ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు ఆదేశాల అమలుకు నరేంద్రమోడీ, పాకిస్తాన్‌ జీ హుజూర్‌ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలని అడిగిన పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ పెట్టిన షరతేమిటో తెలుసా ? వర్తమాన తరుణం నుంచి 37 నెలల రుణవాయిదాల కాలంలో 2026 జూన్‌ నాటికి క్రమంగా వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల ఎత్తివేతను అమలు జరపాలంది. అక్కడి ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పాటించాలని చెప్పింది. ఇలాంటి షరతులనే మనకూ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ పెట్టాయి. రైతాంగానికి భయపడి కాంగ్రెస్‌ పాలకులు వాటిని అమలు జరిపేందుకు సాహసించలేదు. తాయత్తు కట్టుకొని జై భజరంగ భళీ అంటూ నరేంద్రమోడీ మూడు సాగు చట్టాల రూపంలో వాటిని రుద్దేందుకు చూశారు. ఫలితాన్ని, పర్యవసానాలను అనుభవించటం చూస్తున్నాము. దివాలా స్థితిలో ఉన్న పాకిస్తాన్ను ఆదుకొనేందుకు అమెరికా పైరవీతో ఐఎంఎఫ్‌ 700 కోట్ల డాలర్ల సాయం అందించేందుకు అంగీకరించింది. దానికి గాను ఒక షరతు పెట్టింది. తమ అప్పు తీరాలంటే రైతులతో సహా ఎవరికీ రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకుండా ‘‘పాదుపు’’ చేయాలంది. దానికి గాను ప్రభుత్వ ఖర్చు తగ్గించాలన్నది. కావాలంటే ప్రభుత్వం తన అవసరాలకు మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేసి అదే ధరలకు విక్రయించాలి తప్ప సబ్సిడీలు కుదరవంది. ఐఎంఎఫ్‌ షరతు అమల్లోకి వస్తే కనీస మద్దతు ధరలూ ఉండవు, ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యతా ఉండదు. పొదుపు పాటింపులో భాగంగా ఎరువులు, విద్యుత్‌ తదితర రాయితీలు రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాక్‌ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం గోధుమల సేకరణ నిలిపివేయటంతో బహిరంగ మార్కెట్‌లో 40శాతం ధరలు పడిపోయాయి. తరువాత వంతు చెరకు, పత్తి ధర ప్రకటన విధాన రద్దు అంటున్నారు. వినియోగదారులకు ఇస్తున్న గాస్‌ సబ్సిడీ తదితరాలకు దశలవారీ కోత పెడతారు. ఇది పాకిస్తాన్‌కే తప్ప సురక్షితమైన హస్తాలు ఉన్న నరేంద్రమోడీ ఉన్నంత వరకు భారత్‌కు వర్తించదు అని ఎవరైనా అనుకుంటే చేసేదేమీ లేదు.గతంలో 1990దశకంలో తప్ప తరువాత కాలంలో మనదేశం ఐఎంఎఫ్‌ నుంచి అప్పులు తీసుకోలేదు. ప్రపంచ బ్యాంకు నుంచి వివిధ పధకాలకు ప్రాజెక్టు రుణాలు తీసుకుంటున్నాం. కుడికన్ను ఎడమ కన్ను తేడా తప్ప రెండు సంస్థల నుంచి తీసుకొనే రుణాలకు షరతులు షరా మామూలే.మన దేశంలో ఎరువుల ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసి పరిమితంగా కొన్నింటికి సబ్సిడీ విధానం అమలు చేస్తున్నారు. ఎగుమతులకు సబ్సిడీలు ఇవ్వకూడదు దిగుమతుల మీద పన్ను విధించకూడదన్న షరతులు కూడా ఐఎంఎఫ్‌ విధించింది. మన దేశం కూడా చేస్తున్నది అదే. చిత్రం ఏమిటంటే మన పాలకులు పాకిస్తాన్‌తో కొట్లాడినట్లు జనం ముందు ఫోజు పెడతారు. ఇద్దరిని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ పిలిపించినపుడు వాటి ముందు చెప్పినట్లే చేస్తాం జీ హుజూర్‌ అంటూ చేతులు కట్టుకొని నిలబడటం తప్ప వ్యతిరేకించే ధైర్యం లేదు.


అన్ని అవకాశాలూ మూసుకుపోయిన తరువాతనే ఏ దేశమైనా ఐఎంఎఫ్‌ వద్దకు అప్పుకోసం వెళుతుంది.ఒకసారి తీసుకుంటే దాని రుణ ఊబిలో చిక్కుకున్నట్లే. పాత అప్పులు తీసుకొనేందుకు కొత్త రుణాలు తీసుకోవాల్సిందే.రుణాలు తీసుకున్న దేశాల మీద సర్‌ఛార్జీలు విధించి జలగలా పీల్చుతుంది. ఈ విధానం మీద తీవ్ర విమర్శలు తలెత్తటంతో సర్‌ఛార్జీల రూపంలో వచ్చిన రాబడిని రాయితీలతో కూడిన రుణాలు ఇవ్వటానికి వినియోగిస్తామని చెబుతోంది. ఇది మోసం తప్ప మరొకటి కాదు.తీసుకున్న రుణాల మీద వడ్డీ, సేవారుసుముల మీద అదనపు వసూలునే సర్‌ఛార్జి అంటారు.జనం భాషలో చక్రవడ్డీ. రుణాలు ఎక్కువగా తీసుకోకుండా దేశాలను నిరోధించేందుకే వాటికే విధిస్తున్నామని వితండవాదం చేస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న దేశాలను ఉద్దరించటానికే తాము రుణాలు ఇస్తున్నామని ఐఎంఎఫ్‌ చెబుతుంది. అదే నిజమైతే ఇప్పటికి 24సార్లు రుణం తీసుకున్న పాకిస్తాన్‌ పరిస్థితి ఇప్పుడేమిటి ? దాన్ని ఉద్దరించిందీ లేదు, మరోసారి అప్పుకు రాకుండా చూసిందీ లేదు. ఐఎంఎఫ్‌కు చక్రవడ్డీలు చెల్లిస్తున్న ఐదు దేశాల్లో అదొకటిగా మారింది. పాకిస్తాన్‌ జిడిపిలో 70శాతం మేరకు అప్పులున్నాయి. ప్రభుత్వ ఆదాయంలో 50 నుంచి 60శాతం అసలు, వడ్డీల చెల్లింపులకే పోతోంది. మన ప్రభుత్వ రుణ భారం కూడా వందశాతానికి చేరనుందని ఐఎంఎఫ్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రానున్న ఐదు సంవత్సరాల్లో 22 దేశాల నుంచి ఐఎంఎఫ్‌ అదనపుబాదుడు 980 కోట్ల డాలర్లు ఉంటుందని, వాటిలో 2024 నుంచి 2033 వరకు ఉక్రెయిన్‌ 290 కోట్ల డాలర్ల మేర చెల్లించనుందని తేలింది.ధనిక దేశాల మీద ఆధారపడకుండా స్వంతంగా నిధులు సమకూర్చుకోవాలంటే అదనపు వసూలు తప్పదని సమర్థకులు చెబుతున్నారు. అంటే దివాలా స్థితిలో ఉన్నవాటి దగ్గర వసూలు చేసి ఆ మొత్తాన్నే తిరిగి వడ్డీలకు ఇస్తారన్నమాట, ఈ విధంగా కూడా ధనికదేశాలకు ఐఎంఎఫ్‌ మేలు చేస్తున్నది.


ఇబ్బందుల్లో ఉన్న 22 దేశాల నుంచి అదనపు బాదుడు ద్వారా ఐఎంఎఫ్‌కు వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉంది. అలాంటి దేశాలను రక్షించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ నిధి చివరికి చక్రవడ్డీ వ్యాపారిలా మారి పీక్కుతింటోంది.2020లో అదనపు చెల్లింపు దేశాల సంఖ్య పది కాగా కరోనా దెబ్బతో కుదేలై ఐఎంఎఫ్‌ దగ్గరకు అప్పుకోసం వెళ్లిన మరోపన్నెండు దేశాలు వాటి సరసన చేరాయి. ఈ సంస్థ వడ్డీ రేటు ఒకటి నుంచి ఐదుశాతానికి పెరగ్గా, సర్‌ఛార్జి చెల్లించే దేశాలకు అది 7.8శాతంగా ఉంటోంది. అందువలన ఈ దేశాలు అప్పుల ఊబినుంచి బయటపడే అవకాశమే లేదని అనేక మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ అప్పు, వడ్డీ చెల్లించటానికి ఆ దేశాల పాలకులు జనాన్ని పీక్కు తింటారు. ఈ క్రమంలో మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మానవహక్కుల పరిశీలన సంస్థ(హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌) ఏడాది క్రితం ‘‘ బుల్లెట్‌ గాయంపై బాండేజ్‌ ’’ పేరుతో 131పేజీల నివేదికలో వెల్లడిరచింది. ఐఎంఎఫ్‌ షరతులు అనేక సంక్లిష్ట పరిస్థితులను సృష్టించటమేగాక అసమానతలను కూడా పెంచుతున్నాయని చెప్పింది.


2020 మార్చి నెల నుంచి 2023 మార్చి నెల వరకు 110 కోట్ల జనాభా ఉన్న 38దేశాలకు ఇచ్చిన రుణాలను ఆ నివేదికలో విశ్లేషించారు. పొదుపు షరతులే అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, రాబడి పెరిగే కొద్దీ మధ్యతరగతి, ధనికులు చెల్లించాల్సిన పన్ను రేటు తగ్గింపు, తక్కువ ఆదాయం వచ్చేవారి మీద పన్ను పెంపు విధానాలను అది రుద్దుతున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో జనం ఆందోళనలకు దిగుతున్నారు.ఈ షరతుల వలన ఆయా దేశాల రుణ దామాషాలు తగ్గటం లేదని స్వయంగా ఆ సంస్థ నివేదికలోనే పేర్కొన్నారు. దాని 39 ప్రాజెక్టులను సమీక్షించగా 32లో ఏదో ఒక ఆదేశం లేదా షరతు మానవహక్కులను ఉల్లంఘించేదిగా ఉందని తేలింది. ఇరవై రెండిరటిలో ప్రభుత్వ వేతన బిల్లు తగ్గించేందుకు వేతన స్థంభన, వేతన పరిమితి లేదా తగ్గింపు షరతులు ఉన్నాయి.ఇరవై మూడు ఉదంతాలల్లో వ్యాట్‌ పెంచాలనే ఆదేశాలున్నాయి. ఇరవై ప్రాజెక్టుల్లో ఇంథనం, విద్యుత్‌ సబ్సిడీల తగ్గింపు, సామాజిక భద్రతా పథకాల ఖర్చు తగ్గింపు వంటివి ఉన్నాయి. మన దేశంలో నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిలు మీద పెద్ద మొత్తంలో సెస్‌ల పేరుతో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలపై ఖర్చు తగ్గించటం, ప్రభుత్వాలు ఆ రంగాల నుంచి వైదొలగటం లేదా నామమాత్రంగా ఉండాలన్నది ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు చెప్పే సలహాలు లేదా ఆ ముసుగులో ఆదేశాలు ఉంటాయి. ఈ రెండు సంస్థలను బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు అంటారు. ఎందుకంటే ఒకే దగ్గర అవి రూపుదిద్దుకున్నాయి.నాణానికి బొమ్మ బొరుసు వంటివి. రెండూ వేర్వేరుగా ఉన్నప్పటికీ సమన్వయంతో పనిచేస్తాయి. దేశాల మీద ఆదేశాలను రుద్దుతాయి. వాటి దగ్గరకు వెళ్లక ముందు మన దేశంలో రోడ్లకు టోల్‌టాక్సు, సెస్‌లు, వినియోగదారుల రుసుముల వంటి భారాలు లేవు. పెట్రోలు, డీజిలు మీద భారీగా ఒకవైపు పన్నులు సెస్‌ల వడ్డింపు,వాహనాలకు జీవితకాల పన్ను, మరోవైపు అవి రోడ్ల మీద తిరిగితే టోల్‌టాక్సు. దీన్నే గోడదెబ్బ`చెంపదెబ్బ అంటారు.


ఐఎంఎఫ్‌ విధానాలను అమలు జరిపిన జోర్డాన్‌ పరిస్థితిని మానవహక్కుల సంస్థ విశ్లేషించింది.2011 నుంచి 2017 మధ్య అక్కడ వృద్దాప్య పెన్షన్ల వంటి సామాజిక భద్రతా బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించారు. ఇంథనం, రొట్టెల మీద ఉన్న సబ్సిడీలను(మనదేశంలో పెట్రోలు,డీజిలు, గ్యాస్‌ మాదిరి) ఎత్తేశారు.తద్వారా ఆరు సంవత్సరాల్లో 110 కోట్ల డాలర్లను పొదుపు చేశారు.కోటీ పది లక్షల మంది జనాభాకు గాను కేవలం లక్షా ఇరవై వేల మందికి 2019లో ప్రపంచ బ్యాంకు సహకారంతో ఐఎంఎఫ్‌ పధకాల్లో నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టారు.తమకూ వర్తింపచేయాలని కోరిన వారిని వేధించారు, అణచివేశారు. 2018 నుంచి 2022 కాలంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారు 15 నుంచి 24శాతానికి పెరిగారు. దరఖాస్తు చేసుకున్న అత్యధికులకు తిరస్కరించారు. కేంద్రం అనుమతి ఇవ్వని కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పది సంవత్సరాలుగా కొత్తగా తెల్లరేషన్‌ కార్డుల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఇదీ మానవహక్కుల ఉల్లంఘనకిందికే వస్తుంది.

అమెరికా ఎన్నికల్లో కమ్యూనిజం చర్చ- ట్రంప్‌పై రెండో హత్యాయత్నం ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఐదవ తేదీన అమెరికాలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా ? తనకు ప్రతికూలంగా ఫలితం వస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా ? గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తాడా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాల నడుమ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మరోసారి ట్రంప్‌ మీద హత్యాయత్నం జరిగిందని, దుండగుడిని పట్టుకున్నట్లు భద్రతా సిబ్బంది ప్రకటించారు. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో తన స్వంత మైదానంలో గోల్ఫ్‌ ఆడుతుండగా భద్రతా సిబ్బంది సమీపంలో ఉన్న పొదల్లో సాయుధ దుండగుడిని గమనించి కాల్పులు జరిపారు. దాంతో దుండగుడు రయన్‌ రౌత్‌ తన వద్ద ఉన్న ఎకె47 మాదిరి తుపాకి, మరికొన్ని వస్తువులను వదలి తన కారులో పారిపోగా 65 కిలోమీటర్ల తరువాత పట్టుకున్నట్లు చెబుతున్నారు. రౌత్‌ కాల్పులు జరిపాడా లేక పొదల్లో శబ్దాలకారణంగా అతని ఉనికిని గుర్తించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారా అన్నది వెంటనే స్పష్టం కాలేదు. అతని సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించగా డెమోక్రటిక్‌ పార్టీ అభిమాని అని తేలినట్లు చెప్పారు. అయితే అది వాస్తవం కాదని గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటువేశాడని, తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన భారతీయ మూలాలున్న వివేక్‌ రామస్వామి చివరి వరకు పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మీద పోటీలో ఉండాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు మరొక ప్రచారం. జూలై 13వ తేదీన జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి తమ్మెకు గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడిని పట్టుకొని కాల్చి చంపారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రహస్య భద్రతా సిబ్బంది డైరెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ట్రంప్‌ మద్దతుదారైన ప్రపంచ ధనికుడు ఎలాన్‌ మస్క్‌ తాజా ఉదంతం మీద స్పందించిన తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. హత్యాయత్నాలు అధ్యక్షుడు జోబైడెన్‌, పోటీలో ఉన్న కమలాహారిస్‌ మీద ఎందుకు జరగటం లేదు, ట్రంప్‌ మీదనే ఎందుకు అంటూ ఎక్స్‌ ద్వారా మస్క్‌ స్పందించాడు. ఇది అత్యంత బాధ్యతారహితం అని అనేక మంది గర్హించారు. ట్రంప్‌కు ఏమీ కానందుకు జో బైడెన్‌, కమలా హారిస్‌ ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా అధ్యక్షులు గనుక గోల్ఫ్‌ ఆడితే ఆ మైదానం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడతారు. ట్రంప్‌ మాజీ గనుక అలాంటి రక్షణ కల్పించలేదని అధికారులు వివరణ ఇచ్చారు. అమెరికాలో హింసాకాండకు తావులేదని ఎక్స్‌లో కమల స్పందించారు. అమెతో జరిగిన సంవాదంలో ట్రంప్‌ వెనుకబడినట్లు సర్వేలు తేల్చిన తరువాతే ఈ ఉదంతం జరగటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జో బైడెన్‌, కమల తన మీద ధ్వజమెత్తుతున్న కారణంగానే హత్యాయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్‌ ఆరోపించాడు.


