ఇష్టం లేని పెళ్లిలో తలంబ్రాలు పోసినట్లు : పులిహోర – పప్పుచారు మీద ఉన్న యావ మణిపూర్‌ మీద లేకపాయే ! నరేంద్రమోడీ 133 నిమిషాల ప్రసంగంలో కేవలం మూడు నిమిషాలే !

Tags

, , , , , ,

  ఎం కోటేశ్వరరావు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగానే దేశనేతలందు మన ప్రధాని నరేంద్రమోడీ వేరయా అని చెప్పక తప్పదు. సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డును బద్దలు చేశారు. గురువారం నాడు(ఆగస్టు పదవ తేదీ) తన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మాట్లాడిన తీరు కూడా దాన్ని నిర్ధారించింది. మణిపూర్‌ మీద నోరు విప్పించేందుకే అవిశ్వాసం అన్నది తెలిసిందే. దానికి సమాధానం అంటూ 133 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో కేవలం మూడంటే మూడు నిమిషాలే (డక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక) మణిపూర్‌ గురించి మాట్లాడారంటే మొక్కుబడి,ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో లోకానికి వెల్లడైంది. ప్రశ్నలను అడిగే చతురత ఏ ఒక్కరి సొత్తూ కాదు. మీడియాతో మాట్లాడని దేశాధినేతలెవరు లేదా ఎందరు ? ప్రజాస్వామ్యానికి మన దేశం పుట్టినిల్లు , పార్లమెంటును దేవాలయం అని వర్ణించి దానికి దూరంగా ఉండటం, మాట్లాడేందుకు ?ఇచ్చగించని ప్రధాని ఎవరు ? పార్లమెంటుకు వస్తూ సభలో చేయాల్సిన ప్రకటనను ప్రాంగణంలోని మెట్లు, గోడలను ఉద్దేశించి మొక్కుబడిగా మాట్లాడిన ప్రధాని ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం అంత కష్టమేమీ కాదు. యావత్‌ దేశాన్నే గాక ఐరోపా పార్లమెంటులో కూడా చర్చనీయాంశమైన మణిపూర్‌ దారుణాల గురించి స్పందనకు కూడా తీరికలేకుండా ప్రధాని ఉన్నారు.పార్లమెంటులో ఈ అంశం గురించి ప్రధాని నోరు విప్పాలన్న ప్రతిపక్షాల, యావత్‌ సమాజ వేడుకోళ్లు, విన్నపాలు, డిమాండ్లను పట్టించుకోకపోవటంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి మాట్లాడించే మార్గాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా తలెత్తి ఉండదు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. మణిపూర్‌ మీద ఏం చెబుతారో దేశానికి వెల్లడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రవేశపెట్టారన్నది తెలిసిందే.

మానవతుల మర్యాద మంట గలిపిన దుర్మార్గం గురించి మాట్లాడవయ్యా మహానుభావా అంటే మణిపూర్‌ ప్రభుత్వ ఆఫీసుల్లో మహాత్మాగాంధీ చిత్రాలను అనుమతించనపుడు అక్కడున్న ప్రభుత్వం ఎవరిది, జాతీయగీతం అలపించటాన్ని అనుమతించనపుడు ఎవరు అధికారంలో ఉన్నారు, తిరుగుబాటుదార్లు చెప్పిందే జరిగినపుడు ఏలుబడి ఎవరిది అంటూ జికె ప్రశ్నలను సంధించారు. మిజోరామ్‌ అమాయక పౌరుల మీద 1956 మార్చి ఐదున వైమానిక దళంతో కాంగ్రెస్‌ దాడులు చేయించింది అంటూ ప్రధాని మోడీ మాట్లాడిన తీరును చూసి ఏమనుకోవాలి ! జనాలకు బుర్ర తిరిగింది. అప్పుడు మిజోరంలో కాంగ్రెస్‌ దాడి చేయిస్తే నేడు మణిపూర్‌లో ఉన్న రెండింజన్ల పాలన సాగిస్తున్న బిజెపి మేమేన్నా తక్కువ తిన్నామా అంటూ మహిళలను నగంగా తిప్పి మానభంగం చేయించినట్లుగా ప్రధాని తర్కం ఉంది. మణిపూర్‌ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదు, రెండు సామాజిక తరగతుల మధ్య తలెత్తిన అనుమానాలను ఎందుకు తీర్చలేదు, ప్రధాని కనిపించటం లేదు అని పోస్లర్లు వేసి మరీ అక్కడ జనం అడుగుతున్నారు అని ప్రతిపక్షాలు అడిగాయి. వాటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ ఎన్నడూ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొనేందుకు చూడలేదు, నేను 50సార్లు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాను అన్నారు ప్రధాని. ఓట్ల కోసం వందసార్లు వెళ్లవచ్చు, ఒక రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించి జనం బిక్కుబిక్కు మంటూ దిక్కులేకుండా ఉన్నపుడు మణిపూర్‌ వెళ్లారా, పరామర్శించారా ,గాయపడిన మణిపూర్‌ పౌరుల మనోభావాలను పట్టించుకున్నారా లేదా అన్నది గీటురాయి తప్ప ఆ ప్రాంతానికి ఎన్నిసార్లు వెళ్లారు అని ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అడిగిందా ? మణిపూర్‌లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.సమీప భవిష్యత్‌లో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ?ఇస్తున్నాను, దేశం మొత్తం మీతో ఉందని మణిపూర్‌ మహిళలు, బిడ్డలతో సహా పౌరులందరికీ నేను చెబుతున్నాను అని ప్రధాని చెప్పారు. ఈ ముక్కేదో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన తొలి రోజుల్లోనే చెప్పి ఉంటే ? పార్లమెంటు ప్రారంభం కాగానే స్వయంగా ప్రకటన చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేదా ?

  తనకు లేని అధికారాన్ని పుచ్చుకొని మెయితీలను గిరిజనులుగా పరిగణిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్న మణిపూర్‌ హైకోర్టు ఆదేశమే కదా అక్కడ జరిగిన పరిణామాలకు కారణం.దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించనంతవరకు గిరిజనుల్లో ఉన్న అనుమానాలు తొలగవు. ఇతర ప్రాంతాల్లోని గిరిజనులలో కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చు. కానీ ప్రధాని ప్రసంగంలో దాని ప్రస్తావన లేదు. అంటే ఆ వివాదాన్ని కొనసాగించాలని చూస్తున్నారన్నది స్పష్టం. మణిపూర్‌ దారుణాలు జరిగినపుడు కర్ణాటకలో ఓట్ల వేటలో ఉన్నందున మోడీ గారికి వెళ్లే తీరికలేదు అనుకుందాం. ఒక ట్వీట్‌ ద్వారానైనా తన స్పందన ఎందుకు వెల్లడించలేదు. ట్వీట్‌ అంటే గుర్తుకు వచ్చింది. మణిపూర్‌లో హింసాత్మక ఉదంతాలు ఆగలేదు, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. పక్కనే ఉన్న హర్యానాలో బుల్డోజర్లను నడిపిస్తున్న ఆటవిక పాలన సాగుతున్నది. సరిగ్గా అప్పుడు అంటే ఆగస్టు రెండున ఒక ఉదంతం జరిగింది. దాన్ని నరేంద్రమోడీ గారి ట్వీట్‌లోనే చూద్దాం. ” గత సాయంత్రం నేను భారత దక్షిణ రాష్ట్రాల ఎన్‌డిఏ ఎంపీలతో ఒక అద్భుతమైన సమావేశాన్ని జరిపాను. తరువాత గొప్ప విందు జరిగింది. దానిలో పానియారమ్‌, అప్పమ్‌, కూరగాయల కుర్మా, పులిహోర,పప్పుచారు,అడాయి. అవియాల్‌ ?ఇంకా కొన్ని వడ్డించారు ” అని ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు మూడవ తేదీ సాయంత్రం 4.1?కు ఒక ట్వీట్‌ చేశారు, దానికి విందు ఫొటోను కూడా జత చేశారు.

  రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి నిర్వాకం గురించి తెలిసిందే. పులిహౌర-పప్పుచారు రుచుల మీద ఉన్న యావ మణిపూర్‌ మీద ప్రధానికి ఎందుకు లేకపోయింది అన్నది ప్రశ్న. అవిశ్వాస తీర్మానం మీద సమాధానంగా ప్రధాని చేసిన మిగతా ప్రసంగమంతా కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల మీద గతంలో చేసిన దాడిని పునరుచ్చరించటం తప్ప మరేమీ లేదు.ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లిందీ ప్రధాని చెప్పారు. దేవాలయం అని వర్ణించిన పార్లమెంటుకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చారు, ఎంతసేపు గడిపారు, ఏం మాట్లాడారు అన్నది ప్రశ్న.పార్లమెంటు నిబంధనల ప్రకారం ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పార్లమెంటుకు వచ్చినా రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన అవసరం లేదు గనుక వారెన్ని సార్లు వచ్చిందీ మనకు తెలియదు. మన ప్రజాస్వామ్య గొప్పతనమిది అనుకొని మన భుజాలను మనమే చరుచుకోవాలి. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను 2014 ఎన్నికలపుడు నరేంద్రమోడీ విమర్శించిన తీరును చూశాము. బలహీన, నోరులేని, మౌన మోహన సింగ్‌ అని వర్ణించారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో అదే పెద్దముషి తాజాగా చేసిన ప్రసంగంతో కలుపుకొని పార్లమెంటులో మాట్లాడింది కేవలం 31 సార్లు మాత్రమే అని తేలింది. ఇంత కంటే ఎక్కువ సార్లు మాట్లాడినట్లు ఎవరైనా చెబితే ఆ మేరకు అంకెను సవరిద్దాం. అదే మౌన మోహన సింగ్‌ గారు పదేండ్ల పాలనా కాలంలో 70సార్లు మాట్లాడారు. అనేక కీలక అంశాల మీద నరేంద్రమోడీ మౌనం జగమెరిగిన సత్యం.ప్రతి ఏడాదీ రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలపటం, స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా అభినందనలు, తన మంత్రుల పరిచయం, రామ మందిర నిర్మాణం గురించి ప్రకటనల వంటివి మోడీ ప్రసంగాల జాబితాలో ఉన్నట్లు ఇండియా టుడే ఒక విశ్లేషణలో పేర్కొన్నది.

  2014లో మంత్రిగా ఉన్న సాధ్వి నిరంజన ప్రతిపక్షాల మీద చేసిన సంస్కారం లేని అనుచిత వ్యాఖ్యల మీద దుమారం లేవటంతో తప్పనిసరై మోడీ జోక్యం చేసుకొని పార్లమెంటులో మాట్లాడటం, తరువాత ఆమె మంత్రి పదవి పోవటం, ముంబై పేలుళ్లలో పాక్‌ జాతీయుడికి బెయిలిచ్చిన ఉదంతం మీద, ఒకసారి కాశ్మీరు మీద, మరోసారి వ్యవసాయ సంక్షోభం, పదహారవ లోక్‌సభలో ముగింపు మాటలు తప్ప మరొకటి లేదు.రాఫెల్‌ గురించి, అదానీ కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ నివేదిక వంటి అంశాల మీద నోరు విప్పలేదు. వర్తమాన లోక్‌సభలో నెలల తరబడి సాగు చట్టాల మీద పార్లమెంటు అనేక సార్లు స్థంభించినా, మిత్రపక్షం అకాలీదళ్‌ వెళ్లిపోయినా నోరు విప్పలేదు. బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమ మర్యాదకు భంగం కలిగించినట్లు మహిళా రెజ్లర్లు కేసులు పెట్టి ఆందోళన చేసినా నోరు మెదపలేదు. అందువలన మణిపూర్‌లో తమ పార్టీ నిర్వాకం వలన తలెత్తిన పరిస్థితి గురించి ప్రధాని మౌనంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. విధిలేక సాగు చట్టాలను రద్దు చేస్తూ జాతికి క్షమాపణలు చెబుతూ బయట మాట్లాడారు తప్ప పార్లమెంటులో కాదు. అంతకు ముందు గోరక్షకుల పేరుతో జరిపిన దురాగతాల గురించి చేసిన ప్రకటన, సిఏఏ ఆందోళన గురించి మాట్లాడింది కూడా పార్లమెంటులో కాదు. చివరికి గాల్వన్‌ ఉదంతాల మీద కూడా ప్రతిపక్షాలతో జరిపిన అఖిల పక్ష సమావేశంలో, టీవీలో మాత్రమే మన భూభాగంలోకి ఎవరూ రాలేదు, ఏ పోస్టునూ కదిలించలేదు అని మాట్లాడారు. ప్రతిపక్షం అవిశ్వాసం తీర్మానం పెట్టటమే తప్పు అధికారం కోసం ఆకలితో ఉన్నట్లు ప్రధాని ఆరోపించారు. చరిత్రను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే తమ గతం గుర్తుకు వచ్చి ఉండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద గతంలో ప్రవేశపెట్టిన అన్ని అవిశ్వాస తీర్మానాలకు బిజెపి లేదా దానికి ముందు రూపమైన జనసంఘం మద్దతివ్వటమే కాదు, తానే స్వయంగా ప్రవేశపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి.ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ఒక ఆయుధం.దేశ చరిత్రలో 28సార్లు ప్రవేశపెట్టారు. పదహారు సంవత్సరాల పాలనలో ఇందిరా గాంధీ పదిహేను తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఏ ఒక్కటీ నెగ్గలేదు.

  ఇక ప్రధాని నరేంద్రమోడీ పులిహోర- ప్చుచారు ట్వీట్‌ మీదా నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొన్ని స్పందనలను చూద్దాం.” ఉప్మా ఎక్కడ మోడీ గారూ, పెరుగన్నం గురించి చెప్పలేదేం సార్‌, పప్పు అంటే ఏమిటి ? ” ఒక మొద్దుబారిన స్పందన ఇది, హర్యానా, మణిపూర్‌ తగులబడుతున్నది, ఎక్కడ చూసినా హింసాకాండ, రక్తపాతం, విద్వేష ప్రసంగాలు, ప్రతి చోటా జనం చచ్చిపోతుండగా ఈ మనిషి తాను తిన్నదాని గురించి ట్వీట్‌ చేశారు.అతనికేమీ సహానుభూతి లేదు, అతనేమీ పట్టించుకోరు.” ” జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ఎందుకు వెళ్లరు,మణిపూర్‌ను ఎందుకు సందర్శించరు ?” ” ఈ మనిషి నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నారు, దేశం తగులబడుతుంటే తాను తిన్న పదార్ధాల గురించి చెబుతున్నారు ” ” మీ డిన్నర్‌లో దాక్షిణాది వంటకాలతో మజా చేసుకోండి ” ” చాలా గొప్పగా ఉందండి హర్యానా లేదా మణిపూర్‌లో గుజరాత్‌ నమూనా విద్వేష విస్తరణ పండగ పార్టీలా ఉంది. మీరు పార్లమెంటు లేదా మణిపూర్‌ ఎప్పుడు వెళతారు ” ” ఎంతటి గొప్ప మనిషిని మనం ప్రధానిగా కలిగి ఉన్నాం. మణిపూర్‌ సమస్య మీద వివరణ కోసం మీరు పార్లమెంటుకు రావాలని యావత్‌ ప్రతిపక్షం కోరుతుండగా మీరు మాత్రం తాపీగా ఉన్నారు. దక్షిణాది వంటకాల రుచులను అనుభవిస్తున్నారు. మోడీ గారూ పౌరుల గురించి మీకు ఎంత విశాల హృదయ స్పందన ఉందో కదా ! ” ” మీరు మంచి సమావేశాన్ని జరిపారు కానీ మీకు దేశంలో జరుగుతున్న దానిమీద చర్చించేందుకు తగిన సమయం లేదాు. మీరు ఆ గద్దెమీద ఎందుకు ఉన్నారు. మీ వంటి నేతను కలిగి ఉన్నాం కాబట్టి వందల సంవత్సరాల తరువాత కూడా మీ కారణంగా మనం అభివృద్ది చెందిన దేశం మాదిరి గాక అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఉంటాం.” ” అద్భుతం మీరూ హాపీ మేమూ హాపీ . రకరకాల దుస్తులు, ఎన్నో రకాల వంటలు అనుభవించండి, భిన్న రుచులను అనుభవించటమే కదా జీవితం ” ” సార్‌ అప్పుడప్పుడూ డిన్నర్‌లో ఒక రొట్టె ముక్కను కూడా తినేందుకు ప్రయత్నించాలి మీరు. ఎందుకంటే మణిపూర్‌ సహాయ శిబిరాల్లో ఉంటున్నవారు తింటున్నది అదే ” ” ఎనభై కోట్ల మంది జనం ఐదు కిలోల ఉచిత రేషన్‌తో బతుకుతుండగా మీరు అనేక వంటకాలను భుజిస్తున్నారు ” ” అనేక శాంతి భద్రలతల సమస్యల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం, లక్షలాది మంది పేదా మధ్యా తరగతి జనాల ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. మన దేశ ప్రధానికి తమ పార్టీ ఎంపీలతో కలసి ఆరగించిన ఆహార పదార్దాల గురించి ట్వీట్‌ చేసేందుకు వ్యవధి ఉంటుంది గానీ పరిస్థితిని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కనిపించటం లేదు.” వీటి గురించి వేరే వ్యాఖ్యలు అవసరమా ?

పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాపై చైనా దాడిని ఎక్కుపెట్టిందా ?

Tags

, , , , ,



ఎం కోటేశ్వరరావు


పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాను దెబ్బతీసేందుకు చైనా ఎలా చూస్తున్నదో చూడండి, మన పెట్టుబడులనే మన నాశనానికి వాడుతున్నది అంటూ అమెరికాలో విశ్లేషకులు కొందరు అక్కడి పాలకవర్గాన్ని హెచ్చరించారు. ఇది ఒక్కరిద్దరి అభిప్రాయం అనుకుంటే పొరపాటు, అమెరికాలో పెట్టుబడిదారీ విధాన మీద తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు అక్కడి పాలకవర్గ మేథావులు ముందుకు తెచ్చిన సరికొత్త ప్రచారదాడిలో అదొక అస్త్రం.అదే విధంగా అమెరికా స్కూళ్లలో చైనా ప్రవేశించి కమ్యూనిస్టు పాఠాలు చెబుతున్నదని ఆధారంలేని ఆరోపణలతో ఒక నివేదికను విడుదల చేశారు. ఈ రెండూ అక్కడి పాలకవర్గంలో ఉన్న చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత, దాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం కనిపిస్తున్నది.


