తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

ముందు ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లాల్సింది ఎవరు ? నిర్మలక్క, స్మృతక్క, కంగనక్క, సాధ్వులు, ప్రచారక్‌లా ? ఇతరులా !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” అరెస్టు స్వర భాస్కర్‌ ” ఇప్పుడు సామాజిక మాధ్యమంలో నడుస్తున్న మరుగుజ్జుదాడి. ఎందుకటా ! ఆ సినీ నటి తాలిబాన్ల భయానికి – హిందూత్వ భయానికి(టెర్రర్‌) పెద్ద తేడా లేదని తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఏకీభావం ఉంటే సరే లేకపోతే విభేదించవచ్చు, అభిప్రాయం చెప్పినంత మాత్రాన్నే ఆమెను అరెస్టు చేయాలనటం ఏ ప్రజాస్వామిక న్యాయం? ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది ఎవరు ? ఇంతకీ స్వర భాస్కర్‌ చెప్పిందేమిటి ? ” తాలిబాన్‌ భయంతో దిగ్భ్రాంతికి గురైనట్లు, సర్వనాశనం అయిందని అనుకుంటున్నారు అందరూ, హిందూత్వ భయాన్ని కూడా మనం అంగీకరించకూడదు. తాలిబాన్‌ భయంతో నీరుగారి పోకూడదు, హిందూత్వ భయం మీద అందరం ఆగ్రహించాలి. అణిచివేసిన మరియు అణచివేతకు గురైన వారెవరు అన్న ప్రాతిపదికన మన మానవత్వం మరియు నైతిక విలువలు ఉండకూడదు.” దీన్లో తప్పేముంది. అమెఎవరినీ పేరు పెట్టి కూడా విమర్శ చేయలేదు.


ఆమె మీద ప్రచారదాడికి దిగిన వారు అంటున్నదేమిటి ? తాలిబాన్‌ – హిందుత్వ రెండింటినీ ఒకేగాటన కట్టకూడదు. ఆ మాటే చెప్పండి. అరెస్టు చేయాలనటం ఏమిటి ? ఈ డిమాండ్‌ ఎందుకు వచ్చింది ?మహారాష్ట్రలో బిజెపికి చెందిన ఒక లాయర్‌గారు ఆమె మీద పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. మతం పేరుతో జనాల్లో శత్రుత్వాన్ని పెంచుతున్నారు అన్నది ఆరోపణ. అంతవరకే పరిమితం కాలేదు. స్వరభాస్కర్‌ను అరెస్టు చేయాలనే హాషటాగ్‌తో సామాజిక మాధ్యమంలో ప్రచారానికి కూడా దిగారు. దాన్ని అందుకొని మిగతావారు తలా ఒకరాయి వేస్తున్నారు. ఎవరు వారంతా… బిజెపి వారే. స్వర భాస్కర్‌ మీద కాషాయ తాలిబాన్ల దాడి కొత్త కాదు. గతంలో ఇజ్రాయెల్‌ చర్యలను వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్ల నిరసనలకు ఆమె మద్దతు ప్రకటిస్తూ ఇజ్రాయెల్‌ను జాతివివక్ష దేశంగా వర్ణించారు. దానికి గాను ఆమెను తూలనాడుతూ దాడి చేశారు. ఇజ్రాయెల్‌ను ఆమె విమర్శిస్తే వారికి ఇబ్బంది ఏమిటి ? పెగాసెస్‌ ఉప్పు తిన్నందున కృతజ్ఞతగా ఇజ్రాయెల్‌ను పొగడండి, పూజించండి. ఎవరిష్టం వారిది. భగవద్గీతను కూడా అంత నిష్టగా, సంఘటిత పద్దతిలో పంచరు. హంతకుడు గాడ్సే నేనెందుకు గాంధీని చంపాను అంటూ కోర్టులో చేసిన వాదనను పుస్తకంగా ప్రచురించి పంచుతుంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఏది సరైనదో జనం నిర్ణయించుకుంటారు. ఏ దేశాన్ని ఎలా విమర్శించకూడదో మీరే నిర్ణయిస్తారా ? విమర్శకుల మీద దాడి ఫాసిస్టు లక్షణం తప్ప మరొకటి కాదు. ఇస్లామ్‌కు షరియత్‌ ఎలాగో హిందూ మతం అని చెప్పుకొనే వారికి మనుస్మృతి కూడా అలాంటిదే కదా ! మన రాజ్యాంగంలో మనుస్మృతి ప్రతిబింబించలేదని, దానికి అడ్డుపడింది అంబేద్కరే అనే విమర్శలు చేస్తున్నదెవరు ? మనువాద భావజాలం ఉన్నవారే కదా ! స్వర భాస్కర్‌ వంటి వారు చెబుతున్నది అదే కదా !


ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఆఫ్ఘన్‌ మహిళల ఉనికికే ముప్పు ముంచుకు వచ్చిందని సాంప్రదాయ, సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజమే, ఉగ్రవాదం అది మత లేదా మరొక ఉగ్రవాదం అయినా ముందు బలయ్యేది మహిళలే. భావజాలం రీత్యా, రాజకీయంగా వ్యతిరేకులైన మహిళానేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, కొన్ని పార్టీల వారి పేర్లతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని ఎద్దేవా చేస్తూ ఊరూ పేరూ లేకుండా కొందరు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక పోస్టులో ఇలా ఉంది.” సంధ్యక్క, దేవక్క, పుణ్యవతక్క, మలాలా,బర్ఖదత్‌, అమీర్‌ ఖాన్‌, జావేద్‌ అక్తర్‌, హమీద్‌ అన్సారీ, నసీరుద్దీన్‌ షా, దీపికా పడుకొనే, తమన్నా బాటిల్‌, మిర్చి దేశారు, రాజ్‌దీప్‌ సర్దేశాయి, దయచేసి ఆప్ఘాన్‌ ఆడపిల్లలను రక్షించండి. తక్షణమే మీ అవసరం వారికి ఉంది. మోడీ పెద్ద ఫాసిస్టు ….. ఆయన చేయలేరు. మీరే వెళ్లండి…. వారిని రక్షించండి. ఒవైసీ దయచేసి వారికి నేతృత్వం వహించండి. కావాలి అంటే దేశంలో పెద్ద యువకుడు కరాటే కుంగ్ఫు లాంటి విలువిద్యల్లో నైపుణ్యుడు రాహుల్‌ గాంధీని, పెళ్లికాని యువకురాలు, రెండు చేతులతో రాళ్లు రప్పలు సోడాలు విసరగల మమతా బేగాన్నీ సహాయకంగా తీసుకు వెళ్లండి. అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించండి. ఎలాగూ లాయర్‌ కప్ప చీబల్‌ ఉన్నాడు… మర్చి పోకండి పిల్లిజ్‌ ” అంటూ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాల మీద సామాజిక మాధ్యమంలో ఊరూ పేరు చెప్పుకొనేందుకు సిగ్గుపడే కొంత మంది పేరు లేకుండా ఒక పధకం ప్రకారం లౌకివాదులు, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారి మీద చేస్తున్న దాడి ఇది.


వారు వెళతారా లేదా అన్నది తరువాత చూద్దాం. ముందు వెళ్లాల్సిన వారు వెళ్లకుండా ఇతరుల మీద ఎదురుదాడికి దిగారు. కొంతమంది ప్రవచించే అఖండభారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఉందా లేదా ! అది ఉందని చెబుతూ మడికట్టుకున్నట్లు ప్రచారం చేసుకొనే ప్రచారక్‌లు, సాధ్వులు, సాధువులు, వారికి మద్దతు ఇస్తున్న కాషాయ దళాలు కదా ముందుగా ఆఫ్ఘన్‌ వెళ్లాల్సింది. ఒకనాడు అఖండభారత్‌లో భాగమై, ఇప్పుడు విడిగా ఉంటున్న దేశాలన్నీ( ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, చైనా-టిబెట్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌) ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే అని చెబుతున్నవారు కదా ముందుగా కదలాల్సింది ! అందులోనూ నిన్నటి వరకు ఉగ్రవాదుల మీద పోరు సలిపామని చెప్పుకొనే వారు ఇప్పుడు ఇతరులు వెళ్లాలని చెప్పటం ఏమిటి ?తాలిబాన్లు వచ్చారు కనుక మహిళలకు ముప్పు వచ్చిందని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలున్నాయి. వారితో ఒప్పందం చేసుకున్నది అమెరికా ! దాన్ని హర్షించింది నరేంద్రమోడీ సర్కార్‌ ! తాము మారినట్లు తాలిబాన్లు ఇప్పుడు చెబుతున్నారు తప్ప ఒప్పంద సమయంలో స్వయంగా వారు గానీ-అమెరికా వారు గానీ చెప్పలేదు. అయినా దాన్ని దాన్ని మనంఎందుకు హర్షించినట్లు ? (2020 ఫిబ్రవరి 29, హిందూ పత్రిక) ఏమాత్రమైనా బాధ్యత ఉందా ? అమెరికా వాడు ఏది చేస్తే అదే కరెక్టు అనే గుడ్డి అనుసరణ కాదా ? దోహాలో జరిగిన సంతకాల కార్యక్రమానికి కతార్‌ ప్రభుత్వం మనలను ఆహ్వానించగానే మనం ఎందుకు హాజరు కావాలి? రాజుగారు నందంటే నంది పందంటే పంది అనాలన్నట్లుగా ఉగ్రవాదులుగా ప్రకటించిన తాలిబాన్లతో అమెరికా వాడు ఒప్పందం చేసుకోవటం ఏమిటి ? వారి మీద పోరాడుతున్నట్లు చెప్పుకున్న మనం దాన్ని హర్షించటం ఏమిటి ? మనకు ఒక స్వతంత్ర వైఖరి లేదా ? అమెరికాతో పాటు మనమూ తాలిబాన్లు ఉగ్రవాదులు కాదని చెప్పినట్లే కదా ? మరి ఇప్పుడు బిజెపి మద్దతుదార్లు తాలిబాన్ల గురించి గుండెలు బాదుకోవటం నటన తప్ప నిజాయితీ ఉందా ? ఏకత, శీలము ఉన్నవారు చేయాల్సిన పనేనా ?


ఈ ఒప్పందానికి ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ మధ్య భేటీ జరిగింది. ఆ తరువాతే తాలిబాన్‌ ఉగ్రవాదులతో ప్రజాస్వామ్య అమెరికా చేసుకున్న ప్రయివేటు ఒప్పంద సమయంలో మనం సాక్షులుగా దోహా సమావేశంలో పాల్గొన్నాం. ఆ సందర్భంగా మనకు వినిపించిన కహానీలను 2020 ఫిబ్రవరి 29వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ కథనంలో చూడవచ్చు. ఏమిటటా ! పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరిన కోరికలు వ్యక్తిగత స్ధాయిలో ఏవగింపు కలిగించినా ఆఫ్ఘనిస్తాన్‌లో తమ లక్ష్యాల సాధనకు అతనితో మాట్లాడాల్సి వచ్చిందని అమెరికా మనకు చెప్పిందట.పాకిస్తాన్‌ తమకు నమ్మదగిన మిత్రుడు కాదని కూడా చెప్పారట. అలా అయితే సరే అని మనం అన్నామట. గత 19 సంవత్సరాలుగా మనం సాధించిన ఆఫ్ఘన్‌ రాజ్యాంగం, మహిళల, మైనారిటీల హక్కులు, ఆఫ్‌ఘన్‌ రక్షణ దళాలను నష్టపోకూడదనే అంశం గమనంలో ఉంచుకోవాలని కూడా అమెరికాకు చెప్పామట. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే బాణాకర్రను (బిక్‌ స్టిక్‌) ప్రయోగించే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటామని అమెరికా మనకు చెప్పిందట. అమెరికా-తాలిబాన్ల మధ్య అవగాహనలో పాకిస్తాన్‌ కీలకపాత్రధారి అని ప్రపంచానికి కంతటికీ తెలిసినప్పటికీ మనకు ఇలాంటి లీకు కథలను వినిపించారు.


తీరా జరిగిందేమిటి ? గడువు కంటే ముందే బతుకు జీవుడా అంటూ అమెరికన్లు పారిపోయారు.తమకు సహకరించిన వారి రక్షణకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆప్ఘన్‌ సైన్యం చేతులెత్తేసి లొంగిపోయింది. రాజ్యాంగమూ లేదు పాడూ లేదు. తాలిబాన్లు చెప్పిందే వేదం. మహిళలకు రక్షణ లేకపోయిందని మన పరివార్‌ దళాలే చెబుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే అమెరికా బాణా కర్ర ప్రయోగం ఏమైనట్లు ? మనం ఎందుకు అడగలేకపోతున్నాము. నరేంద్రమోడీ నోరు మెదపటం లేదేం? ఆగస్టుమాసం అంతా భద్రతా మండలి అధ్యక్ష స్ధానం మనదేగా, అక్కడ మానవ హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు, దానికి చొరవ ఏమిటి ? అది చేతగాక మలాలా,సంధ్యక్క, దేవక్క, పుణ్యక్క ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని అడుగుతున్నారు. నిజానికి అఖండ భారత్‌లో ఎప్పటికైనా అంతర్భాగం చేస్తామని చెబుతున్న ఆఫ్ఘానిస్తాన్‌కు ముందుగా వెళ్లాల్సింది ఎవరు ? అక్కడి తోటి మహిళలను కాపాడే బాధ్యత నిర్మలక్క, స్మృతక్క, మీనాక్షక్క, కంగనక్క, శాపాలశక్తి గలిగిన సాధ్వీమణులకు లేదా ?


తాలిబాన్ల వెనుక చైనా ఉన్నదని పెద్ద ఎత్తున చెబుతున్నారు, రాస్తున్నారు ? మీడియా వంటవారికి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ? అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నపుడు, దాన్ని మనం హర్షించినపుడు గానీ ఎవరైనా తాలిబాన్ల వెనుక చైనా ఉంది అని చెప్పిన వారున్నారా ? ఎందుకు చెప్పలేదు ?తోటి ముస్లిం దేశంలో జనాన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇతర ముస్లిం దేశాలు, వాటి మిత్ర దేశం చైనా ఎందుకు జోక్యం చేసుకోవు, అక్కడి శరణార్ధులకు ఆశ్రయం ఎందుకు కల్పించవు అంటూ ఒక ప్రచారం. మరికొందరైతే ఇంకొంచెం ముందుకు పోయారు. ఇప్పటి వరకు ముస్లిం దేశాల్లో పరిస్ధితులు బాగోలేనపుడు శరణార్ధులుగా వచ్చిన వారందరినీ పశ్చిమ దేశాల వారే ఆదరించారు. అయితే సదరు ముస్లింలందరూ అక్కడ తమ జనాభాను పెంచి వేసినందున ఇప్పుడు ఆయా దేశాల వారందరూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం మొత్తాన్ని ముస్లింలతో నింపటానికి వేసిన ఒక పధకం కనుక ఇతర దేశాల వారెవరూ వారిని అనుమతించటం లేదన్నది మరొక ప్రచారం. ఇలాంటి ప్రచారాలకు ప్రాతిపదికలు, వాస్తవాలతో నిమిత్తం లేదు. మన దేశాన్ని కూడా ముస్లింలతో నింపి వేయటానికి కుటుంబ నియంత్రణ పాటించటం లేదనే ప్రచారం తెలిసిందే.


ఆఫ్ఘనిస్తాన్‌లో 1978లో కొంత మంది అభ్యుదయ వాదులు అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నాటి సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ గుర్తించింది. అప్పుడు అక్కడ జనమూ ముస్లింలే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారూ ముస్లింలే. ఆ ప్రభుత్వానికిి వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వారే కదా ! తొలుత ముజాహిదీన్లు, తరువాత తాలిబాన్లకు మద్దతు, ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది ఎవరు ? ఒసామా బిన్‌ లాడెన్‌ను తయారు చేసింది ఎవరు ? వారు ఏకు మేకైన తరువాత అక్కడికి సైన్యాన్ని పంపి దాడులకు రెండు నుంచి మూడులక్షల కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు ? పునర్‌నిర్మాణం చేస్తున్నామని చెప్పింది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వారితో స్నేహం చేసిన మన దేశమే కదా ? ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలేవీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు, తమ సైన్యాన్ని పంపలేదు, దాడులకు దిగలేదు. పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పలేదు, పెట్టుబడులూ పెట్టలేదు. చేసిందంతా అమెరికా, దాని మిత్రులుగా ఉన్న నాటో దేశాల వారైతే ముస్లిం దేశాలు ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇవ్వరెందుకంటూ అతి తెలివి ప్రదర్శనలెందుకు ? ఇప్పటి వరకు ఎంత మంది అలా శరణు కోరారు ? అంటే ఏది చెప్పినా బుర్ర ఉపయోగించకుండా వినే జనాలుంటారన్న చిన్న చూపా ? మానవత్వం మాయమై మతోన్మాదం పెరిగిపోయిన ప్రతి వారికి ప్రతిదానిలో అదే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మత ప్రాతిపదికన శరణార్ధులను ఆదుకున్న దేశాలు ఉన్నాయా ?


