కేరళలో రాష్ట్రపతి పాలన బెదిరింపు -రెచ్చగొడుతున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో రాజ్యాంగ యంత్రం విఫలమౌతోందంటూ కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది రాష్ట్రంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేస్తానని బహిరంగంగా బెదిరించటం తప్పమరొకటి కాదని భావిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రపతి పాలనకు నాలుగు ప్రధాన కారణాలతో గవర్నర్లు సిఫార్సు చేస్తారు, వాటిలో రాజ్యాంగబద్ద యంత్రాంగం విఫలమైందన్నది ఒకటి. తనకు వ్యతిరేకంగా కాలికట్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బానర్లను తొలగించాలని గవర్నర్‌ పోలీసులను ఆదేశించి ఒక వివాహానికి వెళ్లారు. తిరిగి ఏడు గంటలకు వచ్చిన సమయంలో బానర్లు అలాగే ఉండటాన్ని చూసి గవర్నర్‌ ఆగ్రహించారు. సిగ్గులేని జనాలు అంటూ పోలీసుల మీద నోరుపారవేసుకున్నారు.ఆగ్రహంతో అటూ ఇటూ తిరుగుతూ ఎస్‌ఎఫ్‌ఐ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నది, వారు బానర్లు కడుతుంటే మీరు చూస్తున్నారు అంటూ చిందులు వేశారు.కాలికట్‌ విశ్వవిద్యాలయంలో తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బానర్లను వైస్‌ ఛాన్సలర్‌ ఎలా ఆమోదించారో సంజాయిషీ అడగాలని గవర్నర్‌ రాజభవన్‌ కార్యదర్శిని ఫోన్లో ఆదేశించారు. తరువాత బానర్లను తొలగించారు. ఈ పరిణామం తరువాత రాజభవన్‌ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బ్యానర్లను ఏర్పాటు చేశారని, అది గవర్నర్‌ను అవమానించటమేనని, దీన్ని గవర్నర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు. తన మీద కుట్ర జరిగిందని, ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా బానర్ల ఏర్పాటు జరగదని, కావాలని ముఖ్యమంత్రి చేయిస్తున్న ఇలాంటి చర్యలు రాజ్యాంగ యంత్రాంగం విఫలం కావటానికి దారి తీస్తుందని హెచ్చరించింది. కాగా తెల్లవారే సరికి వందలాది బానర్లను ఏర్పాటు చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. గవర్నర్‌కు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బానర్‌ను విద్యార్ధులు తగులబెట్టారు.


” మీ క్రూరమైన నోటిని మూసుకోమని మేమూ చెప్పగలం…. కానీ గవర్నర్‌ పదవికి గౌరవం ఇస్తున్నాం గనుక ఆ మాట అనటం లేదు.” అని కేరళ టూరిజం శాఖ మంత్రి పిఏ మహమ్మద్‌ రియాజ్‌ ఆదివారం నాడు చెప్పారు. శనివారం నాడు కాలికట్‌ విశ్వవిద్యాలయ సందర్శనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు రక్తసిక్త చరిత్ర గురించి తనకు తెలుసునంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సమాధానంగా పత్తానంతిట్ట జిల్లా కొన్నిలో జరిగిన నవకేరళ సదస్సులో రియాజ్‌ స్పందించారు. ఇటీవల గవర్నర్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పూనుకున్న తీరు మీద గవర్నర్‌ వెళ్లిన ప్రతి చోటా విద్యార్ధులు, యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని మరింతగా రెచ్చగొట్టే విధంగా గవర్నర్‌ మాట్లాడుతున్నారు.నవ కేరళ సదస్సులతో రాష్ట్ర సిఎం, మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఆ సదస్సులను కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు బహిష్కరిస్తున్నారు. గవర్నర్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చటమే కాదు, ఆ పార్టీ నేతల భాషను కూడా ఉపయోగిస్తున్నారు. మూడు రోజుల కాలికట్‌ పర్యటనకు వచ్చిన గవర్నర్‌కు శనివారం సాయంత్రం నిరసన ఎదురైంది. అంతకు ఐదు రోజుల ముందు నిరసన సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్‌ తనపై దాడి చేయించేందుకు పూనుకున్నారని గవర్నర్‌ ఆరోపించారు.


ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరసనల మధ్య కాలికట్‌ విశ్వవిద్యాలయానికి వచ్చిన గవర్నర్‌ శనివారం నాడు మాట్లాడుతూ వారు కోతుల వంటి వారు. వాటిని చూసి మనం భయపడితే అవి మన వెంటపడతాయి. నేను ఆ విధంగా పారిపోను, నన్ను ఏ విధంగానూ వేధించలేరు, నన్నెవరూ భయపెట్టలేరు.కానీ ముఖ్యమంత్రి అలా చేస్తున్నారు, ఎందుకంటే కన్నూరు నుంచి వచ్చారు గనుక, కన్నూరుకు రక్త చరిత్ర ఉంది, అక్కడ ఒకరినొకరు చంపుకుంటున్నారని అన్నారు. గవర్నర్‌ సంఘపరివార్‌ పనిముట్టుగా పని చేస్తున్నారని, విద్యా రంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారని వివిధ సందర్భాలలో విజయన్‌ విమర్శిస్తున్నారు. సంఘపరివార్‌కు చెందిన వారిని తన అధికారంతో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో చేరుస్తున్నారని చెబుతున్నారు. గవర్నర్‌ మతిమాలిన మాటలతో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనకారులను రెచ్చగొడుతున్నారని విజయన్‌ విమర్శించారు. కాలికట్‌ విశ్వవిద్యాలయంలో సంఘీ ఛాన్సలర్‌ వెనక్కు పో అంటూ హిందీలో ” సంఘీ ఛాన్సలర్‌ వాపస్‌ జావో – ఎస్‌ఎఫ్‌ఐ ” అన్న ఒక బానర్‌ను ఏర్పాటు చేశారు. దీని గురించి విలేకరుల ప్రశ్నకు స్పందనగా అవును నేను కాషాయమయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని దేవాయలయాలు కేరళలో ఉన్నాయి. అవి కాషాయ చిహ్నాలు కావా, దమ్ముంటే వాటిని తొలగించండి అన్నారు. అవును నేను కాషాయీకరణకు పూనుకున్నాను. పురాతన భారత సంస్కృతి రక్షకురాలు కేరళ. పురాతన ఆలయాలు, పురాతన నృత్య రీతులను మీరు ఉత్తర ప్రదేశ్‌లో చూడలేరు, బీహార్‌లో చూడలేరు. వాటిని కేరళలోనే మీరు చూస్తారు.కేరళలో ప్రతిదీ కాషాయమయమే.పురాణాల ప్రకారం కంటికి ఆహ్లాదంగా కనిపించే రంగు కాషాయమే అని చెబుతున్నా. ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని నియమిస్తున్నానని అనటానికి వారెవరు ? వివిధ మార్గాల ద్వారా తన వద్దకు వచ్చిన పేర్ల నుంచి కొందరిని సిఫార్సు చేశాను. అది నా విచక్షణ అధికారానికి సంబంధించిన అంశం. వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి, రాష్ట్రపతికి తప్ప ఎవరికీ జవాబు చెప్పాల్సినపని లేదు.వారు క్రిమినల్స్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కిరాయికి ఏర్పాటు చేశారు. ఇలా ఎందుకు చేశారంటే అతను కన్నూరు నుంచి వచ్చారు. కన్నూరుకు రక్తసిక్త చరిత్ర ఉందని నాకు తెలుసు, అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి దారి మళ్లించాలని సిఎం కోరుకుంటున్నారు. రాష్ట్రంలో సంపదలను సృష్టించకుండా సంక్షేమ పధకాలను ప్రకటిస్తున్నారు, డబ్బంతా విదేశాల నుంచి వస్తున్నది. అన్నారు.


సిఫార్సులను పక్కన పెట్టి తమను కాకుండా గవర్నర్‌ తమ కంటే తక్కువ అర్హతలు కలవారిని కేరళ విశ్వవిద్యాలయ సెనెట్‌కు నలుగురు విద్యార్ధులను నియమించినట్లు దాఖలైన పిటీషన్‌ స్వీకరించి నియామకాల మీద హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన ఇద్దరు విద్యార్ధులను పక్కన పెట్టి గవర్నర్‌ తన ఇష్టం వచ్చిన వారిని నియమించారు. ఆదివారం నాడు పత్తానంతిట్ట జిల్లాలో నవకేరళ సదస్సు సందర్భంగా సిఎం పినరయి విజయన్‌ విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్‌ మతిమాలిన చర్యల ద్వారా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌ చర్యలు నిరసనలకు పురికొల్పుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన తెలుపుతున్నది.వారి మీద గవర్నర్‌ తీవ్ర పదజాలాన్ని వినియోగించారు.చురుకైన రాజకీయాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి వారిని రక్తం మరిగిన నేరగాళ్లు అని ఎలా మాట్లాడారో నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఇది మతిమాలిన చర్య. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారు ఇలాంటి దిగజారుడు పదజాలంతో మాట్లాడకూడదు. ఖాన్‌ గారు ఈ రాష్ట్ర గవర్నర్‌ అని మరిచిపోయినట్లున్నది. తన చర్యల ద్వారా రాష్ట్రంలో శాంతిని విచ్చిన్నం చేసేందుకు కావాలనే మాట్లాడుతున్నారని గతంలో కూడా నేను చెప్పాను. ప్రతి సమస్య మీద గరిష్టంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు ” అని విజయన్‌ చెప్పారు.


కన్నూరు చరిత్ర మీద నిందలు వేసిన గవర్నర్‌ వ్యాఖ్యల గురించి మంత్రి రియాజ్‌ మాట్లాడుతూ ” కన్నూరు చరిత్ర అంత చెడ్డదా ?వలస పాలకులకు వ్యతిరేకంగా కన్నూరు గడ్డ మీద పోరాడిన అనేక మంది అమరజీవులయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కన్నూరు ముఖ్య పాత్రను పోషించింది. కన్నూరు, కేరళ పట్ల గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు అంత కోపమెందుకు ? 1970 డిసెంబరులో ఆర్‌ఎస్‌ఎస్‌ మతహింసాకాండ వ్యాప్తికి కన్నూరులోని తలసెరిని ఎంచుకుందని గౌరవనీయ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తెలుసుకోవాలి. వారు ఒక మసీదు మీద డాడికి యత్నించారు. మసీదును కాపాడేందుకు ఇతర కమ్యూనిస్టులతో కలసి యుకె కున్హిరామన్‌ ప్రయత్నించారు. మలబార్‌ ముస్లిం బిడ్డ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దాడి చేశారు. ఆ ప్రాంతంలో కొట్లాటలను నివారించేందుకు ఎర్రజెండా కట్టుకున్న ఒక నల్లరంగు జీపు తిరుగుతూ శాంతిని పాటించాలని ప్రచారం చేసింది. శాంతికోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని దానిలో ఉన్నవారు చెప్పారు. ఆ జీపు ముందుభాగంలో కూర్చున్న ఒక యువకుడే నేటి ముఖ్యమంత్రి విజయన్‌. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు చరిత్రను తెలుసుకోవాలి. కన్నూరు, కేరళ చరిత్రను వక్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పద్దతుల్లో ముఖ్యమంత్రిని, ఆయన జిల్లాను అవమానపరుస్తున్నారు.” అని రియాజ్‌ చెప్పారు. తాము ఆందోళనను విరమించటం లేదని మలప్పురం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. అయితే గవర్నర్‌ పాల్గొనే ప్రైవేటు కార్యక్రమాల వద్ద ఎలాంటి నిరసన తెలపటం లేదని స్పష్టం చేసింది.

నోరు విప్పిన పొగబాంబు దాడి నిందితులు- విభ్రాంతి కలిగిస్తున్న మో-షా మౌనం, అడిగిన వారిని పార్లమెంటు నుంచి గెంటిస్తారా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


లోక్‌సభలో 2023 డిసెంబరు పదమూడున జరిపిన పొగబాంబు దాడి నిందితులు అందరూ ఒకే రకమైన సమాధానం చెబుతున్నారు. ఎవరో వారి బ్రెయిన్‌ వాష్‌ చేశారని అలా అనుకుందాం. ఇప్పుడు అది ప్రధానం కాదు. దాడి జరిగిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా నోరు విప్పకపోవటమే అసలైన సమస్య. వారి మౌనం, పార్లమెంటుకు రాని కారణంగా గురు, శుక్రవారాల్లో పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన కానసాగింది. ఈ అంశం గురించి చర్చించాలని కోరగా ప్రభుత్వం నిరాకరించింది. దాంతో సభ్యుల పట్టు కారణంగా పలు అంతరాయాల తరువాత సోమవారానికి వాయిదా పడింది. బయట మాట్లాడుతూ సభకు రాకుండా, మౌనంగా ఉండేట్లు వారి బుద్దులను ఎవరు శుద్ధి చేసినట్లు ? దీన్ని రాజకీయం చేయవద్దని కబుర్లు చెబుతున్నారు. ఎవరూ అలాంటి ఆరోపణలూ ఎవరి మీదా చేయలేదు. బిజెపి నోట రాజకీయం మాట ఎందుకు వచ్చింది ?దాడి గురించి చెప్పమని అడిగితే రాజకీయం అంటారా ? దేశ పౌరులు దేని గురించి ఆందోళన చెందాలి ? అసలేం జరుగుతోంది ? ఏ కథనాన్ని వండి వార్చేందుకు తెరవెనుక బిజెపి పెద్దలు మధనం జరుపుతున్నట్లు ? నిందితులు లోక్‌సభ ప్రేక్షకులుగా ప్రవేశించేందుకు మైసూరు బిజెపి ఎంపీ ప్రతాప్‌ సింహ పాసులు ఇచ్చినట్లు తేలింది. అదే ప్రతిపక్షాలకు చెందిన వారెవరైనా ఇచ్చి ఉంటే ఇక చెప్పాల్సిందేముంది? ఈ పాటికి రచ్చో రచ్చ. పార్టీ,లోక్‌సభ స్పీకర్‌ గానీ సదరు ఎంపీ నుంచి వివరణ కోరినట్లు, పోలీసులు ప్రశ్నించినట్లుగానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. అతగాడిని బయటపడవేసేందుకు, తద్వారా బిజెపి పరువు నిలుపుకొనేందుకు చూస్తున్నారా ? దాడి సందర్భంగా నిందితులు చేశారని చెబుతున్న నినాదాలు నిరంకుశత్వం, నిరుద్యోగం, రైతుల ఆందోళన వంటి అంశాలపై నిజమే అయితే వాటి గురించి దేశంలో మరోసారి చర్చ జరిగితే అది కూడా బిజెపికి రాజకీయంగా దెబ్బే. రానున్న ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది, దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవరి మీద నెపం నెట్టి జనం దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు ? ఇలా జనంలో పరిపరి ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. ఈ నెల 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉంది.


లోక్‌సభలో పొగబాంబు దాడికి సూత్రధారి అని చెబుతున్న కొలకతాకు చెందిన లలిత్‌ మోహన్‌ ఝా అనే యువకుడిని రాజస్థాన్‌లో పట్టుకున్నట్లు, అతనే లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతను సామ్యవాది సుభాస్‌ సభ పేరుతో ఒక స్వచ్చంద సంస్థ ఒక శాఖకు అధ్యక్షుడిగా ఉన్నాడని చెబుతున్నారు. దాడి తరువాత లోక్‌సభ వెలుపలి దృశ్యాలను ఫోన్‌ ద్వారా వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టినట్లు, ఆ ఫోన్‌తో పాటు దాడిలో పాల్గొన్న నలుగురి ఫోన్లనూ ధ్వంసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడి తరువాత బస్‌లో హర్యానా సరిహద్దు సమీపంలో రాజస్థాన్‌లోని కుచమన్‌ వెళ్లి ఆ రాత్రి అక్కడ ఒక హౌటల్లో ఉండి, గురువారం నాడు ఢిల్లీ వచ్చి పోలీసులకు లొంగినట్లు వార్తలు. దాడి జరిపేందుకు గత కొద్ది నెలలుగా పార్లమెంటు పాసుల కోసం ప్రయత్నించినట్లు చెప్పాడట. తన కోసం అనేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు గ్రహించి తానే వచ్చి లొంగినట్లు, తన ఫోన్‌ ద్వారానే వీడియోలు తీస్తున్నట్లు, దాడి నిందితులైన అమోల్‌, మనోరంజన్‌, సాగర్‌, నీలమ్‌ ఫోన్లను రాజస్తాన్‌లో ధ్వంసం చేసినట్లు ఝా చెప్పాడు.రాజస్థాన్‌కు చెందిన ఝా స్నేహితుడు మహేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధ చట్టం(ఉపా) కింద వారిని అరెస్టు చేశారు.వారికి బెయిలు రాదు. నిందితులు రెండు సంస్థల పేర్లతో పాటు ఒకే విధమైన సమాధానాలు చెబుతున్నారని, దొరికితే ఏం చెప్పాలో కూడా వారు ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఆరుగురు ఫేస్‌బుక్‌లో భగత్‌ సింగ్‌ పేరుతో ఒక గ్రూపుగా చేరినట్లు, రైతుల నిరసన, మణిపూర్‌ ఉదంతాలు, నిరుద్యోగం వంటి అంశాల మీద తాము ఆగ్రహం చెందినట్లు అందుకే తామీపని చేసినట్లు అమోల్‌, మిగతావారు కూడా అలాగే చెప్పారని అంటున్నారు. వీరికి ఎలాంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు కనిపించటం లేదని పోలీసులు పేర్కొన్నట్లు పిటిఐ తెలిపింది. దుండగులు లోక్‌సభ లోపల, వెలుపల ఎలాంటి హానికరంగాని పొగబాంబులు పేల్చారు. వారంతా ఢిల్లీ శివార్లలోని హర్యానా గురుగ్రామ్‌కు డిసెంబరు పదిన చేరుకున్నారు.పదమూడవ తేదీన పాసులు తీసుకున్న ఇద్దరు గాలరీ నుంచి సభలోకి దూకి పొగ బాంబులు పేల్చారు. బయట ఉన్న వారు వెలుపల పేల్చారు.లోపల ఎంపీలే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.2001లో పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి చేసిన రోజునే వీరు ఎంచుకున్నారు.


