అచ్చేదిన్‌ నరేంద్రమోడీ కాపీ నినాదం ! ఎనిమిదేండ్ల ఏలుబడిలో ఆవిరైన సంతోషం !!

Tags

, ,


ఎం కోటేశ్వరరావు
సంతోషం అంటే ఏమిటి అంటే ప్రపంచంలో ఒక నిర్ణీత నిర్వచనం లేదా నిర్దిష్ట అర్ధం లేని పదాల్లో ఒకటి. చిత్రం ఏమిటంటే ప్రతివారూ సంతోషాన్ని కోరుకుంటారు. అదానీ రోజుకు రు.1002 కోట్లు సంపాదిస్తున్నదాన్ని రెట్టింపు చేసుకోవటం సంతోషాన్ని కలిగిస్తుంది. నిత్యం ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడే అభాగ్యులకు ఆరోజు పని దొరికి వచ్చిన సొమ్ముతో పెళ్లాంబిడ్డల కడుపునింపితే ఎనలేని సంతోషం. ఇహలోకంలో నీతులు, రీతులు చెబుతూ స్వర్గంలో అవేవీ లేకుండా మనతాత, ముత్తాతలు, తండ్రులకు సేవలందించిన రంభ ఊర్వశి, మేనకలతో సౌఖ్యం పొందాలని ఉవ్విళ్లూరే వారికి కలిగే సంతోషం గురించి చెప్పేదేముంది. ఒకరికి మోదం అనుకున్నది మరొకరికి ఖేదం కలిగిస్తుంది. ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్య, అంతకు ముందు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దేశాల మీద జరుగుతున్న పెత్తందారీ దేశాల దాడులు ఆగిపోతే అక్కడి జనాలకే కాదు, ప్రపంచవ్యాపితంగా సంతోషమే. కానీ జనాలు సంతోషంగా ఉంటే తాము తయారు చేస్తున్న మారణాయుధాలకు మార్కెట్‌ ఉండదని వాటిని తయారు చేస్తూ నిత్యం ఎక్కడో ఒక చోట తంపులు పెట్టే అమెరికా,బ్రిటన్‌ వంటి బడాదేశాల కార్పొరేట్‌లకు సంతోషం కరవు. రక్తం తాగే ఇలాంటి వారిని వదలివేస్తే మిగతా జనాలకు సంతోషమే సగము బలము అన్నది తిరుగులేని సత్యం. దాన్ని కొలిచే సాధనాలేవీ లేవు. సంతోషంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి వాంఛ.దాన్ని గనుక ప్రాధమిక రాజ్యాంగహక్కుగా చేసి ఉంటేనా !


ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించిన వాటిని ఏమేరకు అమలు చేస్తున్నారో కొలిచేందుకు రూపొందిస్తున్నదే ప్రపంచ సంతోష సూచిక. ప్రతి ఏటా ప్రచురించే దీని వివరాల మేరకు 2022 సూచికలో 146 దేశాలకు గాను మనం 136వ స్ధానంలో ఉన్నాము. గతేడాది కంటే 0.236 పాయింట్లు పెంచుకొని 139 నుంచి 136కు ఎగబాకాము. ఇది నిజంగా మోడీ భక్తులు పండగచేసుకొనే అంశమే. ఆగండి అప్పుడే రంగులు చల్లుకోవద్దు.2013లో 111వ స్ధానంలో ఉన్నది, 2015లో 117కు తరువాత 2020లో 144వ స్ధానానికి దిగజారింది. తిరిగి పూర్వపు స్ధానానికి ఎప్పుడు చేరుకుంటామో, జనాలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పి మరీ పండగ చేసుకోవాలి. నూటపదకొండులో ఉన్నపుడే మన్మోహన్‌ సింగ్‌ పాలనను జనం భరించలేకపోయారు. తరువాత దిగజారినా మోడీకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామని జనం భావించారు, భరిస్తున్నారు. గొర్రె కసాయిని నమ్ముతుందని ఎందుకు మన పెద్దలు అనుభవసారంగా చెప్పారో ఆలోచిద్దాం.


జనం ఆశించిన సంతోషానికి కారణమైన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ నినాదం అసలు కథ తెలుసా ? నరేంద్రమోడీ, బిజెపి 2014 ఎన్నికలకు ముందు ఓం శ్రీరామతో పాటు అచ్చేదిన్‌ అనే నినాదాన్ని కూడా తారకమంత్రంగా జపిÄంచారు. తరువాత ఎక్కడా మాట్లాడటం లేదు. నినాదాలను కాపీ కొట్టటంలో నరేంద్రమోడీ పెద్ద మాస్టర్‌. కొందరికిది ఆగ్రహం కల్పించినా నిజం నిజమే కదా ! కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా ఈ సంగతి చెప్పినట్లు 2016 సెప్టెంబరు 20 తేదీ టైమ్స్‌ఆఫ్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయ దినం సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారు. అంతకు ముందు తలెత్తిన ప్రపంచ మాంద్యం నుంచి భారత్‌ తప్పించుకున్నప్పటికీ తరువాత తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని ఎన్‌ఆర్‌ఐలకు భరోసా ఇచ్చారు. దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం తమ ప్రభుత్వ ప్రతిష్టకు ఎలా మచ్చతెచ్చిందో చెబుతూ ఆరు సంవత్సరాల తరువాత ద్రవ్యోల్బణం తొలిసారిగా తిరోగమనంలో ఉందంటూ అబ్‌ అచ్చేదిన్‌ ఆనేవాలే హై ( ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి) అన్నారు. వెంటనే నరేంద్రమోడీ ఆ మాటలను తనవిగా చేసుకొని మరుసటి రోజే దాడికి దిగారు. అదే సభలో జనవరి తొమ్మిదిన గుజరాత్‌ సిఎంగా మాట్లాడారు. ఆ సభలో ఉక్కు పరిశ్రమ దిగ్గజం ఎల్‌న్‌ మిట్టల్‌ కూడా ఉన్నారు. మిట్టల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు లండన్‌లో తినే టమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండించినవే అని అతిశయోక్తులను చెప్పారు. తరువాత 2014 ఎన్నికల ప్రచారంలో అచ్చేదిన్‌ నినాదాన్ని ముందుకు తెచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ రెండు సంవత్సరాలకు ముందు చెప్పిందాన్ని ప్రస్తావిస్తూ ” హా మైనే భీ కహతా హుం కి అబ్‌ జల్దీ హై అచ్చేదిన్‌ ఆనే వాలే హై ” ( అవును నేను కూడా చెబుతున్నా ఇప్పుడు త్వరగా మంచి రోజులు రానున్నాయి) అని చెప్పారు. ఇప్పుడు ఆ నినాదమే తమ గొంతుల్లో పచ్చివెలక్కాయ మాదిరి ఇరుక్కుపోయిందని గడ్కరీ అన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి రాశారు. మంచి రోజులు రావని తెలిసీ జనాలు చప్పట్లు కొడుతున్నారని ఇచ్చిన నినాదాన్ని అవసరం తీరింతరువాత పక్కన పెట్టేశారు. ఓట్ల కోసం కొత్త నినాదాలు, మనోభావాలను ముందుకు తెచ్చే కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు.


ఇక సంతోష సూచికల గురించి చూద్దాం. వరుసగా గత ఐదు సంవత్సరాల పాటు ఫిన్లండ్‌ సంతోష సూచికలో మొదటి స్ధానంలో వచ్చింది. మన దేశం చివరి పది స్దానాల్లో నిలిచింది. మనం ప్రతిదానికీ ఇరుగుపొరుగు దేశాలతో పోల్చుకుంటూ మన గొప్పలను చెప్పుకుంటున్నాము. సంతోష సూచికల్లో 2012 నుంచి(2014మినహా) 2022 వరకు తొమ్మిది సంవత్సరాల సగటు 128.8 కాగా కనిష్టం 111, గరిష్టం 144 ఉంది. ఇదే చైనా సగటు 85.6 కాగా కనిష్ట-గరిష్టాలు 2015-2022 ఎనిమిది సంవత్సరాలలో 79-94గా ఉన్నాయి. ఇక బ్రిక్స్‌, మన ఇరుగుపొరుగుదేశాల సంతోష సూచికలు ఇలా ఉన్నాయి.


దేశం××××××× 2022 సూచిక
బ్రెజిల్‌××××××× 34
రష్యా ××××××× 74
ఇండియా ××××× 136
చైనా ××××××× 82
ద.ఆఫ్రికా ××××× 101
నేపాల్‌ ××××××× 85
బంగ్లాదేశ్‌ ××××× 99
పాకిస్తాన్‌×××××× 103
మయన్మార్‌××××× 123
శ్రీలంక ××××××× 126
ఆఫ్‌ఘనిస్తాన్‌××××× 146
వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సంతోష సూచికల్లో ప్రతి ఏటా మార్పులు ఉంటాయి.తలసరి జిడిపి, ఆరోగ్య జీవితప్రమాణం, సామాజిక మద్దతు, జీవన విధాన ఎంపిక అవకాశం, ఉదారత, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచిక నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో కొత్త అంశాలను కూడా చేరుస్తారు. కొన్ని దేశాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అందువలన ప్రతి ఏడాదీ మార్కులు మారినా ఒక్కోసారి సూచికల్లో స్ధానం మారకపోవచ్చు. మన జనాల్లో ఉన్న ఒక అవాంఛనీయ వైఖరి ఏమంటే మన కంటే దిగువన ఉన్నవారిని ఎద్దేవా చేయటం, మనం మరికొందరి కంటే చాలా దిగువన ఉన్నామని మరచిపోవటం.


నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి ఎప్పటికప్పుడు కొత్త నినాదాలను ముందుకు తెచ్చి జనాన్ని ఆకర్షించటంలో, మభ్యపరచటంలో ఎంతో ముందుందనటం అతిశయోక్తి కాదు. చెప్పిన కథ చెప్పకుండా కొత్త కథలు చెబుతోంది. అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ది, నల్లధనం వెలికితీత, 2022 నాటికి నవభారతం, 2024నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి సాధన.2022 ఆగస్టు పదిహేను నాటికి లేదా ఏడాది ఆఖరుకు సాధిస్తామని చెప్పిన అంశాల గురించి చెప్పుకొని ఒక్కసారి సంతోషిద్దాం.
1.జిడిపి వృద్ది రేటు 9-10శాతంగా ఉంటుంది. పెట్టుబడుల రేటు 2022ా23 నాటికి 36శాతానికి పెంపుదల, పది నూతన కల్పనల జిల్లాల ఏర్పాటు.దాతలతో నైపుణ్యాల పెంపుదల, ఆరవ తరగతి నుంచి నైపుణ్య శిక్షణకు స్కూళ్లు. ప్రస్తుతం 5.4శాతంగా ఉన్న నైపుణ్య కార్మికులను కనీసం 15శాతానికి పెంచటం, మహిళాశ్రామిక శక్తి భాగస్వామ్యం 30శాతానికి పెంపు,ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇరవై నుంచి 30లక్షలు, పర్యాటక రంగంలో నాలుగు కోట్లు, ఉద్యోగాలు, గనుల రంగంలో 50లక్షల కొత్త ఉద్యోగాల కల్పన. 2. ప్రతి పౌరుడికి బాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్‌, ఉద్యోగానంతర ప్రణాళికల సేవలు అందచేత,3.రైతుల ఆదాయాలు రెట్టింపు, పొలాలన్నింటికీ జలాల సరఫరా, పొలాల్లో వదలివేసిన గడ్డిని తగులబెట్టకుండా చూడటం, దేశంలో గాలికాలుష్యాన్ని సగానికి తగ్గించటం, ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం. 4. ప్రతి కుటుంబానికి గాస్‌ సిలిండర్‌, రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చూడటం, ముంబై-అహమ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు పరుగులు(ఇప్పుడు దీనికి ఒక తుది గడువు అంటూ లేదు గానీ 2023డిసెంబరుకు పూర్తి అని చెబుతున్నారు). కేరళలొ బిజెపి వేగంగా పరుగెత్తే కె రైల్‌ పధకాన్ని మాత్రం వద్దంటుంది. 5. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, ఇళ్లలో మరుగుదొడ్లు, చేతులతో మలమూత్రాల ఎత్తివేత నివారణ, రోజంతా విద్యుత్‌ సరఫరా.6.2012-13లో ఉన్న 7.7శాతం పారిశ్రామిక ఉత్పాదకత రెట్టింపు.ప్రతిగ్రామానికి ఇంటర్నెట్‌, ప్రతివారూ దాన్ని ఉపయోగించేలా చర్యలు, ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పోషకాహారలేమి నివారణ. ప్రస్తుతం 21శాతంగా ఉన్న అడవులను 33శాతానికి పెంపు, పదవ తరగతి పూర్తి గాకుండా ఏ ఒక్క విద్యార్దీ మధ్యలో బడి మానకుండా చూడటం. ఉన్నత విద్యలో 25శాతంగా ఉన్న చేరికలను 35శాతానికి పెంచటం 7. ఏడువందల జిల్లా కేంద్ర ఆసుపత్రులు వైద్య కేంద్రాలుగా వృద్ది. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో ఆరోగ్యనిపుణులకు ప్రయివేటు పరిశ్రమలవారితో శిక్షణ, మెడికల్‌ టూరిస్టులను ఆకర్షించేందుకు ఇరవై స్వేచ్చా జోన్ల ఏర్పాటు., దేశంలో 11,082 మందికి ఒక అలోపతి వైద్యుడు ఉన్న స్ధితిని ప్రతి పద్నాలుగు వందల మందికి ఒకరుండేట్లు చూడటం.వెనుకబడిన ప్రాంతాల్లో వంద చోట్ల కొత్త విహార కేంద్రాల ఏర్పాటు. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి కోటీ 20లక్షలకు పెంచటం, స్వదేశీపర్యాటకుల సంఖ్యను 1,614 నుంచి 3,200 మిలియన్లకు పెంచటం.8. చమురు, గాస్‌ దిగుమతులను పదిశాతం తగ్గింపు(2022-2023).80 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధనాన్ని 175 గిగావాట్లకు పెంచటం. 9. 1.22లక్షల కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులను రెండులక్షల కిలోమీటర్లకు పెంచటం. దశాబ్దాల తరబడి 2017 నాటికి పూర్తిగాకుండా ఉన్న ప్రాజెక్టుల పూర్తి. ఇలాంటి కబుర్లతో గతంలో కాంగ్రెస్‌ కాలక్షేపం చేసింది. ఇపుడు బిజెపి బిజెపి చేస్తున్నది.


ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న దేశమని త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారి ఏలుబడిలో సంతోష సూచిక ఇలా తగులడుతోందేం అని ఎవరైనా ప్రశ్నించరా ? జిడిపి మొత్తం పెరగటం వేరు, జనాభా పెరుగుతున్నపుడు దానికి అనుగుణంగా తలసరి పెరగటం వేరు.2014లో జిడిపి తలసరి సగటు 1,574 డాలర్లు, 2020లో 1,901 డాలర్లు, ఇదే కాలంలో చైనాలో 7,679 నుంచి 10,500 డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో మొత్తం జిడిపిలో చైనా రెండవ స్దానంలో ఉన్నా తలసరిలో ప్రపంచ సగటు కంటే తక్కువే, ఇక మన దేశం గురించి చెప్పుకోవాల్సిందేముంది. సంతోష సూచిక లెక్కింపులోకి తీసుకొనే జిడిపి తలసరి సగటు సూచికలో గత నాలుగు సంవత్సరాలుగా మనది 102-103 స్దానాల్లో , ఆరోగ్యజీవిత సూచికలో 104-107, సామాజిక మద్దతులో 141-145 స్ధానాల్లో ఉన్నపుడు జనాల్లో ఆనందం ఎక్కడ ఉంటుంది. నేపాల్‌ పేదరికంలో కూడా తన స్ధానాన్ని 48 స్ధానాలు ఎగువకు గణనీయంగా మెరుగుపరుచుకోగా మన దేశం 28 స్ధానాలు కోల్పోయింది.