ఈ ప్రచారం చేస్తున్న వారే చైనా గురించి చెబుతున్నదేమిటి ? ఆప్ఘన్‌ సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రమైన గ్జిన్‌గియాంగ్‌లో ముస్లింలను ప్రభుత్వం ఊచకోతకు గురి చేస్తుంటే ముస్లిం దేశాలు చైనాను ఖండించవు, దానితో లావాదేవీలను ఎందుకు నిలిపివేయవు అని ప్రచారం చేశాయి. ఇప్పుడు తాలిబాన్లకు-చైనాకు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ? అదే తాలిబాన్లు, అమెరికా ఇతర దేశాల మద్దతు ఉన్న ఉఘిర్‌ ముస్లిం తెగకు చెందిన కొందరు చైనాలో ఉగ్రవాద, విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడుతూ ఆప్ఘన్‌ గడ్డ మీద ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా వెళ్లిపోయిన తరువాత మరొక దేశానికి వ్యతిరేకంగా తమ గడ్డను ఉపయోగించుకొనే శక్తులకు తాము తావివ్వబోమని తాలిబాన్లు రష్యాతో చెప్పారు. చైనాతో చర్చల సమయంలో ఇక ముందు తాము ఉఘిర్‌ తీవ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వబోమని చెప్పారు. అయితే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గుర్తింపు గురించి నిర్ణయిస్తామని చెనా చెప్పింది. తాలిబాన్లు తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా, ఉల్లంఘిస్తారా ? అప్పుడు చైనా ఏం చేస్తుంది అన్నది ఊహాజనిత ప్రశ్న. తాలిబాన్లు ఉగ్రవాదులా మరొకటా ఏమిటన్నది ఒక సమస్య. ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరైనా దానికి గుర్తింపు వేరే అంశం. మన పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు చేసి అక్కడి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని చేపట్టింది. ఆ కారణంతో ఏ దేశమైనా వారితో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుందా ? మిలిటరీ చర్య సరైనదే అని సర్టిఫికెట్లు ఇచ్చాయా ? అంతెందుకు, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గోద్రా ఉదంతం అనంతర జరిగిన మారణకాండకు కారకుడంటూ అమెరికా సందర్శనకు అక్కడి ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక ఆపని చేయగలిగింది. అదే అమెరికా ప్రభుత్వం ప్రధాని అయిన తరువాత నరేంద్రమోడీపై చేసిన విమర్శను వెనక్కి తీసుకోకుండానే ఎర్రతివాచీ స్వాగతం పలికిందా లేదా ?

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. అలాంటపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అయినా సిపిఎం అయినా మారకుండా ఎలా ఉంటుంది. తన వైఖరిలో మార్పును ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించుకున్నపుడు, సిపిఎం వైఖరిలో మార్పు మీద వ్యాఖ్యాతలకు అంత ఉక్రోషం ఎందుకు ? మార్పు సరైనదిగాక పోతే విమర్శించవచ్చు. అది ఎవరికైనా ఉన్న హక్కు. సంఘపరివార్‌ దాని సోదర సంస్ధలు జమాతే ఇస్లామీ, ముస్లింలీగ్‌, మజ్లిస్‌ వంటివి మతాన్ని ఇంటికి పరిమితం చేసి ఆరోగ్యకర రాజకీయాల్లో పాల్గొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాంటి పార్టీలు సరైన వైఖరి తీసుకోమనే ఎవరైనా చెప్పేది. అదే సూత్రంతో కమ్యూనిస్టులకూడా తప్పు చేస్తున్నారని ఎవరికైనా అనిపిస్తే వారికీ అలాంటి సలహా ఇవ్వవచ్చు. ఏ సంస్ధలు, పార్టీలు ఏం మార్చుకుంటాయి, ఏం మార్చుకోవు అన్నదాని మీద నిరంతరం చర్చ, విమర్శలు చేసేందుకు ఎవరికైనా హక్కుంది.” జాతీయ జెండా ఆవిష్కరణ అంశం : గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ” అనే శీర్షికతో ఆ సంస్ద తీరుతెన్నుల గురించి చర్చించాము. దిగువ లింకులో దాన్ని చదవవచ్చు. ఇప్పుడు సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పు, కారణాల గురించి చూద్దాం.


స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషి, భారత్‌ అన్న భావనను పటిష్టపరచటం, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారితో ఆర్‌ఎస్‌ఎస్‌ కుమ్మక్కు, వర్తమానంలో రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివరించాలని, వివిధ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు ఆగస్టు తొమ్మిదిన సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపటం, జాతీయ జెండాను ఎగురవేయటమే దేశభక్తికి నిదర్శనం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అధికారిక సంస్దలు స్వాతంత్య్రదినం, రిపబ్లిక్‌ దినోత్సవం, గాంధీ జయంతి రోజులలో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే నిబంధనలు ఉన్నాయి తప్ప ప్రయివేటు సంస్ధలు, పార్టీలు విధిగా జరపాలని, జాతీయ జెండాలను ఎగురవేయాలనే అంశం రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు కొత్తగా మారిందేమీ లేదు. స్వాతంత్య్రదినోత్సవం జరుపుకోవటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు, బలవంతం ఏమీ లేదు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు జండా నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది కనుకనే అది అవాస్తవం చెబుతోందని,పైన చెప్పిన మూడు రోజుల్లో ఎవరైనా ఆపని చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలను పేర్కొనాల్సి వచ్చింది. కానీ ఎన్నడూ కమ్యూనిస్టులు అలాంటి నిబంధనల కుంటి సాకులు చెప్పలేదు. సిపిఎం నిర్ణయాన్ని కొందరు 75 సంవత్సరాల్లో తొలిసారి అని శీర్షికలు పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. సిపిఎం ఏర్పడిందే 1964లో అంటే 57 సంవత్సరాల క్రితం ఏర్పడింది. రాయి వేసేవారికి ఈ చిన్న విషయం కూడా తెలియదంటే ఏమనుకోవాలి. ఇది చిన్న విషయం వదిలివేద్దాం.


కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం వారు తమ కార్యాలయాల మీద జాతీయ జెండాలను ఎగురవేసి ఉత్సవాలు జరపలేదుగాని ముఖ్యమంత్రులుగా లేదా స్ధానిక సంస్థల అధిపతులుగా ఎన్నికైన సందర్భాలలో రాజ్యాంగవిధిగా దాన్ని పాటించారు, పాటిస్తున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినప్పటి నుంచీ సిపిఐ జాతీయ జెండాలను ఎగురవేస్తూ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుతున్నది. సిపిఎం నుంచి విడిపోయి సాయుధ పోరాటం పేరుతో రహస్యంగా పని చేస్తున్న కమ్యూనిస్టు గ్రూపుల వారు అసలు స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్నే గుర్తించటం లేదు గనుకు వారు ఎగురవేసే సమస్యే ఉత్పన్నం కాదు. తరువాత పలు ముక్కలై తమదే అసలైన కమ్యూనిస్టు పార్టీ అని ప్రకటించుకున్న వివిధ బృందాలలో కొన్ని రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పాల్గొంటున్నా జండా పండగలకు దూరంగా ఉంటున్నాయి.


స్వాతంత్య్రానికి ముందే తెలంగాణాలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించారు. వచ్చిన తరువాత నిజాం బదులు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మిలిటరీని పంపి కమ్యూనిస్టులను అణచివేసిన చరిత్ర తెలిసిందే. ఆ నేపధ్యం, దానితో పాటు దేశ రాజ్యాంగం స్వాతంత్య్ర ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణ్యంగా లేదనే వైఖరి కారణంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కమ్యూనిస్టుల్లో ఉంది. స్వాతంత్య్రం ఒక మేడి పండు అన్నట్లుగా భావించారు. అంతే తప్ప తాము స్వాతంత్య్రాన్ని, జాతీయ పతాకాన్ని గుర్తించటం లేదని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎక్కడా చెప్పలేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి జండా గురించి రచ్చచేసిన దాఖలాలు అంతకంటే లేవు. సిపిఎం నుంచి విడిపోయిన తరువాత రాజ్యాంగాన్ని గుర్తించని నక్సల్‌ గ్రూపులు చెప్పిన అంశాలకు, భాష్యాలకు సిపిఎంకు సంబంధం ఉండదు. రాజ్యాంగాన్ని గుర్తించి దానికి అనుగుణ్యంగా తొలి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పాల్గొన్నది, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికయింది. మరి ఇప్పుడు ఎందుకు ఎగురవేయాలని సిపిఎం నిర్ణయించింది అనే ప్రశ్న వస్తుంది.


కమ్యూనిస్టు సిద్దాంతం ఒక దేశానికి పరిమితమైంది కాదు. అందువలన దాన్ని పాటించిన వివిధ కమ్యూనిస్టు పార్టీలు వివిధ సమస్యల పట్ల ఎప్పుడు ఎలాంటి వైఖరులు తీసుకున్నాయో అర్ధం చేసుకుంటే తప్ప వాటిలో వచ్చిన మార్పులు తలకు ఎక్కవు. మార్క్సిజం-లెనినిజం అనే సిద్దాంతాలు గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు, వేదాల్లో, ఉపనిషత్తులో, మనుస్మృతి, ఫలానా పురాణం లేదా బైబిల్‌, ఖురాన్‌లలో ఫలాన చోట ఫలానా విధంగా చెప్పబడింది, అవి అంతే అన్నట్లుగా కమ్యూనిస్టు సిద్దాంతం పిడివాదం కాదు. అది ఒక పురోగామి శాస్త్రం. అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా మార్పులు జరుగుతాయి. అదే విధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా మూసపోసినట్లుగా పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లుగా పని చేయవు.


పొరుగునే ఉన్న చైనా, ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీల చరిత్రను చదివిన వారికి అర్ధం అవుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను ఓడించేందుకు సోవియట్‌ యూనియన్‌తో బ్రిటన్‌ చేతులు కలిపింది. సోవియట్‌ బలపడాలనే అభిప్రాయంతో భారత కమ్యూనిస్టులు ఆ రోజుల్లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఇచ్చిన క్విట్‌ ఇండియా పిలుపుకు దూరంగా ఉన్నారు. తరువాత కాలంలో అలా వ్యవహరించటం తప్పని గుణపాఠం నేర్చుకున్నారు. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినట్లు ? బ్రిటీష్‌ వారికి సహకరిస్తామని ఎందుకు చెప్పినట్లు ? కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి దూరంగా ఉంది తప్ప పాల్గొన్నవారిని తప్పు పట్టలేదు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ వారికి తోడ్పడలేదు. అలాంటి ఉదాహరణలు ఉంటే ఎవరైనా చూపవచ్చు.


ఇన్ని దశాబ్దాలుగా స్వాతంత్య్ర దినం పాటించని కమ్యూనిస్టులు ఎందుకు వైఖరి మార్చుకున్నారు ? పరిస్ధితులే వారిని అలా మారేందుకు పురికొల్పాయి. చైనాలో కొమింటాంగ్‌ పార్టీ స్వాతంత్య్రం కోసం, యుద్ద ప్రభువులను పక్కన పెట్టేందుకు పోరాడింది, విజయం సాధించి 1911లో రాజరికాన్ని కూలదోసి స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే రాజరిక పాలన అయితే తప్పింది గానీ సామాన్యులు ముఖ్యంగా రైతాంగంపై జరిగే దోపిడీకి అడ్డుకట్టపడలేదు. యుద్ద ప్రభువులు తిరిగి తలెత్తి సవాలుగా మారారు. దాంతో చైనా జాతిపితగా పరిగణించబడిన సన్‌ఏట్‌ సేన్‌ 1921లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానించి 1924లో యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి యుద్ద ప్రభువుల అణచివేతకు పూనుకున్నాడు. అయితే మరుసటి ఏడాదే కాన్సర్‌తో మరణించాడు. కొమింటాంగ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన చాంగ్‌కై షేక్‌ తమతో కలసి పోరాడుతున్న కమ్యూనిస్టులు రోజు రోజుకూ బలం పెంచుకోవటం చూసి వారిని ఊచకోత కోయించాడు. 1927 నాటికి రెండు పార్టీలు వైరిశిబిరాలుగా మారిపోయాయి.1931లో జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకోవటం మొదలు పెట్టారు. దాంతో 1936లో తమ కార్యకర్తలను ఊచకోత కోయించిన ఆ చాంగ్‌కై షేక్‌తోనే ఐక్యసంఘటనగా ఏర్పడిన కమ్యూనిస్టులు జపాన్‌ సామ్రాజ్యవాదులను తరిమి వేశారు. తరువాత ఆ చాంగ్‌కై షేక్‌నే తరిమికొట్టి దేశాన్ని విముక్తి చేశారు. అనేక మంది ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. మన కార్యకర్తలు, నాయకులను చంపించిన వాడితో చేతులు కలపటం ఏమిటని చర్చ జరిగింది. అక్కడ అందరికీ ఉమ్మడి శత్రువైన జపాన్ను తరిమి వేయాల్సిన కర్తవ్యం కమ్యూనిస్టులను ఐక్య సంఘటనకు పురికొల్పింది.


జయప్రకాష్‌ నారాయణ ప్రారంభించిన ఉద్యమంలో నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి. జయప్రకాష్‌ నారాయణ మతశక్తి కానప్పటికీ జనసంఘం ఉన్న కారణంగా దానిలో పాల్గొనాలా లేదా అన్న అంశం మీద సిపిఎంలో తీవ్ర చర్చలు జరిగాయి. తరువాత 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌, సిపిఎం, సోషలిస్టు ఇతర తనను రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల వారందరినీ జైలు పాలు చేశారు. ఆ నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే అంశం ప్రధానంగా ముందుకు వచ్చింది. ఆ కారణంగానే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసిన తరువాత జనసంఘం, సోషలిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇతర పార్టీలన్నీ కలసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. దానిలో జనసంఘం-ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి అని తెలిసినప్పటికీ సిపిఎం తన రాజకీయ కర్తవ్యంలో భాగంగా జనతా పార్టీని బలపరిచింది. జనతా పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్న సిపిఎం అభ్యర్ధులకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జనతా పార్టీలోని జనసంఘం కార్యకర్తలు కూడా మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కుల రక్షణ కోసం తన వైఖరిని మార్చుకొనేందుకు నాడు సిపిఎం తన వైఖరిని సవరించుకుంది.


మన స్వాతంత్య్రానికి చైనాలో జరిగిన మాదిరి విదేశాల నుంచి ప్రత్యక్ష ముప్పు లేకపోయినా అంతర్గతంగా బిజెపి పాలకులు అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను దిగజార్చటం ప్రజాస్వామ్యం, పౌరహక్కులకే ముప్పు తెచ్చేవిగా ఉన్నాయని కమ్యూనిస్టులు కాని వారు కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి వారసులు నేడు ఆ పరిమిత స్వాతంత్య్ర లక్ష్యాలు, ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారని గత కొద్ది సంవత్సరాలుగా సిపిఎం హెచ్చరిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ జెండాలకు దూరంగా ఉంటూ వాటిని కాపాడేందుకు జనం ముందుకు రావాలని పిలుపు ఇస్తే అర్ధం ఉండదు. అందుకే సిపిఎం వైఖరిలో ఈ మార్పు అన్నది స్పష్టం.
సంబంధిత వ్యాసం మొదటి భాగం లింకు దిగువ ఉంది. .

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ! https://vedikaa.com/2021/08/16/indian-national-flag-matter-why-rss-disowned-ms-golwalkar-thoughts/

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


చారిత్రాత్మక దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఒకసారి చెప్పింది మరొకసారి మాట్లాడని ప్రధాని నరేంద్రమోడీ తన శైలి, సంప్రదాయాన్ని తప్పి వరుసగా మూడవ సంవత్సర ప్రసంగంలో కూడా వంద లక్షల కోట్ల పెట్టుబడుల గురించి పునశ్చరణ చేశారు. మార్పు ఏమంటే దానికి ” ప్రధాన మంత్రి గతిశక్తి ” అని పేరు పెట్టారు. ఈ మాత్రానికే మూడు సంవత్సరాలు తీసుకుంటే దాని అమలు గురించి చెప్పుకుంటే చాల బాగోదు. కరోనా సందర్భంగా ప్రకటించిన 25లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి బండారం ఏమిటో తెలిసిందే. 75వారాల ముందే అమృతోత్సవంగా ఈ సందర్భాన్ని ప్రారంభించుకున్నాము. ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో చూసిన తరువాత వాటిని మరోమారు సమీక్షించుకుందాం.
డెబ్బయి అయిదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం గురించి మీడియాలో చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, ఇంకా రావచ్చు. కొత్త బిచ్చగాడికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధమే లేకపోగా లేకపోగా బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన కాషాయ దళాల వారసులు సిపిఎం నిర్ణయం మీద ఉక్రోషాన్ని దాచుకోలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు తమ విజయం అని బిజెపి నేతలు కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. మార్క్సిస్టుల నిర్ణయాన్ని మీడియాలో ఇంత సంచలనాత్మకంగా ఎందుకు చేశారు ? కమ్యూనిస్టుల్లో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారా లేక వారిమీద వేసే రాళ్ల సంఖ్య తగ్గిపోయిందనే దుగ్దా ? ఏమైనా కావచ్చు.


సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో స్పందించాయి. ప్రజాజీవనంలో ఒక ఉదంతం జరిగినపుడు స్పందించటం ఒక ప్రజాస్వామిక హక్కు. అందువలన దాన్ని తప్పు పట్టనవసరం లేదు. స్పందనలో ఉన్న విషయం ఏమిటనే అంశంపై ఇతరులకూ అదే హక్కు ఉంటుంది. అందువలన కమ్యూనిస్టులు, కాషాయవాదుల్లో వచ్చిన మార్పుల తీరుతెన్నుల గురించి ఒక పరిశీలన ఇది. ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌-దేశభక్తి, జాతీయ జెండా బండారాన్ని చూద్దాం. నిజాలను తట్టుకొనగలిగే, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ముందుకు పోవచ్చు. లేని వారు ఇంతటితో ముగించవచ్చు.


