Tags
#Anemia Capital India, Anemia, India Health Matters, Narendra Modi Failures, NFHS -6, Poshan failure, Public Health
ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాలలో సూచికల్లో మనదేశ స్థానాలను వెల్లడించినపుడు అవి సమగ్రమైనవి కాదని,తాజా వివరాలను పరిగణనలోకి తీసుకోకుండా మోడీ సర్కార్‌ను బదనాం చేసేందుకు చేస్తున్న ప్రచారమని బిజెపి నేతలు చెబుతుంటారు. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకోవటం కొంతకాలమే సాగుతుంది. నిజానికి ఏ సూచికలనైనా మనదేశం వెల్లడించే సమాచారాన్నుంచే విశ్లేషణలు చేసి రూపొందిస్తారు. ఏ సంస్థాకూడా తానుగా సర్వే చేయదు. అసలు అలాంటి వివరాలను మన సర్కారే సేకరించకపోతే ! మన సర్వేను మనమే నమ్మకపోతే !! అసలు సూచికలే ఉండవు – వైఫల్యాల గురించి చర్చా ఉండదు.కాషాయ దళాల చావు తెలివితేటలు.తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో దేశంలో రక్తహీనత సమస్య గురించి వివరాలనే సేకరించకుండా ప్రశ ్నల జాబితా నుంచి మోడీ సర్కార్ ఎత్తివేసింది.అంతకు ముందున్న వివరాలను ఎవరైనా చెబితే అవి పాతవంటూ బుకాయించటానికి వేసిన ఎత్తుగడ ఇది.గుండెలు తీసిన బంట్లు అంటూ కథలు చదువుకున్నాం గానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.అసలు విషయానికి వస్తే 2023-24 సంవత్సరాలలో జాతీయ సర్వే జరిపారు. అంతకు ముందు సర్వేల్లో రక్తహీనతను గుర్తించేందుకు అనుసరించిన పద్దతివలన తప్పులు దొర్లాయనీ, ఎక్కువగా ఉన్నట్లు చూపాయంటూ తాజా సర్వేలో ప్రశ్నావళి నుంచి గుట్టుచప్పుడు కాకుండా కేంద్రం తొలగించింది. గతంలో వేళ్ల నుంచి రక్తం సేకరించేవారు, దానికి బదులు రక్త నాళాల నుంచి సేకరించి పరీక్షిస్తే సరైన వివరాలు వస్తాయని చెప్పారు, పోనీ ఆ పని కూడా చేయకుండా అసలు పరీక్షలనే ఎత్తివేయాల్సిన అవసరం ఏముంది ? కొత్త పద్దతికి ఏమైనా లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతాయా ! అడిగేవారు కొందరు ఉన్నా సమాధానం చెప్పే జవాబుదారీ తనం లేదు. కేంద్రం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు పొందటం కోసం పోషణ యాప్‌లో పోషకాహార లోపం సమచారాన్ని తక్కువ చేసి నమోదు చేయాలని మహారాష్ట్ర బిజెపి సర్కార్ అక్కడి స్కీము వర్కర్లను వత్తిడి చేసిందంటే అసలు ప్రభుత్వం సేకరించే, ప్రకటించే సమాచారం మీదనే అనుమానం వస్తున్నది.బహిరంగ మలవిసర్జన పూర్తిగా నివారించటంలో విజయం సాధించామని చెప్పుకున్న నరేంద్రమోడీ సర్కార్ విజయగానం వాస్తవం కాదని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇంకా మరికొన్ని పథకాల బండారం కూడా బయటపడింది. ఆ సమాచారాన్ని సవరించాలన్న ప్రభుత్వ వత్తిడికి తలొగ్గని సర్వే నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ డైరెక్టర్ కెఎస్ జేమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టించింది, అందుకు కుంటిసాకులు చెప్పింది.
రక్తహీనతకు మనదేశాన్ని ప్రపంచ రాజధాని అని పిలుస్తుంటారు.నరేంద్రమోడీ గొప్పగా దేశానికే ఆదర్శం గుజరాత్ నమూనా అని చెప్పిన దాని తరువాతే ఈ విషయంలో మరో రాష్ట్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది.నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు ఒక ఆదర్శరాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకొని అదే విధంగా యావత్ దేశాన్ని గుజరాత్ తరహలో తీర్చిదిద్దుతానని 2014 ఎన్నికల్లో వాగ్దానం చేశారు. తరువాత ఎప్పుడైనా దాని గురించి ప్రస్తావించారా ? అలాంటి రాష్ట్రంలో రక్తహీనత గురించి మాట్లాడుకున్న తరువాతే తాజా కుటుంబ ఆరోగ్య సర్వే అంశాలను చెప్పుకుందాం. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం సర్వే-5(2019-21) ప్రకారం దేశంలో, గుజరాత్ రక్తహీనత వివరాలు శాతాలలో ఇలా ఉన్నాయి.
