ఆందోళనకరంగా ప్రపంచ మిలిటరీ ఖర్చు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో చూసినపుడు చైనా లేదా మరొక ఏ దేశమైనా యావత్‌ మానవాళికే ముప్పు తెచ్చే ఆయుధాలతో ఆమెరికా, దాని మిత్ర దేశాలు భూమి, ఆకాశాలను నింపుతున్నపుడు ఎవరైనా వాటిని ఎదుర్కొనేందుకు పూనుకోక తప్పదు. స్టార్‌వార్స్‌ పేరుతో గగనతలంలో అమెరికా రూపొందిస్తున్న అస్త్ర, శస్త్రాల గురించి దశాబ్దాల తరబడి జరుపుతున్న ప్రచారం అదెలా ఉంటుందో చూపుతున్న సినిమాలు, వాస్తవాల గురించి అందరికీ తెలిసిందే.అందువలన దానికి పోటీగా ఏ దేశం ఏం చేస్తున్నదనే వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ ఏదో ఒకటి చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబీలతో స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు తమ ప్రభుత్వానికి సిఐఏ నివేదించినట్లు ఇటీవల బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది. చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక జరిపిన సమీక్షలో పేర్కొన్నారు.చైనా కొత్త ఆయుధాలను రూపొందించటం ఇదే కొత్త కాదంటూ కొందరు విశ్లేషకులు గుండెలుబాదుకుంటున్నారు. వారికి అమెరికా, ఇతర దేశాలు ఏం చేస్తున్నదీ కనపడవా ? చూడదలచుకోలేదా ?


కంటికి కనిపించని సైబర్‌దాడులు అంటే కంప్యూటర్లతో పని చేసే మిలిటరీ, పౌర వ్యవస్థలను నాశనం లేదా పని చేయకుండా చేయటం. అమెరికా తరచూ చేసే ఆరోపణ ఏమంటే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తమ నుంచి అపహరించిందన్నది. సైబర్‌దాడులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా తమ జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) నుంచి తస్కరించినట్లు కథనాలు రాయిస్తున్నది. చైనా 2016లోనే ఎన్‌ఎస్‌ఏ, అమెరికా మిత్రదేశాలకు చెందిన ఐరోపా కంపెనీల నుంచి గుప్త సంకేతాలను తీసుకొని వాటితో అదే కంపెనీల మీదే దాడులు జరుపుతోందన్నది సారం. గత సంవత్సరం అమెరికా కనీసం ఆరు దేశాల ప్రభుత్వ సంస్థలపై దాడులు చేసినట్లు ఇండో-పసిఫిక్‌ వ్యూహాత్మక సమాచార వ్యవస్థ ఆరోపించింది.అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నది. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌ అని చైనా వర్ణిస్తున్నది. చైనా రూపొందిస్తున్న సైబర్‌ ఆయుధాలతో గూఢచర్యం, సమాచారాన్ని పంపే అమెరికా ఉపగ్రహాల వ్యవస్థలను పని చేయకుండా చేయవచ్చని, ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సిఐఏ తన నివేదికలలో పేర్కొన్నది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దీని మాతృసంస్థ ఎలాన్‌ మస్క్‌ అధిపతిగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53 దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.


ప్రపంచంలో రోజు రోజుకూ మిలిటరీ ఖర్చు పెరుగుతున్నది. ప్రపంచం ఏమైనా సరే ఈ ఖర్చు ఎంత పెరిగితే అమెరికా కార్పొరేట్లకు అంతగా లాభాలు. మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది.ప్రపంచ జిడిపి వృద్ది 2.9శాతం, అంతకంటే తక్కువే అని అంచనా వేస్తున్నారు. డాలర్లలో చెప్పుకుంటే 2022 ఖర్చు 2,240బిలియన్‌ డాలర్లు. ఇది ప్రపంచ జిడిపిలో 2.2శాతం. ఐరోపాలో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగింది.ప్రపంచం మొత్తం చేస్తున్న ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. దేశాల వారీ అమెరికా 39, చైనా 13, రష్యా 3.9,భారత్‌ 3.6, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అందచేసిన దాదాపు 20 బి.డాలర్లను కూడా కలుపుకుంటే దాని వాటా 40శాతం. ఐరోపాలో అధికంగా ఖర్చు చేస్తున్న బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ ఎనిమిది శాతం, అమెరికా నీడలో ఉండే జపాన్‌, దక్షిణ కొరియా 2.1శాతం చొప్పున ఖర్చు చేస్తున్నాయి. మొత్తం మీద ప్రపంచ ధోరణులను గమనిస్తే ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్య, తూర్పు ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దీనికి మూలంగా కనిపిస్తున్నాయి, వాటికి అమెరికా, దానితో చేతులు కలుపుతున్న పశ్చిమ దేశాలే కారణం అన్నది బహిరంగ రహస్యం. సోవియట్‌ ఉనికిలో లేదు, దానిలో ఉన్న అనేక దేశాలు ఇప్పుడు అమెరికా చంకనెక్కాయి. అయినప్పటికీ ప్రచ్చన్న యుద్ధం నాటి స్థాయిని దాటి మధ్య,పశ్చిమ ఐరోపా దేశాల మిలిటరీ ఖర్చు ఇప్పుడు పెరిగింది.ఉక్రెయిన్‌ సంక్షోభంతో నిమిత్తం లేని ఫిన్లండ్‌ 36, లిథువేనియా 27, స్వీడెన్‌ 12, పోలాండ్‌ 11శాతం చొప్పున ఖర్చు పెంచాయి. అనేక తూర్పు ఐరోపా దేశాలు 2014తో పోల్చితే రెట్టింపు చేశాయి.


ఇక రష్యా ఖర్చు దాని జిడిపిలో ఒక ఏడాది కాలంలో 3.7 నుంచి 4.1శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉక్రెయిన్‌ ఖర్చు 640శాతం పెరిగి జిడిపిలో 3.2 నుంచి 34శాతానికి చేరింది. అమెరికాలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ద్రవ్యోల్బణం పెరిగి ఇబ్బందులు తలెత్తినా మిలిటరీ ఖర్చు పెంచుతూనే ఉంది. ఉక్రెయిన్‌తో సహా ప్రపంచంలో ఏ దేశానికి మిలిటరీ సాయం చేసినా అది అమెరికా ఆయుధ పరిశ్రమల లాభాలు పెంచేందుకే అన్నది తెలిసిందే.అమెరికాకు యుద్ధం వచ్చిందంటే చాలు పండుగే. రెండవ ప్రపంచ యుద్ధంలో డ్యూపాంట్‌ కంపెనీ లాభాలు 950శాతం పెరిగాయి. ప్రతి పోరూ అలాంటిదే.ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం నాటో ద్వారా ఆయుధాల అమ్మకం 2021తో పోల్చితే 2022లో 35.8 నుంచి 51.9 బి.డాలర్లకు పెరిగాయి.అదే నేరుగా ఈ కాలంలోనే 103.4 నుంచి 153.7 బిడాలర్లకు పెరిగాయి. దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా లేవనెత్తుతున్న వివాదం, తైవాన్‌పై రెచ్చగొడుతున్న కారణంగా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆయుధాల కొనుగోలుకు పూనుకున్నాయి. పేట్రియాట్‌ క్షిపణులను రూపొందించే రేతియాన్‌, ఎఫ్‌-16, 22, 35 రకం యుద్ధం విమానాలను తయారు చేసే లాక్‌హీడ్‌ మార్టిన్‌, నార్త్‌రాప్‌ గ్రుయిమాన్‌ కంపెనీల లాభాలు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగానే ఉక్రెయిన్‌ వివాదంలో సంప్రదింపులు జరగకుండా అడ్డుపడుతున్నది, పదే పదే తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడుతున్నది. మరోవైపున ఆఫ్రికాలో కొత్త చిచ్చు రేపేందుకు, ఉన్నవాటిని కొనసాగించేందుకు చూస్తున్నది.


అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే గత మూడు దశాబ్దాలుగా దాని ఖర్చు పెరుగుతూనే ఉన్నప్పటికీ అమెరికా 877 బి.డాలర్లతో పోలిస్తే దాని ఖర్చు 292 బి.డాలర్లు తక్కువే. ఆత్మరక్షణ సిబ్బంది తప్ప మిలిటరీ ఖర్చు లేదని చెప్పుకొనే జపాన్‌ ఖర్చు 46బి.డాలర్లకు చేరింది.దక్షిణ కొరియా 46.4బి.డాలర్లకు పెరచింది.ఈ రెండు దేశాలూ అమెరికా రక్షణలో ఉన్నాయి. మన దేశం 2021తో పోలిస్తే మరుసటి ఏడాది ఖర్చు(81.4బి.డాలర్లు) ఆరుశాతం పెంచినట్లు సిప్రి పేర్కొన్నది. నైజీరియా 2021లో 56శాతం ఖర్చు పెంచగా గతేడాది 38శాతం తగ్గించింది.నాటో మిలిటరీ ఖర్చు 1,232 బి.డాలర్లకు పెరిగింది.ఐరోపాలో 68.5బి.డాలర్లతో బ్రిటన్‌ మొదటి స్థానంలో ఉంది. తుర్కియె(టర్కీ) వరుసగా మూడవ ఏడాది మిలిటరీ ఖర్చును తగ్గించింది.ఐరోపా మొత్తంగా 13శాతం పెరిగింది.


స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం 4వ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 10.3 బి.డాలర్లతో 24వదిగా ఉంది. చైనా తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌ 12.5 బి.డాలర్లతో 21వ స్థానంలో ఉంది. నలభై దేశాలలో చివరిదిగా 5.2బి.డాలర్లతో రుమేనియా ఉంది. 2021తో పోలిస్తే అనేక దేశాల రాంకుల్లో మార్పు వచ్చింది. సిప్రి వివరాలను అందచేసిన 36 ఐరోపా దేశాల్లో 23 ఖర్చును పెంచటం ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రభావాన్ని వెల్లడిస్తున్నది. వీటి ఖర్చు 0.4శాతం స్విడ్జర్లాండ్‌ నుంచి లక్సెంబర్గ్‌ 45శాతం గరిష్టంగా ఉంది. పదమూడు దేశాల ఖర్చు 0.4శాతం నుంచి 11శాతం వరకు తగ్గింది. వరల్డో మీటర్‌ విశ్లేషణ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌ తన జిడిపిలో 61శాతం ఖర్చు చేస్తున్నది. తలసరి మిలిటరీ ఖర్చును డాలర్లలో చూస్తే అమెరికా 2,240,చైనా 163, శ్రీలంక 116, పాకిస్తాన్‌ 50, మయన్మార్‌ 48, భారత్‌ 43,బంగ్లాదేశ్‌ 27, నేపాల్‌ 7 చొప్పున ఖర్చు చేస్తున్నది.


ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచితే అది జనాల మీద భారం,జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని పైన పేర్కొన్న తలసరి ఖర్చు వెల్లడిస్తున్నది. అలాగే మన దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్తాన్‌ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ లాబీ ఉందన్నది స్పష్టం.మన జిడిపితో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ.అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ దానికే మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ది కుంటుపడుతుంది. అమెరికా ఆయుధ కంపెనీలకు లాభసాటి గనుక అది మిలిటరీ ఖర్చు ఎంతైనా పెడుతుంది.దాని జిడిపి కూడా ఎక్కువే.తనకు లాభం కనుక ఇతర దేశాలనూ ఉసిగొల్పుతుంది. తనను చక్రబంధం చేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు చైనా కూడా మిలిటరీ ఖర్చు పెడుతున్నా అది తక్కువే. తనకోసం అది అయుధాలను రూపొందిస్తున్నది కనుక కొన్నింటిని ఎగుమతి కూడా చేస్తున్నది. 2021లో ప్రపంచ మిలిటరీ సేవలు, అయుధాల వంద పెద్ద కంపెనీల మార్కెట్‌ 592 బి.డాలర్లని అంచనా. వాటి ఎగుమతిలో 2018 నుంచి 2022 వరకు పది అగ్రశ్రేణి దేశాల వారీ వాటా అమెరికా 40, రష్యా 16,ఫ్రాన్స్‌ 11,చైనా 5.2,జర్మనీ 4.2, ఇటలీ 3.8, బ్రిటన్‌ 3.2,స్పెయిన్‌ 2.6, దక్షిణ కొరియా 2.4, ఇజ్రాయెల్‌ 2.3శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మన దేశంలో కూడా కొన్ని బడా కంపెనీలు లాభసాటిగా ఉండే ఆయుధ తయారీకి ఉబలాటపడుతున్నాయి.మిగిలిన అంశాలన్నీ సరిగా ఉంటే అలాంటి పని చేసినా అదొక తీరు లేనపుడు మన పెట్టుబడులను వాటి మీదే కేంద్రీకరిస్తే జనం సంగతేంగాను. అందుకే ఎదుటి వారు తొడకోసుకుంటే మనం మెడకోసుకుంటామా అని పెద్దలు ఏనాడో చెప్పారు. దాన్ని మన పాలకులు పాటిస్తారా ?

కాషాయ దేశభక్తుల బండారం : కమ్యూనిస్టు,చైనా వ్యతిరేక నోటితుత్తర జనం కోసం- కార్పొరేట్ల లాభాల కోసం దిగుమతులు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటం లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి 2023 ఏప్రిల్‌ 20న జపాన్‌ రాజధాని టోకియోలో చెప్పారు.2022-23లో చైనా నుంచి మన దిగుమతులు 4.16శాతం పెరగ్గా ఎగుమతులు 28శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రాధమిక సమాచారం వెల్లడించింది.2022లో చైనా-భారత్‌ వాణిజ్య లావాదేవీలు 136 బిలియన్‌ డాలర్లు కాగా చైనా ఎగుమతులు 118, భారత్‌ ఎగుమతులు 18 బి.డాలర్ల చొప్పున ఉన్నట్లు ముంబైలోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ కాంగ్‌ షియాన్‌ హువా ఏప్రిల్‌ 18న ముంబైలో చెప్పాడు. మరోవైపు మన దేశ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా అమెరికా తయారైందని లావాదేవీల విలువ128 బి.డాలర్లని మరొక వార్త. ఆర్థిక రంగంలో భారత్‌ ఎలా చైనాను వెనక్కు నెడుతున్నదో చూడండి అంటూ ఒక విశ్లేషణ. మన ఇరుగుపొరుగు దేశాలతో 115 బి.డాలర్ల సరిహద్దు వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ 2021లో కేవలం 2.8 బి. డాలర్ల మేరకే జరిగిందని, పదిహేడు రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్నప్పటికీ తొమ్మిది మాత్రమే చురుకుగా లావాదేవీలు జరిపినట్లు మరొక విశ్లేషణ. ఇవన్నీ వారం, పదిరోజుల్లో వచ్చినవే. గత తొమ్మిది సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెబుతున్న విజయాల మాలలో వీటిని ఎక్కడ అమర్చుతారో తెలియదు. ఉట్టికి ఎగరలేని వారు నేరుగా స్వర్గానికి ఎగురుతామని చెప్పినట్లుగా ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు వాణిజ్యలావాదేవీలు జరపలేని స్థితిలో చైనాను వెనక్కు నెట్టేసి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామంటే నమ్మేదెలా ? సరిహద్దు లావాదేవీలు భద్రతాపరమైన కారణాలతో జరపటం లేదని చెబుతున్నారు. ఇతర అంశాలతో పాటు విదేశాలు, స్వదేశంలో ఉన్న ఉగ్రవాదుల వెన్ను విరిచేందుకు పెద్ద నోట్ల రద్దుకు చెప్పిన కారణం ఒకటని గుర్తుకు తెచ్చుకోవాలి. అదే విధంగా దేశం సురక్షిత హస్తం చేతుల్లో ఉందని కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అలాంటపుడు తగిన జాగ్రత్తలు తీసుకొని లావాదేవీలను ఎందుకు జరపటం లేదు ? చైనాకు ఇరుగుపొరుగుదేశాలతో అన్నీ విబేధాలే అని చెబుతున్నవారు మన దేశం కూడా అదే స్థితిలో ఉన్నట్లు ఈ పరిస్థితి చెప్పటం లేదా ? చైనా నుంచి నేరుగా దిగుమతులు చేసుకొంటే లేని భద్రతా అంశం సరిహద్దుల్లో లావాదేవీలకు ఎందుకు చెబుతున్నట్లు ? సరిహద్దు లావాదేవీలు ఆ ప్రాంతంలో ఉన్న పౌరుల ఆర్థిక వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని తెలిసిందే.


ఇక్కడొక అంశాన్ని చెప్పాలి. లడక్‌ గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తుబహిష్కరణ గురించి నానా యాగీ చేసిన కాషాయ దళాలు, వాటి సమర్ధకులు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు.ఎగుమతులు-దిగుమతులను ఆయుధాలుగా మార్చుకోవాలన్న అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ స్పూర్తి తప్ప ఈ తొలి ఉద్రేకం వెనుక మరేమీ లేదు. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు, తన రికార్డులను తానే మోడీ బద్దలు కొడుతున్నారు. చైనా వస్తుబహిష్కరణ అని దుస్తులు చించుకున్న వారే సరిహద్దు వివాదాలకు-వాణిజ్య లావాదేవీలకు లంకె పెడతారేమిటని ఎదురుదాడికి దిగుతున్నారు.ఇదే దేశభక్తులు, వీరి పూర్వీకులు చైనాతో వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్న వైఖరిని చెప్పినందుకు సిపిఐ(ఎం) నేతలను దేశద్రోహులుగా చిత్రించారు. ఇప్పటికీ అదే దాడి చేస్తున్నారు. 1960దశకంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని జైళ్లలో పెట్టిన సంగతిని కూడా మరచి పోరాదు. నరేంద్రమోడీతో చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తిరిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో చైనాతో వాణిజ్యపోరుకు తెరతీశాడు. ఐదేండ్ల తరువాత వెనక్కు తిరిగి చూస్తే అమెరికా ఎన్ని బెదిరింపులకు దిగినా, మరొకటి చేసినా చైనా ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గలేదు. పీటర్సన్‌ సంస్థ విశ్లేషకులు చెప్పిన అంశాలను చూస్తే చెరువు మీద అలిగినవాడి మాదిరి అమెరికా పరిస్థితి మారింది. దాని పరిస్థితే అలా ఉంటే మన నరేంద్రమోడీ ఏలుబడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఆత్మనిర్భరతలో భాగంగా ఓకల్‌ ఫర్‌ లోకల్‌ ( స్థానిక వస్తువులనే వాడండి ) మేకిన్‌ ఇండియా (భారత్‌లో ఉత్పత్తి చేయండి ) మేడిన్‌ ఇండియా (భారత తయారీ) ఇలా ఇచ్చిన పిలుపులు ఎంత మేరకు ఫలించిందీ ఎప్పుడైనా జనానికి చెప్పారా ?


