జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో రెండవసారి అధికారానికి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తికాకుండానే డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు, సంబంధిత అంశాలపై దాడులు చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా సైన్సు రక్షణకు అక్కడి శాస్త్రవేత్తలు నడుంకట్టారు. గత పదకొండు నెలల కాలంలోనే ట్రంప్‌ వేగవంతంగా, తీవ్రమైన దాడులు ఐదువందలసార్లు చేశాడని ఆ రంగం తీరుతెన్నులను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. అనేక సంస్థలలో అశాస్త్రీయ భావాలు కలవారితో నింపుతున్నాడు. పొమ్మనకుండానే పొగబెట్టినట్లుగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు నిధుల కోత పెడుతున్నాడు. ఈ వైఖరి సైన్సుపై నిరంకుశత్వంగా వర్ణిస్తూ దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధులు కావాలని, వచ్చే ఏడాది చేపట్టే కార్యాచరణకు గాను డిసెంబరు 31లోగా విరాళాలు ఇవ్వాలని ” తాపత్రయపడే సైంటిస్టుల యూనియన్‌ ” పిలుపునిచ్చింది. మనతో సహా ప్రపంచంలో అనేక దేశాల్లో ఆశాస్త్రీయ కుహనా సైన్సును జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నది.

డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సైన్సు మీద జరుపుతున్నదాడి వలన అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అది స్వయంగా చేసుకొనే తీవ్రహాని అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులు పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటాన్ని సహించలేని ట్రంప్‌ వాటికి నిధులు కోతపెడతానని బెదిరించిన సంగతి తెలిసిందే.వాటితో నిమిత్తం లేకుండానే శాస్త్రపరిశోధనలను నిరుత్సాహపరిచేందుకు బిలియన్లకొద్దీ నిధులకోత ప్రారంభించాడు. ప్రధాన పరిశోధనా సంస్థల బడ్జెట్‌లో 50శాతం కోత పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అనేక మంది శాస్త్రవేత్తలు అమెరికా వీడటం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో హిట్లర్‌ యూదులపై జరిపిన ఊచకోత నుంచి తప్పించుకొనేందుకు ఆ సామాజిక తరగతికి చెందిన అనేక మంది విద్యావంతులు, శాస్త్రవేత్తలు అమెరికా, ఇతర ఐరోపా దేశాలకు వలసలు పోయారు.ఆ దేశాల్లో అనేక నవకల్పనలకు ఆద్యులయ్యారు. దీంతో ఇతర దేశాలకు ” హిట్లర్‌ ఇచ్చిన బహుమతి ” అని ఈ పరిణామాన్ని వర్ణించారు. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. ఈ చర్యలతో చైనాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ లబ్దిపొందుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దేశాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టేందుకు పెద్ద మొత్తాలలో నిధులు కేటాయించారు. ట్రంప్‌ శాస్త్ర సలహాదారైన మైఖేల్‌ క్రాటిసియోస్‌ మాట్లాడుతూ సైన్సు అసమర్ధంగానూ, కనపడకుండా కంటిమీద గట్టి పొరలా మారిందని, ప్రత్యామ్నాయాలను చూడనిరాకరించేవారి బందీగా మారినందున అంతటినీ మార్చివేయాలని చెప్పాడు. ఇలాంటి వారి మాటలను విన్నతరువాత 80ఏండ్ల ట్రంప్‌కు బుర్రపని చేస్తుందని ఎలా అనుకోగలం.

శాస్త్ర పరిశోధనలకు గత కొన్ని దశబ్దాలుగా అమెరికా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే, వివిధ రంగాలలో నోబెల్‌ బహుమతి గ్రహీతల్లో సగం మంది అక్కడి నుంచే ఉన్నారు.అలాంటి చోట శాస్త్రంపై కత్తికట్టటం అంటే అది ఒక్క అమెరికాకే కాదు, యావత్‌ ప్రపంచానికి నష్టం.ఇప్పటికీ అనేక వ్యాధులకు కారణాలు, చికిత్సలు సవాలుగానే ఉన్నాయి. ట్రంప్‌ తీసుకున్న మతిమాలిన చర్యల కారణంగా అనేక పరిశోధనలు అర్ధంతరంగా ఆగటం లేదా ఆలశ్యానికి దారితీస్తాయి.అన్ని దేశాల్లో ఉన్నట్లే బ్యూరోక్రసీ అమెరికాలో కూడా తక్కువేమీ కాదు.ఐదు రోజుల పనివారంలో రెండు రోజులు ప్రయోగశాలలకు బదులు ప్రభుత్వ యంత్రాంగ కాగితాలు నింపటానికే రెండు రోజులు పోతున్నదని అనేక మంది శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నమాట నిజం. నివారణకు మార్గాలు వెతకాలి తప్ప అసలు పరిశోధకులనే తొలగిస్తే ఎలా ? అమెరికా అనుసరిస్తున్న ప్రతికూల విధానాల ఫలితంగా అక్కడ ఉండేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలకు విదేశాలకు వెళ్లాలని దరఖాస్తుచేసుకున్నవారు 2024 మొదటి మూడునెలలతో పోలిస్తే మూడో వంతు పెరిగింది.అమెరికాకు రావాలనుకొనే వారు నాలుగోవంతు తగ్గారు.ఒకసారి ఉన్న పేరుపోతే తిరిగి తెచ్చుకోవటం కష్టమని అనేక మంది చెబుతున్నా ట్రంప్‌ చెవికి ఎక్కటం లేదు. అమెరికా మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతంగా ఉండటానికి శాస్త్రపరిశోధనలే కారణమని, అలాంటివి లేకపోతే ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని ఆందోళన చెందేవారు మరోవైపు ఉన్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని మానవాళి సౌభాగ్యానికి వినియోగించాలి. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ఎక్కడ జరిగినా కాస్త వెనుకా ముందూ ప్రపంచంలోని వారందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాంటి పరిశోధనా రంగంలో ముందున్న అమెరికా ఒక్కసారిగా జెండా ఎత్తేస్తే లోకమంతా అలాగే ఉంటుందని కాదు గానీ, పరిశోధనలు ఆలశ్యమౌతాయి.

శాస్త్రపరిశోధనలు ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం అవుతున్నందున వాటిని ఆయుధాలుగా చేసుకొని వెనుకబడిన దేశాలను దోపిడీ చేయటం కూడా ఒక వాస్తవం. ఉదాహరణకు అధిక దిగుబడి వంగడాలను తయారు చేసిన దేశాలకు చెందిన సంస్థలు పేటెంట్‌ హక్కుల పేరుతో ఎంత అధిక ధరలకు వాటిని ఎలా విక్రయిస్తున్నారో చూస్తున్నాం. వర్షాలు, వరదలు, దుర్భిక్షం వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే పసిగట్టే పరిజ్ఞానాన్ని మరింత నిర్ధిష్టం కావించాలి. అది అమెరికాకూ అవసరమే అక్కడి కొన్ని రాష్ట్రాలలో సంభవించిన ప్రమాదకర వరదలు, తుఫాన్లను సకాలంలో పసిగట్టగలిగి ఉంటే నష్టాలు తగ్గి ఉండేవి. జలుబుకు కారణమౌతున్న వైరస్‌లు అమెరికాలో ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వలన డెంగీ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిసిందే. రాజకీయాలలో ప్రపంచమంతటా మితవాద శక్తులు పెరిగిపోతున్నట్లుగానే ప్రపంచంలో శాస్త్రవిజ్ఞానాన్ని వ్యతిరేకించే మూఢత్వం కూడా పెరుగుతున్నది. కరోనా సమయంలో మనదేశంతో సహా ప్రపంచమంతటా అలాంటి శక్తులు ఎలా రెచ్చిపోయాయో చూశాము. శాస్త్రవేత్తలు, వైద్యుల సలహాలను పక్కన పెట్టి, వాక్సిన్‌ను వ్యతిరేకంచే శక్తుల మాటలు నమ్మి లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సందర్భంగా లాక్‌డౌన్లు విధించినందుకు పెట్రోలు, డీజిలు వ్యాపారుల లాబీ రంగంలోకి దిగి లాక్‌డౌన్ల వలన ఆర్థిక వ్యవస్థలకు నష్టం అని ప్రచారం చేయించటాన్ని కూడా చూశాము. కరోనా లేకుండానే సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వలన కలిగిన నష్టం ఎంతో, ఎందుకు సంభవించిందో వారు చెప్పారా ? కరోనా గురించి మీడియా సంస్థలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశాయో కూడా చూశాము.కరోనా, వాతావరణమార్పులు వాస్తవం కాదని, వాక్సిన్ల వలన ప్రయోజనం లేదని అమెరికా, ఐరోపాలోని ప్రముఖ మీడియా సంస్థలు చేసిన తప్పుడు ప్రచారం తెలిసిందే.

పర్యావరణానికి కలుగుతున్న హాని, వివిధ వ్యాధుల నివారణకు అవసరమైన వాక్సిన్లపై జరిపే పరిశోధనలకు ట్రంప్‌ సర్కార్‌ నిధుల కోత పెడుతున్నది, సిబ్బందిని తగ్గిస్తున్నది. వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తున్న ఎన్‌సిఏఆర్‌ వంటి సంస్థలను ఎత్తివేయాలని చూస్తున్నది. వచ్చే ఏడాది ఎలాంటి దాడులను చేస్తుందో తెలియదు, 2025లో పరిశోధనా ప్రయత్నాలు, కీలకమైన శాస్త్రీయ సమాచారంతో పౌరులందరికీ అందుబాటులో వెబ్‌సైట్లను మూసివేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే లేదా వ్యతిరేకించేవారి మీద దాడులకు ఉసిగొల్పుతున్నది, పదవుల నుంచి తొలగిస్తున్నది. ప్రజారోగ్య రక్షణలో ముందున్న డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సిడిసి) అధిపతిగా సుసాన్‌ మోనారెజ్‌ బాధ్యతలు స్వీకరించినపుడు అనేక మంది పరిశోధకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు రాజీపడని మైక్రోబయాలజిస్ట్‌ మరియు ఇమ్యునాలజిస్ట్‌ శాస్త్రవేత్తగా పేరుంది. ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఆగస్టులో ట్రంప్‌ ఆమెను బయటకు పంపాడు. ఒక శాస్త్రవేత్తగా రాజీపడని కారణంగానే తనను తొలగించారని ఆమె చెప్పారు.సిడిసిలో కొంత మంది శాస్త్రవేత్తలను తొలగించాలని,ఎలాంటి శాస్త్రీయ సమాచారం లేకపోయినప్పటికీ కొన్ని వాక్సిన్లకు ఆమోద ముద్ర వేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ జూనియర్‌ తనపై తెచ్చిన వత్తిడికి లొంగని కారణంగా తప్పుడు ఆరోపణలతో తొలగించినట్లు ఆమె చెప్పారు. ఈ మంత్రి గతంలో అమెరికాలో అత్యంత అవినీతి సంస్థగా సిడిసిని వర్ణించాడు. వాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కెనడీ వాక్సిన్ల విషయంలోనే ఆమెను వత్తిడి చేయటం అంటే సదరు కంపెనీల లాబీ ఎంతటి శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు. బహిరంగంగా వాక్సిన్లను విమర్శించిన వారిని ఆ సంస్థలో చేర్చాడు. నాలుగో వంతు సిబ్బందిని తగ్గించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ విధానాలు ప్రజారోగ్యానికి ముప్పు తెస్తాయని మోనారెజ్‌ హెచ్చరించారు.నిబద్దత, ఆత్మగౌరవం ఉన్న శాస్త్రవేత్త ఎవరూ తగిన శాస్త్రీయ సమాచారం లేకుండా వాక్సిన్‌ లేదా ఔషధాలను అంగీకరించరని సుసాన్‌ కూడా అదే చేశారని అనేక మంది ప్రశంసించారు. ఆమెకు మద్దతుగా ఒక వైద్యాధికారి, ముగ్గురు సీనియర్‌ సిడిసి శాస్త్రవేత్తలు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు.

శాస్త్రీయ భావనలు, వైఖరుల మీద ఒక్క అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో మితవాదశక్తులు దాడులు చేస్తున్నాయి. గత పదకొండు సంవత్సరాల్లో మనదేశంలో కూడా అదే జరిగింది.ఊహాజనితమైన ఆశాస్త్రీయ సాంకేతికపరమైన అంశాలను అధికారంలో ఉన్న పెద్దలే ప్రచారం చేస్తున్నారు. సైన్సును కాపాడాలంటూ గత ఏడాది ఆగస్టులో అనేక పట్టణాల్లో ప్రదర్శనలు చేసిన శాస్త్రవేత్తలను చూశాము. శాస్త్రీయ భావజాలంపై దాడి, పరిశోధనలకు నిధుల కోత పెట్టటాన్ని, కుహనా సైన్సును ముందుకు తేవటాన్ని నిరసించారు. హిందూత్వ భావజాలానికి అనుగుణంగా విద్యావిధానం, సిలబస్‌లో మార్పులు తెస్తున్నారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయని, ఇతర నాగరికతల కంటే వేదకాలమే గొప్పదనే ప్రచారం చేస్తూ జనాలను నమ్మించేందుకు చూస్తున్నారు. పురాతన కాలంలోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని దానికి నిదర్శనం గణేషుడేనని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే పురాతన కాలంలోనే దేశంలో ఇంటర్నెట్‌, ఉపగ్రహాలు ఉన్నాయని త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిజెపినేత విప్లవదేవ్‌ చెప్పారు.అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు మహాభారతంలో విదురుడు కూడా ఆ పరిజ్ఞానంతోనే యుద్దంలో జరుగుతున్నదాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడని చెప్పేవారున్న సంగతి తెలిసిందే. పురాతన భారతీయ విజ్ఞానం పేరుతో అనేక కోర్సులను ఐఐటిలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడుతున్నారు. హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటానికి మాంసాహారం తినటమే కారణమని హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి ఐఐటి డైరెక్టర్‌ లక్ష్మీధర్‌ బెహరా సెలవిచ్చారు. ఇలాంటి అంశాలకు ప్రయోగశాలగా ఐఐటిని మార్చారు. భారతీయ విజ్ఞాన కేంద్రం (ఐకెఎస్‌) పేరుతో ఖరగ్‌పూర్‌ ఐఐటి అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచురించింది. ఈ పేరుతో జ్యోతిష్యం వంటి వాటిని నూతన విద్యావిధానంలో చొప్పించేందుకు పూనుకున్నారు. డార్విన్‌ సిద్దాంతాన్ని సిలబస్‌నుంచి తొలగించారు. పురాతన కాలంలో అనేక ఇతర నాగరికతల మాదిరి మనదేశంలో కూడా శాస్త్రవిజ్ఞానం వర్ధిల్లిన మాట నిజం, దానికి అనేక దృష్టాంతాలున్నాయి. వాటిని చూపి నాడు లేనివాటిని కూడా ఉన్నాయని చెప్పటం జనాలను తప్పుదారి పట్టించటమే.పురాణాల్లో ఉన్న పుష్పక విమానాలను చూసే మన సంస్కృత గ్రంధాల్లో ఉన్న సమాచారాన్ని తస్కరించి నేటి విమానాలను పశ్చిమదేశాల్లో తయారు చేశారని చెబుతారు. ఆ గ్రంధాలు మన దగ్గర ఉన్నపుడు మనవారెందుకు చేయలేకపోయారంటే సమాధానం ఉండదు.ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు వ్యతిరేకచర్యలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అతగాడి విధానాలను కార్మికవర్గం ఎలా ప్రతిఘటిస్తున్నదో అదే విధంగా అమెరికా శాస్త్రవేత్తలు ప్రారంభించిన ఉద్యమం కూడా ముందుకు పోయి తగిన ప్రభావం చూపటం అనివార్యం. మనదేశంలో కూడా శాస్త్రవేత్తలు, పురోగామివాదులు ముందుకు వచ్చి అలాంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టకపోతే రానున్న తరాలు సైన్సు -జ్యోతిష్యాలలో దేన్ని నమ్మాలో తెలియని అయోమయానికి లోనవుతాయి !

