అమెజాన్‌, అంబానీ సేవలో మోడీ – ఆందోళనలో కిరాణా దుకాణాల నాడి !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
బాంక్‌ ఆఫ్‌ చైనా మన ప్రయివేటు ఐసిఐసిఐ బ్యాంకులో 15 కోట్ల రూపాయల విలువగల వాటాలను కొనుగోలు చేసింది. దీని మీద దేశంలో కొందరు గగ్గోలు లేవనెత్తారు. ఇంకేముంది సదరు బ్యాంకును చైనా మింగేసింది అన్నట్లుగా చిత్రించారు. ఇంతకూ అది ఎంత అంటే ఆ బ్యాంకు వాటాలలో 0.006శాతం మాత్రమే.
అమెరికాకు చెందిన ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ద అమెజాన్‌ గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని సంస్ధలను, వ్యాపారాన్ని మింగివేస్తున్నది. టాటా గ్రూప్‌కు చెందిన వెస్ట్‌లాండ్‌ అనే ప్రచురణ, పుస్తకపంపిణీ సంస్దలో 26శాతం వాటాలను 9.5 కోట్ల రూపాయలకు 2016 ఫిబ్రవరిలో కొనుగోలు చేసింది. మిగిలిన 74శాతం వాటాలను కూడా తీసుకుంటానని అంగీకరించింది. 2018లో టాప్‌జో అనే కంపెనీని 4 కోట్లడాలర్లకు (అంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువ) కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ మోర్‌ అనే పేరుతో ఒక సూపర్‌ మార్కెట్‌ దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసింది. వారి నుంచి ఒక సంస్ద దాన్ని రూ.4,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంస్ధ నుంచి 49శాతం వాటాలను అమెజాన్‌ కొనుగోలు చేసి పెద్ద సంఖ్యలో దుకాణాల ఏర్పాటుకు పూనుకుంది.
పార్టిసిపేటరీ నోట్స్‌ పేరుతో విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్‌ మార్కెట్లో ఏ కంపెనీ వాటాలను అయినా కొనుగోలు చేయవచ్చు, లాభం అనుకున్నపుడు అమ్ముకొని వెళ్లిపోవచ్చు. ఒక దశలో మన దేశాలో ఇలాంటి పెట్టుబడులు నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు చేరాయి. ఇలా బడా కార్పొరేట్‌లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన సంస్ధలను మింగివేస్తూ లాభాలను తరలించుకుపోతుంటే చైనా బ్యాంకు కేవలం 15 కోట్ల రూపాయల వాటాలను కొన్నందుకు గగ్గోలు పెట్టటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఏనుగులను దూరే కంతలను వదలి చీమలు దూరే వాటి మీద కేంద్రీకరించినట్లు అనుకోవాలా ? ఇది దేశ భక్తా లేక చైనా వ్యతిరేకతా ? ఇలా ప్రశ్నించటాన్ని చైనా అనుకూలం అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఐసిఐసి అయినా హెచ్‌డిఎఫ్‌సి అయినా మరొక కంపెనీ అయినా వాటాలు, ఆస్ధులను అమ్మకానికి పెట్టటమా లేదా అన్నది వేరే అంశం. బహిరంగ మార్కెట్‌లో ఎవరైనా శక్తి ఉన్నవారు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఏ విదేశీ సంస్ధ అయినా మన ప్రభుత్వం అనుమతించిన మేరకు లాభాలను తరలించుకుపోయేదే తప్ప మరొకటి కాదు.
ఇప్పుడు చిన్న చిన్న దేశాలను సైతం కొనుగోలు చేయగలిగిన బడా కార్పొరేట్‌లు మన మార్కెట్‌ను తమ స్వంతం చేసుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఒక నాడు గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు చట్టాలు చేసిన మన దేశం ఆరోగ్యకరమైన ఆ విధానాన్ని విస్మరించి అంతర్జాతీయ సంస్దల వత్తిడి లేదా ఆదేశాల మేరకు ఆ చట్టాన్ని రద్దు చేసి పోటీ కమిషన్‌ పేరుతో కొత్త చట్టాలను చేశాయి. దానిలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకొనే వారు లేరు. ఒక వైపు తీవ్ర ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు మూల మూలకూ తమ దుకాణాల గొలుసును విస్తరించేందుకు విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌లు కండలు పెంచుతూ కసరత్తు చేస్తున్నాయి. ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లుగా పెద్ద ఎత్తున స్వయం ఉపాధికల్పిస్తున్న కిరాణా దుకాణాల భవిష్యత్‌ నానాటికీ ప్రశ్నార్ధకంగా మారుతూ ఉపాధి సమస్యను ముందుకు తెస్తోంది. మన దేశంలో అతి పెద్ద కార్పొరేట్‌ సంస్ధ అయిన రిలయన్స్‌, అమెరికాలో అతి పెద్ద సంస్ధ అయిన అమెజాన్‌ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు గోదాలోకి దిగాయి. రానున్న రోజుల్లో పోటీ ఏ విధంగా సాగుతుందో, పర్యవసానాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారుతోంది.
రిలయన్స్‌ కంపెనీ అధిపతి ముకేష్‌ సంపాదన గంటకు ఏడు కోట్ల రూపాయలు కాగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ తొమ్మిది రెట్లు అంటే గంటకు 63 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా.రిలయన్స్‌ కంపెనీ విలువ గత ఏడాది 140 బిలియన్‌ డాలర్లు కాగా అమెజాన్‌ విలువ 991.6బిలియన్‌ డాలర్లు. ఆసియాలోనే అతి పెద్ద ధనవంతుడైన ముకేష్‌ అంబానీ నిన్నా మొన్నా తన కంపెనీల్లో వాటాలను అమ్మి దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర ( దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయలు) ధనం కూడ బెట్టుకున్నట్లు, తన కంపెనీలకు అప్పులు లేకుండా చేసుకున్నట్లు వార్తలు చదివాం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు వాటిని కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే ముకేష్‌ తానే అనేక కంపెనీల కొనుగోళ్లకు దిగారు. అమెజాన్‌తో పోటీ పడేందుకు తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు పూనుకున్నారు. రోగులు దుకాణాలకు పోకుండా ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే ఔషధాలను అందచేసే నెట్‌మెడ్స్‌ అనే కంపెనీలో 620 కోట్లకు మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు ఇది రాసిన సమయానికి చదివాము. ఇప్పటికే అమెజాన్‌ రంగంలో ఉంది. వచ్చే ఐదు సంవత్సరాలలో పాలు సరఫరా చేసే కంపెనీతో సహా అనేక సంస్ధలను తన సామ్రాజ్యంలో కలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాది. రిలయన్స్‌ సంస్ధ జియో ఫోన్లతో పాటు ఇప్పుడు జియో మార్ట్‌ కంపెనీ ద్వారా కిరాణా సరకులను ఇండ్లకు అందచేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. వాల్‌ మార్ట్‌ కంపెనీ ఇప్పటికే 16 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ 5.5 బిలియన్‌ డాలర్ల రంగంలోకి దిగాయి. స్వదేశీ డిమార్ట్‌ కూడా పోటీకి సన్నద్దం అవుతోంది. ఉల్లిపాయల మొదలు ఆర్ధిక సేవల వరకు దేన్నీ వదిలేందుకు ఇవి సిద్ధంగా లేవు.
మోటారు వాహనాల బీమా పాలసీలను ఎలాంటి పత్రాలతో నిమిత్తం లేకుండా కేవలం రెండు నిమిషాల్లో పునరుద్దరించే సేవలను అమెజాన్‌ ప్రారంభించింది. త్వరలో అమెజాన్‌ మెడికల్‌ షాపులు కూడా రాబోతున్నాయి.దాన్లో ఇంగ్లీషు మందులతో పాటు మూలికా ఔషధాలు కూడా ఉంటాయి. చైనాలో ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన ఈ సంస్ధ ఇప్పుడు మన మార్కెట్‌ మీద కేంద్రీకరించింది.
రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి బడా సంస్ధలన్నీ జన సమ్మర్దం ఎక్కువగా ఉండే పట్టణాల మీదే కేంద్రీకరిస్తున్నాయి. పని వత్తిడిలో ఉండే వారు, ధనికులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రిలయన్స్‌ జియో మార్ట్‌లో కొద్ది వారాల్లోనే రోజుకు రెండున్నరలక్షల ఆర్డర్లు వచ్చాయి. రెండు వందల పట్టణాలకే ప్రస్తుతం ఉన్న ఈ సేవలను విస్తరిస్తే ఇంకా పెద్ద మొత్తంలో స్పందన వస్తుంది. అయితే కూరగాయలు చెడిపోవటం, కొన్ని వస్తువుల జాడ లేకపోవటం, వాటికి నగదు వాపస్‌ ఆలస్యం కావటం వంటి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు పూనుకున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న డిమార్డ్‌ దుకాణాల్లో ఇస్తున్న రాయితీలు ఇప్పుడు వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు రిలయన్స్‌, అమెజాన్‌ వంటి సంస్ధలన్నీ రాయితీల జల్లులతో వినియోగదారులను ఆకట్టుకోబోతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఏడాది చందా చెల్లించిన వారికి ఆ సంస్ధ ద్వారా ఏ వస్తువును కొనుగోలు చేసినా ధరల తగ్గింపుతో పాటు రవాణా చార్జీల రాయితీ అదనంగా ఇస్తున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న బిగ్‌ బజార్‌ కంపెనీలో అమెజాన్‌కు వాటా ఉంది. రిలయన్స్‌ కూడా కొంత వాటాను దక్కించుకొనేందుకు పూనుకోగా అమెజాన్‌ అడ్డుపడుతోంది. అమెజాన్‌ ప్రస్తుతం ఒక్కో వ్యాపార రంగం గురించి ఒక్కొక్క పట్టణంలో ప్రయోగాలు, పరిశీలనలు జరుపుతోంది. ఉదాహరణకు పూనాలో ఇండ్లకు పండ్లు, కూరగాయల సరఫరా. మార్కెట్‌ తీరు తెన్నులు అవగతం అయిన తరువాత తన గొలుసును విస్తరించబోతున్నది.
రిలయన్స్‌ ఇప్పటికే తన దుకాణాల ద్వారా తాజాగా ఇండ్లకు సరఫరా చేస్తున్నది. రైతుల నుంచి నేరుగా ఇప్పటికే కొనుగోలు చేస్తుండగా మరింత ఎక్కువ చేసేందుకు పూనుకుంది. జియో కనెక్షన్‌ రేట్లు తగ్గించటం, ఫోన్లకు రాయితీల వంటి చర్యల ద్వారా మిగతా నెట్‌ వర్కులను దెబ్బతీసిన రిలయన్స్‌ ఇప్పుడు రేట్లు పెంచింది. తన కంటే ఆర్ధికంగా అన్ని విధాలా పెద్ద దైన అమెజాన్‌తో ఎలా ఢకొీంటుందో చూడాల్సి వుంది. స్ధానికంగా ఉండే కిరాణా దుకాలతో అనుసంధానించి ఆన్‌లైన్‌ ఆర్డర్లను పెద్ద ఎత్తున సంపాదించేందుకు ఒప్పందాలు చేసుకోనుంది. అంటే ప్రస్తుతం ఉన్న కిరాణా దుకాణాలు రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి కంపెనీల సరకులను సరఫరా చేసే కేంద్రాలుగా మారనున్నాయి. దీని వలన ఆ బడా సంస్దలు మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కంపెనీల పోటీకి నిలువలేని దుకాణదారులు కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఆ కంపెనీల ఏజంట్లుగా మారిపోవటం అనివార్యంగా మారే దృశ్యం కనిపిస్తోంది. అయితే ఇదంతా తెల్లవారేసరికి జరిగిపోతుందని కాదు గానీ, సాంప్రదాయ కిరాణా దుకాణాలు ముందుగా పెద్ద పట్టణాలలో మనుగడ సమస్యలను ఎదుర్కోనున్నాయి.ప్రస్తుతం మన దేశంలో గొలుసుకట్టు షాపులు లేదా ఆన్‌లైన్‌(ఇకామర్స్‌) ద్వారా గానీ కేవలం 12శాతం లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. బడా సంస్దలన్నీ రాబోయే 20సంవత్సరాల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకొని తమ పధకాలను రూపొందిస్తున్నాయి.
ప్రధాన నగరాలలో రిటైల్‌ వ్యాపారులకు వస్తువులను విక్రయిస్తున్న జర్మన్‌ మెట్రో సంస్ధ ఇప్పుడు దాన్ని మరింత విస్తరించి కిరాణా దుకాణదారులకు సరకులను సరఫరా చేసేందుకు ఆలోచిస్తున్నది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పంపిణీదారు పాత్ర పోషించనుంది. ఇదే మాదిరి వాల్‌మార్ట్‌, అమెజాన్‌ కూడా హౌల్‌సేల్‌ వ్యాపారంలోకి దిగాలని చూస్తున్నాయి. రిలయన్స్‌ తన జియో ఖాతాదారులు, అదే విధంగా అది నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌18పేరుతో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న వివిధ టీవీ ఛానళ్ల వీక్షకులు, రిలయన్స్‌ ఫ్రెష్‌ ఖాతాదారులతో మరింతగా తన కార్యకలాపాలను పెంచుకొనేందుకు చూస్తోంది.చౌకదుకాణాలతో ఒప్పందాలు చేసుకొని వాటి ద్వారా సరఫరా చేయాలని యోచిస్తున్నది. అంతే కాదు కొన్ని చోట్ల స్టాక్‌ పాయింట్ల ఏర్పాటు, ఐదువేల దుకాణాలతో ఇప్పటికే ఒప్పందం చేసుకుందన్న వార్తలు వచ్చాయి. పదివేల కిరాణా దుకాలతో ఒప్పందాలకు ఫ్యూచర్‌ గ్రూపు కూడా ఆలోచిస్తున్నది. అమెజాన్‌ 17,500 దుకాణాలతో, ఫ్లిప్‌కార్ట్‌ 15వేల కిరాణా దుకాణాల ద్వారా సెల్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి ఆలోచిస్తున్నది. అనేక వేల దుకాణాల ద్వారా ఈ కంపెనీలన్నీ ఆన్‌లైన్‌ వాణిజ్యం జరిపేందుకు పూనుకున్నాయి. ఈ ఏర్పాట్ల ద్వారా విదేశీ, స్వదేశీ బ్రాండ్‌ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. పర్యవసానంగా వాటి లావాదేవీలు పెరుగుతున్నాయి.
నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న గొలుసుకట్టు షాపులు ఇస్తున్న రాయితీలు వినియోగదారులను సహజంగానే ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా గొలుసుకట్టు షాపులకు వెళ్లేందుకు వినియోగదారుల సంఖ్య మీద పరిమితులు విధించటంతో అనేక మంది తిరిగి ముఖ్యంగా పట్టణాల్లోని కిరాణా దుకాణాలను ఆశ్రయించారు. నిబంధనలను సడలించిన తరువాత తిరిగి మామూలు స్ధితికి చేరుకుంటున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో దాదాపు 70లక్షల కిరాణా దుకాణాలు ఉన్నట్లు అంచనా. కుటుంబ సభ్యులతో పాటు సగటున ఒక్కొక్క దుకాణం ఇద్దరికి ఉపాధి కల్పించినా దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది పని చేసే అవకాశం ఉంది.

74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌, పాలకుల నివాసాలు శుభ్రంగా ఉన్నాయి, మన సామాన్యుల ఇండ్ల మాదిరి వర్షాలకు కురుస్తున్నట్లు వార్తలేమీ లేవు. దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది, లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగపోయినా ఎడా పెడా వేల కోట్ల రూపాయల పన్నులు, ధరల పెంపుతో జనాల జేబులు కొల్లగొడుతున్నారు.లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కరోనా నివారణ చర్యలకు రాష్ట్రాలు నిధుల్లేక నానా అగచాట్లు పడుతున్నాయి. అయినా నూతన పార్లమెంట్‌ భవనం, ఇతర కట్టడాలు నరేంద్రమోడీ హయాంలో నిర్మిత మయ్యాయనే కీర్తి కండూతి కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేసి కట్టేందుకు నిర్ణయించారు. దీన్ని చూస్తే హిట్లర్‌ గుర్తుకు వస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ఐరోపాలో ఎక్కడా లేని విధంగా జర్మనీలో గ్రేట్‌ హాల్‌ నిర్మించాలని నిర్ణయించి, నమూనాలను గీయించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో కమ్యూనిస్టుల చేతిలో పరాజయం పాలై ఆత్మహత్య చేసుకున్నాడు గానీ గెలిచి ఉంటే దాన్ని నిర్మించి ఉండేవాడు. నెహ్రూ నీటిపారుదల ప్రాజెక్టులకు, ఇతర పారిశ్రామిక సంస్దలకు నాంది పలిక ఆధునిక దేవాలయాలకు ఆద్యుడయ్యాడనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ తన ఖాతాలో ఆర్టికల్‌ 370 రద్దు, విగ్రహాలు, ఆయోధ్యరామ మందిరం తదితర అంశాలతో పాటు పార్లమెంట్‌ భవనాన్ని చేర్చి నెహ్రూ పేరును చెరిపి వేయాలన్న తాపత్రయం, ప్రయత్నం కనిపిస్తోంది.


సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే చెప్పింది !
సుప్రీం కోర్టు బాబరీ మసీదు స్ధలం రాముడికే చెందాలని తీర్పు చెప్పింది తప్ప న్యాయం చేకూర్చలేదు అనే విమర్శలు ఉన్నాయి. మసీదు కూల్చివేతను ఒక నేరపూరిత చర్యగా వర్ణించింది.దోషులను శిక్షించేందుకు విచారణను వేగవంతం చేయాలన్నది. అదే కోర్టు మరోవైపున మసీదు కూల్చివేతలో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నవారికి ఆ స్ధలంలో రామాలయనిర్మించే బాధ్యతను అప్పగించింది. అయితే అది ఒక ట్రస్టు ఆధ్వర్యాన జరగాలని తీర్పు చెప్పింది. కానీ నరేంద్రమోడీ అండ్‌కో దాన్ని ఒక అధికారిక కార్యక్రమంగా మార్చివేశారు. లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన మోడీ దీనికి హాజరు కావటాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అని తప్ప ఏమనాలి ? రామాలయ నిర్మాణం కోసం శతాబ్దాల తరబడి అనేక మంది త్యాగాలు చేశారంటూ స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చటం చరిత్రను కించపరచటం కాదా ? నరేంద్రమోడీ మాతృసంస్ధ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామి కాదు. ఉద్యమాన్ని వ్యతిరేకించింది. ఒక సంస్ధగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు అని తనకు తానే ప్రశ్న వేసుకొని ఆ సంస్ధ ప్రముఖుడు నానాజీ దేశముఖ్‌ ఇచ్చిన వివరణే అందుకు నిదర్శ నం.


చెప్పింది చెయ్యరు- చేసేది చెప్పరు !
అచ్చేదిన్‌ (మంచి రోజులు) అని నినాదమిచ్చిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఎన్నికల తరువాత అసలు ఆ మాటను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పారు. దాని ప్రస్తావనా లేదు. విదేశాల్లో దాచుకున్న దొంగ సొమ్మును తీసుకువస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి, ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. అదేమైందో తెలియదు. నిరుద్యోగం 40 సంవత్సరాల రికార్డు స్ధాయికి చేరింది అని ప్రభుత్వ గణాంకాల నివేదిక తేల్చింది. అయితే అదంతా తప్పుల తడక, కల్పించిన ఉపాధిని పరిగణనలోకి తీసుకోలేదు, ఉదాహరణకు పకోడీల తయారీ కూడా ఉపాధికల్పనలో భాగమే అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు, సరైన లెక్కల పద్దతిని రూపొందించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎన్నికల తరువాత అదే నివేదికను ఆమోదించారు. కొత్త గణాంకాలను తెచ్చిందీ లేదు.2019 పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం ఆరునెలల పాటు తొక్కిపెట్టింది.2011-12 సంవత్సరాలలో 467.7 మిలియన్‌లుగా ఉన్నకార్మికశక్తి 2017-18 నాటికి 461.5మిలియన్లకు తగ్గిపోయారు. వ్యవసాయ రంగంలో 29.3 మిలియన్ల మంది ఉపాధి కోల్పోగా వారిలో 24.7 మిలియన్ల మంది మహిళలే ఉన్నారు. అయినప్పటికీ పాలకులు మహిళా ఉద్దరణ, విజయగాధల గురించి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఉపాధి తగ్గిపోయినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం .రూపొందించిన నివేదికలో నాలుగు దశాబ్దాల రికార్డు స్ధాయి 6.1.శాతానికి నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నది. దీనికి 2016లో నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణం అన్నది దాని సారాంశం. దాన్ని ఎన్నికల ముందు విడుదల చేస్తే నష్టదాయకం కనుక తొక్కి పెట్టారు.


