సాగు చట్టాల పునరుద్దరణకు కొత్త ఎత్తుగడ – ఆందోళన పేరుతో బికెఎస్‌ను దించిన ఆర్‌ఎస్‌ఎస్‌ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అనేక మంది ఊహించినట్లుగానే సాగు చట్టాల పునరుద్దరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తనదైన శైలిలో రంగంలోకి దిగింది. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలంటూ దాని అనుబంధ భారతీయ కిసాన్‌ సంఫ్‌ు(బికెఎస్‌) జనవరిలో ఆందోళన చేస్తామని ప్రకటించింది. రద్దు చేసిన చట్టాలు 90శాతం రైతులకు లబ్ది చేకూర్చుతాయని, ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోవాలని కోరుకున్న వారికి సంతోషం కలగటం తప్ప రద్దు తరువాత రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నది. అందువలన కొన్ని మార్పులతో తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని కోరుతూ తాము దేశవ్యాపిత ఆందోళన చేస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి ప్రకటించారు. జై జవాన్‌-జైకిసాన్‌ పిలుపు ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి రోజైన జనవరి 11న దేశమంతటా తహసీల్దారు కార్యాలయాల ముందు నిరసన, బహిరంగ సభలు జరుపుతామని వెల్లడించారు. అంతకు ముందు ఒకటవ తేదీ నుంచి పది వరకు గ్రామగ్రామాన రైతులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం సాగించామని చెబుతున్న ఉద్యమం సాధించిందేమీ లేదని, తొలుత తాము కూడా దానికి మద్దతు ఇచ్చామని తరువాత హింసా కాండ, దేశ. సంఘ వ్యతిరేక చర్యల కారణంగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ గతంలో 20వేల గ్రామాల నుంచి వినతులు పంపామని, 513 జిల్లాల్లో సెప్టెంబరు ఎనిమిదిన ధర్నాలు చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


మూడు సాగు చట్టాల్లో మార్పుల్లో భాగంగా కనీస మద్దతు ధరలకు హామీతో సహా కొనుగోలు దార్ల నమోదుకు ఒక పోర్టల్‌, రైతుల ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ సవరించాలని కోరుతున్నామన్నారు. తమ సంఘం సన్న, చిన్నకారు రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని రద్దైన చట్టాలు 90శాతం మంది రైతులకు మేలు చేసేవన్నారు. వాటి రద్దు తమకు ఆశ్చర్యం, ఆశాభంగం కలిగించిందని,విచ్చిన్నం, హింసను సృష్టించిన వారి మాటలనే ప్రభుత్వం వినటం, తమ వంటి శాంతియుత, ప్రజాస్వామికంగా ఉండే వారు చెప్పేవాటిని పట్టించుకోకపోవటం విచారకరమని చెప్పారు. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం దేశమంతటా రైతులకు తోడ్పడేదిగా లేదన్నారు. ఎంఎస్‌పిగా ఇస్తున్న మొత్తాలు నైపుణ్యం లేని కార్మికులకు సైతం చాలదని గిట్టుబాటు ధర ఇవ్వాలని సంఫ్‌ు జాతీయ కార్యదర్శి కె.శాయిరెడ్డి చెప్పారు.రైతులకు గిట్టుబాటు కావాలంటే సహజ వ్యవసాయ పద్దతులు అనుసరించాలని రసాయన ఎరువుల బదులు ఆవు పేడ వంటి వాటిని వాడాలన్నారు.


బికెఎస్‌ నేతలు గత ఏడాది కాలంగా ఉద్యమించిన రైతుల మీద బిజెపి మోపిన నిందలనే మరోసారి పునశ్చరణ కావించించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి బిజెపి, కేంద్ర మంత్రులు చేసిన ఆరోపణలు, నిందలకు తందాన తాను అంటూ వాటినే బికెఎస్‌ వల్లె వేసింది. ఆ సంస్ధ ఇప్పుడు చెబుతున్న అంశాల మీదనే వేరు దుకాణం పెట్టి ఆందోళన చేసి ఉంటే అదొక తీరు. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. పోనీ వారు చేసిన పోరాటం లేదా ఆరాటం నిజంగా జరిగి ఉంటే మోడీ సర్కార్‌ సదరు అంశాలకు సానుకూలంగా ఎందుకు మాట్లాడలేదు ? ఎంఎస్‌పికి చట్టబద్దతకు ఇప్పటికీ కేంద్రం ఆమోదం చెప్పకుండా కమిటీ వేసి పరిశీలిస్తామని అంటోంది. కొన్ని మార్పులతో పాత వాటినే పునరుద్దరించాలని బికెఎస్‌ చెప్పటం వెనుక ఉన్న ఎత్తుగడ, ప్రభుత్వ హస్తం గురించి తెలియనంత అమాయకంగా ఇప్పుడు రైతులు లేరు. ఏడాది పాటు ఉద్యమం సాగిన సమయంలో బికెఎస్‌ వ్యవహరించిన తీరు, ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను సమీకరించేందుకు చేసిన విఫల యత్నాలు ఎవరికి తెలియనివి. అవన్నీ విఫలం అయిన కారణంగానే తప్పనిసరై మోడీ వెనక్కు తగ్గారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బికెఎస్‌ చెబుతున్నవి కొత్త ప్రతిపాదనలేమీ కాదు, ఎంఎస్‌పికి చట్టబద్దత కుదరదంటే కుదరదని ఏడాది పాటు మొండికేసిన మోడీ ఇప్పుడు సానుకూలంగా ఉండేట్లయితే కమిటీ పేరుతో కాలయాపన ఎందుకు ? బికెఎస్‌ను ఏర్పాటు చేసిందే ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది బహిరంగ రహస్యం. మరణించేంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్‌ టేంగిడీ 1979లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక ఆందోళనకు పోటీగా బిజెపి రైతు సంపర్క యాత్రల పేరుతో తన మద్దతుదార్లను సమీకరించేందుకు అనేక చోట్ల విఫల యత్నం చేసింది. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్‌లో రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు పడని పాట్లు లేవు.డిసెంబరు 23వ తేదీ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ జన్మదినం సందర్భంగా బిజెపి ఎక్కడలేని శ్రద్ద చూపింది. చరణ్‌ సింగ్‌ కుటుంబ, రాజకీయ వారసులు ఆర్‌ఎల్‌డి పార్టీలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీని గద్దె దించేందుకు సమాజవాది పార్టీతో జతకట్టారు. చరణ్‌ సింగ్‌ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా బిజెపి పాటించింది.లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజయ మిశ్రా తనయుడు, అనుచరులు చేసిన దుర్మార్గంతో అవన్నీ కొట్టుకపోయాయి. బిజెపి నేతలు గ్రామాలకు వెళ్లలేని స్ధితి కొన్ని చోట్ల ఏర్పడింది. దాని సెగ ఎంతగా ఉందంటే ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలతో జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బికెఎస్‌ను రంగంలోకి దించారు.


లఖింపూర్‌ ఖేరీలో పధకం ప్రకారమే రైతుల మీదకు మోటారు వాహనాలను నడిపి హత్యచేసినట్లు విధిలేని పరిస్ధితిలో దర్యాప్తు సంస్ధ కూడా నివేదిక ఇచ్చింది. ఆ ఉదంతం గురించి బికెఎస్‌ నేతలు చెప్పిందేమిటి ? తమ మీదకు వాహనాలు నడిపి తోటి వారిని చంపి దొరికిన హంతకులను రైతులు రాచమర్యాదలలో సాగనంపుతారా ? వారు రైతులు కాదు, హత్యలే రోజువారీ పనిగా ఉన్న వారని, వామపక్ష పద్దతుల్లో చేశారని, గుమికూడిన వారు రాజకీయ పార్టీల మద్దతుదారులు తప్ప రైతులు కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని నిందిస్తూనేే జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని సన్నాయి నొక్కులు నొక్కింది. పధకం ప్రకారం జరిపిన హత్యాకాండను ఘర్షణలు అని వర్ణించింది. రైతుల మీదకు కార్లను తోలి చంపిన బిజెపి మద్దతుదారులు అమాయకులన్నట్లు, రైతులు హంతకులైనట్లు చిత్రించటం రైతు సంఘం పేరుతో ఊరేగుతున్నవారికి తగినపనేనా ? ఇంతగా నిందించిన వారు చట్టాలను పునరుద్దరించాలని రోడ్లెక్కుతామనటంలో ఆశ్చర్యం ఏముంది ! బిజెపికి కార్పొరేట్లు అందచేస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులతో రైతుల ముసుగులో తన మద్దతుదార్లను సమీకరించి కృత్రిమ ఆందోళనలు చేయించినా ఆశ్చర్యం లేదు.

సైన్సు పరిశోధనలు : అవని చుట్టూ ఇతర జనం – ఆవు చుట్టూ మనం !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఉన్నత స్ధాయిలో ప్రామాణికంగా పేర్కొన్న పరిశోధకుల పేర్లతో లండన్‌లోని శాస్త్ర సమాచార సంస్ద, క్లారివేట్‌ రూపొందించిన 6,602 మంది వివరాలను పరిశీలించినపుడు అమెరికా ప్రధమ స్థానంలో, తరువాత చైనా ఉంది. డెబ్బయి దేశాలకు చెందిన వారితో 2021నవంబరు 16న ఈ వివరాలను ప్రకటించారు. తొలి ఐదు దేశాలకు చెందిన వారు 71.4శాతం మంది కాగా, మొదటి పది దేశాలను తీసుకుంటే 82.9శాతం ఉండటాన్ని బట్టి కేంద్రీకరణను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 2,622, చైనాలో 935 మంది ఉన్నారు. గత పది సంవత్సరాలలో తమ పరిశోధనలతో గణనీయ ప్రదర్శన, ప్రచురించిన పత్రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. వీరిలో 3,774 మంది ఒక నిర్ణీత రంగంలో, 2,828 మంది ఒకటి కంటే ఎక్కువ రంగాలలో పరిశోధనలు చేస్తున్నవారు ఉన్నారు. మూడవ స్ధానంలో ఉన్న బ్రిటన్‌కు చెందిన వారు గత మూడు సంవత్సరాల్లో తగ్గి 492 లేదా 7.5శాతంగా ఉన్నారు. జర్మనీని అధిగమించి ఆస్ట్రేలియన్లు 332 మంది నాలుగో స్ధానంలో, 331 మందితో జర్మనీ ఐదవ, నెదర్లాండ్స్‌(207, కెనడా(196), ఫ్రాన్స్‌ 146) స్పెయిన్‌(109), స్విడ్జర్లాండ్‌(102)తో తొలి పదిస్దానాల్లో ఉన్నాయి.

గతంతో పోల్చితే అమెరికన్లు 2014లో 55శాతం, 2018నాటికి 43.3, 2021కి 39.7శాతానికి తగ్గారు. చైనీయులు 2018లో 7.9శాతం కాగా 2021కి 14.2కు పెరిగారు.చైనాలో 2014లో కేవలం 122 మంది మాత్రమే ఉన్నారు. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనీయుల పెరుగుదల, అమెరికన్ల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్‌ విశ్లేషకుడు డేవిడ్‌ పెండెల్‌బరీ అన్నాడు. బ్రిటన్‌లో పరిశోధన తగ్గుతున్నది. హాంకాంగ్‌లో ఒక ఏడాది కాలంలోనే పరిశోధకుల సంఖ్య 40 నుంచి 79కి పెరిగింది.తొలిసారిగా బంగ్లాదేశ్‌, కువైట్‌, మారిషస్‌, మొరాకో, జార్జియా ఈ జాబితాకు ఎక్కాయి. క్లారివేట్‌ సంస్ధ దేశాల జనాభా సంఖ్య-శాస్త్రవేత్తలతో పోల్చింది.నూట ముఫ్పై ఎనిమిది కోట్ల మంది ఉన్న భారత్‌లో 22 మంది,22.1 కోట్ల మంది ఉన్న పాకిస్ధాన్‌ నుంచి ఐదుగురు, 27.3 కోట్ల మంది ఉన్న ఇండోనేషియా నుంచి ఒక్కరు ఉన్నట్లు పేర్కొన్నది. ఇండోనేషియా నుంచి ఉన్న ఒక్కరు కూడా మహిళ కావటం విశేషం.ఆమె బయోఫ్యూయల్‌ మీద పరిశోధనలు చేస్తున్నారు. సంస్ధల వారీగా చూస్తే 1,300లో శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు.హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 214 మందితో అగ్రస్ధానంలో ఉంటే చైనా సైన్స్‌ అకాడమీ 194 మందితో రెండవ స్ధానంలో, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 122 మందితో తృతీయ స్ధానంలో ఉంది. యాభై అగ్రశ్రేణి సంస్ధలలో 28 అమెరికాలో, ఐదు బ్రిటన్‌, నాలుగేసి చైనా,ఆస్ట్రేలియాలో సింగపూర్‌, సౌదీ అరేబియాలో రెండేసి, హాంకాంగ్‌, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్‌, బెల్జియంలలో ఒక్కొక్కటి ఉన్నాయి.