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు : బిజెపి తీరుచూస్తే అమిత్‌ షాకు ఆశాభంగం !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడ అధికారంలో ఉన్న వామపక్ష సంఘటనకు ఎదురుదెబ్బ తగిలిందన్నది వాస్తవం. దాన్ని చావుదెబ్బగా కొందరు వర్ణిస్తున్నారు. అది నిజమా ? ప్రధాని నరేంద్రమోడీ తిరువనంతపురంలో బిజెపి సాధించిన విజయం గురించి గొప్పలు చెప్పుకున్నారు. కేరళ రాజకీయాల్లో ఒక మహత్తర ఘట్టం అన్నారు. మోడీ సేవలో తరిస్తున్న కాంగ్రెస్‌ తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ చారిత్రాత్మక విజయం అన్నారు. ఎందుకటా నాలుగున్నర దశాబ్దాలుగా తిరువనంతపురం మేయర్‌ పీఠాన్ని నిలుపుకున్న సిపిఎం అక్కడ ఓడిపోయి 101 సీట్లకు బిజెపి 50 తెచ్చుకున్నందుకు. ఓకే, కాసేపు నరేంద్రమోడీని సంతుష్టీకరించేందుకు అంగీకరిద్దాం, నిజమే కదా ! అయోధ్య రామ మందిరం గురించి దశాబ్దాల పాటు బిజెపి ఎంత హడావుడి చేసిందో చూశాము. దానివల్లనే మూడుసార్లు మోడీ ప్రధాని అయ్యారు. అక్కడ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్‌లో పదేండ్ల అధికారం తరువాత బిజెపి ఓడిపోయింది, అంతేనా, వారణాసి నియోజకవర్గం, వరుసగా ప్రధాని నరేంద్రమోడీ మూడుసార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 3,71,784 ఓట్ల మెజారిటీ తెచ్చుకుంటే రెండవసారి 4,79,505కు పెంచుకోగా మూడవ సారి 1,52,532కు దిగజారింది. దీని గురించి ఏమని వర్ణిస్తారు ? ఒక వాస్తవం ఏమంటే కేరళలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి పెరగకపోగా స్వల్పంగా తగ్గాయి. దీని గురించి మోడీ నుంచి ఎలాంటి స్పందనా ఉండదు ! స్థానిక సంస్థలలో అనేక అంశాలు పని చేస్తాయి. బిజెపి కేరళలో గతంలో తెచ్చుకున్న ఆరువందలకు పైగా పంచాయతీ వార్డులను ఈసారి పోగొట్టుకుంది. కొత్తగా కొన్ని తెచ్చుకొని గతం కంటే స్వల్పంగా మెరుగుపడింది. ఒకసారి అధికారంలో ఉన్నతరువాత అన్ని పార్టీలకూ వాటి పనితీరును బట్టి వ్యతిరేకత ఉంటుంది. అది ఒక్క సిపిఐ(ఎం)కే కాదు, ప్రతి పార్టీకి వర్తిస్తుంది.

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ(ఎం) నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ పని అయిపోయిందని తరువాత బిజెపిదే హవా అన్నట్లుగా మీడియాలో కొందరు ఊదరగొట్టారు. కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేక మీడియాలో మళయాళ మనోరమ ఒకటి. అది 2025 డిసెంబరు 22న ఒక విశ్లేషణ రాసింది. దానికి పెట్టిన శీర్షిక ” స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ బిజెపి తీరుచూసి అమిత్‌ షా ఎందుకు ఆశాభంగం పొందుతారంటే ” దాన్లో ఏముందో చూద్దాం. ” స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతం ఓట్లు తెచ్చుకోవాలని కేంద్ర హౌమ్‌ మంత్రి అమిత్‌ షా లక్ష్య నిర్దేశం చేశారు. అమిత్‌ షాలో ఆశావాద వేడి ఎందుకు పుట్టిందంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ ఒక్కటే ఇక్కడ 19.40 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. అదిప్పుడేమైందంటే నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (బిజెపి-భారత ధర్మ జనసేన-లోక్‌ జనశక్తి పార్టీ) కేవలం 14.76శాతం ఓట్లనే తెచ్చుకోగలిగింది.(గత స్థానిక ఎన్నికల కంటే 0.24శాతం తక్కువ-వికీపీడియా) యుడిఎఫ్‌కు 38.81, ఎల్‌డిఎఫ్‌కు 33.45శాతం వచ్చాయి.

పంచాయత్‌లలో(జిల్లా,బ్లాక్‌,గ్రామపంచాయతీలు అన్నీ కలిపి) ఎన్‌డిఏకు వచ్చిన ఓట్లు 13.92శాతం, 2020లో వచ్చిన 14.34శాతం కంటే స్వల్పంగా తక్కువ. మున్సిపాలిటీలలో 13.1 నుంచి 19.44శాతానికి పెంచుకుంది.కార్పొరేషన్లలో 19.44 నుంచి 23.58శాతానికి పెంచుకుంది. మొత్తం అన్ని స్థానిక సంస్థలలో వచ్చిన సగటు ఓట్లు 14.76శాతం.2020 ఎన్నికల్లో వచ్చిన 12.92శాతం కంటే స్వల్పంగా పెంచుకుంది. కానీ ఇది తప్పుదారి పట్టించేది,ఎందుకంటే 2020 కంటే బిజెపి అదనంగా ఈసారి 40శాతం సీట్లలో పోటీ చేసింది.ఆ ఏడాది బిజెపి 14వేల వార్డుల కంటే తక్కువే పోటీ చేసింది. ఈసారి ఆ పార్టీ, మిత్రపక్షాలతో కలసి ఎన్నికలు జరిగిన మొత్తం 23,576 వార్డులలో 89.35శాతం అంటే 21,065 చోట్ల పోటీ చేసింది. బిజెపి ఒక్కటే 19,262 సీట్లలో పోటీ చేసింది. ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ 17,497, సిపిఎం 14,802చోట్ల పోటీ చేశాయి. గత ఎన్నికల కంటే ఏడువేల వార్డులలో అదనంగా పోటీ చేయటంతో పాటు మొత్తం 25శాతం ఓట్లు, రెండు కార్పొరేషన్లు, కనీసం పది మున్సిపాలిటీలు,30 బ్లాక్‌ పంచాయతీలు, 300కు పైగా గ్రామ పంచాయతీలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా దానిలో ఒక చిన్న భాగం మాత్రమే చివరికి దక్కింది. ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు (తిరువనంతపురం 6, కొల్లం 2, పత్తానంతిట్ట 4, అలప్పూజ 5,కొట్టాయం 3, త్రిసూర్‌ 1, పాలక్కాడ్‌ 2, కాసరగోడ్‌ ),రెండు మున్సిపాలిటీలు(పాలక్కాడ్‌,తిరుప్పునితుర) ఒక కార్పారేషన్‌(తిరువనంతపురం) దానికి దక్కాయి. అయినప్పటికీ కేవలం ఆరుగ్రామ పంచాయతీల్లోనే దానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ముదక్కల్‌(తిరువనంతపురం),పండలం-తెక్కెక్కర(పత్తానంతిట్ట) తిరువిలివామల(త్రిసూర్‌) అకతెత్తెర, పూడూరు(పాలక్కాడ్‌) మాధూర్‌(కాసర్‌గోడ్‌). చివరికి తిరువనంతపురం కార్పారేషన్‌లో కూడా 101 సీట్లకు గాను సాధారణమెజారిటీ 51కి గాను ఒకటి తక్కువగా 50వచ్చాయి. సీట్ల రీత్యా ఎల్‌డిఎఫ్‌ కంటే మెరుగ్గావచ్చాయి, గతం కంటే నాలుగుశాతం ఓట్లు పెరిగినప్పటికీ ఎన్‌డిఏకు వచ్చిన 34.52శాతం కంటే మెరుగ్గా ఎల్‌డిఎఫ్‌కు 34.56శాతం వచ్చాయి.

2020లో బిజెపికి కాసరగోడ్‌ జిల్లాలోని మధుర్‌, బెల్లూర్‌ గ్రామపంచాయతీలలో, రెండు మున్సిపాలిటీలు పాలక్కాడ్‌, పండలంలో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈసారి రెండింటిలో దానికి మెజారిటీ రాలేదు, పండలంలో అవమానకరంగా నష్టపోయింది.ఈసారి ఎన్‌డిఏ 421 కార్పొరేషన్‌ వార్డులకు గాను 22.09శాతం(93), 3,240 మున్సిపల్‌ వార్డులకు గాను పదిశాతం (324), 346 జిల్లా పంచాయత్‌ వార్డులకు గాను ఒక్కటి, 2,267 బ్లాక్‌ పంచాయత్‌ వార్డులకు 54, గ్రామపంచాయతీలలోని 17,337కు గాను 1,447 వార్డులు 8.35శాతం వచ్చాయి.ఒక్క కార్పొరేషన్లలో తప్ప 2020తో పోల్చితే బిజెపి పరిస్థితి పెద్దగా మెరుగైనట్లు ఇవి ప్రతిబింబించటం లేదు. మున్సిపాలిటీలు, జిల్లా పంచాయత్‌లో గతం కంటే తగ్గింది. బిజెపి 2020లో సాధించినవి, ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది.కార్పొరేషన్లు 14.25(ఇప్పుడు 22.09), మున్సిపాలిటీలు 10.4(ఇప్పుడు పదిశాతం) జిల్లాపంచాయత్‌లు 0.60(ఇప్పుడు 0.29), బ్లాక్‌ పంచాయత్‌ 1.78(ఇప్పుడు 2.38) గ్రామపంచాయతీలు 7.4 (ఇప్పుడు 8.35).ఈ సారి పండలం మున్సిపాలిటీని బిజెపి కోల్పోయింది. ఇది శబరిమలకు దగ్గరగా ఉంది. అంతర్గత కుమ్ములాటలు, పాలనలో అక్రమాల కారణంగా ఇది జరిగింది.గతంలో బిజెపికి 20 సీట్లు ఉంటే ఇప్పుడు తొమ్మిది స్థానాలతో మూడవ స్థానానికి దిగజారింది. పాలక్కాడ్‌లో బిజెపి 2020లో 28 సీట్లు తెచ్చుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈసారి పెద్ద పార్టీగా ఎన్నికైనప్పటికీ మెజారిటీకి అవసరమైన 27కు గాను 25 తెచ్చుకుంది. తిపురినిత్తుర మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 15 తెచ్చుకుంది(ఎల్‌డిఎఫ్‌కు 21) ఈసారి 21సీట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఎన్నికైంది, మెజారిటీ సంఖ్య 27.గత ఎన్నికల్లో రెండవ పార్టీగా ఉన్నప్పటికీ ఓట్లశాతంలో 27.54తో పెద్దదిగా, యుడిఎఫ్‌ 24.42, ఎల్‌డిఎఫ్‌ 23.25శాతం తెచ్చుకున్నాయి.

మున్సిపాలిటీలలో గుర్తించదగినదిగా బిజెపి ఉనికి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో దాని ఓట్ల వాటా పెరిగింది. ఎర్నాకుళంలో 9.08 నుంచి 12.65, పత్తానంతిట్టలో 16.18 నుంచి 18.02, త్రిసూర్‌లో 19.14 నుంచి 21.86, పాలక్కాడ్‌లో 18.28 నుంచి 23.96కు పెరిగాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో క్రైస్తవ అభ్యర్ధులతో అది ప్రయోగం చేసింది. మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా పెరిగింది.కొట్టాయంలో 11.5 నుంచి 15.1, ఇడుక్కిలో 12.53 నుంచి 14.88శాతానికి పెరిగింది. ఎల్‌డిఎఫ్‌ వాటా 21.63శాతానికి దగ్గరగా వచ్చింది.అయితే కొన్ని జిల్లాలోని మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా తగ్గింది. తిరువనంతపురంలో 24.49 నుంచి 23.48కి, అలప్పూజలో 19.08 నుంచి 18.19, కాసరగోడ్‌లో 15.36 నుంచి 14.52కు తగ్గాయి. కొల్లం కార్పొరేషన్‌లో ఆరు నుంచి పన్నెండు సీట్లకు పెరిగాయి. ఆ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఓట్ల శాతం స్థిరంగా ఉంది, ఇప్పుడు 15.92 రాగా 2020లో 15.9శాతం వచ్చాయి. కొల్లం కార్పొరేషన్‌లో కూడా ఓట్లశాతం స్థిరంగానే ఉంది. తిరువనంతపురంలో 30.92 నుంచి 34.52,కొచ్చిలో 10.95 నుంచి 14.41కి, కన్నూరులో 11.61 నుంచి 14.06కు పెరిగాయి. మిగిలిన మూడు కార్పొరేషన్లలో 2020లో వచ్చిన మేరకే తిరిగి వచ్చాయి. కొల్లంలో 22.02 నుంచి 22.61కి,త్రిసూర్‌లో 18.86 నుంచి 18.54, కోజికోడ్‌లో 22.29 నుంచి 22.43శాతంగా ఉంది.

పైన పేర్కొన్నదంతా మళయాళ మనోరమ విశ్లేషణలోని అంశాలే. తిరువనంతపురంలో బిజెపి గెలుపు గురించి మీడియాలో వచ్చిందేమిటో చూశాము. శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలో ఉన్న పండలం మున్సిపాలిటీలో 34వార్డులు ఉండగా గత ఎన్నికల్లో బిజెపి పద్దెనిమిది తెచ్చుకుంది. ఈ సారి తొమ్మిది వార్డులతో మూడ స్థానానికి పడిపోయింది. అనేక మంది రాష్ట్ర నేతలు ఇక్కడ తిష్టవేసి ఎలాగైనా నిలబెట్టుకోవాలని చూశారు. ఎల్‌డిఎఫ్‌ 14, యుడిఎఫ్‌ 11 తెచ్చుకున్నాయి. అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశ వివాదంతో గతంలో బిజెపి పొందిన లబ్ది ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల అయ్యప్ప ఆలయంలో జరిగిన బంగారు తాపడాల అక్రమాన్ని ప్రచారం చేసి మరింతగా లబ్దిపొందాలని చూసి భంగపడింది. ఈ మున్సిపాలిటీ మాత్రమే కాదు, దాని పక్కనే ఉన్న కులంద గ్రామ పంచాయతీ 15 సంవత్సరాలుగా బిజెపి ఆధీనంలో ఉంది. ఈ సారి అక్కడ ఎల్‌డిఎఫ్‌ 8,బిజెపి, ఇతరులు నాలుగు చొప్పున, యుడిఎఫ్‌కు ఒక స్థానం వచ్చింది. శబరిమల ఆలయం ఉన్న రన్నీ-పెరునాడ్‌ పంచాయతీ శబరిమల వార్డులో బిజెపి మూడవ స్థానంలో ఉంది. యుడిఎఫ్‌, ఎల్‌డిఎఫ్‌కు సమంగా ఓట్లు రావటంతో లాటరీలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చింది. ఈ పంచాయతీని పదివార్డులతో ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో బిజెపి 101కిగాను 50వార్డులతో అధికారానికి వచ్చింది. సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఓట్ల రీత్యా అక్కడ సిపిఐ(ఎం) ప్రధమ స్థానంలో ఉంది. మీడియాకు ఈ వివరాలు తెలిసినప్పటికీ అది పెద్ద ప్రాధాన్యత కలిగిన అంశం కాదన్నట్లుగా మౌనంగా ఉంది.లోక్‌సభ ఎన్నికలు 2024లో బిజెపికి తిరువనంతపురంలో 2,13,214 ఓట్లు వస్తే కార్పొరేషన్‌ ఎన్నికల్లో అవి 1,65,891కి తగ్గాయి. యుడిఎఫ్‌ ఓట్లు 1,84,727 నుంచి 1,25,984కు పడిపోగా ఎల్‌డిఎఫ్‌ ఓట్లు 1,29,048 నుంచి 1,67,522కు పెరిగాయి, అంటే బిజెపి కంటే స్వల్పంగా ఎక్కువ తెచ్చుకుంది. బిజెపి గెలిచిన 50 వార్డులలో 40 చోట్ల యుడిఎఫ్‌ మూడవ స్థానంలో ఉంది. ఇరవై అయిదు వార్డులలో కాంగ్రెస్‌కు కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. కొన్నింటిలో ఐదువందలకు లోపే వచ్చాయి. ? కొన్ని చోట్ల బిజెపి వంద ఓట్లకంటే తక్కువ మెజారిటీతో గెలిచింది. దీని అర్ధం ఏమిటి ? పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలో ఓటర్ల తీరులో తేడా ఉంటుందన్నది వాస్తవం. అక్కడ గెలిచిన కాంగ్రెస్‌ నేత శశిధరూర్‌ ఆ పార్టీలో ఉంటూనే బిజెపితో చెలిమిచేస్తున్న సంగతి బహిరంగ రహస్యం. తన పార్టీ తీరుతెన్నులను మరిచి పోయి బిజెపి చారిత్రాత్మక విజయం సాధించిందని పొగిడారంటే ఏం జరిగిందో చెప్పనవసరం లేదు. అనేక చోట్ల రెండు పార్టీలు సిపిఎంకు వ్యతిరేకంగా కుమ్మక్కు కావటం గతంలో జరిగింది, ఇప్పుడు కూడా పునరావృతం అయినట్లు కనిపిస్తోంది !

వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?

Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

వినేవారికి కేవలం చెవులే ఉండి మెదడులో పదార్ధం లేకపోతే చెప్పేవారు ఎన్ని కతలైనా వినిపిస్తారు. రూపాయి పతనం గురించి ఇప్పుడు అదే నడుస్తున్నది. డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి పడిపోలేదని ఒక పాట, మిగతా కరెన్సీలతో పోలిస్తే మన పతనం తక్కువ, ఇతర కరెన్సీలన్నీ ఇలాగే ఉన్నాయంటూ మరోముక్తాయింపు. గతంలో వీరే ఏం చెప్పారంటే తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ……. అన్నట్లుగా ఉంది. అవునులే నడిచినంత కాలం దేశం కోసం ధర్మం కోసం అంటూ ఏమైనా చెప్పవచ్చు, చేయవచ్చు. డాలరుతో పోటీ పడి మన రూపాయి విలువను ఎందుకు పెంచలేదని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహం నేరం కింద జైల్లో వేస్తారు. రూపాయి పతనమైతే వచ్చే నష్టం ఏమిటి ? ఉదాహరణకు నరేంద్రమోడీకి అమెరికాలో ఉన్న పలుకుబడి కారణంగా గత పదకొండేళ్లుగా మనం కేవలం పదిడాలర్లకే విమానంలో అమెరికా వెళుతున్నాం, రాయితీ టిక్కెట్ల ధరలు పెంచలేదు అనుకుందాం. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 85 నుంచి 91కి దిగజారింది. టికెట్‌ కొనుక్కోవాలంటే రు.850 బదులు రు.910 చెల్లించాలి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే రూపాయి పాపాయికి రక్షణ లేకుండా పోయిందని నరేంద్రమోడీ, బిజెపి నేతలు ఊరూవాడా నానా యాగీచేసి అధికారానికి వచ్చినపుడు కేవలం రు.600లకే ఆ టికెట్‌ దొరికేది. బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పినట్లు మోడీ వస్తే విలువను 35కు పెంచుతామని చెప్పారు. ఆ పుణ్యం కట్టుకొని ఉంటే రు.350కే దొరికేది. ఇది అత్యాశ అనుకున్నా కనీసం ”56” కు పెంచినా రు.560కి దొరికేది. మోడీకి అంత బలమైన ఛాతీ ఉందని జనం నమ్మేవారు. బిజెపి ప్రభుత్వ నిర్వాకం గురించి ఇంతకంటే వివరణ అవసరం లేదేమో ?