దాడి ఉదంతం గురించి ప్రకటన చేసేందుకు ప్రధాని మోడీ సభకు రావాలని, హౌంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఇలా అనుచితంగా ప్రవర్తించారంటూ గురువారం నాడు లోక్‌సభలో 14 మందిని, రాజ్యసభలో ఒకరిని సస్పెండ్‌ చేశారు.లోక్‌సభలో డిఎంకె ఎంపీ పార్థీవన్‌ అసలు సభకు రాలేదని, చెన్నరులో ఉన్నట్లు గుర్తించి నాలుక కరుచుకొని పేరు తొలగించారు. పార్లమెంటు ప్రాంగణంలో భద్రత లోక్‌సభ కార్యాలయానిదని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించి ప్రభుత్వానికి సంబంధం లేదనే అభిప్రాయం కలిగించేలా చూశారు. ఉదంతం జరిగింది సభలో అయినా దుండగులు వెలుపలి నుంచి వచ్చారు. పార్లమెంటుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ఉండరు, కేసు నమోదు వెలుపల జరిగింది గనుక ప్రభుత్వమే జవాబు చెప్పాల్సి ఉంటుంది. భద్రత లోపాలకు కారకులంటూ ఎనిమిది మంది సిబ్బందిని లోక్‌సభ కార్యాలయం సస్పెండ్‌ చేసింది.


విపరీత ప్రవర్తన ఉన్న పిల్లలను, లేదా పెద్ద వారిని వైద్యులకు చూపించాల్సి ఉంటుందని తెలిసిందే. ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీ అనేక అంశాలపై మౌనంగా ఉండటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక జనం జుట్టుపీక్కుంటున్నారు.ప్రతి అంశం మీద ప్రధాని మాట్లాడాల్సిన అవసరం లేదని బిజెపి మద్దతుదారులు సమర్ధిస్తారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది.పార్లమెంటు మీద జరిగిన దాడి గురించి కూడా మాట్లాడకపోవటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ! అసలు జవాబుదారీ తనం ఉన్నట్లేనా ? రెండు వందల మందికి పైగా మరణించి, మరికొన్ని వందల మంది గాయపడి, 70వేల మంది నెలవులు తప్పినా మణిపూర్‌ రాష్ట్రాన్ని సందర్శించేందుకు మే మూడవ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రధాని వెళ్లలేదు. ఇద్దరు మహిళలను వివస్త్రలను గావించి తిప్పినట్లు వీడియోలు వెల్లడైన తరువాత మూడు నెలలకు మొక్కుబడిగా స్పందించారు. అందుకే అహమ్మదాబాద్‌లో క్రికెట్‌ మాచ్‌ చూడటానికి, ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌ గురించి పట్టించుకోవటానికి తీరిక ఉంటుంది గానీ మణిపూర్‌ వెళ్లటానికి ప్రధాని కుదరలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మిజోరం వెళ్లి ప్రచారం చేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. పక్కనే ఉన్న రాష్ట్రం తగులబడితే చూడటానికి రాలేదుగానీ తగుదునమ్మా ఓట్ల కోసం వచ్చారా అనే విమర్శకు భయపడే అలా చేశారన్నది స్పష్టం.వ్యక్తిగతంగా తనకు, బిజెపికి ఇబ్బంది వచ్చినపుడు మౌనంగా ఉండటం, తరువాత అవకాశం వచ్చినపుడు పార్టీలో తన ప్రత్యర్ధులు, వెలుపల రాజకీయ వ్యతిరేకుల మీద దాడి చేయటం నరేంద్రమోడీ నైజంగా కనిపిస్తున్నది. గుజరాత్‌ బిజెపి కుమ్ములాటలు, అధికార దెబ్బలాటల్లో జరిగింది అదే. చివరికి గురువు వంటి అద్వానీకే ఏ గతి పట్టించిందీ చూశాము. అందువలన మోడీ మౌనం బలహీనత కాదు, ప్రమాదకరమైన ఆయుధం అని గ్రహించాలి. కౌటిల్యుడి ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు.ఇలాంటి వైఖరితో ఎంతకాలం ముందుకు పోతారు, ఏమి సాధిస్తారు అన్నది ప్రశ్న. గణితంలో రెండు రెళ్లు ఎక్కడైనా నాలుగే, కానీ రాజకీయాల్లో కాదు.


అధికారం ఉన్నపుడు ఎవరినైనా ఇంద్రుడు, చంద్రుడు అని పొగడటం సహజం. దానిలో భాగంగానే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ గతశతాబ్దిలో మహాత్మా గాంధీ మహాపురుషుడైతే, వర్తమానంలో నరేంద్రమోడీ యుగపురుషుడంటూ కీర్తించారు. దీన్నే నక్కకూ నాగలోకానికి పోలిక పెట్టటం అంటారు. అహింస, సత్యవాదిగా బ్రిటీష్‌ వారి బానిసత్వం నుంచి మనల్ని మహాత్మాగాంధీ విముక్తి చేస్తే నరేంద్రమోడీ దేశాన్ని ప్రగతిబాట పట్టించారని అన్నారు. ముఖస్తుతికీ ఒక హద్దు ఉంటుందని ఇద్దరికీ పోలిక పెట్టటంతో దానిని కూడా చెరిపివేశారని, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులకు తగనిపని, సిగ్గుచేటు అని కాంగ్రెస్‌ విమర్శించింది. వర్తమాన రాజకీయాల్లో జయాపజయాలు కొన్ని మినహాయింపులతో అధికారపక్షం చేసే తప్పిదాలే ప్రతిపక్షాలకు అవకాశాలు కల్పిస్తున్నాయి తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న కారణంగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఏం చేసినా జనం మరొక మార్గం లేక ఆ పార్టీనే గెలిపించారు. దాని వైఫల్యాలు, ప్రజావ్యతిరేక చర్యలే వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించటానికి, బిజెపికి అవకాశాలు రావటానికి దోహదం చేశాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన రాజస్థాన్‌, చత్తీస్‌ఘర్‌, మధ్య ప్రదేశ్‌లో బిజెపి గెలవటానికి రెండు చోట్ల పాలకపార్టీగా వైఫల్యం, మూడు చోట్లా కూడా తానే గెలవగలననే అతి విశ్వాసంతో బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీలను కూడగట్టుకోలేని కాంగ్రెస్‌ రాజకీయ తప్పిదం, బిజెపికి పోటీగా మృదు హిందూత్వతో జనాలకు దగ్గరకావాలనే దగ్గరదారిని ఎంచుకోవటం తప్ప మరొకటి కాదు. రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. అంతకు ముందు కర్ణాటక, హిమచల్‌ ప్రదేశ్‌లో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. అక్కడ యుగపురుషుడు, విశ్వగురువు మంత్రదండం పనిచేయలేదు.


మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను బిజెపి మౌనమునిగా ఎద్దేవా చేసింది. సోనియా గాంధీకి ఆగ్రహం వస్తుందేమో అన్న భయంతో నోరు విప్పేవారు కాదని ప్రచారం చేసింది. ఇప్పుడు నరేంద్రమోడీకి అలాంటి భయం లేదు. పార్టీలో తనకు ప్రత్యర్ధులుగా ఉన్నవారిని ఎలా తొక్కిపెట్టారో తెలిసిందే. అలాంటి వ్యక్తి ఎందుకు అనేక అంశాల మీద మౌనం పాటిస్తున్నారు. అదానీ మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటు స్థంభించినా మాట్లాడలేదు, ఏడాది పాటు రైతులు ఆందోళన చేసినా వారు ఢిల్లీలో ప్రవేశించటానికి వీల్లేకుండా రోడ్ల మీద మేకులు కొట్టించి కూర్చున్నారు తప్ప నోరు విప్పలేదు.విధిలేక మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తూ క్షమాపణలు చెప్పి తరువాత రైతులు లేవనెత్తిన అంశాల మీద మౌనం దాల్చుతున్నారు. తమ నేత మౌనం గురించి అడిగితే మాటల మనిషి కాదు చేతల మనిషి అని బిజెపి సమర్ధించుకుంటుంది. పార్లమెంటు మీద జరిగిన దాడి గురించి కూడా మాట్లాడని వారి చేతిలో దేశం భద్రంగా ఉంటుందని ఎలా నమ్మాలి. బిజెపి ప్రతిపక్షంగా ఉన్న చోట ప్రభుత్వాలను నిలదీసే నైతిక హక్కు వారికి ఉంటుందా !

ఉక్రెయిన్‌ పోరుపై పశ్చిమ దేశాల మల్లగుల్లాలు, దిక్కుతోచని జెలెనెస్కీ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అదిగో పుతిన్‌ సేనలను తరిమి కొడుతున్నాం ఇదిగో రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి తెచ్చుకుంటున్నాం అని గడచిన 658 రోజులుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ, అమెరికా, పశ్చిమదేశాల నేతలు చెబుతూనే ఉన్నారు.పరిస్థితిలో మార్పు లేదు, రష్యా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలతో సహా త్వరలో ఎన్నికలు జరపబోతున్నామని ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలు మరోసారి ఉక్రెయిన్‌ మీద దృష్టి సారించాయి.పోతున్న పరువును నిలుపుకొనేందుకు కొత్త ఎత్తుగడల గురించి మల్లగుల్లాలు పడుతున్నాయి.దాన్లో భాగంగానే హడావుడిగా జెలెనెస్కీని సోమవారం నాడు వాషింగ్టన్‌ రప్పించారు.ప్రారంభంలో తగిలిన ఎదురుదెబ్బల తరువాత రష్యా మిలిటరీ కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నది. గతం కంటే ఎక్కువగా సైనికులు, క్షిపణులు, మందుగుండును సమకూర్చుకుంది. ఇరాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో యుద్ధరంగంలో వినియోగించే డ్రోన్లను సమీకరించింది. పశ్చిమ దేశాలు మిలిటరీ, ఆర్థికసాయం ఎంతచేసినా ఫలితం లేకపోవటంతో అమెరికా యంత్రాంగంలో ఆందోళన మొదలైంది. సైనిక చర్య వచ్చే ఏడాది కూడా కొనసాగితే అది జో బైడెన్‌ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. ఓడిపోతున్న ఉక్రెయిన్‌కు మనమెందుకు సాయం చేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు. దిక్కుతోచని జో బైడెన్‌ గత వారంలో పార్లమెంటులో మాట్లాడుతూ పుతిన్ను గెలవనివ్వకూడదు, అది మన జాతీయ, మన స్నేహితుల అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఉక్రెయిన్‌కు మన సాయంలో అంతరాయం ఏర్పడితే పుతిన్‌ స్థానం బలపడుతుందని వాపోయాడు. వచ్చే ఏడాది జర్మనీలో జరిపే యుద్ధ విన్యాసాల తరువాత కొత్త ఎత్తుగడలకు ఒక రూపం వస్తుందని భావిస్తున్నారు. కొత్త వ్యూహంతో ముందుకు పోనట్లయితే ఓడే అవకాశం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే 111బిలియన్‌ డాలర్ల సాయం చేశామని, అదంతా బూడిదలో పోసిన పన్నీరైనందున ఇంక సాయం అనవసరమని రిపబ్లికన్లు పెదవి విరుస్తున్నారు.ఇచ్చినదానితో సర్దుకొని పోరుసాగించాలి తప్ప ఎక్కువగా ఆశించవద్దని కూడా పరోక్షంగా సందేశాలిస్తున్నారు. ఎంత ఇస్తామనేది పక్కన పెడితే రానున్న సంవత్సరంలో గత రెండు సంవత్సరాలలో చేసిన మాదిరి సాయం చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.


రానున్న రోజుల్లో గట్టి ప్రతిఘటన ఇస్తే వచ్చే ఏడాది చివరికి లేదా 2025లో రష్యాతో సంప్రదింపులకు అర్ధం ఉంటుందని, భారం మొత్తం ఉక్రెయిన్‌ మీద పెట్టే విధంగా అమెరికన్లు మాట్లాడుతున్నారు. ఎత్తుగడలను మార్చకపోతే మొదటి ప్రపంచ యుద్ధంలో 1916లో పెద్ద సంఖ్యలో సైనికులను పోగొట్టుకున్నా సాధించిందేమీ లేనట్లుగా ఉక్రెయిన్‌ పరిస్థితి ఉంటుందని హెచ్చరించినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. ఎదురుదాడుల పేరుతో ఉక్రెయిన్‌ ప్రారంభించిన చర్యల్లో పెద్ద సంఖ్యలో మరణించిన, గాయపడిన సైనికులు ఉన్నట్లుగా కూడా పేర్కొన్నది.వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యం మాదిరి 2023లో ఉక్రెయిన్‌ పరిస్థితి ఉందని విమర్శకులు పేర్కొన్నారు. చివరి యత్నంగా అమెరికా స్వయంగా తన సీనియర్‌ కమాండర్లు ఆంటోనియో అగుటో జూనియర్‌ వంటి వారు ఎక్కువ సమయం కీవ్‌లో, జర్మనీలో ఉండి సమన్వయం చేసేందుకు పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌ ఎదురుదాడుల్లో సాధించిందేమీ లేకపోగా అమెరికా అంచనావేసినదాని కంటే రష్యా సేనలు బలంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు రష్యా ఎంతగా తన సేనలను బలపరుచుకుంటున్నదన్న అంచనాలో కూడా అమెరికా విఫలమైంది. ప్రస్తుతం ఇరవై శాతం ఉక్రెయిన్‌ ప్రాంతం రష్యా ఆధీనంలో ఉంది. అక్కడ రష్యా పాతిన మందుపాతరలు 1950 దశకంలో కొరియా యుద్ధం తరువాత మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఉక్రెయిన్‌ సేనలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. వాటిని తొలగించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ సేనలపై రష్యా హెలికాప్టర్లతో దాడులు చేస్తూ ఊపిరి సలుపుకోనివ్వటం లేదు. ఇరాన్‌, చైనాల నుంచి సేకరించిన రకరకాల డ్రోన్లను రష్యా ఉపయోగిస్తుండటంతో యాంత్రిక యుద్ధ స్వభావంలోనే మార్పు వచ్చిందని అమెరికా నిర్ధారణకు వచ్చింది.రష్యా ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలలో దేనిమీద కేంద్రీకరించాలనే అంశపై అమెరికా-ఉక్రెయిన్‌ నిపుణుల మధ్య ఏకాభిప్రాయం లేదని వెల్లడైంది. కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూడవద్దని అమెరికా అంటోంది. యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్‌ కొంత భాగాన్ని రష్యాకు కోల్పోవాల్సి ఉంటుందని జెలెనెస్కీ రాక సందర్భంగా అమెరికా రిపబ్లికన్‌ సెనెటర్‌ జెడి వాన్స్‌ చెప్పాడు.


త్వరగా ముగియాలని మేము ఎంతగా కోరుకుంటున్నప్పటికీ సమీప కాలంలో ఉక్రెయిన్‌ పోరు ముగిసేట్లు లేదని, అందుకే వత్తిడిని మరింత పెంచాల్సి ఉంటుదని జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ అధికార సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సమావేశంలో చెప్పాడు. మేం వూరికే వదలి పెడతామని పుతిన్‌ అనుకోవద్దని కూడా అన్నాడు. అమెరికా తరువాత ఉక్రెయిన్‌కు అతిపెద్ద మద్దతుదారుగా జర్మనీ ఉంది, భారీ మొత్తంలో ఆయుధాలను అందిస్తున్నది.పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నందున ఉక్రెయిన్‌కు అమెరికా అదనపు సాయం అందకపోతే ఉక్రెయిన్‌ గతి ఏమిటని అనేక మంది పశ్చిమ దేశాల విశ్లేషకులు ఆందోళన వెల్లడిస్తున్నారు.మార్చి నాటికి పదిలక్షల ఫిరంగి గుండ్లను అందించాలన్న లక్ష్యం నెరవేరేట్లు కనిపించటం లేదని, మరోవైపు ఉత్తర కొరియా నుంచి అంతకంటే ఎక్కువగా రష్యా పొందవచ్చని చెబుతున్నారు. తమ కంటే పది నుంచి 30 రెట్ల వరకు ఫిరంగి గుండ్లు రష్యన్ల వద్ద ఉన్నాయని ఒక ఉక్రెయిన్‌ సైనికుడు చెప్పినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగల్‌ రాసింది. పశ్చిమ దేశాలను మించి రష్యా ఫిరంగి గుండ్లను ఉత్పత్తి చేస్తుండగా ఉత్తరకొరియా నుంచి వస్తున్నవి అదనమని, పశ్చిమ దేశాల రాజకీయాల్లో ఉన్న అనిశ్చితి కారణంగా ఉక్రెయిన్‌ నిలబడగలదా అంటూ, అమెరికా సాయం లేకుంటే ఐరోపా మద్దతు కుప్పకూలిపోతుందని ఎకానమిస్ట్‌ పత్రిక రాసింది.


