దుమ్మెత్తి పోసుకుంటున్న టోరీ నేతలు రిషి సునాక్‌ – లిజ్‌ ట్రస్‌ : ఇలాగైతే లేబర్‌ పార్టీకి అవకాశమంటూ పెద్దల గగ్గోలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


బ్రిటన్‌, ప్రపంచ భద్రతకు చైనా అతి పెద్ద ముప్పుగా ఉందని, స్వేచ్చా దేశాలు చైనా సాంకేతిక దాడిని ఎదుర్కొనేందుకు కొత్త కూటమి ఏర్పడాలని బ్రిటన్‌ కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ నేత రిషి సునాక్‌ అన్నాడు. ఇలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని, దీని వలన వారి సమస్యలు పరిష్కారం కావని చైనా పేర్కొన్నది. బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ ఆర్ధిక విధానాలతో విబేధాల వలన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ జూలై ఐదున రాజీనామా చేశాడు.తరువాత రెండు రోజులకే ప్రధాని జాన్సన్‌ కూడా రాజీనామా ప్రకటించాడు.దాంతో కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా(ప్రధాని పదవికి) తాను పోటీ చేయనున్నట్లు ఎనిమిదవ తేదీన వెల్లడించాడు.ఆ పరుగులో చివరికి సునాక్‌తో పాటు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మిగిలారు.కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టు బాలట్‌ ద్వారా ఒకరిని ఎన్నుకుంటారు. ఫలితం సెప్టెంబరు ఐదున ప్రకటిస్తారు. అప్పటి వరకు ఇరువురు నేతలు మద్దతుదార్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిలో భాగంగా టీవీ చర్చలో ఇద్దరు నేతలు పరస్పరం చేసుకుంటున్నదాడులతో పార్టీ నష్టపడి వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి అవకాశం ఇచ్చేట్లున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. మాటలదాడులతో పరస్పరం గోతులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పన్నుల విధింపు, బ్రెక్సిట్‌, చైనా చివరికి తాము చదువుకున్న స్కూళ్లను కూడా వారి దాడులలో ప్రస్తావించారు. తొలి టీవీ చర్చలో ఎవరు బాగా మాట్లాడారన్న సర్వేలో సునాక్‌కు 39శాతం మంది, ట్రస్‌ను 38శాతం బలపరిచారు. కాగా టోరీ పార్టీ మద్దతుదార్లలో ట్రస్‌ను 47శాతం, సునాక్‌ను 38శాతం బలపరిచారు. దీన్ని బట్టి కొత్త ప్రధానిగా ట్రస్‌కే అవకాశాలు ఎక్కువని కొందరు సూత్రీకరించారు.


పార్లమెంటులో అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే నూతన ప్రభుత్వం లేదా ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంతో బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా ప్రకటించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మొత్తం ప్రభుత్వం మీదనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అధికార పార్టీ దానికి పోటీగా విశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంటులో నెగ్గింది. అందువలన సాంకేతికంగా బోరిస్‌ జాన్సన్‌ మీద మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు కానీ పార్టీ నేతగా విశ్వాసం కోల్పోయాడు. నూతన నేతను ఎన్నుకొనేందుకు నిర్ధిష్ట కాలపరిమితేమీ లేదు. కన్సర్వేటివ్‌ పార్టీలో 1922 కమిటీ అనేది ఒకటి ఉంది. పార్లమెంటులో వెనుక బెంచీలలో కూర్చునే వారితో దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా దీనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. మెజారిటీ వచ్చినపుడు ప్రధాని పదవికి లేదా ప్రతిపక్షంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే ప్రక్రియలో దీని పాత్ర ఉంటుంది.గతంలో 2016 థెరెస్సా మే ఎన్నిక మూడువారాల్లోపే ముగిసింది. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడినందున ఒక్కొక్కరిని తొలగించే ప్రక్రియతో ఆలశ్యమైంది. అక్టోబరులో కన్సర్వేటివ్‌ పార్టీ మహాసభ జరిగే లోగా ఎన్నిక జరగాలని 1922 కమిటీ నిర్ణయించిది.సెప్టెంబరు ఐదున ప్రకటించే విజేతను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు బోరిస్‌ జాన్సన్‌ పదవిలో ఉంటారు, పార్టీ విశ్వాసం కోల్పోయినందున విధానపరంగా, ఇతర మౌలిక నిర్ణయాలేవీ తీసుకోరు.


పార్టీ నేత ఎన్నిక పోటీలో తొలుత రిషి సునాక్‌ ముందున్నట్లు ఓటింగ్‌ తీరు వెల్లడించింది. దాంతో అతనే నూతన ప్రధాని అవుతాడన్నట్లుగా మన దేశ మీడియా వార్తలు ఇచ్చింది. అయితే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ దూసుకువచ్చి సవాలు విసరటంతో పోటీ రసవత్తరంగా మారింది. రిషి సునాక్‌ బ్రిటన్‌లో స్ధిరపడిన పంజాబీ కుటుంబంలో పుట్టాడు.నలభై రెండు సంవత్సరాల రిషి విద్యార్ధిగా ఉన్నపుడు మన దేశంలో ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి కుమార్తె అక్షితతో ఏర్పడిన పరిచయం 2009లో వివాహానికి దారి తీసింది. వారికి ఇద్దరు పిల్లలు. సనక్‌-అక్షితలు బ్రిటన్‌లోని సంపన్నుల్లో 2022లో 73 కోట్ల పౌండ్లతో 222వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు అనేక దేశాల్లో ప్రముఖులుగా, దేశాధినేతలుగా కూడా పనిచేశారు. అమెరికాకు చెందిన ఇండియాస్పోరా అనే స్వచ్చంద సంస్థ 2021లో వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రవాస భారతీయ సంతతిలో పదిహేను దేశాల్లో 200 మంది వరకు వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో తొలి మహిళా ఉపాధ్యక్షరాలుగా ఉన్న కమలా హారిస్‌, అక్కడే లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన బాబీ జిందాల్‌, సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా, ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిమ్రతా నిక్కీ హేలీ, బ్రిటన్‌ హౌం మంత్రిగా ఉన్న ప్రీతి పటేల్‌,ప్రధాని పదవికి ఇప్పుడు పోటీ పడుతున్న రిషి సునాక్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. వివిధ దేశాధినేతలుగా 30 మంది భారతీయ మూలాలు ఉన్నవారు పని చేశారు. వారిలో బ్రిటీష్‌ గుయానా అధ్యక్షుడిగా పనిచేసి చెడ్డీ జగన్‌ వంటి ఒకరిద్దరు వామపక్ష వాదులను మినహాయిస్తే మిగిలిన వారందరూ ఆయా దేశాల్లో పాలకవర్గాలకు ఇష్టులుగా, అనుకూలంగా పని చేసిన వారే అన్నది స్పష్టం.ప్రస్తుతం కెనడా, బ్రిటన్‌ వంటి చోట్లమంత్రులుగా ఉన్నవారు కూడా అదే తరగతికి చెందిన వారే. అమెరికాలో తొలిసారిగా ఆఫ్రో-అమెరికన్‌ సామాజిక తరగతికి చెందిన బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. నల్లజాతీయుల పట్ల వివక్ష, దాడులు ఏమాత్రం తగ్గలేదు. అంతకు ముందు పాలకులు అనుసరించిన విధానాలనే తు.చ తప్పకుండా అనుసరించాడు. అందువలన ఇప్పుడు ఒక వేళ రిషి సునాక్‌ విజేతగా నిలిచి గడువు మేరకు 2025వరకు పదవిలో ఉన్నా ఇంతకు ముందు బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానాల కొనసాగింపే తప్ప మౌలికమార్పులేమీ ఉండవు.


ప్రస్తుతం రిషి సునాక్‌ాలిజ్‌ ట్రస్‌ కన్సర్వేటివ్‌ పార్టీ మద్దతుదార్లకు తమ విధానాలను వివరించే పనిలో ఉన్నారు. బ్రిటన్‌తో సహా అమెరికా నుంచి భారత్‌ వరకు అనేక దేశాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు రుజువుందని, తాను అధికారానికి వచ్చిన తొలిరోజే బ్రిటన్‌లోని 30 చైనా కన్ఫ్యూసియస్‌ సంస్థలను మూసివేస్తానని, చైనా సైబర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక కొత్త నాటో కూటమిని ఏర్పాటు చేస్తానని రిషి సునాక్‌ ప్రకటించాడు. బ్రిటన్‌ సాంకేేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరిస్తున్నదని, విశ్వవిద్యాలయాల్లోకి తన మద్దతుదార్లను చొప్పిస్తున్నదని, వారిని పంపివేస్తానని, రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ దురాక్రమణను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాడు. చైనా-బ్రిటన్‌ సంబంధాల అభివృద్ధి అంశంలో పోటీలో ఉన్న వారిలో సునాక్‌ ఒక్కరే స్పష్టమైన,ఆచరణాత్మకమైన వైఖరిని కలిగి ఉన్నారని ఇటీవల చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దాన్ని పట్టుకొని చైనా, రష్యా పట్ల సునాక్‌ మెతకగా ఉంటారని లిజ్‌ ట్రస్‌ ఆరోపించినదానికి ప్రతిగా చైనా పట్ల కఠినంగా ఉంటానంటూ సునాక్‌ ఎదురుదాడి ప్రారంభించాడు. బ్రిటన్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థలను చైనా కొనుగోలు చేయటాన్ని అధ్యయనం చేస్తానని, నిషేధిస్తానని పేర్కొన్నాడు.తన స్వంత షింజియాంగ్‌, హాంకాంగ్‌ పౌరులను చిత్రహింసలపాలు చేస్తూ అణచివేస్తుదని,తన కరెన్సీ విలువ పెరగకుండా చూస్తూ ప్రపంచ ఆర్ధికరంగాన్ని తనకు అనుకూలంగా రిగ్గింగ్‌ చేస్తున్నదని అన్నాడు. గుడ్డిగా చైనాను సమర్ధిస్తూ పశ్చిమదేశాలన్నీ దానికి ఎర్ర తివాచీ పరిచాయని జరిగిందేదో జరిగింది, తాను అధికారానికి వచ్చిన తొలి రోజునుంచి ఆ వైఖరిని మార్చివేస్తానని అన్నాడు.


తన కంటే పోటీలో ముందున్న లిజ్‌ ట్రస్‌ను ఎదుర్కొనేందుకు కన్సర్వేటివ్‌ పార్టీలోని చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు సునాక్‌ యత్నించారన్నది స్పష్టం. మరోవైపు ట్రస్‌ కూడా చైనా మీదనే దాడిని కేంద్రీకరించింది. జి7 కూటమిని ” ఆర్ధిక నాటో ”గా మార్చాలని, అంతర్జాతీయ నిబంధనలను అమలు జరపని పక్షంలో చైనా మీద ఆంక్షలు ప్రకటించాలని చెప్పింది. దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమిస్తున్నా, తైవాన్ను బెదిరిస్తున్నా, హాంకాంగ్‌లో ఉద్యమాన్ని అణచివేస్తున్నా, ఉఘీర్‌లపై మారణకాండ జరుపుతున్నా గత రెండు సంవత్సరాలలో చైనాతో ఆర్ధిక ఒప్పందాల కోసం ఆర్ధిక మంత్రిగా సునాక్‌ చూశారని, ఇప్పుడు కబుర్లు చెబుతున్న మీరు అప్పుడెక్కడ ఉన్నారని కన్సర్వేటివ్‌ పార్టీ నేత ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ధ్వజమెత్తాడు. దేశంలో జీవన వ్యయం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపధ్యంలో తాను దుబారాకు దూరంగా ఉంటానని ప్రకటించిన సునాక్‌ ఓట్లకోసం జనం ముందుకు వస్తూ 450 పౌండ్ల విలువగల బూట్లు, మూడున్నరవేల పౌండ్ల ఖరీదైన సూటు ధరించి వస్తున్నారని, అదే తమనేత లిజీ ట్రస్‌ కేవలం నాలుగున్నర పౌండ్ల విలువ గల చెవిపోగులు ధరించి దేశంలో తిరుగుతున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ సాంస్కృతిక శాఖ మంత్రి నాదిన్‌ డోరిస్‌ విమర్శించారు.


చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు.
కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్రిటన్‌కు అనేక సవాళ్లను తెస్తున్నాయి. ఐరోపా సమాఖ్య నుంచి వెలుపలికి వచ్చిన తరువాత ఇతర దేశాలతో ఒప్పందాలకు పూనుకొని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నది. కుంభకోణాలు, అవినీతి అక్రమాల కారణంగా రెండుగా చీలిన కన్సర్వేటివ్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సునాక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ మంత్రులుగా ఉండి ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు చైనా పట్ల వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అంతర్గత అంశాలపై ఏమి చెప్పినప్పటికీ విదేశాంగ విధానం గురించి చైనా మీద కేంద్రీకరించటం మద్దతుదార్లను తప్పుదారి పట్టించటం,చైనా వ్యతిరేకతతో సంతుష్టీకరించేందుకు పూనుకున్నారు.

వెనెజులాతో అమెరికా కాళ్ల బేరానికి వచ్చిందా – మితవాదుల ఆగ్రహం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్‌ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని ఆసరా చేసుకొని ఎన్ని కట్టుకథలు, ఎన్ని దెప్పి పొడుపులో ! ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఏమిటి ?


2022 జూలై పన్నెండవ తేదీన బిబిసి ముండో( స్పానిష్‌ భాష) అమెరికా విదేశాంగశాఖ మంత్రిత్వ మాజీ ముఖ్యకార్యదర్శి కారీ ఫిలిపెట్టీతో ఒక ఇంటర్వ్యూను ప్రచురించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విదేశాంగశాఖలో వెనెజులా, క్యూబా వ్యవహారాలను ఆమె చూశారు.అమెరికా అధికారులు ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతో సంప్రదిస్తున్నారని ప్రతిపక్షంతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన మదురో బదులు తాము మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేత జువాన్‌ గుయిడోనే విజేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌, తరువాత ఇటీవలి వరకు జో బైడెన్‌ సర్కార్‌ ఆ వైఖరినే కొనసాగించింది. మదురోను పదవి నుంచి తొలగించాలని అక్కడి మితవాద శక్తులకు అమెరికా చెప్పింది. అన్ని రకాలుగా తోడ్పడుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో తలెత్తిన ఇంథన సంక్షోభం ప్రారంభం వరకు అమెరికా చదరంగంలో గుయిడోనే పావుగా ఉన్నాడు. ఒక ఎత్తుగడగా లేదా అవసరం కొద్దీ గుర్తించను గుర్తించను అన్న అమెరికా ఇప్పుడు తన మాటలను తానే దిగమింగి అధికారికంగా మదురో సర్కార్‌తో చర్చలు జరుపుతోంది.


వెనెజులా పౌరులు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన, ఇప్పటికీ పడుతున్న కష్టాలు, ఇబ్బందులకు అమెరికా కారణం అన్న మౌలిక అంశాన్ని మీడియా కావాలనే విస్మరించి, కట్టుకథలు, పిట్టకతలు చెప్పింది, వాటిని గుడ్డిగా నమ్మి అనేక మంది రకరకాలుగా చెప్పారు. ఎవరెన్ని చెప్పినా అక్కడి జనాలకు వాస్తవాలు తెలుసుగనుక ఎన్ని ఇబ్బందులున్నా వామపక్ష మదురోవైపే మొగ్గుచూపుతున్నారు. మానవహక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్దపాలన పరిరక్షణ పేరుతో అనేక దేశాలపై అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షల ప్రతికూల పర్యవసానాలను నివేదించేందుకు ఐరాస ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదన అధికారిణి ప్రొఫెసర్‌ అలేనా దౌహాన్‌ ఇటీవల చెప్పిన ప్రకారం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు 98శాతం అవి చెప్పిన సుభాషితాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. జింబాబ్వే సందర్శనలో ఆమెతో కొందరు విద్యార్ధులు మాట్లాడుతూ తమ దేశంపై ఆంక్షల కారణంగా టూరిస్టులుగా కొన్ని చోట్లకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చిందని, పరీక్షలకు వెళ్లి రోడ్ల మీద నిద్రించాల్సి వచ్చిందని చెప్పారు. వెనెజులాపై ఆంక్షల కారణంగా 2017 నుంచి 2018వరకు అక్కడ శిశుమరణాల రేటు 31శాతం పెరిగిందని,ఆరోగ్య హక్కుకు భంగం కలిగిందని అలేనా చెప్పారు. వాక్సిన్ల కొనుగోలును అడ్డగించిన కారణంగా 26లక్షల మంది వెనెజులా పిల్లలకు మెనెంజటిస్‌, రోటావైరస్‌, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, మీజిల్స్‌, ఎల్లో ఫీవర్‌ ముప్పు తలెత్తిందన్నారు.


ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా వెనెజులా కరోనా మహమ్మారిని కట్టడి చేసి చావులను గణనీయంగా అరికట్టింది.ప్రతి లక్ష మందికి 20.1శాతం మంది మరణిస్తే అదే అమెరికాలో 304.18శాతం చావులు నమోదయ్యాయి. వెనెజులా మీద 2017 నుంచి 600 రకాల ఆర్ధిక ఆంక్షలను అమెరికా అమలు జరిపింది. ఒక దశలో వీటి కారణంగా 99శాతం రాబడిని కోల్పోయింది. మరోవైపు మితవాద శక్తులను రాజకీయంగా ఉసిగొల్పింది. వీటన్నింటినీ మదురో సర్కార్‌, అధికార సోషలిస్టు పార్టీ ఎదుర్కొన్నది. 2021 డిసెంబరులో జరిగిన ప్రాంతీయ, మున్సిపల్‌ ఎన్నికల్లో 23 గవర్నర్‌ పదవులకు గాను 21, 213 మేయర్‌ పదవుల్లో 120 గెలుచుకుంది.
అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల ఆంక్షల, ఇతర కొన్ని అంశాల కారణంగా గత పది సంవత్సరాల్లో వెనెజులా ఆర్ధికంగా 70శాతం దిగజారింది. అనేక తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ ఈ ఏడాది ప్రధమార్ధం నుంచి జిడిపి కోలుకోవటం ప్రారంభమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయని, జనం కొనుగోలు ఖర్చు పెరిగిందని తాజా వార్తలు. వెనెజులియన్‌ ఫైనాన్స్‌ అబ్సర్వరేటరీ సంస్థ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ద్రవ్యోల్బణం 53.8శాతం, ఇది గతేడాదితో పోలిస్తే ఆరోవంతు. కరెన్సీ బొలివర్‌ విలువ డాలర్‌తో గతేడాది 50శాతం పతనమైతే ఈ ఏడాది 17శాతం. అనేక నియంత్రణ చర్యలు, ఇతర అంశాలు దీనికి దోహదం చేశాయి.ఈ ఏడాది ఆఖరుకు రోజుకు 20లక్షల పీపాల చమురు ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుండగా ప్రస్తుతం 7.75లక్షల పీపాలు జరుగుతున్నది. కోటి మంది కార్మికులు, ఇతరులకు లబ్ది కలిగించే వేతనాలు, కనీసవేతనాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. లాటిన్‌ అమెరికా-కరీబియన్‌ ఎకనమిక్‌ కమిషన్‌ అంచనా ప్రకారం 2014 తరువాత ఈ ఏడాది వృద్ధి రేటు ఐదుశాతం ఉంటుందని, అది అన్ని లాటిన్‌ అమెరికా దేశాల కంటే ఎక్కువ అని పేర్కొన్నది. 2022 జనవరి నుంచి మార్చి నెలవరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చమురు ఉత్పత్తి రోజుకు 5,33,000 పీపాల నుంచి 7,56,000 పీపాలకు పెరిగింది. ఏడాది పొడవునా ఆరులక్షల పీపాలు ఉంటే జిడిపి వృద్ది రేటు 8శాతం ఉంటుందని మరొక అంచనా. ఐదు సంవత్సరాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలను అమెరికా కొద్దిగా మే 17 నుంచి సడలించింది. వెనెజులా ప్రభుత్వ రంగ చమురు కంపెనీతో లావాదేవీలు జరపవచ్చని అమెరికా, ఐరోపా చమురు కంపెనీలకు సూచించింది.


అమెరికా ఆంక్షలకు గురైన దేశాలలో ఇరాన్‌ కూడా ఒకటి. వెనెజులాాఇరాన్‌ మధ్య వివిధ రంగాలలో 20 సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై ఇరుదేశాల నేతలు జూన్‌ 11న సంతకాలు చేశారు. చమురు రంగంలో ఇరాన్‌, ఆహార, ఉత్పత్తి ఎగుమతిలో వెనెజులా సహకరించుకుంటాయి. ఎనిమిది లక్షల పీపాల చమురును రవానా చేసే ఓడలను ఇరాన్‌ అందిస్తుంది. రెండు దేశాలూ అమెరికా సామ్రాజ్యవాద బాధితులే, వ్యతిరేకులే. ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో తలెత్తిన పరిస్థితి పర్యవసానాలను అంచనా గట్టటంలో ఒక విధంగా అమెరికా విఫలమైందనే చెప్పాలి. అమెరికాలో అసాధారణ రీతిలో చమురు ధరల పెరుగుదల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీని దెబ్బతీయవచ్చనే అంచనాలున్నాయి. అసాధారణ రీతిలో పెరిగిన ద్రవ్యోల్బణ దేశ జిడిపి వృద్ది రేటును కూడా దెబ్బతీస్తుంది. వచ్చే ఏడాది మాంద్యంలోకి జారవచ్చన్న హెచ్చరికలూ ఉన్నాయి. చమురు ధరలు తగ్గాలంటే సరఫరాను పెంచాలన్న వినతులను సౌదీ ఇతర దేశాలు అంగీకరించలేదు. రష్యా చమురు ఎంత ఎక్కువగా మార్కెట్‌కు వస్తే అంత అధికంగా దానికి రాబడి వస్తుందని తేలింది. అందువలన వెనెజులాపై గతంలో విధించిన ఆంక్షలను చూసీచూడనట్లు నటిస్తూ అక్కడ చమురు ఉత్పత్తి పెంపుదలకు అమెరికా చొరవ చూపింది.తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే అమెరికాకూ మేలే గనుక ఇది దాని అవసరం కోసం తప్ప వెనెజులా మీద మనసు మారి కాదు. తిరిగి ఎప్పుడైనా పంజా విసరవచ్చు. దొరికిన ఈ వెసులుబాటును వెనెజులా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. గతంలో చమురు ధరల పతనం కూడా దాని ఆర్ధిక ఇబ్బందులకు ఒక కారణం ఇప్పుడు వందడాలర్లకు పైగా ఉన్నందున రష్యా మాదిరి కొన్ని దేశాలకు రాయితీ ఇచ్చినా దానికి రాబడి పెరుగుతుంది. ఇదే తరుణంలో అమెరికాను పక్కాగా ప్రతిఘటించే ఇరాన్‌తో ఒప్పందం కూడా సానుకూల అంశమే. ప్రతిపక్ష నేత గుయిడోను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా, దాని బాటలో నడిచిన ఇతర పశ్చిమ దేశాలు ఇప్పుడు అదే అమెరికా మదురో యంత్రాంగంతో చర్చలకు రావటం అమెరికాకు ప్రపంచంలో పరువు తక్కువ వ్యవహారమే దాన్ని నమ్ముకొని దానికి తాన తందాన అన్న దేశాలకూ పరాభవమే. ఇది మదురోకు పెద్ద నైతిక విజయం.చమురు ఎగుమతుల మీదనే ఆధారపడితే అమెరికా సామ్రాజ్యవాదం నుంచి ఎప్పుడైనా ముప్పురావచ్చు.అందుకే సమతుల విస్తరణ, దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోవటం వంటి విధానాలవైపు వెనెజులా మళ్లుతున్నది.


ప్రతిపక్ష నేతను దేశాధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా 2019లో వెనెజులాలోని తన రాయబార కార్యాలయాన్ని పక్కనే ఉన్న కొలంబియాకు తరలించింది. అక్కడ ఎన్నికల్లో తొలిసారిగా వామపక్షం అధికారంలోకి రానున్నదని గతేడాదే వివిధ సర్వేలు వెల్లడించాయి, అదే జరిగింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడనున్నాయి.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తధ్యమని ముందుగానే అమెరికాకు తెలుసు గనుకనే అంటరాని వాడిగా పరిగణించిన మదురోతో చర్చలకుగాను మార్చి నెలలోనే బైడెన్‌ సర్కార్‌ వెనెజులాకు ఒక అధికారిక బృందాన్ని పంపింది. అక్కడ బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల సంప్రదింపులకు తప్ప మరొకటి కాదని బుకాయించింది. తరువాత ఆంక్షలను సడలిస్తామని ప్రకటించింది.చమురు ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవచ్చని తమ కార్పొరేట్‌ సంస్థ చెవరాన్‌కు అనుమతి ఇచ్చింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని, దీనివలన అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ తట్టుకొని నిలవగలమనే ధైర్యం బాధిత దేశాలకు వస్తుందని మితవాద, వామపక్ష వ్యతిరేకశక్తులు గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాను వ్యతిరేకించే చైనా, రష్యా ప్రభావం పశ్చిమార్ధగోళంలో పెరుగుతుందని వాపోతున్నాయి.


ఆగస్టు 13 నుంచి 27వ తేదీ వరకు వెనెజులా రాజధాని కారకాస్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్మీ గేమ్స్‌ జరుగుతున్నాయి.రష్యా ప్రారంభించిన ఈ క్రీడలను తొలిసారిగా పశ్చిమార్ధగోళంలోని వెనెజులా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 37 దేశాల నుంచి 275 టీములు, 36 విభాగాల్లో పోటీ పడేందుకు వస్తున్నట్లు సమాచారం. జరుగుతున్నది క్రీడలే కావచ్చుగానీ వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లాటిన్‌ అమెరికాలో ఇప్పటికే తొమ్మిది దేశాల్లో అమెరికా వ్యతిరేక, వామపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో పనామా కూడా వీటి సరసన చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసినపుడు అమెరికా బయట-తన పెరటి తోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలోనూ ఒంటరి అవుతున్నది.

ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు : బిజెపిలో పెరుగుతున్న వారసులు – తాజాగా ఎడియూరప్ప కుమారుడు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో వారసత్వ రాజకీయాలకు తావు లేదని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నవారి మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు, అన్నింటికీ మించి వారితో దెబ్బలాటకు అసలు దిగకూడదు. ఆజాదీకా అమృత ఉత్సవాల్లో వారిని కంగన రనౌత్‌ చెప్పినట్లు అసలైన స్వాతంత్య్రం వచ్చిన 2014 పోరులో పాల్గొన్న సమరయోధులుగా సన్మానించినా, పెన్షన్‌ ఇచ్చినా తప్పు లేదు. షా నవాజ్‌ హుసేన్‌ అనే బిజెపి నేత శ్రీనగర్‌లో కూర్చుని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. పేరెత్త కుండానే తాత, తండ్రి, మనవడు ముఖ్యమంత్రులయ్యే రోజులు గతించాయి. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు పాల్పడిన వారు గతంలో చేసిన వ్యాపారం, హౌటళ్లు ఏదో ఒకటి చూసుకోవాల్సిందే అన్నారు. సరిగ్గా అదే సమయంలో నాలుగు సార్లు సిఎం, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న బిఎస్‌ ఎడియూరప్ప కర్ణాటకలోని షిమోగా సభలో తన రెండవ కుమారుడు విజయేంద్రకు తన నియోజకవర్గం షికారపుర రాజకీయ వారసత్వాన్ని ఇస్తున్నట్లు బహిరంగ సభలో ప్రకటించారు.2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ తన బదులు కుమారుడు పోటీ చేస్తాడని ప్రకటించేశారు. తన తండ్రి వారసత్వాన్ని అంగీకరిస్తూ కుటుంబ పేరు ప్రతిష్టలను కాపాడతానని తనయుడు చెప్పారు. తనకు తండ్రి-పార్టీ రెండు కళ్లు అని ఏ ఒక్కటి లేకున్నా చేసేదేమీ ఉండదని కూడా అన్నారు.ఎడియూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర ప్రస్తుతం షిమోగా ఎంపీగా ఉన్నారు. అయినా సరే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని అనకపోతే పరువు దక్కదు మరి. పేద కుటుంబంలో పుట్టిన ఎడియూరప్ప చిన్నతనంలో నిమ్మకాయలు అమ్మితే తప్ప కుటుంబం గడవని స్థితి. తరువాత కార్మికుడిగా కూడా పని చేశారు. ఒక రైస్‌ మిల్లులో గుమస్తాగా చేరి సినిమాల్లో మాదిరి యజమాని కూతుర్నే వివాహం చేసుకున్నారు. తండ్రీ కొడుకులు వారసత్వ రాజకీయాలను వదలి పూర్వపు వ్యాపారం చేసుకోవాలని షా నవాజ్‌ హుస్సేన్‌ ఇప్పటికైనా తమ పార్టీ నేతలకు చెప్పి మర్యాద దక్కించుకుంటారా ?


ఎనిమిదిసార్లు ఎంఎల్‌ఏ, ఒకసారి ఎంపీగా గెలిచిన బూకనకరె సిద్దలింగప్ప ఎడియూరప్పను 75 ఏండ్లు దాటిన వారికి ముఖ్యమైన పదవులను అప్పగించేది లేదన్న బిజెపి తాను చెప్పిన సుభాషితాన్ని తానే దిగమింగి నాలుగోసారి సిఎం గద్దెమీద కూర్చోపెట్టింది. పదవీ కాలం పూర్తిగాక ముందే రాజీనామా చేయించి బసవరాజు బొమ్మైకి అప్పగించింది. జీవితం తనకు అగ్నిపరీక్షగా ఉందని పదే పదే చెప్పిన ఎడియూరప్ప విధిలేక పదవికి రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకొనేది లేదని తన పాత్రను పోషిస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రమే చెప్పారు. విలువల వలువలతో పని చేస్తామని చెప్పే ఈ బిజెపి నేత నాలుగవసారి సిఎంగా గద్దె నెక్కేందుకు పడరాని పాట్లు పడ్డారు. హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆరుసార్లు విఫలయత్నం చేసి ఏడవ సారి ఎవరేమనుకుంటే నాకేమి అన్నట్లుగా 76 ఏండ్ల వయస్సులో నాలుగోసారి గద్దెనెక్కారు. అంతకు ముందు మూడోసారి పెద్ద పార్టీ నేతగా ప్రభుత్వాన్ని ఏర్పరచి కేవలం 55 గంటలు మాత్రమే పదవిలో ఉండి అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. తొలిసారి 2007లో జెడి(ఎస్‌)తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. రెండవ సారి 38 నెలలు, నాలుగవసారి రెండు సంవత్సరాలు పదవిలో ఉన్నారు. అవినీతి కేసులో ఒకసారి జైలుకూ వెళ్లారు, ఇప్పుడు ఒక కేసు విచారణలో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న ఎడియూరప్ప పదవి కోసం బిజెపి మీద తిరుగుబాటు చేసి గతంలో స్వంత కుంపటి పెట్టుకున్నారు. తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిఏ ఎడియూరప్ప – ఎడియూరప్పే బిజెపిగా ఉన్నారు. అలాంటి నేతను ఇటీవల పక్కన పెట్టారు. పార్టీకి ఇతర నేతలు ఉన్నారని రుజువు చేసుకొనేందుకు అధిష్టానం పూనుకున్నది. వారసత్వాన్ని ప్రకటించటం బిజెపి చెప్పే సుభాషితాలకు వ్యతిరేకం. ఎన్నికల ముందు ఎడియూరప్పతో వైరం పెట్టుకుంటుందా ? కుమారుడి కోసం ఏం చేస్తారో చూడాలి.


