రెండు డిగ్రీల అసలు కతేంటి : ఏకత, శీలము కబుర్లు జనానికేనా ! నోరు విప్పరేం అంటున్న నరేంద్రమోడీ భక్తులు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీకి రెండు డిగ్రీలు ఉన్నాయట, అవి నకిలీవని కొందరంటున్నారు. అయితే ఏమిటటా ? ఈ దేశంలో వివాదం కానిది ఏముంది ! కొందరికి ప్రతిదాన్నీ రచ్చ చేయకపోతే నిదుర పట్టదు. ఇదీ అంతే, మోడీ నిజం, మోడీ పాలన నిజం, ప్రపంచంలోని పలు దేశాల నేతలతో పోలిస్తే జనాదరణలో మోడీకి 76శాతం మంది నీరాజనం పడుతున్నట్లు తాజాగా ఒక అమెరికా సంస్థ మోర్నింగ్‌ కన్సల్ట్‌ వెల్లడించింది చూడలేదా ! చూడకేం, మనల్ని విమర్శిస్తేనేమో చూడండి విదేశీ సంస్థలు మన జాతీయవాదుల మీద ఎలా దాడి చేస్తున్నాయో అంటారు. పొగిడితేనేమో చూడండి ఆహా విదేశాల వారే మనల్ని పొగుడుతుంటే మన దేశంలోని వారు ఎలా విమర్శిస్తున్నారో అని కూడా రుసరుసలాడతారు. అంటే మాకు రెండు నాలికలు ఉన్నాయంటున్నారా ? రామ రామ అలా అని బతకటమే, ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి(డు) అన్నారు కదండీ. చర్చలు ఇలా సాగుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రధాని రెండు డిగ్రీలు, రెండు భారత్‌లు, ఇతర అంశాల గురించి చూద్దాం !


నరేంద్రమోడీ రెండు డిగ్రీల వివాదం గురించి మీడియాలో, రాజకీయనేతల ప్రకటనల్లో చర్చ జరుగుతోంది.వీటిని ఎందరు విద్యావంతులు పట్టించుకున్నారు, అసలు పట్టించుకోని వారు ఎందరు ? ఒకటి మాత్రం చేదు నిజం, అదేమిటంటే పట్టించుకొనేది ఒక చిన్న భారత్‌, అసలు దాని జోలికి వెళ్లనిది పెద్ద భారతం. అందుకే కొందరు ఏం చెప్పినా తాత్కాలికంగానైనా సాగుతోంది. అసలు వివాదం ఏమిటి ? దేశంలో అనేక మంది దొంగ డిగ్రీలు సమర్పించి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరే వారి గురించి తెలిసిందే. నరేంద్రమోడీ చిన్న తనంలోనే టీ అమ్ముతూ తండ్రికి తోడ్పడినట్లు చెప్పారు గనుక చదువు కోలేదు. అనేక మంది కాలేజీకి వెళ్లకుండానే దూరవిద్య ద్వారా పరీక్షలు రాసి డిగ్రీలు పొందారు. వారిలో తాను ఒకరిని అని మోడీ చెప్పారు. ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌కు నరేంద్రమోడీ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన డిగ్రీల మీద అనుమానం వచ్చింది. అదేమీ నేరం కాదు.సమాచార హక్కు చట్టం కింద మోడీ గారు ఢిల్లీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయాల నుంచి పొందిన డిగ్రీలకు సంబంధించి ఏ రోల్‌ నంబరు, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిందీ వివరాలు కావాలని అడిగారు. కేంద్ర సమాచార కమిషన్‌ దానికి స్పందించి ఆ వివరాలు సమర్పించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరింది.తద్వారా జనాలకు వాటి గురించి తెలుసుకోవటానికి సాయపడుతుందని కూడా పేర్కొన్నది. కేజరీవాల్‌ మాదిరే అనేక మంది సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు అడిగితే ప్రధాని కార్యాలయం, విశ్వవిద్యాలయాలు కూడా తిరస్కరించాయి. నరేంద్రమోడీ డిగ్రీలు దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కనుక వాటిని వెల్లడించకూడదని చెప్పి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు.అలాంటి అంశాలకు సమాచార హక్కుచట్టం వర్తించదు. తన ఎన్నికల అఫిడవిట్‌లో నరేంద్రమోడీ తాను దూరవిద్యద్వారా 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి 1983లో ఎంఎ పట్టా పొందినట్లు పేర్కొన్నారు. కనుక అవి దేశ రహస్యాలు కాదు.


ఫలానా పదవికి ఫలానా విద్యార్హత ఉండాలని రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టంలో గానీ నిర్దేశించలేదు కదా మరి మోడీ డిగ్రీల గురించి ఇంత రచ్చ ఎందుకు అని సందేహం రావచ్చు.నాది వానాకాలం చదువు అని మోడీ రాసి ఉంటే గొడవ ఉండకపోను.తప్పుడు సమాచారమిచ్చారన్నదే అరోపణ.డిగ్రీ ఉంటే చూపాలి, లేకుంటే ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు గనుక అది అనర్హత కిందికి వస్తుంది. మోడీ గుజరాత్‌ అసెంబ్లీకి పోటీ చేసినపుడు తాను అవివాహితుడనని అఫిడవిట్లలో పేర్కొన్నారు.కానీ 2014 లోక్‌సభ ఎన్నికలపుడు తాను యశోదాబెన్‌ అనే ఆమెను వివాహం చేసుకున్నట్లు రాశారు. జాతికి ఏకత, శీలము నేర్పుతామని చెప్పుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పని చేసిన మోడీ నిజాలను దాచవచ్చా ? వివాహం గురించే నిజాలు దాచారు గనుక డిగ్రీల గురించి కూడా అనుమానం తలెత్తింది.అది పెనుభూతం అవుతోంది.ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ చెప్పుకోవాలి. కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అసలేం చదివారో తెలీదు గానీ ఆమె పెద్ద చదువులు చదువుకున్న వారికి మార్గదర్శకత్వం వహించే మానవవనరుల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. పూర్తిగా రాజకీశాస్త్ర పాఠాలే చదివి ఎంఎ డిగ్రీ చదివినట్లు చెప్పిన ప్రధాని అనేక మందికి పెద్ద ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అందుకే మోడినోమిక్స్‌ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. అదంతా వైఫల్యాల మయం అని విమర్శకులు అనవచ్చు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య గొప్పదనం అది.


స్మృతి ఇరానీ ఒక ఎన్నికల అఫిడవిట్‌లో తాను 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బిఏ డిగ్రీ పొందినట్లు రాశారు.మరొక ఎన్నికలో బికాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొన్నారు.2014లో కేంద్ర మంత్రిగా ఉండగా తాను అమెరికాలోని ఏలే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందినట్లు చెప్పారు.2017లో ఆమె డిగ్రీ గురించి సమాచారహక్కు కింద అడగ్గా వెల్లడించవద్దని ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని కోరారు.ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును కొట్టివేశారు.చివరకు విధిలేక 2019లో తనకు డిగ్రీ లేదని ఆమె అంగీకరించారు. అసలింతకీ ఆమె ఏలే కథ ఎలా చెప్పారంటే 2013లో భారత్‌ నుంచి వెళ్లిన పదిమంది ఎంపీల బృందంలో ఆమె ఒకరు. సదరు సంస్థలో ఆరు రోజుల పాటు నాయకత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి వాటికి హాజరైతే సర్టిఫికెట్లు ఇస్తారు. దాన్నే డిగ్రీగా బుకాయించేందుకు చూశారు. ఇక ప్రధాన కథలోకి వస్తే ఎవరెలాంటి సమాధానాలిచ్చారో చూద్దాం. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక దరఖాస్తుకు ప్రధాని కార్యాలయం ” ప్రధాని విద్యార్హతల వివరాలు ప్రధాని కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.మీ ప్రధాని గురించి తెలుసుకోండి అన్నదానిలో దొరుకుతాయి.కోరిన సమాచారం కావాలంటే ఎన్నికల కమిషన్ను అడగండి ” అని సమాధానం చెప్పింది. దానికి ఇసి ఏమి చెప్పిందంటే ఈ సమాచారం మా వద్దలేదని, సిసిఐ.ఎన్‌ఐసి.ఇన్‌లో అభ్యర్ధుల అఫిడవిట్లు అన్న విభాగంలో చూడవచ్చు అని పేర్కొన్నది. మోడీ ఎంఎ డిగ్రీ గురించి సమాచారం అడిగితే గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఒక్క ముక్కలో ” ఆర్‌టిఐ చట్టం 2005 ప్రకారం ఈ సమాచారాన్ని బహిర్గతపరచకూడదు ” అని జవాబిచ్చింది.


మోడీ డిగ్రీల వ్యవహారం మరో మలుపు తిరిగింది.తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదంటూ కమిషన్‌ అప్పిలేట్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. దాన్ని విచారించిన కమిటీ ఏం చెప్పిందటే ” ప్రజా సంబంధ అధికార వ్యవస్థ తమ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆఫీసు రికార్డులో లేనిదాన్ని ఇవ్వలేరు. ప్రధాని కార్యాలయం కూడా అదే వివరాలను ఇవ్వాలనటం సరైంది కాదు.సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(జె) ప్రకారం ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయ విడుదల చేయనవసరం లేదు. ప్రధాన మంత్రి కావటానికి కనీస అర్హతలను నిర్వచించలేదు గనుక మోడీ డిగ్రీల గురించిన వివరాలను ప్రధాని కార్యాలయం కలిగి ఉండాల్సిన అవసరం లేదు ” అని పేర్కొన్నది. అడిగిన సమాచారం సాధారణంగా ఉందని, రోల్‌ నంబరు లేకుండా తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ఢిల్లీ విశ్వవిద్యాలయం చేసిన వాదనను అంగీకరించింది. ఈ పరిణామం తరువాత అరవింద్‌ కేజరీవాల్‌ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులకు లేఖ రాశారు. దాన్నే సమాచార హక్కు దరఖాస్తుగా పరిగణించి నరేంద్రమోడీ డిగ్రీల రోల్‌ నంబర్లు అందచేస్తే వివరాలను తెలుసుకోవచ్చునంటూ ప్రధాని కార్యాలయాన్ని శ్రీధర్‌ కోరారు.


రెండు విశ్వవిద్యాలయాలు కూడా నరేంద్రమోడీకి ఎలాంటి డిగ్రీలు ఇవ్వలేదని చెబితే ఏమౌతుంది ? ప్రస్తుతం ఉన్న శిక్షాస్మృతి లోని సెక్షన్‌ 191 ప్రకారం ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇవ్వటం నేరపూరితమైన తప్పిదం. దానికి శిక్ష ఏమిటో స్పష్టంగా లేదు. ప్రజాస్వామిక సంస్కరణల కోసం పనిచేసే సంస్థ(ఏడిఆర్‌) 1999లో వేసిన ప్రజాప్రయోజన దావా, తరువాత కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ నేర, ఆర్థిక, విద్యకు సంబంధించిన వివరాలను నామినేషన్‌ పత్రాల్లో విధిగా సమర్పించాలి. వాటిలో అక్రమాలుంటే నేరపూరితం అవుతుంది. ఈ వివరాలు వాస్తవమా కాదా అన్నది ఎన్నికల కమిషన్‌ విచారించదు, తప్పని తేలినా శిక్షించే అధికారం దానికి లేదు. అందుకే కోర్టులకు వెళుతున్నారు. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలను ఇంటిలిజెన్సీ సంస్థల ద్వారా తనిఖీ చేయించవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. అలా చేయ కూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. స్వల్పకాలంలో తనిఖీ చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌ కూడా పేర్కొన్నది. తరువాత కనీసం గెలిచిన వారి వివరాలను ఆరు నెలల్లో తనిఖీ చేయించాలని ఏడిఆర్‌ కోరినా ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవటం లేదు, అఫిడవిట్లన్నీ ఆదాయపన్ను శాఖకు పంపుతున్నామని మాత్రమే చెప్పింది, ఐటి శాఖ చేస్తున్నదేమీ లేదు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన వివాహ స్థితి గురించి నరేంద్రమోడీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ సునీల్‌ సరవాగి దాఖలు చేసిన పిటీషన్‌పై 2013లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ఎన్నికల కమిషన్‌ కోరిన వివరాలను ఇవ్వని వారి నామినేషన్లను తిరస్కరించాలని పేర్కొన్నది. దాంతో విధిలేక నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో తనకు యశోదాబెన్‌తో వివాహం జరిగినట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనవలసి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరు సంఘపరివార్‌ అని చెప్పుకొనే వారు కూడా కోర్టు ఆదేశిస్తే తప్ప నిజాలు చెప్పరన్నమాట !


ప్రజాస్వామిక వ్యవస్థలను పటిష్ట పరుస్తామని చెప్పుకొనే బిజెపి, కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌ చేసిన ఒక చక్కటి సిఫార్సును పక్కన పడేశాయి. తప్పుడు అఫిడవిట్లు ఇస్తే అనర్హత వేటు వేయాలని, ఇప్పుడున్న ఆరు నెలల శిక్షను రెండు సంవత్సరాలకు పెంచాలని, ఈ కేసులను రోజు వారీ విచారించాలని, నామినేషన్ల దాఖలు ఆఖరి గడువుకు తనిఖీకి వారం రోజుల వ్యవధి ఉంటే ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే వాటి మీద అభ్యంతరాలు దాఖలు చేసేందుకు తగినంత వ్యవధి ఉంటుందని చెప్పింది. కానీ గత తొమ్మిదేండ్లుగా మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు, అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా కనిపించటం లేదు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ డిగ్రీల గురించి వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది, అనేక అనుమానాలకు తెరలేపింది. ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశానికి సంబంధించిన ఉదంతంలో నరేంద్రమోడీ డిగ్రీ వివరాలను ఢిల్లీ సిఎం కేజరీవాల్‌కు అందచేయాలని గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని కోరటం చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పటమే కాదు కేజరీవాల్‌ రు.25వేల జరిమానా కూడా విధించింది. దీని మీద కేజరీవాల్‌ ధ్వజమెత్తారు. మోడీ డిగ్రీల మీద అనుమానాలను పెంచిందన్నారు. తమ సంస్థలలో మోడీ డిగ్రీలు పొందినందుకు పండగ చేసుకోవాల్సిన గుజరాత్‌ లేదా ఢిల్లీ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని దాచేందుకు చూస్తున్నాయన్నారు.


ఇక గుజరాత్‌ హైకోర్టులో కేసుకు సంబంధించి వాదనలను చూద్దాం. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌(సిఐసి) ఉత్తరువులు జారీ చేశారు.కేజరీవాల్‌ ఎన్నికల గుర్తింపు కార్డు మీద వచ్చిన దరఖాస్తును పరిష్కరించకుండానే తమకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నది.తన వివరాలు అందచేసేందుకు సిద్దమేనని, మోడీ డిగ్రీ వివరాలను కూడా సమర్పించాలని కమిషన్‌ అడగాలని కేజరీవాల్‌ కమిషన్‌ ముందు వాదించారు. తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలించామని నరేంద్రమోడీ పొందిన 1978 డిగ్రీ వాస్తవమైనదేనని ఢిల్లీ విశ్వవిద్యాయం వాదించింది. ఆ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించాలన్న సిఐసి ఉత్తరువును 2017లో ఢిల్లీ కోర్టులో సవాలు చేసింది. ఆ కేసు ఇంకా తేలలేదు. గుజరాత్‌ విశ్వవిద్యాలయం తరఫున గుజరాత్‌ హైకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.ప్రత్యర్ధుల మీద క్షక్ష తీర్చుకొనేందుకు సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయటం పిల్లచేష్టలన్నారు.విశ్వవిద్యాలయం మోడీ డిగ్రీని బహిరంగంగా అందుబాటులో ఉంచిందన్నారు.ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1) జె ప్రకారం వివరాలను వెల్లడించనవసరం లేదన్నారు. ఏదైనా బహిరంగ కార్యకలాపం లేదా ప్రజాప్రయోజనం కాని లేనపుడు, ఒక వ్యక్తి గోప్యతలో అనవసరంగా చొరబడినపుడు, సమాచార వెల్లడిద్వారా విస్తృత ప్రజాప్రయోజనం కలుగుతుందని సబంధిత అధికారులు సంతృప్తి చెందితే తప్ప సమాచారం పొందలేరు.విశ్వవిద్యాలయం విశ్వాసపాత్రను పోషించేదిగా ఉన్నందున చట్టంలోని పై సెక్షన్‌ ప్రకారం సమాచారం ఇవ్వనవసరం లేదు అని వాదించారు.దాన్ని గుజరాత్‌ హైకోర్టు అంగీకరించింది.


” కొంత మంది జనాలు గౌరవనీయ ప్రధాని డిగ్రీలు నకిలీవని అంటున్నారు. పూర్తి రాజకీయ శాస్త్రంలో మోడీ పొందిన డిగ్రీ చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనదని నేను నిజంగా నమ్ముతున్నాను. కనుక దానిని కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవన ప్రధాన ప్రవేశద్వారం వద్ద ప్రదర్శించాలి, తద్వారా దాని గురించి సందేహాలు లేవనెత్తే వారి నోళ్లను మూయించవచ్చని శివసేన(ఉద్దావ్‌ థాకరే) నేత సంజయ రౌత్‌ అన్నారు.డిగ్రీలు నకిలీవని తేలితే ఉన్న లోక్‌సభ్యత్వం రద్దవుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండదని ఆప్‌ ఎంపీ సంజయ సింగ్‌ అన్నారు. నరేంద్రమోడీ పొందిన డిగ్రీలంటూ బిజెపి నేతలు గతంలో ప్రదర్శించిన కాపీలలో రోల్‌ నంబరు గానీ, తండ్రిపేరు గానీ లేదు. అందువలన అవి నకిలీ అని అనేక మంది భావిస్తున్నారు.1978లో డిగ్రీలను చేతిరాత ద్వారా జారీచేసేవారు. కానీ బిజెపి నేతలు చూపిన వాటిని కంప్యూటర్‌ అక్షరాలతో ప్రచురించినట్లుగా ఉంది.1994లో ఆ అక్షరాలకు మైక్రోసాప్ట్‌ పేటెంట్‌ హక్కు పొందింది. అలాంటిది 1978 డిగ్రీలో ఎలా ముద్రించారన్నది ప్రశ్న. అవీ తప్పుల తడకలు. ఎంఏ మొదటి భాగంలో నరేంద్రకుమార్‌ దామోదరదాస్‌ మోడీ అని ఉంటే రెండవ భాగంలో నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ అని ఉంది.
ఇంత రచ్చ జరుగుతున్నా నరేంద్రమోడీ నోరు మెదపటం లేదు. నిబంధనలకు భాష్యం,వాటిని కోర్టు ఆమోదించటం ద్వారా రక్షణ పొందుతున్నట్లుగా కనిపిస్తున్నది. అనేక మంది మోడీ భక్తులకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. నిందల పాలైన సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి పునీతగా వెలికివచ్చినట్లుగా నరేంద్రమోడీ కూడా వాస్తవాలు చెప్పి విమర్శకుల నోళ్లు ఎందుకు మూయించటం లేదని వారిలో వారు మధనపడుతున్నారు. కోర్టులు, నిబంధనలు ఎలా ఉన్నా నైతిక బాధ్యతగా ఎందుకు వెల్లడించరు,ఎందుకు పిరికిబారుతున్నారు అన్నది ప్రశ్న.

