ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” జర్మనీ గెలుస్తున్నట్లు మనకు కనిపించిందనుకోండి మనం రష్యాకు తోడ్పడాల్సి ఉంటుంది, ఒక వేళ రష్యా గెలుస్తున్నదనుకోండి మనం జర్మనీకి సాయం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంత మందిని పరస్పరం హతమార్చుకుంటారో అంతవరకు వారిని చంపుకోనిద్దాం ” తరువాత కాలంలో హిట్లర్‌ను దెబ్బతీశాం అని తన జబ్బలను తానే చరుచుకున్న అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్‌ 1941లో చెప్పిన మాటలివి. డెబ్బయి నాలుగు సంవత్సరాల వయసులో 1953 మార్చి ఐదున గుండెపోటుతో హిట్లర్‌ పీచమణచిన స్టాలిన్‌ మరణించాడు. డెబ్బయి సంవత్సరాలు గడచినా స్టాలిన్‌ ముద్ర చెరగలేదు. ఈనెల ఐదున మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో వేలాది మంది స్టాలిన్‌కు నివాళి అర్పించారు. అనేక చోట్ల పలు కార్యమాలను నిర్వహించారు. పలు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్న పూర్వరంగంలో వాటిని ఎదుర్కొనేందుకు స్టాలిన్‌ వంటి వారు కావాలని జనం కోరుకొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికే ముప్పుగా మారిన నాజీ మూకలను దెబ్బతీసి చివరికి బంధించేందుకు ఎర్ర సైన్యం చుట్టుముట్టటంతో బెర్లిన్‌లోని ఒక నేళమాళిగలో హిట్లర్‌ తన సహచరితో కలసి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. అలాంటి మహత్తర పోరుకు మార్గదర్శి సోవియట్‌ నేత స్టాలిన్‌. తన పెద్ద కుమారుడు ఎకోవ్‌ స్టాలిన్‌ 1941లో హిట్లర్‌ మూకలకు పట్టుబడినపుడు తమ కమాండర్‌ను వదిలితే ఎకోవ్‌ను అప్పగిస్తామని నాజీ మిలిటరీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్టాలిన్‌ వంటి వారు చరిత్రలో అరుదు.చివరికి ఎకోవ్‌ను హిట్లర్‌ మూకలు చిత్రహింసలపాలు చేసి హతమార్చాయి.


ఎర్రజెండా చరిత్రలో స్టాలిన్‌ది ఒక ప్రత్యేక స్థానం. మరణం తరువాత సోవియట్‌ నేతలే స్వయంగా తప్పుడు ప్రచారానికి పూనుకోవటంతో కమ్యూనిస్టు వ్యతిరేకుల సంగతి చెప్పేదేముంది.స్టాలిన్‌ మీద దుమ్మెత్తి పోసిన వారు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. రష్యాలో స్టాలిన్‌ అభిమానులు పెరుగుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓల్గా గ్రాడ్‌లో కార్పొరేషన్‌ స్టాలిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.నాజీజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఈ రోజున సోవియట్‌ మిలిటరీ సాధించిన విజయాన్ని కనుమరుగు చేసేందుకు చూస్తున్నాయి, దాన్ని సాగనివ్వం అన్నాడు.డెబ్బయ్యవ వర్ధంతి సందర్భంగా అనేక మంది విశ్లేషకులు పత్రికల్లో స్టాలిన్‌ మీద దాడి చేస్తూనే జనంలో వెల్లడౌతున్న సానుకూల వైఖరిని కూడా చెప్పకతప్పలేదు. గతేడాది జరిపిన ఒక సర్వేలో నాజీలను ఓడించటంలో స్టాలిన్‌ పాత్ర గురించి 70 శాతం మంది రష్యన్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది.2015 సర్వేలతో పోలిస్తే సానుకూలంగా స్పందించిన వారు పెరిగారు.కమ్యూనిస్టులు కానివారిలో కూడా పెరుగుదల ఉండటం గమనించాల్సిన అంశం.


చరిత్ర కారులు రెండవ ప్రపంచ యుద్దం గురించి భిన్నమైన పాఠాలు తీశారు. స్టాలిన్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. స్టాలిన్‌ గురించి ఎక్కువగా తప్పుడు పాఠాలు తీసేవారు 1939లో సోవియట్‌-నాజీ జర్మనీ మధ్యకుదిరిన మాల్టోవ్‌-రిబ్బెన్‌ట్రాప్‌ ఒప్పందాన్ని చూపుతారు. కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అని చెప్పేవారు కూడా దీన్నే పేర్కొంటారు. ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నడూ హిట్లర్‌తో స్టాలిన్‌ చేతులు కలపలేదు. పరస్పరం దాడులు జరుపుకోవద్దు అన్నదే ఆ ఒప్పందసారం. అసత్యాలు, అర్ధ సత్యాలను పక్కన పెట్టి దీనికి దారితీసిన పరిస్థితులను మదింపు చేయటం అవసరం.జర్మనీలో 1930దశకం మధ్యనుంచి మిలిటరీని పటిష్టపరచటం ప్రారంభించారు.ఇథియోపియా(గతంలో దాన్ని అబిసీనియా అని పిలిచేవారు)ను ఆక్రమించేందుకు ఇటలీ ముస్సోలినీకి, స్పెయిన్లో నియంత ఫ్రాంకో పాలన రుద్దేందుకు జర్మనీ తోడ్పడింది. ఇదంతా నాజీ జర్మనీని పటిష్టపరిచే పధకంలో భాగమే.1938లో ఆస్ట్రియాను జర్మనీ ఆక్రమించింది.తరువాత చెకొస్లోవేకియాలోని జర్మన్లు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకుంది. దాంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీ, ఇటలీ ఒక ఒప్పందానికి వచ్చి హిట్లర్‌ను సంతృప్తిపరచేందుకు ఆ ప్రాంతాన్ని జర్మనీకి అప్పగించేందుకు అంగీకరించాయి. దీన్నే 1938 సెప్టెంబరు 30 మ్యూనిచ్‌ ఒప్పందం అన్నారు. ఇది నాజీలు తూర్పు ఐరోపాను ఆక్రమించేందుకు దోహదం చేసింది. ఒకవేళ జర్మనీ గనుక దాడి చేస్తే తాము రక్షణ కల్పిస్తామని పోలాండ్‌తో మరుసటి ఏడాది మార్చి 31వ తేదీన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్‌ ఏడున ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించాయి.సెప్టెంబరు ఒకటవ తేదీన హిట్లర్‌ మూకలు పోలాండ్‌ను ఆక్రమించాయి. ఎలాంటి మిలిటరీ చర్యల్లేకుండా బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దేశాలు జర్మనీ మీద యుద్దాన్ని ప్రకటించాయి.తాను తటస్థమని అమెరికా చెప్పింది.


బ్రిటన్‌-ఫ్రాన్స్‌-పోలాండ్‌ రక్షణ ఒప్పందం చేసుకోక ముందు తెరవెనుక జరిగిన పరిణామాలను చూడాలి. సోవియట్‌ మీద దాడి చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని పోలాండ్‌ మీద హిట్లర్‌ వత్తిడి తెచ్చాడు. అదే తరుణంలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ కూడా పోలాండ్‌కు ప్రతిపాదించింది. రెండింటినీ తిరస్కరించిన పోలాండ్‌ పాలకులు బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. హిట్లర్‌తో కలసి ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఈ దేశాలు సిద్దం కాదు, అదే సమయంలో సోవియట్‌ బలపడటం కూడా వాటికి సుతరామూ ఇష్టం లేదు.తమ బలాన్ని అతిగా ఊహించుకోవటం కూడా ఒక కారణం. అప్పటికే సోవియట్‌ గురించి అమెరికా భయపడుతోంది.అమెరికా సెనెటర్‌ రాబర్ట్‌ ఏ టాఫ్ట్‌ చెప్పినదాని ప్రకారం ” అమెరికాకు సంబంధించినంతవరకు ఫాసిజం విజయం కంటే కమ్యూనిజం గెలుపు ఎక్కువ ప్రమాదకరం (1941 జూన్‌ 25 సిబిఎస్‌) ”. అంతేకాదు ఐరోపాలో ప్రజాస్వామ్య ముసుగువేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సోవియట్‌ను అడ్డుకొనేందుకు నాజీలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించాయి. ఈ కారణంగానే హిట్లర్‌ మూకలు ఆస్ట్రియాను ఆక్రమించగానే నాజీల దురాక్రమణలను అడ్డుకొనేందుకు రక్షణ ఒప్పందాలను చేసుకుందామని, ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సోవియట్‌ ప్రతిపాదనను అవి తిరస్కరించాయి.జర్మన్ల దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ 1939 జూలై 23న చేసిన ప్రతిపాదన గురించి ఎటూ తేల్చకుండానే జర్మనీతో పరస్పరం దాడులు జరుపుకోకుండా ఒప్పందం చేసుకోవాలని లోపాయికారీ చర్చలకు బ్రిటన్‌ తెరతీసింది.లండన్‌లో హిట్లర్‌ ప్రతినిధితో చర్చలు జరిపారు.


ఈ పరిణామాలు, అంతరంగాల అర్ధం ఏమిటంటే నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, స్పెయిన్లకూ, ప్రజాస్వామిక ముసుగువేసుకున్న బ్రిటన్‌,ఫ్రాన్స్‌, అమెరికాలకు కావలసింది సోవియట్‌ నాశనం కావటం.బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకొనేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తరువాతనే జర్మనీతో పరస్పరదాడుల నివారణ ఒప్పందాన్ని స్టాలిన్‌ చేసుకున్నారు. ఎప్పుడైనా హిట్లర్‌ మూకలు దాడులకు దిగవచ్చన్న అంచనా లేక కాదు.కొద్ది పాటి వ్యవధి దొరికినా ఎర్ర సైన్యాన్ని పటిష్టపరచాలన్న ఎత్తుగడ దాని వెనుక ఉంది. చరిత్రను ఒక వైపే చూడకూడదు.1939లో పోలాండ్‌ మీద నాజీ మూకలు దాడి చేశాయి. దానితో రక్షణ ఒప్పందం చేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పత్తాలేవు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవంలో లెనిన్‌ అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతీఘాత శక్తులు పూనుకున్నాయి. అంతకు ముందు పోలాండ్‌ కూడా రష్యాలో భాగమే అని జార్‌ చక్రవర్తి చేసిన వాదనను బోల్షివిక్‌ సర్కార్‌ అంగీకరించలేదు. బాల్టిక్‌ ప్రాంతంలోని పశ్చిమ బెలారస్‌, పశ్చిమ ఉక్రెయిన్‌, లిథువేనియాలో కొంత ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నాటికే పోలాండ్‌ తన ఆధీనంలో ఉంచుకుంది.జారు చక్రవర్తితో కలసి బోల్షివిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సెంట్రల్‌ పవర్స్‌ పేరుతో జర్మనీ,ఒట్లోమన్‌, ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియాలతో కలసి పోలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న నాజీ, ఫాసిస్టు శక్తులు కూడా చేతులు కలిపాయి.(ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న నాజీశక్తులు రష్యన్‌ భాషమాట్లాడేవారు ఉన్న కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు) ఈ పూర్వరంగంలోనే సెంట్రల్‌ పవర్స్‌తో లెనిన్‌ శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే బ్రెస్ట్‌-లిటోవస్క్‌ ఒప్పందం అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌-స్టాలిన్‌ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం తప్ప మూడో దేశ ప్రస్తావన లేదు. పోలాండ్‌ మీద నాజీమూకలు దాడి చేసిన వెంటనే దానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశభక్తులు నాజీదాడులను ప్రతిఘటించారు. వారికి మద్దతుగా సోవియట్‌ సేనలు పోలాండ్‌లో ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాలను విముక్తి కావించాయి. దాన్నే కొందరు సోవియట్‌ దురాక్రమణగా చిత్రించి నాజీలకు-కమ్యూనిస్టులకు తేడా ఏముందని వాదిస్తారు.


హిట్లర్‌-స్టాలిన్‌ సంధిలో దేశాలను విభజించే అంశం లేదు.అలాంటి దుర్మార్గపు నిబంధనలు ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌-ఫ్రాన్స్‌ దేశాలు హిట్లర్‌తో చేతులు కలిపి చెకొస్లొవేకియాను విడదీశాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత తూర్పు ఐరోపాలో సోవియట్‌ విముక్తి చేసిన అన్ని ప్రాంతాలూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.(సోవియట్‌ పతనమైన తరువాత దానిలో ఉన్న రిపబ్లిక్కులు కూడా స్వతంత్ర దేశాలుగా మారిన సంగతి తెలిసిందే) ఒక్క జర్మనీలోనే తూర్పు ప్రాంతాన్ని ఎర్రసైన్యం విముక్తి చేస్తే పశ్చిమ ప్రాంతాన్ని ఇతర మిత్రదేశాలు ఆధీనంలోకి తెచ్చుకున్నందున దాన్ని విభజించి తరువాత విలీనం చేయాలని నిర్ణయించారు. కొరియా, వియత్నాం విభజన అలాగే జరిగింది. విలీనానికి అడ్డుపడిన అమెరికా, దాని తొత్తు ప్రభుత్వం మీద దక్షిణ వియత్నాం పౌరులు తిరగబడి అమెరికాను తరిమివేసి ఒకే దేశంగా ఏర్పడ్డారు. తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో భాగంగా తూర్పు జర్మనీలో ప్రభుత్వం పతనం కాగానే పశ్చిమ జర్మనీలో విలీనం చేశారు. రెండు కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా, జపాన్‌ అన్నది తెలిసిందే. అదే విధంగా చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ విలీనానికి అడ్డుపడుతున్నది కూడా అమెరికా అన్నది తెలిసిందే.


లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఏమార్చేందుకు చూస్తున్నారు. వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నదానికి బదులుగా తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. గతేడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ ప్రారంభించిన సైనిక చర్యతో రాజకీయ చర్చంతా దాని మీదకు మళ్లింది.


