ఆగని ఇజ్రాయెల్‌ దుర్మార్గం : గాజాలో కాల్పుల విరమణ, పశ్చిమ గట్టులో దాడులు !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు


గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన పదిహేను నెలల మారణకాండ తరువాత జరిగిన ఒప్పందంతో ప్రస్తుతానికి అది ఆగిపోయింది. దీంతో అటు పాలస్తీనియన్లు, ఇటు ఇజ్రాయెలీలు ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఉపశమనం ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల దగ్గరే తెలుస్తుందంటారు.ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత గాజాలో రాఫా ప్రాంతంలో ఒక బాలుడితో సహా ముగ్గుర్ని ఇజ్రాయెలీ దళాలు కాల్చిచంపాయి. పాలస్తీనాలోని మరో ప్రాంతమైన పశ్చిమ గట్టు జెరూసలెం నగర పరిసరాల్లోని గ్రామాల్లో దురాక్రమణదారులుగా ఉన్న ఇజ్రాయెలీలు తమ మిలిటరీ కనుసన్నలలో పాలస్తీనియన్ల మీద దాడులకు తెగబడ్డారు. జెనిన్‌ పట్టణంలో మిలిటరీ జరిపిన దాడుల్లో పది మంది మరణించగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.పశ్చిమగట్టుపై ఇజ్రాయెల్‌ ఆధిపత్యం దేవుడిచ్చిన హక్కు అని ఐరాసలో ట్రంప్‌ కొత్తగా నియమించిన రాయబారి ఎల్సీ స్టెఫానిక్‌ అనటాన్ని బట్టి రానున్న రోజుల్లో దాడుల కేంద్రీకరణ ఆ ప్రాంతానికి మారనుందన్నది స్పష్టం. పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికార హక్కు లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె ఇజ్రాయెల్‌కు హక్కుందన్నారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని తాను చెప్పలేనని ట్రంప్‌ స్వయంగా చెప్పటాన్ని బట్టి అమెరికాకు చిత్తశుద్ది లేదనేందుకు నిదర్శనం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందంతో ఎవరూ పండుగ చేసుకోవటం లేదు. గాజాలో మంగళవారం నాడు భవనాల శిధిలాల కింద 120 శవాలు దొరికాయి. పాలస్తీనియన్లకు రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి యూదు మూకలదాడుల్లో ప్రాణాలు అర్పించటం లేదా మాతృభూమి కోసం తెగబడి ప్రతిఘటించటం. ఏడు దశాబ్దాలుగా జరుగుతున్నదిదే. అదే ఇజ్రాయెలీలను చూస్తే వారికి ప్రాణ భయం లేకున్నా, ఎటువైపు ఎవరు దాడి చేస్తారో అన్నభయంతో బతుకులీడుస్తున్నారు. సైరన్ల మోతలు వినిపిస్తే చాలు సొరంగాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గాజాలో 47,105 మందిని చంపివేశారు. వీరిలో 80శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు.మరో1,11,147 మందిని గాయపరిచారు. అరవైశాతం భవనాలను నేలమట్టం చేశారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు, వైద్య సంస్థల ధ్వంసంతో అనారోగ్యంపాలై మరణించిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒప్పందం మూడు దశల్లో అమలు జరుగుతుంది.హమస్‌ వద్ద ఉన్న బందీలు, ఇజ్రాయెల్‌ వద్ద ఉన్న నిర్బంధితుల విడుదల తరువాత గాజా పరిస్థితి అజెండాలోకి రానుంది.రెండవ దశలో ఇజ్రాయెల్‌ సైన్యం పూర్తిగా గాజా నుంచి వైదొలగటం, నిరాశ్రయులైన వారిని స్వస్థలాలకు రప్పించటం, బందీలు`ఖైదీలను పూర్తిగా విడుదల చేయటం, మూడవ దశలో హమస్‌ చేతుల్లో బందీలుగా ఉండి మరణించిన వారి మృతదేహాల అప్పగింత ఇతర అంశాలు ఉంటాయి. ఈ ఒప్పందం గురించి ఎవరికి ఉండే అనుమానాలు వారికి ఉన్నప్పటికీ అంగీకారం మేరకు ఆదివారం నుంచి అమలు ప్రారంభమైంది.


నిర్ణీత గడువులోగా హమస్‌ విడుదల చేసే ముగ్గురు బందీల పేర్లు చెప్పలేదంటూ కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటికీ రెండు గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరిపి 19 మంది ప్రాణాలు తీసి 36 మందిని గాయపరిచిందంటే ఏ చిన్న సాకుదొరికినా మాట తప్పేందుకు పూనుకుంటుందన్న అనుమానం తలెత్తింది. ఆదివారం నాడు బందీలలోని ముగ్గురు మహిళలను హమస్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు అప్పగించింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 90మంది పాలస్తీనియన్లను వదలి పెట్టింది. తదుపరి 25వ తేదీ(శుక్రవారం నాడు) మరో నలుగురు మహిళలను అప్పగించనుంది. ఒక్కో బందీకి 30 లేదా 50 మంది పాలస్తీనియన్లను విడుదల చేయవచ్చని వార్తలు వచ్చాయి. మొత్తం 33 మంది బందీలు, వెయ్యికిపైగా నిర్బంధితుల విడుదల ఆరువారాల ప్రక్రియ సాఫీగా ముగిసిన తరువాత రెండవ దశ అమల్లోకి వస్తుంది. ఎవరెన్ని భాష్యాలు చెప్పినప్పటికీ కొన్ని వాస్తవాలను ఎవరూ మూసిపెట్టలేరు. ఇజ్రాయెల్‌ డేగకన్ను కప్పి హమస్‌ సాయుధులు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌ భూభాగంలో ప్రవేశించి 2023 అక్టోబరు ఏడు రాత్రి జరిపిన దాడుల్లో 1,139 మరణించారు, 200 మందిని బందీలుగా పట్టుకున్నారు. దానికి ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ మరుక్షణం నుంచి 2025 జనవరి 19వ తేదీ వరకు మారణకాండ జరుపుతూనే ఉంది. హమస్‌ దాడులను ఎవరూ సమర్ధించలేదు, కానీ ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని మానవహక్కులు, మానవత్వం గురించి నిత్యం పారాయణం చేసే పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా సమర్ధించాయి, అమెరికా అయితే గాజాను ధ్వంసం చేసేందుకు సామూహికంగా జనాన్ని చంపేందుకు రెండువేల పౌండ్ల బరువుండే భారీ బాంబులను కూడా సరఫరా చేస్తామని చెప్పింది.

ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘా, ప్రత్యర్థులను మట్టుబెట్టే పరిజ్ఞానం ఇజ్రాయెల్‌ సొంతం అని ఎంతో మంది చెబుతారు. అయితే గాజా, హమస్‌ విషయంలో అది వాస్తవం కాదని పదిహేను నెలల పరిణామాలు రుజువు చేశాయి. హమస్‌ వద్ద ఆధునిక ఆయుధాలు లేవన్నది బహిరంగ రహస్యం. వారికి ఉన్నది జనబలం, ఆదరణ మాత్రమే.ఎక్కడ ఉంటారో,ఎవరు సాయుధుడో, ఎవరు సాధారణ పౌరుడో గుర్తించలేనంతగా మమేకం అయ్యారు. ప్రతి ఒక్కరూ పౌరుడే, అవసరమైపుడు సాయధుడే. వ్యూహం ఎప్పటికప్పుడు మార్చుకోగలిగిన నేర్పరితనాన్ని బతుకుపోరు నేర్పింది. అందుకే ఇజ్రాయెల్‌ మిలిటరీ సామూహిక మారణకాండ, విధ్వంసకాండకు పాల్పడిరది. ఆసుపత్రులు, స్కూళ్ల భవనాలను నేలమట్టం గావించింది. సొరంగాల్లో ఉన్నారంటూ వాటిని ఉప్పునీటితో నింపింది. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాలిచ్చిన ఆధునిక ఆయుధాలు హమస్‌ ముందు పనికి రాకుండా పోయాయి. అణుబాంబు వేస్తే పీడాపోతుందని ఇజ్రాయెల్‌ మంత్రి ఎలియాహు అనేవాడు పదే పదే డిమాండ్‌ చేశాడంటే ప్రతిఘటన వారిని ఎంతగా కలవరపెట్టిందో అర్ధం చేసుకోవచ్చు. అదిగో హమస్‌ను మట్టుపెడతాం ఇదిగో అంటూ కబుర్లు చెప్పారు. బేషరతుగా లొంగిపోతేనే దాడులను విరమిస్తామన్నారు, ఏదీ జరగలేదు. బలవంతుడైన సర్పము చలి చీమల చేత చిక్కి చచ్చిన పరిస్థితి వచ్చింది. వివరాలు రాకుండా మూసిపెట్టారు గానీ ఇజ్రాయెల్‌ ఉనికిలోకి వచ్చిన 1948 తరువాత అరబ్బులతో జరిపిన యుద్ధాలలో దేనిలోనూ చవి చూడని నష్టాలను పదిహేను నెలల గాజా ఊచకోతలో సంభవించినట్లు చెబుతున్నారు. ఒక వైపు హమస్‌, దానికి మద్దతుగా లెబనాన్‌లో హిజబుల్లా, ఎమెన్‌లో అన్సర్‌ అల్లా సాయుధులు జరిపిన దాడులు ఇజ్రాయెల్‌ మిలిటరీని ఉక్కిరిబిక్కిరి చేశాయి, ఆర్థికంగా ఎంతో నష్టపరిచాయి. అందుకే చివరకు కతార్‌ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించకతప్పలేదు. అనేక ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ హమస్‌ రానున్న రోజుల్లో మరింతగా బలపడుతుందని విశ్లేషిస్తున్నారు.నిజానికి ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోని అంశాలను గతేడాది మే నెలలోనే ప్రతిపాదించినపుడు హమస్‌ అంగీకరించినా ఇజ్రాయెల్‌ ముందుకు రాలేదు. అమెరికా కూడా వత్తిడి చేసినట్లు నాటకమాడిరది తప్ప చేసిందేమీ లేదు. మొత్తంగా చూసినపుడు ఇజ్రాయెల్‌ లొంగుబాటునే ప్రపంచం ఎక్కువగా చూస్తున్నది. తమ మిలిటరీ నాయకత్వం గురించి ఎన్నో భ్రమలు పెట్టుకున్న సాధారణ ఇజ్రయెలీ పౌరుల్లో తాజా పరిణామాలను చూసిన తరువాత కలచెదిరిందని వేరే చెప్పనవసరం లేదు.


ఒప్పందం గురించి జో బైడెన్‌ మాట్లాడుతూ తాను గతేడాది ప్రతిపాదించిన అంశాలను ఆ నాడు భద్రతా మండలి కూడా ఆమోదించిందని, తాజా ఒప్పందం కూడా అదే మాదిరి ఉందని పేర్కొన్నాడు.కానీ ఇదే పెద్ద మనిషి ఐదు సార్లు అదే భద్రతా మండలిలో కాల్పుల విరణమణ ప్రతిపాదనలపై ఒకటి కాదు ఐదుసార్లు వీటో ప్రయోగించిన అంశం దాస్తే దాగేది కాదు. తన కారణంగానే ఒప్పందం జరిగిందని చెప్పుకుంటున్నాడు. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ ఖ్యాతి పూర్తిగా తనదే అన్నాడు. తాను విజయం సాధించిన తరువాతే ఈ పరిణామాలు జరిగినందున తన ప్రభావమే పని చేసిందని చెప్పుకుంటున్నాడు. ఏడాది పాటు బైడెన్‌ చేయలేని దానిని ఒక్క భేటీతో తమ ప్రతినిధి సాధించినట్లు అతగాడి శిబిరం వర్ణించింది. దీన్లో ఎవరి వాటా ఎంత అన్నది పక్కన పెడితే గుణపాఠాలు ఏం తీసుకుంటారన్నది ప్రశ్న.

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరటాన్ని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టుపార్టీ స్వాగతించింది. ప్రారంభం నుంచి ఖైదీలు, అపహరణకు గురైన వారు, నిర్బంధితులు, బందీలు ప్రతి ఒక్కరినీ వదలి పెట్టే విధంగా ఒప్పందం కుదరాలని తాము కోరుకున్నట్లు తెలిపింది. అలాంటి ఒప్పందంతో వేలాది మంది పాలస్తీనియన్ల, వందలాది మంది ఇజ్రాయెలీల ప్రాణాలు నిలుస్తాయని పేర్కొన్నది.ఈ ఒప్పందంతోనే తాము సంతృప్తి చెందటం లేదని, ఆక్రమణ, దిగ్బంధనాలకు స్వస్తి పలుకుతూ పాలస్తీనియన్ల స్వయం పాలిత హక్కు, ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా సంప్రదింపులు కొనసాగాలని కోరింది. తక్షణ లక్ష్యంగా గాజా ప్రాంత పునర్‌నిర్మాణం ఉండాలని, యావత్‌ ప్రపంచం ఆ బాధ్యత తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది.ఒప్పందంలో మిగిలిన వ్యవధిలో లేదా ఖైదీల మార్పిడి ముగిసిన తరువాత మారణకాండను ప్రారంభించకుండా ఇజ్రాయెల్‌లోని మితవాద ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ఇజ్రాయెల్‌లోని పాలస్తీనియన్ల మీద దాడులను తీవ్రం గావించేందుకు, పశ్చిమగట్టు ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉందని కమ్యూనిస్టులు హెచ్చరించారు. శాంతి తప్ప మిలిటరీతో సమస్య పరిష్కారం కాదని భయంకరమైన, దీర్ఘకాలం సాగిన పోరు మరోసారి రుజువు చేసిందని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది.

హమస్‌తో ఒప్పందానికి అంగీకరించినందుకు పలుకుబడి కలిగిన మద్దతుదార్లను నెతన్యాహు కోల్పోయినప్పటికీ తక్షణమే పదవికి ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. ఏడాది పాటు ఒప్పందాన్ని తిరస్కరించి ఇప్పుడు సాధించిందేమిటని ప్రత్యర్ధులు నిలదీస్తున్నారు.హమస్‌కు నెతన్యాహు ప్రభుత్వం పూర్తిగా దాసోహమన్నదని ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా మంత్రి ఇత్మార్‌ బెన్‌ జివిర్‌ ధ్వజమెత్తాడు. అది లొంగుబాటు ఒప్పందమన్నాడు. ఏడాది పాటు ఈ ప్రతిపాదనలను తాను అడ్డుకున్నట్లు చెప్పాడు, దాన్ని అమలు చేస్తే తమ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందన్నాడు. మొదటి దశ అమలు తరువాత గాజాపై యుద్ధాన్ని కొనసాగించకపోతే తాము కూడా ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని మరో పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి స్మోట్‌ రిచ్‌ చెప్పాడు. వీరు వైదొలిగినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తారు గనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. డోనాల్డ్‌ ట్రంప్‌ పాలస్తీనియన్ల వ్యతిరేకి, ఇజ్రాయెల్‌ అనుకూల వాదులను తన యంత్రాంగంలోకి తీసుకున్నాడు. అయినప్పటికీ తన పదవీ స్వీకారానికి ఒక రోజు ముందే కాల్పుల విరమణ అమల్లోకి రావాలని ఆదేశించినట్లు వార్తలు. ఇజ్రాయెల్‌ పాలకులు అమెరికా కనుసన్నలలో పనిచేస్తారని వేరే చెప్పనవసరం లేదు.హమస్‌ను లొంగదీసుకోవటం సాధ్యం కాదని నెతన్యాహుకంటే అమెరికన్లకే బాగా తెలుసు గనుక ట్రంప్‌కు ఇష్టం లేకున్నా అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.దీన్ని చూపి ప్రపంచానికి పెద్ద శాంతిదూతగా కనిపించవచ్చు.గాజాలో ఏమైనప్పటికీ పశ్చిమ గట్టు ప్రాంతంలో ఆక్రమించుకున్న పాలస్తీనా ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు ట్రంప్‌ మద్దతు పొందాలన్నది ఇజ్రాయెల్‌ ఎత్తుగడ. జెరూసలెంలో తమ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో ట్రంప్‌ నిర్ణయించినపుడే అది తేటతెల్లమైంది. ఆమేరకు గతేడాది ఏర్పాటైంది. ఇప్పుడు ట్రంప్‌ ఏం చేస్తాడో తెలిసినప్పటికీ ఎలా చేస్తాడో చూడాల్సి ఉంది.

