భారత రైతులపై డోనాల్డ్‌ ట్రంప్‌ బాణపు గురి – రక్షకుడు నరేంద్రమోడీ ఏం చేస్తారో మరి !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


వాణిజ్య పోరులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సవ్యసాచిలా బాణాలను వదులుతున్నాడు. మరోవైపు రండి మాట్లాడదాం అంటున్నాడు.చైనా కూడా తన ఆస్త్రాలను వదిలింది. పరిస్థితిని గమనిస్తున్నాం అని అధికారుల చేత మాట్లాడిస్తున్నారు తప్ప మన 56 అంగుళాల గుండె కలిగిన ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పటం లేదు.దేశ ప్రజానీకానికి భరోసా ఇవ్వటం లేదు. ట్రంప్‌కు లొంగిపోవటమా, ప్రతిఘటించటమా అని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో అన్నీ చూస్తున్నాం అంటే అర్ధం ఏమిటి ? ఎవరినైనా తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోగల సమర్దుడు మా మోడీ అని బిజెపి ఇంతకాలం చెప్పింది గనుక ఏం చేస్తారా అని ప్రపంచం అంతా చూస్తున్నది.ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరో దగ్గర లైటు వెలుగుతుంది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మన నరేంద్రమోడీ మాట్లాడి ఫార్మాను ప్రతి పన్నుల నుంచి రక్షించినట్లు ఒక ఫార్మా ప్రముఖుడు, రాజ్యసభ సభ్యుడి ప్రకటన ఒకటి పత్రికల్లో వచ్చింది. చైనా ఔషధాలను, సెమీకండక్టర్లను కూడా ట్రంప్‌ మినహాయించాడనే అంశం తెలియదో లేక తెలిసి కూడా మోడీని ప్రసన్నం చేసుకోవటానికి అలాంటి ప్రకటన చేశారో తెలియదు. కానీ అదే ఫార్మా షేర్లు కూడా పతనమయ్యాయి. ట్రంప్‌ వేటినీ వదలడు. పేకాటలో తనకు కావాల్సిన దాని కోసం ఎదుటి వారిని ప్రభావితం చేసేందుకు వేసే వాటిని తురుపు ముక్కలు అంటారు. ఇప్పుడు ట్రంప్‌ అదే చేస్తున్నాడు. అమెరికా వ్యవసాయ, పాడి, కోళ్ల ఉత్పత్తులు, ఆయుధాలు,చమురు, గ్యాస్‌ వంటి వాటిని తమదగ్గర నుంచి కొనిపించేందుకు పెద్ద పథకంతో ఉన్న ట్రంప్‌ ట్రంప్‌ తురుపు ముక్కల మాదిరి కొన్నింటిని పన్నుల నుంచి మినహాయించాడు తప్ప మన మీద ప్రేమ కాదు.


ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నట్లుగా మన దేశం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవాలంటే అమెరికా వస్తువుల మీద పన్నులను తగ్గించాలంటూ కొంత మంది దేశభక్తులు మరోసారి సన్నాయి నొక్కులు ప్రారంభించారు. ఎర్ర చొక్కా కనిపిస్తే తేళ్లూ జెర్రులూ పాకితే వీరంగం వేసినట్లు ఎగిరిపడేవారు అమెరికా నుంచి గాక చైనా నుంచి ఎక్కువగా ఎందుకు దిగుమతులు చేసుకుంటున్నారో జనాలు ప్రశ్నించాలి. వియత్నాం మీద ఎక్కువగా పన్నులు వేసినందున మన దేశం బియ్యం ఎగుమతులు పెంచుకోవచ్చు అన్నది ఒక సూచన. అమెరికాయే ఒక బియ్యం ఎగుమతి దేశం, మన దగ్గర నుంచి ఇప్పటికే బాస్మతి రకాలను అది పరిమితంగా దిగుమతి చేసుకుంటున్నది, కొత్తగా కొనేదేముంటుంది. వియత్నాం బియ్యం మీద ఇతర దేశాలేమీ పన్నులు వేయలేదు గనుక దాని ఎగుమతులకు ఇబ్బంది ఉండదు. రష్యా మీద అమెరికా ఆంక్షలు విధిస్తే చైనా పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోలేదా ! అలాగే వియత్నాం నుంచి కొనుగోలు మానేస్తే ఆ మేరకు చైనా దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ సమస్య ట్రంప్‌ వత్తిడికి లొంగి మనం పన్నులు తగ్గిస్తే అక్కడి నుంచి బియ్యం, మొక్కజొన్నలు, సోయా, కోడి కాళ్లు, పాలపొడి, జున్ను సర్వం దిగుమతి అవుతాయి. మన దిగుమతిదారులు లాభాల పిండారీలు తప్ప దేశభక్తులేమీ కాదు, చైనా నుంచి దిగుమతులు లాభం గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, అదే అమెరికా నుంచి తక్కువకు వస్తే అక్కడి నుంచీ కొంటారు.వారికి సరిహద్దు వివాదాలేమీ ఉండవు. ఇదే నరేంద్రమోడీ గతంలో కోడి కాళ్లు దిగుమతి చేసుకొనేందుకు ఆలోచన చేస్తే మన కోళ్ల పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా అమెరికాను ప్రసన్నం చేసుకొనేందుకు బాతులు, టర్కీ కోడి మాంసాన్ని దిగుమతి చేసుకొనేందుకు 2023లో ఆంక్షలను సడలించారు.పన్ను మొత్తాన్ని 30 నుంచి 5శాతానికి తగ్గించారు. ఇక తరువాత కోడి మాంస ఉత్పత్తులే అని అమెరికన్లు వ్యాఖ్యానించారు. పైన పేర్కొన్న వస్తువులకు తలుపులు బార్లా తెరిస్తే ఏం జరుగుతుందో ఆ మోడీకి కూడా తెలుసు. అయినా అంగీకరిస్తారా లేక వ్యతిరేకిస్తారా ? సీతమ్మకు అగ్ని పరీక్ష అని రామాయణంలో చదివాం, చూశాం. ఇప్పుడు ఆధునిక భారతంలో మోడీకి నిజమైన అగ్ని పరీక్ష ఎదురు కానుంది.


చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతుంటారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని,నిజమే బిజెపితో వచ్చిన ప్రతికూలతను పవన్‌ కల్యాణ్‌ మధ్యవర్తిగా అనుకూలంగా మార్చుకున్నారు. ఏ ఇజమూ లేదు ఉన్నదల్లా ఆపర్చ్యునిజమే( అవకాశవాదం) అనుకొనే వారికి తప్ప ఇలాంటివి అందరికీ సాధ్యమా ? ఇది చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలోకి జంప్‌ చేసినపుడే అబ్బింది. ఏ పార్టీతో చేతులు కలపాలన్నా తగిన తర్కం పుష్కలంగా ఉన్న నేత. అమెరికా ఉత్పత్తుల మీద ఇతర దేశాలు ఎక్కువగా పన్నులు విధిస్తే మన ఉత్పత్తులకు మార్కెట్‌ పెరుగుతుందని కొందరు సూచిస్తున్నారు. ఉదాహరణకు అమెరికా సోయా ఎగుమతుల్లో సగం చైనా దిగుమతి చేసుకుంటున్నది. ఇప్పుడు చైనా గతంలో విధించినదాని మీద 34శాతం పన్నులు పెంచింది గనుక, మనం అమెరికా స్థానంలో చైనాకు ఎగుమతులు చేసి పెంచుకోవచ్చన్నది కొందరి తర్కం. నిజంగా అదే జరిగితే ట్రంప్‌ ఊరుకుంటాడా ? కొరడా రaళిపిస్తాడు. రష్యా మీద ఆంక్షలు విధిస్తే వారు మనకు చౌకగా ముడిచమురు అమ్మేందుకు ముందుకు వస్తే మనం విపరీతంగా కొనుగోలు చేసి భారాన్ని తగ్గించుకున్నాం. ట్రంప్‌ ఊరుకున్నాడా ? రష్యా చమురును సరఫరా చేసే టాంకర్ల మీద, కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు పెడితే మన మోడీ కొనుగోళ్లు తగ్గించారా లేదా ! అలాగే చైనాకు సోయా, ఇతర ఎగుమతులు నిలిపివేస్తారా లేదా అని గుడ్లురిమితే మోడీ తట్టుకోగలరా ! అమెరికాకు మన వ్యసాయ ఉత్పత్తులు ఇతర వాటితో పోలిస్తే సోదిలో కూడా కనిపించవు. మిగతాదేశాలేవీ కొత్తగా ప్రతి సుంకాలు విధించలేదు, అయినా మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే బియ్యం మీద మన ప్రభుత్వం ఇప్పుడు 70శాతం, గోధుమల మీద 40శాతం, ఆహార తయారీ 150, ఆక్రోట్స్‌ 100, పాల ఉత్పత్తులు 33 నుంచి 63, కోడి కాళ్లు 100, ఖాద్య తైలాలు 45, మొక్కజన్నలు 50, పూలు 60, సహజ రబ్బరు 70, కాఫీ 100, ఆల్కహాల్‌ 150, సముద్ర ఉత్పత్తుల మీద 30 శాతం పన్నులు విధిస్తున్నది. ఆ మొత్తాలను గణనీయంగా తగ్గించాలని అమెరికా డిమాండ్‌ చేస్తున్నది.మన రైతులకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌కు మోడీ ససేమిరా అంటున్నారు. 2025 మార్చి నెలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి ఢల్లీి వచ్చి చట్టబద్దత సంగతి తరువాత అసలు మద్దతు ధరలు ప్రకటించటం ఏమిటని ప్రశ్నించినట్లు వార్తలు.వాటితో ప్రపంచ వాణిజ్యమే అతలాకుతలం అవుతున్నదట, బహుశా అందుకే వాటి చట్టబద్దత గురించి మోడీ భయపడుతున్నారా ? మరోవైపున అమెరికా తన రైతులకు 100శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నది. మన మార్కెట్‌ ధరల కంటే అమెరికా బియ్యం, ఇతర ఉత్పత్తులు తక్కువకు వచ్చి దిగుమతులు పెరిగితే మన రైతాంగ పరిస్థితి ఏమిటి ? జన్యు మార్పిడి పంటల దిగుమతికి మోడీ సర్కార్‌ అనుమతి ఇవ్వలేదు, కానీ అమెరికా వత్తిడిని తట్టుకోలేక 2021లో పశుదాణా నిమిత్తం 12లక్షల టన్నుల సోయా మీల్‌ దిగుమతికి అనుమతించింది.


మంచి తరుణం మించిపోవును ఎవరు ముందు వస్తే వారికి ఎక్కువ రాయితీలు ఇస్తాడు ట్రంప్‌ అంటూ వందల కోట్ల ద్రవ్య వ్యాపారి బిల్‌ అక్‌మన్‌ ప్రపంచ దేశాలకు సలహా ఇచ్చాడు. తక్షణమే ఎవరికి వారు వచ్చి పన్నుల గురించి చర్చించి ఒప్పందాలు చేసుకోమంటున్నాడు. స్టాక్‌మార్కెట్‌లు కుప్పకూలి తన పెట్టుబడుల విలువ తగ్గిపోతున్నది గనుక అక్‌మన్‌ నుంచి అలాంటివి గాక వేరే సలహాలు ఎందుకు వస్తాయి ?అమెరికాలో ఏదైనా కంపెనీ ఫ్యాక్టరీలను ప్రారంభిస్తే సదరు కంపెనీల ఉత్పత్తుల మీద పన్ను విధింపు రద్దు చేస్తాడని కూడా చెప్పాడు. వెనుకటి కెవడో నాకు పదివేల రూపాయలిస్తే బంగారాన్ని తయారు చేసే మంత్రం చెబుతా అన్నాడట.వాడే తయారు చేసి సొమ్ము చేసుకోవచ్చు కదా. అమెరికా దగ్గర డబ్బు లేకనా !


అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్‌నిక్‌ ఇటీవల మన దేశం వచ్చాడు. ఇండియా టుడే సమావేశంలో మాట్లాడుతూ మీ వ్యవసాయమార్కెట్‌లోకి ఇతరులు రాకుండా ఎంతో కాలం మూసుకొని కూర్చోలేరన్నాడు. మాతో కలిస్తే మీకెంతో లాభం,ఇద్దరం ఒప్పందం చేసుకుందాం అన్నాడు. దీర్ఘకాలంగా రష్యా నుంచి మిలిటరీ పరికరాలను కొనుగోలు చేస్తున్నారని దానికి స్వస్థిపలికి తమ దగ్గర మరింతగా కొనాలన్నాడు.మేం మీతో మరింతగా కలసిపోవాలని, మరింతగా వాణిజ్యం చేయాలని అనుకుంటుంటే చైనా ప్రతిపాదించిన బ్రిక్స్‌ దేశాల కరెన్సీ ఉనికిలోకి రావటం మా ట్రంప్‌కు ఇష్టం లేదు, చైనాతో కలసి ఇలాంటి పనులు చేస్తే ప్రేమ, ఆప్యాయతలు పుట్టటానికి వీలుండదు అంటూ ఉపన్యాసం సాగించాడు.అమెరికా వాణిజ్య ప్రతినిధి కూడా ఇంతే. ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధి దాటి ప్రపంచంలో అధికంగా 113.1 నుంచి 300శాతం వరకు విధించే దేశాలలో ఒకటిగా భారత్‌ తయారైందని అమెరికా వాణిజ్య వార్షిక నివేదికలో నివేదికలో ధ్వజమెత్తారు. ఇంత పచ్చిగా మన విధానాలు ఎలా ఉండాలో బహిరంగంగా చెప్పే ధైర్యం అమెరికాకు వచ్చిందంటే మనలోకువే కారణం కాదా ! మిలిటరీ, దిగుమతులు, వ్యాపారం అంతా తమ చేతుల్లోకి తీసుకొని మన జుట్టు చేజిక్కించుకోవాలన్నది అమెరికా దురాలోచన. మనకు అర్ధం కావటం లేదా కానట్లు నటిస్తున్నామా ! వారైతే అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లు చెబుతున్నారు. ‘‘ పన్నుల రారాజు, ఒప్పందాల దుర్వినియోగి ’’ అని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే మనలను తిట్టినా చీమకుట్టినట్లు కూడా లేదు.


మనదేశంలో సగటు కమత విస్తీర్ణం ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు) కాగా అమెరికాలో 46 హెక్టార్లు. అక్కడ వ్యవసాయం మీద కేవలం రెండుశాతమే బతుకుతుంటే మనదగ్గర జనాభాలో సగం 50శాతం ఉన్నారు. ఇక్కడ బతకటానికి , అక్కడ వ్యాపారానికి సాగు చేస్తారు. అనేక మంది మేథావులకు మన రైతులంటే చిరాకు ఎందుకటా ! ఎకరాదిగుబడులను గణనీయంగా పెంచటం లేదట, అలా చేస్తే సాగు గిట్టుబాటు అవుతుంది, ఆపని చేయకుండా ధరలు కావాలి, పెంచాలి అంటారు అని విసుక్కుంటారు. ఏ రైతుకారైతు అధిక దిగుబడి వంగడాలను రూపొందించలేడు, పరిశోధనలు చేయలేడు. ఆ పని చేయాల్సిన పాలకులు గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు.కాంటాక్టు వ్యవసాయం అయితే దిగుబడి పెరుగుతుంది, పెద్ద కమతాలు లాభదాయకమన్నది కొంత వరకు వాస్తవమే. రైతులందరూ భూములను ఏదో ఒక రూపంలో కంపెనీలకు అప్పగించి ఉపాధికోసం వారి పొలాల్లోనే వ్యవసాయ కూలీలుగా మారి వేతనాలు తీసుకోవటం తప్ప వారికి అదనంగా ఒరిగేదేమీ లేదు. నరేంద్రమోడీ తనకు మంచి మిత్రుడు అంటాడు ట్రంప్‌. భారత్‌ పెద్ద సహభాగస్వామి అంటుంది అమెరికా. ఎక్కడన్నా బావేగానీ వంగతోటదగ్గర కాదన్నట్లుగా ఇన్ని కబుర్లు చెప్పే అమెరికా మన వరి సాగు ఖర్చుల కంటే అదనంగా 87.85, గోధుమల మీద 67.54శాతం అదనంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఉక్రెయిన్‌, కెనడాలను కలుపుకొని కేసుదాఖలు చేసింది. ఇదంతా మన మీద వత్తిడి, లొంగదీసుకొనే ఎత్తుగడలో భాగమే. అలాంటి దేశాధినేత ట్రంప్‌ ఇప్పుడు మన రైతాంగం మీద బాణాలను ఎక్కుపెట్టాడు.రక్షకుడు అని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ రైతన్నలకు అండగా ఉంటారా ? అమెరికాకు లొంగిపోతారా, ఏ కారణంతో అయినా లొంగితే ఈసారి దేశవ్యాపితంగా రైతాంగం ఉద్యమించటం ఖాయం ! ఢల్లీి శివార్లలో ఏడాది పాటు మహత్తర ఉద్యమం సాగించి మోడీ మెడలు వంచిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఇదే హెచ్చరించింది !!