ఆంక్షలతో పశ్చిమ దేశాలు తమ బాంకుల్లో ఉన్న రష్యా సొమ్ము 300బిలియన్‌ యూరోలను స్థంభింప చేసినా, అనేక ఆంక్షలను విధించి అమలు జరుపుతున్నా ఇప్పటి వరకు పుతిన్‌ తట్టుకొని నిలిచాడు. పశ్చిమ దేశాలు వేసిన అంచనాలన్నీ తప్పాయి.చైనాతో సంబంధాలను పెంచుకొని పశ్చిమ దేశాల ఆంక్షలను నిర్వీర్యం చేశాడు. ఆంక్షల కారణంగా గతేడాది ఆర్థిక ఉత్పత్తి 2.1శాతం తగ్గినా ఈ ఏడాది 2.8శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. జనాభాలో 80శాతం మంది పుతిన్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వేలు తెలిపాయి. అయితే రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను కూడా తక్కువగా అంచనా వేయనవసరం లేదు. తొలిదశలో మాదిరి దూకుడుగా ముందుకు పోకుండా మధ్యలో గట్టిదెబ్బలు కొడుతూ ఉక్రెయిన్‌కు ఊపిరి సలపకుండా రష్యా చూస్తున్నది.అలసిపోయి దారికి రాకతప్పదనే అంచనాలో ఉంది.వచ్చే ఏడాది మార్చినెల 17వ తేదీన జరిగే ఎన్నికల్లో మరోసారి పుతిన్‌ పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.


సరిగ్గా జెలెనెస్కీ వాషింగ్టన్‌ పర్యటనకు వెళ్లినపుడే తాము నిర్మిస్తున్న అణు జలాంతర్గాములలో రెండింటిని మిలిటరికీ అప్పగించినట్లు ప్రకటించారు.మొత్తం ఎనిమిదింటిని రష్యా నిర్మిస్తున్నది.రాజధాని కీవ్‌ నగరం మీద మంగళవారం తెల్లవారు ఝామున డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణుల కంటే వేగంగా ప్రయాణించే ఎనిమిది ఖండాంతర దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా ప్రయోగించింది. వాటిని మధ్యలోనే కూల్చివేయటం ఎంతో కష్టం. ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్రిటన్‌ రెండు నౌకలను నల్లసముద్రంలోకి పంపుతున్నట్లు ప్రకటించింది. సముద్రంలోనూ భూమి మీద ప్రయాణించే సాయుధశకటాలను కూడా అది పంపుతున్నది. ఇటీవలి కాలంలో పుతిన్‌ రక్షణ ఖర్చును భారీగా పెంచుతున్నట్లు ఎకానమిస్ట్‌ పత్రిక పేర్కొన్నది. వచ్చే ఏడాది జిడిపిలో ఆరుశాతానికి పెంచనున్నారని, ఇది సోవియట్‌ యూనియన్‌ కూలిన తరువాత ఎక్కువ అని పేర్కొన్నది. రష్యా వృద్ధిరేటు ఈ ఏడాది ప్రారంభంలో ఒక ఒకశాతం ఉండగా మూడుశాతానికి పెరుగుతుందని రేటింగ్‌ సంస్థలు పేర్కొన్నాయి.


ఉక్రెయిన్‌ పోరు ప్రారంభంలో పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి.విధించిన ఆంక్షలు పని చేయటం లేదు, ఈ స్థితిలో రష్యాను ఎలా దారికి తేవాలా అన్నది పశ్చిమ దేశాలకు తోచటం లేదు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ఐరోపా యూనియన్‌ సమావేశంలో జరిగిన సమీక్షలో డజనుకుపైగా చైనా కంపెనీలు రష్యా మిలిటరీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను వారేమీ అదుపు చేయలేరు. తొలి రోజుల్లో ఆంక్షలు పని చేసినట్లు కనిపించినా తరువాత కాలంలో వాటిని అధిగమించినట్లు నిర్ధారణకు వచ్చారు.నాటో సభ్యురాలు టర్కీ, కజకస్తాన్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా వంటి దేశాలు రష్యాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. అమెరికా తయారీ మందుగుండు కూడా రష్యాకు చేరుతున్నట్లు సమావేశంలో వెల్లడైంది.కజకస్తాన్‌ వంటి దేశాల దిగుమతులు పెరిగిన తీరు చూస్తే మూడవ దేశాల ద్వారా ఐరోపా కంపెనీల యంత్రాలు, విడిభాగాలు రష్యాకు చేరుతున్నట్లు అనుమానిస్తున్నారు.హంగరీ, ఎస్తోనియా వంటి ఐరోపా దేశాలు రష్యాతో సంబంధాలను కలిగి ఉన్నట్లు సమీక్షలో పేర్కొన్నారు.గతంలో సోవియట్‌ మాదిరి ఇప్పుడు రష్యా తనకు అవసరమైన మిలిటరీ పరికరాలను నూటికి నూరుశాతం సమకూర్చుకోగలిగిన స్థితిలో ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఒకవైపు చెబుతూనే అలాంటి కంపెనీలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పలేని స్థితిలో ఐరోపా సమాఖ్య ఉంది.దాదాపు పదహారు వందల ఐరోపా కంపెనీలు రష్యాలో లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. కొన్ని మద్యం కంపెనీలు రష్యా నుంచి వెలువలికి వచ్చినట్లు ప్రకటించినా వాటి ఉత్పత్తులు అక్కడ దొరుకుతున్నాయని ఐరోపా సమాఖ్య అధికారులు వాపోతున్నారు.

ఇప్పుడు ఎవరైనా కాశ్మీరులో భూమి కొనవచ్చా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ద్వారా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హౌదా, ఆర్టికల్‌ 35ఏ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు ఆమోదం తెలిపింది. అది తాత్కాలికమే గనుక రద్దు సబబే అన్నది. తీర్పు ఇచ్చిన కోర్టు, న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు ఉంది గనుక ఆ మేరకు అనేక మంది అనుకూలంగా, వ్యతిరేకంగానూ స్పందిస్తున్నారు.భిన్న అభిప్రాయం చెప్పటం దేశద్రోహం లేదా ఉన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించటం కాదు. ఈ తీర్పుతో రాష్ట్రంలోని ఒక తరగతి జనం సంతోషించరు అని కాశ్మీరు మాజీ రాజు హరిసింగ్‌ కుమారుడు, కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కరణ్‌ సింగ్‌ స్పందించారు. తీర్పుతో ఆశాభంగం చెందాం తప్ప నిరుత్సాహపడటం లేదని మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి వెలుపలికి వచ్చి బిజెపికి దగ్గరగా ఉంటున్న గులాం నబీ అజాద్‌ కూడా ఆశాభంగం చెందినట్లు ప్రకటించారు. తీర్పు వెలువరిస్తున్న సందర్భంగా కాశ్మీరులోయలో ఆర్టికల్‌ రద్దును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలకు చెందిన వారిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆ వార్తలను సహజంగానే ప్రభుత్వం కొట్టిపడవేసింది. కోర్టు తీర్పును ఆమోదించటం తప్పనిసరి అంటూ దీనికి వ్యతిరేకంగా అనవసరంగా గోడకేసి తలలను కొట్టుకోవాల్సిన పనిలేదు.వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు శక్తిని సమీకరించుకోవాలని కరణ్‌ సింగ్‌ సలహా ఇచ్చారు.


ఆర్టికల్‌ 370 వలన దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరూ అక్కడ ఉండటానికి, భూములు కొనుక్కోనేందుకు అవకాశం లేదని, కాశ్మీరు వేరే దేశం అన్నట్లుగా ఉందని రకరకాల ప్రచారాలు చేశారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించారు. కాశ్మీరుకు ప్రత్యేక హౌదా తొలగించిన గత నాలుగున్నర సంవత్సరాలలో జరిగిందేమిటి? వాటిలో కొన్నింటిని చూద్దాం. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తరువాత ” నూతన కాశ్మీరు ” ఎంతో అభివృద్ది చెందిందని ప్రచారం చేస్తున్నారు. 2018-19 కాశ్మీరు రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం మానవాభివృద్ది రంగాల్లో గుజరాత్‌ కంటే ముందున్నట్లు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఇంకా జరిగిందని చెబుతున్నట్లా ? 2019జూన్‌లో ఎకనమిక్‌ టైమ్స్‌ ప్రచురించిన వార్త ప్రకారం 15-29 సంవత్సరాల వారిలో నిరుద్యోగం 15.89శాతం ఉంది. రాష్ట్రాన్ని కేంద్రం స్వాధీనం చేసుకున్న తరువాత 2020లో 17.8శాతం ఉన్నట్లు లేబర్‌ సర్వేలో తేలింది. ఇక తాజా సమాచారం ప్రకారం 18.3 శాతం ఉందని కేంద్ర మంత్రి నిత్యానందరారు పార్లమెంటులో చెప్పినట్లు హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2023 జూలై 26న ప్రచురించింది. కేంద్ర పాలనలో సాధారణ పరిస్థితి ఏర్పడిందని, ఉపాధి పెరిగిందని చేస్తున్న ప్రచారానికి పొంతన కనిపించటం లేదు. ఉగ్రవాదులు చెలరేగుతూనే ఉన్నారు. ఆ కారణంగానే రాష్ట్ర ప్రతిపత్తిని ఇంకా పునరుద్దరించలేదు.


ఆర్టికల్‌ 370కు అనుబంధంగా రాష్ట్రపతి ఉత్తరువు ద్వారా 1954లో రాజ్యాంగానికి ఆర్టికల్‌ 35ఏ తోడైంది. అనేక రాష్ట్రాలలో కల్పించిన మాదిరి కాశ్మీరులో ఉన్న శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక అవకాశాలు, హక్కులను ఇది కల్పించింది. రాష్ట్రం వెలుపల ఉన్న వారికి స్థిర ఆస్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఎవరు శాశ్వత నివాసులన్న నిర్వచనాన్ని మూడింట రెండువంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే మార్చగలదు.ఈ ఆర్టికల్‌ వలన దేశంలోని ఇతరులు కాశ్మీరులో రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడుతున్నట్లు , ఇది పౌరుల మౌలిక హక్కులకే విరుద్దం అని రాష్ట్రం వెలుపలి వారిని వివాహం చేసుకున్న కాశ్మీరీ మహిళకు జన్మించిన సంతానానికి కూడా ఆస్తిహక్కు ఉండదని ఇది వివక్ష కాదా అని కొందరు భాష్యం చెప్పారు. నిజానికి కాశ్మీరు శాశ్వత నివాసుల గురించి 1927లోనే నాటి రాజు హరిసింగ్‌ ఉత్తరువులు జారీ చేశారు. విలీనం సందర్భంగా వాటికి హమీ ఇచ్చినందున రాజ్యాంగంలో పొందు పరచినట్లు సమర్ధకులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక హక్కులు మరికొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నాయని వాటి సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సవరించిన దాని ప్రకారం కాశ్మీరులో స్థానికత నిర్దారణకు నిబంధనలు ఇలా ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు కాశ్మీరులో నివసించిన వారు, రాష్ట్రంలో ఏడు సంవత్సరాల పాటు చదివి పది లేదా పన్నెండవ తరగతి పరీక్షకు హాజరైన వారు, వలస వచ్చినట్లు పునరావాస, సహాయ కమిషనర్‌ వద్ద నమోదు చేయించుకున్నవారు, పదేండ్లకు పైగా కాశ్మీరులో పని చేసిన ఆలిండియా సర్వీసు అధికారులు, ప్రభుత్వ రంగసంస్థలు, బాంకులు, పరిశోధనా సంస్థలు, చట్టబద్ద ఇతర సంస్థలలో వారు పని చేసినా స్థానికులుగా పరిగణించబడతారు. అలాంటి వారి పిల్లలు రాష్ట్రం వెలుపల ఉపాధి, వాణిజ్యం, వంటి వాటికోసం ఉంటే వారినీ స్థానికులుగా పరిగణిస్తారు.


ఒకే దేశం, పౌరులంతా సమానమే అని చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో వెలుపలి వారు భూములు కొనేందుకు లేదు. జమ్మూకాశ్మీరులో నిబంధనలు సడలించినప్పటికీ భూముల కొనుగోలు మినహాయింపు అది పరిశ్రమలకే తప్ప ఎవరుబడితే వారు కొనుగోలు చేసేందుకు కాదని లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా చెప్పారు. సవరించిన కాశ్మీరు రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయదారులు కాని వారు సాగు భూమి కొనుగోలు చేసేందుకు లేదు. ఎవరు వ్యవసాయదారు అంటే స్వంతంగా చేసే వారు అని స్పష్టం చేశారు. ఎవరు కొనుగోలుకు అర్హులో నిర్ణయించాల్సి ఉంది. తిరిగి రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏర్పడే ప్రభుత్వం తలచుకుంటే ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 371 ప్రకారం అనేక రాష్ట్రాలలో ప్రత్యేక హక్కులను కల్పించారు. ఇరవై సంవత్సరాలకు పైగా నివాసం ఉన్నవారే హిమచల్‌ ప్రదేశ్‌లో ఎక్కడైనా భూమికొనుగోలుకు అర్హులు.ఎవరైనా నిజమైన స్థానికుడిని హిమాచలీ కాని మహిళ వివాహం చేసుకుంటే అలాంటి వారికి మినహాయింపు ఉంటుంది. స్థానికులైనా వ్యవసాయదారులు కాని వారు సాగు భూములు కొనటానికి లేదు. నివాసానికి కొనుగోలు చేయాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.వ్యవసాయేతర భూమిని వెలుపలి వారు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు పెట్టుబడిదారులు భూమి కొనుగోలు చేయవచ్చు. నాగాలాండ్‌లో ఆర్టికల్‌ 371ఏ ప్రకారం అక్కడి భూముల బదిలీ, యాజమాన్య హక్కులపై కేంద్రం కూడా చట్టాలు చేయటానికి లేదు. భూమి పుత్రులు తప్ప ఇతరులు భూమికొనే అవకాశం లేదు. సిక్కింలో ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం వెలుపలి వారు భూమి, ఆస్తులు కొనుగోలు మీద ఆంక్షలు ఉన్నాయి. కొన్ని మునిసిపల్‌ ప్రాంతాల్లో తప్ప సిక్కిం వాసులు ఆస్తి కొనుగోలు చేయవచ్చు, వారు కూడా గిరిజన ప్రాంతాల్లో కొనటానికి లేదు అక్కడ వారికి మాత్రమే కొనే అమ్మే హక్కు ఉంటుంది.ఎవరైనా పరిశ్రమలు పెడితే వెలుపలి వారు కొనుగోలు చేయవచ్చు. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం,పశ్చిమబెంగాల్లో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో పేర్కొన్న స్వయం పాలిత గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనటానికి లేదు. మిజోరంలో ఆర్టికల్‌ 371జి ప్రకారం గిరిజనేతర ప్రాంతాల్లో భూబదలాయింపుల్లో పరిమితులు ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో సాంకేతికంగా, సంప్రదాయంగా స్థానిక నివాసులు, కానివారికీ ఎవరికీ భూమిపై హక్కులు లేవు.2018లో చేసిన చట్టం ప్రకారం స్థానికులకు వ్యక్తిగత ఆస్తి హక్కులు కల్పించారు. వెలుపలి వారు, గిరిజనేతరులు స్వంత ఆస్తి కలిగి ఉండటానికి లేదు. ఝార్ఖండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌లలో గిరిజనేతరులు గిరిజనుల భూములు కొనుగోలు చేయటంపై ఆంక్షలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో 2003లో చేసిన చట్టం ప్రకారం వెలుపలి వారు నివాసం కోసం కేవలం 250 చదరపు మీటర్ల భూమిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు.


తమిళనాడులో జిల్లాకలెక్టర్‌ అనుమతితో గరిష్టంగా 59.95 ఎకరాల వ్యవసాయ భూమిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. గడచిన పది సంవత్సరాల్లో సాగులేని భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూములు కొనవచ్చు.ఏ తరగతి ప్రాంతాల్లో గరిష్టంగా పది ఎకరాలు అంటే నీటి వసతి ఉన్నచోట, కె తరగతి ప్రాంతాల్లో మెట్ట, నీటివసతి లేని చోట 54 ఎకరాలను కొనుగోలు చేయవచ్చు.కేరళలో ఎవరైనా భూములు కొనవచ్చు. అయితే వివాహం కాని పెద్దలు లేదా కుటుంబంలో ఒకరే ఉంటే ఐదు నుంచి ఏడున్నర ఎకరాలు మాత్రమే కొనుగోలు చేయవచ్చు.ఐదుగురి వరకు ఉన్న కుటుంబం పది నుంచి పదిహేను ఎకరాలు కొనుక్కోవచ్చు.పదికి మించి ఉన్న కుటుంబం గరిష్టంగా ఇరవై ఎకరాల వరకు కొనవచ్చు.మహారాష్ట్రలో కేవలం వ్యవసాయదారులు మాత్రమే గరిష్టంగా 54ఎకరాల వరకు సాగు భూములు కొనవచ్చు.హర్యానాలో అదుపులో ఉన్న ప్రాంతాలుగా ప్రకటించిన చోట వ్యవసాయేతర అవసరాల కోసం సాగు భూములు కొనాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. గుజరాత్‌లో ఉన్న నిబంధనల ప్రకారం వ్యవసాయం చేయని వారు సాగు భూములు కొనేందుకు లేదు. గుజరాతీలకు మాత్రమే వ్యవసాయ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది.2012లో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం దేశంలోని ఏ సాగుదారైనా గుజరాత్‌లో వ్యవసాయ భూములు కొనుగోలు చేయవచ్చు. వివిధ నేపధ్యాల పూర్వరంగంలో ఒకే దేశమైనప్పటికీ భూములు కొనుగోలుపై ఆంక్షలు ఉన్నాయి. కాశ్మీరులో కూడా అదే జరిగింది. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. రేపు తిరిగి రాష్ట్రంగా ఏర్పడితే భూమి హక్కులు, ఇతర అంశాలకు సంబంధించి తనదైన చట్టాలను చేసుకొనేందుకు అవకాశాలు లేకపోలేదు. కేంద్రం రద్దు చేసిన 35ఏ ఆర్టికల్‌లోని అంశాలను మరో చట్టం రూపంలో తెచ్చినా ఆశ్చర్యం లేదు.
వాట్సాప్‌లో కాషాయదళాలు అనేక తప్పుడు ప్రచారాలు చేశాయి. కాశ్మీరులో హిందువులు, సిక్కులు మైనారిటీలు వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు అన్నది ఒకటి.హిందూ మతం దేశంలో మైనారిటీ కాదు. రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికను బట్టి నిర్ణయిస్తే ఈశాన్య రాష్ట్రాలలో అనేక చోట్ల క్రైస్తవులు మెజారిటీ, కానీ అక్కడ హిందువులకు రిజర్వేషన్లు అడగలేదు.మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కాశ్మీర్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు ? కాశ్మీరు 2005 రిజర్వేషన్‌ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు మూడు, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి మూడు, వెనుక బడిన తరగతులకు రెండుశాతం వున్నాయి. వీటిని 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ ద్వారా షెడ్యూలు తరగతులకు 10,షెడ్యూలు కులాలకు 8, ఇడబ్ల్యుఎస్‌ 10, వెనుకబడిన ప్రాంతాల వారికి పది, మాజీ సైనికులకు ఆరు,పహారీ భాష మాట్లాడేవారికి, వికలాంగులు, వాస్తవాధీన రేఖ వెంబడి ఉండేవారికి, బలహీన వర్గాల(సామాజిక కులాలు)కు నాలుగేసి శాతాల చొప్పున సవరించారు. మొత్తం రిజర్వేషన్లు అరవైశాతం ఉన్నాయి. వర్తమాన పార్లమెంటు సమావేశాల్లో వాటిని చట్టబద్దం చేస్తూ బిల్లులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో హిందువులకు ప్రత్యేక రిజర్వేష్లన్లను ఎందుకు పెట్టలేదో బిజెపి వారు చెప్పగలరా ?