రైతు నేత దల్లేవాల్‌కు వైద్యం : ఫిబ్రవరి 14నచర్చలు ! మద్దతు ధరల చట్టబద్దతపై మోడీ దిగివచ్చేనా !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


నవంబరు 26వ తేదీ నుంచి రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చారాజకీయ రహిత సంస్థ కన్వీనర్‌ జగత్‌సింగ్‌ దల్లేవాల్‌ జనవరి 18వ తేదీ అర్ధరాత్రి వైద్య చికిత్సకు అంగీకరించారు, ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు తగిన చర్యలను ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన చండీఘర్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయ రహిత), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. ఏడు పదుల వయస్సున్న దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్న పూర్వరంగంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలని చర్చలు జరపటం, బిజెపికి కీలకమైన ఢల్లీి ఎన్నికలు, దల్లేవాల్‌కు మద్దతుగా మరో 121 మంది నిరవధిక దీక్షలకు పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వంపై రోజు రోజుకూ వత్తిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు దిగివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రైతుల గురించి మాట్లాడరు, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు సమయం లేదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.కోట్లాది మంది రైతుల గురించి చర్చించేందుకు సమయం లేదనటాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం అయింది. బడ్జెట్‌పై చర్చలంటూ రైతు ప్రతినిధులను మినహా మిగిలిన వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చలను జరిపింది. వీటన్నింటినీ చూసినపుడు వచ్చే నెలలో జరిగే చర్చల్లో ఒరిగేదేమిటి అన్నది పెద్ద ప్రశ్న.ఈనెల 31న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇతర సమస్యలతో పాటు రైతుల గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, గతంలో రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన వారికి పరిహారం, లఖింపూర్‌ ఖేరీ హింసా కాండ బాధితులకు న్యాయం,2013 భూసేకరణ పరిహార చట్ట పునరుద్దరణ,రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ముందు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వివిధ తరగతుల ప్రతినిధులతో చర్చలు జరపటం ఒక తంతుగా జరుగుతున్నది. అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లుగా ఏ పార్టీ చరిత్ర చూసినా గర్వకారణం ఏమీ లేదు. సంపదలలో పెద్ద పీట కార్పొరేట్‌ శక్తులకే వేస్తున్న కారణంగానే అసమానతలు ఏటేటా పెరుగుతున్నాయి. తంతుగా అయినా బడెట్‌ చర్చకు రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. కొంత మంది కొన్ని పోలికలు తెస్తున్నారు. వాటిలో ఉద్యోగులకు వేతన కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించిందిగానీ రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించటం లేదన్నది వాటిలో ఒకటి. దీనిలో రెండవది వాస్తవం, ఉద్యోగులకు పది సంవత్సరాల తరువాత వేతన కమిషన్‌ ఏర్పాటును దీనికి ముడి పెట్టనవసరం లేదు. పదేండ్లకు ఒకసారి వేతన సవరణ ద్వారా వారికి అన్యాయమే జరుగుతున్నది తప్ప న్యాయం కాదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, ఇతర అంశాల గురించి పరిశీలించేందుకు 2022 జూలైలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు అది ఏమి చేసిందో ఎవరికీ తెలియదు, వారు నివేదిక సమర్పించరు, ప్రభుత్వమూ అడగదు, అంతా ఒక నాటకంగా మారింది. ఈ లోగా 2021లో క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశంలో భూ కమతాలు పద్నాలుగు కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 88శాతం రెండున్నర ఎకరాల లోపు కలిగిన రైతులే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదంటూ వారందరినీ కార్పొరేట్లకు అప్పగించేందుకు తన బాధ్యతను వదిలించుకొనేందుకు కేంద్రం చూస్తున్నది.ఒకసారి అది జరిగితే రాష్ట్రాలు కూడా అదేబాట పడతాయి.పరిశ్రమలు, వాణిజ్యాలకు అనేక రక్షణలు, రాయితీలు ఉన్నాయి. వాటి మాదిరిగానే తమకూ కల్పించాలని రైతులు కోరటం గొంతెమ్మ కోర్కె కాదు. కనీస మద్దతు ధరను ఒక్క హక్కుగా చట్టబద్దం చేయాలని కోరుతున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకూ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తున్నది, పోనీ వ్యవసాయం ఉపాధి కల్పించటం లేదా పరిశ్రమలు, సేవారంగాల కంటే ఎక్కువ 44శాతం మందికి కల్పిస్తున్నది. సంఘటితంగా పోరాడే స్థితిలో వారు లేకపోవటం తప్ప మరొకటి కనిపించటం లేదు. మనకు అవసరమైన వంట నూనెల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఎన్నో రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం కానీ ఇక్కడ నూనె గింజలు పండిరచేవారికి ధరల గురించి ఒక హామీ ఇవ్వటానికి ముందుకు రావటం లేదు.మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తున్నది. గతేడాది సోయా, ఆవ రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువే పొందారు. మరోవైపున బియ్యం, గోధుమలు, ఉల్లి, పంచదార వంటి వాటి ఎగుమతుల మీద నిషేధం పెట్టి మార్కెట్లో రైతులకు అన్యాయం చేశారు. వినియోగదారులకు మేలు చేయటం అంటే రైతుల నోట్లో మట్టికొట్టటం కాదు కదా ! ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే తక్కువకు రైతుల నుంచి చెరకును మిల్లులు కొనుగోలు చేయకూడదు(అది గిట్టుబాటు కావటం లేదు). అదే మాదిరి ఇతర పంటలకు ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నది ? కనీస వేతన చట్టాన్ని అమలు జరపకపోతే కార్మికులు కోర్టులకు ఎక్కే హక్కు ఉంది, కానీ రైతులకు కనీస మద్దతు ధరలకు అలాంటి అవకాశం లేదు. దాదాపు పదిహేను కోట్ల మంది రైతులు ఉండగా వారిలో తొమ్మిది కోట్ల మందికి ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అని చెబుతున్నది. తప్పుల తడకలతో కూడిన గణాంకాలు( వివిధ సూచికలను ప్రకటించినపుడు ప్రభుత్వమే అలా చెబుతున్నది. ఉదా : దేశ ఆకలి సూచిక) వెల్లడిరచినదాని ప్రకారం 2004-05లో వ్యవసాయ వాణిజ్య సూచిక 87.72గా ఉన్నది 2010-11 నాటికి 102.95కు పెరిగింది.దాని ప్రకారం పెట్టుబడుల కంటే పంటల అమ్మకం ద్వారా ఎక్కువ పొందారని భాష్యం చెప్పారు. అదే 202223లో ఆ సూచిక 97.21కి పడిపోయింది. అంటే రైతులు పొందుతున్నది తగ్గిపోయింది. అందుకే రైతుల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కోరుతున్నారు.


రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరో రూపంలో ముందుకు తీసుకురావటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ పాలసీ(నాంప్‌)ని 2024 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యాన డిసెంబరు 23న దేశమంతటా నిరసన తెలిపారు. అనేక మంది నిపుణులు విమర్శించారు. దాని మీద అభిప్రాయాలు తెలిపేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే కేంద్రం గడువు ఇచ్చింది. ఇప్పుడున్న మార్కెటింగ్‌ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని కాదు, దాన్ని సంస్కరించకూడదని ఎవరూ చెప్పటం లేదు. అయితే ఆ పేరుతో ఇప్పుడున్నదాని కంటే ప్రమాదకరమైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయద్రవ్య పెట్టుబడి సంస్థలు సూచించిన పద్దతిలో సమూల మార్పులు ప్రతిపాదించటం ఆందోళనకరం. దాని ప్రకారం దేశమంతటిని అనుసంధానించే ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదంతా చిన్న రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారం.రైతులు ముడి సరకును సరఫరా చేసేవారిగా మాత్రమే ఉంటారు.వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేయటం,వాణిజ్యం, ఎగుమతి అంతా కార్పొరేట్లదే. ఈ క్రమంలో తేలే మిగులులో రైతుల వాటా గురించి ఎక్కడా స్పష్టత లేదు. అంతే కాదు కనీస మద్దతు ధరలకు ఎలాంటి హామీ ప్రస్తావన కూడా లేదు.అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. రైతాంగానికి గరిష్ట ప్రయోజనం, డిజిటల్‌, పారదర్శకత, జాతీయ మార్కెట్‌ సమాచారం వంటి పదజాలం ఎంతగా వల్లించినా వాటిని వినియోగించుకొనే అవకాశం ఎంత మంది రైతులకు ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పుడు అనేక నియంత్రణలు ఉన్నా వాటిని ఖాతరు చేయకపోవటం, దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అసలు ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఈ ప్రతిపాదనల్లో ఉన్నది. వ్యవసాయ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఈ విధానంతో రాష్టాల హక్కులు, నియంత్రణలకు నీళ్లదులుకోవాల్సిందే. అమల్లోకి వచ్చిన తరువాత గానీ ఇతర మంచి చెడ్డలు వెల్లడి కావు.

ఫిబ్రవరి 14వ తేదీన కేంద్ర, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగే చర్చల అజెండా ఏమిటో తెలియదు. ఎవరెవరు పాల్గ్గొనేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఒక రోజులో తేలే వ్యవహారం కాదు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని 2012లోనే సిఎంగా ఉండగా నరేంద్రమోడీ కమిటీ నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని గురించి తాజా పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసినా మోడీ మొరాయిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అమలు చేయాలంటూ కేంద్రానికి సూచించాలని రైతు సంఘాల నేతలు సుప్రీం కోర్టును కోరారు. వ్యవసాయ గ్రాంట్లపై ఏర్పాటైన కమిటీ 202425 నివేదికను గతేడాది డిసెంబరు 20న పార్లమెంటుకు సమర్పించింది.దీన్ని కేంద్రం ఆమోదిస్తే అమలుకు ఉపక్రమించాలి తిరస్కరిస్తే కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ చేసిస సిఫార్సు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజన మొత్తం రు. ఆరువేలను పన్నెండు వేలకు పెంచాలి.(దాన్ని చూసి కొంత మంది అమలు జరగనున్నట్లు ప్రచారం చేశారు) ఈ ప్రోత్సహకాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీస మద్దతు ధరల చట్టబద్దతకు ఒక రోడ్‌ మాప్‌ను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలి. వ్యవసాయ కార్మికులకు కనీస జీవన వేతనాల నిమిత్తం జాతీయ కమిషన్‌ ఏర్పాటు. రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాల రద్దు పధకాన్ని ప్రవేశ పెట్టాలి.వ్యవసాయ శాఖ పేరులో వ్యవసాయ కార్మికుల పేరును కూడా చేర్చాలి.

కనీస మద్దతు ధరలకు అనుకూల వాదనల సారం ఇలా ఉంది. రైతులకు ధరల మీద ఒక చట్టబద్దత ఉంటుంది. మార్కెట్‌ వడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. మధ్యవర్తుల దోపిడీ నిరోధంగా ఉంటుంది.ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు, ఆర్థిక పరమైన భద్రతను మెరుగుపరచుకొనేందుకు స్థిరమైన రాబడికి వీలు కలిగిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది. ఆహార భద్రత, కొరతలను తీరుస్తుంది, దారిద్య్ర తగ్గింపుకు తోడ్పడుతుంది.రైతాంగ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్‌ వడిదుడుకులను తగ్గిస్తుంది. వ్యతిరేకించే వారేమంటారంటే.. మార్కెట్లో అసమతూకానికి దారితీస్తుంది, కొన్ని పంటలను అవసరాలకు మించి ప్రోత్సహిస్తుంది. సరఫరాఅవసరాల తీరు తెన్నులను విచ్చిన్నం చేస్తుంది.ప్రభుత్వాల మీద భారం మోపుతుంది, మిగులును కొని నిల్వచేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది.వనరుల కేటాయింపులో అసమర్ధతకు దారి తీస్తుంది. పంటల వైవిధ్యానికి బదులు కొన్ని పంటలనే ప్రోత్సహిస్తుంది.అవినీతిని ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తులు అవకాశంగా తీసుకొని రైతులకు లబ్దిని తగ్గిస్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అడ్డుకుంటుంది,ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మార్కెట్‌ వ్యవస్థలో పోటీని తగ్గిస్తుంది. రైతులు కొత్త పద్దతులవైపు చూడకుండా కనీస మద్దతు ధరల మీద ఆధారపడతారు,మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మారరు.

పాకేజ్‌ ఉపశమనమే : విశాఖ ఉక్కుపై వేలాడుతున్న ప్రయివేటు కత్తి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రు.11,440 కోట్ల పాకేజ్‌ను ప్రకటించింది.ఆ మొత్తంలో రు.10,300 కోట్లు ఈక్విటీ వాటా సొమ్ముగా, మిగిలిన మొత్తం నిర్వహణ రుణం. అది గ్రాంటు కాదు.అయినా కనుక కొంత మేలు కలుగుతుంది. తీవ్రంగా ఉన్న రోగికి నొప్పి తగ్గించే మాత్ర ఇస్తే తాత్కాలిక ఉపశమనం తప్ప జబ్బు పోయినట్లు కాదు.ఈ మాత్రానికే తెలుగుదేశం శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. ఇది రెండిరజన్ల పాలన కారణంగానే జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి పలుకులు వల్లిస్తున్నారు. ప్రయివేటీకరణ ముప్పు తొలగిపోయినట్లు నమ్మించేందుకు చూస్తున్నారు. ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రం గమనించిందని చిత్రిస్తున్నారు. ఈ పదజాలం నరేంద్రమోడీని పొగిడేందుకు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.నిజానికి బిజెపికి మతపరమైన మనోభావాలు తప్ప ఇతర అంశాలు పట్టవు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్దం ఆయన పేరు పెట్టిన భద్రావతి ఉక్కునే అమ్మేందుకు చూసిన వారికి విశాఖ ఉక్కు ఒక లెఖ్కా. దాన్ని రక్షించుకొనేందుకు 1,390 రోజులుగా కార్మికులు,వామపక్ష పార్టీలకు చెందిన వారు ఏదో ఒక రూపంలో నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. ఈ ప్లాంట్‌ ఉనికిలోకి వచ్చిన నాలుగుదశాబ్దాల కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే ఉంది తప్ప ఆ సంస్థను నిలబెట్టేందుకు అవసరమైన మౌలిక చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రెండిరజన్ల పాలన కారణంగానే పదకొండువేల కోట్ల పాకేజ్‌ వస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా అక్కడి భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారానికి నెల రోజుల క్రితమే ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ను ప్రకటించటాన్ని ఎలా చూడాలి. ఆ సంస్థ పునరుద్దరణకు పదివేల కోట్లు అవసరమని గతంలో చెప్పిన మంత్రి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ ప్రకటించారు, 26వేల కోట్ల అప్పులున్న విశాఖ స్టీలుకు పదకొండున్నరవేల కోట్లా ? గొప్పలు చెప్పుకొనేందుకు కాస్త వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా ? జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? విశాఖ ఉక్కు లాభాలతో నడిచేందుకు అవసరమైన స్వంత గనుల గురించి, సెయిల్‌ సంస్థలో విలీనం గురించి రెండిరజన్ల పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు.


భద్రావతి ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారాలను గమనించినపుడు ఒక వేళ విశాఖ ఉక్కును సెయిల్‌ సంస్థలో విలీనం చేసినా ప్రైవేటీకరణ ముప్పు ఉండదనే హామీ లేదు.భద్రావతి ఉక్కు సెయిల్లోనే ఉంది. అయినప్పటికీ దాన్ని మూసివేయాలని, విక్రయించాలని అదే సంస్థగతంలో నిర్ణయించటమే గాదు టెండర్లను కూడా పిలిచింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి మూడోసారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2024జూన్‌ 30వ తేదీన మంత్రి కుమారస్వామి ఆ సంస్థను సందర్శించి తిరిగి పనిచేయిస్తామని వాగ్దానం చేశారు.అది జరిగిన నెల రోజులకు జూలై 30వ తేదీన అదే మంత్రిత్వశాఖ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో దాన్ని ఇప్పటికే మూసివేయాలని నిర్ణయించామని అందువలన తిరిగి పనిచేయించే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా పేర్కొన్నది. ప్రశ్న అడిగింది ఎవరో కాదు, షిమోగా బిజెపి ఎంపీ బివై రాఘవేంద్ర(మాజీ సిఎం ఎడియూరప్ప కుమారుడు). దానికి ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సమాధానం ఇచ్చారు. 2016 అక్టోబరులోనే సూత్రప్రాయంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం కింద ఫ్యాక్టరీని అమ్మివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు, అయితే దరఖాస్తు చేసిన వాటిలో ఎంపిక చేసిన సంస్థలు తదుపరి ముందుకు పోయేందుకు ఆసక్తి చూపకపోవటంతో అమ్మివేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. తరువాత దాన్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.ఈ విషయాన్ని 2022 అక్టోబరు 14వ తేదీన పెట్టుబడుల మరియు ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యశాఖకు తెలియచేసినట్లు కూడా మంత్రి తెలిపారు.ప్రస్తుతం 245 మంది పర్మనెంటు ఉద్యోగులు ఉన్నట్లు అనుబంధ సంస్థలు పంపిన కొన్ని పూర్తిగాని ఉత్పత్తులకు మెరుగులు దిద్దుతున్నట్లు, 202324లో అమ్మకానికి వీలైన పదమూడువేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. నాలుగోసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్దరింప చేయటంలో విఫలమైనట్లు కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున రాఘవేంద్రపై విమర్శల దాడికి దిగటంతో ప్రశ్న అడగాల్సి వచ్చింది.

