ఏడాదిలోపు రెండుసార్లు చెరకు ధర ప్రకటన ! రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు మోడీ ఎత్తుగడ !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


కేంద్రా ప్రభుత్వం తాజాగా క్వింటాలు చెరకు ధరను రు.25 పెంచింది. దీంతో 2024-25 సీజన్‌కు రు.340కి చేరిందని, రైతులకిచ్చిన ఈ బ హుమతితో పండగ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మన దేశంలో సీజన్‌ అంటే ఆర్థిక సంవత్సరానికి చెప్పే నిర్వచనం వేరు, పంటలకు వేరు. ఏప్రిల్‌ నుంచి మార్చి నెలవరకు ఆర్థిక సంవత్సరం. అదే పత్తి, చెరకు సంవత్సరాలు అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు లెక్కిస్తారు.దీని ప్రకారం 2024-25 సీజన్‌ అంటే ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు. కనుక ప్రకటించిన పెంపుదల వర్తమాన సంవత్సరానికి కాదు. ఈ ఏడాది ధరను సీజనుకు ముందుగా గతేడాది జూన్‌లోనే ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత జూన్‌లో చేయాల్సిన ప్రకటనను రైతుల ఓట్ల కోసం నాలుగు నెలల ముందే ప్రకటించారు. అందుకే నిజంగా రైతులు దీంతో సంతోషిస్తారా ? పంజాబ్‌ రైతులు చలో ఢిల్లీ పేరుతో రావటాన్ని పంజాబ్‌-హర్యానా సరిహద్దులో బిజెపి ప్రభుత్వం అడ్డుకుంది. ఫిబ్రవరి 13 నుంచి ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో వారు రెండు చోట్ల తిష్టవేశారు.వివిధ రూపాల్లో ఆందోళనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పోలీసుల దాష్టీకానికి ఒక రైతు మృతి చెందాడు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిపతిికేషన్‌ వెలువడనున్న పూర్వరంగంలో నాటకీయ పద్దతిలో కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 21 సమావేశం, దానిలో చెరకు ధర పెంపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ వెల్లడించారు.


న్యాయమైన మరియు గిట్టుబాటు ధర(ఎంఆర్‌పి) పేరుతో చేస్తున్న జిమ్మిక్కుతో రైతులకు ఒరిగేదేమిటి ? షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా క్వింటాలుకు 10.25శాతం పంచదార దిగుబడి వస్తేనే ఈ ధర దక్కుతుంది. ప్రస్తుత సీజన్‌లో 2023-24కు రు.315గా 2023జూన్‌లో కేంద్రం ప్రకటించింది. వచ్చే ఏడాది నిర్ణీత ప్రామాణిక శాతానికి మించి ఎక్కడైనా పంచదార దిగుబడి పెరిగితే 0.1శాతానికి రు.3.32 అదనంగా చెల్లిస్తారు. అదే మాదిరి తగ్గితే తగ్గుతుంది. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత 2014-15 నుంచి ఈ మాదిరి పెరుగుదల లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది నిజమే. పదేండ్ల వివరాలను చూసినపుడు చెరకు ధరను రు.220 నుంచి రు.315కు పెంచారు. అంటే పదేండ్లలో పెరిగింది కేవలం రు.95 మాత్రమే. ఏడాదికి సగటు పెంపు రు.9.50 మాత్రమే. అలాంటిది ఏకంగా రు.25 పెంచారంటే ఎన్నికల కోసమే అంటే తప్పేముంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ రైతాంగంలో పలుకుబడి కలిగిన ఆర్‌ఎల్‌డి పార్టీ బిజెపితో చేతులు కలిపింది, చెరకు పండేది కూడా అక్కడే ఎక్కువ, ఆర్‌ఎల్‌డి మద్దతుదార్లు ఈ రాజకీయ అవకాశవాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన పూర్వరంగంలో వారిని మచ్చిక చేసుకొనేందుకు మోడీ పూనుకున్నారు. దానిలో భాగంగా చెరకు ధర పెంపుతో పాటు మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు భారత రత్న ప్రకటన వెనుక కూడా చెరకు రైతుల మద్దతు కోసమే అన్నది స్పష్టం. గతంలో సాగిన రైతు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జాట్‌ రైతాంగాన్ని ఈ సారి ఆందోళనకు దూరంగా ఉంచాలన్న ఎత్తుగడ కూడా ఉంది. మహారాష్ట్రలో బిజెపిని వ్యతిరేకిస్తున్న శరద్‌ పవార్‌ నాయకత్వంలోని పార్టీకి చెరకు రైతులే ప్రధాన మద్దతుదార్లు, వారిని ఆకర్షించటం కూడా దీని వెనుక ఉంది. గడచిన పదేండ్లలో నాలుగు సంవత్సరాలు అసలు పెంచలేదు. ఒకేడాది ఐదు, మూడు సార్లు పది వంతున, ఒకసారి 15, మరొకసారి రు.20 పెంచారు.2019 ఎన్నికలకు ముందు రు.20పెంచారు. అదీ ఎన్నికల కోసమే అనివేరే చెప్పనవసరం లేదాు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ హామీలో భాగమే తాజా పెంపుదల అని ప్రచారం చేస్తున్నారు. ఆ లెక్కన ధర రు.440కి పెరగాలి. అందుకే జుమ్లా అని రైతులు వర్ణిస్తున్నారు. యుపిఏ హయాంలో 2009-10లో ఉన్న ధర రు.129 నుంచి 2013-14 నాటికి రు.210కి అంటే ఐదు సంవత్సరాల్లో రు.81 పెరిగింది. పదేండ్ల మోడీ ప్రభుత్వం పెంచింది కేవలం రు.95 మాత్రమే. ఏ ఎలిమెంటరీ విద్యార్ధిని అడిగినా మోడీ ఏలుబడిలో తక్కువే అని చెబుతారు.


దేశంలో చెరకు ధరకు రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు.ఒకటి కేంద్రం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పి కాగా రెండవది కొన్ని రాష్ట్రాలు ప్రకటిస్తున్న రాష్ట్ర సలహా ధర(ఎస్‌ఏపి) సహజంగా కేంద్రం కంటే ఎక్కువగా ఉంటుంది.ఉదాహరణకు పంజాబ్‌లో రు.391, ఉత్తర ప్రదేశ్‌లో రు.370 ఉంది. అందువలన కేంద్ర ప్రకటించిన ధరతో ఎవరికి ప్రయోజనం?ప్రస్తుతం ఉన్న రు.315 ధర పంచదార దిగుబడి 9.5శాతం అన్న అంచనాతో నిర్ణయించారు. అందువలన దిగుబడి పెరిగితేనే రైతుకు ఉపయోగం లేకపోతే నష్టమే.దిగుబడి రైతు చేతిలో ఉండదు. ప్రైవేటు రంగంలో ఉన్న ఏ ఒక్క పంచదార ఫ్యాక్టరీ దిగుబడి గురించి వాస్తవ సమాచారాన్ని వెల్లడించదు. అందువలన దిగుబడితో నిమిత్తం లేకుండా ధర చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రమైనా, రాష్ట్రాలు ప్రకటించే ధరలైనా వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సాగు ఖర్చు టన్నుకు రు.440 అవుతుందని రైతులు చెబుతున్నారు. అందుక పెంపుదలను ముష్టి విదిల్చినట్లుగా భావిస్తున్నారు. మిల్లు యజమానులు పంచదార, తదితర ఉత్పత్తులను అమ్మిన తరువాతే రైతులకు డబ్బు చెల్లిస్తున్నారు. అంటే రైతుల పెట్టుబడితో మిల్లులు నడుస్తున్నాయి.ఒక టన్ను చెరకు నుంచి వంద కిలోల పంచదార, నలభై కిలోల మొలాసిస్‌ వస్తుంది.దీన్నుంచి పది లీటర్ల మేర ఇథనాల్‌ వస్తుంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం లేదా రాష్ట్రాలు చెరకు ధర పెంచటం లేదు. గడచిన మూడు సంవత్సరాల్లో చెరకు ధర 5.7శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 19 శాతం కరవు భత్యం పెంచిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాదీ పార్టీ పాలన 2012 నుంచి 2017వరకు 26శాతం చెరకు ధర పెంచితే నరేంద్రమోడీ అచ్చేదిన్‌, యోగి బుల్డోజర్‌ పాలన ఏడు సంవత్సరాల్లో పెంచింది 17.46శాతమే.


స్వామినాధాన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆయన సూచించిన పద్దతి ప్రకారం మద్దతు ధరలను నిర్ణయించేందుకు మొరాయిస్తున్నది. ఉదాహరణకు చెరకు సంగతే చూద్దాం. 2023లో కేంద్రం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌పి రు.315(దానికి తాజాగా వచ్చే ఏడాదికి మరో 25 పెంచింది), వివిధ రాష్ట్రాలలో ప్రకటించిన సలహాధరలు, స్వామినాధన్‌ పద్దతిలో ఉండాల్సిన ధర, ఒక క్వింటాలకు (రు.315 ఎఫ్‌ఆర్‌పి ప్రకారం) రైతులు నష్టపోతున్న మొత్తాల గురించి ఆలిండియా కిసాన్‌ సభ రూపొందించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి.
రాష్ట్రం×××××× రాష్ట్ర ధర×××× స్వామినాధన్‌××××రైతుల నష్టం

ఆంధ్రప్రదేశ్‌ ×× 357 ×××× 535.50 ×××× 220.50

బీహార్‌ ×× 241 ×××× 361.50 ×××× 46.50

గుజరాత్‌ ×× 289 ×××× 433.50 ×××× 118.50

హర్యానా ×× 327 ×××× 490.50 ×××× 175.50

కర్ణాటక ×× 258 ×××× 387.00 ×××× 72.00

మహరాష్ట్ర ×× 214 ×××× 321.00 ×××× 6

పంజాబ్‌్‌ ×× 298 ×××× 447.00 ×××× 132

తమిళనాడు ×× 299 ×××× 448.50 ×××× 133.50

తెలంగాణా ×× 332 ×××× 498.00 ×××× 183

ఉత్తరప్రదేశ్‌ ×× 310 ×××× 465.00 ×××× 150

ఆలిండియా ×× 292 ×××× 438.75 ×××× 123.50

ఈ పూర్వరంగంలో క్వింటాలకు రు.500 ధర నిర్ణయించాలని అఖిలభారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేసింది. సహకార, ప్రభుత్వ రంగంలో ఉన్న పంచదార మిల్లులను జాతీయం చేయరాదని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది. వర్తమాన సంవత్సరంలో రు.315 అంటే దిగుబడిలో 10.25 శాతం దాటిన తరువాత పెరిగే ప్రతి 0.1శాతానికి అదనంగా రు.3.07 చెల్లిస్తారు, తగ్గితే ఆ మేరకు కోత పెడతారు. సగటు దిగుబడి 9.5శాతమే ఉన్నందున క్వింటాలు ధర రు.315గా చెప్పినా రైతుకు దక్కేది రు.292 మాత్రమే. చెరకు ఉత్పత్తి ఖర్చుకు వందశాతానికి మించి గిట్టుబాటు ధర చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం నమ్మబలుకుతోంది.అసలు కిటుకు అక్కడే ఉంది. క్వింటాలుకు సాగు ఖర్చును కేవలం రు.157 మాత్రమే 2023-24 సంవత్సరానికి లెక్కగట్టి రు. 315 ప్రకటించామంటే రెట్టింపే కదా అని చెబుతున్నారు. రైతులు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? ప్రభుత్వం చెబుతున్నది వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక సంస్థ సూచించిన మొత్తం. అది వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రారంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకే స్వామినాధన్‌ కమిషన్‌ పద్దతి ప్రకారం సాగు ఖర్చును, మద్దతు ధరలను నిర్ణయించాలని, వాటికి చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఏడాది పాటు చేసిన ఉద్యమం, తాజాగా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు కూడా కోరుతున్నది అదే.