కొంత మంది హిట్లర్‌ అనుకూలురు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక చరిత్రకారులు అరే ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే చరిత్ర గతి వేరుగా ఉండేది అని నిట్టూర్పులు విడుస్తారు.ఏమిటా తప్పిదం అంటే సోవియట్‌ శక్తిని, స్టాలిన్‌ ఎత్తుగడలను తప్పుగా అర్ధం చేసుకున్న హిట్లర్‌ తన మూకలను సోవియట్‌ మీదకు నడపటమే అని చెబుతారు. అది నిజానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసి చూపే దుష్ట ఆలోచనే. తప్పుడు అంచనాలు వేసింది ఒక్క హిట్లరేనా ? ప్రపంచాన్ని తమ చంకలో పెట్టుకోవాలని చూసిన ప్రతివారూ అదే తప్పిదాలు చేశారు. తరువాత కాలంలో అమెరికా కూడా చేసి భంగపడిందని గ్రహించటానికి వారు సిద్దం కాదు.కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ అనుభవాలు చెబుతున్నది. అదే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే జరగనుందని భావిస్తున్నారు.గర్హనీయమైన అంశం ఏమంటే తన మూకలను నడిపించి యూదులు, ఇతరులను లక్షలాది మందిని ఊచకోత కోయించిన హిట్లర్‌ను, వాడిని ఎదుర్కొనేందుకు జనాన్ని సమీకరించి ఎదురొడ్డిన స్టాలిన్ను ఒకే గాట కడుతున్నారు. సోవియట్‌ మిలిటరీ తమను ప్రతిఘటించి నాజీలు, వారితో చేతులు కలిపిన వారి సంగతి చూశారు తప్ప సామాన్య జనం మీద దాడులకు దిగలేదు. చరిత్రను వక్రీకరించగలరు తప్ప దాన్ని చెరపటం ఎవరి తరమూ కాదు !

మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది ! మన గడ్డ అలాంటిదేమరి అంటూ తెగమురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం !! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం.ఎంతటి ఆత్మవంచన ! ఇంకా ఇలాంటివే చెప్పుకోవాలంటే మరో రామాయణం, భారతాలు అవుతాయి. దేశంలో పరిస్థితి అలానే ఉందా ? ఆమె దీక్ష తెరవెనుక కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే తెరముందు రాజకీయ పార్టీలు తమ వైఖరిని తేల్చాలంటూ భారత జాగృతి సంస్థ నేత, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. కవిత జన్మించటానికి నాలుగు సంవత్సరాల ముందే 1974లో ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పుట్టక ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు, ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయేలోగా ఆమోదం పొందుతుందా ? ఆ ప్రక్రియ తరువాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున మద్దతుదార్లతో కలసి కవిత దీక్ష చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. లాంఛన ప్రాయమైన ఈ దీక్ష ద్వారా మరుగున పడేసిన ఈ అంశాన్ని ఆమె ఒక్కసారి దేశ దృష్టిని ఆకర్షించేట్లు చేశారు. దీని పర్యవసానాలు ఏమిటి ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగసభ లేదా పరిషత్‌లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు.నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చింది. మహాత్మాగాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు.1931లో నాటి బ్రిటిష్‌ ప్రధానికి సరోజిని నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం, రిజర్వేషన్లు, కో ఆప్షన్‌ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తరువాత కాలంలో దీన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు. 1974లో దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒకటి. చట్ట సభల్లో రిజర్వేషన్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఈ డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరిగింది.తరువాత 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పధకం(నేషనల్‌ పరస్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30శాతం స్థానాలను రిజర్వుచేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992,93 సంవత్సరాలలో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడోవంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి. తరువాత 1996 సెప్టెంబరు 12న దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు లోక్‌సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు.అది వీగింది, తరువాత ప్రతి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టటం ఆమోదం పొందకుండానే సభలు రద్దుకావటం చరిత్రగా మిగిలింది. తరువాత 2008లో యుపిఏ సర్కార్‌ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్‌ కమిటీకి పంపగా దాన్ని ఆమోదించాలని 2009 డిసెంబరులో సిఫార్సు చేసింది.మంత్రివర్గం 2010 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. మార్చి తొమ్మిదవ తేదీన ఓటింగ్‌కు పెట్టగా 199-1తో ఆమోదం తెలిపారు. తరువాత లోక్‌సభ, సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలిపి ఉంటే అది చట్టరూపందాల్చి ఉండేది. ఇంతవరకు అది జరగలేదు.


రాజ్యసభ ఆమోదించినదాని ప్రకారం మూడోవంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి. వర్తమాన లోక్‌సభలో 78 మంది అంటే 14.3శాతం మాత్రమే ఉన్నారు. మంత్రులు కూడా ఇదే దామాషాలో కొలువు దీరారు. అంతకు ముందు ఉన్నవారి కంటే మంత్రుల సంఖ్య తగ్గింది.అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిదిశాతమే ఉన్నారు. వివిధ దేశాల పార్లమెంట్లలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం గురించి అంతర పార్లమెంటరీ యూనియన్‌ 2022లో సేకరించిన సమాచారం ప్రకారం సగానికిపైగా, దగ్గరగా మహిళలున్న పార్లమెంట్లు ర్వాండా(61.25) , క్యూబా( 53.22),బొలీవియా(53.08), న్యూజిలాండ్‌( 50.42), యుఏయి (50), మెక్సికో(48.2), నికరాగువా(47.25) ఉన్నాయి. ఇరవై దేశాలలో 40శాతంపైగా, ప్రపంచవ్యాపితంగా సగటున 26శాతం ఉన్నారు. 2020లో ప్రపంచంలో 193 దేశాలలో మన స్థానం 143 కాగా మన కంటే మెరుగ్గా ఉన్న దేశాలు నేపాల్‌ 43, బంగ్లాదేశ్‌ 98, పాకిస్థాన్‌ 106వ స్థానంలో ఉండగా శ్రీలంక 182వదిగా ఉంది.


మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఓబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులు ఉన్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పినదాని ప్రకారం ఎగువ నిచ్చెనమెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమే అని వాదించిన వారూ లేకపోలేదు.పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్‌ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరోవైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి. గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీచేసే వారిలో నిర్ణీతశాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శకూడా వచ్చింది.


చట్టపరంగా లేదా రాజకీయ పార్టీలు స్వచ్చందంగా మహిళలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవటం మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని ప్రచారం చేసుకోవటాన్ని అపహాస్యం చేస్తున్నది. అన్నింటికంటే పెద్ద వైరుధ్యం, సిగ్గుచేటైన అంశం ఏమంటే ఎన్నికలలో మూడోవంతు సీట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు ముందుకు రాని పార్టీలు మరోవైపున నేరచరితులకు పెద్ద పీటవేసేందుకు ముందుకు వస్తున్నాయి. దోషులుగా తేలేంతవరకు నిందితులు తప్ప ఎవరూ నేరస్థులు కాదనే నిబంధనను అవకాశంగా తీసుకొని వారి కండబలాన్ని తోడు చేసుకొనేందుకు బరిలో నిలుపుతున్నాయి.తొలి లోక్‌సభలో ధనికులు, నేరచరితులు ఎందరు అని వెతికేందుకు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ధనికులు కానివారు ఎందరు, నేర చరిత లేనివారు ఎందరు అన్నది వెతుక్కోవాల్సి వస్తోంది.


గతంలో రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రకారం మూడోవంతు సీట్లను చట్ట సభల్లో మహిళలకు కేటాయించాలి. షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయించిన సీట్లలో కూడా మూడోవంతు మహిళలుండాలి.ఏ రాష్ట్రంలోనైనా మూడు కంటే తక్కువ లోక్‌సభ సీట్లుంటే అక్కడ మూడోవంతు సూత్రం వర్తించదు.ఎక్కడైనా మూడు సీట్ల కంటే తక్కువ ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయిస్తే అక్కడ కూడా రిజర్వేషన్‌ ఉండదు. రిజర్వుడు సీట్లను రొటేషన్‌ పద్దతిలో కేటాయించాలి. మైనారిటీ,ఓబిసి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ లేదు.రాజ్యసభ, శాసనమండళ్లకు రిజర్వేషన్‌ వర్తించదు.పదిహేను సంవత్సరాల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి.


ఎన్నికల నిబంధనవాళి ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, తమ మీద ఉన్న కేసులను అఫిడవిట్లలో పేర్కొనాల్సి ఉంది. వాటిని విశ్లేషిస్తున్న ఎడిఆర్‌ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43శాతం మంది ఉన్నారు.లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. పార్టీల వారీగా బిజెపి 116(39శాతం), కాంగ్రెస్‌ 19(57శాతం), జెడియు 13(81శాతం), డిఎంకె 10(43శాతం) తృణమూల్‌ 9(41) మంది ఉన్నారు.గత మూడు ఎన్నికలలో 2009లో మొత్తం 162(30శాతం) నుంచి 2014లో 185(34శాతం), 2019లో 233(43శాతం)కు పెరిగారు. వర్తమాన సభలో నేరచరితుల మీద ఉన్న కేసులలో 29శాతం అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళల మీద నేరాల వంటి తీవ్ర స్వభావం కలిగినవి ఉన్నాయి.బిజెపికి చెందిన ఐదుగురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌,ఎన్‌సిపి,వైఎస్‌పి, ఒక స్వతంత్రుడి మీద హత్యకేసులు, బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఉగ్రవాద కేసు ఉంది.ఆమె భోపాల్‌ నుంచి గెలిచారు, మాలెగావ్‌ పేలుడు కేసులో నిందితురాలు. ఇక 29 మంది తమ మీద విద్వేష పూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియకోస్‌ మీద దొంగతనంతో సహా 204కేసులు గరిష్టంగా ఉన్నాయి.


ఇలాంటి వారిని కలిగి ఉన్న పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి ఏకాభిప్రాయానికి రావటం లేదన్నది ఒక ఆరోపణ. నిజానికి ఏ పార్టీ రంగేమిటో తేలేది బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చినపుడే. గతంలో తమకు ఉభయ సభల్లో మెజారిటీ ఉంటే ఒక్క క్షణంలో చేసి ఉండేవారమన్నట్లుగా బిజెపి నేతలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పటికీ బిజెపి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చొరవలేదు.2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు ఆ ఏడాది డిసెంబరులో నాటి మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇచ్చిన సమాధానం బిజెపి చిత్తశుద్దిని వెల్లడించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి చొరవ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదన్నదే ప్రశ్న. తాము అనుకున్న కాశ్మీరు రాష్ట్ర రద్దు, ఆర్టికల్‌ 370 రద్దును ఆఘమేఘాల మీద ఎలా ఆమోదం పొందారో తెలిసిందే. అందువలన ఇప్పుడు బిజెపి తలచుకుంటే ఆమోదం కష్టమా ?

క్రైస్తవ మత కుట్రదారులకు జైలు శిక్ష -నికరాగువాలో పెరుగుతున్న ప్రజా చర్చ్‌లు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలోని నికరాగువాలో మానవహక్కులకు భంగం వాటిల్లిందంటూ తాజాగా ఐరాస మానవహక్కుల సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.తటస్థంగా ఉండాల్సిన సంస్థలు తాము ఇచ్చిన వివరాలను, జరిగిన ఉదంతాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నికరాగువా వామపక్ష శాండినిస్టా ప్రభుత్వం ఆ నివేదికను తోసిపుచ్చింది. డేనియల్‌ ఓర్టేగా అధిపతిగా ఉన్న ప్రభుత్వం కాథలిక్‌ బిషప్‌ రోలాండో అల్వారెజ్‌కు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన 26 సంవత్సరాల శిక్ష విధించి జైల్లో పెట్టిందంటూ అనేక క్రైస్తవ మత సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా ఆ ఉదంతం పట్ల విచారం, ఆందోళన ప్రకటించారని, సదరు బిషప్‌ కోసం ప్రార్ధనలు జరపాలని ఎసిఎన్‌ (ఎయిడ్‌ టు ద చర్చ్‌ ఇన్‌ నీడ్‌) సంస్థ పిలుపునిచ్చింది.మతపరమైన ఊరేగింపుల మీద కూడా ప్రభుత్వం ఆంక్షలను విధించినట్లు ఆరోపిస్తూ అందువలన గుడ్‌ఫ్రైడే వంటి వాటిని కూడా చర్చ్‌లకే పరిమితం చేసినట్లు మత సంస్థలు పేర్కొన్నాయి.బిషప్‌ రోలాండో అల్వారెజ్‌ వంటి వారు అమెరికాతో చేతులు కలిపి 2018 ఓర్టేగా సర్కార్‌ను కూల్చేందుకు కుట్ర చేశారు. అలాంటివారు 222 మందిని కోర్టులలో విచారించి శిక్షలు వేశారు. వారి పౌరసత్వాలను రద్దు చేశారు.వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అమెరికా ముందుకు రావటంతో ఒక విమానంలో వారిని పంపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.తాను అమెరికా వెళ్లేది లేదని బిషప్‌ తిరస్కరించాడు. దాంతో అతన్ని జైల్లో పెట్టి అంగీకరించిన వారిని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విమానంలో అమెరికా పంపారు.వారిలో పదకొండు మంది మతాధికారులు కూడా ఉన్నారు.


