హిందుత్వ పేరుతో హత్యపై సంబరాలు నీచం !

Tags

, , , ,

                                                          వాడ్రేవు చిన వీర భద్రుడు

మృత్యువును చూసి కాదు నేను

జీవితాన్ని చూసి జంకుతున్నాను

హంతకుని కత్తి చూసి కాదు, కనుల ద్వేషం

చూసి జంకుతున్నాను

మనసులోని క్రౌర్యం చూసి జంకుతున్నాను

బైరాగి ( ఆగమగీతి:నాకు చావులేదు)

గౌరీ లంకేష్‌ హత్య ఒక విషయాన్ని చాలా బిగ్గరగా, మనం ఎక్కడ వినకుండా పోతామో అన్నంత బిగ్గరగా, మన చెవులు చిల్లులు పడేట్లుగా, భరించలేనంతగా ఘోషిస్తోంది. అదేమంటే: మనం రాజకీయంగా సరే, సాంస్కృతికంగా కూడా పతనం అంచులకు చేరుకున్నామని.

రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత ఇంటికి వస్తున్న జర్మన్‌ సైనికులకు( ఇంటికి తిరిగి రాగల అదృష్టం నోచుకున్నవాళ్లు) తమ పదజాలమంతా హఠాత్తుగా మాయమైనట్లు అనిపించిందట.’దేశం’, ‘కుటుంబం’, ‘మనిషి’, ‘ప్రేమ’, ‘మానవ సంబంధాలు’ ఈ మాటలకు అర్ధం లేదని అనిపించిందట.

గౌరిని హత్య చేసిన మర్నాడే హత్యను ఖండించకపోగా, మరణానికి చింతించకపోగా, ఈ అమానుషాన్ని ప్రతి ఒక్కరూ తమ మీద తీసుకొని ఎంతో కొంత ప్రాయచిత్తం ప్రకటించకపోగా, సోషల్‌ మీడియాలో నడచిన, నడుస్తున్న కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి, భయపెడుతున్నాయి. మనం ఏ దేశంలో వున్నాం ? ఏ విలువల గురించి ఇంతకాలం గర్విస్తూ వచ్చాం? ప్రాచీన కాలం నుంచి ఎవరిని ఆదర్శాలుగా ప్రకటించుకుంటూ వచ్చాం? నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ చేసిన హత్యకన్నా, నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ మాట్లాడుతున్న ఈ మాటలు నన్నెక్కువ కలవరపెడుతున్నాయి.

దుర్మార్గమైన ఈ రాతలు చదివి ఎందరో యువతీ యువకులు, ముక్కుపచ్చలారని పిల్లలు తామేదో మహత్తర హిందూ సంస్కృకి వారసులమని, తమ మతానికి సంస్కృతికి ఏదో పెద్ద ప్రమాదం వాటిల్లుతోందని, అలాంటి ఒక ప్రమాదకరమైన మనిషిని చంపేస్తే వీళ్లంతా ఎందుకిట్లా ఖండిస్తున్నారని, దు:ఖిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చెప్తారు వీళ్లకి ? ఈ రాజకీయ శక్తులు మాట్లాడుతున్న హిందుత్వానికి, అనాది కాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవన విధానానికి సంబంధమే లేదని, అసలు ‘హిందుత్వం’ వేరు, హిందూ జీవన విధానం వేరని, అసలు హిందూ మతమంటూ ఒకటి లేనే లేదని, అసలు అటువంటి మతమంటూ ఒకటుందని అనుకున్నా ఇలాంటి అమానవీయ మిలిటెంట్‌ ధోరణుల్ని అది గతంలో ఇంత నిస్సిగ్గుగా చూపించి వుండలేదని, ఇప్పటి ఈ దుర్మార్గ స్వరూపం గ్లోబల్‌ పెట్టుబడికి, రాజకీయ కట్టుకథకి పుట్టిన విష పుత్రిక అని ఎప్పుడు గుర్తిస్తారు !

మరొక మాట కూడా చెప్పాలి. నేను కూడా హిందువునే, కానీ నా మతానికి బయటి మతాల వలన ప్రమాదం వుందని నాకెప్పుడూ అనిపించలేదు. ఏమతమైనా ఆ మతం పేరు చెప్పకుండా దాన్ని అనుసరించలేని ఆత్మవంచన వల్ల, కాలక్రమంలో సంతరించుకొనే దురాచారం వల్ల ప్రమాదంలో పడుతుంది తప్ప బయటివాళ్ల వల్ల కాదు. ఏమతాన్నయినా కాపాడగలిగేది ఆ మతం ప్రబోధించే మంచి విషయాల్ని అనుసరించగలిగే వాళ్లేతప్ప రాజకీయ నాయకులు, గూండాలు కాదు.

నేనీ మాటలు రాస్తే నేను ఎదుర్కోబోయే ప్రశ్నలేమిటో కూడా నాకు తెలుసు. అన్నింటికన్నా ముందు అడిగే ప్రశ్న: మరి వామపక్ష తీవ్రవాదులు అమాయకుల్ని చంపితే నువ్వెందుకు మాట్లాడలేదు అని, కేరళలోనో మరోచోటనో ఎవరో ఎవరినో చంపుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదని. హింస ఎక్కడైనా హింసే, ఎవరు చేసినా హింసనే. కత్తితో కుడివైపు నుంచి పొడిచినా, ఎడమవైపు నుంచి పొడిచినా కారేది రక్తమే, దు:ఖమే. కానీ నేను ఈ దేశంలో ఇంతదాకా చూసిన హింసకి, ఈ హింసకీ పోలికనే లేదు. గతంలో ఎవరైనా ఎవరినైనా చంపితే ఎంతో కొంత పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవారు, చివరికి గాడ్సే కూడా తన వాంజ్మూలంలో గాంధీ పట్ల ఎంతో కొంత సానుభూతి చూపకుండా వుండలేకపోయాడు. కానీ ఈ హత్యని ఇట్లా సెలబ్రేట్‌(పండుగ) చేసుకుంటున్న హీన సందర్భాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా హిందూత్వం పేరిట.

ఆమె హత్యను ఎవరు ఖండించారన్నది కాదు, ఎవరు ఖండించలేదన్నది నన్నెక్కువ బాధ పెడుతున్నది. బహుశ చిదానంద రాజఘట రాసుకున్న జ్ఞాపకాలు చదివి వుండకపోతే ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా నా గొంతు పెగిలి వుండేది కాదు. మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు ‘మరణం ఒక అనుకోని ఘటన. మంచి వ్యక్తులు చేసిన దానికి, వారు దేనికోసం నిలబడ్డారనేదానికి గౌరవం, ప్రేమ మరియు ప్రశంస ముఖ్యం. వామపక్షవాది, తీవ్రవాది, హిందుత్వ వ్యతిరేకి, లౌకిక వాది తదితర ముద్రలన్నింటినీ మరచిపోండి, నావరకైతే అబ్బురమైన కారుణ్యం, హుందాతనాల సారం’.

పిల్లలూ చదవండి, మీకు నచ్చని ప్రతి ఒక్కరినీ నిర్మూలించుకుంటూ పోనక్కరలేదని తెలుస్తుంది. విబేధాలతో విడిపోయినా, స్నేహితులుగా కొనసాగటమెలానో తెలుస్తుంది.మనుషులుగా మిగలటం అన్నింటికన్నా ముఖ్యమని తెలుస్తుంది.

(ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ సౌజన్యంతో)

కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అయితే పాండవులు-కౌరవులనేమనాలి ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఇప్పటి వరకు సమాజ చరిత్ర మొత్తం వర్గపోరాటాల మయమే అని కారల్‌ మార్క్స్‌ భాష్యం చెప్పారు. దాన్నే మహాకవి శ్రీశ్రీ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మరింత సుబోధకంగా జనం ముందు పెట్టారు. విజేతలే ఎప్పుడూ చరిత్రను రాశారు. రెండు సంస్కృతులు సంఘర్షించినపుడు పరాజితులు రూపుమాసిపోతారు. విజేతలు తమ గొప్పతనాన్ని పెద్దదిగా చూపుతూ చరిత్ర పుస్తకాలు రాస్తారు, ఓడిపోయిన శత్రువు గురించి వాటిలో అగౌరవంగా చిత్రిస్తారు అని డాన్‌ బ్రౌన్‌ అనే పెద్దమనిషి చెప్పాడు.

ప్రపంచంలో దోపిడీ వ్యవస్ధ సంక్షోభానికి గురైనపుడల్లా మితవాద శక్తులు పెరిగాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా నాజీలైనా కమ్యూనిస్టులైనా ఒకటే ప్రాణాలు తీస్తారు, అలాంటపుడు నాజీలే మెరుగు అని జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. దోపిడీ శక్తుల సమాచార యుద్ధంలో ఇదొక ప్రధాన ఆస్త్రం. నమ్మకం లేదా ప్రచారంలో వున్నదాని ప్రకారం పద్దెనిమిది రోజుల పాటు మహాభారత యుద్దం జరిగింది. దానిలో కౌరవులు, పాండవులూ కత్తులు దూశారు. యుధిష్టిరుడు నష్టాల గురించి ధృతరాష్ట్రుడికి చెప్పినదాని ప్రకారం ఇరువైపులా 166 కోట్ల 20వేల మంది మరణించగా, 2,45,165 మంది మాత్రమే మిగిలారు. ఇంత మందిని బలి తీసుకున్నప్పటికీ మన సమాజం ఆ యుద్ధంలో పాండవుల పాత్రను హర్షిస్తూ, కౌరవులను విమర్శిస్తున్నది. చెడుపై మంచి సాధించిన విజయంగా కీర్తిస్తున్నది. పెద్ద సంఖ్యలో జనం మరణించారు గనుక పాండవులు, కౌరవులు ఇద్దరిదీ తప్పే, ఇరు పక్షాలూ దుర్మార్గమైనవే అనటం లేదు. పాండవులు-కౌరవులను ఒకే గాటన కట్టకూడదన్నపుడు కమ్యూనిస్టులు-నాజీలను ఒకే గాటన ఎలా కడతారు.

1848లో వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళికతో దోపిడీ వర్గానికి సరికొత్త ప్రతిఘటన ప్రారంభమైంది. అది ఒక రాజుపై మరొక రాజు, ఒక అధికార(పాలకవర్గ) పార్టీపై మరొక పార్టీ మధ్య జరిగే పోరు, ప్రతిఘటన కాదిది. కనుకనే అప్పటి నుంచి చరిత్రను దోపిడీ వర్గమే కాదు, దోపిడీకి గురయ్యే వర్గం కూడా తన దృక్పధంతో సమాజం ముందుంచుతోంది. మార్క్స్‌కు ముందు, తరువాత చరిత్ర రచనలో వచ్చిన మౌలిక మార్పు ఇది. ప్రస్తుతం మన దేశంలో అధికార వ్యవస్ధలో పైచేయి సాధించిన కాషాయ దళాలు ఇప్పటి వరకు మన ముందుంచిన చరిత్రను నిరాకరిస్తూ తిరగరాసేందుకు, వాస్తవాల ప్రాతిపదికన కాకుండా మతం, విశ్వాసాల ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది వాస్తవానికి దగ్గరగా వుందన్నదే జనం తేల్చుకోవాల్సింది.

ఐరోపాను ఒక దయ్యం వణికిస్తోంది, అదే కమ్యూనిజం అని మార్క్స్‌-ఎంగెల్స్‌ 168 సంవత్సరాల క్రితం చెప్పారు. సోషలిజం-కమ్యూనిజాలపై విజయం సాధించాం, అదింక కోలుకోలేదు అని పాతిక సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీవర్గం ప్రకటించుకుంది. అదే నిజమైతే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా కమ్యూనిస్టు భావజాలంపై దాడి, మ్యూనిస్టు వ్యతిరేక ప్రదర్శనలు, ప్రపంచ కమ్యూనిస్టు వ్యతరేక సమావేశాలు ఎందుకు జరుపుతున్నట్ల్లు ?

రెండవ ప్రపంచ యుద్ధం ముగస్తున్న దశలో ఐరోపా భవిత్యం గురించి 1945 ఫిబ్రవరి 4-11 తేదీలలో జరిగిన యాల్టా సమావేశంలో పొల్గొన్న చర్చిల్‌-రూజ్‌వెల్ట్‌- స్టాలిన్‌. నాజీజం-కమ్యూనిజం ఒకటే అయితే దానికి జర్మనీ నాజీ ప్రతినిధులను ఎందుకు పిలవలేదు ?

ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన నాజీజం, హిట్లర్‌ పీచమణిచి ఆ ముప్పు తప్పించిన శక్తులకు నాయకత్వం వహించింది స్టాలిన్‌. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా నాటి సోవియట్‌ యూనియన్‌-హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ మధ్య 1939 ఆగస్టు 23న నిర్యుద్ధ సంధి జరిగింది.అది సోవియట్‌-జర్మనీ మధ్య ఆ ప్రాంత ఐరోపా దేశాలను విభజించుకొనేందుకు జరిగిన ఒక చీకటి ఒప్పందం, దాని వలన కోట్లాది మంది జనం ప్రాణాలు కోల్పోయారంటూ సోషలిజం-నాజీశక్తులను ఒకే గాటన కడుతున్నారు. దానిలో భాగంగానే ఆ సంధి వలన ప్రాణాలు కోల్పోయినవారు, బాధితులను స్మరించుకొనే పేరుతో 2009 ఏప్రిల్‌ రెండున ఐరోపా పార్లమెంట్‌ చేసిన నిరంకుశపాలన వ్యతిరేక తీర్మానం మేరకు ని ప్రతి ఏడాది ఆగస్టు 23న ఐరోపాలోని కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఎస్తోనియా రాజధాని తాలిన్‌లో కమ్యూనిస్టు పాలకుల నేరాల పేరుతో ఐరోపా దేశాల న్యాయశాఖల మంత్రుల సమావేశం జరిపారు. తమ దేశ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వున్నందున ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రీస్‌ మంత్రి ప్రకటించారు. ఐరోపా చారిత్రాత్మక జ్ఞాపకాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదని ఐరోపా వామపక్ష పార్టీ పేర్కొన్నది. పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌ అయిన ఎస్తోనియాను అటువంటి సమావేశానికి వేదికగా చేసుకోవటం సైద్ధాంతిక లక్ష్యం కోసమే అని పేర్కొన్నది. గ్రీకు మంత్రి బహిష్కరణ నిర్ణయాన్ని ఎస్తోనియా పార్లమెంట్‌ సభ్యురాలు వుడెక్కి లూనే సమర్ధిస్తూ ఒక లేఖ రాశారు. ఆ సమావేశాన్ని నిర్వహించటమంటే ప్రస్తుత ఎస్తోనియా రాజకీయాలు నాజీజాన్ని పరోక్షంగా సమర్ధించటమే అని పేర్కొన్నారు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ విజయాన్ని మేతొమ్మిదవ తేదీన జరపాలన్న తన నిర్ణయంపై అనేక మంది జర్నలిస్టులు, రాజకీయవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని, అదే సమయంలో మద్దతు కూడా లభించిందని లూనే పేర్కొన్నారు.

ఎస్తోనియా అధ్యక్షతన రెండవ సారి జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక సమావేశాన్ని సిపిఎం, సిపిఐతో సహా 83కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు ఒక ప్రకటనలో ఖండించాయి. ఫాసిజాన్ని కమ్యూనిజంతో సమంచేసి చెప్పటం రెచ్చగొట్టటం, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ద గర్బంలో జన్మించిన ఫాసిజాన్ని నిర్దోషిగా ప్రకటించటం తప్ప మరొకటి కాదని, ఈ కారణంగానే కమ్యూనిస్టులను ఖండించటం, హింసించటం, అనేక ఐరోపా దేశాలలో పార్టీలపై నిషేధం విధిస్తున్నారని అదే సమయంలో నాజీలతో కుమ్మక్కైన వారు, వారి రాజకీయ వారసులకు పెన్షన్లు ఇస్తున్నారని కమ్యూనిస్టుపార్టీల ప్రకటన పేర్కొన్నది. కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాలు పెరగటం అంటే ప్రజావ్యతిరేక చర్యలను తీవ్రతరం చేయటం, కార్మికుల హక్కులను పరిమితం చేయటం, సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాలకు తెరతీయటమే అని హెచ్చరించింది. మహత్తర అక్టోబరు విప్లవానికి వందేండ్లు నిండిన సందర్భంగా నిజాలు వెలుగులోకి వస్తాయని, టన్నుల కొద్దీ మట్టి చల్లి సోషలిస్టు వ్యవస్ధ గొప్పతనాన్ని మూసిపెట్టటం సాధ్యం కాదని, సంపదలను సౄష్టించే కార్మికులు దానిని తమ పరం చేసే సమాజం కోసం పోరాటాలు జరిపి సోషలిజం నుంచి కమ్యూనిజానికి పయనిస్తారని పేర్కొన్నది.

హిట్లర్‌ తమ పార్లమెంట్‌ భవనాన్నే తగుల బెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై వేశాడు. ప్రజల హక్కులను హరించటంతో పాటు కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1933లోనే ఆ దుర్మార్గానికి పాల్పడిన హిట్లర్‌ కమ్యూనిస్టు వ్యతిరేకత లోకవిదితం. తొలుత పక్కనే వున్న కమ్యూనిస్టు రష్యాను దెబ్బతీస్తే మిగతా ప్రపంచాన్ని చాపలా చుట్టి తన కింద వుంచుకోవచ్చని భావించిన హిట్లర్‌ అందుకు సన్నాహాలు చేసి సాకు, సమయం కోసం ఎదురుచూశాడు. ఆ తరుణంలో స్టాలిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ బలాబలాలను మదింపు వేసి, తగిన బలాన్ని సమకూర్చుకొనేందుకు, నాటి సామ్రాజ్యవాదుల మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొనేందుకు ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో స్టాలిన్‌ నిర్యుద్ధ సంధి చేసుకుంది తప్ప ఐరోపాను పంచుకొనేందుకు కాదు. అదే హిట్లర్‌ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సంధిని వుల్లంఘించి గురించి సోవియట్‌పై దాడికి దిగటం, ఆ దాడిలోనే పరాజయం, ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.అలాంటి హిట్లర్‌ – స్టాలిన్‌ను ఒకే గాటన కట్టటం దుర్మార్గం. ఐరోపాలోని బ్రిటన్‌, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఒకవైపు జర్మన్‌ సామ్రాజ్యవాదంతో వివాద పడుతూనే కమ్యూనిస్టు రష్యాను కూల్చివేసేందుకు హిట్లర్‌కు ఏ విధంగా మద్దతు ఇచ్చిందీ తెలిసిందే. చివరకు తమకే ముప్పు రావటంతో చేతులు కలిపారు తప్ప కమ్యూనిస్టులపై ప్రేమతో కాదు. హిట్లర్‌, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు,ఫాసిస్టులు తలెత్తటానికిి, బలపడటానికి అనుసరించిన విధానాల బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. స్టాలిన్‌-హిట్లరూ ఇద్దరూ ఒకటే అయితే స్టాలిన్‌తో ఎందుకు చేతులు కలిపినట్లు? తొలుత జర్మనీలో, తరువాత హిట్లర్‌ ఆక్రమించుకున్న పోలాండ్‌ తదితర దేశాలలోనే యూదుల మారణకాండ జరిగింది తప్ప కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వచ్చిన ప్రాంతాలలో అలాంటి వూచకోతలు జరగలేదు, దేశాలను ఆక్రమించుకోలేదు. అలాంటపుడు నాజీజం-సోషలిజం ఒకటే ఎలా అవుతాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు ఐరోపా దేశాలను నియంతృత్వశక్తుల చేతుల్లోకి నెట్టారన్నది ఇంకొక ఆరోపణ. కమ్యూనిస్టులను నియంతలుగా చిత్రించటం అంతకు ముందు జరిగిందీ తరువాత కొనసాగిస్తున్న పాత చింతకాయ పచ్చడి ప్రచారం తప్ప వాస్తవం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అసాధ్యం కావటంతో తన పెరటితోట వంటి దక్షిణ(లాటిన్‌) అమెరికాలోని ప్రతి దేశంలో, ఆసియాలో తన కనుసన్నలలో వున్న దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ వంటి చోట్ల మిలిటరీ నియంతలను నిలబెట్టి వాటిని దోచుకున్న అమెరికా చరిత్ర దాస్తే దాగుతుందా? ఆఫ్రికాలో అమెరికా మద్దతు లేని నియంత ఎవడైనా వున్నాడా ? గతంలో సోవియట్‌, తూర్పు ఐరోపా లేదా ఇప్పుడు చైనాగాని ఏ ఒక్క సైనిక నియంతకైనా మద్దతు ఇస్తున్న వుదంతం వుందా? అమెరికా, ఐరోపాలోని దాదాపు అన్ని దేశాలలో నయానాజీ శక్తులు తలెత్తుతున్నాయి, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి.

ఆగస్టు నెలలో అనేక అమెరికా నగరాలలో నయా నాజీ, ఫాసిస్టు శక్తులు రెచ్చిపోయి భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో జాత్యహంకారం, సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులు కూడా వాటి ప్రచారం, ప్రదర్శనలకు పోటీగా వీధులలోకి వస్తున్నాయి. చార్లెటిసవిలేలో జరిగిన దానికి ఇరు వర్గాలూ బాధ్యులే అని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించి నయానాజీలను వెనకేసుకు వచ్చాడు. స్వేచ్చాభిప్రాయ వెల్లడికి అవాకాశం ఇవ్వాలని కోరుతూ బర్కిలీలో జాత్యహంకారులు చేసిన ఒక ప్రదర్శన సందర్బంగా జాత్యంహంకారులు కొందరిని వామపక్ష ప్రదర్శకులు కొట్టారని, చూడండి వామపక్ష మద్దతుదారులు ఎలా దాడులకు పాల్పడుతున్నారో అంటూ వాషింగ్టన్‌ పోస్టు వంటి పత్రిలు గోరంతను కొండంతగా చిత్రించాయి.ముందే చెప్పుకున్నట్లు ప్రచార యుద్దంలో ఇదొక భాగం !

నేరగాడు గుర్మీత్‌: కాంగ్రెస్‌ాబిజెపి బాధ్యత ఎంత ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !

 

లాటిన్‌ అమెరికాలో మరో కొత్త వామపక్ష పార్టీ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ప్చ్‌ ! కమ్యూనిస్టుల పని అయిపోయింది, కమ్యూనిజానికి కాలం చెల్లింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు విన్న పాత తరంలో కొందరికి నిజమేనేమో అని పిస్తోంది. అసలు కమ్యూనిజం గురించి తెలియని కొత్త తరంలో కాస్త బుర్రవున్న వారికి అసలు కమ్యూనిజం అంటే ఏమిటి, అదేమి చెప్పింది అనే కొత్త ఆలోచన కలుగుతోంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు దేశాలను కూల్చివేసిన తరువాతే కదా లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో, దక్షిణాఫ్రికా, నేపాల్‌లో వామపక్షాలు, కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ 2008 నుంచి తీవ్ర సంక్షోభంలో మునిగి ఎప్పుడు ఒడ్డుకు చేరుతుందో ఇంకా తెలియని స్ధితిలో చైనా సోషలిస్టు వ్యవస్ధకు అలాంటి దెబ్బ తగలలేదేం? నూరు పూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి !

కమ్యూనిస్టులను అణగదొక్కాం, సోషలిజంపై విజయం సాధించాం అని చెప్పుకున్నది అమెరికా. కొలంబియా దాని వుపగ్రహ దేశంగా వుంది. తాము గతంలో అనుసరించింది, భవిష్యత్‌ మార్గదర్శి మార్క్సిజం అని బహిరంగంగా చెప్పుకొనే గెరిల్లా సంస్ధ కొలంబియాలోని ఎఫ్‌ఏఆర్‌సి. అలాంటి దానితో ప్రభుత్వం రాజీకి ఎందుకు వచ్చిందో ఎవరైనా చెప్పగలరా? ఐదు కోట్ల జనాభా వున్న ఆ దేశంలో గత ఐదున్నర దశాబ్దాలుగా సాయుధ పోరాట పంధాలో సాగిన కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌ఏఆర్‌సి) సెప్టెంబరు ఒకటవ తేదీన ‘కొలంబియా విప్లవ ప్రత్యామ్నాయ శక్తి ‘ పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నాయి. ఇంతకాలం వారికి అనేక విధాలుగా మద్దతు ఇచ్చిన క్యూబా,వెనెజులా తదితర దేశాల మధ్యవర్తిత్వంలో కుదిరిన హవానా ఒప్పందం ప్రకారం కొలంబియా పార్లమెంట్‌ ఎఫ్‌ఏఆర్‌సిని ఒక రాజకీయ పార్టీగా గుర్తించటం, అదే సమయంలో ఆ సంస్ధ ఆయుధాలను విసర్జించి రాజకీయ రంగంలోకి రావటం ఒకేసారి జరిగాయి. గెరిల్లాలు తమ వద్ద వున్న ఆయుధాలను అప్పగించి గతవారంలో సాధారణ జీవితంలో ప్రవేశించారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఇలాంటి గెరిల్లా సంస్ధలు సాయుధబాటను వీడి పార్లమెంటరీ రాజకీయాలలో ప్రవేశించి అధికారానికి వచ్చిన పూర్వరంగంలో కొలంబియా పరిణామాలను చూడాల్సి వుంది.

ఇప్పటికీ లాటిన్‌ అమెరికాలో విప్లవశక్తులకు స్ఫూర్తినిస్తున్న సైమన్‌ బొలివర్‌ అవిభక్త స్వతంత్ర కొలంబియా తొలి అధ్యక్షుడు. స్పెయిన్‌ వలస పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఆయన నాయకత్వంలో సాగిన కృషి ఈనగాచి నక్కల పాలైనట్లు తరువాత కాలంలో మితవాద, మిలిటరీశక్తుల పరమైంది. అవి భక్త కొలంబియా నుంచి కొలంబియా, వెనెజులా, ఈక్వెడోర్‌, పెరు, పనామా ఏర్పడ్డాయి. కొలంబస్‌ కనుగొన్న ప్రాంతం కనుక కొలంబియా అని పిలిచారు. పోరు వారసత్వం కలిగిన కొలంబియాలో 1950 దశకంలో గ్రామీణ ప్రాంతాలలో రైతాంగాన్ని భూములనుంచి బలవంతంగా వెళ్లగొట్టి అమెరికన్‌ కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు పూనుకున్న ప్రభుత్వ, కార్పొరేట్‌ గూండాల దాడులను అడ్డుకున్నారు. అందుకోసం కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మరక్షణ దళ వ్యవస్ధ 1960 దశకంలో ఒక సంఘటిత సాయుధ గెరిల్లా దళ సంస్ధ ఎఫ్‌ఏఆర్‌సి ఆవిర్భావానికి దారితీసింది. అప్పటి నుంచి మిలిటరీ, మాదక ద్రవ్యాల మాఫియాలు, అన్ని రకాల సంఘవ్యతిరేకశక్తుల దాడుల నుంచి తట్టుకొని నిలవటమేగాక పటిష్టం కావటం, లాటిన్‌ అమెరికాలో ప్రజావ్యతిరేక మితవాద పాలకపార్టీలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పూర్వరంగంలో అక్కడి పాలకవర్గం విప్లవ సంస్ధతో రాజీకి అంగీకరించాల్సి వచ్చింది. అనివార్యమై ఆయుధాలు పట్టిన ఎఫ్‌ఏఆర్‌సి సాయుధ కార్యకలాపాలతో పాటు బహిరంగ రాజకీయ కార్యకలాపాలలో పాల్గనేందుకు గతంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మూడు దశాబ్దాల క్రితం ఆయుధాలను విసర్జించకుండానే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని దేశ భక్త ఫ్రంట్‌ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టుపార్టీతో 1984-87 మధ్య ఎన్నికలలో పాల్గని అనేక విజయాలు కూడా సాధించింది. అయితే బహిరంగ కార్యకలాపాలలో వున్న అనేక మంది కార్యకర్తలను ప్రభుత్వం, దాని కనుసన్నలలో మెలిగే మాఫియా శక్తులు హతమార్చటంతో ఆ విధానానికి స్వస్ది చెప్పి తిరిగి సాయుధ చర్యలను ప్రారంభించింది. క్యూబా, వెనెజులా వంటి దేశాలు, కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల మద్దతు వున్నప్పటికీ కొలంబియాలో వున్న పరిస్ధితుల నేపధ్యంలో సాయుధ పోరాట మార్గానికి స్వస్తి చెప్పాలని ఎఫ్‌ఏఆర్‌సి నాయకత్వంలో వచ్చిన ఆలోచన, పాలకవర్గాలు దిగివచ్చిన కారణంగానే గత నాలుగు సంవత్సరాలుగా సాగిన శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పవచ్చు.

ఎఫ్‌ఏఆర్‌సి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి ఎన్నికలలో పాల్గనేంతవరకు పార్లమెంట్‌ వుభయ సభలలో ఐదుగురి చొప్పున 2023వరకు ఎన్నికతో పని లేకుండా ఆ పార్టీ ప్రతినిధులు వుంటారు. ఆ లోగా జరిగే ఎన్నికలలో అంటే 2018లో అది సాధించుకొనే సీట్లు అదనం. త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు మహాసభను జరిపి లాంఛనంగా ‘కొలంబియన్‌ రివల్యూషనరీ ఆల్టర్‌నేటివ్‌ ఫోర్సెస్‌'(కొలంబియా ప్రత్యామ్నాయ విప్లవ శక్తి) అని పార్టీకి నామకరణం చేయనున్నట్లు శాంతి చర్చలలో ప్రధాన పాత్ర పోషించిన ఇవాన్‌ మార్క్వెజ్‌ ప్రకటించారు. గతంతో తాము తెగతెంపులు చేసుకోబోవటం లేదని, ఎల్లపుడూ విప్లవ శక్తులుగానే వుంటామని చెప్పారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన కొలంబియా కమ్యూనిస్టుపార్టీ 22వ మహాసభలో అనేక మంది ఎఫ్‌ఏఆర్‌సి నేతలు పాల్గన్నారని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు టెలిసుర్‌ టీవీ వెల్లడించింది. దేశంలో శాంతిని పరిరక్షించే క్రమంలో వామపక్షాల తరఫున ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్ధిని నిలుపుతామని కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు జైమే కేసెడో టురియాగో చెప్పినట్లు వార్తా సంస్ధలు పేర్కొన్నాయి.’ వామపక్షం విస్తరిస్తోంది, నూతన శక్తులు వునికిలోకి వస్తున్నందున మరింతగా విస్తరిస్తూనే వుంటుంది. దానిని మరింత విస్తరింప చేసి ఐక్యతా సృహను పెంచటమే మేము ఇప్పుడు చేయాల్సింది’ అని కెసెడో వ్యాఖ్యానించారు. మహాసభకు గెరిల్లా సంస్ధ ప్రతినిధులుతో పాటు అనేక సామాజిక వుద్యమాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కొలంబియా కమ్యూనిస్టులు, గెరిల్లా సంస్ధలపై గత యాభై సంవత్సరాలలో స్ధానిక పాలకులు, అమెరికా కనుసన్నలలో పని చేసే మీడియా, అనేక సంస్ధలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశాయి. వారిని టెర్రరిస్టులుగా చిత్రించారు, పోలీసు, మిలిటరీ బలగాలతో పాటు మాదక ద్రవ్యాల మాఫియా, ఇతర సంఘవ్యతిరేక శక్తులు, కమ్యూనిస్టు వ్యతిరేకులను వుపయోగించుకొని దాడులు చేశారు. వేలాది మంది కార్యకర్తలు,నేతలను బలితీసుకున్నారు. మాఫియా సంస్ధలు చేసిన దాడులు,హత్యాకాండను కూడా గెరిల్లాలు, కమ్యూనిస్టులకు అంటగట్టారు. వేలాది కుటుంబాలు అనేక అగచాట్లకు గురయ్యాయి. ఈ పూర్వరంగంలో ఎఫ్‌ఏఆర్‌సితో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఓటింగ్‌లో పాల్గన్న సగం మంది శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారంటే అక్కడి ప్రజల్లో వున్న కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించే శక్తులు ఎఫ్‌ఏఆర్‌సిని రెచ్చగొట్టేందుకు శాంతి ఒప్పందం కుదిరిన నాటి నుంచి ఆయుధాలు అప్పగించే ముందు రోజు వరకు ఎనిమిది మంది గెరిల్లా దళ సభ్యులను హత్య చేశాయి. గెరిల్లాలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారు నిరాయుధులుగా బయటకు వస్తుండటంతో ఆ ప్రాంతాలకు మితవాద సాయుధ శక్తులు చేరుతున్నాయి. స్ధానిక కార్యకర్తలు, జనాలను భయభ్రాంతులకు గురిచేసి దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ శక్తులకు గతంలో ప్రభుత్వమే గెరిల్లాలపై దాడులకు శిక్షణ ఇచ్చి పెంచి పోషించింది. అధికారిక గణాంకాల ప్రకారమే 2016 జనవరి నుంచి 2017 మార్చి ఒకటవ తేదీ వరకు 156 మంది సామాజిక, మానవ హక్కుల నేతలకు హత్యకు గురయ్యారు. గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాదిలో మే నెల వరకు 41 మంది హత్యకు గురికావటం ఎక్కువ, ఆందోళనకరం అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్ధ పేర్కొన్నది. శాంతి ఒప్పందంలో పేర్కొన్న సదుద్ధేశ్యాలను ఆచరణలోకి తీసుకురావటం అతి పెద్ద సవాలని, దానిని ఎదుర్కోవటంలో విఫలమై సమర్ధవంతంగా అమలు జరపకపోతే ఒక దేశంగా కొలంబియా మనుగడే ప్రమాదంలో పడుతుందని ఎఫ్‌ఏఆర్‌సి సభ్యుడు లూకాస్‌ కార్వజెల్‌ చేసిన వ్యాఖ్యకు ఎంతో ప్రాధాన్యత వుంది.కొన్ని మీడియా సంస్ధల అధిపతులు, ప్రజాభిప్రాయాన్ని మలిచేవారిగా పాత్ర పోషిస్తున్న కొందయి తమకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని స్పష్టంగా గమనించవచ్చని లూకాస్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి గురించి మేము చర్చ ప్రారంభిస్తే వెంటనే దేశంలో మీరే పెద్ద భూ ఆక్రమణదారులని చెబుతారు, మాదకద్రవ్యాల గురించి మాట్లాడితే మీరే ప్రధాన వుత్పత్తిదారులంటారన్నారు. ఈ పూర్వరంగంలో కొలంబియా శాంతి పరిణామాలు, పరిమితులను చూడాల్సి వుంది.

 

.

 

రెండు విగ్రహాలుా-రెండు దేశాలుా- భావజాలం ఒక్కటే !

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

విగ్రహాలు మాట్లాడతాయా ! ఏం వినాయకుడి విగ్రహం పాలు తాగిందంటే నమ్మినపుడు మాట్లాడతాయంటే ఎందుకు నమ్మరు ? ఒక దేవుడు లేక దేవత, దేవదూత, దేవుని బిడ్డ, ఇలా వివిధ మతాలకు ప్రతీకలుగా మన ముందున్న వారు పాలు తాగటం, కన్నీరు, రక్తాలను కార్చటం వంటి మహిమల గురించి ప్రచారం చేయటానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం లేదు. మేకిన్‌ ఇండియా పిలుపులతో స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన వారు, ఇప్పటికే అలాంటి పరిశ్రమలలో దిగ్గజాలుగా వున్న వారు తమ ప్రచార, ప్రబోధ సైనికులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ పుష్కలంగా దేశం మీదకు వదులుతున్నారు. ఆ కంపెనీలకు ఎలాంటి సంక్షోభం వుండదు, లేఆఫ్‌లు, మూసివేతలు వుండవు. ఏ సందులో చూసినా వారు మనకు దర్శనమిస్తారు.

విగ్రహాలు మాట్లాడవు గానీ మాట్లాడిస్తున్నాయి, ప్రశ్నించేట్లు చేస్తున్నాయి, వుద్యమాలకు పురికొల్పుతున్నాయి, రచ్చ, రగడలు సృష్టిస్తున్నాయి, రాజకీయ, ప్రతిరాజకీయాలు చేయిస్తున్నాయి,కదనాలను రెచ్చగొడుతున్నాయి, కత్తులు దూయిస్తున్నాయి. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి, కష్టాల పాలు చేస్తున్నాయి. వాగ్దానాలను కుమ్మరింప చేస్తున్నాయి. ఏటికేడాది ఎంత ఎత్తు పెంచితే అంతగా లాభాలను కురిపిస్తున్నాయి. శ్రీశ్రీ అన్నట్లు ముందు దగా వెనుక దగా కుడిఎడమల దగా. విగ్రహాల రాజకీయాలను జనం అర్ధం చేసుకోలేకపోతే ఇంకా ఏం జరుగుతాయో తెలియదు.

పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట ఎంతటి సమస్యను సృష్టించిందో మనకు తెలిసిందే. పెత్తందారులకు ఆగ్రహం కలగకుండా వుండేందుకు, వారి మద్దతు కోసం చివరి వరకు పని చేసిన తెలుగుదేశం పాలకులు తాము చేసిన తప్పిదానికి, దళితులను ఇబ్బంది పెట్టి నష్టపరిచినందుకు గాను పెత్తందారుల లేదా పాలకపార్టీ లేదా వారి అడుగులకు మడుగులత్తిన దళిత నేతల నుంచి సామూహిక జరిమానాలు వసూలు చేసి సాంఘిక బహిష్కరణకు గురైన వారికి నష్టపరిహారం చెల్లించి వుంటే అలాంటి ఆలోచనలున్న మిగతా వారికి హెచ్చరికగా వుండేది. అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని చార్లెటోసివిలే పట్టణంలో శ్వేతజాతీయులు, వారి దురహంకారాన్ని వ్యతిరేకిస్తున్న వారి మధ్య జరిగిన వివాదంలో ఒక నల్లజాతి మహిళ మరణించింది. ఇప్పుడు అనేక నగరాలు, ప్రాంతాలలో విగ్రహాలు, చిహ్నాల తొలగింపుపై అనుకూల, వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.గరగపర్రులో బహిరంగ ప్రదేశంలో ఇతర విగ్రహాల పక్కనే అంబేద్కర్‌ను వుంచటాన్ని అంతరించిపోతున్న ఫ్యూడల్‌ భావజాల శక్తులు వ్యతిరేకించాయి.(వీరిలో రోజువారీ ఏదో ఒక పని చేస్తే తప్ప గడవని దళితేతరులు కూడా వుండటం విచారకరం.) అంబేద్కర్‌ దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక. తరతరాలుగా తమ దయాదాక్షిణ్యాలతో బతికిన వారు ఆత్మగౌరవాన్ని అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్ట రూపంలో ప్రదర్శించటాన్ని సహించలేని పెత్తందారీ శక్తుల ప్రభావానికి లోనైన వారు దళితుల మీద కత్తి గట్టి చివరికి తమకు తెలియకుండానే సాంఘిక బహిష్కరణ నేరానికి కూడా ఒడిగట్టారు.

అమెరికా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో బానిసత్వాన్ని కొనసాగించాలని తిరుగుబాటు చేసిన శ్వేతజాతి దురహంకారులు, దోపిడీ శక్తుల ప్రతినిధి రాబర్ట్‌ ఇ లీ. అతగాడి లేదా అంతర్యుద్ధంలో అతని నాయకత్వంలో పని చేసిన వారి విగ్రహాలు, చిహ్నాలను బహిరంగ ప్రదేశాల నుంచి తొలగించాలని జాత్యంహంకార వ్యతిరేక శక్తులు వుద్యమిస్తున్నాయి. వాటిని కాన్ఫెడరేట్‌ చిహ్నాలు అని పిలుస్తున్నారు. విద్య, వుద్యోగాలలో రిజర్వేషన్లు అంబేద్కర్‌ చలవే అని దళితులు, దళిత సంఘాలు ప్రచారం చేస్తుండటం, రిజర్వేషన్లే తమ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని వాటికి అర్హత లేని కులాల వారిలో అసంతృప్తి పెరుగుతున్న నేపధ్యంలో అనేక చోట్ల అంబేద్కర్‌ విగ్రహాలను పెట్టటం ఎక్కువకావటంతో పాటు వాటికి వ్యతిరేకత, అవమానపరిచే శక్తులు కూడా చెలరేగుతున్నాయి.

అమెరికాను ఆక్రమించిన ఐరోపా శ్వేతజాతి వలస వాదులు తమ గనులు, వనులలో పని చేసేందుకు ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా బానిసలుగా అక్కడి వారిని తీసుకు వచ్చిన దుర్మార్గం గురించి తెలిసిందే. అమెరికా ఖండాలను ముందుగా ఆక్రమించిన స్పెయిన్‌, పోర్చుగీసు జాతుల వారసులు హిస్పానిక్‌ లేదా లాటినోలుగా పిలవబడుతున్న వారు 13,17శాతం చొప్పున జనాభాలో వున్నారు. పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్త థామస్‌ పికెట్టీ చెప్పినట్లు అమెరికాలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరగటం, గత శతాబ్దిలో సంభవించిన ఆర్ధిక సంక్షోభాలు, వర్తమాన శతాబ్దిలో 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సమస్యల కారణంగా అమెరికాలోని పేద, మధ్యతరగతుల జీవితాలు దిగజారుతున్నాయి. ఈ పరిస్ధితిని మిగతా దేశాలలో మాదిరి అమెరికాలో కూడా మితవాద శక్తులు వుపయోగించుకుంటున్నాయి. గత వారసత్వంగా వచ్చిన శ్వేత జాత్యంహంకారం ఇటీవలి కాలంలో పెరుగుతోంది.అలాంటి శక్తులు వాటికి ప్రతీకలైన వారిని ఆరాధించటం, అనుకరించటం పెరుగుతోంది.మన దేశంలో త్వరలో ముస్లింల జనాభా మెజారిటీగా మారనుందని హిందుత్వ శక్తులు ప్రచారం చేస్తున్న మాదిరే అమెరికాలో ప్రస్తుతం 77 శాతంగా వున్న శ్వేతజాతీయులు 2042నాటికి మైనారిటీలుగా మారనున్నారనే ప్రచార ఈ నేపధ్యంలో అక్కడి పరిణామాలను చూడాల్సి వుంది.

ముస్లింలు ఈద్‌ రోజున రోడ్లపై నమాజు చేయటాన్ని నేను ప్రశ్నించలేనపుడు పోలీసు స్టేషన్లలో కృష్ణాష్టమి వేడుకులను నిలిపివేయాలని నేనెలా చెప్పగలను అని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చేసిన వ్యాఖ్యల మాదిరే చార్లెటోసివిలే పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా శ్వేత దురహంకారుల చర్యను సమర్ధిస్తూ మాట్లాడారు.దీంతో దేశవ్యాపితంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బోస్టన్‌ నగరంలో నలభైవేల మందితో జరిగినది అలాంటి వాటిలో ఒకటి. చార్లెటిసివిలే పరిణామాలను చూసిన తరువాత బానిసత్వ పరిరక్షకుల తరఫున పని చేసిన వారి విగ్రహాలు, చిహ్నాలు తొలగించాలని చేసిన నిర్ణయాలను సత్వరం అమలు జరిపేందుకు పలు చోట్ల చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ తాజా పరిణామానికి నాంది ఏమిటి? అంటరాని తనాన్ని సమర్ధించే మనుస్మృతిని దగ్దం చేసి వ్యతిరేకత తెలిపేందుకు 1927 డిసెంబరు 25న వేలాది మందితో ఆ పుస్తక ప్రతులను దగ్దం చేసేందుకు నాయకత్వం వహించిన అంబేద్కర్‌ గురించి తెలిసిందే. అలాగే అమెరికాలో బానిసత్వ చిహ్నాలను అనుమతించకూడదని ఎప్పటి నుంచో అభ్యుదయ వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకులు లెనిన్‌, స్టాలిన్‌ విగ్రహాలతో పాటు సోషలిస్టు చిహ్నాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అమెరికన్లు ఇరాక్‌ను ఆక్రమించి తమను వ్యతిరేకించే శక్తులకు ప్రతినిధిగా వున్న సద్దాం హుస్సేన్‌ను వురితీసి, ఆయన విగ్రహాలను కూల్చివేయటాన్ని మనమందరం చూశాం. ఇలాంటివన్నీ భావజాల పోరులో భాగం.సమాజంలో అనేక వైరుధ్యాలు, డిమాండ్లు వుంటాయి. వాటిలో ఏది ఎప్పుడు, ఎలా ముందుకు వస్తుందో వూహించలేము.