ప్రధాన మంత్రికి రోజూ సలహాలిస్తున్న ఆర్థిక సలహామండలి సభ్యుల్లో ఒకరైన సంజీవ్‌ సన్యాల్‌ పుండు మీద కారం చల్లుతున్నారు. రూపాయి పతనంపై తనకెలాంటి ఆందోళన లేదని చెప్పారు.ఆర్ధిక స్థితికి – రూపాయికి సంబంధం లేదని, దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఉన్నత వృద్ధి రేటు ఉన్నపుడు తరచుగా కరెన్సీ మారకపు విలువలు తక్కువగా ఉంటాయన్నారు. రూపాయి పతనం 91 నుంచి వందకు చేరి నరేంద్రమోడీ కళ్లలో ఆనందం చూసే సమయం దగ్గరపడుతున్నదని నెటిజన్లు స్పందిస్తున్న తరుణమిది. టైమ్స్‌ నెట్‌వర్క్‌ 2025 సమావేశంలో సన్యాల్‌ మాట్లాడారు.దేశీయంగా ద్రవ్యోల్బణానికి కారణం కానంత వరకు రూపాయి పతనమైనా ఇబ్బంది లేదని, వెనక్కు తిరిగి చూస్తే జపాన్‌ ఆర్థిక వ్యవస్థ చాలా చాలా వేగంగా పురోగమిస్తున్నపుడు దాని కరెన్సీ చాలా బలహీనంగా ఉంది.చైనా తన కరెన్సీ విలువను పెరగనిచ్చేంతవరకు 1990, 2000దశకాల్లో అలాగే ఉందంటూ సన్యాల్‌ చెప్పారు. ఒక దేశ కరెన్సీ డాలరుతో మారకపు విలువ తక్కువగా ఉన్నపుడు ఆయాదేశాల వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో చౌకగా ఉండి ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉండే మాట నిజం. కానీ మన కరెన్సీ పతనమైనా ఎగుమతులు దానికి అనుగుణంగా ఎందుకు పెరగలేదో పెద్దలు చెప్పాలి. చైనానే తీసుకుంటే జిడిపిలో దాని ఎగుమతులు 2013లో 24.6శాతం కాగా 2024లో 20శాతానికి తగ్గాయి. దాని యువాన్‌ విలువ పెరిగిందని సరిపెట్టుకుందాం. సన్యాల్‌ వాదన ప్రకారం దాని కరెన్సీ విలువ పెరిగింది కనుక తగ్గినట్లు అంగీకరిద్దాం. భారత్‌ పరిస్థితి ఏమిటి ? 2013లో జిడిపిలో మన ఎగుమతులు 25.43 శాతం కాగా 2024లో 21.2శాతానికి తగ్గాయి. ఈ కాలంలోనే కదా మన రూపాయి విలువ 60 నుంచి ఇప్పుడు 91కి పడిపోయినా ఎగుమతులు ఎందుకు తగ్గినట్లు ? జపాన్‌ ఎన్‌ విలువ డాలరుకు 2014లో 106కాగా ఇప్పుడు 157కు తగ్గింది. ఇదే కాలంలో దాని జిడిపిలో ఎగుమతులు 15.8 నుంచి 22.8శాతానికి పెరిగాయి. మన కరెన్సీ విలువపతనమైనా ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? అందుకని రూపాయి పతనం గురించి ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకుంటున్నారు. వారి ధైర్యం ఏమంటే దీని గురించి సామాన్యులకు నిజానిజాలు తెలుసుకొనే తీరిక, ఆసక్తి లేదా తెలివి తేటలు ఉండవనే గట్టి నమ్మకం. అభివృద్ధి చెందుతున్నపుడు కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతారని చెప్పటమంటే కావాలనే పతనాన్ని ప్రోత్సహిస్తున్నారు లేదా పతనమౌతుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చుతున్నారన్నట్లుగా చూస్తూ ఊరుకున్నట్లు కనిపిస్తున్నది. రూపాయి పతనం అవుతుంటే ఎగుమతిదార్లు సంతోషిస్తారు, దిగుమతిదార్లు పెరిగిన భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు, వారికి పోయేదేమీ లేదు, జనాలకు జేబులు గుల్ల. అందుకే సన్యాల్‌ వంటి ఆర్థికవేత్తలకు ఎలాంటి ఆందోళన ఉండదు. ఒక్క సన్యాలే కాదు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ ఇంకా తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రూపాయి పతనం అవుతుంటే ప్రభుత్వం ” నిద్ర చెడగొట్టుకోవటం ”లేదన్నారు. అంటే తాపీగా తడిబట్ట వేసుకొని ఉందని వేరే చెప్పనవసరం లేదు.

బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నపుడేంచెప్పారో చూద్దాం. రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవి శంకర్‌ (2013 జూలై 10) రూపాయి విలువ 60.15కు పడిపోయినపుడు ” జాతీయ స్వాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది,ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ ఆర్థిక మూలాలు విపరీతంగా దిగజారుతున్నయనేందుకు ఇది నిదర్శనం. విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం దుర్బల నమూనా, ఎక్కువగా వాటిపై ఆధారపడితే అవెంత వేగంగా వస్తాయో అదే విధంగా వెనక్కు వెళతాయి.” ఇలాంటి పెద్ద మనుషులందరూ 2014లో అధికారానికి వచ్చినకొత్తలో మోడీ పదే పదే విదేశాలకు ఎందుకు వెళుతున్నారంటే దేశప్రతిష్ట పునరుద్దరణ, విదేశీ పెట్టుబడుల కోసం అని సమర్ధించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. యుపిఏ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఎక్కువగా రూపాయి పతనమైంది. ఇప్పుడు స్వాభిమానం పెరిగినట్లా దిగజారినట్లా ? ఆడవారి మాటలకు అర్దాలే వేరులే అని మహిళలను రచయిత పింగళి నాగేంద్రరావు మిస్సమ్మ సినిమాలో తూలనాడారు గానీ బిజెపి నేతల మాటలకు అది వర్తిస్తుంది.

చిట్కాలు చెప్పటంలో మన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పెట్టింది పేరు. రూపాయి పతనం చెందినందుకు అసలు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే పోతుంది అన్నారు.(2013సెప్టెంబరు ఒకటి) చెన్నరులో మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన ప్రభుత్వాన్ని దేశం భరించలేదు, ఈ అనిశ్చితిని తొలగించటం మంచిది, సాధ్యమైనంత మేరకు త్వరగా ఎన్నికలు పెట్టాలి. మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక బాధల కంటే తన పేరు ప్రతిష్టలను పెంచుకోవటం గురించి ఎక్కువగా శ్రద్ద చూపుతున్నారు. ప్రభుత్వ పెద్దగా దీనికి బాధ్యత ఎవరిదో నిర్ణయించాలి. సదరు వ్యక్తిని తొలగించాలి లేదా తానే బాధ్యత తీసుకోవాలి ” ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన దంటూ ఒక పాట గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీని లేదా కనీసం నిర్మలాసీతారామన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి మరి, చేస్తారా ? బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ గడ్కరీ (ఇప్పుడు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి) ఉన్న సమయంలో(2012 మే 24) రూపాయి పతనానికి ప్రపంచ కారణాలు కానేకాదంటూ ” సమస్య యూరో జోన్‌లో కాదు, యుపిఏ జోన్‌లో ఉంది. ఆర్థికవేత్త అయిన మన ప్రధాని నాయకత్వంలో రూపాయి స్వేచ్చగా పతనమౌతున్నది.” బిజెపి మరోనేత పియూష్‌ గోయల్‌, ఇప్పుడు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి 2013 జూన్‌ 26న ఒక ట్వీట్‌ చేశారు(ఇప్పుడు ఎక్స్‌) పతనం అవుతున్న రూపాయిని చూస్తుంటే చాలా వేదనా భరితంగా ఉంది ” రూపాయి పతనం కాకుండా మోడీ ప్రభుత్వం ఏమైనా పడకుండా కాపాడుతున్నదా ? గోయల్‌ ఆనందంతో గంతులు వేస్తున్నారా ? బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ 2013లో మాట్లాడుతూ రూపాయి పతనాన్ని ఆపలేనట్లయితే మన్మోహన్‌ సింగ్‌ రాజీనామా చేయాలి.ఒక ఆర్థికవేత్తగా ఏం చేస్తున్నారు ? పదవిలో కొనసాగే హక్కులేదు ” అని చెప్పారు. మరో బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ 2013లో మాట్లాడుతూ ” పూర్తిగా దివాలాకోరు ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోలేని స్థితి,పాలన లేదు. రూపాయి పతనానికి అసమర్ధ నాయకత్వమే కారణం, మన్మోహన్‌ సింగ్‌, ఆయన మంత్రులే బాధ్యులన్నది స్పష్టం. మౌలిక సదుపాయాలు, వాణిజ్యంపై సకాలంలో చర్యలు తీసుకుంటే రూపాయి పతనాన్ని అరికట్టవచ్చు ” అన్నారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉందటూ ప్రధానిగా మోడీ పేరును ముందుకు తెచ్చిపుడు చెప్పారు. సదరు అనుభవం రూపాయి పతనాన్ని ఆపలేకపోయింది. ఇక మౌలిక సదుపాయాల గురించి అతిశయోక్తులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు ఇచ్చి విజయాల గురించి చెప్పుకుంది.తమ ఏలుబడిలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి పెరిగిందన్నది వాటిలో ఒకటి. నిజానికి 2014లో దేశంలో 94 పని చేస్తున్నవి, 31పని చేయనివి ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ వార్షిక నివేదికలో ఉందని ఫాక్ట్‌చెకర్‌ అనే వెబ్‌ పోర్టల్‌ పేర్కొన్నది. యుపిఏ పాలనలో రోజుకు 12కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించగా తాము 37 కిలోమీటర్లు నిర్మించినట్లు చెప్పుకుంది. నిజానికి తొమ్మిది సంవత్సరాల సగటు 19.17 కిలోమీటర్లు మాత్రమే, 2021లో 36.5 కిలోమీటర్లు నిర్మించారని లోక్‌సభకు అందచేసిన సమాచారంలో పేర్కొన్నారు. అందువలన అసత్యాలు,అర్ధసత్యాలకు మోడీ సర్కార్‌ పేరు మోసిందన్నది సత్యం.రూపాయి పతనం గురించి ఒక్క బిజెపి నేతలే కాదు, వారిని సమర్ధించే సినీనటీనటులు, ఆధ్యాత్మికులం అని చెప్పుకొనే బాబాలు కూడా యుపిఏ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారు తలలు ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు. జూహీ చావ్లా ఒకపుడు ప్రముఖ హీరోయిన్‌, 2013 ఆగస్టు 21న ఒక ట్వీట్‌ చేశారు.” దేవుడా నీకు కృతజ్ఞతలు, నా అండర్‌వేర్‌ పేరు డాలర్‌, రూపాయి గనుక అయి ఉంటే అది మాటి మాటికీ జారిపోతూ ఉండేది ” అని పేర్కొన్నారు. నెటిజన్లు మామూలుగా స్పందించలేదు, ఇప్పుడు ఆమె అండర్‌వేర్‌ను చూడాలి,రూపాయి పడిపోకుండా డాలర్‌కు రాఖీ కట్టటం(ముడివేయటం) ఆపిందేమో అంటూ సెటైర్లు. గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ఒక ట్వీట్‌లో నరేంద్రమోడీ అధికారానికి వస్తే రూపాయి విలువ 40కి పెరుగుతుందని పేర్కొన్నారు. నిజమే అతని పేరులో ఉన్న ఒక్కో శ్రీ కి 45 రూపాయల చొప్పున ఇప్పుడు 90కి దిగజారిందరటూ జోకులు. బాబా రామ్‌దేవ్‌ యుపిఏ ప్రభుత్వం మీద ఆరోపణల పత్రం(చార్జిషీట్‌) దాఖలు చేయాలని 2013లో చెప్పారు.ఈ 0.75కంటి మనిషి కాంగ్రెస్‌ మీద చార్జిషీట్‌ వేయాలన్నారు, ఇప్పుడు స్వదేశీ పేరుతో భక్తులను వెర్రి వెంగళప్పలను చేస్తున్నాడంటూ నెటిజన్లు ఆడుకున్నారు.

బిజెపిలో సుబ్రమణ్యస్వామి స్థానం ఏమిటో ఒక బ్రహ్మపదార్ధం.తనకు పదవులు ఇచ్చినపుడు, కావాల్సినపుడు ఒక మాట లేనపుడు మరోమాట మాట్లాడతారు, అయినా ఎలాంటి చర్య తీసుకొనే ధైర్యం బిజెపికి లేదు. ఆ పెద్దమనిషి ఆర్థికవేత్త కూడా, 2014 ఏప్రిల్‌ 27న మాట్లాడుతూ ఎన్‌డిఏ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్లయితే మోడీ ప్రధానమంత్రి అవుతారు, రెండు సంవత్సరాలలోపు రూపాయి బలపడి రు.35కు చేరుతుంది ” అన్నారు. నిర్మలా సీతారామన్‌ ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారో చూద్దాం ” రూపాయి పతనం చెందుతున్నపుడు మీరు ఊహించుకోవచ్చు, భారత ఎగుమతులు పెరుగుతాయి, ఎందుకంటే మీ వస్తువులు చౌకగా మారతాయి. మీ వస్తువులను కొనేందుకు విదేశాల వారు ఆకర్షణకు లోనౌతారు. కానీ అలా జరగటం లేదు, మీ వస్తువులను కొనాలని జనాలు అనుకోవటం లేదు. మీ పెట్టుబడులు పెరుగుతున్నాయి, రూపాయి పతనం అవుతున్నా మీ ఎగుమతులు పెరగటం లేదు, ఇది తీవ్రమైన పరిస్ధితి. ఆందోళన పడాల్సిన అవసరం లేదని మనకు ప్రతిసారీ ప్రభుత్వం చెబుతున్నది. నేను ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చాను.నాకు తెలుసు అనేక మంది తమకున్న కొద్దిపాటి పొలాలను కూడా అమ్ముకొని విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లల కోసం డబ్బు చెల్లించారు. రూపాయి విలువ పతనం కారణంగా బయట ఉన్న విద్యార్ధులు చదువులను మధ్యలో ఆపివేసి తిరిగి రాకతప్పటం లేదు.మనం ఎప్పుడైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్నాం రూపాయి పతనం గురించి చెబుతున్నామా ? మనకేమీ చెప్పటం లేదు ” ఒకనాడు తెలుగింటి కోడలిగా ఉన్న ఆమె ఇప్పుడు మాట్లాడటం లేదేం ?

