మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము
అని ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రాసిన జన్మభూమి గీతాన్ని ఎవరు మరచి పోరు.మేరా భారత్‌ మహాన్‌, నిజమే ! నా దేశం గొప్పది. అందులో ఎలాంటి సందేహం లేదు. నా దేశమే గొప్పది, తరువాతే మిగతావి అంటేనేే తేడా వస్తుంది. వసుధైక కుటుంబం అన్న మహత్తర భావన మన దేశంలో తరతరాలుగా జనంలో నాటుకుపోయింది. అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే వారితో ఎలాంటి పేచీ లేదు. ఒకవైపు ఆ మాట చెబుతూనే మరోవైపు దానికి విరుద్దమైన ఆచరణతోనే అసలు సమస్య.


తాజాగా సామాజిక మాధ్యమంలో కొన్ని పోస్టులు తిరుగుతున్నాయి. ఒకదానిలో ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుస్తుగా కోవాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం, నరేంద్రమోడీగారికే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో సాధించిన విజయాలను ఎవరైనా పొగిడితే పోయేదేమీ లేదు. అబద్దాల ప్రచారాన్ని చూసి ప్రపంచమంతా నవ్వితే ఎవరికి నష్టం. అన్నీ ఉన్న ఆకు అణగిమణగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. కరోనా పోరులో ఉన్న మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఇతరులకు ఉచితంగా వేస్తామని, అందుకయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించలేకపోతే కేంద్రమే భరిస్తుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సాధారణ పౌరులకూ అలాగే వేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో వెనకో ముందో అనేక దేశాల్లో కరోనా పోరులో 200 వరకు వాక్సిన్ల తయారీకి కసరత్తు జరుగుతోంది. వాటిలో మన దేశంలో హైదరాబాదు కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ పేరుతో ఒక దాన్ని తయారు చేస్తున్నది.


ఇక ఇతర దేశాల విషయానికి వస్తే ఉచిత వ్యాక్సిన్‌ వేయాలని జపాన్‌ పార్లమెంటులో చట్టపరమైన నిర్ణయం చేశారు.ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ , నార్వే వంటి అనేక దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. అన్నింటి కంటే చైనాలో ఉచితంగా, ప్రయోగాత్మకంగా వాక్సిన్‌ ఇవ్వటం గతేడాదే ప్రారంభించారు. ప్రచార కండూతి లేదని ఒక వైపు చెప్పుకుంటూనే బిజెపి తన ప్రచార సేన ద్వారా సామాజిక మాధ్యమంలో ఇలాంటి పోస్టులు పెట్టించుకోవటం ఎవరెరుగనిది. గుడ్డిగా నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు.

మరో పోస్టు కూడా తిరుగుతోంది. ప్రపంచానికి అమెరికా ఆయుధాలు ఇచ్చింది చంపుకోమని, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ఇచ్చింది చంపమని,చైనా కరోనాను ఇచ్చింది అందరూ చావాలని, నా భారత దేశం మాత్రమే మెడిసిన్‌ ఇస్తుంది అందరూ బతకాలని, అని దానిలో రాశారు. ఇది కాషాయ దళాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అని వేరే చెప్పనవసరం లేదు. 2010-14 సంవత్సరాలతో పోల్చితే 2015-19 మధ్య (ట్రంప్‌ ఏలుబడి) అమెరికా అమ్మిన ఆయుధాలు 23శాతం పెరిగాయి. అనేక దేశాల మీద యుద్దాలు చేస్తూ, చేయిస్తూ ఆయుధ పరిశ్రమలకు లాభాల పంట పండిస్తున్న అమెరికా మనల్ని కూడా వదల్లేదు. చైనా మీదకు మనల్ని ఉసిగొల్పటం, చైనాను బూచిగా చూపి దాని ఆయుధాలను మనకూ అంటగడుతోంది. తన దగ్గర కాకుండా రష్యా దగ్గర కొనుగోలు చేస్తామంటే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తోంది.అలాంటి ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన పెద్దమనిషి నరేంద్రమోడీ, అలాంటి అమెరికా మనకు భాగస్వామి అని, ఎలా కౌగిలింతలతో గడిపారో తెలిసిందే. మన అదృష్టం కొద్దీ ట్రంప్‌ ఓడిపోయాడు గానీ లేకుంటే పరిస్ధితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే !


ప్రపంచానికి భారత్‌ మాత్రమే మెడిసిన్స్‌ ఇస్తుందా ? 2019లో బ్లూమ్‌బెర్గ్‌ అనే అమెరికా కార్పొరేట్‌ సంస్ధ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల సూచిక అంటూ 169 దేశాల జాబితా ఇచ్చింది. దానిలో మన స్ధానం 2017తో పోల్చితే 119 నుంచి 120కి పడిపోయింది. ఈసూచికకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మన దేశం ఎన్ని ఔషధాలు తయారు చేస్తున్నది అని కాదు, మోడీ పాలనలో జనాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచారో అని గర్వపడాలి. ఎందుకంటే కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది బిజెపినే కనుక ఆ ఖ్యాతి కూడా మోడీగారి ఖాతాకే జమకావాలి !


ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో చైనా మూడు స్ధానాలను పెంచుకొని 52వ స్ధానంలో ఉంది. మన పక్కనే ఉన్న శ్రీలంక 66, బంగ్లాదేశ్‌ 110 స్ధానాల్లో ఉండగా మన 120వ స్ధానానికి దగ్గరగా పాకిస్ధాన్‌ 124లో ఉంది. ఆరుదశాబ్దాలకు పైగా అష్టదిగ్బంధనలో ఉన్న క్యూబా 31 నుంచి 30వ స్ధానానికి ఎదగ్గా, దాన్ని నాశనం చేయాలని చూస్తున్న అమెరికా 34నుంచి 35కు పడిపోయింది. జనం ఆరోగ్యానికి తోడ్పడని ఔషధాలు ఎన్ని తయారు చేస్తే ప్రయోజనం ఏముంది ?అదేదో సినిమాలో అన్నట్లు దీనమ్మ జీవితం ఏది మాట్లాడినా నరేంద్రమోడీకే తగులుతోంది.


ఇక నరేంద్రమోడీ గారి ఖాతాలో జమ కావాల్సిన మరో ఘనత కూడా ఉంది. 1995 నుంచి నేటి వరకు గుజరాత్‌ బిజెపి ఏలుబడిలో ఉంది.దానిలో సగం కాలం నరేంద్రమోడీ గారు పన్నెండు సంవత్సరాల 227 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ప్రధాని అయ్యారు. 1990-2016 సంవత్సరాల మధ్య వ్యాధుల భారం గురించి ఒక విశ్లేషణ జరిగింది.దాని ప్రకారం 1990లో గుజరాత్‌లో వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలకు కారణాలలో ప్రధమ స్ధానంలో 36.1శాతం పోషకాహార లేమిగా తేలింది.2016 నాటికి 14.6శాశాతానికి తగ్గినా ప్రధమ స్ధానం దానిదే. ఇదే సమయంలో కేరళ వ్యాధుల భారం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా ప్రధమ స్ధానంలో ఉంది. అక్కడ పైన పేర్కొన్న విశ్లేషణ కాలంలో మరణాల కారణాలలో ప్రధమ స్ధానంలో ఉన్న పోషకాహార లేమి 17.4 నుంచి 4.4శాతానికి, ప్రధమ స్దానం నుంచి తొమ్మిదికి తగ్గింది. మందులు ఎన్ని ఉత్పత్తి చేస్తున్నామన్నది కాదు, వాటి అవసరం లేకుండా ఏ చర్యలు తీసుకున్నారన్నది ముఖ్యం.


మన దేశం ఔషధాల ఉత్పత్తిలో ముఖ్యంగా వాక్సిన్లు, జనరిక్‌ ఔషధాల ఉత్పత్తిలో అగ్రస్ధానంలో ఉన్నమాట వాస్తవం. అదేదో ఆరున్నరేండ్ల నరేంద్రమోడీ పాలనలోనే సాధించినట్లు చిత్రిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఔషధాల ప్రయోగాలకు దొరికే వలంటీర్ల ఖర్చు మన దగ్గర చాలా తక్కువ, సకల రోగాలకు నిలయంగా ఉంది గనుక ప్రయోగాలూ ఇక్కడ ఎక్కువే. నిపుణులు ఉండటం, ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండటం వంటి అంశాలు మన దేశంలో ఔషధ పరిశ్రమ అభివృద్దికి తోడ్పడ్డాయి.అయితే ప్రపంచంలో మన స్ధానం ఎక్కడ అని చూస్తే మొదటి 15దేశాలలో 2018 సమాచారం ప్రకారం 16.8శాతంతో జర్మనీ ప్రధమ స్ధానంలో ఉండగా 12.2, 7.5 శాతాలతో స్విడ్జర్లాండ్‌, బెల్జియం తరువాత ఉన్నాయి. మన దేశం 3.8శాతంతో 12పన్నెండవ స్ధానంలో ఉంది. మొదటి స్ధానంలో ఉన్న జర్మనీ ఎగుమతుల విలువ 62.3 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ 14.5బి.డాలర్లు. మన ఈ స్ధానానికి చైనా కూడా ఒక కారణం. మన ఔషధ ఉత్పత్తులకు అవసరమైన ముడి సరకుల్లో చైనా నుంచి 60నుంచి 70శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాము. మిగతా దేశాలతో పోలిస్తే అవి చౌక గనుకనే ఆ దిగుమతులు అన్నది గమనించాలి. అందువలన గొప్పలు చెప్పేవారు ఇంటా బయటా నిజంగా నరేంద్రమోడీ పరువు పెంచాలనుకుంటున్నారా తుంచాలనుకుంటున్నారో ఆలోచించుకుంటే మంచిది. ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుంటే నరేంద్రమోడీ గారికి గౌరవం, మర్యాద మిగులుతాయి.ప్రతిపక్షాలు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాయి. భక్తులే వాటిని సమర్పించుకుంటుంటే ?

మన గతం ఘనమైనదా కాదా ? దాన్ని అంగీకరిస్తారా లేదా ? గతం, వర్తమానం దేనిలో అయినా ఘనమైనవే కాదు, హీనమైనవి కూడా ఉంటాయి. కులాల కుంపట్లు, ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనం వంటివి ఎన్నో ! రెండోవాటిని ఎప్పటికప్పుడు వదిలించుకోకపోతే ఘనత పాతాళానికి పోతుంది.మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంలో భిన్న భావజాలాలను సహించటంలో మన గతం ఘనమైనదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా ? ప్రపంచంలో ఫాసిస్టు శక్తుల చరిత్రను చూసినపుడు ఊహాజనిత లేదా కల్పితమైన వాటిని రాబట్టేందుకు ప్రయత్నించటం, విభజన తీసుకురావటం, ఆధారాలు లేని వాటిని కీర్తించటం, లేనిగొప్పలు వర్తింప చేయటం, వైఫల్యాలకు కొందరిని బూచిగా చూపటం, వ్యక్తుల మీద కేంద్రీకరించటం ఒక లక్షణం.


కరోనా వాక్సిన్‌ మన దేశంలో తయారు చేసినా మరో దేశంలో రూపొందించినా అది శాస్త్రీయ ప్రాతిపదికన తయారు చేస్తున్నది తప్ప మాయలు మంత్రాలతో కాదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని గతంలో చెబితే ఇప్పుడు ఆవు మూత్రం-పేడలో లేనిదేమీ లేదు అని చెప్పటాన్ని చూస్తున్నాము. మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరుగని కరోనా మహమ్మారి ముంచుకువచ్చినా దాన్నుంచి రక్షించేందుకు వాటినేవీ బయటకు తీయలేదంటే ఉన్నాయని చెబుతున్నవారినేమనాలి ? నిజంగా అవి ఉండీ ఉపయోగం ఏముందీ !


ఊహలను వాస్తవాలుగా సాక్షాత్తూ నరేంద్రమోడీయే చెప్పటాన్ని చూశాము.వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి ఏనుగుతల అంటించటం,కృత్రిమ గర్భం ద్వారా కర్ణుడిని కనటం వేల సంవత్సరాల క్రితమే ఉందని నరేంద్రమోడీయే సెలవిచ్చారు. గురుత్వాకర్షణ, అణు సిద్దాంతం అన్నీ పాతవే, మనవే అని చెప్పిన తీరు చూశాము. ఇన్ని చెప్పిన వారు ఆవు మూత్రంలో ఏమున్నాయో తెలుసుకొనేందుకు పరిశోధనలు జరపమని పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటాన్ని ఏమనాలి. వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అన్నింటి గురించీ చెప్పారు గానీ ఆవు మూత్రంలో ఏమున్నాయో చెప్పలేదా ! పోనీ ఆవు మూత్రం నుంచి కరోనా వాక్సిన్నూ రూపొందించలేదూ ?

