బంగ్లాదేశ్‌లో హసీనా పతనానికి ముందు ఏం జరిగింది : అమెరికా మానసపుత్రుడు మహమ్మద్‌ యూనిస్‌ !

Tags

, , , , , ,



ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌లో జరిగిన అనూహ్య పరిణామాల పూర్వరంగలో మైక్రో ఫైనాన్స్‌ ద్వారా ప్రపంచ వ్యాపితంగా గుర్తింపు పొందిన నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌(84)ను అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ప్రభుత్వ సారధిగా నియమించింది. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఎంతకాలం ఈ ఏర్పాటు అమల్లో ఉంటుంది ? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారు ? ఎన్నికల నిర్వహణకు ”తగిన పరిస్థితులు” లేవని తాత్కాలిక ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. మరోవైపున మనదేశంలో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇక్కడే ఉండేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరిస్తుందా ? లేకపోతే ఆమె ఎక్కడకు వెళతారు ? ఇలాంటి అంశాల మీద కూడా ఇది రాసిన సమయానికి స్పష్టత లేదు. ఎవరీ యూనస్‌ అనే శోధన అంతర్జాలంలో జరుగుతున్నక్రమంలో సూదికోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయట పడినట్లుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ నాటి పరిణామాల పూర్వరంగంలో వెలువడిన వార్తలు, విశ్లేషణలు, బయటపడిన అంశాలే. అవన్నీ కూడా అతగాడు అమెరికా మనిషి అని చూపుతున్నాయి. తోలుమ్మలాటలో తెర వెనుక ఉన్నవారు బొమ్మలను ఎలా ఆడించేదీ, వాటిపేరిట పలికే మాటలూ తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అదే క్రీడకు తెరలేచినట్లు చెప్పవచ్చు.


ఈ పెద్ద మనిషి గతంలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లు , ప్రధాని పదవికోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. 2007 ఫిబ్రవరి 13న కొల్‌కతాలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ తమ ప్రభుత్వానికి పంపిన ఒక వర్తమానం వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాల్లో ఉంది. దానిలో ఉన్న సమాచార సారం ఇలా ఉంది. యూనస్‌ రాజకీయాల్లోకి రావాలని దానికి గాను తన పథకాల గురించి అమెరికా అధికారికి వెల్లడించాడు. రాజకీయాల్లోకి వస్తే తలెత్తే ముప్పు గురించి కూడా చెప్పాడు. అక్కడ అంతర్యుద్ధం చెలరేగ కుండా ఉండేందుకు మిలిటరీ మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించటాన్ని సమర్ధించాడు. దేశంలో అవినీతి, హింసాకాండ నుంచి కాపాడేందుకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఫిబ్రవరి 11న ఒక బహిరంగ లేఖ రాశాడు.(పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించి రెండు నెలల తరువాత సదరు ఆలోచన విరమించుకున్నాడు) హసీనా-ఖలీదా జియా మధ్య అధికార క్రీడలో నలుగుతున్న ప్రజాస్వామ్య క్రమంలో గొప్ప నైతిక వ్యక్తిత్వం మరియు బలమైన సంస్థాగత నైపుణ్యాలు ఉన్న యూనస్‌ అభ్యర్థిత్వం ప్రత్యామ్నాయాన్ని చూపగలదు అని అమెరికా అధికారి తమ ప్రభుత్వానికి నివేదించాడు. ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం ఆ లేఖను ధృవీకరించి స్వదేశానికి పంపింది.


ఇన్నేండ్ల తరువాత యూనస్‌ను గద్దె నెక్కించటానికి అమెరికాకు అవకాశం దొరికింది. అతని మీద వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని అతను కొట్టిపారవేశాడు.మైక్రో ఫైనాన్స్‌ పేరుతో పేదల రక్తం తాగే మనిషి అని ఒక సందర్భంగా షేక్‌ హసీనా వర్ణించింది.ఇతగాడు అమెరికా మానసపుత్రుడు.ప్రతి దేశంలో తనకు అవసరమైన వారికోసం అమెరికా సిఐఏ గాలం వేస్తుంది.ఒకసారి చిక్కిన తరువాత తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. వర్ధమాన దేశాల వారిని ఆకర్షించేందుకు వేసే ఎరల్లో విద్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే పేరుతో అమెరికా ప్రభుత్వం ఎన్నో ఎత్తులు వేసింది, వాటిలో ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌ ఒకటి.యూనస్‌ను దానికి ఎంపిక చేశారు.సిఐఏ నేరుగా ఎంపిక చేయదు గాని ఎంపిక తరువాత అది రంగ ప్రవేశం చేస్తుంది.ఈ స్కాలర్‌ షిప్‌ను 1965లో యూనస్‌ పొందాడు. అర్ధశాస్త్రంలో పిహెచ్‌డి కూడా అమెరికాలోనే చేశాడు.1983లో గ్రామీణ బ్యాంకును ప్రారంభించి మైక్రోఫైనాన్స్‌ ద్వారా దారిద్య్రాన్ని తొలగించవచ్చనే చిట్కాను ముందుకు తెచ్చాడు. దానికి గాను 2006లో మరొకరితో కలసి నోబెల్‌ బహుమతి పొందాడు. ఆ బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్‌క్లింటన్‌ లాబీయింగ్‌ చేశాడు.మైక్రోఫైనాన్స్‌ పధకాన్ని అమలు చేసిన బంగ్లాదేశ్‌లో పేదరికం గణనీయంగానే ఉంది. ఇప్పుడు రోజుకు 6.85డాలర్ల దారిద్య్రరేఖలో(ప్రపంచబాంక్‌ 2022) 74.1శాతం మంది ఉన్నారు. (అఫ్‌ కోర్స్‌ మనదేశంలో కూడా మైక్రోఫైనాన్స్‌ తారక మంత్రంగా చంద్రబాబు నాయుడు వంటి వారు ఊదరగొట్టారు, అమలు చేశారు.ప్రైవేటు కంపెనీలు జనాల రక్తాన్ని పీల్చాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటంతో తరువాత సదరు కంపెనీలన్నీ జెండా ఎత్తేశాయి.) అయితే పైన చెప్పుకున్న అదే ప్రమాణం ప్రకారం భారత్‌లో 81.8శాతం ఉన్నారు.పాకిస్తాన్‌లో 84శాతంపైగా ఉన్నారు గనుక బిజెపి వారు తరచూ దానితో పోల్చి చూడండి మా మోడీ ఘనత అంటారన్నది తెలిసిందే.పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగానికి తోడు ప్రతిపక్షాల అణచివేత షేక్‌ హసీనా మీద జనంలో వ్యతిరేకత పెరగటానికి, దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా కుట్రలో భాగంగా ప్రభుత్వ కూల్చివేత జరిగింది. తమ మానసపుత్రుడు గనుక యూనస్‌కు అమెరికా అనేక అవార్డులు ఇచ్చి స్థాయిని పెంచింది. ఇక షేక్‌ హసీనా విషయానికి వస్తే యూనస్‌ కార్యకలాపాలపై దర్యాప్తును ప్రారంభించి రుణాల వసూలుకు బలప్రయోగ పద్దతులను ప్రయోగించినట్లు వెల్లడించించారు. పదవీ విరమణ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో 2011లో అతగాడిని బాంకు బాధ్యతల నుంచి తొలగించింది. సుప్రీం కోర్టు ఆ చర్యను సమర్ధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా నోబెల్‌ బహుమతి సొమ్ముతో సహా పుస్తకాల మీద సొమ్మును స్వీకరిస్తున్నారంటూ 2013లో కేసు నమోదు చేశారు. యూనస్‌ స్థాపించిన గ్రామీణ టెలికాం కంపెనీలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.2023లో సదరు కంపెనీ సిబ్బంది తమ సొమ్మును స్వాహా చేసినట్లు ఒక కేసును దాఖలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ కేసులో శిక్ష పడి ప్రస్తుతం బెయిలు మీద ఉన్నాడు. సిఐఏ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆ తీర్పును తప్పుపట్టింది.


అంతర్జాలంలో వెల్లడైన సమాచారం ప్రకారం అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు యూనస్‌ అత్యంత సన్నిహితుడు. ఆర్కాన్సాస్‌ గవర్నరుగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. బిల్‌ క్లింటన్‌ సతి హిల్లరీ క్లింటన్‌ పేరుతో ఉన్న ఫౌండేషన్‌కు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాడు. వాటి వివరాలను ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తరువాత తొలగించారు. దీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే డెమోక్రటిక్‌ పార్టీ అధికారంలో ఉంది. ఏడుదేశాల మీద దాడులు జరిపించి మానవహక్కులను హరించిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శాంతిదూతగా నోబెల్‌ బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే పెద్ద మనిషి చేతుల మీదుగా యూనస్‌ అనేక అవార్డులు అందుకున్నాడు.ఒబామా నుంచి అమెరికా అధ్యక్షుడి పేరుతో ఉన్న స్వేచ్చా పతకాన్ని, అమెరికా పార్లమెంటు బంగారు పతకం, సిఐఏతో సంబంధమున్న రాక్‌ఫెల్లర్‌ సోదరులు, ఫోర్డు ఫౌండేషన్‌ సంస్థలు ఏర్పాటు చేసిన రామన్‌ మెగాసెసే అవార్డు వాటిలో ఉన్నాయి. విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్‌ పనిచేసిన సమయంలో పద్దెనిమిది రకాల లావాదేవీలతో యుఎస్‌ ఎయిడ్‌ అనే సంస్థ యూనస్‌కు గ్రాంటులు, రుణాలు, కాంట్రాక్టుల రూపంలో కోటీ 30లక్షల డాలర్ల మేర లబ్దిచేకూర్చినట్లు తరువాత వెల్లడైంది. గ్రామీన్‌ అమెరికా పేరుతో హిల్లరీ క్లింటన్‌ పలుకుబడితో అమెరికా ఆర్థికశాఖ ఆరు లక్షల డాలర్ల గ్రాంటు ఇచ్చింది.యూనస్‌ మీద బంగ్లా ప్రభుత్వం జరుపుతున్న విచారణను విరమించుకోవాలని ఆమె వత్తిడి తెచ్చినట్లు అమెరికా పార్లమెంటరీ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి.హిల్లరీ ఫౌండేషన్‌ అంతర్జాతీయ విధాన డైరెక్టర్‌గా ఉన్న అమితాబ్‌ దేశారు ద్వారా ఆమె బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చారు.2012 జూన్‌ 11వ తేదీన అతగాడు పంపిన ఒక ఇమెయిల్‌ వర్తమానంలో ” ఒకవేళ మీరు ఇప్పటికే దాన్ని చూసి ఉండనట్లయితే వెంటనే చూడాలని డబ్లుజెసి(బిల్‌క్లింటన్‌), హెచ్‌ఆర్‌సి( హిల్లరీ క్లింటన్‌) కోరారు.” అని పేర్కొన్నారు.ప్రపంచబాంకులోని ఇద్దరు కీలక అధికారులను ఎఫ్‌బిఐ, సిఐదే ద్వారా బ్లాక్‌మెయిల్‌ కూడా చేయించారు. ఆ కారణంగానే పద్మానదిపై వంతెన నిర్మాణానికి మంజూరు చేసిన 120 కోట్ల డాలర్ల రుణాన్ని నిలిపివేసింది, దాని నిర్మాణంలో అవినీతి జరిగినట్లు సాకు చూపింది.(అవమానానికి గురైన హసీనా తరువాత అదే వంతెనకు చైనా నిధులు తెచ్చి పూర్తి చేసింది, దాంతో చైనాకు దగ్గరైనట్లు చెబుతారు) అంతే కాదు హసీనా మీద కక్ష కట్టిన అమెరికా సర్కార్‌ న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జారు (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు వార్తలు) కంపెనీ మీద దాడులు జరపాలని 2017లో నాటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ చుక్‌ గ్రాసీ వత్తిడి తెచ్చినట్లు కూడా వెల్లడైంది.మైనస్‌ టూ ఫార్ములా ( షేక్‌ హసీనా, ఖలీదా జియా ) ప్రకారం వారిద్దరికీ రిటైర్మెంట్‌ ఇచ్చి ప్రవాసం పంపి మహమ్మద్‌ యూనస్‌ను నూతన నేతగా చేసే అవకాశాన్ని పరిశీలించాలని బంగ్లా కీలక అధికారులతో హిల్లరీ క్లింటన్‌ 2007లో విశ్వప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే నూతన నేతగా మహమ్మద్‌ యూనస్‌ను మిలిటరీ ముందుకు తేవచ్చునని 2007 ఏప్రిల్‌ ఏడున బిబిసి ఒక వార్తను ప్రసారం చేసింది. అదే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకాన్సులేట్‌ జనరల్‌ సానుకూలత వ్యక్తం చేస్తూ పంపిన వర్తమానం గురించి ముందే చెప్పుకున్నాం.


హసీనాకు ఉద్వాసన మహమ్మద్‌ యూనస్‌కు పట్టం గట్టటం వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పటికే అర్ధమై ఉంటుంది.యూనస్‌ పట్ల 2009లో అధికారానికి వచ్చిన హసీనా కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారో విశ్లేషిస్తూ మనదేశంలోని స్టేట్స్‌మన్‌ పత్రికలో 2019 ఏప్రిల్‌ ఐదున అమెరికాకు చెందిన జర్నలిస్టు బిజడ్‌ ఖుస్రూ రాశాడు. మిలిటరీతో చేతులు కలిపి తనను, ఖలీదాను ప్రవాసం పంపేందుకు యూనస్‌ కుట్ర చేశాడని, రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సిద్దపడినట్లు ఆమె భావించారు. దశాబ్దాలపాటు సాగిన గిరిజన తిరుగుబాట్లకు స్వస్తిపలికిన తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వకుండా యూనస్‌కు ఇచ్చారని ఆమె అసూయ చెందినట్లు ఖుస్రూ పేర్కొన్నారు. రాసిన అంశాల సారం ఇలా ఉంది.హసీనా 2009లో అధికారానికి రాక ముందు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా తనను నియమిస్తే సంతోషిస్తానని యూనస్‌ ఢాకాలో ఒక సభలో ప్రకటించాడు. ఆ మరుసటి రోజు అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ జలీల్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. దానికి ఐదు నెలల ముందు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు యూనస్‌ చెప్పాడని, అంతేగాక పాలన పట్ల అతని అభిప్రాయాలతో తాము విబేధిస్తున్నట్లు కూడా జలీల్‌ చెప్పాడు. ఈ వైఖరి తీసుకోవటానికి హసీనాకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం కూడా ఒక కారణం. అదేమంటే హసీనా స్థానంలో యూనస్‌ను ఉంచాలని అమెరికా కోరుకుంటున్నదని దాని పట్ల భారత్‌ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అంతే కాదు, మతవాద జమాతే ఇస్లామీకి రాజకీయ రంగంలో చోటు కల్పించకూడదన్నది భారత వైఖరి కాగా జమాతే మీద చర్య తీసుకుంటే దాన్ని అజ్ఞాతవాసంలోకి నెట్టడమే అవుతుందని అమెరికా చెప్పిందట. జమాతే ప్రధాన రాజకీయ స్రవంతిలో ప్రవేశిస్తే అది మతవాదాన్ని తగ్గించుకుంటుందన్న తమ వైఖరిని భారత్‌ అర్ధం చేసుకోవటం లేదని అమెరికా చెప్పింది. తన పట్ల ఉన్న వైఖరిని మార్చుకోవాల్సిందిగా హసీనాను కోరాలని అమెరికా రాయబారిని కోరగా, తాను ఆపని చేస్తానని ఆమెతో ఒక మంచిమాట చెప్పిస్తానని హామీ ఇచ్చాడని అయితే హసీనా అందుకు అంగీకరించకపోగా యూనస్‌ను బాంకు పదవి నుంచి తప్పించారు.


హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన మిలిటరీ అధికారులు కేవలం 45 నిమిషాల సమయమిచ్చి ఆమెను బలవంతంగా భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. డెయిలీ స్టార్‌ అనే పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్రాన్సులో ఉన్న యూనస్‌ స్వదేశానికి తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విద్యార్థులు కోరారు. తాను పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నందున రాలేనని యూనస్‌ తొలుత చెప్పాడు.విద్యార్థులు పదే పదే కోరటంతో అంగీకరించాడు. దేశంలో ఆరాచకాన్ని తొలగించే క్రమంలో హసీనాను గద్దెదించటం పట్ల సంతోషం వెలిబుచ్చాడు. విద్యార్థులు, దేశ పౌరులు ఎన్నో త్యాగాలు చేసినపుడు నాకు సైతం కొంత బాధ్యత ఉంది, అందుకే అంగీకరించాను అన్నాడట.హసీనాను గద్దె దించిన రోజును రెండవ విముక్తి దినంగా యూనస్‌ వర్ణించినట్లు ఒక జర్నలిస్టు చెప్పాడు. ఇలాంటి వ్యక్తి సారధ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తుందా అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తుందా ? ఏదో ఒక ముసుగులో అమెరికా అనుకూల బిఎన్‌పి-జమాతే మతశక్తులకు అధికారం కట్టబెడుతుందా ? బంగ్లాదేశ్‌లో అమెరికా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసి అటు చైనా ఇటు భారత్‌కూ ముప్పు తెస్తుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

హసీనా పతనం వెనుక అమెరికా ….. తాత్కాలిక సారధిగా నోబెల్‌ గ్రహీత యూనిస్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆకస్మిక, అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. రాజీనామా కోరుతూ పెద్ద సంఖ్యలో జనం ప్రధాని షేక్‌ హసీనా నివాసం మీదకు దండెత్తటం,తరువాత పార్లమెంటుపై దాడి, దేశం విడిచిపోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించటం, పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్‌లోనే సోదరితో కలసి ఢిల్లీ రావటం, మిలిటరీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తానే అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించటం అంతా కొద్ది గంటల్లోనే జరిగిపోయాయి. డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా జనవరిలోనే నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ఏడాది కూడా గడవక ముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో 17 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న 78 ఏండ్ల మాజీ ప్రధాని ఖలీదా అనారోగ్యంతో ప్రస్తుతం జైలు ఆసుపత్రిలో ఉన్నారు. హసీనా రాజీనామా తరువాత కూడా నిరసనలు కొనసాగాయి. ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఆశ్రయం ఇచ్చేది స్పష్టం కాలేదు.గతంలో జారీ చేసిన వీసాను అమెరికా రద్దు చేసింది. నిబంధనల సాకుతో బ్రిటన్‌ కూడా నిరాకరించినట్లు వార్తలు. తాత్కాలిక ప్రభుత్వ సారధిగా గ్రామీణ బాంకుతో దారిద్య్ర నిర్మూలనకు స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చే మైక్రోక్రెడిట్‌ పథకంతో ముందుకు వచ్చి ప్రాముఖ్యత పొందిన మహమ్మద్‌ యూనిస్‌ను తాత్కాలిక ప్రభుత్వ సారధిగా నియమించారు.ప్రస్తుతం 83 ఏండ్ల వయస్సులో అదే యూనిస్‌, మరో 13మందిని రెండు నెలల క్రితం అవినీతి కేసులో దోషులుగా తేల్చి ఆరునెలల జైలు శిక్ష వేశారు,బెయిలు మీద ఉన్నాడు.తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధులలో రెండు కోట్ల డాలర్లమేరకు విదేశాలకు తరలింపు, దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు.అతని మీద ఇంకా వందకేసులు ఉన్నాయి.తాజా పరిణామాల వెనుక ఏం జరిగిందనేది వెల్లడి కావాల్సి ఉంది.అమెరికా హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.


అమెరికా సిఐఏ కుట్ర గురించి మీడియాలో వెలువడిన సమాచారం ప్రకారం పరిణామ క్రమం ఇలా ఉంది. బంగ్లాదేశ్‌లో తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తే తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని ఒక తెల్లవాడు తెచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు హసీనా చెప్పిన అంశం మే 23న మీడియాలో వచ్చింది. తూర్పు తైమూరు మాదిరి చిట్టగాంగ్‌, మయన్మార్‌లో కొన్ని ప్రాంతాలతో కలిపి క్రైస్తవ దేశం ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. తన తండ్రి మాదిరి తనను కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేస్తూ 2018లో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ జూన్‌ ఐదున హైకోర్టు తీర్పు చెప్పింది.రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై ఒకటిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.జూలై 16 ఆందోళన హింసాత్మక రూపం తీసుకుంది.హసీనా ప్రభుత్వం ప్రకటించిన 30శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఐదుశాతానికి కుదించి సుప్రీం కోర్టు 21వ తేదీన తీర్పు చెప్పింది.దాంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.అయితే ఆగస్టు నాలుగున మాజీ మిలిటరీ ప్రధాన అధికారి ఇక్బాల్‌ కరీమ్‌ భుయాన్‌ అంతకు ముందు నిరసనకారుల మీద జరిపిన అణచివేతను ఖండించాడు.మిలిటరీని వెనక్కు పిలిపించాలని కోరాడు.నూతన మిలిటరీ అధికారి వాకర్‌ ఉజ్‌ జమాన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ మిలిటరీ తటస్థంగా ఉండాలని చెప్పాడు.హసీనా రాజీనామా కోరుతూ ఐదవ తేదీన నిరసకారులు ఢాకా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అదే రోజు హసీనా రాజీనామా చేయాలని జమాన్‌ 45 నిమిషాల గడువు ఇచ్చాడు.దేశం వదలి వెళ్లేందుకు హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాన్ని అమెరికా స్వాగతించింది.
అనేక దేశాలలో సిఐఏ చేసిన కుట్రలో భాగంగా పరిణామాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఏదో ఒక కరాణంతో నిరసన ప్రారంభం, అది కూడా విద్యార్థులతో చేయించటం. దానికి ముందు సిఐఏతో చేతులు కలిపిన మీడియా నిరసనకు అవసరమైన నేపధ్యాన్ని తప్పుడు ప్రచారం ద్వారా ఏర్పాటు చేయటం. తరువాత భద్రతా దళాలపై దాడి చేసి రెచ్చగొట్టి వాటిని రంగంలో దిగేట్లు చేయటం, బలప్రయోగం చేశారంటూ న్యాయవ్యవస్థ ద్వారా చెప్పించటం,ప్రజలకు సేవ పేరుతో తరువాత మిలిటరీ నిరసనలకు మద్దతు ప్రకటించటం, ప్రధాని లేదా అధ్యక్ష భవనాలు, పార్లమెంట్ల ముట్టడికి నిరసనకారులను అనుమతించటం. ఇదే పద్దతి శ్రీలంకలో అనుసరించారు. బంగ్లాదేశ్‌లో అదే జరిగింది. నిజానికి మన స్వాతంత్య్రానికి ముందే ఈశాన్య ప్రాంతంలో కుట్రద్వారా కొన్ని దేశాల ఏర్పాటుకు బ్రిటన్‌, సిఐఏ కుట్రలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో మన ఇరుగు పొరుగుదేశాలలో తన అనుకూల ప్రభుత్వాల ఏర్పాటుకు అమెరికా అనేక కుట్రలు చేసింది.


రద్దయిన పార్లమెంటులో 350కి గాను అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా ఈ ఏడాది 41.8శాతమే నమోదైంది.జనం అసంతృప్తి వెల్లడైంది. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి సోమవారం నాడు రాజీనామా చేసేవరకు అదే పదవిలో కొనసాగారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియావుర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. బిఎన్‌పి మితవాద పార్టీ, దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. దాని మీద కట్టిన పెద్ద వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు బహిరంగంగా ప్రకటించి నిధులు నిలిపివేసింది. బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 2012లో 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది. బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని ప్రకటించింది. కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు. బంగ్లాదేశ్‌ మీద అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు నివేదించినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది.


బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకొనే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే అదే సమయంలో మనకూ ఇబ్బందే. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మనమీద కసి ఉన్నా, ఇతర అంశాలలో మద్దతు ఇస్తున్న కారణంగా మింగా కక్కలేకుండా ఉంది. ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు , దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు. ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదవ బిఎన్‌పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే. మన మీద వత్తిడి తెచ్చేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా చూస్తుంది. బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని అమెరికా స్వాగతించింది. అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మన ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన అనేక పరిణామాల వెనుక గతంలో అమెరికా హస్తం ఉన్నందున ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. హసీనా ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిన కారణంగా అసంతృప్తి తలెత్తింది.ఈ స్థితిలో బంగ్లా విముక్తి పోరులో పాల్గొన్న వారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ప్రకటించటం ప్రభుత్వ వ్యతిరేకులకు కలసి వచ్చింది. సుప్రీం కోర్టు దాన్ని ఐదు శాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడు శాతానికి పరిమితం చేయటంతో యువత ఆందోళన సద్దుమణిగింది. అయితే అనూహ్యంగా హసీనా రాజీనామా డిమాండ్‌తో మరోసారి వీధులకు ఎక్కారు. వారిని అధికార అవామీలీగ్‌ మద్దతుదారులు ఎదుర్కోవటంతో మరోసారి నెత్తురోడింది. అప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపిన మిలిటరీ ఆది, సోమవారాల్లో జరిగిన పరిణామాల్లో వ్యతిరేకంగా మారింది.హసీనా జాతి నుద్దేశించి టీవీలో మాట్లాడకూడదని ఆదేశించటంతో పాటు రాజీనామా చేసి 45నిమిషాల్లో దేశం వదలి పోవాలని అల్టిమేటం జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం నెలన్నర క్రితమే మిలిటరీ నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఇన్ని వారాలు చూసినట్లు కనిపిస్తోంది.

వికసిత భారత్‌ 2047 : కనుచూపు మేరలో లేదు ! నరేంద్రమోడీ గాలి తీసిన ప్రపంచ బ్యాంకు !! కాదనే దమ్ము, ధైర్యం ఉందా !!!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


త్వరలో మరో తిరంగా జెండా పండగ జరుపుకోబోతున్నాం. చరిత్రను చూస్తే పరాయి పాలనలో ఆ జెండాను ఎగుర వేస్తే దేశ ద్రోహం, ప్రాణాలకు తెగించి ఆవిష్కరించటమే దేశభక్తి. నేటి పాలకులు అదే జెండాను ఎగురవేస్తూ చెప్పే కబుర్లలో నిజాయితీని ప్రశ్నించటమే దేశద్రోహంగా పరిగణించబడుతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ అభివృద్ధి గురించి కబుర్లు చెప్పేవారు అపర దేశ భక్తులు, వారి విధానాల బండారాన్ని ప్రశ్నించేవారు క్షమించరాని దేశద్రోహులు.నేడు దేశంలో జరుగుతున్న ప్రచారదాడిలో నలుగుతున్న అంశమిది. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి ఓట్లేయించుకొని తప్పించుకు తిరుగువారు మనకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కనిపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన అభివృద్ధి కబుర్లలో వెయ్యోవంతు ఆచరించినా దేశం ఈ స్థితిలో ఉండేది కాదు. స్వాతంత్య్రం మాకేమిచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు. 2047వరకు ఒకటే లక్ష్యంగా అదే వికసిత్‌ భారత్‌గా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.దాని అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఈ దేశంలో ఉండటం లేదా ? ఇక్కడి గాలి పీల్చటం లేదా ఇక్కడి తిండి తినటం లేదా అని ఎదురుదాడి చేస్తున్నారు. అసలు వికసిత భారత్‌ అంటే ఏమిటి ?


రెండు సంవత్సరాలకు పైగా నీతి ఆయోగ్‌ నిర్దేశం మేరకు అధికారులు మధనం చేసి తీసుకువచ్చిందే వికసిత భారత్‌ 2047 ప్రణాళిక. అంటే అప్పటికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు నిండుతాయి గనుక ఆనాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన వాటి జాబితాలో చేర్చే విధంగా పని చేస్తామన్నారు. దాని ప్రకారం దేశ జిడిపి 30లక్షల కోట్ల డాలర్లకు, తలసరి సంపద 18 నుంచి 20వేల డాలర్లకు పెరుగుతుంది.నవకల్పన, సాంకేతికంగా ప్రపంచ నేతగా ఎదుగుతుంది, మానవాభివృద్ధి, సామాజిక సంక్షేమంలో ఆదర్శవంతంగా తయారవుతుంది, పర్యావరణాన్ని కాపాడే ఒక మొనగాడుగా నిలుస్తుంది. సరిగ్గా దీన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 డిసెంబరు 11న ప్రధాని నరేంద్రమోడీ ”వికసిత్‌ భారత్‌ 2047: యువ గళం ” పేరుతో విడుదల చేశారు. ఈ ప్రకటన చేసేందుకే మోడీకి పదేండ్లు పట్టింది. మనకంటే ఎంతో ముందంజలో ఉన్న చైనా 2012లోనే 2049 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యాన్ని ప్రకటించింది. దీన్ని చూసి ఎవరైనా చైనా కంటే మనమే ముందుంటాం అని టాంటాం వేసుకుంటే చేయగలిగిందేమీ లేదు, నిజంగా అభివృద్దిలో పోటీ పడాలని కోరుకుందాం.


కొన్ని వాదనలు, తర్కాన్ని చూద్దాం. చైనాను పక్కకు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా, సరకుల ఎగుమతి దేశంగా మనదేశాన్ని మారుస్తామని మోడీ(సంఘ) పరివారం చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. మనవారేం చెప్పారు, 2030 నాటికి మన ఎగుమతుల విలువ 1.58లక్షల కోట్లు కాగా దిగుమతులు 1.88 ఉంటాయని, 2047 నాటికి మన ఎగుమతుల విలువ 8.67లక్షల కోట్ల డాలర్లుగా, దిగుమతులు 12.12లక్షల కోట్ల డాలర్లుగా ఉంటాయని జోశ్యం. దీని అర్ధం, భాష్యాన్ని సంస్కృత, వేదపండితులే చెప్పాలి. తేడా తగ్గాలి లేదా ఎగుమతులు పెరగాలి, దానికి విరుద్దంగా ఉంటుందని చెబుతున్నారు.ఇక ఇప్పుడు మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకున్నాయంటే మనదేశంలో వృద్ది పెరిగి ఎక్కువ మంది వస్తు వినియోగం చేస్తున్నారు గనుక ఇది నరేంద్రమోడీ సాధించిన ఘనత అన్నారు. అదే అయితే ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోక చైనా నుంచి విదేశీ కంపెనీలు మనదేశానికి వస్తున్నాయి, మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, అన్నీ ఇక్కడి నుంచే అందరికీ ఎగుమతి చేస్తాం అన్న కబుర్లు ఎందుకు ? ఇప్పుడు చైనా దిగుమతులు తక్కువగా ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి గనుక డ్రాగన్‌ కంటే మనమే మెరుగ్గా ఉన్నట్లా ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదే. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిందాన్ని తాను కేవలం తొలి ఐదేండ్లలోనే చేసి చూపించానన్నారు మోడీ. పదేండ్ల తరువాత ఏం చెప్పారు. ఇప్పటి వరకు చూపింది ట్రైలరే అసలైన సినిమా ముందు ఉంటుంది అన్నారు. వికసిత భారత్‌లో దిగుమతులే ఎక్కువ అంటే మన సొమ్మును విదేశాలకు పంపిస్తామని, విదేశాల్లో ఉన్న కార్మికులకు ఉపాధి చూపుతామని చెప్పటమే! నిజమేలే, ఎందుకంటే మోడీ విశ్వగురువు గనుక ప్రపంచమంతటి మంచి చెడ్డలు చూసుకోవాలి మరి !


అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలనుకుంటే సంకల్పం చెప్పుకుంటే చాలదు. తాజాగా ప్రపంచ బ్యాంకు వెలువరించిన 2024 ప్రపంచ అభివృద్ధి నివేదిక మోడీ అండ్‌ కో ప్రచార గాలి తీసింది. అధికాదాయ స్థాయికి చేరేందుకు ప్రస్తుతం భారత్‌, చైనాలతో సహా 108దేశాలు తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంటున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నది. ఐఎంఎఫ్‌ 2024 అంచనా ప్రకారం అమెరికా తలసరి ఆదాయం 85,373, ప్రపంచ బ్యాంకు 2022 అంచనా మేరకు 76,330, ఐరాస 2021 లెక్కల ప్రకారం 69,185 డాలర్లు ఉంది. వీటిలో నాలుగో వంతు స్థాయికి అంటే ప్రపంచ బ్యాంకు మొత్తాన్నే తీసుకుంటే 19,082 డాలర్లకు చేరటానికి భారత్‌కు 75, ఇండోనేషియాకు 70, చైనాకు పది సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.అదే ప్రపంచ బ్యాంకు తాజా అంచనాను పరిగణనలోకి తీసుకుంటే 21,343 డాలర్లు, కానీ వికసిత భారత్‌ 2047 నాటికి అంటే మరో 23 సంవత్సరాల్లోనే 18 నుంచి 20వేల డాలర్లకు చేర్చుతామన్నారు మోడీ. మన ప్రభుత్వం,నీతి ఆయోగ్‌ ఇచ్చిన లెక్కలు, సమాచారాన్నే ఆధారం చేసుకొని 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఎక్కడన్నా పోలిక ఉందా ? తాను మానవ మాత్రుడిని కాదని తన పుట్టుక గురించిచెప్పిన మోడీ ఏదో శక్తి నడిపిస్తున్నదని కూడా అన్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మోడీ మరో 75 సంవత్సరాలు ఇలాగే ఉండాలి. చూద్దాం, ఆ మాటలను నమ్మేవారి మనోభావాలను ఎందుకు గాయపరచాలి. త్వరలో చైనాను కూడా అధిగమిస్తామని రంగుల కలను చూపుతున్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మన దేశం ఆరున్నర దశాబ్దాలు చైనా కంటే వెనుక ఉంటుంది.మనదేశం గురించి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆకలితో సహా ఇచ్చిన సూచికలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రపంచబ్యాంకు జోశ్యం మీద ఎందుకు స్పందించలేదు ? మన నీతి ఆయోగ్‌ మన పాలకులు చెప్పినట్లు నివేదికలు రాస్తుంది, వాటినే నమ్మాలని జనానికి చెబుతుంది ? ప్రపంచబ్యాంకు మన విశ్వగురువు కనుసన్నలలో నడవదు, దాని విశ్లేషణను తిరస్కరిస్తే అదిచ్చే అప్పులు మనకు రావు. దాన్నుంచి అప్పులు తీసుకోవటం మానుకున్నారని, అది మోడీ ఘనత అని చెప్పారు. కానీ మన సర్కార్‌ తాజాగా హరిత ఇంథన అభివృద్ధి కోసం 150 కోట్ల డాలర్లు ఇప్పటికే అప్పు తీసుకుంది, అమరావతి నగరం కోసం15వేల కోట్ల రూపాయలకు సమానమైన మరో 180 కోట్ల డాలర్లకు హామీగా ఉండి ఆంధ్ర ప్రదేశ్‌కు అప్పు ఇప్పిస్తామని ఇటీవలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకును తప్పుపడితే అవేవీ రావు.