రేవంత రెడ్డి సర్కార్‌ రైతు బంధు నిధులను వెంటనే ఎందుకు విడుదల చేయలేదు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా మూడవ శాసనసభ డిసెంబరు తొమ్మిదవ తేదీన ప్రారంభమైంది. మంత్రులకూ శాఖలు కేటాయించారు.వారింకా కొలువు తీరలేదు.శాసనసభ్యులు ప్రమాణస్వీకారాలు చేసిన తరువాత పద్నాలుగవ తేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు సభ జరుగుతుందని, ఆ సందర్భంగా కొన్ని శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నట్లు చెబుతున్నారు. కాలిగోళ్లపుడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్లు బిజెపి తనదైన మతరాజకీయాలను ప్రోటెం స్పీకర్‌ నియామకంతోనే ముందుకు తెచ్చింది. మజ్లిస్‌-కాంగ్రెస్‌ బంధానికి తెరలేచినట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. భక్తులు తమదైవం రాముడి కంటే రావణుడినే ఎక్కువగా తలచుకుంటారన్నట్లుగా బిజెపినేతలకు మజ్లిస్‌ పేరు పలకకుండా నోట మాటరావటం లేదు. పాతబస్తీలో మజ్లిస్‌ పోటీ పెట్టని గోషామహల్‌ నియోజకవర్గం ఒక్కదానిలోనే బిజెపి గెలిచింది. వారి మధ్య ఉన్న తెరచాటు బాగోతాలకు ఇది నిదర్శనమని ఎన్నికలకు ముందే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.మజ్లిస్‌ పార్టీ ఎంఎల్‌ఏ అక్బరుద్దీన్‌ ప్రోటెం స్పీకర్‌గా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేసేది లేదని పార్టీ నేతలతో చర్చించకుండా అక్కడ గెలిచిన రాజాసింగ్‌ ప్రకటించటంతో అంతేకదా అంతేకదా అన్నట్లుగా బిజెపి ఆమోదించింది. ప్రోటెంస్పీకర్‌గా సీనియర్‌గా ఉన్న కెసిఆర్‌ సభకు రాలేని స్థితిలో అర్హత ఉన్నవారిలో ఎవరినైనా ఎంచుకొనే స్వేచ్చ ఉందని కాంగ్రెస్‌ సమర్ధించుకుంది. ఏ ప్రయోజనమూ లేకుండా ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావించలేము. ఎవరు అధికారంలో ఉంటే వారికి దగ్గరగా మజ్లిస్‌ ఉంటుందన్న అభిప్రాయాల పూర్వరంగంలో ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బిఆర్‌ఎస్‌ నేత, మాజీ సిఎం కె చంద్రశేఖరరావు తన వ్యవసాయ క్షేత్రంలోని స్నానాల గదిలో జారిపడి ఆసుపత్రిపాలయ్యారు.దీనికి కెసిఆర్‌ వయస్సు,బాత్‌ రూం స్థితి కంటే అసలు కారకులు జ్యోతిష్కులంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. ఎందుకంటే వారిలో ఏ ఒక్కరూ ఎన్నికల తరువాత బాత్‌ రూం గండం ఉంటుందని చెప్పకపోవటమే కారణమని, చెప్పి ఉంటే కెసిఆర్‌ అసలు వెళ్లి ఉండేవారు కాదని అంటున్నారు. మూడోసారి సిఎం కావటం ఖాయమంటూ చెప్పిన వారి జోశ్యాలు తలకిందులు కావటంతో బాత్రూంలో పడకముందే బహిరంగంగా కెసిఆర్‌ నోట మాటరాలేదు.


ఎనుముల రేవంత్‌ రెడ్డి సింఎంగా ప్రమాణస్వీకారం చేయగానే తీసుకున్న చర్యలను చూసి కొందరు ఎంతదూకుడుగా ఉన్నారో చూడండని వ్యాఖ్యలు చేశారు.మహలక్ష్మి పధకంలో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణాన్ని సాకారం చేశారు.ఆరోగ్య శ్రీ పధక మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచారు. ఆర్‌టిసి ప్రభుత్వానిదే కనుక వెంటనే అమల్లోకి వచ్చింది.గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పధకం కింద పెద్ద మొత్తంలో బకాయి పడినందున ప్రయివేటు ఆసుపత్రులు అమలు జరిపేందుకు మొరాయించిన సంగతి తెలిసిందే. బకాయిలు ఎంత ఉన్నదీ వెల్లడికావాల్సి ఉంది. ఎక్కడన్నా బావే కానీ వంగతోటదగ్గర కాదన్నట్లుగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం ఏదైనా ఒకటే. బకాయిలను వెంటనే చెల్లిస్తుందా లేదా అన్నదే గీటురాయి.చెల్లిస్తేనే పధకం అమలు జరుగుతుంది. ఈ రెండింటికీ వెంటనే నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉండదు. అందుకే వెంటనే ప్రకటించారన్నది స్పష్టం. ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీవీలలో చర్చలు మొదలయ్యాయి.రైతుబంధు నిధులు విడుదల నిలిచిపోవటానికి కాంగ్రెసే కారణమంటే కాదు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్‌ రావు ఎన్నికల ప్రచార నియమావళి ఉల్లంఘనే కారణమని ఎన్నికలకు ముందు ఆయా పార్టీల వారు వాదించారు. ఎన్నికల కమిషన్‌ కూడా ఉల్లంఘన కారణాన్ని చూపే నిలిపివేయించింది. ఏడవ తేదీన రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత, తొమ్మిదవ తేదీ సోనియాగాంధీ జన్మదినం వచ్చినా ఇంకా విడుదల ఎందుకు కాలేదో చెప్పాలని బిఆర్‌ఎస్‌, బిజెపి ప్రతినిధులు నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలుగా వాటికి ఉన్న ప్రశ్నించే హక్కును ఎవరూ కాదనటం లేదు. ఒకటవ తేదీ నాటికి అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు జరగలేదు. ప్రకటించినట్లుగా వెంటనే రైతుబంధు నిధులను ఎందుకు విడుదల చేయలేదన్న సందేహం కాంగ్రెస్‌ ప్రతినిధుల్లో ఉన్నప్పటికీ బయటకు చెప్పలేని స్థితి.అధికారానికి వచ్చి రెండు రోజులేగా తొందరేముంది అని రాకూడని మాట మంత్రి సీతక్క నోటి నుంచి వచ్చింది.రేవంత రెడ్డి దూకుడుతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నందున దానికి సంతోషిస్తున్న మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అనర్హులను తొలగించే కసరత్తు జరపటంలో తప్పులేదు గానీ అది పూర్తైన తరువాతే నిధులు ఇస్త్తామంటే కుదరదు.ఈ విడత గతం మాదిరే కానిచ్చి తరువాత నుంచి ఆ పని చేయవచ్చు.


ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఏడాది మొత్తానికి చేయాల్సిన అప్పులలో ముందుగానే సింహభాగం తీసుకొని గత ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ప్రకటించే శ్వేత పత్రంలో వెల్లడవుతాయని ఆశిద్దాం. రెండు వాగ్దానాలను వెంటనే అమలు చేసిన రేవంతరెడ్డి రైతు బంధు నిధులు విడుదల చేయకపోవటానికి ఖజానా ఖాళీగా ఉండటం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. తాము దిగిపోయేనాటికి నగదు నిల్వ ఎంత ఉందో మాజీ మంత్రి హరీష్‌ రావు వెల్లడిస్తే అసలు రంగు బయటపడుతుంది. శ్వేత పత్రంతో నిమిత్తం లేకుండా ఈ పథకానికి నిధులు ఉన్నదీ లేనిదీ ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఉంటే జనంలో అనుమానాలు తలెత్తి ఉండేవి కాదు.ప్రతిపక్షాలకు అడిగే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఆరు హామీల అమలు అంత తేలిక కాదు. వర్తమాన బడ్జెట్‌ కేటాయింపులు వచ్చే ఏడాది మార్చి వరకు నూతన ప్రభుత్వానికి కాళ్లు చేతులను కట్టిపడవేశాయి. భూముల అమ్మకం, ఔటర్‌ రింగ్‌రోడ్‌ టోల్‌ కాంటాక్టు సొమ్ము వంటి వాటిని ఖర్చుచేశారు. ఒకటో తేదీకి వేతనాలు, పెన్షన్లే చెల్లించలేని స్థితిలో కొత్త వాగ్దానాల అమలు అంత తేలికకాదు. ప్రగతి భవన్‌ గేట్లు బద్దలు చేయించినంత వేగం, సులభమూ ఆర్థిక అంశాల్లో సాధ్యం కాదు. కాగ్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం 2023-24 సంవత్సరానికి ప్రభుత్వ రుణ సేకరణ లక్ష్యం రు.38,234 కోట్లలో అక్టోబరు నాటికే 87.3శాతం అంటే రు.33,378 కోట్లు తీసుకొని ఖర్చు కూడా చేశారు. మరో ఐదు నెలల కాలానికి తీసుకోగలిగింది రు.4,856 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు కూడా వెంటనే రావన్నది తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని రోజులు ఆలశ్యం చేసినా ఇబ్బందే. అధికారం వస్తుందనుకొని ఆశాభంగం చెందిన బిజెపి వచ్చే లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని వ్యవహరిస్తుందని తెలిసిందే. చెప్పినట్లుగా వాగ్దానం అమలు చేయలేదంటూ ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ రుణాలు రాష్ట్ర జి(ఎస్‌)డిపిలో 25శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే అంతకు మించి అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు 23.8శాతం ఉంటాయని అంచనా కాగా కాగా వివిధ సంస్థలకు హామీగా ఇప్పించిన అప్పులు 2022-23 నాటికే రు.1,29,244 కోట్లు(11.3శాతం) కలుపు కుంటే 35.1శాతానికి చేరుకుంటాయి. బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2023నాటికి రాష్ట్రప్రభుత్వం 19 సంస్థలకు ఇచ్చిన రుణాల హామీల మొత్తం రు.1,35,282 కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్న విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా రైతులకు మీటర్లు పెట్టటం వంటి వాటిని అమలు చేస్తే రుణ అర్హతను కేంద్రం పెంచుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆపని చేస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. గత ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్‌ అధికారానికి వచ్చిన వెంటనే అదే చేస్తే అభాసుపాలవుతుంది. మద్యం బెల్ట్‌షాపుల కారణంగా పెద్ద ఎత్తున ఖజానాకు రాబడి వస్తున్నది. వాటిని అనుమతించబోమని చెప్పినట్లుగా వెంటనే అమలు చేస్తే దాని రాబడి కూడా తగ్గి నిధుల కటకట ఏర్పడుతుంది.


గడువు ప్రకారం నిర్వహిస్తే లోక్‌సభ ఎన్నికలకు ముందే పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు నరేంద్రమోడీ, బిజెపి కోయిల కూతలను వింటే లోక్‌సభ ఎన్నికలు కూడా రెండు నెలల ముందుగానే జరగవచ్చు అంటున్నారు. ఒకవేళ అవి గడువు ప్రకారమే జరిగినా కొత్త ప్రభుత్వానికి ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌కు అనుమతి తీసుకొని ఎన్నికల తరువాత పూర్తి బడ్జెట్‌ను పెట్టటం తప్ప మరొకమార్గం లేదు. ఆర్థిక పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటించే వరకు రైతు బంధు నిధుల విడుదల ఆపితే ప్రభుత్వం మీద వత్తిడి, రాజకీయ దాడి పెరుగుతుంది.ఉచిత బియ్యం పథకానికి కేంద్రం ఆమోదించిన కార్డుల కంటే అదనంగా ఉన్నవాటికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తున్నది. అదనపు కార్డులు ఇస్తే అది పెరుగుతుంది కనుకనే ఏదో ఒకసాకుతో కొత్త కార్డులు ఇవ్వటం లేదు. ప్రకటించిన వివిధ పథకాలకు లబ్దిదారుల ఎంపిక విధానాన్ని కూడా వెంటనే ప్రకటించటం అవసరం. అవన్నీ లోక్‌సభ ఎన్నికల ముందునాటికి పూర్తి చేయకపోతే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునదాడి చేస్తాయి. ఇలా అనేక సమస్యలున్నందున ఏ విధంగా చూసినప్పటికీ కత్తిమీద సాములా పరిస్థితి ఉంది. జనం కూడా ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇవ్వరు. ఎందుకంటే అధికారానికి రావటమే తరువాయి వెంటనే అమలు అన్నట్లుగా కాంగ్రెస్‌ నేతల ప్రకటనలు ఉన్నాయి. బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా చేసిన వాగ్దానాలు అమలు జరిపారా లేదా అన్నదానినే జనం, మీడియా వారూ చూస్తారు.

ఐరాస ప్రధాన కార్యదర్శినీ ధిక్కరించిన వైనం : గాజాలో నరమేథ పాత్రధారి ఇజ్రాయెల్‌ – సూత్రధారి అమెరికా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


శుక్రవారం నాడు అనుకున్నట్లే జరిగింది. వర్తమాన మానవాళి చరిత్రలో మరోదారుణ మారణకాండ, గాజాలో మొత్తం పాలస్తీనియన్లనే లేకుండా చేసే దుర్మార్గానికి పూనుకున్న ఇజ్రాయెల్‌కు మీకు అండగా నేనున్నా ముందుకుపోండి, సర్వనాశనం చేయండి అంటూ అమెరికా నిస్సిగ్గుగా ముందుకు వచ్చింది. పొద్దున లేస్తే ప్రపంచానికి మానవహక్కుల గురించి సుభాషితాలు చెప్పే అమెరికన్లు గాజాలో తక్షణమే మానవహననాన్ని నిలిపివేయాలని కోరిన భద్రతా మండలి తీర్మానాన్ని అడ్డుకున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్‌ తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్‌ 99 ప్రకారం చేసిన వినతినీ పెడచెవిన పెట్టింది. కాల్పులను విరమించాలంటూ అరబ్‌ దేశాల బృందం తరఫున యుఏయి ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా వీటో అధికారంతో తోసిపుచ్చింది.పదిహేను మంది సభ్యులుండే మండలిలో మిగిలిన 14 మందిలో పదమూడు మంది మద్దతు ప్రకటించారు. అమెరికా అడుగులకు మడుగులొత్తే బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండి నేనూ మీ వైపే ఉన్నానంటూ ఇజ్రాయెల్‌కు మద్దతు పలికింది. దారుణాన్ని నివారించేందుకు సమయం ఆసన్నమైందంటూ చరిత్ర, ప్రపంచ నేత్రాలు చూస్తున్నట్లు అంతకు ముందు గుటెరస్‌ అన్నాడు. గాజాలో 339 విద్యా సంస్థలు, 26 ఆసుపత్రులు, 56 ఆరోగ్యకేంద్రాలు, 88 మసీదులు, మూడు చర్చ్‌లను కూల్చివేశారు. అరవైశాతం గృహాలను నాశనం చేశారు, 85శాతం జనాభాను ఇళ్ల నుంచి తరమివేశారు, వేలాది మంది ప్రాణాలు తీశారని చెప్పాడు. ఎక్కడా రక్షణ లేదన్నాడు. శనివారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం మరణాల సంఖ్య 17,487కు పెరిగింది. తీర్మానాన్ని అడ్డుకోవద్దంటూ చివరి ప్రయత్నంగా సౌదీ విదేశాంగ మంత్రి ఫర్హాన్‌ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌న్ను కోరినప్పటికీ వినిపించుకోలేదు. గాజాలో జాతి నిర్మూలన లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఉందనే వాస్తవం తెలియదని నటించేందుకు మనం ఇక్కడున్నామా అని ఐరాసలో పాలస్తీనా శాశ్వత ప్రతినిధి రియాద్‌ మన్సూర్‌ సభ్యులను అడిగాడు. దాడులను విరమిస్తే మరో యుద్ధానికి విత్తులు చల్లినట్లే అవుతుందని అంతకు ముందు అమెరికా ప్రతినిధి రాబర్ట్‌ ఉడ్‌ చెప్పాడు. రెండు దేశాలు ఏర్పడాలని అసలు హమస్‌ కోరుకోవటం లేదని ఆరోపించాడు. ఆర్టికల్‌ 99ని ప్రయోగించటం ద్వారా గుటెరస్‌ పక్షపాతంగా వున్నట్లు తేలిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. వందకు పైగా దేశాలు యుఏయి తీర్మాన సహప్రతిపాదకులుగా ఉన్నాయి. వారిలో ఒకటైన చైనా ప్రతినిధి ఝాంగ్‌ జున్‌ మాట్లాడుతూ మాటలకందని మానవ విషాదమిది, ఒక్క క్షణం ఆలస్యం చేసినా మరిన్ని మరణాలు సంభవిస్తాయి, ప్రస్తుత తరుణంలో కాల్పుల విరమణ తప్ప మరొక మార్గం లేదన్నాడు.