ప్రపంచమంతా కరోనా కల్లోలం గురించి ఆందోళన పడుతుంటే బిజెపి, ఇతర కాషాయ పెద్దలు చెప్పిందేమిటి ? గతంలో ఆవు మూత్రం తాగితే క్యాన్సరే మాయం అవుతుందన్నారు, తాజాగా దాన్ని కరోనా వైరస్‌కు ఆపాదించారు. దీపాలు వెలిగిస్తే వైరస్‌ భస్మం అవుతుందన్నారు. జనం అవన్నీ మరచిపోయారని కాబోలు ఇప్పుడు తమ నరేంద్రమోడీయే దగ్గరుండి వాక్సిన్‌ తయారు చేయిస్తే ఓర్చుకోలేకపోతున్నారని ఎదురుదాడికి దిగారు. ” ఆర్ధికంగా, వైద్యపరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు, శానిటైజర్లు వాడని హిందూ వ్యతిరేక మతాల మధ్య భారత్‌ కరోనా భరతం పట్టిందని, రెండు టీకాలు కనిపెట్టిందని ” తిప్పుతున్న పోస్టులో మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అనుమతించిన రెండింటిలో భారత్‌ బయోటెక్‌ వాక్సిన్‌ మాత్రమే మనది. మన దేశంలో సీరం సంస్ధ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-ఆస్ట్రజెనికా తయారు చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా కొరవడిన పోస్టు అది.


ముస్లిం మత పెద్దలు కూడా తక్కువ తినలేదు. ఐదుసార్లు కడుక్కుంటే కరోనా అంటుకోదన్నారు. మసీదులను మూసివేస్తే దేవుడికి ఆగ్రహం వస్తుందన్నారు.మహిళల చెడునడత కారణంగా దేవుడికి కోపం వచ్చి కరోనా రూపంలో శిక్షిస్తున్నాడన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు చైనా వారే వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలారని చెప్పారు.మనుషుల బుర్రలను నియంత్రించేందుకు యూదులు కరోనా వాక్సిన్‌ ఉన్న చిప్స్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారన్నారని ముస్లిం మతోన్మాదులు చెబుతున్నారు.


ఇంటా బయటా మతశాస్త్రాల బోధన – విద్యాలయాల్లో విజ్ఞానశాస్త్ర బోధన జరుగుతున్నా మూఢత్వం వదలని కారణంగా మొదటిదాని మీద ఉన్న విశ్వాసం రెండవదాని మీద లేదు. ఒక వేళ ఉంటే మోడీ వంటి పెద్దలు ఆశాస్త్రీయ, ఊహాజనిత అంశాలను ప్రచారం చేయగలరా ? ఆవు చేలో ఉంటే దూడలు గట్టున ఉంటాయా ? బిజెపి ఎంపీ, మాలెగావ్‌ పేలుళ్ల కేసు ముద్దాయి ప్రజ్ఞాసింగ్‌ ఒక టీవీలో మాట్లాడుతూ ఆవు మూత్రం కలిపినదానిని తాగితే తన రొమ్ముక్యాన్సర్‌ నయమైనట్లు చెప్పారు. పాలకులకు తాన తందాన పలికే ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు కొన్నివేల సంవత్సరాల క్రితమే కణ పరిశోధనలు జరిపారని, వంద మంది కౌరవులు ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పుట్టారని సైన్స్‌ కాంగ్రెస్‌ సభలోనే సెలవిచ్చారు. అంతటితోనే ఆగలేదు నియంత్రిత క్షిపణులంటే వేరే ఏమీ కాదు విష్ణు చక్రం అన్నారు, రావణుడు24 రకాల విమానాలను వివిధ విమానాశ్రయాలకు నడిపినట్లు చెప్పారు. రాముడు-రావణుడు ఒకే కాలం నాటి వారు రావణుడికి విమానాలు ఉంటే రాముడికి లారీలు, జీపులు కూడా ఎందుకు లేవు ? రావణుడిని చంపే రహస్యాన్ని తెలుసుకున్న రాముడి పరివారం విమానాల టెక్నాలజీ గురించి తెలుసుకోలేకపోయిందా ? బ్రహ్మ డైనోసార్లను కనుగొన్నట్లు చెబుతారు. త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ అయితే మహాభారత కాలం నాడు ఇంటర్నెట్‌ ఉండబట్టే యుద్ధంలో ఏం జరిగిందో ఎప్పటి కప్పుడు సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలుసుకోగలిగినట్లు చెప్పారు.నెమళ్లు ఎన్నడూ జతకూడవని, మగనెమలి కన్నీటితో ఆడనెమలి పునరుత్పత్తిలో భాగంగా గుడ్లు పెడుతుందని ఒక న్యాయమూర్తి సెలవిచ్చిన విషయం తెలిసిందే. పురాతన భారత్‌ను పొగిడే పేరుతో మత రాజ్యాలవరకు జనాన్ని తీసుకుపోవటమే లక్ష్యం. కాలుష్య నివారణకు యజ్ఞాల గురించి చెప్పేవారిని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, లక్ష సంవత్సరాల నాడే హిందూ రుషులు అణుపరీక్షలను జరిపారని చెప్పే శాస్త్రవేత్తలను, అప్పడాలు తింటే కరోనా పోతుందని చెప్పిన వారినీ చూశాము. కరోనా దెబ్బతో అలాంటి సొల్లు కబుర్లు చెప్పేవారి నోళ్లు కొంత మేరకు మూతపడ్డాయి. అలాంటి వారికి కరోనా సోకినపుడు ఆసుపత్రుల్లో చేరి ఉపశమనం పొందారు తప్ప ఆవు మూత్రం, అప్పడాల మీద ఆధారపడలేదు.


ప్రతిదానికి ప్రధాని నరేంద్రమోడీని ఎందుకు విమర్శిస్తున్నారు అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. దీనిలో రెండు రకాలు అసలు మోడీ ఏం చేసినా విమర్శించకూడదు అనే ఒక ప్రమాదకరమైన ధోరణితో కావాలని అడిగేవారు ఒక తరగతి. ఏదో చేస్తున్నారు కదా కాస్త సమయం ఇవ్వాలి కదా అప్పుడే విమర్శలెందుకు అని అడిగేవారు మరికొందరు.రెండో తరగతి కల్మషం లేని వారు. విమర్శకు పెద్ద పీట వేసేది ప్రజాస్వామ్యం. నియంతృత్వ లక్షణాల్లో భజనకు అగ్రపీఠం ఉంటుంది. అన్నీ నెహ్రూ, కాంగ్రెసే చేసింది అని కాషాయ దళాలు ఎలా విమర్శిస్తున్నాయో, వారు చేసిన తప్పిదాలను సరిచేసే పేరుతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ, బిజెపి అంతకంటే దారుణంగా వ్యవహరించింది అనే రోజులు రావని ఎవరు చెప్పగలరు? ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించటమే దేశద్రోహం అయితే మొదటి ద్రోహి బిజెపినే అని చెప్పాలి. ఎవరైనా అవ్వతో వసంతమాడతారా ? ప్రయోజనం ఏముంది, అందుకే అధికారంలో ఉన్న నరేంద్రమోడీ నాయకత్వాన్ని గాక ఇతరులను విమర్శిస్తే అర్ధం ఏముంది ? ఏమైనా సరే మా మోడీని విమర్శిస్తే సహించం అంటే కుదరదు. గతంలో ఇందిరే ఇండియా – ఇండియా ఇందిర అన్న కాంగ్రెస్‌ భజన బృందం కంటే ఇప్పుడు మోడీ దళం ఎక్కువ చేస్తోంది. అది మోడీకే నష్టం కాదంటారా ? కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినన్ని దశాబ్దాలు బిజెపికి జనం ఇవ్వరు !

నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Tags

, , , , , ,



ఎం కోటేశ్వరరావు


దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక పాట గుర్తుకు వస్తోంది. నేను పుట్టాను లోకం మెచ్చిందీ-నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది..నాకింకా లోకంతో పని ఏముంది… అలా సాగుతూ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి… ఐ డోన్ట్‌ కేర్‌ ….అని బాగా ప్రాచుర్యం పొందిన ప్రేమనగర్‌ సినిమాలోని యాభై సంవత్సరాల నాటి పాట ఇది.


ఈ మధ్య కార్పొరేట్‌లు దేశభక్తులు, వారు లేకపోతే సెల్‌ఫోన్లు లేవు, ఉపాధి లేదు, అసలు మన జీవితమే లేదు, వారిని విమర్శించేవారు దేశద్రోహులు అనే ధోరణి పెరిగిపోతోంది. కార్పొరేట్లే అన్నింటినీ జనానికి అందుబాటులోకి తెచ్చాయి అన్నది వారి వాదన. అరే నీకు తెలుసా లండన్‌లో చిన్న పిల్లలు, చివరికి కూరగాయలు అమ్మేవారు, రోడ్లు ఊడ్చేవారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారంట అంటే అవునా అని చిన్న తనంలో ఎబిసిడిలు నేర్చుకోవటానికి కష్టపడిన సమయంలో ఆశ్చర్యపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. అందువలన ఇప్పుడా స్దితి కాదు గనుక అన్నీ కార్పొరేట్లే చేశారు అనే దానితో ఏకీభవించినా లేకున్నా వారి మనోభావాలను గాయపరచకూడదు కదా ! కనుక కార్పొరేట్‌లను, వారికి వెన్నుదన్నుగా ఉన్న వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నాను. అలాంటి దేశభక్తులు నువ్వు ద్రోహం చేస్తున్నావంటే అసలు నువ్వు పెద్ద ద్రోహివని వీధులకు ఎక్కుతున్నారు. జనానికి తెలియని విషయాలను చెబుతున్నారు. కోవాక్స్‌ పేరుతో విదేశాల్లో రూపొందించిన కరోనా వాక్సిన్‌ను మన దేశంలో తయారు చేస్తున్న సీరం సంస్ధ-స్వయంగా రూపొందించి తయారు చేస్తున్న భారత బయోటెక్‌ యజమానులు ఎలా అసలు విషయాలు చెప్పిందీ చూశాము. నీది హానిలేని నీటితో సమానమైందని ఒకరంటే, అసలు నీ వాక్సిన్‌తో వచ్చే దుష్ప్రభావాల గురించి నువ్వు దాచి పెట్టలేదా అని ఇద్దరూ గోదాలోకి దిగారు. మీ రెండు వాక్సిన్లను జనానికి అంటగట్టేందుకు మై హూనా అంటూ మీలో మీకు గొడవెందుకని తెరవెనుక ఉన్న కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దాంతో ఇద్దరం గొడవ పడకుండా ఎవరిది వారు అమ్ముకుందా అని రాజీపడ్డారు. జనం కళ్ల ముందే ఇది ఇద్దరు కార్పొరేట్‌ కరోనా వాక్సిన్‌ దేశభక్తులు-వారికి వెన్నుదన్నుగా ఉన్న వారి వాస్తవ కధ !


ఇటీవల సిమెంట్‌, ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వస్తున్నవార్తల గురించి తెలిసిందే. ముడి ఇనుప ఖనిజపు ధరలు రెట్టింపు అయ్యాయి. పదేండ్ల నాటి రికార్డులతో పోటీ పడ్డాయి. ఎగుమతిదార్లతో పాటు ఆ పేరు చెప్పి ఉక్కు ఉత్పత్తిదారులూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ధరలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కార్పొరేట్‌ కంపెనీలు పోటీ పడి వినియోగదారుడి కాళ్లను నెత్తిమీద పెట్టుకుంటాయని కథలు చెప్పినవారు, దానికి ఉదాహరణగా సెల్‌ ఫోన్‌ కంపెనీలను ఉదాహరించే వారు గానీ మనకు ఎక్కడా కనిపించటం లేదు. కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలు పెంచేశాయని ఏకంగా కేంద్ర మంత్రులే గగ్గోలు పెడుతున్నారు. ఇక గృహనిర్మాణ కంపెనీల దేశభక్తులు సిమెంట్‌, ఉక్కు కంపెనీలే కారణమని గగ్గోలు పెడుతుంటే మీరు మాత్రం తక్కువగా మీ నిర్మాణంలో మా సిమెంటు పాలెంత మీరు ఎంతకు అమ్ముతున్నారో ఎలా సొమ్ము చేసుకుంటున్నారో మాకు తెలియదా, లెక్కలు చెప్పమంటారా అని సిమెంట్‌ దేశభక్తులు ఎదురుదాడికి దిగారు. ఇది ఇంతటితో ఆగలా !


ఇనుప ఖనిజం తవ్వకం,ఎగుమతి-ఉక్కుతయారీ దేశభక్తులు కూడా తక్కువ తినలేదు. రాజకీయ నేతలు మనోభావాలను వాడుకుంటున్నపుడు మనం ఎందుకు తగ్గాలంటూ వారు కూడా నీ దేశభక్తి ఎంత అంటే నీది ఎంత అని దెబ్బలాడుకున్నారు. ఇద్దరూ తమ కోవెల అయినా ప్రధాని కార్యాలయంలో కొలువు తీరిన పెద్దాయనకు లేఖలు రాస్తున్నారు. తమ దేశభక్తిని శంకించటం ఉక్కుకు( ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌-ఐఎస్‌ఏ) తగని పని అని ఇనుపఖనిజం (భారతీయ ఖనిజ పరిశ్రమల ఫెడరేషన్‌-ఫిమి) మండిపండింది. ఒకవైపు చైనాతో వాణిజ్యం సాగిస్తున్న ఉక్కుగాళ్లు మేము ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నామంటూ మా దేశభక్తిని శంకించటం తగిని పని అని ఫిమి పేర్కొన్నది. లడఖ్‌ సరిహద్దులో తలెత్తిన వివాదం తరువాత చైనాతో లావాదేవీల విషయంలో అనేక ఆంక్షలు ఉండగా గనుల యజమానులు ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 92శాతం ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేశారని ప్రధానికి ఉక్కు రాసిన లేఖలో మనోభావాన్ని గుర్తు చేసింది.