అతల్‌ బిహారీ వాజపాయి ప్రధాన మంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో లోక్‌సభలో జాతీయ పతాకం గురించి చర్చ జరిగింది. బిఆర్‌ అంబేద్కర్‌ మనవడు, తొలుత రిపబ్లికన్‌ పార్టీ తరువాత భరిపా బహుజన మహాసంఘ పార్టీ తరఫున ఎన్నికైన ప్రకాష్‌ అంబేద్కర్‌ జీరో అవర్‌లో మాట్లాడుతూ నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదని, మువ్వన్నెల జెండా అంటే గౌరవం లేదని విమర్శించారు. అప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ కొల్‌కతాలో సిపిఎం కార్యాలయం మీద కూడా జాతీయ జెండాను ఎగురవేయలేదని గొంతు కలిపారు. అప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న ప్రమోద్‌ మహాజన్‌ మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నానని సంస్ధ కార్యాలయాల వద్ద జెండాను ఎగురవేశారని చెప్పారు. అలాంటి ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందటం తగదన్నారు. కావాలంటే జనవరి 26న ప్రకాష్‌ అంబేద్కర్‌ను నాగపూర్‌ తీసుకు వెళ్లి ఆయనతోనే జెండా ఎగురవేయిస్తామన్నారు.మంత్రి మాటలను ఖండిస్తూ 1998లో నాగపూర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించాలని ప్రతినిధి వర్గాన్ని పంపాలని, ఒక వేళ వారే స్వంతంగా ఎగురవేయకపోతే వెళ్లిన వారు ఎగురవేయాలని నిర్ణయించినట్లు ప్రకాష్‌ అంబేద్కర్‌ గుర్తు చేశారు.1999లో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లి జండాను ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారి మీద లాఠీచార్జి జరిగిందని, 2000 సంవత్సరంలో కూడా అదే ప్రయత్నం చేయగా తమ భవనం మీద జెండా ఎగురవేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుకున్నదని ప్రకాష్‌ అంబేద్కర్‌ చెప్పారు. వ్యక్తులు, సంస్ధలు ఎవరైనా తమ ఇండ్ల మీద భవనాలపై జెండాను ఎగురవేయవచ్చని, ఈ సందర్భంగా ఎంపీలు అందరూ తమ ఇండ్ల మీద జెండాలు ఎగురవేయటాన్ని తాను చూడలేదని, అంతమాత్రాన వారు దేశభక్తి లేని వారని అర్ధమా అని మంత్రి మహాజన్‌ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జెండా ఎగురవేయటం గురించి మహాజన్‌ నిజం చెప్పులేదు, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సభను తప్పుదారి పట్టించారు.


2002 జనవరి 26న తొలిసారిగా నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆగస్టు 15న రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్ధకు చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ముందు జండా ఎగురవేశారు. జాతీయ జండాను ఎందుకు ఎగురవేయటం లేదు అని అడిగితే జెండా నిబంధనల ప్రకారం ప్రయివేటు వ్యక్తులు ఎగురవేయకూడదనే నిబంధన ఉందని, 2002లో దాన్ని సవరించినందున అప్పటి నుంచి ఎగురవేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెబుతారు. వారు ప్రచారం చేసే పచ్చి అబద్దాల్లో ఇది ఒకటి. పోస్ట్‌ కార్డ్‌ న్యూస్‌ పేరుతో నిరంతరం ఫేక్‌ న్యూస్‌ వండి వడ్డించే విక్రమ్‌ హెగ్డే, ఓప్‌ ఇండియా పేరుతో వక్రీకరణ రాతలు రాయించే నూపూర్‌ శర్మ వంటి అనేక మంది ఈ మేరకు ట్వీట్లు చేశారు. జండా నిబంధనలను సడలించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ ఎగురవేస్తున్నదని చెప్పారు. వాస్తవం ఏమిటి ?


1995 ఫిబ్రవరిలో నవీన్‌ జిందాల్‌ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు.తన ఫ్యాక్టరీ వద్ద అన్ని రోజులూ జాతీయ జెండాను ఎగురవేయకుండా అధికారులు ఆటంకాలు కల్పించారని ఆయన ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పౌరులు జాతీయ జెండాను ఎగురవేయరాదనే నిబంధనలు ఉన్నాయని అధికారులు అడ్డుకున్నారు. తరువాత 2002 జనవరి 15న ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి నియమించిన పిడి షెనారు కమిటీ నివేదికను ఆమోదించారు. అదే జనవరి 26 నుంచి అన్ని రోజులూ ఎవరైనా ఎగురవేయవచ్చని ప్రకటించారు. అయితే 1971 జూన్‌ 15న హౌంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలో ఈ మూడు రోజులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చని పేర్కొన్నారు.1982లో పంజాబ్‌ ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం ఆ మూడు రోజులతో పాటు జలియన్‌వాలాబాగ్‌ అమరజీవుల సంస్మరణ వారమైన ఏప్రిల్‌ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు, జాతియావత్తూ సంతోష పడే ఏదైనా రోజు కూడా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని పేర్కొన్నారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా మరొకరు గానీ ఆ పని చేయవచ్చు, కానీ అనుమతి లేనందున తాము ఎగురవేయటం లేదన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల భాష్యం కుంటి సాకు,అవాస్తవం తప్ప మరొకటి కాదు.


నాగపూర్‌లో బిజెపిఏతర పార్టీలు, సంస్ధలకు చెందిన వారు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం దగ్గర జెండా ఎగురవేసేందుకు చేసిన యత్నాలు దేశవ్యాపితంగా చర్చనీయాంశం కావటం, సరిగ్గా ఆ సమయంలో వాజపాయి ప్రధానిగా ఉండటంతో విధిలేక తన వ్యతిరేకతను దిగమింగి ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ జెండాను ఎగురవేయటం ప్రారంభించింది. ఒకసారి అధికార రుచి మరిగిన తరువాత మైనారిటీలు, ఇతరుల సంతుష్టీకరణలో భాగంగా, ప్రపంచంలో ఉన్న మత శక్తి అనే ముద్రను చెరిపివేసుకొనేందుకు గురువుగా దశాబ్దాలుగా పిలుస్తున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రచనలతో తమకు సంబంధం లేదని చెప్పుకొనేంతవరకు వెళ్లింది. ఆయన ప్రఖ్యాత రచన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుచ్చము), ఇతర పుస్తకాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రామాణికంగా తీసుకొని దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. ఆ సంస్ధ చెప్పే జాతీయతకు గోల్వాల్కర్‌ చెప్పిన అర్ధం ఏమిటి ? ” మేము లేదా మన జాతి గుర్తింపు నిర్వచనం(ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ )” అనే శీర్షికన 1938లో రాసిన పుస్తకంలో ” హిందూస్తాన్‌లో హిందూయేతరులు వారు విధిగా హిందూమతంలోకి మారాలి లేదా హిందూ రాజ్య చేతికిందివారుగా(రెండవ తరగతి) దేశంలో ఉండవచ్చు.ఎలాంటి ప్రత్యేకహక్కులు, చివరికి పౌరహక్కులు కూడా కోరకూడదు.” 1940 నుంచి 1973లో మరణించే వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగిన గోల్వాల్కర్‌ ఆ కాలమంతా తన భావాలను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు నూరిపోశారు. తరువాత కూడా అదే సాగింది.


2004లో దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బిజెపి ఎన్నికల్లో దిగి పరాజయం పాలు కావటం, దాని సిద్దాంతాలను చూసి కొన్ని పార్టీలు ఇబ్బంది పడటం తదితర కారణాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ తన పులిచారలను కనపడకుండా చేసేందుకు ప్రయత్నించింది. దానిలో భాగంగానే 2006లో తొలిసారిగా గోల్వాల్కర్‌ జాతి గుర్తింపు నిర్వచన పుస్తకానికి – తమకూ సంబంధం లేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది. ” గోల్వాల్కర్‌ పుస్తకంతో తమకు సంబంధం లేదని అధికారికంగా చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ ” అనే శీర్షికతో 2006 మార్చి 9న అక్షయ ముకుల్‌ అనే విలేకరి రాసిన వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. ” అందరూ నమ్ముతున్నట్లుగా ఉరు పుస్తకం ఆర్‌ఎస్‌ఎస్‌ బైబిలు కాదు. అది నిజంగా బైబిల్‌ అయి ఉంటే సంఘకార్యకర్త ప్రతిఒక్కరూ దాన్ని చదివి ఉండేవారు, ప్రతి వారి ఇంట్లో ఉండేది, అలా జరగలేదు ” అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధిగా పని చేసిన ఎంజి వైద్య చెప్పిన మాటలను ఆ వార్తలో పేర్కొన్నారు. చిత్రం ఏమిటంటే గోల్వాల్కర్‌ బతికి ఉన్నంతవరకు మూడుదశాబ్దాలకు పైగా ఆ పుస్తకంలోని అంశాలను పక్కన పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు. మరణించిన తరువాత మరో మూడు దశాబ్దాలు కూడా ఎవరూ మాట్లాడలేదు.


ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లెక్చరర్‌ రాకేష్‌ సిన్హా 2006లో ”శ్రీ గురూజీ-ముస్లింలు ” అనే పేరుతో రాసిన పుస్తకంలో సరికొత్త కథను ముందుకు తెచ్చారు. గోల్వాల్కర్‌ రచన ఉరు పుస్తకంలోని అంశాలు నిజానికి గూరూజీవీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌వి కాదట. ఆ పుస్తకంలోని అంశాలు తనవి కాదని గురూజీ బతికి ఉండగా చెప్పేవారట. జిడి సావర్కర్‌ రాసిన ” రాష్ట్ర మీమాంస” అనే పుస్తక సంక్షిప్త రూపం తప్ప గోల్వాల్కర్‌ భావాలు కాదని, కానీ వాటిని గురూజీకి ఆపాదించి లౌకిక సామాజిక శాస్త్రవేత్తలు ఉపశమనం పొందారని రాకేష్‌ సిన్హా ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఆ పుస్తకం మినహా గోల్వాల్కర్‌ ఇతర పుస్తకాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ ప్రచురించి బోధ చేస్తూనే ఉంది. గోల్వాల్కర్‌ పేరుతో సాగిన బోధనల గురించి సిగ్గుపడటం సరే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి ? ఆ పుస్తకంలోని భావాలు, సూత్రీకరణలను ఆరు దశాబ్దాల పాటు సంఘపరివార్‌లోని వారెవరికీ అభ్యంతరం అనిపించలేదా ? భిన్నాభిప్రాయం వెల్లడికాలేదా ? ఎవరూ నోరుమెదపలేని పరిస్ధితి పరివార్‌లో ఉన్నట్లే అని భావించాలా ? జిడి సావర్కర్‌ పేరుతో సదరు పుస్తకాన్నే సంక్షిప్తం చేసి ప్రచురించవచ్చు, కానీ దాని సంక్షిప్త రూపానికి పేరు మార్చి గోల్వాల్కర్‌ తన పేరు ఎందుకు పెట్టుకున్నట్లు ? గోల్వాల్కర్‌ స్వయంగా చెప్పారు అంటున్నవారు అలా ఎందుకు చేశారనే ప్రశ్నించే స్వేచ్చ పరివార్‌లో లేకపోయిందా ? పోనీ ఆయన బతికి ఉండగా పక్కన పెట్టేందుకు ధైర్యం లేకపోతే మరణించిన తరువాత అయినా వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు ? మొత్తం ఆరు దశాబ్దాల పాటు దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు ప్రచారం చేసింది. అందుకే విశ్వసనీయత సమస్య ముందుకు వస్తోంది. అది గురూజీది కాదంటున్నారు గనుక ఆయన పెద్ద కాపీ మాస్టర్‌ అని తేలిపోయింది.


2018 సెప్టెంబరు 20న న్యూస్‌ 18 టీవీ, ఇతర పత్రికలు కూడా ఒక వార్తను ప్రచురించాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా ఉన్న మోహనభగవత్‌ ఒక కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానాలిస్తూ 1966లో గురు గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచన గుచ్చము) అనే పుస్తకం తమకు నిత్య అఖండజ్యోతి కాదని వాటిలో కొన్ని కాలానుగుణ్యంగా లేవని అన్నారు. హిందూయేతర మతపరమైన మైనారిటీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి గురించి భయాలున్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వాటిలో చెప్పిన అంశాలు కొన్ని పరిస్ధితులు, ఒక నిర్దిష్ట పూర్వోత్తర సంబంధంగా చెప్పినవి. మేము ”గూరూజీ- విషన్‌ అండ్‌ మిషన్‌ ” (గురూజీ ఊహ-కార్యక్రమం) అనే పుస్తకాన్ని ప్రచురించాము. వాటిలో కొన్ని పరిస్ధితుల్లో చెప్పిన వాటిని తొలగించాము. గురూజీ అనశ్వర ఆలోచనలను కొనసాగించాము” అన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గురించి చెబుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ పరిధీకృత సంస్ధ కాదు (గీసుకున్న గిరికి పరిమితం), కాలంతో పాటు మా ఆలోచనలు, వాటి స్పష్టత వక్కాణింపులో కూడా మార్పులు ఉంటాయి. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌లో రాసిన అంశాల ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ అనే సందేహాలుంటే మా పనేమిటో చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ కానట్లయితే మహిళలకు, మైనారిటీ మతస్ధులకు సభ్యత్వాన్ని, బాధ్యతలు లేదా నాయకత్వ స్దానాలను ఎందుకు అనుమతించటం లేదు.


ఇక జాతీయ జెండా విషయానికి వస్తే ఆర్‌ఎఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 1947 జూలై 17తేదీ సంచిక, తరువాత రాసిన సంపాదకీయాల్లో చెప్పిందేమిటి ? తంతే గారెల బుట్టలో పడ్డట్లు జనాలు అధికారానికి వచ్చి మన చేతుల్లో మూడు రంగుల జండాను పెట్టవచ్చు, కానీ హిందువులెవరూ ఎన్నడూ దాన్ని గౌరవించరు, తమదానిగా చేసుకోరు. మూడు అనే పదమే ఒక దుశ్శకునం, జండాకు ఉన్న మూడు రంగులు మానసిక ప్రభావాన్ని కలుగ చేస్తాయి, జెండా దేశాన్ని గాయపరుస్తుంది” అని పేర్కొన్నారు. 1946 జూలై 14న గోల్వాల్కర్‌ నాగపూర్‌ సభలో మాట్లాడుతూ కాషాయ జెండా మాత్రమే మన ఘనమైన సంస్కృతికి ప్రతీక, అది దేవుని అవతారం, అంతిమంగా యావత్‌ జాతి కాషాయ జెండా ముందు మాత్రమే తలవంచుతుందని మనం గట్టిగా నమ్ముతున్నాం ‘అన్నారు.


శ్యామ ప్రసాద ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్‌ తమ హీరోగా పరిగణిస్తుంది. ఆయన 1943 నుంచి 46వరకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయాలని బెంగాల్‌ కాబినెట్‌ మంత్రిగా ఉంటూ 1942 జూలై 26న నాటి బెంగాల్‌ గవర్నర్‌ జాన్‌ హరబర్టుకు లేఖ రాసిన అపర దేశభక్తుడు. బెంగాల్లో ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న అని సదరు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ దేశభక్తుడిని పార్టీలో చేర్చుకొనేందుకు, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు నాడు నెహ్రూకు అభ్యంతరం లేకపోయింది. కొద్ది కాలంలోనే నెహ్రూతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేరదీసి 1951లో భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేయించింది.


సంఘపరివారం వీర సావర్కర్‌గా పిలిచే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జాతీయ జెండాను గురించి చెప్పిందేమిటి ? ( ఆయనకు వీర బిరుదు ఎవరిచ్చారంటే ఎవరూ సమాధానం చెప్పరు ) ” మూడు రంగుల జండాను హిందూస్తాన్‌ జాతీయ జండాగా ఎన్నటికీ గుర్తించలేము. కాషాయ జెండా మాత్రమే ఉండాలి… హిందువులు మరొక జెండాకు ఏ స్దాయిలోనూ విధేయులుగా వందనం చేయరు.” అన్నారు. పాకిస్తాన్‌ ఏర్పాటు చేయాలని 1940లో ముస్లింలీగ్‌ డిమాండ్‌ చేసింది.దానికి మూడు సంవత్సరాల ముందే 1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ 19వ సమావేశంలో సావర్కర్‌ మాట్లాడుతూ రెండుదేశాల సిద్దాంతాన్ని సమర్ధించారు. ఈ రోజు దేశం ఇంకేమాత్రం ఐక్యంగా ఒకటిగా ఉండలేదు, హిందూ, ముస్లిందేశాలుగా ఉన్నాయి. జిన్నా రెండు దేశాల సిద్దాంతంతో నాకేమీ పేచీ లేదు, చారిత్రకంగా చూస్తే హిందూ ముస్లింలు రెండుదేశాలుగా ఉన్నారని 1943ఆగస్టు 15న నాగపూర్‌ సమావేశంలో సావర్కర్‌ చెప్పారు. తిరువాన్కూర్‌ సంస్ధాన దివానుగా ఉన్న సిపి రామస్వామి అయ్యర్‌ తమ సంస్దానం ప్రత్యేక దేశంగా ఉంటుందని 1947జూన్‌ 11న ప్రకటించారు.అఖండ భారత్‌ గురించి చెప్పిన సావర్కర్‌ జూన్‌ 20 ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ టెలిగ్రామ్‌ పంపారు. ” తిరువాన్కూరును మన హిందూ స్వతంత్ర దేశంగా ప్రకటించేందుకు ముందు చూపు, దైర్యం కావాలి” అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన జనం దాన్ని వ్యతిరేకించి విలీనానికి పోరాడారు. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి మెరుగని వాటిని ప్రపంచమంతా ఆరాధిస్తుంటే మన రాజ్యాంగ పండితులకు అది పట్టలేదని 1949నవంబరు 30 ఆర్గనైజర్‌ పత్రిక రాసింది.