పరిశోధనారంగంలో వివిధ దేశాలు పోటీ పడుతున్నతీరును చూశాము.ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది మరొకదారి అన్నట్లుగా మనం ఉన్నాం.నరేంద్రమోడీ సర్కార్‌ గత ఏడున్నర సంవత్సరాల్లో ఈ రంగానికి అందించిన ప్రోత్సాహంతో మనంపైన పేర్కొన్న పరిశోధకుల్లో 22 మందైనా ఉన్నారని భక్తులు భజనకు దిగవచ్చు.పరిశోధనలు, నవకల్పనల పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. దేశీయ ఆవుల అద్వితీయత,వాటి పాలు, పేడ, మూత్రంలో ఉన్న రోగనిరోధకత లేదా కాన్సర్‌తో సహా రకరకాల వ్యాధులను నయం చేసే గుణాల గురించి పరిశోధించాలని మన కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది అశాస్త్రీయం, నిధులను దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐదు వందల మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా వెనక్కు తగ్గలేదు. విశ్వాసాల ప్రాతిపదికన ముందుకు తెస్తున్న కుహనా సైన్సును సక్రమమైనదిగా చెల్లుబాటు చేసే యత్నమని పేర్కొన్నారు. హౌమియోపతి, అల్లోపతి, నేచురోపతి వంటి వాటి సరసన కౌపతిని చేర్చేందుకు పూనుకున్నారు. ఆవు మూత్రం, పాలు, పేడలతో చీడపీడల నివారణ మందులు, షాంపూలు, తలనూనెలు, నేలను శుభ్రం చేసే ద్రవాల వంటి వాటి తయారీకి పరిశోధనలు జరపాలని కేంద్రం నిధులు కేటాయించింది. పుక్కిటి పురాణాల్లో రాసిన ఊహాజనితమైన వాటిని రుజువు చేసేందుకు డబ్బు దుర్వినియోగం తప్ప మరొకటి కాదు.దీనికి ”సూత్రా-పిక్‌ అని పేరు పెట్టారు ఆవు మూత్రంతో తన కాన్సర్‌ మాయమైందని బిజెపి ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


కేంద్రం వెనక్కు తగ్గలేదు సరికదా ఆవు శాస్త్ర పధకాలను వేగంగా అమలు జరిపి 2021 ఆగస్టు పదిహేనున ప్రధాని ప్రసంగానికి ముందే పురోగతిని చూపాలని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ నెలలో ఆదేశించారు. అనుమతులు, నిధుల మంజూరులో ఎందుకు జాప్యం చేశారంటూ అధికారుల మీద మండిపడ్డారు. ఆలస్యానికి సాకులు చెబితే కుదరదని హెచ్చరించారు.ప్రధాని నరేంద్రమోడీకి దేశీయ ఆవులు ఎంతో ముఖ్యమని కూడా చెప్పారు. ఢిల్లీ ఐఐటి రూపొందించిన ఈ పధకంలో 2016 నుంచి ఎలాంటి పురోగతి లేదన్నారు.2017లో తొలుత పంచగవ్య సుగుణాలను శాస్త్రీయంగా నిరూపించాలని ఆదేశించారు. తరువాత 2020లో దాన్ని మరింత విస్తరించి కొత్త పధకంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెట్రోలు లేకుండా పైకీ కిందికీ, ఎందరెక్కినా ఒకరికి జాగా ఉండే పురాణాల్లోని విమానాలు,వినాయకుడు పాలు తాగాడు వంటి నమ్మకాలు, ఇతర ఊహలన్నింటినీ 2024 ఎన్నికల నాటికి ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాజక్టులుగా చేపట్టి నిర్ధారించమని నిధులు కేటాయించినా ఆశ్చర్యం లేదు.


పిండికొద్దీ రొట్టె అన్నారు పెద్దలు, కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు దుడ్డుగా ఉండాలి అంటే కుదరదని కూడా అదే పెద్దలు అన్నారు. వీటిని ఎవరు ఎలా వర్తింప చేస్తున్నారు ? చైనాతో పోటీ పడాలని, దేవుతలు కరుణిస్తే అధిగమించాలని మనం కోరుకోవటం తప్పుకాదు. స్టాటిస్టా డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2021లో పరిశోధన-అభివృద్ధికి గాను చైనా పెట్టుబడి 621.5బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా 598.7, జపాన్‌ 182.36, జర్మనీ 127.25, భారత్‌ 93.48 బి.డాలర్లు. ఈ మొత్తం నుంచే ఆవు పాలు, పేడ, మూత్ర పరిశోధనలు జరుగుతున్నాయి. మన జనాలకు తెలివితేటలేమైనా తక్కువా, సోమరిపోతులు మరొకటి కాదే. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి అదృష్టం కోసం ఎదురు చూసే బాపతు కూడా గణనీయంగా ఉన్నందున కాళ్లు, చేతులూ చూసే, జోశ్యాలు చెప్పే రకరకాల మోసగాండ్లు తామర తంపరగా పెరిగిపోతున్నారు. మన అప్పును నరేంద్రమోడీ 55 లక్షల కోట్ల నుంచి 130లక్షల కోట్లకు పెంచటం పట్ల చూపిన శ్రద్ద పరిశోధనకు కేటాయింపుల్లో లేదు. ఈ అంశంలో అంతకు ముందున్న వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌ సర్కార్లు కూడా ఇంతకు మించి పొడిచిందేమీ లేదు.

గేట్‌వేహౌస్‌ డాట్‌ఇన్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో జిడిపిలో మన పరిశోధన ఖర్చు 0.7శాతం ఉంటే 2012 నాటికి 0.8శాతం, ఇదే కాలంలో చైనా 0.9 నుంచి 1.8కి పెరిగింది. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2018లో చైనా 2.14శాతం, మన దేశం 0.65శాతం ఖర్చు చేసింది. రూపాయల్లో పెరుగుదల చూడండి అని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. వాటి విలువ సంగతేమిటని అడగాల్సి వస్తుంది. దేశభక్తి దేశభక్తి అని అరిస్తే,వేషాలు వేస్తే, ఇరుగు పొరుగుదేశాల గురించి కుట్ర సిద్దాంతాలతో జనాలను భయపెడితే, ఆ సాకుతో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే, గంజాయి దమ్ముకొట్టి ప్రగల్భాలు పలికినట్లు వారిని అధిగమిస్తాం వీరిని దాటిపోతాం, మా గత ఘనం చూడండి అంటే సరిపోతుందా ? కృత్రిమ మేథలో కొన్ని రంగాల్లో ఇప్పటికే అమెరికాను అధిగమించి, మొత్తంగా సవాలు విసురుతున్న చైనాతో పోల్చుకుంటే మనమెక్కడ ? నేచర్‌ ఇండెక్సు డాట్‌కామ్‌ ప్రకారం 2015-19 సంవత్సరాలలో అమెరికన్లు 7,020,బ్రిటీషర్లు 2,073, జర్మన్లు 1,756, చైనీయులు1,446 ఆర్టికల్స్‌ను ప్రచురిస్తే మొదటి 25లో 20వ స్దానంలో ఉన్న మనవారికి 192 మాత్రమే. మనం గొప్పగా చెప్పుకొనే ఆంగ్ల భాషా జ్ఞానం, సంస్కృత పరిజ్ఞానం ఏమైనట్లు ? ఆ రెండింటిలోనూ మనకంటే వెనుకబడిన చైనా శాస్త్ర పరిశోధనలో ఎందుకు ముందున్నట్లు ? ఇతర దేశాల జనం ప్రపంచాన్ని చుట్టి వస్తుంటే మనం ఆవుచుట్టూ తిరుగుతున్నాం ?తీవ్రంగా ఆలోచించాలా వద్దా ?

చిలీలో వామపక్ష చారిత్రక విజయం – ఎదురయ్యే సవాళ్లు !

Tags

, , ,



ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మరో ఐదుగురు మిగతా ఓట్లను పంచుకున్నారు. నిబంధనల ప్రకారం విజేత 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. దాంతో తొలి ఇద్దరి మధ్య డిసెంబరు 19 పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నవంబరు 21నే పార్లమెంటు ఉభయ సభలు, 15-17 తేదీలలో స్ధానిక సంస్దల ఎన్నికలు కూడా జరిగాయి. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అధ్యక్షపదవి పోటీకి 35 సంవత్సరాలు నిండాలి. అది నిండిన తరువాత ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 11న పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి 36వ పడిలో ప్రవేశిస్తాడు.


1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు. గత పది సంవత్సరాలలో అనేక ఉద్యమాలు జరగటంతో నూతన రాజ్యాంగ రచనకు జరిగిన రాజ్యాంగపరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష వాదులు, వారిని బలపరిచేవారే ఎక్కువ మంది గెలిచారు. దాని కొనసాగింపుగా జరిగిన ఎన్నికల్లో గాబ్రియెల్‌ బోరిక్‌ విజయం సాధించాడు. పార్లమెంటు ఎన్నికల్లో దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.


నయా ఉదారవాద విధానాలు లాటిన్‌ అమెరికా జనజీవితాలను అతలాకుతలం చేశాయి. సంపదలన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటంతో ఆర్ధిక అంతరాలు పెరిగి సామాజిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఆ విధానాలను వ్యతిరేకించే-సమర్ధించేశక్తులుగా సమాజం సమీకరణ అవుతోంది.గడచిన రెండు దశాబ్దాల్లో వామపక్ష శక్తులు ఎదిగి విజయాలు సాధించటం వెనుక ఉన్న రహస్యమిదే. ఆ విధానాలను సంపూర్ణంగా మార్చకుండా జనానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలకు మాత్రమే పరిమితమైతే చాలదని ఆ దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదారవాద మౌలిక వ్యవస్ధలను అలాగే కొనసాగిస్తే ఫలితం లేదని, ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా తేలింది. చిలీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న నాలుగు పార్టీల కూటమి చిలీ డింగో తన అభ్యర్ధిగా కమూనిస్టు డేనియల్‌ జాడ్యూను ప్రకటించింది. తరువాత జరిగిన పరిణామాల్లో బోరిక్‌ నేతగా ఉన్న కన్వర్జన్స్‌ పార్టీతో సహా ఐదు పార్టీల కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌, చిలీ డింగో ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరించి ” మర్యాదకు మన్నన” అనే అర్దం ఉన్న అప్రూవ్‌ డిగ్నిటీ అనే కూటమి ఏర్పాటు చేశాయి. అభ్యర్ధిగా బోరిక్‌ను ఎన్నుకున్నారు. చిలీ రాజకీయాల్లో ఉన్న పరిస్ధితుల్లో వివిధ పార్టీల కూటములు తప్ప ఒక పెద్ద పార్టీగా ఎవరూ రంగంలోకి దిగలేదు.


సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. ఉదారవాద విధానాలను అణచివేసేందుకు గత పాలకులు స్వజనం మీదనే మిలిటరీని ప్రయోగించారని అటువంటిది మరోసారి పునరావృతం కాదని అన్నాడు.ప్రస్తుత అధ్యక్షుడు పినేరా 2019లో మిలిటరీని దించి జనాన్ని అణచివేశాడు.


అధ్యక్షపదవిలో వామపక్షవాది విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మితవాదులే అత్యధికంగా గెలవటం ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నది.1973లో సాల్వెడోర్‌ అలెండీ మీద అమెరికా సిఐఏ అండతో చేసిన కుట్రలో పార్లమెంటులోని మెజారిటీ మితవాదశక్తులు ఒక్కటయ్యాయి. ఇప్పుడు అనేక దేశాలు వామపక్ష శక్తులకు పట్టంగట్టటం మొత్తం ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్న తరుణంలో చిలీలో ఉన్న మితవాద శక్తులు ఎలా స్పందిస్తాయో ఎవరూ చెప్పలేరు. మరోసారి 1973 పునరావృతం అవుతుందా అంటే సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించక తప్పదు.పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే, రెండు పచ్చి మితవాద కూటములకు 105వచ్చాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. ఈ నేపధ్యంలో వామపక్ష అధ్యక్షుడికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పనవసరం లేదు. నయా ఉదారవిధానాలను జనం ప్రతిఘటించిన చరిత్ర, లాటిన్‌ అమెరికాలో ఉన్న వామపక్ష ప్రభుత్వాల మద్దతు ఉన్న పూర్వరంగంలో మితవాదశక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. అవసరమైతే జనం మరోసారి వీధుల్లోకి వస్తారు.


తొలి రౌండులో ఆధిక్యత సాధించిన మితవాదులు తమదే అంతిమ గెలుపు అని భావించారు. సర్వేలన్నీ పరిస్ధితి పోటాపోటీగా ఉంటుందని, ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్దేశించేదేనని చెప్పాయి. ఈ కారణంగానే మితవాద అభ్యర్ది జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మెజారిటీ 50వేలకు అటూఇటూగా ఉంటే ఫలితాన్ని న్యాయ స్దానాలే తేల్చాలని మరీ చెప్పాడు. కాస్ట్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం బోరిక్‌ మద్దతుదార్లుగా ఉన్న పేద, మధ్యతరగతి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా చూసేందుకు ఎన్నికల రోజున రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రజారవాణాను గణనీయంగా నిలిపివేసింది. అయినా ఓటర్లు గత అన్ని ఎన్నికలంటే ఎక్కువగా 55.4శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు నెలకొల్పారు. మితవాదులు, వారికి మద్దతుగా ఉన్న మీడియా దీన్ని ఊహించలేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో 46.7,41.98శాతాల చొప్పున ఓటింగ్‌ జరిగింది. గత పదేండ్లుగా ఉద్యమించిన యువత తమ నేతకు పట్టం కట్టాలని మరింత పట్టుదలతో పని చేశారు. మరో వెనెజులా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఓటర్లు ఖాతరు చేయ లేదు. ఇలాంటి ప్రచారాలను మిగతా దేశాల్లో కూడా చేసినా అనేక చోట్ల ఓటర్లు వామపక్షాలకు పట్టం కట్టటాన్ని చిలీయన్లు గమనించారు. రెండవ దఫా ఎన్నికల్లో మితవాద శక్తులు వామపక్షాలను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ఉసిగొల్పినా బోరిక్‌ ఎంతో సంయమనం పాటించాడు. మాదక ద్రవ్యాలకు బానిస అంటూ టీవీ చర్చలు, సామాజి మాధ్యమాల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఒక టీవీ చర్చలో బోరిక్‌ తిప్పి కొడుతూ ప్రత్యర్దుల నోరు మూతపడేలా ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదంటూ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించి నోరు మూయించాడు. గత ఏ ఎన్నికలోనూ ఈసారి మాదిరి దిగజారుడు ప్రచారం జరగలేదని విశ్లేషకులు చెప్పారు.


