నాడు ఈస్టిండియా అక్రమ చొరబాటు – నేడు వెస్ట్‌ ఇండియా కంపెనీలకు బిజెపి రాచబాట !

Tags

, , ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూరు శాతం అమ్మేస్తాం లేదా ఫ్యాక్టరీని మూసేస్తాం అని నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారు. సోషలిస్ట్‌, సెక్యూలర్‌ అని రాసి ఉన్న రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికార పీఠం పై కూర్చున్న మంత్రులు రాజ్యాంగం స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా అన్ని ప్రభుత్వ సంస్థలనూ ప్రైవేట్‌ పరం చేయటానికి తయారయ్యారు.
ప్రభుత్వం వ్యాపారం చేయటం కోసం లేదు! కాబట్టి ప్రభుత్వ సంస్థల అన్నిటినీ ప్రైవేట్‌ పరం చేస్తున్నారా? లేక తనవారైన గుజరాతీ కార్పొరేట్‌ కంపెనీలకు లేక పోస్కో కు కారుచౌకగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను హారతి పళ్లెం లో అమర్చి అందించాలని అనుకుంటున్నారా? ప్రభుత్వ సంస్దలనేనా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుపరం చేసి అమ్మ తలుచుకున్నారా?

ప్రభుత్వరంగం లో భారీ పరిశ్రమలు ప్రజల ధనంతో ఏర్పడ్డాయి

1947 నాటికి ఆంధ్ర లో భారీ పరిశ్రమలు లేవు. ఏ ప్రాంతమైనా ఎదగాలంటే పారిశ్రామికంగా అభివ ద్ధి చెందాలి. 1947 నాటికి దేశంలోనే భారీ పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కేంద్రీకరించింది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశ అభివ ద్ధికి భారీ పరిశ్రమల అవసరాన్ని గుర్తించారు. దేశం లోని పెట్టుబడిదారులను విదేశాలలోని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సాంకేతిక, ఆర్ధిక సహకారాన్ని అర్ధించారు. స్వదేశీ, విదేశీ ప్రైవేట్‌ సంస్థలు భారీ పరిశ్రమల స్థాపనకు ముందుకు రాలేదు. తమ దేశాలనుండి ఉక్కు, మందులు, ఎరువులు దిగుమతులు చేసుకోమని యూరప్‌, అమెరికా దేశాలు సలహాలిచ్చాయి, సహాయ నిరాకరణ చేశాయి.
సోషలిస్ట్‌ దేశమైన సోవియట్‌ ప్రభుత్వం నిస్వా ర్ధంగా సాంకేతిక సహాయాన్నే కాకుండా ఆర్ధిక సహాయాన్ని కూడా అందించింది. వందకు పైగా భారీ పరిశ్రమల స్థాపనకు సహాయం చేసింది. మన దేశానికి పారిశ్రామిక పునాదిని కల్పించింది. మందులు, ఎరువులు, ఉక్కు, భారీ ఇంజనీరింగ్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌, ఐడిపిఎల్‌, భిలారు,విశాఖ ఉక్కు కర్మాగారాలు స్థాపించారు. అప్పటికి ప్రైవేటు రంగంలో ఒక టాటా స్టీల్‌ మాత్రమే ఉండేది. ప్రభుత్వం భారీ పరిశ్రమలు స్థాపించిన తర్వాత దేశ పెట్టుబడిదారులు పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా కొన్ని పరిశ్రమలు స్థాపించడం ప్రారంభించారు. పారిశ్రామికంగా కొంత అభివ ద్ధిని సాధించిన తరువాత ఆ ఫలాలను అనుభవించటానికి దేశ, విదేశీ పెట్టుబడిదారులు తయారయ్యారు.


బ్రిటీష్‌ ఈస్డిండియా కంపెనీ మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకులను అందచేసేదిగా, తన ఉత్పత్తులకు మార్కెట్‌గా మార్చిన కారణంగా స్వాతంత్య్ర ఉద్యమం కంపెనీ, బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. ఆ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని, వ్యతిరేకించిన వారి వారసులుగా ఉన్న బిజెపి పెద్దలు ఉన్న పరిశ్రమలను, సహజ సంపదలను వెస్ట్‌ ఇండియా కంపెనీలకు కారుచౌకగా అప్పగించేందుకు పూనుకున్నారు. పరోక్షంగా పరాయి దేశాల పాలనను మన మీద రుద్దుతున్నారు. నాటికీ నేటికీ ఎంత తేడా !


ఈస్ట్‌ ఇండియా కంపెనీ తనకు తానే వస్తే రాజరిక పాలకులు ఆశ్రయం కల్పించారు. నేడు ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే పెద్దలు స్వయంగా వెస్ట్‌ ఇండియా కంపెనీలకు ఎర్ర తివాచీలు పలుకుతున్నారు. అందుకే విశాఖ ఉక్కు ఈ వెస్ట్‌ ఇండియా కొరల్లో చిక్కుకోవటం యాద చ్చికం కాదు. ప్రపంచ ద్రవ్య పెట్టుబడి లాభాల వేటలో పడింది. వడ్డించిన విస్తరి లాగా భారత దేశ పరిశ్రమలను కారు చౌకగా కొట్టేయటానికి కాచుకొని ఉంది. మూడు లక్షల ఇరవై కోట్ల విలువ చేసే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ను ముప్పైరు వేల కోట్లకు అమ్మేస్తాం అంటున్నారు. కేవలం 4889కోట్ల పెట్టుబడితో ప్రారంభించి 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే- సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా?

విశాఖ ఉక్కు నష్టాలలోలేదు


విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలలో ఉన్నదన్న ప్రచారం వాస్తవమేనా? కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి 4889 కోట్ల రూపాయలు. హిందూ పత్రిక అంచనా ప్రకారం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుత ఆస్తుల విలువ మూడు లక్షల 20 వేల కోట్ల పైనే ఉంటుంది. 4889కోట్ల పెట్టుబడితో 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే- సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా? ప్లాంట్‌ విస్తరణకు ప్రభుత్వం పౖసా ఇవ్వలేదు. ప్లాంటు విస్తరణకు కావలసిన ధనాన్ని కార్మికులు తమ కష్టంతో వచ్చిన సొంత లాభాలతో సమకూర్చుకున్నారు . ఇంకా కావలసి వస్తే బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారు. టాటా స్టీల్‌ కంపెనీ కి 8 శాతం వడ్డీ కి బ్యాంకు లు అప్పులు ఇచ్చాయి. విశాఖ ఉక్కుకి 14 శాతం వడ్డీ రేటు ప్రకారం అప్పులు ఇచ్చారు. పన్నెండు లక్షల నుండి 63 లక్షల ఉక్కు ఉత్పత్తిని సాధించారు.72 లక్షల టన్నులఉత్పత్తిని సాధించటానికి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 2 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి స్థాయికి చేరుకోగల సామర్ధ్యం ఉంది. దేశ అభ్యున్నతికి కి విశాఖ ఉక్కు ను వనరుగా ఉపయోగించుకుని ప్రగతి ని సాధించ వచ్చని విశాఖ ఉక్కు నిరూపించింది. ప్లాంట్‌ నష్టాల్లో కూరుకు పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని నష్టాలలో కూరుకుపోతున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో పెట్టలేమని విడ్డూ రపు ప్రకటనలు చేస్తున్నారు.5 వేల కోట్లను మించి ప్రభుత్వం ఏమాత్రం పన్ను చెల్లింపు దారుల ధనాన్ని పెట్టుబడి పెట్టిందో ప్రజలకు చెప్పాలి.

లాభాలు ఎందుకు తగ్గాయి?


హుదూద్‌ తుఫాన్‌ వలన స్టీల్‌ ప్లాంట్‌ కు 1000 కోట్ల నష్టం సంభవించింది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సహాయం చేయలేదు. రాజకీయ అవసరాల కోసం రాయబరేలీ రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో 2 వేల కోట్ల రూపాయలను పెట్టమని విశాఖ స్టీల్‌ ను ప్రభుత్వం ఆదేశించింది.ఫలితంగా 2వేల కోట్ల రూపాయల ను స్టీల్‌ ప్లాంట్‌ నష్ట పోయింది.గనుల కోసం, ఒరిస్సా మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లో 381 కోట్ల రూ.వాటాల ను ప్రభుత్వం కొనిపించింది. పర్యావరణ అనుమతుల కోసం మరో 500 కోట్లను ఖర్చు పెట్టించారు. మొత్తం 881 కోట్ల రూ. స్టీల్‌ ప్లాంట్‌ ధనం ఖర్చు పెట్టించారు. కానీ గనులు లోంచి ఇనుప ఖనిజం రాలేదు. 2010 లో బర్డ్‌ గ్రూప్‌ లో 361 కోట్లను పెట్టుబడిగా పెట్ట్టి 51 శాతం వాటాలు కొనమని కేంద్రం ఆదేశించింది.వాటాలు కొని 10 ఏళ్ళైనా, నేటికీ ఒక్క టన్ను ఇనప ఖనిజం కూడా రానివ్వలేదు.చెయ్యని నేరానికి 1400 కోట్ల అపరాధ రుసుము విధించారు. ఇప్పటికే 500 కోట్లు చెల్లించారు. 1971 లో విశాఖ ఉక్కును సెయిల్‌ సంస్థ క్రింద ప్రారంభించారు. సెయిల్‌ సంస్థకు, 200 సం.తవ్వినా తరగని ఇనప గనులున్నాయి. సెయిల్‌ సంస్థ నుండి 1982లో విశాఖ ఉక్కు ను ఎందుకు విడకొట్టారు? రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం సంస్ధను ఎందుకు ఏర్పాటు చేశారు ?సెయిల్‌ లో ఎందుకు విలీనం చేయరు? గత మూడు నాలుగు సంవత్సరాల సమస్యలను మాత్రమే చెబుతూ అంతకుముందు ప్లాంట్‌ సాధించిన అద్భుత ఫలితాలను విస్మరించడం సమంజసం కాదు. 279 కోట్ల అమ్మకాలతో మొదలై 2018-19 సంవత్సరానికి 20 వేల కోట్లకు పైగా అమ్మకాల తో సాలీనా 14.5 శాతం వ ద్ధిరేటును సాధించింది. ఇంత వ ద్ధి రేట్ను సాధించిన మరొక ఉక్కు ఫ్యాక్టరీ ని చూపించమనండి.

స్వంత గనులు ఎందుకు కేటాయించలేదు?

ఉక్కు తయారీకి వంద రూపాయలు ఖర్చు అయితే అందులో 61% కేవలం ముడిపదార్థమైన ఇనుపఖనిజం కొనటం కోసమే ఖర్చవుతున్నది. సొంత గనులు ఉంటే ఈ ఖర్చు తగ్గటమే కాకుండా విశాఖ ఉక్కు లాభాల బాటలో ప్రయాణించేది. వివరమైన ప్రాజెక్టు రిపోర్ట్‌ ను ఏం యన్‌ దస్తూరి కం పెనీ 1971 లో తయారు చేసింది. అందులో బైలాదిల్లా ఇనుప ఖనిజ గనుల్లో 4 మరియు 5 బ్లాకులను కేటాయించాలని చాలా వివరంగా ప్రాజెక్టు రిపోర్ట్‌ లోనే నివేదించారు. అయినా ఇప్పటివరకు స్వంత గనులను ఎందుకు కేటాయించలేదు? ఇప్పటివరకు అధికారంలోఉన్న అన్ని ప్రభుత్వాల నాయకులు ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉక్కు ఉత్పత్తి ప్రారంభించిన 1991 నుంచి మార్కెట్‌ రేటుకి ఇనప ఖనిజాన్ని కొనక తప్పటంలేదు. 1991 లో టన్ను ఇనప ఖనిజం రేటు 396. రూ. ఉంటే,2004 సంవత్సరానికి 1085 రూ, 2020 కి 4779 రూ.అయింది.మధ్యలో 5424. రూ.కూడా పెరిగింది.
స్వంత గనులున్న స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతి టన్ను ఇనప ఖానిజానికి 2396 రూ ఖర్చు పెడుతూవుంటే, విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్ను ఇనప ఖనిజానికి 6584 రూ. ఖర్చు పెట్టవలసి వచ్చింది. అంటే స్వంత ఇనప గనులు లేనందున విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్నుకూ అదనంగా 4188 రూ ఖర్చు పెట్టి ఉక్కు ను ఉత్పత్తి చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ లు లేని బ్రాహ్మణి స్టీల్స్‌ కు, గాలి జనార్ధనరెడ్డి కి గనులను కేటాయించారు. జిందాల్‌, ఎస్సార్‌,వంటి ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఇచ్చారు. స్వదేశీ ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ కు ఇనప ఖనిజ గనులు ఇవ్వలేదు కానీ ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశీయ ప్రభత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏం పాపం చేసింది? ఎందుకు ఇవ్వలేదు? ఉత్పత్తి పరమైననష్టం లేదు. ఆపరేషన్‌ నష్టాలు లేవు. పెట్టుబడికి అయిదు రెట్లకు మించి లాభాలను ఆర్జించింది.కేంద్ర ప్రభుత్వానికి 43 వేల కోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 8 వేల కోట్ల రూపాయలు పన్ను చెల్లించారు.
ఇనుప ఖనిజం బయట కొన్నా 2014- 15 వరకూ లాభల్లో నడిచింది.2020 డిసెంబర్‌ లో 212 కోట్ల లాభం వచ్చింది.2021 జనవరిలో 135 కోట్ల లాభం వచ్చింది.2021 ఫిబ్రవరి లో 165 కోట్ల లాభం వచ్చింది.2021 మార్చ్‌ లో 300 కోట్ల లాభం రావచ్చంటున్నారు. ప్రైవేట్‌ వారికీవిశాఖ ఉక్కు ను ఇవ్వటానికే స్వంత గనులను కేటాయించలేదు అని అర్ధ మౌతూనే ఉంది.నష్టాల్లో ఉన్న గుజరాత్‌ పెట్రోల్‌ కార్పొరేషన్‌ ను ఓఎన్‌జిసిలో కలిపేశారు. అలానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను సెయిల్‌ సంస్థ లో కలపవచ్చు కదా! గుజరాత్‌ కి ఒక న్యాయం!ఆంధ్ర కొక న్యాయమా? ఒకే దేశం ఒకే న్యాయం అవసరం లేదా?

కార్మికులకు జీతాలు ఎక్కువ- పని తక్కువ !

కార్మికులకు జీతాల ఖర్చులు ఎక్కువ అని, కార్మికులు సరిగ్గా పని చేయరనీ అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తం ఖర్చులో ఉద్యోగుల వేతన ఖర్చు 15 శాతానికి ఎప్పుడూ మించలేదు. విపరీతమైన ఉష్ట్నోగ్రత లో, ప్రతికూల వాతావరణంలో కూడా కార్మికులు శ్రమించి. ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉత్పత్తిని పెంచుతూనే ఉన్నారు. ప్రిఫరెన్షియల్‌ షేర్‌ లను ఉపహరించడం వలన షేర్‌ కాపిటల్‌ ను తిరిగి ఇవ్వవలసి వచ్చింది. ఫలితంగా ప్లాంట్‌ పై 2930 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. గత 30 సంవత్సరాల నుండి నికర ఆస్తులు పెంచుకుంటూ, ప్రిఫరెన్సియల్‌ షేర్స్‌ డబ్బులు ఇచ్చేస్తూ, అప్పులు వడ్డీతో సహా తీరుస్తూ, ఉక్కు ఉత్పత్తిని 63 లక్షల టన్నులకు పెంచుకుంటూ అప్రతిహతంగా పురోగమిస్తున్న విశాఖ ఉక్కును అప్రతిష్ట పాలు చేయలేరు.
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఎత్తిన బావుటా దించేది లేదని ఆంధ్ర ప్రజలు, కార్మికులు ముక్తకంఠంతో తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఎంత మొండి గా ఉందో కార్మికులు, ప్రజలు కూడా అంతే పట్టుదల తో ఉన్నారు. జనవరి 27న కేంద్ర క్యాబినెట్‌ కమిటీ విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయించిన తర్వాత కార్మికులంతా ఐక్యం అయ్యారు. కార్మిక సంఘాలన్నీ కలిసాయి.విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ గా ఏర్పడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ ముందు ప్రారంభించిన నిరాహార దీక్ష శిబిరం ప్రజలతో కిక్కిరిసిపోతూ వున్నది. ”ఎవడు రా అమ్మేది? ఎవడు రా కొనేది? ” అనే నినాదంతో ప్రభుత్వాన్ని గద్ధిస్తున్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రతిధ్వనించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపించేవరకూ పోరాడాలన్న ఉక్కు సంకల్పం తో పోరాడి సాధించారు. వీధులు, గ్రామాలు, పట్టణాలు, హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశ్రమలు, పార్లమెంటు, శాసనసభ అన్నీ పోరాట వేదికలుగా మార్చుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ నలుమూలలకూ విస్తరించిన సమరశీల పోరాటం ప్రతిఫలమే విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాల వలన రాలేదు. ప్రజా పోరాట చరిత్రను పాలకులు మరిచిపొతే చరిత్రహీనులు కాక తప్పదు. ఆ పోరాటమే తిరిగి దారిన పడుతున్నది. నూతన శక్తీతో కార్మికులు, రైతులు ఐక్యమై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎదుర్కొంటున్నారు. ప్రజా శక్తి ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు.


వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ గుంటూరు, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

ఎల్‌డిఎఫ్‌కు అధికారం ఖాయం అన్న 16కు పదిహేను సర్వేలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి ప్రచారం పర్వం వేడెక్కుతున్నది. రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఒక దఫా సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, మరోదఫా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారంలోకి రావటంగా ఉన్న రాజకీయ ఆనవాయితీకి తొలిసారిగా ఈ సారి తెరపడనున్నది. ఈ నేపధ్యంలో దీన్ని సహించలేని హిందూత్వ, క్రైస్తవ మత శక్తులు మరోసారి తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ముందుకు తెస్తున్నాయి. ఓటర్లను రెచ్చగొడుతున్నాయి. శబరిమల దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉండటంతో ఎవరైనా దాన్ని ప్రచార అంశంగా ముందుకు తెస్తే సమస్యలను ఎదుర్కొంటారు. వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారం చేపట్టనున్నదంటూ ఇప్పటి వరకు జరిగిన పదహారు సర్వేలలో ఒకటి మాత్రమే ఏ కూటమికీ మెజారిటీ దక్కదని చెప్పగా మిగిలిన వన్నీ ఎల్‌డిఎఫ్‌కు మెజారిటీ సీట్లు రానున్నట్లు పేర్కొన్నాయి. వీటిలో మొదటిది గత ఏడాది జూలైలో జరగ్గా మిగిలినవన్నీ ఈ ఏడాదిలోనే జరిగాయి. మొత్తం 140 సీట్లకు గాను అధికారం దక్కాలంటే 71 స్దానాలు తెచ్చుకోవాలి. పదహారు సర్వేల సగటు ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 76.3 సీట్లు గరిష్ట సగటు 82 రానున్నాయి. మెజారిటీలలో కనిష్టంగా 72 కాగా గరిష్టంగా 91 ఉన్నాయి. బిజెపి కూటమికి రెండు సర్వేలు 3-7 మధ్య వస్తాయని పేర్కొనగా మిగిలినవన్నీ ఒకటి రెండుగా తెలిపాయి.ఒక సర్వే మూడు వస్తాయని పేర్కొన్నది. గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్ధలలో పార్టీలకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఎల్‌డిఎఫ్‌కు 101 వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వెలువడింది. హంగ్‌ అని పేర్కొన్న సర్వే కూడా 68-78 మధ్య వస్తాయని పేర్కొన్నది.