నరేంద్రమోడీ హయాంలో జిడిపి పెరుగుదల మొదలు అనేక గణాంకాలు వివాదాస్పదం అయ్యాయి. ఏది నిజమో కాదో తెలియని సందిగ్ద స్దితిలో జనాన్ని పెట్టారు. మోడీ గణానికి కావాల్సింది అదే. అలాంటి పరిస్ధితిలో తమ ప్రచార యంత్రాంగం ద్వారా అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలన్నది ఎత్తుగడ. లెక్కించే పద్దతి సరిగా లేదు, మేము సాధించిన వృద్ధి గణాంకాల్లో చేరటం లేదని చెబుతున్న మోడీ సర్కార్‌ ఇంతవరకు సరైన పద్దతిని ఎందుకు రూపొందించలేకపోయింది.అంతచేతగాని స్ధితిలో మన యంత్రాంగం, ప్రధాని సలహాదారులు ఉన్నారా ? లేదూ కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఉన్న విధానం ప్రకారం రూపొందించిన అంకెలను అంగీరించాలి, జనానికి అందించాలా లేదా ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించేదేమిటి అంటే తరువాత కాలంలో లావాదేవీలన్నీ నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. దానికోసమే అయితే యావత్‌ జనాన్ని అంత ఇబ్బంది పెట్టటం ఎందుకు, ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయటమెందుకు? నల్లధనాన్ని బయటపెట్టేందుకు అని చెప్పిన పెద్దలు అసలా మాటనే మరచిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి గురించి దేశం ఏమి ఆశిస్తుంది? ఆచరణలో ఎన్ని లావాదేవీలు నమోదు అవుతున్నాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా చిన్న దుకాణదారులందరూ రెండున్నరశాతం అదనంగా వసూలు చేస్తున్నందున వినియోగదారులు నగదు చెల్లింపుకే మొగ్గు చూపుతున్నారు. రియలెస్టేట్‌ రంగంలో లెక్కల్లో చూపుతున్నది ఎంతో నల్లధనం ఎంత చెల్లిస్తున్నారో బహిరంగ రహస్యం. అనేక దుకాణాల్లో కార్డు చెల్లింపులను అంగీకరించటం లేదన్నదీ తెలిసిందే. బిజెపి ఎన్నడూ కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎంత నాటకీయంగా ఆపని చేసిందో చూశాము


అభివృద్ధికి ఆటంకం కార్మిక చట్టాలా – పాలకుల విధానాలా ?
దేశంలో అభివృద్ది కుంటుపడటానికి, ముందుకు పోయేందుకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాపలాగా ఉన్న ఒక కుక్కను తప్పించాలంటే దాన్ని పిచ్చిదని ప్రచారం చేయాలన్నట్లుగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేదా నీరు గార్చి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి దోపిడీని స్వేచ్చగా కొనసాగనివ్వాలన్నది అసలు లక్ష్యం. ముందే చెప్పుకున్నట్లు ద్రవ్య పెట్టుబడి, నయా ఉదారవాద విధానం కార్మికుల హక్కులను, బేరమాడే, పోరాడేశక్తిని సహించదు.
ఈ నేపధ్యంలోనే 1991 నుంచి ఒక పధకం ప్రకారం కార్మిక చట్టాల సంస్కరణల గురించి ప్రచార దాడి ప్రారంభించారు. మన కేంద్ర ప్రభుత్వం 45, అన్ని రాష్ట్రాలూ కలిపి మరో 170వరకు కార్మిక చట్టాలను చేశాయి. వీటిలో అత్యధిక భాగం కార్మికశక్తిలో పదిశాతానికి అటూ ఇటూగా ఉండే సంఘటిత కార్మికుల కోసం రూపొందించినవే. అసంఘటిత కార్మికులకు ఉన్న రక్షణ నామమాత్రం. అయినప్పటికీ పదిశాతం కార్మికులకు ఉన్న చట్టాలు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో వలస కార్మికులు ఎందరున్నారో, వారికి ఎలాంటి రక్షణ లేదని కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా రుజువైంది. అసలు వారెంత మంది ఉన్నారో, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కేంద్రం లేదా రాష్ట్రాల వద్ద సమాచారమే లేదు, రికార్డులు అంతకంటే లేవు. కరోనా నివారణ కాలేదు కానీ కార్మికశాఖ డొల్లతనం, పాలకుల బండారం బట్టబయలైంది.
కార్మిక చట్టాలను సంస్కరించవద్దని ఎవరూ చెప్పటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటిదంటే తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన జాబితా అంకెల్లో చూపుతుంది. అలాగే సంస్కరణలు అంటే ఉన్నవాటిని మరింత మెరుగుపరచటం గాకుండా అసలు పూర్తిగా ఎత్తివేయటంగా తయారైంది. పారిశ్రామిక, వాణిజ్య సంస్దలలో తనిఖీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడుతోంది బాబూ అని కార్మికులంటే యజమానులకు అనుగుణ్యంగా అసలు తనిఖీలనే ఎత్తివేశారు. యాజమాన్యాలు నిబంధనలను సక్రమంగా అమలు జరపటం లేదంటే చట్టాల అమలు గురించి యజమానులు స్వయంగా అఫిడవిట్లు ఇస్తే చాలన్నట్లుగా చెబుతున్నారు.
కోర్టులు ఏ దేశంలో ఏ పాలనా వ్యవస్ధ ఉంటే దాని విధానాలకు అనుగుణ్యంగానే నడుచుకుంటాయన్నది ప్రపంచ అనుభవం. ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే వారికే కాదు యావత్‌ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె హక్కు లేదిప్పుడు అంటే అతిశయోక్తి కాదు. సమ్మెను ఒక ఆయుధంగా వాడుతూ అత్యధిక సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులు వ్యాఖ్యానించాయి. సమ్మె ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించాయి.


పరస్పర విరుద్ద వాదనలు !
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి పరస్పర విరుద్ద వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న లోపాల కారణంగా తలెత్తుతుంది అని కమ్యూనిస్టులు చెబుతారు. కాదు మేము వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉత్పాదకత పెరుగుతుంది, మాలాభాలు పెరుగుతున్నాయి, పని చేసే వారు ఎక్కువ మంది అవసరం లేదు, అందువలన నిరుద్యోగం పెరుగుతుంది అని యజమానులు, వారికి మద్దతు ఇచ్చే వారు చెబుతారు. ఇదే వాదన చేసే వారు కార్మిక చట్టాలు, కార్మికులకు హక్కులు కలిగించటం వలన వారు వేతనాల పెంపుదల కోసం, హక్కుల కోసం డిమాండ్లు చేస్తారు. వారి చర్యలు ఉత్పత్తికి ఆటంకంగా మారతాయి, ఉత్పాదక ఖర్చులు పెరుగుతాయి అని చెబుతారు. ఒక వైపు యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించామని చెప్పేవారు ఇక్కడ వేతనాలు పెరిగితే ఖర్చు పెరుగుతుంది అని వాదిస్తారు.


ఉత్పత్తి పడిపోవటానికి కార్మిక సమ్మెలు కారణం కానేకాదు. 2011లో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 83శాతం ఉండగా క్రమంగా తగ్గుతూ పెరుగుతూ కరోనాకు ముందు 2019లో 76శాతం ఉండగా ఈ ఏడాదిలో ప్రస్తుతం 68శాతానికి పడిపోయింది.2003 నుంచి 2014వరకు సమ్మెలు 75శాతం తగ్గితే, పని దినాల నష్టం 90శాతం తగ్గింది. 2014లో 119 సమ్మెలు జరిగితే తరువాత రెండు సంవత్సరాలలో 106,93కు తగ్గాయి. 2017 జనవరి-అక్టోబరు మధ్య కాలంలో 82 జరిగాయి. ఇటీవలి కాలంలో వాణిజ్య సులభతర సూచికలో ఎన్నో పాయింట్ల మెరుగుదల ఉంది, నరేంద్రమోడీ ఏ ప్రధానీ చేయనన్ని విదేశీ పర్యటనలు చేసి సంబంధాలు మెరుగుపరచినట్లు, దేశ ప్రతిష్టను పెంచినట్లు చెప్పటాన్ని విన్నాం. అయినా మన ఎగుమతులు పెరగకపోగా పడిపోయాయి. దీనికి కార్మికులు కారణం కాదు. అయినా కార్మిక చట్టాలను మరింతగా సంస్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎగుమతి ఆధారిత, ప్రత్యేక ఆర్ధిక ప్రాంతాలలో చట్టాలు పని చేయవు, ఇప్పుడు వాటిని ఇతర అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారా ? అనుమానం అక్కర లేదు.
అప్రెంటిస్‌ల పేరుతో చట్టబద్దంగానే శ్రమశక్తిని దోచుకొనేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. కనీసం 15శాతం అప్రెంటిస్‌లు ఉండాలి. అంటే వారికి ఎలాంటి చట్టాలు, చట్టబద్ద వేతనాలు వర్తించవు. స్టైఫండ్‌ మాత్రమే ఇస్తారు.రిజిస్టర్లు, ఇతర రికార్డుల నిర్వహణలో కూడా మినహాయింపులు ఇచ్చారు గతంలో 19 మంది కార్మికులున్న ఫ్యాక్టరీలు, సంస్ధలకు ఇలాంటి వెసులుబాటు ఇస్తే నరేంద్రమోడీ గారు ఆ సంఖ్యను 40కి పెంచారు.


మన కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేసేందుకు స్వదేశీ-విదేశీ కంపెనీలకు విచ్చల విడి అధికారాలను ఇచ్చేందుకు పూనుకున్నారు. మన దేశం మీద విదేశాలకు ఆసక్తి ఏమిటి, ఎందుకు ? ఉదాహరణకు జర్మనీలో గంటకు సగటున 35యూరోలు ఉన్నది. అంటే 41.5డాలర్లు. అందువలన మన దేశంలో గంటకు రెండు డాలర్లు ( రు.150 ) ఇచ్చినా ఇబ్బంది లేదన్నది విదేశీ పెట్టుబడిదార్ల లెక్క. రోబోలను వినియోగించినా గంటకు నాలుగు డాలర్లు అవుతుందని అందువలన రోబోల మాదిరి పని చేసే భారతీయ కార్మికులను వినియోగించుకోవటమే లాభం అని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు కావాలి గనుకనే, పెద్ద సంఖ్యలో గతంలో పాలిటెక్నిక్‌లను ప్రోత్సహిస్తే తరువాత తామర తంపరగా ఇంజనీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. నైపుణ్య అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటం కూడా దీనిలో భాగమే.


జర్మనీలో నాజీలు ప్రపంచ యుద్దంలో జర్మనీ పొందిన పరాజయాన్ని పరాభవంగా చిత్రించి జనాల్లో జాతీయ ఉన్మాద భావనలను రెచ్చగొట్టారు. తిరిగి పూర్వ ప్రాభవాన్ని నెలకొల్పాలనే మనోభావాన్ని చొప్పించారు. మన దేశంలో అదే పద్దతుల్లో పన్నెండు వందల సంవత్సరాలుగా హిందువులు బాధితులు అనే ప్రచారాన్ని సంఘపరివార్‌ సంస్దలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. పూర్వ వైభవాన్ని పునరుద్దరించాలని దానికి హిందూత్వ అని పేరు పెట్టారు. దాన్ని అంగీకరించని వారు దేశం వదలి పోవాలని హెచ్చరిస్తుంటారు. చరిత్రకు మతం రంగు పులుముతున్నారు. దేశంలో పాలన మత ప్రాతిపదికనే జరిగినట్లయితే మెజారిటీ ముస్లింలు ఉన్న కాశ్మీరులో రాజు హిందువు ఎలా అయ్యాడు ? మెజారిటీ జనం హిందువులుగా ఉన్న హైదరాబాద్‌, మైసూరు, జునాగఢ్‌ వంటి సంస్దానాలలో ముస్లింలు పాలకులుగా వందల సంవత్సరాలు ఎలా ఉన్నారు ?


మన దేశంలో కోట్లాది కుటుంబాలకు కనీస సౌకర్యాలు లేవు గానీ ప్రస్తుతం ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. వాట్సాప్‌ గురించి వేరే చెప్పనవసరం లేదు. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటున్న బిజెపి కుహనా వార్తలను ప్రచారం చేసేందుకు పెద్ద యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్‌లో వచ్చిన వాటిని నమ్మకూడదని ఒక వైపు అనుకుంటూనే పదే పదే ఆ సమాచారం వస్తుండటంతో తమకు తెలియకుండానే నమ్ముతూ బుర్రను ఉపయోగించని విద్యావంతులైన వారెందరో ఉన్నారు. వాట్సాప్‌కు భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా మార్చిన వినియోగదారులయ్యారు.


బిజెపి, దాని విధానాలను విమర్శించే జర్నలిస్టులను ప్రెస్టిట్యూట్స్‌(పత్రికా వ్యభిచారులు), ముజాహిదిన్స్‌, రెడ్‌ తాలిబాన్స్‌ ఇలా అనేక పదాలతో అవమానిస్తున్నారు. బెదిరిస్తున్నారు, లొంగని గౌరీలంకేష్‌ వంటి వారిని హతమార్చుతున్నారు. మీడియాను నియంత్రించే కార్పొరేట్లు సహజంగానే తమ ప్రయోజనాల కోసం మీడియాను పాకేజ్‌లకు, ప్రలోభాలకు అప్పగించే శారు.
ఫాసిస్టు, నాజీజాన్ని పెంచి పోషించిన శక్తులు తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రయివేటు దళాలను ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని సందర్భాలలో ప్రత్యర్ధులను హతమార్చేందుకు కిరాయిహంతకులను కూడా వినియోగించుకున్నాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు విశ ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటివి అలాంటివే. గౌరీ లంకేష్‌, కులుబుర్గి, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని కాషాయ భావజాలంతో ఉన్మాదులైన వారు లేదా వారు ఉపయోగించిన కిరాయి హంతకులు హతమార్చారు. గోరక్షకులు, హిందూత్వ పరిరక్షకుల పేరుతో ఎవరికి వారే దళాలుగా ఏర్పడటం ప్రత్యర్ధులు లేదా మైనారిటీ మతాలకు చెందిన వారిని హత్యలు చేయటాన్ని చూశాము.


మన దేశంలో ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయని చెప్పేవారు కొందరున్నారు. కాదు ఫాసిస్టు తరహా ధోరణులు నానాటికీ ప్రబలుతున్నాయనే వారు మరికొందరు. లేదు లేదు అసలైన ప్రజాస్వామ్యం ఇదే అని నమ్మబలుకుతున్నవారు ఎందరో ఉన్నారు. నువ్వేమిటో తెలుసు కోవాలంటే నీ గురించి ఆలోచించుకో అని సుప్రస్దిద్ద గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ చెప్పాడు. అందువలన ఎవరేమి చెప్పినా, రాసినా, దృశ్యరూపంలో ప్రదర్శించినా ముందు వాటిని ‘సహనంతో ‘ వ్యక్తపరచనివ్వాలి, వినాలి, చదవాలి, చూడాలి. అలాంటి పరిస్ధితి దేశంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ మెదడుకు పదును పెట్టాలి. ఈ నేపధ్యంలో వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను, దేశంలో వ్యక్తమౌతున్న కొన్ని ధోరణుల తీరు తెన్నులను చూశారు. ప్రపంచ వ్యాపితంగా ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- మితవాదం జమిలిగా ముందుకు వస్తున్నాయి. మన దేశంలో వాటికి మతోన్మాదం కూడా తోడైంది. కనుక పరిణామాలు, పర్యసానాలు ఎలా ఉంటాయి అన్నది ఎప్పటికప్పుడు జాగరూకులై ఉండాల్సిందే ! ముందే చెప్పుకున్నట్లు తద్దినం మాదిరి ఒక్క స్వాతంత్య్ర దినం రోజునే కాదు, నిరంతరం ప్రతి ఒక్కరూ ఆలోచించినపుడే స్వాతంత్య్రం నిలుస్తుంది. ( తొలి భాగం – 74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర ! )

74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
ఇతరులపై ఆధారపడకుండా స్వంత శక్తులు, స్వంత వనరులతో అభివృద్ది చెందాలంటూ ఆత్మనిర్భర భారత్‌ అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచం కోసం తయారీ (మేక్‌ ఫర్‌ వరల్డ్‌) అని పిలుపునిచ్చారు. ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలమైనందున బహుశా ఆ పేరును ఉచ్చరించేందుకు ఇచ్చగించక లేదా పాత నినాదాలకు పాతరేసి కొత్త నినాదాల జాతరను ముందుకు తేవటంలో మోడీ చూపుతున్న అసమాన ప్రతిభకు ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. నిజానికి రెండు నినాదాల అర్ధం, లక్ష్యం ఒక్కటే. విదేశాల కోసం భారత్‌లో వస్తు తయారీ. ఈ కొత్త నినాద మోజు ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు మరో కొత్త నినాదం మన చెవులకు వినిపిస్తారో ఎదురు చూద్దాం.


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం నుంచి రెండు సంవత్సరాల పాటు ఉండే సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో భారత్‌కు 192కు గాను 184 ఓట్లు రావటం మన పరపతి పెరుగుదలకు నిదర్శనమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీన్లో కాస్త హుందాతనం తగ్గినట్లు అనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఐదు స్దానాలకు ఐదు దేశాలు మాత్రమే రంగంలో ఉన్నాయి కనుక ఏకగ్రీవంగా జరిగినట్లే. అయినా నిబంధనావళి ప్రకారం ఓటింగ్‌ జరిగింది. మన దేశానికి 184 వస్తే మెక్సికోకు 187 వచ్చాయని గమనించాలి. అంటే మనకంటే మెక్సికో ఎక్కువ పలుకుబడి కలిగిన దేశం అనుకోవాలా ? గౌరవనీయమైన ప్రధాని నరేంద్రమోడీ గారికే వదలివేద్దా !
ఆగస్టు పదిహేను అన్నది ఒక పండుగ రోజు కాదు. దీక్షాదినంగా పాటించాల్సిన రోజు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని నిత్యం కాపాడుకోవాల్సి ఉంది. ఆ ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నందున ప్రతి స్వాతంత్య్రం దినానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ దాన్ని కాపాడు కొనేందుకు దీక్ష పూనాల్సిందే. దేశంలోని నాలుగు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్ధలైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌ పదవుల్లో తొలిసారిగా సంఘపరివార్‌కు చెందిన వారే ఉన్నారు.


తప్పులు చేసేందుకు సైతం అవకాశం ఇవ్వని స్వేచ్చ విలువైనది కాదు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పారు. అనేక రాష్ట్రాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండగా స్వాతంత్య్రానికి 73 సంవత్సరాలు నిండాయి, 74వ దినోత్సవం జరుపుకున్నాము. మహాత్ముడిని హత్య చేసిన భారత తొలి మతోన్మాద ఉగ్రవాది నాథూరామ్‌ గాడ్సేను మరొక దేశంలో అయితే అక్కడికక్కడే కాల్చి చంపి ఉండేవారు. కానీ అతగాడిన కోర్టులో ప్రవేశపెట్టటమే కాదు, గాంధీని తానెందుకు హతమార్చిందీ చెప్పుకొనేందుకు స్వేచ్చ ఇచ్చిన వ్యవస్ధ మనది. ఆ ప్రకటననే ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌, ఒక ఖురాన్‌ మాదిరి అచ్చువేసి మహాత్ముడిని హతమార్చటం ఎలా సమర్ధనీయమో చూడండి అని చెప్పేందుకు ప్రచారంలో పెట్టిన శక్తులకు, వాటిని హస్తభూషణాలుగా చేసుకొనేందుకు కూడా ప్రస్తుతం ఈ దేశంలో స్వేచ్చ ఉంది. మరోవైపు ప్రభుత్వ విధానాలను, పాలకపార్టీల వైఖరులను విమర్శించటమే దేశద్రోహం అన్నట్లుగా చిత్రించి దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టే ప్రమాదకర పరిస్ధితి కూడా ఉంది.


ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
మెజారిటీ పౌరుల నిర్ణయమే ప్రజాస్వామిక తీర్పు. కానీ జరుగుతున్నదేమిటి ? మైనారిటీ తీర్పే మెజారిటీని శాసిస్తున్నది. ఇది గతంలో కాంగ్రెస్‌ హయాంలో, వర్తమానంలో బిజెపి ఏలుబడిలో అయినా అదే జరుగుతున్నది. 2014లో బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల రీత్యా విజయం సాధించింది, 2019లో ఘన విజయం సాధించింది.2014-19కి తేడా ఏమిటి ? ఆరుశాతం ఓట్లు పెంచుకొని 2019లో 37.4శాతం ఓట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఉండగా, దాని మిత్రపక్షాలకు వచ్చిన ఓట్లు కలుపుకుంటే 45శాతం. అంటే 55శాతం మంది దానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మొత్తం 29 రాష్ట్రాలలో 17 చోట్ల మాత్రమే పోలైన ఓట్లలో సగానికి మించి దానికి వచ్చాయి. ఒక్క వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌ లేదా ఇప్పుడు బిజెపి లేదా వాటికి మద్దతు ఇస్తున్న పార్టీలు గానీ ఎన్నికల సంస్కరణల గురించి చెబుతాయి తప్ప డబ్బు, ప్రలోభాల ప్రమేయం లేని దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానం కావాలని అడగటం లేదు.


ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నాము !
” మనం అంటే ప్రజాస్వామ్యాలు యూదుల విషయంలో ఒక వైఖరిని తీసుకొనే స్ధితిలో లేవు.ఈ సామ్రాజ్యాలలో చదరపు కిలోమీటరుకు పది మంది జనం కూడా లేరు. అదే జర్మనీలో చదరపు కిలోమీటరుకు 135 మంది నివాసితులున్న చోట వారికి చోటు కల్పించాలట ” ఇది 1939 జనవరి 30న నాజీ హిట్లర్‌ తనను వ్యతిరేకించే దేశాలను ఉటంకిస్తూ చేసిన ప్రసంగంలోని అంశం.
మన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు 2002 సెప్టెంబరు తొమ్మిదిన గుజరాత్‌ గౌరవ యాత్ర బేచారాజ్‌లో ప్రవేశించిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ యాత్రలో మాట్లాడుతూ ” మనం బేచారాజ్‌కు నిధులు కేటాయించితే వారు మెచ్చరు. మనం నర్మద నీటిని శ్రావణమాసంలో తీసుకువస్తే అప్పుడు కూడా వారు మెచ్చరు. కాబట్టి ఏమి చేయాలి? మనం పునరావాస కేంద్రాలను నడపాలా ? బహిరంగ పిల్లల ఉత్పత్తి కేంద్రాలను తెరవాలా ” అన్నారు. మనం ఐదుగురం-మనకు 25 మంది అంటూ ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ చేసిన ప్రఖ్యాత ప్రసంగంలోని ఆణిముత్యాలివి.
జాతీయ మైనారిటీ కమిషన్‌ ఈ విద్వేష ప్రసంగానికి సంబంధించి వివరాలు కావాలని నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మోడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్న పికె మిశ్రా ఇదే విషయమై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రసంగానికి సంబంధించి ఏ విధమైన టేపులు లేదా రాతపూర్వకంగా ఏమీ లేనందున తాము జాతీయ మైనారిటీ కమిషన్‌కు పంపేందుకేమీ లేవని చెప్పాడు. ఇదేదో శతాబ్దం క్రితం జరిగింది కాదు. అధికారిక ఆధారాలు నాశనం చేయటం చేయటం లేదా అసలు లేకుండా చేసినందున అసలు ఇలాంటి ప్రసంగాన్ని మోడీ చేయలేదని బుకాయించినా చేసేదేమీ లేదు. అయితే పత్రికలు, టీవీలు వాటిని రికార్డు చేశాయి, ప్రచురించాయి, ప్రసారం చేశాయి గనుక తెలుసుకోగలుగుతున్నాము. అందుకే పని చేసే మీడియా అంటే నరేంద్రమోడీకి గిట్టదు. పాకేజ్‌లతో లేదా ముందే తయారు చేసిన ఫలానా ప్రశ్నలు మాత్రమే అడగాలి అన్న నిర్దేశాలకు అంగీకరించిన భజన మీడియా ప్రతినిధులతోనే ఇప్పటి వరకు మోడీ మాట్లాడారు తప్ప, ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టిని కూడా పెట్టలేదు, ఎందుకంటే ఏటికి ఎదురీదే జర్నలిస్టులు ఇంకా మిగిలే వారు ఉన్నారు గనుక, ప్రశ్నలు అడుగుతారు గనుక అని వేరే చెప్పనవసరం లేదు.
2007జనవరిలో మొహరం పండగ సందర్భంగా జరిగిన మతకలహంలో రాజకుమార్‌ అగ్రహారి అనే యువకుడు మరణించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని అప్పుడు గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాధ్‌ వెళ్లి ” కొంత మంది హిందువుల ఇళ్లు, దుకాణాలను తగులబెడితే ప్రతిగా అదేపని చేయకుండా ఆపాలని అనటంలో నాకు విశ్వాసం లేదు. ” అని మతవిద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆయన దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి, అవసరమైతే నరేంద్రమోడీని తప్పించి ప్రధాని అభ్యర్ధిగా రంగంలో తెచ్చేవారిలో తొలి వ్యక్తిగా ప్రచారంలో ఉన్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న అనేక మంది బిజెపి నేతలు ఇలాంటి ప్రచారాలకు పెట్టింది పేరు.
మేము హిట్లర్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా పొగిడామా అని సంఘపరివార్‌ శక్తులు ఎదురుదాడి చేస్తాయి. ఇలాంటి విద్వేషపూరిత ప్రచారం చేసేవారికి ఉత్తేజమిచ్చేది ప్రపంచంలో హిట్లర్‌ తప్ప చరిత్రలో మరొకరు లేరు. పేరు చెప్పనంత మాత్రాన బహిరంగంగా ఆరాధించనంత మాత్రాన గుండెల్లో గుడి కట్టిందెవరికో తెలియనంత అమాయకంగా మన సమాజం ఉందా ? ఇవి ఫాసిస్టు లేదా నాజీల ధోరణులు కావా ?


దేశంలో జరుగుతున్నదేమిటి ?
ఒక వ్యవస్ధను ధ్వంసం చేయాల్సి వస్తే దాని అవసరం ఏమిటో చెప్పాలి. జనాన్ని ఒప్పించాలి. కొద్ది మంది పెట్టుబడిదారులు అత్యధికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు గనుక ఆ వ్యవస్ధను ధ్వంసం చేయాలని కమ్యూనిస్టులు నిరంతరం దాని గురించి చెబుతూ ఉంటారు, తమ అంతిమ లక్ష్యం దోపిడీ వ్యవస్ధ నిర్మూలనే అని, అది జరగకుండా దోపిడీ అంతం కాదని బహిరంగంగానే చెబుతారు. వారి అవగాహనతో ఏకీభవించటమా లేదా అన్నది వేరే విషయం. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతూ కొన్ని శక్తులు నిరంతరం దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించటాన్ని చూస్తున్నాం. దానికి మూలమైన అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దుర్వినియోగం చేయటం, నీరు గార్చటం, దిగజార్చటం, చివరికి వాటి మీద విశ్వాసం లేకుండా చేసి అసలు ఈ రాజ్యాంగాన్నే మార్చివేయాలి, కఠినంగా ఒక వ్యవహరించే ఒక నియంత కావాలి అని జనం చేతనే అనిపించే విధంగా వారి చర్యలుంటున్నాయి. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది.


మెజారిటీ వర్గ పాలనా ? మెజారిటీ మత పాలనా ?
ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్ధలున్నాయని చెప్పుకొనే ప్రతి దేశంలోను ప్రజాస్వామిక వ్యవస్ధలు వత్తిళ్లకు, దాడులకు గురవుతున్నాయి.నిరంకుశ పోకడలున్న పాలకులు రోజు రోజుకూ పెరుగుతున్నారు.మొదటి ప్రపంచ యుద్దం ముగిసి వందేళ్లు గడచాయి.మొదటి ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ పరిణామాల్లో తొలి సోషలిస్టు రాజ్యం సోవియట్‌ రష్యా ఏర్పడింది. మెజారిటీ కార్మికవర్గానికి ప్రాతినిధ్యం వహించే కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది కనుక దాన్ని తొలి శ్రామికరాజ్యం అన్నారు. దాని స్ఫూర్తితో అనేక దేశాల స్వాతంత్య్ర ఉద్యమాల్లో భాగస్వాములుగా ఉన్న వారు కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేశారు.


ఇదే సమయంలో అనేక దేశాల్లో ఫాసిస్టు, నాజీ శక్తులు కూడా రంగంలోకి వచ్చాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అలాంటి శక్తే అన్నది అనేక మంది విమర్శ. దాని మైనారిటీ, కమ్యూనిస్టు వ్యతిరేకత ముందు బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడటం ముఖ్య అంశంగా లేదు. అందుకే స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంది. బ్రిటీష్‌ వారికి అనుకూలంగా కూడా వ్యవహరించిన చరిత్ర ఉంది. వ్యక్తులుగా తొలి రోజుల్లో ఉద్యమంలో పాల్గొన్న వినాయక దామోదర్‌ సావర్కర్‌ వంటి వారు జైలు జీవితాన్ని భరించలేక నాటి బ్రిటీష్‌ పాలకులకు లొంగిపోయి సేవ చేస్తామని రాసిన లేఖలు తరువాత బహిర్గతం అయ్యాయి. హిందూరాజ్య స్ధాపన నినాదంతో సంఘపరివార్‌ మెజారిటీ రాజ్య స్ధాపన లక్ష్యంగా పని చేస్తోంది.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత ఇటలీ, జర్మనీ,జపాన్‌లలో అంతకు ముందున్న ప్రజాస్వామిక వ్యవస్ధలను కూల్చివేసి ముస్సోలినీ, హిట్లర్‌, టోజో వంటి నియంతలు రంగంలోకి వచ్చారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్దాల మధ్య రెండు దశాబ్దాల కాలంలో ఒక వైపు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌తోక పాటు కొన్ని దేశాల్లో ఫాసిస్టు శక్తులు కూడా బలపడ్డాయి. మహా ఆర్ధిక మాంద్యం పెట్టుబడిదారీ వ్యవస్ధలను అతలాకుతలం చేసింది. ఫాసిస్టు శక్తులు అటు సోషలిజానికి ఇటు పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న అమెరికా, ఐరోపా దేశాలకూ ముప్పుగా పరిణమించటంతో ఆ రెండుశక్తులు కలసి రెండవ ప్రపంచ యుద్దంలో ఫాసిజాన్ని ఓడించాయి. సోవియట్‌ యూనియన్‌ భారీ మూల్యం చెల్లించి, ఫాసిజం ఓటమిలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. దీని పర్యవసానం అనేక దేశాలు సోషలిస్టు వ్యవస్ధలోకి మరలాయి. ప్రత్యక్ష వలసలు రద్దయి స్వాతంత్య్రం పొందాయి.


తరువాత కాలంలో ద్రవ్య పెట్టుబడి ప్రపంచాన్ని పెద్ద ఎత్తున ఆవరించింది. దానికి మద్దతుగా కొన్ని చోట్ల నియంతృత్వ పోకడలు పెరగటం ప్రారంభమైంది.గతంలో పెట్టుబడిదారీ విధానం మధ్య తలెత్తిన తీవ్ర పోటీ ఫాసిజాన్ని ముందుకు తెచ్చింది. అయితే ఫాసిజం, మిలిటరీ నియంతలకు కాలం చెల్లింది కనుక ద్రవ్య పెట్టుబడిదారీ విధానం నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చింది. దాన్ని అమలు జరిపేందుకు లాటిన్‌ అమెరికాలో మిలిటరీ నియంతలకు పట్టం కట్టారు. వాటికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావటంతో ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించటం కోసం వారిని వదిలించుకొని కొత్త శక్తులను రంగంలోకి తెచ్చారు. ఇదే సమయంలో నయా ఉదార వాదం కంటే ఫాసిస్టు విధానమే పరిష్కారం అని చెప్పే నయా ఫాసిస్టు లేదా ఫాసిస్టు తరహా నయా ఫాసిస్టు శక్తులు అనేక ఐరోపా దేశాల్లో ముందుకు వచ్చాయి, గణనీయమైన విజయాలను కూడా సాధిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మన దేశంలో బిజెపి విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి రిపబ్లికన్‌ పార్టీ మితవాదులు, శ్వేతజాతి దురహంకారులు నరేంద్రమోడీకి సహజమిత్రులుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
స్వేచ్చ పరిరక్షకురాలిగా నయా ఉదారవాదం ఫోజు పెడుతుంది. స్వేచ్చామార్కెట్‌కు హామీ ఇస్తుంది. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. గత కొద్ది సంవత్సరాలలో ఈ అవగాహనకు విరుద్దంగా అనేక దేశాలు తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలే దానికి నిదర్శనం. ఇంతే కాదు ఆయా దేశాల అర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలలో పాలకుల జోక్యం, నియంత్రణలను పరిమితం చేసేందుకు నయా ఉదారవాదం పూనుకుంది.గతంలో పెట్టుబడిని పాలకులు నియంత్రిస్తే ఇప్పుడు పెట్టుబడే పాలకులను నియంత్రిస్తోంది. ఇది ఒక్క ఆర్ధిక రంగానికే కాదు, సామాజిక, రాజకీయ రంగాలకూ విస్తరిస్తోంది.


నయా ఉదారవాద విధానాలకు భిన్నంగా పాలకులను నియంత్రించటాన్ని ” ఆర్డోలిబరలిజం ” అంటున్నారు. ఆర్డర్‌ మరియు లిబరలిజం అనే రెండు పదాలను కలిపి అలా పిలుస్తున్నారు. ఉదారవాద విధానాలకు భంగం కలగ కుండా ఆదేశాలు(ఆర్డర్‌) జారీ చేయటం. ఇది నయాఉదారవాదాన్ని ముందుకు తెచ్చే ద్రవ్యపెట్టుబడిదారుల ఆదేశమే. మన దేశంలో ద్రవ్య నియంత్రణ మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) పేరుతో 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చిన చట్టం దీనిలో భాగమే. రుణ, ద్రవ్యలోటు, ఆదాయలోటు, ద్రవ్యోల్బణ లక్ష్యాలను నిర్ణయించటం దీనిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ద్రవ్య రంగంలో మరింతగా ద్రవ్య పెట్టుబడిదారులకు అవకాశాలను కల్పిస్తున్నది.


ద్రవ్య పెట్టుబడి – కార్మికోద్యమం !
నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చిన ద్రవ్య పెట్టుబడి కార్మికోద్యమాన్ని సహించదు.1991లో సరళీకరణ ప్రారంభమైన తరువాత కార్మిక సంఘాలను దెబ్బతీసేందుకు ప్రారంభమైన చర్యలు ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. దేశ వ్యవస్ధలను,సంపదలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మరియు దేశీయ పెట్టుబడిదారీ-భూస్వామ్యశక్తులకు మరింతగా అప్పగించేందుకు గత ఆరు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ మరింత వేగంగా పని చేస్తోంది. ఈ విధానాల వలన జనం ముఖ్యంగా పని చేయగలిగిన యువత నష్టపోతోంది. ఒక వైపు మేకిన్‌ ఇండియా పేరుతో ఉపాధి అవకాశాలను పెంచి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆచరణలో ఉపాధి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి, రెండు పార్టీల వెనుకా చేరే లేదా విడిగా ఉండే ప్రాంతీయ పార్టీలకు దేశంలో అమలు జరుపుతున్న విధానాల పట్ల మొత్తంగా ఎలాంటి పేచీ లేదు. ఈ పార్టీలను ఆడిస్తున్నది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి-దేశీయ పెట్టుబడిదారులన్నది వాస్తవం. ఈ పార్టీలు తమ ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకు అధికారం కోసం కొట్టుకోవటానికి, వ్యవస్ధలను దిగజార్చటానికి, డబ్బు, ప్రలోభాలతో ఎన్నికలను తొత్తడం చేయటం వంటి అక్రమాలను అంగీకరిస్తారు తప్ప విధానాలను మార్చేందుకు అనుమతించరు. గతంలో కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పుడు అదేపని బిజెపికి చేస్తున్నాయి. రేపు ఆ పార్టీ జనం నుంచి దూరం అయిందనుకుంటే తిరిగి కాంగ్రెస్‌కు లేదా మరొకశక్తికి మద్దతు ఇచ్చి రంగంలోకి తెచ్చేందుకు పూనుకుంటాయి.


నియంతలు, ఫాసిస్టులు -ఎన్నికలు !
నియంతలు, ఫాసిస్టుల లక్షణం ఎన్నికలను ప్రహసనంగా మార్చటం లేదా అసలు నిర్వహించకపోవటం, తమ వ్యతిరేకుల అణచివేతకు ప్రయివేటు సైన్యాలను ఏర్పాటు చేయటం వంటివి ఉన్నాయి. తాము ఓడిపోతాము అనుకుంటే ఎన్నికల రద్దు లేదా మరొక పద్దతిలో ప్రజాతీర్పును వమ్ము చేయటాన్ని చూశాము. మన దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి 1976లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసింది, పార్లమెంట్‌, అసెంబ్లీ వ్యవధిని పొడిగించింది. ఇది ఫాసిస్టు చర్యలను పోలి ఉంది. అయితే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసి తిరిగి ఎన్నికలను జరపకతప్పలేదు. అదే పక్కా ఫాసిస్టులు, నియంతలు అలాంటి అవకాశం ఇవ్వరన్నది చరిత్ర.


బిజెపి విషయానికి వస్తే దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌. ఐరోపా దేశాల్లో నియంతలు ఏర్పాటు చేసిన ప్రయివేటు ఆర్మీకి అనుకరణగా, తిరోగామి భావాలతో ఏర్పాటు అయింది. అయితే 2004 బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలకులు తాము విజయం సాధిస్తామనే ధీమాతో ఎన్నికలను నిర్వహించి ఓటమి పాలయ్యారు. 2019లో బిజెపి ఓడిపోనుంది లేదా తగినంత మెజారిటీ రాదనే వాతావరణం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా లేదు. అయితే ఎన్నికల్లో విజయం సాధించటానికి జనాన్ని మభ్యపరిచేందుకు చేయాల్సిందంతా చేసింది. అనేక రాష్ట్రాలలో పాగా వేసేందుకు అన్ని రకాల అవినీతి, అక్రమ పద్దతులను అనుసరిస్తోంది.మెజారిటీ రాని చోట ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతరం ప్రయత్నించటాన్ని చూస్తున్నాము.


చరిత్ర వక్రీకరణ – కొత్త పుంతలు !
చరిత్ర నిర్మాతలు జనం, అయితే చరిత్రకు భాష్యం చెప్పేది పాలకవర్గం. అది ఎల్లవేళలా తమకు అనుకూలంగానే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అని మహాకవి శ్రీశ్రీ పురోగామి భాష్యం చెబితే మతాల ఆధిపత్యంగా మనువాదులు చిత్రించటాన్ని చూస్తున్నాము. మార్పును కోరుతూ 2014లో తమ నరేంద్రమోడీని చూసి జనం ఓటేశారని, ఆ మార్పును కొనసాగించాలని కోరుతూ 2019లో మరిన్ని సీట్లు కట్టబెట్టారని ఆయన మద్దతుదారులు చెబుతారు. మార్పు అంటే ఏమిటి అన్నది బ్రహ్మపదార్ధం. కోరుకున్న వారికి, పరిశీలిస్తున్నవారిక ఒక పట్టాన అర్ధం కావటం లేదు.
దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చిందని అందరికీ తెలుసు. దానికి ఉన్న పరిమితులను గుర్తిస్తూనే కమ్యూనిస్టులు బూర్జువా స్వాతంత్య్రంగా పరిగణిస్తున్నారు. అయితే అది నిజమైన స్వాతంత్య్రం కాదని తామే అసలు సిసలు కమ్యూనిస్టులం అని చెప్పుకొనే నక్సలైట్స్‌ చెబుతారు. చిత్రం ఏమిటంటే బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక ఇతర సంస్ధలు కూడా ఇదే మాదిరే అది నిజమైనది కాదంటూనే తమ నరేంద్రమోడీ పాలనతోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని కొత్త భాష్యం చెబుతారు. తాజాగా వందల సంవత్సరాల తరువాత రాముడు విముక్తి పొందాడని వర్ణిస్తూ , ఆలయ నిర్మాణానికి మోడీ భూమి పూజను దానికి జతచేశారు.గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దుతున్నారన్న ప్రచారం తెలిసిందే. చరిత్రను తిరస్కరించటం, వక్రీకరించటం అంటే ఇదే. విమర్శ, భిన్నాభిప్రాయం కలిగి ఉండటం ప్రజాస్వామ్య లక్షణం. కానీ వాటిని దేశద్రోహం, దేశ వ్యతిరేకతగా అంతర్గత శత్రువులుగా చిత్రించుతున్నారు. 1991తరువాత కమ్యూనిస్టు బాధితుల పేరుతో ప్రచారంచేస్తున్న మితవాద శక్తులు, ఫాసిస్టులు, నాజీల లక్షణాలివి.


బిజెపి చెబుతున్న నూతన భారత్‌ అనేది కొత్తది కాదు. 1925లో ఏర్పడిన నాటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదే. ఇప్పుడు ఆ గళం పెరిగింది కనుక నేటి తరాలకు అది కొత్తగా, వినసొంపుగా ఉండవచ్చు. పార్లమెంట్‌ను ఒక ప్రహసనంగా మార్చారు. కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు ఉదయం మంత్రివర్గ సమావేశంతో ప్రారంభమైన సాయంత్రానికి పార్లమెంట్‌ ఆమోదంతో సంపూర్ణం గావించారంటే బిజెపి తలుచుకుంటే మొత్తం రాజ్యాంగాన్ని కూడా ఇలాగే మార్చివేయగలదు, దానికి వంతపాడే ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తేలిపోయింది. ఇలాంటి ఆక్మసిక, ఆగంతుక చర్యలు నియంతల ఏలుబడిలో తప్ప ప్రజాస్వామిక దేశాల్లో ఇంతవరకు ఎక్కడా జరగలేదు.


