దేవాలయాలపై బూతు బొమ్మలకు ఓకే అంటున్న కాషాయ దళాలు- షారూఖ్‌ ఖాన్‌, దీపిక పఠాన్‌ సినిమా పాటపై దాడి ఎందుకు?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలను చూసినపుడు మన దేశంలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. చాలా మందికి దేనిమీదా స్పందన లేకపోవటం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరుధ్యం వాస్తవం. ఇది కొత్తగా వచ్చిన ధోరణా ? మన దేశ గతంలోనూ ఇలాంటి తీరు తెన్నులు కనిపిస్తాయి. ఈ కారణంగానే రాజరికాలు, విదేశీ దురాక్రమణల వలస పాలన చాలా కాలం ఎదురులేకుండా సాగింది. తాజా అంశానికి వస్తే సినిమాలు ఎలా తీయాలో ఎవరు ఏ దుస్తులు, ఏ రంగువి వేసుకోవాలో కూడా మతశక్తులు నిర్దేశిస్తున్నాయి, లేకుంటే అడనివ్వం, సినిమా హాళ్లను తగుల బెడతాం అని బెదిరిస్తున్నాయి. షారూఖ్‌ ఖాన్‌-దీపికా పడుకొనే జంటగా నటించిన ” పఠాన్‌ ” అనే సినిమా పలు భాషల్లో జనవరి 25న విడుదల కానుంది. దానిలో బేషరమ్‌ సంగ్‌ అనే పాటను డిసెంబరు 12న విడుదల చేశారు. ఇప్పటికే కోట్లాది మంది దాన్ని చూశారు. ఆ పాట తీరు, దానిలో హీరోయిన్‌ దీపిక ధరించిన బికినీ, ఇతర దుస్తుల మీద మతశక్తులు పెద్ద రచ్చ చేస్తున్నాయి. పాటలో దీపికను అసభ్యంగా చూపారన్నది కొందరి అభ్యంతరం.శృంగార భంగిమలతో చూపితే చూపారు పో, ఆమెకు కాషాయ రంగుదుస్తులు వేయటం ఏమిటి అని మరికొందరు, వేస్తే వేశారు పో, ఒక ముస్లిం నటుడు కాషాయ రంగుదుస్తులు వేసుకున్న హిందూ మహిళతో తైతక్కలాడటం ఎంత ఘోరం అన్నట్లుగా స్పందనలు, ప్రచారదాడి తీరు తెన్నులు ఉన్నాయి.


అనేక దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేసే వారు కనిపిస్తారు. కొందరు ఆ బొమ్మలకు అశరీతత్వం, ఆత్మస్వరూపత్వ పరమార్ధం ఉంది అని భాష్యం చెబుతారు. ఖజురహౌ శృంగార శిల్పాలు, వాత్సాయనుడి సచిత్ర కామ సూత్రాల గురించి తెలిసినదే. వాటిని పుస్తకాల మీద ముద్రించి సొమ్ము చేసుకుంటున్నవారు, ఎవరూ చూడకుండా లొట్టలు వేసుకుంటూ ఆ పుస్తకాలను పడక గదుల్లో భాగస్వాములతో కలసి చదివి ఆనందించే, ఆచరించేవారి సంగతీ తెలిసిందే. కానీ వాటి స్ఫూర్తితో సినిమాల్లో కొన్ని దృశ్యాలను పెడితే ఇంకేముంది హిందూత్వకు ముప్పు అంటూ కొందరు తయారవుతున్నారు. దీనిలో భాగంగానే జనవరి 25న విడుదల కానున్న ” పఠాన్‌ ” సినిమాను విడుదల కానివ్వం, విడుదలైనా ఆడనివ్వం, ప్రదర్శించే సినిమా హాళ్లను తగులబెడతాం అంటూ హిందూ-ముస్లిం మతశక్తులు వీరంగం వేస్తున్నాయి.


పఠాన్‌ సినిమాకు సెన్సార్‌బోర్డు అనుమతించిన తరువాతే దానిలో బేషరమ్‌ రంగ్‌ అనే పాటను విడుదల చేశారు. కోట్ల మంది అవురావురు మంటూ చూశారు. ఆ పాటలోని దుస్తులను మార్చకపోతే మధ్య ప్రదేశ్‌లో ఆ సినిమాను ఆడనివ్వం అని రాష్ట్ర హౌంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా బెదిరించారు.మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఆగ్రహంతో చేసిన ట్వీట్‌లో ఇలా ఉంది. ” దుస్తులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. పాటను కలుషిత బుద్దితో చిత్రించారు. పాట దృశ్యాలు, దుస్తులను సరి చేయాలి. లేకపోతే మధ్య ప్రదేశ్‌లో దాన్ని విడుదల చేయనివ్వాలా లేదా అన్నది పరిశీలించాల్సిన అంశం ” . సినిమాను నిషేధించాలి, బహిష్కరించాలని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ అన్నారు. ఇస్లాంలో నమ్మకం ఉన్న ఒక పఠాన్‌ ముస్లింల చిహ్నాలతో ఒక మహిళతో అలాంటి దృశ్యాలలో నటించవచ్చా అని ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు.లవ్‌ జీహాదీల అసంబద్దతకూ ఒక హద్దు ఉంటుంది అన్నారు. సినిమాలోని దృశ్యాలను సవరించే వరకు చిత్ర విడుదల నిలిపివేయాలని సుప్రీం కోర్టులో వినీత్‌ జిందాల్‌ అనే లాయర్‌ ఒక కేసు దాఖలు చేశారు. వీర శివాజీ బృందం పేరుతో ఉన్న కొందరు ఇండోర్‌లో దీపిక, షారుఖ్‌ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. హిందువుల భావాలను గాయపరచిన సినిమాను నిషేధించాలని కోరారు. మధ్య ప్రదేశ్‌ బిజెపి మంత్రికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ గోవింద్‌ సింగ్‌ జతకలసి సినిమా మీద ధ్వజమెత్తారు.భారత సంస్కృతికి విరుద్దంగా సినిమా ఉందని నేత చెప్పారు. సెన్సార్‌ బోర్డు ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఏమిటి ? అది ఇచ్చిన తరువాత బిజెపి దాని మీద రచ్చ చేస్తుంది, ఇదొక నిగూఢమైన అంశం అని కూడా కాంగ్రెస్‌ నేత చెప్పారు.సదరు నేత తమ రాష్ట్రంలో ఉన్న ఖజురహౌ శిల్పాల గురించి ఏమి చెబుతారు ?


2020 జనవరి మొదటి వారంలో ఢిల్లీ జెఎన్‌యులో ముసుగులతో వచ్చిన ఎబివిపి, దాని మద్దతుదారులు విద్యార్ధులు, టీచర్ల మీద చేసిన దాడికి నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావంగా దీపిక వచ్చారు.వారితో కొద్దిసేపు గడపటం తప్ప అమె ఎలాంటి ప్రకటన, ప్రసంగం చేయలేదు. దాడిలో గాయపడిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ అధ్యక్షురాలు, ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐసీ ఘోష్‌ను ఆమె పరామర్శించారు. దాని మీద బిజెపి నేతలు దీపిక సినిమాలను బహిష్కరించాలని అప్పుడే వీరంగం వేశారు. ఇప్పుడు మరోసారి బిజెపి మంత్రి ఆమె తుకడే తుకడే ముఠాకు చెందిన వారంటూ నోరుపారవేసుకొని నాటి ఉదంతాన్ని గుర్తుకు తెచ్చారంటే పాట మీద కంటే ఆమె మీద ద్వేషమే ప్రధానంగా ఉన్నట్లు చెప్పవచ్చు.


హిందూాముస్లిం మతశక్తులు ఒకే నాణానికి బొమ్మా – బొరుసు వంటివి. పఠాన్‌ సినిమా పాట ముస్లిం సమాజ మనోభావాలను దెబ్బతీసిందని, దీన్ని తమ రాష్ట్రంలోనే గాక దేశంలో ఎక్కడా ప్రదర్శించనివ్వబోమని మధ్య ప్రదేశ్‌ ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్‌ అనస్‌ ఆలీ బెదిరించారు. ముస్లిం సమాజాల్లో గౌరవనీయులైన వారిలో పఠాన్లు ఒకరు. పఠాన్లనే కాదు మొత్తం ముస్లిం సమాజాన్నే దీనిలో అగౌరవపరిచారని, సినిమా పేరు పఠాన్‌, దానిలో మహిళ అసభ్యంగా నృత్యం చేసింది. సినిమాలో పఠాన్లను తప్పుగా చూపారని అలీ ఆరోపించారు.హిందూత్వను అవమానించే ఏ చిత్రాన్నైనా మహారాష్ట్రలో ప్రదర్శించనివ్వబోమని బిజెపి ఎంఎల్‌ఏ రామ్‌ కదమ్‌ ప్రకటించారు. పఠాన్‌ సినిమాను బహిష్కరించాలని, ఎక్కడైనా ప్రదర్శిస్తే సినిమా హాళ్లను తగులబెట్టాలని అయోధ్యలోని హనుమాన్‌ ఘరీ రాజు దాస్‌ మహంత్‌ పిలుపునిచ్చారు. చివరకు ప్లేబోయి పత్రికకు అసలు ఏ దుస్తులూ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చిన నటి షెర్లిన్‌ చోప్రా (ఈమె హైదరాబాదీ ) కూడా హిందూత్వ శక్తుల సరసన నిలిచారు. పఠాన్‌ సినిమాలో దీపిక కాషాయరంగు బికినీ ధరించటాన్ని తప్పుపడుతూ ఇది అంగీకారం కాదన్నారు. దీపిక తుకడే తుకడే గాంగు మద్దతుదారని ఆరోపించారు.


కాషాయ రంగు దుస్తులు వేసుకొని అడ్డమైన పనులు చేస్తున్నవారిని చూస్తున్నాము. ఎప్పుడూ ఆ రంగును అభిమానించే వారు వాటిని ఖండించలేదు. అందుకే ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ చక్కగా స్పందించారు. సిగ్గులేని మతోన్మాదులు… కాషాయ దుస్తులు వేసుకున్న పెద్దలు అత్యాచారాలు చేసిన వారికి దండలు వేస్తారు, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తారు.ఎంఎల్‌ఏల బ్రోకర్లుగా ఉంటారు, కాషాయ దుస్తులు వేసుకున్న స్వామీజీలు ముక్కుపచ్చలారని బాలికల మీద అత్యాచారాలు చేస్తారు. ఒక సినిమాలో మాత్రం ఆ రంగు దుస్తులు వేసుకోకూడదా అని అడుగుతున్నానంతే అని ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. షారూఖ్‌ ఖాన్‌ సినిమా రయీస్‌ దర్శకుడు రాహుల్‌ ధోలాకియా మతశక్తుల బెదిరింపులను ఖండించారు. షారూఖ్‌ ఖాన్‌పై విద్వేష దాడులను సినిమా రంగంలోని వారందరూ ఖండించాలని, బుద్దిలేని సిద్దాంతాలతో ముందుకు వస్తున్న మతశక్తులను నోరు మూసుకోమని చెప్పాలని ట్వీట్‌ చేశారు. సినిమా నటి స్వర భాస్కర్‌ అధికారంలో ఉన్న మన నేతలను చూడండి, వారు కొంత పని చేసి ఉండవచ్చు, గుడ్లగూబలా నటుల దుస్తులను చూసేందుకు వారికి వ్యవధి ఉంటుందా అన్నారు. నేరగాండ్లు మంత్రివర్గాల్లో చేరుతుంటే అదేమీ వార్త కాదు. ఆర్థికవేత్తలు యాత్రల్లో చేరుతున్నారు. ఐటం సాంగ్స్‌లో నటి ఏ రంగు దుస్తులు ధరించిందన్నది మాత్రం వార్త అవుతోందని కూడా ఆమె పేర్కొన్నారు.

రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి పేరుతో ఒకరు చేసిన ట్వీట్‌లో నాలుగు డబ్బుల కోసం తన భార్యను బహిరంగంగా అవమానించటాన్ని సహించే లేదా అనుమతించే భర్త ఎలాంటి వాడై ఉంటాడు అని కేవలం అడుగుతున్నానంతే అని పేర్కొన్నారు. దీని గురించి దర్శకుడు ఓనిర్‌ (అనిర్భన్‌ ధార్‌ ) కూడా కాషాయ దళాల దాడిని ఖండించారు.స్పందిస్తూ ” ఛీ ఛీ మానసిక రోగమిది, అనుమతించటం, సహించటం అనే పదాలను ఉపయోగించటాన్ని చూస్తే భర్త ఒక మహిళకు యజమాని అని భావించే తెగకు చెందిన వారిలా కనిపిస్తున్నారు.చౌకబారు ఆలోచనలు గలవారే ఇలా చేస్తారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత బొమ్మలను కళ్లప్పగించి చూడటం, విద్వేష ప్రచారం తప్ప మరేమి చేస్తారు అంటూ ఓనిర్‌ దుయ్యబట్టారు. ఫిలిమ్‌ సర్టిఫికెట్‌ బోర్డు, న్యాయవ్యవస్థ లేదా చట్టాన్ని అమలు పరిచే సంస్థలు కాదు, మనం చూడాల్సిందేమిటన్నది ఇప్పుడు గూండాలు నిర్ణయిస్తారు. భయంకర రోజులు. అని కూడా ఓనిర్‌ అన్నారు.


బూతు బొమ్మలున్న దేవాలయాల సందర్శనలను నిషేధించాలని గానీ, వాటి చుట్టూ ఎత్తైన గోడలు కట్టి మూసివేయాలని గానీ, వాత్సాయన కామసూత్రాలు, వాటి చిత్రాల అమ్మకాలను నిషేధించాలని గానీ ఎన్నడూ హిందూత్వశక్తులు రోడ్డెక్కింది లేదు.వాత్సాయన కామసూత్రాల పేరుతో దుస్తుల్లేకుండా పడకగది దృశ్యాలతో కూడిన వీడియోలు, సినిమాలు చూసేవారికి కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి. కేంద్రంలో ఉన్న పెద్దలు వాటినేమీ నిషేధించలేదు. బేషరమ్‌ పాటను రాసింది కుమార్‌, స్వర పరచింది విశాల్‌-శేఖర్‌, దర్శకుడు సిద్దార్ధ ఆనంద్‌, స్క్రీన్‌ ప్లే శ్రీధర్‌ రాఘవన్‌, గానం చేసింది శిల్పారావు, ఆ పాటను నాలుగు కోట్ల మందికి పైగా వీక్షించారు. వీరందరిని వదలి నటించిన దీపికా, షారుఖ్‌ మీద హిందూత్వ శక్తులు దాడిని కేంద్రీకరించాయి.


దీపికా పడుకోనే-షారూఖ్‌ ఖాన్‌ మీద చిత్రించిన పాటలో దీపిక కాషాయ రంగు దుస్తులు వేసుకోవటాన్ని వారు అంగీకరించటం లేదు. ఇతర రంగు వేసుకుంటే ఫర్లేదా ? ఆ రంగు మీద ఎవరికీ పేటెంట్‌ హక్కులేదు. ఎవరికి ఏ రంగు, ఎలా తగిన విధంగా ఉంటాయో నిర్ణయించేది సినిమా దర్శకులు, వారికున్న హక్కు అది. ప్రధాని నరేంద్రమోడీ ఏ రాష్ట్ర పర్యటనకు పోతే అక్కడి సంప్రదాయ వేషధారణతో కనిపించటం తెలిసిందే. అదే విధంగా కొన్ని రోజులు గడ్డం పెంచారు, తరువాత తగ్గించారు, అది మోడీ స్వంత విషయం. దేశ ప్రధాని లేదా ప్రజాప్రతినిధుల దుస్తులు ఇలా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించలేదు కదా ! గతంలో ఇందిరా గాంధీ ఇంకా అనేక మంది కూడా అలాగే చేశారు. దుస్తుల కంటే కూడా దీపిక అంటే హిందూత్వ శక్తులకు మింగుడు పడటం లేదు, షారూఖ్‌ ఖాన్‌ ముస్లిం గనుక విద్వేషం వాటి డిఎన్‌ఏలోనే ఉంది. అయినా సెన్సార్‌ బోర్డు అనుమతించిన తరువాత దాన్ని అంగీకరించం అంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామని చెప్పే హక్కు ఎవరిచ్చారు. ఇది ప్రజాస్వామ్యమా ? మూక వ్యవహారమా ? ఇరాన్‌లో హిజాబ్‌ వద్దంటూ సాగిన ఆందోళనను సమర్ధించిన శక్తులు మన దేశంలో మాత్రం ఇక్కడ ఎవరు ఏ దుస్తులు వేసుకోవాలో – కూడదో చెబుతూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు, ఇరాన్‌లో నైతిక పోలీసులను విమర్శించే వారు మన దేశంలో వారిని పక్కాగా అనుసరిస్తూ సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. తాలిబాన్లు ఏరంగు,ఏ మతం వారైనా సమాజానికి ప్రమాదకారులే !

ఉచితాలు – అనుచితాల చర్చ : నరేంద్రమోడీకి జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా లేక బిజెపి చేస్తే సంసారం…. !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్రమోడీ మరోమారు ఉచితాలు – అనుచితాల చర్చకు తెరతీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు అజండాను ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు గనుకనే ఇటీవల నాగపూర్‌లో టికెట్‌ కొని మెట్రో రైలు ఎక్కి తాను ప్రధాని పదవిలో ఉన్నా ఉచితంగా రైలెక్కను అనే సందేశమిచ్చారు.ఏదీ ఊరికే రాదు అన్న ఒక నగల వర్తకుడి వాణిజ్య ప్రకటనను చాలా మంది చూసే ఉంటారు. మోడీ టికెట్‌ కౌంటర్‌లో ఉన్న ఫొటో మాదిరి ఉచితాల వ్యతిరేక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఏది ఉచితం, ఏది కాదు అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతున్నది. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతున్నారు. విశ్వగురువు నరేంద్రమోడీ వివిధ సందర్భాలలో చేసిన ప్రవచనాల సారం ఏమిటి ? రివాదీ (ఉచితాలు) సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరం. ఈ రోజు దేశంలో ఉచితాల ద్వారా ఓట్లను దండుకొనేందుకు కొన్ని పార్టీల వారు చూస్తున్నారు. ప్రత్యేకించి యువత ఈ ఉచిత సంస్కృతి గురించి జాగ్రత్తగా ఉండాలి. జనాలకు ఉచితాలు ఇవ్వటం ద్వారా మీకు అవసరమైన రహదారులు, విమానాశ్రయాలు లేదా రక్షణ నిర్మాణాలు జరగవు. ఈ ఆలోచనలు చేసే వారిని ఓడించాల్సి ఉంది.


