అధికారం కోసం దేశం-ధర్మం పేరుతో అమాయక రైతులకు కాషాయ గుంపు అన్యాయం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మూడవ సారి నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఎంతో వేగంగా పని చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దానికి పక్కా నిదర్శనం జమ్మూ-కాశ్మీరుకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 370ని ఎంత వేగంగా రద్దు చేశారో దేశం చూసింది. 2019 జూలై చివరి వారంలో అసాధారణ రీతిలో కాశ్మీరులో భద్రతా దళాలను మోహరించారు.ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం నాడు అమరనాధ్‌ యాత్రీకులకు ముప్పు ఉందంటూ యాత్ర నిలిపివేయాలని భద్రతా హెచ్చరిక కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఆదివారం నాడు రాష్ట్ర మంతటా 144సెక్షన్‌ ప్రకటించారు, ఇంటర్నెట్‌ నిలిపివేశారు. సోమవారం నాడు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ముందు అదేరోజు రాష్ట్రపతి ఉత్తరువు వెలువడింది. వెంటనే మంత్రివర్గ సమావేశం, అనంతరం అదే రోజు దాని మీద రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.సభ్యులకు దాని కాపీలు ఇవ్వలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశమైతే గంటన్నరలో అంటే 12.30లోగా 57పేజీల పత్రం మీద కావాలంటే సవరణలు ప్రవేశపెట్టవచ్చంటూ చెప్పారు. వాటిని చదివేందుకు కూడా ఆ సమయం చాలదు. అదే రోజు సభలో ఆమోదం కూడా పొందారు.మరుసటి ఏడాది కరోనాను అవకాశంగా తీసుకొని మూడు సాగు చట్టాలనూ అంతే వేగంగా ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నారు.వేగంగా పనిచేసే నాయకత్వ ఘనత గురించి నరేంద్రమోడీ భక్తులు, గోడీ మీడియా పండితులను అడిగితే కొండవీటి చాంతాడంత జాబితాను మన ముందుంచుతారు. రైతుల మహత్తర ఉద్యమం కారణంగా స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను క్షమాపణ చెప్పి మరీ 2021లో వెనక్కు తీసుకోవటం కూడా వేగంగా జరిగినట్లే !


ఈ వేగం కోట్లాది మంది కోట్లాది మంది రైతులు కోరుతున్న, గతంలో నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేసిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు ఎందుకు లేదు ? రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌పితో సహా రైతాంగ సమస్యలపై నియమించిన కమిటీ నుంచి ఇంతవరకు తాత్కాలిక నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదు ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. మూడు సాగు చట్టాలను 2021నవంబరులో రద్దుచేసినపుడు వెంటనే ఒక కమిటీని వేస్తామన్నారు. వెంటనే అంటే ఎనిమిది నెలలు, 2022 జూలై 12న కమిటీని వేశారు. ఆలస్యం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి స్పందన కోసం ఎదురుచూడాల్సి రావటం అని వ్యవసాయ మంత్రి సాకులు చెప్పారు. ఆ కమిటీకి నివేదించిన అంశాలు, కమిటీలో ప్రతిపాదించిన వ్యక్తుల పట్ల అభ్యంతరాలు తెలుపుతూ మోర్చా తన ప్రతినిధులను పంపేందుకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం-ఎన్నికల కమిషన్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అందించాలని సమాచార హక్కు కింద కోరగా అలాంటి రికార్డులు లేవని సమాధానం ఇవ్వటాన్ని బట్టి అసలు బండారం వెల్లడైంది.అంతే కాదు రైతు సంఘాలతో సంప్రదింపుల సమాచారం కూడా లేదని 2023 డిసెంబరు నాలుగవ తేదీన మరో సమాచార హక్కు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ తీరుతెన్నులను చూస్తే ఎస్‌కెఎం ఎందుకు బహిష్కరించిందో వివరణ అవసరం లేదు. మొత్తం 29 మంది సభ్యులలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో పనిచేసే వారే 18 మంది ఉన్నారు. మిగిలిన పదకొండు మంది అధికారేతర సభ్యులలో ఎస్‌కెఎం నుంచి ముగ్గురిని నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో ఎనిమిది మంది అధికారపార్టీ కనుసన్నలలో వ్యవహరించే రైతు ప్రతినిధులే ఉన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడు సంజరు అగర్వాల్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ప్రతిపాదించినపుడు వ్యవసాయశాఖ కార్యదర్శి. మరో సభ్యుడు ఇఫ్‌కో చైర్మన్‌ దిలీప్‌, ఇతగాడు గుజరాత్‌ బిజెపి మాజీ ఎంపీ. మరొకరు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బికెఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడైన ప్రమోద్‌ చౌదరి, ఐదవ సభ్యుడు సయ్యద్‌ పాషా పటేల్‌ మహారాష్ట్ర బిజెపి మాజీ ఎంఎల్‌సి, ఇలా అందరూ గత సాగు చట్టాలను అడ్డంగా సమర్దించిన వారితోనే నింపిన తరువాత ఎస్‌కెఎం గళానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.


ఇక ఈ కమిటీ తొలి పద్దెనిమిది నెలల కాలంలో 35 సమావేశాలు జరిపినట్లు, ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో చెప్పకుండా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబిచ్చింది.ఫిబ్రవరి తరువాత మరో రెండు సార్లు సమావేశమైనట్లు వార్తలు.ఈ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు ఇవ్వాలని కోరినా అందుబాటులో లేవన్నదే ప్రభుత్వ సమాధానం. గతంలో స్వామినాధన్‌ కమిషన్‌, తరువాత నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన 2016కమిటీ కూడా అనేక అంశాలను చర్చించింది. అందువలన కొత్త కమిటీ చర్చల పేరుతో కాలయాపన తప్ప మరొకటి కాదు. వాటి సిఫార్సులకు వ్యతిరేకంగా మూడు సాగు చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అయినా మోడీ వాటిని రద్దు చేస్తూ 2021లో చేసిన ప్రసంగంలో రైతులకు కొత్త ఆశలను రేకెత్తించారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి 28 బడ్జెట్‌ సందర్బంగా మోడీ చెప్పారు. అదే ఏడాది ఏర్పాటు చేసిన అశోక్‌ దలవాయి కమిటీ 2012-13 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనా ప్రాతిపదికన 2015-2016లో ఒక రైతు రాబడి ఏడాదికి రు.96,703, నెలకు రు.8,058 ఉంటుందని అంచనా వేసి 2022-23నాటికి అది రు.2,71,378- రు.22,610 ఉండాలని, దాన్ని సాధించాలంటే ఏటా 10.4శాతం పెరుగుదల ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉందో ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2018-19లో 77వ రైతు కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే ప్రకారం రాబడుల మొత్తాలు రు.1,22,616-రు.10,218 ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను 2021లో విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే వార్షిక పెరుగుదల కేవలం 2.8శాతమే ఉంది. పదేండ్ల యూపిఏ పాలన సగటు మూడు శాతం కంటే తక్కువ. అయితే ఏ ప్రాతిపదిక లెక్కించారో చెప్పకుండా కొన్ని పంటలకు 2022 ఆర్థిక సంవత్సరంలో రాబడి రెట్టింపు ఉన్నట్లు ఎస్‌బిఐ పరిశోధనా విభాగం చెప్పిన అంకెలను బిజెపి పెద్దలు ఊరూవాడా ప్రచారం చేశారు. గోడీ మీడియా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అంత పెరిగి ఉంటే రైతాంగం ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, దాని మిత్రపక్షాలను ఎందుకు మట్టికరిపించినట్లు ? అనేక చోట్ల రైతులు కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. రైతుల రాబడి రెట్టింపు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు 2023 డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ వ్యవసాయం రాష్ట్రాల అంశం గనుక అవి చూసుకుంటాయని దాట వేశారు. మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా అమలుకు పూనుకున్నపుడు ఈ అంశం గుర్తులేదా ? రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి గత ఎన్నికలకు ముందు కొంత మంది రైతులకు నెలకు రు.500 ఏడాదికి ఆరువేల చొప్పున పిఎం కిసాన్‌ నిధిపేరుతో ఇస్తున్నారు. ఐదేండ్లలో పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది ఏమూలకూ రాదు. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనుందనే లీకులను వదిలి రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చూసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.


తాజాగా వర్తమాన ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతేడాది ఏడుశాతం పెంచగా ఇప్పుడు ఓట్లతో నిమిత్తం లేదు గనుక 5.4శాతం మాత్రమే పెంచారు. తాజా ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాలలో ఓడిపోయిన బిజెపి దాన్నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్యను గమనించాలి.ఈ సందర్భంగా పదేండ్ల యుపిఏ పాలనలో పెరిగింది ఎంత, రాబడిని రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ ఎంత పెంచారు అన్నది మీడియాలో చర్చకు వచ్చింది. దీన్ని గోడీ మీడియా మూసిపెట్టేందుకు చూసింది.ప్రభుత్వ సమాచారం ప్రకారమే మచ్చుకు సోయాబీన్‌కు గత పాలకులు, 175, పత్తికి 115శాతం పెంచగా మోడీ పదేండ్లలో 80,79శాతాల చొప్పునే పెంచారు. అనేక పంటల ధరల పెరుగుదల శాతాల తీరు తెన్నులు దిగువ విధంగా ఉన్నాయి. దీనికి ఆధారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం.ఈ కనీస మద్దతు ధరలు కూడా రైతాంగంలో కేవలం పద్నాలుగుశాతం మాత్రమే పొందుతున్నారన్నది అంచనా.


పంట××××× యుపిఏ ×× మోడీ ఏలుబడి

వరి ముతక×× 138.2 ×× 66.7
గోధుమ ×× 122.2 ×× 62.5
చెరకు ×× 187.7 ×× 50.0
ఆవాలు ×× 90.6 ×× 85.3
పత్తి ××114.5 ×× 78.9
మొక్క జొన్న ××1594 ×× 59.5
శనగలు ×× 121.4×× 75.5
కందులు ×× 216.2×× 62.8
నరేంద్రమోడీ సర్కార్‌ రైతులకు చేసిన మేలు ఇలా ఉంది గనుకనే అనేక చోట్ల బిజెపి ఎదురుదెబ్బలు తిన్నది, గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది. దేశాన్ని ఊపివేస్తున్న నీట్‌ పరీక్షా పత్రాల కుంభకోణం ఎన్నికలకు ముందే వెలువడి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. దేశం కోసం-ధర్మం కోసమంటూ కబుర్లు చెప్పిన కాషాయదళం తీరుతెన్నులు వచ్చే ఐదు సంవత్సరాలూ వ్యవసాయ రంగంలో ఇదే విధంగా ఉండకూడని అనేక మంది కోరుతున్నారు.పెడచెవిన పెడితే రైతాంగ ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 15-16శాతమే ఉన్నప్పటికీ జనాభాలో 45శాతం మందికి ఉపాధి చూపుతున్నది. ఇది కూడా కుదేలైతే గ్రామీణా ప్రాంతాలలో అలజడి రేగుతుంది. జూలై పదవ తేదీన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్‌ బాడీ సమావేశం ఎన్నికల అనంతర పరిస్థితి గురించి సమీక్ష, కార్యాచరణ గురించి చర్చించనుంది.

నరేంద్రమోడీ రెండు ముఖాలు : రైౖతుల మద్దతు కోసం పాకులాట – ఉద్యమ సంఘాలపై పగసాధింపు !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పదిహేడవ విడత నిధులను మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత పెద్ద ఆర్భాటంతో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.(ఆంధ్రప్రదేశ్‌ మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ మీట నొక్కుడును గుర్తుకు తెచ్చింది) అంతకు ముందు తొలిసంతకం దాని మీదే చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.వెంటనే తాను ఎన్నికైన లోక్‌సభ స్థానం వారణాసి వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎగుమతుల ద్వారా భారత ఆహార వస్తువులను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంచంలో చూడాలని ఉందన్నారు. గతంలో ఎన్నడూ పిఎం కిసాన్‌ యోజన నిధుల విడుదలకు ఇంత హంగామా చేయలేదు. నిజానికి ఈ సొమ్ము ఏ కార్పొరేట్ల నుంచో ధనికుల నుంచో వసూలు చేసి ఇవ్వటం లేదు. మనం కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటరుకు రు.2.50, డీజిలు మీద రు.4.00 సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేసి దాన్నుంచి ఇస్తున్నది. ఇదే కాదు మొత్తం 29 వస్తువులపై ఈ పేరుతో పన్ను మీద 15శాతం సెస్‌ల రూపంలో వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేసి దాన్నుంచే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. ఎప్పుడూ లేనిది కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదలను ప్రచారానికి ఎందుకు వినియోగించుకున్నట్లు ? అదేమీ అర్ధంగాని తత్వం లేదా బ్రహ్మ పదార్ధం కాదు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రైతుల నుంచి వెల్లడైన వ్యతిరేకత అనేక ప్రాంతాల్లో ఓటమిలో వారి పాత్రను చూశారు. తత్వం తలకెక్కి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దగ్గరయ్యే ఎత్తుగడతో వారికోసం తాను తపిస్తున్నట్లు కనిపించేందుకు చేసిన యత్నం తప్ప మరొకటి కాదు.కొందరి విశ్లేషణ ప్రకారం గత లోక్‌సభలో 543 స్థానాలకు గాను బిజెపి 201గ్రామీణ నియోజకవర్గాలలో విజయం సాధించగా తాజా ఎన్నికల్లో 126 చోట్ల మాత్రమే గెలిచింది.వ్యవసాయదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా 159 చోట్ల బిజెపి ఓడిపోయిందని, రైతుల ప్రతినిధులను బడ్జెట్‌ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాపితంగా ఆందోళన తప్ప మరొక మార్గం లేదని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) స్పష్టం చేసింది.


నిజంగా వ్యవసాయం, దాని మీద ఆధారపడిన రైతులు, కూలీల గురించి కేంద్ర ప్రభుత్వానికి అంతశ్రద్ద ఉందా ? పదేండ్ల ఆచరణ చూస్తే అలా కనిపించదు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో రాష్ట్రాలలో చర్చ, ఆమోదంతో నిమిత్తం లేకుండా కరోనా సమయంలో అమల్లోకి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం తెలిసిందే.విధి లేని స్థితిలో క్షమాపణలు చెప్పిమరీ మోడీ వాటిని వెనక్కు తీసుకున్నారు. ఆ మహత్తర ఉద్యమానికి నాయకత్వం వహించింది అనేక రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం). ఆ వేదికలో కీలక పాత్రపోషించిన ఆలిండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) దేశంలో అతి పెద్ద రైతు ఉద్యమ సంస్థ, తొలి వరుసలో ఉంది. మూడు సాగు చట్టాల రద్దు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు, ఇతర అంశాల గురించి 2022 జూలైలో ఒక కమిటీని వేసింది. అది ఏం చేస్తున్నదో నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందో తెలియదు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ తరగతులు ఏ కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సంస్థలు, వ్యక్తులను కూడా పిలిచి ప్రతి ఏడాది సంప్రదింపులు జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆమోదం పొందిన తాత్కాలిక(ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌) స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్చలకు ఎస్‌కెఎం, ఏఐకెఎస్‌లను దూరంగా పెట్టింది. ఇది రైతులను అవమానించటం, కక్ష సాధింపు అనేందుకు పక్కానిదర్శనం.ఈ వైఖరిని ఆలిండియా కిసాన్‌ సభ ఒక ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రతి ఏటా ఎఐకెఎస్‌ను ఆహ్వానించి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్‌కెఎం నాయకులను కూడా చర్చల నుంచి మినహాయించటాన్ని కూడా ఎఐకెఎస్‌ ఖండించింది.


మూడవసారి అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ వ్యవసాయం గురించి సరికొత్తగా ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని అనేక మంది చెబుతున్నారు. మోడీ సర్కార్‌ పారిశ్రామిక వస్తు ఎగుమతుల్లో విఫలమైంది. సముద్ర ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు జతచేసిి మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిగా చూపుతున్నారు.2014-15 సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 36.18బిలియన్‌ డాలర్లుండగా 2020-21నాటికి 38.32 బి.డాలర్లకు పెరిగినట్లు ఏటా పెరుగుదల శాతం 0.96శాతంగా ఉన్నట్లు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు బిజినెస్‌ టుడే పత్రిక 2021 డిసెంబరు 10న ప్రచురించిన వార్తలో పేర్కొన్నది.సముద్ర, తోటల ఉత్పత్తులను మినహాయించి కేవలం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2020-21లో 29.81 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి రాకముందు 2013-14 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 37.292బి.డాలర్లు. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించినట్లు పిఐబి 2014జూలై తొమ్మిదిన తెలిపింది.దీంతో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ విలువ తిరోగమనంలోనే ఉంటుంది. జనాన్ని మభ్యపరిచేందుకు పాలకుల కనుసన్నలలో పనిచేసే అధికార యంత్రాంగం ఎన్నితిప్పలు పడుతుందో పిఐబి 2024 ఫిబ్రవరి 17న వెల్లడించిన మరో సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన పదేండ్లలో సాధించిన విజయాల గురించి కీర్తించటం తెలిసిందే. దానిలో భాగంగానే 1987-88లో అపెడా( వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ) ఎగుమతులు కేవలం 0.6బిలియన్‌ డాలర్లేనని అలాంటిది 2022-23నాటికి 26.7బి.డాలర్లకు పెరిగినట్లు , ఇది మోడీ గొప్పతనం అన్నట్లు చిత్రించింది. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 53.1బి.డాలర్లని కూడా తెలిపింది. ఈ లెక్కన చూసుకున్నా పదేండ్లలో పెరిగింది 53.1-37.29=15.81 బి.డాలర్లు మాత్రమే. తాను వచ్చిన తరువాత భారత ప్రతిష్టను, విదేశాల్లో తిరిగి మార్కెట్లను పెంచానని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేశామని చెప్పుకున్న నరేంద్రమోడీ ప్రచారానికి ధీటుగా ఈ పెరుగుదల లేదు. యాహూ న్యూస్‌ 2024 మార్చి 21వ తేదీ విశ్లేషణ ప్రకారం 2022లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే 20 అగ్రదేశాలలో మనది 11వ స్థానం, చైనా ఆరవదిగా ఉంది.


