నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !

Tags

, , ,


ఎం.కోటేశ్వరరావు


ఎవరమైనా ఏదో ఒక నాటికి పోవాల్సిన వాళ్లమే. ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా ! అన్న శ్మశాన వైరాగ్యం గురించి అందరికీ తెలిసిందే. అమూల్‌ పాల కంపెనీ గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వాలు చేయాల్సింది పాలన తప్ప పాలు, నీళ్లు,చింతపండు, ఉల్లిపాయల వంటి వాటిని అమ్మటం కాదు. కనుక గతంలో ఏం జరిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటికి సంబంధించిన సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ విధానం. అఫ్‌ కోర్స్‌ ఇది, కాంగ్రెస్‌ విధానమే, కాకపోతే తాను జన్మించింది దాని కోసమే అన్నట్లుగా దాన్నే మరింత భక్తి శ్రద్దలతో మోడీ అమలు జరుపుతున్నారు. అందువలన అన్నింటినీ తెగనమ్మిన తరువాత అమూల్‌ను కూడా అమ్మకుండా మరోసారి అధికారం అప్పగిస్తే నరేంద్రమోడీ లేదా వారసులు ఊరుకుంటారా ? ఒకసారి అపని జరిగాక విదేశాల నుంచి చౌకగా దొరికే పాలు, పాలపదార్ధాలను మన మీద రుద్దుతారు. పాలతో కొంత రాబడి కోసం ఆవులు, గేదెలను మేపే రైతుల నోట్లో అప్పుడు మట్టే. కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే జనాలకు రోజుకు అరలీటరు పాలు సరఫరా చేస్తామని బిజెపి నమ్మబలికింది. మీ పాల సంగతి తరువాత అంటూ ఆ బిజెపిని పాల రైతులు కావేరీ, కృష్ణ నీళ్లలో ముంచి గుణపాఠం చెప్పారు.


అమూల్‌ పేరు చెబితే లేదా దాని మార్కెటింగ్‌ అవకాశాలు పెంచితే నరేంద్రమోడీ దృష్టిలో పడి ప్రశంసలు పొందవచ్చని బిజెపి నేతలు భావించి అందుకు తెగించినట్లు చెప్పవచ్చు. గతేడాది డిసెంబరులో పాల రైతులు ఎక్కువగా ఉన్న మాండ్య జిల్లా కేంద్రంలో జరిపిన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల వివాదానికి తెరతీశారు.పాల రైతుల సంక్షేమానికి కర్ణాటక నందిని, గుజరాత్‌ అమూల్‌ పాల సంస్థలు కలసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ పాల కంపెనీలన్నీ సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఉంటే అదొక తీరు. కేవలం అమూల్‌ పేరే చెప్పటంతో నందిని పాలు కనుమరుగుకానున్నాయనే అనుమానం కర్ణాటక రైతుల్లో తలెత్తింది. అదేమీ కాదని 40శాతం కమిషన్‌ సిఎం బొమ్మై మొదలు ఎందరు బిజెపి పెద్దలు సంజాయిషీ ఇచ్చుకున్నా రైతులు నమ్మలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. చేయాల్సింది చేశారు. బెళగావి, హసన్‌, తుంకూరు, మైసూరు, మాండ్య జిల్లాలు పాల ఉత్పత్తికి ప్రసిద్ది. ఈ ఐదు జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్‌ 33 గెలుచుకుంది. గతంలో పదకొండు ఉన్నాయి. బిజెపి బలం 21 నుంచి 12కు తగ్గింది. జెడిఎస్‌ కూడా సీట్లను పొగొట్టుకుంది. గతంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉంది. గుజరాత్‌ తరువాత పాలను సహకార సంస్థలకు ఎక్కువగా అమ్మే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఏడుశాతం ఓట్లను అదనంగా పొందింది. రాష్ట్రమంతటా బిజెపి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్‌ సామాజిక తరగతి ఓటర్లలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదం చేసింది.


జనాలకు పాలు సరఫరా చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ఇతరులకు శుద్దులు చెప్పిందని తప్ప నిజానికి దానిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అది ఉచితం కాదు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పాల రైతులకు లబ్ది చేకూర్చేందుకు, మార్కెట్‌ను పెంచేందుకు అని బిజెపి నేతలు టీవీ చర్చల్లో సమర్ధించుకున్నారు. అదే పని గత మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కర్ణాటక బిజెపి గానీ, గుజరాత్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు అమలు జరపటం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలైనపుడే ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం గత దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది కాలంలోనే 15శాతం పాలధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దోహదం చేసింది. దాంతో ధరల తగ్గించే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పాలు, పాల ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను రద్దు చేసింది. ఇది పాల వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించినా అదే విధానాన్ని కొనసాగిస్తే మన పాడి పరిశ్రమ మూతపడుతుంది. డాలర్లు చెల్లించి చమురుతో పాటు పాలు, పెరుగు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోతే పాడి తగ్గుతుంది. ధర పెరిగితే పోషకాహారం కొనుగోలూ తగ్గుతుంది. మాంసం కోసం ఆవులను వధించారని ఆరోపిస్తూ మూక దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని గో వంశ రక్షక, గో రక్షక దళాలను చూశాము. ఈ కాషాయ దళాలు మేతలేక కృశించే, రోగాలతో మరణించే ఆవుల సంరక్షణ గురించి మాట్లాడవు. పాలు ఇవ్వని వాటిని, మేపలేక ఎవరైనా వధశాలలకు అమ్ముకోవటానికి వీల్లేకుండా చేశారు. రోడ్ల మీద వదలివేస్తే కొత్త సమస్యలను ముందుకు తెచ్చాయి. మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆవులకు సోకిన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు లేవు. దాంతో 2022లోనే కనీసం మూడులక్షల ఆవులు మరణించటం లేదా ఈ రోగం కారణంగా వట్టిపోయినట్లు అంచనా. ఈ కారణంగా పాల ఉత్పత్తి తగ్గటంతో పాటు రైతాంగానికి ఆర్థికంగా విపరీత నష్టం వాటిల్లింది. ఆవు రాజకీయాలు చేసే వారికి ఇదేమీ పట్టలేదు.


ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవసరాలు-ఉత్పత్తికి జత కుదరటం లేదు. ఉత్పత్తి పెరుగుదల దిగజారింది. జాతీయపాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సమాచారం మేరకు 2022-23లో మన దేశం 477 కోట్ల డాలర్ల విలువ గల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది వెయ్యి శాతం ఎక్కువ. ప్రపంచంలో పెరిగిన నెయ్యి గిరాకీ కారణంగా మన దేశం గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో 47 కోట్ల డాలర్ల విలువగల ఎగుమతులు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గొప్పలు చెప్పుకొనేందుకు 19.45శాతం ఎక్కువే, కానీ భారీగా పెరిగిన దిగుమతుల మాటేమిటి ? దేశంలో నిల్వల పరిస్థితిని బట్టి పాలపొడి, వెన్న, నెయ్యితో సహా ఇతర పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు దిగుమతి పన్నులను సులభతరం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగవచ్చని కేంద్ర పశుసంవర్థకశాఖ అధికారి రాజేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న చెప్పారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి ఒక్క శాతమే పెరిగింది. గత దశాబ్దికాలంలో వార్షిక సగటు 5.6శాతం ఉంది. ఈ ఏడాది పాల ఉత్పత్తుల డిమాండ్‌ ఏడుశాతం పెరగవచ్చని అంచనా.గోధుమ గడ్డి, ఇతర మేత లభ్యత తగ్గిన కారణంగా వాటి టోకు ధరలు ఏడాది కాలంలో 25శాతం పెరిగింది. మార్కెట్లో ఆవులు తగ్గిన కారణంగా గేదెల ధరలు బాగా పెరిగాయి.


ఇక కన్నడిగుల ఆరోగ్యం కోసం పాల సరఫరా వాగ్దానం చేసినట్లు వాదిస్తున్న బిజెపి నేతలను జనం నిలదీయాల్సి ఉంది. దేశమంతటా తమదే పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి జన ఆరోగ్యం గురించి పట్టించుకున్న తీరును ఒక్కసారి చూద్దాం. అజాగళ స్థనం వంటి నీతిఅయోగ్‌(ఎందుకంటే అది సూచించిన మేరకు కేంద్రం నిధులు ఇవ్వదు, కానీ కాగితాల మీద సిఫార్సులు మాత్రం అందంగా కనిపిస్తుంటాయి) నివేదికలను రూపొందించేందుకు మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ బాంకు, అది కలసి 2021 డిసెంబరులో మన దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచికలను విడుదల చేసింది.2019-20లో మొత్తంగా పందొమ్మిది పెద్ద రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తూ రాంకులు ఇచ్చారు.దానిలో 82.2 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశానికి నమూనాగా చెబుతూ ఆ విధానాన్ని దేశమంతటా అమలు జరుపుతామని మోడీ 2014లో చెప్పిన గుజరాత్‌ 63.59 మార్కులతో ఆరవ స్థానంలో ఉంది. అది రెండింజన్ల పాలనలో కూడా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ 30.57 మార్కులతో 19వ(చివరి) స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 36.72తో దిగువ నుంచి మూడవ స్థానం, చాలాకాలం బిజెపి ఏలుబడిలో ఉన్న బీహార్‌ 31మార్కులతో ఉత్తర ప్రదేశ్‌ కంటే ఎగువున ఉంది. అక్కడ ఎక్కడా జనాలకు బిజెపి పాల వాగ్దానం చేయలేదు. దీని గురించి ఒక చర్చలో బిజెపి ప్రతినిధి చెప్పిన హాస్యాస్పద కారణం ఏమింటే యోగి ఆదిత్యనాధ్‌ శాంతి భద్రతల మీద కేంద్రీకరిస్తున్నందున పాల గురించి పట్టించుకోలేదట. దానికీ దీనికి సంబంధం ఏమిటి, ఇతర పధకాలన్నింటినీ పక్కన పెట్టారా ? పోనీ గుజరాత్‌, ఎంపీ సంగతేమిటి ? రక్తహీనత తల్లీ,పిల్లల మరణాలకు దారి తీస్తోంది. రక్తహీనత ముక్త భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన పధకం తీరుతెన్నుల గురించి 2022 ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం జనాభాను ఆరు తరగతులుగా విభజించి 2019-20 సంవత్సరంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఎవరిలో ఎంతశాతం రక్తహీనత ఉందో పేర్కొన్నారు. 19-49 సంవత్సరాల పురుషుల్లో 25, మహిళల్లో 57, గర్భవతుల్లో 52.2శాతం చొప్పున ఉంది. ఇక 15-19 సంవత్సరాల తరగతి బాలురలో 31.1, బాలికల్లో 59.1 శాతం ఐదేండ్లలోపు పిల్లల్లో 67.1 శాతం ఉంది. ఇవి దేశ సగటు అంకెలు. పిల్లలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో 66.4, మహారాష్ట్రలో 68.9, బీహార్‌లో 69.4 హర్యానాలో 70.4, రాజస్తాన్‌లో 71.5, కాశ్మీరు, మధ్యప్రదేశ్‌లో 72.7, గుజరాత్‌లో79.7,లడఖ్‌లో 92.5 శాతాల చొప్పున రక్తహీనత ఉంది. ఇక్కడంతా బిజెపి ఏలుబడే సాగింది, సాగుతోంది. అక్కడెక్కడా లేని పాల ఊసు కర్ణాటకలో ఎందుకు తెచ్చారంటే అమూల్‌ కోసం నందిని బలిపెడుతున్నారని రైతాంగం భావించటం తప్ప జనం మీద శ్రద్దకాదంటే ఏమంటారు ? దేశ పాడి పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం పట్టించుకుంటుందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు డైరీలకు పెద్ద పీట వేస్తున్నారు. రేపు దిగుమతులకూ అంగీకరిస్తే మన రైతుల గతేంగాను ?


ప్రపంచంలో పాల రైతులు రెండు తరగతులుగా ఉన్నారు. ఒకటి ఎగుమతుల కోసం పాడిని అమ్ముకొని లాభాలు పొందే వారు, రెండవది జీవనోపాధికోసం పాడిని నమ్ముకొని బతికేవారు. రెండవ తరగతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు పాడిని అమ్ముకొనేవి కాగా మన దేశం వంటి కొన్ని దేశాలు రెండవ తరగతిలో ఉన్నాయి. మన పాడి పరిశ్రమలోని రైతులు నిలదొక్కుకొనేందుకు జీవన పోరాటం చేస్తుండగా వారిని పడగొట్టి తమ ఉత్పత్తులను మన దేశంలో గుమ్మరించాలని పైన పేర్కొన్న దేశాలు చూస్తున్నాయి. మనది జీవనోపాధి, వారిది లాభాల వేట.ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాత మన మీద వత్తిడి పెరుగుతోంది. ఎగుమతులు చేస్తున్న దేశాలలో 2022లో న్యూజిలాండ్‌ 1,353 కోట్ల డాలర్ల మేర, అమెరికా 950, ఆస్ట్రేలియా(2021) 220, కెనడా 50, మన దేశం 2022లో 40 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు చేసింది. ఆస్ట్రేలియా తన పాల ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని మన మీద వత్తిడి తెస్తున్నది. భారత్‌లో ఉత్పత్తిగాని ఆహార ఉత్పత్తులను మాత్రమే అక్కడి నుంచి దిగుమతులకు అనుమతిస్తామని చెబుతున్న మన ప్రభుత్వం ఆ వైఖరికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. అమెరికా వత్తిడి కూడా తక్కువగా లేదు. న్యూజిలాండ్‌ ఉత్పత్తిలో 95శాతం ఎగుమతులకే ఉంటోంది. అమెరికా పెద్ద ఎత్తున ఎగుమతిదార్లకు సబ్సిడీ ఇచ్చి తన ఉత్పత్తులకు మార్కెట్‌ కోసం చూస్తున్నది.

పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టు విప్లవం గురించి పాలక వర్గాలను భయపడనివ్వండి. కార్మికవర్గానికి వారి సంకెళ్లు తప్ప పోయేదేమీ లేదు.వారు గెలుచుకొనేందుకు తమదైన ప్రపంచం ఉంది. అన్ని దేశాల కార్మికులూ ఐక్యం కండి అన్న పిలుపు గురించి తెలిసిందే. సరిగ్గా 175 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ముద్రితమైన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాశారు.పైకి ఎవరెన్ని చెప్పినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రణాళిక పాలకవర్గాలను భయపెడుతూనే ఉంది. ఫిబ్రవరి 21 రెడ్‌ బుక్స్‌ డే రోజున ప్రపంచమంతటా కార్మికవర్గం దాన్ని పఠించింది. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంధాన్ని ఇలా చదివి, చర్చించి ఉండరు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణకు ముందు ప్రజాస్వామ్యం, విముక్తి కోసం అనేక పోరాటాలు, విప్లవాలు జరిగాయి. అప్పటివరకు జరిగింది ఒక ఎత్తుకాగా వాటికి ఒక దశ, దిశ నిర్దేశం చేస్తూ నిర్దిష్ట కార్యాచరణకు నాంది పలికింది కమ్యూనిస్టు ప్రణాళిక.అమెరికాలోని సెంటినల్‌ రికార్డ్‌ అనే వెబ్‌ పత్రిక మే ఎనిమిదవ తేదీన కమ్యూనిజం విజయం అనే శీర్షికతో బ్రాడ్లే గిట్జ్‌ అనే విశ్లేషకుడు రాసిన అంశాన్ని ప్రచురించింది. అదేమీ సానుకూల వైఖరితో చేసిన పరిశీలన కాదు. పేరులో ఏమున్నది పెన్నిధి అన్నట్లుగా పదాలను, వాటికి అర్ధాలను ఎటుతిప్పి ఎటు చెప్పినా చివరికి కమూనిస్ట్యులు చెప్పిన దాన్నే చెబుతున్నారుగా అని ఉక్రోషంతో పెట్టిన శీర్షిక అనిపించింది. భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) అని బైడెన్‌ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించినప్పటికీ వెనుక ద్వారం నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రవేశపెట్టినట్లే.సమానత్వం అన్నది న్యాయం నుంచి పుట్టిందే. గత రెండువందల సంవత్సరాలు అంతకు ముందు నుంచి అమెరికాలో చెబుతున్న హక్కుల సమానత్వానికి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, ఇతర కమ్యూనిస్టు సిద్దాంతవేత్తలు చెప్పిన పర్యవసానం లేదా ఫలితాల సమానత్వానికి వైరుధ్యం ఉంది. అని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.


మన దేశంలో దున్నేవాడికే భూమి అన్న నినాదం ఇచ్చారు కమ్యూనిస్టులు. దున్నగలిగేవాడికే భూమి అన్నది తమ వైఖరని భూసమస్య ప్రధాన చర్చగా ఉన్నపుడు బిజెపి నేతలు చేప్పేవారు. సోషలిజం, తరువాత కమ్యూనిజం తమ అంతిమ లక్ష్యమని కమ్యూస్టులు చెప్పే సంగతి తెలిసిందే.జనం ఈ నినాదాల పట్ల ఆకర్షితులవటాన్ని గమనించి తామే సోషలిజాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆవడి ఏఐసిసి సమావేశంలో తీర్మానించింది.బిజెపి కూడా ఆ నినాద ప్రభావాన్ని తప్పించుకోలేక తాము గాంధేయ సోషలిజం తెస్తామని చెప్పింది.అదే మాదిరి భూ పోరాటాలు అవసరం లేకుండా భూ సంస్కరణలను తామే అమలు జరుపుతామని,భూమిని పంచుతామని కాంగ్రెస్‌ బూటకపు సంస్కరణలకు తెరతీసింది. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవి భూ సమస్య గురించి మాట్లాడటం లేదు. సోషలిస్టు నినాదం జనాన్ని ఆకర్షించిన కారణంగానే ఐరోపాలోని పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పధకాలు, సబ్సిడీల వంటి చర్యలతో అక్కడి పాలకవర్గాలు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చూశారు. తరువాత అనేక దేశాల్లో వాటిని అమలు జరపాల్సి వచ్చింది.చివరికి నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం కూడా అలాంటిదే. అసమానతలు పెరిగి జనజీవనం దిగజారుతున్న క్రమంలో మంచి రోజులు తెస్తానంటే తప్ప బిజెపి చెప్పే మత సిద్దాంతాలకు ఓట్లు రాలవని తెలిసే జనాన్ని వంచించేందుకు ఇలాంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. రాజకీయాలకు తోడు జనాన్ని చీల్చేందుకు, మత్తులో ముంచి వర్గ దృక్పధం వైపు చూడకుండా చూసేందుకు మతాన్ని ముందుకు తెస్తున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, సిద్దాంతాల మీద గందరగోళం సృష్టించే, తప్పుదారి పట్టించే ఎత్తుగడలతో నిరంతరం వక్రీకరణ దాడి జరుగుతూనే ఉంది.