ఈ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను మొత్తం 957 మంది పోటీలో ఉన్నారు. ఫ్రంట్‌లు, పార్టీల వారీగా పోటీ చేస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌)లో పది పార్టీలున్నాయి. సిపిఐ(ఎం) మరియు అది బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధులు 86, సిపిఐ 25, కేరళ కాంగ్రెస్‌(ఎం) 12, జనతాదళ్‌ (సెక్యులర్‌) 4, ఎన్‌సిపి 3, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ 3, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ 3, కాంగ్రెస్‌(సెక్యులర్‌) 1, కాంగ్రెస్‌(బి) 1, జనాధిపత్య కేరళ కాంగ్రెస్‌ 1. యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌)లో ఎనిమిది పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌ 93,ముస్లిం లీగు 27, కేరళ కాంగ్రెస్‌ 10, ఆర్‌ఎస్‌పి 5, నేషనలిస్టు కాంగ్రెస్‌(కేరళ) 2, కేరళ కాంగ్రెస్‌(జాకబ్‌) 1,సిఎంపి 1,ఆర్‌ఎంపిఐ 1. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఏ) బిజెపి 115, భారత ధర్మ జనసేన 21, అన్నాడిఎంకె 2, కామరాజ్‌ కాంగ్రెస్‌ 1, జనాధిపత్య రాష్ట్రీయ సభ 1, డెమోక్రటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ 1. ఈ కూటమిలో కామరాజ్‌ కాంగ్రెస్‌, జనాధిపత్య రాష్ట్రీయ పార్టీలు రెండూ బిజెపి గుర్తుమీదే పోటీ చేస్తున్నాయి.


శబరిమలై వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నాయర్‌ సర్వీసు సొసైటీ(ఎఎస్‌ఎస్‌) ఒక వైపు నుంచి మరో వైపు నుంచి లాటిన్‌ కాథలిక్‌ చర్చి పెద్దలు ఎన్నికల్లో తామేంటో చూపుతామంటూ ఎల్‌డిఎఫ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శబరిమల వివాదం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నప్పటికీ హిందూత్వశక్తులు దాన్ని ఏదో ఒక రూపంలో ఎన్నికల అంశంగా చేసేందుకు పూనుకున్నాయి. విజయన్‌ ప్రభుత్వం జాలర్లకు హాని చేసేందుకు ప్రయత్నించిందంటూ వ్యతిరేకంగా ఓటు వేయాలన్న సందేశాలను చర్చి నేతలు ఇచ్చారు. ఈ సంస్దల యత్నాలు ఫలించబోవనే ధీమా ఎల్‌డిఎఫ్‌లో వ్యక్తమైంది. క్రైస్తవులు ప్రధానశక్తిగా ఉన్న కేరళ కాంగ్రెస్‌(ఎం) ఈ సారి ఎల్‌డిఎఫ్‌లో చేరటం మతశక్తులకు మింగుడు పడటం లేదు. మరోవైపు కొందరు బిజెపికి మద్దతు ఇస్తుండటంతో సామాన్య క్రైస్తవులలో మతాధికారులు ఇచ్చే పిలుపులకు పెద్దగా స్పందన కానరావటం లేదు. క్రైస్తవులు గణనీయంగా ఉన్న ప్రాంతాలలో సర్వేలు ఎల్‌డిఎఫ్‌ మెజారిటీనే సూచిస్తున్నాయి.


ఏకె ఆంటోని ముఖ్యమంత్రి విజయన్‌ పాద సేవ చేయాలి !


ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీద విరుచుకుపడుతున్న మాజీ ముఖ్యమంత్రి ఏకె ఆంటోని కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని సిపిఎం నేత, మంత్రి ఎంఎం మణి ప్రశ్నించారు. కరోనా సమయంలో గనుక కాంగ్రెసే అధికారంలో ఉంటే ఎందరో పౌరులు మరణించి ఉండేవారని అన్నారు. తమ స్వంత ప్రభుత్వాలను దెబ్బతీస్తున్నా బిజెపి గురించి నోరెత్తని ఆంటోనికి వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కరోనా సమయంలో కనిపించని ఆంటోని ముఖ్యమంత్రికి పాదసేవ చేయాలన్నారు. ఏ పార్టీకి ఎందరు నాయర్లను కేటాయించాలనే పంపిణీ హక్కులు ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమార్‌ నాయర్‌కు లేదని, ఆయన వాంఛలకు అనుగుణ్యంగా కొంత మంది ఓటు వేయవచ్చుగానీ మెజారిటీ నాయర్లు ఎల్‌డిఎఫ్‌ మద్దతుదార్లుగా ఉన్నారన్నారు.


బిజెపి ఓట్లు కావాలంటున్న చెన్నితల – వద్దు అంటున్న మరో కాంగ్రెస్‌ నేత !


బిజెపితో సహా తాము ఎవరి ఓట్లనూ వద్దు అనటం లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల ప్రకటించగా తమకు బిజెపి ఓట్లు అవసరం లేదని యుడిఎఫ్‌ కన్వీనర్‌, కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ చెప్పారు. కన్నూరు జిల్లా తలసెరిలో గానీ మరోచోట గాని తమకు బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ఓట్లు అవసరం లేదని పదే పదే చెప్పామని, వెల్ఫేర్‌ పార్టీ(ముస్లిం మతతత్వ)తో ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఎన్నికల జాబితా గురించి ఆరోపణలను కొనసాగిస్తున్న రమేష్‌ చెన్నితల తాజాగా మరొక చౌకబారు ఆరోపణను ఇసికి ఫిర్యాదుగా పంపారు. ఓటు వేసిన తరువాత వేలు మీద వేసే సిరాగుర్తును చెరిపివేసే రసాయనాలను అధికారపక్షం పంపిణీ చేసిందన్నది దాని సారం. ఆరోపణకు ఆధారాలు చూపాలని ఎన్నికల సంఘం కోరగా కొన్ని కేంద్రాల నుంచి తనకు ఫిర్యాదులందాయని చెన్నితల చెప్పారు. పలుచోట్ల దొంగ ఓట్లు చేర్పించారని సిపిఎం మీద రమేష్‌ చెన్నితల చేస్తున్న ఆరోపణలు ఆయనకే ఎదురు తగులుతున్నాయి. పెరుంబవూరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ఎల్దోస్‌ కున్నపల్లి, ఆయన భార్య మరియమ్మకు రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. కైపమంగళం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి సుబిన్‌కు మూడు చోట్ల ఓట్లు, గుర్తింపు కార్డులు ఉన్నట్లు బయటపెట్టిన సిపిఎం కార్యకర్తలు ఇప్పుడు ఎంఎల్‌ఎ, ఆయన భార్యకు రెండు చోట్ల ఉండటం గురించి ఏమి చెబుతారంటూ దీన్ని ఒక ప్రచార అంశంగా ముందుకు తెచ్చారు. రమేష్‌ చెన్నితల ఒక మహిళకు ఐదు చోట్ల ఓట్లు ఉండటాన్ని ఉదాహరణగా మీడియా ముందు చెప్పారు. అయితే సదరు మహిళ తాను కాంగ్రెస్‌ కార్యకర్తను అని చెప్పటంతో చెన్నితల నోట్లో వెలక్కాయపడింది.

ఇడిపై కేసు గురించి కేంద్ర బిజెపి మంత్రి గగ్గోలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర ఎల్‌డిఎఫ్‌ నేతలను దొంగబంగారం కేసులో ఇరికించేందుకు నిందితులను బెదిరించి తప్పుడు ప్రకటనలు చేయించిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దానినే కోర్టుకు అఫిడవిట్‌గా సమర్పించి ఎన్నికల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు తనచేత బలవంతంగా ప్రకటన చేయించారని, ఇడి అధికారుల నుంచి ప్రాణహాని ఉందంటూ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో తప్పుడు కేసు పెట్టిన ఇడి అధికారులపై కేరళ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దాన్ని ఎత్తివేయాలని ఇడి చేసిన వినతిని హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉదంతంపై విచారణ న్యాయవిచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇడిపై విచారణ కమిషన్‌ ఏర్పాటు, కేసు పెట్టటం ఏమిటంటూ కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ గగ్గోలు పెట్టారు. ఇది దేశంలో ఒక వింత అన్నారు.


దొంగబంగారం కేసులో నిందితురాలైన స్వప్న సురేష్‌ను ఇడి అధికారులు బెదిరించి వాంగ్మూలం తీసుకోవటాన్ని తాము విన్నామని ఆమెకు రక్షణగా ఉన్న ఇద్దరు కేరళ మహిళా పోలీసులు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతంపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయించింది. స్వప్న సురేష్‌కు రక్షణగా ఉన్న ఒక మహిళా పోలీసు అధికారి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయించాలని పోలీసులు నిర్ణయించారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 12,13 తేదీలలో విధి నిర్వహణలో భాగంగా తాను స్వప్న వద్ద ఉన్నపుడు ఇడి అధికారులు ఆమెను బెదిరించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని నమోదు చేయటాన్ని తాను విన్నానని ఆ పోలీసు అధికారిణి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచారు. దాన్నే ఒక న్యాయమూర్తి ముందు నమోదు చేయాలని క్రైమ్‌ బ్రాంచికి న్యాయ విభాగం సలహా ఇచ్చింది.తమకు వ్యతిరేకంగా పోలీసు అదికారిణి ఫిర్యాదు, వాంగ్మూలం రాజకీయవత్తిడితో చేస్తున్నట్లు ఇడి ఆరోపించింది.


కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధుల సంస్ధ(కెఐఐఎఫ్‌బి)పై ఆదాయపన్నుశాఖ దాడి చేయటం దాదాగిరి తప్ప మరొకటి కాదని ఆర్ధిక మంత్రి థామస్‌ ఐజాక్‌ వర్ణించారు. అన్ని నిబంధనలను, చట్టాలను పాటిస్తున్న ఆ సంస్ధపై దాడులు చేయటం ద్వారా ఎలాంటి నష్టం చేయజాలరని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో నిర్మించిన అనేక ఆసుపత్రులు, విద్యా సంస్ధలను జనం చూస్తున్నారని, దాన్ని దెబ్బతీస్తుంటే రాష్ట్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే సంస్దను ఏర్పాటు చేశాము, రిజర్వుబ్యాంకు ఆమోదం తెలిపింది. దాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌-కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆదాయపన్ను శాఖ అడిగిన సమాచారం, పత్రాలను గతంలోనే సమర్పించినప్పటికీ అధికారం ఉంది కదా అని ఇప్పుడు మరోసారి దాడి చేయటం తప్ప మరొకటి కాదని చెప్పారు.ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లటానికి ఎవరు హక్కు ఇచ్చారని, దీని వెనుక కేంద్ర మంత్రుల ప్రోద్బలం తప్ప అధికారులదేమీ లేదన్నారు.


విజయాలతో మామా-అల్లుడు చరిత్రను సృష్టిస్తారా !


అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌ విజయం సాధిస్తే కేరళ అసెంబ్లీ చరిత్రలో అదొక రికార్డు అవుతుంది. విజయన్‌ అల్లుడు రియాజ్‌ అన్న విషయం తెలిసిందే. విజయన్‌ కన్నూరు జిల్లాలో పోటీ చేస్తుండగా రియాజ్‌ కోజికోడ్‌ జిల్లాలో పోటీచేస్తున్నారు. ఈ ఉదంతాన్ని మరికొన్ని చోట్ల జరుగుతున్న పోటీలలో బంధువులు పోటీ చేయటాన్ని చూపి సిపిఎంలో కూడా కుటుంబ పెత్తనం, వారసత్వం చోటు చేసుకున్నదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనికి ప్రాధాన్యత తప్ప బంధుత్వాలకు కాదు అన్న విషయం తెలిసిందే. అనేక కుటుంబాలలో సభ్యులందరూ పార్టీ పనిలో పూర్తి కాలం పని చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రియాజ్‌ విషయానికి వస్తే విజయన్‌ అల్లుడు గాక ముందే 2009 ఎన్నికల్లోనే సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈనెల 28న ముఖ్యమంత్రి కోజికోడ్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఐదు కేంద్రాల్లో ప్రచారంలో పాల్గొంటారు. వాటిలో రియాజ్‌ పోటీ చేసే బైపూరు ప్రత్యేకంగా లేదు. దానితో పాటు నాలుగు నియోజకవర్గాల ప్రచారాన్ని కోజికోడ్‌లోనే ఏర్పాటు చేశారు. రియాజ్‌ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.


బంధుగణం పోటీచేస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ వారే ఎక్కువగా ఉన్నారు. ఒక కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ కుమారులు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తుండగా దివంగత స్వతంత్ర ఎంఎల్‌ఏ కుమారుడు ఒకరు స్వతంత్ర అభ్యర్ధిగా ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమారుడు,ఎంపీ అయిన మురళీధరన్‌, కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ పోటీలో ఉన్నారు.ఎన్‌సిపి మాజీ మంత్రి సోదరుడు, ఎల్‌డిఎఫ్‌ కన్వీనరు విజయరాఘవన్‌ సతీమణి బిందు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్‌ అల్లుడు శ్రీనింజన్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులుగా ఉన్నారు. కేరళ కాంగ్రెస్‌ నేత దిగంగత మణి కుమారుడు జోస్‌ మణి ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తుండగా ఆయన బావమరిది, మాజీ అయ్యేఎస్‌ అధికారి జోసెఫ్‌ యుడిఎఫ్‌ అభ్యర్ధిగా వేరేచోట ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు మాజీ మంత్రులు, ఒక మాజీ స్పీకర్‌ కుమారుడు కూడా యుడిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు.

మరోసారి ఎల్‌డిఎఫ్‌దే అధికారం : మనోరమ, టైమ్స్‌ నౌ సర్వేల వెల్లడి

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ-విఎంఆర్‌ సర్వే , టైమ్స్‌ నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి. మనోరమ ఫిబ్రవరి 15-మార్చి 15వ తేదీల మధ్య జరిపిన సర్వే ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 77, గరిష్టంగా 82 రానున్నాయని వెల్లడించారు. ఇదే విధంగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 54-59, బిజెపికి మూడు, ఇతరులకు ఒకటి వస్తాయని పేర్కొన్నది. ఎల్‌డిఎఫ్‌కు 43.65, యుడిఎఫ్‌కు 37.37, బిజెపి కూటమికి 16.46, ఇతరులకు 2.52శాతం చొప్పున ఓట్లు వస్తాయని తెలిపింది. ముఖ్యమంత్రిగా తగిన వ్యక్తిగా 39శాతం మంది పినరయి విజయన్‌కు ఓటు వేయగా తరువాతి స్ధానాలలో ఊమెన్‌ చాందీ (కాంగ్రెస్‌) 26, కెకే శైలజ(సిపిఎం), రమేష్‌ చెన్నితల(కాంగ్రెస్‌) 11, కె సురేంద్రన్‌(బిజెపి) ఐదు, వి.మురళీధరన్‌(బిజెపి) మూడు శాతం చొప్పున ఉన్నారు. తిరువనంతపురం జిల్లాలో పద్నాలుగు స్ధానాలుండగా 12 ఎల్‌డిఎఫ్‌ గెలుస్తుందని, రెండు బిజెకి రావచ్చని, కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదని సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న రెండింటిలో ఒకటి గత ఎన్నికల్లో గెలిచిన నీమమ్‌ స్ధానం ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కె. మురళీధరన్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తూ బిజెపి-కాంగ్రెస్‌ కుమ్మక్కు అనే ముద్రను తొలగించుకొనేందుకు చూస్తున్నారు. ఇక్కడ బిజెపికి 41.3శాతం, సిపిఎంకు 41.2 వస్తాయని సర్వేలో తేలింది. అయితే సర్వే సమయానికి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరన్నది ఖరారు కాలేదు. బలమైన మురళీధరన్‌ను ఎంపిక చేసినందున దాని ప్రభావం ఉండవచ్చని పేర్కొన్నది. ఇలాంటి తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. బిజెపి గెలుస్తుందని అంచనా వేసిన మరొక నియోజకవర్గం తిరువనంతపురం.గతంలో ఇక్కడ యుడిఎఫ్‌ గెలిచింది. ప్రస్తుతం బిజెపి 32.5, సిపిఎం 30.4, కాంగ్రెస్‌కు 25.2శాతం వస్తాయని పేర్కొన్నది.


ఈ సర్వే సమయంలో, తరువాత జరిగిన పరిణామాలన్నీ ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం మంజేశ్వరం నియోజక వర్గంలో బిజెపికి విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆ పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడలు దానికి ఎదురు తగిలి ముస్లిం లీగుకు ఉపయోగపడతాయని తాజాగా మనోరమ విశ్లేషణ పేర్కొన్నది. ఈ నియోజకవర్గంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. కాసరగోడ్‌ జిల్లాలో కర్ణాటకు దగ్గరలో ఉన్న ఈ నియోజకవర్గంలో 53శాతం ఓటర్లు ముస్లింలే ఉన్నారు. కర్ణాటక నుంచి వస్తున్న బిజెపి నేతలందరూ కేవలం హిందూ ఓటర్లనే కలుస్తూ బిజెపిని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తుండటంలో మిగిలిన వారు బిజెపిని ఓడించేందుకు సంఘటితం అవుతున్నారు.గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్లతో బిజెపి సురేంద్రన్‌ ఓడిపోయారు. మరోసారి ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించనున్నదనే వాతావరణం ఎల్లెడలా ఉండటం, మీడియా సర్వేలు కూడా దానినే నిర్ధారించటంతో ఓటర్లు ముస్లింలీగు వైపు మొగ్గుతారా లేక సిపిఎం వైపు చూస్తారా అన్నది ప్రశ్నార్దకంగా మారింది.గత ఏడు దఫాలుగా ఈ నియోజకవర్గంలో బిజెపి రెండవ స్దానంలో వస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడి నుంచి పోటీ చేయటం వరుసగా ఇది మూడవసారి, ఇక్కడ గెలిచే నమ్మకం లేకపోవటంతో పత్తానంతిట్ట జిల్లాలోని కొన్ని నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. మంజేశ్వరంలో పదివేల మెజారిటీతో గెలుస్తానని సురేంద్రన్‌ చెబుతున్నారు.ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింలీగ్‌ సభ్యుడు బంగారు ఆభరణాల కుంభకోణంలో పీకల్లోతు మునిగి ఉన్నారు. ఈ కుంభకోణంలో బాధితులు అత్యధికులు ముస్లింలే. దీంతో ఆ పార్టీ నేతలు సమర్ధించలేని స్ధితిలో పడిపోయారు. దీంతో వేరొకరిని నిలిపారు. సిపిఎంకు ఆదరణ పెరగవచ్చని భావిస్తున్నారు. టైమ్స్‌ నౌ సర్వే వివరాలు కూడా తాజాగా వెలువడ్డాయి. దాని విశ్లేషణ ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు 77, యుడిఎఫ్‌కు 62, బిజెపికి ఒక స్ధానం వస్తుందని పేర్కొన్నారు.


ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : విఎస్‌ అచ్యుతానందన్

‌
రానున్న ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ తిరిగి విజయం సాధించనున్నదని మాజీ ముఖ్యమంత్రి, 97 సంవత్సరాల సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం వరదలు, ఓఖి, నిఫా, కరోనా వైరస్‌లను తట్టుకున్నదని చెప్పారు. విజయన్‌ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శల గురించి చెబుతూ తన మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేశారని, ఏకంగా ఒక కమిటీని కూడా వేశారని గుర్తు చేశారు. వచ్చిన ఆరోపణల మీద కేంద్ర సంస్ధలు దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వమే కోరిన విషయాన్ని చెబుతూ ఎన్నికల సమయంలో ప్రచారానికి దర్యాప్తు సంస్దలను వినియోగిస్తున్నారని అన్నారు. విజయం సాధించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల గురించి అడగ్గా స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి వామపక్ష ప్రజాతంత్రశక్తులు ఎంత చురుకుగా ఉన్నాయో సంఘవ్యతిరేక శక్తులు కూడా అదే విధంగా ఉన్నాయని అన్నారు. కేరళలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని, దేశాన్ని అమ్మివేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయ పార్టీల పని తీరుతెన్నులు మారిపోయాయని, గతంలో ఇచ్చిన నినాదాలు ఇప్పుడు పని చేయవన్నారు. ఎప్పటికైనా రాజకీయనేతలకు మౌలిక విలువలు, త్యాగం, నిజాయితీ ముఖ్యమని వాటిని కాపాడుకొంటూ పని చేయటం ద్వారా వామపక్ష శక్తులు ముందుకు పోతాయని అన్నారు.


ఇడి మీద కేసుల ఎత్తివేతకు కోర్టు తిరస్కారం !


ముఖ్యమంత్రి, ఇతర అధికారపక్ష నేతలకు వ్యతిరేకంగా బంగారం స్మగ్గింగ్‌ కేసులో ఒక నిందితుడితో బలవంతంగా ప్రకటన చేయించటం, దాన్ని కోర్టులో సమర్పించిన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ కేసును ఎత్తివేయాలని, దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని ఇడి చేసిన అభ్యర్ధనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. విచారణ కొనసాగించవచ్చని పేర్కొన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పని చేస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తీరు తెన్నుల గురించి ప్రజలూ, ప్రభుత్వమూ గమనిస్తున్న విషయాన్ని ఆ సంస్ధ కూడా గుర్తించటం అవసరం అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్ల ప్రశ్నలకు జవాబిచ్చారు. అసలు వారెందుకు అలా ఎందుకు వ్యహరిస్తున్నారో మీరైనా తెలుసుకోండని విలేకర్లతో అన్నారు. దీని మీద సొసైటీ ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ తాము సమదూరం పాటిస్తున్నామని, శబరిమల ఆలయం మీద ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నామని, పదిశాతం ఇబిసి రిజర్వేషన్లు అమలు జరపాలని, సంస్ధ నేత మన్మాత్‌ పద్మనాభన్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నట్లుగా చెప్పారు. కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్‌, ఇతర మతశక్తులతో కలసి సాగించిన ఆందోళనలో పద్మనాభన్‌ ఒక ముఖ్యపాత్రధారిగా ఉన్నారు.


ముదిమది తప్పిన మాజీ సిఎం ఎకె ఆంటోని వ్యాఖ్యలు !

ఏడాది తరువాత తిరువనంతపురంలోని కాంగ్రెస్‌ కార్యాలయ మెట్లెక్కిన మాజీ ముఖ్యమంత్రి ఏ కె ఆంటోని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. ఆయనకు గర్వం ఎక్కువ, హిందువులు, ఇతర సామాజిక తరగతులను తప్పుదారి పట్టించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో కూడా ఆయనను అదుపు చేయలేదు అంటూ విరుచుకుపడ్డారు. విజయన్‌ ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ప్రతి సర్వేలోనూ వెల్లడి అవుతోంది. రెండో సారి అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే రెండు ప్రధాన మీడియా సంస్ధలైన మాతృభూమి, మళయాల మనోరమ తమ సర్వేల్లో వెల్లడించిన నేపధ్యంలో గందరగోళ పడిన ఆంటోని సహజంగానే తమ కార్యకర్తల మనోనిబ్బరాన్నికాపాడుకొనేందుకు పూనుకున్నట్లు స్పష్టం అయింది. తమ భవిష్యత్‌ బాగుండాలంటే విజయన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వవద్దని తాను నిజమైన కమ్యూనిస్టులను కోరుతున్నట్లు ఆంటోని చెప్పారు. ఇంతకాలంగా కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. ఇప్పుడు పాడిందే పాడరా అన్నట్లు అంటోని కూడా పునశ్చరణ చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


మాకు బిజెపి ఓట్లు కావాలి : కాంగ్రెస్‌ నేత చెన్నితల !


బిజెపి అభ్యర్దులు లేని గురువాయూర్‌, తెలిచేరి నియోజకవర్గాలలో తమకు బిజెపి ఓట్లు కావాలని అంటాం తప్ప వద్దు అనేది లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చెప్పారు.రకరకాల కారణాల వలన వేర్వేరు పార్టీలకు ఓటు వేస్తారు, అందువలన ఫలానా పార్టీ వారి ఓట్లు వద్దు అనేది లేదన్నారు. కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కులో భాగంగానే ఈ నియోజకవర్గాలలో బిజెపి సరిగా నామినేషన్లు దాఖలు చేయలేదని, అన్ని చోట్లా సక్రమంగా వేసిన వారు ఇక్కడ ఎలా విఫలం అవుతారని సిపిఎం ప్రశ్నిస్తోంది. ఓటర్ల జాబితాల్లో అక్రమాల గురించి తాను ఐదు సార్లు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాసినా స్పందించలేదని, అందువలన ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లున్న వారిని ఓటింగ్‌కు అనుమతించరాదని కోరుతూ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల హైకోర్టును ఆశ్రయించారు.
కొడంగనల్లూరు నియోజకవర్గంలో యుడిఎఫ్‌ అభ్యర్ధి శోభా సుబీన్‌కు రెండు నియోజకవర్గాలలో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ సిపిఎం కార్యకర్తలు గుర్తింపు కార్డులతో సహా వివరాలను మీడియాకు అందచేశారు. ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారు ఓటేసేందుకు అర్హత లేదంటున్న రమేష్‌ చెన్నితల తమ అభ్యర్ధి అసలు పోటీకి ఎలా అర్హుడో చెప్పాలని ప్రశ్నించారు. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న విషయం, ఎలా జరిగిందో తనకసలు తెలియనే తెలియదని సుబీన్‌ చెబుతున్నారు. ఒక వేళ ఎన్నికల సిబ్బంది తప్పు చేస్తే వారే దాన్ని సరిదిద్దాలని సుబీన్‌ అన్నారు. అదే సూత్రం ఇతర చోట్ల వర్తించదా అని రమేష్‌ చెన్నితలను సిపిఎం ప్రశ్నిస్తోంది.


గురువాయూర్‌ అనుకున్నా , నేత త్రిసూర్‌ అన్నారు: సురేష్‌ గోపి


తాను గురువాయూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నానని అయితే పార్టీ నేత (నరేంద్రమోడీ) త్రిసూర్‌ లేనా హరు అన్నారు, దాన్ని మన్నించి ఇక్కడ పోటీ చేస్తున్నా , ఇక్కడ ఓటర్లేమో త్రిసూర్‌ను మీకే ఇస్తున్నాం అని చెబుతున్నారని ప్రముఖ నటుడు సురేష్‌ గోపి చెప్పుకున్నారు. గురువాయూర్‌లో నామినేషన్‌ పత్రాలు సరిగా వేయని కారణంగా అసలు అక్కడ బిజెపికి అభ్యర్దే లేకుండా పోయారు.ఈ ఎన్నికల్లో శబరిమల ఒక అంశం కాదని అయితే మనోభావాలు ఉన్నాయని అన్నారు. వామపక్షాలు గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయి. వాటిని నిలిపివేయాలని కోరుతున్నా కాని అది అసాధ్యమని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. మరోవైపు శబరిమల గురించి చర్చించకూడదని కమిషన్‌ చెబుతోంది. పౌరుల విశ్వాసాలు, సంప్రదాయాలను కాపాడాలంటే శబరిమల గురించి చర్చించాలని అన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేస్తున్న క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మాట్లాడుతూ శబరిమల ఒక ప్రధాన ప్రచారఅంశమని చెప్పారు.


ఉగ్రవాదుల ఓట్లు వద్దంటున్న ఎంఎల్‌ఏ !


గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన వారిలో కొందరు మత ఉగ్రవాదులు ఉన్నారని తరువాత తనకు తెలిసిందని ఈ ఎన్నికల్లో వారి ఓట్లు తనకు వద్దని కొట్టాయం జిల్లాలో పూంజార్‌ నియోజకవర్గంలో తిరిగి పోటీ చేస్తున్న పిసి జార్జి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఎరాట్టుపేట అనే ప్రాంతంలో కొందరు జార్జి ప్రచారాన్ని అపహాస్యం చేయటంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అలాంటి వారి ఓట్లతో తాను ఎంఎల్‌ఏ కావాలనుకోవటం లేదని మీడియాతో చెప్పారు.
తమకు అధికారమిస్తే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఆరు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, దళితులు, గిరిజనులకు ఐదేసి ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. అలాగే వృద్దాప్య పెన్షన్‌గా మూడున్నరవేల రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు జరపని ఈ పధకాలను కేరళలో ఎలా అమలు జరుపుతారంటూ నెటిజన్లు స్పందించారు. ఒక వైపు కేంద్రంలో ఉన్న సర్కార్‌ ఉన్న గ్యాస్‌ సబ్సిడీనే ఎత్తివేస్తుంటే వీరు ఆరు సిలిండర్లు ఉచితం అంటే కేరళీయులు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.శబరిమలలో ఆచారాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని వాగ్దానం చేసింది.

మలబార్‌ తీరంలో ” ఎర్ర ” సునామీ – కాంగ్రెస్‌ గగ్గోలు – మీడియాపై ఇసికి ఫిర్యాదు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మలబార్‌ అంటే తెలుగు ప్రాంతాలలోని పెద్ద తరాలకు గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టుల అణచివేతకు వచ్చిన నాటి కాంగ్రెస్‌ పాలకులు పంపిన రిజర్వు పోలీసులే. అది గత చరిత్ర . ఇప్పుడు మలబార్‌లోని నాలుగు జిల్లాలైన కాసరగోడ్‌, కన్నూరు,వైనాడ్‌,కోజికోడ్‌ జిల్లాలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎర్ర సునామీతో కాంగ్రెస్‌ కొట్టుకుపోనుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ జిల్లాల్లో 27 సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌కు, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 4, బిజెపికి ఒకటి దక్కనుందని కేరళలోని అగ్రశ్రేణి మీడియా సంస్ద మళయాల మనోరమ-విఎంఆర్‌ సర్వే పేర్కొన్నది. నాలుగు భాగాల సర్వేలో తొలి విడత వివరాలను ఆదివారం రాత్రి నుంచి వెల్లడించటం ప్రారంభించింది. ఫిబ్రవరి 15 మార్చి 15 మధ్య సేకరించిన అభిప్రాయాల మేరకు తమ విశ్లేషణ ఉన్నదని తెలిపింది. కోజికోడ్‌, వైనాడ్‌ జిల్లాల్లో అన్ని సీట్లు ఎల్‌డిఎఫ్‌కు రానున్నాయని, యుడిఎఫ్‌ అనేక సిట్టింగ్‌ సీట్లను కోల్పోనున్నదని పేర్కొన్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న మంజేశ్వరం ఆ పార్టీకి దక్కనున్నదని తెలిపింది. ప్రస్తుతం అక్కడ ముస్లింలీగు ప్రాతినిధ్యం వహిస్తోంది. మలబార్‌ అంటే మళయాలీలు నివసించే కొండ ప్రాంతమని అర్దం.బ్రిటీష్‌ వారి పాలనలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఆ ప్రాంతాన్ని మలబార్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కోస్తా ఆంధ్ర జిల్లాలో దానికి మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులను అణచివేసేందుకు నాటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఆ జిల్లా కేంద్రంగా ఉన్న ప్రత్యేక పోలీసు దళాన్ని ఆంధ్ర ప్రాంతానికి రప్పించి దాడులను చేయించింది, వందలాది మందిని హతమార్చింది. పాత తరాలు నేటికీ వాటి దమనకాండను తలుచుకుంటాయి.


ఎల్‌డిఎఫ్‌కు సిపిఎం నేత ఎంఎ బేబీ హెచ్చరిక !


ప్రజలు ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తున్నమాట నిజం. ఇప్పుడు వెలువడుతున్న అనుకూలమైన సర్వేలు మనలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇంకేముంది విజయం దక్కినట్లే అని అతివిశ్వాసానికి పోయి కార్యకర్తలు పాలుమాలుతారేమో అన్న ఆందోళన కలుగుతోంది, అలాంటి వైఖరి ఉండవద్దు అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ కార్యకర్తలను హెచ్చరించారు.


ప్రతిపక్ష స్ధానం కోసం కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే పోటీ !


ఎన్నికల సర్వేల పట్ల తమకు విశ్వాసం లేదని అయినా అన్ని సర్వేలు ఎల్‌డిఎఫ్‌ గెలవనున్నట్లు చెబుతున్నాయని తామైతే ఏ సర్వే నివేదిక కోసమూ ఎదురు చూడటం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌ సైతం రాష్ట్రంలో వామపక్ష పాలన కొనసాగుతుందని జోశ్యం చెప్పారని గుర్తు చేశారు. సర్వేలను చూసి కాంగ్రెస్‌ కళవళ పడుతున్నదని, వచ్చే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరుండాలో తేల్చుకొనేందుకు వివాద పడుతున్నారని చమత్కరించారు.


మీడియా సర్వేలతో కాంగ్రెస్‌ గగ్గోలు !


కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల నిత్యం ప్రభుత్వం మీద ఏదో ఒక బట్టకాల్చివేయటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా దొంగ ఓట్లను చేర్చించారనే ఆరోపణలు ప్రారంభించారు. తాజాగా మీడియా సంస్దల మీద అక్కసు వెళ్ల గక్కుతున్నారు. సర్వేల పేరుతో ఎల్‌డిఎఫ్‌ గెలవనుంది అంటూ యుడిఎఫ్‌ ఓటమికి మీడియా పని చేస్తున్నదని ధ్వజమెత్తారు. నిజానికి అదే మీడియా సహకారం, ప్రోత్సాహంతో స్ధానిక సంస్దల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై ఎంత విష ప్రచారం చేశారో, దాన్ని ఓటర్లు ఎలా తిప్పికొట్టారో తెలిసిందే. తటస్ధం, పక్షపాతరహితంగా కనిపించే మీడియా అల్పబుద్దితో వ్యవహరిస్తోందని రమేష్‌ చెన్నితల ఆరోపించారు. తమను సిపిఎమ్మే నాశనం చేయలేకపోయిందని, మీడియా సర్వేలు కూడా ఆపని చేయలేవన్నారు. బెదిరింపులు, వాణిజ్య ప్రకటనలతో సిపిఎం మీడియాను బెదిరిస్తోందన్నారు. మీడియా సర్వేలను నిలిపివేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు చెన్నితల సోమవారం నాడు ఒక ఫిర్యాదును అందచేశారు. స్వేచ్చ, న్యాయంగా జరగాల్సిన ఎన్నికలను దెబ్బతీసేందుకు సర్వేలను వెల్లడిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలలో కీలకమైన తరుణంలో ఇలాంటి సర్వేల ద్వారా ఓటర్లను గందరగోళపరుస్తున్నారని, తప్పుడు సమాచారంతో తీవ్రంగా ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.


ఓట్లమ్ముకొనే కాంగ్రెస్‌ నేతలు !


2016 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి ఓట్లను అమ్ముకున్నదని ఆ ఎన్నికల్లో యుడిఎఫ్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన జెడి(యు) నేత వి. సురేంద్రన్‌ పిళ్లే చెప్పారు. తాను 1984 నుంచి యుడిఎఫ్‌ను గమనిస్తున్నానని కొన్ని సీట్ల కోసం యుడిఎఫ్‌ కొందరిని బలపశువులుగా వాడుకున్నదని వారిలో తానొకరినని చెప్పారు.భాగస్వామ్య పక్షాలకు సీట్లు కేటాయిస్తామని యుడిఎఫ్‌ చెబుతుందని అక్కడ ఓట్లను అమ్ముకుంటుందని అన్నారు. నీమమ్‌లో గతసారి గెలిచిన బిజెపి ఓ రాజగోపాల్‌ స్వయంగా ఈ అంశాలను చెప్పారన్నారు. ప్రస్తుతం అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ది కూడా దీన్ని గమనించాలని, ఆయనకు అన్నీ తెలుసు అన్నారు. ఓట్ల అమ్మకం వెనుక ఉన్న కొందరు నేతల గురించి తెలుసునని, త్రిముఖ పోటీలో సిపిఎంకు అవకాశాలు ఉన్నాయన్నారు.


మాకు గనుక అప్పుడు తెలివి ఉంటేనా…… అంటున్న కాంగ్రెస్‌ ఎంపీ !


కరోనా నిబంధనల కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో తమ కార్యకర్తలు ప్రేక్షకులుగా మిగిలిపోయారని , కానీ డివైఎఫ్‌ఐ కార్యకర్తలు తెలివి తేటలతో కరోనా సమయంలో చురుకుగా ఉన్నారని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ కె.సుధాకరన్‌ అన్నారు. సిపిఎం తన కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి ఆహారకిట్లు, పెన్షన్లు, ఔషధాలను అందించిందని, ఈ కార్యక్రమాల్లో డివైఎఫ్‌ఐ చురుకుగా ఉన్నదని, పౌరులకు సాయం చేసిందని అన్నారు.మహిళల పట్ల చిన్న చూపినందుకు నిరసగా, ముఠా తగాదాలతో విసిగిపోయి నందున కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు మహిళా కమిషన్‌ మాజీ అధ్యక్షురాలు, ఏఐసిసి సభ్యురాలు కె సి రోజా కుట్టి ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.


హైకోర్టులో బిజెపికి ఎదురు దెబ్బ ! అధికారానికొస్తే లవ్‌ జీహాద్‌ బిల్లు తెస్తారట !


తెలిచేరి, గురువాయూర్‌ నియోజకవర్గాలలో నామినేషన్ల తిరస్కరణకు గురైన ఉదంతంలో బిజెపికి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున రిటర్నింగ్‌ అధికారుల నిర్ణయాన్ని మార్చలేమని సోమవారం నాడు కోర్టు పేర్కొన్నది. మరో ఉదంతంలో ఒక నియోజకవర్గంలో సిపిఎం బలపరుస్తున్న ఒక అభ్యర్ధి సులేమాన్‌ హాజీ దుబారులోని తన రెండవ భార్య గురించి వివరాలు పేర్కొనలేదుకనుక నామినేషన్‌ అంగీకరించరాదన్న అభ్యంతరాన్ని రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. న్యాయనిపుణుల సలహా తీసుకొన్న తరువాత నిలిపివేసిన నామినేషన్‌ చెల్లుబాటు అవుతుందని ప్రకటించారు.
తాము అధికారానికి వస్తే కేరళలో లవ్‌ జీహాద్‌ బిల్లు తీసుకువస్తామని బిజెపి కేంద్రమంత్రి డివి సదానంద గౌడ చెప్పారు. తిరువనంతపురంలో సోమవారం నాడు ఎల్‌డిఎఫ్‌పై ఆరోపణల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ విషయాలన్నింటినీ తమ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని చెప్పారు.క్రైస్తవ మత పెద్దలను సంతుష్టీకరించి వారి మద్దతు పొందేందుకు బిజెపి నేత ఈ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. కేరళలో క్రైస్తవ యువతులను లక్ష్యంగా చేసుకొని లవ్‌ జీహాద్‌ జరుగుతోందని గత ఏడాది సిరియన్‌-మలబార్‌ చర్చి పెద్దలు చేసిన ఆరోపణలను సదానంద గౌడ ప్రస్తావించటమే దీనికి నిదర్శనం. ముస్లింలు – క్రైస్తవుల మధ్య తంపులు పెట్టి క్రైస్తవ ఓటర్లను ఆకర్షించాలన్నది బిజెపి ఎత్తుగడ. ఇప్పటికే జాకోబిన్‌ చర్చి వివాదంలో తలదూర్చి ఒక వర్గాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుంది. కర్ణాటకకు చెందిన బిజెపినేతల సారధ్యంలో కేరళ బిజెపి నేతలు ఇటీవల అనేక మంది బిషప్పులను కలసి మద్దతు ఇమ్మని కోరిన విషయం బహిరంగమే. కొందరు క్రైస్తవ పెద్దలు బిజెపికి మద్దతు ప్రకటించారు కూడా !


