బిజెపికి తీవ్ర ఆశాభంగం కలిగించిన అయ్యప్ప !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


బంగారం దొంగరవాణా వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ఒక సీనియర్‌ నేత కుమారుడికీ సంబంధం ఉందని చెప్పవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తనమీద వత్తిడి తెచ్చినట్లు ఆ కేసులో నిందితుడిగా ఉన్న సందీప్‌ నాయర్‌ ఎర్నాకుళం జిల్లా జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు పేజీల ఆ లేఖ శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. తాము చెప్పినట్లుగా మారి అప్రూవర్‌గా మారితే బెయిలుతో సహా ఇతరంగా అన్ని రకాలుగా సాయం చేస్తామని అధికారులు ప్రలోభపెట్టినట్లు దానిలో సందీప్‌ పేర్కొన్నాడు. దర్యాప్తు అధికారి రాధాకృష్ణన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొన్నాడు. ఇదే విధంగా డాలర్ల కుంభకోణంలో కూడా స్వప్నా సురేష్‌ను బెదిరించి ముఖ్యమంత్రి, స్పీకర్‌,ఇతరుల మీద తప్పుడు ప్రకటనలు చేయించటమేగాక వాటిని కస్టమ్స్‌ శాఖ కోర్టులో అఫిడవిట్‌గా ఇచ్చి ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రచార అస్త్రంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్ధులెవరో తేల్చని కాంగ్రెస్‌- ప్రచారంలో దూసుకుపోతున్నసిపిఎం

సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది.కాంగ్రెస్‌ జాబితాను ఆదివారం నాడు వెల్లడించనున్నట్లు వార్తలు వచ్చాయి. బిజెపి తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఏవో అద్భుతాలు జరిగి తిరిగి అధికారానికి వస్తామనుకుంటున్న కాంగ్రెస్‌లో ముఠాకుమ్ములాటలంటే అర్ధం చేసుకోవచ్చు, ఉన్న ఒక్క సీటు కూడా వస్తుందో తెలియని బిజెపిలో కూడా కుమ్ములాటల కారణంగా జాబితాలను ప్రకటించలేకపోయారు. రాష్ట్ర అసెంబ్లీలోని 140 స్ధానాలలో తమకు 35వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమ మనుషులు కాంగ్రెస్‌లో ఉన్నారని బిజెపి చెబుతున్నదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారానికి 71 స్ధానాలు కావాల్సి ఉండగా తమకు 35 వస్తే చాలని బిజెపి చెబుతున్నదంటే కాంగ్రెస్‌లో తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లుగా అనుకుంటున్నదని ఎద్దేవా చేశారు. అందువలన కాంగ్రెస్‌లోని బిజెపి వారికి ఓటు వేసి మోసం పోవటం ఎందుకని ఆ పార్టీ మద్దతుదారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని విజయన్‌ చెప్పారు. ఈనెల 15న విజయన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఎనభై ఐదు స్ధానాలకు పోటీ చేస్తున్న సిపిఎం 23 మంది వెనుకబడిన తరగతుల వారికి సీట్లిచ్చిందని, వారిలో 20 మంది ఎజవా సామాజిక తరగతికి చెందిన వారే ఉన్నారని కేరళ కౌముది పత్రిక రాసింది. గత ఎన్నికలలో 92చోట్ల పోటీ చేసిన పార్టీ ఈ సారి తక్కువ చోట్ల బరిలో ఉన్నప్పటికీ వెనుకబడిన తరుగతులకు గతంలో మాదిరే సీట్లు ఇచ్చిందని పేర్కొన్నది.

ఎన్నికల్లో పోటీకి రాజకుటుంబీకుల తిరస్కరణ-బిజెపికి ఆశాభంగం !

శబరిమల అయ్యప్ప స్వామి బిజెపికి ఆశాభంగం మిగిల్చారు. ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ఎన్నికల్లో నిలిపి దాన్ని ఎన్నికల అంశంగా చేసి లబ్దిపొందాలని చూసిన బిజెపికి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. రాజకుటుంబీకులు తమ పార్టీ తరఫున పోటీ చేయాలని లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనలను రాజకుటుంబం తిరస్కరించినట్లు కేరళ పత్రికలు రాశాయి. అయ్యప్ప విషయంలో రాజకీయాలకు తావులేదని, తాము పోటీ చేయాలనుకోవటం లేదని రాజప్రతినిధులు చెప్పారని పేర్కొన్నాయి. శబరిమల వివాద సమయంలో జరిగిన కొన్ని ఉదంతాలు జరిగి ఉండాల్సింది కాదని, తాను విచారపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన ప్రకటన మీద ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిందేమీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లే, ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఏ విజయరాఘవన్‌ చెప్పారు. మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ బిజెపి, కాంగ్రెస్‌, నాయర్‌ సర్వీసు సొసైటీ పండలం రాచకుటుంబం ధ్వజమెత్తాయి. మంత్రి దాదాపు క్షమాపణ చెప్పారంటూ మీడియా వర్ణించింది. శబరిమల వివాదం సుప్రీం కోర్టులో ఉన్నదని దాని నిర్ణయం వెలువడిన తరువాత అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, విమర్శించదలచుకున్న వారికి స్వేచ్చ ఉన్నదని రామచంద్రన్‌ పిళ్లే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ అభ్యర్దుల ప్రకటనలో మల్లగుల్లాలు పడుతుండగా దాని భాగస్వామ్య పక్షమైన ముస్లింలీగ్‌ తాను పోటీ చేయనున్న 27కుగాను 25 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పాతికేండ్ల తరువాత మొదటిసారిగా ఒక మహిళా అభ్యర్ధిని పోటీకి నిలిపింది. ఆర్ధిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఎంఎల్‌ఏలను పక్కన పెట్టి ఒక చోట ఒకరి కుమారుడికి సీటు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 24 చోట్ల పోటీ చేసింది.

నీమమ్‌లో కాంగ్రెస్‌-బిజెపిలకు విషమ పరీక్ష !

రాజధాని తిరువనంతపురంలోని నీమమ్‌ స్ధానాన్ని మరోసారి గెలుచుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. 2019లోక్‌ సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ పరిధిలో బిజెపికి 12వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. గతేడాది చివరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అది రెండువేలకు పడిపోయింది. అయితే అక్కడ బలమైన అభ్యర్దిని నిలిపి బిజెపితో తమకు లోపాయికారీ ఒప్పందం లేదని, ఆ పార్టీని నిఖరంగా ఎదిరిస్తున్నది తామే అని రాష్ట్ర ఓటర్ల ముందు కనిపించేందుకు కాంగ్రెస్‌ నానా తంటాలు పడుతున్నది. అభ్యర్దుల ఎంపిక కసరత్తు ఢిల్లీలోని కేరళ హౌస్‌కు మార్చారు. రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ లేదా ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల లేదా మరొక ముఖ్యనేత పోటీ చేస్తారనే లీకులను మీడియాకు వదిలారు. తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ పోటీ చేయాలని రాహుల్‌ గాంధీ కోరినట్లుగా మరొక లీకు వార్త షికార్లు చేసింది. ధరూర్‌ గెలిస్తే అది జాతీయ స్ధాయిలో ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిజెపితో కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తమ మిత్రపక్షమైన బలహీన జెడియుకు ఆ స్ధానాన్ని కేటాయించి తన ఓట్లన్నింటినీ బిజెపి అభ్యర్ధి ఓ రాజగోపాల్‌కు బదలాయించి గెలిపించింది. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కె.కరుణాకరన్‌ ఆ స్దానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజగోపాల్‌ పోటీ నుంచి తప్పుకోవటం, బిజెపితో తమకు ఎలాంటి ఒప్పందం లేదని నిరూపించుకొనేందుకు అక్కడ తమ అభ్యర్దిని నిలిపాలని నిర్ణయించింది.” నీమమ్‌ స్ధానం తమ గుజరాత్‌ అని బిజెపి అనుకుంటున్నది. తొందరెందుకు అది గుజరాత్‌ అవునో కాదో తేలుతుంది, అక్కడ బలమైన అభ్యర్ధిని నిలపాలని ఆలోచిస్తున్నామని” రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ చెప్పారు. నీమమ్‌లో పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని పోటీలోకి దిగితే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుంది, రాష్ట్రంలో ఇతర చోట్ల ప్రచారం అవకాశం ఉండదు మీ ఇష్టం అన్నట్లుగా తన అసమ్మతిని తెలిపినట్లు తెలిసింది. తనను దెబ్బతీసినప్పటికీ తన షరతులను అంగీకరిస్తే పోటీ చేసేందుకు సిద్దమే అని ఊమెన్‌ చాందీ చెప్పారని, తనను గాకుండా వేరే వారిని చూడాలని శశిధరూర్‌ తప్పించుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. రమేష్‌ చెన్నితల ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని తనకు మరొక అవకాశం ఇవ్వాలని, ఒక వేళ అది జరగకపోతే హౌంమంత్రి పదవిని తాను సూచించిన వారికి ఇవ్వటంతో పాటు కొన్ని స్ధానాల అభ్యర్దుల ఎంపిక తనకే వదలాలని చాందీ షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తాను కోరిన విధంగా తన అనుచరులకు సీట్లు కేటాయించకపోతే నీమమ్‌తో సహా తాను ఎక్కడా పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అధిష్టానికి హెచ్చరిక చేశారంటే ముఠాల పెత్తనం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ముఠాల నేతలు తమకు అనుకూలమైన, ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే కధనాలను మీడియాకు లీకులుగా వదిలారు. దీంతో నీమమ్‌ స్దాన అభ్యర్దిని మీడియా పదే పదే మార్చింది.

అమిత్‌ షా పోటీ చేసినా నీమమ్‌లో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : సిపిఎం

ప్రతిష్టాత్మక స్ధానాల్లో ఒకటిగా మారిన నీమమ్‌ నియోజకవర్గంలో అమిత్‌ షా పోటీ చేసినా అక్కడ ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్ది శివన్‌ కుట్టి విజయం ఖాయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. మాజీ ఎంఎల్‌ఏ శివన్‌కుట్టి అభ్యర్ధిగా ఉన్నందున తాను అక్కడ పోటీ చేయనని ఊమెన్‌ చాందీ, రమేష్‌ చెన్నితల కూడా కేంద్ర పార్టీనేతలకు చెప్పారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో బిజెపి గెలిచిందని ఈసారి ఓడిపోవటం, బిజెపి లేని అసెంబ్లీ ఖాయమని చెప్పారు.
కేరళలో ఈ సారి బిజెపి అధికారంలోకి రానున్నదని ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిన మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ది గురించి మాట్లాడతాను తప్ప వివాదాల జోలికి పోనన్నారు. గతంలో గెలిచిన నీమమ్‌ కాకుండా తొమ్మిది స్ధానాలను బిజెపి ఏ క్లాస్‌గా గుర్తించింది. వాటిలో ఎవరిని పోటీలోకి దించాలన్నది అధిష్టాన నిర్ణయానికి వదలివేసినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అసమ్మతినేతగా పేరుమోసిన శోభా సురేంద్రన్‌ పేరును అసలు సిఫార్సు చేసిన జాబితాలోనే లేదని చెబుతున్నారు.
మిగతా పార్టీలు. ఇతర అంశాల విషయానికి వస్తే కొత్తగా ఎల్‌డిఎఫ్‌ వైపు వచ్చిన కేరళ కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఎం ఆరు స్ధానాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి పార్టీ నిబంధనలకు అనుగుణ్యంగా సీనియర్‌ ఎంఎల్‌ఏలకు బదులు 38 చోట్ల కొత్త వారిని ఎంపిక చేశారు. దీంతో కొన్ని చోట్ల సిపిఎం కార్యకర్తలు అసమ్మతిని వెల్లడించినట్లు, ప్రదర్శనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సమస్యల గురించి కార్యకర్తలు, అభిమానులకు వివరించి సర్దుబాటు చేస్తామని సిపిఎం స్ధానిక నేతలు ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో సిపిఎం పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్న ఒక మహిళ ఎల్‌డిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు స్ధానిక కమిటీ ప్రకటించింది. గతంలో ఆమె స్వతంత్ర అభ్యర్ధిగా సిపిఎం మద్దతుతో పోటీ చేశారు. మరొక పంచాయతీ అధ్యక్షుడు తనను అభ్యర్దిగా పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా బిజెపి మిత్రపక్ష అభ్యర్దిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. కొన్ని చోట్ల సిపిఎంను కాపాడండి అనేపేరుతో ప్రత్యర్ధులు పోస్టర్లు వేసి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి తలెత్తినప్పటికీ అది ఎల్‌డిఎఫ్‌ విజయానికి హాని కలిగించలేదు. తలెత్తిన అసమ్మతిని తొలగింప చేసి మిత్రపక్షాల అభ్యర్ధులకు ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు పార్టీ పూనుకుంది.

సరిహద్దు రక్షకులకు చలిదుస్తులు కూడా ఇవ్వలేని స్దితిలో ” దేశ రక్షకుడు ” మోడీ ఉన్నారా ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మాటలు కోటలు దాటతాయి గాని చేతలు గడప దాటవు అన్న సామెత తెలిసిందే. ప్రపంచంలో ఏ మిలిటరీని అయినా ఎదిరించగల సురక్షితమైన (నరేంద్రమోడీ) చేతుల్లో దేశం ఉందని బిజెపి నేతలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. నిజమే అని జనం కూడా నమ్మారు.నమ్మినవారెపుడూ చెడ్డవారు కాదు. కానీ తాజాగా అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ ఫిలిప్‌ డేవిడ్సన్‌ చెప్పినదాని ప్రకారం మంచుకొండల్లోని మన సైన్యానికి అవసరమైన చలిదుస్తులు కూడా అందించలేని స్దితిలో మన ప్రభుత్వం ఉందన్న అనుమానం కలుగుతోంది. చలి దుస్తులు, మంచులో ధరించాల్సిన పరికరాలు, కళ్లద్దాలు, బూట్లు, ఆహార కొరత ఉన్నట్లు కాగ్‌ కూడా తన నివేదికలో పేర్కొన్నది. దానిమీద రక్షణ మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ కాగ్‌ 2015-17 సంవత్సరాల వివరాల ప్రకారం అలా చెప్పిందని, ప్రధాన కార్యాలయాల్లో కొరత నిజమే గానీ రంగంలో ఉన్న సైనికులకు అందించామని పేర్కొన్నది. కానీ డేవిడ్స్‌న్‌ చెప్పింది గతేడాది ఉదంతం గురించి అన్నది గమనించాలి. అమెరికా నుంచి ఆయుధాలతో పాటు చివరకు దుస్తులను కూడా తెచ్చుకొనే దుస్దితిలో మన సర్కార్‌ ఉంది. నిజానికి అవి మనం తయారు చేసుకోలేనివి కాదు, సైనికులను చలికి వదలివేసే నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు.


అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు మార్చినెల తొమ్మిదిన హాజరై ముందుగానే తయారు చేసుకు వచ్చిన అంశాల ఆధారంగా మాట్లాడిన డేవిడ్స్‌న్‌ చెప్పిన వాటి సారాంశం ఇలా ఉంది.సరిహద్దు వివాదంలో భారత్‌కు అవసరమైన సమాచారం, చలి దుస్తులు, ఇతర సామగ్రిని అమెరికా అందించింది.ముందుకు వచ్చిన అనేక స్ధానాల నుంచి చైనా ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. సరిహద్దు ఘర్షణలకు చైనాయే కారణం.వివాదాస్పద సరిహద్దుల సమీపంలో నిర్మాణకార్యక్రమాలను చేపట్టిన చైనా దానికి మద్దతుగా దాదాపు 50వేల మంది సైన్యాన్ని దించింది. దానికి ప్రతిగా భారత్‌ కూడా సైన్యాన్ని మోహరించింది. ఇతరులతో సహకారం తమ స్వంత రక్షణ అవసరాలకే అని సరిహద్దు వివాదం భారతదేశ కళ్లు తెరిపించింది.ఇప్పటికీ భారత్‌ తమ అలీన వైఖరికి కట్టుబడి ఉన్నప్పటికీ అత్యంత సమీప కాలంలో చతుష్టయం(క్వాడ్‌ : అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌. ఈ కూటమిని చైనా తన వ్యతిరేక దుష్ట చతుష్టయంగా పరిగణిస్తోంది, పోటీగా తన అస్త్రాలను తీస్తోంది)లో మరింతగా భాగస్వామి అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా అమెరికా,జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇది కీలకమైన అవకాశం.భారత-అమెరికా సంబంధాలు, 21వ శతాబ్దిలో భాగస్వామ్యంలో ఎవరేమిటో నిర్వచించుకోవాల్సిన సమయం ఇదని భావిస్తున్నాను. సంబంధాలను మరింత సన్నిహితంగా మరియు గట్టిపరుచుకొనేందుకు ఒక చారిత్మ్రాక అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఇటీవలి కాలంలో రెండు దేశాలు పునాదుల వంటి మూడు ఒప్పందాలు చేసుకున్నాయి. మిలిటరీ సహకారాన్ని పెంచుకోవటం,అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తుల కొనుగోలును భారత్‌ పెంచుకోవటం, అమెరికాతో కలసి సంయుక్త విన్యాసాల నిర్వహణ.భారతదేశంతో రక్షణ సంబంధాలు వ్యూహాత్మకంగా తప్పనిసరి.” అన్నారు.


ప్రపంచాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని, తన కార్పొరేట్లకు యావత్‌ దేశాల మార్కెట్లను అప్పగించాలన్న అమెరికా వ్యూహత్మక ఎత్తుగడలో మన పాలకులు మన దేశాన్ని ఇరికించారన్నది డేవిడ్స్‌న్‌ చెప్పిన అంశాల సారం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అమెరికాను నమ్మి, దాని వెంట నడచి బాగుపడిన దేశం ఒక్కటైనా ఉందని ఎవరైనా చూపితే సంతోషం. సహకారం పేరుతో మన ఇరుగు పొరుగుదేశాలతో మనం లడాయి పెట్టుకొనేట్లు చేయటం, ఆ ముసుగులో తన ఆయుధాలను మనకు అంటగట్టటం, మన మిలిటరీలో చొరబడేందుకు సంయుక్త విన్యాసాల వంటివి నిర్వహించటం ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తాయో దేశభక్తులు(బిజెపి మార్కు కాదు) ఆలోచించటం అవసరం. ఈనెల 12న చతుష్టయ అంతర్జాల సమావేశం జరగనుండటం, ఆ తరువాత అమెరికా నూతన రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ త్వరలో మన దేశాన్ని సందర్శించనున్న తరుణంలో డేవిడ్సన్‌ ఈ విషయాలను వివరించారు.అంతకు కొద్ది రోజుల ముందు అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన ఒక మార్గదర్శక పత్రంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, దాన్ని ఎదుర్కొనేందుకు భాగస్వాములతో కలసి పని చేయాలని పేర్కొన్నది. ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా తమ ముగ్గులోకి మనలను లాగే వైఖరిని అమెరికా కొనసాగిస్తూనే ఉందన్నది స్పష్టం. అందువలన పాత ప్రియుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు బ్రేకప్‌ చెప్పి(వదలివేసి) కొత్త ప్రియుడు జో బైడెన్‌ను కౌగలించుకొనే రోజు ఎంతో దూరంలో లేదని గ్రహించాలి.
అమెరికన్‌ కమాండర్‌ డేవిడ్స్‌న్‌ తమ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాలను చెప్పిన మరుసటి రోజే మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఏమి చెప్పింది ? చైనా అన్ని ప్రాంతాల నుంచి వెనక్కు పోలేదని డేవిడ్స్‌న్‌ చెప్పాడు. ఇది చైనా-మనకు తంపులు పెట్టే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి పూర్తిగా సేనల ఉపసంహరణ పూర్తయిందని, మిగతా సమస్యలేవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు.


