చంద్రబాబు : చరిత్రకు విరుద్దమైన సమాచారం

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

ఈనెల 20వ తేదీన విజయవాడలో ప్రముఖ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు రచించిన’అమరావతి ప్రభువు -వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు’ అనే గ్రంధాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగంలోని అంశాల గురించి ప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డల గురించి చూద్దాం.

1.’గతంలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని ఐటిలో అభివృద్ధి చేయగా నవ్యాంధ్రప్రదేశ్‌లో పోర్టుల(రేవుల) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.ఓడ రేవుల ఆధార ఆర్ధిక వ్యవస్ధగా రూపొందితే భవిష్మత్‌ వుజ్వల రీతిలో వుంటుందని వివరించారు.’

   కొంత మంది అంగీకరించినా అంగీకరించకపోయినా, అతిశయోక్తులు చెబుతారని అన్నా చంద్రబాబు నాయుడు అంటే ఐటి రంగ అభివృద్దికి మారుపేరుగా కీర్తి కండూతి దక్కింది. అంతకంటే ఎక్కువగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాయి కనుక విమర్శకులు అంగీకరించరు. దానివలన నష్టం లేదు వదిలేద్దాం. ఇప్పుడేం చేయాలన్నదే అసలు సమస్య. ఇజాలేమీ లేవు ఒక్క టూరిజం తప్ప అని ఒకసారి, ఐటి తప్ప చరిత్ర పాఠాలు చదవనవసరం లేదు అని ఒకసారి ఇలా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అధికార ప్రస్తానంలో ఎన్నో ఆణిముత్యాలను ప్రవచించారు. గతంలో గ్రామాలలో హరికధలు, బుర్ర కధల వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేవారు భుక్తి కోసం ఏ వూరు వెళితే ఆ వూరును మీ వూరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతు గడ్డ అని చెప్పేవారు. కొంత మంది నిజమే కదా అనుకొనే వారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగం అభివృద్ధి పట్ల ఆ దిగ్గజాలకు ఆసక్తి లేదని ఆపిల్‌ సిఇవో టిమ్‌ కుక్‌ హైదరాబాదు పర్యటనలో చేసిన హడావుడి స్పష్టం చేసింది. గతంలో ఏ కంపెనీ సిఇఓ వచ్చినా చంద్రబాబును కూడా తోటి సిఇఓగా పరిగణించి కలవకుండా వెళ్లే వారు కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకనే ఐటి గురించి గాక రేవుల అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెబుతున్నారా ? ఇదే నిజమైతే ఇంజనీరింగ్‌ కళాశాలల పెట్టుబడిదారులు, ఏటా లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తున్న వారి పరిశ్రమలు ఏం కావాలి ?

  చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడని చెప్పటానికి గతంలోనూ, ఇపుడు మరొకసారి రూపొందించిన విజన్‌ పత్రాలు సజీవ సాక్ష్యాలు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కన్న కలలు ఏమిటి అని ఎవరైనా భవిష్యత్‌లో పరిశోధన చేస్తే వారికి మంచి సమాచారంగా అవి వుపయోగపడతాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థగా వుంది. పరిశ్రమలు, సేవారంగం వంటివి అభివృద్ధి చెందకుండా యువతరానికి వుపాధి దొరకదు. ఇప్పటికే వున్న ఓడ రేవుల ద్వారా జరిగే అభివృద్ధి ఏదో జరిగింది. మన తూర్పు, పశ్చిమ తీరాలలో మన కంటే పెద్ద ఓడరేవులు ఇప్పటికే వున్నాయి. సింగపూర్‌ మాదిరి తయారు చేయటానికి మన భౌగోళిక పరిస్థితులు అనువుగా లేవు.

   పరిశ్రమలు పెట్టటానికి, వారికి పదేళ్ల పాటు పలు రాయితీలు ఇవ్వటానికి ఏపికి ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని తేలిపోయింది. అందువలన వారు మరొకదారి చూసుకుంటారు. లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పారిశ్రామికవేత్తలకు రాయితీలు కుమ్మరించటానికి రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని, లోటుతో వున్నట్లు చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. అది ఇప్పట్లో పూడేది కాదన్నది వాస్తవం. పరిశ్రమలు లేకుండా రేవులను అభివృద్ధి చేసి ఏమి ఎగుమతి చేస్తారు. బొగ్గు దిగుమతులు చేసుకోవటానికి ఇప్పటికే కృష్ణపట్నం వంటివి వున్నాయి. చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచీ చెబుతున్న భావనపాడు, నిజాంపట్నం చేపల రేవులు ఏమయ్యాయో తెలియదు. ఈ స్ధితిలో ఓడరేవుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందటానికి వున్న అవకాశాలేమిటో నిపుణులు చెప్పాలి.

2. తాను జపాన్‌లో పర్యటించినపుడు జపాన్‌లో బౌద్దాన్ని ఆచరించేవారు బుద్ధిజం అమరావతి నుంచే వచ్చిందని తమకు చెప్పారని, నాగార్జునుడి పేరు విన్నామని తెలిపారని చంద్రబాబు తెలిపారు.

3.లండన్‌లో పర్యటించినపుడు లండన్‌ మ్యూజియాన్ని సందర్శించానని అక్కడ రెండే రెండు గ్యాలరీలు వున్నాయని ఒకటి గ్రీసు గ్యాలరీ, రెండు అమరావతి గ్యాలరీ అని మ్యూజియం అధికారులు వివరించారని చెప్పారు. అమరావతి గ్యాలరీ అని ఎందుకు నామకరణం చేశారని తాను ప్రశ్నించానని, ప్రపంచంలో అమరావతి వుత్కృష్టమైనదిగా వారు తనకు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

    ఈ రెండూ చరిత్రకు సంబంధించిన అంశాలు. ఈ మధ్య సౌదీ అరేబియాలో అక్కడి యువతులు భారత మాతాకీ జై అని నినాదాలు చేస్తున్న వీడియో ఒక దానిని సామాజిక మాధ్యమంలో కొందరు పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేశారు. వారు మాత భక్తులని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాని నరేంద్రమోడీ సౌదీ పర్యటన సందర్భంగా ఆయనకు పలికిన ఆహ్వానంలో అదొక భాగం. దీన్ని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఎవరైనా విదేశీ అతిధులు వచ్చినపుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారి మనసెరిగి ఇష్టమైన కార్యక్రమాలు రూపొందించటం, వంటకాలు వడ్డించటం అంతర్జాతీయ దౌత్యం మొదలైప్పటి నుంచి జరుగుతున్నదే. దానిలో భాగంగానే మోడీని వబ్బేయటానికి భారత మాతాకు జై అనిపించారు సౌదీవారు. అక్కడి ముస్లింలే జై అంటే ఇక్కడి వారు ఎందుకు అనరనే వాదనలో భాగంగా ఆ వీడియోను హిందుత్వ భక్తులు వినియోగించుకున్నారు.

    జపాన్‌, లండన్‌ పర్యటనలో చంద్రబాబు నాయుడికి కూడా అదే జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు నాయుడి పుణ్యమా అంటూ ఇప్పుడు చరిత్ర పాఠాలు చదివేవారు లేకుండా పోయారు. ఒక వేళ హైస్కూలు స్ధాయిలో కాస్తో కూస్తో చదివినా అదెవరికీ గుర్తుండటం లేదు. అయినా చరిత్ర చరిత్రే. దాన్నెవరూ చెరిపి వేయలేరు.

   జపాన్‌కు అమరావతి నుంచి బుద్ధిజం వెళ్లిందని ఏ చరిత్ర చెప్పలేదు. చైనీయుల నుంచి కొరియా అక్కడి నుంచి జపాన్‌కు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది.జపనీయులు అలా ఎందుకు చెప్పారన్నది ప్రశ్న.

   రెండవది లండన్‌ మ్యూజియంలో వున్న గ్యాలరీల గురించి ఇంటర్నెట్‌లో ఎన్నిసార్లు వెతికినా అమరావతి, గ్రీసు గ్యాలరీల పేరే మనకు కనపడదు, మిగతా గ్యాలరీల గురించి మాత్రమే మనకు దొరుకుతోంది. అక్కడి అధికారులు కూడా చంద్రబాబును తప్పుదారి పట్టించారా ?

   రాజకీయ నేతలు అనేక అంశాలను చెబుతుంటారు, వాటిని అధికారిక ప్రకటనలలో చేర్చినపుడు అధికారయంత్రాంగం ముందు వెనుకలు ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడి వంటి వారు ఇబ్బందులలో పడతారు.

ఫ్లయింగ్‌ మోడీ నుంచి ఫెయిల్యూర్‌ మోడీ వరకు

Tags

, , , , , , , , , , ,

అచ్చే దిన్‌ ఆమడ దూరం

ఎం కోటేశ్వరరావు

    కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మూడు చోట్లా అధికారానికి వచ్చిన వారు రాజకీయ, పాలనా రంగాలకు కొత్తవారు కాదు. అందువలన అనుభవాల గురించి మాట్లాడుకోవటంలో అర్ధం వుండదు. ఈ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏమిటి ? జనానికి వాటి పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. గత పాతిక సంవత్సరాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ నయా వుదారవాద విధానాల చట్రంలో పనిచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవి వున్నా ఎడమ చేయికి,పురచేయికి వున్న తేడా తప్ప వేరు కాదు. నయా వుదార వాద విధానాలు విదేశీ కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్ధల విధానాలకు స్వదేశీ ముద్రవేసి అమలు జరుపుతున్నారన్నది స్పష్టమైంది. వాటి ప్రకారం దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన అమలు జరపాల్సి వుంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం వుంటే విదేశీ కంపెనీలకు తలనొప్పి. పన్ను రేట్లు, చట్టాలు ఒకే విధంగా వుండేట్లు ఇప్పటికే చూశారు. వాట్‌ బదులు జిఎస్‌టిని అమలు జరపాలన్నది కూడా దానిలో భాగమే.ఇలా ఎన్నో వున్నాయి. వాటి గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయికి ఎక్కువ, కేంద్రానికి తక్కువ.

   ఎవరు అవునన్నా కాదన్నా , అభిమానులు గింజుకున్నా ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ పట్ల మోజు తగ్గిపోతున్నది.వెంకయ్య నాయుడి వంటి వంది మాగధులు నరేంద్రమోడీని దేవదూత, దేవుడు అని పొగడవచ్చు. కేంద్రంలో లేని ప్రత్యేకత ఏమంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, వారి కుటుంబ సభ్యులను కూడా పొగడాల్సి రావటం బోనస్‌ వంటిది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు నరేంద్రమోడీ తమ పాలిట బంగారు పళ్లెంతో వస్తారని రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయంలో వారు సంబరాలు చేసుకున్నారు.తొలి ఏడాది ఫ్లయింగ్‌ మోడీగా పేరు తెచ్చుకున్న ప్రధాని రెండో ఏడాది ఫెయిల్యూర్‌ మోడీగా పిలిపించుకుంటున్నారు. మనువాదం పట్ల వున్న శ్రద్ధ జనవాదం గురించి లేకపోవటంతో అటు పారిశ్రామికవేత్తలు, బడా వాణిజ్యవేత్తలు, సామాన్య జనం కూడా అసంతృప్తికి గురవుతున్నారు. విదేశీయులకు మన దేశం అంటే కనిపించేది నరేంద్రమోడీ తప్ప రాష్ట్రాలు కాదు. అందువలన శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీరతాళ్లతో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు విదేశాలలో, స్వదేశంలో ఎన్ని వీరంగాలు వేసినా వారిని కొమ్ముగాసే స్వరాష్ట్రాల మీడియాను తప్ప విదేశీ కార్పొరేట్లను రంజింపచేయవు.

    తాను అధికారానికి వస్తే గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ విస్తరిస్తానని మోడీ చెప్పారు. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయటం లేదు. అమలు జరుపుతున్నట్లా లేదా కనీసం ఆ నమూనా ఏమిటో అయినా జనానికి వివరించారా అంటే లేదు. చిత్రం ఏమిటంటే గుజరాత్‌ మోడల్‌ బండారం గురించి అనేక మంది అనేక సందర్భాలలో వెల్లడించారు. ఇక్కడ స్ధలాభావం వలన దాని గురించి వివరించటం లేదు. మోడీ మహాశయుడు చెప్పినట్లు అదొక ఆదర్శ నమూనా, వాస్తవమే అయితే అందుకు దోహదం చేసింది పంచవర్ష ప్రణాళికలే. నరేంద్రమోడీ అధికారానికి రాగానే అసలు ఆ విధానాన్నే రద్దు చేశారు. నీతి ఆయోగ్‌ పేరుతో ప్రణాళికా సంఘాన్ని తెరమరుగు చేశారు. రెండు సంవత్సరాలు సాము చేసి ఇప్పుడు చెబుతున్నదాని ప్రకారం పదిహేను సంవత్సరాల పాటు అమలు జరిపే ఒక స్వప్న పత్రాన్ని రూపొందించబోతున్నారు.అది 2018 నుంచి అమలులోకి వస్తుంది. దాని ప్రకారం తొలి ఏడు సంవత్సరాలకు ‘ జాతీయ అభివృద్ధి అజెండా’ను రూపొందిస్తారు. దానిని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తారు. దాని ప్రకారం తొలి సమీక్ష 2020లో జరుగుతుంది. దీన్నే చిల్లి కాదు తూటు అంటారు. మరి అప్పటి వరకు అంటే 2018 వరకు ఏ విధానాలను అమలు జరుపుతారు? విఫల కాంగ్రెస్‌ విధానాలను కొనసాగిస్తున్నట్లా ?

    రెండు సంవత్సరాల పాలనలో పరిశ్రమలు, సేవలు, నిర్మాణం,వ్యవసాయం మొదలైన రంగాలలో వాణిజ్య అవకాశాల తీరుతెన్నుల గురించి విశ్లేషణ జరిపిన జర్మనీకి చెందిన ఎంఎన్‌ఐ బిజినెస్‌ సూచిక 2014లో గరిష్టంగా 80.3 వుండగా ఈఏడాది ఏప్రిల్‌ నెలలో 69.6కు దిగజారింది. ఇదే కాలంలో చైనా సూచిక 50-55 పాయింట్ల మధ్య కదలాడినట్లు అదే సంస్ధ తెలిపింది. ఏ దేశంలో ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో సూచిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల నిమిత్తం ఇలాంటి సూచికలను రూపొందిస్తారు. వాటి ఆధారంగా పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటారు. దేశం మొత్తానికి ఈ సూచికను రూపొందించినప్పటికీ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేవారు కూడా వీటిని గమనంలోకి తీసుకుంటారు. మన రిజర్వుబ్యాంకు విశ్లేషణ ప్రకారం వాణిజ్య ఆశల సూచిక 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో 117.9 వుండగా 2016 తొలి మూడు నెలల్లో 111 పాయింట్లకు పడిపోయింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ 8.2శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని గతంలో చెప్పారు. రిజర్వుబ్యాంకు తాజా జోస్యం ప్రకారం సమీప భవిష్యత్‌లో ఆ అంకెను చేరుకొనే అవకాశం లేదని ఆచరణ వెల్లడిస్తోంది.

 అంతర్జాతీయంగా వినియోగదారుల విశ్వాసాన్ని అభివృద్ధి సూచికలలో ఒకదానిగా పరిగణిస్తున్నారు.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 98.2 వుండగా తరువాత అది 109కి పెరిగి ప్రస్తుతం 104.1 పడిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన పరిస్థితులకు ఇది ప్రతిబింబం అని భావిస్తున్నారు.ఈ ఏడాది మంచి వర్షాలు పడితే, కేంద్ర ప్రభుత్వం వుద్యోగులకు వేతనపెంపుదల చేస్తే సూచిక తిరిగి పెరగవచ్చని వాణిజ్యవేత్తలు ఆశిస్తున్నారు. పారిశ్రామిక వుత్పత్తి సామర్ధ్య వినియోగ సూచిక కూడా దేశ పరిస్ధితికి దర్పణం పడుతుంది. 2013-14 చివరి మూడు నెలల్లో ఈ సూచిక 76శాతం వుండగా 2015-16 మూడవ త్రైమాసికంలో 72.5 పాయింట్లకు పడిపోయింది. పారిశ్రామిక ఆర్డర్లు కూడా సగటున ప్రతి మూడు నెలలకు 1.45 బిలియన్‌ రూపాయల నుంచి 1.15 బిలియన్లకు పడిపోయింది. అంటే పెట్టుబడులను ఆకర్షించే పరిస్ధితి లేదన్నది దీని అర్ధం. ఈ పూర్వరంగంలోనే చంద్రబాబు నాయుడు, లోకేష్‌, కెసిఆర్‌, కెటిఆర్‌లు ఎన్ని రాష్ట్రాలు, దేశాలు తిరిగినా వాగ్దానాలు తప్ప పెట్టుబడులు వచ్చేఅవకాశాలు ఏమేరకు వుంటాయో అర్ధం చేసుకోవచ్చు.గడచిన 24నెలల పాలనలో వరుసగా 17వ నెలలో కూడా మన ఎగుమతులు పడిపోయాయని అధికారికంగా ప్రకటించారు.2014-15తో పోల్చితే గతేడాది ఎగుమతుల మొత్తం 310 బిలియన్‌ డాలర్ల నుంచి 261 బిలియన్లకు పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.మోడీ అధికారానికి వచ్చిన తరువాత మన రూపాయి పతనం చెంది జనం మీద భారమూ పెరిగింది, అదే సమయంలో మన ఎగుమతులూ పడి పోయాయి. రూపాయి పతనమౌతుంటే గుడ్లప్పగించి చూడటం తప్ప నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో మన దిగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి కనుక విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సమస్య తీవ్రత కూడా తగ్గింది. ఈ స్థితిలో మేకిన్‌ ఇండియా గురించి చెప్పుకోవటం అంటే నరేంద్రమోడీ ఘోర వైఫల్యం గురించి గుర్తు చేయటమే.