ఇంకా ఎన్నికలకు ఎంతో వ్యవధి ఉండగా ఇప్పుడెందుకు ఆకస్మికంగా వారసత్వ ప్రకటన చేశారన్నది ప్రశ్న. దాని గురించి విజయేంద్ర మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాను వరుణ లేదా చామరాజనగర్‌లో పోటీ చేయనున్నట్లు మీడియాలో ఊహాగానాలు వెలువడినందున ఒక స్పష్టత ఇవ్వాలని స్థానిక నేతలు తన తండ్రిపై వత్తిడి తెచ్చిన కారణంగా ఈ ప్రకటన చేశారని చెప్పారు. షికారిపురాలో పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా మద్దతు ఇస్తానని కొన్ని నెలల క్రితం ఎడియూరప్ప చెప్పినందున పార్టీనేతలు ఆశాభంగం చెందారని, అక్కడ ఎడియూరప్ప లేదా విజయేంద్ర మాత్రమే పోటీ చేయాలని వత్తిడి చేస్తున్నారని, అందువలన తప్పనిసరై ప్రకటించాల్సి వచ్చిందన్నారు. నాటి ప్రకటనల గురించి తాను ఇప్పుడు చెబుతున్నానని అంటూ అప్పుడు కాంగ్రెస్‌, జెడిఎస్‌ల నుంచి అనేక మంది బిజెపిలో చేరేందుకు వచ్చారని దాంతో తనను పక్కన పెడుతున్నారేమోనని విచారంతో పాటు ఆశాభంగం చెందానని, అప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తున్నానని అన్నారు. ఒక కార్యకర్తగా పార్టీలో పని చేస్తున్నాను తప్ప ఎడియూరప్ప కుమారుడిగా కానందున వారసత్వ వాదన తనకు వర్తించదన్నారు. ఈ సారి ఎలాగైనా పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలు వత్తిడి చేసినందున తన తండ్రి ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తమకు సీట్లు కావాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదన్నారు. 2018లో వరుణా నియోజకవర్గం నుంచి పోటీకి పక్షం రోజులు ప్రచారం చేసుకున్న తరువాత, తాజాగా ఎంఎల్‌సీ అవకాశం ఇచ్చేందుకు విజయేంద్రకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఎడియూరప్పకు పార్టీ మీద పట్టును తగ్గించేందుకు ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. దానిలో భాగంగానే బొమ్మై మంత్రివర్గంలో తన మద్దతుదారులైన మంత్రుల ఎంపికను నిరాకరించారు.కుమారుడికి మంత్రి పదవీ ఇవ్వలేదు. పదవి కోసం ఎంతకైనా తెగించే చరిత్ర ఉన్న ఎడియురప్ప తన కుమారుడిని రాజకీయ నిరుద్యోగిగా చూసి భరించగలరా !


బిజెపి లబ్ది పొందిన అంశాల్లో ప్రత్యర్ధి పార్టీల కుటుంబ వారసత్వంపై దాడి ఒకటి. విధానాలను పక్కన పెట్టి జనం దృష్టిని ఆకర్షించే ఎత్తుగడ అది. ఇప్పుడు ఆ జబ్బుదానికి కూడా అంటుకుంది.రోజు రోజుకూ పెరుగుతోంది. మాధవరావు సింధియా కాంగ్రెస్‌ నేత. అతని మరణం తరువాత కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా పదవిలోకి రావటంతో బిజెపి వారసత్వ రాజకీయమని చెప్పింది. అదే పెద్దమనిషి బిజెపిలో చేరిన తరువాత ఎంపీ పదవితో పాటు మంత్రిపదవి ఇచ్చారు. జ్యోతిరాదిత్య మేనత్త వసుంధరరాజే. ఆమె రాజస్తాన్‌ సిఎంగా చేశారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ ఆమె స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. వసుంధరరాజే తల్లి విజయరాజే సింధియా తొలుత కాంగ్రెస్‌, తరువాత స్వతంత్ర పార్టీ, అక్కడి నుంచి జనసంఘం, తరువాత బిజెపి నేతగా ఉన్నారు.ఎంపీ, ఎంఎల్‌ఏగా చేశారు. గోవాలో మాజీ సిఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌కు గత ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు బిజెపి తిరస్కరించింది. కానీ అదే పార్టీ అనేక మంది నేతల వారసులకు సీట్లు ఇచ్చింది.జెన్నిఫర్‌ మాన్సరటా మంత్రి, ఆమె భర్త అటానాసియో ఇద్దరికీ సీట్లు ఇచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రి, అతని భార్యకు సీట్లు ఇచ్చారు.


2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 మందికి గాను వివిధ పార్టీల నుంచి 114 మంది కుటుంబవారసుల నుంచే వచ్చారు. తరువాత 2019లో వారి సంఖ్య 162కు పెరిగింది, ఇది తొమ్మిది శాతం. చిత్రం ఏమిటంటే సగటు కంటే బిజెపి వారసులు ఆ పార్టీకి ఉన్న 388 మందిలో 45 అంటే పదకొండుశాతం ఉన్నారు.2009లో బిజెపి, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారిలో వారసులు పదకొండు, పన్నెండుశాతాల చొప్పున ఉంటే 2014కు వచ్చేసరికి అవి 20-8 శాతాలుగా మారాయి. ఈ కారణంగానే నరేంద్రమోడీ వారసత్వ రాజకీయాల గురించి కొత్త పల్లవి అందుకున్నారు. 2021 నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులు రాజకీయ పదవుల్లోకి వస్తే తప్పులేదంటూ ఒక కుటుంబమే తరతరాలుగా పార్టీని నడపటం ప్రజాస్వామ్యానికి ముప్పు అని సూత్రీకరించారు. కుటుంబాల కోసం పార్టీలు, కుటుంబాలే పార్టీలను నడిపితే ప్రజాస్వామిక లక్షణం ఉండదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమని మరో సందర్భంగా చెప్పారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.

చైనా మీద కోపం, కట్టడి పేరుతో మనం చేతులు కాల్చుకోవాలా ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” నవంబరులో షీ జింపింగ్‌తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు – భారత్‌కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది ” తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ” తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్‌ – ఐరోపా సమాఖ్య వాణిజ్య చర్చల పునరుద్దరణ వెనుక ” అసాధారణ అత్యవసరం ” ముందుకు నెట్టి ఉండవచ్చు ” అన్నది మరొక విశ్లేషణ శీర్షిక. ఏం జరుగుతోంది ? ఒక వైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంది. దాన్ని పక్కన పెట్టి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ? గతంలో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాల సారాంశాన్ని చెప్పాల్సి వస్తే సాఫ్టా( దక్షిణాసియా దేశాల స్వేచ్చా వాణిజ్య ఒప్పందం)తో మాత్రమే మన దేశం లబ్దిపొందింది. మిగతావాటితో మన ఎగుమతులు పెరిగిందేమీ లేకపోగా దిగుమతులు ఎక్కువగా జరిగాయి. అందువలన మరోసారి ఒప్పందాలతో చేతులు కాల్చుకొనేందుకు సిద్దపడుతున్నామా ? గతం కంటే నరేంద్రమోడీ హయాంలో దేశ పరిస్థితి మెరుగుపడిందంటూ మనకు అనుకూలంగా ఉందని చెబుతారా ? అదే నిజం అనుకుంటే మన దిగుమతులు ఎందుకు తగ్గలేదు, ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? ఉనికిలో ఉన్న ఒప్పందాలనే ఉపయోగించుకోవచ్చు కదా !


కరోనా కారణంగా కొన్ని కుదుపులు, వృద్ధి రేటు తగ్గినప్పటికీ చైనా కడుపు నిండిన స్థితిలో ఉంది. కనుక మనల్ని లేదా మరొక దేశాన్ని చూసి పశ్చిమ దేశాలు చైనాను వదలి మనవెంటపడతాయని భ్రమించకూడదు. కఠినమైన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలి అంచనా 5.5శాతాన్ని అందుకోకపోవచ్చుగానీ జిడిపి పురోగమనం మూడు- నాలుగుశాతం మధ్య ఉంటుందని వార్తలు. అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పటికీ చైనా సరఫరాల మీద ఆధారపడుతున్నాయి. చైనాకు జలుబు చేస్తే మిగతా దేశాలు చీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌ ఎక్సేంజస్‌, క్లియరింగ్‌(హెచ్‌కెఇఎక్స్‌) సిఇఓ నికోలస్‌ అగుజిన్‌ ఇటీవల లోహాల గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ 45 -57శాతం ప్రపంచ లోహ వినియోగం చైనాలో జరుగుతోందని,2021 ప్రపంచ ఉత్పత్తిలో 35 నుంచి 55శాతం వరకు లోహాలను చైనాలో శుద్ది చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లనే చైనాలో మందగిస్తే అది ప్రపంచానికి మాంద్యం, ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని అన్నారు.


పశ్చిమ దేశాలు మానవహక్కుల గురించి శుద్దులు చెబుతూ తమ దగ్గరకు వచ్చే సరికి వాటిని హరించే దేశాలు, వాటి నేతలతో చెట్టపట్టాలు వేసుకొనే మోసకారితనాన్ని చూస్తున్నాం. మన దేశంలోని కొన్ని శక్తులు వాటి బాటనే నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని చూపి ఇప్పటికీ ఒక వైపు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే ఉన్నారు. మరో వైపు అక్కడి నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ సర్కార్‌ రికార్డులను సృష్టిస్తున్నది. ఇది జనాన్ని మోసం చేయటం కాదా ? వరుసగా రెండవ సంవత్సరం కూడా వంద బిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు నమోదు కానున్నాయి. జనవరి నుంచి జూన్‌ ఆరు నెలల కాలంలో 67.08 బి.డాలర్లు జరిగింది. దీనిలో మన దిగుమతులు గతేడాది కంటే 34.5శాతం పెరిగి 57.51 బి.డాలర్లకు చేరాయి. మన ఎగుమతులు 35.3శాతం తగ్గినట్లు చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. మన వాణిజ్యలోటు 47.94 బి.డాలర్లు. గతేడాది 125బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా తొలి ఆరునెలల తీరుతెన్నులను బట్టి చూస్తే అంతకంటే పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. గతేడాది మన ఎగుమతులు 28.14 బి.డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు 97.52 బి.డాలర్లు. రెండు దేశాలూ లెక్కించే పద్దతిలో తేడాలు ఉన్నందున మన దేశం ప్రకటించే అంకెలు భిన్నంగా ఉండవచ్చు గానీ ధోరణి తెలుస్తున్నది. చైనా మొత్తం విదేశీ వస్తు వాణిజ్య ఆరునెలల్లో 2.94 లక్షల కోట్ల డాలర్లు.


” ప్రభుత్వం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయదు ” అనే శీర్షికతో 2020 నవంబరు 17న ఒక వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. గతంలో చేసుకున్న ఒప్పందాలతో సబ్సిడీలతో కూడిన వస్తువులను మన దేశంలోకి అనుమతించారని, నష్టం జరిగిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శించినట్లు, ఒప్పందాలను కుదుర్చుకోబోమని కూడా చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఒప్పందాలకు ఉత్సాహపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలోనే మార్పుకు కారణం ఏమిటి ? చైనాను ఒక బూచిగా చూపే దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశ సంబంధాలు పెరిగిన కారణంగానే చైనాను అడ్డుకొనేందుకు ఒక మార్గంగా వాణిజ్య ఒప్పందాల కోసం తొందర పడుతున్నట్లు కొందరు చెబుతున్నదాన్ని తోసిపుచ్చగలమా ? 2014-15లో మన వాణిజ్యలోటు 118.37 బిలియన్‌ డాలర్లు ఉండగా 2021-22కి అది 192 బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సర తీరు తెన్నులను చూస్తే 250కి పెరగవచ్చు. మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు మనకు లబ్దిచేకూర్చలేదనేందుకు ఇది ఒక సూచిక.కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా బలమైన దేశాలే లబ్ది పొందుతాయి. సాప్టా ఒప్పందంతో మనకు లబ్ది, వాణిజ్య మిగులు కలిగిందంటే దానిలో ఉన్న దేశాల్లో మనది బలమైనది కావటమే. ఆసియన్‌ దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా 2009-10లో మన వాణిజ్యలోటు ఎనిమిది బిలియన్‌ డాలర్లుండగా 2018-19నాటికి అది 22 బి.డాలర్లకు పెరిగింది.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు సులభంగా చేరుతుందని కొందరు నరేంద్రమోడీ సర్కార్‌కు బిస్కెట్లు వేస్తున్నారు. వాటి వలన విదేశాల నుంచి సరకులను మన మార్కెట్లో గుమ్మరిస్తే ఇక్కడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. తనను మింగేస్తుందనే భయంతోనే అమెజాన్‌ కంపెనీ విస్తరణను అంబానీ అడ్డుకోవటాన్ని చూస్తున్నాము. జర్మనీ కంపెనీ మెట్రో కూడా తన బిజినెస్‌ను ఎవరికో ఒకరికి అమ్మేసి తనదారి తాను చూసుకోవాలని చూస్తోంది. అందువలన చైనా మీద కోపంతో ఇతర ధనికదేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన చేతులు మరింతగా కాలుతాయి. అందుకే ఆర్‌సిఇపిలో చేరేందుకు మనం వెనుకడుగువేశాము. మన దేశంలో చౌకగా శ్రమశక్తి లభిస్తుందని తెలిసినా, నిపుణులైన పనివారున్నారని ఎరిగినా ఐరోపా, అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాలేదు, చైనా మాదిరి ఎగుమతి వస్తూత్పత్తి జరగటం లేదు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా చైనాతో ఐరోపా సమాఖ్య(ఇయు) సంబంధాలు సజావుగా లేవు గనుక ఇప్పుడు మనం చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అమెరికా, ఐరోపాలకు కావాల్సింది చౌకగా వస్తువులను అందించటం, వారి ఉత్పత్తులకు మార్కెట్లను తెరవటం. ఆ పని ఎవరు చేస్తే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు అది మనవల్ల కాలేదు. ఐరోపా నేతలను నవంబరులో రావాలని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొన్నది.కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా రాకపోకలు లేవు. ఒకవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగవచ్చని చెబుతుండగా దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో అమెరికా కోసం ఆసియాలో చైనాతో కూడా లడాయి పెట్టుకొనేందుకు ఐరోపా సిద్దంగా లేదనే వార్తలు మరోవైపున వెలువడుతున్నాయి. చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ చైనా నుంచి వెలుపలికి పోతున్నట్లుగా జరిగిన ప్రచారం తెలిసిందే.ఇప్పుడు చైనాను బెదిరించేందుకు, రాయితీలు పొందేందుకు పూనుకోవచ్చు తప్ప విస్మరించే అవకాశం లేదు. గాల్వన్‌ ఉదంతం తరువాత మన దేశంలోని కొన్ని శక్తులు చేసిన హడావుడి తరువాత చైనా నుంచి రికార్డు స్థాయిలో మన దిగుమతుల గురించి తెలిసిందే. మరి ఐరోపా, అమెరికా చైనాను ఎలా వదులుకుంటాయి. ఇప్పటికీ వాటి పెట్టుబడులు చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలిపేందుకు అవి మరింతగా వివాదాన్ని ఎగదోయవచ్చు, వాణిజ్య ఆశలు చూపవచ్చు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అవి తమలాభాల దగ్గర రాజీపడవు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు చైనా మీద దూకుడును తగ్గించాయి.