విప్లవకారుడిగా జైలుకు-విద్రోహిగా బయటకు వచ్చిన సావర్కర్‌పై రాహుల్‌ గాంధీ తోకముడిచారా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నాపేరు సావర్కర్‌ కాదు, గాంధీ, గాంధీలు క్షమాపణలు చెప్పరు అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య దుమారం లేపింది. సూరత్‌ కోర్టుకు రాహుల్‌ క్షమాపణ చెప్పి ఉంటే శిక్ష పడేది కాదు, లోక్‌సభ సభ్యత్వం రద్దు అయ్యేది కాదు అంటూ బిజెపి చేస్తున్న ప్రచారానికి ప్రతిగా పై విధంగా మాట్లాడారు. రాహుల్‌ అనర్హతకు నిరసనగా ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి తాము రావటం లేదని ఉద్దావ్‌ థాక్రే శివసేన వర్తమానం పంపింది, రాహుల్‌ సావర్కర్‌ మీద చేసిన విమర్శను దానికి కారణంగా చూపింది. దాంతో ఎన్‌సిపి నేత శరద్‌ పావర్‌ రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు, శివసేన హాజరైంది. తాను మరోసారి సావర్కర్‌ గురించి మాట్లాడనని రాహుల్‌ గాంధీ చెప్పారని వార్తలు వచ్చాయి. నిజంగా అలాగే చెప్పారా మరొకటా అన్నది అధికారికంగా ప్రకటించలేదు గనుక దాని గురించి పక్కన పెడదాం.


ఈ పరిణామాల నేపధ్యంలో కాషాయ మరుగుజ్జు దళాలు రంగంలోకి దిగాయి.సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ కేసు దాఖలు చేస్తానని హెచ్చరించటంతో సావర్కర్‌ మీద చేసిన ట్వీట్లను రాహుల్‌ గాంధీ వెనక్కు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో ప్రచారం చేశారు. ఏం జరిగిందనేది తరువాత చూద్దాం. సావర్కర్‌ క్షమాపణ గురించి మరోసారి చర్చకు తెరలేవటంతో అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అసలు సావర్కర్‌ ఎందుకు క్షమాపణ చెప్పారు, ఎవరికి చెప్పారు ? ఎప్పుడు చెప్పారు అని సందేహాలను లేవనెత్తారు. ఇది సహజం. సావర్కర్‌ గొప్ప స్వాతంత్య్రసమర యోధుడు గనుక భారత రత్న ఇవ్వాలన్నవారు కొందరు నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు, గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చేసిన వాగ్దానాల్లో అది ఒకటి. ఆ మాటకొస్తే జాతిపితను హత్యచేసిన గాడ్సేను కూడా పూజిస్తూ చివరకు గుడులు కట్టేందుకు కూడా సిద్దపడుతున్నవారు రెచ్చిపోతున్న రోజులివి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి,ఉద్దావ్‌ థాక్రే శివసేన ఒక కూటమిలో ఉన్నందున వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం బిజెపి-ఏకనాధ్‌ షిండే శివసేన కూటమి ఈ ఏడాది మే 28వ తేదీ నుంచి వారం రోజుల పాటు సావర్కర్‌ జన్మదిన వారోత్సం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు పూనుకుంది. దానికి రాహుల్‌ గాంధీ విమర్శ ఒక పెద్ద అవకాశాన్నిచ్చింది.


” ఈ రోజు సావర్కర్‌ ఒక జాతీయ అంశం కాదు, పాతది.దేశంలో కేంద్రీకరించేందుకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మేము కూడా సావర్కర్‌ గురించి కొన్ని అంశాలు మాట్లాడాము, కానీ అది వ్యక్తిగతమైనది కాదు. అది హిందూ మహాసభకు వ్యతిరేకమైనవి.మరోవైపు కూడా చూడాలి. సావర్కర్‌ చేసిన సేవలను మనం విస్మరించలేము. 32 సంవత్సరాల నాడు సావర్కర్‌ గురించి నేను పార్లమెంటులో మాట్లాడాను ” అని ఆదివారం నాడు శరద్‌ పవార్‌ నాగపూర్‌లో విలేకర్లతో చెప్పారు. దేశంలోని సమస్యల గురించి విదేశీ గడ్డ మీద ఒక భారతీయుడు మాట్లాడం ఇదే మొదటిసారి కాదు అంటూ రాహుల్‌ గాంధీని సమర్ధించారు. సావర్కర్‌ను విమర్శించినందుకు రాహుల్‌ గాంధీని దేశం క్షమించదని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆదివారం నాడు అన్నారు. ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ రాహుల్‌ పది జన్మలెత్తినా సావర్కర్‌ కాలేడన్నారు. సావర్కర్‌ జీవితాంతం స్వాతంత్య్రంకోసం పోరాడితే రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ వారితో కలసి దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపించారు.సావర్కర్‌ చేసిన త్యాగాల గురించి మహారాష్ట్ర వాసులకు తెలిపేందుకు రాష్ట్రమంతటా సావర్కర్‌ గౌరవ్‌ జాతా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఏకనాధ్‌ షిండే ప్రకటించారు.


ఇక కాషాయ మరుగుజ్జుల ప్రచారం గురించి చూద్దాం. సావర్కర్‌ మనవడు రంజిత్‌ ఇంతవరకు రాహుల్‌ గాంధీ మీద ఎలాంటి కేసు దాఖలు చేయలేదు, క్షమాపణ చెప్పకపోతే చేస్తానని బెదిరించారు.గతంలో కూడా ఇలాంటి బెదరింపులే చేశారు. రాహుల్‌ గాంధీ గతంలో చేసిన ట్వీట్లు గానీ లేదా వ్యాఖ్యలను గానీ వెనక్కు తీసుకోలేదని పిటిఐ వార్తా సంస్థ, ఇతరులు స్పష్టం చేశారు. అసలు దాన్ని గురించే కాదు, ఇతర ఏ ఒక్కదాన్ని కూడా తొలగించలేదు. అలా చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిన వారే తమ ట్వీట్లను వెనక్కు తీసుకున్నారు లేదా పాత సామాన్ల గదిలో పడవేశారు. ” కేసు దాఖలు చేస్తానని సావర్కర్‌ మనవడు బెదిరించిన తరువాత వీర్‌ సావర్కర్‌ మీద చేసిన అన్ని ట్వీట్లను రాహుల్‌ గాంధీ వెనక్కు తీసుకున్నారు. ” అన్న ట్వీట్‌ను లక్షలాది మందిపేరుతో పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేశారు. స్వాతంత్య్రం కోసం సావర్కర్‌ ఏమి చేశారన్నది చర్చ. ఒక మేకపిల్లను సింహం మాదిరి ప్రచారం చేశారంటూ గతంలో ఒక విశ్లేషణ వెలువడింది.


సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.


తప్పుడు ప్రచారం చేయటంలో, ఇతరుల మీద నిందలు మోపటంలో కొందరు పేరు మోశారు.మహాత్మా గాంధీ సలహా మేరకే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి క్షమాపణ లేఖలు రాసినట్లు గతంలో రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ఆరోపించారు. దీనిపై 2021 నవంబరు 22వ తేదీ ఫ్రంట్‌లైన్‌ పత్రిక ఇంటర్వ్యూలో లాస్‌ ఏంజల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడు ప్రొఫెసర్‌ వినయ లాల్‌ సావర్కర్‌ గురించి చేస్తున్న అనేక తప్పుడు ప్రచారాలను సవాలు చేశారు. దానిలో కొన్నింటి సారాంశం ఇలా ఉంది. రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పిన అంశం పూర్తిగా నిరాధారం, అల్లిన కట్టుకథ, మహాత్మాగాంధీ సలహా ఇచ్చినట్లు ఏ చిన్న ఆధారం కూడా లేదు. మంత్రికంటే ముందే అనేక మంది దీని గురించి చెప్పారు. 1911లో సావర్కర్‌ రాసిన క్షమాపణ పిటీషన్‌ కాపీ దొరకటం లేదు గానీ 1913 తరువాత రాసినవి అందుబాటులో ఉన్నాయి. ఇతర ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించిన బ్రిటిష్‌ సర్కార్‌ తమ సోదరుడికి వర్తింప చేయలేదని, మీరేమైనా చేయగలరా అంటూ 1920 జనవరి 18న సావర్కర్‌ సోదరుడు మహాత్మాగాంధీకి లేఖ రాశారు. మీ లేఖ చేరింది, మీకు సలహా ఇవ్వటం కష్టం అని గాంధీ జవాబు రాశారు. తరువాత ఒక ఆర్టికల్లో ఇతర రాజకీయ ఖైదీల మాదిరి సావర్కర్‌ సోదరులు క్షమాభిక్షకు అర్హులే అని రాశారు తప్ప మరొకటి కాదు.సావర్కర్‌ మద్దతుదారులు, భక్తులు చిత్రిస్తున్నమాదిరి హీరో కాదు.దేశ స్వాతంత్య్రం కోసం చేసింది చాలా తక్కువ.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూమహాసభ కూడా చేసిందేమీ లేదు, బ్రిటిష్‌ వారితో కుమ్మక్కు అయ్యారు. దేశ విభజనకు ద్విజాతి సిద్దాంతాన్ని ప్రతిపాదించింది జిన్నా అని చెబుతారు గానీ జిన్నాకంటే ముందే సావర్కర్‌ ప్రతిపాదించారు. అంబేద్కర్‌ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. పరస్పరం వ్యతిరేకించకపోగా ఇద్దరిదీ ఒకే అభిప్రాయం, విభజన జరగాలని గట్టిగా కోరారు అని థాట్స్‌ అన్‌ పాకిస్తాన్‌ (1940) అనే పుస్తకంలో అంబేద్కర్‌ రాశారు. అని లాల్‌ పేర్కొన్నారు.


విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ” సంఘపరివార్‌కు అనుకూలంగా ఉన్న అనేక మంది చరిత్రకారులు హరప్పా నాగరికతను సరస్వతి నాగరికతగా చిత్రించటంలో ఇది కనిపిస్తుంది. గతంలో ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌లో మార్పులు చేసేందుకు చూశారు. దీని మీద దేశంలో ఎందుకు వ్యతిరేకత లేదు ? ” అని వినయ లాల్‌ పేర్కొన్నారు.చరిత్రను తిరగరాయదలచుకున్నవారికి వాస్తవాలు, శాస్త్రీయ అవగాహనతో పని ఉండదని సంఘపరివార్‌ ప్రేరేపిత రాతలు వెల్లడిస్తున్నాయి. వీరత్వంగురించి రాస్తూ అండమాన్‌ జైల్లో ఉన్నపుడు సావర్కర్‌ పికిలి పిట్ట (బుల్‌బుల్‌) రెక్కల మీద ఎక్కి వెలుపలికి వచ్చి దేశంలో పర్యటించి తిరిగి వెళ్లేవారని కర్ణాటక ఎనిమిదవ తరగతి పుస్తకంలో రాశారు.అదే పుస్తకంలో మహాత్మాగాంధీ హత్య ప్రస్తావన లేదు. అంతకు ముందు రాజస్తాన్‌లో ప్రచురించిన పుస్తకాల్లో హల్దీఘటీ పోరులో అక్బర్‌ మీద మహరాణా ప్రతాప్‌ గెలిచినట్లు రాశారు.

పాకిస్తాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి మూడు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని భారత దేశ పిత అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించాడు.

దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తణ ప్రాయంగా అర్పించాడు. ఎంత తేడా, అసలు సిసలు దేశభక్తుడు, నకిలీకి ఉన్న తేడాను గుర్తించలేని స్థితిలో జనం ఉన్నారని భావించేవారే సావర్కర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు.


‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి చిత్రాలతో సహా పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు. 1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ దాని గురించి రాసి ఉండవచ్చు తప్ప వేరు కాదు. అసలు సిసలు చరిత్ర పేరుతో వక్రీకరణలతో నకిలీ చరిత్రను జనాల మీద రుద్దాలని చూస్తున్నారు.

పగలబడి నవ్వుతున్న గురివిందలు : గుజరాత్‌ సిఎంగా మోడీ సిబిఐని ఏమన్నారో తెలుసా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” యువత ముందు నిలుచొని చెబుతున్నాను, ఢిల్లీలోని ప్రభుత్వం సిబిఐని చూపి మమ్మల్ని భయ పెట్టలేదు ” ” సిబిఐ మీద దేశం విశ్వాసం కోల్పోయింది” ” సిబిఐకి భయపడని వారిలో నేను ఒకడిని ” ” మీరు ఏమైనా చేసుకోండి, కానీ సిబిఐ భయంతో అభివృద్ధి బాటను వీడేది లేదు ” ” పరిణామాలు ఎలా మారతాయో నాకు తెలుసు, కానీ మేము సిద్ద పడి ఉన్నాం ” పాఠకులకు ఈ మాటలు ఎవరివో అర్ధమయే ఉంటాయి. ఇంకెవరివి ! మోడీ ఏలుబడిలో వేధింపులకు గురవుతున్న ప్రతిపక్ష నేతలు చేసిన ప్రకటనలు అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎం పదవిలో ఉన్నపుడు చేసిన ఆరోపణలు. మోడీ అంటే అవినీతి అని అర్ధం అంటూ గతంలో తాను చేసిన ట్వీట్‌ను తొలగించటం లేదని బిజెపి నేత కుషుబూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సిబిఐ గురించి మోడీ చెప్పిన ఈ అంశాలు నరేంద్రమోడీ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అంతే కాదు మోడీ చెప్పిన సుభాషితాలు ఇంకా ఇలా ఉన్నాయి. ” సిబిఐ అంటే కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ” ” గుజరాత్‌ను కించపరిచేందుకు అబద్దాలు చెప్పవద్దు ” ” సిబిఐని రాజకీయమయం కావించేందుకు సమయాన్ని ఖర్చు చేసే బదులు ఉత్తరాఖండ్‌లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయ పడేందుకు వెచ్చించండి ” అని కూడా చెప్పారు.2013 జూన్‌ 24న గాంధీనగర్‌లో స్వామి వివేకానంద ఉపాధి వారంలో భాగంగా జరిగిన సభలో నరేంద్రమోడీ ప్రసంగించారు.పైన పేర్కొన్న ఆరోపణలన్నీ అక్కడ చేసినవే.ఈ రోజుల్లో పత్రికల్లో సగం వార్తలు సిబిఐ సంబంధమైన వాటితో నింపుతున్నారు. అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు.వారి రాజకీయ యజమానులను సంతృప్తి పరచేందుకే ఇలా చేస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు.మీరు పోటీ పడాలనుకుంటే పడదాం.ఎవరు ఎన్ని ఉద్యోగాలను ఇవ్వగలమో చూసుకుందాం అని కూడా మోడీ సవాల్‌ చేశారు. అప్పటికే నరేంద్రమోడీని తమ నేతగా లోక్‌సభ ఎన్నికల్లో రంగంలోకి దించేందుకు బిజెపి నిర్ణయించిన పూర్వరంగంలో చేసిన ప్రసంగమది.


అలాంటి మోడీ గుజరాత్‌ సిఎంగా ఉండగా ఒక నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఇరికించేందుకు సహకరించాల్సిందిగా కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా సిబిఐ తనపై వత్తిడి తెచ్చిందని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. తన మీద వత్తిడి తెచ్చినప్పటికీ దాని గురించి బిజెపి ఎన్నడూ రచ్చ చేయలేదని కూడా షా చెప్పారు. కాంగ్రెస్‌ పాలకుల మీద ఎంత ఉదారత ! మరి ఇప్పుడెందుకు చెప్పినట్లు ? అన్న ప్రశ్న జనంలో తలెత్తుతోంది.కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శల మీద అమిత్‌ షా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా ఈ అరోపణ చేశారు అన్నది స్పష్టం. అవినీతి పరులందరూ ఒక దగ్గర చేరుతున్నారంటూ ప్రతిపక్షాల మీద నరేంద్రమోడీ దాడి చేసిన తరువాత అమిత్‌ షా ఈ మాటలను చెప్పి చర్చను పక్కదారి పట్టించేందుకు చూశారు. పరువు నష్టం కేసులో శిక్ష పడిన రాహుల్‌ గాంధీ హైకోర్టులో అప్పీలుకు పోకుండా ప్రధాని మోడీని నిందిస్తూ రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. అప్పీలు చేసుకోవాలా లేదా అనేది రాహుల్‌ గాంధీకి చెందిన అంశం. ఏమి చేయాలో కూడా బిజెపి నేతలు చెబుతారా ? లేక వారు అనుకున్న విధంగా జరగటం లేదని ఉక్రోషమా ? శిక్ష విధించిన కోర్టు అప్పీలుకు ఇచ్చిన గడువు గురించి తెలిసినప్పటికీ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు లోక్‌సభ సచివాలయం ఎందుకు తొందరపడిందో అమిత్‌ షా చెప్పి ఉంటే బాగుండేది.


రాజస్తాన్‌లోని మార్బుల్‌ వ్యాపారులు తమను వేధిస్తున్న గుజరాత్‌కు చెందిన సొహ్రబుద్దీన్‌ షేక్‌ను అదుపు చేయాలని కోరగా నాడు రాష్ట్ర హౌంమంత్రిగా ఉన్న అమిత్‌ షా ఆదేశాల మేరకు పోలీసులు 2005లో సొహ్రబుద్దీన్‌తో పాటు అతని భార్య కౌసర్‌ కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై అమిత్‌ షా రాజీనామా చేశారు, అదే కేసులో సిబిఐ అరెస్టు చేసింది. సొహ్రబుద్దీన్‌ లష్కరే తోయిబాకు చెందిన వాడని, నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు గుజరాత్‌ పోలీసులు ఆరోపించారు. అమిత్‌ షా ఆదేశాల మేరకు అతన్ని చంపినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని, దాని గురించి సిఎం నరేంద్రమోడీకి తెలుసా లేదా అని నిర్ధారణ చేసుకొనేందుకు మోడీని కూడా ప్రశ్నించవచ్చని సిబిఐ భావించినట్లు వార్తలు వచ్చాయి. నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసుల భయంతోనే నరేంద్రమోడీ సిబిఐ మీద దాడులు చేస్తున్నట్లు 2013లోనే కాంగ్రెస్‌ విమర్శించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సిబిఐ పనిచేస్తోందని కూడా గుర్తు చేసింది.