తోటకూరనాడే…. నరేంద్రమోడీ గట్టిగా చెప్పి ఉంటే ఇప్పుడిలా జరిగేదా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలి. విశ్వగురువుగా నరేంద్రమోడీ, ప్రపంచమంతా మోడీవైపే చూస్తోంది. అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు అది లేకున్నా నడుస్తుంది. చైనా నుంచి మనం దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మనతో కాళ్ల బేరానికి వస్తుంది. నరేంద్రమోడీ మాత్రమే ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపగలరు. ఇలాంటి కబుర్లన్నీ వాట్సాప్‌ విశ్వవిద్యాలయ పండితుల మొదలు వివిధ మాధ్యమాల ద్వారా మన చెవుల తుప్పు వదిలించారు, మెదళ్లను ఖరాబు చేశారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీటిని నిజమే అని నిజంగానే నమ్మిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఉక్రెయిన్‌ వివాదంలో మనలను ప్రతివారూ బెదిరించేవారే తప్ప ఇతరత్రా పట్టించుకొనే వారే లేరు. అనేక చిన్న దేశాలనేతలు గళం విప్పినా మన ప్రధానికి నోరు పెగలటం లేదు. చైనా నుంచి దిగుమతులను నిలివేస్తారా అనుకున్నవారికి రికార్డులను బద్దలు కొడుతూ కొనసాగించటం మింగుడుపడటం లేదు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన ఫిబ్రవరి 24కు ముందు మన నేతలు, అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. మన జేమ్స్‌బాండ్‌గా ప్రచారంలో ఉన్న అజిత్‌ దోవల్‌ ఉక్రెయిన్‌ పరిణామాలను పసిగట్టలేకపోయారు. తరువాత ఆపరేషన్‌ గంగ పేరుతో అక్కడ చిక్కుకు పోయిన మన విద్యార్ధులను వెనక్కు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలంటూ నష్ట నివారణ చర్యగా నరేంద్రమోడీ సమీక్షల గురించి మన మీడియా చేసిన హడావుడి కూడా ముగిసింది. కేంద్ర మంత్రులను పంపటం, ఇతరత్రా చేసిన ప్రయత్నాల కంటే అసలు నరేంద్రమోడీ గారే వెళ్లి కూర్చుని ఉంటే ఇంకా తొందరగా పూర్తయి ఉండేది, తలిదంద్రుల ఆవేదన పరిమితంగా ఉండేది. ముందే ఆనందం వెల్లివిరిసేది. ఎందుకంటే ఏదేశంలో ఏది ఎక్కడుందో, ఎక్కడకు ఎలా చేరాలో మోడీగారికి తెలిసినంతంగా ఎవరికీ తెలియదు. సీజన్‌ టికెట్‌ తీసుకున్నట్లుగా స్వల్పకాలంలో ఏ ప్రధాని కూడా చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు, అందుకే ప్రతిదేశం కొట్టినపిండి మరి. సరే అది జరగలేదు, ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముఖ్యగనుక ! ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు కదా !


ఎన్నికలు ముగిశాయి, మొత్తం మీద సామ,దాన,బేధ,దండోపాయాలను ప్రయోగించి అనుకున్నది సాధించారు.యుద్ధం, ప్రేమలో గెలిచేందుకు సాధారణ సూత్రాలు, నీతినియమాలు వర్తించవు అంటారు గనుక ఉత్తర ప్రదేశ్‌లోనూ అదే జరిగిందని అనుకుందాం. ఇప్పుడేమిటి ? ఆపరేషన్‌ గంగ సమయంలో ప్రధాని జరిపిన సమీక్షల గురించి వార్తలేని రోజు లేదు. ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆర్ధిక రంగంలో ఆందోళనకర పరిస్ధితి, చమురు ధరల పిడుగు ఎప్పుడు ఎలా పడుతుందో అని బిక్కుబిక్కు మంటున్న జనం గురించి కూడా రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా జనాన్ని ఎలా రక్షించాలి అన్న ఆతృత, కార్యాచరణ ఎక్కడా కనిపించటం లేదు. ఎందుకని ?


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు.అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. మార్చి 18వ తేదీన అమెరికా-చైనా అధిపతులు జో బైడెన్‌- షీ జింపింగ్‌ వీడియో కాన్ఫరెన్సుద్వారా చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య మీద మనమూ, చైనా భద్రతా మండలిలో తటస్ధవైఖరినే ప్రకటించాయి. అమెరికా మన సహజ భాగస్వామి, ఒకటే మాట, ఒకటే బాట లేదా ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్లుగా రోజురోజుకూ మరింత సన్నిహితం అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటపుడు అమెరికా నేత బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడకుండా షీ జింపింగ్‌తో చర్చించటం ఏమిటి ? విశ్వగురువుగా విశ్వరూపం ప్రదర్శించే అవకాశాన్ని మోడీ చేజేతులా పోగొట్టుకున్నారా ? లేక మనకు అంతసీన్‌ లేదా ? మన బలం గురించి అతిగా అంచనా వేసుకున్నామా ? ఇవన్నీ కాస్త ఆలోచించేవారిలో ఎవరికైనా తలెత్తే ప్రశ్నలు. కాదంటారా ?


ఉక్రెయిన్‌ వివాదంలో జో బైడెన్‌కు చైనా నేత జింపింగ్‌ స్పష్టం చేసిందేమిటి ? మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. వివాద పరిష్కారానికి అమెరికా, నాటో కూటమి రష్యాతో చర్చలు జరపాలి. రష్యా సైనిక చర్యపేరుతో దానిపై విచక్షణా రహితంగా ఆంక్షలను ప్రకటించటాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. ఈవివాదాన్ని మేం కోరుకోవటం లేదు.యుద్ద రంగలో చేతులు కలుపుకోవటాన్ని చూడకూడదనుకున్నాం. వివాదం, ఘర్షణ ఎవరికీ ప్రయోజనకరం కాదు అని కుండబద్దలు కొట్టారు.మరి మన దేశం అలాంటి స్పష్టమైన వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు అన్నది ప్రశ్న. మన, చైనా తటస్ధ వైఖరుల్లో ఉన్న తేదా ఇదే. ఆంక్షలను వ్యతిరేకించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా మీద, అదే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న మన మీద అమెరికా వైఖరిలో కూడా తేడా ఉంది. చైనా మీద ప్రతీకార చర్యలుంటాయని బహిరంగంగానే అమెరికా బెదిరించింది.దానిపై దాడికి అనేక దేశాలను సమీకరిస్తున్న అమెరికాకు మన అవసరం గనుక రష్యానుంచి చమురు కొనుగోలు చేసినా, ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేసినా మింగా కక్కలేకుండా ఉంది. తెరవెనుక బెదిరింపులకు దిగుతోంది.


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. తన పట్టునుంచి ఎటూ కదలకుండా మన దేశాన్ని ఒక్కొక్కటిగా బిగిస్తున్నది. అమెరికాతో బంధం కారణంగా అనేక దేశాలకు మనం దూరమయ్యాం. అందువలన తనకు తాన తందాన అనకుండా ఎలా ఉంటుందనే భరోసాతో ఉంది. చైనాకు వ్యతిరేకంగా చతుష్టయ(క్వాడ్‌) కూటమిలోకి మనలను లాగి రెండు దేశాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పర అనుమానాలు తలెత్తేట్లు అమెరికా చేసింది. మన సరిహద్దుల్లో కదలికలను కూడా అది ఇచ్చిన సమాచారం మీద ఆధారపడేట్లు చేసుకుంది. ఇంత చేస్తే మమ్మల్ని అనుసరించరా అంటూ బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. చమురు కొనుగోలు గురించి బైడెన్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ చెప్పిందేమిటి? చమురు కొనుగోలు మా ఆంక్షలను ఉల్లంఘించినట్లు భావించటం లేదు గానీ వర్తమాన పరిణామాల గురించి చరిత్రను లిఖించినపుడు మీరెక్కడ ఉంటారో కూడా ఆలోచించుకోవాలి.రష్యన్‌ నాయకత్వానికి మద్దతు ఇవ్వటం అంటే( చమురు, ఇతర కొనుగోళ్ల ద్వారా అని అర్ధం) దురాక్రమణకు మద్దతు ఇచ్చినట్లే, అది సహజంగానే వినాశకర ప్రభావాన్ని కలిగిస్తుందని సాకీ హెచ్చరించారు.

ఒక స్వతంత్ర, సర్వసత్తాక దేశానికి ఇటువంటి బెదిరింపులు వచ్చినపుడు కూడా మోడీ నోరు విప్పకపోతే ఏమనాలి. దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని మోడీ చేతుల్లో పెట్టిన జనానికి విశ్వాసం ఎలా ఉంటుంది.యుద్దం చేయమని అడగటం లేదుగా ఇలాంటి బెదిరింపులు తగవని మోడీగాక పోతే ఎవరు చెప్పాలి ? ఇలాంటి బలహీనత లేదా పిరికిబారిన వారు విశ్వగురువులు, ప్రపంచ నేతలు ఎలా అవుతారు ? ఇక బుజ్జగింపుల గురించి చెప్పాల్సి వస్తే మార్చి 19వ తేదీన ఢిల్లీ పర్యటనను జపాన్‌ ప్రధాని కిషిదా 15వ తేదీన ఖరారు చేసుకొని రావటం వెనుక అమెరికా హస్తం లేదా ? ఇరు దేశాల వార్షిక సమావేశాలు ఉన్నప్పటికీ వాటికి కిషిదా వస్తాడని ముందుగా ఎలాంటి ప్రకటనలు లేవు. సహజంగా ఇలాంటి రాకపోకలు ఎంతో ముందుగానే ఖరారవుతాయి. మన దేశంలో 42బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామంటూ మనకు కిషిదా ఒక బిస్కెట్‌ వేశాడు.


ఐరాసలో తటస్ధంగా ఉన్న మన దేశం దానికి కట్టుబడి ఉందా అంటే లేదు. ప్రపంచ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా మన దేశం నుంచి ఎన్నికైన జడ్జి దల్వీర్‌ బండారి అమెరికా కూటమి దేశాల వారితో కలసి ఓటు వేశారు. ఇది అమెరికాను సంతుష్టీకరించేదిగా లేదా ? 2017లో రెండవ సారి దల్వీర్‌ ఎన్నిక నరేంద్రమోడీ సర్కార్‌ దౌత్యవిజయానికి ప్రతీక అని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఇదేమిటి అంటే దల్వీర్‌ వ్యక్తిగత హౌదాలో తన వాంఛను బట్టి ఓటు వేశారని విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణ రష్యాను సంతృప్తి పరుస్తుందా ? దేశ విధానాన్ని బట్టి నడుచుకోవాలా వ్యక్తిగత ఇష్టాఅయిష్టాల ప్రకారమా ? దీని ద్వారా మన దేశం ఏమి సందేశం పంపినట్లు ?
తైవాన్‌ సమస్య మీద కూడా జింపింగ్‌ అమెరికాకు గట్టి హెచ్చరిక చేశాడు. తైవాన్‌ అంశం మీద నిప్పుతో చెలగాటాన్ని కొనసాగించినా, చైనా ముఖ్య ప్రయోజనాలను ఉల్లంఘించినా రెండు దేశాల మధ్య స్నేహ లేదా సానుకూల మాటలు ఉండవని కూడా స్పష్టం చేశాడు.

మనకు అమెరికాతో అలాంటి పరిస్ధితి లేదు కనుక రష్యా అంశంలో మా ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని తెగేదాకా లాగవద్దని ఎందుకు చెప్పకూడదు ? బైడెన్‌-జింపింగ్‌ భేటీ తరువాత కొందరు మీడియా వ్యాఖ్యాతలు అమెరికా దిక్కుతోచని స్ధితిలో ఉందని రాశారు.” పుతిన్‌ వ్యవహారంలో చైనా సాయం కొరకు చూస్తున్న బైడెన్‌ ” అన్న శీర్షికతో బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. రష్యా చేసినదానికి అమెరికా, దాని ఐరోపా మిత్రులు పెను ముప్పును ఎదుర్కోవలసి రావచ్చని దానిలో పేర్కొన్నారు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వేర్పాటును అమెరికా కోరుతున్న సంగతి పదే పదే చెప్పనవసరం లేదు. అలాంటిది షీ జింపింగ్‌తో భేటీలో బైడెన్‌ చెప్పిందేమిటి? ” చైనాలోని వ్యవస్ధను మార్చేందుకు లేదా చైనాకు వ్యతిరేకంగా కూటమికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు,చైనాతో కొత్త ప్రచ్చన్న యుద్దాన్ని కోరుకోవటం లేదు. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని సమర్ధించటం లేదు, చైనాతో ఘర్షణను కోరుకోవటం లేదు” అని బైడెన్‌ చెప్పిన అంశాన్ని షీ జింపింగ్‌ ముఖ్యఅంశంగా పరిగణించినట్లు చెప్పారు. ప్రాణ,విత్త,మాన భంగములందు ఆడితప్ప వచ్చని పెద్దలు సెలవిచ్చారు కదా ! అందుకే అమెరికా దానికి కట్టుబడి ఉంటుందా అన్నది ప్రశ్న.


ఉక్రెయిన్‌ వివాద నేపధ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటాన్ని సమర్ధించేందుకు మన అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపాం తప్ప రాజకీయనాయకత్వం ఎందుకు నోరు మెదపటం లేదు. పాకిస్తాన్‌, చైనాల విషయంలో అలా లేరే, సూటిగా కాకున్నా బహిరంగంగా, పరోక్షంగా నైనా హెచ్చరికలు చేశారు కదా ? అమెరికా, నాటో కూటమి పట్ల అంత అణకువ ఎందుకు ? అమ్మా నీకు తోటకూరను దొంగతనంగా తెచ్చి ఇచ్చినపుడే తప్పని చెప్పి ఉంటే ఇప్పుడు నాకీ దుస్ధితి తప్పేది కదా అని జైలు పాలైన కొడుకు అన్న కథ తెలిసిందే. ఇక్కడ దొంగతనం కాదు గానీ అమెరికా, పశ్చిమదేశాల వత్తిడికి గతంలో లొంగిపోకుండా గట్టిగా ఉండి ఉంటే ఇప్పుడు చివరికి జో బైడెన్‌ మీడియా అధికారికి అంత సాహసం ఉండేదా ?


గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలులో తగ్గేదేలే అని ఆ నాడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? ఇరాన్‌ ఎవరి మీదా దాడులకు దిగలేదే ! మన మాదిరే తన రక్షణ కోసం అణుకార్యమం చేపట్టింది తప్ప మరొకటి కాదు. ఆంక్షలతో నిమిత్తం లేకుండానే ఎంతో కాలంగా మనతో ఉన్న సంబంధాల కారణంగా మన రూపాయలు తీసుకొనేందుకు, చెల్లింపు గడువు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు కల్పించినా మన సర్కార్‌ ఇరాన్నుంచి చమురు కొనుగోలును ఎందుకు నిలిపివేసింది ? మనసుంటే మార్గం దొరికేది కాదా ? ఇదే మాదిరి వెనెజులా నుంచి కూడా నిలిపివేశాము. గతంలో ఎన్నడూ లేనిది అమెరికా నుంచి కొనుగోళ్లకు మరలాం. ఒకసారి మనబలహీనత తెలిసింతరువాత ప్రతివారూ బెదిరిస్తారు. తమ వ్యూహాత్మక ఉద్ధేశ్యాల మీద తప్పుడు అంచనాలకు వచ్చారని షీ జింపింగ్‌ చెప్పినట్లుగా రష్యాతో తమ సంబంధాలను తక్కువ అంచనా వేశారని అమెరికన్లకు మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు ? అమెరికాను నమ్ముకుంటే ఐరోపాలో ఉక్రెయిన్‌కు ఏమైందో చూస్తున్నాము. తన లబ్దికోసం ఎవరినైనా బలిపెట్టేందుకు అది సిద్దం.ఇప్పటికైనా మించి పోయింది లేదు, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటం అవసరం.దీనిలో రాజకీయాలు కాదు,దేశ గౌరవ, ప్రతిష్ట, ప్రయోజనాలు ముఖ్యం. ఎవరు అంగీకరించినా లేకున్నా, విమర్శించినా అభిమానించినా ప్రధానిగా నరేంద్రమోడీ వాటికోసం తగిన విధంగా వ్యవహరించకపోతే చరిత్రలో విమర్శలకు గురవుతారు.

తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ – ఒప్పందానికి చేరువలో చర్చలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


రష్యా -ఉక్రెయిన్‌ పోరుకు స్వస్తి పలికేలా ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు బుధవారం నాడు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దీని మేరకు నాటోలో చేరాలనే ఆకాంక్షలకు స్వస్తి పలికినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించాలి.దాని సాయుధ దళాలను పరిమితం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే రష్యా సైనిక చర్యనిలిపివేస్తుంది. దీనికి ముందు ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండాలని ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలకు అనుగుణంగానే ఈ పరిణామం ఉంది.అయితే సంభావ్యమైన ( సంభవించగల) ఒప్పందాల వివరాలను వెల్లడించటం తొందరపాటవుతుందని రష్యా ప్రతినిధి దిమిత్రి సెకోవ్‌ చెప్పాడు. మరోవైపున దాడులను నిలిపివేయాలని బుధవారం నాడు అంతర్జాతీయ న్యాయ స్ధానం రష్యాను కోరింది. ఇదిలా ఉండగా రష్యాకు లొంగిపోతున్నట్లు జెలెనెస్కీ ఒక ప్రకటన చేసినట్లు ఉక్రెయిన్‌ 24 అనే టీవీ ఛానల్‌ ప్రసారం చేసింది. వెంటనే జెలెనెస్కీ ఒక ప్రకటన చేస్తూ తానలాంటి ప్రకటన చేయ లేదని ఖండించాడు. తమ నెట్‌వర్క్‌ను హాక్‌ చేసి తప్పుడు వార్తను చొప్పించారని తరువాత ఆ ఛానల్‌ వివరణ ఇచ్చింది. రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపధ్యంలో అనేక కుహనా వార్తలు వస్తున్నాయి.


చర్చలు చర్చలే – దాడులు దాడులే – రెండునోళ్లతో మాట్లాడుతున్న జెలెనెస్కీ. రష్యా ప్రతిపాదనలు వాస్తవికంగా ఉన్నాయంటాడు ఒకనోటితో. మరోవైపు తమ తరఫున యుద్దం చేయాలని పశ్చిమ దేశాలకు వినతుల మీద వినతులు. ఎవరి ఎత్తుగడలు వారివే, 30లక్షల మంది నిర్వాసితులుగా మారినా, ఇంకా ఎందరు ఉక్రెయిన్‌ వదలిపోయినా దుష్ట రాజకీయాల నుంచి వెనక్కు తగ్గేదేలే అంటున్నారు పశ్చిమ దేశాల మానవతామూర్తులు.అగ్గిని మరింతగా ఎగదోసేందుకు పూనుకున్నారు. ప్రపంచ ఆర్ధిక రంగం అతలాకుతలం అవుతుందని ఐఎంఎఫ్‌ ఆందోళన. ఇదీ మార్చి 16 నాటికి ఉన్న పరిస్ధితి. వివాదం ఎప్పుడు సమసిపోతుందో తెలియదు. రక్తపోటు అదుపులోకి రాకపోతే పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రపంచ చమురు మార్కెట్‌లో ధరలు ఎందుకు ఒక రోజు విపరీతంగా పైకి ఎగబాకుతున్నాయో,ఎందుకు మరోరోజు పడిపోతున్నాయో తెలీటం లేదు.మన వంటి చమురు దిగుమతి దేశాలకు నిదురపట్టటం లేదు.నవంబరు నాలుగు నుంచి స్ధంభింపచేసిన చమురు ధరల కళ్లెం విప్పితే ఏమౌతుందో లేకపోతే ఎంత బండపడుతుందో అన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండేట్లు ఒప్పందం కుదరవచ్చని వార్తలు, పశ్చిమదేశాలు దాన్ని పడనిస్తాయా అన్న సందేహాలు సరేసరి !


ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల తీరు రాజీకుదిరేందుకు కొంత ఆశాభావాన్ని కలిగించాయని రష్యా విదేశాంగ మంత్రి లావరోవ్‌ చెప్పాడు.ఆస్ట్రియా, స్వీడన్‌ మాదిరి తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ ఉండవచ్చని, మిలిటరీని కూడా కలిగి ఉండవచ్చని రష్యా ప్రతిపాదించింది. అదే జరిగితే ఆ ప్రాంత దేశాలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. రష్యా ప్రతిపాదించినట్లుగాక తమకు అంతర్జాతీశక్తుల హామీ కావాలని ఉక్రెయిన్‌ చెప్పింది. తాము నేరుగా రష్యాతో పోరులో ఉన్నాం గనుక తమ పద్దతిలోనే పరిష్కారం ఉండాలని అంటోంది. బాధ్యత కలిగిన దేశాలతో కూడిన కొత్త కూటమి శాంతికోసం పని చేయాలని జెలెనెస్కీ బుధవారం నాడు అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో కోరాడు. ఐరోపా దేశాలు చాలా కాలంగా రష్యా ముప్పు గురించి పట్టించుకోలేదన్నాడు. మరిన్ని ఆంక్షలను విధించాలని కోరాడు. మేమూ మీలాంటి వారిమే, మా ప్రాణాలను రక్షించాలని కోరటం చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో పెరల్‌ హార్బర్‌ మీద దాడి, 2011లో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడిని ఉటంకిస్తూ తాము మూడువారాలుగా అలాంటి దాడులను అనుభవిస్తున్నాం అన్నాడు. అంతకు ముందు రోజు కెనడా పార్లమెంటునుద్దేశించి కూడా జెలెనెస్కీ మాట్లాడాడు.


పోలాండ్‌, చెక్‌, స్లోవేనియా దేశాల ప్రధానులు కీవ్‌ను సందర్శించి జెలెనెస్కీతో చర్చలు జరిపి మద్దతు ప్రకటించి వెళ్లారు. ఇలాగే ఇతర దేశాల నేతలు కూడా వచ్చి రష్యా మీద వత్తిడి తేవాలని జెలెనెస్కీ కోరాడు. ప్రస్తుత దశలో తమ అధ్యక్షుడు మక్రాన్‌ కీవ్‌ పర్యటన జరిపే ఆలోచనేదీ లేదని ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించాడు.ప్రచారదాడిలో భాగంగా తూర్పు ఐరోపాలో మిలిటరీ సన్నద్దంగా ఉండాలని నాటో కమాండర్లను కోరినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ తరువాత ఇతర దేశాల మీద కూడా రష్యా దాడులు జరపనుందని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగిన సన్నద్దత గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇబ్బంది కనుక ఇలాంటి ప్రచార విన్యాసాలు జరుపుతున్నట్లు చెప్పవచ్చు.


రష్యా గనుక అడ్డం తిరిగి విదేశాల నుంచి తీసుకున్న అప్పులను మేము ఇచ్చేది లేదని ప్రకటిస్తే ఏమిటన్న బెంగ ఇప్పుడు రుణాలు ఇచ్చిన వారికి పట్టుకుంది. బుధవారం నాటికి వడ్డీ కింద 11.7కోట్ల డాలర్లను చెల్లించాల్సి ఉంది. తమపై విధించిన ఆంక్షల కారణంగా డాలర్లలో కాకుండా తమ కరెన్సీ రూబుళ్లలో చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని పుతిన్‌ ప్రకటించాడు. ప్రభుత్వమే అప్పులను చెల్లించేది లేదని ప్రకటిస్తే అక్కడి కంపెనీలు కూడా అదే బాటపడతాయనే భయం పట్టుకుంది. ప్రస్తుతం పుతిన్‌ సర్కార్‌ జారీ చేసిన బాండ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు గానీ మన కరెన్సీలో చెప్పాలంటే రూపాయికి ఇరవై పైసలు కూడా అప్పులిచ్చిన వారికి వచ్చే అవకాశాలు లేవు. అందువలన ఆంక్షలు ఎత్తివేసి తమను ఆదుకోవాలని రుణాలిచ్చిన వారు పశ్చిమదేశాల మీద వత్తిడి తేవచ్చు. గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం రష్యా అంతర్గత రుణాలు జిడిపిలో కేవలం 13శాతమే ఉన్నాయి. విదేశీరుణం 150 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో ప్రభుత్వం తీసుకున్నది కేవలం 45 బి.డాలర్లే, మిగతాదంతా కంపెనీలు తీసుకున్నది. రష్యా వద్ద 630బి.డాలర్ల నిల్వలున్నాయి.కనుక చెల్లింపులకు ఇబ్బంది లేదు. ఆంక్షలే అడ్డుపడుతున్నాయి.


రష్యాకు వర్తింప చేస్తున్న అత్యంత సానుకూల హౌదా రాయితీని ఎత్తివేస్తున్నట్లు జపాన్‌ ప్రకటించింది.మరోవైపు మరిన్ని ఆంక్షలను అమలు జరిపేందుకు జి7 దేశాలు సమావేశం కానున్నాయని వార్తలు వచ్చాయి. తాము నాటోలో చేరటం లేదనే అంశాన్ని గుర్తించండి మహా ప్రభో అని జెలెనెస్కీ నాటోదేశాలకు స్పష్టంచేశాడు. బ్రిటన్‌ ప్రతినిధి వర్గంతో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ నాటో సభ్యురాలు కాదు. దానికోసం ద్వారాలు తెరిచి ఉన్నట్లు చాలా సంవత్సరాలుగా మేం వింటున్నాం, ఇదే సమయంలో మేం చేరకూడదని కూడా విన్నాం. ఇది ఒక వాస్తవం దీన్ని గుర్తించాల్సి ఉంది. మా జనం దీన్ని అర్ధం చేసుకోవటం ప్రారంభించారు, స్వశక్తితో నిలబడాలనుకుంటున్నారు, అలాగే మాకు సాయం చేస్తున్నవారు కూడా గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అన్నాడు.నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని, తమ భద్రతకు తలపెడుతున్న ముప్పును కూడా గమనించాలని రష్యా ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న అంశాన్ని పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిణామాలన్నది తెలిసిందే.


ఉక్రెయిన్‌పై రష్యాదాడి కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలో మౌలిక మార్పులు వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) పేర్కొన్నది. పౌరుల ఇబ్బందులు, నిర్వాసితులు కావటంతో పాటు ఆహార, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, జనాల కొనుగోలుశక్తి పడిపోతుందని, ప్రపంచ వాణిజ్య, సరఫరా వ్యవస్ధలు దెబ్బతింటాయని కూడా చెప్పింది. మదుపుదార్లలో అనిశ్చిత పరిస్ధితి ఏర్పడటంతో పాటు ఆస్తుల విలువలు పడిపోతాయని, వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని కూడా చెప్పింది. ఉక్రెయిన్‌ గగనతలంపై ఆంక్షలు విధించకుండానే నాటో కూటమి వేరే విధంగా ఆయుధాలతో ఎంతో తోడ్పడవచ్చని నాటోలో అమెరికా మాజీ రాయబారి కర్ట్‌వాల్కర్‌ చెప్పాడు. నల్లసముద్రం మీద నుంచి రష్యా వదులుతున్న క్షిపణులను, టాంకులను కూల్చివేసేందుకు అవసరమైన సాయం అందించవచ్చన్నాడు.


యుద్దం ముగిసే సూచనలు కనిపించకపోవటంతో ఐరోపా దేశాల్లో అనేక చోట్ల జనం ఆహార పదార్దాలను పెద్ద ఎత్తున కొనుగోలు నిల్వచేసుకుంటున్నారు. స్లీపింగ్‌ బాగ్స్‌, పాలపొడి, డబ్బాల్లో నిల్వ ఉండే ఆహారం, బాటరీలు, టార్చిలైట్లు, ప్లాస్టిక్‌ డబ్బాల వంటివి ఒక్కసారిగా ఆరురెట్లమేరకు అమ్మకాలు పెరిగాయి. రేడియోల అమ్మకాలు కూడా ఇరవైశాతం పెరిగాయి. వీటిలో నిర్వాసితులుగా వచ్చిన వారు కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయి. రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు 26 బిలియన్‌ యురోలు అవసరమౌతాయని ఫ్రెంచి ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. రష్యా, బెలారస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న పొటాష్‌ ఎరువులకు మన దేశంలో కొరత ఏర్పడే అవకాశం ఉందని వార్తలు. రష్యా నుంచి గోధుమల ఎగుమతులకు ఆటంకం ఏర్పడటంతో మన దేశ గోధుమల ఎగుమతికి అవకాశాలున్నట్లు రాయిటర్‌ పేర్కొన్నది.

.

ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి బుకాయింపులు – అసలు రంగు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎంతో ఆసక్తి కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తమకు ఇంక 2024లో కూడా తిరుగులేదని బిజెపి ఢంకా బజాయిస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఆత్మశోధనలో పడ్డాయి. ఎవరి సూత్రీకరణలు వారు చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరలేదు. పలు కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ సహజం.వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్పిన వాటికి ప్రతిదానికీ తలూపాల్సిన అవసరంలేదు. జనం ఇచ్చిన తీర్పును గౌరవించటం వేరు. చరిత్రలో ఇచ్చిన తీర్పులన్నీ సరైనవే అని ఆమోదించాల్సిన అవసరం లేదు. హిట్లర్‌ వంటి నియంతలకు కూడా జనమే ఓట్లు వేసి గెలిపించారు. అంతమాత్రాన వారి తీర్పు సరైనదే అంటామా ? ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.