చైనా నుంచి ఆహ్వానాలు అందిందీ లేనిదీ ఇంతవరకు ఐరోపా దేశాలేవీ తిరస్కరించలేదు, నిర్ధారించలేదు. ఒకవేళ ఆహ్వానం వస్తే ఏమి చేయాలా అని పారిస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వార్తలు. అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ సభల తరువాతనే భేటీ జరగవచ్చు.ఆహ్వానమే గనుక వస్తే తిరస్కరించటం కష్టమని ఐరోపా అధికారులు అంటున్నారు.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా-ఇయు వాణిజ్య లావాదేవీల విలువ గతేడాది కంటే పదిశాతం పెరిగి 205బి.డాలర్లకు చేరాయి. 2018లో చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ, చైనా నుంచి దిగుమతులను నిలిపివేయలేదు. చైనా వస్తువులపై విధించిన దిగుమతి పన్నుల భారం అమెరికన్‌ వినియోగదారుల మీదనే పడుతోంది. చైనా దారికి వచ్చే వైఖరిలో లేదు, కొనసాగిస్తే జనం మీద భారం, తొలగిస్తే ప్రపంచ దృష్టిలో పలుచన అవుతామనే సందేహం అమెరికా నేతల్లో ఉంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన వాణిజ్యలోటు 250 బిలియన్‌ డాలర్లకు లేదా జిడిపిలో 7.3శాతానికి చేరనున్నట్లు అంచనా. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో గతేడాది లోటు 31.4బి.డాలర్లు కాగా ఈ ఏడాది 70.8కి పెరిగింది.మన దేశం ఆర్ధికంగా పెరిగితే చైనాను అరికట్టవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఇక్కడ కావాల్సింది మనం పెరగటమా చైనాను అరికట్టటమా ? మన ఎగుమతులకు చైనా ఏ విధంగానూ పోటీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా అన్నా ఆ బ్రాండ్‌ పేరును పక్కన పెట్టి తాజాగా ఆత్మనిర్భర్‌ అని మార్చినా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమెరికా వాడి మాటలను నమ్మి చైనా ఆక్రమణకు వస్తోందనే అంచనాతో లడఖ్‌ ప్రాంతంలో కొండలను ఎక్కించిన మన మిలిటరీని ఇప్పుడు దించలేము, కొనసాగించలేని స్థితి. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని గాల్వన్‌ ఉదంతం తరువాత స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.గాల్వన్‌ తరువాత ఇప్పటి వరకు 278 చైనా యాప్‌లను మన దేశం నిషేధించింది. దాని వలన కొంత మన దేశంలో కొంత మందికి మానసిక తృప్తి తప్ప చైనాకు కలిగిన ఆర్ధిక నష్టం ఏమిటో ఎవరూ చెప్పరు. వాటిని నిషేధించినా మన దేశంలోని అనేక సంస్థలలో చైనా పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న వాస్తవాన్ని మూసిపెడితే దాగదు. చైనా జిడిపిలో దాని విదేశీ వాణిజ్య వాటా 35శాతం ఉంది. అమెరికానే అది అన్ని రంగాలలో ముప్పు తిప్పులు పెడుతున్నది.

చైనాఅమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే, కానీ దానికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అమెరికన్లను నమ్మి దిగితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే. మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ మీకు పుణ్యం ఉంటుంది అని తాలిబాన్ల కాళ్లు పట్టుకొని అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోయిన తీరును కళ్లారా చూశాము. తరువాత ఉక్రెయిన్ను రెచ్చగొట్టి గోదాలోకి దించారు. కావాలంటే ఎన్ని ఆయుధాలనైనా అమ్ముతాం తప్ప మా సైనికులెవరూ యుద్దానికి రారు అంటూ అమెరికా, నాటో దేశాలు చేతులెత్తేసిన తీరునూ చూశాము. ఉక్రెయిన్‌ కాదు గానీ తైవాన్ను గనుక చైనా ఆక్రమిస్తే సైన్యాన్ని పంపుతామంటూ జో బైడెన్‌ ప్రగల్భాలు పలికాడు. వాటినెవరూ నమ్మటం లేదు. చైనా అంతర్భాగమే తైవాన్‌ అని అమెరికా అంగీకరించింది, దాన్ని ఎప్పుడు విలీనం చేసుకోవటం అన్నది చైనా అంతర్గత అంశం. విలీనం చేసుకుంటే అడ్డుకొనేశక్తి ఏ దేశానికీ లేదన్నది వాస్తవం., పాకిస్తాన్‌ మరొక దేశం ఏదైనా మన రక్షణ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మూడూ అణుశక్తి దేశాలే గనుక ఎవరిని ఎవరూ లొంగదీసుకోలేరు, ఎవరి మీద ఎవరూ విజయం సాధించలేరు.

అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక్కులు ఒక సాకు-వంచన !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎదుటివారికే చెప్పేటందుకే నీతులు. చరిత్రలో నీతి తప్పిన వారిని చూస్తే పశ్చిమ దేశాలకు మరొకటేదీ సాటి రాదు. మానవహక్కుల వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని తమకు లొంగని వారి మీద దాడులు చేస్తుంటాయి. వాటికి భంగం కలిగించటంలో అవే ముందుంటాయి. ఒక నాడు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను భ్రష్టుడు, అక్కడ మానవహక్కులు లేవు అని ధ్వజమెత్తిన అమెరికా అధినేత జో బైడెన్‌ ఇప్పుడు అతగాడినే కౌగలించుకున్నాడు. సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీని సల్మానే టర్కీలో హత్య చేయించినట్లు చెప్పిన అమెరికా 2018 తరువాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను కూడా తెంచుకుంది. తరువాత సౌదీ గానీ, రాజుగానీ మారిందేమీ లేదు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో 2018 అక్టోబరు రెండున ప్రవేశించిన ఖషోగ్గీని అక్కడే హత్య చేయటం వెనుక సౌదీ రాజు హస్తం ఉందని సిఐఏ ఒక నివేదికను బైడెన్‌కు అందచేసింది. జోబైడెన్‌ సౌదీ పర్యటనపై అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీశాండర్స్‌ మాట్లాడుతూ ” చూడండి, వందబిలియన్‌ డాలర్ల ఆస్తికలిగిన కుటుంబమది, అది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది, మహిళలను మూడో తరగతి పౌరులుగా చూస్తుంది.తన ప్రత్యర్ధులను జైలుపాలు చేస్తుంది, మట్టుపెట్టిస్తుంది.” అలాంటి దేశాన్ని సందర్శించి పాలకుడితో చెట్టపట్టాలు వేసుకుంటారా అని విమర్శించాడు. నాలుగు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో జో బైడెన్‌ సాధించిందేమిటి అన్నది ఒక అంశమైతే తమకు అవసరమైతే గతంలో చెప్పిన మాటలను దిగమింగుతాడని స్పష్టమైంది. ఇదంతా ఎందుకు అంటే రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసమే.


అమెరికాలో ఇంథన ధరలు ఆకాశాన్నంటాయి.ద్రవ్యోల్బణం నాలుగుదశాబ్దాల గరిష్టాన్ని తాకింది. అవి పెరిగే కొద్దీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికారపార్టీకి ఆమేరకు ఓట్లు తగ్గేందుకు సెగతగలనుందనే వార్తలు. మరోవైపున పశ్చిమాసియాలో రష్యాకు మద్దతుదారుగా ఉన్న ఇరాన్ను కట్టడి చేసేందుకు, చమురు ఉత్పత్తి, సరఫరాలను పెంచి రష్యాను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు బైడెన్‌ విఫల పరటన చేశాడని, ఖాళీ చేతులతో వెళ్లాడని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్నదాని కంటే అదనపు ఉత్పత్తికి ఎలాంటి హమీ లేదని, ఇప్పటికే రోజుకు పదమూడు మిలియన్‌ పీపాలకు పైగా ఉత్పత్తి చేస్తున్నట్లు సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పాడు. అమెరికోసం చైనానో చైనా కోసం అమెరికానో వదులు కోవటం తమ విధానం కాదని, ప్రజలతో వారధి నిర్మిస్తామని సౌదీ విదేశాంగమంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ చెప్పాడు. బైడెన్‌ పర్యటన తరువాత రష్యా అధినేత పుతిన్‌ ఇరాన్‌ వెళుతున్నాడు. బైడెన్‌తో భేటీ తరువాత సౌదీ రాజు సల్మాన్‌ మాట్లాడుతూ తమ భేటీలో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య ప్రస్తావన గురించి చెబుతూ ” జరిగింది విచారకరం, అలాంటివి పునరావృతం కాకుండా చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రపంచంలో అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరగవచ్చు. ఇరాక్‌లోని అబూ గ్రాయిబ్‌ జైల్లో ఖైదీలపై చిత్రహింసల వంటి అనేక తప్పిదాలకు అమెరికా పాల్పడలేదా” అని ఎదురు ప్రశ్నించాడు.


అమెరికా పధకంలో భాగంగా రష్యాతో వైరం పెంచుకున్న ఐరోపా దేశాలకు ఇంథన సరఫరాలు తగ్గాయి. వేసవి తరువాత చలికాలంలో వెచ్చదనానికి అవసరమైన చమురును ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఐరోపా చూస్తోంది. ఈ క్రమంలో ఐరోపా సమాఖ్య కూడా ప్రాణ, విత్త, మానభంగములందు ఆడితప్పవచ్చు అన్నట్లుగా మానవహక్కులను ఇంథనం కోసం కొంతకాలం పక్కన పెట్టేందుకు పూనుకుంది.ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు మృగ్యం అని ఏ దేశాల గురించైతే చెప్పారో ఇప్పుడు ఇంథనం కోసం వాటినే ఆశ్రయిస్తున్నారు.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాలకుల నిరంకుశ చర్యల గురించి తెలిసిందే. అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నిహయన్‌ పారిస్‌ పర్యటనకు వెళితే రాచమర్యాదలు జరిపారు.ఇంథన పధకాల్లో పెట్టుబడుల గురించి వారు చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ముఖ్యమైన మిలిటరీ, వ్యూహాత్మకంగా గట్టి బంధం ఉందనేందుకు ఇది నిదర్శనమని, మానవహక్కుల సమస్యల కంటే ఇంథన భద్రతకు ఫ్రాన్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలన్నీ సిరియాపై అమలు జరుపుతున్న ఆంక్షలన్నింటినీ ఎమిరేట్స్‌ వ్యతిరేకించటమే కాదు, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నా, అదేమీ తెలియనట్లు ఫ్రాన్స్‌ ఉంది.


తాము నిరంకుశ పాలకుడిగా వర్ణిస్తున్న అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇలహమ్‌ అలియెవుతో ఐరోపా సమాఖ్య(ఇయు) అధ్యక్షురాలు ఉర్సులా వాండెన్‌ లెయన్‌, ఇంథన కమిషనర్‌ కద్రి సిమ్సన్‌ అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చర్చలు జరిపారు. ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.సహకార మండలిని ఏర్పాటు చేశారు. వాటి ప్రకారం ఏటా 20బిలియన్‌ ఘనపుటడుగుల గాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పుడున్న సహజవాయు సరఫరా 2021లో 8.1బిసిఎంలను ఈ ఏడాది ఆఖరుకు 12బిసిఎంలకు పెంచుతారు. ఈ సంప్రదింపుల సందర్భంగా గతంలో ఇయు లేవనెత్తిన మానవహక్కుల అంశం ఏమైందని విలేకర్లు అడగ్గా తగు సమయంలో వాటిని లేవనెత్తుతామని, ఇప్పుడు కేవలం ఇంథన సహకారంపైనే కేంద్రీకరించినట్లు ఇయు అధికారులు సమర్ధించుకున్నారు. తమ గురించి మంచిగా చెప్పేందుకు ఐరోపా రాజకీయవేత్తలకు అజర్‌బైజాన్‌ అక్రమంగా ఐరోపా బాంకుల ద్వారా మూడుబిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు జర్నలిస్టుల బృందం వెల్లడించింది.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి రష్యా, చైనాలు మినహా ఇతర దేశాల గురించి గతంలో పశ్చిమ దేశాలు గతంలో ప్రస్తావించిన మానవహక్కుల అంశాలను పక్కన పెట్టేశారు.ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యం, మానవహక్కుల ఉల్లంఘనల గురించి 2020-24 కార్యాచరణ ప్రణాళికను ఐరోపా సమాఖ్య ప్రకటించింది. నూతన ఇంథన విధానంలో వాటి ప్రస్తావన లేకుండా చేశారు. ఇది ఐరాస నిరంతర అభివృద్ధి లక్ష్యాలకు లోబడి రూపొందించిన న్యాయమైన, సమగ్ర ఇంథన విధానం అని సమర్ధించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి నిత్యం కబుర్లు చెప్పే ఐరోపా అగ్రదేశాలు ఇప్పుడు దానికి హాని కలిగించే బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తికి పూనుకున్నాయి. దానికి రష్యాను దోషిగా చూపుతున్నాయి. రష్యా కోరుతున్నట్లుగా దాని భద్రతకు హామీ కల్పిస్తే ఉక్రెయిన్‌పై మరుక్షణమే దాడులు ఆగుతాయి, ఐరోపాకు అవసరమైన ఇంథనం రష్యా నుంచి లభిస్తుంది. కానీ వాటికి కావాల్సింది అది కాదు, ఆధిపత్యం. అందుకోసం మానవహక్కులు మంటగలిసినా, పర్యావరణానికి భంగం కలిగినా అమెరికా కూటమి దేశాలకు పట్టదు. గాస్‌ సరఫరాలో ఆటంకాల కారణంగా జర్మనీలో కూడా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి మరోసారి పెరుగుతోందని జర్మన్‌ ఛాన్సలర్‌ షఉల్జ్‌ చెప్పాడు.


ఒకవైపు రష్యాను దెబ్బతీసేందుకు తమతో సహకరించాలని జో బైడెన్‌ గతవారంలో సౌదీ అరేబియాను కోరాడు. కానీ అదే సౌదీ తన విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన(డీజిలుకు దీనికి కొద్ది తేడా ఉంటుంది) ఇంథనాన్ని రష్యా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొంటోంది. దీనిలో కొంత భాగం తన రేవులకు వచ్చే ఓడలకు ఇంథనంగా కూడా ఆమ్ముతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌ వివాదం తరువాత దిగుమతులు పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 3,20,000 టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 6,47,000 టన్నులకు పెరిగింది. గతేడాది మొత్తంగా పదిలక్షల 50 వేల టన్నులు దిగుమతి చేసుకుంది. దీని వలన చమురును శుద్ది చేసే ఖర్చు తగ్గుతుంది. తన చమురును అధిక ధరకు ఎగుమతి చేసుకోవచ్చు.మరో వైపు అమెరికా పెత్తనం చెల్లదు అనే సందేశాన్ని పంపవచ్చు. చమురు ఉత్పత్తిలో ఒపెక్‌, ఇతర దేశాల్లోని రష్యాతో ఇప్పటి వరకు సౌదీకి మంచి సంబంధాలే ఉన్నాయి.


ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నదనే సాకుతో తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా కొన్ని ప్రతిచర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దానిలో కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియ(సిపిసి) పైప్‌లైన్‌ మూసివేత ఒకటి. కజకస్తాన్‌ నుంచి రష్యా మీదుగా (నోవోరోస్సిక్‌ రేవు) నల్లసముద్రం వరకు ఈ లైన్‌ ఉంది. దీనిలో పశ్చిమ దేశాలు, ఆసియా, రష్యాకు చెందిన కంపెనీలు భాగస్వాములు. వివాదం తలెత్తిన తరువాత ఈ పైప్‌లైన్‌లో ఒక భాగస్వామి కజకస్తాన్‌ ఐరోపా దేశాలకు చమురు సరఫరాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.దీంతో జూలై ఆరు నుంచి 30 రోజులపాటు కజకస్తాన్‌ చమురు సరఫరా నిలిపివేస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మార్చినెలలో సంభవించిన తుపాను వలన ఏర్పడిన చమురు తెట్టు కారణాన్ని చూపినప్పటికీ ఐరోపా దేశాలను దెబ్బతీయాలన్నదే దీని వెనుక అసలు కారణం. ఈ లైన్‌ ద్వారా రోజుకు పదిలక్షల పీపాల సరఫరా జరుగుతోంది. దీనిపై ఆధారపడిన చెవరాన్‌, ఎక్సాన్‌ మోబిల్‌, షెల్‌, ఎని అనే పశ్చిమ దేశాల కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతే అవి ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతాయి. ఇవి కజకస్తాన్‌లో చమురు వెలికితీస్తున్నాయి. ఉక్రెయిన్‌ వివాదం తరువాత ఈ కంపెనీలు కొన్ని రష్యాలో తవ్వకాలను నిలిపివేశాయి.ఒకనాడు భ్రష్టుడన్న సౌదీ రాజు సల్మాన్‌తో జో బైడెన్‌ దిగిన ఫొటో ఒక చర్చగా మారింది. మానవహక్కుల గురించి అమెరికా వంచనకు ఇది పక్కా నిదర్శనమని, వారికి అవసరం అనుకుంటే విలువల వలువలను నిస్సిగ్గుగా విప్పి పక్కన పెడతారంటూ వ్యాఖ్యలు వెలువడ్డాయి.ఐరోపా దేశాలూ దీనిలో తక్కువేమీ కాదు !