అమెరికా తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం 2022లో అమెరికా ఎగుమతులు మరింతగా తగ్గినట్లు, దాని పోటీదారులు చైనా మార్కెట్లో వస్తువులను అమ్ముకుంటున్నట్లు తేలిందని, అమెరికా ఎగుమతులైన ఆటో మొబైల్స్‌, బోయింగ్‌ విమానాలు అదృశ్యమైనట్లు పీటర్సన్‌ విశ్లేషణ పేర్కొన్నది. సెమికండక్టర్ల ఎగుమతి విధానం కారణంగా వాటి ఎగుమతి తగ్గింది, కరోనా కాలంలో తగ్గిన సేవల ఎగుమతులు అంతకు పూర్వపు స్థాయికి ఇంకా చేరుకోలేదు. చైనాకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినా చైనా మార్కెట్‌ మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు ఆందోళనకర సూచనలు వెలువడ్డాయి. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులకు పూనుకున్నట్లు పీటర్సన్‌ పేర్కొన్నది.


ఎగుమతులు-దిగుమతులను ఆయుధాలుగా మార్చినందున ఎవరికి వారు జాగ్రత్తలు పడుతున్నారు.రాజీ మార్గంగా రెండు సంవత్సరాల్లో అమెరికా నుంచి 200 బి.డాలర్ల మేరకు అదనంగా కొనుగోలు చేస్తామని 2020జనవరిలో చైనా అంగీకరించినా వివిధ కారణాలతో ఆ మేరకు దిగుమతులు జరగలేదు.చైనా వస్తువులు నాశిరకమని, కరోనా నిరోధ వాక్సిన్లు పని చేయలేదని ప్రచారం చేసిన వారి గురించి తెలిసిందే.ఇప్పుడు అమెరికా గతం కంటే ఎక్కువగా చైనా ఔషధాల మీద ఆధారపడుతోంది. గడచిన ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య మొత్తం లావాదేవీల్లో ఔషధాల వాటా విలువ 0.6 నుంచి మూడు శాతానికి పెరిగింది. అమెరికా 10.2 బి.డాలర్ల విలువ గలవి దిగుమతి చేసుకుంటే చైనా కాన్సర్‌,యాంటీబయటిక్స్‌ వంటి ఆధునిక ఔషధాలను 9.3బి. డాలర్ల మేర దిగుమతి చేసుకుంది. అమెరికా చేసుకుంటున్న మొత్తం ఔషధ దిగుమతుల్లో ఐర్లండ్‌ 19.8, జర్మనీ 10.8, స్విడ్జర్లాండ్‌ 10.7 చైనా నుంచి ఆరుశాతం ఉన్నాయి.రెండు సంవత్సరాల్లో చైనా వాటా 2.5శాతం నుంచి పెరిగింది. అమెరికా నుంచి చైనా చేసుకుంటున్న ఔషధాల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. ఇతర వస్తువులు, సేవల అంశంలో భద్రత అంశాన్ని ముందుకు తెస్తున్న అమెరికా ఔషధాల గురించి మౌనంగా ఉంది. ఇలాంటి కొన్ని అవసరాల రీత్యా చైనా నుంచి తాము పూర్తిగా ఆర్థిక సంబంధాలను విడగొట్టుకోవటం లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి చెప్పారన్నది స్పష్టం.


చైనా వస్తువులను బహిష్కరించి దానికి బుద్ది చెప్పాలన్న కాషాయదళాల గోడు నరేంద్రమోడీ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన నిధులు రావాలన్నా, అధికారాన్ని నిలుపుకోవాలన్నా కార్పొరేట్ల మద్దతు అవసరం. రాజకీయంగా బిజెపితో లడాయిలో ఉన్న ఢిల్లీ సిఎం కేజరీవాల్‌ కాషాయ దళాలు గతంలో లేవనెత్తి తరువాత నోరు మూసుకున్న ఈ అంశాన్నే ఇప్పుడు తవాంగ్‌ పేరుతో ముందుకు తెచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించి దానికి ఎందుకు బుద్ది చెప్పరంటూ ప్రశ్నించారు. చైనా వస్త్తువులను మన దేశంలో కూడా తయారు చేస్తున్నారని, దిగుమతులకు బదులు ఇక్కడే తయారు చేసి మన కార్మికులకు ఎందుకు పని కల్పించరంటూ నిలదీశారు. కేజరీవాల్‌ చేసే అన్ని విమర్శలకు సమాధానం చెప్పే కమలనాధులు దీని గురించి మౌనంగా ఉన్నారు. చైనా నుంచి భారత్‌ దిగుమతులు ఉత్తి పుణ్యానికి లేదా చైనా కార్మికులకు పని కల్పించేందుకు, అక్కడి కంపెనీలకు లాభాలు కట్టిపెట్టేందుకు కాదు. ముంబైలోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ కాంగ్‌ షియాన్‌ హువా మన దేశంలోని పెట్టుబడిదారులతో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య జరుగుతున్న లావాదేవీల లెక్కలు డొక్కలు పూర్తి కథను వెల్లడించవంటూ అసలు సంగతి చెప్పారు. చైనా నుంచి భారత్‌ చేసుకుంటున్న దిగుమతులలో ఇంటర్‌మీడియట్‌లు (పూర్తిగా తయారు కాని, ముడిపదార్ధాలు, విడిభాగాల వంటివి. ఉదాహరణకు మనం వేసుకొనే ఔషధ గోళీలు మన దేశంలో తయారైనప్పటికీ వాటిలో నింపే పదార్ధాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవటం) ఎక్కువగా ఉంటాయని, వాటితో వస్తువులను తయారు చేసి భారత్‌ ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నదని, అందువలన మేక్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా సంపూర్ణం కావాలంటే చైనా మార్కెట్‌కు రావాలని మన పెట్టుబడిదారులను కోరాడు.ఐటి, సినిమా నిర్మాణ రంగాలలో ముందున్న భారతీయులు తమ మార్కెట్లోకి రావచ్చని కూడా చెప్పాడు. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఘర్షణలు జరిగినా, ఏటా భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకోవాల్సి వచ్చినా మోడీ సర్కార్‌ కిమ్మనకుండా దిగుమతులలో రికార్డులను బద్దలు కొడుతున్నది.

మన దేశంతో 2022లో చైనా వాణిజ్య మిగులు 100 బి.డాలర్లు, 2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. అంటే ఇంత మొత్తాన్ని డాలర్ల రూపంలో చైనాకు మనం సమర్పించుకున్నాం.ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరుగుతోంది. చైనా చెప్పే లెక్కలు జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాదిగా పరిగణిస్తే మన ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా తీసుకుంటున్నందున అంకెల్లో కొంత గందరగోళం తలెత్తవచ్చు, వాస్తవాలు మారవు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022-23లో మన చైనా దిగుమతులు 4.16శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు చైనాకు మన ఎగుమతులు 28శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అమెరికాతో లావాదేవీలు 128.55 బి.డాలర్లకు చేరినందున చైనాను వెనక్కు నెట్టి అమెరికా ముందుకు వచ్చిందని చెబుతున్నారు. దాని వలన చైనాకు వచ్చే నష్టం లేదు. ఇక దేశభక్తులుగా చెలామణి అవుతున్న అదానీ వంటి కార్పొరేట్లు ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ దిగుమతి పన్ను ఎగవేసేందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.” దిగుమతి విలువ ఎక్కువ, ఎగుమతి విలువ తక్కువగా ఉండటం సాధారణ అంశం. కానీ భారత్‌లో అందుకు విరుద్దంగా చైనా-భారత్‌ లావాదేవీలు ఉన్నట్లు ” మింట్‌ పత్రిక పేర్కొన్నది.


ఆర్థిక రంగంలో చైనాను భారత్‌ ఎలా పక్కకు నెడుతున్నది అనే శీర్షికతో మేజర్‌ అమిత్‌ బన్సాల్‌ అనే రిటైర్డు అధికారి ఒక విశ్లేషణ చేశారు. ఏమిటి అంటే సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ ఆసియన్‌ దేశాలలో ఇటీవల సింగపూర్‌కు చెందిన ఐఎస్‌ఇఏఎస్‌ అనే సంస్థ జరిపిన సర్వేలో భారత్‌ను ఆమోదించిన లేదా అంగీకరించిన వారు గత సర్వేతో పోల్చితే 5.1 నుంచి 11.3శాతానికి పెరిగారని తేలిందట.చైనా, అమెరికా తరువాత మూడో స్థానంలో ఉన్నాం గనుక ఇదే కొనసాగి చైనాను వెనక్కు నెట్టే దారిలో ఉన్నట్లు బన్సాల్‌ చెబుతున్నారు. ఎందుకటా అమెరికా-చైనా వివాదపడుతున్నాయి గనుక భారత్‌ దూరేందుకు అవకాశం వచ్చింది అంటున్నారు. మరోవైపున చైనా 700 బి.డాలర్ల మేరకు ఆసియన్‌ దేశాలతో లావాదేవీలు జరుపుతూ చైనా మొదటి స్థానంలో ఉందంటూనే మనం 2022లో 110 బి.డాలర్ల దగ్గర ఉన్నామని, అమెరికాను ఐదారు సంవత్సరాల్లో, పదేండ్లకు చైనాను వెనక్కు నెట్టేస్తామంటున్నారు.ఆసియన్‌ దేశాల లావాదేవీల్లో మన దిగుమతులు 68, ఎగుమతులు 42 బి.డాలర్లు అంటే మనం 26బి.డాలర్లు వారికి సమర్పించుకుంటున్నాం. వారికి లాభసాటిగా ఉంది గనుక మనతో లావాదేవీలకు మొగ్గుచూపుతున్నానర్నది స్పష్టం. అందమైన కలలు కనటాన్ని తప్పుపడతామా ? చైనాను వెనక్కు నెట్టే సంగతి తరువాత ముందు వారితో ఉన్న వాణిజ్యలోటును సమం చేస్తే అదే పదివేలు. 2021-22లో మన దేశం 612 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే చేసిన ఎగుమతుల విలువ 422బి.డాలర్లు. పెద్ద దేశాల్లో అమెరికా, బ్రిటన్‌తో మాత్రమే మన ఎగుమతులు ఎక్కువ, ఇక కొన్ని చిన్న దేశాలతో కూడా ఎక్కువే. మన మిగులు విలువ 59 బి.డాలర్లు పోను మన లోటు 192బి.డాలర్లు. అందువలన వచ్చే పదేండ్లలో దాన్ని సమం చేసినా ఘనవిజయమే. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2014 మన వస్తు ఎగుమతుల విలువ 322.69 బి.డాలర్లు కాగా 2021లో 395.43 బి.డాలర్లు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు 2021-22లో 447బి.డాలర్లు. ద్రవ్యోల్బణం కారణంగా ఈ పెరుగుదల తప్ప గడచిన తొమ్మిదేండ్లలో పదే పదే విదేశాలు తిరిగిన నరేంద్రమోడీ మన సరకులకు సాధించిన మార్కెట్‌ ఏమిటి అన్నది ప్రశ్న. అదే ప్రపంచ బాంకు చైనా 2014లో 2.34లక్షల కోట్ల డాలర్ల మేర సరకులు ఎగుమతి చేస్తే 2021నాటికి 3.36లక్షల కోట్లకు పెరిగింది. ఇలాంటి అంకెలు మన కళ్ల ముందు ఉండగా చైనాను అధిగమిస్తామని ఎలా చెబుతారు ?

ఏకత, శీలము ఉన్నవారు చేసే పనేనా ఇది : షిరిడీ సాయి ట్రస్టు మసీదులకు విరాళమిచ్చిందా ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” షిరిడీ సాయి ట్రస్టు మసీదులకు రు.96 కోట్లు విరాళమిచ్చింది. షిరిడీ సాయి ట్రస్టు హాజ్‌కు రు.35 కోట్లు విరాళమిచ్చింది.” ఈ రెండింటికీ జత చేసిన అంశాలేమిటంటే షిరిడీ దేవాలయానికి విరాళాలు ఎక్కువగా ఇచ్చేది హిందూ భక్తులు. అలాంటి సంస్థ అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చేందుకు తిరస్కరించింది. తాము హిందువులకు భిన్నమని చెప్పినట్లు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇది నిజమేనా అంటూ దీన్నే సరికొత్త పద్దతుల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తన పేరుతో జరుగుతున్న ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకొనేందుకు రాముడు పూనుకున్నట్లు మనకు ఎక్కడా దాఖలా లేదు. రామజన్మభూమి ట్రస్టు ఏదైనా వివరణ ప్రకటన చేసినట్లు గూగుల్‌ వెతుకులాటలో కనిపించలేదు. దొరికిన వారెవరైనా పంపితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. కాగలపని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా కాషాయ మరుగుజ్జులు చేస్తున్నదాన్ని చూసీ చూడనట్లు ఉందన్నది స్పష్టం. ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు నిజనిర్దారణలు జరిపి షిరిడీ సాయి ట్రస్టు అలాంటి విరాళాలు ఇవ్వలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రచారం జరుగుతూనే ఉంది. పని గట్టుకు చేసేదే చేసే గోబెల్స్‌ ప్రచారం గనుక వారికి వాస్తవాలతో నిమిత్తం ఉండదు. సత్యమునే చెప్పవలెను-అబద్దమాడరాదు, సత్యహరిశ్చంద్రుడు పుట్టిన గడ్డ ఇది అని చెప్పుకొనే చోట ఇలాంటి ప్రచారం జరుగుతున్నదంటే నిజానికి అది రాముడికి, హరిశ్చంద్రుడికి ఘోర అవమానం, వారి పేర్లను స్మరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది స్పష్టం.ఇలాంటి ప్రచారాలు చేసే చీకటి శక్తులేవో అందరికీ తెలిసిందే.ఏకత, శీలము ఉన్నవారు చేసే పనేనా ఇది ?


ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం ఇమ్మని షిరిడీ సాయి ట్రస్టును అసలు అడగలేదని ది క్వింట్‌ అనే వెబ్‌ పత్రిక 2021 జనవరి 18న స్పష్టం చేసింది. ఈ ప్రచారం పచ్చి అవాస్తవమని, విరాళం కోరుతూ తమకు ఎలాంటి సమాచారం లేదని ట్రస్టు సిఇఓ కెహెచ్‌ బగాటే, విరాళం కోసం తామెలాంటి వినతి పంపలేదని రామాలయ ట్రస్టు సభ్యుడు మోహన ప్రతాప్‌ మిశ్రా చెప్పినట్లు పేర్కొన్నది. హిందూస్తాన్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వార్త ప్రకారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విరాళాలు తీసుకోవటం 2021 జనవరి 15 నుంచి ప్రారంభించిందని, దాని కంటే ముందే ఐదవ తేదీ నుంచే షిరిడీ ట్రస్టు నిరాకరణ గురించి ప్రచారం జరుగుతున్నట్లు క్వింట్‌ పేర్కొన్నది.


ఈ ప్రచారాన్నే ” హార్డ్‌ కోర్‌ హిందూ సేన ఆఫ్‌ చీఫ్‌ మినిస్టర్‌ యోగి ఆదిత్య నాథ్‌ ” పేరుతో నడుపుతున్న ఒక గ్రూపులో, హిందూ రాష్ట్ర భారత్‌ వంటి గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు ది లాలన్‌టాప్‌ అనే వెబ్‌సైట్‌ 2020 జూన్‌ 22న వెల్లడించింది. దీని గురించి శ్రీ సాయి బాబా సంస్థాన్‌ ట్రస్టు సిఇఓ అరుణ్‌ కిషోర్‌ డోంగ్రే మాట్లాడుతూ ఇక్కడికి అన్ని మతాలకు చెందిన వారు వస్తారని, ఒక చట్టం ప్రకారం పని చేస్తున్న ట్రస్టు రు.50లక్షలకు మించి అదనంగా ఎవరికైనా విరాళం ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని, రామ మందిరానికి విరాళం ప్రతిపాదన ఎలాంటిదీ తమ వద్దకు రాలేదని, జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని చెప్పినట్లు కూడా ఆ సైట్‌ పేర్కొన్నది. ఈ ప్రచారం 2019 డిసెంబరులో కూడా జరిగిందని, అప్పుడు షిరిడీ ట్రస్టు సిఇఓగా ఉన్న దీపక్‌ ముఘాలికర్‌ కూడా అది తప్పుడు ప్రచారమని చెప్పారు. మసీదుల మరమ్మతు, నిర్మాణాలకు రు.96 కోట్లను షిరిడీ ట్రస్టు విరాళంగా ఇచ్చినట్లు, రామ మందిరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జరుపుతున్న ప్రచారం వాస్తవం కాదని చెక్‌పోస్ట్‌ అనే మరాఠీ వెబ్‌సైట్‌ 2021అక్టోబరు 30న పేర్కొన్నది. ” బుద్దిలేని మన హిందువులు సాయి గుడికి వెళుతున్నారు. తలలు వంచి కానుకలు సమర్పిస్తున్నారు. ఒక కుట్ర ప్రకారం సాయి విగ్రహాలను హిందువుల గుళ్లలో పెడుతున్నారు.హిందువులారా జాగ్రత్తగా ఉండండి, నిజాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించండి ” అంటూ కూడా వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నట్లు అది పేర్కొన్నది. షిరిడీ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన ఒక నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు ఇచ్చిన 58 విరాళాల జాబితా ప్రకారం వాటికి ఇచ్చిన మొత్తం రు. 101.48 కోట్లని, దానిలో కరోనా సమయంలో సిఎం సహాయ నిధికి 51 కోట్లు ఇచ్చినట్లు ఉంది తప్ప ఎలాంటి మసీదు పేరు లేదని చెక్‌పోస్ట్‌ పేర్కొన్నది.


