతృహత్యా సంబంధమైన యుద్ధం జరుగుతోంది. మిలిటరీ ఆయుధీకరణ మరియు యుద్ధ సన్నాహాలు పెరుగుతున్నాయి. అమెరికా, నాటో, ఐరోపా యూనియన్‌ మరియు వాటి మిత్ర సామ్రాజ్యవాదుల పధకాలు మరియు రాజకీయ వైఖరులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నుంచి అనేక అనుభవాలు లభించాయి.

వైరుధ్యాలు తీవ్రతరం కావటంతో సంపదను వుత్పత్తి చేసే వనరులపై అదుపు, మార్కెట్లు, చమురుపైప్‌లైన్లపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాల ముప్పు ఇమిడి వుంది. శాంతి, నిరాయుధీకరణ కోసం ఇది విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని పటిష్టపరిచేందుకు వుపేక్షించరాని లక్ష్యాలను కమ్యూనిస్టులు మరియు శ్రామికోద్యమాల ముందుంచింది. బడా పెట్టుబడిదారుల లాభదాయకత కోసం పని చేసే బూర్జువా ప్రభుత్వాల వైఖరి మరియు సామాజ్రవాదుల దురాక్రమణ,యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటాలను వుధృతం చేయాల్సి వుంది.

అక్టోబరు విప్లవ వందసంవత్సరాల వార్షికోత్సవం, కారల్‌మార్క్స్‌ 200వ జన్మదినోత్సవాల సందర్భంగా 2017,18 సంవత్సరాలలో తీసుకున్న చొరవను సమావేశం సానుకూలంగా విశ్లేషించింది. సిరియా, పాలస్తీనా, సైప్రస్‌, లెబనాన్‌, సూడాన్‌, క్యూబా, వెనెజులా, బ్రెజిల్‌, ఇరాన్‌ ఎదుర్కొంటున్న సామ్రాజ్యవాదుల దాడులు, బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి అంతర్జాతీయ సౌహార్ద్రతను పునురుద్ఘాటించింది. పోలాండ్‌, వుక్రెయిన్‌, సూడాన్‌, కజకస్తాన్‌, పాకిస్ధాన్లలో కమ్యూనిస్టు వ్యతిరేక మరియు ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న దాడులను, రష్యా తదితర చోట్ల కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్న చట్టపరమైన, రాజకీయ ఆటంకాలను సమావేశం ఖండించింది.

Image result for 20th IMCWP

2019లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ స్ధాపనవందేండ్ల వుత్సవం, చైనా విప్లవ 70, క్యూబా విప్లవ 60వ వార్షికోత్సవాల వంటి ముఖ్యమైన స్మారకోత్సవాలు వున్నాయి. ప్రజా విజయాలకు కమ్యూనిస్టు వుద్యమం ఇచ్చిన తోడ్పాటు, అంతర్జాతీయ కార్మికోద్యమాన్ని పటిష్టపరచాల్సిన అవసరం, చారిత్రక వాస్తవాలను వక్రీకరించి ఫాసిస్టుల అత్యాచారాలతో సమంగా కమ్యూనిజాన్ని చూపే యత్నాలు, తప్పుడు ప్రచారాలను ఎండగట్టటం, కార్మికుల, ఇతర తరగతుల సామాజిక విజయం కోసం జరిపే పోరాటాల పురోగతికి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సమావేశం పిలుపునిచ్చింది.

