మన పౌరులే కాని టిబెటన్ల కిరాయి మెరుపు దళం ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ కథేమిటి ?

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


సరిహద్దుల్లో ఏం జరుగుతోందో తెలియటం లేదు గానీ మన టీవీ ఛానల్స్‌, పత్రికలు మాత్రం చైనాకు ‘దడ’ పుట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసినవారు, చదివిన వారు నిజంగానే నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే యుద్దం వచ్చేస్తోంది, మనం విజయ పతాక ఎగరేయబోతున్నట్లుగా హడావుడి కనిపిస్తోంది. ఒక వైపు చైనాకు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు, చేయాల్సిందే. ఇదే సమయంలో మరోవైపు రికార్డు స్ధాయిలో ఆర్ధిక వృద్ధి రేటు పతనం. ఎంతసేపూ ఆత్మనిర్భర పధకం గురించి చెప్పటమే తప్ప ఇంతవరకు ఆత్మవిశ్వాసం కలిగించే మాట ఒక్కటంటే ఒక్కటి కూడా మన ప్రధాని లేదా ఆర్ధిక మంత్రి నోటి నుంచి ఎందుకు వెలువడటం లేదు ? దీనికి అంత ప్రాధాన్యత లేదని భావిస్తున్నారా ?


నరేంద్రమోడీ కోసం ప్రపంచం చూస్తోంది అని బిజెపి భజనపరులు చెబుతారు. అది నిజం. శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నది ఒక సామెత. ప్రపంచ దేశాల మధ్య సహకారం- ప్రపంచ ఆర్ధిక అభివృద్దికి చేసిన కృషికిగాను మన ప్రధాని నరేంద్రమోడీకి కొరియా ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. అదేమిటో అది తీసుకున్న తరువాత మన ఆర్ధిక వృద్ధి రేటు క్రమంగా దిగజారటం ప్రారంభమైంది. త్రైమాసిక వృద్ధి రేటు 8.2 నుంచి 3.1శాతానికి దిగజారింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో తాత్కాలిక అంచనా ప్రకారం 23.9శాతం దిగజారింది. వాస్తవంలో ఎంత అన్నది నవంబరు 27న ప్రకటించే వివరాల్లో గానీ తెలియదు. అందువలన మోడీ పాలనలో భారతదేశం ఇలా ఎందుకు దిగజారిందా అని ప్రపంచం ఎదురు చూస్తున్నది.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా కరోనా పోరు పేరుతో ఎంతగట్టిగా కంచాలు, రేకులతో మోతలు మోగించి, దీపాలు ఆర్పించి-వెలిగించి ఒకటికి రెండు సార్లు సంకల్పం చెప్పించిందీ చూశాము. దీపాల వెలుగుతో కరోనా అంతరించి పోతుంది అని చెప్పిన పండితుల జోశ్యం ఏమైందో చూస్తున్నాము. రోజుకు దాదాపు లక్ష కేసులతో ప్రపంచంలోనే అగ్రదేశ స్దాయికి చేరబోతున్నది. ఇప్పటికే బ్రెజిల్‌ను అధిగమించి రెండవ స్దానంలోకి దేశాన్ని చేర్చారు. అతి త్వరలోనే అమెరికాను సైతం అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది అని యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోందన్నది నిజం. సరిహద్దు వివాదంలో ఇప్పుడు చైనాతో ఏం చేయబోతున్నారో అని కూడా ప్రపంచం చూస్తోంది.


ఆర్ధిక పరిస్ధితి గురించి లీకులు ఇచ్చి కథలు రాయించేందుకు ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. అందువలన చైనా-సరిహద్దు వివాదం-మిలిటరీ గురించి రంజుగా మీడియాకు అందిస్తున్నారు. అలాంటి వాటిలో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ఒకటి. మన సైన్యంలో ప్రత్యేక విభాగాలుగా చెప్పుకొనేవి ఏడెనిమిది ఉన్నాయి. వాటి కార్యకలాపాలు, బడ్జెట్‌ వివరాలు పార్లమెంట్‌కు కూడా చెప్పనవసరం లేనప్పటికీ వాటన్నింటికీ చట్టబద్దత ఉంది. దీనికి అది లేదు. అయితే ఇతర ఖర్చులు అనే పేరుతో ఈ దళానికి నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నట్లుగా మనం భావించాలి.


పత్రికలు చందాదారుల సంఖ్యను, ఛానళ్లు రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పడుతున్న తాపత్రయంలో అతిశయోక్తులతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయని చెప్పక తప్పదు.ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పేరుతో పని చేస్తున్న దళం చైనాకు దడపుట్టిస్తున్నదని మీడియా చెబుతోంది. దాని గురించి ఒక పత్రిక ఇలా రాసింది.” ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ భారత సైన్యంలో భాగం కాదు. ఆ దళం చేసే సాహసాలకు,త్యాగాలకు బహిరంగంగా గుర్తింపు ఉండదు. అదంతా రహస్యం. ఆ దళం చేసే పని కూడా రహస్యమే. సైన్యానికి కూడా ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ కదలికలు తెలియవు. ప్రధాన మంత్రి కార్యాలయం(పిఎంఓ) పరిధిలో ఈ దళం పని చేస్తుంది. రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఆదేశాలతో ముందుకు సాగుతుంది. అప్పగించిన బాధ్యతలను గప్‌చుప్‌గా పూర్తి చేస్తుంది. ” ఇలా సాగింది.
దీన్ని సూటిగా చెప్పాలంటే ఒక కిరాయి సాయుధ బృందం తప్ప మరొకటి కాదు. ఇది రహస్యంగా పని చేస్తుందని చెబుతున్నారు గనుక ఎన్ని ప్రాణాలు పోయినా, ఎంత నష్టం జరిగినా బయటకు తెలిసే అవకాశం కూడా లేదు. చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకని ? అసలు వీరు మన పౌరులే కాదు. చైనా నుంచి వచ్చిన వారికి మానవతా పూర్వక లేదా మతపరమైన కారణాలతో ఆశ్రయం ఇచ్చిన మనం వారిని చైనాకు వ్యతిరేకంగా వినియోగించుకుంటున్నాము. దీని గురించి కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా అంగీకరిస్తే అంతర్జాతీయంగా తలెత్తే సమస్యలకు సమాధానాలు ఉండవు. ఇప్పుడు చైనాతో వివాదంలో తొలిసారి దాన్ని వినియోగించటంలో ఇది కూడా ఒక కారణమా ?


దీని గురించి రాసిన జర్నలిస్టులకు, ప్రచురించిన పత్రికలకు, ఛానళ్లకు తెలియకపోవచ్చు లేదా తెలిసినా తెలియనట్లు వ్యవహరించవచ్చు గానీ ఈ కిరాయి బాపతు వ్యవహారం బహిరంగ రహస్యం. 1959లో టిబెట్‌లో విఫల తిరుగుబాటు చేసిన దలైలామాను మన దేశానికి తరలించటంలో అమెరికన్‌ సిఐఏ శిక్షణలో తయారైన ముఠాలు కీలక పాత్ర పోషించాయి. మన దేశం, అమెరికా, నేపాల్‌లో తిరుగుబాటు టిబెటన్లకు శిక్షణ ఇచ్చి దాడులు చేయించారు. ఆ ముఠాలకు చైనా సైన్యం చుక్కలు చూపింది. 1962లో చైనాతో యుద్దం యుద్దంలో ఓడిపోయిన కసి లేదా పరాభవంతో ఉన్న మన ప్రభుత్వం తరువాత కాలంలో వారితో సరిహద్దుల్లో దాడులు, విద్రోహ కార్యకలాపాలు చేయించేందుకు ఆ ముఠాలను సంఘటితపరచి చేరదీసింది.
ఇది జరిగి 58 సంవత్సరాలు అవుతున్నది. ఈ దళంలో ప్రారంభంలో చేరిన వారు కూడా ఇంకా పని చేస్తున్నారట. ఒక వేళ అదే నిజమైతే అమెరికా సిఐఏ శిక్షణ పొందిన వారిని మనం పోషించటం, అందునా కీలకమైన ‘ రా ‘ పర్యవేక్షణలోనా ? ఇది అసలు సిసలు దేశభక్తులకు తగినపనేనా ? సిఐఏ పెంచి పోషించిన వారు అమెరికాకు విధేయులుగా ఉంటారా మన దేశానికా ?


మరొక విధంగా చూస్తే దాని తొలి తరం వారు ఇరవై -పాతిక సంవత్సరాల ప్రాయంలో చేరారు అనుకుంటే వారి వయస్సు ఇప్పటికి 78-83 సంవత్సరాలు ఉంటుంది. అతిశయోక్తులు గాకపోతే వారు చైనాకు దడపుట్టిస్తారా ? అరవై సంవత్సరాల క్రితం శరణార్ధుల పేరుతో వచ్చిన సామాన్యులు లేదా సిఐఏ శిక్షణలో తయారైన ముఠాలకు చెందిన సంతానం మన దేశంలోనే పుట్టి పెరిగింది. వారు కూడా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిన వారుగానే ఉంటారు. టిబెట్‌లో పుట్టి పెరిగిన వారంటే కొండలు, కోనల గురించి తెలిసిన వారనుకోవచ్చు. మన దేశంలోని కర్ణాటక, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాలలోని శరణార్ధి శిబిరాలలో పుట్టి పెరిగి పైన చెప్పిన ముఠాలలో చేరిన వారికి టిబెట్‌ అనుపానులు ఎలా తెలుస్తాయి ? ఇలాంటి ముఠాలను భారతదేశం చేరదీసిందని చైనీయులకు తెలియదా ? అలాంటి వారిని కనిపెట్టేందుకు టిబెట్‌లోనే పుట్టి పెరిగిన వారిని చైనా సైన్యంలోకి తీసుకోదా, వారికి శిక్షణ ఇవ్వదా, వారి ముందు వీరు ఏ విషయంలో సరితూగుతారు ?


ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు, దేశంలోని పచ్చి మితవాదుల ఆధ్వర్యంలో నడిచే ” స్వరాజ్య ” పత్రిక సెప్టెంబరు 3న రహస్య ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ గురించి ఒక విశ్లేషణ రాసింది. ఆ దళాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి చైనాకు వ్యతిరేకంగా ఎన్నడూ వినియోగించలేదని, అయితే అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నదని తాజాగా తొలిసారి లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సో దక్షిణ ప్రాంతాన్ని మన దేశం ఆక్రమించుకోవటంలో ధైర్యంగా ముందుకు పోయి దాని అసలు కర్తవ్యాన్ని నెరవేర్చిందని పేర్కొన్నది. టిబెట్‌లో రహస్యంగా విద్రోహకార్యకలాపాలను సాగించటం, చైనా అధికార యంత్రాంగలోకి చొరబడటం వంటి కార్యకలాపాలకు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. పారాచూట్ల ద్వారా శత్రు ప్రాంతాల్లో దిగటంలో కూడా వీరికి శిక్షణ ఇచ్చారు. 1971లో అంతర్యుద్దం సందర్భంగా నేటి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ కొండ ప్రాంతాల్లో ఉన్న పాక్‌ సైన్యంపై దాడులు చేసేందుకు వీరిని వినియోగించారని తరువాత దాన్ని రహస్యంగా ఉంచారని, ఎట్టకేలకు ఇప్పుడు దాని ఉనికిని అంగీకరిస్తూ చైనాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని స్వరాజ్య విశ్లేషకుడు పేర్కొన్నారు.


ఇదే స్వరాజ్య పత్రిక 2018 మార్చి 25న ” టిబెట్‌ తిరుగుబాటు దినం: టిబెట్‌లో సిఐఏ ఎందుకు తనకార్యకలాపాలను నిలిపివేసింది ? ” అనే పేరుతో ఒక విశ్లేషణ ప్రచురించింది. అందువలన ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ వ్యవహారం రహస్యం కాదు అని వేరే చెప్పనవసరం లేదు. 1959 మార్చి 10న టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు వెనుక సిఐఏ హస్తం గురించి దీనిలో రాశారు. అదే నెల 21న తిరుగుబాటు ముగిసింది. దలైలామా అదృశ్యమై అరుణాచల్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో మన దేశంలో ప్రత్యక్షమయ్యాడు. హిందీ-చీనీ భాయి భాయి అన్నట్లుగా ఉన్న సమయంలో చైనా మనతో యుద్దానికి తలపడిందని అనేక మంది విమర్శిస్తారు. దానికంటే ముందే చైనా వ్యవహారాల్లో నాటి నెహ్రూ ప్రభుత్వం వేలు పెట్టిన విషయాన్ని స్వయంగా దలైలామా ప్రవాసంలో స్వేచ్చ పేరుతో రాసిన తన ఆత్మకథలో పేర్కొన్నాడు. తన సోదరుడు 1956లో భారత్‌లో సిఐఏ ఏజంట్లతో సమావేశమయ్యాడని, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారని తెలిపాడు. టిబెట్‌ మాదిరి భౌతిక పరిస్ధితులు ఉండే అమెరికాలోని కాంప్‌ హాలే ప్రాంతానికి టిబెటన్లను తరలించి సిఐఏ శిక్షణ ఇచ్చింది. వారికి ఆయుధాలు, నిధులు ఇచ్చి నేపాల్‌ ద్వారా టిబెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనేక మంది చైనా సైనికుల చేతిలో హతమయ్యారన్నదీ బహిరంగ రహస్యమే. నేపాల్‌లో ఆ తిరుగుబాటుదార్లకు ఉపాధి కల్పించేందుకు, సిఐఏ కార్యకలాపాల కేంద్రంగా వినియోగించేందుకు నేపాల్‌లోని పోఖ్రాన్‌ నగరంలో ఒక హౌటల్‌ను కూడా సిఐఏ నిర్మించి ఇచ్చింది.


దలైలామా, అనుచరగణానికి ఘనస్వాగతం పలికిన నెహ్రూ ప్రభుత్వ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగానే చైనా పరిగణించింది. అయితే రాజకీయంగా ఆశ్రయం కల్పిస్తే వచ్చే సమస్యలకు భయపడి సిఐఏ రూపొందించిన పధకం మేరకు ఒక మతపెద్దగా పరిగణించి ఎర్రతివాచీ పరిచారు. నాటి నుంచి నేటి వరకు టిబెటన్లు రాజకీయ శరణార్ధులు కాదు, మతపరమైన వారిగా పరిగణించి మానవతా పూర్వక రక్షణ పొందుతున్నారు. రాజకీయ ఆశ్రయం కల్పించే దమ్ము, ధైర్యం మన 56 అంగుళాల ఛాతీకి కూడా లేకపోయింది. అ పని చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న భయమే కారణం. ఇదే చేయలేని వారు చైనాతో యుద్దానికి తలపడగలరా అన్నది సమస్య.


1972 ఫిబ్రవరి 21న అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌, చైనా అధినేత మావో మధ్య చారిత్రాత్మక సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రచ్చన్న యుద్ద క్రీడలో తమను పావులుగా వాడుకున్నారని తరువాత దలైలామా అమెరికన్లపై మండి పడ్డారు. చైనాకు ఎక్కడ కోపం వస్తుందో నని దలైలామాను చాలా సంవత్సరాల పాటు అమెరికాకు రానివ్వలేదని కూడా గమనించాలి.
అప్పుడు అమెరికా పావులుగా వాడుకుంటే ఇప్పుడు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పేరుతో ఉన్న టిబెటన్లను భారత్‌ బలిపశువులుగా ఉపయోగిస్తున్నదని, అదేమీ మెరుపు దళం కాదని చైనా నిపుణులు వ్యాఖ్యానించారు. ఆరువేల మందితో ఈ దళాన్ని ఏర్పాటు చేసినట్లు మన మీడియాలో వార్తలు వచ్చాయి తప్ప నిర్దారణ కాదు. ఇదే సమయంలో గరిష్టంగా వెయ్యి మంది కంటే లేరని చైనా నిపుణులు చెబుతున్నారు. రెండు అంచనాల్లోనూ అతి ఉండవచ్చు. భారత సైన్యం విదేశీ సైనికులను, అందునా టిబెటన్లను అసలు విశ్వసించదని, వారి స్ధాయి చాలా తక్కువగా ఉంటుందని, జీవనోపాధిగా టిబెటన్లు ఈ దళంలో చేరతారని చైనా నిపుణుడు గ్లోబల్‌ టైమ్స్‌తో చెప్పాడు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ,పశ్చిమ దేశాల మీడియా రాసిన వార్తల్లో భారత్‌లోని ప్రవాస టిబెట్‌ ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌ఎఫ్‌కు మద్దతు ఇస్తున్నదని, భారత సైన్యంతో భుజం భుజం కలిపి చైనా మిలిటరీతో పోరాడుతున్నట్లు రాసినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రవాస టిబెటన్ల ప్రభుత్వం పేరుకు తప్ప ఉనికిలో లేదని, ఈ సమయంలో వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నించవచ్చని, ప్రవాస టిబెటన్లతో కుమ్మక్కై భారత దేశం టిబెట్‌ను తురుపు ముక్కగా వినియోగించుకోవటం అంటే తన కాళ్లమీద తానే కాల్చుకోవటం వంటిదని పేర్కొన్నది.

పబ్‌జీపై దాడిలో మోడీజీ నిజాయితీ ఎంత ?

