ఉక్రెయిన్‌ సంక్షోభం: రష్యా మూడు రోజుల కాల్పుల విరమణ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు.వందరోజులైంది, ఏం జరుగుతోందో తెలియదు. రెండు వారాలు, అంతకు లోపే ఒప్పందం కుదరవచ్చని, ఇంకా ఎక్కువ కాలమే పట్టవచ్చని తాజాగా చెప్పాడు. దానికి అనుగుణంగా కావచ్చు లేదా ఎత్తుగడగా గానీ మే నెల 8 నుంచి 10వ తేదీ వరకు కాల్పుల విరమణ పాటిస్తామని, ఉక్రెయిన్‌ కూడా అదే విధంగా వ్యవహరించాలని రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ ప్రకటించాడు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ విజయానికి 80ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మాస్కో పేర్కొన్నది. కాదు తక్షణమే నెల రోజుల పాటు పోరును ఆపాలని ఉక్రెయిన్‌ స్పందించింది. సంక్షోభం ప్రారంభమై 1,160 రోజులైంది. ఆ మూడు రోజుల్లో జెలెనెస్కీ సేనలు ఉల్లంఘనకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా పుతిన్‌ హెచ్చరించాడు.‘‘ కొన్ని కారణాలతో ప్రతిఒక్కరూ మే 8వ తేదీ వరకు వేచి ఉండాలని, మాస్కోలో జరిగే కవాతు సందర్భంగా పుతిన్‌ ప్రశాంతతను కోరుకుంటున్నాడని, ఎలాంటి షరతులు లేకుండా కనీసం నెల రోజులు కాల్పుల విరమణ ఉండాలని, మేం పౌరుల ప్రాణాలకు విలువ ఇస్తాం తప్ప కవాతులకు కాదని, నిజంగా శాంతి కావాలని రష్యా కోరుకుంటే వెంటనే కాల్పుల విరమణకు పూనుకోవాలని ’’ జెలెనెస్కీ అన్నాడు. ప్రపంచ నేతల సమక్షంలో మే 9న జరిగే కవాతులో విభ్రాంతకర పరిస్థితి ఎదురుకాకుండా చూడాలన్నది పుతిన్‌ ప్రతిపాదన అర్ధం అని పరిశీలకులు కూడా వ్యాఖ్యానించారు.మన దేశంలో రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగే కవాతులో ఆయుధ ప్రదర్శన చేసినట్లే, గొప్ప దేశభక్త యుద్ధంగా వర్ణించిన రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ విజయం సాధించిన మే9వ తేదీన ప్రతి ఏటా కవాతులో తన ఆయుధపాటవాన్ని ప్రదర్శిస్తున్నది. ఏం జరగనుందో చూద్దాం !


అమెరికా ఆర్భాటంగా ప్రకటించిన 30రోజుల నల్ల సముద్ర శాంతి ఒప్పందం ఏమైందో తెలియదు. మా నేత శాశ్వత ఒప్పందం కుదరాలని కోరుతున్నాడు, రెండు దేశాల నేతల మీద అసహనం పెరుగుతున్నదని వైట్‌హౌస్‌ ప్రతినిధి వ్యాఖ్య. దాడులను గనుక రష్యా ఆపకపోతే తాము శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించాడు. క్రిమియా తమదే అని, అదే విధంగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలన్నది తమ షరతులలో ఒకటని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ బ్రెజిలియన్‌ పత్రిక గ్లోబోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.శాంతి ఒప్పందం రెండు వారాలు, అంతకు లోపే కుదరవచ్చన్న ట్రంప్‌ ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని ఆదివారం నాడు చెప్పాడు.తాను పుతిన్‌తో మాట్లాడిన తరువాత కూడా దాడులు జరగటంతో ఆశాభంగం చెందానన్నాడు. మరిన్ని ఆయుధాలు కావాలని రోమ్‌లో జెలెనెస్కీ తనను కోరినట్లు వెల్లడిరచాడు.పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలకు వెళ్లిన సందర్భంగా వారిద్దరూ అక్కడ మాట్లాడుకున్నారు. క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను అనుమతించటం ద్వారా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ సమస్యను మరింత సంక్లిష్టం గావించినట్లు ఆరోపించాడు. జెలెనెస్కీతో ట్రంప్‌ మాట్లాడిన తరువాత రష్యా దాడులను మరింతగా పెంచింది.


రష్యా ఉపయోగిస్తున్న పదజాలాన్ని చూస్తే ఒప్పందం గురించి కఠిన వైఖరి తీసుకొనేట్లు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నాటోలో ఉక్రెయిన్‌ చేరకుండా చూడటం, దాని మిలిటరీ శక్తిని పరిమితంగావించటం,అంతర్గత రాజకీయాల్లో తన పలుకుబడి ఉండేట్లు చూసుకొనేందుకు పుతిన్‌ చూస్తున్నాడన్నది వారి భాష్యం. అమెరికా ముందుకు తెచ్చిన 30రోజుల శాంతి ఒప్పందానికి రష్యా విధించిన షరతులను చూస్తే అది సుముఖంగా లేదన్నది స్పష్టం. తన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద, వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద ఆంక్షలు విధిస్తే ఇంక ఒప్పందం ఏమిటని అది ప్రశ్నించింది. ఈస్టర్‌ సందర్భంగా ప్రకటించిన పరిమిత వ్యవధి కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. రష్యా మూడువేల సార్లు ఉల్లంఘించిందని, దీర్ఘశ్రేణి క్షిపణులను తప్ప డ్రోన్లు, ఇతర దాడులు చేసిందని ఉక్రెయిన్‌ విశ్లేషకులు ఆరోపించారు. ఆ సమయంలో మిలిటరీ వాహనాలు, ఆయుధాల మరమ్మతులు చేసుకోవటం, మందుపాతరలను వెలికి తీసేందుకు ఉపయోగించుకుందన్నారు. మే తొమ్మిది విజయోత్సవ కవాతు తరువాత రష్యా పెద్ద ఎత్తున దాడులకు దిగనుందని ఆరోపించారు. శుక్రవారం నాడు రోమ్‌లో ట్రంప్‌, జెలెనెస్కీ భేఠీ తరువాత పుతిన్‌ ప్రకటన వెలువడిరదంటే బంతిని అమెరికా కోర్టులో నెట్టినట్లుగా భావిస్తున్నారు.


శాంతి ఒప్పందం కుదరాలంటే రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను ఉక్రెయిన్‌ వదులుకోవాల్సిందే అని మాట్లాడుతున్న ట్రంప్‌ వైఖరితో ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ప్రతిపాదనలు చైనా నేత షీ జింపింగ్‌తో సహా పుతిన్‌, ఇతర ప్రపంచ నేతలకు ప్రమాదకర సంకేతాలను పంపుతున్నట్లే అని భావిస్తున్నాయి. అక్రమ ఆక్రమణలను బహుమతిగా ఇచ్చినట్లే అంటున్నారు. ఐరోపాలోని ఒక దేశాన్ని స్వంత భూభాగాన్ని వదులుకోవాలని చెబితే, దాన్ని బలవంతం చేస్తే ఐరోపాలో లేదా ఎక్కడా ఏ దేశమూ భద్రంగా ఉన్నట్లు భావించలేవని, అది నాటో లేదా ఇతర దేశం ఏదైనా కావచ్చని ఒక దౌత్యవేత్త చెప్పినట్లు సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. అమెరికా అంగీకరించిన ప్రతిదానికీ తాము తలూపలేమన్నాడు. ఆసియాలోని అమెరికా మిత్రదేశాల్లో కూడా ఇదే ఆందోళన తలెత్తింది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి తాము ఒక ఉమ్మడి వైఖరికి వచ్చేందుకు గణనీయంగా ముందుకు పోయినట్లు జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.అమెరికా ప్రతిపాదన ప్రకారం గణనీయమైన ప్రాంతాన్ని తాము వదులుకోవాల్సి వస్తే అది ఆత్మహత్య అవుతుందని, జెలెనెస్కీ ఒప్పుకున్నా తమ పార్లమెంటు అంగీకరించదని ఒక ఎంపీ చెప్పాడు.


యుద్ధ రంగంలో రోజు రోజుకూ ఎదురుదెబ్బలు తింటున్న ఉక్రెయిన్‌ ఆర్థికంగా దివాలా తీసింది. జిడిపితో లంకె ఉన్న రుణాల రీషెడ్యూలు గురించి ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైంది.అప్పులిచ్చిన వారి షరతులకు అంగీకరించటం లేదని పేర్కొన్నది.తదుపరి కిస్తీ మే నెలాఖరులో చెల్లించాల్సి ఉంది. ఒక వైపు అప్పుల వాళ్ల సతాయింపు మరోవైపు రష్యాతో ఒప్పందాన్ని అంగీకరించాలని, తమకు చెల్లించాల్సినదానికి ప్రతిగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని ట్రంప్‌ చేస్తున్న వత్తిడితో జెలెనెస్కీ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. రష్యా దాడి కారణంగా తాము ఆర్థికంగా తాము 30శాతం దెబ్బతిన్నామని, తిరిగి కోలుకుంటే తప్ప షరతులను నెరవేర్చలేమని చెబుతున్నది.260 కోట్ల డాలర్ల రుణ రీషెడ్యూలుపై ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైనట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది, మేనెలాఖరులోగా 60 కోట్ల డాలర్ల కిస్తీపై ఏదో ఒకటి జరగకపోతే దివాలా తీసినట్లు పరిగణించాల్సి ఉంటుంది.2022కు ముందు విదేశీ, స్వదేశీ అప్పు వందబిలియన్‌ డాలర్లు ఉండగా 2024నవంబరు నాటికి అది 160బిలియన్లకు పెరిగింది. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాల వల్లనే ఇలా పెరిగింది. దీన్లో ఐరోపా సమాఖ్య రుణం ఐదు నుంచి ఏకంగా 43బి.డాలర్లకు, ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ రుణం 47బిలియన్‌ డాలర్లకు పెరిగింది. తమ అప్పు తీర్చకపోయినా ఫరవాలేదు గానీ ప్రైవేటు రంగానికి అనుకూలంగా ఉన్న సమాఖ్య ఒప్పందాలను అంగీకరించాలని పట్టుబడుతున్నది. అదే జరిగితే పునర్‌నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఆ సంస్థలకు దక్కుతాయి, వాటితో అంతకంటే ఎక్కువ మొత్తాలను ఆర్జించవచ్చన్నది వాటి ఎత్తుగడ. యుద్దంతో తమకు సంబంధం లేదని గడువు, ఒప్పందం మేరకు అప్పు తీర్చాల్సిందేనని బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు డిమాండ్‌ చేస్తున్నాయి. రష్యాకు చెల్లించాల్సిన 60 కోట్ల డాలర్లను 2015 నుంచి చెల్లించటం నిలిపివేసింది. ఉక్రెయిన్‌ బాండ్లు 70శాతం విలువను కోల్పోయాయి, సెకండరీ మార్కెట్లో 30శాతం మొత్తాలకు విక్రయిస్తున్నారు. పాత బాండ్లు ఉన్నవారు వాటి బదులు వడ్డీ ఎక్కువగా ఉన్న కొత్త బాండ్లు తీసుకొనేందుకు అంగీకరిస్తున్నారు. విదేశీ రుణ భారం మూడు సంవత్సరాల్లో 56 నుంచి 115 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వీటి కోసం ఉక్రెయిన్‌ నయా ఉదారవాద విధానాలతో కూడిన 325 షరతులను అంగీకరించింది.దానిలో భాగంగా 531 చర్యలను అమలు చేపడతామని పేర్కొన్నది.

దాడి ప్రారంభమైన తరువాత ఐరోపాలో ఉన్న 300 బిలియన్‌ డాలర్ల రష్యా ఆస్తులను స్థంభింప చేశారు. వాటిని విక్రయిచేందుకు ధైర్యం చేయలేదు.ఐరోపా యూనియన్‌ వీటి మీద రుణాలు తీసుకొని ఉక్రెయిన్‌కు అప్పుగా ఇస్తున్నది. స్థంభింపచేసిన రష్యా అస్తులను పెట్టుబడులుగా పెట్టి ప్రతి ఏటా ఐదు బిలియన్‌ యూరోల మేరకు ఐరోపా సమాఖ్య లబ్ది పొందుతున్నది. రష్యా మీద ఆంక్షలు విధించినప్పటికీ సమాఖ్యలోని ప్రైవేటు బాంకులు రష్యాలో మామూలుగానే పని చేస్తున్నాయి, అవి రష్యాకు భారీ మొత్తాలలో పన్నులు కడుతూ లావాదేవీలలో పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నాయి, వాటి మీద ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. తమ ఆంక్షలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించిన అమెరికా, ఐరోపా దేశాలు ఈ బాంకులను చూసీ చూడనట్లు వదలివేశాయి. పశ్చిమ దేశాల పావుగా మారిన జెలెనెస్కీ ఎడాపెడా అప్పులు చేస్తూ వాటిని యుద్ద అవసరాలకు వినియోగిస్తున్నాడు.దేశంలో అధిక ఆదాయం గలవారిని వదలివేసి అంతర్గతంగా 16.5శాతం వడ్డీ రేటుతో వారి నుంచే రుణాలు తీసుకుంటున్నాడు. లక్షలాది మంది జనం శరణార్దులుగా ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లినా జెలెనెస్కీకి పట్టలేదు.మిలిటరీలో విధిగా చేరాలన్న నిబంధనల నుంచి సమాజంలో కులీనులకు ఏదో ఒకసాకుతో మినహాయింపు ఇచ్చాడు, కష్టజీవులను బలిపశువులుగా చేస్తున్నాడు. తీసుకున్న రుణాలను విదేశాలు, స్వదేశంలోని ధనికుల జేబుల్లోకి చేరే విధంగా చూస్తున్నాడు. అమెరికా అందించిన మిలిటరీ సాయాన్ని నగదు రూపంలో తీర్చలేక బదులుగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని అప్పగించేందుకు సిద్దపడ్డాడు. ఇలాంటి వారు దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టటానికి కూడా సిద్దపడతారు !

సరిహద్దుల్లో ఉద్రిక్తత : పాకిస్తాన్‌ వైపు చైనా మొగ్గిందా, భారత జలదాడి ఎవరి మీద !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పహల్గామ్‌ ఉగ్రదాడి ఉదంతంలో పాకిస్తాన్‌ వైపు చైనా మొగ్గిందనే అర్ధం వచ్చే రీతిలో మీడియాలో వార్తలు వచ్చాయి.ఉగ్రవాదులకు చైనా తయారీ సమాచార పరికరాలు అందినట్లు చిత్రించారు. కమ్యూనిజం, చైనాపై వ్యతిరేకతను రెచ్చగొడుతున్నవారు ఇలాంటి అభిప్రాయం కలిగించటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అసలు ఎవరేమి చెప్పారో ముందు చూడాలి. మన భాగస్వామ్య దేశం, నరేంద్రమోడీ జిగినీ దోస్తుగా వర్ణించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏం మాట్లాడాడు.రోమ్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు విమానంలో వెళుతూ విలేకర్ల ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఎఎన్‌ఐ ఇచ్చిన వార్తలో ఇలా ఉంది. .‘‘ నేను భారత్‌కు ఎంతో సన్నిహితుడిని, అలాగే పాకిస్తాన్‌కూ ఎంతో దగ్గర.వారు కాశ్మీరు సమస్య మీద వెయ్యి సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటున్నారు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాల నుంచే ఉండవచ్చు, సరిహద్దుల గురించి 1,500 సంవత్సరాలుగాగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉగ్రవాదదాడి చెడ్డది, భారత్‌ మరియు పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నవే. ఏదో విధంగా వారే పరిష్కరించుకుంటారు.ఇద్దరు నేతలూ నాకు తెలుసు’’ అన్నాడు.


చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వార్తలో ఇలా ఉంది.‘‘ పాకిస్తాన్‌ మరియు భారత్‌ మధ్య తలెత్తుతున్న పరిస్థితిని సన్నిహితంగా చైనా పరిశీలిస్తున్నది. నిష్పాక్షిక దర్యాప్తు జరపాలన్న చొరవకు మద్దతు ఇస్తున్నది. ఉభయపక్షాలూ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పూనుకోవాలని, సంయమనం పాటిస్తాయని ఆశాభావం వెలిబుచ్చుతున్నాం.’’ పాకిస్తాన్‌ ఉప ప్రధాని మరియు విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఇషాక్‌ దార్‌ ఆదివారం నాడు ఫోన్‌ చేసిన సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ చెప్పిన మాటలివి. తాము చైనాతో సహా అంతర్జాతీయ సమాజంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తున్నామని దార్‌ చెప్పాడు. అన్ని దేశాలూ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తీసుకుంటున్న చర్యలను నిరంతంర చైనా సమర్ధిస్తూనే ఉందని వాంగ్‌ చెప్పాడు. ఎల్లవేళలా వ్యూహాత్మక భాగస్వామిగా, గట్టి స్నేహితుడిగా ఉన్న పాకిస్తాన్‌ భద్రతాపరమైన ఆందోళనలను చైనా పూర్తిగా అర్ధం చేసుకుంటున్నదని, సార్వభౌమత్వం,భద్రతా ప్రయోజనాలకు పూర్తి మద్దతు ఇస్తామని వాంగ్‌ ఇ చెప్పాడు.రెండు దేశాల మధ్య వివాదం ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలకు మంచిది కాదని కూడా అన్నాడు. పాక్‌ మంత్రి ఫోన్‌ చేశాడు తప్ప చైనా మంత్రి చేయలేదని గ్రహించాలి.తటస్థ మరియు పారదర్శక పద్దతిలో పహల్గాం ఉదంతంపై దర్యాప్తు జరపాలని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కోరాడు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఇరాన్‌, సౌదీ అరేబియా ముందుకు వచ్చినట్లు వార్తలు.