పిచ్చివాడి చేతిలో రాయి – అమెరికాను ఎటు నడుపుతాడో తెలియని డోనాల్డ్‌ ట్రంప్‌ !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఆ సాయంత్రం... రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటుకేగుటో సమస్య తగిలిందొక విద్యార్ధికి (1939లో చెన్నయ్‌లో ఆంగ్ల, తెలుగు సినిమాలు ఆడిన సినిమాహాళ్లు) అని సంధ్యా సమస్యలు అనే కవితలో శ్రీశ్రీ మన ముందుంచినట్లుగానే ఏ అంశం గురించి రాయాలో ఈ విద్యార్థికి పరీక్ష పెట్టాడు డోనాల్డ్‌ ట్రంప్‌.ఏప్రిల్‌ రెండవ తేదీ నుంచి తనకు లొంగని, నచ్చని దేశాలన్నింటి మీద ప్రకటించిన వాణిజ్య యుద్దంలో పన్ను అస్త్రాల ప్రయోగం, అణు ఒప్పందానికి రాకపోతే అంతు చూస్తామన్న బెదరింపులపై తేల్చుకుందాం రా అంటూ ఇరాన్‌ అధినేత ఘాటు స్పందన, పుతిన్‌ మీద కోపం వస్తోందన్న ట్రంప్‌, గాజాపై సాగుతున్న మారణకాండ ఇలా అనేక సమస్యలు మన ముందున్నాయి. తాను చాలా దయతో వ్యవహరిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు. పిచ్చివాడు అనేక మాటలు మాట్లాడతాడు,తన చేతిలో రాయితో అందరినీ భయపెడతాడు, ఎవరినైనా కొట్టవచ్చు, ఉన్మాదంలో తన తలను తానే పగలగొట్టుకోనూ వచ్చు.వాడి దాడి నుంచి తప్పించుకోవాటానికి ప్రతి ఒక్కరూ చూడటంతో పాటు అదుపులోకి తీసుకొని కట్టడి చేసేందుకూ చూస్తారు. ఇప్పుడు ప్రపంచంలో అదే స్థితిలో ఉందా ! ఏం జరగనుంది !!

మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్న ప్రతి సుంకాల విషయంలో తాను ఎంతో దయతో వ్యహరిస్తానని సోమవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తమ నేత చైనా, కెనడా, ఐరోపా యూనియన్లను రెచ్చగొట్టి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నాడని కొంత మంది రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్లే వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు వార్తలు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం గనుక ప్రతి దేశం దాన్ని ముక్కలు చేస్తున్నందున ప్రతికూల పన్నులు వేయకతప్పటం లేదని, త్వరలో అమెరికాకు విముక్తి రోజు వస్తుందని చెప్పాడు ట్రంప్‌. తమ శత్రువుల మీద పోరాడాలంటూనే కొన్ని పన్నుల మీద అధికార పార్టీ సెనెటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, కెనడా మీద చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని సుసాన్‌ కోలిన్స్‌, థోమ్‌ టిలిస్‌ ప్రకటించారు. తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు.ఎవరి జాగ్రత్తలో వారున్నారు.పరస్పర వాణిజ్యంపై చైనా, జపాన్‌, దక్షిణ కొరియా ఆదివారం నాడు ఒక అవగాహనకు వచ్చాయి. ఏ దేశాల మీద ఎంత పన్ను, ఏ వస్తువుల మీద విధించేదీ బుధవారం నాడు ప్రకటిస్తామని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ విలేకర్లతో చెప్పారు. పన్నులపై అనిశ్చితి ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై పడిరది. అమెరికా వాణిజ్య భాగస్వాములందరి మీద 20శాతం వరకు పన్ను విధించవచ్చని ట్రంప్‌ సలహాదారులు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొన్నది. పన్నులతో ముందుకు పోతే రానున్న ఏడాది కాలంలో అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు 20 నుంచి 35శాతానికి పెరుగుతాయని గోల్డ్‌మన్‌ శాచస్‌ విశ్లేషకులు చెబుతున్నారు.కార్ల ధరలు పెరిగితే వాటిని తాను పెద్దగా పట్టించుకోనని ట్రంప్‌ అన్నాడు.

ఇప్పటివరకు చైనా, కెనడా ప్రతి సుంకాలను ప్రకటించాయి. ఐరోపా యూనియన్‌ బేరసారాలాడుతున్నందున, మరో పదిహేను రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. కార్ల మీద ట్రంప్‌ ప్రకటించిన పన్నులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా పన్నులు ఆతృతకు కారణమౌతున్నాయని ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టాలినా జార్జియేవా వ్యాఖ్యానించారు. చైనా, ఐరోపా యూనియన్‌,మెక్సికో,కెనడా,వియత్నాం, జపాన్‌, దక్షిణ కొరియా, చైనీస్‌ తైవాన్‌, భారత దేశాలతో వస్తు వాణిజ్యంలో అమెరికా లోటులో ఉంది. ఈ దేశాలన్నీ కూడా వాటి లావాదేవీలను పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయి. అమెరికా వత్తిడికి లొంగి లేదా మన ఎగుమతిదార్ల లాబీ కారణంగా మన దేశం అమెరికాకు కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.మన మీద పన్నుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా పరిస్థితిని గమనించి అమెరికా ప్రకటించిన పన్నులను గణనీయంగా తగ్గించవచ్చు లేదా కొంత కాలం అమలు వాయిదా వేయవచ్చని కొందరు ఆశిస్తున్నారు.

తమ మీద అమెరికా, దాని అనుయాయులు దాడులకు దిగితే అణ్వాయుధాలను సమకూర్చుకోవటంతప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఇరాన్‌ హెచ్చరించింది. దాడులు జరిగితే వారు కచ్చితంగా ప్రతిదాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని రంజాన్‌ ఉపవాసమాసం ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించాడు. ఖమేనీ సలహాదారు అలీ లార్జియానీ టీవీలో మాట్లాడుతూ తాముగా అణ్వాయుధాలను సమకూర్చుకొనే దిశలో పయనించటం లేదని, ఒకవేళ అమెరికా స్వయంగా లేదా ఇజ్రాయెల్‌ ద్వారా దాడులకు దిగితే తమ నిర్ణయం భిన్నంగా ఉంటుందని, ఆత్మరక్షణకు వాటిని ప్రయోగించకతప్పదని చెప్పాడు. తమతో అణు ఒప్పందం మీద సంతకాలు చేయకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, సుంకాలు విధిస్తామని ఆదివారం నాడు ట్రంప్‌ బెదిరించాడు. దీని గురించి సోమవారం నాడు భద్రతా మండలికి ఇరాన్‌ ఫిర్యాదు చేసింది. రాయబారి అమీర్‌ సయిద్‌ ఇర్వానీ ఒక లేఖ ద్వారా తమ మీద దురాక్రమణకు పాల్పడితే నిర్ణయాత్మకంగా వ్యహరిస్తామని, యుద్దోన్మాదం, రెచ్చగొట్టటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నాడు. గతంలో 2015లో కుదిరిన ఒప్పందం నుంచి ఇదే ట్రంప్‌ 2018లో ఏకపక్షంగా వైదొలిగాడు. ఇరాన్‌ పరిసర ప్రాంతాల్లో అమెరికా పది మిలిటరీ కేంద్రాలను, యాభైవేల మంది సైనికులను నిర్వహిస్తున్నది. అద్దాల మేడలో ఉండి ఎవరూ ఇతరుల మీద రాళ్లు వేయకూడదని ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ అధికారి, ఇస్లామిక్‌ రివల్యూలషనరీ గార్డ్స్‌ సీనియర్‌ కమాండర్‌గా ఉన్న అమిరాలీ హజిజదే హితవు పలికాడు.

గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పశ్చిమ దేశాల ఆంక్షలు ఎత్తివేయాలంటే ప్రతిగా ఇరాన్‌ తన అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి ఉంది. అయితే పశ్చిమ దేశాలు ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో ఇరాన్‌ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది.వాటిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అని పదే పదే చెబుతున్నది. తిరిగి అణు ఒప్పందంపై చర్చలకు అంగీకరించాలని లేకుంటే మిలిటరీ చర్యతప్పదని మార్చి ఏడవ తేదీన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ద్వారా ట్రంప్‌ ఒక లేఖను పంపాడు. దానికి గాను గత వారంలో ఒమన్‌ ద్వారా ఇరాన్‌ సమాధానం పంపింది. గరిష్ట వత్తిడి, మిలిటరీ చర్య బెదిరింపుల పూర్వరంగంలో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్దం కాదని, పరోక్షంగా అంగీకరిస్తామని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశాడు. ఇదే అంశాన్ని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కూడా తేటతెల్లం చేశాడు. చర్చలకు తాము విముఖం కాదని, ముందుగా అమెరికా తన గత తప్పిదాలను సరిచేసుకొని విశ్వాసం కలిగించాలని చెప్పాడు. గతంలో కుదిరిన ఒప్పందం నుంచి ట్రంప్‌ వైదొలిగిన తీరును బట్టి ఇరానియన్లకు నమ్మకం లేకపోవటం సరైనదే అని వాషింగ్టన్‌లోని స్టిమ్సన్‌ కేంద్ర బార్బరా స్లావిన్‌ వ్యాఖ్యానించారు.హిందూ మహాసముద్రంలోని డిగోగార్సియాలో సైనిక కేంద్రానికి అమెరికా అదనపు యుద్ద విమానాలను తరలించిందని, మరొక విమానవాహక నౌకను తరలించటాన్ని చూస్తే ఇజ్రాయెల్‌తో కలసి ఏదో ఒక రకమైన మిలిటరీ చర్యకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తున్నదని ఆమె చెప్పారు. అణుకార్యక్రమంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో ప్రతినిధుల ద్వారా తన పలుకుబడిని పెంచుకొనేందుకు చూస్తున్నదని పశ్చిమ దేశాలు ఇరాన్‌ మీద ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అలాంటి ప్రతినిధి ఎవరైనా ఉంటే యూదు దురహంకార ప్రభుత్వమేనని దాన్ని తుడిచివేయాలని ఖమేనీ స్పష్టం చేశాడు. అనేక బాంబులను తయారు చేసేందుకు అవసరమైన యురేనియంను ఇరాన్‌ సమకూర్చుకుందని, అయితే ఇంకా బాంబులను తయారు చేయలేదని ఇటీవల అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ పేర్కొన్నది. అవసరమైతే రెండు నెలల వ్యవధిలో బాంబులను రూపొందించి, వాటిని పరీక్షించి, విడదీసి అవసరమైన చోటికి తరలించి తిరిగి తయారు చేసేందుకు, వాటిని ప్రయోగించే క్షిపణులను కూడా సమాంతరంగా సిద్దం చేసిందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాతే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. ఈ నేపధ్యంలో తన భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నింటినీ ఇరాన్‌ సన్నద్దం చేస్తున్నదని ఈ మేరకు వాటికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. శత్రుదేశాల దాడులనుంచి వాటిని కాపాడేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య చర్చలకు తెరతీయాలంటే విధించిన ఆంక్షలను అమెరికా సడలించాల్సి ఉంటుంది.

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మీద తనకు పిచ్చి కోపం వస్తున్నదని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నాడు.ఉక్రెయిన్‌పై ఒప్పందానికి ముందుకు రాకపోతే అదనంగా రష్యన్‌ చమురు మీద 50శాతం పన్నులు విధిస్తానని చెప్పాడు. నెల రోజుల పాటు నల్ల సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాపై ఒప్పందానికి ఉక్రెయిన్‌రష్యా అంగీకరించినట్లు ప్రకటించినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు.దాన్లో అంగీకరించినదాని ప్రకారం ఇరు దేశాలు తమ ఇంథన మౌలికవసతులపై పరస్పరం దాడులు నిలిపివేయాలి, అయితే ఇరుపక్షాలూ పాటించటం లేదని ఆరోపించుకుంటున్నాయి. తమ ఆహార, ఎరువుల రవాణాను స్వేచ్చగా జరగనివ్వటంతో పాటు వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగిస్తేనే అమలు చేస్తామని రష్యా షరతులు విధించింది. గతంలో జెలెనెస్కీని బెదిరించిన ట్రంప్‌ ఇప్పుడు మాటమార్చి రష్యా మీద కేంద్రీకరించాడు.తాను ఏది అనుకుంటే అది చేయగలననే అగ్రరాజ్య అహంకారంతో ఉన్నట్లున్నాడు.


ఉక్రెయిన్‌లో మరింత సమర్దవంతమైన ప్రభుత్వం ఉండాలని, జెలెనెస్కీ పదవీకాలం ముగిసినందున ఐరాస పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్‌ సూచించాడు. ఈ ప్రకటన ద్వారా జెలెనెస్కీని తాను గుర్తించటం లేదని స్పష్టం చేశాడు. నల్లసముద్రంలో నౌకల రవాణా గురించి కూడా అమెరికాతో తప్ప ఉక్రెయిన్‌తో రష్యాకు ఎలాంటి ఒప్పందం లేదు, అయితే అమలు జరపాల్సింది మాత్రం జెలెనెస్కీ యంత్రాంగమే. సుదూరంగా ఉన్న ఉత్తర రష్యా నగరమైన మురుమాన్స్క్‌కు జలాంతర్గామిలో ప్రయాణించిన పుతిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరిపేందుకు దోహదం చేస్తుందని, ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వం ఏర్పడితే దానితో చట్టబద్దమైన పత్రాలపై సంతకాలు చేసేందుకు శాంతి చర్చలకు సిద్దమని చెప్పాడు. యుద్దం కారణంగానే గడువు ముగిసినా రాజ్యాంగం ప్రకారం జెలెనెస్కీ అధికారంలో కొనసాగుతున్నాడని, 50లక్షల మంది పౌరులు దేశం వెలుపల ఉంటున్నపుడు, లక్షలాది మంది యుద్ధ రంగంలో ఉండగా ఎన్నికలు ఎలా సాధ్యమని ఉక్రెయిన్‌ అంటున్నది. గతంలో తూర్పు తైమూరు, పూర్వపు యుగోస్లావియా తదితర దేశాల్లో ఇలాగే ఎన్నికలు జరిగినపుడు ఇక్కడెందుకు సాధ్యం కాదని పుతిన్‌ ప్రశ్నించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే నిలిపివేసిన ఆయుధ సాయాన్ని ట్రంప్‌ పునరుద్దరించాడు. మరోవైపు ఐరోపా దేశాలు కూడా మరింతగా జెలెనెస్కీ సేనలను పటిష్టపరచటం ఎలా అని ముఖ్యంగా బ్రిటన్‌, ఫ్రాన్సు చర్చిస్తున్నాయి.తమ ప్రమేయం లేకుండా అమెరికా కుదుర్చుకున్న ఒప్పంద షరతులను తామెందుకు అమలు జరపాలని ఐరోపా సమాఖ్య పరోక్షంగా ప్రశ్నిస్తోంది.తన పరువు కాపాడుకొనేందుకు ట్రంప్‌ నానా తంటాలు పడుతున్నాడు. ఆ బలహీనతను ఉపయోగించుకొని తమపై ఆంక్షలను ఎత్తివేయించుకోవాలని, ఉక్రెయిన్‌లో తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని రష్యా చూస్తోంది. ఎవరి రాజకీయం వారిది, ఈ క్రమంలో ఎవరి ఇబ్బందులు వారివి !

వినదగునెవ్వరు చెప్పిన…..: ప్రశ్నించమన్నాడు స్వామి వివేకానంద, సందేహించమన్నాడు కారల్‌ మార్క్స్‌ – అది మోడీ, రాహుల్‌ మరెవరైనా సరే !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి. అదే బతికున్నవి ఎదురీదుతాయి. మనుషుల్లో తరతరాలుగా ఈ రెండు రకాలూ ఉంటూనే ఉన్నారు. స్వామి వివేకానందుడితో సహా అనేక మంది మనకు ప్రశ్నించటం నేర్పారు.ప్రశ్న లేకపోతే అసలు కిక్కుండదు. యువకుడిగా ఉన్నపుడు వివేకానందుడు రామకృష్ణ పరమమహంస దగ్గరకు వెళ్లి మీరు దేవుడిని చూశారా అని ప్రశ్నించాడు. దానికి అవును చూశాను అని సమాధానం వచ్చింది, అయితే నాకు దర్శన భాగ్యం కల్పిస్తారా అని అడిగితే, నీకా ధైర్యం ఉందా అని రామకృష్ణుడు ప్రశ్నించాడు. తరువాత వివేకానందుడు దేవుడ్ని చూశాడా, ఏం చేశాడన్నది ఆసక్తి కలిగిన వారు చదువుకోవచ్చు. ఇక్కడ సమస్య ప్రశ్నించటం అనే మహత్తర లక్షణం గురించే. సమాజంలో ఎందరికి ఉంది ? ప్రశ్నించేతత్వం ఉంటే రాజకీయ నేతలు జనాలకు ఇన్ని కబుర్లు చెప్పేవారా, ఆచరించని వాగ్దానాలను వర్షంలా కురిపించేవారా !


పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేశామని ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ఊదరగొడుతున్నారు.దేశాభివృద్ధి అంటే జిడిపి ఒక సూచిక తప్ప అదే సర్వస్వం కాదు, సమగ్రతను సూచించదు. పిల్లో, పిల్లాడో పుట్టిన తరువాత లావు, పొడవు పెరుగుతారు. అవి వయస్సుకు తగ్గట్లు ఉన్నాయా, ఆరోగ్యంతో ఉన్నారా లేదా అన్నది గీటురాయి తప్ప చిన్నప్పటికంటే ఎంతో పెరిగారు కదా అంటే కుదరదు. దేశం, మానవాభివృద్ధి అన్నా అలాంటిదే. జిడిపి గురించి పదే పదే చెబుతున్నవారు మిగతా సూచికల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాలా వద్దా ? వాటి పట్ల నిర్లక్ష్యం వహించారా లేక విఫలమయ్యారా ? ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో మన వాటా 2014లో 2.6శాతం, మోడీ అండ్‌ కో చెబుతున్నదాని ప్రకారం జిడిపి మాదిరి అది కనీసం 5.2శాతానికి పెరగాలి, కానీ 2024లో 2.9 మాత్రమే నమోదైంది. అంతేనా జిడిపిలో వాటా 15.02 నుంచి 12.84శాతానికి(2023) తగ్గింది.2024 వస్తూత్పత్తి విలువ జోడిరపులో ప్రపంచ బాంకు సమాచారం మేరకు తొలి స్థానంలో చైనా 5.04 లక్షల కోట్ల డాలర్లతో ఉండగా అమెరికా 2.6లక్షల కోట్లతో రెండవ, భారత్‌ 0.45లక్షల కోట్లతో ఆరవ స్థానంలో ఉంది. తలసరి ఉత్పత్తిని చూస్తే 10,704 డాలర్లతో జర్మనీ, 9,685తో దక్షిణ కొరియా,8,791తో జపాన్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.చైనా 3,569 డాలర్లు, మనదేశం కేవలం 318 డాలర్లు మాత్రమే కలిగి ఉంది. గుజరాత్‌ నమూనాను అమలు జరుపుతానని చెప్పిన తమ నేత మోడీ నాయకత్వంలో ఈ రంగంలో ఇంత తక్కువ ఎందుకు ఉందో బిజెపి నేతలు, ఆ పార్టీ సమర్ధకులు ఎవరైనా చెప్పగలరా ?


