ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

కతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వినతి మేరకు ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అంతకు ముందు రెండు మూడు రోజుల్లో ఒప్పందానికి రాకపోతే యుద్దాన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు. పార్లమెంటు ఆమోదం పొందకపోతే ఇరాన్‌పై సాగిస్తున్న దాడులను నిలిపివేయాలంటూ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ మంగళవారం నాడు అమెరికా సెనేట్‌ 50-47తో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు ఏడు సార్లు డెమోక్రటిక్‌ పార్టీ ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. నలుగురు అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చేతులు కలపటంతో నెగ్గింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం. అయితే అధ్యక్షుడికి ఉన్న అధికారాల గురించి 1973లో పార్లమెంటు చేసిన తీర్మానం మేరకు అరవై రోజులకు మించి సైనిక చర్యకు ఆదేశిస్తే పార్లమెంటు ఆమోదం విధిగా పొందాల్సి ఉంది. ఈ కారణంగానే అసలు తాము ఇరాన్‌ మీద యుద్దం చేయటం లేదని, మిలిటరీ చర్య మాత్రమే అని బుకాయించాడు, అంతేకాదు ఫిబ్రవరి 28న దాడులను ప్రారంభించిన ట్రంప్‌ ఏప్రిల్‌ 7న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాడు. అప్పటి నుంచి అదిరింపులు బెదిరింపులతో కాలం గడుపుతున్నాడు. అమెరికా చేసిన దాడులనుంచి తాము అనేక విషయాలను నేర్చుకున్నామని, మరోసారి దాడులకు పాల్పడితే ఊహించని విధంగా దెబ్బతీస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించాడు. తిరుగులేనిదని చెప్పుకున్న ఎఫ్‌-35 యుద్ధ విమానాన్నే కూల్చివేశామని, మరో 42 ఇతర విమానాలు, శక్తివంతమైన డ్రోన్లను కూడా తాము కూల్చివేసినట్లు అమెరికన్‌ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు కూడా ఇరాన్‌ ప్రకటించింది.యుఏయి అణువిద్యుత్‌ కేంద్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడిచేసింది.దానికేమీ నష్టం జరగనప్పటికీ అవసరమైతే క్షిపణులతో ధ్వంసం చేయగలమని సందేశాన్ని ఇరాన్‌ పంపింది.

మే నెల 14,15 తేదీలలో ప్రపంచంలో ఇద్దరు శక్తివంతులైన నేతలు చైనా రాజధాని బీజింగ్‌లో భేటీ అయ్యారు. సహజంగానే ఈ కలయిక ఫలితాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతోంది.అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి చైనా సందర్శించాడు. పర్యటనకు ముందు, తరువాత కూడా ఈ ఉదంతం గురించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. డ్రాగన్‌ దేశ సందర్శన విఫలమైందని,వాణిజ్య పోరు ఎదురుతన్నిందని,అమెరికన్‌ కార్పొరేట్లు నిరాశాపూర్వక ప్రయత్నాలు చేసినట్లు, ఇంకా అనేక అంశాల గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు, వివరణలు వెలువడ్డాయి. విజయవంతమైందనే మాట ఎక్కడా వినిపించలేదు. సాధారణంగా దేశాధినేతల పర్యటనలు ఇతర దేశాల ఆహ్వానం మేరకే జరుగుతాయి. ట్రంప్‌ తాజా పర్యటనకు చైనా నుంచి అలాంటి ఆహ్వానం లేదు. మీ ఇంటికి ఒకసారి రావాలని కొందరు అంటారని తెలిసిందే, అలాగే ట్రంప్‌ తన వాంఛను వెలిబుచ్చిన తరువాత అంతకంటేనా అని బీజింగ్‌ స్పందించింది.అలాగని మర్యాదలకు లోటు చేయలేదు.ట్రంప్‌ పరివారానికి హెచ్చరికలతో పాటు అనేక బహుమతులు కూడా ఇచ్చిపంపారు. అయితే వాటిలో దొంగచెవులు, నిఘా కెమెరాలను అమర్చారంటూ స్వదేశానికి తీసుకుపోకుండా ఒక చెత్తబుట్టలో వేసి చూపి మరీ ట్రంప్‌ బృందం చైనాను అవమానించింది అనటం కంటే తన చౌకబారు తనాన్ని వెల్లడించుకుంది. గతంలో కూడా అమెరికన్లు గుట్టుచప్పుడు కాకుండా అదేపని చేసేవారని వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా షీ జింపింగ్‌ యంత్రాంగం తమ బుట్టలో పడలేదనే ఉక్రోషం ప్రదర్శితమైంది.చైనాను వత్తిడి చేయటంలో విఫలం కావటాన్ని వాణిజ్య యుద్దంలో ట్రంప్‌ ఓటమిగా కొందరు వర్ణించారు.ఆ పెద్ద మనిషి అంతగా కోరి మరీ ఎందుకు చైనా వెళ్లాడంటే ముక్తసరి సమాధానం అమెరికా ఆర్థిక పరిస్థితి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందనే సమాధానం వచ్చింది. చైనా పర్యటన సమయంలో ట్రంప్‌ రేటింగ్‌ 34 శాతానికి దిగజారింది.రుణ భారం జిడిపికి వందశాతం దాటింది. పులిమీద పుట్రలా ఇరాన్‌పై దాడి చేసి మరింత లోతుగా కూరుకుపోయింది.గౌరవ ప్రదమైన విధంగా ఇరాన్‌తో రాజీకుదర్చాలనే అజెండా తెరవెనుక ఉందని చెబుతున్నారు.వ్రతం చెడ్దా ఫలం దక్కలేదు.చైనా పైచేయిగా ఉందని వాషింగ్టన్‌ మేథో సంస్థ విదేశీ వ్యవహారాల మండలి(సిఎఫ్‌ ఆర్‌) వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటి వెనుక టెస్లా కంపెనీ యజమాని ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌, అందరికీ సుపరిచితమైన ఆపిల్‌, బ్లాక్‌రాక్‌, ఎన్‌విడియా, బోయింగ్‌, జిఇ, మైక్రాన్‌ ఇలా అనేక కంపెనీల అధిపతులు ఉంటారు.ఎవరు మంత్రులు కావాలో, ఏ విధానాలను అనుసరించాలో కూడా నిర్దేశించేది వారే.

ఈ బృందం ఆశాభంగం చెందటానికి కారణాలు ఏమిటి ? గతంలో చైనాకు అవసరమైన చిప్స్‌ను సరఫరా చేయటంలో ఎన్‌విడియా కంపెనీ వాటా 95 శాతం ఉండగా ఇప్పుడు సున్నా శాతానికి పడిపోయింది.చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను సరఫరా చేయకూడదన్న ఆదేశాలకు సదరు కంపెనీ తలొగ్గింది. సవాలుగా తీసుకున్న చైనా తన స్వంత కంపెనీలను ప్రోత్సహించి చిప్స్‌ను అభివృద్ధి చేసుకుంటున్నది. విధిలేక నిషేధం ఎత్తివేసిన తరువాత చూద్దాం, అవసరమైనపుడు మేమే సంప్రదిస్తాం అన్నట్లుగా చైనా అటువైపే చూడలేదు.అందుకే ఆ కంపెనీ యజమాని ట్రంప్‌తో పాటు బీజింగ్‌ వెళ్లాడు. నూటనలభై కోట్ల జనాభాలో 2027 నాటికి 120 కోట్ల మంది మధ్య తరగతిలో ఉంటారని అంచనా. ప్రపంచంలో వీరి వాటా 25శాతం. ఇంత మంది వినియోగదారుల మార్కెట్‌ను అమెరికా కార్పొరేట్లు వదులు కుంటాయా ? వాటికి కావాల్సింది లాభాలు, వాటికోసం రాజకీయాలు చేస్తాయి, అవి తమకు ఆటంకంగా మారినపుడు ప్లేటు ఫిరాయిస్తాయి.

సంస్కరణలు అంటే మన మాదిరి విదేశాలకు ఏకపక్షంగా తలుపులు బార్లా తెరవటం కాదు.మనం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ నిర్దేశిత విధానాల చట్రంలో చేస్తే దానికి భిన్నంగా టెక్నాలజీ అందిస్తే మార్కెట్‌లో అవకాశమిస్తాం అనే షరతు మీద చైనా కమ్యూనిస్టులు వ్యవహరించారు.ఈ కీలకమైన అంశాన్ని వదలి వారు నియంతలు, మనది ప్రజాస్వామ్యం అందుకే చైనాతో పోల్చుకోవద్దు అంటూ కొందరు సొల్లు కబుర్లు చెబుతారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.చైనా తనకు పోటీగా రాదని భావించినంత కాలం అమెరికన్లు ఎలాంటి యాగీ చేయలేదు. తరువాతే అక్కడ మానవహక్కులు లేవని, కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతున్నారని, సబ్సిడీలతో సరకులను తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నారని ఇలా రకరకాల సాకులను ముందుకు తెచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2018లో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించాడు. పెద్ద మొత్తంలో అమెరికా పెట్టుబడులు తగ్గించాడు, వాణిజ్యమూ తగ్గింది. అయినా గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చైనాకు స్వల్ప సమస్యలు తప్ప అదేమీ కుప్పకూలి పోలేదు. వాణిజ్యం తరువాత చిప్‌ వార్‌ను ప్రారంభించాడు.దాన్ని కూడా సవాలుగా తీసుకొని మీ చిప్స్‌ మాకు అవసరం లేదనట్లుగా ఇప్పుడు చైనా ఉంది. దాంతో చైనా పట్ల వైఖరిని మార్చుకోవాలని కొన్ని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వత్తిడి తెచ్చిన కారణంగానే పిలవక పోయినా పెద్ద సంఖ్యలో వాటి యజమానులను వెంటేసుకొని ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లాడు. చైనా కనీసం ఐదు వందల విమానాలను కొనుగోలు చేస్తుందని కొందరు జోశ్యం చెప్పారు.అన్నిగాకున్నా రెండు వందలు అమ్ముదామని ట్రంప్‌ చెప్పాడు. చివరికి దీని గురించి అడిగితే చైనా ప్రతినిధి సమాధాన్ని దాటవేయటంతో బోయింగ్‌: కంపెనీ వాటాల ధరలు నాలుగుశాతం పడిపోయాయి. ఎన్‌విడియా చిప్స్‌ కంపెనీకి సైతం ఇదే ఆశాభంగం ఎదురైందని వార్తలు. బీజింగ్‌ తన ప్రయోజనాలను ఫణంగా పెట్టుకొని తమకు రాయితీలు ఇస్తుందని ట్రంప్‌ ఎలా ఆశించాడు, ఆలోచించాడన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.కొన్ని దేశాల్లో దళారీ బూర్జువా శక్తులు వ్యక్తిగతంగా తాము లబ్డిపొంది దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా, ఇతర ధనిక దేశాలకు సహకరించినట్లుగానే చైనా కమ్యూనిస్టులు చేస్తారని ఆశించి భంగపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌ నుంచి తనకు చమురు అందకుండా చేసేందుకు అమెరికా కుట్రలు తెలిసిందే. అదే ఇరాన్‌ మీద దాడులు చేస్తూ సంక్షోభ పరిష్కారానికి ఇరాన్ను దారికి తేవాలని కోరటం కూడా ట్రంప్‌ దురాశే.

ఇప్పుడు చైనా అమ్ములపొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఏడాది క్రితం చైనా వస్తువులపై 145శాతం పన్నులు విధిస్తా అంటే తాము కూడా అదే మర్యాద చేస్తామని ట్రంప్‌కు చెప్పారు. తన దగ్గర తిరుగులేని అస్త్రాలు ఉన్నాయని, చైనాను నాశనం చేస్తానని చెప్పటం తప్ప వాషింగ్టన్‌ ఇంతవరకు బయటకు తీసిందేమీ లేదు.చైనా ప్రతి సుంకాలు విధిస్తే మనకు నష్టమా అని ప్రశ్నిస్తే వారు పెద్ద తప్పు చేశారు, మనం దిగుమతి చేసుకొనే వస్తువుల్లో ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం గనుక నష్టపోయేదే వారే అని అమెరికా విత్త మంత్రి స్కాట్‌ బెసెంట్‌ గొప్పలు చెప్పాడు. అటువంటపుడు ట్రంప్‌ చైనా ఎందుకు వెళ్లినట్లు ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తే వాటి తయారీకి అవసరమైన విలువైన ఖనిజాల ఉత్పత్తులను నిలిపివేసి డ్రాగన్‌ వాషింగ్టన్‌లో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. సముద్రంలో నీరున్నా తాగేందుకు పనికి రాదన్నట్లు అమెరికా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలను చూసుకొనే స్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. ఒంటరిగా చేయలేమని భావించి పాక్స్‌ సిలికా పేరుతో కొన్ని దేశాలతో కూటమి గట్టింది, వాటి ప్రయత్నాలు ఫలించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతవరకు ఆగలేమంటూ కార్పొరేట్లు ట్రంప్‌ మీద వత్తిడి తెస్తున్నాయి. చైనాను దెబ్బతీయటంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలను తయారు చేసే ఎత్తుగడతో గత పది సంవత్సరాలుగా అక్కడి నుంచి కంపెనీలను తరలించాలని శ్వేత సౌధం వత్తిడి చేస్తున్నది.ఆమేరకు యాపిల్‌ కంపెనీ మనదేశానికి వచ్చినప్పటికీ దానికి ఎదురైన సమస్యలను చూసి మిగిలిన సంస్థలు సాహసించటం లేదు.ఎలన్‌ మస్క్‌ టెస్లా కంపెనీ తయారు చేస్తున్న విద్యుత్‌ కార్లలో సగం చైనాలోనే ఉన్నాయి, అయినప్పటికీ అమెరికా పరిశ్రమను బీజింగ్‌ నాశనం చేయనుందని, గగ్గోలు పెడితే జో బైడెన్‌ సర్కార్‌ 2024లో చైనా కార్లపై వందశాతం దిగుమతి సుంకం విధించింది.అయినా చైనా తగ్గలేదు.

వాణిజ్య అంశాల్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణ జరిగిన నాటి నుంచీ తైవాన్‌ అంశం నలుగుతూనే ఉంది. ఆ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూనే విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలనే కుట్రలకు అమెరికా తెరతీసింది, టిబెట్‌ను మరోదేశంగా మార్చాలనే ఎత్తుగడతో దలైలామా పేరుతో తిరుగుబాటుకు తోడ్పాటునిచ్చిన సంగతి తెలిసిందే.చైనాకు కేవలం 59 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్‌ రక్షణకు 9,500 మైళ్ల దూరం నుంచి వచ్చి యుద్దం ఎలా చేయగలమని ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్టులను ప్రశ్నించాడు. ఇలాంటి స్పందన గతంలో ఏ అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రాలేదు. అమెరికన్లు ఎందుకు తైవాన్‌ గురించి ఆందోళన చెందుతున్నారంటే అక్కడి చైనా జాతీయుల గురించి కాదు, ఆధునిక చిప్స్‌ తయారీ ఫ్యాక్టరీల పైనే కన్ను. ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని గతంలో అమెరికా బెదిరించింది.తైవాన్‌ అంశం గురించి చైనా ముందుకు తెస్తే ట్రంప్‌ ఇరాన్‌ గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటనలో కేవలం 163 పదాలే ఉన్నాయి.హార్ముజ్‌ జలసంధి గురించిన ప్రస్తావన మూడుసార్లు ఉంది.చైనా విడుదల చేసిన ప్రకటనలో అసలు ఇరాన్‌ ప్రస్తావనే లేదు, కేవలం మధ్య ప్రాచ్య పరిస్థితి అనే మాటమాత్రమే ఉంది.

ఇరాన్‌పై విజేతగా బీజింగ్‌ అడుగుపెట్టేందుకు కలలు గన్న ట్రంప్‌కు ఆశాభంగం ఎదురైంది. రెండు రోజుల ట్రంప్‌ పర్యటన తరువాత జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమాసియా సంక్షోభంలో ఎలాంటి సానుకూల పరిణామాలు లేవు. గతంలో మాదిరే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలను వండి వారుస్తున్నారు.మరో నెల రోజుల పాటు సముద్రంలో ఉన్న నౌకలనుంచి రష్యన్‌ ముడి చమురు కొనుక్కొనేందుకు భారత్‌తో సహా కొన్ని దేశాలకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుమతిని పొడిగించాడు.బ్రెంట్‌ రకం ముడిచమురు ధర మంగళవారం నాడు రెండు డాలర్లు తగ్గి 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి అమెరికా చమురు వినియోగదారులపై 45 బిలియన్‌ డాలర్ల మేర అదనపు భారం పడింది.అందువలన అనిశ్చితి ఇంకా కొనసాగితే మరింత పెరిగి నవంబరులో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ట్రంప్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అనేక దేశాలకు ఎరువుల సరఫరాతో పాటు, వాటి ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌ లభ్యత కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది, ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. మరికొద్ది వారాల్లో మనదేశంలో ఖరీఫ్‌ తరుణం ప్రారంభం కానుంది.ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందించనుందో చూడాల్సి ఉంది.యావత్‌ దేశాన్ని కలవర పెడుతున్న అమెరికా దాడులను ఖండించే ధైర్యం లేకపోయినా కనీసం ఆపమని ట్రంప్‌ను నరేంద్రమోడీ ఎందుకు వేడుకోరన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు !

కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు గురు, శుక్రవారాల్లో చైనా పర్యటన జరిపేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నాడు బీజింగ్‌ చేరుకున్నాడు. అన్ని రోడ్లూ రోమ్‌కే దారి తీసినట్లు ఈ పర్యటన గురించి పెద్ద ఎత్తున ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషణలు వెలువడ్డాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్‌ పంపిన తాజా ప్రతిపాదనలను ట్రంప్‌ తిరస్కరించాడు. అదొక చెత్తకాగితమని, దాన్నసలు పూర్తిగా చదవలేదంటూ తాత్కాలిక శాంతి అవగాహన వెంటిలేటర్‌ మీద ఉందని వ్యాఖ్యానించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులకు తెగబడేందుకు అమెరికా సిద్దపడుతున్నదని వార్తలు వస్తున్న పూర్వరంగంలో ట్రంప్‌ చైనా పర్యటన జరగనుంది. ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ ఈ యాత్ర ముగిసేవరకు ఎలాంటి దాడులు జరిపే అవకాశం లేదని చెప్పవచ్చు. ఇప్పటికే చైనాతో బేరసారాల్లో బలహీనపడిన అమెరికా మరోసారి దుస్సాహసానికి వడిగడితే మరింతగా చులకనకావచ్చు. నిజానికి ట్రంప్‌ యాత్ర మార్చి 31, ఏప్రిల్‌ రెండవ తేదీలలో జరగాల్సి ఉంది. ముందస్తు పథకం ప్రకారం ఇరాన్‌ మీద దాడి చేసి తన ఆయుధశక్తి, పాటవంతో దాన్ని లొంగదీసుకొని చైనా నేతల ముందు ప్రదర్శించాలని 78 ఏండ్ల ట్రంప్‌ కలలు కన్నాడు.అయితే అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తాపడ్డావులే బుల్‌బుల్‌ పిట్టా అన్నట్లుగా పరిస్థితిమారింది. పులిలా బీజింగ్‌లో అడుగుపెట్టాలనుకొని పిల్లిలా వెళ్లనున్నాడని చెప్పవచ్చు. ఒకేసారి రెండు ప్రధాన అంశాలపై కేంద్రీకరించలేకనే గత పర్యటన వాయిదా వేసుకున్నాడు.ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. తన బీజింగ్‌ పర్యటన భీబత్సంగా (ఆంగ్లంలో వైల్డ్‌ అనే పదం వాడాడు. దీనికి అనేక అర్ధాలు ఉన్నాయి) ఉంటుందని కొంతమంది ప్రపంచ నేతలతో ఫిబ్రవరి నెలలో వర్ణించాడు. ఇరాన్‌తో పంచాయతీ కారణంగా మార్చినెలలో పర్యటనను వాయిదా వేసుకున్నాడు, అది ఇప్పటికీ ఇంకా తెగలేదు అయినప్పటికీ బీజింగ్‌ వెళ్లిరాక తప్పదన్నట్లుగా పరివారంతో బయలు దేరాడు.తనతో పాటు పదహారు లేదా 17 మంది వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలను బీజింగ్‌ తీసుకుపోతున్నాడు.తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత 2017లో ట్రంప్‌ పర్యటన తరువాత మరొక అమెరికా అధినేత డ్రాగన్‌ గడ్డమీద అడుగుపెట్టలేదు. ఆ పర్యటన తరువాత మరుసటి ఏడాది బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చైనా మీద ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.అయినప్పటికీ అంతమంది వాణిజ్యవేత్తలతో అడుగుపెడుతున్నాడంటే పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాతో వాణిజ్య సంబంధాలను వదులుకొనేందుకు అమెరికన్‌ బహుళజాతి గుత్త సంస్థలు సిద్దంగా లేవన్న సందేశాన్ని ఇచ్చినట్లే. ఇరాన్‌తో వివాదం తెగేంతవరకు ఆగలేమంటూ, ఆలశ్యం చేస్తే బేరసారాల్లో ఇంకా బలహీనపడతామంటూ వారు ట్రంప్‌పై వత్తిడి తెచ్చినట్లు కనిపిస్తోంది. చైనాతో పెట్టుబడులు, వాణిజ్య ఏర్పాట్లపై చర్చకు ట్రంప్‌ పర్యటన జరగనుందని కొందరి విశ్లేషణ.