ఒక మిత్రదేశ విదేశాంగ మంత్రి ఫోన్‌ చేసినపుడు ఎవరైనా స్పందించటం సహజం.పాకిస్తాన్‌ మాదిరి భాగస్వాములు లేదా మిత్రదేశాలతో మనదేశం మాట్లాడినట్లు ఎలాంటి వార్తలు లేవు.చైనాతో మాట్లాడతారని ఎవరూ అనుకోరు. అఫ్‌కోర్స్‌ మాట్లాడాలా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఈ సందర్భంగా మీడియాలో మరోసారి చైనా వ్యతిరేక ప్రచారం మొదలైంది. చైనా తయారీ ఆధునిక ఆల్ట్రాసెట్‌ వాకీటాకీలతో ఉగ్రవాదులు తమ నేతలతో మాట్లాడారని, వారికి అవి ఎలా వచ్చాయంటూ చైనా అంతర్గతంగా దాడికి సహకరించిందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చైనా దగ్గర చౌకరకం వస్తువుల తయారీ తప్ప ఆధునిక పరిజ్ఞానం లేదని గతంలో, ఇప్పటికీ ప్రచారం చేస్తున్నవారి నుంచే ఇప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇలాంటి పరికరాలు గతంలోనే ఉగ్రవాదుల దగ్గర దొరికినట్లు వార్తలు వచ్చాయి. ఆల్ట్రాసెట్‌ వాకీటాకీలను అంతర్జాతీయంగా నిషేధించలేదు. అలాంటివి ఒక్క చైనా మాత్రమే తయారు చేయటం లేదు,ప్రతి అగ్రదేశం వద్దా ఉన్నాయి.చైనా దగ్గర వాటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు, ఆ క్రమంలో పాకిస్తాన్‌ కొనుగోలు చేసి ఉగ్రవాదులకు ఇచ్చి ఉండవచ్చు, దానికి చైనాను ముడిపెట్టటం సమస్య. మనదేశంలో నక్సలైట్ల దగ్గర రష్యన్‌ ఏకె రకం తుపాకులు ఉన్నాయి, అవి ప్రపంచంలో అనేక చోట్ల, మనదేశంలో కూడా తయారవుతున్నాయి. అంటే నగ్జల్స్‌కు మనదేశమే విక్రయిస్తోందని అర్ధమా !


సామాజిక మాధ్యమంలో వెలువడుతున్న పోస్టులు,వ్యాఖ్యలను చూస్తే ఉన్మాదం ఎంతగా తలకెక్కిందో అర్ధం అవుతున్నది. జీలం నది భారత్‌లో పుట్టి పాకిస్తాన్‌లో సింధునదిలో కలసి అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టినట్లు మన ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఎలాంటి ముందస్తు హెచ్చరికలేకుండా జీలం నది నీటిని విడుదల చేయటంతో మన కాశ్మీరులోని అనంతనాగ్‌ జిల్లా నుంచి పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో ప్రవేశించి ముజఫరాబాద్‌ పరిసరాలకు వరద ముప్పు తెచ్చినట్లు, అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. దీని గురించి అవునని గానీ కాదని గానీ ఇది రాసిన సమయానికి మన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.భారత్‌ దెబ్బ అంటే ఇట్లుంటది అన్నట్లుగా కొందరు సంబరపడుతున్నారు. ఎవరి మీద ఈ వరద దాడి జరిగిందో, దాని పరిణామాలు, పర్యవసానాలను గమనించే స్థితిలో ఇలాంటి బాపతు లేకపోవటం విషాదం, గర్హనీయం. మన కాశ్మీరు నుంచి విడదీసిన ముక్కలో ముజఫరాబాద్‌ ఉంది. దాన్నే మనం ఆక్రమిత కాశ్మీరు అంటున్నాం, పాకిస్తాన్‌ విముక్త కాశ్మీరు అని పిలుస్తున్నది. మనదేశంలో అంతర్భాగంగా ఉన్న ముక్కను కూడా విముక్తి చేసి స్వతంత్ర కాశ్మీరు దేశాన్ని ఏర్పాటు చేస్తామని పాక్‌ చెబుతున్నది. అందుకే దాన్ని తనలో విలీనం చేసుకోలేదు, పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించలేదు, తన స్వంత రాష్ట్రంగా కూడా పరిగణించటంలేదు తప్ప మిగతా అన్ని విషయాల్లో తన అంతర్భాగంగానే చూస్తున్నది.


ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీరును మనం తిరిగి తెచ్చుకోవాల్సిందే. అందుకే అసెంబ్లీలో ఆ ప్రాంతానికి కొన్ని సీట్లను కేటాయించి, అవి మినహా మిగిలిన వాటికే ఎన్నికలు జరుపుతున్నాం.మొత్తం 114 సీట్లకు గాను 24 పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు కేటాయించాం, 90స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అప్పుడప్పుడు ముజఫరాబాద్‌లో తాము భారత్‌లో విలీనం అవుతామంటూ ప్రదర్శనలు జరుగుతుంటాయి, వాటిని మన మీడియా కూడా చూపుతుంది. ఇప్పుడు మనదేశం ఆ పట్టణం, పరిసరాలను పహల్గాం దాడికి ప్రతీకారంగా వరద నీటితో ముంచెత్తితే వారు మనకు అనుకూలంగా ఉంటారా ప్రతికూలంగా మారతారా ? కొంత మంది ఉగ్రవాదులు చేసిన దానికి సామాన్యుల మీద ప్రతీకారం తీర్చుకుంటే ఉగ్రవాదులకు ఆశ్రయం మరింత పెరుగుతుందా తగ్గుతుందా ? మానవహక్కులకు, అంతర్జాతీయ ఒప్పందాలకు ఇది పూర్తి విరుద్దం. అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవాల్సిందే. ఉగ్రవాదులను పట్టుకోవాల్సిందే, నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయాల్సిందే.మన దేశంలో నక్సల్స్‌ను పట్టుకొనే పేరుతో ఆదివాసీల మీద పోలీసులు, భద్రతా దళాలు దాడులు చేస్తే జరిగిందేమిటి ? దాన్ని అవకాశంగా తీసుకొని భయంతో లేదా పోలీసుల మీద కసితో మరింతగా నగ్సల్స్‌కు వారు ఆశ్రయమిచ్చారా లేదా !


మన దగ్గర ఉన్న రాఫేల్‌ యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు వీలుగా నిర్ధారణ కాని వార్తలంటూ చైనా తన ఆధునిక పిఎల్‌15 క్షిపణులను అత్యవసరంగా పాకిస్తాన్‌కు తరలించినట్లు క్లాష్‌ రిపోర్టు అనే మీడియాలో రాశారు. ఇవి రాడార్ల నియంత్రణలో గగన తలం నుంచే గగనతలంలో ప్రయోగించే కంటికి కనిపించని దీర్ఘశ్రేణి క్షిపణులు. వీటిని ఒకసారి వదిలిన తరువాత మధ్యలో కూడా దిశను మార్చి లక్ష్యాలవైపు ప్రయోగించవచ్చు. పాక్‌ యుద్ధ విమానాలకు అమర్చిన పిఎల్‌10, పిఎల్‌15 క్షిపణులంటూ ఎక్స్‌లో బొమ్మలను పెట్టారు. అధికారిక వర్గాలేవీ నిర్ధారించలేదని కూడా వార్తలో పేర్కొన్నారు.వీటిని తొలిసారిగా చైనా 2024 నవంబరులో ఒక ప్రదర్శనలో చూపిందట. ఇంత అత్యాధునిక క్షిపణులను ఏ దేశమూ కొన్ని నెలల్లోనే ఇతర దేశాలకు విక్రయించదు.ఈ క్షిపణులను అమెరికా ఏఐఎం120డి అనే వాటికి ధీటుగా చైనా తయారు చేసింది. ఇవి ఐరోపా ఎంబిడిఏ మెటోయర్‌కు సమానమైనవని కూడా చెబుతున్నారు.ఫ్రాన్సు నుంచి మనం కొనుగోలు చేసిన రాఫెల్‌ విమానాలు వీటిని ప్రయోగించేందుకు వీలు కలిగినవి. ఇవి చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న పిఎల్‌15ఇ రకంతో సమానమని నిపుణులు చెబుతున్నారు, అవి 145 కిలోమీటర్ల లక్ష్యాలను దెబ్బతీస్తాయని వార్తలు వచ్చాయి.2019లో బాలకోట్‌పై మన దేశం సర్జికల్‌ దాడులు జరిపినపుడు పాకిస్తాన్‌ మన మిగ్‌21 బైసన్‌ అనే విమానాన్ని కూల్చివేసింది. దానికి గాను అమెరికా అందచేసిన ఎఫ్‌16విమానానికి అమెరికా నుంచే తెచ్చుకున్న మధ్యశ్రేణి క్షిపణి అమ్‌రామ్‌ అమర్చి కూల్చివేసింది. నాటికి మన దగ్గర అలాంటివి లేవు.ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా ఎఫ్‌16 విమానాలు, వాటికి అమర్చిన క్షిపణులను కూడా ధ్వంసం చేసే, దాడులు చేసే క్షిపణులను రష్యా ఇప్పుడు వినియోగిస్తున్నది.

ఇప్పుడు పాకిస్తాన్‌ సేకరిస్తున్న ఆయుధాల గురించి చెబుతుంటే కొంత మందికి రుచించదు. విపరీత అర్ధాలు తీసే ప్రబుద్ధులు కూడా ఉంటారు. ప్రతిదేశం తన భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.ఇప్పుడు పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు మన దేశం ఉన్న సమయంలో పాకిస్తాన్‌ ఆర్మీ చైనా నుంచి ఆధునిక క్షిపణులు సేకరిస్తున్నదని నిర్ధారణగాని వార్తలు వచ్చాయి. సాధారణ పరిస్థితి ఉన్నపుడే మనదేశం అమెరికా ఆంక్షలు, బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా రష్యా నుంచి ఆధునిక ఎస్‌`400 శామ్‌ వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఎందుకు అంటే చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు అని చెప్పారు. మూడిరటిని ఇప్పటికే మోహరించాము. ఇంకా రెండు వ్యవస్థలు రష్యా నుంచి రావాల్సి ఉంది. వాటిని ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించేందుకు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించవచ్చు. ఇవి అన్ని రకాల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తిస్తాయి, క్షిపణులతో వాటి మీద దాడులు చేస్తాయి.ఎనభై లక్ష్యాలను 380 కిలోమీటర్ల పరిధిలో ఛేదిస్తాయి. అందువలన పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోగల స్థితిలో మనదేశం ఉంది !

నోరు తెరిస్తే అబద్దం, మీడియాపై దాడి, ట్రంప్‌ అసత్యాలపై రోజువారీ లెక్కలు !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


నీ స్నేహితులను చూస్తే నువ్వెలాంటి వాడివో తెలుస్తుందన్నది ఒక లోకోక్తి.అనేక దేశాల నేతలు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ జిగినీ దోస్తు అని చెప్పుకోవటం, చెట్టపట్టాల్‌ వేసుకొని తిరగటం తెలిసిందే.ట్రంప్‌ దాదాపు ప్రతి రోజూ ఎక్కడో అక్కడ మీడియాతో మాట్లాడితే, నోరు విప్పేది లేదని మోడీ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్‌ పచ్చి అబద్దాల కోరు అని చైనా తాజాగా చెబుతోంది, ఒక్క చైనాయే కాదు, అమెరికా మీడియా సైతం గతంలో, ఇప్పుడూ అదే చెబుతోంది.రోజూ ఎన్ని అసత్యాలు, తప్పుడు సమాచారం చెబుతున్నదీ లెక్కలు తీయటం ఒక పనిగా మారింది. తాజా అబద్దం ఏమిటంటే చైనా అధ్యక్షుడు తనతో మాట్లాడినట్లు ట్రంప్‌ చెప్పాడు.ఎప్పుడు అంటే అవన్నీ మీకెందుకు మూడు నాలుగు వారాల్లో పన్నుల మీద అమెరికా ఒప్పందం చేసుకుంటుంది అన్నాడు. పన్నుల నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు చైనా సంకేతం పంపింది, పూర్తి విజయం నాదే అని కూడా చెప్పుకున్నాడు. టైమ్‌ పత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ అతను ఫోన్‌ చేశాడు,అది అతనివైపు నుంచి ఉన్న బలహీనతగా నేను భావించటం లేదు ’’ అన్నాడు.మరోవైపు చైనా ఎలాంటి ఆర్భాట ప్రకటనలు లేకుండా వాణిజ్య యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోవాలో రోజువారీ సమీక్షలు చేస్తున్నది. స్వయంగా అధ్యక్షుడు షీ జింపింగ్‌ రంగంలోకి దిగాడు. ఆర్థిక వ్యవస్థలో సానుకూల అంశాలున్నప్పటికీ విదేశీ కుదుపుల ప్రభావం పెరుగుతున్నదని పొలిట్‌బ్యూరో సమావేశం తరువాత చైనా వార్తా సంస్థ సిన్హువా పేర్కొన్నది. అంతర్గతత ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చేందుకు సమస్యలను ఎదుర్కొంటున్న వాణిజ్యాలకు ఊతమిచ్చేందుకు, గృహనిర్మాణాలు, పట్టణ పునరుద్దరణ పధకాలు వేగంగా పూర్తి, నిరుద్యోగులకు చెల్లించే భృతి పెంపుదల,తక్కువ, మధ్య తరగతి ఆదాయాన్ని పెంచటం,సేవారంగ విస్తరణ, వినిమయ ఖర్చు పెంపుదలను ప్రోత్సహించటం వంటి చర్యలు తీసుకుంటున్నది.
పన్నుల గురించి అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగటం లేదని చైనా విదేశాంగ, వాణిజ్యమంత్రిత్వశాఖలు స్పష్టం చేశాయి. అమెరికా జనాలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించాయి. ఇక ట్రంప్‌ అసత్యాలు, వక్రీకరణల విషయానికి వస్తే రెండోసారి పదవీ స్వీకారం చేసిన రోజే 20 అబద్దాలు చెప్పినట్లు మీడియా విశ్లేషించింది. తొలి నాలుగేండ్ల పదవీ కాలంలో 30,573 అబద్దాలు చెప్పినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక వెల్లడిరచింది. తొలి వందరోజుల్లోనే 492, 2020లో ఓటింగ్‌కు ముందు నవంబరు రెండవ తేదీన ఒక్క రోజే 503 అవాస్తవాలు చెప్పి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చూసినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. నిజంగా ఒక రాజకీయనేత అలా మాట్లాడతారా అన్న అనుమానం ఉంటే ట్రంప్‌, అతగాడి స్నేహితులను చూడాల్సిందే. ట్రంప్‌ నోటి నుంచి సగటున రోజుకు 21తప్పుడు సమాచారం లేదా అబద్దాలు వెలువడినట్లు తేలింది. తొలి ఏడాదిలో రోజుకు సగటున ఆరు,రెండో ఏడాది 14, మూడో ఏడు 22, నాలుగో సంవత్సరం 39 చొప్పున, అంటే పదవీ కాలం ముగిసే వ్యవధి దగ్గరపడిన కొద్దీ అబద్దాలు పెరిగాయి. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం సంస్థ ఏకంగా ట్రంప్‌ అబద్దాల సమాచార కేంద్రాన్నే ఏర్పాటు చేసింది. రెండోసారి తొలి రోజే రెండు ప్రసంగాలలో 20 అబద్దాలతో ప్రారంభం అయిన తీరు చూస్తే నాలుగేండ్లలో గత రికార్డును బద్దలు కొట్టేందుకు ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. ఒక ప్రధానిగా నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎవరికైనా అభినందనలు తెలపటం ఒక సంప్రదాయం, కానీ అబద్దాల కోరు ట్రంప్‌ను నా స్నేహితుడు అంటూ మోడీ సందేశాలు పంపారు, వివిధ సందర్భాలలో వర్ణించారు. రాజకీయాల పుట్టుకతోనే అబద్దాలు కూడా వెంటవచ్చాయి గానీ ఇటీవలి కాలంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా వాటికి డోనాల్డ్‌ ట్రంప్‌, అతగాడి బాటలో నడిచే వారు నిష్ణాతులుగా మారారు, అతగాడిని చూసి ఉత్తేజం, ఉత్సాహం పొంది ప్రపంచంలో అనేక దేశాల అధ్యక్షులు లేదా ప్రధానులు కూడా సిగ్గూ ఎగ్గూ లేకుండా అవాస్తవాలు, అసత్యాలు, వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకుడంటే ఒపీనియన్స్‌(అభిప్రాయాలు) మారుస్తూ ఉండాలని మహాకవి గురజాడ చురక అంటించారు, ఆయనే ఇప్పుడు బతికి ఉంటే అబద్దాలు చెప్పని వాడు రాజకీయ నేత కానేకాడని గిరీశం చేత చెప్పించి ఉండేవారు. జర్నలిస్టులు వార్తలను సేకరించే పనిలో భాగంగా నేతల మాటల్లో అబద్దాలు ఎన్ని ఉన్నాయో ఎత్తి చూపే పని భారం వారి మీద పడిరదంటే అతిశయోక్తి కాదు. ఫాక్ట్‌చెక్‌ పేరుతో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సిబ్బందినే నియమించాయి.