కమ్యూనిజం గురించి ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు, విద్వేషాన్ని రెచ్చగొట్టినా జనజీవితాలు దుర్భరం అవుతున్నపుడు ప్రత్యామ్నాయాల గురించి జనం ఆలోచిస్తారు. అమెరికాలో, ఐరోపాలో,ఇతర చోట్ల ఇప్పుడు జరుగుతోంది అదే. గతంలో కమ్యూనిజం వైఫల్యగురించి చర్చకు తెరతీస్తే సోషలిజం అంతరించింది అని చెప్పిన చోట జనం పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. ముందే చెప్పుకున్నట్లు 175 ఏండ్ల నుంచి కమ్యూనిస్టు ప్రణాళిక దోపిడీ వర్గాన్ని భయకంపితం గావిస్తుంటే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యంపై చర్చ కూడా దానికి తోడైంది. దాన్ని పక్కదారి పట్టించేందుకే మేము కూడా మీ గురించి ఆలోచిస్తున్నామని కార్మికవర్గానికి చెప్పేందుకు భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) భావనలను ముందుకు తెస్తున్నారు. అమెరికాలోని అనేక నగరాల్లో తమకు సరైనదారి చూపేది పురోగామి శక్తులే అనే భావం బలపడుతోంది. మూడో పెద్ద నగరమైన చికాగో నగరంలో మితవాదులను పక్కకు పెట్టి పురోగామి వాదులను నగరపాలక సంస్థకు ఎన్నుకోవటం దాన్నే సూచిస్తోంది.


అమెరికాలో న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ తరువాత మూడో పెద్ద నగరమైన చికాగో మేయర్‌గా పురోగామివాది బ్రాండన్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నాలుగవ తేదీన ఎన్నికయ్యాడు. చికాగో టీచర్స్‌ యూనియన్‌, కార్మిక నేతగా పని చేస్తున్నారు.మే పదిహేనవ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడు. యాభై మంది కౌన్సిలర్లలో నగర చరిత్రలో పురోగామి వాదులు ఎక్కువగా ఎన్నికైన సందర్భమిదే. నిబంధనల ప్రకారం నగర పోలీసు కమిషనర్‌ పదవికి నగరంలోని 22 పోలీసు డివిజన్ల నుంచి వివిధ సామాజిక తరగతుల సమూహాల నుంచి ఎన్నికైన 60 మంది కమిటి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి సిఫార్సు చేస్తే వారిలో ఒకరిని మేయర్‌ ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాన్ని కూడా ప్రజాస్వామ్యపద్దతుల్లో పనిచేసేట్లు చూస్తున్నారు. వచ్చే ఏడాది పాఠశాలల కమిటీలను కూడా ఎన్నికల ద్వారా నింపుతారు.ప్రజా ఉద్యమాల ప్రభావం, ప్రజానుకూల రాజకీయాలు, ఎన్నికల పట్ల పౌరుల ఉత్సాహంతో చికాగో నగరం మరింత ప్రజాస్వామిక వాతావరణంలో పురోగమించనుంది. ఇటీవలి కాలంలో అనేక నగరాలలో పురోగామి శక్తులు మేయర్లుగా ఎన్నిక అవుతున్నారు. వారంతా ప్రజా ఉద్యమాలలో పని చేసి ప్రజాదరణ పొందిన వారే.చికాగోలో గతంలో అధికారంలో ఉన్న వారు అనుసరించిన విధానాల ఫలితంగా ధనికులకు మెరుగైన వసతులు, కార్మికులకు దుర్భరపరిస్థితులు, అవినీతి, అక్రమాలు, నేరాలతో జనం విసిగిపోయారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి నిధులను రాబట్టి నగర జీవనాన్ని మెరుగుపరచాలన్న ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఎన్నికల్లో పురోగామి శక్తులు నెగ్గారు. నగరంలోని 50 వార్డులకు గాను జాన్సన్‌ మద్దతుదారులు 29 మంది గెలిచారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఓటర్లలో 80శాతం, తెల్లవారిలో 39,లాటినోలలో 49శాతం మంది వారికి ఓటు వేశారు. ఇటీవలి కాలంలో ఆసియన్‌-అమెరికన్‌ జనాభా కూడా పెరుగుతోంది. ఎన్నికైన వారిలో ఆరుగురు డెమోక్రటిక్‌ సోషలిస్టులు కూడా ఉన్నారు. వారి నేత బెర్నీ శాండర్స్‌ రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.


ఏప్రిల్‌ 23వ తేదీన ఐరోపా దేశమైన ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌ రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు(కెపిఓ) 11.7శాతం ఓట్లు సంపాదించారు.ఐదు సంవత్సరాల క్రితం వారికి వచ్చిన ఓట్లు కేవలం 0.4శాతమే. మితవాదానికి కేంద్రంగా ఉన్న ఇక్కడ ఇన్ని ఓట్లు రావటం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.కెపిఓ ప్లస్‌ పేరుతో స్వతంత్రులను కూడా కలుపుకొని ఒక మ్యూజియంలో గైడ్‌గా పని చేస్తున్న 34 సంవత్సరాల కె మైఖేల్‌ డంకల్‌ అనే కార్మికుడి నేతృత్వంలో పార్టీ పోటీ చేసింది. మొదటి స్థానంలో ఉన్న పార్టీకి 30, రెండో స్థానంలో ఉన్న పార్టీకి 25శాతం చొప్పున వచ్చాయి. డంకల్‌ గతంలో గ్రీన్ప్‌ పార్టీలో పని చేశాడు. వర్గ రాజయాలను అనుసరించటం లేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని 2017లో రాజీనామా చేసి కమ్యూనిస్టులతో కలిశాడు. తరువాత 2019లో స్లాజ్‌బర్గ్‌ నగర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లు అంతకు ముందున్న 1.19 నుంచి 21.5శాతానికి పెరిగాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆస్ట్రియాలో నాలుగో పెద్ద నగరమైన ఈ నగరమేయర్‌గా ఒక కమ్యూనిస్టు ఉండబోతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.దేశమంతటా పార్టీ ఓటింగ్‌ 2019లో ఒకటి నుంచి ఏడు శాతానికి పెరగ్గా 1959 తరువాత 2024 ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇళ్ల సమస్య, అద్దెలు, ఇంథన ధరల పెరుగుదల వంటి రోజువారీ కార్మికుల సమస్యల మీద కేంద్రీకరించి పార్టీ ప్రజల అభిమానం పొందింది. అధికార కూటమి జనం నుంచి దూరమైంది.2021లో జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండో పెద్ద నగరమైన గ్రాజ్‌ మేయర్‌గా కమ్యూనిస్టు ఎన్నికయ్యాడు. గ్రీసులో జరిగిన విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘ ఎన్నికల్లో వామపక్ష భావజాలం కలిగిన వారు 35శాతం ఓట్లు తెచ్చుకున్నారు.వరుసగా రెండవ ఏడాది ఈ ఆదరణ లభించింది. ఈ వీధులు ఎవరివి ? మావే, ఈ భూములు ఎవరికి, స్థానికులం మావే, వేరే వారికి అప్పగించటాన్ని అంగీకరించం అంటూ అమెరికాలోని మినియాపోలీస్‌లో జరిపిన ప్రదర్శనల్లో స్థానికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పతాకాలను చేబూని నినదించారు. పురోగామి శక్తులు ఎన్నికల పోరాటాలతో పాటు ప్రజా ఉద్యమాల్లోనూ ముందుంటున్నారు.లాటిన్‌ అమెరికాలో రాగల ముప్పును గురించి కూడా హెచ్చరిస్తున్నారు.


తమ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని చిలీ కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. దేశ నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన 50 మంది సభ్యుల సభకు మే ఏడవ తేదీన జరిగిన ఎన్నికల్లో మితవాద, తీవ్రవాదుల పార్టీలకు చెందిన వారు 33 మంది ఎన్నికకావటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఉటంకించింది. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలను పొందిన పార్టీకి ఎనిమిదిశాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాల్సి ఉంది. పోలైన ఓట్లలో 21శాతం చెల్లనివిగా ప్రకటించారు. ఇవన్నీ కూడా వామపక్ష శక్తులుగా చెప్పుకొనే వారివేనని, వారంతా వామపక్షాలకు ఓట్లు వేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని కమ్యూనిస్టు పార్టీ చిలీ అధ్యక్షుడు గులిరెమో టెలియర్‌ అన్నారు. నూతన రాజ్యాంగ రచనకు ఎంతో గట్టిపోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. కార్పొరేట్‌ శక్తులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ దేశంలో ఓట్ల రీత్యా మూడవ స్థానంలో పార్టీ నిలిచిందని చెప్పారు.2021 ఎన్నికల్లో గెలిచిన వామపక్ష గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి తాజా పరిణామంతో ఎలాంటి ముప్పు లేనప్పటికీ కీలకమైన రాజ్యాంగ రచనకు ఓటర్లు మితవాద శక్తులవైపు మొగ్గు చూపటం గమనించాల్సిన అంశం. మొత్తం లాటిన్‌ అమెరికా, ప్రపంచంలోని కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు చిలీ పరిణామాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

కర్ణాటకలో మోడీపై పోలీస్‌ స్టేషన్‌లో ”ఉగ్ర ” ఫిర్యాదు : ఆవు మొదలు ఎందెందు చూసినా అందందు దొరుకుతున్న ” దేశభక్త ఉగ్రవాదులు, విద్రోహులు ” !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. దక్షిణ భారతంలో అడ్డదారిలో మూడున్నర సంవత్సరాల క్రితం అధికారం కైవశం చేసుకున్న ఏకౖౖెక రాష్ట్రాన్ని బిజెపి కోల్పోయింది. బిడ్డ పోయినా పురుటి వాసన పోదు అన్న సామెత తెలిసిందే. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు చేసిన వాగ్దానాలు, నేతల ప్రసంగాలు రానున్న రోజుల్లో చర్చనీయాంశాలుగా మారతాయి. వాటిలో ఒకటి ప్రధాని నరేంద్రమోడీ మీద కాంగ్రెస్‌ దాఖలు చేసిన ఒక కేసు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఉగ్రవాదానికి-కాంగ్రెస్‌కు సంబంధాన్ని అంటగడుతూ చేసిన ప్రసంగాల మీద విస్తృత దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్య పుట్టినిల్లు మన దేశమే అని నరేంద్రమోడీ స్వయంగా చెప్పినందున చట్టం ముందు అందరూ సమానులే కనుక తన మీద దాఖలైన కేసుకు సహకరిస్తారా లేదా అన్నది చూద్దాం.ఓట్‌ బాంక్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదాన్ని పోషించింది,ఆశ్రయం కల్పించింది, లొంగింది అని మోడీ ఒక ఎన్నికల సభలో ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో ప్రధాని పదవిని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూశారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించటమే గనుక చర్య తీసుకోవాలంటూ పోలింగ్‌కు ముందే బెంగలూరు నగరంలోని హై గ్రౌండ్స్‌ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న మోడీ పేర్లున్న కొందరి గురించి రాహుల్‌ గాంధీ కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికలపుడు చేసిన వ్యాఖ్యలు,వాటి మీద గుజరాత్‌లోని సూరత్‌లో కేసు, కోర్టు విచారణ, రెండేళ్ల జైలు శిక్ష, దాంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై వెంటనే అనర్హత వేటు, సదరు తీర్పు చెప్పిన జడ్జికి పదోన్నతి, దాన్ని నిలిపివేసిన సుప్రీం కోర్టు ఆదేశం వంటి అంశాలన్నీ తెలిసినవే. ఈ పూర్వరంగంలో తమ ప్రభుత్వమే అధికారానికి వచ్చింది గనుక కాంగ్రెస్‌ తాను దాఖలు చేసిన కేసు పట్ల ఎంత శ్రద్ద చూపుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.


ఉగ్రవాదులు అనే అనుమానంతో మధ్య ప్రదేశ్‌ పోలీసులు హైదరాబాదు, శివారు ప్రాంతాలలో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేసి భోపాల్‌ తరలించారు. అక్కడ దొరికిన పదకొండు మంది నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇక్కడ సోదాలు జరిపి పట్టుకున్నారు.అరెస్టైన వారిలో మజ్లిస్‌ నేత ఒవైసికి చెందిన మెడికాల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒకరు కూడా ఉన్నారు. వారు ఏ దుండగాలకు పాల్పడిందీ ఇంకా వెల్లడికాలేదు. ఇలా పట్టుబడినపుడల్లా మీడియాలో, బిజెపి నేతల నోళ్లలో హైదరాబాద్‌ ఉగ్రవాదుల అడ్డా అని ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు నిందితులు సౌత్‌ గ్రూప్‌కు చెందిన వారు అన్న పదజాలాన్ని చార్జి షీట్లలో పదే పదే ప్రస్తావించటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టి మొత్తం దక్షిణ భారతాన్ని నిందించేవిధంగా ఉన్నట్లు చివాట్లు వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలను లండన్‌లో జరిగిన ఒక సభలో విమర్శించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశాల్లో దేశ పరువు తీశారని ఊరూవాడా టాంటాం వేస్తున్న వారు హైదరాబాద్‌ను ఉగ్రవాదుల అడ్డాగా పేర్కొని అవమానిస్తున్నట్లు కాదా ? ఎక్కడ ఉగ్రవాదులు దొరికితే ఆ రాష్ట్రాన్ని వారి అడ్డాగా వర్ణిస్తే బిజెపి పాలనలో ఉన్న భోపాల్‌ను కూడా ఆ పార్టీ నేతలు అదే విధంగా పేర్కొంటున్నారా ? ముస్లింలందరూ ఉగ్రవాదులు, దేశ ద్రోహాలు కాదు గానీ దొరికినవారందరూ ముస్లింలే అనే ప్రచారం జరుగుతోంది.నిజమేనా ? అదే ప్రాతిపదికన మరి హిందువులు, క్రైస్తవులు, సిక్కుల సంగతేమిటి ?


డిఆర్‌డిఓ శాస్త్రవేత్త ప్రదీప్‌ ఎం కుల్కర్‌ను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ పోలీసు దళం పూనేలో మే నెల మూడవ తేదీన అరెస్టు చేసింది, పదిహేనవ తేదీ వరకు కస్టడీకి పంపారు.యాభై తొమ్మిది సంవత్సరాల ఈ పెద్దమనిషి తన తండ్రి, తాతల నుంచి తాము ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు గర్వంగా చెప్పుకున్న వీడియో కూడా అందరికీ అందుబాటులో ఉంది. కేంద్రంలో, మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్నది రెండింజన్ల పార్టీ అన్నది తెలిసిందే. అందువలన కుట్రతోనో మరోరకంగానో అరెస్టు చేశారని చెప్పేందుకు లేదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోగా బ్రిటీష్‌ వారికి సేవ చేసిన పూర్వరంగం, మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాడు కావటంతో నాడు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అందువలన ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నవారు గానీ అభిమానించే వారు గానీ బహిరంగంగా ఆ అంశాన్ని చెప్పుకొనేందుకు సిగ్గుపడేవారు. గుట్టుగా దాచేవారు. రోజులు మారాయి. చరిత్ర మరుగునపడింది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని వారు, ద్రోహం చేసిన వారిని అసలు సిసలు సమరయోధులుగా పేర్కొంటూ నకిలీ చరిత్రను రాస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కొత్త తరాలు అదే నిజమనుకుంటున్నాయి. కుల్కర్‌ లాంటి వారు పాకిస్తాన్‌కు మన రక్షణ రహస్యాలను ఎప్పటి నుంచి చేరవేస్తున్న జాతీయవాదో తెలియదు. తన ద్రోహాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశపాలనలో చక్రం తిప్పుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం గురించి చెప్పుకుంటే తనవైపు చూడరని కుల్కర్‌ అనుకున్నాడేమో అన్న సందేహం కలుగుతోంది. ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలో పని చేస్తూ ఒక మహిళ వలలో పడి సమాచారాన్ని చేరవేసినట్లు ప్రాధమిక సమాచారం. చార్జిషీటు దాఖలు చేస్తే మొత్తం వెల్లడిఅవుతుంది.