ఈ సందర్భంగా వాణిజ్యంతో పాటు ఇరాన్‌, తైవాన్‌, పన్నులు, కంప్యూటర్‌ చిప్స్‌,విలువైన ఖనిజాలు ఇతర సమస్యలు కూడా చర్చకు రావచ్చని చెబుతున్నారు.వీటిపై బీజింగ్‌ ధృడమైన వైఖరితో ఉంది.తన విదేశాంగ విధానం విజయవంతమైందని నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల ముందు ప్రదర్శించుకొనేందుకు కూడా ట్రంప్‌ చూస్తున్నాడు.లక్ష కోట్ల డాలర్ల మేర చైనా పెట్టుబడులు, వాణిజ్య విమానాల కొనుగోలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అమెరికా కోరుకుంటోంది.వారు గనుక లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులతో అమెరికాలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయని జనవరిలో డెట్రాయిట్‌ ఎకనమిక్‌ క్లబ్‌ సమావేశంలో ట్రంప్‌ చెప్పాడు.అయితే ఇప్పుడు పెట్టుబడులపై ఒప్పందం కుదరకపోవచ్చని, ఇరాన్‌ అంశం ట్రంప్‌ స్థితిని బలహీనపరిచిందని, అమెరికా మిలిటరీ బలహీనతలు ఏమిటో వెల్లడైనందున గతంలో మాదిరి పొగరుగా మాట్లాడటం కుదరదని చెబుతున్నారు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత కూడా అంతకు ముందు మాదిరే దూకుడును ప్రదర్శించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గకపోవటంతో బీజింగ్‌ను సంతుష్టీకరించేందుకు కొన్ని బిస్కెట్లు కూడా వేశాడు.చైనా విద్యార్థుల వీసాలకు అనుకూలంగా నిర్ణయం,ఆధునిక ఏఐ చిప్స్‌ను ఎగుమతి చేసేందుకు అంగీకరించటం, తైవాన్‌కు ఆయుధసరఫరా పాకేజ్‌ల నిలిపివేత, చైనాలో మానవహక్కులు లేవన్న ఆరోపణలపై మౌనం,చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై ధ్వజమెత్తే మంత్రుల నోళ్ల కట్టడి, షీ జింపింగ్‌ మంచి స్నేహితుడని, అద్భుతమైన సంబంధాలను కలిగి ఉన్నామని పదే పదే స్వయంగా చెప్పటం వంటి అంశాలున్నాయి. తాను ఈసారి అక్కడకు వెళ్లినపుడు తనను షీ జింపింగ్‌ గట్టిగా హత్తుకుంటాడని కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు, పొగడ్తలకు పొంగిపోలేదు. గతేడాది దక్షిణ కొరియాలో ట్రంప్‌-షీ జింపింగ్‌ భేటీలో వాణిజ్య పోరు మీద రాజీకుదిరింది. ట్రంప్‌ జరిపే పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత చెడగొట్టకుండా ఉంటే చాలు అని కూడా కొందరు అమెరికన్లు భావిస్తున్నారు.ఇరాన్‌ వ్యవహారంలో తప్పుడు లెక్కలు వేసుకున్నట్లుగా బీజింగ్‌తో వ్యవహరిస్తే ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో తమను ఉపయోగించుకొని చైనా, ఇతర దేశాలు ఎంతగానో లాభపడ్డాయని, ఇక ముందు అలా జరగటానికి వీల్లేదని చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు చైనా విషయంలో మాట మార్చాడు. పన్నులు, విలువైన ఖనిజాలు, కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో తలెత్తిన ఉద్రిక్తతలను పెద్దవేమీ కాదన్నట్లుగా మాట్లాడటమే కాదు, చైనాతో ఎంతో వాణిజ్యం చేస్తూ లబ్ది పొందినట్లు చెప్పాడు.

ఇటీవలి కాలంలో తలెత్తిన విబేధాలతో ఎవరికి వారు ప్రత్యామ్నాయాలను చూసుకుంటూనే ఉన్నారు. తైవాన్‌తో సంబంధాలు కలిగిన ఒక్క దేశంతో తప్ప మిగిలిన అన్ని ఆఫ్రికా దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై ఎలాంటి పన్నులు ఉండవని చైనా తాజాగా ప్రకటించింది.ఈ చర్య తన వస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచుతుందని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా గణాంకశాఖ సమాచారం ప్రకారం 2022లో చైనా దిగుమతుల కంటే గతేడాది 50 బిలియన్‌ డాలర్ల మేరకు తక్కువ ఉన్నాయి. సోయాబీన్స్‌ కొనుగోలును చైనా నిలిపివేసింది.గతేడాది చైనా వాణిజ్య మిగులు 202బిలియన్‌ డాలర్లు ఉంది, తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసి లోటును తగ్గించాలని అమెరికా కోరుతోంది.మరోవైపు చైనా బదులు తైవాన్‌ ప్రాంతం నుంచి ఎక్కువగా కంప్యూటర్‌ చిప్స్‌, సర్వర్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది.మూడవ దేశాల ద్వారా చైనా వస్తువులను ఎగుమతులు చేస్తోంది. చైనా నుంచి 2017లో అమెరికా దిగుమతి చేసుకున్న వస్తువుల వాటా 22శాతం ఉండగా ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కేవలం 7.5శాతం మాత్రమే ఉన్నాయి.వాషింగ్టన్‌ వస్తు దిగుమతులను ఆయుధంగా మార్చటం ఇది సూచిస్తున్నది.చైనాతో ఒప్పందం కుదుర్చుకోక ముందు దిగుమతి పన్ను 145శాతం విధిస్తూ ట్రంప్‌ కత్తి గట్టిన సంగతి తెలిసిందే.

జరుగుతున్న పరిణామాలను చూస్తున్నపుడు రెండుదేశాల మధ్య ప్రచ్చన్న యుద్దం జరుగుతున్నట్లు వేరే చెప్పనవసరం లేదు.కమ్యూనిస్టు చైనాను మొగ్గలోనే తుంచివేసేందుకు అసలు ఐరాసలో సభ్యత్వమే లేకుండా చేసేందుకు తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్నే అసలైన చైనాగా 1970దశకం వరకు గుర్తించిన సంగతి తెలిసిందే.తరువాత బీజింగ్‌ చేపట్టిన సంస్కరణలను అవకాశంగా తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి చౌకగా వస్తువులను తయారు చేసి వాటిని దిగుమతి చేసుకొని అమెరికా, ఇతర ధనిక దేశాలు లబ్దిపొందాయి.ఎప్పుడైతే చైనా బలపడి తమకు సవాలు విసురుతోందని గ్రహించిందో అమెరికా అప్పటి నుంచి కట్టడి చేసేందుకు పూనుకుంది. దాన్ని సవాలుగా తీసుకున్న చైనా అనేక విజయాలతో ముందుకు పోతున్నది. వర్తమానానికి వస్తే చైనాకు అవసరమైన చమురు, గ్యాస్‌ను ఆయుధాలుగా చేసుకొని అమెరికా తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోంది.మరోవైపున కృత్రిమ మేథ, చిప్స్‌తో వాణిజ్య సమతూకాన్ని సాధించాలని పావులు కదుపుతున్నది.దాన్లో భాగంగానే చిప్స్‌ను ఎగుమతి చేయరాదని, వాటి తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను సరఫరా చేయకుండా ఆంక్షలు విధించింది. ఆ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్న బీజింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు అవసరమైన విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తులపై పట్టుసాధించటంతో పాటు విద్యుత్‌ వాహనాలు, సౌరపలకల వంటి రంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. గతేడాది చైనా తయారీ మోటారు వాహనాలు ప్రపంచ ఎగుమతుల్లో 21శాతానికి చేరాయి.అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఐరోపా దేశాల కంటే చౌకగా విద్యుత్‌ వాహనాలను చైనా విక్రయిస్తోంది. చమురు అందకుండా చేయాలన్న అమెరికా ఎత్తుగడకు ప్రతిగా ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్‌ తయారీకి అవసరమైన ఏర్పాట్లతో పాటు పలకలను తయారు చేసి ఇతర దేశాలకు సైతం పెద్ద ఎత్తున ఎగుమతి చేసేదిగా చైనా తయారైంది.ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం దాని సౌరపలకల ఎగుమతులకు అనుకోని వరంలా మారింది.ప్రత్యామ్నాయ, హరిత ఇంథన వనరుల అభివృద్ధికి పూనుకున్న దేశాలన్నీ వాటిని దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికాకు జపాన్‌, చైనా ఇస్తున్న అప్పుల సంగతి తెలిసిందే.ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టాలంటే వాషింగ్టన్‌ వద్ద పెట్టుబడులు లేవు, అందుకే పన్నులను ఆయుధాలుగా చేసుకొని తమ దేశంలో పరిశ్రమలు పెడితే రాయితీలు ఇస్తానని షరతులు పెడుతున్నాడు.

చైనాతో వైరం వలన తమకు వచ్చే లాభం లేదని అమెరికన్‌ కార్పొరేట్లు ఒక నిర్ణయానికి రాకుండా ఇంత మంది కట్టుగట్టుకొని ట్రంప్‌తో పాటు పొలోమంటూ బయలు దేరరు. అమెరికా ఎదురుదాడి చేస్తే ప్రతిఘటిస్తున్న ఇరాన్‌ మాదిరి చైనా కూడా అవసరమైన మేర ఆర్థిక రంగంలో ప్రతిఘటిస్తున్నది తప్ప తానే దాడి చేసేందుకు పూనుకోవటం లేదు, అవసరమూ లేదు. సంఘర్షణ రెండు దేశాలకూ నష్టమే. దాన్ని నివారించాలంటే ప్రధాన బాధ్యత అమెరికాదే అవుతుంది. యావత్‌ ప్రపంచాన్ని చాపచుట్టలా తన చంకలో పెట్టుకోవాలన్న దురాలోచనకు అది స్వస్థి పలికితే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమౌతాయి. ప్రపంచ పెత్తనం సాధ్యం కాదని ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా దానికి అర్ధం కావటం లేదు. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదం తైవాన్‌ విలీనం. ఏదో ఒకసాకుతో దాన్ని అడ్డుకొని స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో బల్లెంగా తయారయ్యేందుకు అమెరికా చూస్తున్నది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట తన ఆయుధాలను మోహరించాలని పన్నిన ఎత్తుగడ వికటించినా వాషింగ్టన్‌కు బుద్ధి రావటం లేదు. ఐరాస, చివరికి అమెరికా కూడా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తించిన తరువాత కూడా విలీనాన్ని అడ్డుకుంటే చైనా చూస్తూ ఊరుకోజాలదు, అయితే వెంటనే అది జరగకపోయినా ఇబ్బంది లేదు గనుక తమాయిస్తున్నది. తెగేదాకా లాగితే స్వాధీనం పెద్ద కష్టమేమీ కాదు. తాజా పర్యటనలో ట్రంప్‌ దీనితో పాటు ఇతర వివాదాలపై చైనాతో సఖ్యతకు ప్రయత్నిస్తాడా, గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడా, చూద్దాం !

పెట్రో బాదుడుకు రంగం సిద్దం చేసిన ” మోడీ బాబా ” ! పొదుపు చేయని వారు దేశభక్తులు కాదా !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు పొదుపోపదేశం చేశారు. ఇంకేముంది పొలోమంటూ కాన్వారులను తగ్గించుకుంటున్నట్లు అనేక మంది ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారు సరేసరి. ప్రధానికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగినట్లు అని ”దేశంకోసం-దర్మం కోసం ” ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. విదేశీ మారకద్రవ్యం, ఇతర అంశాల సమస్యలు ఇప్పటికిప్పుడు తలెత్తాయా ? నిజం అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎందుకు ప్రకటించటం లేదు. ముందు జాగ్రత్త అని బిజెపి నేతల ముక్తాయింపు.జనాల్లో అదెప్పుడూ ఉంటుంది. విడ్డూరం గాకపోతే వారు చెబితేనే జాగ్రత్తపడతరా ! ఇక చమురు ధరలను పెంచకతప్పదని కేంద్ర చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు చెప్పకనే చెప్పారు. బుధవారం నాడు మరోసారి మోడీ సందేశం. నిజానికి అది మంత్రులకు కాదు, జనానికే. అనివార్యమై ధరలను పెంచామని చెప్పబోతున్నారు. నిర్ణీత వంద కొరడా దెబ్బలను ఒకేసారి తింటారా దశలవారీనా అన్నది తేల్చుకోవాలని జనాలకు అవకాశం ఇస్తున్నారు తప్ప నూరు వాతలు తప్పవు.ఇప్పటికే ఆమేరకు మీడియాకు తాజా లీకులు వదిలారు. పెట్రోలు మీద లీటరుకు రు.14, డీజిల్‌ మీద రు.42, గృహవినియోగ ఎల్‌పిజి సిలిండరు మీద రు.674 నష్టం వస్తున్నదన్నది వాటి సారం. చమురు, గ్యాస్‌ సబ్సిడీలను ఎత్తివేసినందున ఏదో ఒక రూపంలో జనాలు ఈ మేరకు భరించటానికి సిద్దపడాలనే సందేశం ఇప్పటికే చేరవేశారు. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ ధరలను ఎలా పెంచిందీ చూశాము. రోజుకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చమురు కంపెనీలకు నష్టం వస్తున్నదనిపూరీ చెప్పారు. ధరల పెంపుదల గురించి అడగ్గా మీకు తెలియనిదేముంది ప్రధాని నరేంద్రమోడీ ”భవిష్యత్‌ దార్శనికుడు ” అన్నట్లుగా చెప్పారు. అంటే ఆదివారం నాడు (2026 మే 10) హైదరాబాదులో చేసిన ఒక విలక్షణ ప్రసంగంలో మోడీ యమలీలను గుర్తు చేశారు. ఎప్పుడూ చేసే రాజకీయాలను వదల్లేదు గానీ ఇతర విషయాలే మీడియాలో పతాకశీర్షికలయ్యాయి,విశ్లేషణలు వెలువడ్డాయి.మన్‌కీ బాత్‌ పేరుతో 2014 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రేడియోలో నెలకు ఒకసారి చొప్పున 113సార్లు మోడీ ప్రసంగించారు. ఎంతమంది ఎన్నింటిని విన్నారో ఎవరికి వారు లెక్కవేసుకోవాల్సిందే. ఒక సర్వే ప్రకారం ఐదుశాతం మంది శ్రోతలు మాత్రమే ఆలకించినట్లు తేలింది. అలాంటి ప్రసంగమే హైదరాబాద్‌లో చేశారని చెప్పవచ్చు. దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సమీక్షల సారం ఏమిటంటే ఇంథన ధరలను పెంచకతప్పదనే మహత్తర సందేశాన్ని ప్రధాని దేశానికి అందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెంచుతారని ఊరూవాడా భావించారు. అయితే వెంటనే ఆ ప్రకటన వెలువడలేదు. కారణం ఏమిటంటే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి కుదిరి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందనే వార్తలు రావటం ఒకటి. నిజంగా అది జరిగితే ధరలు ఎందుకు పెంచారని జనం ప్రశ్నిస్తారు. రెండవది ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవమే అని నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఏ పేరుతో పెంచాలా అని మధనపడుతున్నారు.ఊహించని విధంగా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగటం మోడీ పరివారానికి అవకాశమిస్తున్నదని చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌ నెతన్యాహు, అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను నమ్మి వారం రోజుల్లో ఇరాన్‌ పని అయిపోతుంది లెమ్మని కేంద్రంలోని పెద్దలు తడిబట్ట వేసుకొని పడుకున్నారని సంక్షోభ ప్రారంభంలో వారి తీరుతెన్నులే స్పష్టం చేశాయి. ఏ రోజు తిరిగి దాడులు మొదలౌతాయో తెలియని స్థితి. ఆందోళనలో ఉన్న వారికి బిపి పెరుగుతూ తగ్గుతూ ఉండే మాదిరి యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ మార్కెట్‌ చమురు ధరలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మన స్టాక్‌ మార్కెట్‌ ఈ కారణంగానే భారీగా పతనమైంది. ఇప్పటికే చమురు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ వార్తలను రాయిస్తున్నారు. గతంలో ప్రత్యేక పన్నులు, సెస్‌ల రూపంలో బాదిన బాదుడుకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లలో రాబడి పెరిగినపుడు ఏ మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా రాయలేదు గతంలో లాల్‌బహుదూర్‌ శాస్త్రి పాక్‌తో యుద్దం వచ్చినపుడు ఇచ్చిన పిలుపు మాదిరే ఇప్పుడు తమ మోడీ దేశ పౌరులకు పొదుపు విజ్ఞప్తి చేశారు తప్ప బలవంతం చేయటం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.నాడు యుద్ధం వచ్చింది గనుక శాస్త్రి ఆ పిలుపు ఇచ్చారు, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా లేవు, అంతా సజావుగానే ఉందని చెబుతూ ఆ పిలుపు ఇవ్వటం ఏమిటి ? మచ్చుకు మోడీ ప్రవచించిన పది సుభాషితాల్లో కొన్నింటిని చూద్దాం. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్న లోకోక్తి తెలిసిందే.

” దేశం కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, దేశం కోసం బతకడం,దేశ కర్తవ్యం కోసం పాటు పడటమూ దేశభక్తే ” అని మోడీ చెప్పారు. పొదుపును కూడా దేశభక్తికి ముడిపెట్టారు.ఇదే ప్రమాదకరం. పొదుపు పాటించనివారు దేశభక్తులు కాదనే భావాన్ని చెప్పకనే చెప్పారు. కడుపునిండా తినటానికి తిండిలేదనే కదా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఐదేసి కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను ఇస్తోంది.వారిని పొదుపు చేయమంటే ఆ ఉచితాన్ని వదులుకోవాలి మరి. వంట నూనె వాడకం తగ్గించటం కూడా దేశభక్తే అన్నారు. పొదుపు గురించి దేశ పౌరులకు మోడీ చెప్పాల్సినపని లేదు.మన జీన్స్‌లోనే ఉంది.అవసరమైన మేరకే వస్తువులను వాడతారు. ” సాధ్యమైన మేరకు ఇంటి నుంచే పని చేసే పద్దతి అనుసరించండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, ఇంథనాన్ని పొదుపుగా వాడండి ” మోడీ సుభాషితాల్లో ఒకటి. ఈ చర్యకు ప్రధానే స్వయంగా శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేది. హైదరాబాదు వచ్చి ఎక్కడో జరిగే పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే బదులు అదేదో ఢిల్లీ నుంచే చేయవచ్చు, గతంలో అనేక సార్లు అలా చేశారు.వేలాది మంది పోలీసులు, ఇతర ఏర్పాట్లకు అనవసర ఖర్చు, ఆయాసమూ తప్పేది, ట్రాఫిక్‌ ఆంక్షల వలన అదనపు దూరం ప్రయాణించిన వాహనదారులకు అదనపు పెట్రోలు, డీజిలు కలసి వచ్చేది.మోడీ స్వయంగా చెప్పినట్లు దేశం ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నపుడు లక్షల మంది జనాన్ని తెలంగాణా అంతటి నుంచి ఎండల్లో రప్పించటానికి వాహనాలకు పెద్దమొత్తంలో ఇంథనం ఖర్చు చేయటం అవసరమా ? అందువలన పొదుపు గురించి ఇతరులకు చెప్పేముందు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్య ప్రదేశ్‌లో బిజెపి రాజకీయ నిరుద్యోగి సౌభాగ్య సింగ్‌ ఠాకూర్‌కు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.దానికి ప్రమాణస్వీకారం కోసం డజన్లకొద్దీ వాహనాలతో ఉజ్జయని నుంచి భోపాల్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం అనుయాయులతో అట్టహాసంగా వెళ్లారు. బిజెపి నేతల పొదుపు ఇలా ఉంటుంది. హైదరాబాద్‌ ఉపన్యాసంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మోడీ తన కాన్వారును గణనీయంగా తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.కొత్తగా కొనుగోలు చేయకుండా విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని చెప్పినట్లు వార్త. ఇదంతా పౌరుల మీద భారం మోపే ప్రచార ఎత్తుగడే.విదేశీ ప్రయాణాలు వద్దంటూ చెప్పిన మోడీ వారం రోజుల పాటు ఐదు దేశాల కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో నెహ్రూ 44సార్లు విదేశీ పర్యటనలు చేస్తే మోడీ సెంచరీ కొట్టారు.

ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ మరో సలహా ! తరువాత కొనుగోలు చేయవచ్చా ? ధరలు ఇప్పటికిప్పుడే పెరగలేదే ! ఏడాది పాటు మారుటోరియం ఎందుకు సూచించారు. రూపాయి విలువను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా డాలర్లకు కొరత ఏర్పడుతోంది.మన స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన విదేశీయులందరూ వాటాలను అమ్మివేసి డాలర్లలో తమ దేశాలకు తరలించుకుపోతున్నారు. 2025 ఏడాది మొత్తంలో 2.4లక్షల కోట్ల రూపాయలను తరలిస్తే ఈ ఏడాది మే 11వ తేదీ నాటికే 2.28లక్షల కోట్లు దాటాయని వార్తలు.మే ఒకటవ తేదీతో ముగిసిన వారంలో 7.794 బిలియన్‌ డాలర్లు మన విదేశీ మారకద్రవ్యంలో తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతి ప్రోత్సాహ పథకాల వంటి ఎన్ని కబుర్లు చెప్పినా, రాయితీలు ఇచ్చినా దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగటం లేదు. అయినా విదేశీ వస్తువులు వాడవద్దని ప్రధాని చెబుతారు, దిగుమతులకు ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నది.ముడి చమురు తరువాత బంగారానికే ఎక్కువగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.బంగారంతో నగలు చేయించేందుకు కొంత మందికి పని కల్పించవచ్చు తప్ప నిజానికి అది ఉత్పాదతకు పనికి వచ్చేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పసిడి ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ మోడీ మాట్లాడ లేదు. గతంలో బంగారం దిగుమతులపై పన్ను ఎక్కువగా ఉన్న కారణంగా దొంగరవాణా పెరిగిందని తగ్గించారు. తాజాగా దిగుమతి పన్ను, సెస్‌లు కలిపి ఆరు నుంచి 15శాతానికి పెంచారు. నిరంతరం దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. ఒకదశ దాటిన తరువాత చెల్లింపుల సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవద్దని, వివాహాలు విదేశాల్లో చేయవద్దని చెప్పారు. విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో వివాహాలు చేసేవారందరూ శతకోటీశ్వరులు తప్ప సామాన్యులు కాదు.మోడీ తన పాలనా కాలంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులను పెంచారు తప్ప తగ్గించలేదు.తాను అధికారానికి వచ్చినపుడు కేవలం 70మంది బిలియనీర్లు ఉంటే 2026నాటికి 308పెరిగారు.కోటీశ్వరుల గురించి చెప్పాల్సిందేముంది ! సామాన్యుల వద్ద ఉన్న సంపదశాతం తగ్గుతున్నదని అనేక విశ్లేషణలు వెల్లడించిన సంగతి తెలిసిందే.వారంతా సొమ్మును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేయక ఏం చేస్తారు !

స్వదేశీ ఉత్పత్తి పెరగాలంటారు. దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా ఆయన పలుకుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 95చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ ఏం చేస్తున్నట్లు ? దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకాన్ని చూస్తే 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే.తాజాగా చమురు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన రాయల్టీ తగ్గించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26లో రు.2.07 లక్షల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40, ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 ఇటీవలి వరకు వసూలు చేశారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు పెట్రోలు మీద ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.3 పైన పేర్కొన్న రెండు సెస్‌లు కలిపి రు.8.50, డీజిలుపై సెస్‌ రు.6 కొనసాగుతోంది.ఇప్పుడు మార్కెటింగ్‌ కంపెనీలకు నెలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకుంటున్న మంత్రి పూరీ ఇన్నేండ్లుగా మోడీ ఏలుబడిలో వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్నదాని కంటే అదనంగా వసూలు చేసిన రు.16.5లక్షల కోట్ల ప్రత్యేక ఎక్సయిజ్‌ పన్ను సంగతి మాట్లాడరేం.

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు నంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంథనంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాబాల మాదిరి పొదుపు గురించి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు.గణనీయంగా తగ్గించాల్సిందిపోయి పెంచకపోవటం తమ ఘనత అని చెప్పుకుంటున్నారు.ఇది గోబెల్స్‌ పద్దతి. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత ధర పెరుగుతున్నది. మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చినెల 25వ తేదీ వరకు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌లో 114.48, మే పన్నెండవ తేదీవరకు 105.09 డాలర్లు, అంటే నాలుగేండ్ల నాటి స్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ఇది.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఇరాన్‌పై దాడులు ప్రారంభం ఫిబ్రవరి 28న కాగా అంతకు ముందు 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. జనం జేబులు కొట్టాలనుకున్నపుడు మాత్రం ఈ విధానం గుర్తుకు రాదు, కేంద్రానికి సెగ తగలగానే మళ్లీ మొదలు పెడతారా ? చావు తెలివితేటలు !

ట్రంప్‌కు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ: ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి ఆంతర్యం ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

తాజాగా ఇరాన్‌-అమెరికా మధ్య జరిగిన కాల్పులు ప్రేమతో జరుపుకున్నవే అని డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నాడు వ్యాఖ్యానించాడు.(రోడ్దు మీద ఒక వాహనాన్ని మరొక వాహనం కొట్టినపుడు పెద్దగా నష్టం జరగకపోతే రెండూ ముద్దు పెట్టుకున్నాయని సరదాగా చెప్పుకోవటం వంటిది) రెండు దేశాల మధ్య శాంతి చర్చలు దోబూచులాడుతున్న సమయంలో ఇలా మాట్లాడటం గమనించదగిందే అయినా ట్రంప్‌ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులను ప్రారంభించటమైతే చేసింది గానీ, ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అమెరికా నానా ఇబ్బందులు పడుతున్నది.ఇరాన్‌ దాడుల్లో జరిగిన నష్టం గురించి ట్రంప్‌ చెప్పుకోలేడు, అలాగని దాచుకోలేడు.చెప్పకపోతే ప్రాణం పోతుంది చెప్పుకుంటే పరువుపోతుంది..గల్ఫ్‌లోని పదిహేను అమెరికా మిలిటరీ కేంద్రాలలో 228 కట్టడాలు, ధ్వంసమైన పరికరాలకు సంబంధించి ఇటీవల ఇరాన్‌ కొన్ని చిత్రాలను విడుదల చేసింది.వాటిలో విమానాలను నిలిపే ప్రాంతాలు, చమురు డిపోలు,విమానాలు, రాడార్లు, సమాచార వ్యవస్థల వంటివి ఉన్నాయి. ఆ చిత్రాలు నిజమైనవా లేక కృత్రిమ సృష్టి అని చెప్పలేక అమెరికా ఏవేవో చెబుతున్నది.ఎవరెన్ని చెప్పినా ఇరాన్‌ గురిచూసి దెబ్బతీసింది.ట్రంప్‌ చెప్పినట్లుగా మరిన్ని దాడులకు పాల్పడితే ఇదే మాదిరి పరాభవం ఎదురుకావచ్చనే హెచ్చరికలే భూతల దాడులకు దిగకుండా అమెరికా మిలిటరీ జాగ్రత్తపడుతున్నదని చెప్పవచ్చు.గల్ఫ్‌లోని కొన్ని మిలిటరీ కేంద్రాలు దాడులకు పనికి రాకుండా పోయినట్లు చెబుతున్నారు. ఇరాన్‌పై దాడులతో తమకు 25బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చినట్లు రక్షణశాఖ కబుర్లు చెప్పినప్పటికీ 50బిలియన్‌ డాలర్లకు పైమాటే ఉంటుంది.పశ్చిమాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతంలో జరిగిన నష్టాలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేయవద్దని వాణిజ్య ఉపగ్రహ కంపెనీలను ట్రంప్‌ యంత్రాంగం ఆదేశించిందంటేనే అది ఎంతగా మూసిపెడుతోందో తెలుస్తోంది. ఇరాన్‌ విడుదల చేసిన చిత్రాలు చైనా, రష్యా ఉపగ్రహాలు తీసినవని వేరే చెప్పనవసరం లేదు. గురిచూసి అమెరికా లక్ష్యాలను దెబ్బతీయటం కూడా ఆయా దేశాలు అందించిన సమాచారం, ఐరోపా సంస్థలు విడుదల చేసిన సమాచారం, చిత్రాలతోనే సాధ్యమైంది.

ఏప్రిల్‌ ఎనిమిది నుంచి ఇరాన్‌-అమెరికా మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది.రెండు దేశాల మధ్య పరస్పర దాడులు నిలిచిపోయాయి.అమెరికా కారణంగా ఇస్లామాబాద్‌లో తొలి చర్చలు విఫలమైన తరువాత ఇంతవరకు దోబూచులాట తప్ప మలి చర్చలు ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం నాడు తమపై ఇరాన్‌ 15ఖండాంతర,మూడు క్రూయిజ్‌ క్షిపణులు,నాలుగు డ్రోన్లతో దాడులు చేసిందని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆరోపించింది. (యుఏయి-దుబాయి అంటే అందరికీ బాగా తెలుస్తుంది.దుబారు, షార్జా, అబూదాబీ వంటి ఏడు ప్రాంతాలు కలసి ఉన్నదేశాన్ని ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌గా వ్యవహరిస్తారు, 1971లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది, రాజధాని అబూదాబీ, కోటి పది లక్షల మంది జనాభా ఉండగా దుబారు పెద్ద నగరం) కాల్పుల విరమణ అవగాహన తరువాత ఇదే పెద్ద దాడి.దుబారు చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఫుజాయిరా రేవుపై జరిగినదాడిలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని వార్తలు. ముగ్గురు భారతీయ కార్మికులు గాయపడ్డారు.హార్ముజ్‌ జలసంధితో నిమిత్తం లేకుండా వేరే మార్గంలో చమురు ఎగుమతులు చేసేందుకు ఈ రేవు అనువుగా ఉంది. జలసంధి వెలుపల తిష్టవేసిన అమెరికా ప్రతి రోజూ ఇరాన్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నది, బలవంతంగా జలాల్లో ప్రవేశించేందుకు పూనుకుంది. అందువల్లనే ఇది పధకం ప్రకారం చేసిన దాడి కాదని, ”అమెరికా మిలిటరీ దుస్సాహసానికి ” ప్రతి స్పందన అని ఇరాన్‌ వర్ణించింది.ఇప్పటి వరకు హార్ముజ్‌ జలసంధి వెలుపలనే తిష్టవేసిన అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు చూసినపుడు తాము దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించగా అబ్బే అలాంటిదేమీ లేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. ఇరాన్‌ దాడి వెనుక అనేక అర్ధాలు, అంశాలు ఉన్నాయి.గల్ఫ్‌ దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఎమిరేట్స్‌ను ఒంటరి పాటు చేసేందుకు ఇరాన్‌ పూనుకుందని చెప్పవచ్చు. దుబాయిపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు మోడీ సర్కార్‌ స్పందించింది. రుణాలు చెల్లించాలని పాకిస్తాన్‌పై రుణాల చెల్లింపుకు ఎమిరేట్స్‌ వత్తిడి చేయటం వెనుక మనదేశం కూడా ఉందని వ్యాఖ్యలు వెలువడిన పూర్వరంగంలో కృతజ్ఞతగా ఇలా స్పందించిందని చెప్పవచ్చు. తరువాత ఎలాంటి పరిణామాలు జరగలేదు గనుక ఒక వ్యూహంలో భాగంగా ఇరాన్‌ దాడిని చెప్పవచ్చు.

పశ్చిమాసియా పరిణామాల్లో గల్ఫ్‌ దేశాల పాత్ర గురించి మీడియా అంతగా కేంద్రీకరించకపోవటానికి కారణం వార్తా సంస్థలను పశ్చిమదేశాలు నియంత్రించటమే.చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల బృందం(ఒపెక్‌) నుంచి దుబాయి ఎందుకు ఆకస్మికంగా బయటకు వచ్చింది ?దాని వెనుక ఉన్న కథేంటి అన్నదితెలుసుకోవాలి.గల్ఫ్‌ దేశాల్లో గతంలోనే విబేధాలు ఉన్నప్పటికీ అవి ఈ సందర్భంగా మరింతగా బయటకు వచ్చాయి. తాము పధకం ప్రకారం దాడి చేయలేదని, నియంత్రణల్లో ఉన్న హార్ముజ్‌ జలసంధి నుంచి నౌకలకు దారి కల్పించేందుకు అమెరికా చేసిన మిలిటరీ దుస్సాహసానికి స్పందనకు ఫలితమని ఇరాన్‌ అధికారి చెప్పాడు. అంతకు ముందు నౌకలకు దారి కల్పిస్తామని అమెరికా ప్రకటించింది.ఈ క్రమంలో ఒక యుద్ధ నౌకపై ఇరాన్‌ రెండు క్షిపణులను ప్రయోగించింది. తాము వేగంగా వచ్చి దాడులు చేసే ఆరు ఇరాన్‌ నౌకలపై కాల్పులు జరిపామని, వాటిని ముంచివేశామని, ఇరాన్‌ దాడిలో దెబ్బతిన్నది దక్షిణ కొరియా నౌక తప్ప తమది కాదని అమెరికా చెప్పుకుంది.ఎమిరేట్స్‌పై దాడి పెద్ద విషయం కాదని,చర్చల్లో ఇరాన్‌ ఎంతో నయంగా ఉందనికూడా ట్రంప్‌ వ్యాఖ్యానించాడు.

ఇరాన్‌ మీద దాడి చేసిన ఇజ్రాయెల్‌కు యుఏయి ఎంతో సన్నిహితంగా ఉంది.లాంఛనంగా రక్షణ ఒప్పందం లేకున్నప్పటికీ అదే మాదిరి రెండు దేశాలూ వ్యవహరిస్తున్నాయి.ఇరాన్‌ దాడుల నుంచి రక్షణకు గగనతల వ్యవస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.టెహరాన్‌పై ఇజ్రాయెల్‌ దుష్ట పథకాలకు ఎమిరేట్స్‌ ఎప్పటి నుంచో సాయపడుతున్నది. అమెరికా స్థావరాలకు చోటు కల్పించటమేగాక దాడులకు సైతం తమ వైమానిక స్థావరాల సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ఎమిరేట్స్‌ సహకరించిందని,ఒమన్‌, మరొక దేశం మీద ఇజ్రాయెలే దాడిచేసి తాము చేసినట్లుగా చిత్రించేందుకు కూడా తోడ్పడినట్లు ఇరాన్‌ నిర్ధారించుకున్నది.తమ గురించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు అవసరమైన ఏఐ మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చినట్లు టెహరాన్‌ భావిస్తున్నది.అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయెద్‌(ఎంబిజెడ్‌) ఇజ్రాయెల్‌ మొసాద్‌, అమెరికా సిఐఏలతో కలసి పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నాడు.ఈజిప్టులోతొలిసారిగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్‌ మొర్సీ ప్రభుత్వాన్ని కూలదోయటం, అరబ్బు విప్లవాలను పక్కదారి పట్టించేందుకు నిధులు అందచేయటం వంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి.వాటిలో భాగంగా ట్యునీసియా,లిబియా, సూడాన్‌, ఎమెన్‌లలో జోక్యం చేసుకోవటం, నేరగాండ్లు, కిరాయి సాయుధులను సమకూర్చి అంతర్యుద్దాలకు దోహదం చేయటం వంటి దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈ కారణంగా లక్షలాది మంది అరబ్బులు మరణించటం, ఇబ్బందులకు గురయ్యారు. తన సరిహద్దులను విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ ఎలా దుర్మార్గాలకు పాల్పడుతున్నదో అదేమాదిరి ఎమిరేట్స్‌ విస్తరణకు పథకాలు వేశాడని కూడా చెబుతారు.పశ్చిమ దేశాలలో విద్యను అభ్యసించిన ఎంబిజె అమెరికాలో తన పలుకుబడిని పెంచుకొనేందుకు అప్పటి వరకు ప్రపంచానికి అంతగా తెలియని సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను అమెరికన్లకు పరిచయం చేశాడు. తరువాత రియాద్‌లో ఉన్న ప్రముఖులను సిఐఏ ఏజంట్లుగా మార్చేందుకు సహకరించాడు. ఎమెన్‌లో ఇరాన్‌ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అక్కడి వేర్పాటువాదులను తొలుత ఎమిరేట్స్‌ ప్రోత్సహించింది, తరువాత ఆ బాధ్యతను చేపట్టేట్లుగా సౌదీ అరేబియాను ప్రయోగించింది. తరువాత ప్రత్యర్ధులుగా మారారు. ఇప్పుడు సూడాన్‌, లిబియా, ఎమెన్లలో ఉన్న ఎమిరేట్స్‌ మద్దతు ఉన్న సాయుధులను అడ్డుకొనేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు చూస్తున్నాయి.

అమెరికా ఎత్తుగడలో భాగంగా ఒపెక్‌ కూటమి నుంచి ఎమిరేట్స్‌ వైదొలుగుతూ గతవారంలో నిర్ణయం తీసుకుంది.చమురు ఉత్పత్తి కోటాలతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది. ఆరుదశాబ్దాలుగా ఒపెక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సౌదీని, ఇరాన్ను దెబ్బతీసేందుకే ఈ మేరకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. రియాద్‌-అబూదాబీల మధ్య శాశ్వత వైరుధ్యం ఏర్పడినట్లు అల్జీరియా అధ్యక్షుడు అబ్దుల్‌మాదిజిద్‌ తెబ్బోనే వ్యాఖ్యానించాడు, ఎమిరేట్స్‌ వైదొలగటాన్ని తాను పట్టించుకోవటం లేదన్నాడు. ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి చేస్తే సౌదీ ఉష్ట్రపక్షిలా ఉందంటూ అబుదాబీ వ్యాఖ్యాతలు రెచ్చిపోయారు.అయితే ఎమిరేట్స్‌ వైదొలిగినందున అది నష్టపోయే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. వలస కార్మికులు, కిరాయి సాయుధ మూకలు, చిన్న సైన్యం మాత్రమే కలిగి ఉన్నందున ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటుందనేది ప్రశ్న.ఇజ్రాయెల్‌, అమెరికాలు ఆదుకుంటాయనే ఆశ మాత్రమే ఉంది. ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లు, క్షిపణులను పసిగట్టే లేజర్‌ వ్యవస్థలను ఇజ్రాయెల్‌ సమకూర్చి, వాటి నిర్వహణకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. వీటితో పాటు అబుదాబీ, దుబారు నగరాలకు ఐరన్‌ డ్రోమ్‌ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. ఇరాన్‌ వీటన్నింటినీ గమనించిన కారణంగానే సోమవారం నాడు ఎమిరేట్స్‌ మీద క్షిపణి ప్రయోగం చేసింది.లెబనాన్‌లోని తన మద్దతుదారులైన హిజబుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.దుబారు పథకాలపై ఒక్క టెహరానే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న సౌదీ, ఒమన్‌,కతార్‌, పాకిస్తాన్‌, టర్కీ కూడా ప్రేక్షకులుగా ఉండజాలవు. ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్‌తో పాటు దానికి సహకరించే ఏ దేశాన్నీ కూడా అవి వదలవు.