సిబిఐపై నరేంద్రమోడీ పదే పదే దాడి చేశారు. ఒక్క సిబిఐ మీదనే కాదు, చివరికి కోర్టులు, జడ్జీలను కూడా లాగారు.భావనగర్‌లో 2010 జూలై 31న మాట్లాడుతూ ” గుజరాత్‌ నుంచి కేసులను బదిలీ చేయాలని సిబిఐ చెబుతున్నది. ఇది గుజరాత్‌లోని కోర్టులను, లాయర్లను అమానించటమే, ఎంతకాలం దీన్ని సహించాలి ? మన న్యాయవిశ్వవిద్యాలయాలను మూసుకోవాలా, లాయర్లు రోడ్డున పడాలా ? తొలుత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. తరువాత పోలీసులు, ఇప్పుడు కోర్టులు. నా రక్తం ఉడికి పోతోంది. గుజరాత్‌ దేశంలో భాగం కాదా, ఒక శత్రు రాష్ట్రంగా ఎందుకు పరిగణిస్తున్నారు. ఉగ్రవాదం మీద పోరు జరపకుండా నన్ను నిరోధిస్తున్నారు.ఓటు బాంకు రాజకీయాల్లో భాగంగా నిందితులను అరెస్టు చేయటం లేదు. నా సన్నిహితుడు అమిత్‌ షా మీద సిబిఐ కేసు నమోదు చేసింది.ఇది ప్రభుత్వాన్ని బలహీనపరిచే రాజకీయ ప్రయత్నమే. నరేంద్రమోడీని భయపెట్టే ప్రయత్నాలు మానుకోండి.అతన్ని భయపెట్టలేరు. ఇది జాతీయవాదులు, జాతి వ్యతిరేకుల మధ్య పోరు, గుజరాత్‌ యుద్ధభూమి. గుజరాత్‌ గెలుస్తుంది.” అని చెప్పారు.


అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒక దగ్గరకు చేరుతున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్‌తో సహా 14 పార్టీలకు చెందిన వారు సిబిఐ, ఇడిలను తమ నేతల మీద ప్రయోగిస్తున్నారంటూ సుప్రీం కోర్టు తలుపు తట్టగా విచారణకు స్వీకరించింది. దీంతో మో-షా రంగంలోకి దిగారు. యుపిఏ 2004-14 పాలనా కాలంలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి కేవలం రు.ఐదు వేల కోట్ల విలువ గల ఆస్తులు మాత్రమే పిఎంఎల్‌ఏ కేసుల్లో స్వాధీనం చేసుకున్నారని తాము తొమ్మిది సంవత్సరాల్లో లక్షా పదివేల కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాని చెప్పారు. యుపిఏ పాలనా కాలంలో ఇడి 112 దాడులు చేసి రు.5,346 కోట్లు స్వాధీనం చేసుకోగా మోడీ అధికారానికి వచ్చాక ఎనిమిది సంవత్సరాల్లో 3010 దాడులు రు.99,356 కోట్ల ఆస్తి స్వాధీనం చేసుకున్నట్లుగా 2022 జూలై 27న పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం కాంగ్రెస్‌ ఏలుబడిలో సగటున ఒక్కో కేసులో 47.7 కోట్ల వంతున స్వాధీనం చేసుకోగా మోడీ పాలనలో అది రు.33 కోట్లుగా ఉంది. విదేశీమారకద్రవ్య అక్రమాల కేసులు ఇదే విధంగా 8,586 నుంచి 22,320కి పెరిగినట్లు ప్రభుత్వం చెప్పింది. దాడులు జరిపిన 3,010 కేసులలో చార్జి షీట్లు దాఖలు చేసింది 888 కేసుల్లో కాగా శిక్షలు పడింది 23 కేసుల్లో, వాటిలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రు.869 కోట్లని కూడా ప్రభుత్వం తెలిపింది. అందువలన దాడుల సంఖ్య పెరిగినా ఆస్తులను లక్ష కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించినా తేలిన కేసులు, స్వాధీన మొత్తాలను చూస్తే అది నామమాత్రమే అన్నది స్పష్టం.మోడీ ఏలుబడిలో 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి 3,555 మనీలాండరింగ్‌ కేసులు నమోదు కాగా చార్జిషీట్లు దాఖలు చేసింది 2022 మార్చి వరకు 992 మాత్రమే. అవినీతి అక్రమాల పట్ల తామెంత నిబద్దతతో ఉన్నదీ తమ ఏలుబడిలో కేసుల సంఖ్య పెరగటాన్ని సూచిస్తున్నదని ప్రభుత్వం చెప్పుకుంది. వాటిలో ఎక్కువ భాగం బెదరింపులు, కేసుల్లో ఇరికించేందుకు చేసిన దాడులే అన్నది విమర్శ.


అదానీకి 2014లో ఉన్న ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద 2022నాటికి 137 బి.డాలర్లకు పెరిగిందంటే అది సక్రమంగా జరిగింది కాదన్నది జగమెరిగిందే. గత తొమ్మిది సంవత్సరాల్లో మీకది నాకిది అన్నట్లుగా పంచుకుంటున్న ఉదంతాలు పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు , పారదర్శకతకు డిజిటల్‌ లావాదేవీలు, నల్లధనాన్ని అరికట్టినట్లు ఎన్నో కబుర్లు చెప్పారు. అంత పకడ్బందీగా చేస్తున్నపుడు అవినీతి పరులు తామర తంపరగా ఎలా పుట్టుకువస్తున్నట్లు ?విదేశీ మారక ద్రవ్య అక్రమాల(ఫెమా) కేసులను చూస్తే యుపిఏ పాలనలో 8,586 కేసులు దాఖలు కాగా 2,780 కేసుల్లో షోకాజ్‌ నోటీసలు ఇచ్చారు.తీర్పులు వచ్చిన 1,312 కేసుల్లో రు.1,754 కోట్ల మేరకు జరిమానా విధించారు. మోడీ ఎనిమిదేండ్ల పాలనలో 22,330 కేసుల్లో తీర్పులు వచ్చిన 5,160 కేసుల్లో విధించిన జరిమానా రు.6,376 కోట్లు. అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించని నరేంద్రమోడీ ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి దిగటం ఆశ్చర్యం కలిగించదు. గతంలో సిబిఐ మీద ఆరోపణలు చేసిన మోడీ సర్కార్‌ దాని డైరెక్టర్లుగా తమకు అనుకూలురైన అలోక్‌వర్మ,రాకేష్‌ అస్తానాలను నియమించటం వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవటం, ఆ ఇద్దరినీ తప్పించి మరొక స్వంత మనిషి నాగేశ్వరరావును కూర్చోపెట్టటం తెలిసిందే. ఇలాంటి నిర్వాకం ద్వారా సిబిఐ మీద విశ్వాసం పెంచినట్లు బిజెపి నేతలు చెబుతుంటే వాషింగ్‌ పౌడర్‌ నిర్మా గుర్తుకు వస్తున్నది. గత తొమ్మిది సంవత్సరాలలో సిబిఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన దాడులు, మోపిన కేసులు ప్రతిపక్షాలకు చెందిన వారి మీదనే, కొంత మందిని కేసులు మోపి లొంగదీసుకొని తమ పార్టీలో చేర్చుకోవటం, కొందరిని బెదిరించి పార్టీలోకి లాక్కోవటం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు తమ నిర్వాకాలను చూసుకోవాలి. తమ ప్రభుత్వ చర్యలను సమర్ధించుకోవటం చూస్తుంటే గురివిందలు గుర్తుకు వస్తున్నాయి. ఎదుటి వారి నలుపును చూసి పరిహాసం చేసే గురివిందలు తమ కింది నలుపును చూసుకోవు.

చైనాపై అమెరికా యుద్ధోన్మాద రంకెలు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇటీవలి వరకు అమెరికా తొత్తుగా ఉన్న హొండూరాస్‌ ఆదివారం నాడు తైవాన్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడ వామపక్ష శక్తులు అధికారానికి రావటమే ఈ మార్పుకు కారణం. మారుతున్న బలాబలాలకు నిదర్శనంగా 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది దేశాలు తైవాన్ను వదలి చైనాతో సంబంధాలు పెట్టుకున్నాయి. హొండూరాస్‌పై వత్తిడి తెచ్చేందుకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపిన అమెరికా చివరికి చేసేదేమీ లేక మీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ హొండూరాస్‌కు చెప్పింది. ఈ పరిణామం తైవాన్ను గుర్తిస్తున్న ఇతర దేశాల మీద కూడా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. తైవాన్ను గుర్తించినందుకు ప్రతిఫలంగా అమెరికా, తైవాన్నుంచి కూడా సదరు దేశాలకు పెట్టుబడులు, ఇతరంగా ప్రతిఫలం ముడుతున్నది. అది ఎంతో కాలం కొనసాగించలేరని ఒక్కొక్కటి జారుకుంటున్న తీరు వెల్లడిస్తున్నది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ ఏడవ తేదీ వరకు తైవాన్‌ ప్రాంత పాలకురాలు తై ఇంగ్‌ వెన్‌ లాటిన్‌ అమెరికా, అమెరికా తదితర దేశాలను సందర్శించనున్నారు. తైవాన్‌ వేర్పాటు వాదులకు ప్రపంచంలో ఎంతో మద్దతు ఉందని చెప్పి విశ్వాసం కల్పించేందుకు ప్రధానంగా ఆమె వెళుతున్నారు. పైకి ఏమి చెప్పినప్పటికీ తమకు చైనా నుంచి ముప్పు వస్తున్నదని ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. ఇదంతా అమెరికా అడిస్తున్న నాటకం అన్నది తెలిసిందే.


ఇటీవలి కాలంలో తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతున్నదనే భయం అమెరికాను పట్టి పీడిస్తున్నది.నడమంత్రపు సిరి నరం మీది పుండు కుదురుగా ఉండనివ్వవు అన్నట్లుగా అమెరికా ఆయుధ ఉత్పత్తిదారులు నిరంతరం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత, రక్తపాతాన్ని కోరుకుంటారు. దానికి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం పని చేస్తుంది.గత వారంలో అమెరికా మిలిటరీ జాయింట్‌ ఛీఫ్‌ల చైర్మన్‌ మార్క్‌ మిలే, అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ రక్షణశాఖ పార్లమెంటరీ ఉపకమిటీ ముందు మిలిటరీ విధానం, ఆలోచనల గురించి మాట్లాడారు. రికార్డు స్థాయిలో మిలిటరీ బడ్జెట్‌ ప్రధానంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినదని స్పష్టం చేశారు. చైనాతో పోరుకు తమను సన్నద్దం చేస్తుందని అన్నారు.ఉప సంఘం చైర్మన్‌ కెన్‌ క్లవర్ట్‌ తొలి పలుకులు పలుకుతూ అవసరమైతే ఈ రాత్రికి రాత్రే పోరుకు సిద్దంగా ఉండాలి, ప్రపంచంలో ఎదురులేని శక్తిగా వేగంగా నవీకరించాలని ప్రకటించాడు. చైనా మిలిటరీతో అమెరికా వ్యూహాత్మక పోటీ దృష్టితో రూపొందించిన బడ్జెట్‌ అని ఆస్టిన్‌ చెప్పాడు. మార్క్‌ మిలే మాట్లాడుతూ రానున్న పది సంవత్సరాల్లో పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో చైనా పెద్దదిగా ఉంటుందని, 2049 నాటికి మొత్తంగా సామర్ధ్యంలో అమెరికా మిలిటరీని అధిగమించనుందని వర్ణించాడు.ప్రస్తుతం మొత్తం 10,330 యూనిట్లు ఉన్నాయని, వాటిలో 4,680 చురుకైన విధుల్లో ఉన్నట్లు, అవి ఎంతగా అంటే వాటిలో అరవైశాతాన్ని 30 రోజుల్లో, పదిశాతాన్ని కేవలం 96 గంటల లోపుగానే మోహరించవచ్చని చెప్పాడు. ఈ సన్నద్దతను కొనసాగించేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించిందన్నారు.దీనితో ప్రతి విభాగాన్ని సంసిద్దం గావించవచ్చన్నారు.మొత్తం లక్ష కోట్ల డాలర్లను బైడెన్‌ సర్కార్‌ సిద్దం చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యను అవకాశంగా తీసుకొని ఎలాంటి టెండర్లతో నిమిత్తం లేకుండా అమెరికాతో సహ అనేక దేశాల్లో నేరుగా పరికరాలు, అస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. మిలిటరీ ఎత్తుగడల గురించి కూడా మిలే, ఆస్టిన్‌ వెల్లడించారు. దేశ ఉద్ధేశ్యాలు శాంతియుతమైనవే, హింసాకాండ జరగవచ్చనే బెదిరింపులతో అమెరికా తన ఆలోచనలను రుద్దాలి అవి విఫలమైతే హింసాకాండకు దిగాలి అన్నారు.యుద్దం కంటే ఖర్చు ఎక్కువ కానప్పటికీ యుద్దసన్నద్దత, నిరోధించటం కూడా అసాధారణ రీతిలో ఖర్చుకు దారితీస్తుంది. ఈ భారీ బడ్జెట్‌ యుద్దాన్ని నిరోధిస్తుంది, అవసరమైతే పోరుకు మనల్ని సన్నద్ద పరుస్తుందని మిలే వాదించాడు. ఇలాంటి మాటలతో అమెరికన్లను, ప్రపంచ జనాలను మభ్యపెట్టేందుకు గతంలో అనేక మంది మిలిటరీ అధికారులు చూశారు. దీని వెనుక మిలిటరీ పరిశ్రమల అధిపతులకు లబ్ది చేకూర్చే ఎత్తుగడ ఉంది. నిజానికి చరిత్రలో హిట్లర్‌ మిలిటరీ అధికారులు కూడా ఇదేవిధంగా మాట్లాడారు, జర్మన్లను మభ్యపెట్టారు. వారిలో ఒకడైన ఎరిక్‌ రాడెర్‌ జర్మన్‌ నావికాదళ అధికారి, రెండవ ప్రపంచ యుద్ద నేరాలను విచారించిన న్యూరెంబర్గ్‌ కోర్టులో చేసిన ఇదే వాదనలను తిరస్కరించి జీవితకాల శిక్ష వేశారు. జర్మనీకి దుష్ట ఆలోచనలు లేవని, మిలిటరీ బలంగా ఉంటే కోరుకున్న ప్రాంతాలను యుద్దంతో నిమిత్తం లేకుండా బలాన్ని చూపి పొందవచ్చని వాదించాడు. నిజానికి మిలిటరీని పెంచటమేగాక, దాడుల పధకంలో కూడా ఎరిక్‌ రాడెర్‌ చురుకైన పాత్రధారి అని కోర్టు నిర్ధారించింది. ఆర్థికంగా దిగజారుడును మిలిటరీ హింసాకాండద్వారా పూడ్చుకోవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు.” ఏ దేశంలోనూ లేని విధంగా చైనాలో సంపద, వృద్ది జరుగుతున్నట్లు మనకు కనిపిస్తున్నది.విపరీతంగా సంపద పెరిగితే ప్రపంచవ్యాపితంగా అధికారం కూడా అలాగే పెరుగుతుంది.ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న మనం ఎల్లవేళలా అదే స్థానంలో ఉండాలని ” మిలే చెప్పాడు.


సినిమాలు, టీవీ చిత్రాల ద్వారా అమెరికన్లకు ముప్పు ఎలా ఎటు వైపు నుంచి వస్తున్నదో చూపటం అక్కడ జరుగుతున్నది.వాటిలో గతంలో రష్యన్లు, ఇతర అమెరికా వ్యతిరేకులను ప్రతినాయకులుగా చూపే వారు. వారి మీద అమెరికన్లలో ద్వేషం పుట్టించేవారు. ఇప్పుడు చైనా, ఇతర దేశాల వారిని కూడా ప్రధానంగా చూపుతున్నారు.దానిలో భాగంగానే ఇటీవల కొన్ని అమెరికా సంస్థలు, పార్లమెంటులోని రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు కొన్ని ఊహాజనిత యుద్ద క్రీడలను కంప్యూటర్లలో సృష్టించి జనానికి చూపుతున్నారు. వాటి ప్రకారం 2025నాటికి తైవాన్‌ అంశం మీద అమెరికా-చైనా పోరుకు తలపడతాయని, దానిలో చైనా ఓడిపోతుందని చిత్రించారు. ఇది హాలీవుడ్‌ సినిమా వంటిదే. వాటిలో అమెరికా సిఐఏ గూఢచారులను తెలివిగలవారిగా ఇతర దేశాల వారిని దద్దమ్మలుగా చిత్రిస్తారు. నిజానికి ఇంతవరకు ఏ ఒక్క యుద్దంలోనూ అమెరికా గెలిచిన ఉదంతం లేదు. దాన్ని సిఐఏ పసిగట్టి తమ నేతలను హెచ్చరించి పరువు నిలిపిందీ లేదు. అమెరికా రిటైర్డ్‌ నావీ అధికారి మార్క్‌ మాంట్‌గోమరీ ఓర్లాండోలో రిపబ్లికన్‌ ఎంపీలకు చైనాతో పోరు అనే ఒక ఊహా చిత్రాన్ని చూపాడు. దానిలో వేలాది మంది అమెరికన్లు మరణిస్తారని, విమానవాహక నావలను ముంచివేస్తారని చిత్రించాడు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మిలిటరీలో పని చేస్తున్న వారిలో 15 నుంచి 50 మంది లేదా దేశం మొత్తంగా ఐదు నుంచి ఇరవైవేల మంది ఒక వారంలో మరణిస్తారని చూపాడు. దానిలో తైవాన్‌ రక్షణకు అమెరికా దళాలు చైనా ప్రధాన ప్రాంతంపై ఎలాదాడి చేసేది, దాని నౌకలను ఎలా ముంచేది, మిలిటరీని ఎలా చక్రబంధం చేసేది, వివిధ కోణాల్లో జరిగే పర్యవసానాలను చూపారు. ఇలాంటి వాటిని బూచిగా చూపి అమెరికా తన దుర్మార్గాలను జనంతో ఆమోదింప చేసుకునేందుకు చూస్తున్నది.ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా తైవాన్‌ ఆక్రమణకు చైనా పూనుకుంటే నేరుగా అమెరికా మిలిటరీని దింపుతారా అన్న ప్రశ్నకు జో బైడెన్‌ అవును అని సమాధానమిచ్చాడు.


