సబ్సిడీల ఎత్తివేతపై జర్మన్‌ రైతుల నిరసన, రౌడీ ఆందోళన అన్న మీడియా !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


” ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మరింత సాయం వస్తుందని నేను చెప్పలేను, మీకు మరింత స్వేచ్చ, మీ పనికి మర్యాద కోసం కావాలంటే నేను కూడా మీతో కలసి ఆందోళన చేస్తా , నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడినే ” జనవరి ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్న రైతులతో జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నర్‌ అన్న మాటలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెర్లిన్‌తో సహా అనేక పట్టణాల్లో రోడ్ల మీద ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేస్తున్న అన్నదాతలను రౌడీ రైతులుగా చిత్రించి మీడియా వార్తలకు శీర్షికలిచ్చింది.2024 బడ్జెట్‌తో ప్రారంభించి వ్యవసాయ యంత్రాలు, డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీలను దశలవారీ ఎత్తివేస్తామని జర్మన్‌ ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించింది. సబ్సిడీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో రైతాంగంలో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో ఒకడుగు వెనక్కు వేసి కొత్త వ్యవసాయ యంత్రాలకు పన్ను రాయితీలు ఇస్తాం తప్ప డీజిల్‌ సబ్సిడీలు ఎత్తివేస్తామని చెప్పింది. శాంతించని రైతులు జనవరి మొదటి వారం నుంచి వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారు.పదిహేనవ తేదీన బెర్లిన్‌లో దేశమంతటి నుంచి వచ్చిన 30వేల మంది రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా తరలి వచ్చి ప్రదర్శన చేశారు. దాంతో నగరంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్‌లు, ట్రామ్‌లు నడిచే మార్గాలను మూసివేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా రైతుల నుద్దేశించి మాట్లాడేందుకు మంత్రి ప్రయత్నించగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు ప్రతిపక్ష మితవాద పార్టీలు మద్దతు ప్రకటించటంతో ఇంకేముంది ఆందోళన వెనుక మితవాదులు చేరారు అంటూ మీడియాలో పక్కదారి పట్టించే వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(మన దేశంలో రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఏడాది పాటు చేసిన ఆందోళనను బిజెపి ప్రభుత్వం కూడా ఇలాగే ఉగ్రవాదులతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే). జర్మన్‌ రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద విడిచిన బూట్లు,పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తులున్న డబ్బాలను ప్రదర్శిస్తున్నారు.రైతుల నిరసనలతో కాస్తవెనక్కు తగ్గిన సర్కార్‌ వ్యవసాయ వాహనాల పన్నులను తగ్గించేది లేదని, డీజిల్‌పై పన్నులను దశలవారీ ఎత్తివేస్తామని చెప్పింది. దీన్ని రైతులు అంగీకరించటం లేదు. సోమవారం (జనవరి 22న) ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, తమకు అంగీకారం కానట్లయితే మరోసారి ఆందోళనకు దిగుతామని జర్మనీ రైతు సంఘం ప్రకటించింది.


రైతులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సాకుగా చూపింది. బెర్లిన్‌లో నిరసన తెలిపిన రైతులతో మంత్రి లిండ్‌నర్‌ మాట్లాడుతూ స్కూళ్లు, రోడ్లు, పారిశ్రామిక ఇంథన సబ్సిడీలకు నిధులు అవసరమని చెప్పటంతో రైతులు మరింత ఆగ్రహించారు. దాంతో స్వరం పెంచిన మంత్రి ఐరోపాలో స్వేచ్చకు మరోసారి ముప్పు వచ్చినందున భద్రత నిమిత్తం ఉక్రెయిన్‌ యుద్ధం కోసం నిధులు కావాలని అన్నాడు. ఉక్రెయిన్‌కు నిధులు ఇస్తే ఇచ్చుకోండిగానీ దానికి తమను ఎందుకు బలిపెట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. జర్మనీతో సహా అనేక దేశాల్లో రైతుల ఆందోళనకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక తక్షణ కారణమైంది. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న ధాన్యంతో పోటీ పెరిగిందని, తమకు గిట్టుబాటు కావటం లేదని ఉక్రెయిన్‌ సరిహద్దులో రుమేనియా రైతులు ఆందోళన చేశారు.


అనేక పారిశ్రామిక దేశాల్లో మాదిరి జర్మనీలో రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువ.మన దేశంలో మాదిరి వ్యవసాయం గిట్టుబాటుగాక అప్పులపాలై పురుగుమందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నవారు అక్కడ కూడా ఉన్నారు. అనేక మంది సాగుభూములను వదలి వేశారు.వ్యవసాయం చేసే వారికి జీవిత భాగస్వాములు దొరకటం కూడా సమస్యే. సబ్సిడీ చెల్లించే నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొదవలేదు. వారి నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే సూపర్‌మార్కెట్లు కూడా ప్రపంచ ధరల తీరు పేరుతో ఎప్పటి కప్పుడు మార్చివేస్తుండటంతో రైతులకు ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది.ఐరోపా యూనియన్‌ దేశాలలో సాగు గిట్టుబాటుగాక ప్రతి రోజూ వెయ్యి మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద్ద కమతాలైతేనే సాగు గిట్టుబాటు అవుతుందనే సూత్రీకరణలు పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు చేస్తున్నారు. అది వాస్తవం కాదని అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన దేశంలో కూడా కార్పొరేట్ల లాబీయిస్టులు కొందరు అదే పాట పాడుతున్నారు. పారిశ్రామిక-వర్ధమాన దేశాలలో వ్యవసాయ సంక్షోభ తీరుతెన్నులు భిన్నంగా ఉండవచ్చు గానీ సంక్షోభం మాత్రం వాస్తవం.పూర్తిగా మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే మెరుగైన ధరలు వచ్చి రైతులు లబ్ది పొందుతారని కొందరు చేస్తున్న వాదనలు వట్టి బూటకమని జర్మనీ రైతుల ఆందోళన వెల్లడిస్తున్నది. వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తే యంత్రాలు, డీజిలుపై సబ్సిడీ చెల్లించాలని రోడ్డెక్కాల్సిన అవసరం ఉండేది కాదు. డీజిల్‌ సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా జర్మన్‌ రైతులు ఐదు నుంచి పదివేల యూరోలు( మన కరెన్సీలో ఒక యూరో విలువ 91 రూపాయల వరకు ఉంది) నష్టపోతారని అంచనా.


కార్పొరేట్‌ సాగు మాత్రమే గిట్టుబాటు అవుతుంది అని చెబుతున్నవారు అది అమలు జరుగుతున్న, భారీ కమతాలున్న ధనిక దేశాల్లో ఎందుకు రైతులు ఆందోళనలు చేస్తున్నారో, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నాయో చెప్పాలి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కుదరకపోవటానికి ధనిక దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలపై తలెత్తిన వివాదమే ప్రధాన ఆటంకంగా ఉన్న సంగతి తెలిసిందే. జర్మనీ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో 2010-20 దశాబ్ద కాలంలో 36వేల వ్యవసాయ క్షేత్రాలు మూతపడ్డాయి. పక్కనే ఉన్న ఫ్రాన్స్‌లో 2021డిసెంబరులో విడుదల చేసిన వివరాల ప్రకారం పదేండ్లలో లక్ష మూతపడ్డాయి. ఐరోపా మొత్తంగా 2005 నుంచి 2020 వరకు మొత్తం 53లక్షల వ్యవసాయ క్షేత్రాలు అదృశ్యమయ్యాయి. అంటే కుటుంబ సాగు బడాకంపెనీల చేతుల్లోకి భూమి పోతున్నది. కమతాల్లో భూమి ఎంత ఎక్కువగా ఉంటే సాగు ఖర్చు అంత తక్కువ అని ఒకవైపు చెబుతారు. అమెరికా, ఐరోపాల్లో హెక్టార్ల వంతున సబ్సిడీ చెల్లిస్తున్నారు తప్ప వేరు కాదు.అందుకే చిన్న రైతులకు గిట్టుబాటు కావటం లేదు. అమెరికాలో ప్రత్యక్ష, పరోక్ష సాగు సబ్సిడీలకు గాను 130 పధకాలున్నాయి. ఏడాదికి 30బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ధనిక దేశాల్లో కార్పొరేట్‌ సాగు కూడా సబ్సిడీలు లేకుండా నడవదా లేక ప్రభుత్వాలు వాటికి అప్పనంగా దోచిపెడుతున్నట్లా ? అమెరికాలో గడచిన నాలుగు దశాబ్దాలలో 33 సంవత్సరాలు ఉత్పత్తి ఖర్చు గిట్టుబాటు కాలేదని తేలింది. అందుకే అక్కడ భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. కార్పొరేట్‌ సాగే అలా ఉంటే కుటుంబ సాగు పరిస్థితి చెప్పనవసరం లేదు. మన దేశంలో కూడా ఒక్క పంజాబ్‌లో తప్ప దేశమంతటా ధాన్య రైతులుఉ నష్టపోవటం లేదా ఖర్చులు రావటమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.


ఐరోపా దేశాల్లో పర్యావరణ పరిరక్షణ అంటూ కాలుష్యాన్ని తగ్గించే పేరుతో డీజిల్‌, పురుగుమందులు, ఎరువుల మీద సబ్సిడీల తగ్గింపుకు తీసుకుంటున్న చర్యలు సాగు రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. 2050 నాటికి పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదల నిలిపివేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దానిలో భాగంగా 2030 నాటికి రసాయన పురుగు మందుల వాడకాన్ని 50శాతానికి తగ్గించాలనే నిబంధనలు విధించారు. రైతులను నిరుత్సాహపరిచేందుకు వీటికి ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేస్తున్నారు. వీటితో పాటు ఉక్రెయిన్‌ నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం అనేక దేశాల్లో రైతులను రోడ్ల బాట పట్టిస్తున్నది. నీటి పొదుపు చర్యల పేరుతో బోరు బావుల తవ్వకాన్ని నిషేధించటంతో స్పెయిన్‌ రైతులు అక్రమంగా తవ్వుతున్నారు. బావుల నిబంధనలకు వ్యతిరేకంగా స్పెయిన్‌ రైతులు, నీటి తీరువా ,డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా ఫ్రెంచి రైతులు ఇటీవల కాలంలో ఆందోళన చేశారు. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరిగిన విధంగా ఉత్పత్తులకు పెరగటం లేదు. బీమా ప్రీమియం పెంపు, సబ్సిడీల నిలిపివేతకు నిరసనగా రుమేనియా రైతులు, ట్రక్కు డ్రైవర్లు దేశమంతటా ట్రాక్టర్లు, ట్రక్కులతో రోడ్ల మీద నిరసనలు తెలిపారు.డీజిల్‌పై పన్నులు తగ్గించాలని, రుణాల వసూలు వాయిదా వేయాలని, సబ్సిడీలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. మొక్కజన్నలపై సబ్సిడీ ఇవ్వాలని, పన్నులు పెంచరాదని పోలాండ్‌ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళన విరమించారు.


జర్మనీలో ఆందోళన చేస్తున్న రైతులకు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మితవాద ఎఎఫ్‌డి పార్టీ మద్దతు ఇస్తున్నది. దాన్ని చూపి నయా నాజీలు, మితవాదులు రైతులను రెచ్చగొడుతున్నారని, ఆందోళన వారి చేతుల్లోకి పోతోందని జర్మన్‌ పాలక కూటమి ఆరోపించింది. తమ డిమాండ్లకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తామని రైతులు చెబుతున్నారు. అనేక దేశాల్లో ఎన్నికలు జరగనుండటంతో మితవాద శక్తులు మౌనంగా ఉండవు. అధికారపక్షాల మీద వ్యతిరేకతను సహజంగానే రెచ్చగొడతాయి. పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకుంటే వాటికి అలాంటి అవకాశం రాదు. ఉదారవాద పాలకపార్టీల వైఫల్యం అనేక దేశాల్లో మితవాద పార్టీలు అధికారానికి రావటం లేదా సవాలు చేసే స్థితికి ఎదిగాయి. వాటిని ఎదుర్కోవాలనటంలో ఎలాంటి పేచీ లేదు గానీ ఆ బూచిని చూపి న్యాయమైన డిమాండ్లను తిరస్కరిస్తే జనాన్ని ఆ శిబిరంలోకి నెట్టినట్లే. తాము అధికారానికి వస్తే సాగు సబ్సిడీలను తగ్గిస్తామని పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నది. అయితే ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహంతో కొందరు రైతులు ఆ పార్టీవైపు కూడా మొగ్గుచూపవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాటలకు అర్ధం ఇదే.

ఇంటా బయటా కులవివక్ష : ఉడిపి పెజావర్‌ మఠ స్వామి, టీవీ యాంకర్‌పై ఫిర్యాదు !