విరాళాన్ని తిరస్కరించిన రామ మందిర ట్రస్టు !
రామ మందిర ట్రస్టు నిబంధనావళిని 2020 ఫిబ్రవరి ఐదున ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినట్లుగా మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ అదే ఏడాది ఫిబ్రవరి 20న ఒక వార్తలో పేర్కొన్నది. విరాళాలను స్వీకరించే వ్యవస్థను ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉందని, పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాన్ని ట్రస్టు తిరస్కరించినట్లు ద ప్రింట్‌ అనే వెబ్‌సైట్‌ వార్తను అది ఉటంకించింది. దాని ప్రకారం బీహార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి కిషోర్‌ కునాల్‌ తాను రామ మందిరానికి పది కోట్ల మేరకు విరాళం ఇవ్వదలచుకున్నట్లు ప్రకటించారని, దానిలో భాగంగా రు. రెండు కోట్ల చెక్‌ తీసుకొని అయోధ్య రాగా విరాళాలను స్వీకరించే వ్యవస్థ లేనందున దాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ప్రింట్‌ పేర్కొన్నది. రామమందిర ట్రస్ట్‌లోని ఏకైక దళిత సభ్యుడు, విశ్వహిందూ పరిషత్‌ నేత కమలేష్‌ చౌపాల్‌ మాట్లాడుతూ దేశమంతటి నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని , మందిర నిర్మాణానికి నిధుల కొరత లేదని అన్నట్లు కూడా రాసింది.


షిరిడీ సాయి మందిరం గురించి తప్పుడు ప్రచారం కొత్త కాదు. షిరిడీ సాయిబాబా హిందూాముస్లిం ఐక్యతకు ప్రతీక కాదు, దేవుడూ కాదని మానవుడు కనుక పూజించ వద్దని ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద 2014 జూన్‌ 24న చెన్నైలో పిలుపునిచ్చారు. నిజంగా సాయిబాబా హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకైతే ముస్లింలు కూడా విశ్వాసం వెల్లడించేవారని అన్నారు. సాయిబాబా గంగలో మునిగేందుకు తిరస్కరించారని, అతని పేరుతో గుళ్లు కట్టటం డబ్బు సంపాదనకేనని, సనాతన ధర్మంలో విష్ణువు 24 అవతారాల గురించి చెప్పారని దానిలో సాయిబాబా లేరని, హిందువుల మధ్య విభజన కుట్రలో భాగంగా బాబాకు పూజలు చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటీష్‌ వారు బాబాను ముందుకు తెచ్చారని కూడా ఆరోపించారు.


దేశంలో ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర ఆలయం, షిరిడీ మందిరం ఆదాయంలో పోటీ పడుతున్నాయి. భక్తులను అయోధ్య రామమందిరం వైపు మళ్లించేందుకు చూస్తున్నారు. దేశంలో భక్తి ముదరటంతో గుళ్లు, గోపురాలు, బాబాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. అందుకే అనేక గుళ్లను నవీకరించి రాబడి పెంచేందుకు పూనుకున్నారు. హిందూత్వ రాతలకు ప్రతీకగా ఉన్న ఒపి ఇండియా వెబ్‌సైట్‌లో 2020జనవరి 23న ఒక విశ్లేషణ వెలువడింది. షిరిడీ సాయి బాబా జన్మ స్థలంగా భావిస్తున్న పత్రి అనే చోట బాబా ఆలయాన్ని వృద్ది చేసేందుకు (అప్పటి శివసేన-కాంగ్రెస్‌-ఎన్‌సిపి ) ప్రభుత్వం రు. వంద కోట్లు కేటాయించిందని షిరిడీకి పోటీగా దాన్ని రూపొందించాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే పత్రిలో బాబా ఆలయం ఉన్నప్పటికీ దాని గురించి అంతగా ప్రచారం లేదని, దానికి వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తే మతపరమైన టూరిజం మీద ఆధారపడిన షిరిడీలోని జనం ఆర్థికంగా నష్టపోతారని, అందువలన ఆ ప్రతిపాదనకు నిరసనగా షిరిడీలో బంద్‌ కూడా పాటించారని పేర్కొన్నారు. అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న షిరిడీ ట్రస్టు మీద పెత్తనం చేస్తున్న ప్రముఖ కాంగ్రెస్‌ నేత రాధాకృష్ణ విఖీ పాటిల్‌ ఆ పార్టీని వదలి బిజెపిలో చేరినప్పటికీ ట్రస్టు మీద పట్టుకోల్పోలేదని, అందువలన దాన్ని దెబ్బతీసేందుకు పత్రి ఆలయ ట్రస్టు మీద పట్టు ఉన్న ఎన్‌సిపి-కాంగ్రెస్‌ దాని వృద్దికి కుట్ర చేశారని ఆ వెబ్‌సైట్‌ ఆరోపించింది.ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద అసలు షిరిడీ వెళ్లవద్దని, పూజలు జరపవద్దని ఇచ్చిన పిలుపులో దానికి జనాలకు వచ్చే అర్థిక నష్టకోణం కనిపించలేదు. ఈ రాజకీయాలను ఆ దేవుళ్లు, దేవతలు ఎలా భరిస్తున్నారో కదా !

సూడాన్‌లో భద్రతా దళాల మధ్య అంతర్యుద్ధం, నలుగుతున్న జనం !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక దేశంలో అణచివేతకు పాల్పడుతున్న భద్రతా దళాలు – తిరగబడిన ప్రజాపక్ష సాయుధ దళాల అంతర్యుద్ధం సాధారణం. దానికి భిన్నంగా ఆఫ్రికాలోని సూడాన్‌లో మిలిటరీ-పారా మిలిటరీ అధికార పోరుతో జనాన్ని చంపుతున్నాయి.ఇది రాసిన సమయానికి దాదాపు మూడు వందల మంది మరణించగా రెండువేల మందికిపైగా పౌరులు గాయపడినట్లు వార్తలు. బాధితులు ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చని భయపడుతున్నారు. మిలిటరీ రాజధాని ఖార్టుమ్‌ నగరంలో కొన్ని ప్రాంతాలపై వైమానికదాడులు జరుపుతున్నట్లు వార్తలు. ఇది అక్కడి తీవ్ర పరిస్థితికి నిదర్శనం. ఆ దాడుల్లో ఏం జరిగిందీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, భద్రతా దళాలు పోరు విరమించాలని సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ కోరింది.ఈ నెల 12న ప్రారంభమైన పరస్పరదాడులు ఏ పర్యవసానాలకు దారితీసేదీ, అసలేం జరుగుతున్నదీ పూర్తిగా వెల్లడికావటం లేదు. ఎవరు ముందు దాడులకు దిగారన్నదాని మీద ఎవరి కథనాలు వారు వినిపిస్తున్నారు. అమెరికా, మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి కాల్పులను విరమించాలని చేసిన సూచనలను ఇరు పక్షాలు పట్టించుకోలేదని తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి.దాడులు దేశమంతటా జరుగుతున్నట్లు, వాటిలో చిక్కుకు పోయిన జనానికి విద్యుత్‌, మంచినీటి కొరత ఏర్పడిందని గాయపడిన వారు ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా వీలు కావటం లేదని ఆల్‌ జజీరా టీవీ పేర్కొన్నది. సూడాన్‌లో మొత్తం నాలుగున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు.


మిలిటరీ అధిపతి అబ్దెల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అధిపతి హిమెతీ ఆధిపత్య కుమ్ములాటలే గాక వర్తమాన పరిణామాల్లో ఇంకా ఇతరం అంశాలు కూడా పని చేస్తున్నాయి. గతంలో జరిగిన అంతర్యుద్ధం ముగింపు కోసం జరిగిన ఒప్పందాల్లో ఆర్‌ఎస్‌ఎఫ్‌ మిలిటరీలో విలీనం ఒకటి. ఒప్పందం మీద సంతకాలు జరిగిన రెండు సంవత్సరాల్లో అది పూర్తి కావాలని అంగీకరించినట్లు మిలిటరీ అధిపతి బుర్హాన్‌ చెబుతుండగా, కాదు పది సంవత్సరాలని హిమెతీ భాష్యం చెబుతున్నాడు. అంటే పది సంవత్సరాల పాటు ఆర్‌ఎస్‌ఎఫ్‌ స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సంస్థగా తన ఆధిపత్యంలో కొనసాగాలని, ఆ మేరకు తనకు అధికారంలో వాటా దక్కాలని డిమాండ్‌ చేస్తున్నాడు.ఇది పైకి కనిపిస్తున్న కారణంగా కనిపిస్తున్నప్పటికీ అంతకు ముందు జరిగిన పరిణామాలను బట్టి ఎవరూ మిలిటరీ పాలనకు స్వస్తి చెప్పి పౌరపాలన ఏర్పాటుకు అంగీకరించేందుకు సిద్దం కాదని, అధికారాన్ని స్వంతం చేసుకొనేందుకే ఇదంతా అన్న అభిప్రాయం కూడా వెల్లడౌతున్నది.” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ చెప్పారు.


తాజా పరిణామాల పూర్వపరాలను ఒక్కసారి అవలోకిద్దాం.1989కి ముందు ప్రధానిగా ఉన్న సాదిక్‌ అల్‌ మహదీ ప్రజావ్యతిరేకిగా మారటాన్ని అవకాశంగా తీసుకొని కుట్ర ద్వారా అల్‌ బషీర్‌ అధికారానికి వచ్చి నియంతగా మారాడు. తీవ్రమైన ఇస్లామిక్‌ విధానాలు, మానవహక్కుల ఉల్లంఘనలు, అణచివేతలకు పాల్పడటంతో అనేక తిరుగుబాట్లు జరిగినా వాటిని అణచివేశాడు. 2018 డిసెంబరు 19న ప్రారంభమైన నిరసనలు బషీర్‌ అధికారాన్ని కుదిపివేశాయి. దీన్ని డిసెంబరు లేదా సూడాన్‌ విప్లవంగా వర్ణించారు. మూడు దశాబ్దాల నిరంకుశ పాలనకు మద్దతుగా ఉన్న భద్రతా దళాలే తిరుగుబాటు చేయటంతో 2019 ఏప్రిల్‌ 11న అధికారాన్ని వదులుకున్నాడు. ఆ స్థానంలో సంధికాల మిలిటరీ మండలి(టిఎంఎసి) అధికారానికి వచ్చింది.వచ్చిన వెంటనే ఇది కూడా జనాన్ని అణచివేసేందుకు పూనుకుంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యపునరుద్దరణ కోరిన జనాలపై జూన్‌ మూడున రాజధాని ఖార్టుమ్‌లో భద్రతాదళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణకాండకు పాల్పడ్డాయి. అనేక మంది యువతులు మానభంగానికి గురయ్యారు, 128 మంది మరణించగా 650 మంది గాయపడ్డారు. తరువాత జూలై, ఆగస్టు మాసాల్లో స్వేచ్చ, మార్పును కోరే శక్తుల కూటమి(ఎఫ్‌ఎఫ్‌సి)తో టిఎంసి ఒక ఒప్పందం చేసుకుంది.దాని ప్రకారం కొత్త రాజ్యాంగ రచన,2022లో ఎన్నికలు, ఆలోగా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. ఐదుగురు మిలిటరీ ప్రతినిధులు, ఐదుగురు పౌర ప్రతినిధులు, ఇరుపక్షాలకూ ఆమోదమైన మరొక పౌరప్రతినిధితో సంపూర్ణ అధికారాలు గల 11 మందితో మండలి ఏర్పాటు. అది మూడు సంవత్సరాల మూడునెలలపాటు కొనసాగటం, తొలి 21 మాసాలు దానికి మిలిటరీ ప్రతినిధి, మిగిలిన పద్దెనిమిది మాసాలు పౌర ప్రతినిధి అధిపతిగా ఉండటం, పౌర ప్రధాని, మంత్రి మండలిని ఎఫ్‌ఎఫ్‌సి నియమించటం, పదకొండు మంది ప్రతినిధుల మండలి, మంత్రివర్గ ఏర్పాటు తరువాత తాత్కాలిక పార్లమెంటు ఏర్పాటు,2019 తిరుగుబాటు, ఖార్టూమ్‌ ఊచకోత మీద పారదర్శకంగా స్వతంత్ర విచారణ అంశాలున్నాయి.


ఈ ఒప్పందం జరిగినప్పటి నుంచీ దానికి తూట్లు పొడిచేందుకు కుట్రలు చేశారు.2020లో మాజీ అధ్యక్షుడు అల్‌ బషీర్‌ అనుచరులుగా ఉన్న మిలిటరీ అధికారులు తిరుగుబాటు నాటకం, ప్రధానిగా ఉన్న అబ్దుల్లా హమ్‌దోక్‌పై హత్యాయత్నం జరిగింది. దాని వెనుక ఎవరున్నదీ ఇప్పటికీ వెల్లడికాలేదంటే ప్రస్తుత మిలిటరీ పాలకులే అన్నది స్పష్టం. ఒప్పందం ప్రకారం 2021 ఫిబ్రవరిలో సర్వసత్తాక అధికార మండలి అధ్యక్షపదవి నుంచి మిలిటరీ అధికారి బుర్హాన్‌ తప్పుకోవాలి. దాన్ని తుంగలో తొక్కి శాంతి ఒప్పందం పేరుతో మరొక 20నెలలు కొనసాగేందుకు అంగీకరించారు. దాన్ని కూడా ఉల్లంఘించి అదే ఏడాది అక్టోబరు 25న తిరుగుబాటు చేసి పూర్తి అధికారం తనదిగా ప్రకటించుకున్న బుర్హాన్‌, పదకొండు మంది కమిటీని రద్దు చేశాడు. గతేడాది జరగాల్సిన ఎన్నికలూ లేవు.అణచివేతకు పూనుకున్నాడు. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలూ బుర్హాన్‌ మిలిటరీ నిరంకుశపాలనకు ఏదో ఒకసాకుతో మద్దతు ఇస్తున్నాయి.తిరిగి ప్రజా ఉద్యమం లేచే అవకాశం ఉండటం, కమ్యూనిస్టు పార్టీ, దానితో కలసి పని చేస్తున్న సంస్థలు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించటం ప్రారంభమైంది. ప్రదర్శకులపై దమనకాండకు పాల్పడి 120 మందిని చంపటంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించి మరొక ప్రహసనానికి తెరలేపారు. మిలిటరీ నియంత, మితవాద శక్తులతో కూడిన ఎఫ్‌ఎఫ్‌సి మధ్య 2022 డిసెంబరులో అధికార భాగస్వామ్య అవగాహన కుదిరింది. దాన్ని ఐదువేలకు పైగా ఉన్న స్థానిక ప్రతిఘటన కమిటీలు తిరస్కరించాయి. ఒప్పందాన్ని ఒక కుట్రగా పేర్కొన్నాయి.పాలకులు గద్దె దిగేవరకూ పోరు అపకూడదని నిర్ణయించాయి. తాజా అవగాహన మేరకు పౌర సమాజానికి చెందిన ప్రధాన మంత్రి మిలిటరీ దళాల ప్రధాన అధికారిగా ఉంటారు. తరువాత దీని మీద వివరణ ఇచ్చిన బుర్హాన్‌ విలేకర్లతో మాట్లాడుతూ మిలిటరీ ప్రధాన అధికారి అంటే నియామకాలు జరపటం గానీ, అధికారిక సమావేశాలకు అధ్యక్షత వహించటం గానీ ఉండదని, తనకు నివేదించిన వాటిని అమోదించటమే అన్నారు.అయినప్పటికీ ఒప్పందానికి అంగీకారమే అని ఎఫ్‌ఎఫ్‌సి తలూపింది.ఇంకా అనేక అంశాలపై రాజీ, లొంగుబాటును ప్రదర్శించింది. అవగాహనను ఖరారు చేస్తూ ఒప్పందంపై ఏప్రిల్‌ ఒకటిన సంతకాలు జరపాలన్నదాన్ని ఆరవ తేదీకి వాయిదా వేశారు, పదకొండవ తేదీ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని, రెండు సంవత్సరాల్లో ఎన్నికలు జరపాలని చెప్పారు. కొత్త సర్కార్‌ ఏర్పాటు జరగలేదు. పన్నెండవ తేదీన మిలిటరీ-పారామిలిటరీ పరస్పరదాడులకు దిగాయి. దీనికి తెరవెనుక జరిగిన పరిణామాలే మూలం.