నాటో 70వ వార్షికోత్సవం సందర్భంగా దానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో మరింత మిలిటరీ కేంద్రీకరణ జరుపుతున్న ఐరోపాయూనియన్‌ చర్యలకు వ్యతిరేకంగా 2019 ఏప్రిల్‌ నాలుగవ తేదీన, అణ్వాయుధాలు, విదేశీ సైనిక స్ధావరాలకు, హిరోషిమా-నాగసాకీ అణుమారణకాండకు వ్యతిరేకంగా ఆగస్టు ఆరు మరియు తొమ్మిదిన, రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమై 80సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటిన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం కోరింది. కమ్యూనిస్టు వుద్యమ చరిత్రను, అంతర్జాతీయ కార్మిక సౌహార్ద్రత విలువలను పరిరక్షిస్తూ, కమ్యూనిస్టు వ్యతిరేకత, కమ్యూనిస్టు, కార్మికోద్యమాల అణచివేతకు వ్యతిరేకంగా మార్చినెల రెండవ తేదీన వందేండ్ల కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ వుత్సవం సందర్భంగా, అక్టోబరు విప్లవ 102వ వార్షికోత్సవం సందర్భంగా సోషలిజం సాధించిన విజయాల గురించి ప్రచారం, పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, అణచివేత వంటి అమానుష ధోరణులకు వ్యతిరేకంగా లోతైన సైద్ధాంతిక చర్చ, ఆచరణాత్మక కార్యక్రమాల గురించి బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.

సోషలిస్టు క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా అమలు జరుపుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, వెనెజులా బలివేరియన్‌ విప్లవాన్ని వమ్ము చేసేందుకు చేస్తున్న బెదిరింపులు, జోక్యాలకు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరుల పోరాటం, కొరియాల ఐక్యతకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సం, మే డే, ఫాసిజం, నాజీజాల మీద ప్రజా విజయం రోజున తిరిగి తలెత్తుతున్న ఆ శక్తులకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఏథెన్స్‌ సమావేశం పిలుపునిచ్చింది.

Related image

వంద సంవత్సరాల గ్రీసు కమ్యూనిస్టు పార్టీ 1918 నవంబరు 17న గ్రీసు సోషలిస్టు లేబర్‌ పార్టీగా ఏర్పడింది.పైరాస్‌ పట్టణంలో తొలి మహాసభ జరిగింది. 1924లో గ్రీసు కమ్యూనిస్టు పార్టీగా మారింది. నాజీల దురాక్రమణకు ప్రతిఘటన వుద్యమంలో గణనీయమైన పాత్ర పోషించింది.1967 ఏప్రిల్‌ 21న గ్రీసుకు కమ్యూనిస్టు ముప్పు తలెత్తిందనే పేరుతో మిలిటరీ తిరుగుబాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను నిషేధించింది. మరుసటి ఏడాది గ్రీసు కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చి ఒక వర్గం యూరోకమ్యూనిజం పేరుతో మితవాదబాట పట్టింది. మరొక వర్గం మిలిటరీ పాలకులపై సాయుధపోరుకు దిగింది.1974లో మిలిటరీ పాలన అంతమైన తరువాత తిరిగి కమ్యూనిస్టు పార్టీ బహిరంగ కార్యకార్యకలాపాల్లోకి వచ్చింది. వందవ వార్షికోత్సవ సభ మొదటి మహాసభ జరిగిన పైరాస్‌ పట్టణంలోనే శాంతి, స్నేహ స్టేడియంలో పెద్ద ఎత్తున రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగింది.తొంభై కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధుల సమక్షంలో వేలాది మంది గ్రీసు పార్టీకార్యకర్తలు, పౌరులు పాల్గన్నారు. గతంలో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టిన యోధులు, ఎర్రజెండాను సమున్నతంగా నిలబెడుతున్న యువ కమ్యూనిస్టులు వేలాది మందిని ఈ సందర్భంగా గ్రీసు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌటుసోంబస్‌ సన్మానించారు.