వంద సంవత్సరాల క్రితం మైసూరు రాజు నలవాది కృష్జరాజ వడయార్‌ రాజ్యంలో దివానుగా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ మైసూర్‌ ఐరన్‌ వర్క్స్‌ పేరుతో 1923లో భద్ర నది తీరంలో ప్రారంభమైంది.ఇతర లోహాలతో మిళితం చేసి ప్రత్యేకమైన ఉక్కును తయారు చేసిన దేశంలోని తొలి ఫ్యాక్టరీ ఇది. తరువాత మైసూర్‌ ఐరన్‌ మరియు స్టీల్‌ వర్క్స్‌గా మారింది. 1962లో 40:60శాతం వాటాలతో కేంద్రకర్నాటక ప్రభుత్వ కంపెనీగా ఉనికిలోకి వచ్చింది.1975లో విశ్వేశ్వరయ్య ఐరన్‌ మరియు స్టీల్‌ లిమిటెడ్‌ అని నామకరణం చేశారు. 1989లో సెయిల్‌ అనుబంధ సంస్థగా జతచేసి 1998లో విలీనం చేశారు.2004లో లాభాల బాట పట్టిన సంస్థ తరువాత నష్టాలపాలైంది.తరువాత సెయిల్‌ దాన్ని మూసివేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీ మూసివేత, అమ్మివేత నిర్ణయం రెండిరజన్ల పాలనలోనే జరిగింది.కర్ణాటకలో అప్పుడు బిజెపి అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత కూడా మూసివేతకే కట్టుబడి ఉన్నట్లు అది స్పష్టంగా చెప్పింది.ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, తక్కువ పరిమాణంలో ఉత్పత్తి ఉందని, పాతబడిన సాంకేతిక పరిజ్ఞానం, కాపిటివ్‌ మైన్స్‌ కూడా లేవని, అల్లాయ్‌ ఉక్కు రంగంలో పోటీ ఎక్కువగా ఉందని 2023లో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంటులో వాదించారు. నాటకీయ పరిణామాల మధ్య గతేడాది డిసెంబరులో దాని పునరుద్దరణకు పదిహేనువేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు.అయితే నిర్దిష్ట చర్యలేవీ ఇంతవరకు ప్రారంభం కాలేదు, అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా లేక ఏదో ఒకసాకుతో అయినకాడికి తెగనమ్మి వదిలించుకుంటారా అన్నది చెప్పలేము.


భద్రావతి ఉక్కుతో పోలిస్తే విశాఖ ఉక్కు ఎంతో అధునాతనమైన సంస్థ.ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖలోని అతి పెద్ద కంపెనీ. ఏది పెద్దది ఏది చిన్నది అన్న చర్చ అవసరం లేదు. రెండిరటినీ రక్షించుకోవాల్సిందే. ఇప్పుడు రెండు సంస్థలకూ కేంద్ర ప్రభుత్వం పాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది.దీనికి కారణం కేంద్రంలో బలాబలాల్లో వచ్చిన మార్పే అన్నది స్పష్టం. ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం నరేంద్రమోడీకి లోక్‌సభ వచ్చినపుడు కళ్లు నెత్తికెక్కాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారానికి వచ్చినపుడు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగింది లేదు, జగన్మోహనరెడ్డి ఏలుబడి సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ మోడీకి మద్దతు ఇవ్వటంలో పోటీ పడ్డాయి. భద్రావతి ఉక్కును పునరుద్దరించాలని బిజెపి నేత యడియూరప్ప నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధివర్గం నరేంద్రమోడీని కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.బిజెపికి దూరంగా ఉన్న కారణంగా అప్పుడు దేవెగౌడ పాలనలో తగిన చర్యలు తీసుకొని ఉంటే మూతపడే పరిస్థితి వచ్చేది కాదని ఎడియూరప్ప కుమారుడు, ఎంపీ రాఘవేంద్ర నెపాన్ని ఆయన మీదకు నెట్టేందుకు చూశారు. భద్రావతి ఉక్కును కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని కారణంగా అది అలాగే ఉండిపోయింది తప్ప లేకుంటే తుక్కు కింద ఎప్పుడో మారి ఉండేది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 33వేల ఎకరాల్లో ఉంది.అందువలన అమ్మకానికి పెడితే దాన్ని ఎగరేసుకు పోయేందుకు సిద్దంగా ఉన్నారు.ఆ ఫ్యాక్టరీ కోసం ప్రాణాలర్పించిన వారుగానీ, దానికి భూములు ఇచ్చిన వారు గానీ పప్పుబెల్లాల్లా పందారం చేసి కారుచౌకగా ఎవరికో కట్టబెట్టేందుకు కాదు. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ విధానంలో మార్పు చేసినట్లు కేంద్రం ఎక్కడా చెప్పటం లేదు. అందువలన తెలుగుదేశం, జనసేన నేతల మాటలు నమ్మనవసరం లేదు. తీరా వేటు పడిన తరువాత మేము చేయాల్సిందంతా చేశామని చేతులు దులుపుకుంటారు. ఇప్పటివరకు ఎంతో పట్టుదలతో ఉన్న కార్మికులు, వారికి మద్దతుగా ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను మరింతగా జనం ఆదరించి నిలబడితే ప్రైవేటీకరణ ముప్పును తిప్పికొట్టటం అసాధ్యం కాదు.

పంజాబ్‌లో ‘‘ఎమర్జన్సీ’’ సినిమా ప్రదర్శనకు బ్రేక్‌, సిక్కులపై విరుచుకుపడిన కంగన ! నరేంద్రమోడీపై ఉక్రోషం !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


అందరూ ఊహించినట్లుగానే వివాదాస్పద ‘‘ ఎమర్జన్సీ ’’ (అత్యవసర పరిస్థితి) సినిమా ప్రదర్శనకు పంజాబ్‌లో ఆటంకం ఏర్పడిరది. హిమచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సినిమా హీరోయిన్‌ కంగన రనౌత్‌ నిర్మించి,దర్శకత్వం వహించటమే గాక ఇందిరా గాంధీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు (2025 జనవరి 17న) విడుదలైన ఈ సినిమా గురించి ప్రశంసలు విమర్శలు వెలువడ్డాయి. చరిత్ర కంటే మైకం ఎక్కువగా కనిపించిందని, వాస్తవ చరిత్రను ఎలా తీయకూడదో దీన్ని చూసి నేర్చుకోవాలన్న అభిప్రాయం కూడా వచ్చింది. తన చిత్రాన్ని అడ్డుకోవటం కళాకారులు, కళను అడ్డుకోవటమే అంటూ కంగన రనౌత్‌ విమర్శలకు దిగారు. తొలి రోజు సినిమా వసూళ్లు గణనీయంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నోటి దురుసు వ్యక్తిగా పేరు మోసిన కంగనా రనౌత్‌ ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, సోదరత్వాన్ని దెబ్బతీసి అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్‌ చేశారు. ఖలిస్తాన్‌ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన కొద్ది రోజుల ముందు సెన్సార్‌ ధృవీకరణ పత్రం రాలేదని ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.2024 ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు గతేడాది ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకున్న బిజెపి దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు ఉన్నందున వారంతా వ్యతిరేకిస్తారని భయపడిరది. లోక్‌సభ ఎన్నికల తరువాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నందున మొత్తం మీద ఏదో ఒకసాకుతో సినిమా విడుదలను వాయిదా వేయించారు. గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ కూడా సినిమా ప్రదర్శనను వ్యతిరేకించింది. వచ్చే నెలలో ఢల్లీి ఎన్నికలు జరుగుతుండగా విడుదలైన ఈ చిత్రం మీద తలెత్తిన వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఢల్లీిలో దాదాపు పది లక్షల మంది సిక్కు సామాజిక తరగతి ఓటర్లు ఉన్నారు, అక్కడ ఉన్న 70 నియోజకవర్గాలలో వారు విస్తరించి ఉన్నారు. అదే సామాజిక తరగతికి చెందిన ఆతిషి మోర్లెనా ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వ సిఎంగా ఉన్న సంగతి తెలిసిందే.


ఎమర్జన్సీ సినిమా ప్రదర్శనకు నిరసన తెలుపుతామని శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జిపిసి) ఇచ్చిన పిలుపుతో శుక్రవారం నాడు పలు సినిమా ధియేటర్ల వద్ద సిక్కులు నిరసన తెలిపారు. దాంతో పంజాబ్‌ అంతగా సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.సిక్కు మత చరిత్రను, 1984 ఉదంతాలను సినిమాలో వక్రీకరించారని ఆ సంస్థ విమర్శించింది. చరిత్రను వక్రీకరించి మసాలాను దట్టించకపోతే ఇలాంటి సినిమాలను ఎవరూ చూడరు గనుక అలా తీశారని, సెన్సార్‌బోర్డు, ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవాలని పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరిందర్‌ సింగ్‌ రాజా పేర్కొన్నారు, ఉడ్తా పంజాబ్‌ పేరుతో తీసిన సినిమా కూడా అలాంటిదే అన్నారు. చండీఘర్‌ పక్కనే ఉన్న పంజాబ్‌ మొహాలీ నగరంలో సినిమా హాళ్ల వద్ద రైతులు కూడా నిరసన వెల్లడిరచారు. స్వర్ణదేవాలయం ఉన్న అమృతసర్‌ పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఉదంతాలు జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్‌జిపిసి హెచ్చరించింది. రానున్న రోజుల్లో కూడా హాలు యజమానులు ఇదే వైఖరిని అనుసరిస్తే మంచిది లేకుంటే నిరసనను తీవ్రం చేస్తామని పేర్కొన్నది. సంస్థ న్యాయవాది హర్జిందర్‌ సింగ్‌ రాష్ట్ర ్పభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని కోరారు. ఎమర్జన్సీ చిత్రంలో ముఖ్యమైన చరిత్రను నమోదు చేశారని, కంగన ప్రతిభావంతంగా నటించారని, బిజెపి నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించారు. తన సినిమాను తిలకించి అభినందించినందుకు కంగన కృతజ్ఞత తెలిపారు. రాజకీయాల ప్రాతిపదికన సామాజిక మాధ్యమంలో స్పందించిన కొందరు కంగనకు జాతీయ అవార్డు ఇవ్వాలని కూడా చెప్పారు. నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నవారిని గొప్పగా చూపారనే విమర్శలు వచ్చాయి.


ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలవాలనుకున్నాను, జరగలేదు, అంత మాత్రాన ఇతర ప్రముఖులు కలిస్తే నేనెందుకు కలవరపడతాను అంటూ కంగన రనౌత్‌ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. శుభంకర్‌ మిశ్రా అనే జర్నలిస్టుతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కంగన లేదంటూనే కలవరపాటును వెల్లడిరచారు. గతంలో రైతు ఉద్యమాన్ని గట్టిగా సమర్ధించిన సినిమా గాయకుడు, నటుడు, నిర్మాత దల్జిత్‌ దోసంజ్‌, కపూర్‌ కుటుంబ సభ్యులు ఇటీవల కలిసేందుకు నరేంద్రమోడీ అవకాశం ఇచ్చారు. కపూర్‌ కుటుంబం పేరెత్తకుండానే దానికి నా కెందుకు కలవరం, దీన్లో అలాంటిదేముంది అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసనలో దల్జిత్‌ ముందు వరుసలో ఉన్నాడు, వారిని సమర్ధించాడు అని కంగన ధ్వజమెత్తారు.మరి అలాంటి వ్యక్తిని కలుసుకొనేందుకు, తీరికలేకుండా ఉండే ప్రధాని అతని పాటలు వినేందుకు, సంగీతం గురించి చర్చించేందుకు కొన్ని గంటలు కేటాయించటం మిమ్మల్ని గాయపరచలేదా అన్న ప్రశ్నకు తనకు అవకాశం ఇవ్వకుండా దల్జీత్‌ను కలిసినందుకు తనకు ఎలాంటి కలవరం కలగలేదన్నారు, దీనికి కలవరపడాల్సిందేముంది? ఆయనకు అందరూ సమానమే, సినీ రంగానికి చెందిన అనుపమఖేర్‌, మనోజ్‌ ముంతాషిర్‌ వంటి వారికి గతంలో ప్రధాని కలిసే అవకాశం వచ్చింది.తనకు కొద్ది క్షణాలు మాత్రమే కలిసే అవకాశం వచ్చింది, ఇతరులు కలిసినందుకు నేను ఆశాభంగం చెందలేదు. నిజానికి నేను ఎన్నడూ ప్రధానిని కలవలేదు.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకసారి ఆయనకు నమస్కారం పెట్టాను తప్ప మాట్లాడలేదు. నేను ప్రధానికి పెద్ద అభిమానిని అని మీరు తెలుసుకోవాలి. కళల గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకొనేందుకు అభిప్రాయాలు మార్పిడి, దీర్ఘమైన చర్చ జరపాలని కోరుకుంటాను అని కంగన వివరణ ఇచ్చుకున్నారు. తన చిత్రం ఎమర్జన్సీ ప్రచారంలో భాగంగా విడుదలకు ముందు రోజు ఆమె వివిధ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించటానికి ఆమె పడరాని పాట్లు పడ్డారు. అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. రైతు ఉద్యమాన్ని వ్యతిరేకించటమే గాక అందులో పాల్గొన్నవారిపై నోరు పారవేసుకున్నందుకు చండీఘర్‌ విమానాశ్రయంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ చేతిలో చెంపదెబ్బ తిన్న సంగతి కూడా తెలిసిందే.

ఉక్రెయిన్‌ సంక్షోభం : మాటతప్పే, మడమతిప్పే బాటలో డోనాల్డ్‌ ట్రంప్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నాటో కూటమిలో చేరి తమ భద్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌కు గుణపాఠం చెప్పేందుకు 2022 ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక చర్య గురువారం నాటికి 1,057 రోజులో ప్రవేశించింది. ఏ మలుపులు తిరుగుతుందో ఎలా ముగుస్తుందో అంతుబట్టటం లేదు.ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలకు, బుద్ది చెప్పేందుకు పూనుకున్న రష్యాకు ప్రతిష్టాత్మంగా మారింది. తాను అధికారాన్ని స్వీకరించిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపుతానని ఈనెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. అంతేనా వీలైతే అంతకు ముందే ఆపుతానని కూడా చెప్పాడు. ఒక రోజులో కాదు గానీ కనీసం వందరోజులు పడుతుందన్నాడు ఉక్రెయిన్‌ రాయబారిగా ట్రంప్‌ ఎంచుకున్న కెయిత్‌ కెలోగ్‌. అంత తేలిగ్గా ఎలా కుదురుతుంది కొన్ని నెలలు, అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చునని ట్రంప్‌ సలహాదారులు చెప్పినట్లు రాయిటర్స్‌ తాజా కథనం.శ్వేత సౌధంలో ప్రవేశించే గడవు దగ్గర పడుతున్నకొద్దీ ట్రంప్‌ నోట దానీ ఊసేలేదు. మరోవైపు దిగిపోతున్న జో బైడెన్‌ యంత్రాంగం రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించి సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తాడో చూస్తాం అన్నట్లుగా ట్రంప్‌కు సవాలు విసిరింది. ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడో ఏం జరగనుందో తెలియదు గానీ అగ్రరాజ్య రాజకీయాలు మనవంటి దేశాలకు సంకటాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికా రక్షణ శాఖ గతవారంలో తమ దేశ భద్రతకు ముప్పు అంటూ రెండు చైనా చమురు సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. జనం చెల్లించిన పన్నుల నుంచి బిలియన్ల డాలర్లను ఉక్రెయిన్‌లో తగలేయటం ఎందుకనే రీతిలో ట్రంప్‌ మాట్లాడాడు. అయితే అవి నిజాయితీతో కూడినవి కాదు. అమెరికా ప్రయోజనాల వ్యూహంలో భాగంగానే ప్రతి పరిణామం జరుగుతోంది. నిజానికి ఉక్రెయిన్‌ పోరు కూడా దానిలో భాగమే. అది తెలియనంత అమాయకుడు కాదు ట్రంప్‌. రాజకీయనేతలు ఊరికే ఏమాటలూ చెప్పరు. అందుకే ఎన్నికల్లో లబ్దికోసం ట్రంప్‌ మాట్లాడాడా లేక మరొకవిధంగానా అన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ పోరులో పశ్చిమ దేశాల మిలిటరీని వినియోగించే అంశం గురించి ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌తో జెలెనెస్కీ సంప్రదింపులు జరిపాడు. అమెరికా తాజా ఆంక్షలతో రాయితీ ధరలతో ఇప్పటి వరకు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడిచమురు దిగుమతిని మనదేశం నిలిపివేసింది. మరోవైపున అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి.పులి మీద పుట్రలా మన రూపాయి రికార్డు స్థాయిలో పతనం మరింత భారం మోపనుంది.