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కుల వివక్ష మహమ్మారి కొంతకాలం క్రితం వరకు మన దేశానికే సొంతం, ప్రత్యేకం. ఇప్పుడు ”విద్యావంతులు” దాన్ని అంతర్జాతీయం గావించారు. దాన్ని పాటించేవారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ పిచ్చి తుమ్మలా విస్తరిస్తోంది. దాన్ని నిరసించే వారు ఎక్కడ తలెత్తితే అక్కడ ప్రతిఘటన, బెదిరింపులు ఎదురవుతున్నాయి. డిసెంబరు 27న కర్ణాటకలోని సువర్ణ కన్నడ టీవీ కార్యక్రమంలో అయోధ్యలోని రామాలయంలోపల దళితులు పూజలు నిర్వహించవచ్చా అనే చర్చ జరిపారు. జనవరి పన్నెండున బెంగలూరులో ” బిఆర్‌ అంబేద్కర్‌ దండు(సేన) ” అనే సంస్థ దానిలో పాల్గన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ, ఉడిపి పెజావర్‌ మఠ స్వామీజీ విశ్వప్రసన్న తీర్ధ, టీవీ యాంకర్‌ అజిత్‌ హనుమక్కనావర్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని మీద ఎఫ్‌ఐఆర్‌ దాఖలైందీ లేనిదీ తెలియదు. సువర్ణ టీవీ చర్చలో నాగరాజ్‌ అనే ఒక దళిత సంస్థ ప్రతినిధి అయోధ్య రామాలయం పూజల్లో దళితులను చేర్చలేదని ఆందోళన వెలిబుచ్చారు. దాని మీద స్వామి స్పందిస్తూ ఒక్క కాశీ ఆలయంలో తప్ప ఒక దేవాలయంలో పూజకోసం నియమించిన ఒక్కరు మాత్రమే చేస్తారని ప్రతి ఒక్కరూ చేయరని అన్నారు. ఒక్క దేవాలయమే కాదు, ఉదాహరణకు ఏ కార్యాలయం లేదా సంస్థలో నిర్దేశిత స్థానంలో ఒక్కరే ఉంటారు తప్ప ప్రతి ఒక్కరూ కూర్చోరని, నియమిత వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. అయోధ్యలో వంతుల వారీ పూజలు ఎందుకు చేయకూడదని నాగరాజు ప్రశ్నించారు.” ఇప్పటి వరకు పూజలు నిర్వహిస్తున్న సామాజిక తరగతి మాత్రమే భవిష్యత్‌లో కూడా చేస్తుందని, ఇతరులు చేయకూడదని అన్నారు. సంప్రదాయాలను మార్చకూడదా అన్న దానికి ఈ ప్రశ్న దేవాలయాలు, ధార్మిక సంస్థల గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారని స్వామి ఎదురు ప్రశ్నించారు.
లౌకిక నిబంధనలు మతప్రదేశాలకు వర్తించరాదని, రెండింటినీ కలగా పులగం చేయరాదని టీవీ యాంకర్‌ అజిత్‌ వాదించారు.” మీరు శబరిమల ఆలయానికి వెళ్లాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి, వాటిని పాటించకుండా వెళ్లాలంటే ఎలా ? కొన్ని ఇళ్లలో మీరు బూట్లు వేసుకోవచ్చు, కొన్ని చోట్ల బయట వదలి రావాలన్న నిబంధనలు ఉంటాయి. మీ వంట ఇంట్లో బూట్లు ధరించినట్లుగా ఇతరుల ఇండ్లలో కూడా ధరిస్తామని అంటే అప్పుడు మీరు తర్కబద్దంగా మాట్లాడేవ్యక్తి కానట్లే ” అన్నారు. చర్చలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి ” దళితులు పూజ చేయాలని కోరుకుంటే వారు మంత్రాలు నేర్చుకోవాలి, అఖండ పాండిత్యాన్ని సంపాదించాలి, తరువాత పూజలు చేయాలి ” అన్నారు. అప్పుడు పెజావర్‌ స్వామి మాట్లాడుతూ హిందూయిజంలో దళితులు ప్రత్యేక బృందంగా విడిగా ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దళిత సంఘ ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ దళితులకు ఎక్కడా అవకాశాలు లేవని చెప్పారు. దాని మీద స్వామి మాట్లాడుతూ ” ఒక దళిత సంస్థ నేతగా మీరు ఒక బ్రాహ్మణుడిని అంగీకరిస్తారా ” అని ప్రశ్నించగా అదెలా కుదురుతుందని నాగరాజు అన్నారు.


దళిత సంస్థ అంటే కుల సంస్థ కాదు. దళిత సామాజిక తరగతిలో అనేక కులాలు ఉన్నాయి. అవి వేటికవి తమ కులం గురించి ఏర్పాటు చేసుకున్న సంఘాలకు వేరే కులం వారిని అనుమతించరు. కులవివక్షను ఎదుర్కొంటున్న వారిలో గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు కూడా ఉన్నారు. తీవ్ర వివక్షను దళితులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఉన్న దళిత సంస్థలు ఆ సామాజిక తరగతికి చెందిన వారు మొత్తంగా ఎదుర్కొంటున్న కులవివక్ష, అవమానాలకు, ఉద్యోగ, రిజర్వేషన్లలో చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవి. తమ డిమాండ్లను బలపరిచే ఎవరినైనా తమ నేతలలో ఒకరిగా అంగీకరివచ్చు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాలకు(కెవిపిఎస్‌) నాయకత్వం వహిస్తున్నవారిలో దళితులు కాని వారు కూడా ఉన్నారు. అందువలన పెజావర్‌ స్వామి వేసిన ప్రశ్న సరైందికాదు లేదా తప్పుదారి పట్టించేది కాగా, దానికి సమాధానం చెప్పిన నాగరాజు అవగాహనలో గందరగోళం ఉన్నది. ఇక బిఆర్‌ అంబేద్కర్‌ దండు చేసిన ఫిర్యాదును చూద్దాం. మత ప్రదేశాల్లో మత నిబంధనలను పాటించాలని చెప్పటం ద్వారా దేవాలయాల్లో పూజలు చేసేందుకు దళితులను అనుమతించరని పెజావర్‌ స్వామి, టీవీ యాంకర్‌ చెప్పినట్లయిందని, తద్వారా వారు అంటరానితనాన్ని పాటించాలని చెప్పటమేనని, అలాంటి ప్రకటనలు రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ, లౌకికత్వానికి విరుద్దమని, సంప్రదాయం అనే పదాన్ని ఉపయోగించటం దళితులను అణచివేయటం, ఈ చెడు సంప్రదాయాన్ని ప్రశ్నించకుండా అనుసరించాలని చెప్పటమే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. బెంగలూరు హై గ్రౌండ్స్‌ పోలీసులు తమ ఫిర్యాదు అందినట్లు రసీదు ఇచ్చారని ఇంతవరకు(జనవరి 15) ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదని దండు సలహాదారు ఆదర్శ ఆర్‌ ఆయ్యర్‌ చెప్పారు.


గాంగస్టర్‌ చోటా రాజన్‌ కుమార్తె అమెరికా విశ్వవిద్యాలయంలో లోపాలతో ఉన్న కులసర్వే నిర్వహించారని, జార్జి సోరస్‌తో సంబంధమున్న సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తామని పేర్కొన్నట్లు కాషాయ దళం నిర్వహించే ఓపిఇండియా పోర్టల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. గంధపు చెక్కల స్మగ్లర్‌, ఎన్నో హత్యలు చేసిన వీరప్పన్‌ కుమార్తె దివ్యకు తమిళనాడు బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా కాషాయ కండువా కప్పారు. తండ్రి నేరాలు అందుకు అడ్డురాలేదు. గాంగస్టర్‌ చోటా రాజన్‌ ప్రస్తుతం ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ముంబై జైల్లో ఉన్నాడు. రాజన్‌ కుమార్తె అంకిత నికాలజి ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సిన్‌ మిల్‌వాకీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.ఆమె నిర్వహించిన సర్వే వార్త రాసేటపుడు తండ్రి గురించి ప్రస్తావించటం, సర్వేలో పాల్గొన్నవారికి ప్రతి ఒక్కరికి మూడు డాలర్ల వంతున ఇచ్చే సొమ్మును వివాదాస్పాద పాలస్తీనా హక్కుల కోసం, పాలస్తీనా పిలల్ల నిధి, ఇంటర్నేషనల్‌ దళిత్‌ సాలిడారిటీ సంస్థకు(ఐడిఎస్‌ఎన్‌) ఇస్తామని చెప్పారని, ఐడిఎస్‌ఎన్‌కు జార్జి సోరస్‌కు చెందిన ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నిధులు అందిస్తున్నదని, సోరస్‌ భారత్‌లో రంగుల విప్లవం పేరుతో తిరుగుబాటు రెచ్చగొట్టేందుకు చూస్తున్నట్లు ఓపి ఇండియా ఆరోపించింది. ఇది బురదజల్లే వ్యవహారం తప్ప మరొకటి కాదు. అమెరికాలో కులపరమైన వివక్షను ఎదుర్కొన్నవారి అభిప్రాయాలను ఆ సర్వేలో సేకరించేందుకు అవసరమైన ప్రశ్నలను రూపొందించారు. కులవివక్ష ఉందని అంగీకరించేందుకు ఇష్టపడని కాషాయ దళాలకు మింగుడుపడలేదు.


హిందూమతం లేదా హిందూయిజానికి సంబంధించి ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు బ్రిటన్‌లోని లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న హిందూ కౌన్సిల్‌ యుకె(హెచ్‌సియుకె) అనే సంస్థ బెదిరింపులకు దిగింది. డిసెంబరు నెలలో లిసెస్టర్‌ సెక్యులర్‌ సొసైటీ(ఎల్‌ఎస్‌ఎస్‌) ” హిందూయిజం : అనైతిక తుచ్చ ఆవరణము ” అనే పేరుతో ఒక ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది.హిందూయిజ వైఫల్యాలను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించే అంశమిది. అసలు పేరులోనే హిందువుల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే అంశం ఉందని, దీని గురించి స్థానిక హిందువులు, అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెసియుకె సంస్థ ఒక ఇమెయిల్‌ ద్వారా నిర్వాహకులను బెదిరించింది. మతం గురించి లోతుగా, స్వేచ్చగా చర్చించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, వివక్ష పద్దతులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎల్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నెడ్‌ న్యూయిట్‌ ప్రతి లేఖలో స్పష్టం చేశాడు.కుల వ్యవస్థలో వివక్ష అంతర్లీనంగా ఉందని, మతం-వివక్షకు ఉన్న సంబంధాలను తెలుసుకొనేందుకు ఆసక్తితో ఉన్నామని పేర్కొన్నాడు. బ్రిటన్‌లో యాభై నుంచి రెండు లక్షల మంది వరకు తక్కువ కులాలుగా పరిగణించబడేవారు ఉన్నారని, వారంతా వివక్ష, వేధింపులకు గురౌతున్నట్లు ఎల్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్నది. 2017లో బ్రిటన్‌ ఆమోదించిన సమానత్వ చట్టంలో కులపరమైన వివక్ష వ్యతిరేక అంశాలున్నాయి. దీన్ని హిందూ కౌన్సిల్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.దీని వలన దళితులు ఉన్నత కులాల వారి మీద ప్రతీకారం కోరే అవకాశం ఉందని వాదించింది. డిసెంబరు ఆరవ తేదీన ఆ ప్రసంగ కార్యక్రమం జరిగింది. దానికి నిరసన తెలిపేందుకు ఎవరూ రాలేదు. ప్రశాంతంగా ముగిసింది.


హిందూమతం, దాన్ని అనుసరించే సమాజంలో కొంత మంది పాటించే అంటరానితనానికి దూరంగా ఉండేందుకు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ, బౌద్ద మతం పుచ్చుకున్న చరిత్ర తెలిసిందే. తెలుగు ప్రాంతాల్లో క్రైస్తవ మతం పుచ్చుకున్నవారిలో దళితులు, కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ తదితర కులాల వారు ఉన్నారు. మతం ఒక్కటే అయినా సామాజిక వివక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ కులంవారు ఆ కులంలోనే సంబంధాలు కలుపుకుంటారు తప్ప మరొక విధంగా లేరు. తమిళనాడులోని క్రైస్తవులలో కూడా వివక్ష కొనసాగుతున్నట్లు జనవరి రెండ వారంలో ఒక పుస్తక విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. నివేదిత లూయీస్‌ అనే రచయిత క్రీస్తువతిల్‌ జాతి( క్రైస్తవంలో కులం) అనే పుస్తక విడుదల కార్యక్రమంలో విసికె పార్టీ ఎంపీ తిరుమవలన్‌ మాట్లాడుతూ భారత్‌లో క్రైస్తవం కుల వేళ్లను పెంచి పోషించింది తప్ప క్రైస్తవ విలువలను కాదని విమర్శించారు. క్రైస్తవులుగా మారినా తమ కుల గుర్తింపును వదులుకొనేందుకు సిద్దంగా లేరని అందుకే క్రైస్తవ నాడార్లు, ముదలియార్లు, రెడ్డియార్లు,యాదవులు కనిపిస్తున్నారని అన్నారు.చర్చి వ్యవస్థలో కూడా దళితులు, ఇతర కులాల వారి మధ్య తేడాలు ఉన్నాయన్నారు. సామాజిక న్యాయ గడ్డగా పిలుస్తున్న తమిళనాడులో కులపరమైన దాడుల పట్ల ప్రభుత్వ స్పందన ఉపేక్షతో కూడి ఉందని, పౌరసమాజం మౌనంగా ఉందని జనవరి ఆరవ తేదీన చెన్నరులో జరిగిన ఒక సభలో వక్తలు పేర్కొన్నారు.దళిత్‌ ఇంటెలెక్చ్యువల్‌ కలక్టెవ్‌(డిఐసి) పేరుతో ఒక రోజు పాటు సాగిన వర్క్‌షాప్‌లో రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆ సామాజిక తరగతికి చెందిన పలువురు పాల్గొన్నారు.అనేక పత్రాలను సమర్పించారు. పద్దెనిమిది డిమాండ్లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు అందచేయాలని నిర్ణయించారు. దళితుల మీద జరిగిన దాడుల మీద తీసుకున్న చర్యలతో శ్వేత పత్రం విడుదల చేయాలని, అన్ని పార్టీలతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, పేర్లకు ముందు,వెనుక కుల గుర్తింపు లేకుండా చూడాలని, అన్ని స్థాయిల్లో ఉన్న అధికార యంత్రాంగానికి వివక్షకు దూరంగా ఉండాల్సిన పద్దతుల గురించి వివరించాలని, కేరళలో మాదిరి కులాంత వివాహాలు చేసుకున్న వారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలని తదితర అంశాలు వాటిలో ఉన్నాయి.