ట్రంపు కంపును మరింతగా పెంచాలనే జో బైడెన్‌ నిర్ణయించుకున్నారు. పాతికేండ్ల క్రితం చైనా ప్రభుత్వం పంచన్‌లామా నియామకం మత స్వేచ్చను దుర్వినియోగం చేయటమే అని బైడెన్‌ యంత్రాంగం తాజాగా ఒక ప్రకటన ద్వారా ట్రంప్‌ బూట్లలో దూరి నడవనున్నట్లు వెల్లడించింది. టిబెటన్‌ దలైలామా చైనా మీద విఫల తిరుగుబాటు చేసి 1959 మే 17న మన దేశానికి పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే. టిబెట్‌ బౌద్దమత చరిత్రను చూసినపుడు సంప్రదాయం ప్రకారం ఇద్దరూ వేర్వేరు ఆరామాలకు – తెగలకు అధిపతులు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారు. ఒకరి అధికారాన్ని మరొకరు పరస్పరం గుర్తించుకుంటారు. అయితే దలైలామా తరువాత స్ధానం పంచన్‌లామాదిగా బౌద్దులు పరిగణిస్తారు. పదవ పంచన్‌ లామా 1989లో మరణించిన తరువాత ఎవరినీ నియమించలేదు. 1995లో దలైలామా ఒక ఐదేండ్ల బాలుడిని పదకొండవ పంచన్‌ లామాగా నియమించినట్లు ప్రకటించారు. దాన్ని టిబెట్‌ రాష్ట్ర ప్రభుత్వం, చైనా కేంద్ర ప్రభుత్వమూ గుర్తించలేదు. అతని స్దానంలో వేరొకరిని నియమించి, బాలుడిని, అతని కుటుంబాన్ని వేరే ప్రాంతంలో ఉంచారు. ప్రస్తుతం బాలుడు పెరిగి పెద్దవాడై డిగ్రీ చదువుకొని ఉద్యోగం చేస్తున్నట్లు చైనా పేర్కొన్నది తప్ప ఇతర వివరాలు తెలియవు. చైనా సర్కార్‌ నియమించిన పంచన్‌లామాను దలైలామా గుర్తించలేదు కనుక దలైలామాకు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలూ గుర్తించటం లేదు. మధ్యమధ్యలో ఆ వివాదాన్ని ముందుకు తెస్తూ రాజకీయాలు చేస్తుంటాయి. గతేడాది డిసెంబరులో ట్రంప్‌ (ఓడిపోయిన తరువాతే) చివరి రోజుల్లో టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఒక బిల్లును చట్టంగా మారుస్తూ సంతకం చేశారు.


ప్రస్తుత పద్నాలుగవ దలైలామా 62 సంవత్సరాలుగా మన దేశంలోనే ఉన్నారు. అయినా ఆయన స్దానంలో టిబెట్‌లో ఎవరినీ నియమించలేదు. కొత్త దలైలామాను నియమించబోతున్నారంటూ రెచ్చగొట్టే వార్తలను రాయిస్తూ ఉంటారు. అమెరికాతో కలసి గోక్కోవటం మొదలు పెట్టిన తరువాత గత (కాంగ్రెస్‌, చివరికి అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ) పాలకులు కావాలని విస్మరించిన ఈ అంశాన్ని అమెరికాతో పాటు ఎందుకు గోకకూడదనేే ఆలోచన మన మోడీ సర్కార్‌కూ వచ్చిందని వార్తలు వచ్చాయి. బహిరంగ ప్రకటన చేయలేదు గానీ చైనాను రెచ్చగొట్టే చర్యలన్నీ చేస్తోంది. తాజాగా గాల్వన్‌ లోయ ఉదంతాల్లో టిబెటన్‌ తిరుగుబాటుదార్లతో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) పేరుతో ఏర్పాటు చేసిన అనధికార కిరాయి సాయుధ మూకను చైనీయుల మీదకు ఉసిగొల్పి పాపాంగాంగ్‌ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో గతేడాది ఆగస్టులో కొన్ని కొండలను ఆక్రమించుకొనేందుకు పంపటం, ఆ ఉదంతంలో కొందరు మరణించటం తెలిసిందే.

చతుష్టయ సమావేశం సాధించేది ఏమిటి ?


చతుష్టయ కూటమి ఏర్పాటు వెనుక అమెరికా ఎత్తుగడ ఏమిటో వారెన్నడూ దాచుకోవటం లేదు. తెలిసి వారి వలలో చిక్కుకొనే వారి గురించే ఆలోచించాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనాను ఈ కూటమిలోని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ముప్పుగా పరిగణించలేదు. ఇప్పుడు ముప్పు సిద్దాంతం లేదా భయాన్ని ముందుకు తెస్తున్నాయి. నాలుగు దశాబ్దాల్లో ఈ నాలుగు దేశాలూ చైనా నుంచి ఎంతో లబ్దిపొందాయి-అదే సమయంలో దాని ఎదుగుదలకూ దోహదం చేశాయి. ఎవరి ప్రయోజనం కోసం వారు వ్యవహరించారు. ఈ క్రమంలో మొత్తంగా తేలిందేమంటే చైనా అర్ధికంగా అమెరికానే సవాలు చేసే స్ధాయికి ఎదిగింది ? నాలుగు దేశాలు అనుసరించిన దివాలా కోరు విధానాలు చైనాతో పోటీపడలేకపోయాయి. ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా చైనా ముప్పును ముందుకు తెస్తున్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో తెగేదాకా లాగేందుకు భయపడుతున్నాయి. ఇదే సమయంలో ఎవరికి వారు స్వంత ప్రయోజనాలకు పెద్దపీట వేసి చైనాతో బేరసారాలాడుతున్నాయి. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అందరమూ ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తూనే దెబ్బలాట-ముద్దులాట మాదిరి మరోవైపు ఎవరి సంగతి వారు చూసుకుంటున్నారు.


నిజానికి చైనా నుంచి ముప్పు వచ్చేట్లయితే చతుష్టయ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే చైనా ప్రధాన భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం( ఆర్‌సిఇపి )లో జపాన్‌,ఆస్ట్రేలియా ఎందుకు చేరినట్లు ? మన దేశంతో సరిహద్దులు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలని గత ఏడాది మన ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అలాంటి పెట్టుబడులు పెట్టగలిగింది చైనా ఒక్కటే కనుక దాని పెట్టుబడులను అడ్డుకోవాలన్నది అసలు లక్ష్యం. తరువాత తత్వం బోధపడింది, చైనా పెట్టుబడులు రాకుండా గడవదు అని గమనించిన తరువాత ఆ నిబంధనలను సడలించి సమగ్రంగా పరిశీలించిన తరువాత కీలక రంగాలలో స్ధానికంగా చేయలేని వాటిని ఆమోదించవచ్చు అంటూ తలుపులు తెరిచారు. అంతకు ముందు మాత్రం పరిశీలించకుండా అనుమతించాలని ఎవరు కోరారు, ఎందుకు అనుమతించారు ? సమాధానం రాదు.


మన ఔషధ పరిశ్రమకు అవసరమైన ముడి సరకులు, కొంత మేరకు తయారైన దిగుమతులు చైనా నుంచి రాకుండా ప్రత్యామ్నాయం వెంటనే చూసుకొనే అవకాశం లేకనే ఆ పరిశ్రమ వత్తిడి మేరకు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరవటం వాస్తవం కాదా ? ఆసియా అభివృద్ది బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని అమలు చేసే పధకాల్లో చైనా కంపెనీలు కూడా టెండర్లను దక్కించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అసలు అప్పులు తీసుకోవటం మానుకోవచ్చుగా ? పైగా మోడీ ఏలుబడిలోకి వచ్చిన తరువాత అసలు బయటి నుంచి అప్పులే తీసుకోవటం లేదని తప్పుడు ప్రచారం ఒకటి. చైనా పెట్టుబడులు వస్తే దాని ముప్పు మనకు తొలిగినట్లుగానే భావించాలా ? అలాంటపుడు చతుష్టయంలో అమెరికాతో గొంతు కలిపి చైనా వ్యతిరేక ప్రగల్భాలు ఎందుకు ? చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకుంటామని ఇప్పుడు చెబుతున్నవారు సంఘర్షణ వరకు ఎందుకు తీసుకుపోయినట్లు ? అమెరికన్లకు చైనా మార్కెట్‌ను మరింతగా తెరిస్తే మిగిలిన మూడు దేశాలను దక్షిణ చైనా సముద్రంలో ముంచి అమెరికా తన దారి తాను చూసుకుంటుందనే జ్ఞానం ఆయా దేశాలకు ఉండవద్దా !

ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసి లబ్ది పొందింది అమెరికానా మిగిలిన సభ్యదేశాలా ? ఆ కూటమి తరువాత ఏ సభ్యదేశం మీద అయినా ఎవరైనా దాడి చేశారా ? ఆ పేరుతో ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నది అమెరికా, అందుకు మూల్యం చెల్లించింది ఐరోపా దేశాలు కాదా ? 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి లేదా తాజా కరోనా కల్లోలం నుంచి నాటో కూటమి దేశాలను అమెరికా ఏమైనా ఆదుకోగలిగిందా ? లేనపుడు మనలను ముందుకు నెట్టి ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ఎత్తుగడలో మనం ఎందుకు పావులుగా మారాలి ? మనల్నే రక్షిస్తున్నామని ఒక వైపు అమెరికా డేవిడ్సన్‌ చెబుతుంటే మన నాయకత్వంలో ఏర్పడే ఆసియా నాటో కూటమి అమెరికా ఆయుధాలను ఆయా దేశాలతో కొనిపించే దళారీగా మారటం తప్ప ఎవరి నుంచి ఎవరిని రక్షిస్తుంది ? యుద్దానికి ఎందుకీ ఉత్సాహం ?
నాలుగు సంవత్సరాల పాటు తన దేశాన్ని ఎలా బాగు చేసుకుందామా అనే ఆలోచనకు బదులు చైనాను ఎలా నాశనం చేద్దాం లేదా దారికి తెచ్చుకుందాం అనే యావలో గడిపిన డోనాల్డ్‌ ట్రంప్‌ చివరికి అమెరికాను ఏమి చేసిందీ చూశాము.కరోనా నివారణలోను, దాని పర్యవసానంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను నిలపటంలోనూ ఘోరంగా విఫలమయ్యాడు.కరోనా మహమ్మారికి అత్యధిక మంది పౌరులను బలిచ్చిన దుష్టుడిగా చరిత్రకెక్కాడు.


చైనా వస్తువులను బహిష్కరించండి, చైనా పెట్టుబడులను బహిష్కరించండి, అసలు చైనానే బహిష్కరించండి అన్నట్లుగా గతేడాది సరిహద్దు ఉదంతాల తరువాత ఎంత పెద్ద రచ్చ చేశారో, ఎవరు చేశారో చెప్పనవసరం లేదు. జనానికి చైనాను వ్యతిరేకించటమే అసలైన దేశభక్తి అని నూరిపోశారు.మీడియా తన రేటింగులకోసం మరింతగా రెచ్చిపోయింది. మరోవైపు జరిగిందేమిటి 2020లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టి చైనాతో ప్రధమ స్ధానంలో వాణిజ్యలావాదేవీలను జరిపారు మన అపర దేశభక్తులని ఎంత మందికి తెలుసు.కరోనా కారణంగా మొత్తం దిగుమతులు తగ్గాయి, దానిలో భాగంగానే 2019లో ఉన్న 85.5 బిలియన్‌ డాలర్లకు చేరలేదు గానీ 77.7 బిలియన్‌ డాలర్లతో చైనా మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా 2020లో ఉంది. మన ఎగుమతులు చైనాకు పెరిగాయి. ఇది తెలియని సామాన్యులు, అమాయకులు ఇంకా తెలిసినప్పటికీ మీడియా ఇంకా చైనా వ్యతిరేకతను వదిలించుకోలేదు.


గత నెలలో జరిగిన మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో అమెరికా – చైనాలలో ఏదో ఒక దాని వైపు తేల్చుకోవాలని జోబైడెన్‌ హెచ్చరించారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ దానిని పూర్వపక్షం చేస్తూ అన్ని రాజకీయ కార్యకలాపాలకు బహుముఖ విధానం అవకాశం కల్పించిందని అటువంటి సంస్దలను పటిష్టపరచాలని ఒక్కాణించారు.అంతకు ముందు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా చైనా ఐరోపా యూనియన్‌ పెట్టుబడి ఒప్పందం చేసుకున్నాయి. అందువలన ఇప్పటికైనా చతుష్టయ కూటమి-దాని వెనుక ఉన్న అమెరికా స్వార్ధం, ఎత్తుగడలు, మన మీద తుపాకి పెట్టి చైనాను కాల్చ చూస్తున్న పన్నాగాన్ని మన పాలకులు గ్రహిస్తారా ?

భారత రైతు ఉద్యమం : బ్రిటన్‌ చేతిలో నరేంద్రమోడీ సర్కార్‌కు భంగపాటు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


గురువు గారూ నా సందేహాలు కొన్నింటిని నివృత్తి చేసుకోవాలని ఉంది… వదలమంటారా ?
శిష్యా అత్యవసరం అయితే అడుగు… చెబుతా ! ఇప్పుడు నేను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి దుర్భిణీ వేస్తున్నా !!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా ఇంకా పొత్తులు జిత్తులు ఖరారు కాలేదు కనుక వాటి గురించి మరోసారి అడుగుతా.
సరే శిష్యా బిజెపి గ్రహగతులు కూడా బాగున్నట్లు లేదు, అంతా మసకమసకగా ఉంది.నువ్వు అడిగితే నేనూ ఇప్పుడే చెప్పలేను… ఇంకాస్త చూడాలి… సరే సందేహాలేమిటో అడుగు !


మూడు వ్యవసాయ చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమై వంద రోజులు దాటిపోయింది. దీనికి ప్రచారం ఎక్కువగా కల్పించింది గోడీ మీడియానా లేక మోడీ ప్రభుత్వమా ?
పెట్రోలు ధరల గురించి ధర్మ సంకటంలో పడిన మంత్రి నిర్మలమ్మ మాదిరి ఈ విషయంలో నన్ను సంకటంలో పడవేశావు కద నాయనా ! అయినా …. మనలో మాట….ఆశ్రమంలో దొంగ చెవులు ఉంటాయి. ప్రతి చోటా రహస్య కెమెరాలు అమర్చుతున్నారట. అందరు స్వామీజీలూ నిత్యానందమాదిరి ఉంటారనుకుంటున్నారు జనం, ఖర్మ ఖర్మ ! జరిగేది జరగకమానదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, వ్యతిరేక ప్రచారంతో పాటు గోడీ మీడియా రైతు ఉద్యమం గురించి అనుకూల ప్రచారమూ చేయక తప్పలేదు. మొత్తంగా చెప్పాలంటే రైతాంగ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది మోడీ ప్రభుత్వమే, దానికే నేను ఎక్కువ మార్కులు వేస్తా !


అదేంటి గురువుగారూ చెవులో చెబుతారేమిటి ? దీనిలో ఏముంది… బహిరంగ రహస్యమేగా !
నా మఠం, నా భక్తులు, నా శిష్యులతో మూడు ప్రవచనాలు-ఆరు ఆదాయాలు అన్నట్లుగా వెలుగొందుతున్నదానిని నువ్వు నాశనం చేసేట్లున్నావు…. టూలుకిట్లు, ట్వీట్లు ఇలాంటి పదాలను ఉచ్చరించాలంటేనే ఉచ్చపడుతోంది. ఎక్కడ కేసుల్లో ఇరికిస్తారో అని…


మీరు మరీను గురువుగారూ మనం వేసుకుంటున్నదీ కాషాయమేగా మనల్నీ జైల్లో పెడతారా ?
నీ బండబడ కాషాయం కాషాయం అని పదే పదే అనకు. చివరకు అది బూతులా మారేట్లు ఉంది. బేటీ బచావో అని పిలుపిచ్చిన వారు టూలుకిట్టుపేరుతో దిశ రవి అనే బేటీని జైలు పాలు చేసిన పెద్దలు… ఎంత కాషాయం వేసుకుంటే మాత్రం నిజాలు చెబితే వదులుతారా నాయనా ? ఫిప్టీ ఇయర్స్‌ ఇండిస్టీ ఇక్కడ…75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమంత్రి లాంటి పదవులకు అనర్హులు అని చెప్పారా ! ఆ సాకుతోనే కదా ముసలోడయ్యాడని అద్వానీని పక్కన పెట్టారు. ఒక ఏడాది అటూ ఇటూగా అంతే వయస్సున్న మరో ముసలోడు మెట్రో మాన్‌ శ్రీధరన్‌ను మాత్రం కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నారు, ఓట్లొస్తాయనుకుంటే ఎప్పుడేం చేస్తారో తెలియదు. ఈ వయస్సులో నాకు ఎందుకు చెప్పు ?


సరే సరే గురువుగారూ మీరుంటేనే కదా మేమూ పదికాలాల పాటు పచ్చగా కాదు కాదు కాషాయంగా ఉండేది ! రైతు ఉద్యమానికి ప్రచారం కల్పించటం గురించి వివరంగా సెలవిచ్చారు కాదు.!
నాయనా గాంధీని మోసిన రైలే గాడ్సేనూ మోసింది. అలాగే అమెరికా టైమ్‌ మాగజైన్‌ గతంలో నరేంద్రమోడీ ముఖచిత్రంగా ప్రచారం కల్పించింది. ఇప్పుడు అదే పత్రిక మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగ ఉద్యమంలో మహిళలతో వంద రోజుల సందర్భంగా ముఖపత్ర కథనం ప్రచురించింది. దాని పాఠకులతో పాటు ఆ అంశాన్ని వార్తగా ప్రచురించిన దినపత్రికల ద్వారా మరింత ప్రచారం వచ్చింది. విధి వైపరీత్యంగాకపోతే ఏమిటి నాయనా ఇది !