బిసిలకు కాంగ్రెస్‌ మొండిచేయి-రెట్టింపు సీట్లిచ్చిన సిపిఎం !


కల్లుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకుంటారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకరు చేసిన కులపరమైన దూషణ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ వెనుకబడిన తరగతులకు మొండి చేయి చూపిందని అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణలో మీడియా పేర్కొన్నది.వెనుకబడిన తరగతులలో ఎజవాలకు 28, ఇతర వెనుకబడిన తరగతులకు 18 మొత్తంగా 46 సీట్లను ఎల్‌డిఎఫ్‌ కేటాయించింది. అదే యుడిఎఫ్‌ 14ఎజవా, 12 ఇతర వెనుకబడిన తరగతులకు కేటాయించింది. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి 55 స్దానాలలో ఎజవాలకు 43, ఇతర వెనుకబడిన తరగతులకు 12 కేటాయించింది. కేరళ కౌముది పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ సామాజిక తరగతులకు మూడు ఫ్రంట్‌లు కేటాయించిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


ఫ్రంట్‌ ×× బిసి ×× నాయర్లు×× ముస్లిం×× క్రైస్తవ
ఎల్‌డిఎఫ్‌ ×× 46 ×× 28 ×× 29 ×× 21
యుడిఎఫ్‌ ×× 26 ×× 28 ×× 39 ×× 28
ఎన్‌డిఏ ××× 55 ×× 45 ×× 3 ×× 6


యుడిఎఫ్‌లో ముస్లింలకు కేటాయించిన 39లో ముస్లిం లీగుకు చెందిన వారు 26, కాంగ్రెస్‌ 12, ఎల్‌డిఎఫ్‌లోని 29 మందిలో సిపిఎం నుంచి 21 మంది ఉన్నారు. నాయర్లలో కాంగ్రెస్‌ 28, సిపిఎం 15, బిజెపి 44 మంది ఉన్నారు. బిజెపిని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ బలపరుస్తున్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే గణనీయ సంఖ్యలో ఆ సామాజిక తరగతికి పెద్దపీట వేశారు. క్రైస్తవుల నుంచి కాంగ్రెస్‌ 18, సిపిఎం నుంచి 8 మంది ఉన్నారు.ఎల్‌డిఎఫ్‌ భాగస్వామ్యపక్షమైన కేరళ కాంగ్రెస్‌ పది స్ధానాలను కేటాయించింది.

భారత్‌ కంటే చైనా, పాక్‌లో సంతోషమెక్కువ – మోడీ భక్తులకు మింగుడు పడని వాస్తవం !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు

గురువుగారూ నాకెందుకో భయంగా ఉంది, సెలవిమ్మంటారా ?
భయమెందుకు చెప్పు శిష్యా !
తెల్లవారు ఝామున బెడ్‌ కాఫీ, ఉదయం ఉపాహారం సమయంలో, ఇప్పుడు మధ్యాహ్నభోజన సమయం. అప్పటి నుంచి చూస్తున్నాను. కాసేపు మీలో మీరే నవ్వుతారు, అంతలోనే విషాదంగా ఉంటారు … నాకెందుకో భయంగా ఉంది…. కొంపదీసి వేయించుకున్న కరోనా వాక్సిన్‌ వికటించలేదు కదా !
వాక్సిన్‌ వికటించటమా ! అలాంటిదేమీ ఉండదని నిర్ధారించుకున్న తరువాతే కదా మన ప్రధాని నరేంద్రమోడీ వేయించుకున్నారు…. మనమేమైనా తక్కువ తిన్నామా… మరో ఇరవై రోజులు చూసి కదా వేయించుకున్నాము….. అయినా వాక్సిన్‌ ఇహలోక భక్తుల కోసం తప్ప మనకెందుకు శిష్యా ! కరోనా కాదు కదా మరే మహమ్మారి మనలను దరిచేరదు. మన మహిమ నీకు తెలియదా !
తెలుసు గురువా తెలుసు రోజూ నేను చేస్తున్న ప్రచారం అదే కదా ! అంత మహిమ ఉన్నవారికి వాక్సినెందుకు అని ఎవరైనా అంటే….. ?
బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులందరూ దేవతలే అయినా అన్నీ తెలిసినా వారు కూడా మానవుల మాదిరి వ్యహరించలేదూ ! ఎందుకంటావ్‌ ! మానవుల కోసమే. ఇప్పుడు ప్రతివారూ కరోనా గురించి భయపడుతున్నారు. దేవుడే దిగివచ్చినా వాక్సిన్‌ వేయించుకోకపోయినా అనుమానంగా చూస్తారు. అందువలన మనమెంత ! భక్తుల భయం తీర్చేందుకు ఆ లీలా మానుషుడి విలాసంలో మనం కూడా పాత్రధారులమే గనుక చిన్న స్వాములమైనా పెద్ద స్వాములమైనా వేయించుకుంటున్నాం శిష్యా !
అయితే సరే గురువా ? సందేహం తీరలేదు… మరి ఆ నవ్వు….. దాని వెనుక ఆ విషాదం సంగతి సెలవిచ్చారు కాదు !
ఏం చెప్పమంటావు నాయనా ప్రపంచ సంతోష నివేదిక 2021 వివరాలు చూసిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే అలా అవుతోంది శిష్యా ! అదుపు చేసుకుందామంటే కుదరటం లేదు !
ఆ నివేదికలో ఏముంది గురువా ! నవ్వు దేనికి వస్తోంది, విషాదం దేనికి కలుగుతోంది !!
మన దేశ స్ధానం అత్యంత దిగువన ఉన్నందుకు విషాదం….మన పొరుగుదేశాలు మనకంటే మెరుగ్గా ఉన్నందుకు సంతోషం కలుగుతోంది శిష్యా !
అదేంటి గురువా ! ఎదుటి వారు సంతోషంగా ఉంటే ఏడవటం లోకం తీరు, అందునా ఇప్పటి దేశభక్తి కదా !! మీరు దానికి భిన్నంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందే ! అసలు విషయం ఏమిటో చెప్పండి గురువు గారూ !
ప్రపంచ సంతోష నివేదిక 2021ప్రకారం 149 దేశాల్లో మనది 139వ స్దానంలో ఉంది. మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి రాకముందు 2013లో ప్రకటించిన నివేదిక ప్రకారం 156 దేశాల్లో 111వ స్ధానంలో ఉన్నాం. ఏలినాటి శని పట్టకపోతే ఏడేండ్లలో రాంకు ఇలా దిగజారటం ఏమిటి చెప్పు ! దాన్ని నాకు విషాదం గాక ఎలా వినోదించగలను ? దేన్నయినా వినోదించటానికి నేనేమీ మోడీ భక్తుడిని కాదు కదా ! పోనీ ఏ మనోభావాలు కనపడకుండా నిబ్బరంగా ఉండటానికి మనమేమన్నా ప్రధాని నరేంద్రమోడీనా నాయనా ?
మీరు, నేను సామాన్యులం గనుక మనల్ని మనం చూసుకొని భోరుమంటాం కేరు మంటాం మనిష్టం. మరి సంతోషం సంతోషంతో చిద్విలాసం సంగతేంటి గురూజీ ?
ఈ రోజుల్లో అదీ ఆలోచించాల్సిందే శిష్యా ! మనమా సర్వేజనా సుఖినోభవంతు పరంపరలో ఎదిగిన వారం. దానిలో భాగంగానే మనకు దరిద్రం పట్టుకున్నా చుట్టుపక్కల వారు సంతోషంగా ఉన్నందుకు సంతోషించాను. అంతే తప్ప వేరే దురుద్దేశ్యం లేదు !
నిజమే గురువా నేను ఎప్పటి నుంచో మీ శిష్యరికం చేస్తున్నా ! గత ఏడు సంవత్సరాల నుంచి వసుధైక కుటుంబం-అందరం ఒకటే – సర్వమతాలూ సమానమే అనే పదాలనే మీరు పక్కన పెట్టేశారు !
స్వర్గలోకంలో నరకం గురించి మాట్లాడితే ఫరవాలేదు గాని నాయనా నరకలోకంలో స్వర్గం గురించి మాట్లాడితే కుదురుతుందా చెప్పు ! మనం బాగుపడటం సంగతి పక్కన పెట్టి కాస్త ఖాళీ దొరికితే ఉన్నవాటిని తెగనమ్మటం, మిగతా సమయంలో తరువాత మన కేంద్రీకరణ అంతా ఇరుగుపొరుగు దేశాలను దెబ్బతీయటం మీదనే కదా ఉంది !
అదేమిటి గురువా మన శత్రుదేశాలను నాశనం చేస్తేనే కదా మనం ప్రశాంతంగా ఉండేది… మీరేమో విదేశాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. విదేశాలు పచ్చగా నిప్పులు పోసుకోవాల్సింది పోయి సంతోషం ప్రకటిస్తున్నారు !
శిష్యా నువ్వింకా రాజకుమారి ా అర్ధరాజ్యం కథల్లోనే కాలం గడుపుతున్నట్లున్నావు.మనకు పొరుగు దేశాలు ఎంత దూరమో వాటికీ మనమూ అంతేదూరంలో ఉంటాం. ఇద్దరి దగ్గరా అణ్వాయుధాలటా మన పురాణ బ్రహ్మ అస్త్రాలనైనా వెనక్కు తీసుకోగలంగాని ఒకసారి మీట నొక్కితే అవి అంతేనట ! మన ఇరుగుపొరుగువారి దగ్గర కూడా ఉన్నాయి గనుక వాటిని నాశనం చేస్తాం అనే పిచ్చి కలలు మానుకోవాలి.
వదిలేయండి గురువా గత ఏడు సంవత్సరాలుగా మన ఇరుగుపొరుగు వారిని దెబ్బతీసేందుకు మన జనాలను ఇబ్బంది పెట్టి దేశభక్తిని నవరంధ్రాలద్వారా నింపుతున్నాం. మనం ఇబ్బంది పడటం ఏమిటి వారు సంతోషంగా ఉండటం ఏమిటి ? పొంతన కుదరటం లేదు !
గత ఏడు సంవత్సరాలలో సంతోష సూచికలో చైనా 93 నుంచి 84వ స్దానానికి మెరుగుపరచుకుంది.బంగ్లాదేశ్‌ దరిద్రం గురించి చెప్పనవసరం లేదు.2013లో 108లో ఉంది. ఇప్పుడు 101కి మెరుగుపరచుకుంది. పాకిస్దాన్‌కు అమెరికా సాయం ఆపించాం, సర్జికల్‌ దాడులు చేశాం అయినా వారు సంతోషంగా ఉంటూ మనకంటే మెరుగైన 105వ స్దానంలో ఉన్నారు.అయితే 2013లో ఉన్న 81స్ధానం నుంచి దిగజారినా మనకంటే తక్కువే. శ్రీలంక 137 నుంచి 129కి పెంచుకోగా మయన్మార్‌ 121 నుంచి 126కు పడిపోయింది. ఎలా చూసినా మనకంటే మెరుగే, అందుకే వాటిని చూసి అభిమానపూర్వకంగా సంతోషం దానికి సూచనగా నవ్వు వస్తున్నది నాయనా !
గురువుగారూ ఒకదాని మీద ఒకటి ఏమిటీ ప్రపంచ సూచికలన్నింటా గత ఏడేండ్లలో ఈ దిగజారుడును అర్ధం చేసుకోలేకపోతున్నాను తలబద్దలౌతోంది. దేశం ఎటుపోతోంది.
అందుకే వచ్చే ఎన్నికల నాటికి మంచి నినాదం తట్టకపోతుందా, ఏదో ఒక ఘటన జరగకపోతుందా అని మన ప్రధాని నరేంద్రమోడీగారు నిమురుకుంటూ మధనం చేసేందుకు గడ్డాన్ని పెంచుతున్నారు కదా త్వరలో ఫలితం వస్తుందేమో చూద్దాం.
అంతేనా ! అంతకంటే మార్గం లేదా !!
ఇదిగో శిష్యా మనం ఏకాంతంలో ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం ! భక్తులు వస్తున్నట్లున్నారు. నోస్ట్రోడోమస్‌ జోశ్యాల వందవ ప్రింటు, నరేంద్రమోడీ సుభాషితాలు, ఉపన్యాసాల, పొగడ్తల వంటివి దుకాణంలో ఉన్నాయోలేదో చూడు. వెంటనే నమో మోడీ సీడి రికార్డు ఆన్‌ చేయి. ప్రతి టీవీలోనూ మోడీ బొమ్మ కనపడేట్లు చేయించు. భక్తులకు ఆగ్రహం కలిగితే మనకే నష్టం ! శుభం మధ్యలో అశుభం వినపడకూడదని శాస్త్రాలో ఘోషిస్తున్నాయి. అందుకే మంగళవాద్యాలను పెద్దగా వినిపిస్తారు. ఇప్పుడు మోడీ గారీకి అంతే ! శుభం పక్కనే అశుభం కూడా కాచుకు కూర్చుంటుంది గానీ చెప్పాల్సి వచ్చినపుడు ముందుగా చెప్పాల్సింది శుభాలే, జనానికి అశుభాలు అనుభవంలోకి వచ్చినపుడే మనం వాటి చిట్టా విప్పాలి. అందుకే కొత్తగా ప్రెస్‌ నుంచి వచ్చిన ఆ పుస్తకాలను పొరపాటున కూడా అప్పుడే బయటపెట్టవద్దు !

తిరుగులేని ఎల్‌డిఎఫ్‌ – తాజా సర్వే సైతం నిర్ధారణ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


గతంలో వెల్లడైన సర్వేలు, తాజాగా వెల్లడైన మాతృభూమి సర్వే కూడా ఎల్‌డిఎఫ్‌ విజయాన్ని నిర్ధారించిందని అయితే కార్యకర్తలెవరూ ఆదమరిచి ఉండరాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ హెచ్చరించారు. ఎల్‌డిఎఫ్‌కు 75-83, యుడిఎఫ్‌కు 56-64 మధ్య, బిజెపికి రెండు వస్తాయని మాతృభూమి సి ఓటర్‌ సర్వే తాజాగా పేర్కొన్నది. అన్ని సర్వేల సారం ఎల్‌డిఎఫ్‌ కొనసాగింపేనని, సిపిఎం చెప్పింది నిజమని వెల్లడిస్తున్నాయని, అయితే గట్టిపోటీ జరగనున్నందున కార్యకర్తలు జాగరూకులై ఉండాలని బాలకృష్ణన్‌ చెప్పారు.
కేరళ విభాగం పని తీరుపట్ల కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమంలో ఎల్‌డిఎఫ్‌ ఎంతో ముందున్నదని కాంగ్రెస్‌ కిలోమీటర్ల దూరం వెనుక ఉందని, చేస్తున్న ప్రచారం కూడా క్రమశిక్షణతో లేదని పద్దతి ప్రకారం జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(మణి) బయటకు పోవటాన్ని తీవ్రంగా పరిగణించలేదని, పది సీట్లలో పోటీ చేస్తూ మిగిలిన జోసెఫ్‌ వర్గానికి పోటీ చేసేందుకు అసలు గుర్తే లేకపోయినా పట్టించుకోలేదని మండిపడింది. గత మూడు ఎన్నికల్లోనూ పార్టీకి 40సీట్లకు మించి రాలేదని, ఈ సారి 50 వస్తాయని ఏవిధంగా చెబుతున్నారని అడిగింది. ఎల్‌డిఎఫ్‌ కేవలం అభివృద్ధి నినాదంతో ముందుకు పోతుంటే దానికి ధీటుగా పార్టీ సమాధానం లేదని పేర్కొన్నట్లు వెల్లడైంది.ఫిరాయింపుల నిరోధక చట్టం వేటును తప్పించుకొనేందుకు నామినేషన్లు దాఖలు చేసే ముందు జోసెఫ్‌ వర్గానికి చెందిన ఎంఎల్‌ఏలు పిజె జోసెఫ్‌, మనోజ్‌ జోసెఫ్‌ ఎంఎల్‌ఏలుగా రాజీనామా చేశారు.

శబరిమల వివాదాన్ని ముందుకు తెచ్చే యత్నం !


ప్రస్తుతం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్న శబరిమల అయ్యప్ప దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ సమస్యపై లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి రెండూ ప్రయత్నిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే శబరిమల సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్నే తీసుకువస్తామని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఆ సమస్య ప్రస్తావనే లేకుండా అంతకు ముందు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రణాళికను వెల్లడించింది. ” మతశక్తులను ప్రతిఘటించేందుకు,ఓడించేందుకు దైవం పట్ల విశ్వాసం ఉన్నవారు కూడా ఒక ఐక్య సంఘటనగా ముందుకు రావాలి. అన్ని మతాల విశ్వాసుల నమ్మకాలను రక్షించేందుకు వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అన్ని చర్యలూ తీసుకుంటుంది.ఏ మతం పట్ల విశ్వాసం లేని వారు కూడా ప్రశాంతంగా జీవించేందుకు వీలుకల్పిస్తుంది. ” అని పేర్కొన్నది. తమ ప్రభుత్వం పట్ల విశ్వాసులు ఎలాంటి సందేహాలను పెట్టుకోనవసరం లేదని, శబరిమల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత దాని అమలు గురించి అందరితో చర్చించిన తరువాతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదే పదే ప్రభుత్వ, సిపిఎం వైఖరినీ స్పష్టం చేస్తున్నారు. సమస్య సుప్రీం కోర్టులో ఉన్నందున ఈ అంశం అసలు చర్చనీయాంశమే కాదన్నారు. ఇది రాస్తున్న సమయానికి బిజెపి ఎన్నికల ప్రణాళిక ఇంకా విడుదల కాలేదు. అయితే దాని అజెండా బహిరంగమే కనుక శబరిమల అంశం లేకుండా ఉండదన్నది స్పష్టం. బిజెపికి మద్దతు ఇస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ శబరిమల అంశాన్ని ఎన్నికల్లో ముందుకు తెచ్చే యత్నాల్లో భాగంగా రాజధాని తిరువనంతపురంలో నామజపం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. 2018లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడా నామజపం పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో బిజెపి, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హింసాకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సంవత్సరం జరిగిన ఉదంతాలు తనతో సహా అందరినీ బాధించాయని, జరిగి ఉండాల్సింది కాదని దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన వ్యాఖ్యలను రచ్చ చేసి రాజకీయ లబ్ది పొందాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక శక్తులు చూస్తున్నాయి. సంక్షేమ-అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రానున్న ఐదు సంవత్సరాలలో అమలు జరపనున్న కార్యక్రమాలతో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది.

ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం !


కమ్యూనిస్టులను రెచ్చగొట్టటం, ప్రతిఘటిస్తే తమపై దాడులు చేశారంటూ యాగీ చేయటం కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఎత్తుగడల్లో భాగం అన్నది విమర్శ. దాన్ని ఈ ఎన్నికల్లో కూడా అమలు జరిపేందుకు పూనుకున్నారు. తిరువాన్కూర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేయటానికి తిరస్కరించిన సిపి రామస్వామి అయ్యర్‌ చర్యకు నిరసనగా జరిగిన పోరు పున్నప్ర-వయలార్‌ పోరాటంగా ప్రసిద్ది పొందిన విషయం తెలిసిందే. నైజాం సంస్ధానంలో దోపిడీ నుంచి విముక్తికోసం కమ్యూనిస్టు పార్టీ పోరాడితే అదే సమయంలో కేరళలో 1946లో సంస్దాన విలీనం కోసం కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన పోరులో వెయ్యిమందికి పైగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం మరణించారు.కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అలప్పూజలో ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు. దాన్ని సిపిఎం-సిపిఐ రెండూ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అలప్పూజ బిజెపి అభ్యర్ధి సందీప్‌ వాచస్పతి అక్కడికి వెళ్లి అంజలి ఘటించారు. కమ్యూనిస్టు అమరజీవులను గౌరవిస్తూ ఎవరైనా ఆపని చేస్తే అభ్యంతరం లేదు. కానీ భారతమాతాకి జై అనే నినాదాలతో కమ్యూనిస్టుల నాయకత్వాన పోరు పేరుతో అమాయక దళితుల, వెనుకబడిన తరగతుల వారి ప్రాణాలను బలిపెట్టారని, కమ్యూనిస్టునేతలు పారిపోయి అతి పెద్ద ద్రోహం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టులను రెచ్చగొట్టేందుకు తప్ప మరొకందుకు కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. బిజెపి కుట్రను గ్రహించిన కార్యకర్తలు ఎంతో సంయమనం పాటించారని అభినందించారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి మనోభావాలను బిజెపి గాయపరచిందని అన్నారు. స్మారక కేంద్రంలోకి అక్రమంగా చొరబడ్డారని సిపిఎం విమర్శించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజెపి అభ్యర్ధి చర్యకు నిరసనగా సిపిఎం కార్యకర్తలు ప్రదర్శన జరుపుతుండగా వారిని రెచ్చగొట్టేందుకు పక్కనే ఉన్న మరొక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్ది అనూప్‌ అంటోని పనిగట్టుకొని ప్రదర్శనవైపు రాగా కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. దాన్ని తనపై దాడిగా చిత్రిస్తూ ఆసుపత్రిలో చేరటం వంటి నాటకానికి తెరలేపారని విమర్శలు వచ్చాయి. ఆంటోని కారు బానెట్‌ను కొందరు కొట్టారు తప్ప అతని మీద భౌతికదాడి జరగలేదని పోలీసులు ప్రకటించారు.

పినరయి విజయన్‌ ప్రచార తీరే వేరు !


ఎన్నికలలో పినరయి విజయన్‌ ప్రచార తీరు ఎందరినో ఆకర్షిస్తున్నది. రాజకీయంగా వ్యతిరేకించే మీడియా కూడా దాన్ని గుర్తించింది. విజయన్‌ కొన్ని సెకండ్ల పాటు ఒక సారి తన చేతి వాచ్‌ను చూశారంటే కార్యక్రమం ప్రారంభం లేదా ముగిసినట్లే లెక్క. పత్రికా గోష్టి అయినా, మరొక కార్యక్రమం అయినా నిర్ణీత ప్రకారం ముగియాల్సిందే.ప్రారంభం కూడా అంతే. పత్రికా గోష్టికి 45నిమిషాలు,దానిలో ప్రశ్నలు, సమాధానాలకు పదిహేను నిమిషాలు, ఎన్నికల ప్రసంగం 45నిమిషాల్లో ముగియాల్సిందే. నలభైమూడు నిమిషాలు అభివృద్ధి, ఇతర అంశాలను మాట్లాడిన తరువాత చివరి రెండు నిమిషాల్లో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులకు ఓటు ఎందుకు వేయాలో అభ్యర్ధిస్తారు. విజయన్‌ ప్రాంగణంలోకి రాగానే నినాదాలు, ఈలలు మోతలతో హౌరెత్తుతుంది. వేదిక మీదకు వస్తుండా అప్పటికే ఉన్న నేతలు గౌరవ సూచకంగా లేచి నిలుచుంటారు. వెంటనే ఒక చిన్న పాప వచ్చి గులాబి పువ్వు అంద చేసిన తరువాత పిడికిలి బిగించి అభివాదం చేస్తుంది. ముళ్లు ఏవైనా ఉంటే గుచ్చుకోకుండా విజయన్‌ దాన్ని జాగ్రత్తగా స్వీకరిస్తారు. విజయన్‌కు ప్రత్యేకంగా ఒక మైక్‌ను అమరుస్తారు, దాన్నే తరువాత సభలకూ తీసుకువెళతారు. సభికులు ఎంతో క్రమశిక్షణగా కూర్చుని వుపన్యాసాలను వింటారు. అనేక అంశాలపై కాంగ్రెస్‌ నేతలు ఉదయం ఒక విషయం చెబితే సాయంత్రం బిజెపి నేతలు వాటినే చెబుతారు. బిజెపి నేతలు ఉదయం చెప్పిన వాటిని కాంగ్రెస్‌ నేతలు సాయంత్రం చెబుతారు, రెండు పార్టీలు పరస్పరం ఈ విధంగా సహకరించుకుంటున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రెండు పార్టీల తీరుతెన్నులను వర్ణించారు.

మూడు చోట్ల బిజెపికి నామినేషన్ల ఎదురుదెబ్బ !


మూడు నియోజకవర్గాలలో బిజెపికి నామినేషన్ల సమయంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక తలసెరి, గురువాయూర్‌, దేవీకుళంలో సరిగా లేని కారణంగా నామినేషన్లను తిరస్కరించారు. మూడు చోట్లా డమ్మీ అభ్యర్దులు లేకపోవటం లేదా వారి నామినేషన్లు కూడా చెల్లలేదు. ఈ పరిణామంపై పార్టీ కేంద్ర నేతలకు ఏ కారణం చెప్పాలా అని తలలు పట్టుకుంటున్నారు. కన్నూరు జిల్లాలో గత ఎన్నికల్లో తలసెరిలో 22వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఈనెల 25న అక్కడ అమిత్‌ షా సభ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు అసలు అభ్యర్దే లేకపోవటంతో ఏమి చెయ్యాలో తోచని స్ధితిలో పడ్డారు.తలసెరి నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలుత సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన విఆర్‌ కృష్ణయ్యర్‌ సిపిఐ తరఫున 1957, 1960లో గెలిచారు. అప్పటి నుంచి మధ్యలో ఒకసారి సిపిఐ అభ్యర్ధి తప్ప ఇంతవరకు సిపిఎం నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి ఇకె నయనార్‌, ఐదుసార్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియర్‌ బాలకృష్ణన్‌ ప్రాతినిధ్యం వహించారు. మిగతా అన్ని నియోజకవర్గాలలో సక్రమంగా నామినేషన్లు వేసిన బిజెపి తలసెరీలో తప్పులతడగా వేయటం వెనుక కాంగ్రెస్‌తో కుమ్మక్కును వెల్లడిస్తున్నదని సిపిఎం కన్నూరు జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ చెప్పారు. దేవీకుళంలో బిజెపి మిత్రపక్షమైన అన్నాడిఎంకెకు సీటు ఇవ్వగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దాంతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్ధిని బలపరచాలని బిజెపి నిర్ణయించింది. తలసెరి, గురువాయూర్‌ సీట్ల గురించి హైకోర్టుకు ఎక్కింది.

ప్రత్యర్ధుల వలలో పడవద్దు -సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఎల్‌డిఎఫ్‌ సూచన !


ప్రత్యర్ధి పార్టీలు, వ్యక్తులు రెచ్చగొట్టేందుకు పూనుకుంటారని అందువలన వారికి సమాధానం ఇచ్చే పేరుతో వారి వలలో చిక్కుకోవద్దని ఎల్‌డిఎఫ్‌ తన సామాజిక మాధ్యమ కార్యకర్తలకు సూచింది. ప్రత్యర్ధులపై దూషణలకు పాల్పడవద్దని, అసలు వారి గురించి పట్టించుకోవద్దని, ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయాలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలను గుళికలుగా విడగొట్టి సులభంగా, వెంటనే చదువుకొనే విధంగా తయారు చేసి ప్రచారం చేయాలని పేర్కొన్నది. కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ నీమమ్‌ నియోజకవర్గంలో పోటీ చేయకుండా పుతపల్లికే పరిమితం కావాలని కొందరు కార్యకర్తలు ఆయన ఇంటి మీదకు ఎక్కి కిందికి దూకుతామని బెదిరించిన విషయం తెలిసిందే. దాని మీద ఊమెన్‌ చాందీ ఇంటి మీది పెంకులను మరమ్మతు చేసేందుకు యుడిఎఫ్‌ ప్రయత్నిస్తున్నదంటూ ఎద్దేవా చేస్తూ పెట్టిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాని ఎల్‌డిఎఫ్‌ కోరింది. అలాగే పున్నప్ర-వయలార్‌ కమ్యూనిస్టు అమరజీవుల స్మారకకేంద్రంలో ప్రవేశించిన బిజెపి అభ్యర్ధి జనం, కార్యకర్తల మనోభావాలను గాయపరచినప్పటికీ అతగాడిని తూలనాడుతూ కొందరు పోస్టులు పెట్టటం మంచిది కాదని, ప్రత్యర్ధుల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించింది.

మైనారిటీ మతాల సంతుష్టీకరణ పనిలో బిజెపి !


మైనారిటీ మతాల వారికి పూర్తి మద్దతు ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ చెప్పారు. జాకోబిన్‌ చర్చి వివాదంలో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేమని, దగ్గరిదారులు లేవని అయితే ఆర్దోడాక్స్‌ వర్గానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ముస్లింలీగు, బిజెపి కుమ్మక్కయిన మాట నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలో పడవేశాయి. ఆయనను విమర్శించలేని-సమర్ధించలేని స్దితిలో పడిపోయారు. తాను మాట్లాడే మాటలు వాటి విలువ ఏమిటో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో రాజగోపాల్‌ తెలుసుకోవటం లేదని బిజెపి సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ వినియోగించటాన్ని ముకుందన్‌ తప్పుపట్టారు. సురేంద్రన్‌ ఇంకా ప్రజానాయకుడిగా ఎదగలేదు. హెలికాప్టర్‌ వినియోగాన్ని కార్యకర్తలు మెచ్చరు అన్నారు.

పసుపు బోర్డు -బిజెపి నేతల పచ్చి అవాస్తవాలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
వాగ్దానం చేసినట్లుగా నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకురావటంలో విఫలమైన బిజెపి నేతలు రైతాంగానికి సంతృప్తి కలిగించే సమాధానం చెబుతున్నారా ? తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఇతర పార్టీల మీద ఎదురుదాడి చేస్తున్నారా ? పసుపు బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ విస్తరణ కార్యాలయమే రైతులకు మేలు చేస్తుందని చెప్పటం ద్వారా రైతులను మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ? ఒక్క సమస్య – వంద ప్రశ్నలు అన్నట్లుగా బిజెపి ముందుకు వచ్చాయి . చేసిన వాగ్దానాన్ని అదీ బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చిన దాని సాధన లేదా వాగ్దానం అమలు గురించి ఎవరూ అడగ కూడదా ! అసలు పసుపు బోర్డు కథేమిటి ? బిజెపి నేతల ప్రచారంలో నిజానిజాలేమిటి ? తెలిసి కూడా రైతాంగం, సాధారణ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా ? ఒక్కో అంశాన్ని చూద్దాం !


బిజెపి నేత ధర్మపురి అరవింద్‌ పసుపు బోర్డు వాగ్దానాన్ని ఎందుకు ముందుకు తెచ్చారు ?


2019లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో మిగతా ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌ మార్కెట్లో కూడా పసుపు ధరలు పడిపోయాయి. అప్పుడు కూడా అధికారంలో ఉన్నది నరేంద్రమోడీ సర్కారే.2018లో పసుపు ధరలు పెరగటంతో రైతాంగం పెద్ద మొత్తంలో సాగు చేశారు. దాంతో 2019 మార్కెట్‌ సీజన్‌లో అంతకు ముందు వచ్చిన ధర కంటే నాలుగో వంతు పడిపోయింది. రైతులు ఆందోళనలకు దిగారు. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. పసుపు రైతుల ఓట్లను కొల్లగొట్టాలంటే ధర రాకపోవటానికి బోర్డు లేకపోవటమే కారణమని, కేంద్రంలో అధికారంలో ఉన్నాము గనుక తనను గెలిపిస్తే బోర్టు ఏర్పాటు చేయిస్తానని ధర్మపురి అరవింద్‌ బాండ్‌ పేపర్‌ మీద రాసి రైతులను నమ్మించారు. దాన్ని ఊరూరా చూపి ఓట్లడిగారు. బోర్డు ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రకటించటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు పసుపు బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయ ఏర్పాటే ఎక్కువ ప్రయోజనమని, అది పసుపు ఒక్కదానికే గాక అల్లం వంటి పంటల రైతులకు కూడా ఉపయోగమని చెబుతున్నారు.


పసుపు బోర్డు రాదని బిజెపి నేతలకు తెలియదా ? ఇప్పటికీ రైతులను మభ్యపరుస్తున్నారా ?


పూర్తిగా తెలుసు, అంత అమాయకులు కాదు. ముందే చెప్పినట్లు ఇప్పటికీ రైతులను మభ్యపరుస్తున్నారు. ఏలకుల కోసం 1968 నుంచి పని చేస్తున్న బోర్డును విస్తరించి పసుపుతో సహా 52 సుగంధ ద్రవ్యాల కోసం 1986లో ఒక చట్టాన్ని చేసి మరుసటి ఏడాది సుగంధద్రవ్యాల బోర్డును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అది సుగంధ ద్రవ్యాల దిగుబడులు పెంచటం, మార్కెటింగ్‌, ఎగుమతుల కోసం పని చేస్తున్నది. సుగంధ ద్రవ్యాల తరగతి కిందకు వచ్చే 52 పంటలలో మిర్చిది అగ్రస్దానం. గతంలో ఒకదానికి ఉన్న బోర్డును అన్నింటికీ విస్తరించినపుడు వాటిలో ఒకదానికి ప్రత్యేకంగా తిరిగి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అవకాశాలు లేవు. మిర్చికి లేని బోర్డును పసుపు ఏర్పాటు చేసే అవకాశాలే లేవు. అయినా పసుపు రైతులను అమాయకుల కింద జమకట్టి బాండ్లను రాసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు అనుకోవటంలో తప్పులేదు. రైతులు ఎదుర్కొంటున్న ధరల అస్ధిరత సమస్య బోర్డు లేనందు వలన కాదు, ప్రభుత్వ విధానాలే పరిష్కారమని తెలియచెప్పాల్సిన వారు, తప్పుదారి పట్టించారు.


సుగంధ ద్రవ్యాలలో పసుపు వాటా ఎంత ?


పసుపు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మనదే అగ్రస్ధానం. సుగంధ ద్రవ్యాలన్నింటినీ మన దేశంలోనే వినియోగించే అవకాశం లేదు. విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా విలువై విదేశీ మారకద్రవ్యాన్ని రైతులు సమకూర్చుతున్నారు. నరేంద్రమోడీ ఏలుబడిలో కొన్ని సుగంధ ద్రవ్యాల ఎగుమతులు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా వస్తున్న ఆదాయం ఎలా ఉందో చూద్దాం. (2019-20 సంవత్సర అంకెలు ప్రభుత్వ లక్ష్యాలు, మిగిలినవి వాస్తవ అంకెలు. సరకు పరిమాణం టన్నులలో, విలువ కోట్ల రూపాయల్లో ఉంది.
సరకు సంవత్సరం సంవత్సరం సంవత్సరం సంవత్సరం సంవత్సరం
2015-16×××2016-17 ××× 2017-18 ×××2018-19××× 2019-20
టన్నులు- కోట్లలో×టన్నులు- కోట్లలో×టన్నులు- కోట్లలో×టన్నులు-కోట్లలో×టన్నులు-కోట్లలో
మిర్చి 3,47,500-3,997×4,00,250-5,070×4,43,900-4,256×4,685-5,411×4,84,000-6,221
జిలకర 97,970-1,531×1,19,000-1,963×1,43,670-2,418×1,80,300-2,885×2,10,000-3,225
పసుపు 88,500-921×1,16,500-1,242×1,07,300-1,035×1,33,600-1,416×1,36,000-1,215
మిరియాలు 28,100-1,730×17,600-1,143×16,840-820× 13,540- 568×16,250-519
ఏలకులు 6,100-525×× 4,630-541 ×× 6.440-664 ×× 3,710-417 ××3,190-493

ప్రాంతీయ విస్తరణ కార్యాలయం పసుపు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందా ?


ముందే చెప్పుకున్నట్లు బోర్డు పరిధిలోకి తెచ్చిన 52 సుగంధ ద్రవ్యాల కోసం పని చేసేందుకే ఆ బోర్డు పని చేస్తున్నది. అది సక్రమంగా పని చేస్తున్నదా లేదా అన్న అంశం మీద తేడాలుండవచ్చు తప్ప ప్రత్యేకంగా నిజామాబాద్‌ కార్యాలయం కొత్తగా చేసేదేమీ ఉండదు, ఇతర కార్యాలయాలకు మించి దానికి ప్రత్యేక అధికారాలేమీ ఉండవు. కార్యాలయ బోర్డును చూపి జనాన్ని మభ్యపెట్టటం తప్ప మరొకటి కాదు. ఈ కార్యాలయం ఏర్పాటు చేయక ముందే కొన్ని కొత్త రకాలను రూపొందించి రైతులకు అందచేశారు, చేస్తున్నారు, పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి.బోర్డు కంటే సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయం ద్వారా ఎక్కువ లబ్ది చేకూరుతుందని మరో అబద్దాన్ని చెబుతున్నారు. ఇది మరీ అన్యాయం నరేంద్రమోడీ కంటే ఒక ఎంపీకి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పటమే ఇది. మిర్చి, పసుపు వంటి పంటలకు అసలు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలనే ప్రకటించలేదు. అందువలన బోర్డు అయినా ప్రాంతీయ కార్యాలయం అయినా ఈ విషయంలో చేసేదేమీ లేదు.


పసుపు ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందా ? ధరలకోసం ఎంపీ పోరాటం చేశారా ?