నిషేధాన్ని ఎత్తివేయించుకొనేందుకు రాజకీయాల్లో పాల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా ఉంటా మంటూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సంతకాల తడి ఆరక ముందే జనసంఫ్‌ును ఏర్పాటు చేయించి తమవారిని నేతలుగా పెట్టింది. ఇప్పుడు బిజెపిలో ఉన్నవారందరూ వారే. అయినా తమది రాజకీయ సంస్ద కాదని ఇప్పటికీ చెప్పుకుంటుంది. నిత్యం స్వదేశీ అని పశ్చిమ దేశాలను విమర్శించే ఆర్‌ఎస్‌ఎస్‌ తన యూనిఫామ్‌ విషయానికి వస్తే ఆ పశ్చిమ దేశాల నుంచే అరువు తెచ్చుకుంది.నిక్కర్ల నుంచి పాంట్లకు మారినా స్వదేశీ ఊసులేదు.ఆరు సార్లు యూనిఫామ్‌లో మార్పులు చేసుకుంది. తమ వెనుక ఇన్ని పిల్లి మొగ్గలు, అవగాహనలను మార్చుకున్న చరిత్ర తమ వెనుక ఉంచుకొని సిపిఎం వైఖరి మార్చుకున్నదని చెప్పటం విశేషం. ఇక్కడ గమనించాల్సిందేమంటే గోల్వాల్కర్‌ పుస్తకాలను పక్కన పెట్టినా, జెండా ఎగరవేయటం గురించి విధానాన్ని మార్చుకున్నా, అవగాహన మారిందని చెప్పుకున్నా అదంతా పైపై వ్యవహారం తప్ప అసలైన హిందూత్వ అజెండాలో ఎలాంటి మార్పు లేదు. వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే గతంలో తాము చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నట్లు పునశ్చరణ చేసినా, ముందుకు తీసుకుపోయినా కుదరదు కనుకనే పులిచారలు కనిపించకుండా కొత్త దుస్తులు వేసుకుంటోంది, మాటలను మారుస్తోంది. మరి కమ్యూనిస్టుల సంగతేమిటి ? వారెందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపేందుకు, జాతీయ జండాను ఎగురవేసేందుకు నిర్ణయించుకున్నారు ? మరో భాగంలో చూద్దాం !

సంబంధిత వ్యాస రెండవ భాగ లింకు దిగువ ఉంది.

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ? https://vedikaa.com/2021/08/17/indian-national-flag-matters-what-changed-in-cpim-stand/

బ్రిటన్‌ పెట్టుబడిదారులను హడలెత్తిస్తున్న ” పక్కతడిపే కుర్రాళ్లు ” !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఆందోళన చెందుతున్నది కమ్యూనిస్టులా ? పెట్టుబడిదారులా ? వారి చౌకీదార్లుగా ఉన్నవారా ? పెట్టుబడిదారీ విధానానికి, మతాలకు ఉన్నట్లే కమ్యూనిస్టు లక్ష్యాల కోసం, కుల, మత రహిత సమాజం కోసం పోరాడేవారికీ చౌకీదార్లు ఉంటారు. భిన్న లక్ష్యాలతో నిరంతరం కాపాడుతూ ఉంటారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా తూర్పు ఐరోపా రాజ్యాలు, సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌లను కూల్చివేసినపుడు లేదా ఇతరులు భావిస్తున్నట్లు అవి పతనమైనపుడు అనేక మంది కమ్యూనిస్టులు పార్టీల పేర్లు, జండాలు, అజెండాలు మార్చుకున్నారు. వేరే పార్టీల్లో చేరిపోయారు. కమ్యూనిస్టులకు భవిష్యత్‌ లేదని భావించటమే దానికి కారణం. అలాంటి వారంతా పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందా ?


రోజులెప్పుడూ ఒకే విధంగా ఉండవు. జనం ఎప్పుడూ మత్తులోనే ఉండరు. అది మానవ లక్షణం కాదు. అయినా కొందరు మార్పును గుర్తించేందుకు భయపడతారు.1948 ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగింది. నాడు జర్మనీలో తీవ్ర నిర్బంధం కారణంగా మార్క్స్‌-ఎంగెల్స్‌ దాన్ని లండన్‌లో ముద్రించారు. ప్రస్తుతం ఐరోపాను ఒక భూతం భయపెడుతోంది. అది కమ్యూనిస్టు భూతం అన్న పదాలతో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అదే బ్రిటన్‌లో పెట్టుబడిదారులను మరోసారి వెంటాడుతోంది. కుర్రకారు సోషలిజం అంటున్నది, దీన్ని తేలికగా తీసుకోవద్దు అంటూ పెట్టుబడిదారీ విధాన చౌకీదారు డాక్టర్‌ క్రిస్టినా నిమెట్జ్‌ తీవ్ర హెచ్చరిక చేశాడు.


ఈ రోజు నేటి తరం వామపక్షం వైపు చూస్తున్నదని అనుకుంటున్నాము త్వరలో మొత్తం బ్రిటన్‌ జనాభాయే వామపక్షంగా మారిపోవచ్చని హెచ్చరిస్తూ లండన్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌(ఐఇఏ) సంస్ద జూలైనెలలో 76పేజీల ఒక పత్రాన్ని వెలువరించింది.డాక్టర్‌ క్రిస్టియన్‌ నిమిట్జ్‌ దాన్ని రాశారు. దానిలో పేర్కొన్న అంశాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకు మేలుకొలుపు అని లండన్‌ ఎకనమిక్‌ సంస్ధ తన సమీక్షలో హెచ్చరించింది. ఇంకా అనేక పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు దాని గురించి చర్చించాయి. ఐఇఏ సర్వేలో తేలిన అంశాలేమిటి ? బ్రిటన్‌లోని 67శాతం మంది మిలీనియల్స్‌, జడ్‌ తరం (1981-96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌ అని పిలిస్తే 1997 తరువాత పుట్టిన వారిని జెడ్‌ తరం అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధలో జీవించాలనుకుంటున్నారని, 70శాతం మంది పెట్టుబడిదారీ వ్యవస్ధ స్వార్ధాన్ని ప్రోత్సహిస్తున్నదని భావిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. వాతావరణ,గృహ సంక్షోభానికి పెట్టుబడిదారీ వ్యవస్తేకారణమని యువతరం భావిస్తున్నది. సోషలిజం అంటే సమానత్వం, న్యాయమైన, జనం కోసమనే సానుకూల వైఖరి, పెట్టుబడిదారీ వ్యవస్ధ అంటే దోపిడీ, అన్యాయం, ధనికులు, కార్పొరేట్లకోసం పని చేసేదనే ప్రతికూల అభిప్రాయాలను బ్రిటన్‌ యువతరం ఎక్కువగా కలిగి ఉంది.


యువతరం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారని, సోషలిస్టు ప్రత్యామ్నాయం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పరిశోధన నిర్ధారించింది. లెఫ్ట్‌ టర్న్‌ ఎహెడ్‌ (వామపక్ష మార్గం ముందున్నది) అనే పేరుతో రూపొందించిన పత్రం మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదార్లకు ఒక మేలుకొలుపుగా ఉండాలి.పెట్టుబడిదారీ విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు సంగ్రహరూపంలోనే ఉండవచ్చు గానీ అది బ్రెక్సిట్‌ ( ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావటం )కూ వర్తిస్తుంది. ఈ పరిశోధన 2021 ఫిబ్రవరి -మార్చినెలలో 16-34 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న రెండువేల మంది మీద జరిగింది. అరవై ఏడుశాతం మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పు ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని 75శాతం మంది అంగీకరించారు. బ్రిటన్‌లో గృహ సంక్షోభానికి పెట్టుబడిదారీ విధానమే కారణమని 78శాతం చెప్పారు. ఇంధనం, నీరు, రైల్వేలను తిరిగి జాతీయం చేయాలని 72శాతం మంది కోరారు. జాతీయ ఆరోగ్య సేవలు(ఎన్‌హెచ్‌ఎస్‌) ముప్పు ఎదుర్కోవటానికి ప్రయివేటు రంగమే కారణమని 72శాతం మంది నమ్ముతున్నారు. సోషలిజం మంచి భావనే, అయితే అది వైఫల్యం చెందటానికి అమల్లో లోపమే అని 75శాతం మంది చెప్పారు.


యువతలో వామపక్ష భావాలకు మద్దతు లేదని మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదారులు చెబుతుంటారు. కానీ యువతరాన్ని వామపక్ష భావాలకు దూరంగా ఉంచగలమని పెట్టుబడిదారులు ఇంకెంతో కాలం తమకు తాము నచ్చచెప్పుకోలేరు. మిలీనియల్స్‌ మరియు జడ్‌ తరం మధ్య గతంతో పోల్చితే పెద్దగా తేడా లేదు.మిలినియల్స్‌ సోషలిస్టు భావన వెలుపల ఉన్నారనుకుంటే జూమర్స్‌(1990దశకం తరువాత పుట్టిన వారు) దానిలోనే పెరుగుతారని తేలింది. ఈ సర్వేలో తేలిన అంశాల అర్ధం భావజాల పోరులో పెట్టుబడిదారీ వ్యవస్ధ మద్దతుదారులు ఓటమిని అంగీకరిస్తూ తెల్లజెండా ఎత్తి, భవిష్యత్‌ సోషలిజానిదే అని అంగీకరించాల్సిందే అన్నట్లుగా వ్యహరించాలని కాదు, దాని బదులు మిలియన్ల సోషలిజాన్ని ఇప్పటి కంటే మరింత తీవ్రంగా పరిగణించాలని. విశ్లేషణ పత్ర రచయిత నిమిట్జ్‌ వాదించినట్లు లండన్‌ ఎకనమిక్‌ సమీక్షకుడు పేర్కొన్నారు.


తన పత్రంలో క్రిస్టియన్‌ నిమిట్జ్‌ ఇలా చెప్పారు.” మిలీనియల్‌ సోషలిజం కేవలం సామాజిక మాధ్యమంలో జరిగే తీవ్ర ప్రచారం కాదు. జర్మీ కార్బిన్‌(లేబర్‌ పార్టీ నేత) రాజీనామా మాదిరి తాత్కాలిక సంచలనంగా ముగిసేది కాదు. లేదా 1960దశకం నాటి విద్యార్ధుల సమూల సంస్కరణవాద పునశ్చరణ కాదు. వైఖరుల్లో వచ్చిన దీర్ఘకాలిక మొగ్గు ఇది. అది దానంతట అదే పోదు. మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదారులు ఈ సవాలును స్వీకరించాల్సి ఉంది. దానికి అనుగుణ్యంగా ఎదగాలి. దాన్ని తోసిపుచ్చటం లేదా అదేమీ జరగటం లేదని నటించకూడదు. యువత ఎదుర్కొంటున్న సమస్యలకు మార్కెట్‌ ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేస్తూ పెట్టుబడిదారీ విధానాన్ని సానుకూలమైనదిగా చూపాల్సి ఉంది. ప్రతిచోట, అన్ని వేళలా సోషలిజానికి దారులు మూసుకుపోయినప్పటికీీ అది ఇంకా ఎందుకు మరులు గొల్పుతున్నదో మనం వివరించాలి.” అన్నారు. ” అనాసక్తి తరం ” వామపక్ష తరం ”గా మారుతున్నదని ఈ నివేదిక పేర్కొన్నది.


కుర్రాళ్లు సోషలిజాన్ని అభిమానిస్తున్నారనే ఐయిఏ విశ్లేషణను టాక్‌ రేడియో వ్యాఖ్యాత మైక్‌ గ్రాహమ్‌ కొట్టి పారవేశాడు. పక్కతడిపే-నిద్రలేవగానే కంప్యూటర్లపై వేళ్లాడించే మధ్యతరగతి కుర్రాళ్లు సోషలిజానికి మద్దతు ఇచ్చినంత మాత్రాన జరిగేదేమీ ఉండదన్నాడు. వారికి లేబర్‌ పార్టీ నేత జెర్మీ కోర్బిన్‌ ఒక ఆధ్యాత్మిక నేత, సాంకేతికంగా అతనింకే మాత్రం ప్రతిపక్ష నేతగా ఉండడు అన్నాడు. నోరుపారవేసుకున్న గ్రాహమ్‌పై పలువురు విరుచుకుపడ్డారు. బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ నేత ఆవెన్‌ జోన్స్‌ ట్వీట్‌ చేశాడు. వర్తమానంలో యువతలో ఎక్కువ మంది అప్పులు చేసి చదువుకున్నారు, అద్దె ఇండ్లలో ఉన్నారు, రుణభారంలో కూరుకుపోయారు.దారుణమైన పరిస్ధితుల్లో తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు.అందరూ మధ్యతరగతి వారే. వృద్దులు ఎక్కువ మందికి స్వంత ఇళ్లు ఉన్నాయి, వారంతా కార్మికులు. సమాజంలో 75శాతం మంది మధ్యతరగతి ఉంటారా, వారంతా కలిగిన వారేనా, మీరు నిజాయితీగా ఆలోచిస్తున్నారా అంటూ మరికొందరు విమర్శించారు. గ్రాహమ్‌ వంటి వారిని ఉద్దేశించి నిమిట్జ్‌ పెట్టుబడిదారీ మద్దతుదార్లను తీవ్రంగా హెచ్చరించాడని చెప్పవచ్చు.


ఇటీవలి సామాజిక ఉద్యమాలు నల్లజాతీయుల జీవన సమస్యలు, గ్రేటా టన్‌బెర్గ్‌ వాతావరణ పరిరక్షణ, 2017ఎన్నికల్లో జెర్మీ కార్బిన్‌ ప్రచారం, అహింసాత్మక పర్యావరణ ఉద్యమం వంటి వాటితో ఇటీవలి కాలంలో యువత రాజకీయాలను అధ్యయనం చేస్తున్నది. వయస్సులో ఉన్నపుడు కమ్యూనిస్టు – ముదిరిన తరువాత కాపిటలిస్టుగా యువత మారిపోతుందనే వాదనలను నిమిట్జ్‌ కొట్టిపారవేశాడు. ఆర్ధిక విషయాల పట్ల యువతలోనూ, 40దశకం ప్రారంభంలో ఉన్నవారిలో పెద్దగా తేడాలు లేవు. పెద్దవారయ్యే కొద్దీ యువత సోషలిజానికి దూరం అవుతారనేది ఇంకేమాత్రం నిజం కాదు అన్నారు. నేడు వామపక్ష తరం చిన్నదిగానే ఉండవచ్చు గానీ రేపు బ్రిటన్‌లో అదే ప్రధాన స్రవంతి అభిప్రాయంగా మారవచ్చు. ఇటీవలి ఎన్నికల్లో వర్గ భావన కంటే వయస్సు ప్రధాన రాజకీయ విభజన అంశంగా మారింది. 2019 ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ వయస్సు మీరిన ఓటర్లలో సామాజిక మితవాద భావనలను ముందుకు తెచ్చి వారిలోని మెజారిటీ ఓట్లను పొంది విజయం సాధించాడు. నాలుగు పదులు దాటిన వారు ఎక్కువ మంది లేబర్‌ పార్టీ బదులు కన్సర్వేటివ్‌ పార్టీనే ఎంచుకున్నారు. 1980 తరువాత పుట్టిన వారు(వామపక్ష తరం) అత్యధికులు జర్మీ కోర్బిన్‌ నాయకత్వంలోని లేబర్‌ పార్టీ వైపు మొగ్గారు. యువతరంతో పోల్చితే వయస్సు పైబడిన వారు ఒకరికి ఇద్దరు ఉన్నారు. రానున్న సంవత్సరాలలో ఈ తేడా క్రమంగా అంతరిస్తుంది. వామపక్ష తరం 2019లో ఓటర్లలో 38శాతం ఉండగా 2024 నాటికి 43శాతానికి, 2030 నాటికి 52శాతానికి పెరుగుతుందని అంచనా. ఇది మితవాద రాజకీయ వ్యూహానికి పెద్ద సవాలుగా మారనుంది. జుట్టునెరిసిన వారు ఎక్కువై 2010లో లేబర్‌ పార్టీ ఓడిపోయినట్లుగానే రాబోయే రోజుల్లో కన్సర్వేటివ్‌ పార్టీకి అదే పరిస్ధితి ఎదురు కావచ్చు.” పెట్టుబడిదారీ వ్యతిరేక యువతరం కేవలం నడుస్తున్న ఒక దశకాదు, వారు దాన్నుంచి బయటపడరు. ఇదే ధోరణి కొనసాగితే అవి భవిష్యత్‌లో మొత్తం జనాభాలో ప్రధాన స్రవంతి అభిప్రాయాలుగా మారతాయి. వామపక్ష తరం కాస్తా వామపక్ష జనంగా మారుతుందని నిమిట్జ్‌ అన్నాడు.

అసహనంతో ఉన్న అమెరికా -చైనా మీద యుద్దానికి దిగుతుందా !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


అమెరికన్లు ఇప్పుడు అసహనంతో ఉన్నారు . ప్రపంచంలో తిరుగులేని శక్తి అన్న భావన క్రమంగా తగ్గిపోతోంది. దాని అర్దం అది బలహీనపడిందని కాదు. తమ పెద్దన్న పెత్తనాన్ని ప్రతి చిన్న దేశమూ సవాలు చేస్తోంది. అందువలన చైనాను దెబ్బతీసి మిగతా దేశాలను భయపెట్టాలని చూస్తోందా ? అందుకుగాను చేయబోయే తదుపరి యుద్దం చైనాతోనా ? దానికి అనుగుణ్యంగానే పావులు కదుపుతున్నారా ? రెండవ ప్రపంచ యుద్దరంగం ఐరోపా అయితే మూడవ యుద్దం ఆసియా కేంద్రంగా జరగనుందా ? ఐరోపాతో మొదలు పెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన హిట్లర్‌ రెండవ యుద్దానికి కారకుడు. ప్రపంచం మీద తమ పట్టు జారిపోతోందని భావిస్తున్న అమెరికా తెగింపు మూడవ యుద్దానికి దారి తీస్తుందా ? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలుగానే ఇప్పుడు కనిపించవచ్చుగానీ పరిణామాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే నిజంగానే యుద్దం జరుగుతుందా? సామ్రాజ్యవాద కార్పొరేట్‌ల లాభాల కోసం వాటి చౌకీదార్లుగా ఉండే పాలకులు ఎంతకైనా తెగిస్తారన్నది గత అనుభవం. ఇప్పుడు యుద్దం లాభమా ? ఆ వాతావరణం సృష్టించి మార్కెట్‌ వాటాను దక్కించుకోవటం ముఖ్యమా అన్న మధనం జరుగుతోంది !