చార్లెటెసివిలే నగర పాలక సంస్ధ కాన్ఫెడరేట్‌ చిహ్నాలను తొలగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక తీర్మానం చేసింది. దానికి అనుగుణ్యంగా రాబర్ట్‌ లీ పార్కు పేరును ‘దాస్య విమోచన పార్కు’ గా మార్చాలని దానిలోని జనరల్‌ రాబర్ట్‌ ఇ లీ విగ్రహాన్ని, నగరంలోని ఇతర చిహ్నాలను కూల్చివేసేందుకు వుపక్రమించింది. దానికి నిరసనగా శ్వేతజాతి దురహంకారులు కోర్టులో కేసు దాఖలు చేశారు. మే 13వ తేదీన కొంత మంది విగ్రహాల కూల్చివేతకు నిరసనగా కొందరు నగరంలో ప్రదర్శన చేశారు. జూన్‌ ఐదున నగర మేయర్‌ పార్కు పేరు మార్పును అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 11న శ్వేతజాతీయులు వర్జీనియా విశ్వవిద్యాలయంలో దివిటీలతో నిరసన ప్రదర్శన చేశారు. శ్వేతజాతీయుల జీవిత సమస్య, మమ్మల్ని తొలగించలేరు, ఇతర నాజీ నాజీనినాదాలు చేశారు.పోలీసులు వచ్చి ఆ ప్రదర్శనకు అనుమతి లేదని అడ్డుకున్నారు. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా ఇతరులు పోటీ ప్రదర్శన చేయటంతో వారితో గొడవ పడ్డారు. మరుసటి రోజు ‘మితవాదులు ఏకం కావాలి’ అనే నినాదంతో చార్లొటెసివిలే నగరంలో మధ్యాహ్నం ప్రదర్శనకు శ్వేతజాతీయులు పిలుపునిచ్చారు. అయితే వుదయాన్నే పలుచోట్ల ప్రదర్శనను వ్యతిరేకించేవారు ప్రదర్శకులను అడ్డుకున్నారు.పోలీసులతో సహా కొందరికి గాయాలయ్యాయి. ప్రదర్శనలను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. వర్జీనియా గవర్నర్‌ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నవారిపై ఒక శ్వేతజాతీయుడు కారునడపటంతో ఒక మహిళ మరణించగా 19 మంది గాయపడ్డారు. రెచ్చగొట్టే ప్రదర్శనలకు పిలుపు ఇచ్చి ఒకరి మరణానికి, అనేక మంది గాయాలకు కారకులైన శ్వేత జాతీయులతో పాటు వారిని వ్యతిరేకించిన వారు కూడా హింసాకాండకు కారకులే అని అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేసి మరింత రెచ్చగొట్టారు. హింసాకాండను అదుపు చేసేందుకు వినియోగిస్తున్న హెలికాప్టర్‌ కూలి ఇద్దరు పోలీసులు మరణించారు. మరణించిన మహిళకు సంతాపంగా, శ్వేతజాతీయుల హింసాకాండకు వ్యతిరేకంగా 12వ తేదీ నుంచి దేశంలో అనేక చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్ని విగ్రహాలను కూల్చివేశారు.

ఈ పరిణామాలకు 2015లోజరిగిన వుదంతం ఒక కారణంగా కొందరు విశ్లేషిస్తున్నారు. స్వయంగా తాను శ్వేత జాతి దురహంకారినని ప్రకటించుకున్న డైలాన్‌ రూఫ్‌ 2015జూన్‌ 17న దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్‌ అనే పట్టణంలో నల్లజాతీయులు ఎక్కువగా వుండే ఒక చర్చిలోకి వెళ్లి తుపాకితో కాల్పులు జరిపి తొమ్మిది ప్రాణాలను బలిగొన్నాడు.కాల్పులు జరిపిన తరువాత కాన్ఫెడరేట్‌ పతాకం పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చాడు. వాటిని చూసిన జనం దక్షిణ కరోలినా రాజధానిలో ఎగురుతున్న కాన్ఫెడరేట్‌ పతాకాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. అధికారయుతంగా తొలగించేందుకు అంగీకరించే లోపే కొంత మంది దానిని తీసివేశారు. పతాకంతో పాటు కాన్ఫెడరేట్‌ విగ్రహాలు, చిహ్నాలను కూడా తొలగించాలనే డిమాండ్‌ దేశవ్యాపితంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ముందుకు వచ్చింది. కాన్ఫెడరేట్స్‌ బానిసత్వం కొనసాగాలని పని చేయటం, శ్వేతజాతి దురహంకారానికి ప్రాతినిధ్యం వహించినందున వారి గౌరవార్ధం ఏర్పాటు చేసిన విగ్రహాలు, చిహ్నాలను గౌరవించి పరిరక్షించాల్సిన అవసరం లేదనే వాదనలు ముందుకు వచ్చాయి.

చార్లెటోసెవిలే వుదంతం తరువాత అధ్యక్షుడు ట్రంప్‌ తన అవివేకాన్ని, అహంకారాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. శ్వేతజాతీయులకే అధ్యక్షుడు అన్నట్లుగా వ్యవహరించాడు. పరిస్ధితిని మరింత సంక్లిష్టంగా మార్చివేశాడు. అన్ని వైపుల నుంచి ఘర్షణలు జరిగాయని తొలుత ట్వీట్‌ చేశాడు. తరువాత ‘ఈ వారంలో రాబర్ట్‌ ఇ లీ, మరోవారం స్టోన్‌ వాల్‌ జాక్సన్‌ అంటారు, తరువాత జార్జి వాషింగ్టన్‌ వంతు వస్తుంది, మీరే ఆలోచించండి దీనికి అంతం ఎక్కడ ‘ అని ప్రశ్నించాడు. తరువాత కాన్ఫెడరేట్‌ చిహ్నాలను కూల్చివేయటం బుద్దితక్కువతనం అని మరో ట్వీట్‌ చేశాడు.

దక్షిణ కరోలినా రాష్ట్రం అధికారికంగా కాన్ఫెడరేట్‌ పతాకాన్ని తొలగించిన తరువాత అనేక రాష్ట్రాలు, నగరాలలో అలాంటి చర్యలనే చేపట్టారు. ఒక సర్వే ప్రకారం దేశంలోని 1500బహిరంగ స్ధలాలలో కాన్ఫెడరేట్‌ చిహ్నాలు వున్నట్లు తేలింది. ఇంకా ఎక్కువే వుండవచ్చు కూడా. అమెరికాలో సాగిన అంతర్యుద్దంలో కాన్ఫెడరేట్స్‌ యూనియన్‌కు (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు) వ్యతిరేకంగా బానిసత్వం కొనసాగాలని కోరుకొనే శక్తులవైపు నిలిచారు. అందువలన వారిని అమెరికన్‌ దేశభక్తులుగా పరిగణించకూడదని జాత్యంహకారం, బానిసత్వ వ్యతిరేకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మన స్వాతంత్య్ర వుద్యమంలో దేశ ప్రజలకు వ్యతిరేకంగా బ్రిటీషు వారి సేవలో మునిగిన కాషాయ, హిందూత్వ శక్తులు దేశవ్యాపితంగా స్వాతంత్య్రవుద్యమం, చరిత్రకారులు విస్మరించిన కొందరిని సమరయోధులుగా చిత్రించేందుకు ప్రయత్నించటం, హిందువులు మైనారిటీలుగా మారే ప్రమాదం వుందని ప్రచారం చేయటం, మనువాదం మనుగడ సాగించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా డోనాల్డ్‌ ట్రంప్‌- నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహించేశక్తుల మధ్య సైద్ధాంతిక బంధం కూడా వుండటం చిత్రంగా వుంది కదూ !

చిల్లర రాజకీయాలు వద్దు, చిన్న పిల్లలను కాపాడండి యోగి మహాశయా !

Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది రోజులుగా వుత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన వార్తలు ఇంతవరకు కొన్ని అంశాలను నిర్ధారించాయి. నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా బిజెపి తరఫున రాబోయే రోజులలో కాబోయే ప్రధానిగా ప్రచారంలో వున్న యోగి ఆదిత్యనాధ్‌ పాలనకు ఇతరులకు పెద్ద తేడా లేదు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటం, ఇతరుల మీద నెట్టటంలో ఎవరికీ తీసిపోరు. ప్రజల పట్ల జవాబుదారీ తనం లేదు. కొద్ది రోజుల క్రితం ఆదిత్యనాధ్‌ సోదరి సామాన్యుల మాదిరే ఒక టీ దుకాణం నడుపుకొంటోందని ఈ వుదంతం యోగికి బంధుప్రీతి లేదని చెప్పేందుకు పక్కా నిదర్శనం అని ప్రచారం జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు స్వయం సేవకుడిగా వున్నపుడు పారిశుధ్య పని చేసిన నిగర్వి అంటూ ఒక ఫొటోను ఆయన భక్తులు సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున తిప్పారు. గతంలో ఏ కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల నాయకులకు లేని వ్యక్తిత్వాన్ని, గతాన్ని సృష్టించేందుకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఒక వేళ అలాంటివి వుంటే కాషాయ తాలిబాన్లు, మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) బయట పెడితే లోకానికి మేలు చేసిన వారవుతారు. కాషాయ పరివారం వీరుడు, శూరుడు అని పొగిడే విడి సావర్కర్‌ చరిత్రను చూస్తే ఆయన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని ప్రేమ లేఖలు రాసిన విషయం తెలిసిందే. అంతే కాదు, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక హీరోగా, వీరుడిగా వర్ణించటానికి తగిన వ్యక్తి సావర్కర్‌ అన్నట్లుగా తనకు తానే చిత్రగుప్తుడనే మారుపేరుతో రాసిన పుస్తకంలో రాసుకున్న ఘనుడు. అందువలన ఆయన పరంపరలో ముందుకు వస్తున్నవారికి లేని గొప్పలను ఆపాదించటంలో విశేషం ఏముంది. మహా అయితే ఎవరన్నా ‘దేశద్రోహులు’ ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అది మా విశ్వాసం, మా మనోభావాలను దెబ్బతీశారంటూ దాడులకు దిగుతారు.https://thewire.in/140172/veer-savarkar-the-staunchest-advocate-of-loyalty-to-the-english-government/

అందువలన యోగి గారి సోదరి కథను నమ్మటమా లేదా అన్నది పక్కన పెడదాం. ఆయన మఠానికి దగ్గరలో వున్న గోరఖ్‌పూర్‌ బిఆర్‌డి ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణిస్తున్నారనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ చనిపోవటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మహాశయుడే నిర్ధారించారు. అలాంటి దాని గురించి సామాజిక, సాంప్రదాయక మీడియాలో పెద్ద చర్చ, ఆరోపణలు, ప్రత్యాపరోపణలు ఇప్పటికీ వస్తుంటే భవ బంధాలు, రాగ ద్వేషాలు వుండకూడని, నిజం తప్ప అబద్దాలు చెప్పకూడని ఒక యోగి చిల్లర రాజకీయాలు తప్ప నిజాయితీతో కూడిన ఒక ప్రకటన చేసి దానికి స్వస్తి వాక్యం పలకలేదేం ? ఇదేమి జవాబుదారీతనం. లేదూ విచారణకు ఆదేశించాం అప్పటి వరకు మాట్లాడకూడదు అంటే విచారణ నివేదికలు నిర్ధారించేంత వరకు ఆగకుండా కొందరు వైద్యులపై చర్యలెందుకు తీసుకున్నట్లు ?

గత కొద్ది రోజులుగా మీడియాలో రాసిన వార్తలు, రాయించిన వార్తలను చదివిన వారికి, టీవీలలో చూసిన వారికి ‘మెదడు వాపు ‘ వ్యాధి వచ్చేట్లుగా వుంది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధి విభాగపు అధిపతిగా పని చేస్తున్న డాక్టర్‌ కఫీల్‌ అహమ్మద్‌ సదరు ఆసుపత్రికి అనుబంధంగా వున్న మెడికల్‌ కాలేజీలో పిల్లల వైద్య సహాయ ఫ్రొఫెసర్‌గా బోధన కూడా చేస్తున్నారు.అందువలన ఆయన ఆక్సిజన్‌ కొరత గురించి తెలుసుకొని ఇతర స్నేహితుల నుంచి అరువుగా లేదా కొనుగోలు చేసి సిలిండర్లను తెచ్చి ఎందరో పిల్లలను కాపాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆయన ఆక్సిజన్‌ తెప్పించిన విషయాన్ని అభినందించకపోతే పోయే వాటి గురించి తన ప్రతిష్టను పెంచుకొనేందుకు మీడియాలో ఆయన అలా రాయించుకున్నాడని కొంత మంది చెబుతున్నారు.ఆ వార్తలు వచ్చిన వెంటనే బహుశా వాటిని రాయటంలో వెనుకబడిన కొన్ని మీడియా సంస్ధలు చద్ది వార్తలే ఇస్తే తమకు ‘లాభం’ ఏముంటుంది అనుకున్నాయోమో ఆయన తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి సిలిండర్లను దొంగతనం చేశాడని, అలా తస్కరించిన వాటిని తన, ఇతర ఆసుపత్రుల నుంచి తిరిగి తెప్పించాడు తప్ప అందరూ అనుకున్నట్లు ప్రాణదాతేమీ కాదని మరుసటి రోజునే ప్రచురించాయి. ఒక బిజెపి మహిళా నాయకురాలు ఆయన అత్యాచారాలు చేశాడన్న ప్రచారం మొదలెట్టింది. విద్యార్ధిగా వుండగా ఒకరి బదులు మరొకరికి పరీక్ష రాసిన కేసులో అరెస్టయ్యాడని మరొక వార్త.ఆయనపై క్రిమినల్‌ కేసు వున్న కారణంగా మణిపాల్‌ విశ్వవిశ్వవిద్యాలయం ఆయనను సస్పెండ్‌ చేసిందని మరొక వార్త. ఇలా ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి ఆపాదిస్తారో తెలియదు.సదరు వైద్యుడు ఎందరినో కాపాడారని రాసిన వార్తలను సహించలేక ఆయనపై ఇన్ని ఆరోపణలు లేదా పాత విషయాలను( ఎంతవరకు నిజమో తెలియదు) తవ్వి సామాజిక మాధ్యమంలోపరువు తీయటం అవసరమా ? వారికి దురుద్ధేశ్యం తప్ప మరొకటి కనపడటం లేదు.

సదరు డాక్టర్‌పై తీసుకున్న చర్య గురించి కూడా మీడియాలో వార్తలు తప్పుదారి పట్టించేవిగా వున్నాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమ నోడల్‌ అధికార బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మెదడువాపు వ్యాధి నివారణకు సదరు సంస్ధ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం ఆయనపై నమోదు చేసిన అత్యాచార ఆరోపణలో వాస్తవం లేదని ఆ కేసును పోలీసులు మూసివేశారు. అయినా ఆయనొక రేపిస్టు అని నేను విన్నా అని బిజెపి నాయకురాలు ట్వీట్‌ చేసింది. సినిమా నటుడైన బిజెపి ఎంపీ పరేష్‌ రావల్‌ దానిని సమర్ధిస్తూ చెద పురుగుల తెగ దృష్టిలో హీరో అని పేర్కొన్నాడు. డాక్టర్‌ ఖాన్‌ను బలిపశువును చేశారని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రజారోగ్యాన్ని యోగి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నది.వైద్య విద్య డైరెక్టర్‌ జనరల్‌ చేసిన మౌలిక ఆరోపణ ప్రకారం ఆక్సిజస్‌ సిలిండర్లను తన ఆసుపత్రి నుంచి సేకరించటం అని న్యూస్‌18 వార్త పేర్కొంటే ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చర్య తీసుకున్నట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది. గతేడాది సెప్టెంబరు ఎనిమిది నుంచి డాక్టర్‌ ఖాన్‌ ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం లేదని చెబుతున్నారు.

నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌తో వున్న మన దేశ సరిహద్దులను కాపాడే సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బి) ప్రజాసంబంధాల అధికారి ఓపి సాహు ఇలా చెప్పారు.’ ఆగస్టు పదిన బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో అసాధారణ సంక్షోభ పరిస్ధితి ఏర్పడింది. డాక్టర్‌ కఫిల్‌ ఖాన్‌ ఎస్‌ఎస్‌బి డిఐజి వద్దకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను సేకరించి మెడికల్‌ కాలేజీకి తరలించేందుకు ఒక ట్రక్కు కావాలని అడిగారు.బిఆర్‌డి మెడికల్‌ కాలేజీ సిబ్బందికి సహకరించేందుకు డిఐజి పదకొండు మంది జవాన్లను కూడా ట్రక్కుతో పాటు పంపారు. మా క్క్రు కొద్దిగంటల్లోనే వివిధ ప్రాంతాల నుంచి ఖలీలాబాద్‌లోని ఒక గోడౌన్‌ నుంచి కూడా సిలిండర్లను సేకరించి తీవ్ర సంక్షోభం వున్న మెడికల్‌ కాలేజికి తరలించారు.’

పిల్లల మరణాల వార్తలు వెలువడగానే ఆక్సిజన్‌ సరఫరా లేక మరణించారనటాన్ని యోగి సర్కార్‌ తోసి పుచ్చింది. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ రౌటెల ఒక ప్రకటన చేసి ఇతర కారణాలతో మరణించినట్లు చెప్పిన దాన్ని ఆరోగ్య మంత్రి కూడా చిలుక పలుకుల్లా వల్లించాడు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి నాలుగవ తేదీ వరకు ఆక్సిజన్‌ కొరత గురించి తన కార్యాలయానికి తెలియదని, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటానని దానికి ప్రిన్సిపల్‌, ఇతరులే కారణమని ఆరోపించారు.

మార్చి 22నే ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌కు ఆక్సిజన్‌ సరఫరాదారు పుష్పా సేల్స్‌ వారి లేఖను కూడా జతపరచి చెల్లింపుల గురించి తెలిపారు. తిరిగి ఏప్రిల్‌ మూడున అదనపు ఛీఫ్‌ సెక్రటరీకి పుష్సా సేల్స్‌ తాజా లేఖను జతపరచి మరోసారి రాశారు. రెండు లేఖలకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.ఆగస్టు ఒకటిన మరోసారి అదనపు చీఫ్‌ సెక్రటరీకి రాసి దాని కాపీని మంత్రికి పంపారు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిలో సమీక్ష సందర్భంగా ఆరోజు వుదయం బిల్లుల చెల్లింపు గురించి ఆరోగ్యశాఖ మంత్రికి స్వయంగా తాము లేఖను అంద చేశామని, ఆరోజు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తేగా ఏమిటి అన్నట్లు ప్రశ్నార్ధకంగా యోగి మంత్రివైపు చూసి తరువాత మౌనంగా వుండిపోయినట్లు తమకు తెలిసిందని పుష్పా సేల్స్‌ ప్రతినిధులు టెలిగ్రాఫ్‌ పత్రికతో చెప్పారు. యోగి కాలేజీ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆ సాయంత్రమే సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. అంటే ఒక చిన్న వ్యాపార సంస్ధ కూడా యోగి పని తీరు మీద విశ్వాసం కోల్పోయిందన్నది స్పష్టం.

మరణాలకు బాధ్యత వహిస్తూ ఆగస్టు 12న రాజీనామా చేసిన మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ మిశ్రా మరుసటి రోజు చేసిన ఓ ప్రకటనలో ఆక్సిజన్‌ సరఫరాదారుకు డబ్బు చెల్లించటంలో బ్యూరాక్రటిక్‌ పద్దతులు, ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ పర్యటనే కారణమని విమర్శించారు. ఆక్సిజన్‌ సరఫరాదారుకు చెల్లించేందుకు తాము ఐదవ తేదీనే నిధులు విడుదల చేశామని, సకాలంలో ప్రిన్సిపల్‌ చెల్లించలేదని వైద్య విద్య శాఖ మంత్రి అశుతోష్‌ టాండన్‌ చెప్పారు. రెండు కోట్ల రూపాయలు విడుదల చేయాలని జూలై నెలలోనే మూడు నాలుగు లేఖలు రాశానని ఐదవ తేదీన నిధులు విడుదల చేశారని డాక్టర్‌ మిశ్రా చెప్పారు. ఆగస్టు ఐదవ తేదీ శనివారం, నిధుల విడుదల ఆదేశాలు మాకు ఏడవ తేదీన అందాయి. బిల్లు ఓచర్‌ను ఏడవ తేదీన ట్రెజరీకి పంపాము, వారు ఎనిమిదవ తేదీన టోకెన్‌ విడుదల చేశారు.తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ ఆసుపత్రి సందర్శనకు వచ్చిన కారణంగా ఆసుపత్రి యంత్రాంగమంతా తీరికలేకుండా వుంది.పదవ తేదీన మాత్రమే 52లక్షల రూపాయలను ఆక్సిజన్‌ సరఫరాదారు ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ బ్యాంకుకు పంపగలిగాము.మెడికల్‌ కాలేజీ, ఆక్సిజన్‌ సరఫరాదారు బ్యాంకు ఖాతాలు వేర్వేరు చోట్ల వున్నందున బ్యాంకు బదిలీ చేసే అవకా శం లేదు, రెండు బ్యాంకుల మధ్య నగదు బదిలీకి ఒక రోజు వ్యవధి పడుతుంది. అని మిశ్రా చెప్పారు. పదవ తేదీ మధ్యాహ్నం ఆక్సిజన్‌ సరఫరాదారు నుంచి ఫోన్‌ వచ్చింది, తదుపరి ట్రక్కు సిలిండర్లను పంపే అవకా శం లేదని వారు చెప్పారు. నిధులు విడుదల చేశామని బ్యాంకులో ఆలశ్యం అవుతున్నదని, మీ ఖాతాకు నిధులు అందుతాయని చెప్పానని, అయితే సిలిండర్ల సరఫరా నిలిపివేస్తారని తాను ఊహించలేదని డాక్టర్‌ మిశ్రా అన్నారు.