Image result for KKE, Dimitris Koutsoumbas

ఈ సందర్భంగా దిమిత్రిస్‌ మాట్లాడుతూ ‘మేం ఏటికి ఎదురీదాం, బిగ్గరగా చేసిన విమర్శలను తట్టుకోలేక చెవులు మూసుకున్నాం, మృదువుగా మృదువుగా వుందాం అని చెప్పిన కొందరు స్నేహితులు, కామ్రేడ్లను మేము కలవర పెట్టాము. వారు మమ్మల్ని రాజీపడమని కోరారు. మేమా పని చేయకపోవటమే సరైందని రుజువైంది. అలా చేసి వుంటే చివరకు రాజీ మాత్రమే మిగిలి వుండేది. మేమా పని చేయలేదు. ఎందుకంటే వంద సంవత్సరాల పార్టీ అనుభవం మమ్మల్ని తప్పులు చేయనివ్వలేదు. ఏటికి ఎదురీదిన కారణంగానే మేము ముందుకు పోవటానికి, ప్రతిదాడి చేసేందుకు, నూతన మిలిటెంట్ల సచేతనత్వం పొందటానికి తోడ్పడింది. యజమాని లేకుండా నడపవచ్చుగానీ కార్యకర్తలనే గొలుసు లేకుండా బండిని నడపలేము.’ అంటూ కార్యకర్తలను వుత్సాహపరిచారు.

రామాలయం – రావణ కాష్టం !

Tags

, , ,

Image result for ram statue in ayodhya

ఎం కోటేశ్వరరావు

రావణుడి భార్య మండోదరి శాపానికి భయపడిన దేవతలు ఆమె నిత్య సుమంగళిగా వుండేందుకు గాను రావణుడి చితిని శాశ్వతంగా మండుతూనే వుండేట్లు ఏర్పాటు చేశారట. ఒక సమస్య ఎడతెగకుండా సాగుతూ వుంటే దాన్ని రావణకాష్టంతో మన పెద్దలు పోల్చారు. రావణుడిని తప్పుడు పద్దతుల్లో హతమార్చిన రాముడికి ఆలయాన్ని కడతా మంటున్న సంఘపరివార్‌, దానితో పోటీబడుతున్న ఇతర మతోన్మాద శక్తులు ఇప్పుడు రామాలయాన్ని కూడా అలాగే మార్చినట్లు ఈ పాటికే చాలా మందికి అర్ధం అయింది. ఆదివారం నాడు అయోధ్యలో రామాలయాగ్నికి విశ్వహిందూపరిషత్‌, శివసేన, ఇతరులు రానున్న రోజుల్లో మరింత ఆజ్యాన్ని పోస్తామని ప్రకటించారు.బాబరీ మసీదు స్ధల వివాదంపై సత్వరమే కోర్టు తీర్పు రాకుండా న్యాయమూర్తులను కాంగ్రెస్‌ బెదిరించిందంటూ ప్రధాని నరేంద్రమోడీ ఇదే సమయంలో ఎన్నికల సభల్లో ఆరోపించారు. వారికి అంత సీను వుంటే మూడు ముక్కలు చేసి ఒక ముక్కను ముస్లింలకు రెండు ముక్కలను హిందువులకు ఇవ్వాలని 2010లో తీర్పు చెప్పిన అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులనే ప్రభావితం చేసి వుండేవారు ఏదీ దొరక్క ఆధారం లేని ఈ సాకును ప్రధాని ఎంచుకున్నారన్నది స్పష్టం. మరో విధంగా చెప్పాలంటే హిందూత్వశక్తులు ప్రకటించిన ఆందోళనకు మద్దతు తెలపటమే.

హిందూత్వ సంస్ధలు ప్రకటించినట్లుగా మరోసారి రామాలయ నిర్మాణాన్ని వుత్తరాదిన ముందుకు తెస్తున్నారు. దక్షిణాదిన శబరిమల అయ్యప్ప పేరుతో ఒక ఒక అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. బిజెపి మతోన్మాదంతో కాంగ్రెస్‌ కూడా పోటీపడుతూ ఓట్ల కోసం రెండు సమస్యల్లోను మతాన్ని ముందుకు తెస్తోంది. మతోన్మాద బిజెపిని ఎదిరించాలంటే కాంగ్రెస్‌ను కలుపుకోవాలని సలహాలు ఇస్తున్న వారు ఒకసారి అవలోకనం చేసుకోవటం మంచిది. అయోధ్య, అయ్యప్ప రెండు ఆందోళనల నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ శక్తులే. గతంలోనూ తాజాగా శివసేన కూడా వారితో పోటీ పడుతోంది.ఆదివారం నాడు అయోధ్యలో నిర్వహించిన ధర్మ సభ సందర్భంగా రాష్ట్ర బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేసింది. శివసేననేత వుద్దావ్‌ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.

దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.

పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. తీర్పు రాక ముందే బాబరీ మసీదు స్ధల తీర్పు ఎలా వుండాలో నిర్దేశిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి? అసలు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు, ఆ స్ధలం పూర్తిగా తమదే అని త్వరలో రామాలయ నిర్మాణ తేదీని ప్రకటిస్తామని విశ్వహిందూ పరిషత్‌ నేతలు ప్రకటించారు. అంటే కరసేవ ముసుగులో బాబరీ మసీదును కూల్చివేసినట్లుగా యోగి సర్కార్‌ మద్దతుతో వివాదాస్పద స్ధలంలో రామాలయ నిర్మాణం చేపడతారా ?

సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును కూగా గమనంలోకి తీసుకొని 2010లో అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్‌ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘపరివార్‌ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాటి ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్‌ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్‌ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్‌ నేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ?నెపాన్ని కోర్టులు, న్యాయమూర్తుల మీద, కాంగ్రెస్‌ మీద మోపే యత్నం తప్ప బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.నేతల మాటల తూటాలను చూస్తే అవి ఎన్నికల్లో ఓట్లగాలం అన్నది స్పష్టం.

మతోన్మాద రాజకీయాల్లో బిజెపితో పోటీ పడుతున్న శివసేన నేత వుద్దావ్‌ ధాక్రే భార్య, కుమారుడితో సహా వచ్చి అయోధ్యలోని బాబరీమసీదు స్ధలంలోని వివాదాస్పద రాముడి విగ్రహాన్ని సందర్శించారు. మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ తేవాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రామాలయ నిర్మాణ అవకాశాలను చూస్తామంటున్నారు మీరు, గత నాలుగు సంవత్సరాలలో ఎన్నింటిని చూశారు, ఈ ప్రభుత్వం నిర్మాణం చేయకపోతే తరువాత ఎవరు చేస్తారు, ప్రభుత్వ ఏర్పాటు కాదు మందిరాన్ని త్వరగా నిర్మించాలి అని వుద్ధావ్‌ థాక్రే వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఆఖరి పార్లమెంటు సమావేశాలివే, అందువలన ఆర్డినెన్స్‌ తీసుకురండి, ఏమైనా చేయండి సాధ్యమైనంత త్వరలో ఆలయ నిర్మాణం చేయండి. నేను రామ్‌లాలా విగ్రహదర్శనానికి వెళితే ఒక జైల్లో ప్రార్ధనలకు వెళ్లినట్లుగా వుంది తప్ప మరొక విధంగా నాకు అనిపించలేదు. నాకు ఎలాంటి చాటు మాటు అజెండా లేదు, రామాలయాన్ని ఎపుడు కడతారని ఈదేశ హిందువులు అడుగుతున్నారు, ఎంతకాలం వేచి వుండాలి, కనుచూపు మేరలో మందిరం కనిపించటం లేదు,ఎప్పుడు దాన్ని చూస్తాము అని ధాకరే ప్రశ్నించారు. హిందువులింకేమాత్రం మౌనంగా వుండరు, కచ్చితంగా ఏ తేదీన నిర్మాణాన్ని ప్రారంభిస్తారో చెప్పండి, దాన్ని మీ నుంచి తెలుసుకొనేందుకే నేను ఇక్కడకు వచ్చాను అన్నారు. శివసేన అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బిజెపితో కలసి అధికారాన్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే.