ఇనుప ఖనిజం నుంచి వేరు చేసిన ముడి ఇనుప గుళికలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్ద కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీకి మాత్రమే అనుమతి ఉంది. గత ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో 7.52 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని గనుల యజమానులు ఎగుమతి చేశారు. వాటిపై నిషేధం విధించాలంటున్న ప్రాధమిక ఉక్కు తయారీ(గుళికలు)దారులు గతేడాది అక్రమంగా 10.63 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేశారని, ఇనుప ఖనిజానికి దేశంలో కొరత లేదని ఇది వెల్లడించటం లేదా అని ఫిమి వాదించింది. ఏప్రిల్‌-అక్టోబరు మధ్య ఎగుమతి చేసిన 33 మిలియన్‌ టన్నుల ఖనిజంలో 19మి.టన్నులు 58శాతం లోపు ఇనుము ఉండే ముడి ఖనిజం ఎగుమతి అయిందని, మన ఉక్కు కంపెనీలు 63శాతంపైగా ఇనుము ఉన్న ఖనిజాన్నే వినియోగిస్తాయని అందువలన తాము ఎగుమతి చేయటం వలన కొరత అనటం అర్ధం లేదని ఫిమి చెబుతోంది. అంతేనా గత ఆరునెలల్లో ఇనుప ఖనిజం ధరలు టన్నుకు రూ.1,950 నుంచి 4,110కి పెరిగితో మరోవైపు ఉక్కు రూ.16,700 నుంచి 51,590కి పెరగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.ఉక్కు పరిశ్రమ యజమానులు తమ స్వంత లేదా స్దానిక గనుల నుంచి ఉన్నతస్దాయి ఖనిజాన్ని పొందుతూ ధరలు మాత్రం అంతర్జాతీయ స్ధాయిలో వసూలు చేస్తూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారని ఫిమి పేర్కొన్నది.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ? ఎవరు చెబుతున్నది, ఏది నిజం ? జనం జేబుల ఖాళీ పచ్చినిజం. మేం ఇటు జనానికి దేశభక్తి , లవ్‌ జీహాద్‌, హిందూత్వను ఎక్కిస్తుంటాం, వారు వెంటనే ఈ మత్తునుంచి తేరుకోలేరు గనుక మీరు అటు చైనాతో ఎగుమతి వ్యాపారం ద్వారా, ఇటు జనానికి ధరలు పెంచి రెండు చేతులా లాభాలు పిండుకోండి, ఎన్నికల సమయంలో మా సంగతి చూడండి అని ఖనిజ,ఉక్కు కార్పొరేట్‌ దేశభక్తులకు చెప్పారన్నది అర్ధం కావటం లేదూ !


ఇలాంటి పరిస్ధితి ఉంటే ఏమౌతుంది ? రికార్డు స్ధాయిలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి, ఏమైంది ? మోడీభక్తితో సమర్పించుకోవటంలా ? ఉక్కు ధరలు పెరగటం, తరచూ మారటం ఒక సమస్య అని వీల్స్‌ ఇండియా( ఆటోమొబైల్స్‌ పరిశ్రమకు అవసరమైన ఉక్కు విడిభాగాలు తయారు చేసే కంపెనీ) ఎండీ శ్రీవత్స రామ్‌ అంటున్నారు. వాణిజ్య పధకాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది, మోడీగారి ఎగుమతి పధకమైన మేకిన్‌ ఇండియా మూలనపడుతుంది. ప్రాజెక్టులు, ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతాయి, నిరుద్యోగం పెరుగుతుంది,కొనుగోలు శక్తి తగ్గుతుంది. దరిద్రం పెరుగుతుంది. ఇంతకంటే ఏం జరగదు. కార్పొరేట్‌ లాభాలకు కరోనా కాలంలోనే ఢోకా లేదు గనుక ఇప్పుడు ఏమీ కాదు.


చైనా ప్రపంచమంతటి నుంచి చేసుకుంటున్న వస్తు దిగుమతులు 2020 సంవత్సరాన్ని కాపాడాయని, ఇదొక చారిత్రక పాఠం, హెచ్చరికగా తీసుకోవాలని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతటా గిరాకీ పడిపోతే ఒక పెద్ద దేశంగా సహజ వనరులను కొనుగోలు చేసిన తీరు చరిత్ర. అయితే చైనా తాజాగా విడుదల చేసిన డిసెంబరు గణాంకాలను చూస్తే దాని కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశాలు వెల్లడయ్యాయి. ఇది వస్తుమార్కెట్‌కు పొంచి ఉన్న ముప్పుగా పరిణమిస్తున్నారు. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో దిగుమతులు తగ్గిపోయాయి. వీటిలో చమురు, రాగితో పాటు ఇనుప ఖనిజం కూడా ఉంది. చైనా వారు ఆకలితో మాడుతున్నారు గనుక మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేవారు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. ఆకలితో మాడేవారు ఇనుపఖనిజం ఏం చేసుకుంటారు అంటే ఏం చెబుతారో తెలియదు.

ఇక మన ఇనుప ఖనిజ ఎగుమతి దేశ భక్తులు ఖజానాకు చెల్లించాల్సిన 7,08,000 కోట్ల రూపాయల డ్యూటీ ఎగవేసి చైనాకు ఎగుమతులు చేశారని, 61 సంస్ధల నుంచి ఆ మొత్తాలను వసూలు చేయాలని సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి, ఎగుమతి సంస్ధలకు నోటీసులు జారీ చేసి చేసింది. డ్యూటీని ఎగవేసేందుకు తప్పుడు టారిఫ్‌ కోడ్‌ను చూపి 2015 నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన సంస్దలలో ఎస్సార్‌ స్టీల్‌, జిందాల్‌ స్టీలు మరియు పవర్‌ కంపెనీ ఉన్నాయని, 30శాతం డ్యూటీ వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించి ఈ అక్రమాలకు పాల్పడిన వారి మీద నిర్ణీత వ్యవధిలోపల విచారణ పూర్తి చేయాలని వారి నుంచి ఎగవేసిన డ్యూటీ, జరిమానా వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. ఇప్పుడున్న విధాన ప్రకారం ముడిఖనిజంలో 58శాతం లోపు ఇనుము ఉంటే ఎలాంటి పన్నులు లేకుండా చైనా, జపాన్‌, కొరియా వంటి దేశాలకు ఎగుమతులు చేయవచ్చు. అంతకు మించితే 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.


దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ఇనుప ఖనిజ ఎగుమతులపై స్వల్పకాలం పాటు నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నవంబరు చివరివారంలో చెప్పారు. సిమెంట్‌, ఉక్కు ఉత్పత్తిదారులు కూటములుగా ఏర్పడి ధరలు పెంచారని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోడ్ల వంటి మౌలికసదుపాయాల ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే నాణ్యత తక్కువ ఉన్న ఖనిజం నుంచి కూడా గరిష్టంగా ఇనుము ఉత్పత్తి చేయగల నైపుణ్యం చైనాతో సహా విదేశాల్లో ఉందన్నది ఒక అంశం. టెక్నాలజీలో ఎంతో ముందున్నాం అని చెప్పుకొనే మనం ఎందుకు వినియోగించటం లేదు ? అభివృద్ది గురించి చైనా చెప్పే లెక్కలను నమ్మలేం అని చెప్పే నిత్య శంకితులు ప్రతి తరంలోనూ శాశ్వతంగా ఉంటారు. అదే నిజమైతే మన దేశం నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేసి వారేమి చేసుకుంటారు అంటే నోరు విప్పరు. 2020లో కూడా గణనీయంగా దిగుమతులు చేసుకున్నదంటే అక్కడ కరోనాను కట్టడి చేసి సాధారణ కార్యకలాపాలను పునరుద్దరించటం, డిమాండ్‌ పెరగటమే కారణం. ప్రపంచ ఉక్కు సమాఖ్య సమాచారం ప్రకారం గతేడాది జనవరి-నవంబరు మధ్య 64దేశాల్లో ఉక్కు ఉత్పత్తి 1.3శాతం తగ్గితే చైనాలో 5.5శాతం పెరిగింది. చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలు కూడా దీనికి దోహదం చేశాయి. అనేక దేశాలు కూడా ఉద్దీపన ప్రకటించినా అక్కడ డిమాండ్‌ పెరగలేదు.


నీతి, దేశభక్తి, దేశద్రోహం వంటివి ఇప్పుడు మన దేశంలో బాగా అమ్ముడు పోతున్న సరకులు. అంటే లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి ఎంతకాలం అనేది వేరే విషయం. చైనాను వ్యతిరేకించటం దేశభక్తుడి విధి. చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవటం నేటి మహత్తర కర్తవ్యం అంటూ సామాజిక మాధ్యమంలో, సంప్రదాయ మాధ్యమాల్లో మనం వింటున్నామా-చూస్తున్నామా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా కుమ్మరిస్తున్నారు. గతేడాది జూన్‌లో లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత-చైనా సైన్యం మధ్య జరిగిన సంఘటనలో మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ఇది మరీ ఎక్కువైంది. మధ్యలో మన నరేంద్రమోడీ కౌగిలింతల భాగస్వామి అమెరికా ట్రంపు కంపు కారణంగా కాస్త తగ్గింది గానీ లేకపోతేనా…..రేటింగ్స్‌ కోసం టీవీ ఛానల్స్‌ ఇంకా రెచ్చిపోతుండేవి.

చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి చైనీయులను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పటాన్ని దేశభక్తిగా చిత్రిస్తున్నారు. చైనాతో ఇనుప ఖనిజం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు.అడ్డా మీదకు వచ్చి మాకు ఇనుప ఖనిజం ఎంతకు సరఫరా చేస్తారు అని ఎప్పటికప్పుడు బేరమాడి చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మన అవసరాలకు ఖనిజాన్ని నిల్వ చేసుకోవటం అవసరమా లేక చైనా నుంచి వచ్చే నాలుగు డాలర్లు ముఖ్యమా ? చైనా మాదిరి ఉక్కు తయారీ మనకు చేతకాదా ? మనం ఎగుమతులు చేయలేమా ? వారికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసి మరింతగా బలపడేట్లు చేస్తున్నట్లా కాదా ? చైనాకు ఎగుమతులు చేయటం ఎందుకు ? దాంతో మన దేశంలో ఉక్కు ధరలు పెరగటం ఎందుకు ? జనం గగ్గోలు పెడుతుంటే అచేతనంగా చూస్తూ కూర్చోవటం శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న బిజెపికి మేలు చేస్తుందా ?తనదైన ప్రత్యేక ఆర్ధిక శాస్త్రం(మోడినోమిక్స్‌)తో దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ గారికి ఈ చిన్న లాజిక్కు తెలియదా లేక కార్పొరేట్ల చేతిలో బందీ అయ్యారా ? అనేక మంది అంటున్నట్లు ఆయనకు గడ్డం, జులపాల మీద శ్రద్ద పెరిగిపోయి దేశం మీద తగ్గిందా ? దేశ భక్తి నీతులు కేవలం సామాన్యులకేనా ? కార్పొరేట్లకు ఉండవా ? అసలేం జరుగుతోంది ? అర్ధం కావటం లేదా, కానట్లు నటిస్తున్నారా ? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎంతకాలమో !!

ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐరోపాను ఒక భూతం వెన్నాడుతున్నది. ఆ భూతమే కమ్యూనిజం అంటూ 1848లో కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ తొలిసారిగా వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక రచన ప్రారంభం అవుతుంది. ప్రచ్చన్న యుద్దంగా వర్ణించిన సమయంలో అది తీవ్రమైంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు కమ్యూనిజంపై విజయం సాధించాం అని ప్రకటించారు. అలా చెప్పిన వారే ఇప్పుడు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాల పుస్తకాల దుమ్ము దులిపి మరోసారి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. ఎరుపును భూతంగా చూపిన తొలి రోజుల్లోనే ఎరుపంటే భయం భయం కొందరికి-పసిపిల్లలు వారికన్నా నయం నయం అన్న కవిత్వం తెలుగునాట వచ్చింది. వర్తమానంలో కవులు ఎలా స్పందిస్తారో చూద్దాం.