పైన చెప్పుకున్నవారందరికీ తిరుగులేని నేత నరేంద్రమోడీ ఏం సెలవిచ్చారో చెప్పుకోకపోతే ప్రహసనం సంపూర్ణం కాదు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన తరువాత రూపాయి పతనం గురించి నోరెత్తితే భారతమాత మీద ఒట్టు. అఫ్‌కోర్స్‌ మహానుభావులుగా మారిన తరువాత వారి మౌనానికి ఎన్నో అర్దాలు ఉంటాయనుకోండి. కర్ణాటకలోని హుబ్లీలో 2014 ఫిబ్రవరి 28న జరిగిన సభలో మాట్లాడుతూ ఇలా అన్నారు.” మన రూపాయి నిలకడ లేకుండా ఉంది. విలువ పడిపోతూనే ఉంది. అతల్‌ జీ ప్రభుత్వంలో రూపాయి 40-45 మధ్య ఉంది,ఈ ప్రభుత్వ హయాంలో 62,65,70…..గా పడిపోతూనే ఉంది.దిగుమతులు పెరుగుతున్నాయి, ఎగుమతులు తగ్గుతున్నాయి…స్పృహ ఉన్న ప్రభుత్వం చేయాల్సినపని ఎగుమతులను పెంచాలి, దిగుమతులను తగ్గించాలి ” పదకొండు సంవత్సరాల పాలనలో మోడీ ప్రభుత్వం చేసిందేమిటి ? తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం 2025లో చైనా కస్టమ్స్‌శాఖ చెబుతున్నదాని ప్రకారం బీజింగ్‌తో మన వాణిజ్య లోటు 115 బిలియన్‌ డాలర్లు, మనదేశం 106 బిలియన్‌ డాలర్లు అంటున్నది, ఏ సంఖ్యను చూసినా మోడీ తన రికార్డులను తానే బద్దలుకొట్టుకున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసినపుడు 2014 తరువాత ఒక్క ఏడాది కూడా ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గలేదు. పదకొండు సంవత్సరాలలో మన వాణిజ్య లోటు 80వేల కోట్ల డాలర్లు. తొలి ఏడాది 607 కోట్ల డాలర్లు లోటు ఉంటే 2024-25లో అది 950 కోట్ల డాలర్లకు చేరింది. అయినా సరే సమర్ధవంతమైన పాలన అందిస్తున్నామని చెబుతుంటే మనమంతా నిజమేకదా అని నమ్ముతున్నాం, విశ్వాసం అలాంటిది మరి. రూపాయి గురించి గతంలో నరేంద్రమోడీ ఇంకా ఏం చెప్పారు ! రూపాయి ఆసుపత్రిలో ఉంది ఐసియులో చేర్చారు. సంక్షోభం వచ్చింది, ఇలాంటి సమయాల్లో ఆశల్లేనపుడు, నాయకత్వం ఎటుపోతున్నదో తెలియనపుడు సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. ఒకసారి రూపాయి పతనం అయితే ప్రపంచ శక్తులు దాన్ని పూర్తి అవకాశంగా మలుచుకుంటాయి. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం రూపాయి పోటీ పడుతున్నాయి, రూపాయి విలువ వేగంగా పతనం అవుతున్నది. అతల్‌ జీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ రు.42 ఉంది, దిగిపోయేటపుడు 44, కానీ ఈ ప్రభుత్వం(యుపిఏ) దాన్ని రు.60కి దిగజార్చింది. రూపాయి బలాన్ని కోల్పోవటం లేదు, దాని సైజు మారింది, ఎందుకంటే ఢిల్లీలో అధికారంలో ఉన్నవారు అవినీతి మీద కేంద్రీకరించారని చెప్పారు. నిజంగా బిజెపి నేతలకు, వారిని సమర్ధించేవారికి భారతీయ ఆత్మ, విలువలు, వలువలు ఉండి వారి గతాన్ని నెమరువేసుకుంటే వారి ముఖాలు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ?

చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

సాంకేతిక రంగంలో ముందుకు పోకుండా చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయత్నించిన అమెరికా తాజాగా తనకు తోడుగా మరికొన్ని దేశాలను కూడగట్టుకొని గోదాలోకి దిగింది. బహుశా అందుకే కృత్రిమ మేథ(ఏఐ) రంగంలో పూర్తిస్థాయి యుద్ధ ముప్పు ఉందని ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా దిగ్గజ సంస్థ ఎన్‌విడియా తదుపరి తరం హార్డ్‌వేర్‌ బ్లాక్‌వెల్‌ చిప్‌తో అది ప్రారంభం అయినట్లే అన్నాడు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి అది రానుందనే వార్తల పూర్వరంగంలో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మస్క్‌ స్పందించాడు. ఈ చర్యతో పోటీదారులు వేగం,ఖర్చు,విస్తృతి అంశాల్లో తమ సత్తా చూపేందుకు పూనుకుంటారన్నాడు. ద్రవ్యపెట్టుబడిదారు గవిన్‌ బేకర్‌ మాట్లాడిన అంశాల మీద మస్క్‌ స్పందించాడు. బ్లాక్‌వెల్‌ చిప్స్‌ తయారీలో అనేక సవాళ్లు ఉన్నట్లు బెకర్‌ చెప్పాడు. అందుకే అది ఆలస్యం అవుతున్నదని అన్నాడు.ఏది ఏమైనప్పటికీ ఈ రంగంలో ఉన్న గూగుల్‌, ఎలన్‌మస్క్‌ ఎక్స్‌ఏఐ, మేటా (ఫేస్‌బుక్‌ ) వంటి కంపెనీలన్నీ పోటీపడతాయని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు పశ్చిమ దేశాల సంస్థలకు చైనా పెద్ద సవాలు విసురుతున్నది. గత పదిహేను సంవత్సరాలుగా సాంకేతిక రంగంలో బీజింగ్‌ ఎదగకుండా చూసేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. వాణిజ్యపోరుతో పాటు చిప్స్‌ పోరును కూడా ప్రారంభించాయి. తాజా పరిణామాలను బట్టి ఈ యుద్ధంలో అమెరికాకు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.అందుకే అది కొత్త ఎతుత్తగడలతో పోరును కొనసాగించేందుకు పాక్స్‌ సిలికా పేరుతో కొత్త కూటమిని రంగంలోకి తెచ్చింది.

చిప్‌ యుద్ధంలో చైనా ఒక్కటే ఒకవైపు ,అనేక దేశాలు మరోవైపు ఉన్నాయి. జోబైడెన్‌ సర్కార్‌ 2022 అక్టోబరు నుంచి ా చైనాకు అధునాతన చిప్స్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇటీవలనే ట్రంప్‌ ఏలుబడి ఎన్‌విడియా కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఆ చిప్స్‌ తమకు అవసరం లేదన్నట్లుగా చైనా తీరు ఉందని, తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో చిప్‌ యుద్దంలో తన బలం ఒక్కటే చాలదని భావించిన అమెరికా డిసెంబరు 12న తొలిసారిగా పాక్స్‌ సిలికా పేరుతో ఒక కూటమికి శ్రీకారం చుట్టింది. పాక్స్‌ అంటే లాటిన్‌ భాషలో శాంతి, స్థిరత్వం, సిలికా అంటే ఇసుకతో సహా వివిధ రూపాల్లో ఉండే ఖనిజం. దాన్నుంచి కంప్యూటర్లకు అవసరమైన చిప్స్‌ తయారు చేస్తారు,అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఐటి, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రాలు కేంద్రీకృతమైన ప్రాంతాన్ని సిలికాన్‌ వ్యాలీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. పాక్స్‌ సిలికా లక్ష్యం ఏమిటంటే విలువైన ఖనిజాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆ కూటమిలోని దేశాలు బలపడటం, చైనా ఆధిపత్యాన్ని ఉమ్మడిగా సవాలు చేయటం. అమెరికా వైపు నుంచి ఇలాంటి చొరవ చూపటం అంటే కమ్యూనిస్టు చైనా ముందు ఒక విధంగా తన ఓటమిని అంగీకరించటమే.చిత్రం ఏమిటంటే ఈ బృందం నుంచి భారత్‌ను మినహాయించారు.దీని అర్ధం మనలను చేర్చుకున్నందున తమకు ఉపయోగం లేదని భావించినట్లేనా ? లేక తమకు అనుకూలమైన షరతులతో వాణిజ్య ఒప్పందానికి ఒప్పించటానికి మరోవిధంగా వత్తిడి చేయటమా ?

ప్రస్తుతం ప్రపంచంలో విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల విషయంలో 70శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. వాటి ఎగుమతుల నిలిపివేతతో ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాలు గిజగిజలాడిన సంగతి తెలిసిందే.ఈ ఖనిజాలతో పాటు కృత్రిమ మేథ(ఏఐ), చిప్స్‌ తయారీ వంటి కీలక రంగాలలో పరస్పరం సహకరించుకొనేందుకు అమెరికా,దక్షిణ కొరియా, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్థాపక సభ్యులుగా పాక్స్‌ సిలికా ఏర్పడింది. ఆర్థిక కూటములు తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఏర్పడటం ఇదే ప్రధమం.దీన్ని అమెరికా కృత్రిమ మేథ దౌత్యంగా వర్ణించారు. ఈ కూటమికి సహకరించేందుకు లేదా అతిధులుగా తైవాన్‌, ఐరోపా యూనియన్‌, కెనడా,ఓయిసిడి ఉంటాయి. ఈ సంస్థలకు చెందిన దేశాలు తమవంతు సహకారాన్ని అందిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ చొరవను ” నూతన స్వర్ణ యుగం ” అని వర్ణించాడు. దీని గురించి చైనా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా చైనా స్వయంశక్తితో ఎదిగేందుకు దీర్ఘకాలిక పథకాలను రూపొందించింది.దాన్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది.స్వయంగా ఉత్పత్తులను చేస్తున్నది. ఇప్పుడు పాక్స్‌ సిలికాను కూడా సవాలుగా తీసుకొని మరింతగా తన సంస్థలను ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతగా ఒంటరిపాటు చేయాలని చూస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా అంతగా నూతన విజయాలతో ముందుకు వచ్చి సమాధానం చెప్పింది.

చైనా గురించి అనేక అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్‌విడియా కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయరాదని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే వాటిని అక్రమ పద్దతుల్లో సేకరించి డీప్‌సీక్‌లో వినియోగిస్తున్నట్లు వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని ఎన్‌విడియా ప్రకటించి వాటిగాలి తీసింది. సదరు ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము అమెరికా నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలోనే ఏఐ డీప్‌సీక్‌ను తయారు చేసి 2025లో ప్రపంచాన్ని కుదిపివేసింది. చాట్‌ జిపిటి వంటి ఏఐ వ్యవస్థలను తయారు చేసేందుకు భారీ మొత్తాలలో ఖర్చు చేసిన సంస్థలు తలలు పట్టుకున్నాయి. కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి. ఆధునికమైన చిప్స్‌తో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో ఏఐ వ్యవస్థలను తయారు చేయవచ్చని ఇప్పుడు అనేక మంది భావిస్తున్నారు. సాంకేతిక రంగంలో కొన్నింటిలో ఇప్పటికీ ముందున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు గతంలో మాదిరి అమెరికా ఒక నిర్ణయాత్మక శక్తిగా లేదు. ఎన్‌విడియా హెచ్‌200 రకం చిప్‌లను చైనాకు ఎగుమతి చేయవచ్చని ట్రంప్‌ అనుమతించాడు.చైనా మార్కెట్‌లో ప్రవేశించటం ఒకటైతే, వాటిని కొనుగోలు చేసిన చైనా తనపరిశోధనలను పక్కన పెట్టి వాటిపైనే ఆధారపడుతుందనే అంచనాతో ఈ చర్య తీసుకున్నాడు. అయితే అలా జరుగుతుందని చెప్పలేమని అధ్యక్ష భవనంలో ఏఐ జార్‌గా పరిగణించే డేవిడ్‌ శాక్స్‌ చెప్పాడు. ఎగుమతులపై నిషేధం పెట్టిన అమెరికా తానే ఏకపక్షంగా ఎత్తివేసింది. ఆట నిబంధనలను తానే రూపొందించి తానే మార్చినట్లయింది.

కొన్ని దశాబ్దాల పాటు తన నిబంధనలతో అమెరికా ప్రపంచాన్ని ఏలింది. ఇతర దేశాల తలరాతలను రాసేందుకు ప్రయత్నించింది. మనతో సహా అలీన దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అది సోవియట్‌, ఇతర సోషలిస్టు దేశాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోనే తమ ప్రత్యర్ధులకు చేరుతుందనే భయంతో అనేక చర్యలు తీసుకుంది. పోటీదారులు తలెత్త కుండా చూసుకుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఒక ఆయుధంగా వాడుకుంది. మన దేశానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అండతో దాన్ని అధిగమించాం. అణుపరీక్షలు జరిపితే ఆంక్షలు విధించింది. ఆహార ధాన్యాలు కావాలంటే మాకేంటని బేరం పెట్టింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాయి. అది చేసిన చారిత్రక తప్పిదం వలన ఇతర దేశాల మీద ఆధారపడక తప్పని స్థితి. వస్తు ఉత్పాదక పరిశ్రమలన్నింటినీ మూసివేసింది, లేదా ఇతర దేశాలకు తరలించింది. ఇప్పుడు టాయిలెట్లలో తుడుచుకొనేందుకు అవసరమైన కాగితాన్ని కూడా అది ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కోట్లకు వేసుకొనే టై దగ్గర నుంచి కాళ్లకు వేసుకొనే బూట్ల వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే తప్ప గడవదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంపాదించిన సొమ్ముతో వాటన్నింటినీ ఎక్కడో అక్కడ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉదాహరణకు ఎన్‌విడియా చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసి రాబడిలో 25శాతం ఖజానాకు జమచేస్తానని ట్రంప్‌ చెప్పాడు. ఎలా అంటే 25శాతం ఎగుమతి పన్ను విధించి అన్నాడు. ఆ కంపెనీ ఏటా పది బిలియన్‌ డాలర్ల వరకు హెచ్‌ 200 రకం చిప్స్‌ను ఎగుమతి చేస్తే దాని మీద 25శాతం పన్నుతో రెండున్నర బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని ట్రంప్‌ లెక్కలు వేసుకున్నాడు. తీరా ఏమైంది. అమెరికా చిప్సా అసలు మనకు వాటి అవసరం ఉందో లేదో సమీక్షించాలని, ప్రభుత్వ రంగంలో వాటిని వాడవద్దని తన అధికారులు, సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు మీడియాలో వచ్చింది. మన చిప్స్‌ను చైనా తిరస్కరిస్తున్నది అని అధ్యక్ష భవన అధికారి డేవిడ్‌ శాక్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో చెప్పాడు. అదే నిజమైతే ట్రంప్‌ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. 2023 నుంచి నిషేధం అమలు చేసినందున మూడు సంవత్సరాల్లో ఎంతో నష్టపోయినట్లు ఎన్‌విడియా కంపెనీ వాపోయింది. అమెరికా భద్రత పేరుతో ఈ నిషేధం కారణంగా ఎవరిమీదో ఎందుకు ఆధారపడటం మీరే తయారు చేయండని స్థానిక కంపెనీలకు 70 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక పాకేజ్‌ను చైనా ప్రకటించింది. అంతే శక్తివంతమైన ప్రత్నామ్నాయాలను రూపొందించింది కనుకనే అమెరికా చిప్స్‌తో పనిలేదన్నట్లుగా ఉంది. భద్రత సాకును వదలివేసి లాభాలే పరమావధిగా ఎగుమతులకు అమెరికా అనుమతి ఇచ్చింది.

ముందే చెప్పుకున్నట్లు చైనా పరిశోధనా రంగంలో చేస్తున్న ఖర్చుకు ఫలితాలు కనిపిస్తున్నాయి.2025 డిసెంబరు ఒకటవ తేదీన ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం అది విశ్లేషించిన 74 కీలక రంగాలకు గాను 66లో చైనా పరిశోధనలు ముందున్నాయి.అమెరికా కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఉంది. 2000 దశకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు తిరగబడింది. అయితే చైనా ఆ తరువాత అల్లా ఉద్దీన్‌ అద్బుతదీపాన్ని సంపాదించిందా ? లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని సాగించిన కృషికి ఫలితమిది.అమెరికా ఎప్పుడైతే అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి మరింత పట్టుదల పెరిగింది.అనేక రంగాలలో విదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అలా అని తలుపులు మూసుకోలేదు, అవసరమైన వాటికోసం వెంపర్లాడటం లేదు. చిప్స్‌ కొనటం లేదని అమెరికా అధికారి వాపోవటానికి కారణం చైనా కాదు, అమెరికా అనుసరించిన ఎత్తుగడలే అన్నది స్పష్టం. అవసరం అయినపుడు అమ్మకుండా తీరిన తరువాత ఇస్తామంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా ? చైనా కొన్ని అంశాలలో తన విధానాలను ఇతర దేశాలను చూసి నిర్ణయించుకోవాల్సిన స్థితిలో లేదు. చైనాతో సహా వర్ధమానదేశాలన్నింటినీ తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని అమెరికా శ్వేత సౌధంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు ఉన్నా అనుసరించిన విధానం ఒక్కటే.అక్కడి అధికారం కోసం వారిలో వారు పోట్లాడుకుంటారు తప్ప ఇతర దేశాలను దోచుకోవటంలో, తంపులు పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో ఎవరికెవరూ తీసిపోలేదు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత చైనాపై చిప్‌ యుద్ధం 2.0 ప్రారంభించాడు, ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూద్దాం !

చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే తప్ప అమెరికాకు రోజుగడవదు. దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఇటీవల రెండు సార్లు తమ విమానాల రాడార్లపై చైనా ఆయుధాలను గురిపెట్టిందని జపాన్‌ ఆరోపించింది. మిలిటరీ పరిభాషలో లాక్‌ ఆన్‌ అంటే ఒక దేశానికి చెందిన మిలిటరీ విమానాలు మరోదేశానికి చెందిన విమానాలపై రాడార్ల ద్వారా నిఘావేసి సంకేతాలు పంపటమే. ఇదికొన్ని సందర్భాలలో కూల్చివేతలకు కూడా దారి తీయవచ్చు. నిఘా అవసరాలకూ వినియోగించవచ్చు. దేనికి అలా చేశారన్నది ఆయా దేశాలు చెప్పే భాష్యాలు వివాదం అవుతున్నాయి. దొంగే దొంగ అని అరచినట్లుగా జపాన్‌ నిఘావిమానాలను తమపై కేంద్రీకరించి తామేదో చేసినట్లు గుండెలు బాదుకుంటూ ప్రపంచాన్ని నమ్మింపచూస్తున్నదని చైనా విమర్శించింది. అయితే ఎటు వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు చోటు చేసుకోలేదు గానీ గత దశాబ్దికాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్‌ ఆన్‌ ప్రచారం జపాన్‌ ప్రారంభించిన ఆయుధీకరణకు ఒక ముసుగు మాత్రమే. జపాన్‌ ఆరోపణలకు మంగళవారం నాడు అమెరికా మద్దతు పలికింది.చైనా చర్యలు ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి దోహద పడటం లేదన్నది. అమెరికా ప్రకటన తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఎంతగట్టిదో వెల్లడించిందని జపాన్‌ స్పందించింది. రెండవ ప్రపంచ యుద్దంలో కేవలం ఆత్మరక్షణకు అవసరమైన మిలిటరీ మాత్రమే జపాన్‌కు ఉండాలని ఒప్పందం కుదిరింది. అయితే 2015 ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తమకే గాక మిత్రదేశాలకు ఆపద వచ్చినపుడు కూడా జోక్యం చేసుకోవచ్చని కొత్త నిబంధన చేర్చారు.నిజానికి తైవాన్‌ ఒక దేశం అని ఐరాస గుర్తించలేదు, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సానాయి టకాయిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ బలవంతంగా తైవాన్‌ ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకుంటే తమ దేశభద్రతకు ముప్పు వచ్చినట్లే అని దాన్ని తాము అంగీకరించేది లేదని ప్రకటించారు.

చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ ప్రస్తుతం ఒక తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది.శాంతియుత పద్దతుల్లో తిరిగి ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసేందుకు చూస్తామని,అవసరమైతే మిలిటరీచర్యతో అయినా ఆ పని చేస్తామని చైనా పదే పదే ప్రకటించింది. హాంకాంగ్‌, మకావో దీవుల విలీనం మాదిరి ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింది తైవాన్‌లో ఉన్న వ్యవస్థను 2049 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది, అంటే అప్పటి వరకు స్వయం పాలనకు అవకాశమివ్వటమేగాక అక్కడ ఉన్న పెట్టుబడులకు రక్షణ కల్పించటమే. అయితే ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని అంగీకరిస్తూనే అమెరికా, జపాన్‌ ఇతర పశ్చిమ దేశాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని తాము అంగీకరించేది లేదని వితండ వాదనకు దిగుతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. ఒక దేశం మాదిరి అక్కడ మిలిటరీని ఏర్పాటు చేసేందుకు, వాటికి యుద్ధ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందచేస్తున్నాయి. అమెరికా కవ్వింపులను గమనించిన చైనా ఆచితూచి వ్యవహరిస్తున్నది, ఎప్పటికప్పుడు తన అధికారాన్ని అది పునరుద్ఘాటిస్తున్నది. తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో చూడండి అంటూ తరచు తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నది. వాటిని చూపి ఇంకేముంది చైనా బలప్రయోగానికి పూనుకుందంటూ అమెరికా కూటమి దేశాలు నానా యాగీ చేస్తున్నాయి.

క్లుప్తంగా తైవాన్‌ సమస్య గురించి చూద్దాం.చైనా స్వాతంత్య్రం కోసం కొమింటాంగ్‌ పార్టీ ఏర్పడింది.సన్‌ యెట్‌ సేన్‌ నాయకత్వంలో 1912లో చైనా స్వాతంత్రం ప్రకటించుకొని రిపబ్లిక్‌గా అవతరించింది. తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో అధికారానికి దూరమైన సన్‌ తరువాత మరోసారి అధికారానికి వచ్చి కమ్యూనిస్టులతో కలసి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మరణం తరువాత 1925లో అధికారానికి వచ్చిన ఛాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీలో కమ్యూనిస్టులతో సయోధ్యను కోరుకొనే వారిని పక్కన పెట్టి కమ్యూనిస్టు వ్యతిరేకిగా మారాడు. మావో నాయకత్వాన కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో మిలిటరీ, ఆయుధాలను తీసుకొని చాంగ్‌కై షేక్‌ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడి నుంచి కమ్యూనిస్టులను ప్రతిఘటించాడు. ప్రధాన భూభాగంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ముఖ్యమని భావించిన కమ్యూనిస్టులు దాని మీద కేంద్రీకరించారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ఐరాసలో అప్పుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ నియమించిన ప్రతినిధులనే గుర్తించారు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా అంటే తైవాన్‌లో తిష్టవేసిన కొఇమింటాంగ్‌ పార్టీయే చైనా ప్రతినిధి అని 1970దశకం వరకు పరిగణించారు.ఎట్టకేలకు కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1971 అక్టోబరులో జరిగిన 26వ సమావేశంలో 2,758 తీర్మానం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రధాన భూభాగంలో ఉన్న జనచైనా(పిఆర్‌సి) అసలైన ప్రతినిధి అని గుర్తించారు. నాటి నుంచి తైవాన్‌లో ఉన్న పాలకులు నియమించిన వారికి గుర్తింపు రద్దు చేశారు. చైనాలో తైవాన్‌ అంతర్భాగమని అందరూ అంగీకరించారు. అయితే అప్పుడు జరిగిన చర్చలో దీర్ఘకాలం విడిగా ఉన్నందున బలవంతపు విలీనం జరగకూడదని పలుదేశాలు చెప్పిన అభిప్రాయాన్ని చైనా నాయకత్వం కూడా అంగీకరించింది. నాటి చర్చను సాకుగా తీసుకొని తరువాత ఎప్పుడు విలీన యత్నం చేసినా తగిన పరిస్థితి ఏర్పడలేదని పశ్చిమ దేశాలు పాటపాడుతున్నాయి. ఇప్పటికీ అదే సాకు చెబుతూ విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. తన పౌరులపై బలప్రయోగం అంటే రక్తపాతమే గనుక చైనా అందుకు పూనుకోవటం లేదు, దాని సహనాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. దానిలో భాగమే తైవాన్‌ విలీనం తమ దేశానికి ముప్పు అని జపాన్‌ చెబుతున్న కుంటిసాకు. ప్రస్తుతం తైవాన్‌ వేరుగా ఉన్నందున చైనాకు వచ్చిన ముప్పేమీ లేదు గనుక ఉపేక్షిస్తున్నది. అది చెబుతున్న 2049 గడువులోగా దారికి వస్తే సరే, రాకుంటే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒక్కటి మాత్రం స్పష్టం. తైవాన్‌ వ్యవహారాల్లో మరోదేశం జోక్యం చేసుకోవటం, భిన్నంగా మాట్లాడటం అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, తమ సార్వభౌమత్వం, రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే అని చైనా చెబుతున్నది. ఇదే అంశాన్ని సోమవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు వాంగ్‌ ఇ స్పష్టం చేశారు. తైవాన్‌ గురించి అనేక అంశాలను వివరించాడు. ఈ ప్రాంతాన్ని జపాన్‌ అర్ధశతాబ్దం పాటు ఆక్రమించుకొని వలసగా చేసుకున్నదని, తమ పౌరుల మీద లెక్కలేనని అత్యాచారాలు చేసిందని కూడా చెప్పాడు.

చైనా బూచిని చూపుతూ జపనీయులను రెచ్చగొడుతున్న అక్కడి పాలకులు మిలటరీ బడ్జెట్‌ను పెంచేందుకు సాకులు వెతుకుతున్నారు.ఇదంతా అమెరికా ఆడిస్తున్న క్రీడ తప్ప మరొకటి కాదు. తాను నేరుగా దిగితే చైనాతో సమస్యలు వస్తాయని తెలుసుగనుక ట్రంప్‌ యంత్రాంగం జపాన్ను ఎగదోస్తున్నది. తైవాన్‌ దీవికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చివరి దీవుల సముదాయం,( ఇది చైనాకూ అంతే దూరం) జనాభా పెద్దగా లేని యంగునీ దీవుల సముదాయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించేందుకు పూనుకుంది. అక్కడ రాడార్‌ కేంద్రాలు, మందుగుండు గిడ్డంగులు, అమెరికా అందచేసిన ఎఫ్‌-35 విమానాల మోహరింపు, ఇతర మిలిటరీ నిర్మాణాలకు పూనుకుంది. ఇప్పటికే సిబ్బంది నివాసాలకు కొన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఆ దీవుల్లో ఉన్న పౌరులు కొంత మందితో సమావేశం జరిపి చైనాపై నిఘా, దాని ఎలక్ట్రానిక్‌ పరికరాలనుంచి వెలువడే అయస్కాంత తరంగాలను స్థంభింప చేసేందుకు మిలిటరీ నిర్మాణాలు అవసరమని తేల్చి చెప్పారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్దం అంటూ వస్తే అది జపాన్‌ వైపు నుంచే మొదలు కావాలి తప్ప చైనా నుంచి జరగదు. ఒక వేళ జరిగితే అమెరికా తమను ఆదుకొనే పరిస్థితి లేదని గతంలో ప్రభుత్వ విశ్లేషకురాలిగా ఉండి, ప్రస్తుతం నిగాటా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్‌ చెప్పారు. ప్రభుత్వ మిలిటరీ, క్షిపణుల మోహరింపు గురించి అక్కడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీచర్చలో వ్యతిరేకతను వెల్లడించింది. ఇతర దేశాల మాదిరే జపాన్‌ కూడా చేస్తున్నదని రక్షణ మంత్రి సమర్ధించాడు.

గత వారంలో విమర్శలకు దారితీసిన ఉదంతం జపాన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉన్న ఒకినావా దీవి సమీపంలో జరిగింది. చైనా తమ విమానాలను లక్ష్యంగా చేసుకున్నదని తప్ప గగనతలాన్ని అతిక్రమించినట్లు జపాన్‌ ఇంతవరకు చెప్పలేదు.ముందుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానవాహక యుద్ధ నౌక సమీపానికి ప్రమాదకరంగా జపాన్‌ యుద్ధ విమానాలే వచ్చాయని, తమవైపు నుంచి అనివార్యమైన ప్రతిస్పందన ఉందని బీజింగ్‌ చెబుతున్నది.చైనా విమానవాహక యుద్ద నౌక లియావోనింగ్‌ వైపు జపాన్‌ యుద్ధ విమానాలు సమీపంలోకి వచ్చినపుడు చైనా విమానాలు అడ్డుకొని హద్దు మీరితే అంతే సంగతులని హెచ్చరించినట్లు, అవి పూర్తిగా సమర్దనీయమే అని చైనా నిపుణులు చెబుతున్నారు. జపాన్‌ సమీపంలో చైనా విమానవాహక నౌక కార్యకలాపాలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని జపాన్‌ వార్తా సంస్థ కొయోడో పేర్కొన్నది. తూర్పు ఆసియా సముద్రంలో చైనా నౌకాదళానికి చెందిన వివిధ రకాల వంద నౌకలు పాల్గ్గొన్నట్లు రాయిటర్స్‌ వార్త ఆరోపించింది. తమ నౌకలు పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు జరపటం సాధారణమని అయితే ప్రతిసారీ జపాన్‌ తమకు చైనా నుంచి ముప్పు ఉందని చెప్పేందుకు, తన మిలిటరీ శక్తిని పెంచుకొనేందుకు వాటిని బూతద్దంలో చూపుతున్నదని, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే తాము జరుపుతున్నట్లు, జపాన్‌ ఆత్మరక్షణ రాజ్యాంగం నుంచి పక్కకు జరుగుతున్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వాటి మీద అతిగా స్పందించటం, విపరీత భాష్యాలు ఎవరూ చెప్పకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్‌జియాన్‌ చెప్పాడు.అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుపుతున్న తమ విన్యాసాల గురించి గుండెలు బాదుకుంటున్న జపాన్‌ అదే పని అమెరికా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నదని చైనా ప్రశ్నిస్తోంది.

తైవాన్‌ సమస్యపై రెచ్చగొడుతున్న జపాన్‌ తీరును చూస్తే అమెరికా పన్నిన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే తైవాన్‌ సమస్యపై తక్షణమే చైనాతో యుద్ధం రాకుండా చూసుకోవాలని ఒక పథకం రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా అమెరికా, దాని మిత్రదేశాలు మిలిటరీ బలాన్నిపెంచుకోవాలని, చైనా వైపునుంచి తైవాన్‌, జపాన్‌ మీద వత్తిడి పెరుగుతున్నదని డిసెంబరు ఐదున ప్రచురించిన ఒక పత్రంలో అమెరికా జాతీయ వ్యూహకర్తలు పేర్కొన్నారు.2017లో ప్రచురించిన పత్రంలో ఒక వాక్యంలో మూడుసార్లు తైవాన్‌ ప్రస్తావన చేయగా తాజా పత్రంలో మూడు పేరాల్లో ఎనిమిదిసార్లు ఉన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వాణిజ్య యుద్దాలు జరుగుతున్న, సెమికండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో తైవాన్‌ గురించి సరిగానే కేంద్రీకరించినట్లు, జపాన్‌ నుంచి ఆగేయాసియా వరకు ఏ దీవి మీద కూడా ఎక్కడా దురాక్రమణ జరగకుండా అమెరికా మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఆ పత్రం పేర్కొన్నది. ఇదే సమయంలో అమెరికా ఒక్కటే చేయలేదని, చేయకూడదని, మిత్రదేశాలు మిలిటరీ ఖర్చు పెంచుకోవాలని, ఉమ్మడిగా రక్షణకు పని చేయాలని హితవు పలికింది.ఈ బలం తైవాన్‌ ఆక్రమణ యత్నాలు మానుకొనే స్థాయికి పెరగాలని కోరింది. ఈ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగానే ఆత్మరక్షణ యుద్ధం నుంచి ఎదురుదాడులు చేసే విధంగా ఆయుధాలను పెంచుకోవాలని జపాన్‌ చూస్తున్నది, దానికి సాకుగా చైనా బూచిని చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది !

నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

పరీక్షల్లో మార్కులు తగ్గితే విద్యార్దుల గ్రేడ్‌ (నాణ్యత) తగ్గుతుంది.సమాధానాల పేరుతో పేజీల కొద్దీ రాసినా అసలు విషయాలు లేకపోతే మార్కులు పడవు. పదకొండు సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సర్కార్‌ అందచేస్తున్న జిడిపి వృద్ధి అంకెల నాణ్యతను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) గతంలో ప్రశ్నించింది. ఎలాంటి స్పందన మార్పులు లేకపోవటంతో కొద్ది రోజుల క్రితం సి గ్రేడ్‌కు తగ్గించింది.దీని గురించి గురువారంనాడు (2025 డిసెంబరు 4) లోక్‌సభలో సమర్ధించుకుంటూ వచ్చే ఏడాదినుంచి 2022-23 సంవత్సరాన్ని నూతన ప్రాతిపదికగా తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గణాంకవిధానం గురించి ఐఎంఎఫ్‌ చెప్పింది తప్ప అభివృద్ధి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అనేక అంకెలకు బి గ్రేడ్‌ ఇచ్చిందని నిర్మలమ్మ అన్నారు.మన అంకెల నాణ్యత నాలుగు గ్రేడ్లలో దిగువ నుంచి రెండవదిగా ఉంది.దీనికి అభివృద్ధి అంచనాలకు సంబంధం లేదు, వాటికి చెబుతున్న భాష్యం మీదనే పేచీ. గణింపుకు మీరు తీసుకున్న ప్రాతిపదిక, పద్దతి తప్పు, పాతబడిన సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని భాష్యాలను చెబుతున్నారంటూ 2025 ఆర్టికల్‌ నాలుగు నివేదికలో తలంటింది. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానం గురించి ఇంటా బయటా గత పదేండ్ల నుంచి అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎలాంటి చలనం లేదు. ప్రస్తుతం 2011-12 సంవత్సర అంకెలను ప్రాతిపదికగా తీసుకొని గణాంకాలను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 2022-23 ప్రాతిపదికగా కొత్త సూచీలను రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ ఐఎంఎఫ్‌ మనదేశ సమాచార నాణ్యత గ్రేడ్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రాతిపదికన నూతన సూచీలను తయారు చేస్తారు. ఐఎంఎఫ్‌ చర్యతో మరోసారి కేంద్రం చెబుతున్న అభివృద్ధి అంకెల విశ్వసనీయత గురించి మీడియా, సామాన్య జనంలో చర్చలేకపోయినా ఆర్థికవేత్తలలో మొదలైంది.