త్వరలో నాలుగో ఏడాదిలో ప్రవేశించనున్న ఉక్రెయిన్‌ రష్యా సంక్షోభం పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికి మూలం అమెరికా నాయకత్వంలోని నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌కు స్థానం కల్పిస్తామని చెప్పటమే. తద్వారా రష్యా ముంగిటికి విస్తరించి ముప్పు తలపెట్టేందుకే అన్నది తెలిసిందే. అమెరికా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్నది కొంత మేరకు జరిగింది. అయితే ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత తొలిసారిగా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యాచైనా సంబంధాలు బలపడతాయని నాటో కూటమి ఊహించలేదనే చెప్పాలి. మూడు సంవత్సరాలుగా రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఇదొక ప్రధాన కారణం. యుద్ధం కొనసాగిన కొద్దీ ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోందనే మనోభావాలను ట్రంప్‌ రెచ్చగొట్టవచ్చు, దాని వలలో కొందరు పడవచ్చు గానీ సంక్షోభం ఎంత దీర్ఘకాలం కొనసాగితే అమెరికాకు అంతలాభం. అక్కడి ఆయుధ పరిశ్రమలకు లాభాలు, కొంత మందికి ఉపాధి, అదే విధంగా ధరల పెరుగుదలతో పాటు రష్యా ఇంథన మార్కెట్‌ను అమెరికా కంపెనీలు ఆక్రమించి లాభాలు పిండుకుంటాయి. అందుకనే ఏదో ఒకసాకు చూపి ట్రంప్‌ కూడా జో బైడెన్‌ బూట్లలో కాళ్లు దూర్చి నడిచేందుకే చూస్తాడు. ఐరోపాలోని అగ్రరాజ్యాలైన ఫ్రాన్సు, జర్మనీ, బాల్టిక్‌ దేశాలు, పోలెండు వంటివి కూడా అదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే రష్యా బలహీనం కావటం వాటికి అవసరం. అందుకే ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదని భావిస్తున్నారు. నాటో కూటమి దేశాల ఉద్దేశ్యాలను గ్రహించి కావచ్చు, తొలి రోజుల మాదిరి రష్యా ఇప్పుడు దూకుడుగా ముందుకు పోవటం లేదు, నిదానంగా అడుగులు వేస్తున్నది.


కొందరు పరిశీలకులు మరొక కోణాన్ని కూడా చూస్తున్నారు. ప్రపంచానికి శాంతిదూతగా కనిపించేందుకు, నోబెల్‌ బహుమతి పొందాలనే తపనతో ట్రంప్‌ ఉన్నాడు గనుక ఒక శాంతి ప్రతిపాదన చేయవచ్చని ఆశాభావంతో ఉన్నారు. అదేమిటో వెల్లడి కాలేదు గానీ లీకులుఊహాగానాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం రెండు దశాబ్దాల పాటు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వరు. దానికి ప్రతిగా రష్యా మిలిటరీ చర్యను ఆపివేయాలి.ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను ఉక్రెయిన్‌ వదులుకోవాలి. రెండు దేశాల మధ్య ఉన్న 1,290 కిలోమీటర్ల సరిహద్దులో మిలిటరీ రహిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా దేశాలు చూసుకోవాలి. శాంతి చర్చలలో గనుక పాల్గొంటే రష్యా మీద విధించిన కొన్ని ఆంక్షలను వెంటనే తొలగిస్తారు. గతంలో నాటోను తమ వైపు విస్తరించబోము అన్న హామీని ఆ కూటమి దేశాలు విస్మరించినందున రష్యా అంత తేలికగా అంగీకరించకపోవచ్చు లేదా కొంత ఉపశమనం దొరుకుతుంది గనుక తరువాత చూసుకోవచ్చు లెమ్మని అంగీకరించవచ్చు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్‌ మరికొన్ని ప్రాంతాలను కోల్పోయేందుకు అంగీకరిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. తొలుత కుదరదని చెప్పినప్పటికీ తరువాత మెత్తబడినట్లు నిర్ధారణగాని వార్తలు. ట్రంప్‌ ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చినపుడు రష్యా కొట్టిపారవేసింది. దాని అభిప్రాయం ప్రకారం ఉక్రెయిన్‌ శాశ్వతంగా తటస్థ దేశంగా ఉండాలి లేదా రష్యా ప్రభావంలోకి రావాలి, సరిహద్దులో నిస్సైనిక ప్రాంతం ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా యూనియన్‌కు అప్పగించటాన్ని పుతిన్‌ అంగీకరించే అవకాశాలు లేవని వార్తలు వచ్చాయి. తన మిలిటరీ సామర్ధ్యాన్ని రష్యా పెంచుకుంటున్నదని కూడా చెబుతున్నందున ప్రస్తుత దశలో ఏం జరిగేదీ చెప్పలేము. ఇక రష్యాఉక్రెయిన్‌ యుద్ధ రంగాన్ని చూద్దాం.ఇప్పటికే రష్యా నుంచి తమ భూభాగం మీదుగా నడుస్తున్న ఇంథన సరఫరా వ్యవస్థను ఉక్రెయిన్‌ నిలిపివేసింది. రష్యా నుంచి టర్కీ ద్వారా ఐరోపా యూనియన్‌ దేశాలకు ఉన్న గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒక్కటే పని చేస్తున్నది. దాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా, ఉక్రెయిన్‌ కుట్రపన్నాయని, దానిలో భాగంగానే ఉక్రెయిన్‌ దాడులు జరిపినట్లు, తొమ్మిది డ్రోన్లను తాము కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. ఇలాంటి పనులు చేస్తే ఉక్రెయిన్‌కు ఐరోపాయూనియన్‌ మద్దతు ఉండదని స్లోవేకియాహెచ్చరించింది. మంగళవారం నాడు వందలాది డ్రోన్లు, క్షిపణులతో మూడు రష్యా పట్టణాలపై ఉక్రెయిన్‌ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండువందల డ్రోన్లు, ఐదు అమెరికా తయారీ ఖండాంతర క్షిపణులను రష్యా కూల్చివేసినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ షాట్‌ తెలిపింది. తాము కూడా రష్యా వైపు నుంచి వచ్చిన 80డ్రోన్లలో 58ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పింది. ఈ పరిణామాలను చూస్తుంటే ట్రంప్‌ గద్దెనెక్కే నాటికి పరస్పరదాడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.తాజాగా రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్‌ గ్యాస్‌, విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని సరఫరాకు అంతరాయం కలిగింది.


రష్యా ఇంథన రంగం, చైనా సంస్థలపై ఆంక్షలను మరింత తీవ్రతరంగావిస్తూ జోబైడెన్‌ జనవరి పదిన నిర్ణయించాడు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రష్యాను దెబ్బతీయటంతో పాటు తమ ఎల్‌ఎన్‌జి మార్కెట్‌ను పెంచుకోవటం అమెరికా లక్ష్యంగా ఉంది. రష్యాలోని రెండు అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థలు, రవాణా చేసే 183 ఓడలు, ఎల్‌ఎన్‌జిని ఎగుమతి చేసే 80 కంపెనీలు,బీమా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను కొత్తగా ప్రకటించారు. బ్రిటన్‌ కూడా అమెరికాతో జతకలిసి ఉక్రెయిన్‌లో శాంతి కోసం అంటూ ఆంక్షలను ప్రకటించింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. బుధవారం నాడు ప్రామాణిక బ్రెంట్‌ రకం ధర 80డాలర్లకు అటూ ఇటూగా ఉంది. తాజాగా ఆంక్షలకు గురైన వాటితో సహా ఇప్పటి వరకు 270 టాంకర్లకు చేరాయి. ఈ టాంకర్లతో సముద్ర మార్గాలలో రష్యా ఎగుమతుల్లో 42శాతం జరుగుతున్నది. ఎగుమతి అయ్యే చమురులో 61శాతం చైనాకు,మిగిలింది మనదేశం దిగుమతి చేసుకుంటున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలను ముందుగా ఊహించి ప్రత్నామ్నాయ వనరులను చూసుకుంటున్నట్లు వార్తలు. గతేడాది ఈ టాంకర్ల ద్వారా చైనాకు రోజుకు తొమ్మిది లక్షల పీపాలు ఎగుమతి అయ్యాయి.మార్కెట్‌ విషయానికి వస్తే మార్చి నెలలో సరఫరా చేయాల్సిన చమురు ధర బ్రెంట్‌ రకం 81డాలర్లు దాటింది.గతేడాది ఆగస్టు తరువాత ఇంతగా పెరగటం ఇదే మొదటిసారి. ఆంక్షలకు ముందు ఖరారు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ జాబితాలో ఉన్న టాంకర్లను మార్చి నెలవరకు అనుమతిస్తామని తరువాత వచ్చే వాటిని వెనక్కి తిప్పి పంపుతున్నట్లు భారత్‌ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2024 నవంబరు నెలలోనే రష్యా నుంచి 55శాతం దిగుమతులు పడిపోయాయి. గత ఏడాది మొత్తం 430 టాంకర్ల ద్వారా రష్యా చమురు ఎగుమతులు చేసింది.


ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించే గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఐరోపా నేతలు పరిణామాలు, పర్యవసానాల గురించి సంప్రదింపులు జరుపుతున్నారు. ఉక్రెయిన్‌ పోరు నాలుగో ఏడాదిలో ప్రవేశించనుండగా శాంతికోసం పశ్చిమదేశాల మిలిటరీని తమ గడ్డ మీద మోహరించాలని జెలెనెస్కీ కోరుతున్నాడు.వార్సాలో ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, పోలాండ్‌ నేతలు సోమవారం నాడు భేటీ జరిపారు.ఉక్రెయిన్‌ పోరుకు తామెందుకు భారీ మొత్తాలను ఖర్చు చేయాలని ట్రంప్‌ గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ భారాన్ని ఐరోపా మరింత ఎక్కువగా భరించాలని చెబుతున్నాడు. ఈ నేపధ్యంలో ఐదు ఐరోపా అగ్రరాజ్యాల భేటీ జరిగింది.పశ్చిమ దేశాల మిలిటరీని ఉక్రెయిన్‌లో మోహరించాలని ఏడాది క్రితం తాను సూచన చేసినపుడు తనను ఒంటరిని చేశారని మక్రాన్‌ భావిస్తున్నాడు.అయితే ఈ అంశం గురించి వార్సాలో చర్చించలేదని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ చెప్పాడు. ఒక వేళ నిజంగానే ఆ పనిచేస్తే ఆ చర్య ప్రపంచ గతిని మరో మలుపు తిప్పటం అనివార్యం. ఒకవేళ నాటో దళాలు రంగంలోకి దిగితే తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణించి స్పందిస్తామని ఎప్పటి నుంచో రష్యా చెబుతున్నది. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నది, అవసరమైతే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించింది.

మనుస్మృతిపై మద్రాస్‌ హైకోర్టు తీర్పు : హిందూత్వ మనువాదుల మనోభావాలకు చెంపపెట్టు !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న రోజులివి.తరతరాలుగా జరుగుతున్నదే. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మతగ్రంధాలు, జ్యోతిష గ్రంధాలు చెప్పినది వాస్తవం కాదని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళశాస్త్రజ్ఞుడు నికోలస్‌ కోపర్నికస్‌పై ఐదు వందల సంవత్సరాల క్రితమే నాటి క్రైస్తవ మతవాదులు దాడి చేశారు, మూర్ఖుడని నిందించారు. చరిత్రలో ఏ మతవాదీ నిజాన్ని అంగీకరించిన దాఖలా లేదు. మన దేశంలో హిందూత్వ, ఇస్లామిక్‌, క్రైస్తవ మతవాదులు దానికి అతీతులు కాదు. అలాంటి వారికి 2025జనవరి మొదటి వారంలో మద్రాస్‌ హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. తమిళనాడులో విడుతలై చిరుతాయిగల్‌ కచ్చి(విసికె) అనే పార్టీ ఎంపీ తిరుమవలన్‌. అతని మీద 2020లో ఒక ప్రైవేటు కేసు నమోదైంది.అదేమిటంటే పెరియార్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో ఫిర్యాదుదారు ఒక కార్యక్రమాన్ని చూశారు. తిరుమవలన్‌ మరొక వ్యక్తితో కలసి హిందూ మహిళల గురించి బహిరంగంగా చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని, వారి గురించి ఒక తప్పుడు కథనాన్ని చెప్పారని, వాటిని విని ఒక హిందువుగా అవమానకరంగా భావించానని, తన మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నందున తగిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నది కేసు సారం. ఆ కేసులో పసలేదని దాన్ని కొట్టివేయాలంటూ తిరుమవలన్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయమూర్తి పి.వేలుమురుగన్‌ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కరోనా సమయంలో పెరియార్‌ మరియు భారత రాజకీయాలు అనే అంశంపై యూరోపియన్‌ పెరియార్‌ అంబేద్కర్‌ కామ్రేడ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో తిరుమవలన్‌ ప్రసంగించారు. దానిలో మనుస్మృతిలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి తమ మనోభావాలను దెబ్బతీశాయన్నది కేసు. అయితే తిరుమలన్‌ మనుస్మృతిలో ఉన్న అంశాలను ప్రస్తావించి వాటికి అర్ధం చెప్పారు తానుగా కొత్తగా చెప్పిందేమీ లేనందున ఎలాంటి చర్య తీసుకోవనవసరం లేదంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. తిరోగామి భావజాలం గురించి గతంలోనే అనేక మంది చీల్చి చెండాడారు.వాటిని పునశ్చరణ చేయవచ్చు, మరింతగా వివరించవచ్చు. అంతే కాదు ఈ తీర్పుతో ఒకటి స్పష్టమైంది. ఎవరినీ కొట్టావద్దు తిట్టావద్దు, పురాతన సంస్మృత గ్రంధాల్లో ఉన్న వాటి అసలు అర్ధాలను చెబుతూ వాటిని జనంలోకి మరింతగా తీసుకువెళితే చాలు. ముంజేతిని చూసుకొనేందుకు అద్దాలు అవసరం లేదు.


ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2020 నవంబరులో జస్టిస్‌ ఎం సత్యనారాయణన్‌, జస్టిస్‌ ఆర్‌ హేమలత డివిజన్‌ బెంచి కొట్టివేసింది.ఎస్‌ కాశీరామలింగం దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో బిజెపి నేత, న్యాయవాది ఆర్‌సి పాల్‌ కనకరాజ్‌ వాదించారు.ఉనికిలో లేని మనుస్మృతిని నిషేధించాలని పార్లమెంటు సభ్యుడు కోరుతూ చేసిన ప్రసంగం అశాంతికి, వివిధ తరగతులను రెచ్చగొట్టటానికి దోహదం చేసినందున సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. ప్రసంగం చేయటమే గాక దాన్ని నిషేధించాలని కూడా డిమాండ్‌ చేశారన్నారు. మనుస్మృతి రాజ్యాంగబద్దమైనదేమీ కాదని, అందువలన దాన్ని ఫలాన విధంగానే చదవాలనే నిబంధనేమీ లేదని, రెండువేల సంవత్సరాల నాటి గ్రంధానికి భాష్యాలు చెప్పవచ్చని అందువలన ఎంపీపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది.దానిలో చెప్పిన నైతిక నియమావళి రాజ్యాంగబద్దం కాదని, వాటిని అమలు జరపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.వాద ప్రతివాదనల సందర్భంగా తమ పిటీషన్ను ఉపసంహరించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అంశాలతో మరొక పిటీషన్‌ దాఖలు చేసేందుకు అనుమతించాలని న్యాయవాది పాల్‌ కనకరాజ్‌ కోర్టును కోరారు.చివరికి పిల్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ అంశం మీదే జిల్లా కోర్టులో ఒక ప్రైవేట్‌ కేసును దాఖలు చేశారు.దాన్ని ఈ నెలలో హైకోర్టు కొట్టివేసింది.