ఇటీవలి దాడులతో ఇరాన్‌ పట్ల గల్ఫ్‌ దేశాలు గుర్రుగా ఉన్నప్పటికీ అమెరికాతో కలసి దాడులకు పూనుకోలేదు. సోమవారం నాడు ఎమిరేట్స్‌పై దాడి గురించి ముందుగానే సౌదీ అరేబియా,ఒమెన్‌లకు ఇరాన్‌ చెప్పినట్లు గత గురువారం నాడే అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాయటం గమనించాలి.అయితే ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పిందీ ఆ పత్రిక వెల్లడించలేదు. ఇరాన్‌ చర్యలపై ఆగ్రహం ప్రకటించినప్పటికీ సౌదీ మంత్రులు టెహరాన్‌తో సంబంధాల్లోనే ఉన్నారు. ఎమిరేట్స్‌ మద్దతుదార్లను వ్యతిరేకించే శక్తులకు పాకిస్తాన్‌లో సౌదీ కొనుగోలు చేసిన ఆయుధాలను మార్చినెలలో లిబియాకు తరలించారు.ఇక గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరిపిన దాడులకు సంబంధించి ఎమిరేట్స్‌ మీద ప్రత్యేకంగా కేంద్రీకరించినట్లు వివరాలు వెల్లడి అవుతున్నాయి. కాల్పుల విరమణకు ముందు రెండు వేల ఖండాంతర క్షిపణులు, డ్రోన్లను టెహరాన్‌ సంధించింది.మిగతా దేశాలతో పోలిస్తే ఎమిరేట్స్‌ వైఖరి ఒకటైతే అంతర్జాతీయంగా వత్తిడి తెచ్చేందుకు కూడా దానిపై దాడులను కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా, లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా దుబారు, తదితర నగరాలకు రావటం కూడా ఒక ప్రధాన కారణం. దాడుల్లో ఎవరైనా విదేశీయులకు హాని జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది, పర్యాటకులు, వ్యాపారుల రాక తగ్గి ఆర్థికంగా ఎమిరేట్స్‌ నష్టపోతుందనే ఎత్తుగడ కూడా ఉంది.అది భావించినట్లుగానే అనేక హౌటళ్ల గదులు జనాలు లేక ఖాళీగా ఉంటున్నాయి. ఇదే అదునుగా అవసరమైన మరమ్మతులకు వాటిని మూసినట్లు కూడా చెబుతున్నారు. అమెరికా దాడులకు సౌదీ సహకరించినప్పటికీ చర్చలకూ చొరవ చూపిందని చెబుతుండగా దాడులను కొనసాగించాల్సిందేనని ఎమిరేట్స్‌ పట్టుబడుతున్నదని, తొమ్మిదినెలల వరకు దాడులు జరిగినా తట్టుకుంటామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మధ్యవర్తిగా ముందుకు వచ్చిన పాకిస్తాన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమై ఎమిరేట్స్‌ తమ రుణాలను వెంటనే తీర్చాలని మెడమీద కత్తి పెట్టినట్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనికి రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు. సౌదీతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవటం, ఇరాన్‌ దాడులను ఖండించాలన్న డిమాండ్‌కు అంగీకరించకపోవటం, పాక్‌ను దెబ్బతీసేందుకు భారత్‌ తెచ్చిన వత్తిడి ఉన్నట్లు భావిస్తున్నారు !

వ్యవసాయ పరిశోధనల్లో నిర్లక్ష్యం – అడుగడుగునా రైతులకు అన్యాయం ! వేదాల్లో అన్నీ లేవని మోడీ పరివారానికి ఏ భాషలో చెప్పాలి !!

Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలా లేదా అన్న అంశంపై నాలుగేండ్ల నాడు వేసిన కమిషన్‌ ఏం చేస్తోందో తెలియదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధరలతో పాటు దిగుబడి పెంపుదల, సాగు ఖర్చుల తగ్గింపు గురించి అనేక మంది చెప్పటం తెలిసిందే. పోనీ దానికైనా గడచిన పన్నెండేళ్లలో మోడీ సర్కార్‌ ఏమైనా చేసిందా ? వ్యవసాయ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి తీరుతెన్నులు, ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు గురించి రోమ్‌ నగరంలో ఉన్న ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) ఏప్రిల్‌ 30వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. సభ్యదేశాల ప్రభుత్వాలు అందచేసే సమాచారం మేరకు 2023వరకు ఉన్న వివరాల ప్రకారం రూపొందించిన నివేదిక. గడచిన రెండు దశాబ్దాలలో ఏటా 1.8శాతం చొప్పున పరిశోధనకు ఖర్చు పెరుగుతూ 50.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.వర్తమాన సహస్రాబ్ది తొలి పదేండ్లలో విస్తరణ మందకొడిగా ఉందని, 2009తరువాత పెరిగిందని గమనించారు.రైతే రాజు, దేశానికి వెన్నెముక, రైతులేనిదే రాజ్యం లేదు వంటి మాటలు ఎన్నో విన్నాం. ఏం జరిగింది, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌(ఐజెఓఇఏఆర్‌) 2026 మార్చినెల సంచిక, పేజీ 126లో దిగువ వివరాలు ఉన్నాయి. పంట ఉత్పత్తి అంకెలను మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా, దిగుబడి హెక్టారుకు టన్నులుగా గమనించాలి.చైనాలో మనకంటే సాగుభూమి తక్కువ, అయినా మొత్తం 69.కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంటే మనం 35.4కోట్ల టన్నులు చేసి చైనా కంటే మన జనాభా అదనంగా ఉన్నప్పటికీ అవసరానికి మించి పండిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాం.

పంటపేరు×× భారత ఉత్పత్తి××చైనా ఉత్పత్తి×××భారత దిగుబడి××చైనా దిగుబడి

వరి ×××××× 147-150 ×× 145 ××× 4.3 ×× 7.1

గోధుమ ×× 113-117 ×× 140 ××× 3.5 ×× 5.5

మొక్కజన్న × 35 ×× 280-290 ××× 3.2 ×× 6.1

సోయాబీన్‌×× 12-13 ×× 20 ××× 1.2 ×× 1.9

బం.దుంప×× 60 ×× 95 ××× 24 ×× 33

పిండికొద్దీ రొట్టె అన్న పెద్దలే కుండలో కూడు కుండలోనే ఉండాలి పిల్లాడు దుడ్డులా పెరగాలంటే కుదరదని కూడా చెప్పారు. జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచటంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే దిగుబడులను కూడా అధికంగా సాధించాలి. అందుకు పెట్టుబడి, శాస్త్రవేత్తలు కావాలి. ప్రపంచంలో 2004లో 2,04,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటే 2023నాటికి 3,16,000కు పెరిగారు. మనదేశంలో పరిస్థితి ఏమిటి ? పూర్తికాలం పని చేసే పరిశోధకుల సంఖ్య రెండువేల సంవత్సరంలో 11,154 మంది ఉంటే 2018లో 11,372 మంది ఉన్నారు. అదే చైనాలో ప్రస్తుతం 43వేల మంది పని చేస్తున్నారు.శాస్త్రవేత్తల సంఖ్యను బట్టే వారి మీద పరిశోధన ఖర్చుకూడా ఉంటుంది. అది అధిక దిగుబడి వంగడాలు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పండించటం మీద కూడా ప్రభావం చూపుతుంది.పారిశ్రామిక, ఐటి రంగాలకు అవసరమైన చౌక (కార్మికులు) ఇంజనీర్ల సృష్టి మీద చూపిన శ్రద్ధ అధికారంలో ఎవరున్నా వ్యవసాయం మీద పెట్టలేదు. ఎందుకంటే కోట్లాది మంది రైతుల కంటే లక్షల మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద ఎక్కువ. అందుకే వ్యవసాయ రంగం ఇలా దిగజారిపోతున్నది, వ్యవసాయం గిట్టుబాటుగాక, అప్పులపాలైన రైతాంగ ఆత్మహత్యల గురించి వింటున్నాం.ఇతర రంగాల్లో అలాంటి పరిస్థితి లేనందుకు సంతోషమే గానీ ఇంకా ఎంతమంది రైతాంగాన్ని బలిపెట్టాలన్నదే ప్రశ్న.

దేశంలో జరిగిన అనర్దాలన్నింటికీ గాంధీ, నెహ్రూలే కారణం అని కాషాయ దళాలు నిరంతరం దుమ్మెత్తి పోస్తుంటాయి.వారి పూర్వీకులు బ్రిటీష్‌ వారి సేవకు బదులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొని నాయకత్వ స్థానాలకు వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా, ఎందుకు ఆ పని చేయలేదో చెప్పగలరా ? పోనీ వాజ్‌పాయి, ఇప్పుడు నరేంద్రమోడీ ఏలుబడిలో పరిశోధన అభివృద్ది రంగాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు, ఇతర దేశాలతో ఎందుకు పోటీపడటం లేదో అయినా చెప్పాలి.ఎవరు అడ్డుకున్నారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయిష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకొనేవారి ఒళ్లో కూర్చుని రెండువేల సంవత్సరాల నాడే భారత్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, వినాయకుడికి ఏనుగు తల అమర్చటం దానికి నిదర్శనమని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అదే బాటలో గోమూత్రం తాగితే కాన్సర్‌ నయమౌతుందని బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ సెలవిచ్చినదాన్నీ దేశం చూసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్న నాగేశ్వరరావు ఇంకా ముందుకు పోయి మహాభారత కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ పరిజ్ఞానంతో 100 మంది కౌరవులు ఒకేతల్లికి జన్మించారని కూడా చెప్పారు. అదే నిజమైతే పాండవులు వేర్వేరు తండ్రులకు ఎలా పుట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులని చిత్రిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నవారు శాస్త్రపరిశోధనలను ప్రోత్సహిస్తారా ? అమెరికాలోని లోవా విశ్వవిద్యాలయం చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.ఓయిసిడి సమాచారం(2022) ప్రకారం 2000-2002 మధ్య వ్యవసాయ పరిశోధనలకు అమెరికా, భారత్‌,బ్రెజిల్‌ దేశాలలో ఒక బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ప్రభుత్వాలు ఖర్చు చేశాయి.అదే 2019-21నాటికి చైనా ఖర్చు ఏడాదికి 1.3 నుంచి 6.6బిలియన్లకు పెరిగింది. అమెరికా,భారత్‌,బ్రెజిల్‌ చేసిన మొత్తం ఖర్చు కంటే చైనాలో ఎక్కువగా ఉంది.

దశాబ్దాల పాటు కొనసాగిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి తన అజెండాకు అనుగుణంగా వ్యవహరించేందుకు నీతి అయోగ్‌ను నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే గాంధీ, నెహ్రూలు అడ్డుకొని ధర్నాలకు దిగిన ఉదంతాలేమీ లేవు.నీతి అయోగ్‌ 2025లో విడుదల చేసిన పదకొండవ పత్రంలో ఏం చెప్పిందో తెలుసా ! 1995-96లో కేంద్ర ప్రభుత్వం జిడిపిలో అన్ని రకాల పరిశోధనలకు కేటాయించిన మొత్తం 0.61 శాతం కాగా 2005-06లో అది 0.81కి పెరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015-16లో 0.69శాతం, 2020-21లో 0.64శాతానికి పతనమైంది.వ్యవసాయ పరిశోధనలకూ ఇదే గతి అని వేరే చెప్పనవసరం లేదు.జిడిపిలో కనీసం రెండు శాతం కేటాయించాలని గతంలో ప్రణాళికా సంఘం సిఫార్సు చేసింది.దీని గురించి మోడీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఎందుకు మాట్లాడటం లేదు ? ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2020లో తలసరి పరిశోధన పెట్టుబడి ఇజ్రాయెల్‌ 2,438 డాలర్లతో ప్రపంచంలో అగ్రగామిగా ఉండగా, తరువాత 2,192 డాలర్లతో అమెరికా,తొమ్మిదవ స్థానంలో ఉన్న చైనా 250, పద్నాలుగవ స్థానంలో 13 డాలర్లతో మనం ఉన్నాం. వీటినే అదే ప్రపంచ బ్యాంకు మరోవిధంగా చెప్పింది. జిడిపిలో ఇజ్రాయెల్‌ 5.4, అమెరికా 3.5శాతం కేటాయించగా చైనా 2.4, మనదేశం 0.7శాతం కేటాయించింది.అంతేనా ప్రభుత్వ రంగంలో మొత్తం పరిశోధనా సంస్థలు అమెరికా 727, చైనాలో 353, భారత్‌లో 18 ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక అంశాలను నీతి అయోగ్‌ తన పత్రంలో పేర్కొన్నది. ఇంత దరిద్రంగా ఉంటే మన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు ఎలా పెరుగుతాయి, నాణ్యతలో ప్రపంచంలో ఎలా పోటీపడతాయి ? మోడీ విధానాలతో 2047నాటికి దేశం ఎక్కడికో పోతుందని నమ్మే వారు దేశంకోసం-ధర్మం కోసం బుర్రలు పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదా ! నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌ పర్యటన జరిపి ఏం నేర్చుకొని వచ్చారు.ఇజ్రాయెల్‌ పితృస్వామికం, మనది మాతృస్వామికం అని చెప్పారు.దీని మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు ఎంతగా అపహాస్య చేశారో తెలిసిందే. అక్కడి నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే పాలస్తీనా ప్రాంతాలలో ఇజ్రాయెల్‌ యూదులను ఎలా ప్రవేశ పెట్టి జనాభా నిష్పత్తిని ఎలా మార్చివేసిందో, కాశ్మీరులో కూడా అలాగే చేయాలని ప్రయోగాలు చేసింది.పెగాసెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు వచ్చి విమర్శనాత్మకంగా ఉండే మీడియా, రాజకీయంగా విబేధించే పార్టీల నేతల సమాచారాన్ని దొంగచెవులతో వినేందుకు చూసింది, వివిధ దేశాల్లో హంతక దళాలతో హత్యలు ఎలా చేయించవచ్చో నేర్చుకున్నది తప్ప మరొకటి కాదు.

చరిత్రలో నరేంద్రమోడీ ఏ ప్రధానీ వెళ్లనన్ని సార్లు చైనా వెళ్లారు, దాని నేతలతో భేటీ అయ్యారు.పోనీ చైనా నుంచి అయినా నేర్చుకున్నారా అదీ లేదు. ఓయిసిడి నివేదిక ప్రకారం 2019-21 సంవత్సరాలలో చైనా వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1.6లక్షల కోట్ల డాలర్లు, అమెరికాలో 0.4,భారత్‌ విలువ 0.2లక్షల కోట్ల డాలర్లు మాత్రమే.మనదేశంతో పోలిస్తే చైనా విస్తీర్ణం చాలా ఎక్కువ, దానిలో 10.6శాతం 1.02మిలియన్ల చదరపు కిలోమీటర్లలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. అదే మనదేశంలో 52.8శాతం భూమి 1.69మిలియన్‌ చదరపు కిలోమీర్లలో సాగు చేస్తున్నాం.అయినా మన ఉత్పత్తి విలువ తక్కువగా ఎందుకుందో చైనాలో ఎక్కువ ఎందుకో ఎప్పుడైనా మోడీ తెలుసుకున్నారా ! ప్రపంచం మొత్తంలో ఉన్న భూమిలో 11.6శాతం మాత్రమే సాగులో ఉంది,భారత్‌ అగ్రస్థానంలో ఉండగా అమెరికాలో 17.1, రష్యాలో 7.4శాతంలో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రభుత్వ రంగం చేస్తున్న ఖర్చు గురించే మాట్లాడుకున్నాం. ప్రైవేటు రంగం కూడా ఇటీవలి సంవత్సరాల్లో పరిశోధనలకు ఖర్చు చేస్తున్నది.అది గుత్త సంస్థలకు మాత్రమే లాభాలు చేకూర్చుతున్నది తప్ప అందరికీ కాదు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం వ్యవసాయ పరిశోధనల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది.అక్కడ ప్రభుత్వ ఖర్చు తగ్గుతున్నది. చైనాలో ప్రైవేటు పరిశోధనలు దాదాపు లేవు.భారత్‌,బ్రెజిల్‌, ఐరోపా యూనియన్‌లో పెరుగుతున్నాయి.. ప్రైవేటు రంగం కేంద్రీకరణ అంతా మార్కెట్లో గిరాకీ, లాభం ఉన్నవాటి మీదే ఉంటుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గటం వలన టిఎఫ్‌పి(టోటల్‌ ఫ్యాక్టర్‌ ప్రొడక్టివిటీ) సూచిక అమెరికాలో ఇటీవలి కాలంలో ఆరుశాతం తగ్గింది.దీని అర్ధం ఏమిటంటే పదేండ్ల కాలంలో ఉత్పాదకత అమెరికాలో లాభసాటిగా లేదు.అందుకే పెద్ద ఎత్తున ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి అక్కడి ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో గుమ్మరించేందుకు అదిరింపులు, బెదరింపులు చేస్తున్నది.

మనువాదులు, సనాతనులుగా చెప్పుకొనేందుకు గర్వపడుతున్నవారు ఇటీవలి కాలంలో వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే వాదనలను ముందుకు తెస్తున్నారు.జర్మన్‌ హిట్లర్‌తో సహా పలువురు విదేశీయులు వివిధ రూపాల్లో వచ్చి మన పురాణాలు, వేదాలను తమ దేశాలకు తీసుకుపోయి వాటిలో ఉన్న విజ్ఞానాన్ని తస్కరించి తమవిగా చెప్పుకొని అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పేవారి సంగతి తెలిసిందే. అదే నిజమైతే మనం ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించటానికి బదులు సమాజానికి అజ్ఞానాన్ని ఎందుకు పంచినట్లు ?ఆంగ్లేయులు ఇతర ఐరోపావారు మనదేశానికి రాకముందే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, తరువాతే వారి అదనపు ఉత్పత్తులను అమ్ముకొనేందుకు మనతో సహా ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు. పురాణాల్లో ఉన్న కొన్నింటికి ఆధునిక గణిత, శాస్త్రసిద్దాంతాలను అంటగడుతూ ఇవన్నీ గతంలోనే మనవారికి తెలుసని గతం గురించి గొప్పలు చెప్పుకుంటాయి కాషాయ దళాలు, వాటి తప్పుడు ప్రచారాన్ని తలకు ఎక్కించుకున్నవారు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఏక పార్టీ నియంతృత్వం, దాని విధానాలు మనకు పనికి రావు, చైనీయులు కాపీ కొడతారు అని సొల్లు కబుర్లు చెబుతారు.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని, సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు చెబుతున్నమాట నిజం. కానీ ఉత్పత్తులు ఎలా చేయాలో, పంటలు ఎలా పండించాలో నేర్చుకొనేందుకు ఆడలేక మద్దెల ఓటిగా ఉందని సాకుచెప్పినట్లుగా సిద్దాంతాలతో పనేముంది ?అన్నీ అందరికీ తెలియవని మన పురాణాలే చెబుతున్నాయి. కుమారిల భట్టు వేదపండితుడే అయినప్పటికీ మిగతా అంశాల గురించి తెలియదు. బౌద్దం, జైనుల తత్వశాస్త్రం గురించి అధ్యయనం చేయటానికి వారి ఆశ్రమాలకు మారువేషంలో వెళ్లి అధ్యయనం చేసి తరువాత వాదించాడని చెబుతారు.ఆదిశంకరుడు సైతం పరకాయ ప్రవేశ విద్య ద్వారా కామకళా శాస్త్రాన్ని నేర్చుకొని ఉభయ భారతీదేవితో వాదించి ఆమె భర్త మండన మిశ్రుని శృంగేరి మొదటి పీఠాధిపతిగా నియమించినట్లు చెబుతారు. ఇక్కడ సమస్య ఏమంటే మన ఘనాపాటీలు, సంస్కృత పండితులు ఇంతవరకు వాటిలో ఉందని చెబుతున్న విజ్ఞానాన్ని బయటకు తీయలేదు, నూతన ఆవిష్కరణలు చేయలేదు.ఇప్పటికైనా ఆదిశంకరుల మాదిరి పరకాయ ప్రవేశం చేసిన చైనా, ఇతర దేశాల నుంచి దేశం కోసం-ధర్మం కోసం దేశభక్తులుగా మారి ఆధునిక యుద్ద విమానాల సాంకేతిక పరిజ్ఞానాలను సేకరిస్తారా ? పారిశ్రామిక,వ్యవసాయ రంగంలో వృద్ధికి తోడ్పడతారా ? పడక కుర్చీల కాలక్షేపపు కబుర్లు చెబుతూనే ఉంటారా ?