  చిత్రం ఏమిటంటే ఆర్ధిక రంగంలో ఇన్ని వైఫల్యాలు,దిగజారుడు కనిపిస్తున్నప్పటికీ కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లు ఇప్పటికీ బిజెపి అధికార ప్రతినిధి నరేంద్ర తనేజా మాట్లాడుతున్నారు. అసాధారణ రీతిలో ఆర్ధికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవటం ప్రతిపక్షాలకు కనిపించటం లేదని, కోమాలోకి పోయిన ఆర్ధిక వ్యవస్ధను చైతన్యంలోకి తీసుకువచ్చి ఇప్పుడు మరమ్మతులు ప్రారంభించి మార్పుకోసం పనిచేస్తున్నామని నమ్మబలుకుతున్నారు.

    నరేంద్రమోడీ పాలనలో ఒక్క అవినీతి వుదంతమైనా వున్నదా? అవినీతి సూచికలో మన స్థానం తగ్గిందని ప్రకటించటం చూడ లేదా అని ఆయన అభిమానులు అడ్డు సవాళ్లు విసురుతుంటారు. నిజమే, అసలు కొత్తగా ఏదైనా పనిచేస్తే కదా అవినీతి వున్నదీ లేనిదీ తెలిసేది. తొమ్మిదివేల కోట్లరూపాయలు ఎగవేసిన విజయ మాల్య వుదంతం ఏమి తెలియ చేస్తోంది. దాని గురించి అడిగితే అతగాడికి కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారని తెలివిగా సమాధానమిచ్చారు.అదే పెద్దమనిషి దేశం నుంచి పరారీ అవుతుంటే దొంగగారు పోతుంటే చూసి చెప్పమన్నారు తప్ప పట్టుకోమనలేదని నిఘా సంస్థలు చెప్పటం చూస్తే తెలివితక్కువ తనానికి సరికొత్త వుదాహరణగా మోడీ సర్కార్‌ను కొందరు వర్ణించారు. వీడ్కోలు ఇచ్చి మరీ విదేశాలకు పంపిన నిర్వాకాన్ని చూసి దేశం నివ్వెర పోతోంది. నిజానికి ఇది తెలివితక్కువ తనం కాదు, వున్నత స్థానాలలోని పెద్దల ప్రాపకం లేకుండా పట్టుకోవాల్సిన వ్యవస్థలను దానికి బదులు ఎటువెళుతున్నారో చెబితే చాలని ఆదేశాలు జారీచేయించింది ఎవరు? రేపు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తారనగా ముందురోజే దేశం నుంచి పరారీ కావటానికి పెద్దల సహకారంలేకుండా సాధ్యమా? అధికారం వున్నంత కాలం కాంగ్రెస్‌ను వుపయోగించుకొని పోగానే బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కూడా విజయమాల్యను ఆదర్శంగా తీసుకున్న పెద్దమనిషే,తమ దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది ధర్నా చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త నివేదన ఆధారంగా బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప పదవి నుంచి తప్పుకున్న విషయం లోకవిదితం. తిరిగి అదే పెద్ద మనిషిని ఆ పార్టీ అందలమెక్కించించింది. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుంటూ అవినీతి వ్యతిరేక కబుర్లు చెబితే ప్రయోజనం వుందా ? కాంగ్రెస్‌ హయాంలో అవినీతి అక్రమాలపై విచారణను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత మందిని శిక్షించారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదా ? గొప్పగా చెబుతున్న గుజరాత్‌ మోడల్‌ ఏమిటి, అప్పనంగా ప్రకృతి సంపదలైన నీరు, భూముల వంటి వాటిని పెట్టుబడిదారులకు కట్టపెట్టమేగా ? దాన్ని ఏమంటారు ? వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతోంది . చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ అవినీతి గురించి ఎన్నికలపుడూ, ఇప్పుడూ నానా యాగీ చేశారు, చేస్తున్నారు. కానీ గత రెండు సంవత్సరాలలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రోత్సహించి తన పార్టీలో కలుపుకొనేందుకు చూపిన శ్రద్ధ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు చూపటం లేదేమి? చంద్రశేఖరరావు కూడా కాంగ్రెస్‌ అవినీతి గురించి అలాగే కబుర్లు చెప్పారు. అక్కడ కూడా జరుగుతున్నది అదే ఫిరాయింపులు, ఫిరాయింపులు.

  ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులు గతేడాది నాలుగవ త్రైమాసిక ఫలితాల ప్రకారం ఏడువేల కోట్లరూపాయలను నష్టపోయాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ కనిపించటం లేదు. బ్యాంకులకు వుద్ధేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణలు ప్రతిపాదించటానికేే రెండు సంవత్సరాలు పట్టిందంటే దున్నపోతు మీద వానపడ్డట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపియే హయాంలో 2008-13 సంవత్సరాలలో బ్యాంకుల నిరర్ధక ఆస్థుల సగటు 2.6శాతం వుండగా తమ అసలైన ప్రతినిధి మోడీ అనుకున్నారేమో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రెండు సంవత్సరాలలో వాటిని 4.5శాతానికి పెంచి ఎంతో లబ్దిపొందారు, 2008లో 2.3శాతంగా వున్నవి కాస్తా 2015 నాటికి 4.3 శాతానికి పెరిగాయి. వుద్ధేశ్యపూర్వంగా రుణాలు ఎగవేసిన పెద్ద మనుషులు 2015 డిసెంబరు నాటికి 7,686 మంది వుంటే వారి నుంచి రావాల్సిన సొమ్ము 66వేల కోట్ల రూపాయలు. అందువలన కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారన్నది సాకు మాత్రమే వారి మీద చర్య తీసుకుంటే, డబ్బువసూలు చేస్తే వీరికి ఎవరు అడ్డుపడ్డారు? అవినీతికి పాల్పడటం ఎంత నేరమో పాలకులుగా వుండి అవినీతి పరులను వుపేక్షించటం కూడా దానితో సమానమైన నేరమే అవుతుంది.సుగర్‌, బిపి కవల పిల్లల వంటివి. అలాగే పెట్టుబడిదారీ విధానంతో అవినీతి పెనవేసుకొనే వుంటుంది. అందుకే అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఎవరి గురించి అయినా ముందే సంబరపడిన వారు తరువాత విచారించకతప్పదు.

   జపాన్‌లో పిల్లలకు వేసే డైపర్ల కంటే వృద్ధులకు వేస్తున్న వాటి సంఖ్య పెరిగిపోతోంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ముంచుకు వస్తున్న వృద్ధాప్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్నాయి. మన దేశంలో పశు ‘వృద్ధాప్యం’ రైతాంగానికి, కొందరు వృత్తిదారులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ సర్కార్‌ కొత్తగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగేస్తున్నారని మహారాష్ట్రలో కరువు ప్రాంతాల రైతాంగం వాపోతోంది. అనేక రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం కారణంగా వ్యవసాయానికి, పాడికి పనికిరాని పశువులను వదిలించుకోవటం రైతాంగానికి కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది. పశువుల ధరలు సగానికి సగం పడిపోయాయి. ప్రయోజనం లేని పశువులకు నీరు, మేత అందించటం పెద్ద సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ చేసిన వ్యాఖ్య బడా పారిశ్రామికవేత్తలలో నరేంద్రమోడీ విధానాల పట్ల వున్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి, శక్తి కాదు.’ కొన్ని అంశాలు అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి, వుదాహరణకు కొన్ని రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం. ఇది స్పష్టంగా వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిని దెబ్బతీస్తోంది, ఎందుకంటే ఈ వృధాగా వున్న ఆవులను మనం ఏమి చేసుకుంటాం, ఇది వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది,ఎందుకంటే ఇది అనేక మంది రైతులకు మంచి ఆదాయ వనరు, అందువలన ఆ చర్య ప్రతికూలం. వేదకాలంలో కూడా భారతీయులు గొడ్డు మాంసం తినేవారు, కరవు పరిస్థితులు ఏర్పడినపుడు రైతులు పశువులను వధశాలలకు తరలించేవారు.’ అని చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాలలో జంతు వధ నిషేధం, జరిమానాలు, ఇతరంగా ఏదో ఒక రూపంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో పశువుల ధరలు 13శాతం పడిపోయాయని రాయిటర్‌ వార్తా సంస్ధ తెలిపింది.

    రాజకీయ రాజధాని న్యూఢిల్లీ అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబై.మహారాష్ట్రలోని బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ‘ గొడ్డు మాంసం, మరాఠీ చిత్రాలు తరువాత ఏమిటి; మధ్యాహ్న భోజనంలో విధిగా వడపావ్‌ తినాలి, మరాఠీ మాట్లాడాలి, ప్రతి రోజూ దేవాలయాలను సందర్శించాలనే చట్టాలు చేస్తారేమో అని పారిశ్రామికవేత్త హర్ష గోయంకా వ్యాఖ్యానించారు.’ భారత్‌ ఇప్పుడు భవిష్యత్‌లో వెలిగిపోవాలంటే జనానికి ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ వుండాలి.ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలాపాలకు పరిమితం కావాలి, జనం ఏం చేయాలో చెప్పాల్సిన పాత్ర ధరించకూడదు’ అని రతన్‌ టాటా ఈ ఏడాది జనవరిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

    ఒక పార్టీ మరొక పార్టీ విధానాలను విమర్శించటం ప్రజాస్వామ్య పద్దతి. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షం లేకుండా చేసుకోవటం క్షంతవ్యం కాదు. కానీ అధికార రాజకీయాలలో ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ విలువలను పాటించటం లేదు. కేరళ, బెంగాల్‌,త్రిపుర రాష్ట్రాలలో ఎవరైనా ఒకరో అరో వామపక్షాల నుంచి ఇతర పార్టీలలో చేరటం తప్ప ఇతర పార్టీల నుంచి వామపక్షాలు ఫిరాయించిన వుదాహరణలు లేవని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరచటం, ఫిరాయింపులను ప్రోత్సహించాటాన్ని బిజెపి విమర్శించింది. కానీ అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పనిచేసినట్లు అరుణాచల్‌, వుత్తరాంచల్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడగొట్టేందకు ప్రయత్నించి భంగపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న పిలుపును ఈ విధంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒక్కొక్క ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిని ఒక పద్దతి ప్రకారం ఆకర్షించటమే పనిగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. తెలంగాణాలో వైఎస్‌ఆర్‌సిపిని పూర్తిగా పూర్తిగా, తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు అదే విధంగా స్వాహా చేయటంలో టిఆర్‌ఎస్‌ జయప్రదమైంది. కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలను ప్రోత్సహిస్తోంది. వీటన్నింటినీ చూసినపుడు పార్టీ ఫిరాయింపులు సాధారణ అంశంగా మార్చివేయటంలో ఈ పార్టీలన్నీ జయప్రదమయ్యాయి. రాజకీయాలలో హుందాగా ప్రవర్తించటం అన్నది దాదాపు కనుమరుగైంది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి స్థాయిలలో వున్నవారు కూడా అందుకు అతీతులు కాదని రుజువు చేశారు.

    చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి చిన్నమాట. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించటం తప్ప వీటికంటూ ప్రత్యేక విధానాలు లేవు. అందువలన ధరల పెరుగుదలను నివారించటంలో రెండు చోట్లా వైఫల్యమే. కరవు పరిస్థితులను కప్పి పెట్టేందుకు ప్రయత్నించటం తప్ప జనాన్ని ఆదుకొనేందుకు, కేంద్రం నుంచి నిధులు పొందేందుకు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటో జనానికి తెలియదు. రాష్ట్రం విడిపోతే యువతకు పెద్ద ఎత్తున వుపాధి దొరుకుతుందని తెలంగాణా నేతలు చెప్పారు. ఈ రెండు సంవత్సరాలలో అంతకు ముందుతో పోల్చితే పెద్ద మార్పేమీ కనపడటం లేదు. బాబొస్తే జాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి, వున్న వుద్యోగాలు పోతున్నాయి తప్ప కొత్తవాటి జాడ కనిపించటం లేదు. తెలంగాణాలో ముడుపుల కోసమే ప్రాజక్టుల రూపురేఖలన్నీ మార్చివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుస్తాయన్నట్లు గతంలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నవారికి, అధికారంలో వున్నవారికి కూడా ఈ విషయాలన్నీ కొట్టిన పిండి కనుక దేన్నీ కాదనలేము.ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పోలవరం తప్ప కొత్తగా కట్టే పెద్ద ప్రాజక్టులేమీ లేవు. వున్నవన్నీ పూర్తి చేయాల్సినవే. పోలవరం వంటి వాటికి నీళ్లు లేకుండానే ముందుగానే కాలువలు తవ్వి గత పాలకులు సొమ్ము చేసుకున్నారు. ఇప్పటి వారు వాటి పూడికలు తీసి సొమ్ము చేసుకుంటారు. అన్నింటి కంటే రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు తెరలేపారు.గతంలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు ఐదులక్షల కోట్ల పధకమది. అందువలన శ్రీశ్రీ చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అన్నట్లు ఏ పార్టీ చరిత్ర చూసినా గత రెండు సంవత్సరాలలో గర్వించదగిన చర్యలేమీ లేవు. రానున్నవి మంచి రోజులని చెప్పారు. అవి ఎండమావుల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ చెంపమీద కొడితే మరో చెంప చూపమని మన వేదాంతం చెబుతుంది తప్ప కొట్టిన వారి చెంప చెళ్లు మనిపించమని చెప్పలేదు. అందుకే మన జనం కూడా అంత నిస్సారంగా తయారయ్యారు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నారు. ఇదొక చిత్రం !

గమనిక :ఈ వ్యాసం ‘ఎంప్లాయీస్‌ వాయిస్‌’ మాసపత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది

కేరళ వామపక్షాలకు సవాలు విసిరిన ఓటింగ్‌ సరళి

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

    ఐదు సంవత్సరాల తరువాత కేరళలో తిరిగి అధికారానికి రావటంతో సిపిఎంతో సహా అన్ని వామపక్షాలు, శక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారానికి రాకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలను అయినా వామపక్షాలు సాధిస్తాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. గతంలో వున్న స్ధానాలను కోల్పోయాయి. అందువలన కేరళ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేవు. ఇది భౌతిక వాస్తవం. కేరళలో మూడింట రెండు వంతుల మెజారిటీకి కేవలం రెండు స్ధానాలు మాత్రమే తగ్గాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) విజయానికి వున్న ప్రాధాన్యతను ఎవరూ తగ్గించజాలరు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు కడుపు మంటతో ఏడవలేక నవ్వు ముఖం పెడతారు. అది సహజమే, అర్ధం చేసుకోవాలి అంతే. ఇదే సందర్భంలో మరో కోణం నుంచి కూడా ఫలితాలను విశ్లేషించటం అవసరం.అది ఈ దేశంలో అభ్యుదయ పురోగామి శక్తులు మరింతగా పెరగాలని కోరుకొనే వారందరూ చేయాలి. ఓటమి చెందినపుడు ఎంత తీవ్రంగా అంతర్మధనం చేయాలో గెలిచినపుడు దానిని కొనసాగించటానికి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సి వుంటుంది.

     కేరళలో ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువగా సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమికి సీట్లు  వచ్చాయి.ఎల్‌డిఎఫ్‌ ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం తెచ్చుకుంది. కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుపొందింది. త్రిసూర్‌, పథ్థానం తిట్ట, అలప్పూజ, వైనాడ్‌ జిల్లాలో ఒక సీటు మినహా , కన్నూరు, కాలికట్‌ జిల్లాలో రెండేసి తప్ప అన్నింటినీ గెలుచుకుంది. ఇదే సమయంలో ఓటింగ్‌ తీరు తెన్నులు సిపిఎంకు ఒక పెద్ద సవాలును కూడా విసిరాయి.