నిజమే గురువుగారూ ! చూస్తుంటే రైతు ఉద్యమం గురించి ప్రస్తావించిన వారందరి మీద బస్తీమే సవాల్‌ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఇది ఎక్కడకు దారితీస్తుందంటారు ?
నాయనా శిష్యుడిగా ఇంకా ముదరాల్సిన వాడివి. భారత్‌, చైనా వంటి దేశాల్లో జరిగే పరిణామాలను ప్రపంచ మీడియా విస్మరించజాలదు ! తొలిసారిగా నరేద్రమోడీకి అతి పెద్ద సవాలు రైతుల నుంచి వచ్చిందంటూ ఏదో ఒక రూపంలో వార్తలు ప్రచురించని, దృశ్యాలను చూపని టీవీ ఛానల్స్‌ లేవంటే అతిశయోక్తికాదు నాయనా ? ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిందంటే వేరు, దాన్ని దెబ్బతీసే సత్తా మోడీగారికి ఉంది. కానీ జనంతో, అందునా పెద్ద సంఖ్యలో ఉన్న రైతులతో పెట్టుకుంటే అంతే సంగతులు. ఇంకా తత్వం తలకెక్కినట్లు లేదు. అనుకున్నదొకటి అయింది ఒకటిలే బుల్‌బుల్‌ పిట్టా అన్నట్లు పరిస్ధితి తయారైంది. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటే ఇంక నువ్వెందుకు అంటూ కార్పొరేట్లు మోడీగారిని ఇంటికి పంపుతాయి. అమలు జరిపితే రైతులు అదే పని చేస్తారు. రిపబ్లిక్‌ దినోత్సవ అతిధిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రావాల్సింది రాలేదు. కరోనా అని చెప్పినా రైతు ఉద్యమం సాగుతున్నందున ముఖం చాటేశారని అందరూ అనుకున్నారు. నిజంగా ఆరోజు ఆయన వచ్చి ఉంటే జరిగిన పరిణామాలను చూసి ఏం చేసేవారో తెలియదు. రైతు ఉద్యమాన్ని బదనాం చేసేందుకు ప్రభుత్వం చేసిన కుట్ర ఎదురుతన్నిందని, ప్రపంచ వ్యాపితంగా పెద్ద ప్రచారం వచ్చింది కదా నాయనా ! మనలో మాట ఇది ప్రభుత్వం కల్పించినది కాదంటే ఎలా కుదురుతుంది చెప్పు ?


బోరిస్‌ జాన్సన్‌ అంటే గుర్తు వచ్చింది గురువు గారూ. త్వరలో ఆయన పర్యటన ఉందని ఆ సందర్భంగా రైతు ఉద్యమం గురించి చర్చించుతాం అని బ్రిటను మంత్రి నిగెలు ఆదాము గారు స్పష్టంగా చెప్పారని వచ్చిన వార్తలేమిటి గురువర్యా !
చదువు రాని వాడికి ఒక చోట-చదువుకున్న వాడికి మూడు చోట్ల అనే లోకోక్తి విన్నావా నాయనా ? సావధానంగా చెబుతా విను. ఒక చదువు రాని వాడు, చదువుకున్నవాడు ఒక రోడ్డు మీద నడుస్తున్నారు. ఇద్దరూ అనుకోకుండా పెంటను తొక్కారు. చదువు రాని వాడు ఛీ అంటూ కాలు కడుక్కొని వెళ్లిపోయాడు. అదే చదువుకున్నవాడు తొక్కిందేమిటో తెలుసుకోవాలనుకుని చేతికి రాసుకున్నాడు, వాసన ఏమిటో చూద్దామని ముక్కుదగ్గర పెట్టుకున్నాడట.
రైతు ఉద్యమం గురించి చర్చించాలంటూ గతంలోనే వంద మంది బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు వారి ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు తెచ్చుకో. అలాగే కెనడాలో ఇదే అంశం మీద చర్చ జరిగింది. తాజా విషయానికి వస్తే మన దేశంలో పత్రికా స్వేచ్చ, భారత్‌లో నిరసన తెలుపుతున్న రైతుల రక్షణ గురించి చర్చించాలంటూ బ్రిటీష్‌ పార్లమెంట్‌ పిటీషన్ల కమిటీకి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఇ-దరఖాస్తు చేశారు. చర్చకు తీసుకోవాలంటే అవసరమైన సంఖ్య కంటే ఎక్కువగా లక్ష మంది జనం వెబ్‌సైట్‌లో సంతకాలు చేశారు. దాని గురించి పార్లమెంట్‌ ప్రాంగణంలోని వెస్ట్‌ మినిస్టర్‌ హాలులో మార్చి ఎనిమిదవ తేదీ నాడు చర్చ జరిగింది. శిష్యా మన పార్లమెంట్‌ చేసిన వాటినే మనం పట్టించుకోవటం లేదు, అలాంటిది బ్రిటీష్‌ ఎంపీలు పార్లమెంటు వెలుప మన గురించి వారేమి చర్చిస్తే, ఏం చేస్తే మనకేంటి అని వదలి వేయకుండా దాన్ని మన హైకమిషన్‌ వారు దొరకబుచ్చుకొని సమగ్ర చర్చ కాకుండా తప్పుడు సమచారాన్ని ఏకపక్షంగా చర్చించారంటూ బ్రిటన్‌కు లేఖ రాసి రచ్చ చేశారు.


అదేంటి గురువా మన గురించి ఇతరులు చర్చించటం ఏమిటి ? అలా చేస్తే అభ్యంతరం తెలుపకూడదా ? తప్పేంటి ? మన అంతర్గత విషయాలను ఇతరులు చర్చించటం ఏమిటి ?
శిష్యా ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న పద్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నిజమే మన అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదు. ఇక్కడ చిన్న తర్కం మరిచిపోకూడదు. ప్రభుత్వాలు వేరు, పౌరులు వేరు.ఎంపీలు వేరు అలాగే ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు స్పందిస్తే అది జోక్యం కిందకు వస్తుంది. పౌరులకు, ఎంపీలకు అది వర్తించదు. దేన్ని గురించి అయినా వ్యాఖ్యానించవచ్చు.

అదేమిటి ఎంపీలకు బాధ్యత ఉండనవసరం లేదా మన ఎంపీలు ఎవరైనా అలా చేస్తే మన మోడీ గారు ఊరుకుంటారా గురువు గారూ !
అంతసీను లేదు నాయనా మంత్రులు బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి గారు అదుపు చేస్తున్నారా లేదు. మోడీ గారూ కూడా అంతే . తైవాన్‌ అనేది ఒక దేశం కాదు. చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని మన దేశం అధికారికంగా గుర్తించలేదు, చైనాలో అంతర్భాగంగానే చూస్తున్నది. అయినా అక్కడి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి గతేడాది ఇద్దరు బిజెపి ఎంపీలు టిక్కెట్లు కొనుక్కొని తైపే వెళ్లేందుకు సిద్దమయ్యారు. కరోనా కారణంగా ఆగి అంతర్జాల సభలో పాల్గొన్నారు.
అలాగే చైనా వస్తువులను బహిష్కరించాలని మన మోడీ గారు ప్రధాని హౌదాలో పిలుపు ఇస్తే సమస్యలు వస్తాయి. ఆ పని చేయకుండా తన మాతృసంస్ధ సంఘపరివార్‌ దళాల ద్వారా నిత్యం అదే పారాయణం చేస్తుంటారు. ఇది తెలిసినప్పటికీ ప్రభుత్వానికి పార్టీకి తేడా ఉంది కనుక దాన్ని మన ప్రభుత్వ విధానంగా చైనా పరిగణించటం లేదు. ఇతర దేశాల పౌరులను, ఎంపీలను తప్పు పట్టే ముందు మనం అధికారికంగా అనధికారికంగా చేస్తున్నదేమిటో చూస్తే నేను చెప్పిన ఎప్పటికెయ్యది వర్తిస్తుంది.


అయితే గురువు గారూ బ్రిటన్‌ ఎంపీలను మీరు సమర్ధిస్తున్నారా ?
శిష్యా అల్లుడికి బుద్ది చెప్పిన మామ గడ్డికరిచినట్లుగా మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఇతరులూ దాన్ని పాటిస్తారు.మన కాశ్మీరు మాదిరే టిబెట్‌ చైనా అంతర్గత వ్యవహారం. తేడా ఏమన్నా ఉంటే మనం మనం తేల్చుకుంటున్నట్లుగా వారూ వారూ తేల్చుకుంటారు.కానీ మనం దలైలామాకు ఎందుకు ఆశ్రయం ఇచ్చాం, తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులు ఎందుకు కల్పించాం. ప్రతిరోజు మన కాషాయ దళాలు టిబెట్‌ అంశం గురించి ఎక్కడో ఒకదగ్గర చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాయి కదా ? అంతెందుకు శిష్యా పోయినేడాది మన మోడీ గారు అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా సభలో సెలవిచ్చారే ! దాన్నేమందాం.


డోనాల్డ్‌ ట్రంప్‌ – మన నరేంద్రమోడీ జిగినీ దోస్తులు, తప్పేముంది గురువుగారూ !
దోస్తు అయితే మోడీ గారికి ఇల్లు, సంసారం లేదు గనుక హౌటలుకు తీసుకుపోయి తాగినంత తాగించి తిన్నంత పెట్టించమను. వారి దేశానికి పోయి ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఇప్పుడేమైందో చెప్పు. ఆ ట్రంపు కంపును ఎంత జిగినీ దోస్తు అయినా భరించగలడా ? జో బైడెన్‌ దగ్గరకు వెళ్లలేరు, వెళ్లినా ట్రంప్‌ మాదిరి కౌగలించుకోలేరు. రెండింటికీ చెడలా !
అదేంటి గురువు గారూ అంత మాట అంటారు, మన దగ్గరకు వచ్చే నరేంద్రమోడీ భక్తులెవరూ అలా అనుకోవటం లేదు కదా !
శిష్యా చెప్పుకుంటే సిగ్గు చేటు. కాశ్మీరు రాష్ట్రాన్ని, దాని ప్రత్యేక హౌదాను రద్దుచేసి అక్కడి నేతలను నిర్బంధించి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మన నేతలను, చివరికి ఎంపీలను కూడా పోనివ్వకుండా అడ్డుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ మరోవైపు ఏం చేశారు ? ఐరోపా దేశాల నుంచి పార్లమెంట్‌ సభ్యుల బృందాన్ని ఆహ్వానించి వారికి రాచమర్యాదలు చేసి కాశ్మీరులో తిప్పి ఏం చూపించారు? ఎందుకు రప్పించారు. అక్కడ జనాన్ని అణచివేయలేదు అని ప్రపంచానికి చెప్పించుకొనేందుకే కదా ? తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే కదా శిష్యా ! మరి అదే దేశాల పౌరులు కాశ్మీరులో చీకటి రాజ్యం అని స్పందిస్తే జోక్యం అవుతుందా ?
అయినా మనలో మాట ! అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం, మా వ్యవసాయ చట్టాలను బయట చర్చించటం ఏమిటి అంటున్నాం కదా ! మన చట్టాలను మన పార్లమెంట్‌లోనే సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదనే విమర్శలు, అసలు చర్చించకుండానే మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించినట్లు రాసుకున్నాం కదా ! వాటిని వ్యతిరేకించే వారు రాజధానిలోకి రాకుండా చూసేందుకు రోడ్ల మీద మేకులు కొట్టాం కదా ? మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మన దగ్గర ఇన్ని పెట్టుకొని ఎవరో మన గురించి ట్వీట్లు చేశారు, టూలుకిట్లు పంచారు అని రుసరుసలాడినా, బ్రిటన్‌ లేదా మరొక దాని మీద పడితే ఊరుకుంటారా, మరింత రెచ్చి పోరా నువ్వు చెప్పు !


అయితే గురువా తరువాత ఏం జరుగుతుందంటారు ?
నా బొంద మన నిర్వాకం అలా తగలడింది. పిలిచి మరీ తిట్టించుకున్నట్లయింది. బ్రిటన్‌ ప్రధాని మన దేశం వచ్చినపుడు ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తామని బ్రిటన్‌ మంత్రి చెప్పారు. వ్యవసాయ సంస్కరణలు భారత అంతర్గత వ్యవహారమని ఒక వైపు చెబుతూనే రెండు దేశాల మధ్య ఉన్న సంబంధానికి ఇది ప్రేరేపక సమయం అయినప్పటికీ భారత దేశంతో జఠిలమైన సమస్యలను చర్చించటానికి ఏ విధంగానూ ఆటంకం కాదు అని కూడా చెప్పారు.
శిష్యా అంతటితో ఊరుకోలేదు. భారత్‌లో రైతుల నిరసనలు, వాటి గురించి వార్తలు బ్రిటస్‌ సమాజాల్లో ఆందోళనకరంగానూ అనిశ్చితంగానూ ఉన్నాయని, రెండు దేశాల మధ్య కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయన్నారు. ఓకే ఓకే అంటూ ఆమోదం- వ్యతిరేకత ఏమి తెలుపుతున్నారో కూడా తెలియకుండా చేతులెత్తే వెనుక బెంచీల్లోని ఎంపీలు, ఎంఎల్‌ఏల మాదిరి బ్రిటన్‌ పార్లమెంటులో కూడా అదే బ్యాచీకి చెందిన ఒక మహిళా ఎంపి తప్ప మన వ్యవసాయ చట్టాలను మిగతా పార్టీల వారెవరూ సమర్దించలేదట.


అంటే గురువు గారూ ఆమె అధికార పార్టీ కనుక మన ప్రభుత్వంతో మంచిగా ఉంటే పోలా అన్నారు లోపల ఆమె కూడా వ్యతిరేకంగానే ఉన్నారేమో ! అయినా గురువు గారూ అదేంటండీ మిగతా పార్టీలేవీ మోడీ గారు చెప్పిందాన్ని నమ్మటం లేదూ అంటే ! మన పలుకుబడి ఏమైనట్లూ ? పోనీయండి ఏదో ఒకటి అవుతుంది. చివరిగా ఒక్కటి చెప్పండి ! కాశ్మీరులో మానవ హక్కులకు భంగం కలిగించలేదని ప్రపంచానికి వెల్లడించేందుకు విదేశాల నుంచి ఎంపీలను రప్పించిన విషయం చెప్పారు. వ్యవసాయ చట్టాల గురించి, రైతుల ఆందోళన పట్ల అనుసరిస్తున్న తీరు గురించి కూడా నిజాలు చెప్పేందుకు అలాంటి ఆలోచన చేస్తారంటారా !
శిష్యా ఇప్పటికే పండుగాడి దెబ్బవంటి రైతుల ఆందోళనతో మన ప్రధాని, మంత్రులు మైండ్‌ బ్లాక్‌ అయి ఉన్నారు. ఇప్పుడు అలాంటి పని చేస్తే మన పరువు మరింత దిగజారుతుంది. నీకు పుణ్యముంటుంది నా దగ్గర అంటే అన్నావ్‌గానీ బయట నోరు జారకు, కాషాయం వేసుకున్నావని కూడా చూడరు. దేశ ద్రోహం కింద జైల్లో వేస్తారు జాగ్రత్త !

జనానికి చమురు ధరల చెలగాటం – నరేంద్రమోడీకి రాజకీయ ఇరకాటం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్టం) పలికి ఇది రాసిన సమయానికి 69.62 డాలర్లుగా ఉంది. ఈ పెరుగుదలతో అనేక మంది నరేంద్రమోడీ అభిమానుల్లో అసలైన ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో ” అషోల్‌ పరివర్తన్‌ ” (అసలైన మార్పు) తెస్తామని ప్రధాని బిజెపి ఎన్నికల సభలో చెప్పారు. ఏడు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ తరహా అభివృద్ధి వంటి కబుర్లు చెప్పిన పెద్దమనిషి నోటి నుంచి ఏ రోటికాడ ఆ పాట అన్నట్లుగా ఏ రాష్ట్రం వెళితే ఆ కబుర్లు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల గురించి ఒక్క మాటా లేదు.


ఒపెక్‌ ప్లస్‌ దేశాలు(చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్ద(ఒపెక్‌)లో లేకుండా గణనీయంగా చమురును ఉత్పత్తి ఎగుమతి చేసే దేశాలు) ఏప్రిల్లో కూడా ఉత్పత్తిని తగ్గించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించటంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మేనెల నుంచి చమురు ధరలు తగ్గుతాయని కబుర్లు చెబుతున్న బిజెపి పెద్దలకు అది ఎక్కడైనా తగిలిందో లేదో తెలియదు. గత నాలుగు రోజులుగా ధర పెరుగుతూనే ఉన్నా సోమవారం నాడు ఎక్కువగా పెరగటానికి కారణం అని సౌదీ అరేబియా దాడును ప్రతిఘటిస్తున్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి దాడి అని చెబుతున్నారు. సౌదీ చమురు కంపెనీ ఆరామ్‌కో ప్రధాన కేంద్రాలపై ఆదివారం నాడు ఈ దాడి జరిగింది. దీని తీవ్రత ఇంకా తెలియదు, ఆందోళనపడిన వారు చమురు కొనుగోలుకు ఆతృపడిన కారణంగా ధర పెరిగినట్లు కనిపిస్తోంది. ఆ దాడులతో నిమిత్తం లేకుండానే ధరలు పెరగటానికి ముందే చెప్పుకున్నట్లు ఉత్పత్తి తగ్గింపు నిర్ణయమే అసలు కారణం.
చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయటంలో ఒపెక్‌లో సౌదీ అరేబియా, దాని వెలుపల రష్యా ఇప్పుడు కీలక పాత్రధారులుగా ఉన్నాయి. ధరలు పెరగటం తమ షేల్‌ అయిల్‌ కంపెనీలకు లాభాలు తెచ్చిపెడతాయి గనుక అమెరికా కూడా సంతోషంగానే ఉంది. చమురు ఆదాయమే ప్రధాన వనరుగా ఉన్న వెనెజులా వంటి దేశాలకూ ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చమురు దిగుమతుల మీద ఆధారపడిన చైనా మనకంటే ఎంతో మెరుగైన స్దితిలో ఉంది కనుక దానికి ఇబ్బంది లేదు. ధరల పెరుగుదలతో ఎటొచ్చీ తీట వదలిలేది మనకే. అమెరికా నుంచి ఆయుధాలు, ఆయిలు తెచ్చుకుంటూ కొత్త సమస్యలూ తెచ్చుకుంటున్నాము. ఏప్రిల్‌ నెలలో రోజుకు పదిహేను లక్షల పీపాల మేరకు చమురు ఉత్పత్తి కోత విధించనున్నట్లు జోశ్యం చెబుతున్నారు.అయితే ఈ కోతనుంచి రష్యా, కజకస్ధాన్లు మినహాయింపు పొందాయి.రష్యా లక్షా30వేలు, కజకస్దాన్‌ ఇరవై వేల పీపాల మేరకు రోజు వారీ ఉత్పత్తిని పెంచనున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలలో కూడా అవి మినహాయింపు పొందటానికి స్ధానికంగా చలికాలంలో ఎక్కువ వినియోగమే కారణం. తాను మాత్రం రోజుకు పదిలక్షల పీపాల కోత నిర్ణయానికి కట్టుబడే ఉన్నానని, ధరలతో తమకు నిమిత్తం లేదని సౌదీ ప్రకటించింది. కోత ఎప్పటి వరకు అన్నది కూడా వెల్లడించని కారణంగా ఒక్క మన పాలకుల్లో తప్ప అన్ని వినియోగదేశాల్లో ఆందోళన పెరిగింది.పెరిగిందానికన్నా ఎక్కువగా వసూలు చేసినా ఇదేం దోపిడీ అని అడిగే దమ్మూ ధైర్యం మన వినియోగదారులకు లేనందున కేంద్ర ప్రభుత్వానికి ఎలాగూ పట్టదు. ఎంత పెరిగితే అంత ఆదాయం తమకు పెరుగుతుంది కనుక మెజారిటీగా ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఇతరులూ పట్టించుకోరు.