బిజెపి నేతలు కొన్ని టీవీ చర్చలలో చెప్పిన అంశాలను చూస్తే ఎంత అలవోకగా అసత్యాలు చెప్పగలరో అర్ధం చేసుకోవచ్చు. పసుపు ఎగుమతులను నరేంద్రమోడీ సర్కార్‌ నిషేధించిన కారణంగానే ధరలు పెరిగాయంటూ మాట్లాడే మేక కథలు చెబుతున్నారు, అందుకోసం తమ ఎంపీ అరవింద్‌ పోరాటం చేశారని చెప్పుకుంటున్నారు. ధరలు పెరిగినందున రైతులు పాలాభిషేకం చేశారని చెబుతున్నారు. మొదటి విషయం పసుపు ఎగుమతులను కేంద్రం నిషేధించలేదు. మన పసుపును దిగుమతి చేసుకోకూడదని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించటంతో పక్కనే ఉన్న తమిళనాడు రైతులు నష్టపోయారని వార్తలు వచ్చాయి. ప్రపంచ నేతగా ఎంతో ప్రభావితం చూపుతున్నారని లేని గొప్పలను ఆపాదిస్తున్న వారు నరేంద్రమోడీ గారు కనీసం శ్రీలంక నిషేధాన్ని కూడా ఎత్తివేయించలేకపోయారన్నది అసలు నిజం. ధరల కోసం ఎంపీ చేసింది ఏమిటో రైతులకు ఎప్పుడూ, ఎక్కడా కనపడదు.పాలాభిషేకాలు చేయించుకోవటం ఈ రోజుల్లో ఎంతసులువో తెలిసిందే. దేశమంతటా పసుపు ధరలు పెరిగాయి. అన్నిచోట్లా ధర్మపురికి పాలాభిషేకాలు ఎందుకు చేయటం లేదు ? ఆంధ్రప్రదేశ్‌లో ఎంతవరకు అమలు చేస్తారో తెలియదు గానీ మిర్చికి క్వింటాలుకు రు.7,000, పసుపుకు రు.6,350 కంటే మార్కెట్లో ధరలు తగ్గితే ఆమేరకు తాము కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రపంచం దిగుమతి చేసుకొనే పసుపులో 80శాతం మనమే చేస్తున్నాము. దిగుమతుల ప్రశ్నేలేదు. ఇతన అనేక సుగంధ ద్రవ్యాలతో పాటు తమ దేశంలో పసుపు దిగుబడి పెంచే చర్యల్లో భాగంగా 2018 డిసెంబరు నుంచి మన పసుపు మీద కూడా శ్రీలంక నిషేధం విధించింది.అది తమిళనాడులో రాజకీయ అలజడులను కూడా సృష్టించింది. 2014 నుంచి బిజెపి మిత్రపక్షంగానే ఉంది. లంక నిషేధాన్ని ఎత్తివేయించాలని రెండు సంవత్సరాల నుంచి కోరుతున్నా నరేంద్రమోడీ ఆపని చేయించలేకపోయారు.
కాంగ్రెస్‌ పాలకులు పసుపు దిగుమతులు చేసి రైతాంగాన్ని దెబ్బతీశారా ?బిజెపి ఎంపీ కారణంగా ధరలు పెరిగాయా !
కాంగ్రెస్‌ అనేక తప్పులు చేసింది కనుక తమ వైఫల్యం ప్రతిదానికి గత కాంగ్రెస్‌ పాలకులే కారణం అని చెప్పటం బిజెపికి మామూలై పోయింది. అధికారానికి వచ్చి ఏడు సంవత్సరాలైంది కనుక ఆ పాచిపాటను మరీ ఎక్కువ సాగదీస్తే జనానికి చిరాకు తరువాత ఆగ్రహం వస్తుంది. గతంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పసుపు దిగుమతులు చేసి రైతులను దెబ్బతీసిందన్నట్లుగా కూడా ఎంపీ చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా ఎప్పుడు ఎంత దిగుమతి చేసుకుందో వివరిస్తే అసలు బండారం బయటపడుతుంది. మన దేశం ఎగుమతులు చేయటం తప్ప దిగుమతులు ఎన్నడూ లేవు. ఉంటే ఎవరైనా వివరాలు వెల్లడించవచ్చు.


పసుపు, చెరకు దోఫసలీ పంటల కిందకు వస్తాయి, అంటే సాగు వ్యవధి ఎక్కువగా ఉంటుంది. గతేడాది పడిన వర్షాలకారణంగా అనేక చోట్ల పంట దెబ్బతిన్నది.ఈ ఏడాది పంట ఉత్పత్తి నాలుగోవంతు పడిపోనుందన్నది వ్యాపారుల అంచనా దిగుబడి తగ్గనుందనే అంచనాతో రేట్లు పెరిగాయి తప్ప బిజెపి సర్కార్‌ లేదా ఎంపీ చేసిందేమీ లేదు. మన దేశంలోనే కాదు,ప్రపంచ వ్యాపితంగా పెరిగాయి. పెరిగిన ధరలతో రైతులు సంతృప్తి చెందారా అంటే అంతకు ముందు పతనమైన వాటితో పెరిగినపుడు కొంత సంతృప్తి ఉండటం సహజం. కానీ పెరిగిన ధరలెంత, వ్యవసాయ ఖర్చులెంత ? దానికి అనుగుణ్యంగా ధరలు పెరిగాయా ? ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ గారేమో ప్రభుత్వం వ్యాపారం చేసేందుకు కాదు అంటారు. మరోవైపు బిజెపి వారు వ్యాపారుల ధరలు తమవే అంటారు. ఒకే, వారి ప్రతిభే అనుకుంటే ఇంకా ధరలు ఎందుకు పెంచలేదు అనే ప్రశ్నకు వారు జవాబు చెప్పాల్సి ఉంటుంది.గతంలో ఇంతకంటే రైతులకు ఎక్కువ ధరలు వచ్చిన రోజులున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సమాచారం ప్రకారం 2008-09లో సగటు ధర క్వింటాలుకు రు.3,850 ఉంటే తరువాత రెండు సంవత్సరాలలో రు.11,000, 11,500లకు పెరిగింది, 2011-12లో పతనమై రూ.3,500, తరువాత నాలుగు సంవత్సరాలు రు.6,400 నుంచి రు.8,100కు పెరిగింది.2016-17లో రు.5,850,2017-18లో రు.5,575 పడిపోయాయి. ఈ కారణంగానే రైతుల్లో ఆందోళన తలెత్తింది. అదే పసుపు బోర్డు ప్రతిపాదన, వాగ్దానానికి దారి తీసింది. నరేంద్రమోడీ ఏలుబడిలో హెచ్చుతగ్గులకు కారణం ఏమిటి ? వీటికి కూడా కాంగ్రెస్‌ పాలనే కారణం అంటారా ? నేషనల్‌ కమోడిటీస్‌ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్సేంజ్‌లో (ముందస్తు మార్కెట్‌) లావాదేవీల సమాచారం ఎవరికైనా అందుబాటులో ఉంది. అనుమానాలు ఉన్న వారు చూసుకోవచ్చు. 2021 అంకెలు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ధరలు
సంవత్సరం ××××× క్వింటాలు కనిష్ట ధరలు రూ.
2004-2007××× 2,800-2,460
2008 ××××××× 3,084-3,894
2009 ××××××× 5,254 -10,756
2010 ××××××× 12,730 – 14,232
2011 ××××××× 9,550 – 4,410
2012 ××××××× 3,460 – 5,400
2013 ××××××× 6,704 – 5,330
2014 ××××××× 6,478- 6,800
2015 ××××××× 7,998 – 9,656
2016 ××××××× 8,728 – 6,998
2017 ××××××× 5,974 – 7,758
2018 ××××××× 6,800 – 6,230
2019 ××××××× 6,298 – 6,134
2020 ××××××× 5,730 – 5,700
2021 ××××××× 8,108 – 8,778
మార్చి పందొమ్మిదవ తేదీన ఏప్రిల్‌లో అందచేయాల్సిన పసుపు ధర రు.7,890-8,220 మధ్య ఉన్నది, అదే మేనెలలో అందచేయాల్సిన దాని ధర రు.7,960-8,300 మధ్య ఉన్నది. (కొనుగోలు-అమ్మకం దారుల మధ్య వాస్తవంగా సరకు లావాదేవీలే జరగనవసరం లేదు. ఒప్పందానికి అనుగుణ్యంగా ధరల తేడాను చెల్లించటమే ముందుస్తు మార్కెట్లో సాధారణంగా జరుగుతుంది.ఏది వాటంగా ఉంటే దాన్ని కోరవచ్చు) ఈ ధరలకు అనుగుణ్యంగానే నిజామాబాద్‌, దుగ్గిరాల, కడప, ఈరోడ్‌, సాంగ్లీ వంటి మార్కెట్లలో ధరలు ఉంటాయి. నాణ్యతను బట్టి హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. ముందస్తు – ఏరోజుకు ఆరోజు కొనుగోలు చేసే ధరల్లో కూడా తేడా ఉంటాయి. జనవరి మొదటి వారంలో ఉన్న ముందస్తు ధర రు.5,580 నుంచి 5,725 వరకు ఉన్న ధరలతో పోల్చితే తరువాత పెరిగింది. సరకు మార్కెట్‌కు వచ్చే దాన్ని బట్టి రాబోయే రోజుల్లో తగ్గవచ్చు, మరికాస్త పెరగవచ్చు. వీటిని చూపి అది తమ ప్రతిభే అని బిజెపి నేతలు చెప్పుకోవటమే విచిత్రం, విపరీతం. పసుపు బోర్డు గురించి పార్లమెంటులో తెరాస, కాంగ్రెస్‌ ఎంపీలు అడగటమే దేశద్రోహం అన్నట్లుగా బిజెపి ఎంపీ అరవింద్‌ విరుచుకుపడ్డారు. పేరుకు పసుపు బోర్డు అంశం మాట్లాడిందంతా సంబంధం లేని విషయాలు.నిండా మునిగిన వారికి చలేమిటి అన్న సామెత తెలిసిందే. పసుపు బోర్డు విషయంలో తెలంగాణా రైతాంగాన్ని నిండా ముంచిన వారికి చలేముంటుంది ! లేకపోగా ఎదురుదాడులకు దిగుతున్నారు !! ఇదే ప్రమాదకర పోకడ !!!

కాంగ్రెస్‌, ముస్లింలీగుతో కుమ్మక్కు నిజమే : బిజెపి ఎంఎల్‌ఏ రాజగోపాల్

Tags

, , , , , ,

‌
ఎం కోటేశ్వరరావు


సిపిఎంను ఓడించేందుకు తాము గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ముస్లింలీగుతో చేతులు కలిపిన మాట నిజమే అని కేరళలో ప్రధమ బిజెపి ఎంఎల్‌ఏ,91 సంవత్సరాల సీనియర్‌నేత ఓ రాజగోపాల్‌ వెల్లడించారు. గతంలో ఇదే విషయాన్ని సిపిఐ(ఎం) అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు బిజెపి నేత నోటి నుంచి ఆ విషయం వెల్లడి కావటంతో మూడు పార్టీలు ఇరకాటంలో పడ్డాయని చెప్పవచ్చు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆరోపణ గురించి స్పందించాలని ఒక టీవీ ఛానల్‌ అడిగినపుడు రాజగోపాల్‌ గతం గురించి చెప్పారు.గతంలో అనేక సందర్భాలలో కొన్ని స్ధానాలలో మూడు పార్టీలు సహకరించుకోవటం బహిరంగ అంశమే. మూడు పార్టీలు కలసి వ్యవహరించపోయినా సిపిఎం ఓటమికి గాను బిజెపికి ఓట్లు పడేందుకు ఒకరికొకరు సహకరించుకున్నారు,ఒత్తపాలెం, మంజేశ్వరం వంటి నియోజకవర్గాలు వాటిలో ఉన్నాయి. ఆ మేరకు బిజెపికి లబ్ది చేకూరిందని రాజగోపాల్‌ వెల్లడించారు. ఈ విషయం కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసని, అలా లబ్దిపొందటం తప్పుకానేకాదని కూడా ఉద్ఘాటించారు. నీమమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ది కె మురళీధరన్‌ బలమైన అభ్యర్ధి అని కూడా వ్యాఖ్యానించి పార్టీని, అక్కడ పోటీ చేస్తున్న కుమనం రాజశేఖర్‌ను కూడా ఇబ్బందిలోకి నెట్టారు. బిజెపి ప్రధాన శత్రువు కాదని గతంలో ముస్లిం లీగు చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గుర్తు చేశారు. బిజెపికి లబ్ది చేకూర్చేవిధంగా లీగు-కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయన్నారు. గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అదేవిధంగా జతకట్టారని అవవిత్ర కూటమిని ఓ రాజగోపాల్‌ నిర్దారించారని విజయన్‌ చెప్పారు. సిఎఎకు వ్యతిరేకంగా తొలుత ప్రకటించింది ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే అన్నారు. బిజెపి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉమ్మడిగా నిరసన తెలపాలని తాము కోరగా కాంగ్రెస్‌, లీగు తిరస్కరించాయని చెప్పారు. రాజగోపాల్‌ చెప్పిన అంశంపై బిజెపి, ముస్లిం లీగు, కాంగ్రెస్‌ మౌనందాల్చాయి.


ఓ రాజగోపాల్‌ చెప్పిన అంశాలతో దిక్కుతోచని బిజెపి సరికొత్త అవాస్తవాల ప్రచారానికి తెరలేపింది. బిజెపి-సిపిఎం కలసి పని చేయటం అందరికీ తెలిసిందేనని, ఇదేమీ కొత్తకాదని, తమ పార్టీనేత కెజి మరార్‌ గతంలో ఉడుమ నియోజకవర్గంలో పోటీ చేసినపుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్‌ ప్రధాన ఏజంట్‌గా మరార్‌ తరఫున పని చేశారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ పచ్చి అవాస్తవాలను చెప్పారు. 1977లో మరార్‌ ఉడుమలో పోటీ చేశారు. అప్పటికి అసలు బిజెపి పుట్టనేలేదు. జనతా పార్టీ అభ్యర్దిగా మరార్‌ పోటీ చేశారు. ఆ సమయంలో జనతా పార్టీలో ఎవరున్నారు అనేదానితో నిమిత్తం లేకుండా అత్యవసర పరిస్దితిని వ్యతిరేకించిన వారితో కూడిన ఆ పార్టీని సిపిఎం బలపరిచింది. అదే సమయంలో సిపిఎంను కూడా జనతా పార్టీ బలపరిచింది. 1977లో పినరయి విజయన్‌ వేరే నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు.అందువలన మరార్‌కు ప్రధాన ఏజంట్‌గా ఉండే అవకాశమే లేదు. జనతా పార్టీలో అంతకు బిజెపి పూర్వరూపంగా ఉన్న జనసంఫ్‌ు తన మతతత్వ అజెండాను పక్కన పెట్టి విలీనమైన అంశం తెలిసిందే. తరువాత మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యత్వ వివాదం తలెత్తినపుడు తాము జనతా పార్టీకంటే ఆర్‌ఎస్‌ఎస్‌కే విధేయులమని ప్రకటించి బిజెపిని ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నడూ ఎక్కడా ఏ రూపంలోనూ బిజెపిని సిపిఎం బలపరచలేదు.


నాలుగు నియోజకవర్గాలలో సిపిఎం-బిజెపి కుమ్మక్కు అయినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత బాలశంకర్‌ చేసిన ఆధారం లేని ఆరోపణను ఆ సంస్ద నేతలే ఖండించారు. ప్రాంత కార్యవాV్‌ా గోపాలన్‌కుట్టి మాట్లాడుతూ బాలశంకర్‌ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించిన విషయం తనకు తెలియదని, దాని మీద ఎలాంటి వ్యాఖ్య చేయనని, అతని వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకుడిగా కొద్దికాలమే బాలశంకర్‌ పని చేశారని, ఆ మాటకు వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు కాని వారు కూడా సంపాదకులుగా పని చేశారని అన్నారు. బాలశంకర్‌ చెబుతున్న నాలుగు నియోజకవర్గాలలో ఇప్పుడు సిపిఎం ప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అందువలన బిజెపితో కుమ్మక్కు ఆరోపణకు అర్ధం లేదని సిపిఎం నేతలు చెప్పారు.


ధర్మదోమ్‌పై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న కన్నూరు జిల్లా ధర్మదోమ్‌లో పోటీకి ఎవరిని నిలపాలో మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్‌ ఎట్టకేలకు అభ్యర్దిని ఖరారు చేసింది. తొలుత అక్కడ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్ది దేవరాజన్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్‌ సూచింది. అయితే ప శ్చిమబెంగాల్లో సిపిఎం నాయకత్వంలోని ఉన్న ఫ్రంట్‌లో ఉన్న తాము ఇక్కడ కాంగ్రెస్‌తో ఉన్నప్పటికీ విజయన్‌ మీద పోటీ చేసేందుకు తాము సుముఖంగా లేమని ఆ పార్టీ చెప్పటంతో కాంగ్రెస్‌ ఖంగుతిన్నది. ఎవరిని నిలపాలా అని తర్జనభర్జన పడుతున్నది. కాలేజీ రోజుల నుంచి విజయన్‌కు ప్రత్యర్ధిగా ఉన్న కన్నూరు ఎంపీ సుధాకరన్‌ను పోటీకి నిలపాలని పార్టీ అధిష్టానం సూచించింది. అయితే వత్తిడి చేయవద్దని, పూర్తిగా అంగీకారమైతేనే ఖరారు చేయాలని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నీమమ్‌, ధర్మదోమ్‌లో బలమైన అభ్యర్దులను దింపటం ద్వారా తాము బిజెపి-సిపిఎంలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పేందుకు అవకాశం ఉంటుందన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడ.అధిష్టానం గట్టిగా కోరితే పరిశీలిస్తానని సుధాకరన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తానుకానట్లయితే తన అనుచరుడు రఘునాధ్‌ను పోటీకి నిలపాలని ప్రతిపాదిస్తున్నారని మీడియా పేర్కొన్నది. చివరికి అదే జరిగింది. తాను ధర్మదోమ్‌లో పోటీ చేస్తే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుందని, ఐదు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు వీలుండదని సుధాకరన్‌ చెప్పుకున్నారు. ఇప్పటికిప్పుడు అక్కడ పోటీ చేయటం కుదరదని ఎంతో ముందుగానే నిర్ణయించి ఉంటే అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ఉండేవాడినని కూడా చెప్పారు.


తాను ఎవరి ముందు అయినా ఎలాంటి అభిప్రాయాలనైనా వ్యక్తం చేయగల ధైర్యం ఉందని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ తమ పార్టీనేతలకు సవాలు విసిరారు. అభ్యర్ధుల ఎంపికలో సుధాకరన్‌ ఆశాభంగం చెందినట్లున్నారు, ఆయనకు రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితి తెలియదని సిఎల్‌పి నేత రమేష్‌ చెన్నితల చేసి వ్యాఖ్యాల మీద సుధాకరన్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ ఒక లెక్కలోది కాదని, ఆయన మీద పోటీ చేస్తానని తాను సీటును కోరలేదని, తనను ఎవరూ అడగనూ లేదన్నారు. ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు, పార్టీ కోసం త్యాగం చేసేందుకు సిద్దమే అన్నారు. పార్టీ అభ్యర్ధుల ఎంపిక మీద తనకు సంతృప్తి లేదని, దీనికి తాను ఎవరినీ నిందించటం లేదని చెప్పారు. సుధాకరన్‌ చేసిన వ్యాఖ్యల మీద తాను స్పందించదలచ లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. సీట్ల ఎంపిక ఉమ్మడిగానే జరిగిందని, గెలుపు అవకాశాలనే పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్‌సిపిలో చేరిన పిసి చాకో కన్నూరు ఎంపీ సుధాకరన్‌తో సహా అనేక మంది పార్టీ నుంచి వెలుపలికి వెళ్లే విషయాలను తనతో చర్చించారని అన్నారు. తాను ఎల్‌డిఎఫ్‌ తరఫున రాష్ట్రవ్యాపితంగా ప్రచారం చేస్తానన్నారు. తానసలు ఇటీవల చాకోతో మాట్లాడలేదని సుధాకరన్‌ వివరణ ఇచ్చారు.