డిఆర్‌డిఓకు చెందిన బాబూరామ్‌ డే అనే మరో ఉద్యోగిని ఫిబ్రవరి 24న ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు.బాలసోర్‌ జిల్లా చండీపూర్‌ క్షిపణి ప్రయోగ కేంద్రంలో పని చేస్తాడు. అన్ని పరీక్షలపుడు అతడు భాగస్వామి. ఆ సమాచారాన్ని, నిషేధిత ప్రాంతాల ఫొటోలను పాకిస్తాన్‌కు చేరేవేసేవాడని, అతను కూడా ఒక మహిళ వలలో చిక్కుకొని ఆమె ద్వారా కథ నడిపించేవాడని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు అందచేస్తున్నారనే సమాచారంతో (2016లో పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి, ఆ సలహా తానే ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి చెప్పుకున్నారు) 2019లో మధ్య ప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో భజరంగ్‌ దళ్‌ నేత బలరామ్‌ సింగ్‌, సునీల్‌ సింగ్‌, శుభమ్‌ మిశ్రా ఉన్నారు. పంపిన సమాచారం ఎప్పటికప్పుడు కనిపించకుండా చేసే ఒక ఆప్‌ ద్వారా వారు ఉగ్రవాదులకు నిధుల సమాచారాన్ని చేరవేసేవారని పోలీసులు వెల్లడించారు. అంతకు రెండు సంవత్సరాల ముందు బిజెపి యువమోర్చా, బిజెపి ఐటి విభాగ నేత ధృవ సక్సేనా మరోపదిమందిని కూడా ఇదే ఆరోపణలతో అరెస్టు చేశారు. వీరంతా ఒక ముఠాగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అరెస్టుల గురించి రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ అనేక మంది బిజెపికి చెందిన వారు సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నారని, నిధులు, రహస్య సమాచారాన్ని చేరవేశారని చెప్పారు. బిజెపి నేతలు పాక్‌ ఐఎస్‌ఐ ఏజంట్లుగా మారారని, వారికి బెయిలు కోసం ప్రయత్నించినందుకు సిఎం శివరాజ్‌ సింగ్‌ సిగ్గుపడాలని, ఎవరు దేశద్రోహులో చెప్పాలని మాజీ సిఎం, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాద సంబంధిత కేసులతో రాజకీయం చేయకూడదని, కోర్టు వారికి బెయిలిచ్చిందని బిజెపి నేత దీపక్‌ విజయవర్గీయ సమర్ధించుకున్నారు. ఈ తర్కం తెలంగాణా బిజెపి నేత బండి సంజయకు అర్ధంగాక లేదా తెలియక తరచూ అదే రాజకీయం చేస్తున్నారా ? బిజెపి చేస్తే సంసారం, ఇతర పార్టీలు చేస్తే మరొకటా ?


కాశ్మీరులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాకు చెందిన వారిని గత సంవత్సరం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకడు బిజెపి ప్రాంతీయనేత అని అతను అమిత్‌షాతో దిగిన ఫొటోలు ఉన్నట్లు, అమరనాధ్‌ యాత్రీకుల మీద దాడి చేసేందుకు కుట్రపన్నినట్లు 2022 జూలై 9న కాంగ్రెస్‌ నేతలు ఒకే రోజు దేశమంతటా 23 చోట్ల విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. నూపుర్‌ శర్మ నోటి దురుసు మాటలకు ప్రభావితుడై మద్దతు తెలిపిన ఉదయపూర్‌ దర్జీ కనయలాల్‌ను హత్య చేసిన వారిలో బిజెపి మద్దతుదారులు ఉన్నట్లు, ఒక తీవ్రవాద బృందానికి ప్రభుత్వ నిధులను అందచేసినందుకు 2017లో అసోం బిజెపి నేత నిరంజన్‌ హజయికి ఎన్‌ఐఏ కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు కూడా కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.శ్రీనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఉగ్రవాది అజార్‌ మసూద్‌ శిష్యుడు మహమ్మద్‌ ఫరూక్‌ ఖాన్ను బిజెపి నిలిపిందని కూడా వెల్లడించారు.


హైదరాబాదులో దొరికిన ఉగ్రవాదులు ఇరుగుపొరుగువారితో ఎలాంటి వివాదాలు లేకుండా అసలు ఉన్నట్లే తెలియకుండా ఉన్నారని, అరెస్టులతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడినట్లు మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ఎవరైనా మెడలో బిళ్ల వేసుకొని లేదా ఇంటికి బోర్డు పెట్టి తమ గుర్తింపును వెల్లడించుకుంటారా ? హైదరాబాదులో అరెస్టు చేసిన ఆరుగురిలో ముగ్గురు మతం మారి ఇస్లాం బోధనలు సాగిస్తున్నట్లు కూడా ఒక పత్రిక రాసింది. అదే వాస్తవమైతే కొందరు హిందువుల పధకం ప్రకారమే మతం మారి ముస్లింల పేరుతో ఉగ్రవాద విద్రోహులుగా పని చేస్తున్నట్లు భావించాలి. ఇదొక కొత్త కోణం. ఒక ఉగ్రవాద ముఠా కుట్రను భగం చేసినట్లు 2018 ఆగస్టులో మహారాష్ట్ర ఏటిఎస్‌ టీమ్‌ ప్రకటించింది.వారిలో ఒకడి అరెస్టు వార్తతో ఇరుగుపొరుగు వారు అవాక్కయ్యారట. ఇరుగుపొరుగువారితో ఎంతో సౌమ్యంగా ఉండేవాడని, సమాజంలో ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉందని కూడా చెప్పారట. వారిలో వైభవ్‌ రౌత్‌ గో వంశ రక్ష సమితి నేతగా చెప్పుకున్నాడు. అతని అనుచరులుగా సుధాన్వ గోంధాల్కర్‌, శరద్‌ కలాస్కర్‌ ఉన్నారు. పోలీసులు వెల్లడించినదాని ప్రకారం వీరు మరికొందరు కలసి ఒక ఉగ్రవాద ముఠాగా ఏర్పడ్డారు. వారిలో రౌత్‌, కలాస్కర్‌ వద్ద 20 నాటుబాంబులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, రెండు జిలిటెన్‌ స్టిక్స్‌, నాలుగు ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 22 ఇతర డిటోనేటర్లు, రెండు సీసాల విషం, బాటరీలు, తదితరాలు దొరికాయి.సుధాన్వ గోంధాల్కర్‌ వద్ద పదకొండు నాటు తుపాకులు, తూటాలు, ఇతర విడిభాగాలు లభించాయి. ఇవన్నీ గోవులను సంరక్షించటానికే అని జనం నమ్మాలి. రౌత్‌ మతవిద్వేషాన్ని రెచ్చగొట్టటంలో దిట్ట. అతని నివాస ప్రాంతం పక్కనే ముస్లింలు ఎక్కువగా ఉండటంతో వారి పండుగులపుడు రౌత్‌ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశిస్తారు.సనాతనతో సహా అనేక హిందూత్వ సంస్థలతో కలసి సభల్లో అతను పాల్గొంటాడు. కలాస్కర్‌ అరెస్టు వార్త వినగానే సోదరుడు, ఇతర బంధువులు నమ్మలేదు. కొల్లాపూర్‌లో ఏదో పని చేస్తున్నాడనే భావనలో వారు ఉన్నారు.వివిధ సందర్భాలలో హిందూత్వ సభలు, ప్రదర్శనల్లో కలుసుకున్న వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారు.మాలెగావ్‌ పేలుడు కేసులో అరెస్టయిన హిందూ తీవ్రవాదుల గురించి తెలిసిందే.


హిందూమతానికి ప్రమాదం వచ్చిందని, హిందూత్వ పేరుతో సాగిస్తున్న విద్వేష ప్రచారంతో అనేక మంది అమాయకులు నమ్మి అలాంటి వారి వలలో చిక్కుకుంటున్నారు. తొలుత బోధలతో బుర్రలను చెడగొట్టి తరువాత నేరాలు చేయించి తమ వలలో బంధిస్తారు.మాఫియా, గూండా ముఠాలు, ఇస్లామిక్‌, ఇతర అన్ని రకాల తీవ్రవాద సంస్థలు చేస్తున్నది కూడా ఇదే. ఇలాంటి శక్తులకు ఒక ప్రాంతం, దేశం, ఖండం అనే తేడాలు ఉండవు. ఎక్కడబడితే అక్కడ విష బీజాలు నాటుతారు. ఇస్లాంకు ముప్పు వచ్చిందని, భారత్‌తో సహా ప్రపంచమంతా ఇస్లామిక్‌ రాజ్యాలను స్థాపించాలని ఆ మత ఉగ్రవాద, ఛాందస సంస్థలు ఎలా రెచ్చగొడతాయో మిగిలిన మతోన్మాదశక్తులూ అంతే. దానికి ఒక ఉదాహరణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య. ఆమెను కాషాయ ఉగ్రవాదులు చంపారన్న కేసు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. పదివేల పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.మతం పేరుతో ఉగ్రవాద సంస్థలు ముస్లిం యువతను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా హిందూ యువతీ,యువకులను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. అలా మారినవారే గౌరీ లంకేష్‌ను హతమార్చారు.వారిలో ఒకడు అమోల్‌ కాలే అనే మెకానికల్‌ ఇంజనీరు. బహుళజాతి గుత్త సంస్థలో ఉద్యోగం మానుకొని హిందూత్వకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాడు.హిందూ మతానికి ముప్పు తలెత్తిందనే విష ప్రభావానికి లోనై ఒక ఉన్మాదిగా మారినట్లు అతని తీరుతెన్నులు స్పష్టం చేశాయి. ఎవరైనా హిందూమతాన్ని కించపరిచినట్లు అని పిస్తే వారి మీద హింసాత్మక దాడులకు పాల్పడాలని తనకు అనిపిస్తుందని విచారణలో పోలీసులకు చెప్పాడు. గౌరితో పాటు హేతువాదులు నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారేల హత్యల్లోనూ ఇతని హస్తం ఉంది. మరోహేతువాది కెఎస్‌ భగవాన్ను కూడా చంపేందుకు కుట్ర చేశాడు.


కెనడా హిందూ మహాసభ అనే సంస్థ డైరెక్టర్‌గా ఉన్న రాన్‌ బెనర్జీ బీట్‌ ఆఫ్‌ ద నార్త్‌ అనే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దీని గురించి 2022 జూన్‌ 25న వార్తలు వచ్చాయి.ముస్లింలు, సిక్కులను ఊచకోత కోయాలని చెప్పాడు. ” హిందూయిజం ఒక మార్గం. నేను తీవ్ర హిందూ జాతీయవాదిని.భారత్‌లో మాదిరి కెనడాలో కూడా నరేంద్రమోడీ పాలన రావాలని కోరుకుంటున్నాను. అతను ముస్లింలు, సిక్కు తీవ్రవాదులను హతమారుస్తాడు.దాన్ని నేను సమర్ధిస్తాను, ఎందుకంటే వారు చావాల్సిందే, మోడీ చేస్తున్నది అద్భుతంగా ఉంది.” అని చెప్పాడు. ఇలా మాట్లాడినందుకు ఒకసారి అరెస్టైనా తీరు మార్చుకోలేదు. అమెరికా, కెనడాల్లో ఉన్న ఇలాంటి వారు హిందూత్వ సంస్థలకు అందచేస్తున్న నిధుల వంటి అనేక అంశాలను చూస్తే ఇస్లామిక్‌ జీహాదీల మాదిరే హిందూ జీహాదీలను కూడా తయారు చేస్తున్నారు. ఏ మత జీహాదీలైనా అమెరికా ఉగ్రవాద పరిశ్రమకు లాభాలు తెచ్చిపెట్టే వారిగా మారుతున్నారు.

కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక ఫలితాలు : హిట్లర్‌, ముస్సోలినీ అంతరించినా నాజీ, ఫాసిజం బతికే ఉంది, మతోన్మాదమూ అంతే !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మూడు ముక్కలాటలకు తెరదించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. మతతత్వ బిజెపి, అధికారమే పరమావధిగా ఉన్న అవకాశవాద జెడిఎస్‌కు గుణపాఠం చెప్పారు. మూడున్నర దశాబ్దాల తరువాత కాంగ్రెస్‌ ఓట్లు, సీట్లను కూడా భారీగా తెచ్చుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తున్న సంఘపరివార్‌ శక్తులను ఎదిరించేందుకు ముందుకు వస్తున్న ఒక ప్రధాన శక్తిగా కాంగ్రెస్‌ విజయాన్ని లౌకిక శక్తులన్నీ హర్షించాయి.అధికారికంగా ఫలితాలను నిర్ధారించక ముందే జరిగేదేమిటో స్పష్టమైనందున మీడియా పెద్దలు సిఎం గద్దెపై కూర్చొనేదెవరు అన్న చర్చకు తెరలేపారు. కాంగ్రెస్‌ గతాన్ని బట్టి అలాంటి విశ్లేషణలు చేసేవారిని తప్పుపట్టనవసరం లేదు. గెలిచిన కాంగ్రెస్‌ సంబరాల్లో ఉంది, నరేంద్రమోడీ ఓడినట్లుగా తాము భావించటం లేదని ఆపద్దర్మ సిఎం బసవరాజు బొమ్మై తనను తాను ఓదార్చుకున్నారు. ఒక ఎదురుదెబ్బ ఈ ఓటమి తమనేమీ కదిలించలేదని కమలనాధులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ గెలుపు కారణాలతో పాటు బిజెపి ఓటమి గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి.జెడిఎస్‌ భవితవ్యం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చనీయమే.విధాన సభలోని మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 135(80), బిజెపి 66(104), జెడిఎస్‌(32) 19, ఇతరులు నాలుగు స్థానాలు తెచ్చుకున్నారు.బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు. ఓట్లను చూస్తే మూడు పార్టీలకు వరుసగా 42.9,36,13.3 శాతం వచ్చాయి. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు 4.9శాతం పెరగ్గా బిజెపికి 0.3, జెడిఎస్‌కు ఐదుశాతం చొప్పున తగ్గాయి. ఇతరుల ఓట్లు 0.4శాతం పెరిగాయి.


కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం చూపవని బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ స్పందించారు. అదే ఊపులో ఇక్కడా విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.గెలుపు పట్ల తమ పార్టీ ధీమాగా ఉందని బిజెపినేత బండి సంజయ చెప్పారు. కాంగ్రెస్‌ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ముస్లింలు మొత్తంగా ఆ పార్టీకి ఓటు వేశారని, అలా వేయకపోతే బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని జెడిఎస్‌ కర్ణాటక నేత ఇబ్రహీం బహిరంగంగానే చెప్పారని కూడా బండి చెప్పారు. తమకు సీట్లు తగ్గినా ఓట్లు తగ్గలేదన్నారు. ఫలితాలపై చర్చల్లో బిజెపి ప్రతినిధులందరూ దాదాపు ఇదే విధంగా మాట్లాడారు. టీవీలను వీక్షించేవారిని, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో చదివేవారిని తప్పుదారి పట్టించేందుకు చూశారు. తరువాత కూడా మొదలు పెట్టారు. కర్ణాటకలోనే కాదు, దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాలను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి 80-20 నినాదాన్ని ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.


హిందూత్వ సంస్థలు, నోటి తుత్తర నేతలు విద్వేష ప్రసంగాలను చేస్తున్న నేపధ్యంలో ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బిజెపి సబ్‌కా సాత్‌ -సబ్‌కా వికాస్‌ అని తీపి కబుర్లు చెబుతుంది. అందరం కలసి ఉంటే అందరి పురోభివృద్ధి అన్నది అర్ధం. ప్రపంచంలో మొత్తం ముస్లింలు వంద మంది ఉన్నారనుకుంటే ఒక్క మనదేశంలోనే 10.9 మంది ఉన్నారు. ఈ మాత్రాన్నే భరించలేని వారు ముస్లిం జనాభా శాతం ఇంకా పెరిగే అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.మన దేశ జనాభాలో తాజా అంచనా ప్రకారం 15.5శాతం ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక తరగతిని అభివృద్ధిలో, ప్రజా ప్రాతినిధ్యంలో విస్మరిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కర్ణాటకలో జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 12.92 శాతం ఉన్నారు.కొన్ని జిల్లాల్లో అంతకంటే ఎక్కువ ఉన్నారు. తాజా ఎన్నికల గురించి హిందూ పత్రిక చేసిన విశ్లేషణలో ముస్లిం సామాజిక తరగతి ఎక్కువగా (మొత్తం జనాభాలో కాదు) ఉన్న ఐదు జిల్లాల్లో బిజెపి ఓట్ల శాతం 2023 ఎన్నికల్లో గతంతో పోలిస్తే 0.3శాతం పెరుగుదలతో 44.5 శాతం కాగా కాంగ్రెస్‌కు 2.1శాతం పెరిగి 42.5శాతంగా ఉంది. జెడిఎస్‌ 3.9శాతం కోల్పోయి 5.5శాతానికి పరిమితమైంది. విద్వేషాన్ని ఎంతగానో ఎక్కించబట్టే బిజెపి తన ఓట్లశాతాన్ని స్వల్పంగానైనా గతం కంటే పెంచుకుంది. దాని ప్రమాదాన్ని నిరోధించాలని భావించబట్టే దాన్ని ఎదుర్కొనే పార్టీ కాంగ్రెసే గనుక అనేక మంది దానివైపు మొగ్గటంతో బిజెపి రాష్రమంతటా చావు దెబ్బతిన్నది.


ఒకవైపు ముస్లిం మత సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు తెరవెనుక సంప్రదింపులు జరుపుతారు.కేరళలో వామపక్షాలకు వ్యతిరేకంగా క్రైస్తవులను నిలిపేందుకు నరేంద్రమోడీ ఏకంగా చర్చ్‌కు వెళ్లారు, బిజెపి నేతలు బిషప్పులు, ఇతర మతాధికార్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులు, రంజాన్‌కు ముస్లింల ఇండ్లకు వెళ్లి కానుకలు ఇవ్వాలని, మళయాళ సంవత్సరాది సందర్భంగా వారిని ఇండ్లకు ఆహ్వానించాలని కేరళ బిజెపి ఏకంగా ఒక కార్యక్రమాన్నే ప్రకటించింది. తెలంగాణాలో హిందూ ఏక్తా యాత్రలు జరుపుతున్నారు. అందరినీ కలుపుకోవాలని చెప్పే బిజెపి తాజా కర్ణాటక ఎన్నికల్లో గతంలో జరిగిన లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కరంటే ఒక్క ముస్లింను కూడా పోటీకి ఎందుకు నిలపలేదు. ఇంతేనా మాజీ ఉప ముఖ్యమంత్రి, కెఎస్‌ ఈశ్వరప్ప గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ 40శాతం కమిషన్‌ ఇవ్వాలని వేధించినట్లు లేఖలు రాసిన బిజెపికి చెందిన కాంట్రాక్టర్‌, హిందూవాహిని సంస్థ నేత సంతోష్‌ పాటిల్‌ 2022 ఏప్రిల్‌ 12న ఒక హౌటల్లో ఉరివేసుకొని మరణించాడు. దాంతో ఈశ్వరప్ప ఉద్యోగం ఊడింది. అతగాడు మేనెల పదవ తేదీన జరిగిన ఎన్నికల్లో ముస్లింలు తమ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయనవసరం లేదని బహిరంగంగా ప్రకటించాడు. అతన్ని ఏ ఒక్క బిజెపి నేత కూడా తప్పని ఖండించలేదు. మీ ఓట్లు వద్దన్న పార్టీకి వేసేందుకు ఏ సామాజిక తరగతికైనా ఆత్మగౌరవం అనుమతిస్తుందా ? తమ పార్టీ విద్వేషాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌ సంతుష్టీకరించిన కారణంగానే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, అందువల్లనే తాము ఓడినట్లు మాట్లాడే బిజెపి నేతలవి నోళ్లా మరొకటా అని జనం అనుకుంటున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ముస్లింలు వేస్తే వారికి లేదా ఇతర పార్టీలకు వేటికీ వేయకుండా దూరంగా ఉండాలి.