అవే మిలిటరీ-పారామిలిటరీ దళాల మధ్య తాజా ఆయుధపోరుకు దారితీశాయి. ఆర్‌ఎస్‌ఎఫ్‌ను రెండు సంవత్సరాల్లో మిలిటరీలో విలీనం చేస్తే ప్రస్తుతం దాని అధిపతిగా ఉన్న హిమెతీ అధికారుల మందలో ఒకడిగా ఉంటాడు తప్ప దానిలోని లక్ష మందికి అధిపతిగా ఇంకేమాత్రం ఉండడు. అందువలన మిలిటరీలో విలీనం పదేండ్లలో జరగాలని అతడు అడ్డం తిరిగాడు. దానికి బుర్హాన్‌ అంగీకరించలేదు. దానికి మరొక మెలికపెట్టి గతంలో కుదిరిన అవగాహనతో నిమిత్తం లేని ఇతర పార్టీలు, శక్తులను కూడా ఒప్పందంలో చేర్చాలని కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు. మాజీ నియంత బషీర్‌కు మద్దతుదారుగా ఉన్న ఇస్లామిస్ట్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ను చేర్చాలని పట్టుబడుతున్నాడు. ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.నియంత బషీర్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరులో కలసి వచ్చిన ఉదారవాద, మితవాద శక్తులతో కలసి కమ్యూనిస్టు పార్టీ కూటమిలో చేరింది. అల్‌ బషీర్‌ పాలన అంతమైన తరువాత అధికారానికి వచ్చిన సంధికాలపు మిలిటరీ మండలి కొన్ని సంస్కరణల అమలు గురించి చెప్పినప్పటికీ అది కూడా పౌరుల మీద ఊచకోతకు పాల్పడింది. మిలిటరీతో రాజీపడుతున్న ఎఫ్‌ఎఫ్‌సి వైఖరిని తప్పుపడుతూ ఆ సంస్థ నుంచి 2020 నవంబరు ఏడున కమ్యూనిస్టు పార్టీ వెలుపలికి వచ్చింది. భావ సారూప్యత, మిలిటరీ పాలనను వ్యతిరేకించే ఇతర శక్తులతో కొత్త కూటమిని ఏర్పాటు చేసింది.దానికి విప్లవాత్మక మార్పుల శక్తులు (ఎఫ్‌ఆర్‌సి) అని పేరు పెట్టారు.దీని నాయకత్వాన గతేడాది భారీ ప్రదర్శనలు, నిరసన తెలిపారు.


సూడాన్‌లో జరుగుతున్న పరిణామాల్లో పారామిలిటరీ దళాలు రాజధానిలోని అధ్యక్ష భవనాన్ని, విమానాశ్రయాన్ని పట్టుకున్నట్లు నిర్ధారణగాని వార్తలు వచ్చాయి.మరోవైపు ఈ దళాలు రక్షణ కోసం పౌరనివాసాల్లో చేరి రక్షణ పొందుతున్నట్లు మరికొన్ని వార్తలు. ఈ నేపధ్యంలో కోటి మంది జనాభా ఉన్న ఖార్టుమ్‌, పరిసర ప్రాంతాలపై మిలిటరీ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు ఒక కథనం. ఆ దాడులు జరుపుతున్నది ఈజిప్టు మిలిటరీ అని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా గందరగోళం కలిగిస్తున్నాయి. సూడాన్‌ మిలిటరీ, పారామిలిటరీ ప్రజలను అణచివేసేందుకే గతంలో పని చేసింది. పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీ అధిపతికి బంగారు గనులు కూడా ఉన్నాయి. నియంత బషీర్‌ను గద్దె దింపిన తరువాత దేశ రిజర్వుబాంకుకు వంద కోట్ల డాలర్లను అందచేశాడంటే ఏ స్థితిలో ప్రజల సంపదలను కొల్లగొట్టిందీ అర్ధం చేసుకోవచ్చు. బహుశా ఇది కూడా తాజా ఘర్షణలకు మూలం కావచ్చు. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివాదంలో అరబ్బు, మధ్యప్రాచ్య దేశాలు ఇరు పక్షాలకూ మద్దతు ఇచ్చేవిగా చీలి ఉన్నాయి. మిలిటరీకి అమెరికా మద్దతు ఉంది. పారామిలిటరీ-మిలటరీ ఎవరిది పై చేయిగా మారినా సూడాన్‌ తిరిగి ఉక్కుపాదాల నియంత్రణలోకే వెళ్లనుందని చెప్పవచ్చు.మరోవైపు ప్రజాప్రతిఘటన దళాలు విప్లవం కొనసాగుతుంది, ఎలాంటి సంప్రదింపులు ఉండవు,ఎవరితోనూ సంప్రదింపులు ఉండవు, చట్టవిరుద్దమైన పాలకులతో ఎలాంటి రాజీలేదని జనాన్ని సమీకరించేందుకు పూనుకున్నాయి.

అక్రమ ఆయుధాల నిలయం ఉత్తర ప్రదేశ్‌ : గురువు మోడీ ప్రజాస్వామ్య సుభాషితాల వల్లింపు – శిష్యుడు యోగి తద్విరుద్ద ఆటవిక పాలన !

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్‌ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్‌ అహమ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహమ్మద్‌ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతలకు ఇది చక్కటి ఉదాహరణ. సులభంగా ప్రాణాలు తీసేందుకు కొత్త దారి చూపింది. ఇది పూర్వపు అలహాబాద్‌ నేటి ప్రయాగ్‌ రాజ్‌లో జరిగింది. అంతకు రెండు రోజుల ముందు అతిక్‌ అహమ్మద్‌ 19 ఏండ్ల కుమారుడిని, అతని అనుచరుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ప్రజాస్వామ్య పుట్టినిల్లు భారత్‌ అని, ఇందుకు అనేక చారిత్ర ఆధారాలున్నాయని కావాలంటే పదకొండు వందల సంవత్సరాల నాటి తమిళశాసనాన్ని చూడవచ్చని చరిత్రకారుడి అవతారం కూడా ఎత్తిన ప్రధాని నరేంద్రమోడీ తమిళ సంవత్సరాది సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఇది జరిగింది. శిష్యుడు యోగి ఏలుబడిలో ఆటవిక ఉదంతం. హంతకులు తుపాకులు కాల్చుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేశారట. ప్రస్తుతం అక్కడ ఏ నినాదమిస్తే ఏం చేసినా తప్పించుకోవచ్చని వారికి అవగతమై ఉందేమో !వారిలో ఒకడు భజరంగ్‌దళ్‌ జిల్లా నేత. ఒక పెద్ద గూండాను చంపి తాము పేరు తెచ్చుకోవాలని ఆ ముగ్గురు చిల్లర గూండాలు చెప్పారంటే బిజెపి రెండింజన్ల పాలన, ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధó్యవహిస్తున్న, యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో గూండాలకు, గూండాయిజానికి ఎంత పలుకుబడి, ఆరాధన ఉందో వెల్లడించింది.


అమెరికాలో తుపాకి తీసుకొని టపటపా మంటూ కాల్చిచంపిన వారిని తరువాత వచ్చే పోలీసులు అనేక ఉదంతాల్లో మట్టుపెట్టటం తెలిసిందే. తమ ముందే ఇద్దరిని కాల్చిచంపుతుంటే కళ్లప్పగించి ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు చూశారంటే వారి రాక గురించి ముందే ఉప్పంది ఉండాలి లేదా హంతకులు జై శ్రీరామ్‌ అన్నారు గనుక వారు అధికార పార్టీ వారైతే లేనిపోని తంటామనకెందుకని వదలివేశారా ? ఆ వచ్చిన దుండగులు జర్నలిస్టుల ముసుగులో వచ్చారు.పోలీసులకు వారెవరో తెలీదు.ఎవరినీ తనిఖీ జరపలేదు. ఇద్దరిని చంపిన తరువాత వారు మిగిలిన వారిని కూడా చంపుతారేమో అన్న అనుమానం కూడా వారికి రాలేదు. వారు పారిపోకుండా కనీసం కాళ్ల మీదనైనా కాల్పులు జరపలేదు. ఉత్తర ప్రదేశ్‌లో పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో పోలీసులకు ఇచ్చిన శిక్షణ ఎంత ఉన్నతమైనదో కదా !


అమెరికాలో నిందితులను కాల్చి చంపిన వెంటనే ఇంటర్నెట్‌ నిలిపివేతలు, ఒక చోట నలుగురు గుమికూడ కుండా ఆంక్షల విధింపు, పాలకులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకోవటం వంటివి జరిగినట్లు ఎప్పుడూ వినలేదు, కనలేదు. కానీ ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదివారం నాడు రాష్ట్రమంతటా ఆంక్షలు విధించి మిగిలిన పనులు కూడా చేసింది. గత ఆరు సంవత్సరాల్లో తన పాలనలో మాఫియా, గూండా గాంగులను అంతమొందించినట్లు చెప్పుకుంటున్న సిఎం అంతా సజావుగా ఉంటే ఈ పని ఎందుకు చేసినట్లు ? అవసరం ఏమి వచ్చింది ?


గూండాలను, గూండాయిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలనటంలో ఎవరికీ విబేధం లేదు. చట్టవిరుద్దమైన పనులు చేసినపుడే సమస్య. నిజంగా గూండాలు, తీవ్రవాదులు గానీ జనం మీద లేదా భద్రతా దళాల మీద దాడులకు దిగినపుడు జరిగే ఎన్‌కౌంటర్లలో వారిని చంపితే అదొక తీరు. నకిలీ ఎన్‌కౌంటర్లు జరిపితే అది ప్రజాస్వామ్యమా అన్నది నాగరికుల్లో కలిగే సందేహం. ఇటీవలి కాలంలో నకిలీ ఎన్‌కౌంటర్లను కూడా హర్షించే బాపతు రెచ్చిపోతున్నది.ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కూడా కబుర్లు చెప్పేది వారే కావటం విషాదం. అతిక్‌ అహమ్మద్‌ కుమారుడు, మరొకరిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే అతిక్‌ సోదరులను ఒక పధకం ప్రకారం మట్టుబెట్టించారని అనేక మంది భావిస్తున్నారు.పేరు మోసిన గూండాలను కాల్చిచంపినా తప్పుపడితే ఎలా అని తక్షణ న్యాయం కావాలని కోరుకొనే కొందరు ప్రశ్నిస్తారు. ఇలా ప్రశ్నించటం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశం అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీని అవమానించటం తప్ప మరొకటి కాదు. మతమార్పిడి, లౌజీహాద్‌ నిరోధ చట్టాల మాదిరి పేరు మోసిన నిందితులను కాల్చి చంపాలని ప్రభుత్వ పెద్దలు తమకు ఉన్న మెజారిటీని ఆసరా చేసుకొని చట్టాలను చేసి అందుకు పూనుకుంటే అది వేరే. ప్రజాస్వామ్య ముసుగులో ఎన్‌కౌంటర్లు సమాజానికి పీడగా ఉండే నేరగాండ్లకే పరిమితం కావు, తమకు నచ్చనివారిని సైతం అధికారంలో ఉన్న పెద్దలు ఏదో ఒకసాకుతో ఏరిపారవేస్తారు.తమదాకా వచ్చినపుడు గానీ ” తక్షణ న్యాయ ” వాదులకు ఈ అంశం అర్ధం కాదు. అలా కోరుకోవటం, అలాంటి ఉదంతాలకు మద్దతు ఇవ్వటం అంటే నిరంకుశ శక్తులను ప్రోత్సహించటమే.


ఉత్తర ప్రదేశ్‌లో యోగి అధికారానికి వచ్చిన తరువాతే నేరగాండ్లను మట్టుబెట్టి పీడ లేకుండా చేస్తున్నట్లుగా ప్రచారం పెద్దఎత్తున సాగుతున్నది. 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్లలో 183 మంది నేరగాండ్లను లేపివేసిన బాహుబలిగా వర్ణిస్తున్నారు. జాతీయ మానవహక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2017 మార్చి నుంచి 2022 మార్చినెల వరకు దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక ఎన్‌కౌంటర్‌, 813 మంది మరణించినట్లు వెల్లడించింది. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్‌లో జరిగినవి కాదు.దుండగులు తమ వద్ద ఉన్న తుపాకులను లాక్కొనేందుకు, తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు, తనిఖీ జరుపుతుండగా కాల్పులు జరిపినపుడు ఆత్మరక్షణ కోసం కాల్చినట్లు పోలీసులు చెప్పటం తెలిసిందే.యోగి అధికారంలో లేనపుడు కూడా ఉత్తర ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. సావర్కర్‌ అండమాన్‌ జైల్లో ఉన్నపుడు బుల్‌బుల్‌ పిట్ట రెక్కల మీద ఎక్కి వెలుపలికి వచ్చి దేశంలోని కొన్ని ప్రాంతాలను చూసి తిరిగి జైలుకు చేరుకున్నట్లు కర్ణాటక బిజెపి ప్రభుత్వ స్కూలు పుస్తకాల్లో రాసిన సంగతి తెలిసిందే.ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉండగా బహుశా గోరఖ్‌పూర్‌లోని తన మఠం నుంచి యోగి మారు రూపంలో వచ్చి పోలీసులను ఆవహించి ఎన్‌కౌంటర్లను జరిపించి తిరిగి మఠానికి వెళ్లారని కూడా భక్తులు భక్తులు చెబుతారేమో చూడాలి.


జాతీయ మానవహక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2002 నుంచి 2008 వరకు దేశంలో 440 ఎన్‌కౌంటర్‌ కేసులు జరిగితే రాష్ట్రాల వారీ ఉత్తర ప్రదేశ్‌ 231, రాజస్తాన్‌ 33, మహారాష్ట్ర 31, ఢిల్లీ 26, ఆంధ్రప్రదేశ్‌ 22, ఉత్తరాఖండ్‌ 19 ఉన్నాయి. తరువాత 2009 అక్టోబరు నుంచి 2013 ఫిబ్రవరి వరకు 555 ఉదంతాలు జరగ్గా రాష్ట్రాల వారీ ఉత్తర ప్రదేశ్‌ 138, మణిపూర్‌ 62, అసోం 52, పశ్చిమ బెంగాల్‌ 35, ఝార్ఖండ్‌ 30 ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు మరణించారు. ఈ కాలంలో యోగి అధికారంలో లేరు. ఉత్తర ప్రదేశ్‌లో వేర్పాటు వాదం లేదా నక్సల్‌ సమస్యలేదు. జరిగిన ఎన్‌కౌంటర్లలో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ పోలీసు కస్టడీ మరణాలకు పేరుమోసింది. దీని గురించి ఎక్కడా ప్రచారం జరగదు ఎందుకు ? వారంతా ఎవరు, నేరగాండ్లేనా ? టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 జూలై 26 నాడు ప్రచురించిన వార్త చెప్పిందేమిటి ? 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2022 మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సమాచారం ప్రకారం దేశంలో 4,484 పోలీసు కస్టడీ మరణాలు, 233 ఎన్‌కౌంటర్‌ మరణాలు జరిగినట్లు లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఉత్తర ప్రదేశ్‌ 952 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. నరేంద్రమోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ దుర్మార్గం ఏమిటనిగానీ, ప్రజాస్వామ్య కబుర్లు చెపితే జనం ఏమనుకుంటారని గానీ ఎప్పుడైనా ఆత్మావలోకనం చేసుకున్నారా ?


ఒక పెట్టుబడిదారుడిని చంపినంత మాత్రాన దోపిడీ, ఒక భూస్వామిని చంపినంత మాత్రాన గ్రామాల్లో అణచివేత అంతరించదు. అలాగే గూండాలను చంపినంత మాత్రాన గూండాయిజం అంతం కాదు. అదే జరిగి ఉంటే 1990 దశకం నుంచి 2000 దశకం వరకు ముంబై,మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో గూండాలు, మాఫియాడాన్లను పోలీసులు చంపివేశారు. వాటితో అక్కడ ఇప్పుడు గూండాయిజం అంతరించిందా ? కొత్తవారు పుట్టుకువస్తూనే ఉంటారు. ఏప్రిల్‌ 13న ఎన్‌కౌంటర్‌లో చంపిన పందొమ్మిదేండ్ల అతిక్‌ అహమ్మద్‌ కుమారుడికి యోగి అధికారంలోకి వచ్చే నాటికి 13 సంవత్సరాలుంటాయి. అతను ఈ కాలంలో గూండాగా మారాడా ? నిజంగా మారితే ఎన్‌కౌంటర్లను, బాహుబలి యోగిని ఖాతరు చేయటం లేదనుకోవాలి, అలాగాకపోతే తండ్రి అతిక్‌ అహమ్మద్‌ మీద కసి తీర్చుకొనేందుకు పోలీసులు అతగాడిని హతమార్చి ఉండాలి.ఏది నిజం ? చట్టబద్ద పాలన సాగుతోందా, విరుద్దంగా ఉందా ?


అతిక్‌ అహమ్మద్‌ సోదరులను హతమార్చిన ముగ్గురు నేరగాండ్ల గురించి చూస్తే వారిలో లవలేష్‌ తివారీ అనే వాడు సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన భజరంగ్‌ దళ్‌ నేతగా ఉన్నాడని వార్తలు. తమకేం సంబంధం లేదని ఆ సంస్థలు ప్రకటించటం ఊహించనిదేమీ కాదు. ఫేస్‌బుక్‌లో తనను భజరంగ్‌ దళ్‌ జిల్లా సహ నేతగా వర్ణించినపుడే తమకే సంబంధం లేదని ప్రకటించి ఉంటే వేరు, ఇప్పుడు చెబుతున్నారంటే గాడ్సేను కూడా అలాగే తమవాడు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన సంగతి గుర్తుకు వస్తోంది. నేరం చేసిన తరువాత జై శ్రీరామ్‌ అనటాన్ని బట్టి, ముగ్గురూ కలసి వచ్చారంటే మిగిలిన ఇద్దరు కూడా ఆ బాపతే లేదా తోడు తెచ్చుకున్న నేరగాండ్లన్నది స్పష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన వారిని పోలీసులే ఒక దగ్గరకు చేర్చి ఉండాలి. గతంలో వారి మీద కేసులు ఉన్నప్పటికీ ముగ్గురు కలసి చేసినట్లు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. విధి నిర్వహణలో ఉన్న 17 మంది పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన వార్తలు ఫేక్‌ అని ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని అదానీ ఆధీనంలోని ఎన్‌డిటివి పేర్కొన్నది.లవలేష్‌ తివారీతో తమకెలాంటి సంబంధం లేదని కుటుంబం చెప్పిందట. కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదని కూడా తండ్రి చెప్పాడట.తాను బ్రాహ్మణుడనని శాస్త్రాలను గాక ఆయుధాలు పట్టుకు తిరుగుతానని లవలేష్‌ చెప్పేవాడట. సన్నీ అనే నేరగాడు రౌడీ షీటర్‌. పద్నాలుగు కేసులున్నాయి,ఎలా నేరగాడిగా మారిందీ తెలియదని సోదరుడు చెప్పాడు. మూడోవాడు అరుణ్‌ చిన్నపుడే ఇల్లువదలి వెళ్లాడు. తాము పేరు మోసిన నేరగాండ్లం కావాలనే కోరికతో అతిక్‌ సోదరులను కాల్చి చంపినట్లు పోలీసులకు చెప్పారట.యోగి పాలన ఇలాంటి ఉత్తేజాలకు దోహదం చేస్తున్నట్లే కదా ! ఇలాంటి గూండాలను ఒక దగ్గరకు చేరుస్తోందా ?


యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పటి వరకు పదివేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిపారని వార్తలు.దీనితో నేరాలు అదుపులోకి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ నేరాల వివరాలను చూసినపుడు అలాంటి దాఖలాలు లేవు.కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంకాలను చూద్దాం.
రాష్ట్రం ××2016×××××2017××××2018××××2019××××2020
ఉత్తరప్రదేశ్‌ ××494025××600082××585157××628578××657925
అన్ని రాష్ట్రాలు ×4575746×4722642×4769681×4801091×6291485
ఎగువన ఉన్న వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో యోగి అధికారానికి రాక ముందు 2016లో నమోదైన అన్ని రకాల కేసులు 4,94,025 ఉంటే 2020లో అవి 6,57,925 కు పెరిగాయి. దేశంలో 45,75,746 నుంచి 62,91,485కు చేరాయి.దేశంలో పెరిగినట్లుగానూ ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉన్నాయి.మొత్తం కేసులలో అక్రమంగా ఆయుధాలు కలిగినవి 2021లో దేశంలో వందకు 3.3 ఉంటే ఉత్తర ప్రదేశ్‌ 11.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. రెండంకెలు గల రాష్ట్రం మరొకటి లేదు. అలాంటి స్థితిలో అక్కడి జనం సుఖంగా నిద్రపోతారా ? యోగి ఆదిత్యనాధ్‌కు రెండు తుపాకులకు లైసెన్సు కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సర్వసంగ పరిత్యాగి, నిరంతరం భద్రతా వలయంలో ఉండే యోగి పరిస్థితి ఇది. గూండాలను అణచివేస్తే అన్ని అక్రమ ఆయుధాలు ఎలా ఉంటాయి ?


ఎన్‌కౌంటర్ల గురించి ప్రచారం మీద చూపిన శ్రద్ద ఇతర అంశాల మీద లేదు. తమకు విధించిన జీవితకాల శిక్ష గురించి చేసుకున్న అప్పీళ్లు సంవత్సరాల తరబడి విచారణకు రావటం లేదంటూ 18మంది నేరస్థులు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన విన్నపంలో అలహాబాద్‌ హైకోర్టులో 160 మంది జడ్జీలకు గాను 93 మందే ఉన్నారని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు వారికి బెయిల్‌ ఇచ్చింది.” బలహీన వర్గాలకు చెందిన వారు ఎప్పటికీ కస్టడీలోనే ఉంటున్నారు. మా అనుభవంలో అలాంటి వారు జైళ్లలో ఉంటున్నారు.ఉన్నత సమాజానికి చెందిన ఒక నేరగాడు శిక్ష పడే సమయానికి దేశం నుంచి తప్పించుకున్నాడని ” ఆ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఇది యోగి సర్కార్‌ సిగ్గుపడాల్సిన అంశం. 2021 ఆగస్టు నాటికి 1.8లక్షల క్రిమినల్‌ అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. రెండువేల సంవత్సరం నుంచి కేవలం 31,044 కేసులనే హైకోర్టు పరిష్కరించింది. పదేండ్లకు ముందు అప్పీలు చేసిన ఖైదీలు 7,214 మంది జైల్లో ఉన్నారు.2017 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు జరిపిన 8,472 ఎన్‌కౌంటర్లలో 3,302 మంది నేరారోపణలు ఉన్నవారు గాయపడ్డారు.వారిలో 146 మంది మరణించారు. పోలీసు ఎన్‌కౌంటర్లు పెద్ద ఎత్తున జరగటం అంటే అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగం, న్యాయాన్ని అందించాల్సిన వ్యవస్థ వైఫల్యానికి చిహ్నం. పోలీసు యంత్రాంగాన్ని ఎన్‌కౌంటర్ల విభాగంగా మార్చితే జవాబుదారీతనాన్ని లోపించిన దాన్ని సంస్కరించటం అంత తేలిక కాదు, ఏకుమేకై కూర్చుంటుంది. చివరకు పెంచి పోషించిన వారికే తలనొప్పిగా మారుతుంది. అధికారం మారితే అదే పోలీసు యంత్రాంగం పాలకులు ఎవరి మీద గురి పెట్టమంటే వారి మీదే తుపాకులను ఎక్కు పెడుతుంది.

వీళ్లు పొట్టకూటి మాయలోళ్లు కాదు : కేరళలో మాదిరి ఈద్‌ రోజున హైదరాబాద్‌ ఇతర చోట్ల బిజెపి ముస్లింలను సంతుష్టీకరిస్తుందా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఈస్టర్‌ రోజున ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఒక చర్చి ప్రార్ధనలకు వెళ్లగానే క్రైస్తవులందరూ తమ చంకనెక్కినట్లు, ఇదే ఊపులో ఈద్‌ రోజున ముస్లింలను సంతుష్టీకరించి వారిని మరో చంకనెక్కించుకుందామని కేరళలో బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు కార్యకర్తలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వీర, శూర హిందూత్వ వాదులకు ఇది మింగుడు పడని అంశమే. వారు మైనారిటీ విద్వేషం అనే పులిని ఎక్కి ఉన్నారు. అధికారం కోసం దేనికైనా నరేంద్రమోడీ సిద్దపడేట్లు ఉన్నారు. ఉన్న ఒక్క అసెంబ్లీ సీటును పొగొట్టుకొని కొరకరాని కొయ్యగా ఉన్న కేరళలో పాగా వేసేందుకు చూస్తున్న బిజెపి ఆత్రం అంతా ఇంతా కాదు. అదే పని ఇతరులు చేస్తే వ్యభిచారం తాము చేస్తే సంసారం అన్నట్లుగా ఫోజు పెడుతోంది. ఒక రాజకీయపార్టీగా జనాభిమానం పొందాలన్న కోరిక ఉండటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇంతకాలం తమనేతలు, మద్దతుదార్లు చేసిన క్రైస్తవ, ముస్లిం విద్వేష ప్రసంగాలు, ప్రచారాన్ని ఆ సామాజిక తరగతుల వారు మరిచినట్లు, మారుమనసు పుచ్చుకొని ఇతర పార్టీలను వదలి తమ వైపు వచ్చినట్లు బిజెపి భావిస్తున్నది. వారు మరీ అంత అమాయకంగా ఉన్నట్లు భావిస్తున్నారా ? అవకాశ వాదులు ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఈ రోజుల్లో అన్ని సామాజిక తరగతుల్లో ఉన్నట్లుగానే వీరిలో కూడా ఉన్నారు. లేకుంటే చెట్టపట్టాలు వేసుకొని తిరగరు. అదే విధంగా మెజారిటీ మతోన్మాదం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా దానికి తక్కువేమీ కాదు. రెండూ ఒకే నాణానికి బొమ్మ బొరుసు వంటివి. ఒకదాన్ని మరొకటి ఆలంబనగా చేసుకొని తమ అజెండాలను అమలు జరుపుతున్నాయి.


కేరళ రాష్ట్ర బిజెపికి మార్గదర్శకుడిగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌ తాజాగా రీడిఫ్‌ డాట్‌ కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ(ఏప్రిల్‌ పన్నెండవ తేదీ)లో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది.కేరళలో ఓటు అనుబంధాలు మారతాయి. గత పార్లమెంటు ఎన్నికల తరువాత జన వైఖరి మారింది.నరేంద్రమోడీ సుపరిపాలన ఎలా ఉంటుందో ఇంతకు ముందు కేరళవాసులు చూడలేదు.2019 ఎన్నికల్లో జనం రెండు శిబిరాలుగా చీలారు. ఒకసారి గెలిచిన మోడీ తిరిగి గెలవరని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని అప్పుడు భావించారు.అందుకే కాంగ్రెస్‌కు 20కి గాను పందొమ్మిది ఇచ్చారు.ఈ సారి బిజెపికి కనీసం ఐదు సీట్లు వస్తాయి. క్రైస్తవులు, ఇతర సామాజిక తరగతులు ఇతర ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు.కాంగ్రెస్‌ ఓటు బాంకు బాగా పడిపోయింది. క్రిస్మస్‌ రోజు నుంచి వేలాది మంది బిజెపి కార్యకర్తలు వేలాది క్రైస్తవుల గృహాలను సందర్శించారు.వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. వారికి కేకులు ఇచ్చారు, వారిని లంచ్‌, డిన్నర్లకు ఆహ్వానించారు.అందరూ సంతోషించారు. మరోలక్ష ఇండ్లను సందర్శించే పధకం ఉంది. మళయాళీ నూతన సంవత్సరం ఏప్రిల్‌ 15న ” విషు ” సందర్భంగా హిందూ కార్యకర్తలు క్రైస్తవులు, ముస్లింల ఇండ్లను సందర్శించి తమ ఇండ్లలో జరిగే ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తారు. ఈద్‌ రోజున శుభాకాంక్షలు తెలుపుతారు.


ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవులు సురక్షితంగా ఉన్నారని పొగిడిన సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి అధిపతి మార్‌ జార్జి అలంచెరీ తీరును కాథలిక్‌ పత్రిక ” సత్యదీపం” సంపాదకీయంలో కడిగిపారేసింది. ఒక పత్రిక ఇంటర్వ్యూలో అలంచెరీ మాట్లాడుతూ కేరళలో బిజెపి ప్రజల ఆమోదం పొందుతున్నదని కూడా చెప్పారు.చిన్న చిన్న ప్రయోజనాల కోసం అలా మాట్లాడితే చరిత్ర క్షమించదని హెచ్చరించింది. దేశంలో క్రైస్తవుల మీద పెరుగుతున్న దాడుల గురించి బాధ్యత కలిగిన కాథలిక్‌ చర్చ్‌ ఆఫ్‌ ఇండియా ఆర్చిబిషప్‌ ఒకరు (బెంగలూర్‌ మెట్రోపాలిటన్‌ ఆర్చిబిషప్‌ పీటర్‌ మచాడో) సుప్రీం కోర్టు ముందు ఒక పిటీషన్‌ దాఖలు చేసి ఉండగా అలంచెరీ ఇలా మాట్లాడటం ఏమిటని నిలదీసింది.క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని వర్ణించిన, ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా పనిచేసిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ”ఆలోచనల గుత్తి ” అనే పుస్తకంలో రాసినదాన్ని ఇప్పటికీ బోధిస్తున్నప్పటికీ చర్చి నాయకత్వం తమ బుర్రలను మార్చుకొనేందుకు దోహదం చేసిందేమిటని ప్రశ్నించింది. రాజకీయాలేమీ లేవంటూ బిషప్పులు, క్రైస్తవుల ఇండ్లకు తిరుగుతున్న బిజెపి నేతల రాజకీయం గురించి లౌకిక కేరళ సులభంగానే అర్ధం చేసుకోగలదని పేర్కొన్నది. స్టాన్‌ స్వామిని ఎలా చంపేశారు ? కందమాల్‌ బాధితులకు (2008లో ఒడిషాలోని కందమాల్‌ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులను చంపి, వందలాది చర్చ్‌లను ధ్వంసం చేసిన ఉదంతం) న్యాయాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారో తమ వద్దకు వచ్చిన అతిధులను అడగకుండా బిషప్పులు ”రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారని ” ఎద్దేవా చేసింది.


” హిందూ సమాజం యుద్దంలో ఉంది, అందువలన కలహశీలంగా ఉండటం సహజం.అంతర్గతంగా ఉన్న శత్రువుతోనే యుద్దం. కాబట్టి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజాన్ని రక్షించుకొనేందుకు యుద్దం జరుపుతున్నది. విదేశీ దురాక్రమణలు, విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలుగా పోరులో ఉంది. దీనికి సంఫ్‌ు మద్దతు ఇచ్చింది ”అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఇటీవల తమ పత్రిక ” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో పేర్కొన్నారు. గోల్వాల్కర్‌ చెప్పినదే మరో రూపంలో చెప్పారు. అలాంటి సంస్థ ఏర్పాటు చేసిన బిజెపికి మద్దతు ప్రకటించేందుకు కేరళలోని చర్చి అధికారులు సాకులు చూపుతున్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ (ఆలోచనల గుత్తి ) పేరుతో 1940,50 దశకాల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలు ఇప్పుడు పనికిరావని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ నమ్మబలుకుతున్నారు. అ పుస్తకంలోని అంశాలు ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళి కాదని కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. క్రైస్తవులు భారత్‌ గాక తమ విదేశాల్లోని తమ పవిత్ర ప్రాంతానికే విధేయులుగా ఉంటారని, 1857 నుంచి బ్రిటీష్‌ వారితో కుమ్మక్కు అయ్యారని,బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, క్రైస్తవ మిషనరీలు రక్తం తాగుతారని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలకు చెందిన వారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత ఆ పేరుతో మతమార్పిడి నిరోధ చట్టాలను చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ గోల్వాల్కర్‌ భాషలోనే క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ క్రిస్మస్‌, ఆంగ్ల సంవత్సరాదులను విమర్శించింది. రబ్బరు ధరలను పెంచితే కేరళలో బిజెపికి మద్దతు ఇస్తారని తెలిచ్చేరి ఆర్చిబిషప్‌ ఎంజె పంప్లానీ ప్రకటించారు. కొందరు చర్చి నేతలు భూమితో సహా కొన్ని కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి కొందరిని తమకు అనుకూలంగా బిజెపి మార్చుకుంటున్న తీరు తెన్నులు మనకు తెలిసిందే అని మాజీ ఎంపీ సెబాస్టియన్‌ పాల్‌ అన్నారు. గుర్తు చేసుకుందాం అనే పేరుతో ఏప్రిల్‌ 17న ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు క్రైస్తవులపై దాడులను వివరించేందుకు ఎగ్జిబిషన్లతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నట్లు డివైఎఫ్‌ఐ ప్రకటించింది.


తమ అజెండాను జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు ఊహాజనితమైన అంశాలను ముందుకు తేవటం, వాటి ప్రాతిపదికగా విద్వేషాన్ని రెచ్చగొట్టటం సంఘపరివార్‌ ఎత్తుగడ అన్నది తెలిసిందే.” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో మోహన్‌ భగవత్‌ చెప్పింది అదే. ” కపటం లేని నిజం ఏమంటే హిందూస్తాన్‌ ఎప్పటికీ హిందూస్తాన్‌గానే ఉండిపోవాలి. నేటి భారత్‌లో నివశిస్తున్న ముస్లింలకు హాని ఉండదు.వారి విశ్వాసానికి వారు కట్టుబడి ఉండాలని కోరుకుంటే వారు ఉండవచ్చు. ఒక వేళ వారు తమ పూర్వీకుల విశ్వాసానికి తిరిగి రావాలంటే వారు రావచ్చు. అది పూర్తిగా వారిష్టం. హిందువుల్లో అలాంటి పంతం లేదు, ఇస్లాం భయపడాల్సిందేమీ లేదు. కానీ ఇదే సమయంలో ముస్లింలు తాము ఉన్నతులమనే ప్రచండమైన వాక్పటిమను వదులుకోవాలి…… జనాభా అసమతూకం అనేది ఒక ప్రధాన ప్రశ్న, దాని గురించి మనం ఆలోచించాలి…..అది ఒక్క జననాల రేటు గురించే కాదు. అసమతూకం ఏర్పడటానికి మతమార్పిడులు, అక్రమ చొరబాట్లు ప్రధాన కారణం. వీటిని నిరోధిస్తే సమతూకం పునరుద్దరణ అవుతుంది.మనం దీన్ని కూడా చూడాలి.” గురువుగా సంఘీయులు భావించే గోల్వాల్కర్‌ బోధనల సారం కూడా ఇదే. ఒక వైపు అవి ఇప్పుడు పనికి రావు అని అదే సంఘీయులు కొందరు మరోవైపు చెప్పటం ఎప్పటికా మాటలాడి అప్పటికి తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. రెండు నాలుకలతో మాట్లాడటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. మేకతోలు కప్పుకున్నప్పటికీ పులి స్వభావం మారదు. కుటుంబనియంత్రణ పాటించకుండా జనాభాను పెంచివేస్తున్నారని,హిందువులు మైనారిటీగా మారనున్నట్లు చేస్తున్న ప్రచారం ఎవరు చేస్తున్నదీ తెలిసిందే.


జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కాదు అసలు ఉండదు అన్నది కొందరి భావన అందుకే గతంలో ఎవరేం చెప్పారో, ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకోవటం అవసరం.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ 2021 జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. అలాంటపుడు జనాభా సమతూకం ఎలా ఉంటేనేం ?దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నట్లు ?
ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శనదేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.

2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. అలాంటి శక్తులకు మద్దతు ఇచ్చేందుకు ఇస్లాం, క్రైస్తవ మతాధికారులుగా ఉన్నవారు ముందుకు వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బిజెపిని ఒక్క ప్రశ్న అడగాలి. కేరళలో ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులకు కేకులిచ్చి మంచి చేసుకోవాలని చూశారు. ఈద్‌(రంజాన్‌) సందర్భంగా ముస్లింలను కూడా అదే విధంగా కలవాలని నిర్ణయించారు. కేరళ సిఎం పినరయి విజయన్‌ అన్నట్లు గతంలో చేసిన దానికి పశ్చాత్తాపంగా అలా చేస్తే మంచిదే.కేరళలో మాదిరి దేశంలోని ఇతర ప్రాంతాలు అంటే హైదరాబాద్‌ వంటి చోట్ల కూడా బిజెపి అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందా, అసదుద్దీన్‌ ఒవైసి తదితరులను ఆలింగనం చేసుకొని శుభం పలుకుతుందా ?