ఒకవేళ ఓడితే ఫలితాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా, గతంలో మాదిరే అనుచరులను రెచ్చగొట్టి దాడులకో మరొకదానికో పాల్పడతాడా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబరు ఐదవ తేదీ దగ్గర పడేకొద్దీ అనూహ్యపరిణామాలు సంభవిస్తాయోమోనని భావిస్తున్నారు.జో బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ట్రంప్‌ ముందంజలో ఉన్నాడు. తొలిసారి హత్యాయత్నం తరువాత ఆధిక్యత మరింత పెరిగి విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడిరది. కమలా హారిస్‌ రంగ ప్రవేశంతో అదంతా తారుమారైంది. తీవ్రమైన పోటీ స్వల్ప ఆధిక్యంలో కమల ఉన్నట్లు సర్వేలు వెల్లడిరచాయి. సెప్టెంబరు పదవ తేదీన వారిద్దరి మధ్య జరిగిన సంవాదంలో ట్రంప్‌ తేలిపోయాడు. కొన్ని సర్వేలు కమల 23పాయింట్ల ఆధిక్యతతో ఉన్నట్లు పేర్కొన్నాయి. తరువాత జరిగిన మరికొన్ని సర్వేలలో కూడా ఆమెదే పైచేయిగా ఉంది.దాంతో తాను మరోసారి ఆమెతో బహిరంగ చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని ట్రంప్‌ సంచలన ప్రకటన చేశాడు. దీంతో పోలింగ్‌కు ముందే ఓటమిని అంగీకరించినట్లు కావటంతో మాటమార్చాడు. పిచ్చోడు ఎప్పుడేం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు, ట్రంపు కూడా అంతే. అక్టోబరులో జరిగే మరో రెండు చర్చల్లో పాల్గొనేదీ లేనిదీ చెప్పలేము. ఒక వేళ సిద్దపడకపోతే పారిపోతున్నట్లుగానే ఓటర్లు భావిస్తారు.కమలతో సంవాదాన్ని నిర్వహించిన ఏబిసి సంస్థ వీక్షకుల అభిప్రాయాన్ని తారుమారు చేసిందని తానే ముందున్నట్లు ట్రంప్‌ ప్రకటించుకున్నాడు.గొప్ప చర్చ చేసినందుకుగాను ఓటర్లు తనకు మద్దతు ఇవ్వటం ప్రారంభించారని, సర్వేల్లో అదే వెల్లడైనా కుహనా మీడియా వాటిని వెల్లడిరచటం లేదు రిగ్గింగు చేసినట్లు స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.


అమెరికా ఎన్నికల్లో మైలురాళ్లుగా చెప్పుకోవాల్సి వస్తే జూలై 15న రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సమావేశం ట్రంప్‌ను, ఆగస్టు 19న కమలాహారిస్‌ను డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశం అభ్యర్థులుగా ఖరారు చేశాయి.సెప్టెంబరు పదిన ట్రంప్‌కమల తొలి సంవాదం జరిగింది.నవంబరు ఐదున ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. జనవరి ఆరున ఫలితాలను నిర్ధారిస్తారు.జనవరి 20న నూతన అధ్యక్ష పాలన ప్రారంభం అవుతుంది. ప్రముఖులుగా ఉన్నవారు, ఓటర్లను ప్రభావితం చేసే వారు కొందరు ఎన్నికల్లో ఏదో ఒక పక్షాన్ని లేదా అభ్యర్థిని బలపరుస్తారు ఎక్స్‌ అధిపతి, ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్రంప్‌ను సమర్ధిస్తున్నాడు. అదే విధంగా ప్రముఖ గాయని, నటి, రచయిత్రి టేలర్‌ స్విఫ్ట్‌ కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించింది. ఎలన్‌ మస్క్‌ సామాజిక మాధ్యమాల్లో ఉన్న అసహ్యకరమైన మనిషి అంటూ మస్క్‌ కుమార్తె వివియన్‌ జెనా విల్సన్‌ విరుచుకుపడిరది.టేలర్‌ స్విఫ్ట్‌ను ఉద్దేశించి ఒక ఎక్స్‌ చేస్తూ ‘‘ బాగుంది టేలర్‌..నేను నీకు ఒక బిడ్డను ఇస్తా, నా జీవితాతం నీ కుక్కలకు కాపలా కాస్తా ’’ అని మస్క్‌ పేర్కొన్నాడు. అమెరికా ఎన్నికల ప్రచారం ఎంతలా దిగజారి ఉంటుందో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు. టేలర్‌ వ్యతిరేకతను తట్టుకోలేని ట్రంప్‌ అందుకు తగిన మూల్యం చెల్లిస్తావంటూ బెదిరింపులకు పూనుకున్నాడు.

ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోయినా కమ్యూనిజం, సోషలిజాల గురించి పెద్ద చర్చే నడుస్తున్నది. గతకొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా అనేక మంది బుర్రల్లో అది రాయిలా గడ్డకట్టింది. తాను గెలవాలంటే పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేకతను ఒక అస్త్రంగా చేసుకోవాలని ట్రంప్‌ ఎంచుకున్నాడు.దానిలో భాగంగా కామ్రేడ్‌ కమల మన దేశానికి భయంకరమైన వ్యక్తి. అమె ఒక మార్క్సిస్టు లేదా కమ్యూనిస్టు, ఎప్పుడూ కమ్యూనిస్టుగానే ఉన్నారు, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటారు, ఎన్నుకుంటే అమెరికా చరిత్ర ముగిసినట్లే అని న్యూయార్క్‌ ఎకనమిక్‌ క్లబ్‌ ప్రసంగంలో అన్నాడు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక ప్రధాన పార్టీ అభ్యర్ధి, స్వేచ్చను తిరస్కరిస్తూ మార్క్సిజం, కమ్యూనిజం, ఫాసిజాలను అనుసరిస్తున్నారన్నాడు. ఆమె రూపంలో స్టాలిన్‌ జన్మించాడని చెప్పాడు. మౌలికంగా కృత్రిమ మేథ(ఏఐ) ద్వారా ఆమె కమ్యూనిస్టు టోపీ, ఎర్ర కోటు ధరించినట్లు ఒకటి, ఇంకా కమ్యూనిస్టు అని చెప్పే రకరకాల చిత్రాలను సృష్టించి వైరల్‌ చేయించాడు. కమల అభ్యర్థిగా నిర్ణయంగాక ముందే డెమోక్రటిక్‌ పార్టీని దేవుడు లేడని చెప్పే కమ్యూనిస్టు అని వర్ణించాడు. మన ప్రత్యర్థిని ఒక కమ్యూనిస్టు,సోషలిస్టు లేదా అమెరికాను నాశనం చేసే మరోవ్యక్తిగా చిత్రించి ప్రచారం చేయాలని తన మద్దతుదార్లను బహిరంగంగానే కోరాడు.ఎలన్‌ మస్క్‌ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాడు. సోవియట్‌ నాయకుల మాదిరి కమల బొమ్మలను సృష్టించాడు.కమల తొలి రోజు నుంచే ఒక కమ్యూనిస్టు నియంతగా మారనున్నారు. అమెరికన్ల ఆర్థిక స్వేచ్చను హరించేందుకు సిద్దంగా ఉన్న ఒక సోషలిస్టు అంటూ వ్యాఖ్యలను జోడిరచి ప్రచారంలో పెట్టాడు.

కమలా హారిస్‌ కమ్యూనిస్టు కాదు, డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్న ఉదారవాదుల్లో ఒకరు మాత్రమే. డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ కొన్ని అంశాలలో ఆమె వైఖరిని బట్టి పురోగామివాదిగా పరిగణిస్తున్నట్లు చెప్పాడు. అమెరికాలో గాడిద(డెమోక్రటిక్‌ పార్టీ)ఏనుగు (రిపబ్లికన్‌ పార్టీ) గుర్తుల మీద ఎవరు పోటీ చేసినా రెండిరటినీ బలపరిచే కార్పొరేట్లకు ఆమోదమైతేనే రంగంలో ఉంటారు.కమల కూడా అంతే. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఏమి చెప్పినప్పటికీ కార్పొరేట్లకు ప్రాతినిధ్యం వహించే గోల్డ్‌మన్‌ శాచస్‌ సంస్థ ట్రంప్‌ కంటే కమల మెరుగని పేర్కొన్నది. ఆమె గెలిస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థకు శక్తి వస్తుందని, ట్రంప్‌ వస్తే దెబ్బతింటుందని చెప్పింది. కమ్యూనిస్టు నియంత మెరుగని ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడిదారులు ఎలా చెబుతున్నారంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడిదారుల చక్రవర్తి ట్రంప్‌ ఆర్థిక ప్రణాళిక ప్రకారం కమ్యూనిస్టు కామ్రేడ్‌ కమల చెబుతున్నదాని కంటే లోటు ఐదు రెట్లు పెరుగుతుందని తటస్థంగా ఉంటే పెన్‌ వార్టన్‌ బడ్జెట్‌ నమూనా నివేదిక చెప్పిందని ఒకరు పేర్కొన్నారు. ఇంతకీ కమల లేదా డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్నదేమిటి ? యాభైవేల డాలర్లతో ప్రారంభించే చిన్న అంకుర సంస్థలకు పన్ను రాయితీలను వర్తింపచేయటం, బడా సంస్థలకు పన్నులు పెంచటం, దీన్నే కమ్యూనిజం అంటున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా మధ్యాహ్నభోజనం పెట్టటాన్ని కూడా సోషలిజం అని వర్ణించేబాపతు ఇలా చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది? వాషింగ్టన్‌ ఎగ్జామినర్‌ అనే మీడియాతో కమలాహారిస్‌ మాట్లాడిన అంశాలను రిపబ్లికన్లు కమ్యూనిజంగా వర్ణించటాన్ని పురోగామి మార్పు ప్రచార కమిటీ స్థాపకుల్లో ఒకరైన ఆడమ్‌ గ్రీన్‌ ఎద్దేవా చేశాడు. రానున్న వారాల్లో గుడ్ల ధర ఏడు నుంచి తొమ్మిది దాలర్లకు పెరగటాన్ని అడ్డుకుంటామని కమలా హారిస్‌ చెబుతున్నారు, మితవాదులు దాన్నే గనుక కమ్యూనిజం అంటే అత్యధిక అమెరికన్లు దాన్నే కోరుకుంటారు, మీరేం మాట్లాడుతున్నారో అర్ధమౌతోందా అని గ్రీన్స్‌ ప్రశ్నించాడు.ధరలను అదుపు చేయటాన్ని కూడా ట్రంప్‌ కమ్యూనిజంగా వర్ణించాడు. కరోనా కాలం నాటితో పోల్చితే ప్రస్తుతం అమెరికాలో ధరలు 20శాతం పెరిగాయి.నిజవేతనాలు గణనీయంగా పడిపోతున్నాయి. అందుకే బతుకుదుర్భరమౌతున్న కారణంగా అనేక మంది యువతకు సోషలిజం, కమ్యూనిజాల గురించి తెలియకపోయినా అదే కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ వంటి వారు చేసే విపరీత ప్రచారం వాటి గురించి ఆసక్తి పెంచేందుకు దోహదం చేస్తున్నదంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ దేశాల్లో చేస్తున్న సర్వేల్లో యువతలో సోషలిజం పట్ల సానుకూలత వెల్లడి అవుతున్నది. అమెరికాలో డెమోక్రాట్లను కమ్యూనిస్టులని ప్రచారం చేయటం ఇదే మొదటి సారి కాదు. ఈ ఎన్నికల్లో అది మరింతగా పెరిగింది.

నరేంద్రమోడీ తీరు ఇలాగే ఉంటే …… మనదగ్గరా శ్రీలంక, బంగ్లాదేశ్‌ పరిణామాలు పునరావృతం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన సైనికచర్య, ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వ కూల్చివేత వంటి పరిణామాలు ,కుట్రలు సంభవిస్తాయంటూ నరేంద్రమోడీని బలపరిచే శక్తులు కొన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే వాటి నేపధ్యం వేరే కావచ్చుగానీ జనంపై మోపుతున్న భారాలు అన్ని రంగాలలో వెల్లడౌతున్న వైఫల్యాన్ని చూస్తే మన దేశంలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయా అని ఆలోచించాల్సి వస్తోంది. దానికి వేరే దేశాలు కుట్రలే చేయనవసరం లేదు. హసీనా స్వయంకృతాన్ని ఆమెను వ్యతిరేకించే అమెరికా, బంగ్లా ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే చరిత్ర పునరావృతం కావచ్చుగానీ ఒకే విధంగా ఉండదు. ఎవరూ ఊహించలేరు.


తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం ఎంతకైనా కొన్ని రాజకీయ పార్టీలు తెగిస్తున్న రోజులివి.2024 సెప్టెంబరు 14 నుంచి అమల్లోకి వచ్చేలా మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున దిగుమతి సుంకాలను విధించింది.ముడి(శుద్ధి చేయని) పామ్‌, సోయా,సన్‌ఫ్లవర్‌ దిగుమతి ధరలపై ఇప్పుడున్న 5.5శాతం పన్ను మొత్తాన్ని 27.5శాతానికి పెంచింది. వీటికి ఇప్పటికే ఉన్న సెస్‌లు అదనంగా పెరుగుతాయి. ఇది సగటు ధర, అదే శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న 13.75 నుంచి 35.75కు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక లీటరు వంద రూపాయలకు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు రు.113.75 చెల్లిస్తున్నాము. పెంచిన పన్నుతో అది రు.135.75కు అవుతుంది. ఇది మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వేరే చెప్పనవరం లేదు. మనదేశం ఖాద్యతైలాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏటా వంద కిలోలు దిగుమతి చేసుకుంటే మన వాటా 20కిలోలకు పైగా ఉంది. ఈ కారణంగానే మన ప్రభుత్వం అనుసరించే వైఖరి ఒక విధంగా ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. దిగుమతి సుంకం పెంచగానే చికాగో మార్కెట్‌లో సోయా ధర రెండుశాతం పతనమైంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వినియోగదారులను ఉద్దరించేందుకు దిగుమతి సుంకాలు తగ్గించినట్లు చెప్పిన మోడీ సర్కార్‌ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రైతుల ఓట్ల కోసం అవే సుంకాలను పెంచుతూ నిర్ణయించింది.ఏది చేసినా ఓట్లకోసమే అంటే కొందరు తమ మనోభావాలను గాయపరుచుకోవచ్చుగానీ వాస్తవం.


హర్యానాలో బాస్మతి రకం వరిని సాగు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పతనం అక్కడి రైతుల మీద కూడా పడిరది. బాస్మతి బియ్యాన్ని టన్నుకు 1200 డాలర్లకు తగ్గకుండా ఎగుమతి చేయాలని నిర్ణయించారు. తరువాత దాన్ని 950డాలర్లకు తగ్గించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్‌ అంతకంటే తక్కువ ధరకే ఎగుమతి చేస్తున్నందున మన బియ్యాన్ని కొనేవారు లేకుండా పోవటంతో మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బిజెపి ఐదింటిని పోగొట్టుకుంది. రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు తేలటంతో ఇప్పుడు కనీస ఎగుమతి ధరల విధానాన్ని ఎత్తివేసింది. పోయిన ఖాతాదారులు తిరిగి వస్తారా, ఇది రైతులకు మేలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.అదే విధంగా మహారాష్ట్రలో కూడా బిజెపి చావుదెబ్బతిన్నది, దానికి ఉల్లిరైతుల ఆగ్రహం అని తేలింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కన్నీరు తెప్పించిన ఉల్లిధరలను తగ్గించేందుకు ఎగుమతులపై ఆంక్షలు, కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లు ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మహారాష్ట్రలో సోయా సాగు కూడా ఎక్కువే. దానికి కేంద్రం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.4,892 కంటే మార్కెట్‌లో రు.4,500 నుంచి 600 వరకు మాత్రమే పలుకుతోంది.దీంతో రైతుల్లో తలెత్తిన అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల మీద పడకుండా మోడీ సర్కార్‌ సోయా మీద దిగుమతి పన్ను పెంచి కొంతమేరకైనా మార్కెట్లో ధరలు పెరుగుతాయనే ఆశతో ఈ చర్య తీసుకుంది.