భిన్నమైన పార్టీ అంటే ఏమిటి ? ఆచరణ ఎలా ఉంది ?
దేశ చరిత్రలో విశ్వాసాల ప్రాతిపదికన వివాదాస్పద తీర్పులు ఇవ్వటం, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరు పాలకపార్టీ సిఫార్సుతో రాజ్యసభ సభ్యుడు కావటం న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం సడలే పరిణామాలు. ఎన్నికల కమిషన్‌లో జోక్యం, సిబిఐ, ఇడి, విజిలెన్స్‌ విభాగాలను ప్రత్యర్ధుల మీద ప్రయోగించటం వంటి చర్యలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ దుర్వినియోగం గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమైంది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా వాటిని వినియోగిస్తున్నది. తమ పార్టీలో అంతా పరి శుద్దులు, పులుకడిగిన ముత్యాలే ఉన్నట్లు, ప్రత్యర్ధి పార్టీలన్నీ అవినీతి పరులతో నిండిపోయినట్లు చిత్రిస్తున్నారు. తాము ఓడిపోయిన చోట ఇతర పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతర ప్రయత్నాలు, ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయించటం అలాంటి అవకాశం లేనపుడు డబ్బు, ఇతర ప్రలోభాలతో లోబరుచుకొని తిమ్మిని బమ్మిని చేయటం చూస్తున్నదే.
నోరు తెరిస్తే ఆధారం లేని హేతు బద్దతకు, శాస్త్రీయ పరీక్షకు నిలవని ఆశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం చూస్తున్నాము. పురాతన కాలంలోనే ఇంథనంతో పని లేని విమానాలుండేవని, ప్లాస్టిక్‌ సర్జరీ చేసి వినాయకుడికి ఏనుగు తల అంటించారని, కృత్రిమ పద్దతులలో కౌరవులకు జన్మనిచ్చారని, తాజాగా అప్పడాలు తింటే కరోనా వైరస్‌ తగ్గుతుందని చెప్పేవరకు చేయని ఆశాస్త్రీయ ప్రచారం లేదు. ఇది యువతలో ప్రశ్నించే లేదా ఉత్సుకతను చూపే తత్వాన్ని దెబ్బతీస్తున్నది. ఈ మేరకు విద్యారంగాన్ని కూడా తమ అజెండాకు అనుగుణ్యంగా రూపొందించేందుకు పూనుకున్నారు. (కానసాగింపు – 74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ ! )

గోమూత్రం తాగుతూ, పేడ పూసుకుంటూ మనం- ఆధునిక పరిశోధనల చుట్టూ చైనా జనం !


ఎం కోటేశ్వరరావు
తన ప్రత్యేక లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మిస్తున్నామని ప్రకటించిన చైనా తాజాగా మరో ముందడుగు వేసింది.శాస్త్ర పరిశోధనా పత్రాల సమర్పరణలో తొలిసారిగా అమెరికాను అధిగమించి మొదటి స్ధానంలో ఉన్నట్లు గతవారంలో వెల్లడైన సమాచారం తెలిపింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది.
ఏ దేశంలో అయినా శాస్త్ర పరిశోధనాఅభివృద్ధికి ఇచ్చే ప్రోత్సాహం, అందుకు గాను ప్రభుత్వాలు చేసే ఖర్చు ఆ దేశ వాణిజ్య, మిలిటరీతో సహా అన్ని రకాల అభివృద్ధికి సోపానాలుగా మారతాయన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో చైనా సాధిస్తున్న విజయాలతో బెంబేలెత్తిన అమెరికా పాలకవర్గం మరో ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపింది. దానిలో భాగంగానే రెండు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష వాణిజ్య పోరును ప్రారంభించింది. ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకలు, ఇతర యుద్ద నౌకలను తరలించి చైనాను రెచ్చగొట్టేందుకు, ఆ ప్రాంత దేశాలన్నింటినీ కూడగట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. నిజానికి అమెరికా ఈ చర్యలను ఇప్పటికిప్పుడు ప్రారంభించలేదు. ఎప్పుడో పునాదులు వేసింది, ఇప్పుడు ప్రపంచానికి బాగా కనిపిస్తున్నాయి. ఒక వైపు రాజకీయంగా, మిలిటరీ రీత్యా తన చర్యలను తాను తీసుకుంటూనే అత్యంత కీలకమైన శాస్త్ర పరిశోధనా రంగాన్ని నిరంతరాయంగా అభివృద్ధి చేసేందుకు పూనుకోవటమే చైనా విజయ కారణంగా చెప్పవచ్చు.
2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. అమెరికాలోని క్లారివేట్‌ అనలిటిక్స్‌ సంస్ధ అందచేసిన సమాచారం ప్రాతిపదికన జపాన్‌ జాతీయ శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన విధాన సంస్ద పైన పేర్కొన్న విశ్లేషణ చేసింది. పరిశోధనా, శాస్త్ర పత్రాల సంఖ్య స్ధిరంగా ఉండదు, మూడు సంవత్సరాల సగటును తీసుకున్నారు. అయితే జపాన్‌ విశ్లేషణకు ముందే అమెరికా జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ తమ దేశాన్ని చైనా అధిగమిస్తోందని అంచనా వేసింది. అయితే ఈ రంగంలో పోటీ కారణంగా ఒక దశలో ముందున్న దేశం మరొక దశలో వెనుకబడవచ్చు. మొత్తంగా పురోగమించే ధోరణి కొనసాగుతోందా లేదా అన్నదే ముఖ్యం. చైనాలో అది కనిపిస్తోంది.
జనాభాలో ప్రధమ స్ధానంలో ఉన్న చైనా తమ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రారంభించిన మహత్తర సోషలిస్టు యజ్ఞంలో ఏ రంగాన్ని వదలకుండా తనదైన శైలిలో స్ధిరంగా ముందుకు పోతుండటమే ఈ పురోగతికి కారణం అని చెప్పవచ్చు. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నల్లమందు కాదు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు. 1996-98 సంవత్సరాలతో పోలిస్తే శాస్త్రీయ పత్రాల సమర్పణ 18రెట్లు పెరగ్గా 2006-08 సంవత్సరాలతో పోల్చుకుంటే 3.6 రెట్లు పెరిగింది. పత్రాలు సమర్పించటం ఒక్కటే ప్రమాణంకాదు, వాటి నాణ్యత కూడా ముఖ్యమే. 2017లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన పదిశాతం పత్రాలలో అమెరికన్లు ప్రచురించినవి 24.7శాతం ఉండగా చైనీయులవి 22శాతం ఉన్నాయి. అదే తొలి ఒకశాతం పత్రాలలో కూడా ఈ దేశాల వాటా 29.3 మరియు 21.9శాతం చొప్పున ఉండటం విశేషమే కాదు, రెండు దేశాల మేథావుల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలియచేస్తున్నది.
చైనా పత్రాలను విశ్లేషించినపుడు భౌతిక శాస్త్రాలైన రసాయన, ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ మరియు గణితాల గురించి ఎక్కువగా ఉంటే అమెరికా నుంచి క్లినికల్‌ మెడిసిన్‌ మరియు మౌలిక జీవ శాస్త్రాలపై కేంద్రీకరణ కనిపిస్తోంది. 2018 వివరాలను పరిశీలించినపుడు అమెరికాలో పరిశోధన-అభివృద్ధికి 581 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఐదుశాతం ఎక్కువ. అదే చైనాలో 554 బిలియన్‌ డాలర్లు ఉండగా అంతకు ముందు కంటే పదిశాతం ఎక్కువగా ఉంది.2000 సంవత్సరం నుంచి 2018 మధ్య విశ్వవిద్యాలయాల మీద చైనాలో చేసిన ఖర్చు 10.2 రెట్లు పెరగ్గా అదే అమెరికాలో ఇదే కాలంలో కేవలం 1.8రెట్లు మాత్రమే పెరిగింది.
పరిశోధనాఅభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2000 సంవత్సరం నుంచి మొత్తం పెరుగుదలకు చైనా 32శాతం, అమెరికా 20, ఐరోపా యూనియన్‌ 17శాతం వాటాను సమకూర్చాయి. ప్రస్తుతం చైనా ప్రపంచంలో అతిశక్తివంతమైన సూపర్‌ కంప్యూటర్‌, అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌ తయారీలో ఉంది. జీన్స్‌ పరిశోధనకు పెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చైనాలో పరిశోధనకు చేస్తున్న భారీ ఖర్చు, అనేక నూతన ఆవిష్కరణలకు దారి తీస్తున్నప్పటికీ నోబెల్‌ బహుమతులు మాత్రం అమెరికా, ఇతర దేశాల వారికే ఇప్పటివరకు దక్కాయి. 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు.
వర్తమాన చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం ముందుకు పోవటానికి ప్రాధాన్యత ఇచ్చి జాతీయ లక్ష్యాల బాటను నిర్దేశించాడు. ఆ మేరకు 1993లో ఒక చట్టాన్ని కూడా రూపొందించారు. పరిశోధన-అభివృద్ధి కేటాయింపు ఒక శాతం కంటే తక్కువగా ఉండటాన్ని గమనించి చైనా ప్రభుత్వం 2001-05 మధ్య 1.5శాతం ఖర్చు చేయాలని నిర్దేశించింది.2020లో ఆ మొత్తం రెండున్నర శాతానికి పెరిగింది.
శాస్త్ర పరిశోధనలో జపాన్‌ వెనుకబడింది, 64,874 పత్రాలతో నాలుగో స్ధానంలో ఉంది. అయితే పత్రాల నాణ్యత విషయంలో తొమ్మిదో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది.ప్రకటించిన లక్ష్యాల మేరకు పెట్టుబడుల పెట్టటంలో వైఫల్యమే దీనికి కారణం, పర్యవసానంగా పరిశోధకుల సంఖ్య కూడా పడిపోయింది.
చైనా మొత్తంగా పరిశోధనా పత్రాల సమర్పణలో ముందున్న స్ధితికి నిదర్శనంగా ఉన్నత స్ధాయి నాణ్యత గల రసాయన పరిశోధనా పత్రాల సమర్పణలో నేచర్‌ ఇండెక్స్‌లో కూడా తొలిసారిగా ఒకటవ స్ధానంలో నిలిచింది. అగ్రశ్రేణి పది దేశాల్లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టింది. మన దేశం తొలి పదింటిలో స్ధానం పొందినప్పటికీ సుదూరంగా ఉంది. 2018లో చైనా 6,183.75 పాయింట్లతో ముందుండగా వరుసగా అమెరికా 5,371.32, జర్మనీ 1,673.35, జపాన్‌ 1,275.58, బ్రిటన్‌ 1,023.58,ఫ్రాన్స్‌ 671.93, దక్షిణ కొరియా 615.12, భారత్‌ 501.38, కెనడా 464.62, స్పెయిన్‌ 460.21 చొప్పున సాధించాయి. ఎనభై రెండు పత్రికలలో ప్రచురితమైన అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్ధానంలో ఉన్న అమెరికా తొలిసారిగా రెండవ స్ధానానికి పడిపోయింది. 2017చైనా అభివృద్ధి 17.9శాతం ఉంటే అమెరికా 6.2శాతం దిగజారింది. జపాన్‌ 12.6శాతం, బ్రిటన్‌ 10.8శాతం చొప్పున తగ్గుదల నమోదు చేశాయి.
క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో చైనా ఇతర దేశాలకంటే ఎంతో ముందుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెఫెయి విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 50కిలోమీటర్ల దూరంలోని ఆప్టికల్‌ ఫైబర్‌ సముదాయాలతో క్వాంటమ్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అంటే ఒక సముదాయంలో ఏదైనా మార్పు జరిగితే మిగతా వాటిని అది ప్రభావితం చేస్తుంది. ఇంత దూరంలోని వాటిని అనుసంధానించటం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఈ ప్రయోగం జయప్రదమైతే ఇంటర్నెట్‌ రంగంలో మరో విప్లవానికి దారి తీయనుంది. క్వాంటమ్‌ కమ్యూనికేషన్స్‌, కృత్రిమ మేథ, బయోటెక్నాలజీ, జనోమ్‌ ఇంజనీరింగ్‌లో చైనా ఎంతో పురోగతి సాధించింది. గతంలో చైనా దిక్సూచి, కాగితం, ముద్రణ, తుపాకి మందు విషయాల్లో ప్రపంచంలో ముందున్న విషయం తెలిసిందే.
సాంస్కృతిక విప్లవం పేరుతో 1960దశకంలో అమలు చేసిన కొన్ని దుందుడుకు చర్యల కారణంగా అనేక విశ్వవిద్యాలయాలను మూసివేశారు. పరిశోధన కుంటుపడింది. మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ 1978లో ప్రారంభించిన సంస్కరణల తరువాత తిరిగి పరిశోధన ఊపందుకుంది. తొలి రోజుల్లో ఇతర దేశాలను అనుసరించిన చైనా ఇప్పుడు కొన్ని రంగాలలో ఇతరులు తనను అనుసరించే స్ధితికి చేరుకుంది. ప్రపంచంలోని 137 పరిశోధనా రంగాలలో చైనా 33 చోట్ల ముందుంది.
చైనా తరువాత 1991లో మన దేశం కూడా నూతన ఆర్ధిక సంస్కరణల పేరుతో కొన్ని చర్యలను తీసుకుంది. అవి ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో మనం చూస్తూనే ఉన్నాము. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగిస్తున్నాయి. యువతలో శాస్త్రీయ ఆలోచనలను రేకెత్తించాల్సిన పాలకులు, వారికి మార్గదర్శకులుగా ఉన్నవారు వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చూసే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనలు, భావాలను ముందుకు తెచ్చేవారి మీద సామాజిక మాధ్యమంలో దాడులు చేస్తున్నారు. విద్యార్దుల్లో సృజనాత్మక శక్తులను మొద్డుబారేట్లు చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం చైనా ప్రారంభించిన సంస్కరణలు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి నమ్మని వారు, వారు నిజం చెప్పటం లేదని భావించే వారు ఇప్పటికీ ఉండవచ్చు, ఇక ముందు కూడా ఉంటారు. నిత్య అనుమానితులతో ఏ సమాజం ముందుకు పోదు, వారిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. సంస్కృత గ్రందాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు ? గోమూత్రం తాగే వారిని తాగనివ్వండి-దేశానికి నష్టం లేదు. ఆవు పేడ పూసుకొనే వారిని పూసుకోనివ్వండి జనానికి నష్టం లేదు. మూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పి రుజువుకాని అంశాలను జనం మెదళ్లకు ఎక్కించవద్దు. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకండి ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వకండి !! దేశాన్ని, సమాజాన్ని మరికొన్ని శతాబ్దాలు వెనక్కు నెట్టకండి !!!

పొసగని ఇండియా టుడే సర్వే అంకెలు – మోడీకి మద్దతుపై సంపాదకుడే నమ్మని వైనం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


దేశ మానసిక స్ధితి (మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ ) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్‌ మరియు కార్వీ ఇన్‌సైట్స్‌ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా ఆగస్టు సర్వే వివరాలను వెల్లడించారు. దీనిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం మొదలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అనే ప్రశ్న వరకు అనేక అంశాల మీద అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ సంస్ధ గత సర్వేను ఈ ఏడాది జనవరిలో నిర్వహించింది.


పందొమ్మిది రాష్ట్రాలు, 97 లోకసభ నియోజకవర్గాల పరిధిలోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,021 మందిని ప్రశ్నించి జూలై 15-27 తేదీల మధ్య అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలు, 33శాతం మందిని పట్టణ ప్రాంతాల నుంచి ఎంచుకున్నారు. దీనికి ఉన్న పరిమితులను పై అంకెలు తెలియ చేస్తున్నాయి. వాటిని బట్టి దేశ మానసిక స్ధితిని ఈ సర్వే సమగ్రంగా ప్రతిబింబించిందా అనే సందేహాలు రావటం సహజం.


సర్వేలో అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి వచ్చిన సమాధానాలు మరికొన్నింటి విషయంలో భిన్నంగాను పొంతన లేనివిగానూ కనిపిస్తాయి. నరేంద్రమోడీ మై హూనా అని ఆర్ధిక పరిస్దితి గురించి ఇస్తున్న ధీమాను జనం నమ్మటం లేదని ఈ సర్వేకు కొద్ది రోజుల ముందు ప్రచురించిన బ్రిటన్‌ యు గవ్‌ సర్వే వెల్లడించింది. భారత రిజర్వు బ్యాంకు నిర్వహించిన సర్వేలో అనేక ప్రతికూల ధోరణులు వెల్లడయ్యాయి. ఇండియా టుడే సర్వేలో మూడింట రెండు వంతుల మంది గ్రామీణులు పొల్గొనగా, ఆర్‌బిఐ పూర్తిగా పట్టణ ప్రాంతాల్లోనే జరిపింది. బ్రిటన్‌ యుగవ్‌ అంతర్జాతీయంగా అనేక దేశాల వారి అభిప్రాయాలు సేకరించగా మన దేశం నుంచి సహజంగానే పట్టణ ప్రాంతాలకే పరిమితం అయి ఉండవచ్చు. మూడు సర్వేల ప్రశ్నావళి, ఎంచుకున్న అంశాలు భిన్నమైనవి అయినప్పటికీ మూడింటిలో ఉన్న ఏకైక అంశం దేశ, పౌరుల ఆర్ధిక స్ధితి. కనుక మూడింటిని ఒకదానితో మరొక దానిని పోల్చలేము. ఇండియా టుడే సర్వేను చూసినపుడు మొత్తం ఆరేండ్ల మోడీ పాలన తీరు తెన్నుల గురించి అడిగినట్లుగా ఉంది. యుగవ్‌, ఆర్‌బిఐ వర్తమాన పరిస్ధితుల మీదనే జరిపాయి.
ఆర్ధిక నిర్వహణలో గత యుపిఏ ప్రభుత్వం కంటే నేటి సర్కార్‌ మెరుగ్గా ఉందని జనం ఇంకే మాత్రం విశ్వసించటం లేదని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. యు గవ్‌ , ఆర్‌బిఐ సర్వేలు అంతసూటిగా చెప్పకపోయినా వాటిలోని అంశాల భావమదే. ఇండియా టు డే సర్వే గురించి ముందు చూద్దాం.


నరేంద్రమోడీ ప్రభుత్వం సాధించిన ఒక అతి పెద్ద విజయం ఏమిటి అన్న ప్రశ్నకు 18 అంశాల మీద సమాధానాలు వచ్చినట్లు పేర్కొన్నారు. వాటిలో ఆర్టికల్‌ 370 రద్దుకు 16శాతం, రామాలయం మీద సుప్రీం కోర్టు తీర్పు అని 13, మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం అని 11, అవినీతి లేకపోవటం, నల్లధనం మీద చర్యలని తొమ్మిది శాతాల చొప్పున, కరోనా సమస్య మీద వ్యవహరించిన తీరు అని 7, పెద్ద నోట్ల రద్దు, రైతులు, పేదలకు సంక్షేమ పధకాలని ఆరు శాతం చొప్పున పేర్కొన్నారు.


జనం అతి పెద్ద విజయాలుగా జనం భావించినట్లు పేర్కొన్న ఆర్టికల్‌ 370 రద్దు యావత్‌ దేశానికి సంబంధించినది కాదు. వివాదాస్పద రాజకీయ నిర్ణయం తప్ప ప్రభుత్వ పధకమూ కాదు. రామాలయ నిర్మాణం సుప్రీం కోర్టు తీర్పు పర్యవసానం తప్ప ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, ఒక పార్టీ లేదా వ్యక్తుల విజయమో అసలే కాదు. అయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తులను నరేంద్రమోడీ ప్రభావితం చేసి అలాంటి తీర్పును వచ్చేట్లు చేశారని జనం భావిస్తున్నారా అన్న సందేహం వస్తోంది. అయితే ఈ రెండు అంశాల మీద బిజెపి, ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున చేసిన ప్రచార తీరు తెన్నులతో జనం వీటిని మోడీ విజయాలుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
తమ నేత నరేంద్రమోడీ నాయకత్వంలో సాధించిన విజయాలుగా బిజెపి లేదా మోడీ ప్రచార గణం జనానికి చెప్పిన అంశాలను జనం పెద్ద విజయాలుగా భావించటం లేదని సర్వే అంకెలు చెబుతున్నాయి. పౌర సత్వ సవరణ చట్టం (సిఏఏ), ఆయుష్మాన్‌ భారత్‌ అతి పెద్ద విజయాలని ఒక శాతం, విదేశాల్లో భారత ప్రతిష్టను పెంచటం, మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ డ్రైవ్‌, మహిళాసాధికారత, ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించటం అతి పెద్ద విజయం అని భావించిన వారు కేవలం రెండు శాతం చొప్పున ఉన్నారు. జిఎస్‌టి అని చెప్పిన వారు ఐదుశాతమే.
మోడీ ప్రభుత్వ అతి పెద్ద ఏకైక వైఫల్యం ఏమిటి అన్న ప్రశ్నకు కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల వ్యవహరించిన తీరు అని 25శాతం, నిరుద్యోగంగా 23శాతం, లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల పట్ల వ్యవహరించిన తీరు అని 14, ధరల పెరుగుదల అని 11శాతం మంది పేర్కొన్నారు.


దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటన్న ప్రశ్నకు కరోనా మహమ్మారి అని 70శాతం మంది, నిరుద్యోగం అని 12శాతం పేర్కొనగా చైనాతో వివాదం అని కేవలం నాలుగుశాతం మందే పేర్కొన్నారు. ఇదే సమయంలో చైనాతో సరిహద్దు వివాదంలో యుద్దానికి పోవాలని 59శాతం మంది పేర్కొన్నట్లు సర్వే తెలిపింది. అసలు అది పెద్ద సమస్య కాదని ఒక వైపు చెప్పిన వారు ఈ విధంగా స్పందించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనా వ్యతిరేకతను, జాతీయవాదాన్ని రెచ్చగొట్టిన పర్యవసానం అనుకోవాలా ?
ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో యుపిఏతో సమంగా ఉందని గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా భావించిన వారు కేవలం పదకొండు శాతం మాత్రమే ఉంటే, ఇప్పుడు ఏకంగా 45శాతానికి పెరిగారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఇదే ఇండియా టుడే సర్వేలో ఆర్ధిక నిర్వహణ యుపిఏ కంటే మెరుగ్గా ఉందని భావించిన వారు 60శాతం ఉన్నారు. గతేడాది ఆగస్టులో కూడా అంతే ఉండగా తాజా సర్వేలో 43శాతానికి తగ్గారు.
మన రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గానిది కీలక పాత్ర. కేంద్రంలో ప్రధాన మంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాటికి సారధులు తప్ప సర్వాధికారులు కాదు. మోడీ కాబినెట్‌లో మంత్రుల జనసమ్మతి విషయానికి వస్తే జనవరి-ఆగస్టు మధ్య అమిత్‌ షాకు 43 నుంచి 39కి, రాజనాధ్‌ సింగ్‌ 39-17, నితిన్‌ గడ్కరీ 34-10, నిర్మలా సీతారామన్‌ 26-9, పియూష్‌ గోయల్‌ 24-2, స్మృతి ఇరానీ 22-2, రవిశంకర ప్రసాద్‌ 16-3శాతాలకు పడి పోయింది. దీని అర్ధం కీలక మంత్రులు సరిగా పని చేయలేదనే కదా ? యుపిఏ కంటే ఆర్ధిక నిర్వహణ మెరుగ్గా లేక మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని జనం చెప్పారు. ఇంకా అనేక అంశాలను ప్రతికూలంగానే చూడగా మరో వైపు మొత్తంగా ఎన్‌డిఏ పని తీరు సంతృప్తికరంగా ఉందని చెప్పిన వారు 72శాతం మంది ఉన్నట్లు సర్వే చెప్పింది. అదెలా సాధ్యం ?
ప్రస్తుత మధ్యగత (మీడియన్‌) ద్రవ్యోల్బణం 9.9శాతంగా ఉంది. ఇంకా పెరగవచ్చనే వినియోగదారులు భావిస్తున్నారు. మరోవైపు వాణిజ్య మదింపు సూచిక గత ఏడాది చివరి త్రైమాసంలో 102.2 ఉండగా ఏప్రిల్‌-జూన్‌ మధ్య 55.3 అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఉత్పత్తి, ఆర్డర్లు, ఉపాధి స్దితిగతులను బట్టి ఉత్పాదక సంస్ధలు మదింపు వేస్తున్నాయి.


రిజర్వుబ్యాంకు నిర్వహించిన వర్తమాన పరిస్దితుల సూచీ(సిఎస్‌ఐ) సర్వేలో వినియోగదారుల విశ్వాసం చరిత్రలో రికార్డు స్ధాయికి పడిపోయినట్లు వెల్లడైంది. మేనెలలో సిఎస్‌ఐ 63.7శాతం ఉండగా జూలైలో 53.8కి తగ్గిందని ఆగస్టు మొదటి వారంలో ఆర్‌బిఐ విడుదల చేసిన వివరాలు వెల్లడించాయి. జూలై 1-12వ తేదీల మధ్య దేశంలోని 13 ప్రధాన నగరాల్లోని 5,342 కుటుంబాల వారిని వివిధ అంశాలపై టెలిఫోన్‌ ద్వారా సర్వే చేశారు. మేనెలతో పోలిస్తే ప్రస్తుత ఆర్ధిక స్ధితిగతుల పట్ల మరింత ఎక్కువ నిరాశాపూరితంగా వినియోగదారులు ఉన్నారని తేలింది. గత ఏడాది కాలంలో మొత్తం మీద ఖర్చు పెరిగినప్పటికీ ప్రస్తుతం ఆచితూచి ఖర్చు చేస్తున్నామని, అత్యవసరం కాని వాటి మీద వచ్చే ఏడాది కూడా ఖర్చు చేసే అవకాశం లేదని, అయితే వచ్చే ఏడాది పరిస్ధితి బాగుపడవచ్చనే ఆశాభావాన్ని వినియోగదారులు వ్యక్తం చేశారు. సిఎస్‌ఐ సూచిక 100 ఉంటే మార్పు ఉండదని, వందకంటే ఎక్కువ ఉంటే గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటుందని వినియోగదారులు భావిస్తున్నట్లుగా పరిగణిస్తారు. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి తమ స్ధితి మెరుగుపడుతుందనే ఆశాభావం వినియోగదారుల్లో కనిపించటం లేదు.
ఆర్ధిక పరిస్దితి క్షీణించిందని చెప్పిన వారు 77.8శాతం ఉన్నారు. గతేడాది మే నుంచి ఆర్ధిక స్ధితి గురించి ప్రతికూల అభిప్రాయమే వెల్లడి అవుతోంది. ధరల మీద ప్రతికూల అవగాహనతో 76.2శాతం ఉంటే రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుందని చెప్పిన వారు 61.5శాతం మంది ఉన్నారు. అంటే ప్రస్తుత పాలకులు ధరలను తగ్గిస్తారనే విశ్వాసం వినియోగదారుల్లో లేదు. ఎనభైశాతం మంది ధరలు పెరిగినట్లు భావిస్తే రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతాయని 72శాతం పేర్కొన్నారు. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భావంతో ఉన్నారు. మేనెలలో ఖర్చు తగ్గించామని చెప్పిన వారు 12శాతం ఉంటే జూలైలో 17శాతానికి పెరిగారు. భవిష్యత్‌లో కూడా తగ్గుతుందని చెప్పిన వారు పదిశాతం మంది ఉన్నారు.


యు గవ్‌ సర్వే ప్రకారం మన దేశం మాంద్యంలోకి పోనున్నదని 54శాతం మంది చెప్పగా ఇప్పుడున్న స్దితే కొనసాగుతుందని చెప్పిన వారు 21, అచ్చేదిన్‌ అని చెప్పిన వారు 14శాతం మంది ఉన్నారు. సర్వేకు ముందు నెలతో పోల్చితే సర్వే సమయంలో తమ ఆదాయం తగ్గిందని చెప్పిన వారి సంఖ్య ప్రపంచంలో అత్యధికంగా మెక్సికోలో 58శాతం కాగా రెండవ స్ధానంలో ఫిలిప్పీన్స్‌లో 51, మూడవ స్ధానంలో ఉన్న మన దేశంలో 50శాతం మంది చెప్పారు. ఆదాయాలు పడిపోవటం ఎక్కువగా ఉన్న కారణంగానే యథాతధ స్ధితి కొనసాగుతుందని చెప్పిన వారి సంఖ్య తక్కువగా ఉంది.
ప్రజల అవగాహనకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరేంద్రమోడీ హయాంలో తమ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడిందని చెప్పిన వారు 48శాతం మంది ఉన్నట్లు ఇండియా టుడే సర్వే పేర్కొన్నది. పదిశాతం దిగజారిందని, 42 శాతం మార్పులేదని చెప్పినట్లు ఉంది. సర్వేలో పాల్గొన్నవారు మూడింట రెండు వంతుల మంది గ్రామీణులు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఈ మార్పు నిజమే అయితే కరోనాకు ముందే గ్రామీణ ప్రాంతాలలో వినియోగం పడిపోయిందని, వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తిందని వచ్చిన వార్తలు, పరిస్ధితికి ఇది విరుద్దం. ఒక వేళ దీన్ని ప్రామాణికంగా తీసుకున్నా 52శాతం మంది పరిస్దితి మెరుగుపడలేదనే అర్ధం. ఒక వేళ సమాధానాలు చెప్పిన వారు కరోనా సమయంలో పరిస్ధితి గురించి చెప్పి ఉంటే , నిజంగా మెరుగు పడి ఉంటే జిడిపి వృద్ధి రేటు తిరోగమనంలో ఎందుకు పడినట్లు ?


మొత్తంగా ఆర్ధిక పరిస్ధితి, ఉపాధి దిగజారిందని యుగవ్‌, రిజర్వుబ్యాంకు సర్వేలు చెబుతున్నదానికి తమ పరిస్ధితి మెరుగుపడిందని ఇండియా టుడే సర్వేలో చెప్పినదానికి విరుద్దం. రిజర్వుబ్యాంకు పట్టణ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆదాయం, ఉపాధి పరిస్ధితి మరింత క్షీణించిందని ఆర్‌బిఐ పేర్కొన్నది. లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయ పంటలకు రవాణాల్లే రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయారు. అది గ్రామీణుల్లోని అన్ని తరగతుల మీద ప్రభావం చూపుతుంది, అందువలన తమ ఆదాయం పెరిగిందని స్పందించిన గ్రామీణులు ముఖ్యంగా వారిలో 47శాతం మంది ఎస్‌సి లేదా ఎస్‌టి సామాజిక తరగతికి చెందిన వారున్నారని ఇండియా టుడే చెప్పినదానిని పరిశీలించాల్సిందే.


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పధకం తమను ఉద్దరిస్తుందన్న విశ్వాసం జనంలో కలిగించలేదని కూడా మూడు సర్వేల్లోనూ వెల్లడైన అభిప్రాయం సూచిస్తున్నది. నరేంద్రమోడీకి ఆదరణ గురించి ఇండియా టుడే చెప్పిందే నిజమైతే ఆర్ధికంగా దిగజారుతున్నా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల పట్ల జనంలో విశ్వాసం లేని కారణంగా నరేంద్రమోడీకి మరొక ప్రత్యామ్నాయం లేదని జనం భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది. బిజెపి తరువాత పెద్ద పార్టీగా, ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ స్ధాయికి తగ్గిపోవటం, ఉన్న పార్టీకి సైతం నాయకత్వ వైఫల్యం. మధ్య ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలను నిలబెట్టుకోలేకపోవటం వంటి అంశాలతో పాటు ఎక్కువ ప్రాంతీయ పార్టీలు గుడ్డిగా బిజెపి అప్రజాస్వామిక చర్యలను కూడా బలపరచటం వంటి నేపధ్యం. వామపక్షాలకు తగిలిన ఎదురు దెబ్బలు, కేరళకే అధికారానికి పరిమితం కావటం వంటి కారణాలు దీనికి కారణం కావచ్చు. లేదూ అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా అటు జనాన్ని ఇటు నరేంద్రమోడీ అండ్‌ కోను సంతుష్టీకరించేందుకు ఇండియా టుడే సర్వే నిర్వాహకులు అవసరమైన అంకెల గారడీ చేస్తే చెప్పాల్సిందేమీ లేదు.


ప్రతిదీ దిగజారుతున్న స్ధితిలో ప్రధాని నరేంద్రమోడీ పని తీరు బాగుందని జనం చెపుతున్నట్లు తమ సర్వేలో వెల్లడి కావటం దిగ్భ్రమ కలిగిస్తోందని ఇండియా టుడే సంపాదకుడు రాజదీప్‌ సర్దేశారు వ్యాఖ్యానించారు. దేశంలో పరిస్ధితులు దిగజారుతున్నాయని చెబుతున్న జనం నరేంద్రమోడీ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఎలా చెబుతారన్నది ప్రశ్న. చైనాతో వ్యవహరిస్తున్న తీరు గురించి సర్వేలో వెల్లడైన వాటిని నమ్ముతాను తప్ప ఆర్ధిక రంగంలో మోడీ సర్కార్‌ బాగా పని చేస్తున్నారనటం తనకు విభ్రాంతి కలిగించిందని రాజ్‌దీప్‌ చెప్పాడు. దీన్ని బట్టి ఈ సర్వేను ఎలా రూపొందించారో అని అనుమానించాల్సి వస్తోంది.

మన అంకుర సంస్ధలు అమెరికా ఎందుకు పోతున్నాయి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
ఒక బిలియన్‌ డాలర్లకు పైగా విలువ కలిగిన అంకుర సంస్ధలు( స్టార్టప్స్‌) మన దేశంలో 21 ఉన్నాయని, అవి చైనా సంస్దలలో కేవలం పదో వంతని ఆగస్టు మొదటి వారంలో పిటిఐ వార్తా సంస్ధ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. అంకుర సంస్ధలు అనేకం ఉన్నప్పటికీ ఒక బిలియన్‌ డాలర్ల విలువ దాటిన వాటిని యూనీకార్న్‌ సంస్దలని పిలుస్తున్నారు. అలాంటి సంస్దలు భారతీయులు విదేశాల్లో నెలకొల్పినవి 40కి పైగా ఉన్నాయన్న సమాచారం ఆసక్తి కలిగించేది.
కరోనా వైరస్‌ కారణంగా చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు, ఫ్యాక్టరీలు మన దేశానికి తరలివస్తున్నాయనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌ చివరి వారంలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ అలాంటి కంపెనీలను ఆకర్షించే విధంగా రాష్ట్రాలు అవసరమైన నైపుణ్యం, మౌలిక సదుపాయాలను కలిగించి చైనా నుంచి వచ్చే కంపెనీలకు ప్రత్యామ్నాయం మన దేశమే అనే పరిస్ధితిని కల్పించాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తెలంగాణా రాష్ట్ర సిఎం చంద్రశేఖరరావుతో సహా మంత్రులు, ఇతరులు సదరు కంపెనీలకు భూములను కూడా సిద్దం చేశామని, రావటమే తరువాయి అన్నట్లుగా ప్రకటనలు చేసిన అంశాన్ని గుర్తు చేయాలి. తెలంగాణా సిఎం ఒక్కరే కాదు, అనేక రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. తరువాత అదే చైనాలో తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని, వస్తాయని చెప్పిన కంపెనీలు అసలు బయటకు వచ్చాయో లేదో వచ్చినా ఏ దేశానికి వెళ్లాయో చెప్పిన వారు లేరు.
చైనా కంపెనీల గురించి పక్కన పెడితే మన దేశానికి చెందిన వారు అంకుర కంపెనీలను మన దేశంలో కాకుండా అమెరికా లేదా మరొక దేశంలో ఏర్పాటు చేయటానికి కారణాలు ఏమిటి అన్నది సమస్య. సరిహద్దు వివాదం తలెత్తిన తరువాత మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుమతులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను చేసిన విషయం తెలిసిందే. అది చైనాను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెల వరకు ఏర్పాటు చేసిన చైనాకు చెందిన 227 అంకుర సంస్ధలలో విదేశాలలో స్ధాపించినవి కేవలం 16 మాత్రమే, మిగిలినవన్నీ చైనాలోనే పెట్టారు. అరవైకి పైగా సంస్ధలను మన వారు ఏర్పాటు చేస్తే ముందే చెప్పుకున్నట్లు వాటిలో 40 విదేశాల్లోనే అంటే మన ఐఐటిల్లో చదువుకొని కంపెనీలను మాత్రం విదేశాల్లో పెడతారు. వారిలో దేశభక్తిని నింపటంలో మన పాలకులు విఫలమయ్యారా లేక దేశంలోని పరిస్ధితులు బాగోలేవని విదేశాలకు వెళ్లిపోయారా ?
మన దేశంలోని 21 అంకుర సంస్ధల విలువ 73.2 బిలియన్‌ డాలర్లు. వీటిలోని పదకొండు కంపెనీలలో చైనాకు చెందిన ముగ్గురు పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో మన వారు ఏర్పాటు చేసిన సంస్దల విలువ 99.6బిలియన్‌ డాలర్లు. వీటిలో ఎక్కువ భాగం అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలోనే ఉన్నాయి. ప్రపంచంలోని 29 దేశాలలోని 145 నగరాల్లో 586 అంకుర సంస్ధలు ఉన్నాయి. మన దేశంలోని 21యూనీకార్న్‌ సంస్దలలో ఎనిమిది బెంగళూరులో ఉండటంతో అంకుర సంస్ధల రాజధానిగా దాన్ని పిలుస్తున్నారు. మన దేశంలో అలాంటి సంస్ధలలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్‌ను 2017లో ఏర్పాటు చేశారు. దాని తరువాత మరొక సంస్ధ లేదు. ఒక అంకుర సంస్ధ యూనీకార్న్‌ స్ధాయికి చేరుకోవాలంటే భారత్‌లో 7, అమెరికాలో 6.5, చైనాలో 5.5సంవత్సరాల వ్యవధిని తీసుకుంటున్నది. బహుశా ఈ కారణంగానే మన దేశానికి చెందిన వారు మన దేశం వెలుపలికి పోతున్నట్లు చెప్పవచ్చు.
చైనాకు చెందిన ఆలీబాబా 5, టెన్‌సెంట్‌, డిఎస్‌టి గ్లోబల్‌ మూడేసి భారత యూనీకార్న్‌ సంస్ధలలో పెట్టుబడులు పెట్టాయి.జపాన్‌కు చెందిన సాప్ట్‌బ్యాంక్‌ తొమ్మిదింటిలో, అమెరికా సంస్ధ టైగర్‌ గ్లోబల్‌ ఐదు కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. మన దేశానికి చెందిన యూనీకార్న్‌ అంకుర సంస్ధలను ఏర్పాటు చేసిన వారిలో 36 మంది ఐఐటియన్లు కాగా వారిలో ఎక్కువ మంది ఢిల్లీ ఐఐటికి చెందిన వారు ఉన్నారు. దేశంలోని మొత్తం 104 మంది యూనీకార్న్‌ సంస్ద స్ధాపకులు ఉంటే వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మహిళలు.
అంకుర సంస్ధలలో తగ్గుతున్న పెట్టుబడులు !
మన దేశంలోని అంకుర సంస్ధలలో వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తొలిసారిగా పెట్టుబడులు ఆగస్టు మొదటి వారంలో కేవలం 92లక్షల డాలర్లకు పడిపోయినట్లు యువర్‌ స్టోరీ.కామ్‌లో వచ్చిన ఒక విశ్లేషణ పేర్కొన్నది. జూలై చివరి వారంలో 6.3 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడులు బలహీనంగా ఉన్నప్పటికీ ఇంత తక్కువగా రావటం ఇదే తొలిసారి. ఈ వారంలో కేవలం తొమ్మిది సంస్దలకే పెట్టుబడులు వచ్చాయి. రుణ ఒప్పందం ఒక్కటీ లేదు.ఇతర సంస్ధలకు వచ్చిన పెట్టుబడులన్నీ గతంలో కుదిరిన ఒప్పందాల మేరకు వచ్చినవిగా ఉన్నాయి.
ప్రపంచంలో యూనీకార్న్‌ అంకుర సంస్ధల సంఖ్య మరియు విలువ రీత్యా అమెరికా తరువాత చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు రావటం, ప్రయివేటు రంగం నుంచి పెట్టుబడులు, ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం కారణాలుగా సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక ఒక విశ్లేషణలో పేర్కొన్నది. చైనాలో తొలి తరం అంకుర సంస్దలకు విదేశాలకు చెందిన సాప్ట్‌బ్యాంక్‌, యాహూ, నాస్పర్స్‌ వంటి సంస్ధలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. తరువాత గత దశాబ్ది నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్ధలు, విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ప్రధానంగా ఉంది. ఆర్ధిక మద్దతు మాత్రమే కాకుండా సంస్దల నిర్వహణకు స్నేహపూర్వక వాతావరణం ఉందని కూడా ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికా నుంచి అధ్యయనం చేసిన ఎంబియే కార్యక్రమాలతో పాటు సాంప్రదాయక చైనా పద్దతులను మేళవించి అనేక కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా దాటి విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. విదేశాల్లో చదువుకున్న వారు స్వదేశానికి తిరిగి రావటంతో పాటు దేశీయంగా అనేక మంది కళాశాల గ్రాడ్యుయేట్లు ప్రతిఏటా ప్రతిభావంతుల సముదాయంలో చేరుతున్నారు. తొలి రోజుల్లో చైనా అంకుర సంస్దలు ఇతరులను కాపీ చేసినట్లు కనిపించినా తరువాత చైనా తరహాగా ప్రాచుర్యం పొందాయి. బైడు ( చైనా గూగుల్‌), దిదీ చుక్సింగ్‌( చైనా ఉబెర్‌) ఉరు చాట్‌ (చైనా వాట్సాప్‌) వాటిలో కొన్ని. ప్రపంచంలోని యూనీకార్న్‌ అంకుర సంస్దల విలువ 1.9లక్షల కోట్ల డాలర్లు, ఇది ఇటలీ జిడిపికి సమానం.
అనేక సంస్ధలు ఇప్పుడు చైనా నుంచి కాపీ చేస్తున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. దానికి పెద్ద ఉదాహరణ టిక్‌టాక్‌.అలాంటి దానిని ప్రతి దేశం ఎందుకు తయారు చేసుకోకూడదు అన్నంతగా అది ప్రాచుర్యం పొందింది.అలాగే చైనా ఫోన్లు, గతంలో చౌకరకం ఫోన్లకు మారుపేరుగా చైనా ఉంటే ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఫోన్లు మన మార్కెట్‌ను ఎలా ఆక్రమించాయో తెలిసిందే. ఇప్పటి వరకు చైనా కంపెనీలుగా పేరు గాంచినవి అనేక అంతర్జాతీయ కంపెనీలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని తొలి ఐదు పెద్ద అంకుర సంస్దలలో చైనాకు చెందినవి నాలుగు ఉన్నాయి.అలీబాబాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ 150 బిలియన్‌ డాలర్ల విలువతో ఈ ఏడాది హరున్‌ గ్లోబల్‌ యూనీకార్న్‌ సూచికలో అగ్రస్ధానంలో ఉంది. అగ్రస్దానంలో ఉన్న అమెరికాలో ఇలాంటి కంపెనీల సంఖ్య 233, చైనా కంటే ఆరు ఎక్కువ. ఈ ఏడాది అమెరికా 30, చైనా 21 కంపెనీలను జత చేశాయి. ఈ రెండు దేశాల మధ్య పోటీ తీవ్ర స్ధాయిలో ఉంది. ఒక వైపు రెండు దేశాలూ వాణిజ్య యుద్దం మరోవైపు సాంకేతిక పరిజ్ఞాన పోటీ యుద్దంలో నిమగమయ్యాయి. సెప్టెంబరు 15లోగా తమ కార్పొరేట్‌ కంపెనీలకు టిక్‌ టాక్‌ను విక్రయించని పక్షంలో అమెరికాలో నిషేధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా సమాచారాన్ని చైనా తస్కరిస్తున్న దాఖలాలు లేవని సిఐఏ నివేదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చైనా సంస్ధలను ఏదో రక్షణ, చౌర్యం అంటూ ఏదో ఒక పేరుతో నిషేధించేందుకు అమెరికా లేదా మన వంటి మరొక దేశం పూనుకోవటం వెనుక చైనా సంస్ధలను ఆర్ధికంగా దెబ్బతీయాలన్న ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం చైనాకు చెందిన 39 యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఇ కామర్స్‌ రంగంలో ఉన్నాయి.
యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఏ నగరంలో ఎన్ని ఉన్నాయన్నది చూస్తే 93తో బీజింగ్‌ అగ్ర స్ధానంలో ఉండగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో 68, షాంఘైలో 47, న్యూయార్క్‌లో 33, షెంజెన్‌లో 20 ఉన్నాయి. ఒక ప్రాంతంగా చూస్తే అమెరికాలోని సిలికాన్‌ వాలీలో 121ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులను రాకుండా చూసేందుకు తీసుకున్న చర్యల ప్రభావం కనిపిస్తోంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల(ఎన్‌బిఎఫ్‌సి) ఏర్పాటుకు పలు సంస్దలు చేసుకున్న దరఖాస్తులను రిజర్వుబ్యాంకు తాజాగా తిరస్కరించింది. మారిషస్‌లో నమోదైన చైనా వెంచర్‌ కాపిటల్‌ మరియు ప్రయివేటు ఈక్విటీ ఫండ్స్‌ ఈ దరఖాస్తులు చేసుకున్నాయి. ద్రవ్య లావాదేవీల అక్రమాలను నిరోధించటంలో మారిషస్‌ నిబంధనలు పటిష్టంగా లేవనే కారణంతో ఆ దరఖాస్తులను తిరస్కరించినట్లు చెబుతున్నారు. అయితే వీటిని తిరస్కరించలేదని సమీక్ష చేసేందుకు చాలా సమయం పడుతుందని పక్కన పెట్టినట్లు మరో వార్త.
అంకుర సంస్దలను ఏర్పాటు చేసే మన వారు మన గడ్డ మీద కాకుండా అమెరికా లేదా మరొక దేశానికి ఎందుకు పోతున్నారు ? అదే చైనాకు చెందిన వారు విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చి తమ స్వంత గడ్డమీద సంస్ధలను ఏర్పాటు చేసేందుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన పాలకుల మీద విశ్వాసం లేకనా లేక విధానాల్లో స్ధిరత్వం లేదా ? గత కాంగ్రెస్‌ పాలకుల కంటే తాము భిన్నమని బిజెపి చెబుతోంది, అయినా పరిస్దితిలో మార్పు ఎందుకు రాలేదు ?