ఇప్పుడు అమెరికాలో ఇంకా అనేక చోట్ల ప్రతిదీ ఎరుపుమయంగా కనిపిస్తోంది, అనేక మంది కలవరింతలతో ఉలిక్కిపడుతున్నారు. వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి పుంఖాను పుంఖాలుగా సినిమాలు, సీరియల్స్‌, రచనలను జనం మీదకు వదులుతున్నారు. సామాజిక మాధ్యమం, వాట్సాప్‌ ఫేక్‌ యూనివర్సిటీ బోధన ఎలాగూ ఉంది.
అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన డెమోక్రటిక్‌ పార్టీని సోషలిస్టులు, కమ్యూనిస్టులు నడుపుతున్నారని ముద్రవేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అమెరికాను ఆక్రమించినట్లు చెబుతున్నారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కమ్యూనిస్టులంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీకీ ఇప్పటికీ అసలు పోలికే లేదని, ఆ పార్టీలో ఇప్పుడు సోషలిస్టులు, కమ్యూనిస్టులు నిండిపోయారని, దానిలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన బెర్నీశాండర్స్‌ చివరికి అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పోటీ పడ్డారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ డెవిన్‌ న్యూన్స్‌ ఒక రాజకీయ కరపత్రంలో పేర్కొన్నాడు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక చైనా నుంచి నిధులు పొందుతూ 2011 నుంచి నెలకు ఒక అనుబంధం ప్రచురిస్తున్నదని ( అది డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే పత్రిక) ఆరోపించాడు. నల్లజాతీయుల విషయాల ఉద్యమానికి గతేడాది జూన్‌లో పది కోట్ల డాలర్లు విరాళంగా వచ్చాయని, వారి హింసాకాండలో ఎందరో మరణించగా వంద నుంచి రెండువందల కోట్ల డాలర్ల ఆస్ధి నష్టం జరిగిందన్నాడు. ఎన్నికలలో అక్రమాల గురించి ట్రంప్‌ చేసిన ఆరోపణలన్నింటినీ పునశ్చరణ కావించాడు. రిపబ్లికన్లు లేదా మితవాదులెవరూ ప్రధాన స్రవంతి మీడియాతో మాట్లాడవద్దన్నాడు. డెమోక్రాట్లు అధ్యక్ష భవనం, పార్లమెంట్‌ ఉభయసభలను అదుపులోకి తెచ్చుకున్నారని వాపోయాడు.


ఈనెలలో జార్జియా రాష్ట్ర సెనెట్‌కు జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా ఇద్దరూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులే ఎన్నికయ్యారు. దాంతో సెనెట్‌పై ఆధిపత్యం వహించి జో బైడెన్‌కు ఆటంకాలు కల్పించాలన్న ఆశలు అడియాసలయ్యాయి. కొత్తగా ఎన్నికైన సెనెటర్లిద్దరూ కమ్యూనిస్టులే అని సౌత్‌ డకోటా రాష్ట్ర గవర్నర్‌ క్రిస్టి నియోమ్‌ (రిపబ్లికన్‌) వర్ణించారు. గత 33 సంవత్సరాలుగా రిపబ్లికన్లు తప్ప మరొకరు అక్కడి నుంచి ఎన్నిక అవలేదు. జార్జియా నుంచి ఇద్దరు కమ్యూనిస్టులు సెనెట్‌కు ఎన్నిక అవుతారని ఊహించుకోవటమే పరిహాసాస్పదంగా ఉంది అని ఆమె ఒక వ్యాసంలో వాపోయింది.
అమెరికా మీడియాలో, రిపబ్లికన్‌ పార్టీలో, ఇతర మితవాద శక్తులలో ఈ ధోరణి పెరిగిపోయింది కనుకనే పార్లమెంట్‌, దేశ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌పై దాడికి తన అనుచరులను డోనాల్డ్‌ ట్రంప్‌ పురికొల్పాడు. అలాంటి శక్తులు రేపు సైనిక తిరుగుబాటును ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.


మలేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ఉలికిపాటు !
మలేసియాలోని పదమూడింటిలో ఒక రాష్ట్రం పెనాంగ్‌, దాని జనాభా పద్దెనిమిది లక్షలు.ఆ దీవిలోని పులావ్‌ టైకుస్‌ మరియు జురు అనే రెండు చోట్ల ఓ 40 ఏండ్ల వ్యక్తి చిన్న రెస్టారెంట్లను ఏర్పాటు చేశాడు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తగా ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. మలేసియా బహుళ జాతుల నిలయం. ఆ రెస్టారెంట్‌ యజమాని చైనా జాతీయుడు. ఆహార పదార్దాలకు హాస్యం పుట్టించే విధంగా చైనా పేర్లతో పాటు మావో, ఇతర కమ్యూనిస్టు బొమ్మలను కూడా వాల్‌ పేపర్ల మీద ముద్రించి అందంగా ఏర్పాటు చేశాడు. ఇంకేముంది మలేసియాలో తిరిగి కమ్యూనిస్టులు తలెత్తారు, లేకపోతే ఆ గుర్తులతో హౌటల్‌ ఎలా ఏర్పాటు చేస్తారంటూ కొందరు కమ్యూనిస్టు వ్యతిరేకులు గగ్గోలు పెట్టారు. జనవరి మొదటి వారంలో పోలీసులు దాని మీద దాడి చేసి పోస్టర్లన్నీ చింపివేశారు. కమ్యూనిజానికి-యజమానికి సంబంధం ఏమిటి ? దీని వెనుక కమ్యూనిస్టులున్నారా అంటూ పరిపరివిధాలా బుర్రలు చెడగొట్టుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు సరేసరి. పెనాంగ్‌లో కమ్యూనిస్టు ఉద్యమం ఉందనటానికి హౌటలే నిదర్శనం అని కమ్యూనిస్టు వ్యతిరేక ”ఉమనో ” గా పిలిచే ఒక పార్టీ నేత బహిరంగ ప్రకటన చేశాడు. చైనాతో మలేసియాకు సంబంధం ఉన్న కారణంగానే ఇది జరిగిందని ఆరోపించాడు. ఇది అత్యంత బాధ్యతా రహిత ప్రకటన అంటూ ప్రత్యర్ధి పార్టీలు రంగంలోకి దిగాయి. పోలీసులు దాడి చేసిన సమయంలో ఆ అలంకరణ చేసిన హౌటల్‌ యజమాని కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్నాడు. కమ్యూనిజమూ లేదు ఏమీ లేదు, అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని అలా చేశానని మొత్తుకున్నాడు. అతడు చైనా జాతీయుడు కనుక ఇంత రచ్చ చేశారన్నది స్పష్టం.ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఎలా చెప్పగలుగుతున్నారన్న ప్రశ్న వస్తుంది. జనవరి 13వ తేదీన పోలీసులు రెస్టారెంట్ల యజమానిని విచారించగా తాను ఒక చోట రెండు సంవత్సరాల క్రితం మరోచోట నాలుగేండ్ల నుంచి ఆ అలంకరణలతో నడుపుతున్నానని అప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం పెట్టలేదు ఇప్పుడేమిటని అడిగాడట.


మలేసియా, సింగపూర్‌, ఇండోనేసియా వంటి దేశాలలో గణనీయ సంఖ్యలో చైనా జాతీయులున్నారు.ఉడిపి హౌటల్‌, ఆంధ్రా భోజన హౌటల్‌ పేరుతో తెలుగు ప్రాంతాల్లో ఉన్నట్లుగానే మావో జన్మించిన చైనాలోని హునాన్‌ రాష్ట్రంలో మావో జియా కారు లేదా మావో కుటుంబ వంటలు అంటే ఎంతో ప్రాచుర్యం ఉంది. ఆపేరుతో అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి.దానిలో భాగంగానే పెనాంగ్‌ రెస్టారెంట్‌ అన్నది స్పష్టం.దీన్ని వివాదాస్పదం చేసిన వారు బుద్ధిహీనులు అని అనేక మంది నిరసించారు.జపనీస్‌ రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన జపాన్‌ ఆక్రమణను ప్రోత్సహించినట్లు, పశ్చిమ దేశాల రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన ఆ దేశాల అలవాట్లను ప్రోత్సహిస్తున్నట్లా అని గడ్డి పెట్టారు. మలేసియాలో చైనా యాత్రీకులు మావో చిత్రం ఉన్న కరెన్సీ యువాన్లు ఇస్తే తీసుకోవటం లేదా ? అది కమ్యూనిజాన్ని ప్రోత్సహించినట్లా? దాడి చేయబోయే ముందు పోలీసులు ఇలాంటివన్నీ ఆలోచించరా అన్నవారూ లేకపోలేదు. హౌటల్‌ అలంకరణలో కమ్యూనిస్టు సిద్దాంతాలేవీ లేవని, ఒకవేళ ఉన్నా కూడా తప్పేమిటి, కమ్యూనిస్టు చైనా నుంచి అనేకం నేర్చుకోవటం లేదా దానితో వాణిజ్యం చేయటం లేదా అని ప్రశ్నించిన విశ్లేషకులూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కమ్యూనిజాన్ని ముందుకు తెచ్చే చౌకబారు ఎత్తుగడ అన్న వ్యాక్యానాలు వెలువడ్డాయి. 1930లో ఏర్పడిన మలయా కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ దురాక్రమణకు,తరువాత బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసింది.1957లో స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా బ్రిటీష్‌ పాలనలో విధించిన నిషేధం కొనసాగటంతో సాయుధపోరాటాన్ని కొనసాగించింది.1989లో సాయుధ పోరాటాన్ని విరమించింది.ఈకాలంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన నేపధ్యంలో రెస్టారెంట్‌ అలంకరణ వివాదాస్పదమైంది.


ఇండోనేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత !
కొద్ది సంవత్సరాల క్రితం ఎరుపు రంగు టీ షర్టులు అమ్ముతున్నవారిని కమ్యూనిస్టులని, కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నారని ఇండోనేసియాలో అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడి పశ్చిమ జావా ప్రాంతంలో సుత్తీ కొడవలి చిహ్నాలతో నిర్మించిన ఒక బస్టాప్‌ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి ఇంకే ముంది ఇండోనేసియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. తీరా చూస్తే ఇదే చిత్రాన్ని నాలుగు సంవత్సరాల క్రితం అనేక మంది సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారని తేలింది. అసలు విషయం ఏమంటే 2015లో కేరళలోని కొల్లం జిల్లాలో ఒక చోట ఏర్పాటు చేసిన బస్టాప్‌ చిత్రం అది. అంటే కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు వ్యతిరేకులు ప్రతి అవకాశాన్ని ఎంతగా ఎలా వినియోగించుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కమ్యూనిస్టులు పనిగట్టుకొని ఓడించారని కాషాయ దళాలు చేసే ప్రచారం ఇలాంటిదే. అంబేద్కర్‌ బొంబాయిలోని ఒక రిజర్వుడు-జనరల్‌ ద్వంద్వ లోక్‌సభ స్దానం నుంచి పోటీ చేశారు. జనరల్‌ సీటులో నాటి కమ్యూనిస్టు నేత ఎస్‌ఏ డాంగే, రిజర్వుడు సీటులో అంబేద్కర్‌ పోటీ చేశారు.

రైతులకు కమ్యూనిస్టు ముద్రవేసిన హర్యానా బిజెపి సిఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ !
రైతాంగ ఉద్యమం వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. కిసాన్‌ మాహాపంచాయత్‌ పేరుతో కేంద్ర చట్టాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఒక సభలో ముఖ్యమంత్రి పాల్గనాల్సి ఉంది. అయితే రైతులు ఆ సభను వ్యతిరేకిస్తూ ప్రదర్శనగా వెళ్లి సభా స్ధలిని, హెలిపాడ్‌ను ఆక్రమించుకోవటంతో ఆ సభ రద్దయింది. దాంతో ముఖ్యమంత్రి ఆరోపణలకు దిగారు. నిజంగా రైతులు ఆ పని చేయరని వారి ముసుగులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారే చేశారన్నారు.


కాపిటల్‌ హిల్‌ దాడిలో కమ్యూనిస్టు వ్యతిరేకులు !
అమెరికా అధికార కేంద్రం వాషింగ్టన్‌ డిసిలోని కాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేసిన దుండగులందరూ పచ్చిమితవాద, కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులే.వారిలో కొందరు లాయర్లు,ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిలో ఒకడి పేరు మెకాల్‌ కాల్‌హౌన్‌. మూడు దశాబ్దాలుగా లాయర్‌గా పని చేస్తున్నాడు. అతగాడి ట్విటర్‌ వివరాల్లో తాను ఒక కమ్యూనిస్టు వ్యతిరేకిని అని చచ్చేంత వరకు డెమోక్రాట్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తా అని రాసుకున్నాడు. అమెరికా మీద ప్రేమతో తామీ చర్యకు పాల్పడ్డామని, దానిని దాడి అనకూడదు, అక్రమంగా ప్రవేశించటం అనాలి, నేను ఆ పని చేశాను అని చెప్పుకున్నాడు.


ఒక వస్తువును నాశనం చేయగలరు గానీ ఒక భావజాలాన్ని పాతిపెట్టి విజయం సాధించిన వారెవరూ లేరు. అది కష్టజీవులకు సంబంధించింది అయితే ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా తిరిగి లేస్తుంది.శక్తి రూపం మార్చగలం తప్ప నశింపచేయలేము. కమ్యూనిజమూ అంతే. ప్రచ్చన్న యుద్దంలో కమ్యూనిస్టులను ఓడించామని చెప్పిన తరువాత అమెరికాలో సోషలిజం పట్ల మక్కువ పెరిగింది. కమ్యూనిస్టులు లేదా సోషలిస్టులుగా ముద్రపడిన అనేక మంది స్ధానిక, జాతీయ ఎన్నికలలో విజయం సాధించారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించగలిగినదే అయినప్పటికీ మరింత పెరుగుతుందేమో అని భయపడుతున్నారు. ఒక వైపు యువత కమ్యూనిస్టు పుస్తకాల దుమ్ముదులిపి అధ్యయం చేసేందుకు ఆసక్తి చూపుతుంటే మరోవైపు దానికి ప్రతిగా దోపిడీదారులు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార పుస్తకాల దుమ్ముదులుపుతున్నారు. 1996 తరువాత అమెరికాలో పుట్టిన వారిలో పెట్టుబడిదారీ విధానం మీద ఆసక్తి తగ్గిపోతుండగా సోషలిజం మీద పెరుగుతున్నది. గతంలో కమ్యూనిజం విఫలం అయిందనే మాటే వినిపించేది. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయం పెరుగుతోంది. సోషలిస్టుచైనా ఆర్ధిక రంగంలో అనేక విజయాలు సాధిస్తుండగా అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎందుకు వెనుకబడుతున్నాయన్న మధనం ఆ సమాజాల్లో ప్రారంభం కావటం దోపిడీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరూతూ ప్రారంభమైన ఆందోళన సోమవారం నాటికి 48 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయాలని ఉన్నత న్యాయ స్ధానం అదే రోజు సలహాయిచ్చింది, లేనట్లయితే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే చేసిన చట్టాల ప్రకారం రెండువేల మంది రైతులు ఒప్పందాలు చేసుకున్నారని, వాటిని నిలిపివేస్తే వారికి నష్టం జరుగుతుంది కనుక నిలిపివేయటం కుదరదని, నిలిపివేసే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదించారు. అయితే 2018లో మహారాష్ట్ర చేసిన చట్టాన్ని నిలిపివేసిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.