ధరలు ఎంతవరకు పెరగవచ్చు !

ప్రస్తుతం ఉన్న జోశ్యాల ప్రకారం ఏప్రిలు-సెప్టెంబరు మాసాల మధ్య బ్రెంట్‌ రకం ముడి చమురు 75 నుంచి 80 డాలర్ల మధ్య ఉండవచ్చు. ఈ నెలాఖరుకు 70 డాలర్ల వరకు పెరగవచ్చని సిటీబ్యాంకు అంచనా వేసిందని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం నాడు 71డాలర్ల వరకు పెరిగిన తీరు చూసిన తరువాత జోశ్యాలన్నీ గాల్లో కలసి అంతకంటే ఎక్కువగా పెరిగినా ఆశ్చర్యం లేదు. చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతి దేశాల్లో ఒకటిగా మారింది. అందువలన ధరల పెరుగుదలను అక్కడి చమురు ఉత్పత్తి ముఖ్యంగా షేల్‌ కంపెనీలు కోరుకుంటాయి. అయితే తన ఎన్నికను దృష్టిలో ఉంచుకొని అమెరికా వినియోగదార్లకు ధరలు తక్కువగా ఉంచేందుకు గాను డోనాల్డ్‌ ట్రంప్‌ సౌదీపై వత్తిడి తెచ్చి ధరలను అదుపు చేయించాడని, ఇప్పుడు జో బైడెన్‌ అధికారంలో ఉన్నందున సౌదీ గతంలో మాదిరి వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి.


అరబ్బు దేశమైన ఎమెన్‌లో సంవత్సరాలుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వానికి సౌదీ అరేబియా నాయకత్వంలోని కొన్ని అరబ్బు దేశాలు మద్దతు ఇవ్వటమే కాదు, తిరుగుబాటుదార్ల పట్టున్న ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. అమెరికా తన చేతులకు మట్టి అంటకుండా వాటితో ఈపని చేయిస్తున్నది. ప్రభుత్వవ్యతిరేక శక్తులైన హుతీలకు ఇరాన్‌ మద్దతు ఉంది. రాజధాని సనా తిరుగుబాటుదార్ల వశంలోనే ఉంది. దానిమీద దాడుల నేపధ్యంలోనే ఆదివారం నాడు హుతీదళాలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయి. వాటిని తాము అడ్డుకున్నట్లు సౌదీ చెబుతోంది. అందువలన రానున్న రోజుల్లో ఎమెన్‌పై సౌదీ దాడులు పెరిగితే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. అవి చమురు ధరల మీద ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేవీ కొద్ది నెలల క్రిందట ఊహించినవి కాదు. పడిపోయిన చమురు డిమాండ్‌ పెరుగుతుందని భావించారు తప్ప ధరల పెరుగుదలను ఊహించలేదు.

నాడు ఘనతగా కీర్తనలు -నేడు భక్తుల మౌన రాగాలు !


గత ఆరు సంవత్సరాలుగా చమురు ధరలు గణనీయంగా పడిపోవటం ద్వారా కలిగిన ఆర్ధిక ఉపశమనాన్ని నరేంద్రమోడీ ఘనతగా, మోడినోమిక్సుగా ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భక్తిగీతాలాపనకు బ్రేకు పడింది. రిజర్వుబ్యాంకు అంచనా ప్రకారం పీపా చమురు ధర పది డాలర్లు పెరిగితే మన చమురు వాణిజ్య లోటు 1250 కోట్ల డాలర్లు ( రూపాయల్లో సోమవారం నాడున్న విలువ ప్రకారం 91,622 కోట్లు ) పెరుగుతుంది. ఎంత పెరిగితే అంత మనం చెల్లించాలని అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో ప్రవేశ పెట్టిన విధానాన్ని నరేంద్రమోడీ ఎలాంటి శషభిషలు లేకుండా అమలు జరుపుతున్నందున మరో విధంగా చెప్పాలంటే అంత మొత్తాన్ని లేదా ఇంకా ఎక్కువగానే మన నుంచి వసూలు చేస్తారు. గతేడాది డిసెంబరు నాటికి మనం కొనుగోలుచేసిన ముడి చమురు ధర 49 డాలర్లు ఉంది. ఇప్పుడు 68డాలర్లకు పెరిగింది, అంటే మన లోటు లేదా భారం రెండు లక్షల కోట్లు పెరిగినట్లే. భర్త సంపాదన భార్య బుట్టలోలకులకే పరిపోయిందన్న సామెత తెలిసిందే. జన వేతనాలు ఎంత పెరిగినా, పెరగకున్నా కేంద్ర ప్రభుత్వానికి ఇంత మొత్తం చెల్లించాల్సిందే.మన కరెన్సీ పతనం అయితే అది అదనపు భారం.చమురు ధరల ప్రభావం కరెంట్‌ ఖాతా లోటు మీద ఎలా ప్రభావం చూపుతుందో దిగువ పట్టికలో చూడవచ్చు
ధర × జిడిపిలో వాణిజ్యలోటుశాతం× కోట్ల డాలర్లు
55 ×× -2.33 ×× -6,890
65 ×× -2.76 ×× -8,140
75 ×× -3.18 ×× -9,390
85 ×× -3.61 ×× -10,640
చమురు ధరల పెరుగుదల పెట్రోలు, డీజిలును వినియోగించేవారి మీద ప్రత్యక్ష భారాన్ని మోపితే పరోక్ష భారం జనం అందరి మీదా పడుతుంది. ఇది చమురు వినియోగదారులకు అదనం.చమురు ధరల పెరుగుదల వలన ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. నిజవేతనాలు పతనమౌతాయి, దానికి అనుగుణ్యంగా వేతనాలు పెంచకపోతే జీవితాలు దిగజారతాయి. అది కొనుగోలు శక్తిని దెబ్బతీసి పారిశ్రామిక, వాణిజ్య, సేవారంగాలు కుంటుపడి కొత్త సంక్షోభానికి దారితీసి ఉపాధిని దెబ్బతీస్తుంది. ఇది ఒక విష వలయం. ఒకటి మరొకదానిని దెబ్బతీస్తుంది.


మన వాణిజ్య లోటు పెరిగిన కొద్దీ మన రూపాయి విలువ మీద వత్తిడి పెరిగి పతనానికి దారి తీస్తుంది. అది మనం దిగుమతి చేసుకొనే చమురుతో సహా అన్నింటి ధరల పెరుగుదలకూ దారి తీస్తుంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలో 58గా ఉన్న మన రూపాయి విలువ ఇప్పుడు మోడీగారి వయస్సును కూడా అధిగమించి 73పైగా ఉంది.చమురు ధరల పెరుగుదల పరిశ్రమలు, వాణిజ్యం మీద కూడా పడి కంపెనీల వాటాల ధరల మీద ప్రభావం చూపుతుంది. వాటి ధరలు పడిపోతే విదేశీ సంస్ధలు తమ వాటాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే మన విదేశీమారక ద్రవ్యనిల్వలు తగ్గిపోయి కొత్త సమస్య మొదలవుతుంది.గతంలో ఇది తీవ్రమై బంగారాన్ని తాకట్టు పెట్టటం, రూపాయి విలువ తగ్గించటం, ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను ఆమోదించి మన మార్కెట్‌ను తెరవటం వంటి అవాంఛనీయ పరిణామాలకు మన పాలకులు తెరలేపారు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి అప్పుడే ఇంకా తలెత్తనప్పటికీ మోడీ సర్కార్‌ మన మార్కెట్‌ను ఇంకా తెరుస్తోంది. వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలు వాటిలో భాగమే. ఉన్న ఆస్ధులను తెగనమ్ముతోంది.ప్రభుత్వ ఆస్ధులన్నీ అమ్మిన తరువాత అప్పు తీసుకోవాలన్నా ఇచ్చేవారు మన ప్రభుత్వం దగ్గర ఏముంది అని చూస్తారు. ఇప్పటి వరకు నల్లేరు మీద బండిలా నడిచిన మోడీ సర్కార్‌ ప్రయాణం చమురు ధరలు ఇలాగే పెరిగితే అలా సాగదు.జనం సహనానికీ ఒక హద్దు ఉంటుంది. అది దాటితే అభిమానమే దురభిమానంగా మారుతుంది. అప్పుడేం జరుగుతుందో ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, అతల్‌బిహారీ వాజ్‌పేయిల ఏలుబడిలో ఏమి జరిగిందో చూసిన వారికి అర్దం అవుతుంది.కొత్త తరాలకు నరేంద్రమోడీ అలాంటి ”చైతన్యం ”, అవగాహన కలిగిస్తారా ? మోడీ గారికి ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో తన పార్టీ బలం పెరుగుదల మీదే దృష్టి ఉంది గాని జనం ఊసే లేదు. అందువలన అనుమానమే అవసరం లేదు ! చరిత్ర పునరావృతం అవుతుంది గానీ గతం మాదిరే అవుతుందని చెప్పలేము, కొత్త రూపంలో జరుగుతుంది.

కేరళామే హమ్‌ దేఖేంగే !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇల్లలకగానే పండగ కాదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ! హాం ఫట్‌ అంటే బంగాళాఖాతం కేరళపక్కకు వస్తుందా ? కస్టమ్స్‌ శాఖ దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్లు కేరళ సిపిఎంను దెబ్బతీస్తాయా ? యుఏయి నుంచి దౌత్య సంచిలో వచ్చిన దొంగబంగారం కేసులో అరెస్టయి జైల్లో ఉన్నవారిలో స్వప్న సురేష్‌ ప్రధాన నిందితురాలు. లక్షా 90వేల డాలర్ల( కోటీ ముప్పయి లక్షల రూపాయలకు సమానం)ను అక్రమంగా తరలించటంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ మరికొందరు మంత్రులు, ఇతరులకు సంబంధం ఉందని ఆమె చెప్పిందంటూ ఆ విషయాలను కస్టమ్స్‌ శాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఇంకేముంది దున్నఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా ముఖ్యమంత్రి విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ శనివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఎన్నికలలో దెబ్బతీసేందుకు జరిపిన కుట్రలో భాగంగా కస్టమ్స్‌ శాఖ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయటాన్ని నిరసిస్తూ కస్టమ్స్‌ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని సిపిఎం, ఇతర పక్షాలు పిలుపునిచ్చాయి. స్ధానిక సంస్దల ఎన్నికలను అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌, బిజెపి వాటితో జతకలసిన మీడియా పెద్దలు పెద్ద ఎత్తున దొంగ బంగారం, ఇతర కేసులు, ఆరోపణలతో సిపిఎంను దెబ్బతీసేందుకు చేసిన తప్పుడు ప్రచారాన్ని అక్కడి జనం పట్టించుకోలేదు. ఎల్‌డిఎఫ్‌ పక్షాలను గెలిపించారు.


మరోసారి అధికారానికి వచ్చి ఎల్‌డిఎఫ్‌ చరిత్ర సృష్టించనుందంటూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్ల తీరు తెన్నులు, ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించటంతో కేంద్రంలోని బిజెపి పెద్దలకు బుర్ర ఖరాబై (సామాన్యుల భాషలో మైండ్‌ దొబ్బి) కస్టమ్స్‌ శాఖ ద్వారా ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గం వర్ణించింది. కేంద్ర సంస్దలు బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావటం తప్ప దీనిలో పసలేదని పేర్కొన్నది. నిజానికి ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని విమర్శించింది.ఈ అంశం మీద యుడిఎఫ్‌, బిజెపి ముందుకు తెచ్చిన సవాలును తగిన విధంగా ఎదుర్కొంటామని, స్ధానిక సంస్దల ఎన్నికలలో వారి దిగజారుడు యత్నాలను జనం వమ్ము చేశారంటూ, చౌకబారు వ్యవహారాలకు పాల్పడే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అదేమంటే ఇది కేరళ అని సిపిఎం పేర్కొన్నది.


నిజానికి స్వప్ప సురేష్‌ చెప్పింది అంటూ కస్టమ్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు కొద్ది నెలలుగా కేరళలో తిరుగుతున్నవే.ఒక మెజిస్ట్రేట్‌ ముందు నిందితురాలు ఒక ముఖ్యవిషయం వెల్లడించిందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమైంది. ఇప్పుడు వాటినే రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్‌ రూపంలో సమర్పించి సంచలనాత్మక అంశంగా మార్చారు. ఇంకేముంది దీంతో సిపిఎం ఢమాల్‌ అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

బిజెపి కూడా సిగ్గుపడిన అంశాన్ని కాంగ్రెస్‌ చెబుతోంది !

కరోనా మహమ్మారి సమయంలో వామపక్ష సంఘటన సర్కార్‌ పౌరులను ఆదుకున్న తీరును జనం మెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహార కిట్‌ ఎంతగానో ఆదరణ పొందింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాష్ట్రం చేసిందేమిటని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తాజాగా ఆరోపించారు. గతేడాది నవంబరు నెలవరకు కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు కరోనా సమయంలో ఇచ్చింది. కేరళ ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్‌లో 17రకాల వస్తువులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. దాన్ని మరో ఐదు నెలల వరకు అంటే మే నెల వరకు పొడిగించింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన సరకులను రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన సంచులలో నింపి జనానికి ఇచ్చిందని, సంచుల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తే అవే సరకులను తమ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎందుకు పంపిణీ చేయలేదో సురేంద్రన్‌ చెప్పి ఉంటే అసలు బండారం బయటపడేది. తమ కేంద్ర పభుత్వం ఇచ్చిన సరకులను విజయన్‌ సర్కార్‌ పంపిణీ చేసిందని స్దానిక ఎన్నికల ప్రచారంలో చెప్పుకొనేందుకు బిజెపి కూడా సిగ్గుపడి నోరుమూసుకుంది. అలాంటిది కాంగ్రెస్‌ ఎంపీ నోట వెలువడింది. ఇలాంటి నోటి ముత్యాలు ఏం చేస్తాయో ,ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది అంటున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు !


ఆహార కిట్‌లో సరకులు కేంద్రమే ఇచ్చిందన్న కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మరో మాట కూడా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోనుందని, బలమైన కాంగ్రెస్‌ వర్గం బిజెపిలో చేరనుందని కూడా చెప్పినట్టు కేరళ కౌముది పత్రిక పేర్కొన్నది. ఈ పెద్దమనిషే బిజెపిలో చేరనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో గనుక అధికారానికి రానట్లయితే కేరళలో కాంగ్రెస్‌ చరిత్రలో కలసినట్లే అని కాసరగోడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాజమోహన్‌ ఉన్నితన్‌ చెప్పారు. పార్టీలో ముఠాలు పెద్ద శాపంగా ఉన్నాయని వాటిని అదుపు చేయనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదన్నారు. పార్టీ కంటే కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ముఠాలనే ఎక్కువగా ప్రేమిస్తారు. అది పార్టీ వైఫల్యం. ఈ ఎన్నికల్లో దానిలో మార్పు వస్తుందనుకుంటున్నా , లేనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీ నామినేషన్ల సమయంలోనే కుట్రలు జరుగుతాయి అన్నారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌కు రాష్ట్రం గురించి తెలియదని, అది కాంగ్రెస్‌ పార్టీకి బలహీనత అని మాజీ మంత్రి వయలార్‌ రవి ఆసియా నెట్‌ ఛానల్‌తో చెప్పారు. వ్యక్తిగతంగా కె సుధాకరన్‌(కన్నూరు ఎంపీ) ఉండాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీలో ఇప్పటికీ ముఠాతత్వం ఉందని, అందువల్లనే వాటి ప్రాతిపదికన గాక పార్టీ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరగాలన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌ కూడా కన్నూరుకు చెందిన నాయకుడే అయినప్పటికీ కేరళలో తిరిగిన అనుభవం లేదని, తనకు, ఎకె ఆంటోని, ఊమెన్‌ చాందీకి మాత్రమే కన్నూరుకు రైళ్లలో తిరిగిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ, రాజకీయాలు కూడా తెలుసు, ముళ్లపల్లిని ఢిల్లీలో నేతను చేశారు, ఇది పార్టీకి ఎంతో చెడు, ఊమెన్‌ చాందీని నాయకత్వ స్దాయికి తీసుకురావటం ఎంతో ప్రాధాన్యత కలిగిందని వయలార్‌ రవి చెప్పారు.

ఉన్న ఒక్కటీ దక్కుతుందో లేదో…. కేరళలో బిజెపి సిఎం అభ్యర్ధి ప్రహసనం !


కేరళలో బిజెపికి ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ స్ధానం. దాని ప్రతినిధి ఓ రాజగోపాల్‌. వివిధ కారణాలతో గత అసెంబ్లీ ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాజగోపాల్‌ను గెలిపించేందుకు అక్కడ కాంగ్రెస్‌ బలహీన అభ్యర్ధిని నిలిపిందన్నది బహిరంగ రహస్యం. ఈ సారి ఆయన పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఎవరు పోటీ చేస్తారో, ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ స్ధానంలో పోటీ చేసి గెలవాలని అనేక మంది తాపత్రయ పడుతున్నారు. సినిమా స్టార్లు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారుల్లో ఒకరైన శ్రీధరన్‌ లాంటి వారిని బిజెపి తన టూల్‌కిట్‌లో అలంకార వస్తువులుగా, ఎన్నికల సమయంలో ప్రచారానికి, ఫొటోలకు మాత్రమే ఉపయోగించుకోవటం తెలిసిందే. టూరిస్టు పాకేజి ముసిగిన తరువాత ఎక్కడా కనపడరు. అలాంటి వారిలో ఒకరిగా భావించిన మెట్రోమాన్‌ 88 సంవత్సరాల ఇ శ్రీధరన్‌ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి సిద్దంగా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తే బిజెపికి గతంలో వచ్చిన వాటికంటే రెట్టింపు ఓట్లు వస్తాయని, పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు దేశంలో బిజెపిని వరుసగా అధికారానికి తెచ్చిన నరేంద్రమోడీకే కేరళ కొరకరాని కొయ్యగా ఉంది. అలాంటి స్దితిలో రెట్టింపు ఓట్ల వస్తాయని చెప్పటం పరోక్షంగా నరేంద్రమోడీ పలుకుబడిని కించపరచటమే. నాలుగు ఓట్లు వస్తాయి కదా అని శ్రీధరన్‌కు కాషాయ కండువా కప్పారు.