మన రైతులు నేరుగా ఏ దేశానికైనా ఎగుమతులు చేసుకొనేందుకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలుగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలు, నిషేధం ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి పండే ప్రాంతాలలో ఎక్కువ చోట్ల బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. ఆంక్షల వలన 2023 ఏప్రిల్‌-అక్టోబరు మాసాల మధ్య బాస్మతి బియ్యం ఎగుమతులు 16శాతం పెరిగినా ఇతర ఉత్పత్తుల్లో నాలుగు బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరగలేదు. తొమ్మిదిశాతం ఎగుమతులు తన పరిధిలో తగ్గినట్లు అపెడా పేర్కొన్నది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా బిజెపి రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా నేపాల్‌, ఇతర దేశాలు మన బదులు పాకిస్తాన్‌, చైనాల నుంచి కొనుగోలుకు పూనుకున్నాయి. అంటే ఎగుమతి అవకాశాన్ని తన ఎన్నికల లబ్దికోసం మోడీ అనిశ్చితిలో పడేశారు. పోనీ మనదేశంలో ఉల్లి దిగుబడిని పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ కనపడదు. చైనాలో హెక్టారుకు 21.85 టన్నుల దిగుబడి ఉండగా మనదేశంలో 16.12 టన్నులు మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో రెండు దేశాలూ ఒకటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి.


వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు బదులు రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాల పేరుతో చేసిన యత్నం బెడిసి కొట్టింది. తరువాత కూడా అదే వైఖరి. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి) విధానాన్ని ఎత్తివేయాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల అమలుకు చూస్తున్నారు. ఆ కారణంగానే ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నారు. మరో ఐదు సంవత్సరాల వరకు పార్లమెంటు ఎన్నికలు లేవు గనుక ఎగుమతి వ్యాపారంలో ఉన్న బడా సంస్థల కోసం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసి అవి రైతులకోసమే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడు సాగు చట్టాల తరువాత వేసిన కమిటీతో మరో రూపంలో ఆ చట్టాల్లోని అంశాలనే చెప్పించి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటానికి సాకుల కోసం చూస్తున్నారు. ఆ పేరుతో ప్రపంచవాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకులను సంతుష్టీకరించేందుకు పూనుకోవచ్చు.మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నరేంద్రమోడీ మరోవైపు పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులపై పన్నులు తగ్గించారు. దీంతో మనదేశంలో వీటిని సాగుచేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణ అదుపు చర్యలంటూ ఎగుమతులపై ఆంక్షలు, దిగుమతులపై పన్నుల తగ్గింపు కారణంగా అంతిమంగా నష్టపోయింది రైతులు మాత్రమే. ఎన్నికలు జరుగుతున్నపుడు కిలో ఇరవై రూపాయలున్న ఉల్లి ఫలితాలు వచ్చిన వెంటనే యాభై రూపాయలకు పెరిగింది. దీంతో రైతులెంత లబ్దిపొందుతారో తెలియదు గానీ వినియోగదారుల జేబులకు చిల్లి పడింది.

తొలిసారి నరేంద్రమోడీ అధికారానికి రావటానికి, కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల కూడా ఒకటి.అందుకే తాజా ఎన్నికలకు ముందు దాన్ని కృత్రిమంగా అదుపులో ఉంచేందుకు పైన పేర్కొన్న చర్యలను తీసుకున్నారు.అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబరు నుంచి ఎనిమిదిశాతానికి అటూ ఇటూగా ఉంది. ఆ మేరకు పప్పులు, నూనెలు, ఇతర ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బిజెపిని దెబ్బతీసిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ నేపధ్యంలో బడ్జెట్‌లో రైతులు ఏం కోరుతున్నారో తెలుసుకోవాలంటే వారి సమస్యలపట్ల నిత్యం పని చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సభ వంటి సంస్థలను, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేస్తున్న మేధావులను సంప్రదించకుండా కుదిరేది కాదు. ఆ దిశగా కేంద్ర తీరు లేదంటే దాని అర్ధం ఏమిటి ? చర్చలకు పిలిస్తే ఎవరేం కోరుతున్నారో రైతులకు స్పష్టత వస్తుంది, వాటిని అమలు జరపకపోతే పాలకుల మీద వత్తిడి పెరుగుతుంది. అందుకే దూరంగా పెట్టారు.తన కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తానని ఒక ముసలమ్మ అనుకుందట.అలాగే ప్రభుత్వం అవకాశం కల్పించనంత మాత్రాన ఉద్యమ సంస్థల వాణి రైతులకు చేరకుండా ఉంటుందా ?

నరేంద్రమోడీ వట్టిస్తరి మంచినీళ్లు : భారత్‌లో మహిళా సమానత్వ సాధనకు 152 ఏళ్లు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


బేటీ బచావో బేటీ పఢావో, మహిళా సురక్ష కేంద్ర, మహిళా పోలీసు వలంటీర్స్‌, రాష్ట్రీయ మహిళా కోష్‌, సుకన్య సమృద్ధి యోజన, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ… ఇవన్నీ మన దేశంలో ఉన్న పధకాలు, ఎవరికో చెప్పనవసరం లేదు.కొన్ని రాష్ట్రాల్లో వీటికి పేర్లు మార్చి అమలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇన్ని జరిగిన తరువాత కూడా ప్రపంచంలో స్త్రీ, పురుష సమానత్వ తేడాలో 2024 ప్రపంచ 146దేశాల జాబితా ప్రకారం మన స్థానం 129. పదేండ్లతో పోల్చుకుంటే దిగజారింది. మహిళల అభ్యున్నతి గురించి గత పది సంవత్సరాలుగా తమ భుజాలను తామే చరుచుకొని రొమ్ములు విరుచుకొని గొప్పలు చెప్పుకున్న, మహిళలను వంచించిన వారు, అంతకంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు వారికి భజన చేసిన ఘనులు తలలెక్కడ పెట్టుకుంటారో చూడాలి. పధకాలన్నీ మావే, రాష్ట్రాలు పేర్లు మార్చుకుంటున్నాయి, అందువలన మా ఫొటోలు పెట్టాలి, వాటి ” ఖ్యాతి ”లో మాకూ వాటా రావాలని కోరుతున్న బిజెపి పెద్దలు ఆ మొత్తాన్ని వారే తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. డిఎంకె సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు నాడు మంత్రిగా ఉన్న మేనకా గాంధీ 2015 మే 7వ తేదీన ఇచ్చిన జవాబు సారం ఇలా ఉంది. ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యుఇఎఫ్‌) లింగసమానత్వ తేడా నివేదిక 2014 ప్రకారం 142దేశాలలో భారత్‌ 114వదిగా ఉంది. అంతకు ముందు సంవత్సర నివేదిక ప్రకారం 136 దేశాలలో 101వదిగా ఉంది. ఏడాది కాలంలోనే ఇంతగా దిగజారి పోవటానికి కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం తగ్గటం, అవకాశాలు లేకపోవటమే అని పేర్కొన్నారు. అలాంటిది కొన్ని మార్పులు జరిగినా పదేండ్ల తరువాత 101 నుంచి 129వ స్థానానికి దిగజారింది. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపి, మిత్రపక్షాలే, మెరుగుపరచకపోయినా దిగజారటానికి నెపం నెహ్రూ మీదో, గాంధీ మీదో నెడితే కుదరదు.


ఈ సూచికలను రూపొందించటానికి నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.1.ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, అవకాశాలు, 2. విద్యా అవకాశాలు, 3. ఆరోగ్యం,బతుకు, 4.రాజకీయ సాధికారత. వీటన్నింటిలో ఏ దేశం ఎక్కడుందనే సూచికలు, పాయింట్లు వేస్తారు. వాటన్నింటిని కలిపి మొత్తంగా సాధారణ సూచికలను రూపొందిస్తారు. ఇలాంటి నివేదికలను 2006 నుంచి ప్రతి ఏటా రూపొందిస్తున్నారు. పరిగణనలోకి తీసుకున్న 146దేశాల సగటు లింగ సమానత్వ తేడా 2024లో 68.5శాతం ఉంది. గతేడాది కంటే కేవలం 0.1శాతమే మెరుగైంది. అంటే 31.5శాతాన్ని పూరించాల్సి ఉంది. ఇప్పుడున్న వేగంతో తేడాను పూర్తిగా తగ్గించాలంటే 134 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలో నూటికి నూరుశాతం సమానత్వం సాధించిన దేశమేమీ లేదు. మొదటి స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌లో 93.5శాతం సాధించారు.భారత్‌లో 64.1శాతం ఉంది. ఈ లెక్కన పూర్తి సమానత్వం సాధించటానికి కనీసం 152 సంవత్సరాలు పడుతుంది. దక్షిణాసియా దేశాల సగటు తేడా 63.7శాతమే. పది సంవత్సరాల నాడు మొత్తం రాంకు మార్కులను చూస్తే 0.6455 కాగా తాజా సూచికలో 0.641కి దిగజారింది.


మన దేశంలో లింగ బేధాలను తగ్గించటంలో పదేండ్ల నరేంద్రమోడీ పాలన ఘోరంగా విఫలమైంది. మరింత దిగజారింది.ఇరుగుపొరుగు దేశాలలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ తరువాత ఐదవదిగా మనదేశం ఉంటే బిజెపి పెద్దలు నిత్యం స్మరించే పాకిస్తాన్‌ ఏడవదిగా ఉంది.ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్యంలో 146కు గాను 142వదిగా ఉంది.(మన తరువాత పాకిస్తాన్‌ ఉంది) విద్య అందుబాటులో 112, రాజకీయ రంగంలో 65, కార్మికశక్తి భాగస్వామ్యంలో 134వదిగా ఉంది. విద్యాఅవకాశాలు, రాజకీయ సాధికారత తగ్గుదల కారణంగానే గతేడాది వచ్చిన 127వ రాంకు 129కి దిగజారింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పటికీ ఆ స్ఫూర్తిని రాజకీయ పార్టీలేవీ పాటించలేదు. దాని ఘనత తమదే అని భుజాలు చరుచుకున్న బిజెపి 30 మంది కాబినెట్‌ మంత్రులకు గాను కేవలం ఇద్దరికి, మొత్తం మంత్రివర్గంలో గతంలో ఉన్న పది మందిని ఈ సారి ఏడుకు తగ్గించింది. నేపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మంత్రులలో 23.5శాతం మంది మహిళలే ఉన్నారు. చట్టసభల్లో మహిళల ప్రపంచ సగటు 33శాతం కాగా అక్కడ 49.9శాతం ఉంది.


జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం కల్పించకుండా వారి సాధికారత గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వట్టిస్తరి మంచి నీళ్లు తప్ప మరొకటి కాదు. గడచిన పది సంవత్సరాల్లో జరిగింది అదే. లింగసమానత్వ తాజా నివేదికలో మనదేశంలో కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం 35.09శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా ప్రభుత్వం అందచేసిన తప్పుడు లెక్కల కారణంగానే. నిజంగానే అంత ఉందా ? లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశట్టే ముందు నరేంద్రమోడీ తన పాలనలో మహిళాభ్యున్నతిని చూసి ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని చెప్పారు. తన పదేండ్ల ఏలుబడిలో దిగజారిన రాంకును చూసి తలవంచుకుంటారా ? ప్రతిపక్షాలకు సుభాషితాలు చెబుతూనే ఉంటారా ? ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు, ప్రభుత్వ లెక్కలకు పొంతన కుదరటం లేదు. స్టాటిస్టా విశ్లేషణ ప్రకారం 2014 నుంచి 2022వరకు తొమ్మిదేండ్ల సగటు 26.81శాతం కాగా 2023లో 32.68శాతం ఉన్నట్లు అదే సంస్థ పేర్కొన్నది.ఒక్కసారిగా అంత ఎలా పెరిగింది ? ప్రపంచ బాంకు లెక్క 32.7శాతం అన్నది. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. అందుకే అంకెల గారడీ అనాల్సి వస్తోంది.


ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది. ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మహిళలకు అన్ని గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని ఊరూ వాడా ప్రచారం చేసే బిజెపి ప్రచార దళాలు తమ రెండింజన్ల డ్రైవర్లు సాధించిందేమిటో, పదేండ్లలో పరిస్థితి ఎందుకు దిగజారిందో ఎక్కడా మాట్లాడటం లేదు. గోడీ మీడియా సంగతి సరేసరి తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తటం లేదు. ఈ అంశాన్ని పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని కోల్పోవటానికి మహిళా ఉపాధి తగ్గటం కూడా ఒక కారణమే.

చైనా-రష్యాలను మరింత దగ్గర చేసిన జి7 కూటమి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇటలీలోని అపూలియాలో 2024 జూన్‌ 13-15 తేదీలలో జరిగిన జి7 50వ శిఖరాగ్ర వార్షిక సమావేశ తీరుతెన్నులు, పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతున్నది. ఈ సమావేశాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సహా పన్నెండు దేశాధినేతలను,ఆఫ్రికా యూనియన్‌ ప్రతినిధిని ఆహ్వానించారు. ఇలాంటి వేదికలన్నింటా పూసల్లో దారంలా ప్రపంచ దేశాల బలాబలాల సమీకరణ లక్ష్యం ఉంటుంది. ధనికదేశాలు తమకు సవాలు విసురుతున్న చైనా, రష్యాలను దెబ్బతీసేందుకుగాను వర్దమాన,పేద దేశాలను తమ వైపు తిప్పుకొనేందుకు అపూలియాలో గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్ధకమే. అనేక అంశాల మీద ఈ కూటమి ఒక ప్రకటన చేసినప్పటికీ దానిలో ప్రధానమైన వాటిని చూద్దాం. ఆతిధ్యం ఇచ్చిన దేశం తనకు నచ్చిన, తాను మెచ్చిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు అల్జీరియా, అర్జెంటీనా,బ్రెజిల్‌,భారత్‌,జోర్డాన్‌, కెన్యా, మారిటేనియా, ఆఫ్రికన్‌ యూనియన్‌,ట్యునీసియా, టర్కీ,యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌,ఉక్రెయిన్‌, వాటికన్‌ నగరం నుంచి అధిపతులు వచ్చారు. ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా, రష్యా దేశాలకు ఆహ్వానం లేనప్పటికీ మూడు రోజుల సమావేశాలు వాటి నామజపంతోనే ముగిశాయంటే అతిశయోక్తి కాదు. సమావేశ ప్రకటనలో 28 సందర్భాలలో చైనా పేరును ప్రతికూలంగా ప్రస్తావించారంటే దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని అర్ధం ఘర్షణకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.గతేడాది జపాన్‌-ఒసాకాలో జరిగిన కూటమి ప్రకటనలో 20సార్లు ప్రస్తావించారు.ప్రస్తుతం ధనికదేశాల కూటమికి చైనాను ఢకొీనే సత్తా ఉందా అన్నది ప్రశ్న. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం చైనా అని నెపం నెట్టేందుకు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.


అసలు జి 7 కూటమి, ఎందుకు ఎలా ఉనికిలోకి వచ్చిందీ చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తూ ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. ఆ పర్యవసానంతో పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 1975లో నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో తొలి సమావేశం జరిగింది. అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు వచ్చారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న పూర్వపు తన క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించటంతో తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలకు ఎవరు ఆతిధ్యం ఇస్తే తదుపరి సమావేశం వరకు ఏడాది పాటాదేశాధినేత అధ్యక్ష స్థానంలో ఉంటారు.ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ లేరు. సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. అపూలియా సభలో ఉక్రెయిన్‌, వాతావరణ సంక్షోభాలు, సైబర్‌ భద్రతకు ముప్పు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, మానవహక్కుల హరింపు, అవసరాలకు మించి అదనంగా ఉత్పత్తి చేస్తూ విద్యుత్‌ వాహనాలను ప్రపంచం మీద కుమ్మరిస్తున్నదంటూ చైనా మీద దుమ్మెత్తి పోశారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయకపోయినా, వాటి ఉత్పత్తికి అవసరమైన వాటిని అందిస్తున్నదంటూ విధించిన ఆంక్షలకు ఆమోదం తెలిపింది. ప్రతికూల చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది.