ప్రపంచ బాంకు చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? గత ఐదు దశాబ్దాలలో జరిగినదాన్నుంచి తీసుకున్న పాఠాలే.2023 చివరి నాటికి ఉన్న స్థితి ప్రకారం 108దేశాలను మధ్య తరహా ఆదాయ తరగతిలో చేర్చారు.ఈ దేశాల్లో ప్రపంచ జనాభాలో నూటికి 75శాతం(ఆరువందల కోట్లు లేదా ప్రతి ముగ్గురిలో ఇద్దరు ) ఉన్నారు. వీరి తలసరి జిడిపి 1,136నుంచి 13,845 అమెరికన్‌ డాలర్ల వరకు ఉంది.అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలు అరవై ఆరు ఉన్నాయి. మలేసియా 13,315 డాలర్లతో 67, చైనా 13,136 డాలర్లతో 68వదిగా ఉంది. మన దేశం మొత్తం 191దేశాలలో 2,71 డాలర్లతో 136వ స్థానంలో ఉంది. మంచి మాటలు చెబుతుంటే సానుకూలంగా (బి పాజిటివ్‌) ఉండాల్సింది పోయి, మన దేశంలో జరుగుతున్నదాన్ని ప్రశ్నించటం ఏమిటనే వారు రెండు రకాలు. ఏదో చెబుతున్నారుగా వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకు అనేవారు ఒకరు, అసలు ప్రశ్నించకూడదు అనే దుష్టాలోచన బుర్రలో పెట్టుకున్న వారు మరొకరు. దేన్నయినా ప్రశ్నించటం, సందేహం వెలిబుచ్చటం మానవనైజం. అదే జంతువుల నుంచి వేరే చేసింది. అందువలన ప్రశ్నించేవారు చెప్పేదాన్లో ఏముందో ఆలోచించాలా వద్దా ? స్వామివారు చెప్పింది వేదవాక్కు దాన్ని ప్రశ్నించకూడదు, ఇది తరతరాల భారత సంస్కృతి అనే పరిరక్షకుల కారణంగానే మన సమాజంలో ఎందుకు అనే జిజ్ఞాస పుచ్చి చచ్చిపోయింది. ఎండిపోయిన నదులను తిరిగి నీటితో నింపుతున్నారు, నిలిచిపోయిన జలలో తిరిగి నీరు వచ్చేట్లు చేస్తున్నారు. అలాంటపుడు చెవుల్లో సీసం పోసుకున్నవారిని ఎవరూ ఏమీ చేయలేముగానీ ఇతరుల్లో ఆలోచనను కలిగించలేమా ? ఎవరూ మనోభావాలను గాయపరచుకోనవసరం లేదు. ఎవడబ్బ సొమ్మని అంటూ భక్త రామదాసు రాముడినే ప్రశ్నించినపుడు ఏమిటీ వంచన అని పాలకులను ప్రశ్నించకూడదా ? బోధించు, సంఘటితపరుచు, పోరాడు అన్న అంబేద్కర్‌ను ఎవరైనా మరచిపోగలరా ! ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగున్నదో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న కమ్యూనిస్టు మహాశయుడు లెనిన్‌ బోధను విస్మరించగలమా ?


ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ ప్రధాన ఆర్థికవేత్త, డెవలప్‌మెంట్‌ ఎకనమిక్స్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఇందర్‌మిత్‌ గిల్‌ ప్రపంచ అభివృద్ధి నివేదిక 2024లో చెప్పిన అంశాలను ఎవరూ విస్మరించకూడదు. ” ప్రపంచ ఆర్థిక ఐశ్వర్యం కోసం జరిగిన పోరులో మధ్య తరహా ఆదాయ దేశాలు ఎక్కువగా విజయం సాధించటం లేదా ఓడిపోయాయి. అయితే అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారేందుకు వీటిలో చాలా ఎక్కువ దేశాలు కాలం చెల్లిన వ్యూహాలను అనుసరించాయి. అవి కేవలం భారీ పెట్టుబడుల మీద లేదా పరిణితి చెందకుండా నవకల్పనల మీద ఆధారపడ్డాయి. నూతన దృక్పధం అవసరం. ముందుగా పెట్టుబడుల మీద కేంద్రీకరించాలి తరువాత విదేశాల నుంచి నూతన సాంకేతికతలను చొప్పించాలి. తరువాత మూడు రకాల వ్యూహాన్ని అనుసరించాలి.ఒకటి సమతుల్యమైన పెట్టుబడులు, నూతన సాంకేతికతల చొప్పింపు,నవకల్పనలుగా అది ఉండాలి. పెరుగుతున్న జనాభా, పర్యావరణ, భౌగోళిక రాజనీతి సంబంధమైన వత్తిడులుంటాయి గనుక తప్పు చేసేందుకు ఆస్కారమివ్వకూడదు. గంగలో మునిగితే కరోనా సోకదు, గోవధ కారణంగానే వయనాడులో ప్రకృతి ప్రళయం సంభవించిందని చెప్పే ప్రబుద్దులు, వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అంటూ అమానుష మనుధర్మాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తున్న శక్తులు చెలరేగుతున్నవేళ ఇలాంటి హితోక్తులను పట్టించుకుంటారా ? దేశాన్ని ముందుకు తీసుకుపోతారా ? ఇలాంటి వారి మార్గదర్శనంలో 75 కాదు, మరో 75 సంవత్సరాలు గడిచినా అమెరికాలో నాలుగోవంతు సంవపదల స్థాయికి చేరగలమా ? ఇప్పుడు కావాల్సింది పుట్టుకతో వృద్దులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు కాదు.పావన నవ జీవన బృందావన నిర్మాతలు, కాదంటారా ?

ఎస్‌సి,ఎస్‌టి వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు : కేంద్ర సర్వీసులు, ఓబిసి మాటేమిటి ? ఇరకాటంలో నరేంద్రమోడీ !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దళితులు, గిరిజనుల్లో సామాజిక న్యాయం జరిగేందుకు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఆయా తరగతుల వర్గీకరణ జరిపి వాటాలను నిర్ణయించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక అంకానికి తెరదించింది.మరో దానికి నాంది పలికింది.దీని కోసం ఎదురు చూసిన వారు ఆనందంతో ఉండగా వ్యతిరేకించిన వారు విచారంలో మునిగిపోయారు. ఈ రెండు భావనలూ వాస్తవమే అయినా తాత్కాలికమే.అంటరానితనంతో సహా మొత్తంగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం జరపాలని కోరుకుంటున్నవారి ప్రయత్నాలకు కాస్త ఇబ్బందే. ప్రతి అస్తిత్వ భావన ఎంతో కొంత చెరపు చేస్తుంది. రాష్ట్రాలలో వర్గీకరణ గురించి ఒక స్పష్టత వచ్చింది. మరి కేరద్ర సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థలు, బాంకులు, ఎల్‌ఐసి వంటి ఆర్థిక, విత్త సంస్థలలో దళితులు, గిరిజనులతో పాటు ఓబిసి వర్గీకరణ మాటేమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. అభివృద్ధి జరగాలంటే రెండు ఇంజన్ల పాలన ఉండాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చిన పెద్దలు కేంద్రం గురించి కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ ఘనత మాదే అంటున్నారు, కొన్ని చోట్ల మౌనంగా ఉంటున్నారు, తమ ముందున్న అంశాల గురించి మాట్లాడరేం ? వర్గీకరణ సమస్యను ముందుకు తెచ్చిన వారు కూడా రాష్ట్రాల గురించి తప్ప కేంద్ర అంశాన్ని ప్రస్తావించకపోవటం వెనుక ఉన్న కారణం ఏమిటి ?


నిచ్చెన మెట్ల సమాజం మనది. అసమానతలు, దారిద్య్రం, ఉపాధి రంగాలలో నెలకొన్న దుస్థితికి ఎక్కడా లేని అంటరానితనం అనే సామాజిక వివక్ష కారణంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఉపశమనం తప్ప శాశ్వత నివారణ కాదు. వాటిని కూడా కొంత మందే పొందుతున్నారు అన్న అసంతృప్తి నుంచి ముందుకు వచ్చిందే వర్గీకరణ. అది న్యాయసమ్మతమే కనుక ఎక్కువ మంది ఆమోదం పొందింది. గతంలో సంస్థానాధీశులు, జమిందార్లు, భూస్వాములు భూమి వదులుకొనేందుకు సిద్దం కాలేదు. అలాగే రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని తరాలు కూడా అదే కోవకు చేరి వర్గీకరణను వ్యతిరేకించిన ఫలితమే కోర్టుల జోక్యం. ఇవి చిన్నయ్య-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వివాదంలో వర్గీకరణ చెల్లదని 2004లో సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఇచ్చిన తీర్పును చెల్లదని, పంజాబ్‌, హర్యానా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సమీక్షించి వర్గీకరణ సబబే అని తాజాగా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా సదరు వర్గీకరణ ఎలా ఉండాలో కూడా న్యాయమూర్తులు చెప్పారు. రాష్ట్రాలు వాటిని ఎలా తమ చట్టాలలో పొందుపరుస్తాయో చూడాల్సి ఉంది. అవి కోర్టుల సమీక్షకు లోబడి ఉండాలని, రాజకీయ దుర్వినియోగం చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. గతంలో క్రీమీ లేయర్‌ (మెరుగైన ఆర్థిక స్థితి) ఓబిసిలకు మాత్రమే వర్తింప చేశారని ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టిలకూ అమలు చేయవచ్చని కూడా పేర్కొన్నది. దళితుల ఉపకులాలైన వాల్మీకులు, మజాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలన్న ఆ రాష్ట్ర చట్టాన్ని 2004 సుప్రీం కోర్టు తీర్పు ప్రాతిపదికన 2010లో పంజాబ్‌-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. దళితులంటే అందరూ ఒకటే అని వారిని విడదీయ కూడదని చెప్పింది. తాజా తీర్పు ఆ వైఖరి తప్పు అని పంజాబ్‌లో చేసిన చట్టం సరైనదే అని చెప్పింది. ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయ పక్షాలు లబ్ది పొందేందుకు చూసినందున పార్టీలపై కచ్చితంగా ఈ తీర్పు ప్రభావం పడనుంది, అదెలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. ప్రతిదాన్నీ రాజకీయం చేసేందుకు చూస్తున్న తరుణమిది.


దళితుల వర్గీకరణ డిమాండ్‌ అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు.కులాల పేర్లు ప్రస్తావించకూడదని అనుకున్నప్పటికీ సందర్భవశాత్తూ తప్పటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ సామాజిక తరగతి వర్గీకరణను కోరుతుండగా, పంజాబ్‌లో అదే తరగతి వ్యతిరేకిస్తున్నది. రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని కులాల వారు తమకు అవకాశాలు తగ్గిపోయాయనే భావనతో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు.ఇది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు కాదు. వర్గీకరణ అనుకూల, వ్యతిరేక భావనలకు పంజాబులో నాంది పలికారు. అకాలీదళ్‌ తన పలుకుబడిని పెంచుకొనేందుకు దళితుల్లో వెనుకబడిన వాల్మీకులు, మజాబీ సిక్కులకు అన్యాయం జరిగిందంటూ వారిని సమీకరించేందుకు పూనుకుంది.దాన్ని ఎదుర్కొనేందుకు 1975 మే ఐదున కాంగ్రెస్‌ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న జ్ఞానీ జైల్‌ సింగ్‌ రిజర్వేషన్ల తురుపుముక్కను ప్రయోగించారు.ప్రభుత్వ శాఖలలో వీలైన మేరకు ఈ రెండు సామాజిక తరగతుల వారికి 50శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని ఆదేశించారు.దీంతో అప్పటికే గణనీయంగా లబ్దిపొందిన మాదిగ సామాజిక తరగతి అవకాశాలు తగ్గిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పంజాబ్‌ జనాభాలో 32శాతం మంది దళితులు ఉన్నారు.రాష్ట్రం వర్గీకరణ అమలు చేస్తున్నప్పటికీ వాల్మీకులు, మజబీల పరిస్థితి పెద్దగా మెరుగుపడిందేమీ లేదు.వర్గీకరణ లేని కారణంగా కేంద్ర సర్వీసులలో వారు తగిన ప్రాతినిధ్యం పొందలేకపోయారు. 2004 ఆంధ్రప్రదేశ్‌ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అక్కడ కూడా సదరు అంశాన్ని సవాలు చేశారు. హైకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. అక్కడి పరిస్థితి గురించి 2007లో వర్గీకరణ సమస్య మీద ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 105 మంది ఐఎఎస్‌లలో పంజాబు దళితుల్లో 42శాతం మంది ఉన్న వాల్మీకులు, మజాబీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆది ధర్మీస్‌గా పిలిచే సామాజిక తరగతి తోలు వృత్తిలో ఉన్న దళితులు ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు. కారణం బ్రిటీష్‌ భారత సైన్యంలో ఉన్న వారికి అవసరమైన బూట్ల తయారీలో వారు నిమగం కావటంతో దానికి పరిమితంగానైనా చదువు సంధ్యలు అవసరం కావటం, ఆర్థిక స్థితి మెరుగై రిజర్వేషన్‌ అవకాశాలను కూడా ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. వ్యవసాయ కార్మికులుగా, పట్టణాలలో పారిశుధ్య కార్మికులుగా ఉన్న దళితులకు చదువుతో అవసరం లేకపోయింది. హర్యానాలో 1994లో దళితులను ఏ-బి తరగతులుగా విభజించి తోలు వృత్తి చేసేవారికి 50శాతం ఇతరులకు మిగతా సగం రిజర్వేషన్లు కల్పించారు.తోలు వృత్తి చేసేవారు ఎక్కువగా లబ్ది పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ గురించి అధ్యయనం చేసిన ఉషా మెహ్రా కమిషన్‌ 2008 నివేదిక నాలుగు ఉపతరగతులుగా రిజర్వేషన్లు అమలు జరపాలని సిఫార్సు చేసింది. దళితుల్లో ముందున్న మాలలు ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఎంపికల్లో 76, 86శాతం మంది ఉండగా మాదిగలు 23, 13శాతాల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నది.దళిత జనాభాలో మాలలు 41శాతం కాగా మాదిగలు 49శాతం ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఉన్నది.