కర్ణాటక ఎన్నికల్లో ఓడిన తరువాత కూడా వాట్సాప్‌ యూనివర్సిటీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టటం మానుకోలేదు.తొంభైశాతం మైనారిటీలు ఓటింగ్‌కు వచ్చారని, హిందువుల 60శాతం దాటలేదని ఇలా ఉంటే భవిష్యత్‌ ఉండదంటూ ఒక ప్రచారం మొదలైంది. ఒక వెయ్యి ఓట్లు కాంగ్రెస్‌కు బదులు బిజెపికి పడితే ఆ పార్టీకి 51 సీట్లు వచ్చేవంటూ దానిలో లెక్క చెప్పారు. రెండున్నరశాతం, అంతకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో మూడు పార్టీలు గెలిచిన స్థానాలు 33, గత ఎన్నికల్లో 23 ఉన్నాయి. వాటిలో గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఒకటి పెరిగి 17, బిజెపికి ఎనిమిది పెరిగి 13, జెడిఎస్‌కు ఒకటి పెరిగి మూడు వచ్చాయి. అలాంటపుడు వెయ్యి ఓట్లు పడితే బిజెపికి 51 ఎలా వస్తాయి. చిన్న పిల్లలు, అమాయంగా ఉండే వారిని మోసపుచ్చటం తప్ప మరొకటి కాదు. కాబినెట్‌లోని 22 మందికి గాను 14 మంది మంత్రులు ఓడారు. ఇంకా ఓడిన ప్రముఖుల్లో ఎడియూరప్పను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖ నేత, బిజెపి జాతీయ కార్యదర్శి సిటి రవి ఒకరు. బాబాబుడాంగిరి దర్గా చుట్టూ విద్వేషాన్ని రెచ్చగొట్టిన వారిలో రవి పేరుమోసినట్లు విమర్శలున్నాయి. మాజీ సిఎం సిద్ద రామయ్య ఎన్నికలు వచ్చినపుడు హిందువు, తరువాత హిందువులను ద్వేషిస్తారు. సిద్దరాముల్లా ఖాన్‌ గనుక అధికారానికి వస్తే హిందువుల పని ఖతం అని రెచ్చగొట్టిన ప్రకటనల స్పెషలిస్టు. హాస్యనటుడు బ్రహ్మానందం వెళ్లి మంత్రి సుధాకర్‌కు మద్దతుగా ప్రచారం చేసి అపహాస్యం పాలైనారు. కిచ్చా సుదీప్‌ అనే కన్నడ సూపర్‌ స్టార్‌ బిజెపికి ప్రచారం చేసినా పరువుదక్కలేదు. అలాంటిది బ్రహ్మానందం ఒక లెక్కా. సుధాకర్‌ 2019లో కాంగ్రెస్‌ నుంచి బిజెపికి జంప్‌ చేశారు. కరోనాలో తన జిల్లావారిని తప్ప ఇతరులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.ఓడినవారిలో హిజాబ్‌ మంత్రి నాగేష్‌ వంటి వారున్నారు.


ఇంకా అనేక అంశాల మీద సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇరవై స్థానాల్లో ప్రచారం చేస్తే 15 చోట్ల బిజెపి ఓడినట్లు వార్తలు. జై భజరంగ బలీ అని నినాదమిస్తూ ఓటు వేయాలని పిలుపునిచ్చి ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా దిగజార్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.తనను చూసి ఓటు వేయాలని కూడా కోరినందున బిజెపి కంటే నరేంద్రమోడీ ఓటమిగానే జనం చూస్తున్నారు. 1989లో కాంగ్రెస్‌ నేత వీరేంద్ర పాటిల్‌ ఏలుబడిలో ఆ పార్టీకి 43.76శాతం ఓట్లు, 178 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ సీట్లు ఎక్కువ రావటానికి కాంగ్రెస్‌-జెడిఎస్‌ మధ్య ఓట్ల చీలికే ప్రధాన కారణం. ఈ సారి గణనీయంగా జెడిఎస్‌ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లటంతో బిజెపి బొక్కబోర్లా పడింది. దీన్ని దాచిపెట్టి తమ ఓటమి కంటే జెడిఎస్‌కు ఓట్లు తక్కువ రావటం గురించే బిజెపి నేతలు ఎక్కువగా చెబుతున్నారు. తమ ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉంటే తమకు గతం కంటే ఓట్లు కూడా తగ్గాలి కదా అని బిజెపి వాదిస్తోంది.


దక్షిణాదిన సంఘపరివార్‌ తమ హిందూత్వ ప్రయోగశాలగా కర్ణాటకను ఎంచుకోవటానికి అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం, దాడులు, హిజాబ్‌, హలాల్‌ వివాదం వంటి వన్నీ ప్రయోగాల్లో భాగమే.కులం, మతం, ప్రాంతీయ విద్వేషాల పులుల మీద ఒకసారి జనాన్ని ఎక్కించిన తరువాత వారు వాటి నుంచి అంత తేలికంగా దిగలేరు. విష ప్రభావానికి గురైన కొన్ని తరాలు చివరి వరకు అలాగే కొనసాగుతాయి.ఐరోపాలో ఫాసిజం, నాజీజాలను, యూదుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టిన శక్తులు సృష్టించిన మారణహౌమం, రెండు ప్రపంచ యుద్ధాలను తెచ్చిన సంగతి తెలిసిందే. అవి అంతరించినా అవి ముందుకు తెచ్చిన దుర్మార్గ భావజాలాన్ని నయా నాజీలు, ఫాసిస్టులు అందిపుచ్చుకుంటున్న వర్తమానం మన కళ్ల ముందు ఉంది. అలాంటి శక్తుల స్ఫూర్తితో మన దేశంలో ఉనికిలోకి వచ్చిన కాషాయదళాలు కూడా అలాంటి విష బీజాలనే నాటాయి. గతంలో యూదులను బూచిగా చూపి విద్వేషాన్ని రెచ్చగొడితే ఇప్పుడు ఇస్లాం మతం వారిని ప్రపంచ శత్రువులుగా చూపి అదే చేస్తున్నారు.కసాయిని నమ్మి గొర్రె వెంట వెళ్లిన లోకోక్తి గురించి మన పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. నాజీల నిజస్వరూపం తెలుసుకొనేందుకు జర్మన్లు, ఐరోపా వారికి చాలా కాలం పట్టింది. మన దేశంలో కూడా అలాంటి శక్తులను గుర్తించే క్రమం ప్రారంభమైంది.

పెరుగుతున్న చైనా పలుకుబడి – తగ్గుతున్న అమెరికా పెత్తనం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆఫ్రికాలోని కీలక దేశమైన సూడాన్‌లో పారా మిలిటరీ-మిలిటరీ మధ్య కానసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు ఆరువందల మందికి పైగా మరణించగా ఐదువేల మంది గాయపడినట్లు వార్తలు. గురువారం నాటికి 27రోజులుగా ఘర్షణ సాగుతోంది. అమెరికా మార్గదర్శకత్వంలో సూడాన్‌ మిలిటరీ-పారామిలిటరీ మధ్య రంజాన్‌ మాసంలో కుదిరిన ఒప్పందాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడ శాంతి, భద్రతలు భగం కావటానికి కారకులైన వ్యక్తుల మీద ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించాడు. తరువాత వైరి పక్షాల మధ్య రాజీకుదిర్చేందుకు చైనా రంగంలోకి దిగుతుందా అన్న చర్చ మొదలైంది. మిలిటరీకి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతు ఉండగా పారామిలిటరీకి పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల మద్దతు ఉంది. సంక్లిష్టమైన ఈ వివాదంలో చైనా ఏ పక్షమూ వహించటం లేదన్న ఒక్క సానుకూల అంశం తప్ప సయోధ్య కుదుర్చటం, కుదరటం అన్నది అంత తేలిక కాదు. ఆఫ్రికా సమస్యలను ఆఫ్రికాయే పరిష్కరించుకోవాలి అన్న ఆఫ్రికా యూనియన్‌ వైఖరిని గౌరవిస్తున్న చైనా ఏ దేశ వివాదంలోనూ ఒక పక్షం వైపు మొగ్గలేదు.


ఆఫ్రికాలో పశ్చిమ దేశాల భూ సంబంధ రాజకీయాలకు బలైన దేశాల్లో సూడాన్‌ ఒకటి. బ్రిటీష్‌ వలస పాలన నుంచి 1956లో విముక్తి పొందిన తరువాత అక్కడ శాంతి లేదు. అంతకు ముందు ఈజిప్టు ఆక్రమణలో తరువాత బ్రిటీష్‌ ఏలుబడిలో ఉన్నపుడు దక్షిణ, ఉత్తర సూడాన్‌ ప్రాంతాలుగా ఉంది. బ్రిటీష్‌ వారు వైదొలుగుతూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రెండు ప్రాంతాలను ఒకే దేశంగా చేశారు. అప్పటి నుంచి దక్షిణ సూడాన్‌ పౌరులు ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యం పెరగాలని, తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నిరాకరించటంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. మధ్యలో పది సంవత్సరాలు తప్ప 1956 నుంచి 2005వరకు అది కొనసాగి ఐదు నుంచి పదిలక్షల మంది ప్రాణాలు తీసుకుంది. 2011లో దక్షిణ సూడాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అవిభక్త సూడాన్‌లో, తరువాత పదకొండు మిలిటరీ కుట్రలు, తిరుగుబాట్లు జరిగాయి. అంతర్యుద్ధంలో పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీని మిలిటరీలో ఎప్పుడు విలీనం కావించాలన్న అంశంపై ఒప్పందానికి భిన్న భాష్యాలు చెప్పి అధికారం కోసం జరిగిన కుమ్ములాటల కారణంగా రెండింటి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. జనం నలిగిపోతున్నారు. అణచివేతలో ఇద్దరూ ఇద్దరే.


సూడాన్‌లో వర్తమాన పరిణామాలను చూస్తే ఏడు లక్షల మంది పౌరులు నిర్వాసితులైనట్లు ఐరాస సంస్థ వెల్లడించింది. రాజధాని ఖార్టూమ్‌ పరిసర ప్రాంతాల మీద విమానదాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ ఖాళీగా ఉన్నాయి.మరోవైపు అమెరికా-సౌదీ ప్రతిపాదన మేరకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మిలిటరీ-పారా మిలిటరీ ప్రతినిధుల మధ్య తొలిసారిగా ముఖాముఖీ కాల్పుల విరమణ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సూడాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఆకలి కేకలు ప్రారంభమైనట్లు వార్తలు. బాంకులు, ఏటిఎంలు పని చేయటం లేదు.చమురు కొరత, ధరల పెరుగుదలతో జనం సతమతమౌతున్నారు.రాజధానిలో ఎక్కువ ప్రాంతాలు పారా మిలిటరీ ఆధీనంలో ఉన్నాయి. వారిని దెబ్బతీసేందుకు మిలిటరీ వైమానిక దాడులు జరుపుతున్నది. రాజధానిలో కాల్పుల విరమణకు పారామిలిటరీ(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అంగీకరించకుండా ఒప్పందం కుదిరే అవకాశం లేదని మిలిటరీ అధికారి అల్‌ బుర్హాన్‌ చెప్పాడు.ఆర్‌ఎస్‌ఎఫ్‌ పౌరులను రక్షణగా చేసుకుందని, సేవా కేంద్రాలను ఆక్రమించిందని ఆరోపించారు. విమానాలను కూల్చివేసేందుకు పారా మిలిటరీ క్షిపణులను సంధిస్తున్నట్లు వార్తలు.


చైనా నిజంగా సూడాన్‌లో రాజీ కుదుర్చుతుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. సంక్లిష్టత రీత్యా అంత తేలికగాకపోవచ్చు. సూడాన్‌ పరిణామాలను గమనించినపుడు అక్కడ భద్రతా దళాల మధ్య హింసాకాండ ప్రబలటమే అమెరికా పెత్తనం దిగజారుడుకు ఒక నిదర్శనం అని, అది ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో భాగమే అని కొందరు చెబుతున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా అమెరికా, దాని అనుచరులుగా ఉన్న ఇతర పశ్చిమ దేశాల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏదీ జరగదని బలంగా ఉన్న నమ్మకం సడలుతున్నది. ఈ దేశాల నేతలు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం, అవి పెద్దన్న అమెరికా ప్రమేయం లేకుండా జరగటం పెద్ద చర్చగా మారింది. ఇరాక్‌ మీద దాడి చేసి అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు అక్కడ అమెరికా పలుకుబడి ఎంత అన్నది ప్రశ్నార్ధకం. తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా తాలిబాన్లకు సలాం కొట్టి బతుకుజీవుడా అంటూ ఎక్కడి ఆయుధాలను అక్కడే వదలి కట్టుబట్టలతో అమెరికా మిలిటరీ పారిపోవటం తెలిసిందే.అది శిక్షణ ఇచ్చిన మిలిటరీ కూడా అమెరికాను ఆదుకోలేకపోయింది. దీని అర్ధం అమెరికా కథ ముగిసినట్లు కాదు.


రెండు ప్రపంచ యుద్ధాల్లో మిగతా దేశాలతో పోల్చితే అమెరికా లాభపడింది తప్ప నష్టపోయింది లేదు.తిరుగులేని మిలిటరీ, ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఐరోపా పునరుద్దరణ పేరుతో 13 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి నాటో మిలిటరీ కూటమి పేరుతో ఐరోపాను తన చక్రబంధంలో బిగించుకుంది. ఇతర ఖండాలను కూడా తన కౌగిలిలోకి తెచ్చుకొనేందుకుగాను 80 దేశాలలో 800 మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది.అట్లాంటిక్‌ సముద్రంలో ఆరవ నౌకాదళాన్ని, పసిఫిక్‌ – హిందూ మహా సముద్రంలో సప్తమ నౌకాదళం, పర్షియన్‌ గల్ఫ్‌Ûలో పంచమ నౌకదళాన్ని మోహరించింది. అంటే అన్ని ఖండాల చుట్టూ త్రివిధ దళాలను మోహరించింది. దానికి గాను రకరకాల సాకులు చెబుతున్నది. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్యూనిజం, దానికి ఆలవాలంగా ఉన్న పూర్వపు సోవియట్‌ , వర్తమాన సోషలిస్టు చైనా, ఇతర సోషలిస్టు దేశాల పలుకుబడిని నిరోధించేందుకు అని ప్రపంచాన్ని నమ్మించింది. ఇంతటి శక్తి కలిగి ఉండి కూడా 1960,70 దశకాల్లో వియత్నాం కమ్యూనిస్టు మిలిటరీ, గెరిల్లాల చేతుల్లో చావుదెబ్బతిన్నది. ఆప్ఘనిస్తాన్‌లో తాను పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లో అవమానాలపాలైంది. ఇప్పుడు ఉక్రెయిన్లో అక్కడి మిలిటరీ, కిరాయి మూకలకు ఆయుధాలు అందిస్తూ పరోక్షంగా పోరు సాగిస్తున్నది. అదే చైనాను చూస్తే ఆఫ్రికాలోని జిబౌటీలో అనేక దేశాలతో పాటు తాను కూడా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదిగాక మయన్మార్‌ బంగాళాఖాతంలోని కోకో దీవుల్లో, సంకేతాలను పసిగట్టే ఒక కేంద్రాన్ని, తూర్పు తజికిస్తాన్‌, లావోస్‌, దక్షిణ చైనా సముద్రంలో ఒక ఆరు చిన్న మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేసింది. అమెరికా తన మిలిటరీని చూపి ప్రపంచాన్ని భయపెడుతుంటే చైనా తన దగ్గర ఉన్న మిగులు డాలర్లను ప్రపంచంలో వివిధ దేశాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర పధకాల మీద ఖర్చు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది.


ఆర్థిక, మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో ముందున్న తమ దేశం క్రమంగా తన పలుకుబడిని ఎందుకు కోల్పోతున్నదనే చర్చ అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచంలోనూ రోజు రోజుకూ బలపడుతున్నది.సోవియట్‌ కూలిపోయి, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గగానే చరిత్ర ముగిసింది, పెట్లుబడిదారీ విధాన ప్రవాహానికి ఎదురు లేదు, ప్రచ్చన్న యుద్ధంలో తమదే గెలుపు అని అమెరికా ప్రకటించుకున్న తరువాత గడచిన మూడు దశాబ్దాల్లో చరిత్ర వేరే విధంగా నమోదౌతున్నది.అమెరికా విధాన నిర్ణేతలు, వ్యూహకర్తలు కలలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అమెరికా ఆటకు అనుగుణంగా చైనా నడుచుకుంటుందని భావించి 1970దశకంలో దాన్ని అసలైన చైనాగా గుర్తించారు. తరువాత 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలోకి అనుమతించారు. అప్పుడు చైనా విదేశీమారకద్రవ్య నిల్వలు కేవలం 200 బి.డాలర్లు మాత్రమే, అవి 2023 జనవరి నాటికి 3,379 బి.డాలర్లకు చేరాయి. ఇంత భారీ మొత్తం ఉంది కనుకనే అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు అవకాశం వచ్చింది. వాటి కోసం మొహం వాచి ఉన్న దేశాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. వందల కోట్ల డాలర్లను పెట్టుబడులు, అప్పుగా తీసుకుంటున్నాయి. ఎక్కడా మిలిటరీ కేంద్రాలను పెట్టటం లేదు గనుక దాని మీద అనుమానాలు కూడా లేవు. ఇస్లామిక్‌ దేశాల మధ్య షియా-సున్నీ విబేధాలను అన్ని దేశాలను తన అదుపులో ఉంచుకోవాలని చూసింది. చివరికి దానికి కూడా తెరపడింది. షియా ఇరాన్‌-సున్నీ సౌదీ అరేబియాలను చైనా దగ్గరకు చేర్చింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడేందుకు ఆ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ, దేశాల అంతర్గత వివాదాలకు దూరంగా ఉండటమే చైనా పలుకుబడిని పెంచుతున్నవాటిలో ఒకటి.


