ఎం కోటేశ్వరరావు
అమెరికా, డోనాల్డ్ ట్రంప్ నమ్మక ద్రోహులని ఇరాన్ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. రెండువారాల పాటు ఇరాన్‌పై దాడులను విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుఝామున ఈ ప్రకటన వెలువడింది. దానికి ప్రతిగా హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తాను సమర్ధిస్తానని అయితే దానిలో లెబనాన్‌పై దాడులకు సంబంధించిన అంశం లేనందున దాడులు కొనసాగిస్తానని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పుడు అదే ఒప్పందాన్ని సందిగ్దంలో పడవేసింది. ఇరాన్‌తో కుదిరిన అవగాహనలో లెబనాన్‌పై కాల్పుల విరమణ అంశం లేదని బుధవారం నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటించాడు. దీంతో అమెరికా ఆడిన నాటకం బట్టబయలైంది. ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైంది. ఒప్పందానికి తూట్లు పొడిచి ఇరాన్ మీద నెపం మోపేందుకు ట్రంప్ యంత్రాంగం అతి తెలివి ప్రదర్శించింది. అమెరికాకు అందచేసిన పది అంశాల్లో ఒకటిగా లెబనాన్ మీద దాడుల నిలిపివేతను ఇరాన్ స్పష్టంగా పేర్కొన్నది.అదేమీ తెలియనట్లు జెడి వాన్స్ మాట్లాడటం మోసకారితనమే. ఒప్పందం జరిగిన రోజే లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ వందలాది మందిని చంపింది. దీనికి ప్రతిగా తెరిచిన హార్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.రెండో రోజు గురువారం నాడు కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి.దానికి ప్రతిగా ఇరాన్, లెబనాన్‌లోని హిజబుల్లా కూడా దాడులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి కుదిరిన ఒప్పందం విఫలమైనట్లే కనిపిస్తోంది. దానికి పూర్తి బాధ్యత ట్రంప్‌దే. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు అమెరికా కనుసన్నలలో పనిచేసే ఇజ్రాయెల్ దాడులకు వాషింగ్టన్ అనుమతి ఉందన్నది నిర్వివాదం.
తాజా అంశాలకు ముందు జరిగిన పరిణామాలను ఒక్కసారి నెమరువేసుకుందాం. పోరు ఇంకా ముగియలేదని తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదనే(తుపాకి గుండు బయటకు రావాలంటే నొక్కాల్సిన మీటను ట్రిగ్గర్ అంటారు) ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది. ట్రంప్ ప్రకటన తరువాత రెండు వైపుల నుంచీ దాడుల వార్తలు లేవు.ఇరాన్ ప్రతిఘటనతో గుక్కతిప్పుకోలేని అమెరికా వ్యూహాత్మకంగా ఈ అవగాహనను అంగీకరించిందా ? ఈలోగా తన బలగాలను మరింతగా కూడదీసుకుంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఏకపక్షంగా గడువులను ప్రకటించిన ట్రంప్ ఆ సమయంలో అన్ని రకాల దళాలను అదనంగా పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యానికి తరలించి భూతల దాడులకు సన్నాహాలు చేశాడు.ఒక్క రాత్రితో ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానని మాట్లాడిన సంగతి తెలిసిందే.అమెరికా-ఇజ్రాయెల్ దుష్ట ఆలోచన గురించి ఎలాంటి భ్రమలు లేనప్పటికీ ఎంతో సంయమనం,దూరదృష్టితో ఇరాన్ ప్రతిఘటన నిలిపివేతకు అంగీకరించింది. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా పదిహేను అంశాలు, ఇరాన్ పది ప్రతిపాదనలను అందచేశాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత రెండువారాల వ్యవధిలో వీటి గురించి చర్చలు జరుగుతాయి. ఎవరు వేటిని అంగీకరిస్తారు, తిరస్కరిస్తారు అన్నది చర్చల ప్రారంభం తరువాత మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నిజానికి ఈ అంశాలు ఎప్పటి నుంచో నలుగుతున్నవే.రెండు దేశాలూ వాటిని తిరస్కరించాయి.అందువలన ఇప్పుడేమి జరగనుందనే ఉత్కంఠ సహజంగానే ప్రపంచమంతటా తలెత్తింది.