రామాలయ ఆందోళనలో శివసేన పాత్ర లేదు, రామలాల విగ్రహాలను క్షణకాల సందర్శనకు వుద్ధావ్‌ ధాక్రేకు ఎలాంటి సమస్య లేదు, కానీ బాలాసాహెబ్‌ థాక్రే బతికి వుంటే వుద్ధావ్‌ చేస్తున్న వాటిని నిరోధించి వుండేవాడు, ధర్మసభ ఏర్పాటులోనూ శివసేనకు ఎలాంటి పాత్ర లేదు బాలాసాహెబ్‌ బతికి వుంటే విశ్వహిందూపరిషత్‌కే మద్దతు ఇచ్చి వుండేవాడు అని యుపి వుపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు. రామాలయ సమస్యను శివసేన ఎలా హైజాక్‌ చేస్తుంది, వుత్తరాది వారి మీద దాడి చేసి వారిని వెళ్లగొట్టిన జనాలు వారు, మానవాళికి సేవచేయాలనే మానసిక స్ధితి కూడా లేని వారు రాముడిని ఎలా సేవించగలరు అని బిజెపి ఎంఎల్‌ఏ సురేంద్ర సింగ్‌ శివసేన నేత మీద విరుచుకుపడ్డారు. ఎన్నికలున్నందున ప్రతివారూ అయోధ్య వెళుతున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా వుద్దావ్‌ థాక్రేను వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు. ఒక వైపు వారు బిజెపి స్నేహితులు మరొకవైపు తాము రామాలయ నిర్మాణం పట్ల ఆసక్తితో వున్నామని, ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతూ జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయలేరు అని కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

కేసు సుప్రీం కోర్టులో వుంది. దాని తీర్పు కోసం వేచి చూడాలి లేదా ఏకాభిప్రాయాన్ని సాధించాలి, ప్రభుత్వానికి చాలా స్ధలం వుంది. సరయూ నదీ తీరంలో రామాలయాన్ని నిర్మించవచ్చు. వివాదాస్పద స్ధలం గురించి ఎలాంటి చర్చలు వద్దు అని ప్రగతిశీల సమాజవాది పార్టీ (లోహియా) నేత శివపాల్‌ యాదవ్‌ అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదంటే నరేంద్రమోడీది అని చెబుతారు.182 మీటర్ల వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ రాజకీయాల్లో మోడీతో పోటీ పడుతున్న యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అంతకంటే పెద్దదైన 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని నెలకొల్పి రికార్డును తన పేరుతో నెలకొల్పాలని చూస్తున్నారు. ఆదివారం ధర్మ సభకంటే ముందు ఒక రోజు హడావుడిగా విగ్రహ ప్రకటన చేయటం గమనించాల్సిన అంశం. విగ్రహాన్ని 50 మీటర్ల ఎత్తు దిమ్మె మీద ఏర్పాటు చేస్తారు. విగ్రహం 151 మీటర్లు కాగా మరో 20 మీటర్ల గొడుగు దాని మీద ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎక్కడ, ఎంత ఖర్చుతో ఏర్పాటు చేస్తారో వివరాలు వెల్లడించలేదు.

ఓట్లకోసమే అయోధ్య, అయ్యప్ప ఆందోళనల్లో సంఘపరివార్‌ !

Tags

, , , ,

Image result for vote politics behind ayodhya,ayyappa stirs

ఎం కోటేశ్వరరావు

దేశంలో వుత్తరాదిన ప్రారంభం కానున్న ఒక ఆందోళన. దక్షిణాదిన జరుగుతున్న ఒక అరాచకం. రెండింటి నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ శక్తులే. నవంబరు 25న ధర్మ సభ పేరుతో ఆయోధ్యలో నిర్వహించే కార్యక్రమానికి విశ్వహిందూపరిషత్‌ ఒక లక్ష మందిని, ఆర్‌ఎస్‌ఎస్‌ మరో లక్షమందిని సమీకరించనున్నట్లు ప్రకటించాయి. వారి నుంచి అయోధ్య-ఫైజాబాద్‌ జంటనగరాలలోని మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం వుందనే సమాచారంతో రాష్ట్ర బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేస్తోంది. శివసేననేత వుద్దావ్‌ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. తాను రామభక్తుడిగా ఆ రోజు అయోధ్యకు వస్తానని తనను ఎవరు ఆపుతారో చూస్తానన్నట్లుగా థాకరే ప్రకటించాడు. డిసెంబరు తొమ్మిదిన ఢిల్లీలో సభ తరువాత దేశ వ్యాపితంగా ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు.