మరోవైపు తమ జోలికి వస్తే తాట తీస్తాం అన్నట్లుగా చైనా తన వ్యతిరేకులకు సందేశాలు పంపుతోంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు(9 నుంచి 13వ తేదీ) చైనాలో జరిపే రష్యాతో కలసి జరిపే సంయుక్త మిలిటరీ విన్యాసాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరొక దేశంతో జరిపే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె-20 యుద్ద విమానాలను తరలించటం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అంబుల పొదిలో ఇవి కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య మూలలోని నింగ్జియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ద విమానాలతో పాటు బడా రవాణా విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్‌యు-30 ఫైటర్‌ జెట్‌లు గతనెలలోనే ఇక్కడకు చేరుకున్నాయి. ఉభయదేశాల నిపుణులు, సిబ్బంది ఆయుధాల ప్రయోగం, మెళకువలను తెలుసుకుంటారు. యుద్ధ రంగంలో ఎలా వ్యవహరిస్తారో అదేమాదిరి ఇక్కడ ఆయుధాలను ప్రయోగించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. పదివేల మంది మిలిటరీ సిబ్బంది దీనిలో పాల్గొంటారు. ఈ చర్య ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, సవాళ్లను ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నత స్ధాయికి చేరినట్లు ప్రదర్శితం అవుతుందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ విభాగాల సంక్లిష్టమైన సైనిక విన్యాసాలకు, శిక్షణకు అనువుగా ఉంటుంది. గత ఏడాది రష్యాలోని కవకాజ్‌ ప్రాంతంలో సైనిక విన్యాసాలు జరిగాయి. వాటిలో రష్యా తన ఆధునిక ట్యాంకులు, క్షిపణులు, ఇతర ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది.


ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న వారు అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. వాటిని వేటిని కొట్టిపారవేయలేము, అలాగని యథాతధంగా స్వీకరించలేము. ఆసియా కీలకం లేదా ఇరుసు అన్న సామ్రాజ్యవాదుల పధకం ఎప్పుడో ప్రారంభమైంది. అధికారంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరున్నా కొనసాగుతోంది. దానిలో భాగంగానే చైనా చుట్టూ వందలాది సైనిక స్ధావరాలను అమెరికా ఏర్పాటు చేస్తోంది. మూడింట రెండువంతుల నౌకా, వైమానిక దళాలను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి తరలిస్తోంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంత పెద్ద మిలిటరీ కేంద్రీకరణ లేదు.ఇరవై ఒకటవ శతాబ్దివిజయాన్ని స్వంతం చేసుకొనేందుకు చైనాతో పోటీ పడుతున్నామని జోబైడెన్‌ పార్లమెంట్‌ తొలి ప్రసంగంలోనే చెప్పాడు.ఐరోపాలో నాటోతో ఎలా చేస్తున్నామో ఆసియాలో కూడా ఇండో-పసిఫిక్‌ అలాంటిదే అని కూడా దాచుకోకుండా చెప్పాడు. చైనాను బూచిగా చూపి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచివేస్తున్నారు. ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికా మూడు దశాబ్దాల తరువాత అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.


దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఇటీవలి కాలంలో అమెరికా యుద్ద నౌకలు పదే పదే సంచరిస్తున్నాయి. చైనాను రెచ్చగొట్టటం ఒకటైతే, ఆ ప్రాంత అనుపానులు-చైనా కదలికల మీద కన్నువేయటం రెండవది, చూశారా చైనా సమీపంలోకి మేము వచ్చాం అని పరిసర ప్రాంతదేశాలలో విశ్వాసం కలిగించే లక్ష్యం వంటివి ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, మేము సైతం యుద్ద అగ్నికి అన్నట్లుగా ఈ ప్రాంతంలో రెండు యుద్ద నౌకలను శాశ్వతంగా ఉంచుతామని జపాన్‌తో కలసి బ్రిటన్‌ ప్రకటించింది.ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదని చెబుతున్నప్పటికీ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ కూటమిని ఆసియా నాటోగా మార్చాలన్న ఎత్తుగడ ఉంది. తైవాన్‌ విలీనానికి చైనా బలప్రయోగం చేయనున్నదనే ప్రచారం వెనుక కూడా తమ మిలిటరీ చర్యలను సమర్దించుకొనేందుకే అన్నది స్పష్టం. తైవాన్‌ రక్షణకు తాము, అమెరికా ఉమ్మడిగా వ్యవహరిస్తామని జపాన్‌ ఉప ప్రధాని తారో అసో చెప్పాడు. తైవాన్‌ సమీపంలోని ఒకినావా, ఇతర జపాన్‌ దీవుల్లో 50వేల మంది సైనికులతో అమెరికా అనేక స్దావరాలను నిర్వహిస్తున్నది. అమెరికాలోని ఇండో-పసిఫిక్‌ వ్యవహారాల అధిపతి కర్ట్‌ కాంప్‌బెల్‌ మాట్లాడుతూ తొలిసారిగా తమ వ్యూహాత్మక, ఆర్ధిక ప్రయోజనాలు, మిలిటరీ కేంద్రీకరణను ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి మళ్లిస్తున్నామని వెల్లడించాడు. ఒబామా హయాంలో పన్నెండు సార్లు యుద్ద నావలను తైవాన్‌ జలసంధివైపు నడిపిస్తే ట్రంప్‌ 13సార్లతో ఆ రికార్డును తిరగరాశాడు. బైడెన్‌ ఆరునెలల్లోనే ఏడుసార్లు నడిపి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నాడు.


తన ఉపగ్రహం లేదా తొత్తు దేశమైన ఇజ్రాయెల్‌ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే పెగాసస్‌ నిఘా, చొరబాటు గురించి అమెరికా ఇంతవరకు స్పందించలేదు, అనధికారికంగా జర్నలిస్టుల మీద నిఘావేయటాన్ని ఖండిస్తున్నామని మాత్రమే వ్యాఖ్యానించింది.కానీ అదే అమెరికా గతంలో రష్యా మీద, ఇప్పుడు చైనా మీద రుజువు కాని ఆరోపణలతో ఆంక్షలకు తెగబడుతోంది. తమ దేశ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జోక్యం చేసుకున్నట్లు, మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ను దెబ్బకొట్టేందుకు, సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ఇప్పుడు పెగాసెస్‌ మీద మౌనం ఎందుకు ? చైనాకు వ్యతిరేకంగా సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ(సిఎన్‌ఏఎస్‌) పేరుతో ఆసియా ఇరుసు పధకాన్ని రూపొందించిన కాంప్‌బెల్‌, యుద్ద నేరగాడు మైఖేల్‌ ఫ్లోర్‌నోరు ఏర్పాటు చేసిన సంస్ధకు పెద్ద మొత్తంలు మైక్రోసాఫ్ట్‌ నిధులు ఇచ్చింది. యుద్దమంటూ వస్తే 72 గంటల్లో యావత్‌ చైనా పౌర, మిలిటరీ నౌకలను నాశనం చేసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని పెంటగన్‌కు సమకూర్చటమే తమ లక్ష్యమని బహిరంగంగానే చెప్పాడు.ఈ సంస్ద, దానితో సంబంధాలు ఉన్న అనేక మంది ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంలో తిష్టవేశారు.ఈ సంస్ధకు అమెరికా విదేశాంగశాఖ,తైవాన్‌ ప్రభుత్వం, నార్త్‌రాప్‌ గ్రుమన్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, కామ్‌కాస్ట్‌, ఎక్సాన్‌, మాస్టర్‌కార్డ్‌, అమెరికాలోని జపాన్‌ రాయబార కార్యాలయం, సిటీగ్రూప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, రేథియాన్‌, జార్జిటౌన్‌ యూనివర్సిటీ వంటి సంస్దలు పెద్ద మొత్తాలలో నిధులు అందచేస్తున్నాయి. ఇలాంటి సంస్ధలు ఒక్క చైనాకే వ్యతిరేకం అనుకుంటే పొరపాటు, అనేక దేశాలలో అమెరికన్‌,మిలిటరీ, కార్పొరేట్లకు, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియావంటి దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. రష్యాకు వ్యతిరేకంగా 2014లో దాని ముంగిట ఉన్న ఉక్రెయిన్‌లో నయా నాజీలను అధికారంలో కూర్చోబెట్టాయి.ఇలా అనేక దేశాల్లో వ్యవహరిస్తున్నాయి.


ప్రపంచంలో ప్రతివారి నుంచి తమకు ప్రమాదం ఉందనే ప్రచారంతో అమెరికన్లను మభ్యపెట్టి ఆ దేశ పాలకులు 70దేశాలలో 800వందల సైనిక స్దావరాలు, కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖండాంతర క్షిపణులు, మధ్యశ్రేణి అణ్వాయుధాల పరిమితి ఒప్పందం, గగనతలాన్ని స్వేచ్చగా ఉంచాలనే ఒప్పందాల నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది.ఇది ఆయుధ పోటీకి దారితీస్తోంది. రెండువేల సంవత్సరం వరకు అమెరికా తన సేనలను ప్రధానంగా జర్మనీ, ఉత్తర ఆఫ్రికా దేశాలు, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలో అధికంగా మోహరించింది.2011 సెప్టెంబరులో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి తరువాత మధ్యప్రాచ్యంలో కేంద్రీకరించారు. ఒక దశలో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో లక్ష మంది చొప్పున అమెరికన్‌ సైనికులు ఉన్నారు. తరువాత తూర్పు ఆసియాలో మోహరించారు.


సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించిన రిపబ్లిక్‌లు మిలిటరీల్లో 50శాతం వరకు తగ్గించాయి. ఇదే సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌, మన దేశం 40,30,15శాతం చొప్పున మిలిటరీని, బడ్జెట్లను పెంచాయి.జిడిపిలో ఒకశాతం లోపుగానే ఖర్చు చేయాలని స్వయంగా విధించుకున్న నిబంధనను జపాన్‌ పక్కన పెట్టింది.తనను చక్రబంధంలో బిగించేందుకు అమెరికా పూనుకున్నదని అర్ధం చేసుకున్న చైనా తన బలగాలను గణనీయంగా పెంచుకుంటున్నది. వాటికి సంబంధించి అంచనాలే తప్ప నిర్ధిష్ట సమాచారం బయటికి తెలియదు.1995లో కేవలం 50 స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు కలిగి ఉన్న చైనా 2019లో 750 నుంచి 1500వరకు, 950 మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు సమకూర్చుకున్నట్ల్లు వార్తలు వచ్చాయి.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికన్లు చేసిన ప్రతి యుద్దంలోనూ, ప్రతి చిన్న దేశం చేతిలోనూ ఓడిపోయారు. అలాంటిది చైనాతో పెట్టుకొని నెగ్గుకు రావటం అన్నది కలలో మాట.మొదటి ప్రపంచ యుద్దంలో ఓటమి, విజేతలు రుద్దిన ఒప్పందాలు జర్మన్‌ కార్పొరేట్ల అవకాశాలను దెబ్బతీసిన పరిస్ధితి, దాన్ని అవకాశంగా తీసుకొని హిట్లర్‌ మాదిరి జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం చైనాకు లేదు. తన ప్రయోజనాల రక్షణకు వెనుకడుగువేసే అవకాశమూ లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా తప్పుకున్నప్పటికీ పశ్చిమ, మధ్య ఆసియాలో తన ప్రయోజనాల కోసం మరొక చోట దుకాణం తెరిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అది ఆ ప్రాంత దేశాలతో పాటు రష్యా, చైనాలకు ముప్పుతెచ్చే పరిణామం అవుతుంది.

కట్టు కథలు. పిట్ట కథలు, అతిశయోక్తులు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


మన జీవితాలు ఎలా తయారయ్యాయంటే రోజుకు ఒక కుహనా వార్త లేదా వక్రీకరణ అంశం లేకుండా గడవని పరిస్ధితి. నరేంద్రమోడీ గారు మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి చైనాను మించి పోవాలని చెప్పారు. దానికి బదులు కొద్ది పెట్టుబడితో పుంఖాను పుంఖాలుగా కుహనా వార్తలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఇటీవలి కాలంలో పుట్టుకువచ్చాయి. మంచి వార్తలు రాసే వారికి జీతాలు సరిగా ఉండవు గానీ వక్రీకరణ వార్తలు, వీడియోలు తయారు చేసే వారికి ఎలాంటి సమస్యలూ లేవు. కరోనాతో అనేక మీడియా సంస్దలు సిబ్బందిని తొలగించాయి గానీ కుహనా వార్తల తయారీ ఇంకా పెరిగింది. లేని గొప్పలు చెప్పుకోవటంలో భాగంగా కట్టు కధలు అల్లటం, పిట్టకథలు చెప్పటం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగి పోయింది. ముఖ్యంగా వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు, పట్టభద్రులు పెరిగిపోయిన తరువాత ఇక చెప్పనవసరం లేదు. చెబుతున్న కథలు కూడా కాపీ, పేర్లు మారతాయంతే ! కొందరికి అభిమానులుగా ఉన్న వారు నిజానిజాలను నిర్దారించుకోకుండా వారి గురించిన అతిశయోక్తులను తాము నమ్మటమే కాకుండా ఇతరులకూ పంపిణీ చేస్తుంటారు. కొన్నింటిని పరిశీలించుదాం.


వియత్నాంలోని హౌచిమిన్‌ సిటీలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టారన్నది వాటిలో ఒకటి. వియత్నాం ఒక చిన్న దేశం. జపాన్‌, ఫ్రెంచి, అమెరికన్‌ సామ్రాజ్యవాదులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాగించి తమ గడ్డమీది నుంచి పారదోలిన వీరగడ్డ. అంత పెద్ద దేశం మీద మీరు ఎలా విజయం సాధించారు అని ఒక విలేకరి అడిగితే మాకు ఛత్రపతి శివాజీ గెరిల్లా యుద్ద పద్దతి ఉపయోగపడింది అని వియత్నాం అధ్యక్షుడు చెప్పాడట. నేను గొప్ప రాజైన శివాజీ వ్యక్తిత్వం,చర్యల గురించి చదివాను, యుద్దతంత్రం నన్ను ఎంతో ఉత్తేజపరించింది. అమెరికా దళాలకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించాం, విజయం సిద్దించింది. అలాంటి రాజు గనుక మా దేశంలో జన్మించి ఉంటే ప్రపంచాన్ని ఏలి ఉండేవారం.
శివాజీకి నివాళిగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారన్నది ఒక పిట్టకధ. తన సమాధిరాయి మీద శివాజీ మహరాజ్‌ గురించి రాయించుకున్నాడని కూడా కథలు చెప్పారు. తరువాత కొన్నేండ్లకు వియత్నాం మహిళా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చి ఎర్ర కోట, మహాత్మాగాంధీ సమాధులను సందర్శించినపుడు శివాజీ సమాధి ఎక్కడ అని అడిగారట. కంగారు పడిన అధికారులు మహారాష్ట్రలోని రైగఢ్‌లో ఉందని చెప్పగా తాను అక్కడికి వెళ్లాలని చెప్పినట్లు, తరువాత సమాధిని సందర్శించి అక్కడి మట్టి తీసుకొని తన బ్రీఫ్‌కేసులో వేసుకున్నట్లు, విలేకర్లు ఎందుకా మట్టి అని అడగ్గా తమ దేశమట్టిలో దాన్ని కలుపుతానని, అలా చేస్తే శివాజీ వంటి ధైర్యవంతులు అక్కడ పుడతారని ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ విలేకరి రాసినట్లు పేర్కొన్నారు. అసలు విషయం ఏమంటే అమెరికా మీద యుద్దం ముగిసిన తరువాత ముగిసిన తరువాత వియత్నాం విదేశాంగ మంత్రిగా మహిళలెవరూ పని చేయలేదు. అమెరికా దురాక్రమణలో ఉన్న దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన తిరుగుబాటు ప్రభుత్వంలో 1969-76 మధ్య కాలంలో గుయెన్‌ తీ దిన్‌ అనే కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అన్నింటికీ మించిన పెద్ద అబద్దం ఏమంటే హౌచిమిన్‌ సిటీలో ఉన్నట్లు చెబుతున్న విగ్రహం అసలు శివాజీది కాదు. వియత్నాం మాజీ రాజు ట్రాన్‌ నగాన్‌ హన్‌ విగ్రహమది.


మరొక కధలో శివాజీతో పాటు రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ పేరు చేర్చి ప్రచారం చేశారు. రెండు కథల్లోను రాసిన మరొక అంశం ఏమంటే వియత్నాం అధ్యక్షుడు తాను మరణించిన తరువాత తన సమాధి మీద ” ఇతడు శివాజీ, రాణాప్రతాప్‌ ఆరాధకుడు ” అని రాయించాలని ఆదేశిస్తే అలాగే చేశారట ఇక్కడ మనం గమనించాల్సింది. శివాజీ, రాణా ప్రతాప్‌ సింగ్‌లు వియత్నాం కమ్యూనిస్టులకు ఉత్తేజమిచ్చారని చెప్పటం కట్టుకధలు తప్ప మరొకటి కాదు. భారత చరిత్ర గురించి అధ్యయనం చేసిన పండితులు ఒకరిద్దరికి ఆ పేర్లు తగిలి ఉండవచ్చు తప్ప కమ్యూనిస్టు పార్టీకి ఉత్తేజమిచ్చేంత సీన్‌ లేదు.వియత్నామీయులకు ఉత్తేజమిచ్చింది మార్క్సిజం-లెనినిజం, సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప శివాజీ, రాణాలు కాదు. వారి నుంచి మన దేశంలోని వారే ఉత్తేజం పొందలేదు. అదే జరిగి ఉంటే మొగలాయీల పాలనకు, తరువాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి ఉండేవారు. అదేమీ లేదు.