మూడు ఇరాన్‌ ప్రతిపాదనలకు ట్రంప్‌ తిరస్కరణ : ఊబిలో కూరుకుపోవద్దని హెచ్చరించిన జర్మనీ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రతిష్ఠంభనలో ఉన్న కాల్పుల విరమణ చర్చలు ఫలప్రదమయ్యేందుకు తాజాగా ఇరాన్‌ ముందుకు తెచ్చిన మూడు ప్రతిపాదనలను డోనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించినట్లుగా వార్తలు.హార్ముజ్‌ జలసంధికి మరోవైపున ఉన్న ఓమన్‌, రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌తో చర్చించిన తరువాత టెహరాన్‌ తన ప్రతిపాదనలను పాకిస్తాన్‌కు అందచేసింది.వాటి మీద తమ నేత సంతోషంగా లేరని అధ్యక్ష భవనపు మీడియా అధికారిణి కరోలిన్‌ వెల్లడించారు.సోమవారం నాడు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అర్గాచీ సెంట్‌ పీటర్స్‌బర్డ్‌లో భేటీ తరువాత ఇరాన్‌, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల ప్రయోజనాలకు తద్వారా సాధ్యమైనంత త్వరలో మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని పుతిన్‌ హామీ ఇచ్చాడు.తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే వెంటనే చర్చలకు సిద్దమే అని ఇరాన్‌ ప్రకటించింది.వాటి గురించి లెబనాన్‌, ఇతర మీడియాల్లో వచ్చిన వార్తలను బట్టి మూడు ప్రతిపాదనల సారాంశం ఇలా ఉంది. ఇరాన్‌, లెబనాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి, భద్రతకు హామీ ఉండాలి.ఇది జరగకుండా ఈ దశలో చర్చలకు ఇరాన్‌ సిద్దం కాదు.ఈ మొదటి దశ మీద అంగీకారం కుదిరిన తరువాత రెండవ దశలో హార్ముజ్‌ జలసంధి నిర్వహణ గురించి చర్చలు ముందుకు పోతాయి, ఓమన్‌తో సమన్వయం చేసుకొని నూతన చట్టపరమైన పరిధి గురించి ఇరాన్‌ ముందుకు పోయే అంశం గురించి చర్చలు జరుగుతాయి. ఆ తరువాత అణుశుద్ది, సంబంధిత సమస్యలపై చర్చకు ఇరాన్‌ ముందుకు వస్తుంది. దీని అర్ధాన్ని సూటిగా చెప్పుకోవాలంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆగిపోవాలి, హార్ముజ్‌ జలసంధిని చెరపట్టిన అమెరికా విరమించాలి.ఈ ప్రతిపాదనలపై ట్రంప్‌ పెదవి విరిచినట్లు వార్తలు రావటంతో చమురు మార్కెట్‌లో బ్రెంట్‌ రకం ధర 111డాలర్లకు అటూ ఇటూగా పెరిగింది.అంతకు ముందు జరిగిన పరిణామాల్లో రెండవసారి చర్చలకు ఇస్లామాబాద్‌ వచ్చిన ఇరాన్‌ ప్రతినిధి వర్గం అమెరికన్ల కోసం ఎదురు చూడకుండా వెనుదిరిగివెళ్లిపోయింది.దాంతో అమెరికా ప్రతినిధులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.రెండవ సారి చర్చలు జరగాలంటే జలసంధి దిగ్గంధనాన్ని ట్రంప్‌ విరమించాలని ఇరాన్‌ పదే పదే చెప్పింది. ఇప్పటి వరకు తాము 38 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ కేంద్రం సోమవారం ఉదయం పేర్కొన్నది. మార్చినెల 2 నుంచి ఇజ్రాయెల్‌ దాడుల్లో 2,521 మంది తమ పౌరులు మరణించారని, 7,804 మంది గాయపడినట్లు లెబనాన్‌ తెలిపింది. ఏప్రిల్‌ 17న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించినా ఇజ్రాయెల్‌ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతూనే ఉంది. అక్కడ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్న హిజబుల్లా ఆ ఒప్పందాన్ని అంగీకరించటం లేదని ప్రకటించింది.రక్షణ శాఖ ట్రంప్‌ను తప్పుదారి పట్టిస్తున్నదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అనుమానిస్తున్నట్లు వార్తలు.

బలహీనత ఏమిటో తెలిసిన తరువాత ఐరోపా దేశాలు డోనాల్డ్‌ ట్రంప్‌ను, అమెరికాను ఒక ఆట ఆడుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.ఇప్పటి వరకు నోటి దురుసుతనంతో ట్రంప్‌ అనేక విధాలుగా నాటో కూటమి దేశాలను అవమానించాడు, బెదిరించాడు.ఇప్పటివరకు లోపలదాచుకున్నదంతా ఐరోపా నేతలు బయటకు వెళ్లగక్కుతున్నారు. రానున్న రోజుల్లో సంబంధాల గురించి సంయమనం పాటిస్తున్నారు. అమెరికా-ఐరోపా మిత్రుల మధ్య ఉన్న విభజన మరింత పెరగటం కనిపిస్తున్నది.దానికి నిదర్శనమే జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ సోమవారం నాడు అసాధారణంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు.ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో మాదిరి ఊబిలో దిగేట్లుగా వాషింగ్టన్‌ వైఖరి ఉన్నదని, ఎలాంటి వ్యూహం లేకుండా దాడులకు దిగిందని, అదే ఇప్పుడు పరిస్థితిని సంక్లిష్టం గావించిందని చెప్పటం మూమూలు విషయం కాదు.ఇరాన్‌ పైచేయి సాధిస్తున్నదని, యావత్‌ ఐరోపా ఆర్థికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నదని కూడా మెర్జ్‌ చెప్పాడు. అందరూ అనుకున్నదాని కంటే ఇరాన్‌ బలంగా ఉందని, దాని నాయకత్వం అమెరికాను అవమానించిందని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు.మిత్రదేశాలు ప్రైవేటు వ్యవహారంగా ఎంతో కాలం ఇబ్బందులను మూసిపెట్టుకోలేవని ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ నేత చెప్పాడు. వివాదాల్లో దిగటం కాదు, దాన్నుంచి బయటకు కూడా రావాలి, సంఘర్షణలతో తలెత్తే సమస్యలు ఇలాగే ఉంటాయి, ఎంతో బాధాకరంగా ఇరవై ఏండ్లు ఆఫ్ఘనిస్తాన్‌లో, ఇరాక్‌లో కూడా చూశామని మార్స్‌బెర్గ్‌ అనే పట్టణంలో విద్యార్ధుల సమావేశంలో చెప్పాడు. ఇరానియన్లు ఎంతో నైపుణ్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు లేకపోతే ఎంతో సమర్ధవంతంగా చర్చలు జరపటం లేదని కూడా వర్ణించవచ్చు.అమెరికన్లను ఇస్లామాబాద్‌కు రప్పిస్తున్నారు, ఎలాంటి ఫలితాలు లేకుండానే వెనక్కు పంపిస్తున్నారు,ప్రత్యేకించి ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ అని పిలిపించుకొనే వారు యావత్‌ అమెరికాను అవమానపరిచారని ఆరోపించాడు. జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించేందుకు జర్మనీ సహాయం చేస్తుందని అయితే అది పోరు ముగిసిన తరువాత మాత్రమే జరుగుతుందని కూడా చెప్పాడు. నిజానికి ఇరాన్‌ తన సత్తాను చాటుకుంది తప్ప అమెరికాను అవమానించలేదు. ఎదురులేని ప్రపంచ రారాజునని విర్రవీగుతున్న అమెరికా పరిమితులను తాజా పరిణామం స్పష్టం చేసింది. మీ పరువు మీరే తీసుకున్నారు, అనుభవించండి అని చెప్పాలనుకున్న జర్మనీ బయటకు మాట్లాడలేక ఇరాన్‌ పేరుతో ఆ వ్యాఖ్య చేసిందని చెప్పవచ్చు. ఐరోపా దేశాలను ట్రంప్‌ ఈ వివాదం సందర్భంగా ఎంతగా అవమానించిదీ తెలిసిందే.

జరుగుతున్న దాడుల పరిణామాలతీరు,ఆర్థిక నష్టాల గురించి ఐరోపాలో అంతర్గతంగా ఉన్న ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని మెర్జ్‌ వెల్లడించినట్లు చెప్పవచ్చు, జర్మనీ వినియోగదారుల తీరు తెన్నుల సూచిక మే నెలలో 33.3 పాయింట్ల తిరోగమనంలో ఉండవచ్చని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన 2022 నుంచి నెలవారీ ఇంథన పరిస్థితి ఇంతగా దిగజారలేదు.వాణిజ్య సూచిక 2020లోని బలహీన స్థాయికి పడిపోయింది.పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరు రెండు యూరోలు (రు.221) దాటింది.దీంతో వాటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ధరలు పెరిగినా సరఫరాలో అనిశ్చితి కూడా ఐరోపాలో ఆందోళనకు దారితీస్తోంది.ఇంథన ధరలు విపరీతంగా పెరిగిపోవంటంతో ఫ్రాన్సులోని ట్రాన్స్‌వియా కంపెనీ మే, జూన్‌లో కొన్ని విమానాల ప్రయాణాలను రద్దు చేసింది. ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి సొమ్ము తిరిగి చెల్లిస్తామని లేదా తరువాత తిరిగి ప్రయాణించటానికి అవకాశం ఇస్తామని చెప్పింది.హార్ముజ్‌ జలసంధి రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో పెట్రోకెమికల్స్‌ కొరత ఏర్పడిందని దాంతో కండోమ్‌(గర్భనిరోధం లేదా సురక్షిత శృంగారం కోసం) ధరలను 30శాతం పెంచుతున్నట్లు ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న కారెక్స్‌ కంపెనీ ప్రకటించింది. ఏటా 500 కోట్ల కండోమ్‌లను ఈ కంపెనీ తయారు చేస్తున్నది,ప్రపంచ మార్కెట్‌లో 20శాతం వాటా కలిగి ఉంది. ఆర్థిక అనిశ్చితి ఉన్నపుడు కండోమ్‌లను ఎక్కువగా వాడతారని,ఈ ఏడాది 30శాతం డిమాండ్‌ అదనంగా ఉంటుందని, ధరలను పెంచకతప్పటం లేదని మలేసియాకు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది.

ఇరాన్‌పై దాడులతో అమెరికా ఆయుధ నిల్వలు ముఖ్యంగా క్షిపణుల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు వచ్చిన వార్తలను తాను నమ్మటం లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అంటున్నట్లు మీడియా పేర్కొన్నది.వాన్స్‌ ఈ పరిస్థితిని చూసి ఆందోళనపడినట్లు చెబుతుండగా ఆయుధాలకేమీ కొదవ లేదని ట్రంప్‌ యంత్రాంగం చెబుతున్నది. ఇరాన్‌పై దాడుల గురించి అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ చెబుతున్న అంశాలను వాన్స్‌ పదే పదే ప్రశ్నిస్తున్నాడు.చెబుతున్నది నిజమేనా అని పలువురితో మాట్లాడి ఆరా తీస్తున్నాడు. ఇరాన్‌పై దాడులకు దక్షిణ కొరియా నుంచి క్షిపణులను తరలించినపుడు తమ సంగతేమిటని ఆ దేశ అధ్యక్షుడు బహిరంగంగానే ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో, చైనా మీద ప్రయోగించేందుకు తైవాన్‌లో, రష్యాను అదుపు చేసేందుకు అంటూ ఐరోపాలో అమెరికా పెద్ద ఎత్తున ఆయుదాలను నిల్వచేసింది. వీటిలో ఏవైనా లోటు ఏర్పడితే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందంటూ వాన్స్‌ భయాన్ని వ్యక్తపరిచినట్లు అట్లాంటిక్‌ పత్రిక రాసింది. ఎనిమిదివారాల దాడిలో ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించామని ఆయుధాలకు ఎలాంటి లోటు లేదని రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ సైనిక ఉన్నతాధికారుల సమావేశంలో బహిరంగంగా చెప్పాడు.

మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ అమెరికాకు ఆగ్రహం తెప్పించే నిర్ణయం తీసుకుంది. మూడవ దేశం నుంచి ఇరాన్‌ వెళ్లాల్సిన వస్తువులను తమ భూభాగం ద్వారా చేరవేసేందుకు ఆరు మార్గాలను ప్రకటించింది.బలూచిస్తాన్‌లో సరిహద్దుల్లో వస్తుమార్పిడి కోసం కరాచీ, ఖాసిం, గద్వార్‌ రేవుల నుంచి ఏర్పాటు చేసింది.అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది.ఇరాన్‌ తన ఆహార అవసరాలకోసం దిగుమతుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నది.హార్ముజ్‌ జలసంధిలో అమెరికా అడ్డుకోవటంతో అది తన అవసరాలను కాస్పియన్‌ సముద్రం ద్వారా తెచ్చుకొనేందుకు పూనుకుంది. అందువలన ఇరాన్‌ చమురు రవాణాను అమెరికా అడ్డుకోగలదు తప్ప ఇతర ఇరాన్‌ దిగుమతులను నిరోధించలేదని చెప్పవచ్చు.వాటిని కూడా అడ్డుకొనేందుకు తెగబడితే సంక్షోభ స్వరూపమే మారిపోతుంది. చమురు ధరలు పెరగటంతో ప్రత్యామ్నాయ ఇంథనం గురించి వెతుకులాట ఎక్కువైంది.ఇది చైనాకు వరంగా మారినట్లు కనిపిస్తోంది.హరిత ఇంథన ఉత్పత్తులైన సోలార్‌ పలకలు, విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.ఫిబ్రవరితో పోలిస్తే 30శాతం విలువ పెరిగి మార్చినెలలో 25.77 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గతేడాది మార్చినెలతో పోలిస్తే విదేశాల్లో వాటి అమ్మకాలు 50శాతం పెరిగాయి. సోలార్‌ పలకల ఎగుమతి ఫిబ్రవరితో పోల్చితే మార్చినెలలో రికార్డు స్థాయిలో 68గిగావాట్లకు పెరిగాయి.దీనికి ప్రపంచమంతటా పెరిగిన చమురు ధరలతో పాటు చైనా పన్ను రాయితీల్లో చేసిన మార్పులు కూడా కారణమయ్యాయి.

కొసమెరుపు : స్వతంత్ర దేశాల విధానాలు ఎలా ఉండాలో అమెరికా ఇంకేమాత్రం నిర్దేశించలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.తన చట్టవిరుద్దమైన, గొంతెమ్మ కోరికలను వదులు కోవాలని ఇరాన్‌ రక్షణశాఖ ఉపమంత్రిó రజా తలాయి నిక్‌ షాంఘై సహకార దేశాల ప్రతినిధులతో చెప్పాడు. ఇరాన్‌ చేసిన మూడు ప్రతిపాదనల గురించి అమెరికా సమీక్ష చేస్తున్నదని వార్తలు రాగా ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు, అణుకార్యక్రమం మీద రాజీపడకూడదని సలహాదారులతో అన్నట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. తాజా ప్రతిపాదనల తరువాత మంగళవారం నాడు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. విశ్వాసం సన్నగిల్లుతున్నదని, జలసంధిపై చర్చలతో పరిష్కారానికి రావాలని ఐరాస కోరింది, అందరి మాటలను పెడచెవిన పెడుతున్న ట్రంప్‌కు ఈ మాటలు రుచిస్తాయా !

దేశం కోసం- ధర్మం కోసం : ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి విలువలు, వలువలు – ఒక పరిశీలన !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

జనాలు వెర్రి వెంగళప్పలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌(రాష్ట్రీయ స్వయం సేవక్‌) మేథావుల ప్రగాఢవిశ్వాసం.కొన్ని సందర్భాల్లో కొందరి తీరు చూస్తే నిజమే అనిపించకపోదు. వాట్సాప్‌ యూనివర్సిటీని చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అలవోకగా అందమైన మాటలతో అబద్దాలు, నీటి జాడలు కనిపించని ఎడారుల్లో కూడా మహాసముద్రాలు ఉన్నాయని చెప్పగలరు. ఎవరైనా నిలదీస్తే పురాతన కాలంలో ఉండేవని చెప్పాం అంటారు.పరస్పర విరుద్దంగా మాట్లాడగల మాయల మరాఠీలు. ” ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలను ప్రధాని మోడీ అనుపమానంగా ప్రచారం చేస్తారు, ఉత్తమ ప్రతినిధి ” ఇది 2026 ఏప్రిల్‌ చివరి వారంలో అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబలే చెప్పినదానికి మీడియా పెట్టిన శీర్షిక. ఈ పెద్దమనిషి వాషింగ్టన్‌లోని హడ్సన్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రసంగాల్లో చెప్పిన అంశాలు, పిటిఐతో మాట్లాడినవి మీడియాలో వచ్చాయి. నాలుగు నెలలకు ముందు ” బిజెపి కళ్లద్దాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ను చూడటం పెద్ద తప్పిదం ” 2025 డిసెంబరు చివరి వారంలో కొలకతాలో తమ సంస్థ శతవార్షికోత్సవాల ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పిన సుభాషితం.ఇద్దరూ ఆ సంస్థలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్ననేతలే. అయినా రెండు నాలుకలతో ఎందుకు మాట్లాడినట్లు ? జనాలకు రెండింటినీ పోల్చుకొని చూసే తీరిక, అవకాశం ఉండదని వారికి తెలుసు గనుక.మోడీ ప్రభుత్వ నిర్వాకాలను తమకు అంటగట్టవద్దని ఒక నోటితో, తమ విలువలను మోడీ గొప్పగా ప్రచారం చేస్తున్నారని, తమకు ప్రతీక అని మరోమాట. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి తెలిసినవారందరికీ అది ఎన్ని నాలుకలతో మాట్లాడుతుందో తెలుసు. ఆ సంస్థలో అమాయకంగా చేరుతున్నవారు, అది చెబుతున్న మాటలే పరమ సత్యాలని నమ్ముతున్నవారు దేశం కోసం- ధర్మం కోసం ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాల్సి ఉంది.ఇద్దరు అగ్రనేతలు రెండు విధాలుగా మాట్లాడటాన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే మోడీ వ్యతిరేక-అనుకూల ముఠాలకు ప్రతిబింబం.వారూ మానవమాత్రులేగా మరి ! నరేంద్రమోడీ తీరుతెన్నులను వ్యతిరేకిస్తున్నారనే కక్షతో 2005లో సంజరు జోషి అనే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపినేత సెక్స్‌ కుంభకోణంలో ఉన్నారంటూ వీడియోలు పంపిణీ చేయించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఒక మహిళతో ఉన్న దృశ్యాలు నిజమే అయితే సంఘపరివార్‌ సంస్థనేతల బండారానికి, కాకుంటే వారు కూడా కుట్రలు, ప్రతికుట్రలకు అతీతులు కారనటానికి నిదర్శనం.ఆ ఉదంతం తరువాత 2005లో ప్రధాన కార్యదర్శిపదవికి రాజీనామా చేశారు. అయినా మోడీ కక్ష తీరలేదని చెబుతారు. 2012 జోషి గనుక పార్టీ జాతీయ కార్యవర్గంలో ఉంటే సమావేశాన్ని తాను బహిష్కరిస్తానని పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నితిన్‌ గడ్గరీని బెదిరించారని, దాంతో జోషీ రాజీనామా చేశారు, ఆ వార్త వెలువడిన రెండు గంటల్లోనే తాను సమావేశానికి హాజరువుతున్నట్లు మోడీ ప్రకటించారని నాడు వార్తలు. ఒక నాడు బిజెపిలో కొన్ని రాష్ట్రాలలో చక్రం తిప్పిన జోషి(64) ఇప్పుడు నరేంద్రమోడీ దెబ్బకు విలవిల్లాడుతూ ఎలాంటి పదవులు లేకుండా ఇంటి దగ్గరే పార్టీ కార్యకర్తలతో కాలక్షేపం చేస్తున్నారు.హౌసబలే చెప్పినట్లు నరేంద్రమోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అంటే ఎవరూ చేసేదేమీ లేదు !

