అమెరికా తీరు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


తాము అందించిన ఆయుధాలతో రష్యా మీద పరిమిత దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు అధికారమిచ్చాడు. దీని గురించి ఎలాంటి ఆర్భాటం లేకుండా అమెరికా చూసింది. ఎప్పటి నుంచో జెలెనెస్కీ ఈ మేరకు నాటో కూటమి దేశాలకు విన్నవించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ భూభాగం మీద మిలిటరీ చర్యకు దిగిన రష్యా మిలిటరీని ఎదుర్కొనేందుకు మాత్రమే నాటో ఆయుధాలను వినియోగిస్తున్నారు. బైడెన్‌ నిర్ణయానికి ముందు ఫ్రెంచి నేత మక్రాన్‌, కెనడాతో సహా పన్నెండు దేశాలు కూడా అదే పద్దతిలో అనుమతులు ఇచ్చినట్లు వార్తలు. దాని ప్రకారం రష్యా భూ భాగాలపై ఉక్రెయిన్‌ దాడులు చేయటానికి వీలుకలుగుతుంది. నిజంగా అదే జరిగితే ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. నాటో ఆయుధాలతో దాడులు జరిపితే ఆ కూటమి దేశాలు ప్రత్యక్షంగా దాడులకు దిగినట్లుగానే పరిగణిస్తామని గతంలోనే రష్యా అధినేత పుతిన్‌ ప్రకటించాడు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను ఇప్పటికే అందచేయటమే గాక వాటి ప్రయోగానికి అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే క్రిమియా ప్రాంతంపై ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే అడ్డుకొని రష్యా కూల్చివేసింది. దీర్ఘ శ్రేణి క్షిపణులకు అనుమతి ఇవ్వలేదని అమెరికా చెబుతోంది.డ్రోన్లు, యుద్ద విమానాలను కూడా ఉక్రెయిన్‌కు సరఫరా చేశారు.ఎఫ్‌16 విమానాలను ప్రయోగించాలంటే అవసరమైన రన్‌వేలు ఉక్రెయిన్లో లేవు. వాటిని నిర్మిస్తే రష్యా చూస్తూ ఊరుకొనే అవకాశాలు లేవు.


పశ్చిమ దేశాల నిర్ణయాలు, కదలికల గురించి రష్యా అప్రమత్తం అవుతోంది. ఒక వేళ నాటో కూటమి దేశాలు గనుక తమపై దాడులకు తెగిస్తే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరికలు జారీ చేశాడు. అలాంటి పరిస్థితే వస్తే ఒక్క రోజులోనే బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వద్ద ఉన్న అణ్వాయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీయగలమని రష్యా మిలిటరీ నిపుణుడు యూరీ బరాన్‌చిక్‌ చెప్పినట్లు మిర్రర్‌ పత్రిక రాసింది. అణ్వాయుధాల సామర్ధ్యం ఉన్న దేశాల సంఖ్య తొమ్మిది నుంచి ఏడుకు తగ్గుతుంది అని కూడా చెప్పాడు. ముందు జాగ్రత్తగా పెద్ద పట్టణాలలో సంచార అణు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటో దేశాల పత్రికలు రాస్తున్నాయి.నిజంగా మూడవ ప్రపంచ యుద్దం వస్తుందా ? రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన కొద్ది కాలానికే అనేక మంది పండితులు మూడవ ప్రపంచ యుద్దం గురించి చెప్పటం మొదలు పెట్టారు.అనేక కుట్ర సిద్దాంతాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు వలసల ఆక్రమణలో మొదలైన పోటీ ఐరోపా యుద్ధాలకు దారితీసింది. ఫ్రెంచి సామ్రాజ్యవాది నెపోలియన్‌ బోనపార్టీ 1804 నుంచి ఓటమిపాలైన చివరి యుద్ధం 1815వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు యుద్దాలు చేశాడు. తరువాత వంద సంవత్సరాలకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. పాత్రలోని నీరు మరిగి వంద డిగ్రీలకు చేరుకున్న తరువాత ఆవిరిగా రూపాంతరం చెందినట్లు ఏదైన ఒక ప్రధాన పరిణమానికి ముందు అంతర్గతంగా ఎన్నో జరుగుతాయి. అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.
1871లో పునరేకీకరణ తరువాత జర్మనీ చర్యల వలన అప్పటి వరకు ఉన్న బలాబలాల్లో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రియా-హంగరీ, ఇటలీతో జర్మనీ జట్టుకట్టింది. దాంతో జర్మనీని అడ్డుకొనేందుకు ఫ్రాన్స్‌- జారిస్టు రష్యా ఒక్కటయ్యాయి. అప్పటి వరకు ఈ రెండు దేశాల నుంచి తమకు ముప్పు ఉందని భావించిన బ్రిటన్‌ ఆకస్మికంగా జర్మనీ నుంచి వచ్చిన సవాలును ఊహించలేకపోయింది. ఉప్పు-నిప్పుగా ఉన్న బ్రిటన్‌- ఫాన్స్‌ 1904లో సయోధ్య కుదుర్చుకున్నాయి.దేశాల ఆక్రమణలపై సహకరించుకున్నాయి. ఆఫ్రికాలోని మొరాకోను ఫ్రాన్స్‌ ఆక్రమించగా జర్మనీ వ్యతిరేకించింది, బ్రిటన్‌ మద్దతు ఇచ్చింది.రష్యా,బ్రిటన్‌, ఫ్రాన్సు కూటమి గట్టటం తమకు ప్రమాదమని జర్మనీ భావించింది. ఐరోపా రెండు శిబిరాలుగా తయారైంది.జర్మనీ ప్రోద్బలంతో సెర్బియాపై ఆస్ట్రియా-హంగరీ 1914లో యుద్దం ప్రకటించగా రష్యా వ్యతిరేకించింది.ఫ్రాన్సు కూడా సెర్బియాకు మద్దతు ఇచ్చింది. తటస్థంగా ఉన్న బెల్జియం మీద జర్మనీ యుద్ధం ప్రకటించటంతో ఐరోపాలో దాని ఆధిపత్యం పెరిగిపోతుందనే భయంతో బ్రిటన్‌ కూడా యుద్ధంలోకి దిగింది. ఇదంతా మూడున్నర దశాబ్దాల మధనం తరువాత జరిగింది. వైరుధ్యాలు పెరగటంతో మొదటి యుద్ధం తరువాత రెండవ ప్రపంచ యుద్దం రెండుదశాబ్దాల్లోనే వచ్చింది. అది ముగిసి ఎనిమిది దశాబ్దాలైంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసి కొందరు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు 1930దశకంలో ఉన్న పరిస్థితి ఉందని అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెబుతున్నారు.


అలాంటి వారి వాదనల ప్రకారం ఒక వైపు అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, ఇతర కొన్ని దేశాలు సమీకృతం అవుతున్నాయి. మరోవైపు చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా జట్టుకడుతున్నాయి.ఐరోపాలో అమెరికా, నాటో కూటమి కారణంగా ఉక్రెయిన్‌ రూపంలో వైరుధ్యం నడుస్తున్నది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు 1936-39 స్పెయిన్లో అంతర్యుద్ధం జరిగింది. మిలిటరీ తిరుగుబాటును ఫాసిస్టు జర్మనీ, ఇటలీ సమర్ధించగా మిలిటరీని వ్యతిరేకించిన శక్తులకు సోవియట్‌ యూనియన్‌ మద్దతు ఇచ్చింది. అమెరికా కూడా బాసటగా నిలిచింది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో జరుగుతున్న సైనిక చర్యను పశ్చిమదేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. చైనా తటస్థంగా ఉన్నప్పటికీ రష్యాకు అవసరమైన ఆర్థిక మద్దతు ఇస్తున్నది. ఇరాన్‌, ఉత్తర కొరియా ఆయుధాలు అందచేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో దేశాలు సైనికులను పంపితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. గాజాలో జరుగుతున్న మారణకాండపై పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా, మిగిలిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ చైనాలో అంతర్భాగమని అంగీకరిస్తూనే విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని పశ్చిమ దేశాలు విలీనాన్ని వ్యతిరేకించేశక్తులకు ఆయుధాలు అందచేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దేశాలను రెచ్చగొట్టి చైనాతో కవ్వింపుకు పూనుకున్నాయి. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్‌ సంయుక్తంగా మిలిటరీ విన్యాసాల పేరుతో బల ప్రదర్శన చేశాయి.
గతంలో దేశాలను ఆక్రమించుకొనేందుకు పోరు జరగ్గా ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవటంతో మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు చూస్తున్నారు.దానికి అనుగుణంగానే పెట్టుబడిదారీ దేశాలు ముందుకు తెచ్చిన ప్రపంచీకరణ. అది కూడా వాటికి ఆశించిన మాదిరి లాభాలు తేలేదు.దాన్ని పక్కన పెట్టి రక్షణాత్మక చర్యలకు తెరలేపారు. వాటిలో ఒకటే దిగుమతి పన్నుల వడ్డింపు, దీన్నే వాణిజ్య యుద్దం అని కూడా అంటున్నారు. దీనికి అనుబంధంగానే సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అడ్డుకొనేందుకు సాంకేతిక యుద్దాన్ని కూడా ప్రారంభించారు. వాణిజ్య ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థలు మరింత దగ్గర కావటానికి బదులు దూరం జరుగుతున్నాయి.కొత్త సమస్యలు, సవాళ్లను ముందుకు తెస్తున్నాయి.ఆంక్షల కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్థిక ఉత్పత్తి ఏడు శాతం లేదా 7.4లక్షల కోట్ల డాలర్లమేరకు తగ్గుతుందని గతేడాది ఆగస్టులో ఒక అంచనా వెలువడింది.2019 తరువాత వాణిజ్య ఆంక్షలు మూడింతలు పెరిగి 2022 నాటికే మూడువేలకు పెరిగినట్లు ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు.


డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా మీద ప్రారంభించిన యుద్ధాన్ని జో బైడెన్‌ కూడా కొనసాగించాడు. ఉక్రెయిన్‌ వివాదంతో రష్యా మీద వాణిజ్య ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అణుకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదనే సాకుతో ఇరాన్‌పై అంతకు ముందు నుంచే ఆంక్షలు ఉన్నాయి. పశ్చిమ దేశాలు చైనా మీద ఒక వైపు ఆధారపడుతూనే మరోవైపు దాన్ని దెబ్బతీసేందుకు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో తన ఉత్పత్తులకు చైనా కొత్త మార్కెట్లను వెతుకుతోంది.వర్ధమాన, పేద దేశాల మీద ఎక్కువగా కేంద్రీకరిస్తోంది. డాలరుకు బదులు ప్రత్యామ్నాయ నగదు లావాదేవీలను ముందుకు తెచ్చేందుకు అనేక దేశాలు చూస్తున్నాయి. పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరినట్లు చెప్పలేము గానీ ఆందోళన కలిగిస్తున్నాయని,ప్రపంచదేశాలు అమెరికా, చైనా, అలీనదేశాల కూటములుగా చీలిపోతున్నాయని ఐఎంఎఫ్‌ అధికారిణి గీతా గోపినాధ్‌ చెప్పారు. తగ్గుతున్న తన పట్టు నిలుపుకొనేందుకు అమెరికా చూస్తుండగా, చైనా, రష్యా దాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా విజయం సాధిస్తే ఇతర దేశాల మీద కేంద్రీకరిస్తాడంటూ పుతిన్‌ గురించి పశ్చిమదేశాలు రెచ్చగొడుతున్నాయి.


ప్రపంచంలో కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ అవి ప్రపంచ యుద్ధానికి దారితీసేవిగా లేవన్నది ఒక అభిప్రాయం. రెండు ప్రపంచ యుద్ధాలూ ప్రపంచ దేశాల ఆక్రమణల కోసం సామ్రాజ్యవాద దేశాల మధ్య వచ్చిన తగాదా కారణంగా జరిగాయి. గతంలో సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల మాదిరి ఒక సోషలిస్టు కూటమి వంటిది లేకపోయినప్పటికీ ప్రధాన వైరుధ్యం సోషలిజం-పెట్టుబడిదారీ విధానం మధ్యనే ఉంది. సామ్రాజ్యవాద దేశాలు జి7 కూటమి పేరుతో ఒక్కటిగా ఉంటూ ప్రపంచ మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు చూస్తున్నాయి తప్ప దెబ్బలాడుకోవటం లేదు. చైనా,వియత్నాం, క్యూబాలను దెబ్బతీసేందుకు విడివిడిగా, ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. జి7 దేశాలు రష్యాను కూడా తమతో కలుపుకొని జి8గా మారి జూనియర్‌ భాగస్వామిగా చేసుకొనేందుకు చూడటంతో రష్యా అంగీకరించలేదు. అందుకే దాన్ని పక్కన పెట్టి కత్తిగట్టాయి. తరువాత ఏం జరుగుతుందో తెలియదుగాని ప్రస్తుతానికి అనివార్య స్థితిలో చైనాకు రష్యా దగ్గరకావాల్సి వచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు చైనాకూ రష్యా, ఇరాన్‌ వంటి దేశాల అవసరం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు నాజీ కూటమిని ఓడించేందుకు సోవియట్‌తో చేతులు కలపాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడిదారీ విధానం ముందుకు పోవటానికి, నూతన మార్కెట్ల వేటలో ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దాంతో పెట్టుబడిదారీ దేశాలు గతం మాదిరి రక్షణ చర్యలకు దిగాయి.గడచిన పది సంవత్సరాల్లో అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఉత్పాదకరంగంలో పెరుగుదల దాదాపు లేదు.అమెరికా వాణిజ్య లోటును తగ్గించటంలో కూడా ట్రంప్‌, బైడెన్‌ విఫలమయ్యారు.రక్షణాత్మక చర్యలు కూడా విఫలమయ్యాయి. సోషలిస్టు దేశాలు యుద్ధాన్ని కోరుకోవటం లేదు. అదిరించి బెదిరించి తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు చూస్తున్నాయి తప్ప సామ్రాజ్యవాదులు యుద్ధం చేసే స్థితిలో లేరు. ఈ పూర్వరంగంలో కుట్ర సిద్దాంతాలు చెబుతున్నట్లు ఇప్పటికైతే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే స్థితి లేదు. అయితే పెట్టుబడిదారీ విధానం సంక్షోభం, వైఫల్యాన్ని అధిగమించేందుకు ఎంతకైనా తెగిస్తుందనే అంశాన్ని సదా గమనంలో ఉంచుకోవాలి.

మహాత్మాగాంధీకి ప్రపంచ గుర్తింపు – నరేంద్రమోడీ అజ్ఞానమా ? అవమానించారా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పద్దెనిమిదవ లోక్‌సభ చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. భక్తులకు వినసొంపుగా వారు కోరుకున్నట్లుగా, వ్యతిరేకులకు అనేక విమర్శనాస్త్రాలు అందిస్తూ, నిష్పాక్షికంగా వాస్తవాలను పరిశీలించేవారు అవాక్కయ్యే విధంగా ఎన్నికల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ ప్రక్షాళన కోసమో, మరొకదానికోసమో 45 గంటల పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ధ్యానదీక్ష చేశారు.నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితాలు, పర్యవసానాలు, విమర్శల గురించి పట్టించుకోకు మౌనవ్రతమే నీ ఆయుధం అన్నట్లుగా దేవుడి అంశతో జన్మించినట్లు చెప్పుకున్న మోడీ కార్యాచరణలో నిమిత్తమాత్రుడు తప్ప ఆటాడించిందీ, మాట్లాడించిందీ ఆ దేవుడే గనుక ప్రతిష్టో అప్రతిష్టో ఆయన ఖాతాకు తప్ప మోడీకి కాదని వేరే చెప్పనవసరం లేదు. పచ్చి అవాస్తవాలు,ఎడారిలో సముద్రాల మాదిరి మాటలు, ప్రలోభాలు, బెదరింపులు,బ్రతిమిలాటలు ఇలా ఎన్నో. సకలకళా వల్లభుల ప్రదర్శనలను దేశం చూసింది. మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఓటర్లు తమ తీర్పునిచ్చారు. జూన్‌ నాలుగున వెలువడే ఫలితాలలో గెలిచిన పార్టీల, అభ్యర్థుల హడావుడి, ఓడిన పార్టీలు, అభ్యర్థుల వాదనలు, వేదనలు సరేసరి.. ఏ పార్టీ లేదా ఏ కూటమికి మెజారిటీ రాకుండా హంగ్‌ ఏర్పడితే ఏం జరుగుతుందో అనూహ్యం. ఎన్‌డిఏ-ఇండియా కూటమి రెండూ మెజారిటీ సాధనకు తలపడతాయి. చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు వరకు కింగ్‌మేకర్లుగా మారతాయి.తరువాత వాటి భవిష్యత్‌ చెప్పలేము.చిన పాముపు పెద పాము, చిన చేపను పెద చేప మింగినట్లుగా జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ 272 సాధించుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.గత ఎన్నికలను చూసినపుడు 2014లో బిజెపి 31శాతం ఓట్లతో 282 సీట్లు తెచ్చుకుంది,2019లో 37.3శాతం ఓట్లు 303 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2014లో 19.31శాతం ఓట్లు 44 సీట్లు, తదుపరి ఎన్నికల్లో 19.46శాతం ఓట్లు, 52 సీట్లు తెచ్చుకుంది. బిజెపి హిందూత్వను ఎంతగా రెచ్చగొట్టినా, నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్టుగా జనం ముందుకు తెచ్చినా గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రాలేదు. అదే కాంగ్రెస్‌ను చూస్తే ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు.2014కు ముందు జరిగిన ఎన్నికల్లో బిజెపి తెచ్చుకున్న 18.8శాతం ఓట్లను 31శాతానికి పెంచుకోగా, కాంగ్రెస్‌ 28.55 నుంచి 19.31శాతానికి కోల్పోయింది. అంతకు ముందు ఎన్నికలతో పోల్చితే 2014లో బిజెపి 12.2శాతం అదనంగా తెచ్చుకోగా 2019లో అదనంగా 6.36శాతం తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 2014తో పోల్చితే 2019లో 0.18శాతం ఓట్లు అదనంగా తెచ్చుకుంది. తినబోతూ రుచెందుకు అన్నట్లుగా 2024లో తీరుతెన్నుల గురించి జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రేమ కోసం, యుద్ధంలో గెలుపుకోసం అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఈ ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి నేతల ప్రసంగాల తీరు ఉంది. ఎవరేమనుకుంటే మాకేటి అన్నట్లు వ్యవహరించారు.చివరి దశలో ప్రధాని నరేంద్రమోడీ ఎబిపి టీవీ ఛానల్‌కు జర్నలిస్టులతో మాట్లాడుతూ రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమా తీసిన తరువాతే మహాత్మాగాంధీ ఎవరు అనే ఉత్సుకత ప్రపంచంలో పెరిగిందని చెప్పారు. నిజానికి ఇది ఎన్నికల అంశంగా ఏ పార్టీ కూడా ప్రస్తావన తేలేదు. ఆకర్షణీయమైన నేతలు తప్పులు ఎందుకు చేస్తారంటూ ”అవెంటస్‌ ” పార్టనర్స్‌ అనే ఒక వెబ్‌సైట్‌లో తేదీలేని ఒక సర్వే విశ్లేషణ ఉంది. నేతలు అందునా ఉత్తమ నేతలు కూడా అవివేకమైన తప్పులు తరచుగా చేస్తుంటారని పేర్కొన్నది.పదవి మరియు తెలివితేటల కారణంగా మితిమీరిన విశ్వాసం మరియు అధికారంతో తీవ్రమైన తప్పులు చేస్తుంటారని దీన్ని సైద్దాంతిక వేత్తలు (హ్యూమన్‌ ఫోలీ) మానవ అజ్ఞానం లేదా మూర్ఖత్వమని పిలిచారని పేర్కొన్నది. దానిలో పేర్కొన్న ఐదు తప్పుల సారం ఇలా ఉంది. సంవత్సరాల తరబడి నిరంతరం అందుకునే ప్రశంసల కారణంగా అత్యధిక నేతలు తమ తెలివితేటలు, సామర్ధ్యాల గురించి తిరుగులేని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారట.కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో తమ మీద తమకు ఏర్పడిన అతివిశ్వాసం కారణంగా ఇతరులు వెల్లడించే అభిప్రాయాలు, సూచనలను పట్టించుకోరు, దీంతో చురుకైన నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందట. సూక్ష్మ నిర్వహణ(మైక్రోమేనేజ్‌మెంట్‌) సమస్య నేతలకు మాత్రమే కాదు సంస్థలలోనూ ఉంది.నాయకత్వ స్థానాల్లో సూక్ష్మ నిర్వహణ, బదలాయింపు లేకపోతే మొత్తం జట్టు మీద ప్రభావం చూపుతుంది. సంక్షోభ సమయాల్లో చురుకైన నేతలు జట్టు హస్తం అందుకొనేందుకు చూస్తారు, కానీ కొత్త ఆలోచనల అన్వేషణలో వారి ఆసరా తీసుకోరు. చురుకైన నేతలు తాము రూపొందించిన నిబంధనలను పాటించటంలో విఫలమైనపుడు ఆ సంస్థల విలువలు, సూత్రాల మీదనే సందేహాలు తలెత్తుతాయి. తరువాత వాటన్నింటినీ పరిరక్షించాల్సిన వ్యక్తి విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతుంది. చురుకైన వారు ఇతరులు చెప్పేదానికి విలువ ఇవ్వరు. తమకు సలహాలు ఇచ్చేంత గొప్పవారా అనుకుంటారు.తమ తప్పును అంగీకరించరు. తరచుగా మంచిచెడ్డల స్వీకరణ నిలిపివేత వీరు చేసే అవివేకమైన తప్పు. బలమైన నేతలకు అవకాశాలు సులభంగా వచ్చినపుడు అన్నింటినీ చేసేయగలమనే వ్యక్తిత్వాలను పెంచుకుంటారు. లక్ష్యాలను పెద్దగా నిర్ణయించుకుంటారు, అనుకున్న విధంగా జరగకపోతే తగిన ప్రయత్నం లేకపోవటం అనుకుంటారు.వాస్తవ విరుద్దమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ఎలాగైనా సాధించాలనుకొని జనాలను ఇబ్బందుల్లోకి నెడతారు. చురుకైన తెలివితేటలు కలిగిన వారందరూ పైన పేర్కొన్న లక్షణాలు, ధోరణులు గల నేతలు ఎవరన్నది ఎవరికి వారు అన్వయించుకొని ఒక అంచనాకు రావచ్చు.


నరేంద్రమోడీని అనేక మంది చురుకైన, ఆకర్షణ కలిగిన నేత అని చెబుతారు. ఆయనకు ఉందని చెబుతున్న పట్టా రాజకీయ శాస్త్రంలో అని కూడా అందరం చదువుకున్నదే. అలాంటి వ్యక్తికి చరిత్ర తెలియదా లేక కావాలనే ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను వక్రీకరించినట్లుగా జాతిపిత గురించి కూడా మాట్లాడారా ? రెండూ వాస్తవం కావచ్చు. ప్రపంచ వలస దేశాల చరిత్రను చూసినపుడు మనదేశమంత పెద్దది బ్రిటీష్‌ సామ్రాజ్యంలో మరొకటి లేదు. వారి పాలనను అంతం చేసిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారెవరు అన్న చర్చ జరిగినపుడు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే మహాత్మాగాంధీ అని ప్రపంచం తెలుసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో గాడ్సే గురించి తప్ప గాంధీ గురించి పెద్దగా బోధించి ఉండరు. భగవద్గీత వంటి గ్రంధాల కంటే ” నేనెందుకు గాంధీని చంపాను ” అంటూ గాడ్సే కోర్టులో మాట్లాడిన అంశాలను పెద్ద ఎత్తున బోధిస్తారని వినికిడి. ఆ పుస్తకాన్ని అచ్చువేసి, పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన అంశం తెలిసిందే.మహాత్మాగాంధీ జాతిపిత అని ఎవరు చెప్పారు, ఎలా అయ్యారంటూ, దేశానికి చేసిన ద్రోహాలంటూ వాట్సాప్‌ యూనివర్సిటీలో ప్రచారం చేసే ఊరూపేరు చెప్పుకొనేందుకు ధైర్యం లేని చీకటి బతుకుల బాపతు ఎవరు అన్నది వేరే చెప్పనవసరం లేదు.


మహాత్ముడు కాక ముందు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే బహుశా ఆయన తండ్రి లాగూలు(అప్పటికి నిక్కర్లు వచ్చి ఉండవు) వేసుకొంటున్న సమయానికే 1920దశకంలోనే మోహనదాస్‌ కరంచంద్‌ గాంధీ గురించి పశ్చిమ దేశాలలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణ్యంగా తిరగరాస్తున్నది. గాంధీ హత్య నేపధ్యం గురించి భావితరాలకు తెలియకూడదు అనే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా 2022జూన్‌లో రాజకీయ శాస్త్రంలో ఉన్న అంశాలను తొలగింపచేయించిన ఉదంతం తెలిసిందే.ఏమిటవి ? ” పాకిస్తాన్‌ ముస్లింలకు అన్నట్లుగా ఇండియా హిందువుల దేశంగా మారాలని లేదా హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నవారికి ప్రత్యేకించి ఆయన(గాంధీ) అంటే అయిష్టం…హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉండాలనే స్థిరమైన అనుసరణతో రెచ్చిపోయిన హిందూ ఉగ్రవాదులు ఆ మేరకు అనేక సార్లు గాంధీజీని హత్య చేసేందుకు చూశారు….గాంధీజీ మరణం దేశంలో ఉన్న మతపరిస్థితిపై దాదాపు మాయా ప్రభావం(మేజికల్‌ ఎఫెక్ట్‌) చూపింది…..మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్న సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వంటి సంస్థలపై కొంత కాలం నిషేధం విధించింది…” ఇలాంటి కుదురు నుంచి వచ్చిన నరేంద్రమోడీ నోట మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి అని వెలువడటం వెనుక చిత్తశుద్ది ఉందని ఎవరైనా అనుకోగలరా ?


ఇంతకీ మహాత్ముడి గురించి నరేంద్రమోడీ సెలవిచ్చిందేమిటి ? ప్రతిపక్షాలు రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు, ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా అని ఎబిపి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన మోడీ ప్రతిపక్షం బానిసత్వ భావనలనుంచి బయటకు రాలేదు అంటూ ” మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గురించి ప్రపంచం తెలుసుకొనే విధంగా ఈ 75 సంవత్సరాలలో చేయాల్సిన బాధ్యత మనది కాదా ? మహాత్మా గాంధీ గురించి ఎవరికీ తెలియదు. గాంధీ సినిమా తీసిన తరువాత మాత్రమే ఈ మనిషి ఎవరన్న జిజ్ఞాస ప్రపంచంలో పెరిగింది.మనమాపని చేయలేదు. అది మన బాధ్యత. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గురించి ప్రపంచానికి తెలిసిందంటే, దక్షిణాఫ్రికానేత నెల్సన్‌ మండేలా ప్రపంచానికి తెలిశారంటే వారికంటే గాంధీ తక్కువేమీ కాదు. మీరు దీన్ని అంగీకరించాలి.ప్రపంచమంతా తిరిగిన తరువాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను” అని మోడీ చెప్పారు. బ్రిటీష్‌ సినిమా దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమాతీశాడు, బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్ర పోషించాడు. దానికి పదకొండు అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమా తరువాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పటం మహాత్ముడిని అవమానించటం తప్ప మరొకటి కాదు.ఆ సినిమా తరువాతనే నాకు గాంధీ గురించి తెలిసిందని మోడీ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటం మీద గాంధీ ప్రభావం గురించి స్వయంగా నెల్సన్‌ మండేలానే చెప్పారు. ఆ పోరాటం గాంధీ సినిమా చూసిన తరువాత ప్రారంభం కాలేదు.


మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్‌కు సిఎంగా పని చేసిన నరేంద్రమోడీ అమ్మా గూగులమ్మా మా గాంధీ గురించి కాస్త చెప్పమ్మా అని మోడీ అడిగినా, ఆయన సిబ్బంది అడిగినా గాంధీ సినిమాకు ముందు, తరువాత కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి. సామాజిక మాధ్యమంలో ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదు. గాంధీ గురించి ఉన్న వెబ్‌సైట్‌ను అసలు ఒక్కసారైనా చూసి ఉంటారా అన్నది అనుమానమే. చూసి ఉంటే ఇలా మాట్లాడేందుకు ధైర్యం చేసి ఉండేవారు కాదు.బ్రిటన్‌ వార పత్రిక గ్రాఫిక్‌లో 1922లో గాంధీ అరెస్టయినపుడు గాంధీ గురించి రాశారు. నైరోబీలో గాంధీ అరెస్టు గురించి చేసిన ఆందోళనపై రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అదే ఏడాది లాహౌర్‌ నుంచి వెలువడిన సివిల్‌ మరియు మిలిటరీ గెజెట్‌లో ప్రచురించారు.” సదాచార గాంధీ :1930వ సంవత్సర పురుషుడు ” అంటూ టైమ్‌ పత్రిక 1931 జనవరి ఐదవ తేదీన ప్రచురించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1930లో గాంధీతో పాటు అరెస్టు అయిన 30వేల మందిని ఏం చేయాలా అని బ్రిటీష్‌ సామ్రాజ్యం భయంతో ఉంది. ఆ ఏడాది చివరిలో ఒక అర్దనగ మనిషిని చూసింది, ప్రపంచ చరిత్ర 1930లో ఆ మనిషి సంకేతం నిస్సందేహంగా అన్నింటికంటే పెద్దది ” అని దానిలో రాసింది. అదే ఏడాది సెప్టెంబరు 20న అమెరికా నుంచి వెలువడే బర్లింగ్టన్‌ హాక్‌ ఐ అనే పత్రిక ఒక పూర్తి పేజీ కేటాయించి గాంధీ గురించి రాసింది.” ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన మనిషి ” అనే శీర్షిక పెట్టింది. రాట్నం వడుకుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అమెరికా ఫొటోగ్రాఫర్‌ మార్గరెట్‌ బుర్కే వైట్‌ తీసిన దాన్ని 1946 మే 27వ తేదీన లైఫ్‌ అనే పత్రిక ” భారత నేతలు ‘ అనే శీర్షికతో ప్రచురించింది.


మహాత్మాగాంధీ హత్య గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక పతాక శీర్షికతో ప్రచురించింది.” ఒక హిందూ చేతిలో గాంధీ హత్య, కంపించిన భారత్‌,కొట్లాటల్లో బాంబేలో 15 మంది మృతి ” అని రాసింది.గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్టు, డెయిలీ టెలిగ్రాఫ్‌ వంటి పత్రికలన్నీ పతాక శీర్షికలతో గాంధీ హత్య వార్తను ప్రచురించాయి. గాంధీతో ప్రముఖ సినిమా నటుడు చార్లీ చాప్లిన్‌ భేటీ, ఆల్బర్ట్‌ ఐనిస్టీన్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, గాంధీ గురించి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ రాసిన అంశాలన్నీ సుపరిచతమే.అమెరికా జర్నలిస్టు లూయీస్‌ ఫిశ్చర్‌ 1950లో ” మహాత్మాగాంధీ జీవితం ” పేరుతో రాసిన జీవిత చరిత్రను ఎంతో మంది చదివారు. గాంధీ సినిమాకు ముందే అనేక దేశాలు గాంధీ గౌరవార్ధం పోస్టల్‌ స్టాంపులను ప్రచురించాయి. ఇంత ప్రాచుర్య చరిత్ర ఉంటే నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్దమే గాక అసహ్యం కలిగిస్తున్నట్లు విమర్శలు వెలువడ్డాయి.

పారిస్‌ ఒలింపిక్స్‌లో చైనా వస్తువుల సందడి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా రియలెస్టేట్‌ రంగంలో తలెత్తిన కొన్ని సమస్యలను చూపి ఇంకేముంది అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అంటూ కొంత మంది విశ్లేషణలు చేశారు, పండగ చేసుకున్నారు. కానీ అదే చైనా వస్తువులు ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11వరకు జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో పెద్ద మొత్తంలో దర్శనమివ్వనున్నాయి.క్రీడా పతకాలతో పాటు ప్రపంచ ఫ్యాక్టరీగా తన సత్తా ఏమిటో చూపనుంది. చైనా తూర్పున ఉన్న జెజియాంగ్‌ రాష్ట్రంలో ‘ఇవు’ అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌ ఉంది. అది ఎంత పెద్దది అంటే నలభైలక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన సముదాయం, 75వేల దుకాణాలు ఉన్నాయి. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ ఇతివృత్తంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దిగుమతిదారులు పెద్ద సంఖ్యలో ఆ మార్కెట్‌ను సందర్శించి వస్తువులకు ఆర్డర్లు పెట్టారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల నుంచి ఈ సందడి ప్రారంభమైంది.ఈ వాణిజ్య, పారిశ్రామిక కేంద్రం నుంచి ఒక్క పారిస్‌ ఒలింపిక్స్‌కే కాదు, అమెరికా, ఐరోపాదేశాల్లో జరిగే అని ప్రముఖక్రీడలకూ అవసరమైన వస్తువులను ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. జూన్‌ మాసం వరకు ఒలింపిక్‌ ఆర్డర్ల తయారీకి ఒప్పందాలు కుదిరాయి.జెర్సీలు, ట్రోఫీలు, మెడల్స్‌ ఒకటేమిటి అన్ని రకాల క్రీడా సామగ్రి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి.టేబుల్‌ టెన్నిస్‌ బంతుల్లో తక్కువ రకం ధర 0.083 డాలర్లు (రు.6.90) ఉంది.పారిస్‌ ఒలింపిక్స్‌లో వాడే ఆరుబంతుల ధర.460గా ఉంది.


అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మొత్తంగా ఫ్రాన్స్‌కు ఈ మార్కెట్‌ కేంద్రం నుంచి ఎగుమతులు 42శాతం పెరగ్గా వాటిలో క్రీడావస్తువుల పెరుగుదల 70శాతం ఉందంటే పారిస్‌ ఒలింపిక్సే కారణం.జెజియాంగ్‌ రాష్ట్ర జనాభా 5.75 కోట్లు. ఇక్కడ ప్రధానంగా వస్త్రాల వంటి వినిమయ వస్తువులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుంచి వస్తువులను కొనుగోలు చేసేవారు వేరే దేశాలకు మరలుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తుతయారీ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తుల మీద చైనా కేంద్రీకరించింది. దీనికి తోడు వేతనాల పెరుగుదల వంటి కారణాలతో కొన్ని సంస్థలు ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడికి వెళ్లటం బహిరంగ రహస్యం.దీనికి తోడు వాణిజ్య ఆంక్షలు, సుంకాల విధింపు, ప్రపంచ రాజకీయాలూ పని చేస్తున్నాయి.ఇన్ని కారణాలున్నా ప్రపంచ సరఫరా గొలుసు నుంచి చైనాను తప్పించటం ఇప్పట్లో జరిగేది కాదన్నది పచ్చినిజం. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తువులు చైనా మొత్తం ఎగుమతుల్లో 2017లో 18శాతం ఉండగా 2023లో 17శాతానికి మాత్రమే తగ్గాయి. ఇదంతా అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం తరువాత జరిగిన పరిణామం.


చైనాలో తలెత్తిన రియలెస్టేట్‌ సమస్యలకూ పారిశ్రామిక ఉత్పత్తులకు కొందరు ముడిపెడుతున్నారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 5.3శాతం కాగా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు 6.1శాతం కాగా పెట్టుబడులు పదిశాతం వరకు పెరిగాయి. మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నవారే అవసరాలకు మించి ఉత్పత్తి చేసి తమ దేశాల్లో కుమ్మరిస్తున్నట్లు గగ్గోలు పెడతారు.ఈ ఏడాది ప్రారంభంలో చైనా పారిశ్రామికరంగ వినియోగం 75శాతం ఉంది. తీసుకున్న ఆర్డర్లను వేగంగా సకాలంలో పూర్తి చేసి ఇవ్వటంలో చైనా తిరుగులేనిదిగా ఉంది.పారిస్‌ ఒలింపిక్స్‌ వస్తువుల విషయంలోనూ అదే నమ్మకం ఉన్నకారణంగా వ్యాపారులు ఎగబడ్డారు.తక్కువ ధరలకు అందించటంతో పాటు సకాలంలో సరఫరా ఇక్కడ ముఖ్యం.జెజియాంగ్‌ రాష్ట్రంలో 78 పారిశ్రామిక పార్కులుంటే వాటిలో నాలుగున్నరవేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.వాటికి స్థానిక సంస్థలు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నందున ఆధునిక ప్రమాణాలతో కూడిన ఉత్పాదక పద్దతులతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మార్కెట్‌ ధోరణులను పసిగట్టి అందుకనుగుణ్యంగా ఉత్పత్తుల్లో మార్పులు చేయటం చైనా ప్రత్యేకత అని చెప్పవచ్చు.ఈ కారణంగానే ప్రపంచంలో పెద్ద వాటిలో ఒకటైన షి ఇన్‌ ఫ్యాషన్‌ కంపెనీ వారానికి 50వేల కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండగా జారా అనే కంపెనీ ఏటా పాతికవేలను ఉంచుతున్నది. భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న కారణంగా చైనాలో ఖర్చు తగ్గుతుంది, దాంతో చౌక ధరలకు విక్రయించగలుగుతున్నది.తనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన విధానాలను రూపొందిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనాకు ఇతర దేశాలు ఎంత అవసరమో, ప్రపంచానికి దాని అవసరమూ అంతే ఉంది. పరస్పర ఆధారాన్ని ఎవరు దెబ్బతీసినా రెండు పక్షాలూ నష్టపోతాయి.


చైనాలో మే ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మేడే సెలవలు ఇస్తారు. ఈ సందర్భంగా జరిగే వస్తు విక్రయాలు చైనా ఆర్థిక వ్యవస్థ, పౌరుల కొనుగోలు శక్తిని అంచనా వేసేందుకు ఒక కొలబద్దగా పరిగణిస్తారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో నమోదైన వివరాలు చైనా తిరిగి కోలుకోవటమే కాదు పెరగటాన్ని సూచించాయి. మే ఒకటవ తేదీన ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన వివరాల ప్రకారం 28 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఇవి కరోనాకు ముందున్న స్థాయిని దాటినట్లు పేర్కొన్నారు.జల, వాయు, భూ మార్గాలలో జరిగే ఈ ప్రయాణాలతో రవాణా సంస్థలే కాదు, పర్యాటక రంగం, వస్తూత్పత్తి ఇతర సేవారంగాలు కూడా లబ్దిపొందుతాయి. అనేక దేశాలకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చైనా పౌరులు విహార యాత్రలకు వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలూ, చైనా కూడా లబ్దిపొందుతున్నది. ఐదు రోజుల మేడే సెలవుల్లో 5,800 విమానాలు 9.18లక్షల మంది ప్రయాణీకులను చేరవేస్తాయని అంచనా వేశారు.జపాన్‌, దక్షిణ కొరియాలకు ఎక్కువ మంది వెళతారు.ఈ సారి 2019తో పోలిస్తే ఈ ఏడాది 20శాతం ఎక్కువగా ఈ దేశాలకు టికెట్లను కొనుగోలు చేశారు.ఇతర దేశాలకూ ఇదే రద్దీ ఏర్పడింది.


ఆధునిక పరిజ్ఞానంలో గతంలో చైనా ఎంతో వెనుకబడి ఉండేది. ఇప్పుడు కొన్ని రంగాలలో పశ్చిమ దేశాలను సవాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జనం నోళ్లలో నానుతున్న కృత్రిమ మేథ(ఏఐ)లో చైనా పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముందుకు వస్తుందేమో అన్న భయంతో అమెరికాకు నిదురబట్టటం లేదంటే అతిశయోక్తి కాదు. మేథోసంపత్తి హక్కులున్న నమూనాలకు బదులు అందరికీ అందుబాటులో(ఓపెన్‌ సోర్స్‌) ఉన్న వనరుల మీద చైనా కేంద్రీకరిస్తున్నది. ఇప్పటి వరకు అనేక బడా కంపెనీలు కొన్ని ఉత్పత్తులపై పేటెంట్‌ హక్కులను పొంది విపరీతంగా లాభాలు పొందుతున్న సంగతి తెలిసిందే.కృత్రిమ మేథ అలాంటి కంపెనీలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. మేథో విజ్ఞానాన్ని మానవ కల్యాణానికి బదులు మారణాయుధాలు తయారు చేసేందుకు, తమకు లొంగని దేశాల వ్యవస్థలను దెబ్బతీసేందుకు వినియోగించిన చరిత్ర పశ్చిమదేశాలది. వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని పెద్ద ఖర్చు లేకుండానే మన భాషలో తర్జుమా చేసుకొని చదువుకోవచ్చు. మనదేశంలో దుర్వినియోగం చేస్తూ జనాన్ని తప్పుడు సమాచారంతో పక్కదారి పట్టిస్తున్న తీరు ఇప్పటికే చూస్తున్నాము. ఈ రంగంలో చైనా పురోగతిని చూసి అది కూడా తమ మాదిరే వ్యవహరిస్తే అని ఊహించుకొని ఏఐతో చైనా ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుందని, సైబర్‌దాడులు, జీవాయుధాల తయారీ వంటి వాటికి వినియోగించనుందంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.లైనక్స్‌, హ్యూమన్‌ జినోమ్‌, ఇమేజ్‌నెట్‌, పైటార్చ్‌ వంటి అందరికీ అందుబాటులో ఉన్న వనరులతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో లబ్దిపొందవచ్చు,విద్యార్ధులు, పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయోగం.చైనా కంపెనీల విజయానికి ఇదొక ప్రధాన కారణం.వారి నుంచి ఇతర దేశాలు ఎంతో నేర్చుకుంటున్నాయి.చైనాతో పోటీ పడాలని అమెరికాలోని అనేక మంది తమ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.
తెలివితేటలు కేవలం కొందరి సొంత అన్న భ్రమలు కలిగిన వారికి అవి పటాపంచలయ్యాయి.కృత్రిమ మేథతో ప్రయోజనాలకంటే ప్రమాదాలే ఎక్కువ అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. గూండాల చేతుల్లో పడితే చాకులు మారణాయుధాలుగా మారతాయి గనుక ఎక్కువ మందికి వినియోగపడే వాటిని తయారు చేయటం మానుకుంటామా ? అణుబాంబులు కలిగి ఉన్న చైనా, రష్యా కృత్రిమ మేథతో వాటిని మోహరించేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రమాదమమని అమెరికా గుండెలు బాదుకుంటోంది. అవసరం లేకున్నా ప్రపంచాన్ని భయపెట్టేందుకు, తమకు లొంగనివారికి ఇదే గతి అని హెచ్చరించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ చివరి రోజుల్లో జపాన్‌ మీద అణుబాంబులు వేసిన దుర్మార్గానికి అమెరికా పాల్పడిన సంగతి తెలిసిందే. అణుబాంబులు దాని వద్ద, మిత్రదేశాలుగా ఉన్న బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర కూడా ఉన్నాయి. అవి దుర్వినియోగానికి పాల్పడవన్న హామీ ప్రపంచానికి లేదు. ఆధునిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ తమ అధికారులు చైనాతో సంప్రదింపుల్లో చెప్పినట్లు అమెరికా అధ్యక్ష భవనం ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. కృత్రిమ మేథను దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారకొనసాగింపులో ఇదొక భాగం.చైనాతో వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానంలో పోటీపడలేమని, దానితో ఏదో ఘర్షణ పడటం వలన ప్రయోజనం లేదని అమెరికాకు అవగతమైందంటున్నవారూ లేకపోలేదు.


గత రెండు దశాబ్దాల్లో చైనా సాధించిన ప్రగతిని చూసి అమెరికాలో తీవ్ర మధనం జరుగుతోంది.దాన్నింక ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని అనేక మంది భావిస్తున్నారు. మార్చినెలలో అధ్యక్షుడు జో బైడెన్‌ తన పౌరులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ” చైనా పెరుగుతోంది, అమెరికా పడిపోతోందంటూ గత కొద్ది సంవత్సరాలుగా నా రిపబ్లికన్‌ మరియు డెమోక్రాట్స్‌ స్నేహితుల నుంచి వింటున్నాను ” అని చెప్పాడు.కరోనా తరువాత ఇంక చైనా పని అయిపోయింది, పెరగాల్సిన మేరకు పెరిగింది, ఇంక అవకాశం లేదు అని చెప్పేవారు తయారయ్యారు.కొందరు త్వరలో అమెరికాను అధిగమిస్తుందని, మాంద్యంలో కూరుకుపోతుందని చెప్పినవారూ ఉన్నారు.చైనా వృద్ధి వేగం తగ్గిన మాట నిజం.2021 నుంచి 2023 వరకు అమెరికా జిడిపిలో 76 నుంచి 67శాతానికి చైనాలో తగ్గిందని, అయినప్పటికీ 2019తో పోల్చితే 20శాతం పెద్దదని, కరోనా సమయంలో అమెరికా కేవలం ఎనిమిదిశాతమే పెద్దదన్నది మరచిపోవద్దని అంకెలు చెబుతున్నాయి. అమెరికాలో 2023జిడిపి పెరుగుదల రేటు 6.3శాతం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ వృద్దిరేటు 2.5శాతమే. అదే చైనాను చూస్తే జిడిపి వృద్ది రేటు 4.6శాతమైనప్పటికీ వాస్తవ వృద్ది 5.2శాతం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ వైరుధ్యానికి కారణం చైనాలో ద్రవ్యోల్బణం రేటు తక్కువ, అమెరికాలో ఎక్కువగా ఉండటమే.అమెరికాలో వడ్డీరేటు 2022 మార్చినెల నుంచి 0.25 నుంచి 5.5శాతానికి పెంచగా చైనాలో 3.7 నుంచి 3.45శాతానికి తగ్గించారు. అమెరికాలో వడ్డీరేట్లను తగ్గిస్తే ఎలా ఉండేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.

ఈజిప్టు ఫారోలా ! దేవరాజులా !! దేవదూత నరేంద్రమోడీ ఎవరి సరసన ? చరిత్రలో ఇలాంటి వారు చేసిన దుర్మార్గాలేమిటి ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎన్నికలు చివరిదశకు చేరాయి, 2024జూన్‌ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అది సక్రమంగా ఉంటుందా అంటూ ” దేవుడు లేదా దేవుడి ప్రతినిధి ” గురించి అనేక మంది ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వస్తే లేదా కోల్పోతే ఏం జరుగుతుంది. మొదటిదాని గురించి ఇండియా కూటమి ఇప్పటికే ప్రచారంలో పేర్కొన్నట్లు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగం, సామాజిక న్యాయానికి ముప్పు ఏర్పడుతుందని నమ్ముతున్నవారు ఉన్నారు.మోడీని ఒక వైపు కాంగ్రెస్‌కు గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావంటారు, ఇండియా కూటమి వస్తే ఏడాదికొకరు ప్రధాని పదవి చేపడతారంటారు. అదే నోటితో కాంగ్రెస్‌ అధికారానికి వస్తే మెజారిటీ భారతీయులు రెండవ తరగతి పౌరులుగా మారిపోతారని, మహిళల మెడల్లో ఉన్న పుస్తెలతో సహా ఆభరణాలన్నీ తీసుకొని చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు కలవారికి పంపిణీ చేస్తారని,క్రికెట్‌ జట్లలో ఎక్కువ మంది ముస్లింలను చేర్చుతారని, అయోధ్యలో రామాలయాన్ని కూల్చేందుకు బుల్డోజర్లు పంపుతారని ఆరోపిస్తారు. పరుచూరి బ్రదర్స్‌ చెప్పినట్లు ఒక జేబులో ఒకటి, మరోజేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే రాజకీయనేతగా మోడీ కనిపించటం లేదూ ! ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని సంఘపరివారం నిరంతరం చేస్తున్న ప్రచారం తెలిసిందే. తాను వారి గురించి కాదు అని తరువాత మోడీ మార్చారు. మరి ఎవరిని అన్నట్లు ? సమాజంలో ధనికులుగా ఉన్నవారు, ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసీ సామాజిక తరగతులతో పోల్చితే ఇతరులు పిల్లలను ఎక్కువగా కనటం లేదన్నది తెలిసిందే. అంటే ఆ మూడు సామాజిక తరగతుల మీదనే మోడీ ధ్వజమెత్తారని అనుకోవాలి మరి.లేకపోతే నరం లేని నాలుక అనుకోవాలి. ఇక రెండవ దృశ్యానికి వస్తే మోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫలితాన్ని గుర్తించను అంటూ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ మీదకు తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ఉదంతం ఇక్కడ ప్రతిబింబిస్తుందా ? అన్నది చూడాల్సి ఉంది.


నరేంద్రమోడీ నోటి వెంట ప్రమాదాన్ని సూచించే మరో మాట వెలువడింది. రాజులు దైవాంశ సంభూతులని వంది మాగధులు వర్ణించారు, పొగిడారు. ఏకంగా తామే దైవాంశ అని, దేవుళ్లమని చెప్పుకున్న వారిని చరిత్ర ఎందరినో చూసింది. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా మా నమో లీలలు వర్ణించతరమా అన్న పూనకంతో బిజెపి నేత సంబిత్‌ పాత్ర ఏకంగా పూరీ జగన్నాధుడే నరేంద్రమోడీ భక్తుడుగా మారినట్లు ”వెల్లడించిన” సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ పూరీలో రోడ్‌ షో జరిపిన తరువాత అక్కడ పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ” ప్రభువు పూరీ జగన్నాధుడు నరేంద్రమోడీ భక్తుడు, మేమంతా మోడీ కుటుంబసభ్యులం.ఇలాంటి మహత్తర క్షణాలను చూసిన తరువాత నా భావావేశాలను ఆపుకోలేను, ఒరియా వారందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు ” అని మాట్లాడారు.దీని మీద ప్రతికూల స్పందనలు తలెత్తటంతో క్షమించమని వేడికోళ్లకు పూనుకున్నారు.ఈ తప్పుకు గాను ఉపవాసం ఉండి ప్రాయచిత్తం చేసుకుంటానని చెప్పిన ఈ పెద్దమనిషిని ఎన్నికల్లో పూరీ జగన్నాధుడు ఏం చేస్తాడో చూడాలి.


దేవుడు దేశానికి ఇచ్చిన బహుమతి నరేంద్రమోడీ అని కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఎం వెంకయ్యనాయుడు 2016 మార్చి నెలలో సెలవిచ్చారు.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ పేదల పాలిట దైవాంశగల ఒక మహా పురుషుడు(మేషయ) అని కూడా వర్ణించారు. తరువాత విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మరో కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను విలేకర్లు ప్రశ్నించగా వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను తాను వినలేదని, ఆ ప్రసంగాన్ని అంతగా ఆలకించలేదని చెప్పారు.(బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక 2016 మార్చి 21వ తేదీ) ఇంతగా వ్యక్తి పూజ తలకెక్కిన తరువాత నిజంగానే తాను దేవుడు పంపిన దూతను అని నరేంద్రమోడీ నమ్మటంలో ఆశ్చర్యం ఏముంది. ఇతరులు మాట్లాడితే విమర్శలు తలెత్తటం, రభస ఎందుకు ఏకంగా తానే రంగంలోకి దిగి మాట్లాడితే నోరెత్తే మీడియా ఉండదు కదా అనుకున్నారేమో ! ” కారణ జన్ములు ” అనే శీర్షికతో సంపాదకీయం రాసిన ఒక ప్రముఖ తెలుగు పత్రిక నరేంద్రమోడీ పేరెత్తటానికి భయపడిందంటే గోడీ మీడియా అని ఎవరైనా అంటే తప్పేముంది. అత్యవసర పరిస్థితి సమయంలో దేవకాంత బారువా అనే కాంగ్రెస్‌ నేత ఇందిరే ఇండియా-ఇండియాయే ఇందిర అని పొగడ్తలకు దిగి అభాసుపాలైన సంగతి తెలిసిందే.óఅప్పుడు కూడా మీడియా నోరెత్తలేదు, ఎత్తిన వాటిని ఎలా సెన్సార్‌ చేశారో తెలిసిందే.


తన పుట్టుక అందరి మాదిరి కాదని, తనను దేవుడు పంపినట్లు నమ్మకం కలిగిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.న్యూస్‌ 18 అనే ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు.” నా తల్లి జీవించి ఉన్నంత వరకు నేను జీవసంబంధం (అందరి మాదిరే అమ్మా నాన్నలకు పుట్టినట్లు)గా పుట్టినట్లు భావించేవాడినని, ఆమె మరణం తరువాత నా అనుభవాలను చూస్తే నన్ను దేవుడు పంపినట్లు నిర్ధారించుకున్నాను. అందుకే దేవుడు నాకు సామర్ధ్యం, శక్తి, స్వచ్చమైన హృదయం, ఈ పనులు చేసేందుకు దైవావేశం కూడా ఇచ్చినట్లు భావిస్తున్నాను. దేవుడు పంపిన ఒక సాధనాన్ని తప్ప నేను మరొకటి కాదు ” అని చెప్పారు. కల్యాణమొచ్చినా కక్కొచ్చినా(వాంతి) ఆగదంటారు, ఇప్పుడు దీనికి మోడీ మనసులోకి ఏది వచ్చినా అనే దాన్ని కూడా జతచేసుకొని నవీకరించాలి. చివరి దశ ఎన్నికల్లోగా లేదా తరువాత అయినా తన జన్మ ఏ దేవుడి అంశో అన్న రహస్యాన్ని వెల్లడించినా ఆశ్చర్యం లేదు. అప్పటి వరకు గుజరాత్‌ ద్వారక కృష్ణుడా, అయోధ్య రాముడా, వారణాసి శివుడా ఎవరు పంపారన్నది జనాలు జుట్టుపీక్కోవాల్సిందే. జర్మన్‌ నాజీ హిట్లర్‌ స్వచ్చమైన ఆర్య సంతతి అని భావించిన సావిత్రీదేవి ముఖర్జీ అనే ఫ్రాన్సులో పుట్టిన గ్రీకు ఫాసిస్టు రాసిన పుస్తకంలో హిట్లర్‌ను విష్ణువు అవతారమని చెప్పింది. సదరు అవతారి ఒక మారణహౌమానికి ఎలా కారకుడయ్యాడో తెలిసిందే. అజిత్‌ కృష్ణ ముఖర్జీ అనే బెంగాలీని వివాహం చేసుకొన్న సావిత్రిదేవీ కొల్‌కతాలో జీవించి రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలకు వ్యతిరేకంగా జర్మన్‌ గూఢచారిగా పనిచేసి తరువాత నాజీగా జీవించింది.


ముందే చెప్పుకున్నట్లు చరిత్రను చూస్తే ఈజిప్టులో ఫారోలుగా వర్ణితమైన పురాతన రాజులు తమను దేవుళ్లుగా భావించుకోవటమే కాదు, పేర్లు కూడా అలాగే పెట్టుకొనే వారు. తదుపరి జన్మ కొనసాగింపుకోసం చచ్చిన రాజుల శవాలను మమ్మీలుగా మార్చి పిరమిడ్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కొందరు చైనా రాజులు కూడా తమను స్వర్గ పుత్రులని వర్ణించుకున్నారు. చరిత్రలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌గా పిలిచే గ్రీకు చక్రవర్తి ఈజిప్టు ఫారోల మాదిరే తాను కూడా దైవాంశ సంభూతుడిగానే భావించుకున్నాడు.తన నిజమైన తండ్రి జీయస్‌ అమన్‌ అనే ఈజిప్టు పురాతన దేవుడని భావించాడు.ఇండోనేషియాలో అనేక మంది పురాతన రాజులు తాము హిందూ దేవుళ్ల అంశగా చెప్పుకున్నారని చరిత్ర చెబుతోంది.ఆగేయాసియా దేశాలలో దేవరాజ అని పిలుచుకున్న అనేక మంది శివుడు లేదా విష్ణువు అవతారాలు లేదా వారసుల మని చెప్పుకున్నారు. సూర్య, చంద్ర వంశీకులమని చెప్పుకున్న వారి సంగతి తెలిసిందే.టిబెట్‌లో దలైలామాలు ఇప్పటికీ తాము బుద్దుని అవతారమని చెప్పుకుంటున్నారు. నేపాల్లో షా వంశ రాజులు కూడా తమను విష్టు అవతారాలుగా వర్ణించుకున్నారు. సత్యసాయి బాబాను దత్తాత్రేయ అవతారంగా భావించే భక్తులు సరేసరి. చరిత్రలో తమను తాము దేవుళ్లుగా, దేవదూతలుగా వర్ణించుకున్నవారు, మతాన్ని కాపాడతామని చెప్పేవారు, కలుషితమైన జాతిని పరిశుద్ధం చేయాలనే వారు చేయించిన లేదా చేసిన దుర్మార్గాలు ఎన్నో. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం పేరుతో అధికారానికి వచ్చిన మతశక్తులు ప్రత్యర్ధులను ముఖ్యంగా కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు ”దేవుని శత్రువు ”లు అనే సాకుతో వేలాది మందిని బూటకపు విచారణలతో ఉరితీశారు. జపాన్‌లో షోకో అసహరా అనే వాడు తనను క్రీస్తుగా చెప్పుకున్నాడు. తరువాత బౌద్దం-హిందూ విశ్వాసాలలను కలగలిపి ప్రచారం చేశాడు. యుగాంతం ముంచుకువస్తుందని తన భక్తులను నమ్మించాడు.టోక్యోలో 1995లో శరీన్‌ గాస్‌ను ప్రయోగించి వేలాది మందిని గాయపరచి 13 మంది ప్రాణాలు తీశారు. చివరకు మరో ఏడుగురితో కలిపి అసహరాను అక్కడి ప్రభుత్వం విచారించి ఉరితీసింది. అమెరికాలో ఆస్కార్‌ రామిరో ఓర్టేగా హెర్నాండెస్‌ అనే పెద్ద నేరగాడు తనను దేవదూతగా, ఏసుక్రీస్తుగా వర్ణించుకున్నాడు.అమెరికా అధ్యక్ష భవనం మీద దాడికి దేవుడు తనను ఆదేశించినట్లు చెప్పుకున్నాడు.


తనను దేవుడు ఆవహించినట్లు చెప్పుకున్నా, కొన్ని పనులు చేసేందుకు పంపినట్లు భావించినా, వంది మాగధులు అలాంటి వాతావరణం కల్పించినా చరిత్రలో జరిగిన నష్టాలు ఎన్నో. అనేక మంది ఎలాంటి ఆలోచన లేకుండా వారేం చేసినా సమర్ధించే ఉన్మాదానికి ఎందుకు లోనవుతారు అన్నది అంతుచిక్కని ప్రశ్న. జర్మనీలో జరిగింది అదే.జర్మన్‌ జాతికి యూదుల నుంచి ముప్పు ఏర్పడిందని, వారు జర్మనీకి ద్రోహం చేశారనే ప్రచారాన్ని సామాన్య జనం నిజంగా నమ్మబట్టే హిట్లర్‌ ఆటలు సాగాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను చెప్పిన వక్రీకరణలు, అవాస్తవాలను జనాలు నిజాలుగా భావిస్తారన్న గట్టి విశ్వాసం ఉన్నకారణంగానే నరేంద్రమోడీ ప్రసంగాలు చేశారు. తన జన్మ మామూలుది కాదని చెప్పుకున్నారు. హిట్లర్‌ను దేవుడే పంపాడని జర్మనీ పిల్లలకు నూరిపోశారు, దాంతో వాడిని ఒక సాధారణ రాజకీయవేత్తగా చూడటానికి బదులు దేవుడు పంపిన దూతగా చూశారు. మతాన్ని రాజకీయాలను జోడిస్తే జరిగేది ఇదే. జర్మనీ పూర్వపు ఔన్నత్యాన్ని నిలపాలంటే యూదులను అంతం చేయాలని చెబితే నిజమే అని నమ్మారు.ఇప్పుడు మనదేశంలో కూడా అన్ని రకాల అనర్ధాలకు ముస్లిం పాలకుల దండయాత్రలు, ఆక్రమణ, హిందువుల జనాభా తగ్గుతూ ముస్లింల జనాభాను పెంచుతూ ఒక నాటికి హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందన్న ప్రచారాన్ని నమ్ముతున్న వారు ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే మెజారిటీ హిందూత్వ పాలన రావాలన్నదానికి మద్దతు పెరుగుతోంది. మంచి చెడుల ఆలోచన లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువ కావటం కూడా మంచిది కాదంటూ అనాలోచితంగా మాట్లాడుతున్న జనాలు రోజు రోజుకూ పెరుగుతున్నారు.


ఇందిరా గాంధీ ఉపన్యాసాలు, విన్యాసాలు చూసిన జనం ఆకర్షితులయ్యారు.గరీబీహటావో అంటే నిజమే అని నమ్మారు. చివరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ అద్భుతాలు చేస్తారని, తమ జీవితాలను మార్చివేస్తారని అనేక మంది నమ్ముతున్నారు. ఒక వైపు సంపదలన్నీ కొంత మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంటే అలాంటి వారిని మోడీ వెనకేసుకు వస్తుంటే మార్పు సాధ్యం కాదనే ఆలోచనకు తావివ్వటం లేదు.గోవులను వధిస్తున్నారనే పేరుతో రోజూ తమ కళ్ల ముందు తిరిగే వారి మీద మూకదాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఏమీ చేయలేని వారిని చూశాం.” నాజీ అంతరాత్మ ” పేరుతో 2003లో వెలువరించిన ఒక పుస్తకంలో క్లాడియా కూంజ్‌ అనే చరిత్రకారిణి ఒక ఉదంతాన్ని వివరించారు.ఆల్ఫోన్స్‌ హెక్‌ అనే యువకుడు హిట్లర్‌ యూత్‌లో ఉన్నాడు. (ఇప్పుడు మనదేశంలో ”దళ్‌ ” పేరుతో ఉన్న సంస్థల మాదిరి.) తన గ్రామంలో నాజీ పోలీసులు యూదులను నరహంతక శిబిరాలకు తరలించేందుకు ఒక దగ్గర పోగుచేస్తూ ఉంటే వారిలో హెయినిజ్‌ అనే తన మంచి స్నేహితుడు ఉన్నప్పటికీ ఎంత అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని తనలో తాను కూడా అనుకోలేకపోయాడట. యూదుల నుంచి ముప్పు ఉందనే అంశాన్ని బుర్రకు ఎక్కించుకొని ఉండటంతో హెయినిజ్‌ దురదృష్టం ఏమిటంటే అతను యూదుగా పుట్టటమే అని, వారిని తరలించటం సమంజసమే అని అనుకున్నట్లు తరువాత గుర్తు చేసుకున్నాడట. ఒక ఉన్మాదం తలెత్తినపుడు మనుషుల ఆలోచనల్లో వచ్చే మార్పును కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.” నా భాష జర్మన్‌, నా సంస్కృతి, అనుబంధాలు అన్నీ కూడా జర్మనే.జర్మనీ, జర్మనీ ఆస్ట్రియాలో యూదు వ్యతిరేకత పెరుగుతున్నదని గుర్తించేవరకు నేను కూడా జర్మన్‌ మేథావినే అనుకున్నాను. కానీ యూదు వ్యతిరేకత పెరిగిన తరువాత ఒక యూదును అని నన్ను నేను అనుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చాను” అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది కూడా అదే. హిట్లర్‌ పుట్టుకతోనే నాజీ కాదు. కేవలం జర్మన్‌ జాతి ఒక్కటే నాగరికతకు తగినది అనే భావజాలం విస్తరిస్తున్న సమయంలో అనేక మంది దానికి ఆకర్షితులయ్యారు. అదే భావజాలం మరింత ముదిరి హిట్లర్‌ను నియంత, నరహంతకుడిగా మార్చాయి. అందుకే నేడు కావాల్సింది నిరంకుశత్వానికి దారితీసే మితవాద భావజాలం వైపు ఆకర్షితులౌతున్నవారిని నిందిస్తూ కూర్చోవటం కాదు, ఆ భావజాలాన్ని ఎదుర్కొనే పోరును మరింత ముందుకు తీసుకుపోవటం, దీనికి అధ్యయనం తప్ప దగ్గరదారి లేదు.

జూలై 4న బ్రిటన్‌ ఎన్నికలు : టోరీలకు శృంగభంగం, రిషి సునాక్‌ గెలుపూ కష్టమే !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జనవరి వరకు పార్లమెంటు గడువు ఉన్నప్పటికీ జూలై నాలుగున ముందస్తు ఎన్నికలు జరిపేందుకు ప్రధాని రిషి సునాక్‌ నిర్ణయించాడు. లేబర్‌ పార్టీతో పోల్చితే టోరీల పలుకుబడి 21పాయింట్లు తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతుండగా తీసుకున్న ఈ నిర్ణయం అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలకు వెళతారన్న పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇటీవలి కాలంలో రిషి సునాక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఓటమి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు గనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా ఇప్పుడు ఎన్నికలు జరిపితే ఓడినా గౌరవ ప్రదంగా కొన్ని సీట్లు తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడే ప్రధానంగా కనిపిస్తోంది.మేనెల పదమూడవ తేదీ సర్వప్రకారం లేబర్‌ పార్టీ 44, టోరీలు 23పాయింట్లతో ఉండగా ప్రధాని రిషి సునాక్‌ పనితీరు బాగోలేదన్నవారు గత ఏడాది జూన్‌తో పోల్చితే 57 నుంచి 65శాతానికి పెరిగారు. వ్రతం చెడినా ఫలం దక్కుతుందా ?


సునాక్‌ దంపతుల సంపద 12 కోట్ల నుంచి 65.1కోట్ల పౌండ్లకు పెరిగిందని తాజాగా సండే టైమ్స్‌ ధనికుల జాబితాలో ప్రకటించింది. కానీ ప్రధానిగా జనాభిమానం మాత్రం దిగజారుతోంది.పద్నాలుగేండ్ల టోరీల పాలన పొదుపు చర్యలతో జనం విసిగిపోయారు.అన్ని విధాలుగా కార్మికవర్గం దెబ్బతిన్నది. లండన్‌ కింగ్స్‌ కాలేజీ జరిపిన అధ్యయనం ప్రకారం 2010-20 సంవత్సరాల మధ్య ప్రభుత్వ పొదుపు విధానాల వలన 148వేల మంది మరణించారు. ఇండ్ల అద్దెలపై అడ్డుఅదుపూ లేదు, బలహీనవర్గాల ఇండ్ల పధకాన్ని రద్దు చేశారు.ప్రపంచంలో బాగా అభివృద్ది చెందిన దేశాలలో బ్రిటన్‌ ఒకటిగా చెబుతున్న సంగతి తెలిసిందే.జనాభా 6.7 కోట్ల మందిలో ఒక ప్రమాణాన్ని తీసుకుంటే కోటీ పది లక్షలు, ఇండ్ల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 1.44 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అంచనా.పిల్లల్లో 42.2లక్షల మంది దారిద్య్రంలో ఉన్నారు. పది సంవత్సరాల క్రితం ఈ సంఖ్య 22.8లక్షలు.2021-22లో దాదాపు 2.8లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవు. అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఎవరికైనా ఇల్లు లేకపోతే కనీసం ఆరునెలలు ఉండేందుకు ప్రభుత్వం ఇంటి వసతిని చూపాల్సి ఉంటుంది.ఎక్కడో ఒక దగ్గర నిద్రపోతూ పని చేసే వారు గణనీయంగా ఉన్నారు. అలా నిద్రపోతూ దొరికిన వారికి వెయ్యి పౌండ్ల వరకు జరిమానా విధించే నిబంధనలను ప్రభుత్వం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా జీవన వ్యయం విపరీతంగా పెరిగింది.మనదేశంలో తగినంత ఉపాధి చూపటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా పేదలు ఆహారధాన్యాలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు.ఈ కారణంగానే 80 కోట్ల మందికి నెలకు ఐదు కిలోల చొప్పున ఐదేండ్ల పాటు ఉచితంగా ఇస్తున్నట్లు సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో తినటానికి తిండి దొరకనివారికి ఆహార కూపన్ల ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఆహార పొట్లాలను అందిస్తారు. వాటిని ఆహార బ్యాంకులని ముద్దుపేరుతో పిలుస్తారు. ట్రసెల్‌ అనే పేరుతో ఉన్న ఒక ట్రస్టు నిర్వహిస్తున్న ఆహార బ్యాంకు నుంచి 2008-09లో కేవలం 25,899 మంది ఇలా ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటే 2022-23నాటికి ” మన హిందువు, భారత సంతతి ”గా అనేక మంది కీర్తించిన రిషి సునాక్‌ ఏలుబడిలో వారి సంఖ్య 29లక్షల 86వేల 203కు పెరిగింది.


పొట్టచేతబట్టుకొని లేదా అణచివేతలను తప్పించుకొనేందుకు శరణార్ధులుగా వచ్చే వారిని సహించలేని స్థితిలో బ్రిటన్‌ పెట్టుబడిదారీ వర్గం ఉన్నదంటే అతిశయోక్తి కాదు.దీన్ని ఎదుర్కొనేందుకు అనుమతి లేకుండా వచ్చే వారిని బలవంతంగా ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి తరలించి అక్కడ శిబిరాల్లో ఉంచి వారికి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించాలా లేదా అన్నది నిర్ణయించేందుకు ర్వాండా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నది బ్రిటన్‌. అందుకు గాను ప్రతి మనిషికి ఇంత అని చెల్లిస్తుంది. ఉదాహరణకు మూడు వందలు అంతకు మించి జనాలను పంపితే పన్నెండు కోట్ల పౌండ్లు ప్రభుత్వానికి, ఇరవైవేల చొప్పున శరణార్ధులకు చెల్లిస్తుంది. డబ్బుకక్కుర్తితో ర్వాండా సర్కార్‌కూడా శరణార్ధులను స్వీకరించేందుకు అంగీకరించింది. ముందు ర్వాండాకు తరలించి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేదీ లేనిదీ అక్కడ విచారిస్తారు.ఆశ్రయం కల్పించేందుకు నిర్ణయిస్తే బ్రిటన్‌కు తిరిగి అనుమతిస్తారు లేకపోతే ర్వాండా అంగీకరిస్తే అక్కడే ఉండేందుకు లేదా మూడో దేశం ఏదైనా అంగీకరిస్తే అక్కడకు పంపుతారు. ఇంగ్లీషు ఛానల్‌ దాటి పడవల ద్వారా అనుమతి లేకుండా ప్రవేశించిన వారు స్వచ్చందంగా వెనక్కు వెళ్లిపోయేందుకు అంగీకరిస్తే వారికి మూడువేల పౌండ్లు ఇస్తారు, లేకుంటే విమానాల ద్వారా ర్వాండాకు బలవంతంగా తరలిస్తారు. సుప్రీం కోర్టు ఈ ఒప్పందం చట్టవిరుద్దమని కొట్టివేసిన తరువాత తీర్పును వమ్ము చేస్తూ మరొక చట్టాన్ని 2023నవంబరులో పార్లమెంటు ఆమోదించింది.దీని మీద కూడా పిటీషన్లు దాఖలైతే విచారణకు 25 కోర్టు గదులు, 150 మంది న్యాయమూర్తులను సిద్దంగా ఉంచారు. తన కుటుంబం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన సంగతి గుర్తుంటే వలస వచ్చిన వారిని బలవంతంగా ర్వాండా పంపే కార్యక్రమానికి రిషి సునాక్‌ పూనుకొని ఉండేవాడు కాదు. ఓడమల్లయ్య-బోడి మల్లయ్య కథ మాదిరి ఒక కార్పొరేట్‌గా తన వర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు.


టోరీల పద్నాలుగేండ్ల చరిత్రను చూసినపుడు ప్రతి ప్రధానీ విఫలం చెందినట్లు రుజువైంది.ముందస్తు ఎన్నికలతో రిషి సునాక్‌ కూడా చారిత్రక వైఫల్యాన్ని అంగీకరించినట్లే. ” ఇది ఏం చేయాలో తోచని వ్యక్తి ఆడుతున్న ఆట,దారులు కూడా మూసుకుపోయాయి, తన అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశ సైతం కనిపించని స్థితి ” అని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. మార్చినెలలో 3.2శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 2.3శాతానికి తగ్గటం తన ఘనతే అని చెప్పుకుంటూ ఓటర్ల ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.2008 సంక్షోభం నుంచి బ్రిటీష్‌ పెట్టుబడిదారీ విధానం ఇంకా కోలుకోలేదని, అంతకు ముందుతో పోలిస్తే ఏడాదికి ప్రతి కార్మికుడు సగటున పద్నాలువేల పౌండ్లు నష్టపోతున్నట్లు ఒక అంచనా వెలువడింది.వేతన పెరుగుదల తీరుతెన్నులు చూస్తే నెపోలియన్‌ యుద్ధాల (1803-15) తరువాత ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ఖర్చులకు కోత, జనజీవీతాలు గిడసబారిపోవటంతో ఆలస్యయ్యేకొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. ఒక సర్వేలో ఈ ఏడాది తమ జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని 58శాతం మంది చెప్పారు, అనేక మంది రుణ ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితిలో సునాక్‌ ప్రకటనతో అధికారం ముందుగానే దక్కనుందనే సంతోషంతో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ పండుగ చేసుకుంటున్నది.జూలై నాలుగు స్వాతంత్య్రదినమని కొందరు వర్ణించారు. పిచ్చిపని అని టోరీ ఎంపీలు తమలో తాము గొణుక్కుంటున్నారు. కార్మికుల మీద దాడులు జరిపిన టోరీ పాలనకు స్వస్తి చెప్పేందుకు ముందుగానే వచ్చిన అవకాశమని కార్మిక సంఘాలు కూడా ఎన్నికలను స్వాగతించాయి. అయితే కెయిర్‌ స్టార్మర్‌ నాయకత్వంలో ఏర్పడే లేబర్‌ పార్టీ ప్రభుత్వం పట్ల అప్రమత్తగా ఉండాలని కూడా కొన్ని సంఘాలు హెచ్చరించాయి. కార్మికవర్గ జీవితాలను ఫణంగా పెట్టి తాము బయటపడాలని కార్పొరేట్‌శక్తులు చూస్తున్నాయని, స్టార్మర్‌ యజమానులకు, ఇజ్రాయెల్‌కు అనుకూలం, కార్మికులు, వలసలకు వ్యతిరేకి అని పేర్కొన్నాయి. ఇటీవల లేబర్‌ పార్టీ ప్రకటనలు చూస్తే యజమానులకు అనుకూలంగా ఉన్నందున ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచీ ప్రతిఘటించాల్సిందేనని సోషలిస్టు వర్కర్‌ వంటి సంస్థలు స్పష్టం చేశాయి.ఎవరు గెలిచినా సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగాల్సిందేనని పేర్కొన్నాయి.బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభ(కామన్స్‌)లోని 650 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ 43.6శాతం ఓట్లతో 365, లేబర్‌ పార్టీ 32.1శాతం ఓట్లతో 202 సీట్లు తెచ్చుకుంది.ఈసారి ఎన్నికల్లో టోరీ పార్టీకి 98, లేబర్‌ పార్టీకి 468 వస్తాయని సండే టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అనేక మంత్రులు కూడా ఓడిపోనున్నట్లు జోశ్యం చెప్పింది. ప్రధాని రిషి సునాక్‌ కూడా ప్రత్యర్ధికంటే కేవలం 2.5శాతం ఆధిక్యంతోనే ఉన్నట్లు, ఓడిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పింది. వేల్స్‌, స్కాట్లాండ్‌ ప్రాంతాలలో, లండన్‌ నగరంలో ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదన్నది.


రిషి సునాక్‌ మన వాడు ! బ్రిటన్‌ గద్దెపై తొలి హిందువు ! భారత్‌కు అనుకూలంగా బ్రిటన్‌ విధానాలు !
భారతీయులను అణగదొక్కిన వారి మీద ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ ! బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి గురించి మన మీడియాలో ఊదరగొట్టిన అంశాలు. చర్చోపచర్చల సంగతి సరేసరి. తెల్లవారే సరికి బ్రిటన్‌ రూపురేఖలు మార్చగల ఆర్థికవేత్త అంటూ కొండంత రాగాలు.సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. కెన్యాలో సునాక్‌ తండ్రి, టాంజానియాలో తల్లి జన్మించారు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980 మే 16న రిషి సునాక్‌ బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.


అనేక దేశాల్లో భారతీయ మూలాలు ఉన్న వారు అనేక మంది ఉన్నత పదవులను అధిష్టించారు.ఆ జాబితాను చూసినపుడు రిషి సునాక్కు ఇచ్చినంత ప్రచారం మరొకరికి ఎవరికీ ఎన్నడూ ఇవ్వలేదు. వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఎందుకు వీరిని పట్టించుకోలేదు ? ఎవరిని సంతుష్టీకరించేందుకు మన మీడియా ఇంతగా పాకులాడినట్లు ? మీడియా అంతటిని హిందూ వ్యతిరేకులు ఆక్రమించారనే తప్పుడు ప్రచారాన్ని నిరంతరం సాగిస్తున్నవారు ఈ ప్రచారం గురించి ఏమంటారు ? మీడియాను ఎవరు నియంత్రిస్తున్నారు ? కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు.అది కాదనలేని వాస్తవం. పంజాబీ మూలాలున్న తొలి ఆసియన్ను ప్రధానిగా రాజు ఛార్లెస్‌ నియమించాడు. ఆరునెలల కాలంలోనే ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారిన బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు ఈ పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు.బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీకి 190 సంవత్సరాలు, తొలుత దాని పేరు టోరీ.నూటపన్నెండు సంవత్సరాల క్రితం కన్సర్వేటివ్‌ అని మార్చుకున్నది. అయినప్పటికీ ఈ పార్టీ వారిని ఇప్పటికీ టోరీలనే ఎక్కువగా పిలుస్తారు. ఇంత సుదీర్ఘచరిత్ర కలిగిన పార్టీ 1906లో కనిష్టంగా 131 సీట్లు తెచ్చుకుంది. ఈ సారి రిషి సునాక్‌ నాయకత్వంలో 98కి మించి రావనే సర్వేలు నిజమైతే పార్టీ చరిత్రలో మరో అధ్యాయం నమోదౌతుంది.

” టెహరాన్‌ కసాయి ” ఇబ్రహీం రైసీ దుర్మరణం : ఇరాన్‌లో ఏం జరగనుంది !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి(63) ఆదివారం నాడు జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లా మరో ఏడుగురు కూడా మరణించారు.వారిలో ముగ్గురు హెలికాప్టర్‌ సిబ్బంది, అధ్యక్షుడి భద్రతా విభాగ కమాండర్‌, తూర్పు అజర్‌బైజాన్‌లో ఖమేనీ ప్రతినిధి, తూర్పు అజర్‌బైజాన్‌ గవర్నర్‌ ఉన్నారు. సరిహద్దులో ఉన్న అజరైబైజాన్‌లో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, డామ్‌ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొగమంచు. వర్షంతో కూడిన వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ పర్యతాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటన వెనుక ఇజ్రాయెల్‌, అమెరికా హంతక గూఢచార సంస్థలు మొసాద్‌, సిఐఏ హస్తం ఉండవచ్చని సామాజిక మాధ్యమంలో అనేక మంది అనుమానాలను వెలిబుచ్చారు. మంగళవారం ఇది రాసిన సమయానికి ఇరాన్‌ ప్రభుత్వం నుంచి అలాంటి ఆరోపణలు రాలేదు. మన ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక దేశాల నేతలు సంతాపాలు ప్రకటించారు. ప్రస్తుతం దేశ సర్వాధినేతగా ఉన్న మతనాయకుడు అయాతుల్లా అలీ ఖమేనీ(85) వారసుడిగా రైసీ బాధ్యతలు చేపడతారని భావిస్తున్న తరుణంలో ఈ ఉదంతం జరిగింది. దీంతో అధ్యక్షుడు, ఖమేనీ వారసుడు ఎవరన్న చర్చ మొదలైంది.రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించినా, పదవి కాలం ముగిసినా 50రోజుల్లో కొత్త నేతను ఎన్నుకోవాలి. అప్పటివరకు ఉపాధ్యక్షులలో ప్రధమంగా ఉన్న మహమ్మద్‌ మొక్బర్‌ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. జూన్‌ 28వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.


ఇబ్రహీం రైసి తీరుతెన్నులను చూసినపుడు రెండు ముఖాలు కనిపిస్తాయి.ఒకటి నిరంకుశ మతోన్మాదం, రెండవది తిరుగులేని సామ్రాజ్యవాద వ్యతిరేకత. మరణవార్త నిర్దారణ కాగానే ఇరాన్‌ మతవర్గాలలో దిగ్భ్రాంతి, దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు, ఊపిరి పీల్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాలక ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఖమేనీ మాట్లాడుతూ ” దేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజ్య వ్యవహారాల్లో ఎలాంటి అటంకాలు తలెత్తవు” అని చెప్పిన మాటలను బట్టి తన పునాదులు కదిలినట్లు, కుడి భుజాన్ని కోల్పోయిన భయం వాటి వెనుక ఉన్నట్లు స్పష్టమైందని ఒక అభిప్రాయం వెలువడింది.యువకుడిగా ఉన్నపుడే మత ఛాందసాన్ని వంటబట్టించుకున్న ఇబ్రహీం రైసి 1979లో ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం పేరుతో జరిగిన పరిణామాల్లో ఖమేనీ అనుచరుడిగా ఉన్నాడు.తరువాత మరింత సన్నిహితుడిగా, దేశ సర్వాధినేతను ఎంపిక చేసి, పర్యవేక్షణ చేసే నిపుణుల కమిటీలో 2006 నుంచి పనిచేశాడు. 2021లో దేశ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా వీర విధేయుడిగా ఎదిగాడు.ఐరాస మానవహక్కుల సంస్థ అతని పాత్రను ఖండించగా అమెరికా ఆంక్షలు విధించింది. అనేక అక్రమాలు, అనేక మంది అభ్యర్థులను పోటీకి అనర్హులుగా చేసిన 2021 అధ్యక్ష ఎన్నికలలో అడ్డగోలు పద్దతిలో గెలిచాడనే విమర్శలు ఉన్నాయి. రైసీకి మతపెద్దలతో పాటు మిలిటరీ మద్దతు కూడా ఉన్న కారణంగానే ఎన్నిక సాధ్యమైందని చెబుతారు. ఆ ఎన్నికల్లో దేశ చరిత్రలోనే అత్యంత తక్కువగా 50శాతానికి లోపు ఓట్లు పోలయ్యాయి.


దైవ నిర్ణయం అంటూ మత నేత అయాతుల్లా అలీ ఖమేనీ ఆదేశాల మేరకు 1998లో 30వేల మందికి పైగా రాజకీయ ఖైదీలను ఉరితీశారు. వీరిలో అధికులు పీపుల్స్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ప్రత్యర్ధులే ఉన్నారు. చరిత్రలో అత్యంత హీన నేరగాండ్లుగా నమోదైన వారి జాబితాలో చేరి ఈ మారణకాండకు బాధ్యులైన ముగ్గురిలో ఇబ్రహీం రైసీ ప్రముఖుడు. అందుకే అతన్ని ” టెహరాన్‌ కసాయి ” అని పిలిచారు. ఖమేనీ న్యాయమూర్తుల అధిపతిగా ఉన్న రైసీ 2019లో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేతలుగా ఉన్న వారితో సహా తరువాత తన పదవీ కాలంలో మొత్తం పదిహేను వందల మందిని ఉరితీయించినట్లు, వారిలో తాను అధ్యక్షుడైన తరువాత 2022లో తలెత్తిన నిరసనల సమయంలో 750 మంది ఉన్నట్లు వార్తలు వవచ్చాయి. జైళ్లు, ఇతర నిర్బంధ శిబిరాలలో మధ్యయుగాలనాటి ఆటవిక పద్దతుల్లో వేలాది మందిని చిత్రహింసలకు గురిచేసినట్లు కూడా వెల్లడైంది. మితవాద మతశక్తులను సంతుష్టీకరించేందుకు అధ్యక్షుడిగా తీసుకున్న చర్యలు జనంలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీశాయి. ముఖ్యంగా నైతిక పోలీసులను రంగంలోకి దించి సమాజాన్ని మత గిరి నుంచి కదలకుండా చేసేందుకు చూశాడు. ఈ క్రమంలోనే మహషా అమీ అనే యువతిని పోలీసు కస్టడీలో చంపివేయటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.దాదాపు ఐదు వందల మంది నిరసనకారులను చంపివేశారంటే అణచివేత ఎంత క్రూరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.వందలాది మంది జాడ ఇప్పటికీ తెలియదు.వారిని కూడా చంపివేశారా, జైళ్లలో ఉంచారా అన్నది కూడా స్పష్టం కాలేదు.హిజాబ్‌ ధరించకుండా ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణతో మహషా అమీని నైతిక పోలీసులు ఆమెకు నీతి పాఠాలు బోధించే పేరుతో ఒక చిత్ర హింసల శిబిరంలో ప్రాణాలు తీశారు. ఈ సందర్భంగా ఇబ్రహీం రైసి మతాధినేతకు చూపిన విధేయత కారణంగా ఖమేనీకి తగిన వారసుడు అతనే అనే అభిప్రాయం కలిగింది.


అజర్‌బైజాన్‌కు రైసి ప్రయాణించిన హెలికాప్టర్‌ దశాబ్దాల నాటి పాతదనే వార్తలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.ఆంక్షల కారణంగా దాని మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు లేవని, ఆధునిక తరానికి చెందిన వాటిని కొనుగోలు చేయలేకపోయినట్లు వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవు. అమెరికా, ఇతర పశ్చిమదేశాల ఆంక్షలు, అసమర్ధత, అవినీతి కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది, వాటిని పరిష్కరించటంలో పాలకులు విఫలమయ్యారు.దానిపై తలెత్తుతున్న నిరసనలను అణచివేస్తున్నారు.రైసి పదవిలోకి వచ్చే నాటికి 40శాతంపైగా ఉన్న ద్రవ్యోల్బణం 2022లో 45శాతం దాటింది. అది తరువాత క్రమంగా తగ్గుతున్నప్పటికీ 2029నాటికి 25శాతానికి పరిమితం అవుతుందని అంచనాలు వెలువడ్డాయి.అమెరికా బెదిరింపుల కారణంగా మన మిత్రదేశంగా ఉన్నప్పటికీ ఇరాన్నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అయితే చైనా భారీ ఎత్తున దిగుమతి చేసుకొని ఆదుకుంటున్నది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇబ్రహీం రైసి సామ్రాజ్యవాద వ్యతిరేకతలో తిరుగులేని వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది.ఇటీవలి సంవత్సరాలలో అమెరికా దాని కనుసన్నలలో నడిచే ఇతర సామ్రాజ్యవాద, వాటి అనుయాయిలకు వ్యతిరేకంగా చైనా, రష్యాలతో సంబంధాలను మరింతగా పటిష్టపరుచుకున్నాడు.ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు అవసరమైన డ్రోన్లు, మందుగుండు, ఇతర మిలిటరీ పరికరాలను రష్యాకు సరఫరా చేస్తున్నాడు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో ఇరాన్‌ అనుకూల హౌతీ సాయుధులను అణచేందుకు అమెరికా తరఫున రంగంలోకి దిగిన సౌదీ అరేబియా సాగించిన దాడుల గురించి తెలిసిందే. అలాంటి సౌదీతో ఏడు సంవత్సరాల తరువాత చైనా మధ్యవర్తిత్వంలో 2023లో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకోవటం పశ్చిమాసియా పరిణామాల్లో ఎంతో కీలకమైనది. ఇంతేకాదు అమెరికా తొత్తుగా ఉన్న ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే దేశాలు, పలుచోట్ల ఉన్న సాయుధశక్తులకు భారీ ఎత్తున ఇరాన్‌ అన్ని విధాలుగా సాయం చేస్తున్నది.


పశ్చిమ దేశాల వ్యతిరేకతలో భాగంగానే ఆంక్షలు తమను మరింతగా దెబ్బతీస్తాయని తెలిసినప్పటికీ అణుబాంబుల తయారీకి అవసరమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. బాంబుల పరీక్షే తరువాయి అన్నట్లుగా పశ్చిమదేశాలు భావిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ 2023 అక్టోబరు ఏడు నుంచి ప్రారంభించిన మారణకాండకు వ్యతిరేకంగా ఇరాన్‌ తన వంతు పాత్రను పోషిస్తున్నది. ఇజ్రాయెల్‌-అమెరికాతో నేరుగా ఘర్షణకు తలపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.సిరియాలోని తన రాయబార కార్యాలయంపై దాడిచేసి కీలకమైన వ్యక్తులను హత్య చేసి ఇజ్రాయెల్‌ ఎంతగా కవ్విస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా అవసరమైతే తన సత్తా ఏమిటో చూడండి అన్నట్లుగా తొలిసారిగా పరిమిత డ్రోన్లు, క్షిపణుల దాడి జరిపింది. అది ఇజ్రాయెల్‌ రక్షణ కవచంలో ఉన్న లొసుగులను బయటపెట్టింది. తరువాత ఇజ్రాయెల్‌ ప్రతిదాడి జరిపినప్పటికీ సంయమనంతో ఉంది. రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడిగా మత నేత ఎవరిని ఎంపిక చేస్తాడు అన్నది సంతాపదినాలు, అంత్యక్రియలు ముగిసే గురువారం తరువాత వెల్లడి అవుతుంది. నూతన నేత ఎవరైనప్పటికీ అంతర్గత, అంతర్జాతీయ విధానాల్లో పెనుమార్పులు ఉండే అవకాశం ఇప్పటికైతే కనిపించటం లేదు. ఎంతకాలం ఇలా ఆంక్షలతో ఇబ్బంది పడతాం ఏదో విధంగా ఇరాన్‌ పశ్చిమదేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే లాబీకూడా అక్కడ బలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇరాన్‌పట్ల అనుసరిస్తున్న వైఖరిలో పశ్చిమ దేశాల్లో ఎలాంటి సడలింపులు లేని కారణంగా బహిర్గతం కావటం లేదని చెప్పవచ్చు. ఇబ్రహీం రైసీ స్థానాన్ని సుప్రీం నేతగా ఉన్న అలీ ఖమేనీ కుమారుడు మొజ్‌తాబా స్వీకరిస్తాడని భావిస్తున్నారు.ఒకవేళ అదే జరిగితే గతంలో రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరానియన్లు వారసత్వ అధికారాన్ని సహిస్తారా, ప్రతిపక్షం పుంజుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.


అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎవరు అధికారానికి వచ్చినా వర్తమాన స్థితే కొనసాగవచ్చు.ప్రకటించిన సమాచారం మేరకు జూన్‌ 28 శుక్రవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.నామినేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్‌ మూడువరకు జరుగుతుంది. పన్నెండవ తేదీ నుంచి 27 ఉదయం వరకు ప్రచారం చేసుకోవచ్చు.దీనితో పాటు సుప్రీం నేతను ఎన్నుకొనే 88 మంది సభ్యులుండే పార్లమెంటు లేదా మజ్లిస్‌ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల ద్వారా మితవాద మతశక్తులను గద్దె దించటం సాధ్యంగాకపోవచ్చని చెప్పవచ్చు.నిరంకుశ,మిత, మతవాద శక్తుల తీరుతెన్నులను బట్టి ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత భిన్నమైన భావాలను,శక్తులను అనుమతించటం ఎక్కడా జరగలేదు. అంతర్గత కుమ్ములాటలు లేదా తిరుగుబాట్ల ద్వారానే మార్పు సాధ్యమైంది.ఇరాన్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంటుందా ? అంటే తగిన బలమైన ప్రత్యర్థి ముందుకు వస్తే కాదనలేము. రెండవది జో బైడెన్‌ పరిస్థితే అనుమానంగా ఉన్నపుడు తన దృష్టిని ఇటువైపు కేంద్రీకరిస్తాడా ? ఇజ్రాయెల్‌ విషయానికి వస్తే గాజా మారణకాండకు నేతృత్వం వహిస్తున్న నెతన్యాహు పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది.దురహంకార పులి ఎక్కిన అతడు గాజాలో హమస్‌ను అణచటంలో విఫలమైనట్లు ప్రత్యర్థులు ఇప్పటికే రెచ్చగొడుతున్నారు.రష్యా, చైనా విషయానికి వస్తే అవి మరొకదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం మనకు ఎక్కడా కానరాదు. ఇరాన్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అక్కడి పరిస్థితి, పరిణామాల గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చిప్‌ ఖరాబైందా ? నరేంద్రమోడీని హిట్లర్‌, గోబెల్స్‌ ఆవహించారా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


రంభా, ఊర్వశి, మేనక వంటి వారితో సంతోషంగా గడుపుతున్న జర్మన్‌ నాజీ మాజీ మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌ భారత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి గనుక తన ఆరాధకులు ఎలా పని చేస్తున్నారో చూద్దామని వచ్చినట్లు కనిపిస్తున్నది. (విడ్డూరంగాకపోతే ఎంతైతే మాత్రం మన భారతీయ సంప్రదాయాలు, విలువలకు కట్టుబడిన అప్సరసలు ఒక మ్లేచ్చుడితో ఆడిపాడతారా, ఇంకా ఏదైనా చేస్తారా అని కొంత మంది సనాతనవాదులకు కోపం రావచ్చు.కంచంలో తేడా ఉంటుంది గానీ మంచంలో ఎలాంటి బేధాలను పాటించని ”విశాల భావాలు” మనవి అన్నది తెలిసిందే.అందులోనూ జర్మన్‌ గోబెల్స్‌ మనవా(ఆర్యు)డే అని భావిస్తున్నపుడు, స్వర్గంలో మాట్లాడేది ఎలాగూ సంస్మృతమే, అయినా భాషతో పనేముంది, అంటూ సొంటూ ఏముంటుంది) ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా దేశంకోసం-ధర్మకోసం పని చేస్తున్నట్లు చెప్పుకుంటున్న మన నరేంద్రమోడీ, ఇతర సంఘపరివార్‌ నేతలను గోబెల్స్‌ ఆవహించినట్లు కనిపిస్తోంది. లేకుంటే ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాది పార్టీ-కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వారు ఆయోధ్య రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని, బాలరాముడిని తిరిగి గుడారాల్లో కూర్చో పెడతారని నరేంద్రమోడీ చెప్పేవారు కాదేమో ! ఎందుకిలా మాట్లాడినట్లు ?
వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక వర్తమానంలో రచయిత ఎవరో తెలియదు గానీ నరేంద్రమోడీ-హిట్లర్‌ మధ్య ఒక పోలిక తెచ్చారు.హిట్లర్‌ వివాహం చేసుకోలేదు.(మోడీ వివాహం చేసుకున్నా కాపురం చేయకుండా విడాకులు కూడా ఇవ్వకుండా వదలివేశారు. భారతీయ ధర్మాన్ని, రాజ్యాంగాన్నీ పాటించలేదు).ఒక మతం వారు దేశానికి వ్యతిరేకులనే భావాన్ని హిట్లర్‌ తలకు ఎక్కించుకున్నాడు. హిట్లర్‌ను ఎవరైనా విమర్శిస్తే మద్దతుదార్లు సహించేవారు కాదు. అన్ని రకాల మీడియాను తన గురించి గొప్పలు చెప్పుకోవటానికి హిట్లర్‌ ఉపయోగించుకున్నాడు.తన వ్యతిరేకులందరినీ అణచివేశాడు. వారు దేశ ద్రోహులని, జాతి వ్యతిరేకులని ఎల్లవేళలా పిలిచాడు. అన్ని సమస్యలనూ స్వల్పకాలంలోనే పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు.మంచి రోజులు రానున్నాయన్నది హిట్లర్‌ నినాదం. మంచి దుస్తులు వేసుకొని అందంగా కనిపించేందుకు హిట్లర్‌ చూశేవాడు. అబద్దాలను నిజాలుగా భ్రమింపచేసే కళను హిట్లర్‌ ప్రదర్శించేవాడు.రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చేందుకు హిట్లర్‌ ఇష్టపడేవాడు.స్నేహితులు, సోదరులు, సోదరీమణులంటూ తన ప్రతి ప్రసంగంలో హిట్లర్‌ మాట్లాడేవాడు.హిట్లర్‌కు ఫొటోలు తీయించుకోవటమంటే పిచ్చి.


పైన పేర్కొన్నవాటిలో నరేంద్రమోడీకి ఏ లక్షణాలు, ఏమి ఉన్నాయో లేవో ఎవరికి వారు బేరీజు వేసుకోవచ్చు. చిన్న తనంలో ఒక రైల్వే స్టేషన్‌లో టీ అమ్మినట్లు మోడీ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దానికి ఆధారాలు లేవని చెబుతారు. హిట్లర్‌ చిన్న తనంలో, కాస్త వయస్సు వచ్చాక కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు, అనాధ గృహాల్లో గడిపినట్లు చరిత్ర చెబుతున్నది.హిట్లర్‌ హైస్కూలు విద్యను కూడా పూర్తి చేయకపోవటంతో ఉన్నత విద్యకు అర్హÛత సాధించలేకపోయాడు. నరేంద్రమోడీ ఉన్నత విద్య చదివినట్లు చెప్పుకున్నా దానికి తగిన ఆధారాలు లేవు. నాజీగా హిట్లర్‌, నాజీల బాటలో నడుస్తుందనే విమర్శలున్న ఆర్‌ఎస్‌ఎస్‌లో మోడీ చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ స్థానాలకు ఎగబాకారు.హిట్లర్‌ ఒకనాడు జర్మనీలో దేవుడిగా ఒక వెలుగు వెలిగాడు. నరేంద్రమోడీని కూడా అభిమానులు అలాగే చూస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే స్వయంగా మోడీ దేవుడి బహుమతి, పేదల పట్ల దేవదూత అని చెప్పిన సంగతి తెలిసిందే.


2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన లేదా జరిపిన ప్రచారంలో ఇండియా కూటమి బిజెపి విధానాలపై విమర్శలతో పాటు ఆ కూటమిలోని పార్టీలు విడివిగా ప్రకటించిన మానిఫెస్టోలోని అంశాలను, బిజెపి చెబుతున్నట్లుగా నాలుగువందల సీట్లు ఎందుకు కోరుతున్నదో, ఏం చేసేందుకు అన్నిసీట్లు కోరుతున్నదో స్పష్టంగానే ప్రచారం చేశాయి. బిజెపి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందన్నది ప్రధానమైన విమర్శ. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బిజెపి ఎంతసేపూ ఎన్నిమరుగుదొడ్లు కట్టించిందీ, ఎన్ని ఉజ్వల గాస్‌ కనెక్షన్లు ఇచ్చిందీ, రోడ్లు వేసిందీ చెప్పుకోవటం తప్ప జన జీవితాలను మెరుగుపరిచేందుకు చేసిందేమిటో పెద్దగా చెప్పలేదు. పచ్చి అవాస్తవాలను, ఆధారంలేని ఆరోపణలను ఎన్నింటినో స్వయంగా నరేంద్రమోడీ ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతగా వక్రీకరణ, అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేసిన ప్రభుత్వ నేత మరొకరు లేరన్నది వేరే చెప్పనవసరం లేదు. మీడియాలో ఎన్ని టీవీ ఛానళ్లు వాటి గురించి చర్చలు పెట్టాయి, ఎన్ని పత్రికలు ప్రముఖంగా విశ్వేషణలు, వాస్తవాలను వెల్లడించాయి ? ఇదేం ప్రచారం అన్నట్లుగా కొందరు గొణగినట్లు విమర్శించటం తప్ప గట్టిగా బట్టబయలు చేసే ధైర్యం చేయటం లేదు. విదేశీ మీడియాలో కూడా ఇదే వ్యక్తమైంది.


నరేంద్రమోడీ ఇన్ని పచ్చి అబద్దాలను ప్రచారం చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటి ? పలుకుబడి దిగజారుతున్న పూర్వరంగంలో మైనారిటీ విద్వేషంతో లాభం లేదని గ్రహించి కాబోలు ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారంటూ హిందువులను రెచ్చగొట్టి లబ్దిపొందాలన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి మసీదులు, చర్చీలను కూల్చివేసిన చరిత్ర కాషాయ దళాలది తప్ప ఇతర పార్టీలది కాదు. రోడ్ల విస్తరణ పేరుతో నరేంద్రమోడీ సిఎంగా ఉండగా అహమ్మదాబాద్‌లో కొన్ని మందిరాలను కూడా తొలగించారన్న వార్తలు తెలిసిందే.హిట్లర్‌ నాయకత్వంలోని నాజీల ప్రచారం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. రాజకీయ,చరిత్ర,మతం, కులం, సాంస్కృతిక అంశం ఏదైనా సరే తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరు భావించినా వాటిని వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకోవటం వెనుక రెండు రెళ్లు నాలుగు అన్న విశ్వవ్యాప్త సూత్రం ఒకటే ప్రాతిపదిక. అదే ” పర్వతమంత అబద్దం ” చెప్పటం, వాస్తవానికి వక్రీకరణ, వక్రభాష్యం చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటం. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే చివరికి నిజమై కూర్చుంటుంది. ఎంతైతే మాత్రం ఫలానావారు అంత నిస్సిగ్గుగా అబద్దం అడతారంటే నేను నమ్మను అనే విశ్వాసాన్ని సొమ్ము చేసుకోవాలని తొలిసారిగా హిట్లర్‌ 1925లో మెయిన్‌ కాంఫ్‌ అనే గ్రంధంలో చెప్పాడు. మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయినపుడు జర్మనీలో చర్చ జరిగింది. జర్మనీ మిలిటరీలో లక్షమందికి పైగా యూదులు సైనికులుగా ఉన్నారు.యుద్ధరంగంలో యూదులు సరిగా పోరాడని కారణంగానే జర్మనీ ఓడిపోయిందని ఒక ప్రచారం జరిగింది.ఓటమి గురించి ప్రభుత్వం విచారణ జరిపింది. పేరు పెట్టి ఫలానా సామాజిక తరగతి అని చెప్పలేదు గానీ వెన్ను పోటు కారణంగానే జర్మనీ ఓడిపోయిందనే ప్రచారాన్ని నిజమే అని చాలామంది నమ్మారు. నిజానికి దానిలో ఎలాంటి వాస్తవం లేదు. దాన్ని హిట్లర్‌ వంటి జాతీయవాదులు భుజానవేసుకొని యూదులే వెన్నుపోటుదారులంటూ రెచ్చగొట్టారు. అప్పటికే మతరీత్యా యూదులపై ఉన్న అభిప్రాయాలు, అనుమానాలతో ఉన్న జనం నిజమని నమ్మారు. చివరకు అది ఎంతవరకు దారి తీసిందంటే జర్మనీ ఆత్మరక్షణకు యూదులను అంతమొందించటానికి జర్మన్లకు హక్కు ఉందన్నవరకు పోయి మారణకాండకు దారితీసిన సంగతి తెలిసిందే. తన పార్లమెంటు భవనాన్ని(రీచ్‌స్టాగ్‌) తానే తగులబెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపి అణచివేసిన దుర్మార్గం తెలిసిందే. హిట్లర్‌ ప్రచార పద్దతులను ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వినియోగించుకొనేందుకు చూశాడు.ఎన్నికల్లో డెమోక్రాట్లు అక్రమాలకు పాల్పడ్డారని, ఫలితాలను తారుమారు చేశారని, తాను ఓటమిని అంగీకరించనని చెప్పటమే కాదు, అమెరికా అధికార కేంద్రంపై తన అనుచరులతో దాడి చేయించిన దుండగాన్ని కూడా చూశాము. తాను నిజంగానే ఓడినట్లు ట్రంప్‌కు ముందే తెలిసినా కావాలని రెచ్చగొట్టినట్లు తరువాత వెల్లడైంది. అలాంటి ట్రంప్‌ను గెలిపించాలని పిలుపు ఇచ్చిన మోడీ గురించి తెలిసిందే.


కొందరు పనిగట్టుకొని పదే పదే తప్పుడు సమాచారాన్ని మెదళ్లలోకి ఎక్కిస్తే జనం ఎందుకు నమ్ముతున్నారు అనేది ప్రశ్న. దీని గురించి భిన్న కోణాలు వెలువడుతున్నాయి. తమ ముందుకు వచ్చిన ఒక సమాచారం వాస్తవం కాదని తెలిసినప్పటికీ అది పదే పదే వేర్వేరు మార్గాల్లో చేరితే ఏమో నిజమేనేమో అనే సందేహంలో పడతారు.బ్రాహ్మణుడు-మేకపిల్ల కథ తెలిసిందే. దానికి ప్రతిగా సమాచారం లేకపోతే చివరికి నిజమని నమ్ముతారు. ఉదాహరణకు వైరస్‌తో జలుబు చేస్తుంది. నిజానికి దానికి మందు లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిన వైరస్‌కు వెంటనే మందు కనుగొనటం సాధ్యం కాదు. ఏదైనా బిళ్ల వాడితే వారంలో వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందన్న లోకోక్తి తెలిసిందే. మనశరీరంలోని రోగనిరోధకశక్తి ఆ వైరస్‌ను ఎదుర్కొన్న తరువాత అదే తగ్గిపోతుంది కానీ అనేక మంది ఫలానా బిళ్ల వేసుకుంటే మాకు తగ్గింది అని చెప్పారనుకోండి, కొంతకాలానికి మిగతావారు పోయేదేముంది మనమూ చూద్దాం అని ఆ బిళ్లలనే వాడతారు. ఇది వ్యక్తులకు సంబంధించిన అంశం కనుక పెద్దగా నష్టం ఉండదు. పొట్టను తగ్గించాలంటే సూక్ష్మంలో మోక్షంలా ఫలానా మిషన్‌ వాడితే తగ్గిపోతుందనే ప్రచారం తెలిసిందే. ఒకసారి చూద్దాం పోయేదేముంది అనుకొని అనేక మంది కొనుగోలు చేయటం, ఆయిల్‌ పుల్లింగ్‌, మంచినీటి వైద్యాల వంటి వాటికి బుర్రలను అప్పగించటం చాలా మందికి తెలిసిందే. ఇలాంటి వాటి వలన వ్యక్తులు నష్టపోతారు. అదే ఒక ప్రతికూల భావజాలానికి చెవి అప్పగిస్తే యావత్‌ సమాజానికే ప్రమాదకరం. ప్రతి మనిషి సగటున రోజు 35వేల నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు పరిశోధకులు చెప్పారు. ఒక షర్టు ఆరటానికి అర్ధగంట పడితే పది షర్కులు ఎంతసేపటిలో ఆరతాయంటే ఐదు గంటలు అనేవారు, ఒక కిలో దూది బరువా ఒక కిలో ఇనుము బరువా అంటే ఇనుము అని చెప్పేవారి గురించి తెలిసిందే.అంటే ప్రతి క్షణానికి మన మెదళ్లకు ఎంతో సమాచారం అందుతుంటుంది.బహుశా ఈకారణంగానే వెంటనే బుర్రకు తర్కం కూడా తట్టదు. మన బుర్రలో రెండు రకాల ఆలోచనా వ్యవస్థలుంటాయట. ఒకటి అదుపులేని సృహతో తక్షణమే స్పందించేది, రెండవది సృహతో దీర్ఘంగా, లోతుగా ఆలోచించి నిర్ణయించేది. జనాలు మొదటిదానికే ఎక్కువగా పనిపెడతారని,అందువలన లోతుగా ఆలోచించకుండా చేసే పద్దతులు, సమాచారాన్ని కొన్ని శక్తులు మనబుర్రలకు చేరవేస్తాయని భావిస్తున్నందున హిట్లర్‌ వంటి నియంతలు, మార్కెటింగ్‌ నిపుణులు, రంగులు మార్చే రాజకీయవేత్తలు ప్రతితరాన్ని ఏదో విధంగా మభ్యపెట్టగలుగుతూనే ఉన్నారు.


ఫేక్‌,వక్రీకరించిన సమాచారం ఈ రోజు సామాజిక మాధ్యమాన్ని ఊపివేస్తున్నది. ఇవి పెద్దగా జనానికి అందుబాటులో లేని రోజుల్లో వినాయకుడు పాలు తాగాడన్న వార్త ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. సైన్సు పత్రికలో ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం వాస్తవ కథనాలకంటే తప్పుడు వార్తలు జనాలకు ఆరు రెట్లు వేగంగా చేరతాయని తేలింది.సంఘపరివార్‌ వంటి సంస్థలకు చెందిన వారు తొలిసారిగా చెప్పిన అంశాలను అనేక మంది తొలిరోజుల్లో నమ్మలేదు. కానీ పదే పదే వాటిని ప్రచారం చేస్తుండటంతో అనేక భ్రమాత్మక అంశాలు నిజమై కూర్చున్నాయి. ఉదాహరణకు రాహుల్‌ గాంధీకి అసలు గాంధీ పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించటం తెలిసిందే. రాహుల్‌ తాత ఫిరోజ్‌ గాంధీ, అతని తలిదండ్రులు జొరాస్ట్రియన్‌ మతానికి చెందిన వారు. వందల సంవత్సరాల క్రితం పర్షియాపై దండయాత్ర చేసిన ఇస్లాం పాలకులు జొరాస్ట్రియన్లను అణచేందుకు పూనుకున్నపుడు అనేక మంది అరేబియా సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌కు వలస వచ్చిన పూర్వీకుల కుటుంబాలలో ఫిరోజ్‌ గాంధీది ఒకటి. పర్షియాకు మరో పేరు ఇరాన్‌, అక్కడి నుంచి వచ్చారు గనుక ఇరానీలు, పార్సీలయ్యారు.వారి సంఖ్య ప్రస్తుతం లక్షమందికి లోపే.గతంలో పర్షియాలో ఉన్నపుడే వాణిజ్యంలో ముందున్నారు గనుక మన దేశం వచ్చిన వారు కూడా దాన్ని అందిపుచ్చుకొని దేశంలో నేడు ప్రముఖ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. మహాత్మాగాంధీలో గాంధీ పేరుతో ఎలాంటి సంబంధం లేదు, పార్సీలలో గాందే పేరుతో ఉన్నవారు చివరికి గాంధీలుగా నామాంతరం చెందారు.ఫిరోజ్‌ అని ఉంది గనుక అతను మనవాడే అని అనేక మంది ముస్లింలు భావించారు.దీన్ని ఎంత మంది గూగుల్లో వెతికి నిర్ధారించుకుంటారు. వాట్సాప్‌ ద్వారా పనిగట్టుకు చేస్తున్న ప్రచారం కూడా అలాంటిదే. అనేక తప్పుడు ప్రచారాలు ప్రారంభిస్తే కొన్నాళ్లకవి నిజాలై కూర్చుకుంటాయి. మతోన్మాదశక్తులు ఇంతకాలం చేసింది అదే. వాటితో జనాలు ప్రభావితులౌతున్నారు. అఫ్‌కోర్సు పెరుగుట విరుగుట కొరకే. హిట్లర్‌ను ఆరాధించిన జర్మన్లే ఇప్పుడు ఆ పేరు ఎత్తటానికి కూడా ఇచ్చగించరు వాడొక కుక్క అంటారు.ఎవరికైనా అదే గతి.

ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

అమెరికా విద్యార్థి ఉద్యమం : నాటి వియత్నాం, నేటి పాలస్తీనాకు తేడా ఏమిటి !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ మిలిటరీ రాఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న సహాయసిబ్బందిని కూడా వదలటం లేదు.సోమవారం జరిపిన దాడుల్లో ఐరాస తరఫున పనిచేస్తున్న వారిలో మనదేశానికి చెందిన వ్యక్తి మరణించాడు. రాఫాలోని ఐరోపా ఆసుపత్రికి ఒక వాహనంలో ఇతరులతో కలసి వెళుతుండగా ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన దాడిలో అతడు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 35వేల మందికి పైగా మరణించారు. వారిలో 70శాతంపైగా పిల్లలు, మహిళలు ఉన్నారు.పాలస్తీనియన్ల ఊచకోత గురించి అణుమాత్రమైనా పట్టని అమెరికా, ఇతర పశ్చిమదేశాలు యూదు వ్యతిరేకత పెరుగుతోందని మాత్రం గుండెలు బాదుకుంటున్నాయి. ఆ సాకుతో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. కొద్ది వారాల క్రితం అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలోనే ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు కెనడా, ఐరోపా ముఖ్యంగా బ్రిటన్‌కు విస్తరించింది.అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను గుర్తించి వీసాలను రద్దు చేసినా, అమెరికా నుంచి వెనక్కు తిప్పిపంపినా నష్టపోతామనే భయమే దీనికి కారణంగా ఉన్నట్లు కొందరు చెప్పారు.రఫా మీద దాడులను అంగీకరించేది లేదన్నది అమెరికా ఉత్తుత్తి బెదిరింపు మాత్రమే అని తేలిపోయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు ఆ నగరం పరిసరాలలో ఉన్న 14 లక్షల మంది జనాభాలో సగం మంది దాడులను తప్పించుకొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.


ప్రతి మతంలోనూ దురహంకారులు ఉంటారు. దానికి యూదు అతీతం కాదు.ఐరోపాలో ముందుకు తెచ్చిన యూదు వ్యతిరేకత వారిని అష్టకష్టాలపాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ఆ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు అదే మత ప్రాతిపదికన ఏర్పడిన ఇజ్రాయెల్‌ పాలకుల అరబ్‌ లేదా ముస్లిం వ్యతిరేకతను అనేక పశ్చిమదేశాలు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి.పాలస్తీనా సాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి మానవహక్కులను కాపాడాలని కోరుతున్నారే తప్ప యూదు వ్యతిరేకతను ముందుకు తీసుకురాలేదు. ఇజ్రాయెల్‌ పాలకులు యూదు దురహంకారులు తప్ప అక్కడ ఉన్న సామాన్య పౌరులందరూ అలాంటి వారే అనటం లేదు. ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకుంటున్నది అక్కడి పాలకులు, యూదు ఉన్మాదం తలకెక్కించిన మిలిటరీ, వారిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పశ్చిమదేశాలు తప్ప పౌరులు కాదు. పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, తూర్పుజెరూసలెం ప్రాంతాలలోని పౌరులపై దశాబ్దాల తరబడి సాగిస్తున్న దమనకాండ గురించి తన పౌరులకు బోధ చేసేందుకు ఎన్నడూ ఒక చట్టం చేయని అమెరికా పార్లమెంటు దిగువసభ ఇటీవల ” యూదు వ్యతిరేక జాగృతి బిల్లు ” తెచ్చింది. దానికి 91 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా 320 మంది మద్దతు తెలిపారు.యూదు వ్యతిరేకత అమెరికాలో ఉన్న యూదు విద్యార్థుల మీద ప్రభావం చూపుతుందని చట్టం ప్రకటించింది. దాన్ని సెనెట్‌ కూడా ఆమోదిస్తే అధ్యక్షుడి ఆమోదంతో చట్టంగా మారుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వస్తే వివాదాస్పద యూదు వ్యతిరేక నిర్వచనాలతో విద్యార్థులు, ఇజ్రాయెల్‌ దమనకాండపై గళమెత్తే ఇతరులను అణచివేసే అవకాశం ఉంది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించకూడదని అనేక మంది కోరుతున్నారు. విద్యార్థులు చేస్తున్నది మరొక యుద్ధ వ్యతిరేక ఉద్యమం కాగా దాన్ని యూదు వ్యతిరేకమైనదిగా పశ్చిమదేశాల మీడియా చిత్రించటం పాలకవర్గాల కనుసన్నలలో నడవటం తప్ప మరొకటి కాదు.


గతంలో వియత్నాంపై జరిపిన దురాక్రమణ, హత్యాకాండ, అత్యాచారాలకు నిరసనగా 1968లో అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు బతుకుజీవుడా అంటూ అమెరికన్లు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అక్కడ కనీసం 30లక్షల మంది అమాయక పౌరులను అమెరికన్లు హతమార్చారు. గతంలో వియత్నాంలో మాదిరి ఇప్పుడు 2024లో గాజాలో జరుగుతున్న మారణకాండలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అమెరికా యువతలో పెరిగిన చైతన్యానికి ఒక నిదర్శనం. గతంలో మాదిరి జరుగుతున్నవాటిని మూసి పెట్టటం ఇప్పుడు సాధ్యం కాదు. అమెరికాలో జరుగుతున్నదాని గురించి ఒక విశ్లేషకుడు ఒక సినిమా కథతో పోల్చాడు. మోర్ఫస్‌ అనే చిత్రంలో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చిన ఆశ్రితుడికి ఎరుపు, నీల వర్ణపు రంగుల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమంటాడు.ఎరుపు రంగుదాన్ని సేవించిన వారికి తమ చుట్టూ జరుగుతున్న భయంకర అంశాలన్నీ కనిపిస్తాయి. అదే నీలి రంగు మాత్ర వేసుకుంటే నిజంగా జరుగుతున్నదాన్ని మరిపింపచేస్తుంది. ఆ సినిమాలో ఆశ్రితుడు ఎర్ర రంగు మాత్ర తీసుకున్నట్లుగా ఇప్పుడు అమెరికా సమాజంలోని నవతరం కూడా అదే మాదిరి పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న అకృత్యాలను చూస్తున్నారని, వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఒక్క ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటమే కాదు తమ ప్రభుత్వం అనేక చోట్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుపుతున్న దారుణాలను కూడా ఇప్పుడు విద్యార్థులు స్పష్టంగా చూస్తున్నారు.


అమెరికా జరుపుతున్న దారుణాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అమెరికన్లు వాటిని ఏ మేరకు గమనించారన్న చర్చ ఒకటి ఉంది. ఏదైనా శృతిమించితే వారు కూడా స్పందిస్తారని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులని అమెరికా ఎప్పటి నుంచో చిత్రిస్తున్నది.ప్రతి దేశంలో సామ్రాజ్యవాదం, నిరంకుశపాలకులు చేసింది అదే. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా సాగిస్తున్న చర్యలతో నిజానికి ఉగ్రవాదం పెరిగింది తప్ప తగ్గలేదు. అనేక మందిని ఉగ్రవాదులుగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం వివిధ దేశాలలో అమెరికా కారణంగా 45లక్షల మంది మరణించారు.వారిలో అమెరికా మిలిటరీ ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల మందిని చంపివేసింది.కనీసం 3.8కోట్ల మంది తమ నెలవులు తప్పారు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో అమెరికా మద్దతు, పధకం ప్రకారం జోక్యం చేసుకున్న సౌదీ అరేబియా కారణంగా దశాబ్ది కాలంలో 2.33లక్షల మంది మరణించారు.ఐరాస కార్యాలయం 2020లో చెప్పినదాని ప్రకారం వారిలో ఆహారం, ఆరోగ్యసేవలు, మౌలిక సదుపాయాల లేమి వంటి పరోక్ష కారణాలతో మరణించిన వారు 1.31లక్షల మంది ఉన్నారు. ఇటీవలి ప్రపంచ పరిణామాల్లో సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎమెన్‌లో జోక్యానికి స్వస్తిపలికింది. సద్దాం హుస్సేన్ను తమ పలుకుబడికిందకు తెచ్చుకొనేందుకు ఇరాక్‌పై అమెరికా అమలు జరిపిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది పిల్లలు మరణించారని అంచనా. ఇంకా ఇలాంటి అనేక దారుణాల్లో తమ నేతల, దేశ పాత్ర గురించి విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో గుడారాల్లో తిష్టవేసి నిరసన తెలుపుతున్న విద్యార్థులు అరచేతిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.


అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటమే కాదు, అనేక దేశాల పాలకులను ప్రోత్సహించి లక్షలాది మంది మరణాలకు బాధ్యురాలైంది.ప్రస్తుత బంగ్లాదేశ్‌ 1971కి ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు పాక్‌ మిలిటరీ ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌ పేరుతో జరిపిన మారణకాండలో మూడు లక్షల మంది మరణించగా కోటి మంది తమ ప్రాంతాల నుంచి పారిపోవాల్సివచ్చింది.దానికి అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది.మనదేశం జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని ఓడించి బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడింది. అంతకు కొద్ది సంవత్సరాల ముందు ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు మిలిటరీ నియంత సుహార్తోను గద్దెమీద కూర్చోబెట్టి కనీసం పదిలక్షల మందిని ఊచకోత కోయించటంలో సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రపక్ష దేశాల మీద యుద్దం ప్రకటించిన హిట్లర్‌ వంటి వారిని తప్ప ప్రపంచంలో నియంతగా పేరు మోసిన ప్రతివాడినీ అమెరికా బలపరిచింది.హిట్లర్‌కు సైతం ఆయుధాలు అమ్మి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంతో బ్రిటన్‌ ప్రపంచాధిపత్యం అంతరించి అమెరికా రంగంలోకి వచ్చింది.అప్పటి నుంచి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలతో సాగించిన ప్రచ్చన్న యుద్ధంలో తాము విజేతలం అని ప్రకటించుకొనే వరకు అంటే 1949 నుంచి 1989వరకు వివిధ దేశాలలో పాలకులను మార్చేందుకు అమెరికా 72 ప్రయత్నాలు చేయగా 29 సందర్భాలలో అమెరికా కుట్రలో భాగస్వాములైన వారు జయప్రదమయ్యారు. కూల్చిన వాటిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆరు ఉన్నాయని బోస్టన్‌ కాలేజీ రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు లిండ్సే ఓ రూర్‌కే పేర్కొన్నారు. ఒక వలసవాదిగా అమెరికా దుర్మార్గం చిన్నదేమీ కాదు. ఆసియాలోని ఫిలిప్పైన్స్‌ను ఆక్రమించకొని అక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే రెండు నుంచి ఆరులక్షల మందిని జాత్యహంకారం, ఇతర కారణాలతో అమెరికన్‌ పాలకులు హత్య చేశారని అంచనా.


1968లో వియత్నాంలో దురాక్రమణ, మారణకాండలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఆందోళనకు, ఇప్పుడు గాజాలో జరుపుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి విద్యార్థిలోకం గళమెత్తటానికి గల పోలికలు చర్చలోకి వచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ ఆందోళన కాలేజీ ప్రాంగణాల్లోనే ప్రారంభమైంది.నాడూ నేడు పోలీసులను పిలిపించి అణచివేతకు పాల్పడ్డారు.నవతరం-పాతవారి మధ్య కొన్ని సైద్దాంతిక విబేధాలు గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. నిజానికి ఇవి పెద్ద అంశాలు కావు. ఫ్రెంచి వలస ప్రాంతంగా ఉన్న ఇండోచైనాను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఆక్రమించింది. అది ఓడిన తరువాత తిరిగి ఫ్రాన్సు ఆక్రమించిన వియత్నాంలో విముక్తి పోరాటం కారణంగా 1954లో స్వాతంత్య్రం వచ్చింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా దాన్ని విభజించారు. ఫ్రెంచి పాలకులు తప్పుకున్న తరువాత దక్షిణ వియత్నాం కేంద్రంగా అమెరికా రంగంలోకి వచ్చి ఉత్తర వియత్నాంను ఆక్రమించేందుకు, దక్షిణ వియత్నాంలో విముక్తి పోరాటాన్ని అణచేందుకు చూసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండవ ప్రపంచ యుద్దం తరువాత రెండుగా చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పాలస్తీనా ప్రాంతాలను పశ్చిమదేశాల మద్దతుతో అది అక్రమించి ఇప్పటి వరకు పాలస్తీనా స్వతంత్రదేశం ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. నాడు వియత్నాంలో 5.36లక్షల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు.నేడు ఇజ్రాయెల్‌లో కొద్ది మంది ఉన్నప్పటికీ వారు దాడులలో భాగస్వాములు కావటం లేదు. వియత్నాంలో దాదాపు అరవై వేల మంది అమెరికా సైనికులు మరణించారు, మూడు లక్షలకు పైగా గాయపడ్డారు. తమ సైనికుల ప్రాణనష్టం సాధారణ అమెరికన్లను కలచివేసింది. పాలస్తీనాలో ఒక్క అమెరికనూ చావలేదు, గాయపడలేదు. అయినప్పటికీ మానవత్వానికి ముప్పు తెచ్చిన కారణంగా విద్యార్థులు వీధుల్లోకి రావటం చైతన్యానికి నిదర్శనం.రాఫాలో దాడులను అడ్డుకోవటంలో విఫలమైన తమ ప్రభుత్వం మీద విద్యార్థులు మరింతగా వీధుల్లోకి వస్తారా , ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

దొంగ డబ్బు కేసు : కేరళ బిజెపి నేతలను కాపాడుతున్న ఇడి !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, ఇతర బిజెపి నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్న హవాలా కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు వినోద్‌ మాథ్యూ విల్సన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ద్వారా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున దాన్ని అనుమతించవద్దని ఇడి న్యాయవాదులు కోర్టును కోరింది. ఆమ్‌ ఆద్మీనేత కోరికపై తీర్పును రిజర్వుచేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దోపిడీ, దొంగతనం వంటి ఆరోపణలతో ఈ కేసులో దాఖలైన ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌ను ఇడి కోర్టుకు సమర్పించింది. 2021లో తాము జరిపిన ప్రాధమిక దర్యాప్తు గురించి కూడా కోర్టుకు తెలిపింది.ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టును 2023లో తెరిచి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నది. ఇప్పటికే తాము అనేక మందిని ప్రశ్నించి వారు చెప్పిన అంశాలను నమోదు చేశామని, డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న అంశాలను దర్యాప్తు చేస్తున్నామని, సమగ్రంగా దర్యాప్తు జరిపి తరువాత నివేదిక సమర్పిస్తామని చెప్పింది. రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నింటి మీద తాము దర్యాప్తు జరపలేమని ఇడి వాదించింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన అంశాలలో హవాలా మార్గం ద్వారా 2021 ఎన్నికల కోసం బిజెపికి సంబంధించిన వారు డబ్బుతెచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారని, కానీ దీని గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నదని, మూడు సంవత్సరాల తరువాత కూడా ఎలాంటి చర్యలు లేవని హవాలా గొలుసు గురించి ఉపా చట్టం కింద ఇడి మరియు ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరింది.


వాద ప్రతివాదనల సందర్భంగా విచారణ జరిపిన విచారణ బెంచ్‌లోని న్యాయమూర్తి గోపీనాధ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర్ర పోలీసు లేదా సిబిఐ వంటి సంస్థలు ఒక నేరంపై ఎఫ్‌ఐఆర్‌ సమర్పించిన తరువాత ఇడి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.” సిబిఐ లేదా మరేదైనా కావచ్చు వాటి ఎఫ్‌ఐఆర్‌లను పక్కన పెట్టి దర్యాప్తు జరిపేందుకు వాటి మీద ఉన్న సంస్థ ఇడి కాదు. వారి పని రెండు అంశాలకే పరిమితం ఒకటి విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం(ఫెమా) రెండవది మనీలాండరింగ్‌ నిరోధ చట్టం(పిఎంఎల్‌ఏ). ఒక కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో అది గానీ ఇది గానీ ఉందా అన్నది, ఉంటే వాటిని ఉపయోగించటం తప్ప ఒక దర్యాప్తు సంస్థ మాదిరి దర్యాప్తు చేయటానికి ఇడి దర్యాప్తు సంస్థ కాదు.పిఎంఎల్‌ఏ కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవటం లేదా పోయిన వాటిని స్వాధీనం చేసుకోవటానికి మించి సదరు చట్టంలో ఇంకా ఏమైనా ఉందా అన్నది కోర్టుకు చెప్పండి. మీరు ఉన్న దర్యాప్తు సంస్థలకు అతీతమైన ఉన్నత దర్యాప్తు సంస్థకాదు అని న్యాయమూర్తి అన్నారు.


కేరళ అసెంబ్లీ 2021ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. దాంతో పక్కనే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు కోరినంత నల్లధనాన్ని పంపారు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు మూడున్నర కోట్లుగా తేలింది ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో చెప్పనవసరం లేదు. దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో బిజెపిలో రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది అప్పుడు జరిగిన చర్చ. ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయనున్నట్లు అప్పుడు రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు.


ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నించారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు బుకాయించారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా పని చేసినట్లు ఆరోపణ. అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని తేలింది. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు.
ఈ కేసులో ఇడి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఇడి అరెస్టు చేసిన నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కేజరీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులను అరెస్టు చేసి బెయిలు రాకుండా అడ్డుపడుతున్నది. అదే ఒక రాష్ట్ర పోలీసుశాఖ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నది. పట్టుబడిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం తేల్చటానికి మూడు సంవత్సరాలు దాటినా ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉన్నామని చెప్పటం అసమర్ధత లేదా ఆ కేసులో ప్రమేయం ఉన్న బిజెపి నేతలు, వారికి నిధులు ఇచ్చిన వారిని రక్షించేందుకు వీలైనంత వరకు కాలయాపన చేయటం తప్ప మరొకటి కాదు. ఇడి కొందరి పట్ల దయగల దేవత, మరికొందరి పట్ల వేధించే దయ్యం మాదిరిగా మారిందన్నది ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధమిక ఆధారాలు, డబ్బు రవాణా చేసిన వారి వివరాలు ఉన్నప్పటికీ ఇంత చిన్న కేసును కూడా సంవత్సరాల తరబడి పరిష్కరించలేని దుస్థితిలో ఇడి ఉందా ?


బిజెపికి అనుకూలంగా ఇడి, ఐటి పని చేయటంలో భాగంగానే త్రిసూర్‌లో తమ పార్టీ బాంకు ఖాతాలను స్థంభింపచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు. సిపిఎం ఎన్నికల పనిని దెబ్బతీసేందుకే ఇలా చేశారని అన్నారు. పార్టీకి దేశవ్యాపితంగా ఒకే పాన్‌ నంబరు ఉందని, ఆదాయపన్ను సంబంధిత వివరాలను ఆ శాఖకు సమర్పించినప్పటికీ అక్రమంగా ఐటిశాఖ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఖాతాను నిలిపివేసిందన్నారు.తమ ఖాతాలున్న బాంకు సిబ్బంది వేరే పాన్‌ నంబరు నమోదు చేసినకారణంగా అనవసర చర్చ ఎందుకని తాము మౌనంగా ఉన్నామని, తమ సిబ్బంది చేసిన తప్పిదాన్ని అంగీకరిస్తూ సదరు బాంకు తమకు ఒక లేఖ కూడా రాసిందని గోవిందన్‌ చెప్పారు. బాంకు తప్పిదం వెల్లడైన తరువాత కూడా తమ ఖాతాల స్థంభన కొనసాగించటం వేధింపు గాక ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు పాన్‌ నంబరును ఆధారం చేసుకొని త్రిసూర్‌ జిల్లా పార్టీ కార్యదర్శిని విచారణ పేరుతో వేధించారని, పాన్‌ నంబరు గురించి వివరించినా పట్టించుకోలేదన్నారు.ఈ విచారణను మీడియా పెద్దఎత్తున సిపిఎంకు వ్యతిరేక ప్రచారానికి వాడుకుందని అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటన చేయటాన్ని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వివాదాస్పదం కావించారు. పర్యటన వివరాలను రహస్యంగా ఉంచారని, అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా బిజెపిని మంచిచేసుకొనేందుకే విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పర్యటన పూర్తిగా కుటుంబపరమైందని, ఖర్చంతా వారే భరిస్తారని సిపిఎ స్పష్టం చేసింది.