ట్రంప్‌ను భయపెడుతున్న‘‘కమ్యూనిస్టు భూతం’

Tags

, , , , ,

ఎం.కోటేశ్వరరావు

ఒక భూతం ఇప్పుడు వెంటాడుతున్నది, అదే కమ్యూనిస్టు భూతం అనే వాక్యంతో కారల్ మార్క్స్-ఎంగెల్స్ 1848లో రూపొందించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది. ఇన్నేండ్ల తరువాత ఇప్పుడు అదే భూతం సామ్రాజ్యవాదం, దాని కుంభస్థలంగా ఉన్న అమెరికాను మరోసారి “కమ్యూనిస్టు భూతం” ఊపివేస్తోంది. గతంలో అక్కడి కార్మికవర్గంపై సోషలిస్టు శిబిర సమాజాల ప్రభావం పడకుండా చూసేందుకు పాలకవర్గం అనుసరించని దుష్టవిధానాలు లేవు. ఇప్పుడు చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు ఉన్నప్పటికీ గతం మాదిరి శిబిరంగా లేవు. అయినప్పటికీ గతం కంటే ఇప్పుడు ఎక్కువగా భయపడుతున్నారు. నాడు సోషలిజం విఫలమైందని అమెరికా, ఐరోపా దేశాల పాలకవర్గం ప్రచారం చేస్తే పెట్టుబడిదారీ విధానం విఫలమైందని యువతీయువకులు అనుభవపూర్వకంగా రోజురోజుకూ ఎక్కువగా గుర్తించటమే దీనికి కారణం. ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా ఇరాన్ శక్తి యుక్తులను తక్కువగా అంచనా వేసిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నవంబరు మూడవ తేదీన జరిగే మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీని గెలిపించేందుకు నానా గడ్డీ కరుస్తున్నాడు. తెల్లవారితే ఇరాన్ మీద కొత్త అబద్దం, ప్రచారాన్ని ముందుకు తెస్తున్నాడు. దీంతో పాటు ఓటర్లను భయపెట్టేందుకు కూడా పూనుకున్నాడు. అమెరికాకు ఇప్పుడు “కమ్యూ నిజం పెద్ద ముప్పు” అంటూ ఊగిపోతున్నాడు. సోషలిజం, కమ్యూనిజాలను ఏడు నిలువుల లోతున తిరిగి లేవకుండా పాతిపెట్టామని చెప్పిన నోటితోనే ఇప్పుడు ముప్పు వచ్చిందని చెబుతున్నాడు. నిజంగా అలాంటి ముప్పు తలెత్తిందా? నిజానిజాలేమిటి?


ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కమ్యూనిజాన్ని ఆలింగనం చేసుకొంటోదని డోనాల్డ్ ట్రంప్ గతవారంలో వ్యాఖ్యా నించాడు. పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్ధులుగా పురోగామివాదులు, అదే పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్టులుగా ప్రకటించుకున్నవారు అనేక చోట్ల ముందంజలో ఉండటమే దీనికి కారణం. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ట్రంప్, ఇతర కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎంత రెచ్చగొట్టినా ఓటర్లు డెమోక్రటిక్ సోషలిస్టు జోహ్రాన్ మందానీని మేయర్‌గా ఎన్నుకున్నారు.అనేక చోట్ల అదే పునరావృతం అయ్యేట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. పురోగామివాదులకు పెద్దపీట వేయటం అమెరికా విలువలకు ముప్పు అంటూ మిత వాద శక్తులు గగ్గోలు పెడుతున్నాయి, వాటితో డెమోక్రటిక్ పార్టీలోని వారు కూడా చేతులు కలుపుతున్నారు. గత మంగళవారం నాడు న్యూయార్క్ నగరం నుంచి మూడు పార్లమెంటు స్థానాలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రైమరీలలో మందానీ బలపరిచిన అభ్యర్ధులు నెగ్గారు, శుక్రవారం నాడు క్రైస్తవ మితవాదుల సభలో మాడ్లాడిన ట్రంప్ వారంతా కమ్యూనిస్టులని, దేశానికి కమ్యూనిజం ముప్పు వచ్చిందని ఆరోపించాడు, ఆదివారం నాడు వాషింగ్టన్ నగర మేయర్ కమ్యూనిస్టు కాబోతున్నట్లు ట్రంప్ వాపోయాడు.


దీంతో పాటు ఏకంగా దేశ రాజధాని వాషింగ్టన్ డిసి నగరంలోనే అలాంటి అభ్యర్ధి ముందుండటం ట్రంప్‌కు కలవరం కలిగించింది.ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ కోయలిషన్ అనే మతపరమైన మితవాదుల వార్షిక సమావేశంలో ఆధిక్యతకోసం మార్గం అనే ఇతివృత్తంపై ట్రంప్ మాట్లాడుతూ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. ఆ అంశాలనే తరువాత తన సామాజిక మాధ్యమంలో కూడా పోస్టు చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరు వాత రెండవ ప్రపంచ యుద్ధం, పెరల్‌హార్బర్,లేదా 2011 సెప్టెంబరులో న్యూయార్క్ నగర ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి కంటే 250 ఏండ్ల నాడు ఏర్పడిన అమెరికాకు తొలిసారిగా కమ్యూనిజం ముప్పుగా మారిందని పేర్కొన్నాడు. ఉచితంగా ఇండ్లు, ఆహారం వంటి నినాదాలతో ముందుగా కమ్యూనిజం ఆకర్షిస్తుంది తరువాత అది కూలిపోతుందని ట్రంప్ తన ఉపన్యాసంలో సెలవిచ్చాడు.డెమోక్రటిక్ పార్టీ పెద్ద ప్రమాదంలో ఉంది, మౌలిక మైన సామాజిక కార్యక్రమాలతో అది సాంప్రదాయ అమెరికా విలువలను ధ్వంసం చేస్తున్నది, ఇది ఒక్క న్యూయార్క్ నగరంతోనే ఆగరు, వామపక్ష తీవ్రవాదులు పిల్లలను నపుంసకులుగా మారుస్తారు, వారు క్రైస్తవులు, చర్చ్‌ల మీద యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని చూస్తున్నారు. న్యూయార్క్ నగరంలో ఎన్నికైన కమ్యూనిస్టులను చూశారు, సాంప్రదాయ అమెరికా జీవన విధానాన్నే పూర్తిగా నాశనం చేయాలని చూస్తు న్నారని ట్రంప్ ఆరోపించాడు.

కమ్యూనిజం మతానికి వ్యతిరేకం, హింసదానిలో అంతర్భాగం, హత్యలు వారికి పెద్ద అంశం, వారు పశువులు అన్నాడు. గాజాలో ఇజ్రాయెల్ యూదు దురహంకారులు పిల్లలను ఎలా పథకం ప్రకారం వధించారో చూసి కూడా ఆ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధించి చంపండి, నరకండి అంటూ ప్రోత్స హించిన ట్రంప్ కమ్యూనిస్టుల గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించటం లేదు. క్రైస్తవ మతవాదుల సమావేశంలో ప్రసంగించిన ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా అదే కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదంతో ఊగిపోయాడు. కమ్యూనిజం విదేశీ సమస్య కంటే అంతర్గత ముప్పు అన్నాడు.“దేశంలో ఇప్పుడు ఒక ప్రమాదకర ధోరణి నడుస్తోంది, సరిగా చెప్పాలంటే దేశమంతటా పార్లమెంటుకు పోటీ చేసేందుకు చిన్న మందానీలు ఎదుగుతున్నారు” అన్నాడు. ఇవాంజ లిస్టులంటే క్రైస్తవ మతమార్పిడిని బహిరంగంగా ప్రోత్సహించే మిషనరీ సంస్థలకు చెందిన వారు. అమెరికా చరిత్రలో కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోసినవారిలో వీరి పాత్ర కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి వారంతా పాల్గొన్న సభ కనుకనే ట్రంప్ కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి మాట్లాడాడు.
ఎనిమిది పదుల ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియటం లేదు.

కమ్యూనిస్టులు చర్చీలను కూల్చి వేస్తారు, క్రైస్తవులను చంపుతారు, మతాన్ని నాశనం చేస్తారని మాట్లాడిన నోటితోనే అంతకు ముందు అసలు తానే పెద్ద కమ్యూనిస్టు దేశానికి నాయకుడినని , షీ జిన్‌పింగ్ ఎంతో మంచి వ్యక్తి అన్నాడు. శుక్రవారం నాడు కమ్యూనిజంపై ప్రారంభించిన దాడిని ఆదివారం నాడు కూడా కొనసాగించాడు. వాషింగ్టన్ డిసి నగర మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీ మహిళా నాయకురాలు జానీస్ లెవిస్ జార్జి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆమె దాదాపు ఎన్నికయి నట్లే అని స్వయంగా ట్రంప్ తన సామాజికమాధ్యమంలో పోస్టు పెట్టాడు. ఆమె ఒక కమ్యూనిస్టు అని, రాజధాని నగరానికి ఆమె విధానాలు హాని కలిగిస్తాయని వాపోయాడు. నగరంలోని జైళ్లను ఖాళీ చేస్తారని, వలసదార్లకు రక్షిత నగరంగా మారుస్తారని, నేరగాండ్లను నగరానికి తిరిగి తీసుకువస్తారని ఆరోపించాడు. లెవిస్ జార్జి ప్రస్తుతం నగర కార్పొరేషన్ వార్డు సభ్యురాలిగా ఉన్నారు.ఇప్పుడున్న డెమోక్రటిక్ మేయర్ మరోసారి పోటీచేయటంలేదు, దాంతో ఆమె ముందుకు వచ్చారు, తాను డెమోక్రటిక్ సోషలిస్టునని స్వయంగా ప్రకటించు కున్నారు. అధికార రిపబ్లికన్ పార్టీకి కనీసం మేయర్ అభ్యర్ధికూడా లేని స్థితి.లెవిస్ కనుక అభ్యర్ధిగా ఎన్నికైతే నగరాన్ని ఫెడరల్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ బెదిరించాడు. గతేడాది ఆగస్టు నుంచి నగరంలో నేరాలను అరికట్టే పేరుతో వివిధ రాష్ట్రాల నుంచి రప్పించిన నేషనల్ గార్డు దళాలను తిష్ట వేయించాడు.

అంతకు ముందు నగరాన్ని సుందరీకరించేందుకు అనేక పథకాలను రూపొందించినట్లు ప్రకటించిన ట్రంప్ లెవిస్ అభ్యర్ధిత్వం ఖరారు కాగానే ఆ పథకాలు ఎలా అమలు చేస్తారో చూస్తానంటూ మాట్లాడాడు.ట్రంప్ తనపై మోపిన అభాండాలు, ఆరోపణలను లెవిస్ ఖండించారు.ట్రంప్ అధికార యంత్రాం గంతో కలసిపని చేస్తానని అన్నారు. డెమోక్రటిక్ పార్టీ అధిష్టానవర్గ అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీలో బడా ప్రముఖులుగా ఉన్న వారిని ఓడించేం దుకు తనతో భావసారూప్యత కలిగిన ముగ్గురిని బలపరచి మందానీ తన సత్తా చాటుకున్నాడు. పాత రాజకీయాలే ప్రస్తుత సంక్షోభానికి కారణమని, ఆ రాజకీయాలు దాన్నుంచి బయటపడవేయలేవని, న్యూయార్క్ నగరవాసులు నూతన రాజకీయాలను కోరుకుంటు న్నారని మందానీ వ్యాఖ్యానించాడు. దీని అర్ధం ఇజ్రా‌యిల్‌తో అమెరికా సంబంధాలు, అసమానతలు చెల్లవని చెప్పటమే అని విశ్లేషకులు చెబుతున్నారు.డెమోక్రటిక్ పార్టీ అధిష్టానం అభ్యర్ధులుగా ధనికులు, అందునా ధనవంతుల మీద పన్నులు వేయాలనటాన్ని వ్యతిరేకించే వారిని ప్రతిపాదించింది. మందానీ వారికి వ్యతిరేకంగా తన మద్దతుదార్లను గెలిపించాడు. యూదు సామాజిక తరగతి గణనీయంగా ఉన్న న్యూయార్క్ నగరంలో ఈ ముగ్గురూ ఇజ్రాయిల్‌ వైఖరిని దానికి బేషరతుగా మద్ద‌తిచ్చే ట్రంప్ విధానాన్ని వ్యతిరేకించేవారు కావటం విశేషం. ఈ ఫలితాలు సోషలిస్టు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతుగా కూడా పరిగణిస్తున్నారు.

డెమోక్రటిక్ పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్టులు పెరుగుతున్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ వ్యవస్థ సామా జిక భద్రతా పథకాలను అమలు జరుపుతున్నప్పటికీ సమాజంలో అసమానతలు, అసంతృప్తి పెరుగుతున్నాయి. సామాన్యులు స్వంత ఇల్లు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది, ఆరోగ్య సంరక్షణ కూడా అదే విధంగా ఉంది. ఒక పరిమితికి మించి జనాలను పెట్టుబడిదారీ వ్యవస్థ పట్టించుకోదని తేలిపోయింది. యువతరానికి విద్యారుణాలు తలకుమించిన భారంగా మారాయి. తమ ఆకాంక్షలను నెరవేర్చ టంలో పెట్టుబడిదారీ విధానం విఫలమైందని భావించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. ధనికుల మీద పన్నులను అధికంగా విధించి ఆమేరకు సామాన్యులకు ఫలాలను అందించాలని డెమోక్రటిక్ సోషలిస్టులు కోరుతున్నారు, నిజమే కదా అని యువత ఆకర్షితులౌతున్నారు. అమెరికా ఆర్థిక పురోగమనం ఆశించిన విధంగా లేదు, నిజవేతనాలు పడిపోతున్నాయి.అనవసరమైన యుద్ధాలతో ఆయుధ కంపెనీల కోసం ఖజానా ఖాళీ చేయటం మీద ఉన్న శ్రద్ధ ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనం మీద చూపటం లేదు. నిజానికి డెమోక్రటిక్ సోషలిస్టులు ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చివేసి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం చేస్తామని చెప్పటం లేదు. ఇప్పుడున్న దానిలోనే కార్మికవర్గానికి అనుకూలంగా మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దాన్నే ట్రంప్ వంటి వారు కమ్యూనిజంగా అభివర్ణిస్తున్నారు. సంస్కరణలకు ఒక పరిధి, పరిమితి ఉంటాయి, అది దాటి ముందుకు పోవాలంటే కమ్యూనిజమే శరణ్యమని యువత మరికొన్ని అడుగులు ముందుకు వేస్తారేమో అన్నది అమెరికా పెట్టుబడిదారుల అసలు భయం, దానికి ఎవరూ చేసేదేమీ లేదు, రానున్నది రాకమానదు, కానున్నది కాక మానదన్నది చరిత్ర చెప్పిన సత్యం!

రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు – తిమింగలాలను వదలి పిత్తపరిగలను పట్టారు,కాషాయ దళాల తీరే వేరేబ్బా ! వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కదా అర్ధం చేసుకోరూ !!

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఆరఎసఎస్‌లో ఉన్నవారందరినీ దొంగలనటం లేదుగానీ దానిలో కూడా దొంగలు, నేరగాండ్లను కాపాడేవారు ఉన్నారని అయోధ్య రామాలయంలో హుండీ సొమ్ము, బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల దొంగతనం కేసులో వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.దేశం కోసంధర్మం కోసం కట్టుకున్న భార్యలను వదలివేయమని కూడా ఆరఎసఎస్ ఎక్కడా చెప్పలేదు, కానీ వివాహాన్ని దాచి, భార్యలను గాలికివదలివేసిన వారిని మాత్రం అది సమర్ధిస్తోంది, అందలాలెక్కిస్తోంది. ఆ సంస్థలో పనిచేసే వారి uండారం బయటపడుతుంటే గుడ్డిగా దాన్ని నమ్మినవారు గుండెలు బాదుకుంటున్నారు.ఎవరి లోగుట్టు అయినా ఇంతే, బయటపడటానికి సమయం రావాలి. అయోధ్య ఆలయకానుకల కుంభకోణం ఆ గుంపులో తలెత్తిన కుమ్ములాటల కారణంగానే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల నేపధ్యంలోఈ కుంభకోణాన్ని సాధ్యమైన మేరకు మÖసిపెట్టేందుకు, మరిన్ని వివరాలు వెల్లడిగాకుండా చూసేందుకు “పెద్దలు ” రంగంలోకి దిగారు. ఉదాహరణకు అయోధ్య ఆందోళనలో పేరుమోసిన వారిలో ఒకరైన మాజీ ఎంపీ వినయ్ కతియార్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన తరువాత సదరు పెద్దమనిషి నోరు కట్టేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అసలు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ రామాలయ ఉద్యమంలో భాగస్వామి కాదని కతియార్ చెప్పారు.సిట్ ప్రాధమిక నివేదిక వెల్లడి కాగానే చంపక్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా “ నైతిక ” కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రామాలయ నిధులపై విమర్శలు వచ్చినపుడు అలాంటిదేమీ లేదని దబాయించి మాట్లాడిన పెద్దలు తీరా అనివార్యమైన సిట్ దర్యాప్తు తరువాత నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఆ నిబద్దత, నైతిక విలువలే ఉంటే సిట్ ఏర్పాటుకు ముందే రాజీనామా చేస్తే అదోతీరు ! హవాలా కేసులో ఆరోపణలు రాగానే అద్వానీ రాజీనామా చేశారు కదా ! మరింత ముదిరి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారకుండా చూసుకొనేందుకు తప్పనిసరై రాముడి కానుకల స్వాహా మీద యోగి ఆదిత్యనాధ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. జూన్ 14న అది రంగంలోకి దిగి 25వ తేదీ నాటికి ఎనిమిది మందిపై అభియోగం మోపి అరెస్టులు కూడా చేసింది. ఎంత వేగంగా పని చేసిందో చంద్రబాబు నాయుడు అండ్‌కో అర్ధం చేసుకోవాలి.


నిందితులంతా ఎవరంటే అందరూ రకరకాల పేర్లతో ఉన్న కాషాయ గుంపులో వారే. క్లుప్తంగా ఎవరేమిటో చూద్దాం. రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, ఇతగాడు ఒక సాధారణ టెంపో డ్రైవర్, రామాలయ నిర్మాణ ప్రారంభంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్ కారు డ్రైవర్‌గా చేరాడు, తరువాత ట్రస్ట్ ఉద్యోగిగా, కీలకమైన బాధ్యతలో ఉన్నాడు. ఇతగాడి మేనల్లుడు మనీష్ యాదవ్, ఇతడి దగ్గర డబ్బు దొరికిందని పోలీసులు చెప్పారు. అనుకల్ప మిశ్రా, ట్రస్టు విరాళాల లెక్కలు, నిర్వహణలో కీలక పాత్రధారి, ఇతని బావమరిది లవకుశ్ మిశ్రా, కానుకలు, విలువైన వస్తురూప కానుకల పర్యవేక్షకుడు.అవినాష్ శుక్లా హుండీ లెక్కింపులో భాగస్వామి, మరోముగ్గురు హుండీ లెక్కింపులో భాగస్వాములు.కానుకల అపహరణ ఆరోపణలు వచ్చినపుడు అబ్బే అలాంటిదేమీ లేదంటూ అనేక మంది మÖసిపెట్టేందుకు చూశారు.ఇప్పుడు అరెస్టయిన నిందితుల వెనుక ఉన్న అసలైన పెద్దలు బయటకు వచ్చే అవకాశం లేదని సిట్ దర్యాప్తుకు ముందే అనుమానాలు వ్యక్తం చేశారు. అదే జరిగింది.


అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణ అంశంలో బిజెపిని లక్ష్యంగా చేసుకొని సమాజవాది పార్టీ, కాంగ్రెస్ 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రయోజనాలకోసం వినియోగించుకొనేందుకు చూస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ అధ్యక్షుడు, బిజెపి నేత, ఢిల్లీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అలోక్ కుమార్ ఆరోపించారు. ఆరఎసఎస్ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో విహెచ్‌పి ఒకటి.నిజానికి జూన్ ఏడవ తేదీన సమాజవాది పార్టీకి చెందిన మాజీ మంత్రి పవన్ పాండే ఐదు నుంచి ఏడున్నర కోట్ల రూపాయల మేర రామాలయ నిధులను అపహరించినట్లు ఆరోపించారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని, న్యాయ విచారణ జరిపించాలని సమాజవాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు.రామ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అక్రమాలకు పాల్పడలేదని, దొంగతనం జరిగినట్లు ఎలాంటి అధారాలు లేవని అలోక్ కుమార్‌తోసిపుచ్చారు. చంపత్ రాయ్ విహెచ్‌పి ఉపాధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నందున ఇంతకు మించి ఆ సంస్థ నేతల నుంచి వేరుగా ఊహించలేము. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ బిజెపి నేత డాక్టర్ రజనీష్ సింగ్ జూన్ 9న ప్రధాన మంత్రికి ఒక లేఖ రాశారు. ఒక నివేదిక సమర్పించాలని ప్రధాని కార్యాలయం సదరు ట్రస్ట్‌ను కోరింది.తప్పనిసరి పరిస్థితిలో జూన14న యోగి ఆదిత్యనాధ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఆరు రోజుల విచారణ తరువాత దాదాపు 150 మంది అనుమానితులను గుర్తించినట్లు , వారిలో 25 మంది మీద చర్యలుంటాయని మీడియాకు సమాచారం అందింది.అనుమానితులుగా ఉన్నవారెవరూ అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని సిట్ ఆదేశాలు జారీ చేసింది.కొందరు కనిపించకుండా తప్పుకున్నారని వార్తలు. భక్తులు ఇచ్చిన కానుకలు, భూమికొనుగోలు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలలో కనుగొన్న అంశాల గురించి ముఖ్యమంత్రికి ప్రాధమిక నివేదికను అందచేశారు. హుండీ విరాళాలను లెక్కించే ఐదుగురు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు కోట్ల రూపాయలను, కొంత బంగారాన్ని సిట్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.ఒక సారి కాదు హుండీల నుంచి పదే పదే సొమ్ముకొట్టేసినట్లు విచారణలో తేలింది. అయినా ట్రస్ట్ పెద్దలు మౌనంగా ఉన్నారంటే వారి పాత్ర లేకపోతే అలా జరుగుతుందా !


సిట్ ఏర్పాటకు ముందు జరిగిన పరిణామాలను చూద్దాం. రాముడి నిధులను అపహరించటమేగాక ఆ విషయాన్ని మÖసిపెట్టేందుకు చూశారని కర్నీ సేన జాతీయ అధ్యక్షుడు సూరజ్ పాల్ అమ్ము చెప్పారు. ట్రస్ట్ ప్రముఖులు గోపాల్ రాయ్,అనిల్ మిశ్రా, టిను యాదవ్, లవకుష్ మిశ్రా పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఎవరి మీద కేసు దాఖలు చేయలేదన్నారు.ఒక సాధారణ వ్యక్తి పర్సును దొంగిలిస్తే పోలీసులు వెంటనే పేదలను నిర్బంధించి ప్రశ్నిస్తారని, అంతర్జాతీయంగా ఖ్యాతి ఉన్న రామాలయం విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం కొత్త ప్రశ్నలను ముందుకు తెస్తోందన్నారు. ఎవరి మీదా కేసు దాఖలు చేయకుండా దర్యాప్తు ఎలా చేస్తారని జ్యోతిష్ పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. ఆ చర్యకు చట్టబద్దత ఎలా ఉంటుందన్నారు.నిజాలను వెలికి తీసేందుకు గాక మÖసిపెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. రామాలయ ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇంతవరకు ఏ ఒక్కటి రుజువు కాలేదని కొందరు విహెచ్‌పినేతలు వాదిస్తున్నారు. తొలిసారిగా ప్రధాని కార్యాలయం ఎందుకు స్పందించాల్సి వచ్చిందో వారు మాట్లడరు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిజానిజాలను బయటపెడుతుందా ? తిమింగలాలను వదలి పిత్తపరిగలను పట్టుకొని గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా మÖసివేస్తుందా ? నిజాయితీతో నిజానిజాలు బయటపెట్టినా, పెట్టకున్నా వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ఒక ప్రచార అస్త్రంగా మారటం ఖాయం. రామజన్మ భూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఆరఎసఎస్ ప్రచారక్, విశ్వహిందూపరిషత్‌తో సంబంధాలు కలిగిన చంపత్ రాయ్ ఉన్నారు. అతగాడి వ్యవహారశైలి గురించి ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. రామాలయం కోసం ఆందోళన చేసిన వారిలో అనేక మందిని ఆలయ నిర్మాణం, ట్రస్ట్ వ్యవహారాల్లో పక్కన పెట్టారన్నది ప్రధాన విమర్శ. ట్రస్ట్ అధ్యక్షుడిగా మహంత్ నిత్యగోపాల్ దాస్ ఉన్నప్పటికీ వృద్దాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నందున రాయ్ పెత్తనమే నడుస్తున్నదని చెబుతారు. మిగిలిన సభ్యులు రాయ్ పలుకుబడి కారణంగా నామమాత్రంగా ఉండిపోతున్నారన్నది విమర్శకుల మాట.


రామాలయ ఆందోళన ప్రముఖుల్లో వినయ్ కతియార్ ఒకరు.సంతోష్ దూబే, మహంత్ కమల్ నయన్ దాస్ వంటి వారు ఇప్పుడు ట్రస్ట్ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు.అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత గొంతు విప్పారు. అయితే పెద్దలు జోక్యం చేసుకొని వినయ్ కతియార్ నోరు మÖయించారు.పరువు కాపాడుకొనేందుకు సిట్ విచారణ తతంగంలో ఎలాంటి పొరపాట్లు లేవని లేదా ఏవైనా దొరికితే ఇతరులను ఇరికించి నేతలుగా ఉన్నవారికి సంబంధం లేదని నివేదికలు వెలువడవచ్చని, తరువాత వారిని ట్రస్ట్ నుంచి తొలగిస్తారని వార్తలు వచ్చాయి. కేవలం నీళ్ల నుంచి పాలను వేరు చేయాలని కాదు, బంగారాన్నుంచి పసిడిని, వెండి నుంచి వెండిని ఎలా వేరు చేశారో తేల్చాలని జనం కోరుతున్నారని సమాజవాదీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.కానుకల చోరీ ఆరోపణలు హిందువుల విశ్వాసలకే దెబ్బ అని అయోధ్యలోని రాసిక్ పీఠాధీశ్వర్ మహంత్ జనమేజయ శరణ్ మహరాజ్ వర్ణించారు. ఊహించటానికే సాధ్యం కావటం లేదన్నారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సందర్భంగా 66 రోజుల పాటు ఐదు కోట్ల మంది భక్తులు అయోధ్య రామాýయాన్ని సందర్శించారని ఆ సందర్భంగా వచ్చిన విరాళాల మొత్తం కేవలం వంద కోట్ల రూపాయýకు లోపే హుండీల్లో ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు.దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం నుంచి వేరు చేసి మత సంస్థలకు అప్పగించాలని హిందూత్వశక్తులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్వహణలో అధికారులకు ప్రమేయం లేదు, కేవలం ట్రస్టు మాత్రమే అన్ని వ్యహరారాలను చూస్తున్నది. కానుకల అపహరణ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత ఈ ఆలయానికి ఒక అధికారిని సిఇఓగా నియమించాలని యోగి సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దేవాలయాల నిర్వహణలో ట్రస్టులు, మత సంస్థలకు తప్ప అధికారగణం, ప్రభుత్వ ప్రమేయం ఉండరాదని సనాతన, హిందూత్వశక్తులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పాలనలో అధికార యంత్రాంగానికి అప్పగిస్తే పాపం వారేం అవుతారో తెలియదు.


రామాలయానికి బంగారం, వెండి, రత్నాలు,ఇతర విలువైన రాళ్లతో తయారు చేసి భక్తులు బహుకరించిన 1,250 పవిత్ర ఇటుకలు కనిపించటం లేదని ధర్మసేన సంస్థ స్థాపకుడు సంతోష్ దూబే చెప్పారు. పట్టణాలు, గ్రామాలలో వాటిని పూజించి 1989లో అయోధ్యకు చేర్చారని అన్నారు.అవి 2002వరకు కరసేవ పురంలో ఉన్నాయని, ఇప్పుడు కనిపించటం లేదని, వాటిని రక్షించాల్సిన బాధ్యత రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపక్ రాయ్‌దేనని దూబే చెప్పారు. చిత్రం ఏమిటంటే ఒకవైపు చంపత్ రాయ్‌ను సమర్ధిస్తూనే రామాలయం పేరుతో విరాళాలు వసూలు చేసిన రామాలయ ట్రస్ట్, రామజన్మభూమి మందిర్ పునర్‌నిర్మాణ ట్రస్టులు చేసిన విరాళాలు, బంగారం సేకరణ వ్యవహారాలపై కూడా దర్యాప్తు జరపాలని హరిద్వార్‌లో రెండు రోజుల పాటు సమావేశమైన విశ్వహిందూపరిషత్ కేంద్ర సలహామండలి సమావేశం డిమాండ్ చేdంది.నాటి ప్రధాని పివి నరసింహారావు మార్గదర్శనలో 1995లో రామాలయ ట్రస్ట్ ఏర్పాటైంది. తరువాత బిజెపి నేతలతో మరో ట్రస్ట్ ఏర్పడింది.బాబరీ మసీదు వివాదాస్పదం కావటానికి కారకుడు ధరమ్‌దాస్, 1949లో రాముడి విగ్రహాన్ని మసీదులో పెట్టి వివాదాన్ని కొత్త మలుపు తిప్పాడని చెబుతారు. ఇప్పుడు ఆ పెద్దమనిషి రామాలయంలో జరిగిన చోరీతో సాధువులందరూ దిగ్భ్రాంతి చెందారని అన్నారు.దాస్ లక్ష్యం నరేంద్రమోడీ సర్కార్ 2020లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ పాలకవర్గం మీదనే. ట్రస్ట్ అంటే విశ్వాసం, ఇప్పుడు అది లేదు, అక్కడ ఉన్నవారందరూ దొంగతనంలో భాగస్వాములే కనుక ట్రస్ట్‌ను రద్దు చేయాలన్నారు. అన్ని దేవాలయాలను కబ్జా చేసేందుకు విశ్వహిందూపరిషత్ చూస్తోందని కూడా అన్నారు. ట్రస్ట్ సభ్యుడైన గోపాల్‌రావు ఆరఎసఎస్ నేత, అతగాడిని ఉద్దేశించి దొంగలు ట్రస్ట్ వ్యవహారాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించిన వినయ్ కతియార్‌తో మోడీ మాట్లాడిన తరువాత స్వరాన్ని తగ్గించి ట్రస్ట్‌లో ఉన్నవారు పర్యవసానాలను భరిస్తారంటూ మాట్లాడారు. ఫైజాబాద్ జిల్లా(అయోధ్య అక్కడే ఉంది) విహెచ్‌పి మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ చంపత్ రాయ్ మోసగాడు కాదు గానీ తన అనుచరులుగా పెద్ద మోసగాండ్లనే ఎల్లవేళలా ఎంచుకుంటారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.కాషాయ గుంపు కుమ్ములాటలకు అతీతం కాదు. ఒక నాడు విశ్వహిందూపరిషత్ అగ్రనేతగా ఉన్న ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్రమోడీ విమర్శకులలో ప్రముఖుడు,ఆ కారణంగానే ఏకంగా 2018లో ఆ సంస్థ నుంచి పంపివేశారు. రామాలయ ఆందోళనలో భాగస్వాములైన అనేక మందిని మసీదు కూల్చివేసిన తరువాత పక్కకు పెట్టి ఆరఎసఎస్ ప్రముఖులు రంగంలోకి వచ్చినట్లు అనేక విమర్శలు ఉన్నాయి. నరేంద్రమోడీ జీవిత చరిత్రను రాసిన మధు పూర్ణిమా కిష్వర్, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మోడీ ఏలుబడిలో కొందరు మహిళలకు మంత్రిపదవులు, ఎంపీలు ఎలా అయ్యారో వెల్లడిస్తున్నారు. వారికి పదవులు రాని కారణంగా ఆరోపణలు చేస్తున్నట్లు బిజెపి నేతలు కొట్టి పారవేస్తారు.ఏ పార్టీలో జరిగేదైనా అదే, అధికార పంపకాల్లో తేడాలు వస్తేనే కదా నిజాలు వెల్లడయ్యేది,గతంలో కాంగ్రెస్‌లో, ఇతర కొన్ని ప్రాంతీయ పార్టీల్లో జరిగిందే ఇప్పుడు బిజెపిలో, దాని మాతృసంస్థ సంఘపరివార్‌లో మొదలైంది, కాదంటారా !

బ్రెక్సిట్ సంక్షోభం ` పదేండ్లలో బ్రిటన్‌లో ఏడో ప్రధాని !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


మునిగిపోయే నావ నుంచి బయటకు దూకినట్లుగా బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అక్కడి పాలకవర్గమే బయటకు నెట్టిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.అలాంటి పడవ సరంగుగా బ్రిటన్‌లో 1902 తరువాత తొలిసారిగా మంత్రి పదవిలో తప్ప ప్రతిపక్ష నేతగా అనుభవం లేని లేబర్ పార్టీ నేత, మాంచెస్టర్ మేయర్‌గా పనిచేసిన అండీ బర్న్‌హామ్ ప్రధాని పగ్గాలు చేపట్టనున్నాడు.బ్రిటన్ ప్రధానికి ఎన్నికయ్యేవారికి ప్రధానితో సమానంగా పరిగణించే విదేశాంగ, ీVAంమంత్రిత్వశాఖల్లో పని చేసిన అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొనేవారు. ఆండీ ఆ పదవులను నిర్వహించలేదు.నాయకత్వానికి ఎలాంటి పోటీ లేకపోతే జూలై 16 నాటికి దేశ ప్రధానిగా బాధ్యతలను చేపడతాడు.ఒక వేళ పోటీ జరిగితే సెప్టెంబరు వరకు ఫలితం కోసం ఆగాల్సి ఉంటుంది.గతంలో ఆర్థర్ బాల్‌ఫోర్ 1902లో ఎలాంటి పదవులు నిర్వహించకుండా కన్సర్వేటివ్ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యాడు. పార్టీ కార్యకర్తల చెప్పింది తాను విన్నానని, వచ్చే ఎన్నికలకు నాయకత్వం వహించలేనని, ప్రధాని పదవిలో కొనసాగలేనని రాజీనామా చేస్తున్నట్లు కెయిర్ స్టార్మర్ సోమవారం నాడు ప్రకటించారు. నూతన నేతను ఎన్నుకొనేంతవరకు పదవిలో కొనసాగుతానని బ్రిటన్ రాజుకు నివేదించాడు. ఐరోపా యÖనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన గత పదేండ్లలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రధానులు మారారు. స్టార్మర్ రాజీనామా గురించి ముందే డోనాల్డ్ ట్రంప్ ప్రకటించటం విశేషం.ఒక నాడు రవి అస్తమించని సామ్రాజ్యవాదిగా ఉన్న బ్రిటన్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి అది ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలే కారణం.తమ ప్రయ్పుోనాలను కాపాడే సమర్ధుడికోసం అక్కడి పాలకవర్గం చేస్తున్న ప్రయోగాలకు నేతలు బలి అవుతున్నారు.పదేండ్లలో ప్రతి ఒక్కరూ అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్లుగా మాట్లాడి తీరా అధికారానికి వచ్చిన తరువాత అటు జనానికి ఇటు కార్పొరేట్లకు ఎటూ కాకుండా పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


గత పదేండ్లలో లేబర్,కన్సర్వేటివ్ పార్టీలకు చెందిన ప్రధానులందరూ విఫలమైన చరిత్రను మÖటగట్టుకున్నవారే. మే నెలలో మేకర్‌ఫీల్డ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బరన్‌హామ్ లేబర్ పార్టీ తరఫున ఘనవిజయం సాధించాడు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార లేబర్ పార్టీ చావు దెబ్బతిన్నది, పచ్చిమితవాద రిఫార్మ్ పార్టీ ఆ ప్రాంతంలో కూడా విజయాలు సాధించినప్పటికీ బరన్‌హామ్ గెలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీ అక్కడ గెలిచినప్పటికీ 45శాతం మాత్రమే ఓట్లు రాగా ఉప ఎన్నికలో 54.8శాతం వచ్చాయి. మితవాదులను ఓడించేందుకు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ అభిమానులు లేబర్ పార్టీ వైపు మొగ్గగా కన్సర్వేటివ్‌లు రిఫార్మ్ వైపు నిలవటంతో ఆ పార్టీకి కూడా మÖడు శాతం వరకు ఓట్లు పెరిగాయి. ఇంకా నూతన ప్రధాని అధికారానికి రాకముందే ఆండీ విధానాలు ఎలా ఉంటాయనే చర్చ ప్రారంభమైంది. స్థానికుల ఉపాధిని హరిస్తున్న వలస కార్మికులను వెంటనే స్వదేశాలకు పంపాలన్నది రిఫార్మ్ పార్టీ వాగ్దానం. ఇతర రాజకీయ పార్టీల నేతలు అవకాశవాదంతో రిఫార్మ్‌పార్టీ చెబుతున్నది న్యాయబద్దమే అంటూనే దాన్ని ఓడించేందుకు ప్రయత్నించారు. లేబర్ పార్టీ నేత పదిహేనేళ్ల పాటు సంపాదించుకున్న విదేశీయులను బయటకు పంపవచ్చంటూ కెయిర్ స్టార్మర్ ఆచరణలో పచ్చిమితవాదులను బలపరిచే విధంగా మాట్లాడాడు. బరన్‌హామ్ విషయానికి వస్తే సోషలిస్టు మాదిరి జనాన్ని ఆకట్టుకుంటాడు. అధికారానికి వచ్చిన తరువాత ఆ మాటలకు కట్టుబడి ఉంటాడా అన్నది సమస్య. ఒక పార్లమెంటు సభ్యుడిగా 2001లో ఇరాక్‌పై దాడిని సమర్ధిస్తూ ఓటు వేశాడు.2009లో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలు ఉండాలని తరువాతే ప్రైవేటు సంస్థలు ఉండాలన్న వైఖరి తీసుకోవటంతో కార్పొరేట్ శక్తులు ఆగ్రహించాయి.ఉప ఎన్నికల ప్రచారంలో నీటి సరఫరాను జాతీయం చేయాలంటూ గట్టిగా మాట్లాడి తరువాత స్థానికుల ఆధీనంలో ఉండాలంటూ మాట మార్చాడు. బ్రిటన్‌లో ఇండ్ల సమస్య తీవ్రంగా ఉంది. ధనికదేశాల్లో 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత తొలిసారిగా ప్రస్తుతం ఇల్లు కొనుగోలు చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది.ధరలు పెరగటంతో పాటు కార్మికులకు వేతనాలు పెరగలేదు, మరోవైపు వడ్డీ రేట్లు పెరిగాయి.అయితే నిర్మాణ కంపెనీలు తక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మించినా లాభాలు తగ్గలేదు. అల్పాదాయ వర్గాలు కొనుగోలు చేయగలిగిన ఇండ్ల నిర్మాణాలను చేపట్టటం లేదు.