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ మరో 117 చైనా యాప్‌లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్‌టాక్‌ మరో 58 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్ధితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏమి చెప్పినా మనం తలూపాల్సిందే, లేకపోతే దేశద్రోహుల కింద లెక్క. చెప్పిందాన్ని నోరెత్తకుండా అంగీకరించటమే దేశభక్తి. ఆ యాప్‌లతో పాటు అమెరికా, ఐరోపా దేశాలలో తయారైన ఎన్నో ఎంతో కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రతి యాప్‌ వినియోగదారుల సమాచారాన్ని ఏదో ఒక దేశానికి లేదా కార్పొరేట్‌ కంపెనీలకు, గూఢచార సంస్థలకు చేరవేస్తున్నవే అన్నది అవునన్నా కాదన్నా తిరుగులేని సత్యం. యాప్‌లందు చైనా యాప్‌లు వేరయా అంటారా ? అయితే వాటి ముప్పు గురించి ఇప్పటి వరకు తెలియదా ? చైనా యేతర దేశాల యాప్‌లు దేశ రక్షణకు ఉపయోగపడుతున్నాయా అని ఎవరైనా అడిగారో అంతే సంగతులు, బూతులతో దాడి చేసేందుకు అసలు సిసలు దేశ భక్తులం మేమే అని తమకు తామే కితాబులు ఇచ్చుకొని, కీర్తి కిరీటాలను స్వయంగా తల మీద పెట్టుకున్న గుంపులు సిద్దంగా ఉంటాయి. అయినా విమర్శనాత్మకంగా చూడక, ప్రశ్నించక తప్పదు !


దేశ రక్షణకే కాదు, సామాజిక భద్రతకు సైతం ముప్పుగా పరిణమించిన వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. రాజీ పడకూడదు. ఎవరైనా కోరుకొనేది అదే ! అలాంటి వైఖరి, చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది చూద్దాం. పబ్‌జీ వీడియో గేమ్‌కు రూపకల్పన చేసింది ఐరిష్‌ జాతీయుడు. దాన్ని తీసుకొని తయారు చేసింది దక్షిణ కొరియా కంపెనీ. చైనా అతి పెద్ద మార్కెట్‌ కనుక దానిలో ప్రవేశించి సొమ్ము చేసుకోవాలని కొరియా కంపెనీ చైనా కంపెనీ టెన్సెంట్‌తో ఒప్పందం చేసుకొని పదిశాతం వాటా ఇచ్చింది. కంప్యూటర్లలో ఉపయోగించేది ఒకటైతే సెల్‌ఫోన్లలో ఉపయోగించే రకం మరొకటి. దాన్ని టెన్నెంట్‌ తయారు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెల్‌ఫోన్లలో ఆడేదాన్ని మాత్రమే నిషేధించింది. కంప్యూటర్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. సెల్‌ఫోన్ల ద్వారా వినియోగదారుల సమాచారం చైనాకు అందకూడదు, కానీ కంప్యూటర్ల ద్వారా దక్షిణ కొరియాకు చేరవచ్చు అని పరోక్షంగా నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతున్నది. దక్షిణ కొరియా అమెరికా అడుగుజాడల్లో నడిచే దేశం. తాను సేకరించిన సమాచారాన్ని అమెరికాకు ఇవ్వకూడదు అన్న హామీని మన ప్రభుత్వం తీసుకున్నదా ? తెలియదు, తీసుకున్నట్లు ప్రభుత్వమూ చెప్పలేదు.


పబ్‌జి ద్వారా వినియోగదారుల సమాచార తస్కరణ ఒక సమస్య అయితే సామాజికంగా తలెత్తే లేదా జరిగే హాని అంతకంటే పెద్దది. మరి ఈ అంశం గురించి మోడీ సర్కార్‌ వైఖరి ఏమిటి ? 2017లో పబ్‌జీని చైనాలో ప్రవేశపెట్టారు. కాని దానిలో ఉన్న అంశాలు యువతను తప్పుదారి పట్టించేవిగానూ, హింసాత్మక ధోరణులకు పురికొల్పేవిగా ఉండటంతో చైనా 2018లోనే నిషేధించింది. మన దేశంలో అనేక కోర్టుల్లో దీనికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నరేంద్రమోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రాజధాని అహమ్మదాబాద్‌, రాజకోటలో తాత్కాలికంగా నిషేధించారు. గత ఏడాదే దీని గురించి పలు రాష్ట్రాల్లో చర్చలు జరిగాయి. విద్యార్ధుల పాలిట మత్తు మందుల వంటివి, హాని కలిగిస్తున్నాయి, పిల్లల్లో హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయి అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మానసిక సమస్యలు కూడా తలెత్తాయి. అవేమీ కేంద్ర ప్రభుత్వ దృష్టిలో లేవా ?


అంతెందుకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆ దుష్ఫలితాల గురించి తెలుసు ! మహారాష్ట్రలో ఈ ఆటను నిషేధించాలని, దేశంలో సమీక్ష జరిపేందుకు నైతిక నియమావళి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముంబై హైకోర్టులో పదకొండు సంవత్సరాల బాలుడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఆ పిల్లవాడి తరఫున స్వయంగా న్యాయవాది అయిన అతని తల్లి కోర్టుకు హాజరు అవుతున్నది. ప్రధాని నరేంద్రమోడీ విద్యార్ధులు, తలిదండ్రులతో గతంలో మాటా మంతీ జరిపిన సమయంలో ఒక తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిస అయ్యాడని వాపోయింది. అప్పుడు ప్రధాని మాట్లాడుతూ అతను పబ్జివాలానా ఏమిటి అని ప్రశ్నించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ (ప్రచారం) అయింది. ఈ కేసులో ఆ ఉదంతాన్ని కూడా పిటీషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు.


హింసాత్మక ధోరణులను పెంచే అంశాలపై సమీక్ష జరిపే నైతిక నియమావళి కమిటీ సమీక్షలో పబ్‌జీ ఆట ప్రమాదకరమని భావించి ఆ కమిటీ చైనాలో నిషేధించాలని సిఫార్సు చేసింది, దాన్ని అక్కడ అమలు జరిపారు. మన దేశంలో కూడా అలాంటి కమిటీని వేసి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ముంబై కేసులో పిటీషనరు ప్రశ్నించాడు. ఇలాంటి ఆటలే పిల్లల మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నివేదికలో హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అంతే కాదు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ కూడా పబ్జీ ఆట నిషేధానికి తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇమ్మని కేంద్రాన్ని కోరింది. పబ్‌జీని జూదంగా మార్చి ఆడుతున్న పెద్ద వారిని గుజరాత్‌లో పోలీసులు అరెస్టులు కూడా చేశారు.


చైనా కమ్యూనిస్టు దేశం, నియంతృత్వం ఉంటుంది, అక్కడ ఏమైనా చేయగలరు, మనది ప్రజాస్వామిక దేశం అక్కడ చేస్తున్న మాదిరి ఇక్కడ చేయటం కుదరదు అనే వాదన ఇటీవల అనేక సందర్భాలలో కొందరు ముందుకు తెస్తున్నారు. బాధ్యతను తప్పించుకొనేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు. తప్పుదారి పడుతున్న పిల్లలను సరైన దారిలోకి తెస్తామంటే ప్రజాస్వామ్యం అడ్డుకుంటుందా ? ఒక వేళ అడ్డుకునేట్లయితే భావి తరాలను చెడగొట్టే అలాంటి ప్రజాస్వామ్యం మనకెందుకు ? పబ్‌జి యాప్‌ను నిషేధిస్తే చైనా కంపెనీ టెన్సెంట్‌కు లక్ష కోట్ల రూపాయల నష్టమని కొందరు చెబుతున్నారు. పదిశాతం వాటా ఉన్న కంపెనీకే అంతనష్టమైతే తనదని కూడా చూసుకోకుండా చైనా కమ్యూనిస్టులు దాన్ని నిషేధించారు. మరి మన ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగనిచ్చినట్లు ? పోతే పోనీయండి పిల్లలు ఏమైతే మాకేం అని పాలకులు అనుకుంటున్నారా ?


2018 మార్చినెల తరువాత తొమ్మిది నెలల కాలంలో చైనా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వీడియో గేమ్‌ను కూడా అమ్మకానికి అనుమతించలేదని ఆ విధానాన్ని 2019లో కూడా కొనసాగిసాంచవచ్చని 2018 డిసెంబరు 13న ఒక పత్రికలో కెవిన్‌ వెబ్‌ అనే విలేకరి రాశారు. ప్రభుత్వ విధానాలకు వీడియో గేమ్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించి అభిప్రాయం చెప్పేందుకు ఒక నైతిక నియమావళి కమిటీని కూడా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నైతికత గురించి కబుర్లు చెప్పే మన పాలకులు ఇంతవరకు అలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికను నడుపుతున్నది కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టుల పట్ల దానికి సానుభూతి కూడా ఉన్నట్లు మనకు కనపడదు. అలాంటి పత్రిక రాసిన కథనం ప్రకారం 2018 మార్చినెలలో హింసాత్మక, ఇతరంగా దురుసుగా వ్యవహరించటాన్ని ప్రోత్సహించే సినిమాలు, వీడియోగేమ్‌లు, యూ ట్యూబ్‌ సీరీస్‌ లేదా చిత్రాలను, నూతన మీడియా విభాగం కిందికి వచ్చే అన్నింటినీ సమీక్షించేందుకు చైనా సర్కార్‌ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దాన్నుంచి అనుమతులు వచ్చే వరకు కొత్త వాటిని వేటినీ అంగీకరించకూడదని నిర్ణయించింది.అంతకు ముందు అనుమతించిన వాటి మీద కూడా ఆంక్షలు విధించింది.


చైనా సెంట్రల్‌ టీవీ ( మన దూరదర్శన్‌ వంటిది) వెల్లడించిన సమాచారం ప్రకారం నైతిక విలువల సమీక్ష కమిటీ 20గేమ్‌లను సమీక్షించి తొమ్మిదింటిని తిరస్కరించింది. మిగిలిన వాటిలో మార్పులను సూచించింది. కొన్ని వీడియో గేమ్‌లు పిల్లలను వ్యసన పరులుగాను, పని పాటలు లేని వారిగానూ మారుస్తాయనే విమర్శ చైనాలో వచ్చింది. 2018లో వీడియో గేమ్‌లపై 34 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసినట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో గేమ్స్‌ తయారీ సంస్ధ చైనా కంపెనీ టెన్సెంట్‌. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దాని ఆదాయం 200 బిలియన్‌ డాలర్లు పడిపోయింది. పిల్లలు అదే పనిగా గేమ్స్‌లో మునిగి పోకుండా ఉండేందుకు వారిని గుర్తించి వ్యవధిని పరిమితం చేసే అంటే నిర్ణీత వ్యవధి తరువాత గేమ్‌లు ఆగిపోయే విధంగా సాప్ట్‌వేర్‌లో మార్పులు కూడా టెన్సెంట్‌ కంపెనీ చేసింది. చైనాను ఆర్ధికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మన సర్కార్‌ యాప్‌లను నిషేధించింది. కానీ అంతకంటే ముందే చైనా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తమ కంపెనీకి ఎంత నష్టం వచ్చినా ఆ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ నేత అనుకుంటున్న నరేంద్రమోడీ లేదా ఆయన సలహాదారులు, పెద్ద యంత్రాంగం వీటన్నింటినీ గమనిస్తున్నదా ? నిజంగా గమనిస్తే పబ్‌జీ వంటి ప్రమాదకరమైన వీడియో గేమ్‌ల మీద చర్య తీసుకొనేందుకు సరిహద్దులో చైనాతో సమస్య వచ్చేంత వరకు ఆగాలా ? అందువలన పబ్‌జీ గురించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తెలియని విషయము కాదు అన్నది స్పష్టం. తలిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, కోర్టులలో కేసులు ఎందుకు దాఖలు అవుతున్నాయో పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా ? కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు చైనాను దెబ్బతీసేందుకు నిషేధం అని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే చిత్తశుద్ధి సమస్య ముందుకు వస్తున్నది. జాతిని ఏకత, శీలముతో నిర్మిస్తాము అని చెప్పుకొనే సంఘపరివార్‌ కుటుంబంలో పెరిగిన వారే ఇప్పుడు దేశంలోని అని ప్రధాన పదవులలో ఉన్నారు. పబ్‌జీ గాక పోతే దాని తాతల వంటి ప్రమాదకర వీడియో గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి, మరి వాటి సంగతేమిటి ?


ప్రపంచంలో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మీద కొత్త యుద్దం మొదలైంది. పది సంవత్సరాల క్రితం వరకు చైనా ఈ రంగంలోకి వస్తుందని లేదా తమకు పోటీ ఇస్తుందని అమెరికా వంటి దేశాలు ఊహించలేదు. చైనా వారికి తెలివి తేటలు లేవు, ఫ్యాక్టరీల్లో గొడ్డు చాకిరీ చేస్తారు గానీ వారికి ఆంగ్లం రాదు, ఆంగ్లం రాకుండా కృత్రిమ మేథలో ప్రవేశించలేరు అన్న భ్రమలున్నవారికి దిమ్మతిరిగేలా చైనా ముందుకు వచ్చింది. రాజకీయ రంగంలో ఎవరు ఎటు వుండాలో తేల్చుకోవాల్సిన సమయాల మాదిరి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోటీలో కూడా అమెరికా – చైనాల మధ్య ఏ పక్షంలో ఉండాలో దేశాలూ, కంపెనీలు తేల్చుకోవాల్సిస తరుణం వచ్చిందని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎస్‌ విశ్లేషకులు జిల్‌ దిసిస్‌ జూలై11న రాసిన దానిలో పేర్కొన్నారు. ఫలానా యాప్‌, పరికరం ఫలానా దేశానిది అయితే కొనవద్దు అనే ఆంక్షలకు, ఇతర దేశాల మీద వత్తిళ్లకు శ్రీకారం చుట్టింది అమెరికా. ఇది రాబోయే రోజుల్లో పెట్టుబడిదారీ దేశాల్లోనే కొత్త విబేధాల సృష్టికి నాంది పలకటం ఖాయం.


అమెరికాతో సహా అనేక దేశాలు చైనాతో వాణిజ్యలోటులో ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు రాజకీయంగా చైనా వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా,బ్రెజిల్‌, సౌదీ అరేబియా, స్విడ్జర్లాండ్‌, ఒక దేశం కాకున్నా తైవాన్‌ ప్రాంతం చైనాతో వాణిజ్యంలో మిగుల్లో ఉన్నాయి. అందువలన ఎవరు ఎటు ఉండాలో తేల్చుకోవాల్సిన స్ధితే వస్తే ఈ దేశాల్లో ఉన్న కార్పొరేట్‌ సంస్ధలు నష్టాలు మూటగట్టుకొని లేదా మడి గట్టుకొని చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంటాయా లేక అనుకూల వైఖరిని తీసుకుంటాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు రావటం అనివార్యం.తటస్ధ వైఖరి తీసుకున్నా అది అమెరికాకు ఓటమే అవుతుంది. టిక్‌టాక్‌ యాప్‌ చైనా కంపెనీది అయినప్పటికీ దాని సిఇఓ అమెరికన్‌. మన దేశం దాన్ని నిషేధించిన తరువాత మా భద్రతకు సైతం ముప్పే అంటూ అమెరికా పల్లవి అందుకుంది. నిజంగా ముప్పు అనుకుంటే చైనా కంపెనీకి ఒక అమెరికన్‌ సారధ్యం వహించటం నిజంగా ఆశ్చర్యమే. అదే అమెరికా దాన్ని తమ దేశంలోని కార్పొరేట్లకు విక్రయించాలని కోరిన విషయం కూడా తెలిసిందే.


ప్రస్తుతం యాప్‌ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా తీవ్ర పోటీ నెలకొన్నది. యాప్‌లు వస్తువులను తయారు చేయవు. వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. వినోదం లేదా సమాచారం, ఆటల వంటి వాటిని వినియోగదారులకు చేరుస్తాయి. వాటి ద్వారానే డబ్బు సంపాదించవచ్చు. ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న లేదా కొత్తగా పుట్టుకు వస్తున్న బిలియనీర్లు ఈ రంగం నుంచి వచ్చిన వారే అత్యధికులు. ఇప్పుడు యాప్‌ల సునామీని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ విభాగాన్ని విశ్లేషిస్తున్నవారు చెబుతున్నమాట. యాప్‌ అనీ అనే ఒక సంస్ధ రూపొందించిన నివేదిక ప్రకారం 2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ యాప్‌ ఆర్ధిక వ్యవస్ధలో మొబైల్‌ యాప్స్‌ మరియు గేమ్స్‌ మీద 50 బిలియన్‌ డాలర్ల మేర వినియోగదారులు ఖర్చు చేశారు.అంతకు ముందు ఆరునెలలతో పోలిస్తే పదిశాతం ఎక్కువ. ప్రపంచ వ్యాపితంగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపధ్యంలో మే నెలలో రికార్డు స్ధాయిలో 9.6బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ప్రపంచ వ్యాపితంగా 1.6లక్షల కోట్ల గంటల పాటు వినియోగదారులు ఆరునెలల కాలంలో మొబైల్స్‌తో కాలక్షేపం చేశారని అంచనా.రానున్న రోజుల్లో కొత్త అంశాలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలను చూసేందుకు వినియోగదారులు పోటీ పడతారని భావిస్తున్నారు. ప్రపంచ యాప్‌ల సునామీకి, అమెరికా-చైనాల పోటీకి ఇదే కారణం.