ఇటు రైతులుఅటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలనటంలో మరోమాట లేదు. అందుకు తీసుకొనే చర్యలను సమర్దించవచ్చు. కానీ గత పది సంవత్సరాల్లో ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.మధ్యలో మార్కెటింగ్‌ రంగంలో ఉన్న వాణిజ్యవేత్తలకే లబ్ది చేకూరింది.మన దేశ అవసరాలలో మూడిరట రెండువంతుల ఖాద్యతైలాలను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నాం. నూనెగింజలను ఉత్పత్తి చేసే రైతాంగానికి అవసరమైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. అనేక దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికదిగుబడి వంగడాలను రూపొందించి ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. అది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకూ మేలు. నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు అక్కడ గణనీయంగా సాగుచేసే వేరుశనగ దిగుబడి పెంచేందుకు అవసరమైన వంగడాలను రూపొందించలేదు, పదేండ్లు ప్రధానిగా ఉన్నా చేసిందేమీ లేదు. 2022 గణాకాల(అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా వెబ్‌సైట్‌ ) మేరకు అమెరికాలో హెక్టారుకు వేరుశనగ నాలుగున్నరటన్నుల దిగుబడి ఉండగా, చైనాలో 4.13టన్నులు, అదే మనదేశంలో 1.78 టన్నులు మాత్రమే. మొత్తంగా నూనె గింజల దిగుబడి కూడా ఇదే మాదిరి ఉంది గడచిన పదకొండు సంవత్సరాల సగటు 1.22 టన్నులు మాత్రమే. ఎందుకీ దుస్థితి, దీనికి బాధ్యులెవరు ? జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణం అంటారా ? నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు. పదేండ్లలో మన కరెన్సీ రూపాయి విలువ పతనం కారణంగా అధిక మొత్తాలను చెల్లించి దిగుమతి చేసుకోవటంతో వినియోగదారులకు ధరలు మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం 201314లో దేశ అవసరాల్లో 48.1శాతంగా ఉన్న దేశీయ ఉత్పత్తి 202223 నాటికి 42.92శాతానికి పడిపోయినట్లు అంచనా. దీనికి కారకులెవరు ? మెజారిటీ రాష్ట్రాలలో అధికారం మాదే, అభివృద్ధికి రెండిరజన్ల పాలన కావాలని చెబుతున్న బిజెపి ఏం చెబుతుంది? ఎంతకాలమీ పరిస్థితి, ఈ వైఫల్యాన్ని సహించాల్సిందేనా ? 2047నాటికి వికసిత భారత్‌ అనే కబుర్లతో కడుపు నిండుతుందా ? మన దేశంలో కొంత మంది వైద్యులు, వైద్యుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా కబుర్లు చెప్పేవారు తయారై వంటల్లో నూనెలను తగ్గించండి వీలైతే పూర్తిగా మానుకోండి అని చెప్పటం తెలిసిందే. ఇటీవల యూట్యూబర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో అందరినీ మించిపోయారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవారికి అలాంటి సలహాలు ఇవ్వటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో తలసరి వంటనూనెల కిలోల వాడకాన్ని చూద్దాం. జనాభా రీత్యా మొత్తం వాడకంలో మనదేశం చైనా తరువాత రెండవ స్ధానంలో ఉండవచ్చుగానీ తలసరిలో ఎక్కడో ఉన్నాం.

దేశం——–2010-2012–2022-22---2032 ప్రపంచం- --14.36 ---16.00 --16.60 పేదదేశాలు---07.13---06.97---07.79 భారత్‌----- 09.85---09.87---10.95 ఇండోనేషియా-05.55---10.32---12.24 లాటిన్‌అమెరికా06.95---17.61---18.18 ఐరోపా----- 18.55---24.10---21.73 చైనా------ 20.37---26.02---27.24 అమెరికా----36.63---40.26---36.76

మన దేశంలో కరోనాకు ముందు ఉన్న స్థాయికి వంట నూనెల డిమాండ్‌ పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.అనేక దేశాలతో పోల్చితే మన వినియోగం తక్కువగా ఉన్నపుడే పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిగా ఉంది. అన్నింటికీ పోల్చుతున్న చైనా స్థాయికి చేరితే దిగుమతి చేసుకొనేందుకు మన దగ్గర అవసరమైన డాలర్లు ఉంటాయా ? మూడు దశాబ్దాల కాలంలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదనేది గత,వర్తమాన, భవిష్యత్‌ అంచనాలు తెలుపుతున్నాయి. ఇండోనేషియా తన అవసరాలను గమనంలో ఉంచుకొని పామ్‌ ఆయిల్‌ ఎగుమతులపై గతంలోనే కొన్ని ఆంక్షలు విధించింది. రానున్న సంవత్సరాల్లో దాని వినియోగం పెరగనుందనే అంచనాలు వాస్తవ రూపం దాల్చితే మన దిగుమతులు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోటీతో పాటు మన దిగుమతి అవకాశాలు తగ్గితే సోయా ఆయిల్‌ ఎగుమతి దేశాలు కూడా ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు. మన మొత్తం దిగుమతుల్లో పామాయిల్‌ వాటా 60శాతం.

దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల మీద పన్నులు పెంచితే రైతాంగాన్ని ఆదుకోవచ్చని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అది వాస్తవ రూపం దాల్చలేదు, సాగు పెద్దగా పెరగలేదు. నిజంగా మేలు చేయాలంటే ఇతర మార్గాలను ఆలోచించాలి. మార్చినెలతో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో రు.2.37లక్షల కోట్ల మేర జిఎస్‌టిని ఎగవేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది.అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది రెట్టింపు. మొత్తమే కాదు కేసులు కూడా పెరిగాయి.ముంబై, పూనే, గురుగ్రామ్‌, ఢల్లీి, హైదరాబాద్‌ కేంద్రాలుగా ఈ ఎగవేతను కనుగొన్నారు. మూడోవంతు రు.71వేల కోట్లు ఒక్క ముంబైలోనే ఉంది. అక్కడ రెండిరజన్ల పాలనే సాగుతోంది.లావాదేవీలేమీ లేకుండానే ఇన్‌పుట్‌ టాక్సు క్రెడిట్‌ పేరుతో కొట్టేసిన మొత్తం 20శాతం ఉంది. పన్ను ఎగవేతలను అరికట్టే పేరుతో 2017లో జిఎస్‌టిని తీసుకువచ్చారు.అంతకు ముందు ఎగవేత రు.7,879 కోట్లు కాగా తరువాత ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా తాజాగా రు.2.37లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, తమను వ్యతిరేకించేవారి మీద సిబిఐ,ఐటి,ఇడి దాడులను సాగిస్తున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎగవేస్తుంటే ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? దీన్ని అరికడితే రైతాంగానికి అదనంగా చెల్లించవచ్చు, ఖాద్య తైలాల మీద దిగుమతి సుంకం విధించకపోతే వినియోగదారులనూ ఆదుకున్నట్లు అవుతుందా లేదా ? ఖాద్య తైలాల సంవత్సరం నవంబరు నుంచి అక్టోబరు వరకు ఉంటుంది.భారత సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 201314 నుంచి 202223తో పోల్చితే పదేండ్లలో నూనెల దిగుమతులు 116 లక్షల టన్నుల నుంచి 165లక్షల టన్నులకు పెరిగితే మోడీ ప్రభుత్వ నిర్వాకంతో రూపాయి విలువ తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా ఖర్చు రు.60,750 కోట్ల నుంచి రు.1,38,424 కోట్లకు పెరిగింది. దీనికి తగ్గట్లుగా వినియోగదారుల రాబడి పెరిగిందా ? పోనీ సాగు విస్తీర్ణం పెరిగిందా అంటే లేదు.201112లో 263లక్షల హెక్టార్లలో సాగు చేయగా 202223లో 301లక్షలకు మాత్రమే చేరింది.మన అవసరాలకు ఇదేమాత్రం చాలదు.

గత రెండు సంవత్సరాలుగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచలేదు చూడండి అంటూ బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అసలు సంగతేమిటి ? గతంలో ప్రకటించి అమలు జరిపిన విధానం ప్రకారం గణనీయంగా ధరలను తగ్గించాల్సి ఉండగా పాతవాటినే కొనసాగించి మన జేబులను కొల్లగొడుతున్నారు. 202223 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినపుడు మనదేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 93.15 డాలర్లు కాగా 202324లో అది 82.58కి తగ్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 15వరకు సగటు ధర81.92 డాలర్లు ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు ఎందుకు ధరలు తగ్గించటం లేదంటే అన్నింటికీ జవాబుదారీ అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ ఎన్నడైనా దేశ పౌరులకు తన మన్‌కీ బాత్‌లో చెప్పారా ? ఎందుకు నోరు విప్పటం లేదో ఎవరైనా చెబుతారా ? వంటనూనెల వ్యాపారంలో అదానీ, పెట్రోలియం ఉత్పత్తులలో అంబానీ వంటి కంపెనీలు ఉండగా వాటికి లబ్ది చేకూరేవిధంగా మన ఎగుమతిదిగుమతి విధానాలు ఉన్నాయి తప్ప రైతులు, వినియోగదారులు పట్టలేదు. 1970దశకం ప్రారంభంలో ముంబైలో చిన్నగా ప్రారంభమైన ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళన క్రమంగా గుజరాత్‌, బీహార్‌ తదితర ప్రాంతాలకు విస్తరించటం, జయప్రకాష్‌ నారాయణ్‌ రంగ ప్రవేశం, ఇందిరాగాంధీ ఎన్నికల కేసులో ఓటమి, అత్యవసరపరిస్థితి విధింపు, ఆ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి వంటి పరిణామాలు తెలిసినవే.గతంలో లాటిన్‌ అమెరికా, ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల ఏండ్ల తరబడి హృదయ సామ్రాట్టులుగా అభిమానం చూరగొన్న నాయకులనే జనం చివరికి తరిమికొట్టటాన్ని చూశాము. భారాలు పెరిగి జీవనం దుర్భరమైతే ఎక్కడైనా అలాంటి పరిణామాలు జరగవచ్చు. దానికి మనదేశం అతీతమేమీ కాదు. అయితే చరిత్ర ఏ రూపంలో ఎలా పునరావృతం అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. అన్నీ అనూహ్యంగా జరిగినవే.

చైనాపై పెరుగుతున్న విశ్వాసం – ఆఫ్రికాపై పట్టుకోసం అమెరికా ఆరాటం !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

మూడు రోజుల పాటు 2024 సెప్టెంబరు 46 తేదీల మధ్య బీజింగ్‌లో జరిగిన చైనాఆఫ్రికా సహకార వేదిక సమావేశాలు జయప్రదంగా ముగిశాయి.వర్తమాన భూభౌతిక రాజకీయాల్లో ఈ వేదిక 8వ సమావేశాలకు ఆఫ్రికాలోని 54కు గాను 53దేశాల నుంచి ప్రభుత్వాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. గత సమావేశాలు సెనెగల్‌ రాజధాని డాకర్‌లో జరిగాయి. అమెరికాకు అనుకూలంగా తిరుగుబాటు ప్రాంతం తైవాన్ను చైనాగా గుర్తించిన పన్నెండు లక్షల జనాభా గల చిన్నదేశం స్వాతినీ(గతంలో స్వాజీలాండ్‌ అని పిలిచేవారు) మాత్రమే రాలేదు. 2000 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చిన చైనాఆఫ్రికా సహకార వేదిక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి భవిష్యత్‌ కార్యక్రమాలను నిర్ణయించుకుంటుంది. ఈ వేదిక సాధనంగా ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన 280కోట్ల మంది జీవితాలను నవీకరించవచ్చని సమావేశాలను ప్రారంభించిన చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పారు.చైనా,ఆఫ్రికా రెండూ సామ్రాజ్యవాదుల దురాక్రమణ,వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడినవే అని గుర్తు చేశారు. కేవలం పదినిమిషాలు మాత్రమే మాట్లాడిన షీ రానున్న మూడు సంవత్సరాల్లో చేపట్టదలచిన పది అంశాలను సభ ముందుంచారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆఫ్రికా,చైనా సంబంధాలు నానాటికీ పెరగటం అమెరికాను కలవర పెడుతోంది.భౌగోళికంగా ప్రాధాన్యత ఉన్న ఆ ప్రాంతంలో చైనాతో మిత్రత్వంతో కంటే తన పట్ల వ్యతిరేకత పెరగటాన్ని అది సహించలేకపోతోందంటే అతిశయోక్తి కాదు. ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండంలోని సామ్రాజ్యవాద, ధనిక దేశాలు చీకటి ఖండగా పిలిచిన ఆఫ్రికాను తమ ఉత్పత్తులకు మార్కెట్‌గా, తమ పరిశ్రమలు, గనులు,భూముల్లో పని చేసేందుకు బానిసలుగా పట్టుకువచ్చేందుకు అనువైన ప్రాంతంగా మాత్రమే చూసినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు చైనా దానికి విరుద్దమైన విధానాలతో స్నేహ బంధాలను నెలకొల్పుకోవటం వాటికి మింగుడుపడటం లేదు.


ఈ సమావేశాల్లో రానున్న మూడు సంవత్సరాల్లో ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు 51బిలియన్‌ డాలర్ల మేరకు అందిస్తామని చైనా వాగ్దానం చేసింది. ఈ మొత్తంలో 30బిలియన్లు రుణాలు,పదిబి.డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. చైనాఆఫ్రికా మధ్య వాణిజ్య లావాదేవీలు ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో 167.8బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.వర్తమాన దశాబ్ది చివరకు 300 బి.డాలర్లకు పెంచాలని చూస్తున్నారు. బీజింగ్‌ కార్యాచరణ పధకం పేరుతో ఆమోదించిన ప్రకటన ప్రకారం రానున్న రోజుల్లో మరింతగా హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అందించనుంది. ప్రపంచంలో ఈ రంగంలో అన్ని దేశాల కంటే చైనా ఎంతో ముందుంది. తన బిఆర్‌ఐ (బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పధకం కింద గత దశాబ్దకాలంలో వివిధ దేశాలలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్‌ ప్రాజెక్టులు, వంతెనలు, ఆసుపత్రుల వంటి అనేక పధకాలకు 120 కోట్ల డాలర్లమేర పెట్టుబడులు పెట్టింది. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత సంక్లిష్టమైన ఈ ఖండ దేశాలు చైనాను తమ నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తున్నాయి. అనేక దేశాల్లో కొనసాగుతున్న అంతర్గత కలహాలు, అంతర్యుద్ధాలలో అమెరికా మాదిరి ఏదో ఒక పక్షం వహించకుండా వీలైతే వాటిని పరిష్కరించటానికి, సర్దుబాటు చేసేందుకు చూస్తున్నది.

ఆఫ్రికాతో పాటు అనేక దేశాలలో చైనా పెట్టుబడులు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది. వీటితో సదరు దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతే వాటి ఆస్తులపై కన్నువేస్తున్నదని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తునప్రచారం జరుగుతున్నది. చైనా కంటే అమెరికా, ఐరోపాలో అనేక ధనికదేశాలు ఉన్నాయి. అవసరమైన పేద, వర్ధమాన దేశాలకు అవే సులభతరమైన పద్దతిలో పెట్టుబడులు, రుణాలు ఇచ్చి చైనాకు ఎందుకు అడ్డుకట్టవేయటం లేదు ? చైనా అంటే ఇటీవలి కాలంలో రుణాలు, పెట్టుబడులు పెడుతున్నది. మరి గత శతాబ్దిలో లాటిన్‌ అమెరికా దేశాలు అప్పులపాలై సంక్షోభంలో కూరుకుపోవటానికి కారకులు ఎవరు ? మన దేశం కూడా ప్రపంచ బాంకు వద్దకు వెళ్లి అది విధించిన షరతుల మీద అప్పులు తీసుకున్న చరిత్ర ఉంది కదా ? దానికి కారకులు ఎవరు ? సందర్భం ఆఫ్రికా గురించి కనుక దాని అప్పుల నిజానిజాల గురించి చూద్దాం. గతేడాది(2023)చివరి నాటికి ఆఫ్రికా దేశాల మొత్తం అప్పు 1,15,200 కోట్ల డాలర్లు. దీనికి గాను 2010లో చెల్లించిన వడ్డీ, అసలు మొత్తం 6,100 కోట్ల డాలర్లు కాగా 2024 నాటికి 16,300 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇక చైనా 2000 నుంచి 2023వరకు ఆఫ్రికాకు ఇచ్చిన అప్పు 18,228 కోట్ల డాలర్లు. ఈ మొత్తంతోనే ఆఫ్రికాను చైనా ఆక్రమించుకుంటే మరో లక్ష కోట్ల డాలర్లు ఇచ్చిన దేశాలూ, సంస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉంటాయా ? ఎందుకు చైనా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ? ఆఫ్రికా దేశాలు సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినవి. మంచేదో చెడేదో నిర్ణయించుకోగలగిన పరిణితి కలిగినవే. వాటిని చైనా వలలో ఇరుకుంటున్నాయని చెప్పటమంటే అవమానించటం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలు, వాటి సంస్థలు, ప్రైవేటు సంస్థల నుంచి అప్పులు చేసినపుడు ఇలాంటి హెచ్చరికలను ఎందుకు చేయలేదు ? నాడు అప్పుల ద్వారానే అభివృద్ధి, రుణాలు తీసుకోని దేశం ఏదైనా ఉందా అంటూ సమర్ధించారు. పాలకులు బయటి నుంచి తీసుకున్న అప్పులను దుర్వినియోగం చేయటాన్ని ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఒక్క చైనా నుంచి తీసుకున్నవాటినే స్వాహా చేస్తారు, మిగతా దేశాల వాటిని ముట్టుకుంటే భస్మమౌతారని చెబుతున్నట్లా ? ఏ అవినీతి, అక్రమం జరిగినా దాని గురించి ఆయాదేశాల జనమే తేల్చుకుంటారు.అలాంటి పాలకులందరినీ జనం చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టారు. లాటిన్‌ అమెరికా దేశాలను అప్పుల పాలు చేసిన పాలకులను పేరు చెప్పి మరీ ఓడిరచిన ఉదంతాలు తెలిసిందే, వారికి మద్దతు ఇచ్చిన అమెరికా అంటే అక్కడ నేడు ఎంత వ్యతిరేకత ఎంతో ఉందో కూడా చూస్తున్నాము. పరస్పరం లబ్ది పొందుతున్న కారణంగానే చైనా ఆఫ్రికా సంబంధాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.చైనా పెట్టుబడులు ఆఫ్రికా ఖండాన్ని అప్పుల ఊబిలో దింపుతాయని చెప్పే మాటలను తాను విశ్వసించనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా బీజింగ్‌ సమావేశాలకు హాజరైన సందర్భంగా విలేకర్లతో చెప్పాడు. పరస్పర లాభదాయకమైనవన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతల్లో బ్రిటన్‌, ఫ్రాన్సులు కూడా ఉన్నప్పటికీ అవి ఆఫ్రికాలో వలసలుగా చేసుకున్న దేశాలన్నింటినీ వదలి వెళ్లాల్సి వచ్చింది, స్వచ్చందంగా చేయని చోట పోరాటాల ద్వారా జనం తరిమికొట్టారు. ఆ తరువాత మార్కెట్లను ఆక్రమించటంలో అమెరికా ముందుకు వచ్చింది. తమను దెబ్బతీసే వలసలను, నిరంకుశ పాలకులను వ్యతిరేకించిన ఆఫ్రికన్లు ఒకవేళ చైనా కూడా తమను దోపిడీ చేస్తున్నదని భావిస్తే అదే పని చేస్తారు. గతంలో సోవియట్‌ యూనియన్‌ అలాంటి పనులకు పాల్పడలేదు కనుకనే చైనాను వారు నమ్ముతున్నారు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన పశ్చిమదేశాలు మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు నయావలస విధాన సాధనాలుగా ఐరాస, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణ్యిస్థలను ముందుకు తెచ్చాయి. అవేవీ పేద,వర్ధమానదేశాలను ఉద్దరించేవికాదని ఎనిమిది దశాబ్దాల అనుభవం నేర్పింది. వాటి విధానాల పర్యవసానమే ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లో ఇరుక్కోవటం, దానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటాలను అణచేందుకు మిలిటరీ, మితవాద నిరంకుశ శక్తులను రుద్ది ప్రజాస్వామ్యాన్ని కూడా హరించటం దాస్తే దాగేది కాదు.గతంలో సోవియట్‌ యూనియన్‌గానీ, ఇటీవల తాను పెట్టుబడులు పెట్టిన లేదా రుణాలు ఇచ్చిన దేశాల్లో అలాంటి శక్తులను చైనా ప్రతిష్ఠించిన లేదా పనిగట్టుకొని సమర్ధించిన దాఖలాలు లేవు.