అతి రహస్యం బట్టబయలు : మిత్రుల మీదా దొంగకన్నేసిన అమెరికా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అందరికీ జోశ్యం చెప్పే బల్లి తానే కుడితి తొట్లో పడికొట్టుకున్నట్లుగా ఉంది అమెరికా పరిస్థితి. పదేండ్ల క్రితం కేవలం వందడాలర్ల(రు.8,200)తో కొనుగోలుకు అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌తో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి లక్షలాది పత్రాలను లీకు చేశాడు. స్నోడెన్‌కు ఇటీవలనే పుతిన్‌ తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చాడు. అంతకు ముందు 1971లో అమెరికా రక్షణ శాఖ పత్రాలు కూడా వెల్లడయ్యాయి. అదే విధంగా 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి రహస్య పత్రాలను సేకరించి బహిర్గత పరచిన వికీలీక్స్‌ లక్షలాది అమెరికా రహస్య పత్రాలను వెల్లడించటంతో ప్రాచుర్యం పొందింది.వాటి గురించి అమెరికాలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.ఆ సంస్థలో ప్రముఖుడైన జూలియన్‌ అసాంజేను పట్టుకొనేందుకు,జైల్లో పెట్టేందుకు వీలైతే మట్టుపెట్టేందుకు చూస్తూనే ఉంది.


ఇప్పుడు మరోసారి అలాంటి సంచలనం మరో విధంగా చెప్పాలంటే రాసిలో తక్కువైనా వాసిలో ఎక్కువ అన్నట్లుగా వెల్లడైన వందకు పైగా పత్రాలు అమెరికా, నాటో కూటమిని పెద్ద ఇరకాటంలో పెట్టాయనటం అతిశయోక్తి కాదు. రహస్యం, అతి రహస్యం అని దాచుకున్న రక్షణశాఖ ఫైళ్లు బయటకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకేం వెల్లడౌతాయోనని అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రపంచంలో ఎక్కడే జరిగినా పసిగట్టి చెబుతామని చెప్పుకొనే అమెరికా తాజాగా తన ఫైళ్లను వెల్లడి చేసింది ఎవరన్నది తేల్చుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నది. ఎవరు వాటిని వెల్లడించిందీ తరువాత సంగతి, అసలు ఎంత అజాగ్రత్తగా ఫైళ్ల నిర్వహణ చేస్తున్నదో లోకానికి వెల్లడైంది. అమెరికన్లతో తామేమి మాట్లాడినా అవి వెల్లడికావటం తధ్యంగా ఉంది కనుక ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలనే ఆలోచన,జాగ్రత్తలకు ఇతర దేశాలకు చెందిన అనేక మందిని పురికొల్పింది. తమ గురించిఎలాంటి సమాచారం సేకరించిందో అదెక్కడ వెల్లడి అవుతుందో అన్న ఆందోళన అమెరికా మిత్రదేశాల్లో కూడా తలెత్తింది.


ఈ ఫైళ్లలో ఉన్న అంశాలు వికీలీక్స్‌, ఇతర వాటి మాదిరి గతంలో జరిగిన ఉదంతాలు, పరిణామాల సమాచారం కాదు. వర్తమానంలో జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభం, దాని గురించి అమెరికా అంతర్గత అంచనా, ఆందోళనలతో పాటు ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా ఉండే ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, చివరికి తాను చెప్పినట్లు ఆడుతున్న ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మీద కూడా దొంగకన్నేసినట్లు తేలింది.ఉక్రెయిన్‌ దళాల వద్ద ఉన్న మందుగుండు, ఇతర ఆయుధాలు ఎప్పటివరకు సరిపోతాయి, మిలిటరీలో తలెత్తిన ఆందోళన, ఆ సంక్షోభంలో రోజువారీ అంశాల్లో అమెరికా ఎంతవరకు నిమగమైంది, పెద్దగా బహిర్గతం గాని ఉపగ్రహాలద్వారా సమాచారాన్ని సేకరించే పద్దతులతో సహా రష్యా గురించి ఎలా తెలుసుకుంటున్నదీ, మిత్ర దేశాల మీద ఎలా కన్నేసిందీ మొదలైన వివరాలున్న పత్రాలు ఇప్పటివరకు వెలికి వచ్చాయి. రష్యన్లు తమ కంప్యూటర్లలోకి చొరబడి(హాకింగ్‌) సమాచారాన్ని కొల్లగొట్టారని అమెరికా ఒక కథను ప్రచారంలోకి తెచ్చింది. ఆ పత్రాల్లో ఉన్న వివరాలను బట్టి ఆ కథ అంతగా అతకటం లేదని కొందరు చెప్పారు.దాంతో పత్రాల్లో కొంత వాస్తవం కొంత కల్పన ఉందని అమెరికా అధికారులు చెవులు కొరుకుతున్నారు. తాజాగా వెల్లడైన కొన్ని ఫైళ్లు కుర్రాళ్లు ఆటలాడుకొనే వెబ్‌సైట్లలో తొలుత దర్శనమిచ్చాయి.


ఒక కథనం ప్రకారం ఐదునెలల క్రితం అక్టోబరులో కంప్యూటర్‌గేమ్స్‌(ఆటలు) ఆడుకొనే ఒక డిస్కార్డ్‌ వేదిక (ఒక ఛానల్‌) మీద కొన్ని వివరాలు కనిపించాయి. మన దేశంలో ఇప్పుడు నరేంద్రమోడీ- అదానీ పాత్రలతో( గతంలో అమ్మా-నాన్న ఆట మాదిరి) కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నట్లుగా ఉక్రెయిన్‌ సంక్షోభం మీద ఆడుకుంటున్న కుర్రకారులో ఒకడు తనది పై చేయి అని చూపుకొనేందుకు ఎలుగుబంటితో పంది పోరు అంటూ ఒక వీడియోను వర్ణిస్తూ కొన్ని పత్రాలను పెట్టటంతో కొంత మంది భలే సమాచారం అంటూ స్పందించారు. దాంతో ఆ లీకు వీరుడు మరిన్ని జతచేశాడు. ఆ గేమ్‌లో పాల్గొన్నవారు ఉక్రెయిన్‌ పోరు పేరుతో అప్పటికే నాటో కూటమి విడుదల చేసిన అనేక కల్పిత వీడియోలను కూడా పోటా పోటీగా తమ వాదనలకు మద్దతుగా చూపారు. అనేక మంది ఆ రహస్యపత్రాలు కూడా అలాంటి వాటిలో భాగమే అనుకొని తరువాత వదలివేశారు.ఐదు నెలల తరువాత మరొక ఆటగాడు తన వాదనలకు మద్దతు పొందేందుకు మరికొన్ని పత్రాలను జత చేశాడు. తరువాత అవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని రష్యన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ ఎడిట్‌ చేసి పెట్టింది. దాన్ని బట్టి వాటిని రష్యన్లు సంపాదించి పెట్టారని భావించారు. అంతకు ముందు వాటిని చూసిన వారు ఉక్రెయిన్‌ పోరు గురించి ప్రచారం చేస్తున్న అనేక అవాస్తవాల్లో భాగం అనుకున్నారు తప్ప తీవ్రమైనవిగా పరిగణించలేదు. చీమ చిటుక్కుమన్నా పసిగడతామని చెప్పుకొనే అమెరికా నిఘా సంస్థలు వాటిని పసిగట్టలేకపోయినట్లా లేక, జనం ఎవరూ నమ్మరులే అని తెలిసి కూడా ఉపేక్షించారా, ఒక వేళ గేమర్స్‌ మీద చర్యలు తీసుకుంటే లేనిపోని రచ్చవుతుందని మూసిపెడతామని చూశారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. ఆలోచించేకొద్దీ గందరగోళంగా ఉంది.


వెల్లడైన వందకు పైగా పత్రాల్లోని అనేక అంశాలను ఖరారు చేసేందుకు ఇటీవలనే అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిలే, ఇతర ఉన్నతాధికారులకు వాటిని సమర్పించారు. ఇంత త్వరగా అవి బహిర్గతం కావటం అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. టాప్‌ సీక్రెట్లుగా పరిగణించే పత్రాలకు అంగీకారం, వాటిని పరిశీలించేందుకు అనుమతించే వారి సంఖ్య గురించి చెబుతూ 2019లో పన్నెండు లక్షల మందికి అవకాశం ఉన్నట్లు అమెరికా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఇటీవలనే వెల్లడించింది. అందువలన వారిలో ఎవరైనా వాటిని వెల్లడించాలనుకుంటే ఆ పని చేయవచ్చు. అమెరికా ప్రభుత్వ విధానాలు నచ్చని ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఒక కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్నపుడు తనకు అందుబాటులోకి వచ్చిన అనేక అంశాలను బహిర్గతపరిచాడు. టెలికమ్యూనికేషన్‌ కంపెనీలతో చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతా సంస్థ , ఐదు కళ్ల పేరుతో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ గూఢచార సంస్థలతో కలసి జరుపుతున్న నిఘా బండారాన్ని వెల్లడించాడు. అమెరికా అధికారపక్షం డెమోక్రాట్లు, ప్రతిపక్షం(పార్లమెంటు దిగువసభలో మెజారిటీ పార్టీ) రిపబ్లికన్ల మధ్య ఉన్న విబేధాలు కూడా ఈ లీకుల వెనుక ఉండవచ్చన్నది మరొక కథనం. నాటోలోని పశ్చిమ దేశాలు కొన్ని అమెరికా వైఖరితో పూర్తిగా ఏకీభవించటం లేదు. అందువలన అవి కూడా దీని వెనుక ఉండే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ పోరులో పుతిన్‌ సేనలను ఓడించటం అంత తేలిక కాదని భావిస్తున్న అమెరికా కొంత మంది విధాన నిర్ణేతలు వివాదానికి ముగింపు పలికేందుకు ఈ లీక్‌ దోహదం చేస్తుందని భావించి ఆ పని చేసి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. రష్యా గనుక వీటిని సంపాదించి ఉంటే దానిలో ఉన్న అంశాలను తనకు అనుకూలంగా మలచుకొనేందుకు చూస్తుంది తప్ప బహిరంగపరచదు అన్నది ఒక అభిప్రాయం. కష్టపడి సంపాదించిందాన్ని బహిర్గతం చేస్తే శత్రువు ఎత్తుగడలు మారిపోతాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు అమెరికా సుముఖంగా లేదని, అతి పెద్ద ఆటంకం అన్నది ఈ పత్రాల్లో తేటతెల్లమైంది.కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థల కొరత, బకుమట్‌ పట్టణాన్ని పట్టుకోవటంలో పుతిన్‌ సేనల విజయం వంటి అనేక అంశాలు ఆ పత్రాల్లో ఉన్నాయి.ఈ పత్రాల్లోని సమాచారం కట్టుకథలైనా అది ప్రచారంలోకి తేవటం మానసికంగా ఉక్రెయిన్ను దెబ్బతీసేదిగా ఉంది. ఉద్రిక్తతలు పెరిగి మిలిటరీ రంగంలోకి దిగితే డాన్‌బోస్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు అదుపులోకి తీసుకుంటాయని అమెరికాకు ముందుగానే తెలుసునని కూడా వెల్లడైంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షల మంది రష్యన్‌ సేనలు మరణించినట్లు సిఐఏ,అమెరికా, నాటో కూటమి దేశాలన్నీ ఊదరగొట్టాయి.ఈ పత్రాల ప్రకారం పదహారు నుంచి 17,500 మధ్య మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులు మే రెండవ తేదీ వరకే సరిపోతాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి మద్దతు ఇస్తున్న తూర్పు ఐరోపా, ఇతర దేశాల నమ్మకాలను దెబ్బతీసేవే. మిత్రదేశాల కంటే తొత్తు దేశాలుగా పేరు మోసిన ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియాల మీద కూడా అమెరికా దొంగ కన్నేసినట్లు దాని రాయబారులు పంపిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో నెతన్యాహు ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాల్సిందిగా జనాన్ని అక్కడి గూఢచార సంస్థ మొసాద్‌ రెచ్చగొట్టినట్లుగా అమెరికా పత్రాల్లో ఉంది. అదే విధంగా మరొక దేశానికి వ్యతిరేకంగా ఇంకాకరికి ఆయుధాల సరఫరా తమ విధానాలకు వ్యతిరేకం అని చెబుతున్నా ఉక్రెయినుకు మూడులక్షల 30వేల ఫిరంగి మందుగుండు సరఫరా చేయాలని దక్షిణ కొరియాను అమెరికా వత్తిడి చేసింది. ఫలానా తేదీలోగా జరగాలని కూడా ఆదేశించింది. ఇదంతా కేవలం నలభై రోజుల క్రితం జరిగింది. ఇది దక్షిణ కొరియాను ఇరుకున పెడుతుంది. పక్కనే ఉన్న రష్యా ఈ పరిణామాన్ని తేలికగా తీసుకోదని అక్కడి పాలక పార్టీ భావిస్తున్నది.


గతంలో స్నోడెన్‌, మానింగ్‌, వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం ఎక్కువ భాగం పాతదే కానీ అమెరికా దుష్ట పన్నాగాలను లోకానికి వెల్లడించింది. తాజా సమాచారం వర్తమాన అంశాలది కావటం ఆమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పదేండ్ల నాటికి ఇప్పటికీ అమెరికాను ఎదుర్కోవటంలో చైనా, రష్యా సామర్ధ్యం పెరిగింది. తాజా పత్రాలు అమెరికా ఎత్తుగడలను కూడా కొంత మేరకు వెల్లడించినందున వచ్చే రోజుల్లో వాటిని పక్కన పెట్టి కొత్త పథకాలు రూపొందించాలంటే నిపుణులకు సమయం పడుతుంది. మిగిలిన దేశాలకూ వ్యవధి దొరుకుతుంది. బలాబలాలను అంచనా వేసుకొనేందుకు వీలుకలుగుతుంది.ఇదొకటైతే అనేక దేశాలు అమెరికా, పశ్చిమ దేశాలతో సంబంధాల గురించి పునరాలోచించుకొనే పరిస్థితిని కూడా కల్పించింది.తమ గురించి, తమ అంతర్గత వ్యహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకుంటున్నదో అనే అనుమానాలు తలెత్తుతాయి. ఉక్రెయిను, జెలెనెస్కీ ఏమైనా అమెరికాను ఎక్కువగా ఆందోళన పరుస్తున్నదీ ఈ అంశాలే అని చెప్పవచ్చు. ఇంకెన్ని పత్రాలు బహిర్గతం అవుతాయో చూడాల్సి ఉంది.

ఏమి జిమ్మిక్కులురా బాబూ : ఓట్ల కోసం చర్చి ప్రార్ధనల్లో నరేంద్రమోడీ !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


వెంపలి చెట్టుకు(నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఇంతకాలం మైనారిటీలను సంతుష్టీకరిస్తూ ఓటు బాంకుగా మార్చుకున్నట్లు ఇతర పార్టీలను మీద ధ్వజమెత్తిన బిజెపి, ప్రత్యేకించి నరేంద్రమోడీ ఇప్పుడు ఎంతవారలైనా అధికార కాంతదాసులే అని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్రమోడీ ప్రధానిగా ఉంటారని మోడీ అంతరంగం అమిత్‌ షా చెప్పారు. మోడీ వేస్తున్న పిల్లి మొగ్గల గురించి కేరళ సిఎం పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా అని ఒక సభలో అన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీన ఈస్టర్‌ పండగనాడు ప్రధాని నరేంద్రమోడీ తన మద్దతుదారులైన యావత్‌ హిందూత్వశక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అధికారం తరువాతే అన్నీ అన్న సందేశమిస్తూ ఢిల్లీలోని శాక్రెడ్‌ హార్ట్‌ చర్చ్‌ను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.మామూలుగా అయితే ఎవరైనా ప్రార్ధనా స్థలాలకు వెళ్లటాన్ని తప్పు పట్టనవసరం లేదు. అది వారి వ్యక్తిగత అంశం. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” (ఆలోచనల గుత్తి ) అనే పుస్తకంలో దేశ అంతర్గత శత్రువులలో క్రైస్తవులు ఒకరు అని సెలవిచ్చారు. నరేంద్రమోడీ వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులు అవసరమైతే భగవద్గీతను పక్కన పెట్టి గోల్వాల్కర్‌ రచనను ప్రమాణంగా తీసుకొని పాటిస్తారన్నది తెలిసిందే. మరి ఇప్పుడు తమ గురువును పక్కన పెట్టి మోడీ చర్చికి వెళ్లి సామరస్యత గురించి సుభాషితం పలకటాన్ని చూసి దెయ్యాలు వేదాలను వల్లించినట్లుగా భావిస్తున్నారు.


గతంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా చర్చికి వెళ్లి ఉంటే మంచిదే, ఇది అదేనా ? రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా, మరోదారిలో వెళుతుందా ? అని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. బిజెపి నేతలు కేరళలోని బిషప్పుల ఇళ్లను సందర్శిస్తున్నారు. కేరళ వెలుపల క్రైస్తవుల మీద వేటసాగిస్తున్నారు. ఇక్కడ వారు అలాంటి వైఖరి తీసుకోలేరు, సంఘపరివార్‌కు ఇక్కడ మైనారిటీల మీద ఏదైనా ప్రత్యేక ప్రేమ ఉందా ? ఇక్కడ గనుక మతతత్వ వైఖరి తీసుకొని మతఘర్షణలను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటుంది, దీనిలో ఎలాంటి రాజీలేదు అని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ అసలు రంగేమిటో జనం చూస్తున్నారు, క్రైస్తవ సమాజానికి తాము దగ్గర అవుతున్నట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేరళలో పాగా వేసేందుకు తమ పుస్తకంలోని అని జిమ్మిక్కులను ప్రయోగిస్తున్నారు అన్నారు. కేరళ టూరిజం మంత్రి మహమ్మద్‌ రియాజ్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్‌ మిషినరీ గ్రాహమ్‌ స్టెయిన్‌, అతని కుమారులు ఫిలిప్‌,తిమోతీలను సజీవ దహనం చేయటాన్ని సంఘపరివార్‌ ఇప్పటికీ సమర్ధిస్తున్నది అన్నారు.భజరంగ్‌ దళ్‌కు చెందిన దారా సింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. అతను బిజెపిలో కూడా పని చేశాడు.కనీసం 89 మంది పాస్టర్ల మీద దాడులు, 68 చర్చ్‌ల విధ్వంసం, ప్రార్ధనల మీద దాడులు జరిగినట్లు కూడా రియాజ్‌ చెప్పారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ పుస్తకంలో చెప్పిన భావజాలం మేరకే జరిగాయన్నారు. గత రెండు సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులకు సంబంధించి వెయ్యికిపైగా కేసుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరమ్‌(యుసిఎఫ్‌) వెల్లడించింది. నరేంద్రమోడీ చర్చ్‌ సందర్శన తరువాత అలాంటి దాడులు ఆగిపోతాయనే ఆశ క్రైస్తవుల్లో కలిగిందని క్రైస్తవ వార్తా సంస్థ యుసిఏ పేర్కొన్నది.హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ నేత 2014లో ప్రధాని అయిన తరువాత తొలిసారి చర్చిని సందర్శించినట్లు కూడా పేర్కొన్నది. ఇరవై ఐదు నిమిషాల పాటు నరేంద్రమోడీ చర్చిలో గడిపారు.