కరోనా వైరస్‌ ఒక వైపు ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్నది అన్నది ఒక చేదు నిజం. ఇదే సమయంలో గతంలో ఏ వైరస్‌ చూపని ప్రభావం జన జీవితాల మీద చూపుతున్నది అంటే అతిశయోక్తి కాదు. సెల్‌ ఫోన్‌ లేకుండా రోజువారీ జీవనం గడవదు అనుకొనే పరిస్ధితి రావటానికి కరోనా వైరస్‌ ముందు పది సంవత్సరాలు పడుతుందని అని అంచనా వేశారు అనుకుందాం. కరోనా ఆ వ్యవధిని రెండు మూడు సంవత్సరాలు తగ్గించి వేసిందని తాజా అంచనా. కొద్ది సంవత్సరాల క్రితం పుడుతున్న పిల్లలు ముందు అమ్మా అనటం కంటే అమ్మాయి అంటున్నారని జోక్‌లు పేలాయి. చందమామను చూపి పిల్లలకు తిండి తినిపించే తల్లులు పాత సినిమాలు, కథల్లో మాత్రమే కనిపిస్తారు. సెల్‌ ఫోన్లు చూపి తినిపించే వారు ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నారు. కరోనా ఈ పరిణామాన్ని మరింత వేగవంతం కావించింది. సెల్‌ ఫోన్‌ లేకుండా బడికి వెళ్లం అని పిల్లలు మారాం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


ఇప్పటికే టెలికాం రంగంలో చైనా దూసుకుపోతున్నది. ఐదవతరం ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానంలో చైనా హువెయి కంపెనీ ముందున్నది. భద్రతా కారణాలను సాకుగా చూపి దాని పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయవద్దని అమెరికా తన అనుంగు దేశాలను ఆదేశిస్తున్నది. యాప్‌లను కూడా ఇదే సాకుతో అడ్డుకో చూస్తున్నది. గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందు మన దేశానికి టిక్‌టాక్‌, పబ్‌జి, తదితర చైనా యాప్‌ల నుంచి ముప్పు ఉందని ప్రభుత్వం చెప్పలేదు. వెనెజులా, ఇరాన్‌ మీద కక్ష గట్టిన అమెరికా మనదేశాన్ని తన వైపు తిప్పుకుంది. అమెరికా బెదిరింపులకు లొంగి మనం ఆ రెండు దేశాల నుంచి చమురు కొనుగోలు ఆపి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము. ఐదవతరం టెలికాం టెక్నాలజీ విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకున్నాము.చైనా కంపెనీలను టెండర్లలో పాల్గొన కుండా నిషేధించటంతో పాటు పెట్టుబడులను కూడా అడ్డుకుంటూ నిబంధనలను రూపొందించారు. మనం చైనా వ్యతిరేక శిబిరం అంటే అమెరికా టెంట్‌లోకి దూరేందుకు గాల్వన్‌ లోయ ఉదంతాలు ఒక సాకు తప్ప మరొకటి కాదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


ఒక నాడు కృత్రిమ మేధ రంగంలో ఐబిఎం, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు తప్ప మరొక పేరు వినిపించేది కాదు. ఇప్పటికీ అవి రంగంలో ఉన్నప్పటికీ చైనా కంపెనీలు ముందుకు దూసుకు వచ్చాయి. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా ఉన్నత స్ధాయి సాంకేతిక పరిజ్ఞానంలో పట్టుసాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. పశ్చిమ దేశాల మీద ఆధారపడకూడదనే ప్రధాన అంశం దానిలో ఉంది. అందుకే తీగలతో పనిలేని ఫోన్లు, ఇంటర్నెట్‌, మైక్రోచిప్స్‌, రోబోరంగంలో బిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెడుతున్నది.2019లో చైనా చేసుకున్న దిగుమతుల్లో పదిహేను శాతం లేదా 306 బిలియన్‌ డాలర్ల విలువగల చిప్‌సెట్లను చైనా దిగుమతి చేసుకుంది. ఈ నేపధ్యంలోనే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ట్రంప్‌ ప్రారంభించాడు.అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి తమకు సాంకేతిక పరిజ్ఞానం అందదు అనే నిర్ణయానికి చైనా వచ్చింది. పైన చెప్పుకున్నట్లు పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా అభివృద్ధి పిలుపుకు నేపధ్యం ఇదే.


ప్రపంచంలో తొలి సారిగా అణుబాంబును తయారు చేసింది, ప్రయోగించి భయపెట్టింది అమెరికా. అయితే నాటి సోవియట్‌ నేత స్టాలిన్‌ తాపీగా బాంబును తయారు చేయించి, అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసి ముందుకు పోయిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం తప్పుకాదు. తన వాణిజ్య ప్రయోజనాల కోసం టిక్‌టాక్‌ లేదా పబ్‌జి, మరొక కంపెనీ ఏదైనా చైనాకు దూరంగా జరిగినా ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ వారికి వచ్చే నష్టం లేదు. కొత్త కంపెనీలను రంగంలోకి తెస్తారు తప్ప అయ్యో అంతా అయిపోయిందని చేతులు ముడుకు కూర్చోరు. సాంకేతిక రంగంలో చైనా ఏమీ లేని స్దితి నుంచి ప్రారంభం అయిందని గుర్తుంచుకోవాలి.

కల్పిత వార్తలతో జనాలకు కహానీలు చెబుతున్న మీడియా !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లుగా మీడియాలో నిజాయితీగల మీడియా వేరయా అని చెప్పుకోవాల్సిన రోజులు దాపురించాయి. మీడియాలో పని చేసే వారి గురించి చెప్పనవసరం లేదు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుందన్నట్లుగా ఏ మీడియాలో పని చేస్తే దాని యాజమాన్యానికి అనుగుణంగా రాయాలి, చూపాలి తప్ప పని చేసే వారికి వాస్తవాలతో పని లేదు. అందుకే మీడియా అన్నా వాటిలో పని చేసే వారన్నా విశ్వసనీయత లేని వారిగా పరిగణిస్తున్నారు.


మే, జూన్‌ మాసాలలో భారత-చైనా సరిహద్దుల్లో జరిగిన విచారకర పరిణామాల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు మరణించారు, 73 మంది గాయపడ్డారు, పది మంది చైనా సైనికులకు బందీలుగా పట్టుబడ్డారు. మన సైనికులు కూడా చాలా మంది చైనీయులను చంపారని, బందీలుగా పట్టుకున్నారని చెప్పటం తప్ప అటువైపు నుంచి ఎలాంటి నిర్ధారణలు లేవు. మరణించిన వారి గురించి చైనా ప్రభుత్వం బయట పెట్టటం లేదని, కుటుంబ సభ్యుల నోరు నొక్కివేసిందని మన మీడియా చెబుతోంది. పోనీ అది నిజమే అనుకుందాం. గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతంలో మన వారు 20 మంది మరణించటం తప్ప బందీలుగా ఎవరూ లేరని మన అధికారులు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాతే చైనా తన దగ్గర ఉన్న పదిమంది మన సైనికులను మనకు బహిరంగంగా అప్పగించింది. మన వారెవరూ బందీలుగా లేరని చెప్పిన తరువాత ఆ పదిమందిని చంపినా మన వారు నోటితో సహా అన్నీ మూసుకోవటం తప్ప చేసేదేమీ లేదు. అయినా చైనా మనవారిని మనకు అప్పగించింది.


అప్పటి వరకు మన మీడియా అల్లిన కథలకు బందీల అప్పగింత చెంపదెబ్బ అయింది. అన్నింటికీ మించి మన భూ భాగాలను చైనా అన్ని కిలోమీటర్లు ఆక్రమించింది, ఇన్ని కిలోమీటర్లు ఆక్రమించింది అని స్వయంగా చూసి వచ్చినట్లుగా మీడియా రాసింది, చూపింది. చర్చలు చేసింది, చైనా వ్యతిరేక విషాన్ని నూరిపోసింది. దేశ భక్తిని ఎంత ఎక్కువగా ప్రదర్శించుకొంటే ఒక నాడు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు చైనా వ్యతిరేకతను ఎంత ఎక్కువగా రెచ్చగొడితే అంత దేశ భక్తి అన్నట్లుగా మీడియా పోటీ పడి కేంద్ర పాలకుల మెప్పు పొందేందుకు ప్రయత్నించింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చైనా వారు మన ప్రాంతాలను ఆక్రమించలేదు అని చెప్పి మీడియాను బకరాను చేశారు. మీడియా ప్రచారాన్ని నమ్మి పైత్యం తలకెక్కించుకున్న వారి పరిస్ధితి తేలు కుట్టిన దొంగల మాదిరి తయారైంది.


రెండు దేశాల మధ్య ఎవరికీ చెందని ప్రాంతం కొంత ఉంది, దాన్ని చైనా ఆక్రమించుకుంది కనుకనే ప్రధాని మన ప్రాంతాన్ని ఆక్రమించలేదనే ఒక ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. ఒక వేళ అదే నిజమైతే మన సైనికులను ఆప్రాంతానికి పంపి ప్రాణాలు పోయేందుకు నిర్ణయం తీసుకున్నది ఎవరు ? ఇంతకాలం ఆక్రమణకు పాల్పడని వారు ఇప్పుడెందుకు ఆ పని చేశారు అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక్కడ ఎవరికీ చెందని ప్రాంతమంటూ ఒకటి లేదు. ఒక నిర్ధారిత సరిహద్దు రేఖ లేదు. బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖ ఏ దేశ ఆధీనంలో ఏ ప్రాంతం ఉంది అని నిర్ధారించుకొని గీచింది కాదు, సుమారుగా నిర్ణయించారు. దాని ప్రకారం భారత్‌కు చెందినవి అనుకున్న కొన్ని ప్రాంతాలు చైనాకు చెందినవిగానూ, చైనాకు దక్కాల్సినవి అని పేర్కొన్నవి మన దేశ ఆధీనంలో ఉన్నాయి. ఆక్సారు చిన్‌ ప్రాంతం సరిహద్దు రేఖ ప్రకారం మనదిగా చూపారు కానీ అది ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. దానితో విబేధించిన మన దేశం దాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించింది, పర్యవసానం 1962 యుద్దం. దానిలో మొత్తంగా జరిగిందేమిటి ? చొచ్చుకుపోయిన మన సేనలను వెనక్కు కొట్టిన చైనా తన ఆధీనంలో ఉన్న ప్రాంతానికి కట్టుబడి ఉంది. దాన్ని మనదే అంటున్నాము. మరోవైపున ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో ఉంది. మక్‌మోహన్‌ రేఖ ప్రకారం అది చైనా ప్రాంతంగా ఉంది. అందువలన అది మా టిబెట్‌ దక్షిణ భాగం అని చైనా చెబుతోంది. తమది అని చెబుతోంది తప్ప ఆక్రమించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
తిరిగి మరోసారి మీడియా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటమే విషాదకరం. దాన్ని నమ్మి అనేక మంది మరోసారి చిత్తయ్యారు. జూన్‌లో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు చంపిన చైనా సైనికుల సమాధులు అంటూ జాతీయ మీడియాతో పాటు తెలుగు టీవీ ఛానల్స్‌ కూడా ఊదరగొట్టాయి. ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. మరోసారి పప్పులో కాలేశాయి. తప్పుడు వార్తలను ప్రచురిస్తే పాఠకులకు కలిగిన విచారానికి చింతిస్తున్నామని పత్రికలు ఒకప్పుడు చిన్నదో పెద్దదో వివరణ ఇచ్చేవి. ఇప్పుడు ఆ మాత్రపు విలువలను కూడా పాటించటం లేదు.


ఇంతకీ టీవీలలో చూపిన సమాధులు జూన్‌లో మరణించిన చైనా సైనికులవి కాదు. 1962 యుద్దంలో మరణించిన చైనా సైనికులవని, అవి ఆక్సారుచిన్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న చైనా గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలోని కాంగ్‌క్సివా అనే చోట ఏర్పాటు చేసిన యుద్ద స్మారక కేంద్రంలో ఉన్నట్లు తేలింది. వాటిని చూపి యాంకర్లు రెచ్చిపోయారు. బిజెపి లేదా సంఘపరివార్‌ సంస్ధల నేతలను తలదన్నే విధంగా మాట్లాడారు. గాల్వన్‌లోయలో మన సైనికుల చేతిలో హతులైన చైనా వారికి సంబంధించి రుజువులు ఏవి అనే అడిగేవారికి సమాధానం ఇవి అన్నారు. అంతే కాదు కావాలంటే వెళ్లి లెక్కపెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ఇంకోసారి రుజువులు అడగొద్దు, వీరత్వం చూపిన మన సైనికులను అవమానించవద్దు అని ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రెచ్చిపోయారు. ఆచరణలో ఆజ్‌తక్‌ టీవీ అవమానించింది.
టైమ్స్‌ నౌ ఛానల్‌ కూడా అదే బొమ్మలను చూపింది. మన సైనికులు 35 మంది చైనా వారిని చంపారని మన దగ్గర ఇప్పటికే ఆధారాలున్నాయి, కానీ మరణాలు అంతకంటే ఎక్కువే అని చిత్రాలు చూపుతున్నాయని యాంకర్‌ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్‌క్సివా యుద్ద వీరుల స్మారక కేంద్రంలో 107 మంది సమాధులు ఉన్నట్లు చైనా సైన్యం అధికారికంగానే ప్రకటించింది. వాటితో పాటు 2019లో మరణించిన ఒక సైనికుని సమాధిని కూడా అక్కడే ఏర్పాటు చేశారు, దాంతో 108 ఉన్నట్లు చైనా సిసిటీవీ మిలిటరీ ఛానల్‌లో ఆగస్టు 24నే చూపారని తేలింది. అవే సామాజిక మాధ్యమంలో కూడా ఉన్నాయి. వాటిని మన టీవీల వారు తీసుకొని తాము కనుగొన్నట్లు ఫోజు కొట్టినట్లుగా తేలింది. గ్జిన్‌ జియాంగ్‌ మిలిటరీ ప్రాంతంలో ఉన్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఆ స్మారక కేంద్రానికి వెళ్లి నివాళి అర్పించటం జరుగుతుంది. అలాంటి ఒక సైనికుని చిత్రాన్ని మన టీవీలు చూపాయి. ఆ సైనికుడు విలపిస్తున్నట్లు అది గాల్వన్‌ లోయలో మరణించిన చైనా వారి గురించి అని మన టీవీలు వ్యాఖ్యానం చెప్పాయి. అక్కడ 107మంది సైనికుల వివరాలు, ఇతర విశేషాల గురించి ఒక వ్యాసం 2019 మార్చినెలలో ప్రచురితమైనట్లు బూమ్‌ వెబ్‌ సైట్‌ వెల్లడించింది.


ఇవిగో గాల్వన్‌లో మరణించి చైనా సైనికుల సమాధులు అంటూ ఇండియా టుడే టీవీ ప్రసారం చేసిన వాటిలో ఒక గూగుల్‌ చిత్రం ఉంది. అది 2011నాటిదని ఆల్ట్‌ న్యూస్‌ కనుగొన్నది. ఏ చిత్రం ఎప్పటిదో కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఇండియా టుడే లేదా మరొక టీవీ ఛానల్స్‌ దగ్గర లేవా అంటే అందరి దగ్గరా ఉన్నాయి. వాటిని నిర్ధారణ చేసుకోవచ్చు గానీ తప్పుడు ప్రచారం చేయదలచుకున్నవారికి వాటితో పనేముంటుంది. తాము ప్రత్యేకంగా సంపాదించిన ఉపగ్రహ చిత్రాలంటూ ఇటీవలి కాలంలో టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు ప్రచురిస్తున్న లేదా ప్రదర్శిస్తున్నవన్నీ మిలిటరీ లేదా ప్రభుత్వం అందచేస్తున్నవే. వాటి గురించి మీడియా చేసే వ్యాఖ్యలు తప్ప నిజంగా అక్కడ జరుగుతున్నది ఏమిటన్నది సామాన్యులకు తెలియదు.


మన మీడియా ఒక్కటే కాదు, అనేక దేశాలలో అమెరికన్‌ సిఐఏ ఏజన్సీలు అందించే అనేక కథనాలు, చిత్రాలను పాఠకులకు, వీక్షకుల ముందు కుమ్మరిస్తున్నాయి. అమెరికా లేదా మరొక దేశ గూఢచార, ఇతర ప్రభుత్వ సంస్ధలు ప్రచారదాడిలో భాగంగా ఇలాంటి వాటిని నిరంతరం విడుదల చేస్తుంటాయి. వాటి వనరును పేర్కొన కుండా పత్రికలు , టీవీ ఛానల్స్‌కు ఆయా దేశాల్లో ఉన్న వార్తా సంస్దలు విడుదల చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాపితంగా కుహనా వార్తలు (ఫేక్‌ న్యూస్‌) పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అనేక అంతర్జాతీయ లేదా జాతీయ స్ధాయి మీడియా సంస్దలు వచ్చిన వార్తలను సరి చూసుకొనేందుకు, వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకొన్నాయి. వచ్చిన వార్తల తీరుతెన్నుల గురించి ప్రత్యేక కథనాలను వెలువరిస్తున్నాయి.