నరేంద్రమోడీ ఫొటోలతో జర జాగ్రత్త – ఉద్యోగాలు పోతాయి, ఊచలు లెక్కించాలి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసి పారిపోక ముందు మే పదవ తేదీన ఒక ఉదంతం జరిగింది. మహింద వీర విధేయుడైన అభిమాని ఒకడు కొలంబో వీధుల్లో మద్దతు ప్రకటించాడు. అప్పటికే మద్దతుదార్లను జనం మీదకు ఉసిగొల్పిన మహింద సంగతి తేల్చాలని నివాసం వైపు నిరసనకారులు వెళుతుండగా ఈ ఉదంతం జరిగింది. ఆగ్రహించిన జనం అతన్ని చితక్కొట్టి దారిన వస్తున్న ఒక చెత్తబండిలో కూర్చోపెట్టి తరిమికొట్టారు. ఆ వీడియో వైరలైంది. దెబ్బలు తిన్న అతను సింహళీయుడే చితక బాదిన వారు కూడా ఆ సామాజిక తరగతికి చెందిన వారే. ఆదివారం నాడు (జూలై 17)న ఉత్తర ప్రదేశ్‌లోని మధుర పట్టణంలో ఒక కాంట్రాక్టు పారిశుధ్యకార్మికుడు తన బండిలో చెత్తతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, సిఎం యోగి ఆదిత్యనాధ్‌ ఫొటోలను తరలిస్తున్న వీడియో వైరల్‌ కావటం, దాన్ని చూసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సదరు కార్మికుడిని విధుల నుంచి తొలగించటం సంచలనాత్మక ఘటనగా మారింది. దేశ అదృష్టం కొద్దీ ఉపాధి పోగొట్టుకున్న కార్మికుడూ హిందువే, చెత్తబండి నుంచి మోడీ, యోగి, అబ్దుల్‌ కలామ్‌ చిత్రాలను రక్షించిన వారూ హిందువులే.


ఈ ఉదంత వివరాల్లోకి వెళితే మున్సిపల్‌ కార్మికుడు బాబీ బండిలో మోడీ, యోగి ఫొటోలు ఉండటాన్ని రాజస్తాన్‌లోని ఆళ్ల్వారు నుంచి మధుర వచ్చిన ఇద్దరు భక్తులు గమనించారు. సదరు బండిని వీడియో తీశారు. అంతటితో ఆగలేదు. కార్మికుడిని నిలిపి ఆ ఫొటోలను ఎందుకు చెత్తబండిలో వేశావని అడిగారు. వాటితో తనకేమీ సంబంధం లేదని చెత్తకుప్పలో ఉన్నవాటిని తీసి బండిలో వేసి తీసుకుపోతున్నట్లు చెప్పాడు. ఆళ్వారు భక్తులు మోడీ,యోగి చిత్రాలను బండిలో నుంచి తీస్తుండగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రం కూడా కనిపించిందట. ఆ ఫొటోలను తీసుకొని వాటిని నీటితో శుభ్రం చేసి తమతో ఆళ్వారు తీసుకు వెళతామని, మోడీగారు,యోగి గారు ఈ దేశ ఆత్మలని వారు అన్నారు.


ఈ ఉదంతంపై సామాజిక మాధ్యమంలో భిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి చిత్రాలను అందరూ గౌరవించాలి. వారి చిత్రాలను చెత్తబండిలో తీసుకుపోవటం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదమే కనుక శిక్షించాలని కొందరు అన్నారు. కార్మికుడిపై వేటును కొందరు ప్రశ్నించారు. ఫొటోలు పాతబడి, చిరిగినపుడు అవి ఎవరివైనా ఒకటే. అధికారంలో ఉన్నవారి పాత పొటోలను ఏం చేయాలి, ఎలా తొలగించాలి అనేందుకు ఏదైనా పద్దతి ఉందా అని కొందరు ప్రశ్నించారు. చెత్తకుప్పలో ఉన్న వాటిని బండిలో వేసిన కార్మికుడిది విధి నిర్వహణ తప్ప తప్పెలా అవుతుంది, అతన్ని ఎందుకు శిక్షించాలి అని కొందరు ప్రశ్నించారు. కార్మికుడు తన బండిలో ఆ ఫొటోలను తెలియకుండానే ఉంచాడు. అతని నిర్లక్ష్యానికి గాను అతన్ని వెంటనే పని నుంచి తొలగించినట్లు మధుర-బృందావన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సత్యేంద్ర కుమార్‌ తివారీ ప్రకటించారు. సదరు కార్మికుడు వాటిని బండిలో వేసేటపుడు ఎందుకు చూడలేదని ప్రశ్నించారు.


ప్రముఖులు, ప్రజాప్రతినిధుల చిత్రాలు చెత్తలో కనిపించినపుడు ఏమి చేయాలో కార్మికులకు ఎందుకు వివరించలేదో సంజాయిషీ ఇవ్వాలంటూ శానిటరీ ఇనస్పెక్టర్‌, సూపర్‌వైజర్లకు కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించింది.తనను పనిలోంచి తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచించాలని కార్మికుడు బాబీ ఒక దరఖాస్తులో ప్రార్ధించాడు. చెత్తసేకరణ కేంద్రంలో ఉన్నదాన్నే తన బండిలో వేశానని, తనకు చదువురాదని, ఫొటోలను గుర్తించలేకపోయానని, జరిగిందానికి మన్నించాలని కోరాడు. దేశ ప్రధాని, ముఖ్యమంత్రుల ఫొటోలు తెలియదంటే కుదరదని, వాటిని సులభంగా గుర్తించవచ్చని ఒక అధికారి అన్నారు. ఈ ఉదంతం గురించి నిజనిర్దారణకు ఒక కమిటీని వేసి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అనునయ ఝా చెప్పారు.


వారం రోజుల ముందు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ పట్టణంలో జూలై పదిన నరేంద్రమోడీని విమర్శిస్తూ రెండు చోట్ల హౌర్డింగులు పెట్టినందుకు గాను పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వాటిలో ధరల పెరుగుదల, రైతుల నిరసన, నిరుద్యోగం వంటి అంశాల కార్టూను, బై బై మోడీ అనే హాస్టాగ్‌ ఉన్నాయి. జాతీయ సమగ్రతకు భంగం కలిగించటం, వివిధ తరగతుల మధ్య విద్వేషం, శత్రుత్వం, తప్పుడు ఆలోచనలు కలిగించటం వంటి సెక్షన్లతో కేసులు పెట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాని పేరుకు మచ్చ తెచ్చేందుకు వాటిని ఉద్దేశించారని ఆరోపించారు. వాటిని తెలంగాణాలోని టిఆర్‌ఎస్‌కు చెందిన శాయి అనే అతని కోరిక మేరకు పెట్టారని పోలీసులు చెప్పారు. అనికేత్‌ కేశర్వాని, అభయకుమార్‌ సింగ్‌, రాజేష్‌ కేశర్వాని, శివ, ధర్మేంద్ర కుమార్‌ అనే వారిని అరెస్టు చేశారు.వారిలో ఫ్లెక్సీని ముద్రించిన ఒకరిని, ఒక కార్యక్రమాల నిర్వహణ కంపెనీ ప్రతినిధి ఉన్నారు. హౌర్డింగ్‌లు పెట్టినందుకు శాయి అనే అతను తమకు పదివేల రూపాయలు ఆన్‌లైన్లో చెల్లించినట్లు అనికేత్‌ కేశర్వానీ చెప్పాడు.

ఈ రెండు ఉదంతాలను చూసినపుడు జనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల పాలు కావచ్చు, ఉద్యోగాలు పోగొట్టుకోవచ్చు, ఊచలు లెక్కించవచ్చు. మనోభావాలను దెబ్బతీశారంటూ కేసులు ఎక్కడ నుంచైనా, ఎవరిమీదనైనా పెట్టవచ్చు, అందుకే జర జాగ్రత్త. అసలు చెత్తబండిలో ఫొటోల వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఆ ఫొటోలను చెత్తకుప్పలో వేసింది ఎవరన్నది తేల్చేందుకు యోగి సర్కార్‌ సిబిఐ, ఎన్‌ఐఏలతో దర్యాప్తు జరిపిస్తుందేమో చూడాలి. మరోసారి చెత్తబండ్ల పాలు కాకుండా వీధికి ఒక ఫొటో రక్షకుడిని ఏర్పాటు చేసి ఎవరు చిత్రాలను చెత్తలో వేస్తున్నదీ నిఘాపెట్టిస్తుందో చెప్పలేము. దోషులు తేలితే వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయించినా ఆశ్చర్యం లేదు. ఈ ఉదంతం తరువాత రాష్ట్రాల్లోని మున్సిపల్‌ కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రముఖుల ఫొటోలు చిరిగినా, దుమ్ముపట్టినా, చీడపట్టినా, చెదపురుగులు తిన్నట్లు కనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలి లేదా వారికి అప్పగించాలి. లేనట్లయి అనవసర వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. సిఎం యోగి మెప్పు పొందేందుకు మధుర అధికారుల మాదిరి ఎక్కడైనా ఉన్నతాధికారులు అదే చేయవచ్చు కదా !

సిత్రాలు చేయరో శివుడో శివుడా : ఎస్కలేటర్‌ మీద డాలర్‌ – వెంటిలేటర్‌ మీద రూపాయి

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మన కరెన్సీ రూపాయి ఏ రోజు ఎంత పతనం అవుతుందో తెలియని స్థితిలో ఉన్నాము. వచ్చే వారం (జూలై 18-24)లో రు.80.50కి పతనం కావచ్చని కొందరి అంచనా. అంతేనా లేక బలపడుతుందా, ఇంకా దిగజారుతుందా అంటే నోరు విప్పి ప్రధాని నరేంద్రమోడీ గారే చెప్పాలి. ఈ సందర్భంగా కొన్ని అంశాలను చెప్పుకుందాం. పురాతన చరిత్ర కలిగిన కరెన్సీలలో మన రూపాయి కూడా ఒకటి. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దిలోనే నాణాన్ని విడుదల చేసినట్లు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 340-290 కాలంలో చంద్రగుప్త మౌర్యుడి పాలనలో ప్రధాన మంత్రిగా ఉన్న చాణుక్యుడు రాసిన అర్ధశాస్త్రంలో స్వర్ణ రూప, సీస రూప, తామ్ర రూప నాణాలతో పాటు రూపయ రూప అంటూ వెండినాణెం గురించి కూడా ప్రస్తావన ఉంది. తరువాత కాలంలో ఉన్న కరెన్సీ లేదా ద్రవ్య వ్యవస్థల గురించి అంత స్పష్టంగా లేదు. షేర్‌ షా సూరి పాలన 1540-45లో 178 గ్రెయిన్స్‌( తేలికైన గింజలు) లేదా 11.53 గ్రాముల బరువుతో వెండి నాణాలను ప్రమాణికంగా తయారు చేయించి దానికి రుపియా అని కూడా పేరు పెట్టారు. ఇప్పుడు ఒక డాలరుకు ఇన్ని రూపాయలు అన్నట్లుగా బాబరు కాలంలో 50 ఇత్తడి నాణాలకు రెండు వెండి నాణాలు సమంగా ఉండేవి.బ్రిటీష్‌ వారు అధికారానికి వచ్చే వరకు ఇవి కొనసాగాయి. బ్రిటీషు వారి ఏలుబడిలో మన రూపాయి పతనం తొలిసారిగా 1873లో జరిగిందని చెప్పవచ్చు. ఐరోపా, అమెరికాలో తీవ్ర ఆర్ధిక మాంద్యం సంభవించింది.ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది. అమెరికా, అనేక ఐరోపా వలస దేశాలలో వెండి నిల్వలను కనుగొనటం కూడా దీని కారణాలలో ఒకటి. విస్తారంగా దొరుకుతున్న కారణంగా దీని విలువ తగ్గి బంగారానికి గిరాకీ ఏర్పడింది.దాంతో అప్పటి నుంచి బంగారం ప్రామాణికంగా విదేశీ లావాదేవీలు నడిచాయి.


ఇక వర్తమానానికి వస్తే 1947ఆగస్టు 15న మన రూపాయి ఒక డాలరుకు సమంగా ఉన్నట్లు సమాచారం, ఏడాది సగటు రు.3.50 గా, 4.16గా ఉందని రెండు రకాల సమాచారం. కొనుగోలు, అమ్మకం ధరల్లో తేడా కూడా ఈ గందరగోళానికి కారణం కావచ్చు. ఒన్‌ ఇండియా డాట్‌ కామ్‌లో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రు.43.47 గా ఉన్నది 2014 మే నెలలో రు.59.44గా ఉంది. అప్పటి నుంచి మధ్యలో తగ్గినా, పెరిగినా మొత్తం మీద ఈ నెలలో రు.79.99కి పడిపోయింది. ఇక రూపాయి పతనం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన సమాచారం,హాస్య భరితమైన రచనలు, ట్విటరైట్ల జోకుల తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూడండి. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నా ఈ పరిస్థితికి కారణం మనం(జనం) కాదు గనుక విషాదంలో వినోదం మాదిరిగా చూద్దాం.
” ఎస్కలేటర్‌ మీద డాలర్‌ , వెంటిలేటర్‌ మీద రూపాయి, ఐసియులో దేశం.. దేవుడు రక్షించుగాక ”
” రూపాయి పడుతున్నదంటున్నారు ఎక్కడో చెప్పండి నేను వెతికి తెచ్చుకుంటా ”
” హమ్మయ్య ఎట్టకేలకు జరిగింది….. దశాబ్దాల తరువాత పెట్రోలు కంటే ఇప్పుడు బీరు చౌక. ఇంక మనం కొత్త నినాదం ఇవ్వవచ్చు జస్ట్‌ డ్రింక్‌ డోంట్‌ డ్రైవ్‌ ( తాగండి తప్ప బండి నడపొద్దు) ”
” రూపాయి-డాలరు బంధం పటిష్టత గురించి డాలరుతో చర్చలకు భారత్‌ సిద్దం ”
” రూపాయి పని తీరు ఎంత దారుణంగా ఉందో చైనా వారు గనుక తెలుసుకుంటే వారు అరుణాచల్‌ ప్రదేశ్‌ జోలికి రారని అనుకుంటున్నా ”
” భగవంతుడా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే డాలర్‌, యూరో మాదిరి లోదుస్తుల బ్రాండ్‌గా రూపాయి లేదు. ఒక వేళ ఉంటే అది జారిపోతున్నపుడు యావత్‌ దేశ రూపం కనిపించేది ”
” డిస్నీలాండ్‌ కొత్త రైడ్‌ను ప్రారంభిస్తోంది. దానిలో ఎంతో ఎత్తు నుంచి కొద్ది సెకండ్లలోనే మీరు కిందికి జారిపోవచ్చు. దానికి వారు భారత రూపాయి అనే పేరు పెట్టబోతున్నారు ”
” రూపాయి సీనియర్‌ సిటిజన్‌గా మారినందుకు అభినందనలు ”
” రూపాయి పైకి వెళ్లేది ఒకే ఒక్కసారి అది టాస్‌ వేసినపుడు ”
” రూపాయిని రక్షించాలంటే ఒకే మార్గం ఉంది, డాలరుకు రాఖీ కట్టి రక్షించమని అడగాలి ”
” మీరు గనుక జీవితంలో ఓడినట్లు విచారపడుతుంటే ఒక్కసారి రూపాయిని చూడండి ”
” న్యూటన్‌ గనుక ఇప్పుడు బతికి ఉంటే గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి రూపాయి పతన ప్రాతిపదిక మీద కొత్తగా చెప్పి ఉండేవాడు. ఆపిల్‌ పండ్లు మెల్లగా పడి ఉండేవి ”


వాషింగ్టన్‌ పోస్ట్‌ డాట్‌కామ్‌ నివేదిక ప్రకారం ” రూపాయి చిహ్నం ప్రారంభం ఒక అశుభ దినాన జరిగిందని దేశంలోని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. చిహ్నంలోని అడ్డగీత రూపాయి నాలుక చీరేస్తా అన్నట్లుగా కనిపిస్తోంది ” అన్నారు.ప్రముఖ జ్యోతిష్కుడు బెజాన్‌ దారువాలా రూపాయి చిహ్న రూపకల్పనలో లోపం ఉందనటాన్ని అంగీకరించలేదు.” నవంబరు నుంచి గురుడి స్థితిని బట్టి అదృష్టం, అంతులేని సంపదల యోగం బలంగా ఉంది. డాలరు మీద రూపాయి బలపడుతుంది, షేర్‌ మార్కెట్లో కూడా అదే జరుగుతుంది, ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను ఎంతగానో అభిమానించే ప్రధాన మంత్రి శని ప్రభావంలో ఉన్నారు. శని అంటే వృద్ది నెమ్మదిగా ఉంటుంది, ఆలశ్యం అవుతుంది, కుంభకోణాలు బయటికి వస్తున్నాయి. రోజుకు రోజుకు డాలరుతో రూపాయి బలహీనపడుతుంది. నవంబరు నుంచి ప్రధాని తారాబలం కూడా మెరుగుపడుతుంది.” రూపాయి చిహ్నాన్ని రూపొందించిన ధర్మలింగం ఉదయకుమార్‌ విమర్శల నుంచి పట్టించుకోలేదు.” నేను రూపాయి చిహ్నాన్ని రూపొందించినపుడు పరిస్థితులు వేరు ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఆర్ధిక వ్యవహారాల గురించి వ్యాఖ్యానించేందుకు తగిన వాడిని కాదు.చిహ్న రూపకల్పన గురించి అడిగితే చెబుతా ” అన్నారు.