శివాజీ, రాణా ప్రతాప్‌ కథలను ప్రచారం చేసింది కాషాయ దళాలు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని కాపీకొట్టిన వారు వారి పేర్ల బదులు అంబేద్కర్‌ పేరు చేర్చి మరొక కథను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అదెలా ఉందో చూడండి. ” వియత్నాం ప్రపంచంలో ఒక చిన్న దేశం. అది అమెరికా లాంటి బలమైన దేశం మెడలు వంచింది.దాదాపు 20 సంవత్సరాల వరకు జరిగిన యుద్ధంలో అమెరికా పరాజయం చెందింది. అమెరికాపై విజయం సాధించిన తర్వాత వియత్నాం దేశాధ్యక్షున్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.ప్రశ్న అందరికీ విదితమే, మీరు యుద్ధం ఎలా గెలిచారు? అమెరికాను ఎలా తలవంచేలా చేశారు.కాని,ఆ ప్రశ్న కు ఇచ్చిన జవాబు మీరు వింటే కేవలం ఆశ్చర్యమే కాదు. మీ గుండె గర్వం తో నిండి పోతుంది.ఇచ్చిన జవాబును మీరు చదవండి. దేశాలన్నీంటిలోకీ అమెరికా చాల బలమైన దేశాన్ని ఓడించుటకు భారతదేశానికి చెందిన ఒక గొప్ప మహా నేత చరిత్ర ను చదివాను.ఆయన జీవితం యొక్క ప్రేరణను ఆచరించి నేను సులభంగా విజయాన్ని సాధించాను.ఎవరు ఆ గొప్ప నాయకుడు అని జర్నలిస్ట్‌ అడిగాడు.


”మిత్రులారా! ఇది నేను చదినప్పటినుండి నా గుండె గర్వంతో ఉప్పొంగినది. అలాగే మీ గుండె కూడ గర్వంతో నిండి పోతుంది. వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి ఇలా సమాధానం చెప్పాడు.ఆయనే భారతదేశ మహానాయకుడు భీంరావ్‌ అంబేద్కర్‌. ఆయన అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అన్నారు. బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ పేరును ఉచ్చరించే సమయంలో తన కళ్ళలో వీరత్వం మెరిసిసింది.అంతేకాదు, ఒకవేళ ఆ వ్యక్తి మా దేశంలో పుట్టిఉంటే నేను ప్రపంచాన్నే పాలించేవాన్ని అన్నారు.కొన్ని సంవత్సరాలకు ఆ దేశాధ్యక్షుడు మరణించిన తరువాత తన సమాధి పై ఏం రాయించుకున్నాడో తెలుసా! ”ఈ సమాధి ఒక భీంరావ్‌ అంబేద్కర్‌ శిష్యుని సమాధి అని”. కొన్ని సంవత్సరాల తరువాత వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన కు వచ్చాడు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం మొదట ఎర్రకోట తరువాత గాంధీ సమాధి చూపించారు. ఇదంతా చూచిన తరువాత ఆ మంత్రి మహానీయ భీంరావ్‌ అంబేద్కర్‌ సమాధిó ఎక్కడ అని అడిగాడు.అప్పుడు భారత అధికారి ఆశ్చర్య పోయి ముంబై లోని దాదర్‌లో ఉన్న చైత్య భూమి అని చెప్పాడు.ఆ వియత్నాం విదేశాంగ మంత్రి ముంబై వెళ్ళారు.అక్కడ బాబాసాహేబ్‌ సమాధిని దర్శించుకున్నారు. సమాధి వద్ద కొంత మట్టిని తిసుకుని బ్యాగ్‌ లో నింపుకున్నాడు.ఓ విలేకరి ఆ మట్టి గురించి అడగగా ఆ మంత్రి ఇలా అన్నారు.”ఈ మట్టి బాబాసాహేబ్‌ పాదాల వద్ద ఉన్నది. ఈ మట్టిని నాదేశ మట్టితో కలుపుతాను ,దీనితో నాదేశంలో ఇలాంటి నాయకుడు జన్మిస్తాడని ఆశిస్తున్నాను.బాబాసాహేబ్‌ భీం రావ్‌ అంబేద్కర్‌ కేవలం భారత దేశానికే కాకుండా సమస్త విశ్వానికే గర్వ కారణం.” ఈ కథ ఇప్పుడు వాట్సాప్‌లలో తిరుగుతున్నది. అంబేద్కర్‌ ఒక సంస్కర్తగా దేశ చరిత్రలో ఆయన స్దానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అతిశయోక్తులు చెప్పటం ద్వారా సాధించేదేమిటి ? కాపీ కథ ఆయనకు గౌరవం పెంచుతుందని భావిస్తున్నారా ?


ఇక అతిశయోక్తులు, ఘనతల చెప్పుకోవటాలు సరేసరే ! ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి రోజువారీ అంశాల గురించి చర్చ జరుపుతుంది. దాని నిబంధనల ప్రకారం శాశ్వత, రెండు సంవత్సరాల పాటు సభ్యులుగా ఉండే దేశాలలో నెలకు ఒకరు చొప్పున అధ్యక్షత వహిస్తుంటారు. సాధారణంగా ఐరాసలో శాశ్వత అధికారులుగా ఉన్న ఆయా దేశాల ప్రతినిధులే ఆ పని చేస్తారు. ఆగస్టు నెల అధ్యక్ష పదవి మన దేశానికి వచ్చింది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వంతులను నిర్ణయిస్తారు. ఇదేదో ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడికి నిదర్శనం అన్నట్లుగా కొందరు ప్రచారం చేశారు. భద్రతా మండలికి మన దేశం ఎన్నిక కావటం మొదటిసారి కాదు, ఎన్నికైన ప్రతిసారీ మనవంతు వచ్చినపుడు ఆ బాధ్యత నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టిఎస్‌ తిరుమూర్తి మన శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. గతంలో మోడీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న హర్దీప్‌ సింగ్‌ పూరీ రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరొకటి తొలిసారిగా ఒక భారత ప్రధాని భద్రతా మండలి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారంటూ అదొక ఘనతగా ప్రచారం చేస్తున్నారు. భద్రతా మండలిలో ప్రతినెలా వివిధ అంశాల మీద బహిరంగ చర్చలు జరుగుతుంటాయి. భద్రతా మండలి సభ్యదేశాల అధిపతులు లేదా ప్రతినిధులు వాటిలోప్రత్యక్షంగా పాల్గొంటారు, కాని దేశాల వారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పిస్తారు. అలాంటి నెలవారీ కార్యక్రమంగా ఈనెలలో సముద్రయాన భద్రత అంశం గురించి చర్చిస్తున్నారు. దానికి మన ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎంత మంది దేశాధినేతలు పాల్గొంటారో తెలియదు. ఇదొక గోష్టి వ్యవహారం తప్ప అంతకు మించి ప్రాధాన్యత ఉండదు. పెగాసస్‌ భూతంతో అనేక అంశాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీకి ఈ గోష్టి ప్రపంచ మీడియాలో చోటు కల్పిస్తుంది. ఇలాంటి వాటిని గొప్పగా చెప్పుకోవటమా లేదా అన్నది ఎవరి అభిరుచి వారిది !

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం -2 : పెరుగుతున్న మతోన్మాద ముప్పు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


1757లో ప్లాసీ యుద్దంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన తరువాత ఆంగ్లేయులు మన దేశంలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1947వరకు పాలించారు, మన సంపదలను దోచుకున్నారు, వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మన దేశాన్ని ముడి వస్తువులను సరఫరా చేసేదిగానూ, వినియోగ మార్కెట్‌గా మార్చివేశారు. ఏడున్నర దశాబ్దాల తరువాత చూస్తే పరిస్ధితి ఏమిటి ? బ్రిటీష్‌ వారు భౌతికంగా మనలను పాలించటం లేదు తప్ప ఆ దేశానికి చెందిన వాటితో సహా అనేక దేశాల సంస్దలు మనలను కొత్త రూపాల్లో ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నాయి. మన దగ్గర లేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొనేందుకు విదేశీ కంపెనీలను అనుమతించాలా వద్దా అంటే అనుమతించక తప్పదు, ఎవరూ అభ్యంతర పెట్టటం లేదు. కానీ ఆ పేరుతో విదేశీ కంపెనీలకు మన మార్కెట్‌ ద్వారాలు తెరిస్తే మనం అభివృద్ధి చెందేది ఎప్పుడు, మన జనానికి ఉపాధి దొరికేది ఎన్నడు ? ప్రభుత్వ రంగమూ లేదు, ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చైనాకు పోటీగా మన దేశాన్ని మరో ప్రపంచ ఫ్యాక్టరీగా చేస్తామని నరేంద్రమోడీ మేక్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా అన్నారు. వాటి సూచనలే లేవు. పిలుపులు ఇస్తే చాలదు, ఆచరణకు అనువైన విధానాలను చేపట్టాలి. చివరకు ఆ చైనా నుంచే వస్తువులను దిగుమతి చేసుకోకపోతే గడవని స్ధితి.


మన కంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా విదేశీ దురాక్రమణ నుంచి రెండవసారి స్వాతంత్య్రం తెచ్చుకుంది చైనా. ఆ నాటికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మనకంటే వెనుకబడి ఉంది. అలాంటి దేశం ఇప్పుడు ఎక్కడ ఉంది ? అత్యంత అభివృద్ది చెందిన అమెరికా, ఐరోపా ధనిక దేశాలను అధిగమించి ముందుకు పోతున్నది. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టి ప్రధమ రాజ్యంగా అవతరించనుంది. ఇప్పటికే టెలికాం రంగం, మరికొన్ని పరిజ్ఞానాల్లో పశ్చిమ దేశాల కంటే ముందుంది. వారికి సాధ్యమైంది మనకు ఎందుకు కావటం లేదు ? అది కమ్యూనిస్టు నియంత దేశం మనది ప్రజాస్వామ్యం కనుక చైనాతో పోల్చకూడదు అంటారు. ప్రపంచంలో అనేక దేశాలను ఏలిన నియంతలందరూ తమను ప్రజాస్వామ్యవాదులుగా వర్ణించుకున్నారు. మరి ఆ దేశాలు చైనా మాదిరి వృద్ది చెందలేదేం ? పోనీ మనది నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటే చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. స్వేచ్చ, స్వాతంత్య్రం అవసరం అయినదాని కంటే ఎక్కువ ఉందంటున్నారు గనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మన జనం పని చేయాలి కదా ? లోపం ఎక్కడుంది ?


బ్రిటీష్‌ వారు వెళ్లిపోతూ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. హిందూ-ముస్లిం విబేధాలను రగిలించారు. ఆ సందర్భంగా జరిగిన హింసాత్మక ఉదంతాలలో లక్షలాది మంది మరణించారు, ఆ సంఖ్యను రెండు నుంచి 20లక్షలుగా చెబుతారు. అలాగే కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. నాడు ఆంగ్లేయులు తమ అజెండాను అమలు చేసేందుకు తనకు అనుకూలంగా పాకిస్ధాన్‌ పేరుతో కొంత ప్రాంతాన్ని మరల్చుకొనేందుకు మత విభజనను ముందుకు తెచ్చారు. ఏడున్నర దశాబ్దాల తరువాత ఇప్పుడు దేశంలో పెరుగుతున్న మత విభజనను ఎవరు తెస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం ? వీరికీ బ్రిటీష్‌ వారికీ తేడా ఏముంది ? బ్రిటీష్‌ వారిని తప్పు పట్టిన వారు వీరి విషయంలో అలా ఎందుకు ఉండలేకపోతున్నారు ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రభుత్వం దగ్గర అవసరమైన పెట్టుబడిలేకపోవటంతో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పేరుతో ప్రభుత్వం ఒక పునాది వేసింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలనే పద్దతిని అనుసరించారు. ప్రభుత్వ రంగం ప్రజల ఆస్తులను పెంచటమే కాదు, సామాజిక న్యాయాన్ని అమలు జరపటంలో, ఆదర్శయజమానిగా వ్యవహరించటంలో ముందుంది. మిలిటరీ, కరెన్సీ, పోలీసుల, సరిహద్దుల భద్రత, కీలకమైన రక్షణ పరిశ్రమల వంటి తప్ప మిగిలిన రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు 1990దశకం నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను క్రమంగా వదిలించుకుంటున్నారు. ఈ విధానాలలో కాంగ్రెస్‌-బిజెపికి ఉన్న తేడా ఏమంటే బిజెపి వేగం పెంచింది. గత మూడు దశాబ్దాలలో ఎవరు అధికారంలో ఉన్న కొన్ని రక్షణ విభాగాల్లో తప్ప మిగతావాటిలో ఎక్కడా ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. తాజాగా రక్షణ రంగంలో కూడా ప్రయివేటుకు ద్వారాలు తెరిచారు. అమెరికా, ఐరోపా దేశాల అనుభవం చూసినపుడు ముఖ్యంగా అమెరికాలో మిలిటరీ పరిశ్రమల సముదాయాలు అభివృద్ధి చెందాయి. ఫలితంగా వాటి లాభాలను పెంచేందుకు ప్రపంచ వ్యాపితంగా నిత్యం ఎక్కడో ఒకచోట స్వయంగా యుద్దాలకు దిగటం లేదా రెండు దేశాల మధ్య తంపులు పెట్టి ఇరుపక్షాలకూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. గతంలో భారత్‌ -పాక్‌ మధ్య అదేపని చేసిన అమెరికా ఇప్పుడు చైనా మీదకు మనలను ఉసిగొల్పి మనకు ఆయుధాలు అమ్ముతున్నది. విమానాలతో సహా స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో వారున్నారు గనుక అమెరికా ఆయుధాల భారం మోసేది మనమే. ఏడు సంవత్సరాలుగా చమురు పన్నులు పెంచుతున్న పాలకులు ఎందుకు పెంచారంటే గాల్వన్‌ ఉదంతాన్ని చెబుతున్నారు. అది జరిగింది ఎప్పుడు ? మనల్ని బాదటం ప్రారంభించింది ఎప్పుడు ?


ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలను ఆసరా చేసుకొని అనేక ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ది చెందాయి. ఐడిపిఎల్‌లో పని చేసిన వారు అనేక మంది ఔషధ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగారో చూస్తున్నాము. అలాంటి వారు నేడు ప్రభుత్వ రంగంలో ఫార్మా పరిశ్రమలను మూసివేసే విధంగా వత్తిడి తెచ్చి వాటి స్ధానాన్ని వారు అక్రమించటం తెలిసిందే. వాక్సిన్ల తయారీని సీరం, భారత్‌ బయోటెక్‌ వంటి ప్రయివేటు సంస్ధలకు వదలివేసి ప్రభుత్వరంగంలోని సంస్ధలను పాడు పెట్టటం గురించి ఇటీవలనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో తయారీ బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లాభమా నష్టమా అని లెక్కలు వేసుకొని మన బిహెచ్‌యిఎల్‌ను దెబ్బతీసి దిగుమతులు చేసుకోవటం విద్యుత్‌ రంగంలో చూశాము.ఇదే పరిణామం అనేక రంగాల్లో కనిపిస్తుంది. మన దేశంలో అనేక మంది నిపుణులు ఉన్నప్పటికీ పరిశోధన-అభివృద్ది రంగంలో తగిన పెట్టుబడులు పెట్టకుండా సాంకేతిక రంగంలో ముందుకు పోవటం ఏ దేశానికీ సాధ్యం కాదు. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను నిర్మించాలన్న కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమొక్కటే కాదు, పరిశోధనా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కారణంగానే నేడు పశ్చిమ దేశాలకు సవాలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందుకు పోతోంది.


ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రయివేటు రంగం మీద అన్నింటినీ వదలివేసింది. అమెరికా, ఐరోపా దేశాల ప్రయివేటు సంస్ధలు తమ దేశాల్లో పరిశ్రమలు పెట్టటం కంటే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాలనుంచి వినియోగవస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందాయి. గత ఏడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడీ ఏలుబడిలో చైనా నుంచి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటే దాని అర్ధం ఇక్కడి పారిశ్రామిక-వాణిజ్య సంస్దలు కూడా అదేబాట పట్టాయన్నది స్పష్టం.లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తరువాత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఏడాది కాలంలో కరోనా కారణంగా మొత్తంగా మన దిగుమతులు తగ్గాయి కనుక ఆమేరకు చైనా నుంచి తగ్గాయి తప్ప ఇప్పటికీ అక్కడి నుంచే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము. ఇటీవలి కాలంలో తిరిగి పెరుగుదల ప్రారంభమైంది.


విదేశాంగ విధానంలో అటు అమెరికా ఇటు సోవియట్‌ వైపు మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించి అలాంటి దేశాల నేతగా మన దేశం ఎదగటమే కాదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించింది. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత మన దేశం అలీన విధానానికి స్వస్తిపలికింది. అమెరికాకు చేరువ కావటమే కాదు, దాని జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు అడుగులు వేసింది. దానితో సంబంధాల కారణంగానే యుపిఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత ఏడు సంవత్సరాల పరిణామాలను చూస్తే అమెరికాకు దగ్గరయ్యే వేగం పెరిగింది. ట్రంప్‌ హయాంలో మన దేశం నుంచి చేసుకుంటున్న దిగుమతుల మీద ఇస్తున్న పన్ను రాయితీలను అమెరికా రద్దు చేసింది. అదే విధంగా మనం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం ద్వారా పరిమితులకు మించి సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో దాన్ని రద్దు చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసులు దాఖలు చేసింది. ఆ వత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో చట్టాలను పార్లమెంట్‌లో ఎంత హడావుడిగా ఆమోదింప చేయించుకుందో చూశాము. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వేసిన తొలి అడుగు అవి. వాటి ప్రమాదాన్ని గ్రహించిన పంజాబ్‌, హర్యానా, యుపిలోని వ్యవసాయ ప్రధాన ప్రాంతాల రైతాంగం గతేడాది నవంబరు నుంచి నిరవధిక ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.