కేరళ ఓటర్లను మరీ అంత అమాయకులుగా భావించారో లేక ఆత్రత వారిని అలా ముందుకు తోసిందో లేక ఇతరంగా ఏ నేతను ముందుకు తెస్తే ఏమిసమస్యలు వస్తాయో తెలియదుగానీ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ ప్రకటించారు. వెంటనే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వి. మురళీ ధరన్‌ కూడా నిర్ధారించారు.అసెంబ్లీ ఎన్నికలకు స్ధానిక సంస్ధల ఫలితాలకు సంబంధం లేదని, ఎన్నికల ముందు వెలువడే సర్వేలను తాము విశ్వసించబోమని, ఈ సారి తమకు ఎక్కువ స్ధానాలు వస్తాయని కేంద్ర మంత్రి మురళీధరన్‌ చెబుతున్నారు. అధికారానికి వస్తామని కలలు కంటున్న చోటే సిఎం అభ్యర్ధిని ప్రకటించే స్ధితిలో లేని బిజెపి ప్రకటన కేరళ, దేశ వ్యాపితంగా నవ్వులు పండించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేంద్ర నాయకత్వం ఇదేమి పిచ్చి ప్రకటన అంటూ రాష్ట్ర నాయకులకు బుద్దిశుద్ది చేయటంతో కొద్ది గంటల్లోనే అబ్బే మీడియాలో వార్తలను చూసి నిజమే అనుకున్నా తప్ప నిజం కాదు అని కేంద్ర మంత్రి తన మాటలను తానే దిగమింగారు. సురేంద్రన్‌ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ జారుకున్నారు. ఈలోగా శ్రధరన్‌ తానే కాబోయే ముఖ్యమంత్రిని అని తెగ ఫీలయిపోయి రైల్వే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పరువు కాపాడుకొనేందుకు ఒక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని, అయితే ఎన్నికల్లో ప్రచార బాధ్యత నిర్వహిస్తానని అన్నారు. ఆ పార్టీలో ఇంకే పరిణామాలు వస్తాయో, ఏప్రిల్‌ ఆరున ఎన్నికల్లో కేరళలో బిజెపికి ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. చెల్లించాల్సిన మొత్తాలను ఈక్విటీలుగా మార్చిన విషయం తెలిసిందే. జనాలకు చెవుల్లో పూలు పెట్టదలచుకున్నవారు నటించటం తప్ప 2010వరకు అంతకు ముందున్న ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయనే విషయం తెలుసు. అసలు చమురు బాండ్లంటే ఏమిటి ? ఏమీ లేదండీ . ప్రభుత్వాలు వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే అంతర్జాతీయ భాషలో బాండ్లు అంటున్నారు. అంటే అసలు చెల్లించేంతవరకు వడ్డీ కూడా చెల్లించాలి కదా ? ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు నిర్ణీత తేదీల ప్రకారం వడ్డీ, గడువు మీరిన వాటికి అసలు చెల్లిస్తారు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.

చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ జారీ చేయలేదా ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. మోడీ అధికారానికి వచ్చిన తరువాత చమురు ధరలు విపరీతంగా పడిపోయినప్పటికీ చమురు బాండ్లు, మరొక సాకుతో పెద్ద మొత్తంలో పన్నులు పెంచిన కారణంగా వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇలా చెప్పారు.” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది అర్ధ సత్యం. ఒక వేళ నిజమే అనుకున్నా, ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి ఏడవటం, అంతకంటే ఎక్కువగా జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.

చమురు బాండ్ల బాజా వదలి సరిహద్దు పాట అందుకున్నారు !


చమురు బాండ్లకు సంబంధించి ఇప్పటి వరకు యుపిఏ సర్కార్‌ చెల్లించిందే ఎక్కువ అన్నది అసలు నిజం. ఇప్పటి వరకు 1750 కోట్ల చొప్పున ఉన్న రెండు బాండ్లు మాత్రమే గడువు తీరినందున మోడీ సర్కార్‌ 3500 కోట్లు చెల్లించింది. మిగిలిన మొత్తాలను చెల్లించాల్సి ఉంది. తదుపరి చెల్లింపు 2021 అక్టోబరులో ఉంది. ఈ బాండ్లకు వడ్డీగా చెల్లించిన మొత్తం 40,226 కోట్లని మంత్రి పియూష్‌ గోయల్‌ మూడు సంవత్సరాల క్రితం చెప్పారు.2014-15 నుంచి 2017-18 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి 11.04లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు 7.19 లక్షల కోట్ల రూపాయల ఆదాయం చమురు రంగం నుంచి వచ్చింది. ఇంత ఆదాయ బిజెపి పెద్దలు చెబుతున్నట్లుగా చమురు బాండ్ల అప్పు తీరిపోతే ఆ పేరుతో విధించిన అదనపు భారం ఎందుకు కొనసాగిస్తున్నట్లు ?చమురు బాండ్ల గురించి మరీ ఎక్కువ చెబితే జనానికి అనుమానాలు తలెత్తుతాయనే భయంతో ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు.


సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి కరోనా కష్టకాలంలో జనాన్ని ఇబ్బంది పెట్టటం అవసరమా ? ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పుకున్న మోడీ గారికి తగినపనేనా ?
చమురు ధరలు పెరగటానికి మరొక కారణం రూపాయి విలువ పతనం.చమురు బాండ్లు, సరిహద్దులో ఖర్చు అంటే కాసేపు అంగీకరిద్దాం. మరి రూపాయి పతనానికి బాధ్యత ఎవరిది ? మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 58 రూపాయలుగా ఉన్నది ఇప్పుడు 72-73కు పతనమైంది. గతంలో ముఖ్యమంత్రిగా మోడీ రూపాయి విలువ పతనానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్ధతే అని చెప్పారు. ఇప్పుడు మరి తన మాటలను తనకే వర్తింప చేసుకొనే నిజాయితీని ప్రదర్శిస్తారా ? కేంద్ర బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం 2012 మార్చి-సెప్టెంబరు నెలల మధ్య యుపిఏ సర్కార్‌ రు.9,762.85 కోట్ల రూపాయలను చెల్లించింది. తరువాత మోడీ సర్కార్‌ 2015 మార్చినెలలో 3,500 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పదివేల కోట్లు చెల్లించాలి.తిరిగి 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాస్తవం ఇది కాగా ఈ మొత్తాలను, వడ్డీ చెల్లించామని, అందుకోసమే అదనంగా పన్నులు వేశామని చెప్పటం గుండెలు తీసే బంట్లకు తప్ప మరొకరికి సాధ్యమా ?


దీనిలో కూడా జనాలను ముఖ్యంగా విద్యావంతులను ఎందుకంటే ఇతరులకు బడ్జెట్‌ పత్రాలు అందుబాటులో ఉండవు కనుక తప్పుదారి పట్టించారు. పోనీ విద్యావంతులు తాము తెలుసుకొని వాస్తవాలను జనాలకు చెప్పారా అంటే వాట్సాప్‌లో వచ్చిన తప్పుడు సమాచారాన్ని తాము నమ్మి ఇతరులను నమ్మించేందుకు వాటిని ఇతరులకు కరోనా వైరస్‌ కంటే వేగంగా అందిస్తున్నారు. వాస్తవాలు చెప్పే వారికి ప్రధాన స్రవంతి మీడియాలో చోటు లేదు కనుక వారి గళం వినపడదు, బొమ్మ కనపడదు. వాస్తవ సమాచారాన్ని ఇచ్చే మీడియాను జనం ఆదరించటం లేదు. మోడీ సర్కార్‌ అందచేసిన బడ్జెట్‌ పత్రాలు వాజ్‌పాయి హయాంలో కూడా చమురు బాండ్లు జారీ చేశారనే వాస్తవాన్ని బయటపెట్టాయి.సంవత్సరాల వారీగా ఎప్పుడు ఎంత వడ్డీ చెల్లించారో దిగువ చూడండి, ఏది నిజమో ఎవరు పచ్చి అవాస్తవాలు చెబుతున్నారో అర్ధం చేసుకోండి !


సంవత్సరం××××× వడ్డీ మొత్తం కోట్ల రు.
అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఏలుబడి
1998-99××××× 1,050
1999-2000××× 224
2000-01××××× 40
2001-02××××× 40
2002-03××××× 667
2003-04××××× 667
మొత్తం××××× 2688
మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి
2004-05××××× 684
2005-06××××× 846
2006-07××××× 1,899
2007-08××××× 3,853
2008-09××××× 5,529
2009-10××××× 10,535
2010-11××××× 10,958
2011-12××××× 10,958
2012-13××××× 10,458
2013-14××××× 10,256
మొత్తం××××× 45,536
నరేంద్రమోడీ ఏలుబడి
2014-15××××× 10,256
2015-16××××× 9,990
2016-17××××× 9,990
2017-18××××× 9,990
2018-19××××× 9,990
2019-20××××× 9,990
2020-21××××× 9,990
మొత్తం××××× 70,196
ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీ బదులు జారీ చేసిన చమురు బాండ్లను తప్పు పడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఇతర అవసరాలకు అసలు అప్పులే చేయటం లేదా ? వడ్డీ చెల్లించటం లేదా ? మరి ఆ నిర్వాకానికి ఎందుకు పాల్పడుతున్నట్లు ? ద్రవ్యలోటును కప్పి పుచ్చి అదుపులోనే ఉందని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌,ఇతర అంతర్జాతీయ సంస్ధలను నమ్మించేందుకు( నిజానికి వాటికి తెలియని జిమ్మిక్కులేమీ కాదు- అందరూ ” పెద్దమనుషులు ” కనుక ఎవరూ ఏమీ తెలియనట్లు నటిస్తారు) అంకెల గారడీ చేస్తారు. నగదు చెల్లింపు కాదు గనుక ఈ బాండ్లు ప్రభుత్వ లోటులో కనిపించవు.ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.2,11,026 కోట్లు. ఇదే సమయంలో వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం 1.7లక్షల కోట్లు. పన్ను సంగతి సరే లాభం కంటే తక్కువే కదా ? ఎప్పుడో తీర్చాల్సిన చమురు బాండ్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలను జనం మీద బాదటం మంచి రోజులకు, జవాబుదారీ పాలనకు నిదర్శనమా ?

మొదటి భాగం ” ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1” లో చదవండి.

ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


దిశా రవి అనే రెండు పదుల యువతి మనం సమాజానికి టూల్‌కిట్టు అనే పదాన్ని ఎంతగానో పరిచయం చేసింది. అసలు టూల్‌కిట్టు అంటే ఏమిటి ? రోజూ మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. ఇవి అనేక రకాలు. స్ధల, కాలాలను బట్టి వాటి స్వభావం మారుతూ ఉంటుంది. ప్రధానంగా రెండు తరగతులుగా చూస్తే ఒకటి జనాలకు ఉపయోగపడేవి. రెండవ రకం హాని చేసేవి. చాకు వంటింట్లో ఉంటే పండ్లు, కూరలు, ఉల్లి వంటి వాటిని కోస్తాము. అదే సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో ఉంటే ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియదు.
పాండవుల అరణ్యవాసం ముగిసిన తరువాత ఏడాది అజ్ఞాతవాసం చేసే సమయంలో తమ ఆయుధాలన్నింటినీ కట్టగట్టి జమ్మి చెట్టు మీద పెట్టారని చదువుకున్నాము. అదీ టూల్‌కిట్టే. అందుకే దసరా రోజున అనేక ప్రాంతాలలో ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్దలలో వినియోగించే పరికరాలకు పూజలు కూడా చేస్తారు. పాత సినిమాలలో వైద్యులు ఒక పెట్టె లేదా సంచి వంటిదానిని తీసుకువస్తారు. అది వైద్యుల టూల్‌కిట్టు, కొన్నిదశాబ్దాల క్రితం క్షురకులు తమ టూల్‌కిట్టును తీసుకొని ఇండ్లకు వచ్చి క్షవరాలు చేసేవారు. ఇప్పుడు కూడా పెత్తందారులకు అలా చేస్తూ ఉండవచ్చు. దాన్నే పొది అని పిలిచేవారు. వివిధ సేవలు చేసే మెకానికల్‌లు తమ వెంట తెచ్చే పరికరాలను ఒక బాక్సులో లేదా సంచిలో వేసుకొని వస్తారు. అదీ టూలుకిట్టే. పాములను ఆడించే వారు తమ టూల్‌కిట్టులో పాములతో పాటు, నాగస్వరం వంటివి ఉంటాయి.ఒక మతోన్మాదుల టూల్‌కిట్టులో మిగతావాటితో పాటు ఆవు మాంసం ఉంటే, మరో మతోన్మాదుల దానిలో పంది మాంసం ఉంటుంది. రెండు మతాల వాటిలో కుట్ర సిద్దాంతాలు, విద్వేష, ఉన్మాద ప్రచార సామగ్రి కోకొల్లలు. పట్టణాలలో పెద్ద పెద్ద ఉత్సవాలు, బహిరంగ సభలు జరిగే సమయాల్లో ఏ మార్గాల్లో ప్రయాణించాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం లేదా నిర్వాహకులు ప్రకటిస్తారు. అది కూడా టూల్‌కిట్టే.

దిశ రవి టూలుకిట్టులో ఏముంది ?


రైతు ఉద్యమం సందర్భంగా దానికి మద్దతుగా దిశరవి, ఇతరులు రూపొందించిన అంశాలనే ప్రపంచవ్యాపితంగా తెలిసిన భాషలో టూల్‌కిట్‌ అన్నారు. దానిలో ఎక్కడా నరేంద్రమోడీ లేదా బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేయాలనే అంశాలే లేవు. అయినా దేశద్రోహ నేరం మోపి అన్యాయంగా దిశ రవితో పాటు మరికొందరిని కేసుల్లో ఇరికించారు. దిశ రవికి బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అనేక మందికి కనువిప్పు కలిగించాయి. దేశంలో మతోన్మాద సంస్దలు అవి మెజారిటీ అయినా మైనారిటీ అయినా విద్వేషాలను ఎలా రెచ్చగొట్టాలి, ఘర్షణలు ఎలా సృష్టించాలి, దాడులు ఎలా చేయాలి తదితర అంశాలతో అనేక టూలుకిట్లను ఉపయోగిస్తున్నాయి. వాటికోసం రకరకాల సంస్దలను ఏర్పాటు చేస్తున్నాయి. అన్నింటినీ సమన్వయం పరిచేది ఒక కేంద్రమే. రాజకీయ పార్టీల టూలుకిట్లకు కొదవే లేదు. మరి అవన్నీ నేరం కానపుడు రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన టూలుకిట్టునే ఎందుకు దేశ ద్రోహంగా పాలకులు భావిస్తున్నారు ? అదే దేశద్రోహం అయితే రైతుల కోసం ఆ టూల్‌కిట్‌ను అందరూ ఇతరులకు పంచాలి. టూలుకిట్టు అంటే పరికరాలతో కూడిన ఒక సంచి లేదా పెట్టె అని అనుకున్నాం. ఇంద్రజాల-మహేంద్రజాల కనికట్టు విద్యలు ప్రదర్శించేవారి దగ్గర కూడా టూలుకిట్టు ఉంటుంది.

బిజెపి అబద్దాల అక్షయ టూలుకిట్టు !

ఇలాంటి కనికట్టు విద్యలో రాజకీయ పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. వీటిలో వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ ఇలాంటి పార్టీలన్నీ ఒకేతానులో ముక్కలు. వాటి దగ్గర పరికరాల కంటే ప్రచార అస్త్రాలు ఉంటాయి. వాటిలో బిజెపి ఒకటి. నిత్యం ఉదయం ఆరుగంటలకు చమురు ధరలు పెరిగితే పెంచే, తగ్గితే తగ్గించే ప్రకటన వెలువడుతుంది. ధరలు భారంగా మారుతున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనంత పన్ను మొత్తాన్ని మన దేశంలో విధిస్తున్నారు. ఆ చేదు గుళికను మింగించేందుకు బిజెపి తన అక్షయ తూణీరంలోని అబద్దాల ఆయుధాలను నిత్యం ప్రయోగిస్తున్నది. గతేడాది నవంబరు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల గురించి జనం ముందు గుండెలు బాదుకుంటూ మహా నటి నటులను మరపిస్తున్నది.వాటిని మనం ఎందుకు నిలదీయలేకపోతున్నాం ?
దిగువ ఇస్తున్న అంకెలన్నీ కేంద్ర పెట్రోలియం శాఖలోని పిపిఏసి విభాగ నివేదికల నుంచి సేకరించినవి.2014 మార్చి ఒకటవ తేదీ( నరేంద్రమోడీ ఏలుబడిలోకి రాక ముందు),2015 నవంబరు ఏడవ తేదీన, 2020నవంబరు ఒకటవ తేదీన న్యూఢిల్లీలో పెట్రోలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం ఉన్నదో వివరాలు ఇలా ఉన్నాయి
వివరాలు ×× ఏడాది×× డీలరుకు లీటరు ధర ×××× చిల్లర ధరలో శాతం
సరకు ధర × 2014-49.50×67.6×2015- 26.73×44 × 2020×25.73× 31.74
కేందప్రన్ను×× 2014-9.48 × 13 × 2015-19.56 ×32.2× 2020-32.98×40.68
రాష్ట్రపన్ను ××× 2014-12.20× 16 × 2015-12.14 × 20 × 2020-18.71×23.1
మొత్తం పన్నులు ×2014-21.68×29.61×2015-31.70×52.2× 2020-52.2 ×63.76
2015 నవంబరు ఏడవ తేదీన న్యూఢిల్లీలో డీజిలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం, బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2020 నవంబరు ఒకటవ తేదీ నాటివని గమనించాలి. 2014లో డీజిలు మీద ఎనిమిది రూపాయల సబ్సిడీ ఉంది.
వివరాలు × సంవత్సరం×× డీలరుకు లీటరు ధర ××× చిల్లర ధరలో శాతం
సరకు ధర ×2014-44.31×2015-26.55×57.8×2020-25.75×36.5
కేందప్రన్ను×2014-3.56×6.4× 2015-11.16×24.29× 2020-31.83×45.17
రాష్ట్రపన్ను ×2014-6.41×11.55×2015-6.79×14.8 × 2020-10.36×14.7
మొత్తంపన్ను×2014-9.97×18 ×2015-17.95×39.1×2020-42.19 × 63.45

మధ్య ప్రదేశ్‌ సంగతి ఏమిటి ?