త్వరలో మనం చైనాను అధిగమించబోతున్నాం, మరికొందరైతే డ్రాగన్ను మన కాళ్ల వద్దకు రప్పించుకోబోతున్నాం అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కోతలు కోసే స్వేచ్చ ఉంది కాదనలేం. దేని ప్రాతిపదికన అలా చెబుతున్నారో మనలో మనమైనా తర్కించుకోవాలి కదా ! ఐరాస గణాంక విభాగం నుంచి తీసుకొని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా సమాచారం 2024 ఆగస్టులో వెల్లడిరచిన దాని ప్రకారం మీడియా సంస్థలు పారిశ్రామిక ఉత్పత్తి చేస్తున్న పది దేశాల గురించి సమీక్షించాయి. ప్రతి వంద వస్తువులు లేదా వంద కిలోల ఉత్పతిలో చైనా 31.6, అమెరికా 15.9, జపాన్‌ 6.5, జర్మనీ 4.8, భారత్‌ 2.9, దక్షిణ కొరియా 2.7, రష్యా 1.8, ఇటలీ 1.8, మెక్సికో 1.7,ఫ్రాన్సు 1.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. మన దేశంలోని రాష్ట్రాలంత ఉన్న దేశాలు మనతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంటే దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నామని కబుర్లు చెప్పేవారిని పగటి వేషగాళ్లు, తుపాకి వీరులు అంటే తప్పేముంది ! నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఆయనకున్న అనుభవం తక్కువేమీ కాదు, అందుకే తనకు ఇతరుల మాదిరి హానీమూన్‌ అవసరం లేదన్నారు. గుజరాత్‌ మాదిరి పారిశ్రామికంగా మార్చుతానంటే జనం నిజమే అని నమ్మి ఒకటికి మూడుసార్లు దేశాన్ని అప్పగించారు.కాని జరిగిందేమిటి ? ఇదే కాలంలో చైనా ఉత్పాదకత 20 నుంచి 31.6శాతానికి పెరిగితే, మన దగ్గర 2.6 నుంచి ముక్కుతూ మూలుగుతూ 2.9శాతానికి చేరింది. మన ఉత్పత్తుల విలువ 450 బిలియన్‌ డాలర్లు కాగా చైనా 5.04లక్షల కోట్లు, అమెరికా 2.6లక్షల కోట్ల డాలర్లతో ఉన్నాయి. పెంచకుండా నరేంద్రమోడీని ఎవరు అడ్డుకున్నారు ?

అంతా మీరే చేశారంటూ కాంగ్రెస్‌ పాలకుల మీద ఎన్ని రోజులు దుమ్మెత్తి పోస్తారు. ఆటంకాలు మనకే కాదు, చైనా, అమెరికాలకు ఎదురు కాలేదా ? నిజానికి కరోనా ఆంక్షల పేరుతో మరీ కఠినంగా వ్యవహరించి చైనా స్వయంగా ఉత్పత్తిని దెబ్బతీసుకుందని అనేక మంది సంబరపడ్డారు. దాని ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవాలని ఎందరో చెప్పారు.సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకునే మనం చైనాను అధిగమించాలనే ఆధిపత్య ధోరణి కంటే దానితో పాటు మనమూ ఎదగాలని ఆశించటం వాంఛనీయం. మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గతంతో పోల్చుకుంటే విలువలో చూస్తే పరిమితంగా పెరిగింది.తలసరి ఉత్పత్తిలో అగాధంలో ఉన్నాం. చిత్రం ఏమిటంటే పదేండ్లుగా నరేంద్రమోడీ కార్మికుల నైపుణ్యాలను పెంచినట్లు చెబితే, చంద్రబాబు నాయుడికి వారెంత మంది ఉన్నారో తెలియక లెక్కలు తీస్తున్నట్లు చెబుతున్నారు. కాలయాపన, కాలక్షేప కబుర్లు తప్పితే ఇంజనీరింగ్‌ పట్టాలు, పాలిటెక్నిక్‌ డిప్లోమాలు, ఫార్మసీ పట్టాలు ఎందరికి ఉన్నాయో లెక్కలు తెలియనంత దుస్థితిలో దేశం ఉందా ? దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 54శాతం కేవలం మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్‌,కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌ నుంచే జరుగుతోంది.కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రాలవైపే చూస్తుంటాయి.


ఒక పరిశ్రమ రావాలంటే ఏటిఎం యంత్రంలో కార్డు పెట్టగానే డబ్బులు వచ్చినంత సులభంగా రావని తల మీద మెడ ఉన్నవారందరికీ తెలుసు. పదేండ్లు తక్కువేమీ కాదు, ప్రగతి జాడ ఎక్కడ, రెండిరజన్ల పాలన ప్రభావం ఏమిటి ? చైనాతో పోల్చుకుంటే వేతనాలు మన దగ్గర తక్కువ, అయినప్పటికీ విదేశీ కంపెనీలు ఇక్కడికి ఎందుకు రావటం లేదో పెద్దలు చెప్పాలి. మీడియాలో వెలువడుతున్న అభిప్రాయాల ప్రకారం చైనా మాదిరి తక్కువ ధరలకు ఇక్కడ కూడా ఉత్పత్తి చేయవచ్చు. కానీ జరగటం లేదు. చైనాలో విధానాలను రూపొందించేది అమలు జరిపేదీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ.ఇక్కడ పార్టీలు మారుతుంటాయి కనుక సాధ్యం కావటం లేదన్నది వెంటనే చెప్పే సమాధానం. ఇది తర్కానికి నిలిచేది కాదు. అమెరికా, ఐరోపా, జపాన్‌, దక్షిణ కొరియాలో కూడా పార్టీలు, పాలకులు మారుతూనే ఉన్నారు. మరి అక్కడ సాధ్యమైంది ఇక్కడెందుకు జరగటం లేదు. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా విధానాలు ఒక్కటే. 1990 నుంచి మన దేశంలో జరుగుతున్నది కూడా అదేగా ! ఎవరు అధికారంలో ఉన్నా నూతన సంస్కరణలను ముందుకు తీసుకుపోవటమేగా. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టవద్దన్నారు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత లేక తెగనమ్మాలన్నారు. వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఎవరున్నా చేస్తున్నది అదేగా. మరింత వేగంగా, సమర్దవంతంగా అమలు చేస్తానని మోడీ చెప్పారు, అయినా ఎందుకు ముందుకు పోవటం లేదు ?


ఎంత సేపూ ఐదు లక్షల కోట్ల జిడిపి, కొద్ది వారాలుగా పదేండ్లలో రెట్టింపు కబుర్లు చెబుతున్నారు.మిగతా సూచికల్లో మనం ఎక్కడున్నాం. వాటన్నింటి సమాహారమే దేశం ఎక్కడుందో,ఎలా ఉందో తెలియ చేస్తుంది. 2024, అంతకు ముందు ప్రకటించిన కొన్ని సూచికల్లో భారత స్థానం గురించి చూద్దాం. ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు వెల్లడిరచేవే. మన్మోహన్‌ సింగ్‌ ఉన్నపుడూ ఇప్పుడూ అవే ఉన్నాయి తప్ప నరేంద్రమోడీ సర్కార్‌ను బదనాం చేసేందుకు కొత్తగా పుట్టుకురాలేదు.చిత్రాతి చిత్రం ఏమిటంటే తమకు ప్రతికూలంగా ఉన్న వాటిని మేం అంగీకరించం అంటారు. ఫేక్‌ వార్తలు, ఫేక్‌ నివేదికలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు.అంతర్జాతీయ సంస్థలు మన దేశం ప్రకటించిన సమాచారం నుంచే వివరాలు తీసుకుంటాయి తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో సరిగా మదింపు లేదన్నారు, పదేండ్ల తరువాత పరిస్థితి ఏమిటి ? అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించిన 55 దేశాల అంతర్జాతీయ మేథోసంపత్తి సూచికలో మనం 42లో ఉన్నాం. ప్రపంచ నవకల్పన సూచికలో 113 దేశాల్లో చైనా పదకొండు, భారత్‌ 39వదిగా ఉంది. ఐరాస మానవాభివృద్ధి సూచికలో 193 దేశాల్లో 134, గడచిన పదేండ్లలో దేశ ప్రతిష్టను మోడీ పెంచారని చెప్పిన తరువాత వీసాలు లేకుండా మన పౌరులను అనుమతించే దేశాలను సూచించే హానెల్‌ పాస్‌పోర్టు సూచికలో 80వ స్థానం, ఐరాస లింగసమానత్వంలో 193కు గాను 108,ప్రపంచ సంతోష సూచిక 126, మోడీ సర్కార్‌ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు కరోనా సమయం నుంచి చెప్పుకుంటున్నప్పటికీ 2024లో ఆకలి సూచికలో 126దేశాలకు గాను 105గా ఉన్నాం. ప్రపంచ శాంతి సూచికలో 163కు గాను 116వ స్థానం, అవినీతికి తమ పాలనలో తావు లేదు, మోడీ మీద ఒక్క కుంభకోణమన్నా ఉందేమో చూడండని బిజెపి పెద్దలు సవాళ్లు విసురుతుంటారు. అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సాభాగ్యముల్‌ అన్నాడు ఒక కవి. దేశం మొత్తంగా అవినీతి గురించి ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్‌ సూచికలో 2022లో 85వదిగా ఉంటే 2024లో 96వ స్థానానికి దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్చలో 180 దేశాల్లో 159వ స్థానం, పాయింట్ల వారీ చూస్తే అంతకు ముందు సంవత్సరంలో 36.62 కాగా 2024లో 31.28కి పడిపోయాయి. చట్టబద్ద పాలన సూచికలో 142దేశాల్లో 79వ స్థానం. మంచి జీవనానికి అనువైన నగరాలేమిటని 173 నగరాలను ఎంచుకోగా వాటిలో న్యూఢల్లీి, ముంబై నగరాలకు 141వ స్థానం రాగా ఆ తరువాత చెన్నయ్‌,అహమ్మదాబాద్‌, బెంగలూరు చోటు దక్కించుకున్నాయి. యుపిఏ పాలనా కాలంలో ప్రపంచ జీడిపిలో 11వదిగా ఉన్న మన దేశాన్ని ఐదవ స్థానానికి తెచ్చామని చెప్పుకుంటున్నవారు పైన పేర్కొన్న సూచికల్లో ఎందుకు విఫలమైనట్లు ?


వైఫల్యాల గురించేచెబుతారా మోడీ సాధించిందేమీ లేదా అని ఎవరైనా అడగవచ్చు. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) సమాచారం ప్రకారం 2020 నుంచి 2024వరకు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఉక్రెయిన్‌, తరువాత మనదే. రష్యాతో మూడేండ్లుగా యుద్ధం చేస్తోంది గనుక ఉక్రెయిన్‌ ఆ పని చేసింది, మనం ఎవరితో యుద్దంలో ఉన్నాం, ఎవరి మేలుకోసం ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు ? వాస్తవం ఇలా ఉంటే మన దేశం కూడా ఆయుధాలను ఎగుమతి చేస్తోందన్న ప్రచారం బిజెపి చేస్తోంది. నిజమే ! గ్లోబల్‌ ఎకానమీ డాట్‌ కాం 2022 సమాచారం మేరకు 48దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా 14,515 మిలియన్ల డాలర్ల మేరకు ఎగుమతి చేయగా, నాలుగవ స్థానంలో ఉన్న చైనా 2,017 మిలియన్‌ డాలర్లు, 40 స్థానంలో ఉన్న భారత్‌ 11 మిలియన్‌ డాలర్లు అని పేర్కొన్నది. వెనుకటికెవడో మాది 101 అరకల వ్యవసాయం అని వేరే ఊరిలో గొప్పలు చెప్పాడట, మాది అంటున్నావ్‌ ఎవరెవరు ఏమిటి అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. అందుకే,
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్‌
గనికల్ల నిజము తెలిసిన
మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ
దీని అర్ధం బిజెపి, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీ ఏం చెప్పినా వెంటనే తొందరపడకూడదు, నిజానిజాలేమిటో బాగా పరిశీలించాలి.అది తెలుసుకున్న మనిషే భూమి మీద నిజాయితీ పరుడు. మనలో ఎందరం దీన్ని పాటిస్తున్నామో ఎవరికి వారే ఆలోచించుకోవాలి,ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.దేన్నీ గుడ్డిగా నమ్మకు అని పెద్దలు చెబితే ప్రతిదాన్నీ ప్రశ్నించు అని వివేకానందుడు చెబితే అన్నింటినీ సందేహించు అని మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్‌ మార్క్స్‌ చెప్పాడు.

భారత జిడిపి వృద్ధి స్వంత డబ్బా, అతిశయోక్తులు : నరేంద్రమోడీ సుభాషితాలు, చేదునిజాలు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ చెప్పింది.అయితే ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ, ప్రాంతీయ పత్రికలు కూడా ఈ వార్తకు పెద్ద ఎత్తున ప్రాచుర్యమిచ్చాయి. భజనపరుల సంగతి చెప్పేదేముంది, కీర్తి గీతాలు పాడుతున్నారు. బుర్రకు పని చెప్పకుండా చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని చెబుతారు. లేదు మా వేదగణితం, మోడీ లెక్కల ప్రకారం 105శాతమే ఎక్కువ అంటే అంతేగా అంతేగా మరి అనటం తప్ప చేసేదేముంది ! ఎవరన్నా గట్టిగా కాదు అంటే మున్సిపల్‌ అధికారులు వచ్చి నిబంధనలన్నీ సక్రమంగానే పాటించినా వారి ఇళ్ల గోడల నిర్మాణంలో ఇసుక, సిమెంటు పాళ్లలో తేడా కనిపిస్తోందని,హానికారక రంగులు వేశారంటూ వెంటనే బుల్డోజర్లతో కూల్చివేసే రోజులివి. వ్యంగ్యాన్ని భరించలేక ముంబైలో కునాల్‌ కమ్రా ప్రదర్శన జరిగిన హాలును ఎలా కూల్చివేశారో చూశాంగా !

టీవీ9 నిర్వహించిన సమావేశంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చూద్దాం. ‘‘ నేడు ప్రపంచ కళ్లన్నీ భారత్‌ మీదే ’’. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచీ పదాలు మార్పు ఉండవచ్చు తప్ప ఇదే పాట. ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యలో అయినా లేదా వివాద పరిష్కారంలోనైనా భారత పాత్రను కోరిన దేశాలు గానీ, మోడీ ప్రమేయంగానీ ఉన్న ఉదంతం ఒక్కటంటే ఒక్కటి ఉందా ? కానీ మోడీ చెప్పిందాన్ని మరోవైపు నుంచి చూస్తే నూటికి నూరుపాళ్లూ వాస్తవం. ఏమిటంటే మన మార్కెట్‌లో తమ వస్తువులను అమ్ముకోవటానికి, తమకు అవసరం లేని వాటిని మనకు అంటగట్టటానికి (ప్రపంచంలో నిషేధించిన అనేక పురుగుమందులు, రసాయనాలు, ఔషధాలు మన దగ్గర పుష్కలంగా దొరుకుతున్నాయి), ఇక్కడి కార్పొరేట్లకు మోడీ సర్కార్‌ ఇస్తున్న రాయితీల కారణంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు తరలించుకుపోవటానికి మనవైపు చూస్తున్న మాట వాస్తవం.


‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని అదే నోటితో చెప్పటం విన్నాం. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు గత పదేండ్లుగా కూడా ఉంది. అనూహ్య అద్భుతాలు లేదా నరేంద్రమోడీకి కొత్తగా దైవిక శక్తులు వస్తే తప్ప దాన్నుంచి సమీప భవిష్యత్‌లో బయటపడే దరిదాపుల్లో కూడా లేదు. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు చెప్పుకుంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ శభాష్‌ అని చెప్పుకుంటున్నాం. అ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? దీనికే పొంగిపోతున్నాం. ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, మనకంటే మెరుగైన అభివృద్ధి అంటే పాకిస్తాన్‌ ఏజంట్లని ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోడీ అతిశయోక్తుల గురించి చెప్పుకోవటానికి ఈ ఒక్కటి చాలు.


ఆర్థిక విస్తరణలో జి7, జి20, బ్రిక్స్‌ దేశాలన్నింటి కంటే అసాధారణ వృద్ధి సాధించినట్లు వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వర్ణించారు. త్వరలో జిడిపిలో భారత్‌ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని బిజెపి పెద్దలు, వారి సమర్ధకులు నిత్యం ఊదరగొడుతుంటారు. ఇదొక మైండ్‌ గేమ్‌. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా ? ప్రస్తుతం జపాన్ను అధిగమించేందుకు మోడీ చూస్తున్నారని, 2027 తొలి ఆరునెలల్లోనే 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి, మన పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 1.5 సంవత్సరాలకు (18నెలలకు) ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


కొంత మందికి అంకెలతో ఆడుకోవటం వెన్నతో పెట్టిన విద్య. అంతా అద్భుతంగా ఉందని చెబుతూనే 2025 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతం ఉంటుందని సన్నాయి నొక్కులు. రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్నారు కొందరు. చెన్నయ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు. పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ(పిపిపి) పద్దతి జీవన ప్రమాణాలను మెరుగ్గా వెల్లడిస్తుందని కొందరు చెబుతారు, దాని ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా చెప్పింది. మనకంటే పేద దేశమైన కంపూచియా పైన ఉంది, దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు త్వరలో అధిగమించే దూరం ఎంతో దూరం లేదని నమ్మించేందుకు చూస్తున్న చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో ఆల్జిబ్రా లేదా వేద గణితం ఏదో ఒక అడ్డగోలు పద్దతిలో లెక్క వేసుకోవాల్సిందే.