మోడీ గారి వయస్సు ఇప్పుడు 73 నడుస్తున్నది. బహుశా ఇతర మానవ మాత్రుల మాదిరి ఆయనకూ జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. దానిలో పేర్కొన్న అంశాలను చూస్తే ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్దు స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. బహుశా బిజెపి నిఘంటువులో వీటికి వేరే అర్ధం ఏమన్నా ఉన్నట్లా లేక నరేంద్రమోడీ గారికి ఈ సంకల్పం గురించి గుర్తు లేదా లేక నటిస్తున్నారా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


ఈ ఏడాది మాదిరే 2017లో కూడా హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన పక్షం రోజులకు గుజరాత్‌ ఎన్నికలను ప్రకటించారు. ” హిమచల్‌ ఎన్నికల ప్రకటన తేదీ నుంచి గుజరాత్‌లో కురుస్తున్న ఉచితాల వాన ” అని సిఎన్‌ఎన్‌ – న్యూస్‌ 18 అక్టోబరు 26, 2017న ఒక వార్తను ప్రచురించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే 24 గంటల ముందు బిజెపి సర్కార్‌ నాలుగు పెద్ద పధకాలను ప్రకటించిందని దానిలో పేర్కొన్నారు.( మోడీ నైతిక విలువల వెలుగులో పెరిగిన బిజెపి కూడా ఇతర పార్టీల మాదిరే ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోవద్దు, ఎంతవారలైనా కాంతదాసులే అన్న కవి ఇప్పుడుంటే పార్టీలన్నీ అధికార దాసులే అనే వారు) డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల కొనుగోలుపై రైతులకు 18శాతం జిఎస్‌టి రద్దు, రైతులకు సున్నా వడ్డీకి రుణాలు వాటిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతాంశానికి వస్తే అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి కేంద్ర ఆఫీసులో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రాధాన్యత అన్నది బిజెపి విధానమని, ఏది తమకు అనుకూలంగా పని చేస్తుందో ఏది వ్యతిరేకమో ఓటర్లకు తెలుసునని, దగ్గరదారి రాజకీయాలు దేశానికి నష్టమని వారికి తెలుసు అన్నారు. దేశం బాగుపడితే ప్రతి ఒక్కరూ సంపదలు పొందుతారని చెప్పారు. ఉచితాలు కొనసాగితే ఈ రోజు మన పొరుగుదేశాల్లో జరుగుతున్న మాదిరే పరిస్థితి ఉంటుందని, అందువలన అలాంటి ఎత్తుగడలు ఎవరికీ లబ్ది ఉండదు అన్నారు. ఇలాంటి సుభాషితాలను ఒక వైపు వినిపిస్తూ మరోవైపు గుజరాత్‌ నేతలకు ఏ మార్గదర్శనం చేశారో చూడండి.


” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. బిజెపి కూడా ఉచితాల క్రీడా బరిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతిని ఆకర్షించేందుకు పూనుకుంది. గుజరాత్‌ ఆర్థిక వ్యవస్థను(జిఎస్‌డిపి) లక్ష కోట్ల డాలర్లకు పెంచుతామని(2022-23లో అంచనా రు.22 లక్షల కోట్లు, డాలర్లలో 280 బిలియన్లు.2018-19లో రు.15 లక్షల కోట్లు, అది గత ఐదేండ్లలో 22లక్షల కోట్లకే పెరిగింది. అలాంటిది ఐదేండ్లలో లక్షకోట్ల డాలర్లంటే 1000 బి.డాలర్లకు ఎలా చేరుతుంది.) 2036లో అహమ్మదాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నది.(గుజరాత్‌పై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 నవంబరు 27 తేదీ సంపాదకీయం). ఆలూ లేదూ చూలూ లేదు, 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ ఎవరికి అప్పగిస్తారనేది 2025-29 సంవత్సరాల మధ్య ప్రకటించే అవకాశం ఉంది,మన దేశానికి అవకాశం వస్తుందో రాదో చెప్పలేము.అలాంటిది ఏకంగా నిర్వహిస్తామని ఇప్పుడే బిజెపి చెప్పటం జనాలను అమాయకులుగా పరిగణించటం తప్ప మరొకటి కాదు. తాను ప్రకటించే ఉచితాలు సాధికారతలో భాగమని, ఇతరులు ప్రకటించే వాటిని ప్రలోభాలని బిజెపి చిత్రిస్తోంది. మధ్య ప్రదేశ్‌లో రైతులకు విద్యుత్‌ సబ్సిడీగా రు.15,700 కోట్లు ఇస్తున్నట్లు 2021 అక్టోబరులో అక్కడి బిజెపి సర్కార్‌ ప్రకటించింది. అదేవిధంగా గృహాలకు 2021-22కు గాను రు.4,980 కోట్లు కేటాయించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తమను తిరిగి ఎన్నుకుంటే వృద్దాప్య పెన్షన్‌ మొత్తాన్ని రు.200 నుంచి 1000కి పెంచుతామని మణిపూర్‌ బిజెపి ప్రకటించింది.


నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రధానిగా ప్రతి పైసాకు జవాబుదారీ అన్న సంగతి తెలిసిందే. ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చూస్తున్నారు.గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త).ఇవన్నీ బడాబాబులు, కావాలని ఎగవేసిన రుణాలన్నది అందరికీ తెలిసిందే. పారు బాకీల రద్దు కాదు, వేరు ఖాతాల్లో చూపుతున్నామని అంటున్నారు. ఇంత తక్కువగా వారి నుంచి రాబట్టటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిదన్నది స్పష్టం. అలాంటి పెద్ద మనుషుల పేర్లు వెల్లడిస్తే వారి మర్యాదలకు భంగం అని చెబుతున్నారు. వారితో బాంకులు ఉన్నతాధికారులు కుమ్మక్కు కాకుండా అలాంటి రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్ర రుణాలను తీసుకోవటం తప్ప తిరిగి చెల్లించనవసరం లేదనే అభిప్రాయం ఉంది. ఎగవేసిన వారు చిన్నవారా పెద్దవారా అని కాదు ఎలాంటి సందేశం జనాల్లోకి వెళుతున్నదనేది కీలకం.ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ పధకాల కారణంగానే తిరిగి అధికారానికి వచ్చిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. అక్కడ ముద్రా రుణాల కింద పద్దెనిమిదివేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ పధకం కింద ఇచ్చే రుణాలను క్రెడిట్‌ గారంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ద్వారా మంజూరు చేస్తారు గనుక చెల్లించకున్నా బాంకులు ఎలాంటి ఇబ్బందులు పడవని బాంకు అధికారుల సంఘం పేర్కొన్నది. చిన్న, సన్నకారు సంస్థలకు ఇచ్చే ఈ రుణాల నిరర్ధక ఆస్తుల మొత్తం 2021 మార్చి 31నాటికి 11.98శాతం లేదా రు.2.84లక్షల కోట్లని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం వెల్లడించింది.2018 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పిఏలు కేవలం 5.38శాతమే. ఇదేమీ చిన్న మొత్తం కాదు, పైసల్లో అంతకంటే లేదు. ఇది కూడా పన్ను చెల్లించిన వారి సొమ్మే మరి.


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లేగా ! తమిళనాడు ప్రభుత్వం కార్పొరేట్లకు రద్దు చేస్తున్న రుణాల గురించి సుప్రీం కోర్టు కేసులో ప్రస్తావించింది. మోడీ తొలి మూడేండ్ల పాలనలో అదానీ తీసుకున్న రుణాల్లో 75వేల కోట్లను మాఫీ చేసిందని పేర్కొన్నది, లేదూ పక్కన పెట్టామంటే ఎంత వసూలు చేసిందీ చెప్పాలి కదా ! ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్లు పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది, ఏమంటే అవి ఎగుమతికి పనికి వస్తాయట. కాసేపు అంగీకరిద్దాం, రైతులు పండించే వరి, గోధుమలు, చెరకు నుంచి తీసే పంచదార కూడా ఎగుమతి చేస్తున్నాం, మరి వారికి ప్రోత్సాహకాలను ఎందుకు ఇవ్వటం లేదు.


దేశ సంపద పెరిగితే జనమూ ధనవంతులౌతారని నరేంద్రమోడీ చెబుతున్నారు. దానికి ఆధారాలుండాలి కదా ! సంపదల పంపిణీలో తీవ్ర అసమానలు ఉన్న దేశాల్లో మనది ఒకటి.1990 నుంచి 2020 నాటికి ధనికులుగా ఉన్న ఒకశాతం మంది వద్ద ఉన్న దేశ సంపద 10.4 నుంచి 21.7 శాతానికి పెరగ్గా, పేదల్లోని దిగువ 50శాతం మంది సంపద వాటా 22 నుంచి 14.7శాతానికి తగ్గింది. ఈ కారణంగానే కదా పేదలు ఉచితాల కోసం ఆకర్షితులౌతున్నది. స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఏది ఉచితమో, ఏది సంక్షేమమో ఏది కాదో టీకా తాత్పర్యాలు చెప్పేవరకు ఇది సాగుతూనే ఉంటుంది. చెప్పేవారెవరు ? దాని మీద ఏకాభిప్రాయం ఎలా వస్తుంది ? ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల వాటాను 41శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా ఆచరణలో దక్కుతున్నది 29శాతమే అని చెబుతున్నారు. మరి దీని సంగతేమిటి ? ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవటం కాదా ! ఉచితాల పేరుతో అందించే సేవలు లేక నగదు బదిలీగానీ అవి పొందిన వారి కొనుగోలు శక్తిని పెంచి దేశానికి తోడ్పడేవే తప్ప వేరు కాదు. వాటి వలన ప్రభుత్వాలకు జిఎస్‌టి లేదా మరో రూపంలో రాబడి, పారిశ్రామికవస్తువుల కొనుగోలు, తద్వారా ఉపాధి పెరుగుదలకు పరోక్షంగా తోడ్పడే వాటి మీద దాడికి దిగుతున్నారు. మరోవైపు అంతకు మించి కార్పొరేట్లకు సంపదలు దోచిపెడుతున్నారు.

కుట్రతో పెరూ వామపక్ష అధ్యక్షుడు కాస్టిలో తొలగింపు – నిరసనల అణచివేతకు రంగంలోకి దిగిన మిలిటరీ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మేడిపండు చూడ మేలిమై ఉండు – పొట్ట విప్పిచూడ పురుగులుండు అన్న వేమన పిరికివాడి మదిని గురించి చెప్పారు. అది ప్రజాస్వామ్యానికి కూడా చక్కగా వర్తిస్తుంది. ఆ ముసుగువేసుకున్న వారి అంతరంగాన్ని చూస్తే అవగతం అవుతుంది. పెరూలో అదే జరిగింది.2021 జూన్‌ ఆరవ తేదీన జరిగిన తుది విడత పోలింగ్‌లో వామపక్ష విముక్త పెరూ పార్టీకి చెందిన పెడ్రో కాస్టిలో కేవలం 44,263 ఓట్ల మెజారిటీతో అధ్యక్ష పీఠాన్ని కైవశం చేసుకున్నాడు.జూలై 28న అధికారానికి వచ్చాడు, 2022 డిసెంబరు ఏడవ తేదీన అభిశంసన ఓటింగ్‌ ద్వారా పార్లమెంటు కాస్టిలోను పదవి నుంచి తొలగించింది. తిరుగుబాటు చేశారనే తప్పుడు ఆరోపణతో అరెస్టు చేశారు. ఏడు రోజుల రిమాండ్‌ పద్నాలుగవ తేదీతో ముగుస్తుంది. ఇప్పుడు తప్పుడు కేసులతో జైలుకు పంపేందుకు చూస్తున్నారు. కాస్టిలో తొలగింపునకు నిరసన తెలుపుతున్న వారిని అణచేందుకు మిలిటరీ రంగంలోకి దిగింది. ఆందోళనల కారణంగా మూడు విమానాశ్రయాలను మూసివేశారు.


పదవిలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనివ్వకుండా కాస్టిలోను గద్దె దింపేందుకు స్వదేశీ-విదేశీ శక్తులు పన్నని కుట్ర లేదంటే అతిశయోక్తి కాదు. ఒక స్కూలు టీచర్‌, కార్మిక సంఘనేతగా ఉన్న కాస్టిలో అన్ని రకాల మితవాద శక్తులను, వామపక్ష ముసుగువేసుకున్న ద్రోహులను ప్రతిఘటించి అధికారానికి వచ్చాడు. ఇప్పుడు ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే గద్దెనెక్కారు.ఆమె పార్లమెంటుతో చేతులు కలిపి అధ్యక్ష పీఠాన్ని దురాక్రమణ కావించారని, తాను అధికారం నుంచి వైదొలగలేదని సోమవారం నాడు కాస్టిలో ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. మొత్తం పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపాలని కాస్టిలో మద్దతుదార్లు జరుపుతున్న ఆందోళనలో ఇంతవరకు ఏడుగురిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. ఆందోళన మరింత విస్తరించకుండా చూసేందుకు 2026కు బదులు 2024 ఏప్రిల్లో అంటే రెండు సంవత్సరాలు ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు పార్లమెంటును కోరతానని దినా బొలార్టే చేసిన ప్రకటనతో నిరసనలు ఆగలేదు, వెంటనే ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నట్లు వార్తలు.నియంత ఫుజిమొరి ఏర్పాటు చేసిన రాజ్యాంగ పునాదుల మీద అమలు జరుపుతున్న నయాఉదారవాద ఆర్థిక విధానాలను మార్చేందుకు వీలుగా నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకోవటం అక్కడి పాలకవర్గాలకు అంగీకారం గాకపోవటమే ప్రజాస్వామిక కుట్రకు దారితీసింది.


కాస్టిలో ప్రజలెన్నుకున్న పార్లమెంటును రద్దు చేసేందుకు పూనుకున్న కారణంగానే దాన్ని కాపాడేందుకు అభిశంసన తీర్మానాన్ని పెట్టి ప్రజాస్వామికంగానే పదవి నుంచి తొలగించామని జనాన్ని నమ్మించేందుకు మితవాద శక్తులు చూస్తున్నాయి. పార్లమెంటుకు అలాంటి అధికారం ఇచ్చిన అక్కడి రాజ్యాంగం అదే పార్లమెంటు అప్రజాస్వామికంగా ఉంటే దాన్ని రద్దు చేసే అధికారాన్ని అధ్యక్షుడికి కూడా కట్టబెట్టింది.తన పాలనకు అడుగడుగునా అడ్డుపడుతున్న పార్లమెంటును రద్దు చేసేందుకు కాస్టిలో ఆ నిబంధనను ఉపయోగించుకున్నందుకే పదవి నుంచి తొలగించారు. పార్లమెంటులోని 130 స్థానాలకు గాను గతేడాది వామపక్ష ఫ్రీ పెరూ పార్టీకి వచ్చిన ఓట్లు 13.41శాతం కాగా 37 సీట్లు వచ్చాయి. పార్లమెంటులో మితవాద శక్తులే అధిక సీట్లను పొందారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎందరైనా పోటీకి దిగవచ్చు. పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. అలా రాకపోతే రెండవ విడత ఎన్నిక జరిపి తొలి విడతలో మొదటి రెండు స్థానాలు వచ్చిన వారి మధ్య అంతిమంగా పోటీ జరుగుతుంది. ఆ విధంగా కాస్టిలో గెలిచాడు. కాస్టిలోను తొలగించేందుకు జరిపిన ఓటింగ్‌లో దానికి అనుకూలంగా 87 ఓట్లు, వ్యతిరేకంగా 45 ఓట్లు వచ్చాయి. నైతికంగా పదవికి అనర్హుడని పార్లమెంటు తీర్మానించి తొలగించే అధికారాన్ని దుర్వినియోగం చేశారు. 2020 అదే పేరుతో ఒక అధ్యక్షుడిని తొలగించారు.


నిరంకుశ, మితవాద శక్తుల మద్దతుతో లబ్ది పొందిన అక్కడి కార్పొరేట్‌ శక్తులకు కాస్టిలో ఎన్నిక మింగుడు పడలేదు. తాను గెలిస్తే నూతన రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు గాను రాజ్యాంగసభ ఏర్పాటు గురించి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహిస్తానని ఎన్నికల్లో కాస్టిలో వాగ్దానం చేశాడు. దాన్ని అడ్డుకొనేందుకు గతేడాది డిసెంబరులో పార్లమెంటులోని మితవాద శక్తులు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. సంస్కరణల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటే ముందుగా పార్లమెంటు అనుమతి పొందాలని దానిలో పేర్కొనటం ద్వారా అధ్యక్షపదవి అధికారాలను పరిమితం చేశారు. పార్లమెంటు స్పీకర్‌ మరియా డెల్‌ కార్‌మెన్‌ అల్వా స్పెయిన్‌ పర్యటనలో అక్కడి పార్లమెంటులో ప్రసంగిస్తూ ” కమ్యూనిజం ఆక్రమణకు పెరూ గురైంది. పెడ్రో కాస్టిలోకు అధ్యక్షుడిగా ఎలాంటి చట్టబద్దత లేదు ” అని ఒక ప్రకటన చేయాలని స్పెయిన్‌ పాపులర్‌ పార్టీని కోరటాన్ని బట్టి అక్కడి మితవాదులు ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. తొలి కుట్ర అసలు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకుండా చూసేందుకు ఆధారం లేని ఎన్నికల అక్రమాల ఆరోపణలు చేసి విఫల యత్నం చేశారు. తరువాత రెండుసార్లు అభిశంసన తీర్మానాలు పెట్టి తగినన్ని ఓట్లు రాకపోవటంతో వీగిపోయాయి.లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకోకుండా పార్లమెంటు చూసింది. ప్రతి విదేశీ పర్యటనకు అధ్యక్షుడు పార్లమెంటు అనుమతి పాందాలన్న నిబంధనను అడ్డుపెట్టుకొంటున్నది. 2022 ఆగస్టు ఏడున కొలంబియా వామపక్ష అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో పదవీస్వీకారానికి వెళ్లకుండా అడ్డుకుంది. ఇంతే కాదు వాటికన్‌లో పోప్‌ను కలుసుకొనేందుకు, థాయిలాండ్‌లో ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ సమావేశానికి, నవంబరులో మెక్సికోలో జరగాల్సిన పసిఫిక్‌ కూటమి సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంది.


పెరూ రాజ్యాంగం ఆర్టికల్‌ 134 ప్రకారం అధ్యక్షుడు లేదా కాబినెట్‌ గానీ రెండు సార్లు విశ్వాస తీర్మానాలను కోరినపుడు తిరస్కరిస్తే పార్లమెంటును రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ప్రజాభిప్రాయసేకరణ జరపటంపై విధించిన ఆంక్షల తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ నవంబరులో ఒక విశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని ప్రధాని అనిబల్‌ కోరెస్‌ పార్లమెంటును కోరగా అసలు చర్చించేందుకే నిరాకరించారు. దానికి నిరసనగా నవంబరు 24న ప్రధాని రాజీనామా చేశాడు. దాంతో తదుపరి వచ్చిన కొత్త మంత్రి వర్గం తిరిగి అదే ప్రతిపాదన చేసినపుడు మరోసారి తిరస్కరిస్తే అధ్యక్షుడు పార్లమెంటును రద్దుచేసే అధికారం ఉంది. విశ్వాస ఓటును పార్లమెంటు తిరస్కరించినట్లు ప్రభుత్వం నవంబరు 25న ఒక అధికారిక ప్రకటన చేసింది. పార్లమెంటు చర్యలకు భాష్యం చెప్పే అధికారం అధ్యక్షుడికి లేదంటూ పార్లమెంటు స్పీకర్‌ వెంటనే స్పందించాడు. అదే రోజున బెట్సీ ఛావెజ్‌ను నూతన ప్రధానిగా కొత్త మంత్రి వర్గాన్ని కాస్టిలో ఏర్పాటు చేశాడు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా పార్లమెంటు విశ్వాసాన్ని పొంది బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. దీన్ని గనుక ఆమోదించకపోతే పార్లమెంటు రెండవ తిరస్కరణగా పరిగణించి రద్దు చేసే అవకాశం ఉంది.2026 వరకు పని చేయాల్సిన పార్లమెంటు రద్దు కోసం అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవటం తమ ఉద్దేశ్యం కాదని బెట్సీ ఛావెజ్‌ చెప్పారు. ఆమె అలా మాట్లాడినప్పటికీ పార్లమెంటు మీద వేటు వేసేందుకు కాస్టిలో పూనుకున్నట్లు ఆరోపించిన మితవాదశక్తులు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి కాస్టిలోను గద్దె దించి అరెస్టు చేశారు. కుట్ర పేరుతో విచారణ బూటకానికి తెరలేపారు.


