Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.భారత చక్రవర్తి నరేంద్రమోడీకి భజన చేసేందుకు ఏ అవకావశాన్నీ వదలం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ రాజు చంద్రబాబు నాయుడు, యువరాజు లోకేష్‌ నాయుడు, సామంత రాజు పవన్‌ కల్యాణ్‌. పెట్రోలు,డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం లీటరుకు పది రూపాయల చొప్పున ఎక్సయిజ్‌ డ్యూటీ తగ్గించిందన్న వార్త రాగానే ముగ్గురూ మోడీని అభినందించారు. ఎందుకటా ! వినియోగదారులకు ధర తగ్గించినందుకు కాదు, పెంచనందుకు అన్నది వారి స్పందనల సారం. పూర్వం రాజుల కాలంలో రాజుగారు ఏది చేసినా గొప్పదే అని పొగిడే భట్రాజుల(కులం గురించి కాదు)ను వారు గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. భట్రాజులకు రాజులు, రంగప్పలు నజరానా ఇచ్చేవారు, కేంద్రం ఇస్తున్నది వడ్డీలకే చాలటం లేదని చంద్రబాబు నాయుడు మంత్రులతో అన్నట్లు లీకు వార్తలు. ఈ పూర్వరంగంలో మోడీని పొగిడినందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా ఒరగబెడతారా ? వ్రతం చెడ్డా ఫలం దక్కదా ! చూద్దాం. కొసమెరుపు ఏమంటే నరేంద్రమోడీని పొగడటంలో పోటీపడే వైసిపి నేత జగన్‌మోహనరెడ్డి ఈ విషయంలో వెనుకబడినట్లు కనిపిస్తున్నది, స్పందన కనిపించలేదు, వినిపించలేదు. ఇక్కడ ఒక్క సందేహం. చంద్రబాబు సిఎం, పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి, మరి మోడీని పొగడటంలో మంత్రిలోకేష్‌ పాత్ర ఏమిటి ? పలుకుబడి, ప్రతిష్ట పెంచేకసరత్తులో భాగమా ? మిగిలిన మంత్రులు ఎందుకు స్పందించలేదు.ఎవరికి తోచింది వారు అనుకొనే స్వేచ్చ ఉంది గనుక వదిలేద్దాం !చిత్రం ఏమిటంటే వినియోగదారుల మీద విపరీత భారం మోపినపుడు చంద్రబాబు అండ్‌ కో మౌనంగా ఉండి ఇప్పుడు ఏదో ఒరగబెట్టినట్లు భజన చేశారు. ?ఏమి రాజకీయంరా నాయనా ! అసలు నరేంద్రమోడీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు ?

ఎక్సయిజ్‌ పన్ను తగ్గింపు వార్త వినగానే శ్రీరామనవమి వేడుకల్లో ఉన్న జనం ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెరుగుతాయని మానసికంగా సిద్ధం అయిపోయిన వారు నిజమేనా మోడీ సర్కార్‌ ఇంత మేలు చేసిందా అని కాళ్లు చేతులు గిల్లుకున్నారు, తలలు కొట్టుకున్నారు.చర్మాలు స్పందించటంతో రామా ఇలా కరుణించావా అని సంబరపడ్డారు. అయితే బంకుల వద్దకు వెళ్లగానే ఆ ” తగ్గింపు ” అంబానీ, నయారా వంటి ప్రైవేటు కంపెనీలతో బాటు కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప వినియోగదారులకు కాదని తెలియగానేే చల్లబడిపోయారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గదాడుల కారణంగా తలెత్తిన సంక్షోభంతో ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. ఆ పేరుతో నయారా అనే ప్రైవేటు కంపెనీ పెట్రోలు మీద లీటరుకు ఐదు, డీజిలు మీద మూడు రూపాయల చొప్పన ధర పెంచింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం పవర్‌ పెట్రోలు ధర లీటరుకు రు.2.36వరకు పరిశ్రమల్లో ఉపయోగించే డీజిల్‌ ధరను 22 రూపాయలు పెంచింది. దిగుమతి ఖర్చు పెరిగినందున మన దేశంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు లీటరు పెట్రోలు మీద రు.18-20. డీజిలు మీద రు.30-35 నష్టం వస్తున్నదని చెబుతున్నారు. (అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమైనపుడు వాటికి ఎంత లాభవచ్చిందో చెప్పరు) అందువలన వాటికి ఉపశమనం కలిగించేందుకు మోడీ పూనుకున్నారు. ప్రత్యేక ఎక్సయిజ్‌ డ్యూటీని పెట్రోలు మీద రు.13ను మూడుకు తగ్గించగా, డీజిల్‌ మీద పదిరూపాయలను పూర్తిగా ఎత్తివేశారు.ఈ శ్రద్ధ కోట్లాది మంది వినియోగదారుల మీద లేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభం కాగానే వంటగ్యాస్‌ మీద గృహ వినియోగదారులకు అరవై రూపాయలు పెంచారు, ముష్టిగా విదుల్చుతున్న 40రూపాయల సబ్సిడీని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తివేశారు, అంటే వంద రూపాయల మేరకు వడ్డించారు.