పదకొండు సంవత్సరాల విశ్వగురువు మోడినోమిక్స్‌ సమర్ధ పాలన తరువాత పరిస్థితి గురించి కమ్యూనిస్టులో ఇతర పురోగామి వాదులో చెబుతున్న మాటలను కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే ఎండమావుల వెంట పరిగెడుతున్న జనం వారి మాటలను తలకు ఎక్కించుకొనే స్థితిలో లేరు. బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 21వ తేదీ సంచికలో వైట్‌ కాలర్‌ భారత్‌లో 500 డాలర్ల ఉద్యోగాలింకేమాత్రం లేవు అంటూ ఒక వార్త వచ్చింది.విజ్‌డమ్‌ హాచ్‌ అనే సంస్థ స్థాపకుడు అక్షత్‌ శ్రీవాత్సవ చెప్పిన అంశాలను దానిలో చర్చించారు. శ్రీవాస్తవ చెప్పిన అంశాలు, వార్తలోని వ్యాఖ్యల సారం ఇలా ఉంది.సాంప్రదాయకంగా ఉపాధి కల్పించే రంగాలు, వృద్ధి పడిపోతున్నది, యువత ఎలా ముందుకు పోవాలో ఎంచుకోవటం కష్టంగా మారుతున్నది. దేశ అభివృద్ధి నమూనా గతం మీద ఇంకేమాత్రం ఆధారపడలేదు. భారత ఐటి మార్కెట్‌ నిర్ణయాత్మక మార్పుకు లోనవుతున్నది, అది మంచిదారిలో కాదు. ఐటిలో మంచి ఉద్యోగాలు అంతరిస్తున్నాయి, అవి వెనక్కు తిరిగి రావు. ‘‘ ఒక తెల్లవాడికి వెయ్యి డాలర్లు ఇచ్చే బదులు భారతీయులకు 500 డాలర్లు ఇచ్చారు. ఆ సొమ్ముతో మనం సంతోష పడ్డాం. ఎందుకంటే ఇప్పటికీ అది గొప్ప ఉద్యోగమే.అది మన జీవన ప్రమాణాలను పెంచింది. కానీ అది ఆ కాలం కనుమరుగుతున్నది.’’ అని శ్రీవాత్సవ పేర్కొన్నారు.‘‘ ప్రభుత్వం ఒక పరిష్కారం చూపుతుందేమోనని ఆశించటం అర్ధలేనిది, ఆ మార్పు రావాలంటే దశాబ్దాలు పడుతుంది, అప్పటికి మీరు వృద్ధులు కావచ్చు ’’ అని కూడా చెప్పారు.

పదకొండు సంవత్సరాల క్రితం 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక బిజెపి నేత, గుజరాత్‌ సిఎంగా చెప్పిందేమిటి ? మిగతా అంశాలను పక్కన పెడదాం. గుజరాత్‌ నమూనా అభివృద్ధిని దేశమంతటా విస్తరిస్తాం అన్నారు. అంటే పారిశ్రామికంగా వృద్ధి చేస్తామన్నారు. ప్రధాని పదవిలోకి రాగానే విదేశాలకు ఎందుకు పదే పదే వెళుతున్నారంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అన్నారు. కానీ జరిగిందేమిటి ? తరువాత ఎప్పుడైనా గుజరాత్‌ నమూనా గురించి ఎక్కడైనా మాట్లాడారా ? 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా కొంత భూమి సాగులోకి వచ్చింది, కొంత వ్యవసాయేతర అవసరాలకు మళ్లింది. ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెడితే స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద నాడు 20 కోట్ల మంది బతికితే ఇప్పుడు 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఏటా రెండు కోట్ల మేరకు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాటలేమైనట్లు ?

విదూషకుడు కునాల్‌ కమ్రా హాస్య వీడియో వివాదం : గూండాయిజం, బుల్డోజర్లతో భావ ప్రకటనా స్వేచ్చ హరించే యత్నం !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? చిన్న పాటి వ్యంగ్యం, జోక్‌, విమర్శలను కూడా సహించని శక్తులు రెచ్చిపోతున్నాయి. అధికార యంత్రాంగం అలాంటి వారి చేతుల్లో పనిముట్టుగా మారుతోంది. విదూషకుడు కునాల్‌ కమ్రా వంటి వారు, మిమిక్రి కళాకారులు,చతురోక్తులతో విమర్శలు చేసే వారు, కార్టూనిస్టులు, సినిమా వారు ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న రాజకీయ నేతల తీరుతెన్నులను హాస్య భరితంగా జనం ముందు ఎండగట్టారో వారికి మూడిరదే. వెంటనే గూండాలు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టిస్తారు. వీధుల్లో తిరగనీయం, ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు. సంబంధిత వ్యక్తులు, సంస్థల భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు స్థానిక సంస్థల సిబ్బందికి అప్పుడే గుర్తుకు వస్తాయి, వెంటనే బుల్డోజర్లతో ఆఘమేఘాల మీద కూల్చివేస్తారు. ఎక్కడబడితే అక్కడ వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తారు. సినిమాల్లో మాదిరి అంతా అయిపోయాక రావటం గాక పోలీసులు సిద్దం సుమతీ అన్నట్లు ఉంటారు. ఇక మద్దతు ఇచ్చే రాజకీయ నేతలు, అవే రంగాలకు చెందిన తోటి వారు సైతం రంగంలోకి దిగి దాడులు మొదలు పెడతారు, సుభాషితాలు వల్లిస్తారు.ఈ గూండాయిజాన్ని సిపిఎం, ఉద్దావ్‌ ధాకరే శివసేన ఖండిరచాయి.


చట్ట ప్రకారం తప్పు చేసిన వారిని ఎవరూ సమర్ధించరు. భావప్రకటనా స్వేచ్చ హద్దులేమిటో చట్టాల్లోనే ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే వాటి ప్రకారం ఎంత పెద్దవారినైనా విచారించి శిక్షలు వేయవచ్చు. కానీ కొంత మంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వారిని చూసీ చూడనట్లు వదలివేయటంతో కొత్త వారికి ప్రోత్సాహం వస్తోంది. గతంలో ఇటలీ, జర్మనీ వంటి చోట్ల ఫాసిస్టులు, నాజీలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు అదేపని చేశారు. తమ మీద విమర్శలు చేసిన వారిని తమకు నచ్చనివారిని వెంటాడారు, వేధించారు.నాగరికులమని చెప్పుకున్న, భావించిన వారిలో అనేక మంది మౌనంగా ఉన్నారు. నేటి మాదిరి అడ్డగోలు చర్యలను సమర్ధించిన మేథావులూ, కళాకారులూ నాడున్నారు, జరిగిందేమిటి ? అలాంటి వారిని చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది.1940,50 దశకాల్లో తెలంగాణా సాయుధ పోరాటం జరిగిన సమయంలో సాయుధ పోలీసులు గ్రామాల మీద దాడులు జరిపారు. కోస్తా ప్రాంతంలో గ్రామాలలో గాంధీ విగ్రహాలు నెలకొల్పిన కూడళ్లలో జనాన్ని మందవేసి మీలో కమ్యూనిస్టులెవరో, కాని వారెవరో స్వచ్చందంగా చెప్పండి అని ఆదేశించేవారు. కమ్యూనిస్టులు నిజాయితీగా ముందుకు వస్తే కాని వారు మేం యాంటీ కమ్యూనిస్టులం అని కొన్ని చోట్ల గొప్పగా చెప్పుకున్నారట. ఉన్న కమ్యూనిస్టులతోనే వేగలేక చస్తుంటే వారికి తోడు మరొకరు యాంటీ కమ్యూనిస్టులా అంటూ వారిని కూడా చావబాదినట్లు, బట్టలిప్పించి గాంధీ విగ్రహాల చుట్టూ తిప్పించినట్లు పెద్దలు చెప్పారు. నాటి బ్రిటీష్‌, నిజాం, నెహ్రూ సైన్యం, రిజర్వు పోలీసులకు ఆ రోజుల్లో కమ్యూనిస్టు అన్న పదం వినిపిస్తే అలా ఉండేది మరి. ఆ గుణపాఠాలను మనం తీసుకోవాలా వద్దా, మనకెందుకులే అని తప్పించుకు తిరగాలా ? అన్యాయం, అధర్మాన్ని వ్యతిరేకించకుండా మౌనంగా ఉంటే వాటికి పాల్పడేవారు సహిస్తారని భావిస్తే పొరపాటు. సమర్ధించకుండా మౌనం అంటే మమ్మల్ని వ్యతిరేకించటమే అని మౌనమునుల సంగతి కూడా చూస్తారు. దేశంలో ఇదే జరగనుంది !


ఇటీవల ముంబై హాబిటాట్‌ హాస్య కేంద్రంలో ప్రదర్శించిన కునాల్‌ కమ్రా ప్రదర్శనలో విసిరిన ఒక చతురోక్తి తమ నేత ఏకనాధ్‌ షిండేను ఉద్దేశించే అని అతగాడి నాయకత్వంలోని శివసేన మద్దతుదారులు ఆ కేంద్రంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న స్టూడియో నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెంటనే కొంత భాగాన్ని కూల్చివేశారు. నాగపూర్‌లో ఇటీవల జరిగిన అల్లర్లకు సూత్రధారి అంటూ కొందరిని పోలీసులు ఆరోపించటం, వెంటనే వారిలో ఒకరి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మునిసిపల్‌ అధికారులు కూల్చివేయటాన్ని చూస్తే పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిన విపరీతాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయా ఉదంతాలు జరిగే వరకు సదరు మున్సిపల్‌ అధికారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతుంటారో ఎవరి సేవలో తరిస్తుంటారో తెలియదు. బిజెపి, దాని మద్దతుదారులు అధికారంలో ఉన్నచోట చిన్న నొప్పి అనిపిస్తే చాలు వెంటనే వారికి క్షణాల మీద అతిక్రమణలు ఎలా గుర్తుకు వస్తున్నాయో ఆఘమేఘాల మీద ఎలా కూల్చివేస్తున్నారో అంతుబట్టటం లేదు.


తెలుగు ప్రాంతాల్లో కొన్ని పదాలు ‘‘ కో పైలట్‌, జామాతా దశమ గ్రహం, వెన్నుపోటు,వైస్‌రాయ్‌ హోటల్‌ బ్యాచి, తోలు తీసేవారు, తాటవలిచే వారు, పాచిపోయిన లడ్డూలు, మాట తప్పను మడమతిప్పను, మీట నొక్కుడు, వాట్‌ అయామ్‌ సేయింగ్‌, అలా ముందుకు పోతున్నాం, ఆ రెండు పత్రికలు, సన్నాసులు, ఫాంహౌస్‌, పొట్టోడు, ట్విటర్‌ పిట్ట, గడకర్ర, భాయియోం` బహినోం, సూపర్‌ సిక్స్‌ ’’ వంటి పదాలు చలోక్తులు విసిరేందుకు,రచనలు చేసేందుకు వస్తువుగా మారుతున్నాయి. వాటితో పాటు ఇంకా అనేక పదాలను పేరు పెట్టకుండా ఎవరు ఉచ్చరించినా ఎవరిని ఉద్దేశించి అనేది అందరికీ ఎరుకే. తమ నేతలనే అంటున్నారని మద్దతుదారులు కత్తులు, కటార్లు పట్టుకొని వీధులోకి వస్తే కుదురుతుందా ! మహారాష్ట్రలో అలాంటి పదాలలో ‘‘ ద్రోహి, గౌహతి ప్రయాణం,ఆటోవాలా ’’ అనేవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. కునాల్‌ కమ్రా అలాంటి పదాలతో ఎవరి పేరూ ప్రస్తావించకుండా చతురోక్తులు విసిరాడు. మా నాయకుడినే అంటూ ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సిఎం ఏకనాథ్‌ షిండే శివసేనకు చెందిన వారు హాబిటేట్‌ స్టూడియోలో విధ్వంసకాండ సృష్టించారు.కునాల్‌ కమ్రాను నరికి వేస్తామంటూ వీరంగం వేస్తున్నారు. అమెరికా, లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక మంది దేశాధినేతలు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారిని మీడియాలో, ఇతరంగా అనేక మంది ఫాసిస్టు, నాజీలని నేరుగానే సంబోధించి విమర్శిస్తున్నారు.నోరుబట్టని బూతులను కూడా వినియోగిస్తున్నారు.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి పదాలను ఎలాంటి సంకోచం లేకుండా పరస్పరం వాడేస్తుంటారు. కానీ అదే కళాకారులు వాటిని వ్యంగ్యాస్త్రాలుగా వాడితే మాత్రం సహించరు. మేం మేం వందనుకుంటాం మీరెవరు అన్నట్లుగా స్పందిస్తారు.


తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్దమే అని కునాల్‌ కమ్రా చెప్పాడు. చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పటమే అది. అంతే కాదు గూండా గుంపులను ఉద్దేశించి మరో పేరడీ పాటతో రెండో వీడియోను కూడా విడుదల చేశాడు. తమ దగ్గర కేసు నమోదైంది గనుక వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు, తనకు వారం రోజుల సమయం కావాలని కునాల్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ మేరకు వివరణ ఇవ్వకపోతే చట్టం తనపని తాను చేసుకుపోవాలి. కానీ అతను ప్రదర్శన నిర్వహించిన క్లబ్బు మీద దాడి, అతిక్రమణలంటూ కూల్చివేతలు ఏమిటి ? వచ్చిన జనాల మీద కూడా దాడిచేస్తారా ? అంటే ఎవరూ కునాల్‌ వంటి విమర్శకులు, చతురోక్తులు విసిరే వారికి వేదికలను ఎవరైనా ఇస్తే వాటన్నింటికీ ఇదే గతి పడుతుందని చెప్పటమే కదా ! ఎంతకాలం ఇలా బెదిరిస్తారు, ఎందరి నోరు మూయిస్తారు, ఇదా అసలైన ప్రజాస్వామ్యం అంటే ? దేశం, ఇతర దేశాల నుంచి కునాల్‌కు మద్దతు వెల్లువెత్తుతున్నది, చట్టపరంగా ఎదుర్కొనేందుకు, ధ్వంసమైన స్టూడియోకు చెల్లించేందుకు అనేక మంది లక్షలాది రూపాయలను విరాళంగా కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ పార్టీల నేతలు, వారిద్రోహాలు, అధికార దాహాల గురించి జనంలో ఉన్న అసంతృప్తి, ఆగ్రహాలకు ఇది నిదర్శనం, గళమెత్తాలని కోరటం తప్ప మరొకటి కాదు. ఏకనాధ్‌ షిండే అనుచరులుగా ఉన్నవారు విధ్వంసకాండకు పాల్పడ్డారు తప్ప, మానేతను అంటారా అని సామాన్య జనం వీధులకు ఎక్కినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. కునాల్‌ పరోక్షంగా చతురోక్తులు వేసిన వారిలో ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ, అంతకంటే శక్తివంతుడిగా పేరున్న అమిత్‌ షా కూడా ఉన్నారు. బాద్‌షా బాద్‌షా అనే సినిమా పాటను అనుకరించి హాస్యం పండిరచాడు. మిస్టర్‌ ఇండియా సినిమాలోని హవా హవాయి పాటకు పేరడీతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మీద కూడా సెటైర్లు వేస్తూ వీడియోను తాజాగా విడుదల చేశాడు.సినిమా హాళ్లలో అమ్మే పాప్‌ కార్న్‌( మొక్క జొన్న పేలాలు) మీద వివిధ రకాల జిఎస్‌టిలను విధిస్తూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కుమ్రా బాంకు ఖాతాలు, వాటి లావాదేవీల గురించి తనిఖీలు, విచారణలు తప్ప వారి అభిమానులు గూండాయిజానికి పాల్పడిన ఉదంతాలేవీ ఇంతవరకు నమోదు కాలేదు.


గతంలో కొందరు రాజకీయ నేతల రూపలావణ్యాలతో చిత్రించిన పాత్రలతో సినిమాలు వచ్చాయి. అంతెందుకు కునాల్‌ కమ్రాను విమర్శించిన బిజెపి ఎంపీ కంగన రనౌత్‌ నిర్మించి స్వయంగా నటించిన ఎమర్జన్సీ సినిమా ఇందిరా గాంధీని విమర్శించటానికి తప్ప మరొకందుకు కాదు. కానీ ఆమె కునాల్‌ కమ్రాకు నీతులు చెబుతున్నారు. ఎమర్జన్సీ సినిమాలో తమ సామాజిక తరగతిని కించపరిచారు, చరిత్రను వక్రీకరించారంటూ సిక్కులు సినిమా థియేటర్ల ముందు ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెలిపారు తప్ప వాటి మీద, లేదా సినిమా నిర్మించిన స్టూడియోల మీద దాడులు చేయలేదు. కానీ పద్మావత్‌ సినిమా విడుదల సమయంలో అలాంటి దాడులు జరిగాయి. సినిమాల ద్వారా సెటైర్లు వేయటం కొత్త కాదు. ప్రఖ్యాత చార్లీ చాప్లిన్‌ గ్రేట్‌ డిక్టేటర్‌ పేరుతో హిట్లర్‌ మీద తీసిన సినిమా గురించి తెలిసిందే. పూర్వపు సోవియట్‌ కెజిబి ఏజంట్లను వెర్రి వెంగళప్పలుగా, సిఐఏ వారిని ఎంతో తెలివితేటలు కలిగిన వారిగా చిత్రించిన సినిమాలు అనేకం, అలాగే కమ్యూనిస్టులను దుర్మార్గులుగా రూపొందించినవీ తెలిసిందే. తెలుగులో రాజకీయ కారణాలతో అలాంటి సినిమాలు రాలేదా ! కానీ తమకు నచ్చని భావజాలం, వార్తలు, కార్టూన్లు, కామెడీ, సినిమాల మీద దాడి చేయటం దుర్మార్గం.