విశ్లేషకుల కథన సారం ఇలా ఉంది. ” ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిస్టు సిద్దాంత మార్గదర్శకత్వంలో పని చేసే చైనా నుంచి ముప్పు తీవ్రం అవుతున్నది. అందువలన దానితో ఆర్థిక లావాదేవీలను పున: విశ్లేషణ చేసుకోవాల్సిన అత్యవసరం ఎన్నటి కంటే మరింత పెరిగింది. అమెరికా పెట్టుబడులతో అపార సంపదలను చైనా పోగేసుకుంది. మన స్వంత పెట్టుబడిదారీ వ్యవస్థను మన వ్యతిరేక ఆయుధంగా మార్చింది. పెన్షన్‌ నిధులు, ఇతర మార్గాల ద్వారా దాదాపు పది కోట్ల మంది అమెరికన్లు తమకు తెలియకుండానే తమను దెబ్బతీసే ఆర్థిక ప్రత్యర్ధి చైనాలో పెట్టుబడులు పెట్టారు.ప్రపంచాధిపత్యం కోసం చూస్తున్న దాని మిలిటరీ బలపడేందుకు అవకాశం కల్పించారు. ఆర్థిక సరళీకరణను ప్రారంభించిన 1978 నుంచి చైనా ఒక పద్దతి ప్రకారం పశ్చిమ దేశాల పెట్టుబడి మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీపై అమెరికా పార్లమెంటు ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ ముందు సాక్ష్యమిచ్చిన పెట్టుబడి మార్కెట్ల భద్రతా కమిషనర్‌ రోజర్‌ రాబిన్సన్‌ మాట్లాడుతూ పరాకుగా ఉన్న అమెరికా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న ఐదు వేల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లును పెట్టుబడులుగా పెట్టేందుకు సాధారణ అమెరికన్లను అనుమతించింది. ప్రపంచమంతటి నుంచి చైనా వచ్చే పెట్టుబడుల్లో అరవైశాతం డాలర్లు అమెరికా వనరుల నుంచే ఉన్నాయి గనుక అవి నిలిచిపోతే అక్కడి ఆర్థికరంగం పూర్తిగా దెబ్బతిని చైనా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది.


పెట్టుబడులు పెట్టినందుకు దోహదం చేసిన బ్లాక్‌రాక్‌ వంటి అగ్రశ్రేణి ఆస్తుల నిర్వహణ సంస్థలు ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.అమెరికా పర్యావరణ, సామాజిక, పాలన ప్రమాణాలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి కంపెనీలు వాటిని గట్టిగా పాటించి ఉంటే చైనా కంపెనీలకు పెట్టుబడులు వెళ్లేవి కాదు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ పెట్టనన్ని పెట్టుబడులను బ్లాక్‌రాక్‌ కంపెనీ సిఇఓ లారీ ఫింక్‌ ప్రవహింపచేశాడు. పెట్టుబడి సంస్థలు చైనాలో పెట్టుబడులు పెడితే సంభవించే ఆపదల గురించి పట్టించుకోకపోగా పైకి కనిపించినంత చెడుగా చైనా సంస్థలు లేవని యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చెప్పింది. నిర్భంద శిబిరాలు, బలవంతంగా కార్మికులను తరలించే,మారణకాండ, చైనా మిలిటరీకి ఆధునిక ఆయుధాలను సరఫరా చేసేందుకు దోహదం చేసేవిగా చైనా కార్పొరేట్‌ కంపెనీలు ఉన్నాయి.ప్రపంచ ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాలన్నీ చైనా సంస్థలతో చేతులు కలిపితే వచ్చే ముప్పును గ్రహిస్తున్నాయి. చైనా మీద ఆధారపడితే తలెత్తే ముప్పును తొలగించుకొనేందుకు, నూతన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు జి7 దేశాల కూటమి పూనుకుంది. ఇది చాలదు, అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌లలో ఉన్న చైనా కంపెనీలను జాబితా నుంచి తొలగించాలి, రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి.చైనా కంపెనీలకు రుణాలు ఇచ్చే సంస్థలను నిషేధించాలి.డాలర్ల రూపంలో ఇస్తున్న చైనా ప్రభుత్వ బాండ్ల మీద నిషేధం విధించాలి. గతంలో సోవియట్‌ ముప్పును వమ్ము చేసేందుకు అనుసరించిన ఆర్థిక పద్దతులను ఇప్పుడు చైనా మీద అనుసరించాలి. మనం దీర్ఘకాలంగా ప్రేక్షకుల మాదిరి ఉన్నాం, మన పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఇది సరైన తరుణం. ”


అమెరికా గడ్డ మీద, వెలుపలా అమెరికా మీద చైనా నిరంతర నిఘాను ఉపేక్షించరాదని ఆగస్టు మొదటి వారంలో జరిగిన పార్లమెంటు సెలెక్ట్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘర్‌ డిమాండ్‌ చేశాడు. ఇప్పుడే మేలుకున్నామని కూడా అన్నాడు. దానిలో భాగంగా ప్రపంచమంతటా రహస్య పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనాలో ప్రైవేటు కంపెనీలంటూ లేవు, ప్రతి ఒక్కరూ, ప్రతిదీ, ప్రతి సంస్థ షీ జింపింగ్‌ కోరుకున్నదాని ప్రకారమే ఉంటుందని గాలఘర్‌ ఆరోపించాడు.చైనాలో పెట్టుబడులపై పరిమితులను మరింతగా విస్తరించాలని జో బైడెన్‌న్ను గాలఘర్‌ కోరాడు. ఉత్తరువుల ద్వారా వాటిని వెంటనే అమల్లోకి తేవాలంటూ ఒక లేఖను కూడా రాశాడు. ప్రభుత్వ పెట్టుబడులకే పరిమితం గాకుండా ప్రైవేటు పెట్టుబడుల మీద ఆంక్షలు విధించాలని కోరాడు. చైనా మిలిటరీ కంపెనీలకు మన పెట్టుబడులు తరలటం అంటే మన నాశనానికి మనమే సహకరించినట్లు అవుతుందన్నాడు. చైనా బాండ్లు, కంపెనీల వాటాల్లో 1.1లక్షల కోట్ల డాలర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు 200బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం చైనా మిలిటరీతో సంబంధాలున్న కంపెనీలలో ఉందని ఆరోపించాడు. తైవాన్‌ విలీనం షీ జింపింగ్‌ జీవిత లక్ష్యమని అందుకు గాను సన్నాహాలకు గాను అవసరమైన సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారని అన్నాడు. దాన్ని ఎదుర్కొనేందుకు ఇండో ఫసిఫిక్‌ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన మిలిటరీ, పరికరాలను సమీకరించే మన సామర్ధ్యాన్ని దెబ్బతీసేందుకు చైనా చూస్తున్నదని, చైనాతో ఘర్షణకు దిగాల్సి వస్తే మనం భూమ్యాకాశాలను కదిలించాల్సి ఉంటుందని,ఎంతో వినాశకరంగా ఉంటుందని అన్నాడు.అమెరికా నిషేధిత జాబితాలో ఉంచిన చైనా కంపెనీల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారంటూ బ్లాక్‌రాక్‌, ఎంఎస్‌సిఐ కంపెనీలకు సెలెక్ట్‌ కమిటీ అడిగిన సంజాయిషీకి తాము చట్ట ప్రకారమే తమ వాణిజ్య పద్దతుల్లో భాగంగానే పెట్టుబడులు పెట్టినట్లు ఆ కంపెనీలు చెప్పాయి.


ఇలా సాగిన విశ్లేషణలు, పార్లమెంటరీ కమిటీ చైనా మీద చేసిన విచారణ అంతా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు, రాజకీయంగా ప్రపంచంలో తింటున్న ఎదురుదెబ్బలకు కారణం చైనా అని తమ జనాన్ని నమ్మించేందుకు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ముందుకు తెచ్చిన కొత్త ప్రచార ఎత్తుగడ. గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్నపుడు దానితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనే పేరుతో ప్రచ్చన్న పోరు పేరుతో సాగించిన ప్రత్యక్ష ప్రచార దాడిలో భాగంగా సోషలిజం, కమ్యూనిజం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ పోరులో విజయం సాధించినట్లు మూడు దశాబ్దాల క్రితం స్వయంగా ప్రకటించుకున్నారు. మరోవైపు చైనాలో పెట్టుబడులు పెట్టటంతో పాటు అక్కడి నుంచి భారీ ఎత్తున సరకులు దిగుమతి చేసుకున్నది. దాంతో అనేక మంది చైనా తమ ఉపాధిని హరించిందనే ప్రచారాన్ని అమెరికాలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. అది అనేక మంది యువతలో సైద్ధాంతిక మధనాన్ని పెంచింది. సోషలిజమే మెరుగైనది, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది అనే భావనలు పెరుగుతున్నాయి. అందువలన పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేక అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగిస్తే దశాబ్దాల తరబడి ఆ కమ్యూనిస్టు చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టారు, ప్రతి వస్తువును అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకున్నారు, ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు, చైనాతో తెగతెంపులు చేసుకోవటం లేదని ఎందుకు ప్రకటిస్తున్నారు అన్న ప్రశ్నలకు అమెరికా విధాన నిర్ణతల దగ్గర సమాధానం లేదు. అందుకే మనలను దెబ్బతీసేందుకు మన పెట్టుబడిదారీ వ్యవస్థనే చైనా అస్త్రంగా మార్చుకున్నదనే తర్కానికి నిలవని ప్రచారానికి పూనుకున్నారు. ఒకటి వాస్తవం, ఏ విధంగా చూసినా నేటి చైనా నాటి సోవియట్‌ కాదు.ఆర్థికంగా త్వరలో అమెరికాను అధిగమించనుంది.ప్రపంచీకరణ భావన, స్వేచ్చామార్కెట్‌ను ముందుకు తెచ్చింది అమెరికా తప్ప చైనా కాదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చైనా లబ్ది పొందిన మాట వాస్తవం. దివాలా కోరు విధానాలతో అమెరికా పెట్టుబడిదారీ విధానం విఫల బాటలో ఉంది.


అమెరికా స్కూళ్లలో పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్న చైనా వాటిని కమ్యూనిస్టు ప్రచారానికి అడ్డాలుగా మారుస్తున్నదని విద్యా పరిరక్షక తలిదండ్రుల కమిటీ(పిడిఇ) పేరుతో ఉన్న సంస్థ తాజాగా ఒక నివేదికలో ఆరోపించింది. అమెరికాలో స్కూళ్లు పన్నెండవ తరగతి(మన దగ్గర ఇంటర్‌ మీడియెట్‌) వరకు బోధిస్తాయి. తమ దేశ తత్వవేత్త కన్ఫ్యూసియస్‌ పేరుతో వందకు పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తరగతులను నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతుల మేరకే చైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. నిజానికి అక్కడి సంస్థల సంఖ్యతో పోలిస్తే అసలు లెక్కలోకి రావు. ఈ పేరుతో అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించేందుకు, తమకు ఏజంట్లుగా పనిచేసే వారిని ఎంచుకొనే కేంద్రాలుగా మార్చుతున్నదంటూ ఆరోపిస్తూ ఇటీవల అమెరికా ఎఫ్‌బిఐ ఒక నివేదికను వెల్లడించింది. చైనా జాతీయ ఇంటిలిజెన్స్‌ చట్టంలో చైనా పౌరులు ఎక్కడ నివశిస్తున్నప్పటికీ తమ మాతృభూమి కోసం కళ్లు, చెవులుగా పని చేయాలని చెప్పిందని, అందువలన అమెరికాతో సహా విదేశాల్లో ఉన్న చైనా జాతీయులందరూ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ గతేడాది సిఐఏ మాజీ అధికారి శామ్‌ ఫడీస్‌ ఒక తర్కాన్ని ముందుకు తెచ్చాడు. ఇదంతా తప్పుడు ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. అదే సూత్రం ప్రతి దేశ పౌరులకు వర్తిస్తుంది. అందరినీ అలాగే చూసేట్లైతే ఎవరూ వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.


ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు గాను ప్రతి దేశం అనేక చర్యలను తీసుకోవటం తెలిసిందే. అమెరికా స్కూళ్లలోని టీచర్లు, విద్యార్ధులతో చైనా వారు సంబంధాలు పెట్టుకుంటూ చైనా భాష, సాంస్కృతిక సంబంధాలు, విద్యార్ధి బృందాల మార్పిడి పేరుతో గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు పిడిఇ ” లిటిల్‌ రెడ్‌ క్లాస్‌ రూమ్స్‌” పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో ఆరోపించింది. ఇలాంటి స్కూళ్లు, కాలేజీలన్నీ అమెరికాలోని 20 మిలిటరీ కేంద్రాల చుట్టూ ఉన్నట్లు మరొక కథనాన్ని దానిలో పేర్కొన్నారు. నిజానికి ఇవేవీ అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు.ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి ఉన్న అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలకు వేళ్ల మీద లెక్కించదగిన ఆ సంస్థల్లోని కేంద్రాలను మూసి వేయించటం పెద్ద కష్టమేమీ కాదు. ఒక వేళ నిజమే అనుకుంటే ఆ పని చేయకుండా వాటిని అనుమతిస్తూనే మరో వైపు అనుమానాలు రేకెత్తించే ప్రచారానికి అవి తెరలేపుతున్నాయి. అలాంటి కేంద్రాలన్నీ గూఢచర్యానికి పాల్పడుతుంటే, అది వాస్తవమనుకుంటే అమెరికా సర్కార్‌ లేదా అక్కడి సంస్థలు మన దేశంతో సహా అనేక చోట్ల విద్యా సంస్థలతో సంబంధాలు, అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి, వారాలు , నెలల తరబడి మన వారిని అమెరికా ఆహ్వానిస్తున్నాయి. వాటన్నింటినీ సిఐఏ గూఢచార కేంద్రాలుగా పరిగణించాలా ?

కాశ్మీరీ ఫైల్స్‌ వివేక్‌ అగ్నిహౌత్రికి ఆగ్రహం ! మణిపూరీ ఫైల్స్‌ మీద ఎదురుదాడి !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింప చేసి వారి మద్దతు పొందిన వివేక్‌ రంజన్‌ అగ్నిహౌత్రిని మణిపూర్‌ ఫైల్స్‌ గురించి అడగ్గానే అగ్నిహౌత్ర అవధానులయ్యారు. అగ్నిహౌత్రి సంఘపరివార్‌ సభ్యుడా లేక అనేక మంది మాదిరి ముసుగులో ఉన్న అదే తెగ సినిమా రంగ పెద్దమనిషా అన్నది పక్కన పెడదాం. మణిపూరీ ఫైల్స్‌ సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నించిన వారి మీద నేను తప్ప వేరే మగాళ్లే లేరా అంటూ మండిపడ్డారు. ఎదురుదాడికి దిగారు. కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా 2022లో ప్రపంచమంతటా 350 కోట్ల రూపాయలను వసూలు చేసి హిందీ సినీ రంగంలో ఒక రికార్డు నెలకొల్పింది. దాని కొనసాగింపుగా మరింతగా సొమ్ము చేసుకొనేందుకు, ప్రచార పర్వంలో భాగంగా కాశ్మీరీ ఫైల్స్‌ అన్‌రిపోర్టెడ్‌ పేరుతో అంటే వెలుగులోకి రాని కాశ్మీరి పండిట్ల ఉదంతాల పేరుతో ఒక సిరీస్‌ విడుదల చేయనున్నారు. తొలి భాగం ఆగస్టు 11న జీ5లో ప్రసారం కానుంది. తాము పరిశోధించిన దానిలో పది నుంచి ఇరవై శాతమే ఈ సిరీస్‌లో చూపనున్నామని, వాస్తవ గాధలను వీటిలో చూస్తారని, తమ పరిశోధన సారాన్ని కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాగా తీశామని అగ్నిహౌత్రి చెప్పారు. ఇది రాజకీయ ప్రచారం కోసం అన్నది వేరే చెప్పనవసరం లేదు. కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడుల గురించి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవీ దాచలేదు, వార్తల మీద ఆంక్షలు విధించలేదు. వాటిని అన్ని పార్టీలూ ఖండించాయి. నేడు మణిపూర్‌ ఉదంతాల మీద జరిగినట్లుగా పార్లమెంటు దద్దరిల్లలేదు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్‌ ప్రభుత్వానికి బిజెపి కూడా వెలుపలి నుంచి మద్దతు ఇచ్చింది. రాముడి రధ యాత్ర పేరుతో 1990 నవంబరు రెండున అయోధ్యకు చేరుకున్న కరసేవకులను నిరోధించేందుకు నాడు అధికారంలో ఉన్న ములాయం సింగ్‌ ప్రభుత్వం కాల్పులు జరపటానికి దారితీసిన పరిస్థితి తరువాత బిజెపి దానికి నిరసగా కేంద్రంలో విపి సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది తప్ప కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడులకు కాదు. మూడు దశాబ్దాల తరువాత నాటి ఉదంతాల పేరుతో సినిమా తీసిన వివేక్‌ అగ్నిహౌత్రి వర్తమాన మణిపూర్‌ ఫైల్స్‌ గురించి పరిశోధనా లేదు, సినిమా లేదు.


మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, అత్యాజరిపిన ఉదంతం ప్రపంచమంతటినీ కదిలించింది. వివేక్‌ అగ్నిహౌత్రి ఒక సంఘపరివార్‌ విధేయుడిగా స్పందించారు. ఆ ఉదంతాన్ని తక్కువ చేసి చూపేందుకు బిజెపి ఎత్తుగడనే ఆ పెద్దమనిషి కూడా అనుసరించి తన నిబద్దతలో ఎలాంటి సడలింపు లేదని ప్రదర్శించుకున్నారు. వెలుగులోకి రాని కాశ్మీరీ పండిట్ల ఉదంతాలు అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అగ్నిహౌత్రి ట్విటర్‌ ద్వారా, ఇతరంగా ప్రకటించారు. కాశ్మీరీ హిందువులను ఊచకోత కోస్తే భారత న్యాయవ్యవస్థ దాన్ని చూడకుండా, మౌనంగా నిస్సహాయంగా ఉందని ధ్వజమెత్తారు. మన రాజ్యాంగం వాగ్దానం చేసినట్లుగా కాశ్మీరీ హిందువుల జీవిత హక్కును రక్షించేందుకు తనంతట తానుగా స్పందించటంలో విఫలమైంది, ఇప్పటికీ విఫలమౌతూనే ఉంది అని ఆరోపించారు. మణిపూర్‌ ఉదంతాల మీద నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోడీ మీద అదే స్పందన ఎందుకు వెల్లడించలేదు ? నిజానికి అగ్నిహౌత్రి కడుపు మంట కాశ్మీరీ పండిట్ల మీద స్పందించలేదు అన్నదాని కంటే మణిపూర్‌ మీద నోరు విప్ప నోరు విప్ప అంటూ ప్రధాని నరేంద్రమోడీ నోటికి వేసుకున్న తాళాన్ని న్యాయవ్యవస్థ తీయించిందన్న దుగ్దను ఆ రూపంలో వెల్లడించుకున్నారు. సమయాన్ని వృధా చేయకండి మీరు దమ్మున్న మగాడే అయితే అక్కడికి వెళ్లండి, మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీయండి అని దాని మీద ఒక ట్విటర్‌ సవాలు విసిరారు. ఒక ప్రముఖుడి నుంచి అలాంటి ట్వీట్‌ వెలువడితే వేరు. కానీ ఆ సాధారణ ట్వీట్‌ మీద స్పందించి మీకు నా మీద విశ్వాసం ఉన్నందుకు కృతజ్ఞతలు, కానీ నన్ను అన్ని సినిమాలూ తీయాలంటున్నారు దమ్మున్న వారు ఇంకెవరూ లేరా అని ఎదురుదాడికి దిగి అతి తెలివి ప్రదర్శించారు.


అంతకు ముందు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ మీద ట్వీట్లు చేశారు, ఒక కవితను కూడా రాశారు. ఒక ట్వీట్‌లో ఇలా ఉంది. ” మణిపూర్‌ : మోప్లా, డైరెక్ట్‌ యాక్షన్‌ డే( ప్రత్యేక దేశంగా పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే 1946 ఆగస్టు 11న ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని పాటిస్తామని ముస్లింలీగ్‌ నేత జిన్నా అదే ఏడాది జూలైలో చేసిన ప్రకటన), నౌఖాలీ, బంగ్లాదేశ్‌, పంజాబ్‌, కాశ్మీర్‌, బెంగాల్‌, కేరళ, అసోం, బస్తర్‌ ఇప్పుడు మణిపూర్‌…ప్రతిసారీ అంతిమంగా మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానుష,ఆటవిక చర్యలకు బలౌతున్నారు. ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా ప్రతిసారీ నా ధైర్యం చెదిరింది, నేను సిగ్గుపడ్డాను, నా చేతగాని తనానికి అపరాధన భావనతో ఉన్నా అని పేర్కొన్నారు. ఇక ఆ పెద్దమనిషి కవితా స్పందన గురించి చూద్దాం. ” ఓ మణిపూర్‌… నేను యత్నించా…నేను యత్నించా… కానీ విఫలమయ్యా……నా నైపుణితో ఇప్పుడు నేను చేయగలిగింది వారి విషాద గాధలను చెప్పటమే, కానీ అప్పటికి అది ఎంతో ఆలశ్యం అవుతుంది…… ఎంపిక చేసుకున్న, అతితో కూడిన పోటీ తత్వపు ఎన్నికల రాజకీయాలకు మనమందరం బాధితులం…..మనమందరం మత అతి బాధితులం….. మనమందరం ప్రమాదకర మీడియా బాధితులం…..మనం భారత పౌరులం, బాధితులం……..స్వేచ్ఛా భారతంలో జీవన హక్కులేదు, దాని గురించి మనమేమీ చేయలేం…… ఇది నేను కోరుకున్న స్వేచ్చ కాదు…. ఇలాంటి ప్రజాస్వామ్యం కాదు నేను కోరుకున్నది…… పరస్పరం కొట్టుకున్నవారి రక్తంతో ఒక అఖాతాన్ని మనతో ఏర్పాటు చేయిస్తే దానికి అర్దమే లేదు…..మనది ఒక విఫల సమాజం…. నా సోదరీమణులారా నేను విచారిస్తున్నాను…. నా తల్లులారా నేను విచారిస్తున్నాను…….భారత మాతా నేను విచారిస్తున్నాను.” ఇలా సాగింది ఆ కవిత.


ఇది చదివిన తరువాత ఎవరిలోనైనా తలెత్తే ప్రశ్న ఏమిటంటే దానిలో ఎక్కడైనా మణిపూర్‌ దురాగతానికి పాల్పడిన శక్తుల గురించి ఖండన ఉందా ? దాని మీద రెండు ఇంజన్ల పాలక పార్టీ, ప్రభుత్వాల తీరుతెన్నుల మీద అధిక్షేపణ ఎక్కడైనా ఉందా? మూడు దశాబ్దాల క్రితం జరిగిందని చెబుతున్న, అతిశయోక్తులతో కూడిన కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాను తీశారు. ఇప్పుడు కానసాగింపుగా సిరీస్‌ను ఇప్పుడెందుకు తీస్తున్నట్లు ? మణిపూర్‌ గురించి తాను సినిమా తీసే సరికి ఎంతో ఆలశ్యం అవుతుందని చెప్పటాన్ని ఏమనాలి ? తప్పించుకొనే ఎత్తుగడ తప్ప ఇంకేమైనా ఉందా ? ఎంపిక చేసుకున్న ఎన్నికల రాజకీయాలని ఎత్తి చూపుతున్న పెద్దమనిషి వర్తమానాన్ని వదలి మూడు దశాబ్దాల నాటి సంఘటనలను ఇప్పుడెందుకు ”ఎంపిక” చేసుకున్నట్లు ? అవి జరిగినపుడు నా వయస్సు 17, అప్పుడు నాకు తెలియదు అని చెప్పవచ్చు. ఇప్పుడు 49 సంవత్సరాల పరిణితి వచ్చింది కదా పైన చెప్పిన కవితలోని అంశాలతో వర్తమాన భారతమాత ఫైల్స్‌ ఎందుకు తీయలేదు ? ఐరోపా పార్లమెంటుతో సహా ప్రపంచమంతా చర్చిస్తున్నప్పటికీ మణిపూర్‌ ఫైల్స్‌కు అంత సీన్‌ లేదు, గిరిజనుల జీవితాలు అంత విలువైనవి కాదు, వారికి కాశ్మీరీ పండిట్లకు ఉన్నంత పలుకుబడి వారికి లేదు, కాశ్మీరీ ఫైల్స్‌ మాదిరి సంఘపరివారం ప్రోత్సహించదు, డబ్బురాదు అనుకుంటున్నారా ? లేక అన్నింటికీ మించి అక్కడ అసలు కారకులు సంఘపరివారం అని చెప్పాల్సి వస్తుందనా ? బేటీ బచావో అని చెప్పిన పెద్దమనిషి మణిపూర్‌ బేటీల గురించి తనంతట తాను ముందుకు వచ్చి దేవాలయం అని వర్ణించిన పార్లమెంటులో మాట్లాడకుండా భవనపు మెట్లు, గోడల ముందు మొక్కుబడి ప్రకటన చేసిన ప్రధాని నరేంద్రమోడీ ఫైల్స్‌ను విప్పాల్సి ఉంటుందనా ?


గతంలో శవ గంగా వాహిని పేరుతో దిక్కులేని కరోనా మృతుల కళేబరాలను గంగానదిలో నెట్టివేసి చేతులు దులుపుకున్న యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడి నిర్వాకం మీద, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రతినిధిగా ఉన్న వారణాసి వద్ద ప్రవహించే గంగను పవిత్ర నదిగా భావించే గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన ఆగ్రహ, నిరసన కవిత మీద హిందూత్వశక్తులు విపరీతంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీస్తే అదే దాడి అతని మీద కూడా జరుగుతుంది. దేశంలో ఉన్న వర్తమాన స్థితి అది. అందుకే చచ్చిన చేప వాలు కథనాన్ని ఎంచుకున్నారన్నది స్పష్టం.మణిపూర్‌ మీద అల్లిన కవిత అలాంటిదే. దానితో సంఘపరివారానికి, పాలక బిజెపి నేతలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మానవాళి మీద జరుగుతున్న దోపిడీ, అణచివేత గురించి చరిత్రలో అనేక మంది చెప్పారు. దాన్ని తొలగించే కార్యాచరణను కూడా ప్రతిపాదించటమే కారల్‌ మార్క్స్‌, ఎంగెల్స్‌ ప్రత్యేకత. విఫల సమాజం గురించి చెప్పిన వారి కోవలో వివేక్‌ అగ్నిహౌత్రి మొదటి వారూ కాదు చివరి వారూ కాదు.


గంగ గురించి, దాని మురికి గురించి అనేక మంది రాశారు. ఇప్పుడు ఎవరైనా రాస్తే కొత్త దనం ఏమిటన్నది ప్రశ్న. ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న కరోనా శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప ఆ నిర్వాకానికి కారణభూతమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. అలాంటి స్పందన కూడా వివేక్‌ అగ్నిహౌత్రిలో కనిపించలేదు. ఆమె కవితను మరోసారి ఇక్కడ చూద్దాం.అనువాదం : రాఘవశర్మ

శవవాహిని గంగ
భయపడకు..ఆనందపడిపో…ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి….ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం….ఓ రాజా..అడవి అంతా బూడిదయ్యింది,ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,…..ఓ రాజా..బతికించే వాళ్ళు లేరు,…..శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,…..ధుఃఖితులు మాత్రం మిగిలారు……అంతా కోల్పోయి మిగిలాం…..మాటలు లేక బరువెక్కిన మా హదయాలు శోకగీతాలైనాయి…..ప్రతి ఇంటిలో మత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది……ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి, వైరస్‌ మమ్మల్ని కబళించేస్తోంది……ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి, భారమైన మా హదయాలు ముక్కలయ్యాయి……అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది…..బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పిక గొన్నాయి….. రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు తళుక్కుమనడం లేదు…..ఓ రాజా..ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి…..ఇక పరిమితులు, మినహాయింపులు లేవు నీ దమ్ము చూపించు,…..రా..బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,……దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు……ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు……కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి…..,ఓ రాజా.. నీ రామరాజ్యంలో శవగంగా ప్రవాహాన్ని చూశావా?


ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌ ఉదంతం మీద దాల్చిన మౌనం, అక్కడి మానవతుల మీద జరిపిన దుర్మార్గ పూర్వరంగంలో మరో గుజరాతీ రచయిత్రి మహాస్వేతా జానీ స్పందించారు. ఆ ఉదంతాలు గతంలో జరిగిన వాటి కొనసాగింపే అన్న అగ్నిహౌత్రకు, ఇక్కడ అలాంటివి ఎన్నో జరిగాయన్న మణిపూర్‌ సిఎం బిరేన్‌ సింగ్‌కూ తేడా ఏముంది ? మహిళలు, వారి శరీర భాగాల మీద మనువాదుల భావజాలాన్ని, అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకొని దాడులు చేస్తున్న వారిని నిరసిస్తూ మణిపూర్‌ ఉదంతం మీద వెల్లడించిన మహాస్వేతా జానీ రచన ఇది. ఇతర రాష్ట్రాలలోని అనేక మంది కవులు, కవయిత్రులు స్పందించటం వేరు. గుజరాత్‌కు చెందిన వారు తమ మీద పెద్ద ఎత్తున కాషాయదళ దాడి జరుగుతుందని తెలిసినా గళం విప్పటం, అది కూడా ప్రధాని నరేంద్రమోడీ తీరు తెన్నుల నేపధ్యంలో అన్నది గమనించాలి. ఆ రచన ఇలా సాగింది.సంఘపరివార్‌ నీడలో జీవిస్తున్న వివేక్‌ అగ్నిహౌత్రి స్పందనకు దీనికి ఉన్న తేడాను వేరే చెప్పాల్సిన పనిలేదు.


ఇటీవల కామన్‌ కాజ్‌, లోకనీతి, సిఎస్‌డిఎస్‌ సంస్థలు గుజరాత్‌లో ఉన్న పరిస్థితి గురించి ఒక సర్వే చేశాయి. సామాజిక మాధ్యమంలో ఒక రాజకీయ లేదా సామాజిక అంశం మీద ప్రతికూలంగా స్పందిస్తే దాడికి దిగుతున్నవారిని చూసి తాము చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్లు సర్వేలో మూడింట రెండు వంతుల మంది చెప్పారని తేలింది. వారిలో మూడో వంతు మంది తీవ్రంగా భయపడుతున్నట్లు, తమ ఫోన్ల మీద నిఘాఉన్నట్లు చెప్పారట. ఆ సర్వేలో లోకనీతి ప్రతినిధిగా ఉన్న మహాశ్వేతా జానీ ఆ తరువాతే మణిపూర్‌ ఉదంతం గురించి గుజరాతీ భాషలో ఒక కవితను రాశారు. దాన్ని సలీల్‌ త్రిపాఠీ ఆంగ్లీకరించారు. అది ఇలా సాగింది.

నేను
భగరంధ్రము…..నేను ఒక యుద్ధ క్షేత్రాన్ని కాదు……లేదా ఏ విశ్వాసాన్ని రక్షించేదాన్ని కాదు…..లేదా ఏ సంస్మృతినీ మోసేదాన్ని కాదు…..లేదా పవిత్రతవైపు నడిపించే మార్గాన్ని కాదు……లేదా ఏ సమాజపు సొత్తునూ కాదు…..లేదా బానిసత్వానికి దారి తీసే మార్గాన్ని కాదు….లేదా రక్త ప్రవాహాన్ని కాదు….లేదా స్త్రీత్వ సారాన్ని కాదు……కచ్చితంగా చెబుతున్నా భూమికి భారాన్ని కాదు……కానీ……ఆమె కోరుకుంటే…..
తరువాత…నేను …..ఒక నవసృష్టికి సారధిని అవుతా !

రానున్నది రోబోట్లు, కోబోట్ల యుగం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక నాడు కంప్యూటర్ల ప్రవేశం, వినియోగం గురించి అనుకూల వ్యతిరేక వాదనలు జరిగినట్లుగానే ఇప్పుడు ప్రపంచంలో రోబోట్లు, కోబోట్ల గురించి మాట్లాడుతున్నారు. మానవులతో పని లేకుండా ప్రోగ్రామ్‌ చేసి వదిలితే వాటంతట అవే పని చేసేవి రోబోట్లు, మనుషులు పని చేయించేవి కోబోట్లు. రెండూ ఉత్పత్తిని పెంచేవే. ఎవరు వద్దన్నా కద్దన్నా వచ్చే రోజులు వాటివే. అంతర్జాతీయ రోబోటిక్స్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా పెద్ద మొత్తంలో రోబోట్ల మీద పెట్టుబడి పెడుతోంది. ప్రతి పదివేల మంది కార్మికులకు అక్కడ ప్రస్తుతం 322 రోబోట్లు ఉన్నాయి. దీన్ని రోబోట్ల సాంద్రతగా పరిగణిస్తున్నారు. ఉత్పాదక రంగ పరిశ్రమల్లో 2021 సమాచారం ప్రకారం ప్రపంచ సగటు 141రోబోలు ఉన్నాయి. దేశాల వారీగా దక్షిణ కొరియా 1,000, సింగపూర్‌ 670, జపాన్‌ 399, జర్మనీ 397, చైనా 322, స్వీడన్‌ 321, చైనీస్‌ హాంకాంగ్‌ 304, చైనీస్‌ తైవాన్‌ 276, అమెరికా 274, స్లోవేనియా 249తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. గతంలో వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారినపుడు, 1980వ దశకంలో వచ్చిన కంప్యూటర్ల తరువాత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉపాధి దొరికినట్లే రోబోలు వచ్చినా కొత్త అవకాశాలు వస్తాయని సమర్దకులు చెబుతున్నారు. కార్మికుల స్థానంలో గతంలో యంత్రాలు వచ్చినా వాటిని నడిపేందుకు కార్మికులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు రోబోలకు ఎవరితోనూ అవసరం ఉండదు.అందువలన అంత తేలిక కాదు అంటున్నారు మరికొందరు.


ప్రపంచ పరిణామాలను చూస్తున్నపుడు పెద్ద మొత్తంలో భారీ పరిశ్రమలను నిర్వహించేవారు లాభాలు ఎక్కువగా ఉంటాయి గనుక రోబోట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చిన్న సంస్థలు కోబోటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరింత ఆధునిక రోబోలను రూపొందించేందుకు పరిశోధన- అభివృద్ధికి దేశాలూ, సంస్థలు కూడా భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. రోబో రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారే లక్ష్యంతో చైనా 2021 డిసెంబరు 21న పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కీలక పరిశ్రమలను రోబోట్లతో నింపాలని పేర్కొన్నారు.” తెలివైన రోబో ” ను ఆవిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 23న 4.35 కోట్ల డాలర్లతో పరిశోధనకు శ్రీకారం చుట్టారు.2018లో ప్రపంచంలో చైనా 20వ స్థానంలో ఉండగా మూడు సంవత్సరాల్లో ఐదవ స్థానానికి ఎదిగింది. నూతన రోబోట్‌ వ్యూహం పేరుతో జపాన్‌ 93 కోట్ల డాలర్లతో నూతన ఆవిష్కరణలతో తమ దేశాన్ని ప్రపంచ రోబో హబ్‌గా మార్చేందుకు పూనుకుంది. స్వంతంగా వాహనాలను నడిపే రోబోలతో సహా ఇతర ఆధునిక ఆవిష్కరణలకు నిధులు వెచ్చిస్తున్నది. పారిశ్రామిక రోబోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జపాన్‌ 2021లో ప్రపంచానికి 45శాతం సరఫరా చేసింది.
నాలుగవ తరం పారిశ్రామిక విప్లవానికి అవసరమైన రోబోలను అందించేందుకు దక్షిణ కొరియా 2022వ సంవత్సరానికే 17.25 కోట్ల డాలర్లను కేటాయించింది. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు 2021 నుంచి 2027వరకు 9.43 కోట్ల డాలర్లను ఐరోపా సమాఖ్య వెచ్చించనుంది. 2021-22లో రోబో సంబంధిత కార్యక్రమానికి 19.85 కోట్ల డాలర్లను కేటాయించింది. హైటెక్‌ వ్యూహం 2025 పేరుతో జర్మనీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఏటా 6.9 కోట్ల డాలర్లను 2026 వరకు ఖర్చు చేస్తుంది. జాతీయ రోబోటిక్‌ చొరవ(ఎన్‌ఆర్‌ఐ 3.0) పేరుతో అమెరికా కూడా 2021లో 1.4 కోట్ల డాలర్లతో నవీకరణకు పూనుకుంది. అంతరిక్షంలో పరిశోధనలకు అవసరమైన రోబోలను రూపొందించటం కూడా దీనిలో ఉంది. రోబో సాంద్రతలో వెనుకబడ కూడదని అది భావిస్తున్నది.


రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి, అంతరిక్షం, వైద్యం మొదలు అనేక రంగాల్లో ముందుండేందుకు ప్రపంచ దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి.కృత్రిమ మేథలో ఎవరికి వారు పైచేయి సాధించాలని చూస్తున్నారు. వైద్యం వంటి రంగాలలో రోబోలతో మరింత మెరుగైన సేవలను అందించవచ్చుగానీ పారిశ్రామిక రంగంలో వీటి ప్రవేశంతో వేతనాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుతుందనే అభిప్రాయాలతో పాటు దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు.చైనాలో జరిగిన పరిశోధనలో పారిశ్రామిక రోబోలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలిందని కొందరు ఉటంకిస్తున్నారు.2016లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం యాంత్రీకరణ వలన 77శాతం మంది ఉపాధికి గండిపడుతుందని పేర్కొన్నారు. దానికి ఫాక్స్‌కాన్‌ కంపెనీని ఉదహరించారు. 2020నాటికి 30శాతం ఆటోమేషన్‌ చేసేందుకు గాను 2012-16 సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను రోబోలతో నింపారు. అన్నింటా అదే జరుగుతుందని చెప్పలేము. గంటలవారీ చెల్లించే వేతనాలు తొమ్మిదిశాతం తగ్గినట్లు కూడా తేలింది. కార్మికుల పని గంటలు కూడా పెరిగాయి. మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ 2017లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో ఐదో వంతు అంటే 80 కోట్ల ఉద్యోగాలు రద్దుకానున్నట్లు అంచనా వేశారు.నలభై ఆరు దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించారు. ధనిక దేశాల్లో యాంత్రీకరణ మరింత ఎక్కువగా ఉంటుంది కనుక నిధులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పేద దేశాల దగ్గర డబ్బు ఉండదు కనుక వాటి మీద ప్రభావం తక్కువేనని కూడా పేర్కొన్నది. యాంత్రీకరణతో మెషిన్‌ ఆపరేటర్లు, ఆహార కార్మికులు, ఆఫీసు సిబ్బంది, అకౌంటెంట్లు ఎక్కువగా ప్రభావితులౌతారు. భారత్‌లో తొమ్మిది శాతం ఉద్యోగాలను నూతన సాంకేతిక యంత్రాలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది. వైద్యులు, లాయర్లు, బార్లలో పనిచేసే వారు, తక్కువ వేతనాలతో పనిచేసే గార్డెనర్లు, ప్లంబర్లు, సంరక్షణ సిబ్బంది మీద పెద్దగా ప్రభావం ఉండదు. తక్కువ చదువుకున్నవారికి ఉపాధి తగ్గుతుంది, అభివృద్ది చెందిన దేశాలలో విశ్వవిద్యాలయాల చదువు అవసరాలు పెరుగుతాయి.అమెరికాలో 2030 నాటికి 3.9 నుంచి 7.3 కోట్ల వరకు ఉద్యోగాలు రద్దవుతాయని, ఉపాధి కోల్పోయే రెండు కోట్ల మందిని ఇతర పరిశ్రమల్లోకి సర్దుబాటు చేయవచ్చని, బ్రిటన్‌లో 20శాతం ఉద్యోగాలను రోబోలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది.


అమెరికాలో రోబోల ప్రవేశం గురించి జరిగిన పరిశోధనలో ప్రతి 1000 మంది కార్మికులకు ఒక రోబోను ఏర్పాటు చేస్తే 0.42 శాతం వేతనాలు తగ్గుతాయని, ఉపాధి జనాభా దామాషాలో 0.2శాతం తగ్గుతుందని అంచనా వేశారు.ప్రదేశాలను బట్టి ఇవి మారతాయి. మరొక రోబోను తోడు చేస్తే ఆరుగురికి ఉపాధి ఉండదు. వెల్డింగ్‌, పెయింటింగ్‌, పాకింగ్‌ వంటి వాటిని పూర్తిగా ఆటోమేషన్‌ చేయవచ్చు. 1993-2007 కాలంలో అమెరికాలో పారిశ్రామిక రోబోట్లు నాలుగు రెట్లు పెరిగాయి.యాంత్రీకరణ కంటే ఇవి ఎక్కువ మంది ఉపాధి పోగొట్టినట్లు తేలింది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎక్కువగా రోబోట్లు వస్తున్నాయి.ఎలక్ట్రానిక్స్‌లో 15,కెమికల్స్‌లో 10శాతం రోబోట్లను పెట్టగా ఆటో పరిశ్రమలో 38శాతం ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో కార్పొరేట్ల లాభాల ప్రాతిపదికనే రోబోలను ఏర్పాటు చేస్తే చైనాలో ఎందుకు వేగంగా ప్రవేశపెడుతున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల్లో జనాభా తక్కువ, ఉత్పత్తి ఎక్కువ గనుక లాభాల కోసం చేస్తే చైనాలో 140 కోట్ల జనాభా వినియోగం కోసం ఉత్పత్తి, సేవలను ఎంతగానో పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో లాభం కొన్ని సంస్థల చేతుల్లో చేరుతుంది, చైనాలో ఎక్కువ భాగం సమాజపరం అవుతుంది. ఐరోపా, జపాన్‌ మాదిరి చైనాలో సగటు జీవిత కాలం పెరగటం, పిల్లల్ని కనటం తగ్గింది కనుక రానున్న కాలంలో కార్మికులకు కొరత ఏర్పడనుందని అక్కడి నిపుణులు అంచనా వేశారు. ఆ పరిణామం పశ్చిమ ఐరోపా దేశాల్లో చూస్తున్నదే. ఈ కారణంగా కూడా చైనా రోబోట్లను ప్రవేశపెడుతున్నది. చైనాలో గత దశాబ్దిలో 50లక్షల జనాభా తగ్గింది. సామర్ధ్యపెంపుదలకు, డ్రైవర్లతో పని లేని కార్లు, రోబోలతో నడిచే గోదాముల వంటి వాటి ఏర్పాటుకు అనేక పరిశోధనలు చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఫైనాన్సియల్‌ రంగంలో పని చేసే ఒక కార్మికుడి ఉత్పాదకత ఐరోపాతో పోల్చితే చైనాలో 20శాతం ఉంది, తరువాత 40,50 శాతం వరకు పెరిగినప్పటికీ ఇంకా చాలా తేడా ఉంది. అందువలన వాటితో పోటీ పడాలంటే తగిన మార్పులు అవసరం అని భావిస్తున్నారు. మన దేశంలో కారు డ్రైవర్లకు తక్కువ వేతనాలకు దొరుకుతున్నారు గానీ ఐరోపాలో, అమెరికాలో అలా దొరకరు. అందుకే డ్రైవర్లతో పనిలేని కార్ల గురించి పరిశోధనకు తెరతీశారు.రోబో, యాంత్రీకరణ కారణంగా చైనాలో 2018-30 మధ్య 30శాతం మంది కార్మికులు ఒక పని నుంచి మరొకదానికి మారాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇది అక్కడి ప్రభుత్వం, పౌరులకూ పెద్ద సవాలే అనటంలో సందేహం లేదు. దాన్ని అధిగమించేందుకు చైనా సన్నద్దం అవుతున్నది.


చైనాలో రోబోట్ల ప్రవేశం వలన కలిగే ప్రతికూల పర్యవసానాలు రానున్న రెండు దశాబ్దాల్లో కనిపిస్తాయని కొందరు చెబుతున్నారు. కృత్రిమ మేథ, రోబోట్ల వలన రెండు దశాబ్దాల్లో 26శాతం మంది వేరే ఉపాధి చూసుకోవాల్సి వుంటుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అంచనా వేసింది. దీనికీ మెకెన్సీ అంచనాకు చాలా తేడా ఉంది. కొన్ని పోవటం, కొత్త ఉపాధి రావటం ఏతా వాతా వచ్చే రెండు దశాబ్దాల్లో నికరంగా పన్నెండు శాతం ఉపాధి పెరుగుతుందని కూడా ప్రైస్‌వాటర్‌ చెప్పింది.2017-37 మధ్య సేవారంగంలో 9.7 కోట్లు, నిర్మాణ రంగంలో 1.4 కోట్లు, పరిశ్రమల్లో 40లక్షల మందికి ఉపాధి పెరిగితే వ్యవసాయంలో 2.2 కోట్లు తగ్గితే మొత్తంగా 9.3 కోట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అక్కడ ఉన్నది ప్రజానుకూల సోషలిస్టు ప్రభుత్వం గనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన సర్దుబాటు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా దానికంతటికి అదే జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు. ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించిన చైనా గత చరిత్రను బట్టి ఇలా చెప్పవచ్చు. జనానికి పని కల్పించి ఉత్పత్తి పెంచి ఎగుమతులు చేసి ఎంతో ప్రగతి సాధించిన చైనాలో మాదిరి ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు పెరగలేదు. ఒకనాడు తక్కువగా ఉన్న కారణంగా అనేక దేశాలు తమ పెట్టుబడులతో అక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేతనాలు పెంచిన కారణంగా ఆశించిన మేర లాభాలు రావటం లేదని కొన్ని సంస్థలు అక్కడి నుంచి వెనక్కు పోతున్నాయి. ఎగుమతుల మీద ఎల్లకాలం ఆధారపడటం సాధ్యం కాదని గ్రహించిన కారణంగానే తమ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకు వేతన పెంపుదల వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగితే ఆ మేరకు మానవ శ్రమ పని గంటలను తగ్గించి అందరికీ ఉపాధి కల్పించటం, సంపదల పంపిణీతో జనం అవసరాలను తీర్చటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువలన ఈ నూతన సవాలును ప్రజల పట్ల బాధ్యత కలిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధిగమించటం ఖాయం, అయితే ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరం, ఇదే సమస్యను ఎదుర్కొనే పెట్టుబడిదారీ దేశాలు ఎలా పని చేసేది చూడాల్సి ఉంది.

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

చైనా కమ్యూనిస్టులు బైబిల్‌ను తిరగరాస్తున్నారా ? నిజానిజాలేమిటి ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ చైనా మీద ఆరోపించాడు. జనాలు దేవుడి కంటే పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేట్లుగా మార్చాలని, దానికి గాను అన్ని మతాలను చైనీకరణ గావించాలని, మతం, సోషలిజం ఒకదానికి ఒకటి తోడుగా ఉనికిలో ఉండేట్లు చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగినపుడు 2017లో అధినేత షీ జింపింగ్‌ కోరినట్లు ,దానిలో భాగంగానే బైబిల్‌ను తిరగరాస్తున్నారని కూడా మైక్‌ ఆరోపించాడు. ఈ ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగరాసే పని పెట్టుకున్నారన్నది వాటిలో ఒకటి. దీన్ని ఒక్క క్రైస్తవ మతానికే పరిమితం చేయలేదని బౌద్దం, ఇస్లాంకు కూడా వర్తింప చేస్తున్నారని మైక్‌ ఆరోపించాడు.మతం మీద పూర్తి అధికారాన్ని సాధించేందుకు సిసిపి చూస్తున్నదనే ప్రచారాన్ని అనేక క్రైస్తవ మత సంస్థలు, మీడియాలో కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మతం, సోషలిజం సహజీవనం అన్నది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. మత స్వేచ్చను అనుమతించటం అంటే ప్రోత్సహించటం, ఉనికిని కాపాడటం కాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న భావనలను క్రమంగా పోగొట్టాలి తప్ప ప్రార్ధనా మందిరాలను కూల్చివేసినా, నిషేధాలతో అణచివేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.


చిత్రం ఏమిటంటే మతాన్ని అణచివేస్తున్నట్లు ఒక వైపు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే 2018లో చైనా ప్రభుత్వంతో పోప్‌ ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని చైనాలో కాథలిక్‌ మత అధిపతులుగా పోప్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా టిబెట్‌లో తదుపరి దలైలామాను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా పోప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక బైబిల్‌ను తిరగరాస్తున్నారని చెప్పేందుకు మైక్‌ గాలఘెర్‌ రెండు ఆరోపణలు చేశాడు. న్యూటెస్ట్‌మెంట్‌ బైబిల్‌లో జాన్‌ సువార్త ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక మహిళను రాళ్లతో కొట్టటాన్ని చూసిన ఏసు క్రీస్తు వారి వద్దకు వెళ్లి మీలో పాపం చేయనివారెవరైనా ఉంటే ముందుగా వారు వచ్చి కొట్టమని చెప్పారన్న కథ అందరికీ తెలిసిందే.దాన్ని చైనా వారు మార్చి ఏసు క్రీస్తే స్వయంగా రాళ్లు వేసినట్లు రాశారని మైక్‌ ఆరోపించాడు. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. మరికొన్ని దీన్నే మరోవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఏసుక్రీస్తు జోక్యం చేసుకున్న తరువాత రాళ్లు వేసిన వారు వెళ్లిపోయారని, వారు నిన్ను చంపారా అని సదరు మహిళను అడిగితే లేదని ఆమె చెప్పిన తరువాత వారు గాక పోతే నేనే చంపేస్తా, ఇలాంటి పాపం మరొకసారి చేేయ వద్దు, వెళ్లిపో అన్నట్లుగా బైబిల్‌ను తిరగరాసినట్లు ప్రచారం చేస్తున్నారు.


మరొక కథనం ప్రకారం ఫార్సీ(నాటి చట్టాల గురించి తెలిసినవారు) యూదులు ఒక మహిళను తీసుకు వచ్చి ఏసుక్రీస్తు ముందు నిలిపారు. బోధకుడా ఈ మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడినది. చట్టం , మోజెస్‌ మాకు చెప్పినదాని ప్రకారం అలాంటి మహిళను రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు మీరేమి చెబుతారు అని ప్రశ్నించారట. ఇదంతా ఏసుక్రీస్తును ఉచ్చులో ఇరికించేందుకు యూదునేతలు చేశారట. అప్పుడు ఏసు క్రీస్తు నేల మీద వేలితో ఏదో రాస్తూ (అదేమిటో ఇప్పటికీ తెలియదట) మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగా వారు రాళ్లతో కొట్టండి అన్నారట. దాంతో వణికిపోయి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఏసు మహిళా వారెక్కడ, ఎవరూ నీ మీద దాడి చేయలేదు కదా అంటే అవునయ్యా అందట. నేను కూడా నిన్ను కొట్టను వెళ్లిపో నీ జీవితంలో ఇంక పాపం చేయవద్దు అన్నాడట. అలా అందరూ వెళ్లిన తరువాత ఏసు ఆమెను స్వయంగా రాయితో కొట్టి నేను కూడా పాపినే అని చెప్పినట్లు చైనా కమ్యూనిస్టులు తిరగరాస్తున్న బైబిల్‌లో ఉందని, దాన్ని తరగతి పుస్తకాల్లో పెట్టారని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.ఇది ఏసు దైవత్వాన్ని కించపరచటమే అని ఆరోపిస్తున్నారు.


ప్రస్తుతం చైనా, మన దేశం,ఇంకా అనేక దేశాల్లో ఉన్న చట్టం ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు. అందువలన దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని, ఏసుక్రీస్తే ఆపని చేశారు గనుక మీరూ చేయవచ్చని చైనాలో ఉన్న క్రైస్తవులకు గానీ మరొకరికి గానీ చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు, అందుకుగాను బైబిల్‌ను తిరగరాయాల్సిన అగత్యమూ లేదు. దానికీ సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంబంధం లేదు. అలాగని అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నదీ లేదు. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చైనా చట్టాలలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ స్త్రీ సదరు పురుషుడి ఆస్తికాదు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు పరపురుషుడు అవివాహితుడైనప్పటికీ అభియోగం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. వివాహిత మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్దమని 2018 సెప్టెంబరు 27న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరొకరి భాగస్వామి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నగదు జరిమానా విధించవచ్చని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చెప్పింది.


చైనాలోని హేనాన్‌ రాష్ట్రంలోని ప్రొటెస్టెంట్‌ చర్చిలలో టెన్‌కమాండ్‌మెంట్స్‌ బదులు చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పిన మాటలను బోధించాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారని, ఈ మేరకు మొదటి కమాండ్‌మెంట్‌ను మార్చి రాశారని కూడా అమెరికన్‌ ఎంపీ ఆరోపించాడు. పశ్చిమ దేశాల భావజాలాన్ని చొరనివ్వకుండా ఇలా చేస్తున్నారని, తిరస్కరించిన ఇద్దరు పాస్టర్లను శిక్షించినట్లు, ఇతరులను అడ్డుకుంటున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ కన్సరన్‌(ఐసిసి) నివేదించినట్లు పార్లమెంటు కమిటీ ముందు చెప్పాడు. బైబిల్‌ రెండు రకాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఓల్డ్‌ టెస్టిమెంట్‌, న్యూ టెస్టిమెంట్‌ అన్న గ్రంధాలు మనం ఎక్కడైనా చూడవచ్చు. వాటిని తిరగ రాసింది క్రైస్తవులు తప్ప కమ్యూనిస్టులు కాదు.వివిధ మత గ్రంధాల మీద అనేక మంది భిన్నమైన భాష్యాలు రాశారు. కైస్తవం కమ్యూనిజానికి అనుకూలమని, వ్యతిరేకమని బైబిల్‌లో ఉన్న అంశాలకు వ్యాఖ్యానం చెప్పిన వారు లేకపోలేదు. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, బైబిల్‌ అంశాలను ఎవరు ఎప్పుడు ప్రబోధించారు లేదా ఎప్పుడు రాశారు ? అప్పటికీ అసలు కమ్యూనిజం, సోషలిజం అన్న ప్రాధమిక భావనలు కూడా లేవు. అలాంటపుడు ప్రబోధకులు లేదా రాసిన వారు వాటికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా వాదనలు చేయగలరు. బైబిల్‌ను తిరగరాసి దానిలో ఇలా ఉంది అని చెప్పి జనాన్ని కమ్యూనిజానికి అనుకూలంగా మార్చేంత భావ దారిద్య్రంలో ప్రపంచంలో ఏ కమ్యూనిస్టులూ లేరు. దోపిడీకి వ్యతిరేకంగా జరిపే పోరాటాలను పక్కదారి పట్టించేందుకు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు ప్రతి మతం యత్నించటాన్ని రోజూ మనం చూస్తున్నదే.