గాజాలో జరుగుతున్న దారణాలను జరుపుతున్నది ఇజ్రాయెల్‌ అయితే దాని వెనుక సూత్రధారి అసలైన యుద్ధ నేరస్తురాలు అమెరికా అన్నది స్పష్టం. గాజాలో జరుగుతున్న అత్యాచారాలకు ఇజ్రాయెల్‌ బాధ్యురాలు కాగా దానికి ఆయుధాలు అందిస్తున్నది, దౌత్యపరమైన రక్షణ కవచాన్ని కల్పిస్తూ యుద్ధ నేరాల్లో అమెరికా భాగస్వామి అవుతున్నదని, రెండు దేశాలూ కలసి పాలస్తీనియన్లను శిక్షిస్తున్నాయని మానవహక్కుల నిఘా సంస్థ ప్రకటించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో తరువాత ఈ ప్రకటన వెలువడింది. గాజా పౌరుల మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ టాంకులకు అవసరమైన 45వేల ప్రాణాంతక మందుగుండ్లను విక్రయించేందుకు అనుమతించాలని జో బైడెన్‌ యంత్రాంగం పార్లమెంటును కోరింది. ఒక జర్నలిస్టుతో సహా అనేక మంది పురుషులను డ్రాయర్లతో తిప్పుతూ వారంతా హమస్‌ తీవ్రవాదులంటూ తీసిన చిత్రాలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మానవతాపూర్వక, వైద్య సాయం అందించే బృందాలను అనుమతించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇజ్రాయెల్‌ను కోరింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన తరువాత తొలిసారిగా శుక్రవారం నాడు ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం మీద రాకెట్ల దాడి జరిగింది. అమెరికా అందించిన మారణాయుధాలతో ఇజ్రాయెల్‌ జరిపిన రెండు వైమానికదాడుల్లో డజన్లకొద్దీ పౌరులు మరణించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొన్నది. రెండు చోట్లా ఇటీవలే అమెరికా సరఫరా చేసిన బోయింగ్‌ తయారీ ఆయుధాల కిట్లు కనిపించాయి. మరోవైపు పౌరుల ప్రాణాలను కాపాడాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఇజ్రాయెల్‌కు సుభాషితాలు వినిపించారు.డెబ్బయి శాతం పిల్లలు, మహిళలతో సహా 17వేల మంది మరణించిన తరువాత ఈ కబుర్లు చెప్పారు. మేం చెప్పేది చెబుతాం మీపని మీరు కానివ్వండి అన్నట్లుగా అమెరికా నేతల తీరుతెన్నులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌-హమస్‌ చర్యల్లో ఉన్న యుద్ధ నేరాలను విచారించటం తమ ప్రాధాన్యత అని అంతర్జాతీయ నేర కోర్టు ప్రధాన ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ చెప్పాడు. అయితే ఈ కోర్టు అధికారాన్ని అమెరికా గుర్తించటం లేదు. ఇజ్రాయెల్‌ మీద విచారణ తూతూ మంత్రంగా ఉందని పాలస్తీనా అధికారులు, బాధితులు, న్యాయనిపుణులు విమర్శించారు. ముందుగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తరువాత పశ్చిమ గట్టు ప్రాంతంలో కరీమ్‌ ఖాన్‌ విచారణ జరిపాడు. కేవలం పదినిమిషాల్లో బాధితులు చెప్పదలచుకున్నదానిని ముగించాలని కోరటంతో వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గంటసేపు విన్నారు. ఆ గంటలో ఆలకించిన తీరు చూసిన తరువాత ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లు, కేవలం హమస్‌ చేసిందాన్ని గురించి విచారించటానికే వచ్చినట్లుంది తప్ప ఇజ్రాయెల్‌ రెండు నెలలుగా చేస్తున్న తీవ్ర దాడులు పెద్దగా పట్టినట్లు లేదని బాధితులు విమర్శించారు. ఆసుపత్రులు, శరణార్ధి శిబిరాలు, ఐరాస కేంద్రాల మీద దాడులతో సహా తాము చేస్తున్నవన్నీ చట్టబద్దమే అని ఇజ్రాయెల్‌ బుకాయిస్తున్నది. వాటిని హమస్‌ మానవ కవచాలుగా మార్చుకున్నందున దాడులు చేయకతప్పదని అంటున్నది.


ఇజ్రాయెల్‌ చెబుతున్న కథలన్నింటినీ నిజమే అని అమెరికా సమర్ధిస్తున్నది. ఇజ్రాయెల్‌ చేస్తున్నది కార్పెట్‌ బాంబింగ్‌(ఒక్క అంగుళాన్ని కూడా వదల కుండా నాశనం చేయటం) కాదని, అది వేరే అని అధ్యక్షుడు జో బైడెన్‌ చెబుతున్నాడు. ఆసుపత్రుల మీద దాడులు చేసినపుడు ఇజ్రాయెల్‌ వైద్యులు,అంబులెన్సులను కూడా తమతో పాటు తీసుకువచ్చిందని తమకు సమాచారం ఉందన్నాడు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం గదా అన్నాడు. తాము దాడులు చేస్తున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని జనానికి చెబుతున్నందున ఇజ్రాయెల్‌ వారి మీద దాడులు చేస్తున్నట్లు ఎలా అవుతుందని అమెరికా భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ వాదిస్తున్నాడు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని పౌరులకు పరిమితహాని కలిగే విధంగా ఒక సార్వభౌమత్వదేశం ముందుకు పోవద్దని ఎలా చెబుతారని ఎదురు ప్రశ్నించాడు. యుద్ధంలో రెండు పక్షాలూ చట్టాలను ఉల్లంఘిస్తాయి అని అమెరికా గూఢచార శాఖలో మానవ హక్కుల డైరెక్టర్‌గా పనిచేసిన అలైస్‌ బోర్నీ చెప్పింది. ఒకవైపు పౌరుల మరణాలు పెరుగుతుండగా మరోవైపు దాడులు కొనసాగుతున్నకొద్దీ అమెరికా మద్దతు తగ్గిపోతుందేమోనని ఇజ్రాయెల్‌ ఆందోళన చెందుతున్నట్లు మాజీ భద్రతా సలహాదారు హులాటా చెప్పాడు. మా మద్దతు ఇక ఉండదు అని అమెరికా చెప్పే తరుణం రావచ్చు అన్నాడు. అమెరికా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సహజంగానే బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుంది.


శరణార్ధి శిబిరాల్లో ఖాళీలేకపోవటంతో రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో పాలస్తీనియన్లు ఉంటున్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం జనాన్ని ఖాళీ చేయించినపుడు మరోచోట వారికి తగినన్ని ఏర్పాట్లు చేయాలని గాజాలో ఎక్కడా అలాంటి ఆనవాళ్లు లేవని ఐరాస బాలల నిధి ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ చెప్పటం మానవతాపూర్వక సాయం అందిస్తున్నట్లు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రచారం బండారాన్ని వెల్లడించింది. ఇరవై మూడులక్షల మంది పౌరుల్లో 19లక్షల మంది నెలవులు తప్పారు, పదిలక్షల మంది ఐరాస శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. భవిష్యత్‌లో తమ మీద దాడులు జరగకుండా గాజా ప్రాంతాన్ని మిలిటరీ రహితంగా ఉంచాలన్న ఇజ్రాయెల్‌ ప్రతిపాదనను అమెరికా కూడా వ్యతిరేకించింది. అది పాలస్తీనా ప్రాంతంగా ఉండాల్సిందేనని పేర్కొన్నది.గాజా ఎలా ఉండాలన్నది అక్కడి పౌరులు నిర్ణయించాలని టర్కీ పేర్కొన్నది. ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచి ఎమెన్‌లోని హౌతీ సాయుధశక్తులు అడపాతడపా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నౌకల మీద దాడులు చేస్తున్నాయి. లక్షల మంది సాయుధులతో పాటు దాని దగ్గర నౌకా దళం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు, సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ దాడులను ఆపివేయించేందుకు అమెరికా మీద వత్తిడి తేవటమే ఈ దాడుల లక్ష్యం.

ఇప్పటి వరకు అమెరికా పాటించిన సంయమనాన్ని ముందు కూడా కొనసాగించాలని తాజాగా సౌదీ అరేబియా కోరింది. ఈ దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తూ కవ్విస్తున్నది.ఇటీవలి కాలంలో ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకున్న సౌదీ ఇజ్రాయెల్‌ దాడులను ఆటవిక చర్యలంటూ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే అమెరికా కుట్రలో భాగంగా ఇదే సౌదీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు హౌతీ తిరుగుబాటుదార్లను అణచేందుకు విఫల యత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారితో నేరుగా చర్చలు జరుపుతూ శాంతి క్రమం ముందుకు పోవాలని కోరుకుంటున్నది. ఎమెన్‌ పౌరులు,అరబ్బు. ఇస్లామిక్‌ దేశాల్లో స్వేచ్చను కోరుకొనే జనాల ఆకాంక్షల మేరకు పాలస్తీనియన్లకు మద్దతుగానే తాము దాడులు చేస్తున్నట్లు ఎమెన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు ప్రకటించాయి. దాడులను విరమించే వరకు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశాయి. వారు ప్రయోగిస్తున్న క్షిపణులు సౌదీ గగనతలం నుంచే వెళుతున్నందున అమెరికా ప్రతిదాడులకు పూనుకుంటే మధ్యలో సౌదీ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అందువలన వివాదం మరింత ముదరకుండా చూసుకొనేందుకే సంయమనం పాటించాలని కోరిందన్నది స్పష్టం.ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు తిష్టవేసి ఆ ప్రాంత దేశాల మీద బెదిరింపులకు దిగిన అంశం ఎరిగినదే. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ ఇజ్రాయెలీలు నెతన్యాహు ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు.

పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీర్‌కు 24 సీట్లు – నెహ్రూ ”తప్పిదాలంటూ” బిజెపి రాజకీయం !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు
జమ్మూ మరియు కాశ్మీర్‌ అసెంబ్లీలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతానికి 24 సీట్లు కేటాయించారు. అంటే దాన్ని స్వాధీనం చేసుకొని నరేంద్రమోడీ మన దేశంలో విలీనం చేయనున్నారా ? అంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యాఖ్యలతో పోస్టులు వెలువడ్డాయి. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని బిజెపి నేతలు పదే పదే చెబుతున్న మాటల పూర్వరంగంలో ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమంలో ఆశ్చర్యం కలిగించదు. ఇది నిజమే అనుకొనేవారు కూడా ఉండవచ్చు. వాట్సాప్‌ మరుగుజ్జులు వెంపల చెట్టుకు నిచ్చెనలు వేసే రకం అన్నది తెలిసిందే. డిసెంబరు ఆరవ తేదీన లోక్‌సభలో హౌం మంత్రి అమిత్‌ షా జమ్మూ-కాశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు-2023, జమ్మూ-కాశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ బిల్లు-2023 అనే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీరు కూడా మనదే కనుక ఆ ప్రాంతానికి 24 సీట్లను జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కేటాయించినట్లు అమిత్‌ షా చెప్పారు.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు 24 స్థానాలు పక్కన పెట్టటం బిజెపి ఘనతేమీ కాదు. కాశ్మీరు మన దేశంలో విలీనమైనప్పటి నుంచీ ఉన్నాయి. 1988 వరకు వాటితో సహా అసెంబ్లీలో వంద సీట్లు ఉన్నాయి. తరువాత వాటిని 111కు పెంచారు. వాటిలో 24 స్థానాలు మినహా మిగతా వాటికే ఎన్నికలు జరుగుతాయి. ఆ ప్రాంతం మన ఆధీనంలో లేదు గనుక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు నుంచి రోజు వారీ కార్యకలాపాల వరకు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికైన స్థానాలలో మెజారిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. ఇంతకు ముందు లడక్‌లోని నాలుగు స్థానాలతో సహా 87కు ఎన్నికలు జరిగేవి.2019 కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి జమ్మూ-కాశ్మీరు, లడక్‌లుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. 2020లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జమ్మూ-కాశ్మీరులో అసెంబ్లీ స్థానాలను 114కు పెంచారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు కేటాయించిన 24పోను 90లో ఇప్పుడు కాశ్మీరు డివిజన్‌లో 47, జమ్మూలో 43 స్థానాలు ఉన్నాయి. గతంలో ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులు ఉండేవారు ఇప్పుడు ఐదుగురికి పెంచారు.వారిలో ఇద్దరు మహిళలు, ఒక మహిళతో సహా ఇద్దరు వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్ల నుంచి, ఒకరు పాక్‌ ఆక్రమిత కాశ్మీరు నుంచి వలస వచ్చిన వారి నుంచి గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్ల కుటుంబాల గురించి ఎన్నో అతిశయోక్తులను ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో అమిత్‌ షా చెప్పినదాని ప్రకారం 46,631 కుటుంబాలు రాష్ట్రం వదలి వెళ్లారు.వారికి సీట్లు కేటాయింపు ప్రతిపాదన దశలోనే వివాదం తలెత్తింది, ఇప్పుడూ ఉంటుంది.


పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్‌తో సహా కాశ్మీరు ప్రాంతం మొత్తం, కాశ్మీరులోని లడక్‌లో భాగంగా ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారుచిన్‌ ప్రాంతం కూడా మనదే అన్నది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మనదేశం ప్రకటిస్తున్నది. అయితే కాశ్మీరు రాష్ట్ర అసెంబ్లీలో పాక్‌ ఆక్రమిత ప్రాంతానికి 24 సీట్లు కేటాయించటం తప్ప చైనా ఆధీనంలోని ప్రాంతానికి గతంలో కూడా ఎలాంటి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు లడక్‌ కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం దానికి అసెంబ్లీ ఏర్పాటు లేదు. గిల్గిట్‌ కూడా కాశ్మీరులో భాగమే అయినప్పటికీ అది మినహా మిగిలిన ఆక్రమిత ప్రాంతం పట్ల పాకిస్థాన్‌ వేర్వేరు వైఖరులను తీసుకున్నది. గిల్గిట్‌ ప్రాంత వాసులు తమతో విలీనం కావాలని కోరుకున్నందున అది తమ ప్రాంతమే అని ప్రకటించుకుంది. తమ ఆక్రమణలోని మిగతా ప్రాంతాన్ని ” విముక్త (ఆజాద్‌) కాశ్మీరు” అని ప్రకటించి ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఉంచింది. అది తనదని చెప్పటం లేదు. ఎప్పటికైనా మొత్తం కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఏర్పాటు కానుందని చెబుతున్నది. అందుకే పాక్‌ పార్లమెంటులో దానికి ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆ ప్రాంతానికి విడిగా ఎన్నికలు జరుపుతూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు 1963లో గిల్గిట్‌లోని షాక్స్‌గమ్‌ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. దాని గుండా చైనా కారకోరం రహదారి నిర్మించటంతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత వెల్లడైంది.అనేక తర్జన భర్జనల తరువాత పాకిస్తాన్‌ గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాన్ని 2020లో పాక్‌ ఐదవ రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆక్రమిత కాశ్మీరులోని పౌరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా గిల్గిట్‌ వాసులు విలీనాన్ని కోరుకున్నట్లు పాక్‌ చెబుతున్నది.


తాజా పరిణామాల వెనుక బిజెపి రాజకీయం స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో ఒబిసిగా ప్రకటించిన పహాడియా సామాజిక తరగతిని 2020లో కేంద్ర ప్రభుత్వం నియమించిన జిడి శర్మ కమిషన్‌ ద్వారా వారిని గిరిజనులుగా సిఫార్సు చేయించారు. తాజాగా చేసిన సవరణల్లో అసెంబ్లీలో తొమ్మిది స్థానాలను షెడ్యూలు తరగతులకు కేటాయించారు. వీరికి నాలుగుశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఇచ్చారు. అంతకు ముందు కాశ్మీరులో ” బలహీన, ఆర్థిక, సామాజిక న్యాయానికి దూరంగా ఉన్న కులాలు ”గా పేర్కొన్నవారిని ఒబిసిగా మార్చారు. ఇవన్నీ ఓటుబాంకు రాజకీయాలలో భాగం అన్నది స్పష్టం.ం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న అనేక కులాలు తమను గిరిజనులు, దళితులు, ఓబిసిలుగా పరిగణించాలని, రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. దళితులు వర్గీకరణ కోరుతున్నారు. బిజెపికి చిత్తశుద్ది ఉంటే దేశమంతటా ఉన్న ఈ సమస్యను పక్కన పెట్టి కేవలం కాశ్మీరులోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ప్రశ్న. పహాడియాల జీవన విధానం గిరిజనుల మాదిరే ఉంటుందన్నది వాస్తవమే.అలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాశ్మీరు పట్ల జవహర్‌లాల్‌ నెహ్రూ తీవ్ర తప్పిదాలకు పాల్పడ్డారంటూ గతం నుంచి చేస్తున్న దాడిని హౌం మంత్రి అమిత్‌ లోక్‌సభలో కొనసాగించారు. ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసేందుకు పురోగమిస్తున్న సైన్యాన్ని ముందుకు పోనివ్వలేదని, వివాదాన్ని ఐరాసకు నివేదించారని చరిత్రను వక్రీకరించేందుకు పూనుకున్నారు.ఆక్రమిత కాశ్మీరులోని ముజఫరాబాద్‌ వైపు సైన్యం ముందుకు పోయి ఉంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న రాజౌరీ, పూంచ్‌ ప్రాంతాలు పాక్‌ ఆక్రమణలోకి వెళ్లి ఉండేవని కాశ్మీరు మాజీ సిఎం ఫరూక్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. మరొక మార్గం లేని స్థితిలోనే ఐరాసకు నివేదించారని కూడా చెప్పారు.


