కన్వర్‌ యాత్ర నిబంధనలకు సుప్రీం కోర్టు బ్రేక్‌, బిజెపి హిందూత్వకు ఎదురుదెబ్బ, దళితులతో ముందు ముంత వెనుక చీపురు కట్టించినా ఆశ్చర్యం లేదు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


జూలై 22 నుంచి ఆగస్టు ఆరు వరకు జరిపే కన్వర్‌-కావడి యాత్రల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తరువు అమలును సోమవారం నాడు సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బిజెపి హిందూత్వ అజెండాకు ఎదురు దెబ్బ యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు,హౌటళ్ల, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. వాటిలో హలాల్‌ ధృవీకరణ పత్రం ఉన్న పదార్థాలను విక్రయించరాదని కూడా పేర్కొన్నారు. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తరువుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేకు పడింది. అయితే ఆహార పదార్ధాల స్వభావాన్ని వినియోగదారులకు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని, సామాజికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలను ఆర్థికంగా విడదీస్తుందని పిటీషనర్ల తరఫున వాదించిన సియు సింగ్‌ చెప్పారు. మరో న్యాయవాది అభిషేక్‌ షింఘ్వి తన వాదనలను వినిపిస్తూ ” నేను గనుక పేరును ప్రదర్శించకపోతే నన్ను మినహాయిస్తారు, నేను పేరును ప్రదర్శించినా మినహాయిస్తారని ” చెప్పారు. అయ్యప్ప, భవానీ వంటి దీక్షలు, కన్వర్‌(కావడి) యాత్ర వంటివి జనాల వ్యక్తిగత అంశాలు. ఇష్టమైన వారు పాటిస్తారు, కాని వారు దూరంగా ఉంటారు. వీరంతా నాస్తికులని గానీ పాటించేవారే పరమ ఆస్తికులని గానీ నిర్ధారించటానికి, ముద్రవేసేందుకు ఎవరికీ హక్కులేదు.పౌరహక్కుల పరిరక్షణ సంస్థ(ఎపిసిఆర్‌) పేరుతో ఉన్న ఒక స్వచ్చంద సంస్థ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టింది.న్యాయమూర్తులు హృషికేష్‌ రారు, ఎస్‌విఎన్‌ భట్‌ ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ప్రభుత్వ ఉత్తరువుల కారణంగా దుకాణాల యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమేగాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానుల పట్ల వివక్ష ప్రదర్శించటమే అని పిటీషన్‌లో పేర్కొన్నారు.ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ, తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని అధికారపక్షానికి స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలతో దీని మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


బిజెపి మిత్రపక్షాలుగా ఉన్న జెడియు, ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌డి పార్టీలు ఇలాంటి ఉత్తరువులు తగవని వ్యతిరేకతను వెల్లడించినా బిజెపి ఖాతరు చేయ లేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అజండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల వెనుక ఉన్న కుట్రలేమిటి, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఆయోధ్యతో సహా అనేక చోట్ల చావుదెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బిజెపి స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వ మార్పు జరగాలని కోరుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్‌ యాత్రల ఆదేశం ఒకటి. శివలింగం మీద తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తొలగించలేరు అన్నట్లుగా కేంద్ర బిజెపి నాయకత్వం ముందు పరిస్థితి ఉంది. ఇంతకూ ఈ యాత్రీకులు చేసేదేమిటి ? శ్రావణమాసంలో పవిత్ర జలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులౌతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు ఆరవ తేదీ మధ్య హరిద్వార్‌ వద్ద ఉన్న గంగానది నుంచి తెచ్చే నీటి పాత్రలను కావళ్లలో పెట్టి తీసుకువస్తారు గనుక దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్‌ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రీకుల కోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్దాల హౌటళ్లు. దాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన, మోటారు వాహనాలు ఇలా ఎవరికి వీలైన పద్దతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. 1980దశకం వరకు చాలా పరిమితంగా జరిగే ఈ క్రతువును క్రమంగా పెద్ద కార్యక్రమంగా మార్చారు. అయ్యప్ప దీక్షలకు పోటీగా అనేక దీక్షలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.


దుకాణాలు, హౌటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు ” మానవత్వం ” అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఎక్స్‌లో సూచన చేశారు.దీని మీద బాలీవుడ్‌ హీరోయిన్‌, బిజెపి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ స్పందిస్తూ ఉమ్మిన ఆహారం, ఆపని చేసేవారిని సమర్ధించటమే ఇదంటూ ధ్వజమెత్తారు. ముస్లింలు తయారు చేసే ఆహారం, విక్రయించే పండ్లు మొదలైన వాటి మీద ఉమ్ముతారని, హలాల్‌ చేస్తారని,అపవిత్రమైన వాటిని హిందువులు బహిష్కరించాలని, హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవటం లేదన్నది కూడా ఎరిగిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్‌ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బిజెపికి వ్యతిరేకంగా ఓటువేయటం, అభ్యర్థి ఓటమి తెలిసిందే. పాలస్తీనాలో అరబ్బులపై దాడులు, మారణకాండ, స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలని ముస్లిం, అరబ్బుదేశాలలో పలు సంస్థలు గతంలో పిలుపునిచ్చాయి. వాటిని కాపీకొట్టిన కాషాయ దళాలు మనదేశంలో ముస్లింల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నాయి. అరబ్బు దేశాల చమురును బహిష్కరించమని చెప్పేందుకు వారికి నోరురాదు, ఎందుకంటే వారి యాత్రల వాహనాలు నడవాలంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంథనమే దిక్కు. అక్కడ పవిత్రత గుర్తుకు రాదు.


ఉమ్ముతారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. నిజమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక బిర్యానీ హౌటళ్లకు, రంజాన్‌ మాసం సందర్భంగా హలీం కోసం ఎగబడేవారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఎందుకు ఉంటున్నారు.దుకాణాలలో విక్రయించే వస్తువులు నాణ్యమైనవా కాదా, హౌటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గీటురాయిగా ఉండాలి తప్ప యజమానుల వివరాలు ఎందుకు ? ఒకవేళ ముస్లిం మతానికి చెందిన వారు యజమానులుగా ఉంటే వాటిని బహిష్కరించాలని పరోక్షంగా చెప్పటమే ఇది. పేర్ల ప్రదర్శన ఒక్క ముస్లింలనే దెబ్బతీస్తుందా ? హిందువులను కూడా నష్టపరుస్తుంది.మన సమాజంలో మత విద్వేషమే కాదు, కుల వివక్ష, విద్వేషం కూడా ఎక్కువే, అందునా దేశ ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలలో మరీ ఎక్కువ.దళితులు వివాహాల సందర్భంగా గుర్రాల మీద, ఇతరత్రా ఊరేగింపులు జరపకూడదని, ఎక్క కూడదని దాడులు చేసిన ఉదంతాలు ఎన్ని లేవు.దుకాణాలపై దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన యజమానుల పేర్లను ప్రదర్శిస్తే ముస్లిం దుకాణాల పట్ల అనుసరించే వైఖరినే మనువాద కులాల వారు పాటిస్తారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే అనేక చోట్ల గతంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ హౌటల్‌ అని రాసుకొనే వారు. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు. వాటి స్థానలో రెడ్డి, చౌదరి హౌటల్స్‌ పేరుతో ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నాయి తప్ప ఇతర కులాలను సూచించే హౌటళ్లు ఎక్కడా కనిపించకపోవటానికి సమాజంలో ఇప్పటికీ ఉన్న చిన్న చూపు, వివక్షే కారణం. అదే ముస్లింల విషయానికి వస్తే మతవిద్వేషం. రాఘవేంద్ర,రామా, కృష్ణా, వెంకటేశ్వర విలాస్‌లు తప్ప ఎక్కడైనా అబ్రహాం, ఇబ్రహీం, ఏసుక్రీస్తు,మహమ్మద్‌ ప్రవక్త విలాస్‌లను చూడగలమా ?


ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ యుపి ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఒక మతపరమైన యాత్ర సందర్భంగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలు దుకాణాలు, హౌటళ్ల యజమానుల పేర్లను ప్రముఖంగా వాటి ముందు రాసి ఉంచాలని చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇది వాహనాలకు సైతం వర్తింప చేస్తారని, గతంలో నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇండ్లకు ఇలాంటి గుర్తింపును అమలు చేశారని జావేద్‌ అక్తర్‌ ఎక్స్‌లో స్పందించారు.బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కూడా తప్పు పట్టారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించటం తప్పవేరు కాదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా విమర్శించలేని నక్వీ దీనికి అధికారయంత్రాంగం కారణమని విరుచుకుపడ్డారు. అత్యుత్సాహపరులైన అధికారులే ఇది చేశారన్నారు.సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బిఎస్‌పి నాయకురాలు మాయావతి, మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా విమర్శించారు. ఇది సామాజిక నేరమని, కోర్టులు కలగచేసుకొని నివారించాలన్నారు. తొలుత యజమానుల పేర్లను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. దాని మీద విమర్శలు రావటంతో కాదు స్వచ్చందంగా చేయాలన్నారు, చివరికి విధిగా ప్రదర్శించాలని నిర్ణయించారు.స్వచ్చందంగా అన్నప్పటికీ అంతిమంగా ఫలితం మతపరమైన గుర్తింపును విధిగా వెల్లడించేట్లు చేయటమే. పేర్లు ప్రదర్శించని హిందువులను కూడా ముస్లింలుగానే భావించేందుకు ఆస్కారం ఉంటుంది. ముస్లింలు పేర్లు రాసుకొని ప్రదర్శిస్తే వారి దగ్గర కొనవద్దని చెప్పేందుకు తప్ప దీనిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది. యాత్రికులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకంటూ ముజఫర్‌ నగర్‌ ఎస్‌పి ప్రకటన సాకు మాత్రమే. కావాల్సిన వస్తువు లేదా ఆహారం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తేనేం, దానిలో యాత్రీకులు పడే గందరగోళం ఏమిటి ? దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లను వేరు చేసేందుకు సృష్టించిన బంటూస్తాన్‌లకు, మనదేశంలో వెలిగా ఉంచిన దళిత వాడలకు, వీటికీ తేడా ఏముంది? దళితవాడల్లో నివశించేందుకు ఎంత మంది దళితేతరులు సిద్దపడుతున్నారు ? ముస్లింలు మెజారిటీగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఇతరులు ఇండ్లు కొనేందుకు జంకే ఇతరుల గురించి తెలియని వారెవరు ?


చరిత్రలో మతపరమైన గుర్తింపు చాలా ప్రమాదకరం అని రుజువు చేసింది.మనతో సహా ఆసియా ఉపఖండంలోని దేశాల్లో మతంతో పాటు ఎక్కడా లేని కులపరమైన గుర్తింపు బోనస్‌.మధ్య యుగాల్లో, తరువాత ఇస్లామిక్‌, క్రైస్తవమతాల ఉన్మాదంతో ఇతర మతాల వారు ప్రత్యేక గుర్తులు ధరించాలని ఆదేశించారు. మౌఢ్యం లేదా నిరంకుశత్వం చోటు చేసుకుంది. నాజీ జర్మనీలో యూదు వ్యతిరేకతలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మహమ్మద్‌ ప్రవక్త మరణం తరువాత అరేబియాలో అధికారానికి వచ్చిన ఖలీఫా రెండవ ఉమర్‌ 717-20 సంవత్సరాలలో ముస్లిమేతరులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని తొలిసారిగా ఆదేశించినట్లు వికీపీడియా సమాచారం తెలుపుతోంది. నేటి ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో రాజ్యాధికారం చలాయించిన అరబ్‌ రాజవంశం అగలాబిద్‌ 887-88లో యూదులు తమ ఇండ్లకు గాడిదలను చిత్రించిన వస్త్రాలను వేలాడదీయాలని, పసుపు పచ్చ బెల్టులు, టోపీలు ధరించాలని ఆదేశించింది. తరువాత 1,212లో మూడవ పోప్‌ ఇన్నోసెంట్‌ ప్రతి క్రైస్తవ ప్రాంతంలో గుర్తించేందుకు వీలుగా యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని ఆదేశించాడు. ప్రష్యాలో 1,710లో అధికారంలో ఉన్న ఒకటవ ఫెడరిక్‌ విలియమ్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించనవసరం లేదు.అయితే అలా ఉండాలంటే ఎనిమిదివేల వెండి నాణాల నగదు చెల్లించాలని షరతు పెట్టాడు. తరువాత రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా జర్మనీలో నాజీ పాలకులు యూదులను గుర్తించేందుకు డేవిడ్‌ బొమ్మ ఉన్న ఏదో ఒక రంగు గుర్తును ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.హిట్లర్‌ యంత్రాంగం కొత్త ఆదేశాలను జారీచేసి యూదుల ఇండ్ల ముఖద్వారాలకు గుర్తులు వేయాలని ఆదేశించింది. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఇలాంటి గుర్తింపు ఆదేశాలను అమలు చేశారు. హంగరీ ఆక్రమణ తరువాత యూదుల పౌరసత్వాలను రద్దు చేసి వారంతా ప్రత్యేక గుర్తులను ధరించాలని ఆదేశించారు.ఇక వర్తమానంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు 1996-2001 మధ్య తమదేశంలో ఉండే హిందువులు పసుపుపచ్చ గుర్తున్న బాడ్జ్‌లను ధరించాలని, వేధింపులకు గురికాకుండా ఉండేందుకు హిందూ మహిళలు బురఖాలు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కన్వర్‌ యాత్రీకులు గందరగోళపడకుండా ఉండేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అనే పేరుతో దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రముఖంగా రాసి ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆకుపచ్చ తాలిబాన్లకు కాషాయ తాలిబాన్లకు పద్దతి తప్ప ఇతరంగా తేడా ఏమిటి ? యోగి సర్కార్‌ ఉత్తరువులు ముస్లింల కోసమేనని,మనకేంటి అని ఇతరులు ఎవరైనా భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. చరిత్రను చూసినపుడు సనాతనం లేదా మనువాదం కారణంగా దళితులకు ఇతరుల వాడల్లో ప్రవేశం నిషేధించారు, ఒకవేళ అనుమతిస్తే ఉమ్మివేయకుండా మెడలో ముంత ధరించాలని, వీపులకు చీపుర్లు కట్టుకొని ఊడ్చుకుంటూ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఇప్పుడు కన్వర్‌ మరోపేరుతో మతవిద్వేషం రెచ్చగొడుతున్నవారు మనువాదుల వారసులే. సనాతనాన్ని అమలు జరపాలని కోరేశక్తులకు ప్రతిఘటన లేకపోతే దళితులకు ముంతలు, చీపుర్లే గతి, వెనుకబడిన తరగతులు తిరిగి కులవృత్తులకు పోవాల్సిందే ! కాదంటారా !

చైనా ది గ్రేట్‌ : మైక్రోసాఫ్ట్‌ దెబ్బనుంచి తప్పించుకున్న ఒకే ఒక్క దేశం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


వర్తమాన సమాజం సాంకేతిక పరిజ్ఞాన మీద ఎంతగా ఆధారపడి ఉందో, దానికి చిన్నపాటి అంతరాయం కలిగినా ఎన్ని ఇబ్బందులు, ఎంత నష్టం జరుగుతుందో 2024 జూలై 19న తలెత్తిన ఒక చిన్న సాంకేతిక సమస్య లేదా జరిగిన తప్పిదం ప్రపంచానికి వెల్లడించింది. ఆకస్మికంగా ఐదువేలకుపైగా విమానాల రద్దు ప్రకటన, ఎందుకో, ఎప్పుడు పునరుద్దరణ అవుతాయో చెప్పే నాధుడు లేడు. ప్రయాణీకుల్లో గందరగోళం. ఆసుపత్రులలో ఆపరేషన్లు నిలిపివేశారు.బ్యాంకు ఖాతాలు పనిచేయలేదు. రైలు టికెట్లు జారీ కాలేదు.వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. ఇదంతా క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ వైరస్‌లను కనుగొనేందుకు అందచేసిన ఒక లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను మైక్రోసాఫ్ట్‌ సర్వర్లు, కంప్యూటర్లకు అందచేసిన ఫలితమే. నిత్య జీవితంలో ఎంత ఎక్కువగా ఇంటర్నెట్‌ను, కంప్యూటర్లను వినియోగిస్తారో, ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ పరికరాలను వినియోగిస్తారో అక్కడల్లా ప్రపంచమంతటా కొన్ని గంటల పాటు ఇవే దృశ్యాలు.( ఆపిల్‌ మాక్‌ కంప్యూటర్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు.) నీలి రంగు తెరతో దర్మనమిచ్చిన కంప్యూటర్లు పదే పదే వాటంతట అవే మూతబడ్డాయి, అదే మాదిరి తెరుచుకున్నాయి, తప్పపనిచేయలేదు. దీన్నే నీలిరంగు తెర మృత్యువు అన్నారు గానీ నిజానికి అది చావు బతుకుల మధ్యకొట్టుకోవటం. ఆపరేటర్లకు ఎందుకలా జరిగిందో అర్ధం కాదు, ఏం చేయాలో అసలే తెలియలేదు.ఎలాగైతేనేం పరిస్థితి చక్కబడింది. ఇప్పుడు తీరికగా జరిగిన నష్టం ఎంత అనే లెక్కల్లో మునిగారు. కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం ఉంటే ఇదే జరుగుతుందనే హెచ్చరికలు వెలువడ్డాయి. కొందరు ఇదే మంచి తరుణం మించిపోవును మీ కంప్యూటర్‌ వ్యవస్థలకు బీమా చేయించండి అంటూ సలహాలిస్తుంటే ఇదొక ఆముదమా అంటూ యజమానులు పెదవి విరుస్తున్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను కనిపెట్టినవారే వాటిని దెబ్బతీసే వైరస్‌లను సృష్టిస్తారు, వాటిని నిరోధించే లేదా సంహరించే భద్రత అంటూ మరొక సాఫ్ట్‌వేర్లను అంటగట్టటం తెలిసిందే. తమ కంప్యూటర్లలో తాము సూచించిన సాఫ్ట్‌వేర్లనే వాడాలనే నిబంధనల గురించి తెలిసిందే.మూడింట రెండు వంతుల క్లౌడ్‌ సదుపాయాల వ్యవస్థలను మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ సంస్థలే సమకూర్చుతున్నాయి. ఏదీ ఊరికే రాదు, ప్రతిదీ లాభం కోసమే కదా ! గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతిపాదనలను గతంలో మైక్రోసాఫ్ట్‌ వమ్ముచేసిందనే విమర్శలు ఉన్నాయి.