స్టార్మర్ రాజీనామా చేసినంత మాత్రాన రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు లేవన్నది అభిప్రాయం.మంత్రులెవరూ రాజీనామా యోచనలో లేనందున వారంతా కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత పార్లమెంటుకు 2024జూలైలో ఎన్నికలు జరిగాయి, తిరిగి 2029లో కొత్త పార్లమెంటు ఏర్పాటు కావాల్సి ఉంది.తప్పుడు విధానాల కారణంగా స్టార్మర్మ్ పలుకుబడి దిగజారటం, స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద ఎదురుదెబ్బ వంటి పరిణామాలు కొత్త ప్రధాని ఎన్నికకు దారితీశాయి. నిజానికి అంతకు ముందే పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ ఉంది. ఉప ఎన్నికకు ముందే నాయకత్వ మార్పు జరగాలని ఆండీ బహిరంగంగానే చెప్పాడు. అతను పార్లమెంటులో ప్రవేశించేందుకు అధికారపార్టీ సభ్యుడొకరి చేత రాజీనామా చేయించటం కూడా స్టార్మర్‌కు వ్యతిరేకంగా సమీకరణ అవుతున్నట్లు సూచన ఉంది.. పార్టీ నూతన నేతను ఎన్నుకొనేందుకు లేబర్ పార్టీ జాతీయ కార్యవర్గం విధాన ప్రక్రియను ప్రారంభించనుంది. జూలై తొమ్మిదిన పోటీ పడేవారి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.ఒక్కరే ఉంటే 16వ తేదీన నాయకత్వ మార్పిడి జరుగుతుంది లేకుంటే తిరిగి పార్లమెంటు సమావేశం జరిగే సెప్టెంబరు వరకు ఆగాల్సిందే. ఒక వైపు పశ్చిమాసియా సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు, ఇతర ప్రాంతాల్లో తలెత్తిన ఉద్రిక్తతల పూర్వరంగం, మరోవైపు పెరుగుతున్న చైనా, దశాబ్దాల తరబడి నాటో, ఐరోపాకు ఇచ్చిన మద్దతు నుంచి వెనక్కు తగ్గుతున్న అమెరికా చర్యల నేపధ్యంలో అనుభవజ్ఞుడైన విదేశాంగ విధానంపై అనుభవం లేని ఆండీ ఎలా నెగ్గుకు రాగలరని అనేక మంది ప్రశిస్తున్నారు.


కార్పొరేట్లకు విశ్వాసం కలిగించేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ ప్రధాన ఆర్థికవేత్త ఆండీ హల్డేన్, మరో ఇద్దరు ప్రముఖులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. మంచినీటి వ్యాపారాన్ని జాతీయం చేస్తారా , ఇంథన రంగంలో తెచ్చే మార్పులు వీరి ముందున్న ప్రధాన సవాళ్లు.మార్గరెట్ థాచర్ హయాంలో పెద్ద ఎత్తున ముందుకు తెచ్చిన ఎగువ నుంచి దిగువకు సంపదలు దిగుతాయనే ఊట సిద్దాంతాన్ని ప్రశ్సిస్తూ నయా ఉదారవాద విధానాలకు స్వస్తి చెబుతామని ఆండీ గతంలో చెప్పాడు.దీంతో నూతన లేబర్ పార్టీ పురుడు పోసుకుంటుందని అనేక మంది ఆశిస్తున్నారు. నయా ఉదారవాద విధానాలంటేనే కార్పొరేట్లకు అనుకూలం, కార్మికవర్గానికి వ్యతిరేకమైనవని వేరే చెప్పనవసరం లేదు. ఐరోపాలో ప్రతిపక్షంలో ఉన్నపుడు సోషలిస్టు, సామాజిక న్యాయం గురించి మాట్లాడిన వారందరూ అధికారంలోకి రాగానే కార్పొరేట్ల సేవలో తరించటాన్ని చూశాము, మనదేశంలో కూడా అదే జరుగుతున్నదనుకోండి.నయా ఉదారవాద విధానాలకు తెరతీసింది కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ అన్నది వేరే చెప్పనవసరం లేదు.ప్రారంభంలో మద్దతు ఇచ్చిన బడా కార్పొరేట్ శక్తులు తాము ఆశించిన రీతిలో, వేగంగా సంస్కరణలు అమలు జరపకపోవటంతో ఆపని తాను చేస్తానన్న నరేంద్రమోడీని సరైన నేతగా బావించి అధికారానికి తీసుకువచ్చారన్నది బహిరంగ రహస్యం. ద్రవ్య పెట్టుబడికి కావాల్సింది లాభాలు తప్ప వ్యక్తులు కాదు, అవసరమైతే మోడీని సైతం మార్చి మరొకరిని తీసుకువస్తారు. బ్రిటన్‌లో కూడా జరుగుతున్నది అదే. ఐరోపా యÖనియన్ నుంచి బయటకు వచ్చి చక్రం తిప్పాలని చూసిన బ్రిటన్ కార్పొరేట్లు సాధ్యం గాకపోవటంతో పదేండ్లలో ఆరుగురు ప్రధానులను మార్చారు.వారిలో భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఒకరన్నది తెలిసిందే.తమ బాటలో నడవకపోతే ఒక శాతంగా ఉన్న ధనికులు ఆండీ బరన్‌హామ్‌కు అదే బాట చూపుతారు.


లేబర్ పార్టీ నాయకత్వ మార్పు తప్ప పార్టీనే మార్చాలని కార్పొరేట్‌లు కోరుకోలేదని చెప్పవచ్చు. స్టార్మర్ మీద ఎక్కువ కాలం ఆధారపడలేమని పాలకవర్గం నిర్దారణకు వచ్చి ఇంటికి పంపింది. ఇప్పుడున్న విధానాలను అమలు జరపాలంటే లేబర్ పార్టీ పేరుతో తమకు అనుకూల విధానాలను కొనసాగించటం మేలు తప్ప పచ్చి మితవాదులను రంగంలోకి తెస్తే తక్షణ ప్రయోజనాలు పొందవచ్చు తప్ప వాటికి ఎదురయ్యే ప్రతిఘటనతో కొత్త సమస్యలు వస్తాయని వారికి తెలుసు. నిజానికి ఐరోపాలో పెద్దన్నగా ఉన్న జర్మనీ, ఫ్రాన్సులో కూడా నయా ఉదారవాద విధానాలే అమలు చేస్తున్నప్పటికీ బ్రిటన్ ప్రధాని అంతగా జనం నుంచి దూరంకావటానికి కారణాలను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. మొత్తం మీద చూసినపుడు 2016లో ఐరోపా యÖనియన్ నుంచి(బ్రెక్సిట్) బయటకు వచ్చిన తరువాత అక్కడి పాలకవర్గానికి తత్వం తలకెక్కింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు గనుక చొక్కాలు మార్చినట్లుగా ఇప్పటికి ఆరుగురు ప్రధానులను మార్చింది.బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామాతో కన్సర్వేటివ్ పార్టీ దాదాపు కనుమరుగైంది. తరువాత అదే పార్టీ నేతలు థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్(బ్రిటన్ చరిత్రలో అతి తక్కువకాలం పదవిలో ఉన్న ప్రధాని), రిషి సునాక్ ప్రధానులుగా కాగా 2024 అధికారానికి వచ్చిన లేబర్ ప్రధాని స్టార్మర్ ఇప్పుడు రాజీనామా చేశారు. బ్రిటన్ చరిత్రలో 1721 నుంచి 2026వరకు 305 సంవత్సరాల్లో 58 మంది 79 సార్లు ప్రధానులుగా పని చేశారు.వారి సగటు పదవీ కాలం ఐదు సంవత్సరాల రెండు నెలలు కాగా గత పది సంవత్సరాల్లో పనిచేసిన వారు ఆరుగురు అంటే అక్కడి రాజకీయ అనిశ్చితికి అద్దం పడుతున్నది.పార్లమెంటు దిగువ సభ(కామన్స్) 2024 ఎన్నికల్లో 650 స్థానాలకు గాను లేబర్ పార్టీ 411 తెచ్చుకొని ఘనవిజయం సాధించింది.ఆ పార్టీ చరిత్రలో ఇంతటి ఘనవిజయం మÖడవది కాగా 2001 తరువాత మొదటిది. ఇప్పటి వరకు అధికారానికి వచ్చిన పార్టీలలో గత ఎన్నికల్లో కేవలం 33.7శాతం ఓట్లతో తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీగా కూడా చరిత్రకెక్కింది. అధికారానికి వచ్చిన పార్టీలు ఎంత మెజారిటీ సాధించారని కాదు, ఏ విధానాలను అనుసరించారన్నది గీటురాయిగా తీసుకోవాలి.ఆ రీత్యా ఘనవిజయం సాధించినా జనానికి వ్యతిరేకమైన విధానాలకు పాల్పడితే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నది బ్రిటన్ లేబర్ పార్టీ నేర్పుతున్న పాఠం !

నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌ – అమెరికా మధ్య కుదిరినట్లు చెబుతున్న మరో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై డిజిటల్‌ సంతకాలు జరిగాయని, శుక్రవారం నాడు జెనీవాలో ఇరు దేశాల నేతలు భౌతికంగా సంతకాలు చేస్తారని చెబుతున్నారు. నిశ్చితార్దం జరిగిన తరువాత ఆగిపోయిన వివాహాలను ఎన్నింటినో చూశాం.ఈ ఒప్పందం కూడా అలా కాకూడదని అందరం కోరుకుందాం.అయితే ఎనభై ఏండ్ల డోనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడేం చేస్తాడో తెలియదు గనుక సంతకాలు జరిగేంతవరకూ అనుమానమే. ఒప్పంద అంశాలపై పరస్పర విరుద్దమైన భాష్యాలు వెలువడుతుండటమే దీనికి కారణం. ఒప్పందం కుదిరిందని ప్రకటించిన ట్రంప్‌ మరోసారి ఇరాన్‌ మీద ఆరోపణలకు పూనుకున్నాడు. ఇరాన్‌ గనుక అణ్వాయుధాలను సమకూర్చుకుంటే నరకం చూపుతామని అన్నాడు. దాడులతో తమకు జరిగిన నష్టానికి 400 బిలియన్‌ డాలర్లు పరిహారం చెల్లించాలని ఇరాన్‌ కోరుతున్నది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉంది, గతంలో అది అంగీకరించిన అంశాలే దీనిలో ఉంటాయని చెబుతున్నారు. ఇరాన్‌ కంటే తన మీద పెరుగుతున్న వత్తిడితో డోనాల్డ్‌ ట్రంప్‌ సతమతం అవుతున్నాడు. ఈ పూర్వరంగంలో రానున్న రోజుల్లో పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చలు మొదలయ్యాయి. బహుశా ఇప్పటి వరకు అనేక దేశాలు, కూటముల మధ్య ఒప్పందాలు జరిగాయి, అయితే ఇంతగా అనుమానాలు, సందేహాలు తలెత్తింది మరొకటి లేదు. యుద్దం అనగానే విపరీతమైన ఖర్చు, జనం మీద భారం పడుతుంది. ఇరాన్‌పై అమెరికా దాడి, అది ఎదుర్కొన్న ప్రతిఘటన, ఇతర ఖర్చుల గురించి ఇంతవరకు నిర్దిష్టమైన అంచనాలేవీ లేవు. అమెరికాకు రోజుకు 90 నుంచి 200 కోట్ల డాలర్లు అయినట్లు ఒక అంచనా కాగా అమెరికా రక్షణశాఖ 2,500 కోట్ల డాలర్లని చెప్పింది.ఈ సంఖ్యను ఎవరూ నమ్మటం లేదు. ఇది తాత్కాలిక ఖర్చు మాత్రమే అని దీర్ఘకాలంలో లక్ష కోట్ల డాలర్లు అవతుందని హార్వర్డు విశ్వవిద్యాలయ నిపుణులు చెప్పారు.అమెరికాలో ప్రతి కుటుంబానికి ఒక్క చమురు ఖర్చే అదనంగా 450 డాలర్ల వంతున అయిందని ఒక అంచనా కాగా ఇతరాలను కూడా కలుపుకుంటే 63వేల నుంచి లక్ష కోట్ల వరకు జనాలకు చేతి చమురు వదులుతుందని మరొక అంచనా.ఈ లెక్కన డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చిపనితో ప్రపంచం ఎంత నష్టపోయిందో ప్రస్తుతానికి ఊహించుకోవాలే తప్ప లెక్కలు చెప్పలేము.

ఇక ఒప్పందం కుదిరింది అని చెప్పిన తరువాత వీటి సంగతేమిటి అంటూ అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.వాటిలో కొన్నింటిని చూద్దాం. ఒప్పందంపై సంతకాలు జరిగాయా అంటే సమాధానం లేదు, అయితే ఒప్పందం ఎలా ఉండాలో అంటే ఒక విధంగా ఇంటిని ఎలా నిర్మించాలో ముందుగా ఇంజనీరు రూపొందించే ప్లాన్‌ మాదిరి అవగాహన మీద సంతకాలు చేసినట్లు ట్రంప్‌, జెడివాన్స్‌ చెప్పాడు. ఒప్పంద ముసాయిదా పత్రాలను పరస్పరం మార్చుకున్నారు, వాటిలో కొన్నింటి అమలు ప్రారంభించి 60 రోజుల్లో అంతిమ ఒప్పందం ఖరారు చేసుకుంటారు.అయితే ఒప్పందం గురించి అనుకున్నాం గనుక భౌతికంగా సంతకాలు జరగక ముందే వెంటనే హార్ముజ్‌ జలసంధిని తెరుస్తారని ట్రంప్‌ చెప్పాడు, అయితే శుక్రవారం తరువాతే అని కూడా అదే పెద్దమనిషి చెప్పాడు. అయితే ఒకటి రెండు నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జలసంధి నుంచి వచ్చాయని వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఎలా తెరుస్తారన్నదాని మీద సందేహాలు.ఎలాంటి దారి సుంకం చెల్లించకుండా ప్రయాణించవచ్చని ట్రంప్‌ చెప్పాడు. అరవై రోజుల సంధి కాలంలో మాత్రమే ఎలాంటి రుసుమూ ఉండదని తరువాత తాము చేసిన ఏర్పాట్ల మేరకు రక్షణ, పర్యావరణ సుంకం వసూలు చేస్తామని ఇరాన్‌ చెప్పింది. అంటే జలసంధి మీద అదుపు తమదే అని చెప్పినట్లే.

ఒప్పందంతో ఇరాన్‌ సాధించేదేమిటి ? కుదిరినట్లు చెబుతున్న అవగాహనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నట్లు పశ్చిమదేశాల వార్తా సంస్థలు పేర్కొన్నాయి.ఇరాన్‌ మీద ఆంక్షలు తొలుగుతాయి, విదేశాల్లో స్థంభింప చేసిన దాని నిధులను విడుదల చేస్తారు. అరవై రోజుల్లో తాము 24 బిలియన్‌ డాలర్లను పొందుతామని టెహరాన్‌ చెబితే కాదు పన్నెండు బిలియన్‌ డాలర్లు మాత్రమే అందుబాటులోకి వస్తాయని, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేది లేదని ట్రంప్‌ చెప్పాడు.దీర్ఘకాలం పాటు యురేనియం శుద్ధి ఉండదని, నిల్వల తనిఖీకి అనుమతి, అణ్వాయుధాలను తయారు చేయబోమని అంగీకరిస్తేనే ఆర్థిక ఆంక్షలు తొలుగుతాయని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ చెప్పాడు.షరతులు ఉండవని ఇరాన్‌, కాదు ఉంటాయని అమెరికా చెబుతోంది.ఇరాన్‌ విడుదల చేసినట్లు చెబుతున్న 14 అంశాలను ఒక పత్రిక ప్రచురించగా అది తప్పుడు వార్త అని ట్రంప్‌ తోసిపుచ్చాడు. రెండు రోజుల్లోగా విడుదల చేస్తామని అమెరికా అధికారులు సోమవారం నాడు చెప్పగా సంతకాలు చేసేంతవరకు బహిర్గతం కాదని ట్రంప్‌ ప్రకటించాడు.అప్పటి వరకు అది రహస్యమే అన్నాడు. ఒప్పందంలో లెబనాన్‌ కూడా భాగమే అని ఇరాన్‌, మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ చెబుతున్నది.అయితే ఒప్పందం కుదిరింది అన్న తరువాత కూడా లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నది, అక్కడి నుంచి తమ సేనలు వెనక్కు రావని నెతన్యాహు చెప్పాడు.తమ దేశ రక్షణకు గాను గాజా, లెబనాన్‌, సిరియాలో భద్రతా ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నామని అక్కడి నుంచి వైదొలిగేది లేదన్నాడు.లెబనాన్‌లో ఆరులక్షల మంది పౌరులను నివాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ తరిమివేసింది. గాజాలో మాదిరి అక్కడి నివాసాలన్నింటినీ ధ్వంసం చేస్తామని చెబుతున్నది. నెతన్యాహు జవాబుదారీతనంతో ఉండాలని, అమెరికా లేకపోతే ఇజ్రాయెల్‌ లేదని గుర్తించాలని ట్రంప్‌ మంగళవారం నాడు వ్యాఖ్యానించాడు.అయితే ఇదంతా ఉత్తుత్తి బెదరింపే అని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ చిచ్చును ఆర్పేందుకు అమెరికా సిద్దంగా లేదు.

అణుకార్యక్రమం మీద ఒప్పందం ఉంటుందా అంటే అవునని, కాదని భిన్న కథనాలు వెలువడుతున్నాయి. అవగాహన ఒప్పందం ప్రకారం అరవై రోజుల పాటు కాల్పుల విరమణ మాత్రమే అమల్లో ఉంటుంది.ఈ వ్యవధిలో అణు కార్యక్రమంపై ఒప్పందానికి మార్గాన్ని సుగమం చేస్తారు. 2015లో ఇరాన్‌తో నాటు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసుకున్న మాదిరి ఒప్పంద అంశాలతోనే మరోసారి జరగవచ్చని భావిస్తుండగా, దాన్నుంచి ఏకపక్షంగా వైదొలిగిన ట్రంప్‌ అంతకంటే మెరుగ్గా ఏం సాధిస్తాడనేది అసలు ప్రశ్న.అణు ఒప్పందం కుదరకపోతే తిరిగి దాడులను జరుపుతామని ట్రంప్‌ ప్రకటించాడు.అంతే కాదు తమ దళాలు జలసంధిలోనే ఉంటాయని, అందుకయ్యే ఖర్చులకు పశ్చిమాసియా దేశాల ఆదాయం నుంచి ఇరవై శాతం వసూలు చేస్తామని కూడా చెప్పాడు, అంటే తమ సేనలను కిరాయికి ఇస్తున్నట్లే సంకేతమిచ్చాడు.ఈ అంశాలన్నీ శుక్రవారం నాటికి ఒక స్పష్టతకు వస్తాయా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒప్పందం కోసం తొందరపడుతున్న ట్రంప్‌ అసలు తొలుత చెప్పిందేమిటి ? సాధించిందేమిటి ? ఇరాన్‌లో పాలకులను మారుస్తా అన్నాడు. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని, మిలిటరీని, క్షిపణుల తయారీ కార్యక్రమాన్ని నాశనం చేస్తానని చెప్పాడు.వీటిలో ఏ ఒక్కటీ సాధించలేకపోయాడు. తన పౌరులతో సహా అనేక దేశాల జనాలను అనేక ఇబ్బందులకు గురిచేశాడు. అమెరికా బలహీనతలు ఏమిటో ప్రపంచానికి తేటతెల్లం అయ్యేందుకు దోహదం చేశాడు.ప్రపంచ వ్యవస్థలో అనేక నూతన పరిణామాలు, పర్యవసానాలకు నాంది వేసిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు. వ్యూహాత్మకంగా అమెరికా ఎంత దివాలాకోరుగా ఉందో వెల్లడి చేశాడు. దీని అర్ధం అది మిలిటరీ శక్తిని కోల్పోయిందని కాదు.వేలాది మందిని చంపి, అనేక దేశాల నానా ఇబ్బందులకు గురి చేసి, అనివార్య స్థితిలో స్వయంగా సృష్టించుకున్న ఇరాన్‌ ఊబి నుంచి బయటపడేందుకు పడిన అతగాడి తపనను ప్రపంచం చూసింది.అమెరికా ఏం చేసినా గుడ్డిగా అనుసరించేందుకు, సమర్ధించేందుకు కూడా మిత్రదేశాలుగా చెప్పుకున్నవేవీ సిద్దంగా లేవని రెండవ ప్రపంచ యుద్దం తరువాత తొలిసారిగా వెల్లడైంది. వారితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడు. ఆ పోరుతో తమకు సంబంధం లేదని, తమది కాదని పశ్చిమదేశాలు ప్రకటించాయి. కిందపడినా తనదే గెలుపన్నట్లుగా ఇరాన్‌ మీద విజయం సాధించానని పదే పదే ప్రకటించి వ్యక్తిగతంగా అభాసు పాలయ్యాడు.దేశీయంగా చూస్తే స్వంత జనాన్నే మోసం చేశాడు. రెండవసారి తనను గెలిపిస్తే విదేశాల్లో జోక్యం చేసుకోనని, దేశ ఆర్థిక సమస్యల మీదనే కేంద్రీకరిస్తానని చెప్పాడు, మరోసారి అమెరికాను అగ్రగామిగా చేస్తానన్నాడు.దానికి భిన్నంగా వ్యవహరించాడు.