ట్రంప్‌ రెండవ సారి జనవరి 20న పదవిని చేపట్టి వందవ రోజు పూర్తి చేసుకొనేందుకు ముందుకు పోతున్నాడు.ఈ లోగానే మీడియాను అణచివేసేందుకు కూడా పూనుకున్నాడు. సరిహద్దులు లేని రిపోర్టర్లు అనే సంస్థ పత్రికా స్వేచ్చ మీద రాజ్యాంగేతర దాడి ఎలా జరుగుతున్నదో వివరించింది.ఆరోగ్యం, నేరాల వంటి సమాచారం తెలుసుకొనేందుకు వీలు కల్పించే ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్ల నుంచి ఎనిమిదివేల పేజీలను ప్రభుత్వం తొలగించింది. జనాలు, మీడియాకు సమాచారం అందకుండా చేయటం తప్ప ఇది మరొకటి కాదు. ప్రభుత్వం నిర్వహించే 180 రేడియో స్టేషన్లను మూసివేసేందుకు గాను వాటికి అందచేస్తున్న 110 కోట్ల డాలర్ల నిధులు నిలిపివేయాలని పార్లమెంట్‌ను కోరాడు.దీని వలన గ్రామీణ, సుదూర ప్రాంతాల వారికి వాటి సేవలు నిలిచిపోతాయి. ప్రభుత్వ రంగంలోని మీడియాకు ప్రతి ఏటా సగటున ఒక పౌరుడు చెల్లిస్తున్న మొత్తం కేవలం 1.6 డాలర్లు మాత్రమే. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అధ్యక్ష భవన వార్తలను సేకరించకుండా అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపి) సంస్థ విలేకర్లను నిషేధించారు. మెక్సికో గల్ఫ్‌ పేరును అమెరికా గల్ఫ్‌ అని మార్చినప్పటికీ ఆ సంస్థ తన వార్తలో పాత పేరునే వినియోగిస్తుండటమే దీనికి కారణం.ఏప్రిల్‌ 9న ఒక కోర్టు ఈ నిషేధం ఎత్తివేయాలని ఆదేశించినప్పటికీ ఖాతరు చేయటం లేదు.తన స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ ద్వారా 64సార్లు మీడియా మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు.2021 జనవరి ఆరున కాపిటోల్‌ వద్ద జర్నలిస్టులపై దాడి చేసిన కేసులో శిక్షలు పడిన తన అనుచరులైన 13 మంది గూండాలను క్షమాభిక్ష పేరుతో విడుదల చేశాడు.మీడియా సంస్థలను వేధించేందుకు ఆరు కంపెనీలపై విచారణకు ఆదేశించాడు. ప్రాజెక్టు 2025 పేరుతో ట్రంప్‌ అజెండాకు రూపకల్పన చేసిన బ్రెండన్‌ కార్‌, మీడియా నియంత్రణ కమిషన్‌ చైర్మన్ను చేసిన తరువాత ట్రంప్‌ గురించి విమర్శనాత్మక వార్తలను అందించే సిబిఎస్‌, ఎబిసి, ఎన్‌బిసి, ఎన్‌పిఆర్‌, పిబిఎస్‌, కాలిఫోర్నియా టెలివిజన్‌లపై విచారణ పేరుతో వేధింపులకు పూనుకున్నాడు. నాలుగు సంస్థలపై ట్రంఫ్‌ వ్యక్తిగతంగా పరువు నష్టం కేసులు వేశాడు.


ఇక కమ్యూనిజానికి, తమను వ్యతిరేకించే దేశాల గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు అమెరికా ప్రభుత్వం యుఎస్‌ ఏజన్సీ ఫర్‌ గ్లోబల్‌ మీడియా అనే సంస్థను దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసింది. తరువాత మీడియా పెద్ద ఎత్తున విస్తరించి అలాంటి ప్రచారం చేసేందుకు వాటితో పెద్దగా అవసరం లేకపోయింది. అందుకే అది నిర్వహించే రేడియో, టీవీ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిధులను నిలిపివేసింది, విలేకర్లను సెలవుపై వెళ్లాలని కోరారు. ఈ సంస్థద్వారా నిర్వహించే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, రేడియో ఫ్రీ ఆసియా, యూరోప్‌, లిబర్టీ వంటి వాటిలో కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. అవి ఎంతగా రెచ్చగొట్టినా అమెరికా పాలకవర్గానికి వచ్చిన మేలేమీ లేకపోవటంతో ట్రంప్‌ వాటిని అజాగళస్థనాలుగా భావించి నిధులు నిలిపివేశాడు.ఈ చర్య వలన మూడున్నరవేల మందికి పైగా జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థలలో పని చేస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేసిన జర్నలిస్టులలో విదేశాలకు చెందిన 84 మందిని స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది, అయితే వారిలో అనేక మందిని ఆయా దేశాలు కేసులు పెట్టి జైలు పాలు చేసే అవకాశం ఉందట. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసేందుకు వివిధ దేశాలలో ప్రయివేటు టీవీలు, పత్రికలకు, కొందరు జర్నలిస్టులకు సిఐఏ, ఇతర సంస్థల ద్వారా పెద్ద ఎత్తున నిధులు అందచేస్తున్న సంగతి తెలిసిందే.

రాహుల్‌ గాంధీవి పిల్ల చేష్టలైతే….నరేంద్రమోడీ పెద్దరికం ఎక్కడ ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


రామాయణంలో రాముడికి పేరు ఎలా వచ్చిందంటే ప్రధాన కారకుడు రావణ పాత్రధారి అని కొందరు అంగీకరించకపోవచ్చు. సీత గీత దాటకపోతే రామకథే లేదు అన్నవారు కూడా ఉన్నారు. అలాగే రాహుల్‌ గాంధీకి ప్రాచుర్యం కల్పించటంలో బిజెపి నేతలు, వారి కనుసన్నలలో నడిచే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పెద్ద సంఖ్యలో ఓట్లు పెరగటం, సాయంత్రం 5.30 నుంచి 7.30 మధ్యలో 65లక్షల ఓట్లు పోల్‌ కావటం గురించి గతంలో చేసిన విమర్శలు లేదా ఆరోపణలనే రాహుల్‌ గాంధీ మరోసారి చేశారు. అది అమెరికాలోని బోస్టన్‌ నగరంలో పునశ్చరణ చేయటాన్ని బిజెపి తప్పు పడుతూ దేశద్రోహం అన్నట్లుగా దాడికి దిగింది. మన గడ్డమీద ఎన్నయినా అనుకోవచ్చుగానీ విదేశాల్లో మన రాజ్యాంగ సంస్థలను విమర్శించటం ఏమిటి అంటూ మనోభావాలను ముందుకు తెచ్చింది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, వాటి మీద దాడి చేయటంలో బిజెపి తీరు అనితర సాధ్యం. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన కమిషనర్‌ నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న పద్దతిని మార్చి సిజె స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. అంటే ముగ్గురిలో రెండు ఓట్లు అధికారంలో ఉన్నవారికి ఉంటాయి గనుక ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు, అలాంటి వారు ఎలా పని చేస్తారో వేరే చెప్పనవసరం లేదు. రాహుల్‌ గాంధీ చెప్పినట్లు అలా నియామకం పొందిన వారు రాజీపడక ఏం చేస్తారు, నియమించిన వారికి వ్యతిరేకంగా వ్యవహరించగలరా ? వారేమైనా టిఎన్‌ శేషన్‌ వంటి వారా ?

ఈ పూర్వరంగంలోనే ఎన్నికల కమిషన్‌ రాజీపడుతున్నదని, వ్యవస్థలోనే లోపం ఉన్నదని రాహుల్‌ గాంధీ బోస్టన్‌లో చేసిన వ్యాఖ్యలను బిజెపి వివాదం కావించింది.ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్‌ గురించి ఎన్నికల కమిషన్‌ గతంలోనే తన చర్యను సమర్ధించుకున్నది. మొత్తం 9.7కోట్ల మంది ఓటర్ల గురించి కేవలం 90 అప్పీళ్లు మాత్రమే వచ్చినందున జాబితా సరైనదే అని ఎన్నికల కమిషన్‌ సమర్ధించుకుంది, 30లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైతే ఆ స్థాయిలో ఫిర్యాదులు రాలేదెందుకని ఎదురు ప్రశ్నించింది.రెండు గంటల సమయంలో 65లక్షల ఓట్లు వేయటం ఎలా సాధ్యమని రాహుల్‌ గాంధీ ప్రశ్న, వీడియో చిత్రాలను కూడా అడిగేందుకు వీల్లేకుండా చట్టాలను సవరించారని పేర్కొన్నారు. వీటికి సమాధానం లేదు. రిగ్గింపు ఎప్పుడు ఎలా చేస్తారో మనకు తెలియదా ! రాహుల్‌ గాంధీవి పిల్లచేష్టలని,విదేశీ గడ్డ మీద ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నట్లు బిజెపి ధ్వజమెత్తింది. విదేశీ పర్యటనల్లో విమర్శలు చేయటం కొత్త కాదు, గతంలో కూడా చేశారు. ఆ మాటకు వస్తే వయసులో పెద్దమనిషి, ఒక ప్రధానిగా నరేంద్రమోడీ చేసిందేమిటి ? పెద్దలు నడిచిన బాటనే పిల్లలూ అనుసరిస్తారు. ఒక రాజకీయ నేత తన ప్రత్యర్ధి పార్టీ లేదా ప్రభుత్వం, వ్యవస్థల గురించి స్వదేశంలో విమర్శించి విదేశాల్లో పొగడాలా, ఆ పని చేస్తే సమావేశాలకు వచ్చిన వారు గడ్డి పెట్టరా లేదా నేను మాట్లాడను అని నోరుమూసుకోవాలా ? నరేంద్రమోడీ అదే చేశారా ? కాంగ్రెస్‌ను స్వదేశంలో విమర్శించినట్లే విదేశాల్లోనూ ధ్వజమెత్తారు. ఆ పార్టీనే కాదు, అవినీతిదేశం అంటూ జాతి పరువునే తీశారు.


2015లో జర్మనీ వెళ్లినపుడు కాంగ్రెస్‌ పార్టీ వదలివెళ్లిన చెత్తనంతా శుద్ధి చేయాల్సి ఉందని మోడీ చెప్పారు, భారత్‌ అంటే కుంభకోణాల దృశ్యమని, దాన్ని తాను నైపుణ్య దేశంగా మార్చనున్నట్లు కెనడాలో చెప్పారు. ఓమన్‌లో కూడా అదే చెప్పారు. కాంగ్రెస్‌ పాలనా కాలమంతా కుంభకోణాల మయమని, తప్పుడు పాలనా పద్దతులను సరిదిద్దేందుకు తాను ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పుకున్నారు. గత జన్మల్లో ఏ పాపం చేశామో భారత్‌లో పుడుతున్నామని జనాలు చెప్పుకుంటున్నారని దక్షిణ కొరియా సియోల్‌లో మోడీ సెలవిచ్చారు.ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వేరే చోటకు పోదామని అనుకున్నారు అలాగే వెళ్లారు.ఇప్పుడు నేను గట్టి విశ్వాసంతో చెప్పగలను, అన్ని జీవన రంగాలకు చెందిన ఆ తెలివైన వారు, ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా వారు విదేశాల్లో పెద్ద మొత్తాలను సంపాదిస్తున్నప్పటికీ వారంతా తిరిగి రావటానికి, తక్కువ ఆదాయాలకు కూడా సిద్దపడి భారత్‌లో స్థిరపడటానికి రావాలని చూస్తున్నారని మోడీ చెప్పారు. చైనాలోని షాంఘై నగరంలో భారత సంతతి సమావేశంలో మాట్లాడుతూ గతంలో మీరు భారత్‌ గురించి సిగ్గుపడేవారు, ఇప్పుడు (తాను ప్రధాని అయిన తరువాత) దేశం గురించి గర్వపడుతున్నారన్నారు. ప్రతిపక్షం మీద ధ్వజం, స్వంతడబ్బా ప్రతిచోటా కనిపిస్తుంది. 2014లో ఎన్నిక తరువాత న్యూయార్క్‌ పర్యటనలో మీరు ఓట్లు వేసి ఉండకపోవచ్చుగానీ ఫలితాలు వచ్చినపుడు మీరంతా పండగ చేసుకున్నారని ప్రవాస భారతీయులతో చెప్పారు. ప్రధానిగా 70దేశాలు తిరిగారని 50చోట్ల తన ప్రత్యర్ధుల మీద రాజకీయ దాడి చేశారని పరిశీలకులు చెబుతున్నారు. అప్పుడు అది విదేశీ గడ్డా స్వదేశీ అడ్డా అన్నది గుర్తుకు రాలేదా ? కంటికి కన్ను, పంటికి పన్ను, కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి రాహుల్‌ గాంధీ కూడా అదే బాటలో నడుస్తూ విమర్శలు చేస్తున్నారు. తేడా ఏమిటంటే మోడీ మాట్లాడిన వాటిని గోడీ మీడియా పెద్దగా ప్రచారంలో పెట్టలేదు, చర్చల రచ్చ చేయలేదు, అంతే ! మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మా నెట్‌వర్క్‌ వస్తుందనే హచ్‌ కుక్క ప్రకటన మాదిరి నరేంద్రమోడీ ఏ విదేశ పర్యటన చేస్తే తాము కూడా ఒక సీనియర్‌ నేతను అక్కడకు పంపుతామని, అక్కడేమైనా తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేస్తే అదే స్థాయిలో సమాధానం చెబుతామని, దేశాన్ని కించపరుస్తూ,ప్రతిపక్షం మీద ఆరోపణలతో మాట్లాడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోడీ అని 2015లోనే కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ విమర్శించారు.మోడీ ప్రధానిగా దేశాలు తిరుగుతున్నారు తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ లేదా బిజెపి ప్రతినిధిగా కాదన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారంటూ రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి నేతలు ఏం చేస్తున్నారో దేశంతో పాటు ప్రపంచమంతా చూస్తోంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులనే వారు సవాలు చేస్తున్నారు. పార్లమెంటు సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్‌ థంకర్‌ మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ దగ్గరకు వచ్చిన బిల్లుల మీద మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని లేకుంటే వాటిని ఆమోదించినట్లు పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి విమర్శించారు. అది ప్రజాస్వామిక శక్తులపై అణుక్షిపణి వంటిదని వర్ణించారు. సుప్రీం కోర్టుకు అలాంటి అధికారం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఆమోదించిన బిల్లులను తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఉంది. అయితే వాటిని తిరిగి చట్టసభలు మరోసారి ఆమోదించి పంపితే చట్టాలుగా ఆమోద ముద్రవేయటం తప్ప తిరస్కరించే అధికారం లేదు. అయితే రాష్ట్రపతి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు నెలల తరబడి తిప్పి పంపకుండా ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న పూర్వరంగంలో తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఆ తీర్పు ఇచ్చింది. న్యాయవ్యవస్థ సూపర్‌ పార్లమెంటుగా వ్యవహరించజాలదని జగదీప్‌ తప్పుపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత రాష్ట్రపతి, గవర్నర్లదైతే, రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతున్నదా లేదా అన్న భాష్యం చెప్పేందుకు సుప్రీం కోర్టుకు అధికారం ఉంది.చట్టసభలు చేసిన నిర్ణయాలను కాదనే హక్కు లేదు గానీ, అవి నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్నది నిర్ణయించవచ్చు. ఇప్పుడు వక్ఫ్‌ సవరణ చట్టం గురించి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దాని పరిధికి మించినా లేక ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా షాబానో తీర్పు మాదిరి పార్లమెంటులో బిల్లు పెట్టి దాన్ని రద్దు చేసే దమ్ము బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది సమస్య. ఉపరాష్ట్రపతి చెప్పినట్లుగా దేశానికి పార్లమెంటు, రాష్ట్రాలకు అసెంబ్లీలు ఉన్నతం, అవి ఆమోదించిన బిల్లులను నెలల తరబడి గవర్నర్లు తొక్కిపట్టటాన్ని ఏమనాలి, తానే స్వయంగా అలాంటి పనికి పాల్పడిరది గుర్తులేదా, అప్పుడు అసెంబ్లీ సుప్రీం అన్న జ్ఞానం లేదా ?

ఉపరాష్ట్రపతి సుప్రీం కోర్టు మీద ధ్వజమెత్తటంతో కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవాయ్‌ సున్నితంగా బిజెపి నేతలకు చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌లో హింస కారణంగా అక్కడకు పారామిలిటరీని పంపాలంటూ రాష్ట్రపతికి ప్రవర్తకాది లేఖ జారీ చేయాలన్న పిటీషన్‌పై స్పందించారు. ఇప్పటికే మేము కార్యనిర్వహణ పరిధిని ఆక్రమిస్తున్నామన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాం అందువలన ఈ వినతిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.కోర్టు పేరుతో పశ్చిమబెంగాల్లో కేంద్ర బలగాలను దించాలన్న ఎత్తుగడ పిటీషనర్‌ వినతిలో ఉంది.మమతా బెనర్జీని సమర్ధించనవసరం లేదుగానీ విష్టు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది ఈ పిటీషన్‌కు ముందు రాష్ట్రపతి పాలన విధించాలని 2021లో కూడా కేసు వేశారు. పార్లమెంటూ కాదు, కార్యనిర్వాహక వ్యవస్థా కాదు రాజ్యాంగమే ఉన్నతమైనదని జగదీప్‌ థంకర్‌ వ్యాఖ్యల మీద రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందించారు. సిబల్‌ ప్రస్తుతం సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నోటి తుత్తర బిజెపి నేతల్లో నిషికాంత్‌ దూబే ఒకరు. వక్ప్‌ చట్ట సవరణ చెల్లుతుందా లేదా అన్నదాని గురించి విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు దేశంలో మత యుద్ధాలను రెచ్చగొడుతున్నదని, తన హద్దులను దాటుతున్నదని నోరుపారవేసుకున్నాడు. తరువాత ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ ముస్లిం కమిషనర్‌ తప్ప ఎన్నికల కమిషనర్‌ కాదని వదరుబోతుతనంతో మాట్లాడారు.దూబే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి ప్రకటించటం ఒక నాటకం తప్ప మరొకటి కాదు. అలా ప్రకటించిన తరువాతే ఖురేషీ గురించి మాట్లాడాడు. ఎందుకంటే వక్ఫ్‌ చట్టాన్ని ఖురేషీ విమర్శించారు.తానుగా అధికారికంగా చేయలేని వ్యాఖ్యలను దూబే వంటి వారితో బిజెపి చేయించటం దానికి వెన్నతో పెట్టిన విద్య. దూబే అంతటితో ఊరుకోలేదు, దేశం హిందువులదని, గిరిజనులు, జైనులు, బౌద్దులు వారితో కలసి ఉన్నారని కూడా సెలవిచ్చారు. రెచ్చగొట్టే మాటలు మాట్లానికి దూబె పెట్టింది పేరు, అగ్రనేతల మనసులో ఉన్నదాన్ని వెల్లడిరచిన దూబే మీద ఎలాంటి చర్య ఉండదని, తప్పనిసరైతే ఏదో మమఅనిపిస్తారని ఒక ఎంపీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీం కోర్టు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్టు ధిక్కరణ నేరం కింద దూబేపై చర్యలు తీసుకోవాలని వక్ప్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్న వారి తరఫు లాయర్‌ అనాస్‌ తన్వీర్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి లేఖ రాశారు, బిజెపి చర్యతీసుకుంటుందా ?