ఎనభైమూడు బిలియన్‌ డాలర్ల విలువగల క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా ఉత్పత్తుల సంస్థకు ప్రపంచవ్యాపితంగా ఇరవై వేల మంది ఖాతాదారులున్నారు,మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వాటిలో ఉన్నాయి. విండోస్‌కు అందచేసిన తమ ఉత్పత్తి ఫాల్కన్‌ సెన్సర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం కారణంగా మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులందరూ ఇబ్బంది పడినట్లు అది ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ అప్రదిష్ట కారణంగా ఈ కంపెనీ వాటాల ధరలు పదకొడుశాతం పడిపోయాయి. సైబర్‌ దాడి జరిగితే వేరు, తాజా ఉదంతం బాధ్యతా రహితంగా వ్యవహరించిన తీరుతో జరిగింది. ముందస్తు పరీక్షలు జరపకుండా, సరి చూసుకోకుండా నేరుగా ప్రయోగించిన లోప భూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు ఒక్క దేశం, చైనా తప్ప ప్రపంచం మొత్తం విలవిల్లాడింది. ప్రపంచ వ్యాపితంగా అంతరాయం కలిగినప్పటికీ ఒక్క చైనా దాన్నుంచి తప్పించుకున్నట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది.రాజధాని బీజింగ్‌, ఆర్థిక కేంద్రం షాంఘై వంటి చోట్ల ఉన్న విమానాశ్రయాలు సాధారణంగా నడుస్తున్నట్లు తెలిపింది. తరువాత ఇతర దేశాల మీడియా కూడా అవే కథనాలను ఇచ్చాయి. చైనా పౌరులు మైక్రోసాఫ్ట్‌ గురించి సామాజిక మాధ్యమం వెయిబోలో జోకులే జోకులు పేల్చారు.తమకు ఒక పూట సెలవు ఇచ్చినట్లు కొందరు చెప్పగా మా కంపెనీ వెంటనే మరోకంప్యూటర్‌కు మారినందున మాకు అది కూడా దక్కలేదని కొందరు చమత్కరించారు.


ఇప్పటికీ నల్లమందు భాయీలంటూ నిందించేవారు, చౌకరకం వస్తువులను తయారు చేయటం తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వారి దగ్గర లేదంటూ చైనాను వర్ణించేవారికి ఒక్కసారిగా బుర్రలు పనిచేయటం నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్‌ దెబ్బకు జరిగిన నష్టం విలువ ఎంతో ఇంకా తేలలేదు, దాన్నుంచి బయటపడేందుకు ఎంత సమయం తీసుకుంటుందో తెలియదని చెబుతున్నారు. ఇక చైనాను చూసి పనిచేయటం ఆగిపోయిన వారి బుర్రలు ఎప్పటికీ సాధారణ స్థితికి వస్తాయో తెలియదు.అఫ్‌ కోర్స్‌ , చైనా వ్యతిరేక వైరస్‌ సోకిన వారికి చికిత్సలేదనుకోండి. అయితే చైనాలో అసలేమీ ప్రభావితం కాలేదా ? అక్కడ మైక్రోసాఫ్ట్‌ సేవలు లేవా ? ఉన్నాయి, కొన్ని ప్రభావితమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అక్కడి విదేశీ సంస్థలు తప్ప చైనా స్వంత విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మామూలుగానే పనిచేశాయి. బహుశా ప్రపంచంలో సాంకేతిక అంతరాయం ఇంత పెద్ద ఎత్తున ఏర్పడటం ఇదే ప్రధమం. తిరుగులేని సంస్థగా పేరున్న మైక్రోసాఫ్ట్‌కూ ఇది కోలుకోలేని దెబ్బ. దాని మీద ఆధారపడిన విమానాశ్రయాలు, సంస్థలు, బాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకూ అంతరాయం కలిగింది. రక్షణ సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు దాన్ని తయారు చేసిన కంపెనీతో పాటు మైక్రోసాఫ్ట్‌ కూడా పేరుతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయాయి.వాటి ఖాతాదారులకు జరిగిన నష్టం గురించి అంచనాలు వేస్తున్నారు. ఇవి 24వందల కోట్ల నుంచి లక్షల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని, కొన్ని వారాల వరకు అంతరాయ పర్యవసానాలు ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ప్రొవైడెన్స్‌ హెల్త్‌ అనే సంస్థకు ఏడు రాష్ట్రాలలో 52 ఆసుపత్రులున్నాయి.నలభైవేల సర్వర్లకు గాను పదిహేను వేలు, లక్షా 50వేల కంప్యూటర్లు పనిచేయలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.ప్రపంచ వ్యాపితంగా ఉన్న కంప్యూటర్లలో ఒకశాతానికి అటూ ఇటుగా అంటే 85లక్షల విండోస్‌ కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి.2017లో వాన్నాక్రై సైబర్‌దాడిలో 150దేశాల్లో మూడులక్షల కంప్యూటర్లు దెబ్బతిన్నాయి.ఇలాంటి పెద్ద దాడులేగాక చిన్న చిన్నవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ శుక్రవారం నాటి అంతరాయం చారిత్రాత్మకమైనదిగా నమోదైంది. ఈ ఉదంతం తరువాత జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.నకిలీ ఇమెయిల్స్‌,ఫోన్లలో పిలుపులు, నకిలీ వెబ్‌సైట్లు వస్తాయని, వాటిని తెరవ కూడదని చెప్పారు.


ఇంతకూ చైనా ఎందుకు ప్రభావితం కాలేదు.కమ్యూనిస్టు చైనా ఉద్బవించినప్పటి నుంచి దాన్ని నాశనం చేసేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందువలన ప్రతి దశలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకొంటూ ఆ కుట్రలను వమ్ము చేస్తున్నది. సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ సమాంతరంగా తన స్వంత పరి శోధనలను కొనసాగిస్తున్నది. దీని గురించి తెలిసినా తెలియనట్లు, అబ్బే అదంతా ఉత్తిదే అనే ప్రచారం జరుగుతోంది. దాన్ని పట్టించుకోని చైనీయులు తమపని తాము చేసుకుపోతున్నారు. పూర్తిగా విదేశీ కంపెనీలు, దేశాలకు తమ జుట్టు అందించకుండా షరతులతో జాగ్రత్త పడ్డారు. అదే దాని బహిరంగ రహస్యం.చైనాలో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీసులు అందించే కంపెనీలు సదరు సంస్థ ప్రపంచ మౌలిక వ్యవస్థతో నిమిత్తం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నది ప్రభుత్వ షరతు. దీన్నినా గట్టిగా అమలు చేస్తున్న కారణంగా చైనాలో మైక్ట్రోసాఫ్ట్‌ సేవలు, వాటికి రక్షణ ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది.స్వంత హార్డ్‌వేర్‌, 360 వంటి భద్రతా సాప్ట్‌వేర్‌లతో అవి పని చేస్తాయి.మిగతా ప్రపంచం మాదిరి చైనా సంస్థలు మైక్రోసాఫ్ట్‌కు బదులు తమ స్వంత అలీబాబా, టెన్సెంట్‌,హువెరు వంటి సంస్థల సేవలనే వినియోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అంతర్జాతీయ గ్రూపు హౌటళ్లను నిర్వహిస్తున్న షెరటన్‌, మారియట్‌, హయత్‌ వంటి సంస్థల నుంచి వివరాలు తెలుసుకొనేందుకు చూస్తే వీలు కాలేదని చైనా నెటిజన్లు చెప్పారు.ఇటీవలి కాలంలో చైనాలో విదేశీ ఐటి వ్యవస్థలను వదిలించుకొని దేశీయ నెట్‌వర్క్‌లను వినియోగించుకోవటం పెరుగుతోంది.సమాంతర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా ఉత్పత్తుల మీద ఆధారపడటం లేదు. క్రౌడ్‌ స్ట్రయిక్‌ ఉత్పత్తులను అక్కడ వాడటం లేదు గనుక తప్పించుకుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలన్నీ అమెరికా కంపెనీల మీద ఆధారపడిన కారణంగా దెబ్బతిన్నాయి. ఒక వేళ వాటి ఉత్పత్తుల కారణంగా నష్టం జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నది తాజా ఉదంతం నేర్పిన పాఠం. ఇటీవలఅమెరికాతో సహా కొన్ని దేశాలు సైబర్‌దాడులకు సిద్దం అవుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు వస్తాడని వేరే చెప్పనవసరం లేదు.

బిజెపి క్రమశిక్షణ నేతి బీరలో నెయ్యి : మఠం దారిలో యోగి ఆదిత్యనాథ్‌, పావులు కదుపుతున్న మో-షా !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి దిమ్మతిరిగింది. గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్‌లో చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. దీంతో పార్టీలో చదరంగం, వైకుంఠపాళీ క్రీడలు ప్రారంభమయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని సమాజవాది పార్టీ తన తురుపు ముక్కను ప్రయోగించింది. ఎవరైనా వంద మంది ఎంఎల్‌ఏలతో బిజెపి నుంచి వెలుపలికి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తామని, ఇది వర్షాకాల ధమాకా అని ప్రతిపక్ష నేత అఖిలేష్‌ యాదవ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని 80లోక్‌సభ స్థానాలకు గాను బిజెపికి 2014లో 72, గత ఎన్నికల్లో 62రాగా ఇప్పుడు 33కు పడిపోయాయి. సమాజవాది పార్టీకి 37,దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. యోగిని తప్పించి తిరిగి గోరఖ్‌పూర్‌ మఠానికి పంపేందుకు నరేంద్రమోడీ, అమిత్‌ షా పూనుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రకరకాల కథనాలను ప్రచారంలో పెట్టారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వం మొత్తం తన వెనుకే ఉందని చూపేందుకు యోగి వరుసగా సమావేశాలు జరుపుతూ బల ప్రదర్శనకు పూనుకున్నారు.బిజెపి స్వయం ప్రకటిత నిబంధనల ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమైన పదవుల్లో ఉండకూడదు.ఆ సాకుతో అద్వానీని ప్రధాని పదవికి దూరంగా పెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ వంతు వచ్చింది. ఆ స్థానంలో తదుపరి యోగి ఆదిత్యనాధ్‌ ఉంటారని ఒక ప్రచారం కాగా నితిన్‌ గడ్కరీ పేరు మరోవైపు నుంచి వినిపిస్తున్నది. అమిత్‌ షా ప్రయత్నం సరేసరి. తన పుట్టుక మామూలుగా జరగలేదని, దైవాంశతో జన్మించిన కారణంగానే తనకు శక్తి వస్తున్నదంటూ వయస్సు వచ్చినా గద్దె దిగేది లేదన్నట్లు మోడీ తెగేసి చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్‌ ఓటమికి యోగిని బాధ్యుడిగా చేసి ఒకవేళ ప్రధానిగా అమిత్‌ షాకు అవకాశం వస్తే అడ్డుతొలిగించుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తున్నట్లుకూడా చెబుతున్నారు. దేన్నీ కాదనలేని స్థితి. మొత్తం మీద మిగతా పార్టీలకూ బిజెపికీ పెద్ద తేడాలేదని జనాల కళ్లు తెరిపిస్తున్నారు.


ఇతర పార్టీల వ్యవహారాల్లో వేలుపెట్టి కెలుకుతున్న బిజెపి నేతలు ఇప్పుడు స్వంత పార్టీలోనే చేస్తున్నారని అఖిలేష్‌ యాదవ్‌ ఊరికే అనలేదు. ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌తో సహా అనేక కీలక నియోజకవర్గాలలో బిజెపి మట్టికరచింది. నరేంద్రమోడీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ 4.79లక్షల నుంచి 1.52లక్షలకు దిగజారింది. తమను ఓట్ల రొంపిలోకి లాగటం ఏమిటని అటు రాముడు, ఇటు కాశీ విశ్వనాధుడు కన్నెర్ర చేసినట్లు స్పష్టమైంది. అంతా మీరే చేశారు, అన్నింటికీ మీరే కారణం అన్నట్లుగా ఓటమి కారణాలను యోగి మీదకు నెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేదని యోగి చెబుతున్నారు. నిజానికి యోగి పేరుకు సర్వసంగ పరిత్యాగి తప్ప అతగాడి వెనుక బలమైన రాజపుత్ర ఠాకూర్‌ సామాజిక తరగతి ఉంది. ఓసిలలో బ్రాహ్మణులు, యాదవుల తరువాత ఎనిమిది శాతంతో వీరిదే పెద్ద సంఖ్య. ఆర్థికంగా బలమైన తరగతి. బ్రాహ్మణులు-ఠాకూర్ల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంది. నరేంద్రమోడీ ఈ సామాజిక తరగతులను పక్కన పెట్టి వెనుకబడిన తరగతులను ముందుకు తెచ్చి తనదైన ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకున్నారు. నిజానికి ఈ రాష్ట్ర బిజెపిలో ఎప్పటి నుంచో కుమ్ములాటలు ఉన్నాయి.లోక్‌సభ ఎన్నికల తరువాత యోగిని ఇంటికి పంపుతారన్న ప్రచారం ముందే ఉంది. మూడోసారి మోడీ గెలిస్తే యోగికి మూడినట్లే అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికలలో చావు దెబ్బతినటంతో యోగి వ్యతిరేకులకు, అనుకూలురకు కూడా మంచి ఊపు వచ్చింది. బిజెపిలో కించపరిచే పదజాలం ఒక్క ముస్లింలకే పరిమితం కాదు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నియోజకవర్గ అభ్యర్థి, కాబినెట్‌ మంత్రి పురుషోత్తం రూపాలా రాజపుత్రుల మీద విరుచుకుపడ్డారు. రోటీ బేటీ కా సాత్‌ – రాజపుత్రులు బ్రిటీష్‌ వారికి వారి కుమార్తెలనిచ్చి వివాహాలు చేశారని, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఇది గుజరాత్‌తో పాటు ఉత్తర భారతంలో రాజపుత్రులున్న చోటల్లా వారికి కాలింది. మధ్య ప్రదేశ్‌లో ఠాకూర్లను పక్కన పెట్టినట్లుగానే ఉత్తర ప్రదేశ్‌లో వికె సింగ్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌ వంటి కీలక నేతలను ఇంటికి పంపారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ రాజనాధ్‌ సింగ్‌ను కూడా పక్కన పెట్టినట్లుగానే భావిస్తున్నారు. ఆ కారణంగానే ఎక్కడా పెద్దగా మాట్లాడరు. ఆగ్రహంతో ఉన్న ఠాకూర్లను బుజ్జగించేందుకు అధిష్టానం ఇప్పుడు రాజనాధ్‌ను ఎంచుకుందని వార్తలు వచ్చాయి. వారిని సంతుష్టీకరించే ప్రక్రియలో భాగంగా అమిత్‌ షా ఇప్పటికే కొందరు నేతలతో రహస్యమంతనాలు జరిపారు. ఠాకూర్లలో పలుకుబడి కలిగిన రాజా భయ్యాను చేరదీసి వారిలో చీలిక తెచ్చి ఠాకూర్లను విస్మరించలేదనే సందేశంతో యోగికి పోటీ నేతగా ముందుకు తెచ్చే ఎత్తుగడ దీనిలో ఉంది. ఈ పరిణామం మీద ఆ సామాజిక తరగతి ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దీంతో యోగిని సాగనంపటం ఎలా అన్నది ఆసక్తికరంగా మారింది.
శాసనసభలో పది స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.వాటిలో మిత్రపక్షాలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా బిజెపి ఒక్కటే బరిలో ఉండాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వీటిలో ఐదు స్థానాలు సమాజవాది పార్టీ, నాలుగు బిజెపి, ఒకటి ఆర్‌ఎల్‌డి గతంలో గెలిచినవే.వీటిలో బిజెపి దెబ్బతింటే దానికి బాధ్యత యోగీదే అని చెప్పేందుకు ప్రత్యర్ధులు సిద్దం అవుతున్నారు. ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పది చోట్ల ఇండియా కూటమి గెలిచింది. ఉత్తర ప్రదేశ్‌లో ఓటమికి యోగి కంటే ప్రధానిగా నరేంద్రమోడీ ఎక్కువగా ఎక్కువగా బాధ్యత వహించాలి.చివరకు తన మెజారిటీ తగ్గటానికి కూడా వేరే వారిని నిందిస్తే కుదరదు. యోగి ఒక్కరే సర్వస్వం కాదు అన్న సందేశం ఇచ్చేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను అధిష్టానం నియమించింది. ప్రతి చిన్న విషయాన్ని ప్రధాని కార్యాలయం నియంత్రిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్ర డిజిపి నియామకంలో తనకు ఇష్టమైన వారిని ఎంచుకొనేందుకు యోగికి అవకాశం ఇవ్వటం లేదు.తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఎంతో వత్తిడితో ఒకరిని నియమించినా తరువాత నలుగురు తాత్కాలిక డిజిపిలు తప్ప శాశ్వత నియామకాలు లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా అదే జరిగింది.మంత్రివర్గం నుంచి యోగి అనుకూల సూర్య ప్రతాప షాహిని తొలగించి వ్యతిరేకిగా ఉన్న శివ ప్రతాప శుక్లాకు కట్టబెట్టారు. ఒక విధంగా యోగిని పొమ్మనకుండా పొగబెట్టారు.రెండవసారి గెలిచిన తరువాత కూడా అదే జరిగింది. తీవ్రంగా వ్యతిరేకించినా ఇద్దరిని మంత్రులుగా చేర్చారు. వారిలో ఒకరు ఉప ఎన్నికలో ఓడిన తరువాత సమాజవాది పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరిలో ఒకరైన ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్యకు మోడీ, షా మద్దతు ఉందని, అందువల్లనే ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని తాజాగా ధ్వజమెత్తినట్లు చెబుతున్నారు.పార్టీ కార్యకర్తల బాధ తనకు తెలుసునని మౌర్య అనటాన్ని యోగి మద్దతుదార్లు తప్పుపడుతున్నారు. అతను ఉపముఖ్యమంత్రి కాదా ? కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా ?అది చేయకుండా ప్రతికూల ప్రచారం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.