సుప్రీం కోర్టు ముందు ఉన్న ఈ కేసు ఏ విధంగా పరిష్కారం అవుతుంది, కోర్టు హితవును నరేంద్రమోడీ సర్కార్‌ పట్టించుకుంటుందా ? ఒక వేళ ఏదో ఒక కారణాన్ని పేర్కొని ఆందోళనను విరమించాలని కోర్టు గనుక తీర్పు ఇస్తే రైతులు విరమించుకుంటారా ? పరిష్కారం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. తమ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల మేళ్ల గురించి చెప్పేందుకు హర్యానా బిజెపి ప్రభుత్వం కర్నాల్‌ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం నాడు ఒక సభను ఏర్పాటు చేసింది.కిసాన్‌ పంచాయత్‌ పేరుతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాల్గొనాల్సిన ఆ సభ జరగకుండా రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే వారి మీద పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం జరిపి అడ్డుకోవాలని చూసినా రైతులు వెనక్కు తగ్గలేదు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను స్వాధీనం చేసుకోవటంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తాను సవరించిన చట్టాలను ఎలాగైనా అమలు జరిపేందుకు కేంద్రం- వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవాలని రైతులు పట్టుదలగా ఉన్నారని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో జరుపుతున్న తతంగం ఈనెల 15వ తేదీన కూడా జరగనుంది. రైతులను రహదారుల మీద నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తాజాగా మరొక పిటీషన్‌ వేశాడు. ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ ఆందోళన కారులను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల విషయంలో కూడా అమలు జరపాలని కోరాడు. సుప్రీం కోర్టు ఏమి చేయనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక్కడ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధకు దురుద్ధేశ్యాలను అంటకట్టటం లేదు, ఈ రచయితకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అయితే గతంలో వివిధ ఉద్యమాల సమయంలో ఇలాంటి పిటీషన్లే దాఖలైనపుడు వివిధ కోర్టుల న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తీర్పుల విషయానికి వస్తే ఆందోళన చేస్తున్నవారికి వ్యతిరేకంగానే వచ్చాయి. రైతుల విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా, రైతులు అంగీకరిస్తారా, ప్రభుత్వం బలప్రయోగానికి పూనుకుంటుందా? అన్నవి ఊహాజనిత ప్రశ్నలే.


కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అని పదే పదే ప్రశ్నలు వేస్తున్నా సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ మొండి పట్టుదలను అర్ధం చేసుకోలేము. దేశానికి కాంగ్రెస్‌నుంచి విముక్తి కలిగించామని పదే పదే చెప్పుకుంటుంది బిజెపి, కానీ దాని విధానాలను మరింత పట్టుదలతో అమలు జరుపుతోందన్నది నమ్మలేని నిజం.


ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బ్యాంకు పధకాలను తమవిగానే నమ్మించేందుకు నానా పాట్లు పడ్డాయి, పడుతున్నాయి. ఆక్రమంలోనే అందుకే పలు కమిటీలను వేసి సిఫార్సులను ఆహ్వానించాయి. వాటిలో అనేకం ఉంటాయి, కానీ తమకు అనుకూలమైన వాటినే తీసుకుంటారు, మిగిలిన వాటి గురించి అసలు ఏమాత్రం తెలియనట్లు అమాయకంగా ఫోజు పెడతారు.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు.ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు. వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి, నిల్వపద్దతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.

గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్‌ ముందుకు తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే.డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.


ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.

1991లో అమలు ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు పారిశ్రామిక రంగంలో తీవ్ర సమస్యలకు దారి తీయటంతో మిగిలిన సిఫార్సుల అమలుకు తటపటాయించటం, ఒక్కొక్కదాన్ని అమలు జరుపుతున్నారు తప్ప వెనక్కు తగ్గటం లేదు. వాటిలో భాగమే ప్రయివేటీకరణ. ముందు నష్టాలు వచ్చే కంపెనీలని జనానికి చెప్పి సరే అనిపించారు. అవి పూర్తయిన తరువాత ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలు చూడాలే తప్ప వ్యాపారాలు చేయకూడదు అనే సన్నాయి నొక్కులతో లాభాలు వచ్చేవాటిని ఇప్పుడు వదిలించుకోచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. తాజా వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు.


మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ది కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా ? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి – వినియోగించుకొనే దేశాలకూ లబ్ది చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపదతారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత.ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ?


అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి.( అనివార్యమైన స్దితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008-09నాటికి 1.52శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే ” రైతు బంధు ” నరేంద్రమోడీ గారి ఏలుబడి ప్రారంభంలో 2014నాటికి 0.6శాతానికి తగ్గింది.2016లో 0.5, తరువాత 2019వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.)
బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.( తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్దలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రయివేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు)
సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.
డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.
ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.
ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.
సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు.
డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి.

పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీగారు లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ ఆమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!

మీరు ఎటు వైపో తేల్చుకోండి

Tags

, ,

డాక్టర్ కొల్లా రాజమోహన్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.

ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా  రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును  ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ  సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.

విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ  ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం  నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా  చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్‌ పాటు పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్‌, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.

 డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పోరాట ప్రాంతానికి పయనం 

శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.

మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.

ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం.  మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ  మంది మహిళలు పాల్గొన్నారు.

వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.  

కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.

రోడ్ పై ఎలా బతుకుతున్నారు?

వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా  రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ  చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్  రైతు  వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.

వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.

దాదాపు యాభై కిలోమీటర్లు  గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి  అండగా వుంటారన్నారు.

చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు.  “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.

లంగరు సేవ

ఎక్కడికక్కడే  వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.

‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.

మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.

ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు  చార్జింగ్ అయిపోయింది.  చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు. 

వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ  నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక  అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.

చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి. 

కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.

అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.

“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు. 

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.

నెల  రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. 

షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.

చరిత్ర సృష్టించిన రైతాంగం

సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”,  “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.

దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం,    నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార  దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. 

రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి  రైతులను ఏక  తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ  అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.

కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్  కానూన్ వాపస్ నహీ – తబ్  తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

మీడియాలోమొక్కుబడి వార్తలు.

ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన  మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.  

ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి  ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం  కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు  తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు,  భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది. 

కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.

ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.

రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? 

ప్రజాస్వామ్యం  అంటే ఎన్నికలు, పదవులేనని  పాలకవర్గ పార్టీలు  వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే  కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.

ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే,  మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన  సమయం ఆసన్నమయ్యింది. 

ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. 

కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం  సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.

  1. జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి.    4)  జనవరి 23 న, నేతాజీ సుభాష్   చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి.   5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..

ఢిల్లీ  వెళ్లి వచ్చిన వారు 

వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి,  తోట ఆంజనేయులు, ఎఐకేఎం,  రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన,  జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.

సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.


ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్‌ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్‌ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్‌ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.


వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.


2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్‌) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్‌ ధనిక దేశాలు గ్రీన్‌ బాక్స్‌ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.


బిల్‌క్లింటన్‌ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.


తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్‌ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్‌×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్‌ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్‌ ××× 6.7 ××××× 46
కోట్‌ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?


పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.

పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !

కరోనా వాక్సిన్‌ జాతీయవాదం- దేశ ద్రోహం – బిజెపి విపరీత పోకడ !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
అన్నీ వివాదం అవుతున్నాయి, ఛీ ఛీ, చివరికి కరోనా వాక్సిన్‌ కూడా అనుకుంటున్నారా ! అవును, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. వాక్సిన్‌ తయారీ తన ఆత్మనిర్భర కలను నిజం చేయటంలో శాస్త్రవేత్తల ఆతురత కనిపించిందని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఎదుటి వారి మీద తప్పుడు ముద్రలు వేసేందుకు కూడా అతీతంగా ఏవీ కనిపించటం లేదు. ఒక కంపెనీ వాక్సిన్‌ నీటి మాదిరి సురక్షితమైనది అని ఒకరు ఎత్తిపొడిచింది. మరో కంపెనీ వాక్సిన్‌కు 60శాతం దుష్ప్రభావాలు ఉన్నా పారాసిటమాల్‌ వేసి కనపడకుండా చేసినట్లు మేం చేయం, కేవలం వంద మంది మీదనే పరీక్షించి మా ఉత్పత్తి సురక్షితం అంటే ఎలా అన్నారు మరొకరు. ఇద్దరూ కరోనా వాక్సిన్‌ తయారు చేసే బడా కంపెనీల అధిపతులే, రోడ్డెక్కి చెప్పిన మాటలే కనుక ఒకరు సీరం సిఎండి అదర్‌ పూనావాలా అయితే మరొకరు భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడనవసరం లేదు. ఏమిటీ లొల్లి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని అనుమానించాలి ? కేంద్ర ప్రభుత్వం రెండు వాక్సిన్లను అత్యవసర పరిస్ధితిలో వినియోగానికి అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకదాని ప్రభావం, పరీక్షా ఫలితాల గురించి ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తున్నారు.


ఔషధం, వాక్సిన్‌ ఏదైనా సరే జీవుల ప్రాణాలను కాపాడాలి తప్ప తీయకూడదు. రోగాలు, మహమ్మారుల నుంచి కూడా లాభాలు పిండుకోవటమే పరమార్ధంగా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా పూర్తి వివరాలు ప్రకటించనపుడు అనేక మందికి అనుమానాలు కలగటం, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం సహజం. అది కూడా తప్పేనా ? ఏమిటీ ఉన్మాదం ! భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఉత్పత్తి వలన ప్రయోజనం-హానీ రెండు లేవని ప్రత్యర్ధి కంపెనీ సీరం సంస్ధ ప్రతినిధి చెప్పారు. అది ఆరోపణో, నిజమో జనానికి తెలియదు. దాని మీద స్పందించిన భారత్‌ బయోటెక్‌ అధిపతి కృష్ణ తన ప్రత్యర్ధి కంపెనీ ఉత్పత్తి 60శాతం దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. నిజానికి జనం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు ఇలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచినట్లు ? తన ఉత్పత్తి మీద విమర్శచేసిన తరువాతనే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు వాక్సిన్ల గురించి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగల మధ్య పంపిణీలో తేడాలు వచ్చినపుడు దొంగతనం విషయం బయటకు వచ్చినట్లుగా లేదీ వ్యవహారం !


గర్భవిచ్చిత్తి జరిగిన మానవ పిండాల నుంచి తీసిన కణాలతో తయారు చేసిన వాక్సిన్లను మన క్రైస్తవులు వేసుకోకూడదని కొందరు, పంది మాంసం నుంచి తీసి కణాలతో చేసిన వాక్సిన్లు ముస్లింలు వేసుకోకూడదని మరికొందరు టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. వీరందరికంటే ముందే వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పిన వారు ఆవు మూత్రం తాగి, ఆవు పేడ పూసుకుంటే కరోనా ప్రభావం ఉండదని, దీపాలు వెలిగిస్తే వైరస్‌ నశిస్తుందని చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. గోమూత్ర సేవనం సర్వరోగ నివారిణి అని ఊరందరికీ చెప్పిన పెద్దలు తమవద్దకు వచ్చే సరికి ఆ పని చేయకుండా బతుకు జీవుడా అంటూ కరోనా సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరి క్రైస్తవ, ఇస్లామిక్‌ మత పెద్దలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాక్సిన్లు తీసుకోవచ్చని ముక్తాయింపులు పలికారు. మతాలవారు చెప్పారని వాక్సిన్లు తీసుకోకుండా జనం ఆగుతారా ?