మనదేశంలో మనుధర్మం పేరుతో అమలు జరిపిన వివక్ష, దుర్మార్గాలు చేస్తున్నపుడే సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు. అందువలన అలా చెప్పిన వారిని మన దేశంలో తొలి సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటారా ? ప్రతి సమాజంలో దుర్మార్గాలను చూడలేని అనేక మంది తమ వాంఛలను వెల్లడించారు. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే శాస్త్రీయ సిద్దాంతం, ఆచరణలను కమ్యూనిస్టులు చెప్పారు. వ్యక్తులకు, వారి ఇండ్లకు, ప్రార్ధనా స్థలాలకు పరిమితం కావాల్సిన మతాన్ని వీధులు, రాజకీయాలు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు తీసుకురావటాన్ని కమ్యూనిస్టులే కాదు, హేతువాదులు, పురోగామివాదులెవరూ అంగీకరించరు. రాజ్యం, పౌరుల మీద మత పెత్తనాన్ని చివరికి పెట్టుబడిదారులు కూడా అంగీకరించరు.ఐరోపాలో ఒక దశలో భూమిలో అత్యధిక భాగం మత సంస్థల చేతుల్లోనే ఉండేది. దాన్ని బద్దలు కొట్టటం ఫ్రెంచి విప్లవంలో ఒక భాగం, ఫ్యూడల్‌ బంధాలను,మత పట్టును అది బద్దలు చేసింది.పేదలు,అణగారిన వర్గాలను రక్షించేందుకే క్రైస్తవం తొలి రోజుల్లో ముందుకు వచ్చింది గనుకనే జనం ఖండాలు, రంగు, భాషా బేధాలతో నిమిత్తం లేకుండా ఆదరించారు. కానీ అదే మతం కష్టజీవుల మూలుగులను పీల్చే పెట్టుబడిదారులు,యుద్ధాలతో రక్తపుటేరులు పారించిన నియంతల పట్ల దాని వైఖరి ఏమంటే సానుకూలమే. మత యుద్ధాలకు పాల్పడిన చరిత్ర కూడా తెలిసిందే. దోపిడీని అంతం చేయాలన్న సోషలిస్టు, కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అని ఆ మత పెద్దలే రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


దేశాల మీద మతపెత్తనం కుదరదు, మత రాజ్యాలు అంతరించాయి. మతం పేరుతో విద్రోహానికి పూనుకుంటే సహించాల్సిన అవసరం ఉందా? తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్‌ కూల్చివేతలో క్రైస్తవమత పెద్దలు కూడా అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన చరిత్ర మన కళ్ల ముందు ఉంది. అటువంటి కుట్రలను చైనా సాగనివ్వటం లేదు గనుక దాని మీద తప్పుడు ప్రచారాలు అన్నది స్పష్టం. చైనాలో బైబిల్‌, ఖురాన్‌ ఏ పవిత్ర గ్రంధాన్ని కూడ సహించరని ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంస్థలు నేడు ఐరోపాలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత, ఖురాన్‌ గ్రంధాలను తగులపెడుతున్న ఉదంతాల గురించి ఎక్కడా మాట్లాడవు.స్టాక్‌హౌమ్‌లోని టర్కీ ఎంబసీ ముందు ఖురాన్‌ ప్రతిని తగుల బెట్టేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఏకంగా అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఇంకా అనేక దేశాల్లో పచ్చి ముస్లిం వ్యతిరేకులు ఇలానే రెచ్చిపోతున్నారు. వాటి గురించి అమెరికా ఎంపీలెవరూ మాట్లాడరు. చైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం మత స్వేచ్చ ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు ఫలానా మతాన్ని నమ్మాలని లేదా వద్దని గానీ వత్తిడి తేకూడదు.వివక్ష చూపకూడదు.ప్రజా జీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు లేదా పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు చూడకూడదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు. ఏ మత సంస్థకూడా విదేశీ పెత్తనాన్ని అంగీకరించకూడదు. ఇదే విధంగా మత సంస్థలు విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చు తప్ప వాటిలో మత బోధన చేయకూడదు. ఇలా మతాన్ని పరిమితం చేసే నిబంధనలు ఉన్నాయి. అంతే తప్ప మా మతం ఇలా చెప్పింది లేదా మత కేంద్రం ఫలానా చోట ఉంది, వారు చెప్పినట్లు నడచుకుంటాం, దేశంలోని చట్టాలు మాకు వర్తించవు అంటే కుదరదు. మేం చెప్పినట్లే నడవాలి అంటే అసలు కుదరదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. బౌద్దం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేసిన టిబెట్‌ దలైలామా పారిపోయి మన దేశంలో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.


అమర జీవుల గళం(విఓఎం) పేరుతో పని చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి టోడ్‌ నెటెల్టన్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగ రాయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 2019లో నిర్ణయించిందని. దానిలో కన్ఫూసియస్‌, బౌద్ద సూత్రాలను కూడా చొప్పించి పార్టీకి మద్దతు ఇచ్చేవిధంగా రాస్తారని ఆరోపించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 140 కోట్ల చైనా జనాభాలో ఇండెక్స్‌ ముండీ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం క్రైస్తవులు కేవలం 5.2, ముస్లింలు రెండు శాతమే.ఏ మతానికీ చెందని వారు 51.8, స్థానిక తెగల మతాల వారు 21.9, బౌద్దులు 18.3 శాతాల చొప్పున ఉన్నారు. మనదేశంలో మాదిరి 80శాతం మంది ఉన్న హిందూమతానికి ముస్లిం, క్రైస్తవుల నుంచి ముప్పు వచ్చిందని చెప్పేవారెవరూ అక్కడ లేరు. ప్రపంచంలో ఎక్కడా వర్తమాన కాలంలో ఏ దేశంలోనూ ఒక మతస్తులు తమ జనాభాను విపరీతంగా పెంచి మరొక మతానికి ముప్పు తెచ్చిన ఉదంతమేదీ జరగలేదు. చైనాలో నిజంగా బైబిల్‌ను తిరగరాస్తూ దానిలో కొన్ని భాగాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఉంటే రోమ్‌లో ఉన్న క్రైస్తవమత కేంద్రానికి, పోప్‌కు తెలియకుండా ఉంటుందా ? తెలిస్తే అధికారికంగానే దాని మీద స్పందించిన దాఖలా ఇంతవరకు లేదు.


క్రైస్తవుల కోసం పని చేస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే వారూ, పత్రికల్లో రాతలు రాసేవారూ చివరికి పోప్‌ ఫ్రాన్సిస్‌ను కూడా వదలటం లేదు. చైనా అక్రమంగా నియమించిన షాంఘై బిషప్‌ను అంగీకరించినట్లు ధ్వజమెత్తారు.2018లో చైనాతో పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికీ రహస్యమేనని, దాన్ని ఇప్పటికి రెండు సార్లు సమీక్షించినట్లు జూలై 27న ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం బిషప్పులను ఎంపిక చేసేది చైనా అయినా అధికారికంగా ప్రకటించాల్సింది పోప్‌ అని దానికి విరుద్దంగా షాంఘై బిషప్‌ వ్యవహారం ఉందని, వాటికన్‌కు ఆ సంగతి పత్రికా వార్తల ద్వారా తెలిసిందని కూడా ఆరోపించాడు. ఏప్రిల్‌ నాలుగున నియామకం జరిగితే జూలై 15న పోప్‌ అధికారికంగా ప్రకటించారని వాపోయాడు. గొడవలెందుకని ఊరుకొని ఆమోదించాంగానీ చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పరోలిన్‌ చెప్పినట్లు కూడా రాశాడు. 2018 ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా చర్చి సమావేశాలు నిర్వహించటాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాంటి వారంతా చైనా ప్రభుత్వం గుర్తించిన దేశభక్త కాథలిక్‌ చర్చిలో విలీనం కావాలి.కానీ ఇప్పటికీ రహస్య చర్చ్‌లు కొనసాగుతున్నట్లు వాటికన్‌ మంత్రి అంగీకరించాడు. అలా చేరని వారి మనోభావాలను గౌరవించాలని కూడా ఇప్పుడు మంత్రి చెప్పటాన్ని బట్టి దాని అర్ధం వారికి వెలుపలి నుంచి మద్దతు లభిస్తున్నది. వారికి రక్షణ కల్పించాలని అనేక మంది పత్రికల్లో డిమాండ్‌ చేస్తున్నారంటే పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడవటం, ధిక్కరణ తప్ప మరొకకాదు. బైబిల్‌ను తిరగరాయాలంటే ఎక్కడైనా పది సంవత్సరాలు అవసరం లేదు. తెల్లవారేసరికి పోటీ గ్రంధాలను రాసేవారున్నారు. కమ్యూనిస్టులు అలాంటి పనికిమాలిన పని పెట్టుకోరు. గతంలో మతాన్ని అనుమతించరని, ప్రార్ధనా మందిరాలను కూల్చివేశారని చేసిన ప్రచారం అబద్దమని తేలింది. అందువలన ఎత్తుగడలను మార్చి మతాన్ని తమకు అనుకూలంగా మారుస్తున్నారని, మత గ్రంధాలను తిరగరాస్తున్నారనే తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు.

చైనా మరో ముందడుగు : అమెరికాను హడలెత్తిస్తూ జెట్‌ ఇంజన్‌ రూపకల్పన, ఉత్పత్తి ! మనదేశం ఎక్కడ ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కాపీ కొట్టేందుకు వీలుగాక స్వంత జెట్‌ ఇంజన్‌ చైనా యత్నం అనే శీర్షికతో రాయిటర్స్‌ వార్తా సంస్థ ఒక విశ్లేషణను వెలువరించింది. అణు క్షిపణులను రూపొందించింది, వ్యోమగాములను రోదసీలోకి పంపింది గానీ ఇంతవరకు ఎంతో కీలకమైన జెట్‌ ఇంజన్లను తయారు చేయలేకపోయింది అన్న మాటలతో ప్రారంభమైంది. ఇది 2012 అక్టోబరు 30న రాసింది. కథ అల్లింది వార్తా సంస్థ కావచ్చుగానీ దానిలో ఉన్న అంశాలు పశ్చిమ దేశాల నిపుణుల బుర్రలో ఉన్నవే అన్నది స్పష్టం. చైనా వాటిని సవాలుగా తీసుకొని పది సంవత్సరాల్లో తన స్వంత జెట్‌ ఇంజన్ను ఎగురవేసింది. అది చైనా ప్రత్యేకత. చైనా అంటే కాపీ అన్న తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇది చెంపపెట్టు. కాపీకి వీలైతే ఎవరైనా ఆపని చేయవచ్చు. చైనాకు ధీటుగా మన దేశాన్ని రూపొందిస్తామని చెబుతున్న వారు ఈ రంగంలో మనం ఎక్కడున్నామో కూడా చెప్పాల్సి ఉంది. జెట్‌ ఇంజను రూపకల్పనకు చైనా 1600 కోట్ల డాలర్ల(10000 కోట్ల యువాన్ల) పధకాన్ని రూపొందించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. అంత మొత్తం మన దగ్గర లేదా ? నిపుణులకు మన దేశంలో కొదవ లేదు, కాంగ్రెస్‌ పాలకులు పట్టించుకోలేదనుకుందాం, నరేంద్రమోడీ ఎందుకు పూనుకోలేదు, ఒక వేళ పూనుకుంటే మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం ? కొందరు పశ్చిమ దేశాల నిపుణులు రానున్న రెండు దశాబ్దాల్లో చైనా 4,900 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుందని కూడా అంచనాలు చెప్పారు. వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక పెద్ద ముందడుగు వేసింది. పశ్చిమ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. ఒకసారి బండి కదిలిన తరువాత ఊపందుకోవటం పెద్ద పని కాదు. ” ఐరోపా, అమెరికా, రష్యాలను కలిపి చూస్తే అవి కొన్ని వందల సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాయి. కానీ చైనా మాత్రం 30 సంవత్సరాల నుంచే పని చేస్తున్నది ” అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కానవా ఆసియన్‌ డిఫెన్స్‌ మాగజైన్‌ సంపాదకుడు ఆండ్రెయి చాంగ్‌ అన్నాడు.


అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అందువలన ప్రతి దేశం తన భద్రత గురించి జాగ్రత్తపడటం సాధారణ అంశమే. ఇటీవలి కాలంలో కొన్ని దేశాలను బూచిగా చూపి ఆ పేరుతో మిలిటరీ ఖర్చు పెంచేట్లు అమెరికా కుట్రలు చేస్తోంది, తప్పుడు సమాచారం అందిస్తోంది. ఉదాహరణకు మనకు చైనాతో విరోధాన్ని పెంచేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులు మన ప్రాంతంలో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తున్నట్లు కొన్ని ఫొటోలను అమెరికా విడుదల చేసింది. అది వాస్తవం కాదని, తమ ప్రాంతంలోనే పాతబడిన ఇండ్ల స్థానంలో కొత్తవాటిని నిర్మిస్తున్నట్లు మన మిలిటరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అమెరికా మాటలను నమ్మి అవసరం కంటే అధికంగా మిలిటరీ ఖర్చు చేసిన దేశమేదీ బాగుపడిన దాఖలాల్లేవు. సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రతిదేశం తన మిలిటరీ పరికరాలను నవీకరించుకోవటం అవసరం, దానికి మన దేశం మినహాయింపు కాదు. ఇటీవలనే ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్‌ వెళ్లి కొత్తగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. ఫ్రెంచి కంపెనీతో కలసి జెట్‌ ఇంజన్ల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నట్లు కూడా ప్రకటించారు.


పారిస్‌లో ఇటీవలనే విమాన ఎగ్జిబిషన్‌ జరిగింది. ఈ సందర్భంగా నాటో కూటమి గూఢచార సంస్థలో పని చేసి రిటైరైన ఒక అధికారి బ్రేకింగ్‌ డిఫెన్స్‌ అనే మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఉంది.” చైనా స్వంతంగా జెట్‌ ఇంజన్ల రూపకల్పన, ఉత్పత్తి చేసేదిగా మారాలని ఎవ్వరూ కోరుకోవటం లేదని ” అన్నాడు. అది ఒక్క చైనాకే వర్తిస్తుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇప్పటికే ఆ రంగంలో ఉన్న దేశాలు ఎవరికైనా షరతులతో అమ్ముతాయి తప్ప ఎవరినీ స్వంతంగా ఎదగనివ్వవు. పశ్చిమ దేశాలు ఎంతగా అడ్డుకుంటున్నప్పటికీ సవాలుగా తీసుకొని చైనా ముందుకు పోవటం వాటికి ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికా ఇతర దేశాలను భయపెట్టేందుకు ముందుగానే హడావుడి ప్రకటనలు చేస్తాయి. ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తాయి. చైనా అంశానికి వస్తే అది చేసి చూపించిన తరువాతే చెబుతుంది. పారిస్‌ విమాన ప్రదర్శన 2023 జూన్‌ 24న ముగిసింది. అక్కడ చైనా స్టాల్‌ ఉన్నప్పటికీ ఎవరూ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. తరువాత నాలుగు రోజులకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాడార్లకు దొరకని, గురిచూసి దాడి చేసే చైనా ఐదవ తరం చెంగుడు జె-20 బాంబరు వీడియోను విడుదల చేసింది. దాని సత్తా గురించి పశ్చిమ దేశాలు ఇప్పుడు జుట్టుపీక్కుంటున్నాయి. అంతకు ముందు పరీక్షించినప్పటికీ తొలిసారిగా జె-20ని రెండు డబ్ల్యుఎస్‌-15 కొత్త ఇంజన్లతో విడుదల చేశారు. దీంతో అమెరికా, దాని మిత్ర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


గతంలో చైనా తమ విమానాలకు అవసరమైన జెట్‌ ఇంజన్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. అవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఎంత కాలం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తాం, మనమే ఎందుకు రూపకల్పన చేసి ఉత్పత్తికి పూనుకోకూడదని 2016 ఆగస్టులో జెట్‌ ఇంజన్ల విడిభాగాలు తయారు చేసే యూనిట్లను ఒక దగ్గరకు చేర్చి 750 కోట్ల డాలర్ల పెట్టుబడి, 96వేల మంది సిబ్బందితో ఏరో ఇంజిన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా(ఎఇసిసి)ను ఏర్పాటు చేశారు. అది చేపట్టిన అనేక ప్రాజెక్టులలో డబ్ల్యుఎస్‌-15 ఇంజిన్‌ ఒకటి. రెండు సార్లు విఫల పరీక్షల తరువాత ఇటీవలే దాన్ని జయప్రదంగా ఎగురవేశారు. అంతకు ముందే అదే సీరీస్‌లో తక్కువ సామర్ధ్యం కలిగిన ఇంజన్లు తయారు చేసి జె-20 విమానాలకు అమర్చారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న జెట్‌ ఇంజన్లను కూడా వాటికి అమర్చుతున్నారు, జె-20 బాంబరును 2011 నుంచీ నిర్వహిస్తున్నారు.సమర్దవంతమైన స్వంత ఇంజన్లతో నడపటమే తాజా ప్రత్యేకత. ఎక్కడి నుంచైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేసినపుడు రెండు నుంచి ఎనిమిది వరకు ఇంజన్లను అదనంగా కొనుగోలు చేస్తారు. ఖర్చు రీత్యా అన్ని దేశాలు ఇలా చేయలేవు. ఇంజన్లు విడిగా కావాలంటే తమ సుఖోయి-35 ఫైటర్‌ జెట్‌లను ఎక్కువగా కొనుగోలు చేయాలని రష్యా షరతు పెట్టింది. అందువలన ఎల్ల వేళలా దాని మీద ఆధారపడటం సాధ్యం కాదని చైనా భావించింది. జూన్‌ 28న ఎగిరిన జె-20 బాంబరుకు ఒక కొత్త ఇంజను, మరొక పాత ఇంజను అమర్చారు. ఒకటి విఫలమైతే రెండవది పని చేస్తుంది. పరీక్షలో నిగ్గుతేలినప్పటికీ ఇంకా అనేక పరీక్షలు, మెరుగుపరచిన తరువాతే ఆ ఇంజన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారని చైనా మాజీ సైనికాధికారి సాంగ్‌ ఝోంగ్‌పింగ్‌ చెప్పాడు.