తన పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన యోగి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.ఇంతవరకు ఎక్కడా బహిరంగంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు.తన అనుచరులను రంగంలోకి దించారు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదన్న కేశవ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యపై వెంటనే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పార్టీ నేత సునీల్‌ భరాలా స్పందించారు.” ఎన్నికలలో ఎదురుదెబ్బలు, ఓటమికి పార్టీయే కారణమని గౌరవనీయ ఉపముఖ్యమంత్రి కెపి మౌర్య వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలి ” అని ఎక్స్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. ఈ పోస్టును తొలగించేందుకు బిజెపి కేంద్ర పెద్దలు తెచ్చిన వత్తిడికి ఇప్పటివరకైతే భరాలా లొంగలేదు. గతంలో పార్టీ ఓడినపుడు కల్‌రాజ్‌ మిశ్రా, వినరుకతియార్‌ రాజీనామా చేశారని కూడా గుర్తుచేశారు. బిజెపి మురికివాడల విభాగపు జాతీయ కన్వీనర్‌గా భరాలా ఉన్నారు.ఇలాంటి వారు అనేక మంది యోగి కనుసైగల కోసం ఎదురు చూస్తున్నారు. తన అనుచరులకు సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో చూడండి అన్నట్లుగా యోగి చూపారు. ఆయన కనుసన్నలలో నడిచే హిందూ యువ వాహిని స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఉప ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వస్తే తనపై వేటు పడుతుందని గ్రహించిన యోగి ఆ నియోజకవర్గాలకు 16 మంది మంత్రులను కేటాయించారు. ఎన్నికలు ముగిసేవరకు వారంలో రెండు రోజులు మంత్రులు అక్కడే మకాం వేయాలని ఆదేశించారు. గెలిస్తే తన ప్రతిభ లేకపోతే మంత్రులు సరిగా పనిచేయలేదని చెబుతారు.


ఆకస్మికంగా ప్రభుత్వం మీద జనాలకు ఆగ్రహం కలిగేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటంటూ బిజెపి ఎంఎల్‌సి దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సిఎంకు లేఖ రాశారు.రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలన్న ఎంఎల్‌ఏ రమేష్‌ మిశ్రా వీడియో వైరల్‌ అవుతోంది.బిజెపి మిత్ర పక్షం నిషాద్‌ నేత సంజరు నిషాద్‌ కూడా యోగిపై ధ్వజమెత్తారు.బుల్డోజర్లను మాఫియాలు, భూ కబ్జాదారులపై ప్రయోగించాలి తప్ప తగిన పత్రాలు లేని పేదల ఇండ్లు కూల్చివేతకు ఉపయోగించరాదని, అలా చేస్తే ఎన్నికల్లో మనలను ఓడించేందుకు వారు సంఘటితం అవుతారని, అనేక ఉదంతాలలో అధికారులు అలాంటి కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. అతి విశ్వాసం, ఓట్ల బదిలీ మన అంచనాలను దెబ్బతీశాయి. గతంలో ప్రతిపక్షం వెంటిలేటర్‌ మీద ఉంది, ఇప్పుడు కొంత ప్రాణవాయువు తీసుకుంటున్నదని ఆదిత్యనాథ్‌ చెప్పారు.ఫైజాబాద్‌(ఆయోధ్య ఉన్న నియోజకవర్గం) వంటి గట్టి ప్రాంతాల్లో ఓడిపోవటానికి కొన్ని కులాలు దూరం కావటమే కారణం, ఓబిసి కులాల,దళితుల మద్దతు తిరిగి పొందాలంటే ఓబిసి నేత, ఉపముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉన్న మౌర్యకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుందని యోగి వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ కొన్ని రౌండ్లలో వెనుకబడిన తీరు చూస్తే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు ఎంతవారైనా ఓడిపోకతప్పదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, తరువాత యోగికి ఉద్వాసన ఖాయమని చెబుతున్నారు.అధికారం అందరినీ కలిపి ఉంచుతుంది. దానికి ముప్పు సూచనలు కనిపిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపిలో జరుగుతున్న పరిణామాలు దీన్నే వెల్లడిస్తున్నాయి.

నరేంద్రమోడీ ఫైల్స్‌ అట్టర్‌ ఫ్లాఫ్‌ : అప్పుల కుప్పలు, ఉత్పత్తిలో కాదు ఉత్తుత్తి కబుర్లలో చైనాతో పోటీ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది 2025 మార్చి నెలాఖరుకు మన వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్‌వాల్‌ తాజాగా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరలో 778.2బి.డాలర్లు ఉన్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలలో 200బి.డాలర్ల మేర ఎగుమతులు జరిగినందున ఇదే ధోరణి మిగిలిన తొమ్మిది మాసాల్లో కూడా కొనసాగుతాయన్నది ఆశాభావం మాత్రమే. దిగుమతులు వెయ్యి బిలియన్‌ డాలర్లకు మించే ఉంటాయని కూడా చెప్పవచ్చు. గడచిన పది సంవత్సరాలలో ట్రైలర్‌ మాత్రమే చూపానని అసలైన సినిమా తరువాత ఉంటుందని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా సినీ ప్రేక్షకులను ట్రైలర్లతో ఆకట్టుకొనేందుకు చూస్తారు. ఈ రీత్యా చూసినపుడు ట్రైలర్‌ చూసిన తరువాత జనానికి నచ్చని కారణంగానే లోక్‌సభలో స్వంతంగా మెజారిటీని తెచ్చుకోలేకపోయారు. కూటమిగా కూడా నాలుగు వందల సీట్లకు చాలా దూరంలో ఉన్నారు. ఇక నరేంద్రమోడీ ఫైల్స్‌ అనే సినిమాలో అనేక అంశాలు ఉన్నాయి. ముందుగా విదేశీ అప్పుల గురించి చూద్దాం.
మోడీ గద్దె నెక్కిన 2014లో మన విదేశీ అప్పులు 446.2బిలియన్‌ డాలర్లు. మోడీ కొత్త అప్పులు చేయలేదు, పాత అప్పులు తీర్చారంటూ భక్తులు గొప్పగా దైవాంశ సంభూతుడి మహిమల గురించి ప్రచారం చేశారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2024 మార్చినెలలో వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 డిసెంబరు ఆఖరుకు 648.2బిలియన్‌ డాలర్ల విదేశీ అప్పు ఉంది. అంటే రెండు వందల బిలియన్‌ డాలర్లు పెరిగింది. పాత అప్పు తీర్చితే బకాయి తగ్గాలి, కానీ పెరిగిందంటే కొత్త అప్పులు చేసినట్లే కదా ! దీనికి బాధ్యులెవరు ? మన విదేశీ మారక ద్రవ్య నిల్వ ప్రస్తుతం 657 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉన్నాయి. ఇవి అప్పులకు సరిపోతాయి. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన విదేశీ వాణిజ్య లోటు 137 బిలియన్‌ డాలర్లు కాగా తాజాగా నెలకు ఇరవై బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది, అంటే 240బి.డాలర్లు. లోటు తగ్గించలేకపోతే మానే పెత్తనంలో పెంచకూడదనుకుంటారు, కానీ దాదాపు రెట్టింపుకు దగ్గరగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సమాచారం మేరకు 2023-24లో మన వాణిజ్యలోటు 238 బిలియన్‌ డాలర్లు.దీనిలో మూడోవంతుకు పైగా 85.09బి.డాలర్లు చైనాకే సమర్పించుకున్నాం, కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా చైనా ఎగుమతులు చేస్తున్నది కనుక దానితో ఉన్న 12.21 బి.డాలర్లను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. మన విదేశీ మారక నిల్వలు అప్పులకు సరిపడా ఉన్నాయి. ఎగుమతులతో వచ్చే రాబడి దిగుమతులకు చాలటం లేదు, దేశం ముందుకుపోతున్నట్లా వెనక్కు నడుస్తున్నట్లా ? చివరకు లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందా ? విదేశాల్లో ప్రతిష్ట, పలుకుబడి, మార్కెట్లను పెంచానంటారు తప్ప అది దేవతా లేదా మాయవస్త్రంలా మామూలోళ్లకు కనిపించటం లేదు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83బి.డాలర్లకు చేరింది. తరువాత పదేండ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. అప్పటి నుంచి ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది.ఈ సంవత్సరాలలో వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6లక్షల కోట్ల నుంచి 156.6లక్షల కోట్లకు 174శాతం పెరిగింది.కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా ? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రు.164లక్షల కోట్లు, విదేశీ అప్పు 5లక్షల కోట్లు మొత్తం కలిపితే రు.169లక్షల కోట్లకు, 2025 మార్చి ఆఖరుకు 184లక్షల కోట్లకు చేరనుంది.


మన ఎగుమతుల తీరుతెన్నులను చూద్దాం. సిఎంఐఇ సేకరించిన సమాచారం ప్రకారం మన ఎగుమతుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. బాగా పలుకుబడి పెరిగిందని చెప్పుకున్న కారణంగా జనం రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు. సంవత్సరాల వారీ మొత్తం ఎగుమతుల్లో వస్తువుల శాతాలు ఇలా ఉన్నాయి.
వస్తువులు×××××××2019-20×2020-21×2021-22×2022-23×2023-24
చమురు ఉత్పత్తులు××× 13.2 ××× 8.8 ××× 16.0 ××× 21.6 ××× 19.3
చమురేతర ఉత్పత్తులు×× 86.8 ××× 91.2 ×× 84.0 ××× 78.4 ××× 80.7
వ్యవసాయ ఉత్పత్తులు×× 11.2 ××× 14.2 ×× 11.8 ××× 11.6 ××× 11.0
ఖనిజ ఉత్పత్తులు ×××× 01.5 ××× 02.4 ×× 01.4 ××× 01.1 ××× 01.5
పారిశ్రామికవస్తువులుు×× 73.0 ××× 73.5 ×× 69.8 ×× ×64.3 ××× 66.8
ఎగువన ఉన్న వివరాలు చెబుతున్నదేమిటి ? కరోనా సమయంలో పెద్దగా చర్చ లేకుండా ఎవరూ వ్యతిరేకించరనే ఎత్తుగడతో మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతులకు చెప్పిందేమిటి ? మన వ్యవసాయ ఉత్పత్తులకు పెద్గగా మార్కెట్‌ను పెంచాం, నేరుగా ఎక్కడికైనా ఎగుమతులు చేసుకొనేందుకు వీలుగా ఈ చట్టాలను తీసుకువచ్చామని చెప్పారు.కానీ మన ఉత్పత్తులకు మోడీ చెప్పినంత మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు లేని కారణంగానే ఎదుగూబొదుగూ లేకపోవటం లేదా గిడసబారిన తీరు కనిపిస్తోంది.ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులను పెంచామని తమ జబ్బలను తామే చరుచుకుంటారు. మొత్తం ఎగుమతుల్లో అవి 4.1 నుంచి ఐదేండ్లలో 7.1శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఎగుమతుల ప్రోత్సాహక పథకం వంటి కబుర్లు ఎన్ని చెప్పినా మొత్తం పారిశ్రామిక వస్తువుల ఎగుమతుల వాటా తగ్గుతోంది.మనం ముడి చమురును దిగుమతి చేసుకొని దాన్నుంచి ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయటం ఒక్కటే పెరుగుతోంది.అది కూడా రష్యా నుంచి చౌకగా దిగుమతులు చేసుకొని ఎగుమతులు పెరిగినందున ఆ మేరకు ఉంది. చమురుకు విదేశాల మీద ఆధారపడటం తగ్గించాలని గద్దెనెక్కగానే చెప్పారు. స్వదేశీ ఉత్పత్తి పెంచుతామన్నారు.2014-15లో మొత్తం దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37.46మిలియన్‌ టన్నులు కాగా అదేమి దరిద్రమో పదేండ్లలో 30మి.టన్నులకు పడిపోయింది.దీనిలో 22.6 మిలియన్‌ టన్నులు పనికిరాని వంటూ నిత్యం ఆడిపోసుకొనే ప్రభుత్వ రంగ సంస్థలే చేస్తున్నాయి.రిలయన్స్‌ వంటి ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వాటిని కూడా సరిగా పని చేయనివ్వకుండా చేస్తున్నందున వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కిందా అంటే ప్రయివేటు కంపెనీలు పొడిచిందేమీ లేదు.


చైనా వృద్ధి రేటు భారత్‌ కంటే ఎంతో తక్కువగా ఉందని,రియలెస్టేట్‌ రంగం సంక్షోభంలో పడిందని, మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలిపోనుందన్నట్లుగా రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. జూన్‌ మాసంలో మన ఎగుమతులు 2.5శాతం పెరగ్గా, దిగుమతుల వృద్ధి రేటు ఐదు శాతం ఉన్నట్లు వెల్లడించిన తరుణంలోనే చైనా గురించి కూడా వార్తలు వచ్చాయి. రాయిటర్స్‌ విశ్లేషణ ప్రకారం జూన్‌లో చైనా ఎగుమతులు అంచనాలకు మించి జరగ్గా దిగుమతులు తగ్గాయి. ఇలా జరగటం అంటే స్థానిక డిమాండ్‌ తగ్గటం ఆందోళన కలిగించే పరిణామం, గిరాకీని పెంచాలంటే ఉద్దీపన పథకాలను అమలు జరపాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గడచిన పదిహేను మాసాల్లో ఎగుమతులు జూన్‌లో వేగంగా పెరిగినట్లు కూడా ఆ వార్త పేర్కొన్నది. ప్రపంచంలో డిమాండ్‌ పెరిగిన కారణంగా చైనా ఎగుమతులు 8.6శాతం పెరిగినట్లు జపాన్‌ ఆసియా నికీ డాట్‌కామ్‌ పేర్కొన్నది. చైనా వస్తువుల దిగుమతులను అడ్డుకొనేందుకు అనేక దేశాలు భారీ మొత్తాలలో దిగుమతి పన్నులను విధించినప్పటికీ ఈ పెరుగుదల ఉంది. ఇదే సమయంలో మన వస్తువుల మీద అలాంటి పన్నులు లేకున్నా ఎగుమతులు 2.5శాతానికే ఎందుకు పరిమితం అయినట్లు ? చైనా దిగుమతులు తగ్గినందున గిరాకీ పెంచేందుకు ఉద్దీపన ప్రకటించాలని కోరుతున్నవారు విదేశీ కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప వేరు కాదు. స్వదేశీ వస్తు వినియోగం తగ్గితే ఆందోళన చెందాలి లేదా పెంచటానికి ప్రోత్సాహకాలు ఇస్తే ఏ దేశానికైనా లాభం, గిరాకీ పెరిగితే పరిశ్రమలు పని చేస్తాయి, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, జనాలకు రాబడి పెరిగితే గిరాకీ పెరుగుతుంది తప్ప విదేశీ వస్తువులకు రాయితీలు ఇస్తే ఆయా దేశాల పరిశ్రమలకు, కార్మికులకు లబ్ది ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది అదే.అయితే చైనా దిగుమతుల్లో మూడో వంతు పరికరాలు తిరిగి ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన విడి భాగాలే. ఈ రీత్యా చైనాకు సమస్యలొస్తే వాటిని ఎగుమతి చేసే దేశాలకూ వచ్చినట్లే. కనుక అవి కూడా చైనాతో సంబంధాలను పునరాలోచించుకోవాలి. ఇతర దేశాల ఆంక్షల కారణంగా దిగుమతులకు అవకాశం లేని సెమీ కండక్టర్ల వంటి వాటిని చైనా స్వయంగా తయారు చేసుకోవటం కూడా ప్రారంభించింది. తొలి ఆరు నెలల కాలంలో చైనా ఎగుమతులు 3.6శాతం పెరిగి 1.71లక్షల కోట్ల డాలర్లకు, దిగుమతులు రెండుశాతం పెరిగి 1.27లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య మిగులు 435బిలియన్‌ డాలర్లు. మన అధికారులు చెప్పినట్లు మొత్తం ఎగుమతులు 800బిలియన్‌ డాలర్లకు పెరిగినప్పటికీ అది చైనా వాణిజ్య మిగులు కంటే తక్కువే.అమెరికా వంటి వ్యతిరేక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకోవటం కంటే అదిరించి బెదిరించి తమ వస్తువులను కొనిపించాలని లేదా చైనాను ఎలా దెబ్బతీయాలా అన్నదాని మీదే ఎక్కువ కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకున్నాయి. చైనా వస్తువుల మీద అవి కేంద్రీకరిస్తున్నప్పటికీ అంతిమంగా ఇతర దేశాల మీద కూడా ఆంక్షలకు పూనుకుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనంతీసుకున్న నిర్ణయాల గురించి అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి.