ఈస్టర్‌ ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఒక కాథలిక్‌ చర్చిని అసాధారణంగా సందర్శించారని క్రిస్టియన్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. మైనారిటీ సామాజిక తరగతుల మీద దాడులకు పేరుమోసిన హిందూ జాతీయవాద పార్టీ నేత క్రైస్తవ ఓటర్లకు దగ్గరయేందుకు చూశారని అన్నది. ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఏసి మైఖేల్‌ మోడీ సందర్శన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. క్రైస్తవుల మీద హింసాత్మక దాడులు 2014లో వంద ఉంటే 2022 నాటికి ఆరువందలకు పెరిగినట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది తొలి వంద రోజుల్లోనే 200 ఉదంతాలు జరిగినట్లు వెల్లడించారు. దేశమంతటా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల వివరాలను సమర్పించాలని 2022 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి సుప్రీం కోర్టు పదే అడిగినా ఇప్పటి వరకు మూడుసార్లు గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారనే సాకుతో దాడులు జరుపుతున్నారని, బలవంతపు మతమార్పిడులకు తగిన ఆధారాలు దొరక్కపోవటమే దీనికి కారణమని అన్నారు. క్రైస్తవుల మీద దాడులు, వేధింపుల్లో భారత్‌ ప్రపంచంలోని అరవై దేశాల్లో పదవ స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఓపెన్‌ డోర్స్‌ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది.హిందూ ఉగ్రవాదులు దేశంలో క్రైస్తవులు, ఇతర మైనారిటీలను లేకుండా చేసి దేశాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారని కూడా చెప్పింది.
సంఘపరివార్‌కు చెందిన వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు, ప్రకటనలు చేయటంలో పేరుమోశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ రామేశ్వర శర్మ ఛాదర్‌ ముక్త్‌ – ఫాదర్‌ ముక్త్‌ (ముస్లిం, క్రైస్తవ పూజారులు) భారత్‌ కావాలని బహిరంగంగా చెప్పారు. దేశంలో చత్తీస్‌ఘర్‌ క్రైస్తవ విద్వేష ప్రయోగశాలగా మారింది. హిందువులు గొడ్డళ్లు ధరించి మతమార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవులకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్రానికి చెందిన పరమాత్మానంద మహరాజ్‌ పిలుపునిచ్చారు. ఆ సభలో బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని అదుపు చేయకుండా తాము మారినట్లు మైనారిటీలను నమ్మించేందుకు, సంతుష్టీకరించేందుకు బిజెపి నానా పాట్లు పడుతున్నది. కేరళ, క్రైస్తవులు ఉన్న ఇతర ప్రాంతాల్లో బీఫ్‌కు అనుకూలంగా మాట్లాడటమే కాదు, నాణ్యమైన మాంసాన్ని అందిస్తామని కూడా వాగ్దానం చేసిన పెద్దలు ఉన్నారు. కేరళలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సిఎం ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోనిని బిజెపి ఆకర్షించింది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఏకె ఆంటోనీ ప్రభావమే పెద్దగా లేదు, అలాంటిది కొడుకు బిజెపిలో చేరి ఆ పార్టీని ఉద్దరిస్తారన్నది ఆ పార్టీ పేరాశతప్ప మరొకటి కాదు. తనకు 82 సంవత్సరాలని జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆంటోని చెప్పారు. తన కుమారుడు బిజెపిలో చేరటం బాధాకరమన్నారు.రబ్బరు మద్దతు ధరలను పెంచితే కేరళ క్రైస్తవులు మొత్తం బిజెపికి మద్దతుదార్లుగా మారతారని ఒక మతాధికారి గతంలో ప్రకటించారు. కానీ కేంద్రం వైపు నుంచి అలాంటి సూచనలేమీ లేవు.


నరేంద్రమోడీ చర్చి సందర్శన ఆటతీరునే మార్చివేస్తుందని కేరళ బిజెపి నేతలు సంబరపడిపోతున్నారు. తిరువనంతపురంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో జరిపిన సమీక్షలో ఒకప్పుడు కేరళ కాంగ్రెస్‌ పక్షాలు పొందిన ప్రజామద్దతు ఇంకే మాత్రం వాటికి ఉండదని భావించినట్లు వార్తలు. పినరయి విజయన్‌ ముస్లిం సామాజిక తరగతుల్లోకి చొచ్చుకుపోయినట్లుగా తాము క్రైస్తవుల్లో చోటు సంపాదించినట్లు ఇంటింటికి తిరిగినపుడు వెల్లడైందని, చర్చి పెద్దలు కూడా సానుకూల సంకేతాలను పంపినట్లు వారు భావిస్తున్నట్లు ఒక పత్రిక రాసింది. తిరువనంతపురం, త్రిసూర్‌ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా ఉన్నారని ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్నట్లు , క్రైస్తవులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు, వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. చర్చ్‌ల మీద దాడులు జరుపుతున్నది కొందరు వ్యక్తులని, వారికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపితో సంబంధం లేదని అనేక మంది గుర్తిస్తున్నారని, ఉగ్రవాద హిందూత్వ గ్రూపులకు చెందిన వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి నేతలు చెప్పుకున్నారు.తమను కేవలం మైనారిటీ మోర్చాల్లో కాకుండా బిజెపి, ఇతర ప్రధాన సంస్థల్లో భాగస్వాములుగా చేయాలని క్రైస్తవులు కోరినట్లు, తిరువనంతపురంలో ఒక లక్ష ఈస్టర్‌ శుభాకాంక్షల కార్డులను ముద్రించగా డిమాండ్‌ పెరగటంతో మరో 50వేలు అదనంగా ముద్రించాల్సి వచ్చిందని బిజెపి నేతలు సమావేశంలో చెప్పుకున్నారు.


క్రైస్తవులతో పాటు పసమండా ముస్లింలను కూడా ఆకర్షించేందుకు బిజెపి పూనుకుంది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా ముస్లింలను నిలపని బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు ప్రముఖులను శాసనమండలికి నామినేట్‌ చేసింది. హిందూత్వ పేరుతో జనాన్ని సమీకరించాలని చూసిన బిజెపి కొంత మేరకు సఫలీకృతమై కేంద్రంలో అధికారానికి వచ్చింది.ఇదే సమయంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా మొత్తం హిందువులందరూ బిజెపి వెనుక సమీకృతులు కారని తేలిపోయింది. మరోవైపు తొమ్మిదేండ్ల బిజెపి పాలన వైఫల్యాలమయంగా మారింది. ఈ నేపధ్యంలో అధికారాన్ని నిలుపుకొనేందుకు మైనారిటీల సంతుష్టీకరణ తప్ప మరొక మార్గం లేదని భావించి లేదా ప్రపంచంలో హిందూమతోన్మాదశక్తిగా కనిపించకుండా మేకతోలు కప్పుకొనేందుకు గానీ బిజెపి కొత్త ఎత్తులు వేస్తోంది, కొత్త రాగాలు పలుకుతోంది.

కర్ణాటక ఎన్నికలు 2023 : కుమ్ములాటల్లో బిజెపి-కాంగ్రెస్‌లో ఉత్సాహం !

Tags

, , , , , , ,



ఎం కోటేశ్వరరావు


అధికార బిజెపి-ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది.ఇప్పటి వరకు వెలువడిన వార్తలను చూస్తే కాంగ్రెస్‌ శిబిరంలో ఉత్సాహం, బిజెపి దొడ్లో కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఆదివారం నాడు తమ జాబితాను ప్రకటిస్తామని సిఎం బసవరాజు బొమ్మై చెప్పారు. బిజెపి నేతలంతా ఢిల్లీలో జాబితా గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. సోమవారం లేదా మంగళం వారం గానీ జాబితా వెలువడవచ్చని బొమ్మై చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కొన్ని చోట్ల నామినేషన్లు ప్రారంభమైన తరువాత జాబితాలను ప్రకటించిన ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే 142 మందితో జాబితాను ప్రకటించింది. బిజెపి జాబితాను బట్టి మిగతా సీట్లకు ప్రకటిస్తారని వార్తలు. బిజెపి అసంతృప్త నేతల కోసం కూడా ఎదురు చూస్తుండవచ్చు. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటున్న బిజెపి ఇంతవరకు జాబితాను తేల్చుకోలేకపోవటం బలహీనత, కుమ్ముటాటలకు చిహ్నం.


మొత్తం 224 స్థానాలున్న అసెంబ్లీకి మే పదవ తేదీన ఎన్నికలు, పదమూడవ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈ నెల పదమూడున నోటిఫికేషన్‌, 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ,21న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీని గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం సభలో బిజెపికి 117, కాంగ్రెస్‌కు 75, జెడిఎస్‌కు 27 స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24వ తేదీ వరకు ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.14శాతం ఓట్లు 80 సీట్లు, బిజెపికి 36.85 శాతం ఓట్లు 104 సీట్లు, జెడిఎస్‌కు 18.35 శాతం ఓట్లు 37 సీట్లు వచ్చాయి.జెడిఎస్‌ నేత కుమార స్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏడాది గడచిన తరువాత 2019 జూలైలో కాంగ్రెస్‌,జెడిఎస్‌ల నుంచి కొంత మందిని ఆకర్షించి వారితో రాజీనామాలు ఇప్పించిన బిజెపి సభలో తమకే మెజారిటీ ఉందంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోసి బిఎస్‌ ఎడియూరప్పను సిఎంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికల్లో గెలిచిన సీట్లతో పూర్తి మెజారిటీ సాధించింది. తరువాత బిజెపిలో కుమ్ములాటల కారణంగా 2021 జూలై 26న ఎడియూరప్పతో రాజీనామా చేయించి కొత్త సిఎంగా బసవరాజ్‌ బొమ్మైని గద్దె నెక్కించారు.


ఎన్నికల ప్రకటన వెలువడిన రోజునే బిజెపి ఓడిపోనుందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కర్ణాటకలో1985 తరువాత ఇప్పటి వరకు ఒకసారి నెగ్గిన పార్టీ మరొకసారి వెంటనే అధికారానికి రాలేదు. ఈ సారి ఆచరిత్రను తిరగరాసి తమ పట్టును శాశ్వతం చేసుకోవాలని బిజెపి చూస్తున్నది. తిరిగి అధికారానికి రావటం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు దేశమంతటా ఊపు తేవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది.దక్షిణాదిన హిందూత్వ ప్రయోగశాలగా పరిగణిస్తున్న కర్ణాటకలో మత ప్రాతిపాదికన ఓటర్లను చీల్చి లబ్ది పొందాలని బిజెపి, సంఘపరివారం అనేక వివాదాలను ముందుకు తెచ్చి చిచ్చుపెట్టింది. చిత్రం ఏమిటంటే అధికారం వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండి అసంతృప్తి తలెత్తటం సహజం కానీ ఓడిపోతుందని భావిస్తున్న బిజెపిలో కుమ్ములాటలు అంతకంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు బిజెపి అభ్యర్ధులను ప్రకటించలేదు. కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎంతో ముందుగానే ఎక్కువ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాయి. అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయకముందే దాదాపు నలభై సీట్లలో బిజెపి తిరుగుబాటును ఎదుర్కోనుందని డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీన రాసింది. అభ్యర్ధుల ఎంపికలో తీవ్ర వత్తిడి ఉన్న మాట నిజమేనని, తాము గెలిచే సీట్లలో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆశావహులు ఉన్నారని, ఆ సంఖ్యను రెండు నుంచి మూడుకు తగ్గించి ఒక జాబితాను రూపొందించామని,గెలిచే అవకాశాలు, అధిష్టానం సలహాను బట్టి జాబితాను ఖరారు చేస్తామని ఎడియూరప్ప చెప్పారు. తమను ఎంపిక చేయకుంటే తిరుగుబాటు చేస్తామని అనేక మంది బాహాటంగానే చెబుతున్నారు. సిద్దాంతాలు తప్ప తమకు అధికారం ముఖ్యం కాదని, ఇతర పార్టీలతో పోలిస్తే తమది ఎంతో భిన్నమైనది, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకొనే బిజెపిలో ఇలాంటి ధోరణులు వెల్లడికావటం ఇదే ప్రధమం కాదు. కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాలలో అధికారం కోసం ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుతెన్నులను చూస్తున్న తరువాత తమకు దక్కని అధికారం ఇతరులకూ దక్కనివ్వం అనే ధోరణి పెరిగి బిజెపి మరో కాంగ్రెస్‌గా మారటం కర్ణాటకలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం ఎలా ఉండేది చూడాల్సి ఉంది.


2019 ఫిరాయింపుల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి రమేష్‌ జర్కిహౌలీ తాను కోరిన మూడు సీట్లను తన అనుచరులకు ఇవ్వకుంటే తాను పోటీలో ఉండనని బెదిరించారు. వారసత్వ రాజకీయాలంటూ ఇతర పార్టీల మీద ధ్వజమెత్తిన బిజెపి ఇప్పుడు కర్ణాటకలో అదే సమస్యతో సతమతం అవుతోంది. రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించిన ఉదంతం కాంగ్రెస్‌కు ఒక ప్రచార అస్త్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఓబిసిలను అవమానించిందంటూ ప్రచారం చేస్తున్న బిజెపి కూడా దాన్నే ఇక్కడా కొనసాగించవచ్చు. కన్నడిగుల ఓట్ల కోసం మతాన్ని జోడించి ఎంతో ముందుగానే సమీకరణకు పూనుకుంది. ముఠా కుమ్ములాటలకు తోడు నలభైశాతం కమిషన్‌ ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది. అవినీతి పట్ల కఠినంగా ఉండటంలో విఫలమైనట్లు, బలహీనమైన సింఎంగా బసవరాజ్‌ బొమ్మైని పరిగణిస్తున్నారు.గతంలో సామాజిక సమీకరణలను రెచ్చగొట్టి లబ్దిపొందిన బిజెపికి ఇప్పుడు అవే గుదిబండలుగా మారుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఎడియూరప్ప-బిఎల్‌ సంతోష్‌ వర్గాలుగా బిజెపి ఉంది.


ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడిగా ఉన్న బిఎల్‌ సంతోష్‌ వర్గనేతలు విద్వేష ప్రచారానికి పెట్టింది పేరని అనేక ఉదంతాల్లో వెల్లడైంది. రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్‌ కటీల్‌, రాష్ట్ర మంత్రి సిటి.రవి, కేంద్ర మంత్రి అనంత కుమార్‌ హెగ్డే వంటి వారు హిందూత్వ రాజకీయాలకు కేంద్రంగా ఉండగా ఎడియూరప్ప వర్గం కులసమీకరణల మీద కేంద్రీకరిస్తుంది. బొమ్మై ఈ రెండు గ్రూపుల్లో ఎడియూరప్ప వర్గానికి చెందినట్లు చెబుతారు.హిజబ్‌, టిప్పు సుల్తాన్‌ వివాదాన్ని ముందుకు తెచ్చిన హిందూత్వశక్తుల అజెండాను అమలు జరిపి వారిని సంతుష్టీకరించినట్లు విమర్శలున్నాయి. ముస్లిం వ్యతిరేకతలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న నాలుగుశాతం రిజర్వేషన్లను రద్దు చేశారు. వక్కళిగ-లింగాయత్‌ కులాలకు రిజర్వేషన్లను సమం చేసి వారిని సంతుష్టీకరించేందుకు చూశారు. బిజెపి కుమ్ములాటలతో ఉండగా అధికారం కళ్ల ముందు కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌లోని ప్రధాన వర్గాలు తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నట్లు వార్తలు. వక్కళిగ సామాజిక తరగతి మద్దతు ప్రధానంగా ఉన్న జెడిఎస్‌ కూడా పోటీ చేస్తున్నది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకున్నా తన బలంతో ఒక నిర్ణాయక శక్తిగా ఉంటున్నది. అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ మద్దతుతో ఆ పార్టీ నేత కుమారస్వామి సిఎంగా పని చేశారు. త్రిముఖ పోటీగా కనిపిస్తున్నప్పటికీ మూడు పార్టీలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉండటంతో ఆచరణలో రెండు ప్రధాన పక్షాల సమీకరణే ఎక్కువగా ఉంటున్నది.గత అనుభవాలను చూసిన తరువాత ఈ సారి దానిలో మార్పు వస్తుందా అన్నది ప్రశ్న.