ఈ ఏడాది ప్రారంభంలో ఒక చైనా పత్రికలో రాసిన విశ్లేషణలో తమ జె -20 ఐదవ తరం బాంబరు అమెరికా తయారీ ఎఫ్‌ – 35, ఎఫ్‌ -22 కంటే ఉన్నతమైనదని పేర్కొన్నారు. ఒక ఉదంతంలో తూర్పు చైనా సముద్రంలో చైనా-అమెరికా విమానాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఆ సందర్భంగా అమెరికన్‌ పైలట్లు చైనా విమానాన్ని చూసి ప్రభావితులైనట్లు అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ఫోర్సు కమాండర్‌ జనరల్‌ కెనెత్‌ విల్స్‌బాచ్‌ చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. నవీకరణ అవసరాన్ని గురించి చెప్పేటపుడు చైనా ఆయుధ వ్యవస్థల గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని వాటిని పట్టించుకోనవసరం లేదని కొందరు కొట్టిపారవేశారు. కానీ విమానం ఎగిరిన తీరు చూస్తే దాని కంట్రోలు వ్యవస్థలు సక్రమంగానే ఉన్నట్లు కనిపిస్తోందని, గతంలో ఈ మాత్రం కూడా తెలియలేదనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. ీ చైనా విమానం గురించి సమాచారం పెద్దగా తెలియదంటూనే అమెరికా పత్రికల్లో రెండింటి గురించి విశ్లేషణలు చేస్తున్నారు.


జె-20 విమాన సామర్ధ్యం గురించి పశ్చిమ దేశాలు నిర్ధారణకు రాలేకపోతున్నాయి. ఒక వేళ చైనా వాటిని వినియోగంలోకి తెస్తే ఎఫ్‌ 22తో చైనాను ఢకొీట్టగలమా, తగినన్ని అందుబాటులో ఉన్నాయా అని తర్జనభర్జన పడుతున్నాయి. చైనా డబ్ల్యుఎస్‌-15 జెట్‌ ఇంజన్‌ ఉత్పత్తి ఆలశ్యం అవుతున్నదని గతంలో వార్తలు వచ్చాయి. 2019 చివరి నాటికే 50 జె-20 విమానాలను చైనా తయారు చేయనుందని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఒక వేళ 50 లేదా వంద తయారు చేసినా అమెరికా వద్ద ప్రస్తుతం ఉన్నవాటి కంటే చాలా తక్కువ అని, లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ నివేదిక ప్రకారం 195 ఎఫ్‌-22 విమానాలను ఇప్పటికే అంద చేయగా వాటిలో 186పోరుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపున వికీపీడియా సమాచారం ప్రకారం చైనా వద్ద జె-20 విమానాలు మూడు రకాలు 210కి పైగా ఉన్నాయి. ఇలాంటి బాంబర్లను అమెరికా తరువాత చైనా మాత్రమే రూపొందించింది. తాజా సమాచారం ప్రకారం 2023లో లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ 147 నుంచి 153 ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్లను తన ఖాతాదార్లకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది, అయితే వాటిలో 50 వరకు ఈ ఏడాది తయారుకాకపోవచ్చునని బల్గేరియన్‌ మిలిటరీ డాట్‌ కామ్‌ జూలై 22న పేర్కొన్నది. ఇదే సమయంలో చైనా జె-20 ఉత్పత్తి ఏడాదికి 120 మించనున్నదని కూడా తెలిపింది. ఎఫ్‌-35ఏ, సి రకాల బాంబర్లు నాలుగు నుంచి ఆరు క్షిపణులను, అదే జె-20 ఎనిమిది క్షిపణుల వరకు మోసుపోగలదని కూడా ఆ వార్తలో పేర్కొన్నారు.
అమెరికా, జపాన్‌ ఇతర సామ్రాజ్యవాదుల నుంచి తమకు ఎప్పుడైనా ముప్పు తప్పదని కమ్యూనిస్టు చైనా తొలి నుంచీ భావిస్తూనే ఉంది. దానికి ఆధునిక పరిజ్ఞానం అందనివ్వకూడదని రష్యాతో పాటు పశ్చిమ దేశాలు కూడా చూస్తున్నాయి. దాన్ని సవాలుగా తీసుకొని కసితో చైనా ముందుకు పోతోంది. రష్యా నుంచి యుద్ధ విమానాల ఇంజన్లు కొనుగోలు చేస్తూనే స్వంత తయారీకి పూనుకుంది. 2031 నాటికి పదేండ్ల క్రితం ఉన్న వాటి కంటే 5,260 ప్రయాణీకుల విమానాలు, 2,400 బిజినెస్‌ జెట్‌లు అవసరమని వాటికిగాను 16 వేల ఇంజన్లు అవసరమని అంచనా వేశారు.


స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నది. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌ అని చైనా వర్ణిస్తున్నది. చైనా రూపొందిస్తున్న సైబర్‌ ఆయుధాలతో ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సిఐఏ తన నివేదికలలో పేర్కొన్నది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది. డాలర్లలో 2022 ఖర్చు 2,240బిలియన్లు, ఇది ప్రపంచ జిడిపిలో 2.2శాతం. మొత్తం ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. అమెరికా 39, చైనా 13, రష్యా 3.9,భారత్‌ 3.6, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి. ఇక రష్యా ఖర్చు దాని జిడిపిలో ఒక ఏడాది కాలంలో 3.7 నుంచి 4.1శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉక్రెయిన్‌ ఖర్చు 640శాతం పెరిగి జిడిపిలో 3.2 నుంచి 34శాతానికి పెరిగింది. దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా లేవనెత్తుతున్న వివాదం, తైవాన్‌పై చైనాను రెచ్చగొడుతున్న కారణంగా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆయుధాల కొనుగోలుకు పూనుకున్నాయి.


అమెరికా రక్షణ ఖర్చు 877 బి.డాలర్లతో పోలిస్తే చైనా 292 బి.డాలర్లు తక్కువే. ఆత్మరక్షణ సిబ్బంది తప్ప మిలిటరీ ఖర్చు లేదని చెప్పుకొనే జపాన్‌ ఖర్చు 46బి.డాలర్లకు చేరింది.దక్షిణ కొరియా 46.4బి.డాలర్లకు పెరచింది.ఈ రెండు దేశాలూ అమెరికా రక్షణలో ఉన్నాయి. మన దేశం 2021తో పోలిస్తే మరుసటి ఏడాది ఖర్చు(81.4బి.డాలర్లు) ఆరుశాతం పెంచినట్లు సిప్రి పేర్కొన్నది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 10.3 బి.డాలర్లతో 24వదిగా ఉంది. తలసరి మిలిటరీ ఖర్చును డాలర్లలో చూస్తే అమెరికా 2,240,చైనా 163, శ్రీలంక 116, పాకిస్తాన్‌ 50, మయన్మార్‌ 48, భారత్‌ 43,బంగ్లాదేశ్‌ 27, నేపాల్‌ 7 చొప్పున ఖర్చు చేస్తున్నది. అమెరికా, ఇతర ధనిక దేశాల కూటమి ప్రపంచాన్ని ఉద్రిక్తతల వైపు నడిపిస్తూ వినాశనం వైపు నడిపిస్తున్నది.

ఇది ఎన్నికల ఏడాది : కాషాయ గోబెల్స్‌ దళం రెచ్చిపోతుంది జర జాగ్రత్త !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ది జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల సంవత్సరం గనుక అవాస్తవాలు, అతిశయోక్తులు, అర్థ సత్యాలను జనం ముందు కుమ్మరిస్తారు, కాషాయ దళాలు గోబెల్స్‌ ప్రచారంతో వాట్సాప్‌ను నింపేస్తారు. దానిలో భాగంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో పెట్టుబడులు,నవకల్పనలో ముందు పీఠీన ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో జూలై 21న అమరజిత్‌ వర్మ అనే పరిశోధకుడు రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. కియర్‌నే డాట్‌ కామ్‌ నివేదిక ప్రకారం అగ్రశ్రేణిలో ఉన్న పాతిక దేశాల ఎఫ్‌డిఐ కాన్ఫిడెన్స్‌(విశ్వాస) సూచిక జాబితాలో 2020,21,22 సంవత్సరాల్లో మన దేశానికి చోటు లేదు. అంతకు ముందు 2017లో ఎనిమిది,2018లో 11, 2019లో 16వ స్థానాల్లో ఉన్నది. 2023 సూచిక ప్రకారం 16వ స్థానంలో ఉంది.2022లో పదవ స్థానంలో ఉన్న చైనా 2023లో ఏడవ స్థానానికి చేరింది. ఇక నవకల్పనలు అనేవి పరిశోధన-అభివృద్ది రంగాలలో పెట్టే పెట్టుబడులను బట్టి ఉంటాయి.2013లో ఈ సూచికలో మన దేశం 66వది కాగా 2022లో 40వ స్థానంలో ఉంది.(ఆర్గనైజర్‌ పత్రిక విశ్లేషకుడు 2015లో ఉన్న 81వ స్థానాన్ని తీసుకొని 2022లో 40వదిగా ఉందంటే మోడీ పాలనలో ఎంత పెరిగిందో చూడండని జనాన్ని నమ్మించేందుకు చూశారు) ఇదే కాలంలో చైనా 35 నుంచి 11వ స్థానానికి ఎదిగింది. ఈ సూచికలు స్థిరంగా ఉండవు, ఏడాదికేడాది మారుతుంటాయి. ధోరణి ఎలా ఉందన్నదే గీటురాయి.

మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల పెట్టుబడులను 2007 నాటికి జిడిపిలో రెండుశాతానికి పెంచాలని 2003లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ విధాన పత్రంలో పేర్కొన్నది. తరువాత 2013లో యుపిఏ ప్రభుత్వం 2018 నాటికి ఆ మేరకు పెంచాలని గడువు పెంచింది. దాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ 2020 విధాన పత్రంలో 2030 సంవత్సరంగా పేర్కొన్నారు. ఇక ఆచరణను చూద్దాం. ప్రపంచ బాంకు 2022 అక్టోబరు 24న తాజా పరిచిన సమాచారం ప్రకారం 1996లో మన దేశం ఈరంగానికి చేసిన ఖర్చు జడిపిలో 0.64శాతం.2004లో 0.76, 2008లో 0.86, 2014లో 0.7, 2018లో 0.66, 2023లో 0.7శాతం ఉంది. ప్రపంచ సగటు 1.8లో సగం కూడా మన దేశం ఖర్చు చేయటం లేదు. ఇంత తక్కువగా ఉండటానికి కార్పొరేట్‌ రంగం తగినంత ఖర్చు చేయకపోవటమే అని చెబుతున్నారు. (2023 ఫిబ్రవరి 24, హిందూ వార్త)


సులభతర వాణిజ్యం పేరుతో భారీ మొత్తంలో ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా గతంతో పోలిస్తే ఎఫ్‌డిఐలు పెరిగాయి. వాటి మాదిరి మన పారిశ్రామిక ఉత్పత్తి లేదా వస్తు ఎగుమతులు పెరగలేదు. ఆత్మనిర్భరత గురించి ఊదరగొడుతున్నారు.ఉత్పాదకతతో ముడిపెట్టిన బోనస్‌ పధకం (పిఎల్‌ఐ) పెద్ద ఎత్తున విజయవంతమైందని, 14 రంగాలలో రు.2.74లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పధకం 2020లో ప్రారంభమైంది. ఆరు సంవత్సరాల కాలంలో రు.1.9లక్షల కోట్ల మేర సబ్సిడీకోసం పక్కన పెట్టినట్లు చెప్పారు. దీని కింద 2023 మార్చి నాటికి రు.3,400 కోట్లు తమకు చెల్లించాలని కొన్ని కంపెనీలు కోరగా రు.2,900 కోట్లు చెల్లించారు. ఈ పధకం కింద ఇచ్చే సబ్సిడీతో ఉత్పాదక రంగానికి పెద్ద ఊపు వస్తుందని చెప్పారు. ఆపిల్‌ ఫోన్ల అసెంబ్లింగ్‌ను ఒక విజయగాధగా చెబుతున్నారు. దాని వెనుక ఉన్న అసలు కథేంటి ? వివిధ దేశాల్లో ఉత్పత్తి చేసిన విడి భాగాలను దిగుమతి చేసుకొని మన దేశంలో వాటిని ఒక దగ్గర కూర్చటం తప్ప అది ఉత్పత్తి చేసేది కాదు. ఆ ఫోన్లను మన మార్కెట్లో, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నది. ఉదాహరణకు మన దేశంలో అసెంబ్లింగ్‌ చేసిన అలాంటి ఒక ఫోను విలువ రు. పదివేలు అనుకుందాం. దానిలో తొమ్మిదివేల విలువ గల విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన దేశంలో ఉత్పత్తి అవుతున్న విడి భాగాల విలువ మరొక వెయ్యి జత చేసిందనుకుందాం. దాన్ని రు.200 లాభంతో అమ్మింది, లేదు ఎలాంటి లాభం లేకుండా అసలు ధరకే అమ్మిందనుకుందాం. పిఎల్‌ఐ పధకం కింద మన ప్రభుత్వం ఐదు శాతం సబ్సిడీ ఇస్తే ఒక ఫోను మీద రు.500 లాభం వచ్చినట్లే. ఆ మేరకు ఇతర దేశాల్లో ధర తగ్గించి ఇతర ఫోన్‌ కంపెనీలను వెనక్కు నెట్టవచ్చు. ఇంత లాభసాటిగా ఉన్నపుడు చైనా నుంచో మరొక చోట నుంచో కంపెనీలు మన దేశానికి ఎందుకు రావు, అసెంబ్లింగ్‌ కేంద్రాలను ఎందుకు ప్రారంభించవు. ఈ పధకం కానసాగినంత కాలం ఇక్కడ ఉంటాయి. తరువాత వేరే చోటకు వెళతాయి.


మన దేశంలో పరిశ్రమలకు ఊపు నిచ్చే రాయితీలు ఆత్మనిర్భర పధకంతో మాత్రమే ప్రారంభం కాలేదు. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతో అనేక రాయితీలు ఇచ్చారు, అనుకూల విధానాలు తీసుకువచ్చారు. దీని వలన వచ్చిన ఫలితాలను చూస్తే జిడిపిలో పారిశ్రామిక సంబంధిత సెకండరీ సెక్టర్‌ వాటా 1991-92లో ఉన్న 24.7 నుంచి 27.3 శాతానికి 2019-20 సంవత్సరం నాటికి పెరిగింది. ఇప్పుడు 24శాతం ఉంది. మనవంటి దేశాల్లో ఉత్పాదక రంగం గణనీయంగా పెరగాల్సి ఉంది. జిడిపిలో సెకండరీ సెక్టర్‌లో భాగమైన ఉత్పాదక రంగ వాటా 17శాతం దాటటం లేదు. పిఎల్‌ఐ పధకం వలన ఉత్పత్తి పెరుగుతుందన్నది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ సబ్సిడీ పొందేందుకు బడాకంపెనీలతో చిన్న సంస్థలు పోటీపడలేవు. దాంతో అవి మూతపడతాయి. అసెంబ్లింగ్‌ రంగంలో యాంత్రీకరణ, రోబోలు రంగంలోకి వస్తున్నందున కార్మికులకు ఉపాధికూడా పరిమితమే. ఉన్నది కూడా ఊడిపోతుంది. అందుకే ఉపాధి రహిత వృద్ధి అని చెప్పాల్సి వస్తున్నది. దీనితో పాటు పెద్ద మొత్తంలో పన్ను తగ్గింపు కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో మనదేశ కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, వాటాదార్లకు క్రమం తప్పకుండా డివిడెండ్లు ఇస్తున్నాయి. అందుకే విదేశీ మదుపుదార్లు మన వాటాల మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా వచ్చే డాలర్లను చూపి అది తమ ఘనతే అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. స్టాక్‌మార్కెట్ల సూచీలు, కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. దీన్ని తాము సాధించిన వృద్ధికి ప్రతీక అని బిజెపి చెబుతోంది. ఈ సూచికలు పెరిగినట్లుగా ఎగుమతులు, ఉపాధి సూచికలు ఎందుకు లేవో చెప్పదు. ఉపాధి రహిత వృద్ధి వలన సమాజంలో గిరాకీ తగ్గుతుంది. వస్తువుల కొనుగోలు తగ్గితే ఎన్నిరాయితీలు ఇచ్చినా ఉత్పత్తి చేసేందుకు ఎవరూ ముందుకురారు. దాంతో వృద్ధి రేటు తగ్గుతుంది. అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది. దీన్ని మూసిపెట్టేందుకే కేంద్రంలోని మోడీ సర్కార్‌ గారడీలు చేస్తున్నది.


వందకు రు.30 పెట్టుబడి పెట్టించి రు.70 సబ్సిడీ ఇచ్చి ఇరవై రెండువేల కోట్లకు అమెరికా కంపెనీ మైక్రాన్ను అధిపతిగా చేసిన ప్రధాని నరేంద్రమోడీ నిర్వాకాన్ని దేశం ఇటీవలనే చూసింది. మేడ్‌లేదా మేకిన్‌ ఇండియా బదులు ప్యాకిన్‌ ఇండియా సంస్థను పెట్టించేందుకు, అదీ గుజరాత్‌లో ఏర్పాటుకు అమెరికా వెళ్లి మరీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటిదే 70శాతం సబ్సిడీని (దాదాపు లక్షా పాతికవేల కోట్లు) జేబులో వేసుకొనేందుకు చూసిన వేదాంత-ఫాక్స్‌కాన్‌ కంపెనీకి సెమీకండక్టర్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో చివరకు దాన్ని రద్దు చేసుకున్నది. తాజా వార్త ఏమంటే మనదేశ కంపెనీ టాటా సన్స్‌ బ్రిటన్‌లో 5.2బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ కార్ల బాటరీలను తయారు చేసేందుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అదే కంపెనీ మనదేశంలో పెట్టకుండా అక్కడికి ఎందుకు పెట్టుబడులను తరలిస్తున్నట్లు అన్నది ప్రశ్న.అది 2026 నాటికి మేడిన్‌ బ్రిటన్‌ పేరుతో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, నాలుగువేల మందికి నేరుగా పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కూడా వెల్లడించారు. అది ఐరోపాలోనే అతి పెద్ద సంస్థగా ఉంటుందని, ఏటా 40గిగావాట్‌ గంటల బాటరీలను ఉత్పత్తి చేస్తుందని, తమ దేశ అవసరాల్లో సగం తీరుస్తుందని బ్రిటన్‌ ఇంథన భద్రతా శాఖ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ చెప్పాడు. టాటా కంపెనీకి బ్రిటన్‌ సర్కార్‌ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ వివరాలు వెల్లడించలేదు.