లాటిన్‌ అమెరికా ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ ప్రయోగశాల. ఆ ఖండంలోని దేశాల మీద రుద్దిన నయా ఉదారవాద విధానాలు, వాటిని వ్యతిరేకించిన కార్మికులు, కర్షకులను అణచివేసేందుకు మిలిటరీ, మితవాద నియంతలను రుద్దారు.ఎంత వేగంతో గోడకు కొడతామో అంతే వేగంతో వెనుదిరిగి వచ్చే బంతి మాదిరి అణచివేసినకొద్దీ ప్రజా ఉద్యమాలు పెరిగాయి. పాతకాలపు పద్దతులు పనికి రావని పెట్టుబడిదారీవర్గం, సామ్రాజ్యవాదులు గ్రహించారు. ఆ కారణంగానే ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలన అంటూ గోముఖాలతో జనం ముందుకు వచ్చారు. అణచివేత, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి కలసి కదం తొక్కిన వారందరూ పూర్తిగా వామపక్షశక్తులు కాదు.తమకు మద్దతుగా విశాలవేదికల మీదకు వచ్చిన వారికి ఎన్నికల్లో జనం జైకొట్టారు. అధికారాన్ని అప్పగించారు. అలాంటి వారందరిని అక్కడి జనం, వెలుపలి వారు కూడా మొత్తంగా వామపక్ష శక్తులుగానే పరిగణించారు. బతుకుభారమై దిగజారిన జీవితాలకు ఊతం, ఉపశమనం కలిగించేవారి కోసం ఎదురు చూసిన జనం ఈ శక్తులు ముందుకు తెచ్చిన సంక్షేమ పధకాలు, దారిద్య్రనిర్మూలన పధకాలు పెద్ద ఎత్తున ఆకర్షించి ఒకటికి రెండుసార్లు వామపక్షాలకు పట్టంగట్టారు.


వామపక్ష నేత కాస్టిలో ఒక స్కూలు టీచరు. ఫుజిమోరి హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని ఆయన వాగ్దానం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పెరూలో ధనికులు-పేదల మధ్య అంతరాలు పెరిగాయి. పెరూ ప్రయోజనాలకు విరుద్దమైన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులను సమీక్షిస్తామని, గ్యాస్‌ ప్రాజెక్టులను జాతీయం చేయటం వంటి చర్యలు తీసుకుంటామని, లూటీ చేసిన సంపదలను స్వాధీనం చేసుకుంటామని పెరూ విముక్త పార్టీ వాగ్దానం చేసింది. 2007లో తొలుత పెరూ విముక్త రాజకీయ ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమైంది.2012లో పెరూ విముక్త పార్టీగా ఏర్పడింది.2016లో దీన్ని ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేశారు. 2019లో పెరూ విముక్త జాతీయ రాజకీయ పార్టీగా పేరు ఖరారైంది.తమది సోషలిస్టు సంస్ధ అని, తాము మార్క్సిజానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.


తొలి దశ ఎన్నికల్లో వామపక్ష కాస్టిలో ప్రధమ స్ధానంలో నిలవటంతో మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు.మావోయిష్టు షైనింగ్‌ పాత్‌ సంస్ధతో సంబంధాలున్నాయని, కమ్యూనిస్టు అని ముద్రవేసి ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారు. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతొ సంబంధాలు ఉన్నాయని మనం మరో వెనెజులాగా మారవద్దంటూ ధ్వజమెత్తారు. తనపై జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, కొందరిలో ఉన్న అనుమానాలను తొలగిస్తూ మేం కమ్యూనిస్టులం కాదు, ఛావిస్తాలమూ(వెనెజులా ఛావెజ్‌) కాదు, ఉగ్రవాదులమూ కాదు. మేం కార్మికులం, మీ వంటి వారిమే,మనమందరం వీధుల్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉండే వ్యవస్ధ కావాలని కోరుకుంటున్నాం అని ప్రచారంలో చెప్పారు. వామపక్షేతర శక్తులను కూటమిలో కలుపుకొనేందుకు అలా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాస్టిలో అధికారానికి వచ్చిన తరువాత కొన్ని శక్తులు కాస్టిలోతో విబేధించి కూటమి నుంచి తప్పుకున్నాయి. ఇటీవల మితవాద శక్తులకు ఇది మరింత ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది.


లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధ్యక్ష పదవులను గెలుచుకొని అధికారానికి వస్తున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోవటంలో విఫలం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో సంఘటితమైన పార్టీల నిర్మాణాలు కూడా లేకపోవటం ఒక బలహీనతగా చెప్పాలి. వెనెజులా, అర్జెంటీనా, తాజాగా జరిగిన బ్రెజిల్‌ ఎన్నికల్లోనూ అదే జరిగింది.దీన్ని అవకాశంగా తీసుకొని మితవాద శక్తులు అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నాయి. ఈ బలహీనతలను అధిగమించకుండా, నయాఉదారవాద పునాదుల మీద ఏర్పడిన రాజ్యాంగాలతో వామపక్ష శక్తులు కోరుతున్న కార్మికవర్గ సాధికారతను సాధించటం జరగదు. చివరకు సంక్షేమ పధకాలను కూడా పూర్తిగా అమలు జరపలేని ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. మితవాద శక్తులకు వ్యతిరేకంగా కలసి వచ్చే ప్రజాతంత్ర శక్తులను కలుపుకొనేందుకు వామపక్షాలు కొన్నిసార్లు రాజీపడాల్సి వస్తోంది. పెరూలో జరిపిన ప్రజాస్వామిక కుట్రను నిరసిస్తూ కాస్టిలోకు మద్దతుగా, నూతన ప్రభుత్వం గద్దె దిగాలని, తిరిగి ఎన్నికలు జరపాలని కోరుతూ జనం వీధుల్లోకి వచ్చారు. ఆ డిమాండ్‌ను అంగీకరించేది లేదన్న నూతన అధ్యక్షురాలు ఒక అడుగు దిగి వచ్చి రెండేళ్ల ముందుగా ఎన్నికలు జరిపిస్తామని ప్రకటించినా ఆందోళన సద్దుమణగలేదు.ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌ ఓటమి ఎవరిది ! ముస్లిం విద్వేషం రెచ్చగొడితేనే బిజెపికి ఓట్లా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో 182కు గాను 156 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 సీట్లు తెచ్చుకుంది. గతంలో కాంగ్రెస్‌ తెచ్చుకున్న 149 సీట్ల రికార్డును బిజెపి బద్దలు కొట్టింది. గత ఎన్నికలతో 49.05 శాతం తెచ్చుకున్న బిజెపికి ఈసారి 52.5 శాతం రాగా కాంగ్రెస్‌కు 41.44 నుంచి 27.28 శాతానికి తగ్గగా , ఆమ్‌ ఆద్మీ 12.92శాతం తెచ్చుకుంది. హిమచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 40, బిజెపి 25, ఇతరులు మూడు సీట్లు తెచ్చుకున్నారు. హౌరా హౌరీగా సాగిన పోరులో ఈ సారి బిజెపి ఓట్లు 48.8 నుంచి 43శాతానికి తగ్గగా కాంగ్రెస్‌ 41.7 నుంచి 43.9శాతానికి పెంచుకుంది. ఈ ఫలితాల గురించి వెంటనే కొన్ని సాధారణ విశ్లేషణలు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో లోతైన పరిశీలనలు రావచ్చు. ఈ లోగా దేశంలో తిరిగి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో బిజెపి లేదా దాని మిత్రపక్షాల ఏలుబడిలోని త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో, మే నెలలో కర్ణాటక, నవంబరులో చత్తీస్‌ఘర్‌ (కాంగ్రెస్‌), మిజోరాం(ఎంఎఎన్‌ఎఫ్‌), మధ్య ప్రదేశ్‌(బిజెపి), డిసెంబరులో తెలంగాణా(బిఆర్‌ఎస్‌), రాజస్తాన్‌(కాంగ్రెస్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి గడువు ప్రకారమే జరిగితే మూడు సార్లు అంటే దాదాపు ఏడాది మొత్తం ఎక్కడో ఒక చోట ఎన్నికల వాతావరణం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకపార్టీల నేతలు ముందుస్తు ఎన్నికలు లేవని చెబుతున్నప్పటికీ రావని చెప్పలేము. జరుగుతున్న మధింపు, సర్వేలు ముగిశాక ఒక స్పష్టత రావచ్చు. కర్ణాటకతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


కుక్క మనిషిని కరవటం సాధారణం, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అవుతుంది.నరేంద్రమోడీ నాయకత్వానికి ఎదురు లేదు, ఎవరైనా వస్తే పుట్టగతులుండవన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇందిరా గాంధీ గురించి కూడా ఇలాగే చెప్పారు. రెండు సార్లు నరేంద్రమోడీ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసినట్లుగా భావించాలని మోడీ కోరినప్పటికీ హిమచల్‌ ప్రదేశ్‌లో ఫలితం దక్కలేదు. అందుకే గుజరాత్‌లో గెలుపు కంటే ఇక్కడ ఓటమి వార్తగా మారింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా వృద్ది చెందుతాయని గతంలో కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి అంటున్నది. కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీతో సఖ్యతతో ఉంటే రాష్ట్రాలకు నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చని చెప్పే ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులను చూస్తున్నాము. ” గుజరాత్‌ పర్యటనలో రు. 9.4లక్షల కోట్ల పధకాలను ప్రారంభించనున్న ప్రధాని ” అంటూ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ఒక వార్తను 2022 సెప్టెంబరు 30న ప్రచురించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పధకాలే అనుకోవాల్సిన అవసరం లేదు, కొన్నింటికి శంకుస్థాపనలు, ప్రారంభాలు ఉండవచ్చు. హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా ఉన్నది బిజెపి ప్రభుత్వమే కదా అక్కడ ప్రారంభించిన పథకాల గురించి అలాంటి వార్తలు కనిపించలేదు. హిమచల్‌ ప్రదేశ్‌లో రు.3,650 కోట్ల మేర వివిధ పథకాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని అంటూ 2022 అక్టోబరు మూడవ తేదీ దక్కన్‌ క్రానికల్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. పోనీ అంతకు ముందు అక్కడ మరో రెండు రెట్ల విలువగల పథకాలను ప్రారంభించారనుకుందాం అవి గుజరాత్‌కు సాటి వచ్చేవేనా ? ఒకే పార్టీ రెండు ఇంజన్ల పాలన ఉన్నప్పటికీ గుజరాత్‌కు మరొక రాష్ట్రానికి ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఏ పీఠమెక్కినా, ఎందుకాలిడినా చూపరా గుజరాత్‌ పక్షపాతం అన్నట్లుగా నరేంద్రమోడీ గుజరాత్‌ ప్రధాని అని ఎవరైనా ఎద్దేవా చేస్తే , కాదు దేశానికే ప్రధాని అని బిజెపి పెద్దలు లేదా వారిని సమర్ధించేవారు ఎలానో వెల్లడించాలి.


సిఎంగా నరేంద్రమోడీ గుజరాత్‌ను ఎంతో వృద్ది చేశారని అందుకే దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ను అమలు చేస్తామని 2014లో చెప్పారు, మోడీ ప్రధాని పీఠమెక్కారు గానీ సదరు మోడల్‌ను చివరికి తమ ఏలుబడిలోని రాష్ట్రాల్లో కూడా అమలు జరపలేదు, అసలు ఇంతవరకు ఎక్కడా దాని ప్రస్తావన కూడా తేలేదు. ఇది నరేంద్రమోడీ విశ్వసనీయతను ప్రశ్నించటం లేదూ ! ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి తన పేరును శాశ్వతంగా తలచుకొనే విధంగా మోడీ నీతిఅయోగ్‌ను రంగంలోకి తెచ్చారు. అది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 దేశ ఆరోగ్యసూచికలో మొత్తం మీద పని తీరులో కేరళకు 82.2 పాయింట్లు రాగా దేశానికే నమూనా అని పేర్కొన్న గుజరాత్‌కు వచ్చింది 63.59 మాత్రమే. నరేంద్రమోడీ ఏలుబడిలో ఏమి సాధించించినట్లు ? రెండో ఇంజను తగిలించిన తరువాత కూడా కేరళ కంటే అంత వెనుకబడి ఎందుకు ఉన్నట్లు ? అక్కడే కాదు మధ్య ప్రదేశ్‌లో కూడా దశాబ్దాల తరబడి బిజెపి పాలనే కొనసాగుతున్నది దానికి వచ్చిన పాయింట్లు 36.72 , పందొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ చివరన ఉన్నాయి, గుజరాత్‌లో, ఇతర చోట్ల తమ పని తీరును చూసి జనం ఓటేశారని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. వారి ముందు నవ్వటానికి జనానికి భయం అన్నది తెలిసిందే. అదే అభివృద్దని బిజెపి చెప్పినా జనం భావించినా ఎవరూ చేసేదేమీ లేదు.దారిద్య్రనిర్మూలనలో ఆర్‌బిఐ ప్రకటించిన 2013 నివేదిక ప్రకారం గుజరాత్‌ 14వ స్థానంలో ఉంది.అది నరేంద్రమోడీ పన్నెండేళ్ల పాలన తరువాత. తాజా వివరాల ప్రకారం దేశంలో సగటున 2021-22లో 21.92 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉంటే గుజరాత్‌లో 16.63 శాతం ఉన్నారు. కేరళలో 0.71శాతం మాత్రమే ఉన్నారు. రెండింజన్లు ఉండి ఏమి సాధించినట్లు ? ఇది దేశానికి ఆదర్శం(మోడల్‌) ఎలా అవుతుంది.


గుజరాత్‌లో ఘన విజయానికి కారకుడు నరేంద్రమోడీ అని బ్రహ్మరధం పడుతున్నారు.అమిత్‌ షా దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. వరుసగా గెలవటమే గొప్ప అనుకుంటే గతంలో కాంగ్రెస్‌కూ అలాంటి రికార్డులున్నాయి. అక్కడ బిజెపి ఏలుబడి ప్రారంభం నుంచి చూస్తే క్రమంగా తగ్గుతూ 2017ఎన్నికల్లో 182కు 99 (మెజారిటీ 92 ) మాత్రమే బిజెపి తెచ్చుకుంది. తమ నేత ప్రధానిగా ఎదిగిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడి జనం పెద్దగా స్పందించలేదు. అంతకు ముందు మోడీ నేతగా ఉన్నపుడు వచ్చిన 115 సీట్లు 99కి తగ్గాయి. దీనికి కారకులెవరు ? అమిత్‌ షా మంత్రాంగం అప్పుడు ఎందుకు పని చేయలేదు. నరేంద్రమోడీ తరువాత 2014 నుంచి ముగ్గురు సిఎంలను అక్కడ బిజెపి మార్చింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు చేయించి 99 నుంచి 112కు పెంచుకుంది.ఇదంతా నీతి సూత్రాలు వల్లించే నరేంద్రమోడీకి తెలియకుండా జరిగిందనుకోలేము. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరిగినా మోడీ వలనే అని చెబుతున్నారు గనుక దీనికి మినహాయింపు ఎందుకివ్వాలి ?


గుజరాత్‌లో బిజెపి ఈ సారి ముందు జాగ్రత్త పడింది. అనేక సామాజిక తరగతులను సంతుష్టీకరించింది. ముస్లిం విద్వేషాన్ని కొనసాగించింది. అనేక చోట్ల కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలనే పునరావృతం గావించింది. ఆ పార్టీ నుంచి డజన్ల కొద్దీ నేతలను తెచ్చుకొని బరిలో నిలిపింది. బలమైన పటేల్‌ సామాజిక తరగతి లేకుండా గెలవలేమని గ్రహించి జైన్‌ బనియా సామాజిక తరగతికి చెందిన విజయ రూపాని చేత అవమానకరంగా సిఎం పదవికి రాజీనామా చేయించి 2021 సెప్టెంబరులో భూపేంద్ర పటేల్‌ను గద్దె నెక్కించారు. రూపాని నాయకత్వంలో 2017లో ఎన్నికలు జరిగినపుడు నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి దూరంగా లేరు. ఆ ఎన్నికల్లో 99 రావటానికి రూపాని బలహీన నాయకత్వమే కారణమని, బలహీనమైన సిఎం అని, కరోనాను ఎదుర్కోవటంలో విఫలం చెందారని ప్రచారం చేసి రాజీనామా చేయించారు. అలాంటపుడు ఐదేండ్లు ఎందుకు కొనసాగించినట్లు? మోడీ-షా ఏం చేస్తున్నట్లు ? ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన సీట్లకు కారకుడు నరేంద్రమోడీ అంటున్నారు. అంటే గెలుపు మోడీ ఖాతాకు, పరాజయం ఇతరుల ఖాతాకు వేస్తారని స్పష్టమైంది. ప్రస్తుత సిఎం భూపేందర్‌ పటేల్‌ ఎక్కువ మంది జనానికి తెలియదని రాష్ట్ర బిజెపి ప్రధాన ప్రతినిధి యామల్‌ వ్యాస్‌ చెప్పినట్లు 2022 డిసెంబరు ఐదవ తేదీ అవుట్‌లుక్‌ పత్రిక పేర్కొన్నది. అంటే పలుకుబడి కలిగిన పటేల్‌ సామాజిక తరగతి మద్దతు కోసమే ఒక బొమ్మగా సిఎం గద్దె మీద కూర్చోపెట్టారన్నది స్పష్టం. రూపాని కాబినెట్‌లోని మంత్రులందరినీ తొలగించారు. తాజా ఎన్నికల్లో 41మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. రాష్ట్ర పార్టీ సారధినీ మార్చివేశారు. చిత్రం ఏమిటంటే మూడు దశాబ్దాల పాలన తరువాత గుజరాత్‌ ఆత్మగౌరవం అంటూ బిజెపి కొత్త పల్లవి అందుకుంది. ఎవరి నుంచి దాని గౌరవానికి ఎసరు వచ్చినట్లు ?