నికరాగువాలో అసలే జరుగుతోంది ? తప్పుడు ప్రచారాలకు ఎందుకు పూనుకున్నట్లు ? ముందుగా గమనించాల్సింది, ఇది మొదటిసారి కాదు. అక్కడ తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం ఏర్పడినపుడు, కొంత కాలం తరువాత తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ప్రచారం సాగుతూనే ఉంది. అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) సంస్థతో కలసి ఐరాస మానవహక్కుల కమిషన్‌ ప్రతినిధులు తాజాగా ఒక నివేదిక ఇచ్చారు. ఏకపక్షంగా ప్రపంచం ముందు నికరాగువాను చెడుగా చూపేందుకు చూసింది. భారత్‌ను కనుగొనేందుకు బయలు దేరిన కొలంబస్‌ తన నాలుగవ యాత్రలో 1502లో పసిఫిక్‌ సముద్రం వైపు నుంచి నికరాగువాలో అడుగుపెట్టాడు.తరువాత 1523 నుంచి ఆ ప్రాంతం మొత్తాన్ని అక్రమించి 1821వరకు స్పెయిన్‌ వలసగా మార్చారు. 1821లో గౌతమాలా స్వాతంత్య్రం ప్రకటించుకుంది.అదే ఏడాది మెక్సికోలో భాగంగా మారింది. రెండు సంవత్సరాలకే మెక్సికో రాజరికాన్ని కూలదోసి మిగతా ప్రాంతాలతో కలసి కొత్త రిపబ్లిక్‌ను ఏర్పాటు చేశారు. దానిలో భాగమైన నికరాగువా 1838లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. అప్పటి నుంచిఅంతర్యుద్దానికి లోనైంది.1848లో కాలిఫోర్నియాలో బంగారాన్ని కనుగొన్న తరువాత తూర్పు అమెరికా నుంచి అక్కడికి కార్మికులను చేర్చేందుకు అమెరికన్లు నికరాగువా మీదుగా ప్రయాణించటం దగ్గరిదారిగా భావించి లక్షలాది మంది అటుగా వచ్చారు. నికరాగువాపై ఆధిపత్యం కోసం పోటీపడిన అక్కడి మితవాద, ఉదారవాద వర్గాలలో రెండవది అమెరికన్లను ఆహ్వానించి వారి మద్దతు తీసుకుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎన్నికల పేరుతో 1856లో ఫిలిబస్టర్‌ విలియం వాకర్‌ అనేవాడు తాను నికరాగువా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. 1857లో వాకర్‌ను తరిమివేసి మితవాద శక్తుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1909 వరకు నికరాగువా స్వతంత్ర దేశంగా ఉంది.1893 నుంచి 1909వరకు నికరాగువా అధ్యక్షుడిగా ఉన్న జోస్‌ శాంటోస్‌ జెలయాపై అమెరికా మితవాద శక్తులతో తిరుగుబాటు చేయించింది. తమ పౌరులను రక్షించే పేరుతో 1909 నవంబరు 18 నికరాగువా తీరానికి అమెరికా తన యుద్ద నౌకలను పంపింది. దాంతో జెలయా పదవి నుంచి తప్పుకున్నాడు. తరువాత అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది.దానిలో కుమ్ములాటలు తలెత్తాయి. 1912 నుంచి 1933 వరకు అమెరికా మిలిటరీ స్వాధీనంలో నికరాగువా ఉంది. కాలువ తవ్వకంతో సహా అనేక ఒప్పందాలను తనకు అనుకూలంగా చేసుకుంది.


1927 నుంచి 1933 వరకు తిరుగుబాటు మిలిటరీ అధికారి అగస్టో సీజర్‌ శాండినో గెరిల్లా పద్దతిలో మితవాద ప్రభుత్వం, అమెరికా మిలిటరీ మీద సాయుధ పోరాటం సాగించాడు. దాంతో 1933లో ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. శాండినో తిరిగి తిరుగుబాటు చేయవచ్చన్న జనరల్‌ అంటాసియా సోమోజా గార్సియా సలహామేరకు శాండినోను హతమర్చాలని పధకం వేశారు. దానిలో భాగంగా శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసే పేరుతో 1934 ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి విందుకు ఆహ్వానించారు, విందు తరువాత తిరిగి వెళుతున్న శాండినోను సోమోజా హత్య చేయించాడు. తరువాత తానే గద్దెనెక్కాడు.1956లో సోమోజాను ఒక యువకవి కాల్చి చంపాడు. సోమోజా పెద్ద కుమారుడు లూయిస్‌ సోమోజాను గద్దె నెక్కించారు. 1967లో సీనియర్‌ సోమోజా చిన్న కుమారుడు ఆంటాసియో సోమోజాను గద్దెనెక్కించారు. శాండినోలు 1979 కూల్చేంతవరకు అధికారంలో ఉన్నాడు. సోమోజాపాలన మీద తిరుగుబాటు చేసిన శక్తులు ఆగస్టో సీజర్‌ శాండినో పేరుతో శాండినిస్టా విముక్తి దళాన్ని ఏర్పాటు చేశారు. దాని నేతగా డేనియల్‌ కార్టేగా 1979లో అధికారానికి వచ్చాడు. అనేక సంక్షేమ పధకాలను అమలు చేశాడు. దేశంలో అస్థిర పరిస్థితలను సృష్టించి ఓర్టేగాను దోషిగా చూపి 1990 ఎన్నికల్లో ఓడించారు.తిరిగి 2007 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఓర్టేగాను జనం ఎన్నుకుంటున్నారు.


2018లో ఓర్టేగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విఫల తిరుగుబాటు కుట్ర జరిగింది.ఏప్రిల్‌ 18 నుంచి జూలై 17వరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు అమెరికా తదితర దేశాలు,సంస్థలు ఇచ్చిన మద్దతు, డబ్బు, ఆయుధాలతో హింసాకాండకు పాల్పడ్డాయి. ఇరవైరెండు మంది పోలీసు అధికారులు ఆ దాడుల్లో మరణించగా 400 మందికి పైగా తుపాకి గాయాలయ్యాయి. అరవై మంది అధికార శాండినిస్టా పార్టీ కార్యకర్తలు లేదా మద్దతుదార్లను చంపివేశారు. వందలాది మంది గాయపడ్డారు. ఏప్రిల్‌ 19,20,21 తేదీల్లో అనేక చోట్ల ప్రతిపక్ష సాయుధమూకలు పోలీస్‌ స్టేషన్లు, శాండినిస్టా ఆఫీసులపై జరిపిన దాడుల్లో పెట్రోలు బాంబులు, తుపాకులను వినియోగించిన తీరు వీడియోల్లో ఉంది. వీటిని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. వాటికి సంబంధించి స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా ఐరాస కమిషన్‌కు కనిపించలేదు.శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలపై పోలీసులు దాడులకు పాల్పడినట్లు, తొలుత జరిగిన నిరసనల్లో అసలు ప్రతిపక్షాలకు చెందిన వారెవరూ పాల్గొనలేదని ఐరాస కమిషన్‌ చెప్పింది.


ఎవరెన్ని కుట్రలు చేసినా వాటన్నింటికీ ఇప్పటి వరకు ఓర్టేగా సర్కార్‌ తిప్పికొడుతున్నది. జన విశ్వాసం పొందుతున్నది.ముందే పేర్కొన్న 2018 విఫల కుట్ర తరువాత జరిగిన 2019 కరీబియన్‌ ప్రాంతీయ ఎన్నికలు,2021జాతీయ ఎన్నికలు, 2022 మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార శాండినిస్టా నేషనల్‌ ఫ్రంట్‌ భారీ మెజారిటీలతో గెలిచింది. జనాభాలో 85శాతం మంది క్రైస్తవులే, వారిలో సగానికి పైగా రోమన్‌ కాథలిక్‌లు. పదిహేనుశాతం జనాభా మతం లేని వారు. లాటిన్‌ అమెరికా అంతటా చర్చి ఎప్పుడూ నిరంకుశ శక్తులు, మితవాదులు కనుసన్నలలోనే పనిచేసింది. వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమాలలో ప్రజల పక్షం వహించే మతపెద్దలు అనేక మంది మమేకమయ్యారు. అలాంటి దేశాలలో నికరాగువా ఒకటి.వారికి నియంతలను వ్యతిరేకించటం, పేదల సంక్షేమం ప్రధానం తప్ప పోరు చేస్తున్న వారు పురోగామి వాదులా,కమ్యూనిస్టులా ? మతం పట్ల వారి వైఖరి ఏమిటన్నది ప్రధానంగా కనిపించలేదు.వామపక్ష, కమ్యూనిస్టు గెరిల్లాలకు కూడా మతపెద్దలని గాక వారేవైపు ఉన్నారన్నదే గీటురాయి. అక్కడి వాస్తవ పరిస్థితుల నుంచే ఈ పరిణామం. అందుకే లాటిన్‌ అమెరికా దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు పడక కుర్చీ మార్క్సిస్టు సిద్దాంతవేత్తల చట్రంలో జరగటం లేదు. ఒక చేత్తో బైబిల్‌ మరో చేత్తో ఎర్రజెండా పట్టుకున్న వెనెజులా నేత హ్యూగో ఛావెజ్‌ను ” అమెరికా క్రీస్తు ” అని అనేక మంది జనం నమ్మారు.”నేను క్రీస్తును ప్రేమిస్తాను. నేను క్రైస్తవుడిని. పిల్లలు ఆకలితో మరణిస్తున్నపుడు, అన్యాయాన్ని చూసినపుడు నేను ఏడ్చాను ” అని ఛావెజ్‌ ఒకసారి చెప్పారు.నికరాగువాలో కూడా అదే జరుగుతోంది. అమెరికాతో చేతులు కలిపిన క్రైస్తవమతాధికారులు వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చర్చీలను ఆయుధాలు, కిరాయిమూకల కేంద్రాలుగా మార్చారు. ఆదివారం ప్రార్దనల్లో ప్రభుత్వ కూల్చివేత సుభాషితాలు వల్లించారు.చర్చ్‌కు వచ్చిన వారిలో ఎవరైనా శాండినిస్టాలు(కమ్యూనిస్టులు) ఉన్నారా అని మరీ పిలిచి నిలబడిన వారిని చర్చికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు, 2018 కుట్రలో అనేక మంది ఫాదర్లు స్వయంగా హింసాకాండలో పాల్గొనటాన్ని చూసిన అనేక మందికి చర్చ్‌లు, ఫాదర్ల మీద విశ్వాసం పోయింది. తమకు మేలు చేస్తున్న పాలకులను కూల్చివేసి నిరంకుశ, దోపిడీదార్లను బలపరుస్తున్న చర్చి ఉన్నతాధికారుల తీరును చూసి నివ్వెరపోయారు. దాంతో క్రీస్తును ఆరాధించాలంటే చర్చ్‌లకే పోనవసరం లేదని అనేక మంది భావించారు. ఇండ్లకే పరిమితం కానివారు సామూహిక ప్రార్ధనలు జరిపేందుకు ప్రత్యామ్నాయాలను చూశారు. అవే ప్రజా చర్చ్‌లుగా ఉనికిలోకి వచ్చాయి.


” మేం సంప్రదాయ కాథలిక్కులం కాదు. ఎందుకంటే మాకు ఇక్కడ పూజార్లు ఉండరు.ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి.” అని రాజధాని మనాగువాలోని సెయింట్‌పాల్‌ ప్రాంతానికి చెందిన అపోస్తల్‌ క్రిస్టియన్‌ బేస్‌ కమ్యూనిటీకి చెందిన యామిల్‌ రియోస్‌ విలేకర్లతో చెప్పాడు. ఒక రూములో ప్రార్దనల కోసం వచ్చిన వారందరూ మడత కుర్చీల్లో కూర్చున్నారు. రూము వెలుపల ప్రార్ధనగీతాలు పాడేవారు సంగీత వాద్యాలతో సిద్దంగా ఉన్నారు. మత పెద్దల కుట్రలు వెల్లడైనకొద్దీ పేదలు, కార్మికులతో ఇలాంటి ప్రజా చర్చ్‌లు పెరుగుతున్నాయి.సంప్రదాయ చర్చ్‌లకు వెళ్లేవారు తగ్గుతున్నారు. ఇలాంటి ప్రజాచర్చ్‌లు 1970దశకంలో ప్రారంభమైన 1979లో నియంత పాలన అంతంతో మరింతగా పెరిగాయి. ఇవి క్రైస్తవం-విప్లవం మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవన్న క్రైస్తవ విముక్తి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన పూజారుల ప్రచార కేంద్రాలుగా కూడా పని చేశాయి. వారిలో ఒకరైన ఫాదర్‌ మిగుయెల్‌ డి స్కోటో ప్రస్తుతం నికరాగువా విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నారు.” నీవు జీసస్‌ను అనుసరించకపోతే విప్లవకారుడు కారుడివి కూడా కాలేవు ” అంటారాయన.ఇలాంటి వారు అనేక మంది ఇప్పుడు ఓర్టేగా సర్కార్‌లో పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.వారు క్రైస్తవులే గానీ శాండినిస్టాపాలనను ప్రతిఘటించే అధికార మతపెద్దల తెగకు చెందిన వారు కాదు.1990లో తాము కాథలిక్కులమని చెప్పుకున్నవారు 94శాతం ఉండగా ఇటీవల అది 50శాతానికి తగ్గి ఇప్పుడు 37శాతం ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. లాటిన్‌ అమెరికాలో ఒక చిన్న దేశమైన నికరాగువా(జనాభా 70లక్షల లోపు) ఐరాస మానవహక్కుల సంస్థను శిఖండిగా చేసుకొని అమెరికా, దాని కూటమి చేస్తున్న ప్రచారదాడికి గురవుతోంది. కరీబియన్‌-దక్షిణ పసిఫిక్‌ సముద్రాల మధ్య వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న దేశాలలో అదొకటి. అందువల్లనే ఆ ప్రాంత దేశాలను ఆక్రమించుకొనేందుకు, వీలుగాకుంటే తన తొత్తు ప్రభుత్వాలను రుద్దేందుకు అమెరికా నిరంతరం చూస్తూ ఉంటుంది.దానిలో భాగమే ఇటీవలి పరిణామాలు.

సుప్రీం కమిటీపై కందకు లేని అనుమానం కాషాయదళాలకెందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై మద్దతుదార్ల మండిపాటు !