తమకు నచ్చని రచనలు చేసినందుకు, విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి. కేసులు కూడా పెడుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారందరికీ పెడుతున్న ముద్దు పేరు ద్రోహి అనే కదా ! నైజాం నవాబును వ్యతిరేకించిన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ను నైజాం గూండాలు కాల్చిచంపి, కసి తీరక రచనలు చేసే కుడిచేతిని నరికిన దుర్మార్గం చరిత్రలో చెరిగి పోదు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన కన్నడ నటి, నిర్మాత స్నేహలతా రెడ్డిని నాటి కాంగ్రెస్‌ పాలకుల బరోడా డైనమెట్‌ అనే తప్పుడు కేసులో ఇరికించి జైల్లో చిత్రహింసలు పెట్టారు, దాంతో ఆమె ఆరోగ్యం దెబ్బతినటంతో విడుదల చేసిన ఐదు రోజులకే ఆమె కన్నుమూశారు.హేతువాదులు, వామపక్ష పవాదులుగా ఉన్న నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, జర్నలిస్టుగా ఉన్న గౌరీ లంకేష్‌, మేథావి, రచయిత కులుబుర్గిని మతోన్మాదులు మన కళ్ల ముందే బలితీసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా పిరికిబారకుండా తాను నమ్మిన, తగినవి అనుకున్న ఇతివృత్తాలతో కునాల్‌ కమ్రా తన హాస్య కార్యక్రమాలతో అనేక మందితోపాటు, ధోరణులను చీల్చి చెండాడుతున్నారు.తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి మూకలను చూసి భయపడి మంచాల కింద దాక్కొనే వాణ్ణి కాదని చెప్పారు. ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్‌ తన కుంచెతో మహాత్మా గాంధీని, జిన్నా, జవహర్‌లాల్‌ నెహ్రూతో సహా ఎవరినీ వదల్లేదు. హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రికలో ఉద్యోగాన్ని వదులుకున్నాడు తప్ప కుంచెపదును తగ్గించుకోలేదు. నన్ను కూడా వదలకుండా కార్టూన్లు వేయి శంకర్‌ అన్న నెహ్రూ వంటి నేతలు పుట్టిన దేశంలో చిన్న పాటి వ్యంగ్యాన్ని కూడా సహించని వారు నేడు రాజకీయాల్లో పెత్తనం చేస్తున్నారు.తన మీద విసిరిన వ్యంగోక్తిని ఏకనాధ్‌ షిండే వదలివేసి ఉంటే కునాల్‌ వీడియో చూసే వారికి మాత్రమే అది పరిమితమై ఉండేది.అనుచరులతో చేయించిన రచ్చతో ఆ ఉదంతానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందో చూస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే పాత్ర మరింతగా బహిర్గతమైంది. తనకు తానే పరువును బజారుకు ఈడ్చుకున్నట్లు లేదూ !

ఉక్రెయిన్‌ సంక్షోభంలో పుతిన్‌ తొలి విజయం : ఆంక్షల ఎత్తివేత షరతులతో అమెరికాతో ఒప్పందం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు నల్ల సముద్ర ప్రాంతలో స్వేచ్చగా నౌకా సంచారానికి రష్యా అంగీకరించింది. అయితే తమ షరతులను ముందుగా అమలు జరపాలని స్పష్టం చేసింది. బంతిని అమెరికా మైదానం వైపు నెట్టింది. తమ ఆహార ఎగుమతులకు వీలుగా ద్రవ్య సంస్థల మీద విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిన తరువాతే ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పింది. మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆహార వాణిజ్యంతో సంబంధం ఉన్న రష్యన్‌ వ్యవసాయ, ఇతర బాంకుల మీద ఉన్న ఆంక్షల ఎత్తివేతతో సహా ఇతర అంశాలను కూడా అమలు జరపాలని స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్లకు గతంలో మాదిరి ఆహారం, ఎరువుల ఎగుమతుల పునరుద్దరణ, తమ పతాకాలున్న నౌకల మీద ఆంక్షల తొలగింపు, సముద్ర ప్రయాణ బీమా ధరల తగ్గింపు, వివిధ రేవులను, ద్రవ్య లావాదేవీలు జరిపేందుకు చెల్లింపుల వ్యవస్థలను అందుబాటులోకి తేవటం వంటివి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో కూడా పైన పేర్కొన్న అంశాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. క్రెమ్లిన్‌ విడిగా చేసిన మరొక ప్రకటనలో మార్చి 18 నుంచి నెల రోజుల పాటు రష్యా మరియు ఉక్రెయిన్‌ ఇంథన వ్యవస్థల మీద పరస్పరం దాడులు చేసుకోకుండా ఉండేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నది. ఒప్పంద వ్యవధిని పొడిగించేందుకు లేదా ఎవరు విఫలమైనా ఒప్పందం నుంచి వెనక్కు తగ్గేందుకు అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతకు ముందు అమెరికా ప్రతినిధులతో సమావేశమైన తరువాత రష్యాతో కుదిరిన ఒప్పందానికి తాము అంగీకరిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మొత్తం మీద చూసినపుడు పుతిన్‌ తొలి విజయం సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు, ఉక్రెయిన్‌ కారణంగానే నల్ల సముద్ర స్వేచ్చా రవాణా ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టు వైపు వెళ్లింది. దాని చిత్తశుద్దికి పరీక్ష అని చెప్పవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి అమెరికా, రష్యా ప్రతినిధి వర్గాల మధ్య సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సోమవారం నాడు చర్చలు జరిగాయి.వాటి తీరుతెన్నుల గురించి ప్రతినిధులు తమ దేశ నేతలకు వివరించిన తరువాత అవగాహన గురించి మంగళవారం రాత్రి ఎవరికి వారు విడిగా ప్రకటనలు చేశారు. పది గంటల పాటు జరిగిన సంప్రదింపులలో మూడు సార్లు విరామం ఇచ్చారు. చర్చల తరువాత అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులతో చర్చలు జరిపారు. ఒకవైపు చర్చలు సాగుతున్నప్పటికీ రెండు పక్షాలూ దాడులు కొనసాగించాయి. తాము 30 మంది రష్యన్‌ సైనికులను చంపివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. తాము ట్రంప్‌ ప్రతిపాదించిన నెల రోజుల కాల్పుల విరమణను అంగీకరించలేదని, ఇంథన మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేసేందుకు మాత్రమే అంగీకరించినట్లు రష్యా ప్రతినిధులు అంతకు ముందు చెప్పారు.


నల్ల సముద్రంలో రేవుల నుంచి ఎగుమతి అయ్యే ధాన్యం,నూనెలు,ఎరువుల తనిఖీ గురించి గతంలో కుదిరిన ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. దానిలో తమ ఎగుమతుల మీద ఉన్న ఆంక్షల భాగాన్ని అమలు జరపలేదని గతంలో పేర్కొన్నది. ఇతర అంశాలపై సైనిక చర్యనాటి నుంచి రష్యా చేస్తున్న డిమాండ్లలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. నాటోలో చేరాలన్న ప్రతిపాదనను అధికారికంగా జెలెనెస్కీ ఉపసంహరించుకోవాలి,ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న, స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ సేనలను ఉపసంహరించుకోవాలి. సోవియట్‌ కాలంలో ఉక్రెయిన్‌ పాలనా పరిధిలోకి వచ్చిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా తిరిగి తనలో విలీనం చేసుకున్నది. దానితో సహా, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలన్నింటినీ వెనక్కు అప్పగించాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని జెలెనెస్కీకి అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఒప్పందం కుదిరి మిలిటరీ చర్యను ఉపసంహరించుకున్న తరువాత శాంతి సేనలనో మరొక పేరుతోనో తమను వ్యతిరేకించే దేశాల మిలిటరీని సరిహద్దుల్లో అంగీకరించేది లేదని కూడా రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు చర్చలకు తేదీ, స్థలం నిర్ణయించిన తరువాత జెలెనెస్కీ టైమ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌పై ఆరోపణలు చేశాడు. సౌదీలో చర్చల రోజే వాటిని ఆ పత్రిక ప్రచురించింది. రష్యన్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అమెరికా అధ్యక్ష భవనంలో పని చేస్తున్న కొంత మంది మీద ప్రభావం చూపుతున్నాయని జెలెనెస్కీ ఆరోపించాడు. వారు స్వంత గూఢచారుల సమాచారం కంటే పుతిన్‌ మీదనే ఎక్కువగా విశ్వాసం ఉంచుతున్నట్లు చెప్పాడు. యుద్దం ముగియాలని ఉక్రేనియన్లు కోరుకోవటం లేదని అందువలన వారిని దారికి తెచ్చేందుకు ఏదో ఒకటి చేయకతప్పదన్న సూచన అమెరికన్లకు వెళ్లిందని అన్నాడు. రష్యాలోని కురుస్కు ప్రాంతంలో ఉన్న తమ సేనలను రష్యా చక్రబంధం చేసిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలు కూడా తప్పుడు సమాచార ప్రభావమే అన్నాడు. పుతిన్ను సంతుష్టీకరించేందుకు, జెలెనెస్కీని అంకెకు రప్పించేందుకు గానీ అందచేస్తున్న మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ యంత్రాంగం ఐరోపా నుంచి వత్తిడితో తరువాత వాటిని పునరుద్దరించింది. విలువైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వాషింగ్టన్‌ వచ్చిన జెలెనెస్కీ ఓవల్‌ కార్యాలయంలో డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో గొడవపడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పాక్షిక ఒప్పందానికి సుముఖత తెలిపిన తరువాత కూడా రష్యా ప్రతిరోజూ దాడులు చేస్తున్నదని, వాటిని నివారించాలంటే పుతిన్‌ మీద మరింత వత్తిడి తేవాలని జెలెనెస్కీ తన మద్దతుదార్లను కోరుతున్నాడు. గత ఒక్క వారంలోనే నియంత్రిత బాంబుదాడులు 1,580, 1,100డ్రోన్‌ దాడులు, వివిధ రకాల 15 క్షిపణులతో దాడులు చేసినట్లు చెప్పాడు. వాటిలో 1,02,000 వరకు విదేశీ విడిభాగాలు ఉన్నాయని, దీని అర్ధం ఇప్పటి వరకు రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలించలేదని తేలింది గనుక ఆంక్షల నిబంధనలలో ఉన్న లోపాలను సవరించి కఠినంగా అమలు జరపాలన్నాడు. అందుకోసం కొత్త నిర్ణయాలు, కొత్తగా వత్తిడి అవసరమన్నాడు.


క్రిమియా,డాన్‌బాస్‌, రష్యా అదుపులో ఉన్న మరో రెండు ప్రాంతాలు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కీలక అంశాలని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ రియాద్‌ చర్చలకు రెండు రోజుల ముందు చెప్పాడు.రష్యా పాలనకు మద్దతు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం వాటిని రష్యా ప్రాంతాలుగా ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా అన్నది ముఖ్యమన్నాడు. వాటి మీద అంగీకారం కుదిరితే సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. ఈ నాలుగు ప్రాంతాల్లో మెజారిటీ జనం రష్యన్‌ భాష మాట్లాడతారని, రష్యా పాలనకు ఆమోదం తెలిపారన్నాడు. వీటిని ఆమోదిస్తే జెలెనెస్కీ రాజకీయంగా బతుకుతాడా అన్నది కూడా కీలకాంశమన్నాడు. వాటిని రష్యన్‌ ప్రాంతాలుగా గుర్తించేది లేదని జెలెనెస్కీ గతంలో స్పష్టం చేశాడు. ఐరోపా ప్రమేయం లేని సౌదీ చర్చల్లో ముందుకు వచ్చిన ఇతర అంశాలేమిటి? ఐరోపా యూనియన్‌, ఇతర నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది, తదుపరి ముందుకు పోవటం ఎలా అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.


ఇజ్రాయెల్‌లో నిరసన ప్రదర్శనలు !
ఒక పరిణామం ఆందోళన, ఆగ్రహాలకు దారి తీస్తున్నది. మరొక సంక్షోభ తాత్కాలిక పరిష్కారం గురించి సానుకూల సంకేతాలు. బందీల విముక్తి దానికి ప్రతిగా ఖైదీల విడుదలకు సంబంధించి గాజాలోని హమస్‌తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘించింది. మరోమారు గాజాలో మారణకాండను ప్రారంభించింది.దీని మీద ప్రపంచంలో వెల్లడైన నిరసన అంతా ఒక ఎత్తయితే ఏకంగా ఇజ్రాయెల్‌లోనే లక్షలాది మంది ప్రధాని నెతన్యాహు రక్తదాహాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరపటం గమనించాల్సిన పరిణామం. బందీలను తమ వద్ద ఉంచుకొని వేలాది మంది ప్రాణాలను తీసేందుకు, లక్షలాది భవనాలను నేలమట్టం గావించటాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారనే వత్తిడి పాలస్తీనియన్ల నుంచి వచ్చిన కారణంగానే హమస్‌ శాంతి ఒప్పందానికి అంగీకరించింది. దీని అర్ధం గాజన్లు హమస్‌ను వ్యతిరేకిస్తున్నారని కాదు. అలాగే బందీల గురించి పట్టించుకోకుండా అరబ్బుల ఊచకోత, పాలస్తీనా ప్రాంతాలపై దాడులతో సాధించేదేమిటని ఇజ్రాయెలీ పౌరులు కూడా పెద్ద ఎత్తున వత్తిడి చేసిన కారణంగానే నెతన్యాహ ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. యూదులు మారుమనసు పుచ్చుకొని తమ ప్రభుత్వంపై ఆగ్రహిస్తున్నారని అనుకున్నా పొరపాటే. నిజానికి అలాంటి ధోరణే ఉంటే ఏడాదిన్నర కాలంగా మారణకాండను సహించి ఉండేవారే కాదు. అలా అని మొత్తం యూదులందరూ ఉన్మాదులే అనుకున్నా తప్పే.గాజా ప్రాంతాన్ని శాశ్వతంగా ఆక్రమించేందుకు ఇజ్రాయెల్‌ పథకవేయనున్నట్లు, దానికి గాను అనేక సాకులు చెబుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి ఒకటవ తేదీన కాల్పుల విరమణ తొలి దశ ముగిసింది. హమస్‌ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్లు చెబుతుండగా వారిలో 35 మంది మరణించి ఉండవచ్చని కూడా అంటున్నారు..


గత వారంలో మారణకాండను తిరిగి ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఈసారి గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవాలని కొందరు బహిరంగంగానే పిలుపు ఇస్తున్నారు. అమెరికా సంగతి సరేసరి. దాన్ని తాము స్వాధీనం చేసుకొని విహార కేంద్రంగా మారుస్తామని, అక్కడ ఉన్న జనాలను జోర్డాన్‌, ఈజిప్టు తదితర దేశాలకు తరలించి పునరావాసం కల్పిస్తామని ట్రంప్‌తో సహా అక్కడి దుర్మార్గులు మాట్లాడుతున్నది తెలిసిందే.2023 అక్టోబరు ఏడు నుంచి గాజా మీద దాడులు జరుపుతున్నా, దాన్ని అష్టదిగ్బంధనం కావించినప్పటికీ ఇజ్రాయెల్‌ మిలిటరీ బందీల జాడ కనుక్కోలేకపోవటమే గాక ఒక్కరంటే ఒక్కరిని కూడా విడుదల చేయించలేకపోయింది. దాని దాడుల్లో కొంత మంది బందీలు మరణించినట్లు హమస్‌ గతంలో పేర్కొన్నది. బందీల ప్రాణాలను ఫణంగా పెట్టి పాలస్తీనియన్లను సాధిస్తారా అని ఆలోచించే వారి సంఖ్య టెల్‌అవీవ్‌లో పెరుగుతున్నది. అందుకే గతంలో జరిగిన ప్రదర్శనలతో పోలిస్తే భారీ సంఖ్యలో జనం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నెతన్యాహు నివాసం వద్దకూడా నిరసన వెల్లడిరచారు. రాజధాని టెల్‌అవీవ్‌లో లక్ష మంది పాల్గొన్నారు. అంతర్గత గూఢచార సంస్థ అధిపతి, అటార్నీ జనరల్‌ను తొలగించాలనే ఆలోచనకు వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. తిరిగి డాడులు కొనసాగిస్తే బతికి ఉన్న బందీలకు ప్రాణహాని కలుగుతుందని, ముందు వారు విడుదల కావాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెలీ జాతీయ పతాకాలతో పాటు ప్రతిపక్ష పార్టీల జెండాలు, బానర్లు కూడా ప్రదర్శించారు. నియంత్రత్వ ఉన్మాదానికి స్వస్తి పలకాలనే పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.


గత వారం రోజులుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న, ఒక గుడారంలో సేదతీరుతున్న హమస్‌ అగ్రనేతలు ఇద్దరు ఈ దాడుల్లో మరణించారు. అల్‌ జజీరా విలేకరి ఒకరు కూడా మృతుల్లో ఉన్నారు. గాజాతో పాటు పశ్చిమగట్టు ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతూ అనేక మందిని అరెస్టు చేస్తున్నది. ఇప్పటి వరకు గాజా ప్రాంతంలో 50,144 మందిని చంపివేసినట్లు,1,13,704 మంది గాయపడ్డారని, 61,700 మంది కనిపించటం లేదని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడిరచింది. పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతున్న ఎమెన్‌పై దాడుల పథకం వివరాలను పొరపాటున ఒక జర్నలిస్టుకు పంపిన మాట నిజమే అని అమెరికా ప్రభుత్వం పేర్కొన్నది. మరోవైపు దాడులను కొనసాగిస్తూనే ఉంది. రెండు నెలల కాల్పుల విరమణ తరువాత మరోసారి ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన పూర్వరంగంలో ఈజిప్టు రెండవ దశ కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. వారానికి ఐదుగురు బందీల చొప్పున హమస్‌ విడుదల చేయాలని దానికి అనుగుణంగా దాడుల విరమణ జరగాలని, దీనికి హమస్‌, అమెరికా అంగీకరించినట్లు ఇజ్రాయెల్‌ వైపు నుంచి స్పందన లేదని వార్తలు వచ్చాయి. గాజాలో అదనపు ప్రాంతాలను ఆక్రమించాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ తమ దళాలను ఆదేశించినందున రాజీ ప్రతిపాదనలకు సిద్దంగా లేదని స్పష్టం అవుతున్నది. ఇస్లామిక్‌ జీహాద్‌ అనే సంస్థ తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్లదాడి జరిపింది. దాంతో తమపై దాడులు మరింతగా పెరిగాయంటూ బెల్ట్‌ లహియా ప్రాంతంలో పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శన జరిపారని, ముసుగులు ధరించిన హమస్‌ సాయుధులు వారిని చెదరగొట్టినట్లు బిబిసి ఒక వార్తను ఇచ్చింది. అది వాస్తవమైతే మిలిటెంట్ల రెచ్చగొట్టుడు చర్యలను పాలస్తీనియన్లు సహించకపోవచ్చని చెప్పవచ్చు.

అంతన్నాడిoతన్నాడే మోడీ తాత : ఘోరంగా విఫలమమైన ‘‘ చైనా ఫ్యాక్టరీల ’’ ఆకర్షక ‘‘ ఆత్మ నిర్భర ’’ పధకం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు

చైనా నుంచి బయటకు వచ్చే ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పధకాలను కొనసాగింపుగా అత్మనిర్భరత పధకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఉత్పాదకతతో ముడిపడిన నగదు ప్రోత్సాహక పధకాన్ని (పిఎల్‌ఐ) ప్రధాని నరేంద్రమోడీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అది ఆశించిన లక్ష్యాలకు సుదూరంగా ఉండటంతో నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాయిటర్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. జాతీయ పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ఇచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పిఐబి ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. దాన్ని కొనసాగిస్తున్నట్లు లేదా నిలిపివేస్తున్నట్లుగానీ చెప్పకుండా ఆ పధకం ద్వారా జరిగిందాని గురించి పెద్ద వివరణ ఇచ్చింది. పిఎల్‌ఐ పధకం కింద రు.1.97లక్షల కోట్ల రూపాయలను(డాలర్లలో 23 బిలియన్లు) కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు పక్కన పెట్టింది. ఈ మొత్తాన్ని 2019`20 ఆర్థిక సంవత్సరంతో ప్రారంభించి నాలుగు లేదా ఆరు సంవత్సరాలలో ఉత్పత్తి, ఎగుమతులు చేసే సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని అమలు జరిపితే జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి పెరుగుతుందని చెప్పారు. ఈ పధకాన్ని గతంలో ప్రకటించిన 14పైలట్‌ రంగాలు, నిర్దేశించిన గడువును పొడిగించకూడదని నిర్ణయించినట్లు వార్త. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ పధకాన్ని సమీక్షించి ఈ మేరకు నిర్ణయించిందని, తనకు అందిన ఆ నివేదిక వెల్లడిరచిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ పధక వైఫల్యం గురించి వ్యాఖ్యానించాలని కోరగా ప్రధాని కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించలేదని వార్తా సంస్థ పేర్కొన్నది. ఈ పధకాన్ని నిలిపివేసినంత మాత్రాన ఉత్పాదక లక్ష్య్యాలను వదలివేసినట్లు కాదని, ప్రత్యామ్నాయాలను రూపొందిస్తారని ఇద్దరు అధికారులు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న వివరాలు కూడా పిఎల్‌ఐ పథక వైఫల్యాలను నిర్ధారించాయి.


రాయిటర్స్‌ వార్త సారాంశం దిగువ విధంగా ఉంది. యాపిల్‌ ఫోన్లను సరఫరా చేసే ఫాక్స్‌కాన్‌, రిలయన్స్‌తో సహా 750 కంపెనీలు ఈ పధకం కింద రాయితీ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం గడువును పెంచాలని అనేక సంస్థలు కోరినప్పటికీ అంగీకరించకూడదని అధికారులు తమ అభిప్రాయాలను సమీక్షలో నమోదు చేశారు. అనేక సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించలేదు. దారిలో ఉన్నవారు కూడా నత్తనడక నడుస్తున్నట్లు తేలింది. 2024 అక్టోబరు నాటికి కొన్ని సంస్థలు 151.93 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తూత్పత్తి చేశాయని, ఇది నిర్దేశిత లక్ష్యంలో 37శాతమే అని తేలింది. ప్రోత్సాహకం కింద పక్కన పెట్టిన 2,300 కోట్ల డాలర్లకు గాను ఇప్పటివరకు సంస్థలకు చెల్లించింది కేవలం 173 కోట్ల డాలర్లు లేదా ఎనిమిది శాతం మాత్రమేనని కూడా తేలింది. ఈ పధకం ప్రారంభించినపుడు ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పాదకత వాటా 15.4శాతం ఉండగా ప్రస్తుతం 14.3శాతానికి పడిపోయింది. పిఎల్‌ఐ పధకం వలన ఔషధ, సెల్‌ఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగినట్లు గతేడాది ప్రభుత్వం సమర్ధించుకుంది. కనీస వృద్ధి లక్ష్యాలను చేరుకోని కారణంగా కొన్ని నమోదైన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని సమీక్ష నివేదికలో పేర్కొన్నారు. సోలార్‌ రంగంలో పన్నెండు కంపెనీల నమోదు కాగా వాటిలో రిలయన్స్‌, అదానీ, జెఎస్‌డబ్ల్యుతో సహా ఎనిమిది లక్ష్యాలకు చేరే అవకాశం లేదని 2024 డిసెంబరు సమీక్షలో తేలింది. 2027 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినదానిలో రిలయన్స్‌ కంపెనీ కూడా 50శాతానికి మించే అవకాశం లేదని వెల్లడైంది. అప్పటికి పధకం గడువు ముగిసిపోతుంది. అదానీ కంపెనీ తయారీకి అవసరమైన పరికరాలనే కొనుగోలు చేయలేదు. పథకం గడువు 2027 తరువాత పొడిగించాలని పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ చేసిన వినతిని వాణిజ్యశాఖ తిరస్కరించింది. అసలు పనిచేయని వారికి లబ్ది చేకూర్చటం తగనిపని అని పేర్కొన్నది. ఉక్కు రంగంలో నమోదైన 58 కంపెనీలలో ఎలాంటి పురోగతి లేని 14ను జాబితా నుంచి తొలగించారు.


రాయిటర్స్‌ వార్త తరువాత శనివారం నాడు పిఐబి విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పిఎల్‌ఐ పధకంతో స్థానిక ఉత్పత్తి పెరిగింది, కొత్త ఉపాధి వచ్చింది, ఎగుమతులకు ప్రోత్సాహం వచ్చింది.2024 నవంబరు నాటికి ప్రోత్సాహక మొత్తం కారణంగా రు.1.61లక్షల కోట్ల పెట్టుబడి రాగా, 14లక్షల కోట్ల మేర ఉత్పత్తి జరిగింది,రు.5.31లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి, 11.5లక్షల ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి. పద్నాలుగు రంగాలలో 764 దరఖాస్తులను ఆమోదించగా వాటిలో 176ఎంఎస్‌ఎంఇ సంస్థలున్నాయి. పది రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహక మొత్తం రు.14,020 కోట్లు విడుదల చేశారు. అనేక పరిశ్రమలు అమలు దశలో ఉన్నాయి, తరువాత అవి ప్రోత్సాహకాలకు దరఖాస్తులు చేస్తాయి. ఉక్కు రంగంలో రు.27,106 కోట్ల మేరకు పెట్టుబడులు పెడతామని చెప్పిన కంపెనీలు రు.20వేల కోట్లు పెట్టాయని, తొమ్మిది వేల మందికి ఉపాధి దొరికిందని, ఇప్పటి వరకు 48 కోట్లు ప్రోత్సాహకం ఇచ్చినట్లు, 58 ప్రాజెక్టులకు గాను 14 వెనక్కు తగ్గినట్లు, పిఎల్‌ఐ రెండవ దశలో ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులతో 35 కంపెనీలు ఆసక్తి చూపినట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ నాలుగు సంవత్సరాల తరువాత రు.1.97లక్షల కోట్ల సబ్సిడీ మొత్తంలో విడుదల చేసింది రు.14,100 కోట్లే అని స్వయంగా చెప్పిందంటే ఏడుశాతం మొత్తం కూడా ఖర్చు కాలేదు, రాయిటర్స్‌ కథనం వాస్తవమే అని తేలింది. మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పేర్లతో పదేండ్లుగా కాలక్షేపం చేసినా ఫలితం దక్కలేదు గనుక మరొక పేరుతో ప్రయోగాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.


అంతా వారే చేశారని గోబెల్స్‌ను పూజిస్తూ కాంగ్రెస్‌ మీద పదే పదే ప్రచారం చేయటం తప్ప పదేండ్లలో మోడీ ఏం చేశారన్నది ప్రశ్న. సమావేశాల మీద సమావేశాలు, ముసాయిదా విధానాల పేరుతో భారత్‌ కాలక్షేపం చేస్తుండగా చైనా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక్క గుండుకూడా పేల్చకుండా, చేయాల్సింది చేస్తోందని బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 22న ఒక కథనాన్ని ప్రచురించింది. వివేక్‌ ఖత్రి అనే చార్టడ్‌ ఎకౌంటెంట్‌, ఇన్ఫ్లుయెన్సర్‌ చేసిన ఎక్స్‌ పోస్టును, అభిప్రాయాలను ఉటంకించింది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి క్రీడలో ఎలాంటి శబ్దం, పతాకశీర్షికలు లేకుండా మౌనంగా భారత్‌ను పక్కకు నెట్టే వ్యూహాన్ని చైనా అనుసరించిందని అతను ఆరోపించాడు. చైనా లక్షకోట్ల డాలర్ల వాణిజ్య మిగులు అంటే కేవలం ఆర్థిక గణాంకం కాదని భూ భౌతిక రాజకీయ అస్త్రమన్నాడు. ప్రపంచ కంపెనీలు చైనా ప్లస్‌ ఒన్‌ అనే వ్యూహంతో బీజింగ్‌ను వెనక్కు నెట్టకుండా హంగరీ, మెక్సికో, మొరాకో, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు చక్కగా చైనాతో చేతులు కలుపుతున్నాయని, చైనాతో పోటీ లేని ఉత్పాదక వాతావరణంలో ఉదారంతో విదేశీ పెట్టుబడులను పొందుతున్నాయని వివేక్‌ ఖత్రి పేర్కొన్నాడు.


భారత్‌ను ఎదగనీయకుండా చైనా చూస్తున్నదని వివేక్‌ వంటి వారు చెప్పటం ఆడలేక మద్దెల ఓడు అనటం తప్ప మరొకటి కాదు. భారత పరిశ్రమలకు అవసరమైన కీలక విద్యుత్‌ వాహనాల విడిభాగాలు, సోలార్‌ మాడ్యూల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పతికి అవసరమైన పరికరాలను చైనా అడ్డుకుంటున్నదని, భారత సరఫరా గొలుసు సామర్ద్యాన్ని నిర్మించకుండా తన కార్పొరేట్లను నిరోధిస్తూ ఫాక్స్‌కాన్‌,బివైడి కంపెనీల విస్తరణను నిరుత్సాహపరుస్తున్నదని వివేక్‌ ఖత్రి ఆరోపించారు. ప్రపంచ ఐఫోన్‌ ఉత్పత్తిలో నాలుగో వంతు భారత్‌లో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15శాతమే జరుగుతున్నన్నారు. భారత్‌ 26 బిలియన్‌ డాలర్ల విలువగల ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతి చేస్తుండగా వియత్నాం 126 బిలియన్‌ డాలర్లు చేస్తున్నదని , తైవాన్‌, జపాన్‌ సంస్థలు వెనక్కు పోతున్నట్లు చెప్పారు. జపాన్‌కు చెందిన పదింటిలో ఒక కంపెనీ మాత్రమే భారత్‌లో పెట్టుబులు పెట్టేందుకు చూస్తున్నదని అది కూడా నియంత్రణల సంక్లిష్టత, రెడ్‌టేప్‌, అమలు జరపగలమా లేదా అన్న అనిశ్చితి ఉన్నట్లు చెప్పిందని వెల్లడిరచారు. తక్కువ విలువగల పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను భాగస్వామ్య దేశాలకు అప్పగిస్తూ కీలకమైన, మేథోసంపత్తి హక్కులున్నవాటిని చైనా అట్టిపెట్టుకుంటున్నదని, దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద మొరాకో నుంచి మెక్సికో వరకు పారిశ్రామిక నడవాలను నిర్మిస్తున్నదని, తన అవసరాలకు అనుగుణంగా ప్రపంచీకరణను మలుచుకుంటున్నదని ఖత్రి విమర్శించారు.


భారత్‌ ముందుకు పోతుంటే అడ్డుకుంటున్నదని చైనాను నిందించేవారు నిత్యం కనిపిస్తారు. గతంలో చైనాను చక్రబంధం చేస్తే దాన్నుంచి బయటపడేందుకు అది అనుసరించిన విధానాలు తప్ప ప్రత్యేకించి ఎవరూ చేయూతనిచ్చి పైకి లేపలేదు. ధనిక దేశాలు తమ వద్ద మూలుగుతున్న పెట్టుబడులను అలాగే ఉంచుకుంటే వడ్డీ కూడా రాని స్థితిలో చైనాలో పెట్టుబడులు పెట్టాయి తప్ప కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు.జపాన్‌లో ఎవరన్నా డబ్బుదాచుకోవాలంటే బ్యాంకులకు ఎదురు చెల్లించాలి తప్ప ఎలాంటి వడ్డీ ఉండదు.ధనిక దేశాల్లో శ్రామికులకు ఎక్కువ మొత్తాలు వేతనాలు చెల్లించాలి, చైనాలో జనాభా ఎక్కువ గనుక చౌకగా పనిచేయించుకొని ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలని అవే ధనికదేశాలు చూశాయి. తమ జనానికి పని చూపాలి, అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు కావాలి గనుక చైనా సంస్కరణల బాట పట్టి నేటి స్థితికి ఎదిగింది, దానికి అది అనుసరించిన స్థిరమైన, విశ్వసనీయమైన విధానాలే కారణం. ఆత్మనిర్భరత పేరుతో రెండు లక్షల కోట్ల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నా కంపెనీలు ఎందుకు రాలేదో, వచ్చినవి ఎందుకు ఉత్పత్తిచేయలేదో ఆలోచించాల్సిందిపోయి, చైనా అడ్డుకున్నదని చెబితే కుదురుతుందా !


ఇప్పటికీ చైనా గురించి అనేక అతిశయోక్తులు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. చౌకరకం వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నది వాటిలో ఒకటి. అలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవటంలో నరేంద్రమోడీ రికార్డులను బద్దలు కొట్టారు, అమెరికా, ఐరోపా దేశాలకు అవి లేకపోతే రోజు గడవదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నట్లు ? మరోవైపు చైనా మీద పడి ఎందుకు ఏడుస్తున్నట్లు ? చైనా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, అక్కడి నుంచి విదేశీ పరిశ్రమలు, కంపెనీలు బయటకు వెళుతున్నాయని, అవి హిమాలయాలను దాటి భారత్‌ వస్తున్నట్లుగా అనేక మంది చిత్రించారు. కరోనా తరువాత అతిశయోక్తులు ఎన్నో. ఏ ఒక్కటీ నిజం కాలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా చెప్పారు. 2004మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు ఎక్కువని చెబుతారు. అబద్దాలలో పుట్టి అబద్దాలలో పెరుగుతున్నవారు తప్ప ఇలాంటి తప్పుడు ప్రకటనలు మరొకరు చేయరు.

రహస్య పత్రాల వెల్లడి : ఆవు వ్యాసం తప్ప అమెరికా కెనడీ హత్య కుట్ర వెల్లడి కాలేదు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా చరిత్రలో పిన్న వయస్కుడిగా 35వ అధ్యక్ష పదవికి ఎన్నికైన జాన్‌ ఎఫ్‌ కెనడీ జీవితం 43 ఏండ్లకే అర్ధంతరంగా ముగిసింది.1961 జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత 1963 నవంబరు 22న డాలస్‌ నగరంలో హత్యకు గురయ్యాడు. చిత్రం ఏమిటంటే ఇంతవరకు హత్య వెనుక ఎవరున్నదీ అమెరికా చెప్పలేకపోయింది. అనేక అంశాలను ఇట్టే పసిగట్టి గుట్టువిప్పగల ఎఫ్‌బిఐ,సిఐఏ,జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. నిజంగా వైఫల్యమా ? లేక హంతకుడి వెనుక ఈ సంస్థలలో ఏదో ఒకటి ఉందా, ఉంటే ఎవరి ప్రోద్బలంతో హత్య జరిగింది అన్నది ఎప్పటికీ వెల్లడిగాని రహస్యంగానే మిగిలిపోతుందా ? తాజాగా కెనడీ హత్యకు సంబంధించి రహస్యంగా ఉన్న పత్రాలన్నింటినీ బహిరంగ పరచాలని మార్చి 18వ తేదీన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించిన మేరకు 63వేల పేజీలను విడుదల చేశారు. అనేక కాగితాల్లో ఏముందో తెలియకుండా చేసేందుకు నల్లటి ఇంకు పూశారు. అందువలన కొత్త అనుమానాలు తలెత్తటం తప్ప తెలిసిందేమీ లేదని చెబుతున్నారు. అన్నివేల పేజీలను చదవటం వెంటనే సాధ్యమయ్యేది కాదు గనుక వాటిలో ఎక్కడైనా అణుమాత్రమైనా ఆధారాలుంటే తరువాత బయటకు వస్తుందని ఆశించాలా లేక అలాంటివి కనిపించకుండానే ఇంకు పూశారనుకోవాలా ? 1992లో చేసిన ఒక చట్ట ప్రకారం 25 సంవత్సరాలలోగా కెనడీ హత్యకు సంబంధించి వివరాలన్నీ వెల్లడిరచాలని నిర్దేశించారు. ఆ మేరకు 2017లోనే బయటపెట్టనున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా రక్షణ వ్యవహారాలు అందులో ఉంటే వాటికి మినహాయింపు కూడా ఇచ్చారు. ట్రంప్‌ గతంలో కొన్నింటిని, తరువాత జో బైడెన్‌ మరికొన్ని, తాజాగా ట్రంప్‌ మరికొన్నింటిని విడుదల చేసేందుకు ఆదేశాలిచ్చాడు.


‘‘ కెనడీ అర్ధశతాబ్దం ’’ పేరుతో ఒక గ్రంధాన్ని రాసిన వర్జీనియా విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ఫ్రొఫెసర్‌ రికార్డులను పూర్తిగా సమీక్షించాలంటే సమయం పడుతుందన్నారు. మొత్తం ఎనభైవేల పేజీల రికార్డులను విడుదల చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించినందుకు మరికొన్ని త్వరలో వెల్లడి కావచ్చు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఫైళ్లలో సిఐఏ గురించిన సమాచారం ఎంతో ఉంది తప్ప కెనడీ హత్య వెనుక కుట్ర గురించేమీ లేదన్నది వెంటనే వెల్లడైన స్పందన.ట్రంప్‌ నిర్ణయానికి ముందు మూడు నుంచి మూడున్నరవేల ఫైళ్లు విడుదల కావాల్సి ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఫిబ్రవరి నెలలో తాము కొత్తగా 2,400 కొత్త రికార్డులను కనుగొన్నట్లు ఎఫ్‌బిఐ చెప్పింది. అందువలన ఇంకా ఎన్ని విడుదల కావాల్సిందీ స్పష్టంగా చెప్పలేని స్థితి. లీ హార్వే ఓస్వాల్డ్‌ అనే 24 సంవత్సరాల యువకుడు కెనడీ మీద కాల్పులు జరిపాడని చెప్పారు. వాడిని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తరలిస్తుండగా జాక్‌ రూబీ అనే నైట్‌క్లబ్‌ యజమాని కాల్చి చంపాడు. ఎందుకంటే వాడికి కోపం వచ్చిందట. ఇదంతా కేవలం రెండు రోజుల్లోనే జరిగింది. ఈ తీరు చూసిన తరువాత బుర్ర ఉన్నవారెవరికైనా పెద్ద కుట్ర దీని వెనుక ఉంది అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది.


తాజాగా వెల్లడైన పత్రాల ప్రకారం ఓస్వాల్డ్‌ గురించి సిఐఏ గట్టి నిఘావేసినట్లు తేలింది. అలాంటపుడు ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు ? ఈ పత్రాలలో చాలా వాటిని పాక్షికంగా గతంలోనే విడుదల చేశారు. ఇప్పుడు చేసిందేమంటే పూర్తి పాఠాల బహిర్గతం.కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్‌ సోవియట్‌ వెళ్లినట్లు తిరిగి వచ్చిన తరువాత 1963సెప్టెంబరులో మెక్సికో సిటీ వెళ్లినట్లు, అక్కడ సోవియట్‌ రాయబార కార్యాలయం ముందు ఉన్న మూడు సార్లు గేటు ముందుకు ఉన్న చౌకీదారుతో మాట్లాడినట్లు సిఐఏ నమోదు చేసినా ఒక్కసారే అతడిని గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదని సిఐఏ ఒక మెమోలో పేర్కొన్నట్లు కూడా వెల్లడైంది. 1959 నుంచే ఓస్వాల్డ్‌ మీద నిఘావేసినట్లు కూడా వెల్లడైంది. అయితే ఒక యువకుడి మీద ప్రత్యేకించి,కెనడీ అధికారానికి రాక ముందునుంచే ఎందుకు నిఘా పెట్టారన్నది సందేహాస్పద అంశం. రష్యా వెళ్లాడు గనుక అని చెప్పవచ్చు. హత్యకు ముందు ఇతగాడి మీద నిఘావేసిన ఒక అధికారి సమర్పించిన సమాచార ఫైలును ఇప్పటికీ విడుదల చేయలేదు. అమెరికా విదేశాంగ విధాన వ్యవహారాలలో సిఐఏ పాత్ర ఎక్కువగా ఉందని, రాయబార కార్యాలయాల్లో దాని ఏజంట్లే దౌత్యవేత్తల ముసుగులో ఉన్నట్లు వీటి గురించి ఆర్థర్‌ షెల్సింగర్‌ అనే సహాయకుడు కెనడీ వివరించినట్లు సిఐఏ గురించి కెనడీకి నమ్మకం, సదభిప్రాయం లేదని, సత్సంబంధాలు కూడా లేవని తేలింది. కెనడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో అమెరికా రాయబార కార్యాలయాల్లో పని చేస్తున్న రాజకీయ ప్రతినిధుల్లో 47శాతం మంది సిఐఏ కనుసన్నలలో పని చేసేవారే. ఉదాహరణకు పారిస్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో నాడున్న 123 మంది ముసుగులో ఉన్న ఏజంట్లే, చిలీ కార్యాలయంలో ఉన్న పదమూడు మందిలో పదకొండు మంది కూడా వారే. మొత్తం 3,700 మంది దౌత్య సిబ్బందిగా పేర్కొన్నవారిలో 1,500 మంది మాత్రమే విదేశాంగశాఖకు చెందిన వారు, మిగతా వారంతా మిలిటరీ లేదా గూఢచార సంబంధంగలవారేనని అతను నివేదించాడు. కంటికి కనిపించని దొంగ చెవుల ద్వారా సేకరించిన సమాచారం, చిత్రాలను చూసేందుకు ఎక్స్‌రేస్‌ను వినియోగించినట్లు తేలింది. అతి నీలలోహిత కిరణాలను ప్రసరింప చేస్తే కనిపించే రంగులను కొన్ని పబ్లిక్‌ ఫోన్లకు పూసి ఉపయోగించినట్లు కూడా వెల్లడైంది. ఇలాంటి మరికొన్ని ప్రక్రియల గురించి కూడా బహిర్గతమైంది. తరువాత కాలంలో అవన్నీ లోకానికి తెలిసిన కారణంగా ఇప్పుడు దాయాల్సిందేమీ లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో మిలిటరీ గూఢచారిగా ఉన్న గారీ అండర్‌హిల్‌ సేకరించినట్లు చెబుతున్న సమాచారం ప్రకారం కెనడీ హత్యవెనుక సిఐఏ హస్తం ఉన్నట్లు ఒక వర్తమానంలో కనుగొన్నాడని 1967లో ఒక పత్రిక ప్రచురించింది, అయితే 1964లోనే అండర్‌హిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, కానీ దాని మీద అనుమానాలున్నట్లు సదరు పత్రిక పేర్కొన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడిరది. అయితే ఇదేమీ సరికొత్త అంశం కాదు. 2017లో విడుదల చేసిన వాటికి ఒక పేజీ అదనంగా తోడైంది.


కెనడీ హత్య గురించి అనేక కుట్ర సిద్దాంతాలు, అనుమానాలు నేటికీ వెల్లడౌతూనే ఉన్నాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా అసలు విషయం తేలటం లేదు. ఓస్వాల్డ్‌ సోవియట్‌లో ఉండి వచ్చాడని, అందువలన హత్యకు అక్కడే కుట్ర జరిగిందన్నది ఒకటి. అధ్యక్షులుగా గాడిద పార్టీ ఉన్నా ఏనుగు పార్టీ ప్రతినిధి ఉన్నా సోవియట్‌, తరువాత రష్యాను వ్యతిరేకించిన వారే తప్ప మరొకరు లేరు. అలాంటపుడు రష్యన్ల హస్తం గురించి ఎందుకు తేల్చలేకపోయారు ? కెనడీ డెమోక్రాట్‌ గనుక రిపబ్లికన్లు కుట్ర చేశారనుకుంటే మరి స్వంత పార్టీ వారెందుకు రుజువు చేయలేకపోయారు, లేదూ స్వంత మనుషులే అనుకుంటే అదే పని రిపబ్లికన్లు కూడా చేయలేదు కదా ! కొందరు క్యూబన్ల కుట్ర, మెక్సికో అన్నారు, వాటి గురించీ తేల్చలేకపోయారు. మోటారు వాహనంలో ప్రయాణిస్తుండగా ఓస్వాల్డ్‌ కాల్చినట్లు చెప్పారు. అయితే అతను మెరైన్‌ తప్ప షూటింగ్‌లో అంత నేర్పరి కాదన్నది మరొక వాదన. కాల్పులు జరిగిన సమయంలో అతను సోవియట్‌ కెజిబి అదుపులో లేడని దానికోసం పనిచేసిన ఒక ప్రొఫెసర్‌ కథనం.


సిఐఏకు కమ్యూనిస్టులు లేదా వ్యతిరేకులు అనే బేధం లేదు. వాషింగ్టన్‌ డిసిలో మిత్రదేశమైన ఫ్రాన్సు రాయబార కార్యాలయంలో కూడా దొంగచాటుగా సమాచారాన్ని సేకరించటమేగాక కొన్ని పత్రాలను కూడా తస్కరించినట్లు తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో వెల్లడైంది.కెనడీ కాలంలో సిఐఏ డైరెక్టర్‌గా పనిచేసిన జాన్‌ మెకాన్‌ తన పదవీ కాలంలో పోప్‌ జాన్‌23, పోప్‌ పాల్‌6తో నెరిపిన సంబంధాలు కూడా కొన్ని అనుమానాలను రేకెత్తించాయి. ఇతగాడి హయాంలోనే డొమినికన్‌ రిపబ్లిక్‌ పాలకుడు రాఫేల్‌ ట్రుజిలో హత్యకు సహకరించిన సిఐఏ అధికారుల పేర్లు, బొలీవియాలో తమకు అనుకూలమైన అభ్యర్థికి అనుకూలంగా తీసుకున్న చర్యలు, కమ్యూనిజానికి వ్యతిరేకంగా చేసిన కుట్రల్లో భాగంగా రాజకీయ పార్టీలకు అందచేసిన నిధుల గురించి వివరాలు కూడా బయటకు వచ్చాయి. ‘‘ చీకటి ప్రాంతాల ’’ పేరుతో మన ఢల్లీి, కొలకత్తాతో సహా ప్రపంచంలో ఏ ఏ నగరాల్లో సిఐఏ కార్యాలయాలను ఏర్పాటు చేసిందో కూడా ఈ పత్రాల నుంచి వెలికి తీసి రష్యన్‌ టీవీ ప్రకటించింది.


కెనడీ హత్య గురించి దర్యాప్తు జరిపేందుకు 1964లో వారెన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అదేమీ తేల్చలేదు. 1963 నవంబరు 22 మధ్యాహ్నం డలాస్‌ నగరంలో తన సతీమణి జాక్విలిన్‌, టెక్సాస్‌ గవర్నర్‌ జాన్‌ కోనల్లీ, అతని సతీమణి టాప్‌లేని కారులో ప్రయాణిస్తుండగా 12.30 సమయంలో రైఫిల్‌తో కాల్పులు జరిగాయి. కెనడీ, జాన్‌ కోనలీ ఇద్దరు గాయపడ్డారు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా ఒంటి గంటకు కెనడీ మరణించాడు, కోనలీ గాయాలతో కోలుకున్నాడు. కాల్పులు జరిపిన ఒక గంటలోనే ఓస్వాల్డ్‌ను పట్టుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఒక భవన ఆరవ అంతస్తులో ఉండి కాల్చినట్లు చెప్పారు. కెనడీ ప్రయాణిస్తున్న వాహన శ్రేణికి ఒక వ్యక్తి అడ్డుగా వచ్చినట్లు, అతడిని ఆ భవనంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని, ఒక అరగంట ముందు ఓస్వాల్డ్‌ కనిపించినట్లు ఆ భవనంలో పని చేస్తున్న ఉద్యోగులు చెప్పారు. అంతకు ఒక నెల రోజుల ముందే నిందితుడు అక్కడ పని చేస్తున్నట్లు కూడా వెల్లడిరచారు. ఓస్వాల్డ్‌ను పట్టుకొనేందుకు ప్రయత్నించిన పోలీసు జెడి టిపిట్‌ను ఒక రివాల్వర్‌తో చంపివేసినట్లు తెలిపారు.మొత్తం మీద హంతకుడి వెనుక ఉన్నది ఎవరు, కుట్ర ఏమిటి అన్నది వారెన్‌ కమిషన్‌ గానీ, వెల్లడిరచిన రహస్య పత్రాలు గానీ తేల్చలేకపోయాయి. సూత్రధారి సిఐఏ అయితే పాత్రధారి ఎవరు, ఎందుకు కుట్ర చేశారన్నది బహుశా ఎప్పటికీ వెల్లడయ్యే అవకాశాలు లేవని, అంతుచిక్కని ఒక రహస్యంగా మిగిలిపోవచ్చని భావిస్తున్నారు.

బర్లీ పొగాకు రైతులను గాలికి వదిలేసిన పొగాకు బోర్డు

Tags

, , , ,

డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌,

గత రెండు మూడు సంవత్సరాలు బర్లీ పొగాకు రేటు లాభసాటిగా ఉండటంతో బర్లీ పొగాకు వైపు రైతులు మళ్లారు. గత సంవత్సరం అడుగు ఆకు కూడా క్వింటాలు పదివేల రూపాయలకు అమ్ముడు పోయింది. ఈ సంవత్సరం అడుగు ఆకు నాలుగైదు వేల రూపాయలకు మించలేదు. కంపెనీలు బాండు ఇచ్చినా పొగాకు కొనటం మందంగా ఉంది. 30-40 వేల రూపాయలకు ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకొని, బర్లీ పొగాకు పంటను వేసిన రైతులున్నారు.2023-24 సంవత్సరంలో భారతదేశ పొగాకు ఎగుమతులు రూ.12,006 కోట్లు. 2022-23లో భారతదేశంలో పొగాకు అమ్మకాల ద్వారా వచ్చిన ఎక్సైజ్‌ ఆదాయం రూ.72,788 కోట్లు. ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తున్నా రైతులకు ఆశ, నిరాశలను చూపిస్తూ ప్రభుత్వం, కంపెనీలు రైతులతో ఆడుకుంటున్నాయి.

పొగాకు బోర్డు

పొగాకు రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించేలా చూడటం, ఎగుమతులను ప్రోత్సహించటం బోర్డు ప్రాథమిక కర్తవ్యం. అయితే పొగాకు బోర్డు ఒక్క ఫ్లూ క్యూర్డ్‌ వర్జీనియా పొగాకు (ఎఫ్‌.సి.టి) గురించి మాత్రమే పట్టించుకుంటుందట. బర్లీ పొగాకు, నాటు పొగాకు లాంటివి తమ పరిధిలో లేవని తప్పుకుంటోంది. పొగాకు పండించే రైతులందరి ప్రయోజనాలను కాపాడవలసిన పొగాకు బోర్డు…బర్లీ పొగాకు పండించిన రైతులను కంపెనీల దయా దాక్షిణ్యాలకు వదిలేసింది.
బర్లీ పొగాకుకు విదేశాలలో ఎక్కువ డిమాండ్‌ వుంది. అమెరికా, బ్రిటన్‌లో తయారయ్యే సిగరెట్లలో బర్లీ పొగాకు ప్రధాన స్థానాన్ని పొందింది. సిగరెట్‌లో మంచి ఫ్లేవర్‌ కోసం, ఘాటుగా వుండటం కోసం బర్లీ పొగాకును సిగరెట్‌ తయారీలో తప్పనిసరిగా వాడతున్నారు. ఇదివరకు అమెరికా లోని కెంటకీ రాష్ట్రంలో బర్లీ పొగాకును ఎక్కువగా సాగు చేసేవారు. అక్కడ బర్లీ పొగాకు సాగు తగ్గింది. దేశ, విదేశీ అవసరాలకు 100 మిలియన్‌ కేజీల బర్లీ పొగాకు అవసరం వుంటుందని అంచనా.

పొగాకు పరిశోధనా సంస్ధ

తూర్పు గోదావరి జిల్లాలో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సి.టి.ఆర్‌.ఐ 75 సంవత్సరాల నుండి రాజమండ్రిలో పనిచేస్తున్నది. దక్షిణ ప్రాంతపు తేలిక నేలలు ఉన్న ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో సాగు చేసే బర్లీ పొగాకు నూతన విత్తనాలను ‘విజేత’ పేరున విడుదల చేశారు.ఇదివరకు పది వేల మిలియన్‌ కేజీల ఎగుమతి ఉన్న బర్లీ పొగాకు ఇప్పుడు 45 వేల మిలియన్‌ కేజీలకు పెరిగిందని ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అన్నారు.ప్రత్యామ్నాయ పంటలైన మిర్చి, శనగ, మొక్కజొన్న, సుబాబుల్‌, జామాయిల్‌, పామాయిల్‌ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ప్రత్యామ్నాయ పంటల ధరలకు గ్యారంటీ లేదు. కనీస మద్దతు ధరలు అమలు పరచే యంత్రాంగం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. కచ్చితంగా కొంటారనే గ్యారంటీ లేదు. వ్యవసాయ ఖర్చులు-ఎరువులు, పురుగు మందులు, కౌలు, కూలీ రేట్లు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్ధితులలో పొగాకు ధరలు గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా వున్నాయి. గతంలో పొగాకు సాగును ఆపేసిన పాత గుంటూరు జిల్లా రైతులు మళ్లీ పొగాకు పంట వైపు మళ్ళారు. పొగాకు సాగు గణనీయంగా పెరిగింది.

పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు ఎందుకు లేదు? ప్రభుత్వం స్పందించాలి!

ఇండియన్‌ టొబాకో కంపెనీ, గాడ్‌ ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌, దక్కన్‌ టుబాకో, పోలిశెట్టి కంపెనీ, పి.టి.పి, ఎం.ఎల్‌ మరియు అలియన్స్‌ వన్‌ కంపెనీలు బర్లీ పొగాకు సాగును ప్రోత్సహించాయి. కొందరు విత్తనాలిచ్చారు. కొందరు హామీలిచ్చారు. పొగాకు నారును సప్లరు చేశారు. కచ్చితంగా కొంటామని కొన్నిచోట్ల బాండ్లు ఇచ్చారు. పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు లేకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుంది. బేరన్‌ పొగాకు / వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నటువంటి రైతులకు టుబాకో బోర్డు కొన్ని రక్షణలు కల్పిస్తున్నది. టుబాకో బోర్డు కల్పిస్తున్న రక్షణలు, ప్రయోజనాలు బర్లీ పొగాకు పండించే రైతులకు లేవు. గత సంవత్సరం ధరలు కూడా రావటం లేదు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఏ ప్రాంతంలో ఏరకమైన పొగాకు, ఎంత మొత్తంలో సాగు చేశారనేది ప్రభుత్వం దగ్గర అంచనాలు ఉన్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. పొగాకు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరెవరు జోక్యం చేసుకుంటారు? పొగాకు బోర్డు తన పరిధిలో లేదంటుంటే ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు నిలువెత్తున మునిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?

పంటలకు న్యాయమైన ధరలను సాధించుకోగల శక్తి రైతుల చేతుల్లోనే ప్రపంచంలోని పొగాకు ధరలు, సిగరెట్ల ధరలు, ఐ.టి.సి, బ్రిటిష్‌ అమెరికన్‌ టుబాకో కంపెనీ, ఫిలిప్‌ మోరిస్‌ లాంటి బహుళజాతి సంస్ధల (యం.యన్‌.సి) చేతిలో వున్నాయి. వారి లాభాలకు అంతులేదు. వారి నుండి పంటలకు న్యాయమైన ధరలను సాధించుకోగల శక్తి రైతుల చేతులలోనే వుంది. ప్రజా ఉద్యమాలతోనే తమ న్యాయమైన వాటాను సాధించకోగలరు. కార్పొరేట్‌ కంపెనీల చేతులలో కీలు బొమ్మలైన ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను కాపాడ లేవు. బహుళజాతి సంస్ధలు రైతుల సంక్షేమం కోసం ఏర్పడలేదు. గిట్టుబాటు ధరలు కల్పించితే వారి లాభాలు తగ్గిపోతాయి. నీతి, జాతి లేనటువంటి యం.యన్‌.సి.లు, వారితో పోషింపబడుతున్న ప్రభుత్వాధిపతులు రైతులను కాపాడతారనుకుంటే, గొర్రె కసాయివాడిని నమ్మినట్లవుతుంది. లాభసాటి ధర కావాలంటే రైతులు నిలబడాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించి అమలు పరచమని పోరాడాలి.

తప్పుడు సెక్షన్లతో అణచివేతలో నరేంద్రమోడీ – డోనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ ఇద్దరే : ఇక్కడ ఎస్‌ఎఫ్‌ఐ శివానందన్‌ – అక్కడ మహమ్మద్‌ ఖలీల్‌ !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పటివరకైతే భారత్‌, అమెరికా రెండూ పెద్ద ప్రజాస్వామిక దేశాలే ఎవరూ కాదనటం లేదు. కానీ ఆచరణ చూస్తే నిరంకుశత్వానికి దారితీస్తున్నట్లుగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది.వ్యవస్థలను దిగజారుస్తున్నారు, కొత్త అర్ధాలు చెబుతున్నారు, పాలకులను విమర్శించటాన్ని దేశద్రోహంగా చిత్రిస్తూ బ్రిటీష్‌ వలస పాలకులను గుర్తుకు తెస్తున్నారు. మన గతం గురించి మరచిపోయిన వారికి దాన్ని గుర్తు చేయటం కూడా ఒకందుకు మంచిదేనేమో ? ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా మన స్వేచ్చ, స్వాతంత్య్రాలు ఊరికే రాలేదు అని కొందరైనా తెలుసుకుంటారు.రెండు చోట్లా చట్టాలు, నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కును హరించే ఉదంతాల గురించి చెప్పుకోవటం దేశ వ్యతిరేకతగా పరిగణించినా ఆశ్చర్యం లేదు, రోజులిలా ఉన్నాయి, ఏం జరిగినా ఎదుర్కోక తప్పదు మరి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) అభివృద్ధి అధ్యయనాల విభాగంలో పిహెచ్‌డి చేస్తున్న రామదాస్‌ ప్రిని శివానందన్‌ అనే పరిశోధకుడిని సంస్థ సస్పెండ్‌ చేసింది. ఎందుకటా ! న్యూఢల్లీిలో విద్యార్ధులు భారత్‌ను రక్షించండి`బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో పార్లమెంట్‌వద్దకు ప్రదర్శన నిర్వహించారని, దానిలో భాగస్వామి కావటం జాతి వ్యతిరేకతకిందకు వస్తుందని కారణం చెప్పింది.కేరళలో దళిత సామాజిక తరగతికి చెందిన ఈ యువకుడు ముంబైలో చదువుతూ మహారాష్ట్ర ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు.


టిస్‌ చెప్పిన సాకులు లేదా కారణాలను చూస్తే ఎవరూ కూడా ప్రభుత్వాల విధానాల మీద నిరసనలు, అసమ్మతి తెలపటానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద ఆర్థికంగానో, సేవాపరంగానో ప్రతివారూ లబ్దిదారులే, అలాంటపుడు ఎవరూ ఏ ప్రభుత్వాన్నీ విమర్శించకూడదు, భజన మాత్రమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని ఢల్లీిలో జరిగిన ప్రదర్శనలో విమర్శించారు, దాన్లో పాల్గొన్నందున శివానందన్‌ జాతి వ్యతిరేకి అనటమే కాదు అతని మీద చర్యలు తీసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు ముందుకు రావాలని కూడా టిస్‌ కోరింది. న్యాయవ్యవస్థ ఇంకా ఉనికిలో ఉంది గనుక తన సస్పెన్షన్‌ చెల్లదని ప్రకటించాలని కోరుతూ అతను బోంబే హైకోర్టుకు వెళ్లాడు. ఎంఎం సత్తాయి, ఎఎస్‌ చందూర్కర్‌ డివిజన్‌ బెంచ్‌ అతని పిటీషన్ను కొట్టివేస్తూ టిస్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్లు శివానందన్‌ చెప్పాడు. ఇది వ్యక్తిగత సమస్య కాదని మొత్తం విద్యార్ధి సమాజం మీద ప్రభావితం చూపనున్నందని అన్నాడు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్‌ పొందుతున్న కారణంగా రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గ్గొంటే చర్యలు తప్పవని, సంస్థలో ఉన్నపుడు రాజకీయ అభిప్రాయాలకు దూరంగా ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఒక టెలికాం ఉద్యోగి యువకుడిగా ఉన్నపుడు ఒక యువజన సంఘ సమావేశంలో పాల్గొన్నందున ఉద్యోగం నుంచి తొలగించితే ఆ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అతను పాల్గొన్నది నిషేధిత సంస్థ కాదు, యువకులు యువజన సంఘాల సమావేశాల్లో గాక మరిదేనిలో పాలుపంచుకోవాలని ప్రశ్నిస్తూ ఉద్యోగం నుంచి తొలగించటాన్ని తప్పు పడుతూ జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. తరువాత ఉద్యోగిగా ఆ యువకుడు ఉద్యోగ విరమణ చేసేవరకు టెలికాం ఉద్యోగుల యూనియన్లో కూడా చురుకుగా పని చేశారు.


కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని, ఒక విద్యార్ధి అర్హత పరీక్షలో పాసైనపుడు ఫెలోషిప్‌ ఒక హక్కు తప్ప దయాధర్మం కాదని, పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్‌ ఇవ్వటం తనంతటతాను బతకటానికి అవసరమైన ఉద్యోగ సంపాదన కోసం కాదని, జాతి నిర్మాణ క్రమంలో తోడ్పడేందుకు ఇచ్చే మొత్తమని శివానందన్‌ చెప్పాడు. ఏ విద్యా సంస్థ అయినా జారీచేసే సర్క్యులర్‌ కంటే రాజ్యాంగం ఎంతో ముఖ్యమైనదని తాను భావిస్తున్నానని, రాజ్యాంగ హక్కును వినియోగించుకున్నందుకు తనను శిక్షించారని అన్నాడు. టిస్‌ లేదా ఏ విశ్వవిద్యాలయం జారీచేసే నిబంధనలు, సర్క్యులర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదని, విద్యా సంస్థలు నిష్పాక్షికంగా ఉండాలని, ఒక తరహా రాజకీయాలకు ఒక విశ్వవిద్యాలయం తనను తాను ఎలా అనుంబంధించుకుంటుదని ప్రశ్నించాడు.


పార్లమెంట్‌కు ప్రదర్శన బానర్‌ కింద భారత్‌ను రక్షించండి, బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో తాను ప్రదర్శనలో పాల్గొంటే తాను పట్టుకున్న ప్లకార్డు మీద టిస్‌ పేరు ఉన్నట్లు అధికారులు ఆరోపించారచెప్పాడు. ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌(పిఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శిగా ప్రదర్శనలో పాల్గొన్నాను తప్ప టిస్‌ ప్రతినిధిగా కాదని అన్నాడు. తనను సస్పెండ్‌ చేసిన టిస్‌ కమిటీ, హైకోర్టు ముందు కూడా తాను ఇదే చెప్పానన్నాడు. శివానందన్‌ 2015లో టిస్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌గా చేరి తరువాత అక్కడే ఎంఫిల్‌ పూర్తి చేసి పరిశోధక విద్యార్థిగా నమోదయ్యాడు. టిస్‌ గతంలో ఒక ప్రజాస్వామిక సంస్థగా కనీసం నటించేదని ఇటీవలి సంవత్సరాలలో విద్యార్ధులు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతించటం లేదని చెప్పాడు. అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టినపుడు జాతీయ అవార్డు పొందిన ఆనంద పట్వర్ధన్‌ డాక్యుమెంటరీ ‘‘ రామ్‌ కె నామ్‌ (రాముడి పేరుతో ) ’’ ను అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శించారని తాను ఆ సమయంలో ప్రమాదంలో గాయపడి ప్రదర్శనకు రాలేకపోయానని, అయితే బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా జరిగిన దుర్మార్గమైన వాస్తవాలను తెలుసుకొనేందుకు అందరూ చూడాలని కోరుతూ తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమంలో వెల్లడిరచగా దాన్ని కూడా దేశ వ్యతిరేక చర్యగా టిస్‌ తన మీదకు మళ్లించిందని పేర్కొన్నాడు. కేంద్రం నుంచి 50శాతం పైగా నిధులు పొందుతున్న సంస్థలన్నింటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత టిస్‌లో అనేక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పది మంది విద్యార్దులు కూర్చుంటే, చివరకు తమ గ్రూపు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఒక చోట చేరినా సంస్థను అస్థిరపరిచేందుకు చూస్తున్నారంటూ చెదరగొట్టటం జరుగుతోందన్నాడు.శివానందాన్ని హెచ్చరిస్తూ అనేక సార్లు తప్పుడు నోటీసులు జారీ చేసింది. భగత్‌ సింగ్‌ స్మారక ఉపన్యాసం చేసేందుకు పిలిచిన అతిధులను వివాదాస్పద ప్రసంగీకులు అనే సాకుతో వారి పేర్లు లేకుండా ఇచ్చిన నోటీసు అలాంటి వాటిలో ఒకటి. సదరు వివాదాస్పద అతిధులు ఎవరంటే మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌, ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌, జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్‌, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ మాజీ సంపాదకుడు గోపాల్‌ గురు. గతేడాది టిస్‌ విద్యార్ధి సంఘ ఎన్నికలను రద్దు చేసింది, ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌ను నిషేధించింది. విద్యార్థులు ఆందోళన చేయటంతో వెనక్కు తీసుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే టిస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్‌ తీసుకొనే వారు బిజెపి రాజకీయాలను విమర్శించకూడదంటే నేను అంగీకరించను, దేశంలో ఉండాలంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపి సభ్యత్వం తీసుకోవటానికి లేదా సానుభూతిపరునిగా ఉండటానికి నన్ను బలవంతం చేయలేరని శివానందన్‌ చెప్పాడు.

అమెరికాలో ఏం జరుగుతోంది !
మహమ్మద్‌ ఖలీల్‌ అమెరికా పౌరసత్వం కలిగిన సిరియా దేశస్థుడు. అతని మీద చట్ట ఉల్లంఘనకు పాల్పడిన కేసులేవీ లేవు. అతన్ని బలవంతంగా సిరియా పంపేందుకు ట్రంప్‌ యంత్రాంగం చూస్తోంది. ఖలీల్‌ చేసిన నేరం ఏమిటో తెలుసా ? గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్ధుల నిరసనకు నాయకత్వం వహించటమే. వాక్‌, సభా స్వాతంత్య్రాలు విలసిల్లుతుంటాయని భావించే దేశంలో ఇది జరిగింది. అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి, అరెస్టు చేసిన ఖలీల్‌ గ్రీన్‌కార్డును రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం అతనుండే న్యూయార్క్‌ రాష్ట్రం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానాలోని ఒక నిర్బంధ శిబిరానికి తరలించి తన మానవత్వ ముఖాన్ని ప్రదర్శించుకుంది. ఈ ఉదంతం తరువాత గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన ఎవరూ అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు ఉన్నట్లు కాదని ఉపాధ్యక్షుడు జెడివాన్స్‌ ప్రకటించాడు. అంటే ప్రభుత్వం తలచుకుంటే ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే బెదిరింపు దీని వెనుక ఉంది. పాలస్తీనియన్లకు మద్దతుగా విద్యార్ధులు ఆందోళనకు దిగినపుడు స్థానికులా, వలస వచ్చినవారా అనే తేడా లేకుండా అందరూ నిరసనల్లో పాల్గొన్నారు. దీన్ని నాటి బైడెన్‌ సర్కార్‌ నేటి ట్రంప్‌ జమానా కూడా సహించటం లేదు. గాజాలో మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ మానవహక్కుల పరిరక్షణ గురించి ప్రపంచానికి సూక్తులు వల్లిస్తారు.


పాలస్తీనియన్లకు మద్దతు పలికిన మహమ్మద్‌ ఖలీల్‌ మీద 1952 నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టంలోని సెక్షన్లను మోపటాన్ని బట్టి ట్రంప్‌ అసలు రూపం వెల్లడైంది. వలస వచ్చే వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనా లేదా అనుంబంధం ఉన్నప్పటికీ వీసాలను తిరస్కరించటానికి లేదా అనర్హులుగా ప్రకటింటానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఒకవేళ అమెరికా వచ్చినప్పటికీ తిరిగి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంది. కమ్యూనిజానికి సంబంధించిన సాహిత్యాన్ని రాసినా, ముద్రించినా, తెలిసి కూడా పంపిణీ చేసినప్పటికీ తిప్పి పంపే అధికారం ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఉదారవాదులనే పేరున్న ప్రతిపక్ష డెమోక్రాట్లలో కొందరు ఖలీల్‌ అరెస్టు, గ్రీన్‌కార్డు రద్దును మాట మాత్రంగా ఖండిరచినప్పటికీ తమ పాలిత న్యూయార్క్‌ రాష్ట్రవాసి అరెస్టు గురించి నిరసన వ్యక్తం చేయలేదు. అమెరికాలో గాడిద పార్టీ, ఏనుగు పార్టీ ఏదైనా ఒక్కటే అనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు.కమ్యూనిస్టు వ్యతిరేకత, అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శను రెండు పార్టీలూ సహించవు.


2023లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేమంటే అమెరికా విధానాలను విమర్శించే విదేశీయులు, క్రైస్తవులను ద్వేషించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు ఎవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వం దీనికి గాను 1952 నాటి చట్టాన్ని వినియోగిస్తాం,దేశీయంగా పెరిగన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులను అదుపు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పాడు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు అమెరికాను సోషలిస్టు దేశంగా మారనిచ్చే సమస్యేలేదని ప్రకటించటాన్ని అత్యధిక డెమోక్రాట్లు హర్షించారు. అయితే చరిత్రను చూస్తే కమ్యూనిస్టుల రాకను నిషేధించే చట్టం ఉన్నప్పటికీ పూర్తిగా నిరోధించటం గానీ, అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం గానీ చేయలేకపోయారన్నది వాస్తవం. మన దేశానికి చెందిన కష్మా సావంత్‌ వంటి వారు అనేక మంది అమెరికా వెళ్లి వామపక్ష వాదులుగా మారిన సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపేందుకు చూసిన ప్రబుద్దుల సంగతి తెలిసిందే, భావజాలమూ అంతే, ఎవరూ ఆపలేరు, ఎంతగా అడ్డుకుంటే అంతే వేగంతో విస్తరిస్తుందన్నది చరిత్ర చెప్పిన సత్యం !