క్రైస్తవుల మీద విద్వేష పూరిత ప్రసంగం చేసి రెచ్చగొట్టినందుకు రాష్ట్ర మంత్రి మునిరత్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చినెల 31న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మురికి వాడల్లో ఉన్న వారిని మతమార్పిడి చేస్తున్న క్రైస్తవులను తన్ని తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం బృంద అధికారి మనోజ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మునిరత్న బెంగలూరులోని రాజరాజేశ్వరి నగర్‌నుంచి ప్రాతినిధ్యవహిస్తున్నారు.కన్నడిగులు-తమిళుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఉన్న హనుమంతరాయప్ప కూడా మునిరత్న మీద కేసుదాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అడుగుపెడితే తన్ని పంపండి, నేను చూసుకుంటాను అన్న మంత్రి వీడియోను కూడా పోలీసులకు అందచేశారు. ఇతగాడు సినిమా నిర్మాత కూడా.” ఉరి గౌడ నంజె గౌడ ”అనే పేరుతో ఒక సినిమా పేరు నమోదు చేశారు. వక్కళిగ సామాజిక తరగతికి చెందిన ఆ పేర్లు గల వారు పద్దెనిమిదవ శతాబ్దిలో మైసూరు రాజు టిప్పు సుల్తాన్ను హత్య చేశారన్నది ఒక కథ. దాన్ని చరిత్రకారులు కొట్టిపారవేశారు. తరువాత అంతటితో నిలిపివేశారు.


మాజీ సిఎం ఎడియూరప్పను గద్దె దించటంలో ప్రత్యర్ధులు పై చేయి సాధించారు. ఇక అతని హవా నడవదు అని కొద్ది వారాల క్రితం బిఎల్‌ సంతోష్‌ వర్గానికి చెందిన సిటి రవి బహిరంగంగానే ప్రకటించారు.తాను ఎనిమిదిసార్లు గెలిచిన షికారిపుర స్థానం నుంచి తన కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తాడని 2022 జూలైలోనే ఎడియూరప్ప ప్రకటించారు. షికారిపురతో సహా ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది నిర్ణయించాల్సింది అధిష్టానం తప్ప ఎవరో ఒకరి వంటింట్లో కాదని సిటి రవి అన్నారు.బిఎల్‌ సంతోష్‌ ఎత్తుగడలో భాగంగానే ఈ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. విజయేంద్ర తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చి నాయకత్వస్థానం కోసం పోటీ పడతారని అనేక మంది బిజెపి నేతలు భావిస్తున్నారు.వారిలో తన కుమారుడిని రంగంలోకి తేవాలని చూస్తున్న అదే సామాజిక తరగతికి చెందిన మంత్రి సోమన్న కూడా చూస్తున్నారు. గతంలో ఇతగాడిని బిజెపికి ఆకర్షించటంలో ఎడియూరప్ప కీలకంగా ఉన్నారు. ఎప్పుడూ ఆ ఒక్క కుటుంబానిదేనా ఆధిపత్యం అన్నది సోమన్న వాదన.


ప్రభుత్వ రంగ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ విక్రయించే ” నందిని ” పాలను దెబ్బతీస్తూ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్‌ను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. నందిని మీద ప్రేమ కంటే నరేంద్రమోడీ, అమిత్‌షా మీద ఉన్న ద్వేషాన్ని ఇది సూచిస్తున్నదని బిజెపి ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ఇదొక అడ్డదారి అని విమర్శకుల వాదన. రాష్ట్రంలో తమిళనాడుకు చెందిన ఆరోగ్య, హెరిటేజ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాడ్ల, తిరుమల పాలు విక్రయిస్తున్నపుడు అమూల్‌ను ఎందుకు వ్యతిరేకించాలని సూర్య ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు చెందినవి. కర్ణాటక ప్రభుత్వ సంస్థను దెబ్బతీస్తూ మరో ప్రభుత్వ కంపెనీకి ఎర్రతీవాచీ పరవటం ఏమిటన్నది ప్రశ్న.దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ దెబ్బతీస్తున్న నరేంద్రమోడీ గుజరాత్‌ సంస్థల జోలికి పోకుండా వాటిని రక్షిస్తున్నారన్న విమర్శ ఇప్పటికే ఉంది. కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ బిజెపి తరఫున ప్రచారానికి దిగనున్నారు. దీని మీద మరోనటుడు ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు. ఒక కళాకారుడిగా అందరి అభిమానం పొందే మీరు ప్రజల వాణిగా ఉంటారనుకున్నాను. కానీ స్వయంగా ఒక పార్టీ రంగు వేసుకున్నారు. మంచిది, ప్రతి పౌరుడు మిమ్మల్ని, మీ పార్టీని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు. ఆదాయపన్ను శాఖ దాడుల బెదిరింపుతోనే సుదీప్‌ బిజెపికి ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. మొత్తం మీద కన్నడ ఎన్నికల్లో సినిమా స్టార్ల ప్రచారం ఒక ఆకర్షణగా మారనుంది. జనం ఏదైనా ఒక పార్టీని ఓడించదలచుకున్నపుడు ఎంత పెద్ద స్టార్లు ప్రచారం చేసినా సదరు పార్టీని రక్షించలేదని గతంలో అనేక చోట్ల రుజువైంది. కర్ణాటక దానికి మినహాయింపుగా ఉంటుందా ?

టెక్నాలజీ పోరులో చైనాతో గొంతు కలిపిన భారత్‌! 

Tags

, , , , , , ,

ఎం. కోటేశ్వరరావు

          చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరు మరింత తీవ్రం అవుతున్నది. చైనాతో సహా ఇతర దేశాలను దెబ్బతీసేందుకు అమెరికా పూనుకోవటంతో ఈ రంగంలో ముందున్న దేశాలు తమవైన జాగ్రత్తలు తీసుకుం టున్నాయి. మన దేశంలో సెమి కండక్టర్లు లేదా చిప్స్‌ తయారీకి మద్దతు ఇస్తామని అమెరికా చెప్పినప్పటికీ దాని చర్యలు అనుమానా స్పదంగా ఉండటంతో మన దేశం కూడా ప్రపంచ వాణిజ్య సంస్థలో అభ్యంతరం తెలిపింది. గతేడాది అక్టోబరులో అమెరికా వాణిజ్యశాఖ చైనాకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ను తయారు చేసే యంత్రాలను ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. అంతటితో ఆగితే అదొక దారి, ఇతర దేశాలు కూడా అలాగే ఉండాలని లేకుంటే తమ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించింది. ఈ ఆంక్షలు తమ న్యాయమైన హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్లు డిసెంబరు నెలలో ప్రపంచవాణిజ్య సంస్థలో చైనా కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం అప్పీళ్ల కమిటీ ఏర్పాటుపై వివిధ దేశాల మధ్య ఏకీభావం కుదరకపోవటంతో అది పని చేయటం లేదు.అందువలన చట్టపరంగా జరిగేదేమీ ఉండదు. కమిటీ పునరుద్దరణ జరిగిన తరువాతనే దాని మీద విచారణ జరుగుతుంది.


చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ విధించిన పన్నులు న్యాయసమ్మతం కాదని 2022 డిసెంబరు తొమ్మిదిన ప్రపంచ వాణిజ్య సంస్థ తీర్పు చెప్పింది. ఈ తీర్పు తరువాతనే చిప్స్‌ నిషేధంపై చైనా ఫిర్యాదు దాఖలు చేసింది. దీని మీద అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిప్స్‌ మీద విధించిన ఆంక్షలు తమ జాతీయ భద్రతకు చెందిన అంశాలని చైనాకు ముందే తెలిపామని, ఇలాంటి అంశాలపై తీర్పు చెప్పేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ సరైన వేదిక కాదని అన్నాడు. ఇంతకు ముందు చిప్స్‌ను, వాటిని తయారు చేసే యంత్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎన్నడూ జాతీయ భద్రత గురించి అమెరికా, మరొక దేశం ఎన్నడూ ప్రస్తావించలేదు. షీ జింపింగ్‌ అధికారానికి వచ్చిన తరువాత పశ్చిమ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని, అలాంటి వాటి మీద ఎక్కువగా పరిశోధనలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది, దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఆంక్షలకు పూనుకున్నాడు. చైనా హువెయి టెలికాం కంపెనీని అడ్డుకోవటంతో అమెరికా అసలు రంగు వెల్లడైంది.చైనాపై సాంకేతిక పోరులో కలసి రావాలని జపాన్‌, నెదర్లాండ్స్‌ను కూడా అమెరికా కోరింది. చివరకు చైనాలో ఉన్న కంపెనీలకు సేవలందించే సిబ్బందిని కూడా అమెరికా కంపెనీలు తగ్గించాయి. ఎవరైనా చైనా కంపెనీల్లో పని చేసేందుకు వెళ్తే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా ఆంక్షలు విధించింది.


ప్రపంచ చిప్‌ మార్కెటో ఆధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. అందుకోసం 280 బిలియన్‌ డాలర్ల పథకాన్ని రచించింది. అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే చిప్స్‌ను అనుమతి లేకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన ప్రస్తుతానికి చైనాను దెబ్బతీసేందుకు ఉద్దేశించినప్పటికీ తన దారికి రాని ఏదేశం మీదనైనా ఆ నిబంధనను రుద్దే అవకాశం ఉంది. గతంలో విదేశీ ఉత్పత్తుల నిబంధనల పేరుతో చైనా కంపెనీ హువెయి టెలికాం ఉత్పత్తులను అమెరికాకు దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించింది. రష్యాకు చిప్స్‌ ఎగుమతి నిలిపివేసింది. ఇది మన దేశ ప్రయోజనాలకు కూడా భంగకరమే అని గుర్తించిన మన ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన అమెరికా వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో అభ్యంతరాన్ని నమోదు చేసింది. అమెరికా కోసం ఉత్పత్తి చేసే సెమికండక్టర్లకు తోడ్పడే ప్రోత్సాహకాల పేరుతో అమెరికా రూపొందించిన ఒక చట్టం ప్రకారం ఇవ్వనున్న రాయితీలు ప్రపంచమంతటా మరింత పోటీని పెంచుతాయని, నష్టాన్ని కలిగిస్తాయని ఈ రంగంలో ఉత్పత్తిదారులు ప్రత్యేకించి వర్దమాన దేశాలలో వారికి సమాన అవకాశాలు కలిగించేందుకు ప్రతి పాదన లేమిటని మన దేశం ప్రశ్నించింది. వివిధ సందర్భాలలో ఇతర దేశాల సబ్సిడీ విధానాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అమెరికా తన వైఖరిని మార్చుకుందా అంటూ మన దేశ వాదనకు మద్దతుగా చైనా కూడా గొంతు కలిపింది. తమ దేశం రూపొందించుకున్న చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థకు లోబడే సబ్సిడీలు ఇస్తున్నట్లు అమెరికా సమర్థించుకుంది.


అనేక దేశాలు అమెరికా పోకడలను గమనించి తాము కూడా రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. తమ దేశంలో చిప్స్‌ ఉత్పత్తిదారులకు పన్నుల రాయితీ ఇవ్వాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. దానికి గాను కొరియా చిప్స్‌ చట్టాన్ని తెచ్చింది. రక్షణాత్మక చర్యల వలన తమ కంపెనీలకు అమెరికా నుంచి నిధులు రావటం కష్టమని మంత్రి ప్రకటించాడు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీ వర్తిస్తుంది. గతంలో తగ్గింపు ఎనిమిది శాతం ఉన్నదానిని ఇప్పుడు 15శాతానికి పెంచారు. వచ్చే ఇరవై సంవత్సరాల్లో 230 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు శాంసంగ్‌ ప్రకటించింది. ఐరోపా కమిషన్‌ కూడా అమెరికా మాదిరే 2022 చిప్స్‌ చట్టాన్ని చేసింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో పదిశాతంగా ఉన్న ఐరోపా వాటాను 2030 నాటికి కనీసం ఇరవై శాతానికి పెంచేందుకు దాన్ని తెచ్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఐరోపాలోనే చిప్స్‌ ఉత్పత్తి చేయటం వాటికి ప్రోత్సాహకాల చుట్టూ దానిలో నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం 2030 నాటికి 17బిలియన్‌ డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించారు.


డిజిటలైజేషన్‌ వంటి ఆధునిక ఉత్పత్తుల నుంచి మిలిటరీ పరికరాల వరకు చిప్స్‌ ప్రాణవాయువు వంటివి. అందువలన చైనాకు దాన్ని నిలిపివేస్తే తమ దారికి వస్తుందని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కూడా భావిస్తున్నాయి. పశ్చిమ దేశాల కంపెనీలకు ఫౌండ్రిగా పని చేసేందుకు ఇంకే మాత్రం చైనా సిద్దంగా లేదని స్వంతంగా రూపొందించేందుకు పూనుకుందని ఐరోపా ఐడిసి పరిశోధనా డైరెక్టర్‌ ఆండ్రూ బస్‌ వంటి వారు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆధునిక చిప్స్‌ తయారీలో తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ 80శాతం వాటాను కలిగి ఉంది. చైనా బలవంతంగా దాన్ని విలీనం చేసుకొనేందుకు పూనుకుంటే చైనాకు దక్కకుండా అక్కడి చిప్స్‌ పరిశ్రమలను ధ్వంసం చేస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ఒక్క చిప్స్‌ రంగాన్నే కాదు విద్యుత్‌ వాహనాలకు సైతం భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చేందుకు పూనుకుంది. చైనాపై అమెరికా జరుపుతున్న సాంకేతిక దాడిలో తాత్కాలికంగానైనా పొగపెట్టే నాలుగు అంశాలున్నాయి. 1.ఆధునిక కృత్రిమమేధ చిప్స్‌ను చైనాకు చేరకుండా అడ్డుకోవటం, 2. అమెరికాలో రూపొందించిన చిప్‌ రూపకల్పన సాఫ్ట్‌వేర్‌ను చైనాకు అందకుండా చూడటం, 3.చిప్స్‌ను తయా రు చేసేయంత్రాలు చైనాకు చేరకుండా చేయటం, 4. చైనా చిప్స్‌ తయారీకి అమెరికాలో రూపొందిన విడి భాగాలు అందకుండా చూడటం. ప్రపంచం లోని ఇతర అమెరికా మిత్ర దేశాల నుంచి కూడా ఇదే విధంగా అడ్డుకోవటం ప్రస్తుతం బైడెన్‌ పనిగా ఉంది. పౌర అవసరా లకు ఉపయోగపడే వాటిని కూడా చైనా మిలిటరీకి వాడుతున్నదనే ప్రచారం మరోవైపు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ చిప్స్‌ మార్కెట్‌ విలువ 2022లో 574 బి.డాలర్లకు చేరింది. ప్రపంచంలో ఇతర రంగాలన్నీ మందగించి నప్పటికీ చిప్స్‌ మార్కెట్‌ పెరగటం వాటి అవసరాన్ని వెల్లడిస్తున్నది. ఈ మొత్తంలో చైనా ఒక్కటే 180 బి.డాలర్ల మేరకు కొనుగోలు చేస్తున్నది, 2021తో పోలిస్తే 6.2శాతం తగ్గినప్పటికి ఇంత వాటా కలిగి ఉంది కనుకనే దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దెబ్బతీయాలని అమెరికా కూటమి చూస్తున్నది. 1990లో ప్రపంచ చిప్స్‌ రంగంలో అమెరికా వాటా 37శాతంగా ఉన్నది 2021 నాటికి 12కు పడిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వాటి ప్రాధాన్యత ఎంతో పెరిగింది కనుకనే తిరిగి పూర్వపు స్థితికి చేరాలని, తద్వారా ప్రపంచ మార్కెట్‌ను శాసించాలని అమెరికా కలలు కంటున్నది. ఇటీవలి కాలంలో చైనా ఈ రంగంలో పురోగమించినప్పటికీ ఆధునిక చిప్స్‌ కోసం ఇతర దేశాల మీద ఆధారపడే స్థితిలోనే ఉంది. కొన్ని ఆధునిక ఉత్పత్తులు జపాన్‌, నెదర్లాండ్స్‌, అమెరికాలోని కొన్ని కంపెనీల చేతుల్లో ఉన్నాయి.

ఆధునిక సాంకేతికరంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఎప్పటికైనా పశ్చిమ దేశాల నుంచి సవాలు ఎదురవుతుందని గమనించిన చైనా 2015లో చిప్స్‌ రూపకల్పన, ఉత్పత్తికి పూనుకుంది. అంతకు ఏడాది ముందే 21బిలియన్లు, 2019లో 35బి.డాలర్లు నిధులు కేటాయించింది, 2020 నాటికి ఈ మొత్తం 150 బి.డాలర్లని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఎక్కువ భాగం పరిశోధనకే వెచ్చించారు. తాజా పరిణామాలతో మరింతగా బడ్జెట్‌ను పెంచేందుకు పూనుకుంది. స్థానిక పరిశ్రమలకు 143 బి.డాలర్ల మేర సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు డిసెంబరులో వార్తలు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం చైనాను అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ఒక్కటిగా ముందుకు పోవాలని నిర్ణయించాయి. ఇరవై మూడు రకాల ఉత్పత్తులను చైనాకు విక్రయించకూడదని జపాన్‌ శుక్రవారం నాడు ప్రకటించింది. మిలిటరీ అవసరాలకు వాడకుండా చూసేందుకే ఈ పని చేసినట్లు చెప్పుకుంది. అమెరికా ప్రారంభించిన ఈ పోరుతో వినియోగదారులకు ఉపయోగం లేకపోగా భారం పడుతుందని తైవాన్‌ కంపెనీ ప్రతినిధి హెచ్చరించాడు. అక్కడ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ గనుక ధరలు పెరుగుతాయన్నాడు. కనీసం 40శాతం ధరలు పెరగవచ్చని కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం ఐఫోన్‌ 14ప్లస్‌ ధర ఉత్పత్తి ఖర్చు 527 డాలర్లు కాగా దానిలో 54శాతం చిప్స్‌కే చెల్లించాల్సి ఉంది.దీనిలో 5జి మోడెం ధర 47 డాలర్లు కాగా, 618 డాలర్ల శాంసంగ్‌ 22 ప్లస్‌లో మోడెం ధర 193, గూగుల్‌ పిక్సెల్‌ 441 డాలర్లలో మోడెం ధర 69 డాలర్లు ఉంది. అమెరికా చిప్స్‌ను వాడితే ఐఫోన్‌ ధర మరో వంద డాలర్లు పెరగవచ్చని అంచనా. పశ్చిమ దేశాలు ప్రారంభించిన ఈ పోరు ఎటుదారి తీస్తోందో అని ప్రపంచం ఎదురు చూస్తోంది!