Tags

, , , , , ,



ఎం కోటేశ్వరరావు


తప్పనిసరి పరిస్థితి ఏర్పడి తప్పు చేసినట్లు ఒక వేళ గౌతమ్‌ అదానీ అంగీకరించినా అతని మద్దతుదారులైన కాషాయదళాలు మాత్రం ఒప్పుకొనేట్లు కనిపించటం లేదు. అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే చైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ చైర్మన్‌ ఓ ప్రకాష్‌ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ ప్రారంభకుడు నందన్‌ నీలెకని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి చైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్‌ బాంకు, ఇన్ఫోసిస్‌ చైర్మన్‌గా పని చేసిన కెవి కామత్‌, ప్రముఖ లాయర్‌ సోమశేఖర సుందరేశన్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జెపి దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడౌతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. కానీ కందకు లేని అనుమానం కత్తిపీటకు వచ్చినట్లు సుప్రీం కోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే నేషనలిస్ట్‌ హబ్‌ అనే మీడియా పోర్టల్‌ ప్రశ్నించింది.సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థికనేరాలకు పాల్పడినవారు కొందరితో ఉన్న సంబంధాలివి, మోడీని విమర్శించే సంస్థలతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంటూ ఇలాంటి వారు తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.


దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరు తెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీని వేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగనమ్ముకొన్నారు.నెల రోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్దచేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోడీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్‌మార్కెట్‌ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘపరివార్‌ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు ? భీమకొరేగాం కేసులో మాదిరి దర్యాప్తు సంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు చూసిన దారుణం తెలిసిందే. అదానీ కంపెనీల్లో అలాంటిదానికి అవకాశం లేదు.వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరు తెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగుచూడనివి సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్‌ లేదా ఆ రంగంలో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూలేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘపరివార్‌ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు ? హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీం కోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశంలో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది. విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీం కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది.సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్‌ మార్కెట్‌ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్‌ శర్మ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది.


ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్‌చేసిన జెపిసికి మోడీ సర్కార్‌ అంగీకరించి ఉంటే సుప్రీం కోర్టు కమిటీ ఉందేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్‌ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు.అయినా మోడీ ఎందుకు నిరాకరించినట్లు ? ఏ పార్టీ మంది ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా,దానితో విబేధించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో నరేంద్రమోడీకి ఉందని చెప్పిన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేక కాదు, ఈ కారణంగానే భయపడ్డారు.


సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల మీద వత్తిడి తీసుకురారా, బెదిరించరా అంటే ఈ దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అదీ ప్రభుత్వం వైపు నుంచే ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ముంచుకు వస్తున్న ముప్పు అదే ! తమ ముందు దాఖలైన కేసుల్లో సుప్రీం నోటీసులు ఇచ్చిన తరువాత గానీ కేంద్రం కదలలేదు.కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ తమ ప్రతిపాదనలను ఒక మూసివేసిన కవరులో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. దాని అర్దం ఏమిటి ? మేము చెప్పిన వారితో చెప్పినపద్దతుల్లో విచారణ జరిపించాలని సుప్రీంను ప్రభుత్వం ఆదేశించటమే.పారదర్శక విచారణ జరగాలంటూ సదరు కవరును సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిజానికి కేంద్రానికి అంతకంటే అవమానం మరొకటి లేదు, బహుశా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. ఇంతకీ ఆ కవరులో నరేంద్రమోడీ సర్కార్‌ రాసిన అంశాలేమిటి అన్నది ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ఇక అవకాశాలు లేవు.తరువాత అవి లీకైనా కేంద్రం తోసిపుచ్చే అవకాశం ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో కేసుల స్వభావాన్ని బట్టి కోర్టులు ప్రభుత్వాలు, ఏజన్సీలను కోరిన సమాచారాన్ని సీల్డు కవర్‌లో అందించాలని అడుగుతాయి. అదానీ కంపెనీలదంతా బహిరంగం అయినపుడు విచారణ రహస్యంగా జరగాల్సిన అవసరం ఏముంది ? కమిటీ విచారణ అంశాలు, పరిధి గురించి పిటీషనర్లకు తెలియాల్సి ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించి ఒక కమిటీని తానే ఏర్పాటు చేసింది. గతేడాది నవంబరులో కేరళ టీవీ ఛానల్‌ మీడియా వన్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ సీల్డుకర్‌ను సుప్రీం తిరస్కరించింది. కక్షిదారు వాటిని చూడకుండా అవకాశాన్ని నిరోధించటమే అవుతుందని పేర్కొన్నది. నిబంధనల ప్రకారం ఒక అంశాన్ని రహస్యమని భావించి సీల్డు కవర్‌లో ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు గనుక నిర్ణయిస్తే ప్రజా ప్రయోజనం పేరుతో దాన్ని చూసేందుకు, కాపీ కావాలని కోరేందుకు అవకాశం లేదు. మాజీ మంత్రి పి చిదంబరం అరెస్టయిపుడు బెయిలు కేసులో ఇడి సమర్పించిన సీల్డు కవర్‌ మీద ఆధారపడిన ఢిల్లీ హైకోర్టును 2019లో సుప్రీం కోర్టు తప్పు పట్టింది.తమ మనస్సులను సంతృప్తిపరచుకొనేందుకు న్యాయమూర్తులకు సీల్డు కవర్‌లోని అంశాలను చూసేందుకు అధికారం ఉన్నపుడు కోర్టు విచారణలో వాటిలో కనుగొన్న వాటిని నమోదు చేయకూడదని పేర్కొన్నది.రాఫెల్‌ విమానాల కొనుగోల వివరాలు రహస్యం అని ప్రభుత్వం చెప్పటాన్ని కోర్టు అంగీకరించింది.2జి స్పెక్ట్రం కేసులో కూడా అదే జరిగింది.


ప్రతి వ్యవస్థ తాము చెప్పినట్లు నడవాలని, తమ కనుసన్నలలో మెలగాలని దేశంలోని మితవాద శక్తులు కోరుకుంటున్నాయి.ఈ కారణంగానే తమకు నచ్చని తీర్పులు, పని తీరును అవి సహించలేకపోతున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలదా లేక కొంత మంది అధికారులదా నిర్ణయాధికారం అంటూ జడ్జీల కొలీజియం విధానంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేదు. దేశ వ్యతిరేకులకు సుప్రీం కోర్టు ఒక పనిముట్టుగా మారిందంటూ హిందూత్వ అనుకూల శక్తులు ధ్వజమెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక(హిందీ) పాంచజన్య సంపాదకీయంలో దీన్నే పేర్కొన్నది.సుప్రీం కోర్టు ప్రజలు చెల్లించిన పన్నులతో నడుస్తున్నది.భారత్‌కు అనుకూలమైన భారత చట్టాల ప్రకారం నడుచుకొనేందుకు మన ప్రయోజనాలకు అనుగుణంగా నడిచేందుకు ఏర్పాటు చేసినదే సుప్రీం కోర్టు.అలాంటి దానిని దేశ వ్యతిరేకులు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని పాంచజన్య మండిపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ అదానీ ఎంత లబ్ది పొందితే చైనాకు అంత నష్టం అని పేర్కొన్నది. చౌకబారుతనం తప్ప ఆర్థికంగా అసలు చైనాకు భారత్‌కే పోలికలేదు, ఇంక అదానీ ఎంత ! అదానీ సంపదను సృష్టించాడు.భారత పురోగమనంలో భాగస్వాములైన వారి మీద దాడి చేయకూడదని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ పేర్కొన్నారు.


మితవాద శక్తులలో సహనం ఇప్పటికే నశించి మైనారిటీల మీద తెగబడుతున్న తీరుతెన్నులు తెలిసిందే.చివరికి అది ఆర్‌ఎస్‌ఎస్‌ మీదకు కూడా మళ్లుతున్నది. నయా ఇండియా అనే పత్రికలో శంకర్‌ సహారా అనే రచయిత ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి రాసిన వ్యాసంలో హిందువుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేయాల్సినంత చేయటం లేదంటూ ధ్వజమెత్తారు.” లాఠీలను పంచుతూ హిందువుల్లో ఉన్న వీరత్వాన్ని పొగిడే సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముస్లిం దురాక్రమణకు వ్యతిరేకంగా నేరుగా పోరాడాలంటూ సంఫ్‌ు పుట్టింది.పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉంది.వాస్తవానికి అంతకు ముందుకంటే మరింత దిగజారింది. ఇలా ఉండగా మూడోవంతు దేశంలో హిందువులు తగ్గారు.దేశాన్ని విభజించి రెండు హిందూ వ్యతిరేక దేశాలను ఏర్పాటు చేశారు. చివరికి మిగిలిన స్వదేశంలో కూడా హిందువులు చట్టపరంగా రెండవ తరగతి పౌరులుగా మారారు.విద్య,దేవాలయాలను వారి నుంచి లాగివేసుకున్నారు. ఇలాంటివి బ్రిటిష్‌ వారి ఏలుబడిలోనూ జరగలేదు.కానీ ఈ సమస్యల మీద పోరాటాలకు దూరంగా ఉండటమే కాదు సంఘపరివార్‌ నేతలు నోరు విప్పటం కూడా మానుకున్నారు.బాధ్యతల్లో ఉన్న సంఫ్‌ు నాయకులు, కార్యకర్తలూ వారి విధానాలు లేదా కార్యకలాపాలను అధికారికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకోవటం లేదు. దానికి బదులు (ఉదాహరణకు గోల్వాల్కర్‌, సుదర్శన్‌,మధోక్‌, వాజ్‌పాయి) ఏ సర్‌ సంఫ్‌ు సంచాలక్‌ లేదా అగ్రనేతల ప్రకటనలు, కార్యాచరణలనైనా వారి వ్యక్తిగత ఆలోచన లేదా ఆచరణ అంటున్నారు తప్ప సంఫ్‌ుకు చెందినవిగా చెప్పటం లేదు, మరి అలాంటపుడు సంఫ్‌ు భావజాలం, పని ఏమిటి ?” అని శంకర్‌ సహారా ప్రశ్నించారు.


పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దేశాల్లో దాన్ని కాపాడేందుకే న్యాయ,శాసన,కార్యనిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. వాటి మౌలిక స్వభావం అదే. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుంటాయి. అంత మాత్రాన దేశంలో ఉన్న వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులుగా పరిగణించనవసరం లేదు. చట్టబద్దమైన పాలన జరపాలి, నిబంధనల మేరకు వ్యాపార,పరిశ్రమలు నడపాలి, ఇలా ప్రతి విభాగానికి కొన్ని నిబంధనలను పెట్టుబడిదారీ విధానాల్లో కూడా పెట్టుకుంటారు. వాటిని ఉల్లంఘిస్తే కోర్టులు తప్పు పట్టినంత మాత్రాన అది మౌలికంగా వ్యవస్థను తిరస్కరించినట్లు కాజాలదు. అనేక మంది పెట్టుబడిదారులు పోటీ పడినపుడు అధికారంలో ఉన్న పాలకులు లేదా అధికారులు కొందరికి అనుకూలంగా ఉంటున్నకారణంగానే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు వాటిని బయట పెడతారంటే కొందరు నిజాయితీపరులైన వారు లేదా పోటీలో నష్టపోకపోయినా అవకాశం పొందని వారు అన్నది తెలిసిందే. అందువలన తాము బలపరుస్తున్నవారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు లేదా ఆదేశాలు జారీ చేస్తే వాటిని మితవాద శక్తులు వ్యతిరేకించటం అంటే తామనుకున్నదాన్ని పొందలేకపోవటం తప్ప అవి కోర్టులకు పూర్తిగా వ్యతిరేకం అనో కోర్టులు పురోగామి వైఖరితో ఉంటాయనో అర్ధం కాదు.కోర్టుల మీద భ్రమలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు.


నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్‌ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది.జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్‌ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింలపట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్గ సంఘపరివార్‌ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్‌ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘపరివార్‌ భావిస్తున్నది, అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

అమెరికా పాలకవర్గాన్ని మరోసారి భయపెడుతున్న సోషలిజం-పార్లమెంటులో తీర్మానాలతో అడ్డుకోగలరా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” అమెరికాలోని అనేక మంది జనం, ఐరోపా సోషలిస్టులు ప్రమాదకరంగా కమ్యూనిజానికి దగ్గర అవుతున్నారు.అమెరికా తరహా జీవనానికి ఒక ముప్పుగా మారుతున్నారు.” అమెరికా పత్రిక అట్లాంటిక్‌ 1951 ఫిబ్రవరి సంచికలో ఐరోపాలో సోషలిజం అనే పేరుతో ప్రచురించిన ఒక వ్యాఖ్యానం పై వాక్యాలతో ప్రారంభమైంది. అదే ఫిబ్రవరి రెండవ తేదీ( 2023) న అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) సోషలిజం ఘోరాలను ఖండించే పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.సభలోని మొత్తం 219 రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, 109 మంది డెమోక్రటిక్‌ పార్టీ వారు దానికి అనుకూలంగా ఓటు వేశారు.డెమోక్రాట్లు 86 మంది వ్యతిరేకించగా 14 మంది సభలో ఉన్నా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వ్యతిరేకించిన వారిలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 86 మందిలో అలెగ్జ్రాండ్రియా ఒకాసియో కార్టెెజ్‌, రషీదా లాయిబ్‌, గోరీ బుష్‌, ఇల్హాన్‌ ఒమర్‌ ఉన్నారు. వీరిని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ బలపరిచింది. అక్కడి మీడియా కమ్యూనిస్టులు, సోషలిస్టులని చిత్రించి వారి మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు గత ఎన్నికల్లో చూసింది.ఇల్హాన్‌ ఒమర్‌ గతంలో సామ్రాజ్యవాద, యూదు దురహంకారాన్ని విమర్శించినందుకుగాను ఆమెను పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించేంత వరకు రిపబ్లికన్‌ పార్టీ నిదురపోలేదు.