పాకిస్ధాన్‌ కొత్త మాప్‌ మర్మం, పర్యవసానాలు ఏమిటి ?

Tags

,


ఎం కోటేశ్వరరావు


పాకిస్ధాన్‌ ప్రభుత్వం కొత్త రాజకీయ చిత్ర పటాన్ని రూపొందించి మన దేశంతో సరికొత్త వివాదానికి దిగింది. ఆక్రమిత కాశ్మీరును ఇప్పటికే తనదిగా చూపుతున్న పాక్‌ కొత్తగా జమ్మూకాశ్మీరు, లడఖ్‌ ప్రాంతాలను గుజరాత్‌లోని జునాఘడ్‌, సర్‌ క్రీక్‌ ప్రాంతాలను కూడా తనవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని ప్రచురించింది. లడఖ్‌లో తమవిగా చైనా చెబుతున్న ప్రాంతం, గిల్గిట్‌్‌-బాల్టిస్ధాన్‌లో పాకిస్దాన్‌ 1963లో చైనాకు అప్పగించిన ప్రాంతం వీటిలో లేవు. నిజానికి ఈ మాప్‌లు కొత్తవి కాదు, స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రాంతాలు, నాటి తూర్పు పాకిస్దాన్‌(నేటి బంగ్లాదేశ్‌)ను కలిపి నాటి పాక్‌ ప్రభుత్వం ముద్రించింది.తరువాత వాటిని వెనక్కు తీసుకుంది. కాశ్మీర్‌ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలన్న 1972 సిమ్లా ఒప్పందం తరువాత 1999 నాటి లాహౌర్‌ ప్రకటనకు విరుద్దం. పాక్‌ చర్య రాజకీయ మూఢత్వమని మన దేశం వ్యాఖ్యానించింది.
పాక్‌ కొత్త చిత్రపటాన్ని తయారు చేసినంత మాత్రాన ఆ ప్రాంతాలు దానివి కావు, మన నుంచి పోవు. ప్రతి దేశం తనవి అని భావించే ప్రాంతాలను చూపుతూ రాజకీయ చిత్ర పటాలను తయారు చేస్తుంది, ప్రచారంలో పెడుతుంది. సరిహద్దుల గురించి వివాదం ఉన్నపుడు వాటిని ఇరుగు పొరుగు దేశాలు అంగీకరించవు. ఉదాహరణకు చైనా ముద్రించే చిత్ర పటాల్లో మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ను తన టిబెట్‌లో భాగంగా చూపింది. అదే విధంగా మన చిత్ర పటాల్లో మనవిగా చూపుతున్న ఆక్సారుచిన్‌, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు మన ఆధీనంలో లేవు.


మన ప్రధాని నరేంద్రమోడీ లేదా బిజెపి నేతలు అమెరికా అడుగులకు మడుగులొత్తుతున్నారు. మనకు ఎంతో కావలసిన దేశం అమెరికా అంటారు, అన్ని అంశాల్లో మనకు మద్దతు ఇస్తూ ముందుకు పొమ్మని చెబుతోంది అని చెబుతారు. చైనాకు వ్యతిరేకంగా మనకు మద్దతు ఇస్తోందని ఇటీవల ఎక్కువగా చెబుతున్నారు. భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు చిత్తశుద్దితో పని చేస్తున్న మిత్ర దేశం అని కొనియాడతారు. అయినా సరే కాశ్మీరును మన అంతర్భాగంగా అమెరికా ఇంతవరకు గుర్తించలేదు అనే విషయం ఎంత మందికి తెలుసు. కాశ్మీర్‌ను ప్రస్తావించాల్సి వస్తే గతంలో భారత ఆక్రమిత ప్రాంతం అని పిలిచే అమెరికన్లు ఇటీవలి కాలంలో భారత పాలిత కాశ్మీరు అని సవరించారు తప్ప మరొక మార్పు చేయలేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ను నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నారు-దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ బిరుదు ఇచ్చాడు తప్ప కాశ్మీరు మనదే అని గుర్తించలేదు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తనది అని చైనా తన పటాల్లో ముద్రించినా, కాశ్మీరు మనది అని అమెరికా గుర్తించకపోయినా వాటితో విబేధిస్తున్నామని చెబుతూనే రెండు దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించటానికి మనకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. పాకిస్ధాన్‌ తన చిత్ర పటాల్లో తాజాగా మార్పులు చేసినా ఇదే వైఖరి కొనసాగుతుంది.


పాకిస్ధాన్‌ తన చిత్రపటాన్ని ఇప్పుడెందుకు సవరించింది ?
కాశ్మీర్‌ తమదే అని చెబుతున్నప్పటికీ ఆక్రమిత ప్రాంతాన్ని ఆజాద్‌ కాశ్మీరు అని ప్రత్యేకంగా చూపుతోంది తప్ప మిగతా కాశ్మీరు, జునాఘడ్‌ను తమ అంతర్భాగాలుగా ఇంతవరకు చూపలేదు. ఇప్పుడు సవరించింది అంటే కొత్త వివాదానికి తెరలేపినట్లు అనుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఏడాది గడచిన సందర్భంగా పాక్‌ ఈ చర్యకు పాల్పడింది. దీని గురించి జాతీయంగా, అంతర్జాతీయంగా వెలువడుతున్న విశ్లేషణలు మీడియా కథనాలను చూస్తే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం ఉంది అన్నది ఒక ఆరోపణ. గతంలో నేపాల్‌ విషయంలోనూ అదే ఆరోపణను చైనా మీద చేశారు. గతంలో కుదిరిన ఒప్పందాలకు అనుగుణ్యంగా బంగ్లాదేశ్‌ వస్తువుల దిగుమతులపై చైనా పన్ను రాయితీలు ఇచ్చినపుడు కూడా దాన్ని భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనే చర్యగా వర్ణించారు. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ద విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఆల్‌ దఫ్రా వైమానిక కేంద్రంలో ఆగిన సమయంలో ఇరాన్‌ వైపు నుంచి మూడు క్షిపణులు బయలు దేరాయని, అవి ఆల్‌ దఫ్రా వైపే వస్తున్నట్లు సమాచారం అందిందని అమెరికాలోని సిఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌ టీవీ ఛానల్స్‌ వార్తలను ప్రసారం చేశాయి. ఇరాన్‌ క్షిపణులు వచ్చినట్లు అవి సమీపంలోని సముద్రంలో పడినట్లు కూడా అవి చెప్పాయి. ఇవి అమెరికా అల్లిన కట్టుకథలు, ఇరాన్‌తో మన సంబంధాలను చెడగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. మీడియాలో వస్తున్న వర్ణణలు, అధికారయంత్రాంగం అనధికారికంగా వదులుతున్న లీకు వార్తలను బట్టి ఎలాంటి నిర్దారణలకు రాకూడదు. మీడియాలో వచ్చిన వార్తలకు విరుద్దంగా చైనా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌ చర్య వెనుక చైనా ఉందని అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.

అయితే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం లేదా ?
అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కినపుడు, సంక్లిష్టంగా మారినపుడు ప్రతి పరిణామం వెనుక ఏదో ఒక దేశ హస్తం ఉన్నట్లు అనుమానాలు తలెత్తటం సహజం. అవి దాయాదులు లేదా శత్రుదేశాల మధ్యనే కాదు మిత్రదేశాల వ్యవహారాల్లో కూడా కనిపిస్తుంది. కొన్ని పరిణామాల వెనుక చైనా హస్తం ఉందని అనుకొనే వారికి ఆ స్వేచ్చ ఉంది. అయితే మరికొన్ని పరిణామాల వెనుక అమెరికా హస్తం ఉందని దాని ప్రభావానికి మన దేశం లొంగిపోతోందనే కోణంలో కూడా వారితో పాటు అందరూ ఆలోచించాల్సి ఉంది.
ఉదాహరణకు మన దేశంతో కుదుర్చుకున్న ఒక రైల్వే లైన్‌ నిర్మాణం నుంచి ఇరాన్‌ మనలను తప్పించిందని మన మీడియాలో వార్తలు వచ్చాయి. చాబహర్‌ రేవు నుంచి ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దు వరకు నిర్మించ తలపెట్టిన కొత్త రైలు మార్గ నిర్మాణంలో భాగస్వామ్యం గురించి భారత్‌తో చర్చలు జరిగాయి తప్ప ఒప్పందం వరకు రాలేదని ఇరాన్‌ ప్రకటించింది. భవిష్యత్‌లో ఇరాన్‌ మీద అమెరికన్లు ఆంక్షలను తీవ్రతరం చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే భయం మన దేశానికి కలిగినందున ఆ ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని ఇరాన్‌ తప్పించిందనే రీతిలో వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోక పోవటానికి, ఆంక్షల గురించి భయపడటం వెనుక అమెరికా హస్తం ఉన్నట్లేనా ? అమెరికా బెదిరింపులకు మన 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ భయపడినట్లా ?


ఇరాన్‌ చాబహార్‌ రేవు అభివృద్ధికి 2016లో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఐదుదశల్లో ఈ రేవు సామర్ద్యాన్ని పెంచాలన్నది పధకం. తొలి దశలో మన దేశం చేసుకున్న ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయలేకపోయిందని ఇరాన్‌ చెబుతోంది. దానికి అమెరికా వత్తిళ్లే కారణం అని ఇరాన్‌ విమర్శిస్తోంది. అది వాస్తవం కానట్లయితే సకాలంలో పధకాన్ని పూర్తి చేయలేని మన అసమర్ధత అయినా అయ్యుండాలి. తదుపరి చర్యలకు భారత్‌కోసం తాము వేచి చూడలేమని ఇతర దేశాల పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని ఇరాన్‌ చెబుతున్నది. అయితే ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలు తీవ్రం అవుతున్న కారణంగా మరొక దేశమేదీ ముందుకు రానపుడు అమెరికాను ఖాతరు చేయని చైనా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. అందుకే మన విశ్లేషకులు మన దేశం ఇరాన్‌ను తీసుకుపోయి చైనా చేతిలో పెట్టిందని, దీనికి మనల్ని మనమే నిందించుకోవాలని వ్యాఖ్యానించారు. చైనాను ఒంటరిపాటు చేయటం దేవుడెరుగు మనకు మనమే ఒంటరి అవటానికి అమెరికా వలలో మనం చిక్కుకోవటం కారణం కాదా ?
ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకో కూడదు అన్నది అందరూ అంగీకరించే సాధారణ సూత్రం. అదే సమయంలో అంతర్జాతీయ రాజకీయాలు సరైన దారిలో లేవు కనుక వివాదాలు తలెత్తినపుడు ప్రతి దేశం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం నిత్యకృత్యంగా మారింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకున్నట్లు స్వయంగా అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనేక దేశాల ఎన్నికల్లో, ఎవరు అధికారంలోకి రావాలో ఎవరు రాకూడదో అమెరికా నిర్ణయిస్తోందన్న అంశం కూడా బహిరంగ రహస్యమే.


మన దేశంలో ఉగ్రవాదదాడులు, విచ్చిన్న చర్యలు జరిగినపుడు వాటి వెనుక పాకిస్ధాన్‌ హస్తం ఉందని మన ప్రభుత్వం చెప్పటం తెలిసిందే. పాకిస్ధాన్‌లోని బెలూచిస్తాన్‌, కరాచీ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి ఉగ్రవాద చర్యలు, దాడులు జరిగినపుడు పాక్‌ ప్రభుత్వం కూడా వాటి వెనుక మన హస్తం ఉందనే ఆరోపిస్తున్నది. పశ్చిమాసియాలోని అరబ్బు ప్రాంతాల్లో జరిగే దాడులకు ఇజ్రాయెల్‌ కారణమని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగే చర్యలకు అరబ్బులు కారణమనే వార్తలు కూడా వస్తాయి. అత్యధిక సందర్భాలలో వీటికి ఆధారాలు ఉండవు అందువనల వీటిలో వాస్తవాలు ఏమిటి అన్నపుడు ఒక ఆరోపణ నిజమే అని అంగీకరించినపుడు రెండవదాన్ని కూడా నిజమే అనుకోవాలా లేదా ?


లడఖ్‌ ప్రాంతాన్ని కాశ్మీరు నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా లడఖ్‌ అంతర్భాగమని భారత్‌ చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని భారత చర్య చట్టవిరుద్దమని చైనా ఏడాది క్రితమే భద్రతా మండలిలో అభ్యంతరాన్ని లేవనెత్తింది. మధ్యలో ఒకసారి తాజాగా ఆ చర్యకు ఏడాది నిండిన సందర్భంగా మరోసారి భద్రతా మండలిలో ఇష్టాగోష్టి చర్చకు చైనా లేవనెత్తింది. నిజానికి లడఖ్‌ను పూర్తిగా మనదే అని మనం చెప్పటం లేదా చైనా తన ఆధీనంలో ఉన్నదని చెప్పటం కొత్తగా తలెత్తలేదు. రెండు దేశాల మధ్య సమస్యలు, అనుమానాలు తలెత్తినపుడు మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటారనే కారణంతో లాంఛనంగా అభ్యంతరాలను లేవనెత్తుతారు. ఏడాది క్రితం తొలిసారి చైనా లడఖ్‌ గురించి అదే చేసినపుడు మన అధికారులు చైనా వెళ్లి యథాతధ స్థితి గురించి తాము ఎలాంటి చర్య తీసుకోలేదని, అంతర్గత వ్యవహారాల్లో భాగంగా కొన్ని చర్యలు తీసుకున్నట్లు ఇచ్చిన వివరణతో చైనా తదుపరి పొడిగించలేదు. అయితే తరువాత సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా చైనా మరోసారి భద్రతా మండలిలో దీన్ని చర్చకు పెట్టింది.


చైనా అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నామా ?
మన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసినపుడు, ఆర్టికల్‌ 370 రద్దు చేసినపుడు పాకిస్ధాన్‌ విమర్శలు చేసింది. చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ సమయంలో అది మా అంతర్గత వ్యవహారం ఇతర దేశాల జోక్యం తగదని మన ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే మాదిరి మన మీద చైనా అలాంటి ప్రకటనలే చేస్తున్నది. అవి అధికార ప్రతినిధులు లేదా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యల రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకు తైవాన్‌ సమస్య. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి స్వయంగా గుర్తించింది. మన దేశం, అమెరికా కూడా అదే వైఖరిని కలిగి ఉంది. అయితే చైనాలో తైవాన్‌ విలీనం అయ్యేందుకు తగిన వాతావరణం లేదనే పేరుతో అమెరికన్లు జోక్యం చేసుకుంటున్నారు. తైవాన్‌కు ఆయుధాలు అందిస్తున్నారు, చైనా వ్యతిరేక శక్తులకు అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేనందున దొడ్డిదారిన ఆఫీసులను ఏర్పాటు చేసి నిత్యం అక్కడి చైనా వ్యతిరేక శక్తులతో సంబంధాలను కలిగి ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావానికి గురై భారత్‌ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటోందని చైనా విమర్శిస్తోంది.
కరోనా లాక్‌డౌన్‌కు ముందు తైవాన్‌లో జరిగిన ఎన్నికలలో చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే శక్తులు విజయం సాధించాయి. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపగా బిజెపి తన ఇద్దరు ఎంపీలను ఎంపిక చేసింది. విమానాల రద్దు కారణంగా వారు భౌతికంగా వెళ్లి అక్కడి పాలకులను అభినందించలేకపోయారు గానీ ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆపని చేశారు. ఈ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా చైనా పరిగణిస్తోంది.
కాశ్మీరులో ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగినన్ని అధికారాలు కల్పించే చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అదే మాదిరి చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో కొన్ని శక్తులు 2047లో చైనాలో పూర్తిగా విలీనం కావాలన్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్య్రం కావాలని ఆందోళన చేస్తున్నాయి. చైనా అధికారాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. అలాంటి శక్తుల వలన ముప్పు వచ్చిందని భావించిన చైనా సర్కార్‌ తన అంతర్గత భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌కు వర్తింప చేసింది. ఈ చర్యను వ్యతిరేకించే వారికి పరోక్షంగా మద్దతు తెలియచేస్తూ మన ప్రతినిధి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ వేదిక మీద లేవనెత్తారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వైఖరిని తీసుకోలేదు. ఇది కూడా తమ అంతర్గత వ్యహారాల్లో జోక్యమే అని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కొన్ని దీవుల గురించి చైనాతో సహా ఆ ప్రాంత దేశాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటికి మనకూ ఎలాంటి సంబంధమూ లేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా జోక్యం చేసుకోవటమే కాదు, ఆప్రాంతానికి యుద్ద నౌకలను తరలించి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. దాని ఎత్తుగడకు అనుగుణ్యంగా ఆ వివాదంలో మన దేశం జోక్యం చేసుకోవటాన్ని చైనా తప్పుపడుతున్నది.
ఇక టిబెట్‌ విషయం గురించి తెలిసిందే. చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దలైలామాను అమెరికా రూపొందించిన పధకం ప్రకారం మన దేశానికి రప్పించటం, ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చేయటం, తిరుగుబాటుదార్లకు మన దేశంలో కొన్ని చోట్ల నివాసాలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదంతా దలైలామా మతాధికారి కనుక మానవతా పూర్వక వైఖరితో చేశాము. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా అభ్యంతర పెడుతున్నది. దానిలో భాగంగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు దలైలామాను అనుమతించవద్దని గతంలో చైనా అభ్యంతర పెట్టిన విషయం కూడా తెలిసిందే. వీటన్నింటిలో చైనా వ్యవహారాలలో మన జోక్యం ఉన్నట్లా లేనట్లా ? మనం ఏమి చేసినా మనకు సరైనదిగా కనిపిస్తే చైనా ఏమి చేసినా చైనీయులకూ సరైనదిగానే కనిపిస్తుంది. ఏదేశానికైనా వాటి పర్యవసానాలు ఏమిటి అన్నది ముఖ్యం.