ఈ వారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల గురించి చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక పరామర్శలో వివరించటం సాధ్యం గాదు గనుక ఇద్దరు నేతల సుభాషితాలకే పరిమితం కావటం సముచితం. మేం మాట్లాడే భాషను, విలువలను తనదైన అనితర శైలిలో నరేంద్రమోడీ చెబుతారంటూ, మేము ఒక చెట్టునాటండి అంటే మోడీ అదే పదాలను ఉచ్చరించకపోవవచ్చు, తల్లిపేరుతో ఒక చెట్టు అంటారని హౌసబలే ఉదహరించారు.అనేక ప్రభుత్వ పథకాలు ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన మాదిరే ఉన్నాయని కూడా చెప్పారు.ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ విలువల గురించి చూద్దాం. సంఫ్‌ు ప్రచారక్‌లలో ఒకరైన నరేంద్రమోడీ కట్టుకున్న భార్యను వదలివేయటం గురించి దాచారు. అబద్దం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని అడిగేంత అమాయకులం అని కాషాయ దళాలు చెప్పుకుంటాయి. సినిమాల్లో, కథల్లో విలన్‌ తాను ఒంటరినని అమ్మాయిలను మోసం చేస్తాడు. మోడీ తనదైన శైలిలో తాను ఒంటరినని, అందువలన అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల సభల్లో చెప్పారు. నాలుగు అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలో భార్య గురించి నిజాలను దాచారు, కాంగ్రెస్‌ నేతలు మోడీ బండారం బయటపెట్టటంతో తరువాత రాయాల్సి వచ్చింది. ఆ తరువాత మరొక కత చెప్పారు. ఏమిటంటే మోడీకి తెలిసీ తెలియని వయస్సులోనే పెళ్లి చేశారని, వయస్సు వచ్చిన తరువాత దేశం కోసం-హిందూ ధర్మం కోసం భార్యను వదలివేశారని చెప్పారు.సనాతన ధర్మం ప్రకారం, ముఖ్యంగా దానికి కట్టుబడి ఉన్నామని, కాపాడలని ప్రవచించే వారు వివాహం ఎలా చేసుకున్నప్పటికీ భార్యను వదలివేయకూడదు. చిన్నతనంలో తెలియక పెళ్లి చేసుకున్నారనుకుందాం వయస్సు బుద్ధి వికసించిన తరువాత అయినా తిరిగి భార్యను చేరదీయాలా వద్దా ! అనేక మంది ప్రచారక్‌లు వయస్సు మీరిన తరువాత వివాహాలు చేసుకున్నారు.వారిని చూసి అయినా మోడీ తన భార్యను కాపురానికి తెచ్చుకోలేదు, కనీసం విడాకులు ఇచ్చి చట్టపరంగా తెగతెంపులు చేసుకోలేదు. ఇలాంటి వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అని చెబుతున్నారు, అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలు ఇలాగే ఉంటాయా అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే …..!

సంఫ్‌ు చెబుతున్నమాదిరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటున్నాయని హౌసబలే తన భుజాన్ని తానే చరుచుకున్నారు.యుపిఏ పాలనా కాలంలో జాతీయ సామాజిక సహాయ పధకం(ఎన్‌ఎస్‌ఏపి) కేంద్రం ప్రారంభించింది.దీన్లో 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మొత్తం మూడు కోట్ల మందికి పైగా పెన్షన్‌ ఇస్తున్నారు.నరేంద్రమోడీలో ఎంత మానవత్వం ఉట్టిపడుతున్నదంటే ఆయన అధికారానికి వచ్చినపుడు ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపు 10,547 రూపాయలు,తాజా కేటాయింపులు రు.9,652 కోట్లు. కేంద్ర బడ్జెట్‌లో 0.58శాతం నుంచి 0.2కు దిగజారింది. దేశంలో ఏడాదికేడాది వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదని తెలుసు, వారికి నెలకు ఇచ్చే ముష్టి 200,300 రూపాయలు ఏమూలకు వస్తాయో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి. ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు పెంచలేదు, ఈ పధకం కూడా తాము చెప్పినట్లే ఉందని వారు చంకలు కొట్టుకుంటున్నారా ? తమ మార్గదర్శకంలో నడుస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎంతెంత పెన్షన్లు ఇస్తున్నారో, అవి సరిపోతున్నాయో లేదో ఎప్పుడైనా వృద్దుల దగ్గరకు వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌ ” స్వచ్చంద సేవకులు ” యోగక్షేమాలు విచారించారా ? విచారించిన తరువాత కూడా ఈ మొత్తాలను పెంచాలని కేంద్రానికి సూచించాలని వారికి తట్టలేదా ?మార్గదర్శక్‌ మండల్‌ పేరుతో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారిని ఒక దగ్గర పెట్టారు, వారు కూడా వృద్దాప్య పెన్షన్‌ పెంచాలని మోడీకి సలహా ఇవ్వలేకపోయారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు ఇచ్చిన సబ్సిడీలు ఏ విధంగా పెరిగాయో మానవత్వ ముఖాలు ఉన్నట్లు చెప్పుకుంటున్న వారికి తెలియదా ! వివిధ రాష్ట్రాలు దయాదాక్షిణ్యాలతో తమ బడ్జెట్ల నుంచి అదనపు మొత్తాలను పెన్షన్లు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగువేలు, తెలంగాణాలో రెండువేలు ఇస్తున్నారు.నెలకు రెండు వందలు, మూడు వందలు ముష్టిమాదిరి వేస్తున్న నరేంద్రమోడీ తమ బాటలో నడుస్తున్నారని చెప్పుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి జనాలు ఆలోచించుకోవాలి.మోడీకి కుటుంబం లేదు, తల్లిని ఆయన సోదరులే చూసుకుంటున్నారని విన్నాం. అటువంటి వారికి వృద్దులు, ఒంటరి మహిళల జీవితాలు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తాయి ! ఆయనకు తెలియదు, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పరు !!

మహిళా రిజర్వేషన్‌ గురించి నరేంద్రమోడీ నాయకత్వం ఆడిన గొప్ప నాటకం తమ రచనే అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుందా ?వాజ్‌పాయి పాలనా కాలంలో అంతకు ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టటం విఫలమైన చరిత్ర అందరికీ తెలిసిందే. 2014 నుంచి 2023వరకు మోడీ దాన్ని పట్టించుకోలేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తు చేయలేదంటే వారికి తెలియకనా, కానే కాదు, 2024 ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్‌ అంశాన్ని ముందుకు తెచ్చి ఓట్లు దండుకొనేందుకు రూపొందించిన పెద్ద పథకం. తదుపరి జనాభా లెక్కల తరువాతనే అది అమల్లోకి వస్తుందనే షరతును దానికి తగిలించారు. అప్పటికి జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు,గతంలో విధించిన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థకరణ అంశం గడువు 2026లో ముగుస్తుందనీ తెలుసు. కానీ మూడు సంవత్సరాల ముందే దాన్ని చేపట్టారంటే మరుసటి ఏడాది జరిగే ఎన్నికల కోసమే.ఈ అంశాన్ని మరోసారి 2029 ఎన్నికలకు వినియోగించుకోవాలనే మరో ఎత్తుగడకు తెరతీశారు.మహిళల పేరుతో తమకు అనుకూలంగా ఉండేట్లు ఉత్తరాదిలో సీట్లు పెంచాలని చూశారు. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేదనీ తెలుసు. మోడీ అత్యంత ప్రజాస్వామికవాది అని చెబుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అవసరమైన మెజారిటీ లేదని తెలిసి కూడా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని ముందుగా చర్చించాలనే సలహా మోడికి ఇవ్వలేదా ? లేక ప్రతిపక్షాలను బ్లాక్‌మెయిల్‌ చేయాలనే దుష్టఆలోచన ఎవరి బుర్రలో పుట్టినట్లు ?కనీసం మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా రాజ్యాంగ సవరణ బిల్లులో ఏముందో చెప్పలేదు. అడుగడుగునా మహిళలను వంచించే ఎత్తుగడ, బుల్డోజ్‌ చేసే దుష్ట ఆలోచన తప్ప మరొకటి దీన్లో లేదు. ఇవన్నీ ఇలాంటి అతితెలివి ప్రదర్శన చేసిన వారి విలువలు, వలువలకు మచ్చుకు మాత్రమే.

బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ వేరు కాదు. అదే సంస్థచెందిన నాధూరామ్‌ గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేసినపుడు ఆ సంస్థ మీద నిషేధం విధించారు. దాంతో తాము ఒక సాంస్కృతిక సంస్థగా ఉంటామంటూ కేంద్రానికి లేఖ రాసి నాటి నెహ్రూ ప్రభుత్వంలో ఉన్న తమ అనుకూలురను రంగంలోకి దించి నిషేధాన్ని ఎత్తివేయించుకున్నారు. రాజకీయాలు చేసేందుకు 1951లో భారతీయ జనసంఘం అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థితి తరువాత 1977లో దాన్ని రద్దు చేసి జనతా పార్టీలో చేరారు.ఆ ప్రయోగం వికటించింది. పార్టీలో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యులుగా ఉండకూడదనే అంశం వచ్చినపుడు కావాలంటే మేం విడిపోతాం తప్ప సంబంధాలు వదులుకొనేది లేదంటూ 1980లో బిజెపిని ఏర్పాటు చేశారు. దాని గురించి హౌసబలే ఏం చెప్పారంటే ” వారు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు.అదే జనతా పార్టీ నుంచి విడివడి మరొక రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముఖ్యకారణం. ఆ విదంగా ఉన్న బొడ్డుతాడు బంధాన్ని విచ్చిన్నం చేయలేరు.” అయినా రెండూ వేర్వేరు సంస్థలని జనాన్ని నమ్మించేందుకు బుకాయిస్తారు. హిందూ గుర్తింపు నాగరికతపరమైనది తప్ప మతం పరమైంది కాదు అని అమెరికన్లను నమ్మించేందుకు హౌసబలే ప్రయత్నించారు.తాము హిందువుల ఐక్యత,ఉద్దరణ కోసం పనిచేస్తున్నామని మరోవైపు చెబుతారు. భారతీయులనే మాట వారి నోట రాదు.ఈ దేశంలో కోట్లాది మంది ఇతర మతాలవారు ఉన్నారు. నిజంగా భారతీయుల కోసం పని చేసే వారు అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను జరుపుతారు, లేదా కమ్యూనిస్టుల మాదిరి ఏ మతాన్ని ప్రత్యేకించి భుజానవేసుకోకుండా దూరంగా ఉంటారు.మరి ఆర్‌ఎస్‌ఎస్‌ దానికి భిన్నంగా కేవలం హిందూమత సభలు, పండగల్లోనే మునిగితేలు తుంది. ఇలాంటి సంస్థ భారతీయ సమాజాన్ని ఐక్యంగా ఎలా ఉంచుతుంది ? మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులిచారలు కనిపించకపోవచ్చు తప్ప మాసిపోవు. ఈ గడ్డమీద భారతీయ సంస్కృతి తప్ప హిందూమతానికి మూలమైన వివక్ష, దుర్మార్గపూరితమైన మనుసంస్కృతికి స్థానం ఉండదు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నవారందరూ నరేంద్రమోడీ వ్యవహారశైలితో ఏకీభవించటం లేదు గానీ విధిలేక అన్నివిధాలుగా మద్దతు ఇస్తారు.ఇప్పటికే దేశంలోని అన్ని రంగాలను ఆక్రమించాం, మంచితరుణం మించిపోతే రాదు అంటూ హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉన్మాదం బాగా తలకెక్కిన వారికి ఈ విషయంలో మోడీ తీరు నచ్చటం లేదు. ఆ పెద్దమనిషికి కార్పొరేట్ల సేవే ముఖ్యం,వారు లేకపోతే తనకు పదవి లేదని తెలుసు. మన కార్పొరేట్లు తమ లాభాల కోసం మతంతో సహా దేన్నయినా వినియోగించుకుంటారు, అయితే మతాన్ని పూర్తిగా రంగంలోకి దించి మతరాజ్యంగా మారితే నష్టమని వారికి తెలుసు. గనుక ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను పూర్తిగా అమలు జరిపేందుకు వారు సిద్దం కాదు. మరోవైపు సంఘపరివార్‌ పరిస్థితి ఏమిటి ? మోడీ లేకపోతే అధికారం లేదు, అది లేకపోతే తన అజెండాను ముందుకు తీసుకుపోలేదు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకే లేదా దాని అదుపు ఆజ్ఞలకంటే అంతర్జాతీయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు, జాతీయంగా కార్పొరేట్‌ అజండాను తలకెత్తుకున్నారు.ఈ ప్రక్రియలో కొన్ని అంశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా సమర్ధించలేదు, విబేధించనూలేదు. చెప్పరాని చోట తగిలిన దెబ్బ గురించి చెప్పుకోలేనట్లుగా దాని పరిస్ధితి ఉంది. కార్పొరేట్లను కాదంటే దాని పని ఖాళీ. మిత్ర వైరుధ్యం ఉంది. దానికి తోడు తనది సాధారణ మానవజన్మ కాదని, దైవ నిర్ణయం మేరకు అవని మీద అవతరించానని మోడీ బాబా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకే కడుపులో లేకున్నా కావలింతలను ప్రదర్శిస్తారు.ముందే చెప్పుకున్నట్లు ఇద్దరు సంఫ్‌ు జాతీయ నేతలు భిన్నంగా మాట్లాడారు.బిజెపికి జన్మనిచ్చిన సంస్థదే ఆధిపత్యం అని దాని నేతలు భావిస్తుంటే తమ రాజకీయాలతోనే బిజెపి అధికారానికి వచ్చింది, దాంతోనే ఆర్‌ఎస్‌ఎస్‌ బలపడింది తప్ప మీ గొప్పేమీ లేదని మోడీ, షా భావిస్తున్నారు.ఇరు పక్షాలకూ అహం సమస్య ఉంది.మోడీ చర్యలు నష్టదాయకమని భావించినపుడు పరోక్షంగా వాటితో తమకేమీ సంబంధం లేదని సంఘనేతలు చెప్పటం దైవాంశ సంభూతునికి సహజంగానే రుచించవు.తమది స్వతంత్ర సాంస్కృతిక సంస్థ అని మోహన్‌భగవత్‌ చెబితే అదే కుదురుకు చెందిన నరేంద్రమోడీ కాదు ప్రపంచంలో అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ(ఎన్‌జిఓ) అని ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు. భగవత్‌ హిందూత్వకు ప్రతీక అయితే మోడీని కొందరు హిందూ హృదయ సామ్రాట్‌ అని కీర్తిస్తున్నారు. రాముడు-హనుమంతుడి మాదిరి ఉండాలి తప్ప ఒకే గద్దెమీద ఇద్దరు దేవుళ్లకు అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని అవలక్షణాలూ సంఫ్‌ు సభ్యులకూ ఉంటాయి, వారేమీ అతీతులు కాదు.బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన జెపి నడ్డా 2024 మే నెలలో ఒక సందర్భంగా మాట్లాడుతూ అతల్‌ బిహారీ వాజ్‌పాయి కాలం నాటికీ ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికిలో మార్పు వచ్చిందన్నారు. ప్రారంభంలో మాకు అంత సామర్ధ్యం లేదు,చిన్న పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం ఉండేది.నేడు మేం పెరిగాం,సామర్ద్యం కలిగి ఉన్నాం.బిజెపి తనంతట తానే పని చేయగలదు, అదీ తేడా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతపరమైన రంగం, దాని పని అది చేస్తుంది అన్నారు. తాము కేవలం ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగం కాదు అని చెప్పటమే ఇది.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి, మరోమారు చర్చిద్దాం !

ఏమిరా బాలరాజూ…… బంగ్లాదేశ్‌ కంటే వెనుక బడిన జిడిపి ! కాషాయ దళాలు వీరంగం వేస్తే కుదరదు !! యుపిఏ చివరి రోజులు తిరిగి వస్తున్నాయా ?

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

వికసిత్‌ భారత్‌ పేరుతో దేశ జిడిపిని 2047 మూడో, రెండో స్థానానికో తీసుకుపోతారని జనమంతా ఎందురు చూస్తున్నారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జిడిపిలో భారత్‌ ఆరోస్థానానికి పడిపోయింది.తలసరి జిడిపి మనది 2.81వేల డాలర్లు కాగా బంగ్లాదేశ్‌ 2.91వేలతో ఎగువన ఉంది. చైనా 14.87వేలతో ఇంకా ముందుంది.బంగ్లాదేశ్‌తో పోలుస్తారా అంటూ కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేస్తే కుదరదు.చేదు నిజాలను అంగీకరించకతప్పదు మరి.ఇది ఐఎంఎఫ్‌ చెప్పిన సమాచారం. 1980 నుంచి 2000 వరకు రెండు దేశాల మధ్య స్వల్పతేడా ఉంది.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో మనకంటే బంగ్లాదేశ్‌ వెనుకబడి ఉంది.పన్నెండేళ్ల మోడీనోమిక్స్‌ అభివృద్ధి పథంలో దేశం నడిచిందని చెప్పిన తరువాత ఇప్పుడు మనం వెనుకబడిపోయాం.ఎంత చెట్టుకు అంతగాలి అంటారు గానీ, బంగ్లాదేశ్‌ చిన్న చెట్టు నుంచి ఎక్కువగా వస్తోంది.మొత్తం జిడిపిని జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి, ఇది వేదగణితంలో కూడా మారదు మరి. దీన్ని చూస్తుంటే ఒక సినిమాలో ఏమిరా బాలరాజూ నీవలన దేశానికి ఉపయోగం ఏమిటి అన్న మాట గుర్తుకు వస్తున్నది. ఇరాన్‌మీద జరుగుతున్న యుద్దంతో మనకేం సంబంధం లేదు, మన మీద ఎలాంటి ప్రభావం పడదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న తరుణంలో ఐఎంఎఫ్‌ నివేదిక వెలువడింది. ఒక్కసారిగా నాలుగో స్థానం నుంచి ఆరుకు దిగజారిందంటే మన వృద్ధి ఎంత బలహీనంగా ఉందో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆర్థిక స్థితి గురించి ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ నెలలో వేసిన అంచనాలు పరిస్థితిని వెల్లడించాయి. అయితే నాలుగు లేదా ఆరులో ఉన్నప్పటికీ సమీప దేశాలతో పోలిస్తే తేడాలు పెద్దగా లేవు. ఉదాహరణకు వంద నాలుగో స్థానం అనుకుంటే 101ఐదో స్థానం మాదిరిగా చెప్పుకోవచ్చు.తాజా ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం అమెరికా 32.38,చైనా 20.85,జర్మనీ 5.5, జపాన్‌ 4.38, బ్రిటన్‌ 4.26, భారత్‌ 4.15, ఫ్రాన్సు 3.27లక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగి ఉన్నాయి. అందువలన నాలుగు నుంచి ఆరు స్థానాల వరకు ఉన్న దేశాల్లో ఏ చిన్న మార్పు వచ్చినా వరుస మారుతున్నది.మన స్థానం ఎందుకు తగ్గుతున్నట్లు ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఎన్ని స్టెరాయిడ్లు ఇచ్చినా ఫలితం ఎందుకు రావటం లేదు !