అలాంటి అమెరికాతో కలసి మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరుపుతున్నాము. మనకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణాను అనుమతించాలనే పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమిలో చేరాము. అంతేకాదు అమెరికాకు అంగీకారం లేదు గనుక ప్రాంతీయ ఆర్దిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు నిరాకరించాము. దానిలో చేరితే మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యాలకు హాని జరిగే మాట నిజం. దాన్ని సాకుగా చూపినప్పటికీ అమెరికాతో బిగుస్తున్న ముడే ప్రధానంగా వెనక్కు లాగింది. మరోవైపు తమ ప్రయోజనాలను బేరీజు వేసుకొని అమెరికా వద్దని వారిస్తున్నా ఆర్‌సిఇపిలో జపాన్‌, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఈ పరిణామాల తరువాత ఆకస్మికంగా గాల్వన్‌ ఉదంతాలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి ప్రత్యేక అజెండా లేకుండానే నరేంద్రమోడీ చైనా పర్యటన తరువాత గ్జీ జింపింగ్‌ అదే మాదిరి మహాబలిపురం వచ్చిన విషయం తెలిసిందే.


రాచపీనుగ ఒంటరిగా పోదన్న సామెత తెలిసిందే. అమెరికాతో అంటకాగితే దానికి వచ్చే సమస్యలను మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ ఆఫ్ఘన్‌ ఉదంతమే. అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తరువాత వారి నమ్మి పెట్టుబడులు ఏమౌతాయో తెలియదు. అన్నింటికీ మించి తాలిబాన్ల ముప్పు మన దేశానికి ఎదురవుతుందా అన్న సమస్య ముందుకు వచ్చింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికాతో వ్యవహరించిన మన దేశం అమెరికా మాదిరే ఉగ్రవాదులైన తాలిబాన్లతో రహస్యంగా చర్చలు జరపాల్సి వచ్చింది. తాలిబాన్లను అదుపు చేయాలంటే పాకిస్దాన్‌ సహకారం అవసరం గనుక నాటకీయ పరిణామాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ గురించి ఒప్పందం కుదిరినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాన్‌ – అమెరికా వివాదంలో మనకేమీ సంబంధం లేదు. అమెరికన్లు ఇరాన్‌ మీద ఆంక్షలు విధించారు. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించే దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. మన దేశం భయపడిపోయి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది.అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన మిత్రదేశం ఇరాన్‌ గతంలో సమదూరంలో ఉండేది ఇప్పుడు చైనాకు దగ్గర అయింది. మన చుట్టుపక్కల దేశాలన్నీ అదే విధంగా మారాయి. కారణం అమెరికాను మనం కౌగలించుకోవటమే.


తొలి 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో రాజకీయ రంగంలో ప్రధానంగా ముందుకు వచ్చిన ధోరణి కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు 75 సంవత్సరాల తరువాత దాని స్ధానంలో బిజెపి వ్యతిరేకతకు పునాది పడింది. రెండింటికీ కారణం ఒక్కటే. కాంగ్రెస్‌ ఎలా అయితే అప్రజాస్వామికంగా ప్రత్యర్ది పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయటం, పార్టీలను దెబ్బతీయటం చేసిందో, బిజెపి ఏడు సంవత్సరాల్లోనే దాన్ని మించి పోయింది. దానికి తోడు మతతత్వాన్ని జోడిస్తోంది. ఇది సమాజం చీలిపోవటానికి దారి తీస్తుంది. వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య ఆర్దిక విధానాల విషయంలో ఎలాంటి పేచీ లేదు. పంచాయతీ అల్లా అధికారం దగ్గరే. అందుకే గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత ముందుకు వస్తే దాని స్దానంలో ఇప్పుడు బిజెపి వచ్చింది. అయితే జనం కాంగ్రెస్‌కు ఇచ్చినంత అవకాశం బిజెపికి ఇచ్చే స్ధితి లేదు.


ఏ దేశమైనా తమ ప్రయోజనాలకు తొలి పీట వేయటం ఇప్పుడు ప్రపంచమంతటా జరుగుతోంది. అది దురహంకారంగా మారకపోతే, ఇతర దేశాల ప్రయోజనాలకు ఎసరు పెట్టే విధంగా లేకపోతే ఇబ్బంది లేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బాగు చేసుకోవటం లేదా ముందుకు పోవటం ఎలా అనేదాని కంటే చైనాను దెబ్బతీయటం మీదనే కేంద్రీకరిస్తున్నాయి.దేశీయంగా దివాలా కోరు విధానాలను అనుసరిస్తున్నంత కాలం మరో 75 సంవత్సరాలు గడచినా జన జీవితం మెరుగు పడదు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదలి ఏదో ఒక దేశానికి తోకగా మారితే దాని తప్పులకు మనం కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పాలకులు ఎలాగూ ఈ విషయాలను పట్టించుకొనే స్ధితి లేదు. జనం పట్టించుకోకపోతే ఆమృత మహౌత్సవం ముగిసిన తరువాత హాలా హలాన్ని మింగాల్సి వస్తుందన్నదే 75వ స్వాతంత్య్రదినోత్సవ హెచ్చరిక !

మొదటి భాగం https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం,
తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయి చరిత్ర సారం ” అన్న శ్రీశ్రీని మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు తెచ్చుకోవటం అవసరం. స్వాతంత్య్రానికి ముందు పుట్టి తరువాత దేశాన్ని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. తరువాత పుట్టిన వారు ఈ దేశం మాకేమిచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్ధితి. బిడ్డ పుట్టి పెరిగే క్రమంలో జరిగే పరిణామాల మాదిరే స్వాతంత్య్ర తరువాత దేశంలో కూడా మార్పులు వచ్చాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంతోనా లేక ఈసురో మంటూ ఎదిగినట్లా అన్నదే అసలు సమస్య. స్వాతంత్య్ర దేశాన్ని కూడా అలాగే చూడాలి.


కాలం గడిచే కొద్దీ మెరుగు పరచాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్ధలకు తూట్లు పొడుస్తున్నారు. విపరీత అర్ధాలు చెబుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి హరించుకుపోతున్నాయి లేదా కదలా మెదల్లేని బంధనాల్లో ఇరుక్కు పోతున్నాయి. మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా ? స్వాతంత్య్రం అంటే ఇదా, ఇలాంటిది మనకు అవసరమా అనే ప్రశ్నలు అనేక మందిలో ఉన్నాయి. ఇంతకాలం తరువాత ఇలాంటి ఆలోచనలు కలగటం విచార, విషాదకర స్దితి. ప్రస్తుత తీరు తెన్నులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్దితి ఇంకా దిగజారుతుందా అన్న ఆందోళన తలెత్తుతోంది. సాగు, నిత్య పర్యవేక్షణ లేకపోతే పంట భూముల్లో కలుపు మొక్కలు పుట్టినట్లు లేదా కబ్జాకు గురైనట్లుగానే అనేక దేశాల్లో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినపుడు నియంతలు ముందుకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఎవడొస్తే మనకేంలే మన మీద భారాలు, మనకు బాధలు తప్పవు అని జనం నిర్లిప్తతకు లోనవుతారు.


డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్య్ర సందర్భాన్ని ఏమని పిలవాలి అన్నది ఒక మీమాంస. వజ్రోత్సవం లేదా ప్లాటినం వాటి నిర్వచనాలకు సరిపోదు. నూటయాభయ్యవ సంవత్సరాన్ని ఆంగ్లంలో సెస్‌కో సెంటెనియల్‌ అన్నారు. దీనికి తెలుగులో తగిన పదం లేదని గూగుల్తల్లి నిఘంటువు సమాధానం చెప్పింది. తెలిసిన వారెవరైనా సూచిస్తే దాన్నే ఉపయోగిద్దాం. డెబ్బయి అయిదు అంటే నూటయాభైలో సగం కనుక సెమీ సెస్‌కో సెంటినియల్‌ అనాలన్నారు. మన ప్రధాని నరేంద్రమోడీ గారు అమృత మహౌత్సవ్‌ అన్నారు. పేరులోనేమున్నది పెన్నిధి. వదిలేద్దాం. దానితో ఎవరికీ పేచీ లేదు.
జూలై ఒకటిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా వారు ఎంత గొప్పగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారో, కమ్యూనిస్టు ఆశయాలకు ఎలా పునరంకితమయ్యారో యావత్‌ ప్రపంచం చూసింది. మనకంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా అక్కడ కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడింది, 75 ఏండ్ల ఉత్సవాన్ని వారెలా జరుపుకుంటారో తరువాత చూద్దాం. మోడీ గారు ఏడేళ్ల క్రితం అనేక మాటలు చెప్పారు. తరువాత చెప్పిన మాట చెప్పకుండా చేసేది చెప్పకుండా చెప్పింది చెయ్యకుండా అసాధారణ ప్రతిభతో ” నిత్య నూతనత్వంతో ” గడుపుకు వస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు అమృత మహౌత్సవం జరుపుకొనే స్ధితిలో ఉన్నామా హాలాహలం మింగాల్సిన దుస్దితిలో ఉన్నామో తెలియటం లేదు. అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని వాగ్దానం చేసిన ప్రస్తుత కేంద్ర పాలకులు జనం చేత దేన్ని మింగిస్తారో అర్ధం కావటం లేదు.


ప్రతి ఏడాదీ పంద్రాగస్టు పండగ జరుపుకుంటున్నాం. అదొక తంతులా మారిపోయిందని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సిన పని లేదు. అంతకు మించి జరుగుతున్నదేమీ లేనపుడు ఎవరైనా అలాగే అనుకుంటారు మరి. పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు అన్నట్లుగా మార్చివేశారు. ఉదయాన్నే దేశభక్తి గీతాలు, పాటలను వినిపించటం, మూడు రంగుల జండా ఎగురవేయటం, ప్రతిజ్ఞలు, పప్పు బెల్లాల స్ధానంలో ఏదో ఒకటి తిని మిగిలిన రోజంతా సెలవుగా గడిపేయటానికి అలవాటు పడ్డాము. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్దగా ఉన్న కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా మార్చి వేశారు. ఆ ఉద్యమం ఏ లక్ష్యాలనైతే ముందుకు తెచ్చిందో వాటిని ఆ పార్టీ 1947 ఆగస్టు 16 నుంచే మరచి పోయింది. దాన్ని నీరుగార్చే, ముప్పు తెచ్చే, జనానికి విశ్వాసం కోల్పోయే చర్యలకు పాల్పడింది. చరిత్ర దాస్తే దాగేది కాదు. విజేతలే చరిత్రను రాస్తారు అన్నది తెలిసిందే. అందువలన అది వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనం కూడా చరిత్రను రాస్తున్నారు. అందువలన దానిలో ఎలాంటి వివక్ష, పక్షపాతం ఉండదు. చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఉపయోగించుకొనేందుకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవటమే కాదు బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వారి వారసులతో నిండిన బిజెపి రంగంలోకి దిగింది. బ్రిటీష్‌ పాలన నుంచి దేశ విముక్తి అన్న నినాదాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అనే పేరుతో జనం ముందు మాట్లాడింది. కాంగ్రెస్‌ విధానాలనే వేగంగా అమలు చేస్తూ దేశం మరింత దిగజారే విధంగా ఏలుబడి సాగిస్తోంది.


ఎందుకీ పరిస్ధితి తలెత్తింది ? దీక్షా దినంగా పాటించాల్సిన స్వాతంత్య్ర దినాన్ని సెలవుగా మార్చినపుడే ఆ మహౌద్యమాన్ని జనం మరచి పోవాలన్న అంశం దానిలో ఇమిడి ఉంది. చివరకు అది ఎంతవరకు వచ్చిందంటే స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలకు ముప్పు వచ్చిందని చెబుతున్నవారిని ఇప్పుడు జనం అపహాస్యం చేస్తున్నారు. అవి ఉంటేనేం లేకపోతేనే అంటున్నారు. పంద్రాగస్టు పండగకు 75 వారాల ముందే ప్రధాని నరేంద్రమోడీ మార్చి 12న గుజరాత్‌లో అజాదీ కా అమృతమహౌత్సవాన్ని ప్రారంభించారు. 2022 ఆగస్టు 15న నాటికి డెబ్బయిఅయిదు సంవత్సరాలు నిండి 76వ ఏట ప్రవేశిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ఇది రాసిన సమయానికి వాటిని ఖరారు చేయలేదు. అమృతమహౌత్సవాన్ని ప్రజాఉద్యమంగా నిర్వహించాలని దాని అమలుకు హౌమ్‌ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన ఒక జాతీయ కమిటీ ఉంటుందని చెప్పారు. వారేమి చేస్తారో, అవెలా ఉంటాయో మరో సందర్భంగా చర్చించుకుందాం.


స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు అందరూ ఒకే పార్టీలో లేరు, అనేక పార్టీలలో చేరారు. మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తామే దేశాన్ని విముక్తి చేశామని వారు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్‌ దేశానికి శనిలా దాపురించిందని దాన్నుంచి ముక్తి కలిగిస్తామంటూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌గా మారుస్తామని బిజెపి ప్రకటించుకుంది. దేశ రాజ్యాంగం ప్రకారం నాలుగు ఉన్నత పదవుల్లో అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, ముందే చెప్పుకున్నట్లు బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వారి రాజకీయ వారసులు ఇప్పుడు అధిష్టించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాని,లోక్‌సభ స్పీకర్లుగా సంఘపరివార్‌ రాజకీయ విభాగమైన బిజెపికి చెందిన వారే ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, హత్య సమయంలో అతను తమ సంస్ధలో లేడని వారు చెబుతారు గానీ గాడ్సే కుటుంబసభ్యులు సంఘపరివార్‌లోనే ఉన్నట్లు చెప్పారు. అది తేలేది కాదు గనుక ఆ వివాదాన్ని పక్కన పెడదాం. గాంధీని నేనెందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకరూపంలో ప్రచురించి ప్రచారం చేస్తున్నవారు, సామాజిక మాధ్యమంలో అవే వాదనలను చేస్తున్న వారెవరో మనకు తెలుసు, అయితే అదంతా అనధికారికంగానే అనుకోండి. అలాంటి వారికి స్వాతంత్య్రం , దాని లక్ష్యాల మీద , ప్రజాస్వామిక వ్యవస్ధల పట్ల గౌరవం ఉంటుందా ? ఒకవైపు గాంధీకి నివాళులు అర్పిస్తూ మరోవైపు గాడ్సేను ఆరాధించే వారు పెరుగుతున్నారు, వారు ఎంతకైనా తెగిస్తారు. ఇంతకంటే ఆందోళనకరమైన అంశం ఏముంటుంది ?


జనాభాలో సగ భాగం గురించి ఇన్నేండ్లుగా కబుర్లు చెప్పటమే తప్ప ఫ్యూడల్‌ భావజాలం నుంచి ఇంకా బయటపడలేని స్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక దేశాల చట్ట సభల్లో మహిళలు సగం మంది ఉన్నారు. తాజాగా చిలీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. మన దేశంలో చట్టసభల్లో 33శాతం గురించి ఎప్పటి నుంచో చర్చ. తమకు సంపూర్ణ మెజారిటీ ఉంటే అమలు జరుపుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో వారికి, వారిని బలపరిచే మిత్రపక్షాలతో కలిపి అవసరమైన మెజారిటీ ఉంది. మెజారిటీ రాష్ట్రాలూ వారివే. అయినా దాని గురించి ఎప్పుడైనా ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావన చేశారా అంటే లేదు.


మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది అని చెబుతుంటాం, నిజమే. కానీ అది జనానికి ఏ మేరకు ఉపయోగపడిందన్నదే గీటురాయి. వేల కోట్ల రూపాయలను పెట్టి రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటానికి, అవసరం లేకపోయినా కొత్త పార్లమెంట్‌ భవనం కట్టేందుకు నిధుల కొరత లేదు. కరోనా మహమ్మారి పోరు గురించి కబుర్లకూ అంతకంటే కొదవ లేదు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించి రాకెట్లను ఎగరేశాం గానీ చాలా చౌకగా లభించే ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయారు. అనేక మంది కరోనా పీడితులు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య ఆకుల పసరు ఆక్సిజన్‌ అందిస్తుందంటే, పచ్చడి కరోనాను అరికడుతుందంటే నిజమని జనం నమ్మారు. దీన్ని ఎలా చూడాలి ? కరోనా నిరోధం కోసం లాక్‌డౌన్‌ పెట్టినపుడు రెక్కాడితే తప్ప డొక్కాడని వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లేందుకు అయ్యే రైలు ఖర్చులను కేంద్రం – రాష్ట్రాలు ఎవరు భరించాలి అని వివాదపడిన అపర మానవతా వాదులను మనం తప్ప మరేదేశమూ చూడలేకపోయింది.