ప్రజాబలం, పట్టుదలలో ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ మిలిటరీ రీత్యా అమెరికాతో 50 సంవత్సరాల నాడు వియత్నాం సరితూగే స్థితిలో లేదు. అయినా బతుకు జీవుడా అంటూ అమెరికా మిలిటరీ ఎలా పారిపోయిందీ ప్రపంచమంతా చూసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిందీ అదే. తాలిబాన్లకు సలాం కొట్టి అమెరికన్లు వెళ్లారు. అలాంటిది చైనాతో ఢకొీనగలమని అమెరికన్లను నమ్మించేందుకు అక్కడి యుద్ధోన్మాదులు చూస్తున్నారు. ” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో 2022 ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు మిలిటరీ డ్రిల్లుల ద్వారా చైనా చూపుతున్నది. వత్తిడి పెంచి రాయితీలు పొందేందుకు, వీలుగాకుంటే దాడికి తెగించేందుకు అమెరికా చూస్తున్నది. దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చాయి. దానికి ప్రతిగానే ఇటీవల షీ జింపింగ్‌ మాస్కో వెళ్లి పుతిన్‌తో మరింత గట్టిగా బంధానికి తెరతీశాడు. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని, ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారని వెల్లడైంది. చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను సిఐఏ ప్రకటించింది.


ఏడు దశాబ్దాల నాడున్న చైనాకు నేటి చైనాకు ఏ విధంగానూ పోలికే లేదు. ఇరాన్‌-సౌదీ ఒప్పందాన్ని కుదిర్చి తన పలుకుబడి ఏమిటో ప్రదర్శించింది. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.డేనియల్‌ ఎల్స్‌బర్గ్‌ బహిర్గతపరచిన పెంటగన్‌ పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది. ఇప్పుడు ఆ బలహీనతలన్నింటినీ అధిగమించింది. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. అందుకే నిప్పుతో చెలగాటాలాడవద్దని బైడెన్‌తో భేటీలో షీ జింపింగ్‌ హెచ్చరించగలిగాడు.

ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మాజీ హీరోయిన్‌ కుష్‌బూ తన పార్టీ బిజెపి నేతలను మెప్పించేందుకు తంటాలు పడ్డారు. గతంలో తాను కాంగ్రెస్‌ ప్రతినిధిగా మాట్లాడిన మాటలు పార్టీ నేతలవే తప్ప తనవి కాదని, అందువలన వాటిని ఇప్పుడు తాను వెనక్కు తీసుకోవాలను కోవటం లేదని చెప్పారు. మోడీలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్‌ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించటం, వెంటనే లోక్‌సభ సచివాలయం రంగంలోకి దిగి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్‌ నేతలు గతంలో కుష్‌బూ కూడా రాహుల్‌ మాదిరి వ్యాఖ్యలు చేశారని, ఆమె ఇప్పుడు బిజెపిలో ఉన్నారని గుర్తు చేశారు. వాటి మీద కుషఉ్బ మండి పడ్డారు. ఆమె ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్‌గా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 15న కాంగ్రెస్‌ ప్రతినిధిగా కుష్‌బూ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. ” ఇక్కడ మోడీ, అక్కడ మోడీ, ఎక్కడ చూస్తే అక్కడ మోడీ… లేకపోతే ఏమిటి ? మోడీ అనే పదానికి ముందు అవినీతి పరుల పేర్లు ఉంటున్నాయి.దాని అర్ధం తెలియటం లేదు. కనుక మోడీ అంటే అవినీతి పరులని అర్ధం మార్చుదాం. నీరవ్‌, లలిత్‌, నమో అంటే అవినీతి పరులంటే తగినట్లుగా ఉంటుంది.” అని ఉంది.


దీని గురించి కుష్‌బూ పిటిఐ విలేకరితో మాట్లాడుతూ ” నేను కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఒక కాంగ్రెస్‌ ప్రతినిధిగా నా బాధ్యత మాత్రమే నిర్వహించాను. అలాంటి భాషలోనే మేము మాట్లాడాల్సి ఉండేది, నేను సరిగ్గా అదే చేశాను. నేను పార్టీ నేతను అనుసరించాను.ఇది అతని భాష. కాంగ్రెస్‌ పార్టీ ఎంత తెంపరితనంతో ఉందో చూపటమే కాదు, ఈ అంశాన్ని లేవనెత్తటం ద్వారా వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందో కూడా వెల్లడిస్తున్నది. నా ఖాతా నుంచి నేను ఏ ఒక్క ట్వీట్‌ను కూడా తొలగించలేదు. ఇప్పుడు నేనా పని చేయను. నా పేరును ప్రస్తావించటం ద్వారా కాంగ్రెస్‌ నేతలు ఏం చేస్తున్నారు ? నన్ను రాహుల్‌ గాంధీతో సమానంగా చూస్తున్నారా ? మోడీలను దొంగలు అని పిలిచే స్థాయికి రాహుల్‌ గాంధీ దిగజారారు, నేను అవినీతి అనే పిలిచాను. తేడాను చూసే సామర్ధ్యం కాంగ్రెస్‌కు లేదు. కానీ వారికి దమ్ముంటే నా మీద కేసును దాఖలు చేయాలని సవాలు చేస్తున్నాను. చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాను. నేను నా ట్వీట్‌ను తొలగించను.అది అక్కడే ఉంది, ఇంకా అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌కు పని లేదు. మీ సమయాన్ని వెచ్చింది మరిన్ని ట్వీట్లను వెలికి తీయండి. ” అని. పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీతో తనను సమంగా చూసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అని కుష్‌బూ ట్వీట్‌ చేశారు.


కుష్‌బూ రాజకీయ ప్రయాణం 2010లో డిఎంకెతో ప్రారంభమైంది. మరుసటి ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. తనకు పార్టీలో తగినంత గుర్తింపు ఇవ్వలేదంటూ అదే ఏడాది రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేదని ఆరోపించారు. తరువాత బిజెపిలో చేరారు.వందకు పైగా సినిమాల్లో నటించిన 52 సంవత్సరాల కుష్‌బూ గత పోకడలను బట్టి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఆ పార్టీ నేత భాషనే మాట్లాడాను తప్ప ఆ విమర్శలు తనవి కాదని చెప్పుకున్న కుష్‌బూ విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్న. బిజెపిలో చేరిన తరువాత ఆమె చెప్పిన మాటలు కూడా ఆ పార్టీ నేతకు అనుగుణంగా మాట్లాడినట్లు భావించాల్సి ఉంటుంది. అలా మాట్లాడాలని (కాంగ్రెస్‌లో ఉన్నపుడు అలా మాట్లాడాల్సి వచ్చేదని ఆమే చెప్పారు గనుక) బిజెపి నిర్దేశించి ఉంటుంది గనుక నరేంద్రమోడీని పొగుడుతూ కుషఉ్బ మాట్లాడారన్నది స్పష్టం. బిజెపిలో చేరటాన్ని ఖరారు చేసుకున్న తరువాత ఆమె ఏం మాట్లాడిందీ చూద్దాం.” పార్టీ నాకేమి చేస్తుంది అన్నదాన్ని గురించి నేనేమీ ఆశించటం లేదు. కానీ దేశ ప్రజలకు పార్టీ ఏమి చేస్తుందీ అని చూస్తాను.నూట ఇరవై ఎనిమిది కోట్ల మంది ఒక మనిషిని అదే మన ప్రధానిని నమ్ముతున్నారు. వారు చేస్తున్నది పూర్తిగా సరైనదే అని భావిస్తున్నాను.” అని ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు. అధికార బిజెపిలో చేరే అవసరం కోసం తప్ప ఈ మాటలు నిజాయితీగా చెప్పినట్లు ఆధారం ఏమిటి ?


ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ రాహుల్‌ గాంధీ ఉదంతంపై తనదైన శైలిలో స్పందించి ఆదివారం నాడు ఒక ప్రశ్నను సంధించారు.తన ట్వీట్‌కు ఒక ఫొటోను జత చేశారు. దానిలో ఎడమవైపు లలిత్‌ మోడీ, మధ్యలో నరేంద్రమోడీ, కుడివైపున లలిత్‌ మోడీ చిత్రం ఉంది. అటూ ఇటూ ఉన్నవారు అక్రమాలకు పాల్పడి దేశం వదలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో పైన ” జనరల్‌ నాలెడ్జ్‌- ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏకైక అంశం ఏమిటి అని కేవలం అడుగుతున్నా అంతే ” అన్న వ్యాఖ్యను పెట్టారు. ముగ్గురి పేరులోనూ మోడీ ఉండటం అన్నది దాని భావం అని వేరే చెప్పనవసరం లేదు.” దొంగలందరికీ మోడీ అనే ఒకే ఇంటి పేరు ఎలా వచ్చింది ” అంటూ రాహుల్‌ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో అన్న మాటలు మోడీ కులం అంతటికీ పరువు నష్టం కలిగించినట్లు సూరత్‌ కోర్టులో బిజెపి నేత దాఖలు చేసిన కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడింది. మోడీ కులంతో సహా ఒబిసి లందరినీ రాహుల్‌ గాంధీ అవమానించారు అని బిజెపి ఒబిసిలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నది. తెలుగు ప్రాంతాల్లో ఒకే ఇంటి పేరు కలిగిన వారు అన్ని కులాల్లో ఉన్నారు. ఒకే కులంలో అనేక ఇంటి పేర్లు గలవారు ఉన్నారు. ఒబిసిల్లో మోడీ అనే కులమే లేదు. నరేంద్రమోడీ తెలీ ఘంచీ లేదా మోధ్‌ ఘంచీ అనే కులానికి చెందిన వారు. కొన్ని చోట్ల ఘంచీ అని కూడా పిలుస్తారు.(ఈ పేరుతో ముస్లింలు కూడా ఉన్నారు) ఈ కులానికి చెందిన వారు నూనె గానుగ ఆడించటం, నూనెను అమ్మటం ప్రధాన వృత్తిగా చేస్తారు. వీరిని వైశ్యుల్లో ఒక ఉపకులంగా కూడా పరిగణిస్తారు. కర్ణాటకలో ఈ పని చేసే వారిని గనిగ అని పిలుస్తారు.ఇక అవినీతికి పాల్పడి దేశం వదలి పారిపోయిన నీరవ్‌ మోడీదీ నరేంద్రమోడీది ఒకే కులం, మతం కూడా కాదు. నీరవ్‌ మోడీ జైన మతంలో పాలంపూరీ జైన్స్‌ కులానికి చెందిన వ్యక్తి.లలిత్‌ మోడీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. బీహార్‌కు చెందిన బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ వైశ్య, బిసి కాదు. గుజరాత్‌లో పార్వతికి మరో పేరు మోదేశ్వరీ దేవి. అందువలన గుజరాతీలు అనేక మంది ఆమె పేరు కలసి వచ్చేట్లుగా మోడీ అని అడా మగా అందరూ పెట్టుకుంటారు.


మోడీ ఇంటి పేరు గలవారిని అవమానపరిచినట్లు రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు మొత్తం ముస్లిం సామాజిక తరగతినే ఉగ్రవాదులు అనే అర్ధం వచ్చేట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ” ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే ” అంటున్నారా లేదా ?కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ ” నేను ఒక సామాజిక తరగతిని నిందించటం లేదు గానీ ఉగ్రవాద చర్యలలో పట్టుబడిన వారందరూ ఒక సామాజిక తరగతికే చెందిన వారన్నది నిజం కాదా ? లౌకిక పార్టీలం అని చెప్పుకొనేవి ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు ? ” అని ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా 2022 మే ఆరవ తేదీన కోజికోడ్‌లో మాట్లాడుతూ ముస్లిం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా కేరళ మారినట్లు మాట్లాడారు. ఇది మొత్తం కేరళనే అవమానించినట్లు కాదా ? దీన్లో పరువు నష్టం అంశం లేదా ? ఎవరైనా కేసు వేసినా లేకున్నా సూరత్‌ కోర్టు తీర్పు స్ఫూర్తితో నడ్డాను రాజ్యసభ సచివాలయం అనర్హుడిగా ప్రకటిస్తుందా ?


బిజెపిలో నోటి తుత్తర మనుషులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ కిషోర్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ గనుక ఒక తెల్లమహిళను కాకుండా ఒక నైజీరియన్‌ మహిళను చేసుకొని ఉండి ఉంటే ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఆమోదించి ఉండేదా అని ప్రశ్నించారు.నిజానికి ఇది ఒక్క నైజీరియన్‌ మహిళలనే కాదు, మొత్తం మహిళలను అవమానించినట్లు ? జాత్యహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. దీని గురించి తాము నిరసన తెలపటం లేదంటూ, ప్రధాని నరేంద్రమోడీ దీన్ని సరిచేయగలరని భావిస్తున్నట్లు మన దేశంలో నైజీరియన్‌ రాయబారి ఓబి ఓకోంగొర్‌ ఎంతో హుందాగా స్పందించాడు. కానీ నరేంద్రమోడీ సరి చేసినట్లు గానీ, గిరిరాజ్‌ సింగ్‌ తన ప్రకటనను సవరించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు.ఈ పెద్దమనిషి నోటి నుంచి ఇలాంటి సుభాషితాలకు కొదవ లేదు. నరేంద్రమోడీని వ్యతిరేకించే వారందరూ పాకిస్తాన్‌ పోవాల్సిందే అని 2014 ఎన్నికల ప్రచారం సెలవిచ్చారు.కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో నాడు సిఎంగా ఉన్న నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తూ నరేంద్రమోడీని చూసి ఓర్చుకోలేక ”పల్లెటూరి ఆడదానిలా” పోట్లాడుతున్నట్లు వర్ణించారు. ఇది గ్రామీణ ప్రాంతాల మహిళలు అందరినీ అవమానించినట్లే కదా ! షహరాన్‌ పూర్‌లోని ముస్లిం మత కేంద్రం దారులు ఉలుం దేవబంద్‌ను ఉగ్రవాద దేవాలయం అని ఇదే మంత్రి వర్ణించారు. బాబరీ మసీదు భూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసినపుడు మంత్రికి కోపం వచ్చింది.” ఈ వంద కోట్ల మంది హిందువులు కూడా మీ సోదరులే అని గుర్తించాలని ముస్లింలను కోరుతున్నాను. మీరు మూడు లక్షల మసీదులను ఏర్పాటు చేస్తే ఎవరూ అడ్డుకోలేదు. ఇప్పుడు హిందువుల సహనాన్ని పరీక్షించవద్దు.రాముడి మీద నాకు విశ్వాసం, ఆయన ఆలయాన్ని ఆయోధ్యలో నిర్మించాలి.హిందువుల విశ్వాసానికి రాముడు మూలం.దీన్ని హిందూ – ముస్లిం సమస్యగా మార్చాలని చూసింది.హిందువుల్లో సహనం నశిస్తున్నది” అని అన్నారు. హిందువేతరులందరూ అక్రమ సంతానమే అంటూ నోరు పారవేసుకున్న సాధ్వి నిరంజన గురించి తెలిసిందే. పాలకులుగా రాముడిని అనుసరించే వారు కావాలో అక్రమ సంతానానికి పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని 2014 ఎన్నికల సభలో మాట్లాడారు. ఆ మాటలను మోడీ తప్పు పట్టటంతో ఆమె క్షమాపణ చెప్పారు గానీ ఆమెకు కేంద్ర మంత్రిపదవి బహుమానంగా దక్కింది.


ఉగ్రవాదానికి సంబంధించి సౌత్‌ ఆసియన్‌ టెర్రరిజం పోర్టల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఎవరి చేతుల్లో ఎందరు మరణించింది దిగువ విధంగా ఉంది. కాశ్మీర్‌ మరణాలను మొత్తంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదుల ఖాతాలో వేసినా, మావోయిస్టు, ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులందరూ హిందువులు, క్రైస్తవులే కదా ? వారిలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారన్నది తెలిసిందే.
సం××ఈశాన్య ××మావోయిస్టు×× కాశ్మీర్‌
2011 ×× 246 ×× 602 ×× 225
2012 ×× 326 ×× 367 ×× 206
2013 ×× 252 ×× 421 ×× 193
2014 ×× 465 ×× 314 ×× 193
ఈ వివరాలను చూసిన తరువాత ఎవరైనా ఉగ్రవాదులందరూ ఒక సామాజిక తరగతి లేదా ముస్లింలే అని ఎలా చెప్పగలరు ? ఉగ్రవాదానికి ముస్లిం మతానికి ముడి పెట్టి విశ్లేషణలు చేస్తున్నవారి సంగతేమిటి ? అనేక ముస్లిం దేశాల్లో ఉగ్రవాద చర్యలను ఎలా వర్ణిస్తారు ?


విద్వేషపూరిత ప్రసంగాలకు కాషాయదళాలు పెట్టింది పేరు. కొందరి నోళ్ల నుంచి వెలువడిన ఆ మాటలు పరువు తీసేవిగానూ, సమాజంలో కలతలు రేపేవిగానూ ఉన్నాయి. ఎందరి మీద కేసులు నమోదు చేశారు, ఎందరికి శిక్షలు వేసి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేశారు ? కోర్టులు కూడా తమంతట తాముగా తీసుకోవచ్చు, ఎన్ని ఉదంతాల్లో తీసుకున్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాధ్‌ 34 సందర్భాలలో ముస్లిం విద్వేష ప్రసంగాలు చేసినట్లు వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ నమోదు చేసి ప్రచురించింది. మధ్య ప్రదేశ్‌లో గడ్డం ఉన్న ఒక భవర్‌లాల్‌ జైన్‌ అనే వృద్దుడిని నువ్వు ముస్లిమ్‌వా, ఆధార్‌ కార్డుచూపమంటూ దాడి చేసిన బిజెపి నేత గురించి తెలిసిందే. తరువాత జైన్‌ శవం కనిపించింది. రావణుడ్ని దహనం చేసినట్లు ముస్లింలను కూడా చేయాలని బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ చెప్పారు. వారికి ఓటింగ్‌ రద్దు చేయాలని రెండో తరగతి పౌరులుగా చూడాలన్నారు. బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ అశ్వనీ ఉపాధ్యాయ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసు అరెస్టు చేస్తే తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. చేసింది కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే ఢిల్లీ పోలీసులు అని గమనించాలి. అతన్ని లాయర్‌గా పనికి రాడని ప్రకటించలేదు. ” ఏ హిందువైనా నాకు ఓటు వేయకపోతే వారి నరాల్లో మియా(ముస్లిం) రక్తం ఉన్నట్లే. అతను ఒక ద్రోహి. విద్రోహి జయ చంద్రుడికి పుట్టిన అక్రమ సంతానం.వాడి తండ్రి పాపపు కొడుకే.ఈ సారి నేను హెచ్చరిస్తున్నాను.హిందూ మత ద్రోహులను నాశనం చేస్తాం” ఈ మాటలన్నది బిజెపి ఉత్తర ప్రదేశ్‌ ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌. ఎంతో గౌరవ ప్రదమైన మాటలు గనుకనే అతని ఎంఎల్‌ఏ గిరి నిలిచిందనుకోవాలి. అదే రాష్ట్రానికి చెందిన మరొక బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర సింగ్‌ ” హిందువులు గనుక మేలుకుంటే మేము మీ మీగడ్డాలను లాగి గట్టిగా ముడివేస్తాం.మీరు హిందూస్తాన్‌లో ఉండాలంటే రాధే రాధే అనాలి ” అన్నారు. బక్రీద్‌ సందర్భంగా అమాయకపు జంతువులను కాదు మీ పిల్లలను బలి ఇవ్వాలంటూ 2020లో మరో బిజెపి ఎంఎల్‌ఏ నంద కిషోర్‌ గుజార్‌ అన్నారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.వాటి మీద ఎలాంటి కేసులు లేవు, ఉన్నా శిక్షలు పడిన దాఖలాల్లేవు !

అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” భారత్‌కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా ?” అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్ట్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ” భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ ” మార్చినెల 19వ తేదీ ఆదివారం నాడు లండన్‌ నుంచి వెలువడే మరో పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తన విశ్లేషణకు పెట్టిన శీర్షిక.” ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్లు కోల్పోతున్న గౌతమ్‌ అదానీ, గరిష్ట స్థాయి నుంచి 60శాతం పడిన సంపద ” అని ఎకనమిక్‌ టైమ్స్‌ మార్చి 22న ఒక విశ్లేషణను పాఠకులకు అందించింది. జాతీయవాదం పేరుతో తెలిసో తెలియకో ఊగిపోతున్నవారికి, మోడీ ఏలుబడిలో అచ్చేదిన్‌, అమృత కాలం అని నిజంగా నమ్ముతున్నవారికి లండన్‌ పత్రికల విశ్లేషణలు రుచిస్తాయా ? ఎవరేమి రాశారు ఎందుకు రాశారు అన్నది కాసేపు పక్కన పెట్టి నిజానిజాల గురించి లేవనెత్తిన అంశాల గురించి ఉద్రేకానికి లోనుకాకుండా ఆలోచించాలి.


” కష్టాల్లో కూరుకుపోయిన శతకోటీశ్వరుడు గౌతమ్‌ అదానీకి గత ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్ల రూపాయలమేర దెబ్బతగిలింది. అతని సంపద 53 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని (మార్చి 22న విడుదల చేసిన) ఎం3ఎం హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ జాబితా 2023లో చూపారు ” అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషకుడు ఒకరు విశ్లేషణను ప్రారంభించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎన్ని రోజులైనా పార్లమెంటు జరగకపోయినా సరే అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించేది లేదంటూ భీష్మించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టుదల పట్టుదల ఒకవైపు. ఎలాగైతేనేం ఎంత డబ్బు సంపాదించారనేదే ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తున్న సమాజం మరొక వైపు కనిపిస్తున్నపుడు తరిగిపోతున్న అదానీ సంపదల గురించి గుండెలు బాదుకోక ఏమి చేస్తారు.


2022 సెప్టెంబరు చివరి వారంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ జాబితా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో అదానీ కుటుంబం రోజుకు రు.1,612 కోట్లు, ముకేష్‌ అంబానీ రు.210 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నది. ఒక దశలో అదానీ కంటే అంబానీ సంపద రు. రెండు లక్షల కోట్లు ఎక్కువ, అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని వెనక్కు నెట్టి అదానీ మూడులక్షల కోట్లు ఎక్కువ, అంటే ఏడాదిలో ఐదులక్షల కోట్లు సంపాదించాడు. అబ్రకదబ్ర, మాయలు మంత్రాలు చేసే గంధర్వులకు, మిత్రమా ఏమి నీ కోరిక, తథాస్తు అనే పైవారు ఉంటే తప్ప మానవ మాత్రులకు సాధ్యమా ? 2012లో అంబానీ సంపదతో పోలిస్తే అదానీ దగ్గర ఆరోవంతు మాత్రమే ఉంది. 2014లో కేవలం ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎదిగారు. వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నవారికి సాధ్యం కానిది ఇంత స్వల్పకాలంలో అదానీకి ఎలా వచ్చింది, ఇతరులకు ఎందుకు రాలేదు అన్నది ఎప్పుడైనా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషించిందా ? మిగతా పత్రికల తీరుతెన్నులు కూడా అవే. బ్లూమ్‌బెర్గ్‌ తాజా బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 24న 119 బి.డాలర్ల సంపద ఉన్న అదానీ ఇప్పుడు 57.2 బి.డాలర్లకు దిగజారారు.హరూన్‌ సంస్థ అంచనా 53బి.డాలర్లుగా ఉంది. ముకేష్‌ అంబానీ 82బి.డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.


దేశం వృద్ది చెందటం లేదని ఎవరూ చెప్పరు. దాని ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే చర్చ. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు పెరుగుతున్నది కొన్నే. పోనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతున్న ఊటసిద్దాంతం ప్రకారం పెరిగిన సంపదలు దిగువ వారికి చేరుతున్నాయా అంటే చివరికి అచ్చేదిన్‌, తాజాగా అమృత కాలం అని చెప్పిన నరేంద్రమోడీ తొమ్మిదేండ్ల పాలన తరువాత మన్‌కీ బాత్‌లో కూడా చెప్పే ధైర్యం చేయలేదు.దేశంలో జనవరిలో 7.14శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరిలో 7.45శాతానికి పెరిగిందన్న సిఎంఐఇ సమాచారాన్ని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఉటంకించింది. నైపుణ్య శిక్షణ పథకాన్ని మన్మోహన్‌ సింగ్‌ కాలంలోనే ప్రారంభించారు. దానికి ఒక మంత్రిని, కేటాయింపులను పెంచి అసలు దానికి ఆద్యుణ్ణి తానే అన్నట్లుగా నరేంద్రమోడీ ప్రచారం చేసుకున్నారు. నిజం ఏమిటి ? ” మనది ప్రధానంగా కార్పొరేట్‌ వృద్ది మాత్రమే. ఒక యూనిట్‌ ఉత్పాదనకు భారత కార్పొరేట్లు ఎక్కువ మంది జనాలను నియమించటం లేదు.ఒక వైపు యువతకు ఉద్యోగాలు రావటం లేదు. మరోవైపు తమకు నిపుణులైన జనాలు దొరకటం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. జీవితకాల ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగం అవసరమని ఆకాంక్షిస్తున్నారు, నూటనలభై కోట్ల మంది జనాభాతో పోలిస్తే అవి చాలా తక్కువ.” అని ప్రణాళికా సంఘ మాజీ ప్రధాన సలహాదారు ప్రణబ్‌ సేన్‌ చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ” నైపుణ్యాలు దొరకటం మరొక సమస్య. అనేక కంపెనీలు ఇప్పటికే డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను వృద్ధి చేసుకున్న వారిని తీసుకుంటున్నాయి.భారత్‌లో ఫైనాన్స్‌, బీమా, రియలెస్టేట్‌, పొరుగుసేవలు, టెలికాం, ఐటి రంగాలలో ఎక్కువ వృద్ది ఉంది. కానీ ఇవి ఉపాధిని సృష్టించేవి కాదు ” అని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ఫ్రొఫెసర్‌ అమిత్‌ భోసలే చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది.


భారత్‌లో ఉపాధి సమస్య పరిష్కారం కావాలంటే ఇరవై సంవత్సరాల పాటు వార్షిక వృద్ది రేటు పద్దెనిమిది శాతం ఉండాలని ఐదేండ్ల క్రితం ప్రపంచబాంకు అంచనా వేసింది. చిత్రం ఏమిటంటే తన విధానాలతో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా జిడిపి వృద్ది రేటును తమ ప్రభుత్వం సాధిస్తున్నట్లు మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్నది. మోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరాల్లో ఐదుశాతానికి అటూ ఇటూగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుత 7-8శాతం మధ్య ఉంటున్నది. శ్రామిక శక్తి భాగస్వామ్య అంశంలో రెండు వందల దేశాల సమాచారాన్ని గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ విశ్లేషించింది. దాని ప్రకారం 2021లో 87.3శాతంతో కతార్‌ ఒకటవ స్థానంలో ఉంది. మన దేశంతో సమంగా జనాభా ఉన్న చైనా 68.6శాతంతో 42వది కాగా మన దేశం 45.57 శాతంతో 159వ స్థానంలో ఉంది. కరోనా కాలంలో 40శాతంలోపుకు పడిపోయింది. ఇరవై -ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు వారిలో 2022 అక్టోబరులో పట్టణ నిరుద్యోగం 42శాతం ఉండగా అదే చైనాలో 16-24 తరగతిలో 18శాతమే ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఏండ్ల లోపు వారు సగం మంది ఉన్నారు. అంటే ఉపాధి అవసరం ఎంత ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడున్న ధోరణుల ప్రకారం 2040నాటికి 59 ఏండ్లు పైబడిన వారు దేశంలో ఎక్కువ మంది ఉంటారని అంచనా.2024లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని కేంద్ర ప్రకటించింది. ఇవన్నీ సంవత్సరాల తరబడి నింపకుండా ఉంచిన ఖాళీలు.మెకెన్సీ సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల మేరకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.


దేశంలో ఉపాధి రహిత వృద్ది ఆందోళన కలిగిస్తోందని, వృద్ధికి అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా కూడా చెప్పారు. అమెరికాలో కార్మిక శక్తి భాగస్వామ్యం 62శాతం కాగా మన దేశంలో 40శాతమని(2022) చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2020 ఆర్థిక సర్వేలో 2025 నాటికి మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలను నాలుగు కోట్లు, 2030నాటికి ఎనిమిది కోట్లు కల్పించగలమని, చైనా తరహా వృద్ది విధానాన్ని అనుసరించాలని కూడా దానిలో పేర్కొన్నారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో స్విగ్గి, జొమాటో వంటి కాలక్షేప ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.గ్రామాల్లో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు.వృద్ధికి అనుగుణంగా ఉపాధి లేదు, ఉన్న ఉపాధికి పొందుతున్న వేతనం కూడా నామమాత్రంగా ఉంది. తగినంత వేతనం లేకుండా కొనుగోలు శక్తి పెరగదు. స్థానిక కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగానే ఎగుమతి మార్కెట్లో తేడాలు వచ్చినా చైనా తట్టుకోగలుగుతోంది. మన దేశంలో ఆ పరిస్థితి ఉందా ?


ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమెరికాలోని యుబిఎస్‌ సంస్థ ప్రపంచంలో ధరలు, రాబడి గురించి విశ్లేషణ వెల్లడిస్తుంది. న్యూయార్క్‌ నగరాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచంలోని ఇతర నగరాల్లో పరిస్థితిని అది పోలుస్తుంది. దాని తాజా నివేదిక ప్రకారం కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.నగదు డాలర్లని, కార్‌మెకానిక్‌, భవన నిర్మాణ కార్మికుల మొత్తాలను వార్షిక వేతనంగానూ, బ్రాకెట్లలో ఉన్న అంకెలు వారంలో పనిగంటలుగా గమనించాలి. న్యూయార్క్‌లో వంద డాలర్ల వేతనం ఉంది అనుకుంటే చైనాలోని షాంఘైలో 20.9, బీజింగ్‌లో 17, ముంబైలో 8.5, ఢిల్లీలో ఏడుగా ఉంది.
నగరం పేరు××వేతన స్థాయి ×× గంటవేతనం×× ఏడాది పనిగంటలు×× కార్‌మెకానిక్‌××నిర్మాణ కార్మికుడు
న్యూయార్క్‌ ×× 100 ×× 25.2 ×× 2,062 ×× 50,000(43) ×× 69,300
షాంఘై ×× 20.9 ×× 5.4 ×× 1,967 ×× 9,300 (40) ×× 6,700
బీజింగ్‌ ×× 17 ×× 4.5 ×× 1,979 ×× 8,500 (40) ×× 7,600
ముంబై ×× 8.5 ×× 2.3 ×× 2,251 ×× 2,100 (70) ×× 1,300
ఢిల్లీ ×× 7 ×× 2.1 ×× 2,265 ×× 1,900 (51) ×× 1,300
ఒక దేశ వృద్ధి రేటును నిర్దేశించే అంశాలలో వేతనాలు, కొనుగోలు శక్తి కూడా పాత్ర పోషిస్తాయి. మెరుగైన వేతనం లేకపోతే అంతర్గత డిమాండ్‌ పెరగదు. మన దేశం, చైనాల్లో కనీస వేతనాల పెరుగుదల తీరుతెన్నుల గురించి కంట్రీ ఎకానమీ డాట్‌కామ్‌ ఇచ్చిన సమాచార వివరాలు ఇలా ఉన్నాయి.వేతనాలు యూరో కరెన్సీలో ఉన్నాయి. మార్చి 24వ తేదీన ఒక యూరో రు.88.67గా ఉంది. మన దేశంలో 2020తో పోలిస్తే 2023 నాటికి కనీసవేతనం తగ్గినట్లు విశ్లేషణలో ఉంది.
కనీసవేతనం××2000×× 2010×× 2015×× 2020 ×× 2023
చైనా ×× 49.5 ×× 88 ×× 202.4×× 228.9×× 268.2
భారత్‌ ××26.8 ×× 38.8 ×× 54.2 ×× 57.7 ×× 55
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే చైనాలో వేతనాలు పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి కొన్ని విదేశీ కంపెనీలు వెళుతున్నాయని కొన్ని వార్తలు.చైనా నుంచి వెలుపలికి వెళ్లే కంపెనీలు అవి ఎన్నైనా ఇతర దేశాలకు వెళుతున్నాయి తప్ప మన ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక పథకాల ఆశ చూపినా మన వైపు చూడటం లేదు. కంపెనీలకు ఎక్కడ వేతనాలు తక్కువగా ఉంటే అక్కడకు వెళతాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ మన దేశానికి ఆ మేరకు రావటం లేదు, వచ్చిన దాఖల్లాలేవు.ఎందుకు రావటం లేదో, అనేక కంపెనీలు మన దేశం నుంచి ఎందుకు తరలిపోతున్నాయో ఆలోచించుకోవాలి. భారత అధిక వృద్ది రేటు, ఉద్యోగాలు తక్కువ నరేంద్రమోడీ సమస్య కాదు. కార్పొరేట్లకు అమృతకాలం, అచ్చేదిన్‌, దేశ యువత భవిష్యత్‌కు ముప్పు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేయలేని వాటిని తాను ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు 2019 ఎన్నికల్లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు. దిశ, దశ తెలుసుకొనేందుకు తొమ్మిదేండ్లు తక్కువ కాదు. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోకి నెట్టారు. ఎన్నికల వాతావరణం ఏర్పడింది కనుక దీని గురించి మోడీ భక్తులు ఎలా స్పందిస్తారో చెప్పనవసరం లేదు. నిజానికి ఇది నరేంద్రమోడీ వ్యక్తిగత సమస్య కాదు. తమది కాంగ్రెస్‌కు భిన్నమైన పార్టీ అని జనాన్ని నమ్మించేందుకు చేసిన ప్రచారం తప్ప వాజ్‌పాయి ఏలుబడిలో గానీ ఇప్పుడు నరేంద్రమోడీ పాలనలో అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలు గానీ గతంలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టినవే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) మన దేశం మీద రుద్దిన విధానాలకు భారతీయ ముద్ర వేసి అమలు జరుపుతున్న ఫలితమే. మరి కాంగ్రెస్‌కు బిజెపికి తేడా లేదా అంటే ఉంది. ఆర్థిక విధానాల వైఫల్యాలకు తోడు గోబెల్స్‌ సమాచారాన్ని జనాలకు అందించే వాట్సాప్‌ విశ్వవిద్యాలయం, మత విద్వేషాన్ని బిజెపి బోనస్‌గా ఇచ్చింది.

షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మూడు రోజుల రష్యా పర్యటన బుధవారం నాడు ముగిసింది. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు మాస్కోలో ఉన్నారు. మూడవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జింపింగ్‌ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇది. దీని ఫలితాలు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. బద్దశత్రువులుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలు ఏర్పరచుకొనేట్లు చూడటంలో చైనా పాత్ర గురించి అనేక మంది ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి పన్నెండు అంశాలతో చైనా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన పూర్వరంగంలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఉభయ దేశాలూ ఈ సందర్భంగా చేసిన ప్రకటన మీద స్పందించిన తీరు చూస్తే ఈ పరిణామం అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలకు ఇది మింగా కక్కలేని పరిస్థితిని ఏర్పరచింది. చైనా ప్రతిపాదనలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని రష్యా స్పష్టంగా స్పందించింది. తాము కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ అంశాలపైనే ప్రధానంగా జింపింగ్‌-పుతిన్‌ చర్చలు జరిపినట్లు వార్తలు. మాస్కో చర్చల గురించి అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ ఐరాస నిబంధనల ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని నివారించాలన్న చైనా ప్రతిపాదనల్లోని ఒక అంశం మీద నిజానికి చైనా దానికి కట్టుబడితే ఇదే ప్రాతిపదిక మీద వ్లదిమిర్‌ జెలెనెస్కీ, ఉక్రెయిన్‌తో కూడా షీ జింపింగ్‌ మాట్లాడాలని అన్నాడు. తమ మీద జరుపుతున్న దాడికి స్వస్తి పలికేందుకు చైనా తన పలుకుబడిని ఉపయోగించగలదని, జెలెనెస్కీ, షీ మధ్యనేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్‌ నికొలెంకో కోరాడు. వీలైనపుడు తమ దేశాన్ని సందర్శించాలని పుతిన్ను కోరినట్లు షీ జింపింగ్‌ వెల్లడించాడు.


షీ జింపింగ్‌-వ్లదిమిర్‌ భేటీ అవకాశవాద కూడిక తప్ప మరొకటి కాదని అమెరికా పేర్కొన్నది. ఆ దేశ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ప్రపంచంలో పుతిన్‌కు స్నేహితులెవరూ లేరని, జింపింగ్‌ను పెద్ద మద్దతుదారుగా పరిగణిస్తున్నాడని అన్నాడు. చైనాకు రష్యా జూనియర్‌ భాగస్వామిగా మారిందని రెచ్చగొడుతూ మాట్లాడాడు. జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. కీలకమైన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం గురించి సానుకూలంగా స్పందించాయి. ఉక్రెయిన్‌ అంశంపై ఏ వైపూ మొగ్గు చూపకుండా చైనా తీసుకున్న వాస్తవిక వైఖరిని సానుకూల వైఖరితో రష్యా మదింపు చేసింది. మిలిటరీ, రాజకీయ ఇతరంగా అనుకూలంగా మార్చుకొనేందుకు చూసే క్రమంలో ఏ దేశాలు వాటి కూటములు గానీ ఇతర దేశాల న్యాయబద్దమైన భద్రతా ప్రయోజనాలను నష్టపరిచేందుకు చూడటాన్ని వ్యతిరేకిస్తాయి. సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా చూపిన సుముఖతను చైనా వైపు నుంచి సానుకూలంగా మదింపు చేస్తున్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతి ఉక్రెయిన్‌ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది.