జైళ్లలో ఖైదీల పట్ల కులవివక్ష పాటించటం గురించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, జెబి పార్థీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జైళ్ల నిబంధనల్లోనే వివక్ష ఉందని, బలవంతంగా చాకిరీ చేయిస్తున్నారని పిటీషనర్‌ జర్నలిస్టు సుకన్య శాంత పేర్కొన్నారు. తమిళనాడులోని పాలయం కొట్టారు సెంట్రల్‌ జైలులో థేవర్లు, నాడార్లు, పాలార్లకు ప్రత్యేక బ్లాకులు ఉన్నాయని, పశ్చిమ బెంగాల్లో అగ్ర కులాలకు చెందిన ఖైదీలు వంట విధులకు, పారిశుధ్యం వంటి వాటికి ఫలానా కులం వారనే నిబంధనలు ఉన్నాయని, అదే విధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న లోపాలు, వివక్ష గురించి కూడా పిటీషన్‌లో పేర్కొన్నారు.

తిరిగి చైనా పెట్టుబడులు : తొలి సంకేతాలు పంపిన భారత్‌ !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్‌-చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్‌ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి) కేంద్రశాఖ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చెప్పినట్లు, నాలుగేండ్లనాటి అంక్షల ఎత్తివేతకు ఇది సూచిక అని జనవరి పద్దెనిమిదవ తేదీన రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు అంతర్జాతీయ, జాతీయ మీడియా ఎంతో ప్రాధాన్యతనిచ్చింది.దవోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాజేష్‌ కుమార్‌ సింగ్‌ వెళ్లారు. అక్కడ రాయిటర్స్‌ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వార్త చైనాతో సత్సంబంధాలు కోరుకొనే పౌరులు, లబ్దిపొందాలని చూస్తున్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఆశలు రేకెత్తించేదైతే , కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులకు మింగుడుపడనిదే. అయితే వెంటనే ఏదో అయిపోతుందని అనుకోనవసరం లేదు గానీ నరేంద్రమోడీ సర్కార్‌ మీద దేశీయ కార్పొరేట్‌ శక్తుల నుంచి వస్తున్న వత్తిడికి కూడా ఇది సూచికే. దిగుమతులను అనుమతించుతున్నట్లుగానే పెట్టుబడులను కూడా అంగీకరించకతప్పనట్లు కనిపిస్తోంది.


2020లో జరిగిన గాల్వన్‌లోయ వివాదాల తరువాత మన సరిహద్దులలో ఉన్న దేశాల పెట్టుబడులను తనిఖీ చేయకుండా అనుమతించరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి పరోక్షంగా చైనా పెట్టుబడులను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం.ఎందుకంటే మన నుంచి తీసుకొనేవే తప్ప మరొక సరిహద్దు దేశమేదీ మనకు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేదు. అనేక మంది నోటితుత్తర జనాలు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చినప్పటికీ మన దిగుమతిదారులు వాటిని ఖాతరు చేయకుండా రికార్డులను బద్దలు కొట్టి మరీ దిగుమతులు చేసుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సరిహద్దు ఉదంతాల తరువాత రెండు దేశాల వాణిజ్యం 32శాతం పెరిగింది. నాలుగేండ్లుగా చైనా పెట్టుబడులు, అంతకు ముందు ప్రతిపాదనలు ఏ మాత్రం ముందుకు సాగలేదు.” ఒకసారి మా సంబంధాలు, సరిహద్దు సమస్యలు స్థిరపడితే మార్పు రావచ్చు. పరిణామాలు సక్రమంగా ముందుకు పోతే పెట్టుబడుల అంశంలో కూడా సాధారణ లావాదేవీలను పునరుద్దరించవచ్చని నేను చెప్పగలను. సరిహద్దులను ఎవరైనా కొద్ది కొద్దిగా అక్రమించుకుంటూ ఉంటే మనమేమీ చేయలేం, అటువైపు నుంచి పెట్టుబడులకు ఎర్రతివాచీ మర్యాదలు జరపలేము ” అని రాజేష్‌ కుమార్‌ చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ పెట్టుబడుల విషయంలో ఒక అడుగు వెనక్కు వేసి ఆటంకాలను తగ్గించినట్లు చెప్పారు. ” గతేడాది కాలంగా ఎలాంటి ఉదంతాలు లేవు గనుక సాధారణ ఆశ కనిపిస్తోంది, పరిణామాలు స్థిరపడతాయి, మెరుగుపడతాయి అనుకుంటున్నాను. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరి అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల సమీక్షకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులకు స్వాగతం పలకాలనే పరిస్థితిని కొనసాగించాలని భారత్‌ కోరుకుంటున్నదని రాజేష్‌ కుమార్‌ చెప్పారు.


2020లో గాల్వన్‌ లోయలో జరిగిన పరిణామాల తరువాత చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. 2022లో రెండు సార్లు స్వల్ప ఘర్షణలు తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు.చర్చలతో ఒక అవగాహనా కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మనవైపున 50వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనల గురించి పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. రెండువైపులా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్దీ జరుగుతున్నది. గాల్వన్‌ ఉదంతాలకు ముందు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనా సైనికులు మన వైపు చొచ్చుకు రావటం, మనవారు అటువైపు వెళ్లటం జరిగినప్పటికీ చేతులతో నెట్టుకోవటం తప్ప ఆయుధాలను ఉపయోగించలేదు. సగటున ఏడాదికి ఐదు వందల సార్లు చైనీయులు అతిక్రమిస్తున్నట్లు మన అధికారులు గతంలో వెల్లడించారు. ప్రతి ఉదంతమూ మీడియాలో రాదు. 2015లో చైనా వైపు నుంచి 428సార్లు అతిక్రమణలు జరగ్గా అవి 2019నాటికి 663కు పెరిగాయి. మనవైపు నుంచి జరిగేవి చైనా వారు చెబుతారు తప్పమనం చెప్పుకోం.


నరేంద్రమోడీ తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన తరువాత, షీ జింపింగ్‌ మన దేశాన్ని తొలిసారి సందర్శించనున్న తరుణంలో 2014లో సెప్టెంబరు 16న లడఖ్‌ తూర్పు ప్రాంతంలోని చుమార్‌ గ్రామ సమీపంలో చైనా ఒక రోడ్డు నిర్మిస్తుండగా అది తమ ప్రాంతమంటూ మన సైనికులు అడ్డుకొన్నారు. ప్రతిగా దానికి సమీపంలోని డెమ్‌చోక్‌ వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను చైనా మిలిటరీ అడ్డుకుంది. ఇలా రెండు దేశాల దళాలు 16 రోజుల పాటు మోహరించి తిష్టవేశాయి. చివరికి ఉన్నత స్థాయి చర్చల తరువాత ఉభయపక్షాలూ వెనక్కు తగ్గాయి. రోడ్డు నిర్మాణాన్ని చైనా విరమించుకుంటే దానికి ప్రతిగా మనదేశం పరిశీలక కేంద్రాన్ని కూల్చివేసేందుకు, బంకర్ల నిర్మాణాన్ని నిలిపివేసేందుకు అంగీకరించింది. తరువాత 2015లో లడఖ్‌ ఉత్తర ప్రాంతంలోని బర్టసే అనే గ్రామం వద్ద చైనా మిలిటరీ నిర్మించిన ఒక పరిశీలన కేంద్రాన్ని ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు కూల్చివేశారు. దాంతో చైనా మిలిటరీ రాగా పోటీగా మన సైనికులు కూడా వెళ్లటంతో వారం రోజుల వివాదం తరువాత ఇరుదేశాల స్థానిక మిలిటరీ అధికారులు సర్దుబాటు చేశారు.తరువాత రెండు దేశాల మిలిటరీల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు పన్నెండు రోజుల పాటు సంయుక్త మిలిటరీ విన్యాసాలు జరిపారు. చైనా-భూటాన్‌ మధ్య సరిహద్దు సమస్యలున్నాయి. వాటిలో డోక్లాం ఒకటి. ఆ ప్రాంతం మన దేశంలోని సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంటుంది. డోక్లాంలో చైనా మిలిటరీ రోడ్లు, తదితర నిర్మాణాలను చేపట్టడంతో అంతకు ముందు భూటాన్‌ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మన దేశం జోక్యం చేసుకొని చైనాను నిలువరించింది.2017లో 73 రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. తరువాత సద్దుమణిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా మన ప్రధాని నరేంద్రమోడీ ఊహాన్‌ నగరానికి వెళ్లినట్లే చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మహాబలిపురం వచ్చారు. రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.


1962లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు సరిహద్దు వివాదం, చిన్న చిన్న ఘర్షణలు అడ్డం రాలేదు. కొంతకాలం ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలు ఏర్పడ్డాయి.గాల్వన్‌ ఉదంతం నిస్సందేహంగా మరోసారి సంబంధాలను దెబ్బతీసింది. తరువాత పెద్ద ఉదంతాలేమీ జరగలేదు గనుక సీనియర్‌ అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ ఆలోచనాధోరణి కనిపిస్తున్నది. చైనా తన వస్తువులను తక్కువ ధరలకు మనదేశంతో సహా ప్రపంచంలో కుమ్మరిస్తున్నదని కొంత మంది నిరంతరం ఆరోపిస్తుంటారు. అలాంటి వివాదాలను, సమస్యలను పరిష్కరించటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది.చైనా మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అనేక దేశాలు అనుకుంటున్నట్లుగానే మనదేశంలో కూడా కొందరు సూచిస్తున్నారు. తప్పేమీ లేదు. చైనా బదులు ప్రపంచం మన మీదే ఆధారపడే విధంగా చేస్తానని ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర పిలుపులు ఇచ్చారు. మంచిదే, ఎవరూ కాదనటం లేదు.కానీ కొంత కాలానికి మనదేశం మీద ఆధారపడకూడదని ఇతర దేశాలు అనుకోవన్న గ్యారంటీ ఏమిటి? అసలు సమస్య అది కాదు. ఏ దేశానికి ఆదేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్దమయ్యే పరిస్థితి వచ్చేంత వరకు పరస్పరం ఆధారపడక తప్పదన్నది వాస్తవం.


అనుభవమైతే గానీ తత్వం తలకెక్కదంటారు పెద్దలు. గాల్వన్‌ ఉదంతం తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక ప్రచారం, వస్తు బహిష్కరణ పిలుపుల సంగతి, చైనాతో విడగొట్టుకోవాలన్న స్థానిక, అంతర్జాతీయ పెద్దల సలహాలు ఎరిగినవే. అయినప్పటికీ చైనా నుంచి దిగుమతులలో ఏడాదికేడాది స్వల్పతేడాలుండవచ్చుగానీ పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. చైనాకు మన ఎగుమతులు పెరగటం లేదు.చైనా కంటే ముందు గతంలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌,మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లు మన మార్కెట్‌ను ముంచెత్తాయి.ఇప్పటికీ గణనీయంగానే ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ఎగుమతులు చేశాయన్నది తెలిసిందే. మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు వాటిని ఇక్కడే తయారు చేస్తే అనే ఆలోచన రాలేదనుకుంటే పొరపాటు. అందుకు అనువైన పరిస్థితి మనదేశంలో అప్పుడూ ఇప్పుడూ లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులకూ, ఇప్పుడున్న నరేంద్రమోడీకి అది పట్టలేదు.చౌకగా వస్తూత్పత్తికి అవసరమైన పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేయకుండా వీలుకాదు. అందుకే ఉత్పత్తి కంటే దిగుమతి చేసుకుంటే వచ్చే లాభాలే ఎక్కువని అప్పుడూ ఇప్పుడూ మన కార్పొరేట్‌ శక్తులు భావిస్తున్నాయి. జపాన్‌ కంపెనీలు తమ మార్కెట్‌కోసం మన దేశంలోని స్థానిక కార్పొరేట్లతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేశాయి గనుకనే మారుతీ సుజుకీ, హీరో హౌండా,స్వరాజ్‌ మజడా, వంటి కంపెనీలు రంగంలోకి వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ మోటారు వాహన రంగంలో చైనా ముందుంది.దానితో సంయుక్త భాగస్వామ్యానికి మన పాలకులు అంగీకరిస్తే జపాన్‌ మారుతీ కార్ల మాదిరి చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి.ఇప్పటికిప్పుడు ఆ రంగంలో మనం పోటీపడలేం గనుక ఆ లాభాల కోసం మన కార్పొరేట్లు చైనా పెట్టుబడులను అనుమతించాలని వత్తిడి చేస్తున్నాయా ? ప్రభుత్వం అంగీకరిస్తుందా? దానికి సూచికగానే మన ఉన్నత అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ దవోస్‌లో మాట్లాడారా ? చూద్దాం ఏం జరుగుతుందో !