ఇప్పుడు కుదిరిందని చెబుతున్న ఒప్పందంలోని అంశాలని దాడులతో నిమిత్తం లేకుండానే దౌత్య పద్దతుల్లో సాధించి ఉండే అవకాశం ఉందన్నది స్పష్టం. ఒప్పందం కుదుర్చుకొని ఒబామా ఇరాన్‌కు జీవితాన్ని ఇచ్చాడని ఆరోపించిన ట్రంప్‌ ఇప్పుడు కొత్తగా సాధించిన అంశాలేమిటని రానున్న రోజుల్లో అమెరికన్లు ప్రశ్నిస్తారనటం నిస్పందేహం.తాముగా అణుబాంబులను తయారు చేయబోమని తమ దివంగత నేత అయాతుల్లా ఖమేనీ సంవత్సరాల క్రితమే చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని ఇరాన్‌ ఎప్పటి నుంచో చెబుతున్నది. పార్లమెంటు అనుమతి లేకుండా ట్రంప్‌ బాధ్యతారహితంగా ఇరాన్‌ మీద దాడులు ప్రారంభించి సమర్ధించుకొనేందుకు నానాపాట్లు పడ్డాడు. ఇతగాడి అతి తెలివితో అనివార్యమైన స్థితిలో ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని ఆయుధంగా మార్చుకొని అమెరికా ఆధిపత్యానికి గండికొట్టింది.ఇంతే కాదు, పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక, సైనిక స్థావరాలను కూడా తొలిసారిగా తన లక్ష్యంగా చేసుకుంది, గురిచూసి కొట్టింది. ఈ క్రమంలో అమెరికాకు స్థానం కల్పిస్తే తమకు వచ్చే ముప్పు ఏమిటో కూడా ఆయా దేశాలకు స్పష్టం చేసింది. ఇరాన్‌పై దాడులను ఆపేందుకు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వత్తిడి తక్కువేమీ కాదు. గతంలో ఎన్నిసార్లు దాడులు చేసినా, పదేండ్లపాటు ఇరాక్‌తో యుద్దం చేసినా అలాంటి ఆలోచన చేయలేదు. పిల్లిని గదిలో బంధిస్తే పులిగా మారుతుందున్న లోకోక్తిని ఇరాన్‌ రుజువు చేసింది.అయితే అమెరికా బాధిత దేశాలన్నింటికీ ఇలాంటి అవకాశాలు రావు గానీ, ఇతర పద్దతులను తప్పకుండా అన్వేషిస్తాయి. నిజానికి తొలుత జలసంధిని దిగ్బంధిస్తే వచ్చే పరిణామాల గురించి ఇరాన్‌ నాయకత్వం భయపడింది.చివరకు జరిగేదేదో జరుగుతుంది చూద్దాం అని తెగించింది. బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కిచచ్చినట్లు చాలా తక్కువ ఖర్చుతో డ్రోన్లు, స్వల్పశ్రేణి క్షిపణులు, మందుగుండుతో నింపిన చిన్న పడవలు, మందుపాతరలతో నౌకలను స్థంభింప చేయవచ్చన్న ఆలోచన పని చేసింది.ఈ చర్య దౌత్యపరంగా కూడా ఇరాన్‌ పైచేయి సాధించటానికి తోడ్పడింది.అమెరికన్లు ఈ చిన్న అంశాన్ని పసిగట్టలేకపోయారు.తమ ఆంక్షలను ఉల్లంఘించిందనే పేరుతో ఏ ఒక్క నౌక మీద కూడా ఇరాన్‌ దాడులు చేయలేదు, అదే అమెరికన్లు ధిక్కారమును సైతుమా అన్నట్లు మన దేశం కోసం ప్రయాణించిన మూడు నౌకల మీద దాడులు చేసి ముగ్గుర మన పౌరుల ప్రాణాలు తీశారు.

ఇరాన్ను దెబ్బతీసేందుకు అమెరికన్లు భారీ మొత్తాల్లో ఆయుధాలను ఉపయోగించారు.దాని దగ్గర ఉన్న నిల్వలు కరిగిపోవటంతో ఉక్రెయిన్‌కు ఉద్దేశించిన వాటిని ఇటువైపు మళ్లించారు. దక్షిణ కొరియాలో ఉన్నవాటిని కూడా తరలించారు. తిరిగి ఆయుధాలను సమకూర్చుకోవాలంటే సంవత్సరాలు పడుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించిందంటే ట్రంప్‌ ఎంతకు తెగించాడో అర్ధం చేసుకోవచ్చు.అత్యాధునిక ఆయుధాలు ఉన్నా ఇరాన్ను దెబ్బతీయలేకపోయాయి. అమెరికా మిలిటరీ బడ్జెట్‌తో పోలిస్తే కేవలం వందోవంతు మాత్రమే ఇరాన్‌ ఖర్చు చేస్తున్నది, దానికి వైమానిక దళం లేదు, ఉన్న నౌకా దళాన్ని అమెరికా దెబ్బతీసింది, అయినా ఇరాన్‌ ప్రతిఘటన యావత్‌ దేశాల మిలిటరీకి అనేక పాఠాలు నేర్పుతున్నది. ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా మిత్రదేశాల నుంచి వేరు పడింది, మద్దతు ఇవ్వనందుకు ట్రంప్‌ ఐరోపా నేతలను ఎలా తూలనాడిందీ తెలిసిందే.ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి చెప్పే అమెరికాకు ఇరాన్‌ మీద దాడితో వాటిని ప్రస్తావించే నైతిక హక్కును దెబ్బతీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు !

వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ పుష్కర ప్రధానిగా, ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను మించి పదవిలో కొనసాగుతున్న నేతగా భక్తులు, అభిమానుల నుంచి నీరాజనాలు, ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా ప్రభుత్వ పథకాల గురించి విజయగానాలు చేస్తుంటే వాటి తీరు గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అన్నింటి గురించి వివరించేందుకు అవకాశం లేదు.కనుక మోడీ మానవత్వం గురించి వెల్లడించే సామాజిక పెన్షన్ల గురించి చూద్దాం.మోడీ పదవిని అధిష్టించేనాటికి అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి జాతీయ సామాజిక సహాయక పథకం(ఎన్‌ఎస్‌ఏపి) అమల్లో ఉంది.దీనిలో ఆరుపదులు దాటిన వృద్దులు, వితంతువులు,వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్రాలు అమలు జరపాలి.కేంద్ర ఇచ్చే నగదుకు అదనపు మొత్తాలను జత చేయాలనే షరతేమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు అదనంగా ఇస్తున్నాయి. అందువల్లనే వివిధ రాష్ట్రాలలో చెల్లించే మొత్తాల్లో ఎంతో తేడా ఉంది. 2023లో కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం సగటున రు.1,100 అందుకుంటున్నట్లు తేలింది. ఉదాహరణకు రెండింజన్ల పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెబుతున్న మధ్య ప్రదేశ్‌లో 60 ఏండ్ల వారికి రు.600, ఎనభై దాటిన వారికి రు.1,000 ఇస్తున్నారు. చత్తీస్‌ఘర్‌లో రు.350, ఇక దేశానికే ఆదర్శం అని చెబుతున్న గుజరాత్‌లో వరుసగా రు.750, రు.1,250 చెల్లిస్తున్నారు. మోడీ తరువాత ఆదర్శవంతమైన పాలన అందించారని కీర్తిస్తున్న నితీష్‌ కుమార్‌పాలనలో బీహార్‌లో ఇస్తున్నది రు.1,100, ఆంధ్రప్రదేశ్‌లో రు.4,000 చెల్లిస్తున్నారు.దేశంలో ఇదే గరిష్టం. ఏ రాష్ట్రం ఎంత చెల్లించినా దీనిలో కేంద్ర ఇస్తున్న మొత్తాలు 60 ఏండ్లు దాటిన వారికి రు.200, ఎనిమిది పదులు దాటితే రు.500 మాత్రమే. అంతకు మించి ఇచ్చేదంతా రాష్ట్రాల బడ్జెట్ల నుంచే కేటాయిస్తున్నారు. అభాగ్యులను ఆదుకొనేందుకు ముందుకు రాకుండా వారి ఉసురుపోసుకుంటున్న పాలనలో రెండింజన్లు ఉంటేనేం ఇరవై ఉన్నా ప్రయోజనం ఏముంది ! ప్రతిపక్షంలో ఉండగా ఇంత స్వల్పమొత్తాలా అంటూ ఇదే బిజెపి విమర్శించింది. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఆ పార్టీ వ్యవహరిస్తున్నది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అధికారమిస్తే అచ్చేదిన్‌ అంటే మంచి రోజులను తెస్తానని 2014లో వాగ్దానం చేసిన నరేంద్రమోడీ ఇప్పుడవయస్సు ఇప్పుడు 75 దాటింది. ఇది కూడా వివాదమే, ఒక సర్టిఫికెట్‌ ప్రకారం 75దాటితే ఆయన చెప్పుకుంటున్నదాని ప్రకారం త్వరంలో అధిగమిస్తారు. అరవై దాటిన వారెవరికైనా వృద్దుల బాధలేమిటో తెలిసి ఉండాలి. అయినా ఏమీ తెలియనట్లు, పెన్షన్‌ మొత్తాలను పెంచుతూ సవరించేందుకు మొరాయిస్తున్నారు, ససేమిరా కుదరదని మాట్లాడకపోయినా ఆచరణలో చూపుతున్నారు.పెన్షన్ల సవరణకు ఏమైనా కాలవ్యవధి ఉందా అని లోక్‌సభలో వచ్చిన ఒక ప్రశ్నకు మంత్రి కమలేష్‌ పాశ్వాన్‌ 2025 ఫిబ్రవరి 11న ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. ” పథకపు మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రత్యేకించి సవరణకు నిర్ణీత వ్యవధి అంటూ లేదు.అయినప్పటికీ అంతకు ముందు ఉన్న రు.75ను 2007లో రు.200కు పెంచారు. ఎనభై అంతకు మించిన వయస్సున్నవారికి 2011లో రు.500కు పెంచారు. ఇదిగాక వితంతు, వికలాంగులకు ఇచ్చే మొత్తాన్ని 2012లో రు.200 నుంచి రు.300కు పెంచారు.” అప్పటి నుంచి ఇంతవరకు కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వటం లేదు. మోడీ సర్కార్‌ మానవత్వం లేదా మానవ ముఖానికి ఇది అద్దం పడుతున్నది. ఈ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటు సభ్యులకు నెలవారీ వేతనాలు, ఇతర అలవెన్సులు రు.లలో ఎలా పెంచారో చూద్దాం.

అంశం ×××××××××××××× 2014 ×××× 2026

మూలవేతనం ××××××××× 50,000 ×××× 1,24,000

నియోజకవర్గ అలవెన్సు ×× 45,000 ×××× 90,000

ఆఫీసు ఖర్చులు ×××××××× 45,000 ×××× 75,000

సమావేశాల హాజరు భత్యం× 2,000 ×××× 2,500

కనీస పెన్షన్‌: నెలకు ××××× 20,000 ×××× 31,000

పెన్షన్‌ ప్రతి ఏటికి అదననం× 1,500 ×××× 2,500

2014లో ఉన్న ఇతర సౌకర్యాల్లో ఇంటి వసతి, వైద్యం, మూడు టెలిఫోన్లు ఉచితం, ఏడాదికి 50వేల యూనిట్లు విద్యుత్‌,నీరు ఉచితం, ఎంపీతో పాటు కుటుంబ సభ్యులు లేదా తోటి ప్రయాణం చేసేవారికి ఏటా 34 విమాన ప్రయాణాలు, అపరిమితంగా రైలు, బస్సు ప్రయాణాలు ఉచితం.2026 నాటికి పైన పేర్కొన్న సౌకర్యాలతో పాటు ఏడాదికి లక్షన్నర రూపాయలు ఫోన్లు, ఇంటర్నెట్‌ సౌకర్యాలకోసం ఇస్తున్నారు. పన్నెండు సంవత్సరాల్లో ఇంతగా ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంచిన ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌ మొత్తాలను పెంచేందుకు ఎలాంటి మార్గదర్శక సూత్రాలు లేవని చెబుతోంది. ఆర్టికల్‌ 370, ఇతర అనేక చట్టాలను సవరించిన మానవతావాదులు దీనికి అవసరమైన సవరణలు చేపట్టేందుకు ఎవరు అడ్డుపడ్డారు. ధరల పెరుగుదలకు అనుగుణ్యంగా ఎంపీలు, ఉద్యోగుల వేతనాలు పెంచుతున్న కేంద్రం అభాగ్యులకు అది వర్తించదా ?2013 నుంచి 2026 నాటికి రూపాయి విలువ పతనమై పెన్షన్‌ నిజమొత్తం విలువ రు.99 మాత్రమే,(ఈ మొత్తానికి గ్రామాల్లో అరకిలో వేరుశనగ నూనె మాత్రమే వస్తుంది, మిగతా అవసరాల సంగతేమిటి ) అందుకే కొందరు దీన్ని క్రూర పరిహాసం అని వర్ణిస్తున్నారు, ఇతర వస్తువుల ధరలు, ఇతర అవసరాల పెరుగుదల సంగతేమిటి ? పెన్షన్‌ మొత్తాలు చాలటం లేదని 95శాతం మంది చెప్పినట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేలింది, వారంతా బిజెపి పాలిత రాష్ట్రాలే వారే అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు అవసరమైన తిండిగింజల కొనుగోలుకు తగిన ఉపాధి లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ప్రతినెలా ఐదేసి కిలోల వంతున అందిస్తున్నది. దేశంలో వృద్దుల సంఖ్య పెరుగుతున్నదని అందరూ అంగీకరిస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, లేదా బతుకుతెరువు కోసం వలసలు పోతున్న స్థితిలో ఇండ్లకే పరిమితం అవుతున్న వృద్ధులను ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దేశంలో వృద్దుల సంఖ్య ప్రస్తుతం 17 కోట్లని, 2030 నాటికి 20కోట్లకు పెరుగుతుందని అంచనా, కానీ పెన్షన్‌ మొత్తాలు అందుకుంటున్నవారి సంఖ్య మోడీ పుష్కరకాలంలో 2.2కోట్లుగా ఉంది తప్ప పెరగలేదు.కేంద్ర తన పథకంలో భాగంగా పెన్షన్లు ఎందుకు పెంచటం లేదని బిజెపి నేతలను ప్రశ్నిస్తే రాష్ట్రాలకు ఆ బాధ్యత లేదా అని ఎదురుదాడికి దిగుతారు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వటం లేదంటే మెమ్మెమ్మె బెబ్బెబ్బె అంటారు. రాష్ట్రాలకూ బాధ్యత ఉంది గనుకనే అవి పెంచుతున్నాయి, కేంద్రం ఎందుకు పెంచటం లేదన్నదే ప్రశ్న. పెన్షన్ల మొత్తాన్ని పెంచేందుకు రాష్ట్రాలకు స్వేచ్చ ఉందని అతితెలివి సమాధానం కేంద్ర మంత్రి నోటి నుంచి వెలువడింది.

తమ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను 32 నుంచి 42శాతానికి పెంచిందని బిజెపి నేతల గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ ముసుగులో పథకాలలో కేంద్రం తన వాటాను గణనీయంగా తగ్గించిన సంగతి మాత్రం చెప్పరు. తాజాగా గ్రామీణ ఉపాధి పథకంలో 90ని 60శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. అనేక పథకాలు ఇలానే ఉన్నాయి, అందుకే ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో లాక్కున్నట్లు విమర్శలు వచ్చాయి. పెన్షన్ల విషయంలో కూడా అదే జరుగుతోంది.వివిధ రాష్ట్రాలు ఇస్తున్న మొత్తాలతో పాటు సంఖ్య కూడా పెరిగింది, కనీసం వారికైనా కేంద్రం నిధులు మంజూరు చేయటం లేదు.అయినా ఏ బిజెపి నేతా లేదా చంద్రబాబు వంటి వారు గానీ కుక్కిన పేనుల్లా ఉంటారు తప్ప దాన్ని గురించి అడగరు. మోడీ ఏమైనా తన జేబులోంచి ఇస్తున్నారా ? కార్పొరేట్లకు ఎంతో ఉదారంగా పన్ను తగ్గించి ఖజానాకు రావాల్సిన మొత్తాన్నే రద్దు చేశారు, రాయితీలు జనం చెల్లిస్తున్న పన్నుల నుంచే ఇస్తున్నారు. మరొక దుర్మార్గం ఏమంటే తాము ఇచ్చే ముష్టి రెండువందల రూపాయలను కూడా ఏ రాష్ట్రంలో ఎంతమందికి ఇవ్వాలో కేంద్రం కోటాలను నిర్ణయిస్తుంది. ఆ మేరకు ప్రస్తుతం 3.09కోట్ల మందికి మాత్రమే ఇస్తున్నది, అదనంగా సంఖ్యను పెంచుకోవాలంటే రాష్ట్రాలే భరించాలని చెప్పింది. అలా రాష్ట్రాలు అదనంగా ఇస్తున్న సంఖ్యతో కలుపుకుంటే మొత్తం లబ్దిదారులు 5.86 కోట్ల మంది ఉన్నారు. నిజానికి ఇప్పటికే ఆరు కోట్ల మంది వృద్దులు నిరుపేద కుటుంబాల్లో ఉన్నారని అంచనా, వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వటం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు వృద్దులు ఉసురు తీస్తున్నాయని వ్యాఖ్యానించాల్సి వస్తోంది.గతంలో 58 ఏండ్లు దాటిన మహిళలు, 60 ఏండ్ల వృద్దులకు రైళ్లలో ఛార్జీల రాయితీ ఉండేది. మోడీ సర్కార్‌ దీన్ని కూడా రద్దు చేసింది. తన ఏలుబడిలో దేశ సంపద(జిడిపి)ని గణనీయంగా పెంచానని మోడీ సర్కార్‌ చెప్పుకుంటుంది.సమాజానికి ఉపయోగపడని సంపద తాడి చెట్టు మాదిరి ఎంత పెరిగితేనేం ! మోడీ అధికారానికి వచ్చినపుడు సామాజిక పెన్షన్లకు కేటాయించిన మొత్తం జిడిపిలో 0.58శాతం ఉండేది, పదేండ్ల తరువాత అది 0.2కు పడిపోయింది.ఏటా బడ్జెట్‌ కేటాయింపులు తొమ్మిదిన్నరవేల కోట్లకు అటూ ఇటూగానే ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం నీతి అయోగ్‌ నివేదిక దేశంలో 78శాతం మంది వృద్దులు పెన్షన్లు లేకుండా బతుకుతున్నారని, వారిలో 70శాతం తమ కుటుంబాల మీద ఆధారపడుతున్నట్లు పేర్కొన్నది. ఎన్నికల బాండ్ల జారీ చెల్లవు అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తరువాత కూడా పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని ముద్రించి చెత్తబుట్టలో వేసిన జవాబుదారీతనం నరేంద్రమోడీది.కేవలం పన్నెండు కార్పొరేట్‌ సంస్థలు దివాలా ప్రకటిస్తే వాటికి రద్దు చేసిన మొత్తం రు.2.84లక్షల కోట్లు.నేను పైసా తినను ఇతరులను తిననివ్వను అని ఎన్ని సొల్లుకబుర్లు చెబితే ఏమిటి ! సామాజిక పెన్షన్‌ మొత్తాలను పెంచే ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని 2025 ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అందువలన నరేంద్రమోడీ పుష్కరకాలం పదవిలో ఉంటేనేం మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?

దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికాాఇజ్రాయెల్‌ 2026 ఫిబ్రవరి 28న ప్రారంభించిన ఏకపక్ష దాడులకు వందరోజులు నిండాయి. పోరు నిలిపివేయాలని ట్రంప్‌ ఆదేశించినప్పటికీ మంగళవారం నాడు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు జరిపి అనేక మందిని బలిగొన్నది. నిఘా ముసుగులో హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో తమపై దాడులకు సిద్దపడిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్‌ కూల్చివేసింది. దానికి ప్రతిగా మంగళవారం నాడు దక్షిణ ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపింది. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా మధ్య ప్రాచ్యం, గల్ఫ్‌లోని నాలుగు అమెరికా స్థావరాలపై టెహరాన్‌ దాడిచేసింది. బహరెయిన్‌లో తిష్టవేసిన అమెరికా పంచమదళ విమానవాహక యుద్ద నౌకమీద క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించింది. జోర్డాన్‌, కువైట్లలో ఉన్న అమెరికా వైమానిక స్థావరాల మీద కూడా దాడులు జరిపింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్‌పై జరిపిన దాడులను నిలిపివేసినట్లు అమెరికా మిలిటరీ కమాండ్‌ చెప్పింది. లెబనాన్‌ మీద దాడులకు తెగబడటం అంటే ట్రంప్‌కు తెలియకుండా జరిగేది కాదు. ఇరాన్ను రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగమే. బర్రె చచ్చిన తరువాత గానీ పాడి గురించి బయటపడదు అంటారు. అమెరికా జరిపిన ఈ దుర్మార్గానికి అప్పటి నుంచి ప్రపంచంలో ప్రతికూలంగా ప్రభావితంగాని దేశం లేదంటే అతిశయోక్తి కాదు.అయినా మనతో సహా అనేక దేశాలు అమెరికా వైఖరిని ఖండించేందుకు ముందుకు రావటం లేదు. అదే దానికి బలం చేకూరుస్తోంది.మనదేశ ఆహ్వానం మీద విశాఖ సైనిక విన్యాసాల్లో పాల్గని తిరిగి వెళుతున్న ఇరాన్‌ నౌకపై అమెరికా దాడి చేస్తే మన జలాల్లో కాదు కదా అని ఖండించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రాలేదు.హార్ముజ్‌ జలసంధిలో మనకోసం చమురును తీసుకువచ్చేందుకు వెళుతున్న నౌకపై అమెరికా మిలిటరీ కాల్పులు జరిపింది. దాన్లో ఉన్న 24 మంది మన నావికులు సురక్షితం అని చెప్పటం తప్ప అమెరికా చర్యను మన 56 అంగుళాల ఛాతీ ఖండించలేకపోయింది.తమ ఆంక్షలను ఉల్లంఘించి సదరు నౌక ప్రయాణించినందున దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది. తనకు ఏమాత్రం సంబంధం లేని జలాల్లో అమెరికా తిష్టవేసి దారిన పోయే నౌకలపై దాడి చేయటం ఏ అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణమో మోడీ సర్కార్‌ చెప్పాలి.నెహ్రూ రికార్డును అధిగమించామని సంబరాలు చేసుకుంటున్నారు, అది కూడా వాస్తవం కాదు. 1946లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు పొందింది. దాని కొనసాగింపుగా నెహ్రూ ప్రధాని పదవిని చేపట్టారు, ఎవరో నియమిస్తే కాదు. ఆ నెహ్రూ మొత్తం మీద అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగలేదు, మరి నరేంద్రమోడీ ? ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. అందుకే ఎన్నాళ్లు పదవిలో ఉన్నారని కాదు, ఏం చేశారన్నదే దేశానికి ముఖ్యం. . హార్ముజ్‌ నుంచి బాబ్‌ ఎల్‌ మాండెబ్‌(ఎర్ర సముద్రం) జలసంధి ప్రాంతాన్ని ప్రతిఘటన భద్రతా ప్రాంతంగా ఇరాన్‌ ప్రకటించింది. వంద రోజుల తరువాత జరిగిన ఈ పరిణామం పశ్చిమాసియా సంక్షోభాన్ని మరో మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

మధ్యధరా సముద్రం నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి అక్కడి నుంచి హిందూమహాసముద్రం(అరేబియా సముద్రం) ద్వారా జరిగే నౌకా రవాణా ఇప్పుడు అనిశ్చితంగా మారింది. తన అనుయాయులను కాపాడుకొనేందుకు ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక దేశాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అమెరికాాఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు, ఆడుతున్న నాటకాలకు తెరపడాలంటే ఇరాన్‌కు ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించటం లేనట్లుగా ఉంది. బాబ్‌ ఎల్‌ మాండెబ్‌(ఏడెన్‌ జలసంధి) మీద ఇరాన్‌ అనుకూల ఎమెన్‌ దళాలు పట్టుకలిగి ఉన్నాయి. హార్ముజ్‌ జలసంధి ద్వారా జరిగే రవాణాకు ఆటంకం కలిగితే ఆసియా దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. అదే ఏడెన్‌ జలసంధి దిగ్బంధనానికి గురైతే ఐరోపా, అమెరికా, ఆసియా దేశాలన్నీ ప్రభావితం అవుతాయి.ప్రపంచ వాణిజ్యంలో 9 నుంచి 12శాతం వరకు ఈ మార్గం ద్వారా జరుగుతున్నది.ఒక వేళ ఇది మూతపడితే నౌకలు ఆఫ్రికాలోని గుడ్‌హౌప్‌ ఆగ్రం మీదుగా తిరిగి వచ్చేందుకు అదనంగా 15 రోజుల వ్యవధితో పాటు రవాణా, బీమా ఖర్చులు కూడా పెరుగుతాయి.చమురు, గ్యాస్‌తో పాటు ఇతర వస్తువుల రవాణా కూడా గణనీయంగా ప్రభావితం అవుతుంది.అమెరికా తనకున్న ఆయుధ శక్తిని ప్రయోగిస్తుంటే ప్రతిఘటిస్తున్న ఇరాన్‌ తనకున్న అవకాశాలతో అడ్డుకుంటున్నది.బలవంతుడైన సర్పము అమెరికా అయితే ఇరాన్‌ చలిచీమల వంటిది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా అమెరికా దుశ్చర్యలకు జవాబిస్తున్నది.అక్టోబరులో ఇజ్రాయెల్‌ ఎన్నికలు, నవంబరులో అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు ఉండటంతో నెతన్యాహు, డోనాల్డ్‌ట్రంప్‌కు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు.వారిని గుడ్డిగా సమర్ధిస్తున్న ఇతర ఇతర దేశాల నేతల పరిస్థితీ అంతే ఉంది. వారిద్దరు సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించాల్సింది కూడా వారే, దాన్ని ఎలా చేస్తారో చూడాలి. ఈ లోగా తమపౌరులపై భారాలు మోపితే తమ పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన వారిని నమ్ముకున్న వారిలోనూ మొదలైంది.దానికి మనదేశమే ఉదాహరణ.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఏ రోజు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియదు.ఇప్పటికి 37సార్లు ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందనో, ఆ దేశాన్ని ఓడించామనో, మరకొటో చెప్పాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించాడు.అతగాడి కనుసన్నలలో పని చేస్తున్న నెతన్యాహు ఒక వైపు లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే దాడులు కొనసాగిస్తున్నాడు. అందువలన ఇరాన్‌-అమెరికా ఒప్పందం కుదరటం ఒక సమస్య అయితే తరువాత అయినా అమెరికా-ఇజ్రాయెల్‌ దానికి కట్టుబడి ఉంటాయా అన్న ప్రశ్న ఉండనే ఉంది.ఈ పూర్వరంగంలో వంద రోజుల సంక్షోభం గురించి ఒకసారి ప్రధాన అంశాలను సింహావలోకనం చేసుకుందాం.యావత్‌ ప్రపంచంలో అన్ని రంగాలలో అనిశ్చితి, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల చోటుచేసుకుంది.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలి మదుపుదార్లకు భారీ నష్టం వాటిల్లింది.ముడి చమురు దిగుమతి చేసుకొనే దేశాల వినియోగదారులే కాదు, ఎగుమతి చేసే అమెరికాలోనూ ధరమంట బాధితులు ఉన్నారు. ఇల్లుకాలి కొందరు ఏడుస్తుంటే మరికొందరు దేనికో అన్నట్లుగా సామాన్యులు తమ బడ్జెట్లను ఎలా సర్దుకోవాలా అని ఆందోళన పడుతుంటే కార్పొరేట్‌ కంపెనీలు తమ లాభాలను ఎలా నిలబెట్టుకోవాలా అని చూస్తున్నాయి. చమురు ధరలు తగ్గినప్పటికీ ఆందోళన ఇంకా తగ్గటం లేదు. ఉదాహరణకు మనదేశం ఏప్రిల్‌ నెలలో ముడి చమురు పీపాను సగటున 114.48 డాలర్లకు కొనుగోలు చేస్తే మే నెలలో 106.23 డాలర్లకు తగ్గినప్పటికీ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు నష్టం వస్తున్నదని పెట్రోలు, డీజిలు, ఇతర ఉత్పత్తుల ధరలను పెంచారు. జూన్‌ నెలలో ఇది రాసిన సమయానికి సగటున కొనుగోలు చేసిన ధర 97.44 డాలర్లకు తగ్గినా వినియోగదారుల నుంచి పెంచిన రేట్లే వసూలు చేస్తున్నారు తప్ప పైసా కూడా తగ్గించలేదు. ఫిబ్రవరి 28కి ముందు 70 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడూ తగ్గించలేదు.1970దశకంలో తగిలిన చమురు షాక్‌ కంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ ఇంథన సంస్థ చెప్పింది.ఈ పోరు సామాన్యుల జేబులను ఖాళీ చేస్తుండగా చమురు కంపెనీలకు అపార లాభాలను సమకూర్చుతున్నది. ఏప్రిల్‌ ఏడవ తేదీన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బహిరంగ మార్కెట్‌లో 138 డాలర్లు పలికింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి చమురు, గ్యాస్‌ కంపెనీలు దాడులు ప్రారంభమైన తొలి నెల రోజుల్లో సగటున గంటకు మూడు కోట్ల డాలర్లమేర అదనంగా లాభాలు పొందాయంటే ఆమేరకు జనం జేబులు ఖాళీ అయినట్లే ! ముడిచమురు ధర వంద డాలర్లకు అటూ ఇటూగా కొనసాగితే 2026 ఆఖరుకు 234 బిలియన్‌ డాలర్ల మేర అదనపు లాభాలు పొందుతాయని అంచనా. ఒక్క షెల్‌ కంపెనీ తొలి మూడు మాసాల్లో 6.9బిలియన్‌ డాలర్ల మేర లాభం పొందింది, ఇది అంతకు ముందు త్రైమాస కాలంతో పోల్చితే రెట్టింపు. తొలివారాల్లో ఐరోపా యూనియన్‌ చమురు కంపెనీలు రోజుకు 9.28 కోట్ల డాలర్ల మేర యుద్ద లాభాలు పొందాయి. బ్రిటన్‌లో ఉన్న కంపెనీలు నాలుగువారాల్లో 73.5 బిలియన్‌ డాలర్ల మేర మార్కెట్‌ విలువను పెంచుకున్నాయి. ఇరాన్‌పై దాడుల కారణంగా వంద రోజుల్లో అమెరికాకు వందబిలియన్‌ డాలర్ల మేర తక్షణ నష్టం వాటిల్లింది. ఇక పర్యావరణానికి సంబంధించి తొలి 14 రోజు దాడుల్లోనే తక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేసే 84దేశాలు ఏడాది మొత్తంలో విడుదల చేసే కర్బన కాలుష్యం కంటే ఎక్కువగా ( 50లక్షల టన్నులు) అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు విడదల చేశాయి.

యుద్ధ ప్రభావం ఆహార రంగం మీద కూడా పడింది. 2023 తరువాత తొలిసారిగా అధిక ధరలు నమోదయ్యాయి. ఇంథనం, ఎరువుల ధరలు పెరిగితే ఆహార ధరలతో పాటు పాకింగ్‌, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.ఎరువుల కంపెనీలకు విపరీత లాభాలు వచ్చాయంటే ఆ మేరకు రైతాంగం నష్టపోవటంతో పాటు వినియోగదారుల మీద అదనపు భారం పడుతుంది.ఈ ఏడాది ఆఖరు నాటికి ఎరువుల ధరలు 31శాతం పెరుగుతాయని, వాటిలో యూరియా ధర 60శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.ప్రపంచంలో 60శాతం చమురు గిరాకీ రవాణా రంగం నుంచే ఉంటున్నది.దాని మీద పడే భారం సామాన్యులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది ధరల పెరుగుదల కారణంగా అనేక దేశాలు చేపట్టిన చర్యలతో చమురు గిరాకీ రెండు శాతం తగ్గిందని అంచనా, 76దేశాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో జరిగింది. వాహన వేగపరిమితి, ఇంటి నుంచే పని, పౌర రవాణా వ్యవస్థలకు ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకున్నాయి.మన వంటి దేశాలలో సంక్షోభాల సమయంలో జనం మీద పడే భారాలు, కుటుంబాలకు అయ్యే అదనపు ఖర్చుల గురించి మదింపు వేసేందుకు సరైన యంత్రాంగం, సంస్థలు లేవు. ప్రభుత్వం ఎలాంటి సమాచారసేకరణ చేయటం లేదు గనుక వాటి గురించి చెప్పటం కష్టం.పెరుగుతున్న భారాలను తగ్గించుకొనేందుకు సంక్షేమ పథకాలకు కోతపెడతారు. గతంలో ఏడాదికి ఉజ్వల పధకం కింద పన్నెండు సిలిండర్లు రాయితీ ధరకు ఇవ్వగా తరువాత వాటిని తొమ్మిదికి ఇప్పుడు నాలుగు చేశారు. మూడీ ఎనలిటిక్స్‌ చెబుతున్నదాని ప్రకారం అమెరికాలో సగటున ప్రతి కుటుంబం యుద్ద సమయంలో 750 డాలర్లు అదనంగా ఖర్చు చేశారు. ఇంధనం మీదనే దీనిలో 447 డాలర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న సగటున ఒక గ్యాలన్‌(3.78 లీటర్లు) ధర 2.98 డాలర్లు ఉండగా ఈ వారంలో 4.22 డాలర్లుగా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువవారు బాధితులుగా మారారు.ఈ కారణంగానే 66శాతం మంది ట్రంప్‌ పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.ఒక సర్వే ప్రకారం ఇరాన్‌పై మిలిటరీ చర్య తప్పు అని 61శాతం మంది భావించారు.

ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధాలు,ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ ఆయుధాలు అమ్ముకుంటూ అమెరికా కార్పొరేట్లు లబ్దిపొందుతున్నాయి. వాటికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వెనుకాడటం లేదు. ఇరాన్‌పై పోరులో గెలిచేది లేదని తెలిసినప్పటికీ అమెరికా భారీ మొత్తాలను కేటాయిస్తున్నది. సాధారణ మిలిటరీ బడ్జెట్‌కు తోడు అదనంగా ఇరాన్‌ కార్యకలాపాలకుగాను 200బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని ట్రంప్‌ సర్కార్‌ కోరింది, చివరకు 98 బిలియన్‌ డాలర్లకు ఆమోదం లభించింది, ఈ మొత్తం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేందుకే అని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌పై మిలిటరీ చర్యకు అమెరికా రక్షణ శాఖ రోజుకు రెండు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నది.వచ్చే ఏడాది లక్షన్నర కోట్ల డాలర్లు రక్షణ బడ్జెట్‌కు కేటాయించాలని ట్రంప్‌ సర్కార్‌ కోరింది. ఇదే సమయంలో ఇతర బడ్జెట్లలో 10శాతం కోత విధించాలని కూడా కోరింది. ముందే చెప్పుకున్నట్లు రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించామని చెప్పుకొనేందుకు ఇరాన్‌పై బెదిరింపులతో ఒప్పందానికి తెచ్చుకోవాలని అమెరికా చూస్తోంది. తమ ప్రతిఘటనను హార్ముజ్‌తో పాటు బాబ్‌ అల్‌ మెండాబ్‌కు కూడా విస్తరిస్తామని ఇరాన్‌ ప్రకటించటంతో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, అది ఎన్ని రోజులు అన్నది ట్రంప్‌ మీద ఆధారపడి ఉంటుంది !జజ-ద్‌ీ ×అ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ూఱషవఅరవ

నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాలలో సూచికల్లో మనదేశ స్థానాలను వెల్లడించినపుడు అవి సమగ్రమైనవి కాదని,తాజా వివరాలను పరిగణనలోకి తీసుకోకుండా మోడీ సర్కార్‌ను బదనాం చేసేందుకు చేస్తున్న ప్రచారమని బిజెపి నేతలు చెబుతుంటారు. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకోవటం కొంతకాలమే సాగుతుంది. నిజానికి ఏ సూచికలనైనా మనదేశం వెల్లడించే సమాచారాన్నుంచే విశ్లేషణలు చేసి రూపొందిస్తారు. ఏ సంస్థాకూడా తానుగా సర్వే చేయదు. అసలు అలాంటి వివరాలను మన సర్కారే సేకరించకపోతే ! మన సర్వేను మనమే నమ్మకపోతే !! అసలు సూచికలే ఉండవు – వైఫల్యాల గురించి చర్చా ఉండదు.కాషాయ దళాల చావు తెలివితేటలు.తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో దేశంలో రక్తహీనత సమస్య గురించి వివరాలనే సేకరించకుండా ప్రశ ్నల జాబితా నుంచి మోడీ సర్కార్‌ ఎత్తివేసింది.అంతకు ముందున్న వివరాలను ఎవరైనా చెబితే అవి పాతవంటూ బుకాయించటానికి వేసిన ఎత్తుగడ ఇది.గుండెలు తీసిన బంట్లు అంటూ కథలు చదువుకున్నాం గానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.అసలు విషయానికి వస్తే 2023-24 సంవత్సరాలలో జాతీయ సర్వే జరిపారు. అంతకు ముందు సర్వేల్లో రక్తహీనతను గుర్తించేందుకు అనుసరించిన పద్దతివలన తప్పులు దొర్లాయనీ, ఎక్కువగా ఉన్నట్లు చూపాయంటూ తాజా సర్వేలో ప్రశ్నావళి నుంచి గుట్టుచప్పుడు కాకుండా కేంద్రం తొలగించింది. గతంలో వేళ్ల నుంచి రక్తం సేకరించేవారు, దానికి బదులు రక్త నాళాల నుంచి సేకరించి పరీక్షిస్తే సరైన వివరాలు వస్తాయని చెప్పారు, పోనీ ఆ పని కూడా చేయకుండా అసలు పరీక్షలనే ఎత్తివేయాల్సిన అవసరం ఏముంది ? కొత్త పద్దతికి ఏమైనా లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతాయా ! అడిగేవారు కొందరు ఉన్నా సమాధానం చెప్పే జవాబుదారీ తనం లేదు. కేంద్రం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు పొందటం కోసం పోషణ యాప్‌లో పోషకాహార లోపం సమచారాన్ని తక్కువ చేసి నమోదు చేయాలని మహారాష్ట్ర బిజెపి సర్కార్‌ అక్కడి స్కీము వర్కర్లను వత్తిడి చేసిందంటే అసలు ప్రభుత్వం సేకరించే, ప్రకటించే సమాచారం మీదనే అనుమానం వస్తున్నది.బహిరంగ మలవిసర్జన పూర్తిగా నివారించటంలో విజయం సాధించామని చెప్పుకున్న నరేంద్రమోడీ సర్కార్‌ విజయగానం వాస్తవం కాదని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇంకా మరికొన్ని పథకాల బండారం కూడా బయటపడింది. ఆ సమాచారాన్ని సవరించాలన్న ప్రభుత్వ వత్తిడికి తలొగ్గని సర్వే నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ కెఎస్‌ జేమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టించింది, అందుకు కుంటిసాకులు చెప్పింది.