జింపింగ్‌ పర్యటన ఖరారు కాగానే పుతిన్‌ మీద అరెస్టు వారంటు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు, దానికి ఆ అర్హత లేదంటూ సదరు కోర్టు జడ్జీలు, ప్రాసిక్యూటర్‌పై తామే దర్యాప్తు జరుపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న మరియాపూల్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు నాటో కూటమి పూనుకుంది. దానిలో భాగంగా గతంలో సోవియట్‌ నుంచి పొందిన మిగ్‌ 29 విమానాలను పోలాండ్‌, స్లోవేకియా దేశాలు ఉక్రెయిన్‌కు అందచేసి రష్యా మీదకు పురికొల్పుతున్నాయి. కిరాయి మూకల పేరుతో పోలాండ్‌ తన మిలిటరీని కూడా పంపినట్లు వార్తలు. ఇలాంటి వాటితో పుతిన్‌ సేనలు ఓటమి ఖాయమంటూ మరోవైపున ప్రచారం. చైనా బెలూన్‌ కూల్చివేతకు ప్రతీకారం అన్నట్లుగా అమెరికా ప్రయోగించిన ఒక నిఘా డ్రోన్ను నల్ల సముద్రంలో రష్యా విమానాలు కూల్చివేశాయి. ఫిన్లండ్‌ నాటోలో చేరేందుకు టర్కీ అంగీకారం తెలిపింది. ఇలా అనేక కీలక పరిణామాలు జింపింగ్‌ రాక ముందు జరిగాయి.


షీ జింపింగ్‌ పర్యటనలో చివరి రోజు-బుధవారం నాడు రెండు దేశాలు ఏ ప్రకటన చేస్తాయనేది వెల్లడిగాక ముందే ప్రపంచ మీడియాలో పరిపరి విధాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం, ఇతర సంబంధాలు మరింత పటిష్టం కావించుకోవటం గురించి చివరి రోజు ఎలాగూ చెబుతారు. చైనా ముందుకు తెచ్చిన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఈ పర్యటనతోనే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పశ్చిమ దేశాలు నడిపే శల్యసారధ్యం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఉక్రెయిన్‌ తొలి రోజుల్లో చర్చలకు సిద్దపడినా అమెరికా తన పథకాన్ని అమలు జరిపేందుకు వాటిని చెడగొట్టింది. రష్యా లేవనెత్తిన తన భద్రత అంశాలను విస్మరించటమేగాక దానిపై ఆంక్షల కత్తికట్టింది.ఇతర పశ్చిమ దేశాలు వంతపాడుతున్నాయి. పుతిన్‌తో చర్చించిన తరువాత షీ జింపింగ్‌ అవసరమైతే ఉక్రెయిన్‌ కూడా వెళతారని వార్తలు.గతేడాది డిసెంబరు 30న షీ జింపింగ్‌తో పుతిన్‌ జరిపిన వీడియో చర్చలలో మాస్కో రావాలని పుతిన్‌ ఆహ్వానించినా, కేవలం వారం రోజుల ముందే షీ టూర్‌ ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శాంతి ప్రతిపాదనలను ప్రకటించింది. షీ టూర్‌కు ముందు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) పశ్చిమ దేశాల ప్రచారదాడి పథకంలో భాగంగానే పుతిన్‌ మీద అరెస్టు వారంట్‌ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన దేశాలకే దాని నిర్ణయాలు వర్తిస్తాయి ఇతర దేశాలకు కాదు. ఇది చైనా మీద వత్తిడి తేవటంలో భాగంగా జరిగినట్లు చెబుతున్నారు. ఐసిసిలో అమెరికా, చైనా, రష్యా మరికొన్ని దేశాలు భాగస్వాములు కాదు. లేని మారణాయుధాలను సాకుగా చూపి ఇరాక్‌ మీద దాడి చేసి దాదాపు ఆరులక్షల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న, కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం గావించిన అమెరికా, దాని మిత్రదేశాల అధిపతుల మీద ఐసిసి ఇలాంటి అరెస్టు వారంట్లను జారీ చేయలేదు.


గత కొద్ది వారాలుగా ఇంకేముంది ఉక్రెయిన్‌ గడ్డమీద రష్యా ఓడిపోతున్న సూచనలు కనిపించటంతో తటస్థం అని పైకి చెప్పినా పుతిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. పూర్తిగా ఓడిపోక ముందే కలుసుకోవాలని జింపింగ్‌ అనుకున్నారని, పశ్చిమ దేశాలకు గెలిచే అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారని చెబుతున్నాయి. శాంతిదూత మాదిరి నటిస్తూ రాజకీయ క్రీడలో భాగంగా సంక్షోభ పరిష్కారానికి శాంతి ప్రతిపాదనలను ముందుకు తేవటంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందచేస్తున్నదానికి భిన్నంగా తాత్కాలికంగానైనా ఆయుధ సరఫరా జరపదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. తన అవసరాల కోసం చైనా మీద ఆధారపడినందున పుతిన్‌ శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించినా అమలుకు మాత్రం ససేమిరా అంటాడని జోశ్యం చెబుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తమ మీద మరింత దూకుడును ప్రదర్శించకుండా చైనా చూసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. ఇలా చిలవలు పలవలుగా కథనాలను అల్లుతున్న దశలో షీ జింపింగ్‌ మాస్కో వెళ్లారు.


అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వ్యవస్థను కాపాడేందుకు రష్యాతో పాటు ఒక రక్షకుడిగా చైనా నిలిచేందుకు సిద్దమని మాస్కోలో జింపింగ్‌ చెప్పాడు. సోమవారం రాత్రి విందుకు ముందు పుతిన్‌తో కలసి ఇష్టా గోష్టిగా విలేకర్లతో క్లుప్తంగా మాట్లాడుతూ వ్లదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మరోసారి సందర్శనకు రావటం సంతోషంగా ఉందని, ఇరుదేశాల సంబంధాలు చక్కగా, స్థిరమైన వృద్దితో ముందుకు సాగేందుకు కొత్త ఊపు నిస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సంక్షోభ తీవ్రత గురించి చైనా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, వాటి గురించి చర్చిందుకు మాకు అవకాశం వచ్చిందంటూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు చెప్పాడు. అంతకు ముందు పీపుల్స్‌ డైలీ ( చైనా) పత్రికలో పుతిన్‌ రాసిన ఒక వ్యాసంలో ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల మీద చైనా సమతుల్య వైఖరితో ఉన్నందుకు తాము కృతజ్ఞులమై ఉంటామని,దాన్ని పరిష్కరించేందుకు ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించేందుకు సుముఖంగా ఉండటాన్ని ఆహ్వానిస్తున్నామన్నాడు. ఉక్రెయిన్‌ అంశంలో వ్యవహార జ్ఞానంతో ఉండాలని షీ జింపింగ్‌ కోరినట్లు రష్యా అధికార పత్రిక రూసిసక్యా గజెటాలో ప్రచురించిన ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు.


ప్రపంచ వ్యవహారాల నిర్వహణలో మరింత ప్రబలమైన పాత్ర పోషించాలని చైనా కోరుకుంటోందని దాన్ని మరింత ముందుకు నెట్టేందుకు ఈ పర్యటన కలసి వచ్చిందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్నుంచి పుతిన్‌ సేనలు వైదొలగటం, స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవటం వంటి వాటి గురించి చైనా ప్రతిపాదనల్లో స్పష్టత లేదని, అందువలన అది ముందుకు పోదని పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి. చైనా ప్రతిపాదనలు ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని అమెరికా పత్రిక టైమ్‌ ధ్వజమెత్తింది.ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసింది.చైనా భద్రతతో నేరుగా సంబంధ లేని అంశాల్లో బాధ్యత తీసుకొనేందుకు, ముప్పు ఎదుర్కొనేందుకు గతంలో దూరంగా ఉండేది.ఇప్పుడు జింపింగ్‌ కొత్త పద్దతుల్లో చైనా ప్రభావాన్ని చూపేందుకు పూనుకున్నారు. శాంతి ప్రతిపాదనల్లో మొక్కుబడిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం పట్ల గౌరవం ఉందని పేర్కొన్నది.పౌరుల రక్షణ, మానవతా పూర్వసాయంపై జోక్యం చేసుకోరాదని,అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను ఖండించటం, ప్రపంచంలో వెల్లడైన అభిప్రాయాలను అది ప్రతిబింబించినప్పటికీ ప్రధానంగా రష్యాకు సాయపడేవిధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు టైమ్స్‌ విశ్లేకుడు ఆరోపించాడు. వాటి ప్రకారం తక్షణమే కాల్పుల విరమణ జరిగితే రష్యా జయించింది దాని దగ్గరే ఉంటుంది. తమ ప్రాంతాలను తమకు స్వచ్చందంగా అప్పగించాలని పుతిన్ను ఉక్రెయిన్‌ బతిమాలుకోవాల్సి ఉంటుందని టైమ్‌ రెచ్చగొట్టింది. నష్టపోయేందుకు ఎవరూ సిద్దం కానందున ఈ దశలో శాంతిపధకం విజయవంతం కాదని పేర్కొన్నది. పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు ముందుకు తెచ్చిన అంశాలు వాటి పాలకవర్గాల ఆలోచనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.వాటిలో చైనాను బెదిరించటం కూడా ఒకటి.


కరోనా, తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితి, పేద, వర్ధమాన దేశాలకు సంకటంగా మారింది. దాన్ని పరిష్కరించకుండా అడ్డుపడుతున్నది అమెరికా, పశ్చిమదేశాల కూటమే అని అవి భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, సరఫరా సంక్షోభం వంటి తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉక్రెయిన్‌ వివాదాన్ని మరింత తీవ్రంగావించే, దీర్ఘకాలం కొనసాగించే ఎత్తుగడల కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలకు అవి మద్దతు పలకకపోవటంతో అమెరికా వ్యూహవేత్తలు కంగుతిన్నారు. ఇరాన్‌-సౌదీ మధ్య చైనా కుదిర్చిన ఒప్పందం తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారానికి అడ్డుపడేవారి మీద వత్తిడిపెరుగుతోంది. ఇప్పుడు చైనా ముందుకు తెచ్చిన శాంతి పథకాన్ని సూత్ర ప్రాయంగా ఏ దేశమూ కాదనలేదు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి చర్చలకు అడ్డుపడుతున్న పశ్చిమ దేశాల మీద మరింత ఆగ్రహం వెల్లడి అవుతోంది.
తమ పెత్తనానికి ఎసరు వస్తోందని, దానికి చైనా, రష్యాలే కారణమని భావిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా పెద్ద సవాలు విసురుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలూ తమ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ఏడాది క్రితం ప్రారంభమైనట్లు పైకి కనిపించినా పశ్చిమ దేశాల మద్దతుతో పది సంవత్సరాల క్రితం ” యూరోమైదాన్‌ ” పేరుతో ఉక్రెయిన్లో అమలు జరిపిన కుట్ర దానికి నాంది పలికింది. అది అమెరికా-రష్యా ఘర్షణకు దారి తీసింది.రష్యా మీద అవసరమైతే దాడి చేసేందుకు అమెరికా రెండు విమానవాహక యుద్ద నౌకలను రష్యా ముంగిట తెచ్చిపెట్టింది. దాంతో ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ సైనిక చర్యకు దిగాడు. మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనాతో వాణిజ్య పోరుతో ప్రారంభించి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోరు అనే మరో రెండో రంగాన్ని కూడా తెరిచారు. ఈ పూర్వరంగంలో షీ జింపింగ్‌ మాస్కో పర్యటన నామమాత్రం కాదు అన్నది స్పష్టం.

నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ – ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన కుహనా(ఫేక్‌), వక్రీకరణ సమాచారం పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజమే అని నమ్మిన మీడియా కూడా భుజాన వేసుకొని తరువాత తేలుకుట్టిన దొంగల్లా ఉన్న ఉదంతాలు ఎన్నో. తాజాగా నరేంద్రమోడీని అపహాస్యం పాలు చేసే ఉదంతం జరిగింది. అది ఏ బిబిసి లేదా మరొక విదేశీ సంస్థ చేసి ఉంటే ఇంకేముంది ? నోబెల్‌ శాంతి బహుమతికి నరేంద్రమోడీ అతిపెద్ద పోటీదారుగా ఉన్నట్లు, విశ్వసనీయత ఉన్న పెద్దవాడైన రాజనీతిజ్ఞుడిగా గుర్తించినట్లుగా నోబెల్‌ బహుమతి కమిటీ ఉపనేత అస్లీ టోజె చెప్పారని జాతీయ మీడియా ప్రచారం చేసింది.రామ రామ తానసలు అలా చెప్పలేదని టోజె ఖండించాడు. అది ఫేక్‌ వార్త అని దానికి శక్తి లేదా ప్రాణ వాయువును అందించవద్దని అన్నాడు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించే ప్రబుద్దుల మాదిరి మోడీకి శాంతి బహుమతి లాంఛనంగా ప్రకటించటమే తరువాయి అన్నట్లుగా మీడియా పెద్దలు కథలు అల్లారు. ఎవరో ఒక కొత్త రిపోర్టరు లేదా సబ్‌ ఎడిటర్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారంటే పోనీలే అనుకోవచ్చు. ఒక టీవీ సంపాదకుడు, బడా టీవీ ఛానళ్లు, పత్రికలు దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా వ్యవహరించాయి.


నోబెల్‌ కమిటీ నిబంధనల ప్రకారం ఫలానా సంవత్సర బహుమతుల కోసం ఎందరు, ఎవరు పోటీ పడ్డారు అన్న వివరాలను 5 దశాబ్దాల పాటు వెల్లడించకూడదు అన్నది నిబంధన. అలాంటిది కమిటీ ఉపనేతే మోడీ ప్రధాన పోటీదారు అని చెప్పాడంటే వాస్తవమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. అసలు గతంలో పోటీ పడుతున్నారంటూ ఎవరి గురించీ అలాంటి వార్తలు రాలేదు.ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అస్లీ టోజెతో విలేకర్లు మాట్లాడారు.టోజె చెప్పినదానిని వక్రీకరించారు. తాను నోబెల్‌ కమిటీ ఉపనేత హౌదాలో ఢిల్లీ రాలేదని, అంతర్జాతీయ శాంతి మరియు అవగాహన సంస్థ డైరెక్టర్‌గా ఇండియా సెంటర్‌ ఫౌండేషన్‌(ఐసిఎఫ్‌) స్నేహితుడిగా వచ్చానని టోజె ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు.” ఒక కుహనా వార్త ట్వీట్‌ను చేశారు.దాన్ని కుహనా వార్తగా చూడాలి. ఇక్కడకు భారత రాజకీయాలు, అభివృద్ది గురించి మాట్లాడటానికి వచ్చాను.కుహనా వార్త గురించి చర్చించకూడదు లేదా దానికి శక్తి లేదా ప్రాణవాయువును అందించాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్‌లో రాసినట్లుగా నేనేమీ చెప్పలేదని విస్పష్టంగా చెబుతున్నాను.” అన్నాడు.


అస్లీ టోజె టైమ్స్‌నౌ ఛానల్‌ విలేకరితో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ సంక్షోభంలో ప్రధాని నరేంద్రమోడీ ఒక సానుకూల వైఖరితో స్పందించారు.అణ్వాయుధాలను వాడవద్దని రష్యాను హెచ్చరించారు.వర్తమానం యుద్ధాల యుగం కాదని వ్లదిమిర్‌ పుతిన్‌కు చెప్పారు.ప్రపంచంలో బాధ్యత కలిగిన ఏ నేత అయినా ఇలాంటి సందేశమివ్వటానికే ఇష్టపడతారు. అన్నింటి కంటే ముఖ్యమైనదేమంటే భారత్‌ వంటి శక్తివంతమైన దేశం నుంచి ఇలాంటి సందేశం వచ్చింది.” అని చెప్పాడు.ఫేక్‌న్యూస్‌ను వండి వార్చింది టైమ్స్‌ నౌ అని తేలింది. ఏకంగా దాని సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ తప్పుదారి పట్టించే ట్వీట్లు చేశారు. నరేంద్రమోడీని పొగడటాన్ని అవకాశంగా తీసుకొని నోబెల్‌ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు చిత్రించి ఆ మాటలను టోజె నోట్లో పెట్టారు.దీంతో మోడీని ఆకాశానికి ఎత్తుతూ మిగతా వారంతా నిర్ధారించుకోకుండా ప్రచారం చేశారు. టైమ్స్‌నౌ ఛానల్‌తో మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా అసలు ఆ ప్రస్తావన లేదు. ఐసిఎఫ్‌ చైర్మన్‌ వైభవ్‌ కె ఉపాధ్యాయ ఈ వార్త గురించి మాట్లాడుతూ టోజె చెప్పిన మాటలను తప్పుడుగా చిత్రించారన్నారు.టీవీ ఛానళ్లు పొరపాటున లేదా అత్యుత్సాహంతో అలా చేసి ఉండవచ్చు.పధకం ప్రకారం చేసి ఉంటే అది నేరపూరితం అన్నారు. ఐసిఎఫ్‌ కార్యక్రమం కోసం ఏర్పడిన కమిటీ సభ్యుడైన మనోజ్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ తాను పూర్తిగా అస్లీ టోజెతోనే ఆ రోజు మౌర్య షెరటన్‌ హౌటల్లో ఉన్నానని, టైమ్స్‌ నౌ విలేకరితో సహా ఇతరులతో మాట్లాడినపుడు తాను విన్నానని వారితో లేదా ప్రధాన ప్రసంగంలో గానీ మోడీ గురించి అలాంటి మాటలు చెప్పలేదని స్పష్టం చేశారు. న్యూ ఇండియన్‌ ఛానల్‌ యాంకర్‌ మోడీ-బహుమతి గురించి అడిగిన అంశం మీద టోజె మాట్లాడుతూ ఏ నాయకుడైనా బహుమతిని గెలుచుకొనేందుకు తగినంత కృషి చేయాలి, ముందు పని జరగాలి తరువాత బహుమతులు వస్తాయి ” అన్నాడు తప్ప మోడీ పోటీదారనో మరొకటో చెప్పలేదు.నోబెల్‌ బహుమతి సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 2023 బహుమతికి 305 నామినేషన్లు రాగా వాటిలో 212 మంది వ్యక్తులు, 93 సంస్థలవి ఉన్నాయి. అసలు నరేంద్రమోడీ నామినేషన్‌ ఉన్నదో లేదో కూడా తెలియదు.