మధ్య ప్రాచ్య సంక్షోభం : ఎమెన్‌పై అమెరికా,బ్రిటన్‌ దాడులు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో పరిణామాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తమ శత్రువులు, ఇజ్రాయెల్‌ గూఢచార కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉండే నౌకలపై కొనసాగిస్తున్న దాడులను ఎమెన్‌లోని హౌతీ సాయుధులు తీవ్రం చేశారు. వారి మీద అమెరికా, బ్రిటన్‌ ప్రత్యక్షంగా దాడులు చేస్తుండగా పది దేశాలు వాటికి వివిధ రూపాలలో సాయపడుతున్నాయి. గాజాపై యూదు దురహంకారుల మారణకాండ, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు ఇప్పుడున్న బ్రెంట్‌ రకం 78 డాలర్ల నుంచి ఏప్రిల్‌ నాటికి 110 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరు జోశ్యాలు చెబుతున్నారు. తాము పాలస్తీనాకు మద్దతుదార్లమే అనే సంకేతాలు ఇచ్చేందుకు ఎర్ర సముద్రంలో ప్రవేశించే అనేక నావలు చైనా, రష్యా సిబ్బందితో నడుస్తున్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఇవి నిజంగా ఆ దేశాల కంపెనీలకు చెందినవేనా లేక దాడులను తప్పించుకొనేందుకు అలా సూచిస్తున్నాయా అన్నది నిర్ధారణ కాలేదు.ఉత్తర గాజా ప్రాంతంలో పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన ఆహారం, ఔషధాలు,మంచినీరు, ఇతర అవసరాలను అందచేస్తున్న సంస్థలను ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇప్పటివరకు గాజాలో 24వేల మందికి పైగా పౌరులను ఇజ్రాయెల్‌ చంపింది, 61వేల మంది గాయపడ్డారు. తాను గనుక అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితిని ఎంతో వేగంగా చక్కదిద్ది ఉండేవాడినని డోనాల్ట్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు. తాను పదవిలో ఉంటే అసలు ఇజ్రాయెల్‌ దాడే చేసి ఉండేది కాదన్నాడు. అమెరికా చరిత్రలో జో బైడెన్‌ పరమ చెత్త అధ్యక్షుడని వర్ణించాడు.


ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళం (ఐఆర్‌జిసి) సోమవారం నాడు ఇరాక్‌, సిరియాల్లోని శత్రు కేంద్రాలు,స్థావరాలపై ఖండాంతర క్షిపణులతో దాడులు జరిపింది. ఇరాక్‌లోని కర్దిష్‌ పాక్షిక స్వయం పాలిత ప్రాంత రాజధాని ఎర్బిల్‌ నగరంలోని ఇజ్రాయెల్‌ గూఢచార కేంద్రంపై దాడులను కేంద్రీకరించింది.పేలుళ్ల కారణంగా జరిగిన నష్టం గురించి వెల్లడి కాలేదు గానీ ఐదుగురు మరణించినట్లు కర్దిష్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటించింది. ఈనెల ప్రారంభంలో ఇరాన్‌లోని కెర్మెన్‌ పట్టణంలో జరిపిన దాడుల్లో వంద మంది మరణానికి కారకులం తామే అని ఐఎస్‌ఐఎల్‌ ప్రకటించింది. సోమవారం నాడు సిరియాలోని ఆ సంస్థ కేంద్రాలపై ఇరాన్‌ దాడులు చేసింది.సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ పార్టీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ సోమవారం నాడు దీర్ఘశ్రేణి క్షిపణిదాడి జరిపిందని, నిజానికి ఇది ఇజ్రాయెల్‌ను హెచ్చరించటమే అని ఇరాన్‌ మిలిటరీ వ్యవహారాల జర్నలిస్టు మహమ్మద్‌ షల్‌టౌకీ చెప్పాడు. ఆ క్షిపణి పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దాడి జరపలేదని అన్నాడు.తాను తలచుకొంటే నేరుగా ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలను గురిచూసి కొట్టగలనని చెప్పటమే ఇదన్నాడు.హమస్‌ను ఓడించటం జరిగేది కాదని అయినప్పటికీ లక్ష్యాన్ని సాధించాల్సిందేనని ఇజ్రాయెల్‌ న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత యుద్ధ కాబినెట్‌ మంత్రి గిడియన్‌ సార్‌ చెప్పాడు.వంద రోజులుగా జరుపుతున్న దాడుల మీద పెద్ద ఎత్తున వత్తిడి వస్తున్నది. గాజాపై యుద్ధాన్ని సమర్ధిస్తున్నందుకు గాను ఇద్దరు ముఖ్యమైన అధికారులు జో బైడెన్‌కు తమ రాజీనామాలను సమర్పించారు. ఎర్ర సముద్రంలో అమెరికా వస్తురవాణా నౌక ఎంవి జిబ్రాల్టర్‌ ఈగిల్‌పై ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు క్షిపణులతో దాడులు జరిపారు. అది మార్షల్‌ ఐలాండ్స్‌ పతాకంతో ఉంది. పెద్దగా నష్టం లేదని, ప్రయాణం కొనసాగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఎమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ దాడులు జరుపుతున్నాయి. సోమవారం నాడు ఒక విమానాశ్రయం వద్ద పేలుళ్లు వినిపించాయి. ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటామని హౌతీ నేతలు ప్రకటించారు. అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం, ఏడెన్‌ జలసంధికి దగ్గరగా ఉన్న కీలక ప్రాంతం, రాజధాని సనాతో సహా ముఖ్యమైన ప్రాంతాలన్నీ హౌతీ సాయుధుల ఆధీనంలో ఉన్నాయి.తమదే అధికారం అని ప్రకటించుకున్నాయి. ఎమెన్‌పై దాడులను ఆపాలని ఇరాన్‌ ప్రభుత్వం అమెరికా,బ్రిటన్‌లను కోరింది. ఆ దాడులు చట్టవిరుద్దమని ప్రకటించగా తాము ఆత్మరక్షణ కోసం జరుపుతున్నట్లు అమెరికా చెప్పుకుంటున్నది.హౌతీలకు ఇరాన్‌ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఎమెన్‌ అంతర్యుద్ధంలో హౌతీలకు వ్యతిరేకంగా అమెరికా అనుకూల శక్తులకు దాదాపు పది సంవత్సరాలపాటు మద్దతు ఇచ్చిన సౌదీ అరేబియా ఇటీవల ఇరాన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకుంది.దాంతో హౌతీలపై చేస్తున్న దాడులకు సాయాన్ని నిలిపివేసింది. ఈ పరిణామం మింగుడుపడని అమెరికా ఇప్పుడు ఎర్రసముద్రంలో నౌకల రక్షణకు గాను తాము ఎమెన్‌పై దాడులు జరుపుతున్నట్లు సాకు చూపుతున్నది.హౌతీల వెనుక ఇరాన్‌ ఉన్నట్లు ఆరోపిస్తున్నది.


అమెరికా నౌకపై దాడి దానికి ప్రతిగా బ్రిటన్‌తో కలసి అమెరికా దళాలు చేస్తున్న దాడుల తరువాత హౌతీలు ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని ప్రకటించటంతో అమెరికా కూటమి సామర్ధ్యం గురించి విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.సమీప భవిష్యత్‌లో తాము ఎల్‌ఎన్‌జి రవాణా నౌకలను ఎర్ర సముద్రంలోకి పంపే అవకాశం లేదనని కతార్‌ ప్రకటించింది. గురువారం నాటి అమెరికా,బ్రిటన్‌ దాడుల తరువాత ఆ మార్గంలో ప్రయాణించే నౌకలు తగ్గాయి.గత ఆరువారాల్లో హౌతీలు 30సార్లు నౌకలపై జరిపారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను నిలిపివేస్తే తాముకూడా స్వేచ్చగా నౌకల రవాణాను అనుమతిస్తామని ప్రకటించారు. తమ దాడులు ఒక హెచ్చరిక మాత్రమేనని, నిరంతరం కొనసాగిస్తామని చెప్పలేదని బ్రిటన్‌ రక్షణ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ చెప్పాడు.ఐరాస గుర్తింపు పొందిన ఎమెన్‌ ప్రభుత్వం హౌతీలను ఓడించాలంటే తమకు మిలిటరీ ఆయుధాలు, శిక్షణతో పాటు గూఢచార సమాచారాన్ని అందించాలని పశ్చిమ దేశాలను కోరింది. తొమ్మిది సంవత్సరాల పాటు సౌదీ అరేబియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, వైమానిక దళ శక్తి చాలదని మేజర్‌ జనరల్‌ ఇదారస్‌ చెప్పాడు.హౌతీల క్షిపణులు భూగర్భంలో ఉంటాయని వాటిని పసిగట్టటం కష్టమని కూడా చెప్పాడు.ఆదివారం నాడు ఎమెన్‌ పిఎల్‌సి ప్రభుత్వ ప్రధాని మయీన్‌ అబ్దుల్‌ మాలీతో బ్రిటన్‌ రాయబారి భేటీ అయ్యాడు. మరుసటి రోజు తాము ఇజ్రాయెల్‌ను సమర్ధించటం లేదని, పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఎమెన్‌ ప్రకటించింది. తొలిసారిగా ఎమెన్‌పై అమెరికా,బ్రిటన్‌ దాడులకు దిగినప్పటికీ వాటిని ఎదురుదాడులుగా పరిగణించలేమని కొందరు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలో స్వేచ్చగా తమ నౌకలు తిరిగే హక్కుందని స్పష్టం చేయటమే అసలైన లక్ష్యమని చెబుతున్నారు. ఈ దాడులకు ఆస్ట్రేలియా, బహరెయిన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల మద్దతు ఉంది.హౌతీల చరిత్ర చూసినపుడు వారిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని చెబుతున్నారు.అమెరికా యుద్ధ నౌక డెస్ట్రాయర్‌ మీద జరిపిన దాడి తరువాత సోమవారం నాడు అమెరికా వాణిజ్య నౌక మీద హౌతీలు దాడులు జరిపారు. ఎర్ర సముద్రం నుంచి సూయజ్‌ కాలువకు వెళ్లే మార్గంలో కీలకమైన బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధితో సహా ఎమెన్‌ కీలక ప్రాంతాలన్నీ హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఉద్రిక్తతలు మరింత దిగజారకుండా చూడాలని జో బైడెన్‌ పైకి చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌కు ఆయుధాలు పంపేందుకు ఇప్పటికి రెండు సార్లు అమెరికా పార్లమెంటును పక్కన పెట్టి తన అధికారాలను వినియోగించాడు. రానున్న రోజుల్లో ఎమెన్‌ మీద దాడులు జరిపితే పరిస్థితి విషమించవచ్చు.


విశ్లేషకుల అంచనాలు తప్ప వచ్చు, పోరు తమకు లాభం చేకూర్చుతుందని అమెరికా, దాని మిత్ర దేశాలు భావిస్తే ఆ ప్రాంతాన్ని యుద్ధ రంగంలోకి లాగవచ్చు. అదే జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచ కంటెయినర్‌ రవాణా 30, పన్నెండుశాతం ప్రపంచ వాణిజ్యం ఎర్ర సముద్రంగుండా జరుగుతున్నది. ఐరోపాతో మన దేశ వస్తువాణిజ్యం 80శాతం ఈ మార్గం నుంచే ఉంది. రవాణా వ్యయం పెరిగి మనం చేసుకొనే దిగుమతుల ఖర్చు పెరిగితే వాటిని మనజనం మీద మోపుతారు. అదే మన ఎగుమతుల రవాణా ఖర్చు పెరిగితే వాటిని కొనేవారు లేకపోతే పరిస్థితి ఏమిటన్నది సమస్య. ఇప్పటి వరకైతే ఎలాంటి సమస్య లేదు గానీ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. నవంబరు మధ్య నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించాల్సిన నౌకలలో 95శాతం ఆఫ్రికాలోని గుడ్‌ హౌప్‌ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దీని వలన నాలుగు నుంచి ఆరువేల నాటికల్‌ మైళ్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి రావటం, 14 నుంచి 20రోజులు అదనపు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్‌ దాడులను కొనసాగించినంతకాలం హౌతీల దాడులు కొనసాగుతూనే ఉంటాయి. అదే జరిగితే ప్రపంచ ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చని ఆరు నుంచి ఎనిమిది మిలియన్ల పీపాల సరఫరాలోటు ఏర్పడవచ్చని అక్టోబరు చివరిలో ప్రపంచ బాంకు హెచ్చరించింది.ఫలితంగా 56 నుంచి 75శాతం వరకు ధరలు పెరిగి 140 నుంచి 157 డాలర్ల వరకు పీపా ధర పెరగవచ్చని పేర్కొన్నది. అయితే చమురు వ్యాపారులు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పీపాధర 110 డాలర్లవరకు పెరగవచ్చనే అంచనాతో 30 మిలియన్ల పీపాల మీద పందెంకాశారు.( అంతకంటే తక్కువ ధర ఉంటే వారు చెల్లిస్తారు ఎక్కువ ఉంటే ఇతరుల నుంచి తీసుకుంటారు.చమురు చేతులు మారదు) దీనికి ప్రధాన కారణం ఇరాన్‌ పూర్తి మద్దతు ఉన్న హౌతీ సాయుధుల చర్యలే. అదే విధంగా మే, జూన్‌ మాసాల్లో 130 డాలర్లు ఉండవచ్చని కూడా పందెం కాస్తున్నారు. మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఈ ఏడాది ఆరునెలల్లో వంద డాలర్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో పెద్ద పరిణామాలేవీ జరగకపోవచ్చని అనేక మంది చెబుతున్నారు. డిసెంబరులో రాయిటర్స్‌ సర్వేలో 34 మందిలో ఒక్కరే ఈ ఏడాది 90 డాలర్లకంటే ఎక్కువ ఉండవచ్చని చెప్పారు.అమెరికా, ఇతర పశ్చిమదేశాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా మొత్తం మీద పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.తమ మీద దాడులు జరిగిన తరువాత కూడా అమెరికా నౌకల మీద హౌతీలు దాడులు చేశారు. ఇవి ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

అయోధ్య రామాలయ వివాదం : ఎరక్కపోయి ఇరుక్కున్న గాయని చిత్ర ! శంకరాచార్యలపై కేంద్ర మంత్రి ధ్వజం !!