పది లక్షల కోట్ల రూపాయల పారుబాకీలను వేళ్ల మీద లెక్కించదగిన బడాబాబులకు రద్దు చేయటానికి ఉదారంగా నిర్ణయాలు చేసిన పాలకులకు వాక్సిన్లు వేయటానికి చేతులు రాలేదు. తాము స్వయంగా చెప్పిన ఉచితవాక్సిన్లు వేసేందుకు మధ్యలో ఠలాయించి సగం భారం రాష్ట్రాల మీద మోపేందుకు, చివరకు సుప్రీం కోర్టు వాక్సిన్ల పేరుతో కేటాయించిన సొమ్ముకు లెక్కలు చెప్పండని నిలదీస్తే తప్ప లొంగని నేతలు ఇప్పుడున్నారు. కరోనాను ప్రపంచ విపత్తుగా ప్రకటించారు. మనం దేశంలో విపత్తు సహాయ చట్టం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారు. కరోనా జాతీయ విపత్తుగా పరిగణించినపుడు నష్టపరిహారం ఎందుకు ఇవ్వరు. ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు ? ఎవరు ఎవరికి జవాబుదారులుగా ఉన్నారు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ? రెండు విడతలుగా ఇరవై ఆరులక్షల కోట్ల ఆత్మనిర్భర తాయిలాలను అందించిన కేంద్ర పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు వాయిదాల కరువు భత్యం చెల్లింపునకు ఎసరు పెట్టారు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. అనేక దేశాలలో కరోనా సహాయ చర్యలకు గాను ప్రభుత్వాలు కార్పొరేట్ల మీద ప్రత్యేక పన్ను విధించి నిధులు సమకూర్చుకున్నారు. మన దేశంలో అలాంటిదేమీ లేకపోగా ఉద్యోగుల పొట్టగొట్టేందుకు పూనుకున్నారు. నిలిపివేసిన కరవు భత్యాన్ని వాయిదాల రూపంలో లేదా పిఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నా అదొక దారి, ఎగ్గొట్టటం ఏమిటి ?
(రెండవ భాగంలో ముగింపు https://vedikaa.com/2021/08/09/india-independence-75-what-is-happening-part-two/ )

జపాన్‌ మీద అణుబాంబు వేస్తామని చైనా బెదిరించిందా ? నిందలు-నిజాలేమిటి ?

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


జూలై మూడవ వారంలో మన దేశంతో సహా ప్రపంచ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేమంటే జపాన్‌ మీద అణుబాంబులు వేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది లేదా ప్రకటించింది. నిత్యం చైనాను రెచ్చగొట్టే దేశాలలో జపాన్‌ కూడా ఒకటి గనుక దానికి చైనా దిమ్మతిరిగే జవాబు ఇచ్చిందని ఎవరైనా కమ్యూనిస్టులు కూడా లోలోపల సంతోషించారేమో తెలియదు. వ్యతిరేకులు మాత్రం వెంటనే అందుకున్నారు. దీనిలో నిందలు- నిజాలేమిటి ? కౌపీన సంరక్షణార్ధం చివరికి ఒక సర్వసంగ పరిత్యాగి సంసార ఊబిలోకి దిగాల్సి వచ్చిందనే కథ తెలిసిందే కదా ! సదరు వార్తను పట్టుకొని గోతికాడ నక్కల్లా కూర్చున్న కొందరు అలాంటి కథలనే అల్లారు, వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చెప్పింది ఏమిటి ?


” అణ్వాయుధాలను తాముగా ముందు ఉపయోగించబోమని గతంలో ప్రకటించిన విధానానికి చైనా తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు జపాన్ను బెదిరించింది కనుక యావత్‌ దేశాలకూ ముప్పు వచ్చింది. చైనా వారు 250 అణుబాంబులను భూగర్భంలో దాస్తున్నారు. వాటిని ప్రత్యర్ధులు పసిగట్టలేరు. కానీ అమెరికా కనుగొన్నది. ప్రత్యర్ధుల దాడికి దొరకవు. అందువలన ఆసియన్‌ దేశాలన్నీ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి.” ఇలాంటి వ్యాఖ్యానాలతో చైనా బెదిరింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కధనాలను ఆగస్టు ఆరవ తేదీన ఈనాడు పత్రికలో వ్యాసరచయిత కూడా తలకెత్తుకొని నేను సైతం అన్నట్లుగా ఒక రాయి వేశారు.


చైనా గురించి వచ్చిన వార్తలు, వ్యాఖ్యల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది ? తైవాన్ను ఆక్రమించుకొనేందుకు చైనా ప్రయత్నించినపుడు దాన్ని అడ్డుకొనేందుకు జపాన్‌ ఒక సైనికుడు, ఒక నౌక, ఒక విమానాన్ని పంపినప్పటికీ అది లొంగిపోయేంతవరకు అణుబాంబులను ప్రయోగించాల్సిందే అని చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చైనా ప్రధాన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో తైవాన్‌ దీవి ఉంది. అది చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. దానికి ఒక వైపున దక్షిణ చైనా సముద్రం, రెండో వైపు తూర్పు చైనా సముద్రం ఉంది. మరోవైపున జపాన్‌ ఉంది. ఐక్యరాజ్యసమితి జాబితాలో తైవాన్‌ అనే దేశం లేదు. నిత్యం వివాద పడుతున్న అమెరికా, జపాన్‌ కూడా ఆ ప్రాంతం చైనాకు చెందినదే అని అంగీకరించాయన్న వాస్తవాన్ని ముందు తెలుసుకోవాలి. చైనా విప్లవ సమయంలో కమ్యూనిస్టులను ఎదిరించిన నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ అప్పటి మిలిటరీ, ఆయుధాలను అన్నింటినీ తీసుకొని తైవాన్‌ దీవిలో కేంద్రీకరించాడు. అతగాడికి అమెరికా,బ్రిటన్‌,జపాన్‌ వంటి దేశాలన్నీ ఆయుధాలు అందించి పటిష్టపరిచాయి. కమ్యూనిస్టులు తైవాన్‌ దీవి మీద తమ బలాన్నంతటినీ కేంద్రీకరించటం కంటే మిగతా దేశంలో ఎదురవుతున్న ప్రతిఘటనను అణచివేయటమే ముఖ్యం, తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని అనుకున్నారు. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ తన అధికారాన్ని స్ధిరపరచుకొనేందుకు పది సంవత్సరాల పట్టింది. ఈలోగా తైవాన్‌లోని మిలిటరీని మరింత పటిష్టపరిచారు.

1970వరకు అంటే రెండు దశాబ్దాల పాటు తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా ఐక్యరాజ్యసమితిలో గుర్తించటం, అధికారిక సంబంధాలు పెట్టుకోవటం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సైనిక చర్య కంటే శాంతియుత విలీనానికే ప్రాధాన్యత ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. తరువాత రెండు చైనాలు అనేవి లేవు, ఉన్నది ఒకటే, అది కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ప్రధాన ప్రాంతంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. కానీ విలీనానికి తగిన పరిస్ధితులు లేవు, తైవానీయుల్లో అనుమానాలు ఉన్నాయి, అవి తొలగిన తరువాతే విలీనం జరగాలి అంటూ అమెరికా నాయకత్వంలోని దేశాలు అప్పటి నుంచి నేటికీ విలీనానికి అడ్డుపడుతున్నాయి.


జపాన్ను బెదిరించిందంటూ పేర్కొంటున్న ఆ వీడియో కథేమిటి ? మిలిటరీ వ్యవహారాలను పరిశీలించే కొందరు వ్యాఖ్యాతలు సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ పేరుతో నడుపుతున్న ఇంటర్నెట్‌ ఛానెల్లో సదరు వీడియోను ప్రసారం చేశారు. దాన్ని గ్జి గువా (యు ట్యూబ్‌ వంటిది)లో పెట్టారు. సదరు ఛానల్‌తో కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవసరం అయితే అణుబాంబులు వేయాలి అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోను తొలగించాలని చైనా ప్రభుత్వం సలహా ఇచ్చి ఉండవచ్చు లేదా ఛానల్‌ స్వయం నిర్ణయంతోగానీ దాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానిని లక్షలాది మంది షేర్‌ చేశారు. స్ధానిక కమ్యూనిస్టు పార్టీ శాఖలు నిర్వహించే సామాజిక మాధ్యమ ఛానళ్లు వాటిలో ఉన్నాయి. వాటిని కూడా తరువాత తొలగించారు. ప్రపంచ మీడియాలో వార్తలకు కారణమైన సదరు వీడియో బావోజీ అనే పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ ఛానల్‌లో అలాగే ఉంది. దాన్ని చూపి అమెరికాలో స్ధిరపడిన చైనా జాతీయురాలు ఒకామె జపాన్ను కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది అంటూ ట్వీట్లు చేశారు, దానిలో ఉన్న వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వాటిని ఆధారం చేసుకొని మీడియాలో కథలు రాశారు. తరువాత దాన్నుంచి కూడా తొలగించారు.


దేశ విధానం, ప్రభుత్వాలతో, అధికార పార్టీలతో నిమిత్తం లేకుండా ఇలాంటి అనధికార వ్యక్తులు, వారి వ్యాఖ్యలతో కూడిన వీడియోల ప్రచారాన్ని పార్టీలు, ప్రభుత్వాలకు అంటగట్టటం రాళ్లు వేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇక్కడ మౌలిక సమస్య ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది ? ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనానికి చైనా చేసే యత్నాలు తమ అస్తిత్వానికే ముప్పు అంటూ జూలై రెండవ వారంలో విడుదల చేసిన జపాన్‌ మిలిటరీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గడచిన ఐదు దశాబ్దాల్లో జపాన్‌ వైపు నుంచి ఇలాంటి పదజాలంతో ఆరోపణలు లేదా నివేదికలు లేవు, ఇదే తొలిసారి. ప్రస్తుతం అమల్లో ఉన్న జపాన్‌ రాజ్యాంగం ప్రకారం ఆత్మరక్షణకు అవసరమైతే యుద్దానికి దిగేందుకు అనుమతి ఉంది. అందుకే జాగ్రత్తగా అస్తిత్వం అనే పదాలను వినియోగించారు.దీని ప్రకారం చైనా మిలిటరీ గనుక తైవాన్‌ విలీనానికి పూనుకుంటే అది తమ ఉనికికే ముప్పు గనుక యుద్ధానికి దిగి అమెరికా దళాలతో కలసి జపాన్‌ ప్రతిఘటిస్తుందని జపాన్‌ ఉపప్రధాని తారో అసో ప్రకటించారు. అదే చేస్తే జపాన్‌ మిలిటరీని నాశనం చేస్తామని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌లో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు తప్ప అణుదాడి చేస్తామని ఎక్కడా చెప్పలేదు. చైనా 1964లో అణుబాంబును రూపొందించింది. ఆత్మరక్షణకు ప్రత్యర్ధులు ఉపయోగిస్తే తప్ప తాముగా ముందు వాటిని ప్రయోగించబోమని ప్రకటించింది. జపాన్‌ విషయంలో ఆ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ వీడియో సలహా యిచ్చింది.


జపాన్‌ మీద చైనాలో అంత ఆగ్రహం ఎందుకు ఉంది ? ఎవరినుంచి ఎవరికి ముప్పు ఉంది? ఆసియాలో మిలిటరీ శక్తిగా ఎదిగిన జపాన్‌ ఆక్రమించిన దేశాలలో చైనా కూడా ఒకటి. దానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు తెలిసినవే. అందుకే జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పెద్ద సంఖ్యలో నెటిజన్లు బలపరిచారు. జపాన్‌ దేశం దీవుల సముదాయం. ప్రధాన దీవుల ప్రాంతం నుంచి ఒకినావా అనే దీవి 640కిలోమీటర్లు, (అదే టోకియో నగరానికి 1,550 కిలోమీటర్లు,) అక్కడి నుంచి తైవాన్‌ 500కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సముద్రతీర ప్రాంతం ఏడు వందల కిలోమీటర్లలో ఉంది. జపాన్‌ మొత్తంలో ఎన్ని అమెరికా నౌకా స్దావరాలు ఉన్నాయో వాటిలో 62శాతం అంటే 28 ఈ దీవిలోనే ఉన్నాయి. అక్కడ పన్నెండు వందల అణ్వాయుధాలు, యాభైవేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకటా ? అక్కడికి పన్నెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్‌, ఇతర అమెరికా ప్రాంతాల భద్రత కోసం ఇక్కడ తిష్టవేయాలని అమెరికా చెబుతోంది. అందుకు జపాన్‌ అంగీకరించింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని చెప్పినట్లుగా లేదూ !


సదరు వీడియోలో ఉన్నదేమిటి ? ” మనం తైవాన్ను విముక్తి చేసినపుడు ఒక వేళ జపాన్‌ బలంతో జోక్యం చేసుకుంటే, అది ఒక సైనికుడిని, ఒక విమానాన్ని, ఒక నౌకను మాత్రమే దించినా మనం ప్రతిదాడికి దిగటమే కాదు, పూర్తి స్ధాయి యుద్దానికి పూనుకోవాలి. తొలిసారిగా మనం అణుబాంబులను వినియోగించాలి. బేషరతుగా లొంగిపోతున్నట్లు రెండవ సారి జపాన్‌ ప్రకటించే వరకు అణుబాంబులను వినియోగిస్తూనే ఉండాలి.(రెండవ ప్రపంచ యుద్దంలో తొలిసారిగా బేషరతుగా లొంగిపోతున్నట్లు బ్రిటన్‌,చైనాలతో జపాన్‌ ఒప్పందం చేసుకుంది) జపాన్‌ యుద్ద సామర్ధ్యం పూర్తిగా కోల్పోయేవరకు మన లక్ష్యం ఉండాలని మేము చెబుతున్నాము.ఇంకే మాత్రం యుద్ద మూల్యం చెల్లించలేమని జపాన్‌ గుర్తించినపుడే తైవాన్‌కు దూకుడుగా అది సైన్యాన్ని పంపేందుకు సాహసించదు.


ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితి నాటకీయంగా మారిపోయింది.ప్రస్తుతం మన దేశం ఒక శతాబ్ది కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఒక ప్రధాన పరివర్తన మధ్యలో ఉంది. అన్ని రాజకీయ విధానాలు, ఎత్తుగడలు, వ్యూహాలను దానికి అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి, పరివర్తనకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అణువిధానాన్ని కూడా పరిమిత సర్దుబాట్లకు వీలుగా మార్చాల్సి ఉంది. జపాన్‌ మినహాయింపు అనే సిద్దాంతాన్ని ఒక నిష్టగా మనం ముందుకు తీసుకుపోవాలి. అణ్వాయుధాలను తొలి సారిగా ఉపయోగించకూడదు అనే విధానానికి జపాన్‌ మినహాయింపు అని సూచించాలి. మనం జపాన్‌కు హెచ్చరిక చేస్తున్నాం, ప్రపంచానికి తెలియచేస్తున్నాం. అదేమంటే ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనంతో సహా జపాన్‌ మిలిటరీ పద్దతుల్లో మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే జపాన్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ఉపయోగించాలి. బేషరతుగా లొంగిపోయేంతవరకు వాటిని వినియోగిస్తూనే ఉండాలి.


జపాన్‌ గనుక మూడోసారి చైనాతో యుద్దానికి దిగితే చైనా జనం పాత, కొత్తల బదులు తీర్చుకోవాలి. వారితో శాంతి చర్చలు వద్దు. దియాయు,రియుకు దీవులను (ఒకినావా పరిసరాల్లో ఉన్న దీవులు) తిరిగి స్వాధీనం చేసుకుందాం ” అనే వ్యాఖ్యానం ఆ వీడియోలో ఉంది.
జపాన్‌ మిలిటరీ నివేదికను వెలువరించక ముందే తైవాన్‌ గురించి జపాన్‌ రెచ్చగొడుతున్నది. జూన్‌ 24న రక్షణ మంత్రి నోబు కిషి మాట్లాడుతూ తైవాన్‌ భద్రతకు జపాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది అన్నాడు. చైనా ఒకటే అనే విధానం అనుసరించాలంటే అది కాలపరీక్షకు నిలబడుతుందా ? అది సరైనదేనా, నాకు తెలియదు అని జపాన్‌ ఉపరక్షణ మంత్రి యుషిహైడ్‌ నకయామా అన్నాడు. అధికారికంగా జపాన్‌ వైఖరిలో మార్పు లేనప్పటికీ దానికి కట్టుబడి ఉండాల్సిన అగత్యం లేదని పరోక్షంగా చెప్పటం, తైవాన్‌ సమస్యను తురుపుముక్కగా ఉపయోగించుకొనే యత్నమే. తైవాన్‌ వేరు కాదు, చైనాలో అంతర్భాగమే అని గుర్తిస్తూనే దానికి ఆయుధాలు అందిస్తున్న అమెరికా బాటలోనే జపాన్‌ కూడా నడుస్తున్నది. చైనాాజపాన్‌ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొని ఐదు దశాబ్దాలు గడచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తొలిసారిగా తైవాన్‌ సమస్యను ప్రస్తావించారు. ప్రస్తుతం జపాన్‌ రాజ్యాంగం ప్రకారం జపాన్‌ నేరుగా చైనా మీద యుద్దానికి దిగకపోయినా తన గడ్డపై ఉన్న అమెరికా స్దావరాలకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించగలదు. ఒక వేళ నేరుగా యుద్దంలోకి దిగితే చైనా చేతిలో చావు దెబ్బలు తింటుంది.


చైనా వీడియో ప్రయివేటు వ్యవహారం గనుకనే జపాన్‌ అధికారికంగా స్పందించలేదు. దాని రక్షణకు హామీ ఇచ్చిన అమెరికా వైపు నుంచి కూడా వ్యాఖ్యలేమీ లేవు. మరి మీడియా వార్తలు ఏమిటి అంటే, స్పందన ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు అమెరికా, జపాన్‌ ప్రచారదాడిలో భాగంగా వెలువడిన కట్టుకధలు మాత్రమే.ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో బైడెన్‌ కొత్తగా చేరినా అమెరికన్లు నెగ్గే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఏదో విధంగా చైనాతో గిల్లి కజ్జా పెట్టుకోవాలంటే దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌ సాకులు ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియాలు అన్ని విషయాల్లో, కొంత మేరకు మన దేశం అమెరికాతో యుగళగీతాలు పాడుతోంది.