యోగి ఆదిత్యనాధ్‌ అభివృద్దిని చూసి తిరిగి గెలిపించి చరిత్ర సృష్టించారు. ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా రెండవసారి పార్టీ అధికారానికి రాని చరిత్రను బిజెపి తిరగరాసింది.రెండవది నిజమే. ఇక మొదటి అంశం, అభివృద్ధి అంటే ఏమిటి ? అందునా యోగి చిన్న ఇంజనైతే పెద్ద ఇంజను నరేంద్రమోడీ కూడా తోడయ్యారు అన్నారు. జరిగిందేమిటి ? 2016-21 కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5 నుంచి 32.79(2021 సెప్టెంబరు-డిసెంబరు)శాతానికి పడిపోయింది.కార్మికశక్తి భాగస్వామ్యం కూడా ఇదే కాలంలో 46.32 నుంచి 34.45 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్రంలో బీహార్‌, ఝార్ఖండ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌ మూడవ స్ధానంలో ఉంది. అందుకే బిజెపి చెప్పే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. అయినా జనం ఎందుకు ఓట్లు వేశారనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మరొక ప్రత్నామ్నాయం లేక జనం పదే పదే ఓట్లు వేశారు, దానినేమందాం ?ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజవాది మీద తగినంత విశ్వాసం లేకపోవటం ఒకటిగా కనిపిస్తోంది. రెండవది బిజెపి బి టీమ్‌లుగా పేరు తెచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌ పార్టీలు చీల్చిన ఓట్లు బిజెపికి తోడ్పడ్డాయి. పోటీ 80-20శాతాల(హిందూ-ముస్లిం) మధ్య అనే బిజెపి మత సమీకరణల నినాదం కూడా పని చేసింది.


2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 49.98, దాని మిత్రపక్షానికి 1.21శాతం కలుపుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఇంజన్లకు కలిపి వచ్చిన ఓట్లు 51.19 శాతం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు 43.82శాతమే, మోడీ మంత్రం పని చేయనట్లేనా ? 2019లో సమాజవాది పార్టీ-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా పోటీ చేస్తే 39.23శాతం వచ్చాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజవాదీ కూటమికి 36.32శాతం వచ్చాయి. విడిగా పోటీచేసిన బిఎస్‌పి 12.88శాతం తెచ్చుకుంది.దీని అర్ధం ఏమిటి గతంలో బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో కొన్ని సమాజవాది కూటమికి రాబట్టే ఓట్లశాతం పెరిగింది. బిజెపి సర్కార్‌ మీద ఉన్న వ్యతిరేకతే తమను గద్దె నెక్కిస్తుందని సమాజవాది అతి అంచనా వేసుకొని చేయాల్సిన కృషి లేకపోవటం ఓటమికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు చేసిన వాటిలో ఒకటైన ఏబిపి-సి ఓటర్‌ సంస్ధ 2021 మార్చి నెల నుంచి 2022 జనవరి వరకు చేసిన ఆరు సర్వేల్లో బిజెపి కూటమి సగటు ఓట్ల శాతం 41.11శాతం కాగా చివరి సర్వేలో 41.5శాతంగా పేర్కొన్నది. ఇదే సంస్ద సమాజవాది కూటమి సగటు ఓట్లశాతాన్ని 30.8గానూ, తొలి సర్వేలో 24.4శాతంగానూ చివరి సర్వేలో 33.3శాతంగా పేర్కొన్నది.


యోగి సర్కార్‌ గూండాయిజాన్ని, నేరగాండ్లను బుల్‌డోజర్లతో అణచివేసింది, రెండవ సారి గద్దె నెక్కితే మిగతావారిని కూడా తొక్కివేస్తుంది. మంచిదే. వాస్తవ అలా ఉందా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌ను గతంలో బిజెపి, బిఎస్‌పి, ఎస్‌పి పార్టీలు ఏలాయి, గూండాయిజం, మాఫియా ముఠాల పెరుగుదలకు ఎవరివంతు తోడ్పాటు వారు ఇచ్చారన్నది తిరుగులేని నిజం.ఇక 2022 ఎన్నికల్లో గెలిచిన నేరచరిత గలిగిన వారి మీద బుల్డోజర్లను ఎలా నడిపిస్తారో తరువాత చూద్దాం.


2022లో అసెంబ్లీకి ఎన్నికైన 403 మందిలో 205 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత అసెంబ్లీలో అలాంటి వారు 143 మంది మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామిక సంస్కరణల సంస్ధ(ఏడిఆర్‌) వెల్లడించిన నివేదిక ప్రకారం తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళల మీద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 158 మంది, వీరిలో ఒకరి మీద అత్యాచారయత్నం కేసు కూడా ఉంది. గతంలో ఇలాంటి ఘనులు 117 మాత్రమే. పార్టీల వారీగా చూస్తే తమ పార్టీ ప్రత్యేకం అని చెప్పుకొనే బిజెపి అగ్రస్దానంలో అంటే 255కు గాను 111 మందిని కలిగి ఉంది. సమాజవాది పార్టీలో 111 మందికిగాను 71 మంది ఉన్నారు. ఐదేండ్ల తరువాత అభివృద్ధిని చూపి ఓట్లడిగామని చెప్పుకొనే వారు మరింత మంది నేర చరితులను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? ఎన్నికైన ఎంఎల్‌ఏల్లో గతంలో 322 మంది కోటీశ్వరులుంటే ఇప్పుడు వారి వృద్ది 366కు పెరిగింది. బిజెపి తరఫున గెలిచిన 255 మంది సగటు 8.14 కోట్లు, అదే సమాజవాది సగటు రు.7.39 కోట్లు ? ఎవరిది డబ్బు, కండబలం ఉన్న పార్టీ ? గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ వారి ఆస్తి రు.19.71 కోట్లు.


ఉత్తర ప్రదేశ్‌ చట్టసభలో మెజారిటీ 205 మంది నేర చరితులు ఉన్న తరువాత వారి అనుచరులు, అభిమానులు వేరే దారిలో నడుస్తారా ? చట్టాలను అమలు జరిపే యంత్రాంగాన్ని సక్రమంగా నడవనిస్తారా ? చరిత్రలో ఎక్కడా అలాంటి ఉదంతాలు లేవు. హత్రాస్‌ దుర్మార్గం జరిగింది, లఖింపూర్‌ ఖేరీ దారుణం తెలిసిందే. ఇప్పుడు బిజెపి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవసలు జరగలేదు, ప్రతిపక్షాల కుట్ర లేదా ప్రచారమని చెబుతారా ? చెప్పండి ! మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు చెబుతున్నారు.నిజం కూడా కావచ్చు, దీని అర్ధం ఉత్తర ప్రదేశ్‌ మహిళలకు స్వర్గంగా ఉన్నట్లా ? 2015-19(రెండు సంవత్సరాలు అఖిలేష్‌, రెండు సంవత్సరాలు యోగి ఏలుబడి) సంవత్సరాలలో అక్కడ మహిళలపై నేరాలు 66.7శాతం పెరిగాయి. దేశ సగటు 23శాతం మాత్రమే.2019లో దేశంలో నమోదైన కేసుల్లో 15శాతం యోగి ఖాతాలో పడ్డాయి. సామూహిక మానభంగాలలో 2019లో రాజస్తాన్‌ 902 కేసులతో ముందుంటే ఉత్తర ప్రదేశ్‌ 301, మధ్యప్రదేశ్‌ 162తో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఉన్నత విలువలు నేర్పుతామని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్ధలకు ఈ మూడు రాష్ట్రాల్లో ఎంతో పట్టు ఉందన్నది తెలిసిందే. వారు తెచ్చిన సామాజిక మార్పు ఏమిటి ?


పైన చెప్పుకున్న నాలుగు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దారుణాల కేసుల్లోనూ ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉంది. తరువాత స్ధానాల్లో సంఘపరివారం బలంగా ఉన్న రాజస్తాన్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 2015లో 8,357 నమోదు కాగా 2019లో 11,829కి చేరాయి.2018 – 2020 (పూర్తిగా యోగి స్వర్ణయుగంలో) మూడు సంవత్సరాల్లో 36,467 కేసులు నమోదయ్యాయి, అంటే సగటున ఏడాదికి 12,155, వేద గణితం ప్రకారం లెక్కలు వేసినా యోగి ఏలుబడిలో తగ్గినట్లు ఎవరైనా చెప్పగలరా ? 2019లో దేశంలో పదిహేను శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఉంటే అవి 2020నాటికి 26శాతానికి పెరిగాయి.
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అంటే అందరినీ కలుపుకుపోతాం, అందరి వృద్ధి, అందరి విశ్వాసం అన్నది బిజెపి నినాదం. బిజెపికి మింగుడుపడినా పడకున్నా ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 20శాతం ముస్లింలు ఉన్నారు. ఆ సామాజిక తరగతికి చెందిన వారికి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వలేదు. అంటే బిజెపి ఇచ్చే నినాదం మోసపూరితం కాదా ?మత ప్రాతిపదికన ఓటర్లను సమీకరించేందుకు వేసిన ఎత్తుగడకాదా ? హిందూ పత్రిక-సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్ధలు సంయుక్తంగా ఎన్నికల అనంతర సర్వే వివరాల ప్రకారం బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన రెచ్చగొట్టుడు పని చేసింది.2017 బిజెపికి హిందువులు 47శాతం ఓటు వేస్తే 2022లో 54శాతానికి పెరిగింది. అదే సమాజవాది పార్టీకి 19 నుంచి 26శాతానికి పెరిగింది. బిఎస్‌పికి 23 నుంచి 14శాతానికి, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి రెండుశాతానికి తగ్గింది. ఈ ఓట్లు బిజెపి-సమాజవాది పార్టీలకు వెళ్లాయి. ఇక సమాజవాది పార్టీ కూటమి సీట్ల సంఖ్యపెరగటానికి బిజెపి చేసిన విద్వేష ప్రచారంతో ముస్లింలు ఆ వైపు మొగ్గటమే అన్నది స్పష్టం.గత ఎన్నికల్లో 46శాతంగా ఉన్నవి ఈసారి 79శాతం మంది ఎస్‌పి కూటమివైపు మొగ్గారు. బిఎస్‌పి ఓట్లు 19 నుంచి ఆరు, కాంగ్రెస్‌ ఓట్లు 23 నుంచి మూడు, ఇతరుల ఓట్లు పది నుంచి నాలుగుశాతానికి తగ్గాయి. ఇదే సమయంలో ముస్లిం ఓట్లు బిజెపికి ఐదు నుంచి ఎనిమిదిశాతానికి పెరిగాయి.


యోగి సర్కార్‌ అభివృద్దే గెలిపిస్తుందని చెప్పుకుంటూనే బిజెపి173 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించి పాత వారి మీద జనంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు చూసింది. వారిలో 99 మాత్రమే గెలిచారు.గత ఎన్నికల్లో బిజెపి కూటమి ఓడిన 85 స్దానాల్లో ఈసారి 69 మంది కొత్తవారిని రంగంలోకి దించినా గెలిచింది 19 మాత్రమే. పాతవారిలో 104 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు. అక్కడ కొత్తవారిని పెట్టగా 80 మంది గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన 16 మందిని ఈ సారి కూడా పోటీకి నిలిపితే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు.


మజ్లిస్‌ పార్టీ ఓట్లు చీల్చిన కారణంగా సమాజవాది ఓడింది అన్నది ఒక అభిప్రాయం.ఆ పార్టీ బిజెపికి బిటీమ్‌ అన్నది, దాని అధినేత మీద జరిగిన దాడి బూటకం అన్నది నిజం. కానీ ఇక్కడ ఆ పార్టీ పోటీచేసిన 94 స్ధానాల్లో వచ్చిన ఓట్లు 4,50,929(0.49శాతం) మాత్రమే అయినా అనేక చోట్ల బిజెపికి తోడ్పడింది. మొత్తంగా చూసినపుడు మూడవ స్దానంలో ఉన్న బిఎస్‌పి పోటీ బిజెపికి తోడ్పడిందన్నది గమనించాలి. తిరుగులేదు అని చెప్పుకున్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌లో మూడు చోట్ల డిపాజిట్లు రాలేదు.399 చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌ 387 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. రెండు చోట్ల గెలవగా నాలుగు చోట్ల రెండవ స్ధానంలో ఉంది. తనబలాన్ని అతిగా అంచనా వేసుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ సగటున ఒక్కో చోట 5,391 ఓట్లు తెచ్చుకొంది, ఆ విధంగా కూడా బిజెపికి తోడ్పడినట్లే. బిఎస్‌పి పోటీ చేసిన 403 స్ధానాల్లో 290 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది.ఒక చోట గెలవగా 14చోట్ల రెండవ స్దానంలో ఉంది.


నువ్వానేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడిన సమాజవాది పార్టీ 376 చోట్ల పోటీ చేసింది, ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నూటపదకొండు సీట్లు గెలిచి 231 చోట్ల రెండవ స్దానంలో ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డి 33 చోట్ల పోటీ చేసి మూడు డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది చోట్ల గెలిచింది.చెల్లిన ఓట్లలో 16.66శాతం తెచ్చుకుంటే డిపాజిట్‌ దక్కుతుంది. పురుషుల్లో కేవలం నాలుగుశాతం మాత్రమే సమాజవాది కంటే బిజెపికి ఎక్కువగా ఓట్లు వేయగా మహిళల్లో బిజెపికి 16శాతం మంది అధికంగా ఓటు వేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇది కూడా బిజెపికి తోడ్పడిన అంశంగా భావిస్తున్నారు. కొన్ని సంక్షేమ పధకాలు వీరిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఇక రైతులు కూడా బిజెపికి గణనీయంగా ఓటు చేశారు. ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనం పధకం, ఎన్నికలలో బిజెపి చేసిన కొన్ని వాగ్దానాలు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆకర్షించినట్లు వెల్లడైంది.లఖింపూర్‌ ఖేరీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా తాము గణనీయంగా రైతుల మద్దతు పొందినట్లు బిజెపి చెప్పుకొంటోంది. అంగీకరిద్దాం, క్షమాపణలు చెప్పి రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి నరేంద్రమోడీ ప్రవేశపెడతారా ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు వేస్తామన్న కమిటీని ఉత్తిదే అంటారా ? చూద్దాం !

పాతవరవడిలోనే జగనన్న బడ్జెట్‌ – పెరుగుతున్న అప్పులు, తిప్పలు ?

Tags

, , ,



ఎం కోటేశ్వరరావు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 11వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంకెల గారడీ షరా మామూలే. భారీగా కొండంత రాగం తీసి చడీ చప్పుడు లేకుండా కోత పెట్టటం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోవాలని గట్టిగా శపధం పూనినట్లుగా ఉంది. కొత్త అప్పులు పుట్టే అవకాశాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలా తీసుకోవాలంటే షరతులకు అంగీకరించాలి. దానిలో భాగమే చెత్త పన్ను. మున్సిపల్‌ ఎన్నికల తరువాత అలాంటి భారాలు వేస్తారని వామపక్షాలు హెచ్చరించినా జనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వైసిపికి ఓట్లు వేశారు. బండి గుర్రానికి గడ్డి ఆశచూపి పరుగెత్తించినట్లు కేంద్రం తాను ప్రకటించిన లేదా ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే అప్పులకు సడలింపులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు దాదాపు ఇరవై లక్షల రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించింది తెలిసిందే.
ఇక బడ్జెట్‌ పత్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 257509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55508.46 కోట్లు. 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2022 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.390670.19 కోట్లు, జిఎస్‌డిపిలో 32.51శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం 2021 డిసెంబరు 31నాటికి రు.117503.12 కోట్లకు పెరిగింది. 2022-23లో అప్పుల మొత్తాన్ని రు.439394.35 కోట్లు, 32.79 శాతం జిఎస్‌డిపిలో ఉంటుందని పేర్కొన్నారు. దీనికి హామీల రుణం అదనం. చంద్రబాబు ఏలుబడిలో అన్ని రకాల రుణాలు మూడు లక్షల కోట్లకు పైబడితే జగనన్న దాన్ని వచ్చే ఏడాది చివరికి ఐదున్నర లక్షల కోట్లకు పైగా పెంచనున్నారు. ఇది అంచనాలకు మించిన వృద్ధి.


ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల ఉంటుంది. దీన్నే ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు.దీని తీరుతెన్నులను చూద్దాం. అప్పులకు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని చేరేందుకు చూపే శ్రద్ద ఇతర వాటి మీద ఉండటం లేదు.పెట్టుబడివ్యయ పద్దు కింద గత ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లను 18,529 కోట్లకు సవరించినట్లు చూపారు. అంతకు ముందు ఏడాది కూడా రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,974 కోట్లే. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఇలాంటి కోతల కారణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రకటించినపుడు గొప్పగా చెప్పి కోతలు వేస్తున్నారు.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్ని ఇప్పుడు రు. 2,08,106.57 కోట్లుగా సవరించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను రు.2,56,256.56 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు రు.48,724.11 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని ఎలా పూడుస్తారో తెలియదు. కేటాయింపులకు కోతలు పెట్టాలి, లేదా జనం మీద భారాలు మోపాలి. ఉదాహరణకు 2020-21లో కూడా ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సర అన్ని రకాల రాబడి రు.1,54,272.70 కోట్లుగా సవరించారు, వచ్చే ఏడాది ఈ మొత్తం రు.1,91,225.11కోట్లని చెప్పారు. దీనికి రు.64,816 కోట్ల మేరకు అప్పులు తెచ్చి బడ్జెట్‌ను అమలు చేస్తామన్నారు.ఈ అప్పులో రు.21,805 కోట్లు పాత వాటిని తీర్చేందుకే పోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగు నీటి వనరుల వృద్ధి వలన రైతాంగ ఆదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. జగన్‌ అధికారానికి రాక ముందు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చు రు.31,624 కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రు.15,193 (2021-22 సవరించిన అంచనాతో) మాత్రమే ఖర్చు చేశారు. గతేడాది నీటి పారుదల రంగానికి రు.11,586 కోట్లు ప్రతిపాదించి దాన్ని రు.6,832 కోట్లకు కోత పెట్టారు. వచ్చే ఏడాది అసలు ప్రతిపాదనే రు.9,810 కోట్లుగా పేర్కొన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా లేదా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని భారీగా పెంచాల్సింది పోయి ఇలా చేయటం ఏమిటి ?


నవరత్నాలు లేకపోతే జగన్‌ రత్నాలు పేరు ఏది పెట్టినా పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తప్పు పట్టటం లేదు. అదే పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల పాలైనపుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పధకాల సొమ్ము మొత్తం, ఇంకా అప్పులు చేసినదీ వాటి యజమానులకు సమర్పించుకుంటున్నారు. ఆ స్ధితిలో వైద్య, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ ఖర్చును గణనీయం పెంచాలి. కానీ ఈ బడ్జెట్‌లో గతేడాది చేసిన ఖర్చు కంటే తగ్గించారు. సవరించిన అంచనా ప్రకారం రు.12,972 కోట్లనుంచి రు.11,974 కోట్లకు కుదించారు. షెడ్యూలు కులాలు, తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది ప్రతిపాదించిన రు.27,401 కోట్లను రు.25,349కు కుదించారు. ఈ ఏడాది మాత్రం దాన్ని ఏకంగా రు.45,411 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని చూస్తే అంకెల గారడీ లేదా మధ్యంతర ఎన్నికల ప్రచార అస్త్రమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


రోడ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలిసిందే. గతేడాది రోడ్లు, వంతెనలకు పెట్టుబడి ఖర్చు రు.2,792 కోట్లుగా చూపి దాన్ని రు.927 కోట్లకు కుదించారు. ఇప్పుడు రు.2,713 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలుకుతున్నారు.మొత్తం ఆర్ధిక సేవల పెట్టుబడి ఖర్చు రు.18,319 కోట్లుగా ప్రకటించి ఆచరణలో రు.9,859 కు కోత పెట్టి ఈ ఏడాది రు.17,412 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఏ శాఖను చూసినా ఇదే తీరు. నోరున్నదని చెప్పుకొనే ఉద్యోగులకు తాను ప్రకటించిన 27తాత్కాలిక భృతిలో కూడా కోత పెట్టి పిఆర్‌సిని బలవంతంగా రుద్దిన సర్కార్‌ ఇక నోరు లేని లేదా ఉన్నా నోరెత్తలేని జనాలకు సంబంధించిన, అభివృద్ధి పనులకు కోత పెట్టటంలో ఆశ్చర్యం ఏముంది ?


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. 2021-22లో ముందస్తు అంచనా ప్రకారం అది రు. 12,01,736 కోట్లుగా ఉన్నట్లు ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. అందువలన ఆ మేరకు రుణపరిమితి పెరుగుతుంది. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే ! రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యంలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !


వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

భారత్‌పై బుజ్జగింపులు, వత్తిడి, బెదిరింపులకు దిగిన అమెరికా !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా సాగెనుగా అంటూ సాగుతున్న భారత – అమెరికా ప్రేమ నౌకను ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఒక్క కుదుపు కుదిపింది.ప్రేమ జంట తాత్కాలికంగా వేరు పడింది. జన్మజన్మలకు ఒక్కటిగా ఉందామంటూ చేసుకున్న బాసలను మర్చి పోయి నాతో కలసి రష్యాను ఖండిస్తూ యుగళగీతం పాడేందుకు నిరాకరిస్తావా అంటూ అమెరికా గుర్రుగా ఉంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల్లేవుగానీ తడిక రాయబారాలు కొనసాగుతున్నాయి.వత్తిడికి తట్టుకోలేక నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి ప్రేమ నౌక ఎక్కుతుందా, మరేమైనా చేస్తుందా ? అసలెందుకు భాగస్వాముల మధ్య ఈ పరిస్ధితి వచ్చిందన్నది ప్రపంచంలో చర్చ జరుగుతోంది. మధ్యలో కొందరు చైనాను లాగుతున్నారు? వారి ఎత్తుగడ ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో ఉక్రెయిన్‌ – రష్యా వివాదం ముందుకు తెచ్చింది. మరోమాటలో చెప్పాలంటే మన విదేశాంగ విధానం గురించి సరైన దారీ తెన్నూ గురించి తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వెల్లడిస్తోంది.


ఈ వివాదంలో మన దేశం ప్రకటించిన తటస్ధ వైఖరి గురించి అంతర్గతంగా రష్యా ఏమనుకుంటోందో ఇంకా తెలియదు, తన వ్యతిరేకులతో చేతులు కలపకపోవటం ఒక రకంగా మేలే అని భావిస్తున్నట్లు దాని సానుకూల స్పందన వెల్లడించింది. మరోవైపు అమెరికా పట్టలేని ఆగ్రహంతో ఉన్నా తన పధకాల్లో మన అవసరాలను గమనంలో ఉంచుకొని తమాయించుకుంటూ బయపడకుండా ఉంది. దాని అధినేత, నరేంద్రమోడీతో పెద్దన్న బైడెన్‌ ఇంతవరకు మాట్లాడలేదు. యుద్ధానికి ముందే కొన్ని నెలల పాటు తమతో గొంతు కలపాలని ఒప్పించేందుకు తమ నేతలు తీవ్ర కసరత్తు చేసినట్లు, యుద్దం ప్రారంభమైన తరువాత మరింతగా ప్రయత్నాలున్నట్లు అధికారయంత్రాంగం చెప్పింది.


పలు వైఫల్యాల కారణంగా ప్రపంచంలో పరువు పోగొట్టుకుంటున్నది అమెరికా. శత్రుదేశాలుగా పరిగణిస్తున్నవాటి మీద మరింతగా దూకుడు పెంచటం ద్వారా నష్టనివారణ, తన మిత్రదేశాల్లో విశ్వాసం పెంపొందించేందుకు దుస్సాహసాలకు పాల్పడుతోంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌ను తన కౌగిట్లోకి తీసుకొనేందుకు పావులు కదిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కొంత మేరకు సఫలీకృతమైంది.చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని ముందుకు నెట్టే ఎత్తుగడతో ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు 2007లోనే చతుష్టయ(క్వాడ్‌) కూటమికి రూపకల్పన చేసినా అది ముందుకు సాగలేదు. మన దేశం చేతులు కాల్చుకొనేందుకు సిద్దం కాకపోవటం ఒక ప్రధాన కారణం.కానీ 2017లో దానికి నరేంద్రమోడీ సిద్దపడటంతో అది అమల్లోకి వచ్చింది. లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ ఉదంత రూపంలో దాని పర్యవసానాలను చూశాము.


ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా పరిణామాలను ఆసరా చేసుకొని అమెరికా, మన దేశంలోని దాని మద్దతుదారులు మరోసారి చైనాను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నారు.ఆసియాలో ఆధిపత్యానికి చైనా పూనుకున్నదనే అమెరికా ప్రచారాన్ని మరో రూపంలో ముందుకు తెస్తున్నారు. రష్యా మనకు తరతరాలుగా మిలిటరీ సాయం అందిస్తున్నది. దాన్ని వదులుకుంటే మన జుట్టు అమెరికా వాడి చేతికి చిక్కుతుందనే భయమూ, వారి పాతబడిన ఆయుధాలు కొనుగోలు చేయటం కంటే రష్యా గతంలో ఇచ్చిన వాటిని నవీకరించుకోవటం మెరుగు అనే అభిప్రాయమూ ఉంది. రష్యాను చూపి కొత్త వాటిని ఇస్తారా లేదా అని అమెరికాతో బేరమాడేందుకూ కావచ్చు, ఇలా అనేక అంశాలున్నాయి. మనం కావాలన్న క్షిపణి రక్షణ వ్యవస్ధలను ఇచ్చేందుకు అమెరికా సిద్దం కాదు. రష్యా గతంలో ఇస్రోకు క్రయోజనిక్‌ ఇంజన్లు, వాటి పరిజ్ఞానం అందచేసింది. మనతో కలసి బ్రహ్మౌస్‌ అనే ఆధునిక క్షిపణులు, బహుళ ప్రయోజనాలకు అవసరమైన విమానాల రూపకల్పన, ఎకె రకం తుపాకుల తయారీ వంటి అంశాల్లో భాగస్వామిగా ఉంది. అమెరికా మబ్బుల్లో నీళ్లు చూసి రష్యా ముంతలోని నీళ్లు పారబోసుకుంటే జరిగేదేమిటో మనకు తెలుసు. అందుకే అమెరికా బెదిరించినా ఎస్‌-400 అనే రష్యా క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేశాము. ఇన్ని కారణాలతో ఉక్రెయిన్‌ కోసం రష్యాను కాదని అమెరికా చంకనెక్కి దాని పాటపాడేందుకు మనం సిద్దం కాలేదు.


ఈ విషయాలు చెప్పుకొనేందుకు మన పాలక ప్రభువులు, మీడియాకు భయం, ఎందుకంటే అమెరికా ఆగ్రహం మరింత పెరుగుతుందేమోననే దడ. దాన్ని కప్పి పుచ్చి చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే రష్యా అవసరం కనుక తటస్ధంగా ఉండి దాన్ని దగ్గర చేసుకొనేందుకు పూనుకున్నామని చెప్పేవారు తయారయ్యారు. అమెరికన్లు ఇప్పుడు పుతిన్‌ బూచిని చూపి మనలను వారి చంకనెక్కమంటున్నారు. దక్షిణాసియా వ్యవహారాల అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తమ ఎంపీలతో మాట్లాడుతూ అమెరికా-భారత్‌ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ప్రతి రోజూ పని చేస్తున్నామని, పుతిన్‌కు అడ్డుకట్టవేయకపోతే చైనా మరింత రెచ్చిపోతుందని, ఉక్రెయిన్‌లో జరుగుతున్నదానితో చైనా ప్రవర్తన ప్రభావితం అవుతుందని, అది భారత్‌కు అర్ధంకావాలి. ” అన్నాడు.ఇప్పటి వరకు ఐరాసలో మన దేశం నాలుగు సార్లు తటస్ధంగా ఉంది.


ఒక స్పష్టమైన వైఖరి (అంటే తమబాటలో నడిచే) తీసుకోవాలని అమెరికా కోరుతోంది. కొద్ది నెలలుగా మన మీద బుజ్జగింపులు, వత్తిడికి దిగిన అమెరికన్లు ఇప్పుడు బెదిరింపులకూ పాల్పడ్డారు. ” ఇప్పుడు రష్యాకు మరింతదూరంగా భారత్‌ జరగాల్సిన తరుణం ఆసన్నమైంది.లేనట్లయితే తమ ” కాట్సా ” చట్టం (తమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఏ దేశం మీదనైనా ఆంక్షలు విధించవచ్చని అమెరికా రూపొందించుకున్న స్వంత చట్టం ) కింద గతంలో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకొనే అంశాన్ని బైడెన్‌ పరిశీలిస్తారని ” డోనాల్డ్‌ లు బెదిరించాడు.ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి 543 కోట్ల డాలర్ల ఎస్‌-400 క్షిపణి వ్యవస్ధల కొనుగోలుకు 2018లో ఒప్పందం చేసుకున్నాము. అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మన మీద ” కాట్సా” తో వేటు వేస్తానని బెదిరించినా వెనక్కు తగ్గాడు. తరువాత అదే ట్రంప్‌ను అమెరికా వెళ్లి మన నరేంద్రమోడీ కౌగిలింతలతో ముంచెత్తి ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని ఒక సభలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ మినహాయింపు గురించి జోబైడెన్‌ బెదిరిస్తున్నాడు.


అంతేకాదు భారత అధికారులను మందలించాలని, ఐరాసలో పదే పదే చర్చలు జరపాలని కోరటం, తటస్ధ వైఖరి అవలంభించటం అంటే రష్యా శిబిరంలో ఉన్నట్లే అన్న ముద్రవేయాలని అమెరికా తన దౌత్యసిబ్బందికి పదునైన పదజాలంతో వర్తమానం పంపింది. దాన్ని కావాలనే లీకు చేసింది. రష్యాకంటే భారత్‌ మనకు దగ్గరగా ఉన్నందున ఇలాంటి పని చేస్తే తీరా అది వ్యతిరేక ఫలితాలనిస్తుందేమో అన్న భయం కొందరిలో పట్టుకుందని వార్తలు వచ్చాయి. ఈ సమస్యకారణంగా చైనాపై భారత్‌-అమెరికా వ్యూహాత్మక ఐక్యతకు భంగం కలిగించకూడదని, అమెరికా ప్రయోజనాల రీత్యా భారత్‌తో సంబంధాలు కొనసాగించటం ముఖ్యమని చెబుతున్నవారు కూడా ఉన్నారు. మన దేశం ఇప్పుడు ఉక్రెయిన్‌ అంశంలో తటస్ధంగా ఉన్నట్లే భారత్‌-చైనా వివాదంలో బహిరంగంగా, నిర్ణయాత్మకంగా చైనా వైపు రష్యా ఉండకుండా చూసుకోవాలన్నది కొందరి సలహా.