జూన్‌లో భారత-చైనా సరిహద్దులో జరిగిన ఉదంతాల గురించి వెలువడిన వీడియోలు, వార్తల గురించి బిబిసి విభాగం అదే పని చేసి కుహనా వార్తలు, కుహనా వీడియోలు, దృశ్యాల గురించి జూన్‌ 19న ఒక ప్రత్యేక కధనాన్ని వెలువరించింది. రెండు దేశాల సైనికులు దెబ్బలాడుకుంటున్న దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్‌ అయింది. గాల్వన్‌ నది లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ అని నమ్మిన వారు దాన్ని చూసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వీడియో 2017 ఆగస్టులో, 2019 సెప్టెంబరులో కూడా అదే విధమైన సమాచారంతో యూట్యూబ్‌లో పోస్టు అయినట్లు బిబిసి తెలిపింది. ఏడాది క్రితం కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను గాల్వాన్‌ లోయ ఉదంతానికి అంటగట్టి ప్రచారం చేశారు. అదే విధంగా టిక్‌టాక్‌లో చైనా భాషలో ఉన్న ఒక వీడియోను కూడా అలాగే చిత్రించారు. దానిలో భారతీయ సైనికుడిని చైనా వారు తిడుతున్నట్లు, వెళ్లిపొమ్మని దబాయిస్తున్నట్లు ఉంది. జనవరిలో యూట్యూబ్‌లో పోస్టు అయిన ఆ వీడియోను తాజా ఉదంతంగా ఒక కాంగ్రెస్‌ నేత ప్రచారంలోకి తెచ్చారు. పోనీ సదరు వీడియో లడఖ్‌ ప్రాంతానిదా అంటే అదీ కాదు, అక్కడికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు సంబంధించింది.ఒక సైనికుడి మృతదేహానికి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను గాల్వన్‌ ఉదంతానికి జత చేసి ప్రచారం చేశారు. మేనెలలో లే-లడఖ్‌ ప్రాంతంలో ఒక ప్రమాదంలో మరణించిన సైనికుడికి సైనిక లాంఛనాలతో మహారాష్ట్రలోని స్వంత పట్టణంలో జరిపిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో అది. గాల్వన్‌ లోయలో భారత సైనికుల మృతదేహాలంటూ హల్‌ చల్‌ చేసిన మరికొన్ని చిత్రాలను కూడా బిబిసి టీమ్‌ పరిశోధించింది. 2015లో నైజీరియా సైనికులపై అక్కడి బోకో హరామ్‌ తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి చిత్రాలవి. వాటిని పాకిస్ధాన్‌ వెబ్‌సైట్‌ కూడా ఒకటి ఉపయోగించింది. అనేక మంది సైనికుల శవపేటికలకు సంబంధించిన మరో చిత్రాన్ని కూడా అదే వెబ్‌సైట్‌లో పెట్టి అది పుల్వామా దాడిలో మరణించిన భారత సైనికులని పేర్కొన్నారు. అది కూడా తప్పుడు చిత్రమే నంటూ పాఠకులను బిబిసి హెచ్చరించింది.


ప్రపంచంలో కల్పిత వార్తలు, రాజకీయ నేత అబద్దాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా తయారయ్యాయి. అతి పెద్ద కల్పిత వార్తల తయారీ కేంద్రాలకు అమెరికా నిలయం. అదే విధంగా రాజకీయ నేతల్లో అతి పెద్ద అబద్దాల కోరు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇతగాడి గురించి అక్కడి పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ చెప్పిన సత్యం. అబద్దాల సునామీ అనే శీర్షికతో గార్డియన్‌ పత్రిక ట్రంప్‌ 20వేల అబద్దాలను పూర్తి చేసిన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు చెప్పిన అంశాలను ఉటంకిస్తూ జూలై 13న ఒక వార్తను రాసింది. జూలై 9న రికార్డు స్ధాయిలో ట్రంప్‌ 62 అబద్దాలను ఆడి అబద్దాల రికార్డును నమోదు చేసినట్లు వాషింగ్టన్‌ పోస్టు వాస్తవాల నిర్ధారిత విభాగం పేర్కొన్నది. అలాంటి ట్రంప్‌, అమెరికా మనకు జిగినీ దోస్తు, భాగస్వామి అని మనలను తనతో పాటు కైలాసానికి తీసుకుపోతుందన్నట్లుగా మన మీడియా చిత్రిస్తోంది.


ట్రంప్‌గారూ మీరు ఇన్ని అబద్దాలు ఆడుతున్నందుకు ఎప్పుడైనా విచారించారా అని భారత సంతతికి చెందిన విలేకరి ఎస్‌వి డాటే ఆగస్టు 13న ప్రశ్నించినట్లు గ్లోబల్‌ న్యూస్‌ అనే ఒక వెబ్‌సైట్‌ వార్తను రాసింది. విలేకర్లతో మాట్లాడి సమయాన్ని వృధా చేయటం ఎందుకు, యావత్‌ సమయాన్ని దేశభక్తిలోనే గడిపేస్తా అన్నట్లుగా అధికారానికి వచ్చిన తరువాత ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని నిరంతర తపనశీలి మన ప్రధాని నరేంద్రమోడీ అన్న విషయం తెలిసిందే. కానీ ట్రంప్‌ వేరు తరచూ విలేకర్లతో మాట్లాడతారు. అలాంటి ఆగస్టు 13నాటి సమావేశంలో మామూలుగానే కరోనా వైరస్‌, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్‌ గురించి మాట్లాడిన తరువాత( నిజాలా అబద్దాలా అనేది కాసేపు పక్కన పెడదాం) అఫింగ్టన్‌ పోస్టు విలేకరిగా అధ్యక్ష భవన వార్తలను రాసే ఎస్‌వి డాటేను ప్రశ్నలు అడగండి అని ట్రంప్‌ స్వయంగా ఆహ్వానించాడు. కొన్ని వందల మంది విలేకర్లు ఉంటారు గనుక ప్రశ్నించే అవకాశం అందరికీ రాదు. మనవాడు తబ్బిబ్బు అయి తేరుకొని అధ్యక్ష మహౌదరు మూడున్నర సంవత్సరాలలో అమెరికా జనానికి మీరు చేసిందాన్ని గురించి అన్నీ అబద్దాలే చెప్పినందుకు ఎప్పుడైనా విచారించారా అని అడిగాడు. అన్నీ అంటే ఏమిటి అని ట్రంప్‌ తిరిగి ప్రశ్నించాడు. అదే అన్నీ అబద్దాలు, నమ్మశక్యం కాని అంశాలు చెప్పారు అని డాటే పునశ్చరణ గావించాడు. వాటిని ఎవరు చెప్పారు అని ట్రంప్‌ రెట్టించాడు. మీరే, లక్షల కొద్దీ ఉన్నాయి అని డాటే నొక్కి వక్కాణించాడు. కొద్ది సేపు మౌనంగా ఉన్న ట్రంప్‌ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మరొక విలేకరిని మాట్లాడాలని అడిగారు.


డోనాల్ట్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా పనిచేయక ముందు రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌ అబద్దాల గురించి ప్రశ్నించేందుకు తాను ఐదు సంవత్సరాల పాటు వేచి చూశానని విలేకర్ల సమావేశం తరువాత ఎస్‌వి డాటే ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్రంప్‌-తన మధ్య జరిగిన సంభాషణను కూడా ట్విటర్‌లో పెట్టాడు. మరుసటి రోజు ఉదయానికే దాన్ని 38లక్షల మంది వీక్షించారు. అలాంటి ప్రశ్నలను మన విలేకర్లలో కొందరైనా అడిగే వారు ఇప్పటికీ ఉన్నారు, కానీ, అసలు అడిగేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ అవకాశం ఇస్తారా ? ఒక వేళ మారు మనసు పుచ్చుకొని ఇచ్చినా అడిగిన విలేకరి ఉద్యోగం ఆఫీసుకు వెళ్లేంతవరకు అయినా ఉంటుందా ?


ఈ నేపధ్యంలో చైనా-భారత్‌ సరిహద్దు ఘర్షణలు లేదా మరొక అంశం మీద గానీ సామాజిక మాధ్యమాల్లో, వాటిని ఆధారం చేసుకొని సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాల్లో కధనాలను వెలువరించుతున్న వాటి పట్ల జనం జాగ్రత్త వహించకపోతే తప్పుడు అభిప్రాయాలను బుర్రలోకి ఎక్కించుకొనే ప్రమాదం ఉంది. చైనాతో, పాకిస్ధాన్‌తో మనకు సమస్యలున్నాయి గనుక వాటి గురించి ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఇలాంటి ప్రచారం జరుగుతోందా ? సామాజిక మాధ్యమంలో ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశాలమీదనే జరుగుతుంటే అలాగే అనుకోవచ్చు. కానీ గత ఆరు సంవత్సరాలలో మన దేశంలో బిజెపి, నరేంద్రమోడీ గురించి అనుకూల తప్పుడు ప్రచారాలు, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక తప్పుడు ప్రచారాలు తక్కువేమీ కాదు. సామాజిక మాధ్యమం పెద్ద ఎత్తున విస్తరించింది, ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చినందున వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి వినియోగంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించటమే పనిగా పెట్టుకున్న సంస్ధలు, పార్టీలు అందుకోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి. బిజెపి, దానికి సంబంధించిన మరికొన్ని సంస్ధలు ప్రచారంలోకి తెచ్చిన విద్వేష పూరిత, రెచ్చగొట్టే, ఇతర సమాచారాన్ని అడ్డుకోవద్దని తమ సిబ్బందికి చెప్పినట్లు ఫేస్‌బుక్‌ అధికారులు తాజాగా అంగీకరించిన అంశం తెలిసిందే. అందువలన ఎవరైనా అలాంటి అంశాలను నిర్ధారించుకోకుండా రెచ్చి పోవద్దు, పొరబాటు అభిప్రాయాలకు రావద్దని మనవి.

మనసులోని మాట వీడియో స్పందనతో మోడీ, బిజెపి మైండ్‌ బ్లాంక్‌ ?

Tags

,


ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం మన ప్రధాని నరేంద్రమోడీని చైనీయులు తమ నేతల కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారని అక్కడి అధికార దినపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే వెల్లడించిందని ఒక కల్పిత వార్తను కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు ప్రచురించాయి. ఆహా ఓహౌ అని కొందరు సంబరాలు చేసుకున్నారు. నిజానికి ఆ సర్వే గురించి సదరు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ ప్రస్తావనే లేదు.


ఇప్పుడు అలాంటి వారందరికీ దిమ్మ దిరిగే స్పందన మన దేశంలో వెల్లడైందని చెప్పవచ్చు. ఆగస్టు 30 ఆదివారం నాడు మన ప్రధాని మన్‌కీ బాత్‌ – మనసులోని మాట – ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే మోడీ అభిమానుల్లో ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. దీని భావమేమి రామచంద్ర ప్రభూ ! అయిష్టత ప్రకటించిన వారందరూ విదేశీయులే, కేవలం రెండు శాతం దేశీయులు మాత్రమే వారిలో ఉన్నారు అని బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ సెలవిస్తే, ఇదంతా కాంగ్రెస్‌ చేయించింది అని బిజెపి కేంద్ర ప్రతినిధి విజరు సోంకర్‌ శాస్త్రి తమతో వ్యాఖ్యానించినట్లు ” ది ప్రింట్‌ ” పేర్కొన్నది.
నెటిజన్లు అయిష్టత ప్రకటించిన విషయాన్ని ఏ సీతారామ్‌ ఏచూరో, రాహుల్‌ గాంధీయో లేదా మరొకరో చెప్పలేదు. నరేంద్రమోడీ ప్రచారం కోసం ప్రభుత్వం, బిజెపి ఏర్పాటు చేసిన అధికారిక ఛానల్స్‌ స్వయంగా వెల్లడించిన సమాచారమే. ఆ ఛానళ్లకు ఖాతాదారులుగా చేరిన వారిలో అత్యధికులు బిజెపి కార్యకర్తలు లేదా నరేంద్రమోడీ అభిమానులే ఉంటారన్నది తెలిసిందే. తాజా స్పందన ద్వారా తమ మనసులో ఉన్న మాటలను మోడీ విస్మరిస్తున్నారని అభిమానులు ఆగ్రహిస్తున్నారా ? ఏమిటీ అసందర్భ ప్రసంగాలని విసుక్కుంటున్నారా ?


మనసులోని మాట పేరుతో ప్రధాని కార్యాలయ యంత్రాంగం లేదా పార్టీ యంత్రాంగం రాసి ఇచ్చిన దానిని చెబుతున్నారో లేక నిజంగా తన మనసులోని మాటనే చెబుతున్నారో మనకు తెలియదు. మనకు కనిపించేది, వినిపించేది మోడీయే కనుక అవి స్వంత భావాలుగానే పరిగణించాలి. ఇంత వరకు ప్రతినెలాఖరులో 68 సార్లు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. ప్రభుత్వ సామాజిక మాధ్యమ ఖాతాలతో పాటు దూరదర్శన్‌, రేడియో కేంద్రాలు, బిజెపి అధికారిక యూట్యూబ్‌ ఛానల్స్‌, మరికొన్ని ఛానల్స్‌ కూడా ప్రసారం చేస్తున్నాయి.


ప్రధాని మన్‌కీ బాత్‌ కబుర్లను వినేందుకు తొలి నెలల్లో చాలా మంది ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు కూడా వింటున్నవారు ఉండవచ్చు. తరువాత అదొక తద్దిన కార్యక్రమంగా మారిందని భావించిన వారు లేకపోలేదు. ఇది మామూలు విషయంగా మారింది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ వార్త. మరి సంచలనం ఏమిటి అంటారా ? మనిషి కుక్కను కరవటం, సంఘటన జరిగిన తరువాత ఆ మనిషి మనోభావాలు ఎలా ఉన్నాయి, తనను కరచిన మనిషి గురించి కుక్క ఏమైనా స్పందించిందా వంటి ప్రశ్నలు వేసే యాంకర్ల తీరు తెన్నులు సరేసరి. ప్రధాని మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని అభిమానించటం సాధారణ అంశం. సంచలనం ఏమిటి ?
ఆగస్టు 30నాటి మన్‌కీ బాత్‌ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే ఎక్కువగా ఉండటమే సంచలన వార్త. గంట గంటకూ తిరస్కరించిన వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల వెల్లడి అవకాశాన్నే నిలిపివేయటం మరింత పెద్ద సంచలన వార్త. ఎందుకిలా జరిగిందో తెలియదుగానీ ఊహించుకోవచ్చు. స్పందనను పర్యవేక్షించే అధికార యంత్రాంగానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందన్నది స్పష్టం. తమనేతకు మరుసటి రోజు ఏమి నివేదిస్తే ఎలాంటి స్పందన, పర్యవసానాలు వుంటాయో తెలియక అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల బటన్‌ పని చేయకుండా నిలిపివేశారన్నది స్పష్టం.


మీడియాలో దీని మీద అనేక వార్తలు వచ్చాయి. కొన్ని సంస్ధలు కనపడీ కనపడకుండా వార్తలను ఇచ్చాయి. లాజికల్‌ ఇండియన్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దీని గురించి ప్రచురించిన ఒక కధనం గురించి చూద్దాం. నీట్‌, జెయియి పరీక్షల మీద తలెత్తిన ఆగ్రహం కారణంగా బిజెపి యూ ట్యూబ్‌ ఛానల్లో అత్యంత అనిష్టత లేదా అయిష్టత ( నిఘంటువులో అసహ్యించుకున్న అని కూడా ఉంది) చూపిన వీడియోగా ప్రధాని మన్‌కీ బాత్‌ తయారైందనే శీర్షికతో కధనాన్ని వెలువరించింది. దానికి దృష్టాంతంగా విద్యార్ధుల ట్వీట్లు కొన్నింటిని ఉటంకించింది.


టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ముంబై మిర్రర్‌ కూడా ప్రముఖంగానే దీన్ని విశ్లేషించింది. మన్‌కీ బాత్‌ వీడియో విడుదల అయిన 24 గంటల తరువాత వివరాలను చూస్తే బిజెపి ఛానల్‌లో 79 వేల మంది ఇష్టత చూపారని, 5.34 లక్షల మంది అనిష్టత చూపారని పేర్కొన్నది. ప్రధాన మంత్రి అధికారిక యూ ట్యూబ్‌ ఛానల్లో 39వేల మంది ఇష్టత, 85వేల మంది అయిష్టత చూపారని పేర్కొన్నది.
సోమవారం రాత్రి పది గంటల సమయానికి బిజెపి ఛానల్లో 29లక్షల మంది చూస్తే వారిలో అభిమానించిన వారు 1.2లక్షలు, అయిష్టత వ్యక్తం చేసిన వారు 7.4లక్షలని ది ప్రింట్‌ తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవార మంతా బిజెపి అభిమానులు పని కట్టుకొని అభిమానం వ్యక్తం చేసిన తరువాత పరిస్దితి ఇది అని గమనించాలి.
ఇక వ్యాఖ్యల విషయానికి వస్తే మచ్చుకు కొన్ని చూద్దాం. ౖ” ప్రియమైన ప్రధాని గారూ మీరు జెయియి, నీట్‌ గురించి మాట్లాడతారని నేను అనుకున్నాను. నాకు ఒక సంవత్సరాన్ని వృధా చేసినందుకు కృతజ్ఞతలు ” ఇది లాజికల్‌ ఇండియన్‌ పేర్కొన్నది. ” 2019లో నా కుటుంబం అతనికి ఎందుకు ఓటు చేసిందా అని ఇప్పుడు నేను విచారిస్తున్నాను. ఇంత హీనమైన ప్రధానిని ఎన్నడూ చూడలేదు. హెచ్‌ఆర్‌డి మంత్రి 80శాతం మంది విద్యార్ధులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెబుతున్నారు. దీని అర్ధం మేము పరీక్షలను కోరుకుంటున్నామని కాదు.ఈ మనిషికి నేను మరోసారి ఓటు వేయను ” అని కిరణ్‌ మోరే అనే విద్యార్ధి ట్వీట్‌ చేసినట్లు ముంబై మిర్రర్‌ పేర్కొన్నది.
” మీరు నా దేశాన్ని నాశనం చేశారు. మీ పార్టీకి ఓటు వేసినందుకు ప్రతిక్షణం విచారిస్తాము. నా జీవిత కాలంలో ఈ కుహనా నటుడ్ని సమర్ధించను” అని ఒకరు, ” కుర్రాళ్లూ ఈ ఏడాదిని ఎన్నడూ మరిచి పోవద్దు. గోడీ (మోడీ ప్రభుత్వాన్ని కొందరు అలా పిలుస్తున్నారు) ప్రభుత్వం 30లక్షల మంది విద్యార్దుల ఆర్తనాదాలను, డిమాండ్లను ఎలా అణచివేసిందో కూడా మరవవద్దు.2024లో మనమేమిటో చూపాలి ” అన్న ట్వీట్లను కూడా ముంబై మిర్రర్‌ ప్రచురించింది.