దళితులు, వెనుకబడిన తరగతులలో కొందరు అన్యాయానికి, విస్మరణకు గురౌతున్నారంటూ బిజెపి వారిని తన ఓటుబాంకుగా మార్చుకొనేందుకు పావులు కదిపింది. దానిలో భాగంగానే ఒబిసిల వర్గీకరణ పరిశీలనకు 2017లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. తన నివేదికను 2023జూలై 31న రాష్ట్రపతికి అందచేసింది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు.దానిలో ఉన్న అంశాలు వెల్లడైనా, కేంద్ర ప్రభుత్వం వాటి గురించి అభిప్రాయం వెల్లడించినా లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే రాజకీయ కారణంతో ఆ నివేదికను అటకెక్కించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎందుకు తెప్పించుకోలేదన్నది ప్రశ్న. రాజకీయ కారణాలతోనే కమిషన్‌ గడువును పదమూడు సార్లు పొడిగించారు. ఏడాది గడుస్తున్నా దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఎందుకు కేంద్రానికి పంపలేదు, ఎంతకాలం తన దగ్గర ఉంచుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. ఆ నివేదికను కేంద్రం తిరస్కరిస్తే వేరు, ఆమోదిస్తే పార్లమెంటుకు సమర్పించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి.వేగంగా పనిచేస్తామని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇది ఒక సవాలే. నివేదికలోని అంశాలపై మీడియాలో తిరుగుతున్న లీకు సమాచారం ప్రకారం ఓబిసిలలో ఐదు నుంచి ఆరువేల ఉపతరగతులు ఉన్నారని, వారి జనాభాలో కేవలం ఒకశాతంగా ఉన్న 40 కులాలవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 50శాతం మేరకు రిజర్వేషన్‌ లబ్దిపొందుతున్నట్లు తేలిందట. ఈ నివేదికను తెరవటం అంటే వెంటనే వచ్చే అంశం వెనుకబడిన తరగుతుల జన గణన. దాన్ని రాష్ట్రాలు చేపట్టవచ్చునని బిజెపి తప్పించుకుంటున్నది, ఇంతవరకు ఆ పార్టీ పాలిత రాష్ట్రాలు బుల్డోజర్లు, మత విభజన మీద చూపుతున్న శ్రద్దలో నూరోవంతు కూడా అందుకు చొరవచూపలేదు. దాన్ని బట్టే ఆ పార్టీ చిత్తశుద్ది వెల్లడైంది, ఒక రాష్ట్రంలో బిసిగా ఉన్న వారు మరొక రాష్ట్రంలో ఓసిగానో, కొన్ని చోట్ల దళితులు, గిరిజనులుగానో ఉన్న ఉదంతాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందువలన రాష్ట్రాలు తీసిన జనాభా లెక్కలను కేంద్రం ఆమోదిస్తుందా అన్నది ప్రశ్న. కేంద్రమే నిర్వహించినా అదే సమస్య ఎదురు కావచ్చు, రెండవది జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం నిర్ణయించాలనే డిమాండ్‌కు దారి తీసే అవకాశం కూడా ఉంది.1953లో ఏర్పాటు చేసిన కాకా కలేల్‌కర్‌ తొలి కమిషన్‌ బిసిలను వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరుగతులు అనే రెండుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. మండల్‌ కమిషన్‌లోని సభ్యుడైన ఎల్‌ఆర్‌ నాయక్‌ అణచివేతకు గురైన బిసిలు, మధ్యస్థంగా ఉన్నవారు అనే రెండు ఉపతరగతులుగా విభజించాలని ప్రతిపాదించారు. రోహిణీ కమిషన్‌ నిర్దిష్టంగా ఏమి చెప్పిందో తెలియదు.


చరిత్ర, ఆచరణను చూసినపుడు ఒకే సామాజిక తరగతిగా భావించబడుతున్న కొన్ని కులాల గుంపులో అన్నీ ఒకటిగా లేవన్నది తెలిసిందే.సాధారణ తరగతిగా పరిగణిస్తున్న బ్రాహ్మలలో అధికార వ్యవస్థతో సంబంధాలు కలిగి ఉన్న వారికి-పూజా పునస్కారాలకు పరిమితమైన వారికి ఎంత తేడా ఉన్నదో చూస్తున్నాము. అదే విధంగా మరికొన్ని ఇతర తరగతుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవారికి లేని వారికీ చివరికి ఒకే కులంలో ఉన్నవారిలో గల తేడా ఏమిటో తెలిసిందే.దళితులు, గిరిజనుల్లో కూడా అంతే.వర్గీకరణను వ్యతిరేకించేవారు, అనుకూలించే వారు గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న వాదనలు తెలిసినవే. ఇప్పుడు వాటికి తెరపడింది. వర్గీకరణ జరిపినా ఈ తరగతులకు పూర్తిగా సామాజిక న్యాయం అమలు కాదు. సుప్రీం తీర్పును అమలు జరిపేందుకు అవసరమైన సమాచారాన్ని. సాక్ష్యాలను సేకరించకుండా తొందరపడి చేస్తే కోర్టు లిటిగేషన్లో చిక్కుకోవచ్చు.జనాభా లెక్కలు, ఇతర అంశాలను నవీకరించాల్సి ఉంది. దీనికి మానవ వనరులు, నిధులు కూడా అవసరమే. అందువలన వెంటనే అమలు జరపటం సాధ్యమా కాదా అన్నది కూడా చూడాల్సి ఉంది.ఓబిసి వర్గీకరణ, కేంద్ర సర్వీసుల్లో దళితులు, గిరిజనుల వర్గీకరణను బిజెపి అమలు చేస్తుందా లేదా ?

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా : పధ్నాలుగు పాలస్తీనా విముక్తి సంస్థల ఒప్పందం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మధ్యప్రాచ్య చరిత్రలో మరో చారిత్మాత్మక ఘట్టానికి తెరలేచింది.పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పధ్నాలుగు ప్రజా సంస్థలు, పార్టీలు తమ విబేధాలకు స్వస్తిపలుకుతూ ఐక్యతను పటిష్ట పరిచేందుకు 2024జూలై చివరి వారంలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. వీటిలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఫతా – హమస్‌ కూడా ఉండటం విశేషం.ఈ ఒప్పందం పధ్నాలుగు సంస్థల ఐక్యత, అవి సమాధానపరుచుకోవటానికి అంకితమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ప్రకటించాడు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో సాగిస్తున్నదాడులు, అరబ్బు ప్రాంతాల ఆక్రమణలు కొనసాగిస్తున్న పూర్వరంగంలో ఈ ఒప్పందం కుదిరింది. పాలస్తీనా పౌరులందరికీ ఏకైక అధీకృత ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ(పిఎల్‌ఓ)ను గుర్తించటం దీనిలో కీలకమైన అంశం.ప్రస్తుతం కొనసాగుతున్న గాజా మారణకాండ అనంతర పాలనతో పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.పశ్చిమాసియాలో చిచ్చుపెట్టి తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకొనేందుకు అమెరికా కుట్రలు పన్నుతుండగా వాటిని వమ్ముచేసే క్రమంలో ఐక్యతను సాధించేందుకు చైనా తన పలుకుబడి, అనుభవాన్ని వినియోగిస్తున్నది. ఈ క్రమంలో ఇది రెండవ ఉదంతం. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. తాత్కాలిక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు,భవిష్యత్‌ ఎన్నికలకు ముందు ఐక్య నాయకత్వ పొందిక, నూతన పాలస్తీనా జాతీయ మండలికి స్వేచ్చగా ఎన్నికలు, ఇజ్రాయెల్‌ దాడుల పూర్వరంగంలో ఐక్యతా ప్రకటన. తాము చారిత్రాత్మక కూడలిలో ఉన్నామని, తమ పోరాటాలకు జనం స్పందిస్తున్నందున ఇంతకు మించి మరొక మార్గం లేదని చర్చలలో పాల్గన్న సంస్థల ప్రతినిధులు చెప్పారు.గాజాలో జరుగుతున్న మారణకాండే ఈ ఐక్యత వెనుక ప్రధాన కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఐక్యతా ఒప్పందం పాలస్తీనా పార్టీల అంతర్గత వ్యవహారం, అయితే అంతర్జాతీయ సమాజ మద్దతు లేకుండా సాధించలేరని చైనా ప్రతినిధి లిన్‌ జియాన్‌ చెప్పాడు. ఈ ఒప్పందాన్ని వమ్ము చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సకల యత్నాలూ చేస్తాయి.ముఖ్యంగా ఫతా సంస్థను రెచ్చగొట్టేందుకు, వత్తిడి పెంచేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి.


పాలస్తీనా విముక్తి సంస్థ అనేక పార్టీలు, సంస్థలతో కూడిన ఒక ఉమ్మడి వేదిక. యాసర్‌ అరాఫత్‌ దీని నేతగా ఉన్న సంగతి తెలిసిందే.1993లో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్‌ ఆక్రమిత గాజా-పశ్చిమ గట్టు ప్రాంతంలో పాలస్తీనా సాధికార సంస్థ(పిఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో, అదే విధంగా పిఎల్‌ఓలో కూడా ఫతా అనే పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉంది.ఈజిప్టు కేంద్రంగా పని చేస్తున్న ముస్లిం సోదరత్వం అనే సంస్థ ప్రభావం పక్కనే ఉన్న గాజా ప్రాంతంపై ఉంది. దానితో సంబంధం ఉన్న శక్తులు 1987లో హమస్‌గా ఉనికిలోకి వచ్చాయి. పిఎల్‌ఓ, దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో దానికి ఏకీభావం లేదు. ఓస్లో ఒప్పందాలలో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌ ఉనికిని అది గుర్తించలేదు. పాలస్తీనా సాధనకు సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గాజాలో తిరుగులేని రాజకీయ,మత,సాయుధ శక్తిగా ఎదగటమే కాదు, ఎన్నికల్లో తన సత్తాను చూపి అధికారానికి కూడా వచ్చింది.పశ్చిమగట్టు ప్రాంతంలో ఫతా పార్టీ అధికారంలో ఉంది.పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు తమవైన పద్దతుల్లో పోరాడుతున్నాయి.కొన్ని అంశాలు, పద్దతులపై వాటి మధ్య ఏకీభావం లేని మాటవాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ అణచివేతకు, తాజాగా గాజాలో మారణకాండకు పూనుకుంది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా హమస్‌ గుర్తించకపోయినా 1967నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా ఏర్పాటు జరగాలని 2017లో అది చేసిన ప్రతిపాదనకు అర్ధం పరోక్షంగా అంగీకరించినట్లే.


పాలస్తీనా నేషనల్‌ ఇనీషియేటివ్‌ సంస్థ అధ్యక్షుడు ముస్తఫా బర్గౌటీ తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ అన్ని పక్షాలూ పిఎల్‌ఓలో చేరేందుకు అంగీకరించాయని అదొక్కటే పాలస్తీనియన్ల నిజమైన ప్రతినిధి అన్నాడు. రెండు భిన్న పార్టీల పాలనలో ఉన్న పాలస్తీనాలోని గాజా-పశ్చిమ గట్టు ప్రాంతాలను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తెచ్చేందుకు 2017లో హమస్‌-ఫతా మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాలేదు.2007వరకు గాజా కూడా ఫతా నాయకత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అదే ఏడాది అధికారానికి వచ్చిన హమస్‌ యంత్రాంగం ఫతాను అక్కడి నుంచి బహిష్కరించింది. కొన్ని అరబ్‌ దేశాలూ, ఈజిప్టు తెచ్చిన ఒత్తిడి మేరకు పదేండ్ల వైరాన్ని విరమించుకొనేందుకు చేసుకున్న ఒప్పందం విఫలమైంది. పాలస్తీనా అధారిటీ ప్రధాన మంత్రి రామీ హమదల్లా 2018లో గాజా సందర్శనకు వచ్చినపుడు హత్యాయత్నం జరిగింది. దానికి హమసే కారణమని ఫతా ఆరోపించింది. గతం కంటే నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకొనేందుకు తాజా ఒప్పందంలో అంగీకరించినట్లు ముస్తఫా చెప్పారు. మొత్తంగా పాలస్తీనాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నందున దానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయ సాధనతో ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై కూడా ఒప్పంద పక్షాల్లో స్పష్టత ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇతర దేశాల అండచూసుకొని ఇజ్రాయెల్‌ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అది ముగిసిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా ? బీజింగ్‌ ఐక్యతా చర్చల్లో పాల్గొన్న హమస్‌ ప్రతినిధి హసమ్‌ బద్రన్‌ మాట్లాడుతూ ధ్వంసమైన ప్రాంతాల పునర్‌నిర్మాణం, తగిన సమయంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం జరిగిందని, అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చని, అది కాల్పుల విరమణకు దోహదం చేయవచ్చన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లో హమస్‌-ఫతా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.తరువాత చైనా నేత షీ జింపింగ్‌ మధ్య ప్రాచ్య దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపి అంతర్జాతీయ శాంతి సభ జరపటానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈప్రక్రియకు ముందు ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య చెలిమి అసాధ్యం అనుకున్న దాన్ని చైనా సుసాధ్యం గావించింది.మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికాతో పోలిస్తే చైనా పాత్ర పరిమితమే. అయినప్పటికీ తంపులు పెట్టే అమెరికాతో పోలిస్తే దానికి భిన్నమైన వైఖరితో ఉన్నందున బీజింగ్‌ పట్ల విశ్వసనీయత పెరుగుతోంది.


గాజాలో మారణకాండ పూర్వరంగంలో అంతర్జాతీయ సమాజ అభిప్రాయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మారుతున్నది. గత 57 సంవత్సరాలుగా తూర్పు జెరూసలెం, గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలను ఆక్రమించటం చట్టవిరుద్దమని అంతర్జాతీయ న్యాయ స్థానం(ఐసిజె) వ్యాఖ్యానించింది. ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టు ప్రాంతంలలో పాలస్తీనా అధారిటీ పాలన కొనసాగుతున్నప్పటికీ యూదుల నివాసాల ముసుగులో ఇజ్రాయెల్‌ దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నందున ఫతా సంస్థ వైఖరిలో మార్పురాక తప్పలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.7చదరపు కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్‌ ఆక్రమించిందని పీస్‌ నౌ అనే స్వచ్చంద సంస్థ పేర్కొన్నది.గత రెండు దశాబ్దాల్లో ఆక్రమించినదానికంటే ఇది ఎక్కువ. అమెరికా మధ్యవర్తిత్వలో 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టును ఏబిసి ప్రాంతాలుగా విభజించారు. ఏ తరగతి పాలస్తీనా అధారిటీ ఏలుబడిలో, బి ప్రాంతాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఉమ్మడి పాలన, సి ప్రాంతాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంటాయి. మూడవ ప్రాంతంలో యూదుల నివాసాల ఏర్పాటుతో పాటు అరబ్బు రైతాంగాన్ని ఇజ్రాయెల్‌ క్రమంగా తొలగిస్తున్నది.పాలస్తీనా పశ్చిమ గట్టు ప్రాంతంలో 1990దశకంలో ఇజ్రాయెల్‌ తీసుకువచ్చిన యూదుల సంఖ్య రెండున్నర లక్షలు కాగా ప్రస్తుతం ఏడు లక్షలకు పెరిగారు. పాలస్తీనా రాజధానిగా ఉండే తూర్పు జెరూసలెంలో అలాంటి వారిని 800 నుంచి మూడు వేలకు పెంచారు. గాజాలో మారణకాండ ప్రారంభించిన ఇజ్రాయెల్‌ పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా దాడులకు పూనుకుంది. ఇప్పటి వరకు 513 మంది పాలస్తీనియన్లను మిలిటరీ చంపివేసింది.వందలాది మందిని గాయపరచింది.ప్రతి ఏటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.


ఒప్పందాన్ని తామింకా సమీక్షించలేదంటూ గాజాలో హమస్‌ పాత్రను తాము సమర్ధించే ప్రసక్తే లేదని అమెరికా ప్రకటించింది. ఒక ఉగ్రవాద సంస్థకు ప్రభుత్వంలో పాత్ర ఉండకూడదని ప్రతినిధి మిల్లర్‌ చెప్పాడు.ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత రెండు ప్రాంతాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. పాలస్తీనా ఐక్యతా ఒప్పందం అమలు జరుగుతుందా ? భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉంటాయా, భవిష్యత్‌లో హమస్‌ పాత్ర ఏమిటి అంటూ మీడియా, ప్రభుత్వాలలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు చాణక్య నీతిని ప్రయోగించేందుకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు చూస్తున్నాయి. సందేహాలు లేవనెత్తుతున్నవారందరినీ ఒకేగాటన కట్టలేము గానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ మొత్తానికే ఎసరు పెడుతున్న సామ్రాజ్యవాదుల కుట్ర, చర్యల కారణంగా వాటిని పరిష్కరించుకొనే పరిణితిని పాలస్తీనా సంస్థలు ప్రదర్శిస్తాయి.దానిలో పెద్ద ముందడుగే తాజా ఒప్పందం.ఒప్పందమైతే జరిగింది గానీ దాని అమలు గురించి అనేక మందికి సందేహాలున్నా అవసరాలు వివిధ పక్షాల వైఖరుల్లో మార్పులకు దోహదం చేస్తున్నాయి.అనేక పరిణామాలను చూసినపుడు ప్రతి పాలస్తీనా సంస్థ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ఐక్యత కోసం రాజీలకు, సర్దుబాట్లకు సిద్దంగాక తప్పని స్థితిలో పడ్డాయి. మొదటికే మోసం తెస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించటం ప్రధమ కర్తవ్యంగా భావించాయి.