చిలీ ఆర్ధిక స్ధితి సజావుగా లేదు. బోరిక్‌ విజయవార్తతో స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. సోమవారం నాడు ఒమిక్రాన్‌, తదితర కారణాలతో లాటిన్‌ అమెరికా కరెన్సీ ఐదుశాతం పడిపోతే చిలీ పెసో 18శాతం దిగజారింది. కొత్త ప్రభుత్వం మార్కెట్‌ ఆర్ధిక విధానాల నుంచి వైదొలగనుందనే భయమే దీనికి కారణం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో 22శాతం కోత విధించాలన్న ప్రతిపాదనను తాను గౌరవిస్తానని బోరిక్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అతనికి తెలియనట్లు అని పిస్తోందని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఒకశాతం మంది ధనికుల చేతిలో దేశంలోని సంపదలో నాలుగో వంతు ఉంది. మితవాది కాస్ట్‌ తాను గెలిస్తే పన్నులతో పాటు సామాజిక సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తానని బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. దానికి భిన్నంగా ధనికుల మీద అధికపన్నులు వేస్తామని, సంక్షేమానికి పెద్ద పీటవేస్తామని చెప్పాడు. పెన్షన్‌ సొమ్ముతో ఇప్పటి మాదిరి పెట్టుబడిదారులు లాభాలు పొందకుండా పెన్షనర్లకు ఫలాలు దక్కేలా చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేశంలో విద్యా, వైద్యం, రవాణా వంటి సేవలన్నీ కొనుగోలు చేసే వినిమయ వస్తువులుగా గత పాలకుల ఏలుబడిలో మారిపోయాయి.2018లో మెట్రో చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది.అది చివరకు మితవాద ప్రభుత్వాన్ని దిగివచ్చేట్లు చేసింది. దాని నేతలలో గాబ్రియెల్‌ బోరిక్‌ ఒకడు. అందువలన సహజంగానే యువత పెద్ద ఆశలతో ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇక ముందు జరగనున్నది మరొకటి.ఎన్నికలు రసరమ్యమైన కవిత్వంలా ఉంటాయని పాలన దానికి భిన్నమైన వచనంలా ఉంటుందనే నానుడిని కొందరు ఉటంకిస్తూ బోరిక్‌ ఎలా పని చేస్తారో చూడాలని చెప్పారు.తాను పుట్టక ముందు 1973లో సాల్వడార్‌ అలెండీపై జరిగిన కుట్ర చరిత్రను గమనంలో ఉంచుకొని సామ్రాజ్యవాదుల పన్నాగాలను ఎదుర్కొంటూ బోరిక్‌ ముందుకు పోవాలని యావత్‌ వామపక్ష శ్రేణులు ఎదురు చూస్తున్నాయి

బీహార్‌ ప్రత్యేక హోదాపై బిజెపి, జెడియు రాజకీయం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మధ్యలో 278 రోజులు మినహా పదిహేను సంవత్సరాలకు పైగా వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న జనతాదళ్‌(యు)-జెడియు నేత నితీష్‌ కుమార్‌ పదిహేనేండ్ల నాటి బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి ముందుకు తెచ్చారు. అలాంటి హోదాను వర్తింప చేసే అధికారం నీతి అయోగ్‌కు లేనప్పటికీ ఆ డిమాండ్‌ను పరిశీలిస్తాం అన్నట్లుగా ఆ సంస్ధ అధికారి చెప్పటం, మీడియా ప్రముఖంగా ప్రచారంలోకి తేవటంతో సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోణాల్లో (ఒక చోట నిజంగానే ఇస్తే -మరో చోట వత్తిడి చేస్తే ఇస్తారేమో అన్నట్లుగా) ఆసక్తి రేపింది.బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము మరింత లోతుగా, దగ్గరగా పరిశీలిస్తామని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. మూడు సాగు రైతు చట్టాలను వెనక్కు తీసుకొనేది లేదంటూ ఏడాదికి పైగా భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్న తీరు చూసిన తరువాత కాస్త వత్తిడి చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు దాన్ని వర్తింపచేసే చర్యలు తీసుకోవచ్చేమో అని ఆశపడిన వారు కూడా లేకపోలేదు. మా మోడీ కారణంగా అటు సూర్యుడు ఇటు పొడిస్తే పొడవవచ్చు గాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మాత్రం ఇచ్చేది కల్ల అన్నట్లుగా బిజెపి వ్యవహరించిన తీరు, పార్లమెంటులో కూడా ప్రకటించటాన్ని చూసిన తరువాత కూడా నితీష్‌ కుమార్‌ ఎందుకు ముందుకు తెచ్చారు అన్నది ఆసక్తి కలిగించే అంశం. నీతిఅయోగ్‌ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం దరిద్రంలో బీహార్‌ అగ్రస్ధానంలో ఉంది.


2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బిజెపిని బీహార్‌లో ఇరకాటంలో పెట్టాయి. రెండువందల నలభై మూడు స్దానాలున్న సభలో ఎన్‌డిఏ కూటమిలో 74 స్ధానాలతో బిజెపి పెద్ద పార్టీగా జెడియు 43 స్దానాలతో సరిపెట్టుకుంది. మరో రెండు పార్టీలతో కలుపుకొని కూటమికి వచ్చిన వచ్చిన మొత్తం సీట్లు 125కావటం, సంపూర్ణ మెజారిటీకి కేవలం మూడు సీట్లే ఎక్కువ. దాంతో బిజెపి అనివార్యంగా నితీష్‌ కుమార్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి అది పెద్దన్నగా మారింది. తాము చెప్పినట్లు వినాలని మాటి మాటికీ గుర్తు చేస్తోంది. రాష్ట్ర పేదరికం, వెనుకబాటుతనంతో ఉందనే పేరుతో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు పైకి చెప్పుకోవచ్చుగానీ అది అతికే వాదన కాదు. బీహార్‌కు ఆ స్ధితి ఇవాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. ప్రత్యేక హోదా డిమాండ్‌ అసంబద్దం అని బిజెపికి చెందిన ఉప ముఖ్యమంత్రి రేణు దేవి అన్నారు. హోదాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి సమస్య అర్ధంగాక పోయి ఉండాలి అని నితీష్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అర్హతల గురించి ఒకసారి చూద్దాం.జమ్ము-కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింతో సహా ఎనిమిది ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించి నిధుల కేటాయింపు, రాయితీలు వర్తింప చేస్తున్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు నిధుల వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినందున ఏ రాష్ట్రానికి అలాంటి హోదాను కల్పించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నది. నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించినప్పటికీ 14వ ఆర్ధిక సంఘాన్ని సాకుగా చూపి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిరస్కరించిన అంశం తెలిసిందే. కొండ ప్రాంతాలు, జనాభా సాంద్రత తక్కువగా ఉండటం, వచ్చే ఆదాయం రాష్ట్రాలకు చాలని స్ధితి, విదేశీ సరిహద్దుల్లో ఉన్న పరిస్ధితి,ఆర్ధిక వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.విదేశీ సరిహద్దుల్లో ఉన్న స్ధితి అంటే వ్యూహాత్మకంగా కీలకంగా ఉందా లేదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కేవలం విదేశీ సరిహద్దును మాత్రమే తీసుకుంటే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌కు నేపాల్‌తో సరిహద్దు ఉన్నప్పటికీ గతంలో హోదాను వర్తింప చేయలేదు. అలాంటి జాబితాలో ఉన్న రాష్ట్రాలకు కలిగే లబ్దిని చూద్దాం. విదేశీ సాయంతో, కేంద్ర ప్రత్యేక సాయం, సాగునీటి సంబంధిత ఏఐబిపి ప్రాజెక్టులకు 90శాతం, కేంద్ర ప్రత్యేక పధకాలకు నూరుశాతం నిధులు కేటాయిస్తారు.ఆ పదిశాతం నిధులు కూడా వడ్డీ లేని అప్పుల రూపంలో కేంద్రం ఇవ్వవచ్చు.ఇవిగాక కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఉంటాయి.అయితే నిధుల బదలాయింపు 42శాతానికి పెరిగిన తరువాత అన్ని రాష్ట్రాలకు అనేక కేంద్ర సహాయ పధకాలను రద్దు చేశారు.విదేశీ పధకాలను కూడా పరిమితం చేశారు. ఏఐబిపి పధకాలకు 2014-15లో రు.8,992 కోట్లు ఉన్న బడ్జెట్‌ను మరుసటి ఏడాది కేవలం వెయ్యికోట్లకు పరిమితం చేశారు. అసలు మొత్తంగానే అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించటం, కేంద్రవాటా తగ్గించటం వంటి పనులతో ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకున్నట్లయింది. ఇన్ని చేసినా పరిశ్రమలకు రాయితీల వంటివి ఉన్నందున ప్రత్యేక హోదా ఇంకా ఆకర్షణీయంగానే ఉంది. కొత్తగా ఇవ్వకపోయినా పాతవాటిని కొనసాగిస్తున్నారు.రాజ్యాంగపరంగా అలాంటి హౌదా కలిగిన రాష్ట్రాలు లేకున్నా గతంలో జాతీయ అభివృద్ధి మండలికి మంజూరు అధికారం ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలచుకుంటే ఇప్పటికైనా వర్తింప చేయవచ్చు.


నితీష్‌ కుమార్‌ ఎందుకు ఈ డిమాండ్‌ను ఇప్పుడు ముందుకు తెచ్చారనే ప్రశ్నపై భిన్న కోణాలలో చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల లబ్దికోసమే రైతుల డిమాండ్‌కు నరేంద్రమోడీ తలొగ్గి సాగు చట్టాలను రద్దు చేశారు. వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను బీహార్‌లో బిజెపి ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు కనుక ప్రత్యేక హౌదా కోరితే కనీసం కొంత మేరకు నిధులైనా రాకపోతాయా అన్న ఆలోచన కావచ్చు. ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీకి కొన్ని సీట్లలో మద్దతు కోసం వత్తిడి కావచ్చు.ఇన్నేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా ఎందుకుంచారో సంజాయిషి ఇవ్వాల్సిన పెద్దమనిషి (బిజెపికి సైతం వాటా ఉంది) ఆ ప్రశ్నను పక్కదారి పట్టించేందుకా లేక బిజెపితో సంబంధాలను తెంపుకోవాల్సి వస్తే ఏదో ఒక అంశం కావాలి గనుక ఆ జాబితాలో దీన్ని కూడా చేర్చారా అన్నది చెప్పలేము.గతేడాది అధికారానికి వచ్చినప్పటి నుంచి కలసి కాపురమే గానీ ఎవరి గది వారిదే అన్నట్లుగా బిజెపి-జెడియు మధ్య సంబంధాలున్నాయి.


అనేక అంశాలపై రెండు పార్టీల మధ్య విబేధాలు బహిరంగంగానే వెల్లడయ్యాయి. వెనుకబడిన తరగతుల కుల గణన చేపట్టాలంటూ రెండు సార్లు చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని బిజెపి కూడా బలపరిచనప్పటికీ కేంద్రంలోని బిజెపి తిరస్కరించింది. అవసరమైతే తమ ఖర్చుతో రాష్ట్రంలో కులగణన చేస్తామని నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. 2011లో నాటి కేంద్ర ప్రభుత్వం చేసిన కులగణన వివరాలను రాజకీయ కారణాలతో బయట పెట్టలేదు. బీహార్‌కు ప్రత్యేక హోదా అర్ధం లేదు, అవసరంలేదు అన్న బిజెపి ఉపముఖ్యమంత్రి రేణు దేవీకి ఏమీ తెల్వదు, ఆమెకు తరువాత నేను చెబుతా అని నితీష్‌ మాట్లాడారు. ప్రతి సంకీర్ణ కూటమిలో చిన్న చిన్న విభేదాలుంటాయి, అవి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయవని ఒక బిజెపి మంత్రి అన్నారు. 2009లో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌ను మౌఖికంగా సమర్దించిన బిజెపి నేడు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది.నాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, నేడున్నది తమ నరేంద్రమోడీ, అప్పుడు సంకీర్ణ కూటమిలో బిజెపి తోకపక్షం ఇప్పుడు జెడియు ఆ స్ధానంలో ఉంది కనుక ఈ వైఖరి అన్నది స్పష్టం.


హర్యానాలో మాదిరి బహిరంగ స్ధలాల్లో నమాజును నిషేధించాలని బిజెపి మంత్రులు, ఎంఎల్‌ఏలు నితీషకుమార్‌ను డిమాండ్‌ చేశారు. అలాంటి పని చేస్తే బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు, తమ మీద ఆ ప్రభావం పడుతుందని జెడియు నేతలు మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన వారిలో ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. బిజెపి నేతలు తాము అసలు సిసలు దేశభక్తులమని జనం ముందు కనిపించేందుకు తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే బిజెపికి చెందిన బీహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ జెడియుతో సంప్రదించకుండానే ఇటీవలి శీతాకాల సమావేశాల్లో జాతీయ గీతం ఆలపించాలని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధిశాఖకు జెడియు మంత్రి ఉన్నారు. ఆ శాఖలో ఒక ఇంజనీరు అవినీతి గురించి విచారణ జరపాలంటూ స్పీకర్‌ ఒక సభాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక కొత్త సంప్రదాయం కాగా ఆ కమిటీకి నితీష్‌ కుమార్‌ మీద ఒంటికాలుతో లేచే బిజెపి ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి నితీష్‌ మిశ్రాను నేతగా చేశారు.పార్లమెంట్‌లో బిజెపి బీహార్‌ ఎంపీ ఒకరు తమ రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామ రోడ్ల నిర్మాణ పధకం సక్రమంగా జరగటం లేదంటూ విమర్శకు దిగితే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ నిజమే అంటూ లెక్కలను ప్రకటించారు. బీహార్‌లోనూ కేంద్రంలోనూ ఉన్నది ఎన్‌డిఏ ప్రభుత్వమే అని బిజెపి నేతలకు గుర్తున్నట్లు లేదంటూ జెడియు నేతలు ఎద్దేవా చేశారు. మగధ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ మీద నిధుల దుర్వినియోగ విచారణ నేపధ్యంలో విసిని తొలగించాలన్న ముఖ్యమంత్రి నితీష్‌ వినతిని గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ఖాతరు చేయకపోవటంతో నితీష్‌ పరువు పోయింది.