రక్తహీనతకు మనదేశాన్ని ప్రపంచ రాజధాని అని పిలుస్తుంటారు.నరేంద్రమోడీ గొప్పగా దేశానికే ఆదర్శం గుజరాత్‌ నమూనా అని చెప్పిన దాని తరువాతే ఈ విషయంలో మరో రాష్ట్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది.నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు ఒక ఆదర్శరాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకొని అదే విధంగా యావత్‌ దేశాన్ని గుజరాత్‌ తరహలో తీర్చిదిద్దుతానని 2014 ఎన్నికల్లో వాగ్దానం చేశారు. తరువాత ఎప్పుడైనా దాని గురించి ప్రస్తావించారా ? అలాంటి రాష్ట్రంలో రక్తహీనత గురించి మాట్లాడుకున్న తరువాతే తాజా కుటుంబ ఆరోగ్య సర్వే అంశాలను చెప్పుకుందాం. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం సర్వే-5(2019-21) ప్రకారం దేశంలో, గుజరాత్‌ రక్తహీనత వివరాలు శాతాలలో ఇలా ఉన్నాయి.

వయస్సు ××××××××× దేశం×××× గుజరాత్‌×× ప్రపంచ సగటు

6-59 నెలల పిల్లలు××× 67.1 ××× 79.7 ××× 39.8

15-19 ఏండ్ల బాలికలు× 59.1 ××× 69.0 ×××××××

15-49 గర్భిణులు ××× 52.2 ××× 62.6 ××× 35.5

బిజెపి గొప్పగా చెప్పుకున్న మోడీ, తదనంతర పాలనలో గుజరాత్‌లో సమస్య పెరిగినట్లు మిగిలిన సర్వేలన్నీ చెప్పాయి తప్ప కనీసం, స్థిరంగా కూడా లేదు.దేశంలో కూడా అదే స్థితి. పిల్లలు, తరుణవయస్సువారిలో చైనాలో కేవలం 6.6శాతమే ఈ సమస్యతో ఉన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ మీద ఉన్న శ్రద్ద బిజెపికి ప్రజారోగ్యం మీద లేదు. 2025నాటికి రక్తహీనత ముక్త భారత్‌ అని ప్రకటించారు.అది కూడా మోడీ అధికారానికి వచ్చిన నాలుగేండ్ల తరువాత గానీ గుర్తుకు రాలేదు. తగ్గింపు లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. నిజానికి ఈ సమస్య మీద గతంలో పాలన వెలగబెట్టిన కాంగ్రెస్‌ పార్టీ కూడా పట్టించుకోలేదు.1970లోనే ఎన్‌ఏపిపి కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదున్నర దశాబ్దాలు గడచినా పరిస్థితి తీవ్రంగానే ఉంది.ఇప్పుడసలు తాజా సమాచారమే లేకుండా చేశారు.రక్తహీనత ఆడపిల్లలు,మహిళ్లలోనే ఎక్కువ. మోడీ బేటీ బచావో నినాదం తీరు ఇది. రక్తహీనత ముక్త భారత్‌ను 2025నాటికే సాధిస్తామన్న పెద్దలు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న 2030కైనా నెరవేరుస్తారా అంటే 2029 ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలా అనే యావతప్ప మిగతా అంశాలు పట్టించుకోలేదు గనుక ఎన్ని దశబ్దాలు పడుతుందో ఎవరు పుణ్యం కట్టుకుంటారో తెలియదు.

తాజా జాతీయ కుటుంబ,ఆరోగ్య సర్వేను దేశమంతటా 715జిల్లాలలో, 6.79లక్షల కుటుంబాల్లో నిర్వహించారు.ఆసుపత్రుల్లో ప్రసవాలు అంతకు ముందు సర్వేతో పోలిస్తే 88.6 నుంచి 90.6శాతానికి పెరిగాయి.మొత్తం జననాల రేటు అంతర్జాతీయంగా ఆమోదించిన 2.1కంటే తక్కువగా 2.0 ఉంది.పిల్లల్లో 95.6శాతం మందికి టీకాలు వేశారు.సిజేరియన్‌ ఆపరేషన్లతో జరిగే జననాల రేటు 21.5 నుంచి 27.2శాతానికి పెరిగింది. తల్లిపాలు ఇచ్చే శాతం ఇప్పటికీ ఎక్కువగా ఉన్నప్పటికీ మూడోవంతు మంది పిల్లలకు వారు పెరగాల్సిన వయస్సులో అవసరమైన ఘన ఆహారం అందటం లేదు.ఆరు-ఎనిమిది నెలల వయస్సు ఉన్న వారికి తల్లిపాలతో సహా 40.5శాతం మందికి ఘన ఆహారం అందటం లేదు.గర్భిణులకు 180రోజుల పాటు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ పోషకాలు అందాల్సి ఉండగా కేవలం 37.8శాతం మందికి మాత్రమే అందుతున్నాయి. అంగన్‌వాడీ, పోషన్‌ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ పరిస్థితి ఇది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఎన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12.9శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు అందటం లేదు.ఆయుష్మాన్‌ భారత్‌ బీమా 39.8శాతం మందికి అందుబాటులో లేదు. ఇదే విధంగా 40శాతం మందికి వంటగ్యాస్‌ అందుబాటులో లేదు, కాలుష్యకారక వంట చెరకుతోనే వారు గడుపుతున్నారు. (రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో ఇటీవల బీహార్‌ వలస కూలీల కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులు సమీపంలోని వంట చెరకు తెస్తూ రైలు ఢకొీని మరణించిన ఉదంతం సమస్యకు అద్దంపడుతున్నది.) ఒక వైపు పోషకాహారం అందక అనేక మందికి జబ్బులు వస్తుండగా కొంత మందికి ఊబకాయంతో వచ్చే సమస్యలు పెరగటంతో రెండు భారతాలు దర్శనమిస్తున్నాయి. స్త్రీ, పురుషులిద్దరిలో ఊబకాయాలు పెరుగుతున్నట్లు మహిళల్లో ఈ సంఖ్య 21.6, పురుషుల్లో 20.4కోట్లుగా ఉన్నట్లు సర్వే సర్వే వెల్లడించింది. గర్భిణులైన వారిలో కూడా ఊబకాయం పెరగటానికి పోషకాహారం తగినంతగా లేకపోవటమే. ఇది ఆందోళనకర పరిణామం.దీనితో పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం,మధుమేహం పెరగటం కూడా వెల్లడైంది. ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న అంటు వ్యాధులు కాని ఈ జబ్బులతో జనాల జేబులకు చిల్లుపడుతున్నది, ఆర్థికంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ నష్టమే అయినప్పటికీ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.చిత్రం ఏమిటంటే ఊబకాయాలతో పాటు స్త్రీ పురుషులలో 20శాతం మంది ఉండాల్సినదానికంటే తక్కువ బరువు ఉన్నట్లు తేలింది. ఒకవైపు ఈ సమస్య పరిష్కారం కాకుండానే అధిక బరువు సంక్షోభం ముంచుకువస్తోంది.దేశ ఆర్థిక వ్యవస్థకు రెండూ నష్టమే. పన్నేండ్ల మోడీ పాలనలో తగినంత ఆహారం లేకపోవటంతో పాటు అది పుష్టికరంగా లేదని ఈ సర్వే వెల్లడించింది.దీనికి కూడా మహాత్మా గాంధీ, నెహ్రూలే కారణం అని తప్పించుకోవటం కుదరదు.

బిడ్డ పుట్టిన ఆరునెలల వరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని చెబుతున్నారు, అప్పటి నుంచి పరిమిత ఘన ఆహారం అందచేస్తే 6-23నెలల పిల్లలు పుష్టిగా ఎదుగుతారు. రోజుకు మూడు సార్లు అలాంటి ఆహారం అందుతున్న పిల్లలు కేవలం 15.3శాతమే ఉన్నారని జాతీయ ఆరోగ్య ఆరవ సర్వే తేల్చింది.అంతకు ముందుతో పోలిస్తే ఈ సంఖ్య మెరుగని సంతృప్తిపడితే అంతే సంగతులు. ఇలాంటి పిల్లలు తరువాత కాలంలోనే అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పురుషుల కంటే మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువ జరుగుతున్నట్లు తేలటం కూడా ఆందోళన కలిగించే అంశమే. గతంతో పోలిస్తే ఆరోగ్య బీమా చేయించుకున్నవారు పెరిగినప్పటికీ వైద్యం కోసం జేబుల నుంచి చేస్తున్న ఖర్చు ఈ సర్వే కాలంలో 43.4శాతం పెరిగింది, అంతకు ముందు 39.4శాతమే ఉంది. అందుకే ఆసుపత్రుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్‌ ఆపరేషన్లు 54.1శాతం ఉండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.9శాతమే, అంటే డబ్బుకోసమే ప్రైవేటు ఆసుపత్రులు లబ్ది పొందేందుకు ఈ పని చేస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు.శుభ ముహార్తాల్లో పిల్లలను కనాలనే ఒక మూఢనమ్మకం పెరగటం కూడా దీనికి ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదాని ప్రకారం మొత్తం కాన్పుల్లో సిజేరియన్లు 10-15శాతం మధ్య ఉండాలి.ప్రైవేటు ఆసుపత్రుల్లో అసోంలో అత్యధికంగా 81.4శాతం జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 39శాతం, ప్రైవేటులో 42.5శాతం మాత్రమే ఉన్నాయి. ఆదర్శపాలన అందించారని చెబుతున్న నితీష్‌ కుమార్‌ పాలనలో బీహార్‌లో పదేండ్లుగా సారా నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ గత సర్వేతో పోలిస్తే ఈసారి పెరిగి తాగుబోతుల సంఖ్య 18.9శాతంగా ఉంది. ఆరు-23నెలల మధ్య ఉన్న పిల్లలకు పోషకాహారం అందటంలో జాతీయ సగటు కంటే తక్కువగా బీహార్‌లో 11.9శాతమే ఉన్నారు. ఇదీ ఆదర్శవంతమైన పాలన అందించిన నితీష్‌ కుమార్‌ ఏలుబడి తీరు, అందువలన అభివృద్ధి అంటే ఏమిటి, ఏం ఒరగబెట్టారని ప్రశ్నించుకోవాలి.

యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు  

   తాను యూదులకు వ్యతిరేకం కాదని, యూదు దురహంకారానికి, పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తున్నట్లు  న్యూయార్క్‌ నగర మేయర్‌ జోహ్రాన్‌ మందానీ మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. భారతీయులైన మహమ్మద్‌ మందానీ, మీరా నాయర్‌ల సంతానమైన 35 ఏండ్ల జోహ్రాన్‌ న్యూయార్క్‌ నగరానికి 112వ, తొలి ముస్లిం సామాజిక తరగతికి చెందిన మేయర్‌. వామపక్ష భావజాలం కలిగి ఉన్నందుకు కమ్యూనిస్టు అని ముద్రవేసినప్పటికీ నగర పౌరులు పట్టించుకోకుండా ఎన్నుకున్నారు. తాజాగా మరోసారి అమెరికా మీడియాలో వార్తలకు ఎక్కారు.  ఆదివారం నాడు నగరంలో జరిగిన వార్షిక ఇజ్రాయెల్‌ దినోత్సవాన్ని బహిష్కరించారు. ఇజ్రాయెల్‌ అనుకూల ఏ కార్యక్రమమంలో కూడా భాగస్వామిని అయ్యేది లేదని ఎన్నికల సమయంలోనే కరాఖండితంగా చెప్పానని కూడా గుర్తు చేశారు. తాను యూదుల జీవన శైలికి వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పాడు. వారం రోజుల ముందే విలేకర్లతో మాట్లాడిన మందానీ తాను పాల్గ్గొనకపోయినా ఆ రోజు జరిగే కార్యక్రమానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్లుగానే అసాధారణ రీతిలో పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు జరగకుండా చూశారు. ఇజ్రాయెల్‌ ఉనికిలోకి వచ్చిన తరువాత 1964 నుంచి ప్రతి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ విధిగా పాల్గొనాలని గతంలో నిర్ణయించారు.ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మేయర్లందరూ పాల్గొన్నారు, దాన్ని తిరస్కరించిన తొలి వ్యక్తిగా జోహ్రాన్‌ మందానీ చరిత్రకెక్కారు.  ఈ ఉదంతం గురించి  ప్రపంచ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు, విశ్లేషణలు వెలువడ్డాయి.డెమోక్రటిక్‌ పార్టీలో సోషలిస్టు వర్గంగా ఉన్నవారిలో మందానీ ఒకడు.అతను కార్యక్రమాన్ని బహిష్కరించినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన అనేక మంది  భాగస్వాములయ్యారు. మందానీతో ఏకీభవించిన వారు కూడా దూరంగా ఉన్నారు. యూదు సామాజిక తరగతికి చెందిన వారంతా దురహంకారులు కాదు అన్నది మేయర్‌ ఎన్నికల సమయంలోనే రుజువైంది.న్యూయార్క్‌ నగరంలో యూదు సామాజిక తరగతికి చెందిన వారు గణనీయంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గాజాలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం జరిపిన మారణకాండను తీవ్రంగా వ్యతిరేకించటం, ఆ ప్రభుత్వాన్ని విమర్శించటంలో జోహ్రాన్‌ మందాని ఎంతో స్పష్టంగా ఉన్నారు. మారణకాండకు బాధ్యుడైన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వస్తే  అంతర్జాతీయ న్యాయస్థాన వారంట్‌ ప్రకారం అరెస్టు చేయిస్తానని కూడా చెప్పినంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.       

ఆదివారం నాటి ఇజ్రాయెల్‌ దినోత్సవంలో ఆ దేశానికి చెందిన ముగ్గురు దురహంకారులైన మంత్రులు ప్రతినిధులుగా పాల్గొన్నందున అది ఆ దేశ కార్యక్రమంగానే చూశారు. అలాంటి వారితో తాము గళం కలపటం ఏమిటని మందానీతో సహా అనేక మంది డెమోక్రాట్లు ప్రశ్నించారు. అంతే కాదు న్యూయార్క్‌ మాజీ కంప్‌ట్రోలర్‌, నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సిద్దమౌతున్న బ్రాడ్‌ లాండర్‌, జాతి, ఆర్థిక న్యాయాల కోసం పోరాడుతున్న యూదుల సంస్థకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇజ్రాయెల్‌ దినోత్సవం రోజున ప్రదర్శనల్లో పాల్గొన్న ఇజ్రాయెలీ రాజకీయనేతలు పాలస్తీనియన్ల ఊచకోతకు హర్షాతిరేకాలు వెల్లడించటమేకాదు, మారణకాండకు పాల్పడిన ప్రభుత్వంలో భాగస్వాములు. ఇజ్రాయెల్‌  ఉత్సవాలు యూదుల ఉనికి లేదా వారికి గర్వకారణం కాదంటూ ఇది న్యూయార్క్‌ నగరమేయర్‌కు తెలుసని ఉత్సవంలో భాగస్వాములు గాకపోవటం తమకు ఎంతో ఆనందంగా ఉందని యూదుల సంస్థ ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అయితే ప్రదర్శనలో పాల్గొనకూడదన్నది మేయర్‌ నిర్ణయమని తాను గర్వంతో హాజరవుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌, యూదు సామాజిక తరగతికి చెందిన జెస్సికా టిచ్‌ ప్రకటించారు. ప్రతి ఏడాది ఈ రోజు ఎంతో ఆనందకరమైనదని అమె వర్ణించారు. మొదటి నుంచీ మందానీని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ అనుకూలురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి కుదరక రాకపోవటం కాదని, భావజాలపరమైన, అవమానకర నిర్ణయమని వ్యాఖ్యానించారు. మీడియా రారాజుగా పేరున్న రూపర్ట్‌ మర్డోచ్‌ నిర్వహణలోని న్యూయార్క్‌ పోస్ట్‌ పత్రిక మొదటి పేజీలో మోటార్‌ సైకిల్‌ మీద తిరుగుతున్న మందానీ ఫొటో వేసి విద్వేష సైకిల్‌ , జో ఇజ్రాయెల్‌ పరేడ్‌ను అవమానిస్తూ సైకిల్‌ మీద తిరుగుతున్నాడు అంటూ వ్యాఖ్యానించింది.     

మేయర్‌కు మద్దతు ఇచ్చినవారి వాదనేమిటో చూద్దాం. న్యూయార్క్‌ ప్రదర్శనకు వచ్చిన వారిలో ఒకడైన బెజాలెల్‌ మోట్రిచ్‌ ఇజ్రాయెల్‌ ఆర్థిక మంత్రి, పాలస్తీనియన్ల మారణకాండను బహిరంగంగా సమర్ధించిన ఒక యూదు జాతీయ ఉన్మాది అని పేర్కొన్నారు. గత సంవత్సరం అమెరికా వచ్చి వెళ్లిన రెండువారాల తరువాత తనను ఆరెస్టు చేసేందుకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రయత్నిస్తున్నదని ఆరోపించాడు.అతను యూదు మత పార్టీనేత, అధికారిక అతిధుల జాబితాలో తొలుత అతని పేరు లేదు.చివరికి హాజరయ్యాడు. ఇలాంటి వాడితో కలసి ప్రదర్శనలో పాల్గ్గొనటం అనేక మంది డెమోక్రాట్లకు ఇబ్బందికరంగా తోచింది. అతను 2023లో మాట్లాడుతూ పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలోని హవారా అనే పాలస్తీనియన్ల గ్రామాన్ని ప్రభుత్వమే నాశనం చేయాలని పిలుపునిచ్చాడు. ఆ వెంటనే ఉన్మాదులైన యూదులు పాలస్తీనియన్లను ఊచకోత కోశారు.అతని రెచ్చగొట్టే వ్యాఖ్యలను చివరికి అమెరికా కూడా ఖండించింది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమికొట్టాలని, వెస్ట్‌ బ్యాంకు ప్రాంతాన్ని యూదులతో నింపాలని మోట్రిచ్‌ పిలుపునిచ్చాడు. మరొకడు ఇజ్రాయెల్‌ వలస వ్యవహారాల మంత్రి ఆఫిర్‌ సోఫెర్‌. వీడు మరింతగా రెచ్చిపోయాడు. ఇజ్రాయెల్‌కు వలస వస్తున్న యూదులందరూ సనాతనుల ప్రమాణాలను పాటించేవారు కాదని, లౌకిక, సంస్కరణ వాదులైన వారు, పాక్షిక వారసత్వం ఉన్న యూదులకు ఇక్కడ చోటు ఇవ్వరాదన్నాడు. మరొక మంత్రి అండ్‌ ఎలియాహు, గాజా మీద అణుబాంబు వేయాలని, వెస్ట్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి వారి సరసన మందానీ పాల్గ్గొంటాడా !       