వెనెజులా ఎన్నికల్లో ఫాసిస్టులకు శృంగభంగం : మూడోసారి సోషలిస్టు మదురో విజయం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


జూలై 28న జరిగిన వెనెజులా ఎన్నికల్లో అమెరికా మద్దతు ఉన్న మితవాద,ఫాసిస్టు శక్తులు చావు దెబ్బతిన్నాయి. సోషలిస్టు పార్టీ నేత నికోలస్‌ మదురో మూడవ సారి ఎన్నికయ్యాడు.పదవీ కాలం ఆరు సంవత్సరాలు(2031వరకు) పదవిలో ఉంటాడు. ఈ ఎన్నికల్లో మదురోను ఓడించేందుకు అమెరికా నాయకత్వంలోని వామపక్ష వ్యతిరేకశక్తులన్నీ తీవ్రంగా ప్రయత్నించాయి.ఎన్నికల ఫలితాల తరువాత కూడా అక్రమాలు జరిగాయని, గుర్తించబోమని నానా యాగీ చేస్తున్నాయి.మరోవైపు దేశమంతటా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. మదురోకు మద్దతుగా కూడా అనేక చోట్ల జనం వీధుల్లోకి వస్తున్నట్లు వార్తలు. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన వివరాల మేరకు మదురోకు 53.67శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి ఎడ్మండో గోన్‌సాల్వెజ్‌కు 46.33శాతం వచ్చాయి. మరోవైపున ఇతగాడిని సమర్ధించిన డెమోక్రటిక్‌ యూనిటీ ఫ్లాట్‌ ఫాం(డియుపి) గోన్‌సాల్వెజ్‌కు 69.46శాతం రాగా మదురోకు 30.54శాతం వచ్చినట్లు పోటీగా ఫలితాలను ప్రకటించింది. ఇది అమెరికా కనుసన్నలలో పనిచేసే ప్రతిపక్ష పార్టీలు, శక్తుల కూటమి. మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శలకు దిగిన శక్తుల మద్దతుదార్లు అనేక చోట్ల దివంగత మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ విగ్రహాలు, చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారు. చావెజ్‌ రాజకీయ వారసుడిగా మదురో రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి కొందరు ప్రదర్శకులు అధ్యక్ష భవనంపై దాడికి వెళుతున్నట్లు, దేశమంతటా రోడ్ల దిగ్బంధనానికి పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని నినాదాలు చేస్తున్నారు. ముందే ఇలాంటి పరిణామాలను ఊహించిన కారణంగా రాజధాని కారకాస్‌ నగరంతో సహా దేశమంతటా పోలీసు,జాతీయ భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష గోన్‌సాల్వెజ్‌కు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయని, ఫలితాలు వాటిని ప్రతిబింబించలేదని అమెరికా వ్యాఖ్యానించింది.ప్రజల ఆకాంక్షను ఫలితాలు ప్రతిబింబించలేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వ్యాఖ్యానించాడు. చైనా, రష్యా, క్యూబా మరికొన్ని దేశాలు మదురోను అభినందించాయి. 2018 ఎన్నికల్లో కూడా సర్వేలన్నీ మదురోకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష అభ్యర్థి ముందంజలో ఉన్నట్లే చెప్పాయి. అవన్నీ మదురోను వ్యతిరేకించే శక్తులు వండి వార్చిన కతలు తప్ప మరొకటి కాదు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కూల్చివేసేందుకు కుట్ర జరిగిందని అధ్యక్షుడు మదురో టీవీ ప్రసంగంలో దేశ పౌరులకు చెప్పాడు. దీని గురించి ముందే తెలుసని అయితే చట్టాన్ని గౌరవిస్తామని, తన మద్దతుదార్లు ప్రశాంతంగా ఉండాలని కోరాడు.”నేను నికోలస్‌ మదురో మోరోస్‌ వెనెజులా బొలివేరియన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాను. మన ప్రజాస్వామ్యం, చట్టం, పౌరులను కాపాడతాను ” అని ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే మదురో ప్రకటించాడు.


2013లో ఛావెజ్‌ మరణించిన తరువాత అధికారానికి వచ్చిన నికోలస్‌ మదురో అనేక సవాళ్లు, కుట్రలను ఎదుర్కొంటున్నాడు. ప్రధాన రాబడి వనరైన చమురు అమ్మకాలు, రవాణాపై అనేక ఆంక్షలు, దిగ్బంధనాలతో అమెరికా, లాటిన్‌ అమెరికాలోని దాని మిత్రదేశాలు, ఐరోపా యూనియన్‌ దేశాలూ ఇబ్బందులు పెట్టేందుకు, జనాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన వెలువడింది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష వాదులను సమర్ధించేదేశాలు మదురోకు శుభాకాంక్షలు పలకగా వ్యతిరేక దేశాలు ప్రతికూలంగా స్పందించాయి. వెనెజులా కమ్యూనిస్టు పార్టీతో సహా చిలీలోని వామపక్ష ప్రభుత్వం ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు వివరాలను వెల్లడించాలని ప్రకటించటం గమనించాల్సిన అంశం. సకాలంలో ఫలితాలతో పాటు పోలింగ్‌ కేంద్రాల వారీ ఓటింగ్‌ వివరాలను వెంటనే ప్రకటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కోరినట్లు ప్రతినిధి ప్రకటించాడు. మదురోను వ్యతిరేకించేదేశాలు రంగంలోకి దిగాయి. అమెరికా దేశాల సంస్థ (ఓఏఎస్‌) అత్యవసర సమావేశం జరిపి ఫలితాలను సమీక్షించాలని కోరుతున్నాయి. వాస్తవాలు తేలేవరకు వెనెజులాతో దౌత్య సంబంధాలను స్ధంభింపచేస్తున్నట్లు పనామా ప్రకటించింది. పూర్తి సమీక్ష జరిపే వరకు కారకాస్‌లో ఉన్న తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపిస్తున్నట్లు పేర్కొన్నది. ఫలితాలను అంగీకరించని, వ్యతిరేకించిన పనామా, పెరు, అర్జెంటీనా, చిలీతో సహా ఏడు దేశాల నుంచి తాను కూడా దౌత్య సిబ్బందిని ఉపసంహరిస్తున్నట్లు మదురో ప్రకటించాడు. ఎన్నికల పరిశీలకులను పంపిన కార్టర్‌ సెంటర్‌ కూడా పోలింగ్‌ కేంద్రాల వారీ ఫలితాలను ప్రకటించాలని కోరింది.ఈ సారి ఎలాగైనా మదురో, వామపక్ష శక్తులను దెబ్బతీస్తామని కలలు గన్న తిరోగామి శక్తులు ఆశాభంగం చెందినట్లు స్పందనలు వెల్లడించాయి. ఫలితాలను ఆలశ్యం చేసేందుకు, లెక్కింపు ప్రక్రియను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అటార్నీ జనరల్‌ తారెక్‌ సాబ్‌ ప్రకటించాడు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్న లిమా విదేశీ శక్తుల బృందాన్ని ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి యవన్‌ గిల్‌ ప్రకటించాడు. తొత్తు ప్రభుత్వాన్ని రుద్దేందుకు ఇప్పుడే కాదు 2019లో కూడా ప్రయత్నించారని అన్నాడు.వెనెజులా చట్టం ప్రకారం స్వతంత్ర పరిశీలకు ప్రతి పోలింగ్‌ బూత్‌లో లెక్కింపు జరిగి ఫలితాలను సరి చూసేందుకు, రాతపూర్వంగా ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది. ఫలితాలు వెలువడి మదురో గెలిచినట్లు ప్రకటించిన తరువాత అంతర్జాతీయ పరిశీలకు తనిఖీకి అనుమతించాలని ప్రతిపక్షాలు కొత్త పల్లవి అందుకున్నాయి.


గత పాతిక సంవత్సరాలుగా వెనెజులాలో వామపక్ష ఉద్యమం, ప్రభుత్వాలను కూల్చివేసేందుకు దేశంలోని తిరోగామి శక్తులు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికా చేయని కుట్ర లేదు. ఫాసిస్టు శక్తులు ఎప్పటికప్పుడు ఊసరవెల్లి మాదిరి రూపాన్ని మార్చుకొని ముందుకు వస్తున్నాయి.జనంలో వాటికి ఆదరణ లేకపోవటంతో జాతీయవాదంతో ఆకర్షించాలని చూస్తున్నాయి. అమెరికా తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఎన్నికుట్రలు చేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధికారానికి వచ్చిన వామపక్షశక్తులు ఉన్నంతలో కార్మికవర్గాన్ని కాపాడేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాల కారణంగా వాటి ఆటలు సాగటం లేదు. దీని అర్ధం వెనెజులాకు వాటితో ముప్పు లేదని కాదు.మదురో అనుసరిస్తున్న విధానాలన్నీ సరైనవే అని కాదు. వెనెజులా ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం క్రమంగా తగ్గుతున్నది. మదురో విధానాలను కాపాడుకోవాలని జనాల్లో కోరిక బలంగా ఉంటే ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం పెరగాల్సి ఉంది. కానీ 2013లో 79.65శాతం మంది పాల్గొంటే 2018లో 45.73శాతానికి పడిపోయింది. ఈ సారి 44.85శాతానికి తగ్గింది. 2018 ఎన్నికల్లో మదురోకు 67.85శాతం ఓట్లు రాగా ఇప్పుడు 53.67శాతమే వచ్చాయంటే కొన్ని తరగతుల్లో అసంతృప్తి ఉందన్నది స్పష్టం. పోయిన సారి మదురో మీద పోటీచేసిన ప్రత్యర్ధులలో ఇద్దరికి 20.93-10.75 శాతాల చొప్పున వచ్చాయి. ఈ సారి ఒకే అభ్యర్ధి రంగంలో ఉన్నాడు. ఛావెజ్‌ అనుసరించిన సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలను మదురో కూడా కొనసాగిస్తున్నప్పటికీ అంతర్గత విధానాల మీద వెనెజులా కమ్యూనిస్టు పార్టీ(పిసివి) ఇతర కొన్ని వామపక్ష పార్టీలు విమర్శనాత్మక వైఖరితో ఉన్నాయి.లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన ఇతర వామపక్ష నేతల మాదిరిగానే మదురో కూడా పెట్టుబడిదారీ విధాన పునాదులను ముట్టుకోకుండా సంస్కరణలతో, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమాన్ని విబేధించిన వామపక్ష శక్తులను సహించటం లేదని కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది.


గతంలో ఛావెజ్‌, మదురో ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి సంవత్సరాలలో మదురో విధానాలతో విబేధిస్తున్నది. తన విధానాలను విమర్శించిన వామపక్ష శక్తులను ప్రతి పక్షపార్టీల ఏజంట్లుగా మదురో దాడి చేశాడు. ఛావెజ్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తే ఏ కమ్యూనిస్టు లేదా వామపక్ష పార్టీగానీ ప్రతిపక్ష మితవాద శక్తులను సమర్దించిన దాఖలా లేదు. విమర్శనాత్మకంగా ఉంటూనే సోషలిస్టు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంటులో ఒక స్థానం, ఎనిమిది మంది మేయర్లు ఉన్నారు. తమ పార్టీ నేతల మీద విచారణకు ఆదేశించిన ప్రభుత్వ చర్యను వెనెజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫిగుయెరా గోన్‌సాల్వెజ్‌ ఖండించాడు.పార్టీ నిబంధనావళి ప్రకారం ఎన్నికైన నేతల స్థానే వేరే వారిని ఎంచుకోవాలని కోర్టు చెప్పటం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పార్టీ విమర్శించింది. కోర్టు సూచించిన ఏడుగురు పార్టీ సభ్యులు కూడా కాదని అందువలన అది చట్టవిరుద్దమని కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం పేర్కొన్నది. వారితో పోటీ పార్టీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయించారు. ఛావెజ్‌ హయాంలో ప్రారంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను మదురో రద్దుచేశారని, పౌరసేవలు దిగజారినట్లు కూడా పేర్కొన్నది.కార్మికుల ఆదాయాలు, హక్కులకు కోత పెట్టిందని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వేతనాల పెంపుదల, ప్రైవేటు గుత్త సంస్థల రద్దు వంటి విప్లవాత్మక చర్యలు చేపట్టటానికి బదులు ఉదారవాద సంస్కరణలకే పరిమితం అయ్యారని పేర్కొన్నది. అమెరికా డాలర్ల చలామణిని స్వేచ్చగా అనుమతించటాన్ని, మారకపు విలువపై అదుపును వదలివేశారని, దిగుమతులపై పన్ను రద్దు చేయటాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు తప్పు పట్టారు.మదురో ఆచరణాత్మక విధానాలను అనుసరిస్తున్నారని కొందరు సమర్దిస్తే నయా ఉదారవాద విధానాలు తప్ప మరొకటి కాదని కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. అంతే కాదు, తనతో పాటు కలసివచ్చే వామపక్ష పార్టీలను కలుపుకొని ప్రజా విప్లవ ప్రత్యామ్నాయం పేరుతో ఒక కూటమని ఏర్పాటు చేసింది.ఈ కూటమిలో కమ్యూనిస్టు పార్టీతో సహా మరో నాలుగు పార్టీల నాయకత్వాన్ని మార్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం మీద పోలీసులు దాడి చేశారు. ఇటీవలి కాలంలో అనేక రంగాలలో కార్మికులు జరుపుతున్న పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది, దీంతో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది కార్మికుల పోరాటాలు అంతకు ముందు ఏడాడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెరిగాయి.కమ్యూనిస్టు పార్టీ లేదా మరొక పార్టీలో అంతర్గత సమస్యలేవైనా ఉంటే వారు తేల్చుకుంటారు తప్ప కోర్టులు నాయకత్వాన్ని సూచించటం అప్రజాస్వామికం.

రైతుల పంపుసెట్లకు మీటర్ల ఒప్పందం నిజమేనా : బిజెపి మద్దతు ! వ్యతిరేకించిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ రద్దు చేస్తాయా ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


విద్యుత్‌ వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి చేసిన ప్రకటన, సభకు చూపిన పత్రాలు వివాదాస్పదమయ్యాయి.తాము వ్యవసాయ పంపుసెట్లకు తప్ప మిగిలిన వాటికి మాత్రమే స్మార్టు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నామని, ఆ విషయాన్ని దాచి తమపై అవాస్తవాలు చెప్పారని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీ ట్రాన్స్‌ఫర్లకు మీటర్లు పెడతామని అంగీకరించారని, రైతులకు కూడా అక్కడి నుంచే సరఫరా జరుగుతుంది గనుక వ్యవసాయ సరఫరాకూ మీటర్లు పెట్టేందుకు సమ్మతించినట్లే కదా అని కాంగ్రెస్‌ చెబుతోంది. ఒప్పంద పత్రాలను జనాలకు అందుబాటులో ఉంచితే నిజానిజాలేమిటో అందరికీ సుబోధకం అవుతుంది.2017లో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏమి ఉంది అన్నది పక్కన పెడితే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పంపుసెట్లకు మీటర్లు పెట్టలేదన్నది వాస్తవం. అందువలన నిజంగా వ్యవసాయ పంపుసెట్లకు తప్ప అనే పదం ఒప్పందంలో ఉందా లేదా అన్నది ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.


ఇప్పటికే విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి కదా స్మార్ట్‌ మీటర్లంటే ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు.ప్రయివేటీకరించే రంగాలలో విద్యుత్‌ పంపిణీ కూడా ఒకటి. సెల్‌ఫోన్లకు రెండు పథకాలు ఉన్నాయి. ఒకటి ముందుగానే డబ్బు చెల్లించేది, రెండవది తరువాత బిల్లు కట్టేది. విద్యుత్‌ రంగంలో స్మార్టు మీటర్లు అంటే ముందుగా సొమ్ము చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. ఆ మేరకు వినియోగించగానే సరఫరా ఆగిపోతుంది. వాడకం తరువాత బిల్లు చెల్లించే పథకాలనూ పెట్టవచ్చు. అసలు ఈ విధానం ఎందుకు, చెప్పిన కారణాలేమిటి ? వినియోగించే ప్రతి యూనిట్‌కూ లెక్కతేలాలని, మీటర్లు లేకుండా వినియోగించేవారిని నిరోధించేందుకు, ఖర్చు మొత్తం వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అని చెప్పారు. ప్రయివేటీకరించిన తరువాత కొనుగోలు చేసిన కార్పొరేట్‌ సంస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం ఒకటైతే, ముందుగానే చెల్లించే జనం సొమ్ముతో పెట్టుబడి పెద్దగా లేకుండా సదరు సంస్థలకు లాభాలు అప్పగించే మహత్తర ఆలోచన దీనివెనుక ఉంది. వినియోగదారులు చెల్లించే మొత్తాలనే జన్‌కోలకు చెల్లిస్తారు. ఇతర ఖర్చులకూ వినియోగిస్తారు.ప్రస్తుతం రైతాంగానికి కొన్ని రాష్ట్రాలలో ఉచితంగా అందచేస్తున్నారు, కొందరికి సబ్సిడీలు ఇస్తున్నారు. స్మార్టు మీటర్లు పెడితే అందరూ ముందుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయాలి. ఎలా అంటే గతంలో వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించి చెల్లిస్తే సిలిండర్లు ఇచ్చేవారు. ఇటీవల దాన్ని మార్చి ముందుగా మొత్తం చెల్లించేట్లు చేశారు. తరువాత సబ్సిడీ మొత్తం వారి బాంకు ఖాతాలలో జమ చేస్తున్నారు. విద్యుత్‌కూ అంతే చేయనున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తే వినియోగదారులకు బదలాయిస్తారు. చేతులేత్తేసినా చేసేదేమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు సబ్సిడీ సొమ్మును నెలల తరబడి చెల్లించటం లేదు, ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించకుండానే వాడుతున్నాయి. దీంతో పంపిణీ సంస్థ(డిస్కామ్‌లు)లు అప్పుల పాలవుతున్నాయి.ప్రైవేటీకరిస్తే వాటిని కొనుగోలు చేసే సంస్థలు ముందుకు రావు. అందుకే రుణాలు లేకుండా చూసేందుకు విధానపరంగా ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.