ఈ సమావేశాలకు హాజరైన నేతలందరి పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అయినా లేస్తే మనుషలం కాదన్నట్లుగా ఫోజు పెట్టారు.చైనాను దెబ్బతీసేందుకు మిత్రదేశాలను అమెరికా ఎలా కూడగడుతున్నదో తనను తాను రక్షించుకొనేందుకు బీజింగ్‌ కూడా అదే చేయనుందని వేరే చెప్పనవసరం లేదు. ” ఆరుగురు అసమర్ధులు మరియు జార్జియా మెలోనీ 2024 జి7 తరగతిలో కూడిక ” అన్న శీర్షికతో పొలిటికో పత్రిక ఒక బలహీన సమావేశం అంటూ విశ్లేషణ రాసింది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు బలపడటంతో ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఏకంగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా అంతకు ముందే అదేపని చేశాడు. జర్మనీ ఛాన్సలర్‌ షఉల్జ్‌ కూడా చావు దెబ్బతిన్నాడు, ఎప్పుడైనా అదేపని చేయవచ్చు. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ”వెర్రి(క్రేజీ)” పదవి నుంచి తప్పుకోనున్నట్లు బహిరంగంగానే ప్రకటించాడు.జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా పలుకుబడి అధ్వాన్నంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ తిరిగి అధికారానికి రావటం అనుమానంగానే ఉంది. ఇలాంటి వాటన్నింటినీ మూసిపెట్టేందుకు రష్యాతో పాటు చైనాను కూడా బూచిగా చూపేందుకు కసరత్తు చేశారు.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అయితే దాన్ని పరిష్కరించటానికి బదులు మరింత ఎగదోసేదిగా కనిపించింది. ఈ సమావేశం ఫలితాలు, పర్యవసానాల విషయానికి వస్తే ఇప్పటికే దగ్గరైన చైనా-రష్యాలను మరింత దగ్గరగా చేసేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా ఆయుధాలను రష్యాకు సరఫరా చేయటం లేదు, కానీ వాటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని సమకూరుస్తున్నది, కాబట్టి నిజానికి అది రష్యాకు సాయం చేయటమే అని జో బైడెన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. రష్యా యుద్ధ యంత్రాంగ రక్షకురాలిగా చిత్రించటం తప్ప వేరు కాదు.గత కొద్ది సంవత్సరాలుగా చైనా మీద సాగిస్తున్న విమర్శ మరింత పదును తేలింది. గత రెండు సమావేశాల్లో చైనా పాత్ర గురించి దాదాపు లేవనెత్తలేదని, ఉక్రెయిన్‌పై వ్లదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాన్ని పేల్చుతారన్న భయాలు తలెత్తినపుడు షీ జింపింగ్‌ అంతదాకా పోనివ్వని నియంత్రణశక్తిగా భావించారని, ఈసారి దానికి భిన్నంగా సమావేశ ప్రకటన ప్రారంభమైందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.రష్యా యుద్ధ యంత్రాంగానికి వస్తు సరఫరా చేస్తున్న చైనా, మూడవ పక్షదేశాల సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నట్లు ఉటంకించింది. గత సమావేశాల్లో వాతావరణ ప్రతికూల మార్పులను అడ్డుకొనేందుకు,ఉగ్రవాదం, అణ్వాయుధ నిరోధం కోసం చైనాతో చేతులు కలుపుతామంటూ మాట్లాడిన ధనికదేశాలు ఇప్పుడు శత్రువుగా చూస్తున్నాయంటే ఆ సమస్యల పట్ల వాటి చిత్తశుద్ది ఏమిటో స్వయంగా వెల్లడించుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షీ జింపింగ్‌ చైనా ఆధిపత్య లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అపూలియా అంతరంగిక సమావేశంలో అభిప్రాయపడినట్లు అమెరికా అధికారి ఒకరు విలేకర్లతో చెప్పాడు. ఉక్రెయిన్‌ వివాదంలో చైనా పాత్ర గురించి షీ జింపింగ్‌ వైఖరిలో గత ఏడాది కాలంలో మార్పు వచ్చినట్లు అమెరికా ప్రచారం చేస్తున్నది.రష్యాతో అవధులు లేని భాగస్వామ్యంగా ప్రకటించినప్పటి నుంచి అది ప్రారంభమైందని ఆరోపిస్తోంది. స్విడ్జర్లాండ్‌లో పశ్చిమదేశాలు నిర్వహించిన ఉక్రెయిన్‌ శాంతి సదస్సులో పాల్గొనవద్దని దేశాలను నిరుత్సాహపరచిందని కూడా ఆరోపించింది. చిత్రం ఏమిటంటే ఈ సమావేశంలో భాగస్వామిగా ఉన్న మనదేశం సమావేశ ప్రకటనను ఆమోదించటానికి తిరస్కరించింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉందని చెప్పగలరా ?


అవసరానికి మించి చైనా ఉత్పత్తులు చేస్తున్నదనే ప్రచారం పెద్ద ఎత్తున పశ్చిమదేశాలు చేస్తున్నాయి. ఇటలీ సభలో కూడా ఇది ఒక ప్రధాన అజెండాగా ఉంది. పెట్టుబడిదారీ విధాన సూత్రం ప్రకారం అవసరానికి మించి ఉత్పత్తి చేస్తే కొనేవారు లేక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ కనీస ఇంగితం చైనా నాయకత్వానికి లేదని భావిస్తున్నారా ? చైనా ఉత్పత్తులు, సరఫరా గొలుసు మీద ఆధారపడకూడదని, విడగొట్టుకోవాలని చెబుతున్నవారిని ఎవరూ బలవంతంగా ఆపలేదే. వస్తు తయారీకి ధనిక దేశాల వద్ద పెట్టుబడులు లేవా, సాంకేతిక పరిజ్ఞానం లేదా, పని చేసే కార్మికులు లేరా ? చైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నది అనుకుంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌ కూడా చైనా ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను పెంచి రక్షణాత్మక చర్యలు తీసుకొని కూడా గగ్గోలు పెడుతున్నాయి. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొనేందుకు తమమీద నిందలు వేస్తున్నట్లు చైనా విమర్శిస్తున్నది.


చైనా మీద వ్యతిరేకతను పెంచేందుకు చేయని తప్పుడు ప్రచారం లేదు. అవసరమైనపుడు అమెరికా, ఐరోపా దేశాలలోని అన్నిరకాల వ్యవస్థలను పనిచేయకుండా చేసేందుకు వాటిలో కంప్యూటర్‌ వైరస్‌లను పెట్టి సిద్ధంగా ఉంచిందని అమెరికా ఆరోపించింది. దీనికి ” ఓల్ట్‌ టైఫూన్‌ ” అనే పేరు పెట్టారు. దీని ప్రకారం విద్యుత్‌,నీరు,రేవుల వంటి వ్యవస్థలను అమెరికా, దాని మిత్రదేశాలలో పనిచేయకుండా చేసేందుకు చైనా ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించి సదరు వ్యవస్థలలో ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటి, అన్ని రకాల సాంకేతిక రంగాలలో తమకు మించిన వారు లేరని విర్రవీగుతున్న పశ్చిమదేశాలు తమ వ్యవస్థలకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేనంత అసమర్ధంగా ఉన్నాయా ? అంటే ఎవరూ నమ్మరు, చైనాను బూచిగా చూపి జనంలో దిగజారుతున్న తమ పలుకుబడిని నిలుపుకొనేందుకు, ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఒక మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. ఒకవేళ బలవంతంగా తైవాన్‌ విలీనానికి చైనా పూనుకుంటే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే. అందువలన ఒక వేళ నిజంగా చైనా అలాంటి వైరస్‌ను చొప్పించిందంటే దెబ్బకు దెబ్బ తీసే జాగ్రత్త అని అర్ధం చేసుకోవాలి.
ఇక అపూలియా సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ హాజరైపుడు ఫొటో తీసుకొనేందుకు హాజరైన నేతలందరూ చుట్టుముట్టారని, నేతల మధ్యలో మోడీ ఉండటమే దానికి నిదర్శనం అన్నట్లు సమావేశ గ్రూపు ఫొటోను చూపి కొంత మంది చౌకబారు ప్రచారం చేస్తున్నారు. ఐదుసార్లు ఈ సమావేశాలకు మోడీ వెళ్లారన్నది మరొకటి. యుపిఏ పదేండ్ల కాలంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా ఐదుసార్లు హాజరయ్యారు.(2006 సెంట్‌పీటర్స్‌బర్గ్‌ సమావేశానికి మనదేశం నుంచి తీసుకువెళ్లిన జర్నలిస్టుల బృందంలో ఈ రచయిత కూడా ఒకరు ) భారత్‌ ఈ కూటమి సభ్యదేశంగా చేరనుందనే భావం కల్పిస్తూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఏ ఒక్కదేశమూ ఈ గ్రూపును విస్తరించే ప్రతిపాదనలు ముందుకు తేలేదు. ఒకవేళ విస్తరించినా మనదేశాన్ని చేర్చుకుంటారన్నది సందేహమే. ఆ గ్రూపులోని ఐదు దేశాల జిడిపి కంటే మనది ఎక్కువగా ఉన్నది తప్ప ధనికదేశ వర్గీకరణకు ఎంతో దూరంలో ఉంది. యాభై ఏండ్లుగా ఉన్న ఆ బృందం ప్రపంచ పరిణామాలను నియంత్రించటంలో నానాటికీ బలహీనపడుతున్న తరుణంలో మనదేశం చేరినంత మాత్రాన మన జనానికి ఒరిగేదేమిటి ? ఒకవేళ నిజంగా చేరితే చైనా, రష్యాలతో ఒక శత్రుకూటమిగా మనదేశం కూడా లడాయికి దిగటమే. అటువంటి దుస్సాహసానికి నరేంద్రమోడీ పాల్పడతారా ?

ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్టు సంస్థ, ఊసరవెల్లి : సోషలిస్టు నేత మధు లిమాయే చెప్పిన వాస్తవాలేమిటి ?

Tags

, , , , , , , ,


మధులిమాయే


నేను 1937లో రాజకీయ జీవితంలో ప్రవేశించాను. ఆ రోజుల్లో పూనాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు సావర్కర్‌వాదులు( వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనుచరులు) ఒక వైపు, మరోవైపు జాతీయవాదులు, సోషలిస్టులు మరియు వామపక్ష రాజకీయ సంస్థలు ఎంతో చురుకుగా ఉండేవి.1938 మే ఒకటవ తేదీన మే దినోత్సవాన్ని పాటించేందుకు మేము ఒక ప్రదర్శన జరిపాము. దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌వాదులు దాడి చేశారు. ఆ సందర్భంగా సుపరిచితులైన విప్లవవాది సేనాపతి బాపట్‌, మా సోషలిస్టు నేత ఎస్‌ఎం జోషి కూడా గాయపడిన వారిలో ఉన్నారు. హిందూత్వ సంస్థలతో అప్పటి నుంచి మాకు తీవ్రమైన విబేధాలు ఉండేవి. జాతీయవాద సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌తో మా తొలి విబేధం ఉంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని మేము నమ్మాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ వాదులు హిందూ రాష్ట్ర అనే భావంతో వచ్చారు. మహమ్మదాలీ జిన్నా కూడా అలాంటి లోకపు భావన బాధితుడే. భారత్‌ రెండు – ముస్లిం, హిందూ దేశాలతో ఏర్పడిందని అతను నమ్మారు, సావర్కర్‌ కూడా అదే చెప్పారు.


మా మధ్య రెండో ప్రధాన విబేధం ఏమిటంటే మేము ఒక ప్రజాస్వామిక సర్వసత్తాక రాజ్యం ఉద్భవించాలని కలగన్నాము, ప్రజాస్వామ్యం పశ్చిమదేశాల భావన, భారత్‌కు పనికిరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఎంతగానో పొగిడేవారు. గురూజీ(మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగానే కాదు సైద్దాంతిక గురువుగా కూడా ఉండేవారు.గురూజీ మరియు నాజీల మధ్య ఆలోచనల్లో అద్భుతమైన సామీప్యతలు ఉన్నాయి. ఆయన ఉత్తమ రచనల్లో ఒకటిగా ఉన్న ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” అనే గ్రంధం అనేక ప్రచురణలు పొందింది. హిందువులు కాని వారిని పౌరులుగా పరిగణించకూడదని స్పష్టంగా దానిలో చెప్పారు.వారి పౌరసత్వహక్కులను రద్దుచేయాలని కోరారు. ఈ ఆలోచనలు కొత్తగా రూపుదిద్దుకున్నవి కాదు. మేము కాలేజీలో ఉన్న రోజుల నుంచి(1930 దశకం మధ్యలో) హిట్లర్‌ భావజాలం వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు మొగ్గుచూపేవారు. వారి దృష్టి ప్రకారం జర్మనీలో యూదుల పట్ల హిట్లర్‌ ఎలా వ్యవహరించాడో అదే మాదిరి భారత్‌లో ముస్లింలు, క్రైస్తవుల పట్ల వ్యవహరించాలి.నాజీ పార్టీ భావాల పట్ల గురూజీ ఎంతలా సానుకూలంగా ఉన్నారో ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” గ్రంధంలో దిగువ పేరాయే సాక్ష్యం.” తన జాతి, సంస్మృతిని పరిశుద్దంగా ఉంచేందుకు సెమిటిక్‌ జాతులను-యూదులను అంతమొందించి జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతి ఔన్నత్యం దాన్ని ఉన్నతిని ఇక్కడ స్పష్టం చేసింది. జాతులు,సంస్కృతుల మధ్య ఉన్న విబేధాలకు కారణాలు తెలుసుకొంటే వాటిని తొలగించటం అసాధ్యం కాదని, ఐక్యంగా ఉంచటానికి సమీకృతం చేసేందుకు ప్రపంచానికి జర్మనీ దారి చూపింది, దాన్నుంచి నేర్చుకొనేందుకు, లబ్దిపొందేందుకు హిందూస్తాన్‌లో మనకు మంచి పాఠం ”


కుల సమస్య మీద గురూజీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో మా మూడో ప్రధాన విబేధం. ఒక సోషలిస్టుగా నా వంటి వారికి అది ఒక పెద్ద శత్రువు కాగా కుల వ్యవస్థ సమర్ధకులు వారు. కుల వ్యవస్థ దాని పునాదిగా ఉన్న అసమానతలను నిర్మూలించకుండా భారత్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది నా గట్టి వైఖరి. మేము విబేధించిన నాలుగో అంశం భాష. పౌరుల భాషలను ప్రోత్సహించేందుకు మేము అనుకూలం. అన్ని ప్రాంతీయ భాషలు దేశీయమైనవే. కానీ దీని మీద చెప్పిందేమిటి ? అందరికీ ఉమ్మడి భాషగా ప్రస్తుతానికి హిందీని, తరువాత అంతిమంగా జాతీయ భాషగా సంస్కృతాన్ని చేయాలని గురూజీ చెప్పారు. ఐదవది, స్వాతంత్య్రం కోసం తలెత్తిన జాతీయ ఉద్యమం ఫెడరల్‌ రాజ్యం అనే భావనను ఆమోదించింది. ఒక సమాఖ్య దేశంలో కొన్ని నిర్దేశిత విషయాలలో కేంద్రం కొన్ని తప్పనిసరి అధికారాలను కలిగి ఉంటుంది, ఇతర అన్ని అంశాలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండాలి. కానీ దేశ విభజన తరువాత కేంద్రాన్ని పటిష్టపరిచేందుకు ఉమ్మడి జాబితాను నిర్దేశించారు. ఈ జాబితా ప్రకారం అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. వాటి మీద కేంద్రం, రాష్ట్రాలకు సమానమైన అధికారపరిధి ఉంది.ఆ విధంగా సమాఖ్య రాజ్యం ఉనికిలోకి వచ్చింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని ప్రధాన సిద్దాంతవేత్త గురు గోల్వాల్కర్‌ ఈ మౌలిక రాజ్యాంగ ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల సమాఖ్య భావననే వీరు అపహాస్యం చేశారు. రాష్ట్రాల సమాఖ్యను కోరిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్నారు. తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” అనే గ్రంధంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని, కొత్త రాజ్యాంగంలో ఏక(యూనిటరీ) రాజ్య ఏర్పాటును లిఖించాలని పేర్కొన్నారు. ఏక లేదా మరో మాటలో చెప్పాలంటే కేంద్రీకృత రాజ్యాన్ని గురూజీ కోరారు.రాష్ట్రాల వ్యవస్థను వదిలించుకోవాలని చెప్పారు.


జాతీయోద్యమం ఎంచుకున్న త్రివర్ణ పతాకం మరొక సమస్య. మనం ఎంచుకున్న జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కోసం వందలాది మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వేలాది మంది లాఠీ దెబ్బలను తిన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణాన్ని జాతీయ జెండాగా ఎన్నడూ ఆమోదించలేదు. అది ఎల్లవేళలా కాషాయపతాకానికే వందనం చేస్తుంది.స్మృతికందని కాలం నుంచీ అది హిందూ రాజ్య పతాకంగా ఉందని చెబుతుంది.ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల గురూజీకి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య భావన పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదనే ధృడ వైఖరిని కలిగి ఉన్నారు. భారతీయ నాగరికత, ఆలోచనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదన్నారు. ఏక నాయకత్వ సూత్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్ముతుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మానసిక దృక్పధాన్ని సృష్టిస్తుందని అది పూర్తిగా క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉంటుందని అది ఏం చెబితే దాన్ని జనం అంగీకరిస్తారని గురూజీ కూడా స్వయంగా చెప్పారు. ఈ సంస్థ ఏక వ్యక్తి నాయకత్వ సూత్రం మీదనే పనిచేస్తుంది. సోషలిజం గురూజీ దృష్టిలో పూర్తిగా వెలుపలి భావజాలం, సోషలిజం, ప్రజాస్వామ్యంతో పాటు అన్ని ఇజాలూ విదేశీ ఆలోచనలే, వాటిని తిరస్కరించాలని, భారతీయ సమాజాన్ని భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించాలని అతను పదే పదే చెప్పారు. మా గురించి చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,సోషలిజం పట్ల మాకు విశ్వాసం ఉంది. శాంతియుత పద్దతుల్లో గాంధియన్‌ సూత్రాలకు అనుగుణంగా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు ఒక ప్రత్యేక మూసలో యువ మెదళ్లను తయారు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక నైపుణ్యాన్ని సంతరించుకుంది. తొలుత అది పిల్లలు, యువత మెదళ్లలోకి ఏమీ ప్రవేశించకుండా ఘనీభవింపచేస్తుంది. ఆ తరువాత వారు ఇతర భావజాలాలకు స్పందించలేని అశక్తులుగా మారిపోతారు.