బహుశా ఆ తమిళనాడు పిటీషనర్‌ మనుస్మృతిలో ఏమి రాసి ఉందో చదివి, అర్ధం చేసుకొని ఉంటే నిజంగానే సిగ్గుపడి ఆ కేసు దాఖలు చేసి ఉండేవారు. ఆ గ్రంధాన్ని పరమపవిత్రంగా పూజించేవారు ఉన్నారు.మద్రాస్‌ హైకోర్టు తీర్పు మరో ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. కర్ణాటకలో మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌, ప్రముఖ రచయిత, హేతువాది కెఎస్‌. భగవాన్‌. రామాయణం ఉత్తరకాండలో ఉన్న వాటిని గురించి చెప్పినందుకు హిందూత్వవాదులు అంతుచూస్తామని బెదిరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ అంశాలను చెబుతున్నారు. ఉత్తరకాండలో ఉన్నదాని ప్రకారం రాముడు పదకొండువేల సంవత్సరాలు పాలించలేదని, పదకొండు ఏళ్లు మాత్రమే రాజుగా ఉన్నట్లు, అడవుల్లో తాను మద్యం తాగుతూ సీతాదేవిని కూడా తాగమని కోరినట్లు, కొందరు రామరాజ్యం తెస్తామని చెబుతున్నారని, రాముడు ఆదర్శప్రాయుడేమీ కాదని భగవాన్‌ చెప్పిన అంశాలు తమ మనోభావాలను గాయపరచినట్లు కొందరు ప్రైవేటు కేసును దాఖలు చేశారు. సీతాదేవిని అడవుల పాల్జేసి పట్టించుకోని, శూద్రుడైన శంబుకుణ్ని వధించిన రాముడిని ఎలా సమర్ధిస్తారని భగవాన్‌ ప్రశ్నించారు.‘‘ ప్రొఫెసర్‌ కల్‌బుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌లను హత్యచేసినవారు ఇప్పుడు నన్ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు, వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే, మీరు మా మీద దాడి చేయవచ్చు, ముక్కలుగా నరకవచ్చు కానీ మారచనలు సజీవంగానే ఉంటాయి. వారు నన్ను చంపవచ్చు తప్ప నా వైఖరిని మార్చలేరు ’’ అని భగవాన్‌ స్పష్టం చేశారు. ఈ వివాదం తరువాత కొంత మంది అసలు ఉత్తరకాండను వాల్మీకి రాయలేదని, తరువాత కొందరు దాన్ని చేర్చారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రామాయణాలు అనేకం ఉన్నాయి. దేన్ని సాధికారికంగా తీసుకోవాలో చెప్పినవారెవరూ లేదు. ఎవరికీ అలాంటి సాధికారత లేదు.ఎవరైనా పుచ్చుకుంటే దానితో అంగీకరించాలని కూడా లేదు.


మనుస్మృతిలో రాసినవి, వాటి ఆచరణ చూసి తన మనోభావాలు తీవ్రంగా గాయపడిన కారణంగానే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంద సంవత్సరాల క్రితమే దాన్ని తగులబెట్టి నిరసన వెల్లడిరచారు. సదరు మనువాదాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలని, అది లేకుండా రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక సంపాదకీయాలు రాసింది. ఆ చర్య మనోభావాలను దెబ్బతీయటమే కాదు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించటం నేరం.నక్సలైట్స్‌గా పరిగణించే వారు రాజ్యాంగాన్ని ఆమోదించం అని చెబుతారు, వారికీ ఆర్‌ఎస్‌ఎస్‌ వారికీ పెద్ద తేడా లేనట్లే కదా ? వారు అడవుల్లో చెబితే కాషాయ దళాలు జనారణ్యంలో ఆపని చేశాయి. రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టిన మనుస్మృతిని తమ న్యాయశాస్త్ర విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని ఢల్లీి విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కోర్టులలో అమలు చేసే శిక్షాస్మృతులను పాఠాలుగా చెప్పాలి, శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలాంటి చర్యలతో అధికారికంగా మనువాదులను తయారు చేసే వ్యవహరం తప్ప మరొకటి కాదు. ఇలాంటి బలవంతాలు చేసే శక్తులు ఒక వైపు రెచ్చిపోతుంటే మరోవైపు దాన్ని వ్యతిరేకించేవారు కూడా ఎప్పటికప్పుడు తయారవుతారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి, కార్పొరేట్‌ జలగలకు జనాలను అప్పచెప్పాయి. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నూతన విద్యావిధానం పేరుతో తన కాషాయ అజెండాను దేశం మీద రుద్దేందుకు పూనుకుంది. దానిలో భాగమే సిలబస్‌లో మనువాదాన్ని చేర్చటం. మరింతగా మనువాదులను న్యాయవ్యవస్థలో చేర్చేందుకు వేసిన పథకమిది. సమాజంలో సగం మందిగా ఉన్న మహిళలకు విద్య, సమానహక్కులు, సాధికారతను పూర్తిగా వ్యతిరేకించే తిరోగమన భావాలను బలవంతంగా అధ్యయనం చేయించేందుకు చూస్తున్నారు. అంతేకాదు, శూద్రులు,దళితులుగా ఉన్న 85శాతం మంది గురించి కూడా దాన్నిండా వ్యతిరేకతలే, మొత్తంగా మన రాజ్యాంగానికి, దానికి స్ఫూర్తికి వ్యతిరేకమైనది.


ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భగత్‌ సింగ్‌ స్టూడెంట్స్‌ మోర్చా(బిఎస్‌ఎం)కు చెందిన వారు డిసెంబరు 25న మనుస్మృతి గ్రంధంపై ఒక చర్చ నిర్వహించారు, తరువాత తగులబెట్టేందుకు నిర్ణయించారు. ఆ సందర్భంగా ముగ్గురు విద్యార్ధినులతో సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. పదిహేడు రోజుల తరువాత వారు బెయిలు మీద జనవరి 11న విడుదలయ్యారు. ఈ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిపై పరిశోధన చేసే వారికి ఫెలోషిప్‌ ఇస్తున్నారు. దాని గురించి చర్చించేవారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన నేతన్నలను దెబ్బతీసిన విదేశీ వస్త్రదహనం ఒక పోరాట రూపంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా దిష్టిబొమ్మల దహనం కూడా. సమాజంలో స్త్రీలు, మెజారిటీ కులాల వారిపట్ల వివక్ష, దురాచారాలను ప్రోత్సహించే మనుస్మృతికి వ్యతిరేకంగా ఒక నిరనస రూపంగా దాన్ని దహనాన్ని అంబేద్కర్‌ ఎంచుకున్నారు.తొలిసారిగా 1927లో స్వయంగా ఆపని చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 25ను మనుస్మృతి దహన దినంగా పాటిస్తున్నారు. ఎక్కడో అక్కడ అది కొనసాగుతూనే ఉంది. బెనారస్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు హింసాకాండకు, దాడులకు పాల్పడ్డారంటూ తప్పుడు కేసులు పెట్టారు.కస్టడీలో పోలీసులు వారిని కొట్టారు, దుస్తులు చించివేశారు, బెదిరించారు. ఉగ్రవాద వ్యతిరేక దళ పోలీసులు వారిని విచారించటాన్ని బట్టి ఎలాంటి నేరాలు మోపారో, ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి రాజ్యం నడుస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.పదేండ్ల వరకు శిక్షలు పడే సెక్షన్లతో నేరాలను మోపారు. తాము భగత్‌ సింగ్‌బాబా సాహెబ్‌ వారసులమని హిందూత్వ శక్తులు తమను అణచేందుకు చూస్తున్నాయని బిఎస్‌ఎం నేతలు చెప్పారు.

ఒక్క మనుస్మృతే కాదు అనేక పురాణాలు, ఇతర గ్రంధాలు, వెంకటేశ్వరసుప్రభాతం వంటి వాటిలో ఉన్న అశ్లీలత, బూతు గురించి అనేక మంది గతంలోనే రాశారు. అందువలన వాటన్నింటినీ నేటి తరాలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం కూడా ఉంది.ఉదాహరణకు సుప్రభాతంలో ఇలా ఉంది.

కమలాకుచ చూచుక కుంకుమతో

నియతారుని తాతుల నీలతనో

కమలాయతలోచన లోకపతే

దీనికి అర్ధం ఏమిటంటే లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమ పూవు రంగువలన అంతటా ఎర్రగా చేయబడిన రంగుగల వాడా అని హేతువాది వెనిగళ్ల సుబ్బారావు వివరణ ఇచ్చారు.దీన్ని చదివి ఎవరైనా మా మనోభావాలను దెబ్బతీసిందని కేసులు వేస్తే కుదరదు. ఫలానాదే నిర్థిష్ట అర్ధం అని నిర్ధారణ ఉంటే దాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. ఉత్తర కాండలో సీతా రాముల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు వివాదం రేపటాన్ని కూడా చూశాము. మనోభావాల పేరుతో ఉన్మాదాన్ని, ఉద్రేకాలను రెచ్చగొట్టటం, దాడులకు పూనుకోవటం తగని పని. మేము చెప్పిందే భాష్యం ఇతరులెవరూ చెప్పటానికి వీల్లేదు అంటే కుదరదు.మద్రాసు హైకోర్టు కేసులో మనోభావం గాయపడిరదని చెప్పుకున్న వ్యక్తి హాజరై మనుస్మృతిలో చెప్పిన దానికి పవిత్రమైన అర్ధం ఇదని చెప్పలేదు, అసలు కోర్టుకే రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎవరైనా మూడవ పక్షంగా చేరి అసలు అర్ధం చెప్పారా అంటే అది కూడా లేదు. మనుస్మృతిని పాటిస్తున్నామని లేదా పాటించాలని చెప్పేవారి కుటుంబాలలో మహిళలను దానిలో చెప్పినట్లుగానే ఉంచుతున్నారా ? ఉంటున్నారా ? దాని మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఇస్లామిక్‌ షరియాలో కూడా అలాంటివే ఉన్నాయి. వర్తమానానికి వర్తించవు. చిత్రం ఏమిటంటే షరియాను విమర్శించేవారు దానికి ఏమాత్రం తగ్గని, కొన్ని విషయాల్లో అంతకంటే ఎక్కువ తిరోగమన సూత్రాలు ఉన్న మనుస్మృతిని మాత్రం పవిత్రమైనది, మార్పులేని సనాతనమైనదిగా పరిరక్షించాలని కోరటమే కాదు, అమలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.అసలు సనాతనం అంటే ఏమిటో చెప్పలేని వారు కూడా వీర సనాతన్‌ అంటూ ముసుగులు వేసుకొని వీరంగం వేస్తున్నారు. అంబేద్కర్‌ కంటే ముందుగా సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే(182790) మనుస్మృతిని సవాలు చేశారు. దానిపేరుతో బ్రాహ్మణులు అనుసరిస్తున్న పద్దతులను వ్యతిరేకించారు, దళితులు, ఇతరుల దుస్థితిని వెలుగులోకి తెచ్చారు.నూతన తరాలు భావజాల పోరులో భాగంగా పూలే, అంబేద్కర్‌ చెప్పిన వాటిని మరింతగా జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.

అమెరికా అధ్యక్ష పదవీ స్వీకార ఉత్సవం : నరేంద్రమోడీని విస్మరించిన డోనాల్డ్‌ ట్రంప్‌, ఆహ్వానం కోసం విశ్వగురువు ఆరాటం, రాను పొమ్మన్న చైనా అధినేత షీ జింపింగ్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియదు. ఈనెల 20వ తేదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రత్యర్థిగా ప్రకటించిన చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించి తన జిగినీదోస్తు, అమెరికా సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మన ప్రధాని నరేంద్రమోడీని విస్మరించటం రెండూ సంచలనాత్మకమే. ఆ ఉత్సవానికి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ హాజరవుతారని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఎక్స్‌ద్వారా ఆదివారం నాడు వెల్లడిరచారు.అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు వాన్స్‌ ప్రమాణ స్వీకార ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఉన్నట్లు జైస్వాల్‌ పేర్కొన్నారు. దీనికి కొద్ది రోజుల ముందు మన విదేశాంగ శాఖ ప్రతినిధి నరేంద్రమోడీకి ఆహ్వానం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘‘ ఇటీవల మన విదేశాంగశాఖ మంత్రి మరియు విదేశాంగశాఖ కార్యదర్శి అమెరికాను సందర్శించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. దాని వివరాలను ఇప్పటికే మీడియా ద్వారా మీతో పంచుకున్నాము.రానున్న రోజుల్లో ఈ సంబంధాన్ని మరింత పటిష్టంగా, మరింత సన్నిహితంగా తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మీరు అడిగిన నిర్దిష్ట ప్రశ్నకు ఏవైనా పరిణామాలు ఉంటే తప్పనిసరిగా మీకు తెలియచేస్తాము ’’ అని పేర్కొన్నారు. నరేంద్రమోడీని విస్మరించటం గురించి గోడీ మీడియా కావాలనే విస్మరించింది. ఎందుకంటే విశ్వగురువుగా ఆకాశానికి ఎత్తిన వారు ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో పడిపోయారు. కొడదామంటే కడుపుతో ఉంది తిడదామంటే అక్క కూతురు అన్నట్లుగా ఉంది.మోడీకి ఆహ్వానం పలికితే దానికి ప్రతిగా పెద్ద సంఖ్యలో ఎఫ్‌35 ఫైటర్‌ జెట్‌ విమానాలను కొనుగోలు చేస్తామని జై శంకర్‌ చెప్పవచ్చని కూడా పుకార్లు వచ్చాయి. ఏమైనా మోడీకి ఆహ్వానం రాలేదు.

అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 1874 సంవత్సరం నుంచి ఇతర దేశాల అధినేతలను ఎవరినీ ఆహ్వానించే సాంప్రదాయం లేదు. అక్కడ పని చేస్తున్న దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు మాత్రమే హాజరవుతారు. కానీ ఈ సారి డోనాల్డ్‌ ట్రంప్‌ దాన్ని పక్కన పెట్టి కొన్ని దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు. ఆ జాబితాలో మన ప్రధాని నరేంద్రమోడీ పేరు లేదు. వెళ్లేందుకు అన్నీ సర్దుకొని విమానం ఎక్కేందుకు తయారైన మోడీకి పిలుపు లేకపోతే పోయింది, వచ్చేందుకు ఇచ్చగించని చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించటాన్ని మోడీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కావాలంటే ఒక ప్రతినిధి వర్గాన్ని పంపుతాను తప్ప తాను వచ్చేది లేదని చెప్పినట్లు వార్తలు. షీ జింపింగ్‌కు నటించటం రాదని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, దానికి అనుగుణంగానే స్పందించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అమెరికాకు సహజభాగస్వామిగా చెప్పుకోవటమే కాదు, ట్రంప్‌కు ఎంతో సన్నిహితంగా ఉంటారని, దానికి నిదర్శనంగా గతంలో అసాధారణ రీతిలో మన గత ప్రధానులే కాదు, ఏ దేశాధినేతా చేయని విధంగా ట్రంప్‌ రెండవ సారి పోటీ చేసినపుడు అప్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని అమెరికా వెళ్లి మరీ భారతీయ సంతతి వారి సభలో నరేంద్రమోడీ ప్రచారం చేసి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి బంధం ఉన్నప్పటికీ ఆహ్వానం ఎందుకు రాలేదన్నది చర్చగా మారింది. నరేంద్రమోడీకి ఆహ్వానం పంపాలని కోరేందుకు విదేశాంగ మంత్రి జై శంకర్‌ను అమెరికా పంపారని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి చేసిన ప్రకటనపై అవునని గానీ కాదని గానీ ప్రభుత్వం లేదా బిజెపి ఇంతవరకు ప్రకటించలేదు. అసలేం జరుగుతోంది, ట్రంప్‌ మోడీని పట్టించుకోవటం మానేశారా లేక మరింతగా వత్తిడి తెచ్చి లొంగదీసుకొనే ఎత్తుగడలో భాగమా !