నాటోలో భాగంగా అమెరికాతో స్నేహం చేస్తూనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ ఇటీవలి బీజింగ్‌ పర్యటనలో మాట్లాడిన తీరు అమెరికాను బిత్తరపోయేట్లు చేసింది. తన వెనుక ఉన్న వారు ఎప్పుడేం చేస్తారో అన్న అనుమానాలను పెంచింది. తైవాన్‌ అంశంపై అమెరికా బాటలో నడిచేది లేదని, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య కలిగి ఉంటామని మక్రాన్‌ చెప్పాడు. వందల కోట్ల లాభదాయక ఒప్పందాలను ఫ్రెంచి కంపెనీలకు సాధించటంలో మక్రాన్‌ చొరవ చూపాడు. ఒక్క ఫ్రాన్సే కాదు జర్మనీ వైఖరి కూడా అలానే ఉంది.డాలరు పెత్తనానికి తెరదించాలన్న అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతున్నది. నిజానికి అనేక దేశాల మీద ఆంక్షలు విధిస్తూ అమెరికా దాన్ని ముమ్మరం చేస్తున్నది. మొత్తం మీద చూసినపుడు నూతన ప్రపంచ వ్యవస్థ రూపుదిద్దు కుంటున్నది. అది అమెరికా-పశ్చిమ దేశాల కేంద్రంగా జరగటం లేదు. ఏక ధృవ కేంద్రానికి బదులు రెండు లేదా అంతకు మించి ఎక్కువ అధికార కేంద్రాలున్నపుడు దేశాలకు ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.


” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ సూడాన్‌ పరిణామాలపై చెప్పారు.ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి కూటమి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.

మౌనమే నా భాష ఓ దేశ జనమా : నోరు విప్పేందుకు కాశ్మీరులో సైనికులు, మణిపూర్‌లో జనం ప్రాణాలు ఇంకా ఎన్ని పోవాలి విశ్వగురువా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 ఎత్తివేత, జమ్మూ – కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చటంతో ఉగ్రవాదుల వెన్ను విరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని కీలక సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆర్భాటం చేశారు. నిజమే కామోసనుకొని జనం సంతోషించారు. కేంద్ర ప్రత్యక్ష పాలనలో ఉన్న కాశ్మీరులో గత పక్షం రోజుల్లోనే పది మంది సైనికుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా మిలిటరీ గ్రామాలను నిర్మిస్తోందంటూ అమెరికా ఇచ్చిన సమాచారంతో మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. ఇప్పుడు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల గురించి ఎలాంటి సమాచారమూ ఇచ్చినట్లు వార్తలు లేవు. మరో రాష్ట్రం మణిపూర్‌. ఇక్కడ బిజెపి పాలన ఉంది. ఇది రాసిన సమయానికి అక్కడ ఇటీవల జరిగిన హింసాకాండలో 55మంది మరణించినట్లు వార్తలు. వారెలా మరణించిందీ తెలియదు. రాష్ట్రమంతటా ఇంటర్నెట్‌ బంద్‌, కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు ఇచ్చి ఆర్టికల్‌ 355ను ప్రకటించి కేంద్ర బలగాలకు అప్పగించారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనా రాష్ట్రపతి పాలన పెట్టలేదు, స్వంత పార్టీ కదా !


చిత్రం ఏమిటంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఇంత జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. విలేకర్లతో మాట్లాడేందుకు ఎలాగూ ముందుకు రారు, కనీసం ఒక ప్రకటన లేదా బహిరంగ సభల్లో మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయన్నట్లు ఉన్నారు. కల్పిత కట్టుకథలతో కేరళ సమాజాన్ని అవమానపరిచేందుకు తీసిన కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడతారు, ప్రతిపక్షాలు ఉగ్రవాదులతో చేతులు కలిపినట్లు, మద్దతు ఇచ్చినట్లు రాళ్లు వేసేందుకు తీరిక దొరుకుతుంది గానీ కాశ్మీర్‌, మణిపూర్‌ గురించి ప్రస్తావించలేదు. ఢిల్లీలో రెజ్లర్ల మీద పోలీసు జులం గురించి మాట్లాడరు. స్వంత పార్టీ ఎంపీ మీద పోక్సో కేసు పెట్టినా అరెస్టు లేదు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధాని 30 ట్వీట్లు పెట్టారు వాటిలో సగం కాంగ్రెస్‌, జెడిఎస్‌ మీద దాడికి దిగారు. మణిపూర్‌, కాశ్మీరు, రెజ్లర్ల ఉదంతాలపై ట్వీట్ల ద్వారా కూడా స్పందించలేదు. జై భజరంగ బలీ అంటూ మతం పేరుతో ఓట్లడిగేందుకు నోరు వచ్చిందన్న విమర్శలు వచ్చినా సరే పదే పదే ప్రస్తావించారు. అడిగేవారెవరు, నిబంధనలను అమలు జరిపేదెవరు? ప్రపంచ నేతగా,విశ్వగురువుగా భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ కాశ్మీరు, మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలు అల్పమైనవని, వాటి మీద స్పందించటం తన స్థాయికి తగదని మౌన ముద్రదాలుస్తున్నారా ?


మణిపూర్‌ అగ్నిగుండంగా మారేందుకు హైకోర్టు ఇచ్చిన సలహా కారణమైంది.న్యాయమూర్తుల సలహాలు చిచ్చు రేపేవిగా ఉండకూడదు, వాటి పర్యవసానాలను కూడా గమనంలో ఉంచుకోవాలి.రాష్ట్ర జనాభాలో 53శాతంగా ఉన్న మెయితీ సామాజిక తరగతికి చెందిన వారు తమను షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని చాలా కాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. అది వీలవుతుందో కాదో చట్టబద్దమో కాదో స్పష్టంగా చెప్పాల్సిన కోర్టు వారి కోర్కెను పరిశీలించాలని ఏప్రిల్‌ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని గనుక అమలు జరిపితే గిరిజనులుగా ఉన్న కుకీలు, నాగాలు తమ భూములు కోల్పోతామని భయపడ్డారు. అక్కడి బిజెపి ప్రభుత్వం వారి అనుమానాలను తీర్చేందుకు పూనుకోలేదు.ఏప్రిల్‌ 28వ తేదీన సిఎం బిరేన్‌ సింగ్‌ చురుచందపూర్‌ అనే చోట ఒక జిమ్‌ను ప్రారంభించేందుకు రానుండగా ముందు రోజు నిరసనకారులు దాన్ని తగులబెట్టారు.గిరిజన-గిరిజనేతర ప్రాంతాలన్నింటా కనిపిస్తే కాల్చివేత ప్రకటించి ప్రభుత్వం మరింత రెచ్చగొట్టింది.గిరిజన విద్యార్ధి సంఘం మే మూడవ తేదీన చురుచందపూర్‌లో గిరిజన సంఘీభావ ప్రదర్శనకు పిలుపునిచ్చింది.ఆ సందర్భంగా హింసాకాండ చెలరేగింది. గిరిజనేతర ప్రాంతాల్లోని గిరిజనుల మీద, చర్చ్‌ల మీద దాడులు జరిపారు. అప్పటి నుంచి రాష్ట్రం అగ్నిగుండంగా మారింది.


మణిపూర్‌ భూ సంస్కరణల చట్టం ప్రకారం గిరిజనులు నివసించే కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు, భూములు కొనేందుకు వీల్లేదు.గిరిజనేతరులు ఇంఫాల్‌ లోయ ప్రాంతానికే పరిమితం కావాలి. అక్కడ రాష్ట్రంలోని భూమిలో పదిశాతమే ఉంది. గిరిజనులు ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. గిరిజనేతరుల్లో ఎక్కువ మంది హిందువులు, గిరిజనులంతా క్రైస్తవులు. అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను 40 చోట్ల మెయితీలే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. వారి మద్దతు కోసమే రాష్ట్రాన్ని బిజెపి అగ్నిగుండంగా మార్చిందా ? విస్తారమైన భూమిని ఏదో ఒక పద్దతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్‌ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమవలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకుంది. తాజా పరిణామాలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది.


కాశ్మీరులో నిజంగా ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించారా ? అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? బిజెపి చేసుకుంటున్న ప్రచారంలో నిజమెంత ? ఇక్కడ ఉగ్రవాదాన్ని ఐదు దశలుగా విభజించాలి. ఎప్పుడు ఎవరి పాలనలో ఏం జరిగిందో దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌ వివరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి.1988 నుంచి 1997వరకు కాంగ్రెస్‌ పాలన.1998 నుంచి 2003 వరకు ఎన్‌డిఏ వాజ్‌పాయి ఏలుబడి, 2004 నుంచి 2013వరకు తిరిగి కాంగ్రెస్‌ పాలన. 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్రమోడీ అధికారం.2019 ఆగస్టు నుంచి కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఈ కాలంలో మరణించిన పౌరులు, భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులు, చొరబాటుదార్ల సంఖ్యలు. బ్రాకెట్లలో ఉన్నవి వార్షిక సగటుగా గమనించాలి.
ఎవరు×××1988-97××××1998-03×××××2004-13××××× 2014-2023×× కేంద్ర పాలన
పౌరులు××7692(769.2)××5583(797.5)××1503(150.3) ××× 350(38.8)×××× 99(33)
భద్రతా ××1988(198.2)××3367(481)××1158(115.8) ××× 569(56.9)××××× 131(43.6)
ఉగ్రవాదు×11352(1621.7)××5583(797.5)××4221(424.1)××× 1485(148.5)×× 618(206)
పైన పేర్కొన్న అంకెలను చూసినపుడు కాశ్మీరులో ఆర్టికల్‌ 370 రద్దు,కొత్తగా భద్రతా దళాలకు అధికారం ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్న కాలంలో జరిగిన పరిణామాలను చూసినపుడు అంతకు ముందు జరిగిన వాటితో కుడి ఎడమలుగా ఉన్నాయి తప్ప ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలన కాలేదు. వాజ్‌పాయి పాలనతో పోల్చినపుడు అదే కాశ్మీరులో ఆర్టికల్‌ 370 ఉండగా కూడా కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉగ్రవాదం తగ్గినట్లు అంకెలు చెబుతున్నాయి. పలు కారణాలతో ఉదంతాలు తగ్గినపుడు తమ ఘనతగాను లేనపుడు పాక్‌ కుట్రగానూ వర్ణిస్తే కుదురుతుందా ? తగ్గినపుడు పాక్‌ దూరంగా ఉందని చెబుతారా ?


పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో గోవాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సమావేశానికి హాజరైనపుడే ఉగ్రవాదులు మన పారా ఎస్‌ఎఫ్‌(స్పెషల్‌ ఫోర్సెస్‌) దళానికి చెందిన ఐదుగురు కమాండోలను చంపారు. అదే జమ్మూ ప్రాంతంలో ఏప్రిల్‌ 20న ఐదుగురు సైనికులను చంపారు. తాజా ఉదంతాలను చూసినపుడు ఉగ్రవాదులు కాశ్మీరు నుంచి జమ్మూకు తమ కుట్రలను విస్తరింప చేసినట్లు కనిపిస్తోంది. చిన్న బృందాలుగా దాడులు చేసేందుకు శిక్షణ పొందినట్లు కూడా చెబుతున్నారు. అది పాకిస్తాన్‌లో తప్ప మన గడ్డమీద సాధ్యం కాదు. వీటి గురించి మనకు అమెరికా ఎందుకు సమాచారం అందించటం లేదు అన్నది ప్రశ్న. పూంచ్‌లో ఏప్రిల్‌ 20న జరిపిన దాడిలో ఉపయోగించిన ఆయుధాలు, పేలుడు పదార్ధాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా మిలిటరీ వదలి వెళ్లినవని గుర్తించారు. వాటిని అక్కడి తాలిబాన్లు మన దేశంలోని ఉగ్రవాదులకు అందిస్తే తప్ప దొరికేవి కాదు. మరోవైపున ఉగ్రవాదులు స్థానికంగా, విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లో దొరికిన సమాచారం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుకు ఉగ్రవాదులకు నిధులు దొరక్కుండా చేయటం ఒకటని చెప్పారు. మరి ఇప్పుడు దీనికి ఏ సాకు చెబుతారు ? పాత నోట్లు రద్దు చేసి కొత్తగా రెండువేల నోట్లు ముద్రించి మరింత పెద్ద మొత్తాలను సులభంగా అందచేసేందుకు అదే మోడీ సర్కార్‌ వీలు కల్పించింది.

ఓట్లకోసం ఇన్ని పాట్లు, కుట్రలా : హనుమంతుడిని రోడ్డు మీదకు లాగిన మోడీ, కర్ణాటకలో పాలు తాగిస్తాం అన్న బిజెపి !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అగ్గి పుల్లా సబ్బు బిళ్లా, కుక్క పిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏ గడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి.ఈనెల పదవ తేదీన జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది.చట్టాన్ని వ్యక్తులు, నిషేధిత b పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పిఎఫ్‌ఐ), భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలు ఉల్లంఘిస్తే వాటి మీద నిషేధంతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నారు. పదజాలం ఏదైనా నిషేధం విధిస్తామనే భావం దానిలో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రధాని నరేంద్రమోడీ జై భజరంగ బలీ(జై హనుమాన్‌) అని నినాదమిస్తూ ఓటు వేయాలని ఎన్నికల సభల్లో పిలుపు ఇచ్చారు. మమ్మల్ని పిఎఫ్‌ఐ వంటి సంస్థలతో పోలుస్తారా, నిషేధిస్తామని అంటారా అంటూ సంఘపరివార్‌ సంస్థలు, బిజెపి దేశమంతటా వీధులకెక్కింది. కాంగ్రెస్‌ ఆఫీసుల మీదకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరైనా నిరసన ప్రకటనలు లేదా వేరే చోట్ల ఆందోళనలు చేయటం వేరు, ఆఫీసుల మీదకు వెళ్లటం మూకస్వామ్యం, ఫాసిస్టు లక్షణమే. దీన్ని బట్టే వారి స్వభావం, ప్రమాదం ఏమిటో స్పష్టం అవుతున్నది. హనుమంతుడిని వీధుల్లోకి తేవటంతో ఓటర్ల మీద ప్రభావం పడుతుందేమో అన్న భయంతో కాంగ్రెస్‌ నష్ట నివారణకు పూనుకొని నిషేధం తమ ఉద్దేశ్యం కాదని, అలాంటి చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు లేదని ఆ పార్టీ నేతలు వివరణలు ఇచ్చారు. అయినప్పటికీ మత ఉద్రిక్తతలు, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చనే ఎత్తుగడతో ఎన్నికల తేదీ వరకు బిజెపి రచ్చ చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మానిఫెస్టోలో పెట్టకపోయినా వారు చేసేది చేస్తారు. ఉచిత పథకాలను అమలు జరిపితే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయంటూ సుభాషితాలు పలికిన నరేంద్రమోడీ కర్ణాటక బిజెపి ఎన్నికల ప్రణాళిక భేషుగ్గా ఉందని కితాబునిచ్చినట్లు వార్తలు. ఒక సంస్థ మీద ఒక రాష్ట్రం ఎలా నిషేధం విధించలేదో అలాంటిదే ఉమ్మడి పౌరస్మృతి. దాన్ని ఒక రాష్ట్రం అమలు జరిపేది కాదు. అయినప్పటికీ అమలు జరుపుతామని కర్ణాటక బిజెపి తన మానిఫెస్టోలో పెట్టింది. ఇది క్రైస్తవ, ముస్లిం, ఇతర మైనారిటీ మతాల వారిని రెచ్చగొట్టేందుకు, హిందూత్వ శక్తులను సంతుష్టీకరించేందుకు చేసిన కసరత్తు. బిజెపి ఇన్ని పాట్లు పడినా ఎన్నికల్లో గట్టెక్కుతుందా అన్నది శేష ప్రశ్న.


నిజానికి భజరంగదళ్‌, ఇతర హిందూత్వ సంస్థల మీద నిషేధంతో సహా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఈ నాటిది కాదు. విద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తుల మీద ఫిర్యాదు లేకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని ఉన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి నేరాలకు పాల్పడే వారు మెజారిటీ హిందూత్వ కావచ్చు మైనారిటీ మత శక్తులు కావచ్చు. భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించవచ్చు అని చెప్పిన కాంగ్రెస్‌ తనకు తానే హాని చేసుకుందని కొందరు విశ్లేషణల పేరుతో బిజెపి అనుకూల ప్రచారానికి దిగారు. ఈ అంశంతోనే కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బతింటాయా ? కర్ణాటక ఓటర్లు కాషాయ దళాల వలలో పడతారా ? నిషేధ ప్రతిపాదన లేదా డిమాండ్‌ లేకముందే హిజాబ్‌, లవ్‌ జీహాద్‌, ఇతర మతోన్మాద అజెండాతో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, కర్ణాటకలో మెజారిటీ ఓటు బాంకు సృష్టికి బిజెపి ఎప్పటి నుంచో అనేక వివాదాలను ముందుకు తెచ్చింది. ఇప్పటి వరకు ఎక్కించిన మతోన్మాదం, కుల ఓటు బాంకు రాజకీయాలు తక్కువేమీ కాదు.వాటితో మతోన్మాద పులిని ఎక్కి వీరంగం వేస్తున్న వారు ఇప్పటికే ఉన్నారు. ఇన్ని తెచ్చిన తరువాత కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోనుందనే వాతావరణం ఏర్పడిందని గమనించాలి.


కేరళలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ఖాతరు చేయని అపర ప్రజాస్వామికశక్తులుగా కాషాయదళాలు రుజువు చేసుకున్నాయి. ఆ కేసుకు కమ్యూనిస్టులకు ఎలాంటి సంబంధమూ లేదు. కోర్టును తీర్పును అమలు జరుపుతామని అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అంటూ రెచ్చగొట్టారు. మహిళలను ముందు పెట్టి ఆగమాగం చేశారు.దాడులకు పాల్పడ్డారు.2021లో జరిగే ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ను దెబ్బతీసేందుకు చూశారు. చివరకు బొక్కబోర్లా పడి ఉన్న ఒక్క సీటునూ పోగొట్టుకున్నారు.శబరిమలతో సహా ప్రముఖ దేవాలయాలున్న ప్రతిచోటా అంతకు ముందు ఉన్న ఓట్లనూ తెచ్చుకోలేకపోయారు. హనుమంతుడు కర్ణాటకలోని హంపిలో పుట్టినట్లు కాషాయ దళాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


కర్ణాటకలో భజరంగదళ్‌ అంశం ఏమేరకు పని చేస్తుందో చూడాల్సి ఉంది. అక్కడ ఆ సంస్థ చరిత్రను చూసినపుడు అనేక ఉదంతాల్లో అది భాగస్వామిగా ఉంది. 2008లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత కర్ణాటక కోస్తా ప్రాంతంలో చర్చ్‌లు, క్రైస్తవ సంస్థల మీద చేసిన దాడుల గురించి సిఎంగా ఉన్న ఎడియూరప్ప జస్టిస్‌ బికె సోమశేఖర కమిషన్‌ ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాది సమర్పించిన మధ్యంతర నివేదికలో ఆ దాడుల్లో భజరంగదళ్‌ వంటి మితవాద బృందాలున్నట్లు పేర్కొన్నారు. మంగుళూరు ప్రాంతంలో చర్చ్‌ల మీద దాడులు తామే చేసినట్లు భజరంగ్‌దళనేతలు పత్రికా గోష్టి పెట్టిమరీ చెప్పారు. గతేడాది షిమోగాలో హలాల్‌ మాంసం అమ్మాడంటూ ఒక ముస్లిం వ్యాపారి మీద దాడి చేసిన కేసులు ఆ సంస్థకు చెందిన వారిని అరెస్టు చేశారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.ఒడిషా, కర్ణాటకల్లో జరిపిన హింసాకాండకు గాను విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించాలని 2013లో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ డిమాండ్‌ చేశారు. తరువాత అదే పెద్ద మనిషి బిజెపి చంకనెక్కి మంత్రిగా పని చేశారు.చివరిగా బిజెపి మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు.


అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఉచితాల గురించి రచ్చ చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకలో తమ పార్టీ ఉచితాలను సమర్ధించారు.కర్ణాటక కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో రాష్ట్రం అప్పుల వూబిలో మునుగుతుందన్నారు. ఉచితాల సంస్మృతి భవిష్యత్‌ తరాల వనరులను హరించి వేస్తుందని, తాము రానున్న పాతిక సంవత్సరాల గురించి ఆలోచిస్తాము తప్ప దగ్గరదారుల్లో వెళ్లం అన్నారు. ప్రతి రోజు బిపిఎల్‌ కుటుంబాలకు పాల సరఫరా హామీ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఆ రాష్ట్ర పాలరైతులకు మార్కెటింగ్‌ కల్పించి ఆదుకొనేందుకు అని బిజెపి నేతలు చెబుతున్నారు. మరి అధికారంలో ఇప్పటికే ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదు, కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు ఎందుకు పాలు సరఫరా చేయలేదు ? కుటుంబ పాలన, అవినీతి గురించి మోడీ పెద్దగా ప్రస్తావించటం లేదు. ఎందుకంటే 40శాతం అవినీతి పాలన అని బిజెపి సర్కార్‌ గబ్బుపట్టింది. ఇక ఎడియూరప్పను పక్కన పెట్టుకొని కుటుంబపాలన గురించి చెబితే కన్నడిగులు ముఖం మీదే జనం నవ్వుతారు. మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కాశ్మీరులో భద్రతా దళాలకు అధికారం ఇవ్వలేదంటూ ఆర్టికల్‌ 370 రద్దు, ఏకంగా రాష్ట్రానే రద్దు చేసి కేంద్ర పాలన సాగిస్తోంది. అక్కడ ఒక వైపు ఉగ్రవాదులు భద్రతాదళాల ప్రాణాలు తీస్తుంటే మరోవైపు కర్ణాటకలో మోడీ ఉగ్రవాదం గురించి ఇతరుల మీద రాళ్లు వేస్తున్నారు. వారితో చేతులు కలిపిన వారి మీద చర్యలు తీసుకుంటే ఎవరు అడ్డుకున్నారు ? ఇంతవరకు ఎంత మందిని పట్టుకున్నారు, ఎన్నికేసులు పెట్టారు ?


ఉచితాలకు వ్యతిరేకంగా బిజెపి నేత అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో కేసు వేశారు. సంక్షేమ చర్యలు అంటే ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వటం కాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.కర్ణాటకలో ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, ఉచిత ఆహార ధాన్యాల సంగతేమిటి ? గత ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్ద స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను , పేదలకు అందుబాటులో ఉన్న పాసింజరు రైళ్లను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. ” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బిజెపి చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మరొకటా ?


ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒకవైపు నరేంద్రమోడీ చూస్తున్నారు.మరోవైపు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త). వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లే !


స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు 55 లక్షల కోట్లు, మోడీ పదేండ్ల పాలన గడిచే నాటికి అది 169లక్షల కోట్లకు చేరనుంది. ఇంత అప్పు దేనికి చేసినట్లు, ఎక్కడ నుంచి తెచ్చిందీ, దేనికెంత ఖర్చు చేసిందీ మోడీ చెబుతారా ? దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా ? పార్లమెంటులో 2017జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004-05 కస్టమ్స్‌, ఎక్సైజ్‌, కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ వచ్చింది నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత జనానికి అర్ధంగాకుండా లెక్కలను తారుమారు చేసి సరికొత్త పద్దతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు.2014-15లో కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రు.4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రు.1,48,442 కోట్లుగా చెప్పారు. దీని అర్ధం ఖజానాకు మోడీ గారు రు.2,87,314 కోట్లు మిగిల్చినట్లా ? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014-15లో ఎక్సైజ్‌ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రు.99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రు.1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020-21నాటికి రు.3,72,970 కోట్లకు చేర్చారు. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్‌ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు. పైన పేర్కొన్నట్లుగా అప్పు తడిచి మోపెడైంది ? ఎవరికోసం బిజెపి పని చేస్తున్నట్లు ?

తెల్ల బంగారం లిథియంపై బహుళజాతి గుత్త కంపెనీల కన్ను !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
పెట్టుబడిదారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే దానికోసం ఎంతకైనా తెగిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.కొలంబస్‌ అమెరికాను కనుగొనటంలోనే అది తొలిసారిగా స్పష్టమైంది. ఆ పరంపరలో ఓడలు, సముద్ర మార్గాలు,దేశాల ఆక్రమణ, వలసపాలన, ముడి చమురు, విలువైన ఖనిజ సంపదలను ఆక్రమించుకొనేందుకు, వాటినుంచి లాభాలను పిండుకొనేందుకు జరిపిన దాడులు, యుద్ధాల చరిత్ర తెలిసింది. ఆ జాబితాలో ఇప్పుడు తెల్లబంగారంగా భావిస్తున్న లిథియం అనే ఖనిజం చేరనుందా ? రానున్న రోజుల్లో చమురుతో పాటు అది కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాలుష్య ఉద్గారాలను 2050నాటికి సున్నా స్థాయికి తగ్గించే విధంగా శుద్దమైన ఇంథనాన్ని ఉత్పత్తి చేయాలనేది ఒక లక్ష్యం.తద్వారా పర్యావరణాన్ని రక్షించేందుకు పూనుకోవాలని ప్రపంచం చూస్తోంది.దీనికి గాను వాహన రంగంలో రెండువందల కోట్ల ఎలక్ట్రిక్‌ లేదా ఎలక్ట్రిక్‌తో పాటు అవసరమైతే చమురు ఇంథనాన్ని వినియోగించే వాహనాలను తయారు చేయాల్సి ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైది పెద్ద మొత్తంలో విద్యుత్‌ నిలువ చేయగలిగిన బ్యాటరీలు.వాటికి అవసరమైనది లిథియం. ఇప్పటివరకు కనుగొన్నమేరకు ఆ ఖనిజ నిల్వలు 250 కోట్ల బ్యాటరీల తయారీకి మాత్రమే సరిపోతాయట. సముద్రాల్లో , రాతి శిలల ప్రాంతాల్లో కూడా ఇది భారీగా దొరుకుతుంది.


ఈ పూర్వరంగంలో ఎంతో విలువైన లిథియం నిల్వలను కొత్తగా కనుగొనేందుకు, ఉన్న వాటిని తమ స్వంతం చేసుకొనేందుకు బహుళజాతి గుత్త కంపెనీలు చూస్తున్నాయి. వాటికి అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించేందుకు పూనుకున్నాయి. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా అందుకోసం కుట్రలు ఉంటాయని చెప్పనవసరం లేదు. బహుళజాతి కంపెనీల కోసం పని చేసే పత్రికల్లో ఒకటైన టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ చివరి వారంలో ” లిథియం కోసం ఒకవేళ దక్షిణ అమెరికా ఒక ఓపెక్‌ను ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది ” అంటూ ఒక విశ్లేషణా హెచ్చరికను ప్రచురించింది. ఒపెక్‌ అంటే చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్థ. అలాంటి దానినే లిథియం ఖనిజానికీ ఏర్పాటు చేస్తే అనేది దాని భయం. ప్రపంచంలో 2020 నాటికి కనుగొన్న మేరకు ఉన్న నిల్వలు రెండు కోట్ల పదిలక్షల టన్నులు. ఈ మొత్తంలో ఒక్క చిలీలోనే 92లక్షల టన్నులు ఉంది. తరువాత మన దేశంలోని జమ్మూ-కాశ్మీరు ప్రాంతంలో 59లక్షల టన్నులు, ఆస్ట్రేలియా 47, అర్జెంటీనా 19, చైనా 15, అమెరికాలో 7.5, కెనడాలో 5.3లక్షల టన్నుల నిల్వలున్నాయి. వీటి నుంచి 82వేల టన్నులు అదే ఏడాది వెలికి తీయగా ఒక్క ఆస్ట్రేలియాలోనే 40,చిలీ 18, చైనా 14, అర్జెంటీనా 6.2 వేల టన్నులు వెలికి తీశారు.మరుసటి ఏడాది లక్ష టన్నులకు పెరిగింది.దీనిలో అమెరికా వాటా కేవలం ఒక్కశాతమే ఉంది.


గతంలో గ్లాసును కరిగించే ఉష్టోగ్రతలను తగ్గించేందుకు, అల్యూమినియం ఆక్సైడ్‌ కరిగింపు,సిరామిక్స్‌ వంటివాటిలో లిథియంను వాడేవారు. రెండువేల సంవత్సరం తరువాత బ్యాటరీల తయారీకి ఉపయోగించటంతో దాని డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది భౌగోళిక రాజకీయాలనే ప్రభావితం చేసేదిగా మారుతోందంటే అతిశయోక్తి కాదు.2020లో ప్రపంచమంతటా 30లక్షల విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేస్తే మరుసటి ఏడాదికి 66లక్షలకు పెరిగాయి.మార్కెట్‌లో వీటి వాటా 9శాతం.రానున్న పది సంవత్సరాల్లో పెట్రోలు, డీజిలు మోటారు వాహనాల కొనుగోలును క్రమంగా తగ్గిస్తామని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. చమురు ధరలు పెరగటంతో సాధారణ పౌరులు కూడా వాటివైపే మొగ్గుతున్నారు. మోటారు వాహనాలు, ఇతర రంగాల్లో చిప్స్‌ ప్రాధాన్యత ఎలా పెరిగిందో లిథియ బ్యాటరీలు కూడా అంతే ప్రాధాన్యవహించనున్నాయి. అందుకే ఆరు దశాబ్దాల క్రితం చమురు దేశాలు మార్కెట్‌ను అదుపు చేసేందుకు ఒపెక్‌ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా లిథియం ఖనిజం ఉన్న దేశాలు కూడా ఒక్కటైతే అమెరికా,జపాన్‌,ఐరోపాలోని వాహన తయారీ కంపెనీలు విద్యుత్‌ వాహన రంగంలో అడుగుపెట్టాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. టైమ్‌ పత్రిక విశ్లేషణలో వెల్లడించిన భయమదే.


లాటిన్‌ అమెరికా దేశాల్లో లిథియం నిల్వలున్నాయి.పెరూ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష నేత పెడ్రో కాస్టిలో ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల ప్రభుత్వం ఏప్రిల్‌ 10న ఒక ప్రకటన చేస్తూ అమెరికా లిథియం కంపెనీ అనుబంధ కెనడా కంపెనీకి లిథియం ఖనిజ గనులను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. దాన్ని వ్యతిరేకిస్తూ పెరూవియన్లు ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వరంగంలోనే కొనసాగాలని డిమాండ్‌ చేస్తున్నారు.కుట్ర పూరితంగా అధికారానికి వచ్చిన ప్రభుత్వానికి తెలుపుతున్న నిరసనలో భాగంగా ఈ డిమాండ్‌ను కూడా చేర్చారు. కార్పొరేట్ల లాభాలు, ఇతర లబ్ది గురించి చూపుతున్న శ్రద్ద ఆ ప్రాంత పౌరుల పట్ల లేదని, తమ డిమాండ్లను విస్మరిస్తే ఖనిజతవ్వకాలను అనుమతించేది లేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఖనిజమున్న పూనో ప్రాంతంలోని స్థానిక తెగలకు చెందిన మూడువేల మంది ప్రతినిధులు సమావేశమై ఆ ఖనిజం మీద సంపూర్ణ హక్కు తమదేనని, తమ సంక్షేమానికే వనరులను వినియోగించాలని, తమను సంప్రదించకుండా నిర్ణయాలు చేస్తే కుదరదని స్పష్టం చేశారు. ముడిసరకులను ఎగుమతి చేసే ప్రాంతంగా, దేశంగా మారిస్తే సహించేది లేదని పరిశ్రమలను పెట్టి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.


నిజానికి ఇది ఒక్క పెరూ సమస్యమాత్రమే కాదు, ప్రపంచంలో సహజ సంపదలున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. లిథియంను కార్పొరేట్ల పరం చేసేందుకు పెరూ కుట్రదారులు చూస్తున్నారు, ప్రజల పరం చేయాలని తాను కోరుతున్నట్లు పెడ్రో కాస్టిలో చెప్పారు. దీనిలో భాగంగానే బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్సీ లాటిన్‌ అమెరికా లిథియం ఉత్పత్తి, ఎగుమతులకు ఓపెక్‌ మాదిరి సంస్థ ఏర్పాటును ప్రతిపాదించినట్లు చెప్పాడు. అర్జెంటీనా సర్కార్‌ కూడా దీనిపట్ల ఆసక్తి వెల్లడించింది. మెక్సికో, చిలీ అధినేతలు కూడా ఇటీవల లిథియం గనులను జాతీయం చేయాలని ప్రకటించారు. తమ ప్రాంత సంపదలను తమ పౌరుల సంక్షేమానికే అన్న అంశం దీనివెనుక ఉంది. పెరటిగా తోటగా చేసుకొని నిరంకుశ, మిలిటరీ పాలకులను గద్దె మీద కూర్చోపెట్టిన అమెరికా ముడిసరకుల ఎగుమతి ప్రాంతంగా దీన్ని చూసింది తప్ప పరిశ్రమలను వృద్ది చేయలేదు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఈ పరిస్థితిని మార్చాలని చూస్తున్నాయి.


టైమ్‌ వంటి కార్పొరేట్‌ మీడియాకు జన ఆకాంక్షలు పట్టవు. కొద్ది రోజుల క్రితం చిలీ ప్రభుత్వం లిథియం గనులను ప్రభుత్వ అదుపులోకి తేవాలని ఒక ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు సాగిస్తున్న రెండు అమెరికన్‌ కంపెనీలను కొన్ని సంవత్సరాల తరువాత అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించటం, కొత్తగా జరిపే తవ్వకాలను ఆధునిక పరిజ్ఞానంతో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో చేపట్టాలని ప్రతిపాదించారు. అనేక దేశాల్లో ఈ పాక్షిక జాతీయకరణ ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. చమురు దేశాల్లో ఒపెక్‌ ఏర్పాటును కూడా నాడు బహుళజాతి గుత్త సంస్థలు అంగీకరించలేదు, విఫలం చేసేందుకు చూశారు. మన దేశంతో సహా అనేక దేశాలు చమురు ఉత్పత్తి, మార్కెటింగ్‌ విదేశీ కంపెనీలను జాతీయం చేశారు. ఒపెక్‌ ఇప్పుడు రష్యాతో సహా 40శాతం చమురు సరఫరాను అదుపు చేస్తున్నది.లిథియం అంశంలో కూడా అదే జరిగితే లాభాలు తెచ్చే మరో గంగిగోవు తమకు దక్కదని బహుళజాతి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.2010లో కేవలం 23,500 టన్నుల డిమాండ్‌ మాత్రమే ఉన్న ఈ ఖనిజం 2030నాటికి 40లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. లాటిన్‌ అమెరికాలోని ఉప్పునీటి కయ్యలలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అయితే శుద్ధి ఎంతో సంక్లిష్టమైనదిగా, ఖర్చుతో కూడినదిగా మారటంతో అనేక దేశాల్లో వినియోగంలోకి రాలేదు. లాటిన్‌ అమెరికా దేశాలకు పెట్టుబడులు సమస్య కూడా ఉంది. సంయుక్తరంగంలో తామెందుకు పెట్టుబడులు పెట్టాలని కార్పొరేట్లు పెదవి విరుస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియాలలో కఠిన శిలలు ఉండే ప్రాంతంలో ఈ నిక్షేపాలు ఉన్నాయి. పాక్షిక జాతీయం, ప్రయివేటు రంగ భాగస్వామ్యం అన్న తమ విధానం పెట్టుబడులకు దోహదం చేస్తుందని చిలీ వామపక్ష అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెబుతున్నాడు. పర్యావరణానికి హాని జరగకుండా, కాలుష్యం పెంచని ఆధునిక పరిజ్ఞానంతో పెట్టుబడులు పెట్టే వారికి 49.99 శాతం వాటా ఇస్తామని చెప్పాడు. ఖనిజ తవ్వకం స్థానికులకు, దేశ పౌరులకు లబ్ది కలిగించేదిగా ఉండాలన్నాడు.