మన దేశ జిడిపి గురించి ప్రభుత్వం చెప్పే అంకెలకు ఐఎంఎఫ్‌ అంచనాలకు తేడా ఉంది. అది విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిజమైన జిడిపి వృద్ధి రేటు 6.5శాతం కాగా 2025-26 తొలి మూడు మాసాల్లో 7.8శాతం ఉంది. అయితే ఐఎంఎఫ్‌ మాత్రం 2025-26లో 6.6శాతం ఉంటుందని, మరుసటి ఏడాది 6.2శాతమని అంచనా వేసింది.మన ప్రభుత్వం అనుసరిస్తున్న గణాంక, విశ్లేషణ పద్దతులపై ఐఎంఎఫ్‌ చాలా సంవత్సరాల నుంచి విబేధిస్తున్నప్పటికీ సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని తన విశ్లేషణలను అందిస్తున్నది. వాటి గురించి తన భిన్నాభిప్రాయాన్ని చెప్పవచ్చు తప్ప సమాచారాన్ని తిరస్కరించేందుకు వీల్లేదు. కొద్ది సంవత్సరాలుగా వెల్లడిస్తున్న అభిప్రాయాలను జనం దృష్టికి తేలేదు. ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.గత పదేండ్లలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, కరోనా తరువాత చెప్పే అంకెలకు, వాస్తవానికి తేడా ఉంటోందని ఐఎంఎఫ్‌ భావించింది. కొద్ది సంవత్సరాలుగా అంతర్గతంగా తన విబేధాలను వెల్లడిస్తూనే ఉంది, చివరికి 2025లో సమాచారం నాణ్యత గురించి గ్రేడ్‌ను తగ్గించింది. ఇప్పుడెందుకు ఆపని చేసింది. ముందే చెప్పుకున్నట్లుగా వచ్చే ఏడాది 2022-23 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొత్త సిరీస్‌ను విడుదల చేయనుంది గనుక ఇప్పటి వరకు గమనించిన లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే ఈ పనిచేసిందని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే సమాచారాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నది తప్ప సంఘటిత, అసంఘటితరంగ సమాచారాన్ని నిర్దిష్టంగా సేకరించటం లేదనే విమర్శ ఉంది. ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు టోకు ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నది, దీనికి బదులు ఉత్పత్తి ధరలు, రంగాల వారీ ధరలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తం మీద ఆర్థిక రంగం గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు కదా, నాణ్యత లేని సమాచారం ఆధారంగా తీసుకోవటాన్ని ఐఎంఎఫ్‌ తప్పుపట్టిందని మాత్రమే కొందరు సూత్రీకరిస్తున్నారు. రుణాలు, విదేశీమారకద్రవ్యం, ఖర్చు గురించి సరైన లెక్కలే చెబుతున్నారు కదా అంటున్నారు. ముఖం ఎలా ఉందో ఎవరికైనా తెలుస్తుంది,దాన్ని వేరేగా చెబితే వెంటనే బండారం బయటపడుతుంది. శరీరం అంతర్భాగంలో ఉన్నవాటిని ఎవరో ఒక నిపుణుడు చెబితేనే కదా మనకు తెలిసేది, ఆ చెప్పటంలోనే నిపుణుల మధ్య ఏకాభిప్రాయం, నాణ్యత లేదన్నది సమస్య. కేవలం చెయ్యి చూసి అంతాబాగానే ఉందంటే కుదురుతుందా ? నాణ్యత లేని వస్తువును కొన్నపుడు అది ఎంతకాలం మన్నుతుందో తెలియదు, నాణ్యత లేని సమాచారం ప్రాతిపదికగా ఏ రంగమైనా దీర్ఘకాలిక వ్యూహాలను ఎలా రూపొందించుకుంటుంది ?

జిడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉందని చూపుతున్నపుడు దానికి తగినట్లుగా కార్పొరేట్‌ ఫలితాలు కనిపించటం లేదన్నది కొందరి ప్రశ్న. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జడిపి వృద్ధి రేటు 7.4శాతం ఉంటుందని, పబ్లిక్‌ ఫైనాన్స్‌ మరియు విధాన జాతీయ సంస్థ(ఎన్‌ఐపిఎఫ్‌పి) చెప్పింది.మూడీస్‌ రేటింగ్‌ సంస్థ 2026, 2027 సంవత్సరాలలో ప్రపంచ వృద్ధి రేటు 2.5 -2.6శాతం మధ్య, భారత వృద్ధి 6.4 మరియు 6.5, చైనా 4.5శాతం ఉంటుందని పేర్కొన్నది. ఇవి చూడటానికి బాగానే ఉన్నాయి.పశ్చిమ దేశాల సూత్రం ప్రకారం జిడిపి వృద్ధి రేటు కంటే కార్పొరేట్‌ లాభాల రేటు మూడు, నాలుగుశాతం ఎక్కువగా ఉంటుంది.మనదేశంలో కూడా దశాబ్దాల పాటు అలాగే ఉంది. కానీ సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల్లో నిఫ్టీ 50 సూచికలో పెరుగుదల కేవలం ఏడుశాతమే. మొత్తం లాభాలు 13శాతం కాగా పన్నులు పోను నిఖర లాభం తొమ్మిదిశాతమే ఉంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించకపోవచ్చుగానీ దాన్ని విస్మరించలేము.నిప్టీ మైక్రోకాప్‌ 250 అమ్మకాల వృద్ధి 12శాతం ఉన్నా, మొత్తం లాభాలు ఆరుశాతమే ఉన్నాయి. జిడిపి వృద్ధి రేటు స్థిరంగా ఉంటే ఈ ఫలితాల సంగతేమిటి ? ఏ అంకెలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ? ఆసియన్‌ పెయింట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 2024 మేనెలలో జిడిపి అంకెలు ఎలా వస్తున్నాయో నాకు నమ్మకం లేదు అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు వైరల్‌ కావటంతో ఒక్క రోజులోనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వత్తిడి వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిండికొద్దీ రొట్టె అన్నారు.కుండలో కూడు కూడు అసలుందో లేదో ఉంటే ఎంత ఉందో,పిల్లాడు తిన్నాడో లేదో తెలియదు గానీ దుడ్డులా ఉన్నాడు అని చెబుతున్నట్లుగా అభివృద్ధి గొప్పగా ఉందని భాష్యం చెబుతున్నారు. జిడిపికి దోహదం చేసేవాటిలో వినియోగవృద్ధి ఒకటి.దేశంలో నిజవేతనాలు పడిపోవటం లేదా గిడసబారి పోయినట్లు చెబుతుండగా గృహస్తుల వినియోగం పెరిగిందని చెప్పటం మీద అనుమానాలు ఉన్నాయి. రెండవ అంశం పెట్టుబడులు, మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు పెట్టుబడులు నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు జిడిపిలో 31.3శాతం ఉంటే 2024-25లో 29.6శాతం ఉన్నాయి. మధ్యలో ఒక ఏడాది మాత్రమే 31.2శాతం నమోదయ్యాయి. మిగిలిన అన్ని సంవత్సరాలలో అంతకంటే తక్కువే.ఈ కాలంలో కార్పొరేట్‌ పన్ను మొత్తం ప్రైవేటు రంగానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని చూస్తే కార్పొరేట్‌ పన్ను విధింపు 30శాతం నుంచి 15కు తగ్గించారు. అయినా పారిశ్రామికరంగం వాటా జిడిపిలో 2014తో పోల్చితే తగ్గింది లేదా స్థిరంగా ఉంది తప్ప పెరగలేదు. చైనాలో సాధారణ కార్పొరేట్‌ రేటు 25శాతం కాగా మన దేశంలో కొత్త సంస్థలకు 15శాతంగా రాయితీ ఇచ్చినప్పటికీ చైనా నుంచి కంపెనీలు ఆశించిన స్థాయిలో రాలేదు. మేకిన్‌ ఇండియా విధానంతో 2022 నాటికి జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 25శాతం లక్ష్యంగా చెప్పారు.తరువాత దాన్ని 2025కు పొడిగించామన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి 2006లో 17.3శాతం ఉండగా మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో 15.07 నమోదైంది తరువాత నేటి వరకు చూస్తే 13శాతానికి పడిపోయింది. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా పదవ స్థానంలో ఉన్న జిడిపిని ఐదుకు తెచ్చామంటారు, మరి దీని సంగతేమిటి ? జిడిపిని 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామన్నారు, పారిశ్రామిక ఉత్పాదకత పెరగకుండా అదెలా సాధ్యం ? ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయి, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టటం లేదు. ఆర్థిక మాంద్యం వచ్చినపుడు అమెరికాలో భారీ మొత్తంలో రోడ్లు, వంతెనలు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల మీద అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసి కొనుగోలు శక్తి పెంచేందుకు చూసింది. అక్కడి మాదిరి మాంద్యాలు లేకపోయినా మందగమనం కారణంగా మనదేశంలో కూడా జరుగుతున్నది అదే. ప్రైవేటు రంగంలో తనకు లాభం ఉంటుందా లేదా అని ఆచితూచి పెట్టుబడులు పెడుతోంది.వాజ్‌పారు నుంచి మధ్యలో మన్మోహన్‌ సింగ్‌, ఇప్పుడు నరేంద్రమోడీ వరకు భారీమొత్తాలను కేటాయించి జాతీయ రహదారులనిర్మాణం, రైల్వే విస్తరణ, సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల వంటివి నిర్మిస్తున్నారు.అవి లేకపోతే పరిస్థితి మరింత దిగజారి ఉండేది, బిజెపి నేతలు రోడ్లను చూపి చూశారా మా ప్రతిభ అంటున్నారు. అదే సామర్ధ్యాన్ని ఉత్పాదకరంగంలో ఎందుకు చూపలేకపోతున్నారు ? మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి వాటి ఉత్పాదకతను పెంచకపోయినా పడిపోకుండా చూసేందుకు ఇటీవల తగ్గించిన జిఎస్‌టి కూడా ఆయా రంగాలకు ఉద్దీపనలో భాగమే.చిత్రం ఏమిటంటే జిఎస్‌టి తగ్గించిన రెండు నెలల తరువాత నవంబరు మాసంలో పన్ను వసూలు పెరగకపోగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా నమోదైంది. అందుకే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి భజనబృందాలు ఇప్పుడు మూగపోయాయి.

జిఎస్‌టి తగ్గింపు గురించి గతేడాదే సంప్రదింపులు మొదలయ్యాయి. తగ్గింపుతో డిమాండ్‌ పెరిగి ప్రైవేటు రంగానికి పెద్ద ఊపువస్తుందన్న అంచనాతో 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించేందుకు పూనుకుంది. వాటిలో గ్రామీణ ఉపాధిపథకానికి నిధుల కోత ఒకటి.2023-24లో రు.89,154 కోట్లు ఖర్చు చేస్తే 2025-26లో రు.86వేల కోట్లకు కుదించారు.2025 జనవరిలో చూస్తే ఏడు రాష్ట్రాలలో ప్రకటించిన వేతన సగటు రు.294 కాగా చెల్లించిన మొత్తం రు.257 మాత్రమే. తెలంగాణాలో రు.319కిగాను రు.276, ఆంధ్రప్రదేశ్‌లో రు.300కు గాను రు.258 చెల్లించారు. జిడిపిలో ప్రభుత్వ ఖర్చు వాటాను 15.6 నుంచి 15శాతానికి తగ్గించారు. వాస్తవంలో ఇంకా దిగజారుతుందేమో తెలియదు. మొత్తంగా దేశమంతటా శ్రామికుల నిజవేతనాలు పెరగకుండా వస్తు, సేవలకు గిరాకీ పెరగదు. ఉద్యోగులకు వేతన సవరణ చేసినంత మాత్రాన మొత్తం గిరాకీ మీద దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే కోట్లాది మంది రాబడిని పెంచే అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే పెంచారు. ఐదేండ్లకు ఒకసారి సవరిస్తే ఈ పాటికి మూడుసార్లు పెరిగేవి.ప్రభుత్వాల ఖర్చు అంటే ఏదో ఒక రూపంలో జనాలకు చేరే మొత్తాలతో పాటు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకూ లబ్ది చేకూరుతుంది. ప్రైవేటు పెట్టుబడులలు అలాంటివి కాదు, వాటి లాభాలే ప్రాతిపదికగా ఉంటాయి. అందువలన ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు రానున్న రోజుల్లో ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.అధికారంలో ఎవరున్నా చేసింది అంకెల గారడీ గనుకనే సామాన్యుల స్థితిలో పెద్దగా మార్పులేదు, వచ్చే ఏడాది నూతన సీరీస్‌ అంటున్నారు గనుక మరో జిమ్మిక్కు చేయనున్నారా !

యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను మింగేయాలనుకున్న తోడేలు కథ తెలిసిందే ! ప్రపంచంలో ఏదో ఒక మూల ఘర్షణ లేదా యుద్ధం లేకుండా అమెరికాకు నిదురపట్టదు. అందుకే మాదక ద్రవ్యాల రవాణా సాకుతో వెనెజులాపై ఏ క్షణమైనా దాడి చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పెంటగన్‌ పూర్తి చేసింది. మిలిటరీ ద్వారా మదురోను తొలగించేందుకు పూనుకోవద్దని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పోప్‌ లియో మంగళవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌కు హితవు చెప్పాడు. అక్కడ మార్పులు కావాలని అనుకుంటే ఆర్థిక ఆంక్షల ద్వారా చేయవచ్చని సలహా కూడా ఇచ్చాడు. ప్రపంచంలో అతి పెద్దది, అధునాతనమైనదిగా పరిగణిస్తున్న యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ విమానవాహక యుద్ధ నౌకతో సహా అనేక ఇతర నౌకలు, వేలాది మంది సైనికులను కరీబియన్‌ సముద్ర ప్రాంతానికి తరలించింది.దేశం నుంచి వెళ్లిపోవాలని డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బెదిరించిన ట్రంప్‌ శుక్రవారం నాటితో గడువు ముగిసిందంటూ వెనెజులా గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన చేసినప్పటికీ సోమ, మంగళవారాల్లో అమెరికా నుంచి వెనెజులా పౌరులను అనేక మందిని విమానాల ద్వారా తరలించారు, వారానికి రెండు రోజుల్లో తరలించవచ్చని గతంలో మదురో సర్కార్‌ అనుమతించింది. అద్దె విమానాలను నడిపే సంస్థ తమకు అనుమతులు ఇవ్వాలని సోమవారం నాడు దరఖాస్తు చేసింది. గత కొద్ది నెలలుగా వెనెజులా నుంచి మాదక ద్రవ్యాలతో నిండిన పడవలు వస్తున్నాయంటూ వాటిపై దాడులు చేసి అనేక మందిని అమెరికా హత్య చేసింది. అమెరికా దుర్మార్గాన్ని వదలిపెట్టి వెనెజులా మిలిటరీ సామర్ధ్యం ఎంత, దాడులను తట్టుకోగలదా లేదా అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కథనాలను మీడియా ముందుకు తెస్తున్నది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ డాట్‌కామ్‌ 2025 మిలిటరీ సూచిక ప్రకారం అమెరికా మొదటి స్థానంలో ఉండగా వెనెజులా 50వదిగా ఉంది. అయినప్పటికీ తమ దేశాన్ని కాపాడు కొనేందుకు చివరి రక్తపు బొట్టువరకు చిందిస్తామని మదురో గతంలో ప్రకటించాడు. ఏ దేశానికైనా అంతకు మించి మరో మార్గం ఉండదు.సోమవారం నాడు విదేశాంగ, రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులతో ట్రంప్‌ సమావేశమైన దాడి సన్నాహాల గురించి చర్చించినట్లు వార్తలు.అమెరికా అధికార పీఠంపై ఎవరు ఉన్నప్పటికీ వెనెజులాలో వామపక్షల హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా వచ్చిన మదురో వరకు వారి కుట్రలు ఆపటం లేదు. అక్కడి ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇచ్చి కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే.

తప్పుడు ప్రచారం, అసత్యాలతో ఇతర దేశాలపై దాడులు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. తనకు లొంగని, నచ్చని దేశాధినేతలను పదవుల నుంచి తొలగించేందుకు చేసిన కుట్రల గురించి తెలిసిందే. వాటి వలన ప్రయోజనం లేదని చరిత్ర చెబుతున్నా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నది.వలసవాదానికి వ్యతిరేకంగా లాటిన్‌ అమెరికా గతంలో పోరాడింది. దాన్ని తన పెరటితోటగా మార్చుకొనేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు ఇన్నిన్నికాదు. నవంబరు 29న లాటిన్‌ అమెరికాలో జోంగ్‌ మారణ కాండకు 244 సంవత్సరాలు నిండాయి.లాటిన్‌ అమెరికాలోని చెరకు తోటల్లో పని చేసేందుకు జోంగ్‌ అనే పడవలో 1781లో ఆఫ్రికా నుంచి బానిసలను తరలించారు. ఒక్కో బానిసను 36 పౌండ్లకు విక్రయించారు. పడవ సామర్ధ్యానికి రెండు రెట్లు అంటే 442మందిని ఎక్కించారు.ఘనా నుంచి జమైకాకు ప్రయాణించే ఆ పడవ నావికులు చేసిన తప్పిదాల వలన ఆలస్యమై మంచినీరు చాలకపోవటం, ఇతరత్రా కారణాలతో అనేక మంది మరణించారు. ఓడ యజమానులు ఒక్కొక్క బానిస మీద 30 పౌండ్ల చొప్పున బీమా సొమ్ము పొందే అవకాశం ఉంది. దుర్మార్గం ఏమంటే అందుకోసం నీరసించిపోయిన వారిలో 54 మంది మహిళలు, పిల్లలను మరణించినవారితో పాటు నవంబరు 29న కరీబియన్‌ సముద్రంలోకి నెట్టి చంపివేశారు.ఈ ఉదంతం సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన, బానిసత్వ రద్దు చట్టాలకు నాంది పలికింది. దీన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే బానిసవ్యాపారులు బీమా సొమ్ముకోసం బతికి ఉన్నవారిని సముద్రంలోకి తోసివేసినట్లే వెనెజులాపై దాడికి అమాయకులైన వారు ప్రయాణిస్తున్న పడవలపై దాడులు చేసి వారిని చంపివేసిన అమెరికా మిలిటరీ దాన్ని మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకున్న చర్యగా ప్రపంచాన్ని నమ్మించేందుకు చూసింది. అసలు అమెరికాకు అలాంటి అధికారం ఎవరిచ్చారు, అదేమీ అమెరికా గడ్డకాదు, సముద్రజలాలు వారివి కాదు. తాము పేల్చివేసిన ప్రతిపడవతో 25వేల మంది అమెరికన్ల ప్రాణాలను రక్షించామని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు.ప్రతి ఏటా వేలాది మందిని అమెరికాలో తుపాకులతో కాల్చిచంపుతుంటే, మాదక ద్రవ్యాలతో నింపుతుంటే వారిని నిరోధించటం చేతగాని దద్దమ్మలు ఎక్కడో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ యుద్ధ నౌకలు, మిలిటరీని తరలిస్తుంటే నమ్మటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఛావెజ్‌ నాయకత్వంలో వెనెజులాలో ప్రారంభమైన వామపక్ష పాలనకు 26 సంవత్సరాలు నిండాయి. ఆ ప్రాంతంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారైంది.అసలు దుగ్ద అది, అందుకే మదురోను తొలగించి తన తొత్తులను అక్కడ అధికారంలో కూర్చోపెట్టేందుకే ఈ దుర్మార్గానికి ట్రంప్‌ తెరతీశాడు.

అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా వెనెజులా ప్రస్తుతం క్యూబా, చైనా తదితర దేశాలకు చమురు ఎగుమతులు చేస్తున్నది. ప్రపంచంలో 303 బిలియన్‌ పీపాల చమురు నిల్వలతో వెనెజులా మొదటి దేశంగా ఉంది.వాటిని చేజిక్కించుకొని అమెరికా కంపెనీలకు అప్పగించాలని అక్కడి రిపబ్లికన్లు, డెమోక్రాట్లూ ప్రయత్నిస్తున్నారు.దానికి గాను సాకులు చెబుతున్నారు.2007లో ఛావెజ్‌ ప్రభుత్వం అమెరికా కంపెనీల చేతుల్లో ఉన్న చమురు సంస్థలను జాతీయం చేసినప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాలో వెనెజులా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, నేరాలకు సంబంధించిన ఐరాస సంస్థ, చివరికి అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ కూడా వాటిని తిరస్కరించింది. వార్షిక నివేదికల్లో మాదకద్రవ్యాలను వెనెజులా ఉత్పత్తి చేయటం లేదని, సరఫరా గురించి ఆధారాలు లేవని పేర్కొన్నాయి.అమెరికా చేరుతున్న కొకెయిన్‌లో 90శాతం పసిఫిక్‌ సముద్రమార్గాల ద్వారా దక్షిణ అమెరికా మిత్రదేశాల నుంచి నుంచి చేరుతున్నదని, ప్రమాదకరమైన ఫెంటానిల్‌ అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి ఎక్కువగా అమెరికా పౌరులే స్మగ్లింగ్‌ చేస్తున్నారని అనేక నివేదికలు ఉన్నాయి.వాటిని విస్మరించి మదురో మాదక ద్రవ్యాల సరఫరా మాఫియా నాయకుడని ఆరోపించటం తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అమెరికా చెబుతున్న మాదకద్రవ్యాల ముఠా జాడ అక్కడ ఉందని ఏ అంతర్జాతీయ సంస్థా చెప్పలేదు. మాదకద్రవ్యాల రవాణా మీద పోరాడుతున్నట్లు అమెరికా చెప్పుకోవటం హాస్యాస్పదం, బూటకం. లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ మాదక ద్రవ్యాల రవాణా కేసులో 2024లో అమెరికా కోర్టు 45 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాంటి నేరగాడికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.

యుద్ధాల ప్రారంభానికి సామ్రాజ్యవాదులు, యుద్దోన్మాదులు అబద్దాలు చెప్పటం కొత్త కాదు.నిజానికి అది పురాతన ఎత్తుగడ. యుద్దంలో ముందుగా హతమయ్యేది నిజం.మొదటి ప్రపంచ యుద్దంలో న్యూయార్క్‌ నుంచి బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ బయలుదేరిన ఆర్‌ఎంఎస్‌ లుస్టియానా అనే నౌకను ఐర్లండు వద్ద జర్మన్లు పేల్చివేశారని ప్రచారం చేశారు.జున్ను, వెన్న రవాణా పేరుతో పేలుడు పదార్దాలను కూడా దానిలో రవాణా చేస్తుండగా అవి పేలటంతో 139 మంది అమెరికన్లలో 128 మంది మరణించారు. ఇది వాస్తవం కాగా జర్మనీ మీద నెపం మోపి అమెరికన్లను యుద్దానికి సిద్ధంచేసేందుకు తప్పుడు ప్రచారం చేశారు. ఇదే ఎత్తుగడతో రెండవ ప్రపంచ యుద్దంలో చేరేందుకు కుట్ర చేశారు.దాన్ని అర్ధంచేసుకోని జపాన్‌ 1941 డిసెంబరులో పెరల్‌హార్బర్‌పై చేసినదాడిలో 2,400 మంది అమెరికన్‌ మిలిటరీ, పౌరులు మరణించారు. ఆ దాడి గురించి నాటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, అధికార యంత్రాంగానికి ముందే తెలుసునని, వారం ముందే దాడి జరగనున్నదని రూజ్‌వెల్ట్‌ తనకు చెప్పినట్లు నాటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ టిమ్సన్‌ తన డైరీలో రాశాడు. ప్రభుత్వానికి అందిన హెచ్చరికలను కూడా కావాలనే పక్కన పెట్టారని తరువాత వెల్లడైంది.ఈ దాడిని ఆసరా చేసుకొని జపాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించటం, అణుబాంబులను వినియోగించటం తెలిసిందే. దీనికి పది సంవత్సరాల ముందు చైనాలోని మంచూరియాను ఆక్రమించుకొనేందుకు జపాన్‌ సామ్రాజ్యవాదులు కూడా ఇదే ఎత్తుగడను అనుసరించారు. తమ నిర్వహణలోని రైల్వే ట్రాక్‌ను తామే పేల్చుకొని చైనా మీద నెపం మోపి దురాక్రమణకు పూనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఉత్తర కొరియా దురాక్రమణ నుంచి దక్షిణ కొరియాను రక్షించేపేరుతో కొరియా యుద్దం జరిగింది. అది కూడా తప్పుడు ప్రచారమే.అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల ఆధీనంలో ఉండటమే అసలు కారణం. ఐరాస పేరుతో అమెరికా జరిపిన దాడి, ప్రతిఘటనలో 30లక్షల మంది పౌరులు మరణించారు.

వియత్నాం దురాక్రమణ కూడా అసత్యాలతోనే ప్రారంభమైంది. టోంకిన్‌ గల్ఫ్‌(దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తీరంలోని జలసంధి) లో తమ నౌకపై ఉత్తర వియత్నాం 1964 ఆగస్టులో రెండుసార్లు దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా దాడికి దిగింది. దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్యతిరేకపాలకులకు మద్దతుగా వచ్చిన అమెరికా నౌక ముందుగా చేసిన దాడిని ఉత్తర వియత్నాం ప్రతిఘటించింది. అసలు రెండవదాడి ఉదంతమే జరగలేదని తరువాత వెల్లడైంది. 1967లో అమెరికా మద్దతుతో ఈజిప్టు,జోర్డాన్‌, సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపినదాడి కూడా అబద్దాలతోనే జరిగింది.ఈజిప్టు తొలుత తమపై దాడి చేసినట్లు దానికి ప్రతిదాడికి దిగినట్లు ఆరోపించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఈజిప్టు ఇతర అరబ్బుదేశాలు తమపై దాడికి సన్నద్దం అవుతుండటంతో ఆత్మరక్షణ కోసం దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంది. అమెరికాను ప్రత్యక్షంగా రంగంలోకి దించేందుకు పధకం ప్రకారం ఈజిప్టు సమీపంలో ఉన్న అమెరికా నౌక యుఎస్‌ఎస్‌ లిబర్టీపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. నెపాన్ని ఈజిప్టుమీద నెట్టేందుకు చూసింది.ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని తరువాత వెల్లడైంది.1990దశకంలో జరిగిన గల్ఫ్‌దాడులను కూడా అమెరికా అబద్దాలతోనే మొదలు పెట్టింది.ఇరాకీలు కువాయిట్‌పై దాడి చేసినపుడు ఆసుపత్రిలో ఉన్న పిల్లలను చంపివేశారని కాకమ్మ కథలను అమెరికా చెప్పించింది. తరువాత 2003లో ఇరాక్‌ అధినేత సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి దాడి చేయటమేగాక సద్దామ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే. తరువాత అలాంటి ఆయుధాలేమీ లేవని అమెరికన్లే అంగీకరించారు. సిఐఏ చెప్పిన కట్టుకథలను అమెరికాతో సహా యావత్‌ ప్రపంచ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లిబియాలో మానవహక్కులకు భంగం కలిగిందని, వాటిని పునరుద్దరించేపేరుతో జోక్యం చేసుకోవటమే గాక అధినేత గడాఫీని అంతం చేసేందుకు నాటో దళాలను దించిన సంగతి తెలిసిందే.గడాఫీ వ్యతిరేక తిరుగుబాటుదార్ల పేర్లతో నాటకమాడి 2011లో గడాఫీని హత్య చేశారు.

అనేక దేశాలలో పాలకులు, పార్టీలను మార్చి తనకు అనుకూలశక్తులను గద్దెల మీద కూర్చోపెట్టేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా చేసిన యత్నాలన్నీ విఫలం కావటమేగాక చేతులు కాల్చుకున్నది.నియంతలు, పచ్చిమితవాదులకు ఆశ్రయమిచ్చి రక్తపాతానికి కారకురాలైంది.అయినా సరే ఎప్పటికాలిట్టిట్టే అన్నట్లుగా అమెరికాలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా అదే వైఖరి.ఇప్పుడు వెనెజులాలో కూడా అదే జరుగుతోంది.అధ్యక్షుడు నికోలస్‌ మదురో దేశం విడిచిపోవాలని ట్రంప్‌ బెదిరించాడు. ఒక విమానవాహక యుద్ధ నౌక, పది ఇతర మిలిటరీ నౌకలు, పదిహేనువేల మంది మిలిటరీ, వందలాది యుద్ధ విమానాలతో వెనెజులాను చుట్టుముట్టారు. మదురో కూడా గతకొద్ది నెలలుగా తనకున్న మిలిటరీ, గెరిల్లా దళాలను సన్నద్దం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఏం జరగనుందో అని యావత్‌ ప్రపంచం ఆందోళనతో చూస్తున్నది.నేడు వెనెజులా పతనమైతే రేపు ఏ దేశం మీదనైనా ఏదో ఒకసాకుతో అమెరికా దాడికి దిగితే పరిస్థితి ఏమిటో ప్రతివారూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది !

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా ! జనాలకు గోడీ మీడియా చెబుతున్న నిజానిజాలేమిటి !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

చైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచీ పెరుగుతూనే ఉన్నాయి.మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోడీకి భజన చేసేందుకు అలవాటు పడిన వారు చేసిన జిమ్మిక్కు లేదా తిమ్మిని బమ్మిని ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు అంతకంటే ఎక్కువగా పెరిగిన సంగతి, పదేండ్ల స్థాయికి ఎగుమతులు పడిపోయిన నిజాన్ని జనాలకు చెప్పరేం ! నరేంద్రమోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిద్దాం. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో చైనాకు మన ఎగుమతులు 11.96 నుంచి 16.75 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. తరువాత మూడు సంవత్సరాలలో 21.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి 2024-25లో 14.25 బిలియన్‌ డాలర్లకు పతనమయ్యాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోల్చి చూపి వర్తమాన సంవత్సరంలో 10.03 బిలియన్‌ డాలర్లకు 25శాతం పెరిగినట్లు చిత్రించారు. మిగిలిన ఐదు నెలల కాలంలో గత ఏడాది మొత్తాలకు చేరవచ్చు, స్వల్పంగా పెరగవచ్చు తప్ప గతంలోని 21.56 బిలియన్‌ డాలర్లకు చేరే స్థితి ఉందా ? చైనాకు మన ఎగుమతులు పెరగటం వెనుక అంతర్జాతీయ రాజకీయాలు కూడా లేకపోలేదు. అమెరికా వైపు మొగ్గుచూపుతున్న నరేంద్రమోడీకి పన్నుల రూపంలో ట్రంప్‌ తీసుకున్న వైఖరి మింగుడు పడలేదు.ఈ స్థితిలో ఎత్తుగడగా అవసరం ఉన్నా లేకున్నా చైనా ఏప్రిల్‌ నుంచి మన దేశం నుంచి దిగుమతులను పెంచింది, దీని కొనసాగింపు రానున్న రోజుల్లో మనదేశం అనుసరించే వైఖరిని బట్టి ఉంటుంది.చైనాకు మన మార్కెట్‌ను ఎంతగా తెరిస్తే దానికి ప్రతిగా మనకూ మేలు చేకూరే విధంగా బీజింగ్‌ వ్యవహరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. చైనా పెట్టుబడులను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మన దేశం నుంచి విమానాలను నడిపేందుకు రెండు చైనా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తాజా వార్తలు వెల్లడించాయి.

చైనా మీద ఆధారపడకూడదు, దాన్ని పక్కకు నెట్టేసి అసలు మనమే ప్రపంచానికి వస్తువులను ఎగుమతులు చేద్దాం అంటూ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అలాంటి సూచనలు లేవు.తొలి ఏడు నెలల్లో ఎగుమతులు పెరిగాయని చెప్పిన వారు అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 57.65 నుంచి 64బిలియన్‌ డాలర్లకు పెరిగాయని చెబితే నిజాయితీగా ఉంటుంది. గత సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 99.12 బిలియన్‌ డాలర్లు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ సర్కార్‌ అసమర్ధతకు బీజింగ్‌కు మనం చెల్లించిన మూల్యం.ఇంకా చెప్పాలంటే గత పదకొండు సంవత్సరాల్లో 701.95 బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన వాణిజ్య లోటు 48.45 బిలియన్‌ డాలర్లు కాగా పదకొండేండ్లలో రెట్టింపై 99.21 బి.డాలర్లకు చేరింది, ఎందుకని ? గత ఐదు సంవత్సరాల్లో చైనాకు మన ఎగుమతులు 33శాతం పడిపోగా దిగుమతులు 74శాతం పెరిగాయి. ఆత్మనిర్భరత ఏమైనట్లు, ప్రపంచంలో పెరిగినట్లు చెబుతున్న మోడీ పలుకుబడి సంగతేమిటి ? కాంగ్రెస్‌ యాభై ఏండ్లలోచేయలేని వాటిని తాను తొలి ఐదేండ్లలోనే చేసినట్లు గతంలో చెప్పుకున్నారు. సంతోషం. వర్తమాన అవసరాలకు అనుగుణంగా వస్తూత్పత్తిని ఎందుకు చేయలేకపోయినట్లు ? రెండింజన్ల పాలనే కదా ఉన్నది. యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం చూడండహౌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మిగతా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంగతేమిటి ? గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ-ఇండియా) చెప్పినదాని ప్రకారం కీలకమైన ఎనిమిది పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో చైనా ప్రధాన సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి దిగుమతుల వలన రెండు రకాల నష్టాలు, ఒకటి స్థానిక మన పరిశ్రమలు గిడసబారిపోతున్నాయి, కార్మికులకు ఉపాధి దొరకటం లేదు.విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకుంటున్నట్లు ముందే చెప్పుకున్నాం. గత కాంగ్రెస్‌ పాలనకూ మోడీ ఏలుబడికి తేడా ఏమిటి ? చైనా నుంచి దిగుమతుల్లో మన్మోహన్‌ సింగ్‌ రికార్డులనే కాదు, తన రికార్డులను కూడా తానే మోడీ బద్దలు కొట్టుకున్నారు. చైనాతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకొనటం మంచిదే. కానీ అనేక వస్తువుల దిగుమతులపై ఆంక్షలను సడలించిన కారణంగా గత రికార్డులను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి గత పదినెలలుగా చెబుతూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతతో సహా అన్నీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నట్లే జరుగుతున్నందున అనేక అనుమానాలు. ఇంతవరకు ఏం జరుగుతోందో జనానికి తెలియదు. ట్రంప్‌ చెబితే తప్ప మనకు తెలిసేట్లు లేదు, మన మార్కెట్‌ను వారి వస్తువులకు బార్లా తెరవాలని అమెరికా వత్తిడి తెస్తోంది. అదే జరిగితే స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాల్సిందే అని మన కార్పొరేట్లు హెచ్చరిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలల్లో మన ఎగుమతులు ఎక్కువగా అమెరికాకు జరిగితే దిగుమతులు చైనా నుంచి జరిగాయి. ఇదేం కుదరదు అన్నీ మానుంచే దిగుమతి చేసుకోవాలని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. అసలు సంగతేమిటంటే చైనా నుంచి తక్కువ ధరలకు వస్తున్నాయి గనుక దిగుమతి చేసుకుంటున్నాం తప్ప షీ జింపింగ్‌ మీద ప్రేమతో కాదు. అమెరికాకు చోటిస్తే ఎడారి వ్యాపారి, ఒంటె కథ మాదిరి దేశీయ సంస్థలను బయటకు నెట్టేయటం లేదా మింగివేస్తుంది. అందుకనే రెండు దేశాలతో సమన్వయం చేసుకోవటం మోడీకి కత్తిమీద సాములా ఉంది. రానున్న రోజుల్లో మనకు మేలు జరిగే విధంగా విదేశాంగ విధానం ఉండాలని ఇప్పటికే కార్పొరేట్ల లాబీ మాట్లాడుతోంది. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం ! మన దేశ వస్తు ఎగుమతులను చూస్తే 2024లో 434.44 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతులు 698-702 బి. డాలర్ల మధ్య ఉన్నాయి. నిఖర వాణిజ్యలోటు 263.31బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల్లో అమెరికా 18.3, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.5, నెదర్లాండ్స్‌ 5.6, సింగపూర్‌ 3.6, చైనా 3.4,బ్రిటన్‌ 3.2, సౌదీ అరేబియా 2.8, బంగ్లాదేశ్‌ 2.6, జర్మనీ 2.4, ఇటలీ 1.92శాతాల చొప్పున ఉన్నాయి. 2024 జనవరి నుంచి జూన్‌ వరకు వివరాలు చూస్తే మన దేశం 151దేశాలతో వాణిజ్య మిగులు, 75దేశాలతో తరుగులో ఉంది. మోడీ భక్తులు చూశారా మానేత పలుకుబడి అని డబ్బా కొట్టుకోవటానికి ఈ అంకెలు తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటోపైన చెప్పుకున్నాం. అమెరికాను వదులుకొనేందుకు భయపడటానికి, డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంతగా అవమానించినా మౌనంగా ఉండటానికి అక్కడికి మన ఎగుమతులు ఎక్కువగా ఉండటమే.మరోవైపు ఐదేండ్లపాటు చైనాతో వైరంతో గడిపిన తరువాత సాధారణ సంబంధాలు ఏర్పరుచుకోవటానికి కారణం దాని మీద ఆధారపడాల్సి రావటమే. పదకొండు సంవత్సరాల్లో పరాధీనతను తగ్గించటానికి మోడీ చేసిందేమీ లేదు. అందుకే రాజీపడ్డాం. మన దిగుమతులను చూస్తే 2024లో చైనా నుంచి 15.5,రష్యా 9.1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.6, అమెరికా 6.1, సౌదీ అరేబియా 4.3, ఇరాక్‌ 4.2, ఇండోనేషియా 3.4,స్విడ్జర్లాండ్‌ 3.1,దక్షిణ కొరియా 3, సింగపూర్‌ 2.9శాతం చొప్పున ఉన్నాయి. గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో కాషాయ దళాలు చైనా నుంచి దిగుమతుల నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందంటూ ఊగిపోయారు.నిజానికి మనకు అంత సీన్‌ లేదు, 2024లో చైనా నుంచి దిగుమతులు చేసుకున్న మొదటి పది దేశాలలో మనం కేవలం 3.4శాతంతో ఆరవ స్థానంలో ఉన్నాం.