డోనాల్డ్‌ ట్రంప్‌ రూటే సపరేటు. తన పదవీ స్వీకారోత్సవానికి ఎంత మందిని ఆహ్వానించాడో, ఎవరు వస్తారో ఇది రాసిన జనవరి 12వ తేదీ నాటికి స్పష్టత రాలేదు. అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అనేక మంది నేతలు రానున్నారు.ఆ మేరకు సమచారాన్ని లీకుల రూపంలో వదిలారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు ఆహ్వానం అందినట్లు ధృవీకరించారు.జనవరి ఐదవ తేదీన అమెరికా వచ్చి ఫ్లోరిడాలోని ట్రంప్‌ విడిది మార్‌ ఏ లాగోలో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. హంగరీ ప్రధాని విక్టర్‌ ఓర్బాన్‌కు ట్రంప్‌ తొలి ఆహ్వానం పంపినట్లు, అతగాడు ఇంకా అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఎన్నికల ఫలితం వెలువడగానే తొలుత ట్రంప్‌కు అభినందనలు తెలిపిన ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు నాయిబ్‌ బుకీలే ఆహ్వానితులలో ఒకరు. గతేడాది అతగాడి ప్రమాణ స్వీకారానికి ట్రంప్‌ కుమారుడు హాజరయ్యాడు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీ కూడా రానున్నాడు. ఇంత చిన్న దేశాలకు ఆహ్వానం పలికి భారత ప్రధానిని ఎందుకు విస్మరించినట్లు ? ప్రధమంగా ట్రంప్‌కు అభినందనలు తెలిపిన తొలి ముగ్గురిలో మోడీ ఒకరని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.‘‘ మనం నిజాయితీగా చెప్పుకోవాలి, ఈ రోజు అమెరికా అంటే ప్రపంచంలో అనేక దేశాలు పిరికిబారి ఉన్నాయి, వాటిలో ఒకటిగా మనదేశం లేదు ’’ అని కూడా చెప్పారు. ట్రంప్‌ అధికార స్వీకరణ ఉత్సవానికి హాజరయ్యేందుకు ఆహ్వానాల కోసం విదేశీ నేతలు వేలం వెర్రిగా ప్రయత్నించారంటూ న్యూయార్క్‌ పోస్టు పత్రిక రాసింది. అనేక మందికి అలాంటి అవకాశం లేదని ఆహ్వానాల కోసం పైరవీలు చేసే ఒక ఏజంట్‌ చెప్పినట్లు పేర్కొన్నది. ‘‘ మీకు ఆహ్వానం అందే అవకాశం లేదని నా ఖాతాదారులకు వాస్తవం చెప్పాను. మీరు కోస్టారికా నుంచి వచ్చారనుకోండి, మీ వలన చేకూరే లబ్ది ఏమిటి ? మీరు మీ దేశం నుంచి వాణిజ్యం లేదా ప్రధాన కంపెనీలను తీసుకురాలేరు’’ అని చెప్పాడు.ట్రంప్‌ అంటే వాణిజ్యం, లాభం, ప్రతిదాన్నీ ఆ కోణం నుంచే చూస్తాడు. వాషింగ్టన్‌ వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించటమేగాక బహిరంగంగా వాంఛను వెల్లడిరచిన నేత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ. అయినా ఆహ్వానం అందలేదు.అయితే అతను రావాలనుకొని వస్తే మాట్లాడి పంపిస్తా అని ట్రంప్‌ అమర్యాదకరంగా మాట్లాడాడు. అనేక మంది ఆహ్వానాలు పొందేందుకు వివిధ మార్గాల ద్వారా ట్రంప్‌ యంత్రాంగం దగ్గరకు వస్తున్నారని ఈ విషయాల గురించి తెలిసిన ట్రంప్‌ అంతరంగికుడు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.

ట్రంప్‌ పంపిన ఆహ్వానాన్ని షీ జింపింగ్‌ తిరస్కరించినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడిరచింది. షీ బదులు ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌ లేదా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ గానీ హాజరుకావచ్చని,ట్రంప్‌ బృందంతో చర్చలు కూడా జరుపుతారని పేర్కొన్నది.అయితే వారిబదులు కీలకనేత చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాయ్‌ కీ హాజరుకావాలని ట్రంప్‌ సలహాదారులు వాంఛించినట్లు కూడా ఆ పత్రిక రాసింది.ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీకి ఎంతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ ఆహ్వానం పంపకుండా చైనా నేత షీ జింపింగ్‌ రాకపోయినా అక్కడి ఇతర ప్రముఖులు రావాలని కోరుకోవటం అమెరికా ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పుకు సూచిక అని కొందరి అభిప్రాయం. ఎక్స్‌ సామాజిక మాధ్యమం అధిపతి ఎలన్‌మస్క్‌ ట్రంప్‌ సలహాదారుగా నియామకం అయిన సంగతి తెలిసిందే.ఫేస్‌బుక్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సొమ్ము తీసుకొని అనుకూల, వ్యతిరేక ప్రచారాలను ప్రోత్సహించటం లేదా నియంత్రించటం బహిరంగ రహస్యం. ఈ పూర్వరంగంలో ఎక్స్‌లో హెచ్‌ 1 బి వీసాలు, ఇతర అంశాల గురించి భారత వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది, దాన్ని అనుమతించటం అంటే కావాలని చేయటం తప్ప మరొకటి కాదు. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న విద్వేష ప్రచార అధ్యయన సంస్థ సిఎస్‌ఓహెచ్‌ చేసిన విశ్లేషణ ప్రకారం డిసెంబరు 22 నుంచి జనవరి మూడవ తేదీ వరకు ఎక్స్‌లో 128 పోస్టులను 13.854 కోట్ల మంది చూశారు.36 పోస్టులనైతే ఒక్కొక్కదానిని పదిలక్షల మందికి పైగా చదివారు.ఈ పోస్టులన్నీ 86ఖాతాల నుంచి వెలువడ్డాయి.ఎక్స్‌ యాజమాన్యం లాభాల కోసం విద్వేష ప్రసంగాలను ప్రోత్సహించిందని కూడా ఆ విశ్లేషణ వెల్లడిరచింది.

అమెరికా అధ్యక్షుడి నుంచి ఆహ్వానం రావటంతో చైనా పొంగిపోవటం లేదు. సైద్ధాంతికంగా, ఆర్థికంగా తమకు శత్రువు అని అమెరికా అనేక సార్లు ప్రకటించింది. నిత్యం తైవాన్‌ అంశం మీద కాలుదువ్వుతున్నది. ఇదే ట్రంప్‌ 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్దం ఇంకా కొనసాగుతున్నది.మరోపదిశాతం పన్నులు విధిస్తానని బెదిరించాడు. అందువలన ఆహ్వానం వెనుక ఉన్న ఎత్తుగడ ఏమిటన్నది చైనా పరిశీలించటం అనివార్యం. అసలు చైనా స్పందన ఎలా ఉంటుందో పరిశీలించేందుకు వేసిన ఎత్తుగడ లేదా దానితో సంబంధాలను తెంచుకోవటం అంత సులభం కాదని భావించటంగానీ కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా మరుగుదొడ్లలో తుడుచుకొనే పేపర్‌ కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటిది చైనాతో ప్రత్యక్ష పోరుకు తెరదీసే అవకాశాలు లేవని చెప్పవచ్చు. చైనాను శత్రువుగా పరిగణించటం అపత్కరం అయితే స్నేహితుడిగా చూడటం ప్రాణాంతకం అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీకిసింజర్‌ వర్ణించాడు. అందువలన ట్రంప్‌కు కత్తిమీద సామే.

అమెరికా ఎన్నికలకు ముందు అక్కడ జరిగిన క్వాడ్‌ సమావేశానికి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మోడీ తనను కలుస్తారంటూ ట్రంప్‌ బహిరంగంగా ప్రకటించి భంగపడ్డాడు.మన అధికారులు ఇచ్చిన సలహా లేదా ట్రంప్‌ గెలిచే అవకాశాలు లేవన్న అంచనాల పూర్వరంగంలో కలిస్తే గతంలో మాదిరి తప్పుడు సంకేతాలు వెళతాయన్న జాగ్రత్త కావచ్చుగానీ వారి భేటీ జరగలేదు.దాన్ని మనసులో పెట్టుకొని కూడా మోడీకి ఒక పాఠం చెప్పాలని భావించి ఉండవచ్చు. ట్రంప్‌ కక్షపూరితంగా వ్యవహరించే మనిషి. సిక్కు తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వ్యక్తిగా పేరున్న ఇండోఅమెరికన్‌ లాయర్‌ హర్‌మీత్‌ థిల్లాన్ను పౌరహక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా ట్రంప్‌ నియమించాడు. సిఐఏ ఏజంటుగా పేరున్న సిక్కు తీవ్రవాది గురు పత్వంత్‌ సింగ్‌ పన్నుకు అమెరికా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.అతగాడు మహాకుంభమేళా సందర్భంగా దాడులు చేస్తామని బెదిరించాడు. బంగ్లాదేశ్‌లో తిష్టవేసేందుకు పూనుకున్నది అమెరికా. అక్కడ భారత అనుకూల అవామీలీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం బహిరంగరహస్యం. ఈ పరిణామం మన దేశానికి తలనొప్పులు తెచ్చేదే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాతో శతృత్వాన్ని పెంచుకోవాలని మనదేశంపై అమెరికా తెస్తున్న వత్తిడికి మోడీ పూర్తిగా తలొగ్గటం లేదు. పెద్ద ఎత్తున వస్తువుల దిగుమతి, చైనా పెట్టుబడులకు అనుమతి, సరిహద్దులో పూర్తి స్థాయి సాధారణ సంబంధాల పునరుద్దరణకు ఒప్పందం చేసుకోవటాన్ని అమెరికా ఊహించ, సహించలేకపోయింది. దీనికి తోడు దాని ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయటం తెలిసిందే. అధ్యక్షుడు పుతిన్ను మనదేశ పర్యటనకు నరేంద్రమోడీ ఆహ్వానించారు. అది జనవరిలో ఉండవచ్చనే వార్తలు వచ్చాయి. పుతిన్‌కు ఆహ్వానం పలికిన మోడీని కలవటాన్ని ట్రంప్‌ సహించడని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఉన్న సంబంధాల గురించి అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు విదేశాంగ మంత్రికి ఆహ్వానం పంపారు. వివిధ దేశాల నేతలకు తన పదవీ స్వీకార ఉత్పవ ఆహ్వానం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవటంలో కీలకమని అమెరికా మీడియా సంస్థ సిబిఎస్‌ వ్యాఖ్యానించింది. అలాంటి ఆహ్వానితుల్లో మోడీ పేరు లేకపోవటం మనదేశానికి మంచిది కాదని కొందరు చెబుతున్నారు. గతంలో ట్రంప్‌తో సఖ్యంగా ఉన్నపుడు మనదేశానికి ఒరిగిందేమిటన్నది ప్రశ్న !

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడు ధన్యజీవి ! దేవదూత అన్న నోటితోనే మానవుడిని అని చెప్పుకున్న నరేంద్రమోడీ !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


ఇంతకీ నరేంద్రమోడీ ఎవరు ? లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పినట్లు మహత్తర లక్ష్యం కోసం దేవుడు పంపిన దూత అనుకోవాలా ? తాజాగా చెప్పినట్లు మానవుడినే కానీ దేవుడిని కాదు, తప్పులు చేసి ఉంటా అనే మాటలు నమ్మాలా ? మోడీ గురించి తెలిసిన వారు ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగు ధన్యుడు అనుకుంటారు. ఇక తేల్చుకోవాల్సింది భక్తులే ! అప్పుడు దేవుడు ఎందుకు పంపాడని చెప్పారో ఇప్పుడు మానవుడినే అని ఎందుకు అన్నారో మోడీ ఎలాగూ నోరు విప్పరు గనుక ఆయన ప్రధమ గణాలు వివరించాలి. ఈ కాలంలో మోడీ నెరవేర్చిన లేదా మిగిలిపోయిన మహత్తర లక్ష్యం ఏమిటో ఎవరికైనా తెలుసా ? జరోధా అనే సంస్థ తరఫున నిఖిల్‌ కామత్‌ 2025 జనవరిలో మోడీతో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌ ( ఒక జర్నలిస్టు జరిపే ముఖాముఖీ`ప్రశ్నలు ముందే ఇవ్వాలి, ఇంటర్య్వూ సమయంలో మోడీని ఇబ్బందికరమైన కొత్త ప్రశ్నలు అడగకూడదు అనే షరతులు వర్తిస్తాయి)లో అనేక అంశాలను వివరించారు. తనకు దేశమే ప్రధమ లక్ష్యం అన్నారు. గుజరాత్‌ సిఎంగా పని చేస్తున్నపుడే మరో ఇరవై సంవత్సరాల పాటు పనిచేసే బృందాన్ని తాను తయారు చేశానని, ఇప్పుడు కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ బృందంలో ఎవరున్నారో వెల్లడిరచలేదు, వ్యక్తుల పేర్లు చెబితే అనేక మంది ఇతరులకు అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఆ బృందం ఒక బ్రహ్మపదార్ధం అనాల్సి ఉంటుంది.ప్రతివారినీ తన ఖాతాలో వేసుకోవచ్చు. మరికొన్ని సుభాషితాలు, స్వంత గొప్పలు ఇలా ఉన్నాయి. తప్పులు సహజం కానీ దురుద్ధేశ్యాలతో చేయలేదు, నేనూ తప్పులు చేసి ఉంటాను, నేను మనిషిని దేవుడిని కాదు. నేను ఒక విలక్షణమైన రాజకీయవేత్తను కాదు.నేను ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అది నాకు తప్పనిసరి, నాకది ఇష్టం లేదు గానీ చేయాల్సి ఉంటుంది. పాడ్‌కాస్ట్‌ ఇలా సాగింది. మహాత్మా గాంధీ, సావర్కర్‌ మార్గాలు వేరైనా ఇద్దరూ స్వాతంత్య్రం కోసమే పోరాడారంటూ ఇద్దరూ ఒకటే అన్నట్లుగా చిత్రించారు. జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానంటూ ప్రేమ లేఖలు రాసిన సావర్కర్‌ను గాంధీతో పోల్చటం చరిత్ర వక్రీకరణ తప్ప మరొకటి కాదు.

ఎనిమిది నెలల క్రితం తన జన్మ జీవ సంబంధమైనది కాదని (2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ) లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు, ఇప్పుడు మానవుడిని అని చెప్పుకోవటం నష్ట నివారణ చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేష్‌ వ్యాఖ్యానించారు. భూమ్మీద తన ఉనికి కేవలం జీవ సంబంధమైనది కాదని, తన తల్లి మరణించిన తరువాత తనను దేవుడు భూలోకంలోకి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పంపాడని తనకున్న శక్తులను చూసిన తరువాత తానీ మాటలు చెప్పగలుగుతున్నట్లు మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘ నా తల్లి బతికి ఉన్నంత వరకు నేను కూడా జీవసంబంధంగానే జన్మించానని అనుకున్నాను. కానీ తరువాత అనుభవాలను చూస్తే పరమాత్ముడు ఒక లక్ష్యం కోసం పంపాడని నేను నమ్మాను, ఆ లక్ష్యం నెరవేరిన తరువాత మరోసారి నాతో పని ఉండదు. అందువల్లనే నేను పూర్తిగా దేవుడి కోసం అంకితమయ్యాను, నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు ’’ అంటూ అదానీ యాజమాన్యంలోని ఎన్‌డిటివితో మోడీ చెప్పారు.( ఆ లక్ష్యం ఏమిటో, ఎంత వరకు వచ్చింది, పూర్తి చేసిందీ లేనిదీ చెప్పలేదు) ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వారిని నేరుగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకు వెళతారు అంటూ అప్పుడు రాహుల్‌ గాంధీ అపహాస్యం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ మారు మాట్లాడలేదు. అంతకు కొద్ది రోజుల ముందు తననెవరూ దెబ్బతీయలేరని, తాను మూడు, ఐదు చివరికి ఏడు ఎన్నికలైనా సరే గెలుస్తూనే ఉంటానని చెప్పుకున్నారు.తనకు ఓటు వేయటం అంటే పుణ్యం చేసుకోవటమే అని కూడా చెప్పారు. మోడీ చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను ఆకాశానికి ఎత్తిన తీరు చూశాము. ఎంతగా అంటే పూరీ జగన్నాధుడు కూడా నరేంద్రమోడీ భక్తుడేనని ఒడిషాకు చెందిన బిజెపి నేత సంబిత్‌ పాత్ర వర్ణించి తరువాత నోరు జారినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే.