యువరైతును బలితీసుకున్న బిజెపి సర్కార్‌ – రైతు ఉద్యమ భవిష్యత్‌ ఏమిటి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 13న ప్రారంభమైన రైతు ఉద్యమంలో బుధవారం నాడు 24ఏండ్ల సుభకరణ్‌ సింగ్‌ ప్రాణాలర్పించాడు. హర్యానా పోలీసులు రైతుల మీద జరిపిన దమనకాండలో అనేక మంది గాయపడ్డారు.కనౌరీ ప్రాంతం నుంచి తమ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురిలో ఒకరు మరణించినట్లు పాటియాలలోని రాజీంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హెచ్‌ఎస్‌ రేఖీ విలేకర్లతో చెప్పారు. తమ దగ్గర అలాంటి సమాచారం లేదని పోలీసులు బుకాయించారు. పోలీసుల దమనకాండ నేపధ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీ చలో ప్రదర్శన నిలిపివేసినట్లు రైతు సంఘాల ప్రతినిధి సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం నాడు వెల్లడిస్తామని తెలిపారు. బుధవారం నాడు పంజాబ్‌-హర్యాన సరిహద్దులోని రెండు ప్రాంతాలలో ప్రదర్శకుల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మిర్చి కలిపిన ఎండుగడ్డిని తగులబెట్టి దానితో రైతులు తమ మీద దాడి చేసినట్లు పోలీసులు ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో కొన్ని చోట్ల ట్రాక్టర్లతో ప్రదర్శనలు జరిపారు.


అంతకు ముందు జరిగిన పరిణామాలలో మూడు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ఐదేండ్ల పాటు కొనుగోలు చేస్తామని, మిగతా వాటి కనీస మద్దతు ధర గురించి ఎలాంటి హామీ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదం కాదని ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఢిల్లీకి ప్రదర్శనగా వెళతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా( రాజకీయ రహితం-ఎస్‌కెఎం-ఎన్‌పి) నేతలు ప్రకటించారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో దాదాపు పద్నాలుగువేల మంది రైతులు గత కొద్ది రోజులుగా తిష్టవేశారు.పన్నెండు వందల ట్రాక్టర్లు-ట్రాలీలు, పది మినీ బస్సులు, ఇతర వాహనాలతో రైతులు పదమూడవ తేదీ నుంచి అక్కడే ఉన్నారు వారిని 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ చేరుకునేందుకు ముందుకు సాగనివ్వకుండా హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు అడ్డుకుంటున్నారు. చర్చలు విఫలమైనందున బుధవారం నుంచి ఢిల్లీ చలో పిలుపుతో ముందుకు సాగుతామని ఎస్‌కెఎం-ఎన్‌పి నేతలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను రాజధానిలోకి రానివ్వకూడదని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. మరోవైపున ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న బిజెపి సర్కార్‌ కూడా రోడ్లను మూసివేసి అన్నదాతలను అడ్డుకొనేందుకు పూనుకుంది. తాము ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలతో వస్తున్నట్లు, ఇది నేరపూరితమని హర్యానా పోలీసులు ఆరోపించారు.ఢిల్లీ వైపు వచ్చేందుకు పూనుకున్న రైతుల మీద హర్యానా పోలీసులు డ్రోన్లతో బాష్పవాయు గోళాలను విసిరారు. దీంతో షంభు సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. జెసిబిలు, క్రేన్లు, పొక్లెయిన్లను రైతులకు సరఫరా చేయవద్దని యజమానులను హెచ్చరించారు. ఈ నేపధ్యంలో రైతుల ఉద్యమం ఏమౌతుంది, రానున్న ఎన్నికలలో బిజెపి, దాని మిత్ర పక్షాల మీద ఆందోళన ప్రభావం ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది.


గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రభుత్వ తాజా చర్చలలో భాగస్వామి కాదు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నామని, రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు, ఎన్‌డిఏ ఎంపీల ఇండ్ల ముందు నిరసన తెలపాలన్న తమ పిలుపుతో ముందుకు పోతామని ప్రకటించింది. గతంలో అనేక రాష్ట్రాలలో రాజకీయాలతో నిమిత్తం లేని రైతు సంఘాల పేరుతో అనేక మంది సంస్థలను ఏర్పాటు చేసి రైతులను సమీకరించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా ఉన్నారు. దాని కొనసాగింపుగానే 2020-21లో ఆందోళనలో భాగస్వాములుగా ఉన్న కొందరు ఎస్‌కెం నుంచి విడగొట్టుకొని తాజా ఆందోళనకు పిలుపు ఇచ్చారు. గత ఆందోళనకు దూరంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా ఇప్పుడు వారితో కలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు దేశ శత్రువులను ఎదుర్కొనే పద్దతిలో రైతులను అడ్డుకొనేందుకు సన్నద్దం అవుతున్నది, మరోవైపు చర్చల పేరుతో లోక్‌సభ ఎన్నికల ప్రకటన జరిగే వరకు కాలయాపన ఎత్తుగడలకు పూనుకుంది. రైతుల మీద తప్పుడు ప్రచారం సరేసరి.


మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని రానున్న ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనిని రైతు సంఘాలు తిరస్కరించాయి.ఢిల్లీ చలో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి.ఎస్‌కెఎం-ఎన్‌పి నేత జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ సోమవారం నాడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రు.1.75లక్షల కోట్లతో పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నదని, ఈ మొత్తాన్ని చమురు గింజల సాగుదార్లకు ఇస్తే వారికి ప్రయోజనం ఉంటుందన్నారు.ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పంటల మార్పిడి చేసే రైతులకు మాత్రమే లబ్ది చేకూర్చుతుందన్నారు. తమ డిమాండ్లను ఆమోదించటం లేదా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల దమనకాండలో పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో 400 మంది రైతులు గాయపడ్డారని దలేవాల్‌ చెప్పారు. సుప్రీం కోర్టు దీని మీద స్వయంగా చర్య తీసుకోవాలని కోరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు ఝామువరకు జరిగిన చర్చలలో రైతులు అంగీకారం తెలిపిన అంశాల మీద మరుసటి రోజు మాట మార్చినట్లు చర్చలలో భాగస్వాములైన వర్గాలు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక సమీక్షలో పేర్కొన్నది.ఇప్పుడు ఆందోళనకు పిలుపుఇచ్చిన వారు నిజంగా అంగీకరించారా లేక వారి మీద చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఇలాంటి వార్తలను వ్యాపింపచేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.

ప్రభుత్వం జరుపుతున్న చర్చల తీరు గురించి గతంలో ఆందోళనకు నాయకత్వం వహించిన వారిలో ఒకరైన హన్నన్‌ మొల్లా ఆదివారం నాడు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో జరుపుతున్న ఆందోళన తమ పిలుపు మేరకు జరుగుతున్నది కాదని గతంలో తమ నుంచి వేరుపడిన కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారు కూడా తమ పేరునే ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన నాలుగవ విడత చర్చల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఆందోళన సందర్భంగా పదకొండుసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లేదన్నారు.ఈ పదకొండు దఫాల చర్చలకు 42 మందిని కేంద్రం పిలిచిందని, వారిలో ఇద్దరిని విడదీసిందని, ఇప్పుడు ఆ ఇద్దరితో మాట్లాడుతూ 40 మందిని విస్మరించిందని చెప్పారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏదో ఒక లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు. అయితే దీని అర్ధం ఇప్పుడు రైతు సంఘాలు ముందుకు తెచ్చిన డిమాండ్లను తాము వ్యతిరేకించటం లేదని, వాటిని వెంటనే అమలు జరపాలని హన్నన్‌ మొల్లా చెప్పారు. కనీస మద్దతు ధరలు, వరి, గోధుమ గడ్డి తగులబెట్టటం గురించి చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా బుధవారం నాడు చెప్పారు. రైతులను అణచేందుకు చూడవద్దని రైతు నేత సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ బుధవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. రైతులే మోడీని ప్రధానిని చేశారని, వారిని విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని అన్నారు. మీరు మమ్మల్ని చంపవచ్చు కానీ రైతులను అణచవద్దని ప్రభుత్వానికి చెప్పామని, కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తూ ప్రధాని ఒక ప్రకటన చేసి ఆందోళనకు తెరదించాలని అన్నారు.హర్యానా గ్రామాలలో పారా మిలిటరీని దించారని, తామేం నేరం చేశామని ప్రశ్నించారు. భద్రతా దళాలు తమను ఇలా అణచివేస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించి శాంతియుతంగా ఢిల్లీ చేరేందుకు తమను అనుమతించాలన్నారు. ఇది తమహక్కు అని స్పష్టం చేశారు. తమ ఉద్దేశ్యం గొడవలు సృష్టించటం కాదని, నవంబరు ఏడవ తేదీ నుంచి ఢిల్లీ వచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని ప్రభుత్వానికి తగిన సమయం లేదని అనటం నిర్లక్ష్యం చేసేందుకు చూడటమే అని జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ అన్నారు. బారికేడ్లతో తమను ఆపటం సరైంది కాదన్నారు.


ఎవరైనా డిమాండ్లను నీరుగార్చినా, ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గినా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఈ అంశంపై చర్చ జరగటం అనివార్యం.రైతులకు రాజకీయాలు వద్దనటం, ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రచారం చేయటమే ఒక రాజకీయం, వారిని తప్పుదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. ఏ రైతు సంఘం ముందుకు తెస్తున్న డిమాండ్లైనా వ్యవసాయానికి సంబంధించినవే తప్ప వేరు కాదు. వ్యవసాయంతో సహా అన్ని అంశాల మీద విధానాలను రూపొందించేది పార్టీల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభలే. ప్రతి పార్టీకి చెందిన వారు ఏదో ఒక రైతు సంఘంలో పని చేయటం తెలిసిందే. అందువలన తమకు మేలు చేసే వారెవరో కీడు చేసే వారెవరూ రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ?

మూడవ ఏడాదిలో ఉక్రెయిన్‌ సంక్షోభం ! రష్యా పట్టు మరింత బిగిసింది !!