Tags

, , , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు వివాదాలు కూడా కొనసాగేట్లున్నాయి. మతాన్ని, విశ్వాసాలను పాటించేవారు మౌనంగా ఉండగా ఓట్ల కోసం రాముడిని ముందుకు తెచ్చిన రాజకీయ కుహనా హిందూత్వవాదులదే పైచేయి కావటం ప్రత్యేకత. తెలిసిగానీ తెలియకగానీ చేసిన ప్రకటనలతో సుప్రసిద్ద గాయని చిత్ర తాజాగా సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ట జరిగే 12.20ని సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ సంకీర్తన జరపాలని, జ్యోతులను వెలిగించాలని, లోకసమస్తా సుఖినోభవంతు అంటూ గాయని చిత్ర సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు, విడుదల చేసిన వీడియోలో కోరారు.దీని మీద అనేక మంది అనుకూలంగానూ వ్యతిరేకంగానూ స్పందించారు. బిజెపి నేతలు కేరళ ప్రభుత్వం మీద, కమ్యూనిస్టుల మీద దాడికి ఉపయోగించుకున్నారు. వామపక్ష పాలిత రాష్ట్రంలో అసహనానికి ఇది నిదర్శనమంటూ ఆరోపించారు. సామాజిక మాధ్యమం మీద కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి గానీ ఎలాంటి నియంత్రణ, అధికారం లేదు. వామపక్షాలు, పురోగామి భావాలకు వ్యతిరేకంగా సంఘపరివార్‌, బిజెపి నేతల స్పందనలు అదే సామాజిక మీడియా, సంప్రదాయ మీడియాలో చోటు చేసుకుంటున్నాయంటే అసహనం, వ్యతిరేకత ఉంటే కుదిరేదా ? తన మీద వచ్చిన విమర్శలు లేదా ప్రశంసల గురించి గానీ ఇది రాస్తున్న సమయానికి చిత్ర వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.


భావ వ్యక్తీకరణ హక్కులో భాగంగా ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఏమైనా చెప్పవచ్చు. ఆ రీత్యా చూసినపుడు చిత్ర తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే భావ వ్యక్తీకరణలో భాగంగా ఒకరి భావాలను మరొకరు విమర్శించే హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. అఫ్‌కోర్సు దానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నూరుపూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల చర్చ జరగాల్సిందే. చిత్రను సమర్ధించిన వారు కొందరైతే అలాంటి సందేశం ద్వారా రాజకీయ వైఖరులను తీసుకున్నారని మరికొందరు విమర్శించారు. ” చిత్రకు భావ ప్రకటనా స్వేచ్చ ఉంది, ఆమె నచ్చిన వైపు నిలిచే స్వేచ్చ కూడా ఉంది.ఆమె తన ఇంట్లో రామ భజన చేయవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు. మారణకాండకు, జాత్యంహంకారానికి దారితీసే ఒక కారణాన్ని అమాయకంగా ఉత్సవంగా జరుపుకోవటంలో హానికరమైనది కనిపించకపోవచ్చుగానీ అది వాస్తవానికి అది ఎంతో బాధాకర అనుభవం అని రచయిత్రి ఇందూ మీనన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో చిత్ర తీరును విమర్శించారు. జనాల రక్తం, వలసలు, వారి బాధలు పట్టకుండా మీరు రామ భజన చేస్తున్నారు.రాముడు లేదా విష్ణువు రాబోవటం లేదు. మీరు ఐదులక్షల దీపాలను వెలిగించినప్పటికీ మీ బుర్ర వెలుగుతో నిండదు. మీ కంఠం కారణంగానే మిమ్మల్ని నైటింగేల్‌(పశ్చిమ దేశాల్లో కోకిల వంటి మధురంగా కూసే పక్షి) అని భావించారు, కానీ మీరు నకిలీ నైటింగేల్‌ అని రుజువైంది అని ఇందూ మీనన్‌ తీవ్రంగా విమర్శించారు.చరిత్రను విస్మరించి ప్రతివారూ సుఖంగా ఉండాలని చెప్పేవారి అమాయకత్వం ఇక్కడ ముఖ్యమైనదని గాయకుడు సూరజ్‌ సంతోష్‌ అన్నారు.మసీదును కూల్చివేసి దేవాలయాన్ని కట్టిన చరిత్రను చిత్ర కావాలనే మరచినట్లు విమర్శించారు. ప్రముఖ గాయకుడు జి వేణుగోపాల్‌ ఒక వైపు చిత్రకు మద్దతు ఇస్తూనే ఆమె ప్రకటనలపట్ల ఏవైనా విబేధాలుంటే విమర్శించేవారు ఆమెను క్షమించాలని వ్యాఖ్యానించారు. ఆమె కేవలం భక్తిభావంతో చెప్పారే తప్ప రాజకీయ కోణం తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, మనకోసం వేలాది పాటలు పాడిందని అన్నారు. క్షమించాల్సినంత తప్పేమి చేసిందని కొందరు వ్యాఖ్యానించారు.గాయని చిత్ర గతాన్ని చూసినపుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలూ చేసిన చరిత్ర లేదు.ప్రతిదాన్నీ రాజకీయం గావిస్తున్న వర్తమానంలో ప్రజాజీవనంలో ఉన్న ప్రముఖులు తాము చేసే ప్రకటనల పట్ల తగిన జాగరూకత పాటించాలని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


సుప్రీం కోర్టే ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.విశ్వాసం ఉన్నవారు అయోధ్య రామాలయానికి వెళ్లవచ్చు, లేనివారు వెళ్లకపోవచ్చు, గాయని చిత్ర ప్రకటనను వివాదాస్పదం కావించాల్సిన అవసరం ఏముంది, తమ అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించుకోవచ్చని సిపిఎం నేత, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ వ్యాఖ్యానించారు.కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ మాట్లాడుతూ భౌతిక దాడులు చేయలేనపుడు సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేయటం ఫాసిజం అన్నారు. మనం చిత్ర వైఖరితో అంగీకరించకపోవచ్చు, ఆమె వైఖరిని ఆమెను వెలిబుచ్చనివ్వండి, ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంది, ఎవరైనా అంతకు ముందు చెప్పని వాటి గురించి మాట్లాడటాన్ని ప్రశ్నించవచ్చు అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న కారణంగానే గాయని చిత్ర మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. వామపక్ష-జీహాదీ వాతావరణంలో ఉన్నవారే దాడులు చేస్తున్నారన్నారు.ఈ విమర్శలు చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పినరయి విజయన్‌ పాలనలో హిందువులు తోటి వారితో తమ విశ్వాసాలను పంచుకొనే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ దీని మీద మౌనంగా ఉందని ఎక్స్‌లో ఆరోపించారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్యను అవకాశంగా తీసుకొని హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వామపక్షం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అసహనానికి ఒక ఉదాహరణ చిత్ర మీద చేస్తున్న విమర్శలని జాతీయ మహిళాకమిషన్‌ సభ్యురాలు, బిజెపి నేత కుషఉ్బ ఆరోపించారు.


మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణే శంకరాచార్యల మీద ధ్వజమెత్తటాన్ని కుషఉ్బ వంటి వారు ఎలా వర్ణిస్తారు.నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, ఇతర మతాల వారిని పక్కన పెడితే హిందూమతాన్ని నమ్మేవారు, పాటించేవారికి నలుగురు శంకరాచార్యలు పూజనీయులు ! ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ ఏదో ఒక సమయంలో వారి పాదాలవద్ద చేరి ఆశీస్సులు పొందిన వారే. రామాలయ ప్రతిష్ట మీద వారు మాట్లాడినదాన్ని ఇప్పుడు ఎందుకు సవాలు చేస్తున్నట్లు ? హిందూ ధర్మానికి మీరేమి చేశారని గతంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నది కీలక అంశం. శంకరాచార్యులను అవమానించినందుకు గాను కేంద్ర మంత్రి రాణేను పదవి, పార్టీ నుంచి తొలగించాలని శివసేన నేత ఉద్దావ్‌ థాకరే డిమాండ్‌ చేశారు. బిజెపి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరారు. రాణేకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతకు ముందు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంత్రి రాణే విలేకర్లతో మాట్లాడుతూ శంకరాచార్యలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని రాజకీయ కోణం నుంచి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఏమీ చేయలేదని, ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను తీసుకొని రామాలయాన్ని నిర్మించిందని, దాన్ని వారు ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? ఆలయాన్ని రాజకీయాలకోసం కాదు మతం కోసం నిర్మించాము, రాముడు మా దేవుడు.హిందూమతం కోసం తామేమీ చేసిందీ శంకరాచార్యలు చెప్పాలని రాణే డిమాండ్‌ చేశారు. శంకరాచార్యలు రాకపోవటానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులే అని శివసేన విమర్శించింది. వారు రాకపోతేనే మీ బొమ్మలు కనిపిస్తాయి, వస్తే వారి చిత్రాలనే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది.రామాలయాన్ని కూల్చి బాబరీ మసీదును కట్టారని ఇంతకాలం సంఘపరివారం ఆరోపించింది.కానీ పూర్తికాని రామాలయాన్ని ఎన్నికల కోసం ముందే ప్రారంభించారన్న విమర్శలు ఇప్పుడు చరిత్రకెక్కాయి. ఇది వాస్తవం.

నయనతారకు ఒక న్యాయం,రామాలయ ట్రస్టుకు మరొకటా ! పవిత్ర కట్టడం కాదు సమాధి అన్న శంకరాచార్య !! హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరు ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా తమ మనోభావాలను గాయపరచిందని హిందూత్వవాదులు ఫిర్యాదు చేసిన కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆ సినిమాను తన వేదిక నుంచి తొలగించింది. ఒక బ్రాహ్మణ పూజారి కుమార్తె బతుకుతెరువు కోసం వంటగత్తెగా మారి ఎలా ఎదిగిందన్నది ప్రధాన కథ. తండ్రి ప్రసాదాలు వండి వడ్డిస్తే, కుటుంబ ఆంక్షలకు భిన్నంగా పాకశాస్త్ర కాలేజీలో చేరి మాంసాహార తయారీ నేర్చుకోవటమే గాక, ఒక రోజు తింటూ కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమెకు బలవంతంగా వివాహం చేసేందుకు తండ్రి చూడటంతో ఇష్టం లేనందున తన స్నేహితుడు ఫర్హాన్‌తో కలసి ఇంటి నుంచి పారిపోతుంది. ఈ సినిమాను సెన్సార్‌ బోర్డు అనుమతించిన తరువాత విడుదలైంది. అయితే కొద్ది రోజుల తరువాత ఆ కథ, చిత్రీకరణలో తమ దేవతలు మాంసాహారాన్ని తింటున్నట్లు చిత్రించారని, ఇది హిందూమత, బ్రాహ్మణ కుల మనోభావాలను గాయపరచిందంటూ ఫిర్యాదులు, పోలీసు కేసుల దాఖలు వరకు హిందూత్వవాదులు వెళ్లారు.లవ్‌ జీహాద్‌ కోణం కూడా ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట శాస్త్రవిరుద్దంగా జరుగుతోందంటూ ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా నలుగురు శంకరాచార్యలు తిరస్కరించారు. వారి మనోభావాలు దెబ్బతిన్న కారణంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భార్యలేని నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్ట పూజలకు అనర్హులని సామాజిక మాధ్యమంలో వ్యతిరేక, అనుకూల వాదనలు వెల్లువెత్తాయి. శంకరాచార్యుల వ్యాఖ్యల మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామాలయ ట్రస్టు చేస్తున్నది సనాతన హిందూ ధర్మ విరుద్దమని వారు ప్రకటించినప్పటికీ ఏ ఒక్క హిందూత్వవాది మనోభావాలూ గాయపడలేదు, ఆ కార్యక్రమం మీద ఎలాంటి పోలీసు కేసులు నమోదు చేయలేదు. ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీశారు. కొందరిపైనే హిందూత్వవాదులు ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు.శంకరాచార్యులు చెప్పిన మాటలనే ఏ నాస్తికులో, హేతువాదులో చెప్పి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ జరిగి ఉండేది !


బాబరీ మసీదు-రామ మందిర వివాదానికి సుప్రీం కోర్టు తెరదించింది. ఆ తీర్పు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా దాన్నెవరూ సవాలు చేయలేదు. ఆ మేరకు బాబరీ మసీదును కూల్చిన ప్రాంతంలో రామాలయ నిర్మాణం జరుగుతోంది.అది పూర్తిగాక ముందే ప్రారంభానికి ముహూర్తం పెట్టటంతో కొన్ని వివాదాలు తలెత్తాయి. వాటిని నాస్తికులు, హేతువాదులు, అబ్రహామిక్‌ మతాల వారో చెప్పలేదు. సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులుగా, భాష్యం చెబుతున్న నలుగురు శంకరాచార్యులే అభ్యంతరాలను లేవనెత్తారు. రామాలయ నిర్మాణం కావించిన నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిధిగా రావటాన్ని సహించలేని శంకరాచార్యులు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వారి మీద సామాజిక మాధ్యమంలో మోడీ భక్తులు విరుచుకుపడుతున్నారు. అసలు రామాలయ ఉద్యమంలో వారెక్కడ ఉన్నారని సవాళ్లు విసురుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మ విరుద్ద పద్దతులకు తెరతీశారని శంకరాచార్యులను అనుసరించేవారు కుమిలిపోతున్నారు. ఎవరైనా నరేంద్రమోడీ చేస్తున్నది ధర్మవిరుద్దం అంటూ వీధుల్లోకి వస్తే వారి వీపులకు హామీ లేదనే వాతావరణం నేడుంది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. హిందూ మతంలోని అసంబద్దతలు, మతం లేదా మనుస్మృతి పేరుతో అమలు జరిపిన వివక్షాపూరితమైన చర్యలను ప్రశ్నించిన నాస్తికులు, హేతువాదులు, సంస్కరణ వాదులు, పురోగామివాదులు, కమ్యూనిస్టులను హిందూ ద్వేషులు, సనాతన ధర్మవిరోధులుగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు హిందూత్వను పరిరక్షిస్తామని చెబుతున్నవారు శంకరాచార్యులను కూడా ఆ జాబితాలో చేరుస్తారా ? లేదా సనాతనాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకున్నాం అనుకుంటున్నవారు రామాలయాన్ని రాజకీయం చేసిన నరేంద్రమోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలను ధర్మం కోసం- దేశం కోసం వ్యతిరేకిస్తారో లేదో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది.