చరిత్రలో అవతార పురుషులమని ప్రదర్శించుకున్నవారందరూ ఇలాగే ఒక లక్ష్యం కోసం ఉద్భవించినట్లు చెప్పుకున్నవారే. దైవదూతను అన్న నోటితోనే అదానీ, అంబానీలు రాహుల్‌ గాంధీకి టెంపోల నిండుగా నోట్ల కట్టలు పంపారని తుచ్చ మానవుల మాదిరి మోడీ ఎన్నికల సమయంలో ఆరోపణ చేసిన సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ పారిశ్రామిక, వాణిజ్యవేత్తల వద్ద లెక్కల్లో చూపని నల్లధనం పెద్ద ఎత్తున ఉందని చెప్పటమే. బహుశా ఆ వ్యాఖ్యల తరువాత తన స్నేహితుల గురించి మాట్లాడిరది తప్పని తెలిసిందో లేక వారి నుంచి హెచ్చరికలు వచ్చాయో తెలియదు గానీ తరువాత మరోసారి ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రతిపక్షపార్టీల నేతలందరూ ముజ్రా పనులు చేస్తున్నారంటూ దిగువ స్థాయి విమర్శలు కూడా చేశారు.(ఉత్తరాదిన వేశ్యలతో కులీనులు చేసే గానాబజానాలను ముజ్రా అంటారు). తనకు ఇల్లూ, సంసార బంధాలు లేవు, దేశం కోసమే పుట్టినట్లు నరేంద్రమోడీ చెప్పుకుంటారు, భక్తులు కూడా అదే చెబుతారు. గుజరాత్‌ రాజధాని గాంధీ నగర్‌లో ధనికులు నివసించే ప్రాంతంలో తనకు ఒక ఇంటి స్థలం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న అంశాన్ని కారవాన్‌ పత్రిక వెల్లడిరచింది. ముఖ్యమంత్రిగా ఉండగా తన పేరున తానే మంజూరు చేసుకున్న స్థలమది. దాని మీద వివాదం చెలరేగటం, కోర్టులకు ఎక్కటంతో సదరు స్థలాన్ని పార్టీకి ఇస్తానని మోడీ చెప్పారు. ఏ బంధాలు లేని తాను స్థలం తీసుకోవటం ఎందుకు, తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా పార్టీకి ఇస్తానని చెప్పటం ఏమిటి ? ఈ స్థలం ఉన్న అంశం గురించి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణ ఉంది.

నరేంద్రమోడీ గురించి ఉన్నతంగా చిత్రించేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి నిపుణులెందరో పని చేశారన్నది బహిరంగ రహస్యం. దానికి గోడీ మీడియా ఎంతగానో సహకరించిందని అనేక మంది విమర్శలు చేసింది కూడా వాస్తవమే.2019లో ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ఒక ప్రచార సినిమా కూడా తీశారు. వాస్తవాల ఆధారంగా తీసినట్లు చెప్పిన ఆ సినిమాలో వక్రీకరణలు, అవాస్తవాలెన్నో, అన్నింటినీ త్యజించి దేశం కోసమే మోడీ పాటుపడుతున్నట్లు చిత్రించారు.ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన నరేంద్రమోడీ బాల్యంలో ఒక చేత్తో టీ అమ్ముతూ మరో చేత్తో జాతీయ జండాను పట్టుకున్నట్లు, దానికి వందనం చేసినట్లు చూపారు. వాస్తవం ఏమంటే అదే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం వచ్చిన తరువాత 52 సంవత్సరాల పాటు జాతీయ జండాను ఎగురవేయటానికి నిరాకరించింది, బాల్యంలోనే జాతీయ భావాలతో పెరిగినట్లు సినిమాలో చూపిన మోడీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వామే.శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో ఆర్మీ పహారాలో బిజెపి నేత మురళీ మనోహర జోషి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. కానీ ఈ చిత్రంలో నరేంద్రమోడీ ఆ పని చేశారని చిత్రించటం కళ్ల ముందే చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ చేయని విధంగా గుళ్లు గోపురాలు తిరిగి, ధ్యానం పేరుతో ఫొటో ప్రదర్శనలు, అయోధ్యలో రామాలయ ప్రారంభం సందర్భంగా అన్నీ తానై చేసిన హడావుడి, బాలరాముడి చిత్రంతో నరేంద్రమోడీ బొమ్మ పెట్టి వేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాటన్నింటికీ పరాకాష్టగా అసలు తనది జీవసంబంధ జన్మ కాదని చెప్పుకొనేంత వరకు వెళ్లింది. ఇప్పుడు తాను మానవుడనే అని, తప్పులు చేయటం సహజం అని చెప్పుకోవటం కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటంలో భాగమే అన్నది స్పష్టం.మాట మార్చి తాను మానవమాత్రుడనని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ? అయోధ్యలో బిజెపి ఓడిపోవటం, వారణాసిలో తన మెజారిటీ భారీగా పడిపోవటం, లోక్‌సభలో ఒక పార్టీగా బిజెపికి సంపూర్ణ మెజారిటీని తీసుకురావటంలో వైఫల్యం, గతంకంటే ఓట్లు కూడా తగ్గటం, దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుడు, ఎటు చూసినా వైఫల్యాలే కనిపిస్తుండగా తాను దైవాంశ సంభూతుడనని, తన శక్తి గురించి చెప్పుకొనే అవకాశాలు ఆవిరయ్యాయి. వీటి గురించి ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తారో అని గ్రహించి తాను కూడా మానవ మాత్రుడనేనని, వైఫల్యాలు సహజమేనని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపిస్తోంది.

విమానాల వీడియోతో అమెరికా కూటమికి దడపుట్టించిన చైనా ! ఫైటర్‌ జెట్స్‌లో మనమెక్కడ !!

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు చివరి వారంలో చైనా ఎగురవేసిన రెండు విమానాల వీడియోను చూసి అమెరికా, దాని అనుంగు దేశాలకు దడమొదలైందా ? మీడియాలో వస్తున్న విశ్లేషణలు, వివరాలను చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. చైనా కమ్యూనిస్టు విప్లవ సారధి మావో జెడాంగ్‌ 131వ జన్మదినం డిసెంబరు 26వ తేదీన రెండు తయారీ కేంద్రాల నుంచి ఆకాశంలో విహరించిన రెండు విమానాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రతి దేశం స్వంత విమానాలను అవి పౌర లేదా యుద్ధ అవసరాల కోసం తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు గానీ చైనా గురించి ఎందుకింత ఆందోళన.స్టెల్త్‌ బాంబర్ల తరగతికి చెందినవి చెబుతున్న ఆధునిక విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయన్నది రహస్యమే.ఐదు, ఆరు తరాలకు చెందిన వాటిని స్టెల్త్‌ బాంబర్లు అని పిలుస్తున్నారు. ఇవి ఇతర దేశాలకు రాడార్లకు దొరక్కుండా( రెండో కంటికి తెలియకుండా) ఎగిరి శత్రువును దెబ్బతీసేంత వేగం, సామర్ధ్యం కలిగినవి. ఫోర్బ్స్‌ వెబ్‌సైట్‌ నాలుగు సంవత్సరాల క్రితం వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 2020 డిసెంబరు నాటికి ఏరకం విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉనాయో పేర్కొంటూ ఒక జాబితాను ఇచ్చింది. దాని ప్రకారం అమెరికా 540, చైనా 41,నార్వే 22, ఇజ్రాయెల్‌ 18, ఆస్ట్రేలియా 16, బ్రిటన్‌ 15, జపాన్‌ 12, ఇటలీ 11, దక్షిణ కొరియా 11, రష్యా వద్ద పది చొప్పున ఉన్నాయి.రాడార్లను తప్పించుకొని ప్రయాణించే నాలుగు రకాలను చైనా రూపొందిస్తున్నదని కూడా ఆ వార్త పేర్కొన్నది. ఈ నాలుగేండ్లలో వాటి సంఖ్య కచ్చితంగా పెరిగి ఉంటుంది. మిలిటరీలో అమెరికా ఇప్పటికీ ఎదురులేని శక్తి అన్నది నిస్సందేహం. ఆ బలాన్ని చూపి ప్రపంచాన్ని తన అదుపులో పెట్టుకోవాలని చూస్తున్న మాట కూడా తెలిసిందే. ఇంతకీ చైనాను చూసి ఎందుకు కంగారు పడుతున్నట్లు ? ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదవ తరం యుద్ధ విమానాలే ఉన్నాయి. అమెరికా తయారు చేసిన ఆరవ తరం విమానం 2020లో గగనతలంలో ఎగిరినప్పటికీ దాని గురించి వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. తాజాగా చైనాలోని చెంగడు, షెన్‌యాంగ్‌ విమాన తయారీ కేంద్రాల నుంచి రెండు కొత్త విమానాలు ఆకాశంలో కనిపించగా వాటికి రక్షణగా ఐదవ తరం జె20 ఫైటర్‌ విమానం తిరిగింది. ఆ దృశ్యాలు తప్ప అంతకు మించి వివరాలేమీ ప్రపంచానికి వెల్లడి కాలేదు. ఆయితే ఆ రంగంలో నిపుణులైన వారు ఆ విమానాలను చూస్తే ఆరవతరానికి చెందిన లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు.

2024 చివరిలో ఫ్లైట్‌ గ్లోబల్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 161 దేశాలకు చెందిన సాయుధ దళాల్లో 52,642 విమానాలు ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 759 తక్కువ. ఆఫ్రికా ఖండంలో 4,230, మధ్య ప్రాచ్యంలో 4,595, రష్యా కామన్‌వెల్త్‌ దేశాల్లో 5,124, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 14,583, ఉత్తర అమెరికాలో 13,339,ఐరోపాలో 7,760, లాటిన్‌ అమెరికాలో 2,956 ఉన్నాయి.దేశాల వారీ చూస్తే అమెరికాలో 13,043(ప్రపంచంలో25శాతం), రష్యా 4,292(8శాతం), చైనా 3,309(6),భారత్‌ 2,229(4), దక్షిణ కొరియా 1,592(3), జపాన్‌ 1,443(3),పాకిస్థాన్‌ 1,399(3) కలిగి ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే చైనా దగ్గర ఉన్న మిలిటరీ విమానాలు ఎక్కడా సరితూగవు. చిత్రం ఏమిటంటే అమెరికాతో సహా నాటో దేశాలు ఇస్తున్న మద్దతు చూసి కేవలం 324 మిలిటరీ విమానాలు మాత్రమే కలిగి ఉన్న ఉక్రెయిన్‌ నాలుగువేలకు పైగా ఉన్న రష్యాను ఓడిస్తామని ప్రపంచాన్ని నమ్మింప చూస్తున్నది. రష్యాను చూసి నాటోలోని 23దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను జిడిపిలో రెండుశాతం అంతకు మించి ఖర్చు చేసేందుకు పూనుకున్నాయి.


చైనా ప్రదర్శించిన రెండు విమానాలు పరీక్ష కోసం ఉద్దేశించినవిగా చెబుతున్నారు. దానిలో తేలే ఫలితాలను బట్టి ప్రమాణాలను నిర్ధారించిన తరువాత మార్పులు చేర్పులతో రంగంలోకి దించుతారు. ఇది అన్ని దేశాలలో జరిగే ప్రక్రియే. అమెరికా ఐదవతరం ఎఫ్‌22, ఎఫ్‌35 రకాలకు ధీటుగా చైనా ఉన్నదని అందరూ అంగీకరిస్తున్నారు.మనదేశం అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌(ఎఎంసిఏ) రూపకల్పన దశలో ఉంది.ఎగుమతుల కోసం చైనా తయారు చేసిన జె35 రకం 40 స్టెల్త్‌ బాంబర్లను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్‌ నిర్ణయించింది.చైనాలో ఐదవతరం చెంగుడు జె20 రకం పని చేస్తుండగా షెన్‌యాంగ్‌ ఎఫ్‌సి31 రకం త్వరలో సేనలో చేరనుంది. ఈ సమాచార పూర్వరంగంలోనే ఆరవ తరం విమానాన్ని చైనా పరీక్షించినట్లు భావిస్తున్నారు.దాన్లో మూడు ఇంజన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆధునిక విమానాల్లో అలాంటి ఏర్పాటు లేని కారణంగా ప్రత్యేకత సంతరించుకుంది.ఇప్పటికిప్పుడు దాన్ని నిర్ధారించుకొనే అవకాశం లేదు.రెండో విమానం పైలట్లతో పని చేస్తుందా లేక మానవరహితంగా లక్ష్యాన్ని చేరేవిధంగా రూపొందించారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

అమెరికా 2020 సెప్టెంబరు 14న తాను ఆరవ తరం యుద్ధ విమానాన్ని రూపొందించినట్లు ప్రకటించటమే గాక ఒక విమానాన్ని ఎగురవేసింది. దాని వివరాలు ఇప్పటికీ రహస్యమే. 2022లో అమెరికా వైమానిక దళ విశ్రాంత జనరల్‌ మార్క్‌ డి కెలీ చైనా ఆరవతరం విమానాల గురించి హెచ్చరించాడు. సాంకేతికపరమైన తేడాను వేగంగా తగ్గిస్తున్నదంటూ ఆందోళన వెల్లడిరచాడు.1997లో అమెరికా ఐదవతరం స్టెల్త్‌ ఫైటర్‌ ఎఫ్‌22 రాప్టర్‌ను తొలిసారిగా ఆవిష్కరించారు. దానికి ధీటైన చైనా జె20 పద్నాలుగు సంవత్సరాల తరువాత 2011లో ఉనికిలోకి వచ్చింది.దీనితో పోల్చుకుంటే అమెరికా 2020లో ఆరవతరాన్ని ఆవిష్కరించిన నాలుగు సంవత్సరాలకే 2024లో చైనా తన విమానాలను ప్రదర్శించింది. దీన్ని బట్టి చైనా సాంకేతిక పరిజ్ఞానం ఇంత వేగంగా ఉందా అని ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. గతంలో చైనా సాధించినట్లు ప్రకటించిన అనేక విజయాలను తొలుత అంతా ప్రచారం తప్ప నిజం కాదని కొట్టిపడవేసిన వారు తరువాత వాస్తవమే అని తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు ఆరవతరం విమానాల గురించి కూడా అదే డోలాయమానంలో ఉన్నారు.దీని గురించి చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరాది సందర్భంగా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తూర్పు కమాండ్‌ ఒక సంగీత వీడియోను విడుదల చేసింది. దానిలో నూతన జెట్‌ బొమ్మలను చేర్చి అనధికారికంగా వాస్తవమే అని సంకేతమిచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.వివిధ దేశాలకు చెందిన విశ్లేషకులు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీర్ఘశ్రేణి, అత్యంత వేగంగా ప్రయాణించగల, శత్రు విమానాలను అడ్డుకోగలిగిన రష్యా మిగ్‌31 మాదిరి ఉన్నాయని, దానికంటే 45 టన్నుల బరువును మించి మోయగలవని, 400కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను దెబ్బతీయగలవని, ధ్వని కంటే నాలుగురెట్లు వేగంగా ప్రయాణిస్తాయని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. ప్రపంచంలో పరిణామాలు ఇలా ఉంటే మన దేశ పరిస్థితి ఏమిటి ?


పెట్రోలు, డీజిలు మీద విపరీతమైన సెస్సుల భారం మోపి ఏటా లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే గతం కంటే మోడీ సర్కార్‌ మిలిటరీ ఖర్చు ఎక్కువగా చేస్తున్నది, దానికి అవసరమైన మొత్తాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. సెస్‌ అంటే ఏ అవసరాల కోసం విధిస్తే దానికి మాత్రమే ఖర్చు చేయాలి, కానీ మోడీ సర్కార్‌ విధించిన వాటిలో రక్షణ లేదు. కాంగ్రెస్‌ దేశ రక్షణను నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. మన వైమానిక దళ అధిపతి ఏపి సింగ్‌ సుబ్రతో ముఖర్జీ 21వ సెమినార్‌లో మాట్లాడుతూ చెప్పిన మాటలు గమనించదగినవి.2010లో తేజ రకం యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం ఇప్పటికీ వాటిని పూర్తిగా సరఫరా చేయలేదని, మరోవైపున చైనా ఆరవతరం జెట్‌ను పరీక్షించిందని, చైనా నుంచి పాకిస్థాన్‌ ఐదవ తరం యుద్ధ విమానాలను రానున్న రెండు సంవత్సరాలలో కొనుగోలు చేయనున్నదని చెప్పారు. తేలిక రకం 40 తేజ విమానాలు కావాలని 200910లో ఆర్డరు పెడితే ఇంతవరకు పూర్తిగా రాలేదన్నారు. 1984లో విమానానికి రూపకల్పన జరిగిందని పదిహేడేండ్ల తరువాత మొదటి తేజా 2001లో ఎగిరిందని పదిహేను సంవత్సరాల తరువాత 2016లో మిలిటరీలో ప్రవేశపెట్టినట్లు, ఇది 2024, ఇంతవరకు తొలి 40 విమానాలను అందచేయలేదని, ఇదీ మన ఉత్పాదక సామర్ధ్యమని సింగ్‌ చెప్పారు. చైనాను గమనిస్తే ఎన్ని విమానాలను అది తయారు చేసిందని కాదు, ఎంతో వేగంగా సాంకేతికంగా ముందుకు పోతున్నదని నూతన తరం యుద్ధ విమానాలను బయటకు తీసుకురావటాన్ని ఇటీవల చూశామని ఎయిర్‌ ఛీఫ్‌ మార్షల్‌ అన్నారు. పాతబడిన మిగ్‌ 21 విమానాల స్థానంలో తేలిక రకం(ఎల్‌సిఏ) విమానాలను స్వంతంగా రూపొందించేందుకు 1980దశకంలో నిర్ణయించారు. ఒక ఇంజను కలిగిన నాలుగవ తరం తేజ విమానాలను స్వంతంగా తయారు చేస్తున్నాము. వాటిని మెరుగుపరచి తేజా ఎంకె1, తేజా ఎంకె1ఏ రకాలను రూపొందించాము. ఈ రంగంలో పురోగతిని వేగవంతం చేసేందుకు పదేండ్లలో మోడీ సర్కార్‌ చేసిందేమిటన్నది ప్రశ్న.

అమెరికా, చైనాలు ఆరవతరంలో ప్రవేశిస్తే మన దేశం వద్ద ఫ్రాన్సు నుంచి దిగుమతి చేసుకున్న దసాల్ట్‌ రాఫెల్‌ విమానమే ఆధునికమైనది, అది 4.5వ తరానికి చెందినదిగా పరిగణిస్తున్నారు. చురుకుగా పనిచేసే వైమానిక యూనిట్లు 42 ఉండాలని నిర్ణయించగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడిరచారు. ఒక్కొక్క యూనిట్‌లో రెండు అంతకు మించి యుద్ధ విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 83 తేలిక రకం తేజా విమానాల కోసం వాయుసేన ఒప్పందాలు చేసుకుంది, మరో 97కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది.వచ్చే దశాబ్దిలో ఐదవ తరం తేజా ఎంకె2 విమానాలు సిద్దం అవుతాయని భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న మిరేజ్‌ 2000, మిగ్‌29, జాగ్వార్‌ విమానాలున్నాయి, ఐదవతరం తేజా వస్తే మరింత ఆధునికం అవుతుంది. వీటిని అభివృద్ధి చేసేందుకు గత ఏడాది మార్చి నెలలో మాత్రమే కేంద్రం అనుమతించిందనే వార్తలను చూస్తే కబుర్లు చెప్పినంతగా ఆచరణ గడపదాటటం లేదన్నది వాస్తవం.పరస్పరం విశ్వాసం లేమి, మిత్రులుగా పైకి కనిపించే వారే కుట్రలు జరుపుతున్న పూర్వరంగంలో ప్రతిదేశం తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది. ఈపూర్వరంగంలో మన రక్షణ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు,ప్రచారానికే పరిమితం కాకుండా నిర్థిష్ట కార్యాచరణను రూపొందించాలి.

పదేండ్ల క్రితం వెలిగిన ప్రభ మసకబారింది, కెనడా ప్రధాని రాజీనామా !

Tags

, ,

ఎం కోటేశ్వరరావు


అతడు పది సంవత్సరాల క్రితం లిబరల్‌ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు అందుకున్నాడు. ఇప్పుడు అతని ఉనికి పార్టీని పాతాళానికి దించుతుందంటూ అదే పార్టీ నేతలు తూర్పారపడుతున్నారు. అతడే కెనడా ప్రధాని, అంతకు ముందు ప్రకటనల మోడల్‌గా పనిచేసిన 53 సంవత్సరాల జస్టిన్‌ ట్రుడేవ్‌. ఇంటా బయటా తలెత్తిన పరిస్థితి కారణంగా ఉక్కిరి బిక్కిరితో పార్టీ, ప్రభుత్వ పదవి నుంచి తప్పుకొంటూ సోమవారం నాడు ఆకస్మికంగా రాజీనామా ప్రకటన చేశాడు.ఈ నెల 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటు సమావేశాలను మార్చి 24వరకు సస్పెండ్‌ చేశారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ ప్రారంభం కాగానే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని మూడు ప్రధాన పార్టీలు ప్రకటించాయి. అదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయం. ట్రుడేవ్‌ ప్రకటన వెలువడిన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించాడు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా విలీనం కావటం మంచిదని గతంలో చేసిన ప్రకటనను పునరుద్ఘాటించాడు. అది అందరికీ మంచిదన్నాడు, రష్యా, చైనాల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నాడు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎన్నుకొనేంత వరకు ట్రుడోవ్‌ పదవుల్లో కానసాగుతాడు. వారం రోజుల్లో కొత్తనేతను ఎంపిక చేస్తామని లిబరల్‌ పార్టీ ప్రకటించింది. పార్టీలో తలెత్తిన కుమ్ములాటల కారణంగా పలుకుబడి పాతాళానికి పడిపోవటం, ఆర్థిక మంత్రి రాజీనామా, ఆర్థికంగా అనిశ్చితి, వాణిజ్య యుద్ధానికి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన తదితర అనేక కారణాలతో ట్రుదేవ్‌ రాజీనామా ప్రకటన చేస్తూనే తాను పోరాటయోధుడనని కొందరి మాదిరి వెనక్కు తగ్గేవాడిని కాదని చెప్పుకుంటూనే దేశానికి నిజమైన నేత అవసరమని, పార్టీలో అంతర్గత పోరు కారణంగా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించటానికి తాను తగిన వాడిని కాదని, ఈ అంశంతో పాటు ప్రభుత్వంలో సంక్షోభం రాజీనామాకు కారణాలని కూడా చెప్పుకున్నాడు. తాను తొలిసారి పదవిలోకి వచ్చినప్పటికంటే రెండోసారి మెరుగైన విజయాలను సాధించానని, ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టకపోవటం పట్ల విచారిస్తున్నా అన్నాడు. రాజీనామా చేయటానికి ముందు అనేక మంది స్వంత పార్టీ ఎంపీలు గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.ట్రుడేవ్‌ ఏ మాత్రం కొనసాగినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని అనేక సర్వేలు వెల్లడిరచాయి. గడచిన రెండు ఎన్నికల్లోనూ లిబరల్‌ పార్టీ తక్కువ శాతం ఓట్లతో ఎక్కువ సీట్లు తెచ్చుకొని మైనారిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.2021లో జరిగిన ఎన్నికల్లో 338 పార్లమెంటు స్థానాలకు గాను 160 సీట్లు తెచ్చుకున్న లిబరల్‌ పార్టీకి 32.62శాతం ఓట్లు రాగా ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీకి 33.74శాతం ఓట్లు 119 సీట్లు వచ్చాయి. న్యూడెమోక్రటిక్‌ పార్టీ(ఎన్‌డిపి)కి 17.82శాతం ఓట్లు 25 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ మద్దతుతో ట్రుడేవ్‌ నెట్టుకువచ్చాడు.


గతేడాది సెప్టెంబరులో న్యూడెమోక్రటిక్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో అస్థిర పరిస్థితి ఏర్పడిరది. 2025 అక్టోబరు వరకు పార్లమెంటు వ్యవధి ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా పార్లమెంటు రద్దు, మధ్యంతర ఎన్నికలు రావచ్చని భావించారు. అయితే సమస్యను బట్టి తాము మద్దతు లేదా వ్యతిరేకించటం చేస్తామని ఎన్‌డిపి ప్రకటించటంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే డిసెంబరు 16న ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీ లాండ్‌ రాజీనామాతో పాలకపార్టీలో లుకలుకలు తీవ్రమయ్యాయని చెప్పవచ్చు. ఆమెతో జరిపిన ‘‘ప్రైవేటు సంభాషణ’’ ల గురించి తాను చెప్పలేనని, ఆమె రాజీనామాయే తన నిర్ణయానికి దారితీసిందని గానీ లేదని తాను చెప్పనని ట్రుడేవ్‌ విలేకర్లతో చెప్పాడు.ఇటీవలి వరకు ట్రుడేవ్‌ మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వామపక్ష న్యూ డెమోక్రటిక్‌ పార్టీ నేత జగ్‌మీత్‌ సింగ్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ తరువాత లిబరల్‌ పార్టీ నేత ఎవరుంటారన్నది సమస్య కాదు.వారు జనాన్ని మోసం చేశారు, మరోసారి అవకాశానికి అనర్హులు అన్నాడు. 


2015 ఎన్నికల్లో అనూహ్యంగా లిబరల్‌ పార్టీ అంతకు ముందు మూడవ పెద్ద పార్టీగా 36 సీట్ల నుంచి ఏకంగా 184 సంపాదించి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2019లో 157 సీట్లకు పడిపోయింది, మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ట్రడేవ్‌ 2021లో పార్లమెంటును రద్దు చేసి సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఓట్లు తగ్గినా 160 సీట్లతో మరోసారి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు లిబరల్‌ పార్టీ ఎన్నుకొనే కొత్త నాయకత్వం పార్లమెంటులో బలనిరూపణ చేసుకుంటుందా, పార్లమెంటును రద్దు చేసి ముందస్తుకు వెళతారా అన్నది తెలియదు. ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ ట్రుడెవ్‌ తెచ్చిన అపఖ్యాతిని మోయాల్సి ఉంటుంది.2019 ఎన్నికల్లో ట్రుడేవ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. వయస్సు తక్కువగా కనిపించేందుకు ముఖానికి రంగువేసుకొని తీయించుకున్న ఫొటోలతో ప్రచారం చేసుకున్నాడని ప్రతిపక్షాలు విమర్శించాయి.అనేక అవకతవకల విమర్శలు వచ్చాయి. ధనికదేశాల జి7 కూటమిలో అత్యధికంగా తొమ్మిది సంవత్సరాలు అధికారంలో కొనసాగిన రికార్డును ట్రుడేవ్‌ నెలకొల్పాడు.


పెరుగుతున్న ధరలు రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయని రెండు సంవత్సరాల క్రితం 33శాతం మంది కెనడా పౌరులు చెబితే 2024లో 45శాతానికి పెరిగినట్లు సామాజిక సర్వే వెల్లడిరచింది. ఇండ్ల అద్దెలు భరించలేకుండా ఉన్నామని 38శాతం చెప్పారు.2021 నుంచి ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వలన ప్రతి ఐదుగురిలో ఒకరు సామాజిక సంస్థల నుంచి తక్కువగానో ఎక్కువగానో ఆహారాన్ని పొందినట్లు చెప్పారు. ఆర్థిక సమస్యలతో స్వల్పంగా లేదా తీవ్రంగా మానసిక వత్తిడికి గురైనట్లు 35శాతం చెప్పారు. తక్కువ ఆదాయం వచ్చే వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అద్దె ఇండ్లలో ఉండేవారిలో జీవన సంతృప్తి చాలా తక్కువగా ఉంది.వయసు మీరిన వారికంటే యువత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది.2544 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో 55శాతం మంది ధరల పెరుగుదల గురించి ఆందోళన వెల్లడిరచారు.వృద్ధులలో 28శాతం ఉన్నారు. ఫుడ్‌ బాంకులు, సామాజిక సంస్థల నుంచి ఆహారాన్ని పొందుతున్నవారు యువకులలో 4647శాతం ఉండగా వృద్దులలో 27`28శాతం ఉన్నారు. పిల్లలపై ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం గురించి చెప్పనవసరం లేదు. ఆర్థికంగా కెనడా తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటోంది.


2008లో ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభం నాటి నుంచి నేటి వరకు కెనడాలో అనిశ్చితి సూచిక తీవ్ర వడిదుడులకు లోనవుతున్నది. రెండువేల సంవత్సరం నుంచి 2008 వరకు 50 నుంచి 200 మధ్య కదలాడగా తరువాత అది వంద నుంచి 400 మధ్య ఊగిసలాడిరది. 2020 కరోనా సమయంలో గరిష్టంగా 690, గతేడాది 650గా ఉంది.ట్రుడేవ్‌ ప్రకటనతో ఈ ఏడాది అది మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్టోబరులోగా ఎన్నికలు జరగాల్సి ఉండగా పెట్టుబడిదారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదు, తమ ప్రాజెక్టులను తాత్కాలింగా నిలిపివేయటం లేదా వాయిదా వేసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉపాధి మీద కూడా తీవ్ర ప్రభావం చూపటం అనివార్యం. నూతన నియామకాలు పరిమితం అవుతాయి. కరెన్సీ కెనడా డాలరు విలువ కూడా గత వారంలో పతనమై కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధాని రాజీనామా ప్రకటన తరువాత స్వల్పంగా పెరిగినప్పటికీ అనిశ్చితిలో కొనసాగ వచ్చు. కెనడా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్ను విధిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన గురించి తెలిసిందే.ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితి ఉన్న కారణంగా దీని గురించి బేరమాడే శక్తి కెనడాకు తగ్గుతుంది.ట్రంప్‌ చర్య అమెరికా వినియోగదారుల మీద భారాలు మోపినప్పటికీ కెనడా ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది.1985 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలలో కెనడా మిగులులో ఉంది. తమ వస్తువులను మరింతగా దిగుమతి చేసుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది.


గత కొద్ది నెలలుగా పార్టీ ఎంపీలు అనేక మంది డిమాండ్‌ చేసినప్పటికీ రాజీనామాకు ససేమిరా అన్న ట్రుడేవ్‌ డిసెంబరు నెలలో జరిగిన పరిణామంతో దిగిరాక తప్పలేదు. ప్రధానితో తన విబేధాల గురించి ఫ్రీలాండ్‌ రాజీనామా లేఖలో వెల్లడిరచారు. రాజకీయ జిమ్మిక్కులు భారీ మూల్యం చెల్లిస్తున్నాయంటూ పరోక్షంగా చేసిన విమర్శల లేఖను బహిర్గతం చేయటంతో వత్తిడి మరింత పెరిగింది. ఈ ఏడాది బడ్జెట్‌లోటు 20 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేయగా అది 60బిలియన్‌ డాలర్లకు పెరిగింది.బడ్జెట్‌ లోటు, ఆర్థిక అసమానతలను తగ్గిస్తానంటూ యువకుడిగా రంగంలోకి దిగిన ట్రుడెవ్‌కు యువతరం బ్రహ్మరధం పట్టటంతో 2015లో ఘనవిజయం లభించింది, ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కొన్నాడు.ట్రుడెవ్‌ రాజీనామాతో పాలక లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ నుంచి ప్రధాని పదవికి పోటీ పెరిగింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీలాండ్‌, ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన అనిత ఇందిరా ఆనంద్‌, విదేశాంగ మంత్రి మెలీనా జోలీ కూడా ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బాంక్‌ ఆఫ్‌ కెనడా గవర్నర్‌గా పనిచేసి ట్రడేవ్‌కు సలహాదారుగా ఉన్న మార్క్‌ కార్నే కూడా రేసులో ఉన్నాడు.ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చిన కార్బన్‌ పన్ను విధింపు ఇతగాడి సలహామేరకే జరిగింది.మూడు సార్లు ఓట్లు అధికంగా తెచ్చుకున్నప్పటికీ అవసరమైన సీట్లు తెచ్చుకోవటంలో విఫలమైన ప్రతిపక్ష నేత పిరే పోయిలివరే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక టీవీ జరిపిన సర్వేలో పిరేకు 44.2శాతం మంది మద్దతు ప్రకటించగా ట్రుడెవ్‌కు 24శాతం ఉన్నారు.కరోనా తరువాత వివిధ దేశాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులను చూస్తే అధికారంలో ఉన్నవారందరూ దాదాపు ఓడిపోయారు. కెనడాలో కూడా లిబరల్‌ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. రకరకాల ఆకర్షక వాగ్దానాలతో మద్దతు పొందిన వారిని హృదయ సామ్రాట్టులుగా జేజేలు కొట్టిన జనమే తీరు మారితే ఏ విధంగా తరిమి కొట్టారో బంగ్లాదేశ్‌, శ్రీలంక పరిణామాలు స్పష్టం చేశాయి. మన దేశంలో పాలక పార్టీలు వీటి నుంచి గుణపాఠాలు తీసుకుంటాయా ?