భారత క్రికెట్‌ కంట్రోలు బోర్డు ఆధిపతిగా ఉన్న ఎన్‌ శ్రీనివాసన్‌ తన జ్యోతిష్కుడి సమక్షంలో ప్రపంచ నేతలను సవాలు చేశారు.” వచ్చే వారం నాటికి రూపాయి స్థిరపడని పక్షంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తీవ్రతరం కాకుండా చూసేందుకు ఒక ఏడాది పాటు భారత టీము అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా బిసిసిఐ నిరోధిస్తుంది.ఐతే మేము ఐపిఎల్‌లో ఆడతాము, హిందీ వ్యాఖ్యానంతో వాటిని కేవలం దూరదర్శన్‌ మాత్రమే ప్రసారం చేయాలి. విదేశాలు తమ దేశాల్లో ఐపిఎల్‌ను ప్రసారం చేయాలంటే ఇప్పుడు మేము చెల్లిస్తున్నదానికి పది రెట్లు మాకు చెల్లించాలి. స్వదేశంలో కూడా క్రికెట్‌ ఆడవద్దని మేము శ్రీలంకను కూడా కోరతాము. ఐపిఎల్‌తో సహా ఏ రకమైన క్రికెట్‌ ఆడవద్దని మన మంచి దోస్తులైన దక్షిణాఫ్రికాను కూడా కోరతాము. మన ఆర్ధిక వ్యవస్థ స్థిరపడేవరకు ప్రపంచమంతటి నుంచి క్రెకెటర్లు భారత్‌ రావాల్సిందే, ఎక్కడా ఏ విధమైన ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకూడదు.” అని శ్రీనివాసన్‌ అన్నారు.


బిసిసిఐ అభిజ్ఞవర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం రూపాయి పతనం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ బాటింగ్‌ సగటును దాటే అవకాశం ఉందనే భయం కూడా ఉంది.రూపాయి వేగాన్ని సచిన్‌ టెండూల్కర్‌ కూడా అధిగమించలేదు. ఒక నాడు తన కెరీర్‌ను కాపాడుకొనేందుకు రాహుల్‌ ద్రావిడ్‌ వికెట్‌ కీపింగ్‌ చేపట్టాడు. రూపాయిలో మార్పులు రావాలని కూడా ద్రావిడ్‌ చెప్పాడు. బహుశా నోట్లు గుండ్రంగాను, నాణాలను చతురస్రంగా మార్చాలని కావచ్చునని బిసిసిఐ వర్గాలు చెప్పాయి. రూపాయికి ఒక విలువను నిర్ణయించలేమని శ్రీశాంత్‌ ట్వీటాడు. బిసిసిఐ సాంకేతిక కమిటీ సభ్యుడు రవిశాస్త్రి వివరణ ఇస్తూ మరొక ఐపిఎల్‌ నిర్వహణ లేదా కేవలం భారత్‌లోనే క్రికెటర్లు ఆడేవిధంగా చూడాలి. తద్వారా విదేశీ పెట్టుబడిదార్లను దేశానికి ఆకర్షించాలి. ఇది గిరాకీ-సరఫరా ఆట, మనం గిరాకీని సృష్టించాలి.”
రాయల్‌ ఛాలెంజర్స్‌ అధిపతి డాక్టర్‌ విజయ మాల్య నిలిపివేసిన కింగ్‌ఫిషర్‌ జెట్‌ ఒకదానిలో కూర్చొని శ్రీనివాసన్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. తన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ను కూడా ఆదుకోవాలని బిసిసిని కోరాడు. ఆర్‌సిబి మరియు సిఎస్‌కె మామూలుగా అయితే ప్రత్యర్దులు, కానీ చూస్తే ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ శ్రీనివాసన్‌ ఆ భేటీ తరువాత విలేకర్లతో చెప్పింది వేరేగా ఉంది. మా ఇద్దరికీ పనికిరాని కొడుకులున్నారు, కాబట్టి మాకు చక్కగా కుదిరిందన్నాడు. రూపాయి తిరిగి బలపడుతుందా అని తెలుసుకోవాలని దేశం కోరుకుంటోంది కనుక ప్రముఖ రాజకీయనేతలు, క్రికెటర్లు, ప్రపంచ నేతలతో తన న్యూస్‌ అవర్‌ కార్యక్రమంలో చర్చించేందుకు ఆర్నాబ్‌ గోస్వామి ఏర్పాట్లు చేసుకున్నాడు.


భక్తోం, మిత్రో ఆగ్రహించకండి, విశ్వగురువుగా ప్రపంచంలో నీరాజనాలు అందుకుంటున్న మన ప్రధాని ఎంతైనా నరేంద్రమోడీ, పాలన గురించి ఇలా జోకులేస్తారా, వాటిని మీరు మా ముందు పెడతారా అని కోప్పడకండి. పైన పేర్కొన్న జోకులన్నీ 2013లో యుపిఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ మీద వేసినవిగా గమనించాలి. ఇప్పుడు జోక్స్‌ వేయాలన్నా, షేర్‌ చేయాలన్నా ఎక్కడ కేసులు నమోదై ఇబ్బందులు పడతామో అన్న భయం వలన కావచ్చు అంతగా రావటం లేదు. పూర్వం రాజు గారు నవ్వితే నవ్వాలి లేదా తనను నవ్వించమని అడిగితే నవ్వించాలి తప్ప ఏదీ మనంతట మనం చేయకూడదు. రాజు గారు నవ్వేంత వరకు ఎదురు చూడాల్సిందే మరి. తొమ్మిదేండ్ల క్రితం రూపాయి మాదిరి ఇప్పుడూ ఉంది. కరోనాలో చూసిన పాతసినిమాలే చూసినట్లు ఇప్పుడు పాత జోకులతోనే సరిపెట్టుకుందాం.రోజులు బాగుంటే కొత్త జోకులు వస్తాయి.


”యుపిఏ ఏర్పడినపుడు రూపాయి-డాలరు నిష్పత్తి రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా ఉంది, ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గరగా ఉంది, మన్మోహన్‌ సింగ్‌ వయస్సును తాకుతుందేమో అన్నది మా అనుమానం” అని బిజెపి నేత రవిశంకర ప్రసాద్‌ ప్రసాద్‌ 2014కు ముందు జోక్‌ చేశారు. కాలం కలసి రాక ఇప్పుడు ఆ పెద్ద మనిషి రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. లాయరు గనుక తిరిగి కోర్టులకు వెళుతున్నారో లేదో తెలియదు. చైనాతో వంద బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరపాలని మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చటంలో మన ప్రధాని నరేంద్రమోడీ విజయం సాధించారు.తొమ్మిదేండ్ల క్రితం రవిశంకర ప్రసాద్‌ చెప్పినట్లు సోనియా గాంధీ వయస్సు 67(ఇప్పుడు 75)ను దాటించారు. ఊపు చూస్తుంటే మన్మోహన్‌ సింగ్‌ వయస్సు80(ఇప్పుడు 89)కు చేరారు. తరువాత తన రాజకీయ గురువైన ఎల్‌కె అద్వానీ 85(ఇప్పుడు 94) గారికి దక్షిణ సమర్పించినా ఆశ్చర్యం లేదు. ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో కదా !

విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంచిన నరేంద్రమోడీ : తన స్థానానికి ఎసరు వస్తుందేమోనని గోబెల్స్‌ ఆందోళన !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” నరేంద్ర మోడీ ఎనిమిదేండ్ల పాలన కారణంగా విదేశాల్లో ఉన్న భారత సంతతి దేశానికి మరింత దగ్గరైంది, ప్రపంచ వేదిక మీద భారత ప్రతిష్ట ఎన్నడూ లేని విధంగా ఉన్నత స్థాయిలో ఉంది ” 2022 జూన్‌ 14వ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో శివప్రకాష్‌ అనే బిజెపి జాతీయ సంయుక్త కార్యదర్శి రాసిన ఆణిముత్యాలలో చెప్పిన అంశమిది. సరిగ్గా నెల రోజులకు ప్రపంచ ఆర్ధిక వేదిక విడుదల చేసిన ప్రపంచ లింగ సమానత్వ నివేదిక మన దేశం గురించి చెప్పిందేమిటో ఒక్కసారి చూద్దాం.


ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రపంచ లింగ సామ్య లేదా పోలిక నివేదిక 2022ను తాజాగా విడుదల చేసింది.లెక్కలు కట్టే పద్దతి సరిగా లేదు లేకుంటేనా అన్నట్లుగా వివిధ ప్రపంచ సూచికల్లో మన స్థానం గురించి అధికారంలో ఉన్నవారు మాట్లాడతారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ మాటలు వినీ వినీ చిరాకు పుడుతోంది. లెక్కించే పద్దతి తప్పైతే, అది మన దేశ స్థానాలను సరిగా ప్రతిబింబించటం లేదు అనుకుంటే ఆ సర్వేల నుంచి మనం తప్పు కోవచ్చు లేదా వాటితో సంబంధం లేదని ప్రకటించవచ్చు. ఆడలేక మద్దెల ఓడు అంటే ఎలా ! ప్రపంచంలో 195 దేశాలున్నాయి, వాటిలో 193 ఐరాస సభ్యదేశాలు. పాలస్తీనా, వాటికన్‌ సిటీలకు పరిశీలక హౌదా కల్పించారు. ప్రపంచ సూచికల్లో ఈ దేశాలన్నీ ఉండవు. కనుక మనం కూడా తప్పుకోవచ్చు, పరువును మరింతగా పెంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు.


2022 లింగ పోలిక నివేదికలో 146 దేశాలను చేర్చారు. దానిలో మనది 135వ స్ధానం, 2021నివేదికలో 156కు గాను మనది 140వ స్థానం చూశారా గతేడాది కంటే ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాం అన్నట్లుగా చూపుతున్నారు. దేశాల సంఖ్య తగ్గింది. మన మెరుగుదల తరుగుదల మనం సాధించిన పాయింట్లను బట్టి చూడాలి. 2021లో వచ్చింది 0.629 కాగా 2022లో 0.625 గా నమోదు. పాయింట్లు పెరిగితే మన స్థానం మెరుగుపడి సూచికలో ఎగువకు పోతాం. కనుక ఇది మెరుగుదల అంటే చూసి నవ్వాలా ఏడవాలా ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. 2020లో 112లో ఉన్నాము. 2022లోప్రధమ స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌కు 0.908 రాగా రెండవ స్ధానంలో నిలిచిన ఫిన్లాండ్‌కు 0.860 వచ్చాయి. ఆడా మగా తేడా లేదు అంతాసమానం అని చెప్పుకొనే అమెరికా 0.769 స్కోరుతో 27వ స్ధానంలో, 25వ స్ధానంలో ఉన్న కెనడాకు 0.772 వచ్చాయి. దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌ 71, నేపాల్‌ 96, శ్రీలంక 110, మాల్దీవులు 117, భూటాన్‌ 126, భారత్‌ 135, పాకిస్తాన్‌ 145, ఆప్ఘనిస్తాన్‌ 146వ స్థానంలో ఉంది. వీటిని చూపి మనం చివరి రెండు దేశాల కంటే మెరుగ్గా ఉన్నామని ఎవరైనా చెప్పుకుంటే నిజంగా సిగ్గు చేటు.


ప్రపంచంలో ఇప్పుడున్న స్థితిగతులను బట్టి లింగ సమానత్వాన్ని సాధించాలంటే మరో 132 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు మాత్రమే. ప్రాంతాల వారీగా ఉత్తర అమెరికా 59, ఐరోపా 60, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల్లో 67,ఆఫ్రికాలోని సబ్‌ సహారా ప్రాంతంలో 98, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో 115, మధ్య ఆసియా 152, తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో 168, దక్షిణాసియాలో 197 సంవత్సరాలు పడుతుందని అంచనా. 2021 నివేదికలో ఇది 195.4 సంవత్సరాలుగా ఉంది. ఈ లోపల కరోనా వంటి మహమ్మారులు, ఇతర కల్లోలాలు వస్తే మరింత ఆలశ్యం అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. కరోనాకు ముందు లింగసమానత్వ సాధనకు పట్టే సగటు కాలాన్ని వంద సంవత్సరాలుగా అంచనా వేశారని గమనించాలి. కరోనాతో మరో 32 సంవత్సరాలు వెనక్కు వెళ్లింది. కల్లోలాలు వచ్చినపుడు ముందుగా దెబ్బతినేది మహిళలే. గతేడాదితో పోలిస్తే నాలుగు సంవత్సరాలు తగ్గింది.


వివిధ ప్రపంచ సూచికల్లో మనం ఎక్కడున్నాం అన్నది వాటిని ప్రకటించినపుడల్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారు. కొన్ని సూచికల్లో మన స్థానాలేమిటో చూద్దాం.
ప్రపంచ పోటీ తత్వం 2022 – 37
ప్రజాస్వామ్య సూచిక 2021-46
నవకల్పన 2021-46
సులభతర వాణిజ్యం 2021- 63
డిజిటల్‌ నైపుణ్యం 2022 – 63
ఆరోగ్య భద్రత 2021 – 66
ప్రపంచ నైపుణ్యం 2022 – 68
ఆహార భద్రత 2021 – 71
చట్టబద్ద పాలన 2021 – 79
లంచాల ముప్పు 2021 – 82
అవినీతి సూచిక 2021- 85
ఆకలి సూచిక 2021 – 101
మానవ స్వేచ్చ 2020 – 111
పిల్లల హక్కులు 2021-113
ఇంటర్నెట్‌ వేగం 2022 – 115
ఆర్ధిక స్వేచ్చ 2021-121
యువజన అభివృద్ధి 2021- 122
అసమానతల తగ్గింపు కట్టుబాటు 2021-129
మానవ అభివృద్ది 2020 – 131
ప్రపంచ శాంతి 2021-135
సంతోష సూచిక 2021 -136
ప్రపంచ పత్రికా స్వేచ్చ 2022 -150
పర్యావరణ పనితీరు 2022-180


బేటీ బచావో బేటీ పఢావో అంటూ 2015 జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ప్రచారం తరువాత లింగ సమానత్వంలో దేశం మరింత దిగజారింది. ఆర్ధిక రంగంలో భాగస్వామ్యం-అవకాశాలు, విద్య,ఆరోగ్యం-ప్రాణ రక్షణ, రాజకీయ సాధికారత అంశాల ప్రాతిపదికన లింగ సమానత్వ సూచికను ఖరారు చేస్తారు. తాము అధికారానికి వస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఉభయ సభల్లో మెజారిటీ ఉన్నా దాని గురించి మాట్లాడరు. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఏలుబడిలో మహిళలకు రాజకీయ సాధికారతకు ఒక సూచికగా పరిగణించే అంశంలో దిగజారటం తప్ప మార్కులు పెరగటం లేదు. 2019లో 23.1శాతంగా ఉన్న మహిళా మంత్రులు 2021 నాటికి 9.1శాతానికి తగ్గారు. చట్టసభల్లో, సీనియర్‌ అధికారులు, మేనేజర్లుగా ఉన్న మహిళలు 2022 నివేదిక ప్రకారం 17.6 శాతం మందే.