మన పత్రికలు, టీవీ ఛానళ్ల తీరు తెన్నులు, అవి ప్రచారం చేసే ఫేక్‌ వార్తల గురించి గత సంవత్సరంలో లాజికల్‌ ఇండియా పేర్కొన్నవాటిని కొన్నింటిని చూద్దాం. టిప్‌ టిప్‌ భర్సాపానీ అనే మన హిందీ పాటకు పాకిస్తాన్‌ రాజకీయవేత్త అమీర్‌ లియాకత్‌ హుసేన్‌ డాన్స్‌ చేసినట్లు ఒక వీడియో వైరలైంది.నిజానికి అతను సొహాయిబ్‌ షుకూర్‌ అనే డాన్స్‌మాస్టర్‌. టైమ్స్‌ నౌ, నవభారత్‌ రాజకీయవేత్తగా చిత్రించాయి. అసోంలోని ఒక టీ అమ్మే కుర్రాడు రాహుల్‌ కుమార్‌ దాస్‌ నీట్‌ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రాంకు తెచ్చుకొని ఎయిమ్స్‌లో సీటు పొందినట్లు మీడియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారంలో పెట్టింది. తీరా చూస్తే అతను పరీక్ష రాసింది నిజమే కానీ వచ్చిన రాంకు 9,29,881. మార్కులను తిమ్మినిబమ్మిని చేసి అతను చెప్పిన కథనాన్ని గుడ్డిగా ప్రచారం చేశారు. నిజం వెల్లడి కాగానే అతను, అతని సోదరి, తల్లి కనిపించకుండా పోయారు. టీవీ9 భరత్‌వర్ష్‌ ఛానల్‌ శ్రీ లంకలోని హంబంటోటా రేవు గురించి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ ప్రాంతమంతా చైనా అదుపులో ఉందని, మొత్తం 500 వందల తనిఖీ కేంద్రాలున్నట్లు, పైకి కనిపించకుండా చైనా మిలిటరీ ఉందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలను బానిసలుగా తెచ్చి అక్కడ పని చేయిస్తున్నారని దానిలో పేర్కొన్నది. అదంతా అవాస్తవం అని, సంచలనం కోసమే అలాంటి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసినట్లు తేలింది.


అసోంలో భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో ఒక వంతెన కూలినట్లు ఆజ్‌తక్‌, టీవీ9, ఇండియాటీవి,ఆసియానెట్‌, ఇతర సంస్థలు ప్రసారం చేశాయి.నిజానికి ఆ వంతెన ఏడాది క్రితం ఇండోనేషియాలో కూలింది. కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ముస్లిం దుండగులు హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు మీడియా సంస్థలన్నీ ప్రసారం చేశాయి.నిజానికి ఆ ఉదంతంలో పాల్గొన్నది హిందువులని తేలింది. తెలంగాణాలో వరదలు అంటూ టీవీలు ఒక వీడియోను ప్రసారం చేశాయి. జెసిబి ట్రాక్టర్‌ నుంచి వరద బాధితులను కాపాడుతున్న హెలికాప్టర్‌ దృశ్యమది. నిజానికి ఆ ఉదంతం 2021నవంబరులో అదీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదిలో జరిగింది. ఒక కామెడీ కథనాన్ని నిజమని నమ్మి చైనా అధినేత షీ జింపింగ్‌ను అరెస్టు చేశారంటూ సాగించిన తప్పుడు వార్తలు, దృశ్యాల గురించి తెలిసిందే. పదకొండు సంవత్సరాల నాటి 2జి కుంభకోణం అరెస్టయిన మాజీ మంత్రి ఏ రాజా అంటూ ఒక వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అనేక పత్రికలు, టీవీలు గుడ్డిగా తాజా వార్తగా ప్రసారం చేశాయి.పీఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మీద గెలిచిన సౌదీ అరేబియా క్రీడాకారులందరికీ రోల్స్‌రాయిస్‌ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు వచ్చిన తప్పుడు వార్తను ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఇచ్చాయి.


అసలు గమనించాల్సిందేమంటే ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు ప్రపంచ శాంతికి చేసిన కృషి ఏమిటి అన్నది ప్రశ్న. తటస్థంగా ఉండటం, ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి మాట్లాడిన వారిలో మోడీ ఒకరు తప్ప నివారణకు ఇతరుల కంటే భిన్నంగా చేసిందేమీ లేదు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో విశ్వగురువు, ప్రపంచ నేత అని ఎవరెన్ని చెప్పినా ఏ అంశంలోనూ నిర్దిష్టపాత్రను పోషించి ఒక అంశాన్ని కొలిక్కితెచ్చిన ఉదంతం లేదు. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా రెండూ మనకు మిత్రదేశాలే. అలాంటి స్థితిలో అమెరికా బెదిరింపులు, వత్తిడికి లొంగి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అంటే అమెరికా వైపు నిలిచినట్లు సందేశమిచ్చాము. ఆ రెండు దేశాలూ ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసినా మన దేశం వైపు నుంచి చేసిందేమీ లేదు. చిత్రం ఏమంటే ఇష్టం ఉన్నా లేకున్నా వెంటనే అమెరికా సానుకూలంగా స్పందించింది. ఆరు రోజుల తరువాత మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ సమస్యల పరిష్కార చర్చలకు మన దేశం ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటుందని ముక్తసరిగా మాట్లాడారు.ఇరాన్‌-సౌదీ ఒప్పందం కుదరటానికి చైనా నిర్వహించిన పాత్ర చివరి క్షణం వరకు ప్రపంచానికి బహిరంగంగా తెలియదు. ఇలాంటి చొరవ తొమ్మిదేండ్ల కాలంలో నరేంద్రమోడీ వైపు నుంచి ఎక్కడా లేదు. మన దేశంలోని జాతీయ టీవీలు, పత్రికలకు దీని గురించి తెలియదని అనుకోగలమా ? ప్రపంచ శాంతికి నరేంద్రమోడీ ఏమి చేశారని నోబెల్‌ బహుమతి వస్తుందని అలాంటి కుహనా వార్తలకు తావిచ్చినట్లు ?ఎవరినైనా ప్రభావితం చేయగల నరేంద్రమోడీ నోబెల్‌ కమిటీని పైరవీ చేసి బహుమతి తెచ్చుకోగల సమర్థత ఉందని జర్నలిస్టులు నిజంగా నమ్ముతున్నారా ? నోబెల్‌ కమిటీ ఉపనేత గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన అంశాన్ని ప్రపంచ మీడియా మూసిపెడుతుందా ? విశ్వగురువుగా చెబుతున్న నరేంద్రమోడీకి ప్రపంచంలో ఎంత పరువు తక్కువ ? ప్రపంచ నేతలకు ఈ వార్తలు చేరకుండా ఉంటాయా ? భారత్‌ గురించి విదేశీ మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు మోడీ మద్దతుదార్లు ఊరూవాడా నానా యాగీ చేస్తున్నారు. తమ నేత పరువు తీసిన ఈ ఉదంతం గురించి ఎలా స్పందిస్తారు ?

ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగమంతా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భజనకు, మీట నొక్కిన అంకెలను వల్లించేందుకే సరిపోయింది. అంకెల గారడీ మామూలుగా లేదు. ప్రసంగం నిండా ప్రముఖుల సూక్తులు, బోధలు మడమతిప్పుడు తప్ప కొత్త పథకాలేమీ లేవు.మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన బడ్జెట్‌ మొత్తం రు.2,56,256.57 కోట్లను రు.2,40,509.35 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాది రు.2,79,279.27 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఖర్చు చేస్తారా లేదా అన్నది జగన్‌కే ఎరుక. బడ్జెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్రం నుంచి వచ్చే వాటాతో పాటు రాష్ట్రం విధించే పన్నుల మొత్తం. ఇవిగాక రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తం రెండవది.పన్నుల ద్వారా 2021-22లో వచ్చిన మొత్తం రు. 1,50,552.49 కోట్లు. ఇది 2022-23లో రు.1,91,225.11 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంత వచ్చే అవకాశం లేదు రు.1,76,448.39 కోట్లకు సవరిస్తున్నామని, 2023-24లో మాత్రం రు. 2,06,224.01 కోట్లు వస్తుందని చెప్పారు.ఇవన్నీ ఉజ్జాయింపు మాత్రమే. బడ్జెట్‌ పత్రాల్లో ఎకౌంట్స్‌ అనే శీర్షిక కింద ఇచ్చే అంకెలు మాత్రమే ఖరారు చేసినవి. ఉదాహరణకు 2021-22లో పన్ను రాబడి రు. 1,77,196.48 కోట్లు వస్తుందని వేసిన అంచనాను రు.1,54,272.70కు సవరించారు.చివరికి పైన పేర్కొన్న రు. 1,50,552.49 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పటికే జనాల నుంచి గరిష్టంగా పన్నులను పిండుతున్నందున ఎన్నికలు కళ్ల మందు కనిపిస్తున్నందున గొప్పకోసం అంకెలను పెంచి చూపారా లేక వేలాది కోట్ల ఆదాయ, ద్రవ్యలోటును అదనపు భారాలు, అప్పుల ద్వారా తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర స్వంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే మొత్తం రు.రు. 2,06,224.01 కోట్లు కాగా దీనికి అదనంగా వివిధ మార్గాల ద్వారా తెచ్చే రు.73,055.26 కోట్లను జత చేస్తే మొత్తం బడ్జెట్‌ రు.రు.2,79,279.27 కోట్లు అవుతుంది.గతేడాది తెచ్చిన అప్పు రు.64,303.71కోట్లను ఈ ఏడాది రు.73,055.26 కోట్లకు పెంచుతామని చెప్పారు.


చంద్రబాబు నాయుడు సిఎంగా దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 2,57509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55,508.46 కోట్లు. అప్పుల మీద ఊరూవాడా టాంటాం వేసిన జగన్‌ తాను వస్తే తగ్గిస్తానని చెప్పినా ఆచరణలో 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2023 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.4,26,233.92 కోట్లు, జిఎస్‌డిపిలో 32.35శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం రు.1,38,874.75 కోట్లకు పెరిగింది. 2023-24కు ప్రభుత్వ రుణం రు. 4,83,008.96 కోట్లకు పెరుగుతుందని అది జిఎస్‌డిపిలో 33.32 శాతం అని బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. దీనికి హామీల రుణం అదనం.అంటే మొత్తం ఆరులక్షల కోట్లు దాట నుంది. ఆర్ధిక మంత్రి జిఎస్‌డిపి పెంపుదల గురించి చెప్పారు. 2023 మార్చి ఆఖరుకు రు.13,17,728 కోట్లుగా ఉన్నదాన్ని 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. కానీ తీరు తెన్నులు ఆ ధోరణిని సూచించటం లేదు. కరోనా కారణంగా అరశాతం రుణాలు అదనంగా తీసుకొనేందుకు దొరికిన వీలును జగన్‌ సర్కార్‌ వాడుకుంది. దీనికి తోడు విద్యుత్‌ సంస్కరణలు(మీటర్ల బిగింపు) అమలు చేసినందుకు మరో అరశాతం అదనంగా తీసుకొనేందుకు వీలుదొరికింది.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు. 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం 48,316 కోట్లకు పెరుగుతుంది. కేంద్రం మినహాయింపులు ఇస్తే ఇంకాస్త పెరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇవ్వకున్నా అదనంగా అప్పుతెచ్చుకొనేందుకే కేంద్రం మీద, బిజెపి మీద వైసిపి విమర్శలు చేయటం లేదా ? తెలంగాణా అప్పులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం జగన్‌ పట్ల ఉదారంగా ఉండటానికి కారణం రాజకీయమా లేక కేంద్రం రుద్దిన సంస్కరణలను వినయ విధేయతలతో అమలు జరుపుతున్నందుకు బహుమతి కోసం ఎదురు చూపా ? 2021-22లో రాబడి లోటు (ఖర్చు-ఆదాయం మధ్య తేడా) రు.8,610 కోట్లు కాగా 2022-23లో అది రు.17,036 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా సవరించిన మొత్తం రు.29,107 కోట్లకు చేరింది. 2023-24లో రు.22,316కోట్లకు పెరిగింది. ద్రవ్యలోటు (మొత్తం ఖర్చు-రాబడి మధ్య తేడా) గతేడాది రు.47,716 కోట్లు కాగా వచ్చే ఏడాదికి రు.54,587 కోట్లుగా చూపారు. ఈ తేడాను పూడ్చుకొనేందుకు జనం మీద భారాలు మోపాలి లేదా అప్పులు తీసుకోవాలి.పరిమితికి మించి రుణాలు తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించదు. అలాంటపుడు సంక్షేమం లేదా ఇతర పధకాలకు కోతలు విధించాలి.జగన్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.


గడచిన నాలుగు సంవత్సరాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు సగటున ఏటా జగన్‌ సర్కార్‌ ఖర్చు చేసింది పదహారువేల కోట్లు మాత్రమే. ఒకేడాది 18వేల కోట్లుగా ఉన్నది తరువాత తగ్గింది. కానీ అప్పు మాత్రం రెట్టింపైంది. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని చెప్పేవారు దీనికి ఏమి సమాధానం చెబుతారు ? అందుకే తెచ్చిన అప్పును దేని కోసం ఖర్చు చేశారో జనం అడగాల్సి ఉంది. ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల గురించి చెప్పే కబుర్లు వినీ విని జనానికి బోరు కొడుతోంది. ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు. ఇది నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా ఉంది. అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పే అప్పులకు చెల్లించే మొత్తాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. సంక్షేమాన్ని తప్పు పట్టటం లేదు. పెట్టుబడి వ్యయం ఎందుకు పెరగటం లేదు, కేటాయించిన మొత్తాలు ఎందుకు ఖర్చు కావటం లేదని రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాల్సి ఉంది.పెట్టుబడివ్యయ పద్దు కింద 2021-22 ప్రతిపాదించిన రు. 31,198 కోట్లకు గాను ఖర్చు చేసింది రు. 16,372 కోట్లు మాత్రమే.2022-23 ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని రు.16,846 కోట్లకు సవరించినట్లు చెప్పారు. వాస్తవంగా ఇంకా తగ్గవచ్చు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఈ నిర్వాకం ఇలా వుంటే కొత్త బడ్జెట్‌లో రు.31,061 కోట్లని మురిపించేందుకు చూశారు. ఇదే సందర్భంలో అప్పుల చెల్లింపు ఎలా ఉంది ? దీనికి కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా ? అంతకు ముందు చెల్లించింది రు.22,165 కోట్లుగా కాగా 2022-23లో దాన్ని రు.21,340 కోట్లకు తగ్గిస్తామని చెప్పి రు.25,288 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సవరించారు. తాజా బడ్జెట్‌లో రు. 28,673 కోట్లన్నారు. గతేడాది అనుభవాన్ని చూస్తే మూడు పదులు దాటినా ఆశ్చర్యం లేదు. గడగడపకు అనే పేరుతో వచ్చే వైసిపి నేతలు ఈ నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారో జనం అడగాలా లేదా ?


ఇప్పటి వరకు తమ ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా బదిలీ చేసిన నగదు మొత్తం లక్షా 97వేల కోట్లని ఆర్థిక మంత్రి రాజేంద్రనాధ్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఏటా 50వేల కోట్లు ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రెండో వైపు వివిధ కులాల కార్పొరేషన్ల పేరుతో భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా నగదు బదిలీ కింద 2022-23లో రు.47,240 కోట్లు పంపిణీ చేయగా 2023-24లో ఆ మొత్తాన్ని రు.54,228 కోట్లకు పెంచినట్లు ప్రతిపాదించారు. దానిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు. 17,850 నుంచి రు. 21,434 కోట్లని పేర్కొన్నారు. వాగ్దానం మేరకు నెలకు మూడువేలు చేసేందుకు ఈ మేరకు పెంపుదల చేశారు. ఇక్కడే తిరకాసు ఉంది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధుల మొత్తం ఒక తరగతిలో రు.4,115 నుంచి రు.5,760 కోట్లకు వేరే తరగతిలోని కార్పొరేషన్లు, పధకాలకు రు.39,103 కోట్ల నుంచి రు.46,911 కోట్లకు పెంచినట్లు బడ్జెట్‌ ప్రసంగ ప్రతిలో పేర్కొన్నారు. మొత్తంగా రు.45,218 కోట్ల నుంచి రు.52,671 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ అన్నింటిలో ఉన్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు.23,042 కోట్లు ఉంది. రెండింటినీ కలిపితే మొత్తం వైఎస్‌ఆర్‌ కానుకలుగా రు.44,476 కోట్లు ఉంది. మిగిలిన దంతా ఇతర నవరత్న పధకాలకు చూపారు. ఈ లెక్కన ఏటా లక్ష కోట్లను జగన్‌ సర్కార్‌ నేరుగా బదిలీ చేస్తున్నదా ? లేదా నేరుగా బదిలీ చేసే సొమ్మును కులాల కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి అక్కడి నుంచి తీసి నవరత్నాలకు ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కార్పొరేషన్ల ఏర్పాటు వైసిపి రాజకీయ నిరుద్యోగులను సంతుష్టీకరించేందుకు, ప్రచారానికి వేసిన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.ఇవిగాక కేవలం ఎస్‌సి (సబ్‌ప్లాన్‌ )నిధులుగా రు.20,005, ఎస్‌టిలకు రు.6,929, బిసిలకు రు.38,605,మైనారిటీలకు రు.4,203 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం రు.69,742 కోట్లు. అందుకే ఇదంతా అంకెల గారడీ అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏ ఖాతా కింద సొమ్మును చూపినా జనాలకు కావాల్సింది ఒక స్పష్టత. ఏ సామాజిక తరగతి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ఆ సామాజిక తరగతి వారికి అందచేసే నవరత్నాలకు సొమ్ము బదలాయిస్తున్నారా, విడిగా బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతున్నారా ? అందుకే ఉదాహారణకు అసలెన్ని వైఎస్‌ఆర్‌ పెన్షన్లు ఇస్తున్నారు, వారికి కేటాయిస్తున్న సొమ్మెంత అన్నది జనానికి స్పష్టం కావాలి.