ఇస్లామాబాద్‌లోని 22 మంది విదేశీ రాయబారులు ఒక బహిరంగ సంయుక్త లేఖను విడుదల చేశారు. రష్యా చర్యను ఐరాసలో ఖండించాలని వారు పాకిస్తాన్ను కోరారు. దీని మీద ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మండిపడ్డాడు. మీరు చెప్పినట్లు చేసేందుకు మేమేమైనా బానిసలం అనుకుంటున్నారా, మా గురించి ఏమనుకుంటున్నారు ? ఇలాంటి లేఖను మీరు భారత్‌కు రాశారా అంటూ ఐరోపా దేశాల రాయబారులపై ధ్వజమెత్తాడు. తమకు అమెరికా, రష్యా, చైనా, ఐరోపా అందరూ కావాల్సినవారే, స్నేహితులే, ఏ శిబిరంలోనూ మేము ఉండం అన్నాడు. మన దేశానికి లేఖ రాసిందీ లేనిదీ బహిరంగం కాలేదు గాని ఢిల్లీలోని విదేశీ దౌత్యవేత్తలు కొందరు ఉక్రెయినుకు మద్దతుగా ఒక సమావేశం నిర్వహించారు. దాని మీద మన దేశం ఎలాంటి అభ్యంతరమూ వెల్లడించలేదు.


ఉక్రెయినుపై భారత్‌ అనుసరిస్తున్న గడసాము వైఖరి సంతృప్తికరంగా లేదని, ఆ దేశం నిశిత పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇది అమెరికా అంతరంగంగా చెప్పవచ్చు.ఇదీ బెదిరింపే. ఒక వేళ అమెరికా వత్తిడి ఫలించినా, భారత్‌ రాజీపడటం కష్టమని, కొన్ని స్వల్పమార్పులు మాత్రమే ఉండవచ్చని, బహిరంగంగా రష్యాను విమర్శించలేకపోవచ్చని చైనా నిపుణులు చెప్పారు. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా చదరంగంలోని పావుల్లా దేశాలను వాడుకోవాలని చూస్తోందన్నది అనేక దేశాలు గుర్తిస్తున్నాయి. మెక్సికో, టర్కీ తాము రష్యాపై ఎలాంటి ఆర్ధిక ఆంక్షలను అమలు జరపబోమని ప్రకటించగా బ్రెజిల్‌, పనామా, అర్జెంటీనా, బలీవియా వంటివి ఖండించేందుకు తిరస్కరించాయి.


రష్యా ఇప్పుడు సోషలిస్టు దేశమూ కాదు, పుతిన్‌ కమ్యూనిస్టూ కాడు. సోవియట్‌ విడిపోయిన తరువాత రష్యా అనేక సమస్యలను ఎదుర్కొన్నది, ఆర్ధికంగా బలహీనపడింది. ఇదే అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ జి7 బృందాన్ని విస్తరించి రష్యాను కలుపుకొని జి8గా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. అది ఆర్ధికంగా బలపడటం ప్రారంభం కావటం, నాటో విస్తరణ పేరుతో దాని ముంగిటకు తన సైన్యాలు, ఆయుధాలను తరలించాలని ఎప్పుడైతే చూసిందో అప్పటి నుంచి రెండు దేశాలు దూరం కావటం, జి8 నుంచి రష్యాను తొలగించటం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ధికంగా ఎదుగుతున్న చైనాను చూసి కూడా అమెరికాకు దడపట్టుకుంది. ఈ రెండు దేశాలను దెబ్బతీయాలని ఒకేసారి పావులు కదుపుతోంది. వీటికి వ్యతిరేకంగా మన దేశాన్ని, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించేందుకు పూనుకుంది. అందువలన రష్యా పెట్టుబడిదారీ దేశమైనా, చైనా సోషలిస్టు వ్యవస్ధ కలదైనా ఉమ్మడి శత్రువుగా అమెరికా కూటమి ముందుకు వస్తున్నందున ఇప్పుడున్న బలాబలాల్లో రెండూ కలిసి ఎదుర్కోవాల్సిన అగత్యాన్ని గుర్తించి ముందుకు పోతున్నాయి. ఇది శాశ్వతమా అంటే చెప్పలేము. రెండవ ప్రపంచ యుద్దంలో సోవియట్‌ నేత స్టాలిన్‌ నాజీ హిట్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడు, అదిశాశ్వతంగా ఉండదని ఇద్దరికీ తెలుసు. రష్యా గత మూడుదశాబ్దాలుగా తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఇంతవరకు ఏ దేశాన్నీ ఆక్రమించేందుకు పూనుకున్న ఉదంతాలు లేవు. సిరియా వంటి చోట్ల అమెరికా కూటమికి వ్యతిరేకంగా ఉంది. రష్యా-చైనాల మధ్య 4,209 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వివాదాల్లేకపోతే అంత పొడవున సాధారణ మిలిటరీ కార్యకలాపాతో సరిపెట్టుకోవచ్చు. అదే ఉద్రిక్తతలు ఉంటే పెద్ద మొత్తంలో వనరులు ఖర్చు. ఆ మొత్తాన్ని ఇప్పుడు చైనా అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు.భవిష్యత్‌లో సమస్యవస్తే అప్పుడు ఎలాగూ తప్పదు.


ఈ వివాదంలో మన దేశం తీసుకుంటున్న వైఖరి గురించి ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు వివరించలేదు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరాసలో తటస్ధతను ప్రకటించటాన్ని ప్రతిపక్ష పార్టీలేవీ విమర్శించలేదు. ఆపరేషన్‌ గంగ మీద వచ్చిన విమర్శలకు విదేశాంగ విధానానికి సంబంధం లేదు.స్వతంత్ర వైఖరిని తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి అమెరికా వత్తిళ్లకు లొంగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం : మీడియా ద్వంద్వ ప్రమాణాలు, జనంపై ప్రచారదాడి !

Tags

, , , ,



ఎం కోటేశ్వరరావు


రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే మన దేశంతో సహా అన్ని చోట్లా అది కనిపిస్తోంది. ధరలు పెరుగుతున్నాయి, చమురు పిడుగు ఏక్షణంలో పడుతుందో తెలియదు. తమ దగ్గర చిక్కుకు పోయిన లేదా ఉక్రెయిన్‌ బందీలుగా చేసిన భారత్‌, ఇతర దేశాల విద్యార్ధుల భవిష్యత్‌ గురించి తలిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. సకాలంలో కేంద్ర ప్రభుత్వం మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి ఉండేది కాదు. ఇక ఈ ఈ యుద్ధం గురించి మీడియా తీరు తెన్నులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.


ప్రపంచ చట్టాలను, భద్రతా మండలి తీర్మానాన్ని లెక్క చేయటం లేదంటూ రష్యాను దోషిగా చూపుతూ ప్రచారం జరుగుతోంది.1995లో తొలిసారిగా నాటో కూటమి యుగ్లోసావియా మీద మార్చినెల 24 నుంచి జూన్‌ పది వరకు 78 రోజుల పాటు వైమానిక దాడులు జరిపింది. దీనికి భద్రతా మండలి అనుమతి లేదు. అప్పుడు దాడికి దిగిన ” ఐరోపా అపర ప్రజాస్వామిక దేశాలు ”, వాటికి మద్దతు పలికిన మీడియాకు అంతర్జాతీయ చట్టాలు, ప్రజాస్వామిక సూత్రాలు గుర్తుకు రాలేదు. కొసావోలో ఉన్న పరిస్ధితులు ప్రాంతీయ స్ధిరత్వానికి ముప్పు వచ్చిందని నాటో సమర్ధించుకుంది. దానికి మీడియా తాన తందానా అంది. అదే నిజమైతే ఇప్పటి మాదిరి ఐరాసలో ఎందుకు చర్చించలేదు? ఇప్పుడు ఉక్రెయినుకు నాటో సభ్యత్వం ఇచ్చే చర్యలు తన భద్రతకు, ప్రాంత దేశాలకు ముప్పు అని ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న రష్యా అభ్యంతరాలను ఎందుకు పట్టించుకోలేదు ? ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌బాస్‌ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న రష్యన్‌ భాష మాట్లాడేవారిపై కిరాయి ఫాసిస్టు మూకలు, మిలిటరీ జరిపిన దాడులతో పదిహేను వేల మంది మరణించటం, ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్దం, జర్మనీ, ఫ్రాన్స్‌ కుదిర్చిన రెండవ మిన్‌స్క్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఉక్రెయిన్‌ ప్రభుత్వ తీరుతెన్నులు ఆ ప్రాంతంలో అస్ధిరతకు దారి తీయవా ? నాటో ఎందుకు పట్టించుకోలేదు ?


పశ్చిమ దేశాలు ఇరాక్‌, లిబియా, సిరియా, ఎమెన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలపై దాడులు జరిపాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యాదాడులు జరుపుతోంది. రెండు ఉదంతాలపై మీడియా స్పందించిన తీరేమిటి ? సిబిఎస్‌ అనే అమెరికా మీడియా కీవ్‌ నగర విలేకరి చార్లీ డి అగటా చెప్పిన వార్తలో ” ఈ ప్రాంతం దశాబ్దాల తరబడి విబేధాలు చెలరేగుతున్న ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటిది కాదు, ఇది వాటితో పోలిస్తే నాగరికమైన ప్రాంతం, ఐరోపాకు చెందినది, ఈ నగరంలో యుద్దం జరుగుతుందని మీరు ఊహించలేరు..” అన్నాడు. అంటే పైన పేర్కొన్న ప్రాంతాలు అనాగరికమైనవన్న శ్వేతజాతి జాత్యహంకారం తప్ప ఆ మాటల్లో మరేమైనా ఉందా ? అమెరికా, ఐరోపా వంటి నాగరిక దేశాలు అనాగరికంగా ఇతర దేశాల మీద దాడులకు దిగటం ఏమిటి ? పశ్చిమ దేశాల్లోని జనాలు అడవుల్లో ఉంటూ సరిగా బట్టలు కట్టుకోవటం కూడా రాని కాలంలోనే ఇరాక్‌ వంటి దేశాలు నాగరికతను కలిగి ఉన్నాయి. అనేక గణిత, సైన్సు అంశాలను బోధించాయి.


మరో అమెరికా మీడియా ఎన్‌బిఎస్‌ విలేకరి హాలీ కోబిలే ఒక మహిళ అనికూడా మరచి మరింత దారుణంగా మాట్లాడింది.” మొహమాటం లేకుండా చెప్పాలంటే వీరు సిరియా నుంచి వచ్చిన నిర్వాసితులు కాదు, ఉక్రెయిన్‌ వారు. వారు క్రైస్తవులు, వారు తెల్లవారు, మన మాదిరే ఉంటారు.” అంటే సిరియన్లు, ఇతరులు ఏమైనా వారికి ఫరవాలేదన్నమాట. బిబిసిలో ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ ” నీలి కళ్లు, తెలుపు-రాగి రంగు జుట్టు కల ఐరోపా వారిని చంపుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను” అన్నాడు. మరొక యాంకర్‌ పీటర్‌ డోబీ మాట్లాడుతూ ” వారి దుస్తులను చూస్తుంటే వారంతా ధనికులు, మధ్యతరగతి వారిలా ఉన్నారు తప్ప మధ్య ప్రాచ్యం, లేదా ఉత్తరాఫ్రికా నుంచి పారిపోతున్న కాందిశీకుల్లా మాత్రం లేరు. మీ పక్కింటి యురోపియన్‌ వారిలానే ఉన్నారు. ” పశ్చిమాసియా,ఆఫ్రికా, ఆసియా ఖండాలలో జరిగిన యుద్ధాలకు పాల్పడిందీ, ప్రపంచాన్ని ఆక్రమించింది ఐరోపా సామ్రాజ్యవాదులే కదా !


బ్రిటన్‌ టెలిగ్రాఫ్‌ పత్రిక జర్నలిస్టు డేనియన్‌ హానన్‌ ఉక్రెయిన్‌ పరిస్ధితిని చూసి దిగ్భ్రాంతి చెందాడట. ఎందుకటా అది ఐరోపా దేశమట. నిజమే రెండు ప్రపంచ యుద్దాలను ప్రారంభించిందీ, అంతకు ముందు ఐరోపాలో, అమెరికాలో కొట్టుకు చచ్చిందీ, యుద్దాలకు పాల్పడిందీ, ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకున్నదీ ” ఐరోపా నాగరికులే ” అని మర్చిపోతే ఎలా, అందుకే తమ కింత ఉన్న పెద్ద మచ్చను ఒకసారి చూసుకోమని చెప్పాల్సి వస్తోంది. ఐదు లక్షల మంది ఉక్రెయినియన్లు నిర్వాసితులుగా మారటం, ఇతర దేశాలకు పోవటం దురదృష్టకరమని ఐరాస అధికారి ఫిలిప్పో వాపోయారు. 1948 నుంచి తమ మాతృదేశం నుంచి వెళ్ల గొట్టిన కారణంగా ఏడున్నరలక్షల మందితో ప్రారంభమై ప్రస్తుతం 56లక్షలకు చేరిన పాలస్తీనియన్లు అప్పటి నుంచి పరాయి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కాందిశీకుల శిబిరాల్లోనే పుట్టి కాందిశీకులుగా అక్కడే మరణించిన వారే కొన్ని లక్షల మంది ఉన్నారు. పిల్లలకు దాడుల భయం తప్ప మరొకటి తెలియదు. వారి గురించి నాగరికులకు పట్టదు, దానికి కారణమైన ఇజ్రాయల్‌కు మద్దతు ఇస్తున్నారు.2019 నాటికి 7.95 కోట్ల మంది ప్రపంచంలో నిరాశ్రయులు కాగా వారిలో 2.04 కోట్ల మంది 18 ఏండ్ల లోపువారున్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులెవరు అంటే 99శాతం ఐరోపా, అమెరికా అనాగరికులే.