ఇన్ని వివరాలు చూసిన తరువాత నిజంగా కలికాలం లేదా కలి మహత్యం కాకపోతే ప్రపంచంలో దేశ ప్రతిష్టను నరేంద్రమోడీ పెంచారని ఎనిమిదేండ్ల తరువాత కూడా పాడిందే పాడరా అన్నట్లుగా ఇంకా చెప్పుకోవటం ఏమిటి ? జనం చెవుల్లో పూలు పెట్టటం అంటే ఇదే. బిజెపి నేతలకు, నరేంద్రమోడీ భక్తులకు నిజంగా ఈ వివరాలేవీ తెలియవా లేక తెలవనట్లు నటిస్తున్నారా ? ఇలాంటి తప్పుడు తప్పుడు ప్రచారాలకు విశ్వగురువు జర్మన్‌ నాజీ హిట్లర్‌ ప్రచార మంత్రిగా పనిచేసిన గోబెల్స్‌. మన దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చూసి ఇప్పటి వరకు గోబెల్స్‌ ప్రచారం అనే బదులు ఇక ముందు బిజెపి లేదా మోడీ ప్రచారం అని పిలుస్తారేమోనని స్వర్గంలో ఉన్న గోబెల్స్‌ ( ఇలాంటి వారిని నరకం భరించలేదు ) ఇటీవల భయపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మన ప్రధాని నరేంద్రమోడీ మానస మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కుహనా వార్తలు, ప్రచారాన్ని తట్టుకోలేక 2017 నవంబరు 27న ఫేక్‌ న్యూస్‌ అవార్డు, దానికి గాను ఫేక్‌ న్యూస్‌ ట్రోఫీ ఇస్తే బాగుండునని ఒకట్వీట్‌లో ప్రతిపాదించాడు. మోడీ గారు ఇంకా అధికారంలో ఉండటమే కాదు, 2024లో కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నారు గనుక జనాన్ని చైతన్య పరిచేందుకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పర్యవేక్షణలో ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో !

శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు మాల్దీవులకు పరారీ, అత్యవసర పరిస్థితి ప్రకటన !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


బుధవారం నాడు పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన శ్రీ లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు పారిపోయినట్లు వార్తలు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని విక్రమ సింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశాడు. సోమవారం రాత్రి దుబాయి పారిపోయేందుకు చేసిన యత్నాన్ని ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది విఫలం చేశారని కొన్ని వార్తలు రాగా, అమెరికా వీసా నిరాకరించిందని మరికొన్ని వార్తలు. దాంతో సముద్ర మార్గం ద్వారా దేశం విడిచి పోవాలని చూశాడు. చివరకు మిలిటరీలో తనకు అనుకూలురైన వారి సహకారంతో దేశం వదలి వెళ్లాడు. గొటబయ పరారీకి మన దేశం సహకరించిందన్న వార్తలను విదేశాంగశాఖ ఖండించింది. అతగాడి ఆచూకీ గురించి చెప్పేందుకు మాల్దీవుల సర్కార్‌ కూడా తిరస్కరించింది. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లవచ్చని వార్తలు వచ్చాయి.


రాజీనామా డిమాండ్‌ చేసిన పౌరుల ఆందోళన కారణంగా శుక్రవారం రాత్రి అధ్యక్ష నివాసం నుంచి ఒక సైనిక నౌకా కేంద్రానికి గొటబయ వెళ్లాడు. అక్కడి నుంచి కటునాయకే సైనిక వైమానిక కేంద్రానికి తరలించారు. తదుపరి రెండు మిలిటరీ హెలికాప్టర్లలో గొటబయ పరివారం సోమవారం నాడు కొలంబో విమానాశ్రయానికి వెళ్లింది. ఎందుకు అన్నది అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా దుబాయి పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ప్రముఖులు ఉండే గదికి వెళ్లి గొటబయ పాస్‌పోర్టుపై ముద్రవేసేందుకు తిరస్కరించారని, తాను పౌరులు ప్రయాణించే విమానాలు ఎక్కనంటూ గొటబయ తిరస్కరించినట్లు, తరువాత మధ్య ప్రాచ్యానికి నాలుగు విమానాలు గొటబయ లేకుండానే వెళ్లినట్లు వార్తలు. లంక అధ్యక్ష పదవిలో ఉన్న వారిని అరెస్టు చేసేందుకు అక్కడి నిబంధనలు అంగీకరించవు. దీన్ని అవకాశంగా తీసుకొని పారిపోయే ఎత్తుగడతోనే బుధవారం నాడు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ముందస్తు తేదీ వేసిన రాజీనామా లేఖను ముందుగానే అందచేశారని చెబుతున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.


విదేశీ రుణం 51బిలియన్‌ డాలర్లకు గాను జూన్‌లో చెల్లించాల్సిన 8.6బి.డాలర్ల కిస్తీ చెల్లింపులో లంక సర్కార్‌ విఫలమైంది. ఐఎంఎఫ్‌, ఇతర సంస్థలు, దేశాలతో కొత్త రుణాల కోసం చేస్తున్న సంప్రదింపులు ఇంకా కొలిక్కి రాలేదు. ” సార్థక ప్రజాస్వామిక పాలన ”ను ప్రోత్సహించే పేరుతో ”అంతర్జాతీయ అభివృద్ధికోసం పని చేసే అమెరికా సంస్థ( యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. గొటబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గంముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగపరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్ధిక లబ్ది లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30నాటికి పదిరోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. అప్పుగా ముడిచమురు, గాస్‌ ఇప్పించాలంటూ కతార్‌కు గొటబయ సర్కార్‌ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. కతార్‌ను మంచి చేసుకొనేందుకు లంకలో పనిచేస్తున్న కతార్‌ ఛారిటీ అనే కతార్‌ ప్రభుత్వ సంస్థ మీద నిషేధాన్ని వెనక్కు తీసుకుంది.2019లో జరిగిన ఉగ్రవాద చర్యలకు ముస్లింలే కారణమని, వారికి కతార్‌ ఛారిటీ నిధులు అందచేసిందని ప్రభుత్వం విమర్శించింది. సదరు సంస్థ నిధులను ప్రభుత్వం స్థంభింపచేసింది. అంతే కాదు కరోనా కారణంగా మరణించిన ముస్లింల శవాలను ఖననం చేస్తే భూమి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని గొటబయ సర్కార్‌ నిషేధం విధించింది.


శ్రీలంక ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ కతార్‌ సర్కార్‌ కరుణించలేదు. ఐఎంఎఫ్‌తో చేసుకొనే ఒప్పందాన్ని బట్టి తాము వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్‌ ప్రభుత్వం కూడా సాయానికి సిద్దం అంటూనే తమ సంగతి కూడా తేల్చాలని మెలికపెట్టింది. తాము చమురు సరఫరాకు అవసరమైన 360 కోట్ల డాలర్లకు గాను దానికి చెల్లించే వడ్డీ బదులు చమురు తవ్వకాలకు గాను లంకలో కొంత ప్రాంతాన్ని తమ అప్పగించాలని షరతు పెట్టగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. నెలకు 30 కోట్ల డాలర్ల చొప్పున 12నెలల్లో రుణం ఇస్తామని, దాన్ని ఐదు సంవత్సరాల విరామం తరువాత పదిహేను సంవత్సరాల్లో చెల్లించాలని ఒమన్‌ ప్రతిపాదించింది. దీని సంగతి కూడా తేలిస్తే తాము చమురు కొనుగోలుకు రుణం ఇస్తామని లంకలో ఒమన్‌ రాయబారి స్పష్టం చేశారు. ఇవేవీ తేలకుండానే గొటబయ పరారీ, ఇతర పరిణామాలు సంభవించాయి.


శ్రీలంక పరిణామాలకు కుటుంబ పాలనే కారణమనే సూత్రీకరణలు, సంక్షేమ పధకాల అమలు వల్లనే సంక్షోభం తలెత్తిందనే రాగాలూ వినిపిస్తున్నాయి.అవినీతి అక్రమాలు జరిగినప్పటికీ నిజానికి లంక సమస్య తప్పుడు విధానాల వలన తలెత్తింది. దీనికి కరోనా, ఇతర కారణాలు కూడా తోడయ్యాయి.దేశ జిడిపిలో పన్నెండుశాతం సమకూర్చే టూరిజం 2019లో జరిగిన ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్నది. దీనికి కరోనా తోడైంది. విదేశాల్లో పనిచేసే శ్రీలంక వాసులు పంపే మొత్తాలు జిడిపిలో 8-10శాతం ఉండేవి. కరోనాతో అవి కూడా నిలిచిపోయాయి. 2019లో అధికారానికి వచ్చిన గొటబయ ప్రకటించిన పన్నుల రాయితీ కారణంగా పన్ను చెల్లించే ధనికుల సంఖ్య 15 నుంచి నాలుగు లక్షలకు తగ్గింది. వాట్‌ను 15 నుంచి 8శాతానికి తగ్గించాడు, మరో ఏడు పన్నులను రద్దు చేశాడు. వాటిలో ఒకటి దేశ పునర్‌నిర్మాణానికి కార్పొరేట్ల నుంచి వసూలు చేస్తున్న రెండు శాతం పన్ను. 2018లో టూరిజం ద్వారా 440 కోట్ల డాలర్లు రాగా 2021నాటికి 40 కోట్లకు పడిపోయింది. రసాయన ఎరువుల దిగుమతులు నిలిపివేసిన కారణంగా పంటలు దెబ్బతిని ఆహార కొరత ఏర్పడింది. ప్రపంచంలో తలెత్తిన సంక్షోభం కారణంగా వివిధ ప్రాజక్టుల మీద ఆశించిన రాబడి కూడా రాలేదు. ఇలా విధానపరమైన తప్పిదాలు,బయటి కారణాలు లంకను దెబ్బతీశాయి.


శ్రీలంక సంక్షోభానికి మూలం చైనా ఇచ్చిన అప్పులు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అనేక దేశాలు గతంలో లంక మాదిరే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికీ చైనా రుణాలు ఇవ్వలేదు.1990 దశకంలో ఆసియా టైగర్‌గా పేరు తెచ్చుకున్న ఇండోనేషియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి తిరిగి కోలుకున్నది.1960దశకం నుంచి ఇప్పటి వరకు 147 దేశాలు రుణ చెల్లింపుల్లో విఫలం చెందినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక సమాచారం పేర్కొన్నది. కంపెనీలు బాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేనట్లుగానే ప్రభుత్వాలు కూడా అప్పులు చేసి సకాలంలో కిస్తీ చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. చరిత్రలో 1557లో తొలిసారిగా స్పెయిన్‌ దివాలా ప్రకటించింది. తరువాత పద్దెనిమి, పందొమ్మిదవ శతాబ్దాలలో 15సార్లు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోయింది.వర్తమానంలో లాటిన్‌ అమెరికా దేశమైన అర్జెంటీనా 2001లో 132 బిలియన్‌ డాలర్లు, తరువాత 2016, 2020లో కూడా రుణాలను చెల్లించలేక చేతులెత్తేసింది. సోవియట్‌ విచ్చిన్నం తరువాత 1998లో రష్యాకూ అదే పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్‌ 1998,2020లో, ఈక్వెడార్‌ 2008,2020లో, మెక్సికో 1982,1995లో, జమైకా 2010లో శ్రీలంక పరిస్థితినే ఎదుర్కొన్నాయి.


1960,70 దశకాల్లో అనేక లాటిన్‌ అమెరికా దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి పారిశ్రామికీకరణ కోసం రుణాలు తీసుకున్నాయి. చమురు ఎగుమతి చేసే దేశాలలో ఒకటైన మెక్సికో 1970 దశకంలో భవిష్యత్‌లో వచ్చే చమురు ఆదాయాన్ని చూపి ప్రైవేటు బాంకుల నుంచి రుణాలు తీసుకుంది.1973లో చమురు ధరలు పతనం కావటంతో ఇబ్బందుల్లో పడింది. కొద్ది సంవత్సరాల క్రితం వెనెజులా కూడా చమురు ధరల పతనం, అమెరికా ఆంక్షలకారణంగా సకాలంలో రుణాలు చెల్లించలేకపోయింది.1975-83 కాలంలో వాణిజ్యబాంకుల నుంచి లాటిన్‌ అమెరికా దేశాలు తీసుకున్న రుణాలు ఏటా 20శాతం పైగా పెరిగాయి. రుణ మొత్తం 75 నుంచి 315 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది ఆ ప్రాంత జిడిపిలో 50శాతం. ఇదే కాలంలో వడ్డీ రేట్లు కూడా పెరగటంతో వడ్డీ, అసలు చెల్లింపు ఏటా 12 నుంచి 66 బి.డాలర్లకు చేరింది. ఈ దేశాలేవీ చైనా నుంచి రుణాలు తీసుకోలేదు. మన కరెన్సీ విలువ పతనం కారణంగా విదేశాలకు చెల్లించాల్సిన డాలర్ల కొనుగోలు ధర పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది.తాజా సమాచారం ప్రకారం మన దేశానికి ఉన్న 621బిలియన్‌ డాలర్ల విదేశీ రుణంలో స్వల్పకాలిక రుణాల మొత్తం 267 డాలర్లు ఉంది, రానున్న తొమ్మిది మాసాల్లో దీన్ని తీర్చాల్సి ఉంది. రూపాయి విలువ పతనం కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రుణాల మీద వత్తిడి పెరుగుతుంది. దీని కోసం కొత్త రుణాలు తీసుకోవాలి లేదా ఆస్తులను తెగనమ్మి చెల్లించాలి. డాలరు విలువ, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్న కారణంగా కొత్త రుణాలు మరింత భారంగా మారతాయి. రుణదాతలు కఠినమైన షరతులు విధిస్తారు. ఐఎంఎఫ్‌ లేదా ప్రపంచబాంకు జోక్యాలను అంగీకరించాలని, వాటి షరతులను అమలు జరపాలని డిమాండ్‌ చేస్తాయి. ఆ సంస్థలు రుణాలు తీసుకున్న దేశాలు తమ మార్కెట్లను మరింతగా తెరవాలని, సంక్షేమ పధకాలకు కోత పెట్టాలని, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు అనుకూలగా చట్టాల సవరణ వంటి అనేక అంశాలను రుద్దుతాయి. ఈ సంస్థల్లో పెట్టుబడులు ఎక్కువ భాగం ధనికదేశాలవే వుంటాయి గనుక వాటి ప్రయోజనాలను ముందుకు తెస్తాయి. శ్రీలంకకు మన దేశం చేస్తున్న సాయాన్ని చూపి అదానీ కంపెనీ విద్యుత్‌ ప్రాజెక్టును అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ వత్తిడి తెచ్చినట్లు వచ్చిన వార్తల గురించి తెలిసిందే.