ప్రధాని తన మనసులోని మాటలో లక్షలాది మంది విద్యార్ధులు, వారి తలిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోలేదన్నది పైన పేర్కొన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్ధుల్లో ఆగ్రహం కారణంగా ఇలాంటి స్పందన వచ్చిందని ఇదేదో తాత్కాలికం అన్నట్లుగా చిత్రించే యత్నం కనిపించింది. విద్యార్ధులైనా మరొకరైనా అధికారిక చానళ్లలో ఖాతాదారులుగా చేరిన వారే మోడీ అంటే అభిమానులే కదా ! లేదూ వారంతా కొత్త వారు, తాజా మన్‌కీ బాత్‌ విని అలా స్పందించారని అనుకోవాలా ? అదైనా నరేంద్రమోడీకి ప్రతికూల స్పందనే కదా ! పరీక్షలు రాసేందుకు సిద్దమైన విద్యార్ధుల కుటుంబాలు, స్నేహితుల్లో ఇదొక ప్రధాన చర్చ నీయాంశం అయిందా లేదా ? ఇలాంటి స్పందన గత మన్‌కీ బాత్‌లకు ఎందుకు రాలేదు ? ఒక వేళ వచ్చినా పట్టించుకోకుండా నేను ఏమి చెప్పినా జనం నోరు మూసుకొని వింటారనే భావం ప్రధానిలో ఆయన యంత్రాంగంలో చోటు చేసుకుందా ? ఈ స్పందనతో బిజెపి నేతల మైండ్‌ బ్లాంక్‌ అయినట్లు కనిపిస్తోంది. కాస్త బాణీ మార్చారు. మోడీ వీడియో మీద అయిష్టతకు నెహ్రూయే కారణం అని చెప్పకుండా కాంగ్రెస్‌ అన్నారు. కాంగ్రెస్‌కు విదేశాల్లో అందునా అధికార ప్రతిపక్ష స్ధాయి కూడా లేని కాంగ్రెస్‌కు అంత పలుకుబడి ఉందా లేక నరేంద్రమోడీ వెలుగు ఆరిపోతోందా ? గతంలో నరేంద్రమోడీకి వచ్చిన మద్దతులో విదేశాల నుంచి ఎంత స్వదేశాల నుంచి ఎంతో వివరిస్తే బాగుండేది. కాంగ్రెస్‌కు అంత సత్తా ఉంటే 67 నెలలు ఏమీ చేయకుండా 68వ వీడియో మీద ఎందుకు కేంద్రీకరించింది అన్న ప్రశ్నకు కూడా బిజెపి నేతలు సమాధానం చెప్పాలి. అభిప్రాయాలను ఇలా తారు మారు చేయటం సాధ్యం అయితే గతంలో బిజెపి కూడా నరేంద్రమోడీకి అనుకూలంగా అదేపని చేసినట్లే కదా !


సామాజిక మాధ్యమాల్లో బిజెపికి మద్దతు బండారం ఏమిటో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బయట పెట్టింది. తాజాగా మరికొన్ని వివరాలను వెల్లడించింది. బిజెపికి 2014 ఎన్నికల్లో తాము ప్రచారం చేశామని ఫేస్‌బుక్‌ భారత అధికారిణి అంఖీదాస్‌ పేర్కొన్న విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆగస్టు 30వ తేదీ వార్తలో పేర్కొన్నది. బిజెపి రాజకీయవేత్తలు, వ్యక్తిగతంగా హిందూ మతవాదులు, బృందాల విద్వేష ప్రచారానికి నిబంధనల ఉల్లంఘన నిబంధనను పాటించవద్దని తమ సిబ్బందికి అంఖీదాస్‌ ఆదేశాలు ఇచ్చినట్లు గతంలో అదే పత్రిక వెల్లడించింది. మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకు నిబంధనల ఉల్లంఘన రూల్స్‌ను వర్తింప చేస్తే ఫేస్‌బుక్‌ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి కనుక చూసీ చూడనట్లు వ్యవహరించాలని ఆమె అదేశించినట్లు బయటపడింది.2014లో మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ఆమె చేసిన ఒక పోస్టులో ” అతని సామాజిక మాధ్యమ ప్రచారానికి మనం అగ్గి అంటించాం, తరువాత చరిత్ర తెలిసిందే అని పేర్కొన్నారు. మరొక పోస్టులో మోడీని ఉక్కు మనిషిగా వర్ణించారు. భారత రాజ్య సోషలిజాన్ని ఓడించటానికి దిగువ స్ధాయి నుంచి చేసిన పనికి 30 సంవత్సరాలు పట్టింది అని కాంగ్రెస్‌ ఓటమి గురించి పేర్కొన్నట్లు అమెరికా పత్రిక వెల్లడించింది.

ఆగస్టు నెల మనసులోని మాటలో చెప్పిందేమిటి ? సెప్టెంబరును పోషకాహార నెలగా పరిగణిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సుభాషితం చెప్పారు. ఫ్రెంచి విప్లవ కాలంలో జనానికి రొట్టెలు కూడా దొరక్క రాణి మేరీ ఆంటోనెటెకు విన్నవించుకున్నపుడు రొట్టెలు దొరక్క పోతే కేకులు తినొచ్చు కదా అని ప్రశ్నించిందట. ప్రజలతో సంబంధాలు లేని పాలకుల స్పందన బాధ్యతా రాహిత్యం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. మనం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్ధాయికి చేరుకున్నామని మన మంత్రులు తమ జబ్బలను తామే చరుచుకొంటున్నారు. జనానికి కొనుగోలు శక్తి లేకపోతే ఆహార ధాన్యాలు మిగిలిపోతున్నాయి తప్ప ఎక్కువై కాదు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. ఈ స్ధితిలో ఒక నెలను పోషకాహార మాసంగా ప్రకటించటం ఏమిటి ?


ప్రధాని నోటి నుంచి మరొక ఆణిముత్యం కుక్కలను, అదీ దేశీయ జాతులను పెంచండి. ఒక వైపు దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా దిగజారనుందో ప్రభుత్వం లెక్కలు ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు ప్రధాని నోటి నుంచి ఇలాంటి సందేశం రావటంతో జనం విస్తుపోతున్నారు. దేశంలో ఎలుకలు రైతుల పంట పొలాల్లో తరువాత గోదాముల్లో ఆహార ధాన్యాలను ఎంత నష్టపరుస్తున్నాయో తెలిసిందే. పది నుంచి 20శాతం వరకు ఉంటుందనే ఆ నష్టాన్ని అరికట్టేందుకు ఎలుక నివారణ సాధ్యంగాకపోతే పిల్లులను పెంచాలని పిలుపు ఇచ్చినా ఒక అర్ధం వుంటుంది. అదే విధంగా దోమలతో ఎంత మంది అనారోగ్యం పాలవుతున్నారో, ఎంత నష్టం జరుగుతోందో తెలుసు. దోమల నివారణ పిలుపు ఇచ్చినా అదో అందం. కుక్కలను అదీ దేశీయ కుక్కలను పెంచాలనటం ఏమిటో అర్ధం కాదు. కుక్కలు దేశీయమా విదేశీయా అని కాదు పోలీసు, మత్తుపదార్ధాలు, ఇతర అవాంఛనీయ కార్యకలాపాలను పసిగడతాయా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ కూడా జాతీయ భావనలను చొప్పిస్తున్నారా ?


కరోనా నేపధ్యంలో వాక్సిన్‌ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకొని అత్యవసరమైన వాటికే ఖర్చు చేస్తున్నారని ప్రపంచం నలుమూలల నుంచి వార్తలు వస్తున్న సమయంలో ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయాలని , మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. వాటిని కొనుగోలు చేసే వారు ఉండాలి కదా ! బొమ్మల కంటే సెల్‌ఫోన్ల మార్కెట్‌ ఎక్కువ, ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ వదలి ఒక ప్రధాని బొమ్మల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమే. బొమ్మలైనా, మరొకటైనా తయారు చేయవద్దని గత ఆరు సంవత్సరాలలో మన దేశంలోని వారిని ఎవరు అడ్డుకున్నారు. అదేమీ కొత్తగా పెరుగుతున్న మార్కెట్‌ కాదే ! నిజంగా అలాంటి మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు ఉంటే మన దేశంలోని తయారీదారులు ప్రధాని పిలుపు ఇచ్చే వరకు ఆగుతారా ?
కరోనాకు ముందు, కరోనా సమయంలో, తరువాత కూడా తమ ప్రభుత్వం చేయబోయే పనుల గురించి నరేంద్రమోడీ, మంత్రులు ఎన్నడూ దాచుకోలేదు. రైళ్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, బీమా, చమురు సంస్ధలు, గనులు, ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతిదానిని ప్రయివేటీకరణ చేయటం గురించి నిరంతరం చెబుతూనే ఉన్నారు. వీటన్నింటినీ వదిలించుకున్న తరువాత నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు ఇంక చేసేదేమి ఉంటుంది ? పనేమీ లేకపోతే నెమలి ఆటలను చూపుతామని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే సూచన ప్రాయంగా జనానికి చెప్పారు. అనేక చోట్ల భారీ వర్షాలతో జనం వరదలు, ఇతర వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతుంటే ఒక్క రాష్ట్రాన్ని అయినా ప్రధాని సందర్శించకుండా నెమళ్లకు మేత వేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న సందేశం ఇప్పటికే జనంలోకి పోయిందా లేదా ?


నెమలిని పెంచటం చట్టరీత్యా నేరం కనుక మరోసారి అలాంటి ఆటలు ప్రధాని నుంచి రాకపోవచ్చు. మంత్రులకు పనేమీ ఉండదు కనుక కోతులు, కొండముచ్చులను ఆడించటం, పగటి వేషాలతో తుపాకి రాముడిలా, వీరతాళ్లతో పోతురాజుల్లా జనాన్ని అలరించటం, సాము గరిడీలకు దిగినా ఆశ్చర్యం లేదు ! ఆ చర్యలతో కడుపునింపుకొనే పొట్టగొట్టినట్లు అవుతుంది. ఇలాంటి వినోదం కోసమే అయితే మోడీ అండ్‌కోను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా ? ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి, ఏడాది క్రితం మరోసారి అధికారం కావాలని నరేంద్రమోడీ ప్రజలను కోరింది దేనికి ? ప్రజలు ఆయనను చూసి దేనికి ఓటు వేశారు ? ప్రజలెదుర్కొంటున్న తక్షణ లేదా ప్రధాన సమస్యలను వదలి ఇలాంటి కబుర్లను మన్‌కీ బాత్‌లో చెబితే వినటానికి సిద్దంగా లేరనేందుకు తాజా మన్‌కీ బాత్‌ వీడియోపై వెల్లడైన వ్యతిరేక స్పందన ఒక సూచిక. నెమళ్లను ఆడించటానికి, కుక్కలను పెంచండి, ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయండి, పౌష్టికాహారం తీసుకోండనే సుభాషితాలను వినేందుకా ఓటు వేసింది అని ఆలోచించాల్సిన సమయం వచ్చిందా లేదా ? ఆలోచించండి !!

దేవుడి పేరుతో రాష్ట్రాలకు జిఎస్‌టి శఠగోపం ? అబద్దాలతో తప్పుదారి పట్టిస్తున్న బిజెపి !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


కోవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. అన్ని దేశాల పాలకులకు వైరస్‌ పెద్ద పరీక్షగా మారింది. అనేక దేశాల పాలకులు, పాలక పార్టీలు జిమ్మిక్కులు చేసి జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అనే చులకన భావం ఎల్లెడలా వ్యాపించి ఉంది.


” నరేంద్రమోడీ భారత్‌కు దైవమిచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు ” అని ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం.వెంకయ్య నాయుడు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పని చేసిన సమయంలో వర్ణించారు. 2016 మార్చి 21వ తేదీన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సమయంలో ప్రవాహంలా దొర్లిన ఈ మాటలను అప్పుడు నరేంద్రమోడీ అభిమానులు వహ్వా వహ్వా అంటూ ఎంతగానో ఆనందించారు. మీడియా కూడా ప్రముఖంగానే ఈ వార్తలను ఇచ్చింది. సమావేశం ముగిసిన తరువాత కొందరు విలేకర్లు వెంకయ్య నాయుడి పొగడ్తల గురించి అడగ్గా హౌం మంత్రిగా ఉన్న రాజనాధ్‌ సింగ్‌ వెంకయ్యగారు మాట్లాడుతుండగా తాను వినలేదని తప్పించుకున్నారు. పోనీ దేశానికి దేవుడు ఇచ్చిన బహుమతిగా నరేంద్రమోడీని మీరు గానీ బిజెపిగానీ భావిస్తున్నదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తిరస్కరించారు.
దేవుడు ఇచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు అయిన నరేంద్రమోడీ ఏలుబడిలో జరగరానివి జరిగిపోతున్నాయి. ఆగస్టు 27న జిఎస్‌టి 41వ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దైవ విధి లేదా దైవిక కృత్యం( యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ ) కారణంగా కరోనా మహమ్మారి వలన పన్ను వసూళ్లు తగ్గాయని సెలవిచ్చారు. దేశానికి తానిచ్చిన ” బహుమతి ” గురించి దేవుడు మరచి పోయినట్లా ? పేదల పాలిట రక్షకుడు వలస కార్మికులను స్వ స్ధలాలకు చేర్చటంలో ఎలా ఇబ్బందులు పెట్టారో, అలవిగాని ఇబ్బందులకు, దిక్కులేని చావులకు ఎలా కారకులయ్యారో, పని కోల్పోయిన వారి కడుపు ఎలా నింపుతున్నారో యావత్‌ దేశంతో పాటు దేవుడు కూడా చూస్తేనే ఉన్నాడు కదా !


ఐదు సంవత్సరాల పాటు జిఎస్‌టి వలన నష్టపోయే రాష్ట్రాలకు అంగీకరించిన సూత్రం ప్రకారం ఎంత నష్టమైతే అంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. 2017 జూలై ఒకటి నుంచి 2022 జూన్‌ 30వరకు ఈ అవగాహన అమల్లో ఉంటుంది. అమల్లోకి వచ్చిన తేదీ నాటికి రాష్ట్రాలకు అంతకు ముందున్న అమ్మకపు పన్ను మీద ప్రతి ఏటా 14శాతం వృద్ధి ఉంటుందనే భావనతో రాష్ట్రాల ఆదాయాన్ని లెక్కించాలి. 2017 జూలై ఒకటి నాటికి వంద రూపాయలు ఆదాయం వచ్చిందనుకుందాం. మరుసటి సంవత్సరం దాన్ని రు.114గా పరిగణించాలి. ఒక వేళ ఆ మొత్తం రాకపోతే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని ప్రతి రాష్ట్రానికి కేంద్రం చెల్లించాలి. మరుసటి సంవత్సరం 114 రూపాయలు మీద పద్నాలుగు శాతాన్ని పెంచి లెక్కించితే ఆ మొత్తం రు.129.96 అవుతుంది.తరువాత రూ.148.15కు పెరుగుతుంది. ఇలా ఐదు సంవత్సరాలు పెంచుతూ అమలు జరపాలి, సదరు మొత్తాలకు ఎంత తగ్గితే అంత మొత్తాన్ని కేంద్రం ఇవ్వాలి.


గత ఏడాది అంటే 2020 మార్చి నెల వరకు నష్టం మొత్తాన్ని చెల్లించిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి చెల్లింపులను నిలిపివేసింది. నలభై ఒకటవ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశానికి నివేదించిన వివరాల ప్రకారం 2020-21 సంవత్సరానికి మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గుతుందని, జిఎస్‌టి సెస్‌ ద్వారా రూ.65వేల కోట్ల మేరకు సమకూరుతుందని, నిఖర ఆదాయ లోటు రూ.2.25లక్షల కోట్లని చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రం చెల్లించాలన్నది రాష్ట్రాల డిమాండ్‌. అయితే రుణాలు తీసుకొని నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకొంటే తరువాత ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని దానికి గాను రెండు పద్దతులలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని కేంద్రం కోరింది. దీనికి గాను వారం రోజుల గడువును రాష్ట్రాలు కోరాయి.