మరొకటి శబరిమల. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఆలయ సందర్శనకు వస్తున్న హిందూ మతానికి చెందిన మహిళలను కూడా తాము రానిచ్చేది లేదంటూ ఆ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న సంస్ధల నుంచి తలెత్తిన ముప్పును నివారించేందుకు, భక్తుల ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని అడ్డుకొనేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం 144వ సెక్షన్‌ ప్రకటించింది. అయోధ్యలో ఆంక్షల గురించి పల్లెత్తు మాట్లాడని వారు శబరిమల విషయంలో ప్రభుత్వం భక్తులను అడ్డుకుంటున్నట్లు నానా యాగీ చేస్తున్నారు.దొంగే దొంగని అరవటం అంటే ఇదేనేమో !

దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.

పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. దశాబ్దకాలం పాటు సాగిన కోర్టు విచారణలో తమ వాదనలకు అనుకూలంగా వున్న నిషేధ ఆధారాలను సమర్పించటంలో విఫలమయ్యారు. రెండు వందల సంవత్సరాల నాడే బ్రిటీష్‌ పాలకుల హయాంలో పిల్లలను కనే వయసులో వున్న మహిళలకు ఆలయ ప్రవేశ నిషేధం వున్నట్లు ఆధారాలు దొరికాయని ఇటీవల ఒక పెద్దమనిషి ప్రకటించాడు. నిజానికి అదేమీ కొత్త అంశం కాదు. అన్ని వయసుల వారినీ ఆలయ ప్రవేశానికి అనుమతించాలన్న మెజారిటీ తీర్పును వ్యతిరేకించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా ఆ అంశాన్ని తన వ్యతిరేక నోట్‌లో పేర్కొన్నారు. వాటన్నింటినీ పరిశీలించిన తరువాతే ఆ తీర్పు వెలువడింది. అయినా ఇదేదో కొత్తగా కనుగొన్న అంశం మాదిరి మీడియాలో పెద్ద ఎత్తున ఆ వార్తలకు ప్రాచుర్యం కల్పించటం గమనించాల్సిన అంశం. నిజంగా అలాంటి పక్కా ఆధారాలు వున్నపుడు వాటి మీద విశ్వాసం వున్నవారు వెంటనే సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను విరమించాలి. కోర్టులో అనేక పునర్విచారణ పిటీషన్లు దాఖలయ్యాయి, వాటిని పరిశీలించేందుకు కోర్టు కూడా అంగీకరించినందున ఆ సమయంలో తమకు దొరికిన బలమైన సాక్ష్యాన్ని కోర్టుకు సమర్పించి తీర్పును తిరగరాయమని కోరవచ్చు. కానీ ఆపని చేయటం లేదు, అందుకోసమే ఓట్ల కోసం రాజకీయం చేయాలన్న నిర్ణయం ప్రకారం నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Image result for vote politics behind ayyappa stirs

బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? ఈనెల 25నుంచి దేశవ్యాపితంగా తలపెట్టినట్లు చెబుతున్న ఆందోళనల అసలు లక్ష్యం ఏమిటి? ఇలా పరిపరి విధాలుగా తలెత్తుతున్న అంశాలను కూడా జనం ఆలోచించాలి. బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి?

సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును ప్రాతిపదికగా చేసుకొని 2010లో అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్‌ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘపరివార్‌ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాడు జరిగే ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్‌ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్‌ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్‌ నేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ? లేదా బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.