మన దేశంలో కరోనా వాక్సిన్‌ ఎందుకు రాజకీయ వివాదంగా మారింది ? ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ను మన దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసేందుకు అనుమతులు పొందింది. మరోవైపు దేశీయంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారతబయోటెక్స్‌ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఐసిఎంఆర్‌ మరియు వైరాలజీ జాతీయ సంస్ధతో కలసి రూపొందించి కోవాగ్జిన్‌ పేరుతో వాక్సిన్‌ ప్రయోగాలు జరుపుతున్నది. కోవిషీల్డ్‌ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెబుతున్నా ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు. అలాంటి వాక్సిన్‌ వినియోగానికి ముందుగానే అనుమతివ్వటం ఏమిటన్న ప్రశ్నను కొందరు లేవనెత్తారు. ఇది వివాదాస్పదమైంది. దీని మీద సమర్ధనలూ, విమర్శలూ వెలువడుతున్నాయి. జనంలో గందరగోళం, వాక్సిన్ల సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తాయి. కొందరు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నారు.ఇదొక అవాంఛనీయ పరిణామం. వాక్సిన్ల తయారీ కంపెనీల మధ్య వాణిజ్య పోరుగా రాబోయే రోజుల్లో బయటపడనుందా ?

కోవాగ్జిన్‌ వాక్సిన్‌ ప్రత్యామ్నాం అని పేర్కొనటం,వినియోగానికి సంబంధించి అనేక పరిమితులను పేర్కొని అనుమతులు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అంటే ఏదీ దొరకనపుడు అనే అర్ధం కూడా ఉంది. అందువలన ఈ రెండు వాక్సిన్లలో దేనిని ఎవరు వేసుకోవాలి? నిర్ణయించేది ఎవరు ? మూడవ దశ ప్రయోగాల ఫలితాలు పూర్తిగాక ముందే కోవాగ్జిన్‌కు అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తొలుత మన సైనికుల పరాక్రమాన్ని ఇప్పుడు వాక్సిన్‌ తయారీని శంకిస్తున్నారంటూ కేంద్ర మంత్రి హర్దేవ్‌సింగ్‌ పూరీ, ఇతర బిజెపి నేతలు ప్రతిపక్షాలు, ఇతరుల మీద ఎదురుదాడికి దిగటం విస్మయం కలిగిస్తోంది. అసలు ఆ కంపెనీ తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి ? ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతారా ? కోవాగ్జిన్‌ సామర్ధ్యం గురించి ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు, వివరాలు వెల్లడించకుండా నమ్మటం ఎలా అన్నదే అసలు సమస్య.


కోవాగ్జిన్‌ గతేడాది ఆగస్టు 15నాటికే అది సిద్దం అవుతుందని స్వయంగా ఐసిఎంఆర్‌ లేఖలు రాసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ గడువు పోయింది, రిపబ్లిక్‌ దినోత్సవం లోపు అయినా పరిశోధనా ఫలితాలు వస్తాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలో రాకముందే ఏకంగా ముందస్తు అనుమతి ఇచ్చేశారు. కొంత మంది చెబుతున్నట్లు ఇప్పటికే దాదాపు 7 కోట్ల డోసులు తయారు చేసిన సీరం సంస్ధ నుంచి కొనుగోలు బేరసారాల వత్తిడిలో భాగంగా కోవాగ్జిన్‌ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇచ్చారా అన్న కోణం కూడా ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి విషయాలు దాగవు.


కోవాగ్జిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయటమే దేశ ద్రోహం అన్నట్లుగా వ్యాఖ్యానించి బిజెపి వాక్సిన్‌ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది. టీవీ ఛానల్స్‌ పెద్దలు కూడా ముందూ వెనుకా చూడకుండా నిర్దారణ చేసుకోకుండా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. ఎవరో ఒక చిన్న విలేకరి పొరపాటు లేదా అత్యుత్సాహం ప్రదర్శించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇండియా టీవీ అధిపతి, ప్రధాన సంపాదకుడు అయిన రజత్‌ శర్మ ఏకంగా కోవాగ్జిన్‌ టీకాను ముందుగానే 190 దేశాలు ఆర్డర్‌ ఇచ్చాయని సెలవిచ్చారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించి చెప్పే వారి మాదిరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో చూడండి.” మన దేశంలో వృద్ది చేసిన ఈ వాక్సిన్‌ బాగా పని చేస్తుంది, ధర తక్కువ, నిల్వచేయటం సులభం. ఎందుకంటే నరేంద్రమోడీ విధానాలు మన శ్స్తావేత్తల నైపుణ్యం దీనికి కారణం. వాక్సిన్‌ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ముందుగానే 190 దేశాలు దీని కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయని తెలుసుకోవాలి ” అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. దాన్ని బిజెపి మరుగుజ్జులు పెద్ద ఎత్తున రీ ట్వీట్‌ చేశారు.


తమ ఉత్పత్తి కేంద్రాన్ని 70దేశాల ప్రతినిధులు సందర్శించారని చెప్పారు తప్ప ఆర్డర్లు బుక్‌ చేశారని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా ఎక్కడా చెప్పలేదు. అలా సందర్శించిన వారు ఆర్డర్లు పెట్టినట్లు వార్తలు కూడా లేవు. మరి రజత్‌ శర్మగారికి 190 దేశాల సమాచారం ఎలా తెలిసింది? అనేక మంది సామాన్యులు భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ వాక్సిన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కార్యక్రమమైన కోవాక్స్‌తో గందరగోళపడుతున్నారు.ప్రపంచ దేశాలన్నింటికీ చౌకగా వాక్సిన్‌ అందించేందుకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో 190 దేశాలు పాలుపంచుకుంటున్నాయని, భాగస్వామ్య దేశాలన్నింటికీ రెండువందల కోట్ల డోసుల వాక్సిన్‌ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిసెంబరు 19న ప్రకటించారు. వీటిలో అనేక దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దారించిన వాక్సిన్లన్నీ ఉన్నాయి. ఇరవై కోట్ల డోసులు అందించేందుకు వాక్సిన్‌ అలయన్స్‌ గవీ, ఇతర సంస్ధలు ఒప్పందం చేసుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన పది వాక్సిన్‌లను ఉటంకిస్తూ అవి ఏ దశలో ఉన్నాయో కూడా ప్రకటనలో తెలిపారు. చిత్రం ఏమిటంటే వీటిలో భారత బయోటెక్స్‌ కోవాగ్జిన్‌ లేదు. త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఇది కూడా చేరుతుందా లేదా అన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఎగుమతి వార్తలు లేవు.

కోవాక్స్‌ కార్యక్రమం ప్రకారం దానిలో భాగస్వామ్య దేశాలకు ఆ కార్యక్రమం కింద పంపిణీ చేసే వాక్సిన్‌లో ఆయా దేశాల జనాభాను బట్టి 20శాతం డోసులను వారికి అందచేస్తారు. వాటిని ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎవరికైనా అందచేస్తాయా అన్నది వారిష్టం. ఉదాహరణకు చైనాలో కరోనా కేసులు లేని కారణంగా చైనా రూపొందించిన వాక్సిన్లను బ్రెజిల్‌లో ఉన్న రోగుల మీద ప్రయోగాలు చేశారు. కోవాక్స్‌ కార్యక్రమంలో చైనా భాగస్వామి కనుక దానికి వచ్చే వాటాను ఇతర దేశాలకు అందచేయవచ్చు. అమెరికా దానిలో భాగం కాదు కనుక దానికి వాక్సిన్ల కోటా ఉండదు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం పేద దేశాలకు సబ్సిడీ ధరలకు వాక్సిన్‌ అందచేస్తారు. బిల్‌గేట్స్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి కనుక తనకు వచ్చే వాక్సిన్‌ తన సంస్ధ ద్వారా ఎవరికైనా అందచేయవచ్చు.


సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేసి శాస్త్రవేత్తలను అవమానించటం తన ఉద్దేశ్యం కాదంటూ తరువాత నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్‌ బిజెపిదని దాన్ని తాను వేసుకోనని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. నిజానికి సర్వరోగనివాణి బిజెపి వాక్సిన్‌ లేదా ఔషధం ఆవు పేడ లేదా మూత్రం అన్నది అందరికీ తెలిసిందే . ఆవు మూత్ర సేవన కార్యక్రమాల సమయంలో ఆ ప్రకటన చేసి ఉంటే అర్ధం ఉండేది. ఆవు మూత్రం, పేడ కరోనాను నివారిస్తుందని చెప్పిన బిజెపి పెద్దలు అనేక చోట్ల వాటి సేవన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మన వైద్యులు, శాస్త్రవేత్తలను అవమానించిందీ, ఇప్పటికీ అవమానిస్తున్నదీ కాషాయ దళాలే.
భారత బయోటెక్‌లో తయారు చేస్తున్నది ఆవు (మూత్రపు) శాస్త్రవేత్తలు కాదు. దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇంకా రాలేదు కనుక వేసుకోను అన్నా అదొకరకం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఊపుమీద ఉండటం, వాక్సిన్‌ తయారీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌లోని ఆ సంస్దలను సందర్శించిన నేపధ్యంలో సమాజవాద పార్టీ నేత బిజెపి వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఆ వ్యాఖ్య పనికి వస్తుందని భావించి ఉండవచ్చేమోగాని, శాస్త్రవేత్తలను కించపరచాలనే ఉద్దేశ్యం ఉంటుందని చెప్పలేము. అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేస్తే బిజెపి నేతలు తక్కువేమీ తినలేదు. వివరాలు లేని వాక్సిన్‌ సామర్ద్యాన్ని ప్రశ్నించటం దేశద్రోహం అనేంతవరకు వెళ్లారు.


వాక్సిన్లను స్వదేశీ-విదేశీ అని వర్ణించటం అర్ధంలేని విషయం. విదేశాల్లో రూపొందించిన వాక్సిన్లు, ఔషధాలను మన దేశంలోని సంస్ధలు తయారు చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.ఇదొక వ్యాపారం. భారత్‌ బయోటెక్‌ సంస్ధకు ప్రపంచంలో అతి పెద్ద వాక్సిన్‌ వ్యాపారి బిల్‌ గేట్స్‌కు, అంతర్జాతీయ ఫార్మా లాబీకి ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ వారి సంబంధాలు బహిర్గతమే. ఏదో ఒక రూపంలో ఆ సంస్ధ బిల్‌గేట్స్‌, ఇతర సంస్ధల నుంచి నిధులు పొందింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న డయేరియాకు ఉపయోగించే రోటోవాక్‌ వాక్సిన్‌ సామర్ధ్యం 56శాతమే అని, దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ వాక్సిన్‌ కొనుగోలుకు ఆ సంస్దతో బిల్‌ గేట్స్‌ ఒప్పందం ఉంది. దాన్ని ప్రభుత్వాలకు అంటగట్టి ప్రజారోగ్య కార్యమ్రాలలో వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌, అంతర్జాతీయ వాక్సిన్‌ లాబీ కంపెనీలు సరఫరా చేస్తున్న నాసిరకం లేదా ప్రభావం లేని వాక్సిన్ల కారణంగా ప్రపంచ వ్యాపితంగా 3.8కోట్ల మంది శిశువులు పుట్టక ముందే మరణించారనే విమర్శలు ఉన్నాయి.మన దేశంతో సహా అనేక దేశాలలో వాక్సిన్ల దుష్ప్రభావాలకు తయారీ కంపెనీల నుంచి పరిహారాన్ని కోరే చట్టాలు లేవు. ఈ నేపధ్యంలోనే కోట్లాది మందికి వేయదలచిన వాక్సిన్‌ గురించి భారత్‌ బయోటెక్‌ వివరాలు వెల్లడి చేయక ముందే అనుమతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.

వాక్సిన్‌పై తలెత్తిన వివాదం ”సమాచార మహమ్మారి ” ని మరింత ఎక్కువ చేయనుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎన్ని మహమ్మారులను అయినా ఎదుర్కొనగలంగానీ అంతకంటే వేగంగా తప్పుడు, నకిలీ వార్తలను వ్యాపింప చేసే సమాచార మహమ్మారి వైరస్‌ ఎంతో ప్రమాదకరమని ఆ రంగంలోని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా-వాక్సిన్‌ కూడా వివాదం అయింది కనుక దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సవినయమనవి. చివరిగా ఒక విషయం మరచి పోకూడదు. కరోనా వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ప్రపంచంలోని అనేక మంది దాని నివారణకు వాక్సిన్‌ తయారీకి పూనుకున్నారు. మన దేశంలో తొలి వైరస్‌ కేసు బయటపడి, లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించింది. అది ఆర్ధిక ఉద్దీపన కార్యక్రమం అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాక్సిన్‌ తయారీ ఆ కార్యక్రమ కల అని దాన్ని శాస్త్రవేత్తలు నెరవేర్చారని ప్రధాని చెప్పటంలో నిజాయితీ ఎంతో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు మన వాక్సిన్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించటం దేశవ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌, మరొక మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు. కలికాలం, వైపరీత్యం గాకపోతే బిజెపికి నచ్చని వారందరికీ ఈ ముద్ర తగిలిస్తారా ! ఏమిటీ అనారోగ్యపు వ్యాఖ్యలు !!