అమెరికా 15ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. తక్షణమే నెల రోజుల కాల్పుల విరమణ జరగాలి, అన్ని చర్యలు నిలిపివేసి ముఖాముఖీ చర్చలు పాకిస్తాన్‌లో జరిపేందుకు అవకాశం కల్పించాలి.ఇరాన్‌లోని నాటంజ్, ఇష్‌ఫహాన్, ఫోర్డో అణుకేంద్రాలను శాశ్వతంగా ధ్వంసం చేయాలి. ఇరాన్ గడ్డమీద యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలి.శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ (ఐఏఇఏ) పర్యవేక్షణలో మరోదేశానికి తరలించాలి.ఇరాన్‌లోని అన్ని మిలిటరీ, పౌరకేంద్రాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు ఐఏఇఏ నిరాటంక తనిఖీకి అనుమతించాలి.హార్ముజ్ జలసంధిని తటస్థ ప్రాంతంగా చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతించాలి.బాలిస్టిక్ క్షిపణుల పరిధిని పరిమితం చేసి సంఖ్యను తగ్గించుకొని ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించాలి.హిజబుల్లా, హౌతీల వంటి సాయుధ బృందాలకు నిధులు, ఆయుధాల అందచేత నిలిపివేయాలి. నిర్బంధంలో ఉన్న విదేశీ పౌరులందరకీ, ద్వంద్వ పౌరసత్వం ఉన్న అందరికీ స్వేచ్చ నివ్వాలి.అమెరికా ఆస్తులు మరియు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోకుండా ఒక ఒప్పందానికి రావాలి.సమగ్రమైన ఆంక్షల నుంచి ఊరట, ప్రాధమిక,ఇతర ఆంక్షలు పూర్తిగా తొలగింపు.విదేశాల నుంచి సేకరించే ఇంధనంతో బుషేహర్‌లో ఉన్న అణువిద్యుత్ కేంద్రానికి అమెరికా మద్దతు.ఇరాన్ ఇంథన రంగంలో పశ్చిమదేశాల పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.ఒప్పందం కుదిరిన తరువాత ఆటోమేటిక్‌గా అమల్లోకి వచ్చే ఐరాస ఆంక్షల తొలగింపు.ప్రాంతీయ స్థిరత్వానికి చట్టపరమైన అంగీకారంతో శాశ్వత శాంతి ఒప్పందం.
ఇరాన్ ప్రతిపాదించిన పది అంశాలు ఇలా ఉన్నాయి.ఇరాన్ మీద ఇంకేమాత్రం దాడులు చేయకూడదు.అమెరికా, దాని అనుయాయి దేశాలు అన్ని రకాల దాడులను శాశ్వతంగా ఆపాలి.తాత్కాలిక విరమణ కాదు, శాశ్వత ఒప్పందం కుదరాలి.విదేశాల్లో స్థంభింపచేసిన ఇరాన్ ఆస్తులన్నింటినీ ఒప్పందంలో భాగంగా తిరిగి ఇవ్వాలి. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులను ఆపాలి.అన్ని రకాల అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలి.ఇరాన్ అనుయాయుల మీద ఇంకేమాత్రం దాడులు జరపకూడదు.హార్ముజ్ జలసంధిలో స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతి. ప్రయాణించే ప్రతి నౌకకూ ఇరవైలక్షల డాలర్ల ఫీజు చెల్లించాలి.ఈ ఫీజులో ఒమన్‌కూ వాటా ఇస్తాం.దాడుల కారణంగా దెబ్బతిన్న తమ ఆస్తుల పునరరుద్దరణకు ఈ ఫీజు ద్వారా సమకూడే సొమ్మును ఖర్చు చేస్తాం. అన్ని ఒప్పందాలకు ఐరాస భద్రతా మండలి తీర్మాన హామీ ఉండాలి. అయితే బుధవారం నాడు వచ్చిన కొన్ని వార్తల ప్రకారం అధికారిక పార్సీ భాషలో పేర్కొన్న ఒక కీలక అంశం విదేశీ మీడియా, ఇతరులకు ఆంగ్లంలో జారీ చేసిన ప్రతిపాదనల్లో లేదని చెబుతున్నారు. యురేనియంను శుద్ధి చేసుకొనే హక్కు తమకు ఉండాలన్న అంశం పార్సీలో ఉందని అంటున్నారు.. ఎన్నో ప్రగల్భాలు పలికిన ట్రంప్ పాకిస్తాన్ తడిక రాయబారానికి ఎందుకు అంగీకరించాడు అన్నది చర్చ.
డోనాల్డ్ ట్రంప్ హీన సంస్కృతికి ప్రతిబింబం.ు ముందు ఇరాన్‌పై దాడులకు తెగబడి దిక్కుతోచని ట్రంప్ సభ్యసమాజం నోటితో ఉచ్చరించలేని, సైగలద్వారా చూపలేని బూతు పదజాలంతో ఇరాన్‌పై దూషణలకు దిగాడు. స్వేచ్చ పేరుతో బూతులు మాట్లాడటం అమెరికాలో సర్వసాధారణం అని తెలిసిన వారికి ట్రంప్ బూతుపురాణం ఆశ్చర్యం కలిగించలేదు.అలాంటి వాడిని తన స్నేహితుడు, వ్యూహాత్మక భాగస్వామి అని 56 అంగుళాల ఛాతీ విరుచుకొని చెప్పుకున్నవారందరూ సిగ్గుపడతారా ? గర్వపడతారా ! జాలి చూపుదాం, వదిలేద్దాం. ఇరాన్‌లో పాలకులను గద్దె దింపుతాం అంటూ బయలు దేరిన ట్రంప్‌నే గద్దె దించాలని అమెరికాలో అధికార పార్టీకి చెందిన వారు కూడా కోరారు.దీన్నే విధి వైపరీత్యం అంటారు. ఒక్క లక్ష్యమూ నెరవేరలేదు. ఇరాన్ గెలిచింది అనటం కంటే అమెరికా ఓడిందని వర్ణించటం సరైనది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల లోగా తాను చెప్పినట్లుగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను పేల్చివేస్తామని ట్రంప్ బెదిరించాడు. ఒక్క రోజులో ఇరాన్ను ఆక్రమించుకోగలమని చెప్పాడు. తమ విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవకవచాలుగా ఏర్పడాలని కవులు, కళాకారులు, యువకులు,యావత్ పౌరులకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. వేలాది మంది జాతీయ పతాకాలతోగుమికూడారు.అమెరికా, ఇజ్రాయెల్ దుర్మార్గాల చరిత్రను చూసినపుడు నిరాయుధులైన పిల్లలు,మహిళలు, ఆసుపత్రుల్లోని రోగులు, సహాయ కేంద్రాలకు చేరిన అభాగ్యులు ఎవరినీ వదలకుండా చంపివేసిన దుర్మార్గాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.ఇరాన్‌లో అని ప్రాంతాల మీద దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నందున ఎక్కడో మరణించేబదులు, దేశరక్షణ కోసం ప్రాణాలర్పించటానికి మానవ కవచాలుగా ఏర్పడటానికి ముందుకు వచ్చారు. వారిని చంపివేస్తారా ? భయపడి వెనక్కు తగ్గుతారా ? అన్న చర్చ జరిగింది, చివరకు ట్రంప్ తోకముడవక తప్పలేదు.
రాజ్యాగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది.అయితే ఇది అంత తేలిక కాదు. అతగాడి చర్యల ద్వారా తమ ప్రయోజనాలకు ముప్పు వచ్చినట్లు పాలకవర్గం భావిస్తేమాత్రం ఎంతో సులువు. ఉక్రెయిన్ సంక్షోభం, గాజాలో మారణకాండ, తాజాగా ఇరాన్‌పై దాడులతో అమెరికాలోని చమురు, ఆయుధ కంపెనీలు, వ్యాపారులకు లాభాల పంట పంట పండుతున్నది. ఆయుధ కంపెనీల వాటాల ధరలు నెల రోజుల్లో 25శాతం పెరిగాయి.చమురు కంపెనీల సంగతి సరేసరి అమెరికాలో దొరికే ముడి చమురు ధర 60 నుంచి 110 డాలర్లకు పెరిగింది, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ధరలు కూడా అలాగే పెరిగాయి. అందువలన ట్రంప్‌ను ఇప్పటికిప్పుడు తొలగించేందుకు పూనుకుంటే ఈ రంగంలోని కార్పొరేట్లు మౌనంగా ఉంటారా ? సమస్యే లేదు. ప్రపంచంతో వారికి పనిలేదు. నిజానికి ట్రంప్‌ను గద్దె దించాలన్న డిమాండ్ దాడులు ప్రారంభమైన నెల రోజుల వరకు ముందుకు రాలేదు.అమెరికాకు తగులుతున్న ఎదురుదెబ్బలు, ఇరాన్ లొంగే అవకాశం, అమెరికా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన తరువాతే ప్రారంభమైంది.బహుశా తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని కార్పొరేట్ శక్తులు కూడా వత్తిడి తెచ్చి ఉంటాయి, జనంలో తలెత్తిన నిరసన తెలిసిందే. రెండు వారాల విరామ ఒప్పందం వెనుక సూత్రధారి చైనా, పాత్రధారి పాకిస్తాన్ అనే విశ్లేషణలు వెలువడ్డాయి. పాక్ మధ్యవర్తిత్వం గురించి వార్తలు వెలువడిన సమయంలో ఇస్లామాబాద్‌లో చర్చలకు తాము అంగీకరించేది లేదని కొద్ది రోజుల క్రితం ఇరాన్ ప్రకటించింది.పాకిస్తాన్ అమెరికా తొత్తు అన్న సంగతి తెలిసిందే. అటువంటి దాన్ని నమ్ముకొని చర్చలకు దిగితే ఏం జరిగేది చెప్పలేని స్థితిలో నాటకీయంగా కాల్పుల విరమణ అవగాహన ఎలా కుదిరిందన్న ప్రశ్న ముందుకు వచ్చింది.ట్రంప్ ప్రకటనకు ముందు జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా అవలోకనం చేసుకోవటం అవసరం. ఇరాన్ మీద దాడి చేసేందుకు అమెరికా భద్రతామండలి తీర్మానాన్ని ఆయుధంగా చేసుకొనేందుకు చూసింది. హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు అవసరమైతే బలప్రయోగం చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న తీర్మానం మండలి ముందుకు వచ్చినపుడు మంగళవారం నాడు చైనా, రష్యా వీటో చేసి ఇరాన్‌కు బాసటగా నిలిచాయి. అది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ.ఆ తీర్మానం, ట్రంప్ విధించిన దాడుల గడువు మధ్య పది గంటల వ్యవధిలో చైనా రంగంలోకి దిగి తన మిత్రదేశమైన ఇరాన్ను ఒప్పించింది అని చెబుతున్నారు.ట్రంప్‌ను విలేకర్లు దీని గురించి అడగ్గా అవును నేను విన్నాను అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం.హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ను ఒప్పించటం అంటే అమెరికాకు లొంగిపొమ్మని కాదు. సంక్షోభ ముగింపుకు ఎక్కడో ఒక దగ్గర నాంది పలకాలి. ఇరాన్ ఎంత మిత్రదేశమో గల్ఫ్ దేశాలు కూడా చైనాకు అంతే దగ్గర. సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చిన సంగతిని మరచిపోరాదు.గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్నదాడులు వాంఛనీయం కాదన్నది తప్ప చైనా ఖండించలేదు.ఐరాస తీర్మాన సమయంలో చైనా, రష్యా తటస్థంగా ఉన్నాయి. అదే బలప్రయోగానికి పూనుకోవాలన్న తీర్మానం వచ్చినపుడు అవి రెండూ టెహరాన్ రక్షణకు నిలిచాయి.ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మార్గదర్శనం చేశాయంటే అతిశయోక్తి కాదు. నలభై రోజుల దాడుల సమయంలో ఈ రెండు దేశాలు ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండా మద్దతునిచ్చాయి.అమెరికా, ఇజ్రాయెల్ దళాలు, నావలు, విమానాల కదలికలకు సంబంధించిన ఉపగ్రహ,కృత్రిమ మేధ విశ్లేషణలు ఇరాన్‌కు అందచేసిన కారణంగానే నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేసి ట్రంప్‌కు ఊపిరి సలపకుండా చేశాయని అమెరికా పత్రికలే రాశాయి. ఒప్పందానికి ముందు తమ విదేశాంగ మంత్రి వాంగ్ ఇ ఇరాన్,రష్యా, గల్ఫ్ దేశాలతో 26సార్లు ఫోన్ సంభాషణలు జరిపినట్లు చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పాడు. దాడుల సమయంలో చైనా మౌనం గురించి ” నీ శత్రువు తప్పు చేస్తున్నపుడు అస్సలు అంతరాయం కలిగించవద్దు ” అనే శీర్షికతో ఎకనమిస్ట్ పత్రిక ఒక విశ్లేషణ చేసింది.వచ్చే నెలలో డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో ఈ ఒప్పందం కుదరటం గమనించాల్సిన అంశం. కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి ప్రధాని షెహబాజ్, ఫీల్డ్ మార్షల్ మునీర్ పాత్ర గురించి ట్రంప్ పేర్కొన్నాడు. చిత్రం ఏమిటంటే ఈ ఒప్పందాన్ని హర్షించిన ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ ప్రస్తావన చేయలేదు.అందుకే అందని ద్రాక్ష పుల్లన అన్నారు, అసలు సంగతేమంటే విశ్వగురువును పిలిచినవారెవరూ లేరు ! ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు మన సంగతి మనం చూసుకోవాలని తమ ఆరాధ్య దైవం మౌనంపై భక్తులు సమర్ధనకు దిగారు. ఒప్పందం కుదరగానే హర్షం వెలిబుచ్చుతూ ప్రభుత్వం ఎందుకు స్పందించింది ? ఇరాన్ మీద ఏకపక్షంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు తెగబడినపుడు ఎందుకు మౌనం దాల్చినట్లు ? నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి మరి !