యోగులు మఠాలకే పరిమితం అయితే ఒక తీరు, అలాగాక ప్రజాజీవనంలోకి వచ్చి, అధికారపదవులు కూడా స్వీకరించిన తరువాత వారినేమీ ప్రశ్నించకూడదు అంటే కుదరదు. పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించటం వాస్తవం. ఆ సంబంధిత వార్తలతో పాటు ఆసుపత్రి, దాని పరిసరాలు, అసలు మొత్తంగా గోరఖ్‌పూర్‌ పరిసరాలన్నీ ఆశుభ్రత నిలయాలుగా వున్నాయని కూడా వార్తలు వచ్చాయి. మెదడు వాపు వ్యాధి కారణంగా ఆ ప్రాంతంలో పిల్లలు, ఇతరులు మరణించటం కూడా ఎక్కువగానే వుందని వెల్లడైంది. సరే ఎవరైనా మూడు నెలల్లోనో, ఆరునెలల్లోనే అద్భుతాలు చేయగలరని ఎవరూ అనుకోరు. యోగులైనా అంతే.మరణించిన పిల్లల తలిదండ్రులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గోరఖ్‌ పూర్‌ వెళతానని ప్రకటించటంతో యోగికి పూనకం వచ్చింది. ఆగ్రహంతో వూగిపోయారు. గోరఖ్‌పూర్‌ను ఒక విహార కేంద్రంగా మార్చవద్దని ఎదురుదాడి ప్రారంభించారు.(కేరళలో వ్యక్తిగత కక్షలు లేదా కారణాలతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే కేంద్ర మంత్రి పరామర్శకు వెళ్లటం సరైనదే అయితే 70 మందికి పైగా పిల్లలు మరణించిన వుదంతంలో రాహుల్‌ గాంధీ పరామర్శించటం తప్పెలా అవుతుందో మరి) స్వచ్చ వుత్తర ప్రదేశ్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరే షరా మామూలుగా గత ప్రభుత్వాలు కనీస సదుపాయలు కల్పించలేదని చెప్పారనుకోండి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మన యోగి గారు పాతికేండ్లుగా, అంతకు ముందు ఆయన సీనియర్‌ యోగి గోరఖపూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధిగా వున్నారు. ప్రతి ఏటా తమ కనుసన్నలలో వుండే బిఆర్‌డి ఆసుపత్రిలో పిల్లలు చని పోతుంటే, ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా తయారైతే, మెదడు వాపు వ్యాధి ప్రబలంగా వుంటే ఎంపీగా ఆయన లేదా స్ధానిక బిజెపి ఎంఎల్‌ఏలు ఏం చేస్తున్నారు. ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నారు. మూడు సంవత్సరాలుగా నరేంద్రమోడీ స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో కనీసం ఆసుపత్రి పరిసరాలను అయినా బాగు చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి?ఎంపీగా ఏం పట్టించుకున్నట్లు ? తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేరళ ఆసుపత్రులలో చేర్చుకోని కారణంగా మరణించాడు. ఆ ఘటన మీద కేరళ ముఖ్యమంత్రి విచారం వెలిబుచ్చారు. రాగ ద్వేషాలకు అతీతంగా వుండే, వుండాల్సిన యోగి బిఆర్‌డి ఆసుపత్రికి నిధులు సకాలంలో విడుదల కాలేదన్న విమర్శలు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించి భవిష్యత్‌లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూస్తామని చెబితే ఆయన గౌరవం మరింత పెరిగి వుండేది. ఇంత రాద్దాంతం జరిగేది కాదు.కానీ చేసిందీ, జరిగిందేమిటి? ముందసలు తనకు తెలియదన్నారు ముఖ్యమంత్రి. ఇలాంటివి కొత్తగా జరగటం లేదని తేల్చిపారేశారు అమిత్‌ షా. యోగి ప్రభుత్వం, బిజెపి మరుగుజ్జు యోధులు, బిజెపి మెప్పుపొందేందుకు తహతహలాడిన మీడియా చౌకబారు రాజకీయాలకు పాల్పడింది. విమర్శకులపై ఎదురుదాడికి దిగింది. యోగి సర్కార్‌ పని తీరును బజారుకు ఈడ్చింది.

యోగి ఆదిత్యనాధ్‌ ఒక పర్యటన సందర్భంగా దళితులు శుభ్రంగా లేరని వారికి సబ్బులు, షాంపూలు ఇచ్చి స్నానాలు చేయించి, వారెక్కడ యోగిని ముట్టుకుంటారో అని లేవకుండా చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు ప్రజల ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న అధికార యంత్రంగాన్ని మొత్తంగా శుద్ధి చేయటానికి ఎన్ని సబ్బులు వాడాలో తెలియదు. మొత్తం మీద ఈ వుదంతం బిజెపి, యోగి సర్కార్‌, యోగికి వ్యక్తిగతంగా చెప్పుకోలేని చోట దెబ్బ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కావాల్సింది చిల్లర రాజకీయాలు కాదు, చిన్న పిల్లల ప్రాణాలు కాపాడండి యోగి మహాశయా !

పరువు నష్టం కేసులతో మీడియా నోరు నొక్కే దుష్టయత్నం !

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

భావ ప్రకటనా స్వేచ్చ మానవులకు పుట్టుకతో వచ్చిన హక్కు. భూమ్మీద పడగానే గాలి పీల్చుకోవటంతో కేరు మంటూ ప్రారంభమయ్యే స్వేచ్చా గళం తిరిగి అంతిమంగా శ్వాస తీసుకోవటం ఆగినపుడే మూతపడుతుంది. అలాంటి పుట్టుకతో వచ్చిన హక్కును హరించేందుకు మధ్యలో ఎవరు ప్రయత్నించినా దానిని ఏదో ఒక రూపంలో ప్రతిఘటించటమే సజీవ మానవ లక్షణం.

కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం……… హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయ్‌ అన్నీ అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. అలాగే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి నియంతలు,పోలీసులు, గూండాలు, కార్పొరేట్లు కావేవీ మినహాయింపు, ఏదీ తక్కువ కాదు అని చెప్పుకోవాల్సిన రోజులచ్చాయి. నియంతలు ఏదో ఒకసాకుతో లంగని మీడియా సంస్ధలను పూర్తిగా మూతవేయించటానికి ప్రయత్నిస్తారు. గూండాలు పశుబలాన్ని వుపయోగిస్తే, పోలీసులు, కార్పొరేట్లు చట్టాలను రక్షణగా తీసుకొని స్వేచ్చ, ప్రజాస్వామ్యాన్ని హరించటానికి ప్రయత్నిస్తాయి.

ఇటీవలి కాలంలో అధికార రాజకీయాలు నడిపే శక్తులు తమకు లంగని రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం ద్వారా వారిని తమ దారికి దారికి తెచ్చుకోవటం ఒక ముఖ్యపరిణామం. దాని ఫలితమే ఎవరు ఏ పార్టీ తరఫున ఎన్నికవుతారో, ఏక్షణంలో పార్టీ మారతారో తెలియని స్ధితి. కార్పొరేట్‌ సంస్ధలు ఒక దశలో స్వయంగా మీడియా సంస్ధలను ప్రారంభించటం ఒక పరిణామమైతే, తమ ప్రయోజనాలకు సహకరించని ఇతర వాటిని ఆర్ధికంగా దెబ్బతీయటం రాజకీయాలలో మాదిరి మరో సరికొత్త కొత్త ధోరణి. అది సంస్ధలకే పరిమితం కాలేదు, వ్యక్తులకు, శక్తులకు, మీడియాయేతర సంస్ధలను కూడా తమ దారికి తెచ్చుకొనేందుకు పైన పేర్కొన్న శక్తులన్నీ పూనుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో వుపాధి,వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే రొయ్యల ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ గ్రామం, పరిసర ప్రాంతాల జనం వుద్యమిస్తే వారిని అణచివేసేందుకు సంబంధిత పారిశ్రామికవేత్తలు గూండాలు, పోలీసులు, అధికారయంత్రాంగం, మంత్రులు, వాణిజ్యమీడియాను ఎలా వుపయోగించుకున్నదీ ప్రత్యక్షంగా చూశాము. వారి కుమ్మక్కును బహిర్గతం చేసేందుకు కొందరు జర్నలిస్టులు సిద్ధంగా వున్నా మీడియా యాజమాన్యాలు వారి నోరు నొక్కుతున్నాయి. వాస్తవాలకు మీడియాలో చోటు కల్పించటం లేదు.

వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు లాభం కలిగించేందుకుాతద్వారా తాము లబ్ది పొందేందుకు అధికారంలో వున్న పార్టీలు, వారి చెప్పుచేతల్లో పనిచేసే అధికార గణం నిబంధనలను ఎలా కావాలనుకుంటే అలా మార్చటం, తమకు అనువైన టీకాతాత్పర్యాలు చెప్పటం చూశాము. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో చెరువులు తవ్వాలనే పేరుతో తమకు ఓటు వేయని దళితుల భూములను ఆక్రమించేందుకు, వ్యవసాయానికి పనికిరాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి ఒక శత్రుదేశంపై దాడి మాదిరి జనాన్ని బయటకు రానివ్వకుండా చేసి, పెద్ద సంఖ్యలో యంత్రాలను ప్రయోగించి ఎలా తవ్వించిందీ లోకం చూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !

ప్రధాని నరేంద్రమోడీ, బిజెపికి అత్యంత సన్నిహితుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త అదానీ. అతని గ్రూపు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు మార్చిన నిబంధనలు, పన్నుఎగవేత తీరుతెన్నుల గురించి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఇపిడబ్ల్యు) జూన్‌ నెలలో రెండు పరిశోధనాత్మక విశ్లేషణలను ప్రచురించింది. వాటిని వెబ్‌ నుంచి వెంటనే వుపసంహరించని పక్షంలో తాము పరువు నష్టం దావా వేస్తామని అదానీ గ్రూపు లాయర్‌ నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానంగా సంపాదకుడు పరంజయ గుహ థాకూర్దా ఒక లాయర్‌ను ఏర్పాటు చేసి సమాధానం పంపారు. ఈలోగా ఆ పత్రికను నడుపుతున్న సమీక్షా ట్రస్టు పాలకవర్గం వెంటనే ఆవిశ్లేషణలను తొలగించాలని ఆదేశించటంతో దానికి నిరసనగా పరంజయ్‌ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో ఆ పత్రిక యాజమాన్య ట్రస్టు గురించి ఎంతో వున్నతంగా వూహించుకున్న అనేక మంది హతాశులై పత్రిక ప్రతిష్టను పునరుద్దరించాలని ఒక బహిరంగ లేఖ రాశారు. భారతీయ మీడియాలో ఇలాంటి పరిణామం బహుశా ఇదే ప్రధమం. అనేక సంస్ధల యాజమాన్యాలు పాలేర్లను మార్చినట్లు సంపాదకులను మార్చటం చూశాము. అయితే అవన్నీ తెరవెనుక పరిణామాలకే పరిమితం అయ్యాయి. కానీ ఇపిడబ్ల్యు వుదంతం అలాంటి కాదు, అలా జరగలేదు.

కార్పొరేట్ల అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా వుద్యమించిన సంస్ధలు, వ్యక్తులు, శక్తులు, వాటిని బయట పెట్టిన జర్నలిస్టులను కేసులు ముఖ్యంగా భారీ మొత్తాల ప్రమేయం వున్న పరువు నష్టం, తదితర కేసులతో వేధించటం ప్రపంచవ్యాపితంగా జరుగుతోంది. కార్పొరేట్‌ సంస్ధలు ఎప్పుడైతే దేశ రాజకీయాలను శాసించేంత బలంగా తయారయ్యాయో ఆ పరిణామం మన దేశంలో కూడా వేగవంతమైంది. ఆంగ్లంలో స్ట్రాటజిక్‌ లా సూట్‌ ఎగైనెస్ట్‌ పబ్లిక్‌ పార్టిసిపేషన్‌ అనేదాన్ని పొట్టిగా ‘స్లాప్‌’ అంటున్నారు. జన భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక న్యాయపరమైన దావా అని తెలుగులో చెప్పవచ్చు. ఇలాంటి దావాలు కోర్టు విచారణలో నిలుస్తాయా లేదా అన్నదానిని కార్పొరేట్‌ సంస్ధలు పట్టించుకోవు. తమను వుతికి ఆరవేస్తున్నవారిని ముందుకు పోకుండా చేయటమే ప్రధాన లక్ష్యం. అందుకు గాను పెద్ద మొత్తం పరువు పరిహారాన్ని కోరటం, క్రిమినల్‌ కేసులు పెట్టటం ప్రధానంగా జరుగుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో న్యాయవాదులకు డబ్బులిచ్చి కోర్టులలో పోరాడటం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు కనుక ఇలాంటి బెదిరింపులు ప్రతి దేశంలో సర్వసాధారణమయ్యాయి. గ్రీన్‌పీస్‌ అనే సంస్ధ నోరు మూయించటానికి ఒక కేసులో 30కోట్లు, మరోకేసులో 70లక్షల డాలర్ల పరిహారానికి కేసులు నమోదు చేశారు. ‘స్లాప్‌’ కేసులు బనాయించకుండా చూసేందుకు పరిమిత దేశాలు మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కేసులు పెరిగిపోతూనే వున్నాయి.

పశ్చిమ గోదావరిలో ఒక నాడు ఒక సన్నకారు రైతుగా వుండి తరువాత కాలంలో ఆఫ్రికాలో, మన దేశంలోని బెంగళూరులో ఒక పెద్ద వ్యాపార సంస్ధగా ఎదిగిన కరుటూరి గ్లోబల్‌ యాజమాన్య కార్యకలాపాల గురించి కేయ ఆచార్య అనే ఒక పర్యావరణ జర్నలిస్టు రాసిన వ్యాసాన్ని ఇంటర్‌ ప్రెస్‌ సర్వీసు(ఐపిఎస్‌) ప్రచురించింది. దాని వలన కలిగిన తమ పరువు నష్టంగా వందకోట్ల రూపాయలు చెల్లించాలని 2014 ఆగస్టు ఐదున ఆ సంస్ధ ఎండీ శాయి రామకృష్ణ కరటూరి ఒక నోటీసు పంపారు. కంపెనీ తూర్పు ఆఫ్రికాలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు భారత్‌లోని గులాబి సాగుపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆ జర్నలిస్టు తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఆమెకు నోటీసు అందగానే ఆ విశ్లేషణను తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఐపిఎస్‌ సంస్ధ వెంటనే ఒక ప్రకటన చేసింది. జర్నలిస్టు రాసిన విశ్లేషణలోని అంశాలను, వార్తా వనరు గురించి నిర్ధారించుకొనేందుకు గాను ఆ వ్యాసాన్ని పక్కన పెడుతున్నామని, తమ సంస్ధ నుంచి వార్తలను కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు దానిని ఏ రూపంలోనూ తిరిగి ప్రచురించవద్దని దానిలో పేర్కొన్నది. ఈ నోటీసు తనను బెదిరించేందుకు మాత్రమే కాదని భవిష్యత్‌లో ఆఫ్రికాలో కరుటూరి కంపెనీ కార్యకలాపాల జోలికి పోకుండా మౌనం వహించేందుకు కూడా వుద్దేశించిందని శ్రేయ ఆచార్య పేర్కొన్నారు.

కాలం చెల్లిన పరువు నష్టం చట్టాలను ఇంకా మన దేశంలో కొనసాగించటం స్వేచ్చా గళాలను అణచివేయటానికి సాధనాలుగా చేసుకొనేందుకు అనుమతించటం దారుణం. పరువు నష్టం కేసుల వివరాలను పరిశీలిస్తే బెదిరించటానికే వాటిని వుపయోగిస్తున్నట్లు వెల్లడి అయింది. పెద్ద మొత్తం పరిహారం కోరుతూ జర్నలిస్టులకు నోటీసు పంపితే రాసిన వాటిని వెనక్కు తీసుకోవటమో లేదా తదుపరి రాయకుండా చేయటమో జరుగుతోందని తేలింది. తాజా వుదంతం ఇపిడబ్ల్యు సంపాదకుడు పరంజయ గుహ థాకూర్ధా విషయంలో కూడా దీన్ని గమనించవచ్చు. పరంజయ్‌ గుహ, సుబీర్‌ ఘోష్‌, జ్యోతిర్మయ్‌ చౌదరి ‘గ్యాస్‌ వార్స్‌-క్రోనీ కాపిటలిజం అండ్‌ అంబానీస్‌’ అనే పేరుతో పుస్తకం రాశారు. దానిలో సహజవాయు ధర నిర్ణయంలో జరిగిన అక్రమాలను వివరించారు. ఆ పుస్తకం వెలువడగానే ఆ పుస్తకాన్ని రాసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, దానిని వెబ్‌సైట్‌నుంచి తొలగించాలని, విక్రయాలు, ముద్రణలను నిలిపివేయాలని లేకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అంబానీ సోదరులు నోటీసులు జారీ చేశారు. రచయితలు కూడా వాటికి లీగల్‌గానే సమాధానాలు పంపారు. తరువాత అంబానీల వైపు నుంచి ఎలాంటి కదలికలు లేవు. ఇలాంటి వాటికి తాము భయపడలేదని రచయితలలో ఒకరైన ఘోష్‌ వ్యాఖ్యానించారు.తమను బెదిరించటానికి, వేధించటానికే ఈ నోటీసులు జారీ చేశారని థాకూర్ధా వ్యాఖ్యానించారు.

సహారా గ్రూపు అధిపతి సుబ్రతారాయ్‌ కూడా సహారా: అన్‌ టోల్డ్‌ స్టోరీ పేరుతో మింట్‌ పత్రిక డిప్యూటీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా వున్న తమల్‌ బందోపాధ్యాయ, పుస్తక ప్రచురణ సంస్ధ జైకో పబ్లిషింగ్‌ హౌస్‌పై రెండువందల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేశాడు. సహారా సంస్ధ లావాదేవీలు, అది ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యల గురించి దానిలో వివరించారు. దాని విడుదలపై కొల్‌కతా హైకోర్టు స్టే విధించింది. తరువాత వుభయ పక్షాలూ కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఆపుస్తకంలో పరువుకు భంగం కలిగించే అంశాలున్నాయని, సహారా సంస్ధ వాటి గురించి సంతోషంగా లేదనే ప్రకటన కూడా పుస్తకంలో ప్రచురించేట్లు, పుస్తక ప్రచురణ, విడుదలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదిరింది. ఒక వ్యక్తిగా అలాంటి పెద్ద సంస్ధలతో పోరాడటం కష్టమని, తనకు మింట్‌ యాజమాన్య మద్దతు వున్న కారణంగానే పోరాడగలిగానని, అన్నింటికంటే తనకు మీడియా ఎంతగానో మద్దతు ఇచ్చిందని, అయినా తన ఆరోగ్యం దెబ్బతిన్నదని రచయిత తమల్‌ బందోపాధ్యాయ చెప్పారు. ఇలాంటి నోటీసులు నిజాయితీగా వార్తలు అందించటాన్ని అడ్డుకొనేందుకే అన్నది వాస్తవం అన్నారు. మింట్‌ పత్రికను ప్రచురిస్తున్న హిందుస్తాన్‌ టైమ్స్‌ సంస్ధపై రిలయన్స్‌ పవర్‌ కూడా మింట్‌ ప్రచురించిన వార్తపై దావా వేసింది. సెబీతో సహారా కంపెనీ వివాదంపై వార్తలు రాసినందుకు మింట్‌ పత్రిక సంపాదకుడిపై ఆ కంపెనీ పాట్నాలో ఒక పరువు నష్టం దావా వేసింది.

ఒక సంస్ధ లేదా ఒక వ్యక్తికి సంబంధించిన వార్త లేదా వ్యాఖ్య ప్రచురితం లేదా ప్రసారమైనపుడు అభ్యంతరకరమైన అంశాలుంటే ముందుగా వాటికి సంబంధించిన వివరణలు లేదా ఖండనలు ఇవ్వాలి. వాటిని మీడియా విస్మరించినపుడు ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి అక్కడ కూడా న్యాయం జరగలేదని అనిపిస్తే తదుపరి న్యాయపరమైన చర్యలకు పూనుకొనేందుకు ఎవరికైనా హక్కుంటుంది. అయితే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది. గూండాలు, మాఫియా, ప్రజాప్రతినిధులు లేదా వారి అనుయాయులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని భౌతికదాడులకు పాల్పడుతున్నారు. హత్యలకు కూడా వెనుతీయటం లేదు. పోలీసులు కూడా అత్యధిక సందర్భాలలో వారితో కుమ్మక్కయి జర్నలిస్టులపై ప్రతి కేసులు బనాయించటం లేదా కొన్ని సందర్భాలలో అయితే రౌడీషీట్లను కూడా తెరిచే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్‌ శక్తులు తమ డబ్బు మదంతో భారీ మొత్తాలకు పరువు నష్టం కేసులు వేస్తూ మీడియా సంస్ధలు, జర్నలిస్టుల నోరు నొక్కేందుకు పూనుకోవటం ఏడుపదుల మన ప్రజాస్వామ్య వ్యవస్ధకు పట్టిన దుర్గతి. ఈ స్ధితిలో ఏం చెయ్యాలి అనే సమస్య ఒక్క జర్నలిస్టులకే కాదు యావత్‌ సమాజం ముందున్నది.

ఇపిడబ్ల్యు వుదంతానికి వస్తే అసలు వాస్తవాలేమిటన్నది బయటకు రావాల్సి వుంది. కేవలం ఒక లాయర్‌ నోటీసుకే యాజమాన్యం ఇలాంటి చర్యలకు పూనుకోవటం అనూహ్యం. ఇప్పటి వరకు వెల్లడైన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అనేక కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అదానీ లీగల్‌ నోటీసు ట్రస్టును వుద్ధేశించిందని అయితే దాని గురించి తమకు తెలపకుండానే ట్రస్టు తరఫున సమాధానం ఇస్తున్నట్లు పేర్కొన్నారని, అది ఏకపక్షంగా నిర్ణయమని విశ్వాసాన్ని వుల్లంఘించారని సమీక్ష ట్రస్టు ప్రకటించింది. జరిగిందేమిటో తమకు తెలపకుండానే లీగల్‌ నోటీసు, సమాధాన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిపింది. వాటితో పాటు అదానీ కంపెనీల గురించిన రాసిన ఆర్టికల్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపింది. ఆ తరువాత పరంజయ్‌ రాజీనామా చేశారని, దానిని ట్రస్టు సమావేశం అంగీకరించినట్లు తెలిపారు. లీగల్‌ నోటీసు గురించి అనుమతి తీసుకోకుండా సమాధానం ఇవ్వటం తన పొరపాటేనని అంగీకరించానని, జరిగిందానిని పూర్తిగా ట్రస్టు సభ్యులు వెల్లడించటం లేదని రాజీనామా చేసిన పరంజయ్‌ చెబుతున్నారు.

జరిగిందాని గురించి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అదానీ గ్రూపు లాయర్లు పేర్కొన్న వ్యాసాన్ని తొలగించాలని ట్రస్టు కోరిందీ లేనిదీ స్పష్టం కావాల్సి వుంది. అదానీ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేసిందా అన్నదొక వ్యాసం, అదానీ కంపెనీకి ఐదువందల కోట్ల రూపాయలను అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టిన విధాన లోపం గురించి మరొక వ్యాసంలో పేర్కొన్నారు.రెండవ వ్యాసాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని ట్రస్టు సభ్యులు కోరారన్న అంశంపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. తొలగించమని కోరటానికి గల కారణాలను ట్రస్టు వెల్లడించలేదు.అదే సమయంలో తామెవరి వత్తిడికి ఎన్నడూ లంగలేదని పేర్కొన్నారు. పరంజయ్‌ రాసిన వ్యాసంలో గుర్తుతెలియని వనరులు చెప్పిన ఆధారాలు లేని అనేక కట్టుకథలు వున్నాయని, వాటి ఆధారంగా నిర్ధారణలు చేశారని ట్రస్టు సభ్యులు ఆరోపించారు. కొద్ది రోజుల తరువాత ట్రస్టు సభ్యుల పేరుతో వెలువడిన ప్రకటనలో ఇపిడబ్ల్యు ప్రమాణాలకు అనుగుణ్యంగా ఆ వ్యాసాలు లేవని, వాటిపై సమీక్ష కూడా సవ్యంగా జరగలేదని పేర్కొనటం గమనించాల్సిన అంశం.