ప్రచ్చన్న యుద్ధంలో సోవియట్‌ను ఓడించాం, సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేశాం, కమ్యూనిజానికి కాలం చెల్లింది, దాన్ని ఏడు నిలువుల లోతున పూడ్చిపెట్టాం అంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ అమెరికా, ఐరోపా, ప్రపంచంలోని యావత్తు కమ్యూనిస్టు వ్యతిరేకులు మూడు దశాబ్దాల నాడే పండగ చేసుకున్నారు. సోషలిజం జరిపిన ఘోరాలను ఖండించాలంటూ అమెరికా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అన్నది ఆసక్తి కలిగించే అంశం. బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న ” ప్రతివారూ ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు: పెరిగిన యుగోస్లావియా బెంగ ” అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది.యుగోస్లావియా సోషలిస్టు దేశ స్థాపకుడు మార్షల్‌ టిటో ”ఐక్యత, సోదరత్వం ” అనే నినాదం కింద భిన్నమైన తెగలు, మతాల వారితో ఐక్య దేశాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని,1980 టిటో మరణం తరువాత తలెత్తిన జాతీయవాదంతో అది 1992 విచ్చిన్నానికి దారి తీసిందని ఆ పత్రిక పేర్కొన్నది. టిటో కాలంలో అనుసరించిన కొన్ని విధానాలు, వైఫల్యాలు వాటి మీద జనంలో తలెత్తిన అసంతృప్తి, దాన్ని ఆసరా చేసుకొని అమెరికా, ఐరోపా దేశాల గూఢచార సంస్థలు, క్రైస్తవమత పెద్దల కుమ్మక్కు, కుట్రలతో దాన్ని, ఇతర తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన చరిత్ర, దాన్ని రక్షించుకోవాలని జనం కూడా అనుకోకపోవటం మన కళ్ల ముందు జరిగిందే. ఆకాశంలో మబ్బులను చూసి చేతిలోని ముంతనీళ్లు పారబోసుకున్నట్లు ఆ దేశాల్లో పరిస్థితి తయారైంది. ఆకాశంలో కనిపించిన వెండి మబ్బులు వర్షించలేదు. పూర్వపు పెట్టుబడిదారీ వ్యవస్థను జనాల నెత్తిన రుద్దారు. దానికి తోడు యుద్దాలు, అంతర్యుద్ధాలను బోనస్‌గా ఇచ్చారు. ఈ నేపధ్యంలో మూడు దశాబ్దాల తరువాత గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న చేసిన విశ్లేషణలో ఉనికిలో లేని యుగోస్లావియా గురించి బెంగను, విచ్చిన్నంపట్ల విచారాన్ని వెల్లడించారని పేర్కొన్నది.విడిపోయిన సెర్బియాలో 81శాతం, బోస్నియాలో 77, తొలుతగా ఐరోపా సమాఖ్యలో చేరిన స్లోవేనియాలో 45, కొసావోలో పదిశాతం మంది విచ్చిన్నాన్ని తప్పుపట్టారని వెల్లడించింది.పూర్వపు సోషలిస్టు వ్యవస్థను వర్తమాన పెట్టుబడిదారీ విధానాన్ని పోల్చుకొని నిట్టూర్పులు విడిచేవారిని గురించి కూడా ఉటంకించింది. దీని అర్ధం ఆ దేశాల్లో ఉన్నవారందరూ తిరిగి సోషలిజాన్ని కోరుకుంటున్నారని చెప్పలేము.పెట్టుబడిదారీ ప్రపంచం గురించి కన్న కలలు కల్లలౌతున్నపుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఒక మధనం జరుగుతోంది. సోషలిజం పేరెత్తితే అణచివేసేందుకు ప్రజాస్వామ్యముసుగులో నిరంకుశపాలకులు వారి కళ్ల ముందు ఉన్నారు.


ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ బూచిని చూపి దశాబ్దాల పాటు అమెరికన్లను ఏమార్చిన పాలకులకు 1991 తరువాత అలాంటి తమ పౌరులను భయపెట్టేందుకు వెంటనే మరొక భూతం కనిపించకపోవటంతో ఉగ్రవాద ముప్పును ముందుకు తెచ్చారు.అదీ అంతగా పేల లేదు. ఈ లోగా వారు ఊహించని పరిణామం మరొకటి జరిగింది.సోషలిస్టు చైనా పురోగమనం, దాని మీద అన్ని రకాల వినియోగ వస్తువులకు ఆధారపడటం అమెరికన్లలో కొత్త ఆలోచనకు తెరలేపింది. సోషలిస్టు దేశాల్లో అన్నింటికీ కరువే, ప్రభుత్వం కేటాయించిన మేరకు సరకులు తీసుకోవాలి, దుకాణాలన్నీ ఖాళీ అని చేసిన ప్రచారాన్ని నమ్మిన వారిలో కొత్త ప్రశ్నలు. అదే నిజమైతే అమెరికా, ఐరోపా ధనిక దేశాలన్నింటికీ చైనా వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం ప్రారంభమైంది.దానికి తోడు అమెరికాలో ఉపాధి తగ్గటం, నిజవేతనాలు పడిపోవటం వంటి అనుభవాలను చూసిన తరువాత మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? చైనా, వియత్నాంలో ఉన్న సోషలిజమే మెరుగ్గా కనిపిస్తోంది కదా అన్న సందేహాలు మొగ్గతొడిగాయి. దీనికి తోడు తమ పెరటి తోట అనుకున్న లాటిన్‌ అమెరికాలో తమ ప్రభుత్వం బలపరిచిన నియంతలందరూ మట్టి కరిచారు. సక్రమంగా ఎన్నికలు జరిగిన చోట అమెరికాను వ్యతిరేకించే వామపక్ష శక్తులు అనేక దేశాల్లో ఒకసారి కాదు, వరుసగా అధికారంలోకి రావటాన్ని కూడా అమెరికన్‌ పౌరులు, ముఖ్యంగా యువత గమనిస్తున్నది. సోషలిజం విఫలం అన్న ప్రచారానికి విలువ లేదు గనుక పాలకులు దాన్ని వదలివేశారు. తమ జీవిత అనుభవాలను గమనించిన వారు సోషలిజం సంగతేమో గానీ పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, అది మనకు పనికి రాదు అనే వైపుగా ఆలోచించటం ప్రారంభించారు.అనేక విశ్వవిద్యాలయాల్లో, పుస్తక దుకాణాల్లో మూలన పడేసిన కాపిటల్‌ తదితర మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులిపినట్లు దశాబ్దాల క్రితమే వార్తలు వచ్చాయి. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా వారిలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. చైనా తమకు పోటీదారుగా మారుతున్నదన్న అమెరికా నేతల ప్రకటనలూ వారిని ప్రభావితం చేస్తున్నాయి.


ఇదే తరుణంలో అమెరికా రాజకీయవేదిక మీద బెర్నీ శాండర్స్‌ వంటి వారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ప్రారంభించటం, అవును నేను సోషలిస్టునే అని ప్రకటించి మరీ సెనెట్‌కు గెలవటాన్ని చూసిన తరువాత ఇటీవలి కాలంలో మేమూ సోషలిస్టులమే అని చెప్పుకొనే యువత గణనీయంగా పెరిగింది. అమెరికా అధికార కేంద్రమైన కాపిటల్‌ హిల్‌ ప్రాంతం ఉన్న వార్డు నుంచి పెట్టుబడిదారుల కుంభస్థలం వంటి సియాటిల్‌ నగరంలో వరుసగా మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు క్షమా సావంత్‌(49) అనే మహిళానేత ఇచ్చిన ఉత్తేజంతో పాటు, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి కొంత మంది పురోగామివాదులుగా ఉన్న వారు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నిక కావటం వంటి పరిణామాలు కూడా జరిగాయి.వారు కుహనా వామపక్ష వాదులు అంటూ వామపక్షం పేరుతో ఉన్న కొన్ని శక్తులు కార్పొరేట్‌ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే అందుకున్నాయి. ఎవరు ఎలాంటి వారు అన్నది చరిత్ర చెబుతుంది. ఒక వేళ నిజంగానే కుహనాశక్తులు వామపక్షం ముసుగులో వస్తే అలాంటి వారిని గమనించలేనంత అవివేకంగా అమెరికా కార్మికవర్గం, యువత లేదు.


అందుకే పాలకపార్టీలు రెండూ కంగారు పడుతున్నాయి. లేకుంటే సోషలిజం ఘోరాలను ఖండించేపేరుతో రెండు పార్టీలు ఒకే తీర్మానాన్ని ఎందుకు బలపరుస్తాయి ? కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని, అమెరికాకు తిరుగులేదు అని చేప్పే గొప్పలను నమ్మటానికి అమెరికన్లు సిద్దంగా లేరు.తమ పక్కనే ఉన్న కమ్యూనిస్టు క్యూబాను అమెరికాతో పోల్చితే ఎలుక పిల్ల-డైనోసార్‌ వంటివి. అలాంటి క్యూబా దగ్గర అణ్వాయుధాలు లేవు, స్వంత క్షిపణులు లేవు. నిజానికి అమెరికా తలచుకుంటే ఒక్క నిమిషంలో క్యూబా దీవిని నామరూపాల్లేకుండా చేసే శక్తి ఉంది. అయినప్పటికీ మేము మీకెంత దూరమో మీరు కూడా మాకంతే దూరం అని ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన ఉన్న కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. కాస్ట్రో వారసులు ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. అమెరికాకు తిరుగులేదు అన్నట్లు చిత్రించే హాలీవుడ్‌ సినిమాల బండారం కూడా ఎరిగిందే. వియత్నాం నుంచి 1975లో బతుకు జీవుడా అంటూ హెలికాప్టర్లు, విమానాల వెంట పరుగులు తీసి పారిపోయి వచ్చిన అమెరికా సైనికులు మరోసారి ఆప్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతుల్లో కూడా అలాంటి పరాభవాన్నే పొందారంటూ వచ్చిన వార్తలను,దృశ్యాలను అమెరికా యువతీయువకులు చూడకుండా ఉంటారా ?


అమెరికా దిగువ సభ ఆమోదించిన కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఎగువ సభ సెనెట్‌ ఆమోదించటం లాంఛనమే, తిరస్కరిస్తే చరిత్ర అవుతుంది. తీర్మానంలో ఏముందో చెప్పనవసరం లేదు. వెనెజులా,క్యూబా తదితర దేశాలపై విధించిన ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం గురించి పల్లెత్తు మాట లేదు. అక్కడ జనం ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అమెరికా పుణ్యమే అది.వ్యక్తిగత గౌరవార్హతల ప్రాతిపదిక మీద విశ్వాసం పునాదిగా అమెరికా ఏర్పడింది.సామాహిక వ్యవస్థగా నిర్మితమయ్యే సోషలిజం దానికి పూర్తి వ్యతిరేకం అని దానిలో పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాచిపాట, దాన్ని అమెరికా నూతన తరం అంగీకరించటం లేదని ముందే చెప్పుకున్నాం. ఉక్రెయిన్‌ వివాదానికి కారకులైన అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు దాన్నుంచి గౌరవ ప్రదంగా బయటపడే దారి, పడాలనే చిత్తశుద్ది లేక మరింత తీవ్రంగా మార్చేందుకు పూనుకున్నాయి. తటస్థంగా ఉన్న చైనా పుతిన్‌ మిలిటరీకి మారణాయుధాలు ఇచ్చేందుకు పూనుకున్నదని ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం జి20 దేశాల బృందం అధ్యక్ష స్థానంలో ఉన్న మన దేశాన్ని తమ వెంట నడవాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది.


ప్రతి ఏటా అమెరికాలోని కొన్ని సంస్థలు అభిప్రాయాలను సేకరిస్తాయి. వాటిలో సోషలిజం, పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించటం, వ్యరేకించటం గురించి కూడా ఉంటాయి. ఒక ఏడాది శాతాలు పెరగవచ్చు, తరగవచ్చు మొత్తం మీద గ్రాఫ్‌ ఎలా ఉందన్నదానినే పరిగణనలోకి తీసుకుంటే సోషలిజం పట్ల మక్కువ పెరుగుతోంది. అందుకే దాని మీద తప్పుడు ప్రచారం చేసేందుకు ఏకంగా పార్లమెంటునే వేదికగా ఎంచుకున్నారు.ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ” పూ ” సంస్థ సర్వే ప్రకారం 2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు.ప్రతికూలంగా ఉన్నవారు 33 నుంచి 39శాతానికి పెరిగారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు, ప్రతికూలంగా ఉన్నవారు 55 నుంచి 60శాతానికి పెరిగినట్లు కూడా పేర్కొన్నది. దేశంలో 3.4 కోట్ల మందికి ఆహార భద్రత లేదు. వారిలో 90లక్షల మంది పిల్లలు ఉన్నారు. వారంతా ప్రభుత్వం లేదా దాన ధర్మాలు చేసే సంస్థలు జారీ చేసే ఆహార కూపన్లు (మన దేశంలో ఉచిత బియ్యం వంటివి) తీసుకుంటున్నారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారిలో . 40శాతం మంది తమ వేతనాల్లో 30 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ సర్వేల మీద ప్రభావం చూపుతాయి. దిగజారుతున్న పరిస్థితులు తమ జనాన్ని మరింతగా సోషలిజం వైపు ఆకర్షిస్తాయి అన్నదాని కంటే పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించే ధోరణులు పెరగటమే అమెరికా పాలకవర్గాన్ని ఎక్కువగా భయపెడుతున్నదంటే అతిశయోక్తి కాదు !

అమెరికా సియాటిల్‌ నగరంలో కులవివక్షపై నిషేధం – మహిళలందు కమ్యూనిస్టు క్షమా సావంత్‌ వేరయా !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం గర్వంతో తల ఎత్తుకొనే పరిణామం.అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్‌ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్‌ క్షమా సావంత్‌ అనే 49 సంవత్సరాల భారతీయ మహిళ.తొలిసారి ఎన్నికైనపుడు కనీస వేతనం గంటకు 15 డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్‌ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్‌గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్‌ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు.రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ పత్రిక ” అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి ? ” అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నపుడు మేయర్‌ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్‌గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మితవాదులు, కార్పొరేట్‌ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసిలోని అమెరికా అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ ప్రాంతం కొంత భాగం కూడా క్షమా సావంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ వార్డు(జిల్లా అని పిలుస్తారు) పరిధిలోకి వస్తుంది.


సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న మొత్తం తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. అటువంటి శక్తులకు క్షమా సావంత్‌ ప్రతినిధి. కానీ ఎక్కడకు వెళ్లినా కులవివక్ష కంపును మోసుకుపోతున్న సంస్కారం లేని జనాలు అమెరికాలో కూడా ఆ జాఢ్యాన్ని వదిలించుకోకపోగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.చివరికి ఇటీవల సినిమా అభిమానులు కొట్టుకొని కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే. అనేక మంది తాము కులవివక్ష పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఎలా చూడాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు అక్కడ కూడా మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు.


సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. వత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిస ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కులాలు లేకపోతే హిందూత్వ వాదులకు ఉలుకెందుకు ? తాజాగా సియాటిల్‌ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలు లేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది ) ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇలాంటి వాటిని ఎవరైనా చూడవచ్చు. భుజం మీద చేయివేసి జంధ్యం ఉందా లేదా అని నిర్ధారించుకొనే టెక్నాలజీ మన సొంతం. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను బ్లడీ బాస్టర్డ్స్‌అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం జరిగింది. అమెరికాలోని స్వామినారాయణ సంస్థ్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా వారే భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్థులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్థలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.


మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్‌ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి.భర్త వివేక్‌ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్ధశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు.సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. మన దేశం నుంచి అనేక మంది అమెరికా వెళ్లారు. ఎంపీలు, మంత్రిపదవులు వెలగబెట్టారు. ఇప్పుడు ఏకంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కష్మా సావంత్‌ మాదిరి ఎందుకు ఆలోచించలేదు ? మహిళలకు మాత్రమే వారి సమస్యలు అలాగే దళితులకు మాత్రమే దళితుల వారి సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా మాట్లాడేవారికి దళితురాలు కాని క్షమా సావంత్‌ ఆచరణ ఆలోచింపచేస్తుందా ? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ది కావాలి. అది ఉండబట్టే నాడు ఉన్నవ లక్ష్మీనారాయణను మాలపల్లి నవలా రచనకు పురికొల్పింది. లేనందునే అనేక మంది దళితులమని చెప్పేవారు మనువాదుల చంకనెక్కి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. నాడు దళితుల కోసం పోరాడిన ఇతరులు అనేక మంది వారి సామాజిక తరగతికి ద్రోహం చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు, మరి నేడు మనువాదుల వెంట తిరిగే దళితులు ఎవరికి ద్రోహం చేస్తున్నట్లు ?

తోడేళ్లను బుజ్జగిస్తున్న మేకలు : కేరళలో వివాదంగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌ – జమాతే చర్చలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమదారికి తెచ్చుకోవటం అసాధ్యమా ? కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ(ఎం) ఫిబ్రవరి 21 నుంచి నెల రోజులు సాగే జాతాను కోజికోడ్‌లో సిఎం పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బిజెపి ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌తో కేరళకు చెందిన జమాయతే ఇస్లామిక్‌ హింద్‌ సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్‌ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది.దాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి ఎదురుదాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి.


జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్‌ జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో జరిపిన చర్చల గురించి వెల్లడించారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక వధలు, అట్టడుగున ఉన్న తరగతుల అణచివేత అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.” ఆర్‌ఎస్‌ఎస్‌తో విబేధించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారతలోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుంచుతామన్న వాదన చేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు.ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు.మైనారిటీల రక్షణ అంటే మత స్వేచ్చకు రక్షణ. దాన్ని విచ్చిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్నవారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకికవాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం ? సంఘపరివార్‌ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడుతున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకు మద్దతు ఇస్తాయి.మతశక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకికవాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరం లేదు.లౌకిక శక్తులకు ఇదొక సవాలు ” అని విజయన్‌ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్‌, సమస్త కేరళ జమైతుల్‌ ఉలేమా, ముస్లిం లీగ్‌, కేరళ నదవతుల్‌ ముజాహిదీన్‌, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చల ద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్‌ కాంతాపురం ఏపి అబూబకర్‌ ముస్లియార్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్‌ పేర్కొన్నది.మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది.భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పి పుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్‌ ఒక పనిముట్టుగా మారుతున్నది ” అని విమర్శించింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్‌ నేతలు పికె కున్హాలీకుట్టి, ఎంకె మునీర్‌ పేర్కొన్నారు.


ముస్లిం సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ జరిపిన రహస్య సమావేశం గురించి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడించింది. సంఘపరివార్‌ నేతలు ఇంద్రేష్‌ కుమార్‌, రామ్‌లాల్‌, కృష్ణ గోపాల్‌ మూడు గంటల పాటు ఢిల్లీలోని మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్‌, జమాతే ఉలేమా ఇ హింద్‌, అజ్మీర్‌ దర్గా సల్మాన్‌ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, నజీబ్‌ జంగ్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, ప్రముఖ హౌటల్‌ ఓనరు సయిద్‌ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్‌ సిద్దికీ, మరికొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్‌ మినహా మిగిలిన ముస్లిం ప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూ పత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటం ద్వారా సానుకూల సందేశాన్ని పంపటం ముఖ్యమని భాగాస్వాములైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు భావించారు.ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్‌ నేతలు రావటం మంచిది కాదని భావించినట్లు, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు కూడా వెల్లడించింది.అనేక అంశాలను ముస్లిం నేతలు లేవనెత్తితే వాటికి సమాధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గోవుల అంశాల్లో హిందువుల మనోభావాలను గమనించాలని కోరినట్లు వెల్లడించింది.


ఆర్‌ఎస్‌ఎస్‌-జమాతే ఇస్లామీ హింద్‌ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్‌ పార్టీ బుర్రలో పుట్టిన ఆలోచనకాదా అని సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభలో విమర్శించారు. కాంగ్రెస్‌లోని కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్‌ పార్టీ, జమాతే పట్ల ముస్లింలీగ్‌లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ప్రత్యేక బంధం ఏమిటో, చర్చల గురించి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ది పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు. ఈ సభలో సిఎం పినరయి విజయన్‌ ప్రస్తావించిన మూడు సార్ల తలాక్‌ అంశంపై బిజెపి, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడు సార్లు తలాక్‌ చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కనుక దాని మీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దాని మీద చట్టం చేసేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సిపిఎం ఖండించింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్‌ కేసులుగా పరిగణించి ముస్లిం పట్ల క్రిమినల్‌ కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్‌ను సమర్ధించలేదు.సిఎం పినరయి విజయన్‌ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతుష్టీకరించలేదు.


ఖురాన్‌లో మూడుసార్లు తలాక్‌ అనే పద్దతే లేదని చెబుతున్నారు. అనేక దేశాల్లో అది లేని మాట నిజం. ఖురాన్‌లోని లేని దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్లు ? అన్ని మతాల్లో అనేక అంశాలను కొత్తగా చొప్పించినట్లుగా మూడు సార్లు తలాక్‌ అనేదాన్ని కూడా చొప్పించారు. దాన్ని ఎవరూ సమర్ధించటం లేదు.వేదకాలంలో కులాలు లేవని చెబుతారు, చేసే వృత్తిని బట్టి కులం అన్నారు అంటారు. ఇప్పుడు కులవృత్తులు లేకున్నా, సదరు వృత్తులు చేయకున్నా అదే కులాలతో పిలుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సెలవిచ్చినట్లుగా కులాలను సృష్టించింది పండితులు(బ్రాహ్మలు కాదు మేథావులని తరువాత వివరణ ఇచ్చుకున్నారు) అన్నదాని ప్రకారం ఉనికిలో ఉన్న కులాలను ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా ! వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. వాటి మీద చట్టాలను ఎందుకు చేయటం లేదు.కులాలను, వివక్షను, కొందరిని కించపరిచే వాటిని సమర్ధించే మనుస్మృతి, ఇతర పురాణాలను సమర్ధించటాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారా ? వాటిని ప్రచురించి ప్రచారం చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?


సిపిఐ(ఎం) ప్రారంభించిన నెల రోజుల యాత్రలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జనం ముందుకు తీసుకువెళుతున్నారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు ఆ మూడు పార్టీలకు తెలిసే జరిగినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, యాత్ర సారధి ఎంవి గోవిందన్‌ పేర్కొన్నారు.లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో జమాతే మాట్లాడితే తప్పేముందని కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ ఎలా అంటారు ? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సిపిఎం ముందుకు తెచ్చిన అనవసర వివాదం అని ముస్లింలీగ్‌ నేత కున్హాలీ కుట్టి చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.చర్చలు జరపటంలో ఆ రెండు పార్టీలకు ఎలాంటి తప్పు కనిపించటం లేదన్నారు. గాంధీ మహాత్ముడిని చంపిన, బాబరీ మసీదు కూల్చివేసిన భావజాలం గలవారితో సంప్రదింపులు తప్పులేదని కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ ఎలా చెప్పగలుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ యాత్రకు పికె బిజు మేనేజర్‌, సిఎస్‌ సుజాత, ఎం స్వరాజ్‌, కెటి జలీల్‌, జేక్‌ సి థామన్‌ సారధులుగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాది కాలంగా రావాల్సిన రు.40వేల కోట్ల గురించి ఏ మీడియా మాట్లాడదు. పదవ ప్రణాళికలో కేరళకు కేంద్రం నుంచి 3.9శాతం నిధులు వస్తే ఇప్పుడు 1.9శాతానికి తగ్గినా మౌనంగా ఉంటుంది. జిఎస్‌టి పరిహారం రు.9,000 కోట్లు, రెవెన్యూలోటు పరిహారం రు.6,716 కోట్లు ఇవ్వటం లేదని, రుణాలు తీసుకోవటం మీద పరిమితి విధిస్తే సాంఘిక సంక్షేమ పధకాలను ఎలా అమలు జరపాలని సిపిఎం ప్రశ్నిస్తోంది.రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించింది.

రెండో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం – స్టార్ట్‌ 2 ఒప్పందాన్ని పక్కన పెట్టిన రష్యా !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్‌) నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం నాడు రష్యన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు.1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ వప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది.తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు.నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారం నాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్‌ రాజధానికి సోమవారం నాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందో నని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలాండ్‌ వెళ్లాడు.గతవారంలో మ్యూనిచ్‌ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ రావటం ఇదే ప్రధమం.గతంలో బిల్‌ క్లింటన్‌ 1994,1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్‌ కీవ్‌ సందర్శనకు వచ్చారు. జూనియర్‌ బుష్‌ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది.తొలుత సంప్రదింపులంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్‌ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.


జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు.మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్‌ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్‌ తదుపరి తైవాన్‌ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్‌-చైనా రెండూ ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్‌ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్‌ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిటలో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్‌ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్చ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని వత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.


ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా.ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి.అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంథనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంథన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబాంకు దారిద్య్ర దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు.అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు.మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్‌ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి.వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.


కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్‌ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.నిజానికి ఒక్క ఉక్రెయిన్‌ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి.ఇరవైశాతం ఉక్రెయిన్‌ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్‌ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నట్లు వార్తలు.ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు.దానికి గాను అవసరమైన సరంజామా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.


సంక్షోభం రెండో ఏడాదిలో ప్రవేశించిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. అవి రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలకు దారి తీసేదీ చెప్పలేము. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో నిమిత్తం లేకుండా తమ భద్రతను తామే చూసుకోగలమనే జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల ధీమా ఇప్పుడు కనిపించటం లేదు. వాటిని ఇరకాటంలో పెట్టి తమ అవసరాన్ని మిగతా దేశాలతో గుర్తించే ఎత్తుగడలో భాగంగానే ఉక్రెయిన్ను ముందుకు తోసి అమెరికా వర్తమాన పరిస్థితిని సృష్టించిందన్నది స్పష్టం. దానికి రష్యాను అదుపు చేయటంతో పాటు దాని బూచిని చూపి మొత్తం ఐరోపాను తన అదుపులో ఉంచుకొనేందుకు చూస్తున్నది.ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ తప్పుకున్నప్పటికీ తన నమ్మిన బంటుగా అమెరికా నిలబెట్టుకుంది. మరోవైపున భద్రతామండలి, ఐరాస చేసేదేమీ లేదని ప్రపంచానికి రుజువైంది. దీంతో ఎవరి జాగ్రత్తలు వారు చూసుకుంటున్నారు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్‌ సిబిఎస్‌ టీవీలో ఆరోపించాడు.ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు.చైనాలో ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గాస్‌, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్‌ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు.పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు.రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్‌ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్‌ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

,

ఓరి మాయలోడో ఓరి మందులోడో : మోదానీ సినిమాలో ఒక రైల్వే పోర్టర్‌ సంచలనం !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


లాహిరి లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోడీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు.అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా స్వంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్‌ పోస్ట్‌ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడించింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడింటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోడీ సర్కార్‌ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.వికీపీడియా వెల్లడించిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి.వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోడీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.


గుజరాత్‌ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, స్వంత పార్లమెంటుకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్‌ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు.హిండెన్‌బర్గ్‌ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్‌ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్‌, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోడీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది రాసినపుడు ఆ మొత్తం రు. పదకొండులక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ 120 బిలియన్‌ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే ఫిబ్రవరి 20న తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్‌ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్‌ గాస్‌ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.


ఐరోపాలోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన సమావేశంలో జార్జి సోరస్‌ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలని అన్నాడు.నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ-మోడీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.” మోడీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు.వారి విధి విడదీయ లేనిది.వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేక మేడల్లా కుప్పకూలాయి.మోడీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి.ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది.నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా ” అన్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్‌ ఒక ఆసక్తికలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోడీ ప్రజాస్వామికవాది కాదన్నాడు.భారత్‌ క్వాడ్‌(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోడీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండించాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండించాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.