1995లో ప్రపంచ లిథియం ఉత్పత్తిలో మూడో వంతు వాటా కలిగి ఉన్న అమెరికా ఇప్పుడు ఒక శాతానికి పడిపోయింది. దాని గనుల్లో ఉన్న నిల్వలు కూడా తగ్గినట్లు చెబుతున్నారు.ఈ ఖనిజానికి డిమాండ్‌ పెరుగుతున్న దశలో తమ ఆటో రంగానికి అవసరమైన దానిని చేజిక్కించుకొనేందుకు అక్కడి కంపెనీలు తప్పకుండా చూస్తాయి.చైనాలో ఉన్న గనులతో పాటు విదేశాల్లో కూడా దాని కంపెనీలకు 5.6బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. బాటరీలకు అవసరమైన ప్రపంచ ముడి ఖనిజంలో 60శాతం మేరకు చైనాలో శుద్ది చేస్తున్నారు. డిమాండ్‌ పెరిగే కొద్దీ చిలీ ప్రపంచ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోని లిథియం నిల్వల్లో 60శాతం చిలీ, బొలీవియా, అర్జెంటీనా త్రికోణ ప్రాంతంలో ఉన్నట్లు ప్రపంచ ఆర్థికవేదిక చెబుతున్నది. ఫోన్లు, కార్లకు అవసరమైన బాటరీలకు ఇది అనువుగా ఉండటంతో ఒక దశంలో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతేడాది నవంబరులో టన్ను ధర 14 నుంచి 80వేల డాలర్లకు చేరి తరువాత తగ్గింది. 2040 నాటికి ఇప్పుడున్న డిమాండ్‌ 40 రెట్లు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రయివేటురంగంలో ఉన్న చిలీ అమెరికన్‌ కంపెనీల అనుమతి గడువు 2030లో ముగియనున్నది.దానిని పొడిగిస్తారా లేక సంయుక్త భాగస్వామ్యంలోకి మారుస్తారా అన్న అనుమానాలతో ఆ కంపెనీల వాటాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని చిలీ రాగి కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అదే మాదిరి లిథియం కంపెనీని కూడా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ఈ పూర్వరంగంలో అది తెచ్చే లాభాల కోసం సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలకైనా పాల్పడే అవకాశం ఉంది. చిలీ రాగి గనులకూ ప్రసిద్ది అన్నది తెలిసిందే.ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమను అక్కడ 1973లో అధికారానికి వచ్చిన వామపక్ష నేత సాల్వెడార్‌ అలెండీ జాతీయం చేయటాన్ని అమెరికా, కార్పొరేట్‌ సంస్థలు సహించలేక కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మిలిటరీ తిరుగుబాటుతో అలెండీని హత్య చేశారు. ఇప్పుడు లిథియం పాక్షిక జాతీయకరణ నిర్ణయం నాటి పరిణామాలను గుర్తుకు తెచ్చిందని కొందరు పేర్కొన్నారు.

మోడీ పక్కకెళ్లొద్దురో డింగరీ : పన్నెండు గంటలపని, మూడు రోజుల సెలవు కుర్రకారుకు గాలమే !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మే డే అంటే కార్మికులు కొన్ని చోట్ల సంబరాలు జరుపుతున్నారు. మరికొన్ని చోట్ల దీక్షాదినంగా పాటిస్తున్నారు. అసలు ఏదీ పాటించకుండా, మే డే అంటే ఏమిటో కూడా తెలియకుండా ఆ రోజున కూడా పనిలో ఉండేవారు ఉన్నారు. కరోనా సమయంలో శ్రామికులు తక్కువగా అందుబాటులో ఉన్నందున రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు 2020 అక్టోబరు ఒకటవ తేదీన తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసిన విధాన నిర్ణయం ప్రకారం వారానికి నాలుగు రోజులు, రోజుకు పన్నెండు గంటల చొప్పున పని గంటలు ఉన్నాయి. వాటిని అమలు జరపాల్సింది రాష్ట్రాలు గనుక అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఆమోదించారు. తాజాగా తమిళనాడులో ఆమోదం మీద తీవ్ర నిరసన వెల్లడి కావటంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది తప్ప రద్దు చేయలేదు. అది తాత్కాలికం, దేశమంతటా ఆ కత్తి కార్మికుల మెడమీద వేలాడుతూనే ఉంది.మూడు సాగు చట్టాలను ప్రతిఘటిస్తూ రైతాంగం సాగించిన ఏడాది పోరాటం, దానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేసిన తీరు తెలిసిందే. రైతన్నల పోరు, దేశంలో దిగజారుతున్న ఆర్థిక స్థితి, వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికుల మీద రుద్దనున్న చట్టాలను ఆలశ్యం చేస్తున్నారు తప్ప వెనక్కు తగ్గే ధోరణిలో లేరు. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించింది. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని అంశాలపై ముసాయి నిబంధనలను ప్రకటించాయి. ఒక విధానంగా చట్ట సవరణ చేస్తే దాన్ని కోర్టులు కొట్టివేసేందుకు అవకాశాలు దాదాపు లేవు. కార్మికులను కోర్టులు కూడా ఆదుకోలేవు. ఇప్పుడున్న ఎనిమిది గంటల షిప్టులను పన్నెండు గంటలకు పెంచుకోవటమా లేదా అన్నది యజమానులు నిర్ణయించుకోవచ్చని, దీనికి కార్మికుల అంగీకారం కూడా అవసరమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తమకు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలనో మరో సాకునో యజమానులు చూపితే పన్నెండు గంటలు ఏకబిగిన పని చేయక తప్పదు.చట్టాలు యజమానులకు చుట్టాలు తప్ప కార్మికులకు కాదు. చట్టాల ఆటంకం కారణంగానే మన దేశానికి విదేశీపెట్టుబడిదారులు రావటం లేదని, ఎగుమతుల్లో పోటీ పడలేమని అందువలన వారు కోరుకున్నట్లుగా భూమి, కార్మిక చట్టాలను మార్చాలని ఎప్పటి నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మార్పులన్నీ వారి కోసం తప్ప కార్మికుల కోసం కాదు.


ఆసుపత్రులు, మరికొన్ని చోట్ల ఇప్పటికే అరకొర వేతనాలతో పన్నెండు గంటల షిప్టుల్లో పని చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారికి వారానికి ఒక రోజు సెలవు తప్ప అదనంగా ఇవ్వటం లేదు. ఇప్పుడు వారికి మూడు రోజులు సెలవులు, వాటికి వేతనం ఇస్తారా, ప్రభుత్వం ఇప్పిస్తుందా ? నాలుగు రోజులు పని చేస్తే వచ్చే వేతనంతో ఏడు రోజులు ఎలా గడుపుకుంటారు ? కొన్ని చోట్ల పని స్థలాలకు వెళ్లి వచ్చేందుకు కార్మికులకు రెండు నుంచి నాలుగు గంటలు పడుతున్నది. అంటే పదహారు గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులతో గడిపేందుకు, విశ్రాంతి తీసుకొనేందుకు వ్యవధి దొరుకుతుందా ? ఇదే అమలు జరిగితే వారానికి నాలుగు రోజులు వారు ఇంటికి దూరమై ఫ్యాక్టరీల గేట్ల ముందు పడుకున్న 150 సంవత్సరాల నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ విధానం అమల్లోకి వస్తే తొలి బాధితులు, పనికి దూరమయ్యేది మహిళలు. వారు ఇంట్లో పని చేసుకొని పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయాన్ని పనికి వెచ్చించగలరా ? పసి పిల్లలను సంరక్షించుకోగలరా ? పన్నెండు గంటల షిఫ్టులు పెడితే ఆహారపు అలవాట్లు, వేళలు మారతాయి. మూడు పూటలా తినేందుకు వీలుండదు, మూడుసార్లు తినాల్సినదాన్ని రెండుసార్లు కుక్కటం జరిగేదేనా ? ఇవి అలసట, ఆరోగ్య, మానసిక వత్తిడి, తాగుడు వంటి వాటికి దారితీస్తాయి.ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు, కుటుంబ జీవనానికి కొత్త వాటిని జోడిస్తాయి.


అదనపు వేతనం ఇచ్చేందుకు నిరాకరిస్తూ, ఇచ్చినా అరకొరా చెల్లిస్తూ అడిగిన వారిని పని నుంచి తొలగిస్తున్న యజమానులకు చట్టబద్దంగా అధికారమిచ్చి ఎనిమిది గంటలకు ఇస్తున్న వేతనంతోనే పన్నెండు గంటలు చేయించినా అడిగేవారు ఉండరు. దశాబ్దాల తరబడి కనీస వేతనాలను పెంచని పాలకులు కళ్ల ముందు కనిపిస్తున్నపుడు ఇంతకు మించి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు.చట్టవిరుద్ద దోపిడీని చట్టబద్దం చేస్తుంది. కొత్త చట్టాల ప్రకారం మొత్తం వేతనంలో మూలవేతనం సగం ఉండాలని చెబుతున్నారు. అంటే ఆ మేరకు కార్మికులు, యజమానులు చెల్లించే ప్రావిడెంట్‌ ఫండ్‌ వాటా పెరుగుతుందని, ఉద్యోగ విరమణ చేసినపుడు గ్రాట్యూటీ పెరిగి పెద్ద మొత్తాలు చేతికి అంది సుఖంగా జీవించవచ్చని ఆశ చూపుతున్నారు. పిఎఫ్‌ వాటా పెరగటం అంటే తమ పెన్షన్‌కు తామే ముందుగా చెల్లించటం తప్ప మరొకటి కాదు. దీని వలన వచ్చే వేతనాల మొత్తం తగ్గి రోజువారీ గడవటం ఎలా అన్నది అసలు సమస్య. అలవెన్సులు, కరువు భత్యం వంటివి మూలవేతనంలో సగానికి మించకూడదంటే అది కార్మికులకు నష్టమే.
కొత్త చట్టం వస్తే సెలవులేమీ పెరగవు. ఇప్పుడు 45 రోజులకు ఒక వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారని, దాన్ని ఇరవై రోజులకు ఒకటి వచ్చేట్లు చేస్తున్నామని చెబుతున్నారు. ఎనిమిదికి బదులు నాలుగు గంటలు పని చేస్తే ఓవర్‌టైమ్‌ వేతనం చెల్లించాలి. ఇప్పుడు మామూలు వేతనానికే అదనంగా రోజుకు నాలుగు గంటలు పని చేయాలి.కంపెనీలో చేరిన 240 రోజుల తరువాత సెలవు పెట్టుకొనే దానిని ఇప్పుడు 180రోజులకే తగ్గిస్తున్నట్లు ఆశచూపుతున్నారు. ఇప్పుడు ఏడాదికి వారాంతపు సెలవులు 52 పోగా పని రోజులు 300 వరకు ఉంటున్నాయి. నాలుగు రోజులే పని అమల్లోకి వస్తే పని రోజులు రెండువందలకు తగ్గుతాయి. ఏదైనా ఒకటే కదా ! వాస్తవంగా నిబంధనలు అమల్లోకి వస్తే తప్ప కార్మికులు ఎంత పొగొట్టుకొనేది, యజమానులకు కలిగే లబ్ది ఏమిటనేది స్పష్టం కాదు.


అనేక దేశాల్లో మాదిరి సంస్కరణల్లో భాగంగా షిప్టులను మారిస్తే తప్పేమిటి అని కొందరు వాదించవచ్చు. ఒక సినిమాలో దేన్నీ ఒక వైపే చూడకు అన్న డైలాంగ్‌ తెలిసిందే. వీటినీ అంతే. చైనాలో సంస్కరణలు అక్కడ సంపదలను సృష్టిస్తే మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు. అదే చైనాలో పన్నెండుగంటల పనికి అనుమతి ఉంది అని కొందరు కొన్ని కంపెనీలను చూపి ఉదాహరించవచ్చు.వాస్తవాలేమిటి ? చైనాలో రోజుకు ఎనిమిది గంటలపని, వారానికి 44 గంటలు అన్న చట్టాన్ని మార్చి పన్నెండుగంటలుగా, నాలుగు రోజులుగా మార్చలేదు. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను అవకాశంగా తీసుకొని కొన్ని కంపెనీలు వారానికి ఆరు రోజులు, రోజుకు పన్నెండు గంటల షిప్టులను అమలు జరిపాయి. దాన్నే 996 పని సంస్కృతి అని పిలిచారు. ఆలీబాబా కంపెనీ అధినేత జాక్‌ మా వంటి వారు దాన్ని అమలు జరిపారు. అలాంటి పని పద్దతులను అమలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. అనేక కోర్టులు పన్నెండు గంటలపని చట్టవిరుద్దమని తీర్పులు చెప్పాయి. 2021 సెప్టెంబరు 21 చైనా సుప్రీం కోర్టు, కార్మిక మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఒక ప్రకటనలో పది కోర్టు తీర్పులను ఉటంకిస్తూ కార్మికుల చేత చట్టాలకు భిన్నంగా ఏ రంగంలోనూ బలవంతంగా పని చేయించటాన్ని సహించేది లేదని స్పష్టం చేశాయి. విశ్రాంతి సమయంలో, సెలవు రోజుల్లో కార్మికులతో పని చేయిస్తే చట్టపరంగా చెల్లింపు లేదా పరిహారాన్ని కోరే హక్కు కార్మికులకు ఉందని పేర్కొన్నాయి. టెక్నాలజీ (ఐటి) కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా ఎక్కువ సేపు పని చేయించినట్లు, పరిహారం చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.2019లో కొంత మంది ప్రోగ్రామర్లు రంగంలోకి దిగి అందరికీ అందుబాటులో ఉండే (ఓపెన్‌ సోర్స్‌ కోడ్స్‌ ) సంకేతాలను ఉపయోగించుకొని పని చేసే అంకుర సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తే వాటిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలా ఎక్కువ గంటలు పనిచేసి అనారోగ్యాలకు గురై కొందరు నిపుణులు మరణించిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి. మన దగ్గర స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల తరఫున ఆహారాన్ని అందించే కార్మికులు తమకు చట్టాలను వర్తింప చేయటం లేదని ఫిర్యాదు చేసిన తరువాత చైనా ప్రభుత్వం అలాంటి సంస్థలను కట్టడి చేసి కార్మికులకు రక్షణ కల్పించింది. అనేక సంస్థలు దారికి వచ్చాయి. అలాంటి చిత్తశుద్ది మన ప్రభుత్వాలకు ఉన్నాయా అన్నది ప్రశ్న.చైనాలో కార్మిక చట్టాలను కఠినతరం గావించటం, కనీసవేతనాల పెంపుదల వంటి కారణాలతో అక్కడ ఇంకేమాత్రం వాణిజ్యం, ఫ్యాక్టరీలను నడపటం లాభసాటి కానందున అక్కడి నుంచి వచ్చే కంపెనీలను మన దేశం ఆకర్షించాలని మన దేశంలో అనేక మంది చెబుతున్నారు. ఇదే తరుణంలో ఇక్కడ కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే, జీవితాలను ఫణంగా పెట్టే పని పద్దతులను రుద్దేందుకు చూస్తున్నారు. ఏదో దేశంలో తొడకోసుకుంటే మన దేశంలో మెడకోసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ సిద్దాంతాలు, విదేశీ పద్దతులు వద్దని చెప్పేవారు కార్మికుల మీద విదేశీ పద్దతులనే ఎందుకు బలవంతంగా రుద్దుతున్నట్లు ?


అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( కొంత మంది దళితులలో ఒక ఉప కులానికే పరిమితం చేస్తున్నారు) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే బిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం ఎందరికి తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాలకే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికులు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో నారాయణ్‌ ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హౌదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు. 1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయమది. మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొక కోణం.


దీన్ని బట్టి యజమానులకు ఏది లాభంగా ఉంటే దాన్నే కోరుకుంటారన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు, మూడు రోజుల సెలవు వెనుక ఉన్నది కూడా అదే.మన దేశంతో సహా ప్రపంచమంతటా వినిమయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు.ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటలు చేసి వారానికి మూడు రోజులు సెలవు తీసుకుంటే కుటుంబాలతో సంతోషంగా గడపవచ్చంటూ రంగుల కలను చూపుతున్నారు. ఇలా మార్చాలని అసలు ఎవరు అడిగారు. అన్ని రోజులు సెలవులు గడిపి ఖర్చు చేసేందుకు ఎందరి వద్ద మిగులు ఉంటుంది. పశ్చిమ దేశాలలో జనం ఎంత ఖర్చు చేస్తే అక్కడి కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలకు లబ్ది. అందుకోసం అప్పులూ ఇప్పిస్తారు, వాటిని ఖర్చు చేసేందుకు సెలవులూ ఇస్తున్నారు. మన దేశం ఆ స్థితికి ఇంకా చేరిందా? అక్కడున్న మాదిరి సామాజిక రక్షణలు ఇక్కడ ఉన్నాయా ?


2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు. మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కషిని గుర్తించిన మాట వాస్తవం. పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ, ఇతర పోరాటాలను విస్మరిస్తున్నారనే విమర్శను మరచి పోకూడదు. అందువలన ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి శత్రువైరుధ్యాలు కావు.


కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు నిబంధన అందరికీ వర్తిస్తుంది. దానిలో ఎవరికీ మినహాయింపులు ఉండవు. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే మే డే సందేశం. ఎనిమిది గంటల పని దినం కోసం జరిపిన పోరాటాలకు ప్రతి రూపమే మే డే. ఇప్పుడు ఆ విజయాన్ని వమ్ము చేసి పన్నెండు గంటల పనిని రుద్దబోతున్నారు. కార్మికులు ఈ సవాల్‌ను స్వీకరించాలా వద్దా ? ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. తెల్లచొక్కాల వారు తాము కార్మికులం కాదనుకుంటున్నారు.యాజమాన్యంలో భాగం కాకుండా వేతనం తీసుకొనే ప్రతివారూ కార్మికులే. మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి. ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు. దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు ప్రతి రోజూ మేడేను స్మరించుకుంటూ కార్యోన్ముఖులు కావాలి.

ఎట్టకేలకు బిజెపి ” మల్లుడు ” మీద కీచక కేసులు : పరువు పోగొట్టుకున్న పరుగుల రాణి పిటి ఉష !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


సుప్రీం కోర్టు ఆదేశించటంతో విధిలేని స్థితిలో లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ, మల్లుడు, నలభై కేసులున్న నేరచరితుడైన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ మీద అమిత్‌ షా ఆధీనంలో పని చేసే ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన పోక్సోకేసు. ఒక కేసు నమోదు చేసేందుకు దేశ ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్న వార్త ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకుంటున్న దేశ పరువును తీసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, పాలకపార్టీ పెద్దలు, వారి సమర్ధకులు తప్ప వేరెవరూ కారణం కాదు. బేటీ పఢావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఆయన అధికార పీఠం ఉన్న చోటే ఆఫ్టరాల్‌ ఒక కేసు నమోదుకు ఇంత రచ్చ జరిగిందంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని జనం ఆశ్చర్యపోతున్నారు. అంతకు ముందు జరిగిన పరిణామాల్లో అఫ్‌కోర్స్‌ ఎవరేమనుకుంటే నాకేటి…. అనుకున్నట్లుగా ఒక నాడు పరుగుల రాణిగా దేశ ప్రజల, క్రీడాకారుల నీరాజనాలు అందుకున్న పిటి ఉష, రెజ్లర్ల మీద విమర్శలకు దిగి పరువు పొగొట్టుకున్నారు. ఇప్పుడేమంటారో చూడాలి. ఢిల్లీ పోలీసుల మీద ఎవరికీ విశ్వాసం లేదు.కేసు నీరుగారేట్లు చేస్తారని అనేక మంది భావిస్తున్నారు. బహుశా ఈ దుమ్ముతోనే కేసులు పెట్టినా తాను రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ పదవికి రాజీనామా చేసేది లేదని బ్రిజ్‌ భూషణ్‌ ప్రకటించారు. కేసులు నమోదు చేశాం కనుక ఆందోళన విరమించండి, జంతర్‌ మంతర్‌ నుంచి వెళ్లిపోండి అంటూ శరవేగంతో వచ్చిన పోలీసులు ఆందోళన శిబిరంలో ఉన్న వారికి నీరు, ఆహారం అందకుండా అడ్డుకున్నారు.


వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసి మల్లయుద్ధ క్రీడాకారులు దేశ ప్రతిష్టను మంటగలిపారంటూ భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) అధ్యక్షురాలు పిటి ఉష ఆరోపించారు. రోడ్లెక్కే ముందుకు ఐఓఏను సంప్రదించి ఉండాల్సిందంటూ హితవు పలికారు.మల్లయోధులు తమ అసోసియేషన్‌కు తాత్కాలిక కమిటీ వేయాలని కోరారని, తామాపని చేసినట్లు ఉష చెప్పారు. అంతకు ముందు జరిగిన ఐఓఏ కార్యవర్గ సమావేశం తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎల్లవేళలా ఆటగాళ్ల పక్షానే ఉందని, క్రీడలు, అథ్లెట్లు తమ ప్రాధాన్యత అని చెప్పుకున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మీద విమర్శలు వచ్చిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలను చూస్తే అతగాడిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి చూపుతున్న శ్రద్ద నిజాలను నిగ్గుదేల్చేందుకు చూప లేదు. నిజానికి రెజ్లర్లను వీధుల్లోకి లాగింది, దేశ ప్రతిష్టను దిగజార్చిందీ కేంద్రం, బిజెపి పార్టీ తప్ప మరొకటి కాదు. బిజెపి నేత అద్వానీ మీద హవాలా ఆరోపణ వచ్చినపుడు ఎంపీగా రాజీనామా చేసి ఆ నింద తొలిగిన తరువాతనే తిరిగి ఎన్నికల్లో నిలిచారు. బ్రిజ్‌ భూషణ్‌ అంశంలో బిజెపి ఎందుకు ఠలాయిస్తున్నట్లు ? వెంటనే పదవి నుంచి తప్పించి విచారణ సక్రమంగా జరిపించి ఉంటే ప్రపంచ క్రీడా రంగంలో, ఇతరంగా దేశ పరువు నిలిచేది కదా !


రాజ్యసభకు పంపినందుకు బిజెపి పట్ల కృతజ్ఞతగా బహుశా పిటి ఉష ఈ కోణాన్ని చూడకుండా రెజ్లర్ల మీదనే దాడికి దిగారన్నది స్పష్టం. నిరసన తెలపటం ప్రజాస్వామిక హక్కు, ఒక మహిళగా తోటి మహిళా అథ్లెట్ల బాధను ఆమె అవగాహన చేసుకోలేదు. అన్ని రంగాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్న సంగతి తెలియదని అనుకోవాలా ? ఇతర అసోసియేషన్లలో చేయని ఆరోపణలు రెజ్లింగ్‌లోనే ఎందుకు వచ్చినట్లు ? రెజ్లర్లు తమ వద్దకు రాలేదని చెబుతున్న ఉష, ఆమే వారిని తన వద్దకు ఎందుకు పిలిపించుకోలేదు. జనవరి 18న తొలిసారిగా రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఆమె రంగంలోకి దిగితే ఇంతదాకా వచ్చేది కాదు కదా ! తాత్కాలిక కమిటినీ తమంత తాముగా ఎందుకు వేయలేదు ? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తటం సహజం. లండన్‌ పర్యటనలో రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలతో దేశం పరువు తీసినట్లు, పోయినట్లు బిజెపి ఇప్పటికీ నానా యాగీ చేస్తోంది. ఇప్పుడు అదే భాషను పరుగుల రాణి వినిపించారు.నిరసన తెలపటమే నేరం అన్నట్లు మాట్లాడారు ? బిజెపి గీసిన గిరి నుంచి వెలుపలికి వస్తే ప్రపంచంలో గతంలో, వర్తమానంలో జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసి ఉండేది. అసలు ఆమె సంగతేమిటి ? ఆమె క్రమశిక్షణ బండారమేమిటి ?


పిటి ఉష రాజకీయ రంగు దాస్తే దాగేది కాదు. క్రీడా రంగంలో ఉన్నంత వరకే ఆమె క్రీడాకారిణి.తరువాత సాధారణ పౌరురాలే. ఏ రాజకీయపార్టీనైనా అభిమానించవచ్చు, చేరవచ్చు. ఆమె నెరపిన రాజకీయం ఏమిటో కేరళ జనాలకు తెలుసు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఏ క్షణంలోనైనా బిజెపిలో చేరవచ్చని 2021 పత్రికలను తిరగేస్తే వచ్చిన వార్తలు చూడవచ్చు. విజయ యాత్ర జరిపిన బిజెపి చివరికి ఉన్న ఒక్క అసెంబ్లీ సీటు, అంతకు ముందు వచ్చిన ఓట్లను కూడా పోగొట్టుకుంది. ఏ రాష్ట్రంలోనూ సిఎం అభ్యర్థిని ప్రకటించటం తమ విధానం కాదని చెప్పుకొనే బిజెపి అక్కడ మెట్రో మాన్‌ శ్రీధరన్ను ప్రకటించింది. తనకేమీ రాజకీయాల్లేవంటూనే 2016లో కేరళలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ఆహ్వాన సంఘానికి అధ్యక్షురాలిగా పని చేశారు. ఆ మరుసటి ఏడాది ఉష అథ్లెటిక్‌ స్కూలులో సింథటిక్‌ ట్రాక్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆ తరువాత రైతులు తిరస్కరించి ఏడాది పాటు ఆందోళన సాగించిన మోడీ మూడు సాగు చట్టాలను ఆమె సమర్ధించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ గ్రేటా థన్‌బెర్గ్‌, గాయని రిహానాను ఖండించారు. వీటికి ప్రతిఫలంగా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది.


ఇంతకూ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను బిజెపిని కాపాడుతున్నదా లేక ఆ పార్టీనే అతను ఒక ప్రాంతంలోనైనా శాశించే స్థితిలో ఉన్నారా ?ఉత్తర ప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో ఒకనాటి రౌడీ షీటర్‌, ఇప్పటికీ హత్యాయత్నం, కొట్లాట, దోపిడీ వంటి 40 క్రిమినల్‌ కేసులున్నప్పటికీ గాంగ్‌స్టర్లను ఏరిపారవేస్తానన్న యోగి పాలనలో ఆ జాబితాలో ఇతగాడి పేరు లేదు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా దేశం కోసం, ఉత్తర ప్రదేశ్‌ ఉన్నతి కోసం ఎప్పుడూ సాధు, సంతులతో కలసి తిరిగే బిజెపి గాంగ్‌స్టర్లు వేరయా అని లోకానికి సందేశమిచ్చారు. ఎందుకంటే అరవై ఆరు సంవత్సరాల ఈ పెద్దమనిషి స్వయంగా మల్లయోధుడు, ఒకసారి ఎస్‌పి, ఐదుసార్లు బిజెపి ఎంపీగా ఉన్నారు. అదనపు అర్హతలు ఏమంటే పేరుమోసిన హిందూత్వవాది, బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుడనని స్వయంగా చెప్పుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌లతో సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. ఆ ప్రాంతంలో ” శక్తిశాలి ” అని అనుచరులు ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకు అంటే కెమేరాల సాక్షిగా అతిక్‌ అహమ్మద్‌ అనే గూండా సోదరులను కాల్చిచంపిన ఆ పుణ్య గడ్డమీదే తన స్నేహితుడిని చంపిన హంతకుడి మీద కాల్పులు జరిపి హతమార్చినట్లు కెమెరాల ముందే ప్రకటించిన బ్రిజ్‌ తీరు ఉత్తర ప్రదేశ్‌లోగాక మరెక్కడ జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరఫున పోటీకి దిగినపుడు నాలుగుసార్లు ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ నేత ఆనంద సింగ్‌ మీద పోటీ వద్దని నాటి జిల్లా పోలీసు అధికారి తన కార్యాలయానికి పిలిపించుకొని అడగ్గా తీవ్ర వాదోపవాదాల్లో భాగంగా తన దగ్గర ఉన్న తుపాకిని తీసి ఎస్‌పి మీద గురి పెట్టగా వెనక్కు తగ్గిన తరువాత తాను వెనక్కు వెళ్లినట్లు స్వయంగా మీడియాతో చెప్పారు. అంతేనా ముంబై డాన్‌ అరుణ్‌ గావ్లీ అనుచరుడిని చంపినట్లు ఆరోపణలున్న దావూద్‌ ఇబ్రహీం అనుచరులు సుభాష్‌ ఠాకూర్‌, జయేంద్ర ఠాకూర్‌,ప్రకాష్‌ దేశాయిలతో చేతులు కలిపినందుకు టాడా చట్టం కింద అనేక నెలలు తీహార్‌ జైల్లో ఉన్న హిందూ-ముస్లిం జాతీయవాది, గాంగస్టర్ల ఐక్యతావాది. ఇలాంటి వారి మీద కేసులకు పట్టే గతి తెలిసిందే. ఎవరైనా ముందుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పి బతగ్గలరా ?


పన్నెండు సంవత్సరాలుగా దేశ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతగాడి లైంగిక వేధింపులను భరించలేక కొంత మంది రెజ్లర్లు చేసిన ఫిర్యాదులను ” బేటీ బచావో ” అనుచరులు, అధికారులూ పట్టించుకోలేదు. మాఫియా డాన్‌ అతిక్‌ ఆహమ్మద్‌ సంపాదించిన ఆస్తుల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని కాషాయ దళాలు సామాజిక మాధ్యమాలలో ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నాయి. ఒక నాడు రౌడీ షీటర్‌గా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సంపాదించినదేమీ తక్కువ కాదు.అనేక జిల్లాల్లో కనీసం 50 విద్యాసంస్థలు ఉన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. వీటి విలువ ఎంతో, ఎలా సంపాదించాడో కాషాయ దళాలు చెప్పాలి. ఇన్ని సంపదలు, కేంద్రం, రాష్ట్రంలో పలుకుబడి, ఎంపీగా ఉన్నకారణంగానే మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడి నోరు మూయిస్తున్నట్లు లోకం కోడై కూస్తున్నది.ఇతర పార్టీల కుటుంబ వారసత్వం గురించి బిజెపి లోకానికి సూక్తిముక్తావళి వినిపిస్తుంది. ఇతని కుమారుడు ప్రతీక్‌ భూషన్‌ రెండవసారి ఎంఎల్‌ఏగా ఉన్నారు. మరో కుమారుడు కరన్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో ఆఫీసుబేరర్‌, భార్య కేతకీ దేవి గోండా జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2004లో బిజెపి టికెట్‌ నిరాకరించి ఇతని బదులు ఘనశ్యాం శుక్లా అనే అతన్ని నిలిపింది. ఎన్నికల రోజున జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా జరిగిన ఒక ప్రమాదంలో శుక్లా మరణించాడు. ఆపని బ్రిజ్‌ భూషణే చేయించినట్లు శుక్లా కుటుంబం ఆరోపించింది. దీనిపై వాజ్‌పాయి ఆగ్రహించటంతో అతను పార్టీ మారీ సమాజవాదిలో చేరి 2009లో ఎంపీగా గెలిచారు. తరువాత 2014లో నరేంద్రమోడీ తిరిగి అతన్ని పార్టీలో చేర్చుకోవటమే గాక రెండుసార్లు టికెట్‌ ఇచ్చి ఎంపీగా గెలిపించి ” వాజ్‌పాయిని గౌరవించారు.”


మహిళా రెజ్లర్లు తమపై తమపై జరుగుతున్న వేధింపుల మీద గళమెత్తారు.కొన్ని ఉదాహరణలను చూస్తే జాతి వివక్ష వంటి అంశాల మీద నిరసన తెలిపిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు, అథ్లెట్ల గురించి పిటీ ఉషకు తెలియకుండా ఉంటుందా ? లేకపోతే మాట్లాడే ముందు తెలుసుకోవాలి. 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో రెండువందల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్‌, సిల్వర్‌ పతకాలను సాధించిన అమెరికా టోమీ స్మిత్‌, జాన్‌ కార్లోస్‌ జాతి వివక్షకు నిరసనగా కాళ్లకు బూట్లు లేకుండా, చేతులకు నల్లటి గ్లౌజులు వేసుకొని పోడియం మీదకు ఎక్కారు.2016లో ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు కోలిన్‌ కయిపెర్నిక్‌ ఉదంతం తెలిసిందే. అమెరికాలో కొనసాగుతున్న జాతి వివక్ష, నల్లజాతీయుల మీద జరుగుతున్న పోలీసుదాడులకు నిరసనగా క్రీడలకు ముందు జరిపే జాతీయగీతాలాపన సందర్భంగా లేచి నిలబడకుండా మోకాళ్ల మీద నిలిచి నిరసన తెలిపాడు. ఒకసారి కాదు అనేక సార్లు అదే చేశాడు.దాంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిరసన తెలిపే క్రీడాకారులను లంజకొడుకులని నోరుపారవేసుకున్నాడు.2020లో జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని పోలీసులు చంపినపుడు అమెరికా అంతటా తీవ్ర నిరసన వెల్లడైంది. అనేక మంది క్రీడాకారులు దానిలో పాల్గొన్నారు. క్రమశిక్షణ పేరుతో మౌనంగా ఉండలేదు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సంస్థ పీఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో వాటి మీద స్పందిస్తూ నిరసన తెలిపిన క్రీడాకారులను అభినందించాలి తప్ప శిక్షించకూడదన్నాడు. తోటి మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులు జరుగుతుంటే పిటి ఉష గొంతెత్తి వారి పక్షాన నిలవాల్సిందిపోయి నోరుమూసుకొని భరించమనే సందేశం ఇవ్వటం, దానికి క్రమశిక్షణ అని ముసుగుతొడగటం స్త్రీ జాతికే అవమానం.నిరసించే ధైర్యం లేకపోతే అవమానాలను దిగుమింగుతూ ఆత్మగౌరవాన్ని చంపుకొని చచ్చిన చేపల్లా వాలునబడి కొట్టుకుపోతూ, మౌనంగా ఉంటున్న అనేక మంది మాదిరే ఉంటే అదొక తీరు. తోటి క్రీడాకారులు రోడ్డెక్కితే అనేక మంది ప్రముఖ క్రీడాకారులు వారికి బాసటగా నిలిచారు. అనేక మంది మౌనంగా ఉన్నారు. ఈ రోజు వేధింపులు రెజ్లర్ల మీద జరగవచ్చు. వాటి పట్ల మౌనంగా ఉంటే రేపు తమదాకా వస్తే అని ఆలోచించి ఉంటే ఈ పాటికే ఢిల్లీ పోలీసుల మీద వత్తిడి పెరిగి సుప్రీం కోర్టు వరకు పోకుండా కేసులు నమోదు చేసేవారు. క్రీడాకారుల మౌనం ఎంతో ప్రమాదకరం. సుప్రీం కోర్టును సంతుష్టీకరించేందుకు కేసులు నమోదు చేసినా తరువాత జరిగే వాటి గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.