ఇక ఏకత, శీలము అంటూ కబుర్లు చెప్పే సంఘపరివార్‌కు గుజరాత్‌ పెట్టని కోట. ఆ కోటలోకి కాంగ్రెస్‌ నుంచి2007, 2012లో గోద్రాలో గెలిచిన సికె రావుల్జీ 2017 ఎన్నికల ముందు బిజెపిలో చేరి ఆ పార్టీ తరఫున అదే ఏడాది కేవలం 258 ఓట్ల తేడాతో గెలిచారు.అతగాడు 2002 గోద్రా మారణకాండలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేసులో శిక్షలు పడి జైలు జీవితం అనుభవిస్తున్న 11 మంది శిక్షా కాలం తగ్గించి వెలుపలికి రప్పించేందుకు కృషి చేసిన అపర శీలవంతుడు. 2022 ఆగస్టు 19న కోర్టు నిర్ధారించి నేరగాండ్లుగా తేల్చిన 11మంది గురించి మాట్లాడుతూ ” వారు నేరానికి పాల్పడిందీ లేనిదీ నాకు తెలియదు. వారు బ్రాహ్మలు, బ్రాహ్మలు మంచి సంస్కారవంతులని తెలిసిందే ” అని అప్పటికే ఏడు సార్లు గెలిచి ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టిన ఆ పెద్దమనిషి సెలవిచ్చారు.తాజా ఎన్నికల్లో 35వేల 198 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచారు. గుజరాత్‌లో తిరుగులేని ప్రభావం చూపుతున్న సంఘపరివార్‌ సంస్థలు అక్కడి జనాలకు నేర్పిన ” సంస్కారానికి ” ఫలితమిది. ఇలాంటి వారిని బరిలోకి దించిన బిజెపి తప్ప గుజరాత్‌ గౌరవాన్ని మరో పార్టీ ఎలా దెబ్బతీస్తుంది ? జర్మనీలో హిట్లర్‌ యుూదుల మీద ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టినపుడు అక్కడి జనం నీరాజనాలు పలికిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు హిట్లర్‌ను నెత్తిమీద పెట్టుకున్న జర్మన్లు నేడు వాడి పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా రోజులన్నీ ఒకే విధంగా ఉండవు.


హిమచల్‌ ప్రదేశ్‌లో ఓటమికి అక్కడ ఒకసారి కాంగ్రెస్‌ ఉంటే మరోసారి బిజెపి అధికారానికి రావటం రివాజుగా ఉందని దాని కొనసాగింపు తప్ప వేరేఏమీ కాదని బిజెపిని సమర్ధించే వారు కొట్టి పారవేస్తున్నారు. ఆ ముక్క ఎన్నికలకు ముందే చెప్పి ఈ వుంటే అది వేరుగా ఉండేది. నరేంద్రమోడీ పరువు దక్కేది. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఫలితాల తరువాత చెబుతున్నారు. దేశంలో రివాజులను మార్చటమే మోడీ గొప్పతనమని, ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ చేయలేని వాటిని ఐదేండ్లలో మోడీ చేసి చూపించారని నీరాజనాలు పలికారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాగే ఉన్న రివాజును మార్చివేశామని, హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా అదే జరగనున్నట్లు బిజెపి పెద్దలు చెప్పారు. పార్టీ అభ్యర్ధులను చూసి కాదు, కమలం గుర్తుకు ఓటేస్తే తనకు వేసినట్లే అని మోడీ స్వయంగా చెప్పుకున్నారు. కమలం ఓడి వాడింది కనుక నరేంద్రమోడీ కూడా అక్కడ ఓడినట్లా కాదా ? తిరుగుబాటు అభ్యర్ధులు బిజెపిని దెబ్బతీశారని ఒక ముక్తాయింపు. జెపి నడ్డా బిజెపి పార్టీ దేశ అధ్యక్షుడు కావచ్చుగానీ హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపిలో ఒక ముఠానేత అని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నది. లేకుంటే దానికి ఇంకా సీట్లు వచ్చేవేమో ? అయినా కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకొని వారికి పెద్ద పీటవేస్తే బిజెపిలో అధికార రుచిమరిగిన వారు మడి కట్టుకు కూర్చుంటారా ? వారంతా రంగంలో ఉన్నప్పటికీ తమదే అధికారం అని చెప్పినవారు ఇప్పుడు అంతా వారే చేశారు అంటే కుదురుతుందా ? ఒకసారి అధికారం వస్తే వారు వీరవుతారన్నది స్పష్టం.


బిజెపి అంటే మోడీ – మోడీ అంటే బిజెపి అంటున్నారు. దేశంలో మోడీ ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఇడి చురుకుగా పని చేస్తుందని జనం గ్రహిస్తున్నారు. ఇతర పార్టీలు బలంగా ఉంటే వారి మద్దతుదార్ల మీద దాడులు జరుగుతాయి, భయపెడతారు. అత్యాచారం చేసిన వారు సంస్కారవంతులని కితాబునిచ్చిన గుజరాత్‌ బిజెపి ఎంఎల్‌ఏ తిరిగి రికార్డు మెజారిటీతో గెలిచిచారంటే అక్కడి జనానికి కాషాయ దళాలు కలిగించిన అపర చైతన్యానికి నిదర్శనం. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ సాదర్‌లో తొలిసారిగా ఒక హిందువు అసెంబ్లీకి ఎన్నికైనట్లు మరొక వార్త. వీటి గురించి మరొక విధంగా చెప్పాలంటే ఎక్కడ ముస్లిం విద్వేషాన్ని, హిందూ భావోద్వేగాలను రెచ్చగొడితే అక్కడ బిజెపికి ఓట్ల పంట ఎక్కువగా పండుతున్నది. గుజరాత్‌లో గోద్రా మారణకాండ ఇంకా లబ్ది చేకూర్చుతూనే ఉంది. అక్కడ జనాభాలో 2011లెక్కల ప్రకారం 88.6శాతం హిందువులు, 9.7శాతం ముస్లింలు ఉన్నారు. గోద్రా మారణకాండకు ముందు 1960, 80దశకాల్లో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన పూర్వరంగం ఉంది. అదే హిమచల్‌ ప్రదేశ్‌లో ముస్లింలను బూచిగా చూపేందుకు అవకాశం లేదు.అక్కడ జనాభాలో దేశంలో ఎక్కడా లేని విధంగా 95.17శాతం మంది హిందువులే ఉన్నారు. అక్కడ 2.18శాతం మందే ముస్లిం జనాభా ఉంది. ఈ కారణంగా అక్కడ ముస్లిం విద్వేష భావోద్వేగాన్ని రగిల్చే అవకాశం లేనందున మోడీ-బిజెపి ఎత్తుగడలు పారలేదని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరును బట్టే జనం ఓట్లేశారని, ఆమేరకు బిజెపి వైఫల్యం ఓటమికి దారి తీసిందని అభిప్రాయపడుతున్నారు. హిందూమతానికి ముప్పు వచ్చిందని, లవ్‌ జీహాద్‌, ఉమ్మడి పౌరస్మృతి, వెనుకబడిన తరగతుల వంటి అంశాలు అక్కడ ఓటర్లను ఆకర్షించేవికాదు.జనాభాలో మూడోవంతు మంది ఠాకూర్లు, 25.2శాతం దళితులు(33శాతం మంది ఉన్న పంజాబ్‌ తరువాత ఇంత మంది మరొక రాష్ట్రంలో ఎక్కడా లేరు) 18శాతం బ్రాహ్మణులు,13.5శాతం వెనుకబడిన తరగతులు 5.7శాతం మంది గిరిజనులు ఉన్నారు. ఇక్కడ మరొక పార్టీ ఎదగలేదు. జనాభాలో అగ్రవర్ణాలుగా పేర్కొనబడుతున్నవారే ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక సమీకరణలకూ అవకాశం లేదు. పంజాబ్‌లో కూడా ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వీలుగా అక్కడ ఆ సామాజిక తరగతి జనాభా లేకపోవటంతో బిజెపి ఓటు బాంకును ఏర్పరుచుకోలేకపోయిందని సూత్రీకరించిన వారున్నారు.

ఉత్తర ప్రదేశలో చేసిన మాదిరి పదమూడు శాతం ఉన్న ముస్లింలు ఉన్న కర్ణాటకలో రెచ్చగొడుతున్న వివాదాలు, తెలంగాణాల టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నది మజ్లిస్‌ అని ప్రచారం చేయటం, కేరళలో ముస్లిం మతశక్తుల గురించి చేస్తున్న ప్రచారం వంటివన్నీ ఈ సూత్రీకరణలకు ఊతం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొడితే కుదరదు, జగన్మోహన్‌ రెడి ్డ క్రైస్తవమతానికి చెందిన వారు గనుక హిందూ మతానికి ముప్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో తీవ్ర విద్వేషాన్ని రెచ్చగొట్టినా పదిహేను సంవత్సరాలు మున్సిపల్‌ పాలన సాగించిన బిజెపి తాజాగా దెబ్బతిన్నది. కేరళలో దాని ఎత్తుగడలు పారలేదు, ఉన్న ఒక్క సీటును, గతంలో తెచ్చుకున్న ఓట్లనూ అది పోగొట్టుకుంది. శబరిమల పేరుతో మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టాలని చూసినా కుదరలేదు. క్రైస్తవుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నది. బెంగాల్లో కొంత మేరకు ముస్లిం విద్వేషం ఫలించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అంతకు ముందు తెచ్చుకున్న ఓట్లను తెచ్చుకోలేకపోయింది. ఇలా బిజెపికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నా దాని ముస్లిం విద్వేషం తగ్గలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా విశ్వాస్‌, వికాస్‌ అని చెబుతున్న ఆ పార్టీ గుజరాత్‌లో పదిశాతం ఉన్న ముస్లింలకు ఒక్క సీటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఇచ్చిన వారికి ముస్లిం సంతుష్టీకరణ పార్టీలని ముద్రవేస్తున్నది. స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కూడగట్టేందుకు కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలు, తరువాత మైనారిటీలను ఓటు బాంకుగా మార్చుకున్న తీరును బిజెపి బాగా ఉపయోగించుకుంది.అసలు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేని సంఘపరివార్‌, తరువాత దాని రాజకీయ ముసుగులుగా ముందుకు వచ్చిన జనసంఘం, బిజెపి డిఎన్‌ఏలోనే ముస్లిం విద్వేషం ఉంది. షాబానో కేసు వంటి వాటితో మైనారిటీలను సంతుష్టీకరిస్తూనే బిజెపిని ఎదుర్కొనేందుకు బాబరీ మసీదును కూడా తెరిపించి మెజారిటీ మతస్తుల సంతుష్టీకరణకు కాంగ్రెస్‌ తెరలేపింది. రెండింటికీ చెడింది. బిజెపి గతంలో జరిగిన వాటి పేరుతో ముస్లిం విద్వేషం, మెజారిటీ హిందువుల సంతుష్టీకరణకు తెరతీసింది. కానీ ఎక్కడా దానికి మెజారిటీ హిందువుల మద్దతు ఇంతవరకు రుజువు కాలేదు. ప్రతిపక్షాల్లో చీలికల కారణంగానే అది ఎక్కువ సీట్లు తెచ్చుకుంటున్నది.

.

అమెరికా సబ్సిడీలు – ఐరోపాతో వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ రక్షణ పేరుతో రష్యా మీద ఆంక్షలు, ఆయుధాలతో ఉమ్మడిగా పోరుచేస్తున్న అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య అమెరికా సబ్సిడీలు కొత్త వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ రాయితీలు ప్రధానంగా జర్మనీ, ఫ్రెంచి కార్ల కంపెనీలకు ముప్పుగా కనిపించటంతో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. జర్మనీ కాస్త ఆచితూచి స్పందిస్తున్నది.ఉక్రెయిన్‌ పోరులో అన్ని రకాలుగా అమెరికా లబ్ది తమకు ఇబ్బందులా అన్న ఉక్రోషం ఇప్పటికే ఐరోపాలో ప్రారంభమైంది. దాన్ని మరింతగా పెంచేదిగా తాజా పరిణామాలున్నాయి. సబ్సిడీ వివాదం టీ కప్పులో తుపానులా ముగుస్తుందా మరింత తీవ్రం అవుతుందా ? అమెరికాలో తయారైన ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ, పన్ను రాయితీల గురించి ఐరోపా సమాఖ్య ఒక్కటిగా ఉండాలని తొలిసారిగా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయాన్‌ పిలుపునిచ్చారు.అనుచిత పోటీకి దారితీసి మార్కెట్ల మూత, సరఫరా గొలుసుల విచ్చిన్నానికి దారి తీస్తుందని వాన్‌డెర్‌ అన్నారు. నిజానికి ఆమె ఐరోపాలో అమెరికా అనుకూల నేత, అంతరంగంలో ఏమున్నప్పటికీ ఐరోపాలో తలెత్తిన ఆందోళనను ప్రతిబించించే విధంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది.


ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం(ఐఆర్‌ఏ) పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 430 బిలియన్‌ డాలర్ల పథకాన్ని ప్రకటించింది. దీనిలో అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తారు. ఇది అక్కడి కంపెనీలకు ఇచ్చినట్లే. ఈ పధకం అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకున్న కెనడా, మెక్సికో దేశాలకు కూడా వర్తిస్తుంది. మరోవైపు తమ కంపెనీలకు నష్టదాయకమని ఐరోపా సమాఖ్య ఆందోళన వెల్లడించింది. అమెరికాకు ప్రతిగా సమాఖ్య కూడా తన స్వంత నిబంధనలను సరి చేసుకొని అమెరికాకు పోటీగా చర్యలు తీసుకోవాలని ఉర్సులా సూచించారు. అమెరికా ఐఆర్‌ఏ చట్టం గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)కు ఫిర్యాదు చేయాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. అమెరికా ఇప్పటికే చట్టాన్ని ఆమోదించినందున పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా అన్నట్లు వార్తలు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం పేరుతో ఇస్తున్న సబ్సిడీ నిజానికి పోటీదార్లను బలహీనపరిచేందుకు తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా అమెరికా చిప్స్‌ చట్టం పేరుతో తీసుకున్న చర్య తన స్వంత సెమికండక్టర్‌ పరిశ్రమ రక్షణ కోసమే.


అమెరికా ప్రకటించిన సబ్సిడీల మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయిన వాటికి ఇవ్వటం డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని, దానితో తాము పోటీ పడలేమని 27దేశాల ఐరోపా సమాఖ్య అంటోంది. అమెరికా సబ్సిడీలు మహా కలహశీలమైనవి, పశ్చిమ దేశాలను విడదీస్తాయని ఫ్రెంచి అధినేత మక్రాన్‌ వాషింగ్టన్‌ పర్యటనలోనే తన అసమ్మతిని వెళ్లగక్కాడు. మరోవైపున ఐఆర్‌ఏలో ఎలాంటి మార్పులు చేసేది లేదని అధికార డెమోక్రాట్లు స్పష్టం చేశారు. లోపల ఏమి ఉన్నప్పటికీ సబ్సిడీల వివాదాన్ని అట్లాంటిక్‌ వ్యాపిత దేశాల వాణిజ్య వివాదంగా మార్చకుండా చూడాలని మక్రాన్‌-జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా సబ్సిడీలకు ఐరోపా నుంచి గట్టి స్పందన ఉండాలని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ అన్నాడు. జర్మనీ విత్త మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నెర్‌ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్యపోరుకు సిద్దపడాలన్నాడు. తమ వాణిజ్య ప్రయోజనాల రక్షణకు ఆర్థిక దౌత్యం మీద ఆధారపడాలని కూడా చెప్పాడు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అమెరికా-ఐరోపా ప్రతినిధులు టెక్‌ సహకారం గురించి చర్చలు జరపనున్నారు. ఈ చర్చలల్లో సబ్సిడీల గురించి తేలేదేమీ ఉండదు గనుక ఐరోపా తన పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం కావాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థిర్రీ బ్రెటన్‌ మాట్లాడుతూ ఐరోపా పరిశ్రమలను కాపాడుకొనేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.అమెరికాకు ప్రతిగా ఇతర దేశాలు కూడా కొన్ని ప్రతికూల చర్యలు తీసుకోకపోలేదు. ఉదాహరణకు డిజిటల్‌ సార్వభౌమత్వం పేరుతో అమెరికా టెక్‌ కంపెనీల మీద ఫ్రాన్సు డిజిటల్‌ పన్ను విధించింది. అమెరికా మీద ఆధారపడకుండా సబ్సిడీలతో ఐరోపా సెమికండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికా కంపెనీలను తమ దేశంలో కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించాలని చూస్తున్నది. నిజంగా విబేధాలు ముదిరితే ఇలాంటి వాటిని చూపి అమెరికా ఎదురుదాడికి దిగవచ్చు.


అమెరికా-ఐరోపా మధ్య వాణిజ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన పెరుగుతోందని, ఈ పూర్వరంగంలో తాము మూల్యం చెల్లిస్తూ అమెరికా పెత్తనానికి తలవంచి అనుసరించటం కంటే తమ ప్రయోజనాల రక్షణకు స్వంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదని చైనా విశ్లేషకులు ఐరోపాకు సూచించారు. ప్రస్తుతం ఐరోపా నేతలు అటు అమెరికా ఇటు చైనాతోను సంబంధాలను కొనసాగిస్తున్నారు.చైనాతో విడగొట్టుకోవాలని అమెరికా నిరంతరం ఇతర దేశాలకు చెబుతోంది.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ జనవరిలో చైనా రానున్నాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీకి అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలుతాయని భావిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా నేత వాటి గురించి ఆందోళన వెల్లడిస్తున్నారు.


ఉదాహరణకు అమెరికాలో తయారు చేసిన ఒక విద్యుత్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ధరను బట్టి గరిష్టంగా ఏడున్నరవేల డాలర్లు సబ్సిడీ ఇస్తారు. సదరు కారు విడి భాగాలు అమెరికా లేదా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవై ఉండాలి. ఐరోపా సమాఖ్య – అమెరికాకు అలాంటి ఒప్పందాలు లేవు. అందువలన ఐరోపా కార్లకు సబ్సిడీ వర్తించదు.సోలార్‌ పానెల్స్‌, హీట్‌ పంప్స్‌, బయోమాస్‌ స్టవ్‌ల వంటి వాటికి కూడా సబ్సిడీలు ఇస్తారు. ఇవి జనవరి నుంచి అమల్లోకి రానుండటంతో ఆగస్టులోనే అమెరికా చట్టం చేసినా ఇప్పుడు ఐరోపాలో చర్చగా మారింది. మాతో సహకరిస్తున్నవారికి హాని కలిగించం అని జో బైడెన్‌ చెబుతూ ఐరోపాను బుజ్జగిస్తున్నప్పటికీ చట్టంలో మార్పులు చేసేందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు.


ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేస్తే అది ఎంత కాలానికి తేలుతుందో, ఏ తీర్పు వస్తుందో అన్న అనుమానాలు కూడా ఐరోపాలో ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌- ఐరోపా కంపెనీ ఎయిర్‌బస్‌ విమానాలకు ఇచ్చే సబ్సిడీ వివాదం పదిహేడు సంవత్సరాలు నడిచింది. ఆ సంస్థలో కొత్త జడ్జీల నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నది, అందువలన అసలు కొత్త కేసులను అది చేపట్టటం కూడా అనుమానమే. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్లుగా మనం కూడా సబ్సిడీలు ఇద్దామని మక్రాన్‌ అంటున్నాడు. ఐతే ఈ చర్య ఐరోపా అంతర్గత మార్కెట్‌ను దెబ్బ తీస్తే సమాఖ్య వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఉమ్మడి పారిశ్రామిక విధానంతో పాటు సబ్సిడీలు ఇచ్చేందుకు కూడా ఉమ్మడి నిధి అవసరం, దాని కోసం అప్పు తేవాలి లేదా దేశాలన్నీ నిధులు సమకూర్చాలి. ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏమేరకు అంగీకరించేది అనుమానమే. కావాలంటే ఐరోపా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే తాము ఇస్తున్నదానికి సరితూగవచ్చు అని అమెరికా వాణిజ్య కాథరీన్‌ తాయి సలహా ఇచ్చారు. అలా ఇవ్వగలిగిన అవకాశం జర్మనీకే ఉంది. ఒక వేళ ఇస్తే ఒకే మార్కెట్‌ అన్న ఐరోపా సమాఖ్య లక్ష్యానికే ఎసరు వస్తుంది. చిన్న దేశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరల నుంచి గృహాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు జర్మన్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిన 206 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పథకం మీద మిగతా దేశాలు గుర్రుగా ఉన్నాయి.


ఐరోపా కార్పొరేట్ల లబ్ది ప్రధానంగా రష్యా నుంచి చౌకగా వచ్చే ఇంథనం, చైనా నుంచి వస్తువుల మీద ఆధారపడి ఉంది. అమెరికాకు తోకగా మారి నడుస్తున్న కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఇంథనం నిలిచి ధరలు విపరీతంగా ధరలు పెరిగాయి. పరిశ్రమలకు ముప్పు వచ్చింది. దీనికి అమెరికా సబ్సిడీలు తోడైతే ఐరోపా పరిశ్రమల భవిష్యత్‌ సందిగ్దంలో పడుతుంది. ఇప్పటికే అక్కడ ఇంథన ధరలు విపరీతంగా పెరగటంతో అనేక మంది ఐరోపా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ స్వంత దేశాల్లో బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. వారికి కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ఈ స్థితిలో అమెరికా మాట నమ్మి చైనాతో కూడా తెగతెంపులు చేసుకొంటే ఇబ్బంది పడేది ఐరోపా దేశాలే. అందువలన అది జరగకపోవచ్చు. అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరిగే అవకాశాలు వస్తే చైనా దాన్ని వదులు కోదన్నది తెలిసిందే.


ఇతర దేశాల సబ్సిడీల గురించి వివిధ రకాలుగా నానా గొడవ చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలు. పలు రకాలుగా వాటిని అదుపు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా జాతీయవాదం, రక్షణాత్మక చర్యలకు దిగింది.అమెరికాకు అగ్రస్థానం అన్న విధానానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తెరతీస్తే జో బైడెన్‌ దాన్ని కొనసాగిస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా వద్ద ఎక్కువ అస్త్రాలు లేవు. తొలుత చర్చలతో ప్రారంభించి కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించవచ్చు. వాటితో అమెరికా కొంత మేర దిగిరావచ్చు లేదా ససేమిరా అంటే నీవు నేర్పిన విద్యే అన్నట్లుగా ఐరోపా కూడా సబ్సిడీలు ప్రారంభించటం, అమెరికా వస్తువులపై పరిమితులు విధింపు వంటి పనులకు పూనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అమెరికా తెగేదాకా లాగుతుందా ? చైనా, రష్యాలను అదుపు చేసేందుకు దానికి ఐరోపా అవసరం. అందువలన ఇతరంగా దానికి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా? కొందరు ఐరోపా నేతలు, పెద్దల్లో అమెరికా గురించి ఇంకా భ్రమలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇంథన సరఫరాకు ఇబ్బందులు, ధరల పెరుగుదలతో ఇప్పటికే ఐరోపా అతలాకుతలం అవుతున్నందున ఇప్పుడు అమెరికా సబ్సిడీలతో తన పరిశ్రమలను కూడా దెబ్బతీస్తే జనం ఊరుకుంటారా ? ఐరోపా సమాఖ్య ఒకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నా అన్ని దేశాలు ఒకే విధంగా లేవు. అమెరికాతో రాజీకి కొన్ని సుముఖంగా, మరికొన్ని స్వతంత్ర వైఖరితో ఉండాలని కోరుకుంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అవసరమైతే తాము చైనాకు దగ్గర అవుతామనే సంకేతాలను పంపటం అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకే అన్నది స్పష్టం. మక్రాన్‌ వాషింగ్టన్‌లో జో బైడెన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే బీజింగ్‌లో షీ జింపింగ్‌తో పెట్టుబడుల గురించి ఐరోపా కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ భేటీ జరిపాడు. నిజంగా అమీ తుమీ తేల్చుకోవాల్సి వస్తే ఎవరెటు ? ఏం జరుగుతుందనేది తెరమీద చూడాల్సిందే !

అదానీ కోసం కేరళలో బిజెపితో సిపిఎం చేతులు కలిపిందా ? నిజా నిజాలేమిటి ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నూటనలభై రోజులుగా లాటిన్‌ కాథలిక్‌ చర్చి తిరువనంతపురం పెద్దల మార్గదర్శనంలో నడిచిన విఝంజమ్‌ రేవు నిర్మాణ వ్యతిరేక కమిటీ డిసెంబరు ఆరవ తేదీన బేషరతుగా ఆందోళనను విరమించింది. ఇది తాత్కాలికమని కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిఎంతో చర్చలు జరిపిన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కమిటీ అంతకు ముందు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో రేవు నిర్మాణం ఆపాలన్నదాన్ని మినహ మిగిలిన ఆరింటిని ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది. అయినప్పటికీ తరువాత కూడా దాన్ని కొనసాగించేందుకు, శాంతి భద్రతల సమస్య సృష్టికి చూసినప్పటికీ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, పోలీసు శాఖ ఎంతో సంయమనం పాటించిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మంగళవారం నాడు చర్చల్లో ఆందోళన కమిటీ కొత్తగా లేవనెత్తిన ఏ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అంతకు ముందు ఈ ఆందోళనను ఆసరా చేసుకొని ప్రభుత్వం, సిపిఎం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు, వాస్తవాలను వక్రీకరించేందుకు చూశారు. వాటిలో ఒకటి ” అదానీ విఝంజమ్‌ రేవు నిర్మాణానికి చేతులు కలిపిన సిపిఐ(ఎం)-బిజెపి ” అంటూ పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.నవంబరు 26, 27 తేదీలలో రేవు నిర్మాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలన్న వినతిని హైకోర్టు తిరస్కరించింది. అదానీ కంపెనీ కోరినట్లుగా రేవు రక్షణకు కేంద్ర బలగాల ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిపిఎం చెప్పగా బిజెపి వ్యతిరేకించింది. తాము కూడా రేవు నిర్మాణానికి అనుకూలమే అన్న కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకోచూసిన ఆందోళన కారులకు పరోక్షంగా వత్తాసు పలికింది. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ రేవు నిర్మాణం జరగాలంటూనే ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విలేకర్లతో చెప్పారు. వాస్తవాలను వివరించేందుకు ప్రజల వద్దకు వెళతామని సిపిఎం ప్రకటించింది. మరోవైపున మతం రంగు పులిమేందుకు, రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు విఫలయత్నం చేశాయి. రేవు నిర్మాణం ఆపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటిని చూసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టికి కుట్ర జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. కేరళలో తాజా పరిణామాలు వెల్లడిస్తున్న అంశాలేమిటి?


కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర నిర్మితమౌతున్న రేవు నిర్మాణం మీద తలెత్తిన వివాదం గురించి జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రచారానికి పైన పేర్కొన్న వార్తా శీర్షిక ఒక ఉదాహరణ. వాటిని పట్టుకొని అదానీని ఇతర చోట్ల వ్యతిరేకించి తమ పాలనలో ఉన్న కేరళలో కమ్యూనిస్టులు సమర్దించారంటూ కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో రెచ్చి పోయారు. రేవు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న వారు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో ఆరింటిని అంగీకరించామని, నిర్మాణం ఆపాలి, వద్దు అన్న ఏడవ అంశాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమ ఆందోళన ఒక దశకు వచ్చినందున తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళన కమిటీ కన్వీనర్‌ ఫాదర్‌ ఫెరీరా మంగళవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధి వర్గం సిఎంను కలిసింది.విఝంజమ్‌ రేవు వద్ద జరిగిన ఉదంతాలపై న్యాయవిచారణ జరిపించాలని, సముద్ర పోటుకు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేంత వరకు నెలకు ఎనిమిది వేలు అద్దెగా చెల్లించాలని, దీనిలో రేవు కంపెనీ అదాని కంపెనీ సొమ్ము ఉండకూడదని, ఈ ప్రాంతంలో సముద్రతీర కోతపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో స్థానిక ప్రతినిధి ఒకరు ఉండాలని ఆందోళనకారులు ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. దేన్నీ ప్రభుత్వం అంగీకరించలేదు. అద్దెగా చెల్లించాలన్న ఎనిమిది వేలలో ప్రభుత్వం ఐదున్నరవేలు, అదానీ రేవు కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మరో రెండున్నరవేలు చెల్లించేందుకు చూస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను చర్చి పెద్దలు తిరస్కరించారు. తాము అదానీ కంపెనీ డబ్బు తీసుకోబోమని, ఐదున్నరవేలకే పరిమితం అవుతామని చెప్పారు. చర్చి అధికారులు, ఇతరులపై మోపిన తీవ్రమైన కేసుల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


విఝంజమ్‌ రేవును మూడు దశల్లో నిర్మించాలన్నది పథకం.2019 డిసెంబరు నాటికి తొలి దశ పూర్తి కావాలనుకున్నది జరగలేదు, తరువాత 2020 ఆగస్టుకు పొడిగించారు, కరోనా, భూసేకరణ పూర్తిగానందున అది కూడా జరగలేదు. 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేసేందుకు జరుగుతున్న పనులను రేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి స్థానిక చర్చి నేతలు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రయాణీకులు, కంటెయినర్‌, ఇతర సరకు రవాణా ఓడలను నడిపేందుకు కేరళ ప్రభుత్వం విఝంజమ్‌ ఇంటర్నేషనల్‌ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(విఐఎస్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ రేవు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ఓడల రవాణా మార్గానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని కూడా ఆకర్షించి ఇతర రేవుల నుంచి వచ్చే సరకుల ఎగుమతి-దిగుమతి ఓడల అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. కొలంబో, సింగపూర్‌, దుబాయి రేవులకు వెళ్లే కొన్ని ఓడలు ఇటు మరలుతాయి. దీని నిర్మాణం గురించి పాతిక సంవత్సరాలుగా చర్చ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో చేపట్టేందుకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఫలించలేదు. తొలుత ఒక చైనా కంపెనీకి టెండరు దక్కినా కేంద్రం నుంచి దానికి భద్రతా పరమైన అనుమతి రానందున రద్దైంది. తరువాత లాంకో గ్రూపుకు ఇవ్వటాన్ని జూమ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ కోర్టులో సవాలు చేసింది. దాంతో అదీ జరగలేదు. మూడవసారి 2014లో పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ ఒక్కటే వచ్చింది, దాంతో 2015లో నాటి యుడిఎఫ్‌ (కాంగ్రెస్‌కూటమి) ప్రభుత్వం అదానీ కంపెనీకే ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి సిఎం ఊమెన్‌ చాందీ శంకుస్థాపన కూడా చేశారు. దీని ప్రకారం వెయ్యి రోజుల్లో రేవు నిర్మాణం పూర్తి కావాలి. రు.7,525 కోట్ల ఈ పథకానికి నిరసనగా 2022 ఆగస్టు 16 నుంచి స్థానిక మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. దానికి చర్చి పెద్దలు నాయకత్వం వహించారు. ప్రతి ఆదివారం చర్చి ప్రార్ధనల్లో ఆదేశాలు జారీ చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు కూడా రేవును వ్యతిరేకిస్తున్నారు.దీని వలన తీర ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి వాదన. సముద్ర తీరం కోతకు గురవుతుందని, తమ జీవనాధారం దెబ్బతింటుందని చేపలు పట్టేవారు అంటున్నారు. అలాంటిదేమీ ఉండదని పరిశీలన జరిపిన కమిటీ చెప్పింది. ఆందోళన ప్రారంభం నాటికి సగం రేవు పనులు పూర్తైనందున ఆపే అవకాశం లేదని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. గతంలో చర్చలకు వచ్చిన ప్రతినిధులు సమావేశాల్లో సంతృప్తిని ప్రకటించి వెలుపలికి వచ్చిన తరువాత ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోసారి చర్చలకు రావాలంటే ముందుగా నిర్మాణ పనులు ఆపాలనే షరతు విధిస్తున్నారు.ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. వారు లేవనెత్తిన మిగిలిన ఆరు డిమాండ్లను అమలు జరిపేందుకు, పరిశీలించేందుకు అంగీకరించింది.


ఆగస్టు నుంచి నిరసన తెలుపుతున్నవారు ఆందోళనకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఉన్నవారిని, ఇతరులను రేవు పనులను అడ్డుకుంటున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలనే నెపంతో నవంబరు 26 రాత్రి 27వ తేదీన తీవ్ర హింసాకాండకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశారు, పరిసరాల్లో ఉన్న ఇండ్లపై రాళ్లు వేశారు. రెండు వాహనాలను దగ్దం చేసి అనేక మంది పోలీసులను గాయపరిచారు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లటాన్ని కూడా అడ్డుకున్నారు. రోడ్లను ఆక్రమించారు. రేవు నిర్మాణంలో తమకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ దళాలను రప్పించాలని అదానీ గ్రూపు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు కేంద్ర దళాల అవసరం లేదని, కావాలని అదానీ కంపెనీ కోరింది తప్ప తాము కాదని రాష్ట్ర రేవుల శాఖ మంత్రి అహమ్మద్‌ దేవరకోవిల్‌ స్పష్టం చేశారు. కేంద్రం పంపితే తమకేమీ అభ్యంతరం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.


ఈ రేవు నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్దతికి మారుగా కౌలు పద్దతిని పాటించాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ కోరింది. పిపిపి పద్దతిలో రు.7,525 కోట్లకు గాను అదానీ రు.2,454 కోట్లు మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వం తిరగదోడితే నిర్మాణ హక్కు పొందిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తాను వ్యతిరేకించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలుకు కట్టుబడి ఉంది.ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి, తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి వేరే విధంగా మాట్లాడటం వెనుక ఓట్ల రాజకీయం ఉంది. లాటిన్‌ కాథలిక్‌ మతపెద్దలు గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినందున ఆ పార్టీ లబ్ది పొందింది. 2021 ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చినా దక్షిణ, మధ్య కేరళలోని చర్చి ప్రభావితం చేసే 34 చోట్ల నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. రేవు ప్రాంతంలోని రెండు సీట్లను కూడా ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరిగి చర్చి మద్దతు పొందేందుకు రేవు ఆందోళనను ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్‌ చూసింది, సకాలంలో నిర్మించలేదని, చర్చి డిమాండ్లను పరిశీలించలేదని ఆరోపించింది.


రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటూ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచారు. దాంతో పనులను కొనసాగనివ్వాలని నవంబరు చివరి వారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆందోళనకారులు ఉల్లంఘించి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. ఒక వైపు క్రైస్తవ మత పెద్దలు పల్లెకారులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పుతుంటే మరోవైపు దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి మద్దతు ఉన్నశక్తులు రేవుకు మద్దతు పేరుతో హిందూ ఐక్యవేదిక వంటి సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు కాషాయ జండాలతో మరోవైపున టెంట్లు వేసి రెచ్చగొట్టేందుకు, మత రంగు పులిమేందుకు చూశారు.ఈ అంశంలో రెచ్చగొట్టేందుకు క్రైస్తవ మత పెద్దలు కూడా తక్కువ తినలేదు.రేవు నిర్మాణ వ్యతిరేక ఆందోళన కారుల సంస్థ నే తలలో ఒకరైన ఫాదర్‌ థియోడోసియస్‌ డి క్రజ్‌ జనాన్ని రెచ్చగొడుతూ మత్స్యశాఖ మంత్రి అబ్దుర్‌రహిమాన్‌ పేరులోనే ఒక ఉగ్రవాది దాగి ఉన్నాడని నోరుపారవేసుకున్నారు. ఎల్‌డిఎఫ్‌కు చెందిన వివిధ సంస్థలు, ఇతరుల నుంచి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు రావటం, హింసాకాండను ప్రోత్సహించినందుకు చివరికి మద్దతు ఇస్తున్న వారిలో, సాధారణ జనంలో సానుభూతి కనుమరుగు కావటం, పోలీసులు వివిధ కేసులను పెట్టిన పూర్వరంగంలో సదరు ఫాదర్‌ నోరు జారి మాట్లాడానని క్షమించాలని కోరారు.


కొన్ని స్వార్దపరశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, కొందరు ప్రతిఘటించి బెదరించినంత మాత్రాన విశాల ప్రయోజనాలకోసం ఉద్దేశించిన దానిని నిలిపివేసే ప్రసక్తి లేదని సిఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.అదే జరిగితే రాష్ట్రం విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు.విఝింజమ్‌ రేవు పరిరక్షణ సమితి పేరుతో ఉన్న వారు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన ప్రదర్శనలలో పార్టీలతో నిమిత్తం లేకుండా రేవు నిర్మాణం జరగాలని కోరుకోనే వారందరూ పాల్గొన్నారు. అది ఒక పార్టీకి చెందిన వేదిక కాదు. దానిలో సిపిఎం, బిజెపి ఇతర సంస్థల స్థానిక నేతలు పాల్గొన్నారు. దాన్నే రెండు పార్టీలు చేతులు కలిపినట్లుగా కొందరు చిత్రించారు. కేంద్ర దళాలను పంపాలని అదానీ కంపెనీ కేరళ హైకోర్టును కోరింది, ఇప్పటికే కొన్ని సంస్థలను కేంద్ర దళాల పరిధిలో ఉన్నందున మరొకదానికోసం పంపితే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీని మీద వైఖరిని తెలపాలని కేంద్రాన్ని కోర్టు కోర్టు కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.


కేంద్ర దళాలు వస్తే తమకు అభ్యంతరం లేదని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలపటం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నందున కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. ఒక వేళ కేంద్ర దళాలు వచ్చినపుడు ఏదైనా అవాంఛనీయ ఉదంతం జరిగితే ఒక్క లాటిన్‌ కాథలిక్‌ చర్చ్‌కు చెందిన వారే కాదు మొత్తం క్రైస్తవులు పార్టీకి మరింత దూరం అవుతారని బిజెపి భావిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ” కొంత కాలంగా వివిధ క్రైస్తవ సమూహాలకు చేరువ కావాలని బిజెపి, సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది. వీరిలో ఒక తరగతి మద్దతైనా లేకుండా రాష్ట్రంలో ఎన్నికలలో నిలబడలేమని బిజెపికి తెలుసు. ఇటీవలి కాలంలో వివిధ చర్చ్‌ల అధికారులతో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వం, ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుసార్లు మీటింగ్‌లు జరిపారు.ఈ వెలుగులో హైకోర్టుకు ఎల్‌డిఎఫ్‌ వెల్లడించిన వైఖరి వెనుక రాజకీయం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌,రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌తో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో కలసి రాష్ట్ర నేతలు దీన్ని గురించి చర్చించనున్నారు. విఝుంజమ్‌లో కేంద్ర దళాల గురించి విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మురళీధరన్‌ ఆరోపించారు. రేవు వద్ద ఏదైనా జరిగితే దానికి బాధ్యత బిజెపిదే అని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ చూస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్‌ చెప్పారు.సిపిఎం, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో ఉంది అది కుదరదు ” అన్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.