ఉక్రెయిన్లో రష్యన్‌ సైన్యాన్ని వ్యతిరేకిస్తున్న వారి గురించి కథ కథలుగా చెబుతున్న పశ్చిమ దేశాల మీడియా ఎన్నడైనా పాలస్తీనియన్లు, వియత్నాం తదితర చోట్ల సామాన్యులు చూపిన తెగువ, అమెరికన్లను మూడు చెరువుల నీళ్లు తాగించి సలాం కొట్టించిన ఉదంతాలను ఎప్పుడైనా చెప్పిందా ? అంతెందుకు, మమ్మల్ని ప్రాణాలతో వెళ్లి పోనివ్వండ్రాబాబూ అని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని అమెరికన్లు పారిపోకముందు వరకు వారిని అణచివేశామనే కట్టుకథలనే ప్రపంచానికి వినిపించిన సంగతి మరచిపోగలమా ! ఉక్రెయిన్లో బాంబులు తయారు చేసి ఉపయోగించి చూపటాన్ని దేశభక్తిగా చూపుతున్న మీడియా పాలస్తీనాలో అదే పని చేస్తున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచివేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇలా ద్వంద్వ ప్రమాణాలు, మోసకారితనం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లు అమెరికా సిఎన్‌ఎన్‌ విలేకరి బెర్నీ గోరెస్‌ను ఉరితీసి చంపారని గతంలో ప్రపంచాన్ని నమ్మించారు. ఇప్పుడు అదే బెర్నీ ఉక్రెయిన్లో దర్శనమిచ్చి పిట్ట, కట్టుకథలను రాసి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాడు. ఐరోపా యూనియన్నుంచి బ్రిటన్‌ విడిపోవటానికి ప్రణాళికను రూపొందించాడన్న పేరు తెచ్చుకున్న ” నాగరిక ” నిగెల్‌ ఫారాజి గతంలో బ్రిటన్‌ నుంచి పోలిష్‌ జాతివారిని బయటకు పంపాలని కోరాడు, ఇప్పుడు రష్యన్లను తరిమివేయాలని చెబుతున్నాడు.


గత ఏడు సంవత్సరాలుగా పశ్చిమ దేశాల తరఫున వకాల్తా పుచ్చుకొని ఎమెన్‌పై దాడులు చేస్తున్న సౌదీ అరేబియా, ఇతర దేశాల దాడుల్లో 80వేల మంది పిల్లలతో సహా ఐదు లక్షల మంది మరణిస్తే ఐరోపా మానవతావాదులు, వారికి మద్దతు ఇచ్చే మీడియాకు చీమకుట్టినట్లుగా లేదు. రష్యన్ల ఆస్తులను స్ధంభింపచేయాలని నిర్ణయించిన ” నాగరికులు ” సౌదీ అరేబియా, ఇతర దేశాల మీద అలాంటి చర్యలెందుకు తీసుకోలేదు, బ్రిటన్‌లో అది రెండు ఫుట్‌బాల్‌ క్లబ్బులను నడుపుతోంది. భద్రతా మండలిలో తటస్ధంగా ఉన్న యుఏయి బ్రిటన్‌లో అత్యంత ధనవంతమైన మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భాగస్వామి, ఉక్రెయిన్‌పై బాంబు దాడులను నిరసిస్తూ సదరు క్లబ్బులో సభ నిర్వహించింది. దాని తటస్ధత ఎక్కడ ? రష్యన్లు ఉక్రెయిన్‌ తరువాత మిగతా దేశాలను కూడా ఆక్రమించుకుంటారు అని అమెరికా, ఐరోపా దేశాలన్నీ ఊదరగొడుతున్నాయి. ఐరాస తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనా ప్రాంతాలను గత ఏడు దశాబ్దాలుగా ఆక్రమించుకొని స్ధిరపడాలని చూస్తున్న ఇజ్రాయల్‌కు అవి తిరుగులేని మద్దతు ఇస్తున్నాయి. ఉక్రేనియన్లు తమ దేశం వెళ్లి పోరాడేందుకు అన్ని రకాల సాయం చేస్తామని బ్రిటీష్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. కానీ అదే బ్రిటన్‌ పశ్చిమాసియాకు చెందిన వారిని ఉగ్రవాదులుగా చిత్రించి జైళ్లలో పెట్టింది. ఫుట్‌బాల్‌ స్టేడియాల వద్ద పాలస్తీనా పతాకాలను ఎగురవేయటాన్ని బ్రిటన్‌ నిషేధించింది, ఎందుకంటే క్రీడలకు రాజకీయాలకు ముడి పెట్టకూడదని చెప్పింది, అదే ఇప్పుడు ఉక్రెయిన్‌ పతాకాలను ఎగురవేయిస్తున్నది.అమెరికాతో కలసి తనకు సంబంధం లేకపోయినా అనేక దేశాల మీద దాడులకు దిగిన బ్రిటన్‌ ఇప్పుడు రష్యాను చూపి గుండెలు బాదుకుంటోంది.


పశ్చిమ దేశాల మీడియా పోకడలను అమెరికాలోని అరబ్‌ మరియు మధ్యప్రాచ్యదేశాల జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో ఖండించింది. ఆ దేశాల దుష్టమనస్తత్వానికి వారి జర్నలిజం ప్రతీకగా ఉందని, మధ్యప్రాచ్యదేశాలలో విషాదాలు సర్వసాధారణమే అన్నట్లు చిత్రిస్తున్నదని పేర్కొన్నది.యుద్ద బాధితులు ఎవరైనా ఒకటేనని, అయితే మధ్యప్రాచ్యదేశాల బాధితుల పట్ల అమానుషత్వాన్ని ప్రదర్శిస్తున్నదని సంఘ అధ్యక్షురాలు హుదా ఉస్మాన్‌ విమర్శించారు. పశ్చిమ దేశాల జర్నలిస్టులు ఇతర దేశాల పట్ల అలవోకగా, సాదాసీదాగా వివక్షను వెల్లడించటం వృత్తికి తగనిపని అన్నారు.


ఇక మన మీడియా విషయానికి వస్తే ఒక మంచి రేటింగుల అవకాశాన్ని కోల్పోయినట్లుగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.రష్యా పట్ల మన దేశం తటస్ధవైఖరిని ప్రదర్శించటం దానికి ఒక కారణం. అయినప్పటికీ పశ్చిమ దేశాల మీడియా కథనాలను కొత్త పాకింగులో అందిస్తున్నది. భక్తి ప్రపత్తులతో తమ పని చేసిపెడుతున్నందున పశ్చిమ దేశాలు మాట్లాడటం లేదు. భారత మీడియా వివక్ష పూరితంగానూ, తప్పుదారి పట్టించే వార్తలను అందిస్తున్నదని రష్యా విమర్శించింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ వాస్తవ సమాచారాన్ని భారత పౌరులకు అందించాలని హితవు చెప్పింది. ఉక్రెయిన్లోని అణువిద్యుత్‌ కేంద్రాలు, చర్చల గురించి తప్పుడు సమాచారాన్ని భారత మీడియా అందించిదని విమర్శించింది. ” రష్యా దురాక్రమణ ” గురించి భారత మీడియా విమర్శించటం లేదెందుకంటూ బిబిసి ఒక కథనాన్ని రాసింది. యుద్దాన్ని ఆసరా చేసుకొని రేటింగులను పెంచుకొనేందుకు, తద్వారా సొమ్ము చేసుకొనేందుకు చూస్తున్న అత్యధిక పశ్చిమ దేశాల మీడియా సంస్ధలు ఇల్లు కాలుతుంటే చుట్టకాల్చుకొనే వారిని గుర్తుకు తెస్తున్నాయి.జనాలను కించపరుస్తున్నాయి, ఏకపక్ష వార్తలు, వ్యాఖ్యానాలతో తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ విషయంలో మన మీడియా కూడా తక్కువ తినటం లేదు. తప్పును తప్పని ఖండించలేని నరేంద్రమోడీ సర్కారు మాదిరి యుద్దానికి అసలు కారకులైన అమెరికా దాని నేతృత్వంలోని నాటో కూటమి కుట్రలు, ద్వరద్వ ప్రమాణాలను వెల్లడించటంలో మ్యావ్‌ మ్యావ్‌ మంటున్నాయి. జనం మీద జరిగే ప్రచారదాడికి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్ధలు అణ్వస్త్రాల క్షిపణుల మాదిరి ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
.

‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ – పొసగని రంగనాయకమ్మ సూత్రీకరణలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నూరు పూవులు పూయనీయండి – వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న స్ఫూర్తితో ఎవరు ఏమైనా చెప్పవచ్చు, రాయవచ్చు. దానిలో భాగంగానే ఎవరైనా వాటితో విబేధించవచ్చు కూడా. తొలుత ప్రముఖ రచయిత్రిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న రంగనాయకమ్మ తరువాత మార్క్సిస్టు సిద్దాంతవేత్తగా కూడా మారారు. మార్క్సిజం- లెనినిజం లేదా దానికి మావోయిజాన్ని తోడు చేసి వాటి మీద వ్యాఖ్యానాలు చేసేందుకు ఎవరికీ మేథోసంపత్తి హక్కులేమీ లేవు, కనుక ప్రతివారికీ అవకాశం ఉంది, అనేక మంది రాస్తున్నారు. అలాంటి వారిలో రంగనాయకమ్మ ఒకరు. ‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ అనే శీర్షికతో మార్చి రెండవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన అంశాలలో కొన్నింటి గురించి చూద్దాం. బోల్షివిక్‌ పార్టీ సారధిగా, తొలి సోషలిస్టు విప్లవానికి నేతృత్వం వహించి అనేక అంశాలపై మార్క్సిజాన్ని మరింతగా పరిపుష్టం చేసిన కారణంగానే లెనిన్‌కు చరిత్రలో ఒక ప్రత్యేక స్ధానం ఉంది. అదెంతటి మహత్తరమైనదంటే తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శనంగా చేసుకొనేంతగా అన్నది స్పష్టం.


రంగనాయకమ్మగారు ప్రస్తావించిన జాతుల సమస్య మీద ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ జరగనన్ని చర్చలు, వాదోపవాదాలు అక్కడి భౌతిక పరిస్ధితుల కారణంగా విప్లవానికి ముందు తరువాత రష్యన్‌ పార్టీలో జరిగాయి. లెనిన్‌ ప్రతిపాదించిన వాటితో తీవ్రంగా విబేధించిన వారున్నారు, లెనిన్‌ విబేధించినవీ రాజీపడినవీ ఉన్నాయి. ఆ చర్చ జోలికి పోదలచలేదు. బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రజాస్వామిక సంస్ధ. మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కూడా అంగీకరించి అమలు జరపాలనే కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలతో పని చేసింది. అందువలన పార్టీలో లెనిన్‌ప్రతిపాదించినా, స్టాలిన్‌ ప్రతిపాదించినా తప్పయినా ఒప్పయినా చర్చల తరువాత ఆమోదం పొందిన వాటినే అమలు చేశారు. అందువలన వాటిని వ్యక్తులకు ఆపాదించటం తగనిపని.ఉమ్మడి óాకమ్యూనిస్టు పార్టీ సైద్దాంతిక విబేధాలతో చీలిన తరువాత తెలుగునాట రెండు పార్టీలను కొందరు సుందరయ్య పార్టీ, రాజేశ్వరరావు పార్టీ అని పిలవటాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు. ” లెనిన్‌ వ్యతిరేకించిన జాతుల విధానమే స్టాలిన్‌ ఆధిపత్యంలో కొనసాగింది ” అని చెప్పటం అలాంటిదే. బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైనపుడు రష్యాలో అనేక మైనారిటీ జాతులు ఉన్నాయి. తొలి శ్రామిక రాజ్యం పేరు ” రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్‌) ”. తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు.


జారు కాలంలో మైనారిటీ జాతులను అణచివేసింది నిజం, అందుకే విప్లవం సంభవించక ముందే సోషలిస్టు దేశంలో జాతుల సమస్య పరిష్కారం గురించి పార్టీలో చర్చ జరిగింది. ఐనప్పటికీ రష్యన్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసింది లెనిన్‌ నాయకత్వంలో ఉన్న పార్టీ, ప్రభుత్వమే కదా పెట్టింది. దాని అర్ధం మహా రష్యన్‌ దురహంకారానికి లెనిన్‌ లోనైనట్లా ? రిపబ్లిక్‌లకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్న లెనిన్‌ వైఖరిని కొందరు ఆమోదించకపోయినా మెజారిటీ అంగీకరించారు.1917 నవంబరు ఏడున రష్యన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడితే, స్వయం నిర్ణయాధికార అవకాశాన్ని వినియోగించుకొని అంతకు ముందు స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ఫిన్లండ్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటే లెనిన్‌ ఆమోదించాల్సి వచ్చింది. దీని మీద భిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి, తరువాత కూడా అలాంటి అవకాశం కల్పించినా మరొకటేదీ విడిపోలేదు. స్టాలిన్‌ కాలం నుంచి అనుసరించిన ఆధిపత్య విధానాలు 1991లో వేరుపడి పోవటానికి ఒక ముఖ్యకారణం అని రంగనాయకమ్మ చేసిన సూత్రీకరణకు స్టాలిన్‌ పట్ల గుడ్డి వ్యతిరేకత తప్ప తర్కబద్దత కనిపించదు. అమెరికా ఇతర శక్తుల కుట్రలను గుర్తించేందుకు నిరాకరించటమే. ఆమెతో సహా కొందరు చెప్పే స్టాలిన్‌ ఆధిపత్యానికి తలొగ్గి రిపబ్లిక్కులు విధిలేక కలసి ఉన్నాయనుకుందాం, స్టాలిన్‌ 1953లో మరణించిన తరువాత ఎక్కడి నుంచీ స్వయం నిర్ణయాధికార కాంక్ష లేదా డిమాండ్‌ ఎందుకు తలెత్తలేదు. రిపబ్లిక్కులకు అసమాన అధికారాలు ఉంటే మన దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమస్య మాదిరి అక్కడ కూడా తలెత్తి ఉండేవి.లెనిన్‌ వ్యతిరేకించిన లేదా స్టాలిన్‌ అమలు పరచిన విధానాలు అనే పదప్రయోగాలు కూడా తప్పే. అవేవీ ఏకపక్షమైనవి కాదు, తప్పయినా ఒప్పయినా పార్టీ తీసుకున్న వైఖరిని అమలు చేశారు. తప్పనుకుంటే గుణపాఠాలు తీసుకోవచ్చు, అభిప్రాయాలు వెల్లడించవచ్చు. రంగనాయకమ్మకు ఆ స్వేచ్చ ఉంది. ఆమె ఆలోచనా బడిలొ చదువుకుంటున్నవారికి, అనుసరిస్తున్నవారికి అవే తిరుగులేనివిగా అనిపించవచ్చు, ఇతరులు విబేధించవచ్చు.


ఇక ” ఉక్రెయిన్‌ ముందుగా దాడి చేయనపుడు రష్యాకు ఆత్మరక్షణ ప్రశ్న ఏమిటి ” అని రంగనాయకమ్మ అడుగుతున్నారు. ఇది అమాయకత్వమో లేక కొందరి టీకా తాత్పర్యాల ప్రభావమో తెలియదు. అసలు రష్యా ఆ మాట ఎక్కడ చెప్పింది ? చెప్పలేదు, కనుక ఇతరులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఏమిటి ? ” ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత….అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీతో సంబంధాలు పెట్టుకుంది ” అన్నారు. ఇది వాస్తవ విరుద్దం. ఒక స్వతంత్ర దేశంగా ప్రతిదేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటం వేరు, ఒక దేశం లేదా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి వైపు మొగ్గి ఇతర సంబంధాలు పెట్టుకోవటం వేరు. 2013లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ ఒక ప్రకటన చేశాడు. ఐరోపా యూనియన్‌తో ఆర్ధిక అనుసంధాన ఒప్పందానికి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత ఆర్ధికం పేరుతో సంబంధాలు, తరువాత నాటోలో చేర్చుకోవాలని తద్వారా రష్యా ముంగిటకు తమ సేనలను చేర్చాలన్నది అమెరికా పధకం. దానికి ఎదురుదెబ్బ తగలటంతో సిఐఏ రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలతో ప్రదర్శనలు చేయించి తిరుగుబాటును రెచ్చగొట్టింది. ఎనుకోవిచ్‌ రష్యాలో తలదాచుకున్నాడు. తరువాత ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అసలు సమస్య ఇక్కడినుంచే ప్రారంభం కాగా స్వతంత్రదేశంగా ఏర్పడిన వెంటనే అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకున్నదని రాయటం వక్రీకరణ కాదా ?