రూపాయి పతనం గురించి మోడీ, ఇతర బిజెపి నేతలు మన్మోహన్‌ హయాంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకుంటే ఆడపిల్లలకంటే ఎక్కువగా సిగ్గుపడిపోతారు గనుక ఇప్పుడు మాట్లాడటం లేదు, కిందపడినా గెలుపు మాదే అన్నట్లుగా ఉన్నారు. గతంలో రూపాయి పతనమైతే మన్మోహన్‌ సింగ్‌ చేతగాని తనం, అవినీతి అన్నారు.ఇప్పుడు మరోవిధంగా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుకల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.వ్యవస్థా సంబంధిత సమస్యల కంటే రూపాయి మార్పులే జిడిపి స్థానం పడిపోవటానికి కారణమని, రానున్న సంవత్సరాలో భారత్‌ పుంజుకుంటుందని ఐఎంఎఫ్‌ చెప్పింది.జోతిష్కాలన్నీ అలాగే ఉంటాయి. ప్రపంచ జిడిపి లెక్కలన్నీ అమెరికా డాలర్లలోనే ఉంటాయి.అందువలన డాలర్‌తో ప్రతిదేశ కరెన్సీ విలువను బట్టి పరిస్థితి మారుతూ ఉంటుంది.మనదేశంలో ఉత్పత్తి ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే విలువ పడిపోతుంది. గడిచిన ఏడాది కాలంలో రు.80లలో ఉన్న మారకం రు.90లోకి పతనమైంది.అందుకే డాలర్ల లెక్కలో మన జిడిపి తగ్గింది.ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మన రూపాయి పాపాయి మీద వత్తిడిని మరింతగా పెంచాయి. ముడిచమురు ఉత్పత్తిలో మోడీ అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో 37.4మిలియన్‌ టన్నుల నుంచి ప్రస్తుతం 25మి.టన్నులకు పడిపోయింది, సహజవాయు ఉత్పత్తి కూడా తగ్గింది.ఈ మేరకు విదేశీ దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తున్నది.దీనికి గాను డాలర్లు కావాలి, వాటిని కొనుగోలు చేయాలంటే మన రూపాయి విలువ పతనం అవుతున్నది. ఇటీవలి కాలంలో మన స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు పెద్ద మొత్తంలో లాభాలు దండుకొని వెనక్కు తీసుకోవటం కూడా డాలర్లు తరలిపోవటానికి ఒక కారణం. తన డాలరు పెత్తనాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్‌ వంటి దేశాలనే తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు చూస్తున్న అమెరికా తన కరెన్సీ విలువ పతనం కాకుండా చూస్తున్నది. భారత ఆర్థిక సంవత్సరం 2025-26లో మన వృద్ధి రేటు 6.5శాతం ఉన్నప్పటికీ కరెన్సీ విలువ పదకొండుశాతం పతనం కాగా జపాన్‌ ఎన్‌ 10, బ్రిటన్‌ పౌండ్‌ రెండు శాతాల చొప్పున పెరిగాయి. అందుకే స్వల్పంగానే అయినప్పటికీ అవి రెండు మనలను వెనక్కు నెట్టి పైకి వెళ్లాయి. మన జిడిపి లెక్కింపు ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చిన కారణంగా తగ్గిపోయినట్లు కొందరు చెబుతున్నారు, అదే వాస్తవం అయితే అంతకు ముందు పాత ప్రాతిపదిక సంవత్సరాన్ని తీసుకొని ఎక్కువగా చూపి జనాన్ని మభ్యపెట్టారని అనుకోవాల్సి ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం వలన మనకెలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నారు. అలా జరగాలనే జనం కోరుకుంటున్నారు.అది నిజమా !ఇల్లు కట్టేటపుడు, పెళ్లి కుదిరిన తరువాత వాటిని పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కడబడితే అక్కడ అప్పు తెచ్చి ముగించటం తెలిసిందే. తరువాతే అసలు కథ మొదలౌతుంది.యుద్ధ ప్రభావం కూడా అంతే.మనకు అవసరమైన ముడి చమురు దిగుమతులను తగ్గించటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది.అవసరాలు పెరుగుతున్నపుడు దిగుమతులు కూడా పెరగాలి కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆత్మనిర్భరత నినాద కాలంలో మన స్వదేశీ ఉత్పత్తి 2014 38మిలియన్‌ టన్నులు ఉండగా ఇప్పుడు 25మి.టన్నులకు పడిపోయింది.అందువలన 88శాతం మేరకు దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది.రోజుకు సగటున 50లక్షల పీపాలను కొనుగోలు చేస్తున్నాం.ఈ మొత్తంలో 40శాతం హార్ముజ్‌ జలసంధి ద్వారా రవాణా అవుతుంది.వంటగ్యాస్‌ను 91శాతం గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.ఇప్పుడు దీనికీ ఆటంకం ఏర్పడింది.విదేశాల్లో ఉన్న భారతీయులు వందమంది అనుకుంటే 50మంది గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారు. వారు ప్రతిఏటా 50బిలియన్‌ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు.ఇప్పుడు ఎంత తగ్గిందో లెక్కలు తేలిన తరువాత మాత్రమే తెలుస్తుంది.యుద్దానికి ముందు మనం సగటున 67డాలర్లకు ఒక పీపా దిగుమతి చేసుకుంటే అది 110 డాలర్లకు పెరిగింది. 2022 నుంచి దిగుమతి ధర తగ్గినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి తగ్గుదల లేకుండా గోళ్లూడగొట్టి అధికమొత్తాలను వసూలు చేశారు.అందుకే తేలుకుట్టిన దొంగల మాదిరి ఏమీ మాట్లాడటంలేదు, అయితే తాత్కాలికమే.

పవర్‌ పెట్రోలు, పారిశ్రామిక అవసరాలకు వాడే డీజిల్‌ ధరలను మాత్రమే పెంచారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మొత్తం చమురు, గ్యాస్‌ ధరలను పెంచుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న.ఎందుకంటే నరేంద్రమోడీ జిగినీదోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడప్పుడే సంక్షోభాన్ని ముగించేట్లు లేడు. యుద్దానికి ముందు రోజుకు 33.5కోట్ల డాలర్లను దిగుమతులకు ఖర్చు చేస్తుంటే ఆ మొత్తం ఇప్పుడు 55 కోట్ల డాలర్లకు పెరిగింది.నలభై ఐదు రోజుల యుద్ద కాలంలో పెరిగిన అదనపు చమురు బిల్లు 970 కోట్ల డాలర్లు.ఇది మన కరెన్సీ 92వేలకోట్లకు సమానం.ముడి చమురు ధర ఒక పీపాకు పదిడాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు జిడిపిలో 0.4 నుంచి 0.5శాతం పెరుగుతుంది. గల్ఫ్‌ దేశాల నుంచి చమురు దిగుమతి చేసే టాంకర్ల బీమా ధరలు 400శాతం పెరిగాయి, రూపాయి విలువ నష్టం గురించి ముందే చెప్పుకున్నాం.చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 40శాతం పెరిగాయి, మన రూపాయి విలువ 11శాతం తగ్గింది. దీంతో ప్రతి పీపాకు మనం చెల్లించాల్సిన మొత్తం 55శాతం పెరిగిందని అంచనా. మరింత సులభంగా చెప్పాలంటే యుద్దానికి ముందు ఒక పీపాను మన రూపాయల్లో రు.5,695కు తెచ్చుకుంటే ఇప్పుడు రు.9,500 చెల్లించాల్సి వస్తోంది.ఈ మొత్తం జనాలు లేదా ప్రభుత్వం భరించాల్సిందే. మోడీ జనం మీద దయచూపుతారా ? పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కారణాలతో మన విదేశీమారక ద్రవ్యం100 బిలియన్‌ డాలర్లు తగ్గింది. యుద్దం కారణంగా వంటగ్యాస్‌ దిగుమతులు వెంటనే 30శాతం తగ్గాయి. దాంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం చమురుశుద్ది కేంద్రాలలో ఉప ఉత్పత్తులైన ప్రొపేన్‌ మరియు బుటేన్‌లను వంటగ్యాస్‌ తయారీకి మళ్లించాలని ఆదేశించింది, దాంతో 25శాతం మాత్రమే అదనంగా అందుబాటులోకి వచ్చింది. ఈ కారణంగా ఇప్పటికీ గ్యాస్‌ సరఫరా ఆలశ్యం అవుతున్నది. గ్యాస్‌ ధర రు.60 పెంచారు, సబ్సిడీ రు.40 రద్దు చేశారు, అంటే వంద రూపాయలు వడ్డించారు.మన భూగర్భ నిల్వల సామర్ద్యం 1.4లక్షల టన్నులే,రోజుకు 80వేల టన్నులు కావాలి గనుక రెండు రోజులకూ సరిపోదు. అందుకే వెంటనే కొరత ఏర్పడింది.

ఈ సంక్షోభం కారణంగా దాదాపు పన్నెండు బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు ముప్పులో పడినట్లు గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ) అంచనా వేసింది.నాలుగు లక్షల టన్నుల బాస్మతి బియ్యం రేవుల్లో నిలిచిపోయింది.కాండ్లా రేవులో అరటి పండ్లు పనికిరాకుండా పోయాయి.తేయాకు ఇరవైశాతం ఎగుమతులు ఆగిపోయాయి.ఇదే విధంగా మనం దిగుమతి చేసుకొనే ఆపిల్‌,ఇతర ఉత్పత్తులు కూడా ఆగిపోయాయి.దిగుమతి చేసుకొనే ఎరువులు నెల రోజులు ఆలశ్యం అవుతాయని, ఇప్పటికే 20శాతం ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రతి ఏటా 50 బిలియన్‌ డాలర్లు మాతృదేశానికి పంపుతున్నారు.ఈ మొత్తంలో మధ్య ప్రాచ్య దేశాల నుంచి 15బిలియన్‌ డాలర్లు వస్తున్నాయి.తాజా సంక్షోభంతో ఈ మొత్తాల మీద ప్రతికూల ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే తెలియదు.పశ్చిమాసియా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండదని తొలిరోజుల్లో మాట్లాడిన అధికారపక్ష నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.నీతి ఆయోగ్‌ తాజా నివేదికలో దేశవాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం గురించి చెబుతూ కరెంట్‌ ఖాతా లోటు పెరగనుందని చెప్పింది.దేశ ఎగుమతులు, దిగుమతుల్లో గల్ఫ్‌ ప్రాంత వాటా పన్నెండుశాతం ఉంది.యుఏయికి సరకులను పంపి అక్కడి నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తారు.ఇప్పుడు వాటికీ ముప్పు ఏర్పడింది.ఈ ప్రాంతం నుంచి మన ఎరువుల అవసరాల్లో 36శాతం, విలువైన రాళ్లు,లోహాలలో 32శాతం దిగుమతి చేసుకుంటున్నాము.మూడవ త్రైమాస కాలంలో యుద్దంతో నిమిత్తం లేని సమయంలో మన వస్తు ఎగుమతులు కేవలం 1.6శాతం పెరగ్గా దిగుమతులు 7.9పెరిగాయి.

ముడి చమురు ధరలు పెరగటం, కొరతల కారణంగా వృద్ధి రేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు ఉందని ఏప్రిల్‌ ఎనిమిదిన ఆర్‌బిఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా విధాన ప్రకటనలో పేర్కొన్నారు.ద్రవ్యోల్బణ లక్ష్యం నాలుగుశాతం కాగా 4.6శాతానికి పెరగవచ్చని ఆర్‌బిఐ పేర్కొన్నది.నెల రోజుల పాటు రష్యన్‌ చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ” అనుమతి ” ఇచ్చింది. అయితే గతంలో ట్రంప్‌ బెదిరించిన కారణంగా మనం దిగుమతులు తగ్గించిన కారణం కావచ్చు,మార్కెట్‌లో డిమాండ్‌ ఇతర కారణాలతో గతంలో రష్యా ఇచ్చిన రాయితీలు ఇప్పుడు లేకపోగా అదనంగా చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ప్రపంచ మార్కెట్‌ కంటే పీపాకు పదిహేను నుంచి ఇరవై డాలర్లు తక్కువగా రాయితీ ధరలకు రష్యా ముడిచమురును అందచేస్తే దాన్నుంచి ఉత్పత్తులు తయారు చేసి అంబానీ,నయారా కంపెనీలు విదేశాలకు లాభాలకు అమ్ముకున్నాయి తప్ప మన వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గించలేదు.ఇప్పుడు గతరాయితీలు పోగొట్టుకొని ప్రామాణిక బ్రెంట్‌ రకం కంటే రెండు నుంచి నాలుగు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.అమెరికా పాటలకు అనుగుణ్యంగా డాన్సులు చేస్తే ఇలాగే ఉంటుంది మరి.అతి తెలివి ప్రదర్శిస్తే వ్రతమూ చెడుతుంది, ఫలితమూ దక్కదు ! మొత్తంగా పన్నెండేళ్ల పాలన తీరు తెన్నులను చూస్తే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో యుపిఏ ఎదుర్కొన్న తీవ్ర పరిస్థితులు తిరిగి వస్తున్నాయా ? 2029లో మోడీ, బిజెపి పాలనకు తెరపడుతుందా ?

ఇరాన్‌పై అమెరికా దాడి : చర్చలు, కాల్పుల విరమణ నిరవధిక వాయిదా ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్‌ చర్చలు నిరవధికంగా వాయిదా పడినట్లు వార్తలు. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ వినతి మేరకు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు మంగళవారం నాడు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే తమ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. నిర్ణీత వ్యవధిని పేర్కొనలేదు గనుక నిరవధికం అనుకుంటున్నారు. మాటమార్చి మరోసారి ఏ చెబుతాడో తెలియదు. చర్చలంటూనే వివిధ దేశాల్లో ఉన్న 14 మంది ఇరానియన్లు, సంస్థలపై కొత్తగా ఆంక్షలను ప్రకటించాడు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో ఇరాన్ను దారికి తేవాలని చూస్తే కుదిరేది కాదని చెప్పవచ్చు. ఇస్లామాబాద్‌ ప్రయాణ సన్నాహాలు చేసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వాయిదా వేసుకున్నాడు.బుధవారం నాడు చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్‌ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా గొంతెమ్మ కోరికలను ముందుకు తెస్తోందని, ఇలాంటి స్థితిలో చర్చలంటే సమయం వృధాతప్ప మరొకటి కాదంటూ చర్చలుకు వచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో అమెరికా దిగ్బంధనం ముగిసేవరకు మాటల్లేవని అన్నది. కాల్పుల విరమణ పొడిగింపు గురించి గురువారం ఉదయం వరకు ఇరాన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పేరుతో అమెరికా బలగాలను కూడగట్టుకుంటున్నదని గతంలోనే అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మిలిటరీకి అనుకూలంగా టెహరాన్‌లో జనం వీధుల్లోకి వచ్చారు, ఈ సందర్భంగా ఒక ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగ వాహనాన్ని ప్రదర్శించారు. ఇరాన్‌ వద్ద దాడులకు ఉపయోగించే డ్రోన్లు, క్షిపణులు ఇప్పటికీ వేలాదిగా ఉన్నాయని అమెరికా రక్షణశాఖ గూఢచార నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.మరోవైపు ప్రత్యర్ధుల క్షిపణులను కూల్చివేసే అమెరికా పేట్రియాట్‌ వ్యవస్థలు సగం ఖర్చయినట్లు చెబుతున్నారు.

మంగళవారం రాత్రి వరకు జరిగిన పరిణామాలను ఒకసారి నెమరు వేసుకుందాం. గడువు ముగిసేలోగా తాము చెప్పినట్లు ఒప్పందం జరగకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్‌ మరోమారు బెదిరించాడు.తాను విజయం సాధించినట్లు కూడా చెప్పుకున్నాడు.గడువు పొడిగించేది లేదన్నాడు.తాము ఇప్పటికే 27 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ చెప్పుకుంది.దీని వలన ఇరాన్‌ రోజుకు 50కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నదని ట్రంప్‌ చెప్పాడు.ఉభయ దేశాలూ కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు అమెరికన్‌ మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ మాజీ అధిపతి డేవిడ్‌ పెట్రాస్‌ చెప్పాడు. ఒప్పందం కుదిరేట్లయితే స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే వచ్చి సంతకాలు చేస్తాడని లేదా వీడియో సమావేశంలో పాల్గ్గొంటారని మరోవైపు రాయిటర్స్‌ పేర్కొన్నది.ఉభయ పక్షాలు తమ తమ ఎత్తుగడలతో కొనసాగుతున్నాయి. ఆదివారం తమ నౌకను దిగ్బంధించటం ఓడదొంగల దుశ్చర్య వంటిదేనని ఇరాన్‌ పేర్కొన్నది.ఆ నౌకలో క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి వచ్చాయని మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు నికీ హేలీ ఆరోపించారు.నిజమే నిజమే చాలా ప్రమాదకరంగా చైనా వ్యవహరిస్తోందంటూ అమెరికా అనుకూల మీడియా వ్యాఖ్యాతలు భజన ప్రారంభించారు. ఆ కంటెయినర్‌ నౌకతో తమకు సంబంధం లేదని అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఖండించాడు.ఒక వైపు అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండగానే ఇరాన్‌ నౌక ఒకటి హార్ముజ్‌ జలసంధి నుంచి ఓమన్‌ గల్ఫ్‌ వైపు ప్రయాణించినట్లు వార్తలు, మరో రెండు నౌకలు కూడా దాటినట్లు చెబుతున్నా, అవి ఏ దేశానివో స్పష్టం కాలేదు.

పశ్చిమాసియా సంక్షోభం బుధవారం నాటికి 54వ రోజులో ప్రవేశించింది. నాలుగు నుంచి ఆరువారాల్లో ఇరాన్ను నాశనం చేసి తమ లక్ష్యాలను సాధిస్తానని ప్రగల్భాలు పలికిన డోనాల్డ్‌ట్రంప్‌ పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు.శుద్ది చేసిన యురేనియం బాంబుల తయారీకి దగ్గరలో ఉందని ఒకసారి చెబుతారు.దాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందే అంటారు. గతేడాది తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇప్పుడు వాటి నుంచి యురేనియాన్ని సేకరించటం చాలా కష్టం, దీర్ఘకాలం పడుతుందని సోమవారం నాడు ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు చైనా నుంచి భారీ విమానాల్లో ఆయుధాలు దిగాయని చీకట్లో బాణాలు వేసినట్లు ప్రచారం చేశారు.దానికి ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇప్పుడు క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు పంపుతున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.నిజం ఏమిటి ? అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ఏమున్నాయో తెలియదు. అమెరికన్లు చెప్పిన ప్రతిమాటను నమ్మాల్సిన అవసరం లేదు. అయితే బీజింగ్‌ నుంచి టెహరాన్‌కు రసాయనాలు పంపటం కొత్త కాదు, రహస్యమూ కాదు.మనతో సహా అనేక దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి,మనమూ కొన్ని రసాయనాలను ఎగుమతి చేస్తున్నాము. వాటిని దేనికి వినియోగించుకోవాలనే షరతులేమీ దిగుమతి చేసుకొనే దేశాలకు ఉండవు.ఉదాహరణకు అమెరికా కంపెనీలు చిప్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. వాటిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించవచ్చు, ఆయుధాల తయారీలో చొప్పించవచ్చు.చైనా సరఫరా చేస్తున్నదని చెబుతున్న రసాయనాలు కూడా అలాంటివే.ఉదాహరణకు చైనా నుంచి అమెరికాకు నచ్చని లేదా వ్యతిరేకించే దేశం చాకులను దిగుమతి చేసుకుంటే తమను పొడవటానికే అని నికీ హేలీ వంటి వారు గుండెలు బాదుకుంటారు. ఇదంతా అమెరికా ఆడించే నాటకంలో భాగం తప్ప మరొకటి కాదు.

తన నౌక ఎంవి టౌస్కాను ఓమన్‌ జలసంధిలో దిగ్బంధించిన తరువాత ఆ ఉదంతాన్ని విస్మరించి ఇరాన్‌ చర్చలకు వస్తుందని ఎవరూ భావించరు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి ఉండదు. అందుకే చర్చల తలుపులను పూర్తిగా మూసివేయకుండా ఎటూ తేల్చకుండా పరిణామాలను గమనిస్తున్నది. ఒప్పందం కుదిరితేనే ఇరాన్‌ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తానంటూ ట్రంప్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు. ఉభయదేశాలూ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి ముగియనుండగా పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అమెరికా స్వాధీనంలో ఉన్న నౌక గత ఆరువారాల్లో రెండు సార్లు ఇరాన్‌-చైనాల మధ్య రాకపోకలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే నౌకల తీరుతెన్నులను గమనించినపుడు ఒక దేశ రేవు నుంచి బయలు దేరిన అక్కడ నింపిన సరకులను మధ్యలో దించి మరోనౌక నుంచి తెచ్చిన వాటిని రవాణా చేయటం సాధారణంగా జరిగేదే. సదరు వస్తువులపై వేరే దేశాల తయారీ అనే స్టిక్కర్లు కూడా వేస్తారు. అసలు ఎక్కడ తయారైందనే ఆనవాలు లేకుండా లేదా మరోదేశ తయారీ అని ముద్రలు వేస్తారు. ఇరాన్‌ నౌకను ఒమన్‌ జలసంధిలో అమెరికా యుద్ద నౌక నుంచి ఆరుగంటలపాటు చేసిన హెచ్చరికలను నౌకా సిబ్బంది ఖాతరు చేయలేదు, ఇరాన్‌వైపు నడిపేందుకు చూశారు. దాంతో అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి ఇంజన్‌ గది నుంచి సిబ్బంది బయటకు రావాలని హెచ్చరించింది. సిబ్బంది ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడకపోవటంతో నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఒకవేళ అమెరికా గనుక తిరిగి దాడులకు పాల్పడితే తమ దగ్గర ఉన్న కొత్త అస్త్రాలను బయటకు తీస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

అమెరికా అనుసరించిన వైఖరితో హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ పట్టుబిగిసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటమే తన లక్ష్యం అన్న ట్రంప్‌ గడచిన 54 రోజుల్లో రోజుకో కొత్త లక్ష్యాన్ని ప్రకటిస్తుండగా టెహరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదానికే కట్టుబడి ఉంది.జలసంధి మీద ఇరాన్‌ అదుపు కలిగి ఉన్నప్పటికీ గతంలో దాన్ని ఒక ఆయుధంగా చేసుకోలేదు. అదే మాదిరి ఇప్పుడు కూడా ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్‌ వేసుకున్న అంచనాలు తప్పాయి.దాన్నే కాదు, ఎమెన్‌ జలసంధిని కూడా అవసరమైతే మూసివేయిస్తామని ఇరాన్‌ నేతలు ప్రకటించారు.అదే జరిగితే సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం ద్వారా హిందూమహా సముద్రంలోకి ప్రవేశించే రవాణా కూడా నిలిచిపోవటం అనివార్యం. ఇరాన్‌ వైఖరిని చూస్తుంటే రానున్న రోజుల్లో హార్ముజ్‌ను తన అదుపులో ఉంచుకొనేందుకు పూనుకున్నదని చెప్పవచ్చు.పట్టుసాధించటమేగాక అమెరికా దాడులతో తమకు కలిగిన నష్టాలను పూడ్చుకొనేందుకు ఆ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి సుంకం వసూలు చేసి పునరుద్దరణకు వినియోగిస్తామని కూడా ప్రకటించింది.పీపాకు ఒక డాలర్‌ వంతున పన్ను విధిస్తే ఒక్కో టాంకర్‌ ద్వారా ఇరవైలక్షల డాలర్ల రాబడి వస్తుంది.సాధారణ సమయంలో రోజుకు 120 నుంచి 150 నౌకలు ఆ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రపంచ వ్యాపితంగా వందల కోట్ల మంది జనాలను ఇబ్బందుల పాలు చేయటం తప్ప ఇంతవరకు అమెరికా సాధించిందేమీ లేదు.గతంలో అన్ని దుర్మార్గాల్లోనూ పాలుపంచుకున్న ఐరోపా మిత్రదేశాలు ఈసారి ముఖం చాటేశాయి.ఇరాన్‌ దాడులతో తాము కూడా నష్టపోతున్నప్పటికీ ప్రత్యక్ష పోరుకు దిగేందుకు గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకు నిరాకరించాయి. రానున్న రోజుల్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తే గల్ఫ్‌ దేశాలను కూడా ఎలా దెబ్బతీయగలదో ఇరాన్‌ నిరూపించింది.అది మరింత దూరం ప్రయాణించి దాడి చేసే క్షిపణులను రూపొందిస్తున్నది.ఈ రీత్యా కూడా పశ్చిమాసియాలో ఇరాన్‌ పట్టు పెరగనుంది.

పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తరువాత చైనా గురించి కూడా చర్చ జరుగుతున్నది.పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదంటూ ఆరోపణలు, ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.అసలు కారకులైన అమెరికా, ఇజ్రాయెల్‌ను వదలి బీజింగ్‌పై కేంద్రీకరించటం ఒక ఎత్తుగడలో భాగమే. తన ఇంథన భద్రతా చర్యల్లో భాగంగా ఇరాన్‌, గల్ఫ్‌ దేశాలతో సఖ్యతతో ఉండటమే గాక పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది.ఇరాన్‌-సౌదీ మధ్య ఉన్న దీర్ఘకాలిక విబేధాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించింది.అనేక దేశాలకు భరోసా ఇస్తున్నది. అమెరికా దుశ్చర్యలను ఖండిస్తున్నది తప్ప ఇరాన్‌ మీద పెద్దగా వత్తిడి తేవటం లేదు, భద్రతా మండలిలో దానికి అనుకూలంగా రష్యాతో కలసి వీటోను కూడా ప్రయోగించి రక్షించింది. తన ఇంథన భద్రతలో భాగం ఒకటో, రెండో దేశాలపై ఆధారపడటంలేదు. అమెరికా కుట్రలను ముందుగానే గ్రహించిన కారణంగా కొన్ని నెలల పాటు సరఫరా ఆగినా తట్టుకొనేందుకు అవసరమైన నిల్వలను చేసుకున్నది.ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత స్వల్పంగా చమురు ధరలను పెంచిన చైనా తాజాగా అంతకంటే ఎక్కువగా తగ్గించింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలతో వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకుంది. ఆ ప్రాంత దేశాలతో 2024లో 257 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను నిర్వహించింది. ఈ మొత్తం పశ్చిమదేశాలతో సాగించిన మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా ఇరాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న తీరును చూసిన తరువాత పేద, వర్ధమాన దేశాల్లో చైనా పలుకుబడి పెరగటం, అమెరికా ప్రభావం తగ్గటం అనివార్యం !బ్‌ ూ్‌శీషసర

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మాహుతిదళ బుడిబుడి రాగాలు – భారత మహిళలకు దొంగనక్క క్షమాపణలు !

Tags

, , , , , , , , ,

!ఎం కోటేశ్వరరావు

దేశంలో సరికొత్త నాటక రాజకీయాలు అదీ మరోసారి మహిళల పేరుతో మొదలయ్యాయి.ప్రతిపక్షాల మద్దతు లేకుండా వీగిపోతుందని తెలుసు. వేదగణితం ప్రకారం కూడా మూడింట రెండువంతుల మెజారిటీ పాలక కూటమికి లేదు. అయినా కనీసం మాటమాత్రంగా సంప్రదింపులు జరపని అపర ప్రజాస్వామిక వాదులతో కూడిన ఎన్‌డిఏ పక్షాల కారణంగా నారీశక్తి ముసుగులో ప్రవేశపెట్టిన రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయింది.నారీ బిల్లు వీగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టమై గజెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. ఓడిపోయింది మోడీ మరియు మద్దతు ఇచ్చిన ఆత్మాహుతి దళానికి చెందిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌మోహనరెడ్డి బిల్లు మాత్రమే.కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతున్నారు.బిల్లును ఓడించిన పార్టీలు తాము ఏమి సాధించామో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోడీకి మద్దతు ఇచ్చి వ్రతం చెడినా ఫలం దగ్గని ఆ పెద్దమనిషి తానేమి సాధించారో చెప్పాలి. పచ్చి అబద్దాలతో ప్రకటన చేశారు. కేంద్రం ప్రతిపాదించిన 50శాతం పెంపుదలను ఆమోదించి ఉంటే అన్నారు. బిల్లులో అలాంటి పదజాలం ఉందో లేదో కూడా సరిచూసుకోకుండా జనాన్ని, తన గణాలను తప్పుదారి పట్టించారు. బిల్లును ఓడించారంటూ బుడిబుడి రాగాలు తీస్తున్న తెలుగుదేశం, జనసేన, బిజెపి నేతలతో కలసి వైసిపి నాయకులు కూడా సామూహిక రోదన కార్యక్రమాల్లో పాల్గ్గొని ఉంటే జగన్‌ వ్రతం సంపూర్ణం అయి ఉండేది.దీన్లో కూడా ఎటూ కాకుండా పోయారు.నిడదవోలులో మూడు పార్టీల కూటమి దుకాణం పెడితే దానికి దగ్గరలో అయినా మోడీ ఓదార్పు యాత్రను జగన్‌ చేపట్టి ఉంటే సార్ధకనామధేయుడై ఉండేవారు. దక్షిణాది, కుటుంబనియంత్రణ పాటించిన ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవటమే ప్రతిపక్షాలు సాధించిన అంశం. ఇది కూడా అర్ధంగాక పోతే ఎక్కడైనా చికిత్సకు చేర్చటం మంచిది.

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటం, మెప్పు పొందటంలో దేశంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరని చెప్పవచ్చు. ఎదుటివారికి కన్ను కొడుతూ వేరే వారితో సంబంధాలు నెరపటంలో దిట్ట. నిడదవోలు ప్రసంగంలో యుపిఏ పాలనలో మహిళా రిజర్వేషన్‌ గురించి పట్టించుకోలేదని చెప్పారు, సరే, 2014 నుంచి 2023వరకు తొమ్మిదేండ్లు నరేంద్రమోడీ ఏం చేశారన్న ఒక్క ముక్క నోటి నుంచి రాలేదు.రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిన తరువాత కూడా గురువారం రాత్రి వరకు నోటిఫికేషన్‌ జారీ చేయని నిర్వాకం గురించి ప్రశ్నించలేదు. ”నోటిఫికేషన్‌” ప్రాధాన్యత ఏమిటో అమరావతి గురించి చూసిన తరువాత చంద్రబాబుకు చెప్పాల్సిన పనిలేదు.తెలుగుదేశం ఉప్పు తిని విశ్వాసంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారిలో జర్నలిస్టు ఆర్‌కె జగమెరిగిన బ్రాహ్మణుడు. ఏం చేద్దాం బ్రదర్‌ అని చంద్రబాబు అడిగి ఉంటే ఏ సలహా చెప్పేవారో ఆదివారం నాటి కొత్త పలుకు చూసిన తరువాత అర్ధం అవుతుంది.” కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అని అందరూ భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా సదరు బిల్లులో ఏముందో తెలియని స్థితి ” అని రాశారు. చంద్రబాబు నాయుడిని చూసి జగన్‌మోహనరెడ్డి సానుభూతి చూపాల్సిన దుస్థితి. అవున్లే బాబుకే తెలియకపోతే దేనికైనా మద్దతు అని ప్రకటించిన వైసిపి నేతలను కనీసం ఈ విషయంలో అయినా తండ్రీ కొడుకులు ఓదార్చి ఉండాల్సింది. తనతో సంప్రదింంచకుండా మోడీ ఏపనీ చేయరనే ధీమాతో ఉన్న చంద్రబాబు ”కేంద్రమంత్రులకు ఫోన్లు చేసి అన్ని రాష్ట్రాలలో 50శాతం సీట్లు పెంచబోతున్న విషయం తెలుసుకున్నారు ” అని ఆర్‌కె ముక్తాయించారు. ఆ ముక్క అసలు బిల్లులో పెట్టలేదని తన పత్రికలోనే రాసిన విషయం తెలియదని అనుకోవాలా ? చంద్రబాబుకు సైతం తెలియదని రాయటం వెనుక ఉన్న అంతరంగం ఏమిటి ? తెలిసి ఉంటే బాబుగారు జాగ్రత్తపడి ఉండేవారు అని భజన చేయటం కావచ్చు.లేకపోతే మీ మద్దతు తీసుకోవటం తప్ప మీరంటే మోడీకి లెక్కలేదు అని ఇరుకునపెట్టటానికి రాసి ఉండవచ్చు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చన్న సంభాషణను గుర్తుకు తెచ్చుకోవాలి. కలానికి, కత్తికి రెండు రకాల పదను, ప్రయోజనం దాగి ఉంటుంది.ఆర్‌కె ఏ లక్ష్యంతో రాసినప్పటికీ అది ప్రచురితంగాక ముందు మోడీని బలపరిచిన తెలుగుదేశం, జనసేన వీరాభిమానులందరూ చదివిన తరువాత తమ నేత పలుకుబడిని చూసి నీరులేని బావులను చూసుకొని ఉండి ఉండాలి. ఆత్మగౌరవం, అన్న ఎన్‌టిఆర్‌ అని జపం చేసే వారందరూ ఆర్‌కె వ్యాఖ్యానం చదివిన తరువాత కూడా మామూలుగానే భజన కొనసాగిస్తుంటే చంద్రబాబు నాయుడి మాదిరి ” స్థితప్రజ్ఞత ” సంతరించుకొని ఉండాలి.చంద్రబాబు నాయుడు కూడా బ్యూరోక్రాట్‌ మాదిరి వ్యవహరించారని ప్రవచించిన ఆర్‌కెకు అంతకు మించిన పెద్ద బ్యూరోక్రాట్‌ మోడీ గురించి తెలియదనుకోవాలా ? తమను బలపరచటం తప్ప బాబుకు మరోదారి లేదన్నదే మోడీ ధీమా ! గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం మొత్తాన్ని మింగివేసిన మోడీకి ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పక్షాన్ని స్వాహా చేయటం చిటికెలో పని. చంద్రబాబు అండ్‌కోకు మోడీ ఏం చేసినా బలపరచటం తప్ప మరో మార్గం లేదు. అందుకే అన్నీ తెలిసి రాజ్యాంగసవరణ బిల్లును బలపరచి తన కాళ్లను తానే నరుక్కొనేందుకు కూడా సిద్దపడక తప్పలేదు.

భవిష్యత్‌లో కూడా జనాభా ప్రాతిపదికన అది 2011 అయినా 2027 లెక్కల ప్రకారమైనా లోక్‌సభ సీట్లను కేటాయించాలని చూస్తే మరోసారి ఇదే సమస్య పునరావృతం అవుతుంది.కుటుంబనియంత్రణ పథకాన్ని అమలు చేసిన తరువాత 1961-71 జనాభాలెక్కల్లో వెల్లడైన వ్యత్యాసాన్ని గమనించి ఇందిరాగాంధీ ముందు చూపుతో రాజ్యాంగ సవరణద్వారా 25 సంవత్సరాల పాటు లోక్‌సభ సీట్ల పెంపుదలను స్థంభింప చేశారు. ఎందుకంటే హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసి మూర్ఖపు చర్యతో అంతకు ముందు తమిళనాట తలెత్తిన నిరసన ఏమిటో ఆమెకు అవగతం అయింది.తరువాత వాజ్‌పాయి కూడా ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడిన కారణంగా ఆ కందిరీగల తుట్టెను కదిపేందుకు సాహసించలేదు. మరోసారి పాతిక సంవత్సరాల స్థంభన విధించారు.తన రూటే సపరేటు(ఇతరుల మార్గంలో నడవను) అన్నట్లుగా మోడీ వ్యవహరించారు.ఇరాన్‌తో వ్యవహారంలో జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అతితెలివి తీరును చూస్తున్నాం.బిజెపి నేతలు కూడా అదే చేశారు. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చింది.దాన్ని ఎవరూ మార్చలేరు. అయినా సవరణ బిల్లు పేరుతో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం, కొన్నింటికి విపరీత లబ్దికలిగే పద్దతిలో సంఖ్య పెంచి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లంకెపెట్టటమే అసలు వివాదానికి కారణమైంది. మహిళల పేరు చెప్పి భావోద్వేగపూరిత బెదిరింపులకు(ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌)పూనుకున్నారు. మీరు గనుక మేం చెప్పినట్లు ఆమోదించకపోతే మాకే లాభం అన్నారంటేే అర్ధం ఏమిటి ? మీ గురించి వ్యతిరేకతను రెచ్చగొడతాం అని చెప్పటమే.చిత్తశుద్ది ఉన్నవారెవరైనా అలాంటి పరిస్థితే వస్తుందనుకుంటే వేరే పదజాలాన్ని ఉపయోగిస్తారు. పెంచిన 50శాతం సీట్లను రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల దామాషా ప్రకారం కేటాయిస్తామంటే గుడ్డిలో మెల్లమాదిరి అన్ని పార్టీలూ అంగీకరించి ఉండేవి.

అసలు రాజ్యాంగ సవరణ ప్రతిపాదన లేక ముందు అమిత్‌షా మొదలు బిజెపి గల్లీ లీడరు వరకు అన్ని రాష్ట్రాలకు అలాగే పంచుతామని చెప్పారు. తీరా బిల్లులో ఆ ప్రస్తావనే లేదు.రెండు రోజులు పాటు పార్లమెంటులోపలా వెలుపలా ప్రభుత్వ ప్రతిపాదనతో కొన్ని రాష్ట్రాలకు గలిగే నష్టం, లబ్ది గురించి వివరంగా చర్చ జరిగింది. అయినప్పటికీ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా సరిగ్గా ఓటింగ్‌కు వెళ్లే ముందు(తొలుత సాయంత్రం నాలుగు అన్నారు, తరువాత ఆరు, మరోసారి ఏడు అన్నారు) అమిత్‌షా ప్రతిపక్షాలను తీవ్రంగా దుయ్యబట్టి మీరు గనుక మా షరతుకు అంగీకరిస్తే 50శాతం చేరుస్తామని అన్నారు. అంతకు ముందు బిజెపి నేతలు ఇరవై నాలుగు గంటలపాటు అలాంటి లీకులు ఇచ్చారు, చివరికి తమ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అదే చెప్పారు.అయినా బిల్లులో ఎలాంటి మార్పులు చేయకుండా నాటకమాడారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు 2023 నుంచి గజెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా గురువారం రాత్రి ప్రకటించారు. స్వంత మిత్రులనే తప్పుదారి పట్టించి మోసం చేసిన బిజెపి మంత్రుల మాటలను ఎవరు నమ్ముతారు.చివరికి అదే జరిగింది.బిల్లు ఓడిపోయింది. అలాంటి పరిణామం జరుగుతుందని ముందే తెలుసుగనుకనే వారు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసే నినాదాలతో కూడిన ప్లకార్డులను సిద్దం చేసుకొని పార్లమెంటు ప్రాంగణంలో దాచబట్టే వెంటనే నిరసనపేరుతో వీధుల్లో ఊరేగారు. ఇప్పటికైనా నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాలకు వదలివేసి 543 స్థానాల్లో 33శాతం రిజర్వేషన్‌ అమలుకు పూనుకోవాలి.2023 చట్టంలో తదుపరి జనాభా లెక్కల తరువాత అమలు అని లంకె పెట్టినందున దాన్ని సవరించేందుకు ఇప్పుడు జరుగుతున్న జనాభాలెక్కల ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల సంఖ్యను మార్చకుండా పునర్విభజన చేసేందుకు చట్టసవరణ చేయాలి.అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు.మహిళలూ క్షమించండి అంటూ ప్రకటించిన మోడీ చిత్తశుద్దికి ఇప్పుడు పరీక్ష ఎదురుకానుంది, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు చాలా ముందుగానే జన సంఖ్య ఎక్కడ ఎంత అనేది స్పష్టం అవుతుంది గనుక దానికి అనుగుణంగా లోక్‌సభ, రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి ఆటంకం ఉండదు.

ఇక నరేంద్రమోడీ క్షమాపణల చిత్తశుద్ది బండారం గురించి చెప్పుకోకపోతే సంపూర్ణం కాదు. ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతాంగ పోరాటానికి తలొగ్గిన నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలలో ఒకటి కనీస మద్దతు ధరలకు చట్టబద్దత.మోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు ఆ డిమాండ్‌ను ముందుకు తెచ్చినప్పటికీ తాను ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మిగతా వాగ్దానాల మాదిరే దాన్ని కూడా విస్మరించారు.అయితే రైతుల ఆందోళనను చల్లార్చేందుకు మద్దతుధరల చట్టబద్దత పరిశీలన పేరుతో 2021నవంబరు 19న ఒక కమిటీని ప్రకటించారు.దానికి 2022 జూలై 22న సభ్యులను ఎంపిక చేశారు.త్వరలో నాలుగో వార్షికోత్సవం జరుపుకోనుంది.అసలా కమిటీ ఏమి చేస్తున్నదో, సమావేశాల పేరుతో కాలక్షేపం, టిఏ, డిఏలు తీసుకుంటున్నది తప్ప చేసిందేమీ లేదు. జరిగిన ప్రతి సమావేశమూ అసంపూర్ణమే, 35 ఉపసంఘాల సమావేశాలు జరిగాయి.చివరి సమావేశం చాలా కాలం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కమిటీలో ఉన్న అధికారగణ సభ్యులు మార్కెట్‌ కమిటీల వెలుపల జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలను అమలు జరపటానికి విముఖత చూపటంతో ఇతర కమిటీ సభ్యులు తీవ్రంగా విబేధించినట్లు నిర్దారణగాని వార్తలు. కనీస మద్దతు ధర ఎక్కడైనా రైతులకు దక్కాల్సిందేనని ఐదుగురు సభ్యులు కమిటీ చైర్మన్‌ మీద వత్తిడి తెచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. నివేదిక ఇవ్వాలని మోడీ సర్కార్‌ అడగలేదు, అసలా కమిటీకి ఒక నిర్ణీత గడువును కూడా నిర్ణయించలేదు.రైతుల్లో మహిళలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.రిజర్వేషన్లు, కనీస మద్దతు ధరలకు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో రిజర్వేషన్లతో వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది తప్ప ఆర్థికంగా ఒరిగేదేమీ లేదు. అదే పంటల కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తే కోట్లాది మంది మహిళా రైతుల జీవితాలు కాస్త మెరుగుపడతాయి.ఈ విషయంలో చిత్తశుద్దిలేని మోడీ సర్కార్‌ ఇప్పుడు చట్టసభల రిజర్వేషన్లను ఎలా అమలు జరుపుతుందో చూడాల్సి ఉంది.