1.గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు దాదాపు ఒక శాతం తక్కువగా 43.1శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో అధికారం రానప్పటికీ కాసరగోడ్‌, కోజికోడ్‌, ఇడుక్కి, కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఒక్క కొల్లం జిల్లాలోనే ఆ విజయాన్ని కొనసాగించింది.

2. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గి 45 నుంచి 38.78శాతానికి పడిపోయాయి. పోటా పోటీగా కేరళలో జరిగే ఎన్నికలలో రెండు కూటముల మధ్య ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల తేడా వుండటం, రెండు కూటములకూ ఓటింగ్‌ శాతం తగ్గటం కూడా ఇదే ప్రధమం.

3.బిజెపి నాయకత్వంలోని కూటమి గత ఎన్నికలలో వచ్చిన ఆరుశాతాన్ని 15కు పెంచుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, కొద్ది నెలల కితం జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికల కంటే కూడా అదనంగా ఓట్లు తెచ్చుకొంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీటు గెలుచుకోవటంతో పాటు ఏడు చోట్ల రెండవ స్ధానంలో నిలిచింది.

     కాంగ్రెస్‌ మీద వున్న వ్యతిరేకతతో పాటు బిజెపి గణనీయంగా ఓట్లు చీల్చటం కూడా ఎల్‌డిఎఫ్‌కు కలసి వచ్చి ఘన విజయం సాధించిందని ఓటింగ్‌ తీరుతెన్నులను బట్టి కొందరు విశ్లేషించారు. గతంలో అనేక సందర్బాలలో కమ్యూనిస్టులను అధికారానికి రానివ్వకూడదన్న గుడ్డి వ్యతిరేకతతో బిజెపి తన ఓట్లను కాంగ్రెస్‌కు బదలాయించిందన్నది బహిరంగ రహస్యం.ఈ సారి ఎలాగైనా బిజెపి పర్మనెంటు అభ్యర్ధిగా పేరు తెచ్చుకున్న ఓ రాజగోపాలన్‌ను గెలిపించేందుకు తోడ్పడటం ద్వారా బిజెపి హిందూత్వ ఓటర్ల మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ ఆయనపై బలహీనమైన అభ్యర్ధిని నిలిపి పరోక్ష సందేశం పంపింది. అయితే బిజెపి కాంగ్రెస్‌ మద్దతు పొంది తొలిసారిగా కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టింది తప్ప మొత్తం మీద తన ఓట్లను బదలాయించినట్లు కనిపించటం లేదు. అయితే గతంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అనేక చోట్ల ఈ సారి బిజెపి ఓట్లు తగ్గాయి. అంటే అక్కడ ఆ ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయించారా ? చూడాల్సి వుంది. కాంగ్రెస్‌, బిజెపి చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా సిపిఎంకు హిందువుల ఓట్లతో పాటు అనేక చోట్ల మైనారిటీలు కూడా మద్దతు ఇచ్చినట్లు ఫలితాల తీరు తెన్నులపై విశ్లేషకులు చెబుతున్నారు.’ సాంప్రదాయంగా సిపిఎంకు ఓటు చేసే హిందువులలో చీలిక తెచ్చేందుకు చివరి దశలో బిజెపిఏ తనకు ప్రధాన ప్రత్యర్ధి అని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. కానీ ఫలితాలను చూస్తే హిందువులు మెజారిటీ వున్న ప్రాంతాలతో పాటు బిజెపి పెరుగుదల కారణంగా మైనారిటీలు ఎక్కువగా వున్న కొన్ని చోట్ల కూడా సిపిఎం తన ఓట్లను పెంచుకున్నట్లు వెల్లడి అవుతోందని’ డెక్కన్‌ క్రానికల్‌ కేరళ ఎడిషన్‌ సంపాదకుడు కెజె జాకబ్‌ అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు కారణంగానే ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మెజారిటీ 70వేల నుంచి 27వేలకు పడిపోయిందన్నారు.

    బెంగాల్లో ఫలితాలు వామపక్షాలను తీవ్రంగా పునరాలోచనలో పడవేస్తాయి. రెండు సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ ఎన్నికలలో 16శాతం ఓట్లు పొందిన బిజెపి అసెంబ్లీలో 10శాతానికి పడిపోయింది.అవి తృణమూల్‌ కాంగ్రెస్‌కు బదిలీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమికి కారణాలుగా చెబుతూ వస్తున్న కొన్ని వ్యాఖ్యలను వామపక్షాలు నిశితంగా పరిశీలించాల్సి వుంది. మమతాబెనర్జీ కిలో రెండు రూపాయల బియ్యం పధకం ప్రవేశపెట్టి శారద, నారద వ్యతిరేకతను అధిగమించారన్నది ఒకటి. దేశవ్యాపితంగా ఆహార భద్రత కావాలని డిమాండ్‌ చేసిన వామపక్షాలు బెంగాల్‌లో తమ మూడున్నర దశాబ్దాల పాలనలో సబ్సిడీ బియ్యం పధకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బాలికలకు స్కాలర్‌ షిప్పులు, సైకిళ్లు ఇచ్చారని మరికొన్ని ఇలాంటివే వున్నాయి. అన్నింటినీ ప్రజాకర్షక పధకాలుగా కొట్టివేయలేము. సిపిఎం కార్యక్రమం జనతా ప్రజాస్వామిక విప్లవ దశకు చేరటం తప్ప నేరుగా సోషలిజం కాదు. అటువంటిది ఒక రాష్ట్రంలో మౌలిక మార్పులను చేయలేని పరిస్థితులలో వున్నంతలో ప్రజలకు వుపశమనం కలిగించటం అవసరమా లేదా ? అందువలన బెంగాల్లో గతంలో ఏం జరిగింది అని అంతర్గతంగా మధించుకోవటంతప్ప ఇప్పుడు బహిరంగంగా చర్చించి ప్రయోజనం లేదు. అధికారంలో వున్న త్రిపుర, కేరళలో అయినా అలాంటి వైఫల్యాలు, లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.

    రెండవది కాంగ్రెస్‌ ఓటింగ్‌ పూర్తిగా బదిలీకాలేదన్న వాదన. దీని గురించి ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. బదిలీ అవుతాయి అని ఎవరైనా భావిస్తేనే భ్రమలకు లోనయినట్లుగా పరిగణించాలి. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఇతర వామపక్షపార్టీలతో కలిగిన అనుభవం ఏమిటి? సిపిఎం ఓట్లు పూర్తిగా, నిజాయితీగా బదిలీ అయ్యాయి తప్ప ఇతర పార్టీల నుంచి అవి మిత్రపక్షాలుగా వున్నపుడే పూర్తిగా బదిలీ జరగలేదని తేలింది. అలాంటిది బెంగాల్లో గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పనిచేసిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఓట్లు పూర్తిగా బదిలీ అవుతాయని భావించటం అత్యాశే అవుతుంది. సాధారణ పరిస్థితులలో పార్టీ పనిచేయటానికి కూడా అవకాశం లేని స్ధితిలో ప్రజాస్వామ్య పరిస్ధితుల పునరుద్దరణకోసం చేసుకున్న సర్దుబాటు తప్ప అది మరొకటి కాదు. కమ్యూనిస్టులు ప్రపంచంలో అనేక చోట్ల అంతకంటే తీవ్ర నిర్బంధం, ప్రతికూల పరిస్థితులలో పనిచేస్తున్నారు. అందువలన బెంగాల్లో వామపక్షాలు రాబోయే అయిదు సంవత్సరాలలో మరిన్ని దాడులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. నూతన పరిస్ధితులకు అనుగుణంగా పని చేసి తిరిగి ప్రజల విశ్వాసం పొందటం తప్ప మరొక మార్గం లేదు. అది ఎలాగన్నదే సమస్య.

     ఫలితాలకు సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణలు రాబోయే రోజుల్లో వెలువడతాయి. వామపక్షాల ముందున్న ఒక తీవ్ర సవాలును అవి ఎలా అధిగమిస్తాయన్నదే ప్రశ్న. అదే మిటంటే గత ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే స్పష్టం అవుతుంది. వర్గరీత్యా ఒక శాతం పెట్టుబడిదారులు, భూస్వాములు అయితే 99శాతం కార్మికవర్గం, ఇతర కష్టజీవులే. అటువంటపుడు కమ్యూనిస్టులు పొందుతున్న ఓటింగ్‌ శాతం దానిని ప్రతిబింబించటం లేదు. అనేక మంది శ్రామికులు కమ్యూనిస్టులు కాని పార్టీల, కుల మత శక్తుల వెనుక వున్నారు. ఓడిపోయిన ప్రతి సారీ కమ్యూనిస్టులు ఆత్మశోధన చేసుకొని బలహీనతను అధిగమిస్తామని చెబుతూనే వున్నారు. కానీ తరువాత అది ప్రతిబింబించటం లేదు. కమ్యూనిస్టుల బలం ఒక పరిధికి మించి పెరగటం లేదు. అలాగని దీన్ని గురించి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు గానీ తీవ్రంగా పరిశీలించకతప్పదు. వివరాలు చూడండి. కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌,బిజెపి ఓట్ల శాతాలు ఇలా వున్నాయి.

                1987      1991      1996     2001     2006     2011     2016

ఎల్‌డిఎఫ్‌    44.65     45.80    44.69    43.70     48.60    44.83   43.10

యుడిఎఫ్‌    44.04     48.07    43.58    49.27    42.98     45.90   38.78

బిజెపి                                                5.20       4.75      6.00    15.00

     గత ఏడు ఎన్నికలలో తొలిసారిగా 2016లో అటు ఎల్‌డిఎఫ్‌ ఇటు యుడిఎఫ్‌ రెండు కూటములు అతి తక్కువ ఓట్లు పొందాయి.ఏడు ఎన్నికల సగటు ఎల్‌డిఎఫ్‌కు 45, యుడిఎఫ్‌కు 44.6శాతంగా వున్నాయి. ఎల్‌డిఎఫ్‌ గరిష్టంగా 2006లో 48.6శాతం, యుడిఎఫ్‌ 2001లో 49.27 శాతం ఓట్లు పొందాయి.

     పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2006 వరకు జరిగిన ఎన్నికలలో వామపక్ష సంఘటన సగటున 49.82 శాతం ఓట్లు పొందింది. ఏడు ఎన్నికలలో రెండు సార్లు మాత్రమే 50 శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది. బెంగాల్‌, కేరళలో రెండు చోట్లా సగం మంది కంటే తక్కువ ఓటర్ల మద్దతు మాత్రమే వామపక్షాలు ఇంతకాలం పొందగలిగాయి. బెంగాల్లో గత రెండు ఎన్నికలలో వామపక్ష ఓటింగ్‌ గణనీయంగా తగ్గిపోయింది. తిరిగి ప్రజా మద్దతు పొందటం ఎలా అన్నది ఆ పార్టీలు చూసుకుంటాయి, అది వేరే విషయం. బాగా వున్న రోజులలో కూడా వాటి బలం అంతకు మించి పెరగ లేదు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో బెంగాల్లో పోయిన పునాదిని తిరిగి సంపాదించటం ఒక సవాలైతే కేరళలో పునాదిని మరింత పెంచుకోవటం అంతకంటే పెద్ద సవాలు. కేరళలో వున్న సామాజిక పరిసిస్థితులలో 43శాతం మైనారిటీ జనాభాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని మరిచి పోరాదు. మైనారిటీలందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కానప్పటికీ వారు మెజారిటీగా వున్న ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలను చూసినపుడు మతశక్తుల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతశక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోంది.అదే సమయంలో కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో రాజీపడటం, కుమ్మక్కు కావటమే ఇప్పటివరకు దాని చరిత్రగా వుంది. ప్రపంచంలో మత ధోరణులతో పాటు నయా వుదార వాద విధానాల ప్రభావం అన్ని తరగతులలో బలంగా వ్యాపిస్తున్న తరుణమిది.అందుకే మన దేశంలో మైనారిటీ మతాలకు చెందిన కొన్ని శక్తులు బిజెపిని చూసి ఒకవైపు భయపడుతూనే మరోవైపు దానిని సమర్ధించటానికి కూడా పరిమితంగానే అయినప్పటికీ వెనుకాడటం లేదు. ఆ తరగతులలో మధనం జరుగుతోంది. దీనికి కేరళ మినహాయింపు అవుతుందా ?

అయిననూ పోయి రావలె హస్తినకు…..

Tags

, , , , ,

చంద్రబాబు ఢిల్లీ యాత్ర విఫలం !

ఎం కోటేశ్వరరావు

   అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు మరోసారి హస్థినాపురి పర్యటనకు వెళ్లి వచ్చారు. జూదంలో ఓడిపోయిన పాండవులకు చివరకు ఐదు వూళ్లు కాదుకదా సూదిమోపినంత స్థలం కూడా ఇచ్చేది లేదని కౌరవులు చెప్పినట్లుగా కేంద్రమంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఎంతో స్పష్టంగానే చెప్పారు. కాదని చెప్పటానికి మీరెవరు. అవునన్నా కాదన్నా అగ్రజుడితోనే మాట్లాడి అమీతుమీ తేల్చుకుంటా అన్నట్లగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, తిరిగి వచ్చారు. సాధించేదిమిటి అన్నది అర్ధంగాక రాష్ట్ర జనం జుట్టుపీక్కుంటున్నారు. తెలుగుదేశం వీరాభిమానులు కూడా వారిలో వుంటారు. కసు ఓడిపోయిన వారు కోర్టులోనే ఏడిస్తే గెలిచిన వారు ఇంట్లో ఏడ్చినట్లుగా వారు బయట పడరు అదే తేడా. ప్రధాన మంత్రిని కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది విలేకర్లందరితో ఒకేసారి, ఒకటే అయినా ఒకే పత్రికను చదివితే ఆయనేం మాట్లాడిందీ పూర్తిగా తెలియని స్థితి.

    చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ పత్రిక ‘సాక్షి ‘(దాని ఆస్థులు ప్రభుత్వ ఆధీనంలో వున్నాయన్నారు కనుక) పత్రిక ‘ హోదాతో ఏం వస్తుంది ‘ అని చంద్రబాబు అన్నట్లు శీర్షిక పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు ‘ ఆ రెండు ‘ పత్రికలలో ఒకటైన ‘ఆంధ్రజ్య్రోతి’ ‘కేంద్రానిదే బాధ్యత ‘ అనగా ‘ఈనాడు’ ప్రత్యేక హోదాపై ఆందోళన వద్దు ‘ అని ‘ప్రజాశక్తి ‘ చట్టంలోని అంశాలే ‘ అని పేర్కొన్నది. మొత్తం మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనే దింపుడు కళ్లం ఆశను కూడా చంద్రబాబు తీర్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదొక పెద్ద మలుపుకు నాంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం రాజకీయం ఏ రకంగా వుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వ్యూహాలు పన్నటానికి ప్రతి పార్టీ కొంత సమయం తీసుకోవచ్చు.లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఫోజు పెడుతున్న పవన్‌ కల్యాణ్‌ వంటి వారు ఎలా లేస్తారు ? తెలుగుదేశం-బిజెపి తెగతెంపులు చేసుకుంటే పరస్పరం లాభమని భావిస్తాయా, కలిసి వుంటేనే కలదు సుఖం అనుకుంటాయా అన్నది స్పష్టం కావటానికి సమయం పట్టవచ్చు.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియనట్లు ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక పాకేజీ కూడా రాదని చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.గతేడాది రాజధాని శంకుస్థాపనకు ప్రధాని రాక సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక పాకేజిని అడిగినట్లు ప్రకటించి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత నష్ట నివారణ చర్యగా తాను పొరపాటున హోదాబదులు పాకేజి అన్నానని సవరించుకున్నారు. కేంద్రంపై వున్న భ్రమలు, దింపుడు కళ్లం ఆశతో వున్నారని అప్పుడే వెల్లడైంది. అందువలనే గత రెండు సంవత్సరాలుగా ఎవరైనా కెలికితే తప్ప సాధ్యమైన మేరకు వాటి ప్రస్తావన రాకుండా చూసుకున్నారు, ఒక వేళ వచ్చినా బి పాజిటివ్‌ అన్న ధోరణిలో మాట్లాడారు. ఎంతైనా తెలివైన రాజకీయవేత్త కదా ! హోదా వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ వుండదని జనానికి, హోదారాకపోయినా కనీసం ఆర్ధికంగా మంచి పాకేజి ఇచ్చినా సరిపెట్టుకుంటామన్నట్లుగా కేంద్రానికి అనేక సంకేతాలు పంపారు. మరోవైపు రాజధాని నిర్మాణం, విదేశాల నుంచి భారీఎత్తున పెట్టుబడుల పేరుతో పెద్ద హంగామా సృష్టించారు. ఎన్నిదేశాలు తిరిగినా ,ఎవరితో కూర్చున్నా వూసులు తప్ప కాసుల రాశులు రావటం లేదు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా ప్రతివారూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడుల కోసం పోటీ పడని రాష్ట్రం లేదని వారికీ అర్ధం అయింది. ఎవరైనా వూరికి దూరంగా ఇల్లు కడుతుంటే సామాన్లు వేసుకోవటానికి అవసరమైన తాత్కాలిక షెడ్డు వేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా తాత్కాలిక రాజధాని నిర్మాణానికే వందల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. అంటే శాశ్వత రాజధాని శంకుస్థాపన దగ్గరే ఆగిపోతుందన్నది స్పష్టం. తనను సవాలు చేసే బలమైన ప్రతిపక్షం లేకపోయినా తాను సృష్టించుకున్న సమస్యలే ఎంతో బలంగా చంద్రబాబును నిలదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

    ప్రత్యేక హోదా, ప్యాకేజీల వంటివి ఏమీ రాకపోయినా జనాన్ని ఏదో విధంగా జోకొట్ట వచ్చు, అందుకు గాను ముందు ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలన్నది చంద్రబాబు చాణక్యంగా కనిపిస్తోంది. ఒక వేళ బిజెపి తనను వదలి పెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే దానికి అంత సీన్‌ లేదని అందరికీ తెలుసు. అందులోనూ ఐదు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా అని పార్లమెంట్‌లోపలా, వెలుపలా హడావుడి చేసిన పార్టీ అది. చివరికి నిధులు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వకుండా బిజెపి ఏ మొహం పెట్టుకొని ఓటర్ల వద్దకు వెళుతుంది.అందులోనూ దానిలో కాంగ్రెస్‌ ముఖాలే కనిపిస్తాయి. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్‌ కోలుకోలేనంతగా దెబ్బతిన్నది, దానిని పునరుద్ధరించే నాయకత్వం కూడా లేదు. వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ విఫల ప్రతిపక్ష నేత. ఆ పార్టీని మరింతగా దెబ్బకొట్టటానికి ఒక పధకం ప్రకారం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎవరెవరో వస్తారని మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తెలుగు దేశం పార్టీని కూడా ముఠాలతో మునిగి వుండే మరొక కాంగ్రెస్‌ పార్టీగా తయారు చేసినా ఒకరి జుట్టును మరొకరికి ముడివేసి తాను చక్రం తిప్పవచ్చు. వైఎస్‌ఆర్‌సిపిని బలహీన పరిస్తే పరిపాలనలో తాను వైఫల్యం చెందినా మరొక ప్రత్యామ్నాయం వుండదు కనుక బొటాబొటా మెజారిటీతో అయినా జనం తమను తప్ప మరొకరిని ఎన్నుకొనే అవకాశం లేదన్న అంచనాతో వున్నట్లు చెబుతున్నారు. అయితే రాజకీయ నేతలు వూహించిన విధంగా పరిణామాలు వుంటాయని చెప్పలేము. అందుకు ఒకసారి వెనక్కు తిరిగి చూడాలి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సంపాదించినప్పటికీ సీట్లు పొందటంలో విఫలమైది. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరినీ కాంగ్రెస్‌ తనలో కలిపేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసుకుంది. అయితే తెలుగు దేశం రూపంలో తన ఏకపక్ష పాలనకు తెరదించే రోజులు వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం ఆనాడు కనీసంగా వూహించలేదు. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిణామాలను పునరావృతం చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి దుకాణాన్ని ఖాళీ చేస్తున్నారు. ఆయన వూహిస్తున్నట్లు లేదా చెబుతున్న విధంగా విధిలేక జనం తననే ఎన్నుకుంటారా ? ఊహించని విధంగా కొత్త శక్తులు రంగంలోకి వస్తాయా ? ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ?

     దేశంలోని కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు చీవాట్లు వేసిన తరువాత కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు తప్ప ప్రత్యేక హోదా గురించి చర్చించటానికి కాదు అన్నది తెలుసుకోవాలి. ఈ సందర్బాన్ని చంద్రబాబు వుపయోగించుకొని ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయి ప్రత్యేక హోదా, ఇతర ఆర్ధిక సమస్యలను గురించి నివేదించారు. దీన్ని గురించి కూడా అధికారిక ప్రకటనేమీ లేదు. లీకుల సమాచారమే. ఎందుకంటే నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు. వారి మధ్య ఏం నడిచిందన్నది ఎవరో ఒకరు ఏదో రూపంలో ఎక్కడో అక్కడ వెల్లడించి వుండాలి. ఈ భేటీ గురించి ఒక పత్రికలో ప్రధానితో చంద్రబాబు సూటిగా మాట్లాడారని రాశారు అంటే చేతులు నలుపుకోకుండా గట్టిగా అడిగారనే అర్ధం ధ్వనించే విధంగా. ఒక ప త్రిక పదినిమిషాలే సమయం ఇచ్చినప్పటికీ రెట్టింపు సమయం మాట్లాడినట్లు రాస్తే మరొక పత్రిక అరగంట సేపు అని రాసింది. ఏది నిజం.

   మొత్తం మీద హోదా, నిధుల గురించి నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు తెలుగు దేశం నాయకత్వానికి మార్గాలు వెతికేందుకు మరికొంత కాలం గడపవచ్చు. ఇప్పటికే తెలుగుదేశంపై ధ్వజమెత్తుతున్న బిజెపి రానున్న రోజులలో మరింతగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి నెపం మోపేందుకు ప్రయత్నించవచ్చు. మంగళవారం నాడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు విలేకర్లతో మాట్లాడిన అంశాల తీరు తెన్నులను చూస్తే బిజెపికి వ్యతిరేకంగా సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదే పదే కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్న చంద్రబాబు మరి బిజెపి సంగతి ఏమిటంటే తాను ఎన్నికలపుడే రాజకీయాలు మాట్లాడతానని తప్పించుకున్నారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని మరొక మాట. మొత్తం మీద ప్రధానితో మాట్లాడిన తరువాత గందరగోళానికి, వత్తిడికి గురైనట్లు ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి.ఎవరికి ఏమైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

చట్టం కొందరికి చుట్టం కొందరికి దయ్యమైంది ఎందుకు ?

Tags

, , , , ,

సత్య

    చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టానికి చుట్టాలుగా వుంటారా ? న్యూఢిల్లీలో మేనెల రెండవ వారంలో పుష్పా శర్మ అనే జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాధానాన్ని ఫోర్జరీ చేశారని, దానిని పత్రికలో ప్రకటించి తప్పుడు సమాచారంతో మతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నించారనే ఆరోపణలతో నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా దినం సందర్భంగా శిక్షకుల ఎంపికలో ఒక్క ముస్లింనుకూడా చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర కారమే అలా చేసినట్లు ఆయుష్‌ మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారన్నది పోలీసుల అభియోగం. అది నిజమే అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు.ఈ వుదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరు అసాధారణంగా వుంది. ఆ వార్తను ప్రచురించిన పత్రిక ‘మిలీ గజెట్‌ ‘ అనే పత్రికకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందినట్లు పేర్కొన్న సదరు శర్మను అనేక మార్లు పోలీసులు ప్రశ్నించారు. ఎలాంటి వారంటు లేకుండానే అరెస్టు చేసే బెయిలు రాని సెక్షన్‌ 153ఏ కింద కేసు బనాయించారు.

     కానీ ఇదే పోలీసులు ఫిబ్రవరి నెలలో జెఎన్‌యు వుదంతంలో తిమ్మిని బమ్మిని చేసి చేయని దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా రూపొందించిన వీడియోలను పదే పదే ప్రసారం చేసిన జాతీయ టీవీ ఛానల్స్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.ఆ వీడియోల కారణంగా దేశమంతటా ప్రతిష్టాత్మక జెఎన్‌యు పరువు పోయింది, దానిలో చదువుకొనే విద్యార్ధులు దేశద్రోహులుగా దేశం ముందు ప్రదర్శితమయ్యారు. విద్యార్ధి సంఘనేత కన్నయ్య కుమార్‌తో సహా అనేక మందిపై దేశద్రోహ నేరం కేసులు మోపి అరెస్టులు చేశారు. ఢిల్లీ కోర్టుల వద్ద దేశ భక్తుల ముసుగులో వున్న లాయర్లు విద్యార్ధులు, ఆవార్తలను కవర్‌ చేయటానికి వచ్చిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటాన్ని దేశమంతా చూసింది. భారత మాతాకీ జై అన్న నోళ్లతోనే విద్యార్ధుల అరెస్టులు అక్రమం అన్న మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని బెదిరించారు. దేశమంతటా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకు దోహదం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు తోడ్పడిన వీడియో టేపులను తయారు చేసిన వారు, వాటిని ప్రసారం కోట్లాది మంది జనంలో విద్వేషాన్ని నింపిన సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్‌ యాజమాన్యాలు, ఆ తప్పుడు వీడియోల ఆధారంగా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు యంత్రాంగంపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతే కాదు వుమర్‌ ఖాలిద్‌ అనే విద్యార్ధికి వుగ్రవాద సంస్ధతో సంబంధాలు వున్నాయని తప్పుడు వార్తలను ప్రచురించిన పత్రికలు, ప్రసారం చేసిన టీవీలపై కూడా ఎలాంటి చర్యలు లేవు. తనతో పాటు అనిర్‌బన్‌ భట్టాచార్య అనే విద్యార్ధిపై ప్రచురించిన తప్పుడు వార్తల కారణంగా తాము కనిపిస్తే చంపే విధంగా జనంలో ఆగ్రహం వెల్లడైందని వారు స్వయంగా కోర్టుకు విన్నవించుకున్నారే. అంతటి తీవ్రమైన చర్యలు అక్రమాలుగా కేంద్ర ప్రభుత్వానికి కనిపించ లేదా ? ఒక జర్నలిస్టు పుష్పా శర్మ ఫోర్జరీ(రుజువు కావాల్సి వుంది) కారణంగా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తే, మరో ఫోర్జరీ వీడియోల ద్వారా రాజకీయంగా లాభపడేందుకు అదే ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకేనా వీడియో అక్రమాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ?

సుత్తీ, కొడవలి టీ షర్టులతో భయపడిన ఇండోనేషియా సర్కార్‌

Tags

, , , , , ,

ఎంకెఆర్‌

  ప్రపంచంలో సోషలిజాన్ని తొక్కి వేశామని, కమ్యూనిజాన్ని కాలరాశామని అమెరికా సామ్రాజ్యవాదులు ప్రకటించిన పాతిక సంవత్సరాలు దాటింది. అయితేనేం వారి కనుసన్నలలో నడుస్తున్న ఇండోనేషియా పాలకవర్గం ఇప్పుడు ఎటు వైపు నుంచి ఎప్పుడు కమ్యూనిస్టులు తమకు దర్శనమిస్తారోనని భయపడి చస్తోంది, మాటి మాటికీ వులికిపడుతోంది. యాభై సంవత్సరాల నాడు ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, వారి సానుభూతి పరులుగా పరిగణించిన వారిని వూచకోత కోసిన వారు ఇప్పుడు ఏ సమాధి నుంచి ఎవరు ఎక్కడ లేచి వస్తారో అన్నట్లుగా సామూహిక సమాధులను కూడా కానరాకుండా చేసేందుకు పూనుకుంది.

     లేకపోతే కార్మిక, కర్షక చిహ్నాలైన సుత్తీ, కొడవలి ముద్రించిన టీ షర్టులు అమ్ముకుంటున్న ఇద్దరు చిరు వ్యాపారులు కమ్యూనిజాన్ని వ్యాపింపచేస్తున్నారంటూ అరెస్టు చేస్తారా? అలాంటి టీ షర్టులను తయారు చేయవద్దని యజమానులను ఆదేశిస్తారా ? ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అక్కడి పాలకవర్గం వామపక్ష భావజాల చర్చను బహిరంగంగా అనుమతిస్తే ఏం జరుగుతుందో, అనుమతించక ఇంకా అణచివేత కొనసాగనిస్తే దాని మీద ఇంకా యువతలో మోజు పెరుగుతుందా అన్నది తేల్చుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు యాభై సంవత్సరాల నాడు జరిగిన అణచివేతకు గురైన వారి కుటుంబాలతో సర్దుబాటు చేసుకోవాలనే పేరుతో మారణకాండ గురించి ప్రభుత్వమే అధికారికంగా ఒక సదస్సు నిర్వహించి వివరాలుంటే చెప్పమని కోరింది.మరోవైపున అదే ప్రభుత్వం కమ్యూనిస్టు చిహ్నాలను పంపిణీ చేస్తూ కమ్యూనిజాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయలేదు, ఏకపక్షంగా రాసిన చరిత్రను, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇంకా అధికారికంగా కొనసాగిస్తూనే వుంది.

    ఈ కారణంగానే పోలీసులు తాజాగా సుత్తీ,కొడవలి గుర్తులున్న టీ షర్టులను విక్రయించేవారిని అరెస్టు చేసి, వాటి తయారీని నిలిపివేయాలని కోరారు.ఈ చర్య కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ చర్యను అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టు చిహ్నాలను ప్రదర్శిస్తున్న, వ్యాపింప చేస్తున్నవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని అధ్యక్షుడు జోకోవి ఇండోనేషియా మిలిటరీ, నేషనల్‌ ఇంటలిజెన్స్‌, అటార్నీ జనరల్‌ కార్యాలయాలను ఆదేశించించినట్లు జాతీయ పోలీసు ప్రధాన అధికారి బద్రుదిన్‌ హయతీ వెల్లడించారు.దేశంలో కమ్యూనిస్టు భావజాలం అదుపులేకుండా విస్తరించటం ఆందోళన కలిగిస్తున్నదని బద్రుదిన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. కమ్యూనిజం గురించి చర్చించటం, సమావేశాలు జరపటం వంటి కార్యకలాపాలు పెరగటాన్ని గమనించామన్నారు.ఈ పరిస్ధితులను కొన్ని బాధ్యతారాహిత్య పార్టీలు వినియోగించుకోచూడటాన్ని నిరోధించేందుకు పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి సుత్తీ, కొడవలి గుర్తులున్న టీ షర్టులు ధరించి వున్నా వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఎందుకు వాటిని ధరించారో విచారణ జరుపుతారని చెప్పారు. కమ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. మ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవమని తేలితే అలాంటి వారికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. పోలీసులతో పాటు కమ్యూనిస్టులని అనుమానం వున్నవారి సమాచారం చేరవేసేందుకు ఏజంట్లను కూడా వినియోగిస్తున్నారు. టీషర్టులను అమ్మేవారిని నిర్బంధించటంతో వెల్లువెత్తిన నిరసనలతో దిక్కుతోచని అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జాన్‌ బౌడీ ఒక ప్రకటన చేస్తూ భద్రతా సిబ్బంది ఈ విషయంలో అతిగా స్పందించారని, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చను పరిరక్షించేందుకు కూడా శ్రద్ధ తీసుకోవాలని అధ్య క్షుడు కోరినట్లు నష్ట నివారణకు ప్రయత్నించారు.

   కమ్యూనిజం పునరుద్ధరణను నిరోధించే పేరుతో పౌర విధుల్లో మిలిటరీ ప్రమేయం ఎక్కువ అవుతోందని అనేక మంది విమర్శిస్తున్నారు. తూర్పు జావాలో ఈనెల మూడవ తేదీన ‘చెరకు తోటల్లో సుత్తీ, కొడవలి ‘ అనే పేరుతో వున్న గ్రంధ కాపీలను మిలిటరీ స్వాధీనం చేసుకుంది. మరొక ప్రాంతంలో గిరిజన సంఘం సభ్యుల వద్ద వామపక్ష సాహిత్యం, కమ్యూనిస్టు గుర్తులున్న టీ షర్టులు ధరించారనే పేరుతో నలుగురిని అరెస్టు చేశారు.