నితీష్‌ కుమార్‌కు గతంలో ఉన్న పేరు ప్రతిష్టలు ఇప్పుడు లేవని గతేడాది ఎన్నికల్లో తేలిపోయింది. అందువలన నితీష్‌ను బలపరచటం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువని బిజెపి నేతలు లెక్కలు వేసుకున్న కారణంగానే మంత్రులు, నేతలు తరచూ బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర నాయకత్వం అదేమీ తెలియనట్లు అమాయకత్వం నటిస్తోంది. రెండు పార్టీల నేతలూ అబ్బే మాలో విబేధాలేమీ లేవంటూ సమాధానాలిస్తున్నారు. తాజా అంశానికి వస్తే రాష్ట్రానికి కేంద్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులిస్తోందని బిజెపి మంత్రి జివేష్‌ మిశ్రా అంటే నిబంధనల ప్రకారమే ఇస్తోందని ఎక్కువ ఎలా ఇచ్చారో చూపాలని జెడియు మంత్రి బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ సవాలు విసిరారు.


ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల విధానాన్ని ముందుకు తెచ్చిన బిజెపి సర్కార్‌ తీరును, లౌ జీహాద్‌ ప్రచారాన్ని జెడియు విమర్శించింది. 2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తేడా తెలియని స్ధితి ఏర్పడిందని ఎన్నికలు ముగిసిన తరువాత 2021జనవరి పార్టీ సమావేశంలో నితీష్‌ కుమార్‌ పరోక్షంగా బిజెపిని తప్పుపట్టారు. మొత్తం ప్రచారంలో బిజెపి-ఎల్‌జెపి భాయి భాయి అని కేంద్రీకరించారని, తమ మీద పోటీ చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జిపి కంటే బిజెపి వల్లనే ఎక్కువ సీట్లను కోల్పోయినట్లు జెడియు నేతలు వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన 15 మంది ఎల్‌జెపి తరఫున పోటీకి దిగిన అంశం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ పధకం కింద బీహార్‌లో కోటీ 46లక్షల గ్రామీణ మంచినీటి సరఫరా కనెక్షన్లను అందచేసినట్లు బిజెపి చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పించినవి 87శాతం ఉన్నందున ఆ ఖ్యాతి నితీష్‌ కుమార్‌కు దక్కాలని జెడియు తిప్పికొట్టింది.


బిజెపి తన సైద్దాంతిక అంశాలలో భాగంగా అది రామాలయ నిర్మాణం లేదా ఆర్టికల్‌ 370 రద్దు వంటివి చేపట్టి తన మద్దతుదార్లను కాపాడుకుంటోందని, తమది ప్రత్యేక పార్టీ తప్ప బిజెపి అనుబంధ సంస్ద కాదని జెడియు ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తోంది.
సంకీర్ణ కూటమిలో నాలుగేసి స్ధానాలున్న హిందుస్తానీ అవామీ పార్టీ(హామ్‌), వికాస్‌షీల్‌ ఇన్సాన్‌ పార్టీ (విఐపి)కూడా బిజెపి మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఒక ప్రయివేటు మదర్సాలో జరిగిన పేలుడును అవకాశంగా తీసుకొని మదర్సాలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలుగా మారాయంటూ, అన్ని మదర్సాలను మూసివేయాలని బిజెపి నేతలు చేసిన ప్రకటనలను హామ్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రామ్‌ మాంఝీ ఖండించారు. దళితులు విద్యావంతులైతే నక్సలైట్లు, ముస్లింలు చదువుకుంటే ఉగ్రవాదులని చిత్రిస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతుల వారి మద్దతు పొందే ఎత్తుగడలో భాగం, ముస్లింలపై వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ఓటుబాంకును ఏర్పాటు చేసుకొనేందుకు కూడా బిజెపి పావులు కదుపుతోంది. దశాబ్దాల తరబడి ఏదో విధంగా అధికారంలో కొనసాగినప్పటికీ తాము పెద్దపార్టీగా ఎదగలేకపోయామని, ఇప్పటికైనా అందుకు పూనుకోవాలని వారు చెబుతున్నారు.దళితులు, బిసిలపై ముస్లింలు దాడులు చేస్తుంటే నితీష్‌ కుమార్‌ సర్కార్‌ తగిన చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వంలో కొనసాగుతూనే బిజెపి నేతలు విమర్శలకు దిగుతున్నారు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో జెడియును చీల్చి ఆరుగురు ఎంఎల్‌ఏలను బిజెపి తనలో చేర్చుకున్నది. దానిపైజెడియునేతలు మండి పడ్డారు. తమ నేతను స్పీకర్‌గా, ఇద్దరిని ఉపముఖ్యమంత్రులుగా చేయాలని బిజెపి ఆదేశించినట్లుగా చెప్పటం తప్ప ముందుగా నితీష్‌ కుమార్‌తో కనీసం సంప్రదించలేదని అప్పుడే వార్తలు వచ్చాయి.హౌంమంత్రిత్వశాఖను కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.బీహార్‌ రాజకీయాల్లో నితీష్‌ కుమార్‌ వేసినన్ని పిల్లి మొగ్గలు మరొకరు వేసి ఉండరేమో ! అటు ఆర్‌జెడి-ఇటు బిజెపిని రెండింటినీ ఉపయోగించుకొని పదవులు పొందారు. వాటికోసం నితీష్‌ కుమార్‌ ఏమైనా చేయగలరు అనే పేరు తెచ్చుకున్నారు. నరేంద్రమోడీని 2014లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తేనున్నారని గ్రహించి 2013లో బిజెపితో 17 సంవత్సరాల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. మొరటు లేదా విభజించే లక్షణాలు లేని ఉన్నతమైన లౌకిక భావాలు కలిగిన వారే తమకు ఆమోదయోగ్యమని జెడియు అప్పుడు చేసిన తీర్మానంలో పేర్కొన్నది. తరువాత జరిగిన పరిణామాలేమిటో తెలిసిందే. అదే నరేంద్రమోడీతో కలసి పని చేస్తున్నారు. బిజెపితో కలసి ఉంటే కలదు సుఖం అనుకున్నన్ని రోజులు ఉంటారు. లేదనుకుంటే బయటకు వస్తారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బలాబలాల ప్రకారం ఇష్టం ఉన్నా లేకున్నా బిజెపి దయాదాక్షిణ్యంతో అధికారంతో కొనసాగటం లేదా బయటకు వచ్చి ఆర్‌జెడి సర్కార్‌కు మద్దతు ఇవ్వటం మినహా మరొక మార్గం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమికి 40కి గాను 39 స్ధానాలు వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సెప్టెంబరులోనే ప్రతిపక్ష ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ ప్రకటించారు.

మోడీ ఇండియా : 2014 నుంచి రోజుకు 200 స్వదేశీ, ఒక విదేశీ కంపెనీ మూత !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
మేకిన్‌ ఇండియా పధకాన్ని ప్రకటించి ఏడు సంవత్సరాలు గడచింది. ఈ కాలంలో అంటే 2014 సెప్టెంబరు 25 నుంచి 2021 డిసెంబరు ఒకటవ తేదీ వరకు 8,42,710 కొత్త కంపెనీలు నమోదైనట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు. పెట్టుబడులు, తయారీ, రూపకల్పన, నవకల్పన వంటి వాటికి నిలయంగా, ప్రపంచ ఎగుమతి ఎగుమతి కేంద్రంగా మారి చైనాను పక్కకు నెట్టాలన్నది ప్రకటిత లక్ష్యం. పోటీ పడాల్సిందే, ఉపాధి కల్పించాల్సిందే, అంతకంటే కావాల్సింది ఏముంది.పైన పేర్కొన్న కంపెనీలలో పని చేస్తున్నవి 7,82,026 అని కూడా మంత్రి వెల్లడించారు. సులభతర వాణిజ్యానికి అనువైనదిగా గుర్తించటమే అత్యంత ప్రధాన కారణం అని కూడా చెప్పారు.


చిత్రం ఏమిటంటే బిజెపి లేదా నరేంద్రమోడీ విజయ గాధల్లో ఈ కార్యక్రమం లేదా చొరవ లేదు. కొండంత రాగంతో ప్రారంభించి కీచుగొంతుతో ముగిస్తున్నారు. గుజరాత్‌ ఆదర్శ నమూనాను దేశమంతటా అమలు జరుపుతానన్నది నరేంద్రమోడీ 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. తరువాత మోడీ నోట ఆ మాటను ఎవరైనా విన్నారా ? ప్రపంచమంతటికీ నేను ఒక వినతి చేయదలచాను. రండి భారత్‌లో తయారు చేయండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అమ్ముకోండి గానీ తయారీ మాత్రం మాదగ్గరే జరగాలి అని నరేంద్రమోడీ చెప్పారు. తరువాత జరిగిందేమిటో చూశాము. ఇంతచేసినా 2019లో దేశ జిడిపిలో వస్తుతయారీ రంగ వాటా 20 ఏండ్ల నాటికంటే తక్కువగా నమోదైంది.తరువాత స్వయం సమృద్ధి గురించి చెప్పటం ప్రారంభించారు, కరోనా వచ్చిన తరువాత ఆత్మనిర్భరత గానాలాపాన తెలిసిందే. సంస్కరణల పేరుతో మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న చర్యల్లో భాగంగా లైసన్సులు ఎత్తివేశారు,కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించారు. అనేక దిగుమతి పన్నులు తగ్గించారు. కార్పొరేట్లకు అనేక సబ్సిడీలు, రాయితీలు ఇచ్చారు. ప్రణాళికా సంఘం అవసరం లేదంటూ దాన్ని ఎత్తివేశారు. ఉత్పత్తి, ఎగుమతులకు లంకెపెట్టి మరికొన్ని సబ్సిడీలను ప్రకటించారు. వాటికీ సడలింపులు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. కనుకనే వేగంగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. సంస్కరణల పేరుతో మొదటికే మోసం తెస్తున్నారని జనానికి మూడు దశాబ్దాల తరువాత అర్ధం కావటం ప్రారంభమైంది. కరోనా కాలంలో జనానికి ఖర్చు పెట్టేందుకు చేతులు రాలేదుగానీ కార్పొరేట్లకు దాదాపు రెండు లక్షల కోట్ల మేరకు కట్టపెట్టారు. మేడిన్‌ ఇండియాలు కార్యక్రమం జయప్రదం కావాలంటే సులభతర వాణిజ్య సూచికను మెరుగుపరిచేందుకు కేంద్రీకరించారు. ఐదు సంవత్సరాల్లో 79 పాయింట్లను మెరుగుపడినట్లు ప్రకటించారు.వీటితో ప్రపంచబాంకును సంతృప్తి పరచారు తప్ప పెట్టుబడిపెట్టేవారికి విశ్వాసం కల్పించలేకపోయారు.


మరోవైపు జరిగిందేమిటి ? 2021 మార్చి 31 నాటికి దేశంలో నమోదైన కంపెనీలు 21,51,349, వీటికి గాను మూతపడినవి 7,58,350, ఇవిగాక నిద్రావస్ధలో 2,266, రద్దు ప్రక్రియలో 6,893, దానికి ముందు దశలో 38,983 ఉన్నాయి. సాంకేతికంగా ఏ పేరు పెట్టినా ఇవన్నీ మూతపడేవే గనుక మొత్తంగా లెక్కిస్తే 8,06,809 ఉంటాయి. పార్లమెంటులో ప్రకటించిన మేరకు ఏడున్నర సంవత్సరాల్లో కొత్తగా వచ్చినవి 8,42,710, ఏతావాతా వచ్చినవాటికి సమానంగా మూతపడినవీ ఉన్నాయి. ఇవన్నీ మోడీ ఏలుబడిలోనే మూతపడలేదు, సంస్కరణల మాదిరే మూతల వేగం పెరిగింది.


తొలిసారి గద్దె నెక్కినపుడు దేశం కంటే విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపారు నరేంద్రమోడీ. ఎందుకంటే విదేశీ పెట్టుబడుల సాధన, పోయిన ప్రతిష్టను పునరుద్దరించేందుకు అని చెప్పారు. నిజమే కామోసు అనుకున్నారు జనం. ఆ ఊసుల మేరకు విదేశీ కంపెనీలేమైనా ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయా ? ప్రస్తుతం నమోదైనవి 4,979 వాటిలో పని చేస్తున్నవి 3,334. సులభతర వాణిజ్య సూచికలు మెరుగుపడిన తరువాత 2018 -2021 మధ్య దేశంలో కొత్తగా నమోదైన విదేశీ కంపెనీలు 320 అని 2021జూలైలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ పార్లమెంటులో చెప్పారు. 2014 నుంచి 2021నవంబరు వరకు 2,783 విదేశీ కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోయినట్లు వాణిజ, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పారు. మన దేశంలో పర్యవేక్షక లేదా బ్రాంచిఆఫీసులు లేదా ప్రాజెక్టు ఆఫీసులు కలిగిన విదేశీ కంపెనీల సంఖ్య 10,756. కొన్ని కంపెనీల ప్రాజక్టులు ముగిసిన తరువాత వెళ్లినవి, కొన్ని విలీనాలతో మూతపడినవి రకరకాల కారణాలు వెళ్లిపోయిన వాటి వెనుక ఉన్నాయి. ఆఫీసులు కలిగిన కంపెనీలన్నీ ఉత్పాదక లేక సేవలు అందిస్తున్నవి కాదు.