దానిలో భాగంగానే నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే 2015లో ఉజ్వల డిస్కామ్‌ అస్యూరెన్సు యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది.దీని పొట్టి రూపమే ”ఉదరు”. తొలుత ప్రకటించినదాని ప్రకారం 2018-19 నాటికి విద్యుత్‌ ప్రసార నష్టాలను 22 నుంచి 15శాతానికి తగ్గించాలి.విద్యుత్‌ కొనుగోలు,సరఫరా, ప్రసారానికి అయ్యే ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి రాబట్టాలి. ఇందుకు గాను స్మార్ట్‌ మీటర్లను విధిగా పెట్టించి నిర్వహణా సామర్ధ్యాన్ని మెరుగుపరచాలి. పొదుపు చర్యల్లో భాగంగా ఎల్‌ఇడి బల్బులను ప్రోత్సహించాలి, ఇదే మాదిరి వ్యవసాయ పంపుసెట్లు, ఫ్యాన్లు, ఎయిర్‌ కండీషనర్లను ప్రోత్సహించాలి. విద్యుత్‌ ఖర్చు, వడ్డీ భారాన్ని, నష్టాలను తగ్గించాలి.సరసమైన ధరలకు విద్యుత్‌ను అందించాలి. ఇలాంటి చర్యలను చేపట్టిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించాలి.ఇది ఘోరంగా విఫలం కావటంతో తొలుత ప్రకటించిన లక్ష్యాలను కొన్నింటిని 2021జూన్‌లో సవరించారు. వాటి ప్రకారం ప్రైవేటు రంగంలో ఉన్న పంపిణీ సంస్థలు తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నవాటి ఆర్థిక, నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచాలి.మౌలిక సదుపాయాల పటిష్టతకు ఆర్థిక సాయం చేసేందుకు కొన్ని షరతులను విధించాలి.ప్రసార నష్టాలను 2024-25నాటికి 12-15శాతానికి తగ్గించాలి. సరఫరా ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి, ఆధునిక పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.పైన చెప్పుకున్న స్మార్ట్‌ మీటర్ల కథ ఈ పధకంలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో అందిన కాడికి అప్పులు చేసిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌ వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఎఫ్‌ఆర్‌బిఎం అర్హతకు మించి అదనంగా 0.5 అప్పులు తెచ్చుకొనే ” ప్రోత్సాహాన్ని ” పొందింది. తెలంగాణాలో విద్యుత్‌ మోటార్లు ఎక్కువగా ఉన్నందున అంగీకరిస్తే రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది గనుక బిఆర్‌ఎస్‌ సర్కార్‌ వాటి జోలికి పోకుండా పంపిణీ ట్రాన్సఫార్మర్లకు మీటర్లు పెట్టి లెక్క తేలుస్తామని, ఇతర వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకుంది.


రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు, పార్టీలు అధికారంలోకి వచ్చాయి. స్మార్టు మీటర్లను రెండచోట్లా బిజెపి సమర్ధించింది, ఇప్పటికీ సమర్ధిస్తున్నది. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌, వైసిపి విధానాలకు మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసిపి తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని గానీ, కొనసాగిస్తామనీ ఇంతవరకు స్పష్టం చేయలేదు.తెలంగాణాలో వ్యతిరేకించిన కాంగ్రెస్‌దీ ఇప్పుడు అదే పరిస్థితి. అమలు చేయకపోతే పంపిణీ సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతోంది తప్ప, స్మార్టు మీటర్లు పెట్టేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఏం చేస్తారో చూడాలి.మరోవైపు విద్యుత్‌ సంస్కరణలను అమలు జరిపి తీరుతామని బిజెపి గట్టిగా చెబుతోంది. పంపిణీ సంస్థలు అప్పుల్లో కూరుకుపోవటం గురించి రాజకీయపరమైన దాడి చేస్తున్నది. అనేక రాష్ట్రాలలో అంగీకరించినందున రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు వ్యతిరేకించాలని బిజెపి అంటున్నది. ఇది అసంబద్ద వాదన. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సిఇఏ) కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాని నివేదిక 2023 ప్రకారం 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక,తెలంగాణా, పంజాబ్‌ రాష్ట్రాలు మాత్రమే రైతాంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నాయి. మీటర్లు లేకుండా పంపుసెట్ల సామర్ధ్యాన్ని బట్టి మరో ఎనిమిది రాష్ట్రాలు రేట్లు నిర్ణయించాయి. ఒక హార్స్‌ పవర్‌కు బీహార్‌లో నెలకు రు.800, గుజరాత్‌లో రు.200, హర్యానాలో పదిహేను హెచ్‌పి వరకు రు.12, అంతకు మించితే రు.15, కాశ్మీరులో పది హెచ్‌పి వరకు రు.205, 11 నుంచి 20కి రు.222, ఇరవై మించితే రు.1,415, మహారాష్ట్రలో జోన్లు, హార్స్‌పవర్‌ ప్రాతిపదికన గరిష్టంగా రు.422 నుంచి కనిష్టంగా రు.265వరకు, పంజాబ్‌లో ప్రభుత్వ సబ్సిడీ లేని పంపుసెట్లకు రు.419, రాజస్తాన్‌లో రు.775, 955 చొప్పున రెండు తరగతులుగా, ఉత్తర ప్రదేశ్‌లో రైతాంగానికి రు.170( లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం దీన్ని రద్దు చేశారు, రు.1,500 కోట్లు సబ్సిడికి కేటాయించినట్లు ప్రకటించారు.), ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ నిర్వహణలో ఉన్న పంపుసెట్లకు 100 హెచ్‌పివరకు రు.3,300 వసూలు చేస్తున్నారు. అందువలన ఈ రాష్ట్రాలలో మీటర్లు పెట్టినందున రైతులకు జరిగే నష్టం లేదు, ఎలాగూ సొమ్ము చెల్లిస్తున్నారు. అందువలన అవి అంగీకరించాయంటే వేరు, ఉచితంగా ఇచ్చే వాటి సమస్య వేరు. అయితే మీటర్లు పెట్టి ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే అదనపు భారం మోపితే వచ్చే వ్యతిరేకతను అక్కడి పార్టీలు అనుభవించాల్సి ఉంటుంది.


ఇక పంపిణీ సంస్థల నిర్వహణ ఇతర పార్టీల ఏలుబడి ఉన్న చోట కంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏమైనా మెరుగ్గా ఉందా ?బిజెపి వారు తెలంగాణాలో తరచూ హైదరాబాదు పాత బస్తీలో విద్యుత్‌ చౌర్యం గురించి చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్నవారిలో ఒక్క ముస్లింలే విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నట్లు ? హిందువులుగా ఉన్నవారు దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా ఉన్నట్లు చిత్రిస్తున్నారు.అవకాశం ఉంటే చౌర్యంలో ఎవరూ తక్కువ కాదు, వివిధ సందర్భాలలో లైన్ల మీద కొక్కేలు వేసేవారందరూ చోరులే. ఇతర చోట్ల, ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ఆక్రమాలు, మీటర్లు తిరగకుండా చేస్తున్నవారు లేరా ? స్వయంగా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ను చూద్దాం. హైదరాబాద్‌ పాతబస్తీలో విద్యుత్‌ చౌర్యం జరుగుతోందని బిజెపి ఆరోపిస్తున్న, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణాలో డిస్కామ్‌ల రుణం రు.62వేల కోట్లు దాటింది. ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడేవారి మీద ప్రయోగానికి అక్కడ యోగి బుల్డోజర్లు సిద్దంగా ఉంటాయి, రెండింజన్ల పాలన. రెండు దశల్లో ఉదరు పథకాన్ని అమలు జరిపిన తరువాత చూస్తే పంపిణీ సంస్థల నష్టాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు.జూలై నెలలో పదహారవ ఆర్థిక సంఘానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సమర్పించిన పత్రంలో 2022-23సంవత్సరం నాటికే దేశంలో అన్ని పంపిణీ సంస్థలకు పేరుకు పోయిన నష్టాల మొత్తం రు.6.77లక్షల కోట్లు, వీటిలో సమర్దవంతమైన పాలన సాగిస్తున్నట్లు చెబుతున్న యోగి ఏలుబడిలో ఉత్తర ప్రదేశ్‌ వాటా పదిహేనుశాతం అంటే లక్ష కోట్లు దాటింది, ఈ నష్టాలు సగటున ఏటా పదిశాతం పెరుగుతున్నట్లు చెబుతున్నందున మరుసటి ఏడాదిలో మరో పదివేల కోట్లు అదనం, రాజస్తాన్‌ వాటా కూడా పదిహేనుశాతం, మరోబిజెపి పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో పదిశాతం నష్టాలు ఉన్నాయి.తెలంగాణాలో కూడా పదిశాతం ఉన్నాయి. వినియోగదారుల మీద భారాలు మోపటానికి బదులు గడచిన పదేండ్లుగా విద్యుత్‌ ప్రసార నష్టాలను తగ్గించేందుకు కేంద్రం పూనుకొని ఉంటే ఎంతో మేలు జరిగేది. మోడీ సర్కార్‌ దాని మీద కేంద్రీకరించి ఉంటే ఈ పాటికి ఎంతో మేలు జరిగి ఉండేది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న 2014 వివరాల ప్రకారం మనదేశంలో ఆ నష్టాలు 19.33శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 11.4, శ్రీలంకలో 11 పాకిస్తాన్‌లో 17.14 శాతం ఉండగా చైనాలో 5.47శాతం ఉంది.ప్రపంచంలోని 138దేశాల సూచికలో మనం 25వ స్థానంలో ఉండగా చైనా 119వదిగా ఉంది. అందువలన ఈ విఫల పధకం గురించి కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్‌ దెబ్బలాడుకుంటే ప్రయోజనం లేదు.వినియోగదారుల మీద భారాలు మోపటాన్ని సమర్ధిస్తున్న బిజెపిని ఎండగడుతూ విధానాన్ని వ్యతిరేకించేందుకు పూనుకోవాలి !

పోలవరంలో మునిగి తేలుతున్న చంద్రబాబు : బీహార్‌కు అధిక కేటాయింపుల వెనుక అసలు కథేంటి ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికార యంత్రాంగం సహకరించటం లేదా ? ఆర్థిక ఇబ్బందుల ఆత్రంతో చేయాల్సింది చేయటం లేదా ? రాజకీయంగా నరేంద్రమోడీ చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారా ? మొత్తం మీద ఏదో జరుగుతోంది. నీతి ఆయోగ్‌ సమావేశాలకు వెళ్లిన సందర్భంగా మరోసారి సిఎం కేంద్ర మంత్రులను కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ పెట్టక ముందు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పర్యటన జరిపి అనేక అంశాలను కేంద్రానికి నివేదించారు. ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు చెప్పింది ఒకటి తరువాత చేస్తున్నది ఒకటి అన్న సంగతి అమరావతికి అప్పు ఇప్పిస్తామనటంలోనే వెల్లడైంది. బయటకు చెప్పుకోలేక చంద్రబాబు అదియును మంచిదే అన్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి మాత్రమే తెలుసు. కేంద్రం ఇచ్చేదేమిటో చంద్రబాబుకు ముందే తెలుసు గనుకనే వచ్చేదేమీ ఉండదని బడ్జెట్‌ను రెండునెలలు వాయిదా వేసుకున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు చూసిన తరువాత అది వాస్తవమని తేలింది. అసలేమీలేని దానికంటే పదే పదే రాష్ట్రం పేరును ప్రస్తావించటాన్ని చూసి కడుపు నింపుకున్న వారు కొందరు ఉన్నారు. అమరావతికి గ్రాంటు బదులు అప్పు ఇప్పిస్తామంటే పండగ చేసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామంటే ఆహా ఓహౌ అన్నారు. కానీ ఆకస్మికంగా ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు పోలవరం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. బడ్జెట్‌కు ముందు జరిగిన కాబినెట్‌లో ఆ తీర్మానాన్ని ఎందుకు చేయలేదు ? దాని అవసరం గురించి అధికార యంత్రాంగం తప్పుదారి పట్టించిందా ? ఇంతకూ ఏమిటా తీర్మానం ?


పోలవరం ప్రాజక్టు డయాఫ్రం వాల్‌ 2020వరదల్లో దెబ్బతిన్నది. ఏది జరిగినా అందుకయ్యే ఖర్చును భరించాల్సింది కేంద్రమే. దేవుడు చేసిన దానికి మా బాధ్యత లేదంటే కుదరదు. అది జాతీయ ప్రాజెక్టు, ఖర్చంతా భరించేందుకు ఎప్పుడో అంగీకరించారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని జూలై మూడున నిపుణుల సమక్షంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ కుశ్చిందర్‌ ఓహ్రా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దానికి అవసరమైన నిధులు ఇవ్వటమే తరువాయి, అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే తన నిపుణులను పంపవచ్చు లేదా రాష్ట్రం పంపిన వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయవచ్చు. డిపిఆర్‌లో లేని కొత్త అంశమైతే అర్ధం చేసుకోవచ్చు, అలాకానపుడు ముద్ద ముద్దకు గోవిందా గోవిందా లేదా బిస్మిల్లా బిస్మిల్లా అనాల్సిన అవసరం ఏమిటి ? దీనికి గాను ఆకస్మికంగా మంత్రి వర్గ సమావేశం, తీర్మానంతో పనేమిటి ? కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రు.900 కోట్లు కేటాయించాలని, తొలిదశ సవరించిన అంచనా రు.30,437 కోట్లకు గాను ఇంకా రు.12,157 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ముందుస్తుగా మంజూరు చేయాలని మంత్రివర్గ తీర్మానంలో పేర్కొన్నారు. సాంకేతికంగా అలాంటి తీర్మానం అవసరం అయితే బడ్జెట్‌కు ముందే కేంద్రానికి పంపివుంటే నిర్మలా సీతారామన్‌ కేటాయించి ఉండేవారు కదా ! ఎందుకు పంపలేదు ? అధికార యంత్రాంగానికి తెలియదా ? ఇప్పుడు బడ్జెట్‌ను సవరించి కేటాయిస్తారా ? లోగుట్టు పెరుమాళ్లకెరుక !


తమ ప్రభుత్వ హయాంలోనే డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరినా అనుమతి రానందున తామేమీ చేయలేకపోయినట్లు వైసిపి నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చర్చల్లో చెప్పారు. అంతకు ముందు కేంద్ర నిర్వాకాన్ని గురించి జగన్‌ మోహనరెడ్డి లేదా పార్టీ పెద్దలు ఎవరూ ఎక్కడా చెప్పిన, లేదా అనుమతికి కేంద్రం మీద వత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. గురువారం నాడు రాష్ట్రమంత్రి వర్గం ఆకస్మిక సమావేశం జరిపి తీర్మానం చేసిన వార్తతో పాటు శుక్రవారం నాడు సాక్షి పత్రిక కొన్ని విషయాలను ప్రస్తావించింది. దాని కథనం ప్రకారం ” దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదన మేరకు 2022 మార్చి నాలుగవ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు.వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు తొలిదశ పూర్తి చేయడానికి రు.10,911 కోట్లు, డయాఫ్రం వాల్‌ పునరుద్దరణ, మరమ్మతులకు రు.2వేల కోట్లు వెరసి రు.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్‌ ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నోట్‌ జారీచేశారు. ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కాబినెట్‌ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే 2016 సెప్టెంబరు ఆరున పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకొనే క్రమంలో 2013-14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రు.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్రకాబినెట్‌నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రు.15,146.28 కోట్లు విడుదల చేసింది.దీనికి తోడు రు.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కాబినెట్‌ మారుస్తూ తీర్మానం చేయాలి. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ ఈ ఏడాది మార్చి ఆరున కేంద్ర కాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.”