పేదల పట్ల కనికరం అవసరం లేదని గురూజీ భావించారు. తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గ్రంధంలో దేశంలో జమిందారీ వ్యవస్థ రద్దు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు, తీవ్రంగా కలత చెందారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని రుద్దినపుడు వీరితో(ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనసంఫ్‌ు) మేము ఒక కూటమి కట్టామన్నది ఒక వాస్తవం. ఒక పార్టీగా ప్రతిపక్షాలు ఐక్యంగాకపోతే ఇందిరా గాంధీని ఓడించలేమని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నమ్మారు.చౌదరి చరణ్‌ సింగ్‌ కూడా అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు గనుక మేము ఒకే పార్టీగా ఐక్యమయ్యాము. మేము జైల్లో ఉండగా ఒక పార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం గురించి అబిప్రాయాలు చెప్పమని మమ్మల్ని అడిగారు. మనం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక సందేశాన్ని పంపిన అంశాన్ని గుర్తు చేసుకున్నాను. కోట్లాది మంది జనం ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలు ఒక క్రియాశీల క్రమం. ఎన్నికల వాతావరణం పెరిగే కొద్దీ అత్యవసర పరిస్థితి సంకెళ్లు తెగుతాయి,జనం తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటారు. అందువలన మనం ఎన్నికల్లో పాల్గొనాలని నేను గట్టిగా చెప్పాను. ఒకే పార్టీ పతాకం కిందకు అందరూ రాకపోతే విజయం సాధించలేమని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఇతర నేతల వైఖరి ఉన్న కారణంగా సోషలిస్టులంగా మా అంగీకారం తెలిపాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పదలచాను. రాజకీయ పార్టీలు-జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌(ఓ), భారతీయ లోక్‌దళ్‌(బిఎల్‌డి), కాంగ్రెస్‌ ముఠాలలోని కొన్ని అసంతృప్త తరగతుల మధ్య మాత్రమే అవగాహన కుదిరింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి ఏర్పాటుకు మేము రాలేదు, దాని డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. ఇంకా చెప్పాల్సిందేమంటే జైల్లో ఉన్న మా మధ్య పంపిణీ అయిన మనూభారు పటేల్‌ లేఖ ద్వారా 1976 జూలై 7న మేము తెలుసుకున్నదేమంటే కొత్త పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా పార్టీ సభ్యులైతే ద్వంద్వ సభ్యత్వ వివాదం తలెత్తవచ్చని చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక సమస్యను లేవనెత్తారు. దీని మీద అప్పుడు జనసంఫ్‌ు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓమ్‌ ప్రకాష్‌ త్యాగి స్పందిస్తూ కొత్త పార్టీ సభ్యత్వాన్ని ఎలా కావాలంటే అలా రూపొందిచుకోవచ్చని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నందున రద్దయినట్లేనని, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ సమస్య తలెత్తదని కూడా చెప్పారు.


తరువాత ప్రతిపాదిత జనతా పార్టీ నిబంధనావళిని రూపొందించేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు. జనతా పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో విబేధించే ఏ సంస్థకు చెందిన వారికీ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వకూడదని ముసాయిదా నిబంధనావళిలో పెట్టారు. దీని అర్ధం ఏమంటే ఎవరూ ఈ నిబంధనను వ్యతిరేకించకూడదన్నది స్పష్టం.అయినప్పటికీ దీనికి వచ్చిన ఒకే ఒక అభ్యంతరం జనసంఫ్‌ుకు చెందిన సుందర్‌ సింగ్‌ భండారీ నుంచి వెలువడటం గమనించాలి. తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 1976 డిసెంబరులో ఏర్పాటు చేసిన సమావేశానికి జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున అతల్‌ బిహారీ వాజ్‌పాయి రాసిన లేఖలో ప్రతిపాదిత పార్టీలో ఒక తరగతి నేతలు జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సమస్యను లేవనెత్తకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే అనేక మంది నేతలు అలాంటి హామీ ఇవ్వలేదని నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విలీనం కావాలని తలపెట్టినపుడు రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు గనుక అన్నారు. నేను ఒకటి స్పష్టం చేయదలచాను. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒక వేళ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండి ఉంటే దానిలో నాకు భాగస్వామ్యం లేదు.


నేను ఒకటి విస్పష్టంగా చెప్పగలను. జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ రీత్యా చూసినా ఆర్‌ఎస్‌ఎస్‌ అంశాలను ప్రతిబింబించలేదు. వాస్తవానికి ప్రణాళికలోని ప్రతి అంశమూ స్పష్టంగా ఉంది. లౌకిక, ప్రజాస్వామిక, గాంధియన్‌ సూత్రాల ప్రాతిపదికగా సోషలిస్టు సమాజం గురించి జనతా పార్టీ ప్రణాళిక ఉంది.దానిలో హిందూ దేశం గురించిన ప్రస్తావన లేదు.మైనారిటీలకు సమానహక్కులకు హామీ ఇవ్వటమే కాదు, వారి హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్పింది. కుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందా ? ఇతరుల సేవకు శూద్రులు తమ జీవితాలను అర్పించాలని చెప్పిందా ? దానికి విరుద్దంగా వెనుకబడిన తరగతుల పురోగమనానికి వాగ్దానం చేయటమే కాదు పూర్తి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, వారికోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని పేర్కొన్నది. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 25-33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. గురూజీ కేంద్రీకరణ జరపాలని గట్టిగా చెప్పగా వికేంద్రీకరిస్తామని జనతా పార్టీ అంగీకరించింది. రాష్ట్రాలను రద్దు చేయాలని, అసెంబ్లీలను, మంత్రివర్గాలను కూడా రద్దు చేయాలని అతను కోరగా మరింత వికేంద్రీకరణ జరగాలని జనతా పార్టీ నొక్కివక్కాణించింది. మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లాక్కోవాలన్న వాంఛ జనతా పార్టీకి లేదు.


పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను స్వచ్చందంగా అంగీకరించలేదన్నది నిజం. ఇది నా అభ్యంతరం, అంతే కాదు రాతపూర్వకంగా ఒకసారి కుష్‌భాహు థాకరేకు ఫిర్యాదు చేశాను. చర్చల సందర్భంగా మీవారు(ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు) వెంటనే అంగీకరించినా హృదయపూర్వకంగా పూర్తిగా వ్యతిరేకించారని నేను చెప్పాను. అందుకే మీ ఉద్దేశ్యాలను అనుమానించాల్సి వస్తోంది.ఈ లేఖను నేను ఎంతో కాలం క్రితమే రాశాను, ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నాకు ఎప్పుడూ సందేహమే.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్న లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ వాంఛ, ఎలాంటి రాజీలు లేకుండా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉండటం వలన మన ఐక్యతకు నేను ఆమోదం తెలిపాను. అదే సమయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ప్రారంభం నుంచి నాకు ఒక స్పష్టత ఉంది ఐక్య, విశ్వసనీయమైన జనతా పార్టీ ఆవిర్భవించాలంటే రెండు పనులు చేయాల్సి ఉంటుందని నా మనసులో ఉంది. ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని మార్చుకోవాలి మరియు లౌకిక,ప్రజాస్వామిక రాజ్య భావనను అంగీకరించాలి.రెండవది, సంఘపరివార్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలు భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, విద్యార్ధి పరిషత్‌ వంటివి తమను తాము రద్దు చేసుకొని లౌకిక భావజాలం ఉన్న కార్మిక సంఘాల్లో, జనతా పార్టీ విద్యార్థి విభాగంలో విలీనం కావాలి. జనతా పార్టీ కార్మిక విభాగం, విద్యార్థి విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించమని పార్టీ నాకు విధి అప్పగించిన నాటి నుంచీ నేను దీని గురించి స్పష్టతతో ఉన్నాను. ఈ రెండు సంస్థలూ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. హిందువులను మాత్రమే సంఘటితపరచాలనే మీ భావజాలాన్ని వదలి వేసుకోవాలని, మీ సంస్థలో అన్ని మతాల వారికీ చోటు కల్పించాలని,జనతా పార్టీలో ఉన్న భిన్నమైన తరగతుల ప్రాతిపదికన ఉన్న సంస్థలలో విలీనం కావాలని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు చెప్పాను. అది వెంటనే జరిగేది కాదని, అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొద్ది కొద్దిగా మారాలని కోరుకుంటున్నట్లు వారి స్పందన ఉంది. వారు అలా తప్పించుకొనే జవాబులను కొనసాగించారు.


వారి ప్రవర్తన చూసిన తరువాత వారిలో మార్పు ఉద్దేశ్యం లేదన్న నిర్దారణకు వచ్చాను.ప్రత్యేకించి 1977జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వారు నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాగలిగారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ప్రతిష్టతో మారాల్సిన అవసరం లేదని వారు ఆలోచించటం ప్రారంభించారు.ఇప్పటికే వారు నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నారు. క్రమంగా ఇతర రాష్ట్రాలను, చివరకు కేంద్రాన్ని కూడా పట్టుకొనేందుకు చూస్తారు. జనతా పార్టీలోని ఇతర రాజకీయ నేతలు పెద్ద వారు, వారు ఎంతో కాలం జీవించలేరు. పార్టీలో ఉన్న ఉన్నత స్థానాలకు ఎదిగేట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘేతర నేతలను చేయలేరు. అయినప్పటికీ నేను ప్రయత్నించాను. ఒక సందర్భంగా అన్ని కార్మిక సంఘాలనేతల సమావేశం ఏర్పాటు చేశాను. జనతా పార్టీలోని అన్ని పక్షాల ప్రతినిధులు వచ్చారు, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు సమావేశాన్ని బహిష్కరించింది. అంతే కాదు ఎలాంటి కారణం లేకుండానే వారు నన్ను దూషించారు. విద్యార్థి పరిషత్‌, యువమోర్చాలతో అలాంటి ప్రయత్నమే జరిగింది. విలీనం కోసం జరిగిన అన్ని ప్రయత్నాలకూ వారు దూరంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ మీద పెత్తనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాంఛ కారణంగానే. ప్రజల ప్రతి జీవనరంగంలోకి ప్రవేశించాలన్నది వారి లక్ష్యం, అంతేకాదు దాన్ని అదుపు చేయాలన్నది కూడా. ఇలాంటి అభిప్రాయాలను గురూజీ తన ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ అనే గ్రంధంలో పదే పదే వక్కాణించారు. నిరంకుశ సంస్థ ఏదీ స్వేచ్చను అనుమతించదు. దాని వేర్లు కళలు, సంగీతం, ఆర్థికం, సాంస్కృతిక రంగం ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఫాసిస్టు సంస్థ సారం ఇదే. వీరు అరుదైన సందర్భాలలో చేసేదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. గురూజీ బాటలో ఆలోచనలను వదలి వేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ చెప్పలేదు. జైళ్లలో ఉన్నపుడు వీరు క్షమాభిక్ష కోసం ప్రార్ధించారు. రాజనారాయణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇందిరా గాంధీకి అనుకూలంగా వచ్చినపుడు బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆమెను అభినందించారు. అందువలన వీరి ఉద్ఘాటనల మీద నాకు నమ్మకం లేదు. నేను వీరిని (జనతా పార్టీలో పూర్వపు జనసంఫ్‌ు నేతలు) ఎప్పుడు నమ్ముతానంటే పార్టీ, కార్యవర్గ కమిటీల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను బహిష్కరించినపుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల మీద ఆంక్షలు విధించినపుడు, ప్రత్యేకించి నానాజీ దేశముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారీ వారి అనుచరులను బహిష్కరించినపుడే నమ్ముతాను.


గమనిక : మధు లిమాయే(1922 -1995 ) పూనాలో జన్మించారు. కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ నేతగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వంపై వివాదం కారణంగా జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘనేతలు వేరు పడి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చింది తప్ప మౌలిక స్వభావం, లక్ష్యాలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు దశాబ్దాల నాడు (1979) రాసిన ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు నేటికీ సంగతమైనవేే గనుక జనతా వార పత్రిక నుంచి సేకరించి అనువదించి అందించాను, : ఎం కోటేశ్వరరావు

నరంలేని నాలుకల సుభాషితాల రచ్చ మామూలుగా లేదు : నరేంద్రమోడీని తప్పించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ రంగం సిద్దం ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నేతిబీరలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు – పాకిస్తాన్‌, మమకారంలో కారం ! ఇలాంటివి పిల్లల ఆటల్లో చూస్తాం. నరేంద్రమోడీ ఆకర్షణ కూడా అలాంటిదే అని సంఘపరివారం భావిస్తోందా ? వాజ్‌పాయి, అద్వానీలనే పక్కన పెట్టిన వారికి మోడీ ఒక లెక్కా ? ఒక ప్రకటన చేయటం, దాని మీద స్పందన చూసి సానుకూలంగా ఉంటే కొనసాగింపు లేకుంటే వెంటనే మాట మార్చటం తెలిసిందే. మోడీ కూడా పరివారంలో ఇతరుల మాదిరే తప్ప ప్రత్యేకతేమీ లేదనే సందేశాన్ని లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన ఉపన్యాసంలో వెల్లడించారు. ఈ సందర్భంగా దానితో పాటు కలగలిపి చెప్పిన సుభాషితాల్లో విశ్వసనీయత,చిత్తశుద్ధి, నిజాయితీ గురించి అనేక మంది ప్రశ్నిస్తున్నారు.రచ్చ కూడా మొదలైంది. మోడీ ఎలా స్పందిస్తారో, తన మద్దతుదార్లను ఎలా సమీకరిస్తారో చూడాల్సి ఉంది. గందరగోళం సృష్టించటానికి తమ నేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు చెప్పినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. సంఫ్‌ు-బిజెపి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, భగవత్‌ వ్యాఖ్యలను అసందర్భంగా పేర్కొన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. 2014,2019 ఎన్నికల తరువాత చేసిన ఉపన్యాసాలకు, తాజా ఎన్నికల తరువాత చేసిన దానికి పెద్దగా తేడాలేదని. నరేంద్రమోడీ లేదా ఏ బిజెపి నేతను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకుంది.తమ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం తప్ప సంస్థ అధికారిక వైఖరికి ప్రతిబింబం కాదన్నది.


నిజమైన సంఘసేవకులు పొగరుబోతులుగా ఉండరని మోహన్‌ భగవత్‌ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌ శిక్షణా సమావేశంలో సెలవిచ్చారు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే మోడీనే అని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు. మోడీని హెచ్చరించే ధైర్యం పరివార్‌కు ఉందా, తమకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు అవసరం లేదని చెప్పిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను ఉద్దేశించి అని కొందరన్నారు. తన జన్మ మామూలుది కాదని, దైవాంశ సంభూతుడనని నరేంద్రమోడీ చెప్పుకున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి చప్పుడు చేయలేదు. 2018 నుంచి ఎన్‌డిఏ కూటమి కన్వీనర్‌ లేరు, సమావేశాలు జరిపింది లేదు, మిత్రపక్షాలను ముఖ్యమైన అంశాల మీద సంప్రదించిన దాఖలాలు లేవు. అహంకారం, ఏకపక్ష ధోరణే. రైతుల ఆందోళన పట్ల అనుసరించిన వైఖరిని చెప్పనవసరం లేదు. చివరికి అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి పెద్దలతో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి దానితో ఒక్క సమావేశం జరపకపోయినా, రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ రావద్దని చెప్పినపుడు గానీ ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు, సుద్దులు-బుద్దులు చెప్పలేదు. పదేండ్ల పాలన తరువాత సంపూర్ణ మెజారిటీ రాకపోవటం, అయోధ్య రామాలయం ఉన్న చోట బిజెపి మట్టికరవటం, మణిపూర్‌లో పరాభవం వంటి పరిణామాల తరువాత మోడీని కాపాడేందుకే భగవత్‌ రంగంలోకి దిగారనే అభిప్రాయం కూడా ఉంది. గతంలో కూడా అలాగే జరిగిందని కొందరు గుర్తు చేస్తున్నారు. కాదు తమ హిందూత్వ అజెండాకు మొదటికే మోసం వచ్చినందున మోడీని మందలించటం, తరువాత తప్పించేందుకు ముందుగానే పావులు కదిపారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.