అధికారానికి వచ్చినప్పటి నుంచీ చైనాను అధిగమిస్తామని, దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామని నరేంద్రమోడీ చెబుతూనే ఉన్నారు. పదేండ్లలో ఒక్క ఏడాదైనా వాణిజ్య మిగులును సాధించలేకపోయారు.మోడీకి పొగడ్తలు తప్ప మన వస్తువులకు మార్కెట్‌లేదు. దిగుమతులు పెరిగినప్పుడు తమ ఘనతే, దేశంలో కొనుగోలు శక్తి పెరగటానికి నిదర్శనం అంటారు.ఎప్పుడైనా తగ్గితే చూశారా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించాం, విజయం కాదా అంటారు. వాణిజ్య విషయాలకు వస్తే 2022-23తో పోలిస్తే వస్తు ఎగుమతులు 451 నుంచి 437 బి.డాలర్లకు తగ్గగా సేవలు 325 నుంచి 339బి.డాలర్లకు పెరిగాయి.దిగుమతులు 752 నుంచి 677 బి.డాలర్లకు, సేవలు 182 నుంచి 177 బి.డాలర్లకు తగ్గాయి. జిడిపిలో ఐదవ స్థానానికి చేర్చటం తమ ఘనత అని, త్వరలో మూడో స్థానానికి తీసుకుపోతాం అని చెప్పుకుంటున్న మోడీ బృందం వస్తు ఎగుమతుల్లో ఎక్కడ ఉందో ఎందుకు చెప్పదు. గత పది సంవత్సరాల్లో ప్రపంచంలో 19 నుంచి 17వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో ఉన్న చైనా 3,380 బిలియన్‌ డాలర్ల మేర 2023లో ఎగుమతి చేయగా మనం 432బి.డాలర్ల దగ్గర (స్టాటిస్టా సమాచారం) ఉన్నాం. చివరకు చైనా ఏలుబడిలో 70లక్షలకు పైగా జనాభా ఉన్న హాంకాంగ్‌ 573బి.డాలర్లతో పదవ స్థానంలో ఉంది.చైనాతో పోటీ పడాల్సిందే ! దేనిలో, ఉత్పత్తిలో తప్ప ఉత్తుత్తి కబుర్లలో కాదు !!

హత్యాయత్నం ట్రంప్‌కు కలసివచ్చింది : అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు ఎవరి నుంచి ?

Tags

, , , , , ,



ఎం కోటేశ్వరరావు


” అమెరికా మీద దాడి జరుగుతోంది, ముట్టడిలో ఉంది, ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు చూస్తున్నారు.చీకటి అధ్యాయానికి నాంది ” మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నంపై వెలువడిన తక్షణ వ్యాఖ్యలివి.అతగాడు ప్రాణాపాయం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు.శనివారం నాడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్‌ అనే పట్టణంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు జరిపిన కాల్పులో ట్రంప్‌కు కుడి చెవి దగ్గర బుల్లెట్‌ గాయం తగిలింది.దుండగుడి కాల్పుల్లో సభికుల్లో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హంతకుడిని వెంటనే భద్రతా దళాలు కాల్చి చంపాయి. సభ సమీపంలోని ఒక భవనంపై మాటువేసి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఈ ఉదంతం తరువాత అమెరికా రాజకీయాలు, ఎన్నికల్లో ఏం జరగనుందనే చర్చ మొదలైంది.దీనికి ముందు డెమోక్రటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ వృద్దాప్యం గురించి, పోటీ నుంచి తప్పుకొని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ లేదా మరొకరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. హత్యాయత్నంతో సానుభూతి తలెత్తి ట్రంప్‌ విజయావకాశాలు మెరుగుపడినట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో పార్టీల నేతలు, ఎన్నికల్లో అభ్యర్థులపై ౖ జరిగేదాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థి జో బైడెన్‌ వెంటనే ఖండించాడు. ట్రంప్‌పై దాడిని వివిధ దేశాల నేతలు ఖండించారు. దుండగుడు ఇరవై ఏండ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుగా నమోదై ఉన్నాడు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి విరాళం ఇచ్చిన దాఖలా కూడా వెల్లడైంది. ఎందుకు కాల్పులు జరిపాడో వెంటనే తెలియలేదు. క్రూక్స్‌కు తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. తాను ట్రంప్‌ను, రిపబ్లికన్‌ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నట్లు అతడు చెప్పాడన్న వార్తలు కూడా వచ్చాయి. కేవలం ఈ మాత్రానికే దాడికి పాల్పడతాడా ? దీని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ,ట్రంప్‌ మరోసారి అధికారానికి రాకూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారు, రష్యా, చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియా దేశాల హస్తం ఉండవచ్చా అనే సందేహాలను కూడా కొందరు లేవనెత్తినట్లు చెబుతున్నారు. దుండగుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.ఉగ్రవాదం నుంచి కూడా పెట్టుబడిదారులు ఎలా లాభాలు పొందుతారో ట్రంప్‌పై కాల్పుల ఉదంతం వెల్లడించింది. ఈ ఉదంతం తరువాత ట్రంప్‌ మీడియా మరియు టెక్నాలజీ గ్రూపు కంపెనీల వాటాల ధరలు సోమవారం నాడు 55శాతం పెరిగాయి, ఒక దశలో 71శాతాన్ని తాకాయి. ఈ కారణంగా ట్రంప్‌ సంపద విలువ ఒక్క రోజులోనే రెండు బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఈ కంపెనీ ట్రంప్‌ సామాజిక మాధ్యమ ప్రచారాన్ని నిర్వహించే ట్రూత్‌ సోషల్‌ వేదికను కూడా నిర్వహిస్తున్నది. అనేక కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. దీని అర్దం ఏమిటి ? ట్రంప్‌ ఎన్నిక అవకాశాలు పెరిగినట్లు పెట్టుబడిదారులు భావించటమే దీనికి కారణం. ట్రూత్‌ సోషల్‌ను అనుసరించే వారు కూడా గణనీయంగా పెరగటంతో నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ రానున్న రోజుల్లో లాభాల బాట పట్టినట్లే. తుపాకులు, తూటాలు తయారు చేసే కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా ” ఆంధ్రా అల్లుడు ” జెడి వాన్స్‌(39) ఎంపికయ్యారు.(ఎగువ చిత్రంలో ట్రంప్‌తో కలసి ఉన్నవ్యక్తి) వాన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న ప్రవాస భారత కుటుంబానికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నాడు.


ట్రంప్‌పై దాడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో కొందరు మూడు సంవత్సరాల క్రితం 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపై దాడికి తన మద్దతుదార్లను పంపిన డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వాకాన్ని విస్మరించారు. ట్రంప్‌పై దాడి వ్యక్తిగతం, కానీ అతగాడి మద్దతుదార్ల చర్య మొత్తం అమెరికా అధికార, ప్రజాస్వామిక వ్యవస్థనే అపహాస్యం పాలు చేసిందనే అంశాన్ని మరిచిపోరాదు. అమెరికా, దాని ప్రజాస్వామ్యం మీద అసలైన దాడి అది.అమెరికాలో నలుగురు అధ్యక్షులను తుపాకి తూటాలు బలితీసుకున్నాయి. కొంత మంది అధ్యక్షులు తృటిలో తప్పించుకున్నారు, ఇటీవలి కాలంలో రాజకీయపరమైన దాడులు మరింతగా పెరుగుతున్నాయి. కానీ దేశ అధికార కేంద్రంపై ట్రంప్‌ నాయకత్వంలో జరిగిన దాడి చరిత్రలో అదే మొదటిది. తాను ఓడిపోతే ఫలితాలను అంగీకరించేది లేదని ముందుగానే అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓడిపోయిన తరువాత విజేతను అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని జరగకుండా చూసేందుకు, జో బైడెన్‌ గద్దెనెక్కకుండా చేసేందుకు ట్రంప్‌ చేసిన కుట్రలో భాగమది. అంతే కాదు దేశీయ ఉగ్రవాదం అనే కోణంలో ఎఫ్‌బిఐ, ఇతర చట్టాన్ని అమలు జరిపే సంస్థలు చూశాయి. దాడికి ముందు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు కొద్ది దూరంలో తన మద్దతుదారులతో సమావేశం జరిపిన ట్రంప్‌ కాపిటోల్‌ను ఆక్రమించాలని, ఎన్నిక నిర్దారించే పత్రాన్ని ఇవ్వకుండా అడ్డుకోవాలని రెచ్చగొట్టి పంపించాడు.ఈ కేసులో కొంత మందికి శిక్షలు పడినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌పై విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశం లేదు, ఒకవేళ ట్రంపు గెలిస్తే అసలు విచారణే ఉండకపోవచ్చు, ఓడితే వచ్చే ఏడాది జరగవచ్చు.


ట్రంప్‌పై దాడి ప్రపంచానికి చూపుతున్నదేమిటి ? అమెరికాలో రాజకీయ విభజన కారణంగా రాజకీయ హింస కూడా పెరుగుతున్నది. దాడి వెనుక మూడు కారణాలున్నట్లు ఒక అభిప్రాయం. ఒకటి, ట్రంప్‌ గెలవ కూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారి హస్తం, ట్రంప్‌ వంటి పచ్చిమితవాది అధికారానికి రాకూడదని కోరుకుంటున్న వామపక్ష తీవ్రవాద శక్తులు, ఎవరితో ప్రమేయం లేకుండా ట్రంప్‌ మీద తలెత్తిన వ్యక్తిగత ఆగ్రహం కారణంగా కాల్పులు జరిపి వుండవచ్చని చెబుతున్నారు. ఈ కారణాలతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రయత్నాలు జరగవచ్చన్న హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికా చరిత్రలో రాజకీయ హింసాకాండ నేతలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. తొలి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌. 1865 ఏప్రిల్‌ 14న జాన్‌ విల్కెస్‌ బూత్‌ కాల్చి చంపాడు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్‌ హత్యకు కారణం.బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే అమెరికా 20వ అధ్యక్షుడైన అమెస్‌ గార్‌ఫీల్డ్‌ను హత్య చేశారు. 1881 జూలై 2న వాషింగ్టన్‌ రైల్వే స్టేషన్‌లో నడుస్తుండగా ఛార్లెస్‌ గిటౌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రజలతో కరచాలనం చేస్తుండగా అమెరికా 25వ అధ్యక్షుడైన విలియం మెకిన్లే 1901 సెప్టెంబర్‌ 1న న్యూయార్క్‌లోని బఫెలోలో హత్యకు గురయ్యారు. 28 సంవత్సరాల నిరుద్యోగ వైద్యుడు కాల్పులు జరిపాడు. 1965 నవంబర్‌లో 35వ అధ్యక్షుడైన జాన్‌ ఎఫ్‌ కెన్నడీ తన సతీమణి జాక్వెలిన్‌తో కలిసి డల్లాస్‌లో పర్యటిస్తుండగా హంతకుడు లీ ఆర్వీ ఆస్వాయిడ్‌ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్య గురించి తలెత్తిన అనుమానాలు ఇంతవరకు తీరలేదు, అదొక రహస్యంగా ఉండిపోయింది.
రెండుసార్లు దేశాధ్యక్షుడిగా పనిచేసి, మూడోసారి పోటీకి దిగిన థియొడోర్‌ రూజ్‌వెల్ట్‌పై ప్రచార సందర్భంగా 1912లో మిల్వాకీలో కాల్పులు జరిగాయి. అయితే ఆయనకు తీవ్రమైన గాయాలేవీ కాలేదు. అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ 1933 ఫిబ్రవరిలో మియామీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుండి రూజ్‌వెల్ట్‌ తప్పించుకున్నప్పటికీ చికాగో మేయర్‌ ఆంటన్‌ సెర్మాక్‌ చనిపోయాడు. 1950లో 33వ అధ్యక్షుడు హారీ ఎస్‌. ట్రూమన్‌ నివసిస్తున్న బ్లార్‌ హౌస్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ట్రూమన్‌ తప్పించుకున్నప్పటికీ ఎదురు కాల్పుల్లో అధ్యక్ష భవనం పోలీసు, ఒక దుండగుడు చనిపోయాడు.డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాబర్ట్‌ కెన్నడీని లాస్‌ ఏంజెల్స్‌ హౌటల్‌లో హత్య చేశారు. 1972లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన జార్జ్‌ వాలస్‌పై కాల్పులు జరిగాయి. 1975లో 38వ అధ్యక్షుడైన ఫోర్డ్‌ కొన్ని వారాల వ్యవధిలోనే రెండు హత్యాయత్నాల నుండి తప్పించుకున్నారు. 40వ అధ్యక్షుడైన రోనాల్డ్‌ రీగన్‌ 1981 మార్చిలో వాషింగ్టన్‌ డీసీలో జనంలో ఉన్న జాన్‌ హింక్లీ జూనియర్‌ కాల్పులు జరిపాడు. ఆయన కోలుకున్నప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్‌ బుష్‌ 2005లో జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్‌ సాకష్వీతో కలిసి ఓ ర్యాలీకి హాజరు కాగా ఆయనపై చేతి గ్రెనేడ్‌ విసిరారు.అయితే అది పేలకపోవడంతో ఎవరూ గాయపడలేదు.

అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని చూసినట్లయితే కొన్ని అంశాలలో తేడాలున్నప్పటికీ డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు రెండూ అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాటుపడేవే. ఇటీవలి కాలంలో రెండు పార్టీల వైఫల్యాలు గతం కంటే ఎక్కువగా జనం నోళ్లలో నానుతున్నాయి. ప్రపంచంలో అమెరికా పెత్తనాన్ని సాగించేందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, పరువు పోతున్నది. ఎన్నికల సమయంలో వ్యక్తిగత బలహీనతలు, అవినీతి అక్రమాలను బయటపెట్టుకోవటం ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. విధానపరమైన వైఫల్యాలు రెండు పార్టీల్లో ఉండటమే దీనికి కారణం. ఈ పూర్వరంగంలోనే మూడవ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం గురించి అమెరికా సమాజంలో చర్చ ప్రారంభమైంది.కాల్పులు జరిగిన వెంటనే రక్తం కారుతున్న ట్రంప్‌ను భద్రతా సిబ్బంది తీసుకువెళుతుండగా ట్రంప్‌ చేయెత్తి తనకేమీ కాలేదన్న సంకేతం ఇచ్చిన ఫొటోను చూపి కొందరు ట్రంప్‌ అభిమానులు తమనేత దేశం కోసం ఒక హీరో మాదిరి నిలబడిన తీరును చూపుతున్నదని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో నాలుగునెలల్లో జరగనున్నందున ప్రచారం మరింత తీవ్రం కానుంది. గురువారం నాడు జరిగే ఒక సమావేశంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా పార్టీ ప్రకటించనుంది. ప్రతిదాన్నీ సొమ్ము చేసుకొనేందుకు ఎదురు చూసే కొందరు గాయపడిన ట్రంప్‌ బమ్మను ముద్రించిన టీ షర్టులను అందుబాటులోకి తెచ్చారు.