వయస్సు ××××××××× దేశం×××× గుజరాత్×× ప్రపంచ సగటు
6-59 నెలల పిల్లలు××× 67.1 ××× 79.7 ××× 39.8
15-19 ఏండ్ల బాలికలు× 59.1 ××× 69.0 ×××××××
15-49 గర్భిణులు ××× 52.2 ××× 62.6 ××× 35.5
బిజెపి గొప్పగా చెప్పుకున్న మోడీ, తదనంతర పాలనలో గుజరాత్‌లో సమస్య పెరిగినట్లు మిగిలిన సర్వేలన్నీ చెప్పాయి తప్ప కనీసం, స్థిరంగా కూడా లేదు.దేశంలో కూడా అదే స్థితి. పిల్లలు, తరుణవయస్సువారిలో చైనాలో కేవలం 6.6శాతమే ఈ సమస్యతో ఉన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ముక్త భారత్ మీద ఉన్న శ్రద్ద బిజెపికి ప్రజారోగ్యం మీద లేదు. 2025నాటికి రక్తహీనత ముక్త భారత్ అని ప్రకటించారు.అది కూడా మోడీ అధికారానికి వచ్చిన నాలుగేండ్ల తరువాత గానీ గుర్తుకు రాలేదు. తగ్గింపు లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. నిజానికి ఈ సమస్య మీద గతంలో పాలన వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోలేదు.1970లోనే ఎన్‌ఏపిపి కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదున్నర దశాబ్దాలు గడచినా పరిస్థితి తీవ్రంగానే ఉంది.ఇప్పుడసలు తాజా సమాచారమే లేకుండా చేశారు.రక్తహీనత ఆడపిల్లలు,మహిళ్లలోనే ఎక్కువ. మోడీ బేటీ బచావో నినాదం తీరు ఇది. రక్తహీనత ముక్త భారత్‌ను 2025నాటికే సాధిస్తామన్న పెద్దలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న 2030కైనా నెరవేరుస్తారా అంటే 2029 ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలా అనే యావతప్ప మిగతా అంశాలు పట్టించుకోలేదు గనుక ఎన్ని దశబ్దాలు పడుతుందో ఎవరు పుణ్యం కట్టుకుంటారో తెలియదు.
తాజా జాతీయ కుటుంబ,ఆరోగ్య సర్వేను దేశమంతటా 715జిల్లాలలో, 6.79లక్షల కుటుంబాల్లో నిర్వహించారు.ఆసుపత్రుల్లో ప్రసవాలు అంతకు ముందు సర్వేతో పోలిస్తే 88.6 నుంచి 90.6శాతానికి పెరిగాయి.మొత్తం జననాల రేటు అంతర్జాతీయంగా ఆమోదించిన 2.1కంటే తక్కువగా 2.0 ఉంది.పిల్లల్లో 95.6శాతం మందికి టీకాలు వేశారు.సిజేరియన్ ఆపరేషన్లతో జరిగే జననాల రేటు 21.5 నుంచి 27.2శాతానికి పెరిగింది. తల్లిపాలు ఇచ్చే శాతం ఇప్పటికీ ఎక్కువగా ఉన్నప్పటికీ మూడోవంతు మంది పిల్లలకు వారు పెరగాల్సిన వయస్సులో అవసరమైన ఘన ఆహారం అందటం లేదు.ఆరు-ఎనిమిది నెలల వయస్సు ఉన్న వారికి తల్లిపాలతో సహా 40.5శాతం మందికి ఘన ఆహారం అందటం లేదు.గర్భిణులకు 180రోజుల పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ పోషకాలు అందాల్సి ఉండగా కేవలం 37.8శాతం మందికి మాత్రమే అందుతున్నాయి. అంగన్‌వాడీ, పోషన్ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ పరిస్థితి ఇది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఎన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12.9శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు అందటం లేదు.ఆయుష్మాన్ భారత్ బీమా 39.8శాతం మందికి అందుబాటులో లేదు. ఇదే విధంగా 40శాతం మందికి వంటగ్యాస్ అందుబాటులో లేదు, కాలుష్యకారక వంట చెరకుతోనే వారు గడుపుతున్నారు. (రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో ఇటీవల బీహార్ వలస కూలీల కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులు సమీపంలోని వంట చెరకు తెస్తూ రైలు ఢకొీని మరణించిన ఉదంతం సమస్యకు అద్దంపడుతున్నది.) ఒక వైపు పోషకాహారం అందక అనేక మందికి జబ్బులు వస్తుండగా కొంత మందికి ఊబకాయంతో వచ్చే సమస్యలు పెరగటంతో రెండు భారతాలు దర్శనమిస్తున్నాయి. స్త్రీ, పురుషులిద్దరిలో ఊబకాయాలు పెరుగుతున్నట్లు మహిళల్లో ఈ సంఖ్య 21.6, పురుషుల్లో 20.4కోట్లుగా ఉన్నట్లు సర్వే సర్వే వెల్లడించింది. గర్భిణులైన వారిలో కూడా ఊబకాయం పెరగటానికి పోషకాహారం తగినంతగా లేకపోవటమే. ఇది ఆందోళనకర పరిణామం.