పాకిస్ధాన్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకోవటం. ప్రపంచ అణు సరఫరా దేశాల బృందంలో మన దేశం చేరటాన్ని చైనా అభ్యంతరం పెట్టటం, లడఖ్‌ విషయంలో భద్రతా మండలికి ఫిర్యాదు చేయటం వంటివి చైనా జోక్యంగా పరిగణించే వాటిలో కొన్ని.
పాకిస్దాన్‌కు గతంలో అమెరికా ప్రధాన మద్దతుదారుగా ఉంది. ఎఫ్‌16 యుద్ద విమానాలను అందించి మనలను పరోక్షంగా బెదిరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. మన ప్రాంతాలను పాక్‌ తన అంతర్భాగాలుగా చూపుతూ చిత్ర పటాలను రూపొందిస్తే చైనాకు ప్రత్యక్షంగా కలిగే లాభం ఏమీ లేదు. మనకు వ్యతిరేకంగా పాక్‌ను చైనా రెచ్చగొడుతోంది అనే అభిప్రాయం ఒకటి ఉంది. గత చరిత్రను చూసినపుడు కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్దాన్‌ను పురికొల్పింది బ్రిటన్‌, అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. తరువాత జరిగిన యుద్దాల సమయంలో మనకు వ్యతిరేకంగా ఆయుధాలు అందించింది అమెరికా అన్నదీ తెలిసిందే. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ద సమయంలో మనం బంగ్లా దేశ్‌లో జరుగుతున్న ఊచకోతను నివారించేందుకు జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని నిలువరించాము. స్వల్ప యుద్దం కూడా చేశాము. ఆ సమయంలో మనకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకొనేందుకు అమెరికా తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాత ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే.అలాంటి అమెరికాతో, బ్రిటన్‌, ఇతర పశ్చిమ దేశాలతో రాసుకుపూసుకు తిరగటానికి మనకు ఎలాంటి పేచీ అభ్యంతరం కనిపించటం లేదు. పాకిస్ధాన్‌ పాలకులు అమెరికాతో చేతులు కలిపినపుడు అమెరికాను బహిరంగంగా విమర్శించటానికి మన మీడియాకు ధైర్యం చాలలేదు. ఒక వేళ ఇప్పుడు పాకిస్దాన్‌ను మన మీదకు చైనా ఎగదోస్తోంది అనుకుంటే, ఇంతకాలం అలాంటి చర్యలకు పాల్పడని చైనా ఇప్పుడు ఎందుకు ఆ పని చేస్తోందో రెండో కోణం కూడా పాఠకులకు అందించాలి. చైనాతో పాటు మన పాలకుల తప్పిదాలు, విధానాల్లో లోపాలు ఉంటే వాటిని కూడా ధైర్యంగా విమర్శించాలి. ఇరాక్‌ మీద అమెరికా దాడి, సిరియా మీద ఆల్‌ఖైదా ఉగ్రవాదులతో కలసి దాడులు చేసిన తమ పాలకుల గురించి అక్కడి మీడియాలో అనేక మంది తీవ్రంగా విమర్శించారు. వియత్నాం మీద దురాక్రమణ యుద్దానికి పాల్పడితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన చరిత్ర అమెరికా ప్రజలకు ఉంది. మనం ఇతరులను కెలక్కపోతే ఇతరులూ మనలను కెలకరు అనే విషయాన్ని గ్రహించాలి. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్దంలో మనం ఒక పక్షం వహించటం ఏమాత్రం క్షేమకరం కాదు అని పాలకులు గ్రహించాలి. అది సరైనదే అనుకుంటే వచ్చే పర్యవసానాలకూ బాధ్యత వారిదే అవుతుంది.


వెలువడుతున్న వ్యాఖ్యానాలు, పర్యవసానాలేమిటి ?
పాకిస్ధాన్‌ రూపొందించిన కొత్త చిత్ర పటంతో తలెత్తే ఇతర పర్యవసానాల గురించి మన దేశంలో చర్చ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు తమవి అని చెప్పటం ద్వారా కాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు, లేదా ఆక్రమిత కాశ్మీర్‌లోని స్వతంత్ర కాశ్మీర్‌ వాదులకు ఎదురు దెబ్బ తగిలినట్లే అన్నది ఒక అభిప్రాయం. ఇప్పటి వరకు పాక్‌ పాలకులు కాశ్మీర్‌ సమస్య మీద ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, కాశ్మీరీలు స్వతంత్ర దేశంగా ఉంటే తాము మద్దతు ఇస్తామని చెప్పిన మాటలకు ఇక ముందు ఆస్కారం ఉండదు. పాక్‌ మాటలు నమ్మి వేర్పాటును కోరుతున్న వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారుతుంది అని కొన్ని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ,లిపులేక్‌,లిమియాధురా ప్రాంతాలు తనవే అంటూ కొద్ది వారాల క్రితం నేపాల్‌ ప్రకటించటం, ఇప్పుడు అదే పని పాక్‌ చేయటం కాకతాళీయంగా జరిగినవి కాదని వాటి వెనుక రెండు దేశాలకూ పెద్ద మొత్తంలో సాయం చేస్తున్న చైనా హస్తం ఉందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
” చైనాతో కలుపుతూ పాకిస్ధాన్‌ కాగితాల మీద తన చిత్ర పటాన్ని రూపొందించినందున రెండు దేశాలతో యుద్దం ఉండవచ్చేమో అన్న భారత్‌ భయాన్ని తాజా పరిణామం ఎక్కువ చేస్తున్నది. అయితే ఆచరణలో అది పని చేస్తుందనేందుకు ఆధారాలు చాలా పరిమితంగా ఉన్నాయి, అయితే దేశీయ రాజకీయాలు ఈ చిత్రపటం వెనుక ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు ” హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది.

నరేంద్రమోడీ మై హూనా అంటే నమ్మని జనం : బ్రిటన్‌ యు గవ్‌ సర్వే వెల్లడి

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు ఏ దేశం మాంద్యంలోకి కూరుకుపోయిందో అనే వార్త వినాల్సి వస్తుందో తెలియటం లేదు. వరుసగా ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా జిడిపి వృద్ధి రేటు తిరోగమనాన్ని సూచిస్తే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయినట్లుగా పరిగణిస్తారు. బ్రిటన్‌కు చెందిన సంస్ధ యు గవ్‌ జరిపిన తాజా సర్వే వివరాల ప్రకారం మన ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉన్నవారి శాతం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మీకు నేను ఉన్నాను అని మన ప్రధాని నరేంద్రమోడీ ధీమా మీద ఆర్ధిక వ్యవస్ధ విషయంలో జనంలో విశ్వాసం లేదు అని సర్వే ఫలితం సూచిస్తోంది.
తాజాగా ఫిలిఫ్పైన్స్‌ 29 సంవత్సరాల తరువాత తొలిసారిగా మాంద్యంలోకి జారింది. తొలి త్రైమాస కాలంలో 0.7 శాతం తిరోగమనాన్ని సూచించగా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 9శాతం ఉండవచ్చన్న అంచనాలను తారు మారు చేసి 16,5 దిగజారింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అనేక దేశాల తిరోగమనం గత ఏడాదే ప్రారంభమైంది. కరోనా మహమ్మారి పతన వేగాన్ని పెంచింది. గత ఏడునెలలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తున్నది. ఫిలిఫ్పైన్స్‌లో ఇది రాసిన సమయానికి లక్షా 16వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాపితంగా కోటీ 90లక్షల మందికి సోకింది, కోటీ 22లక్షల మంది కోలుకున్నారు, ఏడు లక్షల 12 మందికి పైగా మరణించారు.49.73లక్షల మందితో అమెరికా, 28.62లక్షల మందితో బ్రెజిల్‌ ఒకటి రెండు స్దానాల్లో ఉంటే మన దేశంలో 19.64 లక్షల మందికి పైగా సోకింది. తొలి రోజుల్లో పాకిస్దాన్‌ కేసులు మనలో సగం వరకు ఉండేవి ఇప్పుడు 2.81లక్షలతో 14వ స్ధానంలో, 2.46లక్షలతో బంగ్లాదేశ్‌ 16, చైనా 84వేల కేసులతో 29వ స్ధానంలో ఉంది.

ఆర్ధిక వ్యవస్ధ, తమ భవిష్యత్‌ గురించి ప్రపంచంలోని జన ఆలోచనా ధోరణి ఎలా ఉంది ?
బ్రిటన్‌కు చెందిన యు గవ్‌ అనే ఒక సంస్ధ తాజాగా నిర్వహించిన సర్వే వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రకారం అతి పెద్ద ఆందోళనకర అంశం ప్రపంచ వ్యాపిత ఆర్దిక మాంద్యం. అయితే ఇది అన్నిదేశాలలో ఒకే తీవ్రతతో లేదు. ప్రపంచంలో మెక్సికన్లు తీవ్ర నిరాశ, ఆందోళన చెందుతుండగా, సోషలిస్టు వియత్నాం, చమురు సంపదలున్న మధ్య ప్రాచ్య దేశాల జనం తమ ఆర్దిక వ్యవస్ధ గురించి ఎక్కువ మంది ఆశాభావంతో ఆదుర్దాలేకుండా ఉన్నారు.

దేశాల ఆర్ధిక వ్యవస్ధల కుంగుబాటు ఎలా ఉంది ?
మన దేశ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటితో ప్రారంభం అవుతుంది.అనేక దేశాల్లో జనవరి నుంచి ఆరంభం. మనకు మూడు నెలలు గడిస్తే అనేక దేశాలకు ఆరునెలలు గడిచింది. ప్రతి మూడు నెలలకు ఆర్ధిక ఫలితాలను మదింపు వేయటం దాదాపు అన్ని చోట్లా ఉన్నది. మన ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి లాక్‌డౌన్‌ కారణంగా సమాచార సేకరణ సిబ్బంది బయటకు వెళ్లలేని కారణంగా సమాచారం సమగ్రమైంది కాదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంచనాలు తప్ప వాస్తవాలు ఇంకా బయటకు రావటం లేదు. మిగతా దేశాలు కూడా పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తున్న సూచనలు కనిపించటం లేదు. అరకొరగా వస్తున్నాయి. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ అనే పత్రిక ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు సగటున ఏడుశాతం, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది రెండున్నరశాతం తిరోగమనంలో ఉండవచ్చని అంచనా వేసింది.
ఇప్పటి వరకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎన్ని సార్లు మాంద్యంలోకి పోయింది, వాటి తీవ్రత ఎలా ఉంది ?
1876 నుంచి ఇప్పటి వరకు 14సార్లు ప్రపంచం మాంద్యానికి గురైంది. వీటిలో కొన్ని దేశాలకు మినహాయింపు ఉన్నా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను మొత్తంగా చూసినపుడు ఈ నిర్ధారణకు వచ్చారు.1930-32 సంవత్సరాలలో 17.6, 1945-46లో 15.5, 1914లో 6.7శాతాలు గరిష్టంగా నమోదు కాగా 2020లో 6.2శాతం ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత 2009లో వచ్చిన ఆర్ధిక మాంద్యం 2,9శాతమే తిరోగమనం అయినా చాలా పెద్దదని ఆర్ధికవేత్తలు చెప్పారు, ఇప్పుడు దానికి రెండు రెట్లు 6.2శాతం అని అంచనా, ఇంకా దిగజారినా ఆశ్యర్యం లేదు. అనేక దేశాలో 2009 నాటి మాంద్య ప్రభావం ఇంకా కొనసాగుతుండగా మరో మాంద్యం ముప్పు ఉందని కరోనాకు ముందే అనేక మంది హెచ్చరించారు. ఇప్పుడు జమిలిగా మరో పెద్ద సంక్షోభం రానున్నది, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్ధితి.

వివిధ దేశాల్లో అభివృద్ధి రేటు పతనాల తీరు ఎలా ఉంది ?
సమగ్రమైన సమాచారం ఇంకా రావటం లేదు, అంచనాలు, తాత్కాలిక గణాంకాలు మాత్రమే వెలువడుతున్నాయి. వాటిలో సింగపూర్‌ ఆర్ధిక వ్యవస్ధ చిన్నదే అయినా తొలి మూడు మాసాల్లో 3.3శాతం పతనం కాగా రెండవ త్రైమాసంలో 41.2శాతం మైనస్‌లో పడింది. అమెరికా రెండవ త్రైమాసంలో 33శాతం, యూరో జోన్‌లో 12.1శాతం అయితే స్పెయిన్‌లో 18.5 జర్మనీ 10.1, స్పెయిన్‌ స్వీడన్‌లో 8.6 శాతాల చొప్పున తిరోగమనంలో చైనాలో తొలి మూడు మాసాల్లో 6.8శాతం మైనస్‌ అయితే రెండవ త్రైమాసంలో 3.2శాతం అభివృద్ధిలోకి వచ్చింది. దక్షిణ కొరియాలో మొదటి మూడు నెలల్లో 3.3శాతం తిరోగమనం కాగా రెండవ త్రైమాసంలో 1.3శాతం నమోదు కావటంతో సాంకేతికంగా మాంద్యం ముంగిట ఉన్నట్లే భావిస్తున్నారు. మన దేశం తొలి త్రైమాస వివరాలు ఇంకా ప్రకటించలేదు గానీ వివిధ సంస్ధలు 6.1శాతం మైనస్‌ అని అంచనా వేశాయి. రానున్న ఏడాది కాలంలో తమ వ్యవస్ధలు ఆర్ధిక మాంద్యంలోకి పోతాయని మెక్సికో, ఫ్రాన్స్‌ దేశాలు, చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్ధ ఉన్న హాంకాంగ్‌ ప్రాంత పౌరుల్లో నాలుగింట మూడువంతుల మంది భావిస్తున్నారు.

చైనా, మన, ఇతర దేశాల గురించి యు గవ్‌ సర్వే ఏమి చెప్పింది ?
రెండుదేశాల మధ్య నెలకొన్న పరిస్ధితుల్లో ఆర్ధికం గురించి జనం ఏమనుకుంటున్నారన్నది నిజంగా ఆసక్తి కలిగించేదే. మన దేశంలో 54శాతం మంది మాంద్యంలోకి పోనున్నామని చెప్పగా ఇప్పుడున్న స్దితే కొనసాగుతుందని చెప్పిన వారు 21, అచ్చేదిన్‌ అని చెప్పిన వారు 14శాతం మంది ఉన్నారు. దీనికి కారణం ఏమిటన్నది మరొక ప్రశ్నకు వచ్చిన సమాధానం వెల్లడిస్తోంది. సర్వేకు ముందు నెలతో పోల్చితే సర్వే సమయంలో తమ ఆదాయం తగ్గిందని చెప్పిన వారి సంఖ్య మెక్సికోలో 58శాతం కాగా రెండవ స్ధానంలో ఫిలిప్పీన్స్‌లో 51, మూడవ స్ధానంలో ఉన్న మన దేశంలో 50శాతం మంది చెప్పారు. ఆదాయాలు పడిపోవటం ఎక్కువగా ఉన్న కారణంగానే యథాతధ స్ధితి కొనసాగుతుందని చెప్పిన వారి సంఖ్య తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పధకం తమను ఉద్దరిస్తుందన్న విశ్వాసం జనంలో కలిగించలేదని కూడా సర్వేలో వెల్లడైన అభిప్రాయం సూచిస్తున్నది.
మాంద్య భయం ఎక్కువగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్‌తో సహా ఐరోపా దేశాల్లో ఆదాయం తగ్గినవారి శాతం కనిష్టంగా ఉంది. చైనా విషయానికి వస్తే ఆదాయం తగ్గిన వారు 29, వియత్నాంలో 25శాతం ఉన్నారు. స్ధిరంగా ఉన్న వారు మన దేశంలో 34శాతం అయితే చైనాలో 52 శాతం ఉన్నారు. వియత్నాంలో స్ధిరంగా ఉన్న వారి శాతం41 అయితే ఆదాయం పెరిగిన వారు 33శాతం ఉన్నారు కనుక అక్కడి వారిలో ఆందోళన లేదని సర్వేలో వెల్లడైంది.
చైనాలో మాంద్యం గురించి చెప్పిన వారు 30, యథాతధ స్ధితి కొనసాగుతుందన్న వారు 50, మెరుగుపడుతుందని 12శాతం మంది చెప్పారు. అమెరికాలో 47శాతం మంది ఆర్ధిక మాంద్యం గురించి భయపడుతున్నారు. స్ధిరంగా ఉంటుందని 16శాతం, అభివృద్ధి పధంలో ఉంటామని 20శాతం చెప్పారు. సోషలిస్టు వియత్నాంలో మాంద్యం గురించి భయపడుతున్నవారు 24, యథాతధంగా ఉంటుందన్న వారు 56, మరింత పురోగమిస్తామని ఆశాభావం వెలిబుచ్చిన వారు 15శాతం మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జనంలో ప్రపంచంలో అత్యధికంగా 27శాతం మంది తమ ఆర్దిక వ్యవస్ధలు పురోగమిస్తాయనే ఆశాభావం వెల్లడైంది.

అప్పుల కుప్పగా భారత్‌ : గురువు వాజ్‌పేయి రికార్డును బద్దలు కొట్టనున్న శిష్యుడు నరేంద్రమోడీ !