బ్రిటీష్‌ పాలన అంతమైన తరువాత కాశ్మీరు, హైదరాబాద్‌ సంస్థానాలు భారత్‌లో విలీనానికి అంగీకరించలేదు, స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించాయి. కాశ్మీరు ఎట్టి పరిస్థితుల్లో భారత్‌లో ఉండాలని నెహ్రూ చెప్పారు. హైదరాబాద్‌ స్వతంత్ర దేశంగా ఉంటే మన దేశానికి కడుపులో కాన్సర్‌ మాదిరి తయారవుతుందని వల్లభారు పటేల్‌ భావించారు. అందువలన ఒకవేళ కాశ్మీరు పాలకుడు పాకిస్తాన్‌తో కలవాలని అనుకుంటే దానికి తాను అడ్డుపడబోనని హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనం కావటం ముఖ్యమని వాదించినట్లు చెబుతారు. జునాఘడ్‌ సంస్థాన విలీనాన్ని పాకిస్తాన్‌ అంగీకరించిన తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు వచ్చింది. సంస్థానాలు ఏ దేశంలో విలీనం కావాలో తేల్చుకొనే స్వేచ్చను ఇచ్చినందున ప్రస్తుత గుజరాత్‌లోని జునాఘడ్‌ నవాబు భారత్‌లో విలీనానికి అంగీకరించాడు. స్వాతంత్య్రానికి కొన్ని నెలల ముందు నవాజ్‌ భుట్టో (తరువాత కాలంలో పాక్‌ ప్రధానిగా పని చేసిన జుల్ఫికర్‌ ఆలీ భుట్టో తండ్రి) సంస్థాన నూతన ప్రధానిగా నియమితుడయ్యాడు.భుట్టో సలహామేరకు మనసు మార్చుకొని పాకిస్తాన్‌లో కలిసేందుకు అంగీకారం తెలిపాడు. సంస్థానంలోని జనం దానికి వ్యతిరేకత తెలపటంతో ముందు జాగ్రత్తగా భారత ప్రభుత్వం అక్కడకు మిలిటరీని పంపింది.నవాబు కరాచీ పారిపోయాడు, విధిలేక సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని భుట్టో భారత ప్రభుత్వాన్ని కోరాడు.1947 నవంబరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా 91శాతం మంది భారత్‌తో కలవాలని కోరారు. హైదరాబాద్‌ సంస్థానం విషయానికి వస్తే యధాతధ పరిస్థితి కొనసాగాలని స్వాతంత్య్రం వచ్చిన మూడునెలల తరువాత ఒప్పందం కుదిరింది. అప్పటికే కమ్యూనిస్టులు నిజాంపై తిరుగుబాటు చేసి సాయుధపోరాటం జరుపుతున్న పూర్వరంగంలో పరిణామాలు ఎటువైపు దారితీసేది తెలియని స్థితిలో 1948 సెప్టెంబరు పదమూడున సైనిక చర్యకు పూనుకోవటం, మూడు రోజుల్లోనే నవాబు లొంగిపోవటంతో దేశంలో విలీనమైంది.


కాశ్మీరు రాజు హరిసింగ్‌ ఏ దేశంలోనూ విలీనం కాకుండా స్వతంత్ర దేశంగా ఉంటామని ప్రకటించాడు. దానికి అక్కడి హిందూత్వశక్తులు మద్దతుతెలిపారు. పాకిస్థాన్‌ ఎత్తుగడలను పసిగట్టిన నెహ్రూ కాశ్మీరులో పరిస్థితి ప్రమాదకరంగాను, దిగజారుతోందని, పెద్ద పరిణామం జరగబోతోందని1947 సెప్టెంబరు 27న హౌం మంత్రిగా ఉన్న పటేల్‌కు పంపిన నోట్‌లో నెహ్రూ పేర్కొన్నారు. చలికాలంలో పాక్‌ చొరబాటుదార్లను పంపవచ్చని కూడా హెచ్చరించారు. అప్పటికే కొన్ని చోట్ల తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అక్టోబరులో అనుకున్నంతా జరిగింది. తిరుగుబాట్లతో తమకెలాంటి సంబంధం లేదని తోటి ముస్లింల మీద జరుగుతున్న అత్యాచారాలకు ప్రతీకారంగా గిరిజనులు వారంతటవారే కార్యాచరణకు పూనుకున్నారని పాక్‌ పాలకులు ప్రకటించారు.ఈ స్థితిలో హరిసింగ్‌ భారత్‌ మిలిటరీ సాయం కోరారు. వెంటనే మిలిటరీ రంగంలోకి దిగి చొరబాటుదార్లను వెనక్కు కొట్టటం ప్రారంభించింది. అది తరువాత పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. కాశ్మీరును భారత్‌లో విలీనం చేసేందుకు హరిసింగ్‌ అంగీకరించినందున ” తటస్థ ” వేదికగా ఉన్న ఐక్యరాజ్య సమితి కాశ్మీరు సమస్యను పరిష్కరిస్తుందనే ఆశాభావంతో మన ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి నివేదించింది. అది వల్లభారు పటేల్‌తో సహా మొత్తం మంత్రివర్గ నిర్ణయం తప్ప నెహ్రూ ఒక్కరే తీసుకున్నది కాదు. కానీ తరువాత జరిగిన పరిణామాల తరువాత అంతర్జాతీయ కుట్రను గ్రహించి చేసిన పొరపాటును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఐరాసలో అమెరికా, బ్రిటన్‌ మన వైఖరిని సమర్ధించకపోగా వ్యతిరేకించాయి. ఎందుకంటే పాకిస్తాన్‌ ఏర్పాటు నాటి సోవియట్‌ను దెబ్బతీసేందుకు ఒక సాధనంగా ఉంటుందని అవి భావించటమే కారణం. అధికార రాజకీయాలు తప్ప నైతిక అంశాలు ఐరాసను నడిపించటం లేదని ప్రధాని నెహ్రూ నాడు వైస్‌రారుగా ఉన్న మౌంట్‌బాటన్‌కు రాశారు. ఐరాసను పూర్తిగా అమెరికా నడిపిస్తున్నదని పాక్‌ చొరబాటుదార్లు పూర్తిగా వెనక్కు వెళ్లేంతవరకు ప్రజాభిప్రాయసేకరణ డిమాండ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.


భద్రతా మండలి 1948 ఏప్రిల్‌ 21న ఆమోదించిన తీర్మానం ప్రకారం కాశ్మీరు నుంచి పాక్‌ సాయుధ చొరబాటుదారులను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణ అవసరాల రీత్యా క్రమంగా భారత్‌ తన దళాలను కనీస స్థాయికి వెనక్కు తీసుకోవాలి. తరువాత ఐరాస నియమించిన అధికారి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అయితే తీర్మానం మేరకు పాకిస్తాస్‌ తన దళాలను ఇప్పటికీ విరమించలేదు. ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. తాము వెనక్కు తగ్గితే కాశ్మీరును భారత్‌ పూర్తిగా ఆక్రమిస్తుందనే వితండవాదాన్ని వినిపిస్తున్నది. భద్రతా మండలి తీర్మానాన్ని ముందు పాక్‌ అమలు జరపాలని మన దేశం కోరుతున్నది. ప్రతిష్ఠంభన ఏర్పడటంతో 1949లో ఐరాస ఏర్పాటు చేసిన కమిషన్‌ తాము విఫలం చెందినట్లు ప్రకటించింది. ఉల్లంఘించిన పాకిస్తాన్‌పై తరువాత కాలంలో భద్రతా మండలి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటానికి పాకిస్థాన్‌కు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వెన్నుదన్నుగా ఉండటమే. అమెరికా నేతలు నరేంద్రమోడీ భుజాల మీద చేతులు వేసి కౌగిలించుకున్నా, మనకు ఎన్నికబుర్లు చెప్పినప్పటికీ ఇప్పటికీ అమెరికా అసలు కథ అదే. దీని గురించి చెప్పే ధైర్యం విశ్వగురువుగా భావించే నరేంద్రమోడీకి లేదా ఇతర మంత్రులకు లేదు. ఆక్రమిత కాశ్మీరు సమస్య పరిష్కారానికి గడచిన పది సంవత్సరాలలో తమ ప్రభుత్వం చేసిందేమిటో చెప్ప కుండా పదే పదే నెహ్రూ మీద దాడి చేయటం ఒక మైండ్‌గేమ్‌లో భాగం తప్ప మరొకటి కాదు.దీని వలన ఒరిగేదేమిటి ?

రెండు నెలల గాజా మారణకాండ మరింత తీవ్రం – సొరంగాల్లో ఉప్పునీరు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మానవాళి చరిత్రలో అత్యంత విషాదానికి దారితీసే విధంగా గాజాలో పరిస్థితి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి రిచర్డ్‌ పీపర్‌కోన్‌ చెప్పాడు. రెండు నెలలుగా మారణకాండ సాగుతోంది. ఐక్యరాజ్యసమితి దీన్ని నివారించటంలో ఘోరంగా విఫలమైంది.గాజాలోని రెండవ పెద్ద పట్టణమైన ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్‌ మిలిటరీకి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నట్లు వార్తలు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ నౌకలపై ఎమెన్‌ సాయుధ శక్తుల దాడి, సంయమనం పాటించాలని అమెరికాను కోరిన సౌదీ అరేబియా.ఇప్పటికైనా మానవతా సంక్షోభాన్ని నివారించండని భద్రతా మండలిని తొలిసారిగా కోరిన ఐరాస ప్రధాన కార్యదర్శి.ఈ పరిణామాలన్నీ గాజాలో సాగుతున్న మారణకాండ, దాని పర్యవసానాలు మధ్యప్రాచ్యం పడుతున్న తీరు, మొత్తం మీద దిగజారుతున్న పరిస్థితిని సూచిస్తున్నాయి. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అంబులెన్సులను కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ అడ్డుకుంటున్నది. గాజాలో పౌరుల సామూహిక వధను ఆపాలని, ఐరాస సభ్యదేశాలు ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని పాలస్తీనాలో మానవహక్కులపై ఐరాస ప్రత్యేక నివేదకురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్‌ మంగళవారం నాడు కోరారు. ఈ విషాదం మీద స్పందించటంలో అంతర్జాతీయ సమాజం పక్షవాతానికి గురైనట్లుగా ఉందని, ప్రసుతం తీవ్ర మారణహౌమ ముప్పు ఉందని హెచ్చరించారు. గాజాలో సంభవిస్తున్న మరణాల్లో సగమే వెల్లడౌతున్నాయని గతంలో తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరించారు. ఆత్మ రక్షణ కోసం దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ చెప్పటాన్ని కూడా ఆమె తిరస్కరించారు.కేవలం హమస్‌ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయటం లక్ష్యమని అల్బనీస్‌ అన్నారు.

ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమస్‌ సీనియర్‌ నేత ఒసామా హందన్‌ చెప్పాడు. పాలస్తీనా అనుకూల మరియు పర్యావరణ పరిరక్షణ కోరే బృందాల పట్ల కఠినంగా వ్యవహరించిన తీరు కారణంగా ప్రపంచ పౌరహక్కుల సూచికలో జర్మనీ దిగజారినట్లు ప్రకటించారు. గాజాలో జరుగుతున్న మానవ సర్వనాశనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి యత్నాలను తీవ్రతరం గావించాలని కతార్‌-సౌదీ సమన్వయ కమిటీ కోరింది. తమ వైమానిక దాడుల్లో అనేక మంది హమస్‌ నేతలను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది..


ఏడు రోజుల విరామంలో హమస్‌ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయెల్‌ జైళ్లలో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. ఇంకా హమస్‌ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లలో ఉన్నారు. బుధవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 50వేల మంది గాయపడ్డారు.మరికొన్ని వేల మంది శిధిలాల కింద మరణించి ఉంటారని భయపడుతున్నారు. కూల్చిన భవనాల శిధిలాలను తొలగించే అవకాశం కూడా లేదు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమస్‌, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రకటించాయి. ఇదిలా ఉండగా బందీల విడుదలకు ప్రధాని నెతన్యాహు ప్రయత్నించటం లేదంటూ ఇజ్రాయెల్‌లో కుటుంబసభ్యులతో పాటు అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్‌ మారణకాండలో 70శాతంపైగా పిల్లలు, మహిళలే ఉండటం, ఆసుపత్రులు, ఐరాస కేంద్రాలతో సహ నిర్వాసితుల శిబిరాలపై కూడా మారణకాండను కొనసాగించటంతో ప్రపంచ మంతటా తీవ్ర నిరసన వెల్లడి అవుతోంది. దీంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, దానికి వంతపాడే బిబిసి వంటి మీడియా సంస్థలు, నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న జో బైడెన్‌ వంటి వారు అరవై రోజుల తరువాత కొత్త పల్లవి అందుకున్నారు. గాజాలోని సొరంగాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న హమస్‌ సాయుధులను వెలుపలికి రప్పించేందుకు విష పూరిత వాయువులను పంపాలని గతంలో ఇజ్రాయెల్‌ ఆలోచించింది. ఇప్పుడు దాని బదులు మధ్యధరా సమద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లోకి పంపాలని చూస్తున్నది.


హమస్‌ సాయుధులు అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయెల్‌ మీద జరిపిన దాడి సందర్భంగా అనేక మంది పిల్లలతో సహా మహిళలపై అత్యాచారాలు చేశారని, అంగవిచ్చేదనలకు పాల్పడ్డారంటూ కొత్త కథనాలను ప్రచారంలోకి తెచ్చారు.ఎలాంటి సందిగ్దతకు, మినహాయింపులకు తావు లేకుండా ఇజ్రాయెల్‌ మహిళలపై జరిపిన అత్యాచారాలను ఖండించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, బృందాల నుంచి ఎలాంటి ఖండన ప్రకటనలను తాను వినలేదు, చూడలేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చెప్పాడు.దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్‌యూనిస్‌ పట్టణాన్ని సర్వనాశనం చేసేందుకు మంగళవారం నుండి ఇజ్రాయెల్‌ సేనలు విమానాలు, టాంకులతో దాడులు జరుపుతున్నాయి. అక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయిందీ ఇంకా వెల్లడి కాలేదు. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలంటూ వెదజల్లిన కరపత్రాలలో పేర్కొన్నారు. తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది. ఉత్తర గాజాతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో జన నష్టం జరగకుండా నిర్దిష్ట సమాచారంతో దాడులు జరుపుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. జనాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లిపోవాలని తరుముతున్న ఇజ్రాయెల్‌ మిలిటరీ నుంచి అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. ఒకసారి ఖాళీ చేసిన ప్రాంతానికి తిరిగి అనుమతించటం లేదు. ఖాన్‌ యూనిస్‌ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయెలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి.యుద్ధ విమానాలు కూడా దాడులు జరుపుతున్నాయి.మరోసారి అక్టోబరు ఏడున హమస్‌ జరిపిన మాదిరిదాడులు పునరావృతం కాకుండా చూసేందుకు ఆ సంస్థ మిలిటరీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే దిశగా తాము దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ చెబుతున్నది.


గత రెండు నెలల దాడుల్లో ఐదువేల మంది హమస్‌ తీవ్రవాదులను మట్టుపెట్టామని ఇజ్రాయెల్‌ చెప్పటం తప్ప ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది.తమ దాడుల్లో మరణించిన నిరాయుధులైన పౌరులను హమస్‌ తీవ్రవాదులుగా చిత్రిస్తున్నది. తమ సైనికులు 86 మంది మరణించినట్లు ప్రకటించింది.అన్ని రకాల మత, నైతిక, మానవతా విలువలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనాలో మారణకాండ జరుపుతున్నదని ఏడు రోజుల దాడుల విరామం, బందీలు, ఖైదీల విడుదల చర్చలకు మధ్యవర్తిత్వం వహించి కతార్‌ పాలకుడు హమద్‌ అల్‌ తానీ దోహాలో జరిగిన అరబ్‌ నేతల సమావేశంలో విమర్శించాడు. ఆత్మరక్షణ పేరుతో ఇదంతా చేస్తున్నారని మారణకాండ నేరాన్ని ఆత్మరక్షణ అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. కతార్‌లో హమస్‌ రాజకీయ కార్యాలయంతో పాటు అనేక మంది నేతలు అక్కడే ఉంటున్నారు. ఇజ్రాయెల్‌ షిన్‌బెట్‌ భద్రతా సంస్థ అధిపతి రొనెన్‌ బార్‌ ఒక ఆడియో ప్రకటన చేస్తూ కతార్‌తో సహా హమస్‌ నేతలు ఎక్కడ ఉన్నా వారిని అంతం చేస్తామని బెదిరించాడు. గాజా మీద రెండవ దశ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సరిహద్దులో ఉన్న లెబనాన్ను కూడా కవ్విస్తున్నది.అక్కడ ఉన్న హిజబుల్లా సాయుధులపై జరిపిన దాడిలో లెబనాన్‌ మిలిటరీ పోస్టులో ఉన్న ఒక సైనికుడి ప్రాణాలు పోయినట్లు లెబనాన్‌ ప్రకటించింది. సరిహద్దు ఆవల నుంచి తమ మీద దాడి జరిగిందని, క్షిపణులు జనం లేని చోట పడినట్లు, తమ విమానాలు హిజబుల్లా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ చెబుతున్నది. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన గోలన్‌ గుట్టల మీద అక్టోబరు ఎనిమిది నుంచి హిజబుల్లా అడపాదడపా దాడులు జరుపుతున్నది.తరువాత మొత్తం సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.


గాజాలో జరుపుతున్న నేరాలను ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు హితవు చెప్పాడు. అదే జరిగితే మొత్తం ప్రాంత భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించాడు. రాజకీయ మనుగడకోసం నెతన్యాహు మొత్తం ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడని విమర్శించాడు. తమ గడ్డ మీద ఉన్న హమస్‌ సభ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపవద్దని టర్కీ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ భద్రతా సంస్థ అధినేత రొనెన్‌ బార్‌ చేసిన ప్రకటనలో లెబనాన్‌, టర్కీ, కతార్‌లలో ఎక్కడ ఉన్నా హతమారుస్తామని బెదిరింపు ప్రకటన తరువాత టర్కీ నుంచి ఈ ప్రకటనవెలువడింది. గతంలో విదేశీ శక్తుల చట్టవిరుద్ద పనులను తాము అడ్డుకున్నట్లు గుర్తు చేసింది. అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ మొసాద్‌ ఏజంట్లు అనేక దేశాల్లో తమ వ్యతిరేకులను హత్య చేస్తున్న సంగతి తెలిసిందే. హమస్‌ ఒక విముక్త సంస్థ తప్ప ఉగ్రవాది కాదని అందుకు వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు గతంలో ఎర్డోగన్‌ ప్రకటించాడు.


హమస్‌ సాయుధుల జాడ కనుగొనటంలో విఫలమైన ఇజ్రాయెల్‌ తొలుత వారు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న సొరంగాల్లో విషవాయువులను నింపి వెలుపలికి వచ్చేట్లు చేయాలని చూసింది. తాజాగా వాటిని సముద్రపు నీటితో నింపాలని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ దుష్ట ఆలోచన గురించి అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అదే జరిగితే ఇప్పటికే కాలుష్యమైన గాజా ప్రాంతంలో మరిన్ని పర్యావరణ సమస్యలతో పాటు రానున్న అనేక తరాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని, మంచి నీటి వనరులన్నీ ఉప్పునీటితో నిండుతాయని అనేక మంది హెచ్చరిస్తున్నారు. నవంబరు రెండవ వారంలోనే ఆల్‌ షాతి నిర్వాసిత శిబిరం సమీపంలో ఐదు భారీ పంపులను ఏర్పాటు చేసింది. మధ్యధరా సముద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లో నింపేందుకే ఈ ఏర్పాటు. హమస్‌ సాయుధులను ఏరివేసేందుకు తాము అనేక పద్దతుల గురించి పరిశీలిస్తున్నామని వాటిలో ఒకటి నీటితో నింపటమని ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికారి చెప్పినట్లు అమెరికా పత్రిక పేర్కొన్నది. అదే జరిగితే అంతర్జాతీయంగా వెలువడే ఖండనలు జో బైడెన్‌ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయని అమెరికా మాజీ అధికారి ఒకడు చెప్పాడు. ఈజిప్టు 2015లో తన భూభాగంలో ఉన్న సొరంగాలను ఉప్పునీటితో నింపి దొంగ రవాణాను అరికట్టేందుకు పూనుకున్నపుడు ఆ ప్రాంత పంటలు దెబ్బతినట్లు రైతులు ఆందోళన చేశారు.అమెరికా ఇతర ఐరోపా ధనికదేశాల అండచూసుకొని చెలరేగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు ఇంకా ఎంత మంది బలికావాలన్న ప్రశ్న తలెత్తింది. ఈ దారుణాన్ని నివారించటంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది.

పైసామే పరమాత్మ : చైనా బదులు మన వస్తువుల కోసం వస్తున్న వాల్‌మార్ట్‌ మర్మమిదే !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో ఎక్కువగా రిటెయిల్‌గా వస్తువులను అమ్మే సంస్థ అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌. చైనా మీద ఆధారపడకుండా రానున్న రోజుల్లో భారత్‌ నుంచి పెద్ద మొత్తంలో సరకులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిందన్న వార్తను ప్రపంచ మీడియా ప్రముఖంగా పాఠకులు, వీక్షకుల ముందుకు తెచ్చింది. వస్తు ఎగుమతులు తగ్గుతున్న పూర్వరంగంలో బిజెకి ఇది వచ్చే ఎన్నికల్లో పెద్ద ప్రచార అస్త్రం అవుతుంది. వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతే మన దగ్గర ఉపాధి పెరుగుతుందని భావించేవారు ఒకరైతే చైనా దెబ్బతింటుందని సంతోషించేవారు రెండవ రకం. త్వరలో మనం చైనాను దాటిపోతాం అని అనేక మంది ఆశిస్తున్నట్లు జరగాలని కోరుకుందాం , నిజంగా జరుగుతుందా ? అవకాశాలేమిటి, అవరోధాలేమిటి అన్నది ప్రతి ఒక్కరూ చూడాలి. మన దేశం నుంచి బొమ్మలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సైకిళ్లు, ఔషధాలు, ఎండు ధాన్యాలు,కొన్ని రకాల ఆహారం వంటివి ఇప్పటికే అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.ఏటా మూడు బిలియన్‌ డాలర్ల వస్తు కొనుగోలును 2027 నాటికి పదికి పెంచుతామని వాల్‌మార్ట్‌ చెప్పింది. 2018లో వాల్‌మార్ట్‌ దిగుమతుల్లో చైనా వాటా 80శాతం ఉండగా ఈ ఏడాది జనవరి-ఆగస్టు నాటికి 60శాతానికి తగ్గింది.వాల్‌మార్ట్‌ దిగుమతులు ఒక్క మన దేశం నుంచి మాత్రమే కాదు, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి కూడా పెరుగుతున్నాయి. మన నుంచి కొనుగోళ్లు ఎంత పెరిగినా చైనాను అధిగమించే అవకాశం ఇప్పట్లో లేదు.


ఇటీవలి కాలంలో చైనా ఎగుమతుల్లో వచ్చిన మార్పును చూస్తే శ్రమ ఎక్కువగా ఉండే ఉత్పత్తులకు బదులు యంత్రాలు, పూర్తిగా తయారు కాని వస్తువులు, ఎలక్ట్రిక్‌ వాహనాలు విడి భాగాల ఎగుమతులు పెరుగుతున్నాయి. వాల్‌మార్ట్‌ దిగుమతి చేసుకొనే వాటిలో అసలు ఇవి లేవు. ఎలక్ట్రిక్‌ వాహనాల ఎగుమతులు 2018లో 26.1 కోట్ల డాలర్లుగా ఉన్నవి ఈ ఏడాది జనవరి-ఆగస్టునాటికి 2,582 కోట్ల డాలర్లకు పెరిగాయి.రానున్న సంవత్సరాల్లో ఆధునిక వస్తువులను ఎగుమతి చేసేందుకు చైనా పూనుకుంది.దానిలో భాగంగా కార్మికశక్తి ఎక్కువగా అవసరం ఉన్నవాటిని తగ్గించుకొంటున్నది. కొన్ని సంస్థలు వేరే దేశాలకు వెళుతున్నాయి.ఆ ఖాళీని మన దేశం పూర్తి చేయాలని ధనికదేశాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే వారికి కావాల్సింది చౌకగా వస్తువులు అందించేవారు తప్ప ఎవరన్నది వారికి నిమిత్తం లేదు. మా దేశంలో తక్కువ వేతనాలకుపని చేసే జనాలు పుష్కలంగా ఉన్నారని మన పాలకులు అనేక విదేశీ కంపెనీలకు ఆశ చూపుతున్నది తెలిసిందే. చైనా చౌకగా అందిస్తే తప్పులేదు గాని మనం చేస్తే ఎందుకు అభ్యంతరం అని కొందరు వాదిస్తారు.నిజానికి వాల్‌మార్ట్‌ మన దేశానికి 2002లోనే వచ్చింది.దానితో పాటు భాగస్వామిగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌, ఫోన్‌పే, ఇతర సంస్థల ద్వారా ఒక లక్ష మందికి శాశ్వత, తాత్కాలిక ఉపాధి కల్పిస్తున్నది. దీనికి పోటీదారుగా ఉన్న అమెజాన్‌ మన దేశం నుంచి 2025నాటికి 25 బిలియన్‌ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనాలో వేతనాల ఖర్చు పెరుగుతున్నందున అక్కడి నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటే పోటీలో తట్టుకోవటం కష్టం గనుక అవి మన దేశం వైపు మొగ్గుతున్నాయని ఎస్‌అండ్‌ పి గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజన్స్‌ పరిశోధక విశ్లేషకుడు క్రిస్‌ రోజర్స్‌ చెప్పాడు.చైనాలో కనీసవేతనాలు నెలకు 1,420 యువాన్ల నుంచి 2,690(డాలర్లలో 198.2 నుంచి 376.08) వరకు ఉన్నాయి.ఇదే భారత్‌లో రు. తొమ్మిది నుంచి పదిహేను వేల ( 108.04 నుంచి 180.06 డాలర్లు) వరకు ఉన్నాయి.(ఒక డాలరుకు 7.1528 చైనా యువాన్లు కాగా మన కరెన్సీ రు.83.3050)


కొందరు తనకు పోటీగా మన దేశం ఎదగకుండా చైనా అడ్డుకుంటున్నది అన్న ఆరోపణ చేస్తున్నారు. ఎవరైనా అలా అడ్డుకోగలరా ? వర్తమాన ప్రపంచంలో తొలి బాధితురాలు చైనాయే. అక్కడ కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అసలు ఐరాసలో గుర్తించలేదు. పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడులు లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందనివ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పడూ చిప్స్‌ పరిజ్ఞానం, వాటిని చైనాకు అందనివ్వకూడదని బహిరంగంగా ఆంక్షలే విధించారు గదా ! చైనా నుంచి ఐదవతరం టెలికాం పరికరాలు దిగుమతి చేసుకుంటే వాటి ద్వారా మన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని మనమే వద్దంటున్నాం, అదెంతవరకు వాస్తవమో తెలియదు, ఐరోపా, అమెరికా చెప్పింది కనుక చేస్తున్నాం. పెట్టుబడులనూ మన దేశం అడ్డుకుంటున్నది. మనకు అవసరమైన కీలక దిగుమతుల మీద చైనా ఎలాంటి ఆంక్షలు విధించలేదు గనుకనే నరేంద్రమోడీ ఏలుబడిలో గత దిగుమతుల రికార్డులను బద్దలు కొట్టాం. మన ఎగుమతుల మీద ఆంక్షలు విధించలేదు, ఇక మనల్ని అడ్డుకొనేది ఎక్కడ ? చైనా నేడు అమెరికాను అధిగమించే ఆర్థిక శక్తిగా మారేదారిలో ఉంది. మనదేశం ఆ రైలును అందుకోలేదు.ఎందుకని ? దానికి కూడా చైనానే నిందిస్తే నవ్విపోతారు. చైనా ప్రకటించిన విధానాలు ఒక భరోసాను ఇచ్చినందునే నిర్దిష్ట వ్యవధి వరకు సంపాదించుకొని వెళ్ల వచ్చన్న ధైర్యంతో అన్ని ధనిక దేశాల నుంచి పెట్టుబడులు వరదలా వచ్చాయి. మన దగ్గర అలాంటి విధానాలు లేవు. మన కార్పొరేట్‌ శక్తులు స్వంతంగా మరింతగా ఎదిగేందుకు, సాధ్యం కానపుడు బహుళజాతి సంస్థలతో చేతులు కలిపి లాభాలు పెంచుకొనేందుకు చూస్తున్నాయి. తమకు లబ్దిచేకూర్చవు అనుకుంటే మనదేశంలోకి ఇతర సంస్థల, పెట్టుబడుల ప్రవేశాన్ని అడ్డుకొంటున్నాయి.మనదేశ భద్రతకు ముప్పు అని నిషేధించిన సంస్థలలో చైనాకు చెందిన షి ఇన్‌ ఒకటి. దాంతో రిలయన్స్‌ ఒప్పందం కుదుర్చుకోగానే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను పక్కన పెట్టి అనుమతి ఇచ్చింది. రిలయన్స్‌ కోసం అమెజాన్‌ సంస్థ పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తున్నది.


త్వరలో మన దేశం చైనాను అధిగమించనుందని కొందరి అంచనా. గోల్డ్‌మాన్‌ శాచస్‌ సంస్థ 2011అంచనా ప్రకారం చైనాలో తదుపరి ఇరవై సంవత్సరాలలో ఏటా 4.8శాతం కార్మిక ఉత్పాదకత పెరుగుదల ఉంటుంది, వాస్తవం ఏమిటి ? సిఇఐసి సమాచారం మేరకు 2013-2022 పది సంవత్సరాల సగటు 6.64శాతంగా ఉంది. అదే విధంగా 2026 నాటికి చైనా జిడిపి అమెరికాను దాటుతుందని, 2050 నాటికి అమెరికా కంటే 50శాతం అధికంగా కలిగి ఉంటుందని అదే ఏడాది గోల్డ్‌మాన్‌ శాచస్‌ చెప్పింది. ఇప్పుడు 2035వరకు చైనా అధిగమించే అవకాశం లేదని, తరువాత పెరుగుదల కూడా 2060 నాటికి 14శాతం కంటే అదనంగా ఉండదని 2022 అంచనాలో అదే సంస్థ చెప్పింది. జోశ్యాలను బట్టి నిర్ధారణలకు రాకూడదు. చైనా 1978లో సంస్కరణల్లో భాగంగా తన మార్కెట్‌ను తెరిచింది. అంతకు ముందునుంచి ఉన్నప్పటికీ నూతన ఆర్థిక విధానాల పేరుతో మనదేశం 1990లో మనదేశం మరింత బాగా గేట్లు తెరిచింది. అనేక మంది గణించిన విధానం, వాస్తవాన్ని చూస్తే 1990లో చైనా కంటే మన దేశం ధనికమైంది. ఐఎంఎఫ్‌ తాజా సమాచారం ప్రకారం చూస్తే పది అగ్రశ్రేణి దేశాల మొత్తం, తలసరి జిడిపి దిగువ విధంగా ఉన్నాయి. మొత్తం జిడిపి బిలియన్‌ డాలర్లు, తలసరి వేల డాలర్లుగా గమనించాలి.
దేశం××××× జిడిపి ×× తలసరి
అమెరికా×× 26,854 ×× 80.03
చైనా×××× 19,374 ×× 13.72
జపాన్‌××× 4,410 ×× 35.39
జర్మనీ×××× 4,309 ×× 51.38
భారత్‌×××× 3,740 ×× 2.6
బ్రిటన్‌×××× 3,160 ×× 46.31
ఫ్రాన్స్‌×××× 2,924 ×× 44.41
ఇటలీ×××× 2,170 ×× 36.81
కెనడా×××× 2,090 ×× 52.72
బ్రెజిల్‌×××× 2,080 ×× 9.67
వస్తువులను చౌకగా ఎగుమతులు చేసేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని, కార్మికులకు వేతనాలను పెంచకుండా వస్తువులను చౌకగా ఎగుమతులు చేస్తోందని ఆరోపిస్తుంటారు. నిరంకుశంగా ఉంటారు, కార్మిక సంఘాలు ఉండవు, సమ్మెలు జరగవని, అదే కమ్యూనిస్టులు మన దేశంలో ప్రతి చోటా సంఘం, సమ్మెలు చేస్తుంటారన్న ప్రచారమూ తెలిసిందే. అది వాస్తవమా ? ఒక వ్యతిరేక ప్రచారమే.2011వ సంవత్సరంలో వివిధ కార్మిక సంఘాలు తమ సభ్యత్వ సంఖ్యలను ప్రకటించుకున్నాయి.దాని ప్రకారం కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టియుసిలో 1,90,92,217, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘమైన బిఎంఎస్‌లో 1,19,32,322, హెచ్‌ఎంఎస్‌లో 45,84,201, ఇక కమ్యూనిస్టులు పని చేసే సిఐటియు, ఏఐటియుసి, యుటియుసి, ఇతర పార్టీలు పని చేసే సంఘాల మొత్తంలో కోటీ 50లక్షల మంది ఉన్నారు. కమ్యూనిస్టులను వ్యతిరేకించే మూడు సంఘాల్లో మూడున్నర కోట్ల మంది ఉన్నారు. కంట్రీఎకానమీ డాట్‌కామ్‌ అనే పోర్టల్‌ 2000 నుంచి 2022 వరకు చైనా-భారత్‌ దేశాల్లోని కనీసవేతనాల గురించి ఒక పోలికను గ్రాఫ్‌ రూపంలో ఉంచింది. దాని ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు అవి ఎలా ఉన్నదీ దిగువ చూడవచ్చు. వేతన మొత్తాలను యూరోలలో పేర్కొన్నారు.

దేశం ×× 2000 ××2010×× 2020 ×× 2023
చైనా ×× 49.5 ×× 88 ×× 228.9 ×× 268.2
భారత్‌ ×× 26.8 ×× 38.8 ×× 57.7 ×× 55.7

గ్లోబల్‌ డాట్‌ పేరోల్‌ డాట్‌ ఓఆర్‌జి అనే పోర్టల్‌లో 2016,17 సంవత్సరాల నాటి సమాచారం గురించి ” చైనా, భారత్‌, వియత్నాం దేశాలలో కనీసవేతన చర్చ ” అనే శీర్షిక కింద ఇచ్చిన సమాచారం ప్రకారం నెల వారీ డాలర్లలో ఉన్న కనిష్ట -గరిష్ట వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం××××× కనిష్ట ××× గరిష్ట
చైనా ××× 192.91×× 332.66
భారత్‌ ××× 73.78×× 223.25
వియత్నాం×××106.83×× 155.80
చైనాలో ఉన్నది నిరంకుశ ప్రభుత్వమైతే వేతనాలు అలా ఎందుకు పెంచినట్లు ? మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉంటే ఇరవై ఏండ్లనాడు చైనాతో పోల్చితే సగంగా ఉన్న వేతనం 2023నాటికి ఐదోవంతుకు ఎందుకు తగ్గినట్లు ? రెండు చోట్లా ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థలే అయితే వేతన పెంపుదలలో ఇంత వ్యత్యాసం ఎందుకు ? మన దేశంలో ఇంతతక్కువగా ఉన్నప్పటికీ మనదేశానికి పెట్టుబడులు ఎందుకు రావటం లేదు? చైనా ఎగుమతుల వెనుక శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం ఒక ప్రధాన అంశం. గ్లోబల్‌ ఎకానమీ డాట్‌ కామ్‌ వెల్లడించిన 2022 రాంకుల ప్రకారం 176 దేశాల్లో చైనా 61.07శాతంతో 39వ స్థానంలో ఉంది. మనదేశం 23.97శాతంతో 165వ స్థానంలో ఉంది. మనకు తోడుగా ఎగువన 164వదిగా పాకిస్థాన్‌ ఉంది.మిగిలిన ఇరుగుపొరుగు దేశాలన్నీ మన కంటే ఎగువనే ఉన్నాయి. చైనా నాసిరకం వస్తువులను ప్రపంచానికి అంటకడుతుందని కొంత మంది ఇప్పటికీ ప్రచారం చేస్తారు.దిగుమతి చేసుకొనేవారు అంత అమాయకంగా ఉన్నారని వారు భావిస్తున్నారా ? సాంకేతిక పరిజ్ఞానంలో మనం ఎక్కడున్నామో మన ఎగుమతులే చెబుతాయి. గడచిన పాతిక సంవత్సరాలలో చైనా చేసిన పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల్లో 21శాతం ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవే ఉండగా మన ఎగుమతుల్లో వాటి వాటా 6.4శాతమే.


చైనాను అధిగమించేందుకు మన దేశం పెద్ద అంగ వేసే స్థితిలో ఉందా ? అసలు ఏ దేశమైనా గంతులు వేస్తూ వృద్ధి చెందిందా ? 2007లో చైనాలో ఉన్న మాదిరి ఆర్థిక స్థితిలో నేడు భారత్‌ ఉంది. ఆ మేరకు 2023లో భారత జిడిపి 3.7లక్షల కోట్ల డాలర్లు దాటుతుందని రేటింగ్‌ సంస్థ మూడీస్‌ చెప్పింది. నాడు చైనా తలసరి జిడిపి 2,694 డాలర్లుంటే భారత్‌లో 2,601 డాలర్లు ఉంది.2003 నుంచి 2011 వరకు చైనా జిడిపిలో పెట్టుబడులు సగటున 40శాతం కాగా భారత్‌లో 33శాతం ఉన్నాయి.2012 నుంచి 2021 మధ్య కాలంలో ఈ తేడా 43-29 శాతం అంటే భారత్‌లో పెట్టుబడులు తగ్గాయి. చైనాలో కార్మికభాగస్వామ్య రేటు 2007లో 73శాతం ఉండగా ప్రస్తుతం 67 శాతం దగ్గర ఉంది. మనదేశంలో 2022లో 50శాతానికి అటూఇటూగా ఉంది. ఇదే మహిళల విషయానికి వస్తే చైనాలో 66 నుంచి 61శాతానికి తగ్గగా మన దేశంలో 30 నుంచి 24శాతానికి పడిపోయింది. 1990 వరకు తలసరి ఆదాయం చైనాలో 318, భారత్‌లో 368 డాలర్లు కాగా 2022లో ప్రపంచంలో 72వ స్థానంలో ఉన్న చైనాలో 12,598 డాలర్లు ఉండగా 120వదిగా ఉన్న మన దేశంలో 2,389 డాలర్లు మాత్రమే. 1990ని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలంటే అదే ఏడాది మన దేశం సంస్కరణలకు తెరతీసింది, చైనా 1978 నుంచి అమలు జరుపుతున్నది. అందువలన గడచిన మూడు దశాబ్దాల్లో చైనా మాదిరి ఎందుకు మన దేశంలో పెరగలేదు అన్నది ప్రశ్న.పైసామే పరమాత్మ అంటారు కదా ! లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు. కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెడతామని చెబుతుంటే విదేశీ కంపెనీలన్నీ వాలతాయి.వాల్‌మార్ట్‌ మన వస్తువుల కోసం వస్తున్నదంటే మన మీద ప్రేమ కాదు, దాని లాభాల కోసమే !

నరేంద్రమోడీ ప్రేమ-ద్వేషం : చైనా వద్దు అమెరికన్‌ విద్యుత్‌ కార్లు ముద్దు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ కార్ల యుద్ధానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఒక వైపు, ఐరోపా సమాఖ్య-అమెరికా మరోవైపు మోహరిస్తున్నాయి. అమెరికా కంపెనీ టెస్లా కార్ల దిగుమతికిి మన కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదరిందని, వచ్చే ఏడాది నుంచి ఓడల్లో కార్లు దిగనున్నాయని వార్తలు. అధికారికంగా జనవరిలో ప్రకటించవచ్చు. రానున్న రెండు సంవత్సరాల్లో కార్ల తయారీ(విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ అమర్చటం) కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కార్లను అమ్ముతున్న చైనా బివైడి కంపెనీతో కలసి కార్ల తయారీని ప్రారంభిస్తామన్న మెఘా ఇంజనీరింగ్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. టెస్లా రెండు వందల కోట్ల డాలర్ల మేర కార్ల తయారీ కేంద్రానికి పెట్టుబడి పెడుతుందని మన దేశం నుంచి 1,500 కోట్ల డాలర్ల విలువగల విడి భాగాలను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ సెప్టెంబరు నెలలో కాలిఫోర్నియాలోని టెస్లా కంపెనీని సందర్శించి వచ్చిన సంగతి తెలిసినదే. వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో హైదరాబాదులో ఏటా పది నుంచి పదిహేను వేల కార్ల తయారీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తామని చైనా బివైడి-మెఘా చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అనుమతించే అవకాశం లేదని కారణం చెప్పింది. మెఘా కంపెనీ పెట్టుబడిపెడితే సాంకేతిక పరిజ్ఞానం చైనా కంపెనీ అందచేస్తుందని చెప్పినప్పటికీ అంగీకరించలేదు. దీనికి కారణం అమెరికన్‌ కంపెనీ టెస్లాను అనుమతించేందుకు సముఖంగా ఉండటమే అని చెప్పవచ్చు. మనం ఎలాగూ తయారు చేయలేనపుడు రెండు విదేశీ కంపెనీలు పోటీ పడి ధరలను తగ్గిస్తే మన వినియోగదారులకు లాభం, కొన్ని విడిభాగాలు ఇక్కడే తయారీ ద్వారా కొంత మేరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ టెస్లావైపే మొగ్గుచూపటం ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. చైనాలో స్వంతంగా తయారు చేసే కంపెనీలు ఉన్నప్పటికీ టెస్లాను కూడా అనుమతించిన కారణంగా పోటీ బడి అది కూడా తక్కువ ధరలకే అక్కడ కార్లు అమ్ముతున్నది. మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఇప్పటికే చైనా కంపెనీతో కలసి ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.దానికి లేని అడ్డంకి కార్లకు వచ్చిందంటే 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణలు, చైనా వ్యతిరేక కూటమిలో మన దేశం మరింతగా భాగస్వామి కావటమే అని చెప్పవచ్చు.


ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో చైనా జోరు ప్రపంచ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది.సాంప్రదాయ కార్ల నుంచి ఎలక్ట్రానిక్‌ వాహనాలకు మారితే ప్రస్తుతం తమ సంఘంలోని లక్షా యాభై వేల మంది కార్మికుల్లో 35వేల మందికి ఉపాధిపోతుందని అమెరికా యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది. తమ దేశంలో 2032 నాటికి మూడింట రెండువంతులు ఎలక్ట్రానిక్‌ కార్ల విక్రయమే ఉంటుందని అమెరికా ప్రకటించగా, 2035 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్ముతామని ఐరోపా సమాఖ్య పేర్కొన్నది. ఈ లక్ష్యాలను సాధించటానికి చైనా నుంచి వాహనాల దిగుమతులను అనుమతించాలా వద్దా అని ఆ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కేవలం ఎలక్ట్రిక్‌ మరియు ఇంథనంతోనూ నడిచే హైబ్రిడ్‌ కార్లతో సహా 2022లో ప్రపంచంలో నూటికి 60 చైనాలోనే ఉత్పత్తి చేశారు.చైనాలో ఐదువేల నుంచి 90వేల డాలర్ల వరకు ధర ఉండే 90 రకాల కార్లను అందుబాటులో ఉంచారు. సగటు ధర 53,800 డాలర్లుండగా ఐరోపాలో 94,100 డాలర్లుంది. ఈ ఏడాది చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో నాలుగో వంతు(80లక్షలు) ఎలక్ట్రిక్‌ కార్లుండగా, ఐరోపా సమాఖ్య దేశాల్లో 22, అమెరికాలో ఆరు, జపాన్‌లో కేవలం మూడు శాతమే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఐరోపా సమాఖ్య(ఇయు) 2022లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లు సమాఖ్య మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో మూడు శాతమే. అవి 2030నాటికి 20శాతానికి చేరతాయని స్థానిక కార్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చిన కారణంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ వాటి మీద విచారణ జరపాలని ఇయు నిర్ణయించింది. దిగుమతి సుంకాల మీద ఒక నిర్ణయం తీసుకొనేందుకు పూనుకుంది.ఇయు నిర్ణయం రక్షణాత్మక చర్యలు తప్ప మరొకటి కాదని వెంటనే చైనా స్పందించింది. అక్కడ ఇస్తున్న సబ్సిడీల సంగతేమిటని ప్రశ్నించింది. ఏ హౌదాతో తమపై విచారణ జరుపుతుందని నిలదీసింది. చైనా నుంచి వస్తున్న దిగుమతులతో స్థానికంగా ఉన్న కార్ల గిరాకీ 20శాతం తగ్గుతుందని అంచనా. చైనా కస్టమ్స్‌ సమాచారం ప్రకారం వర్తమాన సంవత్సరం ఏడునెలల్లో గతేడాది కంటే 113శాతం పెరగ్గా, 2020తో పోల్చితే3,205 శాతం ఎక్కువ. చైనా ఇస్తున్న సబ్సిడీలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే పోరాడాల్సిందేనని జర్మనీ మంత్రితో భేటీ అయిన ఫ్రెంచి ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయరే చెప్పాడు. అయితే కొందరు ఐరోపా వాణిజ్యవేత్తలు దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎదురుదాడికి దిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అనేక దేశాలు చైనా నుంచి చౌకగా వచ్చే కార్లను దిగుమతి చేసుకోవాలని ఉన్నా స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుందనే భయం మరోవైపు ఉంది.ప్రపంచంలో ఆటో పరిశ్రమల్లో కార్మికులు కోటీ నలభై లక్షల మంది ఉండగా చైనాలో 40లక్షలు,ఇయులో 25, అమెరికా, మెక్సికో, జపాన్లలో పది లక్షల వంతున ఉన్నారు. గతేడాది ప్రపంచ కార్ల ఎగుమతి విలువ 780బిలియన్‌ డాలర్లు కాగా ఇయు 407, జపాన్‌ 87, అమెరికా 58, దక్షిణ కొరియా 52, మెక్సికో 47 బి.డాలర్ల వాటా కలిగి ఉండగా చైనా 45 బి.డాలర్ల మేరకే ఎగుమతి చేసింది. ఉక్కు రంగంలో 2021లో మిగతా దేశాలను వెనక్కు నెట్టేసినట్లుగా రానున్న రోజుల్లో కార్లలో కూడా చైనా అగ్రస్థానానికి వస్తుందేమోనన్న భయం వెల్లడవుతోంది.


అమెరికాలో పికప్‌ ట్రక్కుల మీద 25శాతం తప్ప సాధారణ పన్ను 2.5శాతమే, అయితే చైనాతో వాణిజ్యపోరు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా కార్ల మీద 25శాతం విధించగా దాన్ని జోబైడెన్‌ కొనసాగిస్తున్నాడు. జపాన్‌లో అసలు పన్ను లేదు, పదిశాతం వసూలు చేస్తున్న ఇయు చైనా కార్ల మీద పన్ను పెంచాలని చూస్తున్నది.చైనా కంపెనీలు తక్కువ ధరలకు కార్లను ఎందుకు విక్రయించగలుగుతున్నాయన్నది ప్రశ్న. ఎలక్ట్రిక్‌ కార్లలో కీలకమైనవి. లిథియం – అయాన్‌ బ్యాటరీలు.వీటి పరిశోధన-అభివృద్దికి చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది, ఆ రంగంలో ఉన్నవారికి రాయితీలిచ్చింది. దానికి తోడు వాటి తయారీకి అవసరమైన ముడిపదార్దాలు చైనాలో పుష్కలంగా ఉండటం అక్కడి కంపెనీలకు కలసివచ్చింది. దీంతో స్థానిక వినియోగదారులు ఆకర్షితులౌతున్నారు ప్రపంచంలో వందకార్లు అమ్మితే గతేడాది చైనాలోనే 59 అమ్మారు. ఈ ఊపుతో ప్రపంచ మార్కెట్లకు విస్తరించాలని అక్కడి కంపెనీలు చూస్తున్నాయి. ఐరోపా దేశాల్లో తలెత్తిన కాలుష్యం కారణంగా రోడ్ల మీద ధ్వనితో 40శాతం మంది బ్రిటీష్‌ పౌరులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తేలింది.వాయు కాలుష్యంతో శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్ల వలన 17 నుంచి 30శాతం వరకు గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విడుదల తగ్గుతుందని అంచనా. అందుకే 2035నాటికి బ్రిటన్‌లో మొత్తం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్మాలని నిర్ణయించారు. ఒకవైపు చమురు ఇంథన కాలుష్యం తగ్గుతుందనే సానుకూలత ఉన్నా ప్రతికూలతల గురించి కూడా చర్చ మొదలైంది. హరిత ఇంథనం కోసం ధనికదేశాల ప్రయత్నం పేద దేశాల్లో పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది.


ప్రస్తుత తీరుతెన్నులను చూస్తే చైనా – ఇతర దేశాల మధ్య కార్ల ధరల యుద్దం జరిగే సూచన కనిపిస్తున్నది. అమెరికా కంపెనీ టెస్లా దీనికి నాంది పలికింది.దీంతో చైనాలోని కొన్ని రకాల కార్ల ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది.ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశీయ మార్కెట్లో 114లక్షల కార్లను విక్రయించగా 20లక్షలు ఎగుమతి చేసింది. విదేశీ ఎగుమతులు 80శాతం పెరగ్గా, స్వదేశీ మార్కెట్‌ 1.7శాతమే పెరిగినందున ధరల పోటీకి దిగితే చైనా కూడా నష్టపోవచ్చని కొందరు చెబుతున్నారు.గతేడాది డిసెంబరు నాటికి చైనాలో 4.3 కోట్ల కార్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉందని, ఉన్న సామర్ధ్యంలో 2017లో 66.6శాతం వినియోగిస్తే గతేడాది 54.5శాతంగా ఉందని రాయిటర్స్‌ పేర్కొన్నది.అక్కడ ఆటోపరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. జపాన్‌ కార్ల పరిశ్రమకు సైతం చైనా సెగతగులుతోంది.టయోటా తదితర కంపెనీలు తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకుంటున్నాయి.చైనాలో హైబ్రిడ్‌ కార్లకు మార్కెట్‌ ఎక్కువగా ఉంది. నిజంగా కార్ల ధర యుద్దమే తీవ్రమైతే చైనాకు తక్షణమే ఇబ్బంది ఉండదు. ఇప్పటికే సామర్ధ్యాన్ని సమకూర్చుకున్నందున పూర్తిస్థాయిలో ఉత్పత్తి వెంటనే జరపవచ్చు, అదే మిగతా దేశాల్లో సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు భారీగా పెట్టుబడులను కూడా పెట్టాల్సి వస్తుంది.


మన దేశంలో ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీకి పూనుకుంటే ముడిపదార్దాలు, బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడటం పెరుగుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(గిట్రి) ఈ ఏడాది మార్చి నెలలో తన నివేదికలో పేర్కొన్నది. భారత్‌లో తయారయ్యే వాహనాలకు అవసరమైన వాటిలో 70శాతం వస్తువులను చైనా, ఇతర దేశాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది..కాలుష్యం, ఉపాధిపై తలెత్తే పర్యవసానాల వంటి 13 అంశాలను గిట్రి గుర్తించింది.ఈ వాహనాల బ్యాటరీలను దిగుమతి చేసుకోవాలి, ధరలు ఎక్కువగా ఉంటాయి, ఆరేడు సంవత్సరాల తరువాత కొత్తవాటిని వేసుకోవాలి, వాటిని రీసైకిల్‌ చేయాలంటే వెలువడే విషపదార్దాలు సమస్యగా మారతాయి, దీని వలన విద్యుత్‌ గిరాకీ పెరుగుతుంది, బొగ్గుద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ ప్రక్రియలో కాలుష్యం పెరుగుతుంది. దూరప్రయాణాలకు అనువుగా ఉండవు,ప్రజా రవాణాకు పెద్దగా ఉపయోగపడవు,చైనా మీద ఎక్కువగా ఆధారపడటం వంటి అంశాలను పేర్కొన్నది. ఆటో విడిభాగాలను తయారు చేసే ఏడు వందల సంఘటిత రంగ సంస్థలతో పాటు పదివేల అసంఘటిత రంగ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. విడిభాగాలు అమ్మేవారు, లక్షలాది గారేజ్‌ షాపులు, సర్వీసు సెంటర్ల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కూడా పేర్కొన్నది. తమ కాలుష్యకారక పరిశ్రమలను రక్షించుకొనేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లాలని ఐరోపా దేశాల చెబుతున్నాయి తప్ప ప్రపంచమంతా అలా లేదు.ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు చార్జర్లకు ఒక ప్రమాణం లేదు, అందువలన ప్రతి సంస్థ తనదైన నమూనాను ఇస్తున్నది, దేశమంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నదని గిట్రి పేర్కొన్నది.