సాధారణ పరిస్ధితుల్లో అవగాహన ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని అయితే ఆ మొత్తం సెస్‌ నిధి నుంచి తప్ప ఇతర ఖాతాల నుంచి చెల్లించకూడదని అటార్నీ జనరల్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.అయితే దైవిక కృత్యాల ద్వారా ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాలన్న నిబంధన లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశంలో వాదించారు. అదే పల్లవిని బిజెపి పాలిత రాష్ట్రమైన అసోం ఆర్ధిక మంత్రి హేమంత బిస్వాస్‌ శర్మ అందుకున్నారు. వారం తరువాత రాష్ట్రాలు ఏమి చెబుతాయి అన్న అంశాన్ని పక్కన పెడితే దైవిక కృత్యం పేరుతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు చెల్లించాల్సిందేమీ లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే దేవుడి పేరుతో శఠగోపం పెట్టటాన్ని రాష్ట్రాలు ఎలా పరిగణిస్తాయి, పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. లోటును పూడ్చుకొనేందుకు రాష్ట్రాలకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. జిఎస్‌టి పరిధిలో లేని మద్యం, చమురు, మరికొన్ని వస్తువులపై ఇప్పటికే రాష్ట్రాలు గరిష్టంగా పన్ను వసూలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డీజిలు, పెట్రోలు ధరల విధానాన్ని పక్కన పెట్టి వాటిమీద పన్నులను పెంచటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా ధరలు పెంచుతూ వినియోగదారుల జేబులు కొడుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాలు నిధుల లేమితో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అందుకోసం వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని పట్టించుకోకుండా మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం, రాష్ట్రాలు మద్యం ధరలను విపరీతంగా పెంచిన తీరును చూశాము. ఇప్పుడు రానున్న రోజుల్లో జిఎస్‌టి ఆదాయం తగ్గటం ఖాయమని తేలిపోయినందున వివిధ వస్తువులపై జిఎస్‌టిని పెంచినా చేసేదేమీ లేదు. పెట్రోలు, డీజిలు ధరలను భరిస్తున్నట్లే జనం జిఎస్‌టి పెంపుదలకు కూడా నోరెత్త కుండా అలవాటు పడాల్సి ఉంటుంది.


అనేక మంది నిపుణులు, సంస్ధలు, సర్వేలు దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం గురించి పెదవి విరుస్తున్నాయి తప్ప ఆశాభావం వెలిబుచ్చటం లేదు. కానీ అధికారపక్షం బిజెపి మాత్రం దేశం వెలిగిపోనుందని చెప్పటం గమనించాల్సిన అంశం. ఆగస్టు 22న ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ఒక ట్వీట్‌ చేసింది. దానికి మద్దతుగా సమాచారం ఉన్న చిత్రాన్ని కూడా జత చేసింది. ట్వీట్‌లో ఇలా ఉంది. ” కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రధాన దేశాలన్నీ తిరోగమన వృద్ధితో ప్రపంచం ఆర్ధికంగా రక్తమోడుతూ తంటాలు పడుతుండగా 2020లో సానుకూల వృద్దితో వెలిగిపోయే చోట భారత్‌ ఉంటుంది. వేగంగా అభివృద్ది చెందుతున్న దేశ స్దాయిని అది నిలబెట్టుకుంటుంది ” అని పేర్కొన్నది.
పైన పేర్కొన్న అభిప్రాయాన్ని బలపరుస్తూ బిజెపి విడుదల చేసిన చిత్రంలో ” కోవిడ్‌-19 సమయంలో భారత అసమాన ఆర్ధిక పోరాటం ” అని ఒక నినాదం ” 2020లో ప్రపంచంలోని పెద్ద ఆర్ధిక వ్యవస్దలలో అత్యధిక జిడిపి అభివృద్దిని నమోదు చేసేందుకు భారత్‌ నడుం కట్టింది ” అని మరొక నినాదాన్ని రాశారు. వాటి కింద భారత్‌ 1.9శాతం, చైనా 1.2 శాతం చొప్పున వృద్ది చెందుతాయని, అమెరికా 5.9, జర్మనీ 7, ఫ్రాన్స్‌ 7.2, ఇటలీ 9.1, స్పెయిన్‌ 8, జపాన్‌ 5.2, బ్రిటన్‌ 6.2 , కెనడా 6.5 శాతాల చొప్పున తిరోగమన వృద్ధి నమోదు చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంకెలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఐఎంఎఫ్‌ అంకెలకు, ఇతర సంస్దల అంచనాలకు తేడాలుంటాయి. వాటి గురించి పేచీ లేదు. ఈ అంకెలతో బిజెపి జనాన్ని తప్పుదారి పట్టించింది అన్నదే గమనించాల్సిన అంశం. ఇదే బిజెపి ఏప్రిల్‌ 15న చేసిన ఒక ట్వీట్‌లో ఇదే అంకెలతో భారత అభివృద్ది గురించి పేర్కొన్నది. అప్పటి చిత్రంలో 2021లో పైన పేర్కొన్న దేశాల ఆర్ధిక వ్యవస్ధలు పురోగమనంలో ఉంటాయని ఐఎంఎఫ్‌ అంకెలను పేర్కొన్నది. ఇప్పుడు వచ్చే ఏడాది అంచనాలను తొలగించి వర్తమాన సంవత్సరానికి నాలుగు నెలల క్రితం వేసిన అంచనాలు తాజావి అన్నట్లుగా పాత అంకెలనే బిజెపి ఆగస్టు 22న ట్వీట్‌ చేసింది. ఇది తప్పుదారి పట్టించటం తప్ప నిజాయితీ కాదు.


ఈ ఏడాది మిగిలిన కాలమంతా తీవ్ర ఆర్ధిక మాంద్యంలో ఉంటుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో మాత్రమే కోలుకోవటం ప్రారంభం కావచ్చని ఆగస్టు 18-27 మధ్య రాయిటర్స్‌ వార్తా సంస్ద నిర్వహించిన అభిప్రాయసేకరణలో ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తిని చూస్తే సమీప భవిష్యత్‌లో కోలుకొనే అవకాశాలు కనిపించటం లేదని, ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున జనం దగ్గర పొదుపు చేసుకున్న మొత్తాలు కూడా కరిగిపోతాయని, తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 18.3శాతం కుంగిపోనుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మూడు నెలల్లో వృద్ధి రేటు మూడుశాతం మాత్రమే ఉండవచ్చని చెప్పారు. కరోనాకు ముందు స్ధితికి చేరుకొనేందుకు ఏడాది పట్టవచ్చని 80శాతం మంది ఆర్ధికవేత్తలు చెప్పారు. మిగిలిన వారు రెండు సంవత్సరాలకు పైగా పట్టవచ్చని మిగిలిన వారు చెప్పారు.


ప్రతి ఏటా ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌లో ఒకసారి, సెప్టెంబరు లేదా అక్టోబరులో రెండవ సారి ఆర్ధిక వ్యవస్ధల గురించి అంచనాలు, జోశ్యాన్ని వెల్లడిస్తుంది. అయితే కరోనా కారణంగా జూన్‌లో కూడా అంచనాలను సవరించింది. దాని ప్రకారం 2020లో చైనాలో ఒక శాతం పురోగమనం, మన దేశంలో 4.9శాతం తిరోగమనంలో ఉంటుందని పేర్కొన్నది. కానీ బిజెపి మాత్రం 1.9శాతం పురోగమనం అని వెలిగిపోతున్న చోట దేశం ఉందని, వేగంగా అభివృద్ది చెందుతున్నదని ఐఎంఎఫ్‌ పేరుతో బుకాయిస్తున్నది ! తప్పుడు విధానాలతో కరోనాతో నిమిత్తం లేకుండానే దేశాన్ని దిగజార్చిన వారు, కరోనా పేరుతో ఎంతకైనా దిగజారేందుకు సిద్ద పడుతున్నారా ?

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే పేరుతో మోడీ గురించి అతిశయోక్తులు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు
చైనాలోనూ మోడీయే….. వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. ” మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు ” అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.
యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.
భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.
భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.
చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.
జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే పేరుతో మోడీ గురించి అతిశయోక్తులు !

Tags

,


ఎం కోటేశ్వరరావు

      చైనాలోనూ మోడీయే..... వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.

     ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. '' మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు '' అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

    చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.

యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.

     భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.

భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.

   చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.

జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.
https://www.globaltimes.cn/content/1199027.shtml

కష్టకాలంలో ప్రధాని నరేంద్రమోడీ నెమలి నాట్యాలా ?

Tags


ఎం కోటేశ్వరరావు


మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా ఉత్తినే తిని తొంగుంటే మడికి గొడ్డుకు తేడా ఏటుంటాది అన్న మాటలను ముత్యాలముగ్గు సినిమాతో ప్రముఖ దర్శకుడు బాపు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి తెచ్చారో తెలిసిందే. అదే మాదిరి దేశం కష్టకాలంలో ఉన్న తరుణంలో జనానికి కాస్త వినోదం పంచుదామని ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించారా ?


రోజు రోజుకూ కొత్త రికార్డులను స్ధాపిస్తూ దేశంలో కరోనా కేసులు ఒక వైపు పెరిగి పోతున్నాయి. అనేక రాష్ట్రాలలో వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉపాధి ఎంతగా పోయిందో తెలిపే లెక్కలను చూసి అప్పటి వరకు మంచి రోజులు రాక పోతాయా అనే ఆత్మ ధైర్యంతో ఉన్న నిరుద్యోగులు ఆత్మ నిబ్బరాన్ని కోల్పోతున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారిన తీరును చూసి సామాన్య జనం సామూహిక గుండెపోటుకు గురి కాకుండా ఎంతగా పతనం అయిందో అనేక సంస్ధలు, వ్యక్తులు అంచనాలతో జనాన్ని మానసికంగా సిద్దం చేస్తున్నారు. ఇరవైనుంచి ఇరవై ఆరుశాతం వరకు అంటే నాలుగో వంతు వరకు మరో విధంగా చెప్పాలంటే గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఒకటి దెబ్బతిన్నదనే రీతిలో వార్తలు వస్తున్నాయి.


ఈ స్దితిలోనే మన ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఆత్మనిర్భర నినాదమిచ్చారు. అదేమిటో అర్ధంగాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో నినాదాలిచ్చారు, ప్రధాని పొదిలో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిని కూడా రానివ్వండి చూద్దాం అన్నట్లుగా లేదా మన కెందుకులే అని గానీ మేథావుల జాబితాలో ఉన్న వారు వేచి చూస్తున్నారు. సరే వంది మాగధులు, భజన పరుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేముంది !


ఎప్పుడూ కష్టాలూ, కన్నీళ్లేనా కాస్త ఉపశమనం పొందొచ్చు కదా అన్నట్లుగా తాను నెమళ్లకు మేత ఎలా వేస్తున్నదీ, తనను చూడగానే అవి పురివిప్పి ఎలా ఆడేది, వాటిని తాను కూడా మెప్పించేందుకు మరింతగా ఆడేందుకు రకరకాల డ్రస్సులను ధరించి అలరిస్తున్నారో చూపుతూ మన ప్రధాని నరేంద్రమోడీ గత ఆదివారం నాడు (ఆగస్టు 23న) యావత్‌ ప్రపంచాన్ని ఒక నిమిషం 47సెకండ్ల పాటు రంజింప చేసే ఒక వీడియోను స్వయంగా విడుదల చేశారు. ఎన్నికల్లో పీకల్లోతు మునిగి ఉన్న మోడీ గారి జిగినీ దోస్తు ట్రంప్‌ చూశారో లేదో లేక ఇంతకంటే వినోదం రోజూ కలిగిస్తున్నాగా దీనిలో ఏముంది అని విస్మరించారో గానీ ఎలాంటి ట్వీటు స్వీటు మనకు పంచలేదు.
ప్రధాని మోడీ ఏమి చేసినా గొప్పే కనుక మన మీడియా నెమలి వీడియోకు బాగానే ప్రాచుర్యం కలిగించింది. చూడని వారి ఖర్మ చేసేదేమీ లేదు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం మిగిలి ఉంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు పాకేజీలకు అమ్ముడు పోయి కొందరు నేతలు, కొన్ని పార్టీలకు అనుకూలంగా ఎలా ప్రచార అవకాశాలు కల్పిస్తున్నాయో రోజూ వార్తల్లో చూస్తున్నాం. కేవలం భజన పరులకే అవకాశం ఇస్తే కొంతకాలానికి వాటి ముఖం చూసే వారు ఉండరు కనుక భిన్నమైన అభిప్రాయ వ్యక్తీకరణకు కూడా చోటు కల్పిస్తున్నాయి. చట్టాలు కొందరికే తప్ప అందరికీ ఒకే విధంగా వర్తించవు అనే అభిప్రాయం ప్రధాని నెమలి ఉదంతంతో వెల్లడైంది.


నెమలి జాతీయ పక్షి. దాన్ని స్వేచ్చగా ఉండనివ్వాలి తప్ప ఎవరూ మచ్చిక చేసుకో కూడదు. దేశంలో ఉన్న చట్టాల ప్రకారం అది నేరం. 2017లో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, గడ్డి కుంభకోణం ఫేం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంటికి రెండు నెమళ్లను తీసుకు వచ్చారు.1972 వన్య ప్రాణి రక్షణ చట్టం ప్రకారం అలా తీసుకురావటం నేరమని, కేసు బనాయించి శిక్షించాలని బీహార్‌ బిజెపి అప్పుడు ఆందోళన చేసింది. ఇటీవలనే బిజెపి నేస్తం నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు నుంచి లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్‌జెడిలో చేరిన శ్యామ్‌ రాజక్‌ అనే నేత ప్రధానిని తప్పు పట్టారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని ప్రతి ఒక్కరూ విధిగా అనుసరించాలి, ప్రత్యేకించి ప్రధాని దాన్ని అమలు జరపాలి అని చెప్పారు.


మన ఆర్ధిక వ్యవస్ధ రక్తమోడుతోంది. రోజుకు వెయ్యి మంది కరోనాతో మరణిస్తున్నారు, 70వేల మందికి సోకుతోంది. ఇలాంటి సమయంలో ప్రధాని సామాజిక మాధ్యమంలో అలాంటి వీడియోను విడుదల చేయటం ఎబ్బెట్టుగా ఉంది, జనం ఇబ్బందుల్లో ఉన్నపుడు రోమన్‌ పాలకులు పరిహాసం చేసినట్లుగా ఉంది అని ఆర్‌జెడి ఎంపీ మనోజ్‌ ఝా స్పందించారు.


నెమళ్లను పక్కనుంచుకుంటే ఇబ్బందులు తొలుగుతాయని, అదృష్టం వరిస్తుందని లాలూ ప్రసాద్‌ యాదవుకు జ్యోతిష్కులు చెప్పారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవటం, కేసులు చుట్టుముట్టటంతో 2017లో అధికారంలో ఉన్న తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్న అటవీశాఖ నుంచి రెండు నెమళ్లను తెప్పించారు. దేశ ఆరోగ్యం బాగోలేదు, ఆర్ధిక వ్యవస్ద దెబ్బతిన్నది తప్ప నరేంద్రమోడీకి అలాంటివేమీ లేవు. లాలూ నెమళ్లను తెప్పించటం మీద బిజెపి రభస చేసింది. అయితే నెమళ్లు కీటకాలను తింటాయని అందువలన పాట్నాలోని ముఖ్యమంత్రి, గవర్నరు, ఇతర ప్రముఖుల నివాసాల్లో వంద నెమళ్లను విడుదల చేయాలని చేసిన నిర్ణయం మేరకే ఆ పని చేశామని అధికారులు సమర్ధించుకున్నారు. అయితే రెండు రోజుల తరువాత తన నివాసంలో వదలిన రెండు నెమళ్లు ఎగిరిపోయాయని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విలేకర్లతో చెప్పి వివాదానికి ముగింపు పలికారు. అవి పాట్నాలోని సంజయ గాంధీ బయలాజికల్‌ పార్కుకే చేరుకున్నాయని వార్తలు రావటం ఆ ఉదంతంలో కొసమెరుపు. అయితే అదే సమయంలో కృష్ణ జింక వివాదంలో సల్మాన్‌ ఖాన్‌ కేసు ప్రముఖంగా మీడియాలో వచ్చిన నేపధ్యంలో ఇది జరిగింది. వివాదాస్పదం కావటంతో తప్పనిసరై లాలూ మీద కేసు నమోదు చేశారు గానీ, నివాసంలో ఎలాంటి నెమళ్లు దొరకలేదని కూడా విచారణలో తేల్చారు.


తాజాగా ప్రధాని మోడీ నెమళ్ల వ్యవహారం వెలుగులోకి రావటంతో బిజెపి, మీడియా కొత్త పల్లవి అందుకుంది. లాలూ ప్రసాద్‌ నెమళ్లను పంజరంలో ఉంచారు. ప్రధాని మోడీ నివాసంలో అవి స్వేచ్చగా తిరుగుతున్నాయి అని బిజెపి ప్రతినిధి రజనీ రంజన్‌ పటేల్‌ సమర్ధించుకున్నారు. ఒక్క ప్రధాని నివాసంలోనే కాదు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నెమళ్లు స్వేచ్చగా తిరగటాన్ని చూడవచ్చు అని కూడా చెప్పారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా నరేంద్రమోడీ ఉదయ వ్యాహ్యాళి సమయంలో నెమళ్లు ఆయన్ను అనుసరిస్తాయని, అవి స్వేచ్చగా ఉండేందుకు నివాసంలో పెద్ద పంజరాల వంటివి ఏర్పాటు చేశారని కూడా మీడియా రాతగాళ్లు కొందరు పేర్కొన్నారు. ప్రధాని నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న లోఢ గార్డెన్స్‌ నెమళ్ల పుట్టుక కేంద్రంగా ఉందని అందువలన ఆప్రాంత మంతటా నెమళ్లు తిరగటం సహజమని దానిలో భాగంగానే ప్రధాని నివాసంలోకి వచ్చి పోతుంటాయని రాస్తున్నారు. ఇది రోజువారీ వ్యవహారమే అని స్వయంగా ప్రభుత్వ సంస్ధ ప్రసార భారతి న్యూస్‌ సర్వీసు ఒక ట్వీట్‌లో పేర్కొన్నది.