మహిళలకు ఓడిపోయే సీట్లిచ్చిన యుడిఎఫ్‌ !


మహిళలకు యుడిఎఫ్‌ ప్రకటించిన పది స్ధానాలలో గతంలో ఎనిమిదింటిలో ఓడిపోయినవే ఉన్నాయి. ఇదే సమయంలో ఎల్‌డిఎఫ్‌ కేటాయించిన 15 స్ధానాలకు గాను పది గెలిచిన స్ధానాలు ఉన్నాయి. ఐదింటిలొ ఓడిపోయిన రెండు చోట్ల ఏడువేలలోపే తేడా ఉంది. ప్రస్తుతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్దానాలో యుడిఎఫ్‌ ఈసారి వారికి మొండి చేయి చూపింది. మహిళలకు కేటాయించిన వాటిలో ఆరు చోట్ల గత ఎన్నికల్లో యుడిఎఫ్‌ పది నుంచి 43వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. స్దానిక సంస్దల ఎన్నికలలో మహిళలకు 50 శాతం స్దానాలను రిజర్వు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికలలో గెలిచిన వారిలో 54శాతం మంది మహిళలు ఉండటం విశేషం. జమాయతుల్‌ ఉలేమా మహిళల పోటీ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నది. పాతిక సంవత్సరాల తరువాత ముస్లిం లీగు పోటీ చేస్తున్న 27 స్దానాలలో ఒకదానిలో మహిళను నిలిపింది.


శబరిమలను వివాదంగా ముందుకు తెచ్చే యత్నం !


శబరిమల దేవాలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ప్రభుత్వం అమలు జరిపింది తప్ప మరొకటి కాదని, దాని గురించి దేవాదాయశాఖ మంత్రి ఎందుకు విచారం ప్రకటించారో తనకు తెలియదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును అమలు జరపక ఏమి చెయ్యాలని ప్రశ్నించారు. శబరిమల సమస్య మీద ముఖ్యమంత్రి తన వైఖరి ఏమిటో వెల్లడించాలని బిజెపికి మద్దతు ఇస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటనలో కోరింది. భక్తులకు తెలుసుకొనే హక్కుందని పేర్కొన్నది. శబరిమల సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, దాని తీర్పు వెలువడిన తరువాత అందరితో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి విజయన్‌ గతంలోనే ప్రకటించినప్పటికీ ఎన్నికలలో దాన్నొక సమస్యగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఎన్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు. దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సుధాకరన్‌(సిపిఐ) పోటీ చేస్తున్న కజకోట్టమ్‌ నియోజకవర్గంలో బిజెపి అసంతృప్త నేత శోభా సురేంద్రన్‌ పోటీలో ఉన్నారు.
శబరిమల వివాదం ముగిసిన అంశమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్‌ చెప్పారు. ఈ వివాదాన్ని తమ మంత్రి లేవనెత్తలేదని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండటం కనీస మర్యాద అని ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్నవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిపిఐ నుంచి వెళ్లిపోయి బిజెపి అభ్యర్దులుగా మారిన వారి గురించి అడగ్గా సీటురాని వా రు అలా చేస్తున్నారని బిజెపికి అభ్యర్దులే దొరకని స్ధితి అన్నారు.


ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చిన కేరళ కాంగ్రెస్‌(టి) తమ పార్టీని యుడిఎఫ్‌ భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్‌(జె)లో విలీనం చేసినట్లు ఆ పార్టీనేత పిసి థామస్‌ ప్రకటించారు. అయితే అతని చుట్టూ కొంత మంది వ్యక్తులు తప్ప జనం లేరని ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత జోస్‌ మణి వ్యాఖ్యానించారు.బిజెపితో సంబంధాలను ఏర్పాటు చేసేందుకే యుడిఎఫ్‌లో చేరినట్లు మణి చెప్పారు. అసలు ఆ పార్టీకి రిజిస్ట్రేషన్‌ కూడా లేదని అన్నారు.నిజమైన కేరళ కాంగ్రెస్‌ ఏదో గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనమే తేల్చారని అన్నారు. త్రిపురలో బిజెపి, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మాదిరి కేరళలో ఈ ఎన్నికల్లో 70 స్ధానాలు వస్తాయని బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ జోశ్యం చెప్పారు.
కేరళ నుంచి రాజ్యసభకు ఏప్రిల్‌ 12న మూడు స్దానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో యుడిఎఫ్‌కు రెండు, ఎల్‌డిఎఫ్‌కు ఒకటి ఉన్నాయి. ఇప్పుడున్న బలాబలా ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు రెండు, యుడిఎఫ్‌కు ఒక స్దానం దక్కనుంది. యుడిఎఫ్‌లోని ముస్లింలీగు తన స్ధానానికి తిరిగి ప్రస్తుత అభ్యర్దినే ప్రకటించింది. రెండో స్ధానంలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం లేదు. ఎల్‌డిఎఫ్‌ తరఫున ప్రస్తుతం ఆలిండియా కిసాన్‌ సభలో ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న విజూ కృష్ణన్‌తో పాటు సిపిఎం సానుభూతి పరుడు చెరియన్‌ ఫిలిప్పును ఎంపిక చేయవచ్చని వార్తలు వచ్చాయి.

కేరళ ఎన్నికల దృశ్యం – ఆర్‌ఎస్‌ఎస్‌ క్రమశిక్షణ బండారం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో అధికారం కోసం పోటీ పడే ఎల్‌డిఎఫ్‌-యుడిఎఫ్‌ అభ్యర్ధుల గురించి కసరత్తు చేశాయంటే అర్ధం ఉంది. బిజెపి, దాని మిత్రపక్షాలు కూడా అదే ఫోజు పెట్టటం పెద్ద ప్రహసనం. తీరా జరిగిందేమిటి ? ఒక 31 సంవత్సరాల యువకుడు టీవీ చూస్తుండగా బిజెపి అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. దానిలో తన పేరు రాగానే ఒక్కసారి తనను తానే నమ్మలేకపోయాడు. స్ధానిక బిజెపి నేతలు, చుట్టుపక్కల వారు అతనికోసం వాకబు చేశారు. నేనేమిటి బిజెపి తరఫున పోటీ చేయటం ఏమిటి ? కనీసం ఆ పార్టీ సానుభూతి పరుడిని కూడా కాదు, నన్ను కనీసం సంప్రదించకుండా నా పేరు ప్రకటించటం ఏమిటని అతను ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని మీడియాతో కూడా చెప్పాడు. అతని పేరు మణికందన్‌, ఎంబిఏ డిగ్రీ కలిగి ఉద్యోగం చేస్తున్న ఒక గిరిజన యువకుడు.అతని పేరును వైనాడ్‌ జిల్లా మనంతనవాడి నియోజకవర్గ అభ్యర్ధిగా ప్రకటించారు. బిజెపి కసరత్తు బండారం ఏమిటో ఈ ఉదంతం బయట పెట్టింది. ఎవ్వరేమనుకుంటే మాకేటి సిగ్గు అంటే ఇదే కదా !

ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్‌-బిజెపి మచ్చ: పినరయి విజయన్‌

ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు లేదా కార్యకర్తల క్రమశిక్షణ బండారం ఏమిటో కూడా ఈ ఎన్నికలు బయట పెట్టాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఆర్గనైజర్‌ పత్రిక మాజీ సంపాదకుడు, బిజెపి జాతీయ శిక్షణా విభాగపు సహకన్వీనర్‌, ఆర్‌ బాలశంకర్‌కు అలపూజ జిల్లా చంగన్నూరు నియోజక సీటు ఇస్తామని బిజెపి చెప్పిందట.ఢిల్లీలో ఎక్కువ కాలం గడిపే బాలశంకర్‌ జనవరిలో రాష్ట్రానికి వచ్చి నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారభించారు. నరేంద్రమోడీ, అమిత్‌ షా చెప్పిన మేరకే తాను వచ్చానని మద్దతుదారులను కలిసినపుడు చెప్పారు. తీరా ఆ జిల్లా అధ్యక్షుడిని అక్కడ నిలిపారు. దానితో అగ్గిమీద గుగ్గిలంలా లేచిన బాలశంకర్‌ వీర శంకర్‌గా మారి ఇలాంటి నాయకత్వం ఉంటే కేరళలో మరో 30సంవత్సరాలున్నా పార్టీ అధికారంలోకి రాదు అని చిందులేశాడు. హిందూ, క్రైస్తవ మత సంస్ధల మద్దతు ఉంది, గెలిచే అవకాశాలున్నప్పటికీ పార్టీ నాయకత్వం సిపిఎంతో లాలూచీ పడి తనకు సీటు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్‌-సిపిఎం కుమ్మక్కయినట్లు బిజెపి చెబుతుంటే దాన్నే కాస్త మార్చి వెరైటీగా చెప్పారు. తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేయటంలో అందెవేసిన చేతులు చివరికి తమ పార్టీకే దాన్ని వర్తింప చేశాయి. రెండు చోట్ల పోటీ చేస్తున్న బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్ను ఒక చోట గెలిపించే విధంగా ,దాని బదులు చంగన్నూరులో సిపిఎంను గెలిపించే విధంగా కుమ్మక్కు అయ్యారని అరోపించారు. సీటు రాని కారణంగా ఆశాభంగం చెందిన బాలశంకర్‌ ఇతర నేతల వంటి వ్యక్తి కాదని అతన్ని రెచ్చగొట్టవద్దని కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ వ్యాఖ్యానించారు. బాలశంకర్‌కు గెలిచేంత సీను ఉంటే అధిష్టానం సీటు ఇచ్చే ఉండేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. బాలశంకర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌లో పెరిగిన వ్యక్తిగనుక తక్కువగా చూడవద్దని, అతనికి సీటు రాలేదు గనుక బిజెపి-సిపిఎం కుమ్మక్కు అయినట్లు ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారని నీమమ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి కె. మురళీ ధరన్‌ అన్నారు.
కాంగ్రెస్‌-బిజెపిలు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బాలశంకర్‌ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజాస్వామ్యం ఒక అమ్మకపు సరకుగా మారింది. కాంగ్రెస్‌ను ఒక సాధనంగా చేసుకొని బిజెపి గోవా, పుదుచ్చేరి, త్రిపురవంటి చోట్ల ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తున్నది. కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు బిజెపిలో చేరే దశకు ఆ పార్టీ చేరుకుంది. నీమమ్‌లో బిజెపికి వచ్చిన ఓట్లు ఏమయ్యాయి ? ఆ రెండు పార్టీల కుమ్మక్కుకు ఇది నిదర్శనం కాదా. అక్కడ కాంగ్రెస్‌ కొత్త అభ్యర్ధిని పోటీకి పెట్టింది. ఏం జరుగుతుందో చూద్దాం. మాకు ఎలాంటి ఆందోళనా లేదు అని విజయన్‌ అన్నారు. గతంలో కూడా బిజెపి సురేంద్రన్‌ రెండు చోట్ల పోటీచేశారని గుర్తు చేశారు. ఎల్‌డిఎఫ్‌ రెండో సారి అధికారంలోకి రావాలంటే బిజెపికి కొన్ని సీట్లు ఉండాలని అందుకే ఈ కుమ్మక్కని కాంగ్రెస్‌నేత, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ ఆరోపించారు. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు టోకున బిజెపికి అమ్ముడు పోతున్న నేపధ్యంలో తమకు కేరళలో 35 సీట్లు వస్తే చాలని బిజెపి నేత సురేంద్రన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తం మీద బాలశంకర్‌ తమ పార్టీ మీద ధ్వజమెత్తి సంచలనం సృష్టించారు. క్రమశిక్షణ గల సంస్దగా ఆర్‌ఎస్‌ఎస్‌, దాని ఉత్పత్తిగా బిజెపిలో ఉన్న నేతల బండారం ఏమిటో ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అధికారం వచ్చే అవకాశం ఏమాత్రం లేని చోటే ఇలా ఉంటే ఏలుబడి ఉన్న చోట ఎలా కొట్లాడుకుంటారో ఊహించుకోవలసిందే.

పగెలుస్తాననే విశ్వాసం లేదు- ఏదో ప్రధాని అడిగారు కనుక పోటీలో ఉన్నా – నటుడు సురేష్‌ గోపి !

ఎన్నికలలో పోటీ చేయాలని నాకు ఇప్పటికీ లేదు. గెలుస్తాననే విశ్వాసం కూడా లేదు. పార్టీ నేతలు బలవంతం చేసి మూడు నియోజకవర్గాల పేర్లు చెప్పి ఏదో ఒకదానిని ఎంచుకోమంటే త్రిసూర్‌ అన్నాను. ప్రధాని నరేంద్రమోడీ అడిగారు గనుక పార్టీకి నిబద్దుడైన కార్యకర్తగా పోటీచేస్తున్నా అని సిని నటుడు సురేష్‌ గోపి చెప్పారు. స్వల్ప అస్వస్తత తరువాత ఆసుపత్రి నుంచి విడుదలైన గోపి విలేకర్లతో మాట్లాడారు. ముందు నాకు ఆరోగ్యం ముఖ్యం, విశ్రాంతి కావాలి, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు వీలుగా కోవాలి. తరువాతనే ప్రచారం చేస్తా అని చెప్పారు. బలవంతంగా లేదా బెదరించి ఇలాంటి వారిని ఎందరిని పోటీలోకి దింపుతున్నారో కదా !తాను కోరుకున్న సీటు ఇవ్వకపోతే అసలు పోటీ చేయను అని బిజెపి మహిళా నేత శోభా సురేంద్రన్‌ పార్టీని బెదిరించారు. దాంతో చివరకు ఆమె కోరుకున్న సీటునే ఇచ్చారు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఉన్నట్లు మీడియా కథలు అల్లిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. అయితే రాష్ట్ర నాయకత్వంతో నిమిత్తం లేకుండానే అధిష్టానం ఆమెకు సీటు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రోజు శోభ మాట్లాడుతూ సీనియర్‌ నేతలు రాజగోపాల్‌, కుమనం రాజశేఖర్‌లకు ఇవ్వని బహుమతిని రాష్ట్ర అధ్యక్షుడు సరేంద్రన్‌కు ఇచ్చారు. రెండు చోట్ల పోటీ చేస్తున్న సురేంద్రన్‌కు ఇది సువర్ణ అవకాశమని, రెండు చోట్లా గెలవాలని కోరుకుంటున్నా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శోభ గనుక పోటీలో ఉండేట్లయితే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు వచ్చిన వార్తలను కె.సురేంద్రన్‌ ఖండించారు. ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో ఎన్నికల్లో హెలికాప్టర్లలో తిరుగుతుంటే తాను పార్టీ సమకూర్చిన డబ్బుతో హెలికాప్టర్‌ ద్వారా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు.

విద్యారంగంలో కేరళ వెనుకబడిందన్న త్రిపుర బిజెపి సిఎం !

త్రిపుర ముఖ్యమంత్రి, బిజెపి నేత విప్లవ కుమార్‌ దేవ్‌ బిజెపి ఎన్నికల ప్రచారంలో విద్యాపరంగా కేరళ వెనుకబడిపోయిందని చెప్పారు. కేంద్ర పధకాలను వేగంగా అమలు జరుపుతున్న కారణంగా త్రిపుర అభివృద్ధిలో కేరళ కంటే ముందున్నదని చెప్పుకున్నారు. అసలు ఒక్క స్దానం కూడా లేకుండా అధికారానికి ఎలా రాగలదో బిజెపి త్రిపురలో చూపిందని, ఇక్కడ ఒక సీటు ఉన్నందున అధికారంలోకి రావటం ఒక సమస్య కాదన్నారు. కమ్యూనిస్టుల పాలనలో కేరళకు ఒరిగిందేమీ లేదన్నారు.
తిరువనంతపురం పట్టణంలోని నీమమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ స్వయంగా పోటీకి దిగింది.గతంలో బిజెపి ఓ రాజగోపాల్‌తో కుమ్మక్కయి జెడియుకు సీటిచ్చి తన ఓట్లను బదలాయించి గెలుపుకు తోడ్పిడిందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడు, ఎంపీ అయిన మురళీధరన్‌ను పోటీకి నిలిపింది. బిజెపికి అతను గట్టి పోటీదారు అని బిజెపి ఎంఎల్‌ఏ ఓ రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు.తాను పోటీలో లేకున్నా పార్టీ అభ్యర్ది కుమనమ్‌ రాజశేఖర్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా అని చెప్పారు. నీమమ్‌లో చూపిన ధైర్యాన్ని ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న ధర్మదోమ్‌లో ఎందుకు చూపలేకపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ప్రశ్నించారు.

విజయన్‌పై పోటీకి పిరికి బారిన కన్నూరు ఎంపీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ తిరస్కారం !

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కన్నూరు జిల్లా ధర్మదోమ్‌లో పోటీ చేసేందుకు కన్నూరు ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె సుధాకరన్‌ వెన్ను చూపారు. అనేక మంది నేతలు, కార్యకర్తలు సుధాకరన్‌ అయితేనే విజయన్‌కు గట్టి పోటీ అని చెప్పగా తాను అందరి కోరికలను తీర్చలేనని అన్నారు. గట్టి పోటీ పెట్టవచ్చుకదా అని విలేకర్లు అడిగితే ఇదేమీ కుస్తీపోటీ కాదు, ఎన్నిక అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధి ఈసారి ముందుకు రాలేదు. దీంతో కాంగ్రెస్‌ తన మిత్రపక్షమైన ఫార్వర్డ్‌బ్లాక్‌ పోటీ చేసేందుకు ఆ స్ధానాన్ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే తమ అభ్యర్ధి అక్కడ పోటీలో ఉండరని ఆ పార్టీ ప్రకటించటంతో కాంగ్రెస్‌ అభ్యర్ధివేటలో పడింది. గత ఎన్నికల్లో ఇక్కడ విజయన్‌ 57శాతం ఓట్లు తెచ్చుకొని ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్‌ తన అభ్యర్దిని చివరి నిమిషంలో ప్రకటించే అవకాశం ఉంది.

సిపిఐకి రాజీనామా చేసి బిజెపి కూటమిలో పోటీ !

సిపిఐలో సీటు రాకపోవటంతో అలపూజ జిల్లాలో గతంలో జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడిగా పని చేసిన తంపి మెట్టుతార ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపి కూటమిలోని బిజెడిఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కేరళలో సిపిఎంకు బి టీమ్‌గా సిపిఐ పని చేస్తున్నదని ఆరోపించారు. తాను చేసిన ఫిర్యాదులను పార్టీ పట్టించుకోనందున రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌డిఏలోని పిసి ధామస్‌ కాంగ్రెస్‌ ఆ కూటమికి గుడ్‌బై చెప్పి యుడిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌(జె)లో చేరారు. గతంలో నాలుగు సీట్లు ఇచ్చిన బిజెపి ఈ సారి ఒక్క స్దానం కూడా ఇవ్వకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాలుగు సార్లు ఎంపీగా పని చేసిన, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడైన పిసి చాకో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను ఎన్‌సిపిలో చేరి ఎల్‌డిఎఫ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ను కలిసి చెప్పారు. కేరళలో కాంగ్రెస్‌(ఐ), కాంగ్రెస్‌ (ఏ) వాటిని సమన్వయపరిచే కమిటీ తప్ప అసలు కాంగ్రెసే లేదని చాకో వ్యంగ్యబాణాలు వదిలారు.
తనకు సీటు ఇవ్వనుందుకు నిరసగా గుండు చేయించుకొని నిరసన తెలిపి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన లతికా సురేష్‌ కొట్టాయం జిల్లాలో యుడిఎఫ్‌ భాగస్వామ్య పక్షం కేరళ కాంగ్రెస్‌(జె) పోటీ చేస్తున్న ఎట్టుమనూర్‌లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దగనున్నారు. పావు గుండు నరేంద్రమోడీ, మరో పావు రాష్ట్రప్రభుత్వం, సగం గుండును పార్టీ తనకు సీటు ఇవ్వనందుకు నిరసగా చేయించుకున్నట్లు ఆమె చెప్పారు.