ట్రంప్‌ ప్రాజెక్టు 2015పేరుతో ముందుకు తెస్తున్న అజెండా కార్మికవర్గం మీద దాడికి ఉద్దేశించిందని పురోగామి రాజకీయ బృందం హెచ్చరించింది. పౌరహక్కులకు ముప్పు ఏర్పడిందని ఆఫ్రో-అమెరికన్ల కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ట్రంప్‌ కోరిక మేరకు మితవాద హెరిటేజ్‌ ఫౌండేషన్‌ దీన్ని రూపొందించింది. దీన్ని అమలు జరిపేందుకు ట్రంప్‌ నియంతగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది. తాను తిరిగి అధికారానికి వస్తే రాజ్యాంగంలోని కొన్నిసెక్షన్లను తొలగిస్తానని ఏడాది క్రితమే ట్రంప్‌ చెప్పిన అంశాన్ని గుర్తు చేసింది. తొమ్మిది దశాబ్దాల క్రితం చేసిన జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని వెనక్కు తీసుకుంటామని ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు నియమించిన బోర్టులో అత్యధికులు కార్మిక వ్యతిరేకులు ఉన్నారు.సోషలిజం విఫలమైందని గతంలో అమెరికా చెప్పింది. కానీ అదే అమెరికాలో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావం విస్తరిస్తోంది.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలతో పోల్చి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. అక్కడ ధనిక-పేద వ్యత్యాసం పెరిగిపోతోంది. మధ్యతరగతి వర్గం కనుమరుగు అవుతోంది. ఆర్థిక, వలసకార్మికులను అనుమతించే విధానాలపై అసంతృప్తి పెరుగుతున్నది. ఈ పూర్వరంగంలోనే సామాజిక వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు కాల్చిచంపుతారో తెలియదు. తుపాకి లేకుండా జనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తుపాకి సంస్కృతిని పెంపొందించటం, వాటిని తయారు చేసే కార్పొరేట్లకు లాభాలు సమకూర్చటంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ తక్కువ తినలేదు. పామును పాలుపోసి పెంచిన చేతినే అది కాటువేస్తుంది. అందువలన ఆ తుపాకులకు ఎప్పుడు ఎవరు బలౌతారో చెప్పలేని అయోమయ స్థితి నేడు అమెరికాలో ఉంది. ఒక దుండగుడు కాదు, అలాంటి వారిని తయారు చేసిన వ్యవస్థ, దాన్ని కాపాడుతున్నవారే ప్రజాస్వామ్యానికి అసలైన ముప్పు. 2021జనవరి ఆరున తన గుంపును అమెరికా అధికార కేంద్రం మీద దాడికి ఉసిగొల్పిన ట్రంప్‌ నుంచే అసలైన ముప్పుకు నాంది. ఇలాంటి ట్రంపు, అతగాడి ఇతర వెర్రి వేషాలను కూడా అక్కడి మీడియా జనానికి చెప్పటం లేదు. ఇది కూడా అమెరికాకు ముప్పు తెచ్చేదే !

చికిత్సలేని హిందూత్వ వైరస్‌ – వాళ్లంతే ! అదో టైపు !! ఓటేయని ముస్లింలు, యాదవులను పట్టించుకోరట-ప్రమాణాన్ని ఉల్లంఘించిన కేంద్ర మంత్రి !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” ముస్లింలు నాకు ఓటు వేయలేదు.కాబట్టి ఇప్పుడు నేను కూడా వారికోసం పని చేయటం లేదు. నా ప్రాంతంలోని ఒక మౌల్వీ ఒక ఇల్లు, ఉజ్వల గ్యాస్‌, ఐదులక్షల రూపాయల ఆయుష్మాన్‌, మరుగుదొడ్డి, రేషన్‌ కార్డు కూడా పొందాడు. నాకు ఓటు వేసి ఉంటే ప్రమాణం చేసి చెప్పాలని నేను అడిగాను, అతనా పనిచేయలేదు. నా హృదయం ముక్కలైంది. ఇది సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌పై ముస్లిం యుద్ధం (ఘజ్వా ఏ హింద్‌ ) చేసేందుకు పక్కాగా రూపొందించిన ఒక వ్యూహం ” తెల్లారగానే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ సుప్రభాతంతో జనాన్ని నిద్రలేపే కారణజన్ముడైన దేవుని బిడ్డ నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అలాంటి దైవాంశసంభూతుడి మంత్రివర్గ సభ్యుడైన జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత తాజాగా ఎక్స్‌ ఖాతాలో వెల్లడించిన అభిప్రాయమిది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిగా ” నా బాధ్యతలను నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వర్తిస్తాను. మరియు రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం అన్ని రకాల ప్రజలకు భయం లేదా అభిమానం, ఆప్యాయత లేదా దురుద్దేశ్యం లేకుండా న్యాయం చేస్తాను ” అని ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి దాన్ని ఉల్లంఘించారు. ఇందుకు గాను అతగాడిని మంత్రి వర్గం నుంచి ప్రధాని తొలగించాలి, లేదా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాష్ట్రపతి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఏదీ జరిగే సూచనలు లేవు.


ఘజ్వా ఏ హింద్‌ అనే పదాన్ని ఇటీవల అనేక మంది ముఖ్యంగా హిందూ-ముస్లిం మతోన్మాదులు, ఉగ్రవాదులు, కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు రెండు మతాలవారినీ రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నారు. కొంత మంది ఇస్లామిక్‌ పండితులు దాని అసలు అర్దాన్ని వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. దాని సారం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త ప్రవచనాలకు తప్పుడు భాష్యం చెబుతున్నారు.దానితో విబేధించే పండితులు కూడా ఉన్నారు. క్రైస్తవం మీద తిరుగుబాటులో భాగంగా ఇస్లాం ఉద్భవించింది. క్రీస్తుశకం 530వ సంవత్సరంలో జన్మించిన మహమ్మద్‌ ప్రవక్త 632జూన్‌ ఎనిమిదిన మరణించాడు.ఎవరి భాష్యం ఎలా ఉన్నప్పటికీ నాడు చెప్పిన అంశాలు నేడు వర్తించవన్నది తెలిసిందే. ఈ అంశాలలో హిందూ-ముస్లిం మతశక్తులు బొమ్మా- బొరుసు వంటివి. సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని రెండూ చెబుతున్నాయి. అరబ్బీలో ఘజ్వా అంటే యుద్ధం. భారత ఉపఖండం మీద దాడి చేసి ఇస్లాం భావజాలాన్ని వ్యాపింప చేయాలని ప్రవక్త చెప్పాడని, దాన్ని కొనసాగించాలని ముస్లిం తిరోగమనవాదులు నిత్యం రెచ్చగొడుతుంటారు. ముస్లింలు ఇప్పటికీ ఘజ్వాను వదల్లేదని అందువలన వారి దాడి నుంచి హిందూ లేదా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ హిందూ తిరోగమన వాదులు పదే పదే దాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు.నిజానికి సనాతనం అంత గొప్పదైతే మరి అంటరానితనం, వివక్షలనే కాన్సర్లు మన సమాజంలో ఎలా విస్తరించాయి ? మహానుభావుడు అంబేద్కర్‌కు సనాతనం గురించి తెలియదా ? పక్కాగా తెలుసు, నాటి సనాతనుల ఆచరణను చూసే దాన్ని వ్యతిరేకించి బౌద్దంలోకి మారిన సంగతి తెలిసిందే.అంటరాని తనంతో సహా అనేక వివక్షలను రుద్దిన మనుస్మృతిని అమలు జరపాలని అంటే దళితులు, గిరిజనులు, వెనుక బడిన తరగతుల వారు బిజెపికి దూరం అవుతారనే భయంతో దాని బదులు సనాతన ధర్మం అనే పల్లవిని అందుకున్నారు. ఇది కూడా ఎంతో కాలం నడవదన్నది వేరే సంగతి.


దానిలో భాగంగానే హిందూ దేవాలయాలు, యాత్రా ప్రాంతాలలో ఉన్న ముస్లింల దుకాణాలను మూసివేయాలి. ముస్లిం పేర్లతోనే ముస్లింలు దాబాలను ఎందుకు తెరవరు ? కన్వర్‌ యాత్రీకులను మోసం చేసేందుకు ముస్లిం దాబాల యజమానులు హిందూ పేర్లు పెడుతున్నారు,పేర్లు ఎందుకు మార్చాలి, దాబాలను ఎందుకు తెరవాలి అంటూ విశ్వహిందూ పరిషత్‌ ప్రశ్నిస్తోంది. సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలకు చెందిన వారు, దాని మతోన్మాద వైరస్‌ బారిన పడిన వారు ఇలాంటి విద్వేషాన్ని వెళ్లగక్కటం తెలిసిందే. అఫ్‌ కోర్సు అలాంటి వాటిని అలఓకగా వెల్లడించే వారిలో పేరుమోసిన వ్యక్తి గిరిరాజ్‌ సింగ్‌ అన్నది తెలిసిందే. ఇలా మాట్లాడటం తగదని తన సహచరులకు నరేంద్రమోడీ అంతర్గతంగానైనా చెప్పి ఉంటే గిరిరాజ్‌ సింగ్‌ లాంటి వారు, విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్థలు పదే పదే రెచ్చిపోతాయా ? దైవాంశ సంభూతుడిని తిరస్కరిస్తాయా ? మీరంతా నిమిత్త మాత్రులు, మీతో చెప్పించేది, చేయించేదీ అన్నీ నేనే అనే భగవద్గీత సారం తెలిసిందే. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి…గుడిసెలు అనే సామెత తెలిసిందే కనుక టీకా తాత్పర్యాలు అవసరం లేదు.


మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది గనుకనే నరేంద్రమోడీ మూడవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా మత స్వేచ్చ నివేదికలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, విద్వేష ప్రచారం గురించి పేర్కొన్నారు. ప్రతి ఏటా అమెరికా నివేదికల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.వాటిని ఒక వైపు మోడీ సర్కార్‌ ఖండిస్తున్నదీ, తిరస్కరిస్తున్నది. మరోవైపున కాషాయ దళం తనపని తాను చేస్తున్నది. నిజం ఏమిటో మన జనానికి తెలియదా ? మణిపూర్‌లో క్రైస్తవులైన గిరిజన కుకీల మీద జరిగిన దాడులు,హత్యాకాండ, ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వైనం అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం దాచినా దాగలేదు.గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలోనే కాదు, చివరకు హిందువులైన మెయితీలు అధికంగా ఉన్న చోట కూడా బిజెపి రెండు చోట్లా తాజా లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరచింది. గిరిరాజ్‌ సింగ్‌ కేంద్ర మంత్రిగా ఎవరి పట్లా వివక్ష చూపనంటూ చేసిన ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించి మాట్లాడారు గనుకనే ఆ పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ముస్లింలు దుకాణాలు తెరవకూడదు, ఉన్నవాటిని మూసివేయాలంటూ వీరంగం వేసిన అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో హిందువులే మెజారిటీ అయినప్పటికీ అక్కడ బిజెపి ఓడిపోయింది. ప్రతిపక్షాలు గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని స్వయంగా నరేంద్రమోడీ చెప్పినా అక్కడి జనాలు పట్టించుకోకుండా చెంపదెబ్బ కొట్టినట్లుగా తీర్పు చెప్పారు.


ఆరునెల్లు గడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా బిజెపితో చేతులు కలిపిన ఇతర పార్టీలు కూడా దాని భావజాలాన్ని, విద్వేషాన్ని తలకెక్కించుకుంటున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయని యాదవులు, ముస్లింల కోసం తాను ఎలాంటి పనులు చేయనని బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు సీతామరి ఎంపీ దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ ఇటీవల ప్రకటించారు. యాదవులు, ముస్లింలు తనవద్దకు వస్తే స్వీట్లు పెట్టి, టీ ఇచ్చి పంపుతాను తప్ప వారికి ఎలాంటి పనులూ చేయనని అన్నారు.హృదయంలో చెలరేగిన భావాలతోనే ఠాకూర్‌ అలా మాట్లాడినట్లు అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అతగాడిని సమర్ధించారు.కేంద్రం, రాష్ట్రం అమలు జరిపిన పధకాలతో లబ్ది పొందిన ముస్లింలు తనకూ ఓట్లు వేయలేదన్నారు. దీనికంతటికీ మంగళసూత్రాలు లాక్కుంటారంటూ ప్రతిపక్షాల మీద ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పుడు ప్రచారమే కారణని ఆర్‌జెడి విమర్శించింది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ చెందిన వారు తప్ప ఒక కులం, మతానికో ప్రాతినిధ్యం వహించేవారు కాదని, రాజ్యాంగం మేరకు దేశం నడుస్తున్నది తప్ప కొంత మంది బుర్రల్లో పుట్టినదాని ప్రకారం కాదని పేర్కొన్నది. ఇలాంటి ఎంపీలు, కేంద్ర మంత్రుల వద్దకు కేవలం టీ తాగేందుకు ఆత్మగౌరవం కలవారు ఎవరైనా వెళతారా ?యాదవులు, ముస్లింలే కాదు, వీరికి ఓటేయని ఏ సామాజిక తరగతికీ మినహాయింపు ఉండదని అందరూ గమనించాలి.ఇలాంటి వారు బిజెపి, దాని మిత్రపక్షాల్లో ఎంతగా వర్ధిల్లితే అంతగా జనం అసలు రంగు తెలుసుకుంటారు.


గిరిరాజ్‌ సింగ్‌ ఏం మాట్లాడినా బిజెపి పెద్దలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలోనే బీహార్‌ బెగుసరారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బహుశా ఈ పెద్ద మనిషి డిఎన్‌ఏలోనే ముస్లిం ద్వేషం ఉన్నట్లు అతగాడి వదరుబోతుతనం వెల్లడిస్తున్నది.దేశ విభజన సందర్భంగా ముస్లింలందరినీ పాకిస్తాన్‌ పంపకపోవటం మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పిదం అన్నారు.2014లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీకి ఓటు వేయని వారిని పాకిస్తాన్‌ పంపాలని సెలవిచ్చినందుకు బహుమతిగా నాడు సహాయ కేంద్ర మంత్రి పదవి, తరువాత మరింతగా రెచ్చిపోయినందుకు 2019లో కాబినెట్‌ మంత్రిగా, మరోసారి ఇప్పుడు కొనసాగించారు మోడీ. బీహార్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న ఎల్‌జెపి, జెడియు నేతలు ఈ పెద్దమనిషి వ్యాఖ్యలను విమర్శించటం తప్ప గట్టిగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలలో ఇలాంటి విద్వేష ప్రసంగీకులకు కొదవ లేదు. విశ్వహిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా వారిలో ఒకరు. ” మనం అధికులుగా ఉన్న ప్రాంతాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ముస్లింలను భయపెట్టాలి ” అన్నారు. నోటిదూల, నోటి తుత్తర లేదా విద్వేష గళాల పీఠాధిపతుల్లో గిరిరాజ్‌ సింగ్‌ను ఒకరిగా చెప్పవచ్చు.ప్రపంచ జనాభా దినం సందర్భంగా 2019 జూలై 11న మంత్రి హౌదాలో ఒక ట్వీట్‌ ( ప్రస్తుతం ఎక్స్‌) చేశారు. ” ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలన్నది నా వైఖరి ” అని పేర్కొన్నారు. ఇది ముస్లింలను ఉద్దేశించే చేసినప్పటికీ ఇతర మతాలలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది కనుక వారు కూడా ఇలాంటి వ్యక్తులు, వారి పార్టీ గురించి ఆలోచించుకోవాలి.


బిజెపి నేతలు హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటిస్తారు. తనకు మియా(అసోంలోని ముస్లింలకు మరోపేరు)ల ఓట్లు అవసరం లేదని సాక్షాత్తూ ఆ రాష్ట్ర సిఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. తాను వారి ప్రాంతాలలో అసలు ప్రచారానికే వెళ్లనని కూడా చెప్పారు. మియాల్లో బాల్య వివాహాలు అంతరించేవరకు వారి ఓట్లను తాను కోరనని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని కూడా చెప్పారు. ముస్లిం సామాజిక తరగతి ఉద్దారకుడిగా ఫోజు పెడుతూ వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం తప్ప ఇది మరొకటి కాదు. దేశంలో బాల్యవివాహాల సామాజిక రుగ్మత ఉంది. దాన్ని రూపుమాపాలంటే జనాల ఆర్థిక, విద్యా స్థాయిని మెరుగుపరచాలి. అసలు వాస్తవం ఏమంటే దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 84శాతం హిందువుల్లోనే ఉన్నట్లు ఇండియా స్పెండ్‌ అనే మీడియా సంస్థ జనాభా లెక్కలను విశ్లేషించి చెప్పింది. ముస్లింలలో పదకొండుశాతం, ఇతరులు మిగతా మతాల్లో ఉన్నారు. అదే హిమంత బిశ్వశర్మ బాల్య వివాహాలు చేసే హిందువుల ఓట్లు, అంటరానితనం పాటించేవారి ఓట్లు తమకు అవసరం లేదని చెప్పగలరా ? బిజెపి నేతల నాలికలకు నరం లేదు. ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతారు. తనకు ఓట్లు వేయని కారణంగా ముస్లింల కోసం తాను పనిచేయనని రాజ్యాంగ విరుద్దమైన మాటలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వల్లిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో బిజెపి సీనియర్‌ నేత కెఎస్‌ ఈశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు ఒక్కటి కూడా అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున ఉంటుందా ? అధినేత నరేంద్రమోడీ స్వయంగా ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టారో తెలిసిందే. మోడీ ముందు హిమంత బిశ్వశర్మలూ, గిరిరాజ్‌ సింగ్‌లూ మరుగుజ్జులే. తన ఉపన్యాసాలు, వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతాయని, భారత ప్రతిష్ట మురికి గంగలో కలుస్తుందని తెలిసి కూడా మోడీ వెనక్కు తగ్గలేదు.ఏది ఎటుపోతేనేం ! కావాల్సింది ఓట్లు, అధికారం ! రామరాజ్యం కోరుకొనే శక్తులకు ఓటు వేస్తారా లేక ఓట్‌ జీహాదీలకు వేస్తారా అంటూ మోడీ ఓటర్లను అడగటం తెలిసిందే.కాంగ్రెస్‌ అధికారానికి వస్తే చొరబాటుదార్లకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదలు పంచుతారని, పుస్తెలను కూడా లాక్కుంటారని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడిందీ తెలిసిందే. దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ముస్లింలకు కాంగ్రెస్‌ సహాయం చేస్తోందని కూడా ఆరోపించారు. మోడీ దిగజారి మాట్లాడినట్లు, అది కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం అవాంఛనీయమని బిజెపి నేత అలోక్‌ వత్స తమతో వ్యాఖ్యానించినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. సంవత్సరాల తరబడి గుడ్డిగా మోడీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఆయన వ్యాఖ్యలను ఆమోదించరని, ప్రధాని స్థాయికి తగని మాటలని వత్స అన్నట్లు పేర్కొన్నది. ఇలాంటి నేత అనుచర గణం ప్రసన్నం చేసుకొనేందుకు మరింత రెచ్చిపోతుంది తప్ప వెనక్కు తగ్గదు.