ఇక్కడే బిజెపి దుష్ట ఆలోచన వెల్లడైంది. ఏదైనా జరుగుతుందని ముందే ఆ పార్టీ కోకిల ఎందుకు కూస్తున్నట్లు ? రేవు వద్ద ఒక పథకం ప్రకారం జరిపిన హింసాకాండ వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడ తెలుసుగనుకనే పోలీసులు ఎంతో నిబ్బరంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అందోళన చేస్తున్న వారు తిరిగి విధ్వంసకాండకు పాల్పడతారని బిజెపికి ముందే తెలుసా ? అందుకే కేంద్ర దళాలు వద్దని చెప్పిందా అన్న అనుమానాలు కలగటం సహజం. గతంలో శబరిమల పేరుతో హింసాకాండను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు చూసిన సంగతి తెలిసిందే.


తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిధరూర్‌ డిసెంబరు ఐదున క్రైస్తవమత పెద్దలను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ రేవు నిర్మాణం ఆపాలనటాన్ని తాను సమర్ధించటలేదంటూ, నిలిపివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వారికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి ఆర్చిబిషప్‌ మార్‌ జార్జి ఆలెన్‌ చెరీ విలేకర్లతో మాట్లాడుతూ రేవు అంశాన్ని కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. శశి ధరూర్‌తో జరిపిన సమావేశంలో ఏదో ఒక అంశం గురించి మాత్రమే గాక అనేక అంశాలను చర్చించినట్లు చెప్పారు. సిరో-మలంకర కాథలిక్‌ చర్చి కార్డినల్‌ బేసిలోస్‌ క్లీమిస్‌తో ప్రతి రోజూ చర్చిస్తున్నట్లు శశిధరూర్‌ చెప్పారు. రేవు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారు గతంలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐఏ అందించిన సొమ్ముతో అన్ని రకాల మతశక్తులు, కాంగ్రెస్‌ కలసి విముక్తి సమరం సాగించినట్లుగా మరోసారి చేస్తామని కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. కొన్ని శక్తుల కుట్రల గురించి తెలుసుగనుకనే గత నాలుగున్నర నెలలుగా ఎంతగా రెచ్చగొడుతున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహనంతో ఉంది. చివరికి ఆందోళన కారులే దాడికి దిగారు. అది వికటించటంతో బేషరతుగా వెనక్కు తగ్గారు.

మార్కెట్‌ సునామీకి విలవిల్లాడుతున్న వనామీ రైతు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో దాదాపు రెండు లక్షల 70వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల రకం సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. టైగర్‌ రొయ్యల రకం మరొక లక్షా 50వేల ఎకరాల్లో జరుగుతోంది. ఇది ప్రధానంగా లక్షా పాతికవేల ఎకరాలు ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరుగుతోంది. ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వనామీ రైతులు వాపోతున్నారు. వివిధ కారణాలతో ప్రపంచంలో రొయ్యల ఎగుమతి మార్కెట్‌ అవకాశాలు తగ్గాయి. ఒక వైపు మేత ధరలు విపరీతంగా పెరగటం మరొక వైపు కొనే వారు లేక చేతికి వచ్చిన వాటిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. రానున్న కొద్ది నెలలు కూడా ఇలాగే కొనసాగితే ఈ రంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో పడనుంది. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే రు.25వేల కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా. రొయ్యలను శుద్ది చేసి ఎగుమతికి అనువుగా తయారు చేసే ఫ్యాక్టరీలలో చిన్నా, మధ్యతరగతివి మూసివేతకు దగ్గరగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎగుమతులు లేవనే పేరుతో కొందరు రైతులకు చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో ముట్టచెప్పటం లేదు.


అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలలో క్రిస్మస్‌ సందర్భంగా పలు ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం తలెత్తిన ఆర్థిక వడిదుడుకుల కారణంగా ఈ ఏడాది దానికి తగిన విధంగా మన దేశం నుంచి దిగుమతి ఆర్డర్లు లేవు. చైనాలో కరోనా కేసులను సున్నాకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్లు ఇతర ఆంక్షలను విధించిన కారణంగా అక్కడి డిమాండ్‌ కూడా తగ్గినట్లు వార్తలు. ఆగస్టు నెల నుంచి ఎగుమతి డిమాండ్‌ తగ్గిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల మార్కెట్‌ సంక్షోభం మొదలైంది. విదేశాల్లో డిమాండ్‌ తగ్గటంతో ధరలు కూడా పడిపోయాయి. 2021-22లో మన దేశం నుంచి 7.76 బిలియన్‌ డాలర్ల మేర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా 8.6బి.డాలర్లను నిర్ణయించింది. అది నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. గిరాకీ తగ్గుదల 30 నుంచి 35శాతం వరకు, ధరల పతనం 20 నుంచి 25శాతం ఉన్నందున జనవరి తరువాత తిరిగి పూర్వపు స్థాయికి చేరితే తప్ప అటు కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం తగ్గుదల ఇటు రైతాంగానికి ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎగుమతి-దిగుమతి దేశాలన్నింటా శీతల గిడ్డంగులన్నీ ఆక్వా ఉత్పత్తులతో నిండి ఉన్నట్లు వార్తలు.ఈ కారణంగానే కొనుగోళ్లు మందగింపు, పరిస్థితి మెరుగుపడకపోదా అనే ఆశ ఉన్న ఎగుమతిదార్లు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. మెరుగుపడితే మంచి లాభాలు లేకపోతే నష్టం ఉండదు అన్న అంచనాలే దీనికి కారణం. గతంలో కూడా మార్కెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇలాంటి తీవ్రత గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు.


ధనిక దేశాల్లో తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా జేబులకు చిల్లుపడుతున్నందున జనం తమ అలవాట్లు, అవసరాల ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటారు. అత్యవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు.ఈ పరిస్థితికి తోడు గతేడాది ప్రపంచంలో 40లక్షల టన్నుల మేర రొయ్యల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 50లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. ఇది కూడా ధరల పతనానికి ఒక కారణం అంటున్నారు. ఈక్వెడోర్‌, ఇండోనేషియా, వియత్నాంలో ఉత్పత్తి పెరిగింది. పన్నెండు లక్షల టన్నులతో ఈక్వెడోర్‌ ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశంగా ఎదిగింది.చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు పెరిగింది. మన దేశం నుంచి అమెరికా, తరువాత స్థానాల్లో చైనా ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయి. రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా పక్కనే ఉన్న ఈక్వెడోర్‌ నుంచి దిగుమతి చేసుకోవటం అమెరికాలోని దిగుమతి కంపెనీలకు ఎక్కువ లాభం కనుక అక్కడి ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. చైనా కూడా అక్కడి నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నది.


మన కరెన్సీ విలువ తగ్గినందున ఎగుమతిదార్లకు పెరిగిన రవాణా ఖర్చు కలసి వచ్చి కొనుగోలు చేస్తారని భావిస్తే అమెరికా మినహా మిగిలిన దిగుమతి చేసుకొనే దేశాల కరెన్సీ విలువలు కూడా మన రూపాయి మాదిరి పతనమై ఆ దేశాలలో కొనుగోలు శక్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కిలోకు వంద తూగే వనామీ రకం రొయ్యలకు కనీసం రు.240 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఎవరూ కొనుగోలుకు ముందుకు రాకపోవటంతో దాన్ని రు.210కి తగ్గించినా చిత్తశుద్దితో అమలు జరిపేవారు లేరు. నిల్వ ఉండే సరకు కానందున చివరకు రు.180, ఇంకా అంతకు తక్కువకు సైతం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి ఖర్చులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు టైగర్‌ రకం ధర కూడా రు.600 నుంచి 450కి పడిపోయింది. ఈ కారణంగా గతేడాది జరిగిన 9.2లక్షల టన్నుల ఉత్పత్తి ఈ ఏడాది ఎనిమిది లేదా ఇంకా తక్కువకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల రైతులకు సైతం ఎగుమతి అవరోధాలు ఉన్నప్పటికీ మలేషియా, వియత్నాం, థాయిలాండ్‌ వంటి దేశాల్లో వంద కౌంట్‌ ఉన్న వాటికి రు.290 నుంచి 310వరకు రైతుకు వస్తుండగా మన దగ్గర రెండువందలకంటే తక్కువకు దిగజారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలోకు రు.300లకు తగ్గితే గిట్టుబాటు కాదని, 270 కంటే తగ్గితే నష్టమని అంటున్నారు.


మన దేశం 123 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వీటిలో ఎక్కువ భాగం రొయ్యలే ఉండటంతో గతేడాది జరిగిన మొత్తం ఆరులక్షల టన్నుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 60శాతం వరకు ఉంది. చైనా తన దిగుమతుల్లో 70శాతం మన దేశం నుంచి చేసుకొనేది ఇప్పుడు ఈక్వెడోర్‌ నుంచి కూడా చేసుకుంటున్నది. వివిధ దేశాలు చేసుకొనే దిగుమతులపై వర్తమాన రాజకీయాలు, వాణిజ్య సంబంధాలు కూడా ప్రభావం చూపుతాయి. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న అమెరికాతో భారత్‌ చేతులు కలుపుతోందన్న అభిప్రాయం చైనాకు ఉంది. మరోవైపున మనదేశంలో బిజెపి, దానికి మార్గదర్శకంగా పనిచేసే సంఘపరివార్‌ సంస్థల దళాలు, వారికి వంతపాడే మీడియా విశ్లేషకులు సుప్రభాతం మాదిరి రోజు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దానికి బుద్ది చెప్పాలని,మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని ప్రచారం చేస్తుంటారు. ఈ నోటి దూలను చూసిన తరువాత మన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతి చేసే దేశాలున్నపుడు వాటి నుంచి దిగుమతుల చేసుకోవాలనే అలోచన కలగవచ్చు. లేకపోతే ఎంతో దూరంలో ఉన్న ఈక్వెడోర్‌ నుంచి చైనా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్లు ? వాటికి ప్రతిగా చైనాకు తన వస్తువులను అక్కడికి ఎగుమతి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి.మన ప్రభుత్వం విధిస్తున్న ఎగుమతి పన్నులు, మన దేశంతో ఒప్పందాలు లేని కారణంగా దిగుమతి చేసే దేశాలు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు కూడా దిగుమతిదార్లను అవి లేని దేశాలవైపుకు నెడతాయి. అందువలన ఇలాంటి పన్నులు లేకుండా ఉండాలంటే మన దేశం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కూడా అవసరమే. అయితే అలాంటి ఒప్పందాలకు వెళ్లే ముందు మన దేశ లబ్దిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఐరోపా, ఇతర దేశాలతో వియత్నాం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నందున అవి మనకు బదులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి. మన రొయ్యలపై తెల్లమచ్చల కారణంగా ఆస్ట్రేలియా దిగుమతులను నిలిపివేసింది. అందువలన ఎగుమతి చేసే దేశాలు కోరుకున్న ప్రమాణాల మేరకు వ్యాధులు, నిషేధిత మందుల అవశేషాలు లేకుండా మన ఉత్పత్తులుండటం కూడా అవసరమే. ఒక వేళ ఇక్కడ కన్ను గప్పి పంపినా ఎక్కడైనా పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది.


ఇక స్థానిక సమస్యల సంగతులను చూస్తే నాణ్యమైన రొయ్య విత్తన(పిల్లల) లభ్యత కూడా తీవ్రంగానే ఉంది.ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడి ఎత్తివేసేందుకు దారులు వెతికి రైతుల్లో ఆందోళన కలిగించింది. ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ అని కొన్ని రోజులు, ఐదెకరాల లోపు, ఆపైవారు అని మరికొన్ని రోజులు, సర్వేల పేరుతో చేస్తున్న కాలయాపన గురించి రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రతి గ్రామంలో సచివాల యాలు, వలంటీర్లు ఉన్నందున ఒక్క రోజులో సమాచారాన్ని సేకరించవచ్చు. మరోవైపు విపరీతంగా పెరుగుతున్న మేత ధరలు అదుపులో ఉండటం లేదు. కనీస మద్దతు ధరను అమలు జరిపే అధికారులు, ఉల్లంఘించిన వారి మీద చర్యలు గానీ ఉండటం లేదు. ఎగుమతి పరిస్థితి మెరుగుపడేంతవరకు పంటవిరామం ప్రకటించాలని కూడా కొందరు రైతులు సూచిస్తున్నారు. లక్షలాది మందికి ఆక్వా ఉపాధి కల్పిస్తున్నది. అందువలన ఈ రంగాన్ని కూడా పరిశ్రమగానే గుర్తించి ఇతర పరిశ్రమలకు మాదిరే ఇస్తున్న విద్యుత్‌, ఇతర రాయితీలను అందరికీ వర్తింప చేయాలని కూడా రైతులు కోరుతున్నారు.సంక్షోభ సమయాల్లో అన్ని రంగాలను ఆదుకున్నట్లుగానే ఆక్వాను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వారి గోడును పాలకులు వినిపించుకుంటారా ? అనుమానమే !

ఉక్రెయిన్‌ పోరులో కంటే ఇంథన సంక్షోభంతో ఐరోపాలో చలి మరణాలే ఎక్కువా !

Tags

, , , , ,



ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాటికి 280 రోజులు. అగ్నికి ఆజ్యం పోస్తున్న మాదిరి వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు దీన్ని ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ తొలి రోజుల్లో సిద్దపడినప్పటికీ అమెరికా, బ్రిటన్‌ ఇతర నాటో దేశాలు వాటిని పడనివ్వలేదని తరువాత స్పష్టమైంది. అమెరికా, దాన్ని అనుసరించే పశ్చిమ దేశాలు వేసిన తప్పుడు అంచనాలు, ఎత్తుగడల గురించి ఇతరులు చర్చించుకోవటం ఒక ఎత్తు కాగా తొమ్మిది నెలల తరువాత ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి, పర్యవసానాలు కార్మికవర్గం మీద ప్రభావం చూపటం ప్రారంభమైంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి కాలం ఎలా గడపాలిరా బాబూ అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపున ఈ సంక్షోభాన్ని అమెరికా తన లాభాల కోసం వినియోగించుకుంటున్నదని ఐరోపా గొణగటం ప్రారంభించింది.ఉక్రెయిన్‌ సంక్షోభం మీద తటస్థ వైఖరిని అనుసరిస్తున్న భారత్‌, చైనా తదితర దేశాలు పశ్చిమ దేశాల బెదరింపులను పక్కన పెట్టి రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును చౌకధరలకు కొనుగోలు చేసి పుతిన్‌కు లబ్ది కలిగించటంతో పాటు డాలర్లను పొదుపు చేసుకుంటున్నాయి. డిసెంబరు ఒకటవ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు ఐరోపా సమాఖ్య మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ చైనా రానున్నాడు. క్రిమియా వంతెన పేల్చివేతకు ఉక్రెయిన్‌ చేసిన కుట్ర వెల్లడి కావటంతో రష్యా దళాలు విద్యుత్‌ కేంద్రాలను దెబ్బతీశాయి. దీంతో రాజధాని కీవ్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చలికాలాన్ని ఆయుధంగా చేసుకొని తమ దేశం మీద పుతిన్‌ దళాలు విరుచుకుపడుతున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. డిసెంబరు ఐదు నుంచి రష్యా చమురును తాము నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలనే ఆంక్షలను అమెరికా, నాటో కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్య తీసుకుంటామని అమెరికా చెప్పగా ధరల అదుపును అంగీకరించిన దేశాలకు అసలు తాము విక్రయించేది లేదని రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉన్నామని చెబుతూనే ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్థిక అంశాల దగ్గరకు వచ్చేసరికి లాభాలు మీకు – భారాలు మాకా ఏమిటీ పద్దతి అని ఐరోపా దేశాలు అమెరికాను ఇప్పుడు అడుగుతున్నాయి. అమెరికా చేసిన దురాగతాలన్నింటిని ఆమోదించి అనుసరించిన గతం వాటిని వెన్నాడుతోంది. అనేక విధాలుగా అమెరికా బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌ పరిణామాలను చూస్తే ఐరోపా కంటే అమెరికాపెత్తనమే ఎక్కువగా ఉంది. నాటో పేరుతో అక్కడ తిష్టవేసేందుకు చూసిన సిఐఏ పథకంలో భాగంగా 2014లో జరిగిన తిరుగుబాటులో నయా నాజీలను అధికారానికి తెచ్చారు. ఈ పూర్వరంగంలో జనాభిప్రాయానికి అనుగుణంగా గతంలో తమ ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని తనలో విలీనం చేసుకుంది. అదేబాటలో నడచిన డాంటెస్క్‌ ప్రాంతంలోని జనాన్ని ఉక్రెయిన్‌ మిలిటరీతో అణచివేతకు పాల్పడటం, గతంలో రష్యాకు ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో విస్తరణకు పూనుకోవటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది.


చర్చలను అడ్డుకోవటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా, తీవ్ర పర్యవసానాలకు దారి తీసేందుకు దోహదం చేసే విధంగా భారీ ఎత్తున అమెరికా ఆయుధాలను అందిస్తున్నది. మరోవైపున రష్యా నుంచి చమురు తదితర దిగుమతులను నిషేధించి ఐరోపాను తమపై ఆధారపడేట్లు చేసుకుంది. గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి ఐరోపా దేశాలు ఉక్రెయిన్నుంచి వచ్చిన శరణార్ధుల భారంతో పాటు పెరిగిన చమురు, విద్యుత్‌ ధరల భారాలను అనుభవిస్తున్నాయి. కరోనాకు ముందే తక్కువ వృద్ధి రేటుతో ఉన్న పరిస్థితి తరువాత మరింత దిగజారింది. దాని మీద ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ద్రవ్యోల్బణం, ధరల భారాలతో ఆర్థిక రంగం కుదేలౌతున్నది. ఇది పాలకపార్టీల మీద వత్తిడితో పాటు జనాన్ని వీధుల్లోకి రప్పిస్తున్నది. మరోవైపు రాజకీయంగా అమెరికాతో స్నేహం కోసం కొన్ని దేశాలతో వైరం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతుండటంతో సుభాషితాలు చెబుతున్న నాయకగణం నేల మీద నడిచేందుకు చూస్తున్నది. తాము చేయాల్సింది చేయకుండా వ్లదిమిర్‌ పుతినే అన్నింటికి కారణం అని చెబితే నమ్మేందుకు జనాలు సిద్దంగా లేరు.