డోనాల్డ్‌ ట్రంప్‌రుద్దిన వాణిజ్య పోరు : చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ?

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రపంచం మీద తాను రుద్దిన వాణిజ్య పోరు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవికి గండం తేనుందా ? దాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు సహిస్తారా ? ఈ పోరులో చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ? ఇలా పరిపరి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. రెండు దిగ్గజాల మధ్య కేంద్రీకృతమైన వివాదాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొందాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటి దేశాలపై తాము గట్టి ప్రతి చర్యలు తీసుకుంటామని సోమవారం నాడు చైనా హెచ్చరించింది. వాణిజ్య పోరులో విజేతలు ఉండరన్నది సాధారణ అభిప్రాయం, అది నిజమేనా ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? మన దేశం బ్రిటీష్‌ వలస పాలనలోకి వెళ్లక ముందు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలకు అవి ఎగుమతి అయ్యేవి. అలాంటి వాటిని బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం మింగేసింది. ఇప్పుడు ట్రంప్‌ దిగుమతి పన్ను విధించినట్లుగా మన చేనేత వస్త్రాల మీద నాటి బ్రిటన్‌ కూడా పన్ను విధించి అడ్డుకుంది, చౌకగా తయారయ్యే తన మిల్లు వస్త్రాలను మనదేశంలో కుమ్మరించింది. మన మార్కెట్‌ను ఆక్రమించింది. పత్తి ఎగుమతి దేశంగా మార్చింది. నాడు భారత్‌ పరాధీన దేశం, వ్యతిరేకించిన వారు లేరు. ఇప్పుడు అమెరికా పన్నులతో చైనా వస్తువులను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా సర్వసత్తాక స్వతంత్ర దేశం, అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది, ఆట కట్టించాలని చూస్తోంది.చిత్రం ఏమిటంటే అసలైన దేశభక్తులం అని చెప్పుకుంటున్న మన పాలకులు మా ఆయుధాలు, వస్తువులు కొంటారా లేదా అని అమెరికా కొరడా రaళిపిస్తే కంటి చూపులేదు, నోట మాట లేదు.ఏం జరుగుతోంది మహాత్మా ఓ మహాత్మా !


డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొనే దేశాల మీద చర్యలు తప్పవని చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.తమతో వాణిజ్యం చేసే దేశాలు చైనా మీద ఆంక్షలు విధించాలని, దానికి ప్రతిగా అలాంటి వాటికి పన్నులను మినహాయిస్తామని అమెరికా చెబుతున్నదని, సంతుష్టీకరణ శాంతిని, రాజీ గౌరవాన్ని తీసుకురాదని చైనా పేర్కొన్నది.అమెరికా చర్యలు చర్మం ఇమ్మని పులిని కోరటంగా వర్ణించింది. ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ మరికొన్ని దేశాలు ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నాడు. చైనా వస్తువులపై 145శాతంగా విధించిన పన్ను, కొన్ని వస్తువులపై 245శాతం వరకు పెంచుతామని అమెరికా బెదిరించింది. తమ మీద విధించిన పన్నుల కారణంగా తీసుకోలేమంటూ అమెరికా కంపెనీ బోయింగ్‌ జెట్‌ను చైనా తిప్పి పంపింది. అమెరికాతో కలసి చైనాను దెబ్బతీయాలని మనదేశంలో కొందరు యాంకీల ఏజంట్లు నూరిపోస్తున్నారు.చైనా సరఫరా గొలుసులో మనం చేరి దాని స్థానాన్ని ఆక్రమించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి స్వంత సత్తాతో ఆస్థాయికి చేరాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదలేరు, అలాగే అమెరికా వెంట నడచిన ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖలా లేదు. కాసేపు దీని గురించి పక్కన పెట్టి వాణిజ్య పోరు గురించి జరుగుతున్న మధనం ఎలా ఉందో చూద్దాం. అమెరికా తాను చేస్తున్న ప్రతిదీ సరైనదే అనుకుటుంది కానీ సమస్య ఏమిటంటే ట్రంప్‌ ప్రతినిర్ణయం తప్పుగా తేలుతోంది.ఏప్రిల్‌ ఐదున జనం 20లక్షల మంది వీధుల్లోకి రాగా 19వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున రాజరికం లేదు, రాజులేడు అంటూ నినదించారు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్‌ 19న బ్రిటన్‌ రాజరికానికి వ్యతిరేకంగా అమెరికన్లు పోరు ప్రారంభించిన రోజది. చైనా కమ్యూనిస్టులను అణచివేయాలని చూసింది అమెరికా. అయితే లాభాల కోసం అదే చైనా మార్కెట్‌ను ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో కమ్యూనిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఆమోదించింది.తరువాత కూడా ఒక వైపు లాభాలు పొందుతూనే మరోవైపు చైనా ఎదగకుండా కేవలం తనమీదే ఆధారపడే ఒక ఎగుమతిదేశంగా పరిమితం కావాలని చూసింది. తియన్మెస్‌ మైదానంలో విద్యార్ధుల ప్రదర్శనలు, హాంకాంగ్‌లో స్వాంత్య్రం పేరుతో జరిగిన ప్రదర్శనలు, తైవాన్‌ వేర్పాటు వాదం వెనుక దాని హస్తం గురించి తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే గత ఐదు దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ప్రతిప్రతికూల విధానమూ చైనాను మరింతగా పటిష్టపరిచాయి తప్ప బలహీనపరచలేదు, దీని అర్ధం కొన్ని తాత్కాలిక సమస్యలూ, ఎదురుదెబ్బలూ లేవని కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో భౌగోళిక రాజనీతిలో చైనా స్థాయి మరింత బలపడుతుందని అమెరికాను ఆర్థికంగానూ, రాజకీయంగా దాటిపోతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు.


చిత్రం ఏమిటంటే అమెరికన్లు, వారి చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవాలని చూసే కాషాయ తాలిబాన్ల ఆలోచన ఒకే విధంగా ఉంది. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మనం గనుక చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పినట్లే ఇప్పుడు ట్రంప్‌ గాంగ్‌ అంటోంది. చైనా మనకు చేసే ఎగుమతులతో పోల్చితే మనం చైనాకు ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అందువలన మన దిగుమతులు ఆగిపోతే నష్టం వారికే అని అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. అమెరికా దిగుమతులు దాని పెద్ద బలహీనత తప్ప బలం కాదు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు.వారి వస్తువుల మీద ఆధారపడటం నిలిపివేయాలన్నాడు. జరిగిందేమిటి ? గత ఏడు సంవత్సరాల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 19.2 నుంచి 14.7శాతానికి మాత్రమే తగ్గాయి.పూర్తిగా నిలిపివేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.జి 7 దేశాలకు చైనా ఎగుమతులు 2000 సంవత్సరంలో 48శాతం జరగ్గా 2024లో 30శాతానికి తగ్గాయి. ఇంత జరిగినా గత పదేండ్లలో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 13 నుంచి 14శాతానికి పెరిగింది. దీని అర్ధం ఏమిటి ? చైనా తన సరకులకు ఎప్పటి నుంచో ప్రత్నామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది.చైనా అనే చెరువు మీద అమెరికా అలిగితే ఎండిపోయేది అమెరికన్లకే.ఎందుకంటే ప్రస్తుతం అది దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తయారు చేసుకోవాలంటే దశాబ్దాలుగాకపోయినా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అప్పటిదాకా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టాయిలెట్‌ పేపర్‌ వంటి వాటి దిగుమతి ఆపివేస్తారా ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరఫరా చేసే స్థితిలో ఎన్ని ఉన్నాయి ? అమెరికా బోయింగ్‌ జెట్‌ విమానాలు గాకపోతే చైనా ఐరోపా ఎయిర్‌బస్‌లను దిగుమతి చేసుకుంటుంది, లేదూ స్వయంగా తానే పూర్తిగా సమకూర్చుకొనేందుకు ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింతవేగవంతం చేస్తుంది. ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ మిలెర్‌ పోగుచేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే లిథియమ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రల్లో 70, స్మార్ట్‌ ఫోన్లు, వంటగది పరికరాలు, బొమ్మల్లో 80, సూర్యరశ్మి పలకల్లో 90శాతాల చొప్పున చైనా తయారు చేస్తున్నది. కార్లు, ఫోన్లు, అనేక మిలిటరీ పరికరాలకు కీలకంగా అవసరమైన అపురూప ఖనిజాలు, లోహాలు కూడా చైనా దగ్గర గణనీయంగా ఉన్నాయి.

సకల దేశాలూ తన వస్తువులనే కొనాలని చైనా ఎవరినీ దేబిరించే స్థితిలో లేదు. విదేశాలకు అవసరమైన వాటిని కావాలనుకున్నవారికి ఉత్పత్తి చేస్తున్నది, మార్కెట్‌లేకపోతే నిలిపివేస్తుంది, నూటనలభై కోట్ల తనజనాభాకు అవసరమైన వాటి మీద కేంద్రీకరిస్తుంది.ఇప్పటికే ఆప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్ల తరబడి సంపాదించిన వాణిజ్య మిగులులో కొంత భాగం సబ్సీడీగా ఇస్తే అంతర్గత మార్కెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా,జొన్నలు, మొక్క జొన్నలను ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు.పశ్చిమ దేశాల మీద ఆధారపడే రంగాలను గుర్తించి స్వయం పోషకత్వం సాధించేందుకు బీజింగ్‌ పూనుకుంది. దాన్లో భాగంగానే హరిత ఇంథనం, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్ల రంగాలలో భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నది. విపరీత పరిస్థితులలో కూడా జాతీయ ఆర్థిక రంగం సాధారణ కార్యకలాపాలను సాగించే విధంగా చూడాలని అధ్యక్షుడు షీ జింపింగ్‌ విధాన నిర్ణేతలను కోరాడు. యుద్ధం అన్న తరువాత ఓడిన వారికే కాదు విజేతలకూ దెబ్బలు తగులుతాయి, నష్టాలు సంభవిస్తాయి, వాణిజ్య యుద్ధమూ అంతే.


ఎదురుదాడిలో భాగంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న అపురూప ఖనిజాల ఎగుమతులను చైనా నిషేధించింది. అవి జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల తయారీలో కీలకంగా ఉంటాయి.తన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలను అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నది.ఇప్పటికే బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసింది, కొన్ని కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది.యాపిల్‌,గూగుల్‌, డ్యూపాంట్‌్‌, టెస్లా వంటి కంపెనీలు తరువాత వరుసలో ఉన్నాయి.జపాన్‌ తరువాత భారీ మొత్తంలో డాలర్ల నిల్వలున్న దేశం చైనా. వాటి నుంచి అమెరికాకు 760 బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చింది. ట్రంప్‌ పిచ్చిపనులు కొనసాగిస్తే ఆ బాండ్లను ఒక్కసారిగా విక్రయిస్తే అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఆర్థిక పరమైన దెబ్బతీసే పద్దతులను చైనా పరిశీలిస్తున్నది.అమెరికా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు లేకపోలేదు. ఐరోపా, ఆసియాలో తన మిత్రదేశాలను చైనాపైకి ఉసిగొల్పేందుకు పూనుకుంది. అయితే ప్రతికూల పన్నుల విధింపులో ఏ దేశాన్నీ వదలని కారణంగా అవన్నీ జతకట్టటం సందేహమే. తమ కోసం అన్ని దేశాలూ కాస్త నొప్పి భరించాల్సిందే అంటున్నాడు ట్రంప్‌. ఎవరి సంగతి వారు చూసుకోవాలనే రక్షణాత్మక వైఖరులు పెరుగుతున్న తరుణంలో ఎంత మేరకు ఇతర దేశాలు అంగీకరిస్తాయో తెలియదు. అయినప్పటికీ ముందే చెప్పుకున్నట్లు ఇతర దేశాలను చైనా సోమవారం నాడు ముందస్తుగా హెచ్చరించింది. మారిన పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేల్లో మెక్సికో, కెనడా, ఐరోపా దేశాల మీద పన్నులు విధించటాన్ని వ్యతిరేకించినప్పటికీ చైనా మీద దాడిని 56శాతం మంది సమర్ధించినట్లు సిబిఎస్‌ తెలిపింది.కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎక్కించుకున్న వారు సహజంగానే చైనా మీద దాడిని అంగీకరిస్తారు. కానీ అదే ట్రంప్‌ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేమిటి ?ద్రవ్యోల్బణం, ధరలను, పన్నుల భారం తగ్గిస్తానని చెప్పాడు. గద్దె నెక్కగానే విముక్తి పేరుతో ఎడాపెడా పన్నులు విధింపు ప్రకటన చేయగానే అమల్లోకి రాక ముందే ధరలు పెరిగి జనం కొనుగోళ్లకు ఎగబడ్డారా లేదా ? కొత్తగా అన్న వస్త్రాలు వస్తాయనుకుంటే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినట్లుగా భరించలేని భారాలను మోపితే జనం సహిస్తారా ? ఇప్పటికే రెండుసార్లు లక్షలాది మంది వీధుల్లో ప్రదర్శనలు చేశారు. అందుకే తేడా వచ్చేట్లు ఉందని ఆలోచించుకోవటానికి మూడు నెలల పాటు పన్నుల పెంపుదల పదిశాతానికే పరిమితం చేసి మిగతా వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో మాదిరి ధరలు, నిరుద్యోగం పెరుగుదల సంభవించవచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.ట్రంప్‌ మొరటుగా ముందుకు పోతాడా తెలివి తెచ్చుకొని వెనక్కు తగ్గుతాడా అన్నది చూద్దాం !

జగన్‌ పోయే…బాబు వచ్చే…విద్యుత్‌ బిల్లు మోత ఢాం ఢాం ? 2029లో పొంచి ఉన్న గండం ! మద్యం గురించి విజయసాయి రెడ్డి ఏం చెప్పారు !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం వైఎస్‌ జగన్‌ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక విద్యుత్‌ బిల్లుల పెరుగుదల గురించి ఒక వార్త ఇచ్చింది. దాన్లో ఉన్న వ్యాఖ్యలను పక్కన పెడితే అంకెల సమాచారం పక్కా వాస్తవం. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాయని చెబుతున్న మీడియా వాటి మీద చర్చలు పెట్టింది, తెలుగుదేశం ప్రతినిధులు విద్యుత్‌ బిల్లుల పెరుగుదలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది గత ప్రభుత్వ పాపమే అంటూ నానా యాగీ చేస్తున్నారు.ఇక్కడ మహాకవి శ్రీశ్రీ కవితను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోక తప్పటం లేదు.
జెంఘిజ్‌ ఖాన్‌, తామర్లేన్‌
నాదిర్షా, ఘజనీ, ఘోరీ
సికిందరో ఎవడైతేనేం
ఒక్కొక్కడూ మహాహంతకుడు
అన్నట్లుగా సిఎంగా వైఎస్‌ జగన్‌, చంద్రబాబు నాయుడు ఎవరైతేనేం ? జనానికి వాచిపోతోంది. జగన్‌ వైసిపి కార్యకర్తలకు, ఓటర్లకు మినహాయింపు ఇచ్చింది లేదు, చంద్రబాబు మూడు పార్టీల వారికీ ఒరగబెడుతున్నదీ లేదు. పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు సేమ్‌ టు సేమ్‌ (అంతా ఒకటే ) జగన్‌ పాలన ఐదు సంవత్సరాల్లో విద్యుత్‌ బిల్లులు మోతమోగించారు, బాదుడే బాదుడు అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అండ్‌ కో అధికారానికి వచ్చిన ఏడాది కాలంలోనే రు.15,485 కోట్ల మేర విద్యుత్‌ భారాన్ని 2026 ఆఖరు వరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించి బాదుడే బాదుడు ప్రారంభించింది.
వైకింగులు, శ్వేతహూణులు
సిథియన్లు, పారశీకులు
పిండారీలు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అన్నాడు శ్రీశ్రీ. అదే మాదిరి కొందరి వ్యవహారం ఉంది. గతం, వర్తమాన భారాలకు కారకుల గురించి వారి మద్దతుదారులైన మీడియా సంస్థలు, జర్నలిస్టులు గతంలో చేసిందీ, ఇప్పుడు చేస్తున్నదీ అదే. వారికి బిల్లులు ఎంత పెరిగినా మౌనంగా కట్టేయటం తప్ప చెప్పుకోలేని దుస్థితి. జనంతో ఆడుకుంటున్నారు.