” దేశభక్త ” నరేంద్రమోడీ పాలనలో ” దేశ ద్రోహ ” చైనా దిగుమతులు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా మీద ఎవరికైనా అంతగా మోజు ఉంటే తీర్చుకోవచ్చు. సరే దాని ఫలితాలు-పర్యవసానాలను కూడా అనుభవించేందుకు సిద్దపడాలి. ఎక్కడో పదమూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని కోసం మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న పొరుగు దేశం చైనాతో సఖ్యత లేకపోతే పో(పా)యే ! విరోధం లేకుండా అన్నా ఉండాలని చెప్పినవారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పోనీ దాన్ని కూడా భరించవచ్చు- తామే సిసలైన దేశభక్తులమని చెప్పుకుంటున్నవారి ఆచరణ ఏమిటి అన్నది అసలు సమస్య ! ఈ మధ్యనే వచ్చిన వార్తల ప్రకారం సూటిగా నిషేధించే దమ్మూ ధైర్యం లేక చైనా నుంచి వచ్చే వారిని చట్టపరంగా నిషేధించలేము గానీ విమాన టిక్కెట్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని సదరు కంపెనీలను కోరినట్లు చదివాము. అంతకు ముందు అమెరికా ప్రభుత్వం చైనా జాతీయులందరినీ కమ్యూనిస్టులుగా పరిగణించి నిషేధం విధించింది. వారిని సంతుష్టీకరించేందుకు ఇంత డొంక తిరుగుడు అవసరమా ?


లడఖ్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఉదంతం తరువాత చైనా పెట్టుబడులు, వస్తువులను అడ్డుకుంటామంటూ వీర,శూర ప్రతిజ్ఞలు చేశారు. అనేక యాప్‌లను నిషేధించారు. దేశభక్తి అని చెప్పారు గనుక ఎవరూ తప్పు పట్టలేదు. ఉల్లిపాయలు తినొద్దని ఊరందరికీ చెప్పాను గానీ నిన్ను కూరల్లో వేయవద్దని చెప్పానా అని ఒక కథకుడు ఇంట్లో భార్యమీద మండిపడ్డాడట. నరేంద్రమోడీ నాయకత్వం పరిహాసం పాలైందని ఎవరైనా అంటే కాషాయ మరుగుజ్జులు గుంజుకుంటారు.తలరాత లేదా విధి మీద నమ్మకం ఉండేవారి ఆలోచన ప్రకారమైతే గతేడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల మధ్య మన దేశ దిగుమతులు మొత్తంగా 32.6శాతం పడిపోతే చైనా నుంచి 17.2శాతమే తగ్గటం విధి వైపరీత్యం, నరేంద్రమోడీకి తలవంపులు గాకపోతే మరేమిటి ?

చైనా వస్తువులను దిగుమతులు చేసుకొనే లేదా వాటిని నియంత్రించే అధికార వ్యవస్దలో సీతారామ్‌ ఏచూరీ, పినరయి విజయన్‌, బృందాకరత్‌ల కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వారి పార్టీ వారు గానీ లేరు, ఉన్నదంతా ” అసలు సిసలు ” ” దేశభక్తులు, జాతీయవాదు ” లైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలే కదా ? మరి ఎందుకు చైనా ఉత్పత్తులు నిలిపివేయలేకపోయారు ? నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చూసీ చూడనట్లు ఉన్నట్లు ? జనాలను బకరాలను చేద్దామనా ?
దిగుమతులు తగ్గటంలో ప్రధానంగా చమురు, బంగారం ఉన్నాయని ఎవరైనా సమర్ధించుకోవచ్చు. అవి మినహాయిస్తే పైన చెప్పిన నెలల్లో దిగుమతులు 25.6శాతం తగ్గాయి, వాటితో పోల్చినా చైనా వాటా తక్కువే కదా ! చైనా నుంచి టీవీల దిగుమతి గణనీయంగా పడిపోయింది, అంతకంటే ఎక్కువశాతం వియత్నాం నుంచి పడిపోయిందని అంకెలు చెబుతున్నాయి. ఈ కాలంలో చైనా నుంచి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్ల వంటివి గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. చైనా నుంచి నేరుగా తగ్గితే మరొక మార్గంలో వయా హాంకాంగ్‌ నుంచి భారత్‌కు చేరుతున్నాయి. చిల్లి కాదు తూటు అంటే ఇదే. చైనా నుంచి దిగుమతులు 80.8శాతం నుంచి 65.1శాతానికి పడిపోతే ఇదే సమయంలో హాంకాంగ్‌ నుంచి 9.8 నుంచి 23.4శాతానికి పెరిగాయి. రెండింటినీ కలిపి చూస్తే 90.6 నుంచి 88.5శాతానికి తగ్గాయి. సంఖ్యపరంగా తగ్గింది తక్కువే అయినా విలువ పరంగా 24.7శాతం పెరిగింది. అసలు కారణం ఇంటి నుంచి పని చేసే వారు, వారి అవసరాలు పెరగటమే. ఈ కాలంలో చైనా నుంచి మనం 38.82 బిలియన్‌ డాలర్ల విలువగలవి దిగుమతి చేసుకుంటే 13.64 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేశాము. చైనా వ్యతిరేకత, దేశభక్తి రేటింగ్స్‌ను పెంచుకొనే టీవీ ఛానల్స్‌, కాషాయ దళాల కబుర్లలో తప్ప ఆచరణలో పెద్దగా లేదని, యాప్‌లను నిషేధించినా వాటి ప్రభావం పెద్దగా లేదని అంకెలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులను అడ్డుకొనే ధైర్యం దేశభక్తులకు లేనట్టా ? ఉన్నట్లా ! ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగుపడుతున్నది కనుక రాబోయే రోజుల్లో దిగుమతులు పూర్వ స్ధాయికి చేరుకుంటాయా ?


చైనా, మరొక దేశం దేనికైనా ఏ దేశమూ లొంగిపోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో స్వంత విధానాలను కలిగి ఉండాలి తప్ప ఇతరుల పాటలకు మరొకరు నృత్యం చేయటం తగనిపని. మన కోసం పశ్చిమ దేశాలు చైనాతో పోరాడుతాయి లేదా చైనా మెడలు వంచుతాయి అనుకుంటే అంతకంటే భ్రమ, అత్యాశ మరొకటి ఉండదు. వాటి ప్రయోజనాల కోసం మనతో పాటు ఎవరినైనా వినియోగించుకుంటాయి.
ఉదాహరణకు అమెరికా గత కొద్ది దశాబ్దాలుగా చైనాలో మానవహక్కులు లేవంటూ ప్రచారం చేయటం తెలిసిందే. కానీ చైనాతో వాణిజ్యం పెంచుకున్నదే తప్ప తెంచుకోలేదు. దానిబాటలోనే ఐరోపా యూనియన్‌ కూడా నానా యాగీ చేసింది. అదంతా రాయితీలు పొందేందుకు ఆడిన నాటకం.తాజాగా చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అందుకు నిదర్శనం. ఒప్పంద చర్చల ప్రారంభం-అంగీకారం మధ్య కాలంలో చైనాలో మారిందేమీ లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మనకు మద్దతు ఇస్తామన్నట్లుగా మాట్లాడిన ఐరోపా యూనియన్‌ మనకు కబుర్లు చెప్పి తీరా చైనాతో ఒప్పందం చేసుకుంది.


అమెరికాలో ఈనెల 20 అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమితులౌతాడని భావిస్తున్న ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పిన మాటలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవటం మరియు అంతిమంగా ప్రతికూల ఫలితాలనిస్తుంది, అదొక తప్పిదమౌతుంది అన్నాడు. కొన్ని అంచనాల ప్రకారం 2028 నాటికి అమెరికాను పక్కకు నెట్టి చైనా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారనుంది, ఇప్పటికే 140 కోట్ల జనాభాతో పెద్ద మార్కెట్‌, వారి జీవితాలు మరింతగా పెరిగితే మార్కెట్‌ ఎంతో విస్తరిస్తుంది. ఈ విషయం ధనిక దేశాల కార్పొరేట్లన్నింటికీ తెలుసు గనుకనే చైనాతో తెగేదాకా లాగటం లేదు. మన భుజం మీద తుపాకి పెట్టి చైనా నుంచి రాయితీలు పొందాలన్నది అమెరికా లేదా చతుష్టయంలోని జపాన్‌, ఆస్ట్రేలియా ఎత్తుగడ. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా అదే చేస్తారు. ఒప్పందం ప్రకారం 2049 నాటికి హాంకాంగ్‌ చైనాలో పూర్తిగా విలీనం కానుంది, అదే సమయానికి తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమైనా ఆశ్చర్యం లేదు. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే ఏ దేశానికి ఆ దేశం తన వ్యూహాలను నిర్ణయించుకుంటుంది.

కొందరు చెబుతున్నట్లుగా పశ్చిమ దేశాలు చైనాను కట్టడి చేయగలవని గానీ లేదా వాటితో కలసి మనం అదుపు చేయగలమనే పగటి కలలు కనటం మానుకుంటే మంచిది. మన కోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వచ్చి యుద్దం చేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఇప్పటివరకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం తమ గుత్త సొమ్ము అన్నట్లుగా ఉన్న ధనిక పశ్చిమ దేశాలు చైనా పురోగమనాన్ని చూసి విస్తుపోతున్నాయి, తేరుకొని సాధ్యమైన మేరకు అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. అందుకు 5జి టెలికాం వ్యవస్ధ పెద్ద ఉదాహరణ. దాన్ని అడ్డుకుంటూనే మిగతా రంగాలలో చైనాతో సంబంధాలను వదులుకోరాదని నిర్ణయించుకుంటున్నాయి. మన మాదిరి వాటికవి దూరం కావటం లేదు. వాస్తవ పరిస్దితులకు అనుగుణ్యంగా వ్యవహరించటం రాజనీతి లక్షణం.


దిగజారుతున్న ఆర్ధిక పరిస్దితులు, తగులుతున్న ఎదురుదెబ్బల కారణంగా గత నాలుగు సంవత్సరాలలో ప్రపంచ నాయకత్వ పాత్ర నుంచి ట్రంప్‌ నాయకత్వంలో అమెరికా పదికిపైగా బహుళపక్ష ఒప్పందాల నుంచి తనకు తానే వైదొలిగింది. అవి ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వైదొలగటం వరకు ఉన్నాయి. ఇదే సమయంలో చైనాను బూచిగా చూపుతూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. దాని వలలో పడిన దేశాలన్నీ తమ వనరులను సమర్పించుకోవటం తప్ప పొందేదేమీ ఉండదు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను సృష్టించిన తాలిబాన్లను అది వదిలించుకొని మనకు అంటగట్టింది. వారు పాక్‌ మిలిటరీ అదుపులో ఉంటారని తెలుసు. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్న నరేంద్రమోడీ తాలిబాన్లలో రాజకీయ కోణాన్ని చూపుతూ వారితో వ్యవహరించేందుకు పూనుకున్నారు. ఆప్ఘనిస్తాన్‌ ఒకవైపు ఉన్న ఇరాన్‌, మరో వైపు ఉన్న పాకిస్ధాన్‌తో మనం కొత్త సమస్యలను తెచ్చుకోవటం తప్ప మరొకటి కాదు. మన అభివృద్ది మనం చూసుకుంటూ ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉంటూ మిలిటరీ ఖర్చు తగ్గించుకొని దాన్ని అభివృద్ధి వైపు మళ్లించటం శ్రేయస్కరం !

జనవరి 26 ఢిల్లీ : ఒకవైపు రిపబ్లిక్‌ డే కవాతు మరోవైపు రైతన్నల ట్రాక్టర్ల ప్రదర్శన !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


రైతుల న్యాయమైన డిమాండ్లపై సాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్న యత్నాలను చూస్తున్నాము. అవి ఫలించకపోతే ఉక్కు పాదంతో అణచివేస్తారా ? ఇప్పటికి ఊహాజనితమైన ప్రశ్నే కావచ్చు గానీ, ఏం జరుగుతుందో చెప్పలేము.డిసెంబరు 30న జరిగిన చర్చలలో ముసాయిదా విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఎత్తివేస్తామని, పంజాబ్‌, హర్యానా, మరికొన్ని ప్రాంతాలలో పనికిరాని గడ్డిని తగులబెడుతున్న కారణంగా పర్యావరణానికి హాని పేరుతో శిక్షించే ఆర్డినెన్స్‌ నుంచి రైతులను మినహాయిస్తామని కేంద్ర ప్రభుత్వం నోటి మాటగా అంగీకరించింది. ఇతర ముఖ్యమైన డిమాండ్ల విషయంలో అదే మొండి పట్టుదల కనిపిస్తోంది. ఈ రెండు అంశాలను అంగీకరించటానికి(అమలు జరుపుతారో లేదో ఇంకా తెలియదు) ప్రభుత్వానికి నెల రోజులకు పైగా పట్టిందంటే ఎంత మొండిగా, బండగా ఉందో అర్ధం అవుతోంది.


మిగిలిన తమ డిమాండ్ల పట్ల రైతన్నలు పట్టువీడే అవకాశాలు కనిపించటం లేదు.జనవరి నాలుగవ తేదీన జరిగే చర్చలలో ఎలాంటి ఫలితం రానట్లయితే తదుపరి కార్యాచరణను రైతు సంఘాల కార్యాచరణ కమిటీ శనివారం నాడు ప్రకటించింది. జనవరి ఐదవ తేదీన సుప్రీం కోర్టు రైతుల ఆందోళన సంబంధిత కేసుల విచారణ జరపనున్నది. ఆరవ తేదీన హర్యానాలోని కుండిలి-మనేసర్‌-పాలవాల్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు మీద ట్రాక్టర్లతో ప్రదర్శన, 15 రోజుల పాటు నిరసన, జనవరి 23న సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినం సందర్భంగా హర్యానా గవర్నర్‌ నివాసం ఎదుట నిరసన, ఆందోళనకు రెండు నెలలు పూర్తయ్యే సందర్భంగా 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరుపుతామని, అదే రోజు రాష్ట్రాల రాజధానులన్నింటా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతుల కార్యాచరణ కమిటీ నేతలలో ఒకరైన డాక్టర్‌ ధర్నన్‌పాల్‌ విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. తమ ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుందని, మేము చాలా రోజుల క్రితమే చెప్పినట్లు ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి మూడు చట్టాలను వెనక్కు తీసుకోవటం లేదా బల ప్రయోగంతో మమ్మల్ని ఖాళీ చేయించటం అని దర్శన్‌ పాల్‌ చెప్పారు.