హిందూ ఉనికి కోసం పోరాటం(స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి) అనే వెబ్‌ సైట్‌ జనవరి ఏడవ తేదీన దైనిక్‌ జాగరణ్‌ అనే పత్రిక ప్రచురించిన ఒక వ్యాసం ఆధారంగా చేసిన వ్యాఖ్యను తన సైట్‌లో ఉంచింది. నలుగురు సనాతన హిందూ ధర్మ గురువులు ఎందుకు రామ మందిర ప్రాణప్రతిష్టలో పాల్గొనటం లేదు అన్నది దాని శీర్షిక. దాన్ని రాసిన వారు ఉపేంద్ర భారతి, శౌనక్‌ రారు చౌదరి. వారి రచనలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” గోవర్ధన మఠ పూరీ పీఠ శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించారు. ఆయనిలా చెప్పారు.” పవిత్ర ఆలయ నిర్మాణంవైపుగా ప్రభుత్వ ప్రయత్నం లేదు ” ఆయన మాటల్లోనే ” ఒక సమాధి ” అని ఆ నిర్మాణాన్ని వర్ణించటాన్ని బట్టి సాంప్రదాయ ఆలయ నిర్మాణానికి ఉండవలసిన పూజ్యభావం మరియు పవిత్రత దానికి లేవు అని సూచించినట్లయింది. తగిన గౌరవంలేని స్థలానికి వెళ్లటం ఇష్టం లేదనే ఆయన నిర్ణయం వెల్లడిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవటం అంటే శ్రీరాముడిని తిరస్కరించటం కాదు. కొందరు నేతల అవకాశవాద, తిమ్మినిబమ్మిని చేసే రాజకీయాలకు వ్యతిరేకం.


శృంగేరి శారదా పీఠ శంకరాచార్య స్వామి శ్రీ భారతీ తీర్ధ ఎందుకు తిరస్కరించారంటే ఆలయ నిర్మాణం అసంపూర్తిగా జరగటమే.అలాంటి దానికి వెళ్లటం సరైన చర్యకాదు. దీనితో పాటే ఆసియాలో అతి పెద్దదైన మసీదును అయోధ్యలో నిర్మించాలని తలపెట్టటం పట్ల ఆయన తన ఆందోళన వెల్లడించారు. దురదృష్టకరమైన పరిణామాలుగా భావిస్తున్నారు.తాను, ఇతరులు కోర్టుకు రామమందిరం సాక్ష్యాలను సమర్పించామని, కానీ రామమందిర ట్రస్ట్‌ లేదా దాని ప్రతినిధులుగానీ ఆలయనిర్మాణంలో తమ సలహాలు తీసుకోలేదని భారతీ తీర్ధ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలో ద్వంద్వ వైఖరి ఉన్నట్లు శంకరాచార్య విమర్శించారు. రామాలయ నిర్మాణం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మనోభావాలను ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీ తీర్ధ నిరాకరణకు ప్రాణ ప్రతిష్ట పవిత్రత, నిర్మాణ క్రమం పట్ల అసంతృప్తి, మత వ్యవహారాల పట్ల ప్రభుత్వ వైఖరికి తిరస్కరణగా చెప్పవచ్చు.


ద్వారకా పీఠ శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అనేక అంశాల మీద ఆందోళన వెల్లడించారు. పుష్య మాసం ప్రాణప్రతిష్టకు శుభప్రదం కాదన్నది మొదటి విమర్శ.దేవతల ప్రతిష్టాపన అశుభ గడియల్లో చేపట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సరైన సమయం వచ్చే శ్రీరామ నవమి అవుతుంది.రామ నవమి నాటికి ఎన్నికల నియమావళి అడ్డం వస్తుంది గనుక ముందుగానే ఎంచుకోవటం వ్యూహాత్మకమని, అప్పుడు జరిపితే పెద్దగా ఉపయోగం ఉండదని బిజెపి నేతలు భావించిన కారణంగానే నిర్మాణం పూర్తి కాకుండా ముందుగానే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని సదానంద సరస్వతి భావిస్తున్నారు. మతపరమైన అంశాలు, రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రాణ ప్రతిష్ట సమయం, నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించటం అనే అంశాలు అయోధ్య రావటం లేదని చెప్పటానికి సదానంద సరస్వతి కారణాలుగా చెప్పవచ్చు.


ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తిరస్కరణకు మతపరమైన, సామాజిక అంశాలు ఉన్నాయి. వేదాలు, హిందూ మత గ్రంధాల్లో బ్రాహ్మణుల పాత్ర గురించి ప్రత్యేక స్థానం ఉంది. పూజారులుగా కేవలం వారినే నియమించాలి.ప్రత్యేకించి శూద్రులను పూజారులుగా నియమించటాన్ని ఆయన విమర్శిస్తున్నారు. మత ఆచారాల ఫలాలను అందరూ పొందటానికి అర్హులే అయినప్పటికీ శూద్రులు సేవకు మాత్రమే పరిమితం, సనాతన హిందూ ధర్మంలో వివక్ష ఉందనటాన్ని ఆయన ఖండిస్తారు.బ్రాహ్మణులకు బదులు పూజారులుగా శూద్రుల నియామకం వేదాలకు విరుద్ధం అని భావిస్తారు. అలాంటి నియామకాలు శ్రీ రాముడితో ముడివడిన ఆదర్శాలకు విరుద్దం, వేదాల్లో చెప్పినట్లు సామాజిక వ్యవస్థ ఉండాలి అంటారు. వీటికి విరుద్దంగా జరుగుతున్న కారణంగానే అవిముక్తేశ్వరానంద హాజరు కావటం లేదు. రాజకీయ లబ్దికోసం ఒకనాడు శంకరాచార్యుల పాదాల ముందు మోకరిల్లిన నరేంద్రమోడీ ఇప్పుడు సనాతన విలువలు, మర్యాదలకు భిన్నంగా అధర్మంగా వ్యవహరించటం దురదృష్టకరం. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు ప్రధాని మోడీలో విష్ణు అవతారాన్ని మాత్రమే చూస్తున్నారు. నలుగురు శంకరాచార్యల్లో శివుడిని చూడలేకపోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్టలో హిందూ ధర్మంలోని ఉన్నత ధర్మ గురువులు భాగస్వాములు గాకపోవటం దురదృష్టకరం. ఇది కేవలం మతపరమైన ఎదురుదెబ్బే కాదు సామాజిక, రాజకీయ చిక్కులను కూడా తీసుకువస్తాయి. ఇదీ స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి విశ్లేషణ, వ్యాఖ్య సారం. ఈ భావాలు, అభిప్రాయాలతో నిజమైన హిందువులు ఏకీభవిస్తారు తప్ప రాజకీయ హిందూత్వ వాదులకు మింగుడు పడదు. పురోగామి వాదుల దృష్టిలో మతం వ్యక్తిగతం, రాజీకీయాల్లోకి చొప్పించకూడదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు మతాన్ని రాజకీయాలకు ముడి పెట్టారని ఏకంగా శంకరాచార్యలు చెప్పటమే కొసమెరుపు.


విశ్వాసుల ఖర్మో లేక రాముడికి పరీక్షో గానీ రామాలయాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు మోసగాండ్లు బయలుదేరారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రతిష్టకు ఆహ్వానం అంటూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో మోసగాండ్లు రెచ్చిపోతున్నారని వార్తలు.” రామజన్మ భూమి గృహసంపర్క్‌ అభియాన్‌.ఏపికే ” పేరుతో ఉన్న యాప్‌ను ఫోన్లో ఏర్పాటు చేసుకోవాలని, దానితో ప్రముఖుల పాస్‌లను పొందాలని కోరుతున్న మెసేజ్‌లు మొదలయ్యాయి.ఎవరైనా ఆ పని చేస్తే తమ సమాచారం మొత్తాన్ని దొంగలకు స్వయంగా అప్పగించినట్లే.ఇక అనేక వెబ్‌సైట్లు కూడా ప్రారంభమై దోచుకోవటం ప్రారంభించాయి. రాముడి ప్రసాదం ఉచితంగా పంపుతామని, మీరు చేయవలసిందల్లా రవాణా ఖర్చులు ముందుగా పంపటమేనని పేర్కొంటున్నాయి. ఇది మీ జేబులోని సొమ్ముతో పాటు మీ సమాచారాన్ని కూడా మోసగాండ్లకు అప్పగించటమే అవుతుంది.

దురహంకార జాతీయవాదంతో మాల్దీవులు మరింత దూరమైతే ఎవరికి నష్టం !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


రాజకీయాలు అవి స్థానికం, జాతీయం, అంతర్జాతీయం ఏవైనా వైరం పెరిగినపుడు ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాల్లో అది జరిగితే సంభవించే నష్టం ఎంతో ఎక్కువ. ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన మాల్దీవులతో ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో అతి పెద్ద స్థానంలో ఉన్న మన దేశంలో కొందరి వైఖరి దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అంటున్నట్లుగా ఉంది. సున్నితమైన అనేక అంశాలను విస్మరిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి మాల్దీవులతో సంబంధాల అంశం ఇప్పుడు మన సామాజిక మాధ్యమం, మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. మన ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను దానికి తగిన బుద్ది చెప్పాలని, మన విహార యాత్రీకులు వెళ్లరాదని పిలుపు ఇస్తున్నారు. ఒక విమానయాన సంస్థ ఇప్పటికే నిరవధికంగా ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది, హౌటల్‌ బుకింగులను కూడా మన వారు రద్దు చేసుకున్నట్లు వార్తలు. మాల్దీవుల ప్రయాణం, అక్కడి హౌటళ్ల రేట్లు సగానికి సగం తగ్గినట్లు ప్రచారం. కొందరు క్రీడాకారులు, సినీతారలు కూడా స్పందించారు. గరిష్టంగా విహార యాత్రీకులను పంపుతున్న మన దేశాన్ని, ఫ్రధానిని కూడా అలా కించపరుస్తారా అని మండిపడ్డారు.


సామాజిక మాధ్యమంలో కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయెల్‌ తొత్తు అని, మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని పేర్కొన్నారు. ఇది బాధ్యతా రాహిత్యం తప్ప మరొకటి కాదు.అరేబియా సముద్రంలోని మన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహించేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.తమ దేశానికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావించారు. కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనేవరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప అధికారిక వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగినదాని మీద విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా గతంలో తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, ఈనెల 8 నుంచి 12వరకు చైనా పర్యటించారు. ఇది మన అహాన్ని దెబ్బతీసిందా ?


ప్రపంచమంతటా సంకుచిత జాతీయ వాదం పెరిగింది. ఎవరికి వారు తమ దేశానికే అగ్రస్థానం ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవైపు వసుధైక కుటుంబం, ప్రపంచమంతా నేడు ఒక కుగ్రామం అని చెప్పేవారు కూడా సంకుచితంగా గిరిగీసుకొంటున్నారు. ఇప్పుడు మాల్దీవులను దారికి తెచ్చుకోవాలంటే అక్కడికి మన యాత్రీకులు వెళ్లకూడదని చెబుతున్నవారు ప్రతికూల ఫలితాల నిచ్చే ఆర్థిక జాతీయవాదానికి లోనైనట్లు చెప్పవచ్చు. మన దేశంలో ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలోనే చైనా పర్యటనలో అధ్యక్షుడు ముయిజ్జు 20 ఒప్పందాలు చేసుకున్నట్లు, పెద్ద ఎత్తున యాత్రీకులను తమ దేశానికి పంపాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. లడక్‌ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఉదంతాల తరువాత చైనాకు బుద్ది చెప్పాలని, దాని వస్తువులను బహిష్కరించాలని, అక్కడి నుంచి దిగుమతులను మానుకొని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు, దిగుమతులను రికార్డు స్థాయిలో చేసుకుంటున్నాము. 2022-23లో మన దేశం 9,850 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకుంటే మన ఎగుమతులు 1,530 కోట్లు, అవి పోను నిఖరంగా 8,320కోట్ల డాలర్లను డ్రాగన్‌ దేశానికి సమర్పించున్నాము. మన దేశాన్ని, ప్రధానిని విమర్శించినా మౌనంగా ఉండాలా అంటే తగిన పద్దతుల్లో దానికి నిరసన తెపాల్సిందే, ఏదైనా ఒక దేశాన్ని ఏ రూపంలోనైనా మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలన్న దురహంకార ఆలోచనే ఎవరినైనా తప్పుదారి పట్టిస్తుంది. ఇతరులను మరోపక్కకు నెడుతుంది. ఇప్పుడు మాల్దీవుల విషయంలో అదే జరుగుతోందా ?