అయితే అప్పటికే ఎన్‌డిఏలో చేరిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదారని, దాంతో కేంద్రం పక్కన పెట్టిందని కూడా సాక్షి కథనం ఆరోపించింది. రు.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన అంశాన్ని చంద్రబాబు కాబినెట్‌ సమావేశం గుర్తు చేసిందని ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొన్నారు. అదే నిజమైతే మిగిలిన మొత్తం రు.12,157కోట్లు విడుదల చేయాలంటూ ఆకస్మికంగా రాష్ట్ర కాబినెట్‌ తీర్మానించాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రశ్న. దీనిపై కేంద్ర ప్రభుత్వం అదే మాదిరి చంద్రబాబు నాయుడు కూడా వాస్తవాలేమిటో జనానికి వెల్లడించాలి. తాజాగా పోలవరంపై విడుదల చేసి శ్వేత పత్రంలో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం ఆమోదించినట్లు చెప్పలేదు. 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ రు.30వేల కోట్లకు ఆమోదం తెలిపితే విడుదల కోసం ప్రత్యేకంగా తీర్మానంతో పనిలేదు. తరువాత పెరిగిన ధరల ఖర్చు సంగతేమిటి ? నీతి అయోగ్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు చేసేది ఉంటుందా ? ప్రతిపాదనలను సవరించేందుకు కేంద్రం అంగీకరిస్తుందా ? అదే జరిగితే మిగతా రాష్ట్రాలు చేస్తున్న వత్తిడి మరింత పెరగదా ? చూద్దాం ఏం జరుగుతుందో !


కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అప్పు ఇప్పిస్తామని చెప్పి బీహార్‌కు పెద్ద మొత్తంలో పథకాలకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ఎందుకిలా చేసింది ? ఏమిటీ వివక్ష ? ఆ రాష్ట్రానికి మొత్తం 62వేల కోట్ల రూపాయల విలువగల పథకాలను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో రోడ్లు, వంతెనలకు రు.26వేల కోట్లు, 2,400 మెగావాట్ల నూతన విద్యుత్‌ కేంద్రంతో సహా విద్యుత్‌ ప్రాజెక్టులకు రు.21,400 కోట్లు, వరదల నిరోధంతో సహా సాగునీటి పథకాలకు రు.11,500 కోట్లు, ఇవిగాక మెడికల్‌ కాలేజీలు, విమానాశ్రయాలు, క్రీడలకు మౌలిక సదుపాయాలు, దేవాలయాల టూరిజం పాకేజ్‌లు ఉన్నాయి. వీటిని బీహార్‌కు ఇచ్చినందుకు ఎవరూ తప్పుపట్టటం లేదు. అయితే ఒక్కసారిగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారన్నది ప్రశ్న. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి-జెడియు కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది సీట్లతో పాటు దాదాపు తొమ్మిదిశాతం ఓట్లను కూడా కోల్పోయింది. నరేంద్రమోడీకి ఎదురులేదని భావించిన నితీష్‌ కుమార్‌ అంచనా తప్పింది, బిజెపి స్వంతంగా మెజారిటీని సాధించలేకపోయింది. మోడీ, బిజెపి బలహీనత వెల్లడైనందున దాని ప్రభావం వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. పలుకుబడి ఇంకా దిగజారక ముందే జాగ్రత్త పడేందుకు ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేటాయింపులను చూస్తే ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానాలతో కలిపి జరుపుతారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ రాష్ట్రాలలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగితే బీహార్‌ను వదులు కోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకే సిఎం కుర్చీ కావాలని అడిగే అవకాశాలు నితీష్‌కుమార్‌కు సన్నగిల్లుతున్నాయి. లోక్‌సభ ఓటింగ్‌ వివరాల ప్రకారం ఆర్‌జెడి తరువాత బీహార్‌లో బిజెపి పెద్ద పార్టీ, అది అక్కడ నిలవాలంటే జెడియు నితీష్‌ కుమార్‌ అవసరం ఉంది.

అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీద బిజెపి ఆధారపడాల్సి ఉంది. అక్కడ పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు లేవు. అందువలన నితీష్‌ కుమార్‌ కంటే తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు బిజెపి బీహార్‌ మీద వరాల వాన కురిపించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి, ఎక్కువ సాయం చేస్తే అది తెలుగుదేశం, జనసేనకే రాజకీయ లబ్దితప్ప బిజెపికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. తెలుగుదేశం పార్టీ తాను తప్ప మరొక పార్టీని ఎదగనివ్వదు. అయినా ఇంకా ఐదు సంవత్సరాల వరకు జనంతో సంబంధం ఉండదు, అడిగేవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు గనుక నోటికి తాళం వేసుకుంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమకే అధికారం కట్టబెట్టాలని అడగాలంటే తెలుగుదేశం బలపడకూడదు.దానికి తోకగా ఎంతకాలం ఉండాలి. అప్పులు ఇప్పిస్తామనటం అంటే పొమ్మనకుండా పొగపెట్టటమే. పోలవరానికి పెరిగిన అంచనాను ఆలశ్యం చేస్తే అది పూర్తిగాక విమర్శలను ఎదుర్కోవాల్సింది చంద్రబాబే. బహుశా ఈ తర్కంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేందుకు కూడా వెనకాడటం లేదా ? ఏమో దేన్నీ కాదనలేం !!

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు : అమరావతి రుణం, కేంద్ర సాయంపై శ్వేతపత్రం ప్రకటిస్తారా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఇతర చోట్ల ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా, రచ్చబండల మీద జరిగిన,కానసాగుతున్న చర్చ ఒక్కటే. అది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం గురించే, ప్రత్యేకించి రాజధాని అమరావతి పట్టణ అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పదిహేనువేల కోట్ల రూపాయలు రుణమా లేక దానమా (ఆంగ్లంలో గ్రాంట్‌ అంటే తెలుగులో దానం ) అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థల వార్తల్లో, చర్చల సందర్భంగా తెలుగుదేశం నాయకత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రతినిధులు దానమే అంటే, కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ఐదేండ్లపాటు ఏటా పదిహేనువేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున పండగ చేసుకోవాలని చెప్పారు.కాదన్నవారి మీద మండిపడ్డారు. కొందరైతే విదేశీ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం 90శాతం భరిస్తుందని, కేవలం పదిశాతమే రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పారు. అంటే పదమూడున్నరవేల కోట్లు కేంద్రమే భరిస్తుందని, పదిహేను వందల కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలన్నది వారి వాదన. అదే నిజమనుకున్నా రాష్ట్రానికి కొంత మేలే. రాష్ట్రం కోరుతున్నది తన మీద భారం మోపని సాయం. కేంద్ర మంత్రి చెప్పిన పదాలకు అర్ధం రుణం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఉన్న రెండు ఇంజన్ల డ్రైవర్లు ఏది నిజమో చెబితే జనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సినపని లేదు.చెప్పటానికి సిద్దంగా ఉన్నారా ?


దీని గురించి స్పష్టంగా చెప్పకుండా చంద్రబాబు నాయుడు తన పరువును, నరేంద్రమోడీ పరువును కాపాడేందుకు పూనుకున్నారు. గతంలో కేంద్రం ప్రత్యేక హౌదా బదులు పాకేజ్‌ ఇస్తామంటే అదే గొప్పదని చెప్పారు. బిజెపితో బంధం తెగిన తరువాత మాట మార్చారు. ఇప్పుడు ఎలాగైతేనేం డబ్బులు వస్తున్నాయిగా అంటున్నారు.తరువాత ఏమంటారో భవిష్యత్‌కే వదలివేద్దాం.తనదైన శైలిలో చెప్పిందేమిటి ? ” నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తేనేం రాష్ట్రం అభివృద్ది చెందుతుంది.కేంద్రం ముందు ఆంధ్రప్రదేశ్‌ ఉంచిన ప్రతిపాదనల్లో అత్యధికాన్ని ఆమోదించింది. రాజధానికి వచ్చే నిధులతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, దీంతో పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వాగ్దానం చేసిన నిధులతో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమౌతుంది.విదేశీ సంస్థల నుంచి రుణాల రూపంలో వచ్చినప్పటికీ వాటిని 20-30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ సంస్థల నుంచి వచ్చే రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. రాజధాని సహాయ రూపంలో కొన్ని కేంద్ర గ్రాంటులు వస్తాయి.వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా సాయం వచ్చే అవకాశం ఉంది.ఈ పాకేజ్‌లో పారిశ్రామిక సబ్సిడీలు కూడా ఉంటాయి.” అన్నారు చంద్రబాబు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తరువాత విలేకర్లతో నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశాలు గందరగోళంగా ఉన్నాయి. ” రాజధాని నిర్మాణానికి ఈ ఏడాదే ప్రపంచ బాంకు నుంచి 15వేల కోట్ల రుణం తీసుకుంటాం.ఇందులో రాష్ట్రం వాటాను కూడా భరించాలి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం తన వాటాను చెల్లించగలదా లేదా కేంద్రమే గ్రాంటు ఇస్తుందా అన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం ” అని నిర్మలమ్మ చెప్పారు. ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రం రుణం తీసుకుంటే దానిలో రాష్ట్రం భరించాల్సిదేమిటి ? ఇచ్చేది రాష్ట్రానికే అయినపుడు రాష్ట్ర వాటా ఏమిటి ? దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రాజెక్టుల రుణాలు తీసుకోవటం కొత్తేమీ కాదు. అవి రాష్ట్రాల్లో అమలు జరిగినా కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.నేరుగా రాష్ట్రాలు తీసుకొనేందుకు వీలులేదు. అలా ఇచ్చే రుణాలలో కొన్నింటిలో కొంత గ్రాంటు కూడా వుంటుంది. బాటా కంపెనీ చెప్పుల ధరలు, వెయ్యో, రెండువేలో కాకుండా రు.999, 1,999 మాదిరి ఉంటాయి. వినియోగదారుని మానసిక స్థితిని సొమ్ముచేసుకొనే వాణిజ్య చిట్కా ఇది. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు ఉంటాయి. వాటికి వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు అవిచ్చే రుణాల్లో కొంత భాగాన్ని గ్రాంటుగా ఇస్తాయి. చేదు మాత్రను మింగించేందుకు వాటికి పంచదార పూత పూయటం వంటిదే ఇది. రుణ షరతులను వ్యతిరేకించేవారి నోరు మూయించేందుకు గ్రాంటు భాగాన్ని జనానికి చూపుతారు. అమరావతి స్వయం పోషక నగరమని, దాని నిధులతోనే నిర్మాణం జరుపుతామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆర్థిక మంత్రి విదేశీ సంస్థల నుంచి అప్పుతీసుకుంటామంటున్నారు. ఒక వేళ అదే వాస్తవం అనుకుంటే ఆ అప్పును ఎవరు తీర్చాలి ? కేంద్రం అంటే దేశం మొత్తం కదా ! ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పును దేశం మొత్తం ఎందుకు భరించాలి ? మా రాజధానులను కూడా నవీకరిస్తాం, ప్రపంచ స్థాయి నగరాలుగా చేస్తాం అప్పుచేసి మాకూ నిధులు ఇవ్వాలి అంటే కేంద్రం అంగీకరిస్తుందా ? విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే ముందుగా ఆ సంస్థలకు ప్రాజెక్టు వివరాలను సమర్పించాలి. పర్యావరణం,వాటి అమలుతో నష్టపోయేవారెవరైనా ఉన్నారా, ఉంటే వారికి పరిహారం ఎలా చెల్లించాలి? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అందుకుగాను మీదగ్గర ఉన్న ఆదాయవనరులు ఏమిటి ? లేకపోతే ఎలా రాబడతారు ? ఇలా అనేక అంశాలను పరిశీలించి షరతులతో కూడిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆదాయాన్ని ఎలా రాబట్టాలో కూడా వినియోగదారుల ఛార్జీల వంటి సూచనల రూపంలో షరతులు విధిస్తాయి. మనం సాధారణంగా బాంకులకు అలా వెళ్లి ఇలా అప్పుతెచ్చుకున్నంత సులభంగా విదేశీ సంస్థల అప్పు ఉండదు. అయినప్పటికీ ఇంకా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకొని ఇస్తామంటూ నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బహుశా నరేంద్రమోడీగారిని విశ్వగురువుగా, నేతగా ప్రచారం చేస్తున్నారు గనుక అలాంటి నిబంధనలను పక్కన పెట్టే ప్రత్యేక వెసులు బాటు, వివరాలేమీ లేకుండానే ముందుగానే ఇచ్చే అవకాశం ఉందేమో తెలియదు. ఇంతవరకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)ను కేంద్రానికి సమర్పించినట్లు చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రకటించలేదు, లీకులు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు అమరావతి కోసం విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. వినియోగదారుల దగ్గర రుసుములు వసూలు చేసే షరతులతో ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం, అమరావతిని వదలివేయటంతో కథకంచికి చేరింది. ఒక వేళ ఇప్పుడు మరోసారి ప్రయత్నించాలన్నా, పెరిగిన ధరలకు అనుగుణ్యంగా డిపిఆర్‌ను సమర్పించాలి. అలాంటి ప్రక్రియ ఇంతవరకు లేనందున పదిహేనువేల కోట్లు వెంటనే ఎలా వస్తాయన్నది ప్రశ్న.


ఇలాంటి ప్రశ్నలు, సందేహాలను ఎవరైనా లేవనెత్తితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవటం లేదనో, వైసిపి కండువా కప్పుకున్నారనో ఎన్‌డిఏ కూటమి ఎదురుదాడికి దిగవచ్చు.గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే వైసిపి వారు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. వాటిని వదలి వేద్దాం.హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికలో 2024 జూలై 18న న్యూఢిల్లీ ప్రతినిధి రాసిన విశ్లేషణ ప్రకారం ”రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ” కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల సాయం కావాలని చంద్రబాబు నాయుడు కోరారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోడీ, అరడజను మంది కేంద్ర మంత్రులు, పదహారవ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాను కలిశారు. నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరణాత్మక పత్రాన్ని కూడా అందచేశారు.కేంద్రం ఎందుకు సాయం చేయాలో కూడా వివరించారు.వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి జిడిపిలో మూడుశాతం నిబంధనను సడలిస్తూ 0.5శాతం పెంచాలని, అమరావతి నిర్మాణానికి రు.50వేల కోట్ల సాయం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పన్నెండువేల కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే దుగ్గరాజపట్నం రేవు నిర్మాణం, రాష్ట్ర మూలధన పెట్టుబడికి ప్రత్యేక పధకం కింద సాయం,బుందేల్‌ ఖండ్‌ పాకేజ్‌ మాదిరి వెనుకబడిన ప్రాంతాలకు సాయాన్ని, చమురుశుద్ధి కర్మాగారాల ఏర్పాటును కూడా కోరారు.కీలకమైన కేంద్ర మంత్రి పదవులు,లోక్‌సభ ఉపసభాపతి పదవిని కూడా కోరకుండా ఆర్థిక సాయం మీదే కేంద్రీకరించినట్లు కూడా బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ” ఆంధ్రప్రదేశ్‌కు నిర్మల మద్దతు, కానీ నాయుడు కోరిన దానికి చాలా తక్కువ ” అనే శీర్షికతో అదే బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. దానిలోని అంశాల సారం ఇలా ఉంది. కేంద్ర సాయాన్ని ఆశిస్తూ బడ్జెట్‌లో ఏం కేటాయిస్తారో చూసేందుకు గాను చంద్రబాబు రాష్ట్రబడ్జెట్‌ ప్రవేశపెట్టటాన్ని వాయిదా వేసుకున్నారు. స్థానికంగా వనరులను పెంచేందుకు మార్గాలు వెతకాల్సి ఉంటుంది, పదిహేనవ ఆర్థిక సంఘం సూచనను అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర రాబడులను పెంచుకోవాల్సి ఉంది.కేేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక పాకేజ్‌ లేదా ప్రత్యేక హౌదా ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతానికి బడ్జెట్‌ పెట్టకుండా సమయాన్ని తీసుకుంది.అయితే చంద్రబాబు లక్ష్యం అంత తేలిక కాదు.రాష్ట్ర ఆదాయంతో పోల్చితే వడ్డీ చెల్లింపులు గణనీయంగా ఎక్కువగా ఉన్నందున ఆర్థిక పునర్‌నిర్మాణం కోసం ఎంతో ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలించేపేరుతో కొద్ది రోజులు కాలయాపన చేయవచ్చు. కేంద్రం నుంచి ఆశించిన సాయం, దాని గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన జనంలో పెద్ద ఎత్తున ఆశలు కలిగించాయి.సూపర్‌సిక్స్‌ పేరుతో చేసిన వాగ్దానాలను బిజెపి ఆమోదించి ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో దాని పేరు కూడా ఉండేది.ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం గురించి 2014-19 మధ్య బిజెపితో కలసి కాపురం చేసినంత కాలం చంద్రబాబు నాయుడు సానుకూలంగా మాట్లాడారు తప్ప జనాలకు వివరాలు చెప్పలేదు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాతే గళమెత్తి, ఢిల్లీలో నిరసనలు, తరువాత 2019ఎన్నికలకు ముందు శ్వేత పత్రాలను ప్రకటించారు. జనం వాటిని నమ్మలేదు.చిత్తుగా ఓడించారు.వైసిపిని గెలిపించారు. ఆ పార్టీ అనుసరించిన వైఖరితో విసిగిపోయి చారిత్మ్రాక స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని గెలిపించారు. రాష్ట్రం ఉన్న స్థితి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరి గుండెలు బాదుకుంటే, వైసిపి మీద విమర్శలను గుప్పిస్తే కుదరదు. కేంద్ర సాయం గురించి తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలంటే అధికారానికి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఏ ఏ రంగాలలో ఎంత సాయం చేయాలని కోరారు, తాజా బడ్జెట్‌లో వాటిలో ఏమేరకు వచ్చింది అనే అంశాలను జనానికి అర్దమయ్యే రీతిలో ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటించి పరిస్థితిని వివరించాలి. అందుకు చంద్రబాబు సిద్దపడతారా ?
హొ

రెండుగా చీలిన అమెరికా సమాజం : డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు-ఓటమిపై సమీకరణ ! కమలా హారిస్‌ వైపు మొగ్గు !!