తాజాగా పొలిటికో అనే పత్రికలో ఒక విశ్లేషణ వెలువడింది. ” ఉక్రెయిన్‌పై తొమ్మిది నెలల దురాక్రమణ(ఇది పొలిటికో పదజాలం) తరువాత పశ్చిమ దేశాల ఎముకలు విరగ్గొట్టేందుకు పుతిన్‌ పూనుకుంటున్నాడు. ఐరోపా ఉన్నతాధికారులు జో బైడెన్‌ అధికార యంత్రాంగం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఐరోపా సమాఖ్య దేశాలు ఇబ్బందులు పడుతుండగా అమెరికన్లు యుద్దం నుంచి లాభాలు పొందుతున్నారు.” అని పేర్కొన్నది. ఇన్ని నెలలుగా పుతిన్‌ శకం ముగిసింది, ఉక్రెయిన్‌ గెలిచింది అంటూ గంతులు వేసిన వారు ఇప్పుడు ఎముకలు విరగ్గొట్టటం గురించి మాట్లాడటం గమనించాలి. విధించిన ఆంక్షలు వికటించి ఐరోపాకు దిక్కుతోచని స్థితిలో జో బైడెన్‌ అమెరికా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను, హరిత రాయితీలు ఐరోపా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని తమ మిలిటరీ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు ఉపయోగించుకుంటున్నారని, శాంతియుత పరిష్కారానికి పూనుకోవాలన్న తమ వినతులను చెత్తబుట్టలో పడవేస్తున్నారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఐరోపా అధికారి ఒకరు చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది. ” వాస్తవం ఏమంటే, మీరు గనుక నిమ్మళంగా చూస్తే ఈ యుద్దం నుంచి ఎక్కువగా లబ్ది పొందిన దేశం ఏదంటే అమెరికా, ఎందుకంటే వారు అధిక ధరలకు గాస్‌ అమ్ముతున్నారు, ఎక్కువగా ఆయుధాలు అమ్ముతున్నారు. మేము నిజంగా ఇప్పుడు చారిత్రాత్మక సంకట స్థితిలో ఉన్నాము. ముందు చెప్పినట్లుగా అమెరికా ఇస్తున్న సబ్సిడీలు, అధిక ఇంథన ధరల ముప్పు అట్లాంటిక్‌ కూటమి(నాటో),యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మారుతున్నది. అనేక ఐరోపా దేశాలలో ప్రజాభిప్రాయం మారుతున్నదని అమెరికా గుర్తెరగాల్సిన అవసరం ఉంది.” అని కూడా సదరు అధికారి చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది.


రష్యా అంటే ఒంటికాలి మీద లేచే ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ ఉక్రెయిన్‌కు ఉమ్మడిగా సాయపడాలనే భావననే ప్రశ్నించాడు. ” అమెరికన్లు – మా స్నేహితులు – నిర్ణయాలుతీసుకుంటారు, అవి మాపై ఆర్ధిక ప్రభావం చూపుతాయి ” అన్నాడు. ” అమెరికా మాకు అమ్ముతున్న గాస్‌ ధర అట్లాంటిక్‌ దాటే సరికి అనేక రెట్లు పెరిగి నాలుగింతలు అవుతున్నది. అమెరికన్లు మా స్నేహితులనటంలో ఎలాంటి సందేహం లేదు….. కానీ మిత్రుల మధ్య ఎక్కడో తప్పు జరుగుతున్నది అనిపించినపుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ” అని ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థెరీ బ్రెటన్‌ ఒక ఫ్రెంచి టీవీతో మాట్లాడుతూ చెప్పాడు. పొలిటికోతో మరొక ఐరోపా ప్రతినిధి మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 369 బిలియన్‌ డాలర్ల పారిశ్రామిక రాయితీల పథకాన్ని ప్రకటించాడు. అది ఐరోపా రాజధానులన్నింటా ఆకస్మిక భయాన్ని కలిగించింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం అన్నింటినీ మార్చివేస్తున్నది. అమెరికా ఇప్పటికీ మా మిత్రదేశంగా ఉన్నట్లా లేనట్లా అని అడిగినట్లు పొలిటికో పేర్కొన్నది.


అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ తరువాత ఐరోపా సమాఖ్య నుంచి ఒక ఉన్నతాధికారి చైనా సందర్శించటం ఇదే ప్రధమం. చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ బీజింగ్‌ సందర్శన జరుగుతుంది. చైనాను ఒంటరిపాటు గావించాలని, అక్కడి నుంచి సరకులు కొనుగోలు నిలిపివేయాలంటూ రోజూ పారాయణం చేస్తున్న అమెరికా వైఖరిని తోసిరాజనటమే ఇది. చైనా మిగతా దేశాలన్నింటికీ పోటీదారు, వ్యవస్థాపరంగా శత్రువు అని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో అమెరికాకు మరింత దగ్గరైన ఐరోపా సమాఖ్య ప్రముఖుడు చైనా సందర్శన ఒక కీలక పరిణామం. ఎంతో కసరత్తు జరిగితే తప్ప ఇలాంటివి జరగవు.చైనా మీద గుర్రుగా ఉన్న ఐరోపా సమాఖ్యలోని అగ్రదేశం జర్మనీ ఛాన్సలర్‌ ష్కుల్జ్‌ ఇటీవల చైనా సందర్శించి తాము ఘర్షణకు సిద్దం కాదనే సందేశాన్ని నాటో కూటమికి పంపాడు. తరువాత బీజింగ్‌తో సంబంధాలకు సిద్దమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. దానికొనసాగింపుగా మండలి నేత వస్తున్నట్లు చెప్పవచ్చు. ఐరోపాను తన అవసరాలకు వాడుకుంటూ ఆ మేరకు లబ్ది పొందుతూ ఐరోపాకు వాటా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తున్నకారణంగానే అవసరమైతే తమదారి తాము చూసుకుంటామనే సందేశాన్ని ఐరోపా ఇస్తున్నది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకొని తాము బతకాలంటే చైనా లేకుండా జరిగేది కాదన్న గ్రహింపు కూడా దీనిలో ఉంది. అంటే వారి అవసరాల కోసమే చైనాతో చెలిమి అన్నది స్పష్టం.


ఉక్రెయిన్‌ పోరు సంక్షోభం కారణంగా మరణించేవారి కంటే దాని పర్యవసానాలతో తలెత్తిన పరిస్థితి కారణంగా చలి కాలంలో ఎక్కువ మంది ఐరోపా వారు మరణిస్తారని బ్రిటన్నుంచి వెలువడే వారపత్రిక ఎకానమిస్ట్‌ నవంబరు 28వ తేదీ సంచిక విశ్లేషణ పేర్కొన్నది. ఐరాస అధికారికంగా ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అక్కడ మరణించిన పౌరులు 6,900 మంది, గాయపడిన వారి సంఖ్య పదివేలకు చేరింది. మిలిటరీ పరంగా ఎందరు సైనికులు మరణించిందీ నిర్ధారించటం కష్టమని రెండు వైపులా మరణించిన వారు 25 నుంచి 30వేల చొప్పున ఉండవచ్చని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. చలికాలంలో ఇంథన ధరలు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో గత సమాచార ప్రాతిపదికన ప్రాణ నష్టం గురించి పేర్కొన్నది. అసాధారణ రీతిలో గాస్‌, విద్యుత్‌ ధరలు పెరిగిన కారణంగా రానున్నది ప్రత్యేకమైన చలికాలంగా మారితే సాధారణ మరణాలకంటే లక్షా 47వేల మంది అదనంగా మరణిస్తారని పేర్కొన్నది. చలి మరింత తీవ్రంగా ఉంటే, వాతావరణ మార్పులు జరిగితే ఈ సంఖ్య 3,35,000 ఉండవచ్చని పేర్కొన్నది. చలి తక్కువగా ఉన్నప్పటికీ కనిష్టంగా 79 వేలు అదనంగా ఉండవచ్చని తెలిపింది.జూన్‌-ఆగస్టు నెలలతో పోలిస్తే డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మరణాలు 21శాతం ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ విశ్లేషణ తరువాత ఐరోపా ప్రభుత్వాలు, సమాజాల్లో స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా పేదలు, మధ్యతరగతి జనాలు చలికాలంలో ఆహారానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాలా గృహాలను వెచ్చచేసుకొనే ఇంథనానికి ఎక్కువ ఖర్చు చేయాలా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.2000 నుంచి 2019 ధరలతో పోల్చితే గాస్‌ ధర 144, విద్యుత్‌ ధర 78శాతం పెరిగింది. ఇటలీలో 2020 నుంచి 200శాతం వరకు విద్యుత్‌ బిల్లులు పెరిగాయి. ఎక్కువగా నష్టం, ఇబ్బందులు పడుతున్నది ఐరోపా సమాజమే గనుక దాన్నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్‌ – రష్యా చర్చలకు వత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

పాలస్తీనాను అడ్డుకుంటున్న అమెరికా – నేడు సంఘీభావ దినం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఏడున్నర దశాబ్దాలుగా మాతృదేశంలోనే బందీలుగా, కొలువులు నెలవులు తప్పిన వారిగా, ఇరుగు పొరుగు దేశాల్లో శరణార్ధుల శిబిరాల్లోనే పుట్టి పెరిగి, మరణించిన వారెవరైనా వర్తమాన ప్రపంచంలో ఉన్నారంటే వారే పాలస్తీనా అరబ్బులు. ఐరాస చరిత్రలో ఘోర వైఫల్యాల్లో తాను చేసిన పాలస్తీనా తీర్మానాన్ని అమలు జరపలేని అసమర్ధత. జోర్డాన్‌, లెబనాన్‌, సిరియా, సౌదీ అరేబియా, ఇరాక్‌లలో లక్షలాది మంది పాలస్తీనియన్లు శరణార్ధులుగా ఉన్నారు.1947 నవంబరు 29న ఐక్య రాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఆమోదించిన 181వ తీర్మానం ప్రకారం పాలస్తీనాను రెండుగా చీల్చి ఒక ముక్కను ఇజ్రాయల్‌గా ప్రకటించారు. చారిత్రాత్మక జెరూసలెం పట్టణం, పరిసరాలను ఎవరికీ చెందకుండా వాటికన్‌ మాదిరి ప్రత్యేక ప్రాంతంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని అరబ్బులు తిరస్కరించారు.1948 మే 14 అధికారికంగా ఇజ్రాయల్‌ ఏర్పాటు ప్రకటన జరగ్గానే అరబ్బులు తిరుగుబాటు చేశారు అప్పటికే బ్రిటన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి ఇతర దేశాల్లోని యూదులను రప్పించటమే గాక విభజిత ప్రాంతంలో వారికి ఆయుధాలు, డబ్బు అందచేసి సిద్దంగా ఉంచారు. ఎప్పుడైతే అరబ్బులు తిరుగుబాటు చేశారో దాన్ని సాకుగా తీసుకొని . యూదు సాయుధ మూకలు మొత్తం పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నాయి.ఆ క్రమంలో ఇజ్రాయల్‌ దురాక్రమణను నివారించేందుకు ఇరుగు పొరుగు అరబ్బు దేశాలు పాలస్తీనా ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. తరువాత జరిగిన అనేక పరిణామాల్లో అమెరికా రంగ ప్రవేశం చేసి పాలస్తీనాకు గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్నది. దాని అండ చూసుకొని ఇరుగుపొరుగు దేశాలపై ఇజ్రాయల్‌ దాడులకు దిగి కొన్ని ప్రాంతాలను తన ఆక్రమణలోకి తెచ్చుకుంది. పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇతర చోట్ల నుంచి యూదులను రప్పించి అక్కడ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసి అరబ్బులను మైనారిటీలుగా మార్చివేసి అవి కూడా తనవే అనే అడ్డగోలు వాదనకు దిగింది. జరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించి అది కూడా తనదే అని ప్రకటించుకుంది. తన రక్షణకు హామీగా మరికొన్ని ప్రాంతాలను తనకు అప్పగించాలని విపరీత కోర్కెలను ముందుకు తెస్తున్నది.


మధ్య యుగాల్లో జరిగిన మత యుద్దాలలో యూదులను పాత ఇజ్రాయల్‌, జుడా దేశాల నుంచి తరిమివేశారు. ఆక్రమంలో వారంతా అనేక దేశాలకు వెళ్లారు. చరిత్రలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయల్‌ను పునరుద్దరించాలనే వాదాన్ని ముందుకు తెచ్చారు. పశ్చిమాసియాలో కనుగొన్న చమురు నిల్వలను సొంతం చేసుకోవటం కూడా దానివెనుక ఉంది. తమకు విశ్వాసపాత్రధారిగా ఉండేందుకు బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు పన్నిన ఎత్తుగడలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన పాలస్తీనాను రెండు ముక్కలుగా చేసి ఇజ్రాయల్‌ను ఏర్పాటు చేశారు. అడ్డగోలుగా చేసిన తీర్మానాన్ని యూదులు అంగీకరించగా అరబ్బులు తిరస్కరించారు. ఒక పరిష్కారాన్ని కనుగొనే పేరుతో ఐరాస కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. పాలస్తీనాను మూడు ముక్కలుగా చేసి వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇజ్రాయల్‌కు కేటాయించింది. జెరూసలెం నగరం పాలస్తీనా మధ్యలో ఉంది. పాలస్తీనా పౌరులు తమ దేశంలోని ప్రాంతాలకు వెళ్లాలంటే ఇజ్రాయల్‌ అనుమతి అవసరం. 1948 దాడులలో యూదులు జెరూసలెంను ముట్టడించారు. దాన్ని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన జోర్డాన్‌ పాలకులు జోర్డాన్‌ నదికి పశ్చిమాన ఉన్న (దాన్నే పశ్చిమ గట్టు ప్రాంతం అంటారు) పాలస్తీనా ప్రాంతాలు, తూర్పు జెరూసలెంను అదుపులోకి తీసుకొని తరువాత వాటిని విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తరువాత వాటి మీద తమ హక్కును వదులుకున్నట్లు ప్రకటించింది.


అంతకు ముందు పశ్చిమ జెరూసలెం పట్టణాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌ తరువాత అసలు మొత్తం నగరాన్ని స్వంతం చేసుకుంది. రాజధానిగా టెల్‌అవీవ్‌ ఉన్నప్పటికీ ఐరాస తీర్మానం,అరబ్బుల అభిప్రాయాలకు విరుద్దంగా పార్లమెంటుతో సహా ప్రభుత్వశాఖలన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసింది. దేశ అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు, సుప్రీం కోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేశారు. దీన్ని అంతర్జాతీయ సమాజం ఆమోదించలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 2017 డిసెంబరులో జెరూసలెంను ఇజ్రాయల్‌ రాజధానిగా గుర్తిస్తూ టెల్‌ అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు ప్రకటించాడు. వివాదాస్పద ప్రాంతంలోని ఒక భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇటీవలనే శాశ్వత భవనానికి స్థలం కేటాయించినట్లు అక్కడి మేయర్‌ ప్రకటించాడు. ఈ విధంగా ఐరాస తీర్మానాన్ని అమెరికా కూడ ఉల్లంఘించింది. పశ్చిమ గట్టు ప్రాంతం పాలస్తీనాది కాగా అక్కడ 167 అరబ్బుల నివాస ప్రాంతాలు మాత్రమే పాలస్తీనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ఇజ్రాయల్‌ తన పౌరులతో నింపేందుకు నిర్మించిన 200 నివాస ప్రాంతాలు దాని ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో మిలిటరీ,యూదు దురహంకార శక్తులు నిత్యం అరబ్బులతో గిల్లి కజ్జాలకు పాల్పడుతుంటాయి, వారు ప్రతిఘటిస్తే దాడులు జరుపుతాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనా విముక్తి కోసం పోరాడే హమస్‌ సంస్థ అధికారంలోకి వచ్చిన తరువాత 2007 నుంచి ఆప్రాంత మొత్తాన్ని ఇజ్రాయల్‌ దిగ్బంధనం గావించింది. గతంలో దాడులు కూడా చేసింది.


పాలస్తీనా ప్రాంతాలన్నింటితో కూడిన ప్రభుత్వాన్ని 1948 సెప్టెంబరు 22న అరబ్‌లీగ్‌ నాడు ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతంలో ఏర్పాటు చేసింది. దాన్ని ఒక్క జోర్డాన్‌ తప్ప అన్ని అరబ్‌ దేశాలూ గుర్తించాయి. 1988లో పాలస్తీనా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అల్జీర్స్‌లో పిఎల్‌ఏ నేత యాసర్‌ అరాఫత్‌ ప్రకటించాడు.1993లో ఓస్లో ఒప్పందాల తరువాత పశ్చిమ గట్టు, గాజా ప్రాంతాల్లో పరిమిత అధికారాలు గల ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం పాలస్తీనాను ఐరాసలోని 193కు గాను 138 దేశాలు గుర్తించాయి.2012లో ఐరాస ఆమోదించిన తీర్మానం ప్రకారం సభ్యురాలు గాని పరిశీలక దేశ హౌదాను కల్పించారు. ప్రస్తుతం అరబ్‌లీగ్‌, ఇస్లామిక్‌ దేశాల సంస్థ, జి77, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ,యునెస్కో, అంక్టాడ్‌, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో ప్రతినిధిగా ఉంది. పూర్తి స్థాయిలో ఐరాసలో సభ్యత్వం ఇస్తే ఐరాస 181 తీర్మానం ప్రకారం అన్ని ప్రాంతాలను పాలస్తీనాకు అప్పగించాల్సి ఉంటుంది. జరూసలెం సమస్యనూ పరిష్కరించాల్సి ఉంటుంది. అది జరగుకుండా అమెరికా తన వీటో హక్కుతో అడ్డుపడుతున్నది. అందువలన ఇజ్రాయల్‌తో పాటు దానికి మద్దతు ఇస్తున్న అసలైన నేరస్థురాలు అమెరికా, మద్దతు ఇస్తున్న దేశాల వైఖరిని నిరసిస్తూ నవంబరు 29న ప్రపంచమంతటా పాలస్తీనాకు మద్దతుగా జన సమీకరణ జరుగుతున్నది.మన దేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఈ మేరకు పిలుపునిచ్చింది.

భారత్‌పై ప్రపంచ మాంద్య ప్రభావం పడనుందా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నిన్నా మొన్నా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అమెజాన్‌ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్‌ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్‌లో అమెజాన్‌ కంపెనీ డేటా కేంద్రంతో వేలాది మందికి ఉపాధి కబురు. ఒక వైపు ఆర్థిక మాంద్యం గుబులు-మరోవైపు లాభాల వేటలో కంపెనీల కొత్త కేంద్రాల ఏర్పాటు ! ఐటి కంపెనీల్లో కోతలు, కంపెనీల్లో రోబోట్లు, ఆధునిక యంత్రాల ప్రవేశం వెరసి ఉద్యోగాలు హాంఫట్‌ ! ప్రపంచంలో ఏం జరుగుతోంది ? ఉన్న ఉపాధి కోల్పోయినా, కొత్త ఉద్యోగాలు రాకపోయినా కుటుంబాల మీద దాని ప్రభావం పడుతుంది. అది తిరిగి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో మందగమనం తదుపరి మాంద్యం, అది ముదిరితే ఆర్థిక సంక్షోభం. కుటుంబాల మీద మరింత ప్రతికూల ప్రభావం, ఇదొక విష వలయం. ప్రపంచం, దేశం, రాష్ట్రం, కుటుంబాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచ ధనిక దేశాల్లో మాదిరి తీవ్ర పరిస్థితులు మన దేశంలో తలెత్తుతాయా ? తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ? మనమందరం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. అందువలన ప్రతి చోటా జరిగే ప్రతి పరిణామమూ తరతమ తేడాలతో అందరి మీదా పడుతుంది. అమెరికాలో ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తే వారిలో మన భారతీయులు,తెలుగువారు, ఆంధ్ర, తెలంగాణా వారు కూడా ప్రభావితులైనారు. చివరికి వారిలో మన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా ఉండవచ్చు.