భారత్‌తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్‌ ఒక బిలియన్‌ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోడీ సర్కార్‌ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా ? కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహాదారు కాంచన్‌ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిందన్నారు.వారికి జార్జి సోరస్‌ నడిపే ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌కు అనేక మంది శత్రువులుండగా వారందరినీ సోరస్‌ నడిపిస్తున్నాడని ఆరోపించారు.భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోడీ గురించి సోరస్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. అతని గురించి చెప్పాల్సి వస్తే ముసలోడు, ధనికుడు, మొండిమనిషి, దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ప్రమాదకారి కూడా అన్నారు.తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్‌ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు.రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్‌ఆర్‌సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్‌ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


తొంభై రెండు సంవత్సరాల జార్జి సోరస్‌ గురించి ఆరోపణలు కొత్తవేమీ కాదు, అవి నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఎక్కడా ఏ దేశమూ అతని మీద ఉన్న ఆరోపణలను విచారించి రుజువు చేసి జైల్లో పెట్టలేదు. ఇప్పుడు బిజెపి నేతల ఆయాసపడటం తప్ప చేసేదేమీ లేదు.తాను నివశిస్తున్న అమెరికా అధినేతల గురించే బహిరంగంగా సవాలు చేశాడు. 2003 నవంబరు 11వ తేదీ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవిత కేంద్రీకరణ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ను పదవి నుంచి తొలగించటమని, అది తనకు జీవన్మరణ సమస్య అన్నారు. బుష్‌ను ఓడిస్తానని ఎవరైనా హామీ ఇస్తే తన దగ్గర ఉన్న సంపదనంతా ఇస్తానని కూడా చెప్పాడు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో బుష్‌ ఓటమి కోసం డెమోక్రటిక్‌ పార్టీకి సోరస్‌ వివిధ సంస్థలపేరుతో రెండున్నర కోట్ల డాలర్ల మేర విరాళం కూడా ఇచ్చాడు.పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. సంపాదించినదాన్లో వెనకేసిందానికన్నా దాన ధర్మాలకే ఎక్కువ ఇచ్చాడు. అతను కూడా షార్ట్‌ సెల్లింగ్‌ పద్దతుల్లో లాభాలు గడించిన స్టాక్‌ మార్కెట్‌ జూదగాడే. ఆ జూదాన్ని చట్టపరంగానే అన్ని దేశాలూ అనుమతిస్తున్నాయి.


హంగరీలో నాజీ మూకల దాడి నుంచి మారుపేర్లతో తప్పించుకున్న యూదు కుటుంబాలలో సోరస్‌ది ఒకటి.నాజీలతో చేతులు కలిపాడనే విమర్శలకు కూడా అతని మీద ఉన్నాయి.బుడాపెస్ట్‌లో 1930లో జన్మించిన సోరస్‌ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లండన్‌ చేరుకున్నాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనేందుకు కొంతకాలం రైల్వే కూలీగా, కొంత కాలం హౌటళ్లలో సర్వర్‌గా పని చేశాడు. (నరేంద్రమోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మినట్లు ప్రచారం చేశారు గానీ దానికి ఎక్కడా రుజువుల్లేవు.) 1956లో అమెరికా చేరుకొని అక్కడ సంపాదన ప్రారంభించాడు. అనేక దేశాల్లో అనేక మందికి గిట్టనిపనులు చేసి ప్రమాకరమైన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.పచ్చి మితవాద శక్తులను కూడా భయపెట్టే మనిషి అని 2019లో బిబిసి వర్ణించింది.డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అసలు పడదు. ట్రంప్‌-మోడీ జిగినీ దోస్తులు కనుక జార్జి సోరస్‌ చేసిన విమర్శలు, ప్రశ్నలు సహజంగానే మోడీ భక్తగణాన్ని కూడా భయపెట్టి ఉండాలి. సోరస్‌ వివాదాస్పద నేపధ్యం కారణంగా నరేంద్రమోడీ, అదానీ మీద అతని విమర్శలను కొట్టివేస్తే కుదరదు.

సోరస్‌ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం అవి లాభాల బాటలో ఉన్నపుడు వాటినుంచి తప్పుకోవటం, షార్ట్‌ సెల్లింగ్‌ వంటి పనులకు పాల్పడతాడు. గతంలో లండన్‌ బాంకు షేర్లను అలాగే షార్ట్‌ సెల్లింగ్‌ చేసి వాటాల ధరల పతనం కాగానే పెద్ద ఎత్తున కొని లబ్ది పొందాడు. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లు నడమంత్రంగా దూసుకు వచ్చిన కంపెనీల వెనుక ఏం జరిగేదీ అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.అనేక దేశాలు అతన్ని నిషేధించాయి. సోరస్‌కు అనేక ప్రభుత్వాలల్లో కీలకమైన చోట్ల ఉప్పందించేవారు ఉన్నారు. 1992లో బ్రిటన్‌ ప్రభుత్వం పౌండ్‌ విలువను తగ్గించాలని తలపెట్టింది. దాన్ని పసిగట్టిన సోరస్‌ అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పౌండ్లను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆ లావాదేవీల్లో వందకోట్ల డాలర్ల మేర లబ్ది పొందాడు.తన కంపెనీలు అక్రమాలకు పాల్పడలేదనే ప్రచారం చేసేందుకు అదానీ ఒక అమెరికా కంపెనీని ఆశ్రయించినట్లు వార్తలు.దానికి ఉన్న విశ్వసత నీయత ఏమిటి ? ఒక జాతీయ వాదిని, దేశభక్తుడిని అని చెప్పుకున్న పెద్దమనిషి విదేశీ కంపెనీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నట్లు ? నెల రోజులు కావస్తున్నా రోజురోజుకూ అదానీ కంపెనీల వాటాల ధర పతనం తప్ప ఆగలేదు. అంతాబాగుంది అని చెప్పిన దానిని ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న మోదాని (మోడీ + అదానీ = మోదాని ) సినిమాలో జార్జి సోరస్‌ సంచలన ప్రవేశం. ఆ సినిమా చివరకు ఏమౌతుంది.అదానీ అక్రమాల చిట్టా రాజకీయంగా నరేంద్రమోడీ మెడకు చట్టుకుంటుందా ?

ప్రచార ఆర్భాటం తో మోసం- కంపెనీలకు ధనరాసులు-రైతులకు కన్నీరు-జన్యుమార్పిడి ఆవాలు

Tags

, , , , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్,  

అధిక ధిగుబడులు వస్తాయనీ, గులాబీరంగు పురుగు బెడద తప్పుతుందనీ 2002 సం. లో బీ టీ పత్తిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. రైతులకు తాత్కాలికంగా ఉపయోగపడింది. మోన్సాంటో లాంటి కంపెనీలకు లాభాల పంటపండింది. కాలం గడిచేకొద్దీ, బీటీ పత్తి వలన రైతులకు ప్రయోజనం లేకపోగా పురుగు బెడద విషమించింది. ప్రురుగు మందుల ఖర్చు ఎక్కువయింది. 2002 సం.లో హెక్టారుకు 100 కేజీల పురుగుమందుల వాడకం 2013సం.కి 220 కేజీలకు పెరిగింది. అయినా పురుగులు కంట్రోలుకాక పంట సగటు దిగుబడి హెక్టారుకు 554 కిలోలనుండి 445 కిలోలకు తగ్గిపోయి, పత్తికి ధర లేక, అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

బీటీ పత్తి విత్తనాలలో లాభాలను రుచిమరిగిన మోన్సాంటో, బేయర్స్ లాంటికంపెనీలు మానవులందరూ తినే కూరగాయలు, ఆహారధాన్యాలలో బీటీ ప్రవేశపెట్టి అధిక లాభాలనార్జించాలని కంపెనీలు విరామమెరుగని కృషి సాగిస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి  బీటీ వంకాయ, బీటీ బెండ పై గుంటూరు జిల్లా నారాకోడూరు లో 2005 సం.లో ప్రయోగాలను చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజాసంఘలు, మీడియా చేసిన ఆందోళన ఫలించి ఆ ప్రయోగాలను ప్రభుత్వం ఆపక తప్పలేదు. బీటీ వంకాయ పై మారటోరియం విధించారు. 

మొట్టమొదటి జన్యుమార్పిడి ఆహార పంట – ధారామస్టర్డ్ హైబ్రిడ్-11

ఇపుడు జన్యుమార్పిడి ఆవాలను (GM MUSTARD) ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం రంగం సిధంచేసింది. కేంద్ర పర్యావరణ శాఖ( MOEFC) క్రింద పనిచేసే జనిటెక్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ (GEAC) జన్యుపరంగా మార్పు చేసిన బీ టీ ఆవాలకు 2022 అక్టోబర్ 25న అనుమతించింది. భారతదేశ శాస్త్రవేత్త దీపక్ పెంటేల్, ప్రభుత్వ నిధుల సహాయంతో ” ధారా మస్టర్డ్ హైబ్రిడ్-DMH-11”విత్తనాలను అభివృధిచేశారు. ఆవ మొక్క ఒక్క పువ్వు లోనే మగ స్టేమెన్-ఆడ పిస్టిల్  వుండటంవలన ప్రకృతిలో స్వతహాగా సహజసిధంగా సంపర్కం తేలికగాజరుగుతున్నది. కొత్తజన్యువులను పువ్వులో చొప్పించటానికి బార్-బార్నేస్-బార్ స్టార్ టెక్నాలజీని ఉపయోగించారు. బార్నేస్ పధతివలన మొగ స్టేమెన్ ను నిర్వీర్యం చేసి, బార్ స్టార్ పధతివలన భూమిలో నుండి సేకరించిన బాక్టీరియా బేసిల్లస్ ఆక్వాఫిసియన్స్ జన్యువు ను చొప్పించి ఆడ పిస్టిల్ నుఉత్తేజపరచి, సాంప్రదాయ ఆవాల మొక్కఅయిన వరుణ  జన్యువు తో సంకరం చేశారు. హెర్బిసైడ్ రెసిస్టెంట్ కలుపు మందును తట్టుకునేటట్లుగా బార్ జన్యువు ను ప్రవేశపోట్టారు. జన్యుమార్పిడి విత్తనాలే కాకుండా స్ధానిక “వరుణ “తో సంకరం వలన అధిక దిగుబడులు లభిస్తాయంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ గా జన్యు మార్పిడి చేసినందువలన పొలంలో కలుపు తీసే పని లేదంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపు మందు ను తట్టుకునే విధంగా జన్యువులను మార్చటం. కలుపు మందు కొట్తే ఈ జన్యుమార్పిడి ఆవాల పంట మాత్రమే బతుకుతుంది. కలుపు మొక్కలన్నీ నాశనం అవుతాయి.

ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు బహిరంగంగా పొలాలలో ప్రయోగాత్మకంగా సాగుచేయటానికి, ప్రదర్శనకు, విత్తనాల ఉత్పత్తికి అనుమతించారు. రాజస్ధాన్, పంజాబ్,హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 100 చోట్ల ప్రయోగాలను ఐ.సీ.ఏ. ఆర్ నిర్వహిచాలన్నారు. జీ ఎమ్ ఆవాల అనుమతి, దేశంలోతీవ్రమైన చర్చనీయాంశమయింది. జన్యుపరంగా మార్పుచెందిన ఆవాల పంట మన దేశంలో తేనె ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని జన్యుమార్పిడి పంట లో వచ్చిన తేనె ను విదేశాలు కొనవనీ, విదేశీ మారకద్రవ్యం రాదనీ గ్లూఫోసినేట్ హెర్భిసైడ్ కలుపుమందు ఆవ పంటలో వాడితే, ఎవరూ కొననందున మా బతుకు బజారున పడుతుందని తేనె సాగుదారులు ఆందోళనకు దిగారు. రైతులు 150,000 టన్నుల తేనెను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. . ఇది మనకు రూ. 75,000 కోట్లు ( రూ. 750 బిలియన్లు ) ఆర్జించే తేనె ఎగుమతులపై ప్రభావం చూపుతుంది

GM ఆవాలతో తేనెటీగ జనాభా నశిస్తుంది. నేడు, తేనెటీగల రైతులు ఆధారపడిన ఏకైక సహజ పంట ఆవాలు.

సుప్రీమ్ కోర్టు స్టే

అరుణా రోడ్రిగ్జ్ , కవితా కురుగంటి లాంటి సామాజిక కార్యకర్తలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ జన్యుమార్పిడి పంటల సమస్యను పరిశీలించేటందుకు సాంకేతిక నిపుణుల కమిటీ ని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టుకి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ ( 2013 ) మరియు జన్యుమార్పిడి పంటలను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల ఏకగ్రీవ నివేదికలు జన్యుమార్పిడి పంటలపై పూర్తి నిషేధాన్ని సిఫార్సు చేశాయి.

భారతదేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపుమందులను చేలో చల్లితే తట్టుకునే పంటలు పనికిరావని కమిటీ చెప్పిందన్నారు. హెర్బిసైడ్లు అంటే కలుపు నివారణ మందులు కాన్సర్ కు కారణమవుతాయని కూడా కమిటీ అభిప్రాయపడింది. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, జీవ వైవిధ్యం పై దీర్ఘకాలిక ప్రభావం గురించి ఎటువంటి అధ్యయనాలు నిర్వహించనందున హెర్బిసైడ్ అంటే కలుపు మందులు వాడే పంటలపై పూర్తి నిషేధాన్ని విధించాలని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన కమిటీసిఫార్సు చేసిందని కోర్టుకు గుర్తు చేశారు. జన్యుమార్పిడి పంటలపై స్వతంత్ర అధ్యయనం చేయకుండా స్వంత ఆర్ధిక ప్రయోజనాలున్న కంపెనీలే ప్రయోగాలు, అధ్యయనాలు చేయటం, ఆ రిపోర్టులపై ఆధారపడి పర్యావరణ అనుమతులివ్వడం తగదని ప్రశాంతభూషణ్ నివేదించారు.

 ప్రజారోగ్యం పై పర్యావరణంపై రహస్యనివేదికలకు బదులుగా స్వతంత్ర నిపుణుల సంస్ధలచే , నిర్వహించబడే పబ్లిక్ డొమైన్ లో సమగ్రమైన, పారదర్శకమైన, నిజాయితీతో వాస్తవ అంశాలతోకూడిన  బయోసేఫ్టీ రిపోర్టును జీ ఈ ఏ సీ  బహిరంగపరచాలన్నారు. 

జన్యుమార్పిడి ఆవాల విత్తనాలపై యధాస్ధితినినకొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.