   టీ షర్టులపై ముద్రించేందుకు ఏ గుర్తులు బాగుంటాయో చూద్దామని తాము ఇంటర్నెటలో వెతికామని దానిలో 1990 దశకం నాటి తూర్పు జర్మనీ చిత్రం ఆకర్షణీయం వుండటంతో దానిని తీసుకొని టీ షర్టులపై ముద్రణకు ఇచ్చాం తప్ప ఆ గుర్తుల గురించి వాటిని కలిగి వుంటే ఇలా జరుగుతుందని తమకు తెలియదని వాటిని అమ్మిన చిరు వ్యాపారులు చెప్పారు. పోలీసులు కూడా తరువాత దానిని నిర్ధారించారు.అయితే ఆ చిహ్నాలను ముద్రించిన ఫ్యాక్టరీ యజమానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే జకర్తాలో జరిపిన ఆసియన్‌ సాహిత్య వుత్సవాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం తలపెట్టారంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు దానిని జరగనీయరాదని డిమాండ్‌ చేశారు.అయితే పోలీసు రక్షణలో అది జరిగింది. ఇదిలా వుండగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ప్రతినిధులు జావా,సుమత్రా దీవులలో 122 సామూహిక సమాధుల వివరాలను వెల్లడించింది. ఇండోనేషియా విశ్వవిద్యాలయ ఆంత్రోపాలజిస్టు దవే లుమెంటా మాట్లాడుతూ పాఠశాలల్లో బోధించినది తప్ప అత్యధికులకు దేశ చరిత్ర అందుబాటులో లేదన్నారు. ప్రభుత్వం అందించిన దానిని అంగీకరించటం తప్ప దాని అర్ధం చేసుకోలేక జనం కమ్యూనిజం గురించి భయపడుతున్నారని అన్నారు. ఆ పాఠాలలో కూడా చరిత్రలో ఏ రోజు ఏం జరిగిందో వరుసగా చెప్పటం తప్ప అలా జరగటానికి కారణాలు, పర్యవసానాల గురించి వాటిలో వుండదని, ప్రస్తుతం వునికిలో లేని కమ్యూనిస్టు పార్టీ గురించి ఏమీ వుండదని తెలిపారు. 1965నాటి సామూహిక హత్యాకాండ గురించి ఏకపక్షంగా చెప్పే కధనాల ప్రకారం కమ్యూనిస్టులు కేవలం అంతరాత్మలు లేని నాస్థికులుగా చిత్రితమైందని దవే చెప్పారు. 1965 తరువాత మిలిటరీతో సహా కొన్ని పార్టీలకు రాజకీయ చట్టబద్దత లభించిందని, వాటికి పైన చెప్పిన చెప్పిన కథనాలను పరిరక్షించటం తప్ప మరొకదానిపట్ల ఆసక్తి లేదంటూ నూతన అధికార వ్యవస్ధ కాలంగా పరిగణించబడుతున్న 1966-1998 మధ్య మిలిటరీకి చెందిన వారిని రాజకీయాలు, వాణిజ్యంలో కూడా అనుమతించారని తీవ్రవాదంతో కూడిన మితవాద శక్తులను ప్రోత్సహించటం ప్రమాదకరమని అన్నారు. యాభయి సంవత్సరా క్రితం సామూహిక హత్యాకాండకు గురైన వారి, లేదా దాని నుంచి తప్పించుకున్నవారి కుటుంబాలపై ఇప్పటికీ నింద, వివక్ష కొనసాగుతోందని ఇండోనేషియా విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజిస్టు రువైదా నూర్‌ చెప్పారు. ప్రభుత్వం దానిని సంస్థాగతంగా జోక్యం చేసుకొని సరిదిద్దాలన్నారు. కుటుంబం, స్కూలు, మీడియా ద్వారా ఇది జరగాలని చెప్పారు.

పోప్‌ ఫ్రాన్సిస్‌ కమ్యూనిస్టు పాలనకు పిలుపునిచ్చారా ?

Tags

, , ,

ఎంకెఆర్‌

   అవుననే అంటున్నారు బ్రిటన్‌కు చెందిన జర్నలిస్టు జెఫ్‌ బెర్విక్‌. ది మార్కెట్‌ ఒరాకిల్‌ అనే వెబ్‌సైట్‌లో ఈనెల 12న ప్రచురితమైన జెఫ్‌ వ్యాసంలోని కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది.’ గతవారంలో చార్లేమాగనే బహుమతి స్వీకరణ సందర్భంగా చేసిన ప్రసంగంలో పోప్‌ ఒక వ్యాఖ్య చేశారు.’ లాభాల కోసం అవినీతిని ఒక సాధనంగా వుపయోగించుకొనేందుకు తయారు చేసిన ద్రవ్య, ఆస్థులతో కూడిన ఆర్ధిక వ్యవస్ధ నుంచి కష్టజీవులకు భూమి, గృహవసతికి హామీనిచ్చే సామాజిక ఆర్ధిక వ్యవస్థకు మనం మారాల్సిన అవసరం వుంది’ అన్నారు. దీని అర్ధం ఏమిటి ? అనిశ్చిత స్ధితి తక్కువ వుండాలి, మరింత అదుపు అంటే ఒక విధంగా అవినీతి మార్గం, తరువాత సామాజిక ఆర్ధిక వ్యవస్ధకు మారాలని అయన కోరారు. దీని అర్ధం సోషలిజం లేదా కమ్యూనిజం. దీని ద్వారా భూమి, గృహవసతికి హామీ వుండాలని కోరుతున్నారు. రాజకీయాలు, ఆర్ధిక విషయాలకు వచ్చినపుడు పోప్‌ మాట్లాడ కూడదని కొందరు ఆగ్రహించవచ్చు, వారు చెప్పేది సరైనది కావచ్చు. కానీ ఆయన 2030 నూతన ప్రపంచ వ్యవస్థ గురించి ఆయన పెద్ద పాత్ర వహిస్తున్నారు. మార్క్సిజం గురించి మాట్లాడితే ప్రపంచ వ్యాపితంగా వందకోట్లకు మించి జనం వింటారు.చార్లెమాగ్నే అవార్డు వుత్సవంలో ఆయన స్పష్టంగా స్వచ్చందవాదం గాక జులుం గురించి మాట్లాడారు.ఆయన ‘హామీ’ గురించి మాట్లాడారు.అంటే ఏదైనా స్వచ్చందగా ఇచ్చేదిగాక హామీగా ఇచ్చేది.’

మీడియా స్చేచ్చకు ముంచుకు వస్తున్న ముప్పు

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

    మేనెల మూడవ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్చా దినాన్ని పాటించారు. మీడియా స్వేచ్చ ప్రాధాన్యతను తెలియ చేసేందుకు ప్రతి ఏటా ఈ దినాన్ని పాటిస్తున్నారు. 1991 ఏప్రిల్‌ 29 నుంచి మే మూడవ తేదీ వరకు ఆఫ్రికా ఖండం నైరోబీ దేశంలోని విండ్‌హాక్‌ పట్టణంలో ఆఫ్రికా ఖండ జర్నలిస్టుల సమావేశం పత్రికా స్వేచ్చ సూత్రాల గురించి ఒక ప్రకటనను ఆమోదించింది. తరువాత ఐక్యరాజ్యసమితి ఆ తీర్మానాన్ని తనదిగా స్వీకరించి ఆమోదం పొందిన మూడవ తేదీని ప్రపంచ పత్రికా దినోత్సవంగా ప్రకటించింది.ఈ ఏడాది ఈ ప్రకటనకు పాతికేండ్లు నిండటంతో పాటు ప్రపంచంలో తొలిసారిగా 1776లో స్వీడన్‌ ఆమోదించిన పత్రికా స్వేచ్చ చట్టానికి 250 సంవత్సరాలు నిండటం కూడా ఈ ఏడాదే కావటం విశేషం. ఇంతవరకు 95దేశాలు పత్రికా స్వేచ్చకు సంబంధించి ఏదో ఒక చట్టాన్ని ఆమోదించాయి. ప్రతి ఏటా ఒక దేశంలో మీడియాకు సంబంధించి ఒక ఇతివృత్తంపై ఐరాస మే మూడవ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కొలంబియాలో 1986లో తన కార్యాలయం ఎదుటనే మాదక ద్రవ్యాల మాఫియా చేతిలో గ్యూ లెర్మో కనో అనే జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. అతని సంస్మరణంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమంలో మీడియా స్వేచ్ఛకోసం పోరాడిన జర్నలిస్టుకు బహుమతి ఇస్తోంది. ఈ ఏడాది అజర్‌బైజాన్‌ జర్నలిస్టు ఖతీజా ఇస్మాయిలోవాకు ప్రకటించారు. ఈ సందర్బంగా వివిధ దేశాలలో వున్న పరిస్థితుల గురించి చర్చలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిన్లండ్‌ రాజధాని హెల్సింకీలో ‘అందుబాటులో సమాచారం మరియు ప్రాధమిక స్వేచ్ఛలు ‘ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. వెయ్యిమందికిపైగా పాల్గొన్న జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యకు గురైన వారికి నివాళులు అర్పించారు. అనేక దేశాలలో ఇదే రోజున పలు కార్యక్రమాలు జరిగాయి.

     పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌, ఇంటర్నెట్‌ ఏ మీడియా రంగంలో పని చేస్తున్నప్పటికీ జర్నలిస్టు జీవితం అంత సులభం కాదు. కత్తిమీద సాము వంటిది. నిత్యం ప్రమాదాలు పొంచి వుంటాయి. అవి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అవినీతి,అక్రమాలు ఏవైనా సరే జర్నలిస్టులను ప్రమాదపు అంచుల వరకు తీసుకు వెళుతున్నాయి. అయినా సరే ఈ వృత్తిని ఎంచుకొనేందుకు నిబద్దులై వుండే యువతీ యువకులు ముందుకు వస్తూనే వున్నారని ఈ సందర్బంగా ప్రపంచ వ్యాపితంగా మరోసారి వెల్లడైంది.

   జర్నలిస్టులు కనిపించగానే నమస్తే చెప్పటం, పక్కకు తిరిగి నోరు బట్టని బూతులు తిట్టటం సర్వసాధారణం. అక్రమాలకు పాల్పడే శక్తులే కాదు, రాజకీయ వేత్తలు, అధికారయంత్రాంగం ఇలా ఒకరని కాదు, తమ ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించే ప్రతి వారూ చివరకు భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. జెఎన్‌యు ఘటనల సందర్బంగా భారతమాతాకు జై అంటూ ఒకవైపు నినదిస్తూనే అదే నోటితో మరోవైపు ఆ వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన, ఆ ఘటనల పట్ల విమర్శనాత్మక కధనాలు వెలువరించిన, చర్చలు నిర్వహించిన మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని కూడా బెదిరించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వుద్యోగ భద్రలేమి మరొక ప్రధాన అంశం. అధికారంలో వున్నవారికి నచ్చకపోయినా, యాజమాన్యం ఇచ్చగించకపోయినా బలౌతున్నది జర్నలిస్టులు. మీడియా స్వేచ్చ అన్నది రోజు రోజుకూ పరిమితం కావటంతో పాటు దుర్వినియోగం అవుతున్నది. యాజమాన్యాలు తమ లాభాల కోసం అనుసరిస్తున్న అక్రమ పద్దతుల కారణంగా జర్నలిస్టులు సమిధలుగా మారుతున్నారు.

    సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ(రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) గతనెలలో విడుదల చేసిన నివేదిక మీడియా స్వేచ్చ అన్ని ప్రాంతాలలో మొత్తం మీద దిగజారుతున్నది. ఈ సంస్ధ 2002 నుంచి ప్రతిఏటా నివేదికలను ప్రకటిస్తూ సూచికలను వెల్లడిస్తున్నది. దాని ప్రకారం గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లండ్‌ మీడియా స్వేచ్చలో అగ్రస్ధానంలో వుంటున్నది. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్విడ్జర్లండ్‌లో భాగంగా ఫిన్లండ్‌ వుండేది. స్వేచ్ఛాయుత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై రాయటం, ప్రచురించటం మూలస్థంభాలుగా వుండాలని వుదారవాది అయిన ఫిన్నిష్‌ మతాధికారి ఆండెర్స్‌ చైడెనియస్‌ 1765లో ఒక రచనలో తన అభిప్రాయం వెల్లడించారు. జర్నలిజం మంచి చట్టాలు రూపొందించటానికి, అధికార యంత్రాంగ బాధ్యతలు, పరిమితుల గురించి సమాచారాన్ని అందించటంలో రాజ్యానికి సహాయపడుతుందని, దానినే ఒక చట్టంగా రూపొందించాలని పార్లమెంట్‌కు నివేదించాడు. అది లేకపోతే అధ్యయనం, వినయ విధేయతలు అణచివేయబడతాయని, ఆలోచనలో మొరటుతనం చోటు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు అది చట్టమైంది. అంతకు ముందు ఎక్కడా అలాంటి చట్టాలు వున్నట్లు దాఖలాలు లేకపోవటంతో ప్రపంచంలో తొలి చట్టంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ పత్రాలు అందరికీ అందుబాటులో వుంచటం ప్రజల హక్కుగా గుర్తించటం దానిలోని ముఖ్యాంశం.ఇది జరిగి రెండువందల యాభై సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పత్రికా స్వేచ్ఛ పూర్తిగా అన్ని దేశాలలో అమలులోకి రాలేదు.

    గత పన్నెండు సంవత్సరాలలో గతేడాది మీడియా స్వేచ్చకు అత్యంత చెడ్డదిగా వుందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సూచిక వెల్లడించింది. ప్రపంచ వ్యాపితంగా మీడియా స్వేచ్ఛ ఆందోళనకరంగా వుందని, అనేక మంది ప్రపంచ నేతలు నిజమైన జర్నలిజం పట్ల ఒక విధమైన మానసిక రుగ్మతకు గురి అవుతున్నారని, భయ పూరిత వాతావరణం చర్చలు జరిపేందుకు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు విముఖులను చేస్తోంది. గతం కంటే ఎక్కువగా ప్రభుత్వాలు మీడియా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యాలలో వున్న మీడియాలలో రిపోర్టింగ్‌ వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మలచబడుతున్నది.’ అని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సెక్రటరీ జనరల్‌ క్రిస్టోఫీ డెలోయిర్‌ వ్యాఖ్యానించారు. తాజా సూచికలో ప్రధమ స్ధానంలో ఫిన్లండ్‌, నెదర్లాండ్‌, నార్వే తదుపరి స్ధానాలలో వున్నాయి.

     ఖండాల వారీగా చూస్తే ఐరోపా సూచిక 19.8,ఆఫ్రికా 36.9, వుత్తర, దక్షిణ అమెరికా ఖండాలు 37.1, ఆసియా 43.8గా వుంది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు ఐరోపా, మధ్య ఆసియా 48.4, వుత్తర ఆఫ్రికా , మధ్యప్రాచ్యం 50.8 పాయింట్లతో అధమ స్ధానంలో వుంది. 2013తో పోల్చితే మొత్తం మీద సూచిక 13.6శాతం పతనమైంది. గతేడాది 3,857 పాయింట్లు వుంటే తాజాగా 3,719కి పడిపోయింది. మతపరమైన అంశాలతో సహా దీనికి అనేక కారణాలు వున్నాయి. ప్రపంచ వ్యాపితంగా కార్పొరేట్‌ శక్తులు మీడియా రంగంలో ప్రవేశిస్తూ ప్రభుత్వాలపై వత్తిడిని పెంచుతున్నాయి. కొన్ని దేశాలలో ఇంటర్నెట్‌ను అందుబాటులో లేకుండా చేయటానికి, పత్రికా ముద్రణను అడ్డుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. గత మూడు సంవత్సరాలలో ఈ సూచిక 16శాతం దిగజారింది. స్వల్ప కారణాలను సాకుగా చూపి జర్నలిస్టులను శిక్షించటానికి వీలుగా చట్ట సవరణలు కూడా ఈ కాలంలో పెరిగాయి. అధ్యక్షుడు, ప్రధానిని అమానించారనో, మత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డారని, వుగ్రవాదులకు తోడ్పడటం వంటి కారణాలను వాటిలో పొందుపరుస్తున్నారు.

      మిగతా ప్రాంతాలతో పోల్చితే ఐరోపా జర్నలిస్టులు ఎక్కువ స్వేచ్చాయుత వాతావరణంలోనే పని చేస్తున్నారు, అయితే అక్కడ కూడా పరిస్థితి దిగజారుతోంది. పోలాండ్‌లో కొత్త ప్రభుత్వానికి విధేయులుగా లేరనే సాకుతో ప్రభుత్వ రేడియో, టీవీ సర్వీసులనుంచి 135 మంది జర్నలిస్టులకు వుద్వాసన పలికారు. జర్నలిస్టుల వార్తా వనరుల విషయంలో పోలీసులు నిబంధనలను వుల్లంఘించిన కారణంగా బ్రిటన్‌ రేటింగ్స్‌ పడిపోతున్నాయి. టర్కీ అధ్యక్షుడిపై ఒక వ్యంగ్య పద్యాన్ని ప్రచురించినందుకు ఆదేశం కోరిక మేరకు ఒక కమెడియన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఆదేశించారు. మీడియా స్వేచ్చ సూచికలో 180 దేశాలలో టర్కీ స్ధానం 151 అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో వూహించుకోవచ్చు. పత్రికా స్చేచ్చలో అగ్రగాములుగా వున్న దేశాలలో ఒకటైన స్వీడన్‌లో జర్నలిస్టులపై బెదిరింపుల కారణంగా దాని సూచిక ఐదు నుంచి ఎనిమిదికి పడిపోయింది. ‘ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు, ఇంటర్నెట్‌ మీడియాలో వ్యాఖ్యల విభాగాలను ఎత్తివేస్తున్నాయి.అనేక మంది జర్నలిస్టులు స్వయం సెన్సార్‌ విధించుకుంటున్నట్లు చెబుతున్నారని స్వీడిష్‌ జర్నలిజం ప్రొఫెసర్‌ ఇంగెలా వాడ్‌ బ్రింగ్‌ తెలిపారు. పనామా పత్రాలతో సంబంధం వున్న సమాచారాన్ని పన్నులు, పోలీసు అధికారులకు అందచేయాలని ఫిన్లండ్‌ ఆర్ధిక మంత్రి హుకుం జారీ చేశారు. ఇది ప్రమాదకర సంప్రదాయం అవుతుందంటూ ప్రభుత్వ మీడియా సంపాదకులు తిరస్కరించారు. హెల్సింకీలో ప్రపంచ మీడియా స్వేచ్చా పరిరక్షణ దిన సదస్సు జరుగుతుండటంతో మంత్రి తాత్కాలికంగా వెనక్కు తగ్గాడు.