ప్రపంచ వ్యాపితంగా ఆర్థికరంగం అనిశ్చితంగా ఉంది. వచ్చే ఏడాది అనేక దేశాలు మాంద్యంలోకి వెళ్ల వచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వృద్ధి రేటును ప్రకటిస్తారు. ఏ దేశంలో వరుసగా ఆరు నెలల పాటు తిరోగమన(మైనస్‌) వృద్ది నమోదైతే అది మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. గతంలో అనేక దేశాలు అలా దిగజారి తిరిగి కోలుకున్నాయి. పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్న దేశాల్లో ప్రతి పదేండ్లకు ఒకసారి ఈ పరిస్థితి ఏర్పడినట్లు గత చరిత్ర వెల్లడించింది. 2008లో, 2020లో కరోనా సందర్భంగా తలెత్తిన పరిస్థితి కంటే రానున్న మాంద్యం మరింత తీవ్రంగా ఉండనుందని ఐరాస హెచ్చరించింది. వాణిజ్యం-అభివృద్ది 2022 నివేదిక ప్రకారం ప్రపంచం మాంద్యం అంచున ఉంది, ఆసియాలోని అభివృద్ది చెందుతున్న దేశాలు దీని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది.

ఆర్థికవేత్తలు చెప్పిన వాటన్నింటినీ క్రోడీకరిస్తే మాంద్యానికి ఐదు ప్రధాన అంశాలు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. అమెరికా డాలరు గత కొన్ని నెలలుగా బలపడుతున్నది, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. మరింత బలంగా మారనుందని అంచనా. బలమైన డాలరు అమెరికాకు బలమూ, నష్టమూ కలిగించినట్లుగానే ప్రపంచ దేశాలకూ ఉంటుంది. బ్రిటీష్‌ పౌండ్‌,ఐరోపా యురో, చైనా, జపాన్‌, మనతో పాటు దాదాపు అన్ని దేశాల కరెన్సీల విలువలను కోల్పోయాయి. ఫలితంగా దిగుమతులు భారంగా మారుతున్నాయి. ఉదాహరణకు 2014లో అక్టోబరులో ముడిచమురు పీపా ధర 92 డాలర్లు ఉండగా మన కరెన్సీలో రు.5,650 చెల్లించాము. ఇప్పుడు 91 డాలర్లు ఉండగా పీపాకు రు.7,514 చెల్లించాము. దీనికి కారణం మన కరెన్సీ మారకపు విలువ 61.40 నుంచి 82.26 దిగజారటమే కారణం. అన్ని దిగుమతి వస్తువుల ధరలూ ఇదే మాదిరి పెరిగాయి. మన వారు విదేశాల్లో చదువుకుంటే వారి మీద ఇదే మాదిరి అదనపు భారం పడుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగినపుడు, కరెన్సీ విలువలు పతనమైనపుడు అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఇది కొత్త సమస్యలకు కారణం అవుతున్నది. ఇది అమెరికాకూ వర్తిస్తుంది. అక్కడ వడ్డీ రేట్లు పెంచినపుడల్లా ఇతర దేశాల నుంచి డాలర్లు అక్కడకు చేరుతున్నాయి.దీని వలన అమెరికన్లు లాభపడుతున్నారా అంటే అదీ లేదు.ద్రవ్యోల్బణంతో వృద్ధిరేటు దిగజారి మాంద్యంలోకి దిగజారే ముప్పు ఉంది.వడ్డీ రేట్లు పెరిగితే పరిశ్రమలు, వాణిజ్యాల పెట్టుబడులపై భారం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు ఉండవు, పరిశ్రమలూ రావు. రుణాలు తీసుకొని ఇండ్లు కొనుగోలు చేసిన వారికి భారం పెరుగుతుంది. ధరల పెరుగుదలతో జనాల జేబులకు చిల్లిపడి వస్తువులను తక్కువగా కొనుగోలు చేస్తారు. అది మాంద్యానికి దారితీస్తుంది. డిమాండ్‌ తగ్గటంతో ఆపిల్‌ ఐఫోన్‌ 14 ఉత్పత్తి తగ్గించింది. దాంతో దాని షేర్ల ధర తగ్గింది.

ఇతర దేశాల్లో మాంద్య పరిస్థితులు ఏర్పడితే వాటి మార్కెట్లపై ఆధారపడిన ప్రతిదేశమూ ప్రభావితం అవుతుంది. పశ్చిమ దేశాల్లో డిమాండ్‌ తగ్గిన కారణంగా రెండు సంవత్సరాల్లో తొలిసారిగా 2022 అక్టోబరులో మన ఎగుమతులు 16.7 శాతం తగ్గాయి. దిగుమతులు పెరిగినందున మన దేశంలో డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. మన పెట్టుబడులు ఎగుమతి ఆధారితంగా ఉన్నందున వృద్ధి రేటు పడిపోనుందని అంచనా వేస్తున్నారు, అదే జరిగితే అంతర్గత డిమాండ్‌ కూడా తగ్గుతుంది. అక్టోబరు నెలలో ఎగుమతి చేసే 30 వస్తువులకు గాను 24 తిరోగమనంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బియ్యం, టీ, చమురు గింజలు, పొగాకు, చమురు గింజల ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల ఉంది. చమురు ఉత్పత్తుల ఎగుమతులు సెప్టెంబరులో 43శాతం పెరగ్గా అక్టోబరులో 11.4శాతం తిరోగమనంలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌ వస్తువులు 21.3, ఆభరణాలు 21.6, రసాయనాలు 16.4, రెడీమేడ్‌ దుస్తులు 21.2,డ్రగ్స్‌-ఫార్మా 9.24 శాతాల చొప్పున తిరోగమనంలో ఉన్నాయి. తెలంగాణా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలోని వస్తువుల ఎగుమతులు జరుగుతుంటే వాటి ప్రభావం రాష్ట్ర సంస్థలు, వాటిలో పని చేసే సిబ్బంది మీద కూడా పడుతుంది. రానున్న రోజుల్లో పశ్చిమ దేశాల్లో పరిస్థితులు ఇంకా దిగజారవచ్చని చెబుతున్నందున పరిస్థితిని ఊహించలేము.


పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభానికి గురైనపుడల్లా కార్మికవర్గం మీద దాని భారాలను మోపి తాను తప్పించుకొనేందుకు చూస్తుంది. 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత కూడా అదే జరుగుతోంది. దానిలో భాగంగా ఐటి కంపెనీలన్నీ రోబో ప్రోసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పిఏ) వైపు కేంద్రీకరించాయి. ఇది ఏదో ఒక దేశానికే పరిమితం కాదు. బాంక్‌ ఆఫ్‌ అమెరికా గతంలో ఒక విశ్లేషణలో పేర్కొన్నదాని ప్రకారం 2022 నాటికి మన దేశంలోని కోటీ 70 లక్షల ఐటి, ఐటి సంబంధిత ఉద్యోగాల్లో 30లక్షలు రద్దవుతాయని అంచనా వేసింది. పరిశ్రమల్లో కార్మికుల బదులు రోబోలు పని చేస్తాయి. ఐటి రంగంలో రోబో ప్రాసెస్‌ అంటే ఇంజనీర్ల బదులు రోబోలు అని కాదు, వాటి ప్రోగ్రామ్స్‌లో చేసే మార్పులతో ఎక్కువ మంది సిబ్బందితో పనిలేకుండా చేస్తాయి. డేటా విశ్లేషణ, ఎకౌంటింగ్‌, ఫైనాన్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి సేవలను ఆటోమేషన్‌, కృత్రిమ మేథతో చేసి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొని లాభాలకు ముప్పు లేకుండా చూసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి క్రమంలోనే అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎంతో నిపుణులైన వారిని మాత్రమే ఉంచుకుంటారు. కొన్ని కంపెనీలు తొలగించకపోయినా కొత్తగా సిబ్బందిని తీసుకోకుండా సర్దుబాటు లేదా విస్తరణకు పూనుకుంటాయి.కొత్త కంపెనీలు పరిమిత సిబ్బందిని మాత్రమే చేర్చుకుంటాయి.


గార్టనర్‌ కార్పొరేషన్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం 2022లో ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌ 20శాతం పెరుగుతుందని, అందుకోసం కంపెనీలు 290 కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు అంచనా వేసింది. ప్రపంచమంతటా 2023లో ఈ సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ రెండంకెల వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నది. అంటే అది పెరిగే కొద్దీ తీసివేతలు మరింతగా ఉంటాయి, కొత్త అవకాశాలు తగ్గుతాయి.ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే కంప్యూటర్ల మీద పనిచేసేందుకు సాంకేతిక అర్హతలున్నవారే ఉండనక్కరలేదు. మరోవైపున నైపుణ్యాలు ఎక్కువగా ఉన్న అవకాశాలు, వేతనాలూ పెరుగుతాయి. ఇదే సమయంలో జనాలకు మరింత వేగంగా సేవలు, కంపెనీలకు లాభాలు ఉంటాయి. సేవలు మెరుగుపడినందుకు సంతోషించాలా ? ఉపాధి తగ్గినందుకు విచారపడాలా ? ఇప్పుడు ప్రపంచమంతటా కంపెనీలన్నీ ఆర్‌పిఏ లాభ నష్టాల గురించి మదింపు చేసుకుంటున్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరద ప్రాంతాలకు పోడు అన్న సామెత తెలిసిందే.వర్తమాన సంవత్సరంలో ఇంతవరకు ప్రపంచంలో 853 టెక్‌ కంపెనీలు 1,37,492 మందిని తొలగించినట్లు తాజా సమాచారం. అదే కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి చూస్తే 1,388 సంస్థలు 2,33,483 మందిని ఇంటికి పంపాయని లేఆఫ్స్‌ డాట్‌ ఫై అనే సంస్థ వెల్లడించింది. ఐటి రంగంలో పని చేస్తున్న వారికి, ఉపాధికోసం చూస్తున్న వారికి 2022 సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది.


2023లో మాంద్యం తలెత్తితే మన దేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే తర్జన భర్జన మొదలైంది. మన దేశం ప్రపంచీకరణలో మరీ లోతుగా దిగలేదు గనుక అంతగా మునగం అన్నది ఒక భావం. ప్రతి సంక్షోభంలో తొలుత నష్టపడేది కార్మికులు, సామాన్యులే అన్నది గత అనుభవసారం. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన జిడిపి వృద్ది గురించి అనేక సంస్థలు ప్రతినెలా అంచనాలను తగ్గిస్తూనే ఉన్నాయి. అంతిమంగా ఎంత ఉండేది చెప్పలేని స్థితి. కరోనా మహమ్మారి తలెత్తకుండా ఉండి ఉంటే 2016 నుంచి ప్రపంచ ఉత్పత్తి 23శాతం పెరిగి ఉండేదని, ప్రస్తుత అంచనా 17శాతమే అని చెబుతున్నారు. నిజమైన జిడిపి కరోనాకు ముందున్నదాని కంటే తక్కువే. దీని వలన 17లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగిందని అంచనా. గతంలో ఎక్కువ వృద్ది రేటు ఉన్న దేశాలే ఎక్కువ భాగం నష్టపడ్డాయి.2019 జిడిపి సూచిక 110 కాగా కరోనా లేకుంటే 2023 నాటికి 123.4 పెరిగి ఉండేది, అలాంటిది ఇప్పుడు 117.3కు మాత్రమే చేరుతుందని అంచనా. ఇటీవలి పరిణామాలు మన ఆర్థిక రంగం మీద తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయి. ఆహార ధరల సూచిక 2021 నవంబరులో 148.2 ఉంటే 2022 అక్టోబరు నాటికి 165.2కు పెరిగింది. మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 2020-21లో సగటున 44.82 డాలర్లుంటే 2021-22లో 79.18, 2022-23లో నవంబరు 22 నాటికి 100.2 డాలర్లు ఉంది. ఇలాంటి భారాలు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం కావు. దేశమంతటా ఉంటాయి.


పశ్చిమ దేశాల్లో ఆర్థికరంగంలో సంభవించే మార్పుల పరిణామాలు, పర్యవసానాల గురించి అందుబాటులో ఉండే సమాచారము ఎక్కువగా ఉంటుంది గనుక విశ్లేషణలు కూడా వెంటనే వెలువడతాయి. మన దేశంలో దానికి విరుద్దం. సమాచార ప్రభావం ఎక్కడ తమ ఎన్నికల లబ్ది మీద పడుతుందో అని అధికారంలో ఉన్నవారు తొక్కి పట్టటం, ప్రభావాన్ని తక్కువగా చూపటం జరుగుతోంది. ఉదాహరణకు 2019లోక్‌ సభ ఎన్నికలకు ముందు నాలుగు దశాబ్దాల రికార్డును నిరుద్యోగం బద్దలు కొట్టిందని సమాచారం తెలుపగా దాన్ని వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. తీరా అది అనధికార మార్గాల ద్వారా బహిర్గతం కావటంతో అది తప్పుల తడక అని దాన్ని నమ్మవద్దంటూ కేంద్రం చెప్పింది. తీరా ఎన్నికలు ముగిసిన తరువాత అదే వాస్తవమంటూ ఆ విశ్లేషణను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2014 నుంచి ప్రపంచ సంస్థలు వెలువరించే అనేక సూచికల్లో మన దేశం వెనుకబడి ఉండటాన్ని చూస్తున్నాము. అన్ని దేశాలకూ వర్తింప చేసే పద్దతినే మన దేశానికీ వర్తింప చేస్తున్నప్పటికీ మన దేశ వాస్తవాలను ప్రతిబింబించటం లేదని ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది, నిరాకరిస్తున్నది తప్ప వాస్తవం ఏమిటో తన అంకెలను ఇంతవరకు వెల్లడించలేదు.


ధనిక పశ్చిమ దేశాల్లో జరిగే పరిణామాలు వెంటనే మన దేశం మీద పడే అవకాశం లేదు. 2008లో ఆ దేశాల్లో మాదిరి బాంకులు మన దేశంలో కుప్పకూలలేదు.కారణం అవి ప్రభుత్వరంగంలో ఉండటమే. ఇప్పుడు ఐటి కంపెనీల్లో జరుగుతున్న లేఆఫ్‌లు, తొలగింపులు ప్రధానంగా అమెరికాలో జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం మహా సంక్షోభంగా మారినపుడు ప్రతి దేశాన్ని ఆవహిస్తుంది. మన జిడిపి వృద్ది రేటు బ్రిటన్‌లో మాదిరి తిరోగమనంలో పడలేదు. తాజాగా బ్రిటన్‌లో తలెత్తిన స్థితిని చూస్తే మాంద్యం కారణంగా ఎనిమిది సంవత్సరాల్లో పెరిగిన గృహస్తుల రాబడి హరించుకుపోయి జీవన వ్యయ సంక్షోభం తలెత్తింది.వంద బిలియన్‌ పౌండ్ల ప్రభుత్వ ఉద్దీపన ఉన్నప్పటికీ 2024 ఏప్రిల్‌ నాటికి నిజ ఆదాయాలు ఏడుశాతం తగ్గుతాయని అంచనా. ఉత్పత్తి రెండు శాతం తిరోగమనంతో ఐదులక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా.


పశ్చిమ దేశాల్లో తలెత్తిన సంక్షోభం మన దేశంలో లేదా తెలంగాణాలో లేదు అంటే దాని అర్ధం అసలేమీ సమస్యలు లేవని అంతా సజావుగానే ఉందని కాదు. తెలంగాణా పౌరస్పందన వేదిక నిర్వహించిన ఒక సర్వే, యుటిఎఫ్‌ చెబుతున్న దాని ప్రకారం రాష్ట్ర పాఠశాలల్లో 26వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బంగారు, ధనిక రాష్ట్రం అని చెబుతున్న చోట ఇలాంటి పరిస్థితి ఉండటం ఆర్ధిక ఇబ్బందులకు నిదర్శనంగా చెప్పవచ్చు. మార్చి నెలలో సిఎం కెసిఆర్‌ ఆర్భాటంగా ప్రకటించిన 90వేల ఖాళీల భర్తీ ఎక్కడుందో ఎవరికీ అర్ధం కాదు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల గురించి చెబుతున్న అంకెలకు ఒకదానికి ఒకటి పొంతన ఉండటం లేదు. ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప జనానికి అర్ధం కాదు. ఉన్న సిబ్బంది, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏటా ఏడున్నరవేల కోట్ల మేరకు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ కారణంగానే గత ఎనిమిది సంవత్సరాలుగా సంక్షేమ పథకాలకు తప్ప ఉద్యోగాల భర్తీకి పూనుకోవటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెబుతున్నారు.ప్రభుత్వం మీద పైసా అదనపు భారం పడని వివిధ రంగాల కనీసవేతనాల సవరణకూ ప్రభుత్వం ముందుకు రావటం లేదు.


తెలంగాణాలో ఉన్న భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు వంటి చర్యల ద్వారా సమకూరుతున్న ఆదాయం సంక్షేమ పథకాలకు తప్ప వనరుల పెంపుదలకు అవసరమైన పెట్టుబడులు పెట్టటం లేదనే విమర్శ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించేందుకు ప్రభుత్వాలు తీసుకొనే రుణాలకు పరిమితులు ఏర్పడటంతో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పులు తీసుకొని వాటికి ప్రభుత్వం హామీదారుగా ఉంటున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఈ మొత్తాలను కూడా ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని ప్రకటించి వెనుకటి నుంచి అమలు జరుపుతామని ప్రకటించటంతో కొత్తగా తీసుకొనే రుణాల మొత్తం తగ్గే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి అప్పులను బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తీసుకుంటున్న కారణంగా వచ్చే ఏడాది నుంచి అమలు జరుపుతామని చెప్పటంతో కాస్త ఊరట లభించింది. వర్తమాన సంవత్సర జిఎస్‌డిపి పదమూడు లక్షల కోట్లుగా అంచనా వేశారు.దీని ప్రకారం నాలుగుశాతం అంటే 52వేల కోట్ల మేరకు అప్పులు తీసుకోవచ్చు. హామీ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో 43వేల కోట్లకు మించి తీసుకొనే అవకాశం లేకపోయింది. దీంతో నెలవారీ ఖర్చులు – రాబడి తేడా ఒకటి నుంచి రెండువేల కోట్ల వరకు ఉండటంతో ప్రతినెలా ఇబ్బంది పడుతున్నది. అనేక అభివృద్ధి పనులకు కోతలు పెడుతున్నారు.2020-21లో ఇండ్ల నిర్మాణానికి 10,591 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం ఆరువందల కోట్లే. అలాటే పట్టణాభివృద్దికి 13,053 కోట్లకు గాను ఖర్చు 3,816 కోట్లు మాత్రమే. అందుకే రెండు పడకల ఇండ్లు లేవు, పట్టణాల్లో వరదలు వస్తే తట్టుకొనే స్థితిలేదు. ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్‌లో ఎన్నికోతలు పెట్టేది తరువాత గానీ వెల్లడి కాదు. ప్రపంచం, దేశంలో మాంద్యం తలెత్తితే తెలంగాణాకు మినహాయింపు ఉండదు.