మాల్దీవులకు వెళ్ల వద్దన్న దాన్ని ఎంత మేరకు ఎంత మంది పాటించారు. చైనా వస్తువు బహిష్కరణ పిలుపు మాదిరే ఉన్నట్లు ఇప్పటికే సమాచారం వస్తోంది. అక్కడికి బదులు లక్షద్వీపాలకు వెళ్లాలని చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లాలనేది ఎవరికి వారు నిర్ణయించుకొనేది తప్ప మరొకటి కాదు. గతంతో పోలిస్తే లక్షద్వీప్‌ గురించి గత కొద్ది రోజులుగా సమాచారం అడుగుతున్నవారు 50శాతం పెరిగారు తప్ప ఆచరణలోకి రావటం లేదని టూరిజం రంగంలో ఉన్నవారు చెప్పారు. ప్రస్తుతం కేరళలోని కోచి నుంచి రోజూ లక్షద్వీప్‌కు తిరుగుతున్న విమానం ఒకటి.దానిలో ఉన్న సీట్లు 72, మార్చి నెలాఖరు వరకు సీట్లన్ని నిండినట్లు ఇండియా టుడే పేర్కొన్నది. ఇదే సమయంలో మాల్దీవులకు చెడు వార్తలేమీ లేవని కూడా చెప్పింది. ఇప్పటికే బుక్‌ చేసుకున్న వారు రద్దు చేసుకుంటే చెల్లించిన సొమ్ము వెనక్కి రాదన్న సంగతి తెలిసిందే. లక్షద్వీపాలకు యాత్రీకులను ఆకర్షించేందుకే మన ప్రధాని నరేంద్రమోడీ అక్కడికి వెళ్లి బీచ్‌ ఫొటోలను ప్రపంచానికి విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు.తాజాగా వచ్చిన వార్తల ప్రకారం గోవాకు వచ్చే విదేశీ యాత్రీకుల సంఖ్య పడిపోయినట్లు టూరిజం శాఖా మంత్రి రోహన్‌ కౌంతే ప్రకటించారు. గోవాకు రష్యా, ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే యాత్రీకులు గణనీయంగా ఉంటారని ప్రస్తుతం ఆ దేశాలు సంక్షోభంలో ఉన్నందున రాక తగ్గినట్లు చెప్పారు. సౌదీ అరేబియా చేపట్టిన ఎర్ర సముద్ర ప్రాజెక్టు నిర్ణీత గడువుకంటే ముందుగానే పూర్తి కానుండటం, దీనికి తోడు బహరెయిన్‌ క్రమంగా వివాహాలకు కేంద్రంగా మారుతుండటంతో గోవా టూరిజానికి సవాలు పెరుగుతున్నట్లు కూడా మంత్రి చెప్పారు. రష్యా, బ్రిటన్ల మీద ఎక్కువగా ఆధారపడటాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం కూడా వచ్చిందన్నారు.


రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు చిన్న దేశం కావచ్చుగాని కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీషు వారు ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా అనుసరిస్తున్న విధానాల కారణంగా దాని పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను దించి కుట్రను విఫలం గావించింది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి. గతేడాది ఎన్నికల ప్రచారంలో ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరిని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తరువాత స్వరాన్ని తగ్గించారు. ఈ పూర్వరంగంలో ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను దిగజారేట్లు చేశాయి. మరింత గట్టి సంబంధాలను పెట్టుకుంటామని, నుంచి పర్యాటకులను మరింతగా పంపాలనిఐదురోజుల పర్యటనలో ముయిజ్జు చైనా నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. మాల్దీవులకు పెద్ద సంఖ్యలో భారత్‌ నుంచి పర్యాటకులు ప్రస్తుతం పదకొండు శాతం వెళుతున్నమాట వాస్తవం,90శాతం ఇతర దేశాల నుంచి ఉన్నారని మరచిపోకూడదు..


2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి తాము వైదొలుగుతున్నట్లు మాల్దీవుల అధికారులు 2023 డిసెంబరు 14న తెలిపారు. తమ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు తప్ప చైనాకు దగ్గరవుతున్నందున ఈ నిర్ణయం తీసుకోలేదని మాల్దీవుల అధికారులు చెప్పారు. సాధారణంగా మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి అధికారిక పర్యటన మనదేశంలో జరపటం సాంప్రదాయంగా వస్తోంది. దానికి కూడా నూతన అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు స్వస్తి పలికి టర్కీ వెళ్లాడు. దీంతో మన నేతల అహం దెబ్బతిన్నదా ? అంతే గాక మాల్దీవుల్లో ఉన్న మన సైనికులు కూడా వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో అట్టడుగు జలాల్లో పరిశోధనలు చేసేందుకు తమ యువాన్‌ వాంగ్‌ నౌక లంగరు వేసేందుకు అనుమతించాలని మాల్దీవులను కోరటం గమనించాల్సిన అంశం. మాల్దీవుల మొగ్గు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణాలు ఏమిటన్నది తీవ్రంగా ఆలోచించాలి.


మాల్దీవులకు చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావం ఉంది అన్నది కూడా ఎంతో కీలకమైనదే. ఈ కారణంగానే మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. 2023 సెప్టెంబరు 30న జరిగిన ఎన్నికలు చైనా – భారత్‌ మధ్య పోటీగా జరిగాయి. ఇంత బాహాటంగా ఏ దేశంలోనూ రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. 2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది. ఇప్పుడు మన దేశం నుంచి యాత్రీకులు వెళ్లనందున మాల్దీవుల్లో ఆర్థిక సంక్షోభమేమీ రాదు. ఈ పూర్వరంగంలో దూరమౌతున్న దాన్ని దగ్గరకు ఎలా తెచ్చుకోవాలా, మన ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలా అని చూడాలి తప్ప నీ సంగతి చూస్తా అన్నట్లుగా ఉంటే నడిచే రోజులు కావివి.

మలుపు తిరిగిన రామాలయ వివాదం : నలుగురు శంకరాచార్యలూ దూరం ! వారి డిఎన్‌ఏల గురించి బిజెపి ప్రశ్నిస్తుందా !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మొన్న సిపిఎం నేత సీతారాం ఏచూరి, నిన్న కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ అయోధ్య రామాలయ ప్రతిష్టకు రావటం లేదని చెప్పగానే బిజెపి నేతలు అసలు వారి డిఎన్‌ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారదాడి చేస్తున్నారు. రధయాత్ర నిర్వహించిన ఎల్‌కె అద్వానీని ఆ ఛాయలకే రావద్దని చెప్పిన పెద్దలు ఓటు బాంకు రాజకీయం గాకపోతే వారి డిఎన్‌ఏ గురించి ముందే తెలిసినపుడు అసలు ఆహ్వానాలు పంపటం ఎందుకు ? కమ్యూనిస్టులు దేవాలయాలు, మసీదులు, చర్చ్‌ల ప్రారంభాలకు రారని అందరికీ తెలుసు.వారు లేదా కాంగ్రెస్‌ నేతలు గానీ బిజెపి మత రాజకీయాలను విమర్శించటం ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. హిందూమతానికి భాష్యకారులుగా, పీఠాధిపతులుగా ఉన్న నలుగురు శంకారాచార్యలూ అయోధ్య వెళ్లటం లేదన్న సమాచారం ఇది రాసిన సమయానికి ఉంది. చివరి నిమిషంలో వారు మనసు మార్చుకుంటారో లేక ఏం చేస్తారు అన్నది పెద్ద సమస్య కాదు. పూరీ శంకరాచార్య నిశ్శలానంద, ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌ మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద తాము రావటం లేదని తమ కారణాలను వివరిస్తూ చెప్పారు. ద్వారకా పీఠం అధిపతి స్వామి సదానంద సరస్వతి, శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్ధ రామాలయ ప్రతిష్టకు ఆశీర్వచనాలు చెప్పారే తప్ప వస్తున్నదీ లేనిదీ ఇంతవరకు ప్రకటించలేదు. ఆలయ నిర్మాణం పూర్తి కానందున నలుగురమూ అయోధ్య వెళ్లటం లేదని అవిముక్తేశ్వరానంద చెప్పిన మాటల మీద వారు మౌనంగా ఉన్నారు. అందరి తరఫున మాట్లాడేందుకు అనుమతించలేదని ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదు. హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని ప్రారంభించటం తగదని అవిముక్తేశ్వరానంద ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. తమ చర్యలను మోడీ వ్యతిరేకమైనవిగా చూడరాదని, శాస్త్ర వ్యతిరేకులుగా మారటం ఇష్టం లేకనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మేమెందుకు వెళ్లటం లేదు ? మాకు ద్వేషం ఉండి కాదు. శాస్త్ర విధిని పాటించటం, పాటించేట్లు చూడటం శంకరాచార్యుల బాధ్యత, ఇక్కడ శాస్త్ర విధిని విస్మరించారు, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తిగాక ముందే ప్రాణ ప్రతిష్టకు పూనుకోవటం ఇక్కడ పెద్ద సమస్య, దీన్ని మేం చెబితే మమ్మల్ని మోడీ వ్యతిరేకులని పిలుస్తున్నారు, ఇక్కడ మోడీ వ్యతిరేకత ఏముంది అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామాలయాన్ని రాజకీయం చేస్తున్నారని రాజకీయ పార్టీలు చెబితే, శాస్త్రవిరుద్దమని శంకరాచార్యలు భావిస్తున్నారు. రాజకీయ నేతల డిఎన్‌ఏల గురించి ధ్వజమెత్తుతున్న బిజెపి శంకరాచార్యల డిఎన్‌ఏల గురించి ప్రశ్నించగలదా ? వారిని అనుసరించే వారి మనోభావాలను గాయపరచి తట్టుకోగలదా ?


” మోడీ గారు విగ్రహాన్ని తాకి ప్రారంభోత్సవం చేస్తుంటే నేను అక్కడ ఉండి చేసేదేమిటి ?నేను లేచి నిలబడి చప్పట్లు కొట్టాలా ? నాకు పదవి అవసరం లేదు, ఇప్పటికే నేను పెద్ద స్థితిలో ఉన్నాను, నాకు పేరు అవసరం లేదు. శంకరాచార్యలు అక్కడికి వెళ్లి చేసేదేమిటి ఇది అహంకారం కాదు, నేనున్న స్థానపు గౌరవం గురించి నాకు తెలుసు, అందుకే నేను అక్కడికి వెళ్లటం లేదు, నాకు ఆహ్వానం వచ్చింది, దానిలో నాతో పాటు ఒకరిని తీసుకురావచ్చు అని ఉంది, నాతో పాటు ఒకరిని నేనెందుకు తీసుకుపోవాలి ” అని ఒక వీడియోలో స్వామి నిశ్చలానంద ప్రశ్నించారు. మత వ్యవహారాల్లో మోడీ జోక్యం చేసుకుంటున్నారని, తనకు అయోధ్య అంటే వ్యతిరేకత లేదని కూడా చెప్పారు. విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌(రామాలయ నిర్మాణ, నిర్వహణ) ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు అమర్‌ ఉజాలా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాలయం వైష్టవులకు చెందిన రామానంద సాంప్రదాయానికి చెందింది తప్ప సన్యాసులది లేదా శైవులదీ కాదు అని చెప్పారు.ఆది శంకరుడు శైవుడు, ఆయన స్థాపించిన నాలుగు శంకరమఠాధిపతులూ శైవులే, అయితే వారు విష్ణుమూర్తిని కూడా అంగీకరిస్తారు.శైవుల అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధ్వని చంపత్‌ రారులో వినిపించింది.రారు ప్రకటన తరువాత అవిముక్తేశ్వరానంద స్పందించారు.” ధర్మశాస్త్రాల ప్రకారమే జరగాలని మేమూ, జనం కూడా కోరుకుంటున్నారు. రాముడు మనకు చెప్పిన పాప పుణ్యాలేమిటో మనకు తెలిసినవే. రామాలయ ప్రతిష్టకు రావటం లేదన్న మా నిర్ణయం ఏమిటో బహిర్గతమైంది. అక్కడకు శంకరాచార్యలు రానవసరం లేదని చంపత్‌ రారు చెబుతున్నారు, ఎందుకంటే ఆ స్థలం రామానంద సంప్రదాయానికి చెందినది అంటున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే రామాలయం వైష్ణవులదే అయితే చంపత్‌ రారు అక్కడెందుకు ఉన్నారు ? నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా, పూర్వపు అయోధ్య సంస్థానం, రామాలయ ట్రస్టీ రాజా సాహెబ్‌ అక్కడ ఎందుకు ఉన్నట్లు ? వారు రాజీనామా చేసి రామానంద సంప్రదాయ ప్రతినిధులకు ఆలయాన్ని ప్రతిష్టాపనకు ముందే అప్పగించాలి.ప్రతిష్టను రాజకీయం చేశారు, మతాధిపతులను కావాలనే పక్కన పెట్టారు, ఆలయం రామానంద సంప్రదాయవాదులదే అయితే వారు విరాళాలు తీసుకొనే ముందే ఆ ముక్క చెప్పాలి. ఆ సమయంలో మీరు మా నుంచి కూడా విరాళాలు పొందారు.అలయం శంకరాచార్యులది కాదంటే మీరు మానుంచి విరాళాలను ఎందుకు స్వీకరించినట్లు? అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామానంద పరంపరలో నిర్మోహీ అఖారా మతపరమైన చిహ్నం, సుప్రీం కోర్టు తీర్పు రాకముందు అక్కడ పూజలు నిర్వహిస్తున్న సంస్థ అది, దానికే ఆ బాధ్యతను కూడా మరోసారి అప్పగించాలి, మీరు మరింత మంది పూజారులను ఎందుకు నియమిస్తున్నారు, పూజ బాధ్యతను రామానంద సాంప్రదాయం ప్రకారం నిర్మోహి అఖారాకు అప్పగించాలి, దాన్ని మేము ఆమోదిస్తాము, దీంతో నలుగురు శంకరాచార్యలూ సంతోషిస్తారు అని కూడా ముక్తేశ్వరానంద అన్నారు.