ఆహారకిట్‌ ఇతర రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వలేదు – బిజెపికి విజయన్‌ ప్రశ్న !

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన ఆహార కిట్‌ కేంద్రం సరఫరా చేసిందే అని బిజెపి నేతలు ప్రచారం చేయటాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. అదే నిజమైతే అన్ని రాష్ట్రాలలో ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు.ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం వాటిని అందచేసింది, అదేమీ పెద్ద విషయం కూడా కాదు, ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ అందించాం. దాన్ని గురించి ప్రచారం కూడా చేయలేదు. అయితే కాంగ్రెస్‌, బిజెపికి చెందిన కొంత మంది ఇప్పుడు కిట్‌లోని సరకులన్నీ కేంద్రం ఇచ్చినవే అని తామే ఇచ్చినట్లు విజయన్‌ ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. నిజంగా కేంద్రమే ఇస్తే మిగతా చోట్ల ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని విజయన్‌ అన్నారు.
కేరళ ప్రభుత్వం కరోనా సాయంగా ప్రతినెలా అందచేస్తున్న ఆహార కిట్‌లో 17 నిత్యావసర వస్తువులు ఉన్నాయి.1. కిలో పంచదార, 2. పావు కిలో తేయాకు, 3.కిలో ఉప్పు, 4. కిలో పెసలు, 5. కిలో సెనగపప్పు, 6.పావుకిలో కందిపప్పు, 7.అరకిలో కొబ్బరి నూనె, 8.కిలో సన్‌ఫ్లవర్‌ నూనె, 9.రెండు కిలోల గోధుమ పిండి, 10.కిలో బొంబాయి రవ్వ, 11.కిలో మినప పప్పు, 12. వందగ్రాములు కారం, 13.వందగ్రాముల ధనియాల పొడి, 14.వంద గ్రాములు పసుపు, 15.వందగ్రాముల మెంతి పొడి, 16.వందగ్రాముల ఆవాలు, 17. రెండు సబ్బులు ఉన్నాయి.

బ్రెజిల్‌ రాజకీయ వేదికపై తిరిగి వామపక్ష నేత లూలా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


లూయిస్‌ ఇనాసియో లూలా డ సిల్వా ! ప్రపంచానికి సుపరిచితమైన పేరు లూలా !! వామపక్ష బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు !!! న్యాయవ్యవస్ద,మీడియా, కార్పొరేట్‌శక్తులు కుమ్మక్కై ”ఆపరేషన్‌ కార్‌వాష్‌ ” పేరుతో చేసిన కుట్రలో జైలు పాలయ్యాడు. వేళ్లేటపుడు లక్షలాది ప్రజల మధ్య జైలుకు వెళ్లాడు. ఆయనకు శిక్ష విధించిన కోర్టుకు మోపిన ఆరోపణలను విచారించే అధికారమే లేదని, రాజధానిలోని మరో కోర్టుకు కేసులను బదలాయిస్తున్నామని, అక్కడ కేసులు తేలేంతవరకు లూలా దోషి కాదని తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో విధించిన 26 సంవత్సరాల శిక్ష రద్దు, కోల్పోయిన రాజకీయ హక్కులు తిరిగి వచ్చాయి. ఈ తీర్పు పచ్చిమితవాది, నియంతగా ఉన్న అధ్యక్షుడు జైర్‌ బోల్సనారోను కుదిపివేసిందనే చెప్పాలి. తిరిగి ప్రభుత్వం కేసును తిరగదోడుతుందా, అది తేలేవరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేవి శేష ప్రశ్నలు. వచ్చే ఏడాది మధ్యనాటికి శిక్ష పడితే తప్ప ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో తిరిగి లూలా పోటీ చేయవచ్చు. తప్పుడు కేసులు మోపి జైలు పాలు చేసినపుడు ఒక వీరుడి మాదిరి వీడ్కోలు ఇచ్చిన జనం ఇప్పుడు కేసుల నుంచి బయటపడటంతో తమ ప్రియతమ నేత తిరిగి వచ్చాడంటూ నీరాజనం పట్టారు. లూలా తిరిగి వచ్చాడు అంటూ బ్రెజిల్‌ పాలకవర్గాలకు దడపుట్టించారు.


అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా తప్పుడు కేసులు పెట్టారు. ఇరవైఆరు సంవత్సరాల జైలు శిక్ష, రాజకీయ హక్కులను తొలగిస్తూ 2018లో కోర్టు తీర్పు చెప్పింది. దాని మీద పునర్విచారణ కోరగా అప్పీళ్లు తేలకుండా జైలులో ఉంచటం చట్టవిరుద్దం అని కోర్టు తీర్పు ఇవ్వటంతో 580 రోజుల తరువాత 2019 నవంబరులో లూలా విడుదల అయ్యాడు.శిక్ష విధించిన న్యాయమూర్తి మోరో పక్షపాత రహితంగా వ్యవహరించారో లేదో చెప్పాలని లూలా న్యాయవాదులు కోర్టును కోరారు. దాంతో ఐదుగురు న్యాయమూర్తులలో ఇద్దరు అవునని ఇద్దరు కాదని పేర్కొన్నారు. తాను కొత్తగా నియమితుడైనందున, కేసు గురించి తగినంత అవగాహన లేనందున తన అభిప్రాయాన్ని చెప్పజాలనని ఐదవ న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులలో ఒకరైన ఎడ్సన్‌ ఫాచిన్‌ మార్చి ఎనిమిదవ తేదీన తీర్పు చెబుతూ లూలాకు వ్యతిరేకంగా నమోదు చేసిన నేరాలు వాటిని విచారించిన కోర్టు పరిధిలోనివి జరిగినవి కానందున విచారించే హక్కే లేదని కేసులను రాజధాని కోర్టుకు బదిలీచేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో ఉన్నట్లుగా పరిగణించి అర్హతలేని కోర్టు విధించిన శిక్షలు, రాజకీయ హక్కుల ఉపసంహరణ చెల్లదని తీర్పునిచ్చారు. లూలా నిర్దోషి అనిగానీ లేదా దోషి అని న్యాయమూర్తి నిర్దారించలేదు.అయినప్పటికీ రాజధాని కోర్టులో కేసు తేలేంతవరకు లూలా నిర్దోషిగానే ఉంటారు. అక్కడి నియమ నిబంధనల ప్రకారం 2022వ సంవత్సరం జూన్‌కు ముందుగా కేసుల్లో శిక్షపడితేనే పోటీ చేసేందుకు వీలు కాదని, అయితే అలా జరిగే అవకాశం లేదని తిరిగి కేసులు నమోదు చేసి విచారించేందుకు సంవత్సరాలు పడుతుంది కనుక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ తీర్పుతో 75 సంవత్సరాల లూలా తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే లూలా పోటీ చేస్తారా లేక పార్టీ తరఫున మరొకరిని నిలుపుతారా అన్నది వచ్చే రోజుల్లో మాత్రమే స్పష్టం అవుతుంది.


పులిట్జర్‌ బహుమతి పొందిన జర్నలిస్టు గ్లీన్‌ గ్రీన్‌వాల్డ్‌ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్ట్‌ బ్రెజిల్‌ అనే ఆన్‌లైన్‌ పత్రికలో న్యాయమూర్తి మోరో ఆపరేషన్‌ కార్‌వాష్‌ కుట్రదారులతో జరిపిన సంప్రదింపులు, సూచనలు, సలహాలు తదితర అంశాలన్నీ ప్రచురితమయ్యాయి.దాంతో మోరో 2020ఏప్రిల్లో రాజీనామా చేసి వెంటనే న్యాయశాఖ మంత్రి అవతారమెత్తాడు.తీర్పునకు ప్రతిఫలంగా ఈ బహుమతి పొందారు. నిజానికి పత్రికలో ఈ విషయాలు వెల్లడిగాక ముందే చార్జిషీటులోని పరస్పర విరుద్ద అంశాలు వెల్లడయ్యాయి. లూలాను విడుదల చేయాలనే ఉద్యమం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ పత్రికలో అనేక పత్రాలు వెల్లడి కావటంతో లూలా మీద కేసులు నిలిచేవి కాదని, విడుదల తధ్యమని అభిమానులు, ఇతరులు కూడా భావించారు.


సైన్సును నమ్మని బోల్సనారో మూర్ఖంగా వ్యవహరించి జనాన్ని కరోనా పాలు చేశాడు. దేశాన్ని అభివృద్ధిబాటలో నడుపుతాననే ఆకర్షణీయ వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన ఆ పెద్దమనిషి ఏలుబడిలో కరోనా సమయంలో 4.1శాతం తిరోగమనంలో ఉంది.1996 తరువాత ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదు. అమెజాన్‌ అడవులను నాశనం చేసే విధంగా పర్యావరణ విధానాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అడవులు అంతరిస్తున్నాయి. చివరికి జోబైడెన్‌, ఐరోపా ధనిక దేశాలు కూడా బ్రెజిల్‌ ఉత్పత్తులను బహిష్కరిస్తామని, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది.2019లో అధికారానికి వచ్చిన పచ్చి మితవాది బోల్సనారో ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. కరోనాను అరికట్టటంలో వైఫల్యం ఎంత దారుణంగా ఉందో ఏడాది కాలంలో నలుగురు ఆరోగ్యశాఖ మంత్రులను మార్చటమే పెద్ద నిదర్శనం. అమెరికా తరువాత కోటీ పదిహేనులక్షల కేసులు 2.8లక్షల మంది మరణాలతో రెండవ స్ధానంలో బ్రెజిల్‌ ఉంది ఉంది. ఆర్ధికంగా దిగజారటమే కాకుండా ఉద్యమాలను అణచివేయటంలో బోల్సనారో పేరుమోశాడు. గతేడాది అక్టోబరులో 41.2శాతం మంది మద్దతు ఇవ్వగా ఫిబ్రవరి 22న వెల్లడైన సిఎన్‌టి సర్వే ప్రకారం అది 32.9శాతానికి పడిపోయింది. మరింతగా దిగజారుతున్న ధోరణే తప్ప మరొకటి కాదు.


లాటిన్‌ అమెరికాలో రెండు దశాబ్దాల వామపక్ష పురోగమనంలో ఎదురు దెబ్బలు తగిలిన వాటిలో బ్రెజిల్‌ కూడా ఒకటి. వామపక్ష ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బ్రెజిల్‌ ప్రజాస్వామ్య ఉద్యమం(ఎండిబి) పార్టీ 2016లో ఆ ప్రభుత్వానికి ద్రోహం చేసింది. పాలకవర్గంతో చేతులు కలిపి అధ్యక్షురాలిగా ఉన్న దిల్మా రౌసెఫ్‌ మీద తప్పుడు ఆరోపణలు మోపి అభిశంసన ద్వారా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎండిబి నేత మిచెల్‌ టెమర్‌ అధ్యక్ష పీఠమెక్కి 2019 జనవరి ఒకటవ తేదీ వరకు పదవిలో కొనసాగాడు. అంతకు ముందు సంవత్సరం జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదు.2017లో జరిగిన ఒక సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం ఏడు శాతం మంది మాత్రమే టెమర్‌కు మద్దతు ఇవ్వగా 76శాతం మంది రాజీనామా చేయాలన్నారు. 2018 ఎన్నికలలో అతగాడు పోటీ చేయలేదు. వర్కర్స్‌ పార్టీ ప్రతినిధిగా రంగంలోకి దిగిన లూలాను తప్పుడు కేసులతో శిక్షించటంతో పోటీకి అనర్హుడయ్యారు. చివరి నిమిషంలో సావో పాలో మాజీ మేయర్‌ అయిన ఫెర్నాండో హదాద్‌ను పోటీకి నిలిపారు, ఓటర్లకు పెద్దగా పరిచయం లేకపోవటం, అంతకు ముందు దిగజారిన పరిస్ధితులను చక్కదిద్ది మంచి రోజులను తెస్తానన్న బోల్సనారో ప్రజాకర్షక వాగ్దానాల వరదలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. బోల్సరారో గద్దెనెక్కాడు.


వామపక్షాలు ఎన్నికల్లో ఓడిపోయి లేదా కుట్రతో మితవాద శక్తులు అధికారానికి వచ్చిన చోట అవి ఎన్నికల్లో పరాజయం పాలుకావటం తిరిగి వామపక్ష శక్తులు గద్దెనెక్కటం చూస్తున్నాము. అర్జెంటీనా, బొలీవియాలో అదే జరిగింది. ఈక్వెడోర్‌లో తొలి దఫా జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ది మొదటి స్దానంలో ఉన్నాడు. ఏప్రిల్‌ 11న జరిగే మలిదఫా ఎన్నికల్లో ఎలాంటి కుట్రలూ చోటు చేసుకోకపోతే విజయం సాధిస్తారనే వాతావరణం ఉంది.వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు తిరిగి పోటీ చేస్తాడని, అతగాడికి తగిన ప్రత్యర్ధి లూలా అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.బోల్సనారోను సమర్ధించేందుకు అవకాశం లేని వారు లూలాను కూడా అతగాడితో జమకట్టి ఆ ప్రమాదం పోతే ఈ ప్రమాదం వస్తుందనే పేరుతో ఇప్పటికే కధనాలను అల్లుతున్నారు. ఒక న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు మీద పునర్విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది. గత పాలకులు చార్జిషీట్లను సరిగా రూపొందించని కారణంగా బోల్సనారో సర్కార్‌ తిరిగి లూలాపై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. నిజంగా జరిగితే అదేమీ ఆశ్చర్యం కలిగించదు. అలాంటి పరిస్ధితి లాలూను తిరిగి జైలుకు పంపితే మరొకరు అభ్యర్ధి అవుతారు.


తప్పుడు కేసులో తనను శిక్షించిన జడ్జి సెర్జియో మోరో ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడని తరువాత బోల్సనారో సర్కార్‌లో మంత్రి అయ్యాడని లూలా చెప్పారు.ఐదు వందల సంవత్సరాల చరిత్రలో న్యాయవ్యవస్దకు బలైన అతి పెద్ద బాధితుడనని చెప్పారు. మార్చి పదవ తేదీన వేలాది మంది తన మద్దతుదార్లతో ఎక్కడైతే ఒక లోహకార్మికుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించాడో అదే లోహకార్మిక సంఘకార్యాలయం వద్ద జరిగిన సభలో లూలా ప్రసంగించారు. కరోనా మహమ్మారితోపాటు దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు. గతంలో లూలాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామి అయిన అతిపెద్ద మీడియా సంస్ద గ్లోబో గ్రూప్‌తో పాటు కొందరు రాజకీయనేతలు కూడా తమ వైఖరిని మార్చుకోవటం అనేక మంది ఆశ్చర్యం కలిగిస్తున్నది. దానికి కారణం వామపక్షాల స్దానంలో అధికారానికి వచ్చిన మితవాద పక్షాలు ఎన్నికల్లో పరాజయం పాలై తిరిగి వామపక్షాలు అధికారానికి వస్తున్న ధోరణి ఒకటని చెప్పవచ్చు. గ్లోబో గ్రూపు మీడియా సంస్దలు లూలాకు శిక్ష వేసిన మోరోను హీరోగా చిత్రిస్తూ గతంలో ఆకాశానికి ఎత్తాయి. అలాంటిది ఇటీవల దేశ ప్రజాస్వామిక వ్యవస్దలో లూలా నిర్మాణాత్మక పాత్ర పోషించారంటూ సానుకూలంగా స్పందించాయి. దీని అర్ధం ఈ సంస్ధలతో సహా మొత్తంగా మీడియా మారు మనసు పుచ్చుకొని మారిపోయింది అని కాదు, విశ్వసనీయత మరింతగా దిగజారకుండా చూసుకొనే యత్నంలో భాగమే అని గుర్తించాలి. చివరకు పార్లమెంట్‌ స్పీకర్‌ ఆర్ధర్‌ లీరా కూడా న్యాయమూర్తి ఫాచీ ఇచ్చిన తీర్పును రాజకీయ వ్యవస్ద ఆమోదించాలని పేర్కొన్నారు. అంతే కాదు కార్‌వాష్‌ పేరుతో మోపిన కేసుకు దోహదం చేసిన వారిని శిక్షించకుండా వదల కూడదని కూడా చెప్పటం విశేషం. ఈ కేసును కుట్రపూరితంగా నమోదు చేశారనేందుకు అనేక ప్రభుత్వ అంతర్గత పత్రాలు బహిర్గతం కావటంతో లూలాపై మోపిన నేరారోపణలను ఎవరూ బహిరంగంగా సమర్దించలేని స్ధితి ఏర్పడింది.


లూలాపై కేసులు కొట్టివేసిన తీర్పు వెలువడిన తరువాత స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. డాలరుతో స్ధానిక కరెన్సీ రియల్‌ మారకపు విలువ పడిపోయింది. లూలా తిరిగి దేశ రాజకీయాల్లో ముందుకు రావటం కార్పొరేట్లకు ఇష్టం లేదనేందుకు ఇదొక సూచిక. గతంలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ అధినేత లూలా, తరువాత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అధికారంలో ఉన్న అదే పార్టీకి చెందిన దిల్మా రౌసెఫ్‌ హయాంలో సంక్షేమ పధకాలు అమలు జరిగాయి. తరువాత 2016లో అభిశంసన పేరుతో జరిపిన పార్లమెంటరీ కుట్రతో అధికారానికి వచ్చిన మిచెల్‌ టెమర్‌, నయా ఫాసిస్టు బోల్సనారో కార్మిక హక్కుల మీద దాడి చేశారు. ఆరోగ్యం, విద్య వంటి అనేక సంక్షేమ పధకాలకు కోతపెట్టారు. అనేక అక్రమాలకు తెరలేపారు, చట్టవిరుద్దమైన చర్యలను అనుమతించారు.అన్నింటికీ మించి కరోనా వైరస్‌ను అదుపుచేసే విషయంలో వ్యవహరించిన తీరును నేరపూరితమైనదిగా జనం భావిస్తున్నారు.అమెరికాలో ట్రంపు మాదిరే బోల్సనారో కూడా జనాన్ని పట్టించుకోలేదు.


లూలా సామాజిక, ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికగా ఆవిర్భవించిన నిజమైన నేత. అదే బోల్సనారో దానికి భిన్నమైన వ్యక్తి.పచ్చిమితవాది, ప్రభుత్వ పదవుల్లో గతంలో నియంతలను బలపరిచిన మాజీ సైన్యాధికారులను అనేక మందికి స్ధానం కల్పించాడు.దేశ ప్రజాస్వామిక వ్యవస్ధలను దిగజార్చిన ఆచరణ ఉన్న వ్యక్తి.అమెరికా సామ్రాజ్యవాదుల నమ్మిన బంటుగా ఉన్నాడు.లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్న తరుణంలో లూలా రాజకీయ హక్కుల పునరుద్దరణ బ్రెజిల్‌ వామపక్ష శక్తులకు పెద్ద ఊరట,మరోసారి అక్కడ జయకేతనం ఎగరవేయవచ్చనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.