పైన పేర్కొన్న వివరాలను గమనించినపుడు ఏ రీత్యా చూసినా కేంద్ర పన్నుల భారం పెరిగింది.ఆ దామాషాలో రాష్ట్రాల భారం పెరగలేదన్నది స్పష్టం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేంద్ర పన్నులు ఏక మొత్తం. వాటిని సవరించేంతవరకు ధరలతో నిమిత్తం లేకుండా స్ధిరంగా ఉంటాయి. రాష్ట్రాల పన్నులు శాతాల మేరకు పెరుగుతాయి. నెలలో కేంద్రం 30 రోజుల పాటు పెట్రోలు, డీజిలు ధరలు పెంచినా కేంద్ర పన్ను మొత్తం పెరగదు.ఈ మధ్య బిజెపి నేతలు పెట్రోలు ధర విషయంలో కాంగ్రెస్‌ పాలిత రాజస్ధాన్‌ రాష్ట్రాన్ని చూపి చూశారా అక్కడ ఎంత ఉందో అని చెబుతున్నారు. ఎదుటి వారి కంట్లో నలుసులను వెతికేవారు తమ సంగతి చూసుకోరు. కేంద్ర పెట్రోలియం శాఖ నివేదిక ప్రకారం 2020నవంబరు ఒకటవ తేదీన రాజస్ధాన్‌లో పెట్రోలు ధర రు.88.21 ఉంటే తమ ఏలుబడిలోని మధ్య ప్రదేశ్‌లో రు.88.70 ఉందని సదరు నివేదిక ఒక్కాణించి మరీ చూపింది. ఆ తరువాత ధరలు అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల వివరాలు తీసుకుంటే అసలు కథను కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. అనేక రాష్ట్రాలలో స్ధానిక ప్రభుత్వాలు స్దానిక సెస్‌లు, ప్రత్యేక పన్నులను విధిస్తున్నాయి.
మధ్య ప్రదేశ్‌ పెట్రోలు ×వ్యాట్‌ 33శాతం+లీటరుకురూ.4.50 వీటి మీద ఒకశాతం సెస్‌
రాజస్దాన్‌ పెట్రోలు ×వ్యాట్‌ 36శాతం+లీటరుకురూ.1.50 రోడ్‌ సెస్‌
మధ్య ప్రదేశ్‌ డీజిలు ×వ్యాట్‌ 23శాతం+లీటరుకురూ.3.00 వీటి మీద ఒకశాతం సెస్‌
రాజస్దాన్‌ డీజిలు ×వ్యాట్‌ 26శాతం+లీటరుకురూ.1.75 రోడ్‌ సెస్‌

చమురు బంకుల దగ్గర బోర్డులు పెడితే బండారం బయటపడుతుంది !

బిజెపి నేతలు చెప్పే మరొక అబద్దం, గారడీ ఏమంటే కేంద్రం వసూలు చేస్తున్న పన్నులలో రాష్ట్రాలకు 42శాతం(అది ఇప్పుడు 41శాతం) బదలాయిస్తున్నది కనుక కేంద్ర పన్నుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ కనుక రాష్ట్రాలే ధరలు తగ్గించాలని చెబుతారు. మెజారిటీ రాష్ట్రాలు తమ ఏలుబడిలోనివేగా ఎన్ని తగ్గించాయి? ఈ వాదన వెనుక కూడా మోసం ఉంది. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం పెట్రోలు, డీజిలు మీద వసూలు చేస్తున్న రూ.32.98, 31.83లలో రాష్ట్రాలకు 41శాతం కేటాయిస్తే ఆ వాదనను సమర్ధించవచ్చు ? ఈ మొత్తాలలో రెండు భాగాలు ఉంటాయి. ఎక్సయిజు పన్ను మరియు సర్‌ఛార్జీలు,సెస్‌లు. వీటిలో పన్నుల్లోనే రాష్ట్రాలకు 41శాతం వాటా. రెండో భాగంలో ఇచ్చేదేమీ ఉండదు. అందుకే కేంద్రం ఏటేటా రెండో భాగాన్ని పెంచుతున్నది. రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయి గనుక పన్ను వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినట్లు అంకెల గారడీ చేశారు.


2017ఏప్రిల్‌-2020 మే నెల మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద సెస్‌, సర్‌ఛార్జీ 150శాతం, డీజిలు మీద 350శాతం పెంచితే ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69, 57శాతాలను మాత్రమే పెంచింది.తాజాగా బడ్జెట్‌లో పెట్రోలు మీద రూ.2.50, డీజిలుకు రు.4.00 వ్యవసాయ సెస్‌ విధించారు. ఇది అదనం కాదు, ఈ మేరకు పన్ను తగ్గించి దాన్ని సెస్‌గా చూపారు. వినియోగదారులకు భారం లేనప్పటికీ రాష్ట్రాలకు కోత పడుతుంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సెస్‌లు, సర్‌ఛార్జీల నుంచి రాష్ట్రాలకు వాటా లేదు. ఇలాంటి జిమ్మిక్కు కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం.

రోడ్డు సెస్‌-టోలు టాక్సు వెరసి గోడ దెబ్బ చెంపదెబ్బ !

చమురు మీద రోడ్డు సెస్‌ వసూలు చేస్తున్న కేంద్రం మరోవైపు ఆ రోడ్లను వినియోగించినందుకు టోలుపన్ను వసూలు చేస్తున్నది. అంటే మన నుంచి వసూలు చేసిన సొమ్ముతో రోడ్లు వేస్తూ తిరిగి మన నుంచి టోలు వసూలు చేయటం వినియోగదారులకు గోడదెబ్బ చెంపదెబ్బ కాదా ? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తమ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి కూడా నాంది పలికారు.
ప్రస్తుతం మనకందరికీ మీడియాలో లేదా ప్రభుత్వం కూడా చెబుతున్న ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్‌ పన్ను(బెడ్‌) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ పన్ను(సీడ్‌) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్‌, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది. కేంద్ర పన్నుల పెంపుదల రాష్ట్రాలకు వరమా శాపమా ?

బిజెపి పక్కా విదేశీ – లేకుంటే గోబెల్స్‌ను ఎలా అనుకరిస్తారు ?

దిశా రవి టూల్‌కిట్టు గురించి నానాయాగీ చేసిన సంఘపరివార్‌ మరుగుజ్జులు(ట్రోల్స్‌) చమురు బాండ్ల గురించి జనాల మెదళ్లను ఖరాబు చేశారంటే అతిశయోక్తి కాదు. పక్కా భారతీయతను పాటిస్తున్నామంటారు గాని నిజానికి పక్కా విదేశీ, అందునా నాజీ హిట్లర్‌ మంత్రి పక్కా అబద్దాలను ప్రచారం చేసిన గోబెల్స్‌ వీరికి ఆరాధ్యదైవం, నిత్యం కొలుస్తూ ఉంటారు. అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటే విదేశీ సంస్ధల అనుకరణ లేదా అరువు తెచ్చుకున్నది అనుకోండి.
గత కాంగ్రెస్‌ పాలకులు చమురు బాండ్లు చేసి చమురు ఖాతాను గుదిబండగా చేశారని, తమ నేత నరేంద్రమోడీ వచ్చి వాటన్నింటినీ తీర్చాల్సి వచ్చినందున కేంద్ర పన్నులు పెంచాల్సి వచ్చిందని ఒక పిట్టకథ వినిపిస్తారు. ఒక వేళ అదే నిజమనుకోండి. ఆయిల్‌ బాండ్‌ సెస్‌ అనే పేరుతో వసూలు చేసి వాటిని తీర్చివేయవచ్చు. అప్పు తీరగానే నిలిపివేయవచ్చు, కానీ ఆపని చేయలేదే ? అయినా ఒక ప్రభుత్వం చేసిన అప్పు తరువాత వచ్చే మరొక ప్రభుత్వానికి గుదిబండ ఎలా అవుతుంది. పార్టీలు, పాలకులు మారతారు తప్ప ప్రభుత్వం కొనసాగుతుంది కదా ?
అర్ధ సత్యాలను, అసత్యాలను చెప్పటంలో బిజెపి ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ? ఇంతకూ చమురు బాండ్ల అప్పును మొత్తం తీర్చినట్లేనా ? నిజం ఏమిటి ?


మిగతా – ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2 లో చదవండి

లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో కొన్ని చోట్ల తగిలిన తీవ్ర ఎదురు దెబ్బలతో ఇంకేముంది వామపక్షాల పని ముగిసింది అని చాలా మంది సంతోషించారు. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతి సారీ మనుషుల ప్రాణాలు పోయేట్లయితే మానవ జాతి ఇంతలా పెరిగి ఉండేది కాదు. అలాంటిది తగిలిన ఎదురు దెబ్బలకు ఉద్యమాలు అంతరించిపోతాయను కోవటం ఒక భ్రమ మాత్రమే. సామ్రాజ్యవాదుల కుట్రలు, వాటికి వ్యతిరేకంగా జాగ్రత్తలను తీసుకోకపోవటం, నయా ఉదారవాదం మీద భ్రమలు, దాని ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయటం, నయా ఉదారవాద పునాదులను కదిలించకపోవటం వంటి అనేక అంశాలు వామపక్షాల ఎదురు దెబ్బల వెనుక ఉన్నాయి. ఎదురు దెబ్బలను మాన్పుకొని తిరిగి పయనం ఎలా సాగిస్తామో ఉద్యమాలూ అంతే . ఇటీవల జరిగిన పరిణామాలు, కొన్ని చోట్ల ఎన్నికలలో తిరిగి వామపక్షాలు విజయం సాధించటాన్ని కొందరు మరోసారి వామపక్ష పురోగమన తరంగం ప్రారంభం అయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కడలి తరంగాల ఆటు పోట్లు నిత్యం జరుగుతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. అదే మాదిరి ఉద్యమాలుంటాయి. అల అది పురోగామి లేదా తిరోగామి ఏదైనా జనానికి కొత్త అనుభవం నేర్పుతుంది.


లాటిన్‌ అమెరికా ప్రత్యేకించి బొలీవియాలో ఉన్న పరిస్దితి గురించి దేశ మాజీ ఉపాధ్యక్షుడు అల్వారా గార్సియా లినేరా మాట్లాడుతూ రెండవ పురోగమన తరంగంలో ఉన్నామని చెప్పారు.యాభై ఎనిమిది సంవత్సరాల లినేరా చేగువేరా స్ఫూర్తితో ఏర్పాటయిన టపాక్‌ కటారీ గెరిల్లా సైన్య నేతగా పని చేశారు. తిరుగుబాటు చేశారనే ఆరోపణలతో 1992లో అరెస్టు చేసి 1997లో విడుదల చేశారు. ఇవోమొరేల్స్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2005 నుంచి 2019వరకు దేశ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన వారిద్దరి మీద పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి దేశం నుంచి వెళ్లిపోయేట్లు చేసింది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మొరేల్స్‌ నాయకత్వంలోని మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్సీ ఘన విజయం సాధించటంతో ఇద్దరూ స్వదేశానికి చేరుకున్నారు.


ఒక వార్తా సంస్దతో తన స్వగృహంలో మాట్లాడుతూ ఏడాది తరువాత ఇంటి తలుపులు తెరిచినపుడు వచ్చిన శబ్దాలు తనను ఎంతో ఉద్వేగానికి గురి చేశాయన్నారు. లూయీస్‌ ఆర్సీ 55శాతం ఓట్లతో అధికారానికి రావటం వామపక్ష వాద విజయాలు మరియు పురోగమనాన్ని నిర్దారించింది.కొంత మంది వామపక్ష సైకిలు చక్రం తిరగటం ఆగిపోయిందనటం వాస్తవం కాదనేందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇది, వామపక్ష ఉద్యమం తరంగాల వంటిది తప్ప ఆగిపోయే చక్రం కాదు, తరంగాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు. తొలి తరంగం బలమైన ప్రజాకర్షణ గల నాయకత్వంతో విప్లవాత్మక పురోగమనవాదం అయితే రెండవది అలాంటి ప్రజాకర్షక నాయకత్వం లేని సాధారణ పురోగమనవాదంగా మనం చూస్తామన్నారు. మధ్యేవాద మితవాద శక్తుల పతనం పచ్చిమితవాద శక్తులకు దారి కల్పిస్తుంది, బలపడతాయి, దీన్ని మనం బ్రెజిల్లో చూశాము. ఇదేదో ఏదో ఒక చోట జరిగింది కాదు, డోనాల్డ్‌ ట్రంప్‌లో చూశాము, ఐరోపాలో చూస్తున్నాము. మధ్యేవాద మితవాదం విప్లవాత్మకంగా మారలేక వామపక్ష ప్రజాకర్షకనేతలను విమర్శిస్తూ హింసాత్మక మితవాదులనుంచి తనకు తాను దూరం జరుగుతోందని లినేరా చెప్పారు. బొలీవియాలో మరోసారి కుట్ర జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ అందుకే నేను యువతను కలిసిన ప్రతిసారీ మరోసారి కుట్ర జరిగితే మీరేం చేస్తారు అని అడుగుతాను. అదొక సంస్దాపరమైన ప్రశ్న. అలా అడగటం ద్వారా సంఘటితం కావటం, రాజకీయ శిక్షణవైపు, స్పష్టమైన మార్గంవైపు వారిని నెడుతుంది. కేవలం ఎన్నికల కూటములకు మించి ఆలోచించటం నూతన ప్రజాస్వామ్య తరంగానికి ముఖ్యం అన్నారు.


అనేక చోట్ల ప్రతిపక్ష స్ధానాల్లోకి పోయిన లాటిన్‌ అమెరికా వామపక్షం తిరిగి నూతన ఎన్నికల విజయాల గురించి ఆశలు రేపుతున్నది.చిలీలో 1973లో వామపక్ష అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీని హత్య చేసి నియంత అగస్టో పినోచెట్‌ అధికారాన్ని చేపట్టాడు. వామపక్ష ఉద్యమాన్ని అణచివేశాడు. పినోచెట్‌ అధికారం కోల్పోయిన తరువాత ఎవరు అధికారానికి వచ్చినా అతగాడి నిరంకుశ రాజ్యాంగమే అమల్లో ఉంది. గతేడాది జరిగిన ప్రజా ఉద్యమం కారణంగా వామపక్షాలు ఆమోదించిన కొత్త రాజ్యాంగ రచన జరగనుంది. దాని రూపు రేఖల మీద కొందరికి అనుమానాలు ఉన్నప్పటికీ అది కూడా ఒక విజయంగానే పరిగణించాల్సి ఉంది. అన్నీ సక్రమంగా జరిగి కొత్త రాజ్యాంగం ప్రకారం ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరిగితే వామపక్షాలు సమైక్యంగా ఉంటే విజయం సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వామపక్షం అని పూర్తిగా చెప్పేందుకు లేకున్నా వారితో కలసిపని చేసే, అర్జెంటీనాలో గతంలో అధికారానికి వచ్చి తరువాత ఓడిపోయిన పెరోనిస్టు పార్టీ 2019లో అధికారానికి వచ్చింది. ” లాటిన్‌ అమెరికాలో వామపక్షాలు వెనుకపట్టు పట్టినా మితవాదం-వామపక్షం మధ్య వైరుధ్యం ముగియలేదు.2021లో వామపక్షం తిరిగి లాటిన్‌ అమెరికాలో ముందుకు పోయేందుకు వీలుగా ఉంది. ఈక్వెడోర్‌లో మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా బలపరచిన వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ విజయం సాధిస్తే ఎంతో ప్రాధాన్యత కలిగినది అవుతుంది. లాటిన్‌ అమెరికాలో పురోగమన వాదం నూతన రాజకీయ దశకు నాంది అవుతుంది” అని కొలంబియాకు చెందిన సామాజికవేత్త జేవియర్‌ కాలడెరన్‌ కాస్టిలో చెప్పారు. పెరూలో వామపక్ష విజయావకాశాలు పెరుగుతున్నాయి, వెరోనికా మెండోజా విజయం సాధించే అవకాశాలున్నాయని కూడా అన్నారు. ”నయా ఉదారవాదానికి బొలీవియా, చిలీలో పెద్ద దెబ్బ తగిలింది. నేడు నయా వుదారవాదవిధానాల పర్యవసానాలకు వ్యతిరేకంగా జనం పోరాడుతున్నారు. పురోగామి శక్తులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పురోగమించే అవకాశాలు అంటే గత దశాబ్దంలో మాదిరి సాధ్యమైనంత త్వరలో అని కాదు. నయా ఉదారవాద శక్తులకు తమ ఇబ్బందులేమిటో తెలుసు, ఇదే సమయంలో పురోగామిశక్తుల పురోగమనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2022లో జరిగే కొలంబియన్‌ ఎన్నికలలో కొందరు పురోగామి శక్తులు విజయం సాధించవచ్చు ” అని కాస్టిలో చెప్పారు. బ్రెజిల్‌ గురించి చెబుతూ ” అది లాటిన్‌ అమెరికాలో పెద్ద దేశం. అది లాటిన్‌ అమెరికాలో బలాబలాల పొందికను కచ్చితంగా మారుస్తుంది. ప్రస్తుతానికి అది పచ్చి మితవాదశక్తుల చేతుల్లో ఉంది. అక్కడ పురోగమనం ఉన్నా అది సంపూర్ణం కాదు, పోరు ఇంకా సాగుతూనే ఉంది.అక్కడ పురోగామి శక్తులు ఉన్నా ఇంకా ఎంతో ముందుకు పోవాల్సి ఉంది.

చిలీ సోషలిస్టు పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు ఎన్రిక్వెజ్‌ ఒమినామీ ఇలా అభిప్రాయపడ్డారు.” లాటిన్‌ అమెరికా ఖండం మరింత సన్నిహితం అయ్యేందుకు సాధ్యమైనన్ని ప్రభుత్వాలతో వామపక్షం తిరిగి ముందుకు రావాలి. అది వాణిజ్య పరంగా, ఆర్ధిక విలువ, రుణాలపై మారటోరియం, మిలిటరీ ఖర్చు, అమెరికాతో సంబంధాలలో జరగాలి. ఆర్దిక సామర్ధ్యం కంటే సామాజిక న్యాయం గురించి వామపక్షం కేంద్రీకరిస్తుంది, కనుక ఇది ఎంతో ముఖ్యం. మితవాద లేదా ఉదారవాద ప్రభుత్వాలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈక్వెడోర్లలో తమ వాగ్దానాలను నిలుపుకోలేదు కనుక వామపక్షాలకు అవకాశాలు ఉన్నాయి.దీనికి తోడు లాటిన్‌ అమెరికా వామపక్షం వ్యవస్దా వాదాన్ని మార్చాల్సి ఉందనే పాఠాన్ని నేర్చుకున్నది. మధ్య తరగతి డిమాండ్లకు అనుగుణ్యంగా సామాజిక న్యాయం కోసం పోరాడాలి” అన్నారు.