రెండు నాలుకలతో మాట్లాడటం, ఆ జేబులో ఒక స్టేట్‌మెంటు ఈ జేబులో మరో స్టేట్‌మెంటు పెట్టుకొని తిరిగే వారిలో సంఘపరివార్‌ దళం కూడా ఉంది. ఉదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ మాట్లాడుతూ అహంకారం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సీట్లను భగవంతుడు రాముడు 241 సీట్ల దగ్గరనే నిలిపివేసినట్లు, సంపూర్ణ మెజారిటీకి దూరంగా పెట్టినట్లు ధ్వజమెత్తారు. జైపూర్‌ సమీపంలోని కనోటా వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో జూన్‌ 13వ తేదీన మాట్లాడుతూ రామభక్తులు క్రమంగా అహంకారులుగా మారారు. ఆ కారణంగానే రాముడు ఆ పార్టీని అతిపెద్దపార్టీగా 241 సీట్ల వద్ద నిలిపాడని అన్నారు. ఇదంతా మోహన భగవత్‌ వ్యాఖ్యల తరువాతే జరిగింది. ఇంద్రేష్‌ కుమార్‌ వ్యాఖ్యలపై బిజెపి నుంచి నిరసన వెల్లడికావటంతో నష్టనివారణ చర్యగా ఆ సేవక్‌ మాటమార్చారు. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారానికి దూరంగా ఉన్నారు. అనుసరించిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మరుసటి రోజు చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రి పగలు పనిచేస్తుందని,దేశం ఎంతో పురోగతి సాధిస్తుందన్న నమ్మకంతో జనం ఉన్నారని ఆకాశానికి ఎత్తారు.మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై తలెత్తిన రచ్చ గురించి ప్రశ్నించగా దాని గురించి సంఫ్‌ు అధికారిక ప్రతినిధులను అడిగితే మంచిదని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.
మోహన్‌ భగవత్‌ చెప్పిన హితవులో మణిపూర్‌ హింసాకాండ అంశం కూడా ఉంది. ” ఈ ఈశాన్య రాష్ట్రంలో చూస్తుంటే ఎట్టకేలకు తుపాకి సంస్కృతి అంతమైనట్లుగా కనిపించింది, అయినప్పటికీ ”ఆకస్మికంగా” హింసాకాండ చెలరేగింది. ఎలాంటి ఆలశ్యం లేకుండా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది ” అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.” గత పది సంవత్సరాల్లో మణిపూర్‌లో హింసాకాండ లేదు. కానీ పరిస్థితి దిగజారింది.శాంతియుత పరిస్థితి కోసం గత ఏడాదిగా ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.” అన్నారు. మణిపూర్‌, కేంద్రంలోనూ రెండు చోట్లా స్వయం సేవకులే పాలకులుగా ఉన్నారు. హింసాకాండ చెలరేగి వందలాది మంది మరణించారు, వేలాది మంది నెలవులు తప్పారు. గిరిజన మహిళలను వివస్త్రలుగా ఊరేగించిన ఉదంతం వెలుగుచూడకుండా చేసేందుకు అదే సేవకులు పాటుపడ్డారు. అది బయటకు వచ్చిం తరువాత అక్కడకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పిరావాల్సిన కేంద్ర సేవక్‌ కదలేదు, మెదల్లేదు. ఇదేం పని అంటూ ప్రధాన సేవక్‌ ప్రశ్నించిన దాఖల్లాలేవు.చెంపదెబ్బ మాదిరి లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో బిజెపి ఓడిపోయిన తరువాత మోహన్‌ భగవత్‌ సుభాషితాలకు పూనుకున్నారు. అక్కడ హిందువులైన మెయితీలు, క్రైస్తవులైన గిరిజన కుకీలు బిజెపిని మట్టికరిపించారు. రెండింజన్లు పనికిరానివిగా తేల్చారు. గుజరాత్‌ మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని చెప్పిన అతల్‌ బిహారీ వాజ్‌పేయి మాటలనే పూచికపుల్లగా తీసిపారేసిన, మార్గదర్శక మండల్‌ పేరుతో సీనియర్ల కమిటీ అంటూ వేసి దాన్ని విస్మరించిన మోడీ గురించి జనానికి తెలిసినా మోహన్‌ భగవత్‌కు తెలియదంటే నమ్మలేము. స్వయం సేవకుల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు అని చెప్పారు.


మణిపూర్‌ గురించి మోహన్‌ భగవత్‌ స్పందించటం ఇదే తొలిసారి కాదు. అక్కడ ఉన్న సామాజిక తరగతులైన మెయితీ-కుకీల మధ్య దీర్ఘకాలంగా ఉన్న పరస్పర అనుమానాలు, విబేధాల పూర్వరంగంలో బిజెపి మత అజండాతో మెయితీలను దగ్గరకు తీసి అధికారాన్ని పొందింది.హిందువుల సంతుష్టీకరణ, ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపింది. మెయితీలను కూడా గిరిజనులుగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్లను వర్తింప చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు సిఫార్సు చేసింది. దానికి నిరసన తెలిపిన గిరిజనులను అణచివేసేందుకు పూనుకోవటంతో హింసాకాండ తలెత్తింది.దారుణాలు చోటు చేసుకున్నాయి.ఈ వాస్తవాన్ని మూసిపెట్టేందుకు హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ గతేడాది అక్టోబరు 24న విజయదశమి సందేశంలో మోహన్‌ భగవత్‌ బిజెపి పాటను పాడారు. 2023 మే నెల మూడవ తేదీ నుంచి హింసాకాండ జరుగుతుంటే అక్టోబరు వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు. విదేశీ హస్తమే వాస్తవం అనుకుంటే విదేశీ సరిహద్దులు ఉన్న ఆ రాష్ట్రంలో స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు సదరు హస్తాన్ని ఖండించకుండా, కట్టడి చేయకుండా ఏ గుడ్డిగుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? అప్పటి వరకు మాట్లాడని మాదక ద్రవ్యాల ఉగ్రవాదం, అక్రమంగా ప్రవేశించిన కుకీలు అంటూ కొత్త కతలను చెప్పారు. ఒక మాదక ద్రవ్య మాఫియా నేత (కుకీ) పట్ల నిదానంగా వ్యవహరించాలని ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌(మెయితీ) హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఒక పోలీసు అధికారి చెప్పిన మాటలను మరచిపోరాదు.మెయితీ-కుకీల మధ్య సంబంధాలకు ఎవరో మతం రంగు పులిమేందుకు చూశారని కూడా విజయదశమి ఉపన్యాసంలో భగవత్‌ ఆరోపించటం దొంగేదొంగని అరిచినట్లుగా ఉంది. అందువలన మణిపూర్‌ సమస్యను పట్టించుకోవాలని ఇప్పుడు మోహన్‌ భగవత్‌ చెప్పటంలో చిత్తశుద్ది ఉందా ? మణిపూర్‌ను సందర్శించటానికి నరేంద్రమోడీకి తీరిక దొరకలేదు, వెళ్లి సమీక్ష జరపాలని చెప్పటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆలోచన తట్టలేదంటే నమ్మే అమాయకులు కాదు జనం.


ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి పెద్దల దిగజారుడు ప్రసంగాల తీరు తెలిసిందే. దాన్ని తక్కువ చేసి చూపేందుకు అందరూ అలాగే నోరుపారవేసుకున్నారంటూ భగవత్‌ మాట్లాడారు. నిజమైన ” సేవక్‌ ” ఎల్లవేళలా గౌరవం, వినయాన్ని ప్రదర్శించాలన్నారు. మోడీ ఎన్నికల ప్రసంగాల్లో అలాంటివి మచ్చుకైనా కనిపించాయా ? అడుగడుగునా అహంకార ప్రదర్శన, అబద్దాలు, వక్రీకరణలు, స్వంతడబ్బా, ప్రతిపక్షాలపై వ్యంగ్యాలు తప్ప ఒక ప్రధాని స్థాయిలో మాట్లాడింది లేదు. మోడీ గ్యారంటీలంటూ పెద్ద ఎత్తున వ్యక్తిపూజకు తెరలేపారు. దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మేథావులు అంగీకరించబట్టే కొనసాగింది. తీరా ఎదురుతన్నిన తరువాత ఇప్పుడు దానికి బాధ్యత తమది కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు.తమకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అవసరం లేదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వ్యాఖ్య యధాలాపంగా చేసిందనుకుంటే పొరపాటు.రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత నరేంద్రమోడీ చుట్టూ ఉన్నవారిలో అంతర్లీనంగా పెరుగుతున్న అభిప్రాయమే ఇది. సంఘపరివార్‌కు బదులు మోడీ పరివారాన్ని రూపొందించే క్రమంలో వ్యక్తిపూజను ముందుకు తెచ్చారు. గతంలో చౌకీదార్‌ అన్నట్లుగానే కేంద్ర మంత్రులతో సహా అందరూ మోడీకాపరివార్‌ అని తమ సామాజిక మాధ్యమాల్లో పేర్లకు తగిలించుకున్నారు. భజనబృందంలో చేరారు. ప్రతి విజయం వెనుక ఉన్నది మోడీ మాత్రమే అని చెప్పటమే కాదు, తాజా ఎన్నికల్లో మోడీ హామీల పేరుతో జనాన్ని ఊదరగొట్టటం దాని కొనసాగింపే. దీనికి గోడీ మీడియా ఎంతగానో సహకరించింది. తాను మామూలుగా జన్మించలేదని మోడీ చెప్పుకోవటం దానికి పరాకాష్ట. దీన్ని సంఘసేవక్‌లు కొందరు జీర్ణించుకోలేదని, వారిని సంతుష్టీకరించేందుకు మోడీ కూడా సంఘసేవకుల్లో ఒకరే అన్న సందేశమిస్తూ మోహన్‌ భగవత్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మాదిరి మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా సంఘసేకుడే, దాని తిరోగామి భావజాల ప్రతినిధే అన్నది నిస్సందేహం. అయితే మోడీ మాదిరి దిగజారిన ప్రసంగాలు చేయలేదు.అద్వానీ మాదిరి కరడుగట్టిన హిందూత్వవాదిగా బయటకు కనిపించేందుకు చూడలేదు.


ప్రపంచంలో అనేక తిరోగామి, ఫాసిస్టు, నాజీ లక్షణాల సంస్థల వంటిదే ఆర్‌ఎస్‌ఎస్‌. అది మత తీవ్రవాద పులిని ఎక్కింది. దాని మీద నుంచి దిగితే మింగివేస్తుంది, ప్రాణాలు నిలుపుకోవాలంటేే స్వారీ చేయాల్సిందే. దేశం, సమాజం మీద పట్టు సాధించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక మందిని జనసంఘం, బిజెపి వంటి రాజకీయ పార్టీ, మత సంస్థల రూపంలో మరికొందరిని ముందుకు తెచ్చింది. ఉపయోగించుకోవటం, పనికిరారు,అజెండాను అమలు జరపలేరు అనుకుంటే పక్కన పెట్టేయటం అనేక మందిని చూశాము. అద్వానీ, వాజ్‌పాయిలను కూడా అది సహించలేదు.నరేంద్రమోడీని కూడా ఉపయోగపడినంత వరకు పల్లెత్తుమాట అనలేదు, మద్దతు ఇచ్చింది, తన అజెండాను అమలు చేయించింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో అది వికటించిన తీరు గమనించిన తరువాత మరో బొమ్మను తెచ్చేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. తన అజెండాను ముందుకు తీసుకుపోయే సాధనంగా పనికి వస్తారా లేదా అన్నదే దానికి గీటురాయి. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో ఓడిపోవటం, వారణాసిలో గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే గణనీయంగా తగ్గటంతో నరేంద్రమోడీ బలహీనత ఏమిటో వెల్లడైంది. ఇంకేమాత్రం తమ అజెండాను ముందుకు తీసుకుపోయే అవకాశం లేదన్న సంశయం మొదలై ఉండాలి. నరేంద్రమోడీని ఒకందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెస్తే మరొకందుకు కార్పొరేట్‌ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. అందువలన మోడీని సేవక్‌ల గుంపులో ఒకరిగా ఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తే పప్పులో కాలేసినట్లే. సంఘపరివారం మెచ్చిన నేతలు ఉండవచ్చు తప్ప కార్పొరేట్లకు నచ్చిన వ్యక్తిని వెంటనే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయటం అంత తేలికకాదు. ఇది సంఫ్‌ు బలహీనత. ఈ పూర్వరంగంలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు టీకప్పులో తుపానులా సమసిపోతాయా ? 75సంవత్సరాల వయస్సు వచ్చిన వారు పదవుల నుంచి తప్పుకోవాలనే పేరుతో 73 సంవత్సరాల మోడీని కొన్ని రాష్ట్రాల ఎన్నికల తరువాత 2026లో గౌరవంగా సాగనంపుతారా ? దానికి కార్పొరేట్లు అంగీకరిస్తాయా ? చూద్దాం !

ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు : చంద్రబాబు పట్టాభిషేకం – తమిళశైకి అమిత్‌ షా అక్షింతలు ! కెసిఆర్‌ కూడా ఇలా అవమానించలేదు !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అక్కటా ఏమిటీ విధి వైపరీత్యం ! చంద్రబాబు పట్టాభిషేకానికి నేను వెళ్లటం ఏమిటి ? వెళితినిపో.. ఏదో ఒక మూలన కూర్చోకుండా అమిత్‌ షా అన్నను మర్యాదగా పలకరించాలనుకోవటం ఏమిటి ? అనుకుంటిని పో… నా నమస్కారానికి తిరస్కారంగా నన్ను చీవాట్లు పెట్టటం ఏమిటి ? అన్నగనుక దాన్లో తప్పులేదు ! పక్కనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇంకా పార్టీ పెద్దలు, ఇతరులు అనేక మంది చూస్తుండగానే బహిరంగవేదిక మీద అలా చేయవచ్చా ? అయినా అంత తప్పు నేనేం చేశాను ? పోనీ నా అపరాధం ఏదైనా ఉంటే నాలుగ్గోడల మధ్య చివాట్లు వేయవచ్చు. ఇలా బహిరంగవేదిక మీద, టీవీల ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని తెలిసి కూడా అమిత్‌ అన్నకు అంత ఆగ్రహం రావటం ఏమిటి ? నన్ను అవమానించటం ఏమిటి, తెలంగాణా గవర్నర్‌గా ఉండగా కెసిఆర్‌ చేసిన అవమానం దీనితో పోలిస్తే చాలా చిన్నది. అమిత్‌ అన్న చేసింది భరించలేనిదిగా ఉంది. బేటీ బచావో అంటూ మోడీ ఇచ్చిన నినాదాన్ని అమిత్‌ అన్న విస్మరించి ఇలా అవమానించటం ఏమిటి ? ఉన్న గవర్నర్‌ ఉద్యోగం వదులుకొని కేంద్ర మంత్రి పదవి మీద ఆశతో బరిలో దిగి అటు ఎన్నికల్లో ఓడి ఇటు అమిత్‌ అన్నతో చివాట్లు తిన్న తరువాత నేను రాష్ట్రంలో తలెత్తుకోగలనా ? కింకర్తవ్యం ఏమిటి ? ఇలా పరిపరి విధాలుగా తెలంగాణా మాజీ గవర్నర్‌, తమిళనాడు బిజెపి నేత తమిళశై సౌందర్‌రాజన్‌ మధనపడుతూ ఉండి ఉండాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తుండగా జరిగిన ఉదంతాన్ని ఎవరైనా జీర్ణించుకోవటం కష్టం.


2024జూన్‌ 12న బుధవారం నాడు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణోత్సవానికి హాజరైన అనేక మంది బిజెపి ప్రముఖులలో తమిళశై ఒకరు. వేదిక మీద ఆసీనుడైన అమిత్‌ షా, పక్కనే ఉన్న వెంకయ్య నాయుడికి ఆమె నమస్కారం చేయగానే అమిత్‌ షా ముఖకవళికలు మారిపోయాయి, అభివాదం చేసి వెళుతున్న ఆమెను వెనక్కు పిలిచి వేలు చూపుతూ తీవ్రంగా హెచ్చరిక లేదా మందలించినట్లు కనిపించింది.ఆమె ఏదో వివరణ ఇవ్వబోగా అదేమీ కుదరదన్నట్లు కనిపించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది. ఏం మాట్లాడింది పక్కనున్న వెంకయ్యనాయుడు,ఇతర బిజెపినేతలు నోరువిప్పితేనే వాస్తవం తెలుస్తుంది.ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారమైంది. మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరించాయి. తమిళనాడు బిజెపిలో ఉన్న కుమ్ములాటల గురించే అమిత్‌ షా మందలించినట్లు పేర్కొన్నాయి. మీడియా వ్యాఖ్యానాలను పక్కన పెడదాం. ” తమిళశై అక్కను అమిత్‌షా గారు తీవ్రంగా మందలించినట్లు దానిలో కనిపిస్తున్నది.అయితే బహిరంగంగా చేసిన ఈ ”హెచ్చరిక”కు కారణం ఏదై ఉండవచ్చు ? అవాంఛనీయ బహిరంగ వ్యాఖ్యలా ? ” అని ఏకంగా తమిళనాడు బిజెపి ఐటి విభాగపు ఉపాధ్యక్షుడు కార్తిక్‌ గోపీనాధ్‌ ఎక్స్‌లో స్పందించారు. ఎక్కడ జనాలు సదరు వీడియోను చూడలేదో అని దాన్ని కూడా జతచేశారు.


తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత అన్నామలై అద్భుతాలు సృష్టించబోతున్నారు, తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాయబోతున్నారన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఏ పార్టీతో పొత్తు లేకుండా డిఎంకె నాయకత్వంలోని కూటమిని మట్టికరిపిస్తారని చెప్పారు. అది జరగకపోగా ఇప్పుడు పార్టీ ఖాతా తెరవకపోవటానికి కారణం నువ్వంటే నువ్వన్నట్లు అన్నామలై-తమిళశై వర్గాలు కుమ్ములాటలకు దిగాయి. ఎన్నికల ఓటమి గురించి ఒక యూట్యూబ్‌ ఛానలతో తమిళశై మాట్లాడుతూ చీలికలు లేని అన్నా డిఎంకెతో సర్దుబాటు చేసుకొని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని చేసిన వ్యాఖ్య బిజెపిలో విబేధాలకు కారణమైంది. పార్టీ అధ్యక్షుడు అన్నామలై దీనికి వ్యతిరేకమైన వైఖరితో ఉన్నారు. అన్నామలై కారణంగానే అన్నాడిఎంకెతో బిజెపి మైత్రి చెడిందని, దాంతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని పార్టీలో కొందరు మండిపడుతున్నారు. అన్నాడిఎంకె మాజీ మంత్రి ఎస్‌పి వేలుమణి మాట్లాడుతూ తమ పార్టీలో చీలికకు అన్నామలై పూర్తి కారకుడని విమర్శించారు. రెండు పార్టీలు పొత్తుపెట్టుకొని ఉంటే తమ కూటమి 35 సీట్లు గెలిచి ఉండేదన్న అతని అభిప్రాయాన్ని తమిళశై బలపరచటంతో రెండు వర్గాల మధ్య దూరం పెరిగింది. ఒక్క సీటుకూడా తెచ్చుకోని పార్టీ నేత చెప్పిన మాటలను ఎలా సమర్ధిస్తారంటూ అన్నామలై ధ్వజమెత్తారు. పన్నెండు స్థానాల్లో అన్నాడిఎంకెను మూడవ స్థానంలోకి నెట్టామని ఇది బిజెపి సాధించిన విజయమని అన్నామలై సమర్ధించుకున్నారు. గతంలో తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నపుడు ఒక ప్రమాణం పెట్టుకున్నానని, సంఘవ్యతిరేక శక్తులను ప్రోత్సహించలేదని, కానీ ఇటీవల అలాంటి వారిని పార్టీలోకి తీసుకున్నారని. అన్నామలై మంచినేత అనటంలో తనకెలాంటి సందేహం లేదని, మనమంతా అనేక రకాల నేతలమని, భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటామని తమిళశై పరోక్షంగా అన్నామలై మీద ధ్వజమెత్తారు. అయితే దీని మీద మాజీనేత తిరుచ్చి సూర్య శివ స్పందిస్తూ ఆమె పార్టీ నేతగా ఉండగా రాష్ట్రంలో పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాలేదని విమర్శించారు. దీంతో సామాజిక మాధ్యమంలో ఇద్దరి అభిమానులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కుమ్ములాటలు బహిరంగమై పార్టీ పరువుతీశాయి.


ఓటర్లలో మాజీ హీరోయిన్‌ కుష్‌బూకు ఉన్న ఆకర్షణను ఎన్నికల్లో ఉపయోగించుకొని ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని బాలీవుడ్‌ దర్శకుడు, బిజెపి అభిమాని ఆనంద కుమార్‌ చెప్పారు. అన్నామలై గనుక కుష్‌బూను ప్రచారంలోకి దించి ఉంటే తమిళనాడులో ఫలితాలు వేరుగా ఉండేవన్నారు. తమిళనాడు బిజెపిలో సమన్వయం లేదు, రాజకీయాల్లో ఒకే ఒక్కడు ప్రత్యేకించి రాజకీయాలకు కొత్తగా వచ్చిన అన్నామలై పోరాడలేరు. ఓట్ల శాతం పెరిగి ఉండవచ్చు తప్ప ఒక్క సీటూ రాలేదన్నారు. ఎంతగానో ఆకర్షణ ఉన్న కుష్‌బూను బిజెపి ఎందుకు వినియోగించుకోలేదో, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, జెపి నడ్డా వచ్చిన సభలకు ఎందుకు ఆహ్వానించలేదో ఆశ్చర్యంగా ఉందన్నారు.


అసలే సంపూర్ణ మెజారిటీకి పార్టీ దూరమై కారణాలను బహిరంగంగా చెప్పుకోలేని స్థితిలో పడితే ఒక్క సీటు కూడా రాని చోట ఈ రచ్చేమిటని కేంద్ర నాయకత్వం తలలు పట్టుకుంది. ఈ పూర్వరంగంలో అమిత్‌ షా బహిరంగ మందలింపు ఉదంతం చోటు చేసుకుంది.అన్నామలై కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బిజెపి మేథావుల విభాగపునేత కల్యాణ రామన్‌ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో పార్టీకి ఒక అంకెలో వచ్చిన ఓట్లు ఇప్పుడు రెండంకెల శాతానికి పెరిగాయని చెప్పటం తప్పుదారి పట్టించటమే అన్నారు.2019లో తొమ్మిది సీట్లలో పోటీ చేసినపుడు 5.56శాతం ఓట్లు వచ్చాయని తాజాగా 23చోట్ల పోటీ చేస్తే 11.24శాతం వచ్చాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే పోటీ చేసిన సీట్ల ప్రాతిపదికన ఈ సారి 14.25శాతం రావాలని రామన్‌ వాదించారు. అన్నామలైకి నైతిక విలువలు లేవని పదవికి రాజీనామా చేయాలన్నారు. అమిత్‌ షా తీరు గురించి డిఎంకె ప్రతినిధి ఎస్‌ అన్నాదురై ఎక్స్‌ ద్వారా స్పందిస్తూ ” ఇవేమి రాజకీయాలు ? తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళానేతను బహిరంగంగా మందలించటం సభ్యతేనా ? ఇది చాలా చెడు ఉదాహరణ, ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తారని అమిత్‌ షా తెలుసుకోవాలి ” అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఓటమి తరువాత తమిళనాడు బిజెపిలో ఉన్న కుమ్ములాటల గురించి దేశంలోనే పెద్దగా తెలియదు. అమిత్‌ షా ఆగ్రహ ప్రదర్శనతో అది విశ్వవ్యాప్తమైంది.

కందకు లేని దురద కత్తిపీటకెందుకు !
అమిత్‌ షా తీరుపై అటు తమిళనాడులో, ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళుల్లో నిరసన వ్యక్తమైంది. అయితే ముందే చెప్పుకున్నట్లు అక్కడి బిజెపి రెండు ముఠాల మద్దతుదార్లు తమనేతలకు అనుకూలంగా కాని వారికి ప్రతికూలంగా స్పందించారు.యాంటీ క్లైమాక్స్‌ (విలోమ పరాకాష్ట) ఏమిటంటే అవమానానికి గురైన తమిళశై అబ్బే అలాంటిదేమీ లేదు, పార్టీ కోసం పనిచేయాలనే సూచనలు ఇచ్చారంటూ గురువారం నాడు ఎక్స్‌ చేశారు.ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. ”ఎన్నికల తరువాత తొలిసారిగా ఆ వేదికపైనే అమిత్‌ షాతో మాట్లాడాను. ఎన్నికలు ముగిసినందున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయని అడిగారు. నేను వాటిని వివరిస్తుండగా సమయం లేకపోవడంతో త్వరత్వరగా మాట్లాడుతూ పార్టీకి, నియోజకవర్గం అభివద్ధికి మరింత విస్తతంగా పనిచేయాలని చెప్పారు. దీనిపై రకరకాల వదంతులు వ్యాపించడంతో ఈ వివరణ ఇస్తున్నానని ” పేర్కొన్నారు. వేదికపై ఆమెతో అమిత్‌ షా మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో లేదా ఫొటోలను చూసిన మానవ మాత్రులెవరూ ఆ పెద్ద మనిషి సూచనలు ఇచ్చినట్లుగా భావించరు. ఆమె మౌనంగా ఉన్నా అదో తీరు. వివరణ ద్వారా తన ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టారని చెప్పవచ్చు. మద్దతుగా స్పందించిన వారిని ఇరకాటంలో పెట్టారు. కేంద్రంలో ఐదేండ్లు అమిత్‌ షా అధికారంలో ఉంటారు గనుక కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ఏమీ జరగలేదని ప్రకటించారు. అయినా కందకు లేని దురద కత్తిపీటలకెందుకు అన్నట్లు అవమానంపై ఆమెకు లేని అభ్యంతరం మనకెందుకు అన్నట్లు జనాలు ఆ స్పందనను చూసిన వారు భావిస్తున్నారు.

ఐరోపా పార్లమెంటు ఎన్నికలు : పెరిగిన నాజీ, ఫాసిస్టుల ముప్పు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐరోపా యూనియన్‌లోని 27దేశాలలో జూన్‌ ఆరు నుంచి తొమ్మిదవ తేదీవరకు జరిగిన యూనియన్‌ పదవ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అందోళనకర సూచనలు వెలువడ్డాయి. అధికారికంగా ఫలితాల పూర్తి ప్రకటన వెలువడలేదు, నాలుగు దేశాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి అందిన సమాచారం, ఫలితాల తీరుతెన్నుల ప్రకారం నయా నాజీ, ఫాసిస్టు, పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకున్నాయి. ఈ పరిణామం ఐరోపా విధానాలనే తీవ్రంగా ప్రభావితం చేసేదిగా ఉంది. వివిధ దేశాలలో పాలక పార్టీలు, కూటములకు ఎదురుదెబ్బలు తగిలాయి.ఐరోపా సమాఖ్య వైఖరిలో వచ్చే మార్పులు, చేర్పుల గురించి చర్చ ప్రారంభమైంది ఐరోపా సమాఖ్యకు ఒక స్థంభం వంటి ఫ్రాన్సు మీద పిడుగులా పడి ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉన్న పార్లమెంటురద్దుకు దారితీసింది.పాలకపక్షం ఘోరంగా దెబ్బతినటంలో పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపనున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వెంటనే ప్రకటించాడు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్నా, ప్రధాని, మంత్రులు వేరే పార్టీకి చెందినవారైనా, అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉంటాయి. 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో మక్రాన్‌ పోటీ చేసేందుకు నిబంధనలు అంగీకరించవు . జర్మనీ ప్రతిపక్షం మధ్యంతర ఎన్నికలకు డిమాండ్‌ చేసింది. అధికార త్రిపక్ష సంకీర్ణ కూటమికి ఎదురు దెబ్బ తగిలినా ఎన్నికలకు వెళ్లేది లేదని ప్రకటించింది.


పార్లమెంటులోని మొత్తం 720స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ 361 సాధించిన కూటమి ఎంచుకున్న నేత ఐరోపా కమిషన్‌ అధ్యక్ష పదవిని అధిష్టిస్తారు. కమిషన్‌ విధానాలను ఐరోపా పార్లమెంటు రూపొందిస్తుంది. ప్రతి దేశానికి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో 751 స్థానాలుండగా 27 సీట్లున్న బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగినందున వాటిని ఇతర దేశాలకు కేటాయించినప్పటికీ తరువాత వాటికి ఉపఎన్నికలు జరగలేదు. తరువాత 46 స్థానాలను రద్దు చేశారు. తాజా ఎన్నికలకు ముందు ఆమోదించిన విధానం ప్రకారం 705 నుంచి 720కి స్థానాలను పెంచారు. జర్మనీలో 96,ఫ్రాన్స్‌81, ఇటలీ 76 స్థానాలతో అగ్రభాగాన ఉన్నాయి. మాల్టా, సైప్రస్‌, లక్జెంబర్గ్‌ దేశాలలో తక్కువగా ఆరేసి స్థానాల చొప్పున ఉన్నాయి. ఏ దేశానికి ఆదేశం ఎంచుకున్న పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటులో ఒక పక్షాన్ని గుర్తించాలంటే ఏడు దేశాలలో పోటీచేసి కనీసం 23 స్థానాలను తెచ్చుకోవాల్సి ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా లేని వాటిని గుర్తింపులేని పార్టీలుగా పరిగణిస్తారు.ఈ ఎన్నికల్లో కేవలం 51శాతం మాత్రమే ఓటర్లు పాల్గొన్నట్లు తొలి వార్తలు తెలిపాయి. గరిష్టంగా బెల్జియంలో 89.2, లక్జెంబర్గ్‌లో 82.3శాతం పోలు కాగా క్రోషియాలో అత్యల్పంగా కేవలం 21.3శాతమే ఓటర్లు పాల్గొని ఒక రికార్డు సృష్టించారు. కొన్ని దేశాలలో ఈ సందర్భంగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారు.


ఈ ఎన్నికలలో ప్రస్తుతం సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న ఉర్సులా వాండరె లెయన్‌ నాయకత్వంలోని యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ(ఇపిపి) 191సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. పచ్చి మితవాదులను అధికారంలోకి రాకుండా నిరోధించగలమని ఆమె చెప్పింది. మరోసారి ఆమె సమాఖ్య అధ్యక్ష స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఐరోపా రాజకీయ పరిభాషలో ఇపిపిని మధ్యేవాద మితవాద పార్టీగా పరిగణిస్తారు. ఫ్రాన్సులో మేరీనె లీపెన్‌ నాయకత్వంలోని పచ్చిమితవాద ఐడెంటిటీ(ఉనికి)-డెమోక్రసీ(ప్రజాస్వామ్య) పార్టీ(ఐడి)కి 57 వచ్చాయి. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ నాయకత్వంలోని యూరోపియన్‌ కన్సర్వేటివ్‌, రిఫార్మిస్టు(ఇసిఆర్‌) పార్టీకి 71 వచ్చాయి. ఈ మూడు పక్షాలూ గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. సోషలిస్టు మరియు డెమోక్రాట్స్‌ కూటమి(ఎస్‌డి) రెండవ పెద్ద పక్షంగా 135 సీట్లు తెచ్చుకుంది. గుర్తింపు పొందని చిన్న పక్షాలు 95 గెలుచుకున్నాయి.గ్రీన్స్‌ పార్టీ 53,రెన్యూ(పునరుద్దరణ) యూరోప్‌(ఆర్‌ఇ) 83, ఐరోపా వామపక్ష పార్టీ 35 సీట్లు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండెర్‌ లెయాన్‌ అభ్యర్థిత్వాన్ని సమర్ధించి గెలిపించిన పార్టీలు తాజా ఎన్నికల్లో 720కి గాను 402 స్థానాలను తెచ్చుకున్నట్లు వెల్లడైంది. అందువలన ఆమె తిరిగి మరోసారి అదే పదవిలో కొనసాగవచ్చు. ఆమె గనుక పచ్చిమితవాద పార్టీల మద్దతుకోసం ప్రయత్నిస్తే తాము దూరంగా ఉంటామని, ఉదారవాద, మితవాద పార్టీల ప్రతినిధులు హెచ్చరించారు. ఆమె బలహీన పడిన గ్రీన్స్‌, ఇటలీ మితవాది మెలోనీ పార్టీ మద్దతు కోరవచ్చని కొందరు విశ్లేషకులు జోశ్యం చెప్పారు.హంగరీలో జాతీయవాద నేత విక్టర్‌ ఒర్బాన్‌ పార్టీ బలం తగ్గినా 44శాతం తెచ్చుకుంది.ఇటలీలో మితవాద ప్రధాని మెలోనీ పార్టీ 30శాతం తెచ్చుకుంది.


ఫ్రెంచి పార్లమెంటును ఆకస్మికంగా రద్దు చేయటంతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 30,జూలై ఏడున ఎన్నికలు జరగనున్నాయి. పదహారవ తేదీలోగా అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఐడి పార్టీ నాయకురాలు మేరీనే లీపెన్‌ దేశ పౌరులు ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పార్టీ 31.5శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జీన్‌ మారీ లీపెన్‌ కుమార్తె మేరీనే కాగా మనుమరాలు మరియో మార్చెల్‌ ఆమెతో వేరుపడి రికగ్నిట్‌ పేరుతో మరో పచ్చిమితవాద పార్టీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో మేనత్త మీద ఎలాంటి విమర్శలూ చేయలేదు, మితవాదులందరూ కలవాల్సిన అవసరం గతం కంటే నేడు ఎక్కువగా ఉందంటూ ఎన్నికల ఫలితాల తరువాత మరియో వ్యాఖ్యానించింది. వ్యతిరేకులు, పోటీదార్లకు తేడా ఉంది అన్నారు.అయితే ఇప్పటికే మార్చెల్‌తో మేరీ లీపెన్‌ ప్రతినిధి జోర్డాన్‌ బార్‌డెలా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మక్రాన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే మితవాద పార్టీలు మేరీ లీపెన్‌, మార్చెల్‌తో కలిసే అవకాశాలు ఉన్నాయి. వివిధ పార్టీలలో చీలికలు తెచ్చి తనవైపు తిప్పుకొనేందుకు మక్రాన్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. అతగాడి అధ్యక్ష పదవీకాలం 2027వరకు ఉంది. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే ఇబ్బంది కనుక వాటిని అడ్డుకొనేందుకు సర్వశక్తులూ వడ్డాలని చూస్తున్నాడు. సోషలిస్టులు, గ్రీన్స్‌, మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా కూటమిగా ఏర్పడేందుకు చూస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ(పిఎస్‌)కు 14శాతం ఓట్లు వచ్చాయి.కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో మక్రాన్‌ నాయకత్వంలోని రినయసాన్స్‌ పార్టీ(ఆర్‌ఎన్‌) సగం స్థానాలను కోల్పోనున్నట్లు వెల్లడైంది.


జర్మనీలో పాలక కూటమిలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 13.9శాతం ఓట్లు తెచ్చుకొని మూడవ స్థానంలో ఉంది. పచ్చిమితవాద పార్టీ ఏఎఫ్‌డి 16శాతం తెచ్చుకొని చరిత్ర సృష్టించింది. ప్రతిపక్ష క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌-క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ కూటమి 30శాతం తెచ్చుకొని ప్రధమ స్థానంలో ఉంది.తూర్పు జర్మనీ ప్రాంతంలో ఎఎఫ్‌డి అగ్రస్థానంలో ఉంది. సంకీర్ణ కూటమిలోని సోషల్‌ డెమోక్రాట్స్‌(ఎస్‌పిడి), పర్యావరణ గ్రీన్స్‌,ఫ్రీ డెమోక్రాట్స్‌ పార్టీలు వరుసగా 13.9 -11.9-5.2శాతాల చొప్పున తెచ్చుకొని చావు దెబ్బతిన్నాయి.దీంతో వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది.నాలుగింట మూడు వంతుల మంది జనం కూటమి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ బెర్లిన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చినందున మామూలుగా తమపని తాము చేసే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నాడు. వచ్చే జాతీయ ఎన్నికల్లో ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తామన్నాడు.నూటముప్ఫై సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువగా ఎస్‌పిడి ఎన్నడూ ఓట్లు తెచ్చుకోలేదు. ప్రత్యామ్నాయ జర్మనీ (ఎఎఫ్‌డి) ఈ ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లతో సుస్థిరం కావటాన్ని అడ్డుకుంటామని, వెనక్కు కొడతామని అన్నాడు. జర్మనీలో, ఐరోపా అంతటా సంప్రదాయ ప్రజాస్వామిక పార్టీలు ఇప్పటికీ మెజారిటీగా ఉన్నాయని అన్నాడు. ప్రతిపక్షం కోరినట్లుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, గడువు ప్రకారమే జరుగుతాయని షుల్జ్‌ ప్రతినిధి స్టెఫెన్‌ ó చెప్పాడు. జాతీయవాదం,విద్వేష ప్రమాదాలను జనం మరచిపోరాదని జర్మనీ అధ్యక్షుడు (మన రాష్ట్రపతి మాదిరి) ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిమెయిర్‌ హెచ్చరించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీల మారణకాండకు బలైనవారి గౌరవార్ధం ప్రాన్సులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు ఎదగటాన్ని ప్రస్తావించి జర్మనీలో నేషనల్‌ సోషలిస్టులు(హిట్లర్‌ నాజీ పార్టీ) సాగించిన అత్యాచారాలను గుర్తు చేశాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో జరుగుతున్న పరిణామాలు,ఐరోపా అంతటా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం వంటి అంశాలన్నింటి కారణంగా మరింత భద్రత కావాలని ఓటర్లు కోరుకున్నారని, దాని మీద పచ్చి మితవాదులు వాగ్దానం చేశారని, ఈ ఎన్నికలు జాతీయ నాయకుల మీద జరిగిన ప్రజాభిప్రాయవెల్లడి అని ఐరోపా సమాఖ్య విదేశీ సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ వెసెలా టెక్నర్‌నెవా అన్నారు.ఐరోపాలో ఫాసిస్టు, నాజీ, పచ్చి మితవాద శక్తులు పుంజుకోవటమే కాదు, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ధోరణి కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో అనేక మంది ఊహించిన మాదిరి అవి ఎక్కువ బలాన్ని పెంచుకోలేదు. మూడోవంతు సీట్లు తెచ్చుకోవటం రానున్న ముప్పును వెల్లడిస్తున్నది.ఇప్పటివరకు అనేక కారణాలతో వివిధ దేశాల్లోని ఈ శక్తుల మధ్య ఐక్యత లేదు, అసంఘటితంగా కూడా ఉన్నాయి.ఎవరికి వారుగానే పని చేస్తున్నారు. మితవాదులు, పచ్చిమితవాదులకు స్వల్పతేడాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న పూర్వరంగంలో పార్లమెంట్‌లో ఈ శక్తులు కలిస్తే పరిణామాలు ఎలా ఉండేదీ చెప్పలేము. ఒక వేళ అదే జరిగితే వాటిని వ్యతిరేకించే వారందరూ ఒక కూటమిగా ఏర్పడవచ్చు, వారితో వామపక్షాలు కూడా చేతులు కలిపే అవకాశం లేకపోలేదు.పచ్చిమితవాద శక్తులు బలం పుంజుకోవటం వలన పర్యావరణ,వలసలు, ఉక్రెయిన్‌కు సాయంతో సహా విదేశాంగ విధానంలో మార్పుల కోసం పట్టుపట్టవచ్చు, వేగంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని అడ్డుకోవచ్చు.

కంగన రనౌత్‌కు చెంపదెబ్బ – ఒక సిక్కు మహిళకు ఎందుకు, ఎలా అంత ధైర్యం వచ్చింది !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చండీఘర్‌ విమానాశ్రయంలో 2024 జూన్‌ ఆరవ తేదీన ఒక అనూహ్య ఉదంతం జరిగింది.హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గెలుపొందిన సినీనటి కంగన రనౌత్‌ ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉంది. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఒక సిఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. రోజుకు వంద, రెండు వందల రూపాయలు తీసుకొని మహిళలు ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్నారని గతంలో కంగన నిందించారని, ఆ మహిళల్లో తన తల్లి కూడా ఉన్నందున ఆమెను అవమానించినందుకు గాను తాను కొట్టానని కుల్విందర్‌ కౌర్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమె మీద కేసు నమోదు చేయటమే గాక విధి నిర్వహణ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు. అరెస్టు చేశారు. చట్టాల ప్రకారం ఆమెకు ఎంత శిక్ష వేస్తారు, ఏం చేస్తారు అనేది చూద్దాం. పంజాబ్‌ సుల్తాన్‌పూర్‌ లోధీ ప్రాంతంలో ఉన్న ఆమె తలిదండ్రుల ఇంటికి పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు.కుటుంబ సభ్యులందరికీ సిక్కు మత గౌరవ చిహ్నాలలో ఒకటైన కాషాయ రంగు సిరోప్స్‌(శాలువ వంటి వస్త్రం) కప్పి గౌరవిస్తున్నారు.కుల్విందర్‌ కౌర్‌ సోదరుడు షేర్‌ సింగ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష కమిటీ స్థానిక నేత. కుటుంబం మొత్తం రైతుల ఉద్యమంలో పాల్గొన్నది. కుల్విందర్‌ భర్త కూడా సిఐఎస్‌ఎఫ్‌లోనే పని చేస్తున్నారు.ఆమెకు మద్దతుగా రైతు సంఘాలు ప్రకటనలు చేశాయి.


కంగన వ్యాఖ్యానించినట్లుగా నేను పనికిమాలినదాన్నా అంటూ కుల్విందర్‌ కౌర్‌ తల్లి వీర్‌ కౌర్‌ ప్రశ్నించారు. కంగన తొలిసారిగా తప్పు మాట్లాడి ఉండవచ్చు, కానీ అంతకు ముందు ఆమె ప్రవర్తన బాగానే ఉంది. ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. నేను రైతు ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాను. కొంత మంది మా సన్నిహిత బంధువులు మిలిటరీలో పనిచేశారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. నా భర్త ఇద్దరు అన్నలు కూడా మిలిటరీలో ఉన్నారు, 1965యుద్ధంలో పాల్గొన్నారని ఆమె మీడియాతో చెప్పారు. కుటుంబమంతా రైతు ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ దాని గురించి తన సోదరితో ఎప్పుడూ పెద్దగా చర్చించలేదని షేర్‌ సింగ్‌ చెప్పారు. ఘటన తరువాత ఆమెతో మాట్లాడటం కుదరలేదని, భర్తతో మాట్లాడి ఇద్దరు పిల్లలను తమ ఇంటికి తీసుకువచ్చామని, మీడియా, సామాజిక మాధ్యమం ద్వారానే విషయాలు తెలుసుకుంటున్నామని, అందువలన ఉదంతానికి సంబంధించి వీడియో మొత్తాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని షేర్‌ సింగ్‌ కోరారు.


కుల్విందర్‌ కౌర్‌కు మద్దతు తెలపటం మీద కంగన రౌనత్‌ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు.సినిమా పరిశ్రమ మౌనంగా ఉందని ఆరోపించారు. అఫ్‌కోర్సు అది ఆమె ఇష్టం. తన అనుమతి లేకుండా తన శరీరాన్ని తాకారంటూ చెంపదెబ్బ కొట్టటాన్ని సమర్ధించేవారి గురించి ఆమె మండి పడ్డారు. ” ఏ కారణం లేకుండా ఏ నేరమూ ఎప్పుడూ జరగదు.నేరం చేసిన వారి మానసిక ధోరణులేమిటో కుల్విందర్‌ కౌర్‌ను సమర్ధిస్తున్నవారు చూడాలి. అత్యాచారం, హత్య చేసిన వారికి లేదా దొంగలకు కూడా బలమైన భావోద్వేగ, భౌతిక, మానసిక లేదా ఆర్థికపరమైన కారణాలు ఎల్లవేళలా ఉంటాయి.అయినప్పటికీ వారికి శిక్ష విధించి జైలుకు పంపుతారు. బలమైన భావోద్వేగాలతో నేరాలకు పాల్పడిన నేరగాండ్లతో మీరు చేతులు కలుపుతున్నారంటే దేశంలో ఉన్న చట్టాలన్నింటినీ ఉల్లంఘించటమే. అనుమతి లేకుండా కొంతమంది శరీర భాగాలను తాకి వారి అంతరంగిక పరిధిలోకి చొరబడటాన్ని అంగీకరిస్తున్నారంటే, గుర్తుపెట్టుకోండి మీరు అత్యాచారం, హత్యలను కూడా సమర్ధించినట్లే. వాటిలో మాత్రం పెద్ద ఏముంది కేవలం దూర్చటం,పొడవటమేగా అని ఇతరులు చెప్పుకోలేని, చూడకూడని చోట్లకు వెళ్లటమే. మీరు మీ మానసిక, నేరపూరిత ధోరణుల్లోకి లోతుగా చూడండి, దయచేసి యోగా, ధ్యానం చేయండని మనవి చేస్తున్నా లేకపోతే జీవితం మీకు దుర్భరమౌతుంది, మరీ అంత పగ,ద్వేషం, అసూయలను పెంచుకోకండి, వాటి నుంచి దూరం కండి ” అంటూ ఎక్స్‌ల మీద ఎక్స్‌లు(ట్వీట్లు) చేశారు.అంతేకాదు ఆమె పోస్టు చేసిన ఒక వీడియోలో పంజాబ్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరుగుతున్నదని అంటూ మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారు.


తనను చెంపదెబ్బ, అదీ ఒక మహిళ కొట్టినందుకు, ఆ చర్యను కొందరు తప్పేముంది అన్నందుకు ఇంతలా దిగ(భాష) జారి నోరుపారవేసుకోవటం పద్మ అవార్డు గ్రహీత కంగనకే చెల్లింది. అత్యాచారం అంటే లైంగిక దాడి తప్ప దూర్చటమేగా అని ఏ నాగరికజీవీ ఇంతవరకు ఎక్కడా అన్నట్లు వినలేదు, అలా అంటారేమో అని కంగన చెప్పారు.బహుశా తన పరివారంలో అలాంటి దిగజారుడు భాష వాడతారేమో ! కంగనను మహిళా కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టింది తప్ప అంతకు మించి జరిగిన ఇతర పరాభవమేమీ లేదు.(దీని అర్ధం చెంపదెబ్బను సమర్ధిస్తున్నానని కాదు, అనేక ఉదంతాల్లో మహిళలే మహిళల మీద దాడి చేసి కొట్టటంతో పాటు వివస్త్రలను చేసిన ఉదంతాలు తెలిసిందే.) చెంపదెబ్బను సమర్ధించినందుకే ఇంతగా మండిపడుతున్న సాధ్వీమణి గుజరాత్‌లో బిలికిస్‌ బానూ సామూహిక అత్యాచారం కేసులో శిక్షపడి బిజెపి పెద్దల ఆశ్వీరచనాలతో జైలు శిక్ష నుంచి మినహాయింపు పొందిన నేరగాండ్లకు అదే బిజెపి ప్రజాప్రతినిధులు మిఠాయిలు పంచి మంచి ప్రవర్తన కలిగిన బ్రాహ్మలని కితాబులిచ్చినపుడు కంగనకు ఎలాంటి తప్పూ కనిపించలేదు. మణిపూర్‌లో గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించినపుడూ కంగనకు ఎలాంటి అవమానమూ కనిపించలేదు, నోటికి తాళం వేసుకున్నారు.చివరకు ఎంత దిగజారుడు అంటే బిలికిస్‌ బానూ ఉదంతం మీద సినిమా తీసి సొమ్ము చేసుకోవాలని చూస్తే ఏ ఓటిటి సంస్థా, టీవీ కూడా అంగీకరించలేదు.తను చెంపదెబ్బ కొట్టిన మహిళలో ఉగ్రవాదం, తీవ్రవాదం కనిపించింది గానీ, పార్లమెంటు మీద పొగబాంబులతో దాడి చేసిన వారి ప్రవేశానికి పాసులిచ్చిన బిజెపి మైసూరు ఎంపీలో మాత్రం దేశభక్తి కనిపించింది గనుక మౌనంగా ఉన్నారు.


తనకు కంగన మీద ప్రేమ దోమా వంటివేమీ లేవు గానీ, ఆమెను చెంపదెబ్బ కొట్టినందుకు ఉత్సవంలో పాల్గొనటం లేదని ప్రముఖ సినీనటి షబనా ఆజ్మీ స్పందించారు. హింస, గూండాయిజం అంటూ రవీనా టాండన్‌ వర్ణించారు.తాను హింసాకాండను ఎప్పుడూ సమర్ధించనని అయితే కుల్విందర్‌ కౌర్‌ను ఉద్యోగం నుంచి తీసివేస్తే ఆమెకు ఉపాధి కల్పిస్తానని సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్‌ దద్లానీ ప్రకటించాడు. ఒక మహిళ తన ఉద్యోగ స్థానాన్ని వినియోగించుకొని మరొక మహిళ మీద దాడి చేయటం విచారకరమని, చట్టపరంగా దర్యాప్తు జరపాలని అనుపమ ఖేర్‌,శేఖర్‌ సుమన్‌, అతని కుమారుడు అధ్యాయన్‌ సుమన్‌ కూడా ఖండించారు. తనను చెంపదెబ్బ కొట్టటంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉందంటూ కంగన తప్పు పట్టారు.ఇలాంటిదే రేపు మీకు, మీ పిల్లలకూ జరగవచ్చు, ఒకరి మీద జరిగిన ఉగ్రదాడిని మీరు ఉత్సవంగా జరుపుకుంటే అలాంటి రోజే మీకూ ఎదురౌతుంది సిద్దంగా ఉండండి అని శాపనార్ధాలు పెట్టారు. రైతులను వంద, రెండు వందలు తీసుకొని వచ్చిన కిరాయిబాపతు అని ఆమె నిందించినపుడు కూడా సినిమా పరిశ్రమ మౌనంగానే ఉంది మరి.అప్పుడు మోదం-ఇప్పుడు ఖేదం !


కంగన రనౌత్‌ 2020 డిసెంబరు మొదటి వారంలో రైతులను నిందిస్తూ ట్వీట్‌ చేశారు. అప్పుడే పెద్ద రచ్చ జరిగింది. మూడున్నర సంవత్సరాల తరువాత దానికి ప్రతిగా కంగన చెంపదెబ్బ తిన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలో జరిగిన షాహిన్‌ బాగ్‌ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్న 82 సంవత్సరాల బిలికిస్‌ అనే మహిళ రైతు ఉద్యమంలో కూడా పాల్గొంటున్నదను కొని వంద రెండు వందలకు దొరికే ఆమె తిరిగి వచ్చిందంటూ కంగన్‌ నోరు పారవేసుకున్నారు. తరువాత తన తప్పు తెలుసుకొని ఆ ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే దాని మీద పెద్ద రచ్చ జరిగింది. ఉడతా పంజాబ్‌ సినిమా నటుడు-గాయకుడు అయిన దిల్జిత్‌ దోసాంజ్‌ కంగన మీద తీవ్రంగా విరుచుకు పడ్డాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాడు.దిల్జిత్‌ను ఒక జంతువు అని ఆమె నిందించారు. సిక్కు మహిళ మహిందర్‌ కౌర్‌ను ఉద్దేశించి కంగన నోరుపారవేసుకున్నారని ఒక వీడియో రుజువు చూపాడు. దాంతో కంగన వెనక్కు తగ్గింది.తనను కరణ్‌ జోహార్‌ పెంపుడు జంతువు అన్న కంగన్‌ బాలీవుడ్‌లో అనేక మందితో కలసి పనిచేశారని ఆమెకూడా ఆమె వారందరికీ పెంపుడు జంతువుగా ఉన్నట్లా అంటూ ఇది బాలీవుడ్‌ కాదు, పంజాబ్‌, పౌరుల మనోభావాలతో ఆడుకోవద్దని దిల్జిత్‌ హెచ్చరించాడు. సరిగ్గా అదే పంజాబీ మనోభావం ఇంకా ఉన్నందున కుల్విందర్‌ కౌర్‌తో చెంపదెబ్బ కొట్టించింది.


ఇన్ని సంవత్సరాల తరువాత ఆమె ఎందుకు స్పందించిందన్న ప్రశ్న అనేక మందిలో తలెత్తింది. గతంలో ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను అడ్డుకొని నెలల తరబడి అడ్డుకున్న బిజెపి సర్కార్‌ తీరుతో పంజాబీ రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో లోక్‌సభ ఎన్నికల్లో వెల్లడైంది. 2019లోక్‌సభ ఎన్నికలలో అకాలీదళ్‌, బిజెపి ఉమ్మడిగా పది, మూడు సీట్ల చొప్పున పోటీ చేసి 27.76-9.63శాతాల చొప్పు ఓట్లు రెండేసి సీట్లు తెచ్చుకున్నాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది, ఆమ్‌ఆద్మీకి ఒకటి వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏడు, ఆమ్‌ ఆద్మీకి మూడు, అకాలీదళ్‌కు ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. బిజెపికి ఒక్కసీటూ రాలేదు.ఓట్ల రీత్యా కాంగ్రెస్‌, ఆప్‌ తరువాత మూడవ పార్టీగా వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా రైతులు ఆందోళనకు దిగటం దాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, బండరాళ్లతో కూడిన ట్రక్కులను ఏర్పాటు చేయటం వంటి పనులకు మోడీ సర్కార్‌ పాల్పడింది.హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు ఒక పంజాబీరైతు ప్రాణాన్ని బలిగొన్నారు, అణచివేసేందుకు చూశారు.నిజానికి రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన బిజెపి, దాన్ని గుడ్డిగా సమర్దించిన పెద్దలందరికీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో ప్రచారానికి వెళ్లగా అనేక గ్రామాల్లో ప్రవేశం కష్టమైంది, తీవ్ర నిరసన తెలిపారు. అలాంటి నేతలందరూ గత మూడు సంవత్సరాలుగా అనేక బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూనే ఉన్నారు. ఆకస్మికంగా ఎవరైనా వెళ్లి చెంపదెబ్బ కొట్టటమో, మరో రూపంలో నిరసన తెలపటానికి అనేక అవకాశాలు ఉంటాయి. కానీ ఆ పని చేయలేదు. ఈ ఎన్నికల్లో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు రాకపోవటం, నరేంద్రమోడీ గ్యారంటీలను జనం నమ్మకపోవటం, చివరికి అయోధ్యలోనే బిజెపి ఓడటం, మోడీ గెలుపు మెజారిటీ గణనీయంగా తగ్గటం, ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చిన బలహీనత వెల్లడైంది. అంతకు ముందు బిజెపిని చూసి భయపడిన వారంతూ ఇప్పుడు దాన్ని కూడా జనం ఓడించగలరని రుజువు కావటంతో అనేక మందిలో ఉత్సాహం కట్టలు తెంచుకున్నది. దానికి ప్రతిస్పందనే కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ. ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ అధికారగర్వంతో విర్రవీగిన వారందరికీ ఈ ఉదంతం ఒక హెచ్చరిక కావాలి. అయితే ప్రజా ఉద్యమాలను అణచేందుకు చూసిన వారికి, తూలనాడిన వారికి చేయాల్సింది చెంపదెబ్బల శాస్తి కాదు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడకుండా తమ చేతులతో ఎన్నికల యంత్రాల మీట నొక్కి అలాంటి పార్టీలు, శక్తులకు రాజకీయంగా పీకనొక్కాలి.

విధి వైపరీత్యం : ముస్లిం అనుకూల పార్టీల దయ మీద నరేంద్ర మోడీ ! హిందూ దేవునిబిడ్డకేమిటీ పరిస్థితి !!

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో విధిని నమ్మేవారు ఎక్కువ, నమ్మనివారు తక్కువ. విధి వైపరీత్యం గురించి చెప్పే బాబాలు, జ్యోతిష్కులు,ప్రవచనకారులను రోజూ చూస్తూనే ఉన్నాం. పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం అంటూ కొత్త కొత్త అంశాల గురించి అనేక మంది చెబుతారు. ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్‌ 1,555లోనే నరేంద్రమోడీ గురించి జోశ్యం చెప్పాడని కేంద్ర మంత్రి కిరెన్‌ రిజుజు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో హిందువులు అధికారానికి వస్తారని ( అతల్‌ బిహారీ వాజ్‌పాయిను హిందువుగా గుర్తించలేదా లేక దుర్భిణికి కనిపించలేదా) భూమ్యాకాశాలను పాలిస్తారని, ఆసియాలో వారిని ఎవరూ నిరోధించలేరని,భారత అధినాయకుడు గుజరాత్‌లో జన్మిస్తాడని,అతని తండ్రి టీ అమ్ముతారని,అతని మొదటి నామం నరేన్‌దసు అని, 2026వరకు అధికారంలో ఉంటారని రాతపూర్వకంగా ఉందని సదరు మంత్రి సెలవిచ్చారు. ఇన్ని చెప్పిన సదరు జ్యోతిష్కుడు బాబరీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండల గురించి, ఆ కారణంగా అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వదనీ, 2024లో ముస్లిం అనుకూల పార్టీల దయతో ఏలుబడిలోకి వస్తారని ఎలా పసిగట్టలేకపోయారన్నది ప్రశ్న. ఇంకా చాలా ఉన్నాయి. అయోధ్యలో రామమందిరం కట్టిస్తారని, ఓట్ల కోసం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని, చివరకు అక్కడ పార్టీని గెలిపించటంలో మోడీ చతికిల పడతారని, రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని నరేంద్రమోడీ ఎవరి గురించి చెప్పారో ఆ సమాజవాది పార్టీ ప్రతినిధిని ఆ రాముడే తన ఆలయ రక్షణకు గెలిపిస్తారని, బిజెపిని ఓడిస్తారని ఎందుకు చెప్పలేదు. హిందూ హృదయ సామ్రాట్టుగా మన్ననలను అందుకున్న, ముస్లింల సంతుష్టీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన 56 అంగుళాల ఛాతీ ఉన్న ధైర్యవంతుడిగా స్తోత్రపాఠాలు అందుకున్న నేతపట్ల విధి ఎందుకు ఇంత విపరీతంగా ప్రవర్తించినట్లు ?నోస్ట్రాడామస్‌ను పక్కన పెడదాం, సాధారణ మానవుల మాదిరిగాక దైవాంశ సంభూతుడిగా జన్మించినట్లు చెప్పుకున్న కారణజన్ముడు సైతం రాగల పరిణామాలను ఎందుకు ఊహించలేకపోయారు.


తాను బతికి ఉండగా ముస్లిం రిజర్వేషన్లను అనుమతించే ప్రసక్తి లేదని నరేంద్రమోడీ ప్రతిజ్ఞ చేశారు, దేశానికి గ్యారంటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. నితీష్‌ కుమార్‌ కూడా ముస్లింలకు అనుకూలంగానే వ్యవహరించారు.బీహార్‌లో కుల గణన సర్వే వివరాలు నిలిపివేయాలని కోరిన కేసులో సుప్రీం కోర్టు తిరస్కరించిన తీర్పు మరుసటి రోజు 2023 అక్టోబరు ఏడున నితీష్‌ కుమార్‌ తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సుదీర్ఘసమావేశం జరిపారు.మైనారీటీల సంక్షేమం, సామాజిక భద్రత గురించి వారికి హామీ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కుల సర్వే వివరాల ప్రకారం బీహార్‌లో ముస్లిం జనాభా 17.7శాతం ఉంది.కులగణనలో ముస్లింలలో ఉన్న పాతిక కులాల వారిని అత్యంత వెనుకబడిన తరగతి(ఇబిసి)గా పరిగణించి లెక్కించారు.స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లకు అర్హత కల్పించారు.నితీష్‌ కుమార్‌ రిజర్వేషన్‌ ఫార్ములా ప్రకారం దళితులకు 16, గిరిజనులకు ఒకటి, ఇబిసిలకు 18, ఓబిసిలకు 12, ఇబిసి మహిళలకు మూడు శాతం అని చెప్పారు.ఇదంతా చేసిన తరువాత ఆ పెద్ద మనిషి ఇండియా కూటమినుంచి ఫిరాయించి తిరిగి ఎన్‌డిఏ కూటమిలో చేరి బిజెపితో అధికారాన్ని పంచుకున్నారు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. నితీష్‌ కుమార్‌కు అవి పెద్ద పరీక్షగా మారతాయి.తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ పార్టీలకు వచ్చిన ఓట్లను చూసినపుడు 2019లో వచ్చిన ఓట్లకంటే ఆరుశాతం తగ్గగా ఇండియా కూటమి ఓట్లు 3.5శాతం పెరిగాయి. ఓట్లపరంగా చూసినపుడు ఆర్‌జెడి 22.41శాతం ఓట్లతో పెద్ద పార్టీగా ఉంది.బిజెపి 20.5శాతంతో ద్వితీయ, 18.52శాతంతో జెడియు మూడవ స్థానంలో ఉంది.బిజెపి, జెడియు రెండూ గతంలో ఉన్న లోక్‌సభ స్ధానాలలో తొమ్మిదింటిని కోల్పోయాయి.తెలుగు ప్రాంతాలలో ఇంత బతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్లు అనే లోకోక్తి తెలిసిందే. తమ పార్టీ ఓట్ల కోసం ఎవరినీ సంతుష్టీకరించదు, మిగతా పార్టీలన్నీ మైనారిటీల సంతుష్టీకరణకు పాల్పడుతున్నట్లు వూరూ వాడా చెడా మడా ప్రచారం చేసిన బిజెపి గురించి తెలిసిందే. ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేకం, ఎట్టి పరిస్థితిలోనూ దానికి లొంగేది లేదని చెప్పిన వారు ఇప్పుడు ముస్లిం అనుకూల విధానాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని పార్టీల దయమీద కేంద్రంలో అధికారానికి రావటాన్ని ఏమనాలి ? ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిపితీరుతామని చెప్పిన చంద్రబాబుతో మోడీ రాజీపడతారా లేక చంద్రబాబు నాయుడు నితీష్‌ కుమార్‌ ఇద్దరూ మోడీతో సర్దుకుపోదాం పదండి అంటారా ? విధి వైపరీత్యం ఎవరితో ఎలా ఆడుకుంటుందో, వారిని నమ్మిన వారిని ఏం చేస్తుందో చూద్దాం.


నరేంద్రమోడీని ఇప్పటి వరకు అనేక మంది విశ్వగురువుగా, ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నేతగా ప్రచారం చేశారు. నిజమే అని నమ్మి అబ్‌కీబార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బాహాటంగా ప్రకటించిన నరేంద్రమోడీ అమెరికాలో చేతులు కాల్చుకున్నది తెలిసిందే. సదరు ట్రంప్‌ అధికారం పోయింది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా మోడీకి జనం తగిన పాఠం చెప్పారు.అదే ట్రంప్‌ మనదేశం వచ్చి నరేంద్రమోడీకి అనుకూలంగా చెప్పి ఉంటే ఏం జరిగేదో అనూహ్యం.ఎన్నికల తరువాత మోడీ గురించి ప్రపంచం ఏమనుకుంటోంది అంటే మీడియా వ్యాఖ్యలను చూడాల్సిందే. బిజెపి పెద్దలు తరచూ పాకిస్తాన్‌తో పోల్చి తాము సాధించిన విజయాల గురించి చెప్పుకుంటారు.అదే పాక్‌ ఆంగ్ల పత్రిక ”డాన్‌ ” మన ఎన్నికల గురించి పతాకశీర్షిక పెట్టింది.” విద్వేషాన్ని ఓడించిన భారత్‌, ముస్లిం అనుకూల పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన మోడీ ” అని రాసింది. దీన్ని చూస్తే మోడీ భక్తులకు మామూలుగా మండదు. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అనే ఒక సామెత గుర్తుకు రావటం లేదూ ! అందరూ ఈ వార్తను చూస్తారో లేదోనని ఆ పత్రిక మొదటి పేజీని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి తన ఎక్స్‌ ఖాతాలో పంచుకొని మోడీని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ హిందూత్వ ఉత్సాహం, ముస్లింలు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవటాన్ని అంగీకరించని బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని లౌకిక పార్టీల దయమీద ఆధారపడాల్సి వచ్చిందని, కేరళలో తొలిసారిగా విజయం సాధించిన బిజెపి అభ్యర్థికూడా మైనారిటీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తని కూడా డాన్‌ పేర్కొన్నది. బలహీన పడినప్పటికీ ఇంకా ప్రాణాంతకమే అంటూ బిజెపి, నరేంద్రమోడీ గురించి అదే పత్రిక మరో విశ్లేషణలో హెచ్చరించింది.


”భారత్‌లో మోడీ పార్టీ బిజెపి తన ఆధిక్యతను ఎలా కోల్పోయింది ” అనే ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ ఎఎఫ్‌పి సంస్థ వార్త ఇచ్చింది.పది సంవత్సరాల క్రితం హిందూ జాతీయనేత అధికారానికి వచ్చిన తరువాత తొలిసారిగా సంపూర్ణ మెజారిటీని సాధించటంలో భారత ప్రధాని నాయకత్వంలోని బిజెపి విఫలమైంది అని వ్యాఖ్యానించింది.వరుసగా మూడవ సారి భారీ మెజారిటీ సాధించటంలో వైఫల్యానికి కారణాలను పేర్కొన్నది.విభజన వాద ప్రచారం దెబ్బతీసింది.హిందూ మెజారిటీని సమీకరించుకొనేందుకు అసాధారణ రీతిలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ మాట్లాడారు.తన సభల్లో వారిని చొరబాటుదార్లు అన్నారు, ప్రతిపక్ష కాంగ్రెస్‌ అధికారానికి వస్తే దేశ సంపదలను ముస్లింలకు పంచుతుందని చెప్పారు. ఇది హిందూ ఓటర్లను ఉత్సాహపరచలేకపోయింది, మైనారిటీల మద్దతు ప్రతిపక్షానికి గట్టిపడేట్లు చేసింది.ఎన్నికల సందర్భంగా తాము ఓటర్లను కదిలించినపుడు ప్రభుత్వ భావజాల(హిందూత్వ) అజెండా కంటే తమకు నిరుద్యోగ సమస్య ప్రధానమని చెప్పినట్లు పేర్కొన్నది. జనం తమ జీవనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఎక్కువ ఆవేదన చెందినట్లు , మోడీ, బిజెపి చెబుతున్నవి తమకు సంబంధం లేని అంశాలుగా జనం భావించారని మోడీ జీవిత చరిత్రను రాసిన నిలంజన్‌ ముఖోపాధ్యాయ కూడా అన్నట్లు ఈ వార్తా సంస్థ పేర్కొన్నది. పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లలో విఫలం కావటం, దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకొనేందుకు పదేపదే పర్యటించినా ఫలితం లేకపోవటం, అయోధ్యలో ఓటమి తదితర అంశాలను అది ఉటంకించింది.


”భారత ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు, మోడీ విజయం” అంటూ అమెరికా టీవీ సిఎన్‌ఎన్‌ వార్తలను ఇచ్చింది.ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటర్లు ప్రజాకర్ష హిందూ దేశానికి అగ్రతాంబూలం అనే దృక్పధాన్ని ఓటర్లు పాక్షికంగా తిరస్కరించారని విశ్లేషణలో పేర్కొన్నది.మోడీ ముద్రగల హిందూ దేవాలయం ఉన్న పెరటితోటలో తిరుగులేని ఓటమి అంటూ అయోధ్య గురించి న్యూస్‌వీక్‌ పత్రిక పేర్కొన్నది. ఎట్టకేలకు మేలుకున్న భారతీయ ఓటర్లు అంటూ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి విశ్లేషణ రాసింది.అజేయమైన శక్తి అనే మోడీ ప్రతిష్టకు చిల్లుపడింది, సంకీర్ణ రాజకీయాలు తిరిగి వచ్చాయి అని పేర్కొన్నది. మోడీ, ఆయన పార్టీకి తిరుగులేని దెబ్బ అని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. మోడీ పేలవ ప్రదర్శన ప్రతిపక్షం పుంజుకోవటానికి నిదర్శనం అని బ్రిటన్‌ పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ”మోడీ విజయంతో చైనా, అమెరికాలతో భారత్‌ మరింత దగ్గర ” అంటూ చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ విశ్లేషణ శీర్షిక పెట్టింది.మోడీ ఏలుబడి తొలి ఐదు సంవత్సరాలలో చైనాతో ముద్దులతో మొదలై గుద్దులదాకా వచ్చింది, తరువాత మరింత ఆర్థిక సహకారం కోసం ఉద్రిక్తతలను సడలించింది.2019 నుంచి సరిహద్దు ప్రతిష్ఠంభను ఒక ప్రధాన సమస్యగా చేసింది. మూడవసారి మరింత జాగ్రత్తలతో కూడిన మార్పులు జరగవచ్చు.శాంతియుత, స్థిరమైన సంబంధాలు రెండుదేశాలకూ కీలకం, సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్యం 2023లో అమెరికా-భారత్‌ లావాదేవీలను అధిగమించింది. గుడ్డిగా వివాదపడితే ఎవరికీ ఉపయోగం ఉండదని రుజువైందని పేర్కొన్నది.


అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల విశ్లేషణలు ఇంకా రానున్న రోజుల్లో వెలువడతాయి. వాటితో మోడీ ప్రతిష్ట మరింత మసకబారేదే తప్ప వెలిగేది కాదు. దేశీయంగా సంపూర్ణ మెజారిటీ లేని నరేంద్రమోడీ ఇతర పక్షాల మీద ఆధారపడి ఎలా పని చేస్తారో చూడాల్సి ఉంది. అజేయశక్తి అనుకున్న నేత బలహీనత వెల్లడైన తరువాత ప్రపంచ దేశాలు, నేతలు గతం మాదిరే గౌరవిస్తారా ?ఎలా స్పందిస్తాయన్నది ప్రశ్న.మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకారం చేయనున్న నరేంద్రమోడీ రానున్న రోజుల్లో తన ప్రాధాన్యతలు ఏమిటో వెల్లడిస్తారని ఎదురు చూసిన దేశానికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు వినిపించారు.శుక్రవారం నాడు జరిగిన ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో మోడీని తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ మీద దాడికి ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లు కూడా రావన్న మోడీ మనిషి పదేండ్లలో వంద సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిందన్నారు. స్వంతంగా 370, కూటమిగా 400కు పైగా సీట్లు తెచ్చుకుంటామన్న బిజెపి తన బలాన్ని కోల్పోయి 240కి ఎందుకు పరిమితమైందనే చర్చ దేశంలో జరుగుతుండగా దాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్‌ మీద దాడికి దిగారు.బిజెపి, నరేంద్ర మోడీ బలహీన పడివుండవచ్చు తప్ప ప్రమాదకరంగా ఉంటారన్నది ఇండియా కూటమే కాదు, ఎన్‌డిఏ పక్షాలు కూడా గ్రహించాలి.తన మిత్రపక్షాలను అది ఎలా మింగివేసిందో తెలుగుదేశానికి, శివసేనకూ తెలిసిందే.