మేం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు కదా అంటున్నారు మూడు పార్టీల చెట్టుకింది ప్లీడర్లు. పెంచారని ఎవరన్నారు, చార్జీల బదులు మా జేబులను గుల్లచేసే బిల్లులు పెంచారుగా అని కదా ప్రజానీకం మొత్తుకుంటున్నది. పళ్లూడగొట్టటానికి ఇనుప సుత్తి అయితేనే బంగారుదైతేనేం. ఆ పాపం మాదికాదు జగన్‌మోహనరెడ్డిదే అంటున్నారు, అది నిజం. 20142019 కాలంలో చంద్రబాబు నాయుడు చేసింది కూడా అదే. విద్యుత్‌ గురించి మాట్లాడుకుంటున్నాం గనుక ఆ రంగంలో జగన్‌ ముగ్గురు పిల్లల్ని కన్నారు. ఒక పిల్ల వినియోగదారులకు స్మార్టు మీటర్లు, రెండవది చంద్రబాబే చెప్పినట్లు రానున్న పాతిక సంవత్సరాల్లో లక్షకోట్ల రూపాయల భారం మోపే సెకీ ఒప్పందం. మూడవది కొరత సమయాల్లో విద్యుత్‌ కొనుగోలు(ఇప్పుడు వస్తున్న అదనపు బిల్లులు). వీటిలో మొదటి ఇద్దరు పిల్లలు ఓకే, మూడోదానితో మాకు సంబంధం లేదని తెలుగుదేశం అంటే కుదురుతుందా ! మూడూ అక్రమ సంతానమనే కదా గతంలో చెప్పింది. ఇప్పుడు మూడోదాని భారం మీరే మోయాలంటూ జనం మీదకు వెంటనే వదిలారు. నిజానికి మిగతా ఇద్దరి భారాన్ని కూడా మోసేది జనమే. తేడా ఏమిటి అంటే వాటిని తరువాత వదులుతారు, తక్షణం భారం పడదు అంతే ! స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టమని పిలుపు ఇచ్చిన వారు ఇప్పుడెందుకు వాటిని పెడుతున్నారు అంటే కరెంటు ఎంత కాలింది లెక్కలు తేలాలి కదా అని తెలుగుదేశం వారు టీకా తాత్పర్యం చెబుతున్నారు. నరేంద్రమోడీ, ఆ పెద్ద మనిషి రుద్దిన స్మార్ట్‌ మీటర్లను పెట్టేందుకు అంగీకరించిన జగన్మోహన్‌రెడ్డి కూడా చెప్పింది అదే కదా. మరి తెలుగుదేశం చెప్పేదానికి తేడా ఏమిటి అంటే అది చిల్లి కాదు తూటు అంటున్నారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి అంటే, దాన్ని రద్దు చేస్తే పెట్టుబడులు పెట్టేవారికి విశ్వాసం దెబ్బతింటుంది అందుకే కొనసాగిస్తాం అన్నారు. ఎవరో పెట్టుబడి పెడతారంటూ రాష్ట్ర జనం మీద లక్షకోట్లు భారం మోపటానికి ఏం నాటకం ఆడుతున్నారు ! నిజానికి సెకీ వప్పందంతో రాష్ట్రానికి కొత్తగా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాదు.గతంలోనే కుదిరాయి. అదానీ వంటి వారి నుంచి కొనుగోలు చేసే సెకీ ఆ విద్యుత్‌ను రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తుంది. దానికి డబ్బు చెల్లించాలి, అంతకు మించి వచ్చే పెట్టుబడులేమిటో 40 సంవత్సరాల అనుభవం ఉన్న సిఎంచంద్రబాబు నాయుడిని, వేల పుస్తకాలు చదివిన డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌లను చెప్పమనండి. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు మేం నందంటే నంది పందంటే పంది అంటారని ఆ పార్టీల నేతలు అనుకోవచ్చు, కొంత మంది రచ్బబండల దగ్గర అదే వాదించి ఇంటికి వెళ్లిన తరువాత బిల్లులను చూసినపుడు గొల్లుమంటారు తప్ప బయటకు చెప్పుకోలేరు. కానీ మిగతావారు అంత అమాయకంగా లేరు.

విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌గా పని చేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని, జగన్‌ హయాలో చేసిన కొనుగోళ్లకు సంబంధించి ఎంత వసూలు చేయాలో అప్పుడు నిర్ణయించకుండా తమనేత చంద్రబాబు అధికారానికి వచ్చిన తరువాత కావాలనే ఖరారు చేశారన్నది మరొక తర్కం. అదనపు విద్యుత్‌ కొనుగోలు విధిగా కమిషన్‌ అనుమతి తీసుకోవాలి. అలా కొన్నదాని ఖర్చు గురించి కమిషన్‌ విచారణ జరిపిన తరువాతే కదా నిర్ణయించేది, ఎప్పుడైనా తెలుగుదేశం,జనసేన, బిజెపి నేతలు వాటికి వ్యతిరేకంగా కమిషన్‌ ముందు వ్యతిరేకించారా ? ప్రకటనలు చేశారేమో తప్ప కమిషన్‌ ముందు వామపక్షాల వారి మాదిరి వ్యతిరేకంగా వాదించినట్లు కనపడదు, లేదూ మేం కూడా వ్యతిరేకించాం,వాదించాం అంటే కాసేపు అంగీకరిద్దాం, కమిషన్‌ చేసిన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయకుండా ఎందుకు అమలు చేస్తున్నట్లు ?అవసరం లేకపోయినా విద్యుత్‌ కొనుగోలు చేశారు అన్నది మరొక వాదన. విద్యుత్‌ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారు అలా మాట్లాడరు. కరెంటు నిల్వ ఉండదు, ఎంత ఉత్పత్తి అయితే అంతా వినియోగం కావాల్సిందే, తగ్గితే ఉత్పత్తిని తగ్గిస్తారు, సరఫరా తగ్గిస్తారు తప్ప అదనంగా కొని రోడ్లపక్కనో చెరువుల్లోనే పోయరు. అదనంగా బిల్లులు వసూలు చేయాలని కమిషనే చెప్పింది అన్నది మరొక వాదన. ఉత్పత్తి, చాలకపోతే అదనంగా కొనుగోలు చేసేది విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, జనాలకు అందించేది పంపిణీ సంస్థలు. ఈ రెండూ ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయి. పెట్టుబడి, రాబడి మధ్యవచ్చే తేడాను తేల్చి ఆ మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లించాలని యజమాని అయిన ప్రభుత్వానికి విద్యుత్‌ కమిషన్‌ చెబుతుంది తప్ప ఎలా వసూలు చేయాలో చెప్పదు, ఒకవేళ చెప్పినా వసూలు చేయాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. వ్యవసాయానికి, మరికొందరికి సబ్సిడీ లేదా ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని ప్రభుత్వాలు చెబుతాయి. అందుకయ్యే ఖర్చును బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు, మరొక పేరుతో వడ్డిస్తున్న మొత్తాలను తేల్చిన తరువాత ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లించవచ్చు లేదా వినియోగదారులనుంచి వసూలు చేయవచ్చు. చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ రెండో పద్దతినే ఎంచుకుని బాదుడే బాదుడు ప్రారంభించారు.ఎందుకంటే స్వంత పార్టీల వారు అడగరు, ప్రతిపక్షం అడిగితే ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు వసూలు చేస్తున్నదిగాక 202425ఆర్థిక సంవత్సరంలో జగన్‌మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనా కాలంలో కొనుగోలు చేసిన కరంట్‌కు ఎన్నివేల కోట్ల రూపాయలు జనం మీద మోపుతారో ఇంకా ఖరారు కాలేదు. రెగ్యులేటరీ కమిషన్‌ గత చైర్మన్‌ కావాలనే ఆలశ్యం చేసి జగన్మోహరెడ్డి పాలనా కాలంలో ఖరారు చేయలేదని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కొత్త చైర్మన్‌తో ఎంత త్వరగా ఖరారు చేయిస్తారో తెలియదు, చేస్తే మాత్రం వెంటనే బాదుడు మొదలు పెడతారు.

ఇదిగాక కనిపించని మరొక భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. అదానీ కంపెనీ ద్వారా బిగించే 59,21,344 స్మార్ట్‌ మీటర్ల బిగింపు పూర్తి అయిన తరువాత రెండు రకాల చార్జీలు ఉంటాయి. వేసవి కాలంలో కూరగాయలు తక్కువగా పండుతాయి గనుక రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వేసవిలో ఉక్క పోతకు తట్టుకోలేక ఫాన్లు, ఎసిలు వేసుకున్నపుడు కాలే కరంటు ధర ఎక్కువగా, మిగతా సమయాల్లో మామూలుగా ఉంటుంది. ఈ మీటర్లు బిగించిన తరువాత సెల్‌ఫోన్లకు ముందుగానే డబ్బు చెల్లించినట్లుగా విద్యుత్‌ను కూడా ముందుగానే డబ్బు చెల్లించాలి. ఉదాహరణకు ఇప్పుడు నెలకు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు వస్తుందనుకోండి. దాన్ని వాడుకున్న తరువాత ఒకేసారి చెల్లించాలి, లేకుంటే ఫీజులు పీకి వేస్తారు. స్మార్ట్‌ మీటర్లు వచ్చిన తరువాత ఫీజులు పీకేవారు ఉండరు.వారు లేకపోతే పక్కింటి వారి ముందు మన పరువూ పోదు. ముందే కరెంటును కొనుక్కోవాలి. మన దగ్గర సమయానికి ఎంత డబ్బు ఉంటే అంత మేరకు కరంటు కొనుక్కోవచ్చు, అది అయిపోగానే సరఫరా ఆగిపోతుంది, తిరిగి కావాలంటే డబ్బు చెల్లించాలి. ఇక రెండు రకాల చార్జీలు ఎలా ఉంటాయంటే. చలికాలంలో వంద రూపాయలు చెల్లిస్తే నెల రోజుల పాటు కరంటు ఉంటుంది. అదే వేసవిలో పగలు ఫాన్లు,ఎసిలు వేసుకుంటే ఒక రేటు, పొలాలు, ఉద్యోగాలకు వెళ్లినపుడు వేసుకుంటే ఒక రేటుతో పదిహేను లేదా ఇరవై రోజులకే వస్తుంది. భవిష్యత్‌లో చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ ఇచ్చే మహత్తర కానుక ఇది.దీనికే టైమ్‌ ఆఫ్‌ డే (రోజులో కరంటు కాల్చే సమయ) అనే స్మార్ట్‌ (ముద్దు ) పేరు పెట్టారు. చీకటి పడగానే ఇంట్లో లైట్లన్నీ వేసుకోవటం ఉండదు,ఎక్కడ కూర్చుంటే అక్కడే వేసుకోవాలి.ఎవరన్నా రాత్రిపూట వస్తే లైట్లు వేయాల్సి వస్తే ఇప్పుడెందుకు వచ్చార్రాబాబూ అనుకుంటాం. ఇంకా ఇలాంటివే రానున్న నాలుగేండ్లలో ఎన్ని స్మార్టు విధానాలను ముందుకు తెస్తారో చూద్దాం ! 2000 సంవత్సరంలో విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా చంద్రబాబు సర్కార్‌ మీద జనం పెద్ద ఎత్తున ఉద్యమించటం, బషీర్‌బాగ్‌ కాల్పుల ఉదంతం, అది కూడా 2004లో తెలుగుదేశం ఓటమికి ఒక ప్రధాన కారణం కావటం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు 2029 ఎన్నికల నాటికి ఒక గండంగా మారటం ఖాయం, జనం స్మార్ట్‌గా పాఠం చెబుతారు !


జగన్‌మోహనరెడ్డి పాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగిందని, దాని మీద కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విచారణకు పిలిపించగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎంత సేపు ప్రశ్నించినా తనకేమీ తెలియదని కసిరెడ్డి రాజశేఖరరెడ్డికే అంతా తెలుసని అతన్ని విచారించాలని సిట్‌కు ఉచిత సలహా ఇచ్చారు. ఒకవేళ అతను ఏదైనా చెబితే దానికి సాక్ష్యాలు ఉండాలి కదా అని వైసిపి అంటోంది. ఇక అసలైన సూత్రధారిగా చెబుతున్న రాజ్‌శేఖర రెడ్డి అజ్ఞాతం నుంచి ఒక ఆడియో పంపి ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదని, తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి సంగతి బయటపెడతానంటూ దానిలో పేర్కొన్నారు. మొత్తం మీద దీన్లో తేల్చేదేమిటో తెలియదు గానీ సిట్‌ దర్యాప్తు పూర్తి చేసి కేసు నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్‌ గురించి ఇడి రంగంలోకి దిగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జనం సూపర్‌ సిక్స్‌ గురించి ఆలోచించకుండా ఇలాంటి విచారణ కబుర్లతో కాలక్షేపం చేసేందుకు బాగా పనికి వస్తుందని చెప్పవచ్చు ! పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి కుంభకోణ మొత్తం ఇప్పటికే తగ్గిపోయింది, చివరికి సున్నాగా తేలుతుందా, కూటమి ప్రభుత్వానికి చివరికి ఆయాసమే మిగులుతుందా ? డబ్బు కొట్టేయలేదని ఎవరూ చెప్పటం లేదు, ఎందుకంటే ప్రతి కుంభకోణం స్మార్డ్‌గా జరిగే రోజులివి !

ఉక్రెయిన్‌ విభజన ? యుద్ధానికి ఆ ముగ్గురే కారణం అన్న ట్రంప్‌ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ పోరులో మిలియన్ల మంది మరణించారంటే దానికి ఆ ముగ్గురే కారణం, నాకేం సంబంధం లేదంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! సోమవారం నాడు ఓవల్‌ ఆఫీసులో విలేకర్లతో మాట్లాడుతూ జో బైడెన్‌, జెలెనెస్కీ సమర్ధులై ఉంటే యుద్ధానికి అవకాశం ఉండేది కాదు, పుతిన్‌ ప్రారంభించి ఉండేవాడే కాదు అన్నాడు . జెలెనెస్కీ గురించి అడగ్గా ‘‘ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నావంటే నువ్వు గెలవగలవా లేదా అనేది తెలుసుకోవాలి, నీకంటే 20 రెట్లు పెద్దవారి మీద యుద్ధం ప్రారంభించకూడదు, ఆ తరువాత కొన్ని క్షిపణులు ఇస్తారని జనాల మీద ఆశ పెట్టుకోకూడదు, ఎంతసేపూ ఎప్పుడు అమెరికా క్షిపణులు అమ్ముతుందా అని ఎదురుచూస్తున్నారు, అక్కడికీ ముందు నేనే జావెలిన్‌ క్షిపణులు ఇచ్చాను. యుద్ధ కారకుల్లో పుతిన్‌ మొదటివాడు, రెండోవాడైన జో బైడెన్‌ గురించి చెప్పాలంటే ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, జెలెనెస్కీ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు, నా వరకైతే యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తా, ఆపగలను, అదే నేను కోరుకుంటున్నా, చావులను ఆపాలని కోరుకుంటున్నా, త్వరలో మీరు మంచి ప్రతిపాదనల గురించి తెలుసుకుంటారు ’’ అన్నాడు. అసలు 2020లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగి ఉండకపోతే తాను గెలిచి ఉంటే ఉక్రెయిన్‌ యుద్దమే వచ్చి ఉండేది కాదని తన స్వంత ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాడు 1,148వ రోజులో ప్రవేశించింది.ఏవైనా అనూహ్య నాటకీయ పరిణామాలు జరిగితే తప్ప ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు ముగిసేది కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఆదివారం నాడు సమీ అనే పట్టణంపై రష్యన్‌ క్షిపణులు, నియంత్రిత బాంబులతో జరిపినదాడిలో 35 మంది మరణించగా, 40 మంది ఆసుపత్రిపాలు కాగా 11మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాడి ఒక చర్చ్‌ మీద జరిగిందని ఉక్రెయిన్‌, కాదు మిలిటరీ అధికారుల సమావేశం మీద అని రష్యా ప్రకటించింది. రష్యా తరఫున కిరాయి సైనికులుగా పని చేస్తున్న ఇద్దరు చైనా జాతీయులను పట్టుకున్నామని ఉక్రెయిన్‌ ప్రదర్శించగా అలాంటిదేమీ లేదని మాస్కో, బాధ్యతా రహితంగా ఆరోపణలు చేయవద్దని బీజింగ్‌ హెచ్చరించింది. చైనీయులను కిరాయి సైనికులుగా తీసుకుంటున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. గతంలో ఉత్తర కారియా నుంచి సైనికులను పంపినట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు చైనాను కూడా వివాదంలోకి లాగే ఎత్తుగడతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ట్రంప్‌ ప్రకటించిన పన్నుల దాడికి తీవ్ర ప్రతిఘటన, దేశీయంగా వ్యతిరేకత వ్యక్తం కావటంతో మూడు నెలల పాటు సుంకాల విధింపు అమలును వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. దాన్నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు లేదా మరొక ఎత్తుగడతో గానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ విభజన మాదిరి ఉక్రెయిన్‌ విభజన గురించి అమెరికా చర్చకు తెరలేపింది. త్వరలో మంచి ప్రతిపాదనలను మీరు చూస్తారని విలేకర్లతో ట్రంప్‌ చెప్పింది దీని గురించే అన్నది స్పష్టం.


ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌ ఉక్రెయిన్‌ విభజన ప్రతిపాదనను వెల్లడిరచాడు. దాని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన మాటలకు తప్పుడు అర్ధం చెప్పారని ఆరోపించాడు. శాంతి ఒప్పందం కుదరాలంటే కోల్పోయిన ప్రాంతాల గురించి మరిచిపోవాలని గతంలోనే ట్రంప్‌, అతగాడి యంత్రాంగం ఉక్రెయిన్‌కు చెప్పింది.ఇప్పుడు కెలోగ్‌ దాన్నే మరింత స్పష్టంగా వెల్లడిరచాడు.అమెరికా పధకం ప్రకారం ఉక్రెయిన్ను నాలుగు ముక్కలుగా చేస్తారు. మొదటి జోన్‌లో బ్రిటన్‌, ఫ్రెంచి దళాలతో పాటు ఇతర దేశాల మిలిటరీ కూడా చేరి పర్యవేక్షణ జరుపుతుంది.రెండవ జోన్‌ పూర్తిగా ఉక్రెయిన్‌ మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. మూడవది ఉక్రెయిన్‌, రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాల మధ్య 29 కిలోమీటర్ల వెడల్పున ఎవరూ ప్రవేశించకూడని ప్రాంతం, నాలుగవది క్రిమియాతో సహా, స్వాతంత్య్రం ప్రకటించుకొని రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. నాటో లేదా నాటో కూటమిలోని దేశాలకు చెందిన మిలిటరీ ఉనికిని ఉక్రెయిన్‌లో అంగీకరించేది లేదని గతంలోనే రష్యా స్పష్టం చేసింది. మొదటి జోన్‌ పేరుతో నాటో దేశాల దళాలను ఉంచాలన్న అమెరికా ఎత్తుగడ ఆరని రావణకాష్టం వంటిదే. రెండవ ప్రపంచ యుద్ధంలో విడదీసి వియత్నాం దక్షిణ ప్రాంతంలో శాశ్వతంగా తిష్టవేసేందుకు అమెరికా వేసిన ఎత్తుగడను అక్కడి జాతీయవాదులు, కమ్యూనిస్టులు ప్రతిఘటించి అమెరికా సేనలను తరిమివేశారు. కొరియాను కూడా అలాగే విభజించి ఉభయ కొరియాలు విలీనం కాకుండా అడ్డుపడుతున్నారు.తైవాన్‌ దీవి చైనా అంతర్భాగమే అని అధికారికంగా గుర్తిస్తూనే చైనా ప్రధాన భూభాగంతో విలీనానికి తగిన తరుణం అసన్నం కాలేదంటూ రెచ్చగొడుతున్నారు. తమ దేశాన్ని విభజించటానికి వీల్లేదని, అన్ని ప్రాంతాలు తమకు రావాల్సిందేనని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ గతంలోనే చెప్పాడు. దీనికి ఐరోపాలోని ఇతర దేశాలు కూడా అంగీకరించే అవకాశాలు లేవు. జర్మనీ విభజనకు ఉక్రెయిన్‌ సమస్యకు అసలు పోలికే లేదు. యుద్ధం కొనసాగితే రష్యన్లు జెలెనెస్కీని బందీగా పట్టుకుంటారని లేదా ఉక్రెయిన్‌ మిలిటరీలోని జాతీయవాదులు, గూఢచార ఏజన్సీ జెలెనెస్కీని పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు.నాలుగు ముక్కలుగా విభజన చేస్తే అక్కడ తమకు పనేమీ ఉండదని, ఇతర చోట్ల వ్యవహారాలను చక్కపెట్టుకోవచ్చని, పరువు దక్కించుకోవచ్చని అమెరికా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రష్యా మీద ఆంక్షలు విధించిన ఐరోపా దేశాలు అక్కడి నుంచి ముడిచమురు తప్ప చౌకగా సరఫరా అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నాయి. దాన్ని కూడా నిలిపివేస్తే అనేక దేశాల్లో పాలక పార్టీలకు నూకలు చెల్లుతాయని భయపడుతున్నారు. అందువలన సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగటం అనేక దేశాలకు ఇష్టం లేదని, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవటమా, అస్తవ్యస్థ పరిస్థితులను ఎదుర్కోవటమా అనే గుంజాటనలో ఉన్నాయి. తన చమురు, గ్యాస్‌ లావాదేవీల వివరాలను బహిర్గతం పరచటం నిలిపివేసిన రష్యా వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు అదే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
సిబిఎస్‌ టీవీ ‘‘60నిమిషాలు ’’ కార్యక్రమంలో ఆదివారం నాడు జెలెనెస్కీతో జరిపిన ముఖాముఖిని ప్రసారం చేసింది.దాని మీద ట్రంప్‌ మండిపడ్డాడు. ఉక్రెయిన్‌ పోరు గురించి తారుమారు చేసిన వాస్తవాల మీద ఆధారపడి ట్రంప్‌ యంత్రాంగం పని చేస్తున్నదని జెలెనెస్కీ ఆరోపించాడు.తాముగా యుద్ధాన్ని ప్రారంభించలేదని, చూస్తుంటే పుతిన్‌ ప్రారంభించిన యుద్ధాన్ని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సమర్ధిస్తున్నట్లు కనిపిస్తున్నదన్నాడు. రష్యా దురాక్రమణదారు, తాము బాధితులమని, పోరు మధ్యలో మరొకదాని కోసం అటూ ఇటూ చూడలేమన్నాడు. అమెరికా మాట మాత్రమే మార్చలేదని, వాస్తవాన్ని కూడా తారుమారు చేసిందని అరోపించాడు. ట్రంప్‌ ఒక నిర్ణయం తీసుకొనే ముందు స్వయంగా వచ్చి పరిశీలించాలన్నాడు. ఎక్కడికైనా వెళ్లి చూడవచ్చు, దాడులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.అమెరికా మా వ్యూహాత్మక, బలమైన భాగస్వామి అయితే సందేహాలున్నాయి. అమెరికా పౌరులను నేను సందేహించను, వారు మాతోనే ఉన్నారు, కానీ దీర్ఘకాలిక యుద్ధంలో ఐరోపా నుంచి అమెరికా దూరంగా జరగవచ్చు అని ఐరోపాలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.అమెరికా లేకపోతే మేము భారీగా నష్టపోతాం,మానవ మరియు భూభాలను కోల్పోతాము. ఏదో విధంగా ఈ యుద్ధాన్ని ముగించాలి అని జెలెనెస్కీ చెప్పాడు.జెలెనెస్కీ వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలనిస్తాయని జెడి వాన్స్‌ కార్యాలయం హెచ్చరించింది. తమ ఉపాధ్యక్షుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కంటే వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవటంపై కేంద్రీకరించాలని పత్రికా కార్యదర్శి టేలర్‌ వాన్‌ కిర్క్‌ ప్రకటించాడు. ఈ కార్యక్రమం వక్రీకరణలతో కూడుకొని ఉన్నందున నియంత్రణ సంస్థ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌(ఎఫ్‌సిస)ి తీసుకొనే చర్యల్లో సిబిఎస్‌ టీవీ ప్రసార అనుమతులను రద్దుతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధించాలని ట్రంప్‌ చెప్పాడు. ఇది బెదిరించటం తప్ప మరొకటి కాదు. ప్రతివారం 60నిమిషాల కార్యక్రమంలో అసభ్యకరమైన, అవమానకరంగా ట్రంప్‌ పేరు ప్రస్తావించుతున్నారు.వాటన్నింటిలో ఇది పరాకాష్ట అని ట్రంప్‌ తన ట్రూత్‌ సామాజిక వేదికలో పోస్టు పెట్టాడు. ఎన్నికలకు ముందు గతేడాది తనకు వ్యతిరేకంగా కమలా హారిస్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మోసపూరితంగా ఎడిట్‌ చేసి కార్యక్రమాన్ని ప్రసారం చేశారంటూ ట్రంప్‌ సిబిఎస్‌ ఛానల్‌ యజమాని పారామౌంట్‌ కంపెనీ మీద కేసు దాఖలు చేశాడు.తమను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ కంపెనీ ఆరోపించింది. ట్రంప్‌ దాఖలు చేసిన 20 బిలియన్‌ డాలర్ల పరువు నష్టం కేసులో ఒక అంగీకారానికి వచ్చేందుకు ఇరు పక్షాలూ మధ్యవర్తిత్వానికి తెరతీసినట్లు గత నెలలో న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.


ఉక్రెయిన్‌లో శాంతికోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవటం అంత తేలిక కాదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ వ్యాఖ్యానించాడు.మూల కారణాల సంగతి చూడకుండా అమెరికా ప్రతిపాదనలను అంగీకరించలేమన్నాడు.అమెరికా కనీసం సమస్యలోతులోకి వెళుతున్నది, ఐరోపా వైపు నుంచి వెర్రి ఆవేశం తప్ప మరొకటి కనిపించటం లేదన్నాడు. అంతకు ముందు ట్రంప్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్‌తో చర్చలు జరిపాడు.పుతిన్‌ శాశ్వత శాంతిని కోరుతున్నాడని, దాని గురించి చర్చించాల్సి ఉందన్నాడు. సంక్లిష్టమైన పరిస్థితి ఉందన్నాడు.మరోవైపున సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు చూస్తున్నారు.ఉక్రెయిన్‌కు ఎలాంటి శషభిషలు లేని మద్దతు అందిస్తున్నట్లు నాటో అధిపతి మార్క్‌ రూటె మంగళవారం నాడు ప్రకటించాడు, ఉక్రెయిన్‌లోని ఒడెసా ప్రాంతాన్ని సందర్శించాడు. అమెరికా పార్లమెంటు దిగువ సభలో ఉక్రెయిన్‌కు మరింతగా మిలిటరీ సాయం అందించాలని, రష్యాపై ఆంక్షలను పెంచాలని తదితర అంశాలతో డెమాక్రాట్లు ఒక బిల్లును ప్రదిపాదించగా దాన్ని బహిర్గతం చేయలేదు. దీర్ఘశ్రేణి తారుస్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలనే జర్మనీ నిర్ణయాన్ని మాస్కో తప్పు పట్టింది. పరిస్థితిని మరింత దిగజార్చేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని హెచ్చరించింది. ఆయుధాల కొనుగోలుకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని బ్రిటన్‌ నిర్ణయించింది. ఉక్రెయిన్‌లో పోరు విషయానికి వస్తే రష్యన్లు ఎత్తుగడలను మార్చి మెల్లమెల్లగా దాడులను విస్తరిస్తున్నారు. ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటించే స్థితిలో లేదు.ఐరోపా దేశాలు పరువు కోసం పాకులాడుతున్నాయి. ఉక్రెయిన్‌ పోరులో రష్యా గెలిస్తే రానున్న రోజుల్లో తమ భవిష్యత్‌ మరింతగా ఇబ్బందుల్లో పడుతుందని అవి అంతర్గతంగా భయపడుతున్నాయి.

ఆకాశానికి, బిజెపి అవకాశవాదానికి హద్దే లేదు :నాడు తెలంగాణాలో బండి సంజయ్‌, నేడు అన్నాడిఎంకె ఓట్ల కోసం అన్నామలై బలి !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


తమిళనాడులో చరిత్ర పునరావృతమైంది. అధికారం కోసం మరోసారి అన్నాడిఎంకెతో బిజెపి ఎన్నికల ఒప్పందం చేసుకుంది.కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో 2025 ఏప్రిల్‌ 11న మైత్రీ బంధాన్ని ప్రకటించారు. ఈ కూటమికి అధికారం వస్తుందో రాదో తెలియదుగానీ ఈ పరిణామంతో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై పదవి మాత్రం పోయింది.అంటే అన్నారని అంటారు గానీ వీరశూర ప్రతిజ్ఞలు చేయాలని అతగాడిని ఎవరైనా కోరారా ? తెలంగాణా ఎలక్షన్‌ రెడ్డి(తూర్పు జగ్గారెడ్డి) మాదిరి గడ్డం ప్రతిజ్ఞ చేస్తే వేరు. డిఎంకె ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు తాను చెప్పులు ధరించేది లేదంటూ 2024 డిసెంబరు 28న తన ఇంటి ముందు ఆరుసార్లు కొరడా దెబ్బలు కొట్టుకొని పెద్ద ప్రదర్శన చేశారు. అదేమీ లేకుండానే 2025 ఏప్రిల్‌ 12న చెప్పులు వేసుకున్నారు.ఎందుకంటే అన్నాడిఎంకెతో కలసి బిజెపి విజయానికి ఇప్పటికే అమిత్‌ షా బాట వేసినందున నిరసన విరమించాలంటూ కొత్త అధ్యక్షుడు నాగేంద్రన్‌,కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్‌, ఇతర నేతలు కలసి ఒక కార్యక్రమంలో చెప్పులు అందచేశారు. స్వయంగా పరువు తీసుకోవటం, విధి వైపరీత్యం అంటే ఇదే కదా ! అతగాడితో కలసి పని చేయటం తమకు అంగీకారం కాదని, రాష్ట్ర బిజెపి సారధిగా మరొకరిని పెట్టాలని అన్నాడిఎంకె విధించిన షరతుకు బిజెపి తలొగ్గింది. గతంలో అన్నాడిఎంకె నేతగా ఉన్న నైనార్‌ నాగేంద్రన్ను ఎంపిక చేసింది. 2019లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. తరువాత అన్నామలై బిజెపి అధ్యక్ష పదవి స్వీకరించిన తరువాత మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామిని పదే పదే రెచ్చగొట్టే విధంగా విమర్శించారు. అతని వ్యాఖ్యలతో మైనారిటీల ఓట్లు పోతాయని కూడా అన్నాడిఎంకె భయపడిరది. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఓడిరచేందుకు ఉప్పు నిప్పుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి చేతులు కలిపి విజయం సాధించటంతో అదే ఫార్ములాతో తమిళనాడులో కూడా గెలవాలని రెండు పార్టీల నేతలు కొంతకాలంగా ఆలోచనలు చేస్తున్నారు. అడ్డుగా ఉన్న అన్నామలైని తప్పించారు.

అధికారం వస్తుందంటే బిజెపి దేనికైనా సిద్దపడుతుంది. విలువలు, వలువల గురించి కబుర్లు చెప్పే ఆ పార్టీకి ఇతరులకు తేడా లేదు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగిస్తామని స్వయంగా ప్రకటించిన పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డిని కూర్చోపెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయింది. వ్రతం చెడ్డా ఫలందక్కలేదనట్లు బిజెపి పరిస్థితి తయారైంది. బండి సంజయ్‌ను తొలగించినా మిన్నువిరిగి మీద పడలేదు, ఇప్పుడు అన్నామలైని తొలగించినా అంతే. నోటి దురుసులో ఇద్దరూ ఇద్దరే. తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీకి అది తోకగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి మధ్యవర్తి పవన్‌ కళ్యాణ్‌ లాంటి వారెవరూ లేకపోతే నేరుగా కేంద్ర బిజెపి నాయకత్వం బేరం కుదుర్చుకుంది. ఇటీవల ఆమోదించిన వక్ఫ్‌ చట్ట సవరణను వ్యతిరేకించిన వారిని ముస్లిం సంతుష్టీకరణ పార్టీలుగా వర్ణించింది. వాటిలో అన్నాడిఎంకె ఒకటి. శుభకార్యానికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇప్పుడు బిజెపి నేతలను చంకనెక్కించుకొని ముస్లింల ఓట్లను అర్ధించటం ఆ పార్టీకి పెద్ద పరీక్ష. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డిపిఐ)ని ఉగ్రవాద పార్టీ అని బిజెపి వర్ణించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె మద్దతుతో అది ఒక స్థానానికి పోటీ చేసింది. ఇప్పుడు ఎస్‌డిపిఐ కూటమిలో భాగస్వామిగా కొనసాగితే బిజెపి దాని అభ్యర్థులను ఎలా బలపరుస్తుంది, సమర్ధిస్తుందన్నది ప్రశ్న.ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు ! మమ్మల్ని విమర్శించే వారేమైనా నాలుగు ఓట్లు వేయిస్తారా, ఒకటో అరో సీటు తెప్పిస్తారా !! అనుకున్నట్లుగా ఉంది. రాష్ట్రానికి పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ ధ్వజమెత్తి వాటినే మహాప్రసాదంగా స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌ మాదిరి అన్నాడిఎంకె నేత పళనిస్వామి కూడా తమిళనాడుకు బిజెపి చేసిన అన్యాయాల గురించి నిన్నటి వరకు ధ్వజమెత్తారు. ఆకస్మికంగా అదే పార్టీతో చేతులు కలిపితే తమిళ తంబీలు ప్రశ్నించకుండా ఉంటారా ? అంతకు ముందు బిజెపితో కలసి ఉన్నపుడు సంకీర్ణ ధర్మంగా సిఏఏను సమర్ధించామని విడిపోయిన తరువాత విమర్శించామని చెప్పుకున్న ఆ పెద్దమనిషిని మైనారిటీలు నమ్ముతారా ? అదే తర్కం ప్రకారం కొద్ది రోజుల క్రితం వ్యతిరేకించిన వక్ప్‌ చట్టానికి ఇప్పుడు జైకొట్టరనే హామీ ఏమిటి ?సినిమా నటుడు విజయ్‌ నాయకత్వంలోని టివికె పార్టీతో చేతులు కలపాలని తొలుత అన్నాడిఎంకె భావించి పావులు కదిపింది. విజయ్‌ అంగీకరించకపోవటంతో స్వంతంగా డిఎంకెను ఓడిరచలేమని గ్రహించి బిజెపిని కలుపుకుంది. బిజెపితో తెగతెంపులు చేసుకున్నా 2024లో మైనారిటీల ఓట్లు రాలేదని అందువలన తిరిగి ఆ పార్టీతో చేతులు కలిపినా నష్టం లేదన్నది అన్నాడిఎంకె అంతర్గత ఆలోచన అని కూడా చెబుతున్నారు.