ఒక దేశం నుంచి మరొక దేశానికి పెట్టుబడులు వెళ్లటం ఒక సాధారణ అంశంగా మారింది. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చినపుడు విదేశాలకు తరచూ ఎందుకు వెళుతున్నారన్న ప్రశ్నకు కాంగ్రెస్‌ ఏలుబడిలో దిగజారిన దేశ ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదార్లు చెప్పారు. మరోవైపు మోడీ అధికారానికి వచ్చిన తరువాత మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు పెరిగాయి. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడికి చీమలు చేరినట్లు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పెట్టుబడి పరుగులు తీస్తుంది తప్ప ఒక నేత పలుకుబడిని బట్టి ఉండదు.నరేంద్రమోడీ ప్రపంచ నేత అని అందరూ కీర్తిస్తున్నారని, ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరధం పడుతున్నారని భక్తులు తన్మయత్వంతో ఊగిపోతారు. అంత పలుకుబడి ఉంటే టాటా కంపెనీ బ్రిటన్‌లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? ఫాక్స్‌కాన్‌ ఎందుకు తప్పుకుంది ? ఐరాస సంస్థ ఆంక్టాడ్‌ సమాచారం ప్రకారం 2004లో మనదేశానికి ఐదువందల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే 2021లో అవి 8,300 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 200 నుంచి 1,500 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా నుంచి కూడా పెట్టుబడులు పెద్ద మొత్తంలోనే ఇతర దేశాలకు వెళుతున్నాయి. అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది, ఆక్రమంలో పెట్టుబడులు తరలాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టకపోతే అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులు జరగకపోవటం వంటి అనేక షరతులు, ఆటంకాల పూర్వరంగంలో అది జరిగింది. మన దేశం కూడా మోడీ చెప్పినట్లు గుజరాత్‌ నమూనాను దేశమంతటా విస్తరించి చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉన్నా, ఆ దిశలో ప్రగతి ఉన్నా టాటా వంటి కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లాయంటే అర్ధం చేసుకోవచ్చు.


మనదేశం నుంచి వెళుతున్న పెట్టుబడుల గురించి రిజర్వుబాంక్‌ ఇచ్చిన వివరాల ప్రకారం 2007 నుంచి 2021వరకు 68 శాతం పెట్టుబడులు విదేశాల్లో ఉన్న ద్రవ్య సంబంధ కేంద్రాలకు వెళుతున్నాయి. వాటి వలన మనదేశానికి సాంకేతిక పరిజ్ఞానం, మరొకటో ఏమీ రాదు. పన్నులు తక్కువగా ఉండే సింగపూర్‌, మారిషస్‌, బెర్ముడా, కేమాన్‌ ఐలండ్స్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, నెదర్లాండ్స్‌ వంటి వాటికి 51శాతం వెళుతున్నాయి. ఈ దేశాలు, ప్రాంతాల్లో నమోదైన కార్పొరేషన్ల మీద అక్కడి ప్రభుత్వాలు నామమాత్ర పన్ను లేదా కొన్ని సార్లు అసలు పన్నే లేకుండా అనుమతిస్తాయి, అంటే పన్నులను తప్పించుకొనేందుకే అన్నది స్పష్టం. ఈ నిధులు చివరికి ఎక్కడికి చేరుతున్నదీ తెలియటం లేదు. హిండెన్‌బర్గ్‌ నివేదికలో ఇలాంటి డొల్ల కంపెనీలతో లావాదేవీల గురించి ఉంది. మారు పేర్లతో ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దేశాలకే విదేశీ పెట్టుబడుల పేరుతో వచ్చి రాయితీలు పొందుతున్నాయి. అక్కడున్న డొల్ల కంపెనీలకు అధికారికంగా లేదా అక్రమ పద్దతుల్లో పెట్టుబడులు చేరుతున్నాయి. నల్లధనం తెల్లధనంగా మారుతున్నది. మన దేశానికి 2000 నుంచి 2023లో ఇప్పటి వరకు వచ్చిన విదేశీ పెట్టుబడులను చూస్తే మారిషస్‌ నుంచి 26, సింగపూర్‌ 23 అంటే రెండు చోట్ల నుంచే 49శాతం వచ్చాయి. దీని వలన మన ఖజానాకు ఎంతో నష్టం జరుగుతోంది. మన ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను ఉపయోగిస్తున్నారనేది కూడా స్పష్టంగా తెలియదు. మన దేశం నుంచి వెళుతున్న పెట్టుబడులతో కొన్ని దేశాల్లో అప్పటికే ఉన్న సంస్థల కొనుగోలు లేదా విలీనాలకు పూనుకుంటున్నారు. ఇదంతా సదరు కంపెనీల మార్కెట్‌ విస్తరణ, లాభాలను పెంచుకొనేందుకు తప్ప మన దేశంలో ఉపాధి కల్పించేందుకు ఏమాత్రం తోడ్పడదు. ఆర్థిక వ్యవహారాల కేంద్ర ప్రభుత్వ శాఖ సమాచారం ప్రకారం మనదేశం విదేశాల్లో నేరుగా పెట్టిన పెట్టుబడుల మొత్తం 2021-22లో 17.53 బిలియన్‌ డాలర్లు కాగా అత్యంత ధనిక దేశమైన అమెరికా పెట్టిన పెట్టుబడులు 12.1 బి.డాలర్లు మాత్రమే. అక్కడి సంస్థలు పన్నులను తప్పించుకొనేందుకు మారిషస్‌ వంటి పన్నులు లేని చోట్ల నుంచి పెట్టుబడులు పెడతాయి. భారీ మొత్తాల్లో సబ్సిడీలు ఇచ్చి పాకింగ్‌ కంపెనీలను తెస్తున్న నరేంద్రమోడీ బాటరీలను ఉత్పత్తి చేసే టాటా కంపెనీ బ్రిటన్‌ ఎందుకు వెళ్లిందో మన జనాలకు చెప్పాలా లేదా ?

ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి క్లస్టర్‌ బాంబులు-మరో మలుపు తిరిగిన సంక్షోభం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


శాంతి నెలకానాల్సిన చోట మరింత అశాంతి తలెత్తేలా జో బైడెన్‌ సర్కార్‌ ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబులు పంపింది. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం కావించేందుకు, రష్యా మీద మరిన్ని ఆంక్షలతో నష్టపరిచేందుకు నాటో కూటమి పూనుకుంది. దానికి ప్రతిగా దాడులను మరింత తీవ్రం గావించటంతో పాటు, ఉక్రెయిన్నుంచి నల్లసముద్రం ద్వారా జరుగుతున్న ధాన్య ఎగుమతుల ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఆదివారంతో ముగిసిన ఒప్పందాన్ని అది పొడిగించలేదు. దీంతో 45 దేశాలకు ఉక్రెయిన్‌ ధాన్య ఎగుమతులపై అనిశ్చితి ఏర్పడింది.నౌకలకు భద్రత లేనందున రవాణా నిలిచిపోనుంది. గత ఏడాది టర్కీ చొరవతో ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉక్రెయిన్‌ రేవుల దిగ్బంధనాన్ని రష్యా ఎత్తివేసింది. దానికి ప్రతిగా తమ ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగించలేదని పుతిన్‌ విమర్శించాడు.మూడు ఉక్రెయిన్‌ రేవుల నుంచి వివిధ దేశాలకు 3.28 కోట్ల టన్నుల గోధుమలు,ఇతర ధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె ఎగుమతి జరిగింది. వీటిలో 46శాతం ఆసియా, 40శాతం పశ్చిమ ఐరోపా, 12శాతం ఆఫ్రికా, రెండు శాతం తూర్పు ఐరోపా దేశాలకు వెళ్లాయి. దాంతో గత ఏడాది మార్చి నుంచి ఇటీవలి వరకు ప్రపంచ మార్కెట్లో ఆహార ధరలు 23శాతం వరకు తగ్గినట్లు తేలింది. తిరిగి పరిస్థితి మొదటికి రావటంతో సోమవారం నాడు చికాగో మార్కెట్లో గోధుమల ముందస్తు ధర 3.5శాతం పెరిగింది. వెంటనే ఒప్పంద పునరుద్దరణ జరగకపోతే భారత్‌తో సహా అనేక దేశాల మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఒప్పందాన్ని కొనసాగించలేదనే ఆగ్రహంతో క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రధాన భూ భాగాన్ని కలిపే వంతెన పేల్చివేసేందుకు ఉక్రెయిన్‌ దాడిజరిపింది. పాక్షికంగా దెబ్బతిన్న వంతెనను వెంటనే రాకపోకలకు పునరుద్దరించినటు పుతిన్‌ సర్కార్‌ ప్రకటించింది. దీనికి ప్రతిగా భారీ ఎత్తున నల్లసముద్రంలోని రేవు, ఉక్రెయిన్‌ ఇతర ప్రాంతాల మీద రష్యా పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరుపుతున్నట్లు మంగళవారం నాడు వార్తలు వచ్చాయి. తమ తూర్పు ప్రాంతంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమ అదుపులోనే ఉందని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. లక్ష మందికి పైగా మిలిటరీ, తొమ్మిది వందలకు మించి టాంకులను రష్యా మోహరించిందని అన్నాడు.


మానవ హక్కుల బృందాలు విమర్శించినా ఖాతరు చేయకుండా నిషేధిత క్లస్టర్‌ బాంబులను ( పలు రకాల బాంబుల గుత్తి ) ఉక్రెయిన్‌కు సరఫరా చేసి సంక్షోభాన్ని ప్రమాదకర మలుపు తిప్పేందుకు అమెరికా పూనుకుంది. ఎనభై కోట్ల డాలర్ల విలువగల పాకేజ్‌లో భాగంగా ఇప్పటికే వాటిని అక్కడకు తరలించింది. ఒక వేళ వాటిని తమ మీదకు వదిలితే తాము కూడా ప్రయోగించేందుకు తమ వద్ద భారీగా నిల్వలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఒక రష్యా జర్నలిస్టుతో మాట్లాడినపుడు ఈఅంశాన్ని చెప్పాడు. గతంలో అమెరికా వీటిని ప్రయోగించిన ప్రాంతాలలో జరిగిన ప్రాణ నష్టం, వనరుల విధ్వంసం కారణంగా వాటిని నిషేధించారు. కొన్ని సందర్భాలలో కొన్ని బాంబులు పేలవు. వాటి గురించి తెలియక ఎవరైనా ముట్టుకుంటే సంవత్సరాల తరువాత కూడా మందుపాతరల మాదిరి పేలే ముప్పు ఉంది. గగనతలం నుంచి విమానాలు, భూమి, సముద్రాల మీద నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. గతంలో ఇవి పేలినపుడు మరణించిన వారిలో 94శాతం మంది పౌరులు కాగా 40శాతం మంది పిల్లలు ఉన్నారు. వీటిని రూపొందించే పద్దతిని బట్టి ఒక్కో గుత్తిలో కొన్ని డజన్ల నుంచి గరిష్టంగా ఆరువందల బాంబులను అమర్చవచ్చు. తక్కువ మంది మిలిటరీ, పరిమితమైన విమానాలు, ఓడలు, రాకెట్‌ వాహనాలతో భారీ నష్టం కలిగించవచ్చు.


ఈ బాంబులను రకరకాలుగా రూపొందిస్తున్నారు. మామూలుగా ఒక బాంబును వేస్తే ఒక చోటే నష్టం కలిగిస్తుంది. కానీ ఈ గుత్తి బాంబు వేసిన తరువాత అది అనేకంగా విడిపోయి విసృత ప్రాంతంలో పేలుళ్లకు కారణమౌతుంది. మనుషులను చంపటంతో పాటు రోడ్లు,వాహనాలు, విద్యుత్‌ లైన్లు ఇలా ఆ ప్రాంతంలో ఏవి ఉంటే వాటిని ధ్వంసం చేస్తాయి. కొన్ని సందర్భాలలో మానవాళి, పంటలకు ముప్పు కలిగించే జీవ, రసాయనాలతో కూడా బాంబులను రూపొందిస్తున్నారు. యుద్ధం, ఇతర సందర్భాలలో పౌరులను హెచ్చరించేందుకు, బెదిరించేందుకు రూపొందించిన కరపత్రాలను కూడా ఈ బాంబుల ద్వారా వెదజల్లిన ఉదంతాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇవి కలిగించిన అపార నష్టాన్ని చూసిన తరువాత 2008 మే 30వ తేదీన డబ్లిన్‌ నగరంలో 107 దేశాలు వీటి ఉత్పత్తి, వినియోగం, బదిలీ, నిల్వ చేయరాదని ఒక అవగాహనకు వచ్చాయి, అదే ఏడాది డిసెంబరు మూడున ఓస్లో నగరంలో ఒప్పందం మీద సంతకాలు చేశాయి. 2010 ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 111 దేశాలు సంతకాలు చేసి పార్లమెంట్లలో ఆమోద ముద్ర వేశాయి, మరో పన్నెండు దేశాలు సంతకాలు చేసినా తదుపరి ప్రక్రియను పూర్తి చేయలేదు. మన దేశం, అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ఒప్పందంలో చేరలేదు. నాటోలోని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి పద్దెనిమిది దేశాలు కూడా ఒప్పందాన్ని అమలు చేస్తున్నవాటిలో ఉన్నాయి. అవి కూడా అమెరికాను నివారించేందుకు పూనుకోలేదు. అయిష్టంగానే తాము ఉక్రెయిన్‌కు అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దురాక్రమణకు పూనుకున్న నాజీ సేనల మీద 1943లో నాటి సోవియట్‌ కురుస్క్‌ ప్రాంతంలో వీటిని వేసింది. అదే ఏడాది ఇంగ్లాండ్‌లోని గ్రిమ్స్‌బై ప్రాంతం మీద నాజీ సేనలు వెయ్యి బటర్‌ ఫ్లై బాంబులు వేశాయి. ఇండో చైనాను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న అమెరికా 1960,70 దశకాల్లో వియత్నాం, లావోస్‌, కంపూచియాల మీద వాటిని వేసింది. ఒక్క వియత్నాం మీదనే 4,13,130 టన్నుల బాంబులు, లావోస్‌ మీద 27 కోట్లు వేసింది. రెడ్‌క్రాస్‌ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం లావోస్‌లోని 17 రాష్ట్రాలలో ఇప్పటికీ ఏటా మూడు వందల మంది చొప్పున అవి పేలి మరణిస్తున్నారు. అక్కడ ఎనిమిది కోట్ల బాంబులు పేలలేదని అంచనా. అవి ఎక్కడ పడిందీ కనుగొనటం ఎంతో కష్టం. ఎప్పుడైనా పేలవచ్చు. 1975-88 సంవత్సరాల్లో మొరాకో మిలిటరీ వీటిని తిరుగుబాటుదార్ల మీద వేసింది.1978లో లెబనాన్‌పై దురాక్రమణ జరిపిన ఇజ్రాయెల్‌ వాటితో దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌-అమెరికా రెండూ కూడా వాటితో దాడులు జరిపాయి. బ్రిటన్‌ 1982 ఫాక్‌లాండ్స్‌ దాడిలో అర్జెంటీనా మీద వేసింది. ఇరాక్‌పై దురాక్రమణ దాడిలో అమెరికా, దాని మిత్ర పక్షాలు 61వేల వైమానిక దాడులలో వీటిని వదిలాయి. బోస్నియాపై 1992-95లో యుగోస్లావ్‌ సేనలు, 1994-96లో చెచెన్‌ తిరుగుబాటుదార్లపై రష్యా,1995లో క్రోషియాపై సెర్బ్‌, 1996-99లో సూడాన్‌ మిలిటరీ దక్షిణ సూడాన్‌ తిరుగుబాటుదార్ల మీద, ఇంకా ఎరిట్రియా, ఇథియోపియా,అల్బేనియా, కొసావా వార్‌లో నాటో సేనలు, జార్జియాపై 2008లో రష్యా,సిరియా, ఎమెన్‌ తదితర చోట్ల కూడా వీటిని వినియోగించారు.


రష్యా ఉక్రెయిన్‌ మీద వేసినట్లు గతంలో నాటో కూటమి ఆధారం లేని ఆరోపణలు చేసింది. తాజాగా అమెరికా వాటిని ఇవ్వటాన్ని సమర్ధించుకొనేందుకు ముందుగానే ఈ ప్రచారం చేసినట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. పట్టణాల మీద వీటిని వేయకూడదని రాతపూర్వకంగా ఉక్రెయిన్నుంచి హామీ పొందినట్లు నమ్మించేందుకు అమెరికా చూస్తోంది. కొంత మంది ఇలా అందచేతతో తలెత్తే చట్టపరమైన అంశాల గురించి చర్చలు చేస్తున్నారు. నాటోలోని కొన్ని అమెరికా మిత్రదేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తప్పని చెబుతూనే ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు ఇస్తున్నారు గనుక అర్ధం చేసుకున్నామంటూ సమర్ధించాయి. ఐదు వందల రోజుల సంక్షోభం తరువాత ఎందుకు ఇప్పుడు వీటిని అమెరికా సరఫరా చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. రష్యా అదుపులో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు తాము ప్రతిదాడులు జరుపుతున్నట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఎలాంటి పురోగతి లేకపోగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు వార్తలు. టాంకులు, శతఘ్నులను పెద్ద ఎత్తున నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో రష్యన్లు భారీ సంఖ్యలో మందుపాతరలను అమర్చినట్లు, కందకాలను తవ్వినట్లు వెల్లడికావటంతో ఉక్రెయిన్‌, నాటో మిలిటరీ అంచనాలు తప్పాయి. వాటిని దాటుకొని ముందుకు పోవటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. అందుకే ఆ ప్రాంతాల మీద క్లస్టర్‌ బాంబులను వేయటం తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇవి కందకాల మీద, బహిరంగంగా ఉన్న టాంకులు, శతఘ్నులను పేలుళ్లు జరిపి నష్టపరుస్తాయి. పేలని బాంబులు, వాటితో పాటు జారవిడిచే మందుపాతరలను తప్పించుకొని పుతిన్‌ సేనలు ముందుకు పోవటం కూడా ఇబ్బందే.


క్లస్టర్‌ బాంబులను గతంలో ప్రయోగించిన ప్రాంతాలన్నీ మిలిటరీ, పౌరులు కలసి ఉన్న ప్రాంతాలే కావటంతో అనేక మంది వీటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ బాంబులలో రెండు నుంచి నలభై శాతం వరకు పేలే అవకాశం లేదని, చెట్లు, గుట్టలు, బురద ప్రాంతాల్లో పడినవి తరువాత ఎవరైనా వాటిని కదిలించినపుడు లేదా అవేమిటో తెలియని పిల్లలు, ఇతరులు వాటిని ముట్టుకున్నపుడు పేలి ప్రాణాలు తీస్తాయి. తాము ఉక్రెయిన్‌కు పంపిన ఈ బాంబుల్లో పేలనివి 2.35శాతమే ఉంటుందని, ఎంతో మెరుగుపరచిన పరిజ్ఞానంతో రూపొందించినట్లు అమెరికా నమ్మించచూస్తోంది. అయితే దాని రక్షణశాఖ జరిపిన పరీక్షల్లో పేలనివి 14 నుంచి 20శాతం అంతకంటే ఎక్కువే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు వాటిని అందించటమంటే అక్కడి సంక్షోభాన్ని మరో మలుపు తిప్పటమే కాదు, తీవ్ర పర్యవసానాలకూ దారి తీస్తుంది. ఉద్రిక్తతలను ఎగదోసే యుద్ధోన్మాదాన్ని ఎండగట్టాలి.

పేదరికం మీద పరిహాసం : మన ” దరిద్రపు ” లెక్కలేంటి , మనమెక్కడున్నాం ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రనుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి సంతోషించారు. జీవన పరిస్థితులను ”గణనీయం” గా మెరుగుపరచినందున ఈ పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ -వర్తమాన బిజెపి పాలన కలసి ఉంది గనుక, మరీ డబ్బా కొట్టుకుంటే జనం నవ్విపోతారు గనుక కాషాయ దళాలు కాస్త తగ్గి ఉన్నట్లు కనిపిస్తోంది. సున్నా కంటే ఒకటి విలువ ఎంతో ఎక్కువ అన్నట్లుగా దీని గురించి సానుకూల వైఖరితోనే మంచి చెడ్డలను చూద్దాం. ఈ సూచికను ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి), ఆక్స్‌ఫర్డ్‌ దారిద్య్ర, మానవ అభివృద్ధి చొరవ (ఓపిహెచ్‌ఐ) సంస్థ ఉమ్మడిగా రూపొందించాయి. ప్రభుత్వాలు అందించిన సమాచారాన్ని విశ్లేషించి వివరాలను వెల్లడించారు. ఇది ఒక్క మన దేశం గురించే కాదు, అన్ని దేశాల గురించీ 2010 ప్రతి ఏటా ఇలాంటి సమాచారాన్ని ప్రకటిస్తున్నారు.వివిధ అంశాల ప్రాతిపదికన జీవన నాణ్యతను లెక్కిస్తున్నారు. మన దేశంలో 2005-06 నుంచి 2019-2021వరకు పదిహేను సంవత్సరాలలో వచ్చిన మార్పు ప్రకారం పోషకాహారం, శిశుమరణాలు, స్కూలు వెళ్లే సంవత్సరాలు, బడికి హాజరు, వంట గాస్‌, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ అందుబాటు, ఇంటివసతి, ఆస్తులు ఎంత మేరకు కలిగి ఉన్నారనేదాని ప్రాతిపదికగా అంచనా వేశారు. 2005-06లో ఇవి లేని వారు దేశ జనాభాలో 55.1శాతం, 2015-16లో 27.7శాతం, 2019-2021లో 16.4 శాతం మంది ఉన్నారని ఎంపిఐ సూచికలో పేర్కొన్నారు. మన దేశంలో 41.5 కోట్ల మంది జీవితాలు మెరుగుపడితే చైనాలో 2010-14 మధ్య 6.9 కోట్ల మంది జీవితాలు మెరుగుపడ్డాయి. ప్రపంచమంతటా 110 దేశాల్లో 110 కోట్ల మంది ఇంకా దారిద్య్రంలో మగ్గుతున్నారు. మన దేశంలో 23 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆరుగురిలో ఐదుగురు ఆఫ్రికాలోని సబ్‌ సహారా, దక్షిణాసియాలో ఉన్నారు. ఈ విశ్లేషణలన్నీ కరోనాకు ముందు ఉన్న సమాచారం ప్రాతిపదికగా చేసినవే, ఆ మహమ్మారి కలిగించిన ప్రతికూల ప్రభావం వలన దారిద్య్రంలోకి దిగజారిన వారు ఇంకా పెరిగారని చెబుతున్నారు.


దారిద్య్రం నుంచి ఇంత మంది బయపడ్డారు అన్నది ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దీనికి ఆయా దేశాలు నిర్ణయించిన ప్రమాణాలు తప్ప ప్రపంచమంతటికీ వర్తించే ప్రాతిపదిక లేదు. ప్రపంచబాంకు నిర్వహించే దారిద్య్రం, అసమానతల వేదిక – పావర్టీ అండ్‌ ఇనీక్వాలిటీ ప్లాట్‌ఫాం(పిఐపి) విశ్లేషణ ప్రకారం రోజుకు 2.25 డాలర్లు, అంతకంటే తక్కువ వచ్చే వారు మన దేశంలో 2019లో 11.88శాతం ఉన్నారు. త్వరలో మన దేశం చైనాను అధిగమించనుందని అనేక మంది చెబుతున్నారు గనుక, దానితో పోలిక ఎలా ఉందో చూద్దాం. 2017 పిపిపి పద్దతిలో లెక్కించిన మేరకు 2019నాటి వివరాలు. ఆ ఏడాది సగటున ఒక డాలరుకు రు.70 మారకపు విలువ ఉంది.(జూలై 15న ఒక డాలరుకు రు.82గా ఉంది) కనుక ఎవరికి వారు ఆ రోజున ఉన్న విలువ ప్రకారం లెక్కించుకోవచ్చు. ప్రామాణికంగా డాలర్లను తీసుకున్నారు గనుక ఇక్కడ కూడా దాన్నే తీసుకుందాం. విశ్లేషకులు తీసుకొనే రాబడి అంకెలలో స్వల్ప తేడాలుంటే జనాభా శాతాలు ఎలా మారతాయో కూడా చూద్దాం. ప్రపంచ బాంకు పేర్కొన్న ప్రమాణం ప్రకారమే రోజుకు 2.15 డాలర్ల రాబడిని ప్రాతిపదిక తీసుకుంటే 2015 – 2019 కాలంలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్న జనాభా మన దేశంలో 18.7 నుంచి 10శాతానికి తగ్గగా చైనాలో 1.2 నుంచి 0.1 శాతానికి తగ్గింది. పిఐపి వేదిక సమాచారం మేరకు దిగువ విధంగా ఉన్నారు.
దేశం××× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం
భారత్‌ ×× 2.25 ×× 11.88 ×× 3.60 ×× 43.66 ×× 6.95 ×× 84.31
చైనా ×× 2.25 ×× 0.18 ×× 3.70 ×× 3.24 ×× 6.80 ×× 24.34


ఎగువ అంకెలను బట్టి రోజుకు ఎక్కువ సంపాదించే వారు చైనాలో చాల ఎక్కువ మంది ఉన్నారు. రాబడిని బట్టి జీవన ప్రమాణాలు, నాణ్యత ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. జనాల రాబడితో పాటు ప్రభుత్వాలు అందించే సేవలు కూడా వాటికి తోడౌతాయి. బిజెపి పెద్దలు, కొన్ని మీడియా సంస్థలు మన దేశాన్ని పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌(2016), పాకిస్తాన్‌(2018)లతో పోల్చి చూపటం తెలిసిందే. వాటి స్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. అచ్చేదిన్‌ గురించి ప్రతి దేశంలోని పాలకులూ చెప్పే కబుర్లే కనుక ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి వారే పోల్చుకోవచ్చు.
దేశం××× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం
బంగ్లాదేశ్‌ ×× 2.20 ×× 14.62 ×× 3.65 ×× 51.63 ×× 6.95 ×× 87.43
పాకిస్తాన్‌ ×× 2.15 ×× 4.93 ×× 3.65 ×× 39.84 ×× 6.95 ×× 85.16


దక్షిణాసియాలో మన ఇరుగు పొరుగు దేశాల్లో శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉంది. మన దేశంలో దారిద్య్రరేఖ గురించి ఎవరికి వారే తమదైన సూత్రీకరణలు చేశారు, భాష్యాలు చెప్పారు. వాటి తీరు తెన్నుల గురించి చూద్దాం. ప్రపంచ బాంకు రోజుకు 1.90 డాలర్లుగా అంతకు ముందు నిర్ణయించిన దానిని 2022లో 2.15 డాలర్లకు పెంచింది. దారిద్య్రరేఖ నిర్ణయానికి అన్ని దేశాల ప్రమాణాలు ఒకే విధంగా లేవని ముందే చెప్పుకున్నాం. మన దేశంలో కూడా వివిధ కమిటీలు భిన్న ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకున్నాయి. అలఫ్‌ు కమిటీ (1979) ప్రతి రోజూ పెద్దవారికి గ్రామాలలో 2,400, పట్టణాలలో 2,100 కాలరీల శక్తి అవసరమని, అందుకు అవసరమైన ఆహారం, దాని ధరలను ప్రాతిపదికగా తీసుకుంది. తరువాత లకడావాలా కమిటీ(1993), టెండూల్కర్‌ కమిటీ(2009), రంగరాజన్‌ కమిటీ (2012)లు దీని గురించి నివేదికలు ఇచ్చాయి. రంగరాజన్‌ కమిటీ పట్టణాల్లో రోజుకు తల ఒక్కింటికి నెలకు రు.1,407, గ్రామాలలో రు.972 ఖర్చును దారిద్య్రరేఖ నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకుంది.


మన దేశంలో దారిద్య్రానికి కారణాలుగా దిగువ వాటిని పేర్కొంటున్నారు. జనాభా పెరుగుదల నిరంతరం జరుగుతున్నది, దానికి అనుగుణంగా వస్తు వినియోగ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండటం. దీనికి కారణం కమతాలు చిన్నవిగా ఉండటం, రైతులకు పెట్టుబడి లేమి, నూతన సాంకేతిక పద్దతుల గురించి తెలియని తనం, సాంప్రదాయ పద్దతుల్లోనే సాగు, వృధాను అరికట్టలేకపోవటం, దీని వలన జీవన ప్రమాణాలు పెరగటం లేదు అని చెబుతున్నారు. వనరులను సమర్ధవంతంగా ఉపయోగించకపోవటం, ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండటం, పెట్టుబడుల లేమి, ధరల పెరుగుదల,నిరుద్యోగం, వారసత్వం, కుల వ్యవస్థ కూడా కారణాలుగా పేర్కొంటున్నారు. ఇవి నాణానికి ఒక వైపు మాత్రమే.ఈ అంశాల పరిష్కారానికి పాలకులు అనుసరించిన దివాలా కోరు విధానాలు అసలైన కారణాలు. ఆపరేషన్‌ అవసరమైన చోట పూత మందులు పూసి చికిత్స చేసినట్లుగా అనేక ఉపశమన పథకాలను అమలు జరిపినా ఫలితం ఉండటం లేదు. పరిమితమైన మెరుగుదలను చూపి మొత్తం దారిద్య్రం నుంచి జనాలను బయటపడవేసినట్లు చెబుతున్నారు. దానికి జీవన ప్రమాణాలు మెరుగుపడినట్లు అందమైన పేరు. ప్రపంచ బాంకు చెప్పినట్లు రోజుకు 2.15 డాలర్లు అంటే (ఇప్పటి మారకపు రేటు ప్రకారం) రు.172 రాబడి ఉంటే దారిద్య్రం నుంచి వెలుపలికి వచ్చినట్లే. దీని ప్రకారం నెలంతా పని ఉందనుకుంటే రాబడి రు5160 వస్తుంది. రంగరాజన్‌ కమిటీ ప్రతి వ్యక్తి నెలకు రు.1,407 ఖర్చు చేస్తే చాలని చెప్పింది. ఇవి నేడున్న స్థితిలో వాస్తవాల ప్రాతిపదికన వేసిన అంచనాలేనా ? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీసవేతనం కూడా నెలకు ఐదున్నరవేలకు అటూ ఇటూగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా 200, 500 చొప్పున నిర్ణయించింది అరవై, ఎనభై ఏండ్లు దాటిని వారికి ఇది ఏమూలకు వస్తుందో, ఇతర ఏ ఆధారం లేని పని చేయలేని వారు దానితో ఎలా బతుకులీడుస్తారో అచ్చేదిన్‌ కబుర్లు చెప్పేవారు ఎన్నడైనా ఆలోచించారా ? దారుణమైన అంశం ఏమంటే 2013లోనే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పెన్షన్లు పెంచాలని సిఫార్సు చేసింది. దాన్ని పట్టించుకోవాల్సినంత గొప్పది కాదన్నట్లుగా గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ పక్కన పెట్టింది. డిఎంకె సభ్యురాలు కనిమొళి సారధిగా ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2023 మార్చి నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దీర్ఘకాలంగా ఎదుగబొదుగూ లేకుండా ఉన్న ఈ మొత్తాలు ఇప్పుడు దేనీకీ చాలవని, పెంచాలని చేసిన సిఫార్సును కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది పచ్చి నిజం.


మన దరిద్రం గురించి మనమే చెప్పుకుంటే ప్రపంచంలో పలుచనకామా అని కొంతమంది మండి పడతారు. మూసిపెడితే పాచిపోతుంది. మన గురించి ప్రపంచం ఎన్నో అంశాలను చెబుతోంది. మన పాలకులు వాటిని దాచిపెడుతున్నారు. ఎవరైనా లేవనెత్తితే దేశద్రోహం అంటున్నారు. ఈ అంశాలను ఎక్కడ చర్చించాలి ? ప్రపంచ సంస్థలు ఇచ్చే రాంకులు, సూచికలను అంగీకరించేది లేదు, వాస్తవాలకు ప్రతిబింబం కాదు అంటారు.పోనీ వారు అసలైన అంకెలను వెల్లడిస్తారా అంటే అదీ లేదు. నిజంగా మన దేశం దరిద్రం నుంచి 41.5 కోట్ల మందిని విముక్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాలు చెబుతున్నదేమిటి ? కేంద్ర ప్రభుత్వం 2018లో అనీమియా(రక్తహీనత) ముక్త భారత్‌ పధకాన్ని ప్రకటించింది. జీవన ప్రమాణాలను ప్రతిబింబించేవాటిలో ఇది ఒకటి. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత రెండుసార్లు 2015-16లో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌), 2019-21 ఐదవ సర్వే చేశారు. రక్తహీనత పెరుగుదల తగ్గుదల గురించి ఈ రెండు సర్వేలను పోలుస్తూ కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో పిఐబి ద్వారా సమాచారాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం ఒకటి రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తప్ప దేశమంతటా, మెజారిటీ రాష్ట్రాలలో రక్తహీనత ఉన్నవారి సంఖ్య పెరిగింది. దరిద్రం తగ్గితే ఇది కూడా తగ్గాలి కదా ! మన దేశంలో రక్త హీనత గురించి కొన్ని వివరాలు చూడవచ్చు.
గణన × రాష్ట్రం × పిల్లలు×15 -49 స్త్రీలు×15 -49గర్భిణులు×మొ.స్త్రీలు× బాలికలు× బాలురు
సర్వే 4 × దేశం × 58.6 × 53.2 × 50.4 × 53.1 × 54.1 × 29.2
సర్వే 5 × దేశం × 67.1 × 57.2 × 52.2 × 57 × 59.1 × 31.1
సర్వే 4 × గుజరాత్‌ × 62.6 × 55.1 × 51.3 × 54.9 × 56.5 × 31.9
సర్వే 5 × గుజరాత్‌ × 79.7 × 65.1 × 62.6 × 65 × 69.0 × 36.0
సర్వే 4 × కేరళ × 35.7 × 34.7 × 22.6 × 34.3 × 37.8 × 14.3
సర్వే 5 × కేరళ × 39.4 × 36.5 × 31.4 × 36.3 × 32.5 × 27.4

జనాభాను ఆరు బృందాలుగా విభజించి ఎవరిలో పరిస్థితి ఎలా ఉందో విశ్లేషించారు. ఇక్కడ బాలికలు, బాలురు అంటే 15-19 సంవత్సరాల వారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటా విస్తరిస్తాను అని నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గానీ సిపిఎం గానీ తమది నమూనా అనే మాటలు చెప్పలేదు. దేశ సగటు కంటే ధనిక రాష్ట్రం గుజరాత్‌లో రక్తహీనత అన్ని తరగతుల వారిలో ఎక్కువగా ఉంది. దానికి విరుద్దంగా కేరళలో మెరుగైన స్థితి ఉంది. ప్రపంచ ఆకలి సూచికలో 2022లో 121 దేశాలకు గాను మన రాంక్‌ 107గా ఉంది. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి, నరేంద్రమోడీ కేంద్రంలో అధికారానికి రాక ముందు 2013లో 120 దేశాలకు మన రాంకు 63గా ఉంది. ఇండెక్స్‌ ముండీ డాట్‌ కామ్‌ సమాచారం 2019 ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు 186 దేశాలకు గాను మనం 32వ స్థానంలో ఉన్నాం, అదే చైనా 141వ స్థానంలో ఉంది. మన కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక 98, బంగ్లాదేశ్‌ 55, నేపాల్‌ 51, భూటాన్‌ 50, మయన్మార్‌ 41, పాకిస్తాన్‌ 33వ స్థానంలో ఉంది. రెండింజన్ల పాలన ఉంటేనే అభివృద్ది అని చెప్పేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు. పిల్లలను ఆరోగ్యంగా ఉంచలేని వారు జిడిపి గురించి ఎన్నిక కబుర్లు చెప్పినా దాని వలన ఫలితం ఏమిటి ?