   తాను ఇజ్రాయెల్‌ ఉనికి ప్రశ్నించటం లేదని, యూదులకు ఉన్నట్లే ఇతరులకూ హక్కులు ఉంటాయని గుర్తించాలని చెప్పాడు. న్యూయార్క్‌ నగరంలో యూదు వ్యతిరేక ధోరణులు పెరగకుండా చూసేందుకు ఉన్న సంస్థకు నిధుల పెంపుదలకు కూడా చర్యలు తీసుకున్నాడు. జోహ్రాన్‌ మందానీ సిద్దాంతాల వలన వివాదం తలెత్తింది తప్ప మోట్రిచ్‌ వంటి ఫాసిస్టు శక్తులతో కలసి డెమోక్రాట్లు భాగస్వాములైనందుకు కాదని బరాక్‌ ఒబామా ఏలుబడిలో భద్రతా సలహాదారుగా పని చేసిన బెన్‌ రోడ్స్‌ వ్యాఖ్యానించాడు.మోట్రిచ్‌ పచ్చిమితవాద వాచాలత్వం విలువలకు కట్టుబడిన న్యూయార్క్‌ వాసులంగా ఉన్న తమకు వ్యతిరేకమైనదని, అతని భాగస్వామ్యం యూదు సామాజికులకు గర్వకారణం కానందున తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ముస్లిం వ్యతిరేకతకు నగరంలో స్థానం లేదని మరికొందరు స్పందించారు. ఏడు లక్షల మంది పాలస్తీనియన్లను వెళ్లగొట్టి 1948లో ఇజ్రాయెల్‌ను ఉనికిలోకి తెచ్చారంటూ ఈ ప్రదర్శనకు కొద్ది రోజుల ముందు ఒక వీడియోను విడుదల చేశారు.తాను తొమ్మిదేండ్ల బాలికగా ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, అప్పటి నుంచి వివిధ ప్రాంతాలలో ప్రవాసంలోనే గడుపుతున్నానని ప్రతిచోటా వెలుపలి మనిషిగానే చూశారని ఇనియా బుష్‌నాక్‌ ఆ వీడియోలో చెప్పిన మాటలు ఉన్నాయి.       

   తాజా వివాదం న్యూయార్క్‌ నగరం, అమెరికాలో మారుతున్న యూదుల ఆలోచనా సరళిని ప్రతిబింబించింది. న్యూయార్క్‌ నగరంలో సామాజిక పరంగా చూస్తే ఎక్కువ మంది యూదులు ఉన్నారు. మేయర్లుగా గతంలో పని చేసినవారందరూ ఇజ్రాయెల్‌ను సమర్ధించినవారు, తరచూ ఆ దేశాన్ని సందర్శించినవారే. జోహ్రాన్‌ మందానీ ఆ బాటలో నడవని ఒకే ఒక్కడు అంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్‌ నెలలో పూ పరిశోధనా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి పదిమందిలో ఆరుగురు అమెరికన్లు గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండను విమర్శించారు. ఇలాంటి వ్యతిరేకత 2022 నుంచి 20 పాయింట్లు పెరిగింది.ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఇజ్రాయెల్‌ దినోత్సవ ప్రదర్శన జరిపారు.    యూదు ఓటర్ల కేంద్రం ఈ వారంలో ఒక సర్వే వివరాలను వెల్లడించింది.అమెరికా యూదుల్లో 35 ఏండ్ల లోపు వారు సగం మంది ఇజ్రాయెల్‌ాపాలస్తీనా దేశాలు ఉండాలన్న ప్రశ్నకు మద్దతు ఇచ్చారు. సనాతనులు కాని వారు 51శాతం మద్దతు ఇచ్చారు. ఇదేదో వామపక్ష సంస్థ జరిపిన సర్వే అనుకుంటే పొరబాటు. ఉత్తర అమెరికా యూదు ఫెడరేషన్‌ జరిపిన సర్వేలో కేవలం 37శాతం మంది  అమెరికన్‌ యూదులు మాత్రమే మత సంబంధ గుర్తింపును చెప్పుకున్నారు. మత వ్యతిరేకం, మతంతో సంబంధం లేదని చెప్పుకున్న వారు 18 నుంచి 34 ఏండ్ల వయస్సు వారు మూడో వంతు ఉండటం విశేషం. నెతన్యాహు అనుసరిస్తున్న విధానాల పర్యవసానాల ఫలితంగా అమెరికా యువ యూదుల్లో అసంతృప్తి పెరుగుతున్నదని పరిశీలకులు ఈ సర్వే తీరుపై వ్యాఖ్యానించారు. 

    ప్రదర్శనకు దూరంగా ఉండి మందానీ యూదులనుంచి దూరం కాలేదా అన్న ప్రశ్నకు  ఇలాంటి మంత్రులను ఆహ్వానించిన వారే మెజారిటీ యూదుల నుంచి దూరమైనట్లు సమర్ధకులు తిప్పికొట్టారు.      హమస్‌ సాయుధ బృందాలు 2023 అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయెల్‌పై దాడి చేసి అనేక మందిని చంపి, కొందరిని బందీలుగా పట్టుకుపోయిన తరువాత రోజు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ హమస్‌ను మట్టుబెట్టే పేరుతో గాజా ప్రాంతంలో 70వేల మంది సాధారణ పౌరులను హత్యచేసింది. వారిలో 70శాతం మంది మహిళలు, పిల్లలే. లక్షలాది గృహాలను నేలమట్టం కావించింది. ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనియన్లను గాజా నుంచి తరమివేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలని అమెరికా ట్రంప్‌, నెతన్యాహు చెబుతున్నారు.పాలస్తీనాలోని మరొక ప్రాంతమైన వెస్ట్‌ బ్యాంకులో నిరంతరం యూదులను రప్పించి స్థిరనివాసాలను ఏర్పాటు చేసి యూదు మెజారిటీ ప్రాంతాలుగా చిత్రించి ఇజ్రాయెల్‌లో కలిపేందుకు లేదా వివాదాస్పద ప్రాంతాలుగా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. పాలస్తీనాకు రాజధానిగా ఉండాల్సిన తూర్పు జెరూసలెంను ఆక్రమించేందుకు చూస్తున్నారు.ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించేవారు అమెరికాలో నానాటికీ పెరుగుతున్నారని ముందే చెప్పుకున్నాం. గాజాలో మారణకాండకు పాల్పడినట్లు ఐరాస కమిషన్‌,ఇజ్రాయెలీ మరియు అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు సైతం దాన్ని నిర్ధారించటంతో సామాన్య అమెరికన్లు కళ్లు తెరుస్తున్నారు.ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం చేస్తున్న దుర్మార్గాలతో సామాన్య యూదులపై కూడా వ్యతిరేకత పెరుగుతున్నది. అయితే వారు తాము దురహంకారులం కాదని, పాలస్తీనియన్లకు వ్యతిరేకం కాదంటూ జోహ్రాన్‌ మందానీ వంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తూ యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.దేశ దేశాల్లో ఉన్న ఫాసిస్టు, మతశక్తులను దూరం పెట్టేందుకు ఆయా దేశాల పౌరులు జాగరూకులు కావాల్సిన తరుణం అసన్నమైంది !               

చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

మంగళవారం నాడు ఢిల్లీలో నాలుగుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. మహాభారతంలో నలుగురిని దుష్ట చతుష్టయం అని పిలిచారు.వారు దుర్మార్గానికి పాల్పడ్డారు గనుక దుష్ట అని విశేషణాన్ని చేర్చారు. అమెరికా,భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు ఒక కూటమిగా భద్రత చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందున చతుర్భుజ భద్రతా సంప్రదింపులు(క్వాడ్రలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌-క్వాడ్‌) అని పేరు పెట్టారు.పదే పదే అంత పెద్ద పేరుతో పలకలేం గనుక చతుష్టయం అందాం. మన విదేశాంగమంత్రి జై శంకర్‌ ఆహ్వానం మేరకు చతుష్టయ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఎందుకు జరిగిందయ్యా అంటే చైనాకు చెక్‌(అడ్డుకొనేందుకు) పెట్టేందుకు అని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన అది సాధుజంతువుగా ఉంటుందా ? కొన్ని దేశాలు సమావేశమైనపుడు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం,సంపదల సృష్టికి సహకారం, మద్దతు ఇవ్వాలి తప్ప మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు అంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా కుట్రలకు తెరతీయటం, కూటమిగా సంఘర్షణకు పూనుకోవటాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పారు. లోపల ఏం మాట్లాడుకున్నారో పైకి ఏం చెప్పారన్నదాని గురించి పెద్దగా బుర్రలు బద్దలు చేసుకోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నందున ఎదుటివారికి చెప్పేందుకే ఉన్న నీతి సూత్రాలకు కొదవ ఉండదు.ముందుగా ఈ సమావేశం గురించి పెద్దగా చర్చలు కూడా జరగలేదు గనుక సాదాసీదా సమావేశంగానే మీడియా భావించిందని చెప్పాలి. ఈ భేటీకి పది రోజుల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా యాత్ర చేసిన తరువాత నిజంగానే ఆ ఏముంటుందిలే అని పెద్దగా పట్టించుకోలేదు. పైకి ఏమి చెప్పినా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణా జరగాలన్నది ఈ కూటమి అజెండాలో ఒకటి. ప్రపంచాన్ని పక్కదారి పట్టించేందుకు లేని సమస్యను ఉన్నట్లుగా చూపే ఒక మైండ్‌ గేమ్‌. సోవియట్‌ యూనియన్‌తో ఐరోపాకు ముప్పు పొంచి ఉందంటూ నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లుగానే ఆ ప్రాంతంలో చైనా ముప్పు గురించి ప్రచారం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే ఎవరైతే ఈ డిమాండ్‌ చేస్తున్నారో ఆ దేశాల్లో ఒకటైన అమెరికా తన ఇరుగూ కాదు పొరుగూ కాదు, ఖండమూ కాదు, పదివేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హార్ముజ్‌ జలసంధిలో ఆయుధాలను చూపి నౌకల దిగ్బంధాన్ని అమలు జరుపుతూ మరోవైపు చైనా పెరటితోట వంటి దక్షిణ చైనా సముద్రం గురించి తేల్చాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.ఇంతవరకు చైనా ఏ ఒక్క నౌకనూ అడ్డుకున్న ఉదంతం లేదు.ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నౌకా రవాణాకు సంబంధించి నిఘావేసేందుకు నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

నిజానికి చతుష్టయ కూటమి ఏర్పాటలో దేశాల మధ్య అవగాహన తప్ప ఎలాంటి ఒప్పందమూ లేదు. తొలుత 2002 భారత్‌ మినహా మూడు దేశాలు త్రిపక్ష కూటమిగా ఏర్పడ్డాయి.తరువాత ఐదేండ్లకు భారత్‌ చేరింది.దీన్ని మరికొన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలని చూసినప్పటికీ ఏ దేశమూ ముందుకు రాలేదు. తరువాత పదేండ్ల పాటు దాన్ని గురించిపెద్దగా పట్టించుకోలేదు. 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు, ప్రకటనలు చేస్తున్నారు.2021 నుంచి ఏటా ఒక సభ్యదేశంలో కూటమి అగ్రనేతల సమావేశాలు, దానికి ముందు విదేశాంగ మంత్రుల సన్నాహక సంప్రదింపులు జరుపుతున్నారు. ఆరుసార్లు అధినాయక సభలు జరగ్గా రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సులు, రెండుసార్లు జపాన్‌లో, మరో రెండుసార్లు అమెరికాలో జరిగాయి.2024జూన్‌30 నుంచి జూలై రెండవ తేదీ వరకు కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది.డోనాల్డ్‌ ట్రంప్‌ మనతో సహా అనేక దేశాలపై పన్నుల యుద్ధం ప్రకటించటంతో గతేడాది సమావేశం జరగలేదు. తనకు వ్యతిరేకంగా జతకట్టడటంగా చైనా పరిగణిస్తుండగా, ఆసియా నాటో కూటమి అని రష్యా అంటున్నది,ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. పైకి ఎవరు ఏమి చెప్పినప్పటికీ చైనాను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం. దక్షిణ చైనా సముద్రంలోనికొన్ని దీవుల గురించి జపాన్‌, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. అయితే ఏ ఒక్క దేశపు నౌకనూ చైనా మలేసి(అడ్డుకున్న)న ఉదంతం లేదు. అయినప్పటికీ స్వేచ్చా రవాణా పేరుతో అమెరికా నాటకం ఆడుతోంది.ఇతర దేశాలను కూడగట్టేందుకు చూస్తోంది.ఆసియా-పసిఫిక్‌ లేదా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ పెత్తనం సాగాలన్నది దాని అసలు లక్ష్యం. ఇరాన్‌-అమెరికా మధ్య తలెత్తిన పోరు నేపధ్యంలో సంధి గురించి చర్చలు ఒకవైపు మరోవైపు విదేశాంగ మంత్రుల సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. అమెరికా మంత్రి మార్కో రూబియో, జపాన్‌ మంత్రి టోషిమిట్సు మోటెగీ, పెనీ వాంగ్‌(ఆస్ట్రేలియా) పాల్గంటుండగా జై శంకర్‌ అధ్యక్షత వహించారు.

నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన రూబియో ఇండో -పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్చగా, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పాడు. ఇలాంటి సమావేశాలను భావసారూప్యత కలిగిన దేశాలతో ఏదో మొక్కుబడిగా జరపటం కాకుండా అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.నౌకా రవాణా, కీలకమైన ఖనిజాలు,లోహాల వంటి అంశాలపై నిర్దిష్ట కార్యాచరణకు పూనుకుంటామని రూబియో అన్నాడు.ఈ ఏడాది ముగిసేలోగా నలుగురు అగ్రనేతల భేటీ ఉంటుందన్నాడు. గతేడాది వాషింగ్టన్‌లో జరిగిన సమావేశ చర్చల కొనసాగింపు ఉంటుందని మన విదేశాంగశాఖ ఢిల్లీ సమావేశం గురించి చెప్పింది. చతుష్టయ కూటమి లక్ష్యాలుగా ప్రజాస్వామ్యం, మానవహక్కులు,చట్టబద్దమైన పాలన వంటి కబుర్లు చెబుతున్నది. వీటన్నింటినీ అమెరికా ఉల్లంఘిస్తున్నది. చట్టబద్దంగా ఎన్నికైన వెనెజులా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్‌ చేసి తమ దేశానికి తీసుకుపోయి తప్పుడు కేసులతో విచారణ జరుపుతున్నది. అక్కడ ఉన్న చమురు సంపదలన్నింటినీ తన దేశ కంపెనీలకు అప్పగించింది.ఇరాన్‌లో ఉన్న ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి వేరే పాలకులను ఏర్పాటు చేస్తామని వాషింగ్టన్‌ బహిరంగంగా ప్రకటించటమేగాక దానిలో భాగంగా సుప్రీం నేత ఖమేనీ, ఇతర అనేక మందిని చంపివేయటంతో పాటు దాడులు కూడా చేసిన సంగతి తెలిసిందే. గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని బరితెగించి సమర్ధించిన అమెరికా మానవహక్కుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలను వల్లించినట్లే.ఇది సైనిక కూటమి కాదని చెప్పినప్పటికీ మన దేశ ఆధ్యర్యంలో నాలుగు దేశాల మిలిటరీ మలబార్‌ సైనిక విన్యాసాలు జరిపాయి.

చైనాను కట్టడి చేయాలని నాలుగుదేశాల నేతలకూ ఉన్నప్పటికీ పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న సమస్య ఉంది.ఆర్థిక రంగాల్లో సహకరించుకొనేందుకు అనేక వేదికలు ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు.ఒక వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాయి. ఆర్థిక, మిలిటరీ రంగాలలో ఏ ఒక్క దేశానికీ పోలిక లేదు అసమానతలు ఉన్నాయి.చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకుపోయి తెగేంతవరకు లాగేందుకు ఎవరూ సిద్దంగా లేరు ప్రత్యేకించి భారత్‌, ఆస్ట్రేలియాలు అలాంటి వైఖరిని కనపరిచాయి. ఆర్థిక రంగంలో మిగిలిన మూడు దేశాలను నమ్ముకున్న భారత్‌కు ఆశించిన మేరకు పెట్టుబడులు రాలేదు. దీంతో గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత ఐదు సంవత్సరాల పాటు నామ మాత్ర సంబంధాలను మాత్రమే కొనసాగించిన మనదేశం ఇప్పుడు పెట్టుబడులకు ఆహ్వానం పలకటంతో సహా సాధారణ సంబంధాలను పునరుద్దరించుకుంది. అటువంటపుడు చైనా వ్యతిరేకత అనే ఎర్రగీతను దాటి ముందుకు పోయే స్థితి లేదు. తక్షణం పరిష్కరించాలని భావిస్తున్న ప్రాంతీయ సమస్యల తీవ్రతను తగ్గించే అవకాశాలు కూడా లేవని ఇన్ని సంవత్సరాల అనుభవం నేర్పింది.పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడి చేసి దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక అమెరికా గిలగిలా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికాకు ఏ ఒక్క దేశమూ మద్దతుగా నిలవకపోగా ఇరాన్‌కు మద్దతుగా చైనా వ్యవహరిస్తున్నది, భద్రతా మండలిలో దాన్ని కాపాడిన తీరు తెలిసిందే.

చతుర్భుజ భద్రతా చర్చల పేరుతో వ్యవహరిస్తున్నవారు ఇప్పుడు ఇతర అంశాల మీద కేంద్రీకరించటాన్ని బట్టి ఈ కూటమి దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత వెల్లడి అవుతున్నది. కొందరు సాధువులు రాత్రికి ఒక చోట చేరి ప్రతి రోజూ గంజాయిదమ్ము కొట్టేవారు. అది తలకు ఎక్కగానే తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలి, ఈ బతుకు ఎంతకాలం అంటూ ప్రగల్భాలు పలికేవారట. తెల్లారేసరికి దమ్ముదిగి ఎవరి కర్రా బుర్రా తీసుకొని వారు ఊరు మీదకు వెళ్లేవారు. చైనా పేరు పెట్టకుండా దాన్ని ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్‌ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ప్రతి సమావేశంలో మాట్లాడుతుంటారు. నాలుగుదేశాల నేతలు సమావేశమైనపుడు పరోక్షంగా చైనా మీద మాటలదాడిలో ఎవరూ తక్కువ తినటం లేదన్నది గతసమావేశాల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. చైనా నుంచి తలెత్తిన ముప్పు పేరుతో చేస్తున్న ప్రచారానికి దానితో సంబంధాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. అలాంటి దేశంతో లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు ప్రతిదేశమూ విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నది. ఉదాహరణకు 2014లో మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో చైనా 38 బిలియన్‌ డాలర్ల మేరకు మిగులు ఉండగా 2026నాటికి 116 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా వస్తువుల దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు.గతేడాది ట్రంప్‌ మనపై పన్నుల దాడి ప్రారంభించినపుడు నరేంద్రమోడీ చైనా పర్యటనలో షీ జింపింగ్‌, పుతిన్‌తో కలసి అవసరమైతే తాము ఏకమౌతామనే సంకేతాన్ని ఇచ్చిన సంగతిని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాను మింగేస్తాం, నలిపేస్తాం అంటూ కొండంత రాగం తీసిన ట్రంప్‌ ఈ నెలలోనే పెద్ద సంఖ్యలో తన కార్పొరేట్‌ అధిపతులను బీజింగ్‌ పర్యటనకు తీసుకువెళ్లి సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అది వాణిజ్య పర్యటన తప్ప మరొకటి కాదు. విలువైన ఖనిజాల ఉత్పత్తులను చైనా బంద్‌ చేయటంతో తిరిగి కాళ్లబేరానికి రావటాన్ని చూశాము. గతేడాది ఆస్ట్రేలియాలో లోవీ సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా తమకు ఆర్థిక భాగస్వామితప్ప ముప్పుదేశం కాదని మెజారిటీ అభిప్రాయపడినట్లు తేలింది. చైనా అనేక దేశాలతో వాణిజ్య మిగులుతో ఉంటే ఆస్ట్రేలియా అదే చైనాతో 2025లో 4.21 బిలియన్‌ డాలర్లు మిగులులో ఉంది. అందువలన అది చైనాతో తగాదాకు ఏమాత్రం సిద్దపడటం లేదు. ఉత్తర కొరియాను చూసి జపాన్‌ భయపడుతున్నది తప్ప చైనాతో వాణిజ్యాన్ని వదులుకొనేందుకు సిద్దంగా లేదు. అమెరికా కనుసన్నలలో నడిచే దక్షిణ కారియా పరిస్థితి అంతే. ఢిల్లీ సమావేశంకోసం వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు ఎంత చమురు కావాలంటే అంత సరఫరా చేస్తామంటూ బిస్కెట్‌ వేశారు.మన అవసరాలకు ప్రతిదేశం నుంచి చమురు కొనుగోలు చేయాల్సి ఉంది.అలాగాక అమెరికాను నమ్మి మిగిలిన దేశాలను వదలివేస్తే పరిస్థితి తారుమారైతే అమెరికన్లు మన జట్టుపట్టుకుంటారు, తమ కాళ్ల ముందు పడేట్లు చేసుకుంటారు. రూబియో ఢిల్లీలో మాట్లాడుతూ విలువైన లేదా కీలక లోహాలపై ఒక ఏర్పాటును ప్రకటిస్తామని, పరస్పర సహకారం, పెట్టుబడులు సరఫరాలను సమన్వయం చేసుకుంటామని చెప్పాడు. ఇండో-పసిఫిక్‌ ఇంథన భద్రతను కూడా పటిష్టపరుస్తామన్నాడు. ఇంకా ఇండో-పసిఫిక్‌ నౌకా నిఘాసహకారం పెంచుకుంటామని చెప్పాడు. ఇలాంటి సాధారణ విషయాలు తప్ప ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామమేదీ ఢిల్లీ సమావేశంలో జరగలేదు !

అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఇప్పటి వరకు బొద్దింకలను చూసి కొంత మంది ఎలా భయపడతారో చూశాం గానీ ఇప్పుడు ఆ పేరును చూసి కళవళపడుతున్న రాజకీయ పార్టీలను చూస్తున్నాం. ఇలాంటి రోజు వస్తుందని ఎవరైనా ఊహించారా ! ఫాసిజం మరోమారు తలెత్తుతున్నదంటే హిట్లర్‌, ముస్సోలినీ, టోజో వంటి దుర్మార్గులే తిరిగి జన్మించారని కాదు. వారి వారసులు ప్రజాస్వామ్య వేషాలతో మనమధ్య తిరిగేవారే ఆపని చేస్తున్నారు.లేకపోతే బొద్దింకల జనతా పార్టీ (సిజెపి) ఎక్స్‌ ఖాతా నిలిపివేయటం ఏమిటి ! దాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఖరాబు చేశారు, చివరికి వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఆ పేజీని కూడా కనపడకుండా చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో దీన్ని కూడా అంతే. ఇలాంటి చేష్టలతో యువతను మరింతగా రెచ్చగొట్టటం, సిజెపికి మద్దతుదార్లను పెంచటం తప్ప మరొకటి కాదు. ఇది నిరంకుశ చర్య అని ఉద్యమాన్ని ప్రారంభించిన అభిజిత్‌ డిప్కే వ్యాఖ్యానించాడు. సామాజిక ఉద్యమనినాదం రూపంలో ఉన్న ఆ పార్టీ ముందుకు తెచ్చిన ఐదు అంశాలు దేశంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయట, ఆ విషయాన్ని కేంద్ర ఇంటిలిజెన్స్‌ బ్యూరో (ఐబి) ప్రభుత్వానికి నివేదించిందట,దేశ రక్షణ కోసం సదరు సిజెపి సామాజిక మాధ్యమ ఎక్స్‌ ఖాతాను మోడీ సర్కార్‌ నిలిపివేయించిందట. నేపాల్లో అధికారంలో ఉన్న పార్టీ సామాజిక మాధ్యమాలపై విధించిన ఆంక్షలే తమకు నష్టం అని భావించిన పాలకపార్టీ ఆంక్షలు పెట్టింది, దానిపై యువత ఎలా స్పందించిందో చివరికి అధికార మార్పిడికి దారితీయటాన్ని ప్రపంచం చూసింది. చరిత్రలో మోడీ మరొక పేజీకి నాంది పలికారా ? భారత్‌లో నిషేధాలు, ఇతర చర్యలతో సిజెపి పేజీలను అడ్డుకోవచ్చు, కానీ విదేశాల్లో చేరే అనుచరులను మోడీ అడ్డుకోగలరా ? ప్రపంచవ్యాపితంగా మోడీ పలుకుబడి గురించి బిజెపి గొప్పలు చెప్పుకుంటుంది. అలాంటి మోడీ పాలనలో యువత గురించి దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యలు, దేశంలో ఉన్న స్థితిగతుల గురించి విదేశాల్లో ఉన్నవారికి ఆసక్తి కలిగినట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఇదీ ఒకందుకు మంచిదే. మోడీ ప్రజాస్వామ్య బండారం ప్రపంచానికి తెలుస్తుంది. విమర్శకుల సంగతి సరే, మోడీని అభిమానించే వారందరూ మతోన్మాదులు లేదా మరొకరో అనుకోనవసరం లేదు. ప్రజాస్వామిక ప్రియులకు ఈ వార్త వీనుల విందుగా ఉందా ? ఈ పరిణామాలను జీర్ణించుకోగలుగుతున్నారా !!

ఇంతకూ సిజెపి తన అజెండాలో ప్రకటించిన అంశాలేమిటి ? పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను రాజ్యసభకు పంపకూడదు, తొలగించిన ఓట్లకు గాను ఉపా చట్టం కింద కేంద్ర ఎన్నికల కమిషన్‌పై విచారణ, మహిళలకు 55శాతం రిజర్వేషన్లు, ఓట్ల తొలగింపును ఎన్నికల కమిషన్‌ నిర్ణీత వ్యవధిలో జరపాలి, భారతీయ యువతకు రాజకీయ విద్యగరపాలి.పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని దీర్ఘకాలం ఎన్నికల్లో పాల్గ్గొననివ్వకూడదు. ఆసక్తి కలిగిన వారు ఆ పార్టీ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తే లేదా వేరే రూపంలో తిరిగి ప్రారంభమైతే ఈ అంశాల మీద వారి వివరణను చదువుకోవచ్చు.ఈ అజెండాను ఎవరైనా అందరూ ఆమోదించాలనేమీ లేమీ లేదు, అది వారికి ఉన్న హక్కు. అలాగే సమర్ధించటానికీ హక్కు ఉంది. దానిలో రెచ్చగొట్టే అంశాలేమున్నాయి, వాటితో దేశ భద్రతకు వచ్చిన ముప్పేమిటి ? వెంపలి చెట్లకు నిచ్చెనవేసుకు ఎక్కేవారు పుడతారన్నట్లుగా పోతులూరి వీరబ్రహ్మం చెప్పారని ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో తెలియదు గానీ కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఏ నివేదిక కావాలంటే దాన్ని క్షణాల్లో తెప్పించుకోవచ్చు, ఇడి, ఐటి, సిబిఐతో పాటు దేశ భక్తిని గుత్తకు తీసుకున్నామని చెప్పేవారి దాడులు కూడా ఎవరిమీదైనా ఎప్పుడైనా జరగవచ్చు.

సిజెపి సృష్టికర్త అభిజిత్‌ దిప్కే గురించి టీవీ చర్చల్లో, సామాజిక మాధ్యమాల్లో బిజెపివారు ధ్వజమెత్తుతున్నారు. మూడు పదుల వయస్సున్న ఆ యువకుడి వెనుక బిజెపిని వ్యతిరేకించే అన్ని పార్టీలు, శక్తులు ఉన్నాయని, కుట్ర చేశాయని బిజెపి నేతలు దేశభక్తి గీతాలాపన ప్రారంభించారు. పండుగాడి దెబ్బ తగిలి మైండ్‌ బ్లాంక్‌ అయినవారు తప్ప మరొకరు ఇలా మాట్లాడరు.సిజెపి ఎక్స్‌ ఖాతాను అనుసరించేవారు కోట్లలో ఉండటంతో బిజెపి తట్టుకోలేకపోయింది.భారత్‌ను వ్యతిరేకించే దేశాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అనుసరించుతున్నారని, వారంతా భారతీయులు కాదని ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతోందని బిజెపి ప్రతినిధులు టీవీ చర్చల్లో చెబుతున్నారు.బోడి గుండుకు మోకాలికి ముడిపెట్ట గల సమర్ధులకు మాత్రమే ఇలా మాట్లాడటం సాధ్యం. తమ నేత, పార్టీకి విదేశాల్లో కూడా అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారని కాషాయ నేతలు గొప్పలు చెప్పుకోవటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సామాజిక మాధ్యమ ఖాతా అంటే ఒక బ్యాంకు ఖాతా వంటిది కాదు. ప్రపంచంలో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నవారెవరైనా ఎక్కడి నుంచైనా చేరవచ్చు. ఉచితం ఉన్నాయి, డబ్బు వసూలు చేసేవీ ఉన్నాయి.కుట్ర అంటే చేతివేళ్ల మీద లెక్కించదగిన వారు చేసేది తప్ప కోట్లాది మంది భాగస్వాములు అవుతారా ? మోడీ, బిజెపి, కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ ఖాతాను అనుసరించేవారిలో ఎక్కువ మంది నకిలీలే అనే అభిప్రాయం ఉంది, గొప్పలు చెప్పుకొనేందుకు పార్టీలు, వ్యక్తులు అలాంటి చర్యలకు పాల్పడతారు.లోకోభిన్న రుచి అన్నట్లుగా సినిమాతారలు, ఇతర ప్రముఖులను అనుసరించేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉండే సంగతి తెలిసిందే.

అసలు మే 15వ తేదీ ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ వివాదాస్పద బొద్దింకలు, పరాన్న జీవుల వ్యాఖ్యలు చేయటం, మరుసటి రోజునే అభిజిత్‌ బొద్దింకల జనతా పార్టీ అంటూ వ్యంగ్యాస్త్రంతో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టటం, లక్షల నుంచి కోట్ల సంఖ్యలో అనుచరులు చేరటం అంతా మూడు నాలుగు రోజుల్లోనే జరిగిపోయింది. బిజెపి వారు చెప్పేదాన్ని బట్టి కుట్ర ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు ముందే రూపొంది ఉండాలి.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయటం కూడా కుట్రలో భాగం అయి ఉండాలి. లేకపోతే ఎలా సాధ్యం. ఒక నేత ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో పర్యటిస్తారని ముందే ప్రకటిస్తారు గనుక తెలుస్తుంది తప్ప ఏ సెలవిస్తారో ఊహించగలరా ? ఆ రోజు ఫలానే కేసు విచారణకు వస్తుందని తెలియవచ్చు ప్రధాన న్యాయమూర్తి అలాంటి వివాదాస్పద మాటలు మాట్లాడతారని కుట్రదారులకు ముందే తెలుసా ? బొద్దింకల జనతా పార్టీ పోస్టులను పెట్టగానే అనుచరులుగా మారండని కోట్లాది మందికి ముందుగానే వర్తమానాలు పంపుతారా ? ఆరోపణలు చేసే ముందు తర్కానికి అవి నిలిచేవిగా ఉండాలి. వారు చెప్పేదాని ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తి కూడా బిజెపి వ్యతిరేక కుట్రలో భాగమే అనుకోవాలి.తల మీద మెదడు ఉన్నవారెవరూ ఇలా చెప్పరు. నిజంగా కుట్ర జరిగిందని నమ్మితే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి నిజా నిజాలను నిగ్గుతేల్చాలి. ఆపని చేయలేదు. తాను అలాంటి వ్యాఖ్యలను యువతమొత్తాన్ని ఉద్దేశించి చేయలేదని ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఎవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన అంతరంగంలోంచి వచ్చిన అవాంఛనీయ వ్యాఖ్యలుగానే చూస్తున్నారు.ఎందుకంటే ఫిబ్రవరి నెలలో కార్మిక సంఘాలను కూడా ఆయన ఇదే విధంగా తూలనాడారు. ఇటీవలి కాలంలో హైకోర్టు, సుప్రీం కోర్టులలో అనేక మంది న్యాయమూర్తులు తీర్పులతో సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో సంచలనాలకు కారకులౌతున్నారు.గతంలో ఇలా ఉండేవారు కాదు. తాము నిరుద్యోగులుగా ఉన్నందున శారీరకంగా సోమరిపోతులం తప్ప మెదళ్లు పనిచేస్తూనే ఉన్నాయని కూడా సిజెపి వ్యంగ్యాస్త్రం విసిరింది. ఇది ఎంత మంది పెద్దలకు అర్ధం అవుతుందో తెలియదు.

సిజెపిని ముందుకు తెచ్చిన అభిజిత్‌ అమెరికాలో ఉండి ఇదంతా చేస్తున్నాడని, గతంలో ఆమ్‌ ఆద్మీపార్టీలో పని చేశాడని బిజెపి నేతలు ధ్వజమెత్తుతున్నారు.ఎక్కడ ఉండి చేశారు, చేస్తున్నారని కాదు, ఏం చేశారనేదే ముఖ్యం. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ అమెరికాలో విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడే 1923లో అమెరికా హిందూస్థాన్‌ అసోసియేషన్‌ సభకు అధ్యక్షత వహించాడు. తరువాత ఆరేండ్లకు భారత్‌ వచ్చి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొన్నారు. సంఘపరివార్‌ ఆరాధించే విడి సావర్కర్‌ లండన్‌లో చదువుకొనేందుకు వెళ్లి అక్కడ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇలా చెప్పుకుంటే ఎందరో. అభిజిత్‌ దిప్కే వయస్సు మూడు పదులు, 2023లో చదుకొనేందుకు అమెరికా వెళ్లాడు,అక్కడి నుంచే స్పందించాడు. తప్పేముంది, భారత్‌ను యావత్‌ ప్రపంచానికి విశ్వగురువుగా మారుస్తామని బిజెపి నేతలు చెబుతారు. ప్రపంచ కుగ్రామంలో అతను అమెరికా అనే పేటలో ఉండటం నేరం కాదు. అలా అనుకుంటే అనేక మంది అమెరికా, ఇతర దేశాల్లో ప్రవాస భారతీయులు హిందూ సంస్థలు, సంఘపరివార్‌ సంస్థలను ఏర్పాటు చేసి కోట్లాది డాలర్లను బిజెపికి అందిస్తున్నారు. వారంతా స్వదేశం వచ్చి ఆ పని చేయాలని బిజెపి వారు అడగటం లేదేం ? దళితులు, రిజర్వేషన్ల సమస్యల గురించి ఒక నెటిజన్‌ అభిజిత్‌ను ప్రశ్నిస్తే తానే ఒక దళితుడనని చెప్పాడు. ఇంకేముంది ప్రతిభకు పట్టం గట్టటాన్ని వ్యతిరేకిస్తారని, దళితకార్డు వాడుకుంటున్నారంటూ కొందరు ధ్వజమెత్తుతున్నారు.బరాబర్‌ హిందూమతం కోసం పని చేస్తాం, కరడు గట్టిన సనాతన వాదులం అంటూ వీరంగం వేస్తున్నమాదిరి అతన తన సామాజిక తరగతిని ముందుగా వెల్లడించలేదు. అన్నింటికీ మించి అతనేమీ రిజర్వేషన్‌ సౌకర్యంతో అమెరికా వెళ్లలేదు. తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు, బలహీనవర్గాలకు తెలివితేటలు ఉండవా ! స్వయంకృషితో ఎదిగిన అంబేద్కర్‌ జన్మించిన గడ్డ మీద అభిజిత్‌ పుట్టాడు. ఒక మేథావి, సంస్కరణవాదిగా, మనుధర్మ వ్యతిరేకిగా అనేక మందికి అంబేద్కర్‌ స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. దళితులను సామాజికంగా ఎలా వేధిస్తున్నారో నిత్యం చూస్తున్నాం, అలాంటి వారి భావజాల వారసులు ఇప్పుడు అభిజిత్‌ను కూడా అవమానించేందుకు పూనుకున్నారు. ఇది మనువాదులకు మరింత మంది వ్యతిరేకులను తయారు చేస్తుంది, తెలిసో తెలియకో వారిని అనుసరిస్తున్న దళితులు, అణచివేతకు గురైన గిరిజనులు, ఇతర బలహీనవర్గాలు కూడా తామెటు ఉండాలో నిర్ణయించుకొనేట్లు చేస్తుంది, ఇప్పటికిప్పుడు మార్పురాకపోవచ్చు, ఆలోచన మొదలైతే చాలు ఆచరణ ఎలా ఉండాలో తెలుస్తుంది. సిజెపిని వదలి బిజెపిలో చేరాలని లేకపోతే నీ తలిదండ్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసు అంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.ఇది అనూహ్యమేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించటం, ప్రశ్నించటాన్ని దేశద్రోహంగా చిత్రించి దాడులు చేయటం తెలిసిందే, అభిజిత్‌ భారత్‌కు తిరిగి వస్తే అదే జరుగుతుందా ? చూద్దాం !

దేశంలో సమస్యలు, సంక్షోభం తలెత్తినపుడు యువత స్పందిస్తూనే ఉంది.కాంగ్రెస్‌ పార్టీలో చీలిక వచ్చిన తరువాత జరిగిన 1971లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని పార్టీ 352 సీట్లతో అఖండ మెజారిటీ సాధించింది, అప్పుడు సిపిఐ(ఎం) 25 సీట్లతో పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎన్నికైంది. వాజ్‌పాయి నాయకత్వంలోని భారతీయ జనసంఘం 35 సీట్ల నుంచి 22కు పడిపోయింది. ఆ ఎన్నికల్లోనే ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే కేసు రుజువు కావటంతో 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రెండు సంవత్సరాల ముందు, గుజరాత్‌, బీహార్‌లో ధరల పెరుగుదల, కాంగ్రెస్‌ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమై ఇందిరాగాంధీని ఇరుకున పెట్టాయి.1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ కూడా ఎన్నికల్లో ఓడిపోయి జనతా పార్టీ అధికారానికి వచ్చింది. ఆ సమయంలో యువకులుగా రంగంలోకి వచ్చిన అనేక మంది తరువాత కాలంలో వివిధ పార్టీల నేతలుగా ఎదిగారు. బొద్దింకల జనతా పార్టీ ప్రస్తుతానికి సామాజిక మాధ్యమ ఉద్యమంలో భాగం తప్ప భౌతిక ఉనికిలో లేదు. పార్టీని నమోదు చేస్తారో లేదో తెలియదు. ఒక సంచలనం. గతంలో ఎన్‌టి రామారావు ఆంధ్ర ప్రదేశ్‌లో, తాజాగా విజరు తమిళనాడులో సృష్టించిన ప్రభంజనంలో యువత ప్రముఖ పాత్రపోషించిన సంగతి తెలిసిందే.యువత మార్పును కోరుతున్నారు. సాంప్రదాయ పార్టీలు చేసిన మోసాలు, వాగ్దాన భంగాలతో విసిగిపోయి ఉన్నారు.తీవ్రమైన రాజకీయ, సామాజిక అంశాలను వ్యంగ్యంగా ముందుకు తెచ్చినట్లు కొందరు తప్పుపడుతున్నారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి. జనం దృష్టిని ఆకర్షించటంలో నవరసాలు ఉంటాయి, వాటిలో హాస్యం, వ్యంగ్యం ఒకటి.కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యల గురించి చెబితే జనంలో ఎలాంటి స్పందన ఉండటం లేదు. అందుకని ఏ రూపాన్ని ఎంచుకున్నారన్నది కాదు, యువత, ఇతర తరగతులను కదిలించాడా లేదా అన్నదే గీటురాయిగా ఉండాలి. ఇదేదో కొంపముంచేట్లుంది చూడండయ్యా అన్నట్లుగా కేంద్ర మంత్రివర్గ సమావేశాలో నరేంద్రమోడీ చివాట్లు వేశారన్న వార్తలు వచ్చాయి, యాభైఆరు అంగుళాల ఛాతికి ఏదో జరగకుండా అది జరుగుతుందా ! కాంగ్రెస్‌, బిజెపి, వాటిని ఆదరించిన డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు విజరు దెబ్బను చవిచూశాయి. అందుకే ఇప్పటివరకు సినిమాలో పండుగాడి దెబ్బతో పోలిక బదులు ఇప్పుడు దేశవ్యాపితంగా రాజకీయంగా అభిషేక్‌ దెబ్బ గురించి చెప్పుకోవాల్సి వస్తోంది !