మన ఎగుమతులు, దిగుమతులు రెండు రకాలు. ఒకటి వస్తువులు, రెండవది సేవలు. వస్తు లావాదేవీల్లో 2014-15లో లోటు 137 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25 నాటికి 283బి.డాలర్లకు పెరిగింది. సేవల విషయంలో ఇదే కాలంలో మిగులు 74 నుంచి 189 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రెండింటినీ కలిపి చూసినపుడు నిఖర లోటు 63 నుంచి 94 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.ప్రపంచంలో 2024లో మొత్తం 24.5లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తు ఎగుమతులు జరగ్గా ఎగువన ఉన్న 30దేశాల వాటా 20.3లక్షల కోట్ల డాలర్లు.మొదటి స్థానంలో ఉన్న చైనా వాటా 14.6 శాతం కలిగి మొదటి స్థానంలో ఉండగా పద్దెనిమిదవదిగా మనదేశ వాటా కేవలం 1.8శాతమే, రష్యా, స్విడ్జర్లాండ్‌ కూడా ఇదే వాటాను కలిగి ఉన్నాయి. చైనాను వెనక్కు నెట్టేయాలన్న సంకల్పాన్ని ఎవరూ కాదనరు, పోటీ పడాల్సిందే. కానీ ఒక్కసారిగా ఈ పరిస్థితి మారాలన్నా, 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోవాలన్నా నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్భుత దీపాన్ని సంపాదించాల్సిందే. అల్లావుద్దీన్‌ ముస్లిం మేం బరాబర్‌ హిందువులం పొడగిట్టదు అని అంటారా, మనోభావాలను ముందుకు తెస్తే మన వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీయాలి మరి, దగ్గరిదారి లేదు, చేస్తారా !

అమెరికాకు చెంపపెట్టు – 2025 జి20 సభ !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా జి20 సదస్సును బహిష్కరించటమంటే ప్రపంచ ఆర్థిక ఆకర్షణ శక్తి వేరేవైపు మరలుతున్నదనేందుకు సూచిక అని కెనడా ప్రధాని మార్క్‌ కార్నే చెప్పాడు. ప్రపంచ రాజకీయాలలో కెనడా అమెరికా అనుయాయిగా ఉంటున్నది, కొన్ని సందర్భాలలో విబేధిస్తున్నది. నవంబరు 22,23వ తేదీలలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2025 సంవత్సర జి20 శిఖరాగ్ర సమావేశంలో కార్నే చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశాడు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అమెరికా కోడి కూయనంత మాత్రాన తెల్లవారకుండా ఉండదన్నాడు..” సంఘీభావం, సమానత్వం, సుస్థిరత ” అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఐరాస నిర్దేశించిన 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇంకా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సును డోనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరించటమేగాక సమావేశ ప్రకటనను ఆమోదించవద్దంటూ ముందే అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను బెదిరించాడు. వచ్చే ఏడాది జరిగే సదస్సుకు ఆతిధ్యం ఇచ్చే సభ్యదేశంగా, అధ్యక్ష స్థానాన్ని స్వీకరించాల్సి ఉండి కూడా ఒక చిన్న అధికారిని పరిశీలకుడిగా పంపాడు. బాధ్యతలను స్వీకరించే సాంప్రదాయ కార్యక్రమానికి కూడా రాకుండా దక్షిణాఫ్రికాను అవమానించాడు. ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాను అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా ముందే ట్రంప్‌ అవమానించాడు. తెల్లజాతీయుల ఆధీనంలోని భూములను స్వాధీనం చేసుకుంటున్న ఆఫ్రికన్ల వీడియోను చూపి ఇది శ్వేతజాతీయుల మారణకాండ అంటూ ట్రంప్‌ రచ్చ చేశాడు. అప్పటి నుంచి కక్షకట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. వారి విధానాలు తనకు నచ్చటం లేదని అందువలన అక్కడ జరిగే జి20సమావేశాలకు వెళ్లటం లేదని జూలైలోనే ప్రకటించాడు. దక్షిణాఫ్రికా వస్తువులపై గరిష్టంగా 30శాతం పన్నులను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దౌత్యమర్యాదలను తుంగలో తొక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్య పర్యవసానాల గురించి అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఒక సభ్యదేశమై ఉండి నిజంగా ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సరైన స్ధాయి ఉన్న ఎవరినైనా పంపవచ్చు, ఇది అధినేతల సమావేశం, సరైన స్థాయి అంటే తన ప్రతినిధిగా ప్రత్యేకంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు పంపవచ్చు గాని అమెరికా చేసింది ఏమాత్రం సమర్ధనీయం కాదని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్‌ లామోలా విమర్శించాడు. శతాబ్దాల తరబడి మైనారిటీ శ్వేతజాతీయులు దక్షిణాఫ్రికాలో సాగించిన జాత్యహంకార పాలన, ఆఫ్రికన్ల అణచివేత, బంటూస్థాన్‌(మన దళితవాడల వంటివి)లకే వారిని పరిమితం చేయటం వంటి దుర్మార్గం గురించి తెలిసిందే.1994లో ఆ పాలన అంతమైన తరువాత ఇన్నేండ్లకు అక్కడి శ్వేతజాతి రైతులను ప్రభుత్వం అణచివేస్తున్నదంటూ ట్రంప్‌ ఈ సమావేశాలను బహిష్కరించటం ఒక సాకు తప్ప మరొకటి కాదు.శ్వేత జాతీయుల మారణకాండ అని కూడా వర్ణించాడు. బహిష్కరించటమేగాక అమెరికా ఎదురుదాడికి దిగింది. అధ్యక్ష భవనపు మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా తమ దేశ అధ్యక్షుడిపై నోరుపారవేసుకుంటున్నట్లు ఆరోపించింది.వాతావరణ మార్పు, ప్రపంచ సంపద అసమానతల వంటివాటిపై దక్షిణాఫ్రికా కేంద్రీకరించి సదస్సు ప్రకటనలో వాటిని ప్రస్తావించటాన్ని అమెరికా తట్టుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి.తాము సమావేశాన్ని బహిష్కరించటమేగాక సదస్సు ప్రకటన వెలువడకుండా అడ్డుకుంటామని అమెరికా బెదిరించింది.తమ అంగీకారం లేకుండా ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించింది. అమెరికా వైఖరిని ఒక్క అర్జెంటీనా తప్ప ఐరోపా, ఇతర ఖండాల దేశాలేవీ ఆమోదించలేదు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలి డోనాల్డ్‌ ట్రంప్‌ అనుయాయి, అతగాడు కూడా ప్రకటనను వ్యతిరేకించి సదస్సును బహిష్కరించాడు. దక్షిణాఫ్రికా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, అక్రమవాణిజ్య పద్దతులను అనుసరిస్తున్నదని పాలస్తీనా మీద గట్టి వైఖరి తీసుకోవటమే గాక చైనా, రష్యాలతో కలుస్తున్నదని కూడా అమెరికా దాడి చేస్తున్నది. ఆర్థిక అసమానతల గురించి తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందని ప్రపంచ నేతలు గుర్తించిన తొలి సమావేశం ఇదని ఆక్స్‌ఫాం సంస్థ ప్రతినిధి మాక్స్‌ లాసన్‌ వ్యాఖ్యానించాడు.

ప్రపంచంలో అనేక కూటములు ఉన్నాయి. అవి సమావేశాలు జరపటం, సంకల్పాలు చెప్పుకోవటం, తీర్మానాలు ఆమోదించటం తప్ప సభ్య దేశాలకు వాటిని పాటించాల్సిన విధి లేదు. అలాంటి వాటిలో ఒకటి జి20. దీనిలో అర్జెంటీనా,ఆస్ట్రేలియ,బ్రెజిల్‌, కెనడా, చైనా,ఫ్రాన్సు, జర్మనీ, భారత్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా దేశాలతో పాటు ఐరోపా యూనియన్‌, ఆఫ్రికా యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానితులుగా నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ కూటమి ఉంది. ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా ఒక్కటే ఈ కూటమిలో ఉంది. తొలిసారిగా ఆఫ్రికా గడ్డమీద సదస్సు జరిగింది. జి20లోని సభ్య దేశాలు (ఐరోపా, ఆఫ్రికా యూనియన్లు మినహా) ప్రపంచ జిడిపిలో 85,అంతర్జాతీయ వాణిజ్యంలో 75, జనాభాలో 56, భూమిలో 60శాతం కలిగి ఉన్నాయి. అందువలన పరోక్షంగా ఈ దేశాల మీద ప్రభావం చూపేందుకు పెద్ద దేశాలన్నీ ప్రయత్నిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. జోహన్నెస్‌ సభకు మన ప్రధాని నరేంద్రమోడీ హాజరై అన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గ్గొన్నారు. పలుదేశాల నేతలతో జరిపిన చర్చలు ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. చైనా ప్రతినిధిగా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్‌ పాల్గొన్నాడు.

జి7 ధనిక దేశాలే కాలక్షేపపు కబుర్లకు పరిమితం అవుతున్నపుడు భిన్న ధృవాలుగా ఉన్న జి20 అంతకు మించి ఫలవంతమైన చర్చల వేదికగా మారుతుందన్న భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక అంశాల కంటే రాజకీయ పరమైనవాటికే జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల వేదిక నాంది పలికింది. సదస్సు తీర్మానం గురించి సంతకాలు చేయవద్దని ట్రంప్‌ చేసిన విన్నపాల రూపంలో ఉన్న ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఇది దక్షిణాఫ్రికా విజయాల్లో ఒకటి. ముప్పై పేజీలు, 122 పేరాల అంతిమ ప్రకటనలో అనేక అంశాలు ఉన్నాయి. అది సాధారణ ప్రకటనగానే చూసే వారికి అనిపిస్తుంది, నిజం కూడా. అసమానతలు, రుణభారం, కీలకమైన ఖనిజాలు, ఇంథనం, సమానత్వం, నిరంతర అభివృద్ధి, పర్యావరణం ఇలా లేని అంశం లేదు. ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలు జరపాల్సిన విధి సభ్యదేశాలకు లేదు గానీ వాటిని విస్మరిస్తే కుదరదు అనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.అసమానతల గురించి సదస్సు ఆమోదించిన పత్రంలో అరవై కోట్ల మంది ఆఫ్రికన్లకు విద్యుత్‌ అందుబాటులో లేదని పేర్కొన్నారు.2030 నాటికి పునరుత్పత్తి ఇంథనాన్ని మూడు రెట్లు, ఇంథన సామర్ధ్యాన్ని రెండు రెట్లు పెంచాలని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అభివృద్ధి రుణాలు, రుణ భారం తదితర అంశాల గురించి పరస్పరం సమాచార మార్పిడి,రుణాలు ఇచ్చే దేశాలు, సంస్థల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ నియామకం ఈ సందర్భంగా జరిగింది. ఆఫ్రికాలో అభివృద్ధికి దక్షిణాఫ్రికా చొరవ, కృషికి ఒక గుర్తింపు దక్కింది. రెండు రోజుల పాటు 130 వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించటంలో అక్కడి ప్రభుత్వ సామర్ధ్యం వెల్లడైంది.

జోహన్నెస్‌బర్గ్‌ సమావేశానికి ట్రంప్‌ గైరుహాజరు కావటంతో నాయకత్వ స్థానంలోకి వచ్చేందుకు చైనాకు అవకాశం వచ్చిందంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా పలుకుబడి కోల్పోతున్నదనే ఉక్రోషం దీనిలో ఎక్కువగా కనిపిస్తున్నది.అమెరికా ఏకపక్ష వైఖరి, పెత్తందారీతనం కారణంగా అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికే చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్‌ తాజా వైఖరులతో అది వేగం పుంజుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభావం పెంచుకొనేందుకు అమెరికాయే చైనాకు అవకాశం ఇస్తున్నదని దానితో పాటు ఐరోపా సమాఖ్య కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బక్‌నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఝీక్విన్‌ ఝ చెప్పాడు. అమెరికా బహిష్కరించిన వెంటనే దాని స్థానంలో చైనా చేరే అవకాశం ఉండదని అయితే మరింత నమ్మకమైన భాగస్వామిగా తనను తాను ప్రదర్శించుకొనేందుకు దోహదం చేస్తుందని బ్రిటన్‌ ఆర్థికవేత్త జింగ్‌ గు చెప్పారు.అంతర్జాతీయ సంస్థలు, పశ్చిమ దేశాలు విధించే కఠినమైన షరతులు లేకుండా ఇప్పటికే అనేక దేశాల్లో వివిధ ప్రాజక్టులకు చైనా సాయం చేసింది. ఆఫ్రికా ఇంథన అవసరాలలో భాగంగా ఇటీవలి కాలంలో చైనా నుంచి 60శాతం సౌరపలకలను దిగుమతి చేసుకున్నారు. బహిష్కరణ రాజకీయాలు, బెదిరింపులు చెల్లవని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అమెరికాను నేరుగానే హెచ్చరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జి20తో పాటు దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ(ఎపెక్‌), బ్రెజిల్లో జరిగిన ఐరాస వావావరణ మార్పు సమావేశాన్ని అమెరికా బహిష్కరించింది. ఇలాంటపుడు ఇతర దేశాలు చైనా వైపు చూడటం సహజం.అంతే కాదు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలు కూడా దేశాలను ఆలోచింపచేస్తున్నాయి. ఆఫ్రికాలోని 22 దేశాల దిగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేకపోగా ట్రంప్‌ ఇప్పుడు 15 నుంచి 30శాతం విధించాడు. తమతో దౌత్య సంబంధాలు కలిగిన అన్ని ఆఫ్రికా దేశాల సరకులపై ఎలాంటి పన్ను విధించబోమని ఎపెక్‌ సమావేశంలో చైనా నేత షీ జింపింగ్‌ ప్రకటించాడు. చైనా ప్రధాని లీ ఐరాస 80వ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వగా డోనాల్డ్‌ ట్రంప్‌ పునరుత్పత్తి ఇంథనం గురించి అపహాస్యంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది డిసెంబరులో జి20 సమావేశాలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలో జరగనున్నాయి. ఈ మేరకు డోనాల్డ్‌ట్రంప్‌ గతంలోనే ప్రకటించాడు. ఇరవై సంవత్సరాల చరిత్రలో అమెరికాలో జరగటం ఇదే తొలిసారి. జోహన్నెస్‌ సమావేశాల సందర్భంగా అమెరికా అనుసరించిన వైఖరి వచ్చే ఏడాది సమావేశాలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు దాన్ని బహిష్కరించినా ఆశ్చర్యం లేదు !