శ్రీలంక విషయానికి వస్తే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకోవాలని గొటబయ సర్కార్‌ నిర్ణయించి ఏప్రిల్‌ నుంచే సంప్రదింపులు ప్రారంభించింది.ఐబిఎఫ్‌డి( ఇంటర్నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఫిస్కల్‌ డాక్యుమెంటేషన్‌-నెదర్లాండ్స్‌) సంస్థ మే 31న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లంక సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించింది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా వాట్‌ను ఎనిమిది నుంచి పన్నెండు శాతానికి పెంచింది.వాట్‌ చెల్లించాల్సిస సంస్థల నమోదుకు లావాదేవీల ప్రారంభాన్ని 30 నుంచి 12 కోట్లకు తగ్గించారు.కార్పొరేట్‌ పన్ను 24 నుంచి 30శాతానికి పెంచింది. 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశీయ కంపెనీలు విదేశీ వ్యక్తులకు చెల్లించే డివిడెండ్స్‌ను ఆదాయపన్ను పరిధిలోకి తెచ్చారు. టాక్స్‌ హాలిడేలను, పన్ను రాయితీలను కొన్ని రంగాలకు మినహాయించారు. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు రాయితీ మొత్తాన్ని రు. 30 లక్షల నుంచి 18లక్షలకు తగ్గించారు. ఆదాయపన్ను విధింపు రు. 30 నుంచి గాక పన్నెండు లక్షల నుంచే ప్రారంభిస్తారు. ఇలాంటివే మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఇవన్నీ ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థలను ప్రసన్నం చేసుకొనేందుకే. గతంలో గొటబయ సర్కార్‌ కార్పొరేట్లకు అప్పనంగా రాయితీలు ఇచ్చిందని, పన్ను చెల్లించగలిగిన వారికి మినహాయింపులిచ్చి ఖజానాను గుల్లచేసిందనే విమర్శలు ఉన్నాయి.పైన పేర్కొన్న అంశాలు గతంలో చేసిన వాటిని కొన్నింటిని సవరించినట్లు కనిపిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా సామాన్యజనంపై భారాలు మోపే వాట్‌ పెంపుదల వంటివి కూడా ఉన్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం చూసినపుడు ఐఎంఎఫ్‌ షరతుల వలన కార్మికుల నిజవేతనాలు పడిపోవటం, భారాలు పెరగటం వంటి పరిణామాలను, వాటికి ప్రతిఘటన పోరాటాలను చూశాము. లంకకు ఐఎంఎఫ్‌ విధించే షరతులు పూర్తిగా వెల్లడైన తరువాత వాటి ప్రభావం గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాలకుల అస్తవ్యస్త విధానాల మీద జనం చేసిన తిరుగుబాటు రేపు భారాలకు వ్యతిరేకంగా కూడా పునరావృతం అవుతుంది.

వెయ్యి చైనా కంపెనీల రాక జుమ్లా – 2,783 భారత కంపెనీల పోక నిజం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి వెయ్యి కంపెనీలు మన దేశానికి వస్తున్నట్లు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ఇంకే ముంది చైనాలో ఫ్యాక్టరీలన్నీ ఖాళీ అవుతున్నాయన్నట్లుగా వాటిని చూసి అనేక మంది కొండంత రాగాలు తీశారు. తాజాగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించింది.దానిలో జెపి మోర్గాన్‌ కంపెనీ ప్రతినిధులతో మన దేశానికి ఉన్న ఎగుమతుల అవకాశాల గురించి చెప్పించారు. చైనా ప్రస్తుతం తక్కువ నైపుణ్యంతో ఉత్పత్తి చేసే దుస్తులు, పాదరక్షలు, తోలు వస్తువులు, ఫర్నీచర్‌ వంటి ఎగుమతుల నుంచి వైదొలుగుతున్నదని, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు భారత్‌కు అవకాశం వచ్చింది కనుక వినియోగించుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. దాని కొనసాగింపుగా రాష్ట్రాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పెద్దలు చెప్పారు. పూర్వకాలంలో రాజుల దగ్గర ఉండే కొందరు వారి మనసెరిగి దానికి అనుగుణంగా కబుర్లు చెప్పేవారు. ప్రస్తుతం రెండింజన్ల సర్కార్లున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు మేకిన్‌ ఇండియా ఎగుమతుల బదులు బుల్డోజర్ల మీద కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎగుమతులకు అవకాశం లేదు గనుక ఇప్పుడైనా వాటిని పక్కన పెడతారేమో, పనికి వచ్చే పనులు చేస్తారేమో చూద్దాం. ఇంతకూ చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలేమైనట్లు ? జనాలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు గనుక ఎప్పటికప్పుడు కొత్త కతలు చెబుదాం మిత్రోం !


తాజాగా వచ్చిన వార్తల ప్రకారం చైనా కంపెనీలు కొన్ని అమెరికా సరిహద్దుల్లో ఉన్న మెక్సికోకు తరలేందుకు చూస్తున్నట్లు, అక్కడ వేతనాలు తక్కువ, పన్ను రాయితీలు ఎక్కువ, సరకు రవాణా ఖర్చులు తగ్గుతాయన్నది సారాంశం. దాన్ని వేరే విధంగా చూస్తే చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు తగ్గుతున్నాయి. చైనాలో పెట్టిన కొన్ని అమెరికన్‌ కంపెనీలు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాయి. ఎందుకని ? అమెరికా మాజీ నేత నోటి దూల ట్రంప్‌ అధికారంలో ఉండగా 2018లో చైనా మీద ప్రారంభించిన వాణిజ్యం యుద్ధం నుంచి ఎలా వెనక్కు తగ్గాలా అని ప్రస్తుత నేత జో బైడెన్‌ చూస్తున్నాడు. చైనా నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్ను పెంచి వారిని దెబ్బతీస్తానని ట్రంప్‌ కలలు గన్నాడు. అవే పన్నులు అమెరికన్ల మీద భారాలు మోపాయి. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు అక్కడ తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను నివారించాలంటే చైనా వస్తువుల మీద పన్ను తగ్గించటం మినహా మరొక మార్గం లేదని బైడెన్‌కు అర్ధమైంది.

ఈ పూర్వరంగంలోనే చైనాలో ఉన్న కొన్ని కంపెనీల ఆలోచనల గురించి ఎటి కియర్నీ అనే కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. చైనా నుంచి కంపెనీలను మెక్సికో, కెనడా లేదా మధ్య అమెరికా దేశాలకు తరలిస్తే లాభదాయకమని గతేడాది 78శాతం మంది అమెరికన్‌ కంపెనీల అధికారులు భావిస్తే ఈ ఏడాది మార్చి నెలలో 92శాతానికి పెరిగారట.పదహేడు శాతం మంది ఇప్పటికే మెక్సికో వెళ్లినట్లు చెప్పారు. 2018లో అమెరికా-కెనడా-మెక్సికో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఫర్నీచర్‌ తయారీదారులు స్థానికంగా దొరికే వాటి నుంచి 50శాతం ముడివస్తువులను ఉపయోగిస్తేనే మెక్సికో పన్ను రాయితీలు వర్తిస్తాయి.దీన్ని అమలు జరపటం కష్టం కనుక ఏం జరుగుతుందో చెప్పలేం. జో బైడెన్‌ దిగుమతి పన్ను ఎత్తివేస్తే చైనాలోనే కొన్ని కానసాగవచ్చు, కొన్ని మెక్సికోకు తరలవచ్చు తప్ప మన దేశం వైపు వచ్చే అవకాశం లేదు. లాభసాటిగా ఉంటే అమెరికన్లతో పాటు కొన్ని చైనా కంపెనీలు కూడా మెక్సికోలో కొత్తగా పరిశ్రమలు పెట్టవచ్చు. అలా పెట్టకూడదనే ఆంక్షలను చైనా ప్రభుత్వం విధించలేదు.మెక్సికోకు చైనా కంపెనీలు తరలే అవకాశం గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా కొందరు చెబుతున్నారు. ఎవరిష్టం వారిది ఎవరి లాభం వారిది గనుక వారికే వదిలేద్దాం !


చైనా మార్కెట్లో ప్రవేశించేందుకు విదేశాల నుంచి అనేక మంది అక్కడకు వెళ్లి కంపెనీలు పెట్టటం, తరువాత ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడకు పోవటం నిరంతరం జరుగుతున్నదే.దుస్తుల ఉత్పత్తి బంగ్లాదేశ్‌, వియత్నాంలో లాభసాటిగా ఉంటుందని దశాబ్దక్రితమే అనేక మంది తరలి వెళ్లారు. మొత్తం మీద చూసినపుడు అనేక మంది భావిస్తున్నట్లు లేదా కొందరు కోరుకుంటున్నట్లుగా పొలోమంటూ చైనా నుంచి వలసలు లేవు. విదేశీ పెట్టుబడుల పెరుగుదల రేటు తగ్గటం, పెరగటం తప్ప పూర్తిగా ఆగిపోలేదు. కనీస వేతనాలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది చైనా గ్వాంగఝౌ దుస్తుల పరిశ్రమలో కనీసవేతనం 313 డాలర్లుంటే, ఇండోనేషియాలో 243, కంపూచియాలో 190,మయన్మార్‌లో 157, బంగ్లాదేశ్‌లో 95 డాలర్లుందని జర్మనీ స్టాటిస్టా సంస్థ పేర్కొన్నది. ఇతర దేశాల్లో లేని సంక్షేమ పధకాలు చైనాలో అదనం అన్నది తెలిసిందే. చైనా ప్రస్తుతం అధిక విలువ గలిగిన ఉత్పత్తుల తయారీ మీద కేంద్రీకరించినందున గిట్టుబాటుగాని తక్కువ విలువగల వస్తు తయారీ సంస్థలు రాకపోవచ్చు, ఉన్నవి వెళ్లిపోవచ్చు.


కరోనా, ఇతర పరిణామాల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాటికి తోడు రాజకీయాలు ఉండనే ఉన్నాయి. దానిలో భాగంగా చైనా మీద ఆధారపడటం తగ్గించాలని అనేక మంది చెబుతున్నారు. నిజానికి ఆధారపడాలని ఎవరూ వత్తిడి తేలేదు. అమెరికా ముందుకు తెచ్చిన ఇండో పసిఫిక్‌ ఆర్ధిక చట్రం(ఐపిఇఎఫ్‌) మీద ఎక్కువగా ఆధారపడాలని కొందరు సూచిస్తున్నారు. ఎవరూ మనకు సరకులు ఉచితంగా ఇవ్వనపుడు ఎక్కడ తక్కువ ధరలు ఉంటే అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఎవరు మన వస్తువులను కొంటే వారికే అమ్ముతాం. మబ్బులను చూసి చేతిలో ఉన్న ముంత నీళ్లు పారపోసుకున్నట్లుగా పరిస్థితి మారకుండా చూసుకోవాలి.చైనాకు మన ఎగుమతులు దెబ్బతినకూడదు. చెరువు మీద అలిగే వారు కొందరు చైనా వస్తువుల కొనుగోలు నిలిపివేసి, వారికి వస్తువులు ఎగుమతి ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తారని పగటి కలలు కనేవారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. రాత్రంతా సత్రాలు, మఠాల్లో గంజాయి దమ్ము లేదా బార్లలో మందుకొట్టి అది చేయాలి, ఇది చేయాలి అని వాగి తెల్లవారి మత్తుదిగిన తరువాత ఎవరిదారిన వారు పోవటం తెలిసిందే.


పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా కాకుండా వస్తూత్పతికి చైనాను అనుకరించాల్సిన అవసరం లేదని, గత కొద్ది సంవత్సరాలుగా అది పని చేయలేదని అందువలన సేవారంగం మీద కేంద్రీకరించాలని రఘురామ్‌ రాజన్‌ వంటి వారు చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పెట్టుబడుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం కనిపించటం లేదు. 2014 నుంచి 2021 నవంబరు వరకు వివిధ కారణాలతో మన దేశం నుంచి 2,783 విదేశీ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయి.2021 నవంబరు 30 నాటికి దేశంలో 12,458 విదేశీ కంపెనీలు చురుకుగా పని చేస్తున్నట్లు కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పినట్లు 2021 డిసెంబరు ఎనిమిదవ తేదీన ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. మన దేశంలోని జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తన ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ను చైనా సంస్ధ అనుబంధ ఎంజి మోటార్‌ ఇండియా 2017లో కొనుగోలు చేసింది. ఇటీవల మహారాష్ట్రలోని తాలేగాంలోని ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్‌ కంపెనీ ముందుకు రాగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటంతో లావాదేవీ ఆగింది. ” గుజరాత్‌ను ఆదర్శంగా చూపుతూ చైనా పెట్టుబడులను కోరిన మోడీ ” అనే శీర్షికతో 2011నవంబరు తొమ్మిదిన తన బీజింగ్‌ ప్రతినిధి పంపిన వార్తను హిందూ పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ససేమిరా చైనా పెట్టుబడులను అంగీకరించేది లేదంటున్నారు. పదేండ్లలో ఎంత మార్పు ! పెట్టుబడులు వద్దుగానీ మనకు చైనా కరెన్సీ యువాన్లు కావలసి వచ్చాయి.


రష్యా నుంచి దిగుమతులు చేసుకొని మన చమురు సంస్థలు ఎంతో లబ్ది పొందుతున్నాయి.పశ్చిమ దేశాల ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేము. ఈ లోగా రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే మన దేశ సంస్థలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మన దేశంలో సిమెంటు తయారీలో పెద్ద కంపెనీ ఆల్ట్రాటెక్‌. అది చైనా కరెన్సీ యువాన్లు చెల్లించి రష్యా నుంచి 1,57,000 టన్నుల బొగ్గు దిగుమతి చేసుకొంటోంది. ఇది మన కస్టమ్స్‌ పత్రాల్లో నమోదైన సమాచారమని రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ 29న తెలిపింది.ఈ లావాదేవీల విలువ 17,26,52,900 యువాన్లు లేదా 2.581 కోట్ల డాలర్లు. రష్యా – మన దేశం మధ్య రూపాయి-రూబుల్‌ లావాదేవీల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మన కరెన్సీ విలువ పడిపోతున్నందున అది ఏ మేరకు ఖరారు అవుతుందో చెప్పలేము. ఈ లోగా చైనా కరెన్సీతో చెల్లింపులు జరిపే అవకాశాన్ని మన కార్పొరేట్‌ సంస్థలు కనుగొన్నాయి.దీనితో వచ్చే సమస్యల గురించి, తదుపరి కూడా కొనసాగుతుందా లేదా అన్నది ఎవరూ చెప్పటం లేదు. మన దేశంలోని బాంకులు చైనా, హాంకాంగ్‌, సింగపూర్లలో ఉన్న బ్రాంచీల ద్వారా డాలర్లతో యువాన్‌లు కొనుగోలు చేసి రష్యాకు చెల్లిస్తారు. లేదా చైనా బాంకుల నుంచి మన బాంకులు యువాన్‌ల రుణాలు తీసుకుంటాయి. దీన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటి వరకు అడ్డుకున్నట్లు వార్తలు లేవు. వచ్చే రోజుల్లో ఈ లావాదేవీలు ఇంకా పెరుగుతాయా, మన ఆర్ధిక రంగం మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పటికైతే చెప్పగలిగింది లేదు.


చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు బారులు తీరాయంటే అక్కడ చౌకగా వస్తు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసేందుకు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఉన్న స్థానిక మార్కెట్లో అమ్ముకొనేందుకు అని గ్రహించాలి. ప్రపంచ కంపెనీలు 2020లో చైనా నుంచి 900 బిలియన్‌ డాలర్లు ఎగుమతులు చేయగా 1.4లక్షల కోట్ల డాలర్ల మేర స్థానికంగా విక్రయించారంటే దాని ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చని కియర్‌నీ గ్రేటర్‌ చైనా సంస్థ చైర్మన్‌ హి షియావోక్వింగ్‌ అన్నాడు. 2015 నాటికి చైనాలో విదేశీ పెట్టుబడులతో పని చేసే వివిధ కంపెనీల 8,36,595 ఉన్నట్లు, 2020 చివరి నాటికి అవి 10,40,480కి పెరిగినట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. అందువలన కొన్ని వేల కంపెనీలు చైనా నుంచి తరలి వెళ్లినా అదేమీ పెద్ద పరిణామం కాదు.