దీనితో పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం,మధుమేహం పెరగటం కూడా వెల్లడైంది. ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న అంటు వ్యాధులు కాని ఈ జబ్బులతో జనాల జేబులకు చిల్లుపడుతున్నది, ఆర్థికంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ నష్టమే అయినప్పటికీ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.చిత్రం ఏమిటంటే ఊబకాయాలతో పాటు స్త్రీ పురుషులలో 20శాతం మంది ఉండాల్సినదానికంటే తక్కువ బరువు ఉన్నట్లు తేలింది. ఒకవైపు ఈ సమస్య పరిష్కారం కాకుండానే అధిక బరువు సంక్షోభం ముంచుకువస్తోంది.దేశ ఆర్థిక వ్యవస్థకు రెండూ నష్టమే. పన్నేండ్ల మోడీ పాలనలో తగినంత ఆహారం లేకపోవటంతో పాటు అది పుష్టికరంగా లేదని ఈ సర్వే వెల్లడించింది.దీనికి కూడా మహాత్మా గాంధీ, నెహ్రూలే కారణం అని తప్పించుకోవటం కుదరదు.
బిడ్డ పుట్టిన ఆరునెలల వరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని చెబుతున్నారు, అప్పటి నుంచి పరిమిత ఘన ఆహారం అందచేస్తే 6-23నెలల పిల్లలు పుష్టిగా ఎదుగుతారు. రోజుకు మూడు సార్లు అలాంటి ఆహారం అందుతున్న పిల్లలు కేవలం 15.3శాతమే ఉన్నారని జాతీయ ఆరోగ్య ఆరవ సర్వే తేల్చింది.అంతకు ముందుతో పోలిస్తే ఈ సంఖ్య మెరుగని సంతృప్తిపడితే అంతే సంగతులు. ఇలాంటి పిల్లలు తరువాత కాలంలోనే అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పురుషుల కంటే మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువ జరుగుతున్నట్లు తేలటం కూడా ఆందోళన కలిగించే అంశమే. గతంతో పోలిస్తే ఆరోగ్య బీమా చేయించుకున్నవారు పెరిగినప్పటికీ వైద్యం కోసం జేబుల నుంచి చేస్తున్న ఖర్చు ఈ సర్వే కాలంలో 43.4శాతం పెరిగింది, అంతకు ముందు 39.4శాతమే ఉంది. అందుకే ఆసుపత్రుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ ఆపరేషన్లు 54.1శాతం ఉండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.9శాతమే, అంటే డబ్బుకోసమే ప్రైవేటు ఆసుపత్రులు లబ్ది పొందేందుకు ఈ పని చేస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు.శుభ ముహార్తాల్లో పిల్లలను కనాలనే ఒక మూఢనమ్మకం పెరగటం కూడా దీనికి ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదాని ప్రకారం మొత్తం కాన్పుల్లో సిజేరియన్లు 10-15శాతం మధ్య ఉండాలి.ప్రైవేటు ఆసుపత్రుల్లో అసోంలో అత్యధికంగా 81.4శాతం జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 39శాతం, ప్రైవేటులో 42.5శాతం మాత్రమే ఉన్నాయి. ఆదర్శపాలన అందించారని చెబుతున్న నితీష్ కుమార్ పాలనలో బీహార్‌లో పదేండ్లుగా సారా నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ గత సర్వేతో పోలిస్తే ఈసారి పెరిగి తాగుబోతుల సంఖ్య 18.9శాతంగా ఉంది. ఆరు-23నెలల మధ్య ఉన్న పిల్లలకు పోషకాహారం అందటంలో జాతీయ సగటు కంటే తక్కువగా బీహార్‌లో 11.9శాతమే ఉన్నారు. ఇదీ ఆదర్శవంతమైన పాలన అందించిన నితీష్ కుమార్ ఏలుబడి తీరు, అందువలన అభివృద్ధి అంటే ఏమిటి, ఏం ఒరగబెట్టారని ప్రశ్నించుకోవాలి.