ఫాసిస్టు వ్యతిరేక పోరాటం – ఫ్రెంచి ఎన్నికల్లో వామపక్షాలు నేర్పిన పాఠం ఏమిటి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు 25దేశాల్లో పాలకులు మారారు. ఆ పరంపరలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చేరాయి. రెండు చోట్లా మధ్యంతర ఎన్నికలు జరిగాయి, అనూహ్య, ఉత్తేజం కలిగించే పరిణామాలు సంభవించాయి. అధ్యక్ష తరహా పాలన ఉన్న ఫ్రాన్సులో హంగ్‌ పార్లమెంటు ఏర్పడింది. నాలుగు కూటములు, అనేక స్వతంత్ర పార్టీలు పోటీ పడినా ఏ కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేదు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను వామపక్షాల కూటమి 188సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. ఫాసిస్టు శక్తుల ముప్పు తప్పింది. బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది అనటం కంటే టోరీ(కన్సర్వేటివ్‌) పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో ఊచకోతకు గురైంది, అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. ఈ ఘనత భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఏలుబడిలో జరిగింది. పార్లమెంటులోని 650 సీట్లకు గాను లేబర్‌ పార్టీ 411తో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల తొలిదశలో ఫాసిస్టు శక్తులది పైచేయిగా ఉండటమే కాదు,ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 289 సీట్ల కంటే ఎక్కువగా 297 స్థానాలలో ప్రధమ స్థానంలో ఉంది. పచ్చి మితవాద నేషనల్‌ రాలీ-ఆర్‌ఎన్‌ (గతంలో నేషనల్‌ ఫ్రంట్‌) ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో 31శాతం ఓట్లతో విసిరిన సవాలుతో అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. ఈ ఎన్నికల తొలిరౌండులో 33.21శాతం తెచ్చుకుంది.రెండవ రౌండ్‌లో 37.06శాతానికి పెంచుకుంది.వామపక్షాలతో కూడిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌ఇ) తొలి దఫా 28.21శాతం తెచ్చుకోగా మలి దశలో 25.81శాతం పొందింది. అధికారపక్షమైన టుగెదర్‌ కూటమి 21.28 నుంచి 24.53శాతానికి పెంచుకుంది.


పార్లమెంటులోని 577 స్థానాలకు గాను జూన్‌ 30న జరిగిన ఎన్నికల్లో 76 నియోజకవర్గాలలో ఫలితాలు తేలాయి. ఆర్‌ఎన్‌ పార్టీ 37, వామపక్ష కూటమి 32, అధికార పక్షం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. మిగిలిన స్థానాలకు ఏడవ తేదీన పోలింగ్‌ జరిగింది. త్రిముఖ పోటీ జరిగితే దేశ చరిత్రలో తొలిసారిగా పచ్చిమితవాదులు అధికారాన్ని కైవశం చేసుకుంటారని తేలింది. ఈ ముప్పును తప్పించేందుకు విధానపరంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ వామపక్ష కూటమి, అధికార పార్టీ ఒక అవగాహనకు వచ్చాయి. అదేమంటే ఆర్‌ఎన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న చోట రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా మూడవ అభ్యర్థి ఉపసంహరించుకొని మద్దతు ఇవ్వటంతో ఫాసిస్టు పార్టీ ఓట్ల రీత్యా పెద్దదిగా ఉన్నా సీట్లలో మూడవ స్థానానానికి పడిపోయింది. రెండవ దశలో సీట్ల సర్దుబాటు కారణంగా వామపక్ష కూటమి, అధికార కూటమి లబ్ది పొందాయి. వామపక్ష సంఘటనలో ఉన్న పార్టీలకు గతంలో 130 ఉండగా ఈ సారి 188, అధికార ఐక్యత కూటమికిి 245 నుంచి 161కి పడిపోగా ఆర్‌ఎన్‌ పార్టీ కూటమికి 89 నుంచి 142కు పెరిగాయి. ప్రస్తుతానికి ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ముప్పు తప్పినా ఓట్లపరంగా 37శాతానికి పెంచుకోవటం ప్రమాదకరపరిణామం. వామపక్ష కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అధికార ఐక్యత కూటమి మద్దతు ఇవ్వటం లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావటం తప్ప మరొక మార్గం లేదు. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో అనేక అంశాలపై మక్రాన్‌ వైఖరిలో మార్పులు కూడా ఉంటాయని భావిస్తున్నారు.


ఫలితాల్లో ఫాసిస్టు పార్టీ అధికారానికి రాదనే తీరు కనిపించగానే పారిస్‌తో సహా దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చారు. సంతోషం, ఆనందంతో కన్నీటి బాష్పాలు రాల్చారు.ఫలితాల మీద తొలి ప్రకటన వెలువడగానే ఎదురుగా ఉన్న వారు పరిచితులా, అపరిచితులా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎవరుంటే వారిని వారిని హత్తుకున్న దృశ్యాలు కనిపించాయి. నిమిషాల తరబడి చప్పట్లు చరిచారు. ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు పరస్పర విరుద్ద వైఖరులతో పని చేస్తున్న పార్టీలు ఐక్యమైనపుడు విబేధాలను పక్కన పెట్టి అదే జనం మద్దతు ఇచ్చి గెలిపించినపుడు ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యం కలిగించవు. ఐరోపా పార్లమెంటు, తొలిదశ ఎన్నికల్లో ఫాసిస్టు పార్టీ పెద్దదిగా అవతరించటంతో ఆందోళనకు గురైన అనేక మంది బరువు దించుకున్నారు. మరోవైపు ఫాసిస్టు పార్టీ అభిమానులు చిక్కినట్లే చిక్కి అధికారం దూరమైందన్నట్లుగా తీవ్ర ఆశాభంగం చెందారు.అయినా తమ కూటమి ప్రతిసారీ బలం పెంచుకుంటున్నదని సంతృప్తిని కూడా వెల్లడిస్తున్నారు. 2027లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఏ కూటమి కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించిన విధానాల నుంచి వైదొలిగే అవకాశాలు ఉండవు. ప్రజలిచ్చిన తీర్పుతో ఫ్రెంచి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయా, మక్రాన్‌ సర్కార్‌కు కొత్త ప్రభుత్వం గుదిబండగా మారుతుందా ? విదేశీ, అంతర్గత విధానాలపై మక్రాన్‌తో వామపక్షాలు విబేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక సందేహాల మీద చర్చ ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని గాబ్రియెల్‌ అతల్‌ రాజీనామా లేఖను పంపాడు. దాన్ని తాను ఆమోదించటం లేదని మక్రాన్‌ ప్రకటించాడు.ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశాన్ని తమకే ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా ఉన్నామని వామపక్ష కూటమి నేత జీన్‌ లక్‌ మెలెన్‌చోన్‌ ప్రకటించాడు. తాము గెలిస్తే హమస్‌ అణచివేత పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే వైఖరి ఉపసంహరించుకుంటామని, జనానికి ఉపశమనం కలిగించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వ ఖర్చు పెంచుతామని వామఫక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో వాగ్దానం చేశాయి. వామపక్షాల తీరు తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఖర్చు పెంచేందుకు అవసరమైన నిధులు కొన్ని సంపద పన్ను, అధికాదాయం వచ్చేవారి మీద పన్ను పెంపుదల వంటి అంశాలను అమలు జరిపితే దేశం నాశనం అవుతుందని, ఇప్పటికే దేశం అప్పుల ఊబిలో ఉందని మక్రాన్‌ వ్యాఖ్యానించాడు.


అనూహ్యంగా పెద్ద కూటమిగా అవతరించిన వామపక్ష న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌పి) గురించి అనేక మందిలో ఆసక్తి నెలకొన్నది, ఇది ఫాసిస్టు శక్తులను మట్టి కరిపించింది.ఐరోపాలో ఇలాంటి శక్తుల వ్యతిరేకులకు ఒక దారి చూపిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని అంశాలపై తేడాలతో గతేడాది అక్టోబరులో వామపక్ష ఫ్రంట్‌ విడిపోయింది.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆర్‌ఎన్‌ పార్టీ పెద్దదిగా అవతరించటం, అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటు రద్దు చేయటంతో తలెత్తిన నూతన పరిస్థితుల్లో వామపక్షాలు తమ విబేధాలను పక్కన పెట్టి జూన్‌ 13న ఎన్‌ఎఫ్‌పి ఏర్పాటుకు అంగీకరించాయి. దీనికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. ఫాసిజానికి వ్యతిరేకంగా 1930దశకంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఏర్పడింది, ఆ పేరుకు న్యూ(కొత్త) అని చేర్చారు నెల రోజుల్లోనే పెద్ద పక్షంగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. కూటమిలో 75 సీట్లు ఫ్రాన్స్‌ అన్‌బౌవ్‌డ్‌ -తలవంచని పార్టీ (ఎల్‌పిఐ)కు వచ్చాయి. ఇది సోషలిస్టు పార్టీ నుంచి విడిపోయిన వారితో ఏర్పడింది. భావజాలంలో కమ్యూనిస్టు పార్టీ కంటే తక్కువ సోషలిస్టు పార్టీ కంటే ఎక్కువ అంటే మధ్యస్థంగా ఉంటుందని విశ్లేషకులు వర్ణించారు. రెండవది 65 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ. దీన్ని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా పేర్కొంటారు. మూడవ పక్షం ది ఇకోలజిస్ట్స్‌(ఎల్‌ఇ)-పర్యావరణ పార్టీ, దీనికి 33 స్థానాలు వచ్చాయి.నాలుగవది ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ. దీనికి తొమ్మిది స్థానాలు వచ్చాయి. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు సమాజాలను కూల్చివేసిన తరువాత పార్టీ బలహీనపడినప్పటికీ ఇతర దేశాలలో కమ్యూనిస్టుల మాదిరి తన ఉనికిని కాపాడుకుంటున్నది. మరికొన్ని చిన్న పార్టీలు కూడా దీనిలో ఉన్నాయి. అధ్యక్షుడు మక్రాన్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఈ కూటమితో అతగాడి నాయకత్వంలోని మితవాద కూటమి కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, బయట ఉండి మద్దతు ఇస్తుందా అన్నది స్పష్టం కాలేదు. ఫాసిస్టులకు వ్యతిరేకంగా రెండు కూటములు ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాయి.


ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌లో కూడా కొన్ని నెలల ముందే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.పద్నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టోరీ(కన్సర్వేటివ్‌ పార్టీ)ని ఓటర్లు ఊచకోత కోశారని కొందరు వ్యాఖ్యానించారు. రిషి సునాక్‌ను నేతగా ఎన్నుకొని తప్పుచేశామని అనేక మంది టోరీలు తలలు పట్టుకుంటున్నారు.గడచిన వందేండ్లలో ఇంత తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. పొదుపు చర్యల పేరుతో అమలు జరిపిన విధానాలతో జనజీవితం అతలాకుతలం అయింది. అందుకనే ఈ సారి 650 స్థానాలకు గాను ఆ పార్టీకి 53 నుంచి 131 మధ్యలో సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొనగా 121 వచ్చాయి.గతంలో ఉన్నవాటిలో 251 స్థానాలను కోల్పోయారు. మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌,పన్నెండు మంది మంత్రులు మట్టికరిచారు.ఆశ్చర్యం ఏమిటంటే మూడవ పక్షమైన లిబరల్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పదకొండు నుంచి 72 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. టోరీ ప్రధానులుగా పనిచేసిన డేవిడ్‌ కామెరాన్‌, థెరెసా మే ప్రాతినిధ్యం వహించిన స్థానాలను ఈ పార్టీ కైవశం చేసుకుంది.ఈ ఎన్నికలు మరొక రికార్డును కూడా సృష్టించాయి. 1918 తరువాత రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు 57.4 శాతమే. లేబర్‌ పార్టీ 33.7శాతం ఓట్లతో 411 సీట్లు(63.2శాతం) తెచ్చుకోగా టోరీ 23.7శాతం ఓట్లు, 121 సీట్లు(18.6శాతం) తెచ్చుకున్నాయి. గ్రీన్స్‌ పార్టీకి 6.7శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం నాలుగు స్థానాలు(0.6శాతం) మాత్రమే వచ్చాయి. రిఫామ్‌(సంస్కరణ) యుకె పార్టీకి లిబరల్స్‌ కంటే ఎక్కువగా 14.3శాతం ఓట్లు వచ్చినా కేవలం 5(0.8శాతం) సీట్లు వచ్చాయి. డెమోక్రటిక్‌ యూనియనిస్టు పార్టీకి కూడా ఐదు సీట్లు వచ్చినా దానికి వచ్చిన ఓట్లు కేవలం 0.6శాతమే ఈ తీరును చూసిన కొందరు ఎన్నికల సంస్కరణలు అవసరమని సూచించారు.బ్రిటన్‌ పార్లమెంటు చరిత్రలో అధికారానికి వచ్చిన పార్టీ తక్కువ ఓట్లు తెచ్చుకోవటం ఒక రికార్డు, దాన్ని లేబర్‌ పార్టీ సొంతం చేసుకుంది.మూడు ప్రధాన పార్టీలకు 69.6 శాతం ఓట్లు 92.9 శాతం సీట్లు వచ్చాయి. చిన్న పార్టీలు ఓట్లు గణనీయంగా తెచ్చుకున్నట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 7.4శాతం తగ్గి 59.9శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి ఓటర్లు ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదన్నది స్పష్టమైంది. లేబర్‌ పార్టీ గత ఎన్నికల కంటే కేవలం 1.7శాతం, లిబరల్‌ పార్టీ 0.6శాతం మాత్రమే అదనంగా తెచ్చుకోగా టోరీలు 19.9శాతం కోల్పోయారు.అధికారంలోకి లేబర్‌ పార్టీ వస్తుందా లేదా అన్నదాని కంటే టోరీ పార్టీని వదిలించుకోవాలని ఓటర్లు భావించినట్లు ఈ అంకెలు స్పష్టం చేశాయి.


లేబర్‌ పార్టీ పెద్ద విజయాన్ని సాధించగానే సమస్యలన్నీ పరిష్కారమైనట్లు భావించనవసరం లేదు. దాని ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.ప్రతిపక్షంలో ఉండగా పౌరుల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చే లేబర్‌ పార్టీ నేతలు అధికారానికి వచ్చిన తరువాత జనాన్ని మరచిపోతారనే నానుడి ఉంది. గతంలో అది నిరూపితమైంది. దాని నేత కెయిర్‌ స్టామర్‌ కార్పొరేట్లకు అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడిన తరువాత తొలిరోజు స్టాక్‌మార్కెట్‌ సూచీ0.86పెరిగిందన్నది ఒక అభిప్రాయం.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ది కేవలం 0.6శాతమే పెరగ్గా ధరలు రెండు పెరిగాయి. ఇతర అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే కరోనాకు ముందున్న ఉత్పాదకత, పెట్టుబడి రేట్లు తక్కువగా ఉన్నాయి. 1980దశకంలో పెట్టుబడి రేటు 23శాతం ఉండగా రెండువేల సంవత్సరం నుంచి 17శాతానికి అటూ ఇటూగా ఉంది. అదే ఇతర జి7 దే శాలలో 20-25శాతంగా ఉంది.ఆదాయపన్నుతో సహా ఇతర పన్నులేవీ పెంచబోమని లేబర్‌ పార్టీ ఎన్నికల్లో చెప్పింది. పెంచకపోతే మరింత అప్పులపాలౌతామని, స్పష్టంగా వైఖరిని వివరించాలని టోరీల నేత రిషి సునాక్‌ పదే పదే లేబర్‌ పార్టీ నేతలను ప్ర శ్నించాడు. ప్రస్తుతం జిడిపితో పోలిస్తే 100శాతం అప్పుల్లో,ద్రవ్యలోటుతో బ్రిటన్‌ ఉంది.దాన్ని అధిగమించాలంటే జనాన్ని పన్నులతో బాదాలని టోరీలు చెబుతున్నారు. జనంలో వ్యతిరేకత కనిపించటంతో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సర్కార్‌ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నది. గత పద్నాలుగు సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో ప్రభుత్వ రంగ సిబ్బందికి వేతనాలను స్థంభింపచేశారు. కార్మిక సంఘాలన్నీ లేబర్‌ పార్టీ నిర్వహణలో ఉన్నందున వేతన సమస్య ప్రధానంగా ముందుకు రానుంది. దేశంలోని అతి పెద్ద థేమ్స్‌ నీటి కంపెనీ అప్పులపాలైంది.అయినా వాటాదార్లకు డివిడెండ్లు చెల్లిస్తున్నది. దివాలా తీసే స్థితిలో ఉన్నదాన్ని నిలబెట్టటం ఒక సమస్య. దీన్ని జాతీయం చేయవచ్చని, అందుకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైళ్లన్నీ 99శాతం నిండి ఉన్నాయి.న్యాయవ్యవస్థ విఫలమైందనే విమర్శకూడా ఉంది. నేరాలను ఎలా తగ్గించాలనేదాని కంటే కొత్తగా జైళ్ల నిర్మాణం గురించి పాలకులు ఆలోచిస్తున్నారు.విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చు పెరిగింది, 2012తరువాత ట్యూషన్‌ ఫీజులను పెంచలేదు.విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తగ్గుతున్నారు.దీంతో వాటి రాబడి పడిపోతున్నది.బ్రిటన్‌ పెద్ద సమస్యల్లో ఇదొకటి. ఆరోగ్య రంగ బడ్జెట్‌లోటులో ఉంది.చికిత్సకు పట్టే వ్యవధి రోజు రోజుకూ పెరుగుతోంది, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి.సేవలను మెరుగుపరచాల్సి ఉంది.టోరీల పొదుపు చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు దివాలా ప్రకటించాయి.ప్రస్తుతం ప్రతి ఐదింటిలో ఒకటి అదే బాటలో ఉన్నది.ఈ పూర్వరంగంలో లేబర్‌ పార్టీ ముందు పెద్ద సవాలే ఉంది.

ఐఎంఎఫ్‌ భారాలకు కెన్యాలో ప్రతిఘటన !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


జనంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌ 25న కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 26 మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవహక్కుల కమిషన్‌ ప్రకటించింది.మృతుల సంఖ్య 30దాటినట్లు వార్తలు వచ్చాయి.దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టటంతో సహా అనేక చోట్ల లూటీలు, దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టటం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్‌ రూటో ప్రకటించాడు. అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జూలై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. రాజధాని నైరోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకులను బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు అంటారు. అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయిగనుక ఆ పేరు వచ్చింది.ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తరువాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారతారు.కానీ ఈ కవలలు అలాంటివి కాదు. పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్‌ పెడుతున్నాయి.ప్రపంచ బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్‌ సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్నీ వేరే చెప్పనవసం లేదు.


ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా 5.22 కోట్లు. రాజధాని నైరోబీ. ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది. బ్రిటీష్‌ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా, తరువాత వలసగా మార్చారు.1952 నుంచి ప్రారంభమైన మౌమౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా 1963లో స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి, ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు.అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారని, నేరస్థ ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట250 మంది మరణించినట్లు, వారి మృత దేహాలను కూడా లభ్యం కావటం లేదని, అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి.పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది. దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది. మిలిటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటం లేదు. మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు.


ఎందుకీ పరిస్థితి వచ్చింది ? దేశం అప్పులపాలైంది. దేశ, విదేశీ అప్పు 80 బిలియన్‌ డాలర్లు దాటింది. వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు.దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్లింది. మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి. ఆ మేరకు ప్రభుత్వం 2021లో ఒప్పందం చేసుకుంది. బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు, ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పెలా తీరుస్తారో చెప్పమంటాయి. వెంటనే, మీరేమీ చెప్పలేరుగానీ మేం చెప్పినట్లు చేయండి, వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి. ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన 2024 విత్త బిల్లు.దాని ప్రకారం నిత్యావసర వస్తువులు, పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు. ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు.ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు.అయినా తగ్గేదే లే అన్నట్లుగా అధ్యక్షుడి వైఖరి ఉండటంతో ఆందోళన విస్తరించింది.దాంతో బిల్లు మీద సంతకం చేయటం లేదని ప్రకటించాడు. ఇదంతా ఒక నాటకమని, వ్యవధి తీసుకొనేందుకు వేసిన పాచిక అని చెబుతున్నారు.నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. కరోనాకు ముందు పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది, కరోనా మరింత దెబ్బతీసింది. అనేక మంది యువతకు ఉపాధిపోయింది. గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఉపాధి, పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు, వాటితో పాటు దొరకే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు గాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో కెన్యా ఒకటి.రెండువేల సంవత్సరాల ప్రారంభంలో విదేశాల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్దికి ఖర్చు పెట్టలేదు.దానికి తోడు వరదలు, కరోనా జతకలిశాయి.


దివాలా కోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్ధమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది.ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజారోగ్యం, వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు, వడ్డీలు తీర్చటానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బినాయిఫెర్‌ నౌరోజీ చెప్పాడు. వలసవాద అవశేషాలు, అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విత్త దుర్వినియోగం. పెరిగిన ఆర్థిక, తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా, ఐదేండ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పని చేసిన విలియం రూటో 2022 ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల్లోనే తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నాడు. తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉద్దేశించారు. దానికి గాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు. చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోతపెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు. ఇదంతా జనం మీద మోపే భారాలకు నాంది. ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటు పడేది సామాన్యులు, వారికి ప్రభుత్వం చేసే ఖర్చుల మీదే.అన్నింటికీ ఒక్కసారే కోతపెడితే జనం సహించరు. చేదు మాత్రను మింగించటం అలవాటు చేసినట్లుగా దశల వారీ మొదలు పెడతారు. కెన్యా రాబడిలో 60శాతం రుణాలు తీర్చేందుకే పోతోంది. అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత, చివరకు బడి పిల్లల మధ్యాహ్న భోజనఖర్చునూ తగ్గించనున్నారు.


పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియమ్‌ రూటో వ్యవహరిస్తున్నాడడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. గద్దె దిగేవరకూ ఆందోళన చేస్తామని ప్రకటించింది. రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది. గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌ పాలకులకు, ఉక్రెయిన్‌ వివాదంలో నాటోకు మద్దతు ఇచ్చాడు. ఇటీవల కెన్యాను నాటో ఏతర భాగస్వామిగా ప్రకటించారు. సిఐఏ అల్లుతున్న కతలన్నింటినీ వల్లిస్తున్నాడు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు. దేశీయంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కు తీసుకోవటానికి రాజ్యాంగం అనుమతించదని, ఒక వేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తరువాత 14రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, లేదా సవరణలు చేయాలంటూ వెనక్కు పంపాలి.


రొట్టెలపై 16,వంటనూనెలపై 25శాతం పన్ను ప్రతిపాదించారు.ఆర్థిక లావాదేవీలపై దశలవారీ పన్ను పెంపుదల, మోటారు వాహనాల ధరలో రెండున్నరశాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు, పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు. దీనిలోనే దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, శానిటరీ పాడ్‌ల మీద పన్ను ప్రతిపాదించారు. జిఎస్‌టి 16శాతం, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు.ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని 30 నుంచి 35శాతానికి పెంచగా, కొత్తగా 1.5శాతం ఇంటి పన్ను, వైద్య బీమా పేరుతో 2.75శాతం, ఇంథనంపై ఎనిమిదిశాతంగా ఉన్న పన్నును 16శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్ధించుకున్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి 65 బిలియన్‌ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నాడు. రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు. ఏడాది కాలంలో 40సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు. ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన, ఉద్యోగఅవకాశాలను వెతికేందుకు అని సమర్ధించుకున్నాడు.ఇదే సమయంలో అనేక సంస్థలు మూతబడి వేలాది మందికి ఉపాధి పోయింది.రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొన్నది.జనం దగ్గర డబ్బులేక రోజుకు ఏడువందల గ్యాస్‌ సిలిండర్లు అమ్మేతాను ప్రస్తుతం రెండువందలకు పడిపోయినట్లు, తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు. ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, జనాన్ని పట్టించుకోకపోవటం వంటి అంశాలను తీసుకొని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి, అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారిని చరిత్రలో ఎందరో ఉన్నారు. శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాము. కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేము.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పలుకుబడి, ప్రతిష్ట, నరేంద్రమోడీ చిత్తశుద్ధికి పోలవరం ఒక పెద్ద సవాలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఒకటి. అప్పులు చేయటంలో నరేంద్రమోడీ అంతకు ముందున్న ప్రధానుల రికార్డులను తునాతునకలు చేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది. వర్తమానంలో మరో 16-17లక్షల కోట్లు అప్పు చేయనున్నారు. అందువలన పోలవరానికి నిధుల సమస్య ఉండదని, చంద్రబాబు అడగాలే గానీ ఎంత కావాలంటే అంత ఇస్తారని అందరూ భావిస్తున్నారు.అది సాకారం కావాలని కోరుకుందాం. గడచిన పది సంవత్సరాలలో జరిగిన పోలవరం ప్రాజక్టు నిర్మాణం-సంభవించిన నష్టం, ప్రస్తుత పరిస్థితి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 28న శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెప్పాయి. పునరుద్దరణే కాదు, సంక్షేమ పధకాలను మరింతగా అమలు చేస్తామని వాగ్దానం చేశాయి. అలవిగాని హామీలు ఇచ్చిన తెలంగాణా కాంగ్రెస్‌ వాటిని ఎలా అమలు చేయనుందో చెప్పాలని ఆ రాష్ట్ర బిజెపి డిమాండ్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మీ కూటమి కూడా అంతకంటే ఎక్కువే వాగ్దానాలు చేసింది, వాటి సంగతేమిటంటే ఆ ఎన్నికల ప్రణాళికతో బిజెపికి సంబంధం లేదని నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఆంధ్రప్రదేశ్‌ బిజెపి నేతలకు కంటిచూపే తప్ప నోటమాట ఉండటం లేదు. మరీ గట్టిగా అడిగితే చంద్రబాబుకు ఉన్న అనుభవంతో అన్నింటినీ అమలు చేస్తారంటూ ఆయన మీద నెడుతున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజక్టు శ్వేత పత్రంలోని అంశాలను చూద్దాం.


గోదావరి నదిపై రాజమండ్రి కాటన్‌ బారేజ్‌కు ఎగువన 42కిలో మీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా రామయ్య పేట సమీపంలో బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం జాతీయ హౌదా ఇవ్వక ముందే దీనికి అనుమతులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని పనులు జరిగాయి. సముద్ర మట్టానికి 45.72 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మిస్తే 194.6టిఎంసిల నీటిని నిలువ చేయవచ్చని అంచనా. ఈ నీటితో 3.2లక్షల ఎకరాలు కుడి, నాలుగు లక్షల ఎకరాలకు ఎడమ కాలువ ప్రాంతంలో కొత్తగా సాగునీరు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలోని 23.5లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ, 80టిఎంసి నీటిని ప్రకాశం బారేజ్‌కు ఎగువన కృష్ణా నదికి మళ్లింపు, 960మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు, పరిసరాల్లో ఉన్న జనావాసాలకు 23.44 టీఎంసీల నీటి సరఫరా, కాలువలు వెళ్లే ప్రాంతాలలోని 540 గ్రామాలకు మంచి నీటి సరఫరా కలుగుతుంది. అందుకే దీన్ని జీవనాడిగా పరిగణిస్తున్నారు. పైన చెప్పుకున్న 80టిఎంసిల మళ్లింపు జలాలు వాడుకున్నందుకు గాను కృష్ణా నదీ జలాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ వాటా తగ్గుతుంది. ఈ నీటిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు 45,కర్ణాటకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసిలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయినందున దానికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంది.పోలవరంపై బ్రిటీష్‌ వారి హయాంలో తొలిసారిగా 1941లో ప్రతిపాదన రాగా 1942-44 సంవత్సరాలలో ప్రాధమిక పరిశీలన జరిగింది. ఆనకట్ట ఎత్తు 170 నుంచి 208 అడుగులు ఉంటే 340 నుంచి 700 టిఎంసిల వరకు నీటిని నిల్వచేయవచ్చని చెప్పారు.ఇపుడు అంత ఎత్తుకు ఎగువ రాష్ట్రాలు అంగీకరించే ప్రసక్తే లేదు గనుక ఆ ప్రతిపాదన చరిత్రగా మిగిలింది. ప్రస్తుతం 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో ఉన్న సంగతులు, వాటిని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రానున్న ఐదేండ్లలో సాకారం గురించి, ఇతర అంశాల గురించి చెప్పుకుందాం.
ఒక ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించినపుడే మొదలైంది, అదే పునరావాసం.ముందే చెప్పుకున్నట్లుగా ప్రాజక్టు నిర్మాణం ముందే ప్రారంభమైన కారణంగాగా 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి అప్పటి అంచనా ప్రకారం నీటి పారుదల(ఆనకట్ట, కాలువలు) నిమిత్తమయ్యే ఖర్చు నూటికి నూరుశాతం భరిస్తామని కేంద్రం చెప్పింది. దానిలో ప్రధానమైన ముంపు బాధితుల పునరావాసం, విద్యుత్‌ ప్రాజక్టు ఖర్చు లేదు. విద్యుత్‌ ప్రాజక్టుకు అయ్యే వ్యవయం రు.4,560 కోట్లే గనుక తామే భరిస్తామని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. పునరావాసానికి అయ్యే ఖర్చు తామే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి శాతాల గురించి శ్వేత పత్రంలో దిగువ విధంగా పేర్కొన్నారు.
అంశం×××× 2019 మే××× 2024 మే
సివిల్‌ పని ×× 71.93 ××× 75.77
హెడ్‌ వర్క్స్‌ × 65.67 ××× 72.63
కాంక్రీటు ×× 91.14 ××× 92.75
ఎల్‌ఎంసి ×× 70.99 ××× 73.07
పునరావాసం× 18.66 ××× 22.55
ఖర్చురు.కోట్లు×16493.18××21489.71


దీని ప్రకారం రానున్న రోజుల్లో ప్రధానమైన సమస్యగా పునరావాసం ముందుకు రానుంది.ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన తరువాత రిజర్యాయర్లో మునిగే ప్రాంతం, అక్కడి వారి పునరావాసం గురించి మాట్లాడకుండా శ్వేత పత్రంలోనూ, విడిగా చంద్రబాబు నాయుడు అశ్వద్ధామ కుంజరహ అన్నట్లుగా గత ఐదేండ్ల జగన్‌మోహన రెడ్డి పాలనలో జరిగిన తప్పిదాల గురించే పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకువస్తున్నారు. శ్వేత పత్రంలో పునరావాసం గురించి ప్రస్తావించినప్పటికీ అందుకు అవసరమైన మొత్తాలను కేంద్రం నుంచి తెస్తారా, రాష్ట్రమే భరిస్తుందా అన్న ప్రస్తావన లేదా వివరణ లేదు.మొదటి దశ అంటే ఆనకట్ట ఎత్తు 41.15 మీటర్లు లేదా 130 అడుగుల వరకు నిర్మిస్తే లక్షా 98 ఎకరాల భూసేకరణకు గాను 83,659 ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన మొత్తాన్ని 2025 జనవరి నాటికి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని 38,060కు గాను 12,797 కుటుంబాలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారిని 2026 మార్చి నాటికి తరలిస్తారు. రెండవ దశ 150 అడుగుల ఎత్తుకు ఆనకట్ట నిర్మాణం జరిపితే మునిగే మరో 67,665 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 29,465ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగతా ప్రాంతాన్ని రెండవ దశలో చేపడతారు. ఈ ప్రాంతంలో 2017-18 సంవత్సరంలో చేసిన సర్వే ప్రకారం 1,06,006 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది.అయితే సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 96,660 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. ఈ లెక్క ప్రకారమైనా రెండు దశల్లో ఇప్పటికి తరలించిన 12,797పోను మరో 83,863 కుటుంబాలను ఇంకా తరలించాల్సి ఉంది. తొలి సర్వే ప్రకారమైతే 93,209 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. దీనికి గాను తొలి దశ భూసేకరణ-పునరావాసానికి రు.7,116, రెండవ దశకు రు.18,801 కోట్లు, మొత్తం రు.25.917 కోట్లు కావాల్సి ఉన్నట్లు శ్వేత పత్రం తెలిపింది. ఇతర వ్యయం పెరిగినట్లే దీనికి కూడా కచ్చితంగా పెరుగుతుంది. ఈ మొత్తం రు.35వేల కోట్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.దీని గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు. బాధితులకు చెల్లించాల్సిన మొత్తాల గురించి కూడా ఒక స్పష్టత లేదు.


ప్రాజెక్టు పూర్తి చేయటం, నీటి విడుదల గురించి గతంలో, ప్రస్తుతం తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాల సిఎంలు చెప్పిన కబుర్లు మొదటి దశ గురించే అన్నది గమనించాలి.ఏజన్సీని మార్చకుండా, పథకం ప్రకారం పనులు జరిగి ఉంటే 2020 నాటికే నీటిని సరఫరా చేసి ఉండేవారని చెప్పారు, తరువాత వాయిదాలు వేసి 2023జూన్‌కు పొడిగించారు, ఇప్పుడు మరో ఏడాది గడచింది. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే సిఎం చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అని చెబుతున్నారు.కుడి, ఎడమ కాలవల్లో మిగతా భాగాలు పూర్తి కావాలి. పంట కాలువల తవ్వకం ఇంతవరకు చేపట్టలేదు. అందువలన రెండవ దశ ఎప్పటికి అన్నది అసలు చర్చకే రాలేదు. ఇక ప్రాజెక్టు వ్యయం ఇబ్బడి ముబ్బడి అయింది. దాన్ని ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు.గతంలో నిర్మాణ వ్యయానికి సంబంధించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయల్లో అని గమనించాలి.టిఏసి-టెక్నికల్‌ అసిస్టెస్స్‌ కమిటి, సిడబ్ల్యుసి-కేంద్ర జల కమిషన్‌, ఆర్‌సిసి-సవరించిన ధరల కమిటీ
అంశం ××××××××× 2010-11××××××2013-14××××××××2017-18
అంశం ××××××××× టిఏసి ××× టిఏసి × సిడబ్ల్యుసి × ఆర్‌సిసి × సిడబ్ల్యుసి
నీటిపారుదల ×××××× 12,944 ×××24,467 × 26,158ి × 43,165 × 51,096
విద్యుత్‌ ఉత్పత్తి×××××× 3,716 ××× 4,561 × 4,561ి × 4,561 × 4,561
మొత్తం ఖర్చు ×××××× 16,010 ×××29,028 × 30.719 × 47,725 × 55,657


పైన పేర్కొన్న వివరాలలో 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. జగన్‌మోహన రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటానికి ఏం చేసిందీ తెలియదు. లేఖలు రాశారా, కేంద్రం ఏం సమాధానమిచ్చిందీ తెలియదు. ఆమోదం లభించలేదని తాజా శ్వేతపత్రం తెలిపింది. ఈ అంచనా సవరణ జరిగి ఆరు సంవత్సరాలైంది. అప్పటి నుంచి ధరలు మరింత పెరిగాయి.పైన పేర్కొన్నట్లుగా కేవలం మూడు సంవత్సరాల్లోనే వ్యయం 30 నుంచి 55వేల కోట్లకు పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో పెరుగుదల అంచనా వేయాల్సి ఉంది. ఆరేండ్ల నాటి దానికే మోడీ సర్కార్‌ ఆమోదం తెలపలేదు, ఇప్పుడు తాజా అంచనాలు ఇంకా వేయలేదు, వాటికి ఎప్పుడు ఆమోదం లభించేదీ అగమ్యగోచరమే.

అందువలన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడి వర్తమాన హయాంలో మొదటి దశ పూర్తి కావటం కూడా ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అదేమీ అసాధ్యం కాదు. ఎన్నికలకు ముందు పోలవరం బాధితుల పునరావాసానికి అయ్యే 30వేల కోట్లను విరాళాల ద్వారా సేకరించి ఇవ్వవచ్చని దానికి గాను తన వంతు వాటాగా కోటి రూపాయలు ఇస్తానని పవన్‌ కల్యాణ్‌ ఒక సందర్భంగా చెప్పారు.దేశ విదేశాల్లో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌కు ఎంతో పలుకుబడి ఉందని చెబుతున్నారు గనుక కేంద్రం ఇవ్వకపోతే ఆమొత్తాన్ని వారు సేకరించి బాధితులకు న్యాయం చేయాలి. కావాల్సింది పునరావాసం తప్ప నిధులు ఎక్కడి నుంచి తెచ్చారన్నదానితో బాధితులకు సంబంధం ఉండదు.పోలవరం సత్వర నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు, పునరావాస ఖర్చు భరింపుకు ఆమోదం పొందటం కోసం చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తమ ప్రతిష్ట, పలుకుబడిని ఉపయోగించగలరని జనం గట్టిగా నమ్ముతున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్‌ పట్ల బిజెపి చిత్తశుద్దితో ఉన్నదా అన్న అనుమానాలు ఇప్పటికీ జనంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రణాళికకు అది దూరంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు సర్దుకుపోయాయి. వాగ్దానాలకే ముందుకు రాని బిజెపి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తారా ? చంద్రబాబు చెప్పినట్లు ఏపి అంటే అమరావతి, పోలవరం కాదు. అవి రెండు ప్రధాన సమస్యలు మాత్రమే. మొత్తం రాష్ట్ర సమగ్రవృద్దికి పని చేస్తున్నారనే అభిప్రాయం జనంలో కలగకపోతే రాజకీయంగా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

చైనాతో గిల్లి కజ్జా : అమెరికా రాజకీయ క్రీడలో పావుగా దలైలామా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న 88 ఏండ్ల దలైలామా మోకాలి చికిత్సకోసం అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ రాజకీయ నేతలతో చర్చలు జరుపుతారా లేదా అన్నది ఇంకా స్ఫష్టం కాలేదు. గతవారంలో అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసి హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామాను కలిశారు.ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కూడా ఆమె నాయకత్వంలో వచ్చిన ఏడుగురు ఎంపీల బృందం భేటీ జరిపింది. ఇతర పని మీద భారత్‌ పర్యటనలో భాగంగా ఏదో ఇంతదూరం వచ్చాం కదా మర్యాద పూర్వకంగా అనుకుంటే దలైలామాను కలవటం పెద్ద వార్తే కాదు.రావటమే కాదు,నేను చైనాను విమర్శిస్తే అది దలైమాకు అంగీకారం కాదని తెలిసినా అంటూ అక్కడే చైనా అధినేత షీ జింపింగ్‌ మీద ధ్వజమెత్తింది. అందుకే ఇది పక్కా రాజకీయ, చైనా వ్యతిరేక పర్యటనే అనటంలో ఎలాంటి సందేహం లేదు.దలైలామా వారసత్వం ఎప్పటికీ ఉండిపోతుంది, కానీ చైనా అధ్యక్షపదవిలో ఉన్న మీరు శాశ్వతంగా ఉండరు,ఎవరూ, దేనికీ మిమ్మల్ని గుర్తుంచుకోరు అంటూ నాన్సీ పెలోసి నోరుపారవేసుకుంది. దలైలామాతో చైనా ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కూడా చెప్పింది.
ఈ పరిణామం మీద మన విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు, స్థిరంగా ఉందని చెప్పారు.మనదేశంలో మతపరమైన,ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేందుకు మాత్రమే దలైలామాకు ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. నాన్సీ పెలోసీ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు-మన ప్రభుత్వానికి సంబంధం లేదని, వాటి గురించి మీరు అమెరికానే ప్రశ్నించాలని విలేకర్లతో చెప్పారు. ధర్మశాలలో ఉందని చెబుతున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఒక వేర్పాటు వాద రాజకీయ సంస్థ, చైనా రాజ్యాంగం, చట్టాల ప్రకారం అది చట్టవిరుద్దం, ఆ సంస్థకు ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదు, ఇక దలైలామాతో సంప్రదింపులు, మాటల విషయానికి వస్తే అది చైనా ప్రభుత్వం-పద్నాలుగవ దలైలామాకు సంబంధించిన వ్యవహారం అన్నది ఎప్పుటి నుంచో మేము చెబుతున్నాం అని చైనా స్పందించింది. ఈ సందర్భంగా కొన్ని అభిప్రాయాలు, వక్రీకరణలు, భాష్యాలు వెలువడ్డాయి.టిబెటన్ల హక్కుల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆడుతున్న నాటకం తెలిసిందే. అమెరికా, దానికి తాన తందాన పలికే దేశాలు చెబుతున్నదాని ప్రకారం టిబెట్‌ ఒక స్వతంత్ర దేశం, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని చైనా ఆక్రమించింది. కనుక టిబెటన్ల హక్కును పరిరక్షించాలి అంటూ వేర్పాటు వాదాన్ని సమర్ధిస్తున్నది.మనదేశంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి లోబడిన సామంత రాజరిక సంస్థానాల మాదిరే చైనాలో రాజరిక కాలంలో టిబెట్‌ కూడా అలాంటిదే.చైనాకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చైనా ప్రభుత్వానికి లోబడిన ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉంది, దాని అధిపతిగా దలైలామా కొనసాగాడు.


చైనా కమ్యూనిస్టు పార్టీ లాంగ్‌ మార్చ్‌ లేదా విప్లవపోరాట కాలంలో అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని గ్రహించిన అమెరికా, బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు ఒక వ్యూహం ప్రకారం నాడు ఫార్మోజా దీవిగా నేడు తైవాన్‌గా పిలుస్తున్న ప్రాంతానికి మిలిటరీ, ఆయుధాలను తరలించి అక్కడే తిష్టవేయించింది. చైనా రాజులు ఆ దీవిని 1895లో జపాన్‌కు ధారాదత్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన తరువాత 1945లో దాన్ని తిరిగి చైనా ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా ప్రధాన ప్రాంతంలో కమ్యూనిస్టులు కేంద్రీకరించి తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని భావించారు.తరువాత అనేక కారణాలతో స్వాధీనం చేసుకోలేదు. ఈ లోగా అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌ పాలకులకు భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఒక దేశం మాదిరి తయారు చేశారు. దాన్నే అసలైనా చైనాగా భద్రతా మండలిలో గుర్తించారు. 1970దశకంలో అనివార్య స్థితిలో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానం ప్రకారం చైనా అంటే తైవాన్‌తో కూడిన ప్రాంతం తప్ప రెండు చైనాలు లేవు. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. అయితే శాంతియుతంగా విలీనం జరగాలంటూ కొత్త నాటకం ప్రారంభించింది. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటే తాము సహించేది లేదని అమెరికా అంటున్నది. తైవాన్‌ వ్యవహారాలను చూసేందుకు ఏ ఒక్కదేశానికీ భద్రతా మండలి అనుమతి ఇవ్వలేదు. తనకు తానే రక్షకురాలిగా అమెరికా ప్రకటించుకుంది. ఆధునిక ఆయుధాలన్నీ ఇచ్చి ఎదురుదాడులకు కూడా అనుగుణంగా తయారు చేస్తున్నది.


ఇక టిబెట్‌ విషయానికి వస్తే కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తతో వ్యవహించి సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ముచేసింది. మతం, దలైలామా పేరుతో జరిపిన తిరుగుబాటును అణచివేసింది.టిబెట్‌లో తిరుగుబాటు చేసేందుకు పూనుకున్న వేర్పాటు వాదులకు సిఐఏ అనేక చోట్ల రహస్యంగా సాయుధ శిక్షణ, పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికారానికి వచ్చిన తరువాత ” ఇంకే ముంది మనం చైనాను నష్టపోయాం, మన అదుపు నుంచి పోయింది, మనకు కొత్త విరోధి ఉనికిలోకి వచ్చింది ” అన్నట్లుగా అమెరికా పాలకవర్గం భావించింది. విప్లవ కాలంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీని అడ్డుకోవటంలో విఫలం కావటం గురించి అది బెంగపెట్టుకుంది. ఇరాన్‌లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు1953లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ఖర్చుతో పోలిస్తే సిఐఏ 1949-51కాలంలో ఇరవై రెట్లు మొత్తాన్ని చైనా కోసం వెచ్చించింది.రహస్య కార్యకలాపాలకు పది రెట్లు సిబ్బందిని పెట్టింది.కార్యస్థానంగా టిబెట్‌ను ఎంచుకుంది.చరిత్రను చూస్తే టిబెట్‌ ప్రాంతంలో చైనా రాజులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప స్వతంత్రదేశం కాదు.1912లో క్వింగ్‌ రాజరిక వ్యవస్థకూలిపోయిన మరుసటి ఏడాది పదమూడవ దలైలామా తమకు స్వాతంత్య్రం కావాలని ప్రకటించాడు.చైనా ఆశీస్సులతో నిమిత్తం లేకుండా ఆధ్యాత్మిక, రాజకీయ అధికారాన్ని చెలాయిస్తానని చెప్పుకున్నాడు.దాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత టిబెట్‌ను పూర్తిగా చైనాలో విలీనం చేసేందుకు చూస్తున్నట్లు 1941డిసెంబరు 20వ తేదీ డైరీలో నాటి ప్రధానిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ రాశాడు.


కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ముందే చెప్పుకున్నట్లు సిఐఏ రంగంలోకి దిగింది. దీన్ని పసిగట్టిన మావో జెడాంగ్‌ ముందు జాగ్రత్త చర్యగా 1950లో అక్కడికి 40వేల మంది మిలిటరీని పంపాడు.దీంతో పాటు చైనాతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. అదే ఏడాది అక్టోబరు 6-24వ తేదీల మధ్య తూర్పు టిబెట్‌లో తిరుగుబాటుకు తెరతీసిన వేర్పాటు వాదులను చామడో పోరులో మిలిటరీ అణచివేసింది, మూడు వేల మందిని బందీలుగా పట్టుకుంది. టిబెట్‌ పౌరుల మీద ఎలాంటి దాడులు జరపలేదు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న 14వ దలైలామా టెంజిన్‌ జియాస్టో ఆ పరిణామం తరువాత తాను క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించాడు. కాశ్మీరు, హైదరాబాదు సంస్థానాలను మనదేశంలో విలీనం చేసినట్లుగానే టిబెట్‌ సంస్థానాన్ని చైనా 1951 మే నెలలో విలీనం చేసింది. టిబెట్‌ రాజకీయం చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రావటానికంటే ముందే మొదలైంది.మన దేశం తొలిసారిగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం టిబెట్‌తోనే మొదలైంది.చైనా మిలిటరీ చర్య గర్హనీయమని, అది చైనా ప్రయోజనాలకు, శాంతికి కూడా దోహదం చేయదని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వెంటనే అమెరికా, బ్రిటన్‌ తదితర ఆ గుంపు దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి.


దలైలామాకు 1940దశకంలోనే సిఐఏతో సంబంధాలు, నిధుల అందచేత ఉన్నట్లు తరువాత వెల్లడైంది. అమెరికాలోని కొలరాడోలో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు శిక్షణ ఇచ్చింది. వారిని అక్కడికి విమానాల్లో తరలించి తరువాత తిరిగి టిబెట్‌కు చేర్చింది. ఆయుధాలను ఇచ్చింది. అలాంటి వారి నాయకత్వంలో 1956లో తూర్పు టిబెట్‌లో రెండు చోట్ల తిరుగుబాటును ప్రకటించారు. దలైలామా అన్న గయాలో తోండప్‌ 1951లో అమెరికా వెళ్లాడు.అక్కడే ఉండి ఎప్పటికప్పుడు చైనా, టిబెట్‌లో పరిస్థితుల గురించి అక్కడ ఎందరు సైనికులు ఉన్నదీ మొదలైన సమాచారాన్ని అందచేసేవాడు. దానికి ప్రతిగా చైనాకు వ్యతిరేకంగా తమకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం భారత్‌, నేపాల్లో అమెరికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జపాన్‌లోని ఒకినావా, మైక్రోనేసియా ప్రాంతంలోని ఫసిపిక్‌ దీవుల్లో అమెరికా ఆధీనంలో ఉన్న గువామ్‌లో టిబెటన్లకు శిక్షణ ఇచ్చారు. ఢిల్లీలో సిఐఏ-మనదేశ సంస్థ కలసి ఒక కేంద్రాన్ని కూడా నడిపినట్లు తరువాత వెల్లడైంది. ఆపరేషన్‌ ఎస్‌టి సర్కస్‌ పేరుతో ఒక పధకాన్ని రూపొందించి 1959లో దలైలామా సోదరుడి నాయకత్వంలో గెరిల్లా తిరుగుబాటు ప్రారంభించారు. అయితే దాన్ని చైనా మిలిటరీ రెండు వారాల్లోనే అణచివేసింది. లాసా నుంచి పారిపోయిన దలైలామా నాటి భారత ప్రభుత్వ సహకారంతో నేటి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతం ద్వారా మనదేశానికి 1959 మార్చి 31న వచ్చాడు. ధర్మశాలలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో కాందిశీకుల పేరుతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత తాను వైదొలిగి ఇతరులకు అప్పగించాడు. ఈ ప్రభుత్వాన్ని మనదేశం గుర్తించనప్పటికీ నాటి నుంచి నేటి వరకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. అమెరికా విదేశాంగశాఖ 1998లో వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం మేరకు దలైలామా 1970దశకం మధ్య వరకు ఏటా లక్షా 80వేల డాలర్లను అమెరికా సిఐఏ నుంచి పొందినట్లు ఉంది. ఇప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతోంది. నాన్సీ పెలోసీ గుంపు పర్యటన అదే.


దలైలామాతో చర్చలు జరపాలని చైనాను డిమాండ్‌ చేసే హక్కు అమెరికాకు లేదు. తాను చేసిన చట్టాలు, లేదా అవగాహన ప్రకారం బిన్‌లాడెన్‌ లాంటి కొంత మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. అలాంటి వారితో ఎవరైనా చర్చలు జరపాలని కోరితే అంగీకరిస్తుందా. చైనా దృష్టిలో తిరుగుబాటు చేసిన దలైలామా వేర్పాటువాది. అలాంటి వారితో చర్చలు జరిపేది లేదని గతంలోనే ప్రకటించింది.దలైలామా ఒక్క మతనాయకుడే కాదు, ప్రవాసంలో ఉన్న రాజకీయవాది కూడా అని తాజాగా స్పష్టం చేసింది. అతగాడి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు దలైలామాకు వృద్దాప్యం వచ్చింది. తదుపరి వారసుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. తన వారసుడు భారత్‌లో ఉన్నట్లు దలైలామా చెబుతున్నారు. కొత్త దలైలామాను తాము ఆమోదించాల్సిందేనని చైనా అంటున్నది.జూన్‌ పన్నెండున అమెరికా పార్లమెంటు టిబెట్‌-చైనా వివాద బిల్లును ఆమోదించింది.అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అది ఉభయ దేశాల సంబంధాల మీద ప్రభావం చూపుతుంది గనుక అలాంటి పనికి పూనుకోవద్దని చైనా హితవు పలికింది. పురాతన కాలం నుంచి చైనాలో టిబెట్‌ భాగం కాదని దానిలో పేర్కొన్నారు. అసలు అలాంటి చట్టం చేసే అధికారం అమెరికా పార్లమెంటుకు ఎవరిచ్చారు. దలైలామా గురించి ప్రపంచంలో ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో అమెరికా ఈ పని చేసింది.