ఆ వాదనలతో విబేధించాల్సిన అవసరం లేదు. కేవలం 107 సెకన్ల వీడియోలో ఫ్రధాని ఆరుసార్లు వేర్వేరు దుస్తులతో కనిపించటం విశేషం. యాదృచ్చికంగా నెమళ్లు వచ్చినపుడు వాటికి వేయటానికి ఎలాంటి ఆహారం అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఒక వేళ తరచూ వస్తున్నందున వేయటానికి కొన్ని గింజలను అందుబాటులో ఉంచుకున్నారను కోవాలి. కానీ దృశ్యాలను చూసినపుడు అలా అనిపించటం లేదు. ఆరు రకాల దుస్తులను మార్చుకున్నారంటే ఫొటో లేదా నెమలితో దృశ్యాల చిత్రీకరణకు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటే, ఎంతో సమయం వెచ్చిస్తే తప్ప సాధ్యం కాదు. వీటన్నింటిని బట్టి ప్రచారం కోసమే ఇదంతా చేసినట్లుగా కనిపిస్తోంది.
ప్రధాని నెమళ్ల వ్యవహారం చూడగానే మీడియాలో జర్మన్‌ హిట్లర్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు, వ్యాఖ్యలు దర్శనమిచ్చాయి.పిల్లలు, పిల్ల జింకలు, కుక్క పిల్లలతో ఎంతో ప్రేమగా ఉన్న హిట్లర్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అవన్నీ తాను ఎంత సున్నిత మనస్కుడనో అని ప్రపంచానికి చూపేందుకు హిట్లర్‌ తయారు చేయించిన ప్రచార చిత్రాలన్నది తెలిసిందే. నిజానికి అంత సున్నిత మనస్కుడైతే యూదులను హతమార్పించిన తీరు అంత భయంకరంగా ఉంటుందా ? పిల్లలు,స్త్రీలు, వృద్దులు అనే విచక్షణ లేకుండా మారణకాండ సాగించిన దుర్మార్గుడని తెలిసిందే. అయితే హిట్లర్‌ కుక్కల ప్రియుడు అన్నది నిజం. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్దంలో పరాజయాన్ని తట్టుకోలేక ప్రియురాలు ఎవా బరూన్‌తో కలసి ఆత్మహత్య చేసుకోబోయే ముందు తనకు ఇష్టమైన బ్లోండీ అనే పేరుతో పిలుచుకున్న జర్మన్‌ షెపర్డ్‌ కుక్కకు సైనైడ్‌ విషమిచ్చి చంపినట్లు వెల్లడైంది.


నరేంద్రమోడీ నెమళ్ల ప్రియుడా లేక నివాసంలో వచ్చినందున వాటికి ఆహారం వేశారా అన్నది ఒక అంశం. ప్రధాని నిత్యం ఉదయాన్నే నడుస్తారు గనుక ప్రతి రోజూ వచ్చి వాలే నెమళ్ల గురించి లేదా వాటికి వేసే ఆహారం నిత్యకృత్యమైతే ఎన్నడూ మీడియాలో రాలేదు,నిజంగా అంత పక్షి ప్రేమికుడే అయితే దాన్ని వెల్లడించటానికి ఆరు సంవత్సరాల వ్యవధి ఎందుకు తీసుకున్నట్లు ? మోడీ వీడియో గురించి సామాజిక మాధ్యమంలో మిశ్రమ స్పందన వెల్లడైంది. సమర్ధించిన వారు ఉన్నారు. ధైర్యం కలిగిన అధికారులెవరైనా ఉంటే అలా నెమళ్లను మచ్చిక చేసుకోవటం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరం అని ప్రధానికి చెప్పండి అన్నది వాటిలో ఒకటి. ప్రచారం కోసం తప్ప మరొకటి కాదన్నది మరొక అభిప్రాయం. సామాన్య జనం కరోనా మహమ్మారి బారిన పడినపుడు, ఆర్ధికంగా దేశం దిగజారిన స్దితిలో ఇలాంటి వీడియోలను స్వయంగా తానే విడుదల చేయటం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటి గురించి నరేంద్రమోడీ స్వయంగా మాట్లాడతారని ఎవరూ భావించటం లేదు, కనీసం తన చర్య గురించి ట్విటర్‌లో అయినా స్పందించలేదు.అయినా ఆపని చేస్తే నరేంద్రమోడీ ఎలా అవుతారు ?

భద్రతా మండలిలో అమెరికాకు ఎదురు దెబ్బ-ఇరాన్‌పై ఏకపక్ష ఆంక్షలు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న అమెరికాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గత వారం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మండలిలోని 15 మందికి గాను 13 మంది ఇరాన్‌ మీద తిరిగి ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు లేఖలు అందచేశారు.2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించించిదని ప్రకటించేందుకు ఐరాస ప్రధాన కార్యాలయానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు ఈ లేఖలు శరా ఘాతం మాదిరి తగిలాయి. అయితే తాము ఏకపక్షంగా ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. అయితే ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగినందున ఆంక్షలను అమలు జరపాలని కోరే హక్కును కోల్పోయిందని పదమూడు మంది పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు18తో ఆయుధాల విక్రయంపై ఇరాన్‌ మీద ఉన్న ఆంక్షల గడువు ముగియనుంది. భద్రతా మండలి ఆమోదం పొంది ఉంటే మరికొంత కాలం ఆంక్షలు కొనసాగేవి. ఈ పరిస్ధితిపై చర్చించేందుకు సమావేశం కావాలని రష్యా ప్రతిపాదించింది. తాము హాజరు కావటం లేదని ట్రంప్‌ ప్రకటించాడు.


కిందపడినా తనదే పై చేయి అన్నట్లుగా అమెరికా తప్పుడు వాదనకు పూనుకుంది. తాను ఒప్పందం నుంచి వైదొలిగినా 2015లో సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం ఒప్పందం ప్రకారం భద్రతా మండలి ఆమోదించిన తీర్మానంలో సాంకేతికంగా తాము కూడా సంతకం దారుగా ఉన్నందున తిరిగి ఆంక్షలను విధించాలని కోరే హక్కు తమకు ఉన్నదని ట్రంప్‌ సర్కార్‌ విఫలవాదన చేసింది. ఆ వాదనను తిరస్కరిస్తున్నట్లు అమెరికా మిత్రరాజ్యాలైన జర్మనీ, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ స్పష్టం చేశాయి. అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించిన సభ్యదేశాలలో రష్యా, చైనా,జర్మనీ, బెల్జియం, వియత్నాం, నైగర్‌, సెయింట్‌ విన్‌సెంట్‌, గ్రెనడైన్స్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఎస్తోనియా, ట్యునీసియా ఉన్నాయి.కేవలం డొమినికన్‌ రిపబ్లిక్‌ ఒక్కటే ఈ సమస్యపై లేఖను ఇవ్వాల్సి ఉంది. అయితే అంతకు ముందు జరిగిన చర్చలో ఇరాన్‌ మీద ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను బలపరచిన దేశం అదొక్కటే కావటంతో లేఖను కూడా అదే మాదిరి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
భద్రతా మండలిలో తగిలిన ఎదురు దెబ్బతో దిమ్మతిరిగిన మైక్‌ పాంపియో ఉక్రోషం వెళ్లగక్కుతూ యూరోపియన్లు అయాతుల్లాల వైపు ఉండేందుకు నిర్ణయించుకున్నారని నోరు పారవేసుకున్నాడు.భద్రతా మండలిలో అమెరికన్లు అపహాస్యం పాలయ్యారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. డెబ్బయి అయిదు సంవత్సరాల ఐరాస చరిత్రలో తమ శత్రువు ఇంతగా ఒంటరి పాటు కావటం గతంలో జరగలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.అయినా తాను తగ్గేది లేదని ట్రంప్‌ ప్రకటించాడు. తామేం చేసేది త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించాడు.
భద్రతా మండలి తీర్మాన తిరస్కరణతో గల్ఫ్‌ ప్రాంతంలో తలెత్తిన పరిస్ధితి గురించి చర్చించేందుకు చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, అమెరికా, ఇరాన్‌కు రష్యా చేసిన ప్రతిపాదన మేరకు జరిగే వీడియో సమావేశంలో తాను పాల్గొనకపోవచ్చని ట్రంప్‌ చెప్పాడు. సమావేశ ప్రతిపాదనను చైనా స్వాగతించింది. 2018లో సంయుక్త సమగ్రకార్యాచరణ పధకం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత దానిలో అమెరికా భాగస్వామి కాదని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఈ పధకానికి తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని అమెరికా చర్యను తాము సమర్ధించలేమని, ఒప్పందానికి మద్దతు యత్నాలకు ఇది పొసగటం లేదని పేర్కొన్నాయి. ఒప్పందానికి అనుగుణంగా లేని చర్యలనుంచి వెనక్కు తగ్గాలని తాము ఇరాన్‌పై వత్తిడి తెస్తామని మూడు దేశాలు స్పష్టం చేశాయి.
తమ మిత్రులుగా ఉన్న ఇ3(బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌) దేశాలు ఇరాన్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వకపోవటం తమకు ఆశాభంగం కలిగించిందని ఇజ్రాయెల్‌ వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌తో మంగళవారం నాడు సమావేశమైన ఇజ్రాయెల్‌ మంత్రి అషెకెనాజీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ఇరాన్‌ స్పందించిన తీరు ఈ ప్రాంత భద్రతకు ముప్పు తెచ్చేదిగా ఉందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.
మూడు అణువిద్యుత్‌ కర్మాగారాలలో అణుశుద్ధి కార్యక్రమం నుంచి ఇరాన్‌ వైదొలిగితే దానికి పరిహారంగా ఆంక్షల తొలగింపు, ఇతర సహాయం చేస్తామంటూ భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ భాగస్వాములుగా 2015లో ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.2018లో దీన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అయితే ఇరాన్‌ గనుక ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే దానిలో భాగస్వాములైన ఏ దేశమైనా తనంతటతానుగా 2007నాటి భద్రతా మండలి తీర్మానంలో పేర్కొన్న ఆంక్షల విధింపునకు చర్య తీసుకోవచ్చనే నిబంధన కూడా ఉంది. 2007నాటి తీర్మానంలో తాము భాగస్వాములం కనుక ఆ మేరకు ఆంక్షలు విధించవచ్చనే వితండవాదానికి అమెరికా దిగింది.అది ఒప్పందానికి కట్టుబడి ఉన్న ఇతర భాగస్వాములకు తప్ప వైదొలగిన అమెరికాకు లేవని మిగిలిన దేశాలు చెబుతున్నాయి. ఎవరూ తమను అనుసరించకపోయినా తాము ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా అంటోంది. నిజానికి 2018 తరువాత అమెరికా అదరగొండితనంతో తన ఆదేశాలను పాటించని దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తానని బెదిరిస్తోంది. దానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు సైతం మినహాయింపులేదని అమెరికా చెప్పటంతో మన దేశం భయపడి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.
అయితే అమెరికా బెదిరింపులకు భయపడి మిగతా దేశాలేవీ ఇరాన్‌తో సంబంధాలను వదులుకోలేదు. అంతర్జాతీయ నిబంధనలు, తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామే తప్ప ఇరాన్‌తో సంబంధాలను వదులుకొనేది లేదని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రియబకోవ్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిని కొన్ని ముడుల మధ్య బంధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా చర్య అక్రమం అని చైనా పేర్కొన్నది. అంతే కాదు పాతిక సంవత్సరాల వ్యవధిలో ఇరాన్‌లో 400 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్దం అవుతోంది. ఒప్పందం ప్రకారం తమకు చేస్తామన్న సాయం రానపుడు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇరాన్‌ చెబుతోంది. తాము పూర్తి స్ధాయి అణుశుద్ధి చేస్తున్నపుడు విధించిన వాటి కంటే తీవ్రమైన ఆంక్షలను ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటున్నది. అణురియాక్టర్లలో వినియోగించే అణు ఇంధనాన్ని ఐదుశాతానికి మించి శుద్ది చేయకూడదు. ఒప్పందం ప్రకారం 3.67శాతం మించకూడదు. అయితే ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినందున మిగతా సభ్యదేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై వత్తిడి తెచ్చేందుకు ఇరాన్‌ 4.5శాతానికి పెంచింది
2015లో అంగీకరించిన దానికి మించి అదనపు నిబంధనలను తాము అంగీకరించేది లేదని మంగళవారం నాడు ఇరాన్‌ స్పష్టం చేసింది. ఐరాస అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ ప్రతినిధి(ఐఏఇఏ) బృందం సోమవారం నాడు ఇరాన్‌ పర్యటనకు వచ్చింది. బహిర్గతం చేయకుండా నిల్వ చేసిన లేదా ఉపయోగించిన అణుపదార్ధాల తనిఖీకి అనుమతించాలని ఆ బృందం కోరుతోంది. గత ఏడాది వరకు ఒప్పందానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ వ్యవహరిస్తున్నట్లు ఐరాస బృందం నివేదించింది. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత పరిమితికి మించి అణు శుద్ధి చేస్తున్నట్లు బహిరంగంగానే ఇరాన్‌ చెబుతోంది. తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామని అణుశక్తి సంస్ద ప్రతినిధి బృంద నేత రాఫెల్‌ గ్రాసీతో కలసి టెహరాన్‌లో విలేకర్లతో మాట్లాడిన ఇరాన్‌ ప్రతినిధి అలీ అక్బర్‌ సలేహీ స్పష్టంగా చెప్పారు. రెండు అణుకేంద్రాలను తనిఖీ చేయాలని ఐఏఇఏ కోరుతోంది. గత ఏడాది వాటి తనిఖీని ఇరాన్‌ అడ్డుకుందని, వాటిలో ఒక దానిని 2004లో పాక్షికంగా ధ్వంసం చేశారని, మూడవదానిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అణుకేంద్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామనే ఆరోపణలను తాము ఖండిస్తున్నామని, ఒప్పందానికి తాము కట్టుబడే ఉన్నామని ఇరాన్‌ చెబుతోంది
టెహరాన్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని ఇరాన్‌ అతి పెద్ద నాటంజ్‌ యురేనియం శుద్ధి కర్మాగారంలో గత నెలలో జరిగిన పేలుడు, చెలరేగిన అగ్ని విద్రోహచర్యల్లో భాగమే అని ఇరాన్‌ అణు శక్తి సంస్ధ చెబుతోంది. కేంద్రం పరిసరాలలో చెలరేగిన మంటలకు సైబర్‌ దాడులు కారణం కావచ్చని తొలుత అధికారులు భావించారు. అక్కడ మరింత ఆధునిక పరికరాలను అమర్చుతామని ప్రకటించారు. ఇక్కడ యురేనియం శుద్ధిని మరింతగా పెంచినట్లు, ఇది 2015 ఒప్పంద ఉల్లంఘనే అని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు కథనాలను వెల్లడించాయి. ముందే చెప్పుకున్నట్లు తక్కువ శాతం శుద్ధి మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఆయుధ తయారీకి ఉపయోగించే యురేనియం 90శాతం ఉన్నట్లు ఆరోపించాయి. ఒప్పందం ప్రకారం నాంటజ్‌లో 2026వరకు 5,060 సెంట్రిఫ్యూజస్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఫోర్డోలోని భూగర్భ కేంద్రంలో 2031 వరకు ఎలాంటి శుద్ధి చేయకూడదు. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత నాంటజ్‌లో ఆధునిక సెంట్రిఫ్యూజస్‌ను రెట్టింపు చేసిందని, ఫోర్డోలో సెంట్రిఫ్యూజస్‌లోకి హెక్సాఫ్లోరైడ్‌ గ్యాస్‌ను ఎక్కిస్తున్నారని చెబుతున్నారు.ఇప్పుడు భద్రతా మండలితో నిమిత్తం లేకుండా అమెరికా ప్రకటించిన ఆంక్షల గురించి రానున్న రోజుల్లో పరిణామాలను చూడాల్సి ఉంది.

జాతీయవాద పులి మీద నరేంద్రమోడీ స్వారీ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు
ప్రతి ఉగాదికి పంచాంగం చెప్పే పండితుల గురించి మనకు తెలిసిందే. వాటిలో సానుకూల అంశాలు తప్ప ప్రతి కూల అంశాలు సాధారణంగా చోటుచేసుకోవు. మహా అయితే కరవుల గురించి చెబుతారు. రాజకీయ పార్టీలకు పంచాంగం చెప్పే వారు ప్రతికూలంగా చెబితే వారు కార్యాలయాల గేటును ఎలా దాటుతారో వారికే తెలియదు. కనుక అది కూడా బి పాజిటివ్‌గానే ఉంటుంది.


ఉగాది పంచాంగానికి భిన్నంగా ప్రపంచానికి లేదా దేశాలకు ముప్పుగా పరిణమించే వారు లేదా పరిణామాల గురించి చెప్పేరాజకీయ జోశ్యులు కూడా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పని చేసే యూరేసియా గ్రూప్‌ వాటిలో ఒకటి. 2020లో ప్రపంచ రాజకీయ ముప్పుగురించి జనవరిలో ఒక విశ్లేషణను వెలువరించింది. తరువాత మార్చినెలలో దానిని నవీకరించింది. అయినా తొలి పది ముప్పు జాబితాలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా అమెరికా గడ్డమీద పని చేస్తున్న సంస్ధ గనుక ప్రపంచానికి అమెరికా నుంచి తలెత్తే ప్రధాన ముప్పు జాబితాలో అక్కడి రాజకీయాలను చేర్చదు. కానీ ఈ ఏడాది దానికి భిన్నంగా తొలి ప్రపంచ రాజకీయ ముప్పుగా అమెరికా అంతర్గత రాజకీయాలని పేర్కొనటం విశేషం. రెండవదిగా సాంకేతిక రంగం, వాణిజ్యంలో చైనా-అమెరికా యుద్దం, మూడవదిగా అమెరికా-చైనా రాజకీయ వ్యవస్ధల మధ్య ముదురుతున్న వైరం, నాలుగవదిగా కార్పొరేట్‌ సంస్ధల పోరు, ఐదవదిగా నరేంద్రమోడీ వైఖరిని పేర్కొన్నది.