2013 డిసెంబరు 31నాటికి దేశంలో నమోదైన 13,69,362 కంపెనీల్లో 19శాతం 2,67,639 మూతపడినట్లు నాటి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సచిన్‌ పైలట్‌ లోక్‌సభలో చెప్పారు. పైన పేర్కొన్న వివరాల ప్రకారం 2021మార్చి 31 నాటికి అది 37.6శాతానికి పెరిగాయి. కొన్ని కంపెనీలు ప్రభుత్వం వద్ద నమోదైనప్పటికీ పన్నుల ఎగవేత, లాభాల తరలింపు వంటి అక్రమాలకు మాత్రమే పరిమితమైనవి ఉన్న అంశం అందరికీ తెలిసిందే. వాటిని షెల్‌ లేదా సూట్‌కేస్‌ కంపెనీలని పిలుస్తున్నాము. నిజానికి చట్టంలో కంపెనీ అంటే కంపెనీ తప్ప సూట్‌కేస్‌ అని ఉండదు. పాలకులు తమ హయాంలో సాధించిన గొప్పల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు వీటిని కూడా కలుపుకొనే చెబుతారు. అనేక అక్రమాలు బయట పడిన తరువాత అలాంటి వాటిని గుర్తించి కంపెనీల జాబితా నుంచి తొలగిస్తామని మోడీ సర్కార్‌ హడావుడి చేసింది. ఆ మేరకు 2018-21కాలంలో 2,38,223 సంస్ధలను గుర్తించినట్లు పార్లమెంటుకు తెలిపారు. వాటన్నింటినీ రద్దు చేశారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి.యునిటెక్‌ గ్రూపు కంపెనీ 52 సూట్‌కేస్‌ కంపెనీలను సృష్టించినట్లు తాజాగా ఇడి వెల్లడించింది. వాటిలో డైరెక్టర్లుగా ఉన్న వారికి నెలకు పది, ఇరవై వేలు చెల్లిస్తూ అవసరమైనపుడు సంతకాల కోసమే పిలిపిస్తుంటారని కూడా తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి వందల కోట్ల నిధులను సూట్‌కేసు కంపెనీల పేరుతో దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న కార్వి కంపెనీ సూట్‌కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి పాల్పడిన అక్రమాలపై విచారణ, అరెస్టుల గురించి తెలిసినదే. ఇంకా ఇలాంటివి ఎన్నోఉన్నాయి. తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసేందుకు వాటిని దారి మళ్లించి, విదేశాలకు తరలించి కంపెనీలను దివాలా తీయించి మూతవేసేవి కూడా ఉన్నాయి. పాతవాటిని మూసివేసి కొత్త పరిశ్రమల పేరుతో రాయితీలు పొందేందుకు కొత్త కంపెనీల సృష్టి, ఒకేచోట జరిపే ఉత్పత్తిని వేర్వేరు కంపెనీల పేరుతో లెక్కలు చూపే సంగతి తెలిసిందే. తప్పుడు మార్గాల్లో విదేశాలకు నిధులు తరలించి మారిషస్‌ మరొక దేశం పేరుతో తిరిగి వాటినే పెట్టుబడులుగా పెడుతూ లబ్దిపొందేవారు కూడా ఉన్నారు.


ఏడున్నర సంవత్సరాల పాలనలో ఎగుమతులేమన్నా పెరిగాయా ? ప్రపంచబాంకు సమాచారం మేరకు 2013లో గరిష్టంగా మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతులు 25.43శాతం ఉండగా 2020నాటికి 18.07శాతానికి తగ్గాయి. 2013-14 కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల వాటా వర్తమాన ధరల్లో 18.2 -24.77-57.03 శాతాల చొప్పున ఉంది. అదే కరోనాకు ముందు 2019-20లో 20.19-25.92-53.89శాతాల చొప్పున ఉంది. ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? విదేశీ పెట్టుబడులు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పేరుతో ఆర్భాటం తప్ప పెను మార్పులేదన్నది స్పష్టం. ఎగుమతి రంగంలో చూస్తే 2014లో 468-2018లో 538, 2020లో 474 బిలియన్‌ డాలర్ల మధ్య ఉన్నాయి.ఈ ఏడాది 400 బి.డాలర్లు అంటున్నారు.నరేంద్రమోడీ గారు చెప్పిన అచ్చేదిన్‌ కనుచూపుమేరలో కనిపించటం లేదు. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారిన తరువాత కరోనా వచ్చింది. తిరిగి ఎంత మేరకు వృద్ధి ఉంటుందో చెప్పలేము. ఏడేండ్లలో జరిగిందేమిటి ?


2013 డిసెంబరు 31నాటికి దేశంలో మూతపడిన కంపెనీలు 2,67,639 కాగా 2021 మార్చి 31నాటికి మూతపడినవి 7,81,987. అంటే ఏడు సంవత్సరాల మూడునెలల్లో కొత్తగా మూతపడినవి 5,14,348. సులభంగా అర్ధం కావాలంటే రోజుకు రెండువందల కంపెనీలు మూతపడ్డాయి. మేక్‌ ఇండియా ప్రకటన తేదీ నుంచి 2021డిసెంబరు ఒకటి వరకు అంటే ఏడు సంవత్సరాల రెండు నెలల ఆరు రోజుల్లో నమోదైన కొత్త కంపెనీలు 8,42,710. అంటే రోజుకు 321 కొత్త కంపెనీలు నమోదు, మూతపడిన వాటిని తీసుకుంటే నిఖరంగా పెరిగినవి రోజుకు 121. మూతపడుతున్నవాటి కంటే కొత్త కంపెనీలే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పవచ్చు. ప్రపంచంలో దేశంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. చైనా వంటి వర్ధమాన దేశాల్లో వస్తూత్పత్తి రంగం ప్రధాన ఉపాధి కల్పన వనరుగా ఉంది. అందుకే మన పాలకులు చైనా స్ధానాన్ని ఆక్రమించి వస్తూత్పత్తి చేస్తామని చెప్పారు. ఆశయం మంచిదేగానీ ఆచరణేలేదు. సేవారంగం మీద ఆధారపడ్డారు. వస్తూత్పత్తి రంగంలో ఆటోమేషన్‌, రోబోలు ఎలా వచ్చాయో, సేవారంగాన్ని కూడా ఆటోమేషన్‌ ఆవరిస్తున్నది. బాంకులకు వెళ్లి డబ్బు తీసుకోనవసరం లేకుండా ఎటిఎం మెషీన్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల ద్వారా నిధుల బదిలీ, ఇతర లావాదేవీలు జరుపుకోవచ్చు, సేవలకు చెల్లింపులు జరపవచ్చు. ఇవన్నీ ఉపాధిని హరించేవే. అందువలన మన అవసరాలకు అనుగుణంగా వృద్ధి లేదు. జనానికి ఆదాయం లేనపుడు వస్తు, సేవల వినియోగం తగ్గుతుంది. పంటలకు తగిన గిట్టుబాటు ధరలను సమకూర్చలేని పాలకులు నాటు, కోత, ఇతర యంత్రాలను ప్రోత్సహిస్తున్నారు, ఫలితంగా గ్రామాల్లో ఉపాధి తగ్గుతోంది. చేతి వృత్తుల్లో కూడా యాంత్రీకరణ పెరిగిపోతోంది. అసలు మొత్తంగానే వృద్ది రేటు తగ్గింది. ఉన్నమేరకు చూసినా అది ఉపాధి రహిత వృద్ధి. మోడీ సర్కార్‌ డిజిటైజేషన్‌ గురించి తాజాగా కబుర్లు చెబుతోంది. అది పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు తరుగుతాయి.

బీజింగ్‌ ఒలింపిక్స్‌-అమెరికా కపట రాజకీయం!

Tags

, , ,


ఎం. కోటేశ్వరరావు


బీజింగ్‌ ఒలింపిక్స్‌ తుది సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగు నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో సత్తా చూపేందుకు క్రీడాకారులు ఒకవైపు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు చైనాను బదనాం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని దేశాలు అంతకంటే ఎక్కువగా సిద్ధం అవుతున్నాయి. క్రీడల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. అసలేం జరగనుంది? అమెరికా కూటమి దేశాలు తమ క్రీడాకారులను బీజింగ్‌ పంపుతాయట గానీ వారి వెంట రాజకీయ నేతలు, అధికారులను మాత్రం పంపవట. దీనికి దౌత్యపరమైన బహిష్కరణ అని పేరు పెట్టారు. ఆడేది క్రీడాకారులు తప్ప అధికారులు కాదు కదా! వారు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి అని క్రీడా సంబంధిత వర్గాలు పెద్దగా ఆ పిలుపులను పట్టించుకోవటం లేదని వార్తలు. రాజకీయ నేతల హడావుడి మరీ ఎక్కువగా ఉంది, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు మిమ్మల్ని రమ్మని పిలిచిందెవరు అని చైనా ప్రతినిధులు బహిష్కరణ గురించి చెప్పేవారి గాలితీశారు. తాము ఇంతవరకు అసలు అమెరికా రాజకీయవేత్తలకు ఆహ్వానాలే పంపలేదని, అలాంటప్పుడు బహిష్కరణకు తావెక్కడని అమెరికాలోని చైనా రాయబారి ప్రతినిధి ప్రశ్నించాడు.


నిర్వహించేది అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ, దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆతిధ్యదేశం చైనా మాత్రం దీన్ని తేలికగా తీసుకోవటం లేదు. ప్రతిగా క్రీడలు పూర్తయిన తరువాత కర్ర కాల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతాం అన్నట్లుగా హెచ్చరించింది. ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎన్ని దేశాలు అమెరికాను అనుసరిస్తాయి, ఎన్ని తిరస్కరిస్తాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిధువేనియా బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. జపాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు గానీ అలాంటి సూచనే చేసింది. అమెరికా అడుగులో అడుగువేసే దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ ఆ బాటలో నడిచేది లేదని చెప్పేశాయి. పంపటం లేదని, తమది బహిష్కరణ కాదంటూ కరోనాను కారణంగా న్యూజిలాండ్‌ చూపింది. మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అమెరికా తన పెరటితోటగా భావించే లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా కూడా హాజరవుతోంది. సముద్రంలోకి ప్రవహించే నదులను పర్వతాలు నిరోధించలేవని చైనా ఎద్దేవా చేసింది.


రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోచూడటం గర్హనీయం. చైనాలోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ పట్టణంలో జరిగిన జి7 దేశాల విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం చైనా ఆర్థిక బలాత్కారం పేరుతో కొత్త పల్లవి అందుకుంది. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచారదాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.

దొంగే దొంగని అరచినట్లుగా అమెరికా చేస్తున్న ఆర్థిక బలాత్కారాలకు అనేక ఉదంతాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. దానికి తన మన పర బేధాలు లేవు. పసిఫిక్‌ సముద్రంలో నౌరు, కిరిబటి, మైక్రోనేసియా అనే మూడు చిన్న దీవుల దేశాలున్నాయి. ఇంటర్నెట్‌ సేవలను మెరుగుపరచేందుకు సముద్రంలో వైర్లద్వారా సమాచారాన్ని పంపే ప్రపంచబాంకు పథకాన్ని 7.25 కోట్ల డాలర్లతో రూపొందించి అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దానిలో చైనా కంపెనీ ఒకటి 20శాతం తక్కువకు టెండరు వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. చైనా కంపెనీకి గనుక పని అప్పగిస్తే భద్రతకు ముప్పు వస్తుందంటూ అమెరికా వత్తిడి తెచ్చి సదరు ప్రాజెక్టును అడ్డుకుంది. ఇది తాజా ఉదంతం. అంతకు ముందు హువెయి, టిక్‌టాక్‌, మూడు టెలికాం కంపెనీల మీద ఆంక్షలు విధించటం, వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టటం, వాటి ఉత్పత్తులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన దేశాల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీలను తొలగించటం, హువెయి కంపెనీ ఉన్నతాధికారిణిని కెనడాలో అరెస్టు చేయించటం తెలిసిందే. చైనా సంగతిని పక్కన పెడితే ఫ్రెంచి కంపెనీ అస్టోమ్‌పై 77.23 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐరోపా విమానకంపెనీ ఎయిర్‌బస్‌పై 2020లో పన్నులు పెంచింది. అంతెందుకు మన నరేంద్రమోడీ కౌగిలించుకున్నా మరొకటి చేసినా మన ఎగుమతులపై రద్దు చేసిన పన్నుల రాయితీని రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌గానీ, తరువాత గద్దెనెక్కిన బైడెన్‌ గానీ వాటిని పునరుద్దరించలేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తే మన దేశం మీద కూడా చర్య తీసుకుంటామని అమెరికా చేసిన బెదిరింపులకు మన నరేంద్రమోడీ భయపడి నిలిపివేసిన అంశం తెలిసినదే.

లివర్‌పూల్‌లో జరిగిన జి7దేశాల సమావేశం చేసిన ప్రకటనల్లో ప్రస్తావించిన షిన్‌జాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలన్నీ చైనా అంతర్గత విషయాల్లో వేలు పెట్టటమే. మానవహక్కులలో ఆరోగ్యం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో అమెరికా, బ్రిటన్‌ జనాభా కేవలం ఐదుశాతం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలున్నాయి, అయినా ప్రపంచ కరోనా కేసుల్లో 23శాతం, మరణాల్లో 18శాతం అక్కడే అంటూ జీవించే హక్కును కాపాడాలని చైనా డిమాండ్‌ చేసింది. ఆపని చేయకుండా మిగతా దేశాల్లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాపితంగా రెండులక్షలకు పైగా సైన్యాలను, అణ్వాయుధాలతో సహా ఆధునిక క్షిపణులను మోహరించి నిత్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. ఎవరు ఏ ఆయుధాలు కొనాలో, కొనకూడదో నిర్దేశిస్తోంది. రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగిన అంశం కూడా తెలిసిందే.

చైనాను గుర్తించకుండా తైవానే అసలైనా చైనాగా చిత్రించి 1948 నుంచి 1971వరకు ఐక్యరాజ్య సమితిలో, 2001వరకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించకుండా అడ్డుకొన్నది అమెరికా. ప్రస్తుతం అది కానసాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఆర్థిక బలాత్కారం కాదా? తనకంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులను వెతుకుతోంది. మానవహక్కుల పరిరక్షణ అన్నది తన డీఎన్‌ఏలోనే ఉన్నదని అమెరికా చెప్పుకుంటోంది. ఆచరణలో మానవహక్కుల హరణమే దాని డీఎన్‌ఏ అని రుజువు చేస్తోంది. వందల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుంచి జనాలను బానిసలుగా పట్టుకువచ్చింది అమెరికన్లు, వారిని కాపలా కాసేందుకు ఏర్పాటు చేసుకున్నదే అమెరికా పోలీసు వ్యవస్థ, దాని అవశేషాలే ఇప్పటికీ ఆఫ్రో-అమెరికన్లను హతమారుస్తున్న దురంతాలు. అమెరికా పొలాలు, కార్ఖానాల్లో పని చేసిన ఆఫ్రికన్‌ బానిసలకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఆమొత్తం ఇప్పుడు 97లక్షల కోట్ల డాలర్లని జాక్‌ కోపే అనే ఆర్థికవేత్త అంచనా.

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబులు వేసి 66వేల మందిని హిరోషిమాలో, 39వేల మందిని నాగసాకిలో పొట్టన పెట్టుకుంది. తరువాత కూడా దాని పర్యవసానాలకు ఎందరో బలయ్యారు. ఇలాంటి అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గానాలాపన చేస్తుంటే దానికి కెనడా, బ్రిటన్‌, జపాన్‌ వంతపాడటం సహజమే. ఎందుకంటే ఈ దేశాలు కూడా మానవహక్కుల హరణంలో తక్కువ తినలేదు. ఇక ఐరోపా సామ్రాజ్యవాద వారసులే కనుక ఆస్ట్రేలియా వారి వెనుక నడవటంలో ఆశ్చర్యం లేదు. ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో దాడిచేసి పదిలక్షల మందిని, ఉగ్రవాదం మీద పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో రెండున్నర లక్షలు, ఎమెన్‌లో నాలుగు లక్షలు, సిరియా, సోమాలియా, లిబియాల్లో మరికొన్ని లక్షల మందిని హతమార్చిన అమెరికా అండ్‌కో హంతక ముఠా చైనాలో షిన్‌జాంగ్‌లోని ముస్లింల గురించి మొసలి కన్నీరు కారుస్తోంది. మన కాశ్మీరులో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది అమెరికా, దానికి సాధనంగా పని చేసింది పాకిస్థాన్‌. అదే మాదిరి చైనాలో చిచ్చుపెట్టేందుకు షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో రెచ్చగొట్టింది. అక్కడి ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాల ద్వారా ఆయుధాలు, డబ్బు అందచేసింది అమెరికా. మెక్సికో, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల నుంచి అక్రమంగా వలసలను ప్రోత్సహించి వారిని ఎక్కడా అధికారికంగా నమోదు చేయకుండా సామాజిక రక్షణ కల్పించకుండా తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్న అమెరికా మానవత నిజస్వరూపం తెలియందెవరికి? లాటిన్‌ అమెరికాలో నిత్యం ఏదో ఒక దేశంలో మానవహక్కులను హరించే శక్తులకు మద్దతు ఇస్తున్న అమెరికా ప్రజాస్వామ్య బండారం తెలిసిందే. ప్రపంచమంతటా అమెరికాకు చిన్నవీ, పెద్దవీ 800 వందల సైనిక కేంద్రాలు ఉన్నాయి. చైనాకు ఉన్నది ఒక్కటి, అదీ నాలుగు వందల అమెరికా కేంద్రాల మధ్య ఉంది.

క్రీడలపై బహిష్కరణ అస్త్రం పెద్దగా పనిచేయకపోయినా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. చైనా సహకారం, ప్రమేయం లేకుండా నేడు అంతర్జాతీయ రాజకీయాలు ముందుకు పోవు. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికాతో సహా 66దేశాలు బహిష్కరించాయి. తైవాన్‌కు గుర్తింపు ఇచ్చిన కారణంగా 1956 నుంచి 1980వరకు చైనా అసలు మొత్తంగా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. తరువాత 1984 లాస్‌ ఏంజల్స్‌ క్రీడలలో సోవియట్‌, పదమూడు తూర్పు ఐరోపా దేశాలు పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని 1980లో అమెరిరా సాకుగా చూపింది. కానీ అదే అమెరికా, దాని మిత్రదేశాలు తరువాత వివిధ దేశాల్లో మారణకాండ సాగించినా ఎవరూ క్రీడలకూ-వాటికి పోటీ పెట్టలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. క్రీడలను రాజకీయం చేయకూడదని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నాడు.


అమెరికా దౌత్యపరమైన బహిష్కరణకే పరిమితం కావటం వెనుక అక్కడి మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రీడలను చూపేందుకు ఎన్‌బిసి సంస్థ ఒలింపిక్స్‌ కమిటీకి బిలియన్ల డాలర్లు చెల్లించింది. పోటీల్లో అమెరికన్‌ క్రీడాకారులు లేకపోతే దానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. మిగతా దేశాలకూ అదే సమస్యలున్నాయి. 2014లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన కారణంగా రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల క్రీడలను నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధమ మహిళ మిషెల్లీ ఒబామా మాత్రమే వాటిని బహిష్కరించారు. ప్రస్తుత అమెరికా కూటమి చర్యకు ప్రతీకారంగా 2028 లాస్‌ ఏంజల్స్‌, 2032 బ్రిస్‌బేన్‌ (ఆస్ట్రేలియా) ఒలింపిక్స్‌ను చైనా బహిష్కరించ వచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. చైనా వైపు నుంచి అలాంటి సూచనలైతే లేవు.

మద్దతు ధర చట్టబద్దతకు మోడీ మొరాయింపు వెనుక అసలు కథేంటి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.


అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్‌ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్‌ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.


ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్‌ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్‌ పీటర్సన్‌ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్‌ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్‌ అనే వ్యాపార సంస్ధ చైర్మన్‌ చార్లీ మాథ్యూస్‌ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్‌, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.


అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్‌ అదేపని చేశాయి.


ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్‌ బాక్స్‌, రెండు అంబర్‌బాక్స్‌, మూడవది బ్లూబాక్స్‌. గ్రీన్‌ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్‌, బ్లూబాక్స్‌ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్‌ అంటే షరతులతో కూడిన అంబర్‌ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.


మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్‌ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్‌ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?


విడదీసి పాలించాలనే బ్రిటీష్‌ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్‌ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్‌ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్‌ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్‌ సహాయ రుణాలు, మార్కెట్‌ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.


ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్‌ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్‌ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్‌ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్‌ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.


మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?


ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్‌ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.

భారత వ్యవసాయ రంగం – నరేంద్రమోడీ : ఇంతకాలం రైతు ఉద్యమం – ఇక కార్పొరేట్ల వత్తిడి ప్రారంభం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఏడాదికి పైగా సాగిన మహత్తర రైతు ఉద్యమం మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం సాధించింది. సింహం లాంటి నరేంద్రమోడీ ఎత్తుగడగా ఒక అడుగు వెనక్కు తగ్గారు తప్ప తగు సమయంలో తిరిగి అదే అజండాతో ముందుకు వస్తారని మోడీ అభిమానులు వెంటనే స్పందించటాన్ని చూశాము. వారికి రైతు ఉద్యమం మీద ఉన్న అవగాహన కంటే నరేంద్రమోడీ మీద పెంచుకున్న విశ్వాసం బలంగా ఉందన్నది స్పష్టం. రైతుల పోరాటం ముందుకు తెచ్చిన ఇతర ప్రధాన అంశాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. కొన్నింటిపై ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ, అవసరమైతే తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు జనవరి 15న సమావేశం జరపనున్నట్లుసంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. సమస్యల తీవ్రత, సంక్లిష్టత, అనుమానాల దృష్ట్యా 378 రోజుల పోరులో ఒక విరామంగానే దీన్ని చెప్పవచ్చు.


కనీస మద్దతు ధరల చట్టం గురించి ఒక కమిటీని వేస్తామని, దానిలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పారు. ఆ కమిటీని వేస్తారు, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు దాని నివేదిక వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల పబ్బం గడచిన తరువాత ఏం జరుగుతుందో చెప్పలేము.ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. కొన్ని అంశాలను చూద్దాం. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి టి.నందకుమార్‌ డిసెంబరు 8వ తేదీన రాసిన విశ్లేషణాభిప్రాయంలో వెంటనే ఎంఎస్‌పి డిమాండ్‌ను భరించగలిగే స్ధితి దేశానికి లేదని, అరాజకత్వం, దీర్ఘకాలిక నష్టం జరుగుతుందంటూ గుండెలు బాదుకున్నారు. ఇదేమీ అనూహ్యమైంది కాదు, ఇలాంటి వారు సాగు చట్టాలకు ముందు-తరువాత చర్చలో – రద్దు తరువాత కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. వీరంతా స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ లాబీకి చెందిన పెద్దమనుషులు. రైతులను విభజించే వాదనలను కూడా నందకుమార్‌ ముందుకు తెచ్చారు. మిగులు పంటను అమ్ముకొనే తరగతి రైతులు ఎవరు ? ఏ ప్రాంతాల్లో సేకరణకు అవసరమైన సదుపాయాలున్నాయి ? వర్షాధారిత రైతులకు పెట్టుబడి సబ్సిడీలు అందకపోతే, సేకరణ వ్యవస్తలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే ఆ మేరకు జరుగుతోందా లేదా అని ప్రతిలావాదేవీని తనిఖీ సిబ్బంది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.అప్పుడు వ్యాపారులెవరూ మార్కెట్లో ఉండరు, ప్రభుత్వ విక్రయాల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏకైక వ్యాపారి అవుతుంది.అది విపత్తుకు దారి తీస్తుంది. ప్రస్తుత డిమాండ్‌ను చూస్తే విశ్వాస ప్రాతిపదిక వ్యవస్ధ బదులు హక్కుల వ్యవస్ధను కోరుతున్నారు. అదే జరిగితే పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితమైన దానిని దేశమంతటా విస్తరించాల్సి ఉంటుంది. ఆహారభద్రత హక్కు మాదిరి రైతులకు సేకరణ హక్కు లభిస్తుంది. అదే జరిగితే అదొక సేకరణ పధకం లేదా మద్దతు ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ తేడాను చెల్లించేది లేదా రెండూ అమలు జరపాల్సి రావచ్చు. అప్పుడేం జరుగుతుంది అని నందకుమార్‌ ప్రశ్నించారు.


మిగులు పంటను అమ్ముకొనే వారా లేకా స్వంత అవసరాల కోసం పండించుకొనే వారా అన్నది అసంబద్ద వాదన. అసలు ఎవరికీ సాగు గిట్టుబాటు కావటం లేదన్నది అసలు సమస్య. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా 116 దేశాల్లో ఆకలిలో 101వ స్ధానంలో ఉన్నామనే అంశం ఇలాంటి వాదనలు చేసే వారికి తెలుసా ? ఎవరి అవసరాలకు సరిపడా వారు పండించుకుంటే మిగులు లేకుండా ఆకలిని తీర్చేదెవరు ? అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని-అక్కడి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలని చెబుతున్నారా ? వర్షాధారిత ప్రాంతాల రైతులను ఆదుకొనేందుకు అవసరమైన పధకాలను అమలు జరిపితే సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మరొకరెవరైనా అడ్డుకున్నారా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు ధరలను నిర్ణయించే అవకాశం, హక్కు పారిశ్రామిక, వాణిజ్యసంస్ధలకు ఉన్నపుడు రైతులకు అలాంటి అలాంటి హక్కు ఎందుకు కలిగించకూడదు ? ప్రతి రైతుకు అలాంటి అవకాశం లేదు కనుక వారి తరఫున ఆ పని ప్రభుత్వమే చేయాలి. ఇన్నేండ్లుగా విశ్వాసాన్ని వమ్ము చేశారు కనుకనే రైతులు హక్కుల విధానాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక, వాణిజ్య సంస్దలకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినపుడు కార్మికులను నియమించుకొనే, తీసివేసే స్వేచ్చ ఇవ్వాలన్న వత్తిడికి లొంగి ఆ చట్టాలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే వ్యాపారులు మార్కెట్‌ నుంచి తప్పుకుంటారని చెప్పటం బెదిరింపు తప్ప మరొకటి కాదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరలకంటే తక్కువ వెలకు వినియోగదారులకు అమ్మాలనే నిబంధనలేమీ లేనపుడు వారికి వచ్చే నష్టం ఏమిటి ?


నందకుమార్‌ ముందుకు తెచ్చిన మరికొన్ని వాదనలేమిటి ? ఇరవై మూడు పంటలకు ఇప్పటికే ఉన్న ఎంఎస్‌పికి చట్టబద్దమైన హామీ కల్పించాలని అడుగుతున్నారు. ఇతర రైతుల గురించి ఎలాంటి నిర్దిష్టత లేదు. అందువలన వారు కూడా ఎంఎస్‌పిని అడగరని ఏముంది ? (నిర్ధిష్టత లేకపోతే ప్రభుత్వం ఆ పని చేస్తే వద్దన్నదెవరు ? ఇతర పంటలకూ ఎంఎస్‌పి అడిగితే ఇవ్వాలి. సాగు చేయాలా వద్దా ? ఇతర పంటలు అవసరం లేదా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు అలాంటి పరిమితులేమీ లేవుగా !) ప్రస్తుతం ఎంఎస్‌పి పరిధిలో ఉన్న 23 పంటల విలువ ఏడులక్షల కోట్ల రూపాయలు.చట్టబద్దత కల్పిస్తే అదనపు ఖర్చు రు.47,764(2017-18 సమాచారం) అవుతుందని కిరన్‌ విస్సా, యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. వీరు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.వాటిలో ఆహార సబ్సిడీ రు.2,40,000 కోట్లున్నాయి.(ఇంత సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా దేశం ఆకలి సూచికలో 116 దేశాల్లో 101వదిగా దిగజారిన స్ధితిలో ఉంది, ఈ సబ్సిడిని తగ్గిస్తే మరింతగా అన్నార్తులు పెరగరా ?) అందులో ఎక్కువ భాగం వినియోగదారులకే చెందుతోంది. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సేకరణ విధానాన్ని, ఆహార సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంఎస్‌పి పెరిగినపుడు సబ్సిడీ కూడా పెరుగుతుంది, జారీ ధరలు స్ధిరంగా ఉంటాయి.దీనికి ప్రతి ఏటా 50వేల కోట్లను జత చేస్తే మూడులక్షల కోట్లవుతాయి. గోధుమ, బియ్యం కాకుండా చిరు,పప్పు ధాన్యాలు, ఖాద్యతైలాలను కూడా సేకరించి బహిరంగ మార్కెట్‌ వేదికలద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.కనీస మద్దతు ధరలలో 40-45శాతం మేరకు నష్టం రావచ్చు.కనుక ఏ సేకరణ చేపట్టినా విలువలో సబ్సిడీ భారం 30శాతానికి తగ్గదు.

ఎంఎస్‌పికి హామీ ఇస్తే పరిమితంగా కొనుగోలు చేయాలి.పౌరపంపిణీ వ్యవస్ధతో సేకరణకు ఉన్న లంకె, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కష్టం, ఎంతో ఖర్చవుతుంది కనుక వాటి లంకెను విడగొట్టాల్సిన తరుణం వచ్చింది.కనీస మద్దతు ధరలేని పంటలను సాగు చేసేందుకు రైతులను ఒప్పించాలి, లేకపోతే వారు ఇతరులు కూడా ఎంఎస్‌పి పంటలను సాగు చేస్తారు. కొత్త సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు పిఎం కిసాన్‌, ఎరువులు, ఇతర సబ్సిడీలతో పాటు ఆహార సబ్సిడీని రు.2,40,000 కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచగలదా ?(వీటిని నష్టాలుగా పరిగణించి గుండెలుబాదుకుంటున్నవారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇస్తున్న ఇతర అనేక రాయితీల గురించి ఏమి చెబుతారు ? వారి సంపదలను పెంచితే జనానికి వచ్చేదేమిటి ? తిండి కలిగితే కండకలదోయి-కండకలవాడేను మనిషోయి అన్న గురజాడను మరిస్తే ఎలా ? కార్మికులు ఆరోగ్యంగా ఉంటే అది వారికే కాదు దేశానికీ లాభమే.) తాజా దారిద్య్రసమాచారం ప్రకారం ఆహార భద్రత వర్తింపును నలభైశాతానికి కుదించటం, చౌకదుకాణాల ద్వారా విక్రయించే వాటి ధరలను పెంచగలదా ? రైతుల ఆదాయాన్ని పెంచే ప్రాధమిక బాధ్యను తీసుకొనే విధంగా రాష్ట్రాలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం లేదా ?( రాష్ట్రాలను సంప్రదించుకుండా సాగు చట్టాలను మార్చినపుడు నందకుమార్‌ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ చర్చను ఎందుకు ముందుకు తెస్తున్నారు? )


నందకుమార్‌ లేదా జయప్రకాష్‌ నారాయణ లాంటి వారు చేస్తున్న వాదనలు ప్రపంచ వాణిజ్య సంస్ధకు అనుగుణ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా తదితర దేశాలు వేసిన కేసులు, వాదనల తీరు తెన్నుల గురించి మరో విశ్లేషణలో చూద్దాం. వాటికి అనుగుణ్యంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు, వాటి కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు సంస్కరణలు-రైతుల పేరుతో హడావుడిగా నరేంద్రమోడీ సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కనీస మద్దతు ధరల మీద కమిటీ వేయగానే ఏదో జరిగిపోతుందనే భ్రమలకు లోను కానవసరం లేదు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎస్‌కెఎం ప్రతిపాదించిన వారిని మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించలేదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం, ప్రభుత్వ కనుసన్నలలో నడిచేవారిని రైతుల పేరుతో నియమించనున్నారన్నది స్పష్టం.అలాంటి వారితో కూడిన సుప్రీం కోర్టు కమిటీ రూపొందించిన నివేదికను నెలలు గడిచినా బహిర్గతం చేయలేదు, ఏముందో తెలియదు. బహుశా అది రైతులకు అనుకూలంగా లేనందున జనానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఎస్‌కెఎంతో వాగ్దాన-ఒప్పంద భగ్నానికి పాల్పడితే మరింత తీవ్ర రూపంలో ఉద్యమం తిరిగి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు తమకు వ్యతిరేకమైన చర్యల మీద రైతాంగం ఉద్యమించింది. అందినట్లే అంది చేజారిన వ్యవసాయ మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకొనేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు కేంద్ర ప్రభుత్వం మీద రైతులకంటే తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తమకు ఉపయోగపడే అవకాశాలు లేవనుకుంటే ఆ స్ధానంలో మరొకరిని రంగంలోకి తెచ్చినా లేదా తమ హిందూత్వ అజెండాకే ప్రమాదం ముంచుకువచ్చిందని సంఘపరివార్‌ భావించినా దాన్ని అమలు జరపగల సమర్ధుడిగా భావిస్తున్న నరేంద్రమోడీ మరో రూపాన్ని ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.


రైతులు డిమాండ్‌ చేస్తున్న అంశాలలో కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్నది ఒకటి. అదేమీ వారు కొత్తగా కోరిన గొంతెమ్మ కోరిక కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలలో ఒకటే. నెలవులు మారిన తరువాత పాతవాటిని మరచిపోయినట్లు నటించటం కొందరిలో చూస్తాము. కానీ మోడీ గారి విషయంలో అలా అనుకోలేము. అసలు కథవేరే ఉంది. అది బయటకు చెప్పలేరు-రైతులను మెప్పించలేరు, అందుకే అనేక మంది పాలకుల మాదిరే బలవంతంగా రుద్దేందుకు పూనుకొని మూడు సాగు చట్టాలను తెచ్చారు. అనుకున్నది ఒకటి-అయింది ఒకటి. చివరకు క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కాబినెట్‌లో చర్చించి ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందటం క్షణంలో పని. జమ్ము- కాశ్మీరు రాష్ట్రం, ఆర్టికల్‌ 370ని ఒక్క రోజులో వేగంగా రద్దు చేయటంలో చూపిన సామర్ధ్యం జగమెరిగిందే. అలాంటిది కనీస మద్దతు ధరల చట్టం తేలేరా ?

.

2021ప్రపంచ ఉత్తమ మేయర్‌గా ఫ్రెంచి కమ్యూనిస్టు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సిటీ మేయర్స్‌ ఫౌండేషన్‌ – వరల్డ్‌ మేయర్‌ ప్రాజెక్టు సంయుక్తంగా 2004 నుంచి అందచేస్తున్న ప్రపంచ ఉత్తమ మేయర్‌ అవార్డుకు 2021కి ఇద్దర్ని ఎంపిక చేసింది. వారిలో ఒకరు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ శివార్లలోని గ్రినీ పట్టణానికి 2012 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న 47 ఏండ్ల ఫిలిప్‌ రియో, కమ్యూనిస్టు, మరొకరు నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌ మేయర్‌ అహమ్మద్‌ అబౌతాలెబ్‌, లేబర్‌ పార్టీనేత.


అబ్జర్వేటరీ ఆఫ్‌ ఇనీక్వాలిటీస్‌ (అసమానతల పరిశీలన) సంస్ధ వర్గీకరించినదాని ప్రకారం ఫ్రాన్స్‌లోని అత్యంత పేద మున్సిపాలిటీగా గ్రినీ ఉంది. సగం మంది జనం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. దారిద్య్రం, సామాజిక విస్మరణకు వ్యతిరేకంగా, విద్య-సంస్కృతి అంశాలు, పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడుల అంశాలపై ఫిలిప్‌ రియో నాయకత్వంలో జరిగిన కృషికి గుర్తింపు ఇది. కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి, పారిస్‌ డిప్యూటీ మేయర్‌ ఇయాన్‌ బ్రోసాట్‌ ఈ అవార్డు గురించి మాట్లాడుతూ కరోనా సమయంలో అవసరమైన జనాలకు ఆహారం,విద్యార్ధులకు కంప్యూటర్లను అందచేశారని, ఇటీవలి కాలంలో విద్యార్దులకు ఉదయపు అల్పాహారంతో సహా 21సామాజిక చర్యలను తీసుకున్నట్లు చెప్పారు.ఉత్తమ మున్సిపల్‌ కమ్యూనిజాన్ని ఫిలిప్‌ మూర్తీకరించారు, ఉన్నత విలువలను కలిగి ఉండటమే కాదు వాటిని అమలు జరిపేందుకు ప్రయత్నించారు, జన జీవితాల్లో మార్పులు తెచ్చారని ప్రశంసించారు.


గౌరవ ప్రదమైన ఈ అవార్డు గురించి ఫిలిప్‌ చిరునవ్వుతో వినమ్రంగా స్పందించారు. మేయరుగా పని చేస్తున్న క్రమంలో ప్రతికూల ముద్రవేశారు. రాజకీయ చర్చలో మమ్మల్ని బలిపశువులను చేశారు, కార్మికులు నివసించే ప్రాంతాలను విస్మరించారని అన్నారు. తమ మేయర్‌ కాళ్లు ఎప్పుడూ నేలమీదే ఉంటాయని, ఈ గౌరవాన్ని తాము చేసిన పనికి దక్కిన బహుమానమని, మాకు ఎదురవుతున్న అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు తమకు శక్తినిస్తుందని కౌన్సిలర్‌ ఒకరు చెప్పారు. ముఫ్పైవేల మంది పౌరులున్న ఈ పట్టణంలో నిరుద్యోగం, దారిద్య్రం, నేరాలు పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ గుర్తింపు కార్మికవర్గం నివశించే ప్రాంతాలన్నింటినీ గర్వపడుతూ తలెత్తుకొనేలా చేస్తాయి. ఎందుకంటే రోజంతా వార్తలందించే వార్తా ఛానళ్లలో మాట్లాడేందుకు అవకాశం కల్పించిందని ఇయాన్‌ బ్రోసాట్‌ చెప్పారు.ప్రపంచంలో ఉత్తమ పట్టణంగా ఎన్నికైనప్పటికీ దీని వెనుక ఎంతో కృషి ఉంది. తెల్లవారే సరికి మార్పులను తేలేము.ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఎక్కడ ప్రారంభించాలనేది సమస్య. దారిద్య్రంపై పోరు అంటే ఆరోగ్యం,విద్య, ఉపాధి,గృహవసతి, శిక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టటం. ఈక్రమంలో మేము పంటికి తగిలే రాళ్లను కూడా మింగాల్సి ఉంటుంది అని ఫిలిప్‌ చెప్పారు.


తమ పట్టణాన్ని మీడియా తరచూ ప్రతికూల వైఖరితో చూస్తుందని, ఈ అవార్డు తన ఒక్కడిది కాదన్నారు.కరోనా కాలంలో పట్టణంలో లక్షా30 మాస్కులు పంపిణీ, ప్రతి రోజూ వృద్దుల క్షేమ సమాచారాలు తెలుసుకోవటంలో తమ పట్టణంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలోని పట్టణ పాలక సిబ్బంది, ఎన్నికైన ప్రతినిధులు, సంఘాలన్నింటికి దక్కిన ఉమ్మడి గౌరవం ఇది.అనేక ఆటంకాలను అధిగమించాం, ఎంతో గర్వంగా ఉంది అని కూడా ఫిలిప్‌ చెప్పారు.2021లో 21 పరిష్కారాలు అనే పధకాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం,2022కు సైతం కొత్త పధకాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. ఈ రోజు గ్రినీ పట్టణం ప్రభుత్వ విధానాలను రూపొందించేందుకు ఒక జాతీయ ప్రయోగశాలగా ఉంది. మా ఆలోచన, ఆచరణను సమీక్షించుకొనేట్లు చేసిందీ అవార్డు అన్నారు.మానవహక్కుల విషయంలో మేము తొలి అడుగు వేయాల్సి ఉంది. దారిద్య్రం మానహక్కులకు ఆటంకంగా మారింది, దీని కోసం దీర్ఘకాలం పట్టవచ్చు అనికూడా మాకు అర్దమైంది అన్నారు. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత్వం అనే భావనకు పుట్టిల్లు ఫ్రాన్స్‌.ప్రస్తుతం దేశం దానికి విరుద్దంగా ఉందని ఫిలిప్‌ చెప్పారు.”గ్రినీ వినతి ” పేరుతో జాతీయ ప్రభుత్వానికి 2017 రూపొందించిన పత్రంపై దేశంలోని వందలాది మంది మేయర్లు బలపరుస్తూ సంతకాలు చేశారు. పేదలు నివశించే ప్రాంతాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలన్నదే దాని సారాంశం.


తమ స్ధానిక కమ్యూనిస్టు పాలనను అంతర్జాతీయ విజయగాధగా మార్చేందుకు స్ధానిక సామాజిక కార్యక్రమాలు తోడ్పడ్డాయని అమెరికా నుంచి వెలువడే జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో ఫిలిప్‌ చెప్పారు. అనేక మంది తమ మూలాలను మరచి తమ వర్గాలను విస్మరించి అందలాలు ఎక్కేందుకు అర్రులు చాస్తూ ” మన ” అనే భావం నుంచి దూరమై ”తన ”కు మాత్రమే గిరిగీసుకుంటున్న తరుణమిది. ఈ నేపధ్యంలో ఫిలిప్‌ రియో గమనం ఆదర్శనీయంగా ఉంది. దానికి సంబంధించిన అనేక అంశాలు జాకోబిన్‌కు చెప్పారు. .
ఉత్తమ మేయర్‌ అవార్డుకు అంతిమంగా పోటీ పడిన 32 పట్టణాల్లో నూఢిల్లీతో సహా వాషింగ్టన్‌, బగోటా, బ్యూనోస్‌ ఎయిర్స్‌ వంటివి ఉన్నాయి. వెళ్లకూడని ప్రాంతాలుగా కొంతమంది చిత్రించిన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న గ్రినీ పట్టణానికి అవార్డు రావటం ఆశ్చర్యం కలిగించింది. అమెరికాలో పేదలు నివసించే ప్రాంతాల నుంచి ఒలింపిక్‌ ఛాంపియన్లు లేదా నటులు వచ్చినపుడు జనాలు నీరాజనాలు పడతారు.మమ్మల్ని అవమానిస్తారు గనుక ఈ అవార్డు మా ఛాతీని ఉప్పొంగించింది.మనం ప్రపంచ ఛాంపియన్లమయ్యామని మావారు అంటున్నారు. మా ప్రయత్నాలకు అంతర్జాతీయ గుర్తింపు తేవటంలో విజయవంతమయ్యామని ఫిలిప్‌ చెప్పారు.
1995లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఫిలిప్‌ తలిదండ్రులు దుర్భర పేదరికాన్ని అనుభవించారు. ” కమ్యూనిస్టుగా ఉండటం అంటే ఏమిటని నన్ను తరచు కొందరు అడుగుతారు.నేనెందుకు పార్టీలో చేరాను అని గుర్తుకు తెచ్చుకుంటే ఒకటికి రెండు సార్లు అన్యాయం మీద ఆగ్రహం, రెండవది మున్సిపల్‌ స్ధాయి కమ్యూనిస్టు ఉత్పత్తిని.సమాజంలో ఉన్నత స్ధాయి గురించి నాకు తెలియదు, అయితే తమ ఖాళీ సమయంలో ఇతరుల జీవనాల మెరుగుదల కోసం పని చేసే కార్యకర్తలతో పని చేశాను.వారు నాకు క్రీడల్లో ఫుట్‌బాల్లో పాల్గొనేందుకు తోడ్పడ్డారు.శిక్షణ ఇచ్చారు. నా తండ్రి నిరుద్యోగి, తలిదండ్రులు కడు పేదరికాన్ని అనుభవించారు.కొన్నిసార్లు తినటానికి కూడా ఉండేది కాదు. దాంతో కమ్యూనిస్టుల సమావేశాలతో సహా దిగువ స్ధాయిలో సాయం అందించే వారి దగ్గర ఆహారం తిన్నాను.గ్రాండ్‌ బోర్నె అనే గృహ సముదాయం నుంచి మమ్మల్ని దాదాపు ఖాళీ చేయించారు. అద్దెకుండే వారిని ఖాళీ చేయించకుండా అడ్డుకొనేందుకు కమ్యూనిస్టులతో సహా అనేక మంది వచ్చారు. ఈ కార్యకర్తలు ముఖ్యంగా కమ్యూనిస్టులు ఎలా పని చేశారో చూశాను. వారంతా కార్మికవాడల్లోనే ఉండటాన్ని గమనించాను, వారితో కలిశాను.


విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం, ప్రపంచాన్ని మార్చేందుకు దాన్ని మనం ఉపయోగించవచ్చన్న నెల్సన్‌ మండేలా మాటలు నాకు ఎంతగానో నచ్చాయి.గ్రీనీ వంటి కార్మిక ప్రాంతాల్లోని విద్యార్దులు సగం మంది ఎలాంటి డిప్లొమా పొందకుండానే బయటకు వస్తారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కార్మికవాడల్లోని స్కూళ్లకు నిధులు సగమే ఇస్తారు.నేను ముందే చెప్పాను మున్సిపల్‌ కమ్యూనిజం ఉత్పత్తిని అని చెప్పాను. పార్టీ రూపొందించిన కార్యక్రమాలు భిన్నమైనవి. ఆరోగ్యపరిరక్షణకు స్ధానిక సంస్ధల అధికారాలను ఉపయోగించాము. విద్య అంటే క్రీడలు, సంస్కృతి కూడా కలసి ఉండేది.స్మార్ట్‌ ఫోన్ల ద్వారా అనేక మందితో సంబంధాలు పెట్టుకోవచ్చుగానీ మానవ సంబంధాలను నష్టపోతాము కనుక సమాజంతో సంబంధాలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకొని డిప్లొమాలు, డిగ్రీలు పొందవచ్చు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించవచ్చు. కానీ దానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలంటే పెద్దవారు బాధ్యత తీసుకోవాలి. పిల్లలు సమగ్రపౌరులుగా ఎదగాలంటే వారికి జీవితాంతం నేర్పాల్సి ఉంటుంది.గ్రినీలో మేము మూడు స్కూళ్లను స్ధాపించాము. ఒకటి పూర్తిగా యువకులైన పెద్దవారికి, అందరు పెద్దవారికి. వారికి డిప్లొమాలు లేనందున శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశాము. అసాధారణమైన ఫలితాలు వచ్చాయి. మరొకటి వయోజన విద్యాకేంద్రం. ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చాము. మూడవది ఆరోగ్య,సామాజిక సాయం చేసే శిక్షణ కేంద్రం.ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన యువతలో 60శాతం మంది మహిళలు, వారిలో కూడా 55శాతం మంది కార్మిక పేటల నుంచి వచ్చిన వారే. విశ్వవిద్యాలయాలకు వెళ్లలేని వారికి ఇవి అలాంటి అవకాశం ఇచ్చిన విశ్వవిద్యాలయాల వంటివే.ఉపాధి పొందేందుకు ఫ్రెంచి భాష,గణితంలో నిష్ణాతులు కావటం తప్పనిసరిగా ఉన్నందున ఆ శిక్షణ ఇస్తున్నాము.


కమ్యూనిస్టు పార్టీకి ఎన్నికల విజయాలు-పరాజయాలు రెండూ ఉన్నాయి. బలమైన కేంద్రాలు, ఎన్నికల విజయాలకు గారంటీలేమీ లేవు.మనకు మనం కొత్త మార్గాలను కనుగొనాలి. ప్రస్తుతం కార్మికవర్గంలో మార్పు ఉన్నమాట నిజమే గానీ పేదలు ఇంకా ఉన్నారు కదా ! నలభై ఏండ్ల క్రితం నీవు నివశించిన ప్రాంతంలో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటని కొందరు నన్ను అడుగుతారు. అప్పుడు ఐదు శాతం నిరుద్యోగం ఉంటే ఇప్పుడు 50శాతానికి పెరిగింది అని చెబుతాను. సంపదకోసం వెంపర్లాట పెరిగింది, ఉదారవాద సమాజం పేద కార్మికులను సృష్టిస్తున్నది. నేను మేయర్‌గా బాధ్యతలు చేపట్టేనాటికి అనేక సమస్యలున్నాయి.పదిహేడు వేల మంది నివాసం ఉండే ఐదువేల ఇండ్లకు వేడి నీరు, వెచ్చగా ఉంచే ఏర్పాట్లకు బిల్లులు చెల్లించక నిలిపివేశారు. అవి సహజవాయువుపై ఆధారపడి నడుస్తాయి.వాటి ధరలను మనం అదుపు చేయలేము. ప్రత్యామ్నాయంగా నూటికి నూరుశాతం ప్రజల భాగస్వామ్యంతో జియోథర్మల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశాము, 25శాతం మేరకు బిల్లులను తగ్గించాము, పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడ్డాము.వామపక్షాల మేయర్లందరం సమన్వయంతో పని చేస్తున్నాము.”


ఐరోపా, అమెరికాల వంటి ధనిక దేశాల్లో ఉన్న స్ధానిక సంస్ధలు పని చేసే తీరు, మన దేశంలోని వాటికి తేడాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా వాటికి తగిన అధికారాల కోసం పోరాడుతూ పౌరుల సమస్యలపై పని చేయటం ద్వారా జనాల మన్ననలను పొందవచ్చు. ఫ్రాన్సులో కేంద్ర అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలలో కమ్యూనిస్టులు ఎన్నికౌతున్నారంటే జనంతో కలసి ఉండటమే కారణం.

.

బంగాళాదుంప విత్తన హక్కు కేసులో పెప్సీకి ఎదురుదెబ్బ !

Tags

, , ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


పెప్సీకంపెనీ ” లేస్‌ ” బంగాళాదుంప ”చిప్స్‌” రకంపై హక్కులను కోల్పోయింది. ప్లాంట్‌ వెరైటీస్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ పెప్సీ రిజిస్ట్రేషన్‌ను డిసెంబర్‌ 3న రద్దుచేసింది. ఇది విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘనవిజయం. బంగాళాదుంప పంటలో ఉపయోగించే ఈ వంగడాలను 2009 లో భారత్‌ లోకి తీసుకువచ్చారు. రైతులకు అందించి బంగాళదుంపలను కొనేలా పెప్సీకో ఒప్పందాలు కుదుర్చుకున్నది, 2016 సం.ఫిబ్రవరి 2 న ఈ రకపు వంగడం పిపిఇవిఆర్‌-2001 చట్టం 64,65 సెక్షన్ల క్రింద అధికారికంగా పెప్సీ కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నది.” చిప్స్‌” కోసం ఉపయోగించే ప్రత్యేకమైన బంగాళాదుంప పై పూర్తి హక్కులు తమవేనని పెప్సీ కంపెనీ విర్రవీగుతున్నది. ”పెప్సీకో ఇండియా హౌల్డింగ్‌ యఫ్‌. యల్‌.2027 ” అని పిలవబడే బంగాళాదుంప రకాలను పేటెంట్‌ చట్టం క్రింద నమోదు చేసుకున్నాం కాబట్టి ఈ వంగడం పై పూర్తి హక్కులు తమ స్వంతం అని పెప్సీకో దబాయిస్తున్నది. తమ అనుమతి లేకుండా ఎవరూ ఆ రకాన్ని పండించటానికి వీలు లేదని పెప్సీ కంపెనీ అంటున్నది. ఈ ప్రత్యేక రకమైన బంగాళాదుంపలను ఉపయోగించి ” లేస్‌ ” అనే బ్రాండ్‌ పేరుతో ”చిప్స్‌” తయారుచేసి అమ్ముకుంటున్నది. . చిరుతిళ్ళు, కూల్‌ డ్రింకులు తయారుచేసే పెప్సీకో ఒక పెద్ద మల్టీనేషనల్‌ ఫుడ్‌ కంపెనీ, 200 దేశాలలోవ్యాపారాన్ని చేస్తున్నది. గతసంవత్సరం అమ్మి మన దేశాన్నుండి 4.52 లక్షల కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. దేశంలో 12 రాష్ట్రాలలో 24 వేల మంది రైతులకి బంగాళాదుంప విత్తనాలను ఇచ్చి తిరిగి బంగాళాదుంపలు కొనేటట్లుగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేస్తున్నది. చట్టాల పేరున సాంప్రదాయక రైతు విత్తన హక్కు పై దాడి చేస్తున్నది. రైతు తన విత్తనాన్ని తనే తయారుచేసుకుని వాడుకోకుండా అడ్డుకుంటున్నది.

ఒక్కొక్క రైతు నుండి ఒక కోటి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్నిడిమాండ్‌ చేసిన పెప్సీ

రెండు సంవత్సరాల క్రితం గుజరాత్‌ లో నలుగురు రైతులపై 4.2 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టారు. 2018 ఏప్రియల్‌ 8 న అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు రైతులను విచారించకుండానే, వారి లాయర్‌ లేకుండానే కంపెనీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. అయితే రైతులు, ప్రజాస్వామిక వాదులు రైతు విత్తన హక్కు కోసం నిలబడ్డారు. కోర్టు కేసులు రద్దు చేయాలని దేశ వ్యాపిత ఆందోళనలు చేశారు. గుంటూరు దగ్గర తుమ్మలపాలెంలోకూడా పెప్సీ కంపెనీ వద్ద రైతు సంఘాలన్నీ ఆందోళన చేశాయి. పెప్సీకంపెనీ చిరుతిళ్ళను, కూల్‌ డ్రింకులను బహిస్కరించాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఎన్నికల ముందు దేశ వ్యాపిత ఆందోళనల ఫలితంగా కంపెనీ కేసులన్నీ వెనక్కి తీసుకున్నది.

పెప్సీ కంపెనీకి విత్తనం పై హక్కు

కానీ విత్తనం పై హక్కు నాదే అని పెప్సీ ఇప్పుడు కూడా అంటున్నది. తాత్కాలికంగా వెనక్కితగ్గానంటున్నది. చట్టం ప్రకారం రైతులకు విత్తనం తయారుచేసుకునే హక్కులేదని కంపెనీ వాదిస్తూనే వుంది. ఇందుకు ప్రతిగా కవిత కురుగంటి రైతుల విత్తన హక్కుకోసం పిటీషన్‌ వేశారు. రైతుల విత్తన హక్కు ను పెప్సీ కంపెనీ ఉల్లంఘిస్తున్నదని ,పిపిఇవిఆర్‌-2001 చట్టం ప్రకారం వారికిచ్చిన రిజిస్ట్రేషన్‌ చెల్లదని పిటీషన్‌ దాఖలుచేశారు. చట్టంలోని సెక్షన్‌ 64 ను పెప్సీ ఉపయోగించుకున్నది. రైతులు అదేచట్టం లోని సెక్షన్‌ 39(1) ను ఉదహరించారు. ఈ సెక్షన్‌ ప్రకారం వ్యవసాయానికి విత్తనాలను నాటటం, తిరిగి నాటటం, విత్తనాలను మార్చుకోవటం, పంచుకోవటం లేదా విక్రయించటానికి రైతులకు అవకాశంవున్నది. ఈ చట్టం అమలులోకి రాకముందులాగానే రైతులకు హక్కులన్నీ వుంటాయని కూడా సెక్షన్‌ 39 చెప్తున్నది. కాకపోతే రైతులు బ్రాండులతో విత్తనాలను అమ్మకూడదు. ఈ రక్షణ నిబంధనలు విత్తన రకాలపై పేటెంట్‌ ను అనుమతించటంలేదని , పెప్సీ యొక్క యఫ్‌ సీ 5 బంగాళదుంప రకానికి మంజూరు చేసిన మేధోరక్షణను రద్దు చేయాలని చేసిన వాదనను పిపిఇవి అధారిటీ అంగీకరించింది. రైతులకు విత్తనాలను తయారు చేసుకునే హక్కు ఉన్నదన్నారు. బ్రాండు లేని విత్తనాలను అమ్మకునే హక్కుకూడా రైతుకు వుందన్నారు.

పెప్సీ కంపెనీ దబాయింపులకు కోర్టు అడ్డుకొట్టింది. ఆ బంగాళాదుంప వంగడం పై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దుచేస్తూ మొక్కల రకాల పరిరక్షణ, రైతు హక్కుల పరిరక్షణ అధారిటీ , శుక్రవారం తీర్పుఇచ్చి సందిగ్దాన్ని తొలగించింది. రైతులను నిలవరించటం కుదరదన్నారు. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తమ పేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులు ఎవరూ పండించటానికి వీలులేదని పెప్సీకంపెనీ వాదిస్తూవుంది

ఈ తీర్పువలన మన రైతులకు చారిత్రక విజయం లభించింది. ఏ కోర్పోరేట్‌ కంపెనీ ఐనా విత్తనం పై సంపూర్ణ హక్కును పొందే అవకాశం లేకుండా స్పష్టమైన తీర్పును, పీపీవీ యఫ్‌ఆర్‌ఏ ఛైర్‌ పర్సన్‌ శ్రీ కే వీ ప్రభు గారు ఇచ్చారు. రైతులోకం స్వాగతించవలసిన తీర్పును సాధించిన కవితా కురుగంటి అభినందనీయులు.
డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.