ఏప్రిల్‌ నెలలో రెండవ దఫా ఎన్నికలు జరగాల్సిన ఈక్వెడోర్‌లో ఏం జరగనుందో ఇప్పటికీ స్పష్టత లేదు. అమెరికా అనుకూల హరితవాది యకు పెరెజ్‌ను రెండవ స్ధానంలో నిలిపేందుకు, తుది దఫా ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో నాలుగు జైళ్లలో ఆటవిక పద్దతిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 81 మంది మరణించారు. రంపాలతో శరీరాలను కోయటం, కుళ్లపొడవటం, ముక్కలు చేయటం వంటి దారుణాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.లాటిన్‌ అమెరికాలోని కొలంబియా వంటి కొన్ని దేశాల్లో ఇటువంటి చర్యలకు పోలీసులు, పారామిలిటరీ, ప్రభుత్వకిరాయి హంతక దళాలు, వాటిని ఎదిరించే వారు పాల్పడటం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించి గుర్తింపు బయటకు రాకుండా ఇలాంటి పనులు చేయించి ఇతరుల మీద నిందలు వేయటం సర్వసాధారణం. ఈక్వెడోర్‌ జైళ్లలో జరిగిన ఉదంతాలకు మాజీ అధ్యక్షుడైన వామపక్ష రాఫెల్‌ కొరెయా అనుచరులే కారణమని ప్రభుత్వం ప్రకటించటం వెనక ఉన్న కుట్ర ఏమిటో స్పష్టం.రెండవ దఫా జరగనున్న ఎన్నికలలో కొరెయా బలపరచిన అభ్యర్దిని దెబ్బతీసే దుర్మార్గమైన ఎత్తుగడ ఇది.మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అనేక మంది నేరగాండ్లు ఈ జైళ్లలో ఉన్నారు. అలాంటి సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జైళ్లలో కూడా వారు మారణకాండకు పాల్పడిన ఉదంతాలెన్నో. తాజా ఉదంతాలలో మరణించిన వారిలో అలాంటి మాఫియాలకు చెందిన వారు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేయించిన దారుణం తప్ప రాజకీయంగా వామపక్ష పార్టీకి ఎలాంటి సంబందం లేదు. జైళ్లలో ఉన్నవారికి అధికారుల అనుమతి, అవకాశం ఇవ్వకుండా అలాంటి మారణాయుధాలు ఎలా అందుబాటులోకి వస్తాయి ? వామపక్ష ఇఎల్‌ఎన్‌ పార్టీకి మాదకద్రవ్యాల ముఠాల నుంచి నిధులు అందుతున్నాయని ముందే తప్పుడు ప్రచారం చేశారు. ఆ పార్టీ అభ్యర్ధి ఆండ్రెస్‌ అరుజ్‌ ప్రధమ స్ధానంలో ఉన్నందున, ఏదో ఒకసాకుతో అసలు ఎన్నికలనే రద్దు చేసేందుకు ఇదంతా చేశారన్నది స్పష్టం.

అమెరికా అనుకూల అభ్యర్ధి యకు పెరెజ్‌ అనూహ్యంగా మూడవ స్ధానంలో రావటంతో అసలు రెండోసారి పోటీకే అనర్హుడయ్యాడు.మూడో స్ధానంలో వచ్చిన మరోమితవాది లాసో అతని మధ్య ఓట్ల తేడా కేవలం 20వేలు లోపు కావటంతో లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ యాగీ చేశాడు. దానికి ఎన్నికల సంఘం అంగీకరించింది. తీరా చూస్తే దానిలో కూడా పసలేదని తేలింది. లెక్కింపులో అటువేయాల్సిన ఓట్లను ఇటు వేశారని చెప్పిన 31 పత్రాలను పరిశీలించగా వాటిలో ఉన్న మొత్తం ఓట్లే పదహారు వేలు. అవి మొత్తం పెరేజ్‌కు వచ్చినా మూడవ స్ధానం మారదు.వాటిలో 7,233 ఓట్లలో మాత్రమే ఓటు నంబరు, ఓటరు సంతకానికి తేడాలు కనిపించాయి, వాటిలో కూడా 1,453ను రెండుసార్లు లెక్కించారు. అందువలన అది కూడా వీగిపోయిన తరువాత చట్టపరంగా ఇతర ఇబ్బందులు కలిగించేందుకు పూనుకోవటంతో పాటు జైల్లో హత్యాకాండ చేయించారు. అందువలన అడుగడుగునా ఎన్నికలను తొత్తడం చేసేందుకు కుట్ర సాగుతూనే ఉంది. దానిలో భాగమే మాదకద్రవ్య మాఫియా నుంచి వామపక్ష అభ్యర్ధికి నిధులు అందాయన్న మరొక కట్టుకధ. దాని మీద ఫిర్యాదు, విచారణ తతంగం. ఎంతకు బరితెగించారంటే ఏప్రిల్‌లోగా వామపక్ష అభ్యర్ధి అరౌజ్‌ పతనం కానట్లయితే తరువాత అక్రమంగా నిధులు పొందారన్న కారణంతో పతనం అవుతాడని యకు పెరేజ్‌ ప్రకటించటం కుట్రగాక మరేమిటి ?


ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ అంతర్గతంగా అనేక మంది గళమెత్తుతున్నారు.ప్రజాస్వామిక ప్రక్రియ ఈక్వెడోర్‌లో కొనసాగుతుందనే హామీ ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ అబ్రాడోర్‌, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రకటనను బొలీవియా అధ్యక్షుడు లూయీస్‌ ఆర్సీ కూడా బలపరిచారు. రాఫెల్‌ కొరియా నాయకత్వంలో ఉన్న పార్టీకి ద్రోహం చేసి విద్రోహ శక్తులతో చేతులు కలిపిన ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో తన అభ్యర్ధి సోదిలో కూడా లేకుండా పోవటంతో ఇప్పుడు బ్యాంకర్‌ అయిన రెండవ స్ధాన అభ్యర్ధి లాసోకు మద్దతు ఇస్తున్నాడు. కనిపించని కుట్రల నేపధ్యంలో ఇప్పటి వరకు ఉన్న పరిస్దితిని బట్టి పోటీ అరౌజ్‌ -లాసో మధ్య జరుగుతుందా ? మితవాదశక్తులన్నీ లాసో వెనుక నిలుస్తాయా ? అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నది చెప్పలేము. ఇక్కడ అరౌజ్‌ విజయం లాటిన్‌ అమెరికాలో వామపక్షాల నిర్ణయాత్మక పాత్రను మరింత ముందుకు తీసుకుపోనుంది. అయితే సామ్రాజ్యవాదులు దీన్ని అనుమతిస్తారా లేక గతం మాదిరి మిలిటరీ నియంతలను తిరిగి రంగంలోకి తెస్తారా ?

చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
” ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో వాడే పండు గాడు ” దీని గురించి వేరే చెప్పనవసరం లేదు కదా ! బిజెపి నేతలు, వారి అనుయాయులకు చమురు పండుగాడి దెబ్బ తగిలినట్లుంది. లేకపోతే చమురు ధరల మీద గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట, ప్రధాని, ఆర్ధిక మంత్రి, చమురు మంత్రి ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు తలా ఒక మాట ఎలా మాట్లాడతారు ? రాజకీయ పార్టీల నేతలు (వామపక్షాలు దీనికి మినహాయింపు-వారు కూడా అలాంటివి పెట్టినట్లు ఎవరైనా నిరూపిస్తే సవరించుకుంటానని మనవి) జనానికి చెవుల్లో పూలు పెట్టాలను కోవటం నిత్యకృత్యం. అందులోనూ కమలం పువ్వు బిజెపిదే కనుక వారికి మేథోపరమైన, ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి.
” చమురు బంకుల దగ్గర బోర్డులు పెట్టాలి. కేంద్రం, రాష్ట్రాలు ఎంతెంత పన్ను విధిస్తున్నాయో, కేంద్రం విధించే పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు ఎంత వస్తున్నదో వాస్తవ భారం ఎంతో వివరిస్తూ ఆ బోర్డుల్లో రాస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి.” అని కొంతకాలం క్రితం మోడీ భక్తులు ప్రచారం చేశారు. బారు గడ్డంతో చిదానంద స్వామిలా ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా ఉన్న నిలువెత్తు నరేంద్రమోడీ చిత్రంతో ప్రతి బంకు వద్ద ఇప్పటికైనా భక్తులు స్వచ్చందంగా పెట్టినా ఇబ్బంది లేదు.లేదా జియోకు ఎలాగూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు గనుక ముకేష్‌ అంబానీ లేదా అదానీ అయినా తమ ప్రచార అంశాన్ని కిందో పైనో పెట్టి చమురు గురించి బోర్డులు పెట్టి రుణం తీర్చుకోవాలి.జనానికి వాస్తవాలను తెలియపరచాలి.

చమురు ధర వందడాలర్ల గురించి చర్చ ప్రారంభం !

ఇక పండుగాడి దెబ్బ గురించి చూద్దాం.కొద్ది రోజుల క్రితం బ్రెంట్‌ ముడి చమురు ధర 67-68 డాలర్ల వరకు ఊగిసలాడి ఆదివారం సాయంత్రం 66.13డాలర్ల దగ్గర, మన చమురు 65.70 డాలర్ల వద్ద ఉంది. మరోవైపున 2022 నాటికి వందడాలర్ల గురించి వ్యాపారులు ఆలోచిస్తున్నారు. త్వరలో 75-80 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరి జోశ్యం. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నది తెలిసిందే. చమురు ధరల చెలగాటం జనానికి అలవాటైపోయింది. ఎంత చెబితే అంత చెల్లించటం దేశభక్తిగా భావిస్తున్నారు.తాము చెల్లించేది కార్పొరేట్లకు రాయితీల రూపంలో సమర్పిస్తున్నారనేది తెలియటం లేదు. నరేంద్రమోడీ గారికి ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే ఆయన అధికారానికి వచ్చిన నాటి నుంచి బహుశా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే అంతర్జాతీయ మార్కెట్‌ను నియంత్రించి ఉండాలి. లేకపోతే రికార్డు స్దాయిలో సంవత్సరాల తరబడి ధరలు ఎందుకు తగ్గి ఉంటాయి. ఇప్పుడు కాక మొదలైంది కనుక చమురు పండు గాడు గుర్తుకు వస్తున్నట్లుంది.

ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా ! సమన్వయం ఉండదా !

ఫిబ్రవరి 17వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చమురు ధరలు వందరూపాయలు(బ్రాండెడ్‌) దాటాయన్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ధరలు ఆకాశాన్ని తాకటానికి గత పాలకులే కారణమంటూ గడ్డాన్ని సవరించుకున్నారు. వారు గనుక (తమ నేత వాజ్‌పాయి గారు కూడా ఆరేండ్లు అధికారంలో ఉన్న విషయం గుర్తు లేనట్లుంది) దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రీకరించి ఉంటే మధ్యతరగతికి ఈ భారం ఉండేది కాదు అంటూనే అబ్బే నేను ఎవరినీ విమర్శించటానికి కాదు గానీ ఈ విషయం చెప్పక తప్పదు అన్నారు. ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా గత ఏడు సంవత్సరాల కాలంలో చమురు దిగుమతులు పెరిగాయో తరిగాయో, స్వదేశీ ఉత్పత్తి ఎలా దిగజారిందో మోడీ గారికి పాఠంగా చెబుతారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కబుర్లు ఆయన గడ్డం పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నాయి.పెట్రోల్లో ఇథనాల్‌ను ప్రస్తుతం 8.5శాతం కలుపుతున్నామని, 2025 నాటికి దాన్ని 20శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని అది జరిగితే దిగుమతులు తగ్గుతాయి, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెరుగుతాయి. మధ్యతరగతి గురించి తాము ఎంతో సున్నితంగా వున్నామన్నారు. అసలు విషయం ఏమంటే చక్కెర పరిశ్రమలు ఇథనాల్‌ సరఫరా చేస్తుంటే వాటిని నిల్వచేసే ట్యాంకులను కూడా చమురు సంస్దలు ఏర్పాటు చేయలేదు. మోడీ గారు ఏమి చేస్తున్నారో తెలియదు.


చలికాలం తరువాత చమురు ధరలు తగ్గుతాయని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు.అయినా ఇది అంతర్జాతీయ వ్యవహారం, గిరాకీ పెరిగిన కారణంగా ధరలు పెరిగాయని సెలవిచ్చారు. చలికాలంలో ధరలు పెరగటం తరువాత తగ్గటం మామూలే అన్నారు. గత ఏడు సంవత్సరాల కాలంలో అలా ఎప్పుడైనా జరిగిందా ? ఒక దేశంలో చలికాలం అయితే మరో దేశంలో మరో వాతావరణం ఉంటుందని జనానికి తెలియదా అని అడిగితే దేశద్రోహం కేసు బనాయిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చమురు ధరలు అత్యంత కనిష్టానికి పడిపోయిన సమయంలో దానికి అనుగుణ్యంగా 86 రోజుల పాటు ధరలను ఎందుకు తగ్గించలేదో మంత్రిగారు చెబుతారా ? చమురేమైనా టమాటాల్లాంటివా ! సీజన్‌లో కొనేవారు లేక రైతులు పారపోస్తారు లేదా కిలో రూపాయికి లోపే అమ్ముకుంటారు. చమురు అలాంటిది కాదే.


మరోవైపున ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరలు తగ్గుతాయని తాను చెప్పలేనని,అదొక ధర్మ సంకటమని చెప్పారు. ఉల్లిధరల గురించి అడిగినపుడు నేను వాటిని తినను కనుక తెలియదని, జిఎస్‌టి నష్టాలకు దేవుడి విధి అని కేంద్రం ఏమీ చేయలేదని గతంలో చెప్పిన ఆమె నుంచి అంతకు మించి ఏమి ఆశించగలదు దేశం. ఇదే సమయంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ చమురుపై పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఎవరేం మాట్లాడుతున్నారో గమనించే స్ధితిలో ఉన్నారా ? పెట్రోలియం మంత్రి ఫిబ్రవరి పదవ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ గత మూడు వందల రోజుల్లో కేవలం 60 రోజులు మాత్రమే ధరలు పెంచామని పెట్రోలు ఏడు, డీజిలు 21 రోజులు తగ్గించామని, 250 రోజులు, పెంచలేదు తగ్గించలేదు అన్నారు. అంటే ఆ రోజుల్లో అంతర్జాతీయ ధరల్లో ఎలాంటి మార్పు లేదా ? ఎవరిని మభ్యపెట్టేందుకు ఇలాంటి మాటలు చెబుతారు.

మతిమరపు నటిస్తున్న బిజెపి పెద్దలు ! చంద్రబాబుకు మోకాళ్ల నొప్పులు !

ఇప్పుడు జనానికి సుభాషితాలు చెబుతున్న బిజెపి నేతలు గతంలో చమురు ధరలు పెరిగి నపుడు ఏమి సెలవిచ్చారో మతిమరపు నటిస్తున్న కారణంగా వారేమీ చెప్పలేరు గాని వారిని అభిమానించే వారు తెలుసుకోవాలి. వీధుల్లో వేసిన వేషాలు, చేసిన ప్రదర్శనలు, అన్నట్లు మరిచాను చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో జతకట్టిన కారణంగా యుపిఏకు వ్యతిరేకంగా సైకిలు తొక్కి నిరసన తెలియచేశారు. ఇప్పుడు బహుశా మోకాళ్ల నొప్పులు వచ్చి ఉంటాయి అనుకుంటే కుర్రవాడైన కొడుకు లోకేష్‌ ఎందుకు తొక్కటం లేదు ?


2006లో ముడిచమురు ధర పీపా 55 నుంచి 70 డాలర్లకు పెరిగినపడు బిజెపి డ్రామాలను జనం చూశారు.లీటరుకు 4,2 రూపాయల చొప్పున పెట్రోలు, డీజిలు మీద పెంచిన యుపిఏ సర్కార్‌ దానికి చెప్పిన కారణం అలా పెంచకపోతే చమురు కంపెనీలు కుప్పకూలిపోతాయని.గత సంవత్సరం చమురు ధర 20 డాలర్లకు పడిపోయినపుడు తరువాత 40 డాలర్లయినపుడు కూడా అంతకు ముందు ఉన్న ధరలను తగ్గించలేదు. ఎందుకంటే కరోనా సమయంలో చమురు వినియోగం పడిపోయింది తప్ప కంపెనీల, పెట్రోలు బంకుల ఖర్చులు తగ్గలేదు కనుక తగ్గిన మేరకు ధరలు తగ్గించలేదని బిజెపి నేతలు చెప్పటం తెలిసిందే. మరి సామాన్య జన ఆదాయాలు తగ్గకుండా ఏం చేశారంటే మాత్రం నోరు పెగలదు. నాడు మాజీ ప్రధాని వాజ్‌పాయి గారు యుపిఏ సర్కార్‌ క్రూరమైన పరిహాస మాడుతోందన్నారు.కేంద్రం, రాష్ట్రాలు పన్నులు తగ్గించాలన్నారు. గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ రాజధర్మం పాటించాలని వాజ్‌పాయి చెప్పారు. ఆయన బతికి ఉండగానే ఆ మాటల మీద చల్‌ అన్నట్లుగా పట్టించుకోని నరేంద్రమోడీ ఇప్పుడు దివంగత నేతకు ప్రమాణాలు చేయటం తప్ప ఆయన మాటలను పట్టించుకుంటారా, పాటిస్తారా !


ఇప్పుడు బిజెపిఏతర పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చు కదా అంటున్న బిజెపి వారు అప్పుడు తమ ఏలుబడిలో ఎంత మేరకు తగ్గించారో చెప్పగలరా ? అప్పుడు పెట్రోలు లీటరు ధర 47.51, డీజిలు ధర 23.52 ఉండేది. నిజంగా క్రూరమైన పరిహాసం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ ఆరు సంవత్సరాలలో 33 సార్లు ధరలను పెంచింది. 2002-06 మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 24 నుంచి 75 డాలర్లకు పెరిగింది. చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ ధరలను వసూలు చేయాలని నిర్ణయించింది. అధికారం పోగానే మర్యాదస్తుడని అనేక మంది భావించే వాజ్‌పేయి నాయకత్వంలోనే బిజెపి ధరల పెరుగుదల వ్యతిరేక నిరసన నాటకాలాడింది నిజం కాదా ?

పన్నుల విధింపులో ఔరంగజేబు ఆదర్శమా !


2020 ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో (లాక్‌డౌన్‌ సమయం) కేంద్ర ఎక్సయిజు పన్ను చమురు ఖాతా నుంచి 1,96,342 కోట్లు వస్తే అంతకు ముందు సంవత్సరంలో అదే వ్యవధిలో వచ్చిన మొత్తం 1,32,899 కోట్లు మాత్రమే.చమురు కంపెనీలతో పాటు మోడీ సర్కార్‌ జనం నుంచి పిండిన తీరు ఇది. అంతకు ముందుతో పోల్చితే వినియోగం తగ్గినప్పటికీ ఔరంగజేబు మాదిరి పన్నులతో పీల్చిన ఫలితమిది.ఇదే సమయంలో జిఎస్‌టి ఆదాయం గణనీయంగా తగ్గి రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. నిద్రపోయే వారిని లేపి ఈ విషయాలన్నీ చెప్పగలం తప్ప నటించేవారికి చెప్పలేము.


జనానికి బుర్రలుండవని, ఉన్నా ఉపయోగించలేని బద్దకం బలిసిపోయిందని బిజెపికి అనుకుంటున్నట్లుగా మరొక పార్టీ భావించదని అంగీకరించకతప్పదు. లేకపోతే పెరిగిన ధరలను సమర్ధించేందుకు ఎంత ధైర్యం ఉండాలి. స్మృతి ఇరానీ పెద్ద నటి అన్న విషయం తెలిసిందే. ఆమె బిజెపి నేతగా 2011 జూన్‌ 24న గ్యాస్‌ బండ మీద 50 రూపాయల పెంపుదల మీద చేసిన ట్వీట్‌లో ఏమన్నారో తెలుసా ? మాది సామాన్యుల ప్రభుత్వం అని చెప్పుకుంటారు, గ్యాస్‌ ధర 50 పెంపా, ఎంత సిగ్గు చేటు అన్నారు. ఇప్పుడు ఆమె గౌరవనీయమైన కేంద్ర మంత్రి. డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 150 రూపాయలు పెంచారు. మంత్రిగారు గనుక ఆమె వంటశాలకు దూరంగా ఉంటారు గనుక తెలిసి ఉండదు. లేకపోతే గతంలో మాదిరి వీధుల్లో వచ్చి ఉండేవారు. బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ జగమెరిగిన ఫేకిస్టు.2012 అక్టోబరు ఆరున ఒక ట్వీట్‌ చేశారు. అదేమంటే అప్పటి యుపిఏ సర్కార్‌ గ్యాస్‌ బండమీద రు.11.42పైసలు పెంచింది. దానికి వ్యతిరేకంగా సామాన్యులు, మహిళల మీద కాంగ్రెస్‌ బ్యాండ్‌ మోత మోగించింది అన్నారు. ఇప్పుడు జరిగిందేమిటి ? లెక్కలు చెప్పాలా ?ఒక సంఖ్య చెబితే మరుసటి రోజుకో వారానికో మారిపోతున్నందున ఎవరికి వారు బండను బుక్‌ చేసినపుడు ఎంత ఉందో తెలుసుకొని మోడీ సర్కార్‌కు భజన చేయాలో బ్యాండ్‌ బజాయించాలో నిర్ణయించుకోవచ్చు.