ఈ జోశ్యం లేదా రాజకీయ అంచనాలకు అనుగుణ్యంగానే తొలి ఎనిమిది నెలల్లో దాదాపు వాటి చుట్టూనే పరిణామాలు జరగటాన్ని గమనించవచ్చు. జనవరి నాటికి కరోనా వైరస్‌ అంశం యూరేసియా గ్రూప్‌ పరిగణనలో లేదు. మార్చినాటికి సవరించినా అప్పటికి అంతగా సమస్య తీవ్రతరం కాలేదు. ప్రపంచ రాజకీయ ముప్పుకు సంబంధించి తొలి ఐదు అంశాలలో పక్కాగా మొదటిది డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో, రెండవది ఆ పెద్ద మనిషి జిగినీ దోస్త్‌ నరేంద్రమోడీకి చెందాయి.మరో రెండింటిలో ట్రంప్‌కు మద్దతుగా నరేంద్రమోడీ ఉండటం యాదృచ్చికమా ? పధకం ప్రకారం జరిగిందనుకోవాలా ? నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ట్రంప్‌ ఎన్నికైతే పాత కౌగిలింతలు కొనసాగుతాయి, సర్వేలు చెబుతున్నట్లుగా జోబిడెన్‌ గెలిస్తే నరేంద్రమోడీ కొత్త ప్రియుడి ప్రసన్నం కోసం ప్రయత్నించాల్సిందే.
2020లో మోడీ తన రెండవ పదవీ కాలంలో ఆర్ధిక అజెండాను ఫణంగా పెట్టి వివాదాస్పద సామాజిక విధానాలను ముందుకు తెస్తారని, మతపరమైన, ఒంటెత్తువాదంతో అస్దిర పరిస్ధితి ఏర్పడుతుందని, విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా యూరేసియా నివేదిక పేర్కొన్నది. ఆర్టికల్‌ 370రద్దు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఏఏ వంటి అంశాలను మరింత ముందుకు తీసుకుపోతారనే జోశ్యం దానిలో ఉంది. అయితే అనూహ్యంగా కరోనా సమస్య ముందుకు రావటంతో అవి తాత్కాలికంగా తెరవెనుకకు పోయాయి. విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తున్నదే.


రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి ఆర్ధిక అంశాలను విస్మరించి వివాదాస్పద సామాజిక అంశాలను ముందుకు తెచ్చారనేందుకు తార్కాణంగా గత ఏడాది తొలి మూడు నెలల కాలంలో 8శాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగవ త్రైమాస కాలానికి 4.2శాతానికి పడిపోవటం తెలిసిందే. యూరేసియానే కాదు అనేక మంది ఆర్ధిక వేత్తలు చెప్పినట్లు ఈ దిగజారుడుకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. అనేక మంది ముందే హెచ్చరిస్తున్నా మందగమనం తప్ప మాంద్యం లేదని ప్రభుత్వం బుకాయించిందే తప్ప వాస్తవాన్ని అంగీకరించలేదు. వరుసగా ఆరునెలల పాటు ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో పయనిస్తే దాన్ని అధికారయుతంగా మాంద్యం అని పరిగణిస్తారు. ఇప్పుడు దేశం వర్తమాన ఆర్దిక సంవత్సరం తొలి మూడుమాసాల్లో ( ఏప్రిల్‌-జూన్‌) తిరోగమనం అన్నది స్పష్టం కాగా అది ఏ స్దాయిలో ఉందో ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేవుడు నైవేద్యం తినడనే వాస్తవం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లుగా ఆర్ధిక దిగజారుడు ముందే తెలుసు గనుక కార్పొరేట్లకు రాయితీలతో వర్తమాన సంవత్సర బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా రాకపోయినా దానితో ఫలితం ఉండేది కాదు. కరోనా రావటంతో ఇప్పుడు అసలు విషయాన్ని దాచి పెట్టి కరోనా పేరుతో విదేశాంగ విధానం, ఆర్ధిక రంగాలలో జాతీయ వాదానికి తెరతీసి దేశ పౌరుల దృష్టిని మళ్లించేందుకు పూనుకున్నారు.


ప్రపంచీకరణ నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతారు. లేనట్లయితే ఆ క్రమంలో దాని ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ మద్దతు దెబ్బతింటుంది అని ప్రముఖ అమెరికన్‌ ఆర్ధిక వేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ హెచ్చరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎలాంటిదో కరోనా వైరస్‌ నిరూపించింది.దాని కంటే ముందే ప్రపంచీకరణ సంగతి తరువాత ముందు మన సంగతి మనం చూసుకుందామని ప్రతి దేశం రక్షణాత్మక చర్యలకు, జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పీఠీన ఉంటే మన దేశం, నరేంద్రమోడీ కూడా అదే బాటలో ఉన్నారు.

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ (స్ధానిక తయారీ వస్తువులనే అడగండి) అని మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు, సరిహద్దు సమస్యను సాకుగా చూపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు వంటివి వాటిలో భాగమే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొన్ని జాతీయవాద ధోరణులను చూద్దాం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆ నినాదంతోనే ప్రచారం చేశాడు. దానిలో భాగంగానే చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించింది. చైనా వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలపై, ఇతర దేశాలపై తాను ఆంక్షలను ప్రకటించటమే కాదు, తన ఆంక్షలను ఇతరులు కూడా పాటించాలని లేనట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటానని అమెరికా బెదిరిస్తున్నది. ఇరాన్‌ నుంచి మన దేశం చమురు కొనుగోలు నిలిపివేయటానికి ఈ బెదిరింపే కారణం.


గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అనుసరిస్తున్న వైఖరితో తలెత్తిన పర్యవసానాల కారణంగా ఇతర మార్కెట్లలో ప్రవేశించేందుకు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో చైనా తన పధకాలను ముందుకు తీసుకుపోతున్నది. కొందరు దీనిని విస్తరణవాదం అని చిత్రిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బ్రిటన్‌ వంటి దేశాలు విస్తరణవాదంలో భాగం మనవంటి అనేక దేశాలను వలసలుగా చేసుకున్నాయి. చైనా ఏ దేశాన్నీ ఆక్రమించలేదు. మిగతా దేశాల మాదిరి వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుంటోంది.


అమెరికా, జపాన్‌లను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేని ఐరోపా దేశాలు సమిష్టిగా వ్యవహరించేందుకు ఐరోపా యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.అయినా సభ్యదేశాలన్నీ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగానే యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగింది. వస్తువుల కోసం చైనా, లేదా ఆసియా దేశాల మీద ఆధారపడకూడదనే ధోరణి ఐరోపాలో పెరుగుతోంది. ఐరోపా జాతీయవాదంతో ఐరోపా యూనియన్‌ ముందుకు పోతున్నది.
ఆర్ధిక జాతీయవాదానికి ముద్దు పేరు ఆర్ధిక దేశభక్తి. ఆర్ధిక జనాకర్షక నినాదాలు, చర్యలు ఆచరణలో భాగం. తొలి రోజుల్లో స్వేచ్చా మార్కెట్‌ ఛాంపియన్‌గా ముందున్న నరేంద్రమోడీ ఇప్పుడు దానికి వ్యతిరేకమైన వైఖరిని అనుసరిస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రపంచీకరణలో భాగమైన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు తిరస్కరించటం వాటిలో ఒకటి.( దానిలో చేరితే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి) తాజాగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల ఆంతర్యమిదే. ఈ రోజు చైనాతో ప్రారంభం కావచ్చుగానీ ఆర్ధిక జాతీయవాదం మరింత ముదిరితే అది మిగతా దేశాల పెట్టుబడులకు, వస్తువులకు సైతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్ధానిక వస్తువులనే అడగండి, ఆత్మనిర్భరత పేరుతో స్ధానికంగా అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలనే నినాదాలతో మన దేశం కూడా రక్షణ చర్యలకు పూనుకుంది. దీన్నో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలను సడలించి 200 కోట్ల రూపాయల లోపు వస్తువులు, సేవలను విదేశాల నుంచి పొందకూడదని నిర్ణయించింది. చైనా నుంచి పెట్టుబడులను నిరోధించేందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీన్ని ఆర్దిక జాతీయవాదం అంటున్నారు.


జాతీయవాదానికి అనుగుణ్యంగా ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే అవసరాలను తీర్చుకొనేందుకు తీసుకొనే చర్యలను తప్పుపట్టనవసరం లేదు. కొన్ని సందర్భాలలో తప్పదు. ప్రపంచీకరణలో భాగంగా అమలు జరుపుతున్న ఉదారవాద విధానాలు అన్ని దేశాలకూ ఉపయోగపడటం లేదు. దానికి మన దేశమే చక్కటి ఉదాహరణ. ఇతర దేశాల వస్తువులన్నీ మన దేశంలో కుమ్మరిస్తున్నారు. ఫలితంగా స్ధానిక చేతివృత్తులు, పరిశ్రమలు, చివరికి వ్యవసాయం మీద కూడా ప్రతికూల ప్రభావాల పడ్డాయి.జాతీయ వాదాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు, కానీ జాతీయోన్మాదాన్ని ఎలా చూడాలి. పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకు వస్తారు.


జాతీయవాదంలో భాగంగా పోలీసు, మిలటరీ కాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత వస్తువుల జాబితాలో పండ్లు తోముకొనే కోల్గేట్‌ పేస్ట్‌ వంటి బహుళజాతి సంస్దల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేవీ చైనా ఉత్పత్తులు కాదు. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్రమోడీ అధికారానికి రాగానే ఈ చర్యలెందుకు తీసుకోలేదు? టిక్‌టాక్‌ లేదా ఇతర చైనా యాప్‌లు మన భద్రతకు ముప్పు అని ఆకస్మికంగా గుర్తుకు రావటం ఏమిటి ? అదే నిజమైతే దానికి మోడీ అండ్‌కోను విచారించాలా లేదా ?


దేశంలో 1991నుంచి నూతన ఆర్ధిక విధానాలకు తెరతీశారు. అప్పటి వరకు లేని స్వదేశీ జాగరణ మంచ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి తెచ్చింది. నూతన ఆర్ధిక విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు గనుక, తామూ దేశ ప్రయోజనాలకోసమే పని చేస్తామని చెప్పేందుకు ఆ సంస్ధను ఏర్పాటు చేశారు. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమిటి ?


చైనా వస్తువులను విధిగా కొనాలన్న నిబంధనలేవీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విధించలేదు. ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలేవీ చైనా వస్తువుల గురించి లాబీయింగ్‌ జరపలేదు, దిగుమతి చేసుకోవాలని అడగలేదు. చైనా పెట్టుబడుల విషయం కూడా అంతే. గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడి కావటానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన అవకాశాలు తప్ప తమ వస్తువులు కొనమని,పెట్టుబడులు తీసుకోవాలని చైనా వైపునుంచి వత్తిడేమీ లేదు. లేదా అమెరికా మాదిరి ప్రతీకార చర్యలు ఉన్నట్లు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు.


అన్ని దేశాలూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో భాగస్వాములుగా ఉన్నపుడు దాని నిబంధనలను అమలు జరపటం వాటి విధి. లేకపోతే బయటకు వచ్చే స్వేచ్చ ఉంది. కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరుపుతోందని భావిస్తున్నారు కనుక ఆ పార్టీ విధానాల మంచి చెడ్డల గురించి సహజంగానే ఆసక్తి ఉంటుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా పెట్టుకుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏ బంధం ఉందని బిజెపి ప్రతినిధి బృందాలు చైనా పర్యటనకు వెళ్లినట్లు ? నోరు తెరిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం అంటారు.


భారత్‌-చైనా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అందువలన రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు,ఇతర అనేక అంశాల గురించి రెండు దేశాలను పోల్చటం నరేంద్రమోడీ అధికారంతో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో జరుగుతోంది.చైనాతో మన దేశాన్ని పోల్చటాన్ని కొందరు దేశ ద్రోహంగానూ, చైనా భక్తిగానూ వర్ణిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో ఆ దాడి ఎక్కువగా ఉంది. చైనాతో మన దేశాన్ని పోల్చి ఎక్కువగా మాట్లాడుతున్నదెవరు ? నరేంద్రమోడీ ప్రధాని అయిన ఆరునెలల్లోపే చైనాను సందర్శించిన బిజెపి బృందాలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే రాజకీయ పాఠశాలలను ఎందుకు సందర్శించాయి. మేము కూడా కమ్యూనిస్టు పార్టీ మాదిరే పార్టీని విస్తరిస్తామని, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందెవరు? చైనా కమ్యూనిస్టు పార్టీతో పోల్చుకున్నదెవరు?


చైనాను పక్కకు నెట్టి ప్రపంచానికి వస్తువులను అందిస్తామంటూ మేకిన్‌ ఇండియా, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అని, త్వరలో జిడిపి రేటులో చైనాను అధిగమిస్తామని చెబుతున్నదెవరు ? ప్రతి ఏటా అనుకూలంగానో వ్యతిరేకంగానో చైనా వస్తువుల గురించి మాట్లాడుతున్నది వారే. అంతెందుకు 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సర్వేలో చైనా మాదిరి ఉపాధి, అభివృద్ది గురించి దాదాపు పదిపేజీలు కేటాయించి రాసినవారెవరు ? దీన్ని పోలిక అంటారా మరొకపేరుందా ?ఒక వేళ అదే దేశద్రోహం అయితే సంఘపరివార్‌ శక్తులే తొలి దేశద్రోహులు అవుతారు. చైనాను పక్కన పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాల సరసకు దేశాన్ని తీసుకుపోతామని చెబుతారు. దాన్నేమంటారు ? పోలిక తప్పు కాదు. అయినా పోల్చిన వారిని దేశవ్యతిరేకులు అంటున్నారంటే జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప అది జాతీయవాదమా ? జాతీయోన్మాదమా ?


వలస పాలనను వ్యతిరేకించటం స్వాతంత్య్రానికి ముందు జాతీయవాదం. ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, డచ్‌, పోర్చుగీసు, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలలో జాతీయ వాదం ముందుకు వచ్చింది. తమ దేశం ప్రపంచంలో పై చేయి సాధించాలంటే ప్రపంచాన్ని ఆక్రమించాలనేది వాటి జాతీయ వాదం. చైనా,జర్మనీ, దక్షిణకొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడుతూ వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలను కోవటంలో తప్పు లేదు. వాటిని పక్కకు నెట్టి ఆ స్ధానాన్ని మనమే ఆక్రమించాలనుకుంటే అది సమస్యలకు దారి తీస్తుంది. నాడు జాతీయవాదంతో ఐరోపా దేశాలు పోటీపడి తొలుత ప్రాంతీయ యుద్ధాలు తరువాత ప్రపంచ యుద్ధాలకే పాల్పడ్డాయి. వస్తు తయారీ జాతీయ వాదం ముదిరితే అది వాణిజ్య యుద్దాలకు దారి తీస్తుంది.


అమెరికాను మరోసారి అగ్రస్ధానంలో నిలబెడతానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మంచి రోజులు తెస్తానని మన నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఇద్దరూ విఫలమయ్యారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంలోనూ అదే రికార్డు. వైరస్‌ నివారణ రాష్ట్రాల బాధ్యత అని తప్పించుకొనేందుకు పూనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మహమ్మారులు చుట్టుముట్టినపుడు దేశపాలకులు తమ బాధ్యత లేదని తప్పించుకుంటే కుదరదు. జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోతానని నరేంద్రమోడీ చెప్పారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా సాధిస్తారా ? ఏ క్షణంలో అయినా కరోనా కేసుల్లో మన దేశాన్ని అమెరికా సరసన చేర్చే దిశలో ఉన్నారు. నరేంద్రమోడీ ఘోరవైఫల్యంగా ప్రపంచం కరోనా విస్తరణను చూస్తున్నది. అదే విధంగా కరోనా వైరస్‌ను తక్కువ చేసి మాట్లాడటం ట్రంప్‌ ఏలుబడిలోని అమెరికా చరిత్రలో అతి పెద్ద గూఢచర్య వైఫల్యంగా చరిత్రలో నమోదైంది. చరిత్రలో అమెరికా ఎంత ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదో అదే బాటలో భారత్‌ కూడా పయనిస్తున్నది. రెండింటికీ కరోనా ఒక్కటే కారణం కాదు. రాకెట్‌ మాదిరి అమెరికాలో ఆర్ధిక స్దితి తిరిగి దూసుకుపోనుందని ట్రంప్‌ కనీసం మాటలైనా చెబుతున్నారు. నరేంద్రమోడీ నుంచి ఒక్క మాటైనా విన్నామా ?


డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఒకే కంచం-ఒకే మంచం స్నేహితుల మాదిరి ఉన్నారు. ఇద్దరూ తమ వైఫల్యాలను లేదా ఆర్ధిక, కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకు వచ్చారు. ఒక రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తున్నదనే పేరుతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో చైనా యాప్‌లను మోడీ నిషేధించారు. ఇలా ఇద్దరు స్నేహితులూ ప్రజాకర్షక జాతీయవాద పులి స్వారీ చేస్తున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేనట్లయితే దానికి బలికావాలి ! ఇద్దరు స్నేహితులకు ఆ సత్తా ఉందా ?