 ఆహారం లో జన్యుమార్పిడి పదార్ధాలను ప్రవేశపెట్టే ముందు అందరికీ తెలిసేటట్లుగా క్షేత్ర ప్రయోగాలు భారీ ఎత్తున పారదర్శకంగా జరగాలి. కానీ జరగలేదు. రహస్యనివేదికలే తప్పబహిరంగ రిపోర్టులు లేవు. కనీసం ఇంటర్నెట్ లో కూడా పెట్టలేదు. తేనెటీగలు, తేనె పై బతికే వారి సమస్యలేకాకుండా ఆవాలు తిన్నందువలన, ఆవ నూనె వాడినందువలన మనుష్యులపై, తాగే నీటిపై, పశువులపై, భూమిపై, పర్యావరణంపై  ప్రభావం ఏమిటో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిశోధనలుజరగాలి. సైంటిఫిక్ గా పరిశోధనలతో నిర్ణయించవలసిన ఆహార భధ్రత అంశాన్ని రాజకీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలను, విదేశీ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని అగ్ర రాజ్యాల వత్తిడికి లొంగి నిర్ణయం చేయటం మన దేశ స్వతంత్ర్యాన్నిఅమ్ముకోవటమే.  

కలుపు నివారణ మందులను, జన్యుమార్పిడి హైబ్రిడ్ విత్తనాలను  అమ్ముకోవాలనీ, లాభాలను దండుకోవాలనీ కంపెనీలు తహతహలాడుతున్నాయి. కలుపు నివారణ మందులవలన భూమి విషతుల్యమౌతుందనే వాస్తవాన్ని ప్రభుత్వంకాదనలేకపోతున్నది. ఒక పక్క ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అంటూ ప్రచారం చేస్తూ మరోపక్క భూమిని, భూసారాన్ని, ప్రజారోగ్యాన్ని నాశనం చేసే జన్యుమార్పిడి   పంటలకు, కలుపు మందుల పంటలకు అనుమతులనిస్తున్నది.  భూమికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమన్న రుజువుల కారణంగా గ్లైఫోసేట్ కలుపు నివారణ మందులను నిషేధించక తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యం వలన ప్రమాదకరమైన నిషేధిత మందులు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కలుపు మందులు అమ్ముకోవటానికి వీలుగా విత్తనాలనే జన్యుమార్పిడి చేశారు. కలుపు మందులతో భూమికి, మనిషికి, పశువులకు, వాతావరణానికి ప్రమాదమని నిర్ధారించి నిషేధించారు. మరోప్రక్క హెర్భిసైడ్ టాలరెంట్ జన్యుమార్పిడి ఆవాల పంటలకు అనుమతిని ఇచ్చి హెర్బిసైడ్ కలుపు నివారణ మందులను యధేఛగా వాడుకోమంటున్నారు. బీ.జే.పీ. ఎన్నికల ప్రణాళికలలో ఆహారం లో జన్యుమార్పిడి పంటలను , హెర్బిసైడ్ కలుపునివారణ మందులకు అనుమతులు ఇవ్వమన్నారు. ఆచరణలో జన్యుమార్పిడి పంటలకు హెర్బిసైడ్ కలుపు నివారణ మందుల వ్యాపార కంపెనీలకు స్వేఛనిచ్చి ప్రజలను మోసంచేస్తున్నారు. జన్యుమార్పిడి పంటలతోపాటుగా , హెర్బిసైడ్స్ వాడకం వలన భూమి నాశనమవటం వలన ఏ మందులకూ లొంగని “సూపర్ వీడ్స్”, “సూపర్ వీడ్స్” అభివృధి చెందుతున్నాయి. ఇంకా ఎక్కువ పురుగు మందుల వాడే అవసరం పెరిగి భూమి, పర్యావరణం మరింతగా నాశనమయి ప్రకృతి విఛిన్నమై కాన్సర్ లాంటి జబ్బులతో మానవుని మనుగడ ప్రశ్నార్ధకమౌతున్నది. 

జన్యమార్పిడి ఆవాల పంటవలన ఆవాల దిగుబడి పెరిగి ఆవనూనె దిగుమతులను తగ్గించవచ్చనీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చనీ ప్రభుత్వం అసత్య ప్రచారం చెప్తోంది. 1980 సం.లో ఆయిల్ మిషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో వంటనూనెల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సాంప్రదాయ హైబ్రిడ్ విత్తనాలతోనే హెక్టారుకు 3012 కేజీల దిగుబడిని రైతులు సాధించారు. DMH-11 జన్యుమార్పిడి విత్తనాలతో 30 శాతం అధిక దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వం అసత్యప్రచారం చేస్తున్నది. రుజువులను చూపించలేకపోతున్నది.. DDB-DMH -1. సాంప్రదాయ విత్తనంతో    2924 KG ల దిగుబడిని, DDB-DMH-4.  సాంప్రదాయ విత్తనంతో  3012 KG, ల దిగుబడిని సాధించారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న జన్యుమార్పిడి హెర్బిసైడ్ టాలరెంటు విత్తనం  GM MUSTARD  వలన  2626 KG ల దిగుబడి మాత్రమే వచ్చింది. అదేమంటే మీరు సైన్సుకు వ్యతిరేకం అని దబాయిస్తున్నారు. 

ఆవనూనెను దక్షిణ భారతదేశంలో వాడరు. ఆవ నూనెను ఉత్తర భారత దేశంలో విరివిగా వాడతారు. విస్తారంగా పండిస్తారు. మన దేశంలో వంటనూనెల ఉత్రత్తిలో 40 శాతం ఆవనూనెదే. ఆవపంట 80 లక్షల ఎకరాలలో60 లక్షలమంది రైతులు సాగు చేస్తున్నారు. 1993-1994లోనే, ఆవనూనెలో స్వయం సమృద్ధిని సాధించారు. దేశీయ ఉత్పత్తి అన్ని అంతర్గత అవసరాలను తీర్చింది.ఆవనూనె దిగుమతి అవసరం లేదు. దక్షిణ భారత దేశంలో ఆవనూనె వాడకం చాలా తక్కువ. ఊరకనే ఇచ్చినా వాడరు. తక్కువ ఉత్పత్తి వుండి, ఎక్కువమంది ప్రజలు వాడే పామాయిల్, వేరుశనగనూనె, నువ్వులనూనె, కొబ్బరినూనెలకు ప్రోత్సాహం కరువయింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నపుడు రైతులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తున్నారు.

విదేశాల నుండి దిగుమతి చేస్తున్న పామాయిల్, సన్ ఫ్లవర్ వంటనూనెలకు దిగుమతి సుంకాలను తగ్గించి సింగపూరు, ఇండోనేషియా, ఉక్రెయిన్ ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. మన దేశంలోని పామాయిల్, వేరుశనగ, నువ్వుల నూనె, కొబ్బరినూనె రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. లాభసాటి ధర, గిట్టుబాటు ధరల మాటేలేదు. ప్రకృతి వైపరీత్యాల లో రైతుకు దిక్కే లేదు. 2022 సం.కు రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని మరిచారు. 

బీ టీ కాటన్ వలన కలిగిన దుష్పరిణామాలన్నిటికీ మోన్సాంటో లాంటి బహుళజాతుల సమస్ధలే కారణం అని ఫ్రజలు గుర్తిస్తున్నందున కార్పోరేట్ సంస్ధలు కొత్తముసుగులో ప్రవేశిస్తున్నాయి.  బార్, బార్నేజ్, టెక్నాలజీని ఢిల్లీ యూనివర్సిటీ అధ్యయన బృందం మన దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగం లో కొత్తగా కనుగొన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బార్, బార్నేజ్, టెక్నాలజీపై బేయర్స్ కంపెనీకి పేటెంట్ వున్నది. 2001 సం లో బార్నేజ్ ,బార్ స్టార్ టెక్నాలజీని బేయర్సకంపెనీ వాడింది. 

యూరప్ లో జన్యుమార్పిడి ఆహారాలను తినరు. పంటలకు అనుమతిలేదు. యూరప్ దేశాలు జీ ఎమ్ పంటలను గట్టిగా వ్యతిరేకించాయి.  యూరప్ ప్రజలు తినని ఆహారం మనం ఎందుకు తినాలో ప్రభుత్వం చెప్పాలి. తినే ఆహారంలో విషతుల్యమైన జన్యుమార్పిడి పదార్ధాలున్నయ్యేమో అని అమెరికా ప్రజలు అనుమానిస్తున్నారు. ఆహార పదార్ధాలపై జీ యమ్ లేబుల్స్ అతికించమని  ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అమెరికా లో శక్తివంతమైన విత్తన సంస్ధల వత్తిడికి లొంగి మాన్సాంటో, బేయర్స్ కంపెనీలకు అనుమతులు, పేటెంట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. మన దేశంలోజన్యుమార్పిడి పంటలను, ఆహారాన్ని  అనుమతించబోమని ఎన్నికల ప్రణాళిక లో స్పష్టంగా  చెప్పిన బీజేపీ , ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత పంధా మార్చుకుంది. ఎమ్ ఎన్ సీ ల వత్తిడికి ప్రభుత్వం లొంగిపోయింది. ఆర్.యస్.యస్ అనుబంధ సంస్ధయిన స్వదేశీ జాగరణమంచ్ జన్యుమార్పిడి ఆవాలను వ్యతిరేకించింది. అయినా విత్తన కార్పోరేట్ కంపెనీలు తమ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యొక్క శక్తిని చూపించి ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు అనుమతులను పొందాయి.

 దుష్ట పరిణామాలకు భాధ్యత ఎవరిది  

 అమెరికా లో “లైబిలిటీ లా” వుంది. పరిశోధనల ఫలితాలకు భిన్నంగా దుష్ట పరిణామాలు సంభవిస్తే ఎవరు బాధ్యులో నిర్ణయించి తగిన చర్యలు చేపడ్తారు. మనదేశంలో, మీకేమీ కాదన్నప్రభుత్వం, దిగుబడులు పెరుగుతాయన్న కంపెనీలు, ఆరోగ్యానికి ఢోకా లేదన్న జీ ఈ ఏ సీ సభ్యులు, ప్రభుత్వం – ఎవరిదీ బాధ్యత? 2015 సం. లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫోసేట్ను “మానవ క్యాన్సర్ కు ముఖ్య కారణం” గా వర్గీకరించింది. నాన్ హాడ్కిన్స్ లింఫోమాతో సహా 10 రకాల క్యాన్సర్లకుకారకమైన గ్లైఫోసేట్ ఆధారిత హెర్బిసైడ్ వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించనందుకు మోన్ శాంటో / బేయర్ కంపెనీపై లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  జీన్ క్యాంపెయిన్‌క జన్యు శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ సహాయ్ మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి వాణిజ్య బిటి పత్తి పంటకు సంబంధించిన భద్రతా డేటా ఏదీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడలేదన్నారు. అక్టోబర్ 25, 2022న పర్యావరణ విడుదలకు ఆమోదం లభించిన GM మస్టర్డ్‌కు కూడా అదే విధానాన్ని అవలంబించి విత్తనాల విడుదల తర్వాత అవసరమైన పరీక్షలు నిర్వహించబడతాయా? 

మన దేశంలో GM ఆవాలు పండించడానికి అన్నిఅడ్డంకులు తొలగినతరువాత ఇతర GM పంటలకు కూడా వరద గేట్లను తెరుస్తారు. బీటీ వంకాయ,బీటీ బెండ, గోల్డెన్ రైస్, వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంప-అన్నిటిలో కాస్తోకూస్తో జన్యుమార్పు చేసి వ్యవసాయ వ్యాపారాన్ని పెంచుకోవటానికి కార్పోరేట్ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించలేని ప్రభుత్వాలన్నీలొంగిపోయి మాన్సాంటో, బేయర్స్ లాంటి కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. జీ యమ్ ఆవాలు ప్రవేశపెట్టటానికి బలమైన అమెరికా ఒత్తిడి వున్నదని జర్నలిస్టు రష్మీ సెహగల్ అంటున్నారు.
మన దేశంలో వ్యవసాయం ఒక జీవన విధానం. 66శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడిజీవిస్తున్నారు.53 శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది.దేశ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం క్రమేపీ 15 శాతానికి తగ్గింది. జన్యుమార్పిడి పంటలు మన నేలను, నీటిని  కలుషితం చేస్తాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రక్రియ కోలుకోలేనిది. వివిధ వాతావరణ పరిస్ధితులున్నభారతదేశం జీవ వైవిధ్యానికి ప్రసిధి చెందింది. వైవిధ్యమైన జన్యు వనరులున్నాయి. మన విత్తనోత్పత్తి చాలా శక్తివంతమయినది. మన రైతులు ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తిదారులు.జీవ వైవిధ్యం మన గొప్ప బలాలలో ఒకటి. అది నాశనం చేసి ఒకటే దేశం, ఒకటే విత్తనం, ఒక్కటే పంట అంటూ విశాల భూక్షేత్రాలలో మోనోక్రాప్ తో కోర్పోరేట్ స్ధాయి వ్యవసాయం వైపు నడిపిస్తున్నారు.

వ్సవసాయం లో వున్న వారిలో సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ఇప్పటికే 86 శాతం మంది చిన్న రైతులు ఒత్తిడిలో ఉన్నారు. GM టెక్నాలజీ పేరున కంపెనీలు దారుణంగా పెంచుతున్న రేట్లలోఖరీదైన GM విత్తనాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. పెరుగుతున్న ధరలతో ఎరువులనుకొనలేరు. పెంచనున్నవిధ్యుత్ ఛార్జీలను భరించలేరు. అప్పులను కట్టలేరు. కనీల ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. వారేం చేయాలి. వారికి ఏమవుతుంది? ఢిల్లీ సరిహద్దుల లో సంవత్సరంపైగా సాగిన రైతాంగ పోరాటమే రహదారి. అదే స్పూర్తితో మరింత శక్తివంతంగా సాగించే రైతాంగ పోరాటాలే వ్యవసాయ సమస్యలన్నిటికీ పరిష్కారం.