Tags

,


ఎం కోటేశ్వరరావు


మనకు నరేంద్రమోడీ అనే కొత్త దేవుడు, రక్షకుడు వచ్చాడు. ఆయన మహత్తులు అన్నీ ఇన్నీ కావు. ఛాతీ 56 అంగుళాలంట. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మనకు మంచి రోజులు వచ్చాయి. గుజరాత్‌ అనుభవాన్ని దేశమంతటా అమలు చేస్తారు. గతంలోనూ, ఇప్పుడూ సాగుతున్న ప్రచార సారం ఇదే.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం-దాని రూపు రేఖల గురించి మీడియా గత కొద్ది రోజులుగా ప్రచారం ప్రారంభించింది. శంకుస్ధాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా జరపబోతున్నారు. కొద్ది రోజుల పాటు జనాన్ని ఆ భక్తిలో ముంచి తేల్చుతారు. సుప్రీం కోర్టు మార్గాన్ని సుగమం చేసింది, స్దలం గురించి సవాలు చేసిన వారు కూడా తీర్పును ఆమోదించారు. రామాలయ నిర్మాణ ఏర్పాట్లు చేసుకోనివ్వండి ఇబ్బంది లేదు.
కకావికలమైన దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టటానికి చర్యలేమిటో ఎక్కడా కనపడటం లేదు. ఎవరూ చెప్పటం లేదు. ఎంత త్వరగా రామాలయ నిర్మాణం పూర్తి అయితే అంత త్వరగా కరోనా అంతం అవుతుందని రాజస్ధాన్‌లోని దౌసా బిజెపి ఎంపీ జస్‌కౌర్‌ మీనా ప్రకటించారు. కరోనా వైరస్‌ నిర్మూలనకు రామాలయ నిర్మాణానికి లంకె ఏమిటో తెలియదు. తన ఆలయం పూర్తి అయిన తరువాతే కరోనా సంగతి చూస్తానని రాముడు అలిగి కూర్చున్నాడా అని ఎవరైనే అంటే అదిగో మా మనోభవాలను దెబ్బతీస్తున్నారని దెబ్బలాటకు వస్తారు.
రిజర్వుబ్యాంకు జూన్‌ 30న ప్రకటించిన వివరాల మేరకు 2020 మార్చి నెలాఖరుకు మన విదేశీరుణం 558.5 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. మోడీ అధికారానికి వచ్చిన 2014లో ఈ మొత్తం 446.2బిలియన్‌ డాలర్లు. ఈ కాలంలో మన విదేశీ అప్పుల గురించి సామాజిక మాధ్యమంలో మోడీ మద్దతుదారులు చేసిన ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. మోడీ కొత్తగా అప్పులు చేయలేదు, అంతకు ముందు పాలించిన వారు చేసిన అప్పులను తీర్చేశారు. ఇలా ప్రచారాలు సాగాయి, ఇంకా చేస్తూనే ఉన్నారు. అదే వాస్తవం అయితే ఆరు సంవత్సరాలలో 112 బిలియన్‌ డాలర్ల అప్పులు ఎలా పెరిగినట్లు ?
రిజర్వుబ్యాంకు వెల్లడించిన అంకెల మేరకు పైన పేర్కొన్న సంవత్సరాల మధ్యకాలంలో ముందుకు వచ్చిన ధోరణులు, కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. జిడిపిలో విదేశీ అప్పు శాతం 23.9 నుంచి 20.6కు తగ్గింది. తీసుకున్న అప్పులకు వడ్డీ, అసలు మొత్తం కలిపి జిడిపిలో 5.9 నుంచి 6.5శాతానికి పెరిగింది. వాణిజ్య రుణాల మొత్తంతో పాటు వాటికి చెల్లించే అధిక వడ్డీ ఈ పెరుగుదలకు కారణం. అప్పులో రాయితీలతో కూడిన రుణాల శాతం 10.4 నుంచి 8.6కు తగ్గింది.
అంతర్గత అప్పు 2014-2020 సంవత్సరాల మధ్య 1,160.56 బిలియన్‌ డాలర్ల నుంచి 2,219.37 బి.డాలర్లకు చేరిందని, ఇది 2024 నాటికి 3,299.94 బి.డాలర్లకు చేరుతుందని స్టాటిస్టా డాట్‌ కామ్‌ పేర్కొన్నది. భారత అప్పు జిడిపిలో 87.6శాతానికి పెరగనుందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్ధిక సలహాదారు డాక్టర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ జూలై 20న రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.” 2012లో రు.58.8లక్షల కోట్లుగా (జిడిపిలో 67.4శాతం) ఉన్న అప్పు 2020 ఆర్ధిక సంవత్సరానికి రు. 146.9లక్షల కోట్లకు(జిడిపిలో 72.2శాతం) పెరిగింది. వర్తమాన సంవత్సరంలో పెద్ద మొత్తంలో అప్పు చేయనున్నందున అది రు. 170లక్షల కోట్లకు(జిడిపిలో 87.6శాతం) చేరనుంది. విదేశీ అప్పు విలువ రు.6.8లక్షల కోట్లు(జిడిపిలో 3.5శాతం) కాగా మిగిలిందంతా స్వదేశీ అప్పు. దేశ అప్పులో రాష్ట్రాల వాటా 27శాతం. జిడిపి కుప్పకూలిన కారణంగా అప్పు నాలుగుశాతం పెరగనుంది. ఖజానా బాధ్యత మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టం ప్రకారం జిడిపి-అప్పు దామాషాను 2023 నాటికి 60శాతానికి తగ్గించాల్సి ఉంది.అయితే 2030 నాటికి మాత్రమే అది సాధ్యమయ్యేట్లు కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాలలో వడ్డీ ఖర్చు తగ్గుతుంది.”
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల నుంచి అప్పులు తీసుకోవాల్సి రావటంతో అవి విధించిన షరతుల మేరకు 2003లో ఖజానా బాధ్యత మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టాన్ని చేశారు. అయితే దానికి మినహాయింపులకు కూడా చట్టంలోనే అవకాశం కల్పించారు. చేసిన అప్పులను చెల్లించగలిగే విధంగా చూసే ఏర్పాటులో ఈ చట్టం ఒక భాగం. పరిమితికి మించి అప్పులు చేయరాదు, ద్రవ్యలోటును పెంచకుండా క్రమశిక్షణ పాటించాలి అన్నది ప్రధాన అంశం.2009 నాటికి రెవెన్యూ లోటు లేకుండా చేయాలని అయితే జిడిపిలో అరశాతం వరకు ఉండవచ్చని లక్ష్యంగా నిర్ణయించారు. అదే ఏడాది నాటికి ద్రవ్యలోటును మూడుశాతానికి తగ్గించాలని, 0.3శాతం వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. 2007-08లో ద్రవ్యలోటు 2.7, ఆదాయలోటు 1.1శాతం ఉంది. అదే సంవత్సరం ప్రపంచంలోని ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఉద్దీపన పధకాలను చేపట్టేందుకు ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట లక్ష్యాలను వాయిదా వేశారు. తరువాత ఈ చట్టానికి 2012, 2015లో సవరణలు చేశారు. 2015నాటికి లక్ష్యాలను సాధించాలని 2012లో సవరణ చేయగా 2018 నాటికి రెవెన్యూ లోటును కనీసం 0.5శాతానికి తగ్గించాలని, ద్రవ్యలోటు 3శాతం, కనీసంగా 0.3శాతంగా ఉండాలని 2015లో సవరించారు.
అయితే 2016లో ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయని వాటిని సమీక్షించాలని ఎన్‌కె సింగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ మేరకు ద్రవ్యలోటును 2020 మార్చి ఆఖరుకు 3శాతం, 2020-21కి 2.8, 2023 నాటికి 2.5శాతానికి పరిమితం చేయాలని, అప్పును 60శాతానికి పరిమితం చేయాలన్నది వాటి సారాంశం. అప్పుల విషయానికి వస్తే కేంద్రం 40, రాష్ట్రాలు 20శాతానికి పరిమితం చేసుకోవాలని, రెవెన్యూలోటును 0.8శాతానికి తగ్గించుకోవాలని సింగ్‌ కమిటీ చెప్పింది.
అయితే నరేంద్రమోడీ సర్కార్‌ తాను నియమించిన కమిటీ సిఫార్సులను తానే తుంగలో తొక్కింది. మూడుశాతం ద్రవ్యలోటును 3.2శాతంగా 2017లో నాటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ పేర్కొన్నారు.2018లో చట్టానికి మరో అరశాతం లోటు పెంచుకోవచ్చని నిర్ణయించారు. ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020లో ద్రవ్యలోటును 3.8శాతంగానూ 2021లో 3.5శాతం ఉంటుందని చెప్పారు. అయితే వాస్తవంలో 2020 ద్రవ్యలోటు 4.59శాతం అని రెవెన్యూలోటు 3.27శాతమని ప్రభుత్వమే వెల్లడించింది.
ఇక వర్తమాన ఆర్ధిక సంవత్సర ద్రవ్యలోటు విషయానికి వస్తే 3.5శాతం అంటే 7.96 లక్షల కోట్ల మేర ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశారు. అయితే మొదటి మూడు మాసాల్లోనే దానిలో 83.2శాతం అంటే 6.62లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయి. మరో తొమ్మిది నెలల్లో ఖర్చుకు 1.34 లక్షల కోట్లు మాత్రమే ఉంటాయి. కరోనా నేపధ్యంలో ఈ పరిమితికి లోబడేందుకు ఇప్పటికే ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల మీద జనాన్ని లూటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సొమ్మంతా లోటు, ఆదాయ లోటు పూడ్చుకొనేందుకు వినియోగిస్తున్నారు. ప్రస్తుత మాదిరి ఆర్దిక పరిస్ధితి దిగజారుడు కొనసాగితే అనేక పధకాలు, సంక్షేమ చర్యలకు కోతలతో పాటు జనం మీద ఏదో ఒకసాకుతో భారాలు మోపే అవకాశాలు ఉన్నాయి.
భారత్‌ రేటింగ్‌ మాదిరి దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వ అప్పు ఎంతో ఎక్కువగా ఉందని మూడీస్‌ రేటింగ్‌ సంస్ధ పేర్కొన్నది. ఆ దేశాల మధ్యగత (మిడియన్‌) రుణ భారం 53శాతం అయితే 2019లో భారత అప్పు 72శాతంగా ఉంది. 2003లో (వాజ్‌పేయి ఏలుబడి) 84.7శాతంగా ఉన్న అప్పు 2016 నాటికి 67.5శాతానికి తగ్గింది.కరోనాకు ముందు అప్పు పెరుగుదల రేటు ప్రకారమైనా 2024మార్చి నాటికి భారత్‌ అప్పు జిడిపిలో 81శాతం ఉంటుందని మూడీస్‌ మే నెలలో అంచనా వేసింది.
కరోనా ఖర్మకు జనాన్ని వదలి వేశారు, అది బలహీనపడితేనో, లేక జనం తమంతట తాము జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు మించి చేసేదేమీ లేదని తేలిపోయింది. కరోనా పోరుకు సంకల్పం చెప్పేందుకు చప్పట్లు కొట్టమని, కొవ్వొత్తులు వెలిగించమని మరోమారు కోరే అవకాశం లేదు. కరోనా వదలినా ఆర్ధిక సంక్షోభ ఊబి నుంచి జనం ఎప్పుడు బయటపడతారో తెలియని కొత్త సంక్షోభంలోకి ఒక్కొక్క దేశం చేరుతోంది. మన దేశాన్ని కరోనాకు ముందే ఆ బాటలో నడిపించారు. ఇప్పుడు నిండా ముంచబోతున్నారా ?

అమరావతి మూడు ముక్కలాట మరో మలుపు ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
మొండి వాడు రాజుకంటే బలవంతుడు అన్నది బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఏకంగా రాజే మొండి అయితే ….గతంలో అలాంటి చరిత్ర మనకు తెలియదు, మన పెద్దలూ చెప్పలేదు. ఇప్పుడు రాజరికం లేదు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురించి అలాంటి అభిప్రాయం అయితే ఉంది. ఆయన ఏమి చేసినా ప్రత్యర్ధులు దాన్ని వేరే విధంగా చూస్తే మద్దతుదారులు సానుకూలంగా చూస్తూ మురిసిపోతున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రూపొందించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయటంతో ఇతర ప్రాంతాల్లోని జగన్‌ మద్దతుదారులు ఫెళ్లున నవ్వారు. గవర్నర్‌ మీద దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నవారు, బిజెపి-జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మీద భ్రమలు పెంచుకున్నవారు గొల్లుమంటున్నారు. ఇంత ద్రోహమా అని గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయగానే అంతా అయిపోలేదు కోర్టులు ఉన్నాయి అనే వారు కూడా ఉన్నారు. ఊహించినట్లుగానే గవర్నర్‌ చర్య మీద రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైనా మిగతా చోట్ల లోలోపల ఉడికి పోయినా, గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న కారణంగా పెద్ద స్పందన వెల్లడి కాలేదు. అమరావతి కారణంగా తమ ఆస్ధుల విలువ పెరిగిందని సంతోషించిన వైసిపి మద్దతుదారులు తక్కువేమీ కాదు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో గెలిచిన ఎంఎల్‌ఏలందరూ ఆ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు సచివాలయం తరలింపు గురించి పైకి బింకంగా ఏమి మాట్లాడినా తమ ఆస్ధుల విలువ కూడా హరించుకుపోతున్నపుడు వైసిపి మద్దతుదారుల్లో అంతర్గతంగా సంతోషం ఏమీ ఉండదు. తమ నేతకు చెప్పలేకపోయినా గవర్నర్‌ అడ్డుకుంటే బాగుండు అని కోరుకున్న వారు లేకపోలేదు.
సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పడింది కనుక, ఆ వ్యవస్ధల పాత ఆమోదాన్ని చెత్తబుట్టలో వేసి కొత్త ప్రతిపాదన చేస్తే దానికి కూడా ఆమోదం పొందవచ్చని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలను నమ్మే జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో చేతులు కాల్చుకుంది అని గమనించాలి. లేదూ హైకోర్టు మార్పు విషయంలో హక్కుల అంశం లేదు కనుక ఎవరైనా కోర్టులకు ఎక్కినా విధాన పర నిర్ణయంగా భావించి కోర్టులు అభ్యంతర పెట్టవు అన్నది ఒక అభిప్రాయం. హైకోర్టును కర్నూలులో పెట్టాలని బిజెపి కూడా కోరుతున్నది, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం అయితే కేంద్ర అధికారంలో ఉన్న తాము దాని సంగతి చూసుకుంటామని, సాయం చేస్తామని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు గనుక ఎక్కడ ముద్రవేయమంటే అక్కడ వేస్తారు అని చెప్పేవారూ ఉన్నారు. తనకు లాభం అని బిజెపి భావించినా- వైసిపితో తెరవెనుక ముడి గట్టిగా పడినా అది కూడా జరిగినా ఆశ్చర్యం లేదు. పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయంతో సహా కార్యాలయాల తరలింపును కోర్టులు అడ్డుకోలేవు.
ముందు అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించి తమ పంతం నెగ్గించుకోవాలన్నది వైసిపి పట్టుదల కనుక దాని కోసం బిజెపితో ఎలాంటి రాజీకైనా అంగీకరించే అవకాశం ఉంది. ఒక వేళ హైకోర్టు తరలింపులో అనుకోని అవాంతరాలు ఎదురై ఆగిపోయినా వైసిపికి పోయేదేమీ లేదు. ఆ సాకును చూపి న్యాయ రాజధానిని సీమలో ఏర్పాటు చేయలేక పోయామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాజధాని ప్రాంత రైతుల్లో భూ సమీకరణ దగ్గర నుంచి అధికారంలో ఉన్నంత కాలం అది కల్పించిన ఆశలు, భ్రమలు, మునగచెట్టు ఎక్కించిన తీరు ఒకటైతే, జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతికి మంగళం పాడటానికి నిర్ణయించుకున్న తరువాత కూడా కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడితో చక్రం అడ్డువేస్తామని తెలుగుదేశం నమ్మించింది. రైతులు కూడా నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే భావోద్వేగానికి గురైనా అదంతా నటన అనుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే నిజం చెప్పినా నమ్మరు !
బిజెపి విషయానికి వస్తే అది నమ్మించి మోసం చేసిన తీరును జనం మరచిపోరు. అందువలన కన్నా లక్ష్మీనారాయణ అనే బొమ్మను పక్కన పెట్టి సోము వీర్రాజు అనే మరో బొమ్మను జనం ముందు పెట్టినా దానికి ఉన్నది పోయేదేమీ లేదు కొత్తగా వచ్చేదేమీ కనిపించటం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పరిస్ధితి ఏమిటో అర్దం కాకుండా ఉంది. నటుడు కనుక తిరిగి సినిమాల్లోకి పూర్తిగా వెళ్లవచ్చు, లేదా కాల్షీట్లు తీసుకొని బిజెపి రాజకీయ సినిమాలో పాత్రపోషించవచ్చు, నమ్ముకున్న కార్యకర్తలేమౌతారు ?
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ తమ వంతు పాత్రలను ఎలా పోషించాయో పదే పదే చెప్పుకోవనవసరం లేదు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. బిజెపి నాటకాలు ఇంకా ఆడుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంటులో ప్రకటించింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లులను రూపొందించటం, వాటిని గవర్నర్‌ ఆమోదించటంతో చట్టాలు కావటం తెలిసిందే. ఇప్పుడు గతంలో మాదిరి చెబితే కుదరదు. తన వైఖరి ఏమిటో చెప్పకతప్పదు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం నాడు ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు రమ్మంటే వచ్చి రాయి వేసి వెళ్లారు తప్ప దానితో బిజెకి సంబంధం లేదని ఇప్పుడు ఆ పార్టీ వారు చెబుతున్నారు. రేపు మరి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని శంకుస్ధాపనలకు కూడా పిలిస్తే వస్తారా ? వైసిపి ప్రభుత్వం అసలు పిలుస్తుందా ? ఏం జరుగుతుందో ఎలా కథ నడిపిస్తారో చూడాలి. ఈ మూడు రాజధానుల గురించి కేంద్రానికి రాష్ట్రం ఏ రూపంలో నివేదిస్తుందో కూడా ఆసక్తి కలిగించే అంశమే.
రాజధాని ఏర్పాటులో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి కొత్త నేత సోము వీర్రాజు చెప్పారు. దీనిలో కొత్తదనం ఏముంది. గతం నుంచీ చెబుతున్నదే. బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో అవకాశవాదం తప్ప పెద్ద తెలివితేటలేమీ లేవు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్రవేయటాన్ని కూడా సమర్ధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం విషయంలో గవర్నర్‌ తీసుకున్న చర్య సరైనది అయినపుడు రాజధానుల బిల్లుల విషయంలో గవర్నర్‌ చర్య తప్పిదం ఎలా అవుతుందని చెట్టుకింది ప్లీడర్‌ వాదనలు చేస్తున్నారు. మేము గవర్నర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది, కొత్త కమిషనర్‌ పదవీకాలం గురించి తెచ్చిన ఆర్డినెన్స్‌, కొత్త కమిషనర్‌ నియామకం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు దాని మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు కనుక తన పదవి గురించి రమేష్‌ కుమార్‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ను కలవండన్న కోర్టు సూచన మేరకే కలిశారు. కానీ మూడు రాజధానుల బిల్లుల విషయం వేరు. వాటిని ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాసిన పార్టీలలో బిజెపి కూడా ఉందని వారు మరచిపోతే ఎలా ? గవర్నర్‌ వ్యవస్ధలో జోక్యం చేసుకోము అని చెబుతున్నవారు లేఖ ఎందుకు రాసినట్లు ? లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీ నారాయణను పదవి నుంచి తప్పించారా ? పోనీ లేఖ రాయటం తప్పని కొత్త అధ్యక్షుడు పశ్చాత్తాపం ఏమైనా ప్రకటిస్తారా ?
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించలేదు, సెలెక్టు కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు ప్రకటించారు.సిఆర్‌డిఏ రద్దు బిల్లు, రాజధానికి సంబంధించి ఇతర అంశాల గురించి కోర్టులలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ద చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న వారు రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్‌ గనుక వాటిని ఆమోదించవద్దని లేదా న్యాయసలహాలు తీసుకోవాలని బిజెపితో పాటు ఇతర పార్టీలు కోరాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా లేదా ఆయన కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన తరువాతే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారనే విమర్శలు వున్నాయి.వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు లేదా లేదని నిరాకరిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడు రాజధానుల గురించి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న లేదా ప్రకటనలు చేస్తున్న వారిని ఆ పార్టీ ఇంతవరకు కట్టడి చేయలేకపోయింది.
ఇక హైకోర్టు గురించి గతంలో చేసిన వాదనలనే బిజెపి నేతలు చేస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ప్రావిన్సులలో హైకోర్టులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న అంశం రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. అందువలన రాష్ట్రాల ఏర్పాటు, సంస్దానాల విలీనాల సమయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం రాజధాని ఒక చోట హైకోర్టు ఒక చోట ఏర్పాటు చేశారు. తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంస్ధానాల విలీనం సమయంలో రాజధాని తిరువనంతపురం, హైకోర్టు కొచ్చిన్‌లో ఉండాలన్నది ఒప్పందం. అలాగే మద్రాసు ప్రావిన్సు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాజధాని కర్నూల్లో, హైకోర్టు గుంటూరులో ఉండాలన్నది పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు ఈ సమస్యకు బదులు ఇతరంగా ముల్కీ వంటి ఒప్పందాలు జరిగాయి. రాజధానిని విజయవాడలో పెట్టాలని కొందరు కోరినా హైకోర్టుతో సహా చివరకు హైదరాబాద్‌ను ఖరారు చేశారు. రాజధానులలో కాకుండా ఇతర చోట్ల హైకోర్టులు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఇలాంటి ఏదో ఒక నేపధ్యం ఉన్నది. తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌లో హైకోర్టు నైనిటాల్‌ నగరంలో ఉంది. రాజధాని చలికాలంలో డెహ్రాడూన్‌లో, వేసవి కాలంలో దానికి 250కిలోమీటర్ల దూరంలోని గైరాసియన్‌ పట్టణంలో ఉంటుంది. ఇవేవీ వివాదం కాలేదు, ఒక సారి ఖరారు అయిన తరువాత మార్పులు జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఖరారైన రాజధాని విషయంలో రాజకీయం మొదలైంది.
న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. అనేక రాష్ట్రాలు హైకోర్టు బెంచ్‌లను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని ఇప్పటికే అనేక సార్లు కోరి ఉన్నాయి. వాటిలో దేనినీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు తరలింపుకు ఆమోదం తెలిపితే కొత్త సమస్యలకు తెరలేపినట్లవుతుంది.
ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు గతంలోనే చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో బిజెపి సర్కార్‌ ఎందుకు చెప్పలేదు అని అడిగినవారు లేకపోలేదు.
ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హౌదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు. పోనీ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న ఇతర చర్యలేమైనా ఉన్నాయా అంటే లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజధాని తమ ప్రాంతంలో పెడతామని చెప్పారు గనుకనే మేము భూములను ఇచ్చామని, ఇప్పుడు రాజధాని తరలిపోయి, తాము ఇచ్చిన భూములు దేనికీ పనికి రాకుండా పోతే తామేమి కావాలని వారు అడుగుతున్నారు. దానిలో తప్పు లేదు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా కొన్ని సంవత్సరాల పాటు కౌలు చెల్లింపు, వారు ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేసిన రాజధాని ప్రాంతంలో కొంత స్ధలాన్ని వారికి అందచేయాల్సి ఉంది. చట్టపరంగా ప్రభుత్వం ఆ పని చేయకపోతే కోర్టులకు వెళ్లి దాన్ని సాధించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక్కడ సమస్య అది కాదు. రాజధాని ఏర్పడితే ఆ ప్రాంతంలో తమ వాటాగా వచ్చిన స్ధలాలకు మంచి రేట్లు వస్తాయని, అవి మొత్తం భూముల విలువ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని ఆశించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు అంటే రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అందచేయటం. అలా ఇచ్చినా తాము ఆశించిన మేరకు ధరలు రావన్నది రైతుల అసలు ఆందోళన. దీనికి తోడు పేదలకు ఇండ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్ధలాలు కేటాయిస్తే తమ భూములకు డిమాండ్‌ పడిపోతుందని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
ఇప్పటికీ బిజెపి నేతలు రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని, చేయాలనే తాము కోరుతున్నట్లు చెబుతుంటారు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదంటారు. వారితో కలసిన లేదా గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందున వారిని కలుపుకు ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో, ఏమి చెబుతారో చూద్దాం. వైసిపి నాయకులు కూడా రాజధాని రైతులకు న్యాయం చేస్తామనే చెబుతున్నారు. వారి ఆచరణ ఏమిటో చూడాల్సి ఉంది.