సిఎంగా మోడీ నాడేమన్నారు-ప్రధానిగా నేడేం చేస్తున్నారు !


2012 మే నెలలో పెట్రోలు ధరను లీటరుకు రూ.7.54 పెంచారు. దాంతో ఢిల్లీలో రు.73.18కి పెరిగింది. దాని మీద నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ మండిపడ్డారు.అది కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి ఒక ముఖ్య ఉదాహరణ అన్నారు.తొమ్మిది సంవత్సరాల తప్పుడు ఆర్ధిక విధానాల పర్యవసానం అన్నారు బిజెపి నేతలు. ఆర్ధిక వ్యవస్ధను బలంగా ఉంచే విధంగా సరైన విధానాలను యుపిఏ అనుసరించి ఉంటే అది చమురు సబ్సిడీలను ఇచ్చే స్ధితిలో ఉండేది అన్నారు. తరువాత వామపక్షాలతో పాటు బిజెపి కూడా చమురు ధరలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌లో పాల్గొన్నది. ఇప్పుడు బిజెపి నేతలు ఏం చేస్తున్నారు ? సబ్సిడీలన్నీ ఎత్తివేశారు. మోడీ అధికారానికి రాక ముందు మే 2014లో 113 డాలర్లు ఉన్న ముడిచమురు ధర మరుసటి ఏడాది జనవరి నాటికి 50 డాలర్లకు పడిపోయింది.


2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనేమన్నారు. నిజమే నేను అదృష్టవంతుడనే, కానీ మీకు డబ్బు ఆదాఅవుతోంది. మోడీ అదృష్టం జనానికి లబ్ది చేకూర్చుతుంటే అంతకంటే కావాల్సిందేముంది ? నా అదృష్టం కారణంగా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గితే సామాన్యుల పొదుపు ఎక్కువ అవుతుంది. అందువలన అదృష్టవంతులు కాని వారిని తీసుకురావాల్సిన(ఎన్నుకోవాల్సిన) అవసరం ఏముంది అంటూ కాంగ్రెస్‌ మీద వ్యాఖ్యానించారు. ఆ అదృష్టం ఇంకా పెరిగి 2016లో ఒక దశలో ముడిచమురు ధర 29 డాలర్లకు పడిపోయింది. సదరు అదృష్టవంతుడు చేసిందేమిటి ? వినియోగదారులకు దరిద్రాన్ని పట్టించటం కాదా ? 2014 మే నుంచి ఇప్పటి వరకు వరకు వంద రూపాయలు పెంచి ఒక్క రూపాయి తగ్గించిన మాదిరి ఉదారత్వాలను పరిగణనలోకి తీసుకుంటే భారం ఎలా ఉందో చూద్దాం.
సం ××సరకు ×× ఎక్సయిజ్‌×××డీలరు ధర××వినియోగదారు ధర
2014 ×× పెట్రోల్‌ ×××× 9.48 ××× 49.50 ××××× 73.20
2021 ×× పెట్రోల్‌ ×××× 32.98 ××× 27.75 ××××× 83.71
2014 ×× డీజిలు ×××× 3.56 ××× 52.68 ××××× 55.48
2021 ×× డీజిలు ×××× 31.80 ××× 33.74 ××××× 79.74
(గమనిక 2014డీజిలు, పెట్రోలు ధరలు మార్చి ఒకటవ తేదీ ఢిల్లీ, 2021 డీజిలు ధర ఫిబ్రవరి 16, పెట్రోలు ధర జనవరి ఒకటవ తేదీ ఢిల్లీకి చెందినవి, హిందూస్దాన్‌ పెట్రోలియం కంపెనీ ధరలుగా గమనించాలి.2014 మార్చిలో పెట్రోలు మీద సబ్సిడీ లేదు, డీజిలు మీద లీటరుకు రూ.8.37 సబ్సిడీ ఉంది.)

అమెజాన్‌ ”టూల్‌ కిట్‌ ” లో ప్రధాని నరేంద్రమోడీ గురించి ఉన్నది ఏమిటి ?


విదేశీయులు లేదా స్వదేశీయులు ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రులను పొగడుతున్నారు అంటే వారిలో రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. దానికి ఎవరూ మినహాయింపు కాదు. ఒకటి ప్రయోజనం కోసం చెప్పే మెరమెచ్చు మాటలు, రెండోది అంతర్గతంగా ఉన్న అభిప్రాయం.2012 ఫిబ్రవరి 18వ తేదీన బిజినెస్‌ టుడే అనే పత్రిక రాయిటర్‌ సంస్ధ ఇచ్చిన వార్తను ప్రచురించింది. ” మోడీ ఒక మేథావి కాదు: ప్రధాని గురించి అంతర్గత పత్రాల్లో అమెజాన్‌ వర్ణణ ” అన్నది దాని శీర్షిక. ప్రముఖులు ఇతరులతో సంభాషించే సమయంలో మాట్లాడాల్సినవి ఏవి, మాట్లాడకూడనివి ఏవి, బలం ఏమిటి బలహీనతలు ఏమిటి అని కంపెనీ సిబ్బంది ఒక నోట్‌ తయారు చేస్తారు. దానికి అనుగుణ్యంగానే అమెరికాలోని భారత రాయబారితో 2019లో అమెజాన్‌ డాట్‌కామ్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ జే కార్నే మాట్లాడేందుకు వెళ్లినపుడు సిబ్బంది ఒక పత్రంలో కొన్ని విషయాలు రాశారు.అప్పుడు కార్నే మోడీని బహిరంగంగా ఇలా వర్ణించాడు ” సీదా సాదాగా, తర్కబద్దంగా, ముక్కుసూటిగా ఉంటారు” అని పేర్కొన్నాడు. అమెజాన్‌ కంపెనీ 2012 నుంచి 2019వరకు రూపొందించిన ఇలాంటి పత్రాలు రాయిటర్‌ వార్తా సంస్దకు దొరికాయి. ఒకదానిలో మోడీ ముక్కుసూటి తనం, ఆలోచించే తీరు ఆయన ఒక మేథావి స్దాయికి తగినదిగా ఉండదు అని పేర్కొన్నారు. ఒక మేథావీకాదు, ఒక పండితుడు కాదు గానీ బలమైన పాలనా, యంత్రాంగంతో విజయవంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు.అలాంటి పత్రాలను రూపొందించిన వారిలో మన దేశానికి చెందిన అమెజాన్‌ కంపెనీ ప్రతినిధి అమిత్‌ అగర్వాల్‌ వంటి స్వదేశీయులే ఉన్నారు. టూల్‌కిట్‌తో మన పరువు పోయిందని గగ్గోలు పెడుతున్నవారు ఇలాంటి టూల్‌కిట్ల గురించి కూడా తెలుసుకుంటే మంచిదేమో ?

కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏప్రిల్‌ ఆరవ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనతో రాజకీయ సమీకరణలు, సర్దుబాట్లు త్వరలో ఒక కొలిక్కి రానున్నాయి. గత నాలుగు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమి అధికారానికి వస్తే మరోసారి సిపిఎం నాయకత్వంలోని కూటమి రావటం తెలిసిందే. దానికి భిన్నంగా ఈ సారి మరోసారి అధికారాన్ని నిలుపుకొనేందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తుంటే, అధికారానికి రావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ చేయని ప్రయత్నం లేదు. కేవలం ఒక స్ధానం ఉన్న బిజెపి తాము కూడా అధికారంలోకి వచ్చేందుకు సిద్దం అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. తాను చేరితే బిజెపి ఓట్లు రెట్టింపు అవుతాయని, అధికారానికి వస్తే తాను ముఖ్యమంత్రి పదవికి సిద్దంగా ఉన్నానని మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌లో 14 పార్టీలు, యుడిఎఫ్‌లో ఐదు ఉన్నాయి. ఎన్‌డిఏలో బిజెపితో పాటు మరో నాలుగు చిన్న పార్టీలు ఉన్నాయి. మొత్తం 140 స్దానాలకు గాను ఎల్‌డిఎఫ్‌కు 91 స్ధానాలు, యుడిఎఫ్‌కు 47, బిజెపికి ఒకటి, ఆ పార్టీతో జత కట్టిన మరో పార్టీకి ఒక స్ధానం ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌లో కొత్తగా చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం), లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ యుడిఎఫ్‌లో ఉండగా గత ఎన్నికల్లో 11, 7 స్దానాల చొప్పున పోటీ చేశాయి. ఇప్పుడు వాటికి ఎల్‌డిఎఫ్‌లోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా సిపిఎం, సిపిఐ తమ స్దానాల సంఖ్యను తగ్గించుకొని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు యుడిఎఫ్‌లో ఖాళీ అవుతున్న సీట్లలో మిగిలిపోయిన కేరళ కాంగ్రెస్‌(జె)కు ఏడు సీట్లు పోను మిగిలిన వాటిని కాంగ్రెస్‌-ముస్లిం లీగు పంచుకుంటాయని వార్తలు వచ్చాయి. కొద్ది వారాల క్రితం పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి ఎల్‌డిఎఫ్‌కు 101 స్ధానాలు వస్తాయని, మళయాల మనోరమ విశ్లేషించగా, 98వస్తాయని సిపిఎం సమీక్షలో తేలిందని అదే ప త్రిక రాసింది. స్దానిక సంస్ధల ఎన్నికలకు ముందు ఎల్‌డిఎఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికలలో ఓటర్లు వాటిని తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కూడా తిరిగి అదే ప్రచారం ప్రారంభమైంది.మీడియా వాటికి వంతపాడుతున్నది.


ఓట్లకోసం చర్చిల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్న బిజెపి -ముస్లిం లీగుకూ ఆహ్వానం !


కేరళలో సీట్లు వచ్చినా రాకపోయినా కనీసం ఓట్లయినా పెంచుకోవాలని, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకోవాలన్నది బిజెపి ఆత్రం. అత్రగాడికి బుద్ది మట్టు అన్న సామెత తెలిసిందే. నిత్యం మత మార్పిడుల గురించి క్రైస్తవ మతాన్ని తిట్టిపోసే బిజెపి నేతలు ఇప్పుడు కేరళలో చర్చ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు, ఆ మత పెద్దలను సంతుష్టీకరించి ఓట్లు పొందేందుకు నిర్ణయించుకున్నారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ త్వరలో అందుకోసం బయలుదేర నున్నారని కేరళలో అగ్రశ్రేణి దినపత్రిక మళయాల మనోరమ రాసింది.కర్ణాటక నుంచి కేరళ బిజెపి అభ్యర్ధులకు అవసరమైన డబ్బుతో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు అక్కడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నడుంకట్టారు. కేరళలో సమస్యలు, బిజెపి ఎత్తుగడల గురించి చర్చించేందుకు బెంగళూరులోని వంద మంది మళయాలీ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారట.
కేరళ రాజకీయాల్లో ఏది వాటంగా ఉంటే దాన్ని అనుసరించే సీనియర్‌ ఎంఎల్‌ఏ పిసి జార్జి. కాంగ్రెస్‌తో జీవితాన్ని ప్రారంభించి స్వతంత్రుడిగా, కేరళ కాంగ్రెస్‌లోని రెండు ప్రధాన గ్రూపుల్లో చేరి తరువాత దాన్నుంచి బయటకు వచ్చి జనపక్షం పేరుతో స్వంత పార్టీని పెట్టుకున్నారు. ఏ పేరుతో పోటీ చేసినా మంచి మెజారిటీలతో ఏడు విజయాలతో ఒక ప్రత్యేకత సాధించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తాజా వార్తల ప్రకారం మరోసారి బిజెపితో చేతులు కలపబోతున్నారు. రెండు సీట్లు కేటాయించేందుకు అంగీకరించినట్లు వార్తలు. ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన బహిరంగ ప్రకటనలు, అంతర్గతంగా బిజెపితో సంబంధాలు నెరపటంతో జార్జిని చేర్చుకుంటే చేర్చుకుంటే సంగతి తేలుస్తాం అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం హెచ్చరించింది. ఒక వేళ చేర్చుకొని సీటు ఇస్తే పోటీగా ఒక స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దింపుతామని కొట్టాయం జిల్లా నేతలు హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్ధితిలో ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా కొన్ని వేల ఓట్లు కూడా ఎంతో కీలకమైనవి కనుక చేర్చుకోవాలన్న వర్గం వాదనలను మెజారిటీ అంగీకరించలేదు.


ఎల్‌డిఎఫ్‌ ఎలాగూ చేర్చుకోదు గనుక పిసి జార్జి బిజెపి వైపు చేరనున్నారు. ఆ పార్టీని మంచి చేసుకునేందుకు ముందుగానే చెప్పినట్లు ముస్లింలను విమర్శించి మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. మరోవైపు రామాలయ నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చినట్లుగా మాతృభూమి పత్రిక రాసింది. బిజెపితో కలసిన మరొక పార్టీ కేరళ కాంగ్రెస్‌(థామస్‌). దీని నేత పిసి థామస్‌ గతంలో వాజ్‌పేయి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పిసి జార్జిని బిజెపి వైపు తీసుకురావటంలో సంధానకర్తగా పనిచేశారని వార్తలు.జార్జి వస్తే కొట్టాయం జిల్లాలో ప్రతిష్ఠాత్మక స్ధానంగా మారిన పాలా నియోజకవర్గంలో బిజెపి గెలవవచ్చనే అంచనాతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఐదు దశాబ్దాల పాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేరళ కాంగ్రెస్‌ (ఎం) నేత మణి మరణించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలో ఎల్‌డిఎఫ్‌ తరఫున్‌ ఎన్‌సిపి అభ్యర్ధి ఎంసి కప్పన్‌ విజయం సాధించారు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు యుడిఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(ఎం) బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరింది.దాంతో పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయించాలని సిపిఎం నిర్ణయించింది. కప్పన్‌కు వేరే చోట కేటాయిస్తామని చెప్పినప్పటికీ వినలేదు. దాంతో ఎన్‌సిపి అతగాడిని పార్టీ నుంచి బహిష్కరించటంతో యుడిఎఫ్‌లో చేరారు. పిసి జార్జి గతంలో కేరళ కాంగ్రెస్‌(ఎం)లో ఉన్నపుడు దివంగతనేత మణి కుమారుడు ప్రస్తుత నేత జోస్‌కె మణితో విబేధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తిరిగి మణి పాలాలో పోటీ చేస్తారన్న వార్తల పూర్వరంగంలో పిసి జార్జి కాంగ్రెస్‌లో చేరి దెబ్బకొట్టాలని చూశారు. అది సాధ్యంగాకపోవటంతో బిజెపితో చేతులు కలుపుతున్నారు. పాలాలో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.


మరొక ముఖ్యమైన పరిణామం ముస్లిం లీగ్‌ను ఎన్‌డిఏలోకి ఆహ్వానించారు. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శోభా సురేంద్రన్‌ మాతృభూమి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముస్లిం లీగ్‌ జాతీయవాదాన్ని అంగీకరించి ఎన్‌డిఏలోకి రావాలని అది లీగ్‌ నేతలకు, ముస్లింలకూ ఉపయోగం అని ఆమె వ్యాఖ్యానించారు. అది జరిగినా ఆశ్చర్యం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. శోభ వ్యాఖ్యలు సంచలనం సృష్టించటంతో కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ మాట్లాడుతూ తాము ముస్లింలీగ్‌తో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ మైనారిటీ కమ్యూనిటీ ప్రతినిధులు కాదని, ఎవరైనా తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకున్నారు. సిపిఎం, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలను వారు గుర్తించాలన్నారు. మరోవైపున కేరళలో తాము అధికారానికి రావాలంటే 35-40 స్ధానాలు వస్తే చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చెప్పారు.


బిజెపి రిక్రూట్‌మెంట్‌ ఏజంట్‌గా రాహుల్‌ గాంధీ !


కాంగ్రెస్‌ నిర్వహించిన కేరళ ఐశ్వర్య యాత్ర ముగింపు సభకు వచ్చిన రాహుల్‌ గాంధీ ప్రసంగ తీరుతెన్నులు బిజెపి రిక్రూటింగ్‌ ఏజంట్‌ మాదిరిగా ఉన్నాయని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గం విమర్శించింది. బిజెపిపై పల్లెత్తు విమర్శకూడా చేయకుండా వామపక్షాలపై బిజెపి చేస్తున్న విమర్శల పదజాలాన్నే పునశ్చరణ గావించారని, ఆ కారణంగానే అనేక చోట్ల కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు ఏకంగా బిజెపిలోనే చేరేందుకు ఉత్తేజం పొందుతున్నారని సిపిఎం పేర్కొన్నది. బిజెపి అమలు చేస్తున్న వ్యవసాయ సంస్కరణలు అమలు జరుపుతామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ వైనాడ్‌లో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన రాహుల్‌ గాంధీ చిత్తశుద్ది ఏమిటని సిపిఎం ప్రశ్నించింది.
ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని విస్మరించిన రాహుల్‌ గాంధీ కేరళ వచ్చి మద్దతు ప్రకటించటం అసాధారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.1990 దశకంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన ఉదారవిధానాలు వ్యవసాయ సంక్షోభానికి కారణమని, ఆ పార్టీ చేతులు రైతుల రక్తంతో తడిచాయని, అందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన నియోజకవర్గం వైనాడ్‌లో గతంలో ఏమి జరిగిందో, కాఫీ, మిరియాల రైతులు ఎలా నాశనమయ్యారో తెలుసుకొనేందుకు సిద్దపడాలని అన్నారు. రెండు దశాబ్దాల నాడు కాంగ్రెస్‌ అమలు జరిపిన విధానాల కారణంగా వైనాడ్‌లోని ఆ పంటల రైతులు రెండు మూడు సంవత్సరాలలో ఆరువేల కోట్ల రూపాయలు నష్టపోయారని జర్నలిస్టు శాయినాధ్‌ పేర్కొన్న విషయాన్ని రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలన్నారు.ఆ విధానాల ఫలితంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారని అందుకుగాను రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. సిపిఎం పట్ల రాహుల్‌ గాంధీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఒకే విధమైన వైఖరితో ఉన్నందున వారి మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు.