కరీబియన్‌ ప్రాంతంలో చిచ్చు : వెనెజులా మిలిటరీ విన్యాసాలు, దాడులకు అమెరికా సన్నాహం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టే సాకుతో వామపక్ష పాలనలో ఉన్న వెనెజులాపై దాడులు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేసింది. ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చని వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు మదురోను గద్దె దింపటం తమ లక్ష్యం కాదని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మటం లేదు. అమెరికా దుర్మార్గాన్ని ప్రతిఘటించేందుకు సరిహద్దులో మదురో కూడా మిలిటరీని మోహరించి గురువారం నాడు త్రివిధ దళాలతో విన్యాసాలు నిర్వహించారు. వెనెజులా భూభాగంలో ఉన్న మాదకద్రవ్యాల మాఫియాలపై మిలిటరీ దాడులు చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు మీరే చూస్తారుగా అంటూ ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి అమెరికా ఆంతర్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం కరీబియన్‌ సముద్రంలో ఒక పడవపై దాడి అమెరికా మిలిటరీ దాడి చేసి పదకొండు మందిని చంపివేసింది.వారికి మదురోకు సంబంధాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నద్ని అ బోటులో ఉన్నవారెవరికీ అమెరికా చెప్పే మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధాలు లేవని మదురో సర్కార్‌ ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులు కనిపించటం లేదని బంధువులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నది.తొలుత ఆ ఉదంతం కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో అని మదురో పేర్కొన్నారు. వెనెజులా నుంచి వచ్చిన ఆ మోటార్‌ బోట్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు స్వయంగా ట్రంప్‌ కత చెప్పాడు. ఆ ముఠా అమెరికాలో హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సామూహిక హత్యలు, అమ్మాయిల అక్రమరవాణాకు పాల్పడుతున్నదని ఆరోపించాడు. ఆ తరువాత పోర్టారికోకు పది ఎఫ్‌ 35 రకం యుద్ధ విమానాలను అమెరికా తరలించింది. తప్పుడు సాకులతో అమెరికా దాడులకు పూనుకున్నదని మదురో శుక్రవారం నాడు చెప్పారు. మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి ఇరాక్‌ మీద దాడులు చేసినట్లుగానే తమపై అమెరికా దుర్మార్గానికి పాల్పడేందుకు పూనుకున్నదన్నాడు. అనేక దేశాలతో పోల్చితే తమ దేశం ద్వారా రవాణా అవుతున్న మాదకద్రవ్యాలు స్పల్పమని చెప్పాడు. అమెరికన్లు వెనక్కు తిరిగి పోలేని చోటికి చేరుకుంటున్నారని హెచ్చరించారు. మదురోను అరెస్టు చేసేందుకు వీలు కలిగే సమాచారం ఇచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్లు ఇస్తామని ఆగస్టు నెలలో అమెరికా ప్రకటించిన అంశం తెలిసిందే.1998లో హ్యూగో ఛావెజ్‌ నాయకత్వంలో వామపక్షాలు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలను కూలదోసేందుకు మితవాద నేతలకు అనేక రకాలుగా అమెరికా సాయం చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. విధించిన ఆంక్షలు పనిచేయటం లేదు. ఇప్పుడు మాదకద్రవ్యాల పేరుతో మరోకుట్రకు తెరలేపారు.


కరీబియన్‌ అంతర్జాతీయ జలాల్లో ఉన్న పడవను ఆపేందుకు, ప్రాణాలతో దాన్లో ఉన్నవారిని పట్టుకొనేందుకు అమెరికా మిలిటరీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.నేరుగా కాల్పులు జరిపి చంపివేయటం ద్వారా తాను తలచుకొంటే ఏ దేశంపై అయినా యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఎవరినైనా మట్టుబెడతామనే బెదిరింపు సందేశాన్ని ఆప్రాంత దేశాలకు పంపినట్లయింది.తమకు పూర్తి అధికారాలు, సత్తా ఉందని ఈ ఉదంతంపై విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. పడవపై దాడి ఉదంతానికి ఒక రోజు ముందు మదురో మాట్లాడుతూ అమెరికన్లు అవాస్తవాలు చెబుతున్నారని వారు వెనెజులా చమురు, గ్యాస్‌ను ఉచితంగా దోచుకొనేందుకు వస్తున్నారని అందుకోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని హెచ్చరించాడు. 1898లో స్పెయిన్‌తో యుద్దాలకు తప్పుడు ప్రచారం చేశారని, 1964లో వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ప్‌ కల్పిత ఉదంతాన్ని, 2003 ఇరాక్‌పై మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేశారని అన్నాడు.మోనికా లెవెన్సీతో తన అక్రమ సంబంధ ఉదంతం నుంచి అమెరికన్లను పక్కదారి పట్టించేందుకు నాటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ సూడాన్‌ మీద దాడి చేయించాడని ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అలాంటి కుంభకోణంలో జెఫ్రి ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో కూరుకుపోయాడని అన్నాడు.


తన ప్రత్యర్ధులైన ఇరాన్‌,లెబనాన్‌,హుతీ, హిజబుల్లా, హమస్‌ అగ్రనేతలను ఒక ప్రకారం మట్టుబెడుతున్న క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా ఎమెన్‌ ప్రధాని, మంత్రులను హతమార్చటాన్ని చూశాము. ఈ దుర్మార్గాలన్నింటికీ అమెరికా, ఇతర పశ్చిమదేశాల సంపూర్ణ మద్దతు ఉంది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష నేతలు అమెరికాకు కొరకరాని కొయ్యలుగా మారిన పూర్వరంగంలలో వారిని హతమార్చేందుకు అమెరికా చూస్తున్నది, దాని లక్ష్యంగా మదురో ఉన్నాడని వేరే చెప్పనవసరం లేదు.అమెరికా గద్దెపై ఎవరున్నా అదే చేస్తున్నారు. రెండవసారి అధికారానికి వచ్చిన మరుసటి రోజే విదేశీ ఉగ్రవాద సంస్థలను మాదకద్రవ్యాల మాఫియాలుగా చిత్రిస్తూ ట్రంప్‌ ఉత్తరువులు జారీ చేశాడు. ఆ ముసుగులో వెనెజులా సమీపానికి మిలిటరీని దించుతున్నాడు.ఇతర దేశాల్లో జోక్యం చేసుకొనేందుకు మిలిటరీకి అధికారమిస్తూ రహస్య ఉత్తరువులు ఇచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. వెనెజులా చమురు కొనుగోలు చేయవద్దని, దాన్ని రవాణా చేయవద్దంటూ ఆంక్షలు విధించింది. ట్రంప్‌కు చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో విచ్చలవిడిగా దొరుకున్న మాదకద్రవ్యాలు, వాటిని సరఫరా చేసే వారి మీద కేంద్రీకరించాలి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 200 నుంచి 750బిలియన్‌ డాలర్ల మేరకు మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే ప్రాణావసరమైన ఔషధాల లావాదేవీలు 600 బిలియన్‌ డాలర్లు, చమురు లావాదేవీల విలువ 400 బి.డాలర్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో మాదక ద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న, వాటి తయారీకి అవసరమైన ఔషధ సంబంధిత రసాయనాలు, ఆయుధాలను ప్రపంచానికి ఎక్కువగా సరఫరా చేస్తున్నది అమెరికా అన్నది నమ్మలేని నిజం. ఈ అక్రమలావాదేవీల్లో అమెరికాలోని బడా బాంకులు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. అమెరికన్‌ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇదంతా సాగుతుందా ? తన విధానాలు, కార్పొరేట్ల దోపిడీని ప్రశ్నించకుండా యువతను మత్తులో ముంచే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉందన్నది స్పష్టం. ఐరాస 2025 ప్రపంచ మాదకద్రవ్యాల నివేదికలో వెనెజులా గురించి చేసిన ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. అక్కడ మాదక ద్రవ్యాల సాగు లేదా తయారీ దాదాపు లేదని పేర్కొన్నది.


కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన చారిత్మ్రాక షాంఘై సహకారం సంస్థ 25వ సమావేశంలో షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, పుతిన్‌ కలయిక అమెరికా విధాన నిర్ణేతలకు వణుకుపుట్టించింది. వెంటనే గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్‌ నాలుగు రోజుల తరువాత భారత్‌ను చైనాకు కోల్పోయినట్లు ఉక్రోషంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన వారం రోజుల్లోనే బ్రిక్స్‌ సమావేశాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోయాడు. వెనెజులా పేరుతో కరీబియన్‌ సముద్రంలో ఉద్రిక్తతలకు తెరతీశాడు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సుద్వారా బ్రిక్స్‌ సదస్సును బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ప్రారంభించాడు. కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా యుద్ద నావలు ఉద్రిక్తతకు కారణం అవుతున్నాయని చెప్పాడు. వెనెజులా మీద దాడికి సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నదన్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు బ్రిక్స్‌ సమావేశానికి డుమ్మాకొట్టిన ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ మంత్రి జై శంకర్‌ను పంపారు. చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని పిలుపునిచ్చాడు.


ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమరవాణా సమస్యలు ఉన్నాయి. ఒక దేశం మీదకు యుద్ధ సన్నాహాల మాదిరి కరీబియన్‌ సముద్రంలో అమెరికా యుద్ద నావలను దించింది. వాటిలో నాలుగున్నరవేల మంది మెరైన్లు, నావికులను మోసుకువెళ్లే నౌక, నియంత్రిత క్షిపణులను ప్రయోగించే మూడు డెస్ట్రాయర్లు ఇతర నౌకలు, మరోచోట పది యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది వెనెజులాను బెదిరించేందుకు, దాడి చేసేందుకు అన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్కడా అమెరికా ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న ఉదంతాలులేవు. ఇతర దేశాలతో దాడులు చేయించటం, వాటికి ఆయుధాలు విక్రయించి లబ్దిపొందే విధానాన్ని అనుసరిస్తున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన నికొలస్‌ మదురో ప్రభుత్వాన్ని అమెరికా ఇంతవరకు గుర్తించలేదు.తాము బలపరిచిన ప్రతిపక్ష అభ్యర్థి గోన్‌జాలెజ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అమెరికా చెప్పుకుంది. అమెరికా గనుక దాడులకు పాల్పడితే తాము ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉన్నామని, మిలిటరీతో పాటు లక్షలాది మంది పౌరులను దించుతామని మదురో హెచ్చరించాడు. దాదాపు ఇరవై ఐదువేల మంది సైనికులను కొలంబియా సరిహద్దులకు, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు, సముద్రతీరానికి తరలించటమే గాక దేశవ్యాపితంగా డ్రోన్లు ఎగురవేయటంపై ఆంక్షలు విధించాడు. తమ జలాల్లో నౌకా దళం పహారా కాస్తుందని రక్షణ మంత్రి ప్రకటించాడు.ప్రస్తుతం మిలిటరీలో లక్షా 23వేల మంది సైనికులు ఉన్నారు. వీరు గాక మరో రెండులక్షల ఇరవైవేల మంది ప్రజాసాయుధులు ఉన్నట్లు మదురో ప్రకటించాడు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలను ముందుకు తేవటంతో పాటు పరిసర దేశాల మద్దతు పొందేందుకు వెనెజులా నాయకత్వం పూనుకుంది.

గతంలో మిత్రదేశంగా ఉన్న సమయంలో వెనెజులాకు అమెరికా నాలుగవ తరం ఎఫ్‌ 16 యుద్ద విమానాలను సరఫరా చేసింది. ఇప్పుడు వాటితోనే కరీబియన్‌ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నావల చుట్టూ చక్కర్లు కొట్టించారు. నియంతల పాలనా కాలంలో చమురు నిల్వలపై కన్ను, కమ్యూనిజాన్ని విస్తరించకుండా చూసేందుకు వెనెజులా ఆ ప్రాంతంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అమెరికా యుద్ధ విమానాలను అందచేసింది. అయితే అనూహ్యంగా ఛావెజ్‌ రంగంలోకి రావటంతో వెనెజులా బద్దశత్రువుగా మారింది. ఛావెజ్‌ అధికారానికి వచ్చిన తరువాత చైనా, రష్యాలతో మిలిటరీ సంబంధాలను పెట్టుకున్నాడు. ఒక దశలో తమపై విధించిన ఆంక్షలకు ప్రతిగా ఎఫ్‌16 విమానాలను ఇరాన్‌కు విక్రయిస్తామని ఛావెజ్‌ అమెరికన్లను హెచ్చరించాడు.2013 నుంచి నికోలస్‌ మదురో అధికారంలో కొనసాగుతూ చావెజ్‌ బాటను అనుసరిస్తున్నాడు. కరీబియన్‌ సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగున్నరవేల మందితో వెనెజులాను స్వాధీనం చేసుకోవటం లేదా దాడి చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.అమెరికా దాడులకు గురైన ఇతర దేశాలకు భిన్నంగా ప్రజాసాయుధులను కూడా వెనెజులా దింపే అవకాశం ఉంది. ఇరుగు పొరుగులాటిన్‌ అమెరికా దేశాలలో ఎక్కువ భాగం అమెరికా చర్యను ఖండిరచాయి. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా చైనా చమురు దిగుమతి చేసుకోవటమే గాక వెనెజులాలో చమురు వెలికితీసేందుకు కూడా ముందుకు వచ్చింది. చైనా నుంచి మిలిటరీ జెట్లను కొనుగోలు చేసేందుకు మదురో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయినప్పటికీ అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే వెనెజులా బలం ఒక లెక్కలోనిది కాదు. దాని బలం, బలగం మదురోకు మద్దతు ఇస్తున్న జనం, ఇరుగు పొరుగుదేశాల సంఫీుభావమే !
 
.

చెవిలో పూలు : పాకిస్థాన్‌ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుందా, కాషాయ దళాలు, మీడియా కథనాల్లో నిజమెంత !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


‘‘ పాకిస్థాన్‌ 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్‌ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్‌ యొక్క 60 బిలియన్‌ డాలర్స్‌ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీరులో భాగమైన గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్‌ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్‌ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్‌ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నిజానికి మన్మోహన్‌ సింగ్‌ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్‌ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్‌ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్‌ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్‌, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్‌ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్‌ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్‌ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్‌ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్‌ మునీర్‌ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్‌ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్‌ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.


నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్‌ 11న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు ముందు ఇస్లామాబాద్‌ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్‌ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్‌ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్‌ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్‌ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్‌ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.


సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్‌ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్‌ సజ్దాద్‌ అష్రాఫ్‌ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్‌ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్‌ 20న షీ జింపింగ్‌ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్‌ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్‌ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్‌(ఉఘిర్‌) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్‌ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్‌ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్‌ ఛానల్‌ ప్రాంతంలో బ్రిటన్‌ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్‌, పనామా, సూయజ్‌ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ నుంచి 60 బిలియన్‌ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్‌ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !

. 

హిందూత్వ బాటలో బ్యాంక్‌ మేనేజర్‌ – పెద్ద కూర నిషేధంపై బెఫి నిరసన ! బిజెపి ఎంఎల్‌సిపై గోరక్షకుల దాడి !!

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆహార వ్యవహారాల్లో జోక్యం అంటే ఫలాన తినకూడదు అని ఆంక్షలు పెట్టటం వ్యక్తిగత స్వేచ్చలో మితిమీరిన జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఆహారం, ఆహార్యం కొన్ని సమూహాలకు అస్థిత్వ సూచికలుగా ఉన్నాయి. పెద్ద కూర, దీన్ని ఆంగ్లంలో బీఫ్‌ , అచ్చతెలుగులో గొడ్డు మాంసం అంటారు. తక్కువ ఖర్చుతో జనాలకు అవసరమైన ఎక్కువ ప్రొటీన్లు అందచేసే ఆహారం ఇది. ఇటీవలి కాలంలో హిందూత్వశక్తులు, సనాతనులుగా ముద్రవేసుకున్నవారు దీని మీద పెద్ద రాద్దాంతం, దాడులు, హత్యలకూ పాల్పడటాన్ని చూశాం. మేం శాకాహారులం మా మనోభావాలను గాయపరచవద్దు అనేవారు తయారయ్యారు. మాంసాహారులకు కూడా మనోభావాలు ఉంటాయి. తాజాగా కేరళలోని కోచ్చి నగరంలో కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయానికి బీహార్‌ నుంచి అశ్వనీ కుమార్‌ అనే మేనేజర్‌ బదిలీ మీద వచ్చారు. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బ్యాంకు క్యాంటీన్‌లో పెద్ద కూర కూడా వారంలో కొన్ని రోజులు అందుబాటులో ఉండేది. ఆ పెద్దమనిషి రాగానే ఆహార జాబితా నుంచి దాన్ని తొలగించి నిషేధం విధించారు.ఎందుకంటే నేను తినను అని చెప్పారట. నాకు దక్కనిది ఎవరికీ దక్క కూడదు అనే సినిమా మాటలు బాగా వంటబట్టి ఉంటాయి. దేశంలో అనేక ప్రాంతాలలో ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిన సంగతి తెలియనంత అమాయకంగా సదరు అధికారి ఉంటారని అనుకోలేం. ఉద్యోగులు ప్రశ్నించిన తరువాత అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉంటే ఆ పెద్దమనిషి ఇప్పుడు మీడియాకు ఎక్కి ఉండేవారు కాదు. విధిలేని స్థితిలో బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) నాయకత్వంలో సిబ్బంది నిరసన తెలుపుతూ బ్యాంకు ప్రాంగణంలో పెద్ద కూర, పరోటాల పండగచేసి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏ ఆహారం తీసుకోవాలన్నది వ్యక్తిగత ఎంపిక అంశమని, కొన్నింటి మీద నిషేధం విధించటం రాజ్యాంగహక్కులను ఉల్లంఘించటమే అని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక ఉన్నతాధికారి ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు ఆహార అలవాట్లను ఎందుకు మార్చుకోవాలని వారు ప్రశ్నించారు. మాంసాహారం తినాలని తామెవరినీ బలవంతం చేయటం లేదని బెఫి నేత చెప్పారు.


మాంసం, చేపలు, గుడ్లు తినరాదంటూ బలవంతం చేయటాన్ని బ్రాహ్మణీయ జాతీయవాదం(భావజాలం) అంటున్నారు. అనేక మంది బ్రాహ్మలు మాంసాహారాన్ని తింటారన్నది అందరికీ తెలిసిందే. తిరోగామి జాతీయవాదం ఏ రంగంలో, ఏ సమస్యపై తలెత్తినా దాన్ని వ్యతిరేకించాల్సిందే. మన దేశంలో ఆవును పూజించటానికి, గొడ్డు మాంసం తినటానికి లంకె పెడుతున్న కారణంగా తలెత్తిన భావజాల ఘర్షణను భౌతిక దాడులకు తీసుకుపోయేందుకు కొన్ని శక్తులు పనిగట్టుకు పనిచేస్తున్నాయి. బిజెపి పాలిత ఒడిషా రాష్ట్రంలో ఇద్దరు దళితులు చచ్చిన ఆవు కళేబరం నుంచి చర్మాన్ని వేరు చేయటాన్ని చూసిన కొందరు గోవధకు పాల్పడ్డారంటూ వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మరణించాడు. ఉన్మాదాన్ని ఎలా ఎక్కించారో చూస్తున్నాం. దళితుల మీద దాడులకు ఆవునొక సాకుగా కూడా చూపిన ఉదంతాలు ఉన్నాయి. తమ ఇంట ఆవు చనిపోతే దాన్ని పూడ్చిపెట్టేందుకు ఏ సనాతనవాదీ ముందుకు రారు. ఇదీ గోవుల మీద ప్రేమ బండారం. చివరకు ఆ దళితులే కావాలి. సాంస్కృతిక గురుపీఠాల సృష్టికి ఆహారం ఒక ఉత్ప్రేక్షగా( ప్రస్తుతాన్ని అప్రస్తుతమైనదిగా మార్చటం) మారి చివరకు అవమానించేందుకు దారితీస్తున్నదని ప్రముఖ మేథావి, జెఎన్‌యు ప్రొఫెసర్‌ గోపాల్‌ గురు చెప్పారు. నైతిక పోలీసుల మాదిరి ఇలాంటి గురుపీఠాలు సాంస్కృతిక పోలీసులుగా బ్రాహ్మణ భావజాలాన్ని రుద్దే నిరంకుశ శక్తులుగా మారుతున్నాయి. వాటి ప్రభావానికి లోనైన కారణంగానే కెనరా బాంక్‌ కొచ్చి మేనేజర్‌ వంటి వారు తమ అధికార స్థానాలను ఉపయోగించుకొని నిషేధాలకు దిగటం సహించరానిది. నిజానికి సదరు మేనేజరుకు హిందూత్వ సంస్థలతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. లేనప్పటికీ వాటి ప్రభాంతో తెలియకుండనే హిందూత్వ అజెండాను అమలు జరిపే ఒక పరికరంగా మారటాన్ని గమనించాలి. ఇలాంటి చర్యలకు ప్రతిఘటన తప్పదు. చిత్రం ఏమిటంటే దేశంలో 81శాతం మంది మాంసాహారులు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పగా 39శాతం శాకాహారులని కొన్ని సర్వేలు చెప్పాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఏ విధంగా చూసినా మాంసాహారులే అత్యధికంగా ఉన్నప్పటికీ మైనారిటీలుగా ఉన్న శాకాహారులు తమ అలవాట్లను మెజారిటీ మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవధ గురించి దేశంలో ఎంతో చర్చ జరిగిన తరువాత దాని గురించి రాష్ట్రాలకు నిర్ణయాన్ని వదలివేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 48లో పేర్కొన్నారు. దాన్ని విధి గాక ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి తన హిందూత్వ అజెండాలో భాగంగా గోవధ నిషేధ చట్టాలు చేసింది. అది కొత్త సమస్యలను ముందుకు తెస్తున్నది.


దోపిడీకి అవకాశం కల్పించే, సామాజిక పరంగా వివక్షాపూరితమైన మనువాదాన్ని సమర్ధించే శక్తులు ఇటీవలి కాలంలో రూటు మార్చి చిల్లి కాదు తూటు అన్నట్లుగా సనాతనం పేరుతో రాజకీయం చేస్తున్నాయి.అధునాతన కాలంలో సనాతనాన్ని పాటించటం ఎలా సాధ్యమో వారు చెప్పలేరు. రెండవది వేదకాలం గొప్పతనం గురించి ఒక వైపు చెబుతారు. పోనీ ఆ కాలానికి వెళ్లగలమా ? వేదకాలం గురించి చెప్పేవారు రెండో వైపున గోవధ నిషేధం గురించి మాట్లాడతారు. ఇది రెండిరటికీ పొసగని అంశం అని ఎంత మందికి తెలుసు? ఆవును పవిత్రంగా చిత్రించేవారు వేదకాలంలో ఆవు మాంసం తినటం గురించి ఎందుకు మాట్లాడరు ? వేదాలుగానీ, శాస్త్రాలు గానీ చరిత్రలు కావు.వాటిలో అనేక పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. కారణం ఎవరికి తోచిన వాటిని వారు రాసి వాటిలో చేర్చారు. ఎవరి వాదనలకు అనువుగా ఉన్నవాటిని వారు ఉటంకిస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. యజ్ఞయాగాదులలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి లేకుండా నేడు గడవటం లేదు. వేదాలతో సమానమైనదిగా భావించే శతపథ బ్రాహ్మణంలో యాజ్జవల్క్యుడు తాను బాగా ఉడికించిన పెద్దకూరను తింటానని చెప్పినట్లుగా ఉంది. దేవతల చక్రవర్తిగా పరిగణించే దేవేంద్రుడు ఎద్దుమాంస వడ్డన గురించి చెప్పాడు. వేదకాలంలో పూజారులకు ఆవులను ఇవ్వాలని లేకుంటే కనీసం ఆవు మాంసమైనా అందచేసే సాంప్రదాయం ఉన్నట్లు రాతలను బట్టి తెలిసిందే. కొంత కాలం తరువాత ఆవు వలన ఉపయోగం ఉందని గ్రహించి దాన్ని చంపకూడదని భావించారు. ఆ మాట చెబితే వినే పరిస్థితి లేకపోవటంతో ఆవు గురించి అభూత కల్పనలు, పవిత్రతను అంటగట్టి నిరోధించేందుకు కావాల్సిన వాటినన్నింటినీ చేర్చారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ క్రమంలో ప్రతి జంతువుకు పవిత్రతను ఆపాదించి పురాణాల్లో రాయటం కనిపిస్తుంది. కానీ వాటిని వధించి తినటానికి ఉన్న అనుమతి ఆవుకు ఎందుకు నిరాకరిస్తున్నారన్నదే ప్రశ్న. దీన్ని లేవనెత్తితే అనేక మంది తమ మనోభావాలను స్వయంగా గాయపరుచుకుంటున్నారు. రాజకీయ నేతలు ఒకే ప్రకటనకు విరుద్ధ భాష్యాలు చెప్పినట్లుగా పురాణాలు, వేదాలలోని వాటికీ ఈ మధ్య తమకు అనుకూలమైన అర్ధాలు, భాష్యాలు చెప్పటాన్ని చూస్తున్నాము. చెప్పుకోనివ్వండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ధర్మరక్షకుల పేరుతో సంఘటితం అవుతున్నవారు అంగీకరించనివారి మీద బలవంతంగా రుద్దే గూండాయిజం ఏమాత్రం సహించరానిది.


ఊరకుక్కల కాట్లకు బలవుతున్న పిల్లలు, పెద్దల గురించి తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడు యజమానులు పట్టించుకోకుండా వీధుల్లోకి వదలివేస్తున్న ఆవులు కూడా సమస్యగా మారుతున్నాయి. సనాతనులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఉదయం లేవగానే రోడ్ల మీద తిరుగుతున్న వాటన్నింటినీ తమ ఇండ్లకు చేర్చుకొని ఆదరిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుకు ఆపని చేయటం లేదు. ఇటీవల ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా ఒక ఫ్లై ఓవర్‌ మీదకు ఆవులు రావటంతో ఆకస్మికంగా డ్రైవర్‌ బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.చిత్రం ఏమిటంటే ఆమె కూడా ఒక సనాతన వాదే, ఆవులు వెళ్లేంత వరకు వాహనం దిగి చూశారు తప్ప సిబ్బందిని ఆదేశించి వాటన్నింటిని తన ఇంటికో, కార్యాలయానికో తోలుకు రమ్మని చెప్పలేదు. దేశంలో 50లక్షలకు పైగా ఆవులను రోడ్ల మీద వదలివేసినట్లు అంచనా, నిజానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. యోగి ఆదిత్యనాధ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి పక్కా సనాతనవాదులు అత్యధిక రాష్ట్రాల్లో పాలకులుగా ఉన్న ఈ దేశంలో అలా బాధ్యతా రహితంగా వదలివేయటం ఏమిటి ! ఉత్తర ప్రదేశ్‌లోనే పన్నెండున్నర లక్షలు ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. బిజెపి పాలిత మహారాష్ట్రలో గోశాలల్లో ఉన్న ఒక్కో ఆవుకు రోజుకు రు.50 చెల్లిస్తున్న ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా నెలకు ఇస్తున్న మొత్తం రు.1,500 అంటే ఆవుతో సమానం.బీహార్‌లో రు.400గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ మొత్తాన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2025జూన్‌లో నితీష్‌ కుమార్‌ సర్కార్‌ రు.1,100కు పెంచింది. అత్యంత మానవీయ కోణం ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని సర్కార్‌ జాతీయ సామాజిక సహాయ పథకం కింద మన్మోహన్‌ సింగ్‌ హయాంలో నిర్ణయించిన రు.200, రు.500మొత్తాలనే ఇప్పటికీ మంజూరు చేస్తున్నది. ఈ మాత్రానికే తమ వాటా ఎంత ఉందో లబ్దిదారులకు తెలపాలని కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాము ఇస్తున్న రు.1,600లలో ఎవరి వాటా ఎంతో చెప్పటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అక్కడి వామపక్ష ప్రభుత్వం చురక అంటించింది.

గో సంరక్షణ చట్టాలతో వట్టిపోయిన ఆవులను మేపటం రైతాంగానికి భారంగా మారుతున్నది. గతంలో వాటిని అమ్మివేస్తే వధశాలలకు తరలించేవారు. ఇప్పుడు ఆమ్ముకోవచ్చుగానీ కొనేవారెవరు ? మహారాష్ట్రలో ఉన్న జంతు సంరక్షణ చట్టాన్ని సవరించటం లేదా రద్దు చేయాలని ఏకంగా అక్కడి బిజెపి ఎంఎల్‌సి, మాజీ మంత్రి సదాశివ ఖోట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకుగాను మండిపడిన కాషాయదళాలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయటమే కాదు దాడులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన కూడా తెలిపారు. సతారా జిల్లాలో కొందరు రైతులు తమ గేదెలను విక్రయించారు.వారికి డబ్బు చేతికి అందక ముందే గోరక్షకులమంటూ కొందరు వచ్చి వాటిని బలవంతంగా పూనే తరలించారు. రైతులు కోర్టుకు ఎక్కటంతో వారి పశువులను వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాటికోసం ఒక గోశాలకు వెళ్లగా అవి కనిపించలేదు. రైతులతో పాటు ఎంఎల్‌సి అక్కడ ఉండగా గోరక్షకులమంటూ వచ్చిన వారు తన మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సదాశివ ఖోట్‌ చెప్పారు. మహారాష్ట్రలో వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయించటానికి వీల్లేకపోవటంతో రైతాంగానికి అవి భారంగా మారాయి. షేత్కారి రైతు సంఘ నేత శరద్‌ జోషి, మరికొందరు ఎప్పటి నుంచో చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాను మూడు దశాబ్దాలుగా రైతుల సమస్యల మీద పని చేస్తున్నానని గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు కనీసం ఒక్కసారైనా పాలు పితికిన వారు కాదని ఎంఎల్‌సి విమర్శించారు. గత కొద్ది వారాలుగా సాంప్రదాయకంగా పశువ్యాపారం చేస్తున్నవారు గోరక్షకుల పేరుతో ఉన్నవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.వారికి సదాశివ ఖోట్‌ మద్దతు ప్రకటించారు. వట్టిపోయిన పశువులకు నెలకు తొమ్మిదివేల రూపాయల వంతున మేతకు ఖర్చు చేస్తే రైతులకు వచ్చేదేమీ ఉండదని అందువలన వాటిని అమ్ముకోవటం మినహా మరొక మార్గం లేదని, అయితే గోరక్షకులమంటూ బయలుదేరిన వారు ఆ లావాదేవీలను అడ్డుకుంటున్నారని, రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు.హిందూత్వ నేత మిలింద్‌ ఎక్బోటే ఒక ప్రకటన చేస్తూ ఎంఎల్‌సి పశువులను వధించేవారి తరఫున మాట్లాడుతున్నారని, రాజకీయాలనుంచి గెంటివేయాలని డిమాండ్‌ చేశారు. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కూడా పశువధ చేసే వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అనేక రాష్ట్రాలలో పశువధ, వ్యాపారం వృత్తిగా ఖురేషీ అనే ముస్లిం తెగకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని కూడా ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.మహారాష్ట్రలో వట్టిపోయిన పశువుల సమస్య ముందుకు రావటం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఇది ఒక్క ఆ రాష్ట్రానిదే కాదు, పశువధ నిషేధం ఉన్న ప్రతి చోటా గోరక్షకుల పేరుతో రైతాంగాన్ని దెబ్బతీసే శక్తులు పేట్రేగిపోతాయి !

షాంఘై సహకారం : ట్రంప్‌ను హెచ్చరించిన జింపిగ్‌, భారత పర్యటన రద్దు, స్వరం మార్చిన అమెరికా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కొన్ని సమయాలలో కొందరు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. అదే మాదిరి అంతర్జాతీయ రాజకీయాల ఎత్తులు జిత్తులలో భాగంగా సంభవించే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఆగస్టు 31, సెప్టెంబరు ఒకటవ తేదీలలో చైనాలోని రేవు పట్టణమైన తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 25 వార్షిక సమావేశం జయప్రదంగా జరిగింది. దాని చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పవచ్చు.ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పేందుకు ఈ సభ నాంది పలుకుతుందా ? పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయంటూ సానుకూలంగా, ప్రతికూలంగా ఉండే పండితులందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. చైనా, భారత్‌ మధ్య వెల్లవిరిసిన స్నేహం మరింతగా విస్తరిస్తుందా లేదా అని కమ్యూనిస్టులు, పురోగామి శక్తులలో ఒకింత ఆనందం, అదే స్థాయిలో సందేహాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఈ తరగతికి చెందిన వారే కాదు చైనా, కమ్యూనిజాలను వ్యతిరేకించే, అమెరికాను భక్తితో కొలిచే కాషాయ దళాలు, ఇతరులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలు వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు తియాన్‌జిన్‌లో నరేంద్రమోడీ చైనా ఎర్రజెండా కారులో ప్రయాణం, ఉపన్యాసాలు, కరచాలనాలు, ఆత్మీయపలకరింపులు జరుగుతుండగానే అమెరికాలో కలవరం మొదలై స్వరం మార్చి ప్రకటనలు చేయటం ప్రారంభించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా గందరగోళంగా మాట్లాడారు. తమ కౌగిలిలోకి వస్తారని భావించిన నరేంద్రమోడీ షీ జింపింగ్‌, పుతిన్‌తో చేతులు కలపటంతో డోనాల్డ్‌ ట్రంప్‌లో ఉక్రోషం కట్టలు తెగింది. ఈ ఏడాది చివరిలో తలపెట్టిన క్వాడ్‌ సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిన మనదేశ పర్యటనను రద్దు చేసుకున్నాడు. చివరి క్షణంలో మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. అయితే తెగేదాకా లాగామా అన్న మలి ఆలోచనలో అమెరికన్లు పడ్డారనే చెప్పాలి.బహుశా ఆ కారణంగానే నవంబరులో వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారా ? చైనాకు దగ్గర అవుతున్నామన్న సందేశంతో అమెరికాతో మోడీ బేరమాడేందుకు పూనుకున్నారా ? ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకటి మాత్రం నిజం రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఎవరు తగ్గినా జనంలో గబ్బుపట్టటం ఖాయం.


షాంఘై ఐదు పేరుతో 1996 ఏప్రిల్‌ 26న చైనా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైన తరువాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన రష్యా, కజకస్తాన్‌, కిర్ఖిరిaస్తాన్‌, తజికిస్తాన్‌లతో పాటు చైనా భాగస్వామిగా ఒక బృందం ప్రారంభమైంది. వాటిన్నిటికీ చైనాతో సరిహద్దు సంబంధాలు కొత్తగా ఏర్పడటంతో మిలిటరీ ఖర్చు తగ్గించుకొనేందుకు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పటం వాటి ఒప్పంద అసలు లక్ష్యం. రెండవ సమావేశంలోనే బహుధృవ ప్రపంచం గురించి 1997 మాస్కో సమావేశంలో చైనా, రష్యా నేతలు ఒక ప్రకటన చేశారు. అంటే చక్రవర్తి, సామంత రాజులు అని గాకుండా ఎవరి స్వతంత్రవైఖరిని వారు కలిగి ఉండటం, పెత్తందారీ పోకడలకు దూరంగా, సహకరించుకోవటాన్ని సంకల్పంగా ప్రకటించారు. తరువాత 2001 జూన్‌ 21న ఆరవ దేశంగా ఉజ్బెకిస్తాన్ను చేర్చుకోవటమే కాదు షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) ఏర్పడి భాగస్వాముల మధ్య సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తరువాత వివిధ సంస్థల ఏర్పాటుతో పాటు ఆర్థిక, భద్రతా విషయాల్లో కూడా చొరవ తీసుకొనేందుకు ముందుకు పోయారు. తరువాత దానిలో భారత్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌, బెలారస్‌ సభ్య దేశాలుగా చేరాయి. ఇవి గాక 17దేశాలు చర్చల భాగస్వాములుగా, ఐక్యరాజ్యసమితి, ఆసియన్‌ కూటమి, పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి స్వతంత్రదేశాలైన వాటితో కూడిన కామనవెల్త్‌ ఇండిపెండెంట్‌ కంట్రీస్‌(సిఐఎస్‌) సంస్థ, తుర్క్‌మెనిస్తాన్‌ అతిధులుగా ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఈ దేశాలు ఉన్నాయి.మొత్తం 50 రంగాలలో సహకరించుకుంటున్నాయి. ఈ దేశాల జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు ఉండగా ప్రపంచ జనాభాలో 42శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.


తియాన్‌జిన్‌ సమావేశాన్ని ప్రారంభించి చైనా నేత షీ జింపింగ్‌ పేరు ప్రస్తావించకుండానే అమెరికాకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు. ప్రచ్చన్న యుద్ధ మానసిక స్థితి నుంచి బయటపడాలని, అంతర్జాతీయ సంబంధాలలో అదిరించి బెదిరించే ఎత్తుగడలు, కూటముల ఘర్షణలు సాగవని, నిజాయితీ, న్యాయంతో వ్యవహరించాలని ప్రపంచ నేతలను కోరాడు.సంస్థ సభ్యదేశాలు భద్రత, అభివృద్ధి రంగాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పాడు.మిలిటరీ వ్యవహారాల్లో పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ప్రారంభమైన ఎస్‌సిఓ ఇప్పుడు సరిహద్దులను అధిగమించి స్నేహ బంధంగా, పరస్పర విశ్వాసం,సహకారంతో విస్తరించిందని, ఈ స్పూర్తిని ముందు ముందు కూడా కొనసాగించాలని షీ జింపింగ్‌ ఆకాంక్షించాడు.విబేధాలను పక్కన పెట్టి పరస్పర లాభదాయకమైన అంశాల మీద కేంద్రీకరించాలని, ఆచరణ ప్రాతిపదికన నిజమైన ఫలితాల సాధన, ఉన్నతమైన సామర్ధ్యంతో వ్యవహరించాలని కోరాడు. సభ్యదేశాలన్నీ స్నేహితులు, భాగస్వాములే అన్నాడు. విబేధాలను గౌరవించాలని, వ్యూహాత్మక సంప్రదింపులతో ఏకాభిప్రాయ సాధనకు రావాలని కోరాడు. భద్రత, ఆర్థికపరమైన సహకారంలో భాగంగా సాధ్యమైనంత త్వరలో ఎస్‌సిఓ అభివృద్ధి బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుందామని షీ ప్రతిపాదించాడు.ఈ ఏడాదే సభ్యదేశాలకు తాము రెండు బిలియన్‌ యువాన్ల మేర గ్రాంట్లు ఇస్తామని, వాటితో పాటు పది బిలియన్‌ యువాన్లు రానున్న మూడు సంవత్సరాలలో సభ్యదేశాల బాంకుల కన్సార్టియంకు రుణాలు కూడా ఇస్తామన్నాడు. కూటమి దేశాలలో ఇప్పటి వరకు చైనా 84బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది, దాని వాణిజ్య లావాదేవీల విలువ 2024లో 890 బిలియన్‌ డాలర్లు దాటింది. ప్రపంచ జిడిపిలో 23, జనాభాలో 42, ప్రపంచ చమురు నిల్వల్లో 20, గ్యాస్‌లో 44శాతాల చొప్పున ఈ కూటమి దేశాలు కలిగి ఉన్నాయి. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులకు పోటీగా పెద్దగా షరతులు లేకుండా బ్రిక్స్‌ కూటమి నూతన అభివృద్ది బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది, ఇప్పుడు షాంఘై సహకార సంస్థ కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేసేందుకు పూనుకుంది.


షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ముందే ఆదివారం నాడు షీ జింపింగ్‌ మరియు నరేంద్రమోడీ భేటీ జరిగింది.చైనాతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని వాంఛిస్తున్నట్లు మోడీ చెప్పారు. భారత్‌పై అమెరికా పన్నులు, జరిమానాలు అమల్లోకి వచ్చిన తరువాత జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పరస్పర మన్నన, విశ్వాసం, సున్నితత్వాల ప్రాతిపదికన ఇరుదేశాల సంబంధాలను పెంచుకొనేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల తరువాత చైనాను తొలిసారిగా సందర్శించారు. ఇరుదేశాల సంబంధాలను మరింతగా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని, నిరంతరం ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన అభివృద్దిని ముందుకు తీసుకుపోవాలని షీ జింపింగ్‌ ప్రతిస్పందించాడు. ఇరు దేశాల సంబంధాలలో సరిహద్దు సమస్యల నిర్ధారణ అంశాన్ని ముందుకు తేవద్దని, రెండు దేశాల ఆర్థిక అభివృద్ధి మీద ప్రధానంగా కేంద్రీకరించాలని, మనం ప్రత్యర్ధులు గాకుండా భాగస్వాములుగా ఉండాలని కట్టుబడి ఉన్నంతకాలం బెదిరింపులుగాక అభివృద్ధి అవకాశాల మీద దృష్టిపెట్టాలని రెండు దేశాల సంబంధాలు మరింతగా ముందుకు పోయి ఫలించాలన్నాడు.


ఈ వాంఛలను రెండు దేశాలూ వెల్లడిరచటాన్ని చైనాకు భారత్‌ మరింత దగ్గర అవుతున్నట్లు అమెరికా పరిగణిస్తోంది. సరిహద్దుల యాజమాన్యం గురించి ఒక ఒప్పందం, సరిహద్దు వాణిజ్యం, వీసాలు, విమానాల రాకపోకల పునరుద్దరణ, చైనా పెట్టుబడులకు అనుమతి, టిబెట్‌లోని మానససరోవరాన్ని భారత యాత్రీకులకు తెరవటం, విలువైన ఖనిజాలు, ఉత్పత్తులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయటం, ఎరువుల సరఫరా పునరుద్దరణ, సొరంగాలను తవ్వే యంత్రాల సరఫరా, అన్నింటికీ మించి చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖుడు, విదేశాంగ మంత్రిగా ఉన్న వాంగ్‌ యి భారత పర్యటనలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారానికి వచ్చి ఏడాది కూడా గడవక ముందే ఇవన్నీ జరగటాన్ని అమెరికా జీర్జించుకోలేకపోతోంది. వీటితో పాటు షాంఘై సహకార సంస్థ అమెరికా నాయకత్వంలోని నాటో మిలిటరీ కూటమికి పోటీగా తయారు అవుతుందేమో అన్న భయం కూడా దాన్ని పట్టిపీడిస్తోంది. నిజానికి అలాంటి ఆలోచనలు కూటమిలోని ఏ దేశ అంజండాలో కూడా లేదు. పశ్చిమదేశాల అధికార కూటములకు భిన్నంగా నూతన అంతర్జాతీయ సంబంధాలకు ప్రయత్నిస్తున్నట్లు పాతిక సంవత్సరాల తీరు తెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా పెత్తందారీతనాన్ని వ్యతిరేకించటం అంటే మరో మిలిటరీ కూటమిని కట్టటం కాదు.


నాటో, ధనికదేశాలతో కూడిన జి7, ఐరోపా సమాఖ్యకు పోటీగా తయారవుతుందేమో అన్న భయ సందేహాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి అజెండా ఎస్‌సిఓలో ఇంతవరకు లేదు. బ్రిక్స్‌, ఎస్‌సిఓ రెండూ కూడా విస్తరణ దశలో ఉన్నాయి. స్థానిక కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు జరపాలనటంలో వాటి మధ్య ఏకీభావం ఉంది. తొలుత అది విజయవంతమైన తరువాత డాలరుకు పోటీగా మరోకరెన్సీని తీసుకురావచ్చు. రష్యా, భారత్‌, చైనాలతో కూడిన(రిక్‌) కూటమి గురించి కూడా కొందరు చర్చిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి పరిణామాలు లేవు.అమెరికా చేసే దాడుల తీవ్రతను బట్టి అజెండాలోకి రావచ్చు. తెగేదాకా లాగినట్లు భావించి లేదా దిద్దుబాటు చర్యల్లో భాగంగా అమెరికా స్వరం మార్చింది. గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్యంలో భారత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న తమనేత ట్రంప్‌ వ్యాఖ్యల పూర్వరంగంలో రెండు దేశాలూ ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించాడు.తాము భారత్‌ నుంచి ఎంతో ఎక్కువగా కొనుగోలు చేయగా తమ నుంచి తక్కువ దిగుమతి చేసుకున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. తమ వస్తువుల మీద ఎలాంటి పన్నులు ఉండవని భారత్‌ చెప్పిందనీ అయితే ఇప్పటికే సమయం మించిపోయింది గనుక తాను వెనక్కు తగ్గేదేలేదన్నట్లు మాట్లాడాడు. బెసెంట్‌ ఫాక్స్‌ టీవీతో మాట్లాడుతూ విబేధాలను కూడా పరిష్కరించుకోవచ్చన్నాడు. అన్ని అవకాశాలూ తమ ముందు ఉన్నాయని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ట్రంప్‌ కంటే ముందు అమెరికా మరియు భారత సంబంధాల గురించి అమెరికా రాయబార కార్యాలయం పొగిడిరది. ఇరుదేశాల సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయంటూ తమ విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చేసిన వ్యాఖ్యలను అది ఉటంకించింది. ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే బెసెంట్‌ భారత్‌ను సంతుష్టీకరించే స్వరంతో మాట్లాడాడు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పాడు. షాంఘై సహకార సంస్థ సమావేశం మొత్తం మీద నాటకీయ వ్యవహారం, తద్దినం లాంటిదని, భారత్‌ ప్రపంచంలో అత్యధిక జనాభాగల ప్రజాస్వామిక దేశం, వారి విలువలు చైనా, రష్యాల కంటే అమెరికాకే దగ్గరగా ఉంటాయన్నాడు. అధ్యక్షుడు, రాయబార కార్యాలయం, ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను చూసినపుడు వారి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు నష్టనివారణకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూసినపుడు భారత్‌ను దువ్వేందుకు అమెరికా పూనుకుంది. ఈ నెలలో ఐరాస సమావేశాలకు వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ బృందం ట్రంప్‌తో భేటీ కానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి, అది జరుగుతుందా లేదా జరిగితే ఏమిటి అన్నది చూడాల్సివుంది !

పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ : ముగ్గురు పిల్లల్ని కనాలంటున్న బ్రహ్మచారి ఆర్‌ఎస్‌ఎస్‌ మోహన భగవత్‌ !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మీ కుటుంబంలో తరతరాల వారికి పుణ్యం రావాలంటే కాశీ దాకా తాటిపట్టె మీద దేకమన్నాడట ఒక సనాతనవాది. ముడ్డి మీది కాదుగనుక ఏమైనా చెబుతారు మీ పుణ్యం వద్దు మీరు వద్దు అంటూ ఒక పామరుడు చక్కాలేచిపోయాడని ఒక కథ.జనాభా తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని బ్రహ్మచారి అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సంఫ్‌ు వందేళ్ల సభలో చెప్పారు. మోసే గాడిదలకు తెలుస్తుంది మోపిన బరువెంతో అన్నట్లుగా పిల్లలున్నవారికి తెలుస్తుంది వారిని పెంచటంలో ఉన్న ఇబ్బంది. బ్రహ్మచారులు, కుటుంబ జీవనం లేని సాధువులు, సన్యాసులు, సాధ్విలకు ఏమి తెలుస్తుంది. మోహన్‌ భగవత్‌ ముగ్గురు పిల్లల గురించి చెప్పటం ఇదే మొదటిసారి కాదు. అయితే సంఘపరివార్‌ సభ్యులు లేదా దాని గురించి గొప్పగా చెప్పుకొనే వారు ఎంత మంది ముగ్గురు పిల్లలను కంటున్నారన్నది సమస్య.వారు ఎప్పటి నుంచో చెబుతున్నా జనాలు పట్టించుకోవటం లేదు. జననాల రేటు తగ్గుతూనే ఉంది. అయినా చెబుతూనే ఉండటం వెనుక పెద్ద ఓట్ల రాజకీయం ఉంది. అయితే జనాభా తగ్గుదల గురించి ఇతరులు అనేక మంది చెబుతున్నారు గదా భగవత్‌ చెప్పిందాంట్లో తప్పేముందని ఎవరైనా అడగవచ్చు. నిజమే, ముఖ్యమంత్రులు స్టాలిన్‌, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు తప్పు వారు మతాన్ని జోడిరచలేదు. అదే అసలు సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి 2022 అక్టోబరులో జనాభా అదుపుకు సమగ్ర విధానం ఉండాలని, మత ప్రాతిపదికన అసమతూకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మనదేశంలోకి ఇస్లాం, క్రైస్తవం రాకముందు ఇక్కడ పుట్టిన మతాలు తప్ప మరొకటి లేవుగా, మరి అవి జనానికి ఒరగబెట్టిందేమిటి. అందరూ ఒకే మతం వారంటూ సమానంగా చూసిన పాపాన పోలేదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులవివక్ష, పీడన అదనంగా ప్రసాదించటం తెలిసిందే.

నేడు దేశంలో ఉన్న వాతావరణం ఏమిటి ? హిందూ మతం బతికి బట్టకట్టాలంటే హిందువులు ఎనిమిది నుంచి పది మంది పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపుకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా చెప్పారు.ఆయన కన్నది ఇద్దరిని, అలాంటి వారి కబుర్లన్నీ ఇలాగే ఉంటాయి. బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ నలుగురిని కనాలన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2006 ఏప్రిల్‌ 20వ తేదీన ‘‘కాషాయ జనాభా శాస్త్రం ’’ పేరుతో ప్రచురించిన విశ్లేషణ వివరాల ప్రకారం విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ 2004లో మాట్లాడుతూ హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవటం ఆత్మహత్యా సదృశ్యమన్నారు.2005 ఫిబ్రవరిలో విహెచ్‌పి మార్గదర్శక మండల్‌ సమావేశంలో శ్రీకృష్ణుడి తలిదండ్రుల మాదిరి సంతానాన్ని కనాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.సుభాష్‌ చంద్రబోస్‌ కృష్ణుడి మాదిరి ఎనిమిదవ సంతానమని, రవీంద్రుడు తొమ్మిదవ సంతానమని దానిలో పేర్కొన్నారు.హిందూ మహిళలు విచ్చల విడిగా అబార్షన్లు చేయించుకోకుండా చూడాలని విహెచ్‌పి కోరింది.ముస్లింల జనాభా అదుపులేకుండా పెరుగుతోందని, వారికి పోటీగా హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని హరిద్వార్‌లో జరిగిన విశ్వహిందూపరిషత్‌ మార్గదర్శక్‌ మండల్‌ పిలుపు ఇచ్చిందని రెడిఫ్‌ న్యూస్‌ 2006 జూన్‌ 15న ‘‘ హిందువులు జనాభాను పెంచాలని కోరిన విహెచ్‌పి ’’ అనే శీర్షికతో వార్త ఇచ్చింది. ఇలా కాషాయ గుంపునేతల మాటలను ఎన్నయినా ఉటంకించవచ్చు. హిందూ జాతి అంతరిస్తున్నదని, మతానికి ముప్పు వచ్చిందని, త్వరలో ముస్లిం జనాభా మెజారిటీగా మారుతుందని హిందూ మహాసభ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులంతా పదే పదే చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.జనాభా సమతూకంలో ఉండాలని చెబుతారు.ఇప్పుడు ముస్లింల గురించి చెబుతున్నప్పటికీ తరువాత హిందువుల్లో ఏ కులం వారు ఎందరుంటే సమతూకం ఉంటుందో కూడా నిర్దేశించరని, సమాజం సమతూకంగా ఉండాలంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలనే అజెండాను ముందుకు తీసుకురారనే హామీ ఏముంటుంది. అంటే వీరు చెప్పినట్లే జనం కులం, మతాన్ని పాటించాలి, ఎందరు పిల్లల్ని కనమంటే ఆ సంఖ్యలోనే కనాలి.


జనాభా పెరుగుదల తరుగుదల సమస్యలను మతకోణంలో చూడటం అవాంఛనీయ వైఖరి. ముస్లిం ఛాందసులు అధికారంలో ఉన్న ఇరాన్‌లో సంతానోత్పత్తి రేటు పడిపోతున్నది. 1950లో అక్కడ 6.9 ఉండగా 2024లో 2.08కి తగ్గింది. క్రైస్తవుల్లో కూడా ఛాందసులు తక్కువేమీ కాదు, కానీ ఐరోపాలో సంతానోత్పత్తి రేటు 1.5, సగం ఐరోపా, సగం ఆసియాలో ఉన్న టర్కీ ముస్లిం దేశం, అక్కడ కూడా అంతే ఉంది.ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న దేశాలను ముస్లిం దేశాలని పిలుస్తున్నారు.2011నుంచి 21 సంవత్సరాల కాలంలో ఈ దేశాల్లో సంతనోత్పత్తి రేటు 3.3 నుంచి 2.7కు తగ్గింది.విద్య, పట్టణీకరణ, ఆర్థిక, సామాజిక,ఆరోగ్య, శిశుమరణాలు తదితర పరిస్థితులను బట్టి తప్ప ప్రపంచంలో ఎక్కడా మత ప్రాతిపదికన పిల్లలను కనటం, మానటం లేదు. మేం సనాతనులం, పక్కా హిందువులం అని చెప్పుకుంటున్న కుటుంబాలలో తొగాడియా చెప్పినట్లు ఎంత మంది పదేసి మంది పిల్లలు కలిగి ఉన్నదీ చెప్పమనండి. తమ ఉన్మాద చర్యలకు ఉపయోగించుకోవటం తప్ప ఏ మతమూ పిల్లల బాగోగులకు బాధ్యత తీసుకోవటం లేదు.


2019 నుంచి 21 వరకు జరిగిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే దక్షిణాది రాష్ట్రాలలో 1.64,ఉత్తరాదిన 2.0, పశ్చిమాన 1.81, తూర్పున 2.0, మధ్య ప్రాంతంలో 2.1 ఈశాన్య ప్రాంతంలో 2.15 ఉంది. రాష్ట్రాలన్నింటా ఒకే విధంగా లేదు.బీహార్‌లో 3.02, పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 2.38, దాన్నుంచి ఏర్పాటు చేసిన ఉత్తరా ఖండ్‌లో 1.87, పశ్చిమ బెంగాల్లో 1.56 పక్కనే ఉన్న ఒడిషాలో 2.14 చొప్పున ఉంది. ఒకే రాష్ట్రంలో చూస్తే గుజరాత్‌ గ్రామీణంలో 2.15, పట్టణాల్లో 1.63, మధ్యప్రదేశ్‌లో 2.23 1.62, తెలంగాణాలో 1.95 1.63, ఆంధ్రప్రదేశ్‌లో 1.74 1.62 ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలు, దేశమంతటా కాషాయదళాలు చెప్పినట్లుగా హిందువులు ఎనభైశాతం ఉన్నప్పటికీ సంతానోత్పత్తి ఒకే విధంగా ఎందుకు లేదు ? 201516 జాతీయ కుటుంబ సర్వే వివరాల ప్రకారం అత్యంత ఎక్కువ విద్యావంతులున్న జైన్‌ సామాజిక తరగతిలో 1.2శాతమే. ఇంత తక్కువ ఏ సామాజిక తరగతిలోనూ లేదు. అత్యంత పేదల్లో 3.2 ఉండగా ధనికుల్లో 1.5 మాత్రమే ఉంది. ముస్లిం సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటానికి వారు ఆలశ్యంగా మేలుకోవటమే. దానికి కుట్ర సిద్దాంతాలతో విద్వేష ప్రచారం చేయటం తగనిపని.దేశంలోని కొన్ని ప్రాంతాలలో మైనారిటీలు పైచేయి సాధించటాన్ని నివారించాలంటే పెద్ద హిందూ కుటుంబాలు ఉండాలని, ఉన్నత హిందూ కుటుంబాల వారు కుటుంబనియంత్రణ గురించి తీవ్రంగా సమీక్షించుకోవాని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కేరళలోని కొచ్చిలో 2013లో జరిగిన ఒక సభలో పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణ అన్నది హిందువులకు ఇంకేమాత్రం వ్యక్తిగత సమస్య కాదని, ఒక బిడ్డ చాలని వారు అనుకుంటే ముస్లింలు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని విశ్వహిందూ పరిషత్‌ నేత చంపత్‌ రాయ్‌ 2015లో ఒక పత్రికా గోష్టిలో చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు పిల్లల్ని కనాలని చెబుతున్నారు సరే, వారి బాగోగుల గురించి శ్రద్ద తీసుకోవాలని తమ మార్గదర్శకత్వంలో నడిచే కేంద్రం, 15 రాష్ట్ర ప్రభుత్వాలు, వారికి మద్దతుగా ఉన్న మరో ఆరు మిత్ర ప్రభుత్వాలకు ఎందుకు చెప్పటం లేదు ? ఎంత సేపటికీ మతం తప్ప శిశుసంరక్షణకు కేటాయింపులు, వివిధ పథకాల వైఫల్యం గురించి మీడియాలో వస్తున్న విశ్లేషణలు వారికి పట్టవా, కనిపించవు, వినిపించవా ! మతంతో నిమిత్తం లేకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి ఒక్క బిడ్డకు ఏడాదికి రు.44వేల చొప్పున మూడు స ంవత్సరాల పాటు నగదు ఇచ్చే పధకాన్ని చైనా ప్రవేశపెట్టింది. వారి జనాభా మనతో సమానంగా ఉంది. హంగరీలో ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలుంటే పన్నుల రాయితీ, గృహరాయితీ, పోలాండ్‌లో రెండవ బిడ్డ తరువాత ఎందరుంటే అందరికీ నెలవారీ నగదు, రష్యాలో 25 ఏండ్ల లోపు యువతులు పిల్లలను కంటే నగదు బదిలీ, అమెరికాలో తొలిసారి తల్లులయ్యేవారికి బేబీ బోనస్‌ పేరుతో ఐదువేల డాలర్లు, దక్షిణ కొరియాలో కూడా రాయితీలు ఇస్తున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం తప్ప వారి సక్రమపెరుగుదలకు మనదేశంలో తీసుకుంటున్న చర్యలేమిటి ? కార్పొరేట్‌ కంపెనీలకు గణనీయంగా పన్ను మొత్తాలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మరోవైపున శిశు సంరక్షణ కేటాయింపులకు కోత పెడుతున్నది.


పోషకాహార లేమితో పిల్లలు గిడసబారి పోవటం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం, రక్తహీనత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పేద పిల్లల్లో ఉండాల్సినదానికంటే బరువు తక్కువగా ఉంటే, ధనికుల పిల్లల్లో హానికరమైన ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఐదేండ్లలోపు పిల్లలు 35.5శాతం మంది పోషకాహారం లేక గిడసబారినట్లు, 19.3శాతం ఎత్తుకు తగ్గ బరువు లేరని, 32.1శాతం మంది బరువు తక్కువ, మూడు శాతం ఎక్కువ బరువు ఉన్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది.49 ఏండ్ల పురుషుల్లో 25, మహిళల్లో 57శాతం మందికి రక్తహీనత ఉంది.దేశంలో 74శాతం జనాభాకు ఆరోగ్యవంతమైన ఆహారం లేదని సర్వేలు తెలుపుతున్నాయి, ఆకలి సూచికలో మనం దిగువన ఉన్నాం. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ అని ఎన్నడో మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన పరిస్థితులే నేడు కూడా ఉన్నాయని చెప్పుకోవాల్సి రావటం సిగ్గుచేటు. బాల్యంలో పోషకాహారలోపం ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు నష్టమేగాక ఆరోగ్యపరంగా భారంగా మారుతున్నది. అంగన్‌వాడీల నుంచి ఆరేండ్లలోపు పిల్లలు కేవలం 50.3శాతమే ఏదో ఒక సేవను పొందుతున్నారు. కేంద్ర బడ్జెట్‌, రాష్ట్రాల బడ్జెట్ల గురించి పాలకులు గొప్పలు చెప్పుకోవటం తప్ప పిల్లల సంక్షేమానికి కేటాయిస్తున్నదేమిటి ? 2017 కేంద్ర బడ్జెట్‌లో 3.2శాతం కేటాయిస్తే 2021లో అది 1.9శాతానికి తగ్గి 2024లో 2.3దగ్గర ఉంది. జిడిపిలో 2000సంవత్సరంలో 0.12శాతం కాగా 2024కు 0.10కి తగ్గింది. బీహార్‌లో 2020 నుంచి 2022వరకు మూడు సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్లో ఖర్చు చేసిన మొత్తాలు 83,76,77శాతాలు మాత్రమే ఉన్నాయి.దేశానికి ఆదర్శంగా చెప్పిన గుజరాత్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణిస్తారు. అక్కడ నరేంద్రమోడీ ఏలుబడి సాగింది. రక్తహీనతలో అగ్రస్థానంలో దేశానికే ‘‘ ఆదర్శం ’’గా ఉంది !

జిఎస్‌టి స్లాబుల తగ్గింపు : మాయల మరాఠీలను తలదన్నే నరేంద్రమోడీ మహాగారడీ మామూలుగా లేదుగా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


దీపావళి కానుకగా వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) భారాన్ని తగ్గించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి మీడియాలో ఇప్పటికే పెద్ద ప్రచారం వచ్చింది. సిద్దం సుమతీ అన్నట్లు కాచుకొని ఉండే కాషాయ దళాలు భజన ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం 12,28 పన్ను శ్లాబులను రద్దు చేసి ఐదు, 18శాతం స్లాబులకు అంగీకరించగా, జిఎస్‌టి మండలి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పన్నెండు, 28శాతాలలో ఉన్న వస్తువులను దేనిలో కలుపుతారు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఈ చర్యతో కలిగే లాభాలు, నష్టాల గురించి మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటి మంచి చెడ్డల గురించి మాట్లాడుకొనే ముందు ఇప్పుడున్న తీరు తెన్నులేమిటో చూద్దాం. ప్రతిదాన్లో ఉన్నట్లు మంచీ చెడు ఉంటాయి, ఏదెక్కువ అన్నదే గీటురాయిగా ఉండాలి.


జిఎస్‌టి కూడా ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానమే. విదేశీ కంపెనీలు, వస్తువులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అమ్మకపు పన్ను విధించటంతో వాటికి తలనొప్పిగా ఉండి దేశమంతటా ఒకే పన్ను విధానం తీసుకురావాలని వత్తిడి తెచ్చిన ఫలితమే ఇది. దీన్ని అమలు చేయాలని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 115వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ వ్యతిరేకించారనే అంశం చాలా మందికి గుర్తు ఉండి ఉండదు. బిజెపికి మద్దతు ఇచ్చే వ్యాపారవర్గం పన్నుల ఎగవేతకు అవకాశాలు ‘‘ తగ్గుతాయని ’’ వ్యతిరేకించినట్లు కూడా చెబుతారు. రాజకీయ నేతలు ఎల్లవేళలా కుడి, ఎడమ జేబుల్లో పరస్పర విరుద్దమైన ప్రకటనలు పెట్టుకొని సంచరిస్తూ ఉంటారట. ఏది వాటంగా ఉంటే దాన్ని బయటకు తీస్తారు. జిఎస్‌టి బిల్లు తిరోగామి స్వభావం కలిగినదని, సమాఖ్య ఆర్థిక మూలాలకు పూర్తిగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి పాత్రలో 2011 ఫిబ్రవరి 11న వాదించిన రాజనీతిజ్ఞుడు మోడీ. ప్రధాని హోదాలో దానికి పూర్తి విరుద్దంగా రెండో జేబులో ఉన్న ప్రకటన బయటకు తీశారు.(మోడీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన చంద్రబాబు స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్ల గురించి ప్రతిపక్షంలో ఉండగా చెప్పినదానికి అధికారానికి వచ్చిన తరువాత మాట మార్చినట్లు ) తన ప్రభుత్వం ముందుకు తెచ్చిన జిఎస్‌టి బిల్లు గురించి 2016 ఆగస్టు 9న పార్లమెంటులో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా తనకు సందేహాలు ఉండేవని ఇప్పుడు అవి ఒక ప్రధానిగా ఆ సమస్యలను పరిష్కరించటాన్ని సులభతరం చేసిందని చెప్పుకున్నారు. దానికి తోడు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీతో కూడా అనేక సార్లు చర్చించినట్లు చెప్పుకున్నారు.(మోడీ సందేహాలను ఆయన తీర్చని కారణంగానే బిల్లును వ్యతిరేకించారా) అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని వంది మాగధులు తాళం వేశారు.2017 జూలై ఒకటి నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చింది.తరువాత కొన్ని శ్లాబుల్లో వస్తువుల జాబితా మార్పు, పన్ను రేటు పెంపుదల వంటివి జరిగాయి.


ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఏ స్లాబ్‌ నుంచి ఎంతవస్తున్నదంటే ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు, పద్దెనిమిదిశాతం వాటితో 65, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి పదకొండు రూపాయలు వస్తున్నాయి. మీడియా రాస్తున్న ఊహాగానాల ప్రకారం పన్నెండుశాతం శ్లాబులో ఉన్న జాబితాలో 99శాతం వస్తువులను ఐదు శాతం స్లాబులో చేరుస్తారు.తొంభై శాతం వస్తువుల మీద పన్ను మొత్తాన్ని 28 నుంచి 18శాతానికి తగ్గిస్తారు.పాపపు పన్ను వస్తువులు అంటే పొగాకు ఉత్పత్తులు, పాన్‌ మసాలా వంటి ఐదు లేదా ఏడు ఉత్పత్తులను 40శాతం మరియు సెస్‌ విధించే ప్రత్యేక శ్లాబులో ఉంచుతారు. బంగారం మీద మూడుశాతం మారదు, వజ్రాల మీద 0.25 నుంచి 0.5శాతానికి పెంచవచ్చు.ఈ కసరత్తు తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత రాబడి తగ్గుతుంది లేదా వినియోగదారులకు ఎంత మేరకు ఉపశమనం కలుగుతుంది అంటే ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ ఏటా 1.45శాతం అంటే రు.32 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. ఇతరులు రు.60 వేల నుంచి 1.8లక్షల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఒక నిర్ణయం జరిగి కొన్ని నెలల రాబడి చూసిన తరువాత మాత్రమే ఏది వాస్తవం అన్నది చెప్పగలం. ఒకటి మాత్రం ఖాయం జనానికి తగ్గేది స్వల్పం.


దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా నిజవేతనాలు పెరగకపోవటంతో వస్తువినియోగం తగ్గుతున్నది. ఇది కార్పొరేట్‌ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నది. అందువలన వినియోగాన్ని పెంచాలంటే హెలికాప్టర్‌ మనీ అంటే నేరుగా నగదు ఇవ్వాలని కరోనా సమయంలో కొందరు సూచించారు. మరొకటి పన్నుల తగ్గింపు ఒక మార్గంగా చెబుతున్నారు. అందుకే 28శాతం ఉన్న వస్తువులను 18శాతంలోకి మార్చేందుకు పూనుకున్నారు. గత ఏడాది కాలంగా శ్లాబుల తగ్గింపు గురించి మధనం జరుగుతున్నది. 2024 డిసెంబరులో 55వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు పెట్టారు. కొన్ని వస్తువుల మీద పన్ను తగ్గింపు ద్వారా వచ్చే దీపావళి పండుగ తరుణంలో రు.4.25 లక్షల కోట్ల మేర వినియోగాన్ని పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది. సహజన్యాయం లేదా సామాజిక న్యాయం ప్రకారం అధిక ఆదాయం కలిగిన వారు ఎక్కువ మొత్తం పన్ను చెల్లించాలి, ఆ మేరకు తక్కువ రాబడి కలిగిన వారికి ఉపశమనం కలగాలి. ఆదాయపన్ను విషయంలో అదే జరుగుతున్నది. అదే జిఎస్‌టికి ఎందుకు వర్తించదు ?


ఫ్రాన్సు రాజధాని పారిస్‌ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ (సిఇపిఆర్‌) సంస్థ మన జిఎస్‌టి మీద ఒక అధ్యయనం చేసింది. జనాభాలో దిగువ 50శాతం మంది నుంచి 25శాతం రాబడి వస్తుండగా వారు వినియోగిస్తున్న వస్తు, సేవల వాటా 20 నుంచి 25శాతం మధ్య ఉంది.ఎగువ మధ్యతరగతిలోని 30శాతం మంది నుంచి రాబడి 35శాతం కాగా వినియోగం 35 నుంచి 38శాతం ఉంది. అదే ఎగువ 20శాతం నుంచి వస్తున్న మొత్తం 40శాతం కాగా వినియోగిస్తున్నది 45శాతంగా ఉందని మన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ దగ్గర ఉన్న గణాంకాలను విశ్లేషించి చెప్పింది. ఇప్పుడున్న విధానం ప్రకారం అంబానీ, అదానీ, వారి దగ్గర పని చేసే దిగువ సిబ్బందిలో ఇద్దరు ఒకే షాపులో పండ్లుతోముకొనే బ్రష్‌లను కొనుగోలు చేస్తే నలుగురి మీద విధించే పన్ను మొత్తం ఒక్కటే. మొదటి ఇద్దరు జేబులో ఎంత తగ్గిందో అసలు చూడరు, కానీ పనివారు ఒకటికి రెండుసార్లు మిగిలి ఉన్న మొత్తాన్ని లెక్కపెట్టుకుంటారు. ఎందుకంటే ఆదాయ అసమానత. చూశారా చట్టం ముందు అందరూ సమానులే, సమానత్వం ఎంత చక్కగా అమలు జరుగుతోందో అని కొందరు తమ భుజాలను తామే చరుచుకుంటారు.


ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ, మరో ప్రముఖుడు ల్యూకాస్‌ ఛాన్సెల్‌ ఒక అధ్యయనం చేశారు. అదేమంటే 1922 నుంచి 2015 మధ్య కాలంలో మనదేశంలో జరిగిన ఆదాయ అసమానత పరిణామాలను పరిశీలించారు. బ్రిటీష్‌ రాజ్యం నుంచి బిలియనీర్ల రాజ్యం వరకు అంటూ తమ పరిశీలనకు పేరు పెట్టారు. పేరుకు మనది గణతంత్ర రాజ్యం అని రాసుకున్నప్పటికీ గతంలో బ్రిటీష్‌ వారు పాలిస్తే ఇప్పుడు వారి స్థానంలో బిలియనీర్లు ఉన్నారు.1922ను ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అంటే అదే ఏడాది మనదేశంలో బ్రిటీష్‌ పాలకులు ఆదాయపన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.మన జనాభాలో ఎగువ ఒకశాతం మందికి 1930దశకంలో 21శాతం రాబడి రాగా, 1980దశకంలో అది ఆరుశాతానికి తగ్గింది. తరువాత నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి. ఎగువ నుంచి దిగువకు ఊటదిగినట్లుగా జనాభాలో దిగువన ఉన్న వారికి రాబడి ఊట దించేందుకు ఈ విధానాలను అనుసరిస్తున్నట్లు ఊట సిద్దాంతం చెప్పారు. కానీ జరిగిందేమిటి ? జనాభాలో ఒక శాతం ఉన్న ధనికుల ఆదాయం తిరిగి 22శాతానికి చేరింది. అందుకే బ్రిటీష్‌ వారి ఏలుబడి కంటే స్వాతంత్య్రంలోనే అసమానతలు పెరిగినట్లు వారు వ్యాఖ్యానించారు.1950 నుంచి 1980 మధ్య కాలంలో దిగువన ఉన్న 50శాతం మంది రాబడి మొత్తం సగటుతో పోలిస్తే ఎక్కువగా 28శాతం వేగంతో పెరగ్గా ఎగువన ఉన్న 0.1శాతం మంది రాబడి తగ్గిపోయింది. కానీ 2015 నాటికి అది తారుమారైంది. దిగువ 50శాతం మంది వృద్ధి రేటు పదకొండు శాతం కాగా ఎగువన ఉన్నవారిది 12శాతం పెరిగింది. మధ్య తరగతిగా ఉన్న 40శాతం మంది 23శాతం పొందగా ఎగువున ఒక శాతం మందికి 29శాతం ఉంది.


మనదేశంలో తొలి బిలియనీర్‌ నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. పారిశ్రామికవేత్తలలో 1991లో ఒక్కరే ఉన్నారు. ఇండియా టుడే విశ్లేషణ ప్రకారం 2014లో 70 మంది 2025 నాటికి 284కు పెరిగారు. ఎగువ ఒక శాతం మంది వద్ద దేశ సంపదలో 40.1శాతం పోగుపడిరది. ఇంతగా ధనికులు పెరిగిన తరువాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరింతగా సంపాదిస్తారే తప్ప మోడీ చెప్పినట్లు సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదాన్ని సాకారం కానిస్తారా ? పార్లమెంటు, అసెంబ్లీల్లో పెరుగుతున్న కోటీశ్వరులు సామాన్యుల కోసం విధానాలను రూపొందిస్తారా ? 2025`26 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 50లక్షల కోట్లు అనుకుంటే బిలియనీర్ల వద్ద ఉన్న సంపద 98లక్షల కోట్లు. ఒక్క ముంబైలోనే 90 మంది ఉన్నారని వారి సంపద 39లక్షల కోట్ల రూపాయలని లెక్క. ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మార్చినెలలో విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం మనదేశంలో 2022లో వార్షిక రాబడి ఇరవై ఏండ్లు పైబడిన 92 కోట్ల మంది సగటు రు.2.3లక్షలంటే నెలకు ఇరవై వేలు. మధ్యగత రేఖ(మెడియన్‌) వార్షిక రాబడి రు.లక్ష అంటే నెలకు సగటున రు.8,750 మాత్రమే వస్తున్నది. ఎగువున ఉన్న పదిశాతం మంది ఏడాదికి సగటున రు.13లక్షలు, ఎగువ ఒక శాతం రు.50లక్షలు, ఎగువన 0.1శాతం మంది రెండు కోట్లు, 0.01శాతం మంది పది కోట్ల వంతున సంపాదిస్తున్నారు. ధనికుల్లో అగ్రశ్రేణి వారిలో 9,223 మంది సగటున 50 కోట్లు సంపాదిస్తున్నారు. ఇక సామాజిక తరగతుల వారీ చూస్తే ఐశ్యర్యవంతుల్లో 90శాతం మంది ‘‘ సవర్ణులు ’’’ 2.6శాతం దళితులు, మిగిలిన వారు ఓబిసిలు ఉన్నారట.2014 నుంచి 2022 కాలంలో ధనవంతులైన ఓబిసి బిలియనీర్ల సంపద 20 నుంచి పదిశాతానికి తగ్గగా సవర్ణులకు 80 నుంచి 90శాతానికి పెరిగిందని ఇనీక్వాలిటీ లాబ్‌ పర్కొన్నది. జనాభాలో 25శాతంగా ఉన్న వీరు 55శాతం సంపద కలిగి ఉన్నారట. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే ఇలాంటి ఆర్థిక అసమానతల ఉన్నపుడు శతకోటీశ్వరులు, అల్పాదాయ వర్గాలకు ఒకే జిఎస్‌టి రేటు సామాజిక న్యాయానికి విరుద్దం. ధనికుల మీద సంపదపన్ను విధిస్తే వచ్చే రాబడితో ఖజాన నింపుకోవచ్చు. వస్తు, సేవల పన్ను తగ్గిస్తే భారం ఎంతో తగ్గుతుంది.వినియోగం పెరిగితే యువతకు ఉపాధి పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వాలకు రాబడీ పెరుగుతుంది. కానీ ఆ పని చేయటం లేదు. మోడీ సర్కార్‌ మహామాయ జిమ్మిక్కులతో శ్లాబుల కుదింపును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకొనేందుకు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే. వాస్తవాలను గ్రహించినపుడు జనాలు చివరికి మోడీ నిజం చెప్పినా నమ్మని స్థితి వస్తుంది !

కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం : నాడు తెలుగునాట – నేడు న్యూయార్క్‌ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడిరచేందుకు 1950 దశకంలో నాటి కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టు వ్యతిరేకులు సాగించిన విష ప్రచారంలో పత్రికలు తమ వంతు పాత్రను పోషించాయి. కమ్యూనిస్టులు అధికారానికి వస్తే మహిళల మెడల మీద కాడి మోపి పొలాలను దున్నిస్తారని, జాతీయం చేస్తారని, సమానత్వం సాధించేందుకు గాను పొట్టిగా ఉన్న వేళ్లతో సమానం చేసేందుకు పొడుగువేళ్లను నరికివేస్తారని, తల మీద సుత్తితో కొట్టి కొడవలితో మెడనరికేస్తారని, ఇంకా ఏవేవో పచ్చి అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నవంబరులో జరిగే ఎన్నికల్లో అదే జరుగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున వామపక్ష భావజాలం కలిగిన జోహ్రాన్‌ మమ్‌దానీ అభ్యర్థిత్వాన్ని అడ్డుకొనేందుకు తొలుత ఆ పార్టీలోని మితవాదులు చేయని యత్నం లేదు. దాన్ని అధిగమించాడు. ఓటమికి పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ పని చేయాలని వ్యతిరేకులు పిలుపునిచ్చారు. వాటన్నింటినీ అధిగమిస్తూ జోహ్రాన్‌ 44శాతం, అదే పార్టీకి చెందిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమో స్వతంత్ర అభ్యర్థిగా 25,, అదే పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌, తిరుగుబాటు అభ్యర్థి ఎరిక్‌ ఆడమ్స్‌ ఏడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్‌ స్లివా 12శాతం ఓటర్ల మద్దతు కలిగి ఉన్నట్లు సియేనా సర్వే సంస్థ ప్రకటించింది.(ఎగువ చిత్రంలో ఒక పురోగామి భావజాల వాదిగా పెంచిన తలిదండ్రులు మీరా నాయర్‌, మహమూద్‌ మమ్దానీతో జోహ్రానీ మమ్దానీ)

ఈ నేపధ్యంలో జోహ్రాన్‌పై కొన్ని పత్రికలు ప్రత్యక్షదాడులకు దిగుతుంటే కొన్ని మరోవిధంగా చేస్తున్నాయి.ఫాక్స్‌ న్యూస్‌ టీవీ యాంకర్‌ ఊగిపోతూ జోహ్రాన్‌ మమ్‌దానీ, అతని అనుచరులు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు వారిని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులపై విషం చిమ్మటంలో నోటిదురుసుకు పేరు మోసిన జో మెకార్ధీని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు.ప్రజాస్వామ్యం అంటే ఆత్మహత్య బంధకం కాదని గుర్తించాల్సిన దశ వచ్చిందని, తీవ్రవాదులను న్యూయార్క్‌ వంటి గొప్పనగరంలో ఎన్నిక కావటానికి అనుమతించకూడదని, నగరాన్ని నాశనం కానివ్వకూడదంటూ విరుచుకుపడ్డాడు.కమ్యూనిస్టును కాదని ప్రజాస్వామిక సోషలిస్టును అని అతను చెప్పుకుంటున్నాడు, అది ఏ తరహా ప్రజాస్వామ్యం అతను ఎన్నిక కావటాన్ని సహించకూడదని, ఏదో విధంగా అడ్డుకోవాలన్నాడు.జోహ్రాన్‌ గడ్డం ఉన్న కమలాహారిస్‌ అని నోరుపారవేసుకున్నాడు. ప్రచ్చన్న యుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ మార్క్సిజం బతికిందని దాంతో విశ్వవిద్యాలయాల్లోని టీచర్లకు ధైర్యం వచ్చిందన్నాడు. అందువలన వలస వచ్చేవారిని, సిద్దాంతాలను ఎక్కించటాన్ని అడ్డుకోవాలి, కమ్యూనిస్టుకు ఓటువేయాలని, నగరనాశనాన్ని కోరుకొనే వారిని బయటకు నెట్టాలి. అందరం కూర్చుని కమ్యూనిస్టు ఎన్నికకాకుండా చూడాలి, అధికారికంగా నమోదు కాని, పౌరులు కాని వారు కూడా ఓట్లు వేస్తున్నారని ఆరోపించాడు.పురోగామివాదుల పట్ల మీడియాలో తిష్టవేసిన మితవాదులు ఎలా ఉన్నారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే.


చిన్న చిన్న నేరాలు చేసినవారి మీద మోపిన ఆరోపణలను ఉపసంహరించాలని నేరాలు చేసిన వారిని సమర్ధిస్తున్నట్లు జోహ్రాన్‌ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తీవ్ర సమస్యలు కాని వాటి మీద కేంద్రీకరించి వేధింపులకు పాల్పడవద్దని, చిన్న తప్పిదాలను పెద్ద నేరాలుగా చూడవద్దంటూ ఎన్నికల ప్రచారంలో పోలీసుల గురించి చెప్పిన మాటలను వక్రీకరించారు. చిన్న చిన్న తప్పిదాలకు సైతం కనీసం ఏడాది శిక్ష విధిస్తున్నప్పటికీ తగ్గటం లేదు. కనుక అలాంటి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వాలు, పౌరసమాజం కూడా పరిశీలించాల్సి ఉంది. అమెరికాలో ఎవరు ఏ మూలన ఎప్పుడు తుపాకీ తీసుకొని టపటపా మంటూ జనాలను ఎందుకు కాల్చిచంపుతారో తెలియని స్థితి.పౌర భద్రతలో పోలీసులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని కానీ వారు చేయాల్సినదానిని చేయకుండా అడ్డుకుంటున్నారని జోహ్రాన్‌ పేర్కొన్నాడు. దాన్లో భాగంగానే బతుకుతెరవు కోసం శరీరాలను అమ్ముకుంటున్నవారిని వేధించవద్దని, దాన్నొకనేరపూరిత చర్యగా చూడవద్దని 2020లో న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినపుడు చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకొని ఇంకేముంది న్యూయార్క్‌ నగరాన్ని వేశ్యలతో ముంచెత్తేందుకు పూనుకున్నాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడు మేయర్‌ ఎన్నికల్లో ఆ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. పడుపు వృత్తి న్యూయార్క్‌ నగరంలో లేదా అమెరికా ఒక్క ఆదేశం ఏమిటి ప్రపంచమంతటా జోహ్రాన్‌ పుట్టక ముందే ఉంది. ప్రతి నగరంలో అలాంటి కార్యకలాపాలకు పేరుమోసిన ప్రాంతాల ఉండటం అందరికీ తెలిసిన పచ్చినిజం, న్యూయార్క్‌ నగరం దానికి మినహాయింపు కాదు. కొన్ని ప్రాంతాలలో పట్టపగలు బహిరంగంగానే అలాంటి వారు సంచరించటం బహిరంగరహస్యం. అలాంటి వృత్తి కొనసాగాలని ఎవరూ కోరుకోరు. కొన్ని దేశాల్లో చట్టబద్దం చేసి అనుమతిస్తున్నారు. పోలీసుల వేధింపులు, మాఫియా ముఠాల బారిన పడకుండా అభాగ్యులైన యువతులకు లైసన్సులు ఇవ్వాలని అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లే, వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. యావత్‌ ప్రపంచానికి తెలిసిన బ్యాంకాక్‌లో టూరిజం పేరుతో ఏం జరుగుతున్నదో అందరికీ తెలిసిందే. అక్కడ అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులు కాదు, జూదకేంద్రాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి, అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారా ? అంతెందుకు అమెరికాలోని నెవడా రాష్ట్రంలో పడుపు వృత్తి చట్టపరంగానే చేయవచ్చు. అక్కడ అధికారంలో ఉన్నది రిపబ్లికన్‌ పార్టీ, దాని గురించి ఎక్కడా మీడియా చర్చించదేం ? నెవడాలో మాదిరి చట్టబద్దంగా వేశ్యావృత్తి జరుగుతున్నచోట సంఘటిత నేరాలు, అమ్మాయిల క్రయ విక్రయాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం వెల్లడిస్తున్నది.న్యూయార్క్‌లో అదే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కర్టిస్‌ స్లివా దొరికిందే సందన్నట్లు జోహ్రాన్‌ ఎన్నికైతే న్యూయార్క్‌ నగరం ఒక వేశ్యావాడగా మారుతుందని కబుర్లు చెబుతున్నాడు. గురివిందగింజ తన కింది నలుపు చూసుకోదని పెద్దలు ఊరికే అనలేదు.

జోహ్రాన్‌ గెలిస్తే కుటుంబాలు నాశనం అవుతాయంటూ చేస్తున్న ప్రచారం కూడా దాడిలో భాగమే. అమెరికాలో వివాహాలు, విడిపోవటాలు, అసలా బంధంతో నిమిత్తం లేకుండా పిల్లల్ని కనటం, పెంచటం ఇవన్నీ తెలిసిన వారికి జోహ్రాన్‌ మీద చేస్తున్న ప్రచారానికి కారణం మరింతగా అర్ధం అవుతుంది.మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎంతో వేగంగా అంతరించిపోయాయి, దీనికి కారణం కమ్యూనిస్టులు, పురోగామి వాదులా, పెళ్లయిన మరుసటి రోజే పెటాకులవుతున్న వివాహాలకు వారు కారకులా ? కానే కాదు.మనకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మరింతగా ఎదిగిన అమెరికా సమాజంలో జరుగుతున్న పరిణామాలకు కమ్యూనిస్టులు ఎలా కారణం అవుతారు. మనదేశంలో తలిదండ్రులు చేస్తున్న బలవంతపు వివాహాల వలన ఒకరినొకరు ఎలా చంపుతున్నారో ఈ రోజు ఏ టీవీ చూసినా పత్రికను చదివినా ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఉదంతాల గురించి తెలియదా ! సమాజపోకడలను గమనించిన వారు కమ్యూనిస్టులైనా మరొకరైనా కుటుంబవ్యవస్థ అంతరించే అవకాశం ఉందని చెప్పి ఉండవచ్చు.అంతమాత్రాన అలా చెప్పారు గనుక వారు మేయర్‌గా గెలిస్తే లేదా అధికారానికి వస్తే కుటుంబాలను సాగనివ్వరని చెప్పటం విపరీతం తప్ప మరొకటి కాదు. అది సమాజం నిర్ణయించుకుంటుంది. వివాహంతో నిమిత్తం లేకుండా వయస్సు వచ్చిన స్త్రీ, పురుషుల సహజీవనాన్ని న్యాయవ్యవస్థ అంగీకరిస్తున్న విషయం తెలియదా !


జోహ్రాన్‌ మమ్దానీ ముందుకు తెస్తున్న నగర, వలస కార్మికులు, కుటుంబాలు, మొత్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న గృహ, ఇతర సమస్యల గురించి ప్రత్యర్థులు, మీడియా కావాలనే మౌనం వహిస్తున్నది. ఇప్పటి వరకు న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌, నగర మేయర్‌గా ఉన్నది డెమోక్రటిక్‌ పార్టీ వారే, ఆ నేతలే ఇప్పుడు పోటీలో ఉన్నారు.పౌర సమస్యల గురించి మాట్లాడితే మీరు చేసిందేమిటనే ప్రశ్నవారికి ఎదురువుతుందిగనుక తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.అమెరికాలో ఎన్నికలు ఏవైనా డబ్బుతో కూడుకున్నవే. అభ్యర్థులకు సానుభూతి పరులు ఇస్తున్న విరాళాలు కూడా అభిమానానికి కొలబద్దగా ఓటర్లు చూస్తారు.ఆగస్టు రెండవ వారానికి జోహ్రాన్‌ 10.51లక్షల డాలర్లు వసూలు(సగటున ఒక్కో విరాళ మొత్తం 121 డాలర్లు) కాగా, ప్రత్యర్థులుగా ఉన్న మాజీ గవర్నర్‌ కుమో 5.41లక్షల డాలర్లు (సగటు 646), ఎరిక్‌ ఆడమ్స్‌ 4.25లక్షలు(770 ), రిపబ్లికన్‌ అభ్యర్థి 4.07లక్షల డాలర్లు పొందారు. సగటు విరాళం తక్కువగా ఉండటాన్ని బట్టి జోహ్రాన్‌కు పేద, మధ్య తరగతి మద్దతు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.నగరంలో ఇళ్ల అద్దెల పెంపుదలను స్థంభింపచేయాలని, ఉచిత బస్‌ ప్రయాణం, శిశు సంరక్షణ, నగరపాలక సంస్థ ఆధ్వర్యాన లాభనష్టాలు లేని ప్రాతిపదికన నిత్యావసర వస్తు దుకాణాల నిర్వహణ, స్కూళ్లు, కాలేజీలకు సబ్సిడీ వంటి వాగ్దానాలను అమలు చేస్తానని జోహ్రాన్‌ తన ప్రణాళికలో పేర్కొన్నాడు.

ఎలాగైనా సరే వామపక్ష అభ్యర్థి గెలవకుండా చూడాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మమ్దానీ ఓడిపోవాలంటే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి స్లివా రంగం నుంచి తప్పుకొని తనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తన మద్దతుదార్లతో ఆండ్రూ కుమో చెబుతున్నట్లు పొలిటికో పత్రిక రాసింది.మమ్దానీ నూటికి నూరుశాతం కమ్యూనిస్టు పిచ్చోడని స్వయంగా వర్ణించినందున డోనాల్డ్‌ ట్రంప్‌కు నిదరపట్టటం లేదని కుమో చెబుతున్నాడు. ఇప్పటి నుంచి నవంబరులో ఎన్నికలు జరిగేలోగా అనేక పరిణామాలు జరగవచ్చని గతవారంలో చెప్పాడు. ‘‘ అసెంబ్లీ సభ్యుడు(జోహ్రాన్‌ మమ్దానీ) ఎవరో, అతను దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, వివిధ అంశాలపై అతని వైఖరి ఏమిటో తెలియనంతగా జనం ఉన్నారని నేను అనుకోవటం లేదు.కనుక అతని గురించి మరింతగా తెలుసుకుంటారు, అతన్ని అభిమానించటం తగ్గిస్తారు… అతని ఆకర్షణ నాటకీయంగా పడిపోనుంది ’’ అని చెప్పినట్లు పొలిటికో రాసింది. మమ్దానీ విజయాన్ని అడ్డుకోవాలంటే పార్టీ అభ్యర్థి కర్టిస్‌ స్లివాకు బదులు కుమోకు మద్దతు ఇవ్వాలని ట్రంప్‌, ఇతర నేతలు తమకు విశ్వాసపాత్రులుగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ వారికి చెబుతారని ఆండ్రూ కుమో లెక్కలు వేసుకుంటున్నట్లు వేరే మీడియా పేర్కొన్నది. ఆ విషయాలను స్వయంగా కుమో చెప్పినట్లు ఆడియో ఆధారం లభించినట్లు వెల్లడిరచింది.


తాను డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదని అలాంటి ఆలోచన కూడా లేదని ఆండ్రూ కుమో చెప్పాడు. పోటీ గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. గవర్నర్‌గా ఉండగా ట్రంప్‌ను వ్యతిరేకించిన కుమో ఇప్పుడు అతగాడి సాయం కోరుతున్నాడని, ట్రంప్‌తో ఉన్న సంబంధాల గురించి అవాస్తవాలు చెబుతున్నాడని జోహ్రాన్‌ విమర్శించాడు. ప్రముఖ మీడియా యజమాని జిమీ ఫింక్లెస్టయిన్‌ ఇంట్లో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదార్లు పరిస్థితిని సమీక్షించి కుమో ఎలా పోటీ ఇవ్వగలడో ట్రంప్‌కు నివేదించినట్లు కూడా న్యూయార్క్‌టైమ్స్‌ రాసింది. ట్రంప్‌తో నేరుగా మాట్లాడితే ఫలితం ఉంటుందేమో అని ఒక మద్దతుదారు కుమోను అడగ్గా ట్రంప్‌కు అన్నీ తెలుసు తనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. అయితే అతని మద్దతుదార్లు ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు తాము ఎవరినీ మద్దతు అడిగేది లేదని మమ్దానీని ఓడిరచేందుకు తమనేతే సరైన వ్యక్తి అని ప్రకటనలు చేస్తున్నారు. మమ్దానీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మరోపోటీదారు, ప్రస్తుత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ను కుమో కోరినట్లు వార్తలు. కుమోను ట్రంప్‌ బలపరుస్తున్నాడని, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిపేందుకు కుట్ర చేస్తున్నారని మమ్దానీ ప్రతినిధి డోరా పెకీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. చివరికి ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి చెప్పలేము గానీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మమ్దానీ గురించి సర్వేలన్నీ ఇప్పటి వరకు ముందంజలో ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నప్పటికీ అది ఒక్క అమెరికాలోనే కాదు యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నదంటే అతిశయోక్తి కాదు !

పాడు జీవితమూ…పదకొండేళ్ల మోడీ ముచ్చటా : హత ఆత్మనిర్భరతా ! చివరికి ఎరువుల కొరతను కూడా చైనా చుట్టూ తిప్పాలా !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


ఎరువుల కొరత ! దీనికి ఎవరిని తప్పు పట్టాలి ? దేశంలో ఏం జరిగినా చివరికి సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించినా నరేంద్రమోడీ కారణంగానే జరుగుతోందని చెబుతున్నారు కదా ! మరి ఎరువుల కొరతకు నెహ్రూ బాధ్యుడని అని అందామా, కుదరదే !! సుత్తిలేకుండా సూటిగా చెప్పుకుందాం. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2025 ఆగస్టు ఒకటవ తేదీ నాటికి యూరియా నిల్వ 37.19 లక్షల టన్నులు ఉంది. అంతకు ముందు ఏడాది అదే తేదీతో పోలిస్తే 49.24లక్షల టన్నులు తక్కువ. తెలంగాణా కాంగ్రెస్‌ ప్రభుత్వం తగినంతగా నిల్వచేయని కారణంగా యూరియా కొరత ఏర్పడిరది తప్ప కేంద్రానిది తప్పేమీ లేదని చెప్పే బిజెపి నేతల ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా రెండిరజన్ల పాలనలోకి వెళ్లింది. అక్కడ కూడా యూరియా రావాల్సినంత రాలేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రానికి మొరపెట్టుకున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని ఎంతగా దాచిపెట్టినా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. గల్లీ నుంచి ఢల్లీి వరకు బుకాయిస్తున్న బిజెపి నేతలవి నోళ్లా మరొకటా అని రైతులు అనుకుంటున్నారు. కొందరు బిజెపి పెద్దలు నానో యూరియా గురించి రైతులు పట్టించుకోవటం లేదని నెపం వారి మీద నెడుతున్నారు. దీన్ని పుండు మీద కారం చల్లటం అంటారు.


కావాల్సింది ఎలుకను పడుతుందా లేదా అని తప్ప పిల్లి నల్లదా తెల్లదా అని కాదు. జనాల మెదళ్లలో మతోన్మాదాన్ని ఎక్కించేందుకు చూపిన శ్రద్ధ నిజంగా నానో యూరియా గురించి చూపారా ? అదే పరిష్కారమే అయితే రైతాంగాన్ని చైతన్య పరిచేందుకు తీసుకున్న శ్రద్ద ఏమిటి ? తమకు లబ్ది చేకూర్చే ప్రతి నవ ఆవిష్కరణను ఆహ్వానించి ఆమోదించిన మన రైతన్న నానో పట్ల ఎందుకు విముఖత చూపుతున్నట్లు ? పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంప్రదాయ మరియు నానో యూరియా వాడక ఫలితాల గురించి రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేసింది. గుళికల రూపంలో వాడిన పొలాల కంటే నానో ప్రయోగ క్షేత్రాల్లో గోధుమల దిగుబడి 21.6,వరిలో 13శాతం చొప్పున తగ్గినట్లు తేలింది.2020 నుంచి 2022వరకు పరిశీలన జరిగింది. అయినప్పటికీ 45 కిలోల యూరియా స్థానంలో 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియా అదే ఫలితాలను ఇస్తుందంటూ మార్కెటింగ్‌ ప్రారంభించిన ఇఫ్‌కో, కేంద్ర ప్రభుత్వం కూడా ఊదరగొడుతున్నాయి. అంతే కాదు, ఇది వాడిన పొలాల్లో పండిన గింజల్లో ప్రొటీన్‌ కూడా తక్కువగా ఉంటుందని తేలింది. ప్రొటీన్లకు గింజల్లో నైట్రోజన్‌ అవసరం. వరుసగా వాడితే దిగుబడుల తగ్గుదల ఇంకా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇఫ్‌కో చెప్పినట్లుగా వాడిన పొలాల్లో పండిన వరిలో 17, గోధుమల్లో 11.5శాతం నైట్రోజన్‌ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనికి తోడు సాధారణ యూరియా కంటే దీని తయారీ ఖర్చు పదిరెట్లు ఎక్కువ. అంటే ఒక 45కిలోల యూరియా బస్తా రు.242 కాగా దానికి ఎన్నో రెట్ల ధరతో కొనుగోలు చేస్తే గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి వ్యవసాయ ఖర్చు పెరిగి, దిగుబడి తగ్గి రైతులకు గిట్టుబాటుగాక, వినియోగదారులకు ప్రొటీన్లు అందకపోతే నానో యూరియా తయారీ పారిశ్రామికవేత్తల లాభాల కోసం తప్ప దేనికి ప్రోత్సహిస్తున్నట్లు ?


దేశంలో యూరియా నిల్వలు అంతగా పడిపోవటానికి కారకులు ఎవరు ? మోడీ సర్కార్‌ కాసుల కక్కుర్తే. పిసినారి వాళ్లకు కూడా ముందు చూపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి అది కూడా ఉన్నట్లు లేదు. మే నెలలో టన్ను యూరియా దిగుమతి ధర నాలుగువందల డాలర్లకు అటూ ఇటూ ఉండగా ఇప్పుడు 530 ఉన్నట్లు వార్త. ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అని భద్రాచల రామదాసు అన్నట్లుగా ఎవరూ అడిగేవారు లేరనేగా ఇప్పుడు దిగుమతులకు హడావుడి పడటం, దీనిలో కూడా ఏమైనా అమ్యామ్యాలు ఉన్నాయా ? ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా పడతాయని వాతావరణ శాఖ చెప్పింది, అదే జరిగితే పంటల సాగు పెరుగుతుందని గ్రహించటానికి కేంద్రంలో వ్యవసాయం గురించి తెలిసిన వారు ఉంటేగా, అదానీ ‘‘ వ్యవసాయం ’’ కూడా చేసినా కాస్త బాగుండేమో ! ఇప్పుడు చైనా నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు, అది రావాలన్నా కనీసం నెలన్నర పడుతుందని వార్తలు.చేతి చమురు వదులుతున్నది, రైతాంగం నుంచి విమర్శలు సరేసరి. ప్రభుత్వాల నుంచి అనేక రాయితీలు పొందిన ప్రైవేటు రంగ కాకినాడ నాగార్జున ఎరువుల కంపెనీ మామూలు యూరియా బదులు గ్రీన్‌ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు పొందుతున్నదని వార్త.ప్రభుత్వమే పట్టనట్లు ఉంటే ప్రైవేటు కంపెనీల గురించి చెప్పేదేముంది.

ఒక్క యూరియా విషయంలోనే కాదు అన్ని ఎరువుల పరిస్థితి కాస్త అటూ ఇటూగా అంతే. డిఏపి నిల్వలు గతేడాది 15.82లక్షల టన్నులుండగా ఆగస్టు ఒకటి నాటికి ఈ ఏడాది 13.9లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 46.99లక్షల టన్నులకు గాను 34.97ల.టన్నులు, ఎంఓపి 8లక్షలకు గాను 6.27లక్షల టన్నులు ఉండగా సూపర్‌గా రైతులు పిలిచే ఎస్‌ఎస్‌పి మాత్రం గతేడాది కంటే స్వల్పంగా ఎక్కువగా నిల్వలు ఉన్నాయి.పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పలువురు ఎంపీలు ఎరువుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.యూరియా తరువాత ఎక్కువగా వినియోగించేది డిఏపి.చైనా నుంచి 2023`24లో 22.28లక్షల టన్నులు దిగుమతి చేసుకోగా మరుసటి ఏడాది 8.47ల.టన్నులు, ఈ ఏడాది జూలైలో కేవలం 97వేల టన్నులు మాత్రమే దిగుమతి చేసుకున్నట్లు ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు.చైనా ప్రభుత్వ తనిఖీ నిబంధనలే దీనికి కారణమన్నారు. పోనీ ఇతర దేశాల నుంచి ఆమేరకు దిగుమతి చేసుకున్నారా అంటే అదీ లేదు. అసలు కారణం ఏమంటే అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా ధర పెరగటమే, ఆ మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించాలి గనుక అసలు దిగుమతులే నిలిపివేశారు.ఇదీ రైతుల పట్ల నరేంద్రమోడీ సర్కార్‌ శ్రద్ధ.కేంద్ర మంత్రి సమాచారం ప్రకారమే 2024 ఏప్రిల్‌లో టన్ను డిఏపి దిగుమతి ధర 542 డాలర్లు కాగా 2025 జూలైలో అది 800 డాలర్లకు చేరింది.మరోసారి 2022 నాటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. నాడు డిఏపి ధర టన్ను 900 నుంచి వెయ్యి డాలర్లు ఉండగా ఈ ఏడాది దాని తయారీలో కీలకమైన ఫాస్పరిక్‌ యాసిడ్‌ ధర 2025 జనవరి నుంచి మార్చి నెలలో 1,055 డాలర్లకు పెరగ్గా, జూలై మరియు సెప్టెంబరు మాసాలకు 1,258 డాలర్లకు చేరిందట. పులిమీద పుట్ర మాదిరి ధరలు పెరగటమే కాదు మన రూపాయి విలువ పతనం కావటంతో అది కూడా అదనపు భారాన్ని మోపుతున్నది.

ఫాస్పేట్‌, పొటాష్‌, డిఏపి వంటి ఎరువుల దిగుమతి మీద ఎలాంటి ఆంక్షలు లేవు.వాటిని ప్రైవేటు వారు తయారు చేయవచ్చు లేదా దిగుమతి చేయవచ్చు.ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డా లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపిన సమాచారం ప్రకారం గత ఐదు సంవత్సరాలలో చూస్తే మూడు సంవత్సరాలు డిఏపి ఉత్పత్తి తగ్గింది. 2022లో 43.47, 2023లో 42.93, 2024లో 37.69లక్షల టన్నుల(ఐదేండ్ల నాటి స్థితి) చొప్పున ఉత్పత్తి జరిగింది. 2023 జూన్‌ ఒకటి నాటికి 33.2, 2024లో 21.6, 2025 జూన్‌ నాటికి నిల్వలు 12.4లక్షల టన్నులకు తగ్గాయి. దీంతో అనేక ప్రాంతాల్లో బ్లాక్‌ మార్కెట్‌ లేదా అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. నరేంద్రమోడీ ఎంతో ముందు చూపుగల నేత, 2014లో నిజమైన స్వాతంత్య్రాన్ని సాధించిన గొప్ప యోధుడని పొగుడుతున్నారు కదా ! అన్నీ కాంగ్రెసే చేసిందనే బొమ్మరిల్లు డైలాగులు వల్లించటం తప్ప పదకొండేండ్లలో చేసిందేమిటి ! ఎరువుల కొరత, అనిశ్చితికి పునాది కాంగ్రెస్‌ హయాంలో నూతన ఆర్థిక విధానాలలోనే పడిరది.వాటిని మరింత సమర్ధవంతంగా, వేగంగా అమలు జరుపుతున్నట్లు మోడీ చెప్పుకుంటున్నారు. చైనా నుంచి వినిమయ వస్తువులను చౌకగా దిగుమతి చేసుకొని తన పరిశ్రమలను అమెరికా మూసివేసింది లేదా పక్కన పెట్టింది. మన పాలకులు వారు కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా అదే విధంగా ప్రభుత్వ రంగ ఎరువుల పరిశ్రమలను పక్కన పెట్టారు(మూసివేసిన రామగుండ ఫ్యాక్టరీని తెరవటం తప్ప మోడీ ప్రభుత్వం కొత్తగా పెట్టింది లేదు). కోళ్లను పెంచటం ఎందుకు గుడ్లు, మాంసం దిగుమతి చేసుకుంటే పోలా అన్నట్లుగా పెట్టుబడి, కార్మికులు, వేతనాలు, ఒప్పందాలు ఇవన్నీ ఎందుకు దిగుమతి చేసుకుంటే పోలా అని మన పాలకులు అటువైపు చూశారు. ప్రపంచంలో పరిస్థితులన్నీ ఒకే విధంగా ఉండవనే లోకజ్ఞానాన్ని కోల్పోయారు.


2020 నవంబరు నుంచి 2021నవంబరు కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా టన్ను 280 డాలర్ల నుంచి 923, డిఏపి 366 నుంచి 804, ఎంఓపి 230 నుంచి 280, అమ్మోనియా 255 నుంచి 825 డాలర్లకు పెరిగింది.యుపిఏ 2010 నుంచి ఎన్‌డిఏ 2019వరకు పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎరువుల సబ్సిడీ కనిష్టంగా రు.65,836 కోట్లు, గరిష్టంగా రు.83,466 కోట్లు ఉండగా పదేండ్ల సగటు రు.73వేల కోట్లు. పైన చెప్పుకున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరగటంతో దిగుమతుల మీద ఆధారపడటం, ఏడాది పాటు సాగిన ఢల్లీి శివార్లలో రైతు ఉద్యమం కారణంగా సబ్సిడీ కూడా అనివార్యంగా పెంచాల్సి వచ్చిందని అంకెలే వెల్లడిస్తున్నాయి. 2020 నుంచి 2023వరకు కనిష్టంగా రు.1,31,229 కోట్లు, గరిష్టంగా రు.2,54,798 కోట్లు కాగా నాలుగేండ్ల సగటు రు.1,84,772 కోట్లు ఉంది. 2024లో ఈ మొత్తం లక్షా 90వేల కోట్ల రూపాయలు దాటింది. ఇంత మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటానికి సిద్దపడుతున్నారు తప్ప ఆ మొత్తాలను పెట్టుబడులుగా పెట్టి ఉంటే ఎరువుల స్వయం సమృద్ధితో పాటు వేలాది మందికి మెరుగైన ఉపాధి దొరికి ఉండేది, ఎరువుల కోసం చైనా లేదా మరొక దేశాన్నో దేబిరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా ! జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి కోసం అనేక దేశాల్లో ఎరువుల వినియోగం మనదేశంతో పోల్చితే ఎక్కువగా ఉంది. మన పక్కనే ఉన్న చైనాలో 2022లో హెక్టారుకు 397కిలోలు ఉండగా మనదేశంలో 193 కిలోలు మాత్రమే ఉంది. ముందుచూపు ఉన్న నేతలు, విధాన నిర్ణేతలు మన అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని ఎందుకు పెంచలేకపోయారు !

నేడు ప్రతిదీ రాజకీయాలతో ముడిపెడుతున్న తీరు ప్రపంచమంతటా ఉంది. ఎవరూ తక్కువ తినటం లేదు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం మరింత పెరిగింది. చైనాతో సాధారణ సంబంధాల పునరుద్దరణకు పూనుకున్న తరువాత అక్కడి నుంచి ఎరువుల దిగుమతికి అవకాశం దొరికిందనే వార్తలు వచ్చాయి. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత మనదేశం చైనా యాప్‌ల నిషేధం, పెట్టుబడుల మీద ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి క్వాడ్‌గా చైనా వ్యతిరేకతకు పూనుకున్నట్లు మనమీద విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.దానికి ప్రతిగా చైనా మనం దిగుమతి చేసుకుంటున్న ఎరువులు, విలువైన ఖనిజాలు, విద్యుత్‌ వాహనాలకు అవసరమైన మాగ్నెట్లు, ఇతర విడి భాగాల మీద ఆంక్షలు విధించటం బహిరంగరహస్యం. ఇరుగుపొరుగుదేశాలతో మన జాగ్రత్తలో మనముండటం తప్పు కాదు గానీ మన స్వతంత్ర విదేశాంగ విధానంలో భాగంగా ఎవరితోనూ శతృత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా రాజకీయంలో పావుగా మారకూడదు. మన మీద దాని వస్తువులను రుద్దటానికి పన్నుల ఖడ్గాన్ని మన మీద రaళిపించటాన్ని చూస్తున్నాం. అనువుగాని చోట అధికులమనరాదని మన పెద్దలు చెప్పిన సూక్తిని సదా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో తలెత్తే ఇబ్బందుల గురించి మూడు చేపల కథలో మాదిరి దీర్ఘదర్శిగా ఉండాలి. మనం చర్చించుకున్నది ఎరువుల గురించి గనుక గతంలో మోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాల్లో ఈ రంగంలో ముందుచూపులేక కోట్లాది మంది రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టింది.మన ఆహార పంటల దిగుబడులు, భద్రతకూ ఈ వైఖరి నష్టదాయకమే, జనం ఆలోచించాలి మరి !

చరిత్ర గమనాన్ని మార్చివేస్తున్న కమ్యూనిస్టులు : ప్రతిభావంతులను ఆకర్షిస్తున్న చైనా, బెంబేలెత్తుతున్న అమెరికా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అవును ఎవరు అవునన్నా కాదన్నా, మరొకటన్నా ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా మేథావులందరూ పశ్చిమదేశాలలోనే పుట్టారు, మిగతా దేశాల వారు అక్కడికే వెళతారు అన్నట్లుగా కొందరు చాలాకాలంగా జనాల మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు దాన్ని తలకిందులు చేస్తున్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని ఏలిన చమురుకు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అయితే అదే సర్వస్వం కాదని తేలిపోయింది. దాన్ని పక్కన పెట్టే ‘‘ ప్రతిభ ’’ ప్రత్యామ్నాయ హరిత ఇంథనం, క్వాంటమ్‌, కృత్రిమ మేథ వంటి రూపాల్లో ముందుకు వస్తున్నది. చమురుతో పని లేకుండా నడిచే విద్యుత్‌ వాహనాలు రోడ్లను ముంచెత్తటం తెలిసిందే. ఈ పూర్వరంగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 2035 నాటికి అమెరికాను అధిగమించేందుకు చైనా నడుంకట్టటం గురించి కొద్ది నెలలుగా మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి, అవేవీ కమ్యూనిస్టులు నడిపేవి కాదు, చివరికి కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదుల పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక ‘‘స్వరాజ్య ’’లో 2025 జూన్‌ 27న అమిత్‌ మిశ్రా అనే విశ్లేషకుడు కూడా రాశారు.దాన్ని నవీకరించి ఆగస్టు మూడున తిరిగి ప్రచురించారు. ‘‘ మేథోవంతుల ఆకర్షణ : వేయి ప్రతిభల చైనా వ్యూహం దాని ఔన్నత్యాన్ని ఎలా ముందుకు నెడుతున్నది ’’ అనే శీర్షిక( కోర్టింగ్‌ జీనియసెస్‌ : హౌ చైనా స్‌ థౌసెండ్‌ టాలంట్స్‌ స్ట్రాటజీ ఈస్‌ ఫ్యూయలింగ్‌ ఇట్స్‌ ఎసెంట్‌)తో ఒక విశ్లేషణ వెలుండిరది. ఇక్కడ దీన్ని ప్రస్తావించటం అంటే చైనాకు మిత,మతవాదుల సర్టిఫికెట్‌ లేదా ప్రశంసల గురించి కాదు. చైనా ఎలా దూసుకుపోతున్నదో చూడండి అనే ఉక్రోషం, అసూయ ప్రదర్శన దాని వెనుక ఉందని చెప్పేందుకే.


ఇక సందర్భానికి వస్తే ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అంటే విప్లవదినోత్సం రోజు నుంచి చైనా ప్రభుత్వం ప్రపంచంలోని యువ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కె రకం వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఎందుకు అంటే 2035నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామి దేశంగా మారేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. కొత్తగా పట్టా పుచ్చుకున్న స్వదేశీయులు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారు, ఇతర దేశాల్లో ఇప్పటికే ఆయా రంగాలలో పని చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో చైనా విధాన నిర్ణయాలలో ఇది పెద్దదని భావిస్తున్నారు. తనకు ఎదురులేనంతవరకు చైనాను ఎదగనిచ్చిన అమెరికా ఎప్పుడైతే తన ఆధిపత్యానికి అన్ని రంగాలలో ప్రతిఘటన ఎదురవుతున్నదని గ్రహించిందో అప్పటి నుంచి అడ్డుకోవటం ప్రారంభించింది. వైట్‌హౌస్‌లో ఏ పార్టీ వారున్నా అదే చేస్తున్న పూర్వరంగంలో దానికి ధీటుగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కసరత్తు నుంచి వెలువడిరదే తాజా నిర్ణయం. ప్రధాని లీ క్వియాంగ్‌ సంతకంతో అది చట్టంగా మారింది. స్టెమ్‌(సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) రంగాలలో ప్రతిభావంతులైన విదేశీ యువతను ఆకర్షించేందుకు సరికొత్త ‘‘ యువ ప్రతిభ ’’ కె వీసా ప్రత్యేకత ఏమంటే చైనాలో ఉన్న కంపెనీల యజమానులు లేదా సంస్థల నుంచి సిఫార్సులు అవసరం లేదు.నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిభావంతులైన యువశాస్త్రవేత్తల కార్యక్రమంలో వయస్సు గరిష్ట పరిమితి 45 సంవత్సరాలు, మరో పధకానికి 40 ఏండ్లు. దీనికి ఎలాంటి పరిమితి నిబంధన లేదు. ఇతర దేశాలతో పోటీ పడుతూ వేతనాలు, వసతి, బోనస్‌, పిల్లలకు విద్య వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.దేశ విధానానికి లోబడి పరిశోధనలో స్వేచ్చ ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు ప్రతిభావంతులైన వారిని ఆకర్షించేందుకు అలాంటి విధానాన్నే ముందుకు తెచ్చారని చెప్పవచ్చు. ఇలాంటి ప్రత్యేక వీసాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.

అమెరికాలో చైనా సంతతికి చెందిన వారి మీద పెరుగుతున్న జాత్యహంకార వివక్ష, ఆంక్షలు, పరిశోధనలకు కేటాయింపుల కోత, గూఢచర్య ఆరోపణలతో వేధింపులు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పూర్వరంగంలో అనేక మంది అక్కడి నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. మంచి పండ్లను ఏరి దిగుమతి చేసుకున్నట్లుగా దశాబ్దాల తరబడి, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మేథోవలసతో ఎంతగానో లబ్దిపొందాయి. ఇప్పుడు అటునుంచి వలసలకు చైనాతో నాంది పడిరదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.చైనా కమ్యూనిస్టు పార్టీ నేత లి యువాన్‌చావో 2008లో ‘‘వేయి ప్రతిభావంతుల పథకాని(టిటిపి)కి రూపకల్పన చేశారు .విదేశాల్లో ఉన్న చైనా సంతతికి చెందిన వారిలో కనీసం రెండువేల మందిని స్వదేశానికి ఆహ్వానించి ఒక నవకల్పన సమాజంగా దేశాన్ని మార్చాలని తలపెట్టారు. 2011ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినపుడు ఏటా 50 నుంచి వందమందిని పదేండ్ల పాటు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దానికి మించి ఇప్పటి వరకు ఏడువేల మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు,వాణిజ్య,పారిశ్రామికవేత్తలు వచ్చారని అంచనా, వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. మరొక సమాచారం ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలలో కనీసం 20వేల మంది చైనా జాతీయులు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు. ఇలాంటి వారు చూపుతున్న ప్రతిభను బట్టి మిలియన్ల యువాన్లను బోనస్‌, ఇతర రాయితీలను ప్రతిఫలంగా చెల్లించుతున్నారు. అమెరికా నుంచి వచ్చే వారు విద్రోహచర్యల నిమిత్తం వస్తున్నారా నిజంగానే పని చేసేందుకే అని నిర్ధారించుకొనేందుకు సునిశిత పరిశీలనలు కూడా చేశారని వార్తలు. ఈ పధకానికి చైనా పెద్ద ప్రచారం ఇవ్వలేదు గాని దాని తీరుతెన్నులు గమనించిన అమెరికా జాతీయ గూఢచార సంస్థ, ఎఫ్‌బిఐ గుండెలు బాదుకుంటూ నివేదికలు రూపొందించాయి. చైనా ఆర్థిక, మిలిటరీ రంగాలలో పురోగమించటానికి చట్టబద్దంగా, అక్రమ పద్దతుల్లో అమెరికా మేథో సంపదను చైనా కొల్లగొడుతున్నదని ఆరోపించారు. ఈ ప్రచారం పెరగటంతో చైనా కొత్త పద్దతుల్లో క్విమింగ్‌ పేరుతో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పూనుకుంది.2019 నుంచి 2023వరకు ఐదు వందలకు పైగా ప్రభుత్వ పత్రాలను పరిశీలించిన రాయిటర్స్‌ వార్తా సంస్థ చైనా ఇస్తున్న నగదు, ఇతర మొత్తాల గురించి పేర్కొన్నది.

దశాబ్దాలుగా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఎక్కువగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు వలస వెళ్లారు.వ్యక్తిగతంగా వారితో పాటు ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగటం ప్రారంభమైన తరువాత మరింత ముందుకు పోవాలంటే అలాంటి అవసరం ఎంతో ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టులు ప్రతిభావంతుల మీద కూడా తమ సిద్దాంతాలను రుద్దుతారని, వారికి స్వేచ్చ ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.చైనా కమ్యూనిస్టులు దాన్ని కూడా గమనంలో ఉంచుకున్నారు. నూటనలభై కోట్ల జనాభా జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్లో భాగంగానే తమ దగ్గరలేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. అవి తమ నుంచి లబ్దిపొందుతాయని తెలిసినప్పటికీ దాని కంటే తాము ఎక్కువ ప్రయోజనం పొందుతామనే ముందు చూపు, ధైర్యంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంస్కరణలకు తెరతీశారు, విజయం సాధించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది గనుక అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతిభావంతులను అక్కున చేర్చుకుంటున్నారు.దాని ఫలితాలు కనిపించాయి. సెమికండక్టర్లు, వైమానిక రంగం, 5జి, క్వాంటమ్‌ వంటి అనేక రంగాల్లో మరొకదాని వెనుక వెళ్లే పరిస్థితి నుంచి పోటీదారుగా మారింది. జీవశాస్త్రంలో అమెరికాను అధిగమించి 2017లోనే ఎక్కువగా పరిశోధక పత్రాలను చైనీయులు ప్రచురించారు.

గత నాలుగున్నర దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, విధానాల గురించి కొంత మంది విమర్శలు చేయవచ్చు.ఇప్పుడు చైనా మరొకదశలో ప్రవేశించింది. అధికారాన్ని కార్మికవర్గం చేతిలో పెట్టటం ద్వారా విప్లవం చేయాల్సినపని చేసింది. సాధించిన అధికారం ఒక్కటే జన జీవితాలను మెరుగుపరచదని గుర్తించిన తరువాత తీసుకున్న చర్యలకు తగిన ఫలితాలు వచ్చాయి. వాటికి ఉన్న పరిమితులను గమనించి మరొక అడుగు ముందుకు వేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు కొంత ప్రతిఫలాన్ని చెల్లించినట్లుగా, స్వదేశంలోనే సంస్థల పెరుగుదలకు వ్యక్తులను ప్రోత్షహించిన తీరు చూశాము. అలాగే ప్రతిభావంతులకు మిగతావారితో పోలిస్తే అధికమొత్తాలను ఇవ్వాల్సి ఉంటుందని గ్రహించింది. మరిన్ని పరిశోధనల ద్వారా జనకల్యాణానికి వినియోగించేందుకు పూనుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను చైనా ఆకర్షించటం అమెరికా మాదిరి కార్పొరేట్ల లాభాలకు కాదు, జనాల కోసం.ఈ ప్రయత్నం వెనుక వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిజానికి ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి కత్తిమీద సామువంటిదే.వచ్చేవారు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, శాస్త్ర రంగ నాయకత్వంతో పాటు రాజకీయ నాయకత్వంలో ఇమిడి పోయే విధంగా ఉండాలి. కమ్యూనిస్టుల గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరిగిన నేపధ్యం,అన్యవర్గ ప్రభావంతో అలాంటి వారు ప్రతి చర్యనూ అనుమానంతో చూసే అవకాశం ఉంటుంది, సహజం. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే చైనా కమ్యూనిస్టులు ఒక ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది చేసిన వన్నీ మొత్తం మీద ఫలించాయి.

చైనాలో ప్రస్తుతం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల పర్యావరణం నానాటికీ పెరుగుతున్నది.ప్రపంచ స్థాయి సంస్థలలో చైనా వాటికి చోటుదక్కుతున్నది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోమెడిసిన్‌, కృత్రిమ మేథ, ప్రత్యామ్నాయ ఇంథన రంగాలలో సాధించే పురోగతితో అగ్రగామిగా ఉన్న అమెరికాను అధిగమించాలన్నది కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన లక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ క్రమంలో తలెత్తే మిత్రవైరుధ్యాలు ఎలా ఉంటాయి, వాటిని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.మరోవైపున చూస్తే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు పరిశోధకులను, వారితో కలిగే లాభాలను కోల్పోతే చూస్తూ ఊరుకోవు. ప్రమాణాలకు గీటురాళ్లుగా ఇప్పటి వరకు కొనసాగిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాయా ? ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీ పడటంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి కూడా ఉన్నాయన్నది మరచిపోరాదు. గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా రానున్న రోజుల్లో పోటీ మరింత పెరగటం మంచిదే. వ్యక్తుల ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అయితే అది పూర్తిగా వారి స్వంతం కాదు, సమాజం నేర్పినదానికి తమ సృజనాత్మకతను జోడిరపు మాత్రమే. ఉదాహరణకు విద్యుత్‌ బల్బ్‌ను చూస్తే, 1,799 సంవత్సరం నుంచి బల్బులు, బ్యాటరీల తయారీకి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది చేసిన కృషి 1870, 80 దశకాల్లో పోటీ మరింత పెరిగింది.బ్రిటన్‌లో జోసెఫ్‌ స్వాన్‌, అమెరికాలో థామస్‌ ఎడిసన్‌ ఒకేసారి బల్బులను కనుగొన్నారు.స్వాన్‌ బల్బులు విలియమ్‌ స్టెయిట్‌ రూపొందించన నమూనాల ప్రకారం ఉన్నాయి. వాటి ఫిలమెంటు చాలా మందంగా ఉంది. ఎడిసన్‌ బల్బులో పలుచగా ఉండటంతో వాణిజ్య పరంగా అది విజయవంతమైంది. స్వాన్‌, ఎడిసన్‌ మధ్య పోటీ చివరకు వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చి ఎడిసన్‌ మరియు స్వాన్‌ ఎలక్ట్రిక్‌ లైట్‌ కంపెనీగా ఏర్పడి స్వాన్‌ రూపొందించిన ఫిలమెంట్‌తో మార్కెట్‌ చేశారు. కానీ పేరు ఎడిసన్‌కు వచ్చింది, దాని వెనుక ఎందరో ఉన్నారు. ఆ తరువాత బల్బుల్లో ఎన్ని మార్పులు, చేర్పులు జరిగాయో మనకు తెలిసిందే. అందువలన ప్రతి నవకల్పన సమాజానికి ఉపయోగపడుతుందా, కార్పొరేట్ల లాభాలకా అన్నదాన్ని బట్టి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వర్గదృకృధం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చైనా కార్మికవర్గ వైఖరితో ప్రతిభకు పట్టం కడుతున్నదని చెప్పవచ్చు.

ఉక్రెయిన్‌ సంక్షోభం : అలాస్కా సమావేశ ఆంతర్యం ఏమిటి ? జెలెనెస్కీతో చర్చలకు తొందరేం లేదన్న రష్యా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ గద్దె నెక్కి రెండు వందల రోజులు దాటింది. అడుగు ముందుకు పడకున్నా తాజాగా ఇదిగో పరిష్కారం అంటూ యావత్‌ ప్రపంచ దృష్టిని అటువైపు తిప్పాడు. తాజాగా అమెరికాలోని అలాస్కాలో గత శుక్రవారం నాడు జరిగిన ట్రంప్‌ మరియు పుతిన్‌ భేటీ వార్త సేకరణకు భారీ సంఖ్యలో వచ్చిన మీడియా సిబ్బందే దానికి నిదర్శనం. అంతకు ముందు వరకు కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం ముందు జరగాలంటూ చెప్పిన పెద్దమనిషి అలస్కా సమావేశం తరువాత అలాంటివేమీ లేవు. ఏకంగా పరిష్కారానికి మరోసారి మాస్కోలో సమావేశమని ప్రకటించాడు. చిత్రం ఏమిటంటే సోమవారం నాడు ట్రంప్‌తో భేటీ అయిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మర్యాదల ప్రకారం గతానికి భిన్నంగా కోటు ధరించి వచ్చాడు. గతంలో ట్రంప్‌తో సమావేశానికి ఒక సాధారణ పౌరుడి మాదిరి దుస్తులు రావటంతో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జెలెనెస్కీని ట్రంప్‌ ఎక్కడ బుట్టలో వేస్తాడో తమతో నిమిత్తం లేకుండా ఒప్పందం కుదుర్చుకుంటారేమో అన్న భయం లేదా ముందు చూపుతో అనేక మంది ఐరోపా నేతలు కూడా కట్టగట్టుకు వచ్చి ట్రంప్‌తో చర్చలు జరిపారు.వారితో మాట్లాడుతూనే కాసేపు ఉండండి అన్నట్లు అంతరాయమిచ్చి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి తన ప్రాధాన్యత ఏమిటో వారికి అవగతమయ్యేట్లు చేశాడు.దానికి అనుగుణంగానే ఐరోపా నేతలు కూడా తమ మర్యాదను కాపాడుకుంటూ ట్రంప్‌ యత్నాలను హర్షిస్తూనే నర్మగర్భంగా తమ భిన్నాభిప్రాయాలను వెల్లడిరచారు. భద్రత అన్న తరువాత మేం లేకుండా పుతిన్‌, జెలెనెస్కీ, ట్రంప్‌ ముగ్గురూ మాట్లాడుకుంటే సరిపోతుందా, నాలుగు పక్షాల సమావేశం జరగాలనే సందేశాన్ని వారు కూడా ఇచ్చారు.ఈ నెలాఖరులో సమావేశం ఎక్కడ జరగాలనే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. అది కూడా గత సమావేశాల మాదిరే విఫలయత్నం అవుతుందా నిజంగానే రాజీ కుదిరేందుకు వేదిక అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. సోమవారం నాటి ట్రంప్‌ ఫోన్లో మాట్లాడినపుడు నేరుగా ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు పుతిన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లోవరోవ్‌ మాట్లాడిన తీరు చూస్తే చర్చలు వెంటనే జరిగే అవకాశం లేదని తేలిపోయింది. క్రమంగా నిపుణుల స్థాయిలో మొదలై తరువాత దశలవారిగా చర్చలు జరగాలని లోవరోవ్‌ చెప్పాడు.ఐరాసలో రష్యా ప్రతినిధి దిమిత్రి పోలియానిస్కీ మాట్లాడుతూ చర్చల కోసం చర్చలు జరగకూడదని వ్యాఖ్యానించాడు.


అలాస్కా సమావేశం తరువాత కొన్ని సరికొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.చైనా మరియు రష్యాల మధ్య ఉన్న బంధాన్ని తెంచేందుకు అమెరికా పూనుకుందన్నది వాటిలో ఒకటి.ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుందన్నట్లుగా దీనికి ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం నాంది పలుకుతుందా ! దీనర్ధం వెంటనే ఏదో జరుగుతుందని కాదు గానీ మాజీ కమ్యూనిస్టు మహాప్రమాదకారి అన్నట్లుగా పుతిన్‌ తీరుతెన్నులను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వర్తమాన అంశానికి వస్తే మీడియాలో వస్తున్న లీకు వార్తలు, విశ్లేషణలను చూస్తుంటే మొదటి నుంచి రష్యా చెబుతున్నట్లుగానే దాని షరతులు, వైఖరికి అనుగుణంగానే ఒక పరిష్కారం కుదరవచ్చు అనే భావం కొందరిలో కలుగుతోంది. నిజంగా అలా జరిగితే ఐరోపాలో, ప్రపంచంలోనే సరికొత్త సమీకరణలు, పరిణామాలకు, మరింత పెద్ద సంక్షోభాలకు అది నాంది అవుతుంది. తాజా పరిణామాలు, విశ్లేషణలను చూసినపుడు మొత్తం మీద వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా ఆశాభావంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకుల వ్యాఖ్య. ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పుతిన్‌కు యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రాజకీయ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.అందువల్లనే అతనికీ పరిష్కారం అవసరం.


ట్రంప్‌ యంత్రాంగం రూపొందించినట్లు చెబుతున్న పరిష్కార పద్దతి ప్రకారం ప్రస్తుతం రష్యా స్వాధీనంలో లేని కొన్ని ప్రాంతాలతో సహా డాన్‌బాస్‌ ప్రాంతంలో 6,600 చదరపు కిలోమీటర్లు లేదా 12శాతం భూభాగాన్ని ఉక్రెయిన్‌ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా సుమీ, ఖార్కివ్‌ ప్రాంతాలలో 440 చదరపు కిలోమీటర్లను రష్యా ఖాళీ చేసి ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఇదే జరిగితే రష్యాదే పైచేయి అవుతుంది, దాని షరతుల ప్రాతిపదికగానే ఒప్పందం ఉంటుంది. ఇంతవరకు ఏ ఒక్క అంశం మీద కూడా పుతిన్‌ దిగిరాలేదు.ఈ పూర్వరంగంలో అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్‌ అంగీకరిస్తుందా, ఒకవేళ అమెరికా జెలెనెస్కీ మెడలు వంచి ఒప్పించినా ఐరోపా అగ్రదేశాలు తలూపుతాయా, చెప్పలేము. తెల్లవారే సరికి వైఖరులు, పరిణామాలు మారిపోతున్న ఈ రోజుల్లో రష్యా గడ్డమీద తలపెట్టిన తదుపరి భేటీలోపల ఏమైనా జరగవచ్చు.మిలిటరీ దళాల రంగ ప్రవేశంతో సహా ఉక్రెయిన్‌కు ఐరోపా భద్రత కల్పించేందుకు పుతిన్‌ అంగీకరించవచ్చని ట్రంప్‌ యంత్రాంగం చెబుతోంది. దీని మీద పుతిన్‌ వైపు నుంచి ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి ప్రతికూల లేదా అనుకూల స్పందనలు లేవు. ఒక వారంలోపే ఒప్పందం జరగాలని ట్రంప్‌ పట్టుబడుతుండగా అదెలా కుదురుతుంది, మంచి చెడ్డలు ఆలోచించటానికి కొన్ని వారాల వ్యవధి కావాలని ఐరోపా నేతలు చెబుతున్నారు.


పరిష్కారం కుదరాలంటే ముందుగా డాంటెస్క్‌, లుహానస్క్‌ ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ వెనక్కు పోవటం తనకు ముఖ్యమని, అది చేస్తే మిలిటరీ చర్య నిలిపివేస్తానని శుక్రవారం నాటి చర్చలలో పుతిన్‌ స్పష్టం చేశాడట.జూన్‌ రెండవ తేదీన ఇస్తాంబుల్‌ సమావేశంలోనే దీన్ని రష్యా ప్రతినిధులు చెప్పారు.దీనితో పాటు క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా అంతర్భాంగా గుర్తించటం, ఉక్రెయిన్‌ మిలిటరీ సంఖ్య తగ్గింపు, ఇతర ప్రాంతాల గురించి కూడా దానిలో పేర్కొన్నారు. రష్యన్లు మరీ ఎక్కువగా అడుగుతున్నారని, దాన్లో వారి స్వాధీనంలో లేని ప్రాంతాలు కూడా ఉన్నాయిని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వ్యాఖ్యానించటమే కాదు, ఉక్రెయిన్‌ కూడా అంగీకరించలేదు. గతంలో పేర్కొన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ ఉపసంహరణ బదులు రెండు ప్రాంతాల గురించి పుతిన్‌ పట్టుబట్టినట్లు వార్తలు. ఉక్రెయిన్‌ భద్రతకు హామీకి తాను అంగీకరిస్తానని అయితే వివిధ దేశాలతో కూడిన అలాంటి వ్యవస్థలో తనకు వీటో అధికారం ఉండాలని రష్యా కోరింది.


శుక్రవారం నాటి చర్చలలో భద్రత గురించి చర్చ వచ్చింది తప్ప అది ఎలా అన్నది తేలలేదు. దీని అర్ధం ఏమిటి ? ఒక ఆలోచన ప్రకారం ఒక వేళ ఉక్రెయిన్‌ మీద తిరిగి రష్యా దాడి చేస్తే భద్రతకు హామీ ఇచ్చిన వారు ఐరోపా వారైతే అమెరికా మద్దతు లేకుండా రష్యా మీద ప్రతిదాడులు జరపవచ్చు. అలాంటి ఒప్పందం కుదిరితే అది అమెరికా మరియు ఐరోపా మధ్య అంతరాన్ని పెంచేందుకు, నాటో కూటమిని పూర్తిగా దెబ్బతీసేందుకు రష్యా వినియోగించుకోవచ్చని యూరోపియన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరొక దృశ్యం ప్రకారం ఉక్రెయిన్‌ భద్రతకు హామీదారుగా ఉన్న ఐరోపా దేశాలపై రష్యా దాడికి పూనుకుంటే ఐరోపాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుంది. మూడవ దృశ్యం ప్రకారం భద్రతగా ఉండే ఐరోపా దేశాల మిలిటరీ ఉక్రెయిన్‌లో ఉన్నప్పటికీ రష్యా మీద దాడికి దిగదు, ఉక్రెయిన్‌ మిలిటరీకి అవసరమైన శిక్షణ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు పరిమితంగా అదే చేస్తున్నారు. ఒకవేళ మరోసారి రష్యా దాడికి దిగితే ఇతర దేశాల మిలిటరీ సురక్షితంగా వెనక్కు పోయేందుకు అమెరికా రంగంలోకి దిగుతుంది. ఇవన్నీ పరిపరి విధాల ఊహాగానాలు మాత్రమే.


తమతో భాగస్వామిగా చేసుకొని ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేయాలని జి7 కూటమి ఎనిమిదవ దేశంగా రష్యాను చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే విబేధాలు తలెత్తి రష్యాను పక్కన పెట్టటం, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిట ఆయుధ మోహరింపుకు పశ్చిమదేశాలు కుట్రపన్నిన తరువాతే గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా 2014లో విలీనం చేసుకుంది. సోవియట్‌ ఉనికిలో ఉన్న సమయంలో పాలనా సౌలభ్యం కోసం రష్యన్‌ రిపబ్లిక్‌ ప్రాంతమైన క్రిమియాను ఉక్రెయిన్‌లో కలిపారు. సోవియట్‌ పతనమైన తరువాత రెండూ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ 24 సంవత్సరాలు రష్యా వైపు నుంచి విలీనానికి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నది గమనించాల్సిన అంశం. తమకు విశ్వసనీయమైన భద్రతా హామీ ఇవ్వాలని జెలెనెస్కీ పట్టుబడుతున్నాడు. ఇటీవలి కాలంలో అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ప్రకారం ఆయుధాలు ఎన్నికావాలంటే అన్ని ఇస్తుంది, అవసరమైతే వైమానిక దాడులు జరుపుతుంది తప్ప తన మిలిటరీని కొత్తగా మరేదేశంలోనూ దించేందుకు సిద్దం కావటం లేదు. అందువలన ఐరోపా దేశాలతో కలసి రక్షణ కల్పించేందుకు ట్రంప్‌ అంగీకరించే అంశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.తనకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల కుట్రకు ఉక్రెయిన్‌ దూరంగా ఉంటే అన్ని రకాల భద్రత కల్పించేందుకు అసలు రష్యానే సిద్ధంగా ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. రష్యాకు కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే యుద్ధం ఆగిపోవచ్చుగానీ జెలెనెస్కీ పదవీ గండం పొంచి ఉంటుంది. జరిగే ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు చెప్పలేము గానీ అతగాడు గెలిచే సమస్యే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. భవిష్యత్‌లో రష్యాకు ముప్పు తలెత్తకుండా చూసేందుకు ఇప్పటి వరకు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను సాధించకుండా ఒప్పందం చేసుకుంటే పుతిన్‌కూ అదే పునరావృతం అవుతుంది. ఇన్ని ప్రాణాలను బలి ఇచ్చి ఆర్థికంగా నష్టం కలిగించటం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. రష్యాది పైచేయిగా మారితే ట్రంప్‌ కూడా ఇబ్బందుల్లో పడతాడు, వెంటనే ఎన్నికలు లేవు, వచ్చేసారి పోటీ చేస్తాడో లేదో తెలియదు గనుక వ్యక్తిగతంగా కలిగే నష్టం ఉండదు గానీ, ఐరోపాలో ఉన్న పలుకుబడిని అమెరికా కోల్పోవటం ఖాయం, దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీదనే పడుతుంది.


విడివిడిగా అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోలేమన్న వాస్తవాన్ని గ్రహించిన ఐరోపా దేశాలు సమాఖ్య (ఇయు)గా ఏర్పడి, ఐక్యత మరియు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఇతర దేశాల మీద పన్నుల దాడిని ప్రకటించినట్లే ట్రంప్‌ ఈ కూటమితో కూడా వ్యవహరించి వత్తిడి చేసి ఒక ఒప్పందానికి వచ్చాడు.మరోవైపున జర్మనీ వంటి దేశాలు భారీ ఎత్తున సైనికీకరణకు పూనుకున్నాయి. గతంలో సోవియట్‌ను, గతమూడున్నరదశాబ్దాలుగా రష్యాను చూపి బెదిరించిన అమెరికా ఇప్పుడు ఆ రష్యాతోనే చేతులు కలిపి మరో రూపంలో ఐరోపాను అదుపులో ఉంచుకోవాలని చూస్తోందా అనే కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.గతంలో సోవియట్‌ మరియు చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక విబేధాలను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు చూసింది. ఒకటి రాజకీయ, రెండవది చైనా మార్కెట్లో ప్రవేశించి ఆర్థిక లబ్ది.తైవాన్‌ బదులు కమ్యూనిస్టు చైనాకు భద్రతామండలిలో శాశ్వత సభ్వత్యం కల్పించటాన్ని సైద్దాంతిక విబేధాలున్నా నాటి సోవియట్‌ వ్యతిరేకించలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే రష్యా మరియు చైనా నేడు మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పుతిన్‌ కమ్యూనిస్టు కాదు, రష్యా సోషలిస్టు దేశం కాదు.ఈ రెండో అంశాన్ని ఉపయోగించుకొని మిత్రబేధంతో రష్యాను దగ్గరకు తీసుకోవాలని, దాని వనరులు, మార్కెట్‌లో లబ్ది పొందాలని కొందరు అమెరికన్లు కోరుతున్నారు. ఇందుకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఆటంకంగా ఉంది గనుక దాన్ని పరిష్కరించాలని వారు చెబుతున్నారు. ఈ పూర్వరంగంలోనే ఎరగా ఉక్రెయిన్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ అంటున్నారు. అయితే అదే జరిగితే ఐరోపాలోని ధనికదేశాలు చైనాతో జట్టుకట్టే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. పెట్టుబడిదారులకు లాభాలు తప్ప శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పుతిన్‌ తక్షణ ఆలోచన యుద్ధం నుంచి బయటపడి తద్వారా ఆర్థిక ఆంక్షల బంధాలను బద్దలు కొట్టటం గనుక ఆ కోణంలో దాని మీద కేంద్రీకరించవచ్చు.అమెరికా మద్దతు లేకపోయినా ఐరోపా దేశాలు ఇచ్చే ధైర్యం, ఆయుధ సాయంతో నిలవగలమని ఉక్రెయిన్‌ భావిస్తే వెంటనే ఒప్పందానికి అంగీకరించకపోవచ్చు. లేకపోతే ముందే చెప్పుకున్నట్లు రష్యా షరతుల మీద రాజీకి రావచ్చు కూడా !