ఐపిఎస్‌ అధికారి అన్నామలై (40) 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి 2020 బిజెపిలో చేరారు, 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే పోలీసు అధికారిగా పనిచేశారు. బిజెపిలో చేరగానే ఇతర పార్టీల తోలువలిచి, తాటతీసే మొనగాడిగా సింహం అంటూ ప్రచారం సాగించారు.2024లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరులో డిఎంకె చేతిలో ఓడిపోయారు. కొంగు ప్రాంతంలో బలమైన గౌండర్‌ సామాజిక తరగతిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అన్నాడిఎంకె నేత ఎడప్పాడి కె పళనిస్వామి కూడా అదే ప్రాంతం, అదే సామాజిక తరగతికి చెందిన వ్యక్తి. అన్నామలై బిజెపి అధ్యక్షుడిగా ఉంటే పొత్తు ఉండదని కరాఖండితంగా చెప్పటంతో బిజెపి అగ్రనాయకత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇస్తామని అమిత్‌ షా గట్టిగా చెప్పలేదు, మా గురించి మీకెందుకు ఆందోళన అంటూ విలేకర్లను ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఆ హోదాతో తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంటే పళనిస్వామి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. పార్టీ పదవి నుంచి తొలగించటాన్ని అన్నామలై అభిమానులు వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు. అన్నాడిఎంకెతో పొత్తు వార్తలు వెలువడిన సమయంలో ఉద్వాసన ఖాయమని తేలటంతో విధిలేక తాను మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయటం లేదని ప్రకటించారు.
2024లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె,బిజెపి విడివిడిగా పోటీ చేశాయి.ఈ రెండు కూటముల ఓట్లు కలిస్తే 13లోక్‌సభ నియోజకవర్గాలలో మెజారిటీ వచ్చిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగానే ఒప్పందం చేసుకొని కలసి పోటీ చేస్తే అధికారం ఖాయమనే అభిప్రాయంతో అవి కలిశాయి.లోక్‌సభ ఓటింగ్‌ వివరాలను చూసినపుడు త్రిముఖ పోటీ జరిగింది. డిఎంకె నాయకత్వంలోని కూటమి మొత్తం 39 స్థానాలను గెలుచుకుంది.ఇండియా కూటమికి 46.97, అన్నాడిఎంకె కూటమి 23.05, బిజెపి కూటమి 18.28,ఎన్‌టికె అనే ప్రాంతీయ పార్టీ 8.2శాతం చొప్పున ఓట్లు పొందాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ చూస్తే మొత్తం 234కు గాను ఇండియా కూటమి 221, అన్నాడిఎంకె 10, బిజెపి కూటమి మూడు సీట్లలో మెజారిటీ తెచ్చుకున్నాయి. అయితే బిజెపికి ఒక్క సీటులోనూ మెజారిటీ రాలేదు, దానితో కలసి పోటీ చేసిన పిఎంకె మూడు చోట్ల ఆధిక్యత కనపరిచింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ తమిళనాడును ఏడుసార్లు సందర్శించినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం,జనసేన, బిజెపి పరస్పరం ఎలా తిట్టుకున్నాయో 2019 ఎన్నికల్లో చూశాము. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనుసరించిన అప్రజాస్వామిక, కక్షపూరితమైన, బిజెపికి లంగుబాటు వైఖరిని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయటం వంటి తీరును డిఎంకె నేత ఎంకె స్టాలిన్‌ అనుసరించలేదు. అన్నింటికీ మించి తమిళనాడుకు చేసిన అన్యాయం, డీలిమిటేషన్‌, హిందీని బలవంతంగా రుద్దేందుకు పూనుకున్న బిజెపిని ఎలాంటి తొట్రుపాటు లేకుండా వ్యతిరేకించి ఎండగడుతున్నారు.అందువలన ఆంధ్రప్రదేశ్‌ మాదిరి ఫలితాలను ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ప్రముఖ హీరో విజయ్‌ స్వంత దుకాణం పెట్టుకొని బిజెపి, ఇండియా కూటమి రెండిరటినీ వ్యతిరేకిస్తానని ప్రకటించాడు. అన్నాడిఎంకె నుంచి ఉద్వాసనకు గురైన పన్నీర్‌ సెల్వం,టిటివి దినకరన్‌ వంటి వారు ఏ వైఖరి తీసుకుంటారో వెల్లడి కాలేదు. డీలిమిటేషన్‌, భాషా సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్నాడిఎంకె, బిజెపి మిత్రపక్షమైన పిఎంకె కూడా మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు బిజెపితో కలసి ఈ పార్టీలు ఈ అంశాలపై జనానికి ఏం చెబుతాయన్నది ప్రశ్న. ఇలాంటి తలనొప్పులు ఇండియా కూటమి పార్టీలకు లేదు. ఒకే మాట, బాటలో నడుస్తున్నాయి. వీటిని వ్యతిరేకించే పార్టీలకు డిఎంకెను గద్దె దించటం తప్ప ఎలాంటి భావసారూప్యత లేదు.


ఇతర పార్టీల వారు ఇప్తార్‌ పార్టీలకు వెళితే ముస్లింలను సంతుష్టీకరించేందుకు అని బిజెపి దాడి చేస్తుంది. మరి అదే పార్టీ ఈ ఏడాది ఏకంగా ఇప్తార్‌ విందు ఏర్పాటు చేసింది, ఎందుకు అంటే తమకు అందరూ ఒకటే అని చెప్పింది. దీన్నే తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటారు. అన్నాడిఎంకెతో చేతులు కలపటం గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే అన్నామలై ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందుకు బిజెపి మిత్రపక్ష నేతలైన మాజీ సిఎం పన్నీర్‌ సెల్వం, టిటివి దినకరన్‌ తదితర నేతలు హాజరయ్యారు. ఇప్తార్‌ విందు కేవలం ప్రారంభం మాత్రమే, మేమంతా కలసి కూర్చుని ఐక్యమై తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అదే విందుకు వచ్చిన మాజీ తెలంగాణా గవర్నర్‌ తమిళశై సౌందర్‌రాజన్‌ అన్నారు.తనకు అధికారమిస్తే ఇప్తార్‌తో పాటు దీపావళి, క్రిస్మస్‌ విందులను అధికారికంగా ఇస్తానని అన్నామలై చెప్పుకున్నాడు. ఇతర బిజెపి అధ్యక్షుడు ఎవరైనా ఇప్తార్‌ ఇచ్చారా అని విలేకర్లతో గొప్పగా చెప్పుకున్నాడు. అర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ముస్లిం నేషనల్‌ ఫోరమ్‌ దేశవ్యాపితంగా ఇప్తార్‌ విందులు ఇస్తామని గతంలో ప్రకటించింది.రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్లు, ఒకే సామాజిక తరగతి, ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కూడా అంతే. దీనికి తోడు అన్నామలై 2023లో మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామి గురించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు అన్నాడిఎంకె వేరుపడటానికి కారణమైతే ఇప్పుడు అతగాడిపదవికి ఎసరు తెచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు అన్నామలై బిజెపి నేతలకు కొత్తదేవుడిగా కనిపించటంతో అన్నాడిఎంకెను వదులుకొనేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మోజు రింది గనుక అదే పార్టీతో చేతులు కలిపేందుకు పక్కన పెట్టారు. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది పెద్ద ప్రశ్న !

మరింత ముదిరిన వాణిజ్య పోరు : చైనా, అమెరికాల్లో ముందు ఓడేది ఎవరు ? మోడీది స్థితప్రజ్ఞతా లేక లొంగుబాటా ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేసు ఓడిన వారు కోర్టులో ఏడుస్తారు, గెలిచిన వారు ఇంట్లో ఏడుస్తారనే లోకోక్తి తెలిసిందే. అంటే గొడవ పడి కోర్టుకు ఎక్కితే ఇద్దరూ నష్టపోతారని అర్ధం, అలాగే వాణిజ్య పోరులో విజేతలెవరూ ఉండరని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా ఎవరూ వినటం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యపోరు 2.0లో ముందు ఓడేది అమెరికానా లేకా చైనా వారా అన్నది కొందరి మీమాంస. మొగ్గు అమెరికావైపే కనిపిస్తున్నది, ఏమైనా జరగవచ్చు. బస్తీమే సవాల్‌ అంటూ ప్రపంచం మీద తొడగొట్టింది ట్రంప్‌. దానికి ప్రతిగా చూసుకుందాం రా అంటూ మీసం మెలివేస్తున్నది చైనానేత షీ జింపింగ్‌. అయినను పోయి రావలె హస్తినకు అన్నట్లుగా ట్రంప్‌తో రాయబారాలు, బేరాలు చేసినప్పటికీ కుదరకపోవటంతో చేసేదేముంది మనమూ గోదాలోకి దిగుదాం అని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. కొంత మందికి దిక్కుతోచక నోట మాట రావటం లేదు. మన విషయానికి వస్తే దానికి స్థిత ప్రజ్ఞత అని ముద్దు పేరు పెట్టి నరేంద్రమోడీకి ఆపాదించి సామాజిక మాధ్యమంలో ఆకాశానికి ఎత్తుతున్నారు. చైనా ప్రతిసవాలును షీ జింపింగ్‌ ఆవేశంగా వర్ణిస్తున్నారు.మోడీని కొందరు గోపి అంటుంటే 56 అంగుళాల ఛాతీకీ ఏమైందని అనేక మంది విస్తుపోతున్నారు. సాధారణ సమయాల్లో పౌరుషం, వీరత్వం గురించి మీసాలు మెలేయటం, తొడగొట్టటాలు కాదు, ఓడతామా గెలుస్తామా అన్నదీ కాదు, పరీక్షా సమయం వచ్చినపుడు ఏం చేశారనేదే గీటురాయి. పృధ్వీరాజ్‌ను ఓడిరచేందుకు పరాయి పాలకులతో చేతులు కలిపి ద్రోహానికి మారుపేరుగా తయారైన జయచంద్రుడు బావుకున్నదేమీ లేదు, చివరికి వారి చేతిలోనే చచ్చినట్లు చరిత్ర చెబుతున్నది.


అనేక ఆటంకాలు, ప్రతిఘటనలు, కుట్రలు, కూహకాలను ఎదుర్కొంటూ ప్రపంచ అగ్రరాజ్యానికి పోటీగా ఎదుగుతున్నది చైనా. 2024లో అమెరికా జిడిపి 29.2లక్షల కోట్లు కాగా చైనా 18.9లక్షల కోట్లతో ఉండగా వృద్ధి రేటు 2.8, 5శాతం చొప్పున ఉన్నాయి. అంటే త్వరలో అమెరికాను అధిగమించనుంది. పిపిపి పద్దతిలో ఇప్పటికే చైనా అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద పరీక్ష పెట్టిన మాట నిజం. చైనా వస్తువుల మీద 145శాతం పన్నులు విధించిన ట్రంప్‌కు అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు అమెరికా న్యాయమూర్తి ఒకడు 400శాతం విధించి కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సలహా ఇచ్చాడు.జపాన్‌ సామ్రాజ్యవాదుల ఆక్రమణకు,కొరియాలో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడిన చైనా కమ్యూనిస్టు పార్టీ వారసుడు షీ జింపింగ్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో పాత్రలేకపోగా లొంగిపోయి సేవ చేసుకుంటామని లేఖలు రాసి ఇచ్చిన వారి వారసుడు నరేంద్రమోడీ. అందువలన అమెరికా సామ్రాజ్యవాదం, దానికి ప్రతినిధిగా ఉన్న ట్రంప్‌ను వ్యతిరేకించటంలో ఆ తేడా ఉండటం సహజం.
ఇది రాసిన సమయానికి చైనా వస్తువుల మీద పెంటానిల్‌ పన్ను 20శాతంతో కలిపి అమెరికా 145శాతం పన్ను విధించగా ప్రతిగా 125శాతం విధించినట్లు చైనా ప్రకటించింది. పోరు రెండు దేశాలకే పరిమితమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా కేసును కూడా దాఖలు చేసింది. చైనాను దుష్టశక్తిగా అమెరికా చూపుతున్నది.ఈ పోరు ప్రపంచ, అమెరికా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని బడా వాణిజ్య సంస్థల హెచ్చరిక, తక్షణమే చర్చలు జరపాలని అమెరికా`చైనా వాణిజ్య మండలి పిలుపు, చైనా వైపు నుంచి చర్చలకు చొరవ ఉండదని నిపుణుల అభిప్రాయం, తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ చైనా మోహరిస్తున్నది, బీజింగ్‌ను వంటరి చేసేందుకు అనేక దేశాల మీద సుంకాలను రద్దు చేసిన ట్రంప్‌, అమెరికాను వ్యతిరేకించే శక్తులను కూడగడుతున్న చైనా. మార్కెట్లలో అనిశ్చితిని చూస్తే ఇప్పటికే నష్టం జరిగినట్లు కనిపిస్తోంది.


‘‘మీరు అమెరికాను కొడితే మా అధ్యక్షుడు ట్రంప్‌ మరింత గట్టిగా కొడతాడు ’’ అని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కరోలిన్‌ లీవిట్‌ ప్రకటించారు. పెద్ద పెద్ద అరుపులకు, ఉడుత ఊపులకు భయపడే రకం కాదు మేం అంటూ తాపీగా చైనా ప్రకటన. ఆకాశం ఊడిపడదంటూ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీ వ్యాఖ్య. అమెరికా మార్కెట్ల మీద ఆధారపడటాన్ని తగ్గించుకుని అంతర్గత మార్కెట్‌ను విస్తరిస్తున్నామని పేర్కొన్నది. అయితే చర్చలకు ద్వారాలు మూయలేదని కూడా తెలిపింది. తొలిసారి 2018లో ట్రంప్‌ వాణిజ్య పోరును ప్రారంభించిన నాటి నుంచి చైనా తన అస్త్రాలన్నింటినీ అవసరాల మేరకు ప్రయోగిస్తున్నది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించింది, ఎగుమతులను నియంత్రిస్తున్నది.అమెరికా కంపెనీలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నది.కొన్నింటి మీద నియంత్రణలను అమలు చేస్తున్నది. విలువైన ఖనిజాలను అమెరికాకు అందకుండా చూస్తున్నది. ‘‘ అమెరికాకు వ్యతిరేకంగా బీజింగ్‌ తన అమ్ముల పొది మొత్తాన్ని ఇప్పుడు వినియోగిస్తున్నది.వారు బంకర్‌(దాడుల నుంచి తట్టుకొనే భూ గృహం) నిర్మిస్తున్నారు, నేనే గనుక షీ జింపింగ్‌ను అయితే నేడు డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే మరింత సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తా ’’ అని అమెరికా అట్లాంటిక్‌ కౌన్సిల్‌కు చెందిన మెలాని హార్ట్‌ వ్యాఖ్యానించాడు.


మూడు నెలల పాటు తాను ప్రకటించిన పన్నుల యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన దేనికి సూచన అని పండితులు చర్చలు చేస్తున్నారు. చైనాకు ప్రపంచ మార్కెట్ల మీద గౌరవం,శ్రద్ద లేదని ట్రంప్‌ ఆరోపణ, బీజింగ్‌ మీద కోపం ఉంటే యావత్‌ ప్రపంచం మీద ప్రతికూల పన్నులెందుకు ప్రకటించినట్లు ? అతగాడి నిర్వాకం కారణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయన్నది తెలిసిందే. మూడు నెలల వాయిదా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలను కొద్ది రోజుల ముందు ట్రంప్‌ యంత్రాంగం తోసి పుచ్చింది. తమ మంత్రిత్వశాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వారంతా ఒప్పందం చేసుకోవటానికి చచ్చిపోతున్నారన్నాడు.రిపబ్లికన్‌ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మనకు ఫోన్లు చేస్తున్న వారు ప్లీజ్‌ ప్లీజ్‌ సర్‌ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను అని చెబుతున్నారని, చివరకు నా….ను ముద్దు పెట్టుకుంటున్నారని నోరుపారవేసుకున్నాడు. ఎక్కువ పన్నులు విధించిన దేశాల నుంచి సరకులను దిగుమతి చేసుకొని వాటికి మన ముద్ర వేసి తిరిగి ఎగుమతి చేయవద్దని మన వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ మన ఎగుమతిదార్లను హెచ్చరించారు.పిటిఐ వార్త మేరకు చైనా, ఇతర ఆసియన్‌ ఆదేశాల సరకులను మన దేశం నుంచి ఎగుమతి చేయవద్దని చెప్పారట. మన ఎగుమతిదార్లు అలాంటి పనులు చేస్తున్నట్లు గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు అలా మాట్లాడారంటే అమెరికా మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. ఏ దేశం నుంచి ఏ సరకు వస్తోందో తిరిగి ఎక్కడికి వెళుతోందో తెలుసుకోలేనంత అధ్వాన్నంగా మన నిఘా సంస్థలు, వాటిని నడిపిస్తున్న ప్రభుత్వం ఉందా ?

అసలు పన్నుల వాయిదా నిర్ణయానికి దారితీసిందేమిటి ? మొదటి కారణంగా చెప్పుకోవాలంటే ఏప్రిల్‌ ఐదున 150 సంస్థల పిలుపు మేరకు 20లక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. వెనక్కు తగ్గకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తొలుత మద్దతు ప్రకటించిన ద్రవ్య పెట్టుబడిదారులు, ఇతరులు కూడా పర్యవసానాలను చూసి వైఖరి మార్చుకుంటున్నారు. ఒక్కరంటే ఒక్క ఆర్థికవేత్త కూడా సానుకూలంగా మాట్లాడిన ఉదంతం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతుందన్న భయం పెరిగింది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత భారీగా పెరుగుతుందని ఆశించిన ఎలన్‌ మస్క్‌ సంపద ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. చైనాతో ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్‌ను మస్క్‌ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది. చైనా వెనక్కు తగ్గకపోగా ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది.23 బిలియన్‌ డాలర్ల పన్ను విధిస్తామన్నది. ట్రంప్‌ మాదిరి అది కూడా ప్రతికూల సుంకాలను 90 రోజులు వాయిదా వేసింది. పన్నుల విధింపులో కీలక పాత్ర పోషించిస సలహాదారు పీటర్‌ నవారో, ఎలన్‌మస్క్‌ రోడ్డెక్కి అంతా నువ్వే చేశావంటే నువ్వే చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విదేశాల నుంచి విడి భాగాలు తీసుకొచ్చి అసెంబ్లింగ్‌ చేసి ఇక్కడే కార్లను తయారు చేస్తున్నట్లు చెప్పుకోవటం ఒక గొప్పా అన్నట్లు మస్క్‌ మీద నవారో ధ్వజమెత్తాడు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలన్న పిలుపుకు పెద్ద స్పందన కనిపించటం లేదు. ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన వారు వాటిని అమ్మి సొమ్ము చేసుకొని అమెరికా వెలుపల పెట్టుబడులు పెడుతున్నారు. లొంగుబాటును ప్రదర్శించే దేశాల మీద కొన్ని ఒప్పందాలను రుద్ది దక్కిన మేరకు లబ్ది పొందే ఎత్తుగడ కూడా కనిపిస్తున్నది.


గతంలో కమ్యూనిజం బూచిని చూపి దాన్ని వ్యతిరేకించే దేశాలన్నింటినీ అమెరికా కూడగట్టింది. ఇప్పుడు ప్రపంచం తన అడుగుజాడల్లో నడవటం లేదన్న అక్కసుతో ట్రంప్‌ దేశాలన్నింటి మీద యుద్ధం ప్రకటించాడు.తనకు తానే అమెరికాను ఒంటరిపాటు చేశాడు.కొలిమిలో కాలినపుడే ఇనుమును సాగదీయాలన్న సూత్రానికి అనుగుణంగా అమెరికా దిగిరావాలంటే దాని బాధిత దేశాలన్నీ ఏకం కావటం తప్ప మరొక మార్గం లేదు.కొన్ని తొత్తు దేశాలు కలవక పోవచ్చు, విభీషణుడి పాత్ర పోషించవచ్చు. మన దేశం ఎలాంటి ప్రకటన చేయకపోయినా మాకు అందరూ కావాలి ఎవరితో కలవం అని ఆస్ట్రేలియా చెప్పుకుంది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తనతో కలసి పని చేస్తున్న ఐరోపా దేశాలను పక్కన పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్‌ను నమ్మేదెలా అని ఆలోచిస్తున్న తరుణంలో వాటి మీద కూడా పన్నుల యుద్ధం శంఖారావం పూరించాడు. ఒంటరి పోరుకు సిద్దం అవుతూనే అలాంటి దేశాలన్నింటినీ కూడ గట్టేందుకు చైనా పూనుకుంది. ఎంత మేరకు విజయవంతమౌతుందనేది వేరే అంశం. చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ ఫోన్లో ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లియాన్‌తో మాట్లాడాడు.తరువాత వాణిజ్య ప్రతినిధులు మాట్లాడుకున్నారు. పది ఆగ్నేయాసియా దేశాల కూటమితో కూడా చైనా సంప్రదింపుల్లో ఉంది. ఏం జరగనుందనే ఆసక్తి సర్వత్రా పెరుగుతున్నది, ముందుగా ఎవరు మునుగుతారన్నది చర్చగా మారుతున్నది.

మింగుడు పడని ట్రంప్‌ మాత్ర : 20లక్షల మంది నిరసన, రక్తమోడిన స్టాక్‌ మార్కెట్లు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


డాక్టర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల మాత్ర వైకుంఠయాత్రగా మారిందా ? అది వికటించి ప్రపంచమంతా అతలాకుతలం, స్టాక్‌మార్కెట్లు రక్తమోడాయి. ఒక వైపు ధరల పెరుగుదల భయంతో అమెరికాలో వేలం వెర్రిగా కొనుగోళ్లకు పరుగులు తీసిన జనం. వారే మరోవైపు డోనాల్ట్‌ ట్రంప్‌, అతగాడి ఆత్మ ఎలన్‌ మస్క్‌ విధానాలను వ్యతిరేకిస్తూ 150 సంస్థల పిలుపు మేరకు ఏప్రిల్‌ ఐదవ తేదీన మా జోలికి రావద్ద్దు (హాండ్స్‌ ఆఫ్‌) నినాదంతో 20లక్షల మంది దేశమంతటా ప్రదర్శనలు జరిపారు.ప్రపంచ వ్యాపితంగా మూడవ రోజు సోమవారం కూడా స్టాక్‌ మార్కెట్లు పతనమై 9.5లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరి. హంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీ గరిష్టంగా 13శాతం కుదేలైంది. మంగళవారం నాడు మనదేశంతో సహా ఆసియా దేశాల మార్కెట్లు కొద్దిగా తేరుకున్నాయి. నేనైతే తగ్గాలనుకోవంటం లేదు, ఏదన్నా జరిగినపుడు కొన్ని సమయాల్లో ఒక గోలీ వేసుకోకతప్పదు అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికన్ల హక్కులు, స్వేచ్చల మీద దాడి చేస్తూ బలవంతంగా లాక్కుంటున్నారంటూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుల పిలుపు మేరకు జనం స్పందించారు. అక్కడి 50 రాష్ట్రాల రాజధానులు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు 1,400కుపైగా చిన్నా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌, పారిస్‌ వంటి ఇతర దేశాల నగరాల్లో కూడా నిరసన తెలిపారు. ధనవంతుల పాలన ఇంకే మాత్రం సాగదు, వారికి జన ఘోష వినిపించేట్లు చేస్తామంటూ ప్రదర్శకులు నినదించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని సంతకాలు చేసిన వారే దాదాపు ఆరులక్షల మంది ఉన్నారు.


వాషింగ్టన్‌ డిసిలోని జార్జి వాషింగ్టన్‌ స్మారక స్థూపం వద్ద ప్రధాన సభ జరిగింది. అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు లిజ్‌ షూలెర్‌ ప్రధాన వక్త.పోరాడేవారి నోరు మూయించేందుకు ట్రంప్‌ సర్కార్‌ చూస్తున్నది కానీ ఆటలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వంతో బేరమాడే హక్కులను యూనియన్లకు లేకుండా కాలరాస్తోందని, కార్మిక సంఘాలను దెబ్బతీస్తోందన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎవరెట్‌ కెలీ మాట్లాడుతూ ఉద్యోగులను సులభంగా దెబ్బతీయవచ్చని ట్రంప్‌ మరియు మస్క్‌ భావిస్తున్నారు, మాసభ్యులు మిలిటరీలో పనిచేసిన వారే అని గుర్తుంచుకోవాలని, తమను బెదిరించలేరని హెచ్చరించాడు. డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జామీ రస్కిన్‌ మాట్లాడుతూ అమెరికాను స్థాపించిన వారు రాసిన రాజ్యాంగం మేము పౌరులం అంటూ ప్రారంభమైంది తప్ప మేము నియంతలం అని కాదన్నాడు. ఇక్కడ ప్రదర్శనకు పది వేల మంది వస్తారనుకుంటే పది రెట్లు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వాషింగ్టన్‌ నగరంలో ప్రదర్శన చేసిన వారు కిరాయిబాపతు తప్ప మరొకటి కాదని ఎలన్‌ మస్క్‌ నోరుపారవేసుకున్నాడు. ఆ మేరకు తన ఎక్స్‌లో అనేక వీడియోలను పోస్టు చేశాడు. వారెందుకు ప్రదర్శన చేశారో కూడా వారికి తెలియదన్నాడు. నిరసనకారులు ట్రంప్‌ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో లక్షా 21వేల మంది కేంద్ర ఉద్యోగులను తొలగించిన ఎలన్‌ మస్క్‌ను కూడా అంతే నిరసిస్తున్నారు. రానున్న పది సంవత్సరాలలో ధనికులకు ఐదులక్షల కోట్ల డాలర్ల మేర పన్నుల రాయితీ ఇస్తూ ట్రంప్‌ సర్కార్‌ ఇటీవల నిర్ణయించింది. ఇదే సమయంలో వైద్యం, పెన్షన్‌ వంటి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున కోతలను ప్రతిపాదించింది.తమ మీద మరిన్ని భారాలను మోపే పన్నులతో పాటు ఈ విధానాలకు కూడా శనివారం నాడు నిరసన వెల్లడిరచారు. ట్రంప్‌ వెనక్కు తగ్గకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది.


ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చైనా వ్యాఖ్యానించింది. ఈనెల తొమ్మిదవ తేదీలోగా చైనా వెనక్కు తగ్గాలని లేకుంటే మరో 50శాతం వడ్డిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు.ఎవరూ తగ్గకపోతే చైనా వస్తువులపై ట్రంప్‌ పన్ను 104శాతానికి చేరనుంది. అతగాడిని ప్రసన్నం చేసుకొనేందుకు మనదేశం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఎక్స్‌ తదితర కంపెనీలకు లబ్ది కలిగేలా డిజిటల్‌ సర్వీసు పన్ను రద్దు చేసింది. ఖరీదైన మోటారు సైకిళ్లు, విస్కీల మీద పెద్ద మొత్తంలో తగ్గించింది. ఇంత చేసిన తరువాత రెండు దేశాల మధ్య ఒప్పందం సంగతి తేల్చాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రి మార్కో రూబియోకు ఫోన్లు చేస్తున్నారు. పారిశ్రామిక వస్తు ఎగుమతులు, దిగుమతుల మీద ఎలాంటి పన్ను విధించకూడదని తాము కోరుతున్నామని, వీటి మీద చర్చలకు సిద్దం, కుదరకపోతే తాము కూడా ప్రతికూల పన్నులు వేసేందుకు సన్నద్దమౌతున్నట్లు ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ చెప్పారు. మూడు నెలల పాటు పన్నుల వసూలు వాయిదా వేయాలన్న సూచనను ట్రంప్‌ తిరస్కరించాడు. అయినప్పటికీ మంగళవారం నాడు ప్రారంభంలో ఆసియా స్టాక్‌్‌ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి.


అమెరికాలో బహుళజాతి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న ట్రంప్‌, వారి కనుసన్నలలో పని చేసే మీడియా సంస్థలు అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. మెక్సికో నుంచి చైనా పెంటానిల్‌ అనే మత్తు మందును అక్రమంగా సరఫరా చేస్తోందని, అక్రమ వలసలు అమెరికాను దెబ్బతీస్తున్నాయని చేసిన ప్రచారం నిజంగా అసలు సమస్యలే కాదు. వాటిని అరికట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆ సాకుతో వాణిజ్యం యుద్దం చేయాల్సిన అవసరం లేదు. అధికారానికి వచ్చిన వెంటనే అక్రమవలసదారులను స్వదేశాలకు పంపేపేరుతో చేసిన హడావుడి తరువాత ఎందుకు కొనసాగించలేదు. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ధరలు తగ్గుతాయి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, దిగుమతులపై పన్నులు అమెరికన్ల ఉపాధిని కాపాడతాయి, ఇందుకోసం తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను భరించకతప్పదు అనే రీతిలో జనాన్ని నమ్మించచూస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా కార్మికవర్గ జీవన ప్రమాణాలను పెంచేదిగానీ, ఉపయోగపడేది గానీ ఉందా, వేతనాలను అదుపు చేయటం వారి లాభాలను గరిష్టంగా పెంచుకొనే కార్పొరేట్ల ఎత్తుగడలు తప్ప మరేమైనా ఉన్నాయా అన్న చర్చ కార్మికవర్గంలో ప్రారంభమైంది. గత మూడు దశాబ్దాలుగా అమెరికా వస్తు ఉత్పాదక సంస్థలు దేశం వదలి పోతుంటే 78 ఏండ్ల ట్రంప్‌ గతంలో ఎప్పుడైనా నోరు విప్పాడా ? ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నాడు ? పెట్టుబడిదారులు తమకు ఏది లాభంగా ఉంటే ఆ విధానాలను రూపొందించేవారిని పాలకులుగా గద్దెనెక్కిస్తారు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. అమెరికాలో పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయని అప్పుడు కూడా చెప్పాడు. తరువాత ఎన్నికల్లో ఓడిపోయి చరిత్రకెక్కాడు. అక్కడి ఉక్కు, తదితర కంపెనీలకు లాభాలు తప్ప కార్మికులకు వేతనాలు పెరగలేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత అత్యంత వినాశకరమైన ఆర్థిక విధానాన్ని ట్రంప్‌ పాటిస్తున్నట్లు అమెరికా మాజీ అర్థిక మంత్రి లారెన్స్‌ సమర్స్‌ వ్యాఖ్యానించాడు.1930దశకం తరువాత అతి పెద్ద వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్‌ ప్రారంభించినట్లు చెబుతున్నారు.


సమస్య పెట్టుబడిదారీ వ్యవస్థలోనే అంతర్గతంగా ఉంది. కార్మికుల ఉద్యోగాలు పోవటానికి, వేతనాలు తగ్గటానికి కారణం చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాల నుంచి వస్తున్న దిగుమతులే కారణమని ట్రంప్‌ యంత్రాంగం చిత్రిస్తున్నది. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో భారీ ఎత్తున్న పన్ను రాయితీలు ఇచ్చిననప్పటికీ దేశభక్త జనరల్‌ మోటార్స్‌ వంటి కంపెనీలు స్వదేశంలో ఫ్యాక్టరీలను మూసివేసి మెక్సికో, తదితర దేశాలకు తరలిపోయాయి. పన్నుల విధింపు కంపెనీలకు తప్ప కార్మికులకు మేలు చేయవని తొలిసారి అధికారంలో ఉన్నపుడు ఉక్కు దిగుమతుల వ్యవహారం వెల్లడిరచింది. కరోనా కాలం నుంచి చూస్తే కార్పొరేట్లకు లాభాలు కార్మికులకు భారాలు పెరిగాయి. ఈ నేపధ్యంలో దిగువ చర్యలు తీసుకోవాలని కార్మికవర్గండిమాండ్‌ చేస్తోంది. విదేశాల్లో ఉపాధి కల్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ కార్పొరేషన్ల మీద పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఇతర రంగాలలో కార్మికులను నిలుపుకొనేందుకు వినియోగించాలి. పన్నులు గనుక ఖర్చులను పెంచేట్లయితే ధరలను గట్టిగా నియంత్రించాలి. ఆహారం, ఔషధాలు, గృహ తదితరాల ధరలను స్థంభింప చేయాలి. కార్పొరేట్‌ల కోసం కార్మికులు మూల్యం చెల్లించకూడదు. కార్మిక సంఘాల హక్కులకు భంగం కలగకుండా అంతర్జాతీయ కార్మిక హక్కులను అమలు చేసి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కీలకమైన ఉక్కు, ఆటోమొబైల్‌ వంటి పరిశ్రమలను బడా కంపెనీలకు దూరంగా ప్రజల భాగస్వామ్యంలో నిర్వహించాలి.


పెట్టుబడిదారులు వారు పారిశ్రామికవేత్తలైనా, వాణిజ్యంచేసే వారైనా లాభాలు వచ్చాయా లేదా అన్నది తప్ప ఎలాంటి విలువలు, వలువలు, సిద్దాంతాలు ఉండవు.ఎప్పటికెయ్యది లాభమో అప్పటికా విధానాలను తమ ప్రతినిధులైన పాలకుల ద్వారా రూపొందించి అమలు చేస్తారు. కమ్యూనిజం వ్యాప్తి నిరోధానికి కంకణం కట్టుకున్నట్లు చెప్పిన అమెరికా ప్రత్యర్థిగా ఉన్న బలమైన సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రచ్చన్న యుద్దం సాగించింది. అదే కాలంలో ప్రపంచంలో పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో తన వస్తువులను అమ్ముకొనేందుకు, చౌకగా అక్కడ ఉత్పత్తి చేసి దిగుమతులు చేసుకొని లబ్దిపొందాలని ఎత్తువేశారు. దాంతో అప్పటి వరకు ఐరాసలో కమ్యూనిస్టు చైనాకు నిరాకరించిన భద్రతామండలి శాశ్వత సభ్యత్వాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో స్వేచ్చా వాణిజ్యం పేరుతో ప్రపంచీకరణ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చింది, ప్రపంచ వాణిజ్య సంస్థపేరుతో నిబంధనలు రూపొందించింది. నాలుగు దశాబ్దాల తరువాత సమీక్షించుకుంటే ఈ విధానం తమకంటే చైనా, ఇతర దేశాలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహించి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా తొండి చేస్తున్నట్లు ఇప్పుడు అమెరికా ఆరోపిస్తోంది.తమకు రక్షణ చర్యలు,మరిన్ని రాయితీలు కల్పించాలని ట్రంప్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్చా వాణిజ్యానికి వీలు కల్పించాలని కోరేదీ, దానికి విరుద్దమైన రక్షణ విధానాలను కోరేదీ కూడా పెట్టుబడిదారులే. చైనా నుంచి వస్తువులను స్వేచ్చగా దిగుమతి చేసుకొనేందుకు, పెట్టుబడులను ఆనుమతించాలని మన దేశంలో కోరుతున్నదీ, చౌకగా వచ్చే వస్తువులతో తమ పరిశ్రమల మనుగడకు ముప్పు గనుక ఆంక్షలు పెట్టాలి లేదా పన్ను విధించాలని కోరుతున్నదీ పెట్టుబడిదారులే తప్ప మరొకరు కాదు. చైనా పెట్టుబడులను కేంద్రం అడ్డుకుంటే మోడీ మెడలు వంచి అనుమతించేందుకు ఒప్పించారు. అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాల మీద ప్రతీకార పన్ను ఏటా ఆరువందల బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని చెబుతున్న ట్రంప్‌ రానున్న పది సంవత్సరాల్లో ఐదులక్షల కోట్ల డాలర్ల మేరకు కార్పొరేట్లు, ధనికులకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు తీర్మానం చేయించాడు. అంటే అలా వచ్చేదాన్ని ఇలా అయినవారికి వడ్డించేందుకు పూనుకున్నాడు. మరోవైపున కార్మికుల సంక్షేమ చర్యలకు కోత పెట్టేందుకు పూనుకున్నాడు.


డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి చెప్పాలంటే అతగాడు ఒకసారి వేడెక్కుతాడు, మరోసారి చల్లబడతాడు, ఒకసారి అవునంటాడు, అదే నోటితో కాదంటాడు, ఒకసారి వస్తానంటాడు, మరోసారి వెళతానంటాడు, ఒకసారి పైకి ఎక్కుతాడు అంతలోనే కిందికి దిగుతాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు.కానీ తనవారికి చేయాల్సింది చేస్తున్నాడు, అందుకే కొందరు పిచ్చితనం ప్రదర్శన నటన అంటున్నారు. మిత్రులు, శత్రువులు అని చూడకుండా అందరి మీద బస్తీమే సవాల్‌ అనటం పిచ్చిగాక తెలివా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తమ దేశాలకు చెందిన సంస్థల వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెట్ల వేటలో భాగంగానే ప్రపంచాన్ని వలసలుగా మార్చుకొనేందుకు తలెత్తిన పోటీలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భౌతిక వలసలలో బ్రిటన్‌ది పైచేయి కాగా ఇప్పుడు అది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించే క్రమంలో అమెరికా ముందుకు వచ్చింది. దానికి ప్రతిఘటన ఫలితమే వాణిజ్యపోరు !