అచ్చేదిన్‌ పేరుతో 2014లో అధికారానికి వచ్చిన మోడీ జనాలకు ఏదో ఒరగబెడతారని అందరూ ఆశించారు.అదనంగా అన్నవస్త్రాలు ఇస్తారనుకొంటే ఉన్న వస్త్రాలను లాగేసుకున్నట్లు కొత్తగా మేలు చేస్తారనుకుంటే డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదిల్చారు.ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేశారు. మేలు సంగతి తరువాత భారం ఎలా మోపారో చూద్దాం. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం చమురు రంగం నుంచి ఎక్సైజ్‌ డ్యూటీ రాబడి రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26 తొలి ఆరునెలల్లో రు.1.30వేల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అసలు సిసలు ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40,(దీన్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంది) ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 వసూలు చేస్తున్నారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు రు.13లో పది రూపాయలు తగ్గించినప్పటికీ అది వినియోగదారులకు చేరటం లేదు. సాధారణ డీజిల్‌పై పదహారు రూపాయల బాదుడులో పది రూపాయలు రద్దు చేశారు. అయినా వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గలేదు. అంటే చమురు మార్కెట్‌ కంపెనీలు పది రూపాయల మేరకు ధరలను పెంచినట్లే.ఈ మాత్రానికే మోడీకి భజన చేయాలా ?

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం తగ్గిన ఆదాయలోటును ఎలా సర్దుబాటు చేయనుంది ?బడ్జెట్‌లో సంక్షేమ పధకాల కేటాయింపులకు కోత పెట్టటం లేదా ఏదో ఒకసాకుతో జిఎస్‌టి, సెస్‌ల పెంపుదలకు పూనుకోవాల్సి ఉంటుంది. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు.చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.అధికారులెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నట్లు ? ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంటే ఏడాదికి రు.1.68లక్షల కోట్లు. మోడీ సర్కార్‌ వంచన గురించి చెప్పుకోకపోతే జనాలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత మార్చినెల 25వ తేదీ వరకు ఉన్న కొనుగోలు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఈ వివరాలు ఏ కమ్యూనిస్టులో, కాంగ్రెస్‌ వారో చెప్పినవి కాదు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. నాలుగేండ్ల పాటు జనాల నుంచి లక్షల కోట్లు అదనంగా వసూలు చేసి ఖజానా నింపుకొని అదానీ, అంబానీ వంటి వారికి సబ్సిడీలు రూపంలో కట్టబెట్టారు, పారుబాకీల పేరుతో లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారు.ఇప్పుడు ధరలు పెరిగి ఒక నెల రోజులు కూడా గడవక ముందే చమురు కంపెనీల కోసం నడుంకట్టారు. మోడీ మీద తెలుగుదేశం, జనసేన, వైసిపి వంటి పార్టీలకు ఉన్న మోజు తెలిసిందే. అది ఎంత ఉన్నా జనాన్ని ఇలా చావబాదుతుంటే పల్లెత్తు విమర్శ చేయలేదు.అఫ్‌ కోర్స్‌ జనానికి కూడా ఆ మత్తు వదలలేదు అన్నది నిజం. ఇతర సందర్భాలలో మాట్లాడినపుడు బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు అంటారు. కానీ ఆచరణలో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేసినట్లు కనిపించటం లేదా ?

దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ గుండెలు బాదుకుంటారు. దీనికి రూపాయి విలువపతనాన్ని అరికట్టటంలో వైఫల్యం లేదా ? మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 94చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ అని చెప్పక తప్పదు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇప్పుడు ఇంకా దిగజారింది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్ని కలసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే. ఇలాంటివారు ఆత్మనిర్భరత, వికసిత్‌ భారత్‌ పేరుతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతుంటే జనం చెవుల్లో పూలు పెట్టుకొని తలలు ఊపాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని నాలుగేండ్లు ఎందుకు పక్కన పెట్టారో ఇప్పుడు తిరిగి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ?

రాజకీయనేతలను కాసేపు పక్కన పెడదాం. వారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని తెలిసిన జనంలో అసలు ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? నిజంగానే ఈ ధోరణి గురించి పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలు వారికి పట్టవు. పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది. మంచి రోజులను(అచ్చేదిన్‌) తెస్తామంటే జనం నమ్మారు. ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించినపుడు జనం నిజమే కదా నిజమే కదా అనుకున్నారు. 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీసినమాట నిజం. తరువాత చంద్రబాబును వదలి వేశారు.నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మాత్రమే 2024 ఎన్నికల వరకు అది జనం సమస్యలైనా, జగన్‌ వ్యవహారశైలినైనా నిలదీశారు, తాటవలిచారు. ఇప్పుడు తత్వం తలకెక్కింది గనుక మౌన దీక్ష పట్టారు. అక్రమం జరుగుతుంటే మౌనంగా ఉండమని సనాతనం కూడా ఎక్కడా చెప్పలేదు.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినట్లు తెలియగానే ఎవరైనా వెంటనే దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, తక్కువ మొత్తమే అని తెలిస్తే పోనీలే అని ఊపిరి పీల్చుకుంటాం.అదే కేంద్ర ప్రభుత్వమైనా మరొకరైనా చమురు పన్ను పేరుతో మన పర్సుకొట్టేస్తున్నపుడు ఎంత పోగొట్టుకున్నాం అని ఆలోచించాలా వద్దా ? అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాకపోతే వదిలేద్దాం !