    మన దేశం విషయానికి వస్తే తాజా సూచికలో 133వ స్థానంలో వున్నందుకు తల దించుకోవాలి. గతేడాది కంటే మూడు ర్యాంకులు తగ్గిందన్న మాటే గానీ ఇదేమీ గౌరవ ప్రదమైంది కాదు. వుగ్రవాదులనుంచి జర్నలిస్టులకు ఎదురవుతున్న బెదిరింపుల పట్ల ప్రధాని నరేంద్రమోడీ నిర్లిప్తంగా వున్నారని, జర్నలిస్టులను రక్షించేందుకు క్రియా విధానం లేదని,ఎప్పుడు అవకాశం వచ్చినా మీడియాను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆర్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. మన పొరుగు దేశాల సూచికలు ఇలా వున్నాయి. చైనా 176, పాకిస్థాన్‌ 147, బంగ్లాదేశ్‌ 144, శ్రీలంక 141, ఆఫ్ఘనిస్తాన్‌ 120, నేపాల్‌ 105, భూటాన్‌ 94. ఇదే సమయంలో స్వేచ్చా ప్రపంచంగా చెప్పుకొనే అమెరికా 44, కమ్యూనిస్టు ఇనుప తెరలను బద్దలు కొట్టామని చెప్పుకుంటున్న రష్యా 148వ స్థానంలో వుంది. ఈ నివేదికలో లోపాలు వున్నాయని అభిప్రాయం కూడా వుంది.

     అక్రమ గనుల తవ్వకాల గురించి పరిశోధించిన సందీప్‌ కొథారి అనే జర్నలిస్టును మధ్యప్రదేశ్‌లో హత్య చేశారు.ఈ సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులు కొద్ది వారాలలోనే చేసిన రెండవ హత్య ఇది. ఇసుక, మాంగనీస్‌ మాఫియా గురించి రాయటమే ఆ జర్నలిస్టు చేసిన ‘తప్పిదం’. స్నేహితుడితో కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న అతనిని కారుతో ఢీకొట్టించి తరువాత కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. అంతకు ముందు వుత్తర ప్రదేశ్‌లో జగేంద్ర సింగ్‌ అనే జర్నలిస్టును అతని ఇంటి వద్దే పోలీసులు సజీవ దహనం చేశారు. దేశంలో వుత్తర ప్రదేశ్‌ అత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది. జర్నలిస్టుల హత్యలను నేర సమాచారంలో ప్రత్యేకంగా పరిగణించటం లేదని హోంమంత్రి తెలిపారని, 2014లో దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక జర్నలిస్టు దాడులకు గురైనట్లు పేర్కొన్నది.

    ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు చెందిన మీడియా నుంచి సమాచారాన్ని సేకరించటం లేదు. ముఖ్యంగా మన వంటి ప్రాంతీయ భాషల మీడియా రంగంలో జరుగుతున్న దాడులను కూడా నివేదికలలో చేరిస్తే సమగ్రంగా వుంటుంది. మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పలు చోట్ల జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. పోలీసులు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటం కొత్త పరిణామం. దీనిపై మీడియాలో పనిచేస్తున్న వారు మేల్కొనకపోతే మరొక మెక్సికో, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాల మాదిరి పరిస్థితులు తయారయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల తీరు తెన్నులు

    ప్రపంచ పత్రికా స్వేచ్చా దినం సందర్బంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్ధ కొన్ని వుదంతాలలో జర్నలిస్టులు ఎలా దాడులకు గురైందీ తెలిపింది. జర్నలిస్టులు తమ విధులను నిర్వహించినందుకు తప్ప వారిని వేధించటానికి మరొక కారణాలేమీ లేవని పేర్కొన్నది.’ ప్రపంచ వ్యాపితంగా జర్నలిస్టులను ఏకపక్షంగా అరెస్టు చేస్తున్నారు. పార్టీ విధానాలకు అనుగుణం లేకుండా అధికారంలో వున్న వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినందుకు గాను వారిని జైలు పాలు చేస్తున్నారు, చివరకు చంపేందుకు కూడా వెనుకాడటం లేదని సంస్ధ పరిశోధనా విభాగపు సీనియర్‌ డైరెక్టర్‌ అన్నా నెయిస్టాట్‌ వ్యాఖ్యానించారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సేకరించిన వందలాది కేసులలో కొన్నింటి వివరాలు సంక్షిప్తంగా ఇలా వున్నాయి.

1.మహమ్మద్‌ అబు జైద్‌ అలియాస్‌ షకవాన్‌ ఓ ఫొటో జర్నలిస్టు. కైరోలో నిరసనల సందర్బంగా భద్రతా దళాలు సాగించిన హింసాకాండను చిత్రాలలో బంధించినందుకు మూడు సంవత్సరాల పాటు జైలులో వున్నాడు.అతనిని చిత్రహింసలు కూడా పెట్టారు.మరణశిక్ష పడటానికి వీలు కలిగించే సెక్షన్లతో బనాయించిన కేసులను అతను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు.ఈజిప్టులో నిర్బంధించిన 20 మంది జర్నలిస్టులలో అతను ఒకడు.

2.ఆఫ్రికాలోని కామెరూన్‌లో బాబా వామె, రోడ్రిగ్‌ టోంగ్‌, ఫెలిక్స్‌ ఎబోల్‌ బోలా అనే ముగ్గురు జర్నలిస్టులు భద్రతా దళాలు- ఒక సాయుధ బృందం కుమ్మక్కై ఒక పట్టణంపై చేసిన దాడి గురించి వారు పరిశోధించారు.వారు సేకరించిన సమాచారం దేశ భద్రతకు ముప్పుతెచ్చే దంటూ వారికి అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ప్రభుత్వం వారిపై కేసులు బనాయించింది. వార్త వనరులను చెప్పేందుకు వారు నిరాకరించారు.

3.ఖతీజా ఇస్మాయిలోవా అజర్‌బైజాన్‌లో దేశాధ్యక్షుడి కుటుంబంతో సహా అనేక మంది అక్రమాల చిట్టాను బయట పెట్టిన జర్నలిస్టు. ఆమె నోరు మూయించేందుకు అన్ని రకాలుగా బెదిరించినా ఆమె లొంగలేదు. చివరకు తప్పుడు అభియోగాలు మోపి విచారణను బూటకంగా మార్చివేసి ఏడున్నర సంవత్సరాల శిక్ష వేసి జైలులో పెట్టారు.

4. ఆఫ్రికాలోని బురుండీలో ఒక వున్నత సైనికాధికారిని హత్య చేసిన వుదంతంలో ఫొటోలు తీసినందుకు గాను ఎడ్రాస్‌ దికుమానా అనే జర్నలిస్టును అరెస్టు చేశారు.చిత్రహింసల పాలు చేశారు. ప్రస్తుతం అతను ప్రవాసంలో వున్నాడు. తమ పట్ల విమర్శనాత్మకంగా వున్నారనే దుగ్దతో పాలకపార్టీ జర్నలిస్టులు,ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడింది. గతేడాది ఒక తిరుగుబాటు సందర్బంగా నాలుగు ప్రయివేటు రేడియోస్టేషన్లను పోలీసులు ధ్వంసం చేశారు.

5. అనాబెల్‌ ఫ్లోరెస్‌ సలజార్‌, మెక్సికోలో ఒక పత్రిక క్రైమ్‌ రిపోర్టర్‌.ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యచేశారు. సాయుధులైన వ్యక్తులు ఆమెను ఇంటి నుంచి తీసుకు వెళ్లి చంపివేశారు. గత ఆరు సంవత్సరాలలో మెక్సికోలో 17 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

6. అంగోలాలో సెడ్రిక్‌ కార్‌వాలో, డోమింగోస్‌ డా క్రజ్‌ అనే ఇద్దరు జర్నలిస్టులను మరో 15 మందితో కలిపి అరెస్టు చేశారు. వారు చేసిందేమీ లేదు ప్రజాస్వామ్యం, స్వేచ్చ గురించి చర్చించుకోవటమే. తిరుగుబాటుకు సన్నాహంగా కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

7.థాయ్‌లాండ్‌లో రాజకుటుంబాన్ని విమర్శించే రెండు వ్యాసాలను ప్రచురించినందుకు సోమయోట్‌ అనే సంపాదకుడికి పది సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

8. పత్రికలో వచ్చిన రెండు వార్తాకధనాల ద్వారా అధికారిక రహస్యాలను వెల్లడించారనే పేరుతో కంహరియత్‌ పత్రిక సంపాదకుడు కన్‌ దుండర్‌, ఒక విలేకరిని టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసింది. సిరియాలోని సాయుధ ముఠాలకు టర్కీ సైన్యం మానవతా పూర్వక సాయం ముసుగులో ఆయుధాలను ఎలా అందించిందన్నదే వాటి సారాంశం.

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు ఫెడరేషన్‌ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాసపత్రిక మే నెల సంచిక నిమిత్తం రాసినది.

జై నీల్‌- జై లాల్‌ నినాదం అర్థం ఏమిటి ?

Tags

, , , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

   సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌, వివిధ గ్రూపులలో సభ్యులు ఒక సమాజం అనుకుంటే దానిలోని మంచి చెడులన్నీ ప్రతిబింబిస్తున్నాయి.బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వారి గురించి వదలి వేద్దాం. కొంత మంది సమాజంలో వున్న యథాతథ స్థితిని, వాస్తవాలను ప్రస్తావిస్తున్నారు. తమ అనుభవంలోకి వచ్చిన వాటిని ఆవేదనో, కసి, బాధ, మార్పు రావాలనో ఏదో ఒక భావంతో పెడుతున్నారు. మంచిదే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. కారల్‌ మార్క్సు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘ హేతువు ఎప్పుడూ వునికిలోనే వుంది, కానీ ఎల్లవేళలా యుక్తమైన రీతిలో లేదు( Reason has always existed, but not always in a reasonable form ) బాధితులు చెప్పే దానిలో ఎప్పుడూ హేతువు వుంటుంది, అయితే అది ఎల్లవేళలా సరైన రీతిలో వ్యక్తం కావటం లేదని చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఇది కొందరిని వుద్ధేశించి ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తున్నది కాదు, సవరించుకోవాల్సిన అవసరం గురించి సూచించేందుకు మాత్రమే. పెద్దదిగా వున్నప్పటికీ చదవండి, చర్చించండి. సూక్ష్మంలో మోక్షాలు, దగ్గరి దారులు, గోసాయి చిట్కాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేవన్నది ఏడుపదుల స్వాతంత్య్ర అనుభవం చెబుతోంది. వాటి గురించి పైపైన కాకుండా లోతుగా చర్చిస్తేనే ప్రయోజనం. కావాల్సింది పాలపొంగు కాదు, మరగటం, మధించటం.

  చరిత్రలో కార్మికులు ఒక దశలో యంత్ర విధ్వంసకులుగా వ్యవహరించినట్లు మనం చదువుకున్నాం. దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో ఐరోపాలో నెపోలియన్‌ యుద్ధాలతో సహా అనేక యుద్ధాలు జరిగాయి. పర్యవసానంగా అనేక దేశాలలో ఆర్ధిక పరిస్థితులు దిగజారాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను కాపాడుకొనేందుకు నూతన యంత్రాలను ప్రవేశపెట్టారు. వాటిలో బ్రిటన్‌ పవర్‌లూమ్స్‌ పెద్ద మార్పునే తెచ్చాయి. అప్పటి వరకు అక్కడి సాంప్రదాయ నేత కార్మికుల జీవితాలు వీటితో అతలాకుతలమయ్యాయి. యుద్ధాలతో మొత్తంగా కార్మికుల బతుకులూ ఛిద్రమయ్యాయి.ఇటు సంప్రదాయ నేత పని కరువై, అటు ఫ్యాక్టరీలలో సరైన పనిలేక మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో తమకు కష్టాలు రావటానికి పవర్‌లూమ్స్‌ కారణమని భావించి వాటిని నాశనం చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించి అదే పని చేశారు. వారి ఆవేదనలో హేతువు లేదా వుంది, కానీ యంత్రాల ధ్వంసం పరిష్కారం కాదు. దీంతో 1788లోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌ పవర్‌లూమ్స్‌ తదితర యంత్రాల పరిరక్షణకు ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా వాటిని కావాలని ధ్వంసం చేసినట్లు లేదా ధ్వంసం చేసేందుకు అక్రమంగా ప్రాంగణాలలో ప్రవేశించినా, ప్రోత్సహించినా ఏడు నుంచి 14 సంవత్సరాల పాటు ఖైదీల సెటిల్మెంట్లకు ప్రవాసం పంపేవారు. తరువాత యంత్రాలు పనిచేయకుండా కొన్ని భాగాలు లేకుండా చేస్తున్నట్లు గ్రహించి దానిని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. దాని పర్యవసానమే ఇప్పటికీ కార్మికులు డ్యూటీ దిగి వెళుతుంటే భద్రతా సిబ్బంది తనిఖీ చేయటం. ఆ తరువాత 1788 చట్టాన్ని రద్దు చేసి మరణశిక్షను కూడా చేర్చి 1823లో మరో చట్టం చేశారు. ఈ యంత్ర విధ్వంస కార్మిక తిరుగుబాటును బ్రిటీష్‌ పాలకులు ఎంత తీవ్రంగా అణచివేశారో తెలుసా ? నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలలో ఒకటైన లెబెరియన్‌ ద్వీపకల్పాన్ని నిలబెట్టుకొనేందుకు నియోగించిన సైన్యం కంటే ఎక్కువ మందిని దించారు.

  ఆధునిక చరిత్రలో వుగ్రవాద దారి పట్టిన నక్సల్స్‌ ఏ గ్రూపు అన్నది అప్రస్తుతం, అటవీ ప్రాంతాలలో రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ల, లేదా ప్రభుత్వ యంత్రాలను విధ్వంసం చేయటం, రోడ్లను, స్కూలు భవనాలను కట్టకుండా చేశారని మీడియాలో అనేక వార్తలను చదివాము. అన్నింటి కంటే ఆధునిక రూపంలో సంఘటిత కార్మికవర్గం కొన్ని సంవత్సరాల క్రిందట కంప్యూటర్ల వినియోగాన్ని అడ్డుకున్నపుడు వారి మీద కూడా అదే విమర్శ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుల వివక్ష రాక్షసికి బలౌతున్న వారు దానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం ఎలా కొనసాగించాలన్నదే సమస్య. దీనిపై తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించాలనటంలో ఎలాంటి రాజీ లేదు. ఎలా సాగించాలన్నదే చర్చ. ఈ మధ్య జైనీల్‌-జైలాల్‌ అనే నినాదం వినిపిస్తోంది. ఇదొక శుభపరిణామం.

     కార్మికవర్గం సమాజంలో 99 శాతం మెజారిటీ. మన దేశానికి వస్తే దళితులా, గిరిజనులా, ముస్లింలా, హిందువులా, మరో మతం వారా, బ్రాహ్మలా, కమ్మా, రెడ్డి, కాపు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల కులాల వారు కార్మికులలో వున్నారు, ఒక శాతంగా వుండే దోపిడీ వర్గంలోనూ వీరందరూ వున్నారు. వర్గరీత్యా ఏ వర్గంలో వుంటే వారు తమ ఆర్ధిక సమస్యల మీద ఐక్యం అవుతున్నారు, కార్మికులతో పోల్చితే పెట్టుబడిదారులలో అది ఎక్కువగా వుంది. నిజానికి కార్మికులకు సమాజంలోని పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారుల వంటి ఇతర తరగతుల మద్దతు అవసరమే.వీరికీ వారి మద్దతు అవసరమే.

       మన దేశంలో కొంత మంది దృష్టిలో వర్గం కంటే కుల సమస్య పెద్దది. దానితో మరికొంత మంది ఏకీభవించ వచ్చు, విబేధించవచ్చు. అంత మాత్రాన అది పరిష్కరించాల్సింది కాదు అని అర్ధం కాదు. ఏ సమస్య పరిష్కారానికి అయినా అందుకు కలసి వచ్చే స్నేహితులను ఎంచుకోవాలి. వర్గ సమస్యలో పెట్టుబడిదారుడు- కార్మికులు ముఖాముఖీ తేల్చుకుంటారు. సమస్య ఎక్కడంటే కుల వివక్ష, కులాంతర, మతాంతర వివాహాల వంటి సామాజిక అంశాల దగ్గర వస్తోంది. పెట్టుబడి దారీ విధాన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అనుకుంటే ఏ రీత్యా చూసినా రెండు వేల సంవత్సరాలకు పైబడే వుంది. ఇది గిజిగాడి గూడు కంటే సంక్లిష్టమైనది. ఇక్కడ కూడా మార్క్సు మహనీయుడు చెప్పినది, అంబేద్కర్‌ చెప్పిన అంశాలు ఎన్నో వున్నాయి. ‘ తత్వవేత్తలు వివిధ పద్దతులలో ప్రపంచానికి భాష్యం మాత్రమే చెప్పారు, సమస్య ఏమంటే దానిని మార్చటం ఎలాగన్నదే’ దీనిని మనం మన దేశంలో దళిత సమస్యకు ఎందుకు వర్తింప చేసుకోకూడదు. వర్తమానంలో జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ మాదిరి కాకపోయినప్పటికీ అనేక మంది ప్రముఖులు మనువాదాన్ని వ్యతిరేకించారు. పూలే,అంబేద్కర్‌ తాము నమ్మినపద్దతులలో పరిష్కారాన్ని చెప్పారు. వారితో ఎవరూ విబేధించనవసరం లేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లోనే జ్యోతిబాపూలే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరగటం, వెంటనే ఆయన తన సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత అంబేద్కర్‌ కొనసాగించారు. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట బీజం కమ్యూనిజానికంటే ముందే పడింది. వేదాలను విమర్శిస్తూ పూలే కుల వివక్ష సమస్యను జనం ముందు పెట్టారు. దళిత్‌ అనే మరాఠీ పదాన్ని ఆయనే ముందు వుపయోగించారని చెబుతున్న విషయం తెలిసిందే.

    ‘విద్య లేకపోవటం తెలివి తేటల లేమికి దారి తీస్తుంది, అది నైతిక విలువల లేమికి కారణం అవుతుంది, నైతిక విలువలు లేకపోతే ప్రగతి వుండదు, ప్రగతి లేకపోతే జనం దగ్గర డబ్బు వుండదు, డబ్బలేకపోతే దిగువ కులాలపై అణచివేతకు దారితీస్తుంది, చూడండి విద్యలేకపోవటం ఎన్ని అనర్ధాలకు కారణం అవుతుందో ‘ అన్న పూలే అందుకుగాను విద్యాసంస్ధలను స్థాపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత అంబేద్కర్‌ కూడా పూలే బాటలోనే విద్యతో దళితుల అభ్యున్నతి సాధించవచ్చని భావించి ఆమేరకు ‘బహిష్కృత్‌ హితకారిణీ సభ ‘ సంస్ధను స్ధాపించారు.అయితే వెంటనే తన పంధా మార్చుకొని అస్పృస్యతకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సమీకరించు, పోరాడు, సాధించు అన్నది అంబేద్కర్‌ నినాద సారాంశం. ఇదంతా భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా వేళ్లూనుకోక ముందే ప్రారంభమైంది.

    మన దేశంలో కుల వివక్ష, కుల నిర్మూలన సంస్కరణలు, పోరాటానికి పూలేతో అంటే 1848లో నాంది పలికారంటే ఇప్పటికి 168 సంవత్సరాలు, మధ్యలో అంబేద్కర్‌ కలిసి 90 సంవత్సరాలు . ఈ మొత్తం కాలంలో దళిత వుద్యమం సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? విజయాలను మరింత పటిష్ట పరుచుకోవటం, వైఫల్యాలను అధిగమించటానికి కొత్తదారులు వెతకాల్సిన అవసరం లేదా ? మన దేశంలో కమ్యూనిస్టు వుద్యమం 1920లో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం పుట్టుతోనే శ్రీకృష్ణుడు చెరసాల పాలై తరువాత అజ్ఞాతంలో పెరిగినట్లుగా భారత కమ్యూనిస్టుపార్టీ కూడా నిర్బంధాలు, నాయకుల అరెస్టులు,జైలు జీవితంతోనే ప్రారంభమైంది. పుట్టిన పదిహేను సంవత్సరాల తరువాతే బహిరంగంగా పనిచేయటం సాధ్యమైంది. తరువాత మరోసారి నిర్బంధం, నిషేధం. అంటే దాని వయస్సు కూడా తొమ్మిది పదులు. మ్యూనిస్టులు కూడా పూలే-అంబేద్కరిస్టుల మాదిరి తమ విజయాలు,పరాజయాలను సింహావలోకనం చేసుకొని జనసామాన్యాన్ని ఆకర్షించటంలో ఎదురౌతున్న సమస్య లేమిటో అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటో రూపొందించుకోవాల్సి వుంది. రెండు వుద్యమాలు ఒకదానితో ఒకటి విబేధించే అంశాలు వున్నాయి,అంగీకరించేవి వున్నాయి. ఏవి ఎక్కువ ఏవి తక్కువ అన్న వాటిని చర్చించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్య పడుతుందంటే అంగీకృత అంశాలపై కలసి పనిచేసినపుడే.రెండు వుద్యమాల మధ్య వున్నవి మిత్ర వైరుధ్యాలే తప్ప శతృపూరితమైనవి కాదు.ఒక వేళ ఎవరైనా అలా చిత్రించేందుకు ప్రయత్నిస్తే తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. అంబేద్కరిస్టులు చెబుతున్న దళిత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు, లేదా కమ్యూనిస్టులు చెబుతున్న ఆర్ధిక దోపిడీ అంతం కావాలనటాన్ని పూలే-అంబేద్కరిస్టులు వ్యతిరేకించటం లేదు. అయితే సమస్య ఎక్కడ. కమ్యూనిస్టులలో విలీనం కమ్మని పూలే-అంబేద్కరిస్టులను గానీ లేదా తమ రాజకీయ వేదికను రద్దుచేసుకొని సామాజిక వుద్యమాలలో విలీనం కమ్మని కమ్యూనిస్టులను గానీ ఎవరూ కోరటం లేదు. కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల మధ్య సైద్ధాంతిక విబేధాలు వున్నాయి కనుకనే ఆ పార్టీలు విడివిడిగా వుంటూ ఐక్యంగా పోరాడుతున్నాయి.కలసి వచ్చిన చోట లౌకిక శక్తులను తోడు చేసుకుంటున్నాయి.దీనికి కూడా దాన్నే ఎందుకు వర్తింప చేయకూడదు. మనకు స్వాతంత్య్ర వుద్యమం అనేక పాఠాలు నేర్పింది. కాంగ్రెస్‌ సంస్థలోనే ఎన్ని భావజాలాలు వున్నవారు కలసి పని చేయలేదు. వారిలో ఎన్ని విబేధాలు లేవు? అయినా వారిని కలిపి వుంచింది తెల్లవాడిని దేశం నుంచి తరిమివేయాలి అన్న ఏకైక లక్ష్యం ఒక్కటే.

   ముందుగా పరిష్కారం కావాల్సింది దళిత సమస్య అన్నది మొత్తంగా ఇప్పటి వరకు పూలే-అంబేద్కరిస్టులు ముందుకు తెచ్చిన వైరుధ్యం. అర్ధిక దోపిడీ అంతమైతే సామాజిక సమస్యలు పరిష్కారం కావటం సులభం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది కమ్యూనిస్టుల వైఖరిగా వుంది. ఇవి ఇలా వుంటే ఇప్పుడు ఈ రెండు శక్తులను దెబ్బతీసి అటు ఆర్ధిక దోపిడీని పెంచే నయా వుదారవాదాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తే దానిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు బిజెపి, దానితో చేతులు కలిపిన శక్తులు చూస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షను పెంచి పోషించే మనువాదాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కూడా మత శక్తులు మరింత వూపుతో పనిచేస్తున్నాయి. కుల శక్తులు దానికి అనుబంధంగా వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందువలన నయావుదారవాదం, మతోన్మాదం అనే జంట ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలా అన్నది సమస్య.

     నయా వుదారవాదం ఇంకా వేగంగా, విస్తృతంగా అమలులోకి వస్తే అమలులో వున్న విద్యా, వుద్యోగ రిజర్వేషన్లు మరింతగా తగ్గిపోతాయి. ఇప్పటికే సామాజిక రంగంలో ఎవరు ఎలా వుండాలో, వుండకూడదో నిర్ణయించేందుకు మతశక్తులు ఎలా ముందుకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ జంట ముప్పును తప్పించకుండా ఈ వుద్యమాలు ముందుకు సాగవు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ముఖ్యంగా సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పును గత పది హేను సంవత్సరాలుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చూస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు అఖిలభారత స్థాయిలో కూడా అలాంటి సంస్ధ ఏర్పడి రాష్ట్రాల వుద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతున్నది. ఇంకా అనేక సంస్ధలు కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే అలాంటి కృషే చేస్తున్నాయి.అయితే అన్ని వుద్యమాలు,వుద్యమ రూపాలు ఒకే విధంగా వుండటం లేదు. అందుకే ముందే చెప్పినట్లు సామాజిక వుద్యమ సంస్ధలైనా, రాజకీయ పార్టీలైనా అంగీకృత అంశాల మేరకు కలసి పనిచేయాలి. ఈ విషయంలో ఇటీవలి కాలంలో అంబేద్కరిస్టుల వైఖరిలో కూడా మార్పును గమనిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు జరగాలంటే అసలు ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వ రంగంలో పరిశమ్రలు వుండాలి. వుద్యోగాలను క్రమంగా రద్దు చేస్తున్నారు, పరిశ్రమలను మూసివేస్తున్నారు, లేదా పొరుగు సేవల పేరుతో పర్మనెంటు వుద్యోగాలను రద్దు చేస్తున్నారు. వీటిని రక్షించుకోవటంతో పాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రారంభమైన వుద్యమంలో కూడా వారు భాగస్వాములు కావటం ప్రారంభమైంది.

   ఇక్కడ ఒక విషయంపై స్పష్టత కలిగి వుండటం అవసరం. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి, బీసిల సమస్యలు వారికే తెలుస్తాయి, ఎస్సీ,ఎస్టీల సమస్యలు వారికే తెలుస్తాయి. ఈ అభిప్రాయాలతో ఎవరూ విబేధించాల్సిన అవసరం లేదు. వాస్తవం వుంది. పేచీ ఎక్కడ వస్తుందంటే ఈ తరగతులకు చెందని వారికి ఆ సమస్యలు తెలియవు, అందువలన వారు మాట్లాడకూడదు, వుద్యమాలకు సారధ్యం వహించకూడదు అన్న పెడ ధోరణులకు గురైన స్థితి వుంది. దీనికి గురైన వారు రెండు రకాలు. ఇది నయా వుదారవాద భావజాలం ముందుకు తెచ్చిన విభజించి పాలించు అన్న పాత ఎత్తుగడలకు కొత్తరూపం. తమకు తెలియకుండానే ఇది నిజమే కదా అనుకున్నవారు కొందరు. వీరితో పేచీ లేదు. మంచి చెడులను వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రెండో రకం వారు వున్నారు. అన్నీ తెలిసి కూడా ఈ వాదాన్ని ముందుకు తెచ్చేవారు. వీరు కలిగించే హాని అంతా ఇంతా కాదు. అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కులాలలో పుట్టిన వారు మాట్లాడ కూడదు అంటే రాజ కుటుంబంలో పుట్టిన బుద్దుడు ఎవరు? ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఆద్యుడిగా పరిగణించబడుతున్నారా లేదా ? అందువలన ఎవరు ఏ కులంలో పుట్టారు లేదా పేదవాడా, ధనికుడా అని కాదు, ఏం చెబుతున్నారు అన్నది ముఖ్యం. ఒక అగ్రకులంలో పుట్టిన వ్యక్తి కుల తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అగ్రకులతత్వం వున్న వారి నుంచి దూరమైనట్లే. ఒక కులంలో పుట్టటం అనేది ఒక యాదృచ్చిక ఘటన మాత్రమే.

    మతశక్తులు తమ అజెండాను అమలు జరిపే క్రమంలో తమకు తెలియకుండానే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విశ్వవిద్యాలయాలలో వ్యవరించిన తీరుతో కమ్యూనిస్టులు, వామపక్షాలు,అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయం కోరుకొనే ఇతర అనేక శక్తులను దగ్గరకు తెచ్చాయి. దాని నుంచి వచ్చిందే జైనీల్‌ -జై లాల్‌ నినాదం.ఎవరి ఎజండాలు వారు కలిగి వుండండి, ఎవరి జండాలను వారు మోసుకోండి. సమస్యలపై కలసి పనిచేయండి, జనానికి మేలు చేయండి.

నాస్తిక వాదం గురించి ఆస్థికులు ఆవేదన చెందటం చిత్రమే మరి !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    నాస్తిక వాదం నలిగిపోతోందా అనే శీర్షికన మే ఐదవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గీతాంజలి మూర్తి కొన్ని అంశాలను లేవనెత్తారు.నిరతంతరంగా జరిగే నాస్తిక, ఆస్థిక వాదం చర్చలో అనేక మంది లేవనెత్తుతున్న పాత విషయాలే అవి. నాస్తికులైన తండ్రుల బిడ్డలు ఆస్థికులుగా ఎందుకు మారుతున్నారు? అంటూ అక్కినేని నాగేశ్వరరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, శ్రీశ్రీ, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి వంటి పేర్లను ప్రస్తావించారు.తరిచి చూస్తే వారి ప్రశ్నలోనే సమాధానం వుంది. పైన పేర్కొన్న ప్రముఖ నాస్థికుల తలిదండ్రులందరూ మామూలు ఆస్థికులు, ఆ కుటుంబాలలో అంతకు ముందేమీ పండిత చర్చలు జరిగిన దాఖలాలు లేవు. అటువంటపుడు వారి బిడ్డలు ప్రముఖ నాస్థికులుగా ఎలా మారారు, మూర్తిగారు స్వయంగా హేతువాది అయిన ఆస్థికుడిని అని చెప్పుకున్నారు, వారి తలిదండ్రులు ఏ భావజాలంతో వుండేవారో తెలియదు. మరి ఆయనెందుకు అలా మారారు? ఎందుకు అని ప్రశ్నించుకొని సరైన సమాధానం పొందేవరకు వదలని తత్వం నాది అని మూర్తిగారు అన్నారు కను సమాధానం ఏం పొందారో కూడా ఆయనే చెప్పి వుండాల్సింది.లేక నాస్థికుల నుంచి సమాధానం వచ్చే వరకు వదలను అని చెబుతున్నారా ? ఆయన చెప్పినట్లు నిజంగా హేతువాదే అయి వుంటే ఆస్థికుడిగా వుండే వారే కాదు, ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

   ఆస్థిపాస్తులకు, భావజాలానికి వారసత్వం వుంటుంది. కానీ రెండింటికీ మౌలిక తేడా వుంది. తలిదండ్రుల ఆస్థులపై బిడ్డలకు లేదా దాయాదులకు వారసత్వం హక్కుగా వస్తుంది. కానీ భావజాలం కొనసాగింపు బిడ్డల, ఇతర కుటుంబ సభ్యుల హక్కు లేదా బాధ్యత, విధి కాదు. ఎలా అంటే మూర్తిగారు నాస్థికులను సమర్ధిస్తూనో, విమర్శిస్తూనో ఒక పెద్ద గ్రంధం రాస్తే దాని ప్రచురణపై ఆయన వారసులకు కాపీ రైట్‌ చట్ట ప్రకారం హక్కు వుంటుంది. అంతమాత్రాన దానిలో పేర్కొన్న భావజాలానికి వారు కట్టుబడి వుండాలని లేదు. ఆ పుస్తకం అచ్చువేస్తే వచ్చే డబ్బుకు మాత్రమే వారసులు, కానీ దానిలోని భావజాలానికి నిబద్దులైన ఇతరులు వారసులు అవుతారు.

   కారల్‌ మార్క్స్‌ తంaడ్రి లాయర్‌ ,తన బిడ్డను కూడా లాయర్‌ను చేయాలనుకున్నాడు. కానీ ప్రపంచగతినే మార్చే ఒక అపూర్వ తత్వశాస్త్రానికి ఆద్యుడు అయ్యాడు. మార్క్స్‌తో పాటు విడదీయరాని మేథావి ఎంగెల్స్‌. ఆయనొక పెట్టుబడిదారుడి తనయుడు. కానీ ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు తన ఫ్యాక్టరీ నుంచే పాఠాలు తీసుకున్నాడు. కారల్‌ మార్క్స్‌ను వివాహం చేసుకున్న జెన్నీ రాజకుటుంబాల నుంచి వచ్చిన యువతి. మార్క్స్‌ను వివాహం చేసుకొని జీవితాంతం అష్టకష్టాలను ఎందుకు అనుభవించింది? మధ్యలోనే విడాకులిచ్చి మరొక ధనవంతుడిని వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇలాంటి వన్నీ ఎందుకు జరుగుతాయో మూర్తి వంటి వారు అర్ధం చేసుకుంటే ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం కూడా దొరుకుతుంది.

     భాగవతాన్ని నమ్మటమా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. దానిలో పేర్కొన్న హిరణ్యకశ్యపుడు విష్ణు ద్వేషి. కుమారుడు విష్ణు భక్తుడు. వారికి ఆస్థి, రాచరికం దగ్గర పేచీ రాలేదు, విష్ణువును కొలవటమా లేదా అన్న భావజాలం దగ్గరే వచ్చింది. అందువలన ఆస్థికుల పిల్లలు నాస్తికులుగా మారినా, అటుదిటు అయినా, పెట్టుబడిదారుల కొడుకులు కార్మికవర్గ పక్షపాతులైనా, లేదా ఏమీ లేని వారు పెట్టుబడిదారులుగా మారి ఆ భావజాలాన్ని అనుసరించినా ఆయా కాలాల్లో వుండే అనేక పరిస్థితులు, ముందుకు వచ్చిన అంశాల ప్రభావం వారిపై పడుతుంది.ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ భావజాలాన్ని అలవరుచుకుంటారు. త్రిపురనేని రామస్వామి నాస్తికుడిగా, హేతువాదిగా మారిన సమయంలో ఆంధ్రదేశంలో, కృష్ణా.గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా వున్నా ఆయన కమ్యూనిస్టుగా మారలేదు. అదే సమయంలో అనేక మంది నాస్తికులు కమ్యూనిస్టులుగా మారారు. అంత మాత్రాన ఇతర భావజాలాలు అంతరించినట్లో నలిగిపోయినట్లో అవుతుందా ? తమిళనాడులో డిఎంకె నేతలు గుడులు,గోపురాలకు వెళ్లినంత మాత్రాన నాస్తికత్వ వాదం నశిస్తుందనుకుంటే అంతకంటే అమాయకత్వం వుండదు.

    మనది వేద భూమి అంటారు కొందరు. వేదాలు వునికిలోకి వచ్చినపుడే వాటిని వాటిని తిరస్కరించిన హేతువాదులు కూడా ఇక్కడే పుట్టారు, అందువలన హేతు భూమి అని కూడా ఎందుకు పిలవకూడదు? బుద్దుడు కూడా ఇక్కడే పుట్టినందున కొందరు బుద్ధ భూమి అనటం లేదా ? వేద ప్రమాణాన్ని తిరస్కరించిన చార్వాకులు, లోకాయతులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా ధ్వంసం చేశారు. అయితేనేం తరువాత వేమన అవతరించలేదా, ఆ చార్వాక, లోకాయత, వేమన్నవాద భావజాల వారసులు దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారా లేదా ? వేదాలను నమ్మేవారు ఎక్కువ, నాస్తికులు, హేతువాదులు తక్కువ ఎందుకు వున్నారు అని ఎవరైనా అడగొచ్చు. వేదాలు కొన్ని దేశాలు, ప్రాంతాలకే పరిమితం, అన్ని రకాల మతాలను,దేవుళ్లను వ్యతిరేకించే నాస్తికులు, హేతువాదులు ప్రపంచవ్యాపితంగా వున్నారు. గరిటెడైనను చాలు గంగిగోవు పాలు అన్న వేమన్న సమాధానం వుండనే వుంది. ఎవరూ విత్త కుండానే వర్షాలు పడి, రుతువు రాగానే అనేక మొక్కలు మొలుస్తాయి, వాటిలో పనికిరాని కలుపు , ప్రయోజనం చేకూర్చే మంచి మొక్కలూ వుంటాయి. అదే వర్షాలు లేకపోతే ఆ విత్తనాలు అలాగే భూమిలో వుండిపోతాయి. అలాగే ఏ భావజాల వ్యాప్తికైనా పరిస్థితులు దోహద పడాలి. అది ఎంతకాలం అంటే ఎవరు చెబుతారు.మూర్తిగారే అన్నట్లు హిందూ మత పూర్వ వైభవం తెచ్చుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఎవరినైనా చెప్పమనండి !

     హేతువాదుల ఇండ్లలో ఇతర కుటుంబ సభ్యులు పూజలు, పునస్కారాలు చేయటం గురించి ప్రస్తావించారు.తమ కుటుంబ సభ్యులనే మార్చటంలో ఎందుకు విఫలమయ్యారు అని ప్రశ్నించారు. ఇది వినటానికి ఇంపుగానే వుంటుంది. మొదటి విషయం నాస్థికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మిగతావారికంటే అత్యంత ప్రజాస్వామిక వాదులు. తమ భావాలను కుటుంబ సభ్యులతో సహా ఇతరులపై రుద్దరు. మోతీలాల్‌ నెహ్రూ మితవాది, ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ కాంగ్రెస్‌లో అతివాది అయ్యాడు. కమ్యూనిస్టు దిగ్గజం సుందరయ్య భూస్వామిక కుటుంబంలో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పచ్చి మితవాద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.లోకసభ స్పీకర్‌గా,సిపిఎం అగ్రనేతగా వున్న సోమనాధ్‌ చటర్జీ తండ్రి ఒక పెద్ద లాయర్‌, హైకోర్టు జడ్జి. అంతకు మించి ఆయన హిందూ మహాసభ నాయకుడు. సుందరయ్య,నంబూద్రిపాద్‌, సోమనాధ్‌లు కమ్యూనిస్టులు కాకుండా చేయటంలో వారి కుటుంబ పెద్దలు ఎందుకు విఫలమయ్యారు?

    మతం కూడా ఒక భావజాలమే. ప్రముఖ బిజెపి నాయకులు, సంఘపరివార్‌ పెద్దలు ముస్లింలు లవ్‌ జీహాద్‌ పేరుతో హిందూ యువతులను వివాహమాడి, మతమార్పిడి చేస్తున్నారంటూ ముస్లిం మత భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం గగ్గోలు పెడుతుంటారు.అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, తొగాడియా,సుబ్రమణ్యస్వామి అలాంటి ఎందరో ప్రముఖులు తమ కుటుంబ సభ్యులు ముస్లింలను వివాహం చేసుకుంటుంటే ఎందుకు ఆపలేకపోయారు? ఇతరులకు ఎందుకు నీతులు చెబుతున్నారు? అందుకని చర్చను అలాంటి వైపు తిప్పితే ప్రయోజనం లేదు. ఏ వాదంలో అయినా దాని మంచి చెడ్డలను చర్చించటం మంచిది.

     భారత దేశాన్ని మొగలాయీలు ఆక్రమించినపుడు స్వాతంత్య్రం కావాలన్న వాంఛ దేశ ప్రజలలో పుట్టలేదు, బ్రిటీష్‌ వారు ఆక్రమించిన తరువాత కూడా చాలా కాలం వరకు కలగలేదు. ప్రధమ స్వాతంత్య్ర పోరాటం తరువాత కూడా దేశంలో అంతగా జ్వాల రగలలేదు. అంత మాత్రాన 1857 తిరుగుబాటు విఫలమైనట్లు కాదు. కాంగ్రెస్‌ ఏర్పడిన వెంటనే జనం కుప్పలు తెప్పలుగా వుద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలా కాలం వరకు బ్రిటీష్‌ వాడి పాలనే బాగుందని చెప్పిన వారు మనకు ఎందరో తెలుసు. అందువలన ఒక భావజాలాన్ని మెజారిటీ అంగీకరించి అనుసరించనంత మాత్రాన అది విఫలమైనట్లు , మెజారిటీ ఆమోదించిన భావజాలాలన్నీ సఫలమైనట్లూ కాదు. హిందూమతంపై తిరుగుబాటుగానే బౌద్దం అవతరించింది. అది మన దేశంలో ఆదరణ పొందలేదు, అంత మాత్రాన అది విఫలమైనట్లా ? తరువాతనే మన దేశంలోకి ఇస్లాం, క్రైస్తవం వచ్చాయి.ఎందరో బలహీనవర్గాల వారు ఆ మతాలపట్ల ఆకర్షితులయ్యారు. మెజారిటీగా వున్న హిందూమతం లేదా దానిని కాపాడాలని కంకణం కట్టుకున్న పెద్దలు ఎందుకు ఆ పరిణామాన్ని నివారించలేకపోయారు?

    నాస్తికత్వం, హేతువాదం, భౌతిక వాదం వీటన్నింటినీ కొంతమంది ఒకే గాటన కడుతున్నారు. వాటిలో అనేక అంశాలు ఒకటిగా వుండటం ఒక కారణం. ఈ మూడు వాదాలతో ప్రభావితులైన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కానీ కమ్యూనిస్టులు ఈ మూడు అంశాలను కలిగి వుంటారు. వాటిని జనంలో కలిగించటానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కమ్యూనిస్టులుగా వుండి మూఢనమ్మకాలను, తిరోగమన భావాలను ప్రోత్సహిస్తే తప్పు. అయితే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేరటానికి ఈ అంశాలను షరతులుగా పెట్టటం లేదన్నది తెలుసుకోవాలి.అంటే పార్టీలో ఆస్థికులు,నాస్థికులూ అందరూ వుంటారు. ఎవరైనా దేవాలయం, మసీదు, చర్చికో వెళుతూ మరోవైపు దోపిడీ లేని సమసమాజం కావాలని కోరుకుంటే అలాంటి వారిని ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సభ్యులుగా వద్దంటే అంతకంటే పిచ్చిపని మరొకటి వుండదు. మా మతం కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని వ్యతిరేకించమని చెప్పింది అంటేనే పంచాయతీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మతాలు పుట్టినపుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదు.అందువలన మతాలు కమ్యూనిజాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది? తప్పుడు వ్యాఖ్యానాలు చేసే అలాంటి వారిని పార్టీలు అంగీకరించవు. పార్టీ సభ్యులుగా చేరిన తరువాత వేల సంవత్సరాలుగా వచ్చిన అనేక అన్యవర్గ ధోరణులను పోగొట్టటానికి ప్రయత్నిస్తారు. అయితే అది అన్ని చోట్లా, అందరూ ఒకే విధంగా చేయకపోవచ్చు. అలాంటివి ఏవైనా వుంటే సద్విమర్శలు చేయాలి. ఒక కమ్యూనిస్టు సంస్మరణ సభలో కొందరు వక్తలు బొట్లు పెట్టుకొని జోహార్‌ కామ్రేడ్‌ అనటం చూసి అవాక్కయ్యానని మూర్తిగారు రాశారు. సంస్మరణ సభ కనుక ఇతరులు ఎవరైనా వచ్చి అలా చేసి వుండవచ్చు.దానికి అవాక్కవ్వాల్సిందేముంది. ఎవరైనా బొట్టుపెట్టుకో కూడదని కమ్యూనిస్టుపార్టీ ఎక్కడైనా చెప్పిందా ? సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాండ్రైన బృందాకరత్‌, సుభాషిణీ అలీ పెద్ద బొట్లు పెట్టుకోవటం లేదా ? మతాలు, మతాచారాలు మాత్రమే అలాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

     అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు అన్నట్లు దైవశక్తి ఆస్థికుల అనుభవంలోకి రావటాన్ని నాస్తికవాదులు ఎన్నిరాసినా అడ్డుకోలేరు అని ఒక నిర్ధారణ చేశారు. ఆస్థికులలో కూడా మేథావులు వున్నారని మరువరాదు అన్నారు. మొదటి విషయం, ఆస్థికులలో మేథావులు వుండరని నాస్తివాదం చెప్పలేదు. కొద్ది మందిగా వున్న నాస్థిక, హేతువాద మేథావుల వైఫల్యం గురించి మూర్తిగారు సంతోష పడుతున్నారు ఓకే. వేల సంవత్సరాలనాడే వుద్భవించిన నాస్థిక వాదం ఇప్పటికీ వునికిలో వుందంటే అత్యధికులుగా వున్న ఆస్థిక మేథావులు, పండితులు, మతాధికారులు, వారి రాజపోషకులు, కొత్తగా టాటా , బిర్లావంటి పెట్టుబడిదారీ పోషకుల వైఫల్యం కనపడటం లేదా ? హిందూమతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన అనేక మంది ఆస్థిక మేథావులు ఎందుకు విఫలమయ్యారు. వీధికొక దొంగబాబా పుట్టుకు వచ్చి మతం పేరుతో దండుకుంటుంటే ఎందుకు నివారించలేకపోయారు ? వెర్రి మొహాలు వేసుకొని ఎందుకు చూస్తున్నారు? ఇది వైఫల్యం కాదా ?

    శంకరాచార్యుడు తన వాదనా పటిమతో అనేక మందిని బౌద్ధం నుంచి మళ్లించి హిందూ మతానికి పూర్వ వైభవం తెచ్చారు అని మూర్తిగారు చెప్పారు. ఇది ఘర్‌ వాపసీ ప్రచార ప్రభావంగా కనిపిస్తోంది. ఆ శంకరాచార్యుడు పుట్టిన కేరళలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంత మంది క్రైస్తవులు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎందుకు ఆ మతాలవారు విస్తరించారు? ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల అనేక మంది హిందూ నుంచి ఇతర మతాలకు ఎందుకు మారిపోతున్నారు? ఆస్థికులు అంటే ఒక్క హిందువులే కాదు, దైవాన్ని, దైవదూతలను నమ్మే ఇతర మతాల వారు కూడా ఆస్థికులే. వారు మార్చుకొనేది మతం తప్ప ఆస్తికత్వాన్ని కాదు, అయినా ఎందుకు ఆ మార్పిడులపై ఎందుకు అంత రగడ చేస్తున్నారు? ఆస్థికులలో ప్రజాస్వామ్యం లేదా ?

     చివరగా ఒక్క మాట నాస్థికులు,హేతువాదులు, భౌతిక వాదులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు వేల సంవత్సరాల నుంచి మా విశ్వాసం, మనోభావాలు అంటారు తప్ప సరైన సమాధానం చెప్పటంలో ఆస్థికులు విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో తమ వ్యతిరేక భావాలను,చర్చలు, వాదనలను కూడా సహించటం లేదు. దబోల్కర్‌, పన్సారే,కులుబుర్గి వంటి నాస్థిక,హేతువాదుల్ని హతమార్చారు. ఇంకా అనేక మందిని అదే చేస్తామని బెదిరిస్తున్నారు. వారి హత్యలను ఆస్థికులుగా వున్న ప్రముఖులు ఏ మతం వారైనా ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వారి వాదనలు ఆస్థికవాద మూలాలనే ప్రశ్నిస్తున్నాయి, అహాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది ఈనాటిది కాదు, చార్వాకులు,లోకాయతుల నుంచి జరుగుతున్నదే. హిందూ మతానికి ఒక సాధికార కేంద్రమే లేదు. అందువలన హిందూమతావలంబకులు, దానిని కాపాడాలనుకొనేవారు, ముందు ఎవరు సాధికారులో తేల్చుకొని విశ్వాసం, మనోభావాలను కాసేపు పక్కన పెట్టి ఆ పండితులు, మతాధిపతులతో శాస్త్రీయమైన పద్దతులలో చర్చలు జరిపి నాస్థికవాదం తరతరాలుగా ‘ఎందుకు’ వునికిలో వుంటున్నదో, ఇప్పటి వరకు హిందూ మతం పేరుతో జరిగిన తప్పులను, ఇప్పటికీ కొనసాగుతున్న అస్పృశ్యత, వివక్ష, వంటి సవాలక్ష అవలక్షణాలను, మతం పేరుతో బాబాలు,యోగులు,యోగినులు భారీగా ఆస్థులను పోగేసుకోవటాన్ని ఎలా అరికట్టాలో తేల్చి ప్రకటించాలి.మనుషులను మనుషులుగా చూస్తారనే భరోసా కలిగించాలి. అప్పుడే జనానికి మతం మారాలన్న ఆలోచన వుండదు. మతాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు ఆ పని చేస్తామంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఏమతం అయినా కావచ్చు, జనం ఇతర మతాలోక్లి మారుతున్నారన్న దుగ్దకంటే మన మతంలోకి ఇతరులను ఎలా ఆకర్షించాలనే విషయంలో అన్ని మతాలూ పోటీ పడటం ఆరోగ్యకర లక్షణం.అలాగాక దాడులకు దిగటం బలహీనత, అనాగరిక లక్షణం.