రామాలయ నిర్మాణాన్ని ఓట్లకోసం బిజెపి ఉపయోగిస్తున్నదని లోకం కోడై కూస్తున్నది. వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో రామాలయాన్ని ప్రభావితం చేసేందుకు ఐదువేల మంది చొప్పున ప్రతి నియోజకవర్గంలో నియమించాలని బిజెపి పధకం వేసినట్లు ఒక బిజెపి నేత చెప్పినట్లు ది ప్రింట్‌ న్యూస్‌ పోర్టల్‌ తన విశ్లేషణలో పేర్కొన్నది. రానున్న మూడు మాసాలలో దేశమంతటి నుంచి రెండున్నర కోట్ల మందికి రామదర్శనం ఏర్పాటు చేసి హిందూ ఓటు బాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు కూడా తెలిపింది. అయోధ్యను సందర్శించిన వారు తమ అనుభవాలను ఇతరులకు తెలియచేస్తారని బిజెపి ఎంపీ ప్రదీప్‌ చౌదరి చెప్పినట్లు ప్రింట్‌ రాసింది. రామాలయ ప్రతిష్ట రాజకీయం తప్ప సనాతనం కాదని అయోధ్యలోని మహంతులు కొందరు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించే ప్రాణ ప్రతిష్ట కార్యాక్రమాన్ని వారణాసికి చెందిన లక్ష్మీకాంత దీక్షిత్‌ నిర్వహిస్తున్నారు. దీపావళి ఉత్సవానికి మమ్మల్ని ఆహ్వానించారు ఇప్పుడెందుకు పిలవలేదని మహంత్‌ భానుదాస్‌ ప్రశ్నించారు. విమర్శలు చేసిన శంకరాచార్యలను సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున మోడీ అభిమానులుగా ఉన్న వారు చీల్చి చెండాడుతున్నారు. వారు ఎప్పుడైనా రామాలయం కోసం ఎప్పుడైనా ఆందోళన చేశారా అని ప్రశ్నిస్తున్నారు.శంకరాచార్యులను అనుసరించే వారి మనోభావాలను వారు తీవ్రంగా గాయపరుస్తున్నారు.మొత్తం మీద రాముడిని మరోసారి వివాదాస్పదం కావించారు. వీధుల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు

షేక్‌ హసీనా విజయం : చైనాకు మరింత దగ్గరగా బంగ్లాదేశ్‌ !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా బంగ్లాదేశ్‌లో నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అధికారంలో ఉన్న మరే దేశ మహిళ ఎవరూ ఇంత దీర్ఘకాలం పదవిలో లేరు.పార్లమెంటులోని 350 స్థానాలకు గాను 300 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మరో 50 సీట్లను మహిళలకు కేటాయించారు. పార్లమెంటులో తెచ్చుకున్న సీట్ల దామాషాకు అనుగుణంగా ఆయా పార్టీల నుంచి మహిళను నామినేట్‌ చేస్తారు. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ 222 సాధించింది.ఆమెకు మద్దతు ఇస్తున్న కూటమిలోని చిన్న పార్టీలు, స్వతంత్రులను కూడా కలుపుకుంటే మద్దతు ఇంకా ఎక్కువే ఉంటుంది. రద్దయిన పార్లమెంటులో అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. పదిహేడు కోట్ల మంది జనాభా ఉన్న ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కొన్ని కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.


ఈ ఎన్నికలలో ఓటర్లు చాలా తక్కువ మంది పాల్గొనటాన్ని బట్టి పాలకపక్షం మీద తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెప్పవచ్చు.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా తాజాగా 41.8శాతమే నమోదైంది. బంగ్లాదేశ్‌లో ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికల అక్రమాల ఆరోపణలు, విమర్శలు, బహిష్కరించటాలు మామూలే. తమ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను హసీనా తిరస్కరించారు, స్వేచ్చగా, న్యాయంగా ఎన్నికలు జరిగినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. తొలుత ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి అదే పదవిలో కొనసాగుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆరుపదుల వయస్సులో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించినప్పటికీ 76 సంవత్సరాలు వచ్చినా కొనసాగుతూనే ఉన్నారు.ఆమె సోదరి రెహనా లేదా కుమారుడు సాజిద్‌ వాహెద్‌ రాజకీయ వారసులుగా వస్తారని చెబుతున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియాఉర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. వర్తమాన రాజకీయాల్లో బిఎన్‌పి మితవాద పార్టీగా ఉంది. దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. దాంతో ప్రధాన ఎగుమతి పరిశ్రమ రెడీమేడ్‌ దుస్తుల తయారీ రంగంలో కార్మికులు సమ్మెలకు దిగారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 40 నుంచి 17 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అవి మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ ఏడాది విదేశీ చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి ఇంకా దిగజారవచ్చని చెబుతున్నారు. బంగ్లా విముక్తి పోరాట సమయంలో పాకిస్థాన్‌ పాలకులతో చేతులు కలిపిన విద్రోహులను శిక్షించేందుకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. విచారణ జరిపి అనేక మందిని ఉరితీశారు. హేతువాదులను శిక్షించేందుకు, ఇస్లాంను కించపరిచేవారిని దండించేందుకు కొత్త చట్టాలను తేవాలంటూ హిఫాజత్‌ ఇ ఇస్లామ్‌ అనే మితవాద సంస్థ పుట్టుకు వచ్చింది.లౌకికవాదులు, హేతువాదులను ఇస్లామిక్‌ స్టేట్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు చెందిన వారు అనేక మందిని హత్య చేశారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అమెరికా, ఐరోపాలోని మానవహక్కుల నంస్థలు విమర్శలు చేశాయి. ఎన్నికలను తటస్థ ఆపద్దర్మ ప్రభుత్వం నిర్వహించాలన్న నిబంధనను 2014 ఎన్నికల్లో హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కారణంతో బిఎన్‌పి 2014 ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడూ అదే చెప్పింది.


తాజాగా ఎన్నికలు స్వేచ్చగా జరగలేదని అమెరికా, బ్రిటన్‌ ఆరోపించాయి. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో బంగ్లాదేశ్‌ ఈ దేశాలకు అనుకూలంగా లేకపోవటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఒక దేశ అంతర్గత అంశాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవటం, వ్యాఖ్యానించటం తగనిపని, నిజంగా అక్రమాలు జరిగితే అక్కడి జనమే తేల్చుకోవాలి తప్ప మరొకరికి హక్కు లేదు.మరోవైపున చైనా, రష్యా, భారత్‌లు హసీనాను అభినందించాయి. ఆ మేరకు రాయబారులు ఆమెను కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌ చేసి హసీనాకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానం గురించి అనేక కథనాలు వచ్చాయి. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందన్న ప్రచారం వాటిలో ఒకటి. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అమెరికా, ఇతర దేశాల మాదిరి తాజా ఎన్నికల్లో ఫలానా చర్యలు తీసుకోవాలి అంటూ చైనా ఎలాంటి షరతులను బంగ్లా ప్రభుత్వం ముందు ఉంచలేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగటానికి 2012లో జరిగిన పరిణామం ఒక ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానది ఉపనదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. అది అక్కడ పెద్ద నది. పద్మానది మీద కట్టిన భారీ వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు ఆ ఏడాది బహిరంగంగా ప్రకటించింది.నిధులు నిలిపివేయటంతో పరువు, ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా భావించిన బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది.తరువాత ఇతర దేశాల నుంచి తీసుకున్నట్లుగానే ప్రాజెక్టు రుణాలను చైనా నుంచి కూడా బంగ్లాదేశ్‌ పొందింది. 2016ay బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతా లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. ప్రచ్చన్న యుద్ధ ఆలోచనలు, కూటమి రాజకీయాలకు బంగ్లాదేశ్‌ దూరంగా ఉండాలని 2022లో చైనా బహిరంగంగానే హితవు చెప్పింది. దాంతో తాము అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని తరువాత బంగ్లాదేశ్‌ ప్రకటించింది. అమెరికా చెబుతున్నదానికి భిన్నంగా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఒకే చైనా అని కూడా చెప్పింది.కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు.


ఇక చైనా రుణాల గురించి తప్పుడు ప్రచారం బంగ్లాదేశ్‌ మీద కూడా చేస్తున్నారు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు 2023లో 7,230 కోట్ల డాలర్ల విదేశీ రుణం ఉంది. వాటిలో ప్రపంచ బాంకు నుంచి 1,820, ఆసియన్‌ అభివృద్ధి బాంకు నుంచి 1,330, జపాన్‌ నుంచి 920, రష్యా నుంచి 510, చైనా నుంచి 480, భారత్‌ నుంచి 102 కోట్లు ఉన్నాయని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఎంఎ అబ్దుల్‌ మోమెన్‌ చెప్పాడు. దీన్ని బంగ్లాదేశ్‌కు అన్ని దేశాల నుంచి రుణాలు కావాలి, తీసుకుంటున్నది. ఇవి గాక వివిధ పథకాలకు తీసుకొనే రుణాలు వేరు. అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు తెలిపినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో ఒక సమీక్ష ప్రచురించింది.ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు ఉంది, దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశమే.

అయోధ్య రామాలయ రాజకీయం : అద్వానీని రావద్దన్నారు ! పిలిచినా వెళ్లేది లేదన్నారు పూరీ శంకరాచార్య !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.రధయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారి మీద ప్రచారదాడులు చేస్తున్నారు. అద్వానీ(96), మురళీమనోహర్‌ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్‌ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు.ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ-కుమారస్వామి పార్టీ జెడిఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభ కార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.రధయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్‌కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తనదారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.


ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గతవారంలో ఒక టీవీ ఛానల్‌తో, అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని భవిష్యత్‌లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ” నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు.విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు.అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోడీగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాధ్‌ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్‌ సింఘాల్‌ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు.తీర్థస్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు,టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్‌ పరికర్మ ప్రకల్ప పధకం గురించి స్పందించారు.పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు.హౌటళ్ల వారు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ది పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు.ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నాయి.


సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 టీవీ ఛానల్‌తో 30 నిమిషాలు మాట్లాడిన శంకరాచార్య రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేటపుడు క్రతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.చాతుర్వర్ణ వ్యవస్థకు భగవద్గీతలోని కృష్ణుడి బోధనల్లోనే మూలాలు ఉన్నాయి.గుణము, చర్యలను బట్టి నాలుగు వర్ణాలుగా సమాజాన్ని వర్గీకరించారు.ఇది పుట్టుకను బట్టి అని చెప్పటంగాక చేసే పనులు, వాటి స్వభావాన్ని వర్ణాలు ఉంటాయి.పశ్చిమ దేశాల్లో కూడా వర్ణ వ్యవస్థ మాదిరే విద్య, ఆర్థికం, రక్షణ, సేవా రంగాలు ఉన్నాయి.ఇప్పుడు వర్తమాన సమాజంలో పోలీసుల లేదా ప్రధానులు ఏలాంటి పాత్రను పోషించారో వర్ణ వ్యవస్థలో కూ ఎవరికి వారు తమ స్థితిని బట్టి సమతూకాన్ని నిర్వహించారు. శివపురాణంలో వివిధ రకాల బ్రాహ్మలు ఉన్నారని ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మలుకాదన్నారు.ఒక బ్రాహ్మడు వ్యాపారం చేస్తే వైశ్య బ్రాహ్మణ అని పిలవాలి, పురాతన గ్రంధాలలో చెప్పిన వాటిని అచరిస్తేనే ఒకబ్రాహ్మడిని బ్రాహ్మడిగా పరిగణించాలి అన్నారు.


ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త పూర్వీకులు సనాతన హిందువులే అని స్వామీజి గతేడాది సెలవిచ్చారు(ఫిబ్రవరి 1, 2023 ఓపి ఇండియా పోర్టల్‌) అమెరికా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని అది రుజువైందని నిశ్చలానంద చెప్పారు. వారు క్రైస్తవం, ఇస్లాం స్వీకరించే ముందు హిందువులే అన్నారు. ఏసు క్రీస్తు పది సంవత్సరాలు భారత్‌లో ఉన్నారని దాన్ని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పూరీలో మూడు సంత్సరాలు ఉన్నారని క్రీస్తు వైష్ణవుడని హిందూ క్రతువులన్నీ చేసినట్లు చెప్పారు. ఏసు క్రీస్తుకంటే ముందే హిందూయిజం ఉందని అందువలన ఆయన పూర్వీకులు హిందువులే అన్నది స్వామి వారి అభిప్రాయమని ఎన్నోసార్లు చెప్పారని, పూరీ మఠ ప్రజా సంబంధాల అధికారి మాతృదత్తా చెప్పారు. ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలు నిశ్చలానంద ఖండించారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు,ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు.


రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బిజెపి ఒడిషాలో అక్కడి సిఎం నవీన్‌ పట్నాయక్‌ శ్రీమందిర్‌ పరిక్రమ రధాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత పృధ్వీరాజ్‌ హరిచందన్‌ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రయివేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.శ్రీమందిర్‌ పధకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బిజెడి తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. బిజెపి నేతల విమర్శలను బిజెడి నేత, ఎంఎల్‌ఏ పద్మనాభ బెహరా తిప్పికొట్టారు. మనమంతా జగన్నాధుని పిల్లలం, మనంగాకపోతే భగవంతుడి పేరును ఎవరు తీసుకుంటారు, దీని గురించి మాట్లాడేందుకేమీ లేదు, రాజకీయం అసలే లేదన్నారు. భువనేశ్వర్‌ నగరంలోని అరవై ఏడు వార్డుల్లో శ్రీమందిర్‌ పరిక్రమ పధకంలోని రధాలను రెండు రోజుల పాటు తిప్పుతారు. ప్రతి ఇంటి నుంచి ఆకు వక్కలను, ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ పధకంలో భాగంగా పూరీలోని జగన్నాధ ఆలయ పరిసరాలలో రధయాత్ర వేగంగా కదలటాన్ని సులభతరం చేసేందుకు, తొక్కిడి లేకుండా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జగన్నాధ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ,భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకొనే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పధకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బిజెపి రాజకీయం చేస్తున్నది.