ఇది రాస్తున్న సమయానికి రైతుల నిరసన 38వ రోజు నడుస్తున్నది. ఇప్పటికీ సామాన్యులకు అంతుబట్టని-బిజెపి లేదా ఆందోళనను తప్పు పడుతున్న వారు వివరించేందుకు సిద్దపడని అంశం ఏమంటే, మూడు చట్టాలకు ముందు ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన, తెచ్చినదాని మీద పార్లమెంట్‌లో తగిన చర్చకూడా లేకుండా ఆదరాబాదరా ఆమోద ముద్ర వేయాల్సినంత అత్యవసరం ఏమి వచ్చింది అన్నది. ఇవేమీ కొత్తవి కాదు, ఎప్పటి నుంచో చర్చలో ఉన్న అంశాలని చెబుతున్నవారు ఆర్డినెన్స్‌ అవసరం గురించి మాత్రం చెప్పరు. బహుశా వారి నోటి వెంట ఆ వివరాలు రావనే చెప్పవచ్చు. మూడు చట్టాలవలన రైతాంగానికి హాని ఉందంటూ వాటిని వెనక్కు తీసుకోవాలని కొందరు మేథావులు ప్రకటనలు చేశారు. దానికి పోటీగా మేలు జరుగుతుంది, కొనసాగించాల్సిందేనంటూ అంతకంటే ఎక్కువ మంది మేథావుల సంతకాలతో ఒక ప్రకటన చేయించారు. వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరు చెప్పినా వినాల్సిందే, ఆలోచించాల్సిందే. క్షీరసాగర మధనం మాదిరి మధించి ఎవరు చెప్పిన దానిలో హాలాహలం ఉంది, ఎవరు చెప్పినదానిలో అమృతం ఉందన్నది తేల్చుకోవాలి.శివుడు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు కనుక విషాన్ని పక్కన పెట్టేసి దాన్ని తాగించ చూసిన మేథావులెవరైతే వారికి స్ధానం లేదని చెప్పాలి.

జరిగిన పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే మాలల్లో బయటకు కనిపించని దారం మాదిరి సంబంధాన్ని చూడవచ్చు. అన్ని రంగాలను కార్పొరేట్లకు అప్పగించిన తరువాత మిగిలింది వ్యవసాయమే. కరోనా సమయంలో అన్ని రంగాలు కుప్పకూలిపోగా మూడుశాతంపైగా వృద్ధి రేటు నమోదు చేసింది ఇదే. అందువలన దాన్నుంచి కూడా లాభాలు పిండుకోవాలని స్వదేశీ-విదేశీ కార్పొరేట్లు ఎప్పటి నుంచో చూస్తున్నాయి. అందుకు గాను వ్యవసాయ రంగాన్ని వారికి అప్పగించటం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాల వ్యవసాయ ఉత్పత్తులను గుమ్మరించేందుకు అనుమతించటం ఒకటి. మూడు చట్టాల ద్వారా మొదటి కోరికను తీర్చారు. ఇప్పుడు రెండవ కోర్కెను తీర్చాలని విదేశాలు ముఖ్యంగా అమెరికా వత్తిడి చేస్తోంది.
అమెరికన్‌ కార్పొరేట్లు మన వ్యవసాయరంగంలో రెండు రకాలుగా ప్రయత్నించాలని చూస్తున్నాయి. ఒకటి ఉత్పత్తుల కొనుగోలు వ్యాపారంలో గణనీయమైన వాటాను దక్కించుకోవటం. రెండవది తమ ఉత్పత్తులను గుమ్మరించటం. రైతుల ప్రతిఘటన ఎలా ముగుస్తుందో తెలియదు, దాన్నిబట్టి కార్పొరేట్లు తమ పధకాలను రూపొందించుకుంటాయి. మొదటిది ఎంత సంక్లిష్ట సమస్యో రెండవది కూడా అలాంటిదే. అందుకే గతంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌-ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ కూడా గుంజాటనలో ఉన్నాయి.


అమెరికాలో నవంబరు ఎన్నికల్లోపే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నరేంద్రమోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ తెగ ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే అమెరికాకు ఎలాంటి పాత్ర లేని, చైనా, ఇతర ఆసియా దేశాలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఆర్‌సిఇపి ఒప్పందం నుంచి అమెరికా వత్తిడి మేరకు మన దేశం వెనక్కు తగ్గిందన్నది ఒక అభిప్రాయం. అయితే దానిలో చేరితే మన వ్యవసాయ, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగాలకు ముప్పు కనుక ఆ రంగాల నుంచి వచ్చిన తీవ్రమైన వత్తిడి కూడా వెనక్కు తగ్గటానికి ప్రధాన కారణం గనుక అమెరికా పాత్ర కనిపించలేదని చెబుతారు.
తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకోకపోయినా చిన్న ఒప్పందం అయినా చేసుకోవాలని అమెరికా వత్తిడి తెచ్చింది. దానిలో భాగంగానే 2019 ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ పర్యటన సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ చేసిన ప్రకటనలో కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్లుగా ఏడాది ముగిసేలోగా మొదటి దశ ఒప్పందాన్ని చేసుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనాను కూడా లెక్క చేయకుండా ట్రంప్‌ రావటానికి ఇదొక కారణం. ఎన్నికల్లోగా అనేక దేశాలతో చిన్న వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని వాటిని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్నది ట్రంప్‌ దూరాలోచన.(హౌడీమోడీ కార్యక్రమం కూడా దానిలో భాగమే). చిన్న ఒప్పందాలకు అక్కడి పార్లమెంట్‌ ఆమోదం అవసరం ఉండదు. ఎన్నికల తరువాత రాజెవరో రెడ్డెవరో అప్పుడు చూసుకోవచ్చు అన్నది ట్రంప్‌ దురాలోచన.


పది సంవత్సరాల క్రితం 2010లో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాన్‌ కిర్క్‌ అమెరికా సెనెట్‌లో వచ్చిన ఒక ప్రశ్నకు స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి.” మనం తీవ్ర ఆశాభంగం చెందాం. సాధారణంగా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎక్కడా బయటకు చెప్పం. కానీ వ్యవసాయ అంశాలలో వారి మార్కెట్‌ను తెరిచే అంశంపై భారత్‌ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ పరిశీలిస్తున్నాం.” అన్నాడు. పది సంవత్సరాల తరువాత జరిగిందేమిటి ? 2019లో నరేంద్రమోడీ సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు భారత్‌కు ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రంప్‌ ప్రకటించారు. నవంబరులో నరేంద్రమోడీ సర్కార్‌ ఆర్‌సిఇపి నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించింది.

అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న దేశాలు-పర్యవసానాలను క్లుప్తంగా చూద్దాం.ఎవరో అమెరికాతో కలసి తొడ కోసుకున్నారని మనం మెడకోసుకోలేము. ఒప్పందాలు కూడా అంతే. అన్ని దేశాలకూ ఒకే సూత్రం వర్తించదు.అమెరికాతో చైనా ఒప్పందం చేసుకుంటే లేని తప్పు మనం చేసుకుంటే ఉంటుందా అని కాషాయ దళాలు వెంటనే దాడికి దిగుతాయి. త్వరలో అమెరికా జిడిపిని అధిగమించే దిశ, దశలో చైనా ఉంది, మనం ప్రస్తుతానికి పగటి కలలో కూడా ఆ పరిస్ధితిని ఊహించుకోలేమని గ్రహించాలి. ఆర్‌సిఇపి ఒప్పందం కటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరింత ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలు ప్రపంచంలో మరే దేశమూ ఇవ్వటం లేదు.
మన దేశంలో ఒక కమతపు సగటు విస్తీర్ణం ఒక హెక్టారు. అదే అమెరికాలో 176 ఉంటుంది, అంటే ఆ రైతులతో మనం పోటీ పడాలి. అక్కడ మొత్తం కమతాలు 21లక్షలు, వ్యవసాయం మీద ఆధారపడే జనం కేవలం రెండుశాతం. అదే మన దేశంలో 14 కోట్ల 60లక్షలు. సగం మంది జనం వ్యవసాయం మీదే బతుకు. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ 2018లో పాడి ఉత్పత్తుల మీద ప్రమాణాలను సడలించి అమెరికా నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 30 నుంచి 60శాతం వరకు ఉన్న దిగుమతి పన్నును ఐదుశాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వెయ్యి ఆవుల లోపు డైరీల నుంచి 45శాతం, రెండున్నరవేల ఆవులకు పైగా ఉన్న డైరీల నుంచి అమెరికాలో 35శాతం పాల ఉత్పత్తి ఉంది. పెద్ద డైరీల్లో 30వేల వరకు ఉన్నాయి. అక్కడి డైరీ యాజమాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాడి ఉత్పత్తుల మీద 15, 20 సంవత్సరాల వ్యవధిలో 40శాతంగా ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గిస్తామని 2019లో జపాన్‌ ఒప్పందం చేసుకుంది. దేశంలో పాడి పరిశ్రమలో కార్పొరేట్‌ శక్తులు గుత్తాధిపత్యం వహించటం మీరెక్కడైనా చూశారా అని ఇటీవల రైతులతో సమావేశం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఇప్పుడు లేదు, రేపు విదేశీ ఉత్పత్తులను అనుమతిస్తే పరిస్ధితి ఏమిటి ?


కోడి కాళ్ల దిగుమతులకు మన దేశం మీద అమెరికా తీవ్ర వత్తిడి తెస్తోంది. అది కోరుతున్నట్లుగా పదిశాతం పన్నుతో దిగుమతులకు అనుమతిస్తే 40లక్షల మందికి ఉపాధి ఉండదు. అది ఒక్క కోళ్ల పరిశ్రమనే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్‌ పండిస్తున్న రైతులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అమెరికాలో కోళ్ల పరిశ్రమను ఐదు బడా కార్పొరేషన్లు అదుపు చేస్తున్నాయి.2016లో కోడి, గొడ్డు, పంది మాంస మార్కెట్లో సగం వాటా వాటిదే. అక్కడి రైతులతో అవి ఒప్పందాలు చేసుకుంటాయి. బ్రెజిల్‌ తరువాత కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్న రెండవ దేశం అమెరికా. ఆ రెండు ప్రపంచంలో సగం కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నాయి.

అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. విద్యుత్‌ సంస్కరణలకు ముసాయిదా బిల్లును రూపొందించి విడుదల చేశారు, అభిప్రాయాలను కోరారు. అదే మాదిరి ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి వ్యవసాయ బిల్లులకు తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం.


అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు(2034వరకు) 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మెక్సికోతో వాణిజ్యం ఒప్పందం చేసుకున్న అమెరికా తన సబ్సిడీ మొక్కజొన్నలను అక్కడ గుమ్మరించటంతో 20లక్షల మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు.
2016 డిసెంబరులో మోడీ పభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ? పంజాబ్‌, హర్యానా, ఇతరంగా గోధుమలు ఎక్కువగా పండే ప్రాంతాల రైతాంగం ఆందోళనలో ముందు ఉన్నదంటే ఇలాంటి అనుభవాలే కారణం.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ధాన్య సేకరణ వివరాల ప్రకారం డిసెంబరు 30 నాటికి 479.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా వాటిలో 42.3శాతం పంజాబ్‌, 11.7శాతం హర్యానా నుంచే ఉన్నాయి. అక్కడి రైతాంగం ఎందుకు ముందుగా స్పందించిందో ఇవి కూడా వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే. మన ప్రధాని నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నప్పటికీ ట్రంప్‌ మనకు చేసిన మేలేమీ లేదు. ఇప్పుడా పెద్దమనిషి ఇంటిదారి పట్టాడు. త్వరలో అధికారం చేపట్టనున్న జో బైడెన్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలియదు. అమెరికా అధ్యక్ష పీఠం మీద ఎవరు కూర్చున్నా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనలను మరింత ఇరకాటంలో పెట్టేందుకు అమెరికన్లకు అవకాశాలు పెరిగాయి. వారి వత్తిడికి లొంగి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు వ్యవసాయ చట్టాల వలన వచ్చే ముప్పు మరింత పెరుగుతుంది. కోళ్లు, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం కావటం అనివార్యం. మన పాడి పరిశ్రమ సమస్యలను పట్టించుకోని కారణంగానే ఆర్‌సిఇపిలో చేరలేదని మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అదే పెద్దలు ఇప్పుడు ఉద్యమిస్తున్న రైతుల ఆందోళనను పట్టించుకొనేందుకు, వద్దంటున్న చట్టాలను వెనక్కు తీసుకొనేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ? రేపు ఏదో ఒకసాకుతో అమెరికాకు, ఇతర ధనిక దేశాలకు లొంగిపోరన్న హామీ ఏముంది ?