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా అధ్యక్షుడు, రెండవసారి పోటీచేసేందుకు ప్రయత్నించిన డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ తాను పోటీ పరుగు నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం నాడు ప్రకటించటమే కాదు, అధ్యక్షపదవి అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి పోటీ నుంచి తప్పుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ముదిమితో మతి తప్పి మాట్లాడుతున్న 81ఏండ్ల బైడెన్‌ పోటీ నుంచి వైదొలగి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న వత్తిడి గత కొద్ది వారాలుగా వచ్చింది. అయినప్పటికీ పోటీలో ఉంటానని చెప్పిన పెద్దమనిషి ఆకస్మికంగా ప్రకటించటంతో డెమోక్రాట్లు కొత్త అభ్యర్థికోసం హడావుడి పడుతున్నారు. ఆగస్టు 19-22వ తేదీలలో పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఎన్నిక జరుగుతుంది. మరి కొంత మంది కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చినా బైడెన్‌ ప్రకటన తరువాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అనూహ్యపరిణామాలు జరిగే తప్ప డోనాల్డ్‌ ట్రంప్‌ను ఢకొీనబోయేది కమలాహారిస్‌ అని చెప్పవచ్చు. డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి దిగజారినట్లు,హత్యాయత్నం జరిగిన తరువాత ట్రంప్‌ విజయావకాశాలు మరింత పెరిగినట్లు వార్తలు వచ్చిన పూర్వరంగం జో బైడెన్‌ నిర్ణయాన్ని వేగిరం కావించింది. అయితే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తరువాత కమలా హారిస్‌ రెండు పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 44 -42తో ట్రంప్‌పై పైచేయి సాధించినట్లు సోమ, మంగళవారాల్లో రాయిటర్స్‌ జరిపిన ఎన్నికల సర్వేలో వెల్లడైంది. ఇదే ధోరణి ముందుకూడా కొనసాగితే సంకుల సమరం సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఫాసిస్టులను ఇంటికి పంపిన మాదిరి మితవాది ట్రంప్‌ను ఓడించే అవకాశాలనూ తోసి పుచ్చలేము.


బైడెన్‌ నిర్ణయం అమెరికా లోపలా వెలుపలా, శత్రువులూ, మిత్రుల మధ్య చర్చనీయాంశమైంది. మిత్రదేశాల నేతలందరూ సానుకూలంగా మాట్లాడారు.” ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మాకు ఒక అంశాన్ని నేర్పాయి, అదేమిటంటే దేని గురించి మేము ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు అని, ఈ అంశం అమెరికా ఓటర్లకు సంబంధించింది తప్ప మాది కాదు, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదే మాకు చాలా ముఖ్యం, ఇప్పుడవి చరిత్రలో అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయి ” అని రష్యా ప్రతినిధి స్పందించారు. ఇది వారి అంతర్గత అంశమని చైనా పేర్కొన్నది.అయితే అక్కడి మీడియా, సామాజిక మాధ్యమంలో పెద్ద స్పందన వెలువడింది.నలభైకోట్ల మంది ఈ వార్తను చూసినట్లు లక్షలది మంది వ్యాఖ్యలు చేసినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. అధ్యక్ష పీఠంపై ఎవరు ఉన్నా అమెరికా పెద్దన్నకే అగ్రతాంబూలం అన్నట్లుగా వ్యవహరిస్తారన్నది తెలిసిందే. ఈ కారణంగానే ఎన్నికలు వారి అంతర్గత అంశమైనప్పటికీ అనేక దేశాల నేతలు స్పందించారు. అంతర్గతంగా కమలా హారిస్‌ గెలుస్తారా, ఆమె బలం,బలహీనతలు ఏమిటి అన్న చర్చ మొదలైంది. బైడెన్‌ ప్రకటన వెలువడగానే ఆమె స్పందించారు.” పార్టీని ఐక్యంగా ఉంచేందుకు చేయాల్సిందంతా చేస్తాను. డోనాల్డ్‌ ట్రంప్‌ను, ప్రమాదకరమైన అతగాడి ప్రాజెక్టు 2025 అజెండాను ఓడించేందుకు గాను దేశాన్ని ఐక్యం చేసేందుకు పూనుకుంటానని ” పేర్కొన్నారు.


ప్రపంచంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిష్కరించటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం చెందింది.జనం దగ్గర దారిలో పరిష్కారాల కోసం చూస్తున్నారు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థతప్ప ఇప్పటికి మరొకటి లేదు. అయితే సోవియట్‌ యూనియన్‌, ఇతర దేశాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి గురించి సోషలిజం అనుకూలశక్తులలోనే తలెత్తిన విబేధాలు, వ్యతిరేకులు చేసిన ఎదురుదాడి నేపధ్యంలో జనం గందరగోళంలో ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించేందుకు, కాపాడేందుకు అవసరమైతే నిర్బంధకాండకు సైతం సిద్దపడే పచ్చిమితవాద, ఫాసిస్టు శక్తులు రంగంలోకి వస్తున్నాయి.ఐరోపాలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది.అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రాజెక్టు 2025ను రూపొందించిన హెరిటేజ్‌ ఫౌండేషన్‌ మితవాద,నిరంకుశుల అజెండా. ట్రంప్‌ అధికారానికి వస్తే అమలు జరుపుతారనే ప్రచారం ఉంది. దీన్ని జనంలోకి తీసుకువెళితే జో బైడెన్‌ మరోసారి ఎన్నికౌతారని డెమోక్రాట్లు భావించారు. ఇప్పుడు రంగం నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్‌ను దెబ్బకొట్టగలిగే అస్త్రం ఇదే అని వారు ఇప్పటికీ భావిస్తున్నారు.కమలా హారిస్‌ మాటల భావమిదే. అసలేమిటిది ?


పచ్చి మితవాద భావజాల సంస్థ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ 1973లో ఉనికిలోకి వచ్చింది. వందకు పైగా అలాంటి బృందాల సలహాలతో 922 పేజీల విశ్లేషణ, సిఫార్సులే ప్రాజెక్టు 2025. దీని వెనకాల ఉన్నది ఎవరో నాకు తెలియదు.వారితో నాకెలాంటి సంబంధమూ లేదు అని ఇటీవల ట్రంప్‌ చెప్పుకున్నాడు.ఎన్నికలు ముగిసేవరకు ట్రంప్‌ ఇదే నాటకాన్ని కొనసాగిస్తాడన్నది తెలిసిందే. అయితే బుకాయించినా గతంలో అతని దగ్గర పనిచేసిన వారూ, మద్దతుదారులందరూ దాని రూపకల్పనలో భాగస్వాములే కనుక, దాన్నే అమలు జరుపుతారని వేరే చెప్పనవసరం లేదు. మన దేశంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన సిఫార్సులు, ఆదేశాలను అమలు జరుపుతున్న పార్టీలేవీ ఎక్కడా బహిరంగంగా వాటి గురించి చెప్పరు. అవన్నీ తమ విధానాలే అని జనాన్ని నమ్మించేందుకు చూస్తాయి.తమ ముద్రవేసుకుంటాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బిజెపి, తెలుగుదేశం, బిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా అదే కనిపిస్తుంది. అందుకే ఈ పార్టీల మధ్య అధికారం కోసం కుమ్ములాటలుంటాయి తప్ప విధానపరంగా ఎలాంటి ఘర్షణ ఉండదు. ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు వాటిని వ్యతిరేకించే మితవాద, వామపక్ష శక్తులందరూ ఇటీవలి ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి ప్రస్తుతానికి ఆ ముప్పును తప్పించిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా అదే జరగనుందా ?


అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యేవారు, నియమిత అధికార యంత్రాంగానికి ఇప్పుడున్న వాటి కంటే అధికారాలను మరింతగా కట్టబెట్టటం, మరింత కేంద్రీకరించటం ప్రాజెక్టు 2025లక్ష్యాలలో ఒకటి.అధికార దుర్వినియోగానికి ఇది బాటవేస్తుందని భావిస్తున్నారు. సంక్షేమ పధకాలకు కోతపెట్టాలని, నియంత్రణలను నామమాత్రం చేయాలని కార్పొరేట్‌, మితవాద శక్తులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి, అందువలన వీటి సాధన రెండవది.సామాజిక, మతపరమైన అంశాలలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వ్యత్యాసం ఉంది.అబార్షన్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వినియోగించాలని, గర్భనిరోధ పద్దతులను పరిమితం చేయాలని, బూతుపై నిషేధం, ఆ ఇతివృత్తంతో తీసే సినిమాలు, సీరియళ్లు, ఇతర ఉత్పత్తులను సృష్టించేవారు, వాటిని పంపిణీ చేసే వారి మీద నిషేధం పెట్టాలని, శిక్షించాలన్న అజండా కూడా దీనిలో ఉంది. ఇవన్నీ నిరంకుశ, తిరోగామి ప్రతిపాదనలని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఇవి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలూ కావు.వీటిని అమలు జరిపేందుకు తగిన వాడు ట్రంప్‌ అని భావించటమే తాజాదనం. తన ఓటమిని అంగీకరించకుండా, జో బైడెన్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకొనేందుకు అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేయించిన ట్రంప్‌కే ఈ అజెండాను అమలు చేసే దమ్ముఉంటుదని అనేక మంది గట్టిగా భావిస్తున్నారు. ఇదే మితవాదులను వ్యతిరేకించేవారిలో ఇటీవల ఆందోళనను పెంచుతోంది. లక్షలాది మంది పౌర ఉద్యోగులను తొలగించి తన మద్దతుదార్లను నియమించేందుకు 2020లో ట్రంప్‌ నిర్ణయించాడు. అయితే అమలు జరిపే సమయానికి ఎన్నికల్లో ఓడి పదవి నుంచి దిగిపోయాడు. ఆ నిర్ణయాన్ని బైడెన్‌ రద్దు చేశాడు. ఇప్పుడు ట్రంప్‌ గెలిస్తే తన అజెండాను అమలు జరపవచ్చని భావిస్తున్నారు.విద్యా శాఖను రద్దు చేసి అమ్మవడి-తల్లికి వందనం పేరుతో అమ్మలకు ఇస్తున్న నగదు మాదిరే ప్రయివేటు స్కూళ్లకు పంపే తలిదండ్రులకు నగదు ఇవ్వాలని మితవాదులు కోరుతున్నారు. తక్కువ రాబడి వచ్చే స్కూళ్లకు నిధుల నిలిపివేత, మధ్యాహ్నభోజన పధకాల రద్దు, విద్యారుణాలను విధిగా వసూలు చేయాలనే చర్యలు చేపట్టవచ్చు. పర్యావరణ హాని నివారణ చర్యలను నిలిపివేయాలని, హరిత ఇంథన సబ్సిడీలను ఎత్తివేయాలని, చమురు, గ్యాస్‌ వెలికితీతపై పర్యావరణ ఆంక్షలను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారికి విద్యా రుణాలు ఇవ్వకూడదని,ప్రభుత్వ సహాయం పొందే గృహాల్లో వారికి అవకాశం కల్పించరాదని, అక్రమ ప్రవేశాల నిరోధానికి సరిహద్దుల్లో అశ్వికదళాలను తిరిగి నియమించటమే గాక విస్తరించాలని కోరుతున్నారు.

ఇలాంటి ప్రతిపాదనలతో ఉన్నదే ప్రాజెక్టు 2025. దీని రూపకల్పనలో భాగస్వాములు, వాటితో ఏకీభవించేవారిని యంత్రాంగంలో నియమించి వారి పేరుతో అమలు జరిపించేందుకు ట్రంప్‌ చూస్తున్నారని పురోగామివాదులు అనేక మంది హెచ్చరిస్తున్నారు.
హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు నిధుల కొరత లేదు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కావాలనేదానికంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రీతిలో తన మనుషులను యంత్రాంగంలోకి పంపేందుకే ఇది ప్రాధాన్యత ఇస్తుంది. ఇరవైవేల మంది సుశిక్షుతులైన కార్యకర్తలు, ఇరవైలక్షల మంది స్వచ్చందకార్యకర్తలు దీనికి ఉన్నట్లు అంచనా.దాని అజెండాను అమలు జరిపేందుకు, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసేందుకు, సామాజిక మాధ్యమంలో జనాన్ని సమీకరించేందుకు వారంతా రంగంలోకి దిగుతారు. అనేక మందిని పార్లమెంటరీ కార్యాలయాల్లోకి ఇప్పటికే చొప్పించింది.ట్రంప్‌ యంత్రాంగంలో 2017నాటికి 70 మంది ఈ సంస్థతో సంబంధం ఉన్నవారున్నారు.వారిలో నలుగురు మంత్రులు. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి రిపబ్లికన్లు మరింత మితవాదం వైపు మొగ్గేందుకు చేయాల్సిందంతా చేస్తోంది.1981లో రోనాల్డ్‌ రీగన్‌ అధికారంలోకి వచ్చినపుడు దీని అజెండాలో 60శాతం అమలు జరిపాడు. ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు దీని సిఫార్సుల్లో 64శాతం అమలు చేశాడంటే దీని సత్తా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రిచర్డ్‌ నిక్సన్‌ హయాంలో 1973లో ఉనికిలోకి వచ్చిన ఈ సంస్థ నిర్వాహకులు తాము కమ్యూనిజానికి వ్యతిరేకమని, కార్పొరేట్లకు అనుకూలమని, క్రైస్తవ మత భావజాలానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పుకున్నారు. తాజా విషయానికి వస్తే ట్రంపిజాన్ని వ్యవస్థీకృతం కావించేందుకు తాము పనిచేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు కెవిన్‌ డి రాబర్ట్స్‌ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. అమెరికా ఇప్పుడు రెండవ విప్లవ క్రమంలో ఉందని, అది రక్తపాత రహితంగా ఉంటుందని కూడా ఒక టీవీ చర్చలో చెప్పాడు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఈ అంశాలను జనంలోకి తీసుకువెళ్ల గలిగితే నల్లేరు మీద బండిలా సాగుతుందనుకుంటున్న ట్రంప్‌ ఎన్నిక తిరగబడినా ఆశ్చర్యం లేదు.


అయితే అది అంత తేలిక కాదు. ఇప్పటికే జో బైడెన్‌ ప్రతిష్ట దిగజారింది. దాని ప్రభావం కమలాహారిస్‌ మీద కూడ పడుతుంది.వ్యక్తిగా బైడెన్‌ కంటే అతగాడి విధానాల ఫలితంగానే పలుకుబడి తగ్గటమే దీనికి కారణం. రెండవది ఊపు మీద ఉన్న ట్రంప్‌ మద్దతుదార్లు ఆమె మీద పెద్ద ఎత్తున ప్రచారదాడికి దిగే అవకాశం ఉంది. గార్డియన్‌ పత్రిక పేర్కొన్న సమాచారం ప్రకారం పోటాపోటీగా ఉన్న పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా వంటి రాష్ట్రాలలో టీవీ ప్రకటనల కోసం 50లక్షల డాలర్లను కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నారు. అదే విధంగా అబార్షన్ల వంటి అంశాలపై ఆమె అభిప్రాయాల మీద రెచ్చగొట్టే అవకాశం ఉంది.కమలా హారిస్‌ తల్లి భారతీయ మూలాలున్న మహిళ, తండ్రి ఆఫ్రికన్‌. అందువలన మనదేశంలోని వారు మనమ్మాయి అన్నట్లుగా ప్రచారం చేసుకున్నా అమెరికాలో ఆమెను ఒక ఆఫ్రికన్‌గానే చూస్తారు. శ్వేతజాతి అహంకారం ఉన్న అమెరికాలో దాన్ని కూడా ముందుకు తీసుకురావచ్చు.ఆమె అభ్యర్థిత్వం ఖరారైన తరువాత తలెత్తే పరిణామాల గురించి మరోసారి చూద్దాం !