” రెండవ ప్రపంచ యుద్దం తరువాత నుంచీ ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో అమెరికాకి రష్యా ప్రధాన పోటీదారు.అందుకే అమెరికా, రష్యాలను అగ్రరాజ్యాలు అంటారు ఇతర దేశాల వారు. అసలు అనవలసింది రెండూ పెద్ద బందిపోటు ముఠాలు అని….” ఇది రంగనాయకమ్మ వంటి సీనియర్‌ కలం నుంచి వెలువడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాధమిక అంశాలను కూడా విస్మరిస్తే అమెకు ఉన్న పేరును బట్టి చదువరులు నిజమే అని భావించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం ఉంది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఉంది. దానిలో రష్యాతో సహా 15 రిపబ్లిక్కులున్నాయి.1991 వరకు అదే కొనసాగింది. సోవియట్‌ ప్రపంచ పెత్తనం కోసం చూసిందని అమెరికా కూటమి, దాన్ని అనుసరించే వారు చేసిన ప్రచారాన్ని రంగనాయకమ్మ కూడా వంటపట్టించుకున్నారా ? మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తరువాత అంతకు ముందు చేసిన తన రచనల్లో కొన్ని పదాలను సవరించారు. కానీ సోవియట్‌ గురించి పూర్వపు వైఖరితోనే ఉన్నట్లున్నారు. లేకపోతే అమెరికాతో అంటగట్టి రెండూ ఒకటే అనటం ఏమిటి ? అమెరికా పెత్తనానికి, దుర్మార్గాలకు బలైన కొరియా, వియత్నాం, ఇరాక్‌, లిబియా, సిరియా వంటి ఉదంతాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదేశమైనా అమెరికాను ఆహ్వానించిందా, ఏకపక్ష దాడులకు గురయ్యాయా ?అటువంటి చరిత్ర సోవియట్‌ లేదా దాని తరువాత రష్యాకు గానీ ఉందా ? ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ ఎందుకు జోక్యం చేసుకుందో రంగనాయకమ్మకు తెలీదనుకోవాలా లేక అమెరికా దాడులకు దీనికి తేడా లేదని అనుకుంటున్నారా ? ఆఫ్ఘన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా చేసిన కుట్రల్లో భాగంగా తాలిబాన్లను తయారు చేసి ఉసిగొల్పారు. వారి నుంచి రక్షణకు ఆ ప్రభుత్వం సోవియట్‌ సాయం కోరింది.


శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు యుద్దం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ చెప్పిన అంశాలు ఆ దృక్పధాన్ని ప్రతిబింబించలేదు. రష్యా పెట్టుబడిదారీ దేశమే, అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు. గత మూడు దశాబ్దాల్లో రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్యకు పూనుకుంది. ప్రపంచాధిపత్యం కోసం పూనుకున్న అమెరికా కుట్రలను ఎదిరించేందుకు ఒక పెట్టుబడిదారీ దేశంగా రష్యా లేదా మరొకటి ముందుకు వస్తే శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు ఎదిరించిన వారిని బలపరచాలి. మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీతో లెనిన్‌ బ్రెస్ట్‌-లిటోవస్క్‌ సంధి కుదుర్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో స్టాలిన్‌ ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోంది. కనుక దాన్ని ఎదుర్కొనేవారిని బలపరచాలి. వర్తమాన ఉదంతంలో ఐరాసలో చైనా తటస్ధ వైఖరిని తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, గోధుమల వంటి వాటిని దిగుమతి చేసుకుంటోంది. రంగనాయకమ్మగారు వర్ణించినట్లు ” ఒక బందిపోటు ”ను చైనా సమర్ధిస్తున్నట్లుగా అనుకోవాలా, అమెరికాతో పోరాడేశక్తికి తోడ్పాటు ఇస్తున్నట్లుగా భావించాలా ? ఆమె కళ్లతో చూస్తే అమెరికా బందిపోట్లతో 50 సంవత్సరాల క్రితం సోషలిస్టు చైనా ఒప్పందం చేసుకుంది.దానిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించింది. దాని వలన చైనా శ్రామికులకు మేలు జరిగినట్లా కీడు జరిగిందా ? దీనికి ఏ భాష్యం చెబుతారు. అదే విధంగా రష్యాతోనూ ఒప్పందాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీని అర్ధం రెండు పెద్ద బందిపోటు దేశాలతో చైనా చేతులు కలిపినట్లా ?


తన ప్రధాన పోటీదారైన అమెరికా అడుగుజాడల్లోనే నడుస్తోందనే కారణంతోనే ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణకు పాల్పడిందని రంగనాయకమ్మ చెప్పారు. తన వర్గం ఏదో మరచిపోయి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, వ్యవసాయ కార్మికుడు తమ యజమానులవైపు కొమ్ముకాస్తే పర్యవసానాలను అనుభవించకతప్పదు. అదే ఇక్కడా వర్తిస్తుంది. ఐరోపాలో ఉక్రెయిను కంటే అనేక చిన్న దేశాలు అదే పని చేస్తున్నాయి, మరి వాటి మీద ఎందుకు దాడికి దిగలేదు ? యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల గురించి ప్రస్తావించారు, అవి జరిగే కారణాలు వేరు, అవన్నీ విముక్తి మార్గ బాటలో ఉన్నట్లు భావిస్తున్నారా ? గతంలో అమెరికా, అనేక ఐరోపా దేశాల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున జరిగాయి. వాటికీ విముక్తికీ ముడిపెట్టటం ఏమిటి ?


ఇక శ్రామికవర్గ చైతన్యం గురించి, ఐరాస గురించి చెప్పిందానితో విబేధించాల్సిందేమీ లేదు.తాను శ్రామికవర్గ పక్షపాతినని ఆమె పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే, పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు మార్క్సిజాన్ని ఔపోసన పట్టినట్లు కనిపించే రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె రచనలను అనుసరించేవారు తర్కబద్దంగా ఆలోచించి సరైనవో కాదో నిర్ధారించుకోవాలి.

దడ పుట్టిస్తున్న చమురు ధరలు – నరేంద్రమోడీ జనం గురించి పట్టించుకుంటారా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు మరో మెట్టు ఎక్కాయి. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం పీపా ధర 116.94 డాలర్లను తాకింది. వ్యూహాత్మక నిల్వల నుంచి 60మిలియన్ల పీపాల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని అంతర్జాతీ ఇంధన సంస్ధ(ఐఇఏ) మంత్రుల సమావేశం ప్రకటించిన తరువాత కూడా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఈ మొత్తంలో తాము 30మిలియన్ల పీపాలు విడుదల చేస్తామని అమెరికా పేర్కొన్నది. అరవై మిలియన్ల పీపాలు ఐఇఏలోని 31 దేశాల నిల్వల్లో నాలుగుశాతం. ఈ దేశాల్లో 1.5బిలియన్ల పీపాలు ఉంటే ఒక్క అమెరికాలోనే 600మి. పీపాలుంది. మార్కెట్‌ ఇబ్బందుల్లో పడిన ప్రతికూల సందేశాన్ని సందేశాన్ని ఈ నిర్ణయం పంపిందని, అరవై మిలియన్లన్నది చమురు పీపాలో ఒకబొట్టు వంటిదని, ప్రపంచంలో ఒక రోజుకు అవసరమైన 100మి. పీపాల గిరాకీ కంటే తక్కువంటూ ఇది చమురు ధరలపై ప్రభావం ఎలా చూపుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల కారణంగా మార్కెట్లోకి రష్యానుంచి రోజుకు ఏడు మిలియన్‌ పీపాల సరఫరా నిలిచిపోనుంది. ఆంక్షలున్నప్పటికీ తమ కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. గోధుమల దిగుమతులపై గతంలో ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో నిమిత్తం లేకుండానే అమెరికాలో నాలుగుదశాబ్దాల రికార్డు స్ధాయిలో 7.5శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇప్పుడు చమురు ధరల పెరుగుదల తోడైంది. కొందరి అంచనా ప్రకారం 125 డాలర్లకు పెరిగితే అమెరికా ఏకంగా మాంద్యంలోకి దిగజారుతుంది. ఐరోపా దేశాలకు చమురు, గాస్‌ అవసరం కనుక రష్యా నుంచి వాటి ఎగుమతులపై ఆంక్షలను మినహాయించారు, లేనట్లయితే ఐరోపాలో మరోరకం సంక్షోభం తలెత్తి ఉండేది.ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలను విధించినట్లయితే తనకు మరింత నష్టమైనా రష్యా చమురు, గాస్‌ నిలిపివేత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే స్విఫ్ట్‌( అంతర్జాతీయ బాంకు లావాదేవీల వ్యవస్ధ) నుంచి ఏడు రష్యన్‌ బాంకులకు ఆంక్షల నుంచి పశ్చిమ దేశాలు మినహాయింపునిచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదం వలన ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీసి అమెరికా ఆర్ధిక పురోగతి, పౌరుల ఖర్చు తగ్గేందుకు దారి తీస్తుందని రిచ్‌మండ్‌ ఫెడరల్‌ రిజర్వు అధ్యక్షుడు టామ్‌ బార్కింగ్‌ హెచ్చరించాడు.ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సగటున చమురు ధరలు వంద డాలర్లు ఉంటే అమెరికా ఆర్ధిక రంగం ఆరునెలల పాటు నిభాయించుకోగలదని, 125 డాలర్లకు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందని, వృద్ధి ఆగుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జో బైడెన్‌ సైతం ఉక్రెయిన్‌ వివాదానికి అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చని చెప్పిన అంశం తెలిసిందే.ఐరోపాలో గాస్‌ ధరలు 60శాతం పెరిగాయి. చలికాలంలో మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రష్యాకు వెసులుబాటు కల్పించేందుకు ఇరు దేశాల మధ్య తమ కరెన్సీలో చెల్లింపులకు చైనా ఏర్పాట్లు చేసింది.ఈ అనుభవం భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్పిడి కరెన్సీగా డాలర్‌ను పక్కకు నెట్టేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌ చెల్లింపులు 40శాతం ఉండగా చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌) రెండుశాతం జరుగుతున్నాయి.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో ముడి చమురు పీపా ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మార్చి నెలాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంపై పెరిగిన చమురు ధరలు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెట్రోలు, డీజిలుపై సెస్‌లను ఐదు, పది చొప్పున తగ్గించటంతో పాటు నవంబరు నాలుగవ తేదీ నుంచి వాటి ధరలను స్ధంభింప చేశారు.ఈ నెల ఏడవ తేదీన చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత నుంచి చమురు ధరలు పెరగటం ఖాయం. రానున్న రోజుల్లో జిడిపి వృద్ధి తగ్గటంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంకి పెళ్లి సుబ్చి చావుకు వచ్చిందన్నట్లుగా ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో మనకు ప్రమేయం లేనప్పటికీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తోంది. మన దిగుమతుల బిల్లు తడిచి మోపెడు అవుతోంది.దీంతో మన కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. ముడిచమురు, ఎరువులు, ఖాద్య, ఖనిజతైలాలు, ఇతర దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల బిల్లు 2022లో 600బి. డాలర్లు దాటవచ్చని అంచనా. తక్షణం ద్రవ్యోల్బణం, దానితో పాటు వచ్చే ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం జరగవచ్చు. ఒక పీపా ధర ఐదు డాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతాలోటు 6.6బి.డాలర్లు పెరుగుతుంది. ముడి చమురు ధర 105 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటి అంచనాల ప్రకారం మార్చి ఎనిమిది తరువాత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలను పది రూపాయల వరకు పెంచవచ్చని అంచనా. ఇప్పుడు 117 డాలర్ల వరకు తాకింది. ఇది ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మన ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరునెలల పాటు చమురు ధరలు వంద డాలర్లకు ఎగువనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా దేశ ప్రగతి నిస్తేజంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విశ్లేషకులు చెప్పారు.


జాతీయ గణాంకాల సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) 2021-22లో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరంలోని 7.3శాతం తిరోగమనాన్ని అధిగమించి 9.2శాతం పురోగమనం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా తొమ్మిది నెలల తరువాత దాన్ని8.9శాతానికి తగ్గించింది. తొలి మూడు మాసాల్లో 20.3 శాతంవృద్ధి కాస్తా రెండవ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గింది.తదుపరి మూడు నెలల్లో 5.4శాతంగా ఉందని అంచనా వేశారు. చమురు ధరల పెరుగుదల గణనీయంగా ఉన్న జనవరి-మార్చి నెలల గణాంకాలు వెల్లడైతే స్పష్టమైన అంచనాలు తెలుస్తాయి. ఈ వృద్ధి కూడా గతేడాది తగ్గిన దాని ప్రాతిపదికన చెబుతున్న లెక్క కనుక వాస్తవ వృద్ధి రేటు అంత ఉండదు. అందుకే గతంలో ఉన్న జిడిపి స్దాయికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచినప్పటికీ వృద్ది రేటు ఆందోళనకరంగా ఉంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగేట్లయితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మరొక సమస్యకు దారి తీస్తుంది.


వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ప్రాతిపదికన ద్రవ్యోల్బణం ఆరుశాతం వరకు మనం భరించగలమని రిజర్వుబాంకు అన్నది. అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయని సిద్దంకమ్మని జనానికి చెప్పింది.డిసెంబరులో 5.59శాతం ఉన్నది జనవరిలో 6.01శాతానికి పెరిగింది. ఇదే తరుణంలో టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 13శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక కూడా పదినెలల కనిష్టానికి పడిపోయింది. మన దేశంలో ప్రయివేటు వినియోగం 55శాతం ఉంది. ఇది కరోనాకు ముందున్న స్దాయికంటే తక్కువే. కరోనా మహమ్మారి జనాల పొదుపు మొత్తాలను, గణనీయంగా వేతనాలను హరించివేసినందున వినియోగం బలహీనంగా ఉంది. పులిమీద పుట్రలా దీనికి ఉక్రెయిన్‌ వివాదం మరింత ముప్పు తెచ్చింది. జనంపై పెరిగే భారాల గురించి ఏం చేద్దామన్న అంశాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకున్నారని గానీ, సమీక్షలు జరిపినట్లుగా ఎక్కడా వార్తలు లేవు. చేతులు కాలిన తరువాత ఆకలు పట్టుకున్నట్లు ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన మన విద్యార్దుల గురించి ఎక్కడలేని శ్రద్ద చూపుతున్నట్లు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నారు, మంచిదే, ఇవాళా రేపట్లో అది కూడా పూర్తి అవుతుంది. తరువాతనైనా జనం గురించి పట్టించుకుంటారా ?చమురు ధరలు తగ్గితే ఆ మేరకు జనానికి ఉపశమనం కలిగించకుండా వందల రెట్లు పన్ను, సెస్‌లు పెంచి ఖజానా నింపుకొనేందుకు చూపిన వేగం ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భారం తగ్గించేందుకు కనపరచరేం ?