ఆఫ్రికాలో చైనా పలుకుబడి పెరగటాన్ని అమెరికా, ఐరోపా ధనికదేశాలు భరించలేకపోతున్నాయి.ప్రధానంగా అమెరికా ముందుంది. చైనాను అడ్డుకొనేందుకు చూస్తున్నది.అదే సమయంలో తాను కూడా ఆఫ్రికా పేద దేశాలను ఆదుకుంటానంటూ పోటీగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నది. 2022 డిసెంబరు 1315 తేదీలలో వాషింగ్టన్‌ డిసిలో అమెరికాఆఫ్రికా నేతల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దాదాపు 50దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 2000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చైనా`ఆఫ్రికా వేదిక సమావేశాలు జరుగుతున్నాయి.క్రమంగా పెట్టుబడులతో ముందుకు పోతున్నది.చైనా పట్ల సానుకూల ధోరణి పెరుగుతోంది. కొన్ని సందర్భాలలో అమెరికా మీద వత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలంగా ఆఫ్రికాతో వాణిజ్యం జరిపే దేశాలలో ముందున్న అమెరికాను 2021లో చైనా వెనక్కు నెట్టేసింది. అనేక దేశాల మాదిరే ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా కూడా 2017తన మిలిటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది విదేశాల్లో దాని తొలి కేంద్రం. అనేక మంది ఆఫ్రికన్‌ నేతలు చైనాతో పాటు అమెరికా నుంచి కూడా లబ్దిపొందాలని చూస్తున్నారు. అయితే అమెరికాతో సహా అనేక దేశాలు కబుర్లు చెప్పటం తప్ప నిర్దిష్టంగా చేస్తున్నదేమీ లేదనే విమర్శలు వచ్చాయి.దాన్ని పొగొట్టుకొనేందుకు అమెరికా తొలి సమావేశాన్ని 2014లో నిర్వహించిన తరువాత 2022లో ఏర్పాటు చేసింది. గతంలో వచ్చిన విమర్శలు వాస్తవం కాదని చెప్పుకొనేందుకు అమెరికా చూసింది. ఈ సభలో 1,500 కోట్ల డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రకటించారు. అంతకు ముందు కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి.2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆఫ్రికాలోని మూడు దేశాల్లో పర్యటించారు.ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, తమకు ముప్పు సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి.అంతర్యుద్దాలను రెచ్చగొట్టి తాము దూరాలని చూస్తున్నాయి.ఆఫ్రికాలో కూడా జరుగుతున్నది అదే.అనేక దేశాలు వాటి నుంచి దూరం జరుగుతున్నాయి. అమెరికా వైఖరిని అనేక చోట్ల రష్యా ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నది.అనేక చోట్ల ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ అమెరికా ఇప్పటికీ దాదాపు ఆరువేల మంది సైనికులను ఆఫ్రికాలో నిర్వహిస్తున్నది. రష్యా ఒక వైపు మిలిటరీ రీత్యా ఆఫ్రికా దేశాలకు దగ్గర అవుతుంటే ఆర్థిక రంగంలో చైనా ముందుకు పోతున్నది. ఈ రెండు దేశాలూ తమను సవాలు చేయటాన్ని అమెరికా సహించలేకపోతున్నది.

చైనాకు తలుపులు మూయలేదు, నరేంద్రమోడీకి ‘‘ అమెరికా మనిషి జయశంకర్‌ సమస్య ’’ గా మారారా?

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


‘‘ చైనాతో వాణిజ్యానికి వ్యతిరేకం కాదు, ఏ రంగంలో లావాదేవీలు ఎలా అన్నదే సమస్య అన్న జయశంకర్‌ ’’ ఈటివి భారత్‌ ప్రసారం చేసిన ఒక వార్త శీర్షిక ఇది. ఇంకా మరికొన్ని పత్రికలు కూడా ఇదే వార్తను ఇచ్చాయి. 2024 సెప్టెంబరు పదిన అక్కడి విదేశాంగ మంత్రితో కలసి జర్మనీ నగరమైన బెర్లిన్‌లో ఒక చర్చలో పాల్గొన్న జయశంకర్‌ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘ చైనాతో వాణిజ్యానికి తలుపులు మూయలేదు. ప్రపంచంలో అది రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది ఒక ప్రముఖ ఉత్పత్తిదారు. చైనాతో వాణిజ్యం చేయబోమని చెప్పగలిగేవారెవరూ లేరు. ఏఏ రంగాలలో వాణిజ్యం చేయాలి, ఏ షరతులతో చేయాలన్నదే సమస్య అని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతో సంక్లిష్టమైనది, నలుపా తెలుపా అన్నంత సులభంగా సమాధానం చెప్పలేము ’’ అన్నారు. జయశంకర్‌ చెప్పిన ‘‘ సమస్య ’’ ఒక్క చైనాతోనే అనే ముంది, ప్రతిదేశంతోనూ ఉండేది కాదా ? చైనాతో ఆచితూచి, మిగతా దేశాలతో ఎలాబడితే అలా చేస్తారా ? 2020లో జరిగిన గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత మనదేశం చైనా పేరు పెట్టకపోయినా దానికి వర్తించే అనేక ఆంక్షలను పెట్టిన సంగతి తెలిసిందే. భద్రత, సమాచార రక్షణ పేరుతో అంతకు ముందు స్వేచ్చగా అనుమతించిన టిక్‌టాక్‌ వంటి యాప్‌లను కూడా నిషేధించింది. ఆగస్టు నెలలో ఒక సందర్భంలో జయశంకర్‌ మాట్లాడుతూ చైనాతో ప్రత్యేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఏం జరుగుతోంది ? మన విధానాలను ప్రభావితం చేస్తున్నది ఎవరు ? ప్రధాని నరేంద్రమోడీకి విదేశాంగ మంత్రి జయశంకర్‌ సమస్యగా మారారా ? ఆయన వెనుక ఎవరున్నారు ? జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఇలా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.


ఇటీవలి కాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌తో సహా అనేక మంది చైనా పెట్టుబడులకు అనుకూలంగా సంకేతాలివ్వటమేగాక మాట్లాడుతున్నారు.జూలై నెలలో విడుదల చేసిన మనదేశ వార్షిక ఆర్థిక సర్వేలో చైనా సరఫరా గొలుసుతో అనుసంధానం చేసుకోవటం,మరింతగా చెనా పెట్టుబడులను మనదేశంలోకి అనుమతించటం గురించి పేర్కొన్నారు. సూర్యరశ్మి పలకలు, విద్యుత్‌ వాహనాల బ్యాటరీలు, ఇంకా మన దగ్గర తయారీకి నైపుణ్యం లేని, రక్షణ సమస్యలు లేని ఉత్పత్తుల వంటి రంగాలలో చైనా పెట్టుబడుల అనుమతికి, చైనీయులకు నిలిపివేసిన వీసాల జారీ నిబంధనలను భారత్‌ సడలించవచ్చని జూలై నెలలోనే రాయిటర్స్‌ వార్తా సంస్థ నివేదించింది.జై శంకర్‌ జర్మనీ పర్యటనలో ఉండగానే చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ‘‘ భారత దౌత్యానికి ఎస్‌ జైశంకర్‌ సమస్య ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడిరది. దాన్ని వెబ్‌సైట్‌ నుంచి వెంటనే తొలగించారని కూడా వార్తలు వచ్చాయి.అయితే అది నెటిజన్లకు అందుబాటులో ఉంది. దానిలో పేర్కొన్న అంశాల సారం ఏమిటి ?


ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, సంప్రదింపులు సంబంధాలు మెరుగుపడటానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిన నేపధ్యంలో ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక నిర్వహించిన ప్రపంచ వేదిక సమావేశంలో జై శంకర్‌ చేసిన వ్యాఖ్యలను చైనా విశ్లేషకుడు తప్పు పట్టటమే కాదు, రెండుదేశాల సంబంధాలు మెరుగుపడటం ఇష్టం ఉన్నట్లు లేదని విమర్శించాడు. ‘‘ మామూలుగానే చైనా సమస్య ఉంది.చైనా గురించి చర్చిస్తున్నది ప్రపంచంలో భారత్‌ ఒక్కటే కాదు. భారత్‌కు చైనా సమస్య ఉంది… ప్రపంచానికి ఉన్న సాధారణ చైనా సమస్య కంటే భారత్‌కు ప్రత్యేక సమస్య ఉంది’’ అన్న జై శంకర్‌ వ్యాఖ్యను ఉటంకించాడు. అంతే కాదు కేంద్రంలో నేటి పరిస్థితి గురించి మనదేశ విశ్లేషకుడు ప్రవీణ్‌ సాహ్నే చేసిన వ్యాఖ్యలను కూడా పేర్కొన్నాడు. అవేమిటంటే ‘‘ మోడీ సర్కార్‌లో ఒక బలమైన వర్గం చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తేవాలని అభిప్రాయపడుతున్నది. జై శంకర్‌ నాయకత్వంలోని మరొక శక్తివంతమైన వర్గం చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటే అమెరికాతో ఉన్న భారత సంబంధాలు సంకటంలో పడతాయి కనుక జరగకూడదని చెబుతున్నది. లబ్ది పొందాలని చూస్తున్న కారణంగా నరేంద్రమోడీ ఎటూ తేల్చుకోలేదు ’’ అని పేర్కొన్నారు. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పకపోయినా జై శంకర్‌ అమెరికన్‌ లాబీయిస్టుగా ఉన్నారని చైనా చెబుతోంది. భారత్‌చైనా సంబంధాలు మెరుగుపడటం, బలపడటం గురించి జై శంకర్‌ భయపడుతున్నారని కూడా గ్లోబల్‌టైమ్స్‌ విశ్లేషణలో ఉంది.ఒక వర్గం తమతో సంబంధాల గురించి అనుకూలంగా ఉన్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు అవసరం లేదన్న పునరాలోచనతో దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించి ఉండవచ్చు. చైనా యాప్‌లు, దాని కంపెనీల టెలికాం పరికరాలతో సమాచారాన్నంతా సంగ్రహిస్తుందని, దేశ భద్రతలకు ప్రమాదమని కదా చెబుతోంది. మా పరికరాల ద్వారా అలాంటి ముప్పు ఉందనుకుంటే మరి అమెరికా పరికరాలతో భద్రత ఉంటుందనే హామీ ఇస్తారా అని చైనా అడుగుతోంది. ప్రిజమ్‌ పేరుతో అమెరికా వివిధ మార్గాలలో ఇతర దేశాల సమాచారం మొత్తాన్ని సేకరిస్తోందని దాని రహస్య మెయిళ్లు, ఫైళ్లను బయటపెట్టిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఉదంతం గురించి అది పేర్కొన్నది. మరొక దేశ పరికరాల ద్వారా గూఢచర్యం జరుగుతోందని ప్రతిదాన్నీ అనుమానిస్తే మన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను మనం అమ్ముకోగలమా? కొనేవాళ్లు గుడ్డిగా ఉంటారా ?

చైనాతో సత్సంబంధాలు , రష్యాతో మైత్రి అమెరికన్లకు మింగుడుపడదన్నది బహిరంగ రహస్యం. అందుకే వాటితో పాటు అమెరికాతో కూడా అదే మాదిరి ఉంటున్నాం కదా అని మెప్పించేందుకు మోడీ ఇటీవల ఉక్రెయిన్‌ పర్యటన జరిపినట్లు అనేక మంది భావిస్తున్నారు. నరేంద్రమోడీయే స్వయంగా చైనా సంబంధాల గురించి సానుకూలంగా లేకపోతే ఒక బలమైన వర్గం అనుకూలంగా తయారయ్యే అవకాశమే ఉండదని జై శంకర్‌కూ తెలుసు. మోడీకి చైనా మీద ప్రత్యేక ప్రేమ ఉండి అనుకూలంగా ఉంటున్నారని దీని అర్ధం కాదు, కార్పొరేట్ల ప్రయోజనం, వత్తిడే కారణం. ఇక జై శంకర్‌ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ పాలనలో 2015 నుంచి 18వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత టాటా కంపెనీ విదేశీ వ్యవహారాలను చూసే కీలక బాధ్యతల్లో పని చేశారు. ఆ సమయంలో టాటా కంపెనీల అవసరాల కోసం చైనాతో సంబంధాల మెరుగుదలకు తీవ్రంగా కృషి చేశారని అలాంటి వ్యక్తి ఇప్పుడు చైనా వ్యతిరేకత కలిగి ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.(అదే టాటా కంపెనీ తన విద్యుత్‌ కార్లకు అవసరమైన బ్యాటరీలను చైనా నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ) ఒక బలమైన వర్గం చైనా పెట్టుబడులు, వాణిజ్యాన్ని కోరుకుంటున్న కారణంగానే బెర్లిన్‌లో జై శంకర్‌ చైనాతో సంబంధాలు ఉండవని మేమెప్పుడు చెప్పాం, అసలుదానితో సంబంధాలు లేనివారు ఉంటారా అంటూ మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తెగేదాకా లాగదలుచుకోలేదు. అందుకే భారత దౌత్య అసలు సమస్యను జై శంకర్‌ సమస్యగా చైనా పరిగణిస్తోంది.

మన కార్పొరేట్ల ప్రయోజనాలను దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ ఇటీవల గట్టిగా ప్రతిబింబిస్తున్నారు. చైనా సరఫరా(గొలుసు) వ్యవస్థతో అనుసంధానించుకోవటం తప్పనిసరని చెప్పినట్లు 2024సెప్టెంబరు 11వ తేదీన రాయిటర్స్‌ వార్త పేర్కొన్నది. మనం పూర్తిగా దిగుమతులు చేసుకోవాలా లేక చైనా పెట్టుబడులతో ఇక్కడే తయారు చేయాలా అన్నది భారత్‌ నిర్ణయించుకోవాలని నాగేశ్వరన్‌ చెప్పారు.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఆ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుంది అని జూలై నెలలో విడుదల చేసిన దేశ వార్షిక ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. దాని రూపకల్పన నాగేశ్వర్‌ మార్గదర్శకత్వంలోనే జరిగిందని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్‌ గతంలో విధించిన ఆంక్షలను సడలించటమే కాదు స్థానిక ఉత్పత్తులను పెంపొందించటానికి సబ్సిడీలు కూడా ఇచ్చేందుకు రూపకల్పన చేసిందని రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ చైనా సరఫరా గొలుసులలో భాగస్వామి కాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన ఉత్పత్తులైన సోలార్‌ సెల్స్‌, విద్యుత్‌ వాహనాల రంగంలో ఏమీ చేయలేమని ’’ అమెరికా ఏలే విశ్వవిద్యాలయ లెక్షరర్‌ సుశాంత సింగ్‌ చెప్పారు. చైనా వస్తువుల మీద దిగుమతి పన్నులు విధించాలని చెబుతున్న మనదేశంలోని ఉక్కు పరిశ్రమ దిగ్గజం నవీన్‌ జిందాల్‌ కూడా చైనాతో ఆచరణాత్మక వైఖరిని అవలంభించాలని చెప్పారు.‘‘ అనేక ఉక్కు కంపెనీలు చైనా నుంచి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి, చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారు కొన్నింటిలో అది ఎంతో ముందుంది, అన్నింటిలో కాదు ’’ అని జిందాల్‌ అన్నారు.చైనా పెట్టుబడులపై నాలుగు సంవత్సరాల ఆంక్షల తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సన్నిహితం కావటానికి చూస్తున్నారు, తన మేక్‌ ఇండియా లక్ష్యాలకు కొత్త జీవితాన్ని ఇవ్వటానికి చూస్తున్నారని కూడా రాయిటర్స్‌ పేర్కొన్నది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా నుంచి మన దిగుమతులు 56శాతం పెరిగాయి.వాణిజ్యలోటు రెట్టింపైంది.

చైనా పెట్టుబడుల గురించే కాదు, ఇతర అంశాలలో కూడా పునరాలోచన చేయాలని మన కార్పొరేట్‌ శక్తులు నరేంద్రమోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నాయి.‘‘ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి) పేరుతో పని చేస్తున్న ఆర్థిక కూటమిలో చేరితే మన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు హాని జరుగుతుందనే విమర్శలు, వ్యతిరేకత వెల్లడి కావటంతో మన దేశం దానికి 2019లో దూరంగా ఉంది. అయితే భారత్‌కు తలుపులు తెరిచే ఉంచామని ఆర్‌సిఇపి ప్రకటించింది. మనకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉన్నప్పటికీ దానిలో చేరటం గురించి సానుకూలంగా ఆలోచించాలనే వత్తిడి క్రమంగా పెరుగుతోంది.దానికి దూరంగా ఉండటం కంటే చేరి మరింత వాణిజ్యం చేయవచ్చని చెబుతున్నారు. గత పది సంవత్సరాల్లో భారత్‌ వృద్ధి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో దాని వాటా తక్కువగా ఉందని,వేగాధిక్యత తగ్గుతోందని ఇటీవల ప్రపంచబ్యాంకు చెప్పింది. 2030 నాటికి భారత్‌ లక్ష కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని చేరాలంటే ఇప్పుడున్న విధానాలను మార్చుకోవాలని చెప్పింది. మనదేశం ఆర్‌సిఇపిలో ఉంటే చైనాకు పోటీగా ఉంటుందని అనేక దేశాలు భావించాయి. మన దేశ ప్రయోజనాల కంటే చైనాతో దగ్గర అవుతున్నామన్న భావన అమెరికాకు కలిగితే నష్టమని మోడీ సర్కార్‌ ఎక్కువగా భయపడిరది. దీన్లో భాగస్వామిగా మారేందుకు అమెరికా తిరస్కరించింది.చైనాకు పోటీగా అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోనుందని మోడీ నాయకత్వం ఆశపడిరది. అయితే అది ఎండమావిగానే మిగిలిపోవటంతో పునరాలోచనలో పడిరది. మరోవైపున మన ఉత్పత్తిదారులు చైనా పోటీని ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఈ కూటమిలోని 15కు గాను 13 దేశాలతో మనకు స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు.200709 నుంచి 2020`22 మధ్య కాలంలో ఈ దేశాలతో మన వాణిజ్యలోటు 303శాతం పెరిగింది, మనదేశం దీనిలో చేరితే దిగుమతి పన్నులు సున్నా అవుతాయి, అప్పుడు దిగుమతులు మరింతగా పెరుగుతాయి. అయినప్పటికీ కూటమి బయట ఉండటం కంటే లోపలే ఉండటం మేలని మన కార్పొరేట్‌లు భావిస్తున్నాయి.


అయితే ఆర్‌సిఇపిలో చేరితే కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయనే వాదనలు గతంలోనే ముందుకు వచ్చాయి. వస్తూత్పత్తిదారులు పోటీని తట్టుకోలేమని వ్యతిరేకిస్తుండగా దిగుమతి వ్యాపారులు లబ్ది పొందవచ్చనే ఆశతో అనుకూలంగా ఉన్నారు.పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా అంటూ లక్షల కోట్ల మేర సబ్సిడీలు ఇచ్చినా ఉత్పాదకత, ఎగుమతులు పెరగలేదని రెండవ వర్గం చేస్తున్నవాదనకు బలం చేకూరుతోంది. సేవల ఎగుమతికి అవకాశాలు పెరుగుతాయని దాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. మనకంటే ఉత్పాదకశక్తి ఎక్కువగా ఉన్న జపాన్‌, దక్షిణ కొరియా, కొన్ని ఆసియన్‌ దేశాలు ఆర్‌సిఇపిలో చేరిన తరువాత తమదేశ వాణిజ్యలోటు పెరిగిందని గగ్గోలు పెడుతున్నాయి. అలాంటిది మన దేశం చేరితే చైనా,మరికొన్ని దేశాల ఉత్పత్తులను ఇబ్బడి ముబ్బడిగా కుమ్మరిస్తాయనే ఆందోళన కూడా ఉంది.ఇప్పటికే చైనాతో వాణిజ్య లోటు భారీగా ఉందని అది మరింతగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.మోడీ సర్కార్‌ ఏం చేస్తుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే !

కేంద్ర తుపాను సాయ జాడలేదు ! బిజెపి మరో అన్యాయం !! మచిలీపట్నం రిఫైనరీ ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పది రోజులుగా బుడమేరు వరదతో విలవిల్లాడుతున్న విజయవాడ, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాల రైతాంగం కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి వివరించారు. అయినా ఇంతవరకు వరద సాయం గురించి ఎలాంటి ప్రకటనలూ లేవు. లెక్కలు డొక్కలు తరువాత చూసుకుందాం ముందుగా కొంత సాయం అందిస్తామన్న భరోసా కూడా వెలువడలేదు.కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ రాకను చంద్రబాబు నాయుడి ఘనతగా కొందరు వర్ణించారు. మంచిదే అంతకంటే కావాల్సిందేముంది ? పర్యటనలు కాదు కదా కావాల్సింది ఫలితాలు. మంత్రిగారు వచ్చారు చూశారు వెళ్లారు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అనేక చోట్ల రైతులు అరటి, పసుపు, వరి, కూరగాయల పంటలను పూర్తిగా నష్టపోయినట్లు శివరాజ్‌ సింగ్‌ విలేకర్లతో చెప్పారు. గత ప్రభుత్వం కేంద్ర ఫసల్‌ బీమా పధకాన్ని వినియోగించుకోలేదని, ప్రీమియం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్లుందని కూడా అన్నారు. విపత్తుల సహాయ నిధి(ఎస్‌డిఆర్‌ఎఫ్‌) రు.3,448 కోట్లు రాష్ట్రం దగ్గర ఉందని తక్షణ సాయం కింద దానిని వినియోగించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చి వెళ్లారు. కొందరు దీన్నే కేంద్రం ఇచ్చిన సాయంగా వర్ణించటంతో అబ్బే అలాంటిదేం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సి వచ్చింది. ఆ నిధి రాజ్యాంగబద్దంగా రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చేదే, ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తారు, తెలంగాణాలో అలాంటి నిధి గురించి కేంద్ర మంత్రులు సెలవిచ్చారు. అది కాదు, కేంద్రం ప్రత్యేకంగా జాతీయ విపత్తుగా పరిగణించి ఇచ్చే మొత్తం సంగతేమిటన్నది ప్రశ్న. ఫసల్‌ బీమా సంగతి తరువాత. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక నష్ట అంచనాగా రు.6,880 కోట్లని కేంద్రానికి నివేదించి సాయాన్ని కోరింది. మొత్తం రెండు లక్షల ఇండ్లు మునిగిపోయి దెబ్బతినట్లు అంచనా.ఆదివారం నాటికి మరణించిన వారి సంఖ్య 45కు చేరింది. సోమవారం నుంచి వరద నష్ట అంచనా ప్రారంభం అవుతుందని ఆదివారం నాడు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.


ఇదిలా ఉండగా మచిలీపట్నంలో ఏర్పాటు కానుందని ఊరించిన చమురుశుద్ది కర్మాగారం వట్టి కబుర్లేనా అన్న అనుమానం కలుగుతోంది. ఒక రిఫైనరీని ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు జాతీయ పత్రికలలో వార్తలు వచ్చాయి.‘‘ ఆంధ్రప్రదేశ్‌కు చమురు శుద్ది,పెట్రోకెమికల్‌ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి సాధించిన చంద్రబాబు ’’ అనే శీర్షికతో 2024జూలై 11న బిజినెస్‌ వరల్డ్‌ పత్రిక వార్త రాసింది. దాని సారాంశం ఇలా ఉంది.‘‘ అరవైవేల కోట్ల రూపాయలతో చమురుశుద్ది మరియు పెట్రోకెమికల్‌ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతమయ్యారు. దీని సాధ్యాసాధ్యాల గురించి చర్చించేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్‌(బిపిసిఎల్‌) సీనియర్‌ అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు.జూలై 23వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో చమురుశుద్ధి కేంద్ర ఏర్పాటు ప్రకటన చేయటమే తరువాయి. చంద్రబాబుబిపిసిఎల్‌ అధికారుల సమావేశంలో రిఫైనరీ ఏర్పాటుకు శ్రీకాకుళం, మచిలీపట్నం, రామయపట్నాలలో గల అవకాశాల గురించి పరిశీలించారు. జూలై 23వ తేదీన బడ్జెట్‌లో ప్రకటించేంతవరకు ఎక్కడ అన్నదాన్ని వెల్లడిరచరు. అధికారులు దీని గురించి మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జూలై 10న చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ఇలా రాశారు ‘‘ వ్యూహాత్మకంగా దేశంలోని తూర్పు తీరంలో ఉన్న మా రాష్ట్రంలో పెట్రోకెమికల్స్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నేను భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చైర్మన్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రృష్ణ కుమార్‌ నాయకత్వంలోని ప్రతినిధులను(ఎగువ చిత్రం)కలుసుకున్నాను. అరవై నుంచి డెబ్బయి వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌లో అయిల్‌ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాము.తొంభై రోజులలో సాధ్యా సాధ్యాల నివేదిక కావాలని నేను కోరాను.ఈ ప్రాజెక్టుకు సుమారు ఐదువేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది.ఎలాంటి తలనొప్పులు లేకుండా దాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది ’’ అని పేర్కొన్నారు. ఈ పరిణామం చంద్రబాబు నాయుడికి పెద్ద విజయం ’’ అని ఆ పత్రిక రాసింది. ఇతర పత్రికలు కూడా ఇలాగే రాశాయి. బిపిసిఎల్‌ చమురుశుద్ది కర్మాగారం మచిలీపట్నం రూపురేఖలనే మార్చివేస్తుందని గనులు, ఎక్సయిజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్లు జూలై 14న దక్కన్‌ క్రానికల్‌ పత్రిక రాసింది. ఈ సందర్భంగా కాకినాడ దగ్గర బిపిసిఎల్‌ రిఫైనరీ ఏర్పాటు గురించి కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయించేందుకు ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇద్దరూ జనసేనకు చెందిన వారే గనుక ఎక్కడ వచ్చినా ఆ ఘనత ఆ పార్టీ ఖాతాలోనే పడుతుందని, ఎక్కడో అక్కడ రావటం ముఖ్యమని చెప్పారు. అయితే జూలై 23వ తేదీ, కేంద్ర బడ్జెట్‌ రానూ వచ్చింది, ఆమోదమూ పొందింది. రిఫైనరీ ఏర్పాటు గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకు చేయలేదో ఏ పార్టీ నేతా ఎక్కడా ప్రస్తావించినట్లు కనపడదు. ఈ లోగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌-పూర్వపు అలహాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్‌(మీడియా) వార్త రాసింది.ఓఎన్‌జిసి`బిపిసిఎల్‌ సంయుక్త భాగస్వామ్యంలో 70వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు దాని గురించి బాగా తెలిసిన నలుగురు వ్యక్తులు చెప్పినట్లు అది తెలిపింది. ప్రయాగరాజ్‌లో బిపిసిఎల్‌కు భూమి కూడా ఉన్నట్లు పేర్కొన్నది. ఆ వార్తలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు గురించి కూడా బిపిసిఎల్‌ పరిశీలిస్తున్నట్లు ఆ నలుగురిలో ఇద్దరు చెప్పినట్లు తెలిపింది. ఆ రాష్ట్రం ఇవ్వచూపిన ప్రోత్సాహకాలు, ఏర్పాటు అవకాశాల గురించి సలహా ఇచ్చేందుకు అమెరికాలోని ఒక కంపెనీని కూడా బిపిసిఎల్‌ నియమించినట్లు కూడా బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది.ఇ మెయిల్స్‌ ద్వారా ఓఎన్‌జిసి, బిపిసిఎల్‌ ప్రతినిధుల స్పందన కోరగా వారి నుంచి వెంటనే ఏమీ రాలేదని పేర్కొన్నది.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎన్‌డిఏ కూటమికి ఘనవిజయం లభించింది. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి 2019లో 80కి గాను తెచ్చుకున్న 64 సీట్లలో 2024లో 30 సీట్లు, పదిశాతం ఓట్లూ పోగొట్టుకుంది. చివరికి ఆయోధ్యలో ఓడిపోయింది, వారణాసిలో నరేంద్రమోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది. మోడీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇప్పటికే పరువు పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందనే వాతావరణం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. బహుశా ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్‌లో రిఫైనరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే కంపెనీ అంత భారీ మొత్తాల పెట్టుబడితో రెండు చోట్ల రిఫైనరీలను పెట్టే అవకాశం ఉందా ? నరేంద్రమోడీ, బిజెపికి లోక్‌సభలో ఏడోవంతు సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌ను నిలుపుకోవటం ముఖ్యం అన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎంత చేసినా తెలుగుదేశానికి తోక పార్టీగా ఉండటం తప్ప ఇప్పటికిప్పుడు స్వంతంగా ఎదిగే అవకాశాలు లేవన్నది స్పష్టం.రిఫైనరీ గురించి ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు గనుక చంద్రబాబు వెంటనే అప్రమత్తమై రాష్ట్రానికి తీసుకువస్తారా ? తన పలుకుబడిని వినియోగిస్తారా ? పెద్ద పరీక్షే మరి !

దేవుని బిడ్డ నరేంద్రమోడీకి ఏమిటీ పరిస్థితి : అయోధ్య రాముడు ఓడిరచాడు, కాశీ విశ్వనాధుడు పరువు, ఆర్‌ఎస్‌ఎస్‌ గాలి తీసింది !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


‘‘ నా మాతృమూర్తి జీవించి ఉన్నంత వరకు నేను జన్యు నిర్ణాయకంగా(బయలాజికల్లీ) జన్మించినట్లు నమ్ముతుండేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటి మీద ప్రతిఫలించుతున్నవాటిని చూస్తుంటే దేవుడే నన్ను పంపాడని నిర్ధారణకు వచ్చాను. నా జీవ సంబంధ శరీరం నుంచి అయితే ఈ శక్తి వెలువడి ఉండేది కాదు.నా శక్తి సామర్ద్యాలు, ఉత్తేజం, సదుద్దేశ్యాలను దేవుడు ఒక లక్ష్యం కోసం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు.అందుకే నేను ఎప్పుడు ఏది చేసినా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నమ్ముతాను ’’ అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. వారణాసి నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో నామినేషన్‌ వేసే సందర్భంగా న్యూస్‌ 18 టీవీ ఛానల్‌ విలేకరి అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. చిత్రం ఏమిటంటే అదే విలేకరి 2019 ఎన్నికల సందర్భంగా ‘‘ మీకు అలసట రాదా ’’ అని ప్రశ్నించినపుడు దేవుడు అలా రాసి పెట్టాడు అని బదులిచ్చారట. అయితే అప్పుడు అంతగా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు.నిజం చెప్పాలంటే మనకే(జనానికే) అర్ధం కాలేదు గానీ మొదటి నుంచి నరేంద్రమోడీ తన గురించి స్పష్టతతో ఉన్నారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో చేసిన తొలి ప్రసంగంలో మోడీ చెప్పిన అంశాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ‘‘ అతల్‌ బిహారీ వాజ్‌పాయి హయాంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పలుసార్లు ప్రవేశ పెట్టారు, కానీ దాన్ని ఆమోదించటానికి తగినంత మెజారిటీ లేక ఆమోదం పొందలేదు. ఆ కల అసంపూర్తిగా ఉంది, దాన్ని పూర్తి చేయటానికే బహుశా దేవుడు నన్ను పంపినట్లున్నాడు ’’ అన్నారు.2024 మేనెల 22న ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభల్లో మరోసారి తన దైవత్వం గురించి ప్రస్తావించారు. ఎవరైతే తనకు ఓటు వేస్తారో వారు పుణ్యం చేసుకున్న మంచి పనులను పందుతారని, తాను చేస్తానని చెప్పుకున్నారు. కోరుకున్న రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు.నరేంద్రమోడీ ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ ఆ రూపంలో సాక్షాత్కరించటం బహుశా దానిలో భాగమేనేమో ! తాము అపర భగవత్‌స్వరూపులమని భావించే నలుగురు శంకరాచార్యలు ‘‘ తమ పోటీ భగవంతుడి ’’ ముందు అయోధ్యలో రామ విగ్రహప్రతిష్టలో ఉత్సవిగ్రహాలుగా కనిపించటం ఇష్టంలేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. మోడీ నిజంగా దైవాంశ సంభూతుడే అయితే కరోనా సమయంలో శవాలు గంగాతీరానికి కుప్పలుగా వస్తుంటే దీపాలు వెలిగించమని, చపట్లు కొట్టాలని, పళ్లాలను మోగించమని ఎందుకు చెప్పినట్లని అనేక మంది ఎద్దేవాచేశారు.దైవాంశ సంభూతులు అలాంటి వాటిని పట్టించుకోరు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జై భజరంగ భళీ అంటూ ఓటింగ్‌ యంత్రాల మీట నొక్కమని ఓటర్లకు ఉపదేశించిన సంగతి తెలిసిందే. మోడీ మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఒడిషాలో బిజెపి నేత సంబిత్‌ పాత్ర పూరీ జగన్నాధుడు స్వయంగా మోడీ భక్తుడని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తరువాత నోరు జారానని చెప్పుకున్నప్పటికీ దానిలో చిత్తశుద్ది లేదని జనం భావించారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోయినందుకు మోడీ క్షమాపణలు చెప్పారు. పూరీ జగన్నాధుడే మోడీ భక్తుడంటూ బిజెపి నేత చేసిన వ్యాఖ్యలకు నరేంద్రమోడీ నుంచి క్షమాపణలు కాదు కదా కనీసం విచారం కూడా వెల్లడి కాలేదు, తనకేమీ తెలియనట్లు ఉన్నారు. మోహన్‌ భగవత్‌ పరోక్షంగా మాట్లాడటం రెండోసారి. అంతకు ముందు జూలై నెలలో రaార్కండ్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘ అభివృద్దికి అంతం లేదు… జనాలు అతీంద్రియశక్తులు (సూపర్‌మాన్‌లు) కావాలని కోరుకుంటారు, కానీ వారు అక్కడితో ఆగరు. తరువాత దేవతగా మారాలని తరువాత దేవుడిగా మారాలని కోరకుంటారు. కానీ తాను విశ్వరూపుడనని భగవంతుడు చెప్పారు. అంతకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నది ఎవరికీ తెలియదు.’’ అన్నారు. ఈ మాటలు నాగపూర్‌ నుంచి పేల్చిన అగ్నిక్షిపణి వంటివని నాడు కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ వర్ణించారు. కానీ ఆ క్షిపణి తుస్సుమన్నది. ఆ తరువాత మోడీ నుంచి కనీసం అలికిడి కూడా లేదు.నాగపూర్‌ పెద్దలకు మోడీ మాటలు నచ్చలేదన్నది స్పష్టం.


తాజాగా 2024 సెప్టెంబరు ఆరవ తేదీన పూనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ‘‘ మనం దేవుడిగా మారతామా లేదా అన్నది జనం నిర్ణయిస్తారు. దేవుడిగా మారామని మనం ప్రకటించుకోకూడదు. మౌనంగా ఉండటానికి బదులు కొంత మంది తాము మెరుపులా మెరవాలని కోరుకుంటారు.కానీ మెరుపుల తరువాత అంతకు ముందు ఉన్నదాని కంటే అంధకారం ఏర్పడుతుంది.అవసరమైనపుడు కార్యకర్తలు కొవ్వొత్తిలా కరగాలి, వెలుగునివ్వాలి ’’ అన్నారు. ఈ మాటలు నరేంద్రమోడీ గాలితీస్తూ అన్నవేతప్ప వేరు కాదు. ఒకనాడు మెరిసిన మోడీ మూడోసారి సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవటంలో విఫలం కావటాన్ని అంధకారం అని వర్ణించినట్లుగా చెప్పవచ్చు. తన పేరుతో ఓట్లు దండుకోచూడటం, తాను పూర్తిగా బిజెపి పక్షాన ఉన్నట్లు చిత్రించటం, వీధుల్లోకి లాగటం పట్ల రాముడికి ఆగ్రహం కలిగి ఉండవచ్చు, అందుకే అయోధ్య(ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం)లో ఓడిరచినట్లు అనేక మంది నిజమైన భక్తులు భావిస్తున్నారు. చివరికి కాశీ విశ్వనాధుడికి కూడా మనోభావాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అందుకే మూడవ సారి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించాలని చూసిన నరేంద్రమోడీకి గతం కంటే ఓట్లు, మెజారిటీని కూడా తగ్గించి పరువు తీసినట్లు భావిస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలో 63.62శాతం(6,74,664) ఓట్లు రాగా సమాజవాదీ పార్టీ అభ్యర్ధిపై 4,79,505 మెజారిటీ తెచ్చుకున్నారు. 2024ఎన్నికల్లో 54.24శాతం(6,12,970) ఒట్లు తెచ్చుకోగా కాంగ్రెస్‌ అభ్యర్ధి మీద కేవలం 1,52,513 మెజారిటీ మాత్రమే తెచ్చుకున్నారు.


తాను దైవాంశ సంభూతుడనని లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రకటించుకున్నదానికి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం వచ్చింది. ఆ విషయం మోహన్‌ భగవత్‌కు అప్పుడు తెలియదని అనుకోలేము. ఫలితాలు వెలువడే వరకు మౌనవ్రతం పాటించారు. తరువాత కూడా పరోక్షంగా విమర్శలు చేయటం తప్ప నేరుగా తప్పని చెప్పే సాహసం చేయలేకపోయారు. అది కూడా లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ సాధించటంలో విఫలమై మిత్ర పక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి ఏర్పడి మోడీ బలహీనత లోకానికి వెల్లడైన తరువాతనే చెప్పారు.మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితి గురించి కూడా మోహనభగవత్‌ మరోసారి పూనా సభలో ప్రస్తావించారు(జూన్‌లో తొలిసారి నాగపూర్‌లో నోరు విప్పారు). దీన్లో కూడా చిత్తశుద్ది కనిపించదు. 2023 మే మూడు నుంచి మణిపూర్‌ మండుతున్నది. రాష్ట్రంలో విఫలమైన బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అయినా గానీ అక్కడ ఎంతో కష్టతరమైన, సవాలు విసురుతున్న పరిస్థితి ఉందని, స్థానికులకు తమ భద్రత మీద విశ్వాసం లేదని, సామాజిక సేవచేయాలని అక్కడకు వెళ్లిన వారికి కూడా పరిస్థితి మరింత సవాలుగా ఉందని మోహన్‌ భగవత్‌ చెప్పారు. ఇన్ని చెప్పిన పెద్దమనిషి తన ఆధీనంలో పనిచేసే ఒక స్వయం సేవకుడిగా మణిపూర్‌ వెళ్లాలని నరేంద్రమోడీని ఆదేశించలేకపోయారు. కనీసం రాజధర్మంగా ప్రధాని మోడీ ఆ రాష్ట్ర పర్యటన జరిపి జనానికి భరోసా కల్పించాలన్న ఉద్బోధ చేయలేకపోయారు. మోడీతో సహా మొత్తం కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శనంలో నడుస్తాయన్న బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే.


దేవుళ్లు,దేవతల పట్ల విశ్వాసం, కనిపించిన ప్రతి పుట్టా చెట్టుకు మొక్కే జనాలు పుష్కలంగా ఉన్న మన సమాజంలో చరిత్రలో అనేక మంది తాము దైవాంశ సంభూతులం,కలియుగ దేవతలమని చెప్పుకొన్నారు.ఎంతగా మూఢభక్తి ఉన్నా ఇలాంటి బాపతు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎంతమేరకు వీలైతే అంతమేరకు సొమ్ము చేసుకోదలచిన వారు ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉన్నారు. తనను దేవుడే పంపాడని నరేంద్రమోడీ పదేండ్ల తరువాత అంత బాహాటంగా ఎందుకు చెప్పుకున్నట్లు ? జనం ఎందుకు నమ్మలేదు ? మోడీ ప్రతిష్టను పెంచటానికి 2014కు ముందు, తరువాత కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రశాంత కిషోర్‌ వంటి ‘‘కృత్రిమ గొప్పల తయారీ నిపుణులను’’ కూడా వినియోగించుకున్నారు.ఎక్కడ పర్యటించినా కాషాయ దుస్తులతో గుళ్లు గోపురాలను సందర్శించి మతపరమైన పూజలు పునస్కారాలు, ధ్యానాలు చేశారు. వాటన్నింటినీ టీవీలు పెద్ద ఎత్తున చూపాయి. జనాలను హిందూ ముస్లిం వర్గాలుగా సమీకరించేందుకు చేయాల్సిందంతా చేశారు. తీరా ఇంత చేసినా పదేండ్ల పాలన ఎలాంటి ఫలితాలు ఇవ్వటం లేదని గ్రహించి తానే రంగంలోకి దిగి రామబాణంలాగా దైవాంశసంభూతుడనని చెప్పుకున్నారని చెప్పవచ్చు. రామాయణంలో చివరి అస్త్రంగా పరిగణించే రామబాణం గురించి చదువుకోవటం, సినిమాల్లో చూశాము, కానీ నరేంద్రుడి బాణం ఎదురు తిరగకపోయినా పనిచేయలేదు.

ఐదేండ్లలో ఎంత మార్పు ! సోషలిజం పట్ల ఆస్ట్రేలియా యువత సానుకూలత !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అక్కడేమీ ప్రభావితం చేసే విధంగా కమ్యూనిస్టు పార్టీ లేదు, పురోగామి ఉద్యమాలూ లేవు. వాటి పట్ల వ్యతిరేకత ఉన్న పాలకవర్గం, మీడియాదే ఆధిపత్యం. కమ్యూనిస్టులు కూడా కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు నడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం పరిమితమే. అయినా ఆస్ట్రేలియాలో యువత సోషలిజం పట్ల సానుకూలత చూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడిరచింది.అభివృద్ధి చెందినట్లు చెబుతున్న దేశాలన్నింటా జనం ప్రత్యేకించి యువత పెట్టుబడిదారీ వ్యవస్థపట్ల విముఖత చూపుతున్నారు. 2024 జూన్‌ 24న యు గవ్‌ అనే సంస్థ ఆస్ట్రేలియాలో జరిపిన సర్వేలో 1824 ఏండ్ల మధ్య యువతలో 53శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత చూపగా తటస్థంగా 25శాతం, పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలత వెల్లడిరచిన వారు 22శాతం ఉన్నట్లు తేలింది. అదే మొత్తం అన్ని వయసుల వారిలో అలాంటి అభిప్రాయాలు వెల్లడిరచిన వారు 274231శాతాల చొప్పున ఉన్నారు. 2019 అక్టోబరులో యుగవ్‌ ప్రశ్నలకు 28శాతం మంది ఆస్ట్రేలియన్లు తమకు సోషలిజం అంటే ఏమిటో తెలియదని చెప్పగా 13శాతం మంది ఆ వ్యవస్థ కలుపుగోలుతనంతో ఉంటుందని చెప్పారు.సోషలిజాన్ని నిర్వచించమని అడిగిన ప్రశ్నకు అమెరికా యువత 60శాతం మంది సరైన సమాధానం చెప్పగా ఆస్ట్రేలియన్లు 30శాతమే ఉన్నారు. అలాంటి యువత 2024లో 53శాతం మంది సానుకూలత చూపటాన్ని గమనించాలి. దీని అర్ధం వారందరికీ సోషలిజం అంటే పూర్తిగా తెలిసిందని కాదు. సోషలిజం అంటేనే అణచివేత అని భావించిన స్థితి నుంచి బయటపడి ‘‘ సోషలిజం ’’ తాము జీవిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయం ఏర్పరుచుకోవటాన్ని ఇక్కడ గమనించాల్సిన, ఆహ్వానించాల్సిన అంశంగా చూడాలి. వీరి శాతం ఏటేటా పెరుగుతున్నది. యుగవ్‌ 2019 అక్టోబరులో ‘‘ కమ్యూనిజం బాధితులు ’’ పేరుతో ఏర్పడిన ఒక సంస్థ తరఫున అమెరికా, ఆస్ట్రేలియాల్లో సర్వే చేసింది.యువతలో సోషలిజం అంటే సమ్మతి లేదా ఆదరణ పెరుగుతున్నదని ఆ సర్వేలో తేలినట్లు ప్రకటించింది. ఇదంతా ఎప్పుడు ? సోషలిజంలో అణచివేస్తారు,భావ ప్రకటన స్వేచ్చ ఉండదు, భవిష్యత్‌ లేదు, అది విఫలమైంది అని ప్రచారం పెద్ద ఎత్తున జరుపుతున్న తరుణంలోనే అన్నది గమనించాలి.ప్రచ్చన్న యుద్ధం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన పరిణామాలను చూసిన పాత తరం వారిలో ఉన్న వ్యతిరేక భావం యువతరంలో లేదని ఆ సర్వేలో తేలింది.ఇప్పుడు కమ్యూనిజానికి వ్యతిరేకంగా తక్కువ ప్రచారం జరుగుతోందా ? కానే కాదు, ఏ మాత్రం తగ్గలేదు. తాజా సర్వే జరిగిన నేపధ్యాన్ని చూస్తే అనేక దేశాల్లో యువత సోషలిజం గురించి అధ్యయనం చేయటంతో పాటు నయా ఫాసిస్టు, మితవాద శక్తులు తమ సమస్యలకు పరిష్కారం చూపగలవేమో అన్న భ్రమలతో అటువైపు కూడా మొగ్గుతున్నారు. ఫ్రాన్సులో, తాజాగా జర్మనీలోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఒక రాష్ట్ర ఎన్నికల్లో పచ్చిమితవాదులు పెద్దపార్టీగా అవతరించారు. జీవన ఖర్చు పెరగటం, గృహ సంక్షోభం ఆస్ట్రేలియన్‌ యువతను సోషలిజం గురించి ఆలోచింప చేస్తున్నదని తేలింది.జనాభాలో 1834 ఏండ్ల వయస్సువారిలో 41శాతం మంది సోషలిజాన్ని సమర్ధించగా, 35కు పైబడిన వారిలో 21శాతం మంది ఉన్నారు,అదే వయసులో ఉన్నవారు పెట్టుబడిదారీ విధానాన్ని 34శాతమే సమర్ధించినట్లు విశ్లేషణలో తేలింది. యువత సోషలిజం వైపు ఎందుకు మొగ్గుతున్నారన్న ప్రశ్నకు యుగవ్‌ డైరెక్టర్‌ పాల్‌ స్మిత్‌ మాట్లాడుతూ యువతరం ఎంతో భిన్నమైన ఆర్థిక పరిస్థితిని చవిచూస్తున్నారని, 2008 ద్రవ్య సంక్షోభం తరువాత శ్రామికశక్తిలో చేరిన యువత అసంతృప్తికి లోనై సోషలిజం వైపు మొగ్గుతున్నట్లు చెప్పాడు. పెద్ద తరాలు మంచివేతనాలతో కూడిన జీవితాలను గడపగా యువతకు అలాంటి హామీ లేదని, విద్య, గృహాలకు ఎక్కువగా చెల్లిస్తున్నారని అన్నాడు. ఒక స్థిరమైన ఉపాధి లేకపోవటం, తాత్కాలిక పనివారిని తీసుకొనే వాతావరణం ఎక్కువగా ఉండటంతో వారసత్వంగా వచ్చినవి ఉంటే తప్ప అద్దె ఇండ్లలో నివసించలేని స్థితి ఏర్పడిరది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. గాజా వంటి చోట్ల జరుగుతున్న దారుణాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నవారు పెట్టుబడిదారీ విధానం యుద్ధాలను ప్రోత్సహించటం ఎందుకని ప్రశ్నలు సంధించటం పెరిగింది.ఆస్ట్రేలియాలో పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు 64శాతం మంది సోషలిజాన్ని అభిమానించగా, లేబర్‌ పార్టీ 31, సంకీర్ణ కూటమి మద్దతుదార్లలో కేవలం 12శాతమే ఉన్నారు. కార్పొరేట్ల లాభాల కంటే జనం ప్రయోజనాలు,భూగోళాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు పెరుగుతున్నారు.


యువతలో ఎందుకీ మార్పు ? కమ్యూనిజం విఫలమైందని ప్రచారం జరిగిన చోటే పెట్టుబడిదారీ విఫలమైందని ఆ విధాన గట్టి సమర్ధకుడైన థామస్‌ పికెట్టి వంటి వారు సాధికారికంగా స్పష్టం చేసిన తరువాత యువత ఆలోచించకుండా ఎలా ఉంటుంది ? సోషలిస్టు చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులనే నిత్యం వాడుతున్నపుడు ఆ వస్తువులను మన దేశంలో ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అని ఎక్కడికక్కడ యువత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేరు. 19952010 మధ్య జన్మించిన వారిని జడ్‌ తరం అని పిలుస్తున్నారు. వీరిని సోషలిజం(ఆకర్షిస్తున్నదని) కవ్విస్తున్నదని కొందరు వర్ణించారు.ముఖ్యంగా అమెరికాలో ఈ ధోరణి కనిపిస్తోంది.అనేక మంది మేం సోషలిస్టులం అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు యువతను ఆలోచింపచేస్తున్నాయి. కమ్యూనిజం, సోషలిజం గురించి వక్రీకరణలు కొనసాగుతున్నప్పటికీ టీచర్లు బోధిస్తున్న అంశాలలో డెన్మార్క్‌, నార్వే వంటి చోట్ల స్కాండినేవియన్‌ సోషలిజం గురించి చెబుతున్న అంశాలు వారిని ఆకర్షిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అమెరికా కంటే అక్కడి పరిస్థితి మెరుగ్గా ఉన్నందున అలాంటి సోషలిజాన్ని ఎందుకు అమలు చేయకూడదనే ప్రశ్నకు సరైన సమాధానం వారికి దొరకటం లేదు. అయితే ఆ దేశాల్లో ఉన్న జనాభా మొత్తం కూడా అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉన్నవారికి సమానమని 30 కోట్ల మందికి సోషలిజాన్ని అమలు చేయటం, దీర్ఘకాలం కొనసాగించటం సాధ్యం కాదని మాత్రమే చెప్పటం వారికి సంతృప్తిని కలిగించటం లేదు. ఆయా దేశాల జిడిపితో పోలిస్తే అమెరికా జిడిపి ఎక్కువగా ఉన్నపుడు ఎందుకు సాధ్యం కాదు ? చైనాలో సంస్కరణల పేరుతో అమలు చేస్తున్నది అమెరికాలో మాదిరి పెట్టుబడిదారీ విధానమే అని అని నమ్మించేందుకు అక్కడి మేథావులు ప్రయత్నించారు. అదేగనుక వాస్తవమైతే మిగతా జర్మనీ,బ్రిటన్‌, జపాన్‌ వంటి దేశాలతో మిత్ర సంబంధాలను కొనసాగిస్తూ చైనాను వ్యవస్థాపరమైన శత్రువుగా మరోవైపు పాలకవర్గం చూడటాన్ని యువతరం గమనిస్తున్నది.మొత్తం మీద చెప్పాలంటే సోషలిజం గురించి ఆసక్తి కనపరుస్తున్న యువతను దారి మళ్లించేందుకు అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు నానా పాట్లు పడుతున్నారు.వారి జీవితానుభవం నుంచే అలాంటి ఆసక్తి కలుగుతున్నదని సామాజిక మాధ్యమం, మీడియా తప్పుదారి పట్టిస్తున్నదని, వ్యక్తిగత స్వార్ధం యువతలో పెరిగిందని, దేశం ఏమైనా ఫర్వాలేదన్నట్లుగా తయారవుతున్నారని పెడబబ్బలు పెడుతున్నారు. దీనికి తమను తామే నిందించుకోవాలంటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కావాలన్న డిమాండ్‌కు యువత మద్దతు ఇవ్వటానికి మేథావుల సైద్దాంతిక బోధన కారణం కాదని, పెరుగుతున్న ఖర్చు, బీమా సౌకర్యం లేకపోవటమే అంటున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లుగానే వాస్తవాలు, జీవిత అనుభవాల నుంచి పక్కదారి పట్టించాలంటే కుదరదు. అనేక దేశాల్లో ఇప్పుడు సోషలిజాన్ని యువత కోరుకోవటానికి పెట్టుబడిదారీ వ్యవస్థలలో వారి కలలు కల్లలు కావటమే కారణం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంతో జనాల బుర్రలు నిండటం తప్ప కడుపు నిండదని తేలిపోయింది. అమెరికా, ఐరోపా దేశాలలో సోషలిజం పట్ల పెరుగుతున్న ఆదరణను అడ్డుకొనేందుకు ప్రత్నామ్నాయంగా స్కాండినేవియన్‌ దేశాలలో అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలనే సోషలిజంగా చిత్రించి కమ్యూనిస్టులు చెప్పే వర్గరహిత సోషలిజం, కమ్యూనిజాలవైపు మళ్లకుండా చూశారు. ఇప్పుడు అమెరికాలో, ఇతర చోట్ల పెట్టుబడిదారీ వ్యవస్థలో తమ బతుకులు మెరుగుపడవు అని అర్ధం చేసుకున్నవారు కమ్యూనిస్టు సోషలిజం లేకపోతే పోనివ్వండి కనీసం ‘‘ స్కాండినేవియన్‌ సోషలిజం’’ ‘‘ ప్రజాస్వామిక సోషలిజం ’’ కావాలని, అమలు జరపాలని యువత కోరుతున్నది. సోషలిస్టు భావన కమ్యూనిస్టులతోనే ప్రారంభమైందని ఎవరైనా అనుకుంటే పొరపాటు.సమాజంలో దోపిడీ, అణచివేతలను సహించని అనేక మంది వాటిని వ్యతిరేకించారు, అవిలేని సమాజం కావాలని కోరుకున్నారు. ఉదాహరణకు ఎంతో ఘనమైనదిగా ఉందని చెప్పే మన సమాజంలో గతంలో అందరూ సుఖసంతోషాలతో ఉండి ఉంటే సర్వేజనా సుఖినోభవంతు అనే భావనే వచ్చి ఉండేది కాదు. అదీ సోషలిస్టు భావనే ! కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ ముందుకు తెచ్చిన శాస్త్రీయ సోషలిజం, కమ్యూనిజం సిద్దాంతాలకు ముందు ఊహాజనిత సోషలిస్టులు ఉన్నారు.అఫ్‌కోర్సు ఇప్పటికీ అలాంటి వారు లేకపోలేదు.కారల్‌ మార్క్స్‌`ఫెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పిన సోషలిజం ఊహ తప్ప ఎక్కడా అమలు జరగలేదని, ఆచరణ సాధ్యం కాదని చెప్పేవారు ఉన్నారు. అయినా యువత సోషలిజాన్ని ఎందుకు కోరకుంటున్నది ?


మిగతా ఐరోపా, అమెరికాలతో పోలిస్తే స్కాండినేవియన్‌ దేశాలలో సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత మెరుగ్గా ఉంది. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజాన్ని కాసేపు పక్కన పెడితే ఆ విధానాలనైనా ఎందుకు అమలు జరపరనే డిమాండ్‌ అమెరికాలో ముందుకు వస్తున్నది.కరోనాకు ముందు స్కాండినేవియన్‌ దేశాలలోని డెన్మార్క్‌ జిడిపిలో ప్రభుత్వ ఖర్చు 49.7శాతం ఉండగా, స్వీడన్‌లో 49.1శాతం కాగా అమెరికాలో 38.5శాతమే ఉంది.ట్రేడిరగ్‌ ఎకనమిక్స్‌ తాజా సమాచారం 2023 డిసెంబరు ప్రకారం యూరో ప్రాంతంలో ఖర్చు 49.9శాతం కాగా అమెరికాలో 34.38శాతం, మనదేశంలో 14.92శాతం ఉంది.అందరికీ సమాన అవకాశాలు అని చెప్పే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక అంతరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ మేథావులు చెప్పిన ఊటసిద్దాంతం ప్రకారం సంపదలు ఎగువ నుంచి దిగువకు ప్రవహించలేదు. ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. అందువలన ఒకశాతం ఎగువ ధనికుల మీద అధిక పన్నులు విధించి పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలనే ప్రశ్నకు 66శాతం మంది అమెరికన్లు మద్దతు ఇచ్చారు.ఎగువ పదిశాతం మంది మీద పెంచాలనే వారు 54శాతం ఉండగా అందరి మీద పన్ను పెంచాలనే ప్రశ్నకు 37శాతమే మద్దతు ఇచ్చారు. దోపిడీ ప్రారంభమైపుడే దానికి గురైనవారు సోషలిజం కావాలంటూ ముందుకు వచ్చి ఉద్యమించలేదు. అనేక ఉద్యమాలు, వాటితో వచ్చిన సంస్కరణలు కూడా దోపిడీని నిర్మూలించని కారణంగానే శాస్త్రీయ సోషలిస్టు సిద్దాంత ప్రతిపాదన ఆచరణ సాధ్యంగా ఉంటుందని జనం నమ్మారు,దానికోసం ఉద్యమించారు.ఆచరణలో దానికి తగిలింది ఎదురుదెబ్బలే తప్ప మరొకటి కాదు. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజానికి బదులు ఇతర సోషలిజం కోసం ముందుకు వచ్చేవారిని ఆహ్వానిద్దాం. మితవాదం, మతవాదం వైపు వెళ్లేదానితో పోల్చితే ఇదెంతో ఆరోగ్యకర పరిణామమే కదా ! దానికి ఉండే పరిమితులను అర్ధం చేసుకున్న తరువాత వారు కూడా అంతిమంగా శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణానికే మద్దతు ఇస్తారు. దోపిడీ రహిత సమాజానికి ఎవరైనా వేరే పేరు పెడదాం అంటారా పెట్టనివ్వండి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.పేరులో ఏముంది పెన్నిది !

రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ : వెస్ట్‌బాంక్‌కు విస్తరించిన దాడులు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గతేడాది అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌ గత ఏడు రోజులుగా ఉగ్రవాదులను ఏరివేసే పేరుతో వెస్ట్‌ బాంక్‌ ప్రాంతమంతటా దాడులు చేస్తోంది.అనేక మంది ప్రాణాలు తీసింది. విచక్షణా రహితంగా అరెస్టులు చేస్తోంది.అక్కడేమీ హమస్‌ పార్టీ లేదా దాని మద్దతుదారులెవరూ లేరు.ఒక వైపు గాజాలో పసిపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతూనే మరోవైపు మిలిటరీదాడులు చేస్తోంది.గాజాలోని ఒక సొరంగంలో శనివారం నాడు ఆరుగురు బందీల మృతదేహాలు దొరకటంతో ఇజ్రాయెల్‌ పౌరులు దేశమంతటా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు జరపటంతో పాటు సాధారణ సమ్మె పాటించారు. ప్రధాని నెతన్యాహు దీనికి బాధ్యత వహించాలని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.తాము బందీల వద్దకు వెళ్లటానికి కొద్దిసేపటి ముందే హమస్‌ వారిని చంపిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.ఇజ్రాయెల్‌ దాడుల్లోనే వారు మరణించారని హమస్‌ చెబుతోంది.సోమవారం నాటికి ఇజ్రాయెల్‌ దాడులలో గాజాలో 40,786 మంది మరణించగా 94,224 మంది గాయపడ్డారు. మరణాలతో పాటు గాజాలో ఇప్పటి వరకు 60శాతం నివాస గృహాలు, 80శాతం వాణిజ్య సముదాయాలు,65శాతం సాగు భూమి, 65శాతం రోడ్లు పనికి రాకుండా చేశారు.ఆసుపత్రులు 36 ఉండగా వాటిలో 17మాత్రమే పాక్షికంగా పని చేస్తున్నాయి. అదే మాదిరి 85శాతం పాఠశాల భవనాలను నేలమట్టం చేశారు. హమస్‌ సాయుధులు వీటిని కేంద్రాలుగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.గాజాలోని ఒక పాఠశాలలో నిర్వహిస్తున్న హమస్‌ కమాండ్‌ కేంద్రాన్ని తమ వైమానిక దళం నాశనం చేసిందని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. పాలస్తీనాలో జోర్డాన్‌ నది పశ్చిమంగా ఉన్న ప్రాంతానే ్న వెస్ట్‌బాంక్‌ లేదా పశ్చిమ గట్టు అంటున్నారు. అది 5,650చదరపు కిలోమీటర్లలో ఉంది.జనాభా 30లక్షలు.దానికి ఒకవైపు జోర్డాన్‌, మరోవైపు ఇజ్రాయెల్‌,మూడోవైపు మృత సముద్రం(డెడ్‌ సీ) ఉంది.గాజాకు వెళ్లాలంటే ఇజ్రాయెల్‌ ప్రాంతాల నుంచే దారి ఉంది.అది పూర్తిగా పాలస్తీనాకు చెందినప్పటికీ అనేక ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది.దాంతో 8లక్షల 71వేల మంది పాలస్తీనియన్లు తమ స్వంతగడ్డమీదే శరణార్ధులుగా శిబిరాలలో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ వాటి మీద కూడా దాడులు చేస్తున్నది.తక్షణమే హమస్‌తో రాజీకి వచ్చి వారి వద్ద ఉన్న వందకు పైగా ఉన్న బందీలను విడిపించాలని కోరుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిరచినప్పటికీ నెతన్యాహు ఖాతరు చేయటం లేదు.మరోవైపు ఇటీవల ఇరాన్‌ జరిపిన క్షిపణుల దాడి తరువాత సామాన్య జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో సెకనుకు ఒకటి చొప్పున 100 క్షిపణులను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.దీన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ ఊహించలేదు.మా తడాఖా ఇది అని ఇరాన్‌ ప్రదర్శించిన తరువాత దాడి నిలిపివేసింది. అందువలన ఎప్పుడేం జరుగుతుందో తెలియటం లేదు.


గాజాతో పాటు వెస్ట్‌బాంక్‌ ప్రాంతం మీద కూడా జరుపుతున్న దాడులను చూస్తే పశ్చిమాసియాలో మరో ప్రాంతీయ యుద్ధానికి రెచ్చగొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అమెరికా కనుసన్నల్లోనే అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఈ దాడులతో ఇజ్రాయెల్‌ మరింతగా సంక్షోభంలో కూరుకుపోతున్నదని చెప్పవచ్చు.పాలస్తీనియన్ల రెండవ తిరుగుబాటు 2000 నుంచి 2005వరకు జరిగింది. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మూడువేల మందికిపైగా మరణించారు. తరువాత మరోసారి ఇప్పుడు తెగబడుతోంది.ఇరాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అణచే సాకుతో ఇప్పుడు దాడులకు దిగుతోంది.ఈ పరిణామాన్ని గాజా 2.0గా వర్ణిస్తున్నారు. గాజా మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వెస్ట్‌బాంక్‌లో అడపాదడపా జరుపుతున్న దాడుల్లో 150 మంది పిల్లలతో సహా 650 మంది మరణించారు.ఇప్పటి వరకు 10,300 దాడులు జరిగాయి, ఆ ప్రాంతంలోని యూదు ఆక్రమణదార్లకు వేలాది ఆయుధాలను అందించి అరబ్బులపై దాడులకు రెచ్చగొడుతున్నది. గతవారం రోజులుగా అనేక పట్టణాల్లో ఉన్న నిర్వాసితుల శిబిరాలపై మిలిటరీ దాడులు చేస్తున్నది. ఓస్లో ఒప్పందాల ప్రకారం వెస్ట్‌ బాంక్‌లో పాలస్తీనా ఫతా ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ అది చేసేదేమీ లేదు. అడుగడుగునా ఇజ్రాయెల్‌ మిలిటరీ, సాయుధ దళాలు ఉన్నాయి.పాలస్తీనియన్‌ ప్రాంతాల ఆక్రమణ, వాటిలో యూదుల నివాసాల ఏర్పాటు, జనాభా నిష్పత్తిని మార్చివేసే కుట్ర కొనసాగుతూనే ఉంది.వాటిని ప్రతిఘటించేవారిని అణచివేసేందుకు యూదుల రక్షణ పేరుతో ఇజ్రాయల్‌ మిలిటరీ తిష్టవేసింది. విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ ‘‘ గాజాలో ఉగ్రవాదుల వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లుగానే ఇక్కడ కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, విజయం సాధించాలని ’’ ప్రకటించాడు. వెస్ట్‌బాంక్‌పై దాడికి ఇజ్రాయెల్‌ చెబుతున్న సాకులన్నీ అబద్దాలేనని జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అయమాన్‌ సఫాదీ వర్ణించాడు.పాలస్తీనియన్లను తమ ప్రాంతాల నుంచి తరిమివేసే ఏ చర్యనైనా తాము వ్యతిరేకిస్తామన్నాడు.


తాజా పరిణామాలో వెస్ట్‌బాంక్‌లో కూడా ప్రతిఘటించటం మినహా పాలస్తీనియన్లకు మరోదారి లేదు.ఇజ్రాయెల్‌ కోరుకుంటున్నది కూడా అదే కావటంతో కావాలని రెచ్చగొడుతున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనా విముక్తి సంస్థలన్నీ ఒక అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు హమస్‌ను వ్యతిరేకిస్తున్న పరిమిత అధికారాలున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ కూడా పిఎల్‌ఓలో హమస్‌ భాగస్వామ్యాన్ని అంగీకరించాడు. గత కొద్ది సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ దిగ్బంధనంతో వెస్ట్‌బాంక్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. సహజంగానే అబ్బాస్‌ మీద వ్యతిరేకతను పెంచుతుంది. నేడు గాజాలో జరుగుతున్నది రేపు తమ మీద కూడా జరగవచ్చనే ఆందోళన వెస్ట్‌బాంక్‌లో తలెత్తింది.దీన్ని గమనించే అబ్బాస్‌ కూడా గత వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది.హమస్‌ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గింది. ఈ కారణంగానే వెస్ట్‌బాంక్‌లో రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా పాలస్తీనియన్లు ప్రతిఘటిస్తున్నారు.ఇది అమెరికా, ఇజ్రాయెల్‌ మీద వత్తిడిని పెంచుతుంది, మరో మాటలో చెప్పాలంటే ఊహించని పరిణామం. తాజా దాడులకు ఇది ఒక కారణం. దీన్ని చూపి దిగజారుతున్న తన ప్రతిష్టను నిలుపుకొనేందుకు నెతన్యాహు చూస్తున్నాడు. రెండుదశాబ్దాల నాటి పరిస్థితికీ ఇప్పటికీ వచ్చిన తేడాను యూదు దురహంకారులు గుర్తించటం లేదు.గాజా పరిణామాలు పక్కనే ఉన్న జోర్డాన్‌ రాజు అబ్దుల్లాకు ఎసరుతెచ్చేవిగా ఉన్నాయి.వెస్ట్‌బాంక్‌లో దాడుల కారణంగా పాలస్తీనియన్లు నిర్వాసితులైతే జోర్డాన్‌ వారికి ఆశ్రయం కల్పించే స్థితిలో లేదు. తిరస్కరించే పరిస్థితి కూడా రాజుకు లేదు. పాలస్తీనియన్ల మీద దాడులు పెరిగితే జోర్డానియన్లు సహించరు.ఈజిప్టు,యుఏయి,మొరాకో, బహరెయిన్‌ దేశాల పాలకులు ఇజ్రాయెల్‌తో మిత్ర సంబంధాలు కలిగి ఉన్నారు.వారి మీద కూడా జనం నుంచి వత్తిడి పెరుగుతుంది.ఒక్క గాజా, వెస్ట్‌బాంక్‌ ప్రాంతాల నుంచే కాదు, గోలన్‌ గుట్టలు,లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి కూడా ఇజ్రాయెల్‌ వైదొలగాలనే డిమాండ్‌ పెరుగుతుంది.వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో రెండవ తిరుగుబాటు జరిగినపుడు 2002లో 70వేల యూదుల నివాసాలు ఉంటే వాటిని ఇజ్రాయెల్‌ 2024నాటికి ఎనిమిది లక్షలకు పెంచింది. వాటన్నింటినీ ఖాళీ చేసి అక్రమంగా ప్రవేశపెట్టిన యూదులందరినీ అక్కడి నుంచి తరలించాల్సి ఉంది.తూర్పు జెరూసలెం రాజధానిగా గణతంత్ర పాలస్తీనా ఏర్పడాలన్న ఐరాస తీర్మానం అమలు తప్ప మరొక పరిష్కారం లేదు.
ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి.గాజా మారణకాండకు నిరసనగా ఇరాన్‌ ఒకవేళ దాడులకు దిగితే అడ్డుకొనేందుకు అమెరికా తన నౌక,వైమానిక దళాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి తరలించింది.

ఒకేసారి పలు రంగాలలో దాడులకు నెతన్యాహు ఎందుకు పాల్పడుతున్నాడనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.లెబనాన్‌,ఇరాన్‌లలో హమస్‌ నేతలను హత్య చేయటం,హిజబుల్లాను రెచ్చగొట్టటం,గాజాతో పాటు ఇప్పుడు వెస్ట్‌బాంక్‌పై దాడులకు దిగటం చూస్తున్నాము.నెతన్యాహు అమెరికా పర్యటన జరిపి చర్చలు జరిపి వచ్చిన తరువాత వెస్ట్‌బాంక్‌ మీద దాడులకు దిగింది.ఎవరెన్ని వివరణలు, భాష్యాలు చెప్పినప్పటికీ పొసగటం లేదు. అమెరికా ఎన్నికలు ముగిసేవరకు వర్తమాన పరిణామాలు ఇలాగే కొనసాగవచ్చు.ఉద్రిక్తతలను మరింత పెంచటం ద్వారా బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుందని అది తన విజయానికి బాట వేస్తుందనే అంచనాతో ట్రంప్‌ ఉన్నట్లు, అతగాడి నుంచి వచ్చిన సూచన మేరకు నెతన్యాహు రెచ్చిపోతున్నట్లు ఒక భాష్యం.బైడెన్‌ అమెరికాలో పలుకుబడి కలిగిన యూదుల మద్దతు పొందటానికి వారిని సంతుష్టీకరించేందుకు దాడులకు మద్దతు ఇస్తున్నాడని, దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్నదనే కథనాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ యుద్ధం తలెత్తితే అది ఎన్నికల్లో తమకు లాభిస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్లో తగులుతున్న ఎదురుదెబ్బలు, భారీ ఖర్చును చూసిన తరువాత అమెరికా మరో రంగంలో చేతులు కాల్చుకుంటుందా, పరువు పోగొట్టుకొని పలుచన అవుతుందా ? కారణాలేమైనప్పటికీ అమెరికా పన్నిన వలలో చిక్కుకొనేందుకు ఇరాన్‌ తదితర దేశాలు సిద్దంగా లేవు.అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అది సిద్దమౌతోంది.సౌదీతో ఉన్న విబేధాలను పరిష్కరించుకోవటంలో అదే కనిపిస్తున్నది. హమస్‌తో రాజీకి వచ్చినా తనదే పైచేయి అని చెప్పుకొనేట్లుగా నెతన్యాహు చూస్తున్నాడు, లేనట్లయితే ప్రతిపక్షం వెంటనే దాడి ప్రారంభిస్తుంది. అందుకే అసాధ్యమైన షరతులను విధిస్తున్నట్లు చెబుతున్నారు.గాజా`ఈజిప్టు సరిహద్దులో ఫిలడెల్ఫీ,నెట్‌జారిమ్‌ కారిడార్లలో తమ మిలిటరీని అనుమతించాలన్నది వాటిలో ఒకటి. దానికి హమస్‌ ససేమిరా అంటున్నది.అక్కడ తీవ్రమైన ప్రతిఘటన ఉన్నప్పటికీ మిలిటరీ కొనసాగాల్సిందేనని ఇజ్రాయెల్‌ యుద్ధ కాబినెట్‌ తీర్మానించింది. అమెరికాలో నవంబరులో ఎన్నికలు జరిగి జనవరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాలస్తీనాలో మారణకాండ సాగేట్లు కనిపిస్తున్నది.

చివరికి గొడుగులు కూడా చైనా నుంచి దిగుమతా ! హతవిధీ పదేండ్లలో నరేంద్ర మోడీ ప్రగతి ఇదా !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కార్లకు చైనా బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది. మేకిన్‌ ఇండియా పథకం కింద విద్యుత్‌ బాటరీలను తయారు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదే సమయంలో గతంలో విధించిన నిషేధాలను తొలగించి ఇబ్బందిలేని ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించాలని కూడా నిర్ణయించారు. 2030నాటికి దేశంలో 30శాతం వాహనాలు విద్యుత్‌ బాటరీలో నడిచే అవకాశం ఉన్నందున వాటి ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో చైనా పెట్టుబడుల అవసరం మనదేశానికి ఉందా లేదా అని మోడీ గారి బిజెపిలో ‘‘ అంతర్గత పోరు ’’ ఉన్నట్లు 2024 ఆగస్టు ఒకటవ తేదీన అమెరికాభారత సంయుక్త యాజమాన్యంతో నడుపుతున్న సిఎన్‌బిసి టీవీ ఛానల్‌ ఒక వార్తను ప్రసారం చేసింది. ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు చైనా లేదా అమెరికా,రష్యా దేశం ఏదైతేనేం వాటి నుంచి వచ్చే పెట్టుబడులు లేదా సంబంధాలను నిర్ణయించేది, నడిపేది మన పాలకులా కార్పొరేట్లా అన్న సందేహం కలుగుతున్నది. గతంలో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో సంబంధాలు సజావుగా ఉన్నాయి. గాల్వన్‌ ఉదంతాల సందర్భంగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. సంఘపరివార్‌ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి తెలిసినప్పటికీ గత పదేండ్లలో వాణిజ్య,పారిశ్రామికవేత్తలు ఇబ్బడి ముబ్బడిగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటుండగా లేనిది దాని పెట్టుబడుల అంశంలో ఎందుకు మడిగట్టుకోవాలనే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది.

గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతాల తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ దేశ యాప్‌లను నిషేధించారు.పెట్టుబడులు రాకుండా ఆంక్షలు పెట్టారు.కాషాయ దళాలు, మీడియాలో కొంత భాగం చైనా వస్తు దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందనే ప్రచారం చేశారు.తీరా చూస్తే మన ఉక్కు మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ప్రతి నాలుగు ఉక్కు వస్తువులలో మూడు చైనా నుంచే ఉన్నట్లు ఆగస్టు 29వ తేదీ హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక వార్త పేర్కొన్నది.గతేడాది ఏప్రిల్‌జూలై నెలలతో పోల్చితే మన దిగుతులు అక్కడి నుంచి 30శాతం పెరిగాయి.ఏడాది క్రితం మన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి కాస్తా ఇపుడు పరిస్థితి తారుమారైంది.ఇతర దేశాలకూ మన ఎగుమతులు పడిపోయాయి.విచారకరమైన అంశం ఏమంటే చివరికి గొడుగులు, బొమ్మలను కూడా చైనా నుంచి దిగుమతి పెరగటం వలన మన ఎంఎస్‌ఎంఇ సంస్థలు దెబ్బతింటున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) స్థాపకుడు అజయ్‌ శ్రీవాత్సవ చెప్పారు(2024సెప్టెంబరు ఒకటవ తేదీ పిటిఐ వార్త).ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు మనం చైనాకు 850కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేయగా అక్కడి నుంచి 5,040 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకున్నామని జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడిరచింది.చైనాతో పోటీ పడి గొడుగులను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితికి గత పదేండ్లలో మన దేశాన్ని నరేంద్రమోడీ నెట్టారా ? చిన్నప్పటి పాఠాల్లో భార్య ఎండకు తాళలేక ఆపసోపాలు పడుతుంటే ఒక రుషి ఆగ్రహ శాపానికి భయపడి సూర్యుడు దిగివచ్చి చెప్పులు, గొడుగు ఇచ్చినట్లు చదువుకున్నాం. ఇప్పుడు చైనా వారు ఇస్తున్నారు. ఆ రుషులేమయ్యారు, ఆ సూర్యుడు ఎందుకు కరుణించటం లేదు ! చైనాతో పోటీ పడి నాణ్యంగా, చౌకగా గొడుగులు తయారు చేసేందుకు మన వేదాల్లో నిగూఢమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసే నిపుణులు, దేశం కోసంధర్మం కోసం పని చేసే వారే లేరా ?

ఇటీవలన మన దేశ వార్షిక ఆర్థిక సర్వే విడుదల చేశారు. దాని వివరాల ప్రకారం చైనా నుంచి ఎఫ్‌డిఐని ఆహ్వానించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను పెంచుకోవటం కంటే చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానించటం మెరుగని ఆర్థిక మంత్రికి నివేదించారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత వైఖరిలో వచ్చిన మార్పుకు సూచిక ఇది.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనికి నిర్మలా సీతారామన్‌ కూడా విలేకర్ల సమావేశంలో మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అలాంటి పునరాలోచన లేదని వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ బిజెపి ప్రతిష్టను దెబ్బతీసే పర్యవసానాలకు దారితీసే దీన్ని ఎవరూ కోరుకోవటం లేదు. ఈ విధానాన్ని భారతీయులు మెచ్చరు, కానీ అది అవసరమని మోడీ ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖ గుర్తించింది ’’ అని నాటిక్సిస్‌లోని ఆసియా పసిఫిక్‌ ఎకానమిస్ట్‌ అల్సియా గార్సియా హెరారో చెప్పినట్లు సిఎన్‌బిసి వార్త పేర్కొన్నది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఏటా వంద బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌డిఐలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 71బిలియన్‌ డాలర్లు వచ్చాయి. సోలార్‌ పలకలు,విద్యుత్‌ బాటరీల తయారీ రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సులభతరం చేయనున్నారు.‘‘ భారత ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా,ఐరోపా వారు విముఖంగా ఉన్నారు. అత్యధిక విదేశీ పెట్టుబడులు ఐసిటి(ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌) డిజిటల్‌ సర్వీసెస్‌ వంటి రంగంలోకి వెళ్లాయి’’ అని హెరారో చెప్పాడు. ఆసియా ఉత్పత్తి కేంద్రంగా మారాలని భారత్‌ కోరుకుంటే చైనా సరఫరా గొలుసులతో సంబంధాలు పెట్టుకోవాలని ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌లోని విదేశీ విధాన అధ్యయన విభాగ ఉపాధ్యక్షుడు హర్ష వి పంత్‌ చెప్పారు.

ముందే చెప్పుకున్నట్లుగా చైనా వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన కారణంగా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు , రాజకీయంగా పరువు నిలుపుకొనేందుకు గత కొద్ది నెలలుగా చైనా పెట్టుబడులను అందరితో అంగీకరింపచేయించేందుకు ఢల్లీి పెద్దలు కసరత్తుచేస్తున్నారు.‘‘ ఆర్థిక కోణంలో చూస్తే కొన్ని రంగాలలో చైనా పెట్టుబడులు మనకు అవసరమే అని చక్కటి తర్కంతో చెప్పవచ్చు. కానీ ఆక్రమంలో దేశ భద్రత,అంతర్జాతీయ రాజకీయ కోణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంత మంచిగా,సాధారణంగా లేవు ’’ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇటీవల చెప్పారు. 2070నాటికి పూర్తి కాలుష్య రహిత లక్ష్యాన్ని చేరుకోవాలని మనదేశం లక్ష్యంగా పెట్టుకుంది.దానిలో భాగంగా 2030 నాటికి 50శాతం విద్యుత్‌ను పునరుత్పత్తి ఇంథన వనరుల నుంచి తయారు చేయాల్సి ఉంది.చైనా ఆ రంగంలో ఎంతో ముందుంది,తక్కువ ఖర్చుతో, సమర్ధవంతంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం అది 584 టెరావాట్‌ అవర్స్‌ సామర్ధ్యం కలిగి ఉండగా మనది కేవలం 113టెరావాట్‌ అవర్స్‌ మాత్రమే.చైనా కమ్యూనిస్టుదేశం, మనది ప్రజాస్వామ్యం అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా తీసుకుంటాం అని మడిగట్టుకు కూర్చొనేందుకు మనదేశంలోని కార్పొరేట్‌ కంపెనీలు సిద్దంగా లేవు.అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే బదులు పెట్టుబడులు తీసుకొని మనదేశంలోనే సంస్థలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధిని కూడా కల్పించవచ్చు. ప్రస్తుతం మన దేశం తప్ప ప్రపంచంలో మరేదేశమూ చైనా పెట్టుబడులపై పూర్తి నిషేధం విధించలేదు.దాన్నుంచి పూర్తిగా విడగొట్టుకునేందుకు ఏ దేశమూ సిద్దంగా లేదు.తోటి సోషలిస్టు దేశమైనా చైనావియత్నాం మధ్య కొన్ని సరిహద్దు విబేధాలున్నాయి, అయినా చైనా నుంచి పెట్టుబడులను తీసుకుంటున్నది.


టాటా కంపెనీ అనేక దేశాల అనుభవాలను చూసిన తరువాతనే చైనా నుంచి బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది.సరఫరా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంది.మన దేశ విద్యుత్‌ వాహన మార్కెట్‌లో దాని వాటా 60శాతం. ఇంతకు ముందుదాని ఉత్తత్తుల్లో బాటరీల నుంచి ఎదురైన సమస్యలతో పాటు మార్కెట్లో పోటీని కూడా అది గమనంలోకి తీసుకుంది.చైనాతో ఉన్న సరిహద్దు, రాజకీయ విధానాలను అది పక్కన పెట్టింది. ఇప్పటికే చైనా బివైడి కంపెనీ మన దేశంలోని సంస్థలతో భాగస్వామిగా లేదా విడి భాగాలను ఎగుమతి చేసేదిగా ఉంది. విద్యుత్‌ వాహనాలలో బ్యాటరీ ధర, సామర్ధ్యమే కీలకం.చైనాతో అమెరికా ప్రభుత్వానికి ఉన్న రాజకీయ విబేధాల కారణంగా అమెరికా దిగ్జజ కంపెనీ ఫోర్డ్‌ చైనా కంపెనీతో కలసి అమెరికాలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకొని కూడా అనేక ఆటంకాలను ఎదుర్కొని విరమించుకుంది. అది చేసిన తప్పిదాన్ని టాటా చేయదలచలేదని పరిశీలకులు పేర్కొన్నారు.తొలుత కొన్ని రంగాలలో ఆటంకాలను తొలగిస్తే క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఏ పార్టీ లేదా కూటమిఉన్నప్పటికీ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలనే అనుసరించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.వాటి అడుగులకు మడుగులొత్తితేనే ఎవరైనా అధికారంలో ఉంటారు !