పెరుగుతున్న ధరలు, వ్యయంతో పోల్చితే వివిధ శాఖలకు కేటాయింపులు అరకొరే.అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నా తగినన్ని కేటాయింపులేకనే అన్నది స్పష్టం.వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో 2022-23లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రు. 13,630 కోట్లు ప్రకటించి రు.12,270 కోట్లకు కోత పెట్టారు. ఈ ఏడాది రు.14,043 కోట్లని చూపారు.సాగు నీటికి రు.11,482 కోట్లకు గాను 10740 కోట్లకు కోత, ఇప్పుడు 11,908 కోట్లంటున్నారు.రవాణా రంగానికి రు. 9,617 కోట్లను 6,039 కోట్లకు తెగ్గోసి వచ్చే ఏడాది రు.10,322 కోట్లు ఖర్చు చేస్తాం చూడండి అంటున్నారు. వైద్య రంగానికి రు.15,384 కోట్లను రు.13,072కోట్లకు తగ్గించి ఇప్పుడు రు.15,882 కోట్లని నమ్మబలికారు.ఈ అంకెలను ఎలా నమ్మాలి ?


ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని చెప్పారు. ఆచరణలో ఆ సూచనలేమీ కనిపించటం లేదు. మరోవైపు దాన్ని ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. జగన్‌ అధికారానికి వచ్చినపుడు ఎక్సైజ్‌ రాబడి రు.6,220 కోట్లు కాగా 2023-24లో ఆ మొత్తం రు.18,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జనాలకు నేరుగా అందచేసిన లబ్ది 197వేల కోట్లని చెప్పారు. కానీ రెండోవైపు మోపిన భారాల సంగతి దాస్తున్నారు.మొదటి రెండు సంవత్సరాల లో రాష్ట్ర పన్నుల వార్షిక సగటు రు.57,523 కోట్లు ఉండగా తరువాత రెండు సంవత్సరాల్లో వార్షిక సగటు రు.77,703 కోట్లకు, ఐదవ ఏట రు.1,02,631కోట్లు అని ప్రతిపాదించారు. అందుకే జనం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు అని చెబుతున్నారు. మీట నొక్కుడు తమకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు తెస్తాయని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ బాదుడు ఇంతగా పెంచినా జనం అన్ని సీట్లు, అసలు తిరిగి అధికారం కట్టబెడతారా ? అసలేమీ చేయని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. చేపలను తొలుత ఇచ్చినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది. సంక్షేమ పధకాలూ అంతే ! ప్రభుత్వానికి రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అనేక దేశాల్లో జరిగింది అదే. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంపముంచినా ఆశ్చర్యంలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు ! ఏదో ఒక సాకుతో జగన్‌ ముందస్తు ఎన్నికలకూ పోవచ్చు !!

ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మధ్య ప్రాచ్యంలో ఉప్పు నిప్పు మాదిరి ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మార్చి నెల పదవ తేదీన కుదుర్చుకున్న ఒప్పందం కొన్ని దేశాలను కంపింప చేస్తే, అనేక మందికి నిజమా అన్న ఆశ్చర్యానికి గురి చేసిందనే వర్ణనలు వెలువడ్డాయి. ఈజిప్టులోని సూయజ్‌ కాలువ 1956 వివాదం తరువాత బ్రిటిష్‌ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడినట్లే ఈ ఒప్పందం ఆమెరికా పెత్తనానికి తెరదించేందుకు నాంది అన్నట్లుగా కొందరు వర్ణించారు. దీని కంటే ఆ ఒప్పందం చైనా రాజధాని బీజింగ్‌లో కుదరటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ఇరాన్‌-సౌదీ ప్రత్యక్ష పోరుకు తలపడనప్పటికీ అనేక చోట్ల ఏదో ఒక పక్షానికి మద్దతు ఇస్తూ గడచిన నాలుగు దశాబ్దాలుగా పరోక్షంగా శత్రుదేశాలుగా మారాయి. గత ఏడు సంవత్సరాలుగా దౌత్య సంబంధాలు కూడా లేవు. బీజింగ్‌ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు నెలల్లోగా రాయబార కార్యాలయాలను తెరవాల్సి ఉంటుంది.ఇటీవలి కాలంలో దేశాలు ఏదో ఒక పక్షాన చేరటం లేదా తటస్థంగా ఉండటాన్ని ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం స్పష్టం చేసింది. అమెరికా, పశ్చిమ దేశాలకు తాన తందాన అనేందుకు పేద, వర్ధమాన దేశాలు సిద్దంగా లేవు అనే సందేశాన్ని కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఇరాన్‌-సౌదీ ఒప్పందం ఈ కూటమికి మింగుడుపడకపోయినా అమెరికా హర్షం ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం నాటి వరకు మన దేశం దీని గురించి ఎలాంటి స్పందన వెల్లడించలేదు.


రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటానికి దారితీసిన కారణాలేమిటి ? షియా మతపెద్ద నిమిర్‌ అల్‌ నిమిర్‌తో సహా 50 మందిని సౌదీ అరేబియా 2016 జనవరి రెండున ఉరితీసింది. దీనికి నిరసనగా టెహరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం మీద ఇరానియన్లు దాడి చేశారు. ఇరాన్‌ అధిపతి అయాతుల్లా అలీ ఖమేనీ కక్ష తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు. జనవరి మూడవ తేదీన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ ప్రకటించింది. ఎమెన్‌లోని తమ రాయబార కార్యాలయం మీద సౌదీ వైమానిక దాడులు చేసినట్లు ఏడవ తేదీన ఇరాన్‌ ఆరోపించింది. వాస్తవం కాదని సౌదీ ఖండించింది. వార్షిక హాజ్‌ యాత్రకు వెళితే రక్షణకు హామీ లేదని, సౌదీ కుట్రకు పాల్పడవచ్చంటూ తన యాత్రీకుల మీద ఇరాన్‌ మేనెల 29న నిషేధం విధించింది.తమ చమురు కేంద్రాలపై జరిగిన దాడికి ఇరాన్‌ కారకురాలని, దాని వలన తమ దేశంలో సగం సరఫరా నిలిచిందని సౌదీ చేసిన ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ గ్రూపు తామే దాడి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌ మిలిటరీ అధికారి ఖాశిం సొలిమనీ బాగ్దాద్‌లో 2020జనవరి మూడున అమెరికా డ్రోన్‌దాడిలో మరణించారు. అతను ఇరాన్‌-సౌదీ మధ్య సంబంధాల పునరుద్దరణకు కృషి చేసినట్లు వార్తలు వచ్చాయి. తరువాత 2021 ఏప్రిల్‌ తొమ్మిదిన బాగ్దాద్‌లో సౌదీ-ఇరాన్‌ తొలి చర్చలు జరిగాయి. ఐదవ దఫా చర్చలు జరగనుండగా 41 మంది షియా ముస్లింలను సౌదీలో ఉరితీశారు. దాంతో ఎలాంటి కారణం చూపకుండా 2022 మార్చి 13న చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 21న ఐదవ దఫా చర్చలు జరిగాయి. అక్టోబరు 19న రాయబార కార్యాలయాలను రెండు దేశాలూ తెరవాలని ఇరాన్‌ అధిపతి ఖమేనీ సలహాదారు ఒక ప్రకటన చేశాడు. డిసెంబరు తొమ్మిన చైనా అధినేత షీ జింపింగ్‌ సాదీ సందర్శన జరిపి రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపాడు.ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బిజింగ్‌ను సందర్శించి షీ జింపింగ్‌తో చర్చలు జరిపాడు. మార్చి పదవ తేదీన ఒప్పందం కుదిరింది.


ఒప్పందం కుదరటమే గొప్ప ముందడుగు. సంవత్సరాల తరబడి తెరవెనుక చైనా మంత్రాంగంతో రెండు దేశాలనూ ఒక దగ్గరకు తేవటం ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం అని చెప్పటం కంటే తరుగుతున్న అమెరికా, పశ్చిమ దేశాల పలుకుబడి అనటం సముచితంగా ఉంటుంది. ఈ ఒప్పందం ఇరాన్‌-సౌదీ అరేబియా, మధ్యప్రాచ్యం, చైనా విజయంగా కొందరు చూస్తున్నారు. ప్రపంచం అమెరికా చెప్పినట్లు నడిచే రోజులు గతించాయనే సందేశాన్ని కూడా ఇచ్చింది. పశ్చిమాసియాలో ఉన్న చమురు సంపదలు, భౌగోళికంగా ఉన్న ప్రాధాన్యత రీత్యా గతంలో బ్రిటన్‌, తరువాత అమెరికా ఆప్రాంతంపై పట్టుకోసం చూశాయి.దానిలో భాగంగా చిచ్చు రేపాయి.ఏదో ఒక పక్షం వహించి రెండోదాన్ని దెబ్బతీసి తన అదుపులో పెట్టుకోవటం, చివరకు నాటో తరహా కూటమిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తన పట్టులో బిగించుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. సాధారణ సంబంధాల ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ ఇరాన్‌-సౌదీ మధ్య తలెత్తిన వివాదాలు, పరస్పర అనుమానాలు కూడా పరిష్కారం కావాల్సిఉంది. ఈ ఒప్పందానికి హామీదారుగా ఉన్న చైనా ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వివాదాల్లో ఏదో ఒక పక్షంవైపు మొగ్గుచూపిన దాఖలాల్లేని కారణంగానే రెండు దేశాలూ దాన్ని నమ్మి ముందుడుగువేశాయి. ఇది మిగతా వివాదాలకూ విస్తరిస్తే అమెరికాను పట్టించుకొనే వారే ఉండరు గనుక దీన్ని ముందుకు పోకుండా చూసేందుకు చేసేందుకు అది చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.1979లో అమెరికా మద్దతు ఉన్న ఇరాన్‌ షా ప్రభుత్వం పతనమైన తరువాత అమెరికా ఆ ప్రాంతంలో తలెత్తిన వివాదాల్లో ఇరాన్‌-సౌదీ ఘర్షణ పెరిగింది. ఇరాన్ను శత్రువుగా, సౌదీని మిత్రదేశంగా అమెరికా పరిగణించింది.


సయోధ్య అవసరమని రెండు దేశాలూ గుర్తించినందువల్లనే ఈ ఒప్పందానికి దారి తీసింది తప్ప చైనా వత్తిడేమీ దీనిలో లేదు.దీనిలో చైనా ప్రయోజనాలు లేవా అంటే దాని కంటే ఆ రెండు దేశాల, ప్రాంత ప్రయోజనాలు ఎక్కువ అన్నది స్పష్టం. ప్రస్తుతం ఉన్న కొన్ని వివాదాలను చూద్దాం. లెబనాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో హిజబుల్లా సంస్థకు ఇరాన్‌, ప్రత్యర్ధి పక్షాలకు సాదీ మద్దతు ఉంది. సిరియాలో దశాబ్దికాలానికి పైగా సాగుతున్న పోరులో సౌదీ మద్దతు ఉన్న జీహాదీలకు, ఇరాన్‌ మద్దతు ఇస్తున్న హిజబుల్లా, ఇతర మిలిటెంట్లకు వైరం ఉంది. ఎమెన్‌లో అమెరికా మద్దతుతో సౌదీ దాడులకు దిగుతున్నది. అక్కడ హౌతీ మిలిటెంట్లకు ఇరాన్‌ మద్దతు ఉంది.వారు కొన్ని సందర్భాలలో సౌదీ చమురు టాంకర్ల మీద కూడా దాడులు జరిపారు. ఇరాన్‌లో అత్యధికులు షియా తెగ ముస్లింలు కాగా సౌదీలో సున్నీలు ఉన్నారు.ఇరాక్‌, బహరెయిన్‌లో, చివరికి సౌదీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న సున్నీ-షియా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందంతో అవి క్రమంగా తగ్గుతాయి తప్ప పెరగవు అన్నది అందరూ చెబుతున్నారు. ఇంతకాలం సౌదీ-ఇరాన్‌ వివాదాలతో లాభపడిన అమెరికాకు ఈ పరిణామం సుతరామూ అంగీకారం కాదు. దానికి నిరంతరం ఉద్రిక్తతలు, ఘర్షణలు ఉండాల్సిందే. ప్రపంచంలో అస్థిరతకు అమెరికా చూస్తుంటే సుస్థిరతకు చైనా చేయూత నందిస్తోంది. అమెరికా ఎక్కడ కాలుపెట్టినా తన ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకొనే ఉద్రిక్తతల సృష్టి తప్ప అభివృద్ధికి చేసిందేమీ లేదు.


ఎందుకు సౌదీ అరేబియా అమెరికా నుంచి దూరంగా జరుగుతోంది ? పెట్రో డాలరు బదులు పెట్రో యువాన్‌కు సౌదీ మొగ్గుచూపుతున్నదన్న వార్తలు అమెరికా నేతలకు రక్తపోటును పెంచుతున్నాయి. దీనికి తోడు బ్రెజిల్‌,రష్యా,భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు, తద్వారా రష్యా, చైనాలకు దగ్గర కావాలని సౌదీ చూడటం కూడా దానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఒప్పందాన్ని వ్యతిరేకిస్తే మరింత నష్టమని కావచ్చు, మంచిదేగా అన్నట్లు తడిపొడిగా స్పందించింది. నిజానికి ఒప్పందం కుదరకుండా తెరవెనుక ఎంత చేసినా సాధ్యం కాలేదు.” దీని గురించి మాకు ఎప్పటికప్పుడు సౌదీ చెబుతూనే ఉంది. మేము చేసేది మేము చేస్తున్నాంగానీ నేరుగా ప్రమేయం పెట్టుకోలేదు.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గటానికి చేసే యత్నాలకు మేము మద్దతు ఇస్తాం, అది మాకూ అవసరమే, మా పద్దతిలో మేమూ చేశాం ” అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ అన్నాడు. ఇరాన్‌ పట్ల అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనత కారణంగానే సౌదీ తన దారులు తాను వెతుక్కొంటోందని ఒప్పంద ప్రకటన వార్త వెలువడగానే ఇజ్రాయెల్‌ స్పందించింది. అమెరికా పధకాల ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాల మీద దాడులు జరపాలన్న తమ కలనెరవేరదనే దుగ్గదానికి ఉంది. పాతిక సంవత్సరాల పాటు అమెరికా విదేశాంగశాఖలో మధ్య ప్రాచ్య విధాన సలహాదారుగా పనిచేసిన అరోన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఎన్‌బిసి టీవీతో మాట్లాడుతూ ” ఆ ప్రాంతంలో అమెరికా పలుకుబడి, విశ్వసనీయత తగ్గుతున్నట్లుఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కొత్త అంతర్జాతీయ ప్రాంతీయ పొందికలు చోటు చేసుకుంటున్నాయి, అవి చైనా, రష్యాలకు సాధికారతను, వాటి స్థాయిని పెంచినట్లుగా ఉంది ” అన్నాడు.ఉక్రెయిన్‌ వివాదం పేరుతో రష్యామీద ప్రకటించిన ఆంక్షలను అనేక దేశాలు తిరస్కరించిన నేపధ్యంలో అమెరికా పలుకుబడి గురించి ఏ దేశమైనా ఒకటికి రెండు సార్లు తన విధానాలను సమీక్షించుకుంటుంది. దానికి సౌదీ అరేబియా మినహాయింపు కాదని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


మధ్య ప్రాచ్యపరిణామాల్లో అమెరికా వైఖరిని చూసిన తరువాత ఇరాన్‌-సౌదీ రెండూ పునరాలోచనలో పడటంతో పాటు, సర్దుబాట్లకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి అమెరికా విధించిన ఆంక్షలతో ఆ ప్రాంత దేశాల నుంచి ఇరాన్‌ ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. సౌదీదీ అదే పరిస్థితి, అమెరికాను నమ్ముకొని దాని పధకంలో భాగంగా పని చేస్తే సాధించేదేమీ ఉండదని తేలింది. ఇరాన్‌తో చైనా, రష్యాల సంబంధాలు మరింతగా బలపడటంతో అమెరికాతో వైరం కారణంగా ఇరాన్‌ మరింత బలపడుతుందనేది సౌదీకి అర్దమైంది.దీనికి తోడు ఈ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా మాదిరి ఏ ఒక్క దేశంతోనూ అది ఘర్షణాత్మకవైఖరిని ప్రదర్శించటం లేదు.తన ఎత్తుగడలు, భావజాలాన్ని రుద్దటం లేదు. ఒకదానితో మరొకదానికి తంపులు పెట్టి పబ్బంగడుపుకోవటం లేదు.పరస్పర లబ్ది పొందే పెట్టుబడులు పెడుతున్నది.అందువల్లనే దానితో ప్రతి దేశమూ సంబంధాలు పెట్టుకొనేందుకు చూస్తున్నది. ఇరాన్‌-సౌదీ ఒప్పందం గురించి తొలుత ఇరాక్‌, ఒమన్‌ వంటి ప్రాంతీయ తటస్థ దేశాల్లో ఐదు దఫాలు ప్రాధమిక చర్చలు జరిగాయి. 2030నాటికి ప్రపంచంలో అగ్రశ్రేణి పది దేశాల్లో స్థానం సంపాదించాలంటే అమెరికా ఆధారిత విధానాలతో లాభం లేదని సౌదీకి అర్ధమైంది. అన్నింటి కంటే ఇరుగు పొరుగుదేశాల్లో అస్థిరత్వం, ఘర్షణల వాతావరణం ఉంటే అది ప్రారంభించిన హరిత చొరవ ముందుకు వెళ్లే అవకాశం లేదు. సౌదీతో సర్దుబాటు చేసుకుంటే ఇతర అరబ్బుదేశాలు తమ మీద దాడికి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని ఇరాన్‌కు అర్ధమైంది. ఒంటరి తనం నుంచి అభివృద్ధి వైపు వెళ్లాలంటే మరొక దగ్గరదారి లేదు.తనను బూచిగా చూపి మధ్య ప్రాచ్య నాటో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు మరొక మార్గం లేదు. ఒప్పందాలకు చైనా హామీదారుగా ఉన్నందున రెండు దేశాలకు పెద్ద భరోసా అన్నది స్పష్టం. చైనాకు తెరవెనుక అజండా లేదు. బిఆర్‌ఐ పేరుతో అది రూపొందించిన పథకంలో భాగంగా పెట్టుబడులు పెడుతున్నది. తమ మీద వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన పోరుకు దిగిన అమెరికాను ఎదుర్కొనేందుకు అంతర్గతంగా మార్కెట్‌ను సృష్టించుకోవటంతో పాటు తన ఎగుమతులకు ఇతర మార్కెట్లను వెతుక్కోవలసిన అవసరాన్ని పశ్చిమ దేశాలు ముందుకు నెట్టాయి. ఇరాన్‌-సౌదీ ఒప్పందం మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా దేశాల్లో అమెరికా కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ !