రామ్‌దేవ్‌ బాబా పతంజలి బండారాన్ని సుప్రీం కోర్టు విచారణ బయటపెడుతుందా ! రెచ్చిపోతున్న కాషాయ దళం !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


వివాదం తలెత్తిన ప్రతిసారీ రు.48వేల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన పతంజలి ఆయుర్వేద కంపెనీ ఉత్పత్తులకు పైసా ఖర్చు లేకుండా భారీ ఎత్తున ఉచిత ప్రచారం లభిస్తున్నది.మరోసారి అదే జరిగింది. ఎవరు అంగీకరించినా లేకున్నా వాస్తవమిది. సేవించిన వారికి కంపెనీ ఉత్పత్తులు ఎంత మేర ఉత్తేజమిస్తాయో తెలియదు గానీ అధినేత రామ్‌దేవ్‌ బాబా కాషాయ వేషంతో చేసే ఉపన్యాసాలు హిందూత్వ శక్తులకు స్టెరాయిడ్లలా కిక్కునిస్తున్నాయి. అందుకే వివాదం తలెత్తినపుడల్లా సామాజిక మాధ్యమంలో వారు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు వాదనలతో జాతీయోన్మాదాన్ని ముందుకు తెస్తూ జనాల బుర్రలను ఖరాబు చేస్తున్నారు. అల్లోపతి(ఇంగ్లీషు మందులుగా జనానికి తెలిసినవి) ఔషధాల గురించి జనాన్ని తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలు, ఆధారం లేని అంశాలను ప్రచారంలో పెడుతున్నారన్న వివాదంలో నవంబరు 21వ తేదీన సుప్రీం కోర్టు సర్వరోగ నివారిణి అని చెప్పుకుంటున్న వాటి ప్రకటనలు వెలువడకుండా చూసేందుకు పద్దతిని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటువంటి పనులకు పాల్పడితే పతంజలి ఉత్పత్తుల మీద జరిమానా విధించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అహసనుద్దీన్‌, ప్రశాంత కుమార్‌ వ్యాఖ్యానించారు.అలాంటి ప్రకటనల జారీ నిలిపివేయాలని, వాటి గురించి మీడియాతో మాట్లాడకూడదని, పతంజలి ఉత్పత్తుల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని పేర్కొన్నారు.దీంతో మరోసారి చర్చ, ఖండన మండనలు ప్రారంభమయ్యాయి.ఈ కేసును ఫిబ్రవరి 5కు కోర్టు వాయిదా వేసింది.


పతంజలి సంస్థ అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరుస్తున్నదని, తమ ఉత్పత్తులతో వ్యాధులు నయం గావటం గురించి అవాస్తవ ప్రకటనలు చేస్తున్నదని, కరోనా గురించి పుకార్ల వ్యాప్తి, వాక్సిన్ల పట్ల వైముఖ్యతను రెచ్చగొడుతున్నదని గతేడాది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యలను, ఎడతెగకుండా ఉండే అస్వస్తత, జన్యుపరమైన, చర్మ వ్యాధులు, కీళ్లనొప్పులు,ఆస్మా,వెన్నెముక కండరాల బాధల వంటి వాటన్నింటినీ తమ ఉత్పత్తి శాశ్వతంగా నివారిస్తుందనే తప్పుడు ప్రచారాన్ని పతంజలి చేస్తున్నదని ఐఎంఎ ఫిర్యాదు చేసింది. దీని మీద తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రామ్‌దేవ్‌ బాబా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజాలు, అవాస్తవాలను డబ్బు నిర్ణయించకూడదని, అల్లోపతి ఆసుపత్రులు, వైద్యులు ఎక్కువగా ఉండవచ్చు, వారి గళాన్ని ఎక్కువ మంది వినవచ్చు గానీ తమకు రుషుల జ్ఞానవారసత్వం ఉందని, తాము దానిలో పేదలం కాదని చెప్పుకున్నారు.యోగా, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం, తమ సనాతన విలువలకు వ్యతిరేకంగా కొంత మంది అల్లోపతి వైద్యుల బృందం తప్పుడు ప్రచారం చేస్తున్నదని తమ కంపెనీ ఎలాంటి అబద్దాలు చెప్పటం లేదన్నారు.తప్పుడు ప్రచారం చేస్తున్నందున తమను సుప్రీం కోర్టు మందలించినట్లు వెలువడిన ఒక వార్తా కథనం గురించి చెబుతూ తామలాంటిదేమీ చేయటం లేదని, సుప్రీం కోర్టు అంటే గౌరవం ఉందన్నారు.తప్పుచేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్దమే, మేము అబద్దాలకోరులమైతే వెయ్యికోట్ల రూపాయల జరిమానాకు, మరణశిక్షకూ సిద్దమని కాదని తేలిదే మా మీద ప్రచారం చేస్తున్నవారిని శిక్షించాలన్నారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన కరోనిల్‌ పని చేస్తుందని 2020 జూన్‌లో పతంజలి చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది. రోగనిరోధక శక్తిని పెంచుతుందనే ఏకైక కారణంతో దానికి అనుమతి ఇచ్చాం తప్ప కరోనా నిరోధం గురించి కాదని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ దాన్ని కరోనా నిరోధ ఔషధంగా ప్రచారం చేయటంతో జనాలు ఎగబడి కొనుగోలు చేశారు. దాని సామర్ధ్యం, రక్షణ గురించి ఎలాంటి వివరాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వెల్లడించింది. నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న మోసకారులుగా పేర్కొంటూ బీహార్‌, రాజస్థాన్‌లలో రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సంస్థ చైర్మన్‌ బాలకృష్ణ మీద కేసులను దాఖలు చేశారు. ఇంత జరిగిన తరువాత కరోనిల్‌ ఉత్పత్తులు కొనుగోలుకు దొరుకుతున్నాయి.


యోగా చేస్తే ఎయిడ్స్‌ నివారణ అవుతుందని, స్వలింగ సంపర్క అలవాటును మానుకుంటారని రామ్‌దేవ్‌ బాబా చెప్పినదానికి నిజమే నిజమే అని తలలూపేవారికి కొదవలేదు.తాము ఉత్పత్తి చేసిన ” దివ్య పుత్రజీవక్‌ సీడ్‌ ”ను తీసుకుంటే పుత్రులు పుడతారని 2015 నుంచి ప్రచారం చేస్తున్నారు. దీన్ని సహజ ఔషధ మొక్కల నుంచి తయారు చేశామని, సంతానలేమి చికిత్సకు ఉపయోగపడుతుందని మార్కెటింగ్‌ చేస్తున్నారు. బుర్రల్లో గుంజులేని జనం దాన్ని నమ్ముతూనే ఉన్నారు. మాగీ నూడిల్స్‌లో సీసం శాతం నెస్లే కంపెనీ చెప్పినదానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ ఉందని రుజువు కావటంతో 2015లో దాని మీద నిషేధం విధించారు. వెంటనే రామ్‌దేవ్‌ బాబా తన నూడిల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇక్కడ అసలు కథ ఏమిటంటే కేంద్రంలో నీకది నాకిది అనే పాలకులు అధికారంలో ఉన్నందున ఎలాంటి అనుమతులు లేకుండానే భారత ఆహార భద్రత, ప్రమాణాల ఆధారిటీ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పేరుతో ఒక లేని నంబరును ఆ ఉత్పత్తి మీద ముద్రించి అమ్మి సొమ్ము చేసుకొనే అక్రమానికి పాల్పడ్డారు.దాన్ని గుర్తించిన అధారిటీ అధ్యక్షులు ఆషిష్‌ బహుగుణ ఆ ఉత్పత్తికి అంగీకారం, అనుమతుల్లేేవంటూ తిరస్కరించారు.కాషాయం ధరించిన వారు ఏం చేసినా చెల్లుతుందనే భరోసా కేంద్రంలో ఉన్న పెద్దలు ఇవ్వకుండా ఇలాంటి అక్రమానికి పాల్పడతారని అనుకోగలమా ? తరువాత 2017లో ఆయుర్వేద ఉసిరికాయ రసం పేరుతో మార్కెటింగ్‌ ప్రారంభించారు. అది తాగేందుకు పనికిరాదని ప్రభుత్వ ప్రయోగశాల ప్రకటించటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్పత్తిని పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు కూడా దాన్ని విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.తాజాగా ఒక రకపు చేప ఎముకల పొడితో కూడిన దివ్య దంత మంజన్‌ పేరుతో పండ్లుతోముకొనే పేస్టును మార్కెట్‌ చేయటంపై ఒక లాయర్‌ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చారు. అది శాఖాహార పదార్ధాలతో తయారు చేసిందని నమ్మకం కలిగించేందుకు ఆకుపచ్చ గుర్తువేసి మరీ అమ్ముతున్నారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించటమే అన్నది అభ్యంతరం.లాయర్‌ సాషా జైన్‌ పంపిన నోటీసులో తమ సామాజిక తరగతి, ఇతర శాఖాహారుల మీద జరిపిన దాడిగా ఆమె అభివర్ణించారు.


అల్లోపతి వైద్యులపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కరోనా మీద చేసి వ్యాఖ్యలపై తన మీద పాట్నా, రాయపూర్‌లలో నమోదైన కేసులను ఎత్తివేయాలని లేదా ఢిల్లీలో విచారించాలని రామదేవ్‌బాబా సుప్రీం కోర్టును కోరారు. అక్టోబరు నెలలో దీని మీద న్యాయమూర్తులు ఏఎస్‌ బోపన్న, ఎంఎ సుందరేష్‌లతో కూడిన బెంచ్‌ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. విద్వేష పూరిత ప్రసంగం కేసులో దర్యాప్తు అధికారి ముందుకు అక్టోబరు ఐదవ తేదీన రావాలని రాజస్థాన్‌ హైకోర్టు సెప్టెంబరులో ఆదేశించింది. దాని మీద గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తరువులను అక్టోబరు 16 వరకు పొడిగించింది. అప్పటి వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఒక మతపరమైన కార్యక్రమంలో రామ్‌దేవ్‌ బాబా మాట్లాడుతూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదు చేశారు. ముస్లింలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, హిందూ మహిళలను అపహరిస్తున్నారంటూ మాట్లాడిన అంశాలతో కూడిన వీడియోను సమర్పిస్తూ పాథైఖాన్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. తమ ఆయుర్వేద ఔషధాలు సర్వరోగ నివారిణి అని ప్రచారం చేసుకుంటున్న పతంజలి కంపెనీ అధికారి బాలకృష్ణ 2019 అగస్టులో 23న తనకు తల తిరుగుతోందని, గుండెలో నొప్పి ఉందంటూ రిషికేష్‌లోని ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో చేరారు.తొలుత హరిద్వార్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకుపోగా వారు ఎయిమ్స్‌కు పంపారు.ఉల్లి-హరిదాసు కథ తెలిసిందే. తమదాకా వస్తే గాని అసలు సంగతి వెల్లడి కాదంటారు ఇందుకే.
ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు, శాస్త్రీయత లేని వారి ఉత్పత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో కొందరు కుహనా దేశభక్తులు రెచ్చిపోతున్నారు. అదానీ కంపెనీ అక్రమాలపై హిండెన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణల సందర్భంగా కూడా ఇదే జరిగింది. దేశభక్తుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త మీద దేశద్రోహులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది దేశం మీద జరుగుతున్నదాడే అన్నారు. పతంజలి వివాదం గురించి వారు చేస్తున్న కొన్ని వాదనల తీరు తెన్నులు చూద్దాం.


” 100 సంవత్సరాలుగా సినిమా యాక్టర్స్‌ను చూపించి లక్స్‌ వాడితే తెల్లబడతాం అంటే ఏం ప్రశ్నించకుండా ఎగబడి కొన్నది మనమే కదా? ”
భావజాలం, మతం, సనాతనం, ఆచారం పేరు ఏది పెట్టినా తరతరాలుగా అసలు మన జనాన్ని ప్రశ్నించకుండా, మెదళ్లను ఎదగకుండా పనికిరాకుండా చేసిన ప్రబుద్దుల గురించి ముందుగా ఆలోచించాలి. ఎందుకు అని ఎవరూ ప్రశ్నించకూడదు. నేర్పకున్నా చూసి నేర్చుకోవటం కూడా అపరాధమే. అర్జునుడి కంటే గొప్ప విలుకాడిగా తయారైన గిరిజన ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలిని ద్రోణుడు గురుదక్షిణగా అడిగి అసలు విల్లుపట్టకుండానే చేశాడు కదా ! నిజమే, లక్స్‌ గురించి అడగలేదు అని ఎద్దేవా చేస్తున్నవారు పతంజలి ” సౌందర్య ” బ్రాండ్‌ సబ్బు కూడా అలాంటిదే అని ఎందుకు చెప్పటం లేదు. గుడ్డిగా కొనేవారున్నారు గనుకనే సొమ్ము చేసుకుంటున్నారు.లక్స్‌ వంటి వాటిని చూసే కదా రామ్‌దేవ్‌ సంపాదనకు దిగింది.
” కాంప్లాన్‌ తాగండి జిరాఫీ అంత పొడుగు అవ్వండీ అంటే ఏనాడూ ప్రశ్నించని మనం మన ఆయుర్వేదిక్‌ ఉత్పత్తులపై మాత్రం నానా యాగీ చేస్తాం. కోర్టులూ అంతే. ”
ప్రశ్నించవద్దని ఎవరు వద్దన్నారు. స్వదేశీ జాగరణ మంచ్‌ కార్యకర్తలు, ఈ ప్రశ్నలు వేసేవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? కోర్టులూ అంతే అంటే ఎవరైనా కోర్టుకు వెళితేనే కదా అవి తమ పరిధి మేరకు జోక్యం చేసుకొనేది.తప్పుడు సమాచారం ఇచ్చి వినియోగదారులను మోసం చేస్తున్న కంపెనీలు ఏవైనా ప్రశ్నించాల్సిందే, కోర్టులకు లాగాల్సిందే. ఆయుర్వేదంతో సహా పొడవును పెంచే ఉత్పత్తులేవీ ప్రపంచంలో లేవు.
” తప్పు ఏం ఉంది ఆయన మార్కెటింగ్‌ చేసుకుని సంపాదించింది దేశంలోనే ఉంటోంది కదా లీవర్‌ కంపనీ నెస్లే కంపెనీల వాళ్ళ లాగా విదేశాలకు పట్టుకుపోవడం లేదు కదా? ”
ఈ ప్రశ్న వేసేవారు విదేశాలకు పట్టుకుపోయే కంపెనీల మీద చర్యలు తీసుకోవటానికి అడ్డుపడుతున్నదెవరో చెప్పాలి. పతంజలి సంపాదించిందంతా దేశంలోనే ఉంటే ఒరిగేదేమిటి ? జన సంక్షేమానికేమీ ఖర్చు పెట్టటం లేదుగా ! దేశభక్త అదానీ అని చెప్పిన వారు విదేశాల్లో అతని సూట్‌కేసు కంపెనీల గురించి ఎందుకు చెప్పరు. ఇక్కడ సంపాదించిన సొమ్మును అడ్డంగా తరలించి ఆ సొమ్మునే తిరిగి విదేశీ పెట్టుబడుల పేరుతో తీసుకువచ్చి రాయితీలు భారీగా పొందుతున్న పెద్దల సంగతి తెలియందెవరికి ? గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులు, దేశం కోసం, ధర్మం కోసమే అంతా అంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే విదేశాలకు తరలింపుకు అవకాశం కలిగిస్తోంది.
”అన్ని మందుల కంపెనీలు, అన్ని కాస్మెటిక్‌ కంపెనీలు అబద్ద ప్రకటనలతోనే, డాక్టర్లకు కోట్లలో మూడుపులు ఇస్తూ వంద సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాయి కదా? ”
నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీకీ ఈ విషయాలు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. అలాంటి పనులు ఎవరు చేసినా అక్రమమే. వాటి సరసన పతంజలి కూడా చేరింది. తన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు పతంజలి ఏమీ ఇవ్వకుండానే వ్యాపారులు అమ్మిపెడుతున్నారా ? అల్లోపతి వైద్యులే డబ్బుతీసుకుంటున్నారా, ఆయుర్వేద వైద్యులకు డబ్బు చేదా ! మనవాడని చెప్పి సుత్తితో కొట్టించుకుంటే తలపగలదా ! మెదడు చితకదా !! చితికితే ఆయుర్వేదంతో కుట్లు వేస్తారా ?
”వాడితే తెల్లగా అయిపోతారు అనే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ని ప్రశ్నించం. వాడి మార్కెటింగ్‌ మోసాన్ని హాయిగా ఎంజారు చేస్తాం.”
గర్భ సంస్కారం పేరుతో బలశాలులైన పక్కాహిందూ పిల్లల్ని పుట్టిస్తామని చెబుతున్న బాపతు గురించి లొట్టలేసుకుంటూ చెప్పుకుంటాం. తమ ” దివ్యపుత్రజీవక్‌ సీడ్‌ ”తో మగపిల్లలను పుట్టిస్తామంటే ఎలా అని రామ్‌దేవ్‌బాబాను ప్రశ్నించం ! పతంజలి ” సౌందర్య స్వర్ణ క్రాంతి క్రీమ్‌” కు ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌కు తేడా ఏమిటన్న ప్రశ్నే మన మెదళ్లకు తట్టదు. ప్రతి వాడి మోసాన్ని, వేషాన్ని ప్రశ్నిద్దాం !
” మరి ఒక్క దేశీయ కంపెనీలపై మాత్రమే ఈ దాడి దేనికి? ”
ఏ కంపెనీ అయినా మోసానికి, జనాన్ని తప్పుదారి పట్టిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రశ్నించటాన్నే దాడి అని వర్ణించటం ప్రమాదకరపోకడ. ఇప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని ఎదిరించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న పూర్వరంగంలో పతంజలిని కాషాయ భక్తులు వెనకేసుకురావటం విశేషమేమీ కాదు.
” మన కళ్లను మనమే ఎలా పొడిపించుకోవచ్చో ఎంఎన్‌సిలకు ఉగ్గుతో అబ్బిన విద్య.తెల్ల తొక్క వాడు ఏది చెప్పినా అది మనకు వేదమే. వెధవ దేశీయ నల్లవాడు ఏది చెప్పినా ఎలా ఎదిగినా తప్పే. ”
ఏ రంగువాడు చెప్పాడన్నది కాడు, ఏం చెప్పాడన్నది, ఎవడు ఏం చేశాడన్నది ముఖ్యం. మన వారిలోనే తెల్లవాడిని ఎదిరించే క్రమంలో ప్రాణార్పించిన దేశభక్తులను చూశాం. అండమాన్‌ జైల్లో పెట్టగానే పిరికిబారి బయటపడేస్తే సేవ చేసుకుంటా అని ప్రేమలేఖలు రాసి తనను తానే ”వీర ” అని రాసుకున్న దొంగదేశభక్తుడి గురించీ తెలిసిందే. చిన చేపను పెద చేప మింగినట్లుగా దేశం మారకుండా చూసేందుకు 1969లో గుత్త సంస్థల పరిమిత వాణిజ్య చట్టాన్ని(ఎంఆర్‌టిపి) తెచ్చారు. దాన్ని2002 ఎన్‌డిఏ పాలకులు పోటీ చట్టం తెచ్చి చెత్తబుట్టలో పడేశారు. పోటీ పెరిగినందున జనానికి జరిగిన మేలేమిటి ? ప్రతిదీ దేశీయమే అని చెప్పేవారు అదే తెల్ల విదేశీ కంపెనీలు, పెట్టుబడుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నట్లు ?
” ప్రపంచ సంస్ధ లతో పోటీ పడే పెద్ద ఎంఎన్‌సిలు దేశంలో 70 సం. లుగా ఎందుకు తయారు కాలేదు అంటే మన ఈ మనస్తత్వమే.. ఆలోచన విధానమే కారణం.”
ప్రపంచ ఎంఎన్‌సిలు ఇతర దేశాల జనాన్ని కొల్లగొట్టి బలిశాయి. అందుకు ఆ దేశాల పాలకులు ప్రపంచమంతటినీ వలసలుగా చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు గనుక మనవంటి దేశాల మార్కెట్లను ఆక్రమిస్తున్నాయి. మనం కూడా ఇతర దేశాలను ఆక్రమించి ఉంటే ఎంఎన్‌సిలు వచ్చి ఉండేవి. మనం తక్కువ తినటం లేదు. అదానీని మరింత పెద్ద శక్తిగా మార్చటానికి శ్రీలంకలో విద్యుత్‌ కేంద్రాన్ని అప్పగించమని నరేంద్రమోడీ స్వయంగా వత్తిడి చేసినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. అంబానీ రిలయన్స్‌ను మరింత బలపరచటానికే కదా అమెజాన్‌ కంపెనీని మోడీ అడ్డుకుంటున్నది.
”స్వతంత్ర పోరాటం చేశాం, దేశభక్తి అని చెప్పి గత 75 సం. లలో ఎంత మంది కాంగ్రెస్‌ నేతలు వేల కోట్లకు అధిపతులు అయ్యారు?”
అవును, ఆ పేరుతో కొంత మంది సంపాదించుకున్నారు, ప్రభుత్వ రంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మేమే అసలైన దేశభక్తులం అని చెబుతున్నవారు దేశం కోసం-ధర్మం కోసం అనే పేరుతో కొత్త పెట్టుబడులేవీ పెట్టకుండా గతంలో సమకూర్చిన ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ అయినకాడికి తెగనమ్మేస్తున్నారు. కావాలని ఎగవేసిన వారికి లక్షల కోట్ల బాంకు రుణాలను రద్దు చేశారు. వారికి 75 ఏండ్లు అవకాశం ఇచ్చాం, వీరికీ మరో 75 ఏండ్లు అవకాశమిద్దామా ? ఎలాంటి శషభిషలు లేకుండా మన కళ్ల ముందే దేశాన్నే తెగనమ్మేస్తారు !!

అర్జెంటీనా అధ్యక్షుడిగా పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు జరిగిన అర్జెంటీనా అధ్యక్ష తుది ఎన్నికల్లో పచ్చి మితవాది జేవియర్‌ మిలై విజయం సాధించాడు. వామపక్షాల మద్దతు ఉన్న అధికార పెరోనిస్టు పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, కూటమి అభ్యర్థి సెర్గియో మాసాకు 44శాతం ఓట్లు రాగా మిలై 56శాతం తెచ్చుకున్నాడు.డిసెంబరు పదవ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నాడు. మార్కెట్‌ అనుకూల మిలై వాగాడంబరానికి మితవాద శక్తులు, అసంతృప్తి చెందిన యువతరం అధికార కూటమికి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు కనిపిస్తోంది. ఒక అరాచక కాపిటలిస్టునని తన గురించి మిలై స్వయంగా చెప్పుకున్నాడు. ఎన్నికల ఫలితాలు వెలుబడగానే పెట్టుబడిదారులు సంబరాలు జరుపుకున్నారు. బాండ్ల రేట్లు పెరిగాయి.నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలలో అంతకు ముందు అధికారంలో ఉన్న మితవాద శక్తులను ఓడించి 2019లో పెరోనిస్టు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2015 నుంచి 2019వరకు మితవాద శక్తులు అధికారంలో ఉన్నాయి. వాటి వైఫల్యంతో అంతకు ముందు అధికారంలో ఉన్న పెరోనిస్టు కూటమికి జనం తిరిగి పట్టం కట్టారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌, మరింత దిగజారిన ఆర్ధిక వ్యవస్థ కారణంగా జనంలో ప్రభుత్వం మీద అసంతృప్తి తలెత్తింది.జనాభాలో45శాతం మంది దారిద్య్రరేఖకు దిగువ ఉన్నట్లు అంచనా. వందశాతం దాటిన ద్రవ్యోల్బణం అదుపులేదు. కరెన్సీ పెసో విలువ దిగజారింది.గడచిన పదకొండు సంవత్సరాలలో ఏడు సార్లు వృద్ది రేటు తిరోగమనంలో నమోదైంది. ఈ ఏడాది మాంద్యంలోకి జారవచ్చని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఈ పూర్వరంగంలో పెరోనిస్టు కూటమి ఓడింది.


కరోనా, ఇతర వైఫల్యాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఉపయోగించుకొని జేవియర్‌ మిలై 2021 పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగాడు. వాస్తవ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన అభ్యర్ధిని తాను మాత్రమేనని మిలై చెప్పాడు. అతగాడికి కుక్కలంటే పిచ్చి. వాటి భాషలో మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం గురించి ఆలోచిస్తున్నానని, అందుకుగాను తన దగ్గర ఐదు కుక్కలున్నాయని, అవి పది లేదా ఇరవై కూడా కావచ్చు అని చెప్పాడు. వాటిని వదిలితే తగ్గుతుందన్నాడు. మిలై దృష్టిలో కుక్కలంటే రాజ్యాన్ని పక్కన పెట్టి మొత్తం వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రబోధించే ప్రముఖులు. ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి రాజ్యం ఒక పరిష్కారం కాదు, అదే అసలు సమస్య అని కూడా చెప్పాడు. ఐరోపా సంతతితో ఏర్పడిన అర్జెంటీనా గత శతాబ్ది తొలి రోజుల్లో సంపద్వంతంగా ఉండేదని, ప్రస్తుత దురవస్థకు ప్రభుత్వాల వైఫల్యమే కారణమనేందుకు ఉదాహరణగా ఉందన్నాడు. దేశంలోని మొత్తం రాజకీయ తరగతి అంతా దొంగలని, పన్నులు విధించాలని కోరటం హింసాత్మక చర్య అన్నాడు. ఇతగాడి నోటి దురుసుతనంతో అసంతృప్తితో ఉన్న జనం మద్దతుదారులుగా మారవచ్చు, ఓట్లు వేయవచ్చు, నిజంగా అధికారం వస్తే ఎలా పాలిస్తాడో ఏ తిప్పలు తెచ్చిపెడతాడో అన్న భయాన్ని వెల్లడించిన వారు కూడా ఉన్నారు.చివరకు అదే నిజమైంది. అర్జెంటీనాలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దిగువ సభలో సగం సీట్లకు, ఎగువ సభలో మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు రద్దు కాదు. ఒకసారి ఎన్నికైన వారు ఎగువ సభలో ఆరు సంవత్సరాలు, దిగువ సభలో నాలుగేండ్లు ఉంటారు.ప్రజాప్రతినిధుల దిగువ సభలో రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన సీట్లు ఖరారు చేస్తారు. అధ్యక్ష ఎన్నికలు రెండు లేదా మూడుదశల్లో జరుగుతాయి.


ప్రాధమిక ఎన్నికల్లోనే అర్జెంటీనాకు పచ్చి మితవాద శక్తుల ముప్పు ముంచుకువస్తున్నట్లు వెల్లడైంది. ఫలితాలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. ఆ ఎన్నికల్లో స్వేచ్చతో ముందుకు (లిబర్టీ అడ్వాన్సెస్‌) పార్టీ నేతగా జేవియర్‌ మిలై అగ్రస్థానంలో నిలిచాడు. దేశంలోని 24 ప్రావిన్సులలో పదహారు చోట్ల ఆధిక్యత కనపరిచాడు.మిలైకు 30.04శాతం, మరో మితవాద పార్టీకి 28.28శాతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాతంత్ర, వామపక్ష కూటమికి 27.27శాతం ఓట్లు వచ్చాయి.తొలి దఫా ఓటింగ్‌ 45శాతంపైగా తెచ్చుకున్నవారు ఒకరే ఉంటే సదరు అభ్యర్ధితో పాటు ఉపాధ్యక్షపదవికి పోటీ చేసిన అభ్యర్ధి కూడా నెగ్గినట్లు ప్రకటిస్తారు. అలాగాక 40శాతం తెచ్చుకున్నప్పటికీ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్ధికి మొదటి స్థానంలో ఉన్నవారికి తేడా పదిశాతం కంటే ఎక్కువ ఉండాలి. ఒక వేళ ఇద్దరికి 45శాతానికి మించి ఓట్లు వచ్చినా లేక 40శాతం నిబంధన ప్రకారం ఎవరూ నెగ్గకున్నా, ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఇద్దరి మధ్య రెండవ దఫా ఎన్నిక జరిపి విజేతను ప్రకటిస్తారు. పదహారు సంవత్సరాలకే ఓటింగ్‌ హక్కు ఇచ్చినప్పటికీ 18-70 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు విధిగా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రాధమిక ఎన్నికలలో విధిగా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అక్టోబరు 22న జరిగిన తొలి దఫా ఎన్నికల్లో ఐదుగురు పోటీ చేశారు. వారిలో పెరోనిస్టు మెసాకు 36.78శాతం, మిలైకి 29.99శాతం, మూడో అభ్యర్ధికి 23.81 శాతం రాగా మిగిలిన ఇద్దరికీ కలిపి 9.43శాతం వచ్చాయి. దీంతో నవంబరు19న తుది దఫా మెసా-మిలై మధ్య పోటీ జరిగింది.


ప్రాధమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడి కావటంతో మిలై తన మద్దతుదారులతో మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నాడు.రాజకీయ నేతలు మారకపోతే వారిని వదిలించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చైనాను అనుమతించి కొన్ని కీలకరంగాలను అప్పగించాడని ఆరోపించాడు. తాను చైనాతో సంబంధాలను తెంచివేస్తానని, కమ్యూనిస్టులతో వ్యాపారం చేయనని అన్నాడు. కమ్యూనిజం ఒక హంతక వ్యవస్థ, సోషలిజం ఆత్మకు పట్టిన జబ్బు అన్నాడు. తాను అధికారానికి వచ్చిన తరువాత దేశ రిజర్వుబాంకును రద్దు చేస్తానని, ప్రభుత్వ ఖర్చు కోత పెడతానని, పతనమౌతున్న దేశ కరెన్సీ పెసోను రద్దు చేసి కొన్ని దేశాల మాదిరి అమెరికా డాలరును చట్టబద్దమైన కరెన్సీగా ప్రకటిస్తానని చెప్పాడు. విధిగా పాఠశాలల్లో లైంగిక విద్య బోధన జరపాలన్న గత ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేస్తానని అన్నాడు.అర్జెంటీనా ఎన్నికలు ఒక్క లాటిన్‌ అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికే ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు.


లాటిన్‌ అమెరికాను అమెరికా సామ్రాజ్యవాదం తన పెరటి తోటగా పరిగణించింది. తనకు లోబడిన వారిని గద్దె నెక్కించటం వీలుగాకపోతే మిలిటరీ నియంతలను రంగంలో తెచ్చింది. ఇదే సమయంలో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ విధానాలను ఆ దేశాల మీద రుద్దారు. అవి వికటించటం, అనేక దేశాల్లో నియంతలు, మితవాద పాలకులకు వ్యతిరేకంగా వామపక్ష శక్తులు పార్లమెంటరీ పోరాటంతో పాటు ఆయుధాలు కూడా పట్టి జనాన్ని సమీకరించారు. దివాలా కోరు ఆర్థిక విధానాలతో పాలకులు ప్రజల నుంచి దూరం కావటం, ప్రతిఘటన తీవ్రమైన తరుణంలో విధిలేక ఎన్నికలు జరపటం వాటిలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది ఒక్కటిగా నిలవటంతో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చాయి. వాటికి మద్దతు ఇచ్చిన వారందరూ సోషలిజం, కమ్యూనిజాలకు మద్దతుదార్లు కాదు. నిరంకుశ వ్యతిరేక పోరాటంలో విశాల వేదికల్లో కలసి వచ్చినవారు ఎందరో ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలనే వైఖరిని బలపరిచారు.దోపిడీ వ్యవస్థ పునాదులను కూలిస్తే తప్ప జనజీవితాల్లో మౌలిక మార్పులు రావనే అంశాన్ని గుర్తించటంలో, అమలు జరపటంలో ఏకాభిప్రాయం లేదు. అందువల్లనే అధికారానికి వచ్చినచోట వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు గత పునాదులను అలాగే ఉంచి వాటి మీదనే సామాన్య జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుసగా రెండు, మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. అయితే వాటికి ఉన్న పరిమితులు వెల్లడి కావటంతో జనంలో తలెత్తిన అసంతృప్తి కారణంగా తిరిగి మితవాద శక్తులు తలెత్తుతున్నాయి.బ్రెజిల్లో, మరికొన్ని చోట్ల అదే జరిగింది. కొన్ని చోట్ల వామపక్షం పేరుతో గెలిచిన వారు మితవాద శక్తులతో చేతులు కలిపారు.


గతంలో మాదిరి నియంతలను రుద్దితే లాభం లేదని గుర్తించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను దెబ్బతీసేందుకు మితవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయి.ఎన్నికల్లో గెలిచినప్పటికీ పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ అనుకూల విధానాల కారణంగా అసంతృప్తి తలెత్తి తిరిగి జనం వామపక్షాలకు పట్టంగడుతున్నారు. బ్రెజిల్లో లూలా అదే విధంగా మరోసారి గెలిచాడు. అర్జెంటీనాలోగత ఎన్నికల్లో జరిగింది అదే.ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు మౌలిక విధానాల మార్పుల జోలికి పోని కారణంగా జన జీవితాల్లో పెద్ద మార్పులు రాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం 45శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వార్షిక ద్రవ్యోల్బణం 143 శాతానికి చేరింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవు. దశాబ్దికాలంగా జిడిపి ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.కరెన్సీ విలువ పతనమైంది. అప్పుల మీదనే దేశం నడుస్తోంది. ఈ కారణంగానే మితవాద ఆర్థికవేత్త కూడా అయిన మిలై చేసిన సైద్దాంతికపరమైన దాడికి నూతన తరం ఆకర్షితమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాటన్నింటినీ రద్దు చేసి మొత్తం బాధ్యత అంతటినీ మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే అవే సమస్యలను పరిష్కరిస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ మితవాది బోల్సనారో బాటలో తాను దేశాన్ని నడిపి ఫలితాలను చూపుతానని నమ్మబలికాడు. ఏ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు బదిలీ చేసిందో ఆ లబ్ది పొందిన పేదలు కూడా దానికి వ్యతిరేకంగా మితవాద మిలైకి ఓటువేసినట్లు స్పష్టమైంది. మితవాద మిలై విప్లవాత్మక మార్పులను నిజంగా తెస్తాడని, మరొక మార్గం లేదని జనం భ్రమలకు గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నయా ఉదారవాద విధానాలకు శస్త్ర చికిత్స తప్ప పై పూతలతో దాన్ని సంస్కరించి ప్రజానుకూలంగా మార్చలేరన్నది గ్రహించాల్సి ఉంది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొని గద్దె నెక్కినప్పటికీ జేవియర్‌ మిలై తాను ప్రకటించిన అరాచక పెట్టుబడిదారీ విధానాలను అమలు జరపటం అంత తేలిక కాదు. 2021లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత 257 స్థానాలకు గాను పెరోనిస్టు కూటమికి 118,వర్కర్స్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌కు నాలుగు మినహా మిగిలిన సీట్లన్నింటిలో మితవాద పార్టీల కూటమికి 116, ఇతర మితవాద పార్టీలు, స్వతంత్రులు కలిపితే మెజారిటీ ఉన్నారు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన మితవాదులు తొలుత తమ దాడిని కార్మికుల మీదనే ప్రారంభించిన నేపధ్యంలో మిలై ఆచరణ కూడా దానికి భిన్నంగా ఉంటుందని భావించలేము. అదే జరిగితే వెంటనే ప్రజా ప్రతిఘటన కూడా ప్రారంభం అవుతుంది.

నాడట్లుండె, నేడిట్లుండె – దేశంలో తెలంగాణా ఎక్కడుండె !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మూడు ప్రధాన పార్టీలు ఓటర్ల ముందుకు ఎన్నికల ప్రణాళికలు, ఓట్లు దండుకునే ప్రచారం, పధకాలతో ముందుకు వచ్చాయి. అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ నాడెట్లుండె-నేడెట్లుండే రేపు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ రంగుల కలను జనం ముందు ఉంచింది. అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీ తాను ప్రకటించిన ప్రణాళికను ఎలా అమలు జరుపుతుంది ? దానికి తగిన నిధులు అందుబాటులో ఉన్నాయా ? ఏమి చూసుకొని జనాన్ని వాగ్దానాల జడివానలో తడుపుతున్నది అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి, కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న బిజెపి ఇతర రాష్ట్రాలలో, కేంద్రంలో అమలు జరపని పధకాలను ఇక్కడ ఎందుకు జనానికి చెబుతున్నది, ఎలా అమలు చేస్తుంది ? రాష్ట్ర అధికారపక్షం బిఆర్‌ఎస్‌ గత పది సంవత్సరాలుగా అమలు జరపని వాటిని రానున్న రోజుల్లో అమలు జరుపుతామంటే నమ్మేదెలా అన్న ప్రశ్న సహజంగానే వస్తున్నది. బిఆర్‌ఎస్‌ చెబుతున్నట్లు నిజంగానే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తున్నదా ? దాని పని తీరు ఎట్లుండె అన్నది బడ్జెట్లలో చూస్తే అర్ధం అవుతుంది. అందుకే దాని పని తీరును ఒక్కసారి అవలోకించాల్సిందిగా మనవి.


ఒక పెద్ద మనిషి పదేండ్ల తరువాత బంధువుల ఇంటికి వచ్చాడు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశా ఇప్పుమో నడుస్తూ గంతులేస్తున్నడు, ఎంతగా ఎదిగిండో కదా అన్నడట.పిల్లవాడు పుట్టిన తరువాత పెరగకుండా ఎట్లుంటడు ? ఎలా పెరిగిండు, కడుపు నిండా తింటున్నడా, మంచిగా ఆడుకుంటున్నడా, ఆరోగ్యంగా ఉన్నడా లేడా బడికిపోతున్నడా లేదా అన్నది ముఖ్యం. రాష్ట్రమైనా అంతే పదేండ్లనాడు ఉన్న మాదిరే ఇప్పుడు ఎట్లుంటది, మార్పులు వస్తాయి. అవి ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. రాష్ట్రం, దేశం ఏదైనా అంతే ! దిగువ చూపుతున్న వివరాలలో గత సంవత్సరాల కేటాయింపులు 2023-24 బడ్జెట్‌ ప్రతిపాదనలుగా గమనించాలి. అంకెలు రు. కోట్లు అని గమనించాలి. ఓ.మా రుణం అంటే ఓపెన్‌ మార్కెట్‌ రుణం.
అంశం×××× 2014-15 ××× 2022-23 ×× 2023-24
జిడిపి ×××× 5,05,849 ××× 12,93,000 ×× 14,00,000
అప్పులు ×× 75,577 ××× 4.50,000 ×× 5,00,000
ప్ర.రుణచెల్లింపు× 587 ××× 8,336 ×× 9,341
వడ్డీ,అసలు ×× 6,291 ××× 18.912 ×× 22,400
ఓ.మా.రుణం ×× 8,211 ××× 44, 970 ×× 40,615
లిక్కర్‌ రాబడి×× 10,883 ××× 31,077 ×× 35,000
కే.పన్నువాటా ×× 8,185 ××× 19,668 ×× 21,470
కాపిటల్‌ ఖర్చు×× 8,372 ××× 26,934 ×× 37,525
మూలధన పెట్టుబడి అన్నది రాష్ట్రం, దేశానికైనా కీలకమైనది.2014-15లో ఖర్చు బడ్జెట్‌ మొత్తం ఖర్చు రు.62,306 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.11,633 కోట్లు, 18.6శాతం ఉంది. 2022-23లో సవరించిన అంచనా ప్రకారం ఖర్చు బడ్జెట్‌ రు.2,26,010 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.26,934 కోట్లు,11.9శాతానికి దిగజారింది.2023-24 సంవత్సర ఖర్చు బడ్జెట్‌ రు.2,77,690 కోట్లు కాగా మూలధన పెట్టుబడి రు.37,525 కోట్లుగా ప్రతిపాదించారు.దీన్ని మొత్తం ఖర్చు చేస్తే 13.5శాతం అవుతుంది. బడ్జెట్‌ వివరాలను చూసినపుడు 2021-22లో రు.28,874 కోట్లు వాస్తవ ఖర్చు ఉంది. మరుసటి ఏడాది రు.29,728 కోట్లు ప్రతిపాదించి రు.26,934 కోట్లకు సవరించారు. వాస్తవ ఖర్చు ఇంకా తగ్గవచ్చు. అందువలన వర్తమాన బడ్జెట్‌లో ఎంత కోతపెడతారో తెలియదు. మొత్తం తెలంగాణా వచ్చినపుడు 18.6శాతంగా ఉన్న ఖర్చు క్రమంగా దిగజారటం ఆందోళన కలిగించే అంశం.


పెంచకపోయినా తొలి ఏడాది మూలధన పెట్టుబడి శాతం ఎంత ఉందో దాన్నయినా కొనసాగించాలి కదా ? తెలంగాణా ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో రాష్ట్ర జిడిపిలో అప్పులు16.06శాతం ఉన్నాయి.పదిహేనవ ఆర్థిక సంఘం నిబంధనల(ఎఫ్‌ఆర్‌బిఎం) ప్రకారం అప్పులు 29.5శాతం ఉండవచ్చు. కాగ్‌ నివేదిక 2020-21 ప్రకారం ఆ సంవత్సరంలో అప్పులు 28.1శాతానికి పెరిగాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు. ఇవిగాక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసిస సంస్థలకు హామీగా ఇప్పించిన రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొంటే 38.1శాతంగా ఉన్నాయి. బంగారు బదులు అప్పుల తెలంగాణాగా మార్చారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన రుణ అర్హత పరిమితి తగ్గింది. పేరుకు పోయిన అప్పుల మొత్తం పెరుగుతున్నట్లు అంకెలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర జిడిపి ఏటేటా పెరుగుతున్నందున దానితో పోల్చుకున్నపుడు తగ్గుదల కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ అంకెలనే తనకు అనుకూలంగా చూపుతుంది. కొత్తగా తీసుకొనే రుణాల మీద కోత విధించటం కూడా తగ్గుదలకు ఒక కారణం.2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రుణభారం జిడిపిలో 23.8శాతంగా ఉంటుందని చూపారు. రానున్న రెండు సంవత్సరాల్లో 2025,26 ఆర్థిక సంవత్సరాల్లో ఆ మొత్తం 25శాతానికి పెరుగుతుందని కూడా పేర్కొన్నారు అంతకు ముందు సంవత్సరం 24.3శాతం ఉంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ప్రభుత్వం హామీగా ఉన్న రుణాల మొత్తం 2022-23లో రు.1,29,244 కోట్లు, ఇది జిడిపిలో 11.3శాతం, దీన్ని కూడా కలుపుకుంటే అప్పుల మొత్తం 35.6శాతం ఉంది.


కొన్ని సంక్షేమ పధకాలను చూపి వాటిని తెలంగాణా నమూనాగా ప్రచారం చేస్తున్నారు, అభివృద్ధిలో ముందుందని అంటున్నారు.ఇది వాస్తవమా ? రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ల వంటి కొన్ని సంక్షేమ పధకాలు అందరికీ తెలిసినవే.ఆరు కీలక రంగాలలో తెలంగాణా దేశంలో ఎక్కడుందో తెలుపుతూ పిఆర్‌ఎస్‌ అనే స్వచ్చంద సంస్థ విశ్లేషణలను అందించింది.2022-23లో తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ కేటాయింపులను పోల్చి చూపింది.ఎంతో పురోగమించింది, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం, అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా అవతరించాం అని చెప్పుకోవటంలో వాస్తవం ఎంతో చూద్దాం. బిఇ అంటే బడ్జెట్‌ అంచనా, ఆర్‌ఇ అంటే సవరించిన బడ్జెట్‌ అంచనా.ఆయా రంగాలకు మొత్తం ఖర్చులో తెలంగాణా కేటాయింపు శాతం, చివరి కాలంలో అన్ని రాష్ట్రాల సగటు శాతాలు దిగువ విధంగా ఉన్నాయి.ఆర్‌డి అంటే గ్రామీణాభివృద్ధి.ప.అ అంటే పట్టణ అభివృద్ధి,
రంగం×××2021-22××22-23బిఇ××22-23ఆర్‌ఇ××23-24బిఇ××అ.రా 22-23బిఇ
విద్య ××× 8.7 ×× 7.3 ×× 8.0 ×× 7.6 ××14.8
వైద్యం××× 4.2 ×× 5.0 ×× 5.5 ×× 5.0 ×× 6.3
ఆర్‌డి ××× 4.5 ×× 3.9 ×× 4.3 ×× 3.6 ×× 5.7
ప.అ ××× 1.6 ×× 3.0 ×× 3.2 ×× 2.8 ×× 3.5
పోలీస్‌ ××× 4.6 ×× 4.0 ×× 4.4 ×× 3.6 ×× 4.3
రోడ్లు ××× 1.4 ×× 3.2 ×× 3.3 ×× 3.7 ×× 4.5
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు ఆయా రంగాలలో మూడు సంవత్సరాలలో ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణా దేశ సగటు కంటే తక్కువే ఖర్చు చేస్తున్నది. కెజి నుంచి పిజి వరకు ఉచితం అని చెబుతున్న పాలకులు విద్యలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్లకు ఈ రంగాన్ని అప్పగించటమే అన్నది స్పష్టం. ప్రభుత్వ విద్యా సంస్థలలో తగిన సౌకర్యాలు, సిబ్బంది, చదువుకొనే వాతావరణం ఉంటే తలిదండ్రులు ప్రైవేటు సంస్థలవైపు చూడరు.


ఇక వైద్యం, తల్లీ పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి చూద్దాం.2015-16 సంవత్సరాలలో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, 2019-21లో ఐదవ సర్వే జరిగింది.ఈ రెండు సర్వేల వివరాలను చూసినపుడు దేశం మొత్తం మీద రక్తహీనత సమస్య పెరిగింది.శరీరంలో తగినంత రక్తం లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే.రక్తహీనత పెరుగుదల బడుగు, బలహీన వర్గాలలోనే ఎక్కువగా ఉంది.తాము తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేందుకు చూసే తలితండ్రులు తమ బిడ్డలను ఆరోగ్యంగా పెంచలేకపోవటానికి ప్రధాన కారణం వారికి తగినంత కుటుంబ ఆదాయం లేక పోషకాహారం తీసుకోకపోవటమే అని వేరే చెప్పనవసరం లేదు.వివరాలు దిగువ చూడవచ్చు.1.ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు, 2.గర్భిణులు కాని మహిళలు 15 నుంచి 49 ఏండ్లు , 3. గర్భిణులు 15 నుంచి 49 ఏండ్లు,4.మహిళందరు 15-49 ఏండ్లు, 5.యువతులు 15-19 ఏండ్లు, 6.యువకులు 15-19 ఏండ్లు.దేశం 4 అంటే నాలుగవ సర్వే, దేశం 5 అంటే ఐదవ సర్వే శాతాలు.
ఏరియా ×× 1 × 2 × 3 × 4 × 5 × 6
దేశం 4 ××58.6 ×52.3 ×50.4×53.1 ×54.1× 29.2
దేశం 5 ××67.1 ×57.2 ×52.2×57.0 ×59.1× 31.2
తెలంగాణా4××60.7 ×56.9 ×48.2×56.6 ×57.9× 19.2
తెలంగాణా5××70.0 ×57.8 ×53.2×57.6 ×64.7× 25.1
పై పట్టిక చూసినపుడు పసిపిల్లలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు ఇంత అనారోగ్యంగా ఉంటే ఎలా ! ఒకే వయసు ఉన్న యువతీ యువకుల్లో రక్తహీనత తేడాలు ఎంతగా ఉన్నాయో చూస్తే ఆడపిల్లల పట్ల వివక్ష, నిర్లక్ష్యం కనిపిస్తుంది. దేశంలోని యువకుల్లో రెండు సర్వేల మధ్య తేడా రెండుశాతం కాగా తెలంగాణాలో ఆరుశాతానికి పెరగటాన్ని గమనించవచ్చు. తల్లీ, పిల్లల ఆరోగ్యం, పోషణ అంశంలో దేశం మొత్తం మీద చూపుతున్న నిర్లక్ష్యం కంటే తెలంగాణాలో ఎక్కువగా ఉన్నట్లు అంకెలు చెబుతున్నాయి.అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు కీలక రంగాలకు తగిన కేటాయింపులు జరపక, తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకోక తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నట్లు ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి దిగజారిందా మెరుగుపడిందా ? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా వివక్షకు గురైందని చెప్పిన పాలకులు దేశ సగటు కంటే తక్కువ కేటాయింపులు ఎందుకు చేసినట్లు ?


రాష్ట్ర ప్రభుత్వం రెండులక్షల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని 2016-17బడ్జెట్‌లోనే చెప్పింది. ఒక లక్ష హైదరాబాద్‌, మరోలక్ష ఇతర చోట్ల అని పేర్కొన్నది.దాని ఆచరణ ఎలా ఉందంటే 2021-22 బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి రు.11,151 కోట్లు కేటాయించి ఖర్చు చేసిందెంతో తెలుసా కేవలం రు.299 కోట్లు మాత్రమే.2022-23లో రు.12,172 కోట్లు కేటాయించి రు.8,112కోట్లకు తగ్గించి సవరణ బడ్జెట్‌లో చూపారు. ఆచరణలో ఇంకా తగ్గవచ్చు.కానీ 2023-24లో రు.12,140 కోట్లుగా ప్రతిపాదించి అంతకు ముందు కంటే 50శాతం పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు కొంత మేర నిధులు కేటాయించి నామ మాత్రంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామనిపించి వాటినే గొప్పగా ప్రచారం చేస్తున్నారు.అదే విధంగా అదే ఏడాది పట్టణాభివృద్ధికి రు.10,555 కోట్లు ప్రకటించి 75శాతం కోత పెట్టి రు.2,665 కోట్లు ఖర్చు చేశారు.సగానికిపైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్న పూర్వరంగంలో ఎంత నిర్లక్ష్యం చేసిందీ వేరే చెప్పనవసరం లేదు. అదే బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమం-పోషకాహారానికి రు.18,997 కోట్లు కేటాయించి 35శాతం,రోడ్లు, వంతెనలకు రు.5,187 కోట్లు ప్రకటించి 55శాతం, వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రతిపాదనల్లో 27శాతం కోత పెట్టారు.ఇలా కోతలను దాచి వర్తమాన బడ్జెట్‌లో పెంచినట్లు మాటల్లో కోతలు కోస్తున్నారు.

ప్రయోజనం లేని భద్రతా మండలి తీర్మానం – గాజాలో సొరంగాల అసలు కథేంటి !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమైన నలభై రోజుల తరువాత తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మానవతా పూర్వక కోణంలో దాడులను ఆపాలని యూదు దురహంకారులను కోరుతూ 12-0 ఓట్లతో వేడుకోలు తీర్మానాన్ని ఆమోదించింది.అనేక దఫాల చర్చల అనంతరం మాల్టా ప్రతిపాదించిన ఈ తీర్మానంలో హమస్‌ను ఖండించలేదు గనుక తాము బహిష్కరించినట్లు అమెరికా, బ్రిటన్‌ ప్రకటించాయి. ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేయకుండా వేడుకోవటం ఏమిటంటూ రష్యా నిరసనతో ఓటింగ్‌కు దూరంగా ఉంది.ప్రపంచంలో లక్షలాది మంది ప్రతి రోజూ ఏదో ఒక మూల నిరసన తెలుపుతున్నా, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం చేసినా పెడచెవిన పెట్టిన ఇజ్రాయెల్‌ ఈ తీర్మానాన్ని మన్నిస్తుందా ! వెనక్కు తగ్గుతుందా ? గాజాలోని ప్రధాన ఆసుపత్రి కింద నేలమాళిగల్లో దాక్కున్న హమస్‌ తీవ్రవాదులను పట్టుకొనే పేరుతో మొత్తం ఆసుపత్రినే పనికి రాకుండా చేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ అక్కడ ఎంత మంది తీవ్రవాదులను పట్టుకున్నదీ చెప్పకుండా ఆయుధాలను కనుగొన్నామంటూ లోకాన్ని నమ్మింపచేసేందుకు కొన్ని ‘ సిత్రాలను ‘ చూపుతున్నది. ఇలాంటి ఫేక్‌ వీడియోలు ఎక్కడైనా తయారు చేయవచ్చు, తాన అంటే తందాన అనే బిబిసి లాంటి టీవీలు అవి నిజమే అంటూ ప్రపంచాన్ని నమ్మించేందుకు నానా గడ్డీ కరవవచ్చు తప్ప లోకజ్ఞానంతో ఆలోచించే వారెవరూ నమ్మరు. నివాస ప్రాంతాలు, జనాన్ని మానవ కవచాలుగా వాడుకుంటున్న ఉగ్రవాదులు అంటూ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది.


గాజా ప్రాంతంలో సొరంగాలు ఉన్న అంశం కొత్తేమీ కాదు. వాటిపైన ఆసుపత్రులు, స్కూళ్లు, నివాసాలు, ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి. యూదు దురాక్రమణను ఎదిరించేందుకు పాలస్తీనా పోరాటయోధులు హమస్‌ ఆవిర్భవించక ముందు కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసుకున్నారు. అవి వారి పోరుబాటలో విడదీయలేనివిగా మారాయి.అక్కడేమీ అడవులు, ఎడారులు లేవు. అక్కడే నివాసాలు, అవే పోరాట కేంద్రాలు. అక్కడ పుట్టి పెరిగే ప్రతి బిడ్డా అక్షరాభ్యాసంతో పాటు పోరుబాట పాఠాలు కూడా నేర్చుకోక తప్పని స్థితిని సామ్రాజ్యావాదులు, వారి బంటుగా ఉన్న ఇజ్రాయెల్‌ కల్పించిన కఠిన సత్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. నిత్యం ఎప్పుడేమౌతుందో ఇజ్రాయెల్‌ పోలీసు, మిలిటరీ, యూదు ఉగ్రవాదులు ఎప్పుడు దాడులు చేస్తారో తెలియని స్థితిలో కార్చటానికి కన్నీళ్లు కూడా లేకుండా దశాబ్దాల తరబడి పెరిగారు, అక్కడే మట్టిలో కలిశారు. ఇప్పుడు ఈజిప్టు నేతలు అమెరికా చంకనెక్కి ఇజ్రాయెల్‌తో సఖ్యంగా ఉంటున్నారు తప్ప గతంలో అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహం, సాయంతోనే పాలస్తీనా వారు సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరిన తరువాత తమ భూభాగంలో ఉన్నవాటిని ఈజిప్టు కొన్నింటిని కూల్చివేసి, మూసివేసి, గోడలు కట్టి పాలస్తీనియన్లను రాకుండా కట్టడి చేసింది.


గాజాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణ, మారణకాండ ప్రారంభించిన అక్టోబరు ఏడవ తేదీ నుంచి అక్కడ ఉన్న సొరంగాల గురించి పెద్ద ఎత్తున ప్రసారమాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ అమలు చేసిన దిగ్బంధనాన్ని వమ్ము చేసేందుకు వాటిని తవ్వారు. ఈజిప్టు నుంచి గాజా అక్కడి నుంచి పశ్చిమగట్టుతో పాటు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వాటిని విస్తరించారు.ఆహారం, ఇంథనం, ఔషధాలు, నిత్యావసర వస్తువులు వేటినీ అందనివ్వకుండా గాజా నుంచి పాలస్తీనియన్లు వారంతట వారే వేరే చోట్లకు తరలిపోయేట్లు చేసేందుకు అష్టదిగ్బంధనం చేశారు.ఈజిప్టు నుంచి వాటిని తెచ్చుకొనేందుకు తవ్విన సొరంగాలను స్మగ్లింగ్‌ మార్గాలుగా ప్రచారం చేశారు. గాంధీని మోసిన రైలు గాడ్సేను కూడా తీసుకువెళ్లింది అన్నట్లుగా కొన్ని సందర్భాలలో దొంగరవాణాకు ఉపయోగించిన వారు ఉంటే ఉండవచ్చు తప్ప అందుకోసమే వాటిని తవ్వలేదు. సరకులతో పాటు పాలస్తీనా యోధులకు ఇతర దేశాలు అందచేసిన ఆయుధాలను కూడా ఆత్మరక్షణకు ఆ మార్గాలద్వారా తీసుకురాబట్టే ఇజ్రాయెలీ మూకలు కొంత మేరకు అదుపులో ఉన్నాయి.

1979లో ఈజిప్టు-ఇజ్రాయెల్‌ మధ్య మైత్రి కుదిరింది.1987 నుంచి 1993వరకు సాగిన తొలి తిరుగుబాటుకు ఇజ్రాయెల్‌ రెచ్చగొట్టుడే కారణం. గాజాలోని జబాలియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్వాసిత పాలస్తీనీయన్ల శిబిరం మీదకు ఒక ట్రక్కుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ చేసిన దాడిలో ముగ్గురు మరణించారు. అది ప్రమాదమని నమ్మబలికినప్పటికీ కావాలనే చేసిందనే ఆగ్రహంతో పాలస్తీనియన్లు ప్రారంభించిన నిరసన, ప్రతిఘటన ఐదేండ్లు సాగింది. ప్రధానంగా రాళ్లు, సీసాల్లో మండే ద్రావకాలను నింపి వాటికి ఫీజులు అమర్చి(మాల్టోవ్‌ బాంబు) సైనికుల మీద దాడులు చేశారు. అందుకనే దాన్ని రాళ్ల తిరుగుబాటు అని కూడా కొందరు వర్ణించారు. ఆ సందర్భంగానే సొరంగాల ద్వారానే అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్దాలను తిరుగుబాటుదారులు సమకూర్చుకున్నారు. ఓస్లో ఒప్పందాలను ముందుకు తెచ్చిన తరువాత తిరుగుబాటు ముగిసింది. దాంతో ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెలీ మిలిటరీ సొరంగాలు ఉన్నట్లు 1983లో అధికారికంగా ప్రకటించింది. 2009లో కొత్త వాటిని తవ్వేందుకు, ఉన్నవాటిని వినియోగించేందుకు వీలు లేకుండా ఈజిప్టు తన ప్రాంతంలో భూగర్భ ఆటంకాలను నిర్మించింది. అనేక సొరంగాలను మూసివేసింది.భూమి మీద ఉన్న సరిహద్దుద్వారానే రాకపోకలకు అవకాశమిచ్చింది.2007లో గాజా ప్రాంతంలో హమస్‌ పట్టు సాధించి ఆ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గాజా పౌరులు కదలకుండా మెదలకుండా ఉండేందుకు ఈజిప్టు-ఇజ్రాయెల్‌ రెండూ ఆంక్షలను మరింత కఠినతరంగావించాయి. దానిలో భాగంగానే ఈజిప్టు 2013,14 సంవత్సరాలలో పన్నెండు వందల సొరంగాలను నాశనం చేసింది.


గాజాను దిగ్బంధించిన కాలంలో అధికారికంగా అనుమతించిన వాణిజ్యం కంటే సొరంగాల ద్వారానే ఎక్కవగా జరిగినట్లు 2015 నివేదికలో ఆంక్టాడ్‌ పేర్కొన్నది.2008.09 సంవత్సరాలలో గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ధ్వంసమైన ఆరువేల ఇండ్లను నిర్మించేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించిన మేరకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు నిర్మాణం గావించేందుకు ఎనభై సంవత్సరాలు పట్టేది. కానీ సొరంగాల ద్వారా పాలస్తీనియన్లు వాటిని సమకూర్చుకొని కేవలం ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. గాజాలో ఉన్న ఏకైక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నడవటానికి రోజుకు అవసరమైన పదిలక్షల లీటర్ల డీజిల్‌ను ఈజిప్టు నుంచి తెచ్చుకొనేందుకు కూడా అవే రవాణా మార్గాలు. గాజాలోని, మురుగు, ఉప్పునీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన విద్యుత్‌ కోసం ఈ కేంద్రాన్ని వినియోగించారు. ఈజిప్టు తన ప్రాంతంలో ఉన్న సొరంగాలను మూసివేసిన తరువాత డీజిల్‌ దొరక్క ఆ కేంద్రం మూతపడింది. దాంతో మురుగు నీటిని సముద్రంలోకి వదలటంతో సముద్ర తీరంలో కాలుష్య సమస్య ఏర్పడింది. గాజాపై దిగ్బంధనాన్ని తొలగించి టన్నెల్‌ ఆర్ధిక వ్యవస్థకు స్వస్తి పలకాలని ఆంక్టాడ్‌ పేర్కొన్నది. నిర్మాణ సామాగ్ర రవాణాకు తాము అనుమతిస్తే వాటితో హమస్‌ మిలిటరీ అవసరాల కోసం వినియోగిస్తుందని ఇజ్రాయెల్‌ సాకులు చెప్పింది. రంజాన్‌ సందర్భంగా గాజా వెలుపలికి వెళ్లాలంటే ఈజిప్టు, ఇజ్రాయెల్‌ అనుమతించిన గేట్లద్వారానే వెళ్లాల్సి ఉండేది. సాకులు చెప్పి అనేక పరిమితులు విధించిన కారణంగా రాకపోకలకు కూడా ఆ సొరంగాలే పనికి వచ్చాయి. ఇజ్రాయెల్‌లో జనసమ్మర్ధం లేని, కాపాలా పెద్దగా లేని ప్రాంతాలకు ఈ సొరంగమార్గాలు విస్తరించి వాటి ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించారు.


నెలరోజులకు పైగా టాంకులు, క్షిపణులతో ఒక్కో ఆసుపత్రిని ధ్వంస చేస్తున్న పూర్వరంగంలో ఒకవేళ నిజంగానే తీవ్రవాదులు ఎవరైనా ఆ సొరంగాల్లో ఉంటారా, ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాల మీడియాలో చూపేందుకు ఆయుధాలను అక్కడే వదలి వెళతారా? 1967 యుద్దంలో ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఓస్లో ఒప్పందాల్లో భాగంగా 1993లో పాలస్తీనా అధారిటీకి వాటిని అప్పగించినట్లు ప్రకటించినప్పటికీ 2005లో మాత్రమే సైన్యాన్ని, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి ప్రవేశపెట్టిన యూదు పౌరులను వెనక్కు తీసుకుంది. ఆ తరువాత కూడా ఈజిప్టు పాలకులతో చేతులు కలిపి గాజాను దిగ్బంధం చేసింది, హమస్‌ తీవ్రవాదులను అణచేపేరుతో అనేక సార్లు గాజా మీద దాడులు చేసి వేలాది మందిని బలితీసుకుంది.తాజాగా అదే సాకుతో చేస్తున్న దాడులు మరింత దుర్మార్గంగా ఉన్నాయి, ఆసుపత్రులను కూడా వదల్లేదు.భద్రతా మండలి తీర్మానం భాషలో తొలుత కాల్పుల విరమణ పాటించాలనే డిమాండ్‌ను పెట్టగా తరువాత దాన్ని తొలగించి పిలుపు అనే పదాన్ని చేర్చారంటేనే దాన్ని ఇజ్రాయెల్‌ దయాదాక్షిణ్యాలకు వదలి పెట్టారన్నది స్పష్టం. కాదని ఠలాయిస్తే మీద చర్యలు తీసుకొనేందుకు ఎలాంటి ప్రతిపాదనలూ దానిలో లేవు. గతంలో బాల్కన్‌ నుంచి సిరియా వరకు అనేక సందర్భాల్లో ఇలాంటి వాటిని ఆమోదించారు. వాటిని పట్టించుకున్నవారుగాని, ఎలాంటి ఫలితంగాని లేదు. సరిగ్గా ఈ తీర్మానం ఆమోదిస్తున్న తరుణంలోనే గాజాలో పోరు తరువాత బలమైన మిలిటరీ శక్తిని అక్కడ ఉంచుతాం అని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హర్‌జోగ్‌ చెప్పాడు. ఇదే సమయంలో గాజాను ఆక్రమించటం పెద్ద తప్పిదం అవుతుందని స్పష్టం చేసినట్లు అమెరికా అధినేత జోబైడెన్‌ కొత్త పల్లవి అందుకొన్ని నాటకంలో మరో అంకానికి తెరలేపాడు.


మారణకాండను సమర్ధించటంలో ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. పౌరులను చంపివేస్తున్నారని తక్షణమే కాల్పుల విరమణ జరగాలంటూ అక్టోబరు 26న ఐరాసా సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మన దేశం ఓటింగ్‌లో పాల్గొనలేదు, అంటే పరోక్షంగా ఇజ్రాయెల్‌ను సమర్ధించినట్లే. పేద దేశాల రెండవ వాణి సదస్సులో శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ గాజాలో సాధారణ పౌరులను చంపివేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పటం విశేషం. దీన్నే ఏ రోటి దగ్గర ఆ పాటపాడటం అంటారు. ఐరాసలో ఇజ్రాయెల్‌ను ఖండిస్తే అమెరికాకు ఆగ్రహం కలుగుతుంది. పేద దేశాల సమావేశంలో ఖండించకపోతే వాటికి దూరం అవుతారు.పన్నెండు వేల మంది మరణించిన పూర్వరంగంలో ప్రపంచ మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌ను నిస్సిగ్గుగా సమర్ధించిన వారే మాట మార్చిన తరువాత నలభై రెండవ రోజున నరేంద్రమోడీ నోరు విప్పారు. పిల్లలను చంపటాన్ని నిలిపివేయాలని గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రడెవ్‌, ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ఇజ్రాయెల్‌ను కోరారు. వారు ప్రారంభం నుంచీ ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత హమస్‌ తీవ్రవాదులను అణచివేస్తున్నామని బుకాయించిన ఇజ్రాయెల్‌ మాటలను ఎవరూ నమ్మని స్థితి వచ్చింది. పౌరుల మరణాలను తగ్గించటంలో తాము విజయవంతం కాలేదని చివరికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా చెప్పాల్సి వచ్చింది ప్రజాభిప్రాయానికి, ఆగ్రహానికి వారు తలొగ్గి మాట మార్చిన తరువాతే నరేంద్రమోడీ స్పందించారు.

ఇజ్రాయెల్‌ మారణకాండలో ప్రతి పదినిమిషాలకు ఒక పసి ప్రాణం బలి, ఖండన తప్ప కార్యాచరణ లేని అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల తీరు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


గాజాలో ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండను ఖండించటంలో ముక్తకంఠంతో ఉన్న అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలు దానిపై నిర్దిష్ట చర్యల అంశంపై సంశయంలో పడ్డాయి. శనివారం నాడు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన అరబ్‌లీగ్‌-ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ(ఓఐసి) అసాధారణ సంయుక్త సమావేశం జరిగింది. తక్షణమే గాజాపై జరుపుతున్న దాడులను విరమించాలని, అందుకోసం ఐరాస నిర్ణయాత్మక, కట్టుబడి ఉండేందుకు వీలైన తీర్మానం చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ఆచరణాత్మక చర్యలు తీసుకొనే అంశంలో ఇరాన్‌ చేసిన ప్రతిపాదనలను సమావేశం పక్కన పెట్టింది. అనేక దేశాలకు అమెరికాతో ఉన్న సంబంధాలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ కారణకాండను సాగిస్తున్నది.గాజాలో ఉన్న ఆసుపత్రులను అడ్డం పెట్టుకొని హమస్‌ తీవ్రవాదులు ఆయుధాలు దాచారనే సాకుతో ప్రధాన ఆసుపత్రితో సహా అన్ని వైద్య సదుపాయాలను నాశనం చేశారు. ఇప్పటివరకు పన్నెండువేల మందికి పైగా మరణించగా వారిలో పిల్లలు, మహిళలే 70శాతం ఉన్నారు. వీరిలో ఎందరు తీవ్రవాదులు ఉన్నదీ లేదా వారి ప్రతిఘటనదాడుల్లో మరణించిన తమ సైనికుల గురించి నిర్దిష్టమైన సమాచారం ఇజ్రాయెల్‌ చెప్పటం లేదు. దాని కట్టుకథలు, పిట్టకతలను వల్లిస్తూ మానవత్వం గురించి నిత్యం ధర్మపన్నాలు వల్లింఏ పశ్చిమ దేశాలు ఆత్మరక్షణ పేరుతో సాగిస్తున్న మారణకాండను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. మరోవైపు ఈ దాడులకు ప్రపంచమంతటా తీవ్ర వ్యతిరేకత వెల్లడి అవుతున్నది. బ్రిటన్‌ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా మూడుల లక్షల మంది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన జరిపారు.


గాజాలో వంద మందికి పైగా ఐరాస సహాయక సిబ్బందితో సహా అక్టోబరు ఏడు నుంచి నవంబరు 13వ తేదీ వరకు 11,240 మంది మరణించగా వారిలో పిల్లలు 4,609 మంది ఉన్నారు. చెబుతున్నదాని కంటే మరణాలు ఎక్కువగా ఉండవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. గాజాలో ప్రతి పది నిమిషాలకు ఒక పసిప్రాణాన్ని ఇజ్రాయెల్‌ బలిగొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ చెబ్రియోసుస్‌ భద్రతా మండలిలో చెప్పాడు. గాజాలో ఎవరూ ఎక్కడా సురక్షితంగా లేరని అన్నాడు. ది న్యూఅరబ్‌ అనే మీడియా సంస్థ నవంబరు పదవ తేదీ నాటికి ఉన్న పరిస్థితి గురించి ఒక సమీక్షను ఇచ్చింది. దాని ప్రకారం 11,078 మంది మరణించారు. పౌరులు 10,203, వారిలో 4,506 మంది పిల్లలు, 3,207 మంది మహిళలు, 190 మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారు 30,220 కాగా పిల్లలు 8,663, మహిళలు 6,327 మంది. వీరు గాక శిధిలాల కింద మరో 2,551 మంది ఉన్నారు. పదహారు లక్షల మంది నెలవులు తప్పారు. 53,700 భవనాలు పూర్తిగా ధ్వంసం కాగా మరో 1,56,200 పాక్షికంగా దెబ్బతిన్నాయి.మీడియా సంస్థలు ఉన్న 111పూర్తిగా నాశనం లేదా దెబ్బతిన్నాయి,46 మంది జర్నలిస్టుల ప్రాణాలను తీశారు. పరిశ్రమలు 790, స్కూళ్లు 214,ఆరోగ్య వసతులు 113,మసీదులు 64, చర్చ్‌లు మూడు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్‌ గాజాలోని తమ ప్రాంగణాలపై జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వంద మంది తమ సిబ్బందికి సంతాపసూచకంగా ఐరాస పతాకాన్ని అవనతం చేసి నివాళి అర్పించింది. ఐరాస ప్రాంగణాల్లో కూడా హమస్‌ తీవ్రవాదులు ఉన్నారని ఇజ్రాయెల్‌ బాంబులు వేసిందా ? ఏ విధంగానూ సమర్ధించుకోని విధంగా మొత్తం గాజాను నివాసానికి పనికి రాకుండా చేసేందుకు, అక్కడి ఇరవై మూడులక్షల మందిని ఎడారి ప్రాంతాలకు తరిమివేసేందుకు యూదు దురహంకారులు దమనకాండ సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


తొలుత శని, ఆదివారాల్లో అరబ్‌ లీగ్‌, ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ సమావేశాలను విడివిడిగా జరపాలని సౌదీ అరేబియా ఏర్పాట్లు చేసింది. అయితే ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రత పెరగటంతో శనివారం నాడే రెండు సంస్థల సమావేశం జరిపారు.యాభై ఏడు దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.పదేండ్లకు పైగా ఉప్పు-నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య ఈ ఏడాది మార్చి నెలలో చైనా కుదిర్చిన సయోధ్య కారణంగా దశాబ్దం తరువాత తొలిసారిగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి సౌదీలో అడుగుపెట్టాడు. అదే విధంగా అరబ్‌ లీగ్‌లో పున:ప్రవేశానికి అంగీకరించటంతో సిరియా నేత అసాద్‌ కూడా రియాద్‌ సమావేశంలో భాగస్వామి అయ్యాడు. ఇజ్రాయెల్‌ దాడులను ఖండించటమే గాక దాని మీద ఆర్థిక, రాజకీయ ఆంక్షలను అమలు జరపాలని ఇరాన్‌ చేసిన ప్రతిపాదనకు కొన్ని దేశాలు వ్యతిరేకత వెల్లడించటంతో ఖండన వరకే తీర్మానంలో పొందుపరిచారు. అయినప్పటికీ ఐక్యత పెరగటం ఒక ముఖ్యపరిణామం. ఇది ఇజ్రాయెల్‌ మీద వత్తిడిని మరింత పెంచుతుంది. అడ్డగోలుగా దాన్ని సమర్దించే దేశాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొనేట్లు చేసింది. పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న హమస్‌ సంస్థకు అన్ని విధాలుగా ఇరాన్‌ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనేందుకు ఇటీవలి కాలంలో అమెరికా అనేక దేశాలను అదిరించి బెదిరించి లొంగదీస్తున్నది, ఒప్పందాలు చేయిస్తున్నది.


గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభానికి కొద్ది వారాల ముందు సౌదీ అరేబియా రాజు కూడా ఇజ్రాయెల్‌తో సానుకూల సంబంధాలకు చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించాడు. గత కొద్ది సంవత్సరాలుగా అరబ్బు, ఇస్లామిక్‌ దేశాలతో సంబంధాల ఏర్పాటు సాగుతున్నది. యూదులు, ముస్లింలు అబ్రహాంను దేవదూతగా పరిగణిస్తారు గనుక అవి కుదుర్చుకుంటున్న ఒప్పందాలను అబ్రహాం పేరుతో పిలుస్తున్నారు. 2020 తరువాత యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌,బహరెయిన్‌, మొరాకో, అంతకు చాలా సంవత్సరాల ముందు ఈజిప్టు, జోర్డాన్‌ ఒప్పందాలు చేసుకున్నాయి.వీటన్నింటి వెనుక అమెరికా ఉంది. ఈ ఒప్పందాలు చేసుకున్న దేశాల మధ్య వాణిజ్యం, యాత్రీకుల రాకపోకలు పెరగటం తప్ప అంతకు మించి పురోగతి లేదు. దానికి ప్రధాన కారణంగా పాలస్తీనా రాజ్య ఏర్పాటును ఇజ్రాయెల్‌, అమెరికా అడ్డుకోవటమే. తాజా పరిణామాలు దేనికి దారితీసేది చూడాల్సి ఉంది.హమస్‌కు ఇరాన్‌ మద్దతు బహిరంగ రహస్యమే. మధ్యధరా సముద్రంలో పెద్ద ఎత్తున అమెరికా నౌకాదళాన్ని మోహరించినప్పటికీ ఇటీవలి కాలంలో ఇరాక్‌, సిరియా, ఎమెన్లలో ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధశక్తులు 40 డ్రోన్‌, రాకెట్ల దాడులు చేశాయి.


ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాన్ని నిలిపివేయాలని, పశ్చిమగట్టుతో గాజా సంబంధాన్ని తెంచివేయాలనే యత్నాలను అంగీకరించేది లేదని రియాద్‌ సభ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో విబేధాలు కూడా వెల్లడయ్యాయి. ఇజ్రాయెల్‌ మిలిటరీని ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని, అసలు ఇజ్రాయెల్‌ ఉనికినే గుర్తించరాదని, ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించాలన్న ఇరాన్‌ ప్రతిపాదనను అంగీకరించలేదు. 1967జూన్‌ 4వ తేదీ నాటి సరిహద్దులు, ప్రాంతాలతో జరూసలెం రాజధానిగా పాలస్తీనా ఏర్పాటు జరగాలని అరబ్బుదేశాలు కోరాయి.రియాద్‌ సభ ఆమోదించిన తీర్మానం పట్ల తమకు కొన్ని మినహాయింపులున్నాయని ఇరాన్‌ అధ్యక్షుడు వెంటనే ప్రకటించాడు. ఆ మేరకు వాటి గురించి జడ్డాలోని అరబ్‌లీగ్‌ కార్యాలయానికి అధికారికంగా తెలియచేశారు.అరబ్‌-ముస్లిం దేశాలు తీసుకున్న వైఖరిని తాము ఆమోదించటం లేదని గాజాలో ఉన్న ఇస్లామిక్‌ జీహాద్‌ సంస్థ ప్రకటించింది. అవి తమ బాధ్యతను విస్మరించినట్లు అది పేర్కొన్నది. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని అల్జీరియా ప్రతిపాదించింది.
రియాద్‌ సమావేశంలో పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌ ప్రతిపాదనల సారం ఇలా ఉంది. దురాక్రమణలు, దాడులను నివారించాల్సిన బాధ్యత కలిగిన భద్రతా మండలి దానికి కట్టుబడి ఉండాలి, వైద్య, ఆహార సరఫరాలను అనుమతించాలి, బలవంతంగా నిర్వాసితులను కావించటాన్ని అడ్డుకోవాలి.రెండు దేశాలను ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఉల్లంఘించి పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమించటం, యూదుల నివాసాలను పెంచటాన్ని నివారించేందుకు గతంలో చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం చెందాయి, ఇప్పుడు మారణకాండకు పూనుకున్నారు, ఈ కారణంగా మిలిటరీ, భద్రతా పరిష్కారాలను అంగీకరించేందుకు అంగీకరించం.గాజా ప్రాంతం పాలస్తీనాలో భాగంగానే ఉండాలి, గాజా, పశ్చిమగట్టుతో సహా పాలస్తీనా ప్రాంతాలన్నీ ఉండే విధంగా ఒక సమగ్ర రాజకీయ పరిష్కారం కావాలి.2007 నుంచి గాజాలో పాలస్తీనా అధారిటీ 20బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది, తమ పౌరుల పట్ల అధారిటీ బాధ్యత అది. పాలస్తీనా రాజ్యం, పౌరులకు భద్రతా మండలి రక్షణ కల్పించాలి. సర్వసత్తాక రాజ్యాన్ని సాధించేందుకు ఆచరణాత్మకమైన పరిష్కారం కావాలి. క్వుద్స్‌ (అరబ్బీలో జెరూసలెం పేరు) రాజధానిగా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, ఐరాస 149వ తీర్మానాన్ని అనుసరించి అది జరగాలి.అంతిమంగా రాజ్య స్థిరత్వానికి గాజా పునర్‌నిర్మాణంతో సహా ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సాయానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. అని అబ్బాస్‌ స్పష్టం చేశారు.


రియాద్‌ సమావేశం ఒక విధంగా మధ్యప్రాచ్యంలో అమెరికా వ్యూహానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌-సౌదీ, ఇతర దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని కుదర్చాలని చూస్తున్న యత్నాలకు తాత్కాలికంగా విఘాతం కలిగినట్లే.ఇజ్రాయెల్‌ను అమెరికా అదుపు చేయకుండా సమర్ధించటం, గాజా పరిణామాలతో అరబ్‌ దేశాలు ఆశాభంగం చెందాయి.రియాద్‌ సభకు ముందు నవంబరు తొమ్మిదిన ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కెంట్‌లో ఆర్థిక సహకార సంస్థ(ఇసిఓ) పదహారవ సమావేశం జరిగింది. దీన్లో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ, టర్కీ అధినేత రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ వంటి వారు పాల్గొన్నారు.1980దశకం నుంచి పశ్చిమాసియాలోని పాలకవర్గాలపై అమెరికా పట్టు బిగిస్తున్నది.సోవియట్‌ను కూల్చివేసిన తరువాత అది మరింత వేగం పుంజుకుంది. తన మిలిటరీ, ఆర్థికశక్తితో పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు పూనుకుంది.ఇరాన్‌, సిరియా కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి. ఆంక్షలతో వాటిని సాధించేందుకు చూస్తున్నది. మిగిలిన దేశాలన్నీ చేతులెత్తేసిన కారణంగానే తరువాత కాలంలో విస్మరించిన ఓస్లో ఒప్పందాలను 1993, 95లో పాలస్తీనా విమోచనా సంస్థతో బలవంతంగా ఒప్పించారు. అంగీకరించకపోతే మద్దతు వెనక్కు తీసుకుంటామని కొన్ని దేశాలు బెదిరించాయి.దీంతో ఇజ్రాయెల్‌ మరింతగా రెచ్చిపోతున్నది. ఈ పూర్వరంగంలోనే హమస్‌ రంగంలోకి వచ్చింది. గాజాపై దాడులతో ఆ ప్రాంతంలోని దేశాలన్నీ తమ వైఖరులను సవరించుకోవాల్సి వచ్చింది. గాజాతో సరిహద్దును కలిగిన ఈజిప్టు రాఫా వద్ద గేట్లను తెరవాలని ఇజ్రాయెల్‌, అమెరికా చేసిన వినతిని ఈజిప్టు తిరస్కరించింది. అదే జరిగితే లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్టులోకి తరమాలన్నది వాటి ఎత్తుగడ. కావాలంటే ఖాళీ చేయించిన పాలస్తీనియన్లను నెగెవ్‌ ఎడారిలోకి పంపండని కూడా అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిసి ఉచిత సలహా ఇచ్చాడు. అయితే అదే పెద్ద మనిషి ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు వ్యతిరేకంగా జనంలో వస్తున్న స్పందన చివరికి తన కుర్చీకే ఎసరు తెస్తుందని భావించి నిరసన ప్రదర్శనలు జరిపేందుకు అనుమతించాల్సి వచ్చింది.2013లో ఈజిప్టులో సంభవించిన మిలిటరీ తిరుగుబాటు తరువాత ఇలా వీధుల్లోకి జనాన్ని అనుమతించటం ఇదే ప్రధమం అంటున్నారు. ఇజ్రాయెల్‌కు నిరసన తెలుపుతూ టర్కీ తన రాయబారిని వెనక్కు పిలిచింది.జో బైడన్‌ జోర్డాన్‌ వచ్చి మంతనాలు జరిపినప్పటికీ జోర్డాన్‌ ఇజ్రాయెల్‌ దాడులను ఖండించకతప్పలేదు. చివరికి అది కూడా రాయబారిని వెనక్కు పిలిచింది. బహెరెయిన్‌ ఇజ్రాయెల్‌ రాయబారులను బహిష్కరించింది. ఒక్క ఇజ్రాయెల్‌కే కాదు, సౌదీ అరేబియాకూ ఇరాన్‌ నుంచి ముప్పు ఉందని అమెరికా చెప్పినప్పటికీ తోసి పుచ్చి సౌదీ గాజా అంశంలో ఇరాన్‌తో కలసి నడుస్తోంది. వీటన్నింటినీ చూస్తే తెల్లవారే సరికి అరబ్‌-ఇస్లామిక్‌ దేశాలన్నీ ఇజ్రాయెల్‌ను ఏదో చేస్తాయని చెప్పలేము గాని మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా భౌగోళిక-రాజకీయ చిత్రంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించటంలో ఒక ముందడుగే !

ఎడియూరప్పా మజాకా ! కుటుంబవారసత్వంపై నరేంద్ర మోడీ నోటికే తాళం వేసిన ఘటికుడు !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఎక్కడైనా ప్రధాని నరేంద్రమోడీ హవా నడుస్తుందేమో గానీ కన్నడ సీమలో చెల్లదని అధికార రాజకీయాల్లో తలపండిన కర్ణాటక మాజీ సిఎం బిఎస్‌ ఎడియూరప్ప తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు తప్ప మాకుటుంబానికి వర్తించవు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా తన కుమారుడి నియామకంలో నరేంద్రమోడీయే అంతిమ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. బిజెపి విలువల వలువలను నడిబజారులో విప్పేశారు. వారసత్వ రాజకీయం అని ఎవరైనా అంటే అనుకోనివ్వండి లెక్క చేయను అన్నారు. కుటుంబ,వారసత్వ రాజకీయాలు, ఒకే కుటుంబానికి పలు పదవులకు వ్యతిరేకం అని సుభాషితాలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ తన మాటలను తానే దిగమింగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడియూరప్పవేసిన తాళంతో బహుశా ఇంక ఎక్కడా వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీల మీద ఎక్కక పోవచ్చు. ఎడియూరప్ప కుమారుడు, తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచిన బివై విజయేంద్రను కర్ణాటక పార్టీ అధ్యక్షుడిగా బిజెపి అధిష్టానం నియమించింది.ఎడియూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవిలో ఉన్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల గురించి తెలిసిన వారికి ఎడియూరప్ప కుటుంబం ఒక రాజకీయ సైనిక పటాలం వంటిది. ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబాలు, ఇద్దరు కుమారులు వారి కుటుంబాలు ఎవరు చక్కపెట్టాల్సినవాటిని వారు చేస్తారు. ఇప్పటి వరకు వారి మధ్య ఎలాంటి పేచీలు రాలేదు. గతంలో ఎడియూరప్ప కాబినెట్‌ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప పదవిలో ఉండగానే గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాసి సిఎం కుటుంబం ఎలా జోక్యం చేసుకుంటున్నదో వివరించారు. అనేక మంది విధిలేక మౌనంగా ఉన్నారు. ఇవన్నీ అధిష్టానానికి, ప్రత్యేకించి నరేంద్రమోడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. మనం చేస్తే సంసారం మరొక చేస్తే మరొకటి !


తన కుమారుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించటం గురించి ఎడియూరప్ప నాటకాన్ని రక్తి కట్టించారు. బెంగలూరులో శనివారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ నియామకం గురించి మేమెవరం ఊహించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీలో ఈ విషయమై ఏ నాయకుడినీ అడగలేదు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి అని ఒక విలేకరి ప్రశ్నకు చెప్పారు.” అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా తీసుకున్నారు, నాకేమీ సంబంధం లేదు.” అన్నారు. వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నారు. విజయేంద్రను అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్రమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఎడియూరప్ప చెప్పారు. బిజెపిలో వారసత్వ రాజకీయాలకు ఈ నియామకం రుజువు అని కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్య గురించి మాట్లాడుతూ వారు అలాంటి ఆరోపణ చేయనివ్వండి పట్టించుకోను అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 28గాను 25 చోట్ల గెలిచేందుకు తాను, విజయేంద్ర విడివిడిగా రాష్ట్రంలో పర్యటిస్తామని చెప్పారు. తన కుమారుడి నియామకం పట్ల పార్టీలో నేతలెవరూ అసంతృప్తిని వెల్లడించలేదని, అందరూ ఐక్యంగా స్వాగతించారని, ఎవరూ పార్టీని వీడకుండా తాము చూస్తామని, గతంలో వెళ్లిన వారిని కూడా వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎడియూరప్ప చెప్పారు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తిన్న బిజెపి ఆరునెలలుగా దిక్కుతోచని స్థితిలో పడింది. ఎంతగా మైండ్‌బ్లాక్‌ (మెదడు పని చేయకపోవటం) లేదా బ్లాంక్‌ (మెదడు ఖాళీ కావటం) అయిందంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో బిజెపి ఉంది. కుటుంబ పార్టీ అంటూ గతంలో తెలుగుదేశాన్ని, తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న ఆ పార్టీ కర్ణాటకలో కుటుంబ పార్టీగా ఉన్న జెడిఎస్‌ను తన మిత్రపక్షంగా చేర్చుకుంది. కాంగ్రెస్‌ను కుటుంబవారసత్వ పార్టీ అని ధ్వజమెత్తుతున్న అదే పార్టీ ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఎడియూరప్ప కుమారుడిని పదవికి ఎంపిక చేసింది. కర్ణాటక శాఖను ఒక కుటుంబ పార్టీగా మార్చివేసింది. ఎడియూరప్ప గాలి తీసి పక్కన పెట్టాం గనుక లింగాయత్‌ సామాజిక తరగతి దూరం కావటంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం జరిగిందన్న వాదనను పార్టీ గుర్తించినట్లుంది. తిరిగి వారి మద్దతు పొందాలంటే మరోదారి లేదని భావించి ఆ పెద్దమనిషి కుటుంబ వారసుడినే అధ్యక్షుడిగా నియమించింది. ఎంతవారలైనా అధికార కాంతదాసులే, నరేంద్రమోడీ ఆ కోవకు చెందిన వ్యక్తే గనుక చేసేదేముంది, సరే అనక తప్పలేదు. దీంతో పార్టీలో ఇప్పుడు ఎడియూరప్ప వ్యతిరేకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.కాళ్లబేరానికి వస్తారా ? తిరుగుబాటు చేస్తారా ? తన కుమారుడి నియామకానికి నరేంద్రమోడీ అంతిమ నిర్ణయం తీసుకున్నారని ఎడియూరప్ప చెప్పిన తరువాత దాన్ని ధిక్కరించే సాహసం బిజెపిలో ఎవరికైనా ఉందా అంటే సందేహమే. అవమానాలను దిగమింగి లోలోపల కుములుతూ పార్టీలోనే ఉండాలి లేదా వెళ్లిపోవాలి. పార్టీ పదవి పంచాయతీ తేలింది, ఓట్ల రాజకీయం గనుక వెంటనే శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుంటారు, లింగాయత్‌ కాని వారే అవుతారు.


కర్ణాటక రాజకీయాల్లో అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే పక్కా అవకాశవాద పార్టీగా జెడిఎస్‌ పేరు తెచ్చుకుంది.గతంలో దాని మద్దతుదారులుగా ఉన్న అనేక మంది కాంగ్రెస్‌వైపు మొగ్గటంతో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు దారులు మూసుకుపోవటంతో మరోసారి బిజెపి తలుపుతట్టింది.రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లింగాయత్‌, ఒక్కళిగ సామాజిక తరగతులు కలిస్తే తిరుగుండదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామనే బిజెపి అంచనా దీని వెనుక ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల ప్రభావం ఉందని చెబుతున్న 69చోట్ల బిజెపి 20, కాంగ్రెస్‌ 40 గెలుచుకుంది. ఒక్కళిగలు ప్రభావం చూపే 64 చోట్ల ఆ సామాజిక తరగతి పార్టీగా ఉన్న జెడిఎస్‌ 14స్థానాలతో సరిపెట్టుకుంది. జెడిఎస్‌ను సంతుష్టీకరించేందుకు మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి మద్దతుతో స్వతంత్రురాలిగా గెలిచిన సినీనటి సుమలతను అక్కడి నుంచి తప్పుకోవాలని, కావాలంటే ప్రస్తుత సభ్యుడు డివి సదానంద గౌడ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు గనుక బెంగలూరు ఉత్తరం నుంచి అవకాశం కల్పిస్తామని బిజెపి చెప్పినట్లు వార్తలు. స్వచ్చందంగా లేదా ఇతర కారణాలతో పోటీకి దూరంగా ఉన్నామని ప్రకటనలు చేయించటం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో మరో ఎనిమిది నుంచి పదమూడు మంది ఎంపీలను కూడా ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు లీకులు వదిలారు.ఇలా చేస్తే బిజెపి గెలుస్తుందా అంటే చెప్పలేము. అసెంబ్లీ ఎన్నికల్లో 75 మంది కొత్తవారికి సీట్లిస్తే 14 మందే గెలిచారు. ఇరవై నాలుగు మంది ఎంఎల్‌ఏలను పక్కన పెడితే పది స్థానాల్లో మాత్రమే పార్టీ గెలిచింది.


పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోకపోతే బెలగావిలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని బిజెపి ఎంఎల్‌ఏలు కేంద్ర నాయకత్వానికి ఈనెల మొదటి వారంలో అల్టిమేటం జారీ చేశారు. ఏ పార్టీకైనా ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.అధికారపక్షం కాంగ్రెస్‌ చేసే విమర్శలతో మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావటం లేదని వాపోయారు. ఆరునెలలకు పైగా శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేని స్థితి గతంలో ఎన్నడూ లేదని కాంగ్రెస్‌ నేత గుండూరావు అన్నారు. మే పదవ తేదీన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు 135, బిజెపికి 66, జెడిఎస్‌కు 19 సీట్లు వచ్చాయి.వచ్చే శుక్రవారం నాడు శాసనసభా పక్ష నేతను నియమిస్తామని బివై విజయేంద్ర విలేకర్లతో చెప్పారు. జెడిఎస్‌తో కూటమి గురించి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలతో సంప్రదించలేదని సదానంద గౌడ బహిరంగంగా చెప్పారు. ఆ తరువాత గౌడను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఆ తరువాతే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయటం లేదని ప్రకటించటం గమనార్హం. రాష్ట్రంలో కరవు పరిస్థితి గురించి అధ్యయన కమిటి హసన్‌ పట్టణానికి వచ్చింది. ఆ సందర్భంగా హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గౌడ అసందర్భంగా పోటీలో ఉండనని ప్రకటించారు. అంతకు ముందు అక్టోబరు ఏడవ తేదీన విలేకర్లతో మాట్లాడుతూ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేకపోవటం పార్టీలో సంకటస్థితిని సృష్టించిందని,జెడిఎస్‌తో పొత్తు పట్ల తాను సంతోషంగా లేనని, రాష్ట్రనేతలతో నిమిత్తం లేకుండా చేశారని, తాము దీని గురించి కనీసంగా చర్చించలేదన్నారు. పార్టీ జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేందుకు చేసి ఉండవచ్చు అన్నారు. ఆ తరువాత అక్టోబరు 25వ తేదీన ఢిల్లీ వచ్చి అలా ఎందుకు మాట్లాడారో సంజాయిషీ ఇవ్వాలని అధిష్టానం కోరింది. బిజెపిలో జరిగిన పరిణామాల గురించి మాజీ సిఎం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన లింగాయత్‌ నేత జగదీష్‌ షెట్టార్‌ మాట్లాడుతూ పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఆరునెలల పాటు పార్టీ, శాసనసభా పక్ష నేతలను ఎంపిక చేయలేకపోవటంతో ఎప్పుడు చేస్తారని బిజెపి కార్యకర్తలందరూ ప్రశ్నించారు, ఎట్టకేలకు నేతను ఎంపిక చేశారు, ఆగండి పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అని షెట్టార్‌ అన్నారు.

ఆకలో రామచంద్రా తప్ప అచ్చేదిన్‌ జాడలేదు – మరో ఐదేండ్లు ఉచిత బియ్యం పధక అర్ధమిదేనా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చత్తీస్‌ఘర్‌ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు వరకు ఉంది. కానీ మోడీ కోయిల ముందే కూసింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గానమే ! వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కూడా ఎంతో దూరం లేనందున అప్పుడు కూడా దీని గురించి ఊదరగొడతారని వేరే చెప్పనవసరం లేదు. ఈ పధకం ఖజానా మీద మరింత భారం మోపుతుందని కొందరు అంటున్నారు. కొత్తగా పడేదేమీ లేదన్నది మరొక వాదన.ఏది ఏమైనా పేదలకు మేలు చేస్తుంది. ఉచిత పధకాల వలన రాష్ట్రాలు దివాలా తీస్తాయని నరేంద్రమోడీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఉచిత ఆహార భారాన్ని భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడదా ? చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదంటే ఎక్కడో తేడా కొడుతోందని మోడీ గ్రహించారనుకోవాలి. పౌరులు గౌరవ ప్రదమైన, ఆరోగ్యకర జీవనం గడపాలంటే తగినంత ఆహారం, పోషకాలు అవసరం. వాటిని హక్కుగా పరిగణిస్తూ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామాలలో 75శాతం, పట్టణాలలో 50శాతం మంది అర్హులని పేర్కొన్నారు. కొత్తగా నరేంద్రమోడీ సర్కార్‌ దేశంలో ఎక్కడైనా రేషన్‌ పొందేందుకు వీలుగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. బహుశా దేశ భద్రతకు సంబంధించిన రహస్యంగా భావించి లేదా పరువు పోతుందని సిగ్గుపడిగానీ ఉచిత పధకాన్ని పొడిగించటానికి కారణం ఏమిటో ప్రధాని చెప్పలేదు అనుకోవాలి. ఒకవైపు ఆహార భద్రతకు తూట్లు పొడిచేందుకు మోడీ మంత్రాంగంలో భాగమైన నీతి ఆయోగ్‌ చూస్తుంటే మరోవైపు ఓట్లకోసం పడుతున్న పాట్లు ! అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు !


మోడీ కేంద్రంలో అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది.అది 2022లో 121దేశాల్లో 107కు, 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను గత పదేండ్లలో ఏనాడూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప ఆకలి గురించి మాట్లాడదు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదేండ్లు పొడిగించటం అంటే పదేండ్ల నాడు చెప్పిన అచ్చేదిన్‌ (మంచి రోజులు) రాలేదని, జనం చచ్చే ఆకలితో ఉన్నారని, పరిస్థితి దిగజారుతున్నది వాస్తవమేనని అంగీకరించటం కాదా ! నిర్దిష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర అంచనాల ప్రకారం పదేండ్ల అమలు తరువాత కుర్రవాళ్లలో 40శాతం మందికి తగినంత ఆహారం లేదు. మూడోవంతు మంది దేశ జనాభా పోషకార లేమితో ఉన్నారు. మనకు రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి. తగినంత ఆహారం లేక గిడసబారి పోయిన, బానకడుపుల వారు ఒకవైపు, ఉన్న డబ్బుతో విచ్చలవిడిగా తిని పెంచుకున్న ఊబకాయాలతో కార్పొరేట్‌ ఆసుపత్రులను పోషిస్తున్న వారిని మరోవైపు చూడవచ్చు.


తగినంత ఆహారం, పోషకపదార్ధాలు అందుబాటులో లేని కారణంగా దేశంలో ఉన్న ఆడా మగా రక్తహీనతతో ఉన్నారు.ఆహార భద్రతా పధకం ఈ సమస్యను పరిష్కరించటంలో విఫలమైంది. మరోవైపున నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి పాలిత రాష్ట్రాల పాలకులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్థ ఆరోగ్య భారతి. దేశంలో ” ఉన్నతమైన తెలివితేటలతో అందమైన, పొడవైన ” పిల్లలను పుట్టించేందుకు గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రం పేరుతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తలిదండ్రులు నల్లగా ఉన్నా, తెలివితేటలు పెద్దగా లేనివారైనప్పటికీ పురాతన భారత విజ్ఞానంతో పైన పేర్కొన్న లక్షణాలతో పిల్లలను పుట్టించేందుకు సంస్థ నిపుణులు పని చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నది. తరుణ్‌ విజరు అనే బిజెపి నేత నల్లవారితో కలసి సామరస్యపూర్వకంగా జీవిస్తున్నట్లు చేసిన ప్రకటన గురించి తెలిసిందే. ఇదే ఆరోగ్యభారతి మేథావులు ఆకలితో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు. ప్రాచీన విజ్ఞానం, వేదాల్లో ఉన్నాయంటున్న పరిష్కార మార్గాలను వెలికి తీసి పైసా ఖర్చు లేకుండా లోపాలను సరి చేయవచ్చు కదా !


కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నట్లు, రెండు లక్షల కోట్ల రూపాయలను అందుకు ఖర్చు చేస్తున్నట్లు బిజెపి పెద్దలు విజయగాధలను గానం చేస్తుంటారు. వారి జేబుల్లోంచి తీసి ఖర్చు చేయటం లేదు. దేశంలో ఆకలి ఇవాళ కొత్తగా ప్రారంభం కాలేదు.యుపిఏ పాలనకు ముందు అధికారంలో ఉన్న బిజెపి వాజ్‌పాయి సర్కార్‌ ఆహార భద్రతా పధకం గురించి ఎలాంటి ఆలోచనా చేయలేదు. సిఎంగా ఉన్న నరేంద్రమోడీ ఎన్నడూ అలాంటి ప్రతిపాదన కూడా చేసినట్లు తెలియదు. ఇక 80 కోట్ల సంఖ్య ఎలా వచ్చిందంటే గ్రామాల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతం లెక్కన 67శాతం మందికి ఆహార భద్రత కల్పించాలని 2013 చట్ట చెప్పింది. అప్పటికి ఉన్న జనాభా 122 కోట్లు వారిలో 67శాతం అంటే 81.74 కోట్లు. ఇప్పుడు 142 కోట్లకు చేరింది, అంటే ఇవ్వాల్సింది 95.14 కోట్ల మందికి. పదిహేను కోట్ల మందికి మొండిచేయి చూపుతున్నారు. మరోవైపు ఆరోగ్య సూచికలేవీ మెరుగుపడిన దాఖలా లేదు. అందువలన ఆహార భద్రత, పోషకాహార పధకాలను సవరిస్తే తప్ప దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదని అనేక మంది చెబుతున్నారు. అది వాస్తవం కాదని చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి సర్వేలను నిర్వహించలేదు.దేశంలో ఆహార సబ్సిడీ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2020-21లో కేంద్ర ప్రభుత్వం రు.5.41లక్షల కోట్లు ఖర్చు చేసింది.(2016 నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పులను ఒక్కసారే కేంద్ర ప్రభుత్వం తీర్చిన కారణంగా ఒక ఏడాదిలో ఇంతగా పెరిగింది) 2021-22లో వాస్తవ ఖర్చు రు.3,06,571 కోట్లు, 2022-23లో సవరించిన అంచనా రు.2,96,523, 2023-24లో ప్రతిపాదించిన మొత్తం రు.2,05,765 కోట్లు. యుపిఏ చివరి సంవత్సరం నుంచి నరేంద్రమోడీ తొలి ఆరు సంవత్సరాలలో ఆహార సబ్సిడీ మొత్తం లక్ష కోట్లకు అటూ ఇటూగా ఉంది. కరోనా లేకున్నా ఇప్పుడు కొనసాగిస్తున్న ఆహార ధాన్యాల ఉచిత పధకం గురించి అంతకు ముందు మోడీకి ఎందుకు తట్టలేదు. తన ఏలుబడిలో పరిస్థితి ఆకస్మికంగా దిగజారిందా ? గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంతగా దేశ జిడిపిని పెంచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాసేపు అంగీకరిద్దాం, దానికి అనుగుణంగా ఆహార సబ్సిడీ పెంచకపోగా తగ్గించారు.


2014-15లో ఆహార సబ్సిడీ కేటాయింపు జిడిపిలో 0.9శాతం, తరువాత 2019-20 నాటికి 0.5శాతానికి కోత పెట్టారు. కరోనా కాలంలో పాత బకాయిల చెల్లింపుతో 2.7శాతానికి పెరిగింది, క్రమంగా దిగజార్చుతూ 2023-24లో దాన్ని 0.7శాతానికి తగ్గించారు. ఇదేదో ఏదో అలా జరిగిపోయిందని చెప్పినట్లుగా సంభవించింది కాదు.పౌర పంపిణీ వ్యవస్థ(పిడిఎస్‌)ను ప్రైవేటీకరించాలని, ఉచిత ఆహార లబ్దిదారులను, సబ్సిడీలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చేసిన సూచనలు తెలిసిందే. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ వేసిన బాటలో నడుస్తున్న రాజు కనుసన్నలలోనే సిబ్బంది పని చేస్తారు.ఆహార భద్రత పధకం కింద లబ్దిదారులను స్థంభింప చేశారని, అదనంగా అవసరమైన వారికి ఇవ్వటం లేదంటూ దాఖలైన పిటీషన్‌ మీద లబ్దిదారులను పెంచాలని సుప్రీం కోర్టు 2021 జూన్‌ 29న చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.( ఎనభై కోట్ల సంఖ్య 2011 జనాభాప్రాతిపదిక అని ముందే చెప్పుకున్నాం.) దాంతో అదే ఏడాది సెప్టెంబరులో పిటీషనర్ల తరఫు లాయర్‌ ప్రశాంత భూషణ్‌ సంబంధిత కేంద్ర మంత్రికి నోటీసు పంపారు. అయినా చలనం లేకపోవటంతో 2022జనవరిలో కోర్టు సూచనలను అమలు జరపాలంటూ మరోపిటీషన్‌ దాఖలు చేశారు.దాంతో విధిలేక కొత్త జనాభా లెక్కలను సేకరించిన తరువాతనే విస్తరణ సాధ్యమని, సమీప భవిష్యత్‌లో విస్తరించే పధకాలేవీ లేవని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏదో ఒక మార్గాన్ని చూడాలని కోర్టు కేంద్రానికి చెప్పింది. అయినా ఇంతవరకు చేసిందేమీ లేదు.


జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితి. అప్పటి వరకు కోట్లాది మంది ఆకలితో మాడాలన్నమాట. కేంద్రం తన వాదనకు మద్దతుగా సమర్పించిన అఫిడవిట్‌లో కొన్ని నీతి ఆయోగ్‌ అభిప్రాయాలను పొందుపరచింది. మూడింట రెండువంతుల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందచేతకు ఉన్న అవకాశాలు, అవసరమా అన్న అంశాలను పరిశీలించాలని ఆ సంస్థ పేర్కొన్నది. అంతేకాదు ఆహార ధాన్యాల సేకరణ, పధకాల పంపిణీకి ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకొనే విధంగా ప్రైవేటు,కార్పొరేట్‌ సంస్థలకు బాధ్యతలను అప్పగించాలని కూడా సూచించింది. అంతకంటే దారుణం ఏమంటే సుప్రీం కోర్టు సూచించింది తప్ప ఆదేశాలు జారీ చేయలేదని, ఆహార భద్రత పధకం వర్తింప చేసేందుకు జనాభా అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో చేసిన చట్టంలో లేదని అందువలన కోర్టు మార్గదర్శనం చట్టంలోని సెక్షన్‌ 9కి విరుద్దమని కూడా నీతి ఆయోగ్‌ 2022 ఆగస్టు 31న జరిపిన సమీక్షా సమావేశంలో ఒక వాదనను కేంద్రానికి అందించింది. అయితే ఈ అంశాలను ప్రభుత్వం కోర్టు ముందు సమర్పించలేదు. నిబంధనల సాకుతో అర్హులైన వారికి ఆహార హక్కు లేకుండా మాడ్చి చంపాలని చట్టం చెప్పిందా ? ఆ తరువాత అంటే అదే ఏడాది సెప్టెంబరులో నీతి ఆయోగ్‌ మేథావులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. ఆహార భద్రత పధక చట్టం అమలు జరిపిన ఎనిమిదేళ్ల కాలంలో జనాభా తలసరి ఆదాయం 33.4శాతం పెరిగిందని, అందువలన జనమంతా 2013-14లో ఉన్న మాదిరి ఉండరు గనుక పెరిగిన తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నీతి ఆయోగ్‌ పెద్దలు వాదించారు. ఇది అసంబద్దమైన వాదన. అంబానీ, అదానీల సంపదను, అడుక్కొనేవారి ఆదాయాన్ని సరాసరి కట్టే లెక్కలవి.


ఆహార సబ్సిడీ అనేది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకు ఇచ్చేది. ఎఫ్‌సిఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ విధానాల మేరకు వినియోగదారులకు అందచేస్తాయి. వాటిలో ధరకు విక్రయించేవి, ఉచితంగా అందచేసేవీ ఉంటాయి. ఈ లావాదేవీల్లో వచ్చే తేడా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.గతంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న దారిద్య్రాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఆహారం కేటాయించేదీ నిర్ణయించేవారు. 2017-18 నుంచి దారిద్య్ర సర్వే, కొత్త కార్డులు ఇవ్వటం నిలిపివేశారు. రాష్ట్రాలు జారీ చేస్తే అందుకయ్యే ఖర్చును అవే భరించాల్సి ఉంటుంది. ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని ఒకే కార్డు పద్దతిని ముందుకు తెచ్చారు. మన దేశంలో దారిద్య్రరేఖ నిర్వచనంలో అనేక లోపాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టత లేనికారణంగా ఎవరికి తోచిన అంచనాను ఆయా కమిటీలు ఇచ్చాయి. ప్రపంచ బాంకు అంతర్జాతీయ దారిద్య్ర రేఖను రూపొందించింది. దాని ప్రకారం 2011లో రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు దారిద్య్ర రేఖకు దిగువన(దుర్భరదారిద్య్రంలో) ఉన్నట్లు. దాన్ని 2017 ధరల ప్రకారం 2022 సెప్టెంబరులో 2.15 డాలర్లకు పెంచింది. ప్రస్తుతం డాలరుకు 83 రూపాయలు ఉంది కనుక నెలకు రు.5.353 కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు. కానీ మన ప్రభుత్వం పట్టణాల్లో నెలకు రు.1,260, గ్రామాల్లో రు.1,059గా గీత గీసింది.ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం తన రేఖను నిర్ణయించుకోవచ్చు.వాటిని చూపి దారిద్య్రాన్ని తగ్గించినట్లు చెప్పుకోవచ్చు. ప్రపంచ బాంకు తాజాగా రూపొందించిన మూడు ప్రమాణాల ప్రకారం డాలర్లలో రాబడితో వివిధ దేశాలలో దారిద్య్రం ఎలా ఉందో, ఉంటుందో పేర్కొన్నది.దాని ప్రకారం భారత్‌, చైనాల పరిస్థితి దిగువ విధంగా ఉంది. రాబడి గీతను బట్టిి ఎంత మంది దారిద్య్రంలో ఉన్నారో ఈ పట్టిక సూచిస్తుంది. ఉదాహరణకు రోజుకు 2.15 డాలర్లకంటే తక్కువ ఆదాయం వచ్చే వారు ఆఫ్రికాలోని కాంగో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో 69.9శాతం ఉన్నారు, అంటే వారంతా దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు లెక్క.
దేశం ×× 2.15 ×× 3.65 ×× 6.85
భారత్‌ ×× 11.9 ×× 46.5 ×× 83
చైనా ×× 0.10 ×× 2.00 ×× 24.7
పై అంకెల అర్ధం ఏమంటే చైనా గనుక దారిద్య్ర రేఖను రోజుకు 6.85 డాలర్లుగా నిర్ణయిస్తే అక్కడ 24.7శాతం మంది, అదే మనదేశంలో అయితే 83శాతం మంది దారిద్య్రంలో ఉన్నట్లు భావించాలి. 2.15 డాలర్లంటే చైనాలో దారిద్య్రం లేనట్లే. అందువలన మన పాలకులు దారిద్య్ర రేఖను ఎంతగా నిర్ణయిస్తారో, ఏ దేశంతో పోల్చుకుంటారో చూడాలి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుకాకుండా చైనాను త్వరలో అధిగమిస్తామని చెబుతున్నారు గనుక దానితో పోల్చుతారా ?


ప్రపంచ ఆకలి సూచికను తయారు చేస్తున్న వారు పిల్లల్లో గిడసబారుతనం,ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, బరువు తక్కువగా పుట్టటం, పసి ప్రాయ మరణాలు, తగినన్ని కాలరీల శక్తిని తీసుకోకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లల్లో ఈ లోపాలు ఉన్నాయంటే తలిదండ్రులకు తగిన రాబడి లేకపోవటం తప్ప వేరు కాదు.2019 నుంచి 2021 మధ్య జరిపిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో 35.5శాతం మంది గిడసబారిన వారు, 19.3శాతం ఎత్తుకు తగిన బరువు లేమి, 32.1శాతం మంది ఉండాల్సినదాని కంటే తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. అచ్చేదిన్‌ అని చెప్పి అధికారానికి వచ్చిన వారి ఏలుబడిలో గురజాడ చెప్పినట్లు భావిభారత పౌరులు ఈసురోమంటున్నారు. పోషణ అభియాన్‌ పేరుతో బడుల్లో మధ్యాహ్న భోజన పధకం అమలు చేస్తున్నారు. దాని లక్ష్యం ఏమిటి అంటే ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 38.4శాతంగా ఉన్న గిడసబారుతనాన్ని 2016 నుంచి 2022 నాటికి ఏటా రెండుశాతం చొప్పున 25శాతానికి తగ్గింపు, పూర్తిగా పోగొట్టాలంటేే మరో పదమూడు సంవత్సరాలు పడుతుంది. ఇదే విధంగా పోషకాహార లేమి, తక్కువ బరువుతో పుట్టే పిల్లల తగ్గింపు కూడా ఏటా రెండు శాతం అని, రక్తహీనతను మూడుశాతం చొప్పున తగ్గిస్తామని పేర్కొన్నారు.రక్త హీనత అనేక అనర్దాలకు హేతువుగా ఉంది. రక్తహీనత ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో కొన్ని పధకాలను ప్రారంభించింది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 50శాతం మంది, ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లల్లో 59శాతం మంది రక్తహీనతతో ఉన్నారు.ఏటా మూడు శాతం చొప్పున 2018 నుంచి 2022లోపు దాన్ని తగ్గిస్తామని చెప్పారు.ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సర్వేకు ఎంపిక చేసిన ప్రశ్నావళి నుంచి రక్తహీనత అంశాన్ని తొలగించారు. అంటే వాస్తవ పరిస్థితి తెలవకుండా పాతరేసేందుకు పూనుకున్నారు. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గురించి కలలు కంటున్నా, ప్రపంచంలో ఐదవ స్థానానికి జిడిపిని వృద్ది చేశామని చెప్పినా ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. జనాలకు ఒక్క బియ్యమో, గోధుమలో ఉచితంగా ఇస్తే సమగ్ర పోషకాహారం లభిస్తుందా ? మిగతా వాటి సంగతేమిటి ? వాటికి కావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ విధానాలేమిటి ?

గాజాలో ఇజ్రాయెల్‌ శాశ్వత తిష్ట -తెరపైకి రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


హమస్‌ను అణచే సాకుతో పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇజ్రాయెల్‌ గాజాలోని పాలస్తీనియన్ల మీద ప్రారంభించిన మారణకాండకు నెలదాటింది. అవే పశ్చిమ దేశాల అండచూసుకొని రష్యాను దెబ్బతీస్తామని బీరాలు పలికిన ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమై 622 రోజులు అవుతున్నది. ఇంతకాలం గడచినా సాధించలేనిది ముందు రోజుల్లో రష్యాను వెనక్కు కొడతారంటే ఎలా నమ్మాలనే సందేహాలు మొదలయ్యాయి. మరోసారి శాంతి చర్చలను తెరమీదకు తెచ్చారు. హమస్‌ సాయుధులను అణచివేసేందుకు నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించాడు.” మేము అక్కడ లేకపోతే ఏమి జరిగిందో చూశారు. హమస్‌ తీవ్రవాదం ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని మేము ఊహించలేదు. నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాము ” అన్నాడు.ఇజ్రాయెల్‌ మారణకాండలో మంగళవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 4,100 మంది పిల్లలతో సహా 10,022 మంది మరణించగా 25,408 మంది గాయపడ్డారు. పశ్చిమగట్టు ప్రాంతంలో మరణించిన వారు 163 కాగా 2,100 మంది గాయపడ్డారు. గాజాలో ఉన్న 35 ఆసుపత్రులలో పదహారింటిని పనికిరాకుండాచేశారు. అదే విధంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు 72కు గాను 51మూత పడ్డాయి. ఇజ్రాయెల్‌ మిలిటరీ బాంబులు, క్షిపణులతో దాడులు జరుపుతూ గాజా జనాభా 23లక్షలకు గాను 16.1లక్షల మందిని నివాసాల నుంచి తరిమివేశారు. మరణించిన వారిలో 88 మంది ఐరాస సహాయ సిబ్బంది ఉన్నారంటే హమస్‌ తీవ్రవాదుల స్థావరాల మీద దాడుఉ చేస్తున్నట్లు చేస్తున్న ప్రచార బండారం ఏమిటో అర్ధం అవుతున్నది. ఇంతవరకు ఏ ఒక్క దేశంలో ఒక ఉదంతంలో ఇంత మంది మరణించిన దాఖలా లేదు. మారణకాండను నిరసిస్తూ బహరెయిన్‌, ఛాద్‌, చిలీ, కొలంబియా, హొండురాస్‌, జోర్డాన్‌, దక్షిణాఫ్రికా, టర్కీ ఇజ్రాయెల్‌లోని తమ దౌత్యవేత్తలను వెనక్కు రప్పించాయి. బొలీవియా అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది. వందల కోట్ల డాలర్ల విలువగల మారణాయుధాలను అందిస్తున్న అమెరికా గతంలో ఎర్ర సముద్ర ప్రాంతానికి రెండు విమానవాహక యుద్ధ నౌకలు, క్షిపణి ప్రయోగ యుద్ధ నౌకలను పంపగా ఇప్పుడు ఒక జలాంతర్గామిని ఆ ప్రాంతానికి పంపి ఆ ప్రాంత దేశాలను బెదిరిస్తున్నది. .


తాము అంచనా వేసిన విధంగా రష్యా సేనలను ఎదుర్కోవటంలో ఉక్రెయిన్‌ విఫలం కావటంతో పశ్చిమ దేశాలు పునరాలోచనలో పడటమే గాక, ఏదో విధంగా రాజీచేసుకోవాలంటూ వత్తిడికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వచ్చాయి. రష్యా సైనిక చర్య ప్రారంభమై ఇరవై నెలలు దాటింది. తమ ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టేందుకు ప్రతిదాడులను ప్రారంభించినట్లు ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ రష్యా సేనలు ఖాళీ చేసిన ఒకటి రెండు గ్రామాలు, ప్రాంతాలు తప్ప చెప్పుకోదగిన పరిణామాలేవీ లేవు. రష్యా మందుపాతరలను ఏర్పాటు చేసినందున వాటిని తొలగించేందుకు చాలా సమయం పడుతున్నదని ఉక్రెయిన్‌ చెప్పుకుంటున్నది. నిజానికి అదే వాస్తవమైతే ప్రతిదాడులతో ఆ ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకోవటమే తరువాయి అన్నట్లుగా మే, జూన్‌ మాసాలలో మీడియాలో కథనాలను ప్రచురించారు. పశ్చిమ దేశాలన్నీ మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్‌ మీద కేంద్రీకరించటం, భవిష్యత్‌లో సాయం కొనసాగదేమో అన్న సందేహాలు తలెత్తటం, మరోవైపు రష్యా వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటం, చలికాలం ముందుంటంతో ఉక్రెయిన్‌ మిలిటరీ, పాలకులకు దిక్కుతోచటం లేదు.నవంబరు ఐదవ తేదీన ఉక్రెయిన్‌ మిలిటరీ అవార్డుల సభమీద జరిగిన దాడిలో కనీసం 20 మంది సైనికులు మరణించటంతో జెలెనెస్కీ కలవర పడ్డాడు.యుద్ధం సాగుతున్నపుడు ఆ ప్రాంతంలో అలాంటి కార్యక్రమం నిర్వహించటం ఏమిటని సామాజిక మాధ్యమంలో జనాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ను ఒప్పించేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని నెలల తరువాత రాజీపడితే అసలు ఇంతకాలం ఎందుకు ఆపని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందు మీరు రాజీకి అంగీకరిస్తే గౌరవ ప్రదంగా బయటపడటం గురించి మార్గాన్ని చూద్దామని నాటో కూటమి దేశాల ప్రతినిధులు అంటున్నారు. అందువలన అమెరికా కూటమి ముందుగా ఒక స్పష్టమైన వైఖరికి వస్తేనే చర్చలకు దారి ఏర్పడుతుంది.గత నెలలో జరిగిన ఒక సర్వేలో శాంతి కోసం కొంత భూభాగాన్ని వదులు కోవచ్చా అన్న ప్రశ్నకు ససేమిరా అంగీకరించం అని 74శాతం మంది చెప్పినట్లు తేలింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది, అవి జరుగుతాయా లేదా అన్నది ఒకటైతే ఒకవేళ రాజీపడితే జెలెనెస్కీ ఇంటిదారి పట్టాల్సిందే.బహుశా అందుకనే యుద్ధంలో ఉన్నందున అసలు వచ్చే ఏడాదైనా ఎన్నికలేంటి అనేపల్లవిని ఎత్తుకున్నాడు. ఇప్పటికిప్పుడు కాకున్నా కొన్ని నెలల తరువాతైనా జెలెనెస్కీ చర్చలకు దిగిరాక తప్పదనే భావం రోజు రోజుకూ పెరుగుతున్నది. జెలెనెస్కీ ముందుకు తెచ్చిన పది అంశాల శాంతి పధకం గురించి మాల్టాలో జరిగిన సమావేశానికి చైనా హాజరుకాలేదు. ఈ పరిణామం ఉక్రెయిన్‌ కోరుకున్న శాంతి ప్రతిపాదనకు పెద్ద ఎదురుదెబ్బ.


రష్యాను కొద్ది వారాల్లో వెనక్కు నెట్టవచ్చన్న పశ్చిమ దేశాల అంచనాలు తలకిందులయ్యాయి.అక్కడ విజయం సాధించారు, ఇక్కడ ముందుకు పోయారు అంటూ పశ్చిమ దేశాల మీడియా చూపిన దృశ్యాలు, ఇచ్చిన వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.ఇప్పటికీ మద్దతు ఇస్తామని చెబుతున్నప్పటికీ కొనసాగుతుందన్న హామీ లేదు. 2022 మే నెలలో 400 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న అమెరికా నిర్ణయానికి పార్లమెంటులో 368 అనుకూల, 57 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. ఈ సెప్టెంబరులో జరిగిన 30కోట్ల డాలర్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ వ్యతిరేకించిన వారు 117 మంది ఉన్నారు.ప్రస్తుతం ప్రతిపక్ష రిపబ్లికన్లు పార్లమెంటులో మెజారిటీ ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో జో బైడెన్ను ఓడించాలని చూస్తున్న వారు ప్రతి ప్రతిపాదనను అడ్డుకొనేందుకు, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తారు.జాతీయ భద్రతా సహాయ నిధి పేరుతో అమెరికా పక్కన పెట్టిన 105 బిలియన్‌ డాలర్లలో ఉక్రెయిన్‌ ఒక్కదానికే 60బి.డాలర్లు ఇస్తామని చెప్పారు. అంత మొత్తం ఇచ్చేందుకు రిపబ్లికన్‌ పార్టీ సిద్దంగా లేదు. ఆ పార్టీ పార్లమెంటులో మెజారిటీగా ఉన్నందున వారి మద్దతు లేకుండా ఒక్క డాలరు కూడా జో బైడెన్‌ విడుదల చేయలేడు. అది లేకుండా ఉక్రెయిన్‌ ఎంతకాలం నిలబడుతుందన్నది సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్‌-పామస్‌ పోరు ముందుకు రావటంతో అమెరికా దృష్టి అటువైపు మళ్లింది,భారీ ఎత్తున ఇజ్రాయెల్‌కు నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ఇది కూడా ఉక్రెయిన్‌కు ఎదురు దెబ్బే. పశ్చిమ దేశాల మీడియా అంతటా నెల రోజుల క్రితం వరకు ఉక్రెయిన్‌ విజయగాధలతో ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని ఇజ్రాయెల్‌ హమస్‌ దాడులు, మధ్యప్రాచ్య పరిణామాలు ఆక్రమించాయి. ఐరోపా యూనియన్‌ అక్టోబరు నెలలో వచ్చే నాలుగు సంవత్సరాల బడ్జెట్‌ గురించి బ్రసెల్స్‌లో జరిపిన సంప్రదింపులలో ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకూడదంటూ పోలాండ్‌, హంగరీ, స్లోవేకియా అడ్డం తిరిగాయి.ఉక్రెయిన్‌ తక్కువ ధరలకు ఆహార ధాన్యాల ఎగుమతి తమ రైతాంగానికి నష్టం కలిగిస్తున్నదంటూ పోలాండ్‌ అభ్యంతరం తెలుపుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున పోలాండ్‌ ప్రధాని మోరావిక్కీ తన గెలుపు గురించి ఆందోళన చెందుతున్నాడు, ధాన్య ధరలు తన పతనానికి కారణం అవుతాయోమనని భయపడుతున్నాడు.


పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధునిక విమానాలు తప్ప అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందచేశాయి. వాటినే ఇంకా సరఫరా చేయటం తప్ప అంతకు మించి మరో అడుగువేయలేని స్థితి. జెలెనెస్కీని ముందుకు నెట్టటం తప్ప నేరుగా నాటో కూటమి దేశాలు రంగంలోకి దిగే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించటం లేదు. ప్రస్తుతం ఎలాంటి స్థంభన లేదంటూ బింకాలు పలుకుతున్నప్పటికీ ఎంతకాలం అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది.రష్యాతో శాంతి చర్చలకు ఉన్న అవకాశాలేమిటి అంటూ అమెరికా, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులను అడిగినట్లు అమెరికా ఎన్‌బిసి టీవి పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు మద్దతునిస్తున్న 50కిపైగా దేశాల ప్రతినిధులతో అక్టోబరు నెలలో బ్రసెల్స్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు కదిలించి చూసినట్లు అది వెల్లడించింది. దీని గురించి జెలెనెస్కీ స్పందిస్తూ చర్చలకు ఇది తరుణం కాదని, అందుకోసం పశ్చిమ దేశాల నేతలెవరూ తనను వత్తిడి చేయటం లేదని చెప్పుకున్నాడు. రష్యాతో తమ పోరు కదలిక లేని, ఘర్షణపూర్వక బలహీన స్థితి ఉండే దశలోకి ప్రవేశిస్తున్నదని, ఇలాంటి పరిస్థితి రష్యా తనమిలిటరీ శక్తిని తిరిగి సమకూర్చుకొనేందుకు వీలు కల్పిస్తుందని ఉక్రెయిన్‌ దళాధిపతి జనరల్‌ వాలెరీ జలుఝని ఎకానమిస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ తరువాతే ఎన్‌బిసి వార్త, దాని మీద జలెనెస్కీ స్పందన వెలువడింది. ” కాలం గడిచింది జనాలు అలసిపోయారు, కానీ ఇది ప్రతిష్ఠంభన కాదు ” అని కూడా అన్నాడు. 2014లో రష్యా విలీనం చేసుకున్న క్రిమియా ద్వీపంతో పాటు గత ఏడాది నుంచి ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ చెబుతున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు రిపబ్లిక్‌లను రష్యా గుర్తించింది. వాటితో సహా అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్లో 17.5శాతం ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉంది. ఉక్రెయిన్‌ నాటోలో చేరబోనని, పశ్చిమ దేశాలతో కలసి తమ భద్రతకు ముపు కలిగించబోమని హామీ ఇస్తే క్రిమియా మినహా తమ స్వాధీనంలో ఉన్న వాటిని వెంటనే అప్పగిస్తామని పుతిన్‌ మొదటి నుంచీ చెబుతున్నాడు. పశ్చిమ దేశాలు దాన్ని పడనివ్వకుండా అడ్డుపడటమే కాదు, ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకొని మరోవైపు నుంచి రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి.


ప్రస్తుతానికి పశ్చిమ దేశాల సాయం నిలిచిపోతుందని చెప్పలేము గానీ వచ్చే ఏడాది నుంచి జరగవచ్చని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న పద్దెనిమిది నెలలు ప్రస్తుత పోరులో కీలకంగా మారనున్నాయని, 2025 వసంత రుతువుకు ముందు రష్యన్లు విజయవంతమైన ఎదురుదాడి చేయలేరని, వచ్చే ఏడాది ఉక్రెయిన్‌ పెద్ద ముందడుగు వేయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. తాము కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇస్తే తప్ప చర్చలు లేవని ఉక్రెయిన్‌ చెబుతుండగా, తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను వదిలేదని రష్యా చెబుతున్నందున రెండు దేశాల మధ్య చర్చలకు ప్రస్తుతం ప్రాతిపదిక లేదనే పద్దతిలో విశ్లేషణలు సాగుతున్నాయి. రష్యా మమ్మల్నందరినీ చంపిన తరువాత వారు నాటో దేశాల మీద దాడి చేస్తారు, అప్పుడు గాని మీ కొడుకులూ, కుమార్తెలను పోరాటానికి పంపరా అని జెలెనెస్కీ ఒక అమెరికా టీవీ ఎన్‌బిసి ఇంటర్వ్యూలో నాటో కూటమి మీద అసహనాన్ని వెళ్లగక్కాడు. ఒకసారి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశానికి వస్తే కేవలం 24 నిమిషాల్లో అంతా వివరిస్తానని గెలిస్తే 24 గంటల్లో యుద్ధాన్ని అంతం చేస్తాడని అన్నాడు. మొత్తం మీద ఉక్రెయిన్‌ సంక్షోభం మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

నరేంద్రమోడీ పదేండ్ల పాలన : పేదల పాసింజరు రైళ్లు రద్దు – బడా బాబుల విమానాలు రెట్టింపు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా కాలం నుంచి కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యం పధకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఒక ఎన్నికల సభలో ప్రకటించారు. ఇదే సమయంలో నవంబరు మూడవ తేదీన అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ” భారత్‌ మాదిరి ఎక్కువగా విమానాలను కొనుగోలు చేస్తున్న దేశం మరొకటి లేదు, ఎందుకో ఇక్కడ చూడండి ” అనే శీర్షికతో వార్త ఇచ్చింది. చూశారా జనం పట్ల మోడీకిఎంత శ్రద్ద ఉందో అని ఉచిత బియ్యం గురించి, విమానాల కొనుగోలులో మనమే టాప్‌ అంటే పదేండ్లలో మోడీ దేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పటానికి ఇంతకంటే ఏం కావాలి అని తబ్బిబ్బు అవుతున్నారు. రాజుల వద్ద భట్రాజులు (కుల ప్రస్తావన కాదని గమనించాలి) ఉండేవారు. రాజుగారి నోటి నుంచి ఏ మాట వచ్చినప్పటికీ ఆహా ఓహౌ అని పొగడటమే వారి పని, ఎంతగొప్పగా పొగిడితే వారికి అంత ఎక్కువగా ప్రతిఫలం ముట్టేది. మోడీని పొగిడేవారు వారిని గుర్తుకు తెస్తున్నారు. జనం మీద ఇతర అంశాల్లో లేని ప్రేమ ఉచిత బియ్యం మీద ఎందుకు చూపుతున్నారు ? ఐదు రాష్ట్రాల్లో బిజెపికి పరీక్షగా మారిన అసెంబ్లీ, వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాఖీ బహుమతి పేరుతో ఉజ్వల పధక గాస్‌ సబ్సిడీని 200 నుంచి 400కు పెంచగా, ఇతరులకు రు.200 రాయితీ ఇచ్చారు.పొయ్యి మీదకు ఐదు కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నారు. పొయ్యి కిందకు అవసరమైన గాస్‌ ధర మోడీ గద్దె నెక్కినపుడు రు.420వరకు ఉండగా రు.1,150 కు పెంచారు (రాష్ట్రాలలో ధరల్లో తేడాలు ఉన్నాయి). అంతగా పెంచినపుడు మహిళలు గుర్తుకు రాలేదా ? నరేంద్రమోడీ పదేండ్ల ఏలుబడిలో దేశంలో ఆకలి పెరిగింది తప్ప తగ్గలేదు అన్నది పచ్చి నిజం. పెరగకపోతే ఉచిత బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. కిందపడ్డా పైచేయి నాదే అన్నట్లుగా నరేంద్రమోడీ వైఫల్యాన్ని అంగీకరిస్తారా ? అందుకే ఉచిత బియ్యం ఓట్ల కోసం ఎర. మోడీ అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది.2023నాటికి అది 125దేశాలకు గాను 2022లో 121కి 107 కాగా 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను ఏనాడూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప దేశంలో ఆకలి ఎంత ఉందో అసలు లేదో అన్నది కూడా ఇంతవరకు చెప్పలేదు.


భారత్‌కు అదనంగా వెయ్యి విమానాలు కావాల్సి ఉందని 2018జూన్‌ మొదటివారంలో నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రకటించారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలు మన దేశంలోనే తయారు చేస్తాయని కూడా చెప్పారు. రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌ తమనుంచి 1,750 కొనుగోలు చేయవచ్చని ఎయిర్‌ బస్‌, 2,100 ఆర్డర్లు తమకు రావచ్చని బోయింగ్‌ కంపెనీ 2017లోనే చెప్పింది. కొత్తగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఎవరికీ పేచీ లేదు. వీటి వలన సామాన్యులకు ఒరిగేదేమిటి ? డబ్బున్నోళ్లు ఎక్కుతారు.పెరుగుతున్న రైలు ప్రయాణీకులకు అనుగుణంగా రైళ్లను పెంచాలని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా పట్టించుకోలేదు. మూడేండ్లనాటి రైల్వే శాఖ అంచనా ప్రకారం కనీసం ఇరవై వేల రైళ్లు అవసరం కాగా పదమూడువేలు మాత్రమే ఉన్నాయి. ఏటా వీటిలో ప్రయాణిస్తున్నవారు 2010 నుంచి 2020 వరకు సగటున ఏడాదికి 811 కోట్ల మంది ఉన్నారు. 2010లో 724 కోట్లు కాగా 2020లో 809 కోట్ల మంది ఉన్నారు. తగినన్ని రైళ్లు లేని కారణంగా ప్రయాణీకులు పెరగటం లేదని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. నూటనలభై కోట్ల మందికి అవసరమైన రైళ్లను గడచిన ఆరు సంవత్సరాల్లో ఎనిమిది వందలు మాత్రమే పెంచారు. 2022-23 సంవత్సరరలో దేశంలో విమాన ప్రయాణీకులు 37.7 కోట్లు కాగా వారిలో విదేశీయులు 5.9 కోట్ల మంది ఉన్నారు. వీరి కోసం ఈ ఒక్క ఏడాదే వెయ్యి విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. పోనీ అవి ప్రైవేటు సంస్థలు అనుకుందాం, రైళ్లను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అసలు సంగతేమంటే జనాలకు అచ్చేదిన్‌ అని చెప్పిన మోడీ కరోనా పేరుతో రద్దు చేసిన పాసింజరు రైళ్లను, రాయితీలను ఇంతవరకు పునరుద్దరించలేదు.వాటి మీద ఒక నిర్దిష్ట ప్రకటన కూడా లేదు. అనేక పాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి ప్రయాణీకుల నుంచి జేబులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో ప్రయాణించే రైళ్ల బదులు వందే భారత్‌లను ప్రవేశపెట్టేందుకు మాత్రమే శ్రద్ద చూపుతున్నారు. హైస్పీడు, బుల్లెట్‌ రైళ్లు వాటికోసం మార్గాల నిర్మాణం గురించి చూపుతున్న శ్రద్ద సామాన్య జన అవసరాల మీద లేదు. భారత్‌ విమానాల కొనుగోలు గురించి గొప్పగా రాయటం మోడీని మునగ చెట్టు ఎక్కించే యత్నం తప్ప మరొకటి కాదు.


ఒక్కసారిగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తే అసలు అవి నిండే అవకాశం ఉందా ? ప్రస్తుతం దేశంలో ఇరవై ప్రయాణాలు రైల్లో చేస్తే ఒకటి విమానంలో జరుగుతున్నట్లు అంచనా. విమానం కంటే రైల్లో మొదటి తరగతి ఛార్జీలను ఎక్కువగా నిర్ణయించి జనాలను విమానాలవైపు వెళ్లేట్లు చేస్తున్నారు. ఇది ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చే వైఖరి తప్ప మరొకటి కాదు. ఎయిర్‌ ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటా గ్రూపు కొత్తగా 470 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మరో సంస్థ ఇండిగో మరో ఐదువందలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే విమానాల ద్వారా రద్దీ పెంచుకొని లబ్దిపొందేందుకు అవి చూస్తున్నాయి.ప్రభుత్వం కూడా గత తొమ్మిది సంవత్సరాల్లో 74గా ఉన్న విమానాశ్రయాలను 148కి పెంచింది, 2030 నాటికి 230కి పెంచుతామని చెబుతున్నారు. ఇది తమ ఘనతగా అధికార బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. ఇదే మాదిరి రైలు ప్రయాణీకులకు అవసరమైన ఖర్చు , వేగంగా ప్రయాణించే మార్గాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అంటే లేదు. వందేభారత్‌ రైళ్లు కూడా పూర్తి వేగంతో నడవటంలేదు. రెండు వందల కిలోమీటర్లకు పైగా తిరిగే అన్ని పాసింజరు రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చటంతో దేశంలో ఐదువందలకు పైగా రైళ్లు సామాన్యులకు దూరమయ్యాయి. అనేక గ్రామాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆగకుండా చేశారు. ఈ కారణంగా కలసి వచ్చిన సమయం గురించి చెప్పకుండా వేగం పెంచి ప్రయాణీకులకు మేలు చేసినట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినందున గతంతో పోలిస్తే ప్రతి ప్రయాణీకుడి మీద 20 నుంచి 60 రూపాయల వరకు అదనపు భారం పడింది. దీనికి తోడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సాధారణ స్లీపర్‌ కోచ్‌లను తగ్గించి ఎసి కోచ్‌లను పెంచారు. సీట్లు దొరక్క అనివార్యంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తున్నది.వృద్దులు, మహిళలకు ఇస్తున్న ప్రయాణ రాయితీలను రద్దుచేశారు. టిక్కెట్ల రిజర్వేషన్‌, రద్దు చార్జీలను విపరీతంగా పెంచి మరో రూపంలో జేబులును కొల్లగొడుతున్నారు. పేరుకు చార్జీలను పెంచలేదనటం తప్ప కరోనా తరువాత పరోక్షంగా మోపిన భారం మామూలుగా లేదు. రద్దీ ఉన్న మార్గాలలో ఏండ్ల తరబడి ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతూ జనం దగ్గర అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటినే సాధారణ రైళ్లుగా ఎందుకు నడపరు ?

ప్రయాణీకుల రైళ్ల నిర్వహణ గిట్టుబాటు కావటం లేదంటూ ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. ఆ లెక్కలకు ఆధారం ఏమిటో తెలియదు. ప్రతి ప్రయాణీకుడి నుంచి కేవలం 47శాతమే వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. సామాన్యులకు విమానాలను అందుబాటులోకి తేవాలనే పేరుతో అవి నడిచేందుకు అవసరమైన ఇంథన మీద రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రాల్లో ప్రజారవాణా సంస్థల బస్సులకు ఎలాంటి ఇంథన సబ్సిడీలు లేవు. సరకు రవాణాకు ఎలాంటి రాయితీలేదు.కేంద్ర ప్రభుత్వం ప్రయాణీకులకు 2019-20లో ఇచ్చిన సబ్సిడీ మొత్తం రు.59,837 కోట్లు. సగటున ముందే చెప్పుకున్నట్లు ఏడాదికి ప్రయాణీకులు 811 కోట్లు, అంటే ఒక్కో ప్రయాణం మీద ఇస్తున్న రాయితే రు.73.78 మాత్రమే. ఈ మాత్రానికే అంతా దోచిపెడుతున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. నాసిరకం భోజనం,టిఫిన్లు, టీ, కాఫీలకు ప్రయాణీకులు చెల్లిస్తున్న మొత్తాలతో బేరీజు వేస్తే జనమే అధికంగా చెల్లిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వ రంగంలోని రవాణా వ్యవస్థలు అయ్యే ఖర్చును మాత్రమే రాబట్టాలి తప్ప లాభాలు తేవాలని చూడటమే తప్పు. ఆ లాభం కూడా సామాన్యుల నుంచి మరో రూపంలో వసూలు చేస్తున్నదే.


ఏ చిన్న అవకాశం దొరికినా ప్రయాణీకుల రైళ్లను రద్దు చేయటం పరిపాటిగా మారింది. ఇవి కూడా స్వల్పదూరాల్లో ప్రయణించేవే కావటం గమనించాలి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు 2022వ సంవత్సరంలో ఆరు నెలల్లో తొమ్మిది వేలకు పైగా రైలు సర్వీసులను రద్దు చేశారు. వాటిలో బొగ్గు రవాణాకు ప్రాధాన్యత ఇచ్చే పేరుతో రద్దు చేసినవి 1,934 ఉన్నాయి, మరో 6,995 రైళ్లను మార్గ మరమ్మతులు, నిర్వహణ పేరుతో రద్దు చేశారు.వీటిలో 3,395 మెయిల్‌ లేదా ఎక్స్‌ప్రెస్‌లు, 3,600 పాసింజర్లు ఉన్నాయి. సరకు రవాణా లాభసాటి అన్నది తెలిసిందే. ప్రభుత్వం ఆ లాభాలను చూస్తున్నది తప్ప ప్రయాణీకులను గాలికి వదలి వేస్తునది.2021-22లో రైళ్ల రద్దు, తగినన్ని రైళ్లు లేని కారణంగా కోటీ అరవైలక్షల మంది ప్రయాణించలేదు. చివరి క్షణాల్లో వారెంత ఇబ్బంది పడి ఉంటారో ఊహించుకోవాల్సిందే. విమాన ప్రయాణీకుల పెరుగుదల గురించి చెబుతున్న పాలకులకు రైల్వే ప్రయాణీకులు పెరుగుతున్నారని తెలియదా ?


ఒక విశ్లేషణ ప్రకారం 2019లో మనదేశంలో తలసరి విమాన సీట్లు 0.13 కాగా చైనాలో 0.52, అమెరికాలో 3.03 ఉన్నాయి. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో ఆయా దేశాల్లో నమోదైన విమాన సంస్థల వద్ద ఉన్న వివరాల ప్రకారం అమెరికాలో ప్రయాణీకులు 66.615 కోట్లు, చైనాలో 44.03, ఐరోపా సమాఖ్యలో 25.169, రష్యాలో 9.685, మనదేశంలో 8.396 కోట్ల మంది ఉన్నారు. మన హైదరాబాద్‌ కంటే తక్కువగా అంటే 70లక్షల 52వేల మంది ఉన్న ఐర్లండ్‌లో 7.047 కోట్ల మంది ఉన్నారు. ఈ అంకెలు వాస్తవాలను ప్రతిబింబించవు. ఉదాహరణకు మన దేశంలో ఇండిగో సంస్థ బ్రిటన్‌-రష్యా మధ్య విమానాలను నడిపితే వాటిలో ఎక్కే ప్రయాణీకులను కూడా మనదేశ ఖాతాలోనే వేస్తారు. రానున్న రోజుల్లో దేశంలోని మధ్య తరగతి జనాలు ఇంకా పెరుగుతారనే అంచనాతో కొత్తగా విమానాలను కొనుగోలు చేసేందుకు పూనుకున్నారు. మిగతా దేశాల వద్ద ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఏ దేశమూ కొననన్ని విమానాలను మనం కొంటున్నామని ఎవరైనా అంటే మనకు మనమే జబ్బలను చరుచుకోవాల్సిన అవసరం లేదు.


బిజినెస్‌ టుడే పత్రిక 2023 ఫిబ్రవరి 16న రాసిన వార్త ప్రకారం మన దేశంలో ఉన్న విమానాలు 800-900 మధ్య, చైనాలో 4,500 ఉన్నాయి.మనజనాభాకు కనీసం 3,500 నుంచి ఐదువేల వరకు ఉండాలని మార్టిన్‌ కన్సల్టింగ్‌ సంస్థ సిఇఓ మార్క్‌ మార్టిన్‌ చెప్పినట్లు పేర్కొన్నది. మన జిడిపి వృద్ది రేటు కంటే విమాన ప్రయాణాల వృద్ది రేటు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉన్నందున ప్రైవేటు సంస్థలు ఒక్కసారే భారీ సంఖ్యలో విమానాల కొనుగోలుకు నిర్ణయించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ రానున్న పదిహేను సంవత్సరాల్లో దేశంలో రెండువేలకు పైగా విమానాల అవసరం ఉంటుందని చెప్పారు. ఏ దేశంలోనైనా నెలకు కనీసం ఐదు నుంచి పది విమానాలకు ఆర్డరు ఉంటే అక్కడ విమానాల( అసెంబ్లింగ్‌) తయారీ గురించి ఆలోచిస్తామని, భారత్‌ ఒక్క సారే వెయ్యింటిని కొనుగోలు చేస్తున్నందున పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు తప్ప నిర్దిష్ట ప్రతిపాదనలేవీ లేవు. వివిధ దేశాల నుంచి విడిభాగాలను తెచ్చి చైనాలోని కమర్షియల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ తొలిసారి స్వంతంగా వాణిజ్య విమానాలను తయారు చేసింది. చైనా ప్రభుత్వం 490 కోట్ల డాలర్లను సమకూర్చగా 2007లో శ్రీకారం చుట్టి 2015లో నమూనాను రూపొందించి 2022లో 164 మంది కూర్చునే తొలి చిన్న విమానాన్ని తయారు చేశారు. అది 2023 మే నెలలో తొలి ప్రయాణం చేసింది. షాంఘై-చెంగ్‌డు నగరాల మధ్య తిరుగుతున్నది.


స్వంత తయారీ సి 919తో బోయింగ్‌, ఎయిర్‌ బస్‌ కంపెనీలకు చైనా సవాలు విసిరింది. పశ్చిమ దేశాలతో సంబంధాలు దిగజారుతున్న పూర్వరంగంలో ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నవాటిని నిలిపివేసి స్వంతంగా తయారు చేసుకొనేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్దం చేసుకున్నది. దీని వలన ఖర్చు తక్కువతో పాటు ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అగత్యం కూడా తప్పుతుంది. మన దేశం వెయ్యి విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే చైనా స్వంత తయారీ సి919 విమానాలు 1,200 కావాలని అక్కడి విమాన సంస్థలు ఆర్డర్లు పెట్టాయి. అందువలన చైనాకు దిగుమతులతో పనిలేదు.రానున్న ఐదు సంవత్సరాల్లో 150 రకాల విమానాల తయారీకి నమూనాలను సిద్దం చేశామని, ఉత్పత్తిని ప్రతి ఏటా పెంచుతామని చైనా కంపెనీ కోమాక్‌ ప్రకటించింది.అది ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న సరకుల మాదిరి విమానాలను కూడా ఎగుమతి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మన దేశంలో అలాంటి మేకిన్‌ ఇండియా విమానం సాకారం కావాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఊహించుకోవాల్సిందే.

ఐరాస ఘోర వైఫల్యం – వీటోలతో ఇజ్రాయెల్‌ మారణకాండకు అమెరికా దన్ను !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో శాంతి, దేశాల భద్రత కాపాడేందుకు, మారణకాండలను నివారించేందుకు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్యసమితి వైఫల్యం మరోసారి వెల్లడైంది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ నివారణలో భాగంగా గాజాలో దాడులు నిలిపివేయాలని కోరే తీర్మానాలను భద్రతా మండలిలో అమెరికా అడ్డుకుంది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని, అందువలన అది చేస్తున్న దాడులు సమర్ధినీయమే అంటూ అమెరికా తెచ్చిన తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేశాయి. దాడులను నిరసిస్తూ మెజారిటీ ఆమోదించిన ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం దేనికీ కొరగాకుండా పోయింది. 1948లో ఐరాస చరిత్రలో ఐరాస సాధించిన విజయం ఇది అని చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సందర్భంలో శాంతి పరిరక్షక దళాల మాటున హైతీలో కలరా బాక్టీరియాను విస్తరింపచేసిన దుర్మార్గానికి అది పాల్పడటాన్ని చరిత్ర మరచిపోదు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాల ఏర్పాటును విజయంగా కొందరు వర్ణిస్తారు. అంతిమంగా సాధించింది ఏమిటన్నదే గీటురాయి. ఇప్పటి వరకు గడచిన ఏడున్నర దశాబ్దాలలో వివిధ ప్రాంతాలు, దేశాల్లో ఇరవైలక్షల మంది శాంతి దళాలను ఏర్పాడు చేశారు. వివిధ దేశాల్లో జరిగిన దాడులు, ప్రతిదాడుల ఉదంతాల్లో 4,200మందికి పైగా ఈ దళాల్లోని సైనికులు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్‌-అరబ్‌ కాల్పుల విరమణ ఒప్పందాల అమలును పరిరక్షించేందుకు 1948లో భద్రతా మండలి అక్కడకి శాంతి పరిరక్షక దళాలను పంపాలని నిర్ణయించింది. అవి చేసిందేమీ లేకపోగా తరువాత యూదు దురహంకారులు ఇరుగు పొరుగుదేశాల మీద, పాలస్తీనా ప్రాంతాల మీద దాడులు చేసి వాటిని అక్రమించుకుంటూనే ఉన్నారు. సాధారణ జనాన్ని అణచివేస్తున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఐరాస చేసిందేమీ లేదు.


ప్రచ్చన్న యుద్ధం వలన ప్రపంచంలో శాంతి కొరవడిందని అనేక మంది చెబుతారు, దానికి సోవియట్‌ యూనియనే అని కూడా నిందించేవారు లేకపోలేదు.దాన్ని 1990 దశకంలో విచ్చిన్నం చేశారు.అప్పటికి వివిధ ప్రాంతాల్లో పదకొండు వేల మంది శాంతిపరిరక్షణ దళాలు ఉన్నాయి. పదహారు చోట్ల 2014నాటికి లక్షా 30వేలకు పెరిగారు. దీనికి అమెరికా దాని మిత్రదేశాలే కారణం.ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య ప్రాంతంలో పన్నెండు సమస్యాత్మక ప్రాంతాల్లో 87వేల మంది పని చేస్తున్నారు.ఘోరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాల్సి వస్తే 1994లో ఆఫ్రికా దేశమైన ర్వాండాలో టుట్సీ-హుటు తెగల మధ్య తలెత్తిన హింసాకాండను నివారించటంలో చేతులెత్తేసింది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది ప్రాణాలు పోయాయి.ఐరోపాలో 1995లో జరిగిన బోస్నియా దాడుల్లో ఎనిమిదివేల మంది ముస్లింలను చంపివేసినా చేసిందేమీ లేదు. 1950దశకంలో ఉత్తర కొరియా మీద జరిపిన దాడుల్లో పదిహేను లక్షల మందికి పైగా మరణించగా ప్రతిదాడుల్లో దాదాపు పది లక్షల మంది దక్షిణ కొరియన్లు చనిపోయారు. దీనికి ఐరాస చేసిన నిర్ణయమే కారణం. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాకు బదులు కొద్ది మంది తిరుగుబాటుదార్లతో తైవాన్‌లో తిష్టవేసిన ప్రభుత్వానికి బదులు ప్రధాన భూభాగంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నే గుర్తించాలని కోరుతూ సోవియట్‌ యూనియన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది. దాంతో తాము 1950జనవరి 13నుంచి ఐరాసను బహిష్కరిస్తున్నట్లు సోవియట్‌ ప్రకటించింది. సరిగ్గా ఆ సమయంలో ఉత్తర కొరియా దురాక్రమణకు పాల్పడిందనే సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందటంతో ఉత్తర కొరియా మీద దాడి జరిగింది.దాంతో సోవియట్‌, చైనా రెండూ ఉత్తర కొరియా రక్షణకు రంగంలోకి దిగాయి.1953లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతోంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ జరగలేదు. ఉభయ కొరియాల విలీనానికి ఇంకా తగిన తరుణం రాలేదనే పేరుతో అమెరికా ఇతర దేశాలు అడ్డుపడుతున్నాయి. చైనాలో తైవాన్‌ ఒక రాష్ట్రం తప్ప దేశం కాదంటూ ఐరాస గుర్తించి అంతకు ముందు దానికి ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టు చైనాను గుర్తించి నాలుగు దశాబ్దాలు దాటినా తైవాన్‌ విలీనం బలవంతంగా జరగకూడదు అంటూ దానికీ అడ్డుపడుతున్నారు. ఒక దేశంగా పరిగణించి ఆయుధాలు పెద్ద ఎత్తున అందచేస్తూ చైనా మీద తిరుగుబాటుకు మద్దతు ఇస్తున్నారు. ఇలా తాను చేసిన తీర్మానాలను అమలు జరిపేందుకు తరువాత తానే వెనక్కు తగ్గటం లేదా అసమర్ధంగా ఉండటం, ఇతర అనేక అంశాల పరిష్కారంలో ఐరాస విఫలమైంది. వర్తమాన అంశం పాలస్తీనాలో జరుగుతున్నది కూడా అదే.


ఆత్మరక్షణ పేరుతో గాజాలో సాధారణ పౌరుల మీద వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న హత్యాకాండ నివారణను అడఐర్డుకొనే వారే లేరా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతి రోజూ పిల్లలు, మహిళలతో సహా వందలాది మందిని చంపివేయటాన్ని ఆపాలని భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా ఇప్పటికే వీటో చేసి మరోసారి తానేమిటో ప్రపంచానికి వెల్లడించింది. శనివారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 3,826 మంది పిల్లలు, 2,405 మంది మహిళలతో సహా మొత్తం 9,227 మందిని ఇజ్రాయెల్‌ చంపింది. దీనికి పశ్చిమగట్టులో చేసిన హత్యలు అదనం. ఒక నిర్వాసిత శిబిరం, ఒక ఆసుపత్రి అని లేదు, జనం ఎక్కడ ఉంటే అక్కడ బాంబులు వేస్తూ మారణకాండ సాగిస్తున్నది. దానికి అమెరికా కూడా ప్రత్యక్షంగా పాల్గొని సాయం చేస్తున్నది. గాజా ప్రాంతం మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ మిలిటరీకి అవసరమైన సమాచారం అందించేందుకు గాజా ప్రాంతం మీద మానవరహిత డ్రోన్లను అమెరికా ఎగురవేస్తున్నది. హమస్‌ వద్ద బందీలుగా ఉన్న వారి కోసమే అలా చేస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నిర్ధారించింది. మానవతా పూర్వక చర్యగా కాల్పులను విరమించాలన్న తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా ఏ అధికారంతో ఈ పని చేస్తున్నది. దానికి భద్రతా మండలి తీర్మానం లేదా మరొకటి లేదు. ఇది అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. బందీలను విడుదల చేయించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సింది ఐరాస. రోజూ వందల మందిని హతమారుస్తుంటే అది తీసుకున్న చర్యలేమీ లేవు. బందీల ప్రాణాలెంత విలువైనవో పాలస్తీనా అమాయక పౌరుల ప్రాణాలు కూడా అంతే విలువైనవి కాదా ! డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది తప్ప మెరుగుపడుతుందా ?


ఐరాస చేసిన తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనాను అడ్డుకోవటమే గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న అణచివేత-ప్రతిఘటనకు మూలం. దీనిపై భద్రతా మండలి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతి నెలకొనేందుకు, ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ, పాలస్తీనాకు మద్దతుగా ప్రవేశపెట్టిన 42 తీర్మానాలను పాఅమెరికా వీటో చేసింది. ఇప్పటి వరకు భద్రతా మండలి చరిత్రలో అమెరికా చేసిన మొత్తం వీటోలే 83 కాగా సగానికి పైగా ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు ప్రయోగించిందంటే అమెరికా దుర్మార్గం ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు. యూదు దురహంకారులను సమర్ధిస్తూ ప్రవేశపెట్టిన మరో రెండింటిని రష్యా, చైనా అడ్డుకున్నాయి.లెబనాన్‌పై దాడి, సిరియా గోలన్‌ గుట్టలను ఆక్రమించుకోవటంతో సహా ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉన్న మొత్తం 46 తీర్మానాలను అమెరికా అడ్డుకున్నది. దుర్మార్గం ఏమంటే జరూసలెం నగరాన్ని తటస్థంగా ఉంచుతూ ఐరాస చేసిన నిర్ణయాన్ని ఉల్లంఘించి ఆక్రమించుకొని తమ రాజధాని అని ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. దాన్ని అమెరికా 2017లో గుర్తించింది.ఐరాస తీర్మానాలకు అనుగుణంగా దాని భవిష్యత్‌ నిర్ణయం జరగాలని భద్రతా మండలిలో 14దేశాలు ఓటు వేస్తే అమెరికా వీటో చేసింది.1991 నుంచి 2011 కాలంలో అమెరికా 24 వీటోలు చేయగా వాటిలో 15 ఇజ్రాయెల్‌కు కాపు కాసేందుకే. పాలస్తీనా ప్రాంతాల్లో మారణకాండకు పాల్పడుతున్నది ఇజ్రాయెల్‌ మిలిటరీ, ఉగ్రవాదులు అయినప్పటికీ వారిని వెనుక ఉండి నడిపిస్తున్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు గనుక అక్కడ చిందే ప్రతి రక్తపు బొట్టుకూ బాధ్యతనుంచి తప్పించుకోలేవు.


గతం, వర్తమాన పరిణామాలను చూస్తున్నపుడు ఐరాసను ఒక ప్రజాస్వామిక సంస్థగా మార్చేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమన్నది స్పష్టం.లక్ష మంది జనాభా ఉన్న కరీబియన్‌ ప్రాంత దేశమైన సెయింట్‌ విన్సెంట్‌, నూటనలభై కోట్ల జనాభా ఉన్న భారత, చైనాలు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఒక్కో ఓటును మాత్రమే కలిగి ఉంటాయి. అది ప్రజాస్వామ్య బద్దమే అయినప్పటికీ అక్కడ చేసే తీర్మానాలకు ఎలాంటి విలువా ఉండదు. పదిహేను మంది ప్రతినిధులు ఉండే భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానాన్ని 14 మంది ఆమోదించినా ఐదు శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్కటి కాదన్నా దానికీ అదే గతి పట్టటం పెద్ద లోపం. ఇజ్రాయెల్‌ దుర్మార్గం, క్యూబాపై అమెరికా అమలు జరుపుతున్న అష్టదిగ్బంధనాన్ని ఖండిస్తూ ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తున్నా జరుగుతున్నదేమీ లేదు. గాజాలో జరుపుతున్న దాడులను మానవతా పూర్వకంగా నిలిపివేయాలని సాధారణ అసెంబ్లీలో 121 దేశాలు అనుకూలంగా, 14 వ్యతిరేకంగా ఓటు చేయగా మనతో సహా 44 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన నాలుగు తీర్మానాలను అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ దాడులు చేసే హక్కుందని అమెరికా తెచ్చిన తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకున్నాయి.


మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత ఏర్పడిన నానాజాతి సమితిలో భద్రతా మండలి మాదిరి వ్యవస్థలో ఉన్న 15 సభ్యదేశాలకూ వీటో హక్కు ఉండటంతో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేక అది ఘోరంగా విఫలం కావటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా అడ్డుకోలేకపోయింది.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత విజేతలుగా ఉన్న దేశాల ప్రమేయంతో ఏర్పడిందే ఐరాస. 1945లో అది ఉనికిలోకి వచ్చినపుడు అమెరికా, సోవియట్‌యూనియన్‌,చైనా, బ్రిటన్‌, ఫ్రాన్సులకు వీటో హక్కు కల్పించారు. తొలి రోజుల్లో ఐరాస సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలిలో అమెరికా, పశ్చిమ దేశాల అనుకూలురే ఎక్కువ.దాంతో వారికి అనుకూలమైన తీర్మానాలను సోవియట్‌ అడ్డుకుంది. 2022 మే నెల వరకు సోవియట్‌ , తరువాత దాని వారసురాలిగా ఉన్న రష్యా 121సార్లు, అమెరికా 83, బ్రిటన్‌ 29, చైనా 17, ఫ్రాన్సు 16సార్లు వీటోను ప్రయోగించాయి. వీటో హక్కు ప్రజాస్వామ్య బద్దం కాదన్నది నిజమే అయినప్పటికీ అది లేకపోతే తొలి రోజుల్లో తమ కూటమికి ఉన్న బలంతో మొత్తం ప్రపంచాన్ని అమెరికా తనపెత్తనం కిందకు తెచ్చుకొని ఉండేది. ఇప్పుడు మెజారిటీ దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నందున ప్రజాస్వామిక అభిప్రాయాన్ని అడ్డుకొనేందుకు వీటోను ఆయుధంగా చేసుకుంటోంది. అందుకే పైకి ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో ఐరాస సంస్కరణలకూ అది ససేమిరా అంటున్నది.