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య మూడవ ఏడాదిలో ప్రవేశించింది.2022 ఫిబ్రవరి 24న దాడులు ప్రారంభమైనప్పటికీ 21వ తేదీనే వ్లదిమిర్‌ పుతిన్‌ అధికారికంగా ఆదేశాలు జారీ చేశాడు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు రష్యా దళాల అసాధారణ కదలిక ఉన్నట్లు 2021నవంబరు పదవ తేదీన అమెరికా వెల్లడించింది. ఒకవేళ దాడికి దిగితే బలమైన ఆర్థిక, ఇతర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డిసెంబరు ఏడున అమెరికా అధినేత జో బైడెన్‌ బెదిరించాడు. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరకుండా నిషేధం విధించాలని పుతిన్‌ డిసెంబరు 17న ప్రతిపాదించాడు.దాన్ని జెలెనెస్కీ తిరస్కరించాడు. జనవరి 17న తన మిత్రదేశమైన బెలారస్‌తో సైనిక విన్యాసాలు జరిపేందుకు రష్యా ఆరువేల మంది సైనికులు, 60 జెట్‌ విమానాలను పంపింది. తన దళాలను సన్నద్దం చేసినట్లు జనవరి 24న నాటో ప్రకటించింది. ఫిబ్రవరి 10న పది రోజుల పాటు సాగే మిలిటరీ విన్యాసాలు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా, ఉక్రెయిన్‌ సరిహద్దులో ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు తూర్పు ప్రాంతాలపై ఫిబ్రవరి 17న ఉక్రెయిన్‌ మిలిటరీ విరుచుకుపడింది. అదే నెల 21న పుతిన్‌ సైనిక చర్యకు ఉత్తరులు ఇవ్వటంతో పాటు రెండు ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలు డాటెస్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు, 24వ తేదీన దాడులు ప్రారంభమయ్యాయి.


రెండు సంవత్సరాల ఈ సంక్షోభాన్ని స్థూలంగా చూసినపుడు ఉక్రెయిన్‌పై రష్యా పట్టు మరింత బిగిసింది. భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చిన పశ్చిమ దేశాలు ప్రచారం చేసిన మాదిరి ఉక్రెయిన్‌ ఎదురుదాడులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు వైపులా ఎందరు మరణించిందీ ఇంతవరకు విశ్వసనీయమైన ఆధారాలు లేవు.లక్షల్లో ప్రాణ నష్టం ఉంటుందని భావిస్తున్నారు. రష్యా మీద ప్రకటించిన ఆర్థిక, ఇతర ఆంక్షలు దేనికీ కొరగాకుండా పోయాయి.ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు.ఉక్రెయిన్‌ ఎక్కువ కాలం ప్రతిఘటన సాగించలేదని, పశ్చిమ దేశాల్లో వైరుధ్యాల గురించి పుతిన్‌, రష్యా గురించి పశ్చిమ దేశాలు వేసుకున్న తొలి అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలకు ధీటుగా రష్యా కూడా ప్రచారదాడులతో జవాబిచ్చింది. దీంతో జనాల బుర్రలు ఖరాబు అయ్యాయి. తమ నేతలు చెప్పిన అంశాలు, పలికిన ప్రగల్భాల గురించి పశ్చిమ దేశాల జనాల్లో అనుమానాలు, సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు అమెరికా, ఇటు రష్యాలోనూ ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన అంశంగా మారనుంది. దీంతో రెండింటికీ ఈ సంక్షోభం ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి మరింతగా ఆయుధాలు, ఆర్థిక సాయం అందించటం తప్ప దళాలను ప్రత్యక్షంగా దించే అవకాశాలు కనిపించటం లేదు. ఇవేవీ ఇంతవరకు రష్యాను వెనుకడుగు వేయించలేకపోయాయి. ఈ సంక్షోభానికి ఎప్పుడు,ఎలా తెరపడుతుంది అన్న చర్చ జరుగుతున్నది.


తాజా పరిణామాలను చూద్దాం. తూర్పు ఉక్రెయిన్‌లోని అడీవికా ప్రాంతాన్ని రష్యన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జన నష్టాన్ని నివారించేందుకు తామే ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. గత ఏడాది మేనెల తరువాత రష్యన్లకు ఇది పెద్ద విజయంగా చెబుతున్నారు. తగిన సంఖ్యలో మిలిటరీ, ఉన్నవారి దగ్గర మందుగుండు లేకనే ఇది జరిగిందని వార్తలు.అడీవికా పతనం కాగానే తమ వద్ద ఉన్న శతఘ్నులను మొత్తం ఇస్తామని డెన్మార్క్‌ ప్రకటించింది. మీరు ఇచ్చినా వాటిని వెంటనే వినియోగించే స్థితిలో లేమని ఉక్రెయిన్‌ చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా రష్యా మరిన్ని దాడులకు పూనుకుంది. మ్యూనిచ్‌ నగరంలో జరుగుతున్న భద్రతా సమావేశంలో జెలెనెస్కీ మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని దయచేసి మమ్మల్ని అడగకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పుతిన్‌ ఇప్పటికీ కొనసాగించటానికి ఎలా వీలవుతున్నదో చూడండి అని ఐరోపా సమాఖ్యతో అన్నాడు. ఈ సంక్షోభంలో తాము తటస్థంగా ఉన్నామని చైనా మరోసారి స్పష్టం చేసింది. అన్ని స్థాయిల్లో చైనాతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఐరోపాకు రష్యా ముప్పుకొనసాగుతూనే ఉందని, అది కొన్ని నెలలు, సంవత్సరాలు, ఒక తరం వరకు ఉండవచ్చని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేత డేవిడ్‌ లామీ అన్నాడు. ఉక్రెయిన్‌ ఇప్పుడు జీవన్మరణ స్థితిలో ఉందని, దాని విధిని నిర్ణయించేది తామేనని పుతిన్‌ ప్రకటించాడు.తాము మద్దతు ఇస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో ఆహార ధాన్యాలు, ట్రక్కుల రవాణా సమస్యలు ఉన్నట్లు పోలాండ్‌ మంత్రి సికోరిస్కీ చెప్పాడు. ఉక్రెయిన్‌కు భద్రత ఉండాలంటే తమ సభ్యత్వం ఇవ్వాలని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ అన్నాడు. మరో పద్దెనిమిది నెలల పాటు ఉక్రెయిన్‌ పౌరులకు వీసాలను పొడిగిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది.దీన్ని బట్టి పశ్చిమ దేశాలకు ఈ సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి లేదన్నది స్పష్టమౌతోంది.


రెండు సంవత్సరాల తరువాత రష్యాను శత్రుదేశంగా చూస్తున్నప్పటికీ ఐరోపాలో యుద్ధ ఆయాసం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు రానున్న రోజుల్లో విజయాలు సంభవిస్తే ఫరవాలేదు లేకుంటే మరింత నీరసం, దాన్నుంచి ఎందుకీ తలనొప్పి అనే భావం కూడా తలెత్తవచ్చు. మొత్తం మీద ఎన్ని మల్లగుల్లాలు పడినా నాటో కూటమి ఐక్యంగానే ఉంది. ఫిన్లండ్‌ కొత్తగా చేరగా స్వీడెన్‌ ఆ బాటలో ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా గెలిస్తే అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థ వైపు తిరిగే మలుపు పశ్చిమ దేశాల ప్రయోజనాల ఫణంగా జరుగుతుందని భావిస్తున్నారు. బాల్టిక్‌ దేశాలు ఉక్రెయిన్‌కు గట్టి మద్దతు ఇవ్వాలని కోరుతుండగా నాటోలోని హంగరీ, స్లోవేకియా పెదవి విరుస్తున్నాయి.నెదర్లాండ్స్‌,స్లోవేకియాలో గతేడాది జరిగిన ఎన్నికలు నాటో ఐక్యత మీద ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. జెలెనెస్కీకి మిలిటరీ మద్దతులో కోత పెట్టాలనే నినాదంతో పోటీ చేసిన పచ్చిమితవాద ఫ్రీడమ్‌ పార్టీ నెదర్లాండ్స్‌లో గెలిచింది.రష్యాకు అనుకూలంగా ఉండాలన్న వైఖరితో ఉన్న స్లోవాక్‌ సోషల్‌ డెమోక్రసీ పార్టీ 22.9శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ రెండు చోట్లా ఈ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ లేదు. ఉక్రెయిన్‌కు యాభై నాలుగు బిలియన్‌ డాలర్ల అదనపు సాయం అందించాలన్న ప్రతిపాదనను అడ్డుకొనేందుకు హంగరీ ప్రయత్నించింది. ఇప్పటి వరకు చూస్తే జెలెనెస్కీ దళాలకు తాము ఇచ్చిన ఆధునిక ఆయుధాలను ఉపయోగించటంలో నాటో దేశాలు శిక్షణ ఇస్తున్నాయి తప్ప ముందే చెప్పినట్లు ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు, రష్యాను ఒంటరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాయి.


డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో అధికారంలో ఉన్నపుడు మా నుంచి రక్షణ పొందేది మీరు, దానికయ్యే ఖర్చును కూడా మేమే భరించాలా ? కుదరదు మీ కేటాయింపులు పెంచాలని తెగేసి చెప్పాడు. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఇది కూడా ఒక సమస్యగా ముందుకు వచ్చింది. ఐక్యతకే ముప్పు తెచ్చేదిగా ఉందని కొరదరు చెబుతున్నారు. అవసరాలకు అనుగుణ్యంగా నిధులు కేటాయించని దేశాలకు రక్షణ ఇవ్వాలనుకోవటం లేదని ఇటీవల ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చెప్పాడు.ఈ అంశంలో బైడెన్‌-ట్రంప్‌ వైఖరిలో చాలా తేడా ఉంది. అది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అనే వారు కూడా లేకపోలేదు. ఎవరేం మాట్లాడినా అంతిమంగా అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. నాటో దేశాలు పైకి బింకంగా కనిపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వాటికి తోచటం లేదు.నష్టదాయకమైన షరతులతో రష్యాతో రాజీకి అంగీకరించటమా లేక పోరును పొడిగించి ఓటమిని మూటగట్టుకోవటమో ఏదో ఒకటి జరుగుతుందని అనేక మంది నమ్ముతున్నారు.ఏది జరిగినా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, దాని మిత్ర దేశాలకు ప్రతికూలత మరింత పెరుగుతుంది.


కొందరు కొరియా నమూనాలో పోరు ముగియవచ్చు అని చెబుతున్నారు. 1950దశకంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఒకే దేశంగా ఉండాల్సిన కొరియా రెండు భూభాగాలుగా ఉంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ ఒప్పందం ఇప్పటికీ లేదు.దక్షిణ కొరియా రక్షణకు హమీ ఉన్నట్లుగా ఉక్రెయిన్‌కు నాటో రక్షణ హామీని రష్యా ఎట్టి పరిస్థితిలో అంగీకరించదు గనుక అది కూడా జరగకపోవచ్చన్నది మరొక వాదన. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన తరువాత చైనా -రష్యా సంబంధాలు మరింత బలపడటమే గాక రెండూ దగ్గరయ్యాయి. అంటే ప్రచ్చన్న యుద్ధకాలంలో మాదిరి రెండు శిబిరాలుగా ప్రపంచం చీలిందని సూత్రీకరించేవారు కూడా లేకపోలేదు. తటస్థంగా ఉన్నా, ఆయుధాలను సరఫరా చేయకున్నా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం నుంచి తప్పించేందుకు చైనా ఇటీవలి కాలంలో రష్యా నుంచి తన దిగుమతులను పెంచుకొన్నది.ఈ పరిణామంతో అట్లాంటిక్‌ ప్రాంత దేశాలు వీటికి వ్యతిరేకంగా దగ్గర అవుతున్నాయి.రక్షణ బడ్జెట్లను, మిలిటరీని పెంచుతున్నాయి.గత ప్రచ్చన్న యుద్ధానికి ఇప్పటిదానికి చాలా తేడా ఉన్నది. సోవియట్‌-చైనా బంధం కంటే ఇప్పుడు చైనా-రష్యా బంధం ఎంతో ప్రాధాన్యత కలిగింది.నాడు చైనా ఆర్థికంగా మిలిటరీ రీత్యా నేటి మాదిరి బలం కలిగి లేదు. గతంలో సోవియట్‌-చైనా మధ్య ఉన్న విబేధాలను అమెరికా వినియోగించుకుంది, ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.
ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఏ పక్షమూ గెలిచే లేదా ఓడిపోయే స్థితి లేదని మరికొంతకాలం కొనసాగుతుదంటున్నవారు కొందరు. గత ఏడాది ఆర్భాటం చేసి ప్రారంభించిన ఎదురుదాడిలో మొత్తంగా చూసినపుడు ఉక్రెయిన్‌కు మరిన్ని నష్టాలు, కొత్త ప్రాంతాలను కోల్పోవటం, ఆత్మరక్షణలో భారీ సంఖ్యలో ప్రాణాలను బలిపెడుతున్నది. మరోవైపు రష్యా కూడా ప్రాణాలను పెద్ద సంఖ్యలో కోల్పోవటంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా భారీగా నష్టపోతున్నది. రానున్న ఎన్నికల కారణంగా పెద్ద సంఖ్యలో మిలిటరీ రిక్రూట్‌మెంట్లు కూడా చేసే పరిస్థితి లేదు. జనాభా రీత్యా తక్కువ సంఖ్య ఉన్న ఉక్రెయిన్‌కు ఇంకా కష్టం. పశ్చిమ దేశాలు ఊహించినదానికి భిన్నంగా పుతిన్‌ తనకు కావాల్సిన ఫిరంగి గుండ్లు ఇతర వాటిని ఇరాన్‌, ఉత్తర కొరియా నుంచి పొందుతున్నాడు.ఉక్రెయిన్‌కు నాటో సరఫరాలు సరేసరి. ఉక్రెయిన్‌ లొంగుబాటు తప్ప మరే చర్చలు లేవని పుతిన్‌ తెగేసి చెప్పాడు.పదేండ్ల నాడు కోల్పోయిన క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలను తిరిగి తమకు అప్పగిస్తే తప్ప రాజీ లేదని జెలెనెస్కీ చెప్పటం, ఈ ఏడాది నవంబరులో అమెరికా ఎన్నికల ఉన్నందున ఏడాది పొడవునా పోరు కొనసాగవచ్చు.

చండీఘర్‌ మేయర్‌ పదవి కక్కుర్తి, విలువలు, వలువలు విప్పేసిన బిజెపి ! సుప్రీం కోర్టు చెంపదెబ్బ !!

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


పదేండ్లుగా దేశంలో ఎదురులేని అధికారాన్ని, మెజారిటీ రాష్ట్రాలలో పాలన సాగిస్తున్న బిజెపి అధికార కక్కుర్తి ఎలా ఉందో కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌ మేయర్‌ ఎన్నిక రుజువు చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బిజెపి చెంప చెళ్లుమనే తీర్పు ఇచ్చింది. మరోసారి ఎన్నిక జరపాల్సిన అవసరం లేదని జనవరి 30న జరిగిన అక్రమాన్ని సరిదిద్ది ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్ధి కులదీప్‌ కుమార్‌ గెలిచినట్లు ప్రకటించింది. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన బిజెపి నేత అనిల్‌ మాసి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేత్రత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌ ఇచ్చిన తీర్పు నిజంగా బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బగా మారింది. జనవరి 30న జరిగిన ఎన్నికలో ఆప్‌ అభ్యర్ధికి పడిన ఎనిమిది ఓట్లు చెల్లనివిగా పరిగణించి బిజెపి అభ్యర్ధి గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఎనిమిది ఓట్లను చెల్లకుండా చూసేందుకు అనిల్‌ మాసి కావాలనే ప్రయత్నించినట్లు కోర్టు పేర్కొన్నది. సోమవారం నాడు కోర్టులో సాక్ష్యం చెప్పిన ఈ పెద్దమనిషి ఎనిమిది బాలట్‌ పత్రాలు చెడిపోయినట్లు ప్రకటించారు.రికార్డుల్లో అలాంటిదేమీ లేదని కోర్టులో తప్పుడు ప్రకటన చేసినట్లు సుప్రీం కోర్టు పేర్కొన్నది. కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.అనిల్‌ మాసి ఎనిమిది బాలట్‌ పత్రాలపై టిక్కులు పెట్టినట్లు సిసిటీవీలో రికార్డైంది. సంతలో పశువులను కొన్నట్లు మేయర్‌ ఎన్నిక జరిగిందని కోర్టు పేర్కొన్నది. అంతకు ముందు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ఎన్నికను సవాలు చేయగా ఫలితాన్ని నిలిపివేసేందుకు తిరస్కరించింది. సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిన తేదీకి ఒక రోజు ముందు ఆదివారం నాడు గతంలో ఎన్నికైనట్లు ప్రకటించిన మనోజ్‌ సోంకర్‌ మేయర్‌ పదవికి రాజీనామా చేశారు. అదే రోజు రాత్రి ఆమ్‌ ఆద్మీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లను ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తాడే పార్టీలో చేర్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పని తీరును చూసి ఉత్తేజం పొందామని, తమ వార్డుల అభివృద్ది కోసం బిజెపిలో చేరినట్లు వారు ప్రకటించారు. 2026లో తిరిగి కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతాయి.


పది లక్షలకు పైగా జనాభా, ఆరులక్షల 30వేల మంది ఓటర్లున్న చండీఘర్‌లో 35 కౌన్సిలర్ల స్థానాలు ఉన్నాయి. వీరు గాక వివిధ రంగాలకు చెందిన పది మందిని ఓటింగ్‌ హక్కులేని కౌన్సిలర్లుగా నియమిస్తారు. వారిలో ఒకరు మేయర్‌ ఎన్నికలో రిటర్నింగ్‌ అధికారిగా ఉంటారు. అనిల్‌ మాసి బిజెపి మైనారిటీ మోర్చానేతగా ఎప్పటి నుంచో ఉన్నారు.2021 డిసెంబరు 24న 35 స్థానాలకు కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఏడాదికి ఒక సారి మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. ఐదేండ్ల పదవీ కాలంలో తొలి, నాలుగవ సంవత్సరం మేయర్‌ పదవిని మహిళలకు రిజర్వు చేశారు. తొలిసారిగా పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ 14 సీట్లతో పెద్దపార్టీగా ఉంది.బిజెపికి పన్నెండు, కాంగ్రెస్‌కు ఎనిమిది, అకాలీదళ్‌కు ఒకటి చొప్పున వచ్చాయి. తొలి మేయర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పాల్గొనలేదు.ఒక కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఫిరాయించి బిజెపిలో చేరాడు. ఎంపీ ఓటుతో కలిపి బిజెపికి 14 రాగా, ఆమ్‌ ఆద్మీకి 14 రాగా ఆమ్‌ ఆద్మీకి వచ్చిన ఒక ఓటు మీద టిక్కు పెట్టి అది చెల్లదంటూ బిజెపి గెలిచినట్లు ప్రకటించారు. బిజెపికి వచ్చిన ఓట్లలో ఒకటి చినిగినప్పటికీ దాన్ని ఆమోదించారు. ఆ ఎన్నికను సవాలు చేస్తూ అప్పుడు కూడా కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.ఈఎన్నికల్లో పార్టీల వారీగా కాంగ్రెస్‌కు 29.79, బిజెపికి 29.30, ఆమ్‌ ఆద్మీకి 27.08శాతం చొప్పున ఓట్లు వచ్చాయి.తాజాగా జరిగిన మేయర్‌ ఎన్నికలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. దీంతో బిజెపి ఓటమి ఖాయంగా మారటంతో రిటర్నింగ్‌ అధికారి అక్రమానికి తెరతీశారు. అనిల్‌ మాసి 2015 నుంచి బిజెపిలో చురుకుగా పని చేస్తున్నారు.2022లో కౌన్సిలర్‌గా నామినేట్‌ అయ్యారు. అంతకు ముందు మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇతగాడు వివాదాలకు కొత్త కాదు. ఒక కమిటీ సమావేశంలో విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాటమే గాక నోరుపారవేసుకోవటంతో రెండు సంవత్సరాల పాటు చర్చ్‌ కార్యకలాపాల్లో పొల్గొనకుండా చర్చ్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా(సిఎన్‌ఐ) 2018లో ఆంక్షలు విధించింది. రెండు సంవత్సరాల తరువాత వాటిని ఎత్తివేశారు. ఎక్కడా కుదురుగా పని చేయని అనిల్‌ రాజకీయాల్లో పూర్తిగా నిమగమయ్యారు.


తమ వారు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడరని, సాదా సీదాగా గడుపుతారని బిజెపి చెప్పుకోవటం తెలిసిందే.అక్రమంగా గెలిచిన మహిళా బిజెపి మేయర్‌ సర్వజిత్‌ కౌర్‌ కూడా అలాంటి కబుర్లే చెప్పారు. తరువాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదించిన రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం ఆమె ఏడాది పదవీ కాలం చివరిలో పది రోజుల ముందుగా రు.1,50,306 విలువగల ఆపిల్‌ ఐ ఫోన్‌, రు.75వేల విలువ గల ఆపిల్‌ మాక్‌బుక్‌ను స్వంతానికి కొనుగోలు చేశారు. అక్కడి నిబంధనల ప్రకారం ఎంత మొత్తం అనేదానితో నిమిత్తం లేకుండా మేయర్లుగా ఉన్నవారు ఫోన్‌, లాప్‌టాప్‌ కొనుక్కోవచ్చు. అదే కౌన్సిలర్లకు గరిష్ట పరిమితి నలభై వేలు మాత్రమే ఉంది. పదవీ కాలం చివరిలో కొనుగోలు గురించి అడగ్గా మేయర్‌ భర్త జగతార్‌ జగ్గా సమాధానమిస్తూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది, ఒక వేళ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అని అందరూ అడుగుతారు, అందుకని తామూ తీసుకున్నామని చెప్పారు.గతంలో కొందరు మేయర్‌గానూ, కౌన్సిలర్‌గా రెండు ఫోన్లు తీసుకున్నవారున్నారని, తన భార్య ఒకటే తీసుకున్నట్లు సమర్దించుకున్నారు.అంతకు ముందు కౌన్సిలర్‌గా ఉన్న అతను కూడా 2017లో ఒక ఐఫోన్‌ తీసుకున్నారు. 2016 ఎన్నికల్లో బిజెపి మెజారిటీ కౌన్సిలర్లు ఉన్నారు. అప్పుడు మేయర్లుగా పని చేసిన వారందరూ ఇలా ప్రజల సొమ్ముతో ఖరీదైన సెల్‌ ఫోన్లు కొన్నారు. పదవి నుంచి దిగిపోయే ముందు ఏడాదికి 20శాతం చొప్పున వెలలో తగ్గించి మిగతా సొమ్మును కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంది.

ముగ్గురు రైతుల కళ్లు పోగొట్టిన పోలీసులు : మరో కమిటీ నాటకం, తన సిఫార్సుల అమలుకు తానే మొరాయిస్తున్న మోడీ ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పంజాబ్‌-హర్యానా సరిహద్దులో హర్యానా పోలీసులు, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిల్లెట్లు తగిలి ముగ్గురు రైతులు కళ్లు కోల్పోయినట్లు పంజాబ్‌ ఆరోగ్య మంత్రి డాక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ చెప్పారు. కాలం చెల్లిన, ప్రైవేటు కంపెనీల మందుగుండును రైతుల మీద ఉపయోగిస్తున్నారని, అవి లెక్కల్లో చూపరని రైతు నేత సర్వాన్‌ సింగ్‌ పాంధెర్‌ చెప్పారు. కనీస మద్దతు ధరల మీద మరోకమిటీ వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అది కాలయాపన తప్ప మరొకటి కాదు. ఇప్పటికే ఒక కమిటీ ఉంది, అదేమి చేస్తున్నదో తెలియదు. వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు సాధించబోతున్నామని, అవి రైతుల సమస్యల పరిష్కారానికే గనుక రాజకీయం చేయవద్దని బిజెపి నేత అశోక్‌ తన్వర్‌ చెప్పారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. పదిహేనవ తేదీ రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. ఢిల్లీ చలో అన్న నినాదంతో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది.


రైతులు ముందుకు తెచ్చిన సమస్య మీద గానీ, తానే ప్రకటించిన కమిటీ నివేదికను సత్వరం తెప్పించటం గురించిగానీ కేంద్రానికి చిత్తశుద్ధి ఉందా ? రాష్ట్రాలతో చర్చించాలని కనీస మద్దతు ధరల కమిటీ ప్రకటించిన 20నెలల తరువాత(2022జూలై) మంత్రి మాట్లాడుతున్నారు. గతంలో ఉద్యమం సందర్భంగా జరిగిన పరిణామాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ప్రధానంగా అమలు జరిపేది రాష్ట్రాలే. మూడు సాగు చట్టాలను తెచ్చినపుడు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండానే ఏకపక్షంగా తెచ్చింది. వెనక్కు తీసుకొనేటపుడు కూడా చర్చలు జరపలేదు. ఆ సందర్భంగా ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు ముందు కూడా రాష్ట్రాల వైఖరిని తెలుసుకోలేదు. ఇప్పుడు రాష్ట్రాలతో చర్చించాలని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. చర్చలు జరపకుండా ఇంతకాలం ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అడిగేవాటికి సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ ఆచరణను అర్ధం చేసుకోలేము.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ(ఆస్కి) నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అన్నది దాని సారాంశం. దానిలో ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.


2020డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. మూడు వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది. ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ముఖ్యమైన సిఫార్సులను చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. మూడు వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు. రైతుల ఆందోళనతో వెనక్కు తగ్గారు.


ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ? అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి. బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.


2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు. డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి. పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు నరేంద్ర మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము.
కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే (రద్దుచేసిన) మూడు సాగు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. 2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేశారు? ఇప్పుడు రాష్ట్రాలను సంప్రదించాలని ఎందుకు కబుర్లు చెబుతున్నారు. ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్‌ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్‌పి అమలు : మార్కెట్‌ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! మరి ఇప్పుడు సాకులతో ఎందుకు మొరాయిస్తున్నట్లు ?

రైతులపై మోడీ సర్కార్‌ యుద్ధం : పాక్‌, చైనా సరిహద్దుల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవేమో !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు భద్రతా దళాల నుంచి 30వేల బాష్పవాయు గోళాలను రప్పించారు.
వాటిని ప్రయోగించేందుకు డ్రోన్లను సన్నద్దం చేశారు.
ఒళ్లు మంటలు పుట్టేందుకు రసాయనాలు కలిపిన నీటిని చిమ్మే ఫిరంగుల దుమ్ముదులిపారు.
చెవులు చిల్లులు పడే శబ్దాలు చేసి వినికిడి శక్తిని పోగొట్టే సోనిక్‌ ఆయుధాలను సిద్దం చేశారు.
ఎవరైనా గుర్రాల మీద వస్తే అవి జారి పడే విధంగా గ్రీజు వంటి వాటిని వెదజల్లేందుకు డ్రమ్ములతో సిద్దంగా ఉన్నారు.
రోడ్ల మీద పెద్ద గోతులు తవ్వారు. ఎక్కడబడితే అక్కడ ఇనుప మేకులు కొట్టారు.
ముళ్ల కంచెలు, వాటిని దాటుకొని వస్తే నిరోధించటానికి పెద్ద కంటెయినర్లలో మట్టి, రాళ్లు, ఇటుకలతో నింపారు.
సిమెంటు దిమ్మెల వరుసలు ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కనే నిర్బంధ శిబిరాలను తయారు చేశారు.
ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు ?
సరిహద్దుల్లో పాకిస్థాన్‌ లేదా చైనా, మరొక దేశం దాడి చేస్తుందనో వాటిని ఎదుర్కొందామనో కాదు.
వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద ఈ ఏర్పాట్లు ? ఎందుకనుకుంటున్నారు ?


తమ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగేందుకు వస్తున్న అన్నదాతలను అడ్డుకొనేందుకు !
ఇన్ని ఏర్పాట్లు చేసిన పోలీసుల బాస్‌ ఏం చెప్పారో తెలుసా ? ఒక వేళ వీటన్నింటినీ దాటుకొని రైతులు గనుక వస్తే మీరేమీ వెనుకా ముందు చూడనవసరం లేదు, ఆత్మరక్షణ గురించి ఆలోచించవద్దు అన్నారు. దీని అర్ధం వేరే చెప్పాలా ? ప్రస్తుతం అనేక ఐరోపా దేశాల్లో వేలాది మంది రైతులు రాజధానులు, ఇతర ప్రధాన పట్టణాలకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాల మీద ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులు కాపలాకాసేందుకు ఉన్నారు తప్ప అడ్డుకున్నది గానీ చేయి చేసుకున్న ఉదంతంగానీ ఒక్కటంటే ఒక్కచోట కూడా జరగలేదు. కానీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకుంటున్న చోట రైతులను శత్రువులుగా చూస్తున్న అపర ప్రజాస్వామిక పాలకుల తీరిది.


ఇంతకూ రైతులు చేసిన పాపం ఏమిటి ?
2011లోనే నరేంద్రమోడీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సిఫార్సులో ఒకటైన కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించమని కోరటం. క్షమాపణలు చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకంటూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దతతో పాటు ఇతర సమస్యలను పరిశీలించేందుకు 2022 జూలైలో నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన కమిటీ ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నది, ఎప్పుడు నివేదిక ఇస్తారు, స్వామినాధన్‌ కమిటీ చేసిస సిఫార్సులతో సహా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అని నిలదీయటమే అన్నదాతల అపరాధం. ఇప్పటికే పంజాబ్‌-హర్యానా సరిహద్దులో రైతుల వీపులు పగలగొట్టారు, జర్నలిస్టులతో సహా అనేక మంది గాయపడ్డారు. గురువారం నాడు చర్చల ప్రహసనం చోటు చేసుకుంది. ఆదివారం నాడు మరోసారి మాట్లాడతామని చెప్పారు. ఈలోగా కుట్ర సిద్దాంతాలు. వాట్సాప్‌ యూనివర్సిటీలో నరేంద్రమోడీ సర్కార్‌ను కూలదోసేందుకు అంటూ ఊదరగొట్టటం ప్రారంభించారు.హర్యానాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేశారు. ఢిల్లీలో 144వ సెక్షన్‌ విధించారు. సభలు, ప్రదర్శనలకు అనుమతి లేదు.


2020-21లో సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తరువాత 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ఇతర అంశాల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేసింది. ఇప్పటి వరకు అదేమి చేస్తున్నదో తెలియటం లేదు గనుక మరోసారి రైతులు ఢిల్లీ చలో పిలుపు ఇచ్చారు. సాధారణంగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అనేక మంది అనుకున్నారు. అదేమిటో తెలియదు గానీ మరోసారి రైతులు ఆందోళన చేస్తే అణచి వేసేందుకు పోలీసులకు కొత్త పద్దతులను నేర్పించారు.దేశ రాజధాని వద్ద చేసిన ఏర్పాట్లు బహుశా చైనా సరిహద్దులో కూడా చేసి ఉండరేమో అని కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ వ్యాఖ్యానించారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. గురువారం రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. స్వామినాధన్‌కు భారత రత్న అవార్డు ఇచ్చిన పెద్దలు ఆయన చేసిన సిఫార్సుల అమలు మాత్రం కుదరదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీలో సభ్యులుగా ఎలాంటి వారిని నియమించిందో తెలిస్తే జరిగేదేమిటో ఊహించుకోవచ్చు.


రైతుల నిరసన రాజకీయపరమైదని, హింసాకాండ వ్యాప్తి చేస్తారేమో అనే ఆందోళన కలుగుతోందని, అందుకే తాము భాగస్వాములం కావటం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీ సభ్యుడు ప్రమోద్‌ చౌదరి ఆరోపించారు.ఈ పెద్ద మనిషి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన భారతీయ కిసాన్‌ సంఫ్‌ు నేత గనుక ఇంతకంటే ఏం మాట్లాడతారు ! మరో కమిటీ సభ్యుడి పేరు వినోద్‌ ఆనంద్‌. ఆందోళన చేస్తున్న వారిని గూండా రైతులని వర్ణించిన ఘనుడు.వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (ప్రపంచ సహకార ఆర్థికవేదిక ) కార్యనిర్వాహక అధ్యక్షుడు. అసలు ఈ సంస్థ గురించి రైతులు ఎప్పుడైనా విన్నారా ? ” దేశ ఆర్థిక పురోగతికి, రైతుల సంక్షేమానికి కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించటమే ఏకైక పరిష్కారం అయితే ఆ పని చేసేందుకు చేయాల్సిందంతా చేస్తాము. ఎంఎస్‌పికి గతంలో ఎప్పుడు చట్టబద్దత ఉంది. దాని గురించి ప్రధాని ఎన్నడూ చెప్పలేదు.వీరంతా గూండా రైతులు, రాజకీయంగా ఉత్తేజం పొందిన కొద్ది మంది…ఒక రాష్ట్రానికి చెందిన వారు తమ రాజకీయ ప్రత్యర్ధుల మీదకు రైతులను ఈ విధంగా ఉపయోగిస్తున్నారు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి ఎన్నడూ చెప్పలేదు. 2075వరకు పనికి వచ్చే విధంగా ఉండే వ్యవసాయ విధానాలను మనం రూపొందించుకోవాల్సి ఉంది, తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. కనీస మద్దతు ధర ఒక సంక్లిష్టమైన అంశం.వారు(రైతులు) ముందుకు వచ్చి మాతో కూర్చొని చర్చించాలి.వారి ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పలేకపోతే కమిటీ నుంచి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇదంతా ఒక నాటకం, పక్కదారి పట్టించేందుకు, దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు చేస్తున్న వ్యవహారం ” అని వినోద్‌ ఆనంద్‌ అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది.


ఉత్తరాది రాష్ట్రాల శ్వాస నిలిపివేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారని, తమ రాష్ట్రంలో భయ వాతావరణం ఏర్పడిందని హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. నరేంద్రమోడీ సర్కార్‌ను దించేందుకే రైతులు మరోసారి వీధుల్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. అంటే మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు చేస్తున్నట్లు చిత్రించటమే. అదే రైతుల అజెండా అయితే నిరాయుధులుగా ఎందుకు వస్తారు.తాము ప్రయాణిస్తున్న ట్రాక్టర్లలో గతంలోగానీ ఇప్పుడు గానీ ఆహార పదార్దాలు తప్ప ఎలాంటి మారణాయుధాలు లేవే. ఢిల్లీ చలో అన్న నినాదంతో గతంలో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబరులోనే కేంద్రం ఎందుకు చర్చలు జరపలేదు ?

పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని రైతులే ఎందుకు ఆందోళన చేస్తున్నారంటూ కొందరు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. నిద్రపోతున్నవారిని లేపగలం గానీ నటిస్తున్నవారిని లేపటం కష్టం. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. పండిన పంటలో స్థానిక వినియోగం పోను మిగిలిన దాన్ని మార్కెట్‌ మిగులుగా పరిగణిస్తారు.2005లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం దేశవ్యాపిత సగటు 55.46శాతం మార్కెట్‌ మిగులు ఉంది. ఇది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్‌ 94.43,హర్యానా 90,11,రాజస్థాన్‌లో 90శాతం ఉంది. ఉత్తర ప్రదేశ్‌ మొత్తంగా చూసినపుడు 49.18శాతమే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు పంజాబ్‌, హర్యానా మాదిరిగా ఉంటాయి. స్వల్ప మార్పులు తప్ప ఇప్పటికీ అదే పరిస్థితి. అందుకే మార్కెటింగ్‌, గిట్టుబాటు ధర సమస్య వచ్చినపుడల్లా ఈ ప్రాంతాల రైతులే వెంటనే స్పందించటం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. అందుకే గతంలోనూ, ఇప్పుడూ ఈ ప్రాంతాల వారే ముందుకు వస్తున్నారు. ఆ సమస్య పెద్దగా లేని రాష్ట్రాల రైతుల్లో పెద్దగా స్పందన ఉండదు. హిమచల్‌ ప్రదేశ్‌, కాశ్మీరులో ఆపిల్‌ రైతులు, కొబ్బరి ధర పడిపోతే కేరళ, ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాల రైతులే స్పందిస్తారు. వర్జీనియా పొగాకు ధర పడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని సాగు చేసే ప్రాంతాల్లో రైతులే రోడ్ల మీదకు వస్తారు, మిగతా రైతులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే అర్ధం లేదు.


ఇంతకీ రైతులు కోరుతున్నదేమిటి ? స్వామినాధన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి. రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలి.రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ పధకాన్ని వర్తింప చేయాలి.విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలి.భూసేకరణ చట్టం 2013ను తిరిగి తేవాలి. దాని ప్రకారం భూసేకరణకు రైతుల ఆమోదం తీసుకోవాలి, జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి.ఉత్తర ప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో హత్యకు గురైన రైతులకు న్యాయం జరగాలి.దోషులను శిక్షించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏడాదికి రెండువందల రోజులు పని కల్పించాలి, వ్యవసాయానికి అనుబంధం చేయాలి.2021 ఉద్యమం సందర్భంగా మరణించిన కుటుంబాల వారికి పరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఇవి కేవలం పంజాబ్‌, హర్యానా రైతుల డిమాండ్లేనా, మిగతా ప్రాంతాల రైతులు కోరటం లేదా ? ఆందోళనను పక్కదారి పట్టించి నిందలు వేస్తున్నవారిని ఎక్కడికక్కడ రైతాంగం నిలదీసే రోజులు రానున్నాయి.

నరేంద్రమోడీ దశాబ్ది పాలన : రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో వేడి కబుర్లు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటి వారు రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్నికబుర్లైనా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద 34 ముప్పుల్లో తప్పుడు సమాచారంలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ప్రపంచవ్యాపితంగా1,490 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సర్వే చేసినపుడు వెల్లడైన నిష్టుర సత్యం. విశ్వగురువుగా నరేంద్రమోడీకి ప్రపంచం నీరాజనాలు అర్పిస్తున్నదని చెబుతున్నవారు దీని గురించి ఏం చెబుతారో తెలియదు. అలాంటి ముప్పులో భాగమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసిన శ్వేత పత్రంలోని అంశాలు. పదేండ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినపుడు దేశం సంక్షోభ స్థితిలో ఉందని, దాని గురించి చెబితే పెట్టుబడులు పెట్టేవారు ప్రతికూలంగా ఆలోచిస్తారని, అందుకే అప్పుడే శ్వేత పత్రం ప్రకటించకుండా ఇపుడు పరిస్థితి బాగుపడినందున విడుదల చేస్తున్నట్లు మొదటి పేరాలోనే జనాన్ని తప్పుదారి పట్టించారు.నిజంగా ఇప్పుడు పరిస్థితి బాగుపడిందా, దాని అర్ధం ఏమిటి ?


ఏటా రెండు కోట్ల ఉపాధిని పెంచుతామని 2014లో చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏమిటి ? బిజెపి అధికారానికి రాకముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1శాతం అది 2018లో నేషనల్‌ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1శాతానికి చేరింది. దేశ కార్మికశక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. పదిహేను నుంచి 24 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 22.4శాతం మందికి ఉపాధి లేదు. తరువాత 2022లో 23.22 శాతం, తొమ్మిది సంవత్సరాల సగటు 24.74శాతం ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉంటే ఈ పెరుగుదల ఎలా సంభవించింది? మాక్రోట్రెండ్స్‌ సమాచారం ప్రకారం 15-24 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక శక్తిలో 2014లో 31.64శాతం ఉండగా మోడీ ఏలుబడిలో 2022లో 28.04శాతానికి తగ్గింది. విద్య పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగశాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు ? నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు. ప్రైవేటు కాలేజీలు పెరిగినందున నైపుణ్యాలు లేని పట్టాదారులు తామర తంపరగా పెరిగారన్నది మింగుడు పడని వాస్తవం. అందుకే ప్రభుత్వం 2015లో జాతీయ నైపుణ్య విధానాన్ని ప్రకటించింది.కార్మిక శక్తిలో 40 కోట్ల మందికి 2022 నాటికి నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. జరిగిందేమిటి ? 2012లో కార్మికశక్తిలో వృత్తి విద్యావంతులు లేదా శిక్షణ పొందిన వారు 2.3శాతం కాగా మోడీ గారి శిక్షణ తరువాత 2.4శాతానికి మాత్రమే పెరిగారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం పిఎంకెవివై (నైపుణ్య శిక్షణ) మూడు రకాలుగా శిక్షణ పొందిన వారు 18-45-4 లక్షల మంది చొప్పున ఉన్నారు.వారిలో 14-43-7శాతాల చొప్పున ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణ తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంకేతిక విద్య అభ్యసించిన ఇంజనీరింగ్‌,పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం గత పది సంవత్సరాల్లో రెట్టింపైంది. మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకొనే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది.


కార్మిక శక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్రమోడీ చెప్పారు. పది సంవత్సరాల తరువాత జనానికి అందిన వాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్‌ నినాదంతో త్వరలో చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్చ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మనదేశం ఉంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 39దేశాల్లో 27వదిగా ఉంది. దేశ ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని, భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పుకోవటమే తప్ప కనిపించటం లేదు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2022లో తొలి పది దేశాల్లో మనం పదవ స్థానంలో ఉన్నాం.మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 388, రెండవదిగా ఉన్న చైనాకు 180 బిలియన్‌ డాలర్లు వస్తే మన దేశానికి వచ్చింది 50బి.డాలర్లు. విదేశీ పెట్టుబడుల సంగతి అలా ఉంటే చైనా జిడిపిలో 50శాతం పెట్టుబడులు పెడుతుంటే మనదేశంలో 30శాతమే ఉంది. చైనా ఉత్పాదకరంగం జిడిపికి 30శాతం సమకూర్చుతుంటే మనదగ్గర 20శాతమే ఉంది. యుపిఏ పాలనలో ఎన్నివేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, మా పాలనలో ఎలా వేశామో చూడండి అని బిజెపి అడ్డుసవాళ్లు విసురుతుంది. మౌలిక సదుపాయాలకు గాను 2013-14లో జిడిపిలో 1.7శాతం ఉన్న మొత్తాన్ని 2022-23లో 2.9శాతానికి పెంచాం చూడండి అని చెబుతారు. పదేండ్ల సగటు 1.93శాతం. ఇక్కడ సమస్య పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందేఅది అవసరాలకు తగినట్లుగా ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా ఎన్ని రోడ్లు, రైలు మార్గాలువేసినా, ఓడరేవులను అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏముంటుంది.


పెట్రోలు, డీజిలు మీద విపరీతంగా సెస్‌లను పెంచారు. ఎందుకు అంటే దేశ రక్షణకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే మనోభావాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజమా ? కేంద్ర ప్రభుత్వ 2022-23 ఆర్థిక సర్వే60వ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2013-14లో జిడిపిలో 1.1శాతం కేటాయిస్తే 2022-23లో 0.9శాతంగా ప్రతిపాదించారు.పదేండ్ల సగటు 1.04శాతం. ఈ కాలంలో చేసిన అప్పులు 4.5 నుంచి 6.4శాతానికి చేరాయి. పదేండ్ల సగటు 4.99శాతం.దీనికి అనుగుణంగానే వడ్డీ చెల్లింపులు 3.3 నుంచి 3.6శాతానికి పెరిగాయి. అచ్చేదిన్‌ గురించి కబుర్లు చెప్పిన పెద్దలు సబ్సిడీ మొత్తాన్ని 2.3 నుంచి 1.2శాతానికి దిగ్గోశారు. పదేండ్ల సగటు 1.74శాతం. ముందే చెప్పినట్లుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఖర్చు పెరగాలి. దాని కోసం సంక్షేమ కార్యక్రమాల ఖర్చు తగ్గింపు సమర్దనీయమా ? పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో చెప్పలేరు. మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటారు. ప్రపంచబాంకు విశ్లేషించినదాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307బిలియన్‌ డాలర్లు, అది 2022 నాటికి 450 బి.డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32శాతానికి దిగజారింది. కార్మిక శక్తిలో 15-24 సంవత్సరాల వయస్సు వారు ఎందరున్నారు అంటే 2014లో 31.64శాతం ఉంటే 2022 నాటికి 28.04కు పడిపోయింది. దీని అర్ధం ఏమిటి ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నది. దీని వలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముంది.


ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నపుడు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దాని వలన వివిధ రంగాలు కొంత మేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఈ కారణంగానే 2020-21లో మూలధన వ్యయం కేంద్ర బడ్జెట్‌లో రు.4.26లక్షల కోట్లుండగా 2023-24లో రు.10లక్షల కోట్లకు పెంచారు.(ఎన్నికల సంవత్సరం కదా !) ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. రైల్వే, రోడ్లు,రక్షణ రంగం వాటా 66శాతం ఉంది. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలకు ఇచ్చే 50 ఏండ్ల వడ్డీ లేని రుణ మొత్తం అంతకు ముందు ఉన్న రు.76వేల కోట్లను 130వేల కోట్లకు పెంచారు. ఇదే సమయంలో కొన్ని రంగాలకు ఎలా కోతలు పెట్టారో చూద్దాం. 2009 తరువాత తొలిసారిగా సామాజిక సంక్షేమ ఖర్చు 18శాతానికి తగ్గింది.2023-24 బడ్జెట్‌లో రు.8.28లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు సంవత్సరం కంటే 56వేల కోట్లు తక్కువ. విద్యారంగానికి కేటాయింపులు 2009-2021 మధ్య 20 నుంచి 9శాతానికి తగ్గాయి. 2023-24లో 14శాతం ఉన్నప్పటికీ తక్కువే కదా ! గ్రామీణాభివృద్ధి కేటాయింపులు 28 నుంచి 19శాతానికి తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వాటికి తగ్గటం లేదా గిడసబారి ఉన్నాయి. పదకొండు సాంఘిక సంక్షేమ రంగాలలో కరోనాకు ముందు 2019-20లో ఉన్న కేటాయింపుల కంటే 2023-24లో ఐదింటిలో తగ్గాయి. అవి స్వచ్చ భారత్‌, సమగ్ర విద్యా శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పధకం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. రాష్ట్రాలు తమ వాటాను చెల్లించని కారణంగా కొన్ని పధకాలకు నిధులు పెంచలేదని కేంద్ర అధికారులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు పెంచారు.మొత్తంగా చూసినపుడు కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చును కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

ప్రహసన ప్రాయంగా పాకిస్థాన్‌ ఎన్నికలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌), నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి.రాష్ట్రాలలో ఒక్క సింధులో మాత్రమే పీపుల్స్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. జాతీయ అసెంబ్లీ, మిగిలిన మూడు రాష్ట్రాలలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని నిషేధిత పాకిస్థాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌(పిటిఐ) పార్టీ మద్దతుదార్లు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలకు గాను 266 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 సీట్లలో 60 మంది మహిళలను రాష్ట్రాల వారీగా పార్టీలు తెచ్చుకున్న ఓట్లను బట్టి దామాషా పద్దతిలో నియమిస్తారు.దేశమంతటి నుంచి మరో పది మంది ముస్లిమేతర సామాజిక తరగతులకు చెందిన వారిని నామినేట్‌ చేస్తారు. ఎన్నికలు జరిగిన స్థానాలలో రెండు ఖాళీగా ఉన్నాయి. పార్టీల వారీ పిటిఐ బలపరిచిన స్వతంత్రులు 101 గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి 91 మంది పిటిఐ స్వతంత్రులు, ముస్లింలీగ్‌(ఎన్‌) 80, పీపుల్స్‌ పార్టీ 54, ముత్తాహిదా క్వామీ మువ్‌మెంట్‌(ఎంక్యుఎం) 17 సీట్లు తెచ్చుకోగా ఐదుగురు ఇతర స్వతంత్రులు, మరో పది చిన్న పార్టీలకు 17 స్థానాలు వచ్చాయి. అంతిమంగా పార్లమెంటు సమావేశాల నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు ఉండవచ్చు. ఓటర్లలో 47శాతం మంది పాల్గొన్నారు.


నాలుగు రాష్ట్రాల ఎన్నికల వివరాలు ఇలా ఉన్నాయి. ఖైబర్‌ ఫక్తూన్‌లోని 145 మొత్తం స్థానాలకు గాను ఎన్నికలు జరిగిన 115లో 84 స్థానాలను పిటిఐ స్వతంత్రులు గెలుచుకున్నారు. అతి పెద్ద పంజాబ్‌లో 371కి గాను ఎన్నికలు జరిగిన 297లో ముస్లిం లీగుకు 137, పీటిఐ స్వతంత్రులు 116, పీపుల్స్‌ పార్టీ పది స్థానాలు గెలుచుకుంది.మరో రాష్ట్రమైన సింధులో 168కి గాను ఎన్నికలు జరిగిన 130లో పీపుల్స్‌ పార్టీ 84, ఎంక్యుఎం 28, పిటిఐ స్వతంత్రులు 11 మంది గెలిచారు. ఇక్కడ పీపుల్స్‌ పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.బలూచిస్తాన్‌లో 65కు గాను ఎన్నికలు జరిగిన 51 చోట్ల పీపుల్స్‌ పార్టీ, జమాతే ఉలేమాకు పదకొండు చొప్పున ముస్లింలీగ్‌కు పది, మిగిలినవి స్వతంత్రులు, చిన్న పార్టీలకు వచ్చాయి. పంజాబ్‌లో ముస్లిం లీగ్‌కు మద్దతు ఇస్తామని, దానికి బదులు ప్రధాని పదవిని తమకు ఇవ్వాలని పీపుల్స్‌ పార్టీ తన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. పాకిస్థాన్‌లో 12.85కోట్ల మంది నమోదైన ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.6 కోట్ల మంది 35 సంవత్సరాలలోపు వారే.36-45 సంవత్సరాల వారు 2.9 కోట్ల మంది.మొత్తం ఓటర్లలో మహిళలు 46శాతమే. కాశ్మీరు నుంచి ఆక్రమించుకున్న ప్రాంతంతో పాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్‌కు జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వాటిని స్వతంత్ర విముక్త ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ విడిగా ఎన్నికలు నిర్వహిస్తారు. జాతీయ అసెంబ్లీకి 5,121 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 12,695 మంది పోటీ చేశారు. వీరిలో 882 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.అభ్యర్దులలో 11,785 మంది స్వతంత్రులు, వారిలో 607 మంది మహిళలు.


పాకిస్థాన్‌ గద్దెమీద ఇమ్రాన్‌ ఖాన్‌ ఉండటం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. అతగాడు చేసిన ”పాపం” ఏమిటంటే అమెరికాతో పాటు చైనా, రష్యాలతో కూడా సామరస్యంగా ఉండాలన్న వైఖరి తీసుకోవటమే. తటస్థంగా ఉండటం కూడా తమను వ్యతిరేకించటమే అన్నది అమెరికా భావన, అందుకే అనేక దేశాధినేతలను కుట్ర చేసి కూల్చివేసిన చరిత్ర తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తమకు మాత్రమే విధేయత చూపాలని అది కోరుకుంటున్నది. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 2022 ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున మాస్కోలో వ్లదిమిర్‌పుతిన్‌-ఇమ్రాన్‌ ఖాన్‌ భేటీ జరిగింది. వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఖాన్‌ చెప్పాడు. రష్యాపై విధించిన ఆంక్షలను కూడా వ్యతిరేకించాడు. అది అమెరికాకు నచ్చలేదు. మార్చి నెల ఆరవ తేదీన ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాడు. దానిలో ఒక కాగితాన్ని చూపుతూ ” రష్యాను ఖండించాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ ఐరోపా యూనియన్‌ రాయబారులు ఒక లేఖ రాశారు. మీరు మా గురించి ఏమనుకుంటున్నారు. మీరేం చెబితే దాన్ని చేయటానికి మేము మీ బానిసలమా ? మేము రష్యాకు, అమెరికాకు, చైనాకు, ఐరోపాకూ స్నేహితులమే. మేము ఎవరి శిబిరంలోనూ లేము.పాకిస్థాన్‌ తటస్థంగా ఉంటుంది, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించేందుకు చూసేవారితో కలసి పని చేస్తుంది ” అని ప్రకటించాడు. ఆ మరుసటి రోజే కుట్రకు తెరలేచింది.


వాషింగ్టన్‌లో పాక్‌ రాయబారి అసాద్‌ మజీద్‌ ఖాన్‌తో జరిపిన సమావేశానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్‌ లు, మరో అధికారి వచ్చారు. ఆ సమావేశంలో డోనాల్డ్‌ లు మాటల సారం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ అంశంలో పాక్‌ వైఖరి అమెరికా, ఐరోపాకు ఆందోళన కరంగా ఉంది. తటస్థం అని చెప్పుకోవచ్చుగాని అలా కనిపించటం లేదు. ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే రష్యా పర్యటనను కేవలం ప్రధాని తీసుకున్న నిర్ణయంగా పరిగణించి మిగతా అందరినీ అమెరికా క్షమించి వేస్తుంది. లేకుంటే గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. ఐరోపా దీన్ని ఎలా చూస్తుందో చెప్పలేము, నేననుకోవటం వారి స్పందన కూడా ఇలాగే ఉంటుంది. ఖాన్‌ గనుక అధికారంలో కొనసాగితే ఐరోపా, అమెరికా అతన్ని ఒంటరిపాటు చేస్తాయి. అమెరికా అధికారి మాట్లాడిన దాని మీద పాక్‌ రాయబారి స్పందన సారం ఇలా ఉంది. అమెరికా నేతల నుంచి ఎలాంటి స్పందన, సంప్రదింపులు లేవు.దీన్ని బట్టి మారు మాట్లాడకుండా మీకు అవసరమైన వాటన్నింటికీ పాకిస్తాన్‌ మద్దతు పలుకుతుందనే భావనలో మీరున్నట్లు, మమ్మల్ని ఖాతరు చేయటం లేదని మావారు అనుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా పోరు మన సంబంధాల మీద ప్రభావం చూపదు. దీని మీద లూ మాట్లాడుతూ మీరు అనుకుంటే అనుకున్నారు కొంత నష్టం జరిగినా అదేమీ పెద్దది కాదులే.ఖాన్ను సాగనంపిన తరువాత మన సంబంధాలు తిరిగి మామూలు స్థితికి చేరతాయి. ఇప్పటికే కొంత దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో మీ దేశ రాజకీయ పరిస్థితి మారుతుందో లేదో చూద్దాం.మారితే ఈ సమస్య గురించి మాకు పెద్ద విబేధాలేమీ ఉండవు, లేదో దీని సంగతి తేల్చుకోవాల్సి ఉంటుంది, ఎలా అదుపులోకి తేవాలో నిర్ణయిస్తాం అన్నాడు. ఈ సమావేశం జరిగిన తరువాత మార్చి ఎనిమిదవ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెల రోజుల తరువాత అమెరికా జోక్యం గురించి ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే తన మద్దతుదారులతో సభలో చెప్పాడు.


అమెరికా సిఐఏ కుట్ర ప్రకారం సాకులు చూపి పాక్‌ చరిత్రలో తొలిసారి ఒక ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి 2022 ఏప్రిల్లో ఖాన్ను పదవి నుంచి తొలగించారు. పిటిఐ పార్టీలో అంతర్గత ఎన్నికలు తమకు సంతృప్తి కలిగే విధంగా నిర్వహించలేదని సాధారణ ఎన్నికల్లో పోటీకి ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసింది, ఎన్నికల చిహ్నం క్రికెట్‌ బాట్‌ను స్థంభింప చేసింది. దాంతో ఆ పార్టీ అభ్యర్ధులందరూ స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులతో పోటీ చేయాల్సి వచ్చింది. వారంతా పార్లమెంటులో మరొక కొత్త పార్టీ పేరుతో ఒక బృందంగా ఏర్పడతారా, ఏం జరుగుతుందో తెలియని స్థితి. వారిని చేర్చుకొనేందుకు ప్రధాన పార్టీలు ప్రలోభాలు, బెదరింపులకు పాల్పడుతున్నట్లు వార్తలు. పాక్‌ నిబంధనల ప్రకారం వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం పార్టీలకు నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. పిటిఐ ప్రస్తుతం ఒక పార్టీగా గుర్తింపు లేనందున దానికి వచ్చే అదనపు సీట్లేమీ ఉండవు. గత ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించి 336కు గాను 149 సీట్లను కైవశం చేసుకుంది.ఈ సారి ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీకి అవసరమైన 169 సీట్లను తెచ్చుకొనే పరిస్థితి లేదు. ముస్లింలీగ్‌, పీపుల్స్‌ పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్‌ ఏర్పాటుకు పూనుకున్నట్లు వార్తలు. డెబ్బయి ఒక్క సంవత్సరాల ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడు కేసుల్లో 31 సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదేండ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదనే అనర్హతను కూడా కోర్టు ప్రకటించింది.


ఈ పూర్వరంగంలో జరిగిన ఎన్నికలు ఎంత ప్రహసనంగా సాగిందీ అర్ధం చేసుకోవచ్చు. ఓట్ల రిగ్గింగు, లెక్కింపును సాగదీశారని, 24 చోట్ల గెలిచినట్లు ప్రకటించిన వారికి వచ్చిన మెజారిటీ కంటే చెల్లవని ప్రకటించిన ఓట్లే ఎక్కువని తేలింది. వాటిలో 13 సీట్లు ముస్లింలీగ్‌కు, ఐదు పీపుల్స్‌ పార్టీ, నాలుగు చోట్ల పిటిఐ-స్వతంత్రులు, మరోరెండు చోట్ల ఇతర స్వతంత్రులు గెలిచారు.ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ 91 మంది పిటిఐ మద్దతుదార్లు గెలిచారంటే పాక్‌ ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, మిలిటరీ, న్యాయవ్యవస్థ కుట్రలను వ్యతిరేకిస్తున్నారని, అన్నింటికీ మించి ముఖ్యంగా యువత అమెరికా పట్ల వ్యతిరేకతను వెల్లడిస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అనేక విదేశీ మీడియా సంస్థలు వెల్లడించిన అభిప్రాయం కూడా ఇదే. ఈ అక్రమాల గురించి పిటిఐ మద్దతుదార్లు, సాధారణ ప్రజానీకం ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత 21రోజుల్లోపు(ఫిబ్రవరి 29) కొత్త పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంది. అంతకు ముందే కూడా ఏర్పాటు కావచ్చు. తొలుత స్పీకర్‌ ఎన్నిక ,తరువాత సభా నేత ( ప్రధాని )ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. సాధారణ మెజారిటీ 169 ఓట్లు తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ మేరకు రాకపోతే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య మరోసారి ఎన్నిక నిర్వహిస్తారు. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం, మార్చినెల ఒకటిన స్పీకర్‌, రెండవ తేదీ ప్రధాని ఎన్నిక జరుగుతుంది. తరువాత సెనెట్‌ ఎన్నికలు జరుగుతాయి.


1985లో పార్టీ రహిత ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారందరినీ స్వతంత్రులుగా పరిగణించారు. తరువాత అత్యధికులు తాము పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ అనే పార్టీగా ఏర్పడినట్లు ప్రకటించుకున్నారు. తరువాత ఆ పార్టీలో చీలికలు వచ్చాయి.ఇప్పుడు కూడా పిటిఐ మద్దతుతో గెలిచిన స్వతంత్రులు ఏదో ఒక పార్టీ పేరుతో ఏర్పడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.ఒక వేళ అలా ఏర్పడితే ప్రభుత్వం వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మందిని అకర్షించేందుకు ప్రధాన పార్టీలు బేరసారాలు, బెదిరింపులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పార్లమెంటు సమావేశం నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తరువాత మూడు రోజుల్లో స్వతంత్ర అభ్యర్ధులు పార్టీలను ఎంచుకోవచ్చు. తరువాత పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషాలో నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. తరువాత అసెంబ్లీ సమావేశం జరుగుతుంది.

నాడు రోడ్లపై మేకులు – నేడు రైతులను బందెల దొడ్లో పెట్టాలన్న కేంద్రం ! వీపులు పగలగొట్టి అడ్డుకోవాలన్న పోలీసు బాస్‌ !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మరోసారి రైతులు ఢిల్లీబాట పట్టారు.వారిని ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు బిజెపి సర్కార్‌ పూనుకుంది. అనేక చోట్ల రైతుల మీద బాష్పవాయువు, లాఠీ ఛార్జీ జరిపారు, అడుగడుగునా హర్యానా బిజెపి ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాలలో కూడా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎన్‌పి-రాజకీయ రహిత) పిలుపు నిచ్చింది. గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి విడిపోయిన వారు, గత ఆందోళనకు దూరంగా ఉన్న కొని సంఘాలు తాజా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గతంలో రైతులు ఢిల్లీలో ప్రవేశించి తమ డిమాండ్ల మీద నిరసన తెలుపకుండా అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు, కాంక్రీటు దిమ్మలను ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ తీరు తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో ఉన్న బవనా స్టేడియంను బందెల దొడ్డిగా మార్చి రైతులను అందులో నిర్బంధించేందుకు అవకాశమివ్వాలని మంగళవారం నాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. రైతుల ఆందోళన వలన రోడ్లు, రైలు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతాయి గనుక రైతుల మీద చర్యలు తీసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అరవింద్‌ సేత్‌ అనే లాయరు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు..రైతులు న్యూసెన్సు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు బలవంతంగా నగరంలోకి అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరింది. ఇలాంటి వారు అదే రైతులకు కనీస మద్దతు ధరల కోసం వేసిన కమిటీ నివేదికను వెంటనే ఇప్పించి రైతులు ఆందోళనకు దిగకుండా చూడాలని కేంద్రం మీద ఎలాంటి వాజ్యాలు ఇంతవరకు దాఖలు చేయలేదు.నోరులేని రైతులను అడ్డుకొనేందుకు పూనుకున్నారు. రైతులు వినకుండా దురుసుగా ముందుకు వస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని, మనం కూడా అదే పద్దతిలో ఉండాలని లేకపోతే వారిని అపలేమని ఢిల్లీ శాంతి భద్రతల స్పెషల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ ఢిల్లీ శివార్లలోని శింఘు సరిహద్దులో పోలీసులతో మైకులద్వారా ప్రకటించారు.మనం ఆత్మరక్షణలో పడనవసరం లేదు, బాష్పవాయువు వదలండి, లాఠీలను ప్రయోగించండి, ఇది ఒక రోజంతా జరగవచ్చు అని కూడా చెప్పారని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఇచ్చిన వార్తలో పేర్కొన్నది. ఎవరైనా అలసిపోతే వారి స్థానంలో వేరొక బృందం వస్తుందని, ఎట్టి పరిస్థితిలోనూ రైతులను నగరంలోకి అనుమతించవద్దని కూడా చెప్పినట్లు తెలిపింది.


రైౖతుల డిమాండ్లు న్యాయబద్దమైనవని అందువలన స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర కోరికను తాము అంగీకరించేది లేదని ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులతో చర్చించి పరిష్కరించాలని కోరింది. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్దమైన హక్కు ప్రతి పౌరుడికీ ఉన్నదని అందువలన రైతులను అరెస్టు చేయటం సరైంది కాదని ఢిల్లీ హౌం మంత్రి కైలాష్‌ గెహలట్‌ చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల మీద నిరసన తెలిపేందుకు మంగళవారం నాడు ఢిల్లీ వస్తున్న రైతులను అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్‌ నుంచి వస్తున్న వారి మీద హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు లాఠీ చార్జి చేశారు. రైతులు అన్నదాతలు, వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించటం పుండు మీద కారం చల్లినట్లే, స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగస్వాములం కాలేమని కైలాష్‌ గెహలట్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.2021లో రైతుల ఆందోళన సందర్భంగా కూడా అదే స్టేడియంను జైలుగా మార్చాలని కోరిన నాటి కేంద్ర ప్రభుత్వ కోరికను అప్పుడు కూడా ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ తిరస్కరించింది.


ఇటీవలనే ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన సూచించిన పద్దతిలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు ప్రకటించేందుకు, వాటికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నది.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరుకోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఆరునెలల తరువాత 2022 జూలై 18న 26 మందితో కమిటీని ప్రకటించారు.దానిలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు.
తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ చెప్పుకున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. దీన్ని సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి కాంగ్రెస్‌ ఏలుబడిలో రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక.ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు.


కేంద్రం ఏర్పాటు చేసిన ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన రమేష్‌ చాంద్‌ నీతిఅయోగ్‌ సభ్యులు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం లేదు.


తాజాగా ఢిల్లీ చలో ఆందోళనకు పిలుపు ఇచ్చి ఎస్‌కెఎం(ఎన్‌పి), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ముందుకు తెచ్చిన డిమాండ్లు పాతవే.ఎవరు పిలుపునిచ్చినా సమర్ధించాల్సినవే.పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులు ఢిల్లీ చేరకుండా హర్యానా పోలీసులు పంజాబ్‌ సరిహద్దులోని పాటియాలా సమీపంలోని షాంభు వద్ద అడ్డుకున్నారు. రైతుల మీద బాష్పవాయు ప్రయోగం చేశారు. కనౌరీ వద్ద లాఠీ ఛార్జి చేశారు.అనేక చోట్ల రోడ్ల మీద పోలీసులు కల్పించిన ఆటంకాలను పక్కకు తొలగించి రైతులు ముందుకు వస్తున్నారని వార్తలు. చర్చలు జరపాలి తప్ప ఢిల్లీ వెళ్ల వద్దని హర్యానా హౌంమంత్రి అనిల్‌ విజి రైతులకు సలహా ఇచ్చారు.రెండుసార్లు కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చారు. రైతులు వారితో మాట్లాడలేదంటే దీని వెనుక ఏదో దురుద్దేశ్యం ఉందని ఆరోపిస్తూ రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని అన్నారు. కనీస మద్దతు ధరలకు అనేక మందితో చర్చలు జరపాల్సి ఉందని, రైతులు కూడా మాట్లాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చెప్పారు. మంగళవారం నాడు ఢిల్లీకి దారితీసే అనేక మార్గాలలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.నగరంలో అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.