ట్రస్టు సభ్యులతో జరిగిన సమావేశంలో లీగల్‌ నోటీసు అంటే ఒక లాయర్‌ నుంచి వచ్చిందే తప్ప కోర్టులో క్రిమినల్‌ కేసు నుంచి కాదని తాను వివరించానని, దానికి కూడా ట్రస్టు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా లీగల్‌ నోటీసుకు సమాధానం పంపటం పొరపాటేనని గ్రహించానని అందుకు క్షమాపణ కూడా చెప్పానని పరంజయ్‌ చెప్పారు. అయితే ఆ రోజు జరిగిన దానిని పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. తన పేరుతో వ్యాసాలు రాయవద్దని ట్రస్టీ సభ్యులు చెప్పారని, ఏవైతే సంపాదకుడి విధులు, పాత్ర వుంటుందో అవే వుండే విధంగా ఒక సహసంపాదకుడిని కూడా నియమిస్తామని చెప్పారని, తక్షణమే వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ తొలగించి వెళ్లాలని కోరినట్లు చెప్పారు. తాను ఇతరులతో కలసి రాసిన విశ్లేషణలో ప్రతి వ్యాక్యానికి కట్టుబడి వుంటానని, అందుకు తగిన ఆధార పత్రాలు తన వద్ద వున్నాయని చెప్పానని, తాను రాసిన దానికి సాక్ష్యాల గురించి ట్రస్టీలు అసలు అడగలేదనిఅయినప్పటికీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించాల్సిందేనంటూ తాను చెప్పిందానిని పట్టించుకోలేదన్నారు. ట్రస్టీలకు ఆధారాలపై ఆసక్తి లేదన్నారు. ఒక ట్రస్టీ అయితే ఆ వ్యాసాన్ని తానింకా చదవలేదని కూడా చెప్పారని, వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ను తొలగించిన తరువాతే బయటకు వెళ్లాలని తనతో చెప్పారని కూడా పరంజయ్‌ చెబుతున్నారు. దాంతో తాను ు రాజీనామా చేస్తానని చెప్పానని, ముంబైలో సంపాదకుడికి ఇచ్చే ఫ్లాట్‌ను ఖాళీ చేయటానికి కొద్ది రోజులు గడువిస్తారా అని అడగ్గా జూలై ఆఖరు నుంచి రాజీనామా అమలులోకి వస్తున్నట్లు పరిగణిస్తామని ట్రస్టు సభ్యులు చెప్పారని అయితే తక్షణమే తాను రాజీనామా చేసినట్లు పరిగణించాలని కోరినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు ఆ పత్రిక తీరు తెన్నులను పరిశీలించినపుడు దాని సంపాదకుడి ఎన్నిక మిగతా వాణిజ్య పత్రికల మాదిరిగా జరగదని తెలిసిందే. వివిధ రంగాలలో పరిణితులైన ట్రస్టు సభ్యులు పూర్వపరాలను ఒకటికి రెండుమార్లు పరిశీలించి నిపుణులు, నిబద్ధత కలిగిన వారినే సంపాదకులుగా ఎంపిక చేశారు. గతంలో పని చేసిన వారందరూ వున్నంతలో వున్నత ప్రమాణాలు, విలువలను కాపాడారు కనుకనే ఆ పత్రికకు ఒక విస్వసనీయత ఏర్పడింది.ఆ రీత్యా చూసినపుడు పరంజయ్‌ గుహ థాకూర్ధాను కూడా ఆ ప్రమాణాల మేరకే ఎంపిక చేశారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ముందే చెప్పుకున్నట్లు రిలయన్స్‌ వంటి దిగ్గజ సంస్ధకు సైతం వెరవ కుండా దాని అక్రమాలను బయట పెట్టిన చరిత్ర వుంది. అలాంటి వ్యక్తి అదానీ సంస్ధల గురించి అదీ అదానీకి నరేంద్రమోడీతో వున్న సంబంధాలు తెలిసి కూడా ఆషామాషీగా గాలి వార్తలను పోగేసి కధనాలు రాశారని, తమ విశ్వాసాన్ని వమ్ము చేశారని అంటే నమ్మటం కష్టం. ఒక అంశంపై పరిశోధన చేసిన జర్నలిస్టుకు కొన్ని సందర్భాలలో తప్పుడు సమాచారం కూడా వచ్చి వుండవచ్చు. ఇపిడబ్ల్యు పత్రికలో అటువంటి వార్తలు రాశారంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు ఆ వార్తల గురించి అదానీ సంస్ధ లేదా ప్రభుత్వ ప్రమేయం కూడా వుంది కనుక ఆయా శాఖల స్పందన ఏమిటన్నది కూడా పరిశీలించకుండానే పరంజయ్‌ ఇతరులతో కలసి రాసిన వార్తలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని పేర్కొనటం ట్రస్టు సభ్యులపై అనుమానాలను పెంచేదే తప్ప వేరు కాదు. ప్రజల ఖజానాకు చేరవలసిన వందల కోట్ల రూపాయలను ఒక సంస్ధ అక్రమపద్దతుల్లో ఎగవేసిందని రాస్తే దానికి తగిన ఆధారాలను చూపాల్సిన బాధ్యత ఆ జర్నలిస్టుకు వుంటుంది. అది వాస్తవం కాదని అనే వారు సంస్ధ అయినా ప్రభుత్వశాఖలైనా అది ఎలా అవాస్తవమో జనానికి తెలియచేయాల్సిన బాధ్యత వారిపై కూడా వుంది. పరంజయ్‌, ఆయన సహరచయితలు రాసిన అంశాలు ప్రయివేటు లావాదేవీలకు సంబంధించినవి కావు. చట్ట సమీక్షకు లోబడినవే.

చట్ట సభలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున ఒకసారి జనంలోకి వెళ్లిన అంశాన్ని స్పీకర్‌ తన విచక్షణాధికారాన్ని వుపయోగించి రికార్డుల నుంచి తొలగించవచ్చు. అంతే తప్ప దాన్ని జనంలో ప్రచారం చేయకుండా నిరోధించలేరు.అలాగే ఇపిడబ్ల్యు పత్రికలో ఆ వ్యాసాలు ప్రచురితమై పాఠకులకు చేరాయి. వెబ్‌సైట్‌లో తొలగించినంత మాత్రాన జనానికి అందకుండా పోవు. వైర్‌ వంటి వెబ్‌సైట్లు వెంటనే ఆ వ్యాసాలను పునర్ముద్రించాయి. వాటికి కూడా ఇపిడబ్ల్యుకు ఇచ్చిన మాదిరే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని చట్టపరంగా ఎదుర్కొంటామంటూ సదరు వెబ్‌సైట్‌ ఆ రెండు విశ్లేషణలను ఇప్పటికీ పాఠకులకు అందుబాటులో వుంచింది. సమీక్ష ట్రస్టు చర్యతో ఆ వ్యాసాల్లో అసలేమి వున్నదనే ఆసక్తి పాఠకుల్లో మరింతగా పెరిగి వాటికి ప్రాచుర్యాన్ని పెంచాయి. అనేక మీడియా సంస్ధలు అదానీకి భయపడుతూనే రేఖా మాత్రంగా అయినా వాటిల్లో ఏముందో చెప్పకుండా వార్తలను ఇవ్వలేవు. జరిగిన అక్రమాల సారాన్ని కొద్ది వాక్యాలలో అయినా చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందో అని ఆ వార్తలను నిషేధించినా సామాజిక మాధ్యమంలో అందుబాటులో వున్నాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌ కంపెనీలను కూడా ఆదాని మేనేజ్‌ చేసి వారిని సంతృప్తి పరిస్తే తప్ప చర్చించేందుకు అవకాశాలు ఎన్నో వున్నాయి.

ఈ పరిణామం నిస్సందేహంగా దేశంలోని జర్నలిస్టుల ముందు ఒక సవాలు విసురుతోంది. ఎంతో శ్రమకోర్చి పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన అంశాలు జనానికి తెలియకుండా అడ్డుకోవటాన్ని సహిస్తే అసలు జర్నలిజానికి అర్ధం ఏమిటి? అలాంటి వాటిని ఎలా జనానికి తెలియచెప్పాలి. బ్రిటీష్‌ వారి కాలంలో వారికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలను ఎలా అణచివేసిందీ, ఒక పేరుతో వున్న దానిని అచ్చుకాకుండా చేస్తే మరొక పేరుతో ఎలా జనంలోకి తెచ్చిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్ధితులు పునరావృతం కానున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య మీడియాపై జనంలో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్నప్పటికీ నిజం కాకపోతే ఎలా అచ్చువేస్తారులే అనుకునే జనం ఇంకా వున్నారు. అందుకే వాస్తవాలను మరుగుపరచి కట్టుకథలు పిట్టకధలతో జనాన్ని నమ్మించగలుగుతున్నాయి.

ఇపిడబ్ల్యు వంటి ట్రస్టు మీద మేధావి వర్గంలో ఇప్పటి వరకు వున్న అభిప్రాయం వేరు ఇక ముందు అలాంటిది వుండదనే విషయాన్ని సమీక్ష ట్రస్టు గుర్తించాలి. పూర్వపు విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే అసలు వాస్తవాలేమిటనే విషయాన్ని అది జనం ముందుంచాలి. తన సంపాదకుడు రాసిన విశ్లేషణకు ఆధారాలు చూపలేకపోతే అప్పుడు అతన్ని రాజీనామా చేయమనటమో లేకపోతే ఏకపక్షంగా తొలగించటమో చేసి తమ పత్రిక చేసిన తప్పిదాన్ని నిజాయితీగా అంగీకరించి వుంటే ఇపిడబ్ల్యు గౌరవం మరింత పెరిగి వుండేది. సంపాదకుడు చెప్పిన అంశాలపై ముందుగా ట్రస్టు అంతర్గత విచారణ జరిపి, పరి శోధనాత్మక వార్తకు వున్న ఆధారాలేమిటో అంతర్గతంగా పరిశీలించిన తరువాత చర్య తీసుకోవటం ఒక పద్దతి అదేమీ లేదు, ఆ వ్యాసాలను ఎందుకు వుపసంహరించారో అధికారికంగా వివరణ లేదు కనుకనే యాజమాన్యం బయటివారి వత్తిడికి లంగిపోయినట్లు భావించాల్సి వస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. అనేక మంది మేధావుల అభిప్రాయాలు, మనోభావాలను మన్నించి పారదర్శకంగా వ్యవహరిస్తే నీలినీడలు పటాపంచలవుతాయి. ఒక విస్వసనీయ పత్రికగా ఇపిడబ్ల్యు ముందుకు పోతుంది. లేకుంటే ఏం జరిగేది చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో బడా మీడియా పాలవర్గతొత్తుగా మారి వాటి భజన చేస్తున్న సమయంలో వికీలీక్స్‌ వునికిలోకి వచ్చిన అమెరికా సామ్రాజ్యవాదుల బండారాన్ని వుతికి ఆరేస్తుందని, దాని గుట్టుమట్టులన్నీ బయటపెడుతుందని ఎవరైనా వూహించారా? ఆ సంస్ధ నిర్వాహకులకు అమెరికా ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఆధారాలు అందించబట్టే అది సాధ్యమైంది. అలాంటి వారు ప్రతి దేశంలోనూ వుంటారు. చరిత్రలో హేతుబద్దంగా ప్రశ్నించిన చార్వాకులను నాటి పాలకవర్గం నాశనం చేసింది. వారిని భౌతికంగా అంతమొందించారు తప్ప వారి భావజాలాన్ని అణచివేయలేకపోయారు. అలాగే ఇప్పటి వరకు ఇపిడబ్ల్యు నిర్వహించిన పాత్రను కొనసాగించేందుకు మరొక పత్రిక ఆవిర్భవించకుండా వుంటుందా ? ఏటికి ఎదురీదటమే బతికి వున్న చేపల స్వభావం. చచ్చిన చేపలే వాలునబడి కొట్టుకుపోతాయి. దేశంలో జర్నలిజం, జర్నలిస్టుల కర్తవ్యం కూడా బతికిన చేపల మాదిరి ఎదురీదటమే !

 

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందో లేదో చూడాలి !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వాతావరణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక మన గత చరిత్ర. గత ఘనతను చెత్తబుట్టలోకి నెట్టి మా శంఖంలోంచి వచ్చిందే పవిత్ర తీర్ధం, మేం చెప్పేదే అసలైన చరిత్ర,అదే వేదం, మేమే నిజమైన దేశభక్తులం, మాతో విబేధించేవారందరూ దేశ ద్రోహులే అనే అసహన, నిరంకుశ ధోరణులు వైరస్‌ మాదిరి వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక సమాజం పరిణితి చెందటానికి ఏమి చెయ్యాలి, ఎంత వ్యవధి పడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతకాలంగా పాలకులు అనుసరించిన విధానాలు తీవ్ర అసంతృప్తి కలిగించాయి. దానిని అవకాశంగా తీసుకొని స్వాతంత్య్రం, హక్కులకోసం జరిగిన పోరులో భాగస్వాములు కాని భావజాల వారసులు వాటికే ఎసరు తెస్తున్నా జనం మౌనముద్రదాల్చటం నిజంగా ఆందోళనకరమే.

71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సందర్భంగా అసంతృప్తికి ఆజ్యం పోస్తున్న ప్రధానమైన వాటిలో ఒకటైన అభివృద్ధి సమస్య గురించి అవలోకించటం సముచితంగా వుంటుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జనంలో ప్రచారంలో వున్న సాహిత్య సారం ఏమిటి? వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు కదా? వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, ప్రతి నాగరిక సమాజం అలాంటి ఆకాంక్షలనేే వ్యక్తం చేసింది. అయినా ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం, బలవంతులు బలహీనులను దోపిడీ చేసేందుకు జరిపిన మారణహోమమే సమస్త మానవజాతి గత చరిత్ర. మంచిని కోరుకుంటే అమలు జరిగేది కాదు, దోపిడీని అరికట్టి కొత్త వ్యవస్దను నిర్మించటమే మార్గమని సోషలిజం, కమ్యూనిజం అనే ఒక నూతన భావనను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ ముందుకు తెచ్చారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అనే మార్గంలో మన ప్రయాణం ఎంత వరకు సాగింది? గడ్డం, టోపీ పెట్టుకున్నావు, నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావ్‌,దేశద్రోహివి నిన్ను చంపేస్తా అన్న వున్మాదం వరకు అని న్యూఢిల్లీ రైలు వుదంతంలో చూశాం కదా ! గుప్తుల స్వర్ణయుగం అనో మరొకటో చెప్పి మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే ప్రయోజనం వుంటుందా? మన పూర్వీకులు ప్రపంచానికి ఎంత ఇచ్చారో ప్రపంచం నుంచి కూడా అవసరమైంది పుచ్చుకున్నారని గ్రహించాలి.

అలెగ్జాండర్‌ మన దేశాన్ని ఆక్రమించుకొనేందుకు చేసిన ప్రయత్నం సఫలమై వుంటే, మన దేశంలో పుట్టిన బౌద్ధాన్ని మన పాలకులే నాశనం చేయకుండా వుంటే, మనువాదంతో మన చుట్టూమనం, ఇతరుల చుట్టూ గిరులు గీసి వుండకపోతే మన చరిత్ర మరోవిధంగా వుండేది. తురుష్కులు, ఆఫ్ఘన్‌్‌ దేశాల పాలకుల దండయాత్రలను ఎదుర్కోవటంలో జరిగిన వైఫల్యమే, తరువాత కాలంలో ఐరోపా దేశాల విషయంలో కూడా పునరావృతమై వాటిలో అగ్రశక్తిగా వున్న బ్రిటన్‌ ఆధీనంలోకి మన దేశం వెళ్లిపోయింది.

పొరుగునే వున్న చైనా పరిణామాలు మనకు భిన్నంగా జరిగాయి. హాంకాంగ్‌ను బ్రిటీష్‌వారికి అప్పగించినా అక్కడి క్వింగ్‌ రాజరికం ప్రధాన భూ భాగ ఆక్రమణకు బ్రిటీష్‌ వారికి అవకాశమివ్వలేదు. ఆ రాచరికానికి, బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా జాతీయవాదులు పోరాడి రాజరికాన్ని అంతమొందించి 1912లో రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాచరిక శక్తులు వాటితో కుమ్మక్కయిన యుద్ధ ప్రభువులు బీజింగ్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించి తిరుగుబాటు చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు సన్‌యెట్‌సేన్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ కమ్యూనిస్టులతో కలసి ఒక జాతీయ సైన్యాన్ని తయారు చేసి యుద్ద ప్రభువులను అణచివేసేందుకు దశాబ్దాల పాటు సాయుధ చర్యలను జరపాల్సి వచ్చింది.ఆ క్రమంలో అదే కొమింటాంగ్‌ పార్టీలోని మితవాదులు కమ్యూనిస్టులను అణచేందుకు పూనుకోవటంతో రెండు శక్తుల మధ్య జరిగిన అంతర్యుద్ధమే కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ప్రఖ్యాత లాంగ్‌ మార్చ్‌.ఆ క్రమంలోనే 90 ఏండ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ ప్రజావిముక్తి సైన్యాన్ని ఏర్పరచింది.

అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకున్నారు. దానికి వ్యతిరేకంగా మరోసారి కొమింటాంగ్‌-కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ఒకవైపు జపాన్‌తో పోరాడుతూనే బలపడుతున్న కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసేందుకు కొమింటాంగ్‌ మితవాదులు మరోసారి కమ్యూనిస్టులను అణచేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జపాన్‌ ఓటమితో పాటు కొమింటాగ్‌ సేనలను కూడా కమ్యూనిస్టులు అదుపులోకి తెచ్చారు. 1949 నాటికి అది సంపూర్ణమైంది. అంటే నిజమైన స్వాతంత్య్రం, సమగ్ర చైనా అప్పటికికాని రూపొందలేదు.

మనకంటే రెండు సంవత్సరాలు వెనుక విముక్తమైన చైనాతో పోల్చుకుంటే స్వాతంత్య్రం నాటికి మన పరిస్థితి ఎంతో మెరుగు. తమ అవసరాలకోసమే అయినప్పటికీ బ్రిటీష్‌ వారు మన దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించారు, ఆనకట్టలను నిర్మించారు. చైనాకు నల్లమందును దిగుమతి చేసి అక్కడి జనాన్ని నల్లమందు భాయిలుగా మార్చారు. క్వింగ్‌ రాజరికశక్తులు, యుద్ద ప్రభువులు తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు తప్ప దేశాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కమ్యూనిస్టుల విప్లవానికి ముందు మూడున్నర దశాబ్దాలు జరిగిన, తరువాత పదిహేను సంవత్సరాల పాటు అంటే మొత్తం ఐదు దశాబ్దాలకు పైగా చైనాలో పరిస్ధితులు తిరుగుబాట్లు, కుట్రలతోనే కూడి వున్నాయి, అసలు ఐక్యరాజ్యసమితిలో దానికి 1971వరకు సభ్యత్వం, గుర్తింపే లేదు. పెట్టుబడులు, ఆధునిక పరిజ్ఞానం అందకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకున్నారు. మనపరిస్ధితి అది కాదు. సోవియట్‌ సాయం పొంది అనేక పరిశ్రమలు, రక్షణ వుత్పత్తులను పొందాం. చివరకు ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలలో సాధిస్తున్న విజయాల వెనుక సోవియట్‌ సాయం ఎంతో వుంది.నాటి నుంచి నేటి వరకు ఒక్క జనాభాలో మాత్రమే మనం చైనాతో పోటీలో వున్నాం.మరో పది సంవత్సరాలలో చైనీయులు అమెరికానే అధిగమించనున్నారని కొందరు అంచనా వేస్తున్న సమయంలో సమవుజ్జీకాని దానితో మన దేశాన్ని పోల్చుకోవటం వృధా ప్రయాసే అవుతుంది.

వర్తమానానికి వస్తే అనేక ఆటంకాలను ఎదుర్కొని చైనా ఆర్ధికంగా బలపడి రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టి అమెరికా తరువాత పెద్ద శక్తిగా తయారైంది. కొందరు మన దేశం త్వరలో చైనాను అధిగమించే విధంగా పురోగమిస్తోంది అని చెబుతున్నారు. మనం చైనా, ఐరోపా, అమెరికాతోనే పోటీపడి ముందుకు పోతే అంతకంటే కావాల్సింది ఏముంది? పోటీపడాలనే అభ్యుదయవాదులు కోరుకుంటున్నారు.

విధానాలపై ప్రశ్నలు వేసుకొనే ముందు రెండు దేశాలలో వున్న తాజా పరిస్ధితులను ఒక్కసారి చూద్దాం. 1952లో ప్రపంచ జిడిపిలో రెండు దేశాల వాటా దాదాపు సమానం. ఈరోజు మనమెక్కడ, వారెక్కడ ? మనకు ఆరు దేశాలతో సరిహద్దులుంటే చైనాకు 14తో 22వేల కిలోమీటర్లకు పైబడిన భూ సరిహద్దులున్నాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొక దేశం లేదు. సముద్రతీరం మనది ఏడువేల కిలోమీటర్లయితే వారికి 14,500 అందువలన దౌత్యపరంగా, సమస్యలతో పాటు మనకంటే రక్షణ ఖర్చూ, దౌత్య అనుభవమూ ఎక్కువే. వ్యవసాయ భూమి మన దేశంలో 64.5శాతం, దానిలో సాగుకు యోగ్యమైంది 52.8శాతం వుంటే చైనాలో అవి 54.7,11.3 శాతాలుగా మాత్రమే వున్నాయి. ప్రపంచ సాగు భూమి వాటా చైనాలో ఏడు శాతం వుంటే జనాభా 21శాతం వుంది. అయినా అక్కడ ఆహార ధాన్యాలకు కొరత లేదు.అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలు వందల సంవత్సరాలలో సాధించిన అభివృద్దిని చైనా కొన్ని పదుల సంవత్సరాలలోనే అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు సాధించిన చైనాను చూసి మన దేశం కూడా ఎలా ముందుకు పోవాలా అని చూడకుండా మనది ప్రజాస్వామ్యం, వారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని పోసుకోలు కబుర్లు చెబితే కుదరదు. వాస్తవాలేమిటని యువత ఆలోచించాల్సిన అవసరం లేదా ?

1987లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో చైనా వాటా 1.6శాతం కాగా అది 2012 నాటికి 11.47శాతానికి చేరింది. 1964లోనే 3.1శాతంగా వున్న మన వాటా 1992 నాటికి ఒకశాతానికి పడిపోయింది. ప్రపంచబ్యాంకు తాజా సమాచారం ప్రకారం అమెరికా జిడిపి వాటా 24.32, చైనా 14.84,జపాన్‌ 5.91 శాతాలతో వుండగా మన దేశం 2.83 శాతం దగ్గర వుంది. అంటే జపాన్‌, మన కంటే పెద్దవిగా జపాన్‌ తరువాత వున్న జర్మనీ,బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను కూడా దాటి త్వరలో చైనాను అధిగమించే దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలో మనం పయనిస్తున్నామనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దానికి తందాన అంటే దేశభక్తులు, మోసపూరిత ప్రచారం, వాస్తవ విరుద్ధం అంటే దేశద్రోహులా ? అయితే మనదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదా ? అది కార్పొరేట్లను, బిలియనీర్లను పెంచుతున్నది తప్ప సామాన్యులకు మేలు చేయటం లేదనేదే విమర్శ. వుపాధి రహిత అభివృద్ది సంపదలు ధనికుల వద్ద పోగుపడటానికి దారితీస్తుంది తప్ప జనానికి మేలు చేయదు.

స్వాతంత్య్రం తరువాత మన దేశంభూస్వాములతో రాజీపడిన పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందే బాటను ఎంచుకుంది.దానితోనే సమసమాజాన్ని స్ధాపిస్తామని పాలకవర్గం నమ్మబలికింది. మరోవైపు చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధతో సమసమాజాన్ని ఏర్పాటు చేయాలనే బాటను ఎంచుకుంది. ఇక్కడే అనేక మంది గందరగోళపడుతున్నారు. వందల సంవత్సరాల పాటు, భూస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్ధలలో వున్న దేశాలు ఒక్క గంతువేసి తెల్లవారేసరికి సోషలిస్టు సమాజాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ చెప్పలేదు. చరిత్రను గమనిస్తే ఫ్యూడల్‌ వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ విధానం నేటి వున్నత స్ధితికి చేరుకోవటానికి వందల సంవత్సరాలు పట్టింది. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు నడుస్తున్న ప్రాధమిక సంధిదశ ఇది.

నిర్దేశిత నమూనాలేవీ లేవు కనుక తన అనుభవాల ఆధారంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తనదైన ప్రత్యేక తరహా( దానినే చైనా లక్షణాలతో కూడిన అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. భిన్న దశలలో వున్న దేశాలలో ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం సాధ్యం కాదన్నది స్పష్టం. 1949 నుంచి 1978 వరకు తన బాటను సమీక్షించుకున్న చైనా కమ్యూనిస్టుపార్టీ దానికి భిన్నంగా కొన్ని సంస్కరణలు అవసరమని భావించింది. 1978లో చైనా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. అంతకు ముందు అక్కడ అభివృద్ధి లేదా? ఆరుశాతానికి అటూఇటూగా వుండేది. అంతమంది జనానికి పని కల్పించాలన్నా, వారి జీవితాలను మెరుగుపరచాలన్నా ఆ వృద్ధి రేటు, ఆదాయాలు చాలవని కమ్యూనిస్టుపార్టీ గుర్తించింది.ఆ సంస్కరణలు కొన్ని కొత్త సమస్యలను సృష్టించినప్పటికీ మొత్తం మీద జనజీవితాలను ఎంతగానో మెరుగుపరిచాయి. ఇదే సమయంలో కొత్త ధనిక తరగతిని కూడా సృష్టించాయి. మొత్తం మీద మొగ్గు ఎటుఅంటే జనజీవితాల మెరుగుదల, దారిద్య్రనిర్మూలన వైపే అన్నది స్పష్టం.మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను గడువు కంటే ముందుగా చైనా చేరుకుంది. ఆ విషయాన్ని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ ఆర్ధిక వేదిక వంటి సంస్ధలన్నీ తమ నివేదికలలో పుంఖాను పుంఖాలుగా పేర్కొన్నాయి.

1978 నుంచి చైనా సంస్కరణలు విఫలమౌతాయని అనేక మంది చెప్పిన జోశ్యాలన్నీ ఇప్పటివరకు విఫలమయ్యాయి. చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు జరుపుతున్నదని చెప్పటమే ఒక వక్రీకరణ. అసలు అక్కడ పెట్టుబడిదారీ విధానమే వుందని చెప్పేవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మూలస్ధంభాల వంటి అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం చైనా వేగాన్ని కొంత మేరకు తగ్గించింది తప్ప సంక్షోభంలోకి ఎందుకు నెట్టలేదు? ఈ కాలంలోనే అది జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ దేశంగా ముందుకు రావటం ఎలా సాధ్యం? నిజాయితీగా ఆలోచించేవారికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకటం కష్టం కాదు.

తనకున్న అపార మానవవనరును ఆర్ధిక శక్తిగా మార్చేందుకు చైనా విదేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తన షరతుల మీద ఆమోదించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు ముగిసిన సందర్భంగా అక్కడి పెట్టుబడులు తరలి పోకుండా చూసేందుకు, అవి ప్రధాన చైనాలో కొనసాగేందుకు ఒకే దేశం- రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని 2050వరకు అమలు జరుపుతామని ప్రకటించింది. అంటే ప్రధాన భూభాగంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద, హాంకాంగ్‌, మకావుల్లో నెలకొన్న పెట్టుబడిదారీ వ్యవస్దలను కూడా కొనసాగనిస్తామని స్పష్టం చేసింది. హాంకాంగ్‌లో డాలర్లు, చైనాలో యువాన్‌ కరెన్సీ. ఇదొక ప్రయోగం. ఈ కారణంగా హాంకాంగ్‌ కేంద్రంగా వున్న అనేక కంపెనీలు ఎలాంటి భయం లేకుండా చైనాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దాని వలన చైనాతో పాటు ఆ కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. సంస్కరణల ప్రారంభంలో వాటికి ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గాలికోసం కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు దోమలూ, ఈగలు కూడా వస్తాయి, వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు.

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న మాంద్యం కారణంగా చైనా వస్తువులకు కొంత డిమాండ్‌ తగ్గినమాట వాస్తవం. ఆ కారణంగా అక్కడ లేఆఫ్‌లు జరిగినట్లు వార్తలు లేవు. ఎందుకని ? విదేశీ ఎగుమతులు తగ్గినదానికంటే స్వదేశీ వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. 2008లో చైనా కార్మికుడి వార్షిక సగటు వేతనం 29,229 యువాన్లు వుంటే 2016లో అది 67,596కు చేరిన కారణంగా అంతర్గత వినియోగం పెరిగింది. అందుకే చైనా ముందుకు పోతోంది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మన మాదిరి కార్పొరేట్‌ సంస్ధలకు రాయితీలు ఇవ్వటం గాక జనానికి మరలిస్తున్నకారణంగానే వారి వస్తువినియోగం పెరుగుతున్నది. చైనా విజయ రహస్యం అదే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక సమస్య వుందని చైనాయే స్వయంగా చెబుతోంది.

చైనాలో ఏటేటా వేతనాలు పెరుగుతున్నందున ఇంకేమాత్రం అక్కడ చౌకగా వుత్పత్తి చేయటం సాధ్యం కాదని అనేక కార్పొరేట్‌ సంస్ధలు అంతకంటే శ్రమశక్తి చౌకగా దొరికే చోట్లను వెతుకుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులను నరేంద్రమోడీ ఆహ్వానిస్తున్నారు. వాటికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు పూనుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ఇటువంటి విధానాలు అనుసరించటమంటే ఏమిటి ? గతంలో బ్రిటీష్‌ వాడు మన దేశంలోని రాజుల, రంగప్పల అనుమతి కోరి మన దేశంలో వ్యాపారం ప్రారంభించాడు. ఎర్రతివాచీ పరచి చక్కగా ఏర్పాట్లు చేస్తాము వచ్చి మా కార్మికుల శ్రమను దోచుకుపోండని విదేశీయులను మనమే ఆహ్వానిస్తున్నాము.

ఈ మధ్యకాలంలో కొందరు చైనా వ్యతిరేకులు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇస్తున్నారు. తద్వారా అందరూ దేశ భక్తిని నిరూపించుకోవాలని చెబుతున్నారు. మన దేశాన్ని ఆక్రమించి మన సంపదల మూల్గులు పీల్చుతున్న బ్రిటీష్‌ వారిని తరిమివేసేందుకు సాగిన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ అన్నది ఒక ఆయుధం. ఆ వుద్యమానికి దూరంగా వుండి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర హిందూత్వ సంస్ధలకు చెందిన వారే ఇప్పుడు చైనా వస్తువు బహిష్కరణకు విఫల పిలుపులు ఇస్తున్నారు. మన దేశంతో సహా ప్రపంచంలో తయారయ్యే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, అవి పని చేసే వ్యవస్ధలలో చైనా వస్తువులు లేదా చైనాలో తయారైన విడిభాగాలు లేనిదెక్కడ? అందువలన ముందుగా వారు తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తగులబెట్టి మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీగారి ఫ్యాక్టరీలలో తయారైన నిఖార్సయిన స్వదేశీ వస్తువులను వాడి చూపమని అడగాలి.

చౌకబారు రాజకీయం కాకపోతే ఒక్క చైనాయేం ఖర్మ అన్ని రకాల విదేశీ వస్తువులను బహిష్కరించి వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవటానికి ఎవరు అడ్డుపడుతున్నారు?. అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సమాచారం ప్రకారం 2016లో చైనా 2011 బిలియన్‌ డాలర్లు, హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేసింది. ఒకే చైనాగా లెక్కవేస్తే 2497 బిలియన్‌ డాలర్లు. దానిలో మనం దిగుమతి చేసుకొనేది కేవలం 58 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులనే. వాటి దిగుమతులను నిలిపివేస్తే చైనా దారికి వస్తుందని చెబితే అమాయకులు తప్ప ఎవరు నమ్ముతారు.

చివరిగా మన సంస్కరణల విజయవంతం గురించి ముచ్చటించుకోకపోతే అసంపూర్ణం అవుతుంది. కాంగ్రెస్‌ పాలనలో సంస్కరణలు విఫలమయ్యాయని, అభివృద్ధి ఏదైనా వుంటే అది వుపాధిరహితంగా జరిగి కార్పొరేట్లకే ప్రయోజనం జరిగిందన్నది స్పష్టం. నరేంద్రమోడీ సర్కార్‌ ఆ విఫల విధానాల కొనసాగింపు తప్ప కొత్తదనం ఏముంది? గతనెలలో ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సహకార కూటమి(ఆర్‌సిఇపి) సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.దానిలో చైనా భాగస్వామి. వాటిలోని కొన్ని అంశాలు మన దేశ పౌరుల ప్రయోజనాలకు హానికలిగిస్తాయని వామపక్ష, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారు వ్యతిరేకత, నిరసన తెలిపారు తప్ప కాషాయ దళాల జాడలేదెందుకని? ఏదేశమైనా పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తాలను ఖర్చు చేయకుండా అభివృద్ధి చెందజాలదు. మనం 2015 తలసరి 39.37, చైనా 298.56 డాలర్లు ఖర్చు చేశాయి. ఇంత తక్కువ ఖర్చు చేయమని ఏ ప్రజాస్వామిక వాది చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని కొత్త పుంతలు తొక్కించింది. ఆవు పేడలో ఏం దాగుంది, మూత్రంలో ఏమున్నాయో పరిశోధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలే కేటాయింపు తక్కువ, దాన్ని ఆవు సైన్సు మీదకు మళ్లింపా ! ఇలాంటి పరిశోధనలతో చైనాను అధిగమిస్తామా ! ప్రపంచం నవ్విపోతుంది. చైనా గాకపోతే మరొక మంచి విధానాన్ని అమలు జరపండి ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలి.

ఆరు పదాలపై ‘ ఆంక్షలు ‘ రవీంద్రుని మానవత్వంపై ‘అసహనం’

Tags

, , , , , , , , , , ,

సత్య

దేశంలో వాక్సభా స్వాతంత్య్రాలకు ముప్పు వస్తోందా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అనేక మంది తమకు సంబంధించినవి కావన్నట్లుగా అసలు వాటి గురించి పట్టించుకోవటమే మానుకున్నారు. వీరిలో రెండు రకాలు అణచివేత, వివక్ష, విద్వేషానికి బలౌతున్నవారు ఒక తరగతి అయితే మేథావులం అనుకునే వారు రెండో తరగతి. మొదటి వారితో ఇబ్బంది లేదు, సమయం, సందర్భం వచ్చినపుడు తమ సత్తా ఏమిటో చూపుతారు. గడియారంలోని లోలకం మాదిరి అటో ఇటో వూగటం తప్ప నిలబడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు రాని మేథావులతోనే అసలు సమస్య. వంది మాగధులు పొగడ్తలకు రాజులు, రంగప్పలు ఎలా పొంగిపోయేవారో, తమను విమర్శించేవారిని ఏం చేశారో చూశాము. ఆ రాజరికాలు, జమిందారీ వ్యవస్ధ పోయినా ఆ స్వభావం మాత్రం పాలకులలో ఇంకా సజీవంగానే కొనసాగుతోండటమే ప్రమాదకరం.

మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న చోట గుజరాత్‌, ఆవు, హిందు, హిందూత్వ,ఈ రోజుల్లో, ఇండియాలో అనే పదాలు వినిపించకూడదు, వాడకూడదు.పాఠ్య పుస్తకాలలో అరబ్బీ, ఆంగ్లం, వుర్దు పదాలను తీసివేయాలి. రవీంద్రనాధఠాగూరు ఆలోచనలు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఆత్మకధ వుండకూడదు, మొఘల్‌ చక్రవర్తుల దయాగుణం కలవారని, బిజెపి హిందూ పార్టీ అని, నేషనల్‌ కాన్ఫరెన్సు లౌకికవాద పార్టీ అన్న వర్ణలు వుండకూడదు.1984 దాడులపై మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన క్షమాపణ, గుజరాత్‌లో దాదాపు రెండువేల మంది ముస్లింలను చంపివేశారనే వ్యాక్యాలను పాఠ్యపుస్తకాలను తొలగించాలి. ఇలా రోజు రోజుకూ నిషేధిత పదాలు, భావనలు, ఆలోచనలు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటన్నింటినీ బయటకు తెలియనివ్వకుండా సంబంధిత సంస్ధలు తమంతట తామే చేసినట్లుగా బయటకు కనిపించాలని కోరుకొనే శక్తులు తమ బండారం బయట పెట్టిన మీడియా గురించి రెచ్చిపోతున్నారు.

సుమన్‌ ఘోష్‌,                                 అమర్త్యసేన్‌                       పహ్లజ్‌ నిహ్లానీ

ముందుగా ఆరు మాటలపై ఆంక్షల గురించి చూద్దాం. వీటిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ పదవీకాల గడువు ముగియక ముందే కేంద్ర ప్రభుత్వం తొలగించి ప్రసూన్‌ జోషి అనే రచయితను నియమించింది. తన పదవీ నియామకంతో పాటు తొలగింపు కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానని నిహ్లానీ వ్యాఖ్యానించాడు. ఇక నేరుగా సాధారణ సినిమాల్లోనే అశ్లీల, అసభ్య దృశ్యాలను చూడవచ్చని వుక్రోషం వెలిబుచ్చారు. అసాంస్కృతిక లేదా మర్యాద తెలియని సేన చేతిలో కాలం చెల్లిన ఆయుధంగా వుపయోగపడిన వ్యక్తికి కేంద్రం ముగింపు పలికిందని ఒక పత్రిక వ్యాఖ్యాన శీర్షికలో పేర్కొన్నారు. చరిత్రను వెనక్కు నడపాలని చూస్తున్న, ఏది తినకూడదో, ఏ డ్రస్సు వేసుకోకూడదో, ఎప్పుడు బయట తిరగాలో ఇలా ప్రతి జీవన రంగంలో కాలం చెల్లిన ఆయుధాలతో ‘స్వయంసేవకులు’ మూలమూలనా రెచ్చిపోతున్న స్ధితిలో నూతన అధిపతి ఎలా పని చేయగలరో చూడాల్సి వుంది.

నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ గురించి సుమన్‌ ఘోష్‌ అనే ఒక దర్శకుడు ‘భారతీయ తార్కికుడు ‘ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దానికి కేంద్ర ఫిలింసెన్సార్‌ బోర్డు తాము చెప్పిన ఆరు పదాల కోతలకు అంగీకరిస్తేనే ప్రదర్శనకు అనుమతి సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పింది.పైన పేర్కొన్న మొదటి ఆరుపదాలు, వాటితో కూడిన వ్యాక్యాలను ఆ డాక్యుమెంటరీలో వినిపించకుండా చేయాలని జూలై 11న కోరింది. ఒక్క కోతకు కూడా తాను అంగీకరించటం లేదని ఒక నెల రోజుల తరువాత దర్శకుడు తిరస్కారాన్ని తెలిపాడు. తరువాత ఆ చిత్రాన్ని పునర్విచారణ కమిటీకి పంపుతారు. అదొక తతంగం, ఇంత జరిగాక దానిని ఏమి చేస్తారో వూహించనవసరం లేదు. కుక్క మనిషిని కరవటం సాధారణ విషయం. కానీ మనిషే కుక్కను కరవటం సంచలన వార్త. దేశంలో నేడున్న స్ధితిలో ఆరు పదాలపై ఆంక్షలు పెట్టటం సాధారణం.ఇంత రాద్ధాంతం జరిగాక వాటిని అంగీకరించి అనుమతిస్తేనే అది అసలైన వార్త అవుతుంది. చివరికి అదేమైనా అసలు ఆ పదాలపై ఎందుకు అభ్యంతర పెడుతున్నారన్నదే తెలుసుకోవాల్సిన, తేలాల్సిన అంశం.

సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలపై దేశమంతటి నుంచి అనేక మంది మేథావులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఆ పదాలకు కోత పెట్టినందువలన దర్శకుడి సృజనాత్మకతకు, అమర్త్యసేన్‌ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. ఆ పదాలు భారతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని విస్పష్టంగా తిరస్కరించేవిగా వున్నాయని, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఒక భారతీయుడిపై నిర్మించిన డాక్యుమెంటరీలో రాజకీయాలు, మతం గురించి మందబుద్దితో చేసిన వ్యాఖ్యలను అనుమతిస్తే శాంతి, సామరస్యాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భావించామని వాదించారు. ఒక సందర్భంలో భారతీయ ప్రజాస్వామ్యం గురించి చేసిన ప్రస్తావనలో గుజరాత్‌ నేరాల గురించి పేర్కొన్నారని, దానిలో గుజరాత్‌ అనే పదం తీసివేయమని కోరామన్నారు. మరొక సందర్భంలో ఇండియాలో శత్రువు మతనాయకత్వమని చేసిన ప్రస్తావనలో ఇండియా అనే పదం వాడవద్దన్నామని, ఇండియాను హిందు అని భాష్యం చెప్పినందున హిందూ అనే పదాన్ని తొలగించాలని కోరామన్నారు. ఆవు గురించి మతానికి ముడిపెడుతూ నిరర్ధకమైన ప్రస్తావన చేసినందున ఆవు పదాన్ని వాడవద్దని కోరామని, ఈ రోజుల్లో వేదాలను దురభిమాన పద్దతిలో వినియోగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలో ఈ రోజుల్లో, వినియోగిస్తున్నారు అనే పదాలను తొలగించాలని కోరినట్లు నిహలానీ చెప్పారు. భారత హిందుత్వ వైఖరి నకిలీదని ఆగ్రహం కలిగించే విశేషణం వాడినందున దానిని కూడా తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ పదాలను తొలగించాలని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వత్తిడి లేదని, అలా కోరటాన్ని ప్రభుత్వ అనుకూల చెంచాగిరి చేసినట్లుగా చూశారని వ్యాఖ్యానించారు. ఆవు, హిందూత్వ గురించి చేసిన వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని, చిత్ర నిర్మాతలు భావ ప్రకటనా స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి స్వేచ్చ బాధ్యతతో కూడినదై వుండాలని కూడా వారు తెలుసుకోవాలని నిహ్లానీ అన్నారు. మీరు నోబెల్‌ బహుమతి గ్రహీత కావచ్చు జనం పవిత్రమైనవిగా భావిస్తున్న వాటిని తృణీకారంతో మాట్లాడితే మీపై దాడులు జరిగే అవకాశాలున్నాయని కూడా సెన్సార్‌ బోర్డు అధిపతి వ్యాఖ్యానించారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ లేకుండా పలు బహిరంగ స్ధలాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు, అది చట్టవిరుద్దం, భావ ప్రకటనా స్వేచ్చ మంచిదే చట్ట వుల్లంఘన మాటేమిటని నిహ్లానీ ప్రశ్నించారు.

సెన్సార్‌ బోర్డు అధిపతి ప్రస్తుతం దేశంలో మనువాద, సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న వాదనలను అధికారికంగా వ్యక్తం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ భావజాలంతో ఆయన ప్రభావితులయ్యారా లేక అధికారం ఆయనను ప్రభావితం చేసిందా అన్నది సమస్య. మొదటిదే వాస్తవమైతే అన్ని రంగాలలో తిరోగమనవాదులతో నింపే ప్రప్రకియలో భాగంగానే ఆయనను అక్కడ నియమించారని, లేకపోతే ఆయనపై వత్తిడి తెచ్చారని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. కొంత మంది పవిత్రంగా చూస్తున్నదానిని జనం మొత్తం చూస్తున్నారని చిత్రించటం, వాటితో విబేధించి వర్ణనలు చేస్తే దాడులు జరుగుతాయని చెప్పటమంటే పరోక్షంగా అదే చేయమన్న సందేశం తప్ప మరొకటి కనిపించటం లేదు. మతోన్మాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల తరగతికి చెందిన వారు చేస్తున్న దుర్మార్గాలన్నీ దేవుళ్లు, దేవదూతలు, దేవుని బిడ్డలో, ఆయా మతాల గ్రంధాలు చెప్పాయనో, శాశించాయనో, జనాభిప్రాయమనో, కోరారనో పేరుతో చేస్తున్నవే అని గమనించాలి.

ఆవు, వేదాలు, హిందూత్వల గురించి భిన్న అభిప్రాయాలు వెలువరించటం ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు, లేదూ కొత్తగా ప్రారంభించినా తప్పేమీ కాదు. తమ వ్యాఖ్యానాలకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదని కొన్ని శక్తులు తమ అభిప్రాయాన్ని దేశం మొత్తం మీద రుద్దటం గతంలో నడవ లేదు, ఇప్పుడూ కుదరదు, అది ఏ రీత్యా చూసినా ప్రజాస్వామ్య వైఖరి కాదు. చర్చోపచర్చలు చేయవచ్చు, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు. ఏ వైఖరిని కలిగి వుండాలనేది లేదా ఏ వైఖరికీ బద్దులం కాకూడదనో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలితప్ప భిన్నాభిప్రాయం, భిన్న వ్యాఖ్యానం వినిపించకూడదని చెప్పటం ఏమిటి ? ఇక పహ్లజ్‌ నిహ్లానీ నియామకం, తొలగింపు ఏమి సూచిస్తున్నది. తన తిరోగమన భావాలను సమాజంపై రుద్ధితే వాటి ప్రభావం ఎలా వుంటుందో సంఘపరివార్‌ పరీక్షిస్తున్నది. రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే తమ మనసెరిగి నడుచుకున్నప్పటికీ నిహ్లానీని కొనసాగించటం నష్టదాయకం అని గ్రహించినట్లుగా కనిపిస్తున్నది. అన్ని రంగాలలో ఒకేసారి తమ అజెండాను రుద్దితే నష్టం కనుక బ్రిటీష్‌ వారి సేవలో నేర్చుకున్న విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా కాషాయ పరివారం కొంతకాలమైనా సినీరంగాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుందా అన్నది చూడాల్సి వుంది.

ఇక పాఠ్యపుస్తకాల నుంచి విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూరు అభిప్రాయాలు, కొన్ని భాషా పదాలు, ఇంకా ఏమేమి తొలగించాలో సూచిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి వుత్తన్‌ న్యాస్‌ రూపొందించిన డిమాండ్ల జాబితాను ఆ సంస్ధ నేత దీనా నాధ్‌ బాత్ర నాయకత్వంలో ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించారు. వాటిని ప్రముఖంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతర అనేక పత్రికలు ప్రచురించాయి. వాటిని చూసిన వారు ఇదేమి వైఖరని ఆగ్రహం, విమర్శలు వ్యక్తం చేయటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మీడియాపై చిందులు తొక్కుతున్నారు.

మీడియా సైద్ధాంతికంగా, వివక్షతో కూడినదే గాక దేశాన్ని విభజించేందుకు కుట్రపన్నుతోందని, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని పైన పేర్కొన్న సంస్ధ న్యాస్‌ జాతీయకార్యదర్శి అతుల్‌ కొథారీ ఆరోపిస్తే, మాజీ జర్నలిస్టయిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌కమ్యూనిసకేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన కెజి సురేష్‌ దాడి చేశారు. దొంగే దొంగని అరచినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వ్యవహారం వుంది. రవీంద్రుని భావాలను తొలగిస్తున్నారా అని పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన దానికి ఒక స్వతంత్ర సంస్ధ అయిన ఎన్‌సిఇఆర్‌టి తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నట్లుగా అలాంటిదేమీ జరగబోవటం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఆ సంస్ధ ప్రతినిధులెవరూ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రంలో రవీంద్రుని గురించిన ప్రస్తావన లేదని, కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవాస్తవ వార్తలు ప్రచురించాయని, ఎక్స్‌ప్రెస్‌కు లీగల్‌ నోటీసు పంపుతామని న్యాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

తమ పత్రంలో లేని అంశాలను మీడియా పేర్కొన్నదని ఆరోపిస్తున్న పెద్దలు అసలు తాము సమర్పించిన దానిని బహిరంగపరిచి మీడియా చేసిన వక్రీకరణలను లోకానికి తెలియచేయవచ్చు. కానీ వారా పని చేయలేదు. అదేమీ రహస్యం కాదు, అయినా ఇంతవరకు దానిని అధికారికంగా బహిరంగపరచలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రాన్ని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు అందచేసినట్లు న్యాస్‌ ప్రతినిధులు అంగీకరించారు.దాని కాపీలను మిగతా వారికి అందచేస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. తాను రాసిన వార్తలపై ఎక్స్‌ప్రెస్‌ పత్రిక కట్టుబడి వుంది కనుకనే వారికి లీగల్‌ నోటీసు ఇస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. కనుక పత్రికా వార్తలు లేదా వ్యాఖ్యానాలతో విబేధిస్తున్న న్యాస్‌ తన పత్రంలో ఏం వుందో వెల్లడించాల్సిన బాధ్యత దాని మీదే వుంది.

తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ అని పేర్కొనటాన్ని కూడా న్యాస్‌ అభ్యంతర పెట్టింది. అసలు ఆర్‌ఎస్‌ఎస్సే నమోదిత సంస్ధ కాదు.జనాన్ని మభ్యపెట్టేందుకు లేదా వేరే ప్రయోజనంతో కావచ్చు, దానిలో పని చేసే ప్రముఖుల ఆధ్వర్యంలో అనేక సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. అవన్నీ వాస్తవానికి దాని కనుసన్నలలో పని చేసేవే అన్నది అందరికీ తెలిసిన సత్యం.ఆర్‌ఎస్‌ఎస్‌కు బిజెపి అనుబంధ సంస్ధ అని ఎక్కడా వుండదు. కానీ దాని నాయకులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. దానిలో సభ్యత్వాన్ని వదులుకోవాలని గతంలో జనతా పార్టీలో ఒక డిమాండ్‌ వచ్చినపుడు దానిలో విలీనమైన పూర్వపు జనసంఘనేతలెవరూ అంగీకరించలేదు. తరువాత వారంతా బిజెపిని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. సాంకేతికంగా అనుబంధం వుంటుందా అంటే వుండదు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె వంటి పార్టీలన్నీ తమ అనుబంధ సంస్ధలనాయకత్వాన్ని నియమిస్తూ బహిరంగంగానే ప్రకటిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలలో నాయకులుగా వున్న వారు అనేక ప్రజా సంస్ధలలో కూడా పని చేస్తూ వాటికి నాయకులుగా కూడా వుంటారు. అవి నిజానికి పార్టీ అనుబంధ సంస్ధలు కావు, పార్టీ సభ్యులు కాని వారు కూడా వాటిల్లో నాయకులుగా వుంటారు వాటిని అనుబంధ సంస్ధలని నిరూపించే ఆధారాలను ఎవరూ చూపలేరు. అయినా సిపిఎం అనుబంధ రైతు సంఘమనో, సిపిఐ అనుబంధ కార్మిక సంఘమనో మీడియాలో ప్రస్తావించటం చూస్తున్నాము. అయితే తమ అనుబంధ సంస్ధలు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకొనే వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న సంబంధాల గురించి అంజలీ మోడీ అనే జర్నలిస్టు స్క్రోల్‌ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ఆధారాలతో వివరించారు. అలాంటి వాటిలో ఒకటైన న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించిన ఐదు పేజీల పత్రంలో రవీంద్రుని పేరు ప్రస్తావించటాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆ పత్రపు ఐదవ పేజీలో’ రవీంద్రనాధ్‌ ఆలోచనా ధోరణిలో జాతీయవాదం-మానవతా వాదం మధ్య వైరుధ్యం వున్నట్లు చూపేందుకు ఒక ప్రయత్నం జరిగిందని ‘ న్యాస్‌ పేర్కొన్నది.

” ఎక్కడ ఆత్మ భయరహితంగా వుంటుందో ‘ అనే రవీంద్రుని కవిత, ఇతర అంశాలు ‘ జాతీయ సమగ్రతకు సవాళ్లు ‘ అనే శీర్షిక కింద సిబిఎస్‌యి ప్రచురించిన పదవ తరగతి ఆరవ యూనిట్‌ వర్క్‌బుక్‌లో వున్నాయి తప్ప ఎన్‌సిఇఆర్‌టి పుస్తకంలో కాదు. అయితే ఆర్‌ఎసెస్‌ సంస్ధ న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి ఇచ్చిన పత్రంలో తొలగించాలని లేదా సవరించాలని చెప్పింది వీటి గురించే. ఆ పాఠంలో చెప్పిందేమిటి ? ‘ మానవత్వం అన్నింటికంటే వున్నతమైనదని రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయపడ్డారు. మతం ఒక ప్రమాదకర అంశంగా తయారైంది. అయితే స్ధిరత్వాన్ని సాధించాలంటే మత మౌఢ్యం,తీవ్రవాదాలను తొలగించాల్సి వుంది.’ అన్న వ్యాక్యం ఆ పాఠంలో వుంది.

పదకొండవ తరగతికి ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన ‘రాజకీయ సిద్ధాంతం ‘ అనే పాఠ్యపుస్తకంలో దేశ భక్తికి వున్న పరిమితుల గురించి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయాలను పొందుపరిచారు. ఎఎం బోస్‌కు ఠాగూరు రాసిన లేఖలోని అంశాలను దానిలో వుటంకించారు.’దేశభక్తి అంతిమ ఆశ్రయం దేవతలు(లేదా ఆధ్యాత్మికం) కారాదు, నేను మానవత్వాన్నే ఆశ్ర యిస్తాను.’ అని ఠాగూరు చెప్పారు. హిందీ అనువాదంలో దేశభక్తి అంటే జాతీయవాదం(రాష్ట్రవాద) అని, మానవత్వం అంటే మానవత అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొనే ఠాగూరు ఆలోచనల్లో వైరుధ్యం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ భావించి వుండవచ్చన్నది ఒక అభిప్రాయం.

ఈ వుదంతంలో ఒకటి మాత్రం స్పష్టం. ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదానికి ఠాగూరు ఆలోచనా ధోరణి పొసగదు. తాము చేప్పిన దేశభక్తి, జాతీయవాదం ప్రశ్నించవీలులేనివి అన్నట్లుగా వాటితో విబేధించేవారిని దేశద్రోహులుగానూ, పాకిస్ధాన్‌ లేదా చైనా అనుకూలురుగానో ముద్రవేసి దాడులు చేస్తున్నారు. ఆ పదాలకు సంఘపరివార్‌ లేదా దాని సమర్ధకులు చెబుతున్న భాష్యాలు వివాదాస్పదం, అభ్యంతరకరమైనవి.హిట్లర్‌ దృష్టిలో లేదా అనేక మంది ఐరోపా మితవాదుల దృష్టిలో ఇతర దేశాలపై రాజకీయంగా, ఆర్ధికంగా, మిలిటరీ తదతర అన్ని రంగాలలో జర్మనీ లేదా తమ దేశాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు పూనుకోవటమే జాతీయవాదం, దేశభక్తి. అందుకే జర్మనీ ఔన్నత్యాన్ని కాపాడేందుకంటూ వున్మాదాన్ని రెచ్చగొట్టిన హిట్లర్‌ ప్రపంచానికి ఎలా ముప్పుగా తయారైందీ చూశాము. అదే సమయంలో మన దేశంలో దేశభక్తి, జాతీయవాదం అంటే బ్రిటీష్‌ వారి వ్యతిరేకత, సర్వసత్తాక స్వతంత్ర ప్రభుత్వస్ధాపన. ఈ అవగాహనతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకీభవించలేదు కనుకనే అది స్వాతంత్య్రానికి దూరంగా వుండిపోయింది. దాని నాయకులుగా వున్న సావర్కర్‌ వంటి వారు చివరికి బ్రిటీష్‌ వారికి లంగిపోయి, సేవలు అందించిన విషయం తెలిసిందే. అలాంటి శక్తుల ప్రతినిధులే నేడు దేశభక్తి, జాతీయవాదానికి భిన్న భాష్యాలు చెబుతూ వాటిని అంగీకరించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న ప్రమాదకర పరిస్ధితి దేశంలో నేడు పెరిగిపోతోంది. తాము చెబుతున్న జాతీయవాదమే మానవత్వమని అంగీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.

దేశ చరిత్ర, వ్యక్తులు, భావజాలం వంటి సకల సామాజిక అంశాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ టీకా తాత్పర్యాలతో విబేధించే హక్కు ఇతరులకు ఎలా వుందో, ఇతరులు చెప్పిన వాటిపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చే హక్కు వారికీ వుంది. వాటి గురించి బహిరంగ చర్చ జరపాలి భిన్న పక్షాలు తమ వాదనలకు అవసరమైన రుజువులను చూపాలి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక అంశాలలో అది మానమ్మకం, మా మనోభావం, తరతరాల నుంచీ వస్తున్నదానిని ఎవరూ తిరస్కరించకూడదనే పేరుతో చర్చ నుంచి పారిపోతోంది. తన అజెండాను రహస్య పద్దతుల్లో అమలు జరిపేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే రాజ్యాంగ వ్యవస్ధలో తన భావజాలాన్ని ఏదో ఒక విధంగా అమలు జరిపే శక్తులతో నింపుతూ వారితో తన కార్యక్రమాన్ని అమలు చేయిస్తోంది.పైకి తాము జోక్యం చేసుకోవటం లేదని, తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తోంది.

ఎన్‌సిఇఆర్‌టికి సూచనలు, సిఫార్సులను సమర్పించిన న్యాస్‌ విషయమే చూద్దాం.దాని అధినేత తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధం అని పేర్కొనటాన్ని విలేకర్ల సమావేశంలో తప్పు పట్టారు. పోనీ రెండు సంస్ధల మధ్య వున్న సంబంధం ఏమిటో సెలవివ్వండి అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, తమదీ వేర్వేరు స్వతంత్ర సంస్ధలని మాత్రమే చెప్పారు. శిక్షా సంస్కృతి వుత్తాన్‌ న్యాస్‌ అనే సంస్ధ రిజిస్టర్డు ఆఫీసు చిరునామా ఢిల్లీలోని నారాయణ విహార్‌లోని సరస్వతీ బాల మందిర్‌. ఆ పాఠశాలను నడుపుతున్నది విద్యాభారతి అనే మరొక సంస్ద. దాని వెబ్‌సైట్‌లో జీవితంలో ఒక లక్ష్యం వుండాలనే భావనతో 1952లో కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పిల్లల విద్యను చేపట్టినట్లు స్పష్టంగా రాసుకున్నారు. అంతే కాదు హిందుత్వకు కట్టుబడి ూండే, దేశభక్తిని చొప్పించే ఒక జాతీయ విద్యా వ్యవస్ధను కూడా అభివృద్ధి చేయటం తమ లక్ష్యంగా కూడా దానిలో చెప్పుకున్నారు. విద్యా భారతి మాజీ అధిపతి దీనా నాధ్‌ బాత్రా న్యాస్‌ స్ధాపకులలో ఒకరు. వీరందరికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి ఆ సంస్ధ పత్రిక ఆర్గనైజర్‌లో 2008లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం బృందావన్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో కొంతమంది అధికారుల బాధ్యతలలో మార్పులు చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సరకార్యవాహక్‌ శ్రీ మోహన్‌ భగవత్‌ దిగువ మార్పులను ప్రకటించినట్లు దానిలో వుంది. ఆ జాబితాలో శిక్షా బచావో ఆందోళన్‌ నూతన అధిపతిగా అతుల్‌ కొథారీని నియమిస్తున్నట్లు వుంది. ఆయనే తరువాత ప్రస్తుత న్యాస్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా నష్టం కలిగిస్తుందనుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఏమి చెప్పటానికైనా వెనుతీయరు. న్యాస్‌ పత్రంపై చర్చ జరిగితే ఆర్‌ఎస్‌ఎస్‌ నిజరూపం మరింతగా బహిర్గతం అవుతుంది, అది నష్టదాయకం కనుక ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు తొందరపడుతున్నారు, దానిలో భాగమే రవీంద్రుని భావజాలాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించబోవటం లేదని రాజ్యసభలో ప్రకాష్‌ జవదేకర్‌ చేత చెప్పించటం. ఎన్‌సిఇఆర్‌టి దాని గురించి అధికారికంగా చెప్పేంత వరకు ఎవరేమి చెప్పినా దానికి విలువ లేదు. తన పత్రాన్ని వుపసంహరించుకున్నట్లు లేదా సవరించుకున్నట్లు న్యాస్‌ చెప్పేంత వరకు దీని గురించి ఎవరైనా చర్చించవచ్చు, ఆ తరువాత కూడా జరిగిందానిని ప్రస్తావించవచ్చు. తమను ప్రశ్నించే మీడియాను బిజెపి మంత్రులు, అనుయాయులు ప్రెస్టిట్యూట్స్‌ అంటూ కించపరుస్తున్న విషయం తెలిసిందే.(వళ్లమ్ముకొనే వారిని ఆంగ్లంలో ప్రాస్టిట్యూట్స్‌ అంటున్నారు, తమను ప్రశ్నించే మీడియా వారు కూడా వారితో సమానం అంటూ ప్రెస్టిట్యూట్స్‌ అని దాడి చేస్తున్నారు)

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ న్యాస్‌ విషయానికి వస్తే తమ భావజాలానికి వ్యతిరేకమైనవి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాటిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలని నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నాయి. వుదాహరణకు ‘ మూడు వందల రామాయణాలు: ఐదు వుదాహరణలు, అనువాదంపై మూడు ఆలోచనలు ‘ అనే ఏకె రామానుజం వ్యాసాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ సిలబస్‌ నుంచి తొలగించాలని, వెండీ డోనిగర్‌ రాసిన ది హిందూస్‌ అనే పుస్తకాన్ని వుపసంహరించాలని న్యాస్‌ ఆందోళన చేసింది, కోర్టులకు ఎక్కింది. రామానుజన్‌ వ్యాసాన్ని తొలగించారు, రెండో పుస్తకాన్ని తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేశారు.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించిన దాని ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాల్సిన అంశాలుగా పేర్కొన్న వాటి సారాంశం ఇలా వుంది.

పన్నెండవ తరగతి రాజకీయ శాస్త్రం

1984 ఘర్షణల గురించిన పేరా ఇలా అంతమౌతుంది.’ 2005లో పార్లమెంట్‌లో వుపన్యాసం సందర్భంగా సిక్కు వ్యతిరేక హింసాకాండలో రక్తపాతం జరగటం దానికి దేశం క్షమాపణలు చెప్పాలనటంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.

రామాలయ ఆందోళనకు బిజెపి మరియు హిందుత్వ రాజకీయాల ఎదుగులకు సంబంధం వుందని ఒక పేరా చెబుతోంది. ఒక చోట బిజెపి ఒక హిందుత్వ పార్టీ అని మరొక చోట హిందుత్వ, హిందుపన్‌లు విడి సావర్కర్‌ కల్పితమని పేర్కొన్నారు. మరొక చోట బాబరీ మసీదును మీర్‌ బక్షి నిర్మించాడని….రాముడి జన్మస్ధలంలోని రామాలయాన్ని ధ్వంసం చేసి దానిని నిర్మించారని కొందరు హిందువులు విశ్వసిస్తారని వుంది. గోద్రాలో 2002లో జరిగిన వుదంతం గురించిన చోట ఒక రైలుకు నిప్పంటుకుందని…. దానికి ముస్లింలో కారణమనే అనుమానంతో’ అనే వ్యాక్యంలో నిప్పుంటుకుంది అనే పదాన్ని తగులబెట్టారు అని సవరించాలని, అనుమానం అనే పదాన్ని తొలగించాలని న్యాస్‌ కోరింది. మరొక చోట ‘ అటువంటి మారణకాండకు పధకాలు వేసిన వారికి కనీసం రాజకీయ పద్దతులలో(ఓటింగ్‌) ద్వారా ఒక పాఠం చెప్పేట్లు మనం చూడగలమా అని వుంది.

తొలగించాల్సిన భాషా పదాల జాబితాలో ఆంగ్లంలో వైస్‌ ఛాన్సలర్‌,వర్కర్‌, మార్జిన్‌, బిజినెస్‌,బాక్‌బోన్‌, స్టాంజా, రాయల్‌ అకాడమీ, వుర్దు లేదా అరబిక్‌ భాషలోని బేటార్‌టిబ్‌, పోషక్‌, తాకత్‌, ఇలాకా, అక్సర్‌, ఇమాన్‌, జోకిహిమ్‌,మెహమాన్‌-నవాజీ, చమర్‌, సారే ఆమ్‌, ఇవిగాక భ్రష్టపదాలుగా వుల్లు కహిన్‌కా, కాంబఖత్‌, బద్మాష్‌, లుచ్చే-లఫంగే, బహంగియోన్‌ వున్నాయి.

తొమ్మిదవ తరగతిలో రామధరీ సింగ్‌ దినకర్‌ ఒక ప్రేమికుని వాంఛలు అనే కవిత వలన పిల్లలు తప్పుదారి పడతారు,శీలాన్ని కోల్పోతారు కనుక, కేంద్ర ప్రభుత్వం చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ కార్యకలాపాలు దేశ ఐక్యతం, గణతంత్రానికి ముప్పు అని భావిస్తున్నందున పదకొండవ తరగతిలో ఆయన ఆత్మకథను తొలగించాలని కోరారు. కన్నడ కవయిత్రి అక్క మహా దేవి ఒక సంఘటనను పేర్కొంటూ దానికి నిరనగా తన దుస్తులను తొలగించినట్లు ఒక పాఠంలో వుంది. ఒక నగ్న మహిళను వర్ణించటం మహిళల స్వేచ్చ పేరుతో హిందూ సంస్కృతిని కించపరచటమే అని న్యాస్‌ వాదించింది.

చరిత్ర పాఠ్యాంశాలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాల సారం ఇలా వుంది. వేదాల అనంతర కాలంలో సాధారణంగా మహిళలను సూద్రులతో సమంగా పరిగణించారు. దేవుడి ముందు అన్ని మతాల వారు సమానమే అనే సులహ్‌ ఏ కుల్‌ విధానాన్ని అక్బర్‌ ప్రవేశపెట్టారు. వితంతువుల దురదృష్టాలు, సామాజిక బహిష్కరణల గురించి 19వ శతాబ్ది మహిళా వుద్యమకారిణి తారాబాయ్‌ షిండే రాసిన పుస్తకంలో పితృస్వామ్య వ్యవస్ధపై తీవ్ర విమర్శ వుంది. దానిని కూడా తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ కోరింది. మరొక పుస్తకంలో వర్ణాశ్రమ వ్యవస్ధ గురించిన ప్రస్తావన ఇలా వుంది. ‘పుట్టుకతోనే హోదా నిర్ణయమౌతుంది. వారు(బ్రాహ్మలు) జనం ప్రతిష్ట పుట్టుక మీదే ఆధారపడి వుందని గుర్తించేందుకు ప్రయత్నించారు… అలాంటి అర్హతల గురించి మహాభారతం వంటి అనేక పుస్తకాలలోని కధలతో పటిష్టపరిచారు.’ ఆర్యుల యుద్ధ దేవుడు ఇంద్రుడిపై మొహంజదారో చివరి దశలో స్త్రీ పురుషులను వూచకోత కోశాడనే ఆరోపణలున్నాయి. ఒక చోట మొగల్‌ కాలంలో పాలకులు జనం పట్ల ఎంతో వుదారంగా వుండేవారు, మొగలాయీ పాలకులందరూ ప్రార్ధనా మందిరాల నిర్మాణం, నిర్వహణకు నిధులు ఇచ్చారు. యుద్ధాల సందర్భంగా దేవాలయాలు నాశనమైతే తరువాత వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసేవారు.అని వుంది. ఇలాంటి వాటన్నింటినీ తొలగించాలి, సవరించాలి అని న్యాస్‌ పేర్కొన్నది.

ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం, మనువాద వ్యవస్ధను పరిరక్షించటం, తమ భావజాలానికి తగిన విధంగా లేక వ్యతిరేకంగా వుంటే రవీంద్రుని వంటి వారి ఆలోచనలను కూడా నూతన తరాలకు అందకుండా చూడటం, తమ దుష్ట చరిత్రను మరుగుపరచటానికి విద్యారంగాన్ని వినియోగించుకోవాలని కాషాయ దళాలు చూస్తున్నాయన్నది స్పష్టం.

గో గూండాలు, మరుగుజ్జు యోధులు తప్ప ఆర్ధికవేత్తలు చేసేదేమీ లేదిక్కడ !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

దేశంలో జరుగుతున్న వాటి గురించి నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే నరేంద్రమోడీ భక్త జనాలకు కోపం రావచ్చు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఎవరు? కాషాయ కూటమి అసలైన అజెండాను జయప్రదంగా అమలు చేసేందుకు కండలు తిరిగి పేరు మోసిన గో గూండాలు, సామాజిక మాధ్యమంలో దాడులు చేసే మరుగుజ్జు యోధులా(ట్రోల్స్‌) ? బిజెపి కూటమి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలను, మేకిన్‌ ఇండియా అన్న నరేంద్రమోడీ పిలుపు నిజం చేసేందుకు కావాల్సిన పేరు ప్రఖ్యాతులున్న ఆర్ధికవేత్తలా ? ఆవులకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నట్లు స్వయంగా మోడీ అంతరాత్మ అమిత్‌ షా లక్నోలో ఈ మధ్య విలేకర్లకు చెప్పారు. సరే ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చున్న వుత్తర ప్ర దేశ్‌ ముఖ్య మంత్రి ఆదిత్యనాధ్‌ ఆవుల రక్షణకు కేంద్రాల ఏర్పాటు గురించి చెప్పారనుకోండి.

ఎన్నడూ ఎరగనోడికి ఏగానీ దొరికితే దానిని అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అని తేల్చుకోలేక ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదన్నది ఒక సామెత. నరేంద్రమోడీ విదేశీ పర్యటనల గురించి అనేక మంది ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆచరణ ఏమిటో జనానికి తెలిసిందే. ఎవరేమి విమర్శించినా ఖాతరు చేయకుండా పెట్టుబడులను రాబట్టేందుంటూ నరేంద్రమోడీ తిరగని దేశం, తొక్కని గడపలేదు. పదవీ కాలంలో మిగిలిన దేశాలను కూడా చుట్టి వచ్చి రికార్డు సృష్టిస్తారేమో ! అమెరికా, చైనాలను పక్కకు నెట్టి విదేశీ పెట్టుబడులను రాబట్టి తెల్లవారేసరికి ప్రపంచం మొత్తానికి అవసరమైన వస్తువులను వుత్పత్తి చేసి ఎగుమతులు చేసేందుంటూ ప్రధాని మేకిన్‌ ఇండియా అని నినాదం కూడా ఇచ్చారు. మూడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడడీ సర్కార్‌ ఎన్నికలకు ముందు జనానికి చెప్పిన వాటి కంటే చెప్పని వాటినే ఎక్కువగా అమలు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు తప్ప దానికి ఒక మంత్రి లేడు. చిన్న ప్రభుత్వం-పెద్ద పాలన అంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి చివరకు ఆవులకోసం కూడా ఒక మంత్రిత్వశాఖ ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నట్లు అమిత్‌ షాయే చెప్పారు గనుక నమ్మక తప్పదు.

ఈ మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలను నిరుత్సాహపరిచే విధంగా ఒకవైపు చర్యలు మరోవైపు పురాతన సంస్కృత గ్రంధాలలో దాగున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే ఈ మధ్యనే పంచగవ్యాల సుగుణాల గురించి పరిశోధనలు చేసేందుకు నిర్ణయం. యధారాజా తధా ప్రజా అన్నట్లు ఆవు పేడ, మూత్రాలపై ఐఐటిలలో రోజుల తరబడి సెమినార్లు, వాటిపై పరిశోధనలకు 50వరకు ప్రతిపాదనలు వచ్చినట్లు వార్తలు. ఆసుపత్రి వార్డులను ఆవు మూత్రంతో కడగాలని నితిన్‌ గడ్గరీ వంటి వారి సుభాషితాలు. ఆవు మూత్రంతో తనకు తెలిసిన ఒకరి అంతుబట్టని వ్యాధి నయమైందని బిజెపి అధికార ప్రతినిధులలో ఒకరైన మీనాక్షి లేఖీ కూడా చెప్పారు. నా చిన్నతనంలో గుంటూరు పక్కనే వున్న పలలూరు భావిలో నీరు తాగితే జబ్బులు నయమయ్యాయని జనాలు బారులు తీరటాన్ని లేఖీ గారు గుర్తుకు తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లొట్టలు వేసుకుంటూ వినటానికి ఎన్ని కబుర్లో ! ఇప్పటికే బిజెపి పాలనలోని రాజస్ధాన్‌లో ఆవు సంక్షేమ మంత్రిత్వ శాఖ వుంది కనుక త్వరలో కేంద్రంలో, ఇతర రాష్ట్రాలలో ఆవు మంత్రిత్వశాఖ, దానికి సలహాదారులు, ఆవులు వేసే పేడ, పోసే మూత్రం ఎగుమతికి రామ్‌దేవ్‌ బాబా పతంజలి సంస్ధకు అనుమతి, వాటిని రవాణాచేసేందుకు అదానీ ఓడలకు పని చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఇ కామర్స్‌ సంస్ధలు ఇప్పటికే పేడ, మూత్రాలను కొరియర్‌ సేవల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.మన దేశానికి ఇలాంటి వాటి ఎగుమతులలో మరే నాగరిక దేశమూ సాటి రాదని స్టాంప్‌ పేపర్లపై రాసి ఇవ్వవచ్చు. మోడీ బ్యాండ్‌ ఏ పద్దతులలో అమెరికా, చైనాలను అధిగమించేందుకు దేశ రూపు రేఖలు ఎలా మార్చబోతున్నారో అనేందుకు సూచికలివి.

బహుశా ఈ పరిణామాలను వూహించి లేదా సర్వం ప్రయివేటీకరణ, సకల సబ్సిడీలకు మంగళం పాడాలన్న తన సలహాలను మోడీ సర్కార్‌ తు.చ తప్పకుండా అమలు జరుపుతోందనే సంతోషం లేదా ఇతర అంశాలేమిటో తెలియదు గానీ నీతి ఆయోగ్‌ అని పిలుస్తున్న ‘భారత్‌ రూపురేఖలు మార్చే జాతీయ సంస్ధ'(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) వుపాధ్యక్షుడిగా వున్న అరవింద్‌ పంగారియా ఆగస్టు 31తరువాత సేవలను అందించేది లేదంటూ ఆకస్మికంగా రాజీనామా ప్రకటించారు. దీనికెవరూ చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ జిందాతిలిస్మాత్‌ అని ఆకాశానికి ఎత్తిన దేశ భక్తుడు అరవింద్‌ పంగారియా. దాన్నే దేశమంతటికీ రాసి లేదా పూసి గుజరాత్‌ మాదిరి అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల ప్రచారంలో మోడీ నమ్మబలికారు. అదెంత బూటకమో ఈ దిగువ లింక్‌లోని సమాచారాన్ని బట్టి ఎవరైనా తెలుసుకోవచ్చు.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html

నరేంద్రమోడీ 2014 మే 26న గద్దెనెక్కారు. స్వతంత్ర మూల్యాంకన లేదా విలువ కట్టే కార్యాలయం మే 29న నరేంద్రమోడీకి ఒక నివేదిక సమర్పించి వెంటనే ప్రణాళికా సంఘం అనే ఇంటిని కూల గొట్టించాలని సూచించింది. ఎందుకటా బిజెపి నేతలు వివరించినదాని ప్రకారం ‘బొమ్మరిల్లు’ నాన్న మాదిరి పిల్లలనే రాష్ట్రాలకు ఒకే కొలతలు, ఒకే బట్టతో యూనిఫారాలను కుట్టించేదిగా ప్రణాళికా సంఘం వుంది. ఎవరికిష్టమైన దుస్తులు వారి సైజుల్లో కుట్టించుకోవాలన్నట్లుగా ఏ రాష్ట్రానికా ఆ రాష్ట్రం తన స్వంత అభివృద్దికి చర్యలు తీసుకోవాలంటే ప్రణాళికా సంఘం పనికిరాదు. ఆ మేరకు ఆగస్టు 13న ఆమేరకు కాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దాని స్ధానంలో2015 జనవరి ఒకటిన నీతి అయోగ్‌ వునికిలోకి వచ్చింది. ప్రధాని దానికి అధ్యక్షుడు. అమెరికాలో పాఠాలు చెప్పుకుంటున్న అరవింద్‌ను రప్పించి వుపాధ్యక్షుడిగా నియమించారు. అన్ని రాష్ట్రాలకు ఒకే అభివృద్ధి నమూనా పనికిరాదని చెప్పిన పెద్దలే అన్ని రాష్ట్రాలకు ఒకే పన్ను విధానం కావాలనటం, తీసుకు రావటం, దాన్ని మరొక స్వాతంత్య్రంగా వర్ణించుకోవటం విశేషం.

ఏడు సంవత్సరాలకు ఒక కార్యక్రమం, 15 సంవత్సరాలకు మరొకదాన్ని రూపొందించటం నీతి ఆయోగ్‌ కార్యక్రమం. అంటే ఐదు సంవత్సరాలకు బదులు పేరేం పెట్టినా పదిహేను సంవత్సరాలకు రెండు ప్రణాళికలన్నమాట. అందుకే నరేంద్రమోడీ 2022 నాటికి నేనేం చేస్తానో చూడండి అంటున్నారు.(2015-2022 మధ్య వ్యవధి ఏడు సంవత్సరాలు). అయితే మూడు సంవత్సరాలు గడిచినా కొత్త ఇల్లు ఎలా కట్టుకోవాలో కూడా నిర్ణయించుకోక ముందే వున్న ఇంటిని కూలగొట్టుకున్న వారు పడే ఇబ్బందుల మాదిరి ఏ ఏటికాయేడు ఏదో విధంగా నెట్టుకు వస్తున్నారు. ఒక నిర్ధిష్ట రూపు రేఖలు ఇంతవరకు లేవు. ఈ లోగా దాని శిల్పి అరవింద్‌ పంగారియా జంప్‌. ఆ పెద్ద మనిషి ఎందుకు రాజీనామా చేశారో తెలియదు. దున్న ఈనిందంటే రోజంతా బ్రేకింగ్‌ న్యూస్‌ ఇచ్చే మీడియా అదో సాధారణ విషయం అన్నట్లుగా మూసిపెట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు కాకపోతే తరువాత వెల్లడికాక మానదు.

కాకపోతే తన రాజీనామాకు పద్మభూషణుడిగా మనం సన్మానించిన అరవిందుడు ఇచ్చిన వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా వుంది. నా రాజీనామా నా ఇష్టం అంటే అడిగే వారే వుండరు. ఆగస్టు 31 తరువాత సెలవును పొడిగించేందుకు తాను వుద్యోగం చేస్తున్న కొలంబియా విశ్వవిద్యాలయం అంగీకరించలేదు కనుక రాజీనామా అన్నారు.’అదే నేను 40వ పడిలో వున్నట్లయితే నాకు ఎక్కడయినా వుద్యోగం దొరికేది, ఈ వయస్సు(64)లో కొలంబియాలో మాదిరి వుద్యోగం దొరకటం దాదాపు అసాధ్యం’ కనుక తిరిగి టీచరు వుద్యోగంలో చేరుతున్నట్లు చెప్పారు. నరేంద్రమోడీకి పంపిన రాజీనామా పత్రంలో పిల్లలకు దగ్గరగా వుండాలని తన భార్య గట్టిగా కోరుతున్నదని పేర్కొనటం గమనించాల్సిన అంశం. ఆయన ఇరవైల్లోనో ముప్ఫైల్లోనే వుండి వుంటే భార్య అలా కోరటం సహజం, కానీ 64 ఏండ్ల వయస్సులో అందునా భారత్‌లో ఒక వున్నతమైన స్ధానాన్ని వదులుకొని పిల్లల కోసం అమెరికా రమ్మని కోరటం అంటే నమ్మేట్లుగా లేదు. నీతి ఆయోగ్‌ బాధ్యతలను స్వీకరించే సమయంలోనే తాను ఫలనాతేదీ వరకు మాత్రమే సెలవు పెట్టానని లేదా రెండున్నర సంవత్సరాలు మాత్రమే తాను పదవిలో వుంటానని అప్పుడు చెప్పలేదు. ఒక వేళ అలా చెప్పి వుంటే మోడీ ముందుగానే మరొక ప్రముఖుడిని సిద్దంగా పెట్టుకొని వుండేవారు. అయినా అరవింద్‌కు వుద్యోగం లేకపోతే గడవదు అంటే నమ్మశక్యం కాదు. దేశ రూపురేఖలనే ఏడు సంవత్సరాలలో మార్చే మహత్తర మంత్రదండాన్ని నడుంకు కట్టుకున్న పెద్ద మనిషిని ఈ దేశం ముసలితనంలో వదలి వేస్తుందా? అవసరమైతే భార్యా బిడ్డలను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించుకోవటం అంత కష్టమా ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐరాస వాణిజ్య విభాగం వంటి వాటిలో యుక్త వయస్సులో వుద్యోగాలు చేసి ముసలి తనంలో ఇబ్బందులు లేకుండా గడపటానికి అవసరమైన మొత్తాన్ని వెనకేసుకోలేనంత అమాయకుడా ఆ పెద్దమనిషి. అయినా పుట్టిన గడ్డమీద ఎంత అవిశ్వాసం ? ఇలాంటి వ్యక్తినా మనం పద్మభూషణుడని గౌరవించుకుంది ?

నరేంద్రమోడీ భక్తులు, ఆయన పెరటి మీడియా ఎన్ని విజయగానాలు చేసినా మాటలు కోటలు దాటటం తప్ప ఆచరణ గడపదాటటం లేదు. ఆర్ధిక రంగంలో అన్నీ అధోముఖ సూచికలే దర్శనమిస్తున్నాయి. 2016 అక్టోబరులో 25శాతం సంస్ధలు భవిష్యత్‌ గురించి ఆశాభావం వ్యక్తం చేస్తే 2017 మార్చినాటికి 16శాతానికి పడిపోయిందని, కేవలం ఆరుశాతం సంస్ధలే అదనపు సిబ్బందిని తీసుకొనేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపాయని http://economictimes.indiatimes.com/news/company/corporate-trends/indian-companies-least-confident-worldwide-markit-survey/articleshow/57616150.cms వార్తలు వచ్చాయి. దేశ వుత్పాదక రంగ సూచిక (పిఎంఐ) జూన్‌లో 52.7 వున్నది కాస్తా జూలైలో 46కు అంటే 2009 కనిష్ట స్ధాయికి, సేవారంగం 53.1 నుంచి 45.9కి దిగజారిందని తాజాగా వార్తలు వచ్చాయి. ఈ కాలంలో అన్ని అభివృద్ధి సూచికలు పడిపోతుండగా దేశంలో గో గూండాల దాడుల గ్రాఫ్‌ మాత్రమే రోజు రోజుకూ పెరుగుతోంది. అదీ కఠిన చర్యలు తీసుకోవాలని తిరుగులేని నరేంద్రమోడీ కోరిన తరువాత. ఆశ్చర్యంగా వుంది కదూ !

తాను రాజీనామా చేయబోతున్న విషయం నరేంద్రమోడీకి రెండు నెలల ముందుగానే అరవింద్‌ పంగారియా చెప్పారట. మరొకరిని ఎవరిని తీసుకువస్తారో ఇంతవరకు తెలియదు. రాజీనామా వ్యవహారం బయటకు వచ్చిన తరువాతే కొన్ని పేర్లు పరిశీలనలో వున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు సమస్య ఏమంటే ఎవరు వచ్చినా దేశం ఇప్పుడున్న స్ధితిలో ఏం పొడుస్తారు ? పొడిచేదేమీ లేదని అర్ధం అయిన కారణంగానే అరవింద్‌ సెలవు పొడిగింపు లేదనే సాకుతో మర్యాదగా తప్పుకున్నారా ?

వుత్పత్తి లేదు, ఎగుమతులు పడిపోతున్నాయి, వుద్యోగాల కల్పన అసలే లేదు. కాస్త ఆశాజనంగా వున్న ఐటి రంగం రూపాయి బలహీనం కావటంతో ఏం చేయాలో దిక్కుతోచటం లేదు, కొత్త వుద్యోగాలు లేవు. డిగ్రీ చేతబట్టుకొని వుద్యోగాల కోసం కావాలంటే ముందు వుద్యోగంలో చేరు కొన్ని నెలలపాటు జీతం భత్యం అడగవద్దు, ఖర్చుల మేరకు ఇస్తాం అంటున్నారు. ఆవులకు ఆధార్‌ కార్డులు, ఆవులను చంపితే మరణశిక్ష విధించే విధంగా చట్టసవరణలు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్ధల స్ధానంలో గోశాలలు, వస్తూత్పిత్తికి బదులు ఆవు పేడ, మూత్ర సేకరణ వంటి కార్యక్రమాలు అమలు జరపటానికి, ఆవు, గొడ్డు మాంస రాజకీయాలు చేయటానికి మరో కోణం నుంచి ఆలోచిస్తే అరవింద్‌ వంటి ఆర్ధికవేత్తలు అవసరమా ? గుజరాత్‌ నమూనా అభివృద్ధి అంటూ నరేంద్రమోడీ పాలనకు విశ్వసనీయత కలిగించిన వారిలో అరవింద్‌ పంగారియా ఒకరు. అందుకే నరేంద్రమోడీ ఆయనను ఎంచుకోవటానికి ఒక కారణం. ప్రచార హోరు తప్ప చెప్పిన విధంగా అక్కడకు పెట్టుబడులు రాలేదన్నది నమ్మలేని నిజం. అందువలన గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా దాని బండారం ఏమిటో నరేంద్రమోడీకి బాగా తెలుసుగనుకనే గత మూడు సంవత్సరాలలో దాని గురించి మాట్లాడితే ఒట్టు. రెండవది అరవింద్‌ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ బడిలో చదువుకున్నాడు. అన్నీ ప్రయివేటీకరణ, ప్రభుత్వ జోక్యం పరిమితంగా వుండాలి, సబ్సిడీలన్నీ ఎత్తివేయాలన్నది ఆయన ప్రిస్క్రిప్షన్‌. వాటిని అమలు జరిపితే తమ పని ఖాళీ అని బిజెపి నేతలకు తెలుసు. అందుకే జనం నుంచి వెలికాకుండా వుండటానికి స్వదేశీ జాగరణ మంచ్‌, బిఎంఎస్‌ వంటి సంస్ధలతో కొన్ని విమర్శల నాటకం ఆడిస్తూ వుంటారు. వైఫల్యాల నుంచి జన దృష్టిని మళ్లించాలంటే ఎప్పుడూ ఏదో ఒక జిమ్మిక్కు చేస్తూ వుండాలి. అరవింద్‌ పంగారియాకు పోటీగా నీతి ఆయోగ్‌లో మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఒక వార్త. కొన్ని అంశాలపై ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించి మోడీ ఆగ్రహానికి గురయ్యారని మరొక సమాచారం.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ 2008 నుంచి తీవ్ర ఆర్ధిక మాంద్యంతో సాగుతున్న స్ధితిలో దానిని గట్టెక్కించే అస్త్రాలు అరవింద్‌ వంటి పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల అంబుల పొదిలో లేవు. ప్రయోగించినవన్నీ తుస్సు మంటున్నాయి. ధనిక దేశాల మార్కెట్లు మందగించటం, అనేక దేశాలు తమ దేశాల పరిశ్రమలు, వ్యాపారాలకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న స్ధితిలో మన పెట్టుబడిదారులకు విదేశీ మార్కెట్లను సంపాదించటం అంత తేలిక కాదని గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌కు బాగా తెలిసి వచ్చింది. మరోవైపున ప్రపంచ ఆర్ధిక సంస్ధ, ఇతర వేదికలు మన వంటి మార్కెట్లను మరింతగా తెరవాలని, దిగుమతి పన్నులను తగ్గించాలని రోజు రోజుకూ వత్తిడి తెస్తున్నాయి. మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా మా ఇంటికొస్తూ మాకేం తెచ్చావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అన్నట్లుగా అక్కడ పరిస్ధితి వుంది తప్ప మనకు అనుకూలంగా ఏదీ లేదు. పంచవర్ష ప్రణాళిక విధానం పాతబడితే అవసరాలకు తగిన విధంగా మార్పులు చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమాన్ని సవరించుకోవాలి. లేదూ అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని నిర్ణయించుకొని ఆ తరువాత ఆ విధానాన్ని రద్దు చేయవచ్చు. కానీ నరేంద్రమోడీ సర్కార్‌ మబ్బులను చూపి చేతిలోని ముంతలో నీళ్లు పారబోయటమే కాదు, ముంతనే పగలగొట్టినట్లుగా ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసింది.నీతి ఆయోగ్‌లో అరవింద్‌ కొనసాగినా, మరొక వుపాధ్యక్షుడు వచ్చినా చేసేదేమీ కనిపించటం లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. ఎవరు వచ్చినా కొంత మంది వర్ణిస్తున్నట్లు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాలు లేదా ఆదేశిత విధానాలు అమలు జరపాల్సిందే తప